ఈ సందేశం 'ప్రమాదకరమైన క్రైస్తవ్యం'గా ఎందుకు పేర్కొనబడింది? ఎందుకంటే ఈ క్రైస్తవ్యం పరిశుద్ధగ్రంథమునుండి సంపూర్ణసత్యాలను కాకుండా అర్థసత్యాలను మాత్రమే తీసుకొని ప్రకటిస్తుంది.తక్కువ మూల్యాన్ని మరియు త్యాగాన్ని ఆశించే ఆకర్షణీయమైన వచనములను మాత్రమే వల్లిస్తూ, మరింత ప్రధానమైన లేఖనభాగములను అలక్ష్యం చేస్తూ, అసత్యమైన నిరీక్షణను పుట్టించు సందేశమును ఇది అందిస్తుంది. 'పచ్చిఅబద్ధం కన్న పాక్షిక సత్యమే ప్రమాదకరం' అను సామెత మనకు పరిచితమే కదా! అయితే గమనించండి. నేనిక్కడ అవాంతరమతశాఖలను గూర్చిగాని, అబద్ధ బోధకుల గూర్చిగాని ప్రస్తావించడం లేదు. తమ్మునుతాము సౌవార్తికశాఖకు(ఇవాంజీలికల్స్) చెందినవారిగా పిలుచుకుని, లేఖనముల అంతిమ అధికారమును విశ్వాసిస్తున్నామని అంటూ బైబిల్ నందలి సంపూర్ణబోధను అలక్ష్యము చేయువారి గురించి మాట్లాడుచున్నాను.
ఈ ‘ప్రమాదకరమైన క్రైస్తవ్యం' అడిగినదల్లా అనుగ్రహించు దేవుని గూర్చి బోధిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ప్రేమను చూపించే దేవుని మాత్రమే ప్రకటిస్తుంది. అంతమాత్రమే గాకుండా, ఇది పాపం చేసినప్పడల్లా క్షమించి, ఆయురారోగ్యాలతోను మరియు అష్టఐశ్వర్యాలతోను దీవించి, శాంతి సమాధానాలను ప్రసాదించే దేవున్ని చూపిస్తుంది. ఇవన్నియు నిజమే! అయితే ఈ ప్రమాదకరమైన క్రైస్తవ్యం, పరిశుద్దత, నీతి, క్రమశిక్షణ మరియు తీర్పు అనే దేవుని ప్రధానమైన ఇతర గుణగణాలను మరుగుచేసింది. సత్యాన్ని వక్రీకరించడం ఎంత నేరమో అలాగే సత్యాన్ని మరుగుపరచడం కూడా అంతే నేరం. ఈ 'ప్రమాదకరమైన క్రైస్తవ్యం' పరిశుద్దతలేని ప్రేమను, విధేయతలేని ఆశీర్వాదాలను, మారుమనస్సులేని క్షమాపణను, దైవచిత్తానుసారమైన దు:ఖములేని పరలోక ఆనందాన్ని, సిలువలేని కిరీటాన్ని, నీతిలేని శాంతిని మరియు దైవికభక్తిలేని కృపను ప్రసాదించే దేవున్ని మాత్రమే ప్రకటిస్తుంది. అంతేగాక, ఇది దేవునియందు భయభక్తులులేని విశ్వాసాన్ని పాపమునుండి విడుదలలేని నీటి బాప్తిస్మాన్ని జీవితంలో పరివర్తన లేని క్రీస్తునందలి విశ్వాసాన్ని మరియు స్వయం ఉపేక్షలేని క్రీస్తుకు సమర్పితమైన జీవితమును బోధిస్తుంది. ఇది యేసుక్రీస్తు బోధించిన “ఇరుకైన మార్గాన్ని"కాక విశాలమైన మార్గాన్ని చూపిస్తుంది (మత్తయి 7:13-14) ఇది ‘స్వయాన్ని ఉపేక్షించడం' అనే బోధనుకాక 'స్వయాన్ని పోషించడమనే' బోధను ప్రకటిస్తుంది. ఇది ఉదారతకంటే ధనార్జనకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది.
అంతమాత్రమే గాకుండా, ప్రమాదకరమైన క్రైస్తవ్యమనేది రాజీపడిన క్రైస్తవ్యం. ఇది జీవితాన్ని సుఖమయం చేసే క్రైస్తవ్యం. విశ్వాససంబంధమైన మంచి పోరాటం, సిలువను ఎత్తుకొని, తన్నుతానుఉపేక్షించడం, లోకమును విడిచిపెట్టడం, నీతికొరకు ఆకలిదప్పులు కలిగియుండటం, సమస్త మనుష్యులతో సమాధానంగా వుండడానికి శక్యమైనదంతయు చేయడం, మరియు అవసరతలో ఉన్న బీదవారికి ధారాళముగా ఇవ్వడంవంటి అంశాల ప్రస్తావన ఈ రకమైన క్రైస్తవ్యంలో ఉండదు. పరలోకదర్శనాన్ని మరుగుచేసి లోకసంబంధమైన వాటియందు మనస్సును లగ్నం చేసి, ఈ క్రైస్తవ్యం ప్రజలను ఆకర్షిస్తుంది. ఇది క్రమేపీ లోతైన ఆత్మీయతకంటే సత్తువలేని క్రైస్తవ్యాన్ని ప్రబలపరుస్తుంది. అందుకే అనేకులు శరీరసంబంధులైన క్రైస్తవులుగా జీవించడం ఆశ్చర్యమేమి కాదు. అనేక దశాబ్దాల క్రితం జె.సి రైల్ అనే దైవజనుడు, 'మేము క్రైస్తవులము అని చెప్పుకొనే అనేకులను గూర్చి నేను భయపడుతున్నాను. వారిలో విజయం మాట అలావుంచితే కనీసం పోరాటము యొక్క సూచనయైన నాకు కనిపించుట లేదు. వారు పాపముతో పెనుగులాడుట లేదు. ఇది క్రైస్తవ్యం కాదని నేను మిమ్మును హెచ్చరిస్తున్నాను. పరలోకమునకు మార్గం ఇది కానేకాదు' అని వ్రాసాడు.
పరిశుద్ధత
దేవుడు సంపూర్ణముగా పరిశుద్ధుడని దేవునివాక్యం సెలవిస్తుంది. ఆయన పాపంతో రాజీపడజాలడు. ఆయన మహోన్నతుడు, ఆయన సృష్టియంతటిని అధిగమించినవాడు, ఆయన సమస్తమునుండి ప్రత్యేకింపబడినవాడు. అయినను “ఆయన ప్రేమాస్వరూపి” (యోహను 4:16) గనుక సన్నిహితునిగా కూడా వుంటాడు. అయితే ఆయన ప్రేమ కూడా ఆయన పరిశుద్దత నుండి ప్రవహిస్తుంది. “దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల దేవుని ఆలయమైయున్నాము; అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు - నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైయుందును వారు నా ప్రజలైయుందురు. - కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని” ప్రభువు చెప్పచున్నాడు. - "మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినైయుందును. మీరు నాకు కుమారులును కుమారైలునైయుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్దతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రలనుగా చేసికొందము” (2కొరింథీ 6:17,18; 7:1) దేవుని పరిశుద్దతకు లోబడితే తప్ప మనం ప్రేమగల దేవునితో అన్యోన్య సహవాసాన్ని ఎంత మాత్రము కలిగియుండలేము.
దేవుని గుణాలన్నింటిలోకెల్లా ఆయన పరిశుద్ధ గుణమే లేఖనాలలో విస్తారంగా నొక్కి వక్కాణించబడింది. దేవుని దూతలు రెండు సందర్భాలలో ఆయన పరిశుద్ధ గుణాన్ని వెల్లడి చేశారు. ఆ దూతలు “పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశుద్దుడు” అని ఈ గుణాన్ని ప్రస్తుతించారు (యెషయా6:3 ; ప్రకటన 4:8). ఆర్.సి స్ప్రౌలు అనే దైవజనుడు ఈ మాటను బహు చక్కగా వివరించాడు.
'ఈ స్తుతిగీతమును 'త్రిషాగీయెన్' అని పిలుస్తారు. ముమ్మార్లు పరిశుద్దుడు అని అభివర్ణించుటను ఇది సూచిస్తుంది. పరిశుద్ధుడు అని మరల మరల చెప్పుటయందున్న ప్రాముఖ్యతపై మనము దృష్టి కోల్పోవటం సాధ్యం. ఈ విధముగా మరల మరల చెప్పటం హీబ్రూ భాషాసాహిత్యంలో మరి ముఖ్యముగా కవిత్వంలో ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పేందుకు ప్రయోగించే సాధారణ విధానం'.
సౌలు తన వివరణకు ఇంకాస్త జతచేస్తూ ఈ విధముగా వ్రాసాడు. 'దేవుని ఒకేఒక గుణలక్షణము ముమ్మార్లు వెనువెంటనే ప్రస్తావించబడినది. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్దుడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయన కేవలం పరిశుద్దుడు అని గానీ, లేదా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గానీ చెప్పబడలేదు కానీ, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అభివర్ణించబడినది. దేవుడు ప్రేమ, ప్రేమ, ప్రేమ అనిగానీ, లేక కృప, కృప, కృప అనిగానీ లేక ఉగ్రత, ఉగ్రత, ఉగ్రత అనిగానీ, లేక నీతి, నీతి, నీతి అని గానీ బైబిల్ సెలవియ్యడం లేదు. కాని దేవుడు “పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది” అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
“నేను పరిశుద్దుడను గనుక మీరు కూడా పరిశుద్ధులైయుండండి" అని దేవుడు తన వాక్యంలో మరలా మరలా ఆజ్ఞాపించాడని మనం జ్ఞాపకముంచుకోవాలి (లేవీ 11:44-45;లేవీ 19:1; 1పేతురు 1:16). కాబట్టి, మనం అపవిత్రమైన ప్రతిదాని నుండి విడుదల పొంది, పశ్చాత్తాపహృదయంతో దేవునికి మనలను మనం ప్రత్యేకపరచుకుంటే తప్ప మనం పరిశుద్దుడు, పరిశుద్దుడు, పరిశు ద్ధుడైన దేవున్ని అనుభవించలేము. పరిశుద్ధత అనే మాటకు హెబ్రీ భాషలో 'కెదూషా' అనే పదము వాడబడింది. వేర్పరచుకొవడమని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చు నిమిత్తం మనలను మనం ప్రత్యేకించుకోవడమని దాని భావం.
అయితే నేడు పాప విషయంలో విరిగినలిగిన హృదయంగల ప్రజలుగాని, లేక దేవుని పరిశుద్దత పట్ల ఆకలిదప్పలుగల ప్రజలుగాని ఎక్కడ ఉన్నారు?
“ఆత్మ విషయమై (అనగా తమ ఆత్మీయ బీదరికాన్ని గుర్తించే విషయమై) దీనులైనవారు ధన్యులు; పరలోకరాజ్యము వారిది;
(తమ పాప విషయమై) దు:ఖపడువారు ధన్యులు; వారు ఓదార్చబడుదురు;
నీతికొరకు ఆకలిదప్పులు గలవారు (నీతి కొరకు తృష్ణగొనువారు) ధన్యులు; వారు తృప్తిపరచబడుదురు” (మత్తయి 5:3,4,6) అంటూ యేసు సంబోధించిన ధన్యులైన ప్రజలు ఎక్కడ? ఎ.డబ్ల్యూ టీజర్ చెప్పిన రీతిగా దేవుని ఘనతను గుర్తింపజేసి, మనుష్యులు ఆయన యెదుట సాగిలపడి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఒప్పకొనునట్లు చేయు దేవుని గురించిన సనాతనమైన బైబిల్ సిద్ధాంతమును మనము మరల కలిగియుండాలి. సంఘమునకు దీనికంటే శ్రేయస్సుకరమైనది మరేదియు లేదు.' 'ఉగ్రుడగు దేవుని చేతిలో పాపులు' అనే శీర్షికతో జానతన్ ఎడ్వర్డ్ గారు (1703 - 1758) చేసినటువంటి ప్రసంగములు కూడా నేటి సంఘమునకు ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను.
మన పాపములను బట్టి క్రీస్తు చేసిన బలియాగం మీద దృష్టిని ఉంచినప్పుడు, దేవుడు క్రీస్తు ద్వారా మనకు చూపించిన అమితమైన ప్రేమను అర్థం చేసుకొని కృతజ్ఞతాభావంతో ఆయన పాదాల ముందు మనము సాష్టాంగపడతాము. అయితే క్రీస్తు సిలువ మరణముతో దేవుని ప్రేమ ఎంతగా వెల్లడి చేయబడిందో అంతే అధికముగా దేవుని పరిశుద్దత కూడా ప్రత్యక్షమైనదని మనం గమనించాలి. మనపట్ల తనకున్న అమితమైన ప్రేమను బట్టి దేవుడు మనలను పరలోకం నుండియే సులువుగా క్షమించవచ్చును గదా! అయితే ఆ సిలువలో మరణించులాగున ఎందుకు ఆయన యేసును ఈ లోకానికి పంపించాడు? ఎందుకంటే, దేవుని పరిశుద్ధత పాపాన్ని సహించదు. "రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని” దేవుని వాక్యంలో వ్రాయబడింది (హెబ్రీ 9:22). ఎవరో ఒకరు వచ్చి ప్రజల పాపాలకు సరిపోయేంత మూల్యాన్ని చెల్లించుకోవాలి. దేవుని పరిశుద్దత, పాప విషయంలో ఒక బలియాగాన్ని కోరినది. కనుక దేవుని ప్రేమ యేసును పాపులకొరకు ఒక ప్రాయశ్చితబలిగా త్యాగం చేసింది. ఒకవేళ దేవునికి గనుక పరిశుద్ద గుణం లేకపోయినట్లయితే, మన పాపాల కొరకు యేసు మరణించవలసిన అవసరం లేదు. కాని దేవుడు పరిశుద్దుడు గనుక పాపవిషయంలో రాజీపడడు. అందుకే ఆయన తన సొంత కుమారునే బలిగా అర్పించాడు. దేవుని పరిశుద్ద ప్రమాణాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు తన ప్రాణాన్ని మనకొరకు ఆ సిలువలో సమర్పించాడు; తద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారందరికి దేవునితో సమాధానపడే భాగ్యం లభించింది.
కాబట్టి “క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళవాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను, బలిగాను, అర్పించుకొనెను” అని దేవుని వాక్యం సెలవిస్తుంది (ఎఫెస్సి5:2) దేవుని ప్రేమ మరియు పరిశుద్ద గుణం క్రీస్తు సిలువ మరణములో మిళితంగా బయలుపరచబడ్డాయి. ఈ క్రింది లేఖనాలను జాగ్రత్తగా పరిశీలించండి.
“అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను” (రోమా 5:8) "క్రీస్తు యేసురక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను ” (రోమా 3:26)
యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు మరియు సంపూర్ణమైన మానవుడు. అదే విధంగా, ఆయన సంపూర్ణముగా పరిశుద్ధుడు మరియు సంపూర్ణముగా ప్రేమామయుడు. ఒకవేళ మనం యేసు యొక్క మానవత్వాన్ని గాని లేక దైవత్వాన్ని గాని తృణీకరించినట్లయితే, అది అబద్ధబోధగా ఎలా పరిగణింపబడుతుందో, అలాగే ఒకవేళ మనం క్రీస్తు యొక్క పరిశుద్దతనుగాని లేక ప్రేమనుగానీ తృణీకరించినట్లయితే అది కూడా అబద్దబోధయే అని మనం గమనించాలి. దేవుని ప్రేమ ప్రవాహంలో ఆయన పరిశుద్ధత యొక్క తీవ్రత నేటి క్రైస్తవ్యంలో మరుగుపరచబడటం విచారకరం. ఒకవేళ మనం గనుక యథార్థంగా దేవుడు ఎవరో అని అర్థం చేసుకొన్నట్లయితే, మనం ఆయన ప్రేమను చూసి ఆశ్చర్యపోతాము మరియు ఆయన పరిశుద్ధతను చూసి వణికిపోతాము. ఒకవేళ ఎవరైనా దేవున్ని చులకనగా తీసుకొన్నట్లయితే, పరిశుద్ధగ్రంథం వారిని ఇలా హెచ్చరిస్తుంది.
“అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవకృప కలిగియుందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా “మన దేవుడు దహించు అగ్నియైయున్నాడు” (హెబ్రి 12:28-29).
“దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా?” (రోమా 2:4)
రాబర్ట్ ముర్రే మొక్ చిన్ (1813-1843) అనే దైవజనుడు ఒక ప్రాముఖ్యమైన వ్యాఖ్యానం చేశాడు. మనం దానిని జాగ్రతగా ధ్యానించాలి.
దేవుడు ఎన్నడునూ నీతిగల దేవునిగా ఉండటం మానడు. పాపిని రక్షించడానికి దేవుడు ఏమైనా చేస్తాడు. కాని నిన్ను రక్షించడానికి ఆయన తన నీతిని వదలుకోడు. పాపులను రక్షించులాగున ఆయన తన కుమారున్ని త్యాగం చేశాడు కాని ఆయన తన నీతిని త్యాగం చేయలేదు.
పాపము
నేడు క్రైస్తవ బోధకులు తమ సందేశాలలో పాపాన్ని గూర్చి ఎక్కువగా ప్రస్తావించడం లేదు. దానికి గల కారణం ప్రజలను గాయపరిచి వారిని పోగొట్టుకొంటామేమోనన్న భయం. అనేకులు మృదువైన సందేశాలనే ప్రసంగిస్తూ అందరు సులువుగా నడవగలిగే నున్నని మార్గాన్ని చూపిస్తున్నారు. ప్రజలు ఉద్దేశపూర్వకముగా పాపములో జీవించినప్పటికి వారిని ఎల్లప్పడు దీవించి ఐశ్వర్యముననుగ్రహించే సాత్వికుడైన యేసునే వారు తమ సందేశాలలో బోధిస్తున్నారు. “తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు” (లూకా 14:33) అని బైబిల్లో సెలవిచ్చిన యేసుకు బదులుగా, ప్రజలు కోరినదల్లా అనుగ్రహించే యేసునే ఈ ప్రమాదకరమైన క్రైస్తవ్యం బోధిస్తుంది. వీరి యేసు ముట్టి స్వస్థపరిచే యేసే కావచ్చు కాని అతడు, ముట్టి స్వస్థపరిచిన పిమ్మట “మరియొక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని'(యోహాను 5:14; యోహాను8:11 ) హెచ్చరించిన బైబిల్లోని యేసుకు ఎంతో భిన్నం.
అంతమాత్రమే కాకుండా ఈ ప్రమాదకరమైన క్రైస్తవ్యంలోని యేసు దీవించగలడు, స్వస్థపరచగలడు, సంపదను అనుగ్రహించగలడు, ఆదరించగలడు, కాపాడగలడు మరియు ఉన్నతస్థితిని దయచేయగలడు. కాని ప్రధానముగా, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన బైబిల్లోని యేసుకంటే ఇతడు ఎంతో భిన్నమైనవాడు. ఈ విధముగా రక్షకునికి యేసు అని పేరు పెట్టడంలో గల అంతర్భావాన్నే కనుమరుగు చేయడం ఎంతో విచారకరం. దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమైనప్పడు "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను (మత్తయి 1:21) హెబ్రీ భాషలో "యాషువా” అని పేర్కొనబడిన యేసు నామమునకు “యెహెూవా రక్షించును” అను భావముకలదు. తన ప్రజలను పాపమునుండి రక్షించును కాబట్టే ఆయనకు ఈ పేరు పెట్టబడినది. పాపపూరితమైన లోకానికి, మరి ప్రత్యేకంగా, భ్రష్టత్వముతోకూడిన ఈ తరానికి పాపం నుండి రక్షించే పరిశుద్దుడైన యేసుక్రీస్తు అన్నింటికంటే ఎక్కువ అవసరం.
విచిత్రమేమిటంటే నేడు “పాపి" అనే పదం మంచి పదం కాదు. లౌకికపరమైన మనస్తత్వశాస్త్రం క్రీస్తు సంఘం మీద కలిగియున్న ప్రభావాన్ని చూసి నేనెంతో ఆశ్చర్యపోతున్నాను. నేడు అహన్ని గాయపరచని మరియు జీవితాలను మార్చని సున్నితమైన మరియు తీయనైన సందేశాలకు మాత్రమే స్థానం ఉన్నది. తత్ఫలితంగా, అనేకమంది ప్రజలు తమ కష్టాలలో యేసు సహాయం చేయాలని మరియు భాదలలో తమను ఆదరించాలనే ఉద్దేశ్యముతోనే వారు ఆయనను సమీపిస్తున్నారు. తమ్మును యేసు బలంగా ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచి, ఎల్లప్పుడు సంతోషపరచాలనే కొరికలతోనే వారు ఆయనను వెంబడిస్తున్నారు. కాని పాపానికి వ్యతిరేకంగా పోరాటంగానీ, క్రీస్తు సారూప్యములోనికి చెక్కబడాలనే ఆసక్తిగాని వారికి ఎంతమాత్రము లేదు. పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధపరచు ప్రక్రియ వారిలో జరుగుతున్నట్లు ఏ రుజువును కనిపించదు. దేవుడు మనలను ఎన్నుకున్న ఉద్దేశము సహితం, వీరిచేత మరుగుపరచబడటం ఎంతో విచారకరం. వారు తన కుమారునితో సారూప్యముగల వారవుటకు (దేవుడు) వారిని ముందుగా నిర్ణయించెను”(రోమా 8:29) అని వాక్యం సెలవిస్తుంది. దక్షిణ ఆఫ్రికాలోని ప్రెస్సిటేరియన్ సంఘానికి చెందిన రాబర్ట్ బార్ ఇలా చెప్పారు.
“వినేవారందరికి ఇంపుగా అనుపించు సుతిమెత్తని సందేశాలు మన తరానికి అవసరంలేదు. నిజానికి ప్రజల నెమ్మదిచేరిచే సందేశాలు అవసరం. ప్రజలను కలతపెట్టడమంటే మనకు చాలా భయం. ఈ భయం మనలో చాలా కాలంగా ఉన్నది కాని ప్రజలను గాయపరచని సందేశాలనుగాని మరియు సందేశకులనుగాని పరిశుద్దాత్మడు వాడుకొనడు. తియ్యని మాత్రలతో రోగాన్ని సరిచేయగలమని చెప్పుకొను బూటకపు వైద్యునికి, శస్త్రవైద్యులెవరైనా చోటిస్తారా? అదేవిధముగా మానవాళి తీవ్ర సమస్యను నున్నని, సుతిమెత్తని మాటలతో పరిష్కరించవచ్చని పరిశుద్ధాత్మను ఒప్పించడం కూడా సాధ్యంకాదు. సిలువ దృశ్యము చూడముచ్చటైన సన్నివేశము కాదు; రక్తసిక్తమైన చెక్కదూలములపై వ్రేలాడే రక్తముకార్చు దేహము, వీక్షించడానికి ఒక సుందరమైన దృశ్యము కాదు. అయితే యేసు ఆ సిలువపై వ్యవహరించింది ఒక సుందరమైన దానితో కాదు. అక్కడ లోకపాపముతో ఆయన వ్యవహరించాడు. దానితో వ్యవహరించడానికే నేడు మనము కూడా పిలువబడ్డాము. కాని సుతిమెత్తని మాటలు ప్రజల ఆత్మీయ అవసరతలను తీర్చలేవని మనం గ్రహించాలి.
విధేయత
యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు ఒక గొప్ప ఆజ్ఞను ఇచ్చాడు. అదేమనగా “పరలోకమందును, భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు, కుమారునియొక్కయు, పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి” (మత్తయి 28:18-20) అపోస్తలులు సంఘాలకిచ్చిన తమ బోధలలో క్రీస్తు ఆజ్ఞలకు లోబడాలన్నది అతి ప్రాముఖ్యమైన హెచ్చరికగా వుండేది. పరిశుద్ధగ్రంథాన్ని చదివే ఒక సాధారణ పాఠకుడు కూడా అందలి గ్రంథకర్తల రచనలలో ఈ నాడిని పట్టుకోగలడు. తాను ఆజ్ఞాపించిన ఆజ్ఞలనన్నింటిని గైకొనమని క్రీస్తు ఆజ్ఞాపించాడు గనుక వారు దేవుని సంకల్పమంతయు బోధించారు. వాస్తవానికి మనము ఆయనను విశ్వసించి, ఆయనకు విధేయులవ్వడానికే దేవుడు తన సువార్తను మనకందించాడు. (రోమా 16:26) కుప్తంగా చెప్పాలంటే వాక్యానికి హృదయపూర్వకంగా లోబడి జీవించడమే యథార్థ క్రైస్తవజీవితము యొక్క లక్ష్యం.
కాని దీనికి వ్యతిరేకంగా ప్రమాదకరమైన క్రైస్తవ్యాన్ని' వ్యాప్తి చేసే బోధకులు దేవుని వాక్యానికి లోబడటం కంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీదనే దృష్టిమరల్చి బోధిస్తారు. తద్వారా వారిని వెంబడించే అనుచరులు దేవున్ని అనుభవించడానికి బదులు భౌతికపరమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికే దేవున్ని వెదుకుతారు. ఎలాంటి విధేయత లేకపోయినను, వారు కోరినదల్లా ప్రసాదించే ఒక దేవున్ని ఆ బోధకులు ప్రజలముందు ఉంచుతారు. వారు “యెహెూవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు” (ద్వితి 28:14) వంటి వచనాలను కూడా వాడుకొని తమ సిద్ధాంతాన్ని ప్రకటిస్తారు కాని వారు ఆ సందర్భాలలో “నీవు అనుసరించి నడచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహెూవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల...” (ద్వితి 28:14) అనే మిగతా లేఖన భాగాన్ని చూపించరు.
ప్రమాదకరమైన క్రైస్తవ్యం చేత భాదింపబడిన భాదితులు, ఒకవేళ లోబడాలని ప్రయత్నించినను, వారు దేవుని ఆజ్ఞలను కాదు గాని మనుష్యులు కల్పించిన సంఘ ఆచారాలను లేక సమాజపు ఆచారాలను పాటించడానికే మొగ్గుచూపుతారు. ఆదివారం సంఘానికి వెళ్ళడం, పెదవులతో ఆరాధించడం, ప్రార్థించడం, కానుకలివ్వడం, బైబిల్ ను చదవడం, మరియు ప్రసంగాలు వినడమే క్రైస్తవ జీవితమని అనేకులు భావిస్తారు. విధేయత ఉంటే ఈ కార్యక్రమాలను పాటించడం మంచిదే. అయితే సత్యమేమిటంటే, యేసుక్రీస్తును వెంబడించకుండానే ఈ కార్యక్రమాలను పాటించవచ్చును. ఇప్పటికే ప్రపంచమంతటా అనేకులు అలా చేస్తున్నారు. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన ఆజ్ఞలను గైకొనడమే క్రీస్తును వెంబడించడమని మనం గుర్తించాలి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, “మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నామని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యము లేదు.” (1 యెహను 2:3-4).
హృదయాలు నొచ్చుకొనే స్థాయిలో పాపాన్ని ఖండించే సందేశాలు నేడు ఎక్కడ బోధింపబడుతున్నాయి? దేవుని మార్గములో వినయముతోను మరియు విధేయతతోను నడువలసిన ప్రాముఖ్యతను వివరించే సందేశాలు ఎక్కడ ఉన్నాయి? దానికి బదులుగా అందరికి అనుకూలంగా ఉండే సందేశాలతో సంఘాన్ని సంఖ్యతో నింపాలనే పిచ్చి మాత్రమే కాని, జీవంగల దేవుని వాక్యంతో నశించే ఆత్మలను దేవుని రాజ్యములోనికి నడిపించాలనే భారం వారికి లేదు. యేసు స్వార్థపూరితమైన బహుజనసమూహాన్ని కాదుకాని విధేయులైన శిష్యులనే వెదుకుచున్నాడు.
“అంతట ఆయన తన శిష్యులను, జనసమూహామును తన యొద్దకు పిలిచి - నన్ను వెంబడింపగోరువాడు తన్నుతాను ఉపేక్షించుకోని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించకొనుగోరువాడు దానిని పోగొట్టుకొనును; నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? (మార్కు 8:34-36).
నేను గత పది సంవత్సరాల నుండి క్రైస్తవునిగా ఉంటున్నాను. కాని నేను సంఘాలలోగాని మరియు బహిరంగకూటములలో గాని ఈ పాఠ్యభాగము మీద సందేశాలను విన్న సందర్భాలు ఎంతో అరుదు. అపోస్తలుడైన పౌలు ప్రవచించిన అంత్యదినాలలో మనం జీవిస్తున్నాము. “ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసు..”కుంటారని (2తిమోతి 4:3) పౌలుప్రవచించాడు. నేడు పాపం విషయంలో రాజీపడని బోధలు కఠోరమైన బోధలుగా పరిగణించబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికిని, 'దురదగల చెవులను గోకే ప్రసంగీకులుగా మీరు ఉండకూడదు'అని నేను తరచుగా దేవుని వాక్యాన్ని ప్రకటించే బోధకులను మరియు ప్రసంగీకులను హెచ్చరిస్తాను. ఒకవేళ నేటి బోధకులకు యాకోబు వ్రాసిన పత్రికను తిరిగి వ్రాయడానికిగాని, సవరించడానికిగాని అవకాశమిస్తే వారు ఏమి చేస్తారో అని నేను తరచు ఆశ్చర్యపోతువుంటాను. బహుశ అందులోని కఠిన విషయములన్నిటిని తొలగించి, వినసొంపైన విషయాలను మాత్రమే మిగిలిస్తారని భావిస్తున్నాను. అలాగని మనం ప్రజల పట్ల సౌమ్యంగా ఉండకుండా వారిని ఖండించాలని నా భావం కాదు. ఒక యథార్థమైన దైవజనుడు దేవుని సంపూర్ణ సత్యమును ప్రకటించకుండా వుండలేడు. అదే విధముగా ఒక యథార్థమైన విశ్వాసి ఆ సంపూర్ణ సత్యాన్ని పాటించకుండా వుండలేడు.
కృప
మనము నోచుకోనని దేవుని ఉచితమైన ఔదార్యమే 'కృప' అని మనందరికి తెలుసు; దానిని మనము సంపాదించుకోలేము, దానికి అర్హులము కూడా కానేరము. కాని అది ఉచితముగా దేవునినుండి పొందుతాము. “దేవుని కృపచేత” అనే మాట నేడు ఊతపదంగా మారిందేగాని అర్థసహితంగా వాడబడడంలేదు. పరిశుద్ధ గ్రంథములో దేవుని కృపను గూర్చి ఇంకా ఏమైనా బయలుపరచబడిందా? కృపను గూర్చిన ఒక లేఖనము ఇలా తెలియజేస్తుంది. “ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రధమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను, బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్ క్రియలందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పంచుకొనెను. వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము” (తీతు 2:11-15)
ఈ ప్రాముఖ్యమైన సత్యాలను తప్పనిసరిగా సంఘములో నేర్పించాలని అపోస్తలుడైన పౌలు తీతును ఆదేశించాడు. అయినా నేటి ఆధునిక బోధకులు మరియు ప్రసంగీకులు ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం విచారకరం.
సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, మనము మన భక్తిహీనతను, ఇహలోక దురాశలను విసర్జించి, స్వస్థబుద్దితోను, నీతితోను, భక్తితోను బ్రతకాలనీ బోధిస్తుంది.“మీరు కృపకేగాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు. కనుక పాపము మీమీద ప్రభుత్వము చేయదు” అని అపోస్తలుడైన పౌలు సెలవిచ్చాడు (రోమా 6:14) అయినా ఎంతమంది క్రైస్తవులు తమకున్న నామకార్థపు ఆత్మీయతతో సరిపెట్టుకొని ఈ లోక సంబంధమైన విషయాలను వెంబడించుట లేదు? క్రీస్తును విశ్వసిస్తే శాంతిసమాధానాలు లభిస్తాయని, దేవుని రాజ్యములోకి ప్రవేశించవచ్చని అనేకులు భావిస్తారు. కేవలం దీని కోసమేనా యేసు సిలువలో తన ప్రాణాన్ని అర్పి్ంచింది? “ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్షించుకొనెను”(తీతు2:14) అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఆయన మరణమందలి ఈ ఉద్దేశ్యాన్ని గ్రహించామా? భక్తిపరమైన ఆసక్తికంటే లోకపరమైన ఆసక్తి, క్రొత్తగా క్రీస్తునొద్దకు నడిపింపబడిన వారితో సహా అనేకమందిపై ఏలుబడిచేయడం విచారకరం. 'ది పర్స్యూట్ ఆఫ్ గాడ్' (దేవుని వెంబడించుట) అను తన చక్కటి పుస్తకములో ఎ.డబ్ల్యూ. టీజర్ ఈ విధముగా విలపించారు.
'నేడు మారుమనస్సుకు సంబంధించిన వ్యవహారమంతయు యాంత్రికముగాను, ఆత్మరహితముగాను మార్చబడినది. ఇప్పడు నైతిక జీవితాన్ని ఏ మాత్రము ప్రభావితం చేయకుండానే ఆదాముస్వభావమును(పాత స్వభావము) ఏమాత్రము కలవరపెట్టకుండానే క్రీస్తునందు విశ్వసించవచ్చును. క్రీస్తు కొరకు ప్రత్యేకముగా ప్రేమంటూ ఏమీ లేకపోయినను ఆయనను అంగీకరించవచ్చు. రక్షింపబడినవాడే ! అయినను దేవునిపై అతనికి ఆకలిదప్పులు లేవట! నిజానికి ఆ ఉన్న కొంచంతో తృప్తిపడమని అతనికి నిర్థిష్టముగా నేర్పబడింది.”
ఆదిమ సంఘములో తమ సంఖ్యను పెంపొందించుకోవడానికి అపోస్తలులు లోకపరమైన ప్రయత్నాలేమి చేయలేదు. వారు కేవలం ఆయన పేరట మారుమనస్సు మరియు పాపక్షమాపణ కలదనే సందేశాన్ని ధైర్యంగా ప్రకటించారు. ప్రభువే వారికి తోడైయుండి అనేకులను వారితో చేర్చుచుండెను (లూకా 24:45-48) (మార్కు 16:20) వారు కృపాసువార్తను బోధించారుగాని, వారు ఆ సందేశాన్ని కలుషితం చేయలేదు. సిలువ వేయబడిన క్రీస్తును గూర్చి మరియు మానవులపై రానున్న ఉగ్రతను గూర్చి పేతురు బోధించినప్పుడు విన్నవారిలో రక్షణ పొందడానికి మేమేమి చేతుమనే” (అపో.2:37) స్పందనను అది పుట్టించింది. బాప్తీస్మమునిచ్చే యోహాను మారుమనస్సును గూర్చిన సందేశాన్ని ప్రసంగించినప్పుడు, అనేకులు తమ పాపాలను ఒప్పుకొని నీళ్లలో బాప్తిస్మము తీసుకొన్నారు (మత్తయి 3:6). “మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి” అని అతడు హెచ్చరించాడు. నేడు రక్షణపొందని పెళ్లికుమార్తెకు మరియు పెళ్ళికుమారునికి వివాహం నిమిత్తం, లేదా సంఘంలో సభ్యత్వం నిమిత్తం, బాప్తీస్మమునిచ్చే సేవకులు అనేకులు ఉండుట సిగ్గుచేటు. యేసుక్రీస్తు సంఘములో ఇలాంటి రాజీపడే వారిని మనమెట్లు సహిస్తున్నాము? నేటి క్రైస్తవ్యంలో కృపను గూర్చిన వాక్యానుసారమైన అవగాహన లోపించినట్లనిపిస్తుంది. 'వాటెవర్ హ్యపెండ్ టు ది గాసల్ ఆఫ్ గ్రేస్'(కృపాసువార్త ఏమాయనో?) అనే తన పుస్తకములో, జేమ్స్ మోంట్గొమేరీ బోయిస్ ఇలా వ్రాశాడు.
“నేటి సువార్త ఎక్కువశాతం ఆత్మగౌరవం, మంచి మానసికవైఖరి మరియు లోకపరమైన విజయంవంటి అంశాలను గూర్చే వివరిస్తుంది. నేటి సువార్త ప్రకటనలో దాదాపుగా పాపం, నరకం, తీరు, దేవుని ఉగ్రత అనే అంశాలు లోపిస్తున్నాయి. అంత మాత్రమే గాకుండా, నేటి క్రైస్తవ్యంలో క్రీస్తు మహిమ మరియు ఆయన సిలువ మీద సృష్టంగా కనబడే కృప, విమోచన, ప్రాయశ్చిత్తము, నీతిమంతులముగా తీర్చబడుట, మరియు విశ్వాసము అనే బోధలు కూడా లోపించాయి. వారి సువార్త బోధలో క్రీస్తుగాని లేక క్రీస్తు సిలువగానీ కేంద్ర బిందువుగా పరిగణింపబడటం లేదు. నేడు సువార్త కేవలం మానసిక భావన మరియు ఉద్రేకాల మీద మాత్రమే దృష్టిని పెడుతుంది.
ఒకవేళ మనం యేసుక్రీస్తు పరిచర్యనుగాని లేక అపోస్తలుల పరిచర్యను గాని గమనించినట్లయితే, వారు ఆశ్చర్యకార్యాలు మరియు అద్భుతాలు చేశారన్న మాట వాస్తవమే అయినను వారి సువార్త సందేశమంతయు కూడా మారుమనస్సు మరియు దేవుని రాజ్యము మీదనే కేంద్రీకృతమైయున్నది (మత్తయి 3:2; 4:7; మార్కు 6:12 ; లూకా 5:32; 24:47; అకా 2:38; 17:30; 20:21;). వారు దైవచిత్తానుసారమైన దు:ఖములేని కృపాసహితమైన సువార్తను ప్రకటించలేదు. అయితే “దైవచిత్తానుసారమైన దు:ఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయును; ఈ మారుమనసు దు:ఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దు:ఖము మరణమును కలుగజేయును” (2కొరింథీ 7:10) అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అనేకమంది దైవచిత్తానుసారమైన దు:ఖము లేకుండానే లోకానుసారమైన దు:ఖములతో యేసు వద్దకు వస్తునట్లుగా కనిపిస్తుంది. లోకములో ఉన్న దు:ఖమంతయు రోగం, ఆర్థిక ఇబ్దంది, నష్టం అన్యాయం, మరియు నిరాశ మొదలుగునవి. “దేవునికి సంబంధించనదియు, దేవునికి వ్యతిరేకముగా చేసిన పాపములకై పశ్చాత్తాపపడుట నుండి కలుగనిదియునైన దు:ఖమే లోకసంబంధమైన దు:ఖము అని అలర్ట్స్ బ్యాన్గారు వ్యాఖ్యానించారు. మనం ఈ దు:ఖముతో యేసు వద్దకు రావడం తప్పేమి కాదు. కాని ఒకవేళ ప్రజలు యేసు వద్దకు దైవచిత్తానుసారమైన దు:ఖము లేకుండా కేవలం లోకసంబంధమైన దు:ఖములనుండి విముక్తి పొందుకోవడానికే వచ్చినట్లయితే, వారు దేవునితో అన్యోన్యసహవాసాన్ని చేయలేరు మరియు వారికి నిత్యజీవం లేదు. “ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?” అని యేసుక్రీస్తు ఒకానొక సందర్భములో ప్రశ్నించాడు (మార్కు 8:36)
దైవచిత్తానుసారమైన దు:ఖముతో నిండియున్న హృదయం పాపము విషయమై దు:ఖపడుతుంది. పాపం మనలను దేవుని నుండి వేరు చేసింది గనుక మన హృదయం బాధపడుతుంది. పాపం ప్రేమగల పరిశుద్ధ దేవునిని గాయపరుస్తుంది. గనుక మన హృదయం దు:ఖిస్తుంది. దైవాచిత్తానుసారమైన దు:ఖముగల వ్యక్తి దేవునితో సమాధానపడాలని ప్రయత్నిస్తాడు. అంతమాత్రమే కాకుండా, తన పాపస్వభావాన్ని బట్టి ఎంతగానో వేదన చెందుతాడు. అతడు దేవునికి సమీపంగా జీవించాలనే అమితాసక్తిని కలిగివుంటాడు. కాని లోకసంబంధమైన దు:ఖముగల వ్యక్తి పాపవిషయమై దు:ఖమైనను, దేవుని కొరకైన ఆకలియైనను లేకుండా తన లోకపరమైన సమస్యలకు మాత్రమే పరిష్కారాలను వెదుకుతాడు.
ఈ ప్రమాదకరమైన క్రైస్తవ్యం' ప్రజలను దైవచిత్తానుసారమైన దు:ఖమునకు నడిపించకపోగా క్రీస్తును ఇహలోక సమస్యలకు పరిష్కారముగా చిత్రీకరించడం బహువిచారకరం. ఈ రకమైన క్రైస్తవ్యం ఆశీర్వదించే దేవున్ని కాక ఆశీర్వాదాలనే వెదకులాగున చేస్తుంది. నేడు ప్రజలు తమ హృదయాలలో పాపమును గూర్చి ఎలాంటి అసౌకర్యమైన భావన గాని లేక దు:ఖంగాని లేకుండానే వారు యేసునందు సౌకర్యముగా విశ్వాసమును ఉంచుచూ జీవించడము ఎంతో విస్మయం కలిగిస్తుంది. ఎన్నడూ మారుమనస్సుపొందక, మేధోపరంగా మాత్రమే నమ్మినవారికి ఈ “ప్రమాదకరమైన క్రైస్తవ్యం' రక్షణ విషయమై ఒక అబద్ధపు నిరీక్షణను పుట్టిస్తుంది. ఇదే విషయాన్ని డైట్రిష్ బాన్ హెూఫర్ మాటలలో చెప్పాలంటే, 'ఈ “ప్రమాదకరమైన క్రైస్తవ్యం' మనవైపునుండి ఎటువంటి మారుమనస్సు, విధేయత మరియు సమర్పణగాని లేని 'చౌకకృప'ను మాత్రమే ప్రకటిస్తుంది కాని ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాన్నే బలిగా అర్పించి మనలను తిరిగి దేవుని స్వరూపములోనికి తీసుకొని వచ్చిన 'విలువైన కృప'ను ఎంతమాత్రము ప్రస్తావించదు.'
బైబిల్ పరమైన రక్షణను గూర్చి బహుగా అపార్థము చేసుకొనబడుచున్న ఈ రోజులలో, 'షెల్ హమార్' అను దైవజనుడు, 'లోతులేని ఉజ్జీవాల విషయమై వ్రాస్తూ , మనకు అత్యంత అవసరమైన హెచ్చరికను ఇలా వ్యక్తపరిచాడు - 'దేవుని రాయబారులు అపవాది ప్రతినిధులు కావటం ఎంత భయంకరం! అని జాన్ వెస్లీ బిగ్గరగా అరిచి విలపించాడంటే అందులో ఆశ్చర్యం లేదు. పరలోకమార్గాన్ని ప్రజలకు బోధించడానికి నియమించబడినవారు నరకమార్గాన్ని బోధించడం ఎంత భయంకరం. 'ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు?' అని ఒకవేళ ప్రశ్నిస్తే, 'వివిధ శాఖలనుండి వివిధప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్న పదివేలమంది (లెక్కకు మించినటువంటి) జ్ఞానులు మరియు ఘనతగల వ్యక్తులే ఈ పని చేస్తున్నారు. వారు అహంకారులకు, అలక్ష్యముగా ప్రవర్తించువారికి, శరీరానుసారులకు, లోకాన్ని అమితంగా ప్రేమించేవారికి, అన్యాయస్తులకు, నిర్లక్షంగా జీవించేవారికి, పనికిమాలిన వ్యక్తులకు, నీతికొరకు ఎటువంటి శ్రమను పొందనివారందరికి, పరలోకానికి వెళతారనే నిరీక్షణను, పరలోకమార్గంలోనే నడుస్తున్నారనే భ్రమను కల్పిస్తారు.”
తుది పలుకులు
ప్రియ చదువరీ, 'ప్రమాదకరమైన క్రైస్తవ్యము' వలన మీరు మోసపరచబడకుండా మిమ్మును మీరు జాగ్రతగా చూచుకొనుడి. మీరు ఆత్మీయంగా మేల్కొనాలి. మనందరికి నేడు కావలసినది వాక్యానుసారమైన క్రైస్తవ్యం. వాక్యానుసారమైన క్రైస్తవ్యమనునది పరిశుద్దతలో కూడిన దేవుని ప్రేమను, విధేయతతో కూడిన ఆశీర్వాదమును, పశ్చాత్తాపముతో కూడిన క్షమాపణను, దైవచిత్తానుసారమైన దు:ఖముతో కూడిన పరలోక ఆనందాన్ని, సిలువతో కూడిన కిరీటాన్ని, నీతితో కూడిన శాంతిని, మరియు భక్తితో కూడిన కృపను బోధిస్తుంది. అంతమాత్రమే కాకుండా ఇది దేవుని భయంతో కూడిన క్రీస్తునందలి విశ్వాసాన్ని, పాపనిష్క్రమణతో కూడిన నీటి బాప్తీస్మాన్ని, జీవిత పరివర్తనతో కూడిన క్రీస్తునందలి నమ్మకాన్ని మరియు స్వీయ ఉపేక్షతో కూడిన క్రీస్తు అనుసరణను బోధిస్తుంది. ఇది యేసు బోధించిన ఇరుకు మార్గాన్నే చూపిస్తుంది. ఇది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడటం గురించి, సిలువనెత్తుకొని యేసుని వెంబడించడం గురించి, స్వయాన్ని ఉపేక్షించడం గురించి, శ్రమలను భరించడం గురించి, లోకాన్ని త్యజించడం గురించి, నీతికోరకై ఆకలిదప్పులు కలిగివుండటం గురించి, ఇతరులతో సమాధానంగా జీవించడానికి శక్యమైనదంతయు చేయడం గురించి, నశించువారికి క్రీస్తు సువార్తను ప్రకటించడం గురించి, మరియు బీదలకు, అవసరతలో ఉన్నవారికి, ఉదారంగా సహయపడటము గురించి బోధించబడింది, ( 1యోహను 4:10:11; 1పేతురు 1:15-16;1యోహాను 3:22; అపో.3:20; మత్తయి 5:4,6; యాకోబు 1:12; కీర్తనలు 85:10 ; తీతుకు 2:11-12 ;అపో.2:38; లూకా 9:23; హెబ్రీ 12:7,14; మార్కు 11:22 ; కీర్తనలు 111:10; మార్కు 16:15; 1యోహాను 2:15-17 ;రోమా 12:13 ).వాక్యానుసారమైన క్రైస్తవ్యము భూసంబంధమైన వాటి మీదకాక, పైనున్న వాటి మీదనే మనస్సు పెట్టులాగున ఉజ్జీవపరచే మహిమాన్వితమైన క్రైస్తవ్యము. వాక్యానుసారమైన క్రైస్తవ్యాన్ని అనుసరించే వారు భూమిమీద పరలోకపు స్ప్రుహ కలిగి జీవిస్తారు. నేడు మనకు ఇటువంటి క్రైస్తవ్యమే ఎంతో అవసరం. మనమందరము శరీరానుసారమైనవన్నిటిని గురించి దీనత్వముతో పశ్చాత్తాపమునొంది నిజమైన ఆత్మీయతను అనుసరిద్దాము.
'ఓ దేవా! మీరు నీతిమంతులని మరియు పాపంతో ఎంతమాత్రం రాజీపడరని మాకు తెలియును. మేము మీ పరిశుద్ద ప్రభావము ఎదుట మోకరిస్తున్నాము. మేము కూడా పాపంతో రాజీపడకుండా జీవిస్తామని ఒప్పుకుంటున్నాము. మీ కనికరమును బట్టి మమ్ములను మార్చండి'. యేసు నామమున ఆమెన్!