నిర్గమ. 16, సంఖ్యా 11, కీర్తన 78:21-31, యోహాను 6:31-35

ఉద్దేశము
దేవుడు మన అవసరాలన్నింటిని తీరుస్తాడు అని విశ్వసించాలి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము యేసే. ఆయన మనలను తృప్తి పరచగలడు అని బోధించుట.

ముఖ్యాంశము
మీరు పుట్టిన రోజు నాడు పెద్ద పార్టీ చేసుకున్నారు అనుకోండి. మీ బంధువులు స్నేహితులు చాలామంది బహుమతులు తెచ్చి ఇస్తారు, చాలా రుచికరమైన భోజనం చేసారు, చాలా సేపు ఆడుకున్నారు, అందరూ కలిసి ఎంతో సంతోషకరమైన సమయం గడిపారు. అందరూ వెళ్లి పోయేటప్పటికి చాలా ఆలస్యం అయింది. మెలకువ రాకపోవటం వలన ఆలస్యంగా నిద్రలేచారు అనుకుందాము. స్కూల్ కి వెళ్ళాలి టిఫిన్ తినే సమయం లేదు, స్కూల్ లో సైన్స్ లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి, కింద పడి దెబ్బలు తగిలాయి, మీ స్నేహితునితో గొడవ అవుతుంది - ఆ రోజంతా చాలా కష్టంగా గడిచింది అనుకోండి. ముందు రోజు ఎంతో సంతోషం, అందరూ కలవడం కాని మరుసటి రోజు అన్నీ ఇబ్బందులు, నిరాశ భాధ. మీ మనస్సులో ఎటువంటి ఆలోచనలు వచ్చి ఉండవచ్చు? ఈరోజు తమకు కష్టాలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు ఎలా ప్రవర్తించారు అనే విషయాలను గురించి తెలుసుకుందాము.

ఇశ్రాయేలీయుల ప్రయాణం కొనసాగుట
ఫరో రాజు తమను విడుదల చేసినందుకు ఇశ్రాయేలీయులు ఎంత సంతోషించారో మీకు గుర్తుంది కదూ! వారు ఎర్ర సముద్రములో ఆరిన నేలమీద నడిచినట్లుగా నడిచారు. కాని దుష్టులైన ఐగుప్తీయులు మునిగిపోవు నట్లుగా దేవుడు వారి మీద సముద్ర జలములు పొర్లునట్లు చేశాడు. ఇశ్రాయేలీయులు దేవుడు వాగ్దానము చేసిన కనాను దేశమునకు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దేవుడు పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్ని స్తంభం లో వారితో ఉంటూ వారిని నడిపిస్తున్నాడు. వారు ఎత్తుగా ఉన్న కొండలను దాటుతూ లోయలలో దిగుతూ రాళ్లతో ఇసుకతో నిండి ఉన్న భూమి మీద నడవవలసి వచ్చింది. అది ఎక్కువ వేడి ప్రదేశం కనుక పంటలు ఏమీ లేని ప్రాంతం. పచ్చగా ఎన్నో రకాల పంటలు గల ఐగుప్తు దేశములో నివసించిన ఇశ్రాయేలీయులకు ఈ ప్రయాణం ఎంతో కష్టంగా అనిపించి ఉండవచ్చు.

ఇశ్రాయేలీయులు ఆకలిగొనుట
ఇశ్రాయేలీయులు ప్రయాణం మొదలుపెట్టి నెల దాటింది. వారు తమతో తెచ్చుకున్న ఆహారం, ఆహార పదార్థాలు అన్నీ అయిపోయాయి. వారు విపరీతమైన ఆకలితో ఉన్నారు. వారు ఏమి చేయాలి? ప్రభువుకు ప్రార్ధించి ఆహారం కోసం వేడుకుని ఉండవలసింది. ఆయన తమ కొరకు చేసిన అద్భుత కార్యములు గుర్తు చేసుకుని ప్రార్థించ వలసింది. అంత ప్రేమ గల దేవుడు తమ ఆకలి తీర్చగలడు అని వారు విశ్వసించాలి. వారు తన యందు విశ్వాసము ఉంచుతారా లేదా అని దేవుడు పరీక్షిస్తున్నాడు, కానీ విశ్వాసముతో ప్రార్ధించడానికి బదులుగా వారు సణుగుటకు మొదలుపెట్టారు. ఎంత విచారం! వారు మోషే అహరోనులతో - ``మేము మాంసము వండుకొను కుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినున ప్పుడు దేవుని చేతి వలన ఏల చావకపోతిమి? ఈ సర్వసమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడనుండి తోడుకొని వచ్చితిరి'' అని సణిగారు. (నిర్గమ.16: 3). వారు వెలుపలికి వచ్చినప్పుడు ఎంతో సంతోషించారు,ఉత్సాహంగా ఉన్నారు కానీ కష్టం రాగానే వారి ప్రవర్తన భయంకరముగా మారింది.

దేవుడు మన్నాను కురిపించుట
ఇశ్రాయేలీయులు కృతజ్ఞత లేని వారుగా ఉన్నప్పటికిని ప్రభువు వారి పట్ల ఎంతో దయ గలవాడై యున్నాడు. ఆకాశమునుండి ఆహారము పంపుతాను అని మోషేకు చెప్పాడు. ఇశ్రాయేలీయులు సణుగుట నేను విన్నాను అని ప్రభువు మోషే అహరోనులతో చెప్పాడు. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడి ఉంది. ఆ మంచు ఇగిరి పోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడ్డాయి. ఇశ్రాయేలీయులు దానిని చూచినప్పుడు అది ఏమైంది వారికి తెలియలేదు కనుక ఇదేమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. అప్పుడు మోషే వారితో - "ఇది తినుటకు ప్రభువు మీకిచ్చిన ఆహారము" అని చెప్పాడు( నిర్గమ16 :15). వారు దానిని "మన్నా" అని పిలిచారు. అప్పుడు ఇశ్రాయేలీయులు బయటకు వెళ్లి దానిని కూర్చుకుని తమ పాత్రలలో బుట్టలలో నింపుకున్నారు . అది తెల్లని కొత్తిమీర గింజలవలె ఉంది. దాని రుచి తేనెతో కలిపిన రొట్టెవలె ఉంది అని బైబిల్ లో వ్రాయబడింది. దానిని తిరుగలితో లేదా రోటిలో దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకుని తినవచ్చు. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండేది. అది ఆహారమునకు ఎంతో మంచిది గా ఉండేది, అది దేవదూతల ఆహారము (కీర్తన 78: 21- 31) అని బైబిల్ లో ఉంది. ఇశ్రాయేలీయుల అవసరాలు దేవునికి ఖచ్చితంగా తెలుసు.

దేవుని ఉపదేశములు
మన్నాను గురించి ప్రభువు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా కొన్నిఉపదేశములు ఇచ్చాడు. ప్రతివాడు తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి మనిషికి ఒక్క ఓమెరు మాత్రమే కూర్చోవాలి. ఒక్కొక్కడు తన గుడారములో ఉన్న వారి కొరకు మన్నాను కూర్చోకోవాలి. వారు దినమునకు కావలసినంత సమృద్దిగా మన్నాను కూర్చు కొనవచ్చు, కానీ మరుసటి దినము ఉదయం వరకు మిగుల్చు కొనకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి దినము తమ ఆహారం కొరకు దేవునిపై ఆధారపడాలి. తమ ఆకలి తీర్చుకొనడానికి దేవుడు అనుగ్రహించిన మన్నాను బట్టి ఇశ్రాయేలీయులు ఎంతో సంతోషించాలి. వారు తమకు ఆహారమును కూర్చుకున్న తరువాత మిగిలినది ఎండ వేడికి కరిగిపోయేది. మరుసటి రోజు ఉదయం తిరిగి వారికి ఆహారం కొరకు మన్నాసిద్ధముగా ఉండేది. ఇశ్రాయేలీయులలో కొందరు మోషే మాట వినక ఉదయము వరకు దానిలో కొంచెము మిగుల్చు కొనగా అది పురుగు పట్టి పాడైపోయింది. దేవుడు ముందుగా చెప్పినప్పటికీ వారు విధేయత చూపలేక పోయారు.

కానీ ఈ నియమానికి ఒకరోజు మినహాయింపు ఉంటుంది అని దేవుడు మోషేతో చెప్పాడు. ఆరవ దినమున విశ్రాంతిదినమునకు కూడా అవసరమైనంత మన్నాను వారు కూర్చు కొనవచ్చు. ప్రతిదినము కూర్చుకున్న దానికి రెండంతలు ఏడవ దినమున వారు కూర్చుకొనవచ్చు, ఎందుకనగా ఏడవ దినము విశ్రాంతిదినము కనుక ఆ దినము మన్నా దొరకదు అని మోషే వారికి చెప్పాడు. ఏడవ దినము పరిశుద్ధమైనది కనుక ఆ దినమున ఇశ్రాయేలీయులు ఎటువంటి పనులు చేయకుండా ఉండాలి అని దేవుని ఆజ్ఞ. ఆరవ దినమున వారు కూర్చున్న మన్నాను ఏడవ దినము కూడా మిగుల్చు కొని తినేవారు, కానీ అది మిగిలిన రోజులలో వలె చెడిపోయేది కాదు. ఎంత ఆశ్చర్యం! అంత వివరంగా చెప్పినా కొందరు అవిధేయతతో ఏడవ దినమున మన్నా కూర్చుకొనుటకు వెళ్ళినప్పుడు వారికి ఏమీ దొరకలేదు. దేవుని మాటలు విని విధేయత చూపటం ఎంతో ముఖ్యం.

ప్రజలు సణుగుకొనుట, గొణుగుకొనుట
దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో వారికి ఆహారము సమకూర్చినప్పటికీ తిరిగి ఇశ్రాయేలీయులు సణుగుట మొదలు పెట్టారు. దేవుడు ఇచ్చిన మన్నా తమకు ఇష్టం లేదని,దానిలో ఎటువంటి రుచిలేదు అని గొణిగారు, ఎంత ఆశ్చర్యం! ప్రతిరోజూ మన్నాను తినడం తమకు విసుగు కలిగిస్తుంది అని బాధ పడ్డారు. వారు ఐగుప్తులో తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్ల గడ్డలు జ్ఞాపక మునకు వస్తున్నాయి అని చింతించ సాగారు. వారికి మాంసం తినాలి అనే ఆశ రోజురోజుకూ ఎక్కువ అయిపోయింది. జనుల సణుగులు విని దేవునికి ఎంతో కోపం వచ్చింది. వారికి ఒక పాఠం నేర్పించాలని దేవుడు తలంచాడు. దేవుడు వారికి ఒక నెల రోజులు వరుసగా మాంసము ఇవ్వగలడు కానీ దాని వలన లాభము ఏమిటి? అప్పుడు ప్రభువు సన్నిధి నుండి గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్ళను రప్పించి ఇశ్రాయేలీయుల పాళెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున పడ్డాయి. ఇశ్రాయేలీయులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినము అంతయు వాటిని ఏరుకొనుట మొదలుపెట్టారు. వారు మాంసము తినుచుండగానే ప్రభువు ఒక తెగులు పంపి వారికి ఎంతో భాధ కలిగించాడు. అనేకులు అక్కడ చనిపోయారు. తమకు నచ్చిన వాటిని కాకుండా దేవుడు సమకూర్చిన వాటితో సంతోషించడం ఎంతో మంచిది అని దేవుడు ఈ సంఘటన ద్వారా ఇశ్రాయేలీయులకు నేర్పించాడు.

సందేశము
ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు ఆకాశమునుండి మన్నాను ఆహారంగా కురిపించినట్లు మనము చూశాము. అరణ్యములో ప్రయాణించిన 40 సంవత్సరములు 20 లక్షల మంది ఇశ్రాయేలీయులను పోషించిన దేవుడు ఎంత గొప్పవాడు! ఇశ్రాయేలీయులు సణగటం ఎంత బాధాకరం! దేవుడు చూపిన ప్రేమకు వారిలో ఎటువంటి కృతజ్ఞత భావం లేదు. వారి సణుగులు విని దేవుడు మరల వారిని శిక్షించడం మనము తరువాత వారాలలో చూస్తాము (సంఖ్యా 21: 49).

అన్వయింపు
ఇశ్రాయేలీయులు ప్రవర్తించినట్లు మనము ప్రవర్తించకుండునట్లు ఈ సంగతులు వ్రాయబడ్డాయి అని 1కొరింథి 10:6 లో వ్రాయబడింది. వారివలె మనము సణగకూడదు. ప్రభువు మనకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మనము ఆయన యెడల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు నచ్చలేదు అని ప్రతి విషయానికి సణగడం మంచిది కాదు. ప్రపంచంలో కొన్ని కోట్లమంది తినడానికి ఆహారము లేక చనిపోతున్నారు అని మనము గుర్తు చేసుకోవాలి. ఇంటిలో తల్లిదండ్రులను అది కావాలి ఇది కావాలి అని కష్ట పెట్టకూడదు. మనకు కావలసిన ఆహారం కోసం ప్రతి దినము దేవునికి ప్రార్ధించాలి (మత్తయి 6:11) కృతజ్ఞత కలిగి ఉండాలి (కీర్తనలు 103:2). ప్రభువైన యేసు భూమిమీద జీవించినప్పుడు - "పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారము నేనే" అని చెప్పాడు(యోహాను6:31- 35) ప్రజల ఆకలిని మన్నా తీర్చ గలిగింది, మన ఆత్మీయ అవసరాలను ఆకలిని యేసు తీర్చగలడు. అది ఎలా సాధ్యం? మన పాపములను క్షమించి మన రక్షకునిగా ఉండునట్లు ప్రభువైన యేసు దగ్గర ఎంతో ప్రార్థించాలి. మనము క్రైస్తవులు గా మారినప్పుడు యేసు ప్రేమ మన హృదయాలలో ఉంటుంది గనుక ఎంతో సంతోషంగా ఉండగలము. ఆయనను విశ్వసించిన యెడల జీవితాంతం ఆయన మనలను పోషించగలదు.

కంఠత వాక్యము
యేసు వారితో ఇట్లనెను - "జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు" యోహాను 06:35

ఆక్టివిటీస్ డౌన్లోడ్ PDF

 

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.