విమర్శలకు జవాబు

రచయిత: జి.బిబు & పి.సురేశ్ బాబు

 

కృతజ్ఞతలు

బైబిల్ కు వ్యతిరేకంగా ఒక నాస్తికుడు చేసిన విమర్శలను తిప్పికొట్టాలని మేము చేసిన ప్రయత్నంలో అనేక మంది సహోదరీసహోదరుల సహాయం, సహకారం, ప్రోత్సాహం మరియు ప్రార్థన ఉంది. ఎప్పటిలాగే ఈ పుస్తకాన్ని కూడా ఎడిట్ చేయడానికి మాతో సమానంగా ప్రయాసపడిన సహోదరులు యం.చంద్రశేఖర్ గారిని ప్రభువు నామంలో అభినందిస్తున్నాము. ముందుమాట వ్రాసిన సహెూదరులు జోషి లీలన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు. డిటిపిలో సహాయపడిన జ్యోత్స శ్రీనివాస్ దంపతులకు, అడెస్ట్ డిజిటల్స్ వారికి, ప్రూఫ్ రీడింగ్ లో సహాయపడిన సహోదరి గ్లోరి ప్రసన్న గారికి మా హృదయపూర్వకమైన వందనాలు. తెర వెనుక చేయాల్సినవెన్నో ఎంతో ప్రేమతో చేసి ఈ పుస్తకాన్ని ముగించడానికి సహాయపడినందుకు జి. విజయ్ ప్రసాద్ మరియు జి.ఎస్.పి. లీలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాము. ఈ పుస్తకము విషయమై తమ ప్రార్ధన సహాయాన్ని అందించిన వారందరికి మేము ఎంతగానో రుణపడి ఉన్నాము. అన్నిటికంటే అధికంగా, మన ప్రార్థనలను, ప్రయాసను అంగీకరించి, ఈ పుస్తకాన్ని తన సేవార్ధమై ప్రచురించటానికి అందరిని, అన్నిటిని సమకూర్చిన దేవాదిదేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక, ఆమెన్.
- --జి. బిబు
-పీ. సురేష్ బాబు

 

 

ముందుమాట

 

బైబిల్ ని ఎవ్వరూ నాశనం చెయ్యలేరని బైబిల్ ఎలుగెత్తి చాటుకుంటుంది. ఈ లోకంలో ఏ గ్రంథం కూడా తన శాశ్వతత్వాన్ని గూర్చి ఇంత నిర్భయంగా, విశ్వాసముతో కేక వేసి చెప్పలేకపోయింది.

“సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వువలె ఉన్నది; గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడు నిలుచును.” (1 పేతురు 1:24)

“ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు.” (మత్తయి 24:35)

చరిత్రలో అనేకమంది చక్రవర్తులు, నియంతలు, వేదాంతులు బైబిల్ ను భూమి మీద ఉండకుండా తీసివేయాలనుకున్నారు. అలా అనుకున్నవారంతా కాల గర్భంలో కలిసిపోయారు. కాని బైబిల్ గత 3500 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. క్రీ.పూ. 597లో యెహెూయాకీము అనే ఇశ్రాయేలు రాజు దైవ గ్రంథాన్ని నాశనం చేయాలని ప్రయత్నించి తాను అంతమైపోయాడు. క్రీ.పూ. 168లో సెల్యూసీడ్ రాజు ఆంటియోకస్ ఎపిఫేనస్ మోషే పంచకాండాలను, పాత నిబంధన ప్రతులను నాశనం చేసే ప్రయత్నం చేసాడు. విజయం సాధించాను అని అనుకున్నాడు. కానీ పాత నిబంధన జీవించే ఉంది. అతడు కూడా కాలగర్భంలో కలిసిపోయాడు. క్రీ.శ. 303 లో డైయొక్టీషియన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యంలో బైబిల్ ఉండకూడదని ఆజ్ఞ జారీ చేసాడు. క్రైస్తవులంతా బైబిల్ ను తెచ్చి అప్పగించాలని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత గృహాలను శోధించి బైబిల్ తో కనబడినవారిని చంపించాడు. ఆ తదుపరి డైయొక్లిషియన్ ఎంతో గర్వంగా 'నేను భూతలము పై నుండి క్రైస్తవ లేఖనాలను తీసివేశాను' అని ప్రకటించాడు. సుమారు 17 సంవత్సరాల తరువాత క్రైస్తవుడుగా మారిన కాన్స్టాంటైన్ చక్రవర్తి బైబిల్ కావాలని అడుగగా 25 గంటలలో 50 బైబిల్లు ఆయన వద్దకు వచ్చాయి. క్రీ.శ. 1778లో వోల్టేర్ అను ఫ్రెంచ్ నాస్తికుడు బైబిలను నాశనం చేసే ప్రయత్నాలను చేసి ఇలా అన్నాడు, 'ఇంకా వంద సంవత్సరాలలో క్రైస్తవ్యం భూమి మీద ఉండదు'. దైవ ఘటన ఏమిటంటే, అతను చనిపోయిన 50 ఏండ్లకే ఏ ప్రింటింగ్ ప్రెస్స్ ను అయితే అతడు బైబిల్ కు వ్యతిరేకమైన విషాన్ని వెళ్లగక్కడానికి ఉపయోగించాడో అదే ప్రెస్స్ ను మరియు అతని ఇల్లును జెనీవా బైబిల్ సొసైటీ వారు ఉపయోగించుకొని ప్రపంచమంతా బైబిల్లు పంపిణీ చేశారు. ఫ్రెంచ్ చక్రవర్తి తన రాజ్యంలో ఉన్న క్రైస్తవులను రూపుమాపాలని హింసించడం కొరకు ఆజ్ఞ జారీ చేసినప్పుడు థియోడర్ బేజు అనే వృద్ధ దైవజనుడు ఆ చక్రవర్తితో ఇలా అన్నాడు- 'సార్, మీరొక విషయాన్ని తెలుసుకోవాలి. అనేకమైన సుత్తులను అరగదీసిన దావలి దేవుని సంఘము'

మిత్రులు, తోటి దేవుని సేవకులైన జి. బిబుగారు & పి. సురేష్ బాబుగారు రచించి ప్రచురించిన 'నాస్తిక నిందలు - బైబిల్ నిజాలు' అనే ఈ పుస్తకం క్రైస్తవ తరానికి ఒక గొప్ప ఆశీర్వాదం. 276 నాస్తిక విమర్శలకు వారు వ్రాసిన క్రైస్తవ జవాబులు ఆలోచనను రేకెత్తించేవిగా, క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచేవిగా ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సమగ్రమైన జవాబు ఇవ్వడం సాధ్యంకాదు. చేతగాక కాదు గాని ఎంత వ్రాసినా ఇంకా వ్రాయవచ్చు. స్థలం, సమయం సరిపోవాలిగా! “మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండుడి” అని 1పేతురు 3:15లో పేతురు చెప్పినట్లుగా వీరు చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. దేవుడు వీరి ఈ ప్రయత్నాన్ని మరియు భవిష్యత్ ప్రయత్నాల్ని దీవించును గాక!

గత 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో అనేక భాషలలో రకరకాలుగా బైబిల్ కు, క్రైస్తవ విశ్వాసానికి, క్రీస్తు ప్రభువునకు వ్యతిరేకంగా విషం చిమ్మిన సాహిత్యం, రచయితలు, కళాకారులు కనుమరుగైపోయారు. వారి సాహిత్యం మరుగునపడిపోయింది. కాని క్రైస్తవ సంఘం కొనసాగుతూనే ఉంది. బైబిల్ సజీవంగానే ఉంది. రోజు రోజుకి చదివే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రీస్తు సజీవుడు, దేవుని వాక్యం సజీవమైనది. దేవుని సమయం వచ్చే వరకు సంఘం క్రియాశీలకంగానే ఉంటుంది.

2009లో సహెూ. బిబుగారు జస్టిస్ సోమశేఖర్ కమీషన్ కొందరు హైందవ ఛాందసవాదులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పినప్పుడు, అలాగే “బైబిల్ దేవుని వాక్యమా' అంటూ అహ్మద్ దీదాత్ అనే ఒక ముస్లిమ్ దావా ప్రచారకుడు లేవనెత్తిన విమర్శలను 'ఏది దేవుని వాక్యం - బైబిలా? ఖురానా?' అనే తన రచన ద్వారా తిప్పి కొట్టినప్పుడు దేవుడు వారికిచ్చిన అదే విజయం ఈ పుస్తకం ద్వారా కూడా అనుగ్రహించును గాక.

తోటి దైవ సేవకులు
డా|| జోషి లీలన్ రెడ్డి,
సీనియర్ పాస్టర్ - గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్, హైదరాబాద్
వ్యవస్థాపక అధ్యక్షులు,
ఇండియా థియోలాజికల్ సెమినరీ, తెలంగాణ & ఆంధ్రప్రదేశ్

 

పరిచయం

కోన వీరబ్రహ్మం అనే ఒక నాస్తికుడు, “బైబిల్ బాగోతం' అనే శీర్షికతో బైబిల్ ని విమర్శిస్తూ, 276 ప్రశ్నలతో కూడిన ఒక పుస్తకం వ్రాశాడు. ఈ ప్రశ్నలలో పస లేనప్పటికీ, వాటి సంఖ్య ఎక్కువ కాబట్టి, వాటికి జవాబు వ్రాయటం మాకొక సవాలుగానే అనిపించింది; అయినా వ్రాయక తప్పలేదు. వాటి పసలేనితనాన్ని ఎవరో ఒకరు బయటపెట్టకపోతే, అవి ఎవ్వరు విప్పలేని చిక్కుముడులేమో అని తలంచే అమాయకుల కోసమైనా తప్పక వ్రాయాలిగా మరి?

నాస్తిక పక్షపాతం, బైబిల్ మీద ద్వేషంతో స్థిరపరచుకున్న పూర్వాభిప్రాయాలు మరియు హేతువాద ముసుగులో మోసగించే బుద్ధిమాంద్యాన్ని పసిగట్టేలా ఈ మా పుస్తకం తప్పక సహాయపడుతుందని మేము నమ్ముతున్నాము. అవన్నీ బ్రహ్మంగారి ప్రతీ ప్రశ్నలో ఎంతో ప్రస్ఫుటంగా ప్రదర్శించబడ్డాయి మరియు మా ప్రతి జవాబులో బహుస్పష్టంగా బహిర్గతం చేయబడ్డాయి. కొందరు ఏది ఏమైనా బైబిల్ ను తిరస్కరించి తీరాలని తీర్మానించేసుకున్నారు. అయితే, ఆ తీర్మానాన్ని సమర్థించుకోడానికి తగిన కారణాలు లభించకపోతే, తప్పుడు చిత్రీకరణలు, తింగరి వాదనల తట్టు తిరగడం తప్ప, పాపం వారు మాత్రం ఏంచేస్తారు? అయితే, బైబిల్ ను తిరస్కరించటమే తప్ప ఆ తిరస్కారాన్ని సమర్థించుకోగలిగే ఏ ఆధారాన్ని కానీ, కారణాన్ని కానీ ఎవ్వరూ కనిపెట్టలేరని ఇక్కడ మేము మరోసారి నిరూపించాము. ఎన్ని విమర్శలు కల్పించినా, లోపం బైబిల్లో కాదు, ఖచ్చితంగా వారి కుతర్కంలోనే ఉండితీరాలి. లేదంటే, 276 విమర్శలలో కనీసం ఒక్కటైనా సారవంతంగా లేకపోవటమేంటి?

మానవ మనస్సులలో ఉన్న దైవభావాన్ని నశింపజేయాలన్నది ఒక నాస్తికుని లక్ష్యం. దేవుడున్నాడన్న క్రైస్తవ విశ్వాసం పూర్తిగా బైబిల్ పై ఆధారపడియుంది కాబట్టి, బైబిల్ అసంబద్ద, అనైతిక లేదా అతార్కిక భావాలతో కూడిందని నిరూపిస్తే, బైబిల్ ఆధారిత దైవవిశ్వాసాన్ని కూలద్రోయొచ్చనే దురుద్దేశ్యంతో బ్రహ్మంగారు ఈ పుస్తకం వ్రాశారు. అయితే, వంద అబద్దాలాడైనా ఒక పెళ్లి చెయ్యమని చెప్పే కొందరిలా, వేయి అబద్ధాలాడైనా సరే ఒకనిని నాస్తికుడిగా మార్చే గట్టి ప్రయత్నమే ఆయన పుస్తకమంతటిలోను ప్రస్ఫుటంగా ప్రదర్శించబడింది. 276 అబద్దాలు వ్రాసి, ఇవన్నీ నిష్పక్షపాతంగా బైబిల్ చదివి వెలికి తీసిన సత్యాలుగా తనకు తాను ఆత్మవంచన చేసుకోవటం మాత్రమే కాకుండా, అనేకులను అలాంటి మోసానికి గురిచేసే రచనను కూడా చేసి, అబద్దాల అండ లేకుండా నాస్తికత్వం మనలేదని బహుచక్కగా నిరూపించుకున్నారు. నాస్తికత్వం హరించివేసిన తన నిజాయితీలో శేషమేమైనా మిగిలియుంటే, మా జవాబులు తన వాదనలను ఎందుకు నిరర్థకం చేయవో రుజువు చేసుకోవాలి. అది చేతకాకపోతే, బైబిల్ను తప్పుగా చిత్రీకరించినందుకు, అలాంటి అబద్దాలను ప్రచురం చేసినందుకు, తెలుగు క్రైస్తవ సంఘానికి బేషరతుగా క్షమాపణ చెప్పి, తన పుస్తకాన్ని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించాలి. అంతే కాకుండా, తాను నమ్మిన నాస్తికత్వం అంత సత్యసందమైనదైతే, ఒకనిని నాస్తికుడిగా మార్చటానికి, లేదా బైబిల్ లో సత్యం లేదని తనకు తాను నమ్మబలుకుకోవటానికి ఇన్ని అబద్ధాల సహాయం ఎందుకు అవసరమైందో ఆత్మవిమర్శ చేసుకోవాలని తన శ్రేయస్సు కోరి ప్రాధేయపడుతున్నాము.

ఇరుపక్షాల వాదనలను నిష్పక్షపాత వైఖరితో పాఠకులు పరిశీలించగలిగే విధంగా ఈ పుస్తకం రూపొందించబడింది. బ్రహ్మంగారు లేవనెత్తిన ప్రతి ప్రశ్నను 'వీరబ్రహ్మం' అనే హెడ్డింగ్ క్రింద ఉన్నదున్నట్లుగా ఉదహరించి, ప్రతి ప్రశ్న క్రింద 'జవాబు' అనే హెడ్డింగ్ తో మా సమాధానాన్ని వ్రాశాము. బ్రహ్మంగారి ప్రశ్నలను కుదించటంకాని, వాటి వరుస క్రమాన్ని మార్చటం కాని జరగకుండా జాగ్రత్త వహించాము.

క్రైస్తవులకు ఓ విజ్ఞప్తి. వాదప్రతివాదాలు మనకెందుకు, వితండవాదాలతో మనకేం పని అనుకునే క్రైస్తవులెందరో లేకపోలేదు. 1పేతురు 3:15; యూదా 1:3; 2కొరింథి 10:4-5, తదితర వచనాలలో ఉన్న క్రైస్తవ బాధ్యతను మరచిపోవద్దని, దానిని శిరసావహించటానికి తాము చేయాల్సినదేమిటో కూడా ప్రార్థనాపూర్వకంగా ఆలోచించుకోవాలని ప్రభువు ప్రేమనుబట్టి వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే, ఈ పుస్తకం, కేవలం ఒక నాస్తికవాదికి జవాబు మాత్రమే కాదు. ఒక వాక్యభాగాన్ని ఎంత మూర్ఖంగా అపార్థం చేసుకునే వీలుందో, జాగ్రత్తగా చదివినప్పుడు దాని అసలు అర్థం ఎంత సారవంతంగా ఉంటుందో తెలియజెప్పటానికి మా ఈ ప్రయత్నం తప్పక సహాయపడుతుంది. అర్థవంతంగా, నిష్పక్షపాతంగా బైబిల్లోని అనేక వాక్యభాగాలకు ఎలా భాష్యం చెప్పాలో ఈ మా పుస్తకంలో చూపించబడింది. ఈ ప్రయత్నాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, ప్రతి విశ్వాసి బైబిలను ఎదిరించేవారికి ఇదే పద్దతిలో జవాబు చెప్పే సాధనను ప్రభువు ప్రేమను బట్టి చేపట్టాలని మనవి చేస్తున్నాము. ఆయన పరలోకంలో మనకు ఉత్తరవాదిగా ఉన్నప్పుడు, భూమిమీద మనం ఆయనకు ఉత్తరవాదులుగా ఉండటం మన రుణానికి మించిన విధి కాదని మా మనవి. తెలుగులో బైబిల్ ని విమర్శిస్తూ కనీసం 110 పుస్తకాలు రచింపబడ్డాయి. వాటిలో కనీసం పదింటికైనా సరిగ్గా జవాబులు వ్రాయబడలేదు. జవాబు లేక కాదు, క్రైస్తవులకు తమ బాధ్యత బోధపడలేదు కాబట్టే ఈ దుస్థితి. సువార్తను అంగీకరించకపోవటానికి లోపం బైబిల్ లో ఉందనే సాకు ఎవ్వరికీ లేకుండా చేద్దాం. అనుమానాల అడ్డుబండలను తొలగించి, వారికి మార్గం సరాళం చేద్దాం (యెషయా 14:7). ఇక్కడ బైబిల్ బాగోతమనే బ్రహ్మంగారి రచనకు మేము చేసినట్లే, ప్రతి బైబిల్ విమర్శను ఓటమిపాలు చేద్దాం, సంపూర్ణంగా నిర్మూలం చేద్దాం. సువార్త-సత్యమేవ-జయతే. సమస్త మహిమా ప్రభు యేసుక్రీస్తు నామమున దేవునికే కలుగునుగాక. ఆమెన్.

జి. బిబు,
పి. సురేష్ బాబు.

20-05-2017

1. వీరబ్రహ్మం- యేసు తండ్రి యోసేపు పుట్టింది యాకోబుకా, హెలీకా?
మత్తయి 1:16 లూకా 6:23

క్రొత్తనిబంధనలో యేసు వంశావళి కొండవీటి చేంతాడంత ఉంది. అంతమాత్రాన దానికి లేని ఘనతా రాదు, అది నిజచరిత్ర అని భ్రమింపజేస్తే నమ్మాల్సిన అవసరమూ లేదు. పరస్పర విరుద్ధ విషయాల్లో ఏది సత్యమవుతుంది? మత్తయి సువార్తలో యేసు వరకు 42 తరాలు పేర్కొనబడితే, లూకా మరింత ముందుకు వెళ్ళి యోసేపు వరకు 75 తరాల పేర్లు వ్రాశాడు (మత్తయి 1:16, లూకా 6:23)

మత్తయి 1:16 ప్రకారమైతే “యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను”. లూకా 6:23 ప్రకారం “యోసేపు హేలీకి” కుమారుడు (బైబిల్ బాగోతం ప్రశ్న1 పేజీ నం. 13)

జవాబు :మత్తయి సువార్తలో నమోదు చేయబడిన యేసుక్రీస్తు వంశావళిలో అబ్రాహాము నుండి యోసేపు వరకున్న తరములు మాత్రమే లెక్కించబడిన కారణాన అవి 42 తరాలని పేర్కొనడం జరిగింది. అయితే లూకా సువార్తలో నమోదు చేయబడిన యేసుక్రీస్తు వంశావళిలో యోసేపు నుండి ఆదాము వరకున్న తరాలు లెక్కించబడిన కారణాన అవి 175 తరాలుగా పేర్కోబడ్డాయి . ఇందులో పరస్పర వైరుధ్యం ఏముంది ?

ఇకపోతే యోసేపు యాకోబు కుమారుడా, లేదా హేలీ కుమారుడా అనే వివాదానికి పరిష్కారం ఎంతో సులువైనది.

ప్రతీ వ్యక్తికి ఒకటి కాదు రెండు వంశావళులు వుంటాయి. ఒకటి తండ్రి తరపు నుండి, మరొకటి తల్లి తరపు నుండి. అలాగే మత్తయి, యేసు తండ్రిగా ఎంచబడిన యోసేపు వంశావళిని; లూకా, మరియ వంశావళిని ప్రస్తావిస్తున్నారు కాబట్టి, యాకోబు యోసేపుకు, హేలి మరియకు తండ్రి అని గుర్తించగలము. మత్తయి మరియు లూకా వ్రాసిన యేసు జనన వృత్తాంతం ఇందుకు ఋజువు. మత్తయి 1:18-25 యేసు జననాన్ని యోసేపు కోణంనుండి తెలపగా,  లూకా 1:26-56 యేసు జననాన్ని పూర్తిగా మరియ కోణంనుండి వివరిస్తుంది. అదే నిజమైతే, మరియ హేలి కుమార్తె అని కాకుండా యోసేపు హేలి కుమారుడని లూకా ఎందుకు వ్రాసినట్లు? దీనికి సమాధానం సులభమే. వంశావళిలో స్త్రీ పేరుకు బదులుగా ఆమె భర్తను పేర్కొనే హెబ్రీయుల ఆచారానుసారంగా లూకా మరియ స్థానంలో యోసేపు పేరు వ్రాసాడు. హెబ్రీయుల ఆచారం తెలిసినవారికి, స్త్రీ తన భర్త పేరుతో తెలియబడడం వారు ఎంత గౌరవప్రదంగా భావిస్తారో తెలుసు (యెషయా 4:1 ఇందుకు ఒక నిదర్శనం)

లూకా యోసేపును మరియకు బదులుగా పేర్కొన్నాడనడానికి ఎన్నో ఆధారాలు వున్నాయి. గ్రీకు తెలిసినవారెవరైనా మనకు ధృవీకరించగలిగే మొదటి ఋజువేమిటంటే, లూకా తన జాబితాలోని ప్రతీవ్యక్తికీ, అతడు ఫలానావారికి కుమారుడు అని తెలుపుతూ వాడిన ఉపపదం (డెఫినెట్ ఆర్టికల్) "యోసేపు హెలికి” అని చెప్పినప్పుడు వాడలేదు. కాబట్టి తెలుగులో లేదా ఆంగ్లంలో స్పష్టంగా తెలియకపోయినా గ్రీకు చదివేవారు, యోసేపు మరొకరి స్థానంలో పేర్కొనబడుతున్నాడని ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తించగలరు.
పై వాదనను బలపరచే రెండవ వాస్తవమేమిటంటే, యాకోబు యోసేపును కనెను అని మత్తయి తెలపగా, హేలి యోసేపును కన్నాడు అని లూకా చెప్పడం లేదు. యోసేపు హేలికి కుమారుడని మాత్రమే చెబుతున్నాడు. అంటే, యోసేపు యాకోబుకే కన్నకుమారుడైనప్పటికి, మరియతో వివాహం ద్వారా హెబ్రీయుల వాడుక చొప్పున ఆమె తండ్రికి కుమారుడనబడ్డాడు. కోడళ్ళను కుమార్తెలుగాను, అల్లుళ్ళను కుమారులుగాను పరిగణించడం, గౌరవించడం హెబ్రీయుల సాంప్రదాయం (రూతు 1:11).

మూడవదిగా, క్రీస్తును తమ బద్దశత్రువుగా భావించిన రబ్బీయుల యెరూషలేము తాల్ముడులో మరియను వారు హేలి కుమార్తెగా సంబోధించిన దాఖలాలు వున్నాయి. (హగ్గగా 2:4) (ఫ్రెచెన్ బీమ్ 1995:1013). బైబిలేతర సాక్ష్యాలతో మనకు పనిలేనప్పటికి, శత్రువు నోట వెలువడిన సత్యవాంగ్మూలానికున్న ప్రాధాన్యత ఇలాంటి ఆధారాలకు ఎలాగూ వుంటుంది కదా ! ఈ ఋజువులన్నిటి ఆధారంగా మత్తయి మరియు లూకాలు నమోదు చేసిన యేసు వంశావళులపై ఆరోపించబడిన సమస్యలన్నీ నిర్వీర్యమైపోయాయి.
ఈ వాస్తవాలను పరిశోధించి తెలుసుకోకుండా బ్రహ్మంగారు తన పుస్తకపు మొట్టమొదటి ప్రశ్నలోనే అనుచిత విమర్శకు పాల్పడ్డారు. ఆదిలోనే హంసపాదు అంటే ఇదే మరి !

2. వీరబ్రహ్మం-యేసుకి పేరు ఎవరు పెట్టింది భాయమైంది? దేవదూత పెట్టిందా? ప్రభువు పెట్టిందా? ప్రభువు పెట్టింది కాదు. దేవదూత పెట్టిన పేరే ఖాయమైంది!
దేవదూత మరియ కొడుక్కి “యేసు” అను పేరు పెట్టమన్నాడు. ప్రభువు "ఇమ్మానుయేలు” అని పేరు పెట్టమని ప్రవక్త ద్వారా పలికాడు. కడకు యోసేపు తన కుమారునికి “యేసు” అనే పేరు పెట్టాడు. మరి సర్వోన్నతుడైనటువంటి ప్రభువు మాట నెరవేరలేదు గదా? కావాలంటే మత్తయి 1:21-25 వరకు గల వాక్యాలు చూడండి. (బైబిల్ బాగోతం ప్రశ్న 2 పేజీ నం. 12)

జవాబు: దేవుని చేత ఎన్నుకోబడిన “ఇమ్మానుయేలు” అను పేరు పెట్టబడటానికి బదులు, దేవదూత చేత పలుకబడిన “యేసు” అన్న పేరు పెట్టబడింది కనుక దేవుని ప్రవచనం నిరర్థకమైపోయింది కదా అని బ్రహ్మంగారి వాదన. అయితే ఆయన సలహా మేరకు మత్తయి 1:21-25 వచనాలను దయచేసి చదవండి. 23వ వచనంలో యేసు అని పేరు పెట్టబడడం” “ఇమ్మానుయేలు” అని పేరు పెట్టబడుతుందనే ప్రవచనానికి నిరర్థకతగా కాకుండా నెరవేర్పుగా పేర్కొనబడటం ప్రత్యేకించి గమనించండి. ఐతే ఇది ఎలా సాధ్యమన్నదే అసలు ప్రశ్న. దేవుడు ప్రవచనాత్మకంగా మెస్సీయకు ఆపాదించిన అనేక పేర్లలో “ఇమ్మానుయేలు” అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే. ఇది కాకుండా ఇంకా అనేక పేర్లు ఆయనకు ప్రవచనాత్మకంగా ఆపాదించబడ్డాయి. ఉదా : యెషయా 9:6 చూడండి “ఆశ్చర్యకరుడు”, “ఆలోచనకర్త”, “బలవంతుడైన దేవుడు” , “నిత్యుడగు తండ్రి”, “సమాధానకర్తయగు అధిపతి”, ఇవన్నీ ఆయనకు పెట్టబడాల్సిన పేర్లే కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇవన్నీ 'గుణవాచక నామాలే తప్ప వ్యక్తిగత నామవాచకాలు కావు. అంటే ఇవన్నీ మెస్సీయ నెరవేర్చే కార్యాలను లేక ఆయన వ్యక్తిత్వానికి చెందిన గుణలక్షణాలను వర్ణించే పేర్లు. మెస్సీయ పుట్టినప్పుడు ఆయనకు ఏ పేరు పెట్టబడినా సరే దేవుడే శరీరధారియై మన మధ్యకు దిగివచ్చినందుకు గాను “దేవుడు మనకు తోడు” అని అర్థమిచ్చే “ఇమ్మానుయేలు” అనే పేరు సార్థకమైనట్టే. అందుకే ప్రస్తుత సందర్భంలో ప్రవచనం నెరవేరకపోవడమనేది అనుచిత విమర్శ. పైగా యేసు అనే పేరు దేవదూత చేత అందించబడినప్పటికీ ఆ పేరు పెట్టింది మాత్రం దేవుడే. ఎందుకంటే దేవదూతలు ఏ కార్యాన్ని చేసినా దైవాజ్ఞానుసారమే చేస్తారు (కీర్తనలు 103: 20) కాగా 'దేవుడు పెట్టిందా లేక దేవదూత పెట్టిందా', ఏ పేరు ఖాయమైంది అనే ప్రశ్న అర్థరహితమైనది.

3. వీరబ్రహ్మం- యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెనా? యేసు పాపుల పాలిటి రక్షకుడా, శిక్షకుడా?
మత్తయి 1:21 లో యేసు పాపులను రక్షించేవాడు అని చెప్పబడింది. తద్విరుద్ధంగా మత్తయి 3:12లో “ఆయన తన కళ్ళమును శుభ్రము చేసి, గోధుమలను కొట్టులోపోసి, ఆరని అగ్నితో పొట్టును కాల్చి వేయునని” పాపుల గురించి చెప్పాడు. కాబట్టి, యేసు కూడా “శిష్టరక్షణ, దుష్టశిక్షణ” యథాశక్తి చేశాడన్నమాట.

యేసు పాపులను రక్షించడు, శిక్షించును!
“గురుగులు దుష్ణుని సంబంధులు” (అనగా పాపులు) మత్తయి 13:39, మత్తయి -13:40 - 42 వచనాలలో ఇలా ఉంది. "గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగసమాప్తి యందు జరుగును. మనుష్యకుమారుడు (యేసు) తన దూతలను పంపును. వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని, దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు” మత్తయి 13:50లో యిలా ఉంది. “దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరు పరచి వీరిని అగ్నిగుండములలో పడవేయుదురు”.
బైబిలు దేవుడు పాపుల మొర ఆలకింపడు !
యోహాను 9:31లో ఇలా ఉంది. “దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదము, ఎవరైనను దేవభక్తుడై యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును”. వాస్తవము ఇది కాగా, ఆ దేవుడి కుమారుడైన యేసును గురించి “యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను” అని ప్రచారం చేస్తారేమిటి? (బైబిల్ బాగోతం ప్రశ్న 3 పేజీ నం. 14)

జవాబు: తమ పాపాలను విడిచిపెట్టి నిర్దోష జీవితాన్ని కలిగుండాలని ఆకాంక్షించి క్రీస్తును అంగీకరిస్తే అలాంటి వారికి ఆయన రక్షకుడే. ఐతే అందుబాటులో ఉన్న ఉచిత రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేసి మారుమనస్సును నిరాకరించే వారికి శిక్ష విధిస్తాడని చెప్పబడింది. మత్తయి 13:36-42 మరియు 13: 47–50 లో కూడా పునరుద్ఘాటించబడింది. వాస్తవమేమిటంటే, క్రీస్తు మొదటి రాకడ, పశ్చాత్తాపపడి ఆయనను విశ్వసించే పాపులకు రక్షణార్థమైనదే. అందుకే ఆయన రక్షకుడని ప్రకటిస్తున్నాము. అయితే ఆయన రెండవ రాకడ దుష్టత్వంలో కొనసాగేవారికి శిక్షార్థమైనది. కాబట్టి ఆయన తీర్పరి కూడా అందుకే ఇవి రెండు పరస్పర వైరుధ్యాలు కావు. ఒకే వ్యక్తికి పాపులను రక్షించే సామర్థ్యము మరియు వారిని శిక్షించే ఆధికారము కలిగి ఉండటం పరస్పర వైరుధ్యం ఎలా ఔతుందో నాస్తికులకే తెలియాలి. ఇక యోహాను 9:31లో ఉన్న వాక్యానికి భావం మరోలా వుంది. కల్మషం మరియు కపటంతో నిండిపోయిన మనస్సు కలిగి దేవునిని ప్రార్థించినట్టయితే అలాంటి పాపుల ప్రార్థన దేవుడు ఆలకింపడు (మార్కు 7:1-23).
ఐతే మారుమనస్సుతో నిజంగా మొర్రపెట్టేవారందరికి ఆయన సమీపంగా ఉంటాడు (కీర్తన 145:18, 2 దిన 7:14యెషయా 55:6-7).

4. వీరబ్రహ్మం- యేసు ఎవరి “ఆత్మ” వలన శోధింపబడుటకు అపవాదిని అనుసరించెను.
“ఆత్మ” బైబిల్లో తరచుగా తారసపడే పదం, ఆత్మ దేవుడికి పర్యాయపదం అనుకోవచ్చు. అయితే అపవాదిని అనుసరింపజేసింది దేవుడన్నమాట. మత్తయి 4:1,2లలో “యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను” అని ఉంది. ఎవరి ఆత్మ వలన? యేసు, అపవాదిని అనుసరించి అడవికి పోవటానికి అతన్ని ఎదిరించలేనంత బలహీనుడా? ఆత్మ, అపవాది చెప్పుచేతల్లో ఉంటుందా? లేక అపవాదే ఆత్మ చెప్పుచేతల్ని బట్టి నడుచుకుంటాడా? ఇవి ప్రశ్నించదగ్గవి. (బైబిల్ బాగోతం ప్రశ్న 4 పేజీ నం. 14)

జవాబు: తన ప్రజలను అపవాది శోధనల నుండి కాపాడటానికి, యేసు వాటిని ఎదిరించి జయించాలి (హెబ్రీ 4:15) అప్పుడే ఆయన అపవాది శోధనలను జయించిన శక్తిమంతుడని గుర్తెరగబడతాడు. ఒకవేళ అలా కానట్టయితే ఆయన అపవాది శోధనలను జయించినవాడని, శోధింపబడే సమయంలో మనకు జయమివ్వగల సమర్థుడని మనకెలా తెలుస్తుంది? (హెబ్రీ 2:18) అన్నట్లు యేసు అపవాది చేత శోధింపబడటానికి పరిశుద్దాత్మచేత కొనిపోబడినంత మాత్రాన శోధనలకు లొంగిపోయాడనిగాని, అపవాదిని ఎదిరించలేకపోయాడని గాని అర్థం కాదు. అపవాదిని ఓడించడానికి శోధనలను జయించడానికి ఆయన అరణ్యానికి వెళ్లాడని ఆ సందర్భమంతా చదివినట్లయితే మనకర్థమౌతుంది.

కాబట్టి బ్రహ్మంగారు భ్రమపడినట్లు యేసు అపవాదిని అనుసరించాడనిగాని అపవాదిని ఎదిరించలేని బలహీనుడయ్యాడని గాని సందేహించడానికి ఇక్కడ తావూ లేదు. బ్రహ్మంగారికి మరొక సందేహం కూడా కలిగింది - 'యేసు ఎవరి ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను” అని, ఐతే మత్తయి 3:16లో దేవుని ఆత్మే యేసు పైకి దిగివచ్చినట్లు చదువుతాం. కనుక శోధింపబడి, జయించడానికి దేవుని ఆత్మే యేసును ఉద్దేశపూర్వకంగా అరణ్యానికి నడిపించాడు. కాబట్టి, “ఆత్మ, అపవాది చెప్పుచేతల్లో ఉంటుందా? అనే ప్రశ్న కూడా అర్థరహితమైనదే.

5. వీరబ్రహ్మం- యేసు పిరికిపంద !

సాక్షాత్తు తనకు బాప్తిస్మమిచ్చిన యోహానును చెరలో వేశారని తెలిసికొని, చెరసాల ఉన్న దారి గుండా వెళ్లాల్సిన యేసు ఆ దారి మార్చుకొని వేరేదారి గుండా పారిపోయాడు. పిరికిపంద అంటే యేసే. చూడండి మత్తయి 4:12-16. (బైబిల్ బాగోతం ప్రశ్న 5 పేజినం 14)

జవాబు : పైన ఉదహరించిన ఇలాంటి అనేక సంఘటనలు యేసు జీవితంలో చోటుచేసుకున్నట్లు సువార్తలలో మనం చదువుతాం. వాస్తవానికి ఆయన రెండు సంవత్సరాల బాలునిగా వున్నప్పుడే హేరోదు నుండి తప్పించుకొని ఐగుప్తులో తలదాచుకోవలసిన అవసరత ఏర్పడింది (మత్తయి 2:13). తన బహిరంగ పరిచర్య మొదలుపెట్టిన తరువాత అనేకసార్లు యూదులు ఆయనను పట్టుకోవాలని లేదా రాళ్ళతో కొట్టి చంపాలని ప్రయత్నించినప్పుడు ఆయన వారి మధ్య నుండి తప్పించుకున్నాడని స్పష్టంగా చూడగలం (యోహను 10:30, 11:53-54, లూకా 4:28-30), అయితే ఇలాంటి సందర్భాల ఆధారంగా ఆయనను పిరికిపందగా చిత్రీకరించడం, ఎంతో అజాగ్రతగా, అశ్రద్దగా బైబిల్ చదవడం వలన కలిగిన పరిణామం. ఆయన ఈ విధంగా తప్పించుకోడానికి లేదా వారు ఆయనను పట్టుకోలేకపోవడానికి గల కారణం మత్తయి 5:4) తమను తామే తగ్గించుకుని సాత్వికులౌతారు (మత్తయి 5:5), తమలో లేని ఆ నీతిని పొందడానికి ఆకలిదప్పులు కలిగివుంటారు. (మత్తయి 5:6) కాబట్టి వారు ఓదార్చబడతారు (5:4) తృప్తిపరచబడతారు (5:6), ఇది దాని సందర్భానుసారమైన భావం. అయినా ఈ ప్రశ్నలో పరిగణించదగ్గ హేతుబద్ధమైన విమర్శ ఏదీ మాకు కనిపించలేదు. హేతుబద్ధతను ప్రదర్శించలేని చోట హేళనతో సరిపెట్టుకుందామనుకున్నట్లున్నారు బ్రహ్మంగారు. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెట్టితముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచించదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు” (1కొరింథి 2:14)

7. వీరబ్రహ్మం- “హింసించినా తిరుగుబాటు పనికిరాదు! నిందించినా, హింసించినా, అణగదొక్కినా ఎదురు తిరగొద్దు! మీకొచ్చిన నష్టమేం లేదు. పరలోకం మీదే” !

మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11, 12 వచనాలు ఇలా ఉన్నాయి. “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ ఫలము అధికమగును”. (బైబిల్ బాగోతం ప్రశ్న 7 పేజి నం 14)

జవాబు: స్వీయ సంరక్షణ కొరకు ప్రయత్నించాలా అక్కరలేదా అనే చర్చ బ్రహ్మంగారు ఉదహరించిన వచనంలోని సందర్భము కానేకాదు. హింసించబడినప్పుడు, హేళనకు గురిచేయబడినప్పుడు సహజంగా కలిగే దు:ఖాన్ని ఎందుకు, ఎలా అధిగమించాలో ఈ వాక్యాలు బోధిస్తున్నాయి తప్ప హింసించినా తిరగబడకూడదనే ప్రస్తావన ఇక్కడ లేనే లేదు . లేనివి చొప్పించి పాఠకులను దారి మళ్లించే తమ నాస్తిక ధర్మాన్ని నమ్మకంగానే నిర్వర్తిస్తున్నారు బ్రహ్మం గారు!! ఇక హింసను ఎదుర్కోవడంలో బైబిల్ చేసే సమగ్రబోధను తగిన సంధర్భాలలో ఈ పుస్తకంలోనే వివరించామని పాఠకులు గమనించాలి.

8. వీరబ్రహ్మం- పాతనిబంధన కొట్టివేయబడిందా, కొట్టివేయబడలేదా? పాతనిబంధన కొట్టివేయబడితే దాని క్రొత్తనిబంధనతో ఎందుకు కలిపి చదవటం? అసలు క్రొత్తనిబంధన మాత్రం ఏమంత నిక్కచ్చిఐనది?

మత్తయి 5:17 ప్రకారం పాత నిబంధన కొట్టివేయబడలేదు. కానీ 2కొరింథీ 3:14 ప్రకారము, హెబ్రీ 8:7 మరియు 8:13 ప్రకారము పాత నిబంధన కొట్టివేయబడింది. పాత నిబంధన కొట్టివేయబడిందని 2కొరింథీ 5:14లో ఇలా ఉంది. “మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువ బడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టి వేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది. ”
పాత నిబంధన లోపభూయిష్టమని క్రొత్త నిబంధనే చెప్తోంది.
హెబ్రీ 8:7లో “ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు” అని ఉంది.

పాతనిబంధనను వదలివేయుడి
హెబ్రీ 8:15లో ఇలా ఉంది. ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉండిపోవునో అది అదృశ్యమగుటకు సిద్దముగా ఉన్నది”.

పాత నిబంధన కొట్టివేయబడలేదు. అది నెరవేర్చబడేది అని మత్తయి సెలవిస్తున్నాడు.
“ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవచ్చు. నెరవేర్చుటకే గాని, కొట్టివేయుటకు నేను రాలేదు” అని మత్తయి 5:17లో యేసు అన్నాడు. (బైబిల్ బాగోతం ప్రశ్న 8 పేజినం 15)

జవాబు: పాత నిబంధనకు మరియు పాత నిబంధన గ్రంధానికీ మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకోకుండా ఏదో గొప్ప విషయాన్ని కనిపెట్టేసినట్లు మాట్లాడేశారు బ్రహ్మంగారు. కొట్టివేయబడింది పాతనిబంధన గ్రంథం కాదు; సీనాయి పర్వతము వద్ద దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన కొట్టివేయబడింది.
"ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తము లేకుండ ప్రతిష్టింపబడలేదు. ధర్మశాస్త్రప్రకారము మోషే ప్రతి యాజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత, ఆయన నీళ్లతోను, రక్తవర్ణముగల గొట్టెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెలయొక్కయు మేకలయొక్కయు రక్తమును తీసికొని దేవుడు మీకొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథముమీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను.” (హెబ్రీ 9:18-20).
క్రీస్తు తన సంఘంతో చేయనైయున్న నూతన నిబంధనకు ఛాయగా ఉన్నందుకు క్రీస్తు రాకతో ఆ పాత నిబంధన ఉద్దేశ్యం నెరవేరింది. కనుక ఈ భావంలో క్రీస్తునందు పాత నిబంధన కొట్టి వేయబడింది. అయితే, ఆ నిబంధన మాటలను చదువుతున్న యూదులు, దాని ఆంతర్యాన్ని, నేరవేర్పును, కొట్టివేతను గ్రహించలేకపోయారని 2 కొరింథీ 5:14లోని భావం.

పైగా హెబ్రీ పత్రికలో స్పష్టం చేయబడిన విధంగా పాత నిబంధన క్రొత్తనిబంధనకు కేవలం ఛాయగా ఉంది (హెబ్రీ 10:1). వాస్తవికత ఉద్దేశాన్ని నెరవేర్చడం ఛాయకు సాధ్యపడదు కాబట్టి, పాత నిబంధన తారతమ్యరీత్యా లోపభూయిష్టమైనదే. ఇందులో సమస్యేమీ లేదు.
ఇకపోతే మత్తయి 5:17, పాతనిబంధన గురించి కాదు, పాత నిబంధన గ్రంథాన్ని గురించి ప్రస్తావిస్తుంది. అదెన్నటికీ కొట్టివేయబడదు. అది లోపభూయిష్టమైనది కాదు. అందుకే పాత నిబంధన గ్రంథాన్ని క్రొత్తనిబంధన గ్రంథంతో కలిపి చదవాలి.

“అసలు కొత్త నిబంధన మాత్రం ఏమంత నిక్కచ్చియైనది?' అని వెటకారమాడిన బ్రహ్మంగారు 276 ప్రశ్నలు లేవనెత్తి కూడా బైబిల్లో ఒక్క లోపమైనా ఉందని నిరూపించలేకపోయారు.

9. వీరబ్రహ్మం- ఇదెక్కడి పీనల్ కోడ్ ?

తన సోదరుణ్ణి ఎవరైనా వ్యర్ధుడా అని తిడితే, అలా తిట్టినవాడికి శిక్ష నరకలోకంలో అగ్నిలో పడవేయడమట. మత్తయి 5:23లో ఇలా ఉంది. "తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు నరకాగ్నికిలోనగును”.

జవాబు : ఇది దేవుని పీనల్ కోడ్. కారణం లేకుండా ఇతరులను పల్లెత్తు మాట అనడానికి కూడా దేవుడు అనుమతించడు . సందర్భాన్ని బట్టి చూసినప్పుడు, నరహత్యను, ఎత్తిపొడుపు మాటలను యేసు సమానంగా పరిగణిస్తున్నాడు. చిన్నపాపమైనా పెద్ద పాపమైనా అది దేవుని దృష్టిలో శిక్షార్హమైనదే అని వాక్య సందర్భం ప్రబోధిస్తుంది. ఇతరులను కించపరచడం నాస్తికత్వపు సంస్కృతి కావొచ్చేమో కాని క్రైస్తవ సంస్కృతి మాత్రం కాదు.

10. వీరబ్రహ్మం- భార్యని విడనాడితే ఆమె వ్యభిచారిణి అవుతుందట! బైబిలు దృష్టిలో స్త్రీలంటే ఎంత చిన్న చూపో గమనించండి!

మత్తయి 5:32లో ఇలా ఉంది. “తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు”. అంటే భర్త వదిలి పెడితే నిందింపబడాల్సింది ఆడదే. ఇది బైబిలు చెప్పే న్యాయం. మగవాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సింది స్త్రీ అన్నమాట. చేయని తప్పుకు ఆమెను వ్యభిచారిణిని చేయటం ఎంత తప్పు? ఇది ఎంతటి పురుషాధిక్యత ? అన్ని మత గ్రంథాలలాగానే బైబిల్ కూడా స్త్రీలను దారుణంగా కించపరచింది. బైబిల్ రచయితల్ని కూడా పురుషాహంకారం వదలలేదు. అందుకే స్త్రీల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా రాశారు. స్త్రీని అణచటంలో మతగ్రంథాలు పోటీపడ్డాయి. భార్యను విడనాడిన భర్తను పల్లెత్తుమాట అనకుండా, ఆ తర్వాత ఆమె వ్యభిచారిణి అవుతుందని సూత్రీకరించాడు యేసు. ఆయన దృష్టిలో స్త్రీకి సొంత వ్యక్తిత్వం ఉండదు. “మొగుడు వదిలేసిన ఆడది చెడిపోతుంది” అని యేసు చెప్తున్నాడు. వదిలేసిన మొగుడు మాత్రం చెడిపోడు ! క్రైస్తవ మహిళామణులు ఏమంటారు? యేసుకి గ్రుడ్డిగా స్త్రీలందరి మీదా అలాంటి నీఛాభిప్రాయలే ఏర్పడి ఉంటాయి. బహుశా తన జన్మకారణం అనుమానమేమో!

తన తల్లి మీద ఆయనకు ఈ విషయమై సదభిప్రాయం ఉండేది కాదని ఒకటి రెండు సంఘటనల్లో విశ్లేషణ చేస్తే తెలుస్తుంది. ముందు ముందు గమనించగలరు. (బైబిల్ బాగోతం ప్రశ్న 10 పేజినం 16)

జవాబు: పై మాటలు చదువుతున్నపుడు, వక్రవ్యాఖ్యానాలు చేయడంలో ప్రత్యేక డాక్టరేట్లు, నోబెల్ పురస్కారాలు లాంటివి ఉంటే అవి బ్రహ్మంగారికే దక్కాలని అనిపించింది. పై అంశాలపై యేసు చెప్పిన మాటలన్నిటిని సమగ్రంగా గ్రహించి వ్యాఖ్యానించకుండా ఒక వచనాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఈ విషయంపై ఇదే యేసు దృక్పథం అని వాదించడం ఆయనను తప్పుగా చిత్రీకరించే యత్నం కాకపోతే మరేమిటి ? మత్తయి 19:9లో భార్యను విడనాడి మరో స్త్రీని వివాహమాడే భర్త కూడా వ్యభిచారి ఔతాడని యేసు స్పష్టంగా బోధించగా బైబిల్ ఇతర మత గ్రంథాల్లో పురుషాధిక్యతను సమర్థించిందని, భార్యను విడిచిపెట్టిన భర్తను యేసు పల్లెత్తు మాట కూడా అనలేదని, విడిచి పెట్టబడిన స్త్రీ, చెడిపోతుంది కానీ ఆమెను విడిచి పెట్టిన పురుషుడు మాత్రం చెడిపోడన్నదే యేసు మాటలకు అర్థమని వ్యాఖ్యానించడం, నాస్తికవాదం ఎంతటి పక్షపాతధోరణికి దారి తీస్తుందో నిరూపించడానికి చక్కటి తార్కాణం. మరింత రుజువు కోసం 53వ ప్రశ్నకు రాసిన జవాబు చూడండి. సందర్భసహితంగా చూసినపుడు వ్యభిచార కారణాన్ని బట్టి కాకుండా మరే కారణాన్ని బట్టి భార్యను విడనాడకూడదనే ఆజ్ఞను జారీ చేస్తూ మరే కారణం చేతనైనా భార్యను విడనాడితే భర్త ఆమెను వ్యభిచారిణిగా “చేస్తున్నాడు” అని యేసు బోధించాడు. ఇక్కడ ప్రయోగించబడిన భాషను జాగ్రత్తగా గమనించండి. భార్య వ్యభిచారిణి ఔతుంది అని కాదు కాని భర్త ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నడని యేసు బోధించాడు. జీవింతాంతము కలిసుండేదే యథార్థమైన వివాహబంధం (మత్తయి 19:3-6)

అయితే వివాహ ముసుగులో కొంతకాలం ఒక స్త్రీతో కాపురముండి ఇష్టానుసారంగా ఆమెను ఉపేక్షించి వెళ్లేవాడు ఆమెతో పవిత్ర వివాహబంధాన్ని కలిగివుండలేదని ఆమెను వాడుకొని ఒక వ్యభిచారిణి స్థాయికి దిగజార్చాడని యేసు మాటలకు భావం. ఇది వాస్తవానికి పురుషునిపై మోపబడిన నేరం. ఒకవేళ ఇది స్త్రీ పై మోపబడిన నింద అయితే భార్యను ఈ విధంగా మోసంచేసిన పురుషుడిని సమర్థించే యత్నమైయ్యుంటే భార్యను విడనాడకుండా ఉండేందుకు హెచ్చరికగా యేసు దీనినేందుకు ప్రస్తావించినట్లు ? ఇక్కడ భార్యను విడిచిపెట్టడాన్ని యేసు నిషేధిస్తున్నాడే తప్ప ప్రోత్సాహించడం లేదన్నది సందర్భం నుండి విదితమే కదా. ఈ మాత్రం ఆలోచించే ఇంగితజ్ఞానం కూడా లేకుండా తాను హేతువాదిని అని చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఇక్కడ యేసు స్త్రీలను చిన్నచూపు చూడలేదని అది కేవలం బ్రహ్మంగారు చేసిన అబద్దపు చిత్రీకరణ అని స్పష్టమౌతుంది. ఇక యేసు జన్మకారణం విషయమై బ్రహ్మంగారు చేసిన బుద్దిహీనమైన వ్యాఖ్యలకు తగిన చోట తగిన జవాబునిస్తాము.

11. వీరబ్రహ్మం- “విడువబడిన దానిని చేసుకొనువాడు వ్యభిచరించుచున్నాడు” మత్తయి 5:32.

బైబిల్ ప్రకారం క్రైస్తవులు ఒకసారి పెళ్ళై వదలివేయబడిన అమ్మాయిని మళ్ళీ పెళ్ళి చేసుకోగూడదు. అట్లా చేసుకుంటే అది వ్యభిచరించటమే! విడువబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు” అని మత్తయి 5:32లో ఉంది. మత్తయి 19వ అధ్యాయం, 9వ వచనం కూడా దీన్నే బలపరుస్తోంది. ఇలా ఉంది "మరియు వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను”.  భార్యను విడచిన వానిని కానీ, భార్య చేత వదలివేయబడినవానిని కానీ మళ్ళీ పెండ్లాడవచ్చా? అటువంటి వాడు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చా, లేదా? బైబిలు ఈ ప్రశ్నల జోలికి మాత్రం పోదు. ఎందుకంటే, అది పురుషాధిక్యాన్ని నిలబెడుతుంది కాబట్టి. పురుషుడికి మళ్ళీ పెళ్ళి చేసుకొనడానికి లైసెన్స్ ఎప్పటికీ రద్దుకాదు! (బైబిల్ బాగోతం ప్రశ్న 11 పేజి నం 16)

జవాబు: పునర్వివాహం విషయంలో పురుషునికి గానీ స్త్రీకి గానీ ఎలాంటి పక్షపాతం చూపించకుండా సమానమైన నియమాలనే ఇరువురికీ యేసు విధించాడని సందర్భాన్ని సరిగ్గా చదివితే ఇట్టే తెలిసిపోతుంది . “వ్యభిచారము నిమిత్తము తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడ”నే వాక్యాన్ని ఉదహరిస్తూనే 'పురుషుడికి మళ్లీ పెళ్ళి చేసుకోవడానికి లైసెన్స్ ఎప్పటికీ రద్దుకాద'ని వ్యాఖ్యానించడం, తప్పుత్రోవ పట్టించే బ్రహ్మంగారి మోసపూరిత ఉద్దేశాన్ని బట్టబయలు చేస్తుంది. అబద్ధపు చిత్రీకరణలతో యేసుపై దురభిప్రాయాన్ని పుట్టించి అందరినీ తన నాస్తిక మూర్ఖతలోనికి లాగాలనే ఆరాటమేమో!

వ్యభిచార హేతువు తప్ప మరేకారణం చేతైనా వివాహాన్ని రద్దు చేసి, మరొకరిని వివాహమాడడం ఎంత అమానుషమైన చర్య ! యేసుకు సమకాలికులైన పరిసయ్యులు అలాంటి రాక్షసత్వాన్ని ప్రోత్సహిస్తూ , దానిని సమర్థించుకోవడానికి మోషే ధర్మశాస్త్రాన్ని సహితం వక్రీకరించేవారు. హిలెల్ ఆనే రబ్బీ (మత గురువు) బోధల ప్రభావం క్రింద పరిసయ్యులలోని ఒక వర్గంవారు, భార్యకు ఏ చిన్న కారణంచేతైనా విడాకులివ్వచ్చని ప్రజలకు నేర్పించేవారు. ఉదా : వంట చేసేటప్పుడు మాడితే, వంటలో ఉప్పు ఎక్కువవేస్తే, అవిధేయురాలుగా వుంటే, ఆమెకంటే అందగత్తెను చేసుకునే అవకాశం లభిస్తే వగైరాలన్నీ విడాకులకు తగిన కారణాలుగా హిలేల్ వర్గం వారు సమర్థించేవారని యేసుకు సమకాలీనమైన యూదా రచనలలోనుండి స్పష్టమవుతుంది. అలాంటి పశుప్రాయపు విడాకులను యేసు నిషేధించాడు (మత్తయి 19: 3 -9) హీలెల్ వాదులలాగే నాస్తికవాదుల విచ్ఛలవిడితనానికి యేసు బోధించిన విలువలు వంట పట్టవనేమో బ్రహ్మంగారు పాపం ఇంతగా బెంబేలెత్తిపోతున్నారు.

12. వీరబ్రహ్మం- “భర్త మరణిస్తే భార్య విధవరాలుగా ఉంటేనే ధన్యురాలు” -పౌలు

1 కొరింథీయులులో 7వ అధ్యాయంలో 39, 40 వచనాలు ఇలా ఉన్నాయి. “భార్య తన భర్త బ్రతికి యున్నంతకాలము బద్దురాలై యుండును. భర్త మృతి పొందిన యెడల ఆమె కిష్టమైన వానిని పెండ్లిచేసుకొనుటకు స్వతంత్రురాలై యుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయిన మరి ధన్యురాలని నా అభిప్రాయము” భార్య మరణిస్తే భర్త పునర్వివాహం చేసికొనకుండా ఉంటేనే ధన్యుడు అని చెప్పలేదే? (బైబిల్ బాగోతం ప్రశ్న 12 పేజినం 16)

జవాబు: 1కొరింథి 17వ అధ్యాయంలో వివాహాన్ని గురించి వివిధ కోణాల నుండి మాట్లాడుతూ, వివాహం చేసుకోవడం మంచిది, అయితే ప్రభువు సేవ కోసం వివాహం చేసుకోకుండా ఉండగలిగితే మరీ మంచిది అని అపొస్తలుడైన పౌలు బోధించాడు. ఇది పురుషునికి, స్త్రీకీ ఒకేలా వర్తించే నియమం. బ్రహ్మంగారు ఉదహరించిన వితంతు పున:వివాహానికి చెందిన వచనాలు కూడా ఈ నేపథ్యంలోనే చెప్పబడ్డాయని సందర్భము నుండి స్పష్టమౌతుంది (7: 25-40).
కాబట్టి ఇక్కడ పక్షపాతమేమీ లేదు. అయితే విధవరాండ్ర గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించబడడానికి మరొక కారణం కూడా సూచించవచ్చు. “మీరు వ్రాసిన వాటి విషయము..” అనే ఈ అధ్యాయంలోని ప్రారంభపు మాటలు, కొరింథి సంఘంవారు, ఆ సంఘ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సమస్యల విషయమై పౌలుకు ఒక లేఖ రాసినట్లు, వారు లేవనెత్తిన సమస్యలకు మాత్రమే పౌలు ఇక్కడ పరిష్కారాలు అందిస్తున్నట్లు తెలుపుతున్నాయి. వారు విధవరాండ్ర విషయమై ప్రత్యేకంగా అడిగారు కాబట్టి దానికి మాత్రమే ఇక్కడ సమాధానం చెప్పబడింది. అంతమాత్రాన పురుషుల విషయంలో బైబిల్ ఇక్కడ ఏదో పక్షపాతం చూపించిందని, తప్పుగా చిత్రీకరించడం, హేతువాదులమని చెప్పుకొనే బ్రహ్మంగారి లాంటి వారికి సందర్భసహిత వ్యాఖ్యనాలు చేసే హేతుబద్దత మరియు సామర్థ్యం లేవని నిరూపిస్తుంది.

18. వీరబ్రహ్మం- “స్త్రీకి శిరస్సు పురుషుడు!”

బైబిలు పక్కాగా పురుషాధిక్యతకు కొమ్ముకాస్తుంది. స్త్రీలు అణగిమణిగి ఉండాలని ఖరాఖండిగా చెప్తుంది. దీనికి ఎన్ని ఉదాహరణలైనా పేర్కొనవచ్చు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు, మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను” 1కొరింథి 11:3.

జవాబు: స్త్రీకి శిరస్సు పురుషుడు అనేమాటకు అర్థం స్త్రీ పురుషునికి అణిగిమణిగి వుండవలెనన్నట్లైతే క్రీస్తుకు శిరస్సు దేవుడు అనే మాటకు క్రీస్తు దేవునికి అణిగిమణిగి వుండాలని భావమా? క్రీస్తు దైవసమానుడు. స్వయాన దేవుడు . ఐనా దేవుడు క్రీస్తుకు శిరస్పై ఉన్నాడని చెప్పబడింది కదా ? స్త్రీ, పురుషులు సమానులు అయినప్పటికీ కుటుంబవ్యవస్థలో పురుషునికి అధికారం ఇవ్వబడింది. అయితే ఈ అధికారాన్ని తన ఇష్టానుసారంగా వినియోగించుకోనే హక్కు పురుషునికి ఇవ్వబడలేదు. స్త్రీపురుషసంబంధాన్ని గురించి విస్తృతంగా వివరించబడిన ఎఫెసీ 5:22-33 వాక్యభాగాన్ని చదివితే పురుషునికి స్త్రీపై గల అధికారం ఎలాంటిదో, పురుషాధికారాన్ని గురించి బైబిల్ వైఖరి ఎలాంటిదో బ్రహ్మంగారి వ్యాఖ్యానాల సహయం లేకుండానే ఎవరైనా గుర్తెరగగలరు. బైబిలును తప్పుపట్టాలనే తమ దురుద్దేశానికి అడ్డుతగిలే వాక్యభాగాలను, ఉద్దేశపూర్వకంగానే ప్రక్కకు నెట్టేసినట్లున్నారు బ్రహ్మంగారు.

14. వీరబ్రహ్మం- ప్రార్థన చేసేటప్పుడు పురుషుడు తలమీద ముసుగు వేసికొని తనను తాను తక్కువ చేసికోరాదు. స్త్రీ ఐతే తప్పనిసరిగా ముసుగు వేసుకోవాలి, లేదా శిరోముండనం చేయించుకోవాలి.


“ఏ పురుషుడు తలమీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో, లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుకు వేసి కొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్లుగానే యుండును. స్త్రీ ముసుగు వేసికొనని యెడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను, క్షారము చేయించుకొనుటయైనను స్త్రీకవమానమైతే ఆమె ముసుగు వేసికొనవలెను” (1 కొరింథీ 11:4-6) (బైబిల్ బాగోతం ప్రశ్న 14 పేజీ నం. 16)

జవాబు: బ్రహ్మంగారు 1కొరింథీ11:4-6 వచనాలను పరిగణలోనికి తీసుకుని పురుషుని తలపై ముసుగు అవసరం లేదని స్త్రీకి మాత్రమే అవసరమని, మరియు స్త్రీ తలపై ముసుగు వేసుకోకపోతే ఆ స్త్రీ తల క్షౌరం చేసుకున్నట్లే అనే మాటలను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఈయన గారికి ఇక్కడ కనిపించిన లోపమేమిటో తేటగా సూటిగా చెప్పనేలేదు, కాని దీనిని లేవనెత్తడంలో ఈయనగారి దురుద్దేశమేమిటో ఇట్టే అర్థమైపోతుంది. తలపై ముసుగు ధరించని స్త్రీ క్షౌరం చేయించుకున్నట్టేనని బోధించిన పౌలు, ఈ నియమాన్ని పురుషునికి ఎందుకు వర్తింపజేయలేదు అన్నదే ఈయనగారి ఆక్షేపణ.

దీనికి జవాబు ఏమిటంటే , ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తని, స్త్రీకి శిరస్సు పురుషుడని, క్రీస్తుకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను అని అదే అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడి ఉంది. అనగా ఒకవేళ పురుషుడు తన తలను కప్పుకున్నట్లయితే తలగా ఉన్న క్రీస్తును మరుగుపరిచి ఆయన మహిమను తగ్గించినట్లవుతుంది, అయితే క్రీస్తు కంటే పురుషుడు ఏవిధంగాను ఎక్కువ కాడని అతడు క్రీస్తు సన్నిధిలో తగ్గించబడాలని సూచనగా తెలియజేయడానికి స్త్రీకి తలగాను మహీమగాను ఉన్న పురుషుని మరుగుపరచాలని పౌలు తెలియజేస్తున్నాడు.

పురుషుడైతే దేవుని పోలికయు మరియు మహిమయునై యున్నాడు కాబట్టి తలమీద ముసుగు వేసుకొనకూడదు గానీ స్త్రీ పురుషుని మహిమయై యున్నది (1 కొరింథీ 11:7 ) కాబట్టి ఇక్కడ ఏ కోణంలో చూసినా క్రీస్తు హెచ్చింపబడాలని పురుషుడు తగ్గింపబడాలని గోచరిస్తుంది తప్ప ఇక్కడ పురుషాధిపత్యాన్ని సమర్థించే విధంగా ఏమీ చెప్పబడలేదు.

15. వీరబ్రహ్మం- “దేవుని పోలిక పురుషుడే గానీ, స్త్రీ కాదు!


“పురుషుడైతే దేవుని పోలికయు, మహిమయునైయున్నాడు గనుక తల మీద ముసుగు వేసికొనకూడదు, గానీ స్త్రీ పురుషుని మహిమయైయున్నది”(1కొరింథీ 11:7) (బైబిల్ బాగోతం ప్రశ్న 15 పేజీ నం. 17).

జవాబు: స్త్రీ దేవుని పోలిక కాదని ధృవీకరించే ఒక్కవచనమైనా బైబిల్ లోనుండి బ్రహ్మంగారు చూపించగలరా ? సంఘ ఆరాధనక్రమాన్ని తెలియజేస్తూ నియమించిన కట్టడలను గూర్చి పౌలు ఇక్కడ వ్రాస్తున్నాడు (1కొరింథీ 11:17-19).

1కొరింథీ 11-14 వరకు ఉన్న అధ్యాయాలు సంఘ ఆరాధనలో పాటించవలసిన కట్టడలను గురించి ప్రస్తావిస్తున్నాయి. దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు దేవుని మహిమకు నిదర్శనంగా ఉన్న పురుషుని శిరస్సును మరుగుపరచకుండా పురుషుని మహిమను సాదృశ్యపరచే స్త్రీ శిరస్సును హెచ్చించకుండా ఉండడానికి ఈ వచనాలు (3 నుండి 7) వ్రాయబడ్డాయి. అంతేగానీ దేవుని పోలిక పురుషుడే గానీ స్త్రీ కాదు అని ఈ వచనాలు తెలియజేయడం లేదు ఇందుకు భిన్నంగా పురుషునితో సమానంగా స్త్రీ కూడా దేవుని పోలికలో సృజింపబడిందనే సత్యాన్ని బైబిల్ ధృవీకరిస్తుంది. “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను;దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ” (ఆది. 1:26-27).

16. వీరబ్రహ్మం - “స్త్రీలు సంఘములో లోబడి ఉండవలసినవాళ్ళు ! స్త్రీలు నోరెత్తగూడదు!”


1కొరింథీ 14వ అధ్యాయములో 54 నుండి 36 వచనాలలో ఇలా ఉంది. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల ఇంట తమ తమ భర్తలనడుగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము” (బైబిల్ బాగోతం ప్రశ్న 16 పేజినం 17).

జవాబు: ఇది కూడా ఆరాధన క్రమానికి చెందిన నియమమే గానీ దీనిని బట్టి సంఘంలో పురుషుని కంటే స్త్రీకి దిగువస్థానం ఇవ్వబడిందని చెప్పడం లేఖనాలపై అపనిందలు మోపడమే. సంఘంలో లేదా సంఘపక్షాన మాట్లాడడమనేది సంఘపోషణకు సంరక్షణకు సంబంధించిన బాధ్యతే గానీ ఒక అధికార పదవి కాదు. సామర్థ్యమున్న పురుషులు ఉన్నప్పుడు సహజ బలహీనతలు ఉన్న స్త్రీలపై అలాంటి భారాన్ని మోపడం సమంజసం కాదు. అంతమాత్రాన సంఘంలో స్త్రీలు పురుషుల కంటే తక్కువైపోలేదని సూచించే ఎన్నో నిదర్శనాలు బైబిల్లో స్పష్టంగా కనిపిస్తాయి. లోకరక్షకుడైన క్రీస్తు స్త్రీ ద్వారా జన్మించలేదా ? పునరుత్థానుడైన పిదప ఆయన, తన శిష్యులకు కనిపించడానికి ముందుగా స్త్రీకి కనిపించలేదా ? మిర్యాము, దెబోరా, హులా ప్రవక్తినులే కదా! హేమాను ముగ్గురు కుమార్తెలు దేవుని ఆరాధనలో వాయిద్యాలు వాయించుటకు నియమించబడినట్లు లేఖనాలలో చదవవచ్చు (1 దిన 25:5-6), పైగా ఫిలిప్పు నలుగురు కుమార్తెలు ప్రవక్తినులే కదా (అపొ 21:8-9) ఫీబే, ప్రిస్కిల్లా అనే సంఘపరిచారకులు స్త్రీలు కారా (రోమా 16:1;13)? కాబట్టి బ్రహ్మంగారు బైబిలును తప్పుపట్టే ఉద్దేశంతో పక్షపాతవైఖరిని అనుసరిస్తూ తన వాదనకు తగినట్టుగా లేఖనాలను వక్రీకరించడం సమంజసం కాదు.

17. వీరబ్రహ్మం- “స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి. వారు ఉపదేశించరాదు”.

స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదేగానీ, ఉ పదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను” 1 తిమోతి 2:11, 12. (బైబిల్ బాగోతం ప్రశ్న 17 పేజీ నం. 17)

జవాబు: బ్రహ్మంగారు తమ విమర్శలో ప్రశ్నల సంఖ్య పెంచుకునేందుకు అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడుగుతున్నారు. ఉదహరించిన వాక్యభాగాలు వేరైనప్పటికి 16, 17 ప్రశ్నలు ఒక్కటే కనుక వాటికి సమాధానం కూడా ఒక్కటే.

18. వీరబ్రహ్మం - “భార్య పురుషుడికి లోబడవలెను”.
“సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను”

ఎఫెసీయులకు 5:24.

జవాబు: స్త్రీలు తమ భర్తల విషయంలో అనుసరించాల్సిన ధర్మాలను ప్రస్తావించే వచనాలను మాత్రమే ఎత్తిచూపించి, పురుషులు తమ భార్యల విషయంలో అనుసరించాల్సిన ధర్మాలను ప్రస్తావించే లేఖనాలను కప్పిపుచ్చి, బైబిల్, పురుషాధిపత్యాన్ని సమర్థిస్తుందనే అపవాదును తప్పుడు చిత్రీకరణ ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మంగారు. ఆయన ఉదహరించిన వచనానికి తరువాత వచనాన్ని గమనిస్తే పాఠకులకు ఇది స్పష్టంగా తెలుస్తుంది. “పురుషులారా ! మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడా సంఘమును ప్రేమించి. .... దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను” (ఎఫెసీ 5:25-27). కాబట్టి  స్త్రీలు క్రీస్తువలె తమ భర్తలకు లోబడడం ఎంత అవసరమో, అదేవిధంగా పురుషులు కూడా తమ భార్యలను ప్రేమించి, వారి కొరకు క్రీస్తువలే తమ్మును తాము అప్పగించుకోవడం అంతే అవసరమని లేఖనాలు స్పష్టంగా బోధిస్తున్నాయి. బైబిల్లో కాదు, బ్రహ్మంగారు దానిని చదివే విధానంలో పక్షపాతముంది.

19. వీరబ్రహ్మం- యౌవనస్తులైన విధవరాండ్రు పెండ్లాడగోరటం క్రీస్తుకు విరోధం అంటున్నారు. ఒకవైపు వారు పెండ్లి చేసుకోకపోతే చెడిపోతారంటున్నారింకోవైపు. ఏం చేయాలి ?

యౌవనస్తులైన విధవరాండ్రు పెండ్లాడగోరటం క్రీస్తుకు విరోధం కాబట్టి వారు పునర్వివాహం చేసికోరాదని 1 తిమోతిలో 5వ అధ్యాయంలో 11, 12 వచనాలు చెప్తున్నాయి. ఇలా ఉంది. "యౌవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తుకు విరోధముగా నిరంకుశలైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదలుకొనిరను తీర్పుపొందినవారై పెండ్లాడగోరుదురు”.

ఇదే అధ్యాయంలో 13, 14 వచనాల్లో యౌవనస్తులైన విధవరాండ్రు ఖాళీగా ఉంటే వారి బుద్ది, ప్రవర్తన చెడిపోతాయని, కాబట్టి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఉంది. చూడండి. “మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్దకురాండ్రగుటకు మాత్రమేగాక, ఆడరాని మాటలాడుచు, వదరుబోతులును, పరులజోలికి పోవువారునగుటకును నేర్చుకొందరు. కాబట్టి యౌవన స్త్రీలు వివాహము చేసికొని పిల్లలను కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను” ఇంతకీ క్రైస్తవ సోదరులు ఏం చెయ్యాలి? విధవా పునర్వివాహం చేయవచ్చా? చెయ్యకూడదా?

జవాబు: బైబిల్ లో తప్పులు పట్టుకోవాలని బ్రహ్మంగారు చేస్తున్న కసరత్తు ఇంతా అంతా కాదు.
యవ్వనస్తులైన విధవరాండ్రు మరలా పెళ్లిచేసుకోవడం , క్రీస్తుకు విరోధం అని బ్రహ్మంగారు చెబుతూ 1తిమోతి 5:11-12 లేఖనాలను తగిలించుకున్నారు. మరలా ఇదే అధ్యాయం 13-14 వచనాలను చూపిస్తు యవ్వనస్థులైన విధవరాండ్రు మరలా వివాహం చేసుకోవచ్చునని లేఖనం చెబుతుందని చూపిస్తూ పై రెండు లేఖనాల నడుమ ఏదో వైరుధ్యముందన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వాస్తవం ఎలావుందో చూద్దాం.
“భార్య తన భర్త బ్రతికియున్నంత కాలము బద్దురాలై యుండును, భర్త మృతినొందిన యెడల ఆమెకిష్టమైన వానిని పెండ్లిచేసుకొనుటకు స్వతంత్రురాలైయుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లిచేసుకొనవలెను ”1కొరింథీ 7:39. ఈ వాక్యాన్ని బట్టి యవ్వనస్త్రీలు తమ భర్తలను కోల్పోయిన పిమ్మట విధవరాలుగా వుండడం కంటే పునర్వివాహం చేసుకోవచ్చని పౌలు తేటగా బోధిస్తున్నాడు. అనగా భర్త మృతిపొందిన పిమ్మట యవ్వన విధవరాళ్లు వివాహమాడవచ్చని దీనికి అర్థం.

బ్రహ్మంగారు ఉదహరించిన 1 తిమోతి 5:13-14ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అనగా యవ్వనస్థులైన విధవరాళ్లకు పునర్వివాహానికి అనుమతించాలని పౌలు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ అనుమతి 1తిమోతి 5:11-12 తో విభేదించడం లేదు. సందర్భానుసారంగా చూసినట్లయితే సంఘం చేత పోషింపబడవలసిన వయస్సు మళ్లిన విధవరాళ్ల లెక్కల్లో యవ్వనవిధవరాళ్లను చేర్చి ప్రభువు పరిచర్యకు వారిని బదులుగా చేస్తే, ఆ తర్వాత వారు వివాహమాడగోరి ప్రభువు పరిచర్య విషయమై వారు ఇచ్చిన మాటను తప్పి ప్రభువుకు వ్యతిరేకంగా పాపం చేసినవారౌతారు. అందుకే పునర్వివాహానికి తగిన విధవరాళ్లను సంఘం చేత పోషింపబడే లెక్కల్లోకి చేర్చకుండా జాగ్రత్తపడాలని, ఇది వారి పునర్వివాహానికి అడ్డుగా వుండకూడదని పౌలు ఉద్దేశం. ఆ మాటకొస్తే ఈ వాక్యభాగాన్ని 7 నుండి 16 వచనాల పూర్తి సందర్భంలో అర్థం చేసుకొనేవారెవరూ బ్రహ్మంగారిలా ఇలాంటి అర్థరహితమైన ప్రశ్నలు అడగరు.

20. వీరబ్రహ్మం- “అప్పిచ్చువాడే క్రైస్తవుడు’!

మత్తయి 5:42లో ఇలా ఉంది “నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు”. కాబట్టి నిజమైన క్రైస్తవులు, ఉత్తమ క్రైస్తవులు తమ వద్ద డబ్బు ఉంటే అప్పు అడిగిన వారికి లేదనకుండా అప్పు ఇవ్వాలి. (బైబిల్ బాగోతం ప్రశ్న 20 పేజీ నం. 18).

జవాబు: అప్పులో తప్పేముందో బ్రహ్మంగారు చెప్పనేలేదు. అప్పు ఇవ్వడం తప్పా? అన్నట్టు బ్రహ్మంగారు చెప్పింది వాస్తవమే, ఆపదలలో ఉన్న ఇతరులకు అప్పు ఇచ్చి సహాయం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. "ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహెూదరునికి లేమి కలుగుట చూచియు, అతని యెడల ఎంత మాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును” (1యోహాను 3:16)? బ్రహ్మంగారి మాటలు వింటుంటే సందర్భసహితంగా అర్థం చేసుకునే పరిపక్వత లేకపోవడమే హేతువాదమేమో అనిపిస్తుంది. ఆయన ఉదహరించిన వాక్యభాగాన్ని సందర్భసహితంగా చూసినప్పుడు, కీడుకు ప్రతికీడు చేయకుండా కీడుకు ప్రతిగా మేలు చేయాలనే సందేశం స్పష్టంగా కనిపిస్తున్నది. మత్తయి 5లో 42వ వచనం విడిగా చదవకుండా 38 నుండి 48 వరకు చదివితే బహుశా ఆయనకి ఈ సందర్భం అర్థమైయుండేదేమో, కనీసం పాఠకులైనా చదవండి (106వ ప్రశ్నకు రాసిన జవాబును పోల్చి చూడండి).

21. వీరబ్రహ్మం- క్రైస్తవులు ఎక్కడ ప్రార్థన చేసుకోవాలి? చర్చీలకెళ్ళి ప్రార్థన చేసుకోవాలా? లేక తమ తమ ఇండ్లలో ప్రార్థన చేసుకోవాలా? వ్యర్థమైన మాటలతో విస్తారమైన ప్రార్థనలు చెయ్యవచ్చా? చెయ్యకూడదా?
"క్రైస్తవులు అన్యజనులవలే సమాజమందిరము (చర్చి)లలోకి పోయి ప్రార్థన చేయగూడదు. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వచించగూడదు. విస్తరించి మాటలాడగూడదు” మత్తయి 6:5-8 కాబట్టి క్రైస్తవ భక్తులు చర్చీలకెళ్ళనక్కరలేదు, తమ ఇండ్లలో ఉండి ప్రార్థన చేసుకోవాలి. సుదీర్ఘమైన ప్రార్థన చేయకూడదు. (బైబిల్ బాగోతం ప్రశ్న 21, పేజీ నం. 18)

జవాబు: శాస్త్రులు, పరిసయ్యులు ఇతరుల మెప్పు పొందడానికి, ఇతరుల దృష్టి తమ వైపు తిప్పుకోడానికి ప్రార్థనలు చేసేవారు. నిరాడంబరత కలిగి అణకువతో దేవునికి ప్రార్థించడానికి బదులు వేషధారణతో ప్రార్థన చేసేవారు. సంత వీధులలోను జనసమూహం రద్దీగా ఉన్నచోట వీరి భక్తిప్రవృత్తులు తారాస్థాయికి చేరుకునేవి. ప్రజలలో తమ స్థానాన్ని హెచ్చించుకోవడానికి చివరికి వీరు ప్రార్థనను, ఆరాధనను దుర్వినియోగపరచడానికి కూడా వెనుకాడేవారు కారు. అన్యజనులైతే (మత్తయి 6:6) ప్రార్థనలో వ్యర్థమైన మాటలు వచిస్తూ విస్తరించి మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసేవారు.

ఐతే అటు శాస్త్రులు పరిసయ్యులు కానీ ఇటు అన్యులుకానీ ఇతరుల దృష్టి తమవైపు మళ్లించుకోవటానికి ప్రార్థించేవారే తప్ప దానిని దేవుడు ఆమోదిస్తాడా లేదా అనే విషయం ఆలోచించేవారు కాదు. యథార్థంగా ప్రార్థించే ఒక విశ్వాసి వీరిని పోలియుండకూడదు అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ప్రార్థనైనా ఆరాధనైనా దేవుని మెప్పు పొందేలా ఉండాలి తప్ప వేషధారణతో ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ సందర్భం చర్చిలకు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా అనేది కాదు. భక్తిక్రియలు వేషధారణతో కాకుండా, మనుష్యుల మెప్పుకోసం కాకుండా దేవుని మహిమ కొరకు మాత్రమే చేయాలన్నదే ప్రభువు మాటల్లోని ఆంతర్యం. వ్యాఖ్యానించడం తెలియక బ్రహ్మంగారు ఏదేదో వ్రాసేశారు. వెనుకటికి ఎవరో తలపాగ చుట్టుకోవడం రాక తల వంకర అని అన్నాడట అలా వుంది బ్రహ్మంగారి యవ్వారం.

22. వీరబ్రహ్మం- క్రైస్తవులు తిండి, బట్టల గురించి చింతించతగదు!

మంచి క్రైస్తవులు తిండీ తిప్పలు గురించి ప్రాకులాడగూడదు. ఆహారము లేకపోయినా ప్రాణం ఉంటుంది. “ఆకాశపక్షులకు” తిండి దొరకటం లేదా? అలాగే మీకు! వస్త్రముల గురించి చింతించకూడదు. అడవి పువ్వులు వస్త్రాలు ధరించకపోయినా అందంగానే ఉండటం లేదా? అలాగే మీరూ!
ఇది మత్తయి 6వ అధ్యాయంలో 25-30 వచనాలలో సెలవియ్యబడ్డ విషయం. దీన్ని బట్టి కనీస అవసరాల గురించి క్రైస్తవులు అనబడే వాళ్ళు ప్రభుత్వాల మీద ఆందోళన చెయ్యాల్సిన పనిలేదు!
(బైబిల్ బాగోతం ప్రశ్న 22, పేజీ నం. 18)

జవాబు: నిజమే మంచి క్రైస్తవులు ఆహారం కోసం ప్రాకులాడనవసరం లేదు, ప్రభువు ఆజ్ఞాపించిన ప్రకారం పనిచేస్తే చాలు (2థెస్స 5:10). విత్తుటకు గాని కోయుటకు గాని సామర్థ్యం లేని ఆకాశపక్షులకే ఆయన ఆహారాన్ని సమకూర్చినప్పుడు వాటికంటే మిక్కిలి శ్రేష్టులమైయుండి ఆహారాన్ని సంపాదించుకునే సామర్థ్యం ఇవ్వబడిన మనకు ఆయన కనికరం ఎందుకు కొరవడుతుంది? కాబట్టి దేనికోసమూ చింతించనవసరం లేదు కష్టించి పనిచేస్తూ ఆయన దీవెనపై ఆధారపడాలి. ఇక్కడ సమస్య ఏముంది? ప్రభుత్వంపై ఆందోళనకు దిగడమంటూ అసందర్భమైన మాటలు జొప్పించడమెందుకు? లేనివి జోడించి ఉన్నవి ప్రక్కకు తప్పించడం హేతువాదులకు పరిపాటి కాబోలు.

23. వీరబ్రహ్మం- ఆకాశ పక్షులా?

మత్తయి 6:26లో “ఆకాశ పక్షులను చూడుడి” అని ఉంది. పక్షులు అని అంటే సరిపోతుంది కదా! ఆకాశపక్షులు అని అనాలా? పక్షుల్లో భూపక్షులు, జలపక్షులు, ఆకాశపక్షులు అనే వర్గీకరణ ఉందా? కోడి, నిప్పుకోడి (ఆస్ట్రీచ్), కివి మొదలగునవి భూపక్షులేగదా అనే ప్రబుద్ధులు ఉండినా ఉండొచ్చు ! (బైబిల్ బాగోతం ప్రశ్న 23, పేజినం 18)

జవాబు: ప్రశ్నించడం తనకే తెలుసని బ్రహ్మంగారు అనుకుంటున్నారు. కోడి, నిప్పుకోడి, కివి మొదలగు పక్షులు భూపక్షులు కావని బ్రహ్మంగారు తేల్చేస్తే సరిపోతుందా? నీటి మడుగులో జీవించే అనిహింగ వంటి పక్షులు కూడా సృష్టిలో ఉన్న సంగతి బ్రహ్మంగారికి తెలుసా? యేసు ఆకాశపక్షులని ప్రస్తావిస్తే బ్రహ్మంగారు తప్పుపట్టుకోవడంలో అర్థమేమిటి? భూపక్షులు, జలపక్షులు, ఆకాశపక్షులు అనే వర్గీకరణ పక్షుల్లో లేవనడానికి బ్రహ్మంగారి వద్ద ఉన్న ఆధారలేమిటి ? ఐనా , ఆకాశంలో ఎగిరే పక్షులను ఇతర పక్షులలోనుండి వేరుపరచడానికి వాటిని ఆకాశపక్షులని పిలవకూడదా? అలా వాటిని వర్గీకరించి ప్రత్యేకించడానికి బ్రహ్మంగారి వద్ద లైసెన్సు తీసుకోవాలా ?

24. వీరబ్రహ్మం- యేసును నమ్ముకుంటే, చనిపోయిన తండ్రిని పాతిపెట్టుకోవటానిక్కూడా ఒక శిష్యుడికి పర్మిషన్ దొరకలేదు!

“....శిష్యులలో మరియొకడు - ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి - నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను” ఇలా మత్తయి 8లో 21, 22 వచనాలలో ఉంది, యేసును నమ్ముకుంటే చాలు కన్నతల్లిదండ్రుల్ని నట్టేట్లో మునగనివ్వండి. వాళ్ళని అసలు పట్టించుకోనవసరం లేదు! ఏమంటారు? ఇంకా కావాలంటే లూకా 9:59 -61 వచనాలు కూడా చూడండి (బైబిల్ బాగోతం ప్రశ్న 24, పేజినం 18) .

జవాబు : బ్రహ్మంగారు మరొకసారి పప్పులో కాలేసారు. ఒక శిష్యుడు చనిపోయిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని యేసుబోధ వినడానికి రాలేదని ముందు గ్రహించాలి. ఒకవేళ తన తండ్రి మృతి చెందిన తరువాత, అంత్యక్రియలు జరిపించకుండా, యేసు వద్దకు వచ్చి ఆ పని చేయడానికి అనుమతి కోరుతున్నాడని పొరబడితే దానికి మించిన హాస్యాస్పదం మరొకటి ఉండదు. ఆప్పటికే చనిపోయిన తన తండ్రిని పాతిపెట్టడం, ఆపై వచ్చి యేసుని వెంబడించడానికి ఆటంకం ఎలా ఔతుంది? ఆలా చేయడానికి పర్మిషన్ అడగటం ఎందుకు? ఆయినా, యేసు గొప్పతనాన్ని గుర్తించి ఆయనకు శిష్యరికం చేసేంతగా ఒప్పించబడినవాడు , చనిపోయిన తన తండ్రిని పాతిపెట్టే ఆనుమతి కోరడం కంటే, ఆతనిని బ్రతికించమని ప్రాధేయపడి వుండాలి కదా? ఆయితే, ఇంగితం పనిచేయని నాస్తికులు ఆలోచించటానికి ఈ తరాలకు మించిన ఒక ఆధారాన్ని కూడా అందించగలం.

ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం ప్రకారం, మరణించినవాని ఇంటివారు ఏడు దినముల వరకూ ఆపవిత్రంగా ఉంటారు (సంఖ్యా 19:11-20). తమ ఆపవిత్రత వలన ఇతరులు మైలపడకుండా తమను తాము వేరుగా ఉంచుకోవడం వారి పద్ధతి (సంఖ్యా 19:22). కాబట్టి మృతదేహం ఇంటిలో పెట్టుకుని ఇశ్రాయేలీయులలో ఎవరైనా జనసమూహం మధ్యకు వస్తారని కనీస పరిశోధన చేయకుండా ఆపార్థం చేసుకోవడం, బైబిల్ పై మరియు యేసుపై దురభిప్రాయం కలిగించాలనే బ్రహ్మంగారి పథకాన్ని మరోసారి బట్టబయలు చేస్తుంది.

తన తండ్రికి మరణపర్యంతము సేవలు చేసి అంత్యక్రియల వరకూ తన బాధ్యతలు నిర్వర్తించి, ఆపై వచ్చి యేసును వెంబడించడానికి ఆ శిష్యుడు అనుమతి కోరుతున్నాడు. ఐతే యేసు భూమిపై ఉండాల్సిన గడువు అతి త్వరలో ముగియబోతున్న నేపథ్యంలో, ఆ అనుమతి ఇవ్వడం సాధ్యపడదు. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనిద్దాం. దేశసరిహద్దులలో కాపలాగా ఉండే జవానుకు ఒక్కసారిగా తన తల్లితండ్రులను చూసుకోవాలనో, వారి బాధ్యతలను తీర్చాలనో అనిపించింది. ఇంతలో యుద్ధఘడియలు ముంచుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో, వ్యక్తిగత బాధ్యతలకంటే దేశం యొక్క శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇవ్వాలి; కాబట్టి సదరు జవాను కోరిక మన్నించలేదంటే దానికి మనం మిలిటరీ చట్టాన్ని తప్పు పట్టుకుంటే ఎంత తెలివితక్కువతనమో బ్రహ్మంగారు యేసు మాటలను తప్పుపట్టుకునే విధానం కూడా అంతే తెలివితక్కువతనంగా ఉంది. ఎందుకంటే ఆ శిష్యుడు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రికి మరణపర్యంతమూ సేవ చేసి తిరిగి వచ్చేసరికి యేసు పరిచర్య కాస్తా ముగిసిపోవచ్చు. మూడున్నర సంవత్సరాల వరకూ మాత్రమే చేయాల్సిన ఆయన పరిచర్యలో అప్పటికే ఎంతో సమయం గడిచిపోయింది. ఈ అత్యవసర పరిస్థితిలో ఇంటి పనులు చూసుకోవడానికి అనుమతి కోరడం సమంజసం కాదు.

ఇకపోతే, నన్ను వెంబడిస్తే చాలు, నీ తల్లిదండ్రులు నట్టేట మునగనీ అని యేసు చెప్పినట్లు బ్రహ్మంగారు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఐతే యేసు మాత్రం మృతులు తమ మృతులను పాతిపెట్టుకోనిమ్మని చెప్పాడు, అంటే, ఈ మాటలు, బాధ్యత నిర్వర్తించడానికి మరెవరు లేని పరిస్థితికి చెందినవి కావని స్పష్టంగా తెలుస్తుంది. అనుమతి కోరిన ఆ శిష్యుని ఇంట్లో తన తండ్రి పట్ల బాధ్యతను నిర్వర్తించగలిగే ఇతరులు కూడా ఉన్నారని , తాను వెళ్తేనే తప్ప అది జరగదనే అత్యవసర పరిస్థితేమీ అక్కడ లేదని స్పష్టంగా తెలుస్తుంది.

యేసు పరిచర్య కాలపరిమితి అతి స్వల్పమైనది కాబట్టి ఇతర పనులు చూసుకునే అనుమతి ఆ సందర్భంలో ఆ శిష్యునికి లభించలేదు. అంతమాత్రాన తల్లిదండ్రులను నట్టేట మునగనిమ్మని, వారిపట్ల బాధ్యతలు నెరవేర్చవద్దని యేసు భావం కాదు. ఇందుకు భిన్నంగా, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడంలో ఎలాంటి జాప్యం జరగకూడదనేదే బైబిల్ బోధించే సాధారణ నియమం. “ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాసత్యాగము చేసినవాడై అవిశ్వాసికన్నా చెడ్డవాడై యుండును”. ఇదే ఆదర్శాన్ని కనపరుస్తూ , తల్లిదండ్రుల బాధ్యతను దైవసేవ పేరిట నిరాకరించే విధంగా ప్రేరేపించిన పరిసయ్యులను యేసు తీవ్రంగా ఖండించిన సందర్భం (మార్కు 7:10-13) బ్రహ్మంగారి దృష్టికి ఎందుకు రాలేదో ఆయనకే తెలియాలి.

25. వీరబ్రహ్మం- చచ్చినవాళ్ళు చచ్చిన వాళ్ళను పాతిపెట్టుకోమనటమేంటి ?

మత్తయి 8:22లో ఇలా ఉంది “మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను”అంటే తనతోపాటు తిరగని వాళ్ళంతా యేసు దృష్టిలో చచ్చిన వాళ్ళ క్రింద లెక్క పెళ్ళాం-బిడ్డల్ని, తన వాళ్ళనందర్ని వదిలేసి బిక్కా ఫకీరుల్లాగా తనతో పాటు తిరిగే వాళ్ళంతా సజీవులు !
కాబట్టి “శిష్యుడా! నాతో తిరుగుతున్న నువ్వు సజీవుడవు. నాతో చేరని మీ కుటుంబంలోని మిగిలిన వాళ్ళు మృతజీవుల క్రిందే లెక్క మృతి చెందిన నీ తండ్రిని ఆ మృతజీవులే పాతిపెట్టుకుంటారులే. నువ్వు వెళ్ళటం దేనికి? నువ్వు నాతో పాటే ఉండు” అని తాత్పర్యం. (బైబిల్ బాగోతం ప్రశ్న 25, పేజినం 19

జవాబు: బ్రహ్మంగారు తెలిసి వ్రాసారో తెలియక వ్రాసారో మాకు తెలియదు కాని ఆయన విమర్శలోనే జవాబు వ్రాసేసారు. అవును, క్రీస్తును అంగీకరించని ఏ వ్యక్తియైన మృతుడే. బ్రతికియున్నవారెవరైనా సరే పరిశుద్ధాత్మచేత వెలిగింపబడకపోతే వారు దేవుని దృష్టిలో మరణించినవారే. భార్యాబిడ్డలను విడిచిపెట్టి క్రీస్తును వెంబడించినవారందరిని బిక్కాఫకీర్లు అని ఇష్టమొచ్చినట్లు వ్రాసేసారు బ్రహ్మంగారు. అలాగైతే దేశప్రగతి కోసం భార్యాబిడ్డలను విడిచిపెట్టి సరిహద్దులలో కాపలా కాస్తున్న సైనికులందరు బిక్కా ఫకీర్లేనా? భార్యాబిడ్డల ప్రేమకు దూరమై, దేశశ్రేయస్సుకై పాటుపడుతున్న సైనికులందరి విషయమై బ్రహ్మంగారు ఏమంటారో మరి! వ్యాపారం లేదా ఉద్యోగ అవసరతల కోసం భార్యాబిడ్డలను విడిచిపెట్టి సంవత్సరాల తరబడి దూరదేశాలలో ఉండిపోయేవారిని కూడా నాస్తికులు ఇలాగే ఆడిపోసుకుంటారా?

భార్యాబిడ్డలను విడిచిపెట్టి తనను వెంబడించమని ప్రభువు చెప్పాడు (లూకా 14:25-26). అంటే, భార్యకు విడాకులు ఇచ్చేసి, పిల్లలను గాలికొదిలేసి ప్రభువును వెంబడించాలి అని అర్థం చేసుకోకూడదు. ఒక వ్యక్తి అప్పటి వరకు తన కుటుంబమే జీవితం, తన భార్యే సర్వస్వం, తన పిల్లలే ప్రాముఖ్యం తన సంసారమే ప్రధానం అనే తలంపును కలిగి ఉంటాడు ఐతే దేవుని చేత అతడు పిలువబడిన తర్వాత దేవుడే జీవితం, సర్వస్వం, ప్రాముఖ్యం, ప్రధానం; ఆ తరువాతే కుటుంబం అనే పరిపక్వతకు అతను ఎదగాలి. ఒక్కమాటలో చెప్పాలంటే తొలుత దేవుడు ఆ తర్వాతే కుటుంబం అని ప్రభువు ఉద్దేశం. అంతే తప్ప దేవుని సేవ నిమిత్తమై భార్యాబిడ్డలతోను కుటుంబ సభ్యులతోను తెగతెంపులు చేసుకుని గడ్డాలు మీసాలు పెంచుకుని దీక్షలో మునిగిపోమ్మని భావించకూడదు. ఆయనను వెంబడించే సంఘంలోని ప్రధానులకు సహితం విధించబడిన నియమమేమిటో గమనించండి , “ఎవడైననూ తన ఇంటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును ?” (1 తిమోతి 3:5). తన ఇంటిని పట్టించుకోనివాడు క్రీస్తు పరిచర్యకు పనికిరాడని మరోమాటలో చెప్పవచ్చు. విమర్శించాలంటే విషయపరిజ్ఞానం కావాలి లేదంటే విమర్శించడం మానుకోవాలి.

26. వీరబ్రహ్మం - యేసు శిష్యులు ఎందుకు భయభ్రాంతులయ్యారు ?
మత్తయి 8:23-26 ప్రకారం ఆయన దోనెయెక్కి శిష్యులతో కూడా గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు వచ్చిన తుఫాను అలలకు శిష్యులు భయపడ్డారు. యోహాను 6:19 ప్రకారం యేసు సముద్రం మీద నడచి వచ్చుట చూచి శిష్యులు భయబడ్డారు అని ఉంది. ఇందులో ఏది నిజం? ఏది కల్పితం? మత్తయి చెప్పింది అతిశయోక్తి అనిపించడం లేదు.

మత్తయి సువార్త ప్రకారం యేసు సముద్రం మీద నడచిరాలేదు. యోహాను సువార్త ప్రకారం యేసు సమద్రం మీద నడచి వచ్చాడు.
దోనె వేసికొని సముద్రం మీద ప్రయాణం చెయ్యటం సాధారణంగా జరుగుతుందా? దోనె మీద ప్రయాణం చేసి ఉంటే, అది సముద్రం కాకుండా సరసై ఉంటుంది. మత్తయి రచనలో యేసుకు మహిమను ఆపాదించటానికి యేసు అల్లకల్లోలమైన సముద్రాన్ని శాసించి, శాంతపరచాడు అని వ్రాయగల్గితే, యోహానైతే యేసు సముద్రం మీద నడిచాడు, తన విశ్వరూపాన్ని చూపాడని మరింత సుందరంగా వ్రాయగల్గాడు. ఇక్కడ ఆయా రచయితల సృజనాత్మకతను, కాల్పనిక శక్తిని ఆస్వాదించాలి. అంతేగానీ నిజాలను వెతుక్కోగూడదు. అన్నీ ఇలాగే ఉంటాయి. (బైబిల్ బాగోతం ప్రశ్న 26, పేజినం 19)

జవాబు: మత్తయి సువార్త ప్రకారం యేసు దోనెలో ప్రయాణం చేసాడని , ఐతే యోహాను సువార్త ప్రకారం నీటిపై నడిచి వచ్చాడని ఇది పరస్పర వైరుధ్యమని అయ్యవారు వ్రాసారు; ఇది ఆయనగారి అవగాహనా లోపమే తప్ప వాస్తవం కాదు, మత్తయి 14:25-26 లో యేసు సముద్రంపై నడిచినట్లు వ్రాయబడివుంది, యోహాను ప్రస్తావించినది ఈ సందర్భాన్నే . మత్తయి 8:23-26 మరియు మత్తయి 14:25-26 రెండు వేరువేరు సంఘటనలు , ఒకటి దోనెలో ఉండి సముద్రాన్ని నిమ్మళపరచిన సంఘటనైతే మరొకటి సముద్రంపై నడిచిన సంఘటన . కాబట్టి ఇందులో వైరుధ్యమేమీ లేదు .
యోహాను 6:19 మరియు మత్తయి 14:25-26 ప్రకారం యేసు నీటి మీద నడవడం చూసి శిష్యులు భయపడ్డారు, మత్తయి 8:23-26 ప్రకారం ఆయన శిష్యులతో పాటు దోనెలో ఉన్నప్పుడు సంభవించిన తుఫానును బట్టి భయపడ్డారు ఇందులో వైరుధ్యమేముంది ? రెండు వేరు వేరు సంఘటనలను ఒక్క సంఘటనగా చిత్రీకరించి ఎన్ని పరస్పర వైరుధ్యాలనైనా ఉత్పత్తి చేయవచ్చు. ఇందులో నాస్తికుల సృజనాత్మకతను,కాల్పనిక శక్తిని ఆస్వాదించాలి. అంతేగానీ నిజాలను వెతుక్కోగూడదు. అన్నీ ఇలాగే ఉంటాయి.

దోనే సముద్రంపై ప్రయాణించడం జరుగుతుందా ? అని బడిపిల్లలు అడిగినట్లు అడిగారు బ్రహ్మంగారు. జాలరులు చేపలు పట్టే విధానం మొట్టమొదట చిన్నపాటి దోనెలలో నుండే ప్రారంభమైందనే కనీస అవగాహన లేకుండా ఈయనగారు హేతువాది ఎలా అయ్యారో మాకు అర్థం కావడం లేదు.

ఏతావాతా మేము చెప్పేదేమిటంటే లేనివి వున్నట్టుగా వున్నవి లేనట్టుగా చూపించే ప్రయత్నం చేసి చివరకు బ్రహ్మంగారు తమ బాగోతాన్ని బయటపెట్టుకుంటున్నారు.

27. వీరబ్రహ్మం - యేసుకు భూతదయ లేదు, యేసుకు ప్రాణులన్నింటియెడ సమదృష్టి లేదు !

యేసు గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు ఎదురయ్యారు. వారికి దూరములో గొప్ప పందుల మందమేయుచుండగా, ఆ దయ్యములు “నీవు మమ్మును వెళ్లగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని వేడుకున్నాయి ఆయన ఎంతో ఉదారంగా దయ్యాల మాటమేరకు అలాగే చేశాడు. అప్పుడా “గొప్ప పందుల మంద” యావత్తు “సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్ళల్లో పడిచచ్చెను” మత్తయి 8:28-32.

సముద్రంలోకి పోయిన తరువాత నీళ్ళలో పడిచావకపోతే, నిప్పుల్లోపడి చస్తాయా? యేసు విడిగా దయ్యాల్ని పట్టుకొని చంపలేడా ? చంపలేకపోతే దూరంగా తరిమేయవచ్చు గదా ? మధ్యలో పాపం పందులేం పాపం చేశాయి. వాటిల్ని సముద్రంలోకి తరిమి చంపటానికి ? ఇంతకీ యేసు చంపింది దెయ్యలనా, పందులనా? బైబిలు కధనం ప్రకారం దయ్యాలు వాటంతట అవి ఉండలేవన్నమాట ! అవి మనుషుల్నే కాక పందుల్ని, కుక్కల్ని, నక్కల్ని కూడా ఆవహిస్తాయి. పై కధనంలో ఇద్దరు మనుషుల్లో ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ? అసలు ఆ ఇద్దరిలో విడివిడిగా ఒకొక్కక్కరిని ఎన్ని దయ్యాలు పట్టుకున్నాయి ? ఆ తరువాత అవి మందలో ఉన్న పందుల్లో (ఎన్ని ?) ఒక్కోపందిని ఒక్కోటి ఆవహించిందా ? లేక ఎన్నేసి దయ్యాలు ఒక్కో పందిని ఆవహించాయి ? లేక మందలో ఉన్న పందులు సంఖ్యే ఎక్కువయితే ఒక్కొక్క దయ్యమే మైటాసిస్ పద్ధతిలో విభజింపబడి అనేక పందుల్ని ఆవహించిందా ? ఏమిటీ అర్థంలేని రాతలు ? ( బైబిల్ బాగోతం ప్రశ్న 27, పేజినం 20 )

జవాబు: యేసు దేవుడని బైబిల్ సెలవిస్తుంది (యోహాను - 1 : 1 - 18). సమస్త ప్రాణులకు ప్రాణం పోసేది తీసేది దేవుడే ఆని నాస్తికులు నమ్మకపోయినా, దేవున్ని నమ్మేవారికి ఈ విషయమై ఎలాంటి వివాదమూ లేదు. ప్రాణం పోసినవాడికి ప్రాణం తీసే హక్కు కూడా వుంటుంది. కాబట్టి అన్ని ప్రాణులను పుట్టించేది, వాటి గడువు పూర్తి అయ్యాక వాటి ప్రాణం తీసేది యేసే. అక్కడికి ఏదో ఆయన పందుల ప్రాణాలు మాత్రమే తీసినట్లు, యేసుకు ప్రాణులన్నింట యెడ సమదృష్టిలేదంటూ, పందుల మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు బ్రహ్మంగారు.

ఒక గొప్ప అద్భుతం జరిగి ఇద్దరు మనుషులు అద్భుతరీతిలో విడుదల పొందడం బ్రహ్మంగారిని కదిలించలేకపోయింది. పందుల విషయమై బ్రహ్మంగారు చింత కలిగి ప్రశ్నించారే తప్ప పందుల కంటే విలువైన మనుషుల ప్రాణాలు కాపాడబడ్డాయి అనే విషయం ఎందుకు పరిగణలోనికి తీసుకోలేకపోయారు? అంటే ఈయనగారి దృష్టిలో మనుషుల ప్రాణాల కంటే పందుల ప్రాణాలు ముఖ్యం కదా !

ఇంతకూ యేసు చంపింది పందులనా లేక దయ్యాలనా అని ప్రశ్నించారు బ్రహ్మంగారు. యేసు దయ్యాలను చంపలేదు. ఎందుకంటే దయ్యాల నాశనానికి ఒక నిర్ణీత సమయముందని బైబిల్లో మనం చదువుతాము ( మత్తయి 8:29, ప్రకటన 20 : 10 ).

ఇకపోతే ఎన్నేసి పందులలో ఎన్నెన్ని దయ్యాలు ప్రవేశించాయి అని బ్రహ్మంగారికి తెలియజేయడానికి బైబిలు దయ్యాల జనాభా గణాంకాల పుస్తకమేమి కాదు .

ఆకాశపక్షులు' 'సముద్రపునీళ్లు' వంటి భాషా ప్రయోగంలో కూడా బ్రహ్మంగారికి ఎన్నో దోషాలు లోపాలు కనబడ్డాయంటే దానర్థం ఈయనగారు ఏదో కాలక్షేపానికో బైబిలు మీద బురద జల్లటానికో వ్రాసారు తప్ప నిజమైన హేతుబద్ధత కలిగి విమర్శించడానికి తన పుస్తకం వ్రాయలేదని అర్థమౌతుంది.

బైబిలు కథనం ప్రకారం దయ్యాలు మనుషుల్నే కాక పందుల్ని, కుక్కల్ని, నక్కల్ని ఆవహిస్తాయా? అని వెటకారంగా ప్రశ్నించడం అలా వుంచితే , క్రీస్తును నిరాకరించి వాక్యాన్ని త్రోసిపుచ్చే నాస్తికులను సైతం వదిలిపెట్టవనే విషయం మర్చిపోకండి.

28. వీరబ్రహ్మం- యేసు అంటే పట్టణస్తులు భయభ్రాంతులయ్యారు. తమ ప్రాంతాలను విడచిపొమ్మని వేడుకొన్నారు. నమ్మలేకపోతే మత్తయి 8:34 చూడండి .

మన తెలంగాణాలో కొన్ని మారుమూల ప్రదేశాలలో చేతబడి చేసేవారిని ప్రమాదకర వ్యక్తులుగా భావించి, భయంతో జనాలు వారిని ఊరినుండి తరిమేస్తారు. అలాగే యేసును కూడా తమ పట్టణంలోకి పాదం మోపనియ్యలేదు. తమ జీవనాధారమైన పందుల్లోకి ఇద్దరు మనుషులను ఆవహించిన దేయ్యాల్ని పంపించానని చెప్పి వాటిల్ని మందలకొద్ది చంపిస్తుంటే, అక్కడి సామాన్య ప్రజలకు మామూలుగానే మూఢనమ్మకాలు ఉన్నప్పటికీ తమ నోటి దగ్గర కూడును యేసు తన మహిమల పేరిట తన్నేస్తుంటే, అటువంటి యేసు తమకు వద్దని నిర్ద్వంద్వంగా తిరస్కర్తించారు. ఎంతైనా మనిషి ప్రాక్టికల్గా హేతువాది! (బైబిల్ బాగోతం ప్రశ్న 28, పేజీ నం. 20)

జవాబు : తమ నోటి దగ్గర కూడు యేసు తన మహిమల పేరిట తన్నేస్తున్నందుకు పట్టణంలోనికి రానీయలేదని బ్రహ్మంగారు ఈ సంఘటనను తప్పుగా చిత్రీకరించారు. మూడు సువార్తలలోను ఈ సంఘటనకు సంబంధించి వ్రాయబడిన అంశాలను పోల్చి చదివుంటే ఆయనగారికి అసలు సంగతి బోధపడుండేది. ఆ పట్టణ ప్రజలు యేసును వెళ్లిపొమ్మని బ్రతిమాలుకున్నది సముద్రంలో పడి చచ్చిన పందులను బట్టి కాదు స్వస్థత పొందినవానిని బట్టి భయాక్రాంతులయ్యారు (లూకా 8:37) .

ఈ విషయం బ్రహ్మంగారికి తెలియక అపార్థం చేసుకోవడమే కాకుండా వారందరూ క్రీస్తును తమ పట్టణాలలోనికి పాదం మోపనీయలేదని తప్పుగా వ్యాఖ్యానించారు. ఐతే పాపం ఈయనగారికి తెలియని విషయం మరొకటుంది; ఆయనను విడిచిపొమ్మని వేడుకున్నవారున్నట్టే ఆయన రాక కొరకు కనిపెట్టుకుని తమ దగ్గరకు చేర్చుకున్నవారు కూడా లేకపోలేదు(లూకా 8:40). మరి ఈ అంశాన్ని బ్రహ్మంగారు ఎందుకు ప్రస్తావించలేదు? సత్యాన్వేషణ చేసేవారికి విమర్శించే ముందు వివేచించే మనస్సు వుంటుందని పెద్దలంటుంటారు కాని అయ్యవారికి తెలిసిందల్లా ‘విమర్శ' మాత్రమే .

29 . వీరబ్రహ్మం- యేసు పాపులకే అవసరం, నీతిమంతులకు కాదు!

మత్తయి 9:13లో ఇలా ఉంది. “నేను పాపులను పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు”. ఇందుకు ఇంకా ఉదాహరణలు మార్కు 2:17 మరియు లూకా 5:32. బైబిల్ బాగోతం ప్రశ్న29, పేజీ నం. 20)

జవాబు: అవును, యేసు ఈ లోకానికి వచ్చింది పాపుల కోసమే (బ్రహ్మంగారిలాంటి హేతువాది కొరకు కూడా),

ఇందులో దోషమేముందో ఈయన గారు చెప్పనేలేదు. రోగం బాగుచేయడానికి వచ్చిన డాక్టరును చూచి మీరు వచ్చింది కేవలం రోగుల కోసం మాత్రమేనా అని ప్రశ్నిస్తే ఎంత వెట్టితనంగా ఉంటుందో రక్షకుడు వచ్చింది కేవలం పాపుల కొరకేనా అని ప్రశ్నించే విధానం కూడా అంతే వెట్టితనంగా వుంది. మరి ఇలాంటి వెట్టితనపు ప్రశ్నలు అడగటమేనా హేతువాదమంటే !

30. వీరబ్రహ్మం- యేసు ఆజ్ఞ ప్రకారం ఆయన మహిమలను ప్రచారం చెయ్యకూడదు !

ఇద్దరు గ్రుడ్డివారిని కన్నులు ముట్టి ఆయన చూపు రప్పించాడు. “ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితంగా ఆజ్ఞాపించెను”. ఐనా వారు ఆయన ఆజ్ఞను పాటించలేదు. దేశమంతటా ఆయన కీర్తిని ప్రచారం చేశారు. యేసు మహిమలను ప్రచారం చెయ్యగూడదని మత్తయి 9:30, 31లలో ఆదేశించబడినది (బైబిల్ బాగోతం ప్రశ్న30, పేజీ నం. 20)

జవాబు: 34ప్రశ్నకు వ్రాసిన సమాధానం చూడండి.

31. వీరబ్రహ్మం- యేసు తన పండ్రెండు మంది శిష్యులను బోధచేయుటకు పంపుచు వారికి ఆజ్ఞాపించినది ఏమనగా!

“మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, ........ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్ళుడి” (మత్తయి 10:5, 6) అప్పట్లో అణచివేతకు గురైన తనవారైన ఇశ్రాయేలీయులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి బోధ చెయ్యమన్నాడు. మిగతా చోట్లకు వెళ్లవద్దన్నాడు. కాగా జరిగింది, జరుగుతున్నది ఏమిటి? ఖండఖండాంతరాల్లో క్రైస్తవ మతం ఎలా ప్రచారమైంది? ఎందుకు ప్రచారం చేయబడింది ? (బైబిల్ బాగోతం ప్రశ్న31, పేజీ నం. 20)

జవాబు: యేసు తన మరణానికి ముందు మాత్రమే తన పరిచర్యను ఇశ్రాయేలీయులకు పరిమితం చేసి ఆయన పునరుత్థానం తర్వాత “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి” అని తన శిష్యులను ఆదేశించాడు ( మార్కు 16 : 15 , మత్తయి 28 :18-20 , అపొ. 1:8). యేసు తన మరణం ద్వారా యూదులకు , యూదేతరులకు మధ్య ఉన్న భేదాన్ని తీసివేసి ఉభయులను ఏకం చేసాడు ( ఎఫెసీ 2:13-14 ). అందుకే పునరుత్థానం తరువాత అన్యుల యొద్దకు వెళ్లవద్దనే నిషేధాన్ని తొలగించి అందరికీ సువార్త ప్రకటించమని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. కాబట్టి యేసు సువార్త ఖండఖండాంతరాల్లో విస్తృతంగా ప్రకటించబడడాన్ని బట్టి ఇక బ్రహ్మంగారు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

32. వీరబ్రహ్మం- యేసు కరుణామయుడు కాడు, ప్రేమ స్వరూపుడు అంతకన్నా కాదు!

యేసు కారణంగా కుటుంబంలో కలతలు రేగుతాయి. యేసు పచ్చి కుళ్ళుమోతు, వట్టి స్వార్థపరుడు. మత్తయి 10వ అధ్యాయంలో 35 నుండి 37 వరకు గల వచనాలలో ఏముందో చూడండి. “ఒక మనుష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకు ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చితిని. ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను, తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు”. చూశారా కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన పరస్పర ఆప్యాయతలను, అనుబంధాలను బైబిల్ ఎలా త్రోసిపారేస్తుందో! (బైబిల్ బాగోతం ప్రశ్నకి2, పేజీ నం. 21)

జవాబు: సత్యాన్ని నమ్మేవారిని నమ్మనివారి నుండి సత్యం వేరుచేస్తుంది. ఒకే కుటుంబానికి చెందినవారు కూడా దీనికి మినహాయింపు కాదు. ఐతే యేసు బోధలను సమగ్రంగా చదివినప్పుడు, కుటుంబంలోనైనా మరెక్కడైనా ఆయనను నమ్మినవారి నుండి కాదు కాని ఆయనను తిరస్కరించిన వారి నుండే వైరం ప్రారంభమౌతుందని యేసు స్పష్టంచేసాడు (యోహాను 15:18). ఇలాంటి శత్రుత్వం కారణంగా, యేసుకు మరియు కుటుంబసభ్యులకు మధ్య ఎన్నిక చేసుకోవలసి వచ్చినప్పుడు, ఆయనకంటే ఎక్కువగా ఇంకెవరిని ప్రేమించినా ఆయనకు పాత్రులు కాలేరని యేసు ఇక్కడ బోధిస్తున్నాడు.

యేసు చెప్పిన ఈ మాటలు ఒక నాస్తికునికి మాత్రమే కుళ్లుబోతుతనంగా లేదా స్వార్థపూరితమైనవిగా అగుపిస్తాయి. కాని దేవున్ని యథార్థంగా విశ్వసించేవారందరూ ఆయనకు మాత్రమే ప్రథమస్థానం ఇవ్వాలని, ఆయనకంటే మరి దేనిని, మరెవ్వరిని ఎక్కువగా ప్రేమించరాదని సదా నమ్ముతారు. ఒకవేళ యేసు దేవుడు కాకపోయినట్లైతే ఇలా మాట్లాడటానికి ఆయనకు హక్కుండేది కాదు. ఆయన బోధ మేరకు కుటుంబాన్ని ప్రేమించాలి, పోషించాలి (ఎఫెస్సీ 6:1-4) కాని ఆయనను తృణీకరించేంతగా మాత్రం కాదు. ఇదే యేసు మాటల్లోని ఆంతర్యం. అన్నట్లు యేసును విశ్వసించేవారు సమాధానాన్ని ప్రేమించేవారు కాకపోతే బ్రహ్మంగారిలాంటి వారికి యేసును కుళ్లుబోతు, స్వార్థపరుడు, పరమకిరాతకుడు అంటూ దూషించే స్వేచ్ఛ వుండేది కాదు (మత్తయి 5:44-48). ఇస్లాం మతస్థులకు, హిందుత్వవాదులకు వ్యతిరేకంగా ఇలాంటి సాహసాన్ని ప్రయోగిస్తే తేడా ఏంటో స్వయంగా ఆయనకే తెలుస్తుంది.

33. వీరబ్రహ్మం- యేసుకుగల స్వార్థానికి, ప్రజలకు గల గ్రుడ్డి నమ్మకానికి, మూఢభక్తికి పరాకాష్ట ఇదిగోండి!
తమకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తమ ప్రాణం దక్కించుకోవటానికి క్రైస్తవ విశ్వాసులు ప్రయత్నించకూడదు. మత్తయి 10:39లో ఇలా ఉంది. “తన ప్రాణము దక్కించుకోనువాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకొనును ”. మత్తయి 4:6లో సాతాను యేసును శోధించేటప్పుడు “నీవు దేవుని కుమారుడివైతే క్రిందికి (ఆలయ శిఖరంనుండి) దుముకుము” అంటాడు. అప్పుడు యేసు తన తండ్రి నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకొని మళ్లీ దక్కించుకోవచ్చుగదా! మరి ఎందుకు అలా చేయలేదు? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని వ్రాయబడి ఉన్నదని” అందుచేత తాను దూకనని చెప్పి తప్పించుకున్నాడు. తనకొక న్యాయము, ఇతరులకొక న్యాయమా? తన తండ్రిని ఘనపరచటం కోసం తానే తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఎడ్జస్టవనప్పుడు, తన కోసం ప్రాణం పోగొట్టుకోవటానికి మాత్రం పిచ్చిభక్తుల సిద్ధంగా ఉండాలంటాడు యేసు! (బైబిల్ బాగోతం ప్రశ్న34, పేజీ నం. 21).

జవాబు : ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడు ప్రాణం దక్కించుకోవడానికి క్రైస్తవ విశ్వాసులు ప్రయత్నించకూడదు అని యేసు చెప్పినట్లు బ్రహ్మంగారు చిత్రీకరించారు. ఇది ఆయన సారహీనమైన విశ్లేషణే తప్ప వాస్తవం కానేకాదు. ప్రాణాన్ని కాపాడుకోవడానికి స్వయంగా యేసే తన శిష్యులతో చెప్పిన మాటలు మనం మత్తయి సువార్తలో చదవవచ్చు 'వారు ఈ పట్టణములో మిమ్మును హింసించినప్పుడు మరియొక పట్టణమునకు పారిపొమ్మని” లేఖనం తేటగా బోధిస్తుంటే క్రైస్తవ విశ్వాసులు ప్రాణం దక్కించుకోకూడదని యేసు చెప్పినట్లు బ్రహ్మంగారు ఎలా చెప్పగలుగుతున్నారు?

ఇంతకూ, నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకొనువాడు దానిని దక్కించుకుంటాడనడంలో యేసు భావమేంటి? ఏవిధంగా యేసు కంటే ఎక్కువగా కన్నవారిని, బంధుమిత్రులను ప్రేమించకూడదో అదేవిధంగా యేసు కన్నా ఎక్కువగా తమ ప్రాణాల్ని ప్రేమించకూడదని ఆయన ఉద్దేశం.

మరి ఇంతకీ, అపవాది మాట ప్రకారం యేసు తన ప్రాణమును ఎందుకు పోగొట్టుకోలేదు? దీనికి సమాధానమేమిటంటే-అపవాది యేసును ఆత్మహత్యకు ప్రేరేపించాడు; అది కూడా దేవుడైన యెహెూవాను శోధించకూడదనే ఆజ్ఞను ఉల్లంఘించే విధంగా శోధించాడు. ఈ రెండూ మహాపాపాలు కనుక యేసు దీనికి సమ్మతించలేదు. అయినంత మాత్రాన యేసు తన ప్రాణాన్ని దక్కించుకుని ఎడ్జస్టయిపోయాడని నిందించడం ఎంత అసమంజసమో బైబిలు సమగ్రంగా చదివినవారికెవరికైనా అర్థమౌతుంది. వాస్తవానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది తండ్రి చిత్రాన్ని నెరవేరుస్తూ పాపులకొరకై తన ప్రాణాన్ని పెట్టడానికే తప్ప సాతాను ప్రలోభాలకు లొంగిపోయి మిద్దెల మీద నుండో మేడల మీద నుండో దూకేయడానికి కాదు. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి దానిని తీసుకోవడానికి ఆయనకు అధికారముంది (యోహాను 10:17) అందుకనే తన సమయం వచ్చినప్పుడు యేసు తన ప్రాణాన్ని సిలువలో అర్పించి పునరుత్థానం ద్వారా తిరిగి దానిని దక్కించుకున్నాడు.

బైబిలు తేటగా బోధించే సత్యమేమిటంటే “ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడా సూదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై యున్నాము” (1 యోహాను 3:16) .

యేసు, తాను స్వయానా చేసిన త్యాగానికి అతీతంగా తన భక్తులనుండి ఎప్పుడూ ఏదీ కోరలేదు. అన్నట్లు, యేసు తన ప్రాణాలను దక్కించుకునే విషయంలో ఏమాత్రం ఎడ్జస్టవ్వలేదు కానీ బ్రహ్మంగారే తన అపనిందలను సద్విమర్శలని అపోహపడి ఎడ్జస్టయిపోయారు.

34. వీరబ్రహ్మం- యేసు మహిమల్ని ప్రచారం చెయ్యొచ్చా? చెయ్యగూడదా ?

యేసు ప్రవచనాలు చాలా చోట్ల పరస్పర విరుద్ధంగా ఉంటాయనటానికి ఎన్నైనా ఉదాహరణలు పేర్కొనవచ్చు.
మత్తయి 9:30 ప్రకారం యేసు మహిమల్ని ప్రచారం చెయ్యకూడదు. ఆ వచనం ఇలా చెబుతోంది. “ఇది ఎవరికిని తెలియకుండ చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను”. మత్తయి 12:16లో “తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించెను” అని ఉంది.

లూకా 8:56 ప్రకారం కూడా ప్రచారం చెయ్యగూడదు. అది ఇలా ఉంది. “ఆయన జరిగినది (చనిపోయిన స్త్రీని బ్రతికించుట) ఎవనితోను చెప్పవద్దని వారినాజ్ఞాపించెను” .

అయితే మత్తయి 11: 4 ప్రకారం యేసు మహిమల్ని ప్రచారం చెయ్యొచ్చు. ప్రచారం చెయ్యమని ఆయన ఇలా చెప్తున్నాడు. “మీరు వెళ్ళీ విన్నవాటిని కన్నవాటి యోహానుకు తెలుపుడి” .

మత్తయి 28:19 లో “మీరు వెళ్ళీ, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రియొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు, నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” అని ఉంది.

మార్కు 5 :19 లో ఇలా ఉంది. ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియజేయుమని వానితో చెప్పి వానిని పంపి వేసెను వాడు వెళ్ళి యేసుతన కెట్టి గొప్ప కార్యము చేసెనో ఆ పట్టణమందంతటను అంతా ప్రకటించేను”. ( బైబిల్ బాగోతం ప్రశ్న34, పేజీ నం. 22 )

జవాబు : యేసుప్రభువు చేసిన కొన్ని అద్భుత క్రియలను ప్రచారం చేయొద్దని ఆయన ఆజ్ఞాపించిన సందర్భాలను చూపించి, సువార్త ప్రకటన చేయమని ఆజ్ఞాపించే ఇతర వాక్యభాగాలకు ఇవి విరుద్ధమని, కాబట్టి బైబిలులో పరస్పర వైరుధ్యాలున్నాయని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మంగారు. అయితే ప్రచారం చెయ్యొద్దని చెప్పిన సందర్భాలను పరిశీలించి చూస్తే, అప్పటికే చాలినంత సువార్త ప్రకటన చేసి, అది తిరస్కరించబడిన స్థలాలలో మాత్రమే అలాంటి ఆంక్ష విధించారని, అది వారి సత్యతిరస్కారానికి తీర్పుగా చెప్పబడిందని ఎవరైనా గ్రహించగలరు. ఉదాహరణకు బ్రహ్మంగారు ఉటంకించిన మత్తయి 9:30ని పరిశీలిస్తే ఆ అధ్యాయ ప్రారంభంలోనే ఆయన ఆ పట్టణంలో బహిరంగంగా కొన్ని అద్భుతక్రియలు చేసినట్టు మనము చదువుతాము. అయినా ఆ పట్టణస్థులు ఆయనను అవిశ్వాసముతో హేళన చేసినట్టు 24వ వచనంలో తెలుస్తుంది. వారి కళ్ళముందు జరిగిన వాస్తవాలను తిరస్కరించిన ఈ పట్టణస్టులకు మళ్ళీ ఒకరు వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఆయన స్వస్థపరిచిన గుడ్డివారితో ఇది ఎవరికీ చెప్పొద్దని ఆజ్ఞాపించినట్లు 30వ వచనంలో చూస్తాము. ఇలాంటి పరిస్థితులలోనే కాక కొన్ని ఇతర సందర్భాలలో కూడా ఆయన తన అద్భుతాలను ప్రచారం చేయొద్దని సమయ పరిమితి మరియు స్థలపరిమితితో కూడిన ఆంక్షలు విధించాడు. మత్తయి 12 :16 , లూకా 8:56 మొదలగునవి. ఇది సువార్త ప్రకటించాలనే సాధారణ నియమంతో ఏవిధంగాను విభేదించదు కాబట్టి పరస్పర వైరుధ్యం అన్న ఆరోపణ కేవలం బ్రహ్మంగారి తప్పుడు చిత్రీకరణ మాత్రమే అని స్పష్టమౌతుంది. తప్పుడు చిత్రీకరణకు జనని నాస్తికత్వమే అని మరోసారి నిరూపించుకున్నారు.

34. వీరబ్రహ్మం (బ్రహ్మంగారి పుస్తకంలో వరుస క్రమసంఖ్య 34 రెండుసార్లు తప్పుగా ముద్రించబడింది, మేము కూడా దీనిని సవరించకుండా అదే క్రమాన్ని అనుసరించాము)
పరలోకపు తండ్రి అసమర్దుడు, బలహీనుడు !


అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఎక్కడైనా బలవంతులదే రాజ్యం. మత్తయి 11 :12 ఇలా చెబుతోంది. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ఇలా జరుగుతోందని చెప్పబడింది కావున పరలోకపు తండ్రి లేదా యజమాని అసమర్థుడు, బలహీనుడు అని నిర్ధారించవచ్చును.

జవాబు: బాప్తీస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటివరకు పరలోకరాజ్యము బలత్కారముగా పట్టబడుతున్నదనే మాటకు భావం నిర్థారించాలంటే అతని దినములు మొదలుకొని జరిగిందేమిటో ముందు తెలుసుకోవాలి. ఈ అంశాన్ని గురించిన వివరణ , ఇదే సందర్భాన్ని ప్రస్తావిస్తూ లూకా అందిస్తున్నాడు.

లూకా 7:28 - 30 వరకు చదివినప్పుడు సుంకరులు, సాధారణ ప్రజలు యోహాను ప్రకటించిన దేవుని రాజ్యసందేశాన్ని అంగీకరించారని అయితే శాస్త్రులు పరిరసయ్యులు మాత్రం దానిని తిరస్కరించారని చదువుతాము. ఈ మాట మన ప్రస్తుత సమస్యను పరిష్కరించేందుకు తాళపు చెవి.

శాస్రులు , పరిసయ్యులు, తామే గొప్ప నీతిమంతులమని, అబ్రాహాము సంతానమని, మోషే శిష్యులమని, పరలోకరాజ్యానికి నిజమైన వారసులు కూడా తామేనని గర్వపడేవారు. ఐతే బాప్తీస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యసువార్త ప్రకటిస్తున్నప్పుడు సదరు శాస్త్రులు, పరిసయ్యులు తిరస్కరించారు కానీ సుంకరులు, పాపులు మాత్రం ఆ బోధను విని అంగీకరించి పరలోకరాజ్యానికి నిజమైన వారసులయ్యారు. అనగా తమ దగ్గరకు వచ్చిన రక్షణ భాగ్యాన్ని ఉద్దేశపూర్వకంగా శాస్త్రులు, పరిసయ్యులు నిరాకరించినప్పుడు ఎన్నికలేనివారుగా ఉండిన సుంకరులు, పాపులు బలాత్కారంగా వారి స్థానాన్ని ఆక్రమించుకున్నారనే భావాన్ని తెలియజేస్తూ మత్తయి 11:12లో అలంకారప్రాయంగా యేసు ఈ మాటలు తెలియజేసాడు. అంతేకాని దేవుడు బలహీనుడు గనుక ఆయన రాజ్యం బలాత్కారంగా ఆక్రమించబడిందని దీని భావం కాదు .

35. వీరబ్రహ్మం - బాప్తిస్మము పుచ్చుకోవటమంటే మారుమనస్సు పొందటమేనా అది పొందటానికి ముక్కుమూసుకొని నీళ్ళల్లో మునగాలా ? లేక గోనెపట్టా కట్టుకొని వంటినిండా బూడిద పూసుకోవాలా ?

రెండోదే చెయ్యాలని మత్తయి 11:21లోను,లూకా 10:13 లోను స్వయానా యేసుక్రీస్తే సెలవిచ్చాడు. మత్తయి 11:21లో ఇలా ఉంది. “మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు, సీవోను పట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్టా కట్టుకొని బూడిద వేసికోని మారుమనస్సు పొందియుందురు”. (బైబిల్ బాగోతం ప్రశ్న35, పేజీ నం. 22

జవాబు : వాస్తవానికి, ఒక వ్యక్తి మారుమనస్సు పొంది క్రీస్తు విశ్వాసిగా మారాడని నిర్ధారించడానికి అతడు నీటిలో మునిగి బాప్తీస్మం పొందుతాడు తప్ప బాప్తీస్మం పొందటం వలన మారుమనస్సు గాని పాపక్షమాపణ గాని రాదు, పాఠకులు దీనిని గమనించాలి (1 యోహాను 1:7-9, రోమా 6 : 3 - 5). గోనెపట్టా కట్టుకొని బూడిద వేసుకొని మారుమనస్సు పొందాలని యేసు చెప్పినట్టు బ్రహ్మంగారు చెబుతున్నారు. ఐతే ఇది కేవలం బ్రహ్మంగారి తప్పుడు వ్యాఖ్యానమే గాని యేసు చెప్పిన మాటకు అర్థమది కాదు. అసలు విషయమేమిటంటే - బూడిదలో కూర్చోవడం సంతాపానికి విషాదానికి గుర్తు (యోబు 2:8). అలాగే గోనెపట్టా కట్టుకోవడం పశ్చాత్తాపానికి లేదా చింతకు సాదృశ్యం (యోనా 2:6). కనుక యేసు సాదృశ్యప్రాయంగా మాట్లాడుతూ కొరాజీను బెత్సయిదా పట్టణ ప్రజలు ఆయన అద్భుతాలను సూచక క్రియలును చూసినప్పటికీ తమ పాపాల విషయమై సంతాపంగాని పశ్చాత్తాపంగాని లేనివారుగా వున్నారని వారిని ఇలా గద్దించాడు. కాబట్టి నీటిలో మునగడంగాని బూడిదలో కూర్చోవడం గాని మారుమనస్సుకు అవసరమనేది బైబిలు సిద్దాంతం కాదు (ఎఫెస్సీ 2:8-9).

ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు , బ్రహ్మంగారు కూడా పాపక్షమాపణ కోసం యేసును వేడుకుంటే ఆయన తప్పక క్షమిస్తాడు. దీనికోసం ఈయనగారు గోనెపట్టా కట్టుకొని ఒంటినిండా బూటీద పూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు ( “నా యొద్దకు వచ్చువానిని నేనెంతమాత్రమును బయటకి త్రోసివేయను” అనేది క్రీస్తు వాగ్దానం - యోహాను 6 : 37 )

36. వీరబ్రహ్మం- దేవుడు తన సంగతులు వివేకులకు మరుగుచేసి, పసిబాలురకు బయలు పరచినాడట! దీని పరమార్థం ఏమిటి? వివేకులకు చెబితే వచ్చే నష్టం ?

దేవుడు తన సంగతులు జ్ఞానులకు, వివేకులకు చెబితే వచ్చే నష్టం ఏమిటంటే, వాళ్ళు ఏం చెబితే అది నమ్మరు. వారికి విచక్షణా శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు సత్యాన్ని మాత్రమే గ్రహిస్తారు. పసిపిల్లలు మూగమొద్దులు. వారికి బయలుపరచేదేమిటి? అందువల్ల ఒరిగే లాభమూ లేదు. జరిగే నష్టం అసలే ఉండదు. ఇవి దేవుని మాటలు అని యేసు పెద్దలకు చెప్పే సంగతులు, పిల్లలకు దేవుడు ముందే చెప్పాడని ఒక మాట అడ్డువేయటం వల్ల పెద్దల్ని తేలిగ్గా నమ్మించవచ్చని యేసు పన్నాగం ఇది. మత్తయి 11:25లో ఇలా ఉంది. "తండ్రీ, ఆకాశమునకును, భూమికీని ప్రభువా ! నీవు జ్ఞానులకును, వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను”.

జవాబు: పామరులైన శిష్యుల అమాయకత్వాన్ని సూచిస్తూ “పసిబాలురు” అనే మాట యేసు ఉపయోగించాడే గాని పాలు త్రాగుతున్న పసిపిల్లలకు దేవుడు తన పరలోక మర్మాలు తెలియజేసి వాటిని పెద్దలకు మరుగుపరిచాడని అర్థం కాదు. లోకంలో వివేకవంతులుగా పరిగణింపబడినవారు తమ జ్ఞానానుసారంగా దేవునిని గుర్తెరుగలేకపోయారు, ఐతే విద్యాహీనులైన లేదా బలహీనులుగా ఎంచబడిన అపొస్తలులను దేవుడు ఎన్నుకుని తన పరలోకజ్ఞానాన్ని బయలుపరిచాడు (1 కొరింథీ 1:27;29).

బైబిలు పరిభాషలో జ్ఞానులు, పసిబాలురు అనే మాటలకు అర్థం తెలియకుండా పసిపిల్లలు మూగమొద్దులు కాబట్టి వారికి బయలుపరిస్తే వచ్చే లాభనష్టాలు ఏమీ లేవని బ్రహ్మంగారు వ్యాఖ్యానిస్తూ తమ అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. ఒకవేళ బ్రహ్మంగారు చెబుతున్నట్టు జ్ఞానులకు విచక్షణాశక్తి వున్నందున వారు సత్యాన్ని మాత్రమే గ్రహిస్తారన్నది వాస్తవమైతే ఎంతోమంది జ్ఞానులు హేతువాదులుగా నాస్తికులుగా మారిపోవడమేమిటి ? ఈ పుస్తకంలో బ్రహ్మంగారు లేవనెత్తిన ప్రశ్నలలో ఆయన 'విచక్షణ'తో గ్రహించిన సత్యాలు' ఎంత నాణ్యమైనవో ఈ పాటికి పాఠకులకు అర్థమయ్యేవుంటుంది. తాము వివేకులమని , జ్ఞానులమని చెప్పుకుని విర్రవీగేవారి పరిస్థితి చివరికి ఇలాగే వుంటుంది.

37. వీరబ్రహ్మం- సాత్వికుడు, దీనమనస్సు గల వాడు ఇతరుల మీద ఎక్కుతాడా?

కాడిమోసే వాడి ప్రాణాలకు హాయి ఉంటుందా? నేర్చుకోవాలంటే గురువును నెత్తికెత్తుకోవాలా? మత్తయి11:29లో యేసు ఇలా అంటాడు. “నేను సాత్వికుడను, దీన మనస్సుగలవాడను గనుక మీ మీద నాకాడి ఎత్తికొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును”. నామాటలలో యేసు భావం: నేనెంతో సున్నితమైన హృదయం గలవాణ్ణి. నా దగ్గర మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు. నేనెక్కిన బండికాడి మీ భుజాలకెత్తుకోండి. నెమ్మదిగా మోసుకెళ్ళండి. మీకు అట్టే శ్రమ అన్పించదు. హాయిగా ఉంటుంది (బైబిల్ బాగోతం ప్రశ్న37, పేజీ నం. 23).

జవాబు : క్రీస్తు చెబుతున్న కాడి అక్షరార్థంగా భుజాలపై పెట్టుకుని మోసే కాడి కాదు, మత్తయి 11:29 లో యేసు చెప్పిన కాడిని గూర్చి బ్రహ్మంగారు వివరిస్తూ 'నా మాటలలో యేసు భావం' అంటూ కొత్త భావాలను అంటించారు. ఆ కాడి యేసు కూర్చునే బండిదని, దానిని ఇతరులు మోయాలని యేసు బలవంతపెడుతున్నాడని ఈయన గారి ఆవేదన. కానీ యేసు అలా చెప్పనేలేదు. మత్తయి 11:29 లో "కాడి” అనగా ఆయన ఉపదేశాలు, కట్టడలు మరియు ఆజ్ఞలు ; ఇవి ఏమాత్రం భారమైనవి కావు (1యోహాను - 5:3).

యూదా మతాధికారులు, ఆచారాలను మరియు కర్మకాండలను ఆచరించాలని ఇతరులను బలవంతపెట్టేవారు, మోయలేని కాడిలాంటి శ్రమలకు వారిని గురిచేసేవారు (మత్తయి 23:4, అపొ 15:10). యేసు ఆజ్ఞలు కృపాసహితమైనవి కాబట్టి ఆ కాడి ఏమాత్రం భారమైనది కాదని ఆయన తెలియజేస్తున్నాడు. వ్యాఖ్యానించడం తెలియక వాక్యాన్నే తప్పుపట్టడం అవివేకం. నృత్యం రాక నేలవంకర అని నిందించాడట వెనకటికొక ఆసామి, అలావుంది అయ్యవారి యవ్వారం.

38. వీరబ్రహ్మం- మనుష్యులు ఏ పాపమైనా చెయ్యొచ్చు: కాని దేవుణ్ణి మాత్రం తిట్టగూడదట!

మత్తయి 12:31లో ఇలా ఉంది. “మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు క్షమించబడును గాని ఆత్మ (ఇక్కడ ఆత్మ అనగా దేవుడు) విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు”. (బైబిల్ బాగోతం ప్రశ్న39, పేజి నం. 23)

జవాబు: మనుషులు ఏ పాపమైనా చెయ్యొచ్చు; కానీ దేవునిని మాత్రం తిట్టగూడదు అని బ్రహ్మంగారు వ్రాసారు. పాపపు క్రియలు చేయడాన్ని లేఖనం సమర్ధిస్తుందని ఆయనగారి ఉద్దేశం. కానీ పాపపు క్రియలను చేయమని లేఖనం చెప్పడం లేదు. అంతవరకూ తెలిసీ తెలియక చేసిన దుష్కీయలకు క్షమాపణ ఉంది తప్ప, దేవుని గురించి తెలుసుకుని కూడా ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే అది శిక్షార్హమే (యోహాను 5:14). ఇకపోతే దేవునిని తిట్టే విషయం - దేవునిని తిట్టటం గాని దూషించడం గాని ఒక్క క్రైస్తవ్యమే కాదు ప్రపంచంలో ఏ మతమూ అంగీకరించదు. తెలిసి చేసిన పాపమే ఎక్కువ శిక్షార్హమైనప్పుడు, సర్వాధికారియైన దేవునిని గూర్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే క్షమాపణ ఉంటుందా? ఐనా ఇవన్నీ నాస్తికుడికి ఏమి తెలుస్తాయి; కనీసం అఆలు రానివాడు అణుశాస్త్రం గురించి నేర్పించినట్లుంది.

39. వీరబ్రహ్మం- చెడ్డవారు మంచి మాటలు పలుకగూడదా? కూడదంటున్నాడు యేసు. యేసుక్రీస్తుకు కూడా జాతివివక్ష ఉంది!

మత్తయి 12:34లో యేసు ఒక తెగవారిని నీచంగా సంబోధిస్తూ ఇలా అంటున్నాడు. “సర్పసంతానమా ! మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు?”
ఈ క్రింద పేర్కొన్న మరో వాక్యం యేసుకు గల జాతి వివక్షతను, జాత్యహంకారాన్ని తెలియజేస్తోంది. “మీరు (సమరయులు) మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము (యూదులు) మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.” యోహాను 4:22.

యేసుకే కాదు, ఆయన శిష్యులకు కూడా సంకుచిత భావాలుండేవి. ఒక తెగ ప్రజలను కించపరుస్తూ అదే తెగలోనుంచి వచ్చిన పౌలు కూడా ప్రవక్త మాట్లాడిన మాటలను సమర్థించాడు. తీతుకు 1:12లో చూడండి. “క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండిపోతులునైయున్నారు. ఈ సాక్ష్యము నిజమే” (బైబిల్ బాగోతం ప్రశ్న39, పేజీ నం. 23).

జవాబు : త్రైతసిద్ధాంత ఆదికర్త శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు క్రొత్త ధర్మము' అనే పుస్తకాన్ని విడుదల చేసారు. వీరబ్రహ్మంగారి 'బైబిలు బాగోతం' అనే పుస్తకానికి అది జవాబుగా వ్రాసారు. శ్రీ ప్రబోధానందగారు క్రైస్తవుడు కాకపోయినప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసారు, అవి చాలావరకూ లేఖనానుసారంగా లేవు, కనుక ఆయనతో మేము ఏకీభవించలేము. ఐనా పై ప్రశ్నకు ఆయన వ్రాసిన సమాధానం మాత్రం జ్ఞానయుక్తంగాను, బ్రహ్మంగారి డొల్లతనాన్ని బహిర్గతం చేసేదిగాను వుంది. అదేమిటో చుద్దాం.

“ఇక్కడ మత్తయి 12:34 వాక్యాన్నే కాక 33వాక్యాన్ని కూడా చూడవలసివుంది. '(33) చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదేయని యెంచుడి. చెట్టు దాని పండు వలన తెలియును. (34) సర్పసంతానమా! మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుక గలరు. హృదయమందు నిండియున్న దానిని బట్టి నోరు మాటలాడును కదా !' అని వ్రాయబడివుంది. చెట్టును బట్టి, పుట్టబోయే కాయ వుంటుందనేది అందరికి తెలిసిన విషయమే. చేదు ఫలాలను ఇచ్చే వేప చెట్టులా, తియ్యని ఫలాలను ఇచ్చే సీతాఫలం చెట్టులా మనుషులు రెండు రకాలు వున్నారు. వేపనుండి చేదు ఫలం, సీతాఫలంచెట్టు నుండి తియ్యని ఫలం వచ్చేటట్టు అజ్ఞానులు, జ్ఞానులు అను రెండు తెగల మనుషుల నుండి వారిని అనుసరించిన ఫలములే వచ్చును. అజ్ఞాని నుండి అజ్ఞానపు మాటలే వచ్చును.

............ కావున మీరు చెడ్డవారై (అజ్ఞానులై యుండి ఏలాగు మంచి (జ్ఞానము) మాటలు పలుకగలరు అని యేసు ఆనాడు అన్నాడు. దీనిలో జాతి కుల వివక్ష ఏమాత్రం లేదు. వేప చెట్టా నీ కాయలో తీపు ఎట్లుంటుందన్నట్లు సర్పసంతానమా నీవు మంచి ఎలా మాట్లాడగలవు అన్నారు. చేదును చేదు, తీపిని తీపి అనడంలో తప్పు లేదు.

ఇశ్రాయేలు దేశములో ఆ కాలమున యూదులు, సమరయులు అను రెండు తెగలుండెడివి. యూదులు కొంత దైవజ్ఞానము తెలిసినవారు కాగా సమరయులు మూఢభక్తిని కల్గి దేవుడు కాని దేవతలను ఆరాధించేవారు.
అందువలన మూఢభక్తితో మీకు తెలియనిదానిని ఆరాధించుచున్నారని యేసు సమరయ స్త్రీతో అన్నాడు. జ్ఞానము వలన రక్షణ కలుగునని, యూదుడైన తన వలన రక్షణ కలుగునను అర్థముతో యూదులు తెలిసినదానిని ఆరాధించుచున్నారని యూదుల వలననే రక్షణ కల్గునని అన్నాడు. ఇందులో సత్యము చెప్పాడు గాని జాతివివక్ష అనునది ఎంతమాత్రము లేదు కదా!”

ఇలా బైబిల్ ను విశ్లేషించటానికి ఒక హైందవ మిత్రుడు కనపరచిన నిజాయితీ మరియు వివేచనలో కనీసం ఒక వంతు కూడా ఎన్నో బైబిల్ కోర్సులు పూర్తి చేశానని గొప్పలు చెప్పుకునే ఈ 'హేతువాది'కి లేకపోవటం హాస్యాస్పదమే. ఇక మిగిలింది తీతు 1:12 లోని క్రేతు ప్రజల ప్రస్తావన. వారు అబద్దికులని, దుష్టమృగములని, సోమరిపోతులని, తిండిపోతులని స్వయంగా క్రేతువాడైన ఒక కవే వ్రాసాడని ఇక్కడ పౌలు చెబుతున్నాడే తప్ప జాతి వివక్షతతో మాట్లాడటం లేదు. అనగా తువాసులతో తన అనుభవం ద్వారా వారు ఎలాంటివారని క్రేతు కవి చెప్పాడో ఆ విషయాలు నిజమేనని పౌలు తెలియజేసాడు అంతే.

ప్రపంచంలోని అన్ని దేశాలవారికి వారి వారి సాంఘిక, ధార్మిక, మత సంబంధమైన పరిస్థితులను బట్టి కొన్ని లక్షణాలు ఉన్నాయి . ఈ విశేషగుణాలు వారితో బాగా పరిచయం ఉన్నవారికే తెలుస్తాయి. వాటిని గుర్తించడం జాతి వివక్ష కాదు. అంతెందుకు? క్రేతువారి ఈ లక్షణాలను గుర్తించిన కవి కూడా క్రేతువాడే. మరి అతనికి కూడా తన స్వజాతిపట్ల జాతి వివక్ష వున్నట్లా?

ఆ మాటకొస్తే, యేసును పచ్చికుళ్లుమోతని, వట్టి స్వార్థపరుడని, దయాదాక్షిణ్యాలులేని పరమ కిరాతక హంతకుడు అని నోటికొచ్చినట్లు మాట్లాడిన బ్రహ్మంగారికి జాతివివక్ష లేదా ?

40. వీరబ్రహ్మం - ఈ పతనావస్థకు కారణమెవ్వరు? దేవుడేగదా ?

మత్తయి 12వ అధ్యాయంలో 44, 45 వచనాలలో ఇలా ఉంది. “ఆ యింట (మృతదేహం) ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి, వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితికంటే చెడ్డదగును”. దేహం లోపలు ఊడ్చి అమర్చటం ఎవరికీ సాధ్యం? దేవుడికి తప్ప . కాబట్టి ఈ దుస్థితికి కారణం దేవుడే గదా ! ( బైబిల్ బాగోతం ప్రశ్న40, పేజీ నం. 24 )

జవాబు : ఈ వాక్యసందర్భంలో మృతదేహమెక్కడనుండి వచ్చింది? లేనిదానిని ఉన్నదానిగా చూపించడానికి బ్రహ్మంగారు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వాక్యసందర్భం దయ్యపు ఆత్మ ఒక మనిషిని విడిచి వెళ్లే విషయానికి సంబంధించిన సందర్భమే తప్ప మరణానికి సంబంధించింది కానేకాదు. బైబిల్లో “అపవిత్రాత్మ” అనే మాట దయ్యాలకే తప్ప మనుష్యుల ఆత్మలకు ఎప్పుడూ వాడబడలేదు. కనుక బ్రహ్మంగారు లేవనెత్తిన ప్రశ్నలు బైబిలును కాదు తననే అభాసుపాలు చేస్తున్నాయి. వాస్తవానికి ఈ వాక్యసందర్భంలో యేసు దుష్టులైన పరిసయ్యులను గూర్చి మాట్లాడాడు. ఒక దయ్యపు ఆత్మ వారిని విడిచిపెట్టి వెళ్లినప్పటికీ దేవుని పవిత్రతతో తమ్మును తాము నింపుకోక హృదయాన్ని ఖాళీగానే ఉంచుతారు కాబట్టి మరికొన్ని దురాత్మలకు చోటిచ్చిన వారౌతారని వారిని హెచ్చరిస్తున్నాడు . ఇక ఊడ్చి అమర్చడం విషయానికొస్తే పరిసయ్యుల స్వనీతి పరత్వానికి అది అలంకారమే తప్ప అక్షరార్థంలో వారి అంతరంగం ఊడ్చి అమర్చబడిందని, దానికి దేవుడు బాధ్యుడని అర్థం కాదు. సావధానంగా పరిశీలిస్తే అన్నీ బుర్రకెక్కుతాయి. ఆత్రానికి బుద్ధి మట్టు అని పూర్వికులు ఊరికే అన్నారా ?

41. వీరబ్రహ్మం- మరణమంటే అపవిత్రాత్మ మనుష్యుని వదలిపోవటమేనా ? అయితే అది మంచిదేకదా ? ఈ మాటల్ని నమ్ముతున్న వాళ్ళనందర్ని చచ్చిపొమ్మని చెప్పొచ్చు కదా ?

మత్తయి 12:43-45  ప్రకారం ఖాళీయైన ఇంటిని (మృతదేహాన్ని విడచి పెట్టిన ఒక దయ్యం ఆ ఇల్లు మళ్ళీ ఊడ్చి అమర్చి వుండటం చూచి, తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యాలను వెంటబెట్టుకొని వస్తుందట కాపురముండటానికి. దీన్ని బట్టి మనకేమీ సందేహాలొస్తాయంటే, మరణమంటే అపవిత్రాత్మ (దయ్యం) మనుష్యుని వదలిపోవటమేనా? ఐతే, అది మంచిదే కదా ! ఈ మాటల్ని నమ్ముతున్న వాళ్ళనందర్నీ చచ్చి పోమ్మనండి ! అలా చేస్తే వారిలో ఉన్న అపవిత్రాతులు (దెయ్యాలు) వదలిపోతాయి గదా !

ఖాళీయేన ఇంటిని మళ్ళీ ఊడ్చి అమర్చి మరి యేడు చెడ్డ దయ్యాల కోసం సిద్ధం చేయడం దేనికి ? ఇదేం పాడుపని ? ఇది దేవుడు చెయ్యాల్సిన పనేనా? (బైబిల్ బాగోతం ప్రశ్న41, పేజీ నం. 24)

జవాబు : ప్రస్తుత సందర్భం మరణానికి సంబంధించినది కాదు. అవిశ్వాసంతో సూచకక్రియలను చేయమని యేసును శోధించిన యూదుల ఆత్మీయస్థితిని వారికి తెలుపేందుకు ఇది యేసు వాడిన ఉపమానం మాత్రమే. వారు ఎంతో మతనిష్ఠ కనబరిచారు. అంతేకాక వారి పూర్వికులు చేసిన విగ్రహపూజను వదలి పెట్టారు. యెహెూవా దేవునిని ఆరాధిస్తూ ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించారు. ఈ భావంలో వారిలో వున్న ఆపవిత్రాత్మ వారిని విడిచిపోయింది. అయితే దేవుని కుమారుడంటే వారికి సాతాను సంబంధమైన ద్వేషం వుంది. వారు ఆయన్ను నిరాకరించి సిలువ వేసారు. దేవుడు వారిలో లేడు గనుక, వారి స్థితి అలాంటిదయ్యింది. సాతాను తనతోబాటు మరెన్నో దయ్యాలను వెంటబెట్టుకుని వచ్చి వారిలో చొరబడ్డాడు. ఈ దిగజార్పును గురించే వారిని హెచ్చరిస్తూ యేసు ఈ మాటలు పలికాడు. నాస్తికులకు అలంకార భాష అర్థం కాదేమో పాపం.

42. వీరబ్రహ్మం- యేసు పక్షపాతి !

పరలోకరాజ్యపు మర్మములెరుగుటకు శిష్యులకే ఎందుకు అనుగ్రహింపబడింది ? భక్తులందరికీ అనుగ్రహించ వచ్చుగా? అందరూ బాగుపడడం ఆయనకు ఇష్టం లేదా ?
- మత్తయి 13:11లో ఇలా ఉంది. “పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు (శిష్యులకు) అనుగ్రహింపబడియున్నది గాని వారికి (మిగిలిన భక్తులందరకూ) అనుగ్రహింపబడలేదు”. (బైబిల్ బాగోతం ప్రశ్న42, పేజీ నం. 24)

జవాబు : శిష్యులన్నా భక్తులన్నా అర్థమొక్కటే. భక్తులే శిష్యులు, శిష్యులే భక్తులు. ఈ మాట బ్రహ్మంగారు ముందుగా గ్రహించాలి. అలాగే , ఈ వచనంలోని “వారికి” అనే మాటకు బ్రహ్మంగారు సూచించినట్లు మిగతా భక్తులకు అని అర్థం కాదు. మార్కు 4:12 లోని దీని సమాంతర వచనం, ఇక్కడ "వారికి” అని ప్రస్తావించబడిన వారిని “వెలుపలనుండు వారు” అని నిర్వచించింది. కాబట్టి బ్రహ్మంగారు పొరబడినట్లు శిష్యులకు మరియు మిగతా భక్తులకు మధ్య కాక శిష్యులకు మరియు వెలుపలనుండు వారికి మధ్య ఇక్కడ తారతమ్యం చూపించబడింది.

ఎవరికి పడితే వారికి పరలోక మర్మాలు తెలియజేయాల్సిన అవసరం యేసుకు లేదు. అలా తెలియజేయకపోవడం పక్షపాతం కాదు. మీ ఇంటికి సంబంధించిన సొంత విషయాలు దారినపోయే ప్రతి అనామకునికి తెలియజేస్తారా బ్రహ్మంగారు ? ఒకవేళ మీ ఇంటి మర్మాలు గాని గుట్టుగా వుండవలసిన రహస్యాలు గానీ ఇతరులతో పంచుకోనందుకు మేము మిమ్మల్ని పక్షపాతి అని అన్నట్లయితే నిజంగా మీరు పక్షపాతియైపోతారా? మత్తయి 13:11లో యేసు చెప్పిన మాట కూడా ఇలాంటిదే. మీ కుటుంబ తరహా విషయాలను కేవలం నమ్మకస్థులకు మాత్రమే చెప్పి మిగతా వారికి ఏ విధంగా రహస్యంగా వుంచుతారో అదేవిధంగా యేసు తన పరలోక మర్మాలను నమ్మకస్థులైన తన శిష్యులకు మాత్రమే తెలియజేసాడు, ఇందులో దోషమేముంది ?

43. వీరబ్రహ్మం- యేసు పేదల పెన్నిది కాదు. ధనవంతుల తాబేదారు !

మత్తయి 13:12లో ఇలా ఉంది. “కలిగిన వానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివానికి కలిగినదియు వాని యొద్దనుండి తీసివేయబడును”.

మత్తయి 25:29లో ఇలా ఉంది. “కలిగిన ప్రతివానికి ఇవ్వబడును. అతనికి సమృద్ధి కలుగును. లేనివాని యొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడును". ఇంకా ఇందుకు సాక్ష్యం లూకా 8:18లోను, లూకా 19:26లోను ఉంది. ( బైబిల్ బాగోతం ప్రశ్న43, పేజి నం 24 )

జవాబు : మత్తయి 13:12 లో యేసు ధనవంతులను మరియు పేదలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు . ఇహలోకంలో పేదవారైనప్పటికీ క్రీస్తు అనే గొప్పనిధిని శిష్యులు కలిగివున్నారు. ఐతే, శాస్త్రులు పరిసయ్యులు లౌకికంగా ధనవంతులైనప్పటికీ క్రీస్తును అంగీకరించకుండా పేదవారుగానే ఉన్నారు.

కనుక శిష్యులు భౌతికంగా పేదవారైనప్పటికీ రక్షణ విషయమై వారు ధనికులు కాబట్టి, ఆ ఐశ్వర్యం కలిగినవానికే పరలోకమర్మాలు బయలుపరచబడతాయని, పరిసయ్యులైతే తమకు ఉందనుకున్న స్వనీతి కూడా వారి దగ్గర నుండి తీసివేయబడుతుందని అలంకారప్రాయంగా యేసు చెప్పాడు.

మత్తయి, 13:12; 25:29; లూకా 8:18 ;19:26 ఈ వాక్యాలన్నీ అలంకారభాషలో వ్రాయబడ్డాయనే సంగతిని మరుగుపరచి, అక్కడికేదో ధనవంతులను బీదలను దృష్టిలో పెట్టుకుని యేసు చెబుతున్నట్టు బ్రహ్మంగారు దారి మళ్లించే ప్రయత్నం చేసారు. అసలు భావాలను ప్రక్కకునెట్టి నకలుభావాలను తగిలించడమే హేతువాదమేమో!

44. వీరబ్రహ్మం- ఆవచెట్టు మీద ఆకాశపక్షులు నివసించును !

“అది (ఆవగింజ) విత్తనములన్నింటిలో చిన్నదేకాని పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును”. మత్తయి 13:32 ఆవచెట్టు కొమ్మలమీద ఆకాశపక్షలు నివసిస్తాయట! మీకు తెలుసా ? (బైబిల్ బాగోతం ప్రశ్న44, పేజీ నం. 24).

జవాబు : ఆవగింజను గూర్చి యేసు చెప్పినమాట అలంకారభాష. ఇక్కడ ఆవగింజ అనగా యేసు సువార్త. యేసు భూమి మీద జీవించినప్పుడు ఇద్దరితో ఆరంభమై శాఖోపశాఖలై మహావటవృక్షంగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ సువార్త అనే చెట్టు మీద కేవలం యేసు బిడ్డలైన క్రైస్తవులే కాక బ్రహ్మంగారిలా బైబిలు తర్ఫీదు పొందిన హేతువాదుల్లాంటి పక్షులు కూడా నివసిస్తాయని యేసు ముందుగానే చెప్పాడు, ఈ ప్రవచనం అక్షరాలా నెరవేరడం లేదా !

45. వీరబ్రహ్మం- నమ్మితే మహిమ, నమ్మకపోతే మాయ (హంబక్)!

సత్యసాయిబాబా హేతువాదుల దగ్గర టక్కుటమారాలు ఎలా చేయలేడో, అలాగే యేసు తన చుట్టూ అవిశ్వాసులుంటే అద్భుతాలు చేయలేడు. నిజంగా అద్భుతాలు చేయగల మనుష్య కుమారుడికైనా, దేవుని కుమారుడికైనా అవిశ్వాసులతో అడ్డేమిటంట ? మత్తయి 13: 58లో ఇలా ఉంది. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు”. (బైబిల్ బాగోతం ప్రశ్న45, పేజీ నం. 25)

జవాబు : యేసు అప్పటికే ఎన్నో అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. ఒక్కోసారి శిష్యులకు సాధ్యం కాని సూచక క్రియలను యేసు సాధ్యం చేసి చూపించిన సందర్భాలు వున్నాయి ( మార్కు 9:28-29). అవిశ్వాసులు తన చుట్టూ ఉన్నప్పుడు ఆయన అసలు అద్భుతాలు చేయలేదని ఈ వాక్యం చెప్పడం లేదు కానీ అనేక అద్భుతాలు చేయలేదని మాత్రమే చెబుతుంది. చేసిన కొన్ని అద్భుతాలు చూసి వారు విశ్వసించలేదు కాబట్టి వారి మధ్య ఇంకా అద్భుతాలు చేయడం నిష్ప్రయోజనమని చేయలేదు.

అవును, బ్రహ్మంగారు చెప్పింది కరెక్టే సత్యసాయిబాబా హేతువాదుల దగ్గర టక్కుటమారాలు చేయలేడు. కాని యేసు చేసినవి టక్కుటమారాలు కావు అసలు సిసలైన అద్భుతాలు, వాటిని బట్టి లోకమంతా ఆయన వెంట నడుస్తుంది (యోహాను 12:17-19).

46. వీరబ్రహ్మం- యేసు వచ్చింది ఇశ్రాయేలీయుల కొరకేగాని, ఇతరుల కొరకు కాదు !

“కనాను స్త్రీ యొకతి వచ్చి " తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని పోగొట్టమని యేసును వేడుకుంటుంది. " ఆయన ఇశ్రాయేలు ఇంటివారైన నశించిన గొఱ్ఱల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను” మత్తయి 15:24.

వాస్తవం ఇది కాగా, యేసు సర్వమానవాళికి రక్షకుడు ఎలా అవుతాడు. ఇక్కడ తెలుసుకోవలసిన అర్థాలు గొర్రెలు = మనుషులు (బైబిలు దృష్టిలో మనుషులు గొర్రెల క్రింద చూడబడ్డారు) కనాను = ఇశ్రాయేలీయులుకాని ఒక తెగ. (బైబిల్ బాగోతం ప్రశ్న46, పేజీ నం. 25)

జవాబు: ముందుగా క్రీస్తు పరిచర్య ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రారంభమవ్వాలి కాబట్టి ఆయన మొదట వారియొద్దకే వచ్చాడు. ఐతే ఇశ్రాయేలీయులను మినహా మరెవరిని ఆయన రక్షించడని అనుకోవడానికి అసలు తావే లేదు. యేసు స్వయంగా చెప్పిన మాటలు గమనించండి “ఈ దొడ్డివి కాని వేరే గొఱ్ఱలును నాకు కలవు; వాటిని కూడా నేను తోడుకొని రావలెను” (యోహాను 10: 16) అంటే ఇశ్రాయేలీయులు కాని కనానీయులు లేదా ఇతరజాతి ప్రజలు అని అర్థం. కాబట్టి యేసు కేవలం ఇశ్రాయేలీయులకే తప్ప ఇతరులకు రక్షకుడు కాడనే వాదన అర్థం లేనిదిగా ఉంది. దీనికి సంబంధించిన మరింత వివరణ కోసం 31వ ప్రశ్నకు వ్రాసిన జవాబు చదవండి. ఇకపోతే, బైబిల్ మనుష్యులను గొర్రెలుగా చూస్తుందనే బ్రహ్మంగారి వివరణ సరికాదు. గొర్రెలు వాటి కాపరి పోషణ మరియు సంరక్షణ క్రింద వున్నట్లే దేవుని ప్రజలు ఆయన చేత పోషింపబడి సంరక్షింపబడుతున్నారు. కాబట్టి అలంకారరీతిగా వారిని గొర్రెలని బైబిల్ వర్జించింది. హేతువాదులకు అలంకార భాష అర్థం కాదని ఇదివరకే మనం చూసాము, గుర్తుంది కదా ?

47. వీరబ్రహ్మం- యేసు సంస్కారహీనుడు !

యేసుపై నమ్మకంతో తన కూతురికి పట్టిన దయ్యం పోగొట్టమని వచ్చిన అన్యజాతికి చెందిన కనాను స్త్రీతో తను చేసే సహాయం ఇశ్రాయేలీయులకే గాని అన్యులకు కాదని చెప్పటానికి “పిల్లల రొట్టె తీసుకొని కుక్కపిల్లలకు వేయుట యుక్తముకాదు” అని మత్తయి 15:26 లో యేసు దారుణంగా కించపరచాడు. ఐనప్పటికీ ఆ స్త్రీ వదలక వెంటపడుతూ “నిజమే ప్రభువా ! కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్లమీద నుండి పడుముక్కలు తినును కదా” అని తనను తాను తక్కువ చేసుకున్నాక, అటువంటి ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె కూతురికి స్వస్థత చేకూర్చాడట. - భూత వైద్యుడైన యేసు ! (బైబిల్ బాగోతం ప్రశ్న47, పేజీ నం. 25)

జవాబు : యూదులు తామే దేవుని పిల్లలని అన్యులు లేదా ఇతరజాతి ప్రజలు కుక్కలతో సమానమని భావించేవారు. కాబట్టి వారి భాషలోనే యేసు మాట్లాడుతూ వారు కుక్కతో సమానంగా ఎంచిన ఒక అన్యురాలి హృదయంలో వారికంటే అధిక విశ్వాసం ఉందని నిరూపించడానికి యేసు ఈ సందర్భాన్ని వినియోగించాడు. పిల్లలమని భావించే వారికంటే కుక్కలుగా వారు కించపరిచే అన్యులే విశ్వాస విషయంలో వారికంటే మెరుగైయున్నారని యేసు తారతమ్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి కాదు. మత్తయి 8:10లో కూడా ఇశ్రాయేలీయులలో ఎవరికిని లేని విశ్వాసం అన్యుడైన శతాధిపతిలో ఉందని యేసు బహిరంగంగా ప్రకటించాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మంగారు ఆరోపించినట్లు యేసు కనానీయురాలిని కుక్క అని పిలిచి సంస్కారహీనంగా కించపరచలేదుగాని అలా కించపరిచిన వారికంటే ఆమె గొప్ప విశ్వాసం కలిగినదని యేసు ఆమె విశ్వాసాన్ని ఘనపరిచాడు. “అమ్మా, నీ విశ్వాసము గొప్పది” (మత్తయి 15 : 28) అని యేసు చెప్పిన మాటను ప్రత్యేకంగా గమనించండి. - పాపం బ్రహ్మంగారికి బైబిలు పరిభాష అర్థం కాదుగా ! పెన్నుంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్రాసేసారు.

48. వీరబ్రహ్మం- యేసును క్రీస్తు అని చెప్పగూడదు-యేసు !

“తాను క్రీస్తు (అభిషిక్తుడు) అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను” అని మత్తయి 16:20లో ఉంది. దీన్ని బట్టి క్రైస్తవులు “యేసు క్రీస్తు” అని యేసుని సంబోధించటం ఆయన ఆజ్ఞను అతిక్రమించటమే కాగలదు. ఇది నిజమైన భక్తులకు తగునా ? | యేసును యేసుక్రీస్తు అని పిలవగూడదని మత్తయి 16:20లోనే కాక, మార్కు 8:30లోను, లూకా 9:21లోను కూడా ఉంది చూడండి (బైబిల్ బాగోతం ప్రశ్న48, పేజీ నం. 25)

జవాబు:ఇక్కడ బ్రహ్మంగారు ప్రస్తావించిన మూడు లేఖనాలలో యేసును క్రీస్తు అని పిలవవద్దని లేదు. ఇది బ్రహ్మంగారి తప్పుడు చిత్రీకరణ మాత్రమే. ఈ సందర్భంలో తాను క్రీస్తునని ఇతరులకు ప్రకటించవద్దని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఐతే ఇది కూడా 31 మరియు 47 ప్రశ్నలకు వ్రాసిన జవాబులలో మేము ప్రస్తావించిన విధంగా సమయ పరిమితితో కూడిన నిషేధం మాత్రమే. యేసును తను మరణానికి ముందు జనసమూహం క్రీస్తుగా గుర్తెరిగితే ఆ పరిచర్యను వారు ఆటంకపరచి ఆయనను దావీదు సింహాసనాన్ని అధిష్టింపచేసే ప్రయత్నం చేస్తుండేవారు. మునుపు కూడా ఇలాంటి పరిస్థితే తారసపడింది (యోహాను 6:15) అలా జరిగితే అభిషిక్తుడు (క్రీస్తు) మొదట నిర్మూలం చేయబడాలి అనే ప్రవచనం భగ్నమైపోయుండేది (దానియేలు 9:26). అందుచేతనే ఈ తాత్కాలిక నిషేధం విధించబడింది.

ఐతే యేసు పరిచర్య పూర్తిగా నెరవేరిన తరువాత ఆయన శిష్యులు పరిశుద్దాత్మను పొందిన తర్వాత (అపొ. 1:8) యేసే “క్రీస్తు” అనే సత్యంతో పాటు ఆయన వారికి బయలుపరచిన అన్ని విషయాలు వారికి బహిరంగంగా ప్రకటించమని ఆజ్ఞాపించాడు. “చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పునది మేడల మీద ప్రకటించుడి” (మత్తయి 10:27).

49. వీరబ్రహ్మం- “ప్రేమ గుడ్డిదో కాదో తెలియదుగానీ, భక్తి మాత్రం పిచ్చిది!

భక్తి విశ్వాసాలకు సాధారణ సూత్రం: అనుమానాలు, అభ్యంతరాలు లేవనెత్తకూడదు. వాటిని సహించగూడదు. ఇది మతం చెప్పే కరడు గట్టిన సూత్రం. అది ఏ మతమైనా ఒక్కటే.

మత్తయి 18-7, 8 వచనాలు ఇలా ఉన్నాయి. “అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పవుగాని, యెవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యియైనను, నీ పాదమైననూ నిన్ను అభ్యంతరపరచిన యెడల, దానిని నరికి నీయొద్ద నుండి పారవేయుము”.

క్రైస్తవమతంలో ఇటువంటి అసాంఘిక నియమాలు ఉన్నాయి కాబట్టే ఈనాడు క్రొత్తగా మతాన్ని స్వీకరిస్తున్న కుటుంబాల్లో చుట్టరికాలు దెబ్బతింటున్నాయి. ఆ కుటుంబాలవారు తమతోపాటు మతాంతీకరణ చెందని తమ బంధువుల్ని పరాయివారిగా భావిస్తున్నారు. తాము రక్షణ మార్గంలోకి వచ్చినట్లు, ఇతరులు పాపపంకిలంలోనో, నరక కూపంలోనో ఉన్నట్లు కూడా భావిస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు.

క్రొత్తగా మతం పుచ్చుకున్నవారి మాటల్లో చెప్పాలంటే తమతోపాటు మతం మారని తమ బంధువులను వారు “అన్యజనులు”గా చూస్తున్నారు. ఇందువల్ల వారంతట వారే చుట్టాలనుండి దూరపువారుగా చూడబడుతున్నారు. అంతేకాదు, ఆ కుంటుంబంలోనే యేసుని ఒప్పుకోని సభ్యులు ఉంటే, వారి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. అలా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమౌతుంది. (బైబిల్ బాగోతం ప్రశ్న49, పేజీ నం. 26)

జవాబు : ఇక్కడ “అభ్యంతరములు” అనే మాట 'అనుమానాలు లేవనెత్తడం' అనే భావంలో వాడబడలేదు కానీ 'ఆటంకపరచడం' అనే భావంలో చెప్పబడింది. ఒక పదానికి నానార్థాలు ఉన్నపుడు, సరైన భావాన్ని సందర్భం నిర్వచిస్తుందనే కనీస ఇంగితం కూడా ఇక్కడ బ్రహ్మంగారు వినియోగించలేకపోయారు. (81వ ప్రశ్నకు రాసిన జవాబును పోల్చి చూడండి)

ఇకపోతే, ఎవని వలన అభ్యంతరం వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అంటే క్రైస్తవులు తమ ఇంటివారైన క్రైస్తవేతరులను ద్వేషించమని భావం కానే కాదు. లోకం విశ్వాసులను శ్రమపెడుతుందని, ఆటంకాలు సృష్టిస్తుందని (యోహాను 15:18-20) , ఐతే ఇలా అభ్యంతరాలు తల పెట్టినవారిపై దేవుని ఉగ్రత వస్తుందని యేసు భావం. ద్వేషించేది అవిశ్వాసులే కాని విశ్వాసికి ఆ అనుమతి లేదు. ఇందుకు ఋజువుగా ఈ క్రింది వాక్యాలను గమనించండి. “మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును శపించువారిని దీవించుడి, మిమ్మును భాదించువారికొరకు ప్రార్థన చేయుడి” (లూకా 6:27)

“ఏ సహెూదరునికైనను అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయనిష్టపడినయెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురము చేయ నిష్టపడిన యెడల ఆమె అతని పరిత్యజింపకూడదు. ” (1 కొరిందీ-7:12, 13) “అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి; అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే, వారు భయముతో కూడిన మీ పవిత్రపవర్తన చూచి, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ” (1 పేతురు 3:1-2)

“ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి, దు:ఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడునప్పుడు మీరు సహించినయెడల అవి దేవునికి హితమగును; ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను ఆయన పాపము చేయలేదు; ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడియు బెదరింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను.” (1 పేతురు 2:19-23)

కనుక క్రైస్తవులు క్రైస్తవేతరులను ద్వేషిస్తే అది వారి విధేయతలో ఉన్న లోపమే కాని క్రీస్తు బోధలో ఉన్న లోపం కాదు. బ్రహ్మంగారు ఆరోపించిన విషయాలు కొందరు క్రైస్తవుల ప్రవర్తన విషయంలో నిజమే కావచ్చు కాని అందుకు బైబిలులో ఆధారం ఉందనడం మతిహీనమైన వాదన. ఇంతకీ బ్రహ్మంగారు చర్చించేది బైబిలునా లేక క్రైస్తవుల ప్రవర్తననా ?

50. వీరబ్రహ్మం- “నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్దనుండి పారవేయుము” మత్తయి 16:9

ఒక కంటికి శుక్లం (కేటరాక్ట్) వచ్చి చూపు మందగిస్తే దాన్ని పీకేయ్యాలి గాని, మరి కంటి డాక్టరు దగ్గరకెందుకు వెళ్తారు క్రైస్తవులు ? (బైబిల్ బాగోతం ప్రశ్న50, పేజీ నం. 26)

జవాబు : బ్రహ్మంగారు ఉదహరించిన వాక్యసందర్భాన్ని పరిశీలిస్తే నీ కుడి కన్ను రోగగ్రస్థమైనదైతే దానిని పీకి పారవేయమని చెప్పలేదు కాని క్రీస్తును వెంబడించే విషయంలో అభ్యంతరపరిస్తే పెరికివేయమని చెప్పబడింది, అంటే కన్ను, చెయ్యి, కాలు ఇలా ఏ అవయవం వలననైనా విశ్వాసి పాపానికి, అపవిత్రతకు లోనైతే అలా అభ్యంతరపరచిన అవయవాన్ని పెరికివేయమని భావం.

బ్రహ్మంగారు అపార్థం చేసుకున్నట్టు “అభ్యంతరము” అనే మాటకు భౌతికభావమేమి లేనట్లే, అవయవాలను పెరికివేయడం కూడా అక్షరార్ధం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే మానవ ప్రాణానికి దేహానికి రక్షణ కలిగించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన బోధ ఏదీ ఏసు ఎన్నడును చేయలేదు (మత్తయి 5:17). కాబట్టి అలంకారప్రాయంగా చెప్పబడిన ఈ మాటలకు లేఖనాల నుండే మనం వివరణ అన్వేషించాలి.

అవయవాలను పెరికివేసే విషయంలో కొలస్సీ 3:5 మనకు చక్కని వివరణ అందిస్తుంది. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి.

కనుక అవయవాలను పెరికివేయడమంటే వాటివల్ల కలిగే అభ్యంతరాలను (పాపాలను) చంపడమేనని బైబిలే వివరణ ఇస్తుంది, నేతిబీరకాయలో నెయ్యి వుంటుందా అని ప్రశ్నించే విజ్ఞులలో, అక్షరార్థంలో తప్ప మరే కోణంలోనూ చూడలేని బ్రహ్మంగారు కూడా ఒకరు.

నాస్తికం అనే అవయవం కలిగి నరకంలో పడడం కంటే శిరచ్ఛేదం చేసుకోవడం మేలు (అక్షరార్థంలో కాదు సుమా) .

51. వీరబ్రహ్మం- బైబిలు ప్రకారం కూడా భార్యాపిల్లల్ని అమ్మి అప్పు తీర్చుకోవచ్చు !

“అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమియులేనందున, వాని యజమానుడు వానికి (అప్పిచ్చినవానికి వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని” మత్తయి 18:25లో ఒక కథలో అన్యోపదేశంగా యేసు ఈ సందేశాన్నిచ్చాడు.

భార్య, పిల్లలు మొగుడి సొత్తన్నమాట. వాడు వాళ్లని ఏమైనా చేసుకోవడానికి హక్కుదారుడు. అమ్ముకోవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు. ఇది అన్ని మతాల ఇతిహాసాలు చెప్పే నీతి. (బైబిల్ బాగోతం ప్రశ్న51, పేజీ నం. 26)

జవాబు: బైబిలు బోధలలో తప్పు పట్టుకునే ప్రయత్నంలో బ్రహ్మంగారు మరోసారి బోల్తాపడ్డారు. మత్తయి 18:25ను చూపిస్తూ 'బైబిలు ప్రకారం కూడా భార్యా పిల్లల్ని అమ్మి అప్పు తీర్చుకోవచ్చు' అని కొత్త పాట పాడుతున్నారు. ఐతే వాస్తవానికి ఆయనగారు ఉదహరించిన ఉపమానం అందించే సందేశం పాపక్షమాపణను గూర్చే గాని భార్యాపిల్లల్ని ఎలా చూడాలి అనే అంశాన్ని గూర్చి కాదు. ఈ ఉపమానంలోని యజమానిగాని దాసులు గాని చెప్పిన మాటలు దాని అసలు సందేశం వెలుగులో చూడాలి గాని వారి సంభాషణలోని ప్రతి మాటను అక్షరార్థంలో వ్యాఖ్యానించి అన్యసిద్ధాంతాలు సృష్టించే ప్రయత్నం చేయకూడదు. భార్యాబిడ్డలను సంరక్షించే విషయంలో బైబిలు దృక్పథాన్ని తెలుసుకోవాలంటే ఆ అంశాన్ని ప్రస్తావించే వాక్యభాగాలను చదవాలి గాని ఉపమానాలలోని మాటలను అసందర్భంగా ప్రస్తావించి తప్పుడు చిత్రీకరణలు చేయడం గొప్ప పాండిత్యమనిపించుకోదు. భార్యాపిల్లల విషయమై బైబిలు ఏమి బోధిస్తుందో తెలుసుకోవడానికి ఎఫెసీ 5:28-30 మరియు 6:4 చూడండి.

52. వీరబ్రహ్మం - ప్రశ్న : మొగుడు కఠినుడైతే పెళ్ళాన్ని విడువవచ్చా ?

యేసు చెప్పిన

జవాబు : /strongకఠినుడైన మొగుడు పెళ్ళాన్ని విడువవచ్చని మోషే సెలవిచ్చాడు . మత్తయి 19:6-8లలో ఇలా ఉంది. ఈ దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచగూడదని(యేసు) చెప్పెను. అందుకు వారు (పరిసయ్యలు) అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెననని వారాయనను అడుగగా, ఆయన (యేసు) మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, ఆదినుండి అలాగు జరుగలేదు ” అనేను బైబిల్ బాగోతం ప్రశ్న52, పేజి నం. 26)

జవాబు : కఠినుడైన మొగుడు పెళ్లాన్ని విడువచ్చునని మోషే సెలవిచ్చాడని, దానిని యేసు ఆమోదించాడని బ్రహ్మంగారు తప్పుపడుతున్నారు. కుటుంబాన్ని సంరక్షించి పోషించే బదులు ఆ కుటుంబాన్ని గాలికొదిలేసి, తాగితందనాలాడుతూ బరువు బాధ్యత లేకుండా భార్యను నోటికొచ్చినట్టు దూషిస్తూ రాచిరంపాన పెట్టే కఠినుడైన భర్తను గూర్చి హేతువాదం ఏం సంజాయిషీ ఇచ్చి సమర్థిస్తుందో మాకు తెలియదు గాని, లేఖనం మాత్రం అతనిని సమర్థించదు. పైగా అలాంటివాడు, భార్యను అదేపనిగా హింసిస్తూ కొనసాగడం కంటే ఆమెకు విడాకులు ఇవ్వడం మేలని ధర్మశాస్త్రము చెబుతుంది. అనగా ఆ కఠినుడైన భర్త చేతిలో చిత్రవధ అనుభవించడానికి బదులు భార్యకు విడాకులు ప్రత్యామ్నాయంగా చెప్పబడింది. అంతే గాని ఈ మాటలు కలిసిమెలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తల మధ్య విడాకులనే కుంపటి పెట్టి వారిని విడదీయాలనే ధోరణిలో చెప్పినవి కావు.

ఎంత హితవు చెప్పి మార్చాలని ప్రయత్నించినా మారకుండా, ఒకవేళ కఠినుడైన భర్త చీటికి మాటికి భార్యను కొడుతూ తిడుతూ వుంటే దానికి పరిష్కారంగా బ్రహ్మంగారి నాస్తికత్వం ఏమి చెబుతుందో మరి!

55. వీరబ్రహ్మం- వ్యభిచారం గురించి తప్ప క్రైస్తవులు విడాకులివ్వగూడదు !

“వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు వ్యభిచారము చేయుచున్నాడు” మత్తయి 19:9 (బైబిల్ బాగోతం ప్రశ్న53, పేజీ నం. 27)

జవాబు : సరైన కారణం లేకుండా అన్యాయంగా భార్యను విడిచిపెట్టిన పురుషుణ్ణి బైబిలు వ్యభిచారి అని ఖండిస్తుందని నిర్ధారించడానికి బ్రహ్మంగారు ఉదహరించిన పైవచనం చక్కని తార్కాణం. ఈ వాస్తవం తెలిసికూడా 10వ పాయింటులో ఈయనగారు భార్యను విడనాడిన పురుషుడిని బైబిలు పల్లెత్తు మాట కూడా అనలేదు అని తప్పుగా చిత్రీకరించారు. దీనిని బట్టి ఈయనగారు చేసిన తప్పుడు చిత్రీకరణలన్నీ అపార్థం చేసుకోవడం వలన కలిగినవి కావు గాని ఉద్దేశపూర్వకంగానే చేసినవని మరొకసారి స్పష్టంగా ఋజువైంది. అయినా ఒక నాస్తికుడిలో నిజాయితీ కనబడుతుందని భావించటం, అలా భావించినవారి పొరపాటే ఔతుంది . 

ఇంతకీ పైవచనంలో బ్రహ్మంగారు ఎదుర్కొన్న సమస్యేమిటో! వ్యభిచారాన్ని బట్టి తప్ప విడాకులు అనుమతించకపోవడం కుటుంబవ్యవస్థను పటిష్టపరచడానికి, కాపాడటానికి ఉద్దేశింపబడిన పవిత్రమైన నియమమే కదా! ఇందులో తప్పేముంది ? ఈ సత్యంతో సమ్మతించే మనస్సాక్షిని కఠినపరచుకోవడానికే కదా ఈ నాస్తికత్వపు కసరత్తు అంతా ? ప్రతి చిన్న విషయానికి భార్యకు విడాకులిచ్చుకుంటూ తిరగడానికి క్రైస్తవులేమి నాస్తికులు కారు.

54. వీరబ్రహ్మం- తల్లిదండ్రుల్ని గౌరవించాలా? తిరస్కరించాలా? ఏమని యేసు ఆజ్ఞ?

యేసు తన తల్లిని అవమానించినట్లు మత్తయి 12:47 - 50 వచనాలలో ఉన్న సంఘటనను బట్టి తెలుస్తోంది. ఇలా ఉంది. “అప్పుడొకడు - ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి యున్నారని ఆయన (యేసు)తో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి - నా తల్లి యెవరు? నా సహోదరులు ఎవరు? అని చెప్పి తన శిష్యులవైపు చెయ్యి చాపి - ఇదిగో నా తల్లియు, నా సహోదరులును, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు” అని చెప్పి తనను చూడవచ్చిన తన తల్లిని, తమ్ముళ్ళను తిరస్కరించి మెహర్బానీ కొసం తన భక్త కోటిలో వారిని కించపరచాడు . వారు చేసేది లేక ఖిన్నులై మరలిపోయారు.  మత్తయి 8:22లో యేసు తన శిష్యుల్లో ఒకతనిని అతని తండ్రి అంత్యక్రియలకు వెళ్ళనీయలేదు.

మత్తయి 10:37లో ఇలా చెప్పబడింది. “తల్లినైనను, తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు”

మత్తయి 19:29లలో " నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లిండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును” అని యేసు చెప్పాడు.

మార్కు 10:29, 30 వచనాలలో ఇలా ఉంది. “యేసు ఇట్లనెను - నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతోపాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”.

లూకా 14:26లో ఇలా ఉంది. “ఎవడైనను నావద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్య, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు”. ఇలా చెప్పింది గురువైన యేసు.

లూకా 18వ అధ్యాయంలో 29, 30 వచనాలలో యేసు ఏమన్నాడో చూడండి! “దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను పిల్లలనైను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును, పరమందు నిత్యజీవనమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను”.

చూశారా యేసును నమ్ముకుంటే అయిన వాళ్ళనందర్నీ వదులుకోవాలంట! ఇటువంటి మాటల ప్రభావం విశ్వాసుల మనస్సు మీద, వారి ప్రవర్తన మీద ఎంత గాఢంగా ఉంటుందో గమనించండి. మతనమ్మకాలు మానవ సంబంధాలను కూడా దెబ్బతీస్తాయనటానికి ఇంత కంటే తార్కాణం ఏమి కావాలి? యేసుకంటే ఎక్కువగా తన వాళ్లను ప్రేమిస్తే ఆయన ఓర్చుకోలేడు.

శిష్యులకు జ్ఞానబోధ చేసే సంధర్భంలో తల్లిదండ్రులను గౌరవించవలెను అనే సాధారణ నీతిపాఠం ఒకటి, రెండు చోట్ల మాత్రం యేసు చెప్పాడు; ఈ గౌరవించటం అనేది యేసు తన తల్లిని గౌరవించిన పద్దతిలోనేనా అనే అనుమానం కలుగకమానదు. మత్తయి 19 :19లోను, లూకా 18 :20లోను “తల్లిదండ్రులను సన్మానింపుము” అని ఉంది. (బైబిల్ బాగోతం ప్రశ్న54, పేజీ నం. 27)

జవాబు: యేసు జనసమూహం యెదుట తన తల్లిని గాని ఇతర కుటుంబ సభ్యులను గానీ తిరస్కరించినట్లు లేదా అగౌరవపరచినట్లు అసలు లేనేలేదు. తన తల్లితోను, సహెూదరులతోను యేసు ఏ విధంగా సమీపబంధాన్ని కలిగున్నాడో తన వాక్యాన్ని విని అంగీకరించిన ప్రజలందరు తనతో అలాంటి బంధాన్ని కలిగుంటారని యేసు భావార్థంగా చెబుతున్నాడు.

బ్రహ్మంగారు ఇక్కడ లేవనెత్తిన ఇతర వాక్యభాగాలకు మేము 24, 25, 32 ప్రశ్నలలో ఇచ్చిన వివరణ చక్కగా సరిపోతుంది. వ్రాసిందే మరలా మరలా బ్రహ్మంగారిలా వ్రాసి పుస్తకం సైజు పెంచుకునే అవసరం మాకు లేదు. అన్నట్లు, జ్ఞానబోధ చేసే సందర్భంలో తల్లిదండ్రులను గౌరవించవలెను అనే సాధారణ నీతిపాఠం ఒకటి రెండు చోట్ల మాత్రమే యేసు చెప్పాడని బ్రహ్మంగారు మత్తయి 19 :19 ,లూకా 18 :20లను ఉటంకించారు. ఐతే ఎన్నో ఇతర సందర్భాలలో ఈ అంశంపై యేసు చేసిన బోధను, కనపరచిన మాదిరిని ఉద్దేశపూర్వకంగానే మరుగుచేసి ఈయనగారు మరోసారి అసమగ్ర వ్యాఖ్యానాలకు పాల్పడ్డారు. మత్తయి 15 :4 -19; మార్కు 7 : 10-13 వచనాల్లో తల్లిదండ్రులను అగౌరవపరచడానికి ప్రోత్సహించిన శాస్త్రులను మరియు పరిసయ్యులను యేసు ఖండించిన సందర్భాన్ని బ్రహ్మంగారు ఎందుకు ప్రస్తావించలేదు ? యోహాను 19:26 -27 వచనాల్లో యేసు మరణవేదనను అనుభవించే సమయంలో సహితం తన తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చి కనపరిచిన మాదిరి ఈయనగారికి తెలిసినప్పటికీ దానిని ఎందుకు ప్రస్తావించలేదు ?

55. వీరబ్రహ్మం- యేసుని నమ్ముకుని ఆయన చెప్పినట్లు అయినవాళ్లను, ఇల్లు వాకిళ్ళను వదులుకుంటే ఇహలోకంలో లభించేవి కష్టాలా? సుఖాలా? మార్కు X లూకా !

యేసుని నమ్ముకుని అన్నింటినీ, అందర్నీ వదులకుంటే పరలోకంలో నిత్యజీవితంతోపాటు సకల సుఖాలు దోరుకుతాయని మత్తయి, మార్కు లూకా, ముగ్గురూ చెప్పారు కాని ఇహలోకంలో ఏం దొరకుతుందో చెప్పేటప్పుడు మార్కు లూకాలు పరస్పరం విభేదించారు. అలా వదులుకుంటే ఇహలోకంలో హింసలు పొందుతారని మార్కు చెప్పాడు. (మార్కు 10:29, 30) మార్కు చెప్పింది నమ్ముతారా, లూకా చెప్పింది నమ్ముతారా ?

జవాబు : మార్కు 10:29-30 మరియు లూకా 18: 29-30 ని బ్రహ్మంగారు పూర్తిగా చదివినట్లు లేరు, పైగా కల్త్ కబుర్లకు పోయి ఈయన వైరుధ్యాలు లేని చోట వైరుధ్యాలను కల్పించడంలో నిపుణుడని ఈయనగారి వ్రాతల్లోనే మనం ఎన్నో సార్లు చూసాం.

క్రీస్తును నమ్ముకున్న విశ్వాసులు భూమి మీద హింసలు పొందుతారని మార్కు వ్రాస్తే అలా శ్రమలు పొందే విషయం లూకా ప్రస్తావించలేదు. ఒకరు ప్రస్తావించిన విషయాన్ని మరొకరు ప్రస్తావించనంత మాత్రాన అది వైరుధ్యమౌతుందా? ఒకవేళ మార్కు చెబుతున్న విషయంతో లూకా విబేధించి, 'విశ్వాసులు అసలు హింసలు పొందరు' అని వ్రాస్తే అది వైరుధ్యమైయుండేదేమో. కాని లూకా 18: 29-30 లో అలాంటిదేమీ లేకపోగా , విశ్వాసులు శ్రమలను ఎదుర్కొంటారనే సత్యం లూకా రచనలలో కూడా స్పష్టంగా ప్రకటించబడింది. ఉదాహరణకు “వారు మిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతులయొద్దకును తీసుకునిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.” (లూకా 21 :12)

అంతేకాక లూకాయే వ్రాసిన అపొస్తలుల కార్యములలో కూడా ఇలా చదువుతాం - “ఈ శిష్యుల మనస్సులను ద్రుఢపరచి- విశ్వాసమందు నిలకడగా వుండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి” (అపొ 14 : 22) . కాబట్టి బ్రహ్మం గారు చిత్రీకరించినట్లు ఇక్కడ మార్కు మరియు లూకాల మధ్య వైరుధ్యమేమీ లేదు.

56. వీరబ్రహ్మం- యేసు శాంత స్వభావి కాదు, ముక్కోపి !

మత్తయి 21వ అధ్యాయంలో 18, 19, వచనాలు ఇలా ఉన్నాయి. “ఉదయమందు పట్టనమునకు మరలివెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక అంజూరపు చెట్టును చూచి, దాని యొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. గనుక దానిని చూచి ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను”.

ఏ దేవుడైనా చెయ్యాల్సిన పనేనా ఇది? మామూలు మనుషులు కూడా ఇంతటి క్షణికావేశానికి లోనుకారే? తను చూచిన సమయానికి చెట్టున కాయలు లేకపోతే అది చెట్టు చేసిన తప్పా? సాధ్యమైతే కాయలు కాయించి తన మహిమ చూపించుకోవాలి. అంతేకాని, “ ఓ చెట్టా! నీవు ఎండి మోడైపో” అని శపించటం గొప్పా? అది కరుణామయత్వం అన్పించుకుంటుందా? ఏ కాలంలోపడితే ఆ కాలంలో అంజూరపు చెట్లు కాయలు కాస్తాయా? సాధారణ అవగాహన ఉండొద్దూ? కాయలు కాయటానికి అనుకూలమైన పరిస్థితులున్నయ్యో, లేవో గమనించొద్దా? ఒకవేళ కాయలు కాసీనా యేసుగారు ఈ దారినే వస్తారు ఆయనకు ఉపయోగపడాలనే భక్తి భావంతో కాసిన కాయలు అలానే చెట్టుకు ఉండిపోతాయా?

మార్కు 11వ అధ్యాయంలో 12 నుండి 14 వరకు గల వచనాలలో మరింత స్పష్టంగా ఆ సన్నివేశం కనపడుతోంది. * బేతనియ నుండి వెల్లుచుండగా ఆయన ఆకలిగొని ఆకులుగల ఒక అంజూరపు చెట్టును దూరమునుండి చూచి, దానిమీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దానియొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకాయన ఇక మీదట ఎన్నటికిని నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను ”.

ఆ చెట్టున ఆ తరుణమున తనకు దొరకని పండ్లు ఆ చెట్టునుండి ఇక ఇతరులకు మాత్రం ఎప్పుడైనా సరే ఎందుకు దొరకాలి ? ఇదే ఆయన ఆగ్రహం ! ఇది ఆయన ఉక్రోషం ! ఇటువంటి సంకుచిత మనస్తత్వం గల వాడు యేసు. బైబిల్ బాగోతం ప్రశ్న56, పేజీ నం. 28)

జవాబు : బ్రహ్మంగారు మరోసారి తొట్రుపడ్డారు. కాయలు లేని అంజూరపు చెట్టును యేసు శపించినందుకు ఈయన గారు బాధపడి - ఏ దేవుడైనా చెయ్యాల్సిన పనేనా ఇది అని ప్రశ్నించారు. ఐతే ఏ మనిషైనా ఇలా చెయ్యగలడా? కేవలం ఒకే ఒక్క మాట చేత ఎండిపోయేలా చేయడం ఒక్క క్రీస్తుకు తప్ప మరెవరికైనా సాధ్యమా, పోని బ్రహ్మంగారికి సాధ్యమా ?

ఆ చెట్టు ఆకులు కలిగి ఫలాలు ఉన్న చెట్టుగా కనబడి అందరినీ భ్రమపరిచేదిగా వుంది కాని ఆకులు తప్ప ఫలాలు లేవు. మోసపూరితమైన భక్తికి ఆ చెట్టు సాదృశ్యంగా ఉంది. ఒక విధంగా చూస్తే అది వేషధారణతో కూడిన ఇశ్రాయేలు జాతికి సూచనగా వుంది ( లూకా 13 : 6-9). ఎంతో ఉందని చెప్పుకుంటూ అసలే ఫలించని ఏ వ్యక్తికైనా సంఘానికైనా ఈ సంఘటన హెచ్చరికగా వుంది.

అంజూరపు చెట్లు వసంతకాలంలోనే చిగురిస్తాయని యేసుకు తెలుసు ( మత్తయి 24: 32) ఐతే అకాలంలో కాయలుకాసే చెట్లలో అంజూరపు చెట్టు కూడా ఒకటి . ఆకులతో నిండియున్నా, కనీసం ఒక్క అకాల ఫలమైనా లేని ఆ చెట్టు, ఎంతో భక్తిని ప్రదర్శిస్తున్నా, మారుమనస్సు ఫలాలు ఏమాత్రం ఫలించని ఇశ్రాయేలు జాతికి సరిగ్గా సరిపోలింది. ఇశ్రాయేలు జాతిని అంజూరపు చెట్టుతో సరిపోల్చి చెప్పే వాక్యభాగాలు పాతనిబంధనలోనూ మరియు యేసు బోధలలోనూ ఎన్నో కనిపిస్తాయి. ఉదా : యిర్మియా 8:13; 29: 15-19 ; హెూషియా 9:10 :మీకా 7 : 1-4 ; నహూము 3:12 ; లూకా 13:6-9 ; మార్కు 12:1-9. కాబట్టి అంజూరపు చెట్టుపై ఆయన చూపించిన కోపము, ఇశ్రాయేలుకు సంభవించబోయే పర్యావసానాన్ని తెలిపేదిగా ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు.

యేసు మాటలు మరియు చర్యల వెనుక ఉపమానార్థమైన బోధ ఉందని బ్రహ్మంగారికి తెలియకపోయినా, యేసు పరిచర్యా విధానాన్ని గమనించిన వారెవరైనా దానిని స్పష్టంగా గుర్తించగలరు.

57. వీరబ్రహ్మం-దావీదు “ప్రభువు” కుమారుడెలా అగును ?

ఈ ప్రశ్న వేసింది ఎవరో కాదు, యేసే. దీనికి జవాబు ఆయనకే తెలియక పరిసయ్యులను అడిగితే వాళ్ళకి మాత్రమేం తెలుసు ! మారుమాట్లాడక తెల్లమొఖం వేశారు. దావీదు కుమారుడని పిలిపించుకున్న, గుళ్ళల్లో ఆ పేరుతో పిల్లలతో జేజేలు కొట్టించుకున్న (మత్తయి 21:15 చూడవచ్చు) యేసు, మరోక సందర్భములో 'నేను దావీదు కొడుకునేందుకవుతాను? నేను ప్రభువు (దేవుడు) కొడుకుని” అని చెప్పుకుంటాడు. యేసు తనను గూర్చి అనేక తరాలముందుగానే దావీదు ఇలా చెప్పాడని చెప్తున్నాడు. " నేను నీ ( యేసు యొక్క శత్రువులను నీ పాదముల క్రింద ఉంచువరకు నీవు నా కుడి పార్శ్యమున కూర్చుండుమని ప్రభువు (పైవాడు, తండ్రి) నా ప్రభువు (యేసుతో) చెప్పెను” (మత్తయి 22:44). అని దావీదు ఆయనను (యేసును) ప్రభువని ఆత్మవలన ఏల చెప్పుచున్నాడు; దావీదు ఆయనను (తనను అనగా యేసును) ప్రభువని చెప్పిన ఎడల, ఆయన (తనే) ఏలాగు అతనికి (దావీదుకు) కుమారుడగును? (మత్తయి 22:45, 46)

దావీదు కుమారుడని పిలువబడ్డ యేసు, దావీదు చేత ప్రభువా అని కొలువబడ్డాడన్నమాట ! ప్రభువు కుమారుడు కూడా ప్రభువే ? అయితే ప్రభువంటే ఎవరు ? తండ్రా ? తనయుడా ?

జవాబు: 'దావీదుకు “ప్రభువు” కుమారుడెలా అగును' అనే ప్రశ్నకు జవాబు యేసుకే తెలియదని, జవాబు తెలుసుకోవడానికి పరిసయ్యులను అడిగినట్లు  బ్రహ్మంగారి అపవాదు. అంటే బ్రహ్మంగారికి తెలియని విషయాలు యేసుకు కూడా తెలియదనా?

యేసుక్రీస్తు మానవరీత్యా శరీరధారిగా వచ్చినప్పటికీ, భౌతికమైన దావీదు వంశావళికి చెందినప్పటికీ వాస్తవానికి ఆయన దావీదుకు ప్రభువైయున్నాడు ( ఫిలిప్పీ 2: 6 -7 ) ఇదే విషయాన్ని దావీదు ప్రస్తావిస్తూ  ప్రభువు (దేవుడైన యెహోవా నా ప్రభువు(క్రీస్తు)తో చెప్పిన మాట అని క్రీస్తు దైవత్వాన్ని ఋజువు చేస్తూ  పలికాడు. ఈ విషయం దావీదుకు అర్థమైనప్పటికీ మీకు ఎందుకు అర్థంకాలేదు అని యేసు పరిసయ్యులను ప్రశ్నిస్తున్నాడు. మరొక చోట క్రీస్తు అబ్రాహాము కుమారునిగా చెప్పబడినప్పటికీ, అబ్రాహాము పుట్టక మునుపే ఉనికిలో వున్నవానిగా ప్రకటించుకున్నాడు ( మత్తయి 1:1; యోహాను 8: 57 -58 ).

సహజమైన విషయాలే హేతువాదులకు అర్థంకానప్పుడు సహజాతీతమైన విషయాలు ఎలా అర్థమౌతాయి? యేసు కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు “భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు , పరలోకసంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు సముదురు?” ( యోహాను 3:12 ).

58. వీరబ్రహ్మం - ఈ భూమి మీద కన్న తండ్రిని తండ్రి అని పిలువగూడదని యేసు ఆజ్ఞ ! (నీకు కన్పడేవాడు నీ తండ్రికాడు, నీ తండ్రి మరో చోట ఉన్నాడు!)

యేసు, యోసేపును తండ్రి అని పిలిచి ఉండడు. ఎందుకంటే, తన విషయంలో తన అసలు తండ్రి వేరే ఉన్నాడు. అలాగే మీ అందరికీ కూడా అసలు తండ్రి వేరే ఉన్నాడు కాబట్టి, మీ కుటుంబ పెద్దని తండ్రి అని పిలవొద్దని చెప్తున్నాడు. తనకీ, ఇతరులకి ఈ విషయంలో అబేధాన్ని చూపిస్తూ తన ఇగోని కాపాడకుంటున్నాడు. తనకులాగే ఇతరులు కూడా తమ తమ తండ్రులను తండ్రి అని పిలువగూడదనటం అసమంజసం, అర్థరహితం. మత్తయి 23: 9లో ఇలా సెలవిస్తున్నాడు యేసు, “భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు” కనుక బైబిలు ప్రకారం తండ్రిని తండ్రి అనటం కూడా తప్పే ! ఏమంటే బావుంటుందో చెప్పి ఉంటే బావుండేది .

జవాబు: బైబిలును సరిగ్గా చదివితే మానవ ఆలోచనలకు తావే వుండదు. బ్రహ్మంగారు తన సొంత ఆలోచనలను మిళితం చేసి లేని తప్పులను చూపించే కసరత్తే మళ్ళీ చేస్తున్నారు. మత్తయి 23:9ను చూపిస్తూ ఈ భూమి మీద కన్నతండ్రిని తండ్రి అని పిలవకూడదని యేసు ఆజ్ఞ అని బ్రహ్మంగారు వ్రాసారు. ఐతే ఈ వాక్య సందర్భాన్ని చూసినప్పుడు శాస్త్రులు పరిసయ్యులు విందులలో అగ్రపీఠములను ఆక్రమించి ప్రజలచేత బోధకులని, గురువులని, తండ్రి అని పిలిపించుకోవడానికి ఆరాటపడేవారు. అంటే దేవునికి చెందాల్సిన ఘనతను తమవైపు మళ్లించుకుని కీర్తింపబడాలని భావించేవారు. కనుక యేసు వారిని గూర్చి మాట్లాడుతూ ఒక వ్యక్తి దేవునిని తండ్రి అని పిలిచేటట్లు మరెవ్వరిని కూడా ఆ బిరుదుతో పిలవకూడదనే భావంలో చెబుతున్నాడు తప్ప కన్నతండ్రిని తండ్రి అని పిలవకూడదని చెప్పడం లేదు. అసలు ఆ మాటకొస్తే యేసు సాధారణ కుటుంబసంబంధాల గురించి మాట్లాడడం లేదు. కుటుంబ సందర్భంలో తండ్రి అని పిలవడం తప్పని యేసు చెప్పనేలేదు. ఐతే మతపరమైన విషయాలలో దేవునికి మాత్రమే చెందాల్సిన అర్హతలను మరియు బిరుదులను మనుషులు ఆక్రమించుకునే పొరపాటును ఖండించి, దైవభక్తి పేరిట మనుషులను హెచ్చించడం దేవునిని తగ్గించడమే అవుతుందని హెచ్చరించడం, యేసు మాటల్లోని ఉద్దేశం. ఇందులో ఇగో ఎక్కడుందో బ్రహ్మంగారు చెప్పకపోగా తమ 'ఇగోని బయటపెట్టుకున్నారు.

59. వీరబ్రహ్మం - నాడు పరిసయ్యులకు చెప్పిందే నేడు క్రైస్తవులకు అక్షరాలా వర్తిస్తుంది.

మత్తయి 23:15 లో యేసు మతమార్పిడులను గురించి పరిసయ్యులను ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు. “వేషధారులైన శాస్త్రులారా ! పరిసయ్యులారా ! ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును, భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలసినపుడు అతనిని మీకంటే రెండింతలు నరకపాత్రునిగా చేయుదురు”. (బైబిల్ బాగోతం ప్రశ్న59, పేజీ నం. 30).

జవాబు: బైబిల్లో తప్పులు లేవని, పరస్పర వైరుధ్యాలు లేవని నిరూపించడమే మా ఉద్దేశం. అంతేకాని క్రైస్తవులందరూ యధార్థపరులని నిరూపించడం మా పని కాదు. నాటి కాలంలో వేషధారులైన పరిసయ్యులు, ఇతరులను తమ వేషధారణతో కూడిన మతంలోనికి కలుపుకునే ప్రయత్నం చేసినట్లే ఈనాడు కూడా క్రైస్తవులమని చెప్పుకునేవారు ప్రవర్తిస్తే, వారికి యేసు మాటలు నిస్సందేహంగా వర్తిస్తాయి. కాబట్టి ఇక్కడ సమస్యేమీ లేదు. అన్నట్టు, “ నరకపాత్రునిగా చేయుదురు” అని బైబిలు వాక్యాన్ని ఉదహరిస్తూ ఇది క్రైస్తవుల విషయంలో నిజమని వాదించే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మంగారు. ఇంతకీ నాస్తికులు నరకాన్ని కూడా నమ్ముతారా?

60. వీరబ్రహ్మం- యేసుకు ప్రాణభీతి లేదా? మీకు తెలుసా-యేసు తనకు మరణశిక్షపడకుండా చెయ్యమని ప్రార్థించాడని?
అందరికిలాగే యేసుకు ప్రాణభీతి ఉంది. చావును తప్పించుకోవాలని మూగగా రోదించాడు. యూదా తనను పట్టించకుండా ఉంటే బాగుండును అని అనుకున్నాడు. యేసు మామూలు మానవులందరిలాగానే తనకు రాబోయే మరణాన్ని గురించి భయపడి ఏడ్చాడు. మత్తయి 26:37-39లలో ఇలా ఉంది, “(యేసు) పేతురును జెబెదయి యిద్దరు కుమారులను వెంటబెట్టు కొనిపోయి, దు:ఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు - మరణమగునంతగా నా ప్రాణము బహు దు:ఖముతో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పెను”.
మార్కు 14:34-36లో అయితే అప్పుడాయన నా ప్రాణము మరణమగునంతగా దు:ఖములో మునిగియున్నది. మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంతదూరము సాగిపోయి నేలమీద పడి, సాధ్యమైతే ఆ గడియ తనయొద్ద నుండి తొలగిపోవలెనని ప్రార్థించాడు” అని ఉంది. హెబ్రీ 5:7లో కూడా ఇలా ఉంది, " శరీరధారియైయున్న దినములలో మహరోదనముతోను, కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవారికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి, భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను”.

యేసుకు చావు భయం నిజంగా లేకపోతే యోహాను 6: 51లో చెప్పినట్లుగా ఈ లోకమునకు జీవము కొరకు నా శరీరాన్ని ఆహారంగా ఇస్తున్నాను' అని ధీరగంభీరోపన్యాసాన్ని ఇవ్వొచ్చుగా, సామాన్యుడిలా చావు భయంతో చచ్చేలాగా ఏడ్వటం ఎందుకు? (బైబిల్ బాగోతం ప్రశ్న60, పేజీ నం. 30)

జవాబు: యేసు సంపూర్ణ దేవుడు మరియు సంపూర్ణ మానవుడని బైబిల్ బోధిస్తుంది. ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ , పాపము తప్ప అన్నీ సహజ బలహీనతలు మనలాగే కలిగివున్నాడని బైబిల్ తెలియజేస్తుంది. “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని , సమస్త విషయములలోను మనవలె శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను” ( హెబ్రీ 4 :15 ) .
అందుకే , తన మరణఘడియ వచ్చినప్పుడు యేసు సహజ మానవునిగానే స్పందించాడు. ఇది ఆయన నిజంగా మానవ స్వభావాన్ని ధరించాడని చెప్పడానికి ఒక చక్కటి తార్కాణం. దేవుడిగా మనుషుల రక్షణార్థమై తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన సంసిద్దత కలిగివున్నాడన్నది ఎంత నిజమో, మానవుడిగా మరణాన్ని తప్పించుకోవడానికి ఆయన అందరిలాగే కోరుకున్నాడన్నది కూడా అంతే వాస్తవం. ఐతే తన మానవ ఆలోచనను తన దైవిక చిత్రానికి లోబరచుకున్నాడన్నదే ఇక్కడ ప్రశంసించదగ్గ విషయం. అందుకే ఆయన తన ప్రార్థనలో “ఐనను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించు గాక” అని అన్నాడు. కాబట్టి యోహాను 6: 51 లో - ఈ లోకమునకు జీవము కొరకు నా శరీరాన్ని ఆహారంగా ఇస్తున్నాను అని యేసు సెలవిచ్చిన మాట ఆయన అక్షరాలా నిలబెట్టుకున్నాడు. (5 పాయింటుకు వ్రాసిన మా జవాబును పోల్చి చూడండి).

61. వీరబ్రహ్మం- బైబిలు తెలుగు అనువాదం పరమచెత్త అనువాదం !

మచ్చుతునక: “నా ప్రాణము మరణమగునంతగా దు:ఖములో మునిగి ఉన్నది” (మార్కు 14:34). మరణించటం అంటే ప్రాణం పోవటం గదా! అలాకాకుండా ప్రాణం మరణించటం వేరే ఉంటుందా? ఇది అపసవ్యమైన అనువాదం. నాకు చచ్చేంత ఏడుపు వస్తుంది. అని చెప్పటానికి వచ్చిన తంటా ఇది. (బైబిల్ బాగోతం ప్రశ్న61, పేజీ నం. 31)

జవాబు : బైబిల్ తెలుగు అనువాదం మాట అలా వుంచితే, బ్రహ్మంగారి తెలుగుభాషా అవగాహన పరమ చెత్తదని తేలిపోయింది. ప్రాణం మరణించడమేమిటి అని ప్రశ్నించారు. నిజానికి ప్రాణం మరణించడాన్ని గురించి కాదు ప్రాణం దు:ఖపడడాన్ని గురించి యేసు మాట్లాడుతున్నాడు. ఎంతగా అంటే, మరణమగునంతగా అది దు:ఖపడుతుందని వర్ణనాత్మకంగా చెప్పాడు. కనీసం భాష కూడా తెలియని బ్రహ్మంగారు బైబిల్ ని పరిశీలిస్తారట. నాకు చచ్చేంత ఏడుపు వస్తుందని అనుండాల్సిందని బ్రహ్మంగారి సలహా , అసలు చచ్చేంత ఏడుపు ఎలా వస్తుందట. నాస్తికులు అలాగే ఏడ్చి చస్తారా? ఆయనగారి వ్యంగ్యం ఆయననే అవహేళన చేస్తుంది తప్ప దాని ద్వారా బైబిలుకి కలిగే నష్టమేమీలేదు. వట్టిగొడ్డుకి అరుపులెక్కువ అని మరోసారి నిరూపించుకున్నారు.

62. వీరబ్రహ్మం- ఇంతకీ యేసు పట్టుబడింది ఎక్కడ ?

మత్తయి 26:36, మార్కు 14:32ల ప్రకారం ఈ గేత్సేమనే ” వద్ద. లూకా 22:39 ప్రకారం “ఒలీవల” కొండమీద. యోహను 18:1 ప్రకారం కేద్రోను వాగు దాటిన తరువాత వచ్చే తోటలో (బైబిల్ బాగోతం ప్రశ్న62, పేజీ నం. 31).

జవాబు : నాలుగు సువార్తల వాక్యాలను చూపిస్తు యేసు పట్టుబడింది ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు బ్రహ్మంగారు. నలుగురు సువార్తికులు చెప్పింది వాస్తవమే. యెరుషలేము నగరానికి కొద్ది దూరంలో ఒలీవలకొండ దగ్గర గెత్సమనే తోటవుంది (మార్కు 14:26;32) కేద్రోను లోయ యెరుషలేముకు తూర్పున నగరానికి ఒలీవల కొండకు మధ్యన వున్నది. అనగా గెత్సమనె, ఒలీవలకొండ, కేద్రోను ఈ మూడు కూడా యెరుషలేము నగరంలో వున్న పరిసరప్రాంతాలే కనుక సువార్తీకులు ఒకే స్థలాన్ని వేరువేరు సరిహద్దు గుర్తులతో సూచించారు. ఇందులో పరస్పర వైరుధ్యమేమాత్రమూ లేదు. మెదడులో సమస్య ఉన్నవారికి లేనిచోట కూడా సమస్య కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

63. వీరబ్రహ్మం- యేసంటే ఎవరో ప్రజలకు, భటులకు తెలియదా ?
యేసు కాలంలో అతనున్న ప్రాంతంలోనే అత్యధిక ప్రజలకు అతనెవరో తెలియదని, యేసు మనమనుకుంటున్నంత పేరు మోసిన వాడు కాదని మత్తయి 26:47 - 49 చదివితే తెలుస్తోంది. “యేసు పండ్రెండు మంది శిష్యులలో ఒకడగు యూదాతో కూడా బహుజన సమూహము కత్తులు, గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్దనుండియు, ప్రజల పెద్దల యొద్దనుండియు వచ్చెను. ఆయనను అప్పగించువాడు (యూదా) నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పెను” దీనిని బట్టి, యేసంటే ఎవరో తెలియదనేకదా అర్థమౌతుంది!
యోహను 18:4,5లలో ఇలా ఉంది. “యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారి యొద్దకు (సైనికులు, భటులు) వెళ్ళి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను. వారు నజరేయుడైన యేసునని నాయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను”. ఈ రకంగా రెండోసారి కూడా నజరేయుడైన యేసు అంటే తానేనని చెప్పుకున్నాక, అప్పుడు యేసును బంధించారు. (బైబిల్ బాగోతం ప్రశ్న63, పేజీ నం. 31).

జవాబు : యేసును పట్టుకున్నవారికి ఆయనతో ముఖపరిచయం లేకపోవటం, ఆయన ప్రఖ్యాతి లేని వాడనటానికి నిదర్శనంగా ఎత్తి చూపించే సాహసం, ఓ నాస్తికుని విజ్ఞతకు, విశ్లేషణ సామర్థ్యానికి పరాకాష్ఠ. ఇంత గొప్ప జ్ఞానాన్ని లోకానికి అందించిన మొదటి 'మహామనిషి' బ్రహ్మంగారే అయ్యుండాలి!!

ఇక విషయానికొస్తే, యేసు ప్రసిద్ధిని గురించి తెలిపే ఎన్నో భాగాలు సువార్తలలో మనకు కనిపిస్తాయి ( మత్తయి 4:23-24, 9:26,31,14:1,మార్కు 1:28, లూకా 4:14,37, 5:15). ఐతే,ఇలాంటి ప్రతి సందర్భంలోనూ యేసు చేసిన మహత్కార్యాలను బట్టి ఆయనకు లభించిన ఖ్యాతి ఎంత గొప్పదో తెలుపబడిందే తప్ప, అందరికీ ఆయనతో వ్యక్తిగతంగా పరిచయాలు ఏర్పడ్డాయని దాని అర్థం కాదు. ఈ రోజు టీవీ, ఇంటర్నెట్,ఫొటోగ్రఫీ, పెస్, తదితర మాధ్యమాల వల్ల కలిగే ముఖపరిచయం, ఎంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తికైనా ఆ రోజుల్లో ఉంటుందనుకోవడం అవివేకం.
అంతేకాదు, యేసు ఎక్కువుగా గలీలియ ప్రాంతంలో పరిచర్య చేసాడని సువార్తలు చదివినవారందరికీ తెలుసు. ఐతే ఆయన నిర్భందించబడటం యెరుషలేములో జరిగింది. ఆయన యెరుషలేముకు చెందినవాడు కాదు. పండుగ సమయంలో తప్ప అక్కడ ఆయన పరిచర్య చేసిన దాఖలాలు లేవు ( 'యోహాను 2:13, 5:1, 7:14, 10:22-23, 12:12-18) కాబట్టి అక్కడున్నవారికి ఆయనతో ముఖపరిచయం లేకపోవడాన్ని బట్టి యేసును పట్టుకోవడానికి వచ్చినవారు ఆయన శిష్యులలో ఒకడైన యూదాను ఆశ్రయించటం జరిగింది. వారిలో కొందరు ఆయనను ముఖాముఖిగా చూసినవారైనా సరే,జనసమూహం మధ్య అడపాదడపా కనపడినవానిని ,రాత్రివేళ గుర్తుపట్టడంలో పొరపాటు చేయవచ్చు కాబట్టి వారికి యూదా సహాయం అవసరం అయ్యింది. అంతమాత్రాన అది 'యేసు మహామనిషి కాడ'ని, 'పేరు మోసినవాడు కాడని అనడానికి చాలిన రుజువు ఎంతమాత్రమూ కాదు. అది తెలుసు కాబట్టే, 'యేసు కాలంలో అతనున్న ప్రాంతంలోనే అత్యధిక ప్రజలకు అతనెవరో తెలియదని బ్రహ్మంగారు అబద్దమాడాల్సి వచ్చింది. యేసు నజరేతులో పెరిగాడు(మత్తయి 2:23). పరిచర్య సమయంలో కపెర్నహూములో నివసించాడు (మత్తయి 9:1,మార్కు 2:1). కాబట్టి ఆయన నిర్భందించబడిన యెరూషలేము 'యేసు కాలంలో అతనున్న ప్రాంతంగా చిత్రీకరించడం పచ్చి అబద్ధం. ఏమి సాధించటానికో ఈ అబద్దాల కసరత్తంతా?
పేరుప్రఖ్యాతలు బ్రహ్మంగారికి లేవనేమో యేసు ప్రఖ్యాతలపై అంత కుళ్లు.

64. వీరబ్రహ్మం- యేసు ఎవరు? మనుష్యకుమారుడా? దేవుని కుమారుడా? ప్రభువా?

ఇందుకు వాక్యాలను ఉదహరించనవవసరం లేదు. క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల మనుష్యకుమారుడని, మరి కొన్నిచోట్ల దేవుని కుమారుడని, ఇంకొన్ని చోట్ల ప్రభువని ఉంది. యేసుకు అన్ని రకాల గొప్పదనాన్ని ఆపాదించడానికి బైబిలు రచయితలు నానా ప్రయత్నాలు చేశారు. ఐతే ఈ ప్రయత్నంలో వారి అంచనాలలో స్పష్టత లోపించటం వల్లే యేసును ఒక్కోసారి ఒక్కోచోట ఒక్కోలా ఆకాశానికెత్తారు. ( బైబిల్ బాగోతం ప్రశ్న64, పేజీ నం. 31)

జవాబు : యేసు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, ప్రభువు - ఈ మూడూ వాస్తవాలే. యేసుకు ఆ మూడు బిరుదులు ఎందుకు వర్తించవో బ్రహ్మంగారు కారణాలు ఏవీ చూపించలేదు . ఒక బిరుదున్నవారికి ఇంకొకటి ఉండకూడదా? ఐతే బైబిలు రచయితల అంచనాలలో స్పష్టత లోపించడం వల్లనే ఒక్కోసారి యేసును ఆకాశానికి ఎత్తేసారని ఈయనగారు వ్యథచెందారు గాని అసలు బైబిలు రచయితలలో కనిపించిన అంచనా లోపమేమిటో బ్రహ్మంగారు చెప్పనే లేదు. అస్పష్టత అనేది బ్రహ్మంగారిలోనే తప్ప బైబిలు రచయితలలో లేదు.

65. వీరబ్రహ్మం- చనిపోయిన తర్వాత యేసు వెళ్ళేది దేవుడు (తండ్రి) దగ్గరికి కాదా? దేవుడి దగ్గరకే అయితే ఈ దేవా సన్నెందుకు చెయ్యి విడిచితివి” అని అడుగుతాడా?

మృత్యువు తన దరికి రానప్పుడు “పరలోకములో నా తండ్రి కొలువులో మీకు ఆసనములు సిద్దము చేయుట కొరకు నేను వెళ్ళాల్సి ఉంది” అని చెబుతాడు చావు ముంచుకొచ్చినప్పుడు “తండ్రీ! నన్ను నీ కుడి పార్శ్యమున కూర్చుండబెట్టుకొనుటకు తీసుకెళ్తున్నావా? అందుకు నీకు కృతజ్ఞతలు” అనొచ్చు కదా? కానీ అలా అనలేదు. యేసు ప్రాణం విడిచే ముందు ఏమన్నాడో మత్తయి 27:46లో వ్రాయబడింది. " ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము”.

ఇక్కడ చెయ్యి విడిచినా వెళ్ళేది అక్కడికే అనే నమ్మకముంటే నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ఆక్రోశించటం వ్యర్థం, అవివేకం (బైబిల్ బాగోతం ప్రశ్న65, పేజీ నం. 32).

జవాబు : యేసు మనకొరకు స్థలం సిద్దపరచడానికి వెళ్లింది మరియు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నది ఆయన మరణించినప్పుడు కాదు ; అది ఆయన సజీవుడిగా తిరిగి లేచిన తర్వాత జరిగింది. ఐతే దానిని ఆయన మరణఘడియలో తండ్రినుండి ఎదుర్కొన్న వేర్పాటుతో కలగలిపి కలవరపెట్టే ప్రయత్నం చేసారు బ్రహ్మంగారు. పాపి స్థానంలో శిక్ష పొందుతూ, పాపీకి దేవుని నుండి కలిగే ఎడబాటును యేసు ఆ ఘడియలో అనుభవించాడు కనుక ఆయన ఆ విధంగా రోధించడంలో వింతేమీ లేదు. ఐతే నాస్తికులకు ఇవన్నీ నెత్తికెక్కుతాయని మేమనుకోవడంలేదు, “సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవునిశక్తి ”( 1 కొరింధి - 1:18) .

66. వీరబ్రహ్మం- తండ్రి, పరిశుద్దాత్మ, కుమారుడు - వేరువేరు

త్రిత్వం తీరే వేరు, మత్తయి 28:19లో “మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు” అని ఉంది దీన్ని బట్టి తండ్రి, పరిశుద్దాత్మ, కుమారుడు ఒక్కటే అని భావించరాదని, ఈ ముగ్గురు వేరువేరని తెలుస్తోంది(బైబిల్ బాగోతం ప్రశ్న66, పేజీ నం. 32)

జవాబు : ఔను బ్రహ్మం గారు చెప్పినట్లు తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ , ఈ ముగ్గురూ ఒక్కరు కాదు . త్రిత్వంలోని ముగ్గురు వేరువేరు వ్యక్తులు. తండ్రి కుమారుడని కుమారుడే పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మ తండ్రి అని బైబిల్ చెప్పడం లేదు. దేవుడు ఒక్కడే అని, ఆ దేవుడే ముగ్గురు వ్యక్తులుగా తన అస్థిత్వాన్ని కలిగి ఉన్నాడని బైబిల్ బోధిస్తుంది. బైబిల్లో తప్పులు పట్టుకోవాలనే తొందరలో అంశాన్ని వివరించి, పాపం అదే విమర్శ అనుకున్నారు బ్రహ్మంగారు.

67. వీరబ్రహ్మం- దేవుడు, ఆత్మ ఒక్కటేనా ?

మత్తయి 28:19 ప్రకారం తండ్రి (దేవుడు), పరిశుద్ధాత్మ వేరువేరని తెలుస్తోంది. కానీ, యోహాను 4:24 అనుసరించి దేవుడు, ఆత్మ ఒక్కటే అని తెలుస్తోంది. వీటిల్లో ఏది నిజం అనుకోవాలి? పరిశుద్దాత్మ అన్నా, ఆత్మ అన్నా ఒక్కటి కాదా? యోహను 4:24లో “దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను” అని ఉంది. (బైబిల్ బాగోతం ప్రశ్న67, పేజీ నం. 32)

జవాబు : యోహాను 4:24 లో తండ్రియైన దేవుని ప్రస్తావన వుంది. ఆయన ఆత్మస్వరూపి అని ఆ వాక్యం తెలియజేస్తుంది. కుమారుడైన దేవుడు కూడా శరీరధారిగా రాక మునుపు ఆత్మరూపిగా వున్నాడు. అంతమాత్రాన త్రిత్వంలో పరిశుద్దాత్మ అని పిలవబడే సభ్యుడే తండ్రియైన దేవుడని లేదా కుమారుడైన దేవుడని భావించడానికి బైబిల్లో తావులేదు. ఐనా ఏలాగూ నమ్మనివాడికి వారు ఒక్కరైనా, వేరువేరైనా వచ్చిన తంటా ఏమిటంటా ?

68. వీరబ్రహ్మం- పరిశుద్దాత్మ అంటే ఏమిటి? లేదా ఎవరు? ఎవరి పరిశుద్దాత్మ ?

మరియ గర్భవతి ఐంది తండ్రి వలన కాదు, పరిశుద్ధాత్మ వలన, పరిశుద్దాత్మ అంటే ఏమిటో తెలిసేది కన్యయైన మరియను గర్భవతిని చేసిన చోటే. అక్కడ మాత్రమే సదరు పరిశుద్ధాత్మ శక్తి సామర్థ్యాలు లేదా మహిమ ఎటువంటిదో తెలుస్తుంది. బైబిల్లో మరింకెక్కడ పరిశుద్దాత్మను గురించి వివరం లేదు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే యేసు పుట్టింది తండ్రివల్ల కాదు, పరిశుద్ధాత్మవల్ల. బైబిలుపరంగా నమ్మాల్సింది ఏమిటంటే పరిశుద్ధాత్మల వలన కన్నెలు గర్భవతులు కాగలరు. (బైబిల్ బాగోతం ప్రశ్న68, పేజీ నం. 32)

జవాబు : నాస్తికులు పచ్చి అబద్దికులని నిరూపించడానికి బ్రహ్మంగారి మాటలే గొప్ప రుజువులుగా ఉన్నాయి. మరియ పరిశుద్ధాత్మవలన గర్భవతియైన విషయాన్ని ప్రస్తావిస్తూ 'బైబిల్లో మరింకెక్కడ పరిశుద్ధాత్మను గురించి వివరం లేదు' అని వ్రాసారు , ఐతే బైబిల్లో పాత మరియు క్రొత్తనిబంధనలో పరిశుద్దాత్మను గురించి ఎన్నో వివరాలు వ్రాయబడియున్నాయి , మచ్చుకు కొన్ని - కీర్తన 139 :7- 10; యెషయా 40:13-17 ; మత్తయి 10 : 20 ; యోహాను 15:26 ; అపొస్త 2:3; రోమా 5:5; ఫిలిప్పీ 2:1;1 థెస్స5:19; హెబ్రీ 9:14.

పైగా బ్రహ్మంగారు, "బైబిలుపరంగా నమ్మాల్సింది ఏమిటంటే పరిశుద్దాత్మల వలన కన్నెలు గర్భవతులు కాగలరు' అంటూ అవహేళనగా మాట్లాడినప్పటికీ ఇది వాస్తవమే . ఐతే గర్భం కలిగే సహజ విధానాన్ని తన వెటకారపు మాటల్లో అంతర్లీనంగా పరిశుద్ధాత్మకు ఆపాదించే ప్రయత్మం బ్రహ్మంగారు చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ, కేవలం మాటచేత సమస్తాన్ని కలుగజేయగలిగే దేవుడు కన్యను గర్భవతిగా చేస్తే , దానికి సహజ విధానాలు మరియు ఆసభ్యకరమైన ఆలోచలు అంటగట్టాల్సిన అవసరం లేదు (నాస్తికత్వపు మూర్ఖత్వానికి అమ్ముడుపోతేతప్ప).

69. వీరబ్రహ్మం- దయ్యాలకు యేసు అంతకుముందే ఎలా తెలుసు ?

మార్కు 1:34 లో ఇలా ఉంది. “అవి తన్ను ఎరిగియుండినందున ఆయన దయ్యములను మాటలాడనియ్యలేదు” యేసు జన్మించకముందే దయ్యాలకు తెలుసు అని చెప్పలేము. అంతకుముందు పరలోకములో ఆయనకు అస్థిత్వముందా? ఉంటే ఆయన స్థానమేమిటీ ? యేసు ఈ లోకములో పరిశుద్ధాత్మ వల్ల పుట్టాడు. దేవుడి వల్ల కాదు. దేవుడు, పరిశుద్దాత్మ ఒకటి కాదు. మరి పరలోకంలో యేసు ఏంటి? ఆయన అక్కడ ఎవరి కుమారుడు? అక్కడ తండ్రి (దేవుడు) కుమారుడు, ఇక్కడ పరిశుద్దాత్మ కుమారుడా? యేసు దయ్యాలకు ఏ విధంగా తెలుసు? (బైబిల్ బాగోతం ప్రశ్న69, పేజీ నం. 33).

జవాబు : యేసు ఈ లోకంలో శరీరధారిగా జన్మించకముందే పరలోకంలో ఆయనకు ఆస్థిత్వముందని ఆయనే స్వయంగా చెప్పాడు -“తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము” (యోహాను 17:5). కాబట్టి ఆయన పరిశుద్దాత్మ వలన ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఉనికి ప్రారంభం కాలేదు. అనాది నుండి ఆస్థిత్వాన్ని కలిగున్న ఆయన , పరిశుద్ధాత్మ కార్యం చేత మరియ గర్భంలో శరీధారి అయ్యాడు( లూకా 1:35 , హెబ్రీ 10:5 ). ఆయన శరీరధారిగా రాకమునుపు దేవుని స్వరూపాన్ని కలిగియున్నాడని దేవునితో సమానుడుగా ఉన్నాడని ఫిలిప్పీ 2:6-10 స్పష్టం చేస్తుంది. అన్నట్లు, యేసు జననానికి ముందు పరలోకంలో ఆయనకున్న అస్థిత్వానికి మరియు దయ్యాలు ఆయనను ఎరిగియుండడానికి మధ్య సంబంధమేమిటో? ఆయన పుట్టకముందే అవి ఆయనను ఎరిగియుండెనని ఎక్కడా లేదు కదా! ఏమిటి ఈ అర్థంలేని ప్రశ్నలు?

ఇంతకీ యేసు దేవుని కుమారుడా లేక పరిశుద్దాత్మ కుమారుడా అనే సందేహం కూడా బ్రహ్మంగారికి కలిగింది. దేవుని కుమారుడు పరిశుద్దాత్మ కార్యంచేత నరావతారి అయ్యాడే తప్ప, ఈ కారణం చేత ఆయన దేవుని కుమారుడా లేక పరిశుద్దాత్మ కుమారుడా అని ప్రశ్నించడం అర్థరహితం. ఆయన దేవుని కుమారుడని బైబిల్ స్పష్టం చేస్తుంది.

70. వీరబ్రహ్మం- యేసుకు మతిచెడి ఉంటుందా ? నిజమే కావచ్చు !

మార్కు 3 : 20, 21 లలో ఇలా వుంది. " ఆయన ఇంటిలోనికి వచ్చినపుడు జనులు మరలా గుంపుకూడి వచ్చిరి . కనుక భోజనము చేయుటకైననూ వారికి (యేసుతో సహా శిష్యులకు ) వీలులేకపోయెను. ఆయన ఇంటివారు సంగతిని విని, ఆయనకు మతి చలించియున్నదని ఆయనను పట్టుకొనబోయిరి”.

అసలేం జరిగి ఉంటుంది? భూతవైద్యుడు యేసుచేత దయ్యాలు పోగొట్టించుకోవడానికి జనాలు గుమిగూడితే యేసుకు మతిచెడిందని ఎందుకు అనుకుంటారు?

ఆయన ఇంటివారు ఏ సంగతి విన్నారు ? వారు అలా చేయడానికి (బంధించబోవడానికి ) కారణం ఏమై ఉంటుంది ? మొత్తం మీద కొంత విలువైన సమాచారం ఇక్కడ తప్పిపోయి ఉంటుందనుకోవచ్చు. ఆ మిస్సయిన లింకు బైబిలు చరిత్రకందితే పై ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది .

జవాబు : భోజనం చేయడానికి కూడా వీలులేనంతగా ప్రజలను వెంట బెట్టుకుని తిరగటమేమిటని, యేసు ఇంటివారు కంగారుపడి ఆయనకు మతి చలించిందంటూ ఆయనను ఆపే ప్రయత్నం చేసినట్లు పై సందర్భాన్ని చదివిన ఎవరైనా గుర్తించగలరు. అంతమాత్రానికే బ్రహ్మంగారేమిటి లింకులేవో పోయాయంటారు , చదివేస్తే ఉన్న మతి పోయినట్లు !

71. వీరబ్రహ్మం- యేసు స్వార్థపరుడు, అతనిది కుత్సిత బుద్ధి !

యేసు మహామనిషి కానీ, మహోన్నత మానవుడు కానీ కాడు. ఆయన బోధనల ఉద్దేశ్యమేమిటో, ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడో చూడండి. “దేవుని రాజ్యమర్మము తెలిసికొనుటకు) మీకు (శిష్యులకు) అనుగ్రహింపబడియున్నది కాని వెలుపల నుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను” మార్కు 4:11, 12..

ఎవరైనా యేసుకు దాసులు కాకుండానే ఆయన ప్రసంగాలు విని తమంతట తామే దేవునివైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమోననే భయంతో ఉపమాన రూపంలో బోధ చేస్తున్నానని, అందుకోసమే తను చెప్పే సంగతులు తన 12 మంది శిష్యులు కాకుండా ఇతరులు ఎంతమంది విన్నా వారికేం అర్థంకాకుండానే బోధ చేస్తున్నానని చెప్పాడు. మరి సామాన్య ప్రజానీకానికి, అంటే యేసు ముద్దుగా పిలుచుకున్న గొట్టే పిల్లలకు యేసు బోధ వల్ల బాధే తప్ప బాగేమి ఉంది? అర్థంకాని బోధ, అసలు అర్ధం కాకూడదని చేసే బోధ వ్యర్థమే కదా?

మరొక పేరాగ్రఫ్లో పై వచనాలకు సంబంధం లేకుండా, తద్విరుద్దంగా ఒక వచనముంది. “రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు” మార్కు 4:22.

జవాబు : బ్రహ్మంగారు ఉదహరించిన పై సందర్భాన్ని గమనిస్తే , యేసు గలిలయ సముద్రతీరంలో జనసమూహానికి బోధిస్తున్నాడు. అదివరకే యేసు ఆ ప్రాంతంలో అనేక అద్భుతాలు, సూచకక్రియలు చేసినప్పటికీ, ఎన్నో బోధలు వారు విన్నప్పటికీ ఆయనను విశ్వసించలేదు. కాబట్టి ఇప్పుడు వారు గ్రహించకుండా మర్మయుక్తంగా వారికి బోధించడం వారి అవిశ్వాసానికి తీర్పు. ఇవ్వబడిన సదవకాశాలను వినియోగించి విశ్వసించనివారికి ఇదో హెచ్చరిక. అంతేగానీ ఇక్కడ స్వార్థం ఏమీలేదు.

ఐతే “రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు” (మార్కు 4:22) అనే వచనం పైసందర్భానికి విరుద్దంగా ఉందంటూ బ్రహ్మంగారు తప్పుపట్టే ప్రయత్నం చేసారు కానీ సందర్భాన్ని బట్టి ఆలోచించినప్పుడు, జనసమూహానికి రహస్యంగా ఉంచబడినదేదియు తన శిష్యులకు తేటపరచబడకపోదని వారికన్నీ బయలుపరుస్తానని, ఏదీ మరుగుచేయనని యేసు అంటున్నాడు. బ్రహ్మంగారికి ఇందులో కనిపించిన వైరుధ్యమేమిటో, తన కుత్సితబుద్ది కాకపోతే !

72. వీరబ్రహ్మం- “నా పేరు సేన, యేలయనగా మేము అనేకులము” ఈ వాక్యం మీకేమైనా అర్థం అవుతోందా ?

మార్కు 5:2లో ఇలా ఉంది. " ఆయన దోనె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురుపడెను”. దీన్నిబట్టి ఆ మనిషికి ఒక అపవిత్రాత్మ పట్టిందని తెలుస్తోంది. కాగా, యేసు కూడా అలాగే అనుకొని “ అపవిత్రాత్మా ! ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని అడుగగా వాడు నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి. . . . . ” (మార్కు 5:8-10) దయ్యాలు వదలగొట్టే యేసుకు కూడా ఆ మనిషికి పట్టిన దయ్యాలెన్నో తెలియలేదన్నమాట ! మార్కుకు ఇది రాసేటప్పుడు మనస్సు దగ్గరుండి ఉండదు. అందుకే ముందు ఒక అపవిత్రాత్మ ఉందని రాసి, ఆ తరువాత చాలా దయ్యాలు అని వ్రాశాడు. ( బైబిల్ బాగోతం ప్రశ్న72, పేజీ నం. 34 ).

జవాబు : బ్రహ్మంగారు పొరబడ్డారు. మార్కు తొలుత ఒక దయ్యము పట్టిన వ్యక్తి అని వ్రాసి తర్వాత చాలా దయ్యాలు అని చెప్పాడు కనుక 'మార్కుకు ఇది రాసేటప్పుడు మనస్సు దగ్గరుండి ఉండదు' అని వెటకారంగా రాశారు. ఐతే , మార్కు పొరబడి ఒక దయ్యము మాత్రమే పట్టిన వ్యక్తి అని వ్రాసి ఆ తరువాత అనేక దయ్యాలు అతనికి పట్టాయి అని వ్రాస్తే అది పొరపాటవునేమో. కానీ మార్కు 'ఒక అపవిత్రాత్మ' అని ఒక్కసారి కూడా చెప్పలేదు.
“అపవిత్రాత్మ పట్టిన వాడొకడు” అనే మాట అతడున్న స్థితిని తెలియజేస్తుంది కానీ అతనికి పట్టిన దయ్యాల సంఖ్యను తెలపటం లేదు. ఆ వ్యక్తికి అనేక దయ్యాలు పట్టాయనే వాస్తవాన్ని కూడా మార్కే తెలియజేసాడు. కాబట్టి మొదట చెప్పింది, సంఖ్యను ప్రస్తావించడానికి ఉద్దేశించిన మాట కాదని తెలుస్తుంది. ఇకపోతే, యేసుకు కూడా ఆ మనిషికి పట్టిన దయ్యాలెన్నో తెలియదని వాదించే ప్రయత్నం చేసారు బ్రహ్మంగారు. కానీ నిజానికి యేసు ఆ వ్యక్తి వున్న దయనీయ పరిస్థితిని, ఆ దురాత్మల మాటల ద్వారానే అక్కడ ఉన్నవారికి రుజువుపరిచే విధంగా వ్యవహరించాడే తప్ప, మనుషుల ఆంతర్యాన్ని సహితం ఎరిగిన ఆయనకు (మార్కు 2:8 యోహాను 2:24) దయ్యాల సంఖ్య తెలిసివుండడం ఒక లెక్కకాదని వేరే చెప్పనవసరం లేదు. ఐనా, ఎవరికో పట్టిన దయ్యాల సంఖ్య అలా ఉంచి, ముందు తనకు పట్టిన దయ్యాల సంఖ్య గురించి ఆలోచిస్తే బ్రహ్మంగారికే మంచిది.

73. వీరబ్రహ్మం- మత్తయి ప్రకారం ఇద్దరు, మార్కు ప్రకారం ఒక్కరు !

దోనె దిగగానే అపవిత్రాత్మలు పట్టి యేసుకు ఎదురైనది మత్తయి 8:28 ప్రకారం ఇద్దరు. మార్కు 5:2 ప్రకారమైతే ఒక్కరు. అవాస్తవాలతోను, కల్పనలతోను ఇలాంటి విషయాలు కోకొల్లలు. (బైబిల్ బాగోతం ప్రశ్న73, పేజీ నం. 34).

strong>జవాబు : దోనె దిగిన వెంటనే అపవిత్రాత్మలు పట్టినవారు ఇద్దరు ఆయన కెదురుపడెను అని మత్తయి వ్రాస్తే అపవిత్రాత్మ పట్టినవాడొకడు ఆయన కెదురుపడెను అని మార్కువ్రాసాడు. మార్కు ఆ ఇద్దరిలో యేసుతో మాట్లాడిన ఒకరి ప్రస్తావన మాత్రమే చేశాడు; అలా కాకుండా, ఆయన కెదురుపడింది కేవలం ఒక్కడే తప్ప ఇద్దరు కారు అని మార్కు వ్రాస్తే ఈ రెండిటిలో వైరుధ్యముందని భావించడానికి అవకాశముండేది. కానీ, మార్కు అలా వ్రాయలేదు ఐనా, వైరుధ్యాలుగా కాకుండా చూసే వీలే లేదన్నపుడు తప్ప వైరుధ్యాలుగా చిత్రీకరించడం కుతర్కమని గ్రహించే పరిపక్వత ఒక నాస్తికునికి లేకపోవటం పెద్ద వింతేమీ కాదు.

74. వీరబ్రహ్మం- ప్రయాణం చేసేటప్పుడు చేతికఱ్ఱ తీసికోండి, రొట్టె వద్దు !

యేసు తన 12 మంది శిష్యులకు ప్రయాణం చేసేటప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు చెబుతూ చేతికర్ర తీసికెళ్ళమన్నాడు. కానీ రొట్టె వద్దు అన్నాడు. ఎందుచేత ఇలా చెప్పాడు? దారిలో దొంగల భయం ఉంటుందనని ఇలా చెప్పాడంటారా? ఈ చెంపకొడితే ఆ చెంపచూపించమన్నాడు గదా? చేతికర్ర ఎందుకు? చేతికర్ర ఎంత ముఖ్యమో, రొట్టె కూడా అంతే కదా ? లేక రొట్టె ఎవరో ఒకర్ని దారిలో అడుక్కోమనా?

మార్కు 6:8లో ఇలా ఉంది. ఈ ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను, జాలెనైనను, సంచిలో సొమ్మునైనను తీసికొనక ” అని ఉంది. (బైబిల్ బాగోతం ప్రశ్న 74, పేజీ నం. 34. )

జవాబు : పనివాడు జీతానికి పాత్రుడు అనే లోకోక్తిని బట్టి, తన సేవ కోసం పంపించే శిష్యుల అవసరాలు ఏవీ కొదువకాకుండా ఆయనే చూసుకుంటాడని, వాటికోసం తమకు తాముగా ఏర్పాట్లేమీ చేసుకోనవసరం లేదని ఇక్కడ ప్రభువు ఉద్దేశం. సువార్త సేవా పరిచర్య దేవుని పని కాబట్టి అనుదినాహారాన్ని దేవుడే వారికి సమకూర్చాడని వారి పరిచర్యానుభవంలో నిర్ధారించబడింది: “మరియు ఆయన-సంచియు జాలేయు చెప్పులును లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు , మీకు ఏమైననూ తక్కువాయెనా అని వారినడిగినప్పుడు వారు- ఏమియు తక్కువకాలేదనిరి” (లూకా22:35).

ఇక కర్ర విషయానికొస్తే దానిని ప్రభువు ఎందుకనుమతించాడో ఇక్కడ చెప్పబడకపోయినా, అది దొంగల బారినుండి కాపాడుకోవడానికి ఐయ్యుంటుందా అని బ్రహ్మంగారు అడగటం అవివేకం. కత్తులు కటార్లతో వచ్చే దొంగలను ఎదుర్కోడానికి చేతికర్ర సరిపోతుందా? నాస్తికులు దొంగలను అలాగే ఎదుర్కొంటారా?

75. వీరబ్రహ్మం- చెవుడుగల సత్తివాణ్ణి యేసు ఎలా స్వస్థపరచాడో తెలుసా ?

"వాని చెవుల్లో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి” (మార్కు7:38) యేసు ఎంత అనాగరికంగా ప్రవర్తించేవాడో చూశారా! " అప్పుడు వారు చెవుడుగల నత్తివాణ్ణి ఒకనిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి, వానిమీద చెయ్యియుంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములోనుండి ఆయన వానిని ఏకాంతమునకు కొనిపోయి వాని చెవులలో తన వ్రేళ్ళు పెట్టి, ఉమ్మివేసి, వాని నాలుక ముట్టి ఆకాశమువైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎప్పతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాటలాడుచుండెను” (మార్కు7:32-35). బైబిల్ బాగోతం ప్రశ్న 75, పేజీ నం. 34)

జవాబు : యేసు చేసిన ఈ అద్భుతం బ్రహ్మంగారికి అనాగరికంగా అనిపించిందట, ఈయనగారి మెదడు అనాగరికమైనదైతే చదివే తీరు, అర్థంచేసుకునే విధానం కూడా అనాగరికమైనదిగా వుంటుందని భావించడంలో తప్పులేదు. మార్కు 7 : 32 - 35 లో ప్రస్తావించిన రోగి విషయం గమనిస్తే , వినికిడి శక్తిని కలిగించడానికి మొదట వాని చెవులలో వేళ్లు పెట్టి ఉమ్మివేసి నాలుక ముట్టి స్వస్థపరిచాడు. అంటే అప్పటివరకూ ఎవరూ చేయని ఒక గొప్ప అద్భుతాన్ని యేసు చేసినందుకు వారందరూ “అపరిమితముగా ఆశ్చర్యపడిరి” అని 37వ వచనంలో వ్రాయబడివుంటే , మరి ఆ జనసమూహానికి లేని “అనాగరికమైన అనుమానం' ఈయన గారికెందుకొచ్చిందో!

76. వీరబ్రహ్మం- యేసు గ్రుడ్డివాని కన్నుల మీద ఉమ్మివేస్తే, వానికి చూపొచ్చింది !
“ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యిపట్టుకొని, ఊరి వెలుపలికి తోడుకొని పోయి, వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి. . . . . . . ” (మార్కు 8:23) ఊరి వెలుపలికి తోడుకొని పోవటమెందుకో ?జనాలు తనుచేసే అనాగరికమైన తంతుకి అసహ్యించుకుంటారనా ? ఈ లెక్క సంతాన హీనులను తీసికెళ్తే ఆయన ఏంచేసి ఉండేవాడో ఊహించుకోండి. ( బైబిల్ బాగోతం ప్రశ్న 76, పేజీ నం. 35).

జవాబు : సందర్భాన్ని గమనిస్తే, యేసు ఆ గ్రుడ్డివానిని “ఊరి వెలుపలికి తోడుకొని పోయి” అని వ్రాసివుంది కానీ కీకారణ్యానికి తీసుకువెళ్లినట్లు గానీ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లినట్లు గానీ వ్రాయబడిలేదు. యేసు ఎక్కడికి వెళ్లినా జనసమూహం ఆయనను వెంబడిస్తూనే వుంది. గలిలయ, దేకపొలి, యెరూషలేము, యూదయ నుండి యొర్దాను అవతల నుండి అనేక ప్రాంతాల నుండి వారు ఆయనను వెంబడించారు. చిట్టచివరికి తన శిష్యులతో దోనెలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ప్రజలు దోనెలలో ఆయనను వెంబడించారు ( మార్కు 4 : 35-36 ) . కాబట్టి, ఏ కోశానా కూడా ప్రజలు ఆయనను వదలిపెట్టలేదని చెప్పవచ్చు.

అక్కడికేదో యేసు జనాలు లేని చోటికి ఆ గ్రుడ్డివాడిని తీసుకొనిపోయి రహస్యంగా స్వస్థపరచినట్లు అపార్థం కలిగించే విధంగా బ్రహ్మంగారు మార్కు 8:23ను ఉదహరించారు. కానీ ఆ తర్వాత ( మార్కు 8: 24 ) వచనాన్ని చదివితే “మనుష్యులు నాకు కనబడుచున్నారు” అని స్వస్థత పొందిన ఆ గ్రుడ్డివాడు చెప్పినట్లు వ్రాయబడి ఉంది. వాడు చూపుపొందిన వెంటనే తన చుట్టూ ఉన్న ప్రజలను చూచినట్టు చెప్పాడంటే, చివరికి అతనిని ఊరి వెలుపలికి తీసుకువెళ్లిన సమయంలో కూడా ఆ ప్రజలు ఆయనను వెంబడించారని రూఢి అవుతుంది , మరి ఇక్కడ రహస్యానికి తావెక్కడిది ? అన్నట్టు యేసుపై దురభిప్రాయాలు కలిగేవిధంగా 'సంతాన హీనులను తీసికెళ్తే ఆయన ఏంచేసి ఉండేవాడో ఊహించుకోండి' అని బ్రహ్మంగారు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు బ్రహ్మంగారి వ్యక్తిత్వాన్ని , అతని కలుషిత ఆలోచనా విధానాన్ని బట్టబయలు చేస్తున్నాయే తప్ప వాటివల్ల యేసు పవిత్రతకు వచ్చిన నష్టం ఏమీలేదు. ఎవడి స్వభావాన్ని బట్టి వాడు ఆలోచిస్తాడు , దానికి ఎవరేం చేస్తారు? బ్రహ్మంగారి విమర్శలు ఎంతమాత్రమూ హేతుబద్దమైనవి కావని నాస్తిక పక్షపాతంతోనూ, మతద్వేషంతోనూ, సంకుచిత మనస్తత్వంతోనూ చేసిన అనాగరిక కసరత్తు మాత్రమేనని తేల్చిచెప్పడానికి ఇంతకంటే రుజువు ఇంకేంకావాలి? ఇలాంటి వారు హేతువాదానికే పెద్ద కళంకం.

77. వీరబ్రహ్మం- మరణాన్ని రుచి చూడటమేంటి? ఇదెక్కడి వర్ణన ?

వింత వర్ణనలకు బైబిలు ఆలవాలం. మార్కు 9:1లో ఇలా ఉంది. “ఆయన ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను” లూకా సువార్త 9వ అధ్యాయంలో 27వ వాక్యం కూడా ఇలాగే ఉంది. ( బైబిల్ బాగోతం ప్రశ్న 77, పేజీ నం. 35. )

జవాబు: అలంకార భాషాశైలిలో చెప్పినమాటలు తప్పులు కానక్కరలేదు. వాటిని తప్పులుగా భావించేవారిని కనీస భాషాపరిజ్ఞానం లేని విద్యావిహీనులని అంటారు. ఉదా: సూర్యుడు నడినెత్తిని వచ్చాడు', 'విద్యలేనివాడు వింత పశువు', 'కొండను త్రవ్వి ఎలకను పట్టినట్టు' మొదలైన మాటలు మన అనుదిన జీవితంలో తరచూ మాట్లాడుతూ వుంటాం. అసలు విషయమేమిటంటే మనం చదివిన పై 3 సామెతలు ఏమాత్రం అక్షరాలా వాస్తవాలు కావు ఐనప్పటికీ వాటిలో దోషముందని ఎవరూ చెప్పరు. అదే విధంగా యేసు కూడా “మరణము రుచి చూడరని” వ్యవహారశైలిలో చెప్పిన మాటను పట్టుకొని అక్షరార్థభాషలో చూసీ విమర్శిస్తే అది బ్రహ్మంగారికి అలంకారభాష పట్లవున్న అవగాహనాలోపమే తప్ప యేసు మాట్లాడిన మాటల్లో ఉన్న దోషం కాదు.

78. వీరబ్రహ్మం- అపొస్తలులు యేసును కూడా ఒక ప్రవకే అని భావించలేదా ?

అలాగే భావించారు. అలా భావించకపోతే, మోషే ఏలియా, యేసులను ఒకేగాటకట్టి, సమాన గౌరవం ఎలా ఇస్తారు మార్కు 9:6లో ఇలా ఉంది. “మేము నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను”.

యేసు శిష్యులు తనను ఆ కాలపు గొప్ప ప్రవక్త అని భావిస్తే, అందుకు యేసు చాలా కించపడి, తాను ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అని ఉక్రోషంతో ఆత్మస్తుతికి దిగాడు. లూకా 7:26లో ఇలా ఉంది. “ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను”. (బైబిల్ బాగోతం ప్రశ్న 78, పేజీ నం. 35. )

జవాబు : యేసు శిష్యులు “మేము నీకు ఒకటయు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను” అని తొలుత చెప్పినప్పటికీ , దర్శనం కలిగిన ఆ తొందరలో పేతురుకు ఏం మాట్లాడాలో అర్థంకాక ఏవేవో మాట్లాడాడు, వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు ( మార్కు 9:6) అని స్పష్టంచేయబడింది. అలాంటి పరిస్థితిలో పలికిన మాటలను బట్టి యేసును వారు కేవలం ఆ కాలపు ప్రవక్తగా మాత్రమే పరిగణించారని బ్రహ్మంగారు చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదు.

ఇకపోతే, ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నానని ఉక్రోషంతో ఆత్మస్తుతికి దిగాడు' అని యేసుపై నిందారోపణ చేయడం బ్రహ్మంగారి లేఖన అవగాహనాలోపానికి అద్దంపడుతుంది. లూకా 7:26ను సందర్భసహితంగా చదివినప్పుడు, అక్కడ యేసు బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి జనసమూహంతో మాట్లాడుతూ, 'మీరు అరణ్యంలో చూడవెళ్ళింది కేవలం ఒక ప్రవక్తను కాదు ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెబుతున్నాన' ని సాక్ష్యమిచ్చాడు. బాప్తిస్మమిచ్చే యోహాను గురించి చెప్పిన మాటలను, యేసు తన గురించి తానే చెప్పుకున్న మాటలుగా చిత్రీకరించి ఆయన ఆత్మస్తుతికి పాల్పడ్డాడని విమర్శను కల్పించడం పచ్చి అబద్ధాలతో ఉద్దేశపూర్వకంగా పాఠకులను దారిమళ్లించే బ్రహ్మంగారి కుయుక్తిని బట్టబయలుచేసేదిగా ఉంది.

అన్నట్లు, యేసు ప్రవక్త కాదని ఎవరన్నారట ? తాను ప్రవక్తనని యేసే స్వయంగా ప్రకటించాడు ( మార్కు6:4) ఐనా ఆయన ప్రవక్తే తప్ప మరేమీ కాదు అనడం మాత్రం బైబిల్ సమగ్ర బోధ కాదు.

79. వీరబ్రహ్మం - శిష్యులు భయపడ్డారు. గురువు అయోమయంలో పడ్డాడు !

యేసుకు ఒక్కోసారి చెప్పాల్సిందేమిటో తెలిసేది కాదు !

మార్కు 9:7లో ఇలా ఉంది. “వారు (శిష్యులు) మిగుల భయపడిరి (యేసు రూపాంతరాన్ని చూడడం వలన) గనుక తాను చెప్పవలసినదేమో అతనికి (యేసుకు) తెలియలేదు.” వాళ్ళు భయపడితే ఇతనెందుకు అయోమయంలో పడాలి? (బైబిల్ బాగోతం ప్రశ్న 79, పేజీ నం. 35. )

జవాబు: బ్రహ్మంగారు మరోసారి బోల్తాపడ్డారు. 'యేసుకు ఒక్కోసారి చెప్పాల్సిందేమిటో తెలిసేది కాదు” అని వ్రాసారు. వాస్తవానికి చెప్పాల్సిందేమిటో తెలియనిది యేసుకు కాదు పేతురుకి. “నీకు ఒకటయు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పనది తానెరుగకయే చెప్పెను” అని లూకా 9:33 లో స్పష్టంగా వ్రాసివుంది. ఐతే ఈయనగారు మాత్రం మార్కు లోని ఇదే సంఘటనను ఇతర సువార్తలలో అందించబడిన వివరాలతో పోల్చి చదవకుండానే అపార్థం చేసేసుకున్నారు. ఎవరు అయోమయంలో పడ్డారో చెప్పడానికి ప్రయత్నిస్తూ చివరికి బ్రహ్మంగారే అయోమయంలో పడిపోయారు.

80. వీరబ్రహ్మం- దయ్యాల్లో కూడా మూగవి, చెవిటివి, కుంటివి, గ్రుడ్డివి ఉంటాయి కాబోలు!

మార్కు 9:17లో “మూగదయ్యము” ప్రసక్తి, అదే సువార్త 9:25లో “మూగదైన చెవిటి దయ్యము” ప్రసక్తి ఉంది. యేసు సిద్ధాంతం ప్రకారం రోగాలకు, అంగవైకల్యాలకు ఆయా దయ్యాలు లేదా, అపవిత్రాత్మలు కారణాలు. వాటిని దేహం నుండి పారద్రోలితేనే స్వస్థత చేకూరుతుంది. ఇటువంటి స్వస్థతా నియమం బైబిల్లోనే కనిపిస్తుంది. కాబట్టి ఈ పద్దతి భూతవైద్యాన్ని “బిబ్లియోపతి” అంటాను పైన పేర్కొన్నటువంటి రకరకాల దయ్యాలను ఆయన అడుగడుగునా మనుష్యుల నుంచి వదలగొట్టి వారికి సంపూర్ణారోగ్యం ప్రసాదించినట్టుగా కథలు కథలుగా మహిమలు ఉల్లేఖించబడ్డాయి (బైబిల్ బాగోతం ప్రశ్న 80, పేజీ నం. 35)

జవాబు: మనుష్యులు మూగవారు చెవిటివారు గ్రుడ్డివారుగా పుట్టటానికి దయ్యాలే కారణం కాకపోయినా, దయ్యాల ద్వారా కూడా మనుష్యులకు ఈ దుస్థితి పట్టవచ్చు. దయ్యాలలో మూగవి చెవిటివి గ్రుడ్డివి వుండవు. మనుష్యులకు కలిగించే దుస్థితిని బట్టి అవి వర్ణించబడ్డాయి.

ఇకపోతే, మంత్రతంత్రాలతో భూతవైద్యుడు దయ్యాలను వెళ్లగొట్టినట్లు యేసు దయ్యాలను వెళ్లగొట్టలేదు. తన చుట్టూ వున్న ప్రజల సమక్షంలోనే కేవలం తన శక్తివంతమైన మాటచేత వాటిని వెళ్లగొట్టాడు. ఈనాడు దయ్యాన్ని వెళ్లగొట్టడానికి భూతవైద్యులు చేస్తున్న కసరత్తుకు, యేసు కేవలం తన మాటచేతనే వెళ్లగొట్టిన అద్భుతానికి ఏమాత్రం పొంతన లేదు. అన్నట్లు, రోగాలు అస్వస్థతలు దయ్యాలవల్ల కలుగుతాయా లేదా అనే విషయం అలా ఉంచితే , నాస్తికత్వం మాత్రం దయ్యాల ప్రభావమేనని ఖచ్ఛితంగా చెప్పవచ్చు.

81. వీరబ్రహ్మం- విశ్వాసుల్ని ప్రశ్నిస్తేనే సహించవద్దన్నాడు యేసు. ఇక క్రైస్తవులకు పరమత సహనం, విశాల భావాలు ఎలా అలపడతాయి ?

మార్కు 9:42లో ఇలా ఉంది. “నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు ”.
ఇలాంటి సంకుచిత ధోరణులకు బైబిలు కాణాచి. కాబట్టే సాంస్కృతిక పునరుజ్జీవానికి ముందు ఐరోపాలో అనేకమంది విఖ్యాత శాస్త్రవేత్తలు వారు కనుగొన్న విషయాలు బైబిలుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి హత్యలకు, చిత్రహింసలకు గురిచేయబడ్డారు (బైబిల్ బాగోతం ప్రశ్న 81, పేజీ నం. 36.)

జవాబు : ‘విశ్వాసుల్ని ప్రశ్నిస్తేనే సహించవద్దన్నాడు యేసు' అని బ్రహ్మంగారు మార్కు 9:42లోని వాక్యాన్ని అపార్థం చేసుకున్నారు. వాస్తవానికి అక్కడ యేసు చెప్పింది విశ్వాసులను అభ్యంతరపరిచేవారి గురించే (ఆటంకపరచేవారి గురించి) తప్ప ప్రశ్నించేవారిని గురించి కాదు. ఇంకాస్త ముందుకు చదివితే “నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయెడల”, “నీపాదము నిన్ను అభ్యంతరపరచినయెడల ”, “నీకన్ను నిన్ను అభ్యంతరపరచినయెడల” (మార్కు 9:43-47) అనే మాటలు చూస్తాం. ఐతే వీటిని, “నీ చెయ్యి నిన్ను ప్రశ్నిస్తే 'నీ పాదము నిన్ను ప్రశ్నిస్తే “నీ కన్ను నిన్ను ప్రశ్నిస్తే' అని అర్థంచేసుకుంటామా? సి. పి. బ్రౌన్ గారి తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు చూస్తే, అభ్యంతరము అనే మాటకు 'Obstacle, Hindrance, Impediment ” అనే అర్థం చెప్పబడింది. అంటే దేవునిని వెంబడించకుండా అడ్డుపడడం అతిభయంకరమైన పాపం. అలాంటి వారి మెడకు తిరుగటిరాయిని కట్టి సముద్రంలో పడవేయుట మేలని యేసు బోధిస్తున్నాడు. ఐతే, మెడకు తిరుగటిరాయిని కట్టి సముద్రములో పడవేసే విషయాన్ని అక్షరభావంలో అపార్థం చేసుకుని యేసుబోధను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. కాని, అలాంటి క్రూరమైన చర్యను చెయ్యమని యేసు మాటల్లోని ఉద్దేశం కాదు. వాస్తవానికి ఈ సందర్భంలో కంటిని పెరికివేయడం, చెయ్యి, పాదం నరికి వేయడం లాంటి మాటలు యేసు అలంకారప్రాయంగా చెప్పినట్లే మెడకు తిరుగటిరాయిని కట్టే విషయాన్ని కూడా అలంకారప్రాయంగానే చెప్పాడు. మరొకసారి అలాంటి చర్యకు వీలుండని విధంగా అభ్యంతరాలు కలిగించే వ్యక్తిని దూరంగా వుంచమని యేసు మాటల్లోని అర్థం.
ఇకపోతే, 'ఐరోపాలో అనేకమంది విఖ్యాత శాస్త్రవేత్తలు వారు కనుగొన్న విషయాలు బైబిలుకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి హత్యలకు, చిత్రహింసలకు గురిచేయబడ్డారు' అని బ్రహ్మం గారు వ్రాసారు. ఐతే, అలాంటి దుశ్చర్యలు ఎవరు చేసినా, ఆలా చెయ్యమనటానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు కాబట్టి వాటికి బైబిల్ బాధ్యత వహించదు.

క్రైస్తవులమని చెప్పుకునేవారి దుశ్చర్యలను బైబిల్లో వున్న లోపాలుగా చిత్రీకరించడం, బైబిల్లో తప్పులు లేకపోయినా ఏదో ఒక వంకతో తప్పుపట్టుకోవాలనే ఈయనగారి కుయుక్తిని బట్టబయలు చేస్తుంది.

82. వీరబ్రహ్మం- “మనుష్యుల్లో పురుగు ఉంటుంది. అగ్ని ఉంటుంది” ! ఇదేంటి మహాప్రభో?

మార్కు 9 అధ్యాయంలో 47, 48 వాక్యాలు ఇలా ఉన్నాయి. “ నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని తీసిపారవేయుము. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుటకంటే ఒంటి కన్ను గలవానివై దేవుని రాజ్యములో ప్రవేశీంచుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు”.
ఒంటి కన్ను కలవారు ఖచ్చితంగా దేవుని రాజ్యములోకి ప్రవేశింపగలరట. మరింకేం ప్రభుని పరలోకరాజ్యములో ప్రవేశింపగోరువారు తమకున్న రెండు కళ్లలో ఒకదాన్ని పీకేసుకుంటే గ్యారంటీ ఉంది. ఇంతకీ మనుష్యుల్లో పురుగేమిటి? అగ్ని ఏమిటి? (బైబిల్ బాగోతం ప్రశ్న 74, పేజీ నం. 34).

జవాబు: “నీ కన్ను నిన్ను అభ్యంతర పరచిన యెడల దానిని తీసిపారవేయుము” అనే మాటపై బ్రహ్మంగారు లేవనెత్తిన అపార్థానికి 50వ ప్రశ్నకు జవాబులో సమాధానం వ్రాసేసాము. బ్రహ్మంగారిలా వ్రాసిందే మరలా మరలా వ్రాసి టైమ్ వేస్ట్ చేయడం మాకు ఇష్టంలేదు. ఇక పురుగు, అగ్ని విషయానికొస్తే పురుగు అంటే మనిషి ఆత్మ అని, అగ్ని అంటే నరకాగ్నిగుండమని ( మత్తయి 10:28) అలంకార భాషలో చెప్పబడింది. అంతేకానీ మనిషిలో పురుగు, అగ్ని వుంటాయని అర్థం కాదు. యేసు బోధలపై అవగాహన లేదు, కనీసం ఉపమాన భాష కూడా తెలీదు, పైగా బైబిల్ పై విమర్శకు దిగటం. రాజుగారి దివాణంలో పిచ్చోడి పెత్తనంలా వుంది.

83. వీరబ్రహ్మం- ఉప్పుకు ఉప్పుదనం నిప్పుమూలంగా వస్తుందా ?

మార్కు 9 :49 లో ఇలా ఉంది. ఈ ప్రతివానికి ఉప్పుసారము అగ్ని వలన కలుగును”. (బైబిల్ బాగోతం ప్రశ్న 83, పేజీ నం. 36)

జవాబు : నరకంలో మనుష్యులకు సంభవించే దానిని యేసు ఇక్కడ వర్ణిస్తున్నాడు. నరకంలోని శాశ్వత అగ్ని జ్వాలలు అందులోనివారిని అస్తమానం యాతనకు గురి చేస్తుంటాయి. కానీ వారు దహనమైపోకుండా ఆ అగ్నే వారిని ఉప్పువలె నిల్వచేస్తుందని ఈ అలంకారానికి అర్థం. “అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు” అని ఇదే సందర్భంలో చెప్పబడిన మాట, పై భావాన్ని ధ్రువీకరించే విధంగా వుంది. అలంకారే అపార్థ నాస్తికం.

84. వీరబ్రహ్మం- “భార్యాభర్తలు విడిపోవటం వారు వ్యభిచరించటమే కాగలదు ”.

భార్యాభర్తలు విడిపోవటం వ్యభిచరించటమే కాగలదని, కావున పరిస్థితులు ఏవైనా సరే వారు విడిపోవటానికి వీల్లేదని ఇక్కడ చెప్పబడింది. ఇదెలా సాధ్యమౌతుంది? కొన్ని సంసారాల్లో భార్యాభర్తలుగా కలసి జీవించటానికి ఇక ఎంతమాత్రం కుదరదని సవాలక్ష సమస్యల్లో ఏదో ఒకటి ఉండొచ్చు. అటువంటి సంసారాల్లో జీవచ్చవాల్లా కలసి జీవిస్తూ క్రుంగి పోయేకన్నా, విడిపోయి సుఖంగా జీవించటం మేలనిపించవచ్చు. కానీ క్రింద పేర్కొంటున్న బైబిలు వాక్యాలు విడిపోవటానికి ససేమిరా ఒప్పుకోవు .

మార్కు సువార్త 10వ అధ్యాయంలో 11, 12 వాక్యాలు ఇలా చెప్తున్నాయి “తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లి చేసుకొనువాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరియొకని పెండ్లి చేసుకొనిన యెడల ఆమె వ్యభిచరించునదగునని వారితో చెప్పెను”.

భార్యగానీ, భర్తగానీ చనిపోతేనే తప్ప మళ్ళీ పెళ్ళికి క్రైస్తవులు పూనుకోరాదని లూకా సువార్త 16:18లో ఇలా ఉంది. “తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు. భర్తను విడిచిన దానిని వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచరించుచున్నాడు”. చూశారా! మగవాడికి అది మొదటి పెళ్ళే అయినప్పటికీ, భర్తను విడిచినదానిని మాత్రం చేసుకోవద్దని లూకా హెచ్చరిస్తున్నాడు. (బైబిల్ బాగోతం ప్రశ్న 84, పేజీ నం. 36)

జవాబు: దాంపత్య జీవితంలో కలిగే సవాలక్ష సమస్యలకు విడిపోవడమే పరిష్కారమని నాస్తికత్వం బోధిస్తుందేమో కానీ, బైబిల్ అలాంటి తొందరపాటుకు తావివ్వదు. తెగతెంపులే సమస్యలకు పరిష్కారమని అనుకోవడం అవివేకం. శాంతియుతంగా పరిష్కారాలు వెతుక్కోవడం బైబిల్ విధానం. ఐనా విచ్ఛలవిడితనమే స్వేచ్ఛావాదమని తలచే నాస్తికులకు వివాహ విలువలు ఏం వంటపడతాయి? (10 మరియు 11 ప్రశ్నలలో మా జవాబులను పోల్చి చదవండి).

అయితే, కఠినుడైన భర్త విషయంలో విడాకులు ఇవ్వడం పరిష్కారంగా ఆమోదిస్తుందని 52 పాయింటులో బైబిల్ ని తప్పుపట్టి, చీటికి మాటికీ విడాకులివ్వటాన్ని నిషేధిస్తుందని ఇక్కడ బైబిల్ ని తప్పుపడుతున్నారు బ్రహ్మంగారు. సందర్భంతోకాని, తర్కంతోకాని సంబంధం లేకుండా బైబిల్ అవునన్నచోట కాదనటం, కాదన్నచోట అవుననటం నాస్తికత్వం ఉనికికి తప్పనిసరి కాబోలు.

85. వీరబ్రహ్మం- యేసు సత్పురుషుడు కాడా? ఆయన దుష్టుడు, పాపి !

బైబిలు ప్రకారం ఎవ్వరూ సత్పురుషులు కారు. యేసుతో సహా అందరూ దుష్టులే (పాపులే) మార్కు 10:18 లోను, లూకా 18:19 ఇలా ఉంది. “యేసు - నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు”.

కానీ యేసు ప్రచారమే పనిగా పెట్టుకున్న పౌలు మాత్రం “ఆయన పాపము లేనివాడుగా ఉండెను” అని హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రజల పాపముతో పాటు తన పాపముల కొరకు కూడా యేసు అర్పణం చేయవలిసి ఉన్నాడని ఉంది. అంటే యేసు కూడా పాపి అనే కదా అర్థం. హెబ్రీ 5:3 ఇలా తెలుపుతోంది. “ప్రజల కొరకేలాగో తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు”. హెబ్రీ 7:28లో ఇలా ఉంది. “ఈయన ఆ ప్రధాన యాజకులవలే మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దీనదినము బలులను అర్పింపవలసిన అవసరమ గలవాడు కాడు. తన్నుతాను అర్పించుకొన్నపుడు ఒక్కసారే ఈ పనిచేసి ముగించెను” (బైబిల్ బాగోతం ప్రశ్న 85, పేజీ నం. 37).

జవాబు : ఒక ధనవంతుడూ, యవ్వనస్థుడూ అయిన అధికారి ఒకసారి యేసు వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్లూని "సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదున"ని అడిగాడు. అందుకు యేసు "నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు" అని జవాబిచ్చాడు. యేసు తాను సత్పురుషుణ్ణి కానని చెప్పడం ద్వారా తాను దేవుణ్ణి కానని స్పష్టం చేసాడని ఈ మాటల ఆధారంగా కొందరు బైబిల్ విమర్శకులు వాదిస్తుంటారు.

ఈ వచనంలో ముందుగా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే నేను సత్పురుషుడను కానని యేసు చెప్పడం లేదు. 'నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు' అని అతనిని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తప్ప ఎవ్వరూ సత్పురుషుడు కానప్పుడు 'నన్ను సత్పురుషుడని' పిలవడాన్ని బట్టి 'నేను దేవుడినని ఒప్పుకుంటున్నావా' అన్నది ఈ ప్రశ్నలోని ఆంతర్యం. ఎందుకంటే, వేరొక సందర్భంలో తాను మంచివాడినని యేసే స్వయంగా ప్రకటించాడు. “నేను గొర్రెల మంచి కాపరిని” (యోహాను 10:14). యేసు నిర్వచనం ప్రకారం మంచివాడు దేవుడే కదా !

ఇకపోతే యేసు పాపము లేనివాడని ప్రకటించింది కేవలం పౌలు మాత్రమే కాదు. “నాయందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును”(యోహాను 8:46) అని స్వయానా యేసే సవాలు విసిరాడు. అలాగే హెబ్రీ 7:28 లో పాతనిబంధన యాజకులకు యేసుకు మధ్య తారతమ్యాన్ని చూపిస్తూ వారు ఏటేటా చేయవలసిన యాగాన్ని యేసు ఒకేసారి పూర్తిచేసాడని, వారు ప్రజలపాపాలతో పాటు తమ స్వీయపాపాలకు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వచ్చినట్లు యేసు విషయంలో జరగలేదని ధ్రువీకరించబడింది. హెబ్రీ పత్రిక పూర్తి సందర్భ వెలుగులో ఈభావం మరింత స్పష్టమౌతుంది. యేసు పాపము లేనివాడని ఈ పత్రికలో ముందే పదే పదే నిర్ధారించబడింది(హెబ్రీ4:15, 7:26 ). కాబట్టి పాతనిబంధన యాజకులవలె యేసు తన స్వీయపాపాల కొరకు కాక ప్రజల పాపాల కొరకు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసాడనే తారతమ్యం ఇక్కడ కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది.


ఐనా, దేవునినే దుష్టునిగా చిత్రీకరించి తన దుష్టత్వాన్ని సమర్థించుకునే అలవాటు బ్రహ్మంగారి నుండి ప్రారంభమైనది కాదు. ఇది చాలా పాత పద్దతేనని బైబిల్ నిర్ధారిస్తుంది “. . . నేను కేవలం నీవంటివాడనని నీవనుకొంటివి అయితే నీ కన్నుయెదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను” (కీర్తనలు 50:21) అని దేవుడు హెచ్చరించాడు.

86. వీరబ్రహ్మం- ఎవడు రక్షణ పొందగలడు - దేవుడు తప్ప?ఐతే ఆ దేవుడికి రక్షణ ఇచ్చేదెవరు ?

మార్కు 10:25-27లలో ఇలా ఉంది. ఈ ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూదిబెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి - అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయననడిగిరి. యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమేగాని, దేవునికి అసాధ్యము కాదు. దేవునికి సమస్తమును సాధ్యమే అనెను”. దీని అర్థం రక్షణ పొందటం దేవునికి మాత్రమే సాధ్యము అని కాదా? మరి రక్షణ పొందాలనే తాపత్రయం మనుష్యులకుండటం శుద్ధదండగ కదా! (బైబిల్ బాగోతం ప్రశ్న 86, పేజీ నం. 37. )

జవాబు: దేవునికి రక్షణ అవసరమని దీనర్థంకాదు, రక్షణ పొందడం మనుషులకు అసాధ్యమైనప్పటికీ దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి దేవుని మూలంగా మాత్రమే ఎవరైనా రక్షణ పొందగలరని దీనర్థం. అందుకే నాస్తికత్వానికి స్వస్తిచెప్పి దేవునితట్టు తిరిగితే బ్రహ్మంగారికి మంచిది.

87. వీరబ్రహ్మం- ఇక్కడ వదలి పెట్టనేల? అక్కడ పొందనేల?

అక్కడ మరింత పొందేందుకూ ఇక్కడివి వదలి పెట్టాల్సి వస్తే, అలా వదలిపెట్టడంలో పరమార్ధం ఏముంది? ఎక్కడో ఏదో ఒరుగుతుందనుకొని, ఇక్కడున్న వాటి(రి)ని విడిచిపెట్టి ఇక్కట్ల పాలు కావడం వివవేకమనిపించుకోదు. మబ్బుల్ని చూచి ముంత ఒలక పోసుకుంటారా ? మార్కు 10:29, 30లలో ఇలా ఉంది. . “యేసు ఇట్లనెను- నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెడ్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైననువిడిచినవారు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్యజీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను”.

జవాబు: అక్షయమైన వాటి కోసం క్షయమైనవి, శాశ్వతమైనవాటికోసం అశాశ్వతమైనవి విడిచిపెట్టమని ఇక్కడ యేసు భావం. యేసు చెప్పిన ఒకానొక ఉపమాన వెలుగులో ఈ మాటలను మరింత స్పష్టంగా గ్రహించవచ్చు. “మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును” ( మత్తయి. 13:45-46), కాబట్టి మబ్బుల్ని చూసి ముంత ఒలక పోసుకోమని యేసు చెప్పడం లేదు. ఆయనను అమూల్యమైన ముత్యంగా కనుగొన్నవారు, దానిని సంపాదించుకోవడానికి కోల్పోయినవేవీ నష్టంగా ఎంచనక్కరలేదని యేసు భావం. (54 మరియు 55 ప్రశ్నలకు వ్రాసిన మా జవాబులను పోల్చిచదవండి).

88. వీరబ్రహ్మం- యేసు అధికారాన్ని ప్రశ్నించినవారికి అతనిచ్చిన జవాబేమిటో తెలుసా?

నువ్వు ఏ అధికారంతో మమ్మల్ని అడ్డుకుంటున్నావని గుడి పెద్దలు యేసును నిలదీస్తే, ఆయన నేనడగబోయేదానికి జవాబిస్తేనే, మీరడిగిన దానికి జవాబిస్తానన్నాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానమవుతుందా? ఇది అసలు విషయాన్ని ప్రక్కదారి పట్టించటం మినహా మరొకటి కాదు. ఆ అడిగింది ఎవ్వరో కాదు, అడుగవలసినవారే. సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత యేసుకి తప్పనిసరిగా ఉంటుంది. కానీ, ఏమని బదులివ్వగలడు? ! మార్కు 11వ అధ్యాయంలో గల ఈ క్రింది వచనాలను, చిత్తగించండి.

“వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన (యేసు) దేవాలయములో ప్రవేశించి, దేవాలయములో క్రయవిక్రయములు చేయువారిని వెళ్లగొట్టనారంభించి, రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్మువారి పీటలను, పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్రయైనను ఎవనిని తేనియ్యకుండెను” (15-17). "(అప్పుడు) ప్రధానయాజకులును, శాస్రులును, పెద్దలను ఆయన యొద్దకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు? వీటిని చేయుటకు ఈ అధికారము నీకు ఎవరిచ్చెనని అడిగిరి. అందుకు యేసు - నేనును మిమ్మును ఒకమాట అడిగెదను, నాకుత్తరమియ్యుడి, అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుడి కలిగినదా? మనుష్యల నుండి కలిగినదా? నాకుత్తరమియ్యుడని చెప్పెను. అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన యెడల, ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును. మనుష్యుల వలన కలిగినదని చెప్పుదమా అని తమలో తాము ఆలోచించుకొనిరి గాని అందరు యోహాను నిజముగా ప్రవక్తయని యెంచిరి. గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అదియు మీతో చెప్పననెను”(మార్కు11:27-33). (బైబీల బాగోతం ప్రశ్న 88, పేజి నం 38)

జవాబు : అవును, ప్రశ్నకు ప్రశ్న జవాబు కాగలదు. నీతిని బోధించిన యోహానును పరిసయ్యులు దేవునిచేత పంపబడినవానిగా గుర్తించివుంటే యేసు ఏ అధికారం చేత ఈ కార్యాన్ని చేశాడో వారు గుర్తించగలిగివుండేవారు. ఎందుకంటే, యేసును రానైయున్న మెస్సీయాగా యోహాను ఇశ్రాయేలుకు పరిచయం చేసాడు. వారు యోహానును నమ్మియుంటే ఆయన సాక్ష్యమిచ్చిన యేసును కూడా అంగీకరించక తప్పదు. యోహానును కాదనే ధైర్యం వారికి ఎలాగూ లేదు. కాబట్టి యేసు వారినడిగిన ప్రశ్నలోనే, వారి ప్రశ్నకు జవాబు వుంది.

ఇంతకీ యేసును అడిగింది అడగవలసినవారే అంటూ ప్రజలను భ్రష్టు పట్టించిన ప్రధానులను వెనుకేసుకు రావడం బ్రహ్మంగారి అసలురంగును మరొకసారి బయటపెడుతుంది. యేసును విమర్శించింది దొంగలే ఐనా బ్రహ్మంగారి దృష్టిలో మాత్రం వారు దొరలే ! యేసును ప్రశ్నించారుగా మరి!

89. వీరబ్రహ్మం- సజీవులకు ఒక దేవుడు, నిర్జీవులకు ఒక దేవుడు ఉంటాడా?

మార్కు 12:27లో ఇలా ఉంది. “ఆయన సజీవులకు దేవుడు కాని మృతుల దేవుడు కాడు.” దీనిని బట్టి మృతులకు కూడా ఒక దేవుడు ఉంటాడనుకోవలసి ఉంటుంది. ఎవరా మృతుల దేవుడు అంటే సాతాను కాదు కదా!. (బైబిల్ బాగోతం ప్రశ్న 89, పేజీ నం. 88)

జవాబు: పునరుత్థానం లేదని చెప్పుకునే సదూకయ్యులను ఉద్దేశించి యేసు పై మాటలు చెప్పాడు (మార్కు12:18). వారు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మారు కాబట్టి మోషే రచనల నుండే యేసు వారికి పునరుత్థాన సత్యాన్ని బోధిస్తూ ఇలా అన్నాడు “వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా?” ఆ భాగములో దేవుడు - నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను (మార్కు 12:26). మరోమాటలో చెప్పాలంటే అబ్రాహాము ఇస్సాకు యాకోబులు మరణించి వందలాది సంవత్సరాలు గడిచినప్పటికీ, వారు ఆత్మీయంగా సజీవులే కాబట్టి దేవుడు వారి దేవుడుగా తనను పరిచయం చేసుకున్నాడని, ఆత్మను పునరుత్థానాన్ని తిరస్కరించే సదూకయ్యుల భావాలకు దేవుడు చేసిన ఈ సంబోధన వ్యతిరేకంగా వుందని ఇక్కడ యేసు భావం. ఈ భావంలో శారీరకంగా మరణించినవారు కూడా ఆత్మీయంగా సజీవులే. ఎందుకంటే మరణమే వారి అంతం కాదు, మరలా వారు సజీవులుగా లేస్తారు ( యోహాను 5:28-29 ). కాబట్టి దేవుడు సజీవుల దేవుడు అని చెప్పుడంలో, మరణించినవారితో సహా అందరూ సజీవులని, అందరికీ ఆయన దేవుడని యేసు ఉద్దేశం; అంతేగానీ, బ్రహ్మంగారు భావించినట్లు సజీవులకో దేవుడు మృతులకో దేవుడున్నాడని భావం కాదు.

90. వీరబ్రహ్మం- దావీదుకు కుమారుణ్ణి కాను, దావీదుకు ప్రభువుని అంటున్నాడు యేసు.

ఆయనను నమ్ముకున్నవారు, ఆయనను ఎప్పుడూ "దావీదు కుమారుడా” అని గొప్పగా పిలిచేవారు. (రాముడ్ని రాఘవా అన్నట్లు) అయితే జనంలో తన స్థాయి పెరిగిన తరువాత యేసు అలా పిలిపించుకొనటానికి ఆ మీదట ఒప్పుకోలా. దావీదు కుమారుణ్ణి ఎలా అవుతాను? దావీదుకూ ప్రభువునే అని చెబుతాడు. మత్తయి 12:37లో ఇలా ఉంది. "దావీదు ఆయనను (తననే) ప్రభువని చెప్పు చున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను”. (బైబిల్ బాగోతం ప్రశ్న 90, పేజీ నం. 38)

జవాబు : జనంలో తన స్థాయి పెరిగిన తరువాత దావీదు కుమారుడు అని పిలిపించుకొనటానికి యేసు ఒప్పుకోలేదని బ్రహ్మంగారు వ్రాసారు. ఐతే యేసు అలా ఒప్పుకోలేదని చెప్పడానికి బైబిల్లో ఎలాంటి ఆధారం లేదు. బ్రహ్మంగారు ఉదహరించిన వాక్యభాగంలో, దావీదు తన కుమారుణ్ణి ప్రభువని సంబోధించడంలో ఆంతర్యమేమిటని యేసు ప్రశ్నిస్తున్నాడే తప్ప, “దావీదు కుమారుడా” అనే పిలుపును నిషేధించినట్లుగానీ నిరాకరించినట్లు గానీ లేదు. అన్నట్లు బ్రహ్మంగారి ఈ కసరత్తంతా కాల్పనిక ప్రశ్నల కాలక్షేప కార్యక్రమమే తప్ప మరేమీ కాదని మరోసారి రుజువైంది (57వ ప్రశ్నకు, మా జవాబును పోల్చి చదవండి)

91. వీరబ్రహ్మం- యేసు వచ్చేముందు (రెండవ రాకడ) ప్రపంచ వినాశనం సంభవించేటట్లు అయితే ఆయన మళ్లీ రాకపోవటం ఉత్తమం!

ఎవరైనా మహా మహితాత్ముడు అవతరించబోయే ముందు జగత్కళ్యాణ సూచనలు కనిపిస్తాయని విన్నాము గానీ, ఇదుగో ఈ క్రింద చెప్పినటువంటి మౌరవిపత్తులు జరిగేటట్లయితే ఆ వచ్చేవాడు ఏం ఉద్దరించటానికి రావటం? ఎవరి రాకతోనో మానవాళి కష్టాలు గట్టెక్కుతాయి అనుకోరాదు. విచిత్రమేమిటంటే ఎవరిరాకతో మానవాళి కడగండ్ల పాలవుతుందని హెచ్చరించబడిందో, అతనే రక్షకుడని, మనుష్య కుమారుడని, దేవుని కుమారుడని, దేవుడని, ప్రభువని చెప్పబడుతోంది. విశ్వాసానికి అర్థమేమిటో, అర్థం కావటం లేదు. మార్కు సువార్తను పరిశీలించుదాము. “జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకపంములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము” 18:8). “సహోదరుడు సహోదరిని, తండ్రి కుమారుని మరణమునకప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు” (13:12). "అయ్యో, ఆ దినములలో గర్భిణులకును, పాలిచ్చు వారికిని శ్రమ. అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించండి. అవి శ్రమ దినములు, దేవుడు సృజించిన సృష్ట్యాది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు. ఇక ఎన్నడును కలుగబోదు. ప్రభువు ఆ దినములను తక్కువ చేయని యెడల ఏ శరీరము తప్పించుకొనకపోవును” (15:1720). " ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావంతోను, మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు” (13:24-27).

ఆకాశమందలి ఆ శక్తులు ఏవి ?

యేసు రెండవ రాకడకు ముందు మరికొన్ని దుష్టశకునాలు లూకా 17వ అధ్యాయంలో సూచించబడ్డాయి . 29, 30 వచనాలు ఇలా ఉన్నాయి. “అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసే వారినందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును” 34, 35, 36 వచనాలు ఇలా ఉన్నాయి. " ఆ రాత్రి ఇద్దరొక్క మంచము మీద ఉందురు. వారిలో ఒకరు కొనిపోబడును. ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక్కతిరుగలి విసరుచుందరు. ఒకతే కొనిపోబడును. ఒకతె విడిచి పెట్టబడును”. (బైబిల్ బాగోతం ప్రశ్న 91, పేజీ నం. 39)

జవాబు : యేసు రెండవరాకడ ద్వారా లోకానికి దుర్గతి పడుతుందని బ్రహ్మంగారు అంటున్నారు, కానీ బైబిల్ అలా చెప్పడం లేదు, ఈ లోకానికి దుస్థితి లేదా దుర్గతి పట్టిన సమయంలో యేసు వస్తాడని బైబిల్ చెబుతుంది, అనగా యేసు రెండవరాకతో ఈ దుర్మార్గానికీ దుష్టత్వానికి కాలం చెల్లిపోతుంది. ఇది లోక కళ్యాణమే కదా ! ఇక్కడ సమస్య వాక్యసందర్భంలో కాదు చదివేవాడి దృక్కోణంలో వుంది.
ఇక ఆకాశమందలి శక్తులేమిటని తెలియనట్టు ప్రశ్నించారు బ్రహ్మంగారు. సూర్యచంద్రతారలను కలిపి ఆకాశమందలి శక్తులు అని అంటున్నట్లు ఆ వాక్యసందర్భం చదివిన ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది.

92. వీరబ్రహ్మం- అంత్యదినమెప్పుడు వచ్చేది అతనికే తెలియదు! మహా ప్రభావంతో వచ్చేది తానేనని చెప్పుకుంటున్నాడు. కానీ, తానెప్పుడు వస్తాడో తానే ఎరుగడు, అది యేసు మహిమకున్న శక్తి !

మార్కు 13:32లో ఇలా ఉంది. " ఆ దినమును గూర్చియు ఆ ఘడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతమైనను, కుమారుడైనను ఎరుగరు. ” (బైబిల్ బాగోతం ప్రశ్న 92, పేజి నం. 40. )

జవాబు : యేసు సర్వవ్యాపి ఐనప్పటికీ తన ఉనికిని ఒక ప్రత్యేక స్థలానికి మాత్రమే పరిమితం చేసుకున్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడైనప్పటికీ మానవస్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన సర్వజ్ఞానసంపూర్ణుడే ఐనప్పటికీ, తన అపరిమిత జ్ఞానాన్ని కూడా మానవజ్ఞానానికి అనుగుణంగా పరిమితం చేసుకున్నాడు. కాబట్టి మార్కు13:32లో యేసు తనకు కూడా తెలియదన్న విషయం, తన మానవస్వభావానికి అనుగుణంగా పరిమితం చేసుకున్నదే తప్ప తన దైవత్వంలో కూడా ఆయనకు అది తెలియదని భావం కాదు. నేనునూ తండ్రియు ఏకమై ఉన్నామని యేసు చెప్పిన మాట మనం మర్చిపోకూడదు( యోహాను 10:30 ). కాబట్టి తండ్రికి తెలిసినవన్నీ యేసుకు కూడా తెలుసు.

93. వీరబ్రహ్మం- ఇక్కడే నమ్మండి, లేకుంటే అక్కడ తోలు వలుస్తారు!

మార్కు 16:16లో ఇలా ఉంది, “నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మనివానికి శిక్ష విధింపబడును”

జవాబు : దేవుడు ఒకానొక రోజున తోలు వలుస్తాడనే విషయం ఇంత రూఢీగా తెలిసినప్పటికీ బ్రహ్మంగారు ఎందుకు క్రీస్తును విశ్వసించడం లేదు? నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీరుస్తాడని యేసు చెప్పిన మాట మర్చిపోకు సుమా (మత్తయి 12:35 ; లూకా 19:22).

94. వీరబ్రహ్మం- యేసును నమ్మినవారు ఏమేం చేయగలరు ?

మార్కు16:17, 18లలో ఇలా ఉంది “నమ్మినవారి వలన ఈ సూచక క్రియలు కనపడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొత్తభాషలు మాటలాడుదురు. పాములను ఎత్తి పట్టుకుందురు. మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను”.

ఆ నామమున కనీసం లేగదూడనైనను లేవనెత్తగలరా? ఆ నామమున మాతృభాషను కూడా కొత్త భాషగానే మాట్లాడుతున్నారే. ఇక క్రొత్త భాషలేం మాట్లాడగలరు? పాములను ఎత్తిపట్టుకుంటారట. ఎప్పుడు - చంపకముందా? చంపిన తరువాతా? ఎలాంటి పాములను - విష సర్పాలనా? విషరహిత సర్పాలనా? ఆ నామముననే కాదు, ఏ నామమున ఐనా సరే మరణకరమైనది ఏదైనా త్రాగగలిగే బలమైన విశ్వాసి ఎవరో ఒకర్ని రమ్మనండి ముందుకు. రోగుల మీద చేతులుంచి స్వస్థత దయ చేస్తారా. ఐతే వాళ్ల కొచ్చిన రోగాలు వాళ్లే నయం చేసుకోవచ్చు గదా? పాస్టర్ పుంగవులు కూడా డాక్టర్ల నాశ్రయించడం ఎందుకు? (బైబిల్ బాగోతం ప్రశ్న 94, పేజీ నం. 40 )

జవాబు: పైన పేర్కొన్న సూచకక్రియలు, అద్భుతాలు మరియు మహత్కార్యాలను అపొస్తలీయ చిహ్నాలుగా బైబిల్ వివరిస్తుంది ( 2కొరింథీ 12:12) అవి అపొస్తలుల హస్తనిక్షేపణవలన విశ్వాసులకు సంప్రాప్తించేవని కూడా బైబిల్ సూచిస్తుంది (అపొస్తలుల కార్యములు 8:18). అపొస్తలుల ద్వారా అందించబడిన క్రొత్త నిబంధన వారి స్వీయబోధన కాదని, అది దేవుని మూలంగా వారికి కలిగిన ప్రత్యక్షత అని నిర్ధారించేందుకు, వారి ద్వారాను వారి హస్తనిక్షేపణ కింద ఉన్న ఆదిమ విశ్వాసుల మధ్యను ఈ అద్భుతాలు జరిగాయి (హెబ్రీ2:3-4), ఎఫెస్సీ2:20) క్రొత్త నిబంధన బయలుపాటు, సంఘానికి ఒక్కసారే అనుగ్రహించబడిన బోధ (యూదా 3). ఆ బయలుపాటు సంపూర్ణమైన తర్వాత (ప్రకటన 22:18-19), దాని ధృవీకరణ కొరకు ఇవ్వబడిన అద్భుతాలు మరియు మహత్కార్యాలతో ఇక పని లేదు. దేవుడు తన సంకల్పం చొప్పున నేటికీ అద్భుతాలు స్వస్థతలు చేయగలడు, చేస్తున్నాడు కూడా. ఐనప్పటికీ ఒక వ్యక్తి ద్వారా లేదా కొందరు వ్యక్తుల ద్వారా అపొస్తలీయ కాలంలో జరిగిన విధంగా ఈ సూచక క్రియలు నేడు జరగడంలేదు. బ్రహ్మంగారు ఉదహరించిన సూచకక్రియలు అపొస్తలీయ బోధను ధృవీకరించేవాటి ఉద్దేశాన్ని నెరవేర్చిన పిమ్మట నిలిచిపోయాయి (హెబ్రీ2:3-4 లో అవి భూతకాలంలో ప్రస్తావించబడడాన్ని గమనించండి). ఈ సత్యాన్ని గ్రహించకుండా బ్రహ్మంగారు ప్రభువును సాతాను శోధించినట్లు “నీవు దేవుని కుమారుడవైతే” అనే ధోరణిలో విశ్వాసులకు ఏవేవో సవాళ్ళు విసిరితే, “ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని” యేసు చేసిన హెచ్చరికే నేటికీ ఉత్తమమైన జవాబని మేము జ్ఞాపకం చేస్తున్నాము.

95. వీరబ్రహ్మం- పాతనిబంధనలో పేరుకు నోచుకున్న దేవుడు, క్రొత్త నిబంధనలో మచ్చుకైనా కనబడడే? పాతనిబంధనలో దేవుడైన యెహోవా క్రొత్త నిబంధనలో పనికిరాకుండా పోయాడా?

పై ప్రశ్నకు జవాబేమిటంటే, అంతకు ముందున్న దేవుడికి (యెహోవా) క్రొత్త నిబంధనలో పేరు లేకుండా చేస్తే యేసే దేవుడుగా భావింపబడతాడు. క్రొత్త నిబంధన తయారుకావడంలో ప్రధాన ఉద్దేశ్యం ఇదే. (బైబిల్ బాగోతం ప్రశ్న 95, పేజీ నం. 40)

జవాబు : “ఇదిగో ఈయనే నా ప్రియ కమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (మత్తయి 3:17), “ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను” (మార్కు 9:7), “నేను దానిని మహిమపరచితిని, మరలా మహిమ పరతును అని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను” (యోహాను 12:28). ఈ మూడు వాక్యాలలో చూస్తే స్వయంగా తండ్రియైన దేవుడే తన కుమారుడైన యేసుతో మాట్లాడాడని మనకర్థమౌతుంది.

“నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు; మరియొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు ” (యోహాను 5:43) అనే ఈ మాట దేవుని గూర్చి యేసు మాట్లాడినట్లు మనకర్థమౌతుంది.

“సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక ” (1థెస్స5:25) ఈ మాట పౌలు దేవుని గూర్చి పలికాడని వాక్యం స్పష్టంచేస్తుంది. మరి బ్రహ్మంగారేమిటి - పాతనిబంధనలో పేరుకు నోచుకున్న దేవుడు, క్రొత్త నిబంధనలో మచ్చుకైనా కనపడదే అని ప్రశ్నిస్తున్నారు ? ఇది ఈయనగారి అజ్ఞానం కాకపోతే మరేమిటి ?

క్రొత్త నిబంధనలో పేరు లేకుండా చేస్తే యేసే దేవుడుగా భావింపబడతాడు అని బ్రహ్మంగారు ఇష్టమొచ్చినట్టు ఎడాపెడా వ్రాసేసారు. ఐతే, దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది అని దేవుడే స్వయంగా యేసు గురించి సాక్ష్యమిచ్చాడు (హెబ్రీ 1:8). కాబట్టి పాతనిబంధనలో వున్న దేవుని స్థానాన్ని యేసు చేత ఆక్రమింపజేయడానికే క్రొత్తనిబంధన వ్రాయబడిందనే బ్రహ్మంగారి అభియోగం నిరాధారమైనది.

96. వీరబ్రహ్మం- యోహాను ద్రాక్షారసము త్రాగక పరిశుద్దుడు, యేసు త్రాగినా పరిశుద్దుడే !

యేసు ద్రాక్షారసము (గ్రేప్ జ్యూస్ కాదు ద్రాక్షసారా) త్రాగేవాడనటానికి ఆయన తన శిష్యులకిచ్చిన పస్కా విందు ఒక ఉదాహరణ. కావాలంటే మత్తయి 26:29 చూడండి. లూకా 17:34 లో కూడా యేసు త్రాగేవాడని ఉంది. అది ఇలా ఉంది. “మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను”. ద్రాక్షారసము త్రాగితే పరిశుద్దుడు కాడా అని అడగటం లేదు. యోహాను ద్రాక్షారసము త్రాగక జీవితాంతము పరిశుద్దాత్మతో నిండుకున్నాడని చెప్పబడి ఉంది. కానీ యేసు ద్రాక్షారసము త్రాగినా పరిశుద్ధుడి గానే పిలుపబడ్డాడు. లూకా 1:14-16 లో యోహాను గురించి ఇలా ఉంది. “అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ...........” (బైబిల్ బాగోతం ప్రశ్న 96, పేజీ నం. 40)

జవాబు: తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్దాత్మతో నింపబడ్డాడు కాబట్టి, యోహాను పరిశుద్దుడు, ద్రాక్షారసంతో దీనికి ఎలాంటి సంబంధం లేదు; “బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు, ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను” (లూకా 7:23 ). అంటే, రొట్టె తినడం పాపమని తినకపోవడం పరిశుద్ధతకు నిదర్శనమని దీని భావం కాదు. ఇదే నియమం ద్రాక్షారసానికి కూడా వర్తిస్తుంది. సాధారణంగా ఇశ్రాయేలీయులలో అందరూ కలిగియున్న ఆహార అలవాట్లను యేసు అలవర్చుకుంటే, యోహాను మాత్రం సాధారణ జీవనశైలి నుండి సన్యసించాడు (మత్తయి 3:3-4). యేసు అలా సన్యసించనంత మాత్రాన అపరిశుద్దుడని భావంకాదు. ఐనా, త్రాగడానికి త్రాగుబోతుతనానికి తేడా తెలిసుంటే బ్రహ్మంగారు అసలీ ప్రశ్నే లేవనెత్తి వుండేవారు కాదు.

యేసుక్రీస్తు త్రాగుబోతుతనానికి పాల్పడియుంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి అపరిశుద్ధుడైయుండేవాడు. కానీ ఆయన గురించి ఆలాంటి సందర్భం బైబిల్లో ఒక్కటి కూడా లేదు. త్రాగినంతనే త్రాగుబోతు అని యేసును నిందించిన యూదులు, త్రాగనందుకు యోహానును దయ్యంపట్టినవాడని కూడా ఆక్షేపించారని మనం మర్చిపోకూడదు. బ్రహ్మంగారు కూడా ఆ యూదుల బాపతుకు చెందినవారే. బైబిల్ నియమాలను బట్టి త్రాగుబోతుతనం మాత్రమే కాదు తిండిబోతుతనం కూడా పాపమే (ద్వితి 21:18-21). అంతమాత్రాన తింటే పాపం త్రాగితే పాపం అనడం వివేకం కాదు. బైబిల్ ప్రకారం మాత్రమే కాదు, చట్టప్రకారమైనా, వైద్యశాస్త్రప్రకారమైనా త్రాగడం తప్పు కాదు, త్రాగుబోతుతనం మాత్రమే నిషిద్దం. తగిన పరిమాణంలో తీసుకున్నప్పుడు ద్రాక్షరసంలో ఔషధ గుణాలు, మేలుచేసే లక్షణాలు ఉన్నాయని అందరికీ విదితమే. నాస్తికులకు మాత్రం ఇంకా ఈ సమాచారం అందలేదు కాబోలు! అయినా, బైబిల్ ద్రాక్షారసాన్ని గురించి మాట్లాడుతుంటే బ్రహ్మంగారు ద్రాక్షసారా అంటారేమిటి? అలవాటు వల్ల దొర్లిన పొరపాటు కాబోలు.

97. వీరబ్రహ్మం- దేవుడు రాళ్ళవలన అబ్రహాముకు పిల్లల్ని పుట్టింపగలడు! రాళ్ళు మాత్రం ఎందుకు?

లూకా 3:8లో ఇలా ఉంది. “దేవుడు ఈ రాళ్ళవలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. బైబిల్ బాగోతం ప్రశ్న 97, పేజీ నం. 41)

జవాబు : శూన్యం నుండి సమస్తాన్ని కలుగజేసిన దేవుడు (రోమా 4:17), రాళ్ళ నుండి మాత్రమే కాదు, దేనినుండైనా, పిల్లలను మాత్రమే కాదు, దేన్నైనా పుట్టించగలడు. ఏంటంట సమస్య?

98. వీరబ్రహ్మం- పరిశుద్ధాత్మ పావురమవగా లేనిది, శబ్దము చేయలేదా?

పరిశుద్ధాత్మ శరీరాన్ని ధరించగలదని బైబిల్లో తెలుస్తుంది. ఇక్కడొక సందేహం పొడచూపుతోంది కన్య మరియకు గర్భదానం చేసింది శుద్ధ పరిశుద్ధాత్మా ? లేక ఇప్పుడు చెప్పుకుంటున్నట్లు శరీరాకారాన్ని ధరించిన పరిశుద్దాత్మా ? లూకా 5:22లో పరిశుద్దాత్మ యేసు గురించి ఇలా సాక్ష్యమిచ్చింది. “పరిశుద్దాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు. నీయందు నేనానందించుచున్నాని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.” శబ్దం కూడా పావురం నుండే రావచ్చు గదా, ఆకాశమునుండి రానేల?

జవాబు : శరీరాకారాన్ని ధరించడం పరిశుద్దాత్మకు సాధ్యమే. ఐనంతమాత్రాన కన్య మరియ గర్భధారణకు దీనితో సంబంధమేమిటో? 75వ ప్రశ్నకు వ్రాసిన మా జవాబులో మేము ఎత్తి చూపిన అదే అనాగరిక మనస్తత్వాన్ని బ్రహ్మంగారు మరోసారి బయట పెట్టుకుంటున్నారేమోనని మా అనుమానం. అన్నట్లు, శబ్దం ఆకాశమునుండి కాక పావురము నుండి వచ్చి వుంటే ఈ ప్రబుద్దుడు నాస్తికుడే అయ్యుండేవాడు కాదేమో పాపం.

99. వీరబ్రహ్మం- 33వ యేట మరణించిన యేసుకు 30 ఏళ్ళవరకు చరిత్రే లేదు !

యేసుకు 30 సంవత్సరాలు వచ్చేవరకు యోసేపు కుమారుడిగానే తెలుసు. తన జాతి ప్రజల్లో ఆధ్యాత్మిక బోధ మొదలుపెట్టిన దగ్గరనుంచి అతను మనుష్యకుమారుడని, క్రీస్తని, దేవుని కుమారుడని ఉద్దేశ్యపూర్వకమైన ప్రచారం జరిగింది. యేసు అంత వరకేం చేశాడో సువార్తీకులకు కూడా తెలియదు. లూకా 3:23లో ఇలా ఉంది. * యేసు (బోధింప) మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను”. (బైబిల్ బాగోతం ప్రశ్న 99, పేజీ నం. 41).

జవాబు: ధర్మశాస్త్రాజ్ఞానుసారంగా ఒక వ్యక్తి దైవ సేవ చేయాలి అని అనుకుంటే అతనికి ముప్పై ఏళ్లు నిండాలి. దానికి ముందు అతను దేవుని పరిచర్య చేయడానికి అనర్హుడు (సంఖ్యా 4:3). దేవుని కట్టడను అనుసరిస్తూ తన సువార్త సేవను 30వ యేట ప్రారంభించాడు క్రీస్తు. ఐతే అంతకు ముందు కాలమంతా వడ్రంగిపనిలో తన వంతు సహాకారాన్ని తన ఇంటివారికి అందించాడు. పైగా పన్నెండేళ్ళవయసులోనే తన తండ్రి (దేవుని) పనిలో నిమగ్నుడైయుండడానికి ఆయన కనపరచిన ఆసక్తి (లూకా 2:46-47) తగిన సమయమందు తన పరిచర్యను ప్రారంభించేందుకు ఆయన కలిగివుండిన సిద్దపాటును సూచిస్తుంది. ఐతే దేవుని సేవ చేయాల్సిన సమయం ఆసన్నమయ్యేంత వరకు ఆయన నజరేతులోనే పెరిగినట్లు లేఖనంలో చదవవచ్చు (లూకా 4:16). ఆయనకు ముప్పయి యేళ్ళు నిండిన పిమ్మట తన సువార్త సేవనారంభించాడు.

అవును మరి ఆయన జీవించింది 33 1/2 సంవత్సరాలే. అందులోను సేవచేసింది కేవలం 3 1/2 సంవత్సరాలే. ఐనప్పటికి అనతి కాలంలోనే ఆయన మాటలు విశ్వపు అంచుల వరకూ వెళ్లాయి. ఆయన ఎవరో లోకానికి తెలిసింది. యేసు సంపాదించిన కీర్తంతా కేవలం 3 1/2 సంవత్సరాల ప్రయాస మాత్రమేనని ఎత్తిచూపడం విమర్శకాదు ప్రశంస అని కూడా గుర్తెరగలేకపోయారు బ్రహ్మంగారు. కుళ్ళు ఉబికే నోటి నుండి సహితం తనకు కీర్తి సిద్దింపజేసుకున్న దేవునికి స్తోత్రం.

100. వీరబ్రహ్మం- మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడిందట. దేనికి?

బైబిల్లో గానీ, మరి ఏ ఇతర మత గ్రంథాల్లో గానీ పుక్కిటి పురాణాలే తప్ప, చారిత్రక సత్యాలు, శాస్త్రీయ విషయాలు ఉండవు అని చెప్పటానికి మచ్చుకి ఒక ఉదాహరణ “ఏలియా దినములందు మూడేండ్ల ఆరునెలలు ఆకాశము మూయబడి” (లూకా 4:25) (బైబిల్ బాగోతం ప్రశ్న 100, పేజీ నం. 41)

జవాబు: ఏలియా దినాలలో మూడేండ్ల ఆరు నెలలు ఆకాశం మూయబడినదని బైబిలు చెబుతున్న విషయాన్ని అభూత కల్పన అని బ్రహ్మంగారు కొట్టిపారేస్తున్నారు. ఆకాశం మూయబడినదంటే ఆకాశం నుండి వర్షాలు కురవకుండా ఆపివేయబడిందని అర్థం, అంతే తప్ప బిరడాతో సీసాను మూసినట్టు బ్రహ్మంగారు అర్థం చేసుకుంటే అది ఆయన అజ్ఞానమే తప్ప లేఖనదోషం కాదు. నాస్తికవాద విజ్ఞులకు అలంకారభాష అర్థం కాదని మనమిదివరకే చూసాం! అందుకే అలంకారభాషను పట్టుకొని అభూతకల్పన అని అశాస్త్రీయమని విమర్శిస్తుంటారు.

101. వీరబ్రహ్మం- ఇశ్రాయేలులో అనేకమంది విధవరాళ్ళు ఉండగా, ఏలియా ప్రవక్త సారెపతులో ఉన్న విధవరాలి వద్దకే ఎందుకు పంపబడ్డాడు?

ఎందుకంటే ఆవిడతో ఉన్న సంబంధం అటువంటిది. శుద్దిపొందటానికి ఆవిడొక్కతే అనుగ్రహింపబడిందని చెప్పే వాళ్ళెవరైనా ఉండొచ్చు - బుద్ధిని ఉపయోగించకుండా, గ్రుడ్డిగా నమ్మేవాళ్ళుంటే! లూకా 4:26లో ఇలా ఉంది. “ఇశ్రాయేలులో అనేకమంది విధవరాత్రుండినను, ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు”. (బైబిల్ బాగోతం ప్రశ్న 101, పేజీ నం. 42. )

జవాబు: పై సందర్భంలో ఏలియా ఆ విధవరాలి దగ్గరకు వెళ్ళాడని లేదు; ఆమె వద్దకు పంపబడ్డాడు అని ఉంది. ఏలీయాకు ఆమెతో ఉన్న సంబంధాన్ని బట్టి కాదు; దేవుని ఆజ్ఞానుసారంగా ఇది జరిగిందని బైబిల్ మనకు సూచిస్తుంది. పంపబడినవాడు, పంపినవాని ఉద్దేశానుసారంగా వెళ్తాడే తప్ప అందులో తన సొంత ఉద్దేశాలేమీ ఉండవు. ఒకవేళ, బ్రహ్మంగారు చెప్పినట్లు ఏలియాకు ఆ విధవరాలితో సంబంధముండి ఆమె వద్దకు వెళ్లినా, అందులో వున్న సమస్య ఏమిటో ? బ్రహ్మంగారి కుత్సితబుద్ధికీ, నాస్తిక తలంపుకు చెడు సంబంధాలు మాత్రమే తడతాయేమో కానీ బైబిల్ లో ఉన్న దేవుడు పవిత్ర సంబంధాలు కలిగి ఉండమని నేర్పించే దేవుడు. 'తల్లులని వృద్ద స్త్రీలను, అక్కచెల్లెండ్రని పూర్ణపవిత్రతతో యవ్వనస్త్రీలను'గా ఎంచమని నేర్పించే దేవుడే ఏలియాను ఈ స్త్రీ వద్దకు పంపించాడని మనం మర్చిపోకూడదు 1 తిమో 5:3-4 ఏలియా ఈ నియమాన్ని జవదాటినట్టుగా కూడా ఆ విధవరాలితో తన ప్రవర్తనలో ఏమీ కనిపించదు (1 రాజులు 17 అధ్యాయం). కాబట్టి ఆధారాలు లేని అనుమానాలు పుట్టించి అదే బైబిల్ బాగోతమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మంగారు. ఇలాంటి అపనిందలు మోపే మరొకడు మనకు బైబిల్లో కూడా కనిపిస్తాడు. వాడిని 'అపవాది' అని అంటుంటారు.

102. వీరబ్రహ్మం- సమాజమందిరములో యేసుకు జరిగిన సత్కారమేమిటి?

ఎలీషాకాలములో సిరియా దేశస్థుడు ఒక్కడు తప్ప మరియెవ్వరు శుద్ధి పొందలేదని యేసు ప్రసంగిస్తే, అవమానపడి భక్తులేం చేశారో తెలుసా?
“ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్టురోగులు ఉండినను, సీరియ దేశస్తుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సమాజమందిరము లోపల ఉన్న వారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసికొనిపోయిరి, అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయెను” (లూకా 4:27-30).

జవాబు : దేవుని మాటకు ఇశ్రాయేలీయులలో చోటు లేనప్పుడు, దేవుడు అన్యులను ఎన్నుకుంటాడనే అంతరార్థాన్ని అ సమాజ మందిరంలో కూడుకున్నవారు యేసు చెప్పిన పై మాటలలో గ్రహించగలిగారు. ఐతే లేఖనాధారంగా వారికి యేసు జ్ఞాపకం చేసిన ఈ సత్యాన్ని, హెచ్చరికగా చూసి మారుమనస్సు పోందేది పోయి, వారిని హెచ్చరించడమే నేరమన్నట్లు యేసు పట్ల అవమానంగా ప్రవర్తించారు. వారికోవకే చెందిన బ్రహ్మంగారికి ఇది వీనులకువిందుగా తోచడంలో ఆశ్చర్యమేమీలేదు. ఇంతకూ యేసుకి జరిగిన అవమానాన్ని సత్కారమని వెటకారమాడే కుతూహలంలో పడి అడగాల్సిన ప్రశ్నేమిటో మర్చిపోయినట్లున్నారు బ్రహ్మంగారు.

103. వీరబ్రహ్మం- దయ్యాల్లో పవిత్రమైనది, అపవిత్రమైనవి అంటూ ఉన్నాయా?

దయ్యమంటేనే అపవిత్రాత్మ అన్నారు. అలాంటప్పుడు అపవిత్రమైన దయ్యపు ఆత్మ అనటం అర్ధరహితం కదా! ఏమిటీ పిచ్చిరాతలు! జనాల్ని ఈ రాతలు ఎంతపిచ్చిలో, ఎంత మత్తులో ఉంచుతున్నాయి. ఇవి ఇలా ఉన్నప్పటికీ! లూకా 4:33లో ఇలా ఉంది. “ఆ సమాజమందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొకడుండెను”. చూశారా! అపవిత్రమైన దెయ్యము, దానికొక ఆత్మ! (బైబిల్ బాగోతం ప్రశ్న 103, పేజీ నం. 42).

జవాబు : ప్రశస్తమైన వజ్రం, విలువైన బంగారం, లోతైన సముద్రం లాంటి ఎన్నో వర్ణనలు ఎన్నో పదాలతో జోడించి మనం వాడతాము. అంతమాత్రాన అప్రశస్తమైన వజ్రం, విలువలేని బంగారం, ఎత్తైన సముద్రం లాంటివి కూడా ఉంటాయని బుద్ధి మందగిస్తే తప్ప ఎవరూ అనుకోరు. “అపవిత్రమైన దయ్యపు ఆత్మ” అన్నది కూడా ఇలాంటి వాడుకే. కాబట్టి బైబిల్లో వున్నవి అర్థరహితమైన వ్రాతలు కావు. బ్రహ్మంగారు లేవనెత్తినవే అర్థంలేని ప్రశ్నలు. నాస్తికవాదంతో మతిభ్రమించి, బైబిల్ చదివేవారు పిచ్చిలోను మత్తులోను ఉన్నట్లు కనిపిస్తుందట బ్రహ్మంగారికి! ఇతరులలో లేని పిచ్చి కనిపించడం, మదోన్మాద లక్షణమని ఈయనగారికి తెలియనట్టుంది పాపం!

104. వీరబ్రహ్మం- యేసుకి దెయ్యమైనా, జ్వరమైనా ఒక్కటే! వాటిల్ని పొమ్మని గద్దిస్తే పోతాయ్!

లూకా 4:39 ఇలా చెప్తోంది . “ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను, వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను”. (బైబిల్ బాగోతం ప్రశ్న 104, పేజీ నం. 42)

జవాబు : అవును బ్రహ్మంగారు చెప్పింది నిజమే, 'యేసుకి దెయ్యమైనా, జ్వరమైనా ఒక్కటే! వాటిని పొమ్మని గద్దిస్తే పోతాయ్'. మందులు వాడితేనే తప్ప తగ్గని జ్వరాన్ని తన నోటి మాట చేత బాగుచేసాడు. ఉపవాసముండి ప్రార్థిస్తేనే తప్ప పోని దయ్యాన్ని ఒకే ఒక్క మాటచేత వదలగొట్టాడు. దయ్యాలు, జ్వరాలు మాత్రమే కాదు, సముద్రాలు తుఫానులు కూడా ఆయన గద్దింపుకు లోబడ్డాయి. దయ్యాలు జ్వరాలు మాత్రమే కాదు, ఏ సమస్యలైనా ఆయనకు ఒక్కటే ; అన్నీ ఆయన మాటకు లోబడేవే. ఈ సత్యాన్ని ఒప్పుకున్నందుకు మేము బ్రహ్మంగారిని అభినందిస్తున్నాము.

105. వీరబ్రహ్మం- యేసు, సీమోనును తొలిసారి కలిసింది ఎక్కడ.

మత్తయి 4:18 ప్రకారం “గలిలయ సముద్ర తీరమున” లూకా 5:2 ప్రకారం "గెన్నేసరేతు సరస్సు తీరమును” ఈ రెండింటిలో ఏదో ఒకటే నిజమవుతుంది కానీ రెండూ కావు గదా! లేకపోతే ఇందలి సంఘటనలన్నీ కేవలం కల్పితం కావాలి. (బైబిల్ బాగోతం ప్రశ్న 105, పేజీ నం. 42)

జవాబు: విశాఖపట్నం ఒకప్పుడు వాల్టేరుగా పిలవబడేది, విజయవాడ ఒకప్పుడు బెజవాడగా పిలువబడేది, రాజమండ్రి ఒకప్పుడు రాజమహేంద్రవరంగా పిలువబడేది. అనగా పట్టణాలు అవే అయినప్పటికీ మారుపేర్లతో పిలువబడ్డాయి. ఇదే రీతిగా గలిలయ సముద్రతీరప్రాంత్రం కూడా ఒకప్పుడు గెన్నేసరేతుగా, కిన్నెరైతుగా పిలిచేవారు (సంఖ్యాకాండము 34:11) . మత్తయి భక్తుడు గలిలయ అని వ్రాసాడు, లూకా గెన్నెసరెతుగా వ్రాసాడు. ఇందులో ఏదో తప్పు ఉన్నట్టు ఇంత రాద్ధాంతం చేయడమెందుకు ? అసలు విషయం తెలియకుండా విమర్శించడం హేతువాది లక్షణం అవుతుందా ?

106. వీరబ్రహ్మం- నీ సొత్తు ఎత్తుకు పోతే తిరిగి అడగొద్దు !

లూకా 6:30లో ఇలా ఉంది. “నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము ! నీ సొత్తు ఎత్తుకొని పోవువాని యొద్ద దానిని మరల అడుగవద్దు”. (బైబిల్ బాగోతం ప్రశ్న 106, పేజీ నం. 42)

జవాబు : విశ్వాసులు తమ శత్రువులతోను తమను హింసించేవారితోను ఎలా వ్యవహరించాలో బోధించే సందర్భంలో యేసు పై మాటలు సెలవిచ్చినట్లు మొదట మనం గమనించాలి(27వ వచనం నుండి చదవండి ) ఇదే సందర్భాన్ని గ్రంథస్థం చేస్తూ లూకా ప్రస్తావించని ఒక సంగతిని మత్తయి తెలియజేసాడు. బ్రహ్మంగారు ఉదహరించిన వచనాన్ని మత్తయి 5:38-48 వచనాల నేపథ్యంలో చదివినప్పుడు సరైన భావం మనకర్థమౌతుంది. న్యాయాధిపతుల ద్వారా అమలు చేయవలసిన 'కంటికి కన్ను పంటికి పల్లు అనే నియమాన్ని వక్రీకరించి, ఎవరికివారే చట్టాన్ని తమచేతుల్లోనికి తీసుకోవచ్చని బోధించిన శాస్త్రులు మరియు పరిసయ్యుల దుర్బోధను యేసు ఇక్కడ సరిచేస్తున్నాడు . ఈ విషయంలో శాస్త్రుల నీతికంటెను పరిసయ్యుల నీతికంటెను విశ్వాసుల నీతి ఎలా అధికం కాగలదో యేసు బోధిస్తున్నాడు (మత్తయి 5:20). | హింసకు గురిచేయబడినప్పుడు న్యాయవ్యవస్థపై ఆధారపడాలే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ధర్మసమ్మతం కాదని ఇక్కడ యేసు మాటల్లోని ఉద్దేశం. “కంటికి కన్ను పంటికి పల్లు” అని ధర్మశాస్త్రంలో ప్రస్తావించబడిన 3 సందర్భాలలోనూ న్యాయవ్యవస్థ ద్వారా న్యాయాధిపతులే ఆ తీర్పును అమలు చేయాల్సిందని మనం గమనించగలము. (నిర్గమ 21:24; లేవి 24:20; ద్వితి 19:21). ఈ ధర్మశాస్త్ర ఉద్దేశం నిరర్థకం కాకుండా నెరవేర్చడానికి అవసరమైన బోధను యేసు ఈ సందర్భంలో చేస్తున్నాడని గుర్తించినప్పుడు (మత్తయి 5:17) ఈ భావం మనకర్థమౌతుంది. ఇందులో దోషమేమీ మాకు కనిపించలేదు. వచనాన్ని కనీసం సందర్భసహితంగా కూడా అర్థంచేసుకోవడం చేతకాదని పదేపదే నిరూపించుకున్న బ్రహ్మంగారు, ఇతర సంబంధిత వాక్యభాగాల వెలుగులో సరైన భావాన్ని సంగ్రహించి తెలుసుకుంటారని అపేక్షించడం మన అవివేకమే ఔతుంది.

107. వీరబ్రహ్మం- యేసు తిండిబోతూ, త్రాగుబోతూనా ?

తనను గురించి ఆనాటి ప్రజలు ఏమనుకుంటున్నారో అనుకోని విధంగా యేసు ఇక్కడ బయటపెట్టాడు. లూకా 7:54లో ఇలా ఉంది. “మనుష్యకుమారుడు తినుచును, త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానియు, సుంకరులకును, పాపులకును స్నేహితుడను అనుచున్నారు”. ( బైబిల్ బాగోతం ప్రశ్న 107, పేజీ నం. 42).

జవాబు : బ్రహ్మంగారు ఇక్కడ లేవనెత్తిన ప్రశ్నకు మేము 96వ ప్రశ్నలో జవాబు వ్రాసేసాము.

108. వీరబ్రహ్మం- యేసు స్త్రీకి పుట్టలేదా. ఐతే స్త్రీలు కనినవారందరిలోకి యోహాను గొప్పవాడు అంటే తాను కానట్టేకాదా!

లూకా 7:28 ఈ విధంగా చెబుతోంది. "స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు.” యేసునూ స్త్రీయే కదా కన్నది ! మరి ఈ వచనంలో ఆయన అలా ఎందుకన్నాడు? ఐతే, తనకంటే యోహానే గొప్ప అని ఒప్పుకుంటున్నాడా? కానీ, యోహాను కంటే తానే గొప్పవాణ్ణని యేసు చాలా చోట్ల గుర్తు చేస్తూ వచ్చాడు. ఇదే అధ్యాయంలో 26వ వచనం అందుకు ఉదాహరణ. ఈ విధంగా స్వవచన వ్యాఘాతం ఎలా జరిగివుంటుంది ? ఎలా అంటే, బైబిలు సంకలనాల నిండా ఉన్న కథలు, కధనాలు అన్నీ కూడా చర్వితచర్వణాలు. వీటిని ఏర్చికూర్చటంలో రచయితకు బుర్ర దగ్గర లేకపోతే ముందు రాసిన విషయాలకు, తర్వాత రాసిన విషయాలకు పొంతన కుదరదు . రచయితే విమర్శకుడైనప్పుడు ఇలాంటి పొరపాట్లు వాటిల్లవు.

జవాబు : లూకా సువార్త నుండి బ్రహ్మంగారు ఉదహరించిన ఈ సందర్భము మత్తయి 11:11-13లో మరింత విపులంగా వివరించబడింది. అక్కడ ఈ మాటలు చదువుతాం-“స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయిననూ పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటే గొప్పవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని యిప్పటివరకు పరలోకరాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలత్కారులు దానినాక్రమించుకొనుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరును ప్రవచించుచు వచ్చిరి; ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను.”

పైవచనాలలో గమనించదగిన వాస్తవమేమిటంటే బాప్తీస్మమిచ్చు యోహాను కాలం నుండి మారుమనస్సు ద్వారా యేసుక్రీస్తులో లభించే పరలోకరాజ్య ప్రవేశం ప్రారంభమైంది. ఆ దినముల వరకూ, ఈ పరలోకరాజ్యానికి ప్రజలను సిద్ధపరిచిన ప్రవక్తల పరిచర్య బాప్తీస్మమిచ్చు యోహానులో పతాకస్థాయికి చేరుకుంది. అందుకే, స్త్రీలు కన్న ఆ ప్రవక్తలందరికంటే బాప్తిస్మమిచ్చే యోహాను గొప్పవాడు. ఐతే ఈ పరలోకరాజ్యంలో అత్యల్పుడు కూడా బాప్తీస్మమిచ్చు యోహానుకంటే గొప్పవాడు అనే మాటలోనే బ్రహ్మంగారు లేవనెత్తిన ప్రశ్నకు జవాబు లభిస్తుంది. అందుకే దానిని ప్రస్తావించకుండా తెలివిగా దాటవేసేసినట్టున్నారు. పరలోకరాజ్యంలోని అత్యల్పుడే యోహానుకంటే గొప్పవాడైతే ఆ రాజ్యానికి స్వయానా వ్యవస్థాపకుడు మరియు రారాజైన యేసుక్రీస్తు యోహానుకంటే తక్కువ వాడౌతాడా? మరో మాటలో చెప్పాలంటే, స్త్రీకి పుట్టినవారందరికంటే అని కాదు, స్త్రీకి పుట్టి, తన కాలం వరకూ ప్రవచించిన వారందరికంటే బాప్తిస్మమిచ్చు యోహాను గొప్పవాడని ఇక్కడ యేసు భావం. కాబట్టి యేసు ఇక్కడ చెప్పిన మాటకు, ఆయన యోహాను కంటే గొప్పవాడని తెలియజేసే వాక్యభాగాలకు మధ్య స్వవచన వ్యాఘాతం ఉందన్న బ్రహ్మంగారి ఆరోపణ, చదివేటప్పుడు ఆయనగారికి బుర్ర దగ్గరలేకపోవడం వలన కలిగిందే తప్ప సువార్తల్లోని సమస్య కాదని మరోసారి రుజువైంది.

అంతేకాకుండా, 'స్వవచన వ్యాఘాతముంద'నే తన ఆరోపణను నిరూపించుకోవటానికి బ్రహ్మంగారు వాడిన ఉదాహరణ తనకు బుర్ర దగ్గర లేకుండా రాశారని చెప్పటానికి మరో ఆధారం; ఏమి రాశారో గమనించండి. కానీ, యోహాను కంటే తానే గొప్పవాణ్ణని యేసు చాలా చోట్ల గుర్తు చేస్తూ వచ్చాడు. ఇదే అధ్యాయంలో 26వ వచనం అందుకు ఉదాహరణ'; కాని లూకా 7:26వ వచనంలో 'మీరు అరణ్యంలో చూడవెళ్ళింది ప్రవక్తను కాదు ప్రవక్త కంటే గొప్పవానినని' యేసు ఇచ్చిన సాక్ష్యం తన గురించి కాదని, బాప్తిస్మమిచ్చు యోహాను గురించని బుర్ర దగ్గరున్న ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది. ఇక్కడ స్వవచన వ్యాఘాతమెక్కడుంది?

109. వీరబ్రహ్మం- ఎంత పాపంచేసినా ఫరవాలేదు . యేసును ప్రేమిస్తే చాలు. క్షమించేస్తాడు!

లూకా 7:47 ఇలా చెప్తోంది. “ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారపాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను”.
అపొస్తలుల కార్యములు 10:43 ఇలా ఉంది. “ఆయన యందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్త ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను”.

జవాబు : అవును బ్రహ్మంగారు చెప్పింది నిజమే, యేసును ప్రేమిస్తే చాలు పాపాలను క్షమించేస్తాడు, ఐతే బ్రహ్మంగారు ఇక్కడ ప్రేమకు ఇచ్చే నిర్వచనమేమిటో చెప్పనేలేదు కానీ బైబిల్ ఇచ్చే నిర్వచనం తీరే వేరుగా వుంది. ఆమె తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి గుండెపగిలేలా ఏడ్చింది, గతంలో తాను చేసిన అపరాధాల విషయమై మారుమనస్సుపొంది ఇంకెప్పుడూ అలాంటి అపరాధం చేయననే తీర్మానం ఆమె దుఃఖం ద్వారా కనపరచింది. ఆమె ఆంతర్యాన్ని గుర్తించాడు కనుకే యేసు -“ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తారపాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను” అని అన్నాడు. లూకా 7:47లో భావం ఇదే. అపొ 10:43లో భావం కూడా ఇదే, యేసునందు విశ్వాసముంచి పాపి తన పాపాల విషయమై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడినట్లయితే తప్పకుండా ఆయన క్షమిస్తాడు. యేసు ఇచ్చే పాపక్షమాపణ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే ఆయన ఇచ్చే ఈ సదావకాశాన్ని మీరు కూడా వినియోగించుకోవచ్చు బ్రహ్మంగారు.

110. వీరబ్రహ్మం- మనుష్యులకు పట్టిన దయ్యాలను పందుల్లోకి ఎక్కించింది ఎక్కడ ? గెరాసేనుల దేశములోనా? లేక గదరేనీయుల దేశములోనా?

మత్తయి 8:28 ప్రకారం గదరేనీయుల “దేశం”. మార్కు 5:1 ప్రకారం, లూకా 6:26 ప్రకారం గెరాసేనుల “దేశం”. దటీజ్ బైబిల్! చూశారా, దేవుడి ఆత్మ ఒకే విషయాన్ని అందరిలోనూ ఎలా ఎలా పలికిస్తుందో!

జవాబు : ఒక ప్రదేశానికి రెండేసి పేర్లు వుంటాయి, రాజమండ్రికి మరో పేరు రాజమహేంద్రవరం, విజయవాడకి మరో పేరు బెజవాడ. కొన్ని ప్రదేశాలకైతే ఏకంగా మూడేసి పేర్లు కూడా వుంటాయి, వాల్తేరు, వైజాగ్, విశాఖపట్టణం. ఈ తరహాలో చూస్తే గదరేనీయుల దేశం గెరాసేనల దేశంగా పిలవబడింది. దోషం లేకపోయినా దోషముందని నమ్మించి దటీజ్ హేతువాదం' అని సంబరపడిపోతున్నారు బ్రహ్మంగారు !

111. వీరబ్రహ్మం- యేసును ముట్టుకుంటే ఆయన ప్రభావం తగ్గిపోతుందట, పాపం ! యేసు కూడా మైలపడిపోతాడు.

తన రోగం తగ్గుతుందనే నమ్మకంతో రక్తస్రావరోగము గల ఒక స్త్రీ యేసు వెనుకకు వచ్చి, ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె స్వస్తత నొందినదట. అప్పుడు “యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను” (లూకా 8:46). తన పై పంచే చెంగును చాటుగా ముట్టుకుంటే చూడకుండానే ఎవరో ముట్టుకున్నారని, అందువల్ల తన మహిమాశక్తి తగ్గిపోయిందని చెప్పగలిగిన యేసుకి ఆ ముట్టుకున్నది ఆడో, మగో తెలియలేదన్నమాట. తెలిస్తే "ఎవడో” అని ఎందుకంటాడు?

strong>జవాబు: “ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని” యేసు చెప్పిన మాటను పట్టుకుని ఆయన ప్రభావం తగ్గిపోతుందని ఆయన మైల పడిపోతాడని అర్థంపర్థం లేకుండా విమర్శించారు బ్రహ్మంగారు. ప్రభావం వెడలిపోయింది అంటే, ప్రభావం ఆయన నుండి బయలువెళ్లి స్వస్థతకార్యం జరిగించిందనే భావాన్ని ఆ సందర్భం చదివిన ఎవరైనా గుర్తించగలరు.

ఇకపోతే, అక్కడికేదో యేసు తెలుగుభాషలో "ఎవడో నన్ను ముట్టెను” అని చెప్పినట్లు, “ఆ ముట్టుకున్నది ఆడో, మగో తెలియలేదన్నమాట. తెలిస్తే "ఎవడో” అని ఎందుకంటాడు? అని బ్రహ్మంగారు వెక్కిరించారు. వాస్తవానికి, “who touched me'' అని ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నమాట, గ్రీకు మూలభాషలో ఉన్న “Neuter gender' లో చెప్పబడిన మాటకు సరైన ఆనువాదం తెలుగులో, “ఎవరో నన్ను ముట్టెను” అని అనువదించి ఉండాల్సింది. తెలుగు అనువాద లోపాన్ని బైబిల్ లోపంగా చూపించడం బ్రహ్మంగారి పాండిత్యలోపమే తప్ప మరేమికాదు. ఐనా, రహస్యంగా జరిగిన స్వస్థతకు దానిని పొందినవారి బహిరంగ ఒప్పుకోలే విశ్వసనీయమైన సాక్ష్యం కాబట్టి ముట్టినవారి నోట నుండి ఆ సాక్ష్యం రాబట్టటానికి నన్ను ముట్టింది ఎవరు? అని యేసు అడిగాడే తప్ప తనను ఎవరు ముట్టారో తెలియక కాదు.

112. వీరబ్రహ్మం- ఫిట్స్ రావటాన్ని దయ్యం పట్టడం అనుకున్నారు.

లూకా 9:39లో ఇలా ఉంది. “ఇదిగో ఒక దయ్యము వానిని పట్టును. పట్టినపుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును, నురుగు కారునట్లు అది వానిని విలవిల లాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.”

జవాబు : నురుగుకారడం, అకస్మాత్తుగా కేకలు వేయడం, విలవిల కొట్టుకోవడం ఇవన్నీ ఫీట్స్ కి చెందిన లక్షణాలన్నది వాస్తవమే. ఐతే మనుష్యులు మూగవారు చెవిటివారు గ్రుడ్డివారుగా పుట్టటానికి దయ్యాలే కారణం కాకపోయినా, దయ్యాల ద్వారా కూడా మనుష్యులకు ఈ దుస్థితి పట్టవచ్చని 80వ ప్రశ్నకు జవాబులో మనం చూసాం. ఫిట్స్ విషయంలో కూడా ఇదే వాస్తవం.

ప్రస్తుత సందర్భంలో దయ్యపు ప్రభావం క్రిందే ఈ ఫీట్స్ లక్షణాలు ఆ రోగిని బాధించాయని నిర్ధారించే మరింత సమాచారం మార్కు సువార్త మనకందిస్తుంది. “అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును” (మార్కు 9:22) అని అక్కడ మనం చదువుతాం. ఫిట్స్ రోగం నాశనం చేయాలని పథకంతో నీటిలోనూ అగ్నిలోనూ పడవేస్తుందా? ఐనా దేవుడే లేడని నమ్మే నాస్తికుడిని దయ్యముందని నమ్మిస్తే మాత్రం ఒరిగేదేమిటంట!

113. వీరబ్రహ్మం- శిష్యులకు దయ్యాల మీద అధికారమిస్తే అది పనిచేయలేదు !

అసలు యేసుకే చాలినంత శక్తి లేదా? లేక యోగ్యులైన శిష్యులను ఎన్నుకోవటం చేతకాలేదా? లూకా 9:1-3 లలో ఇలా ఉంది. “ఆయన తన పండ్రెండు మందిని (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యముల మీదశక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారినంపెను”. కాగా, యేసు జారీచేసిన “పవర్ ఆఫ్ పట్టా” ఎందుకు కొరగాకుండా పోయిందని లూకా 9:40లో తెలుస్తోంది. “దానిని (దయ్యమును) వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని, వారిచేత కాలేదని మొఱపెట్టుకొనెను”.

జవాబు : దయ్యాలను వెళ్లగొట్టేందుకు యేసు తన శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని ఇక్కడ మొదటిసారి ప్రయత్నించి విఫలమయ్యారు. దయ్యాలను వెళ్లగొట్టాలంటే తగినంత ఉపవాస ప్రార్ధన అవసరం (మార్కు 9:29). ప్రారంభ దశలో శిష్యులు విఫలమయ్యారనేది వాస్తవమే ఐనప్పటికీ, ఉపవాస ప్రార్థనల ద్వారా ఆత్మలో వారు బలపరచబడిన తర్వాత దయ్యాలను సమర్థవంతంగా ఎదిరించి అవి తమకు లోబడుతున్నట్లు స్వయంగా సాక్ష్యమిచ్చారు (లూకా 10:17) . ఒక సందర్భానికి సంబంధించిన వాక్యవివరణ అర్ధం కావాలంటే దానికి చెందిన ఇతర వాక్యభాగాలు కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ఐతే ఈ సూత్రం బ్రహ్మంగారికి తెలియక కాదు; 11 బైబిల్ యోగ్యతా పత్రాలు పొందినట్లు చెప్పుకుని తిరిగే ఈయనగారికి ఈ మాత్రం మౌలిక సూత్రం తెలియదా? తెలుసు. కానీ బైబిల్లో లేని పరస్పర వైరుధ్యాలను కల్పించడానికే తప్ప ఈ నియమాన్ని ఈయనగారు మరి దేనికీ వినియోగించరు.

114. వీరబ్రహ్మం- మూగవాడు మాట్లాడాలంటే ఏం చెయ్యాలి?


బిబ్లియోపతి ప్రకారం మూగవాడు మాట్లాడలంటే, వాడికి పట్టిన మూగదయ్యాన్ని వెళ్ళగొట్టాలి. లూకా 11:14లో “ఒకప్పుడాయన మూగ దయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట్లాడెను” అని ఉంది.

జవాబు : దురాత్మ ఒక మనిషిలో ప్రవేశించినప్పుడు దాని దుష్ప్రభావం ఒక్కోవిధంగా వుంటుంది. అలా అని అనారోగ్యం పాలైన వారందరూ దురాత్మ చేత పట్టబడ్డారని భావం కాదు, శరీర రుగ్మతలు కూడా కారణం కావచ్చు. సాతాను కట్ల చేత నడుము ఒంగిపోయిన స్త్రీని గూర్చి లూకా 13:11 లోనూ, ఒక వ్యక్తికి దురాత్మ పట్టిన కారణంగా అతడు తరచుగా మూర్ఛపోయి అగ్నిలోనూ నీళ్లలోనూ పడేవాడని మత్తయి 18:16లో నూ చదవవచ్చు. బ్రహ్మంగారు లేవనెత్తిన ప్రశ్నలో కూడా ఇదే తరహాకి చెందిన పరిస్థితిని చూడవచ్చు. తలతిక్క వాదనలు, అర్థం లేని ప్రేలాపనలు కూడా ఒక్కోసారి దురాత్మ ప్రభావం ద్వారా కలగవచ్చు, దానిని వెళ్లగొట్టినప్పుడు స్వస్థత కలుగుతుంది. కాబట్టి బ్రహ్మంగారిని మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోవలసిందని క్రైస్తవ చదువరులకు మా విజ్ఞప్తి.

115. వీరబ్రహ్మం- పరమత అసహనం క్రైస్తవ మత ప్రథమ లక్షణం!

లూకా 11:23లో యేసు ఇలా అంటున్నాడు. “నా పక్షమున ఉండనివాడు నాకు పరమ విరోధి”
“నిన్నెవనిని తృణీకరింపనీయకుము" అని అంటున్నాడు తీతు 2:15లో ఇతరులు తృణీకరించేలా ప్రవర్తింపకుము అనటం కాదు, తృణీకరిస్తే ఊరుకొవద్దు అని చెప్పబడింది.

జవాబు: ఒక పక్షంలో ఉండడానికి నిరాకరించడం ఆ పక్షానికి విముఖత కనపరచడమే. ఈ సాధారణ వాస్తవాన్నే లూకా 11:23లో యేసు తన పక్షంలో లేనివారి గురించి ప్రస్తావించాడు. ఇందులో అసహనమేముంది?

ఇక తీతు 2:15లోని సందర్భాన్ని గమనిస్తే “ఈ లోకంలో స్వస్థబుద్దితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని” పౌలు మొదట తీతుకు ఉపదేశించాడు (తీతు 2:13), తీతు బోధించాల్సిన ఈ హితబోధ విషయమై అతనిని ఎవరూ తృణీకరించకుండా జాగ్రత్తపడమని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఐతే ఇలాంటి హితబోధపై తమకున్న అసహనాన్ని బ్రహ్మంగారు అర్థంలేని ఈ ప్రశ్నల రూపంలో బయటపెట్టుకుంటున్నారని ఈ పాటికే చదువరులకు అర్థమైయుంటుంది. నీతిపట్ల అసహనం నాస్తిక ప్రథమ లక్షణం.

116. వీరబ్రహ్మం- యేసు బ్లాక్ మెయిలింగ్ స్వామీజీ!


"మనుష్యుల యెదుట నన్ను ఎరుగనను వానిని, నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును” అని లూకా 12:9 చెప్తోంది. జాగ్రత్త! ఇక్కడ మీరు నన్ను తెలుసుకోకపోతే, అక్కడ పై లోకంలో మీరు కూడా నాకు తెలియదని మా దూతలతో చెప్పేస్తాను. అప్పుడు వాళ్లు ఏంచేస్తారో చూస్కోండి. కాబట్టి నన్ను నమ్ముకొని బాగుపడండి అని బెదిరిస్తున్నాడు యేసు.

జవాబు : యేసు ఒక్కడే లోకరక్షకుడని, ఆయన ఇచ్చే రక్షణను తృణీకరించేవారికి రక్షణ పొందే ప్రత్యామ్నాయ మార్గమేదీ లేదని, ఆయన కూడా వారిని తృణీకరిస్తాడని బైబిల్ బోధిస్తుంది. ఇది నిజమా లేక బ్లాక్ మెయిలింగా అనేది మరణానంతరం లేదా తీర్పు దినమున రుజువవుతుంది. ఐతే, తమ ఆత్మల మేలు కోరేవారు అప్పటివరకూ వేచివుండక్కరలేదు. భవిష్యత్తులో సంభవిస్తుందని బైబిల్ ప్రవచించిన ఏ విషయమూ నేటి వరకూ విఫలం కాలేదు. కాబట్టి రానున్న తీర్పు విషయమై కూడా బైబిల్ సాక్ష్యాన్ని నిస్సందేహంగా నమ్మవచ్చు. నమ్మిక మాకక్కరలేదు అనుభవపూర్వకంగానే ధ్రువీకరించుకుంటామనుకుంటే మీ ఇష్టం. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉండొచ్చు సుమా!

117. వీరబ్రహ్మం- దేవుడంటే నిప్పుపెట్టేవాడా, సుభిక్షంగా ఉంచేవాడా?

లూకా 12:49లో “నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. అది ఇది వరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను” అని యేసు చెప్పాడు. దీన్ని బట్టి యేసు ఏమిటో తేల్చుకోండి. ఇది ఉపమానమే అనుకున్నా, దీనికిచ్చే అన్వయింపు ఏదీ పొసగదు.

జవాబు : అగ్ని బైబిల్లో తరచుగా సంకేతరూపంలో వాడబడింది- నిర్గమ 3:2; నిర్గమ 13:21 నిర్గమ 19:18; ద్వితి 32:32; కీర్తన 18:8. ఈ లోకంలో దేవుని శుభవార్త వ్యాప్తితోపాటు ఉండే హింసలనూ కష్టాలనూ సూచిస్తు ప్రభువు ఈ మాట చెప్పాడు. అగ్ని అలాంటి విషయాలకు కూడా సూచనగా వాడబడింది- కీర్తన 66:12; యెషయా 43:2; విలాప 1:13 ఐతే ఇలాంటి అగ్ని రగులుకోవాలని యేసు ఎందుకు కోరుతున్నాడు? తన రాజ్యవ్యాప్తితోనూ, తన సత్యం విస్తరించడంతోనూ అది ముడిపడి ఉందని ఆయనకు తెలుసు. | సువార్తను నమ్మినవారు నమ్మని తమ కుటుంబీకుల నుండి ఎదుర్కోబోయే శ్రమల సందర్భంలో ప్రభువు ఈ మాట సెలవిచ్చాడు. సువార్త వలన కలగబోయే ఈ పర్యవసానాలు అగ్నితో దహించేంత వేదన కలిగించినా, ఆ సువార్త చేకూర్చే మేళ్లతో పోల్చుకున్నప్పుడు, ఆ వేదన కోరదగినదే అనే అన్వయింపు యేసు చెప్పిన ఈ ఉపమానానికి చక్కగా పొసగుతుంది. ఇది నమ్మడానికి బ్రహ్మంగారి అంగీకారం గానీ, ధ్రువీకరణ పత్రంగానీ విశ్వాసులకు ఆవసరం లేదు.

118. వీరబ్రహ్మం- యేసు ఎందుకు వచ్చెను. విరోధాలు పెంచటానికా?


"పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను” అని 1 తిమోతి 1:15లో పౌలు చెప్పాడు. కానీ, అది నిజం కాదు. లూకా సువార్తికుడేం చెప్పాడో చూడండి. “నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను. ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి, ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా యిద్దరును ఉందురు. తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లిని, అత్త కోడలికిని, కొడలు అత్తకును విరోధులగా ఉందురని చెప్పెను” (లూకా 12:51-53).

జవాబు : పాపులను రక్షించుటకై యేసు వచ్చాడని 1 తిమోతి 1:15లో వుంటే, కుటుంబసభ్యుల మధ్య గొడవలు పెట్టటానికి వచ్చినట్లు లూకా 12:51-53లో వుంది కదా! అని వీరబ్రహ్మంగారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈయనగారు యేసు మాటలలోని ఆంతర్యమెరుగకుండా అవహేళనగా వ్రాసారు. ఐతే మనం మాత్రం యేసు మాటల్లోని ఆంతర్యాన్ని వెలికితీద్దాం.

యేసుక్రీస్తు పాపుల రక్షకుడే (1 తిమో 1:15); ఐతే ఈ రక్షణ అంగీకరించినవారికి, తిరస్కరించిన వారికి మధ్య విరోధం తప్పకుండా వుంటుంది. ఈ ఉదాహరణ గమనించండి - కుల బేధాలతో నిండియున్న సమాజంలోని ఒక యువకుడు సువార్తకు ప్రభావితుడై 'కుల కట్ల” నుండి విడుదల కావాలని ఆరాటపడతాడు. తరతరాలుగా పాతుకుపోయిన సాంఘిక దురాచారాల మీద కొరడా ఝళిపించాలని, వాటి నుండి తమ కుటుంబసభ్యులను విడిపించాలని ఆకాంక్షిస్తాడు. అలా తాను వినిన క్రీస్తు సువార్తను తన వారికి ప్రకటించి వారిని కూడా దైవసన్నిధికి నడిపించాలని ఆశపడతాడు. ఐతే అది అనుకున్నంత సులువైన పని కాదు. తన ఇంటివారితో అతడు పోరాడవలసి వస్తుంది. అది సాయుధ పోరాటం కాదు, భావ పోరాటం లేక సూత్రపోరాటం. తనకూ ఇంటివారికీ మధ్య తర్జనబర్జనలు జరుగుతాయి. తన ఇంటివారిలో కరుడు కట్టుకుపోయిన మూఢనమ్మకాలను, కులకట్లను తన భావజాలపోరాటం ద్వారా దహించి వేయాలని అతడు అభిలషిస్తాడు, దీనివలన వారిలో వారికి భేదాభిప్రాయాలు రావచ్చు. ఆ పోరాటంలో ఆతనికి తన కుటుంబసభ్యులు శత్రువులుగా మారవచ్చు. వారు అతనిని హింసకు కూడా గురిచేయవచ్చు (మత్తయి 10:21-22). యేసు చెప్పింది ఇలాంటి ఖడ్గాన్ని గురించే. కాబట్టి యేసు పాపులను రక్షించాడన్నది ఎంత నిజమో (1 తిమోతి 1:15), ఆ రక్షణ వలన విరోధాలు కలుగుతాయన్నది కూడా అంతే వాస్తవం. ఒక్కటి నిజమౌతే మరొకటి సాధ్యపడదనుకోవడం కేవలం బ్రహ్మంగారి అవగాహనాలోపమే తప్ప తిమోతి లూకాల మాటల మధ్య పరస్పర వైరుధ్యం కాదు.

119. వీరబ్రహ్మం- వాదించే వారితో గొడవ పెట్టుకోవదు. తప్పించుకో !


లూకా 12:58 లో ఇలా ఉంది. “వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము”.

జవాబు : పై మాటల పూర్తి సందర్భం ఈ విధంగా వుంది. “వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము; లేదా, అతడొకవేళ నిన్ను వ్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోపును, న్యాయాధిపతి నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపటి కాసు చెల్లించువరకూ వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాననెను.” 

న్యాయస్థానంతో పనిలేకుండా, వెలుపలే ప్రతివాదాలు తీర్చుకుని, సమాధానంగా రాజీపడి, కలహాల నుండి తప్పించుకోకపోతే జరిగే పర్యావసానాల గురించి యేసు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. మత్తయి 5:25 ఈ వివరణకు మరింత స్పష్టతనిస్తుంది - “నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము; లేనియెడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతులకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదువు”

యేసు చెప్పినట్లు, సమాధానపడి వ్యాజ్యము నుండి తప్పించుకోవడం వివేకం. ఐతే వాదించే వానినుండి తప్పించుకోమంటున్నాడని సగం సందర్భాన్నే ప్రస్తావించి, మరోసారి యేసు మాటలను అపార్థం చేసుకునే విధంగా బ్రహ్మంగారు వ్యాఖ్యానించారు. ఇది ఆయనగారి అవివేకమో లేదా కుయుక్తో మాకు తెలీదు కానీ వెనుకటికెవడో ఇలాగే సగం పద్యాన్ని చదివి 'అప్పిచ్చువాడు వైద్యుడు' అనే కొత్త సామెతొకటి కనిపెట్టాడట. ఇదెక్కడి సామెత అని పరిశోధించినప్పుడు సుమతీ శతకాలలో అసలు విషయం బయటపడిందట. అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎల్లప్పుడు పారే సెలయేరు తదితర సౌకర్యాలు వున్న ఊళ్ళో కాపురముండమని బద్దెనకవి భావం తప్ప, అప్పిచ్చువాడే వైద్యుడని భావం కాదు. సగం చదివి సగం మింగేస్తే కొత్త ఆలోచనలు, కొత్త సామెతలతో పాటు కొత్త విమర్శలు కూడా ఎన్నో ఉత్పాదించుకోవచ్చు; కాదంటారా బ్రహ్మంగారూ!!

120. వీరబ్రహ్మం- యేసుకు శిష్యుడుగా కావాలంటే ఐనవాళ్లనందర్నీ వదులుకోవాలా?


లూకా 14:26లో యేసు ఇలా వాక్రుచ్చాడు. “ఎవడైనను నాయొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు”.

జవాబు: మరొకసారి బ్రహ్మంగారు వ్రాసిందే తిరిగి వ్రాసారు, 54, 55, 87 ప్రశ్నలకు మా జవాబును పోల్చి చదవండి.

121. వీరబ్రహ్మం- అక్రమ సొమ్ముతో మీరు స్నేహితులను సంపాదించుకొనుడి!
“అన్యాయపు సీరితో ఐనా, అక్రమ సంపాదనతో ఐనా స్నేహితులను సంపాదించుకొండి. ఒకవేళ అది పోయినా గాని అది సంపాదించిపెట్టిన సావాసగాళ్ళేనా మిగులుతారు. డబ్బు పోయినా కష్టాల్లో మిమ్ములను ఆదుకొంటారు”. ఈ హితబోధను ఎవరంగీకరిస్తారో చెప్పండి. ఇదే పద్ధతిలో యేసు తనవారికి బోధ చేస్తున్నాడు. ఈనాడు వివిధ చిన్నా, పెద్ద మిషనరీలు దేశదేశాలలో చేస్తున్న పని ఇదే. లక్షలు, కోట్లు డబ్బు ఖర్చుపెట్టి తమ తమ కూటములను నడుపుకొస్తున్నాయి. లూకా 16వ అధ్యాయంలో 5వ వచనంలో యేసు ఏమన్నాడో పరికించండి. "అన్యాయపుసిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొండి. ఎందుకనగా, ఆ సిరి మిమ్ములను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను'

జవాబు: బ్రహ్మంగారు పొరబడినట్లు, ఇక్కడ “అన్యాయపు సిరి” అంటే “అన్యాయంగా సంపాదించుకున్న ధనం' అని కానీ, అక్రమంగా దాచుకున్న సంపద' అని కానీ భావంకాదు. దానిని నమ్ముకున్నవారిని మోసగించి అన్యాయంచేసే తత్వము సిరిలో ఉందని సామెతలు 23:5 సామెతలు 27:24, ప్రసంగి. 5:13-16, మత్తయి 13:22 మార్కు 4:19తదితర వచనాలలో పదేపదే నొక్కి చెప్పబడిన వాస్తవాన్నే ఇక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడని, లూకా 16:9ను లూకా 16:11తో పోల్చి చదివితే స్పష్టమవుతుంది. అన్యాయపు సిరి విషయంలోనే నమ్మకంగా లేనివారికి సత్యధనము అప్పగించబడడం సాధ్యం కాదని అక్కడ చదువుతాము. సత్యధనము అంటే నిత్యము ఉండే పరలోక సంబంధమైన సంపద (మత్తయి 6:19-20). నమ్మకత్వముతో శాశ్వతమిత్రులను సంపాదించుకోమని, నేడుండి రేపు రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే అన్యాయపు సిరి కోసం అపనమ్మకంగా ప్రవర్తించి వారిని పోగొట్టుకోవద్దనే భావమే ఈ సందర్భానికి న్యాయం చేసే వివరణ. కాబట్టి, అక్రమంగా ధనాన్ని సంపాదించి , వాటి ద్వారా స్నేహితులను సంపాదించుకొమ్మని ఇక్కడ ప్రభువు బోధించడం లేదు. ఐనా ఎంతటి అబద్దానికి తెగించినా సరే, యేసును విలన్గా చిత్రీకరించాలని నడుం కట్టినవారు, ఆయన మాటలతో నిజాయితీగా వ్యవహరిస్తారని ఆశించడం వివేకం కాదేమో ! అన్నట్లు బైబిల్ బోధను పరిశీలించే ఈ చర్చలో మిషనరీలు ఏమి చేస్తున్నారన్న ప్రస్తావన అసందర్భ ప్రేలాపన ఔతుందని బ్రహ్మంగారు మరచిపోయినట్లున్నారు!

122. వీరబ్రహ్మం- మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యమా ?

లూకా 16:15లో "మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము” అని వ్రాయబడివుంది. అనగా, ఈ సమాజంలో ఉన్న నీతి నియమాలు, సాంఘిక కట్టుబాట్లు ఎందుకూ పనికిరావని, కాబట్టి వాటిని లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదని చెప్పటమే కదా ? సామాజిక నీతి, క్రైస్తవ నీతి వేరు వేరు. మొదటి దానికి మీరు కట్టుబడనవసరం లేదని, సాధారణ నీతికి వ్యతిరేకంగా చర్చించే వారికి కొరవడిన మన:స్తైర్యాన్ని ఇచ్చి తప్పుడు తాత్విక చింతనతో వారిని అందుకు సిద్ధంచేసి, తనవైపు తిప్పుకొవటమే ఈ సూత్రంలో ఇమిడి ఉన్న లక్ష్యం.

జవాబు : మరోసారి సందర్భాన్ని పరిగణలోనికి తీసుకోకుండా వాక్యానికి తన సొంత ఆలోచనలను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు బ్రహ్మంగారు. ఆ వాక్య సందర్భంలో అసలు సామాజిక నీతిని గురించిన ప్రస్తావనే లేదు. అక్కడ యేసు స్వనీతిపరులైన పరిసయ్యులను హెచ్చరిస్తూ, మనుష్యుల యెదుట ఘనంగా ఎంచబడే వారి స్వనీతి దేవుని దృష్టిలో హేయమని బోధిస్తున్నాడు. ఎందుకంటే వారి స్వనీతి ఆంతా వట్టి వేషధారణతో కూడినదని ఇతర పలు సందర్భాలలో యేసు స్పష్టం చేసాడు(మత్తయి 23, లూకా 12:1 . అంతేగానీ యేసు సామాజిక నీతి నియమాలను విమర్శించడం లేదు. ఎందుకంటే, నీతినిజాయితీ ఎక్కడ కనిపించినా దాని కర్త దేవుడే (రోమా 2:14-15) . బైబిల్లో లేని నీతి, క్రైస్తవ సమాజంలో కానీ, క్రైస్తవేతర సమాజంలో కాని ఎక్కడా కనిపించదు. కాబట్టి సామాజిక నీతివేరు, క్రైస్తవ నీతి వేరు అనే బ్రహ్మంగారి విమర్శకు ప్రస్తుత వాక్యసందర్భంలో ఏ మాత్రం తావులేవు. ఐనా మనిషి - అణువులు, కణాలు, మరియు రసాయనాల యంత్రం అని నమ్మే నాస్తికుడికి నీతి నియమాలతో పనేంటో?

123. వీరబ్రహ్మం- దేవుని రాజ్యం కొరకు కన్నతల్లిదండ్రుల్ని, కట్టుకున్న భార్యను విడిచిపెడితే అటువంటివారిని చాలామందిని పొందవచ్చు!

లూకా 18:29, 30 వచనాలు ఇలా ఘోషిస్తున్నాయి. “ఆయన (యేసు) దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును, ఇహమందు చాల రెట్లు పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను”.

వివరించటానికి వీలులేనంత హేయంగా ఉన్నాయి ఈ వాక్యాలు. దేవుని కోసం తలిదండ్రుల్ని, ఆలుబిడ్డల్ని వదిలేస్తే, ఆ తరువాత చాలామంది తల్లిదండ్రులు పెళ్ళాలు ఎలా చేకూరతారో ఆ దేవుడే చెప్పాలి. అదీ ఎక్కడో పరలోకంలో కాదు, ఇక్కడే ఈ లోకంలోనే దొరుకుతారని హామీ ఇస్తున్నాడు. నా నిమిత్తం నీకున్న ఒక్క పెళ్ళాన్ని వదలిపెట్టి రా. ఆ తరువాత చాలా మందిని నీకు పెళ్ళాలుగా అప్పజెపుతాను” అని ప్రలోభపెడ్తున్న యేసు కనీసం నైతిక విలువల్ని కూడా పాటించేవాడు కాడు అని తెలుసుకోవాలి.

జవాబు: తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసుకొను ప్రతీవాడు వ్యభిచరించుచున్నాడు(లూకా 16:18)అని యేసు ముందే స్పష్టం చేసాడు. కాబట్టి ఆయన కొరకు ఉన్న ఒక్క భార్యను విడిచిపెట్టి వస్తే అనేకమంది భార్యలనిచ్చి వ్యభిచరింపచేస్తానని యేసు భావంకాదు. బ్రహ్మంగారు ఉదహరించిన వచనంలో, యేసు ఇహలోకంలో అనేక రెట్ల ప్రతిఫలాన్ని వాగ్దానం చేస్తున్నాడన్నది వాస్తవమైనప్పటికీ ఆయనకొరకు విడిచిపెట్టిన వాటినే వడ్డీతో సహా ఇస్తానని భావంకాదు. ఒకవేళ అది నిజమైయుంటే తమ జీవనోపాధిని సహితం విడిచి పెట్టి వచ్చిన పేతురు యోహానులకు భవనాలు, బంగ్లాలు, విస్తారమైన సిరిసంపదలు ప్రతిఫలంగా లభించియుండవలసింది. కానీ వారి స్వీయసాక్ష్యం ఏమిటో గమనించండి “వెండిబంగారములు నాయొద్ద లేవు” (అపొస్తలులకార్యములు. 3:6). కాబట్టి విడిచిపెట్టిన వాటిని రెట్టింపుగా ఇస్తానని కాదు, విడిచిపెట్టిన వాటికంటే రెట్టింపు విలువైన దీవెనలు ఇస్తానన్నది యేసు మాటల్లోని ఆంతర్యం. నాస్తికులకు అర్థం కాకపోయినా, భౌతికమైన బంధుత్వాలు మరియు ఇహలోక సంపదలకంటే, ఆత్మీయమైన సంతోషసమాధానాలే రెట్టింపు విలువైనవని దేవునిని నమ్మేవారందరికీ తెలుసు. మనుష్యులు అణుయంత్రాలు అని నమ్మేవారు ఒక అణుయంత్రాన్ని విడిచిపెట్టి మరో అణుయంత్రంతో సహజీవనం చేసేలా ప్రోత్సహిస్తారేమో కానీ, నీతిని అనుసరించి లోకానికి తీర్పుతీర్చబోయే యేసు, నీతికి వ్యతిరేకంగా ఎప్పుడూ బోధించడు.

124. వీరబ్రహ్మం- సమస్తమును ఎవరి మూలముగా కలిగెను? దేవుడి మూలముగానా, వాక్యము మూలము గానా ?

యెహాను సువార్త 1:1-3లలో ఇలా ఉంది. “ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడైయుండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద నుండెను. సమస్తమును అయన మూలముగా కలిగెను”.

ఇందులో “వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను అని అన్న తరువాత మళ్ళీ " ఆయన ఆదియందు దేవుని యొద్దయుండెను ” అని రాయడం ఎందుకు? పాడిందే పాడరా పాసిపండ్ల దాసుడా అన్నట్లుగా ఉంది. వాక్యం ఎక్కడుందో చెప్పబడింది. వాక్యం అంటే దేవుడని చెప్పబడింది. ఆయన ఎక్కడున్నాడో తిరిగి చెప్పటం శుద్ధదండుగ. "సమస్తమును ఆయన మూలముగా కలిగెను” అని ఉంది. ఇక్కడ “ఆయన అనగా దేవుడైయున్న వాక్యమే (వాక్య దేవుడే) గదా! సమస్తమును కలిగింది ఆ ఆదిదేవుని మూలముగా కాదని, "ఈయన” మూలముగానేనని దీనిని బట్టి అర్థమవుతోంది.

జవాబు : యోహాను 1:1లో ఉన్న మాటనే యోహాను 1:2లో నొక్కి చెబితే 'పాడిందే పాడరా పాసిపండ్ల దాసుడా అన్నట్లుగా ఉంది' అని ఆక్షేపించిన బ్రహ్మంగారికి తాను మాత్రం అడిగిన ప్రశ్నలే ఎన్నిసార్లు తిరిగి అడిగినా అలాంటి సామెతలేవీ జ్ఞప్తికి రాకపోవడం ఇక్కడ విశేషం.

ఆమాట అలా వుంచితే, వాక్యం దేవుడైయుండెనని పైవాక్యభాగం స్పష్టం చేస్తుంది. కాబట్టి సృష్టించింది దేవుడా, వాక్యమా అనే ప్రశ్న అర్థరహితమైనది. దేవుడైయున్న వాక్యం ఆదియందున్నవాడని కూడా స్పష్టం చేయబడింది గనుక 'సమస్తమును కలిగింది ఆ ఆదిదేవుని మూలముగా కాదా' అని బ్రహ్మంగారు చేసిన వ్యాఖ్య కూడ ఆర్థరహితమైనది . బైబిల్ త్రియేక దేవునిని బోధిస్తుంది కాబట్టి సృష్టి చేసింది ఒక్క వ్యక్తి కాదని అనేక వాక్యసందర్భాలలో రూఢి చేయబడింది.
|
ఉదా : మానవునిని సృజించేముందు సృష్టికర్త చేసిన సంభాషణ ఆదికాండము 1:26లో ఇలా చదువుతాం - “దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను”. పై వచనంలో సృష్టి చేసే ఒక వ్యక్తి, అదే పనిని చేసే మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ఈ మాటలు చెప్పినట్లు తేటగా తెలుస్తుంది.

ఐనా, ఓ పెద్ద విస్పోటనం వలన విశ్వం పుట్టిందని, ఆ గందరగోళం భూగోళానికి క్రమం చేకూర్చిందని ఆత్మవంచన చేసుకునే నాస్తికుడికి, సృష్టి ఎవరు చేస్తారనే సందేహం ఎందుకు కలిగిందో !

125. వీరబ్రహ్మం- వెలుగును చీకటి గ్రహించకపోతే వెలుతురుకి గుర్తింపెక్కడి నుండి వస్తుంది?

యోహాను 1:5లో ఇలా ఉంది. "ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. గాని చీకటి దానిని గ్రహీంపకుండెను” చీకటి వెలుగును గ్రహించకోపోతే, అక్కడ ఆ వెలుగుందని ఎలా తెలుస్తుంది?

జవాబు : వెలుగును చీకటి గ్రహించదు;వెలుగు చీకటిని పారద్రోలుతుంది. ప్రస్తుత సందర్భంలో ఈ వెలుగు క్రీస్తు కాగా, చీకటి పాపములో వున్న మనుషులు. పాపమనే చీకటి వలన వారు క్రీస్తు వెలుగును గ్రహించలేదు, కానీ క్రీస్తువెలుగు వారిపై ప్రసరించినప్పుడు చీకటి లయమై వారు వెలిగించబడతారని ఈ సందర్భంలోని పూర్తి భావం. “నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతీ మనుష్యుని వెలిగించుచున్నది”( యోహాను 1:9) అని ఇక్కడ చదువుతాం. అలా వెలిగించబడిన ప్రతీవారిలోను వెలుగుకు గుర్తింపు లభిస్తుంది. చీకటిలోనే కొనసాగాలని తీర్మానించుకున్న బ్రహ్మంగారిలాంటివారు ఈ వెలుగును ఎలాగూ గుర్తించలేరు.


“ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతీవాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు” (యోహాను 3:19-20).

126. వీరబ్రహ్మం- తనమీద ప్రజలకు నమ్మకం లేదని యేసుకీ అనుమానమే !

జనులలో ఆనాడు యేసుకీ తగిన గుర్తింపు లేదు. చాలామంది ఆయనను నమ్మలేదు, అంగీకరించలేదు. ఇందుకు బైబిల్లో ఉదాహరణ లెన్నో పేర్కొనవచ్చు . 1. “ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు” (యోహాను1:10) .
2. “ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు” (యోహాను 1:11)

3. "మా సాక్ష్యము మీరంగీకరింపరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఏలాగు నమ్ముదురు”? (యోహాను 5:12, 13) .

4. “వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి”. (యోహాను 8:19)

5. “ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.” (యోహాను 5:38).

6. “మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానోల్లరు” (యోహాను 5:40).

7. "నేను నా తండ్రినామమున వచ్చియున్నాను. మీరు నన్ను అంగీకరింపరు”. (యోహాను 5:43)

8. “మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పితిని” (యోహాను 6:36)

9. “నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు”. (యోహాను 8:45).

10. “నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు” (యోహాను 8:47).

11. “లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు”. (యోహాను 14:17).

12. “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయము తను అంగీకరింపడు, అవి అతనికి వెట్టితనముగా ఉన్నవి.” (1 కొరింథీయులకు 2:14). .

జవాబు: బ్రహ్మంగారు ఉదహరించిన పైవాక్యాలలో యేసు అనుమానంగా మాట్లాడడం లేదు. అసత్యంలో కొనసాగాలని తీర్మానించుకున్నవారు సత్యానికి చోటివ్వరని, అలాంటివారు ఆయనను నమ్మలేరని రూఢిగానే చెబుతున్నాడు. ఇది ఆనాడు మాత్రమే కాదు ఈనాటికి కూడా వాస్తవమే. బ్రహ్మంగారి లాంటివారే ఇందుకు నిదర్శనం. ఆయనగారు ఉదహరించిన వచనాలన్నీ ఆయన స్థితినే బహిర్గతం చేస్తున్నాయి.

127. వీరబ్రహ్మం- “వాక్యం శరీరాన్ని ధరిస్తుంది”!
బైబిల్లో పరిశుద్దాత్మ పావురమవటం (యోహాను 1:32), వాక్యం "శరీరధారి” కావటం సర్వసాధారణం, దీంట్లో సాధ్యాసాధ్యాల గురించి మనం అడుగకూడదు. యోహానుసువార్త 1:14లో ఇలా ఉంది. “ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ఖుడుగా మన మధ్య నివసించెను.”

జవాబు : అవును దీంట్లో సాధ్యాసాధ్యాల గురించి మనం అడగనక్కరలేదు; ఎందుకంటే దేవునికి సమస్తమూ సాధ్యమే.

128. వీరబ్రహ్మం- ఎవడూ ఎప్పుడూ దేవుడిని చూడలేదు !

యోహాను 1:18లో ఇలా ఉంది. “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను”.

జవాబు : అవును బ్రహ్మంగారు చెప్పినట్టు “ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను”. ఐతే ఈయనగారు లేఖనాన్నైతే చూపించారు కానీ ప్రశ్నించడం మర్చిపోయారు కనీసం మలిముద్రణలో ప్రశ్నేమిటో సెలవిస్తే మేము తప్పకుండా దానికి సమాధానం చెబుతాము.

129. వీరబ్రహ్మం- దేవదూతలు యేసు మీదగా ఎక్కుతారు, దీగుతారట !

“ఆయన (యేసు) - మీరు ఆకాశము తెరువబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కుటయును, దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను” (యోహాను 1:51).

జవాబు : దేవదూతలు దిగిరావడం, ఎక్కిపోవడం అనేది దేవుని సన్నిధికి నిదర్శనంగా ఉందని ఆదికాండము 28:12-17 నుండి గ్రహిస్తాం. ఇక్కడ యేసు తన మీదుగా దేవదూతల సంచారం జరుగుతుందని చెప్పిన అలంకారం నుండి ఆయనే దేవుని సాన్నిధ్యానికి మాధ్యమమని, పరలోకానికి , భూమికి మధ్య ఎలాంటి సంబంధానికైనా

ఆయనే వారధి లేదా నిచ్చెన వంటివాడని గ్రహించగలం. అలంకార భాషను పట్టుకుని దానికి అక్షరభావం తగిలించి అపహసించటం, ప్రశ్నలు కల్పించడానికి నానా పాట్లు పడటం, తీరని నాస్తికుల నిస్సహాయతను బయటపెడుతుందే తప్ప దాని వల్ల బైబిలుకు వచ్చిన నష్టమేమీలేదు.

130. వీరబ్రహ్మం- యేసు మీద విశ్వాసముంచిన వారికి విచారణ జరుగదు. డైరెక్టుగా పరలోకానికి సీటిచ్చేస్తారు!

యేసుని నమ్ముకొమ్మని, నమ్ముకుంటే వాళ్లు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళకు తీర్పు తీర్చబడదని దేవుడి పేరిట ఎలా గ్యారంటీ ఇవ్వబడిందో చూడండి.యోహాను 5:18లో ఇలా ఉంది. “ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు.”

జవాబు: నిజమే ఆయనయందు విశ్వాసముంచినవారికి ఏ శిక్షావిధియు ఉండదు. ఎలాంటివారికైనా ఈ వాగ్దానం వర్తిస్తుంది. ఎందుకంటే ఆయనయందున్న విశ్వాసము కేవలం ఆయన గురించి మనస్సులో కలిగే ఒప్పింపుకు లేదా భావనలకే పరిమితం కాదు. దేవుని సన్నిధికి పాపులను సహితం యోగ్యులుగా తీర్చిదిద్దే ఖచ్చితమైన లక్షణాలు క్రీస్తునందున్న విశ్వాసంలో ఉన్నాయి. విశ్వాసము హృదయాలను పవిత్రపరుస్తుంది అపొస్తలుల కార్యములు 15:9 ; విశ్వాసము మారుమనస్సుకు సంబంధించినదిఅపొస్తలుల కార్యములు 20:21; నీతి, ఆశానిగ్రహం ఈ విశ్వాసంలో ఇమిడివుంటాయి అపొస్తలుల కార్యముల 24:25. చీకటినుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవునివైపునకు నడిపించి ఈ విశ్వాసము పాపక్షమాపణ కలిగిస్తుంది(అపొస్తలుల కార్యములు 26:18). విశ్వాసము లోకాన్ని జయిస్తుంది (1యోహాను 5:4). క్రియల చేత రుజువుపరచబడని విశ్వాసము మృతము(యాకోబు 2:26). మరో మాటలో చెప్పాలంటే యేసునందున్న నిజమైన విశ్వాసం ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఇలాంటి మార్పు అనుభవపూర్వకంగా కలుగనివారికి నిజమైన విశ్వాసం లేదు. అందుకే, “మీరు విశ్వాసము గలవారైయున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి;మిమ్మును మీరే పరిక్షించుకొనుడి” ( 2కొరింథీ 13:5), అని విశ్వాసులమని చెప్పుకునేవారిని సైతం బైబిల్ హెచ్చరిస్తుంది. కాబట్టి బ్రహ్మంగారు పొరబడినట్లు క్రీస్తును నమ్ముకున్నామని ఆషామాషీగా చెప్పుకొనే ప్రతీ ఒక్కరు దేవుని తీర్పును తప్పించుకుంటారన్నది వాస్తవం కాదు; బైబిల్ ఇచ్చిన నిర్వచనానుసారంగా క్రీస్తును నమ్ముకున్నవారు మాత్రమే దేవునితీర్పును తప్పించుకుంటారు. “కాగా ఎవడైననూ క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి ; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను” (2 కొరింథీ 5:17). “కాబట్టి యిప్పుడు క్రీస్తునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు”(రోమా 8:1). బ్రహ్మంగారు జాగ్రత్త, “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును ? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు?” (1 పేతురు4:17-18 ).

131. వీరబ్రహ్మం- విశ్వసింపనివాడు ముందే తెలుసా? తెలిస్తే విశ్వసింపమని చెప్పనేల?

యోహాను 3:18లో ఇలా ఉంది. “యేసుని) విశ్వసింపనివాడు దేవుని ఆద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను”

జవాబు : సువార్త ప్రకటించబడినప్పుడు నమ్మనివారు అవిశ్వాసులుగా ముందే తీర్పుతీర్చబడ్డారని పై వచనంలోని ఆంతర్యం. అలాగైతే వారు తిరస్కరిస్తారని ముందుగా దేవునికి తెలిసినప్పటికీ సువార్త ప్రకటించడం ఎందుకు ? దీనికి జవాబును మనం పౌలు మాటల్లో తెలుసుకోవచ్చు - “రక్షింపబడువారి పట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్డమైన జీవపు వాసనగాను ఉన్నాము” ( 2కొరిం 2: 15-16 ). సువార్తను విశ్వసించినవారికి రక్షణ ఇవ్వడం మరియు అదే సువార్త విని కూడా నమ్మనివారికి శిక్ష విధించడమే సువార్త ప్రకటించడంలోని ఉద్దేశం.

132. వీరబ్రహ్మం- తీర్పు తీర్చే అధికారం తండ్రిదా, కొడుకుదా ?

లోకమునకు తీర్పు తీర్చే అధికారం తండ్రిదే. ఆ పని కుమారునిది కాదు అంటోంది యోహాను 8:17 ఆ అధికారం కుమారునిదే కాని, తండ్రిది కాదు అంటున్నాయి యోహాను 5:22-23 వాక్యాలు.

యోహాను 3:17 ప్రకారం “లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు”.

యోహాను 13:47లో యేసు ఇలా అంటున్నాడు. “ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన యెడల నేనతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని”.

యోహాను 5:22,23 ప్రకారం “తండ్రి యెవనికిని తీర్పు తీర్చడుగాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు”. యోహాను 5:27 ప్రకారం కూడా “ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను”.

జవాబు: బైబిల్లో యేసు క్రీస్తుకు రెండు రాకడలు చెప్పబడ్డాయి. ఈ రెండు పర్యాయాలలో కూడా తీర్పుతీర్చడానికి ఆయన తండ్రితో సమానంగా సార్వభౌమాధికారం కలిగినవాడైయున్నప్పటికీ మొదటిరాకడలో పాపులను రక్షించడానికి మాత్రమే దేవుని గొఱ్ఱపిల్లగా వచ్చాడు (యోహాను 3:17); రెండవసారి వారివారి క్రియల చొప్పున ప్రతిఫలమివ్వడానికి తీర్పరిగా వస్తాడు (మత్తయి 25:31-44 ) ఈ రెంటి మధ్య తారతమ్యం తెలియక బ్రహ్మంగారు తీర్పుతీర్చే అధికారం తండ్రిదా లేక కొడుకుదా అని పాపం సతమతమైపోతున్నారు. ఆ మాటకొస్తే, తీర్పు తీర్చే అధికారం విషయంలో మాత్రమే కాదు, అన్నిటిలోనూ తండ్రి కుమార పరిశుద్దాత్మల సమానత్వం లేఖనాల్లో కనబడుతుంది కాబట్టి ఫలానా అధికారం తండ్రిదా కొడుకుదా అని అడగటం అర్థరహితం.

133. వీరబ్రహ్మం- శిక్ష విధించువాడు దేవుడు కాడు, యేసే!

“శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే”. రోమా 8:34.

జవాబు : తీర్పుతీర్చే పూర్తి అధికారం తండ్రి ద్వారా కుమారునికి ఇవ్వబడింది కనుక, శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తుయేసే. ఇందులో లేని దోషము బ్రహ్మంగారికి ఎలా కనిపించిందో మరి ( యోహాను 5:27).

134. వీరబ్రహ్మం-దేవుడు కొలతల ప్రకారం ఆత్మను అనుగ్రహిస్తాడా ? ఐతే ఏమిటా కొలతలు?

యోహాను 4:34 లో ఇలా ఉంది “దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మననుగ్రహించును”. దేవుడు కొలతల ప్రకారం ఆత్మలను అనుగ్రహిస్తాడా ? ఐతే ఆయన పాటించే కొలమానం ఏమిటి ? ఆత్మకు అసలు బైబిలు ఇచ్చే నిర్వచనమేంటో ?

జవాబు: బ్రహ్మంగారు ఈ ప్రశ్నను లేవనెత్తిన తీరును అభినందించక తప్పదు. 'ఇంతకూ ఆత్మకు బైబిల్ ఇచ్చే నిర్వచనమేమిటి? అంటూ సరిగ్గానే దారికొచ్చారు. నిజమే, ఆత్మకు బైబిల్ ఇచ్చే నిర్వచనం తెలియకపోతే పై వచనంలోని మాటలు అర్థం చేసుకోవడం సాధ్యంకాదు. పరిశుద్ధాత్మను బైబిల్ ఒక వ్యక్తిగా నిర్వచిస్తుంది. ఒక వ్యక్తిగానే సంబోధిస్తుంది. “ఆయన”, “తాను” అనే వ్యక్తిగత సర్వనామాలు బైబిల్లో ఆయనకు బహుస్పష్టంగా ఆపాదించబడ్డాయి యోహాను 14:16-17,26, యోహాను 15:26యోహాను 16:7 రోమా 8:26ఒక వ్యక్తి మరొకరికి కొలత చొప్పున ఇవ్వబడడమనేది అక్షరార్థంలో సాధ్యపడదు. కాబట్టి, యేసుకు పరిశుద్ధాత్మ కొలత లేకుండా అనుగ్రహించబడ్డాడనే మాట ఏ భావంలో చెప్పబడిందో పరిశీలించడం ఉత్తమం. |

పరశుద్దాత్మ వరాలు అందరికీ ఒకే పరిమాణంలో ఇవ్వబడవని, సంఘంలో పరిచర్యావసరతను బట్టి ఒకొక్కరికి వేరు-వేరు వరాలు ప్రసాదించబడతాయని బైబిల్ బోధిస్తుంది (1కొరింథీయులకు 12:4-11). ఆయన చిత్తానుసారంగా కొందరికి ఎక్కువ మరికొందరికి తక్కువ వరాల్ని అనుగ్రహిస్తాడు. ఒకే శరీరంలోని వేరు వేరు అవయవాలకు వేరు వేరు పరిచర్యలు అప్పగించబడ్డాయి. పోలికలో ఒకరికంటే మరొకరి వరం తక్కువైనా, ఒకే శరీరావయవాలు కాబట్టి వారందరూ సమానమే. ఐతే, క్రీస్తుకు తండ్రి పరిశుద్దాత్మను ఎలాంటి పరిమితులు లేకుండా సమస్త వరాల సర్వపరిపూర్ణతలో అనుగ్రహించాడు. అందుకే, “కొలత లేకుండా” అనే అలంకారం ఇక్కడ వాడబడిందే తప్ప అక్షరార్థంలో ఆత్మకు కొలతలు కొలమానాలు ఉంటాయని భావం కాదు. అక్షరజ్ఞానం లేనివాడు పశుప్రాయుడని అంటుంటారు. అది నిజమో కాదో తెలీదు కాని, అలంకారజ్ఞానం లేనివాడు మాత్రం నాస్తికుడని నిరూపించడానికి బ్రహ్మంగారొక్కరే సరిపోయారు.

135. వీరబ్రహ్మం- దేవుడు, యేసుకంటే కూడా కుళ్ళుమోతు!

యేసుని ఎవరు నమ్మరో వారి మీద తన ఉగ్రత చూపిస్తూ ఉంటాడట దేవుడు. ఎంత ఉక్రోషమో చూడండి యోహాను 4:36 ఇలా చెప్తోంది. “కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును.

జవాబు: దేవుని ఉగ్రతను శాంతింపజేసేది ఏమిటో నిర్ణయించాల్సింది బ్రహ్మంగారు కాదు, దేవునికుమారునియందు విశ్వసించడమే తప్ప దైవోగ్రతను తప్పించుకునే మార్గమేదీ లేదన్నది దేవుని నిర్ణయం. దానిని 'దేవుని కుళ్ళుమోతుతనమని' అవహేళన చేసినప్పుడు - అంత్యదినాలలో దేవుని వాక్యాన్ని అపహాసించేవారు వస్తారనే ప్రవచనాన్ని బ్రహ్మంగారి లాంటివాళ్లు నిజం చేస్తున్నారు 2 పేతురు 3:3 , దీనివలన దేవునికి గాని దేవునివాక్యానికి గాని కలిగిన నష్టమేమి లేదు. ఐనా, యేసుకు దేవుడిచ్చిన ఈ ఘనతపై కుళ్ళుపడింది బ్రహ్మంగారు కాగా, దేవునిని కుళ్ళుమోతంటాడేమిటి? యేసును నమ్మకపోయినా ఫర్వాలేదు; వీరబ్రహ్మం అనబడే నాస్తికుని వెర్రివాదనలను మాత్రం తప్పక నమ్మండి' అని దేవుడు చెప్పుంటే బహుశా బ్రహ్మంగారు తృప్తిపడుండేవారేమో. దీనికి మించిన కుళ్ళుమోతుతనం ఇంకేముంటుంది ?

136. వీరబ్రహ్మం- శిష్యులను దోనెవేసికొని సముద్రానికి ఆవలి ఒడ్డున్న బేత్సయిదాకు వెళ్ళిరమ్మని ఆదేశించారు గురువుగారు. కానీ వారెళ్లింది ఎక్కడికి, బేత్సయిదాకా, గెన్నేసరతుకా, కపెర్నహోముకా?

యేసు సముద్రం మీద నడచి వచ్చాడనే మహిమను వర్ణించే కథలో మార్కు కథనం ఒకరకంగాను, యోహాను కథనం మరొక రకంగాను ఉంది. పరస్పర విరుద్దంగా కన్పించే ఈ సంఘటనలో క్రైస్తవ భక్తులు వాస్తవమని దేనిని నమ్మాల్సి ఉంటుందో?

మార్కు 6:45లో ఇలా ఉంది. “ఆయన జనసమూహమును పంపివేయునంతలో దోనె ఎక్కి అద్దరినున్న బేత్సయిదాకు ముందుగా వెళ్ళమని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను”. అప్పుడు శిష్యులేం చేశారో మార్కు 6:53లో చెప్పబడింది. "వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి”. అవతల బేతయిదా ఉంది. ముందు అక్కడికెళ్ళమన్నాడు గురువుగారు. శిష్యులు గెన్నేసరతు ఒడ్డుకొచ్చారట. పోనీ, ఇక్కడ దారిపట్టింది బేత్సయిదాకే అనుకుందాం.

ఇక యోహాను సువార్తకొచ్చేసరికి అసలు ప్రదేశం పూర్తిగా మారిపోయింది. అందులో 6:16 ఇలా వ్రాయబడింది. "సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రము నొద్దకు వెళ్ళి దోనెయెక్కి సముద్రపుటద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి.”

జవాబు: కపేర్నహెూము ఆనే ప్రదేశం గెన్నేసరేతు ప్రాంతానికి ఆంతర్భాగం కాబట్టి మార్కు 6:53, యోహాను 6:16 - 24 మధ్య ఎలాంటి పరస్పర వైరుధ్యం లేదు. బేత్సయిదాకు ముందుగా లేదా ఎదురుగా ఉన్న ప్రాంతం కుడా ఇదే కాబట్టి మార్కు 6:45లో యేసు తన శిష్యులను వెళ్ళమని ఆజ్ఞాపించింది కుడా ఈ స్థలానికే. బేతయిదాకు ముందుగా వెళ్ళమని యేసు చెప్పిన మాటలు సముద్రానికి ఆవలి ఒడ్డున వున్న బేత్సయిదకే వెళ్ళమని చెప్పినట్లు వక్రీకరించి ఇక్కడ లేని వైరుధ్యం పుట్టించాలని బ్రహ్మంగారు చేసిన కసరత్తు మరోసారి ఆయనగారి కుతంత్రాన్ని బహిర్గతం చెయ్యడానికి తప్ప మరేందుకు పనికి రాలేదు. భౌగోళిక శాస్త్రం మరియు చరిత్రపై ఆవగాహన లేకుండ కలిగే అనుమానాలకు హేతువాదమనే గౌరవాన్ని ఆపాదించుకోకపోతే బ్రహ్మంగారి నాస్తికవాదానికి సమర్థనలను వారు మాత్రం ఎక్కడ కొనితెచ్చుకోగలరు.

137. వీరబ్రహ్మం- యేసు శరీరాన్ని తిని, యేసు రక్తాన్ని త్రాగువాడే నిత్యజీవము గలవాడట.

యేసు మాట్లాడే చాలా పిచ్చిమాటల్లో తాత్త్వికార్థాన్ని వెతుక్కోవటం వృధా ప్రయాస. ఎంత తర్కశాస్త్ర ప్రవీణుడైనా దీన్ని ఎలా అన్వయించగలడు ?

యోహాను సువార్న- 6:50-58 వరకు చూడండి. “దీనిని (తన దేహాన్ని) తినువాడు చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యూదులు - ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను - మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేకాని, మీలో మీరు జీవముగలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నాశరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునైయున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నామూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము”.

జవాబు : నేను ద్వారమును, ద్రాక్షావల్లిని, గొఱ్ఱల కాపరిని అని యేసుక్రీస్తు అనేకమార్లు ఉపమానరీతిగానూ సాదృశ్యప్రాయంగానూ తనగూర్చి చెప్పుకోవడం జరిగింది. ఐనంత మాత్రాన ఆయన అక్షరార్థంగా తలుపు, ద్రాక్షావల్లి, గొఱ్ఱల కాపరి అయిపోడు. అదేవిధంగా తన శరీరాన్ని భుజించమని చెప్పినది కూడా అక్షరార్థమైన భావంలో కానేకాదు. భౌతిక శరీరానికి ఆహారం ఎంత అవసరమో, ఆత్మ జీవించడానికి యేసు అంతే అవసరం. అందుకే యేసు తనను తాను ఆహారంతో సాదృశ్యపరచుకున్నాడు యోహాను 6:35 యోహాను 6:56-57 . దీనిలో వున్న ఆధ్యాత్మిక సారాన్ని గుర్తించారు కనుకే నాటి అపొస్తలులు ఆ మాటలను విని కూడా ఆయనను వెంబడించటం మానలేదు. ఐతే ఆ ఆధ్యాత్మిక సారాన్ని గుర్తించలేదు కనుకే యూదులు ఆయనను తిరస్కరించి విమర్శించారు. బ్రహ్మంగారు కూడా ఆనాటి యూదుల వలే తిరస్కరించి విమర్శిస్తున్నారు.

138. వీరబ్రహ్మం- యేసును ఈసడించుకొని చాలామంది శిష్యులు ఆయనను వదలిపెట్టారు !

“ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట (పై పలుకులు) విని యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సణుగుకొనుచున్నారని యెరిగి. . . . . . ” యోహాను 6:60, 61). “అప్పటినుండి (పైన చెప్పిన అర్థం పర్థం లేని ప్రసంగం జరిగినప్పటినుండి) ఆయన శిష్యులలో అనేకులు వెనుక(కు) తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు - మీరు కూడా వెళ్లిపోవలెనని యున్నారా? అని పండ్రెండు మందిని అడుగగా. . . . . . . . ” (యోహాను 6:66, 67), వారు బుద్ధిమంతులవలె ఆయనతో పాటు ఉంటామని అంటారు.

జవాబు: వెటకారంగానైనా సరే బ్రహ్మంగారు నిజమే చెప్పారు. యేసు 12 మంది శిష్యులు బుద్ధిమంతులు కాబట్టి ఆయన చేసిన ప్రసంగంలోని ఆంతర్యాన్ని గ్రహించి ఆయనను వెంబడించారు. ఐతే వెంబడించకుండా ఆయనను విడిచిపెట్టిన శిష్యులకు మాత్రం ఆ ప్రసంగం బ్రహ్మంగారిలా అర్థంపర్థం లేనిదిగా అనిపించింది. వారు బుద్దిమంతులు కారుగా మరి.

139. వీరబ్రహ్మం- యేసు సోదరులు కూడా ఆయనయందు విశ్వాసముంచలేదు!---

యేసు ప్రభావం ఏపాటిదో చూడండి. “ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు” (యోహాను 17:5) తల్లిదండ్రుల్ని, ఆడబిడ్డల్ని అన్న దమ్ముల్ని అక్కచెల్లెళ్లను, ఐనవారినందర్నీ గాలికి వదిలేసి, తననే నమ్ముకోమని చెప్పినయేసుని సొంత తమ్ముళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఎలా నమ్ముతారు మరి?

జవాబు: తన స్వకీయులు తనను నమ్మకపోవడానికి కారణం యేసే స్వయంగా తెలియజేసాడు “అందుకు యేసు - ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను” (మార్కు 6:4). “ఒక మనుష్యుని యింటివారే అతనికి శత్రువులగుదురు” (మత్తయి 10:36) అని యేసు చెప్పిన మాట నెరవేర్పు యేసు ఇంటి నుండే ప్రారంభమైంది. ఆయన స్వయంగా మోయని కాడి తన శిష్యులను మోయమని ఎన్నడు ఆజ్ఞాపించలేదు. ఆయన తాగిన పాత్రలోనిదే ఆయనను వెంబడించువారు కూడా తాగవలసి ఉంది.

యేసు స్వకీయులు ఆయనను నమ్మలేదని ఉంది కానీ యేసు వారిని ద్వేషించినట్లు ఎక్కడా చెప్పబడలేదు. వారు చేసిన తప్పుకు యేసును నిందించడం అవివేకం. విరోధమెప్పుడు క్రైస్తవేతరుల నుండే ప్రారంభమౌతుంది.

కాబట్టి యేసు స్వకీయులు ఆయనను నమ్మకపోవడం పెద్ద వింతేమీ కాదు. అలాగే, యేసును వెంబడించేవారి స్వకీయులను కూడా ద్వేషించమని, గాలికొదిలేయమని యేసు ఎక్కడా బోధించలేదు. అలా అనిపించే ప్రతీ సందర్భములోను విరోధం వారి నుండి ప్రారంభమైనప్పుడు వారిని సంతోషపెట్టేలా సువార్త విషయమై విశ్వాసులు రాజీ పడకూడదనే భావంలో మాత్రమే యేసు బోధించాడని మేమిదివరకే నిరూపించాము (32, 54, 55, 87, 118, 120, 123 ప్రశ్నలకు వ్రాసిన జవాబులను చదవండి).

యేసు, తల్లిదండ్రుల్ని, ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లెళ్లను ఐనవారినందర్నీ గాలికి వదిలేయమన్నాడని బ్రహ్మంగారు మాటిమాటికి వాపోతున్నారు. ఐనా, మాకు తెలియక అడుగుతన్నాము, మనుష్యులందరు రసాయన మిశ్రమాలనే తన నాస్తిక సిద్ధాంతంతో పొంతనలేని ఈ బంధుప్రీతి బ్రహ్మంగారికి ఎలా పుట్టుకొచ్చిందో!

140. వీరబ్రహ్మం- మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము అని యేసుతో అంటే దాని అర్థం?

వాదోపవాదాల్లో మేమైతే వ్యభిచారము వల్ల పుట్టినవారము కాము అని అంటే దాని అర్థం, నీవు వ్యభిచారం వల్ల పుట్టినవాడివి అనే కదా! యేసు అసందర్భ ప్రేలాపన జరుపుతుంటాడు. అలాంటి ఒక సందర్భంలో ఆయనను నమ్ముకున్న యూదులు ఆయనతో గొడవపడాల్సి వస్తుంది. అప్పుడు వారు పై విధంగా అంటారు. యోహాను 8:41లో ఇలా ఉంది. “మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని (యేసు) వారితో చెప్పెను. అందుకు వారు (తనను నమ్మిన యూదులు) మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా..”

జవాబు : ఇక్కడ సందర్భంలో తేటగా కనిపించే వాస్తవమేమిటంటే, “మేము అబ్రాహాము సంతతివారము” అనే యూదుల ధీమాను యేసు సవాలు చేసి మాట్లాడాడు. దానికి స్పందనగా 'మేము అబ్రహాము సంతానమే, వ్యభిచారం వలన పుట్టినవారము కాము' అని గట్టిగా వాదిస్తున్నారే తప్ప, “నీవు వ్యభిచారము వలన పుట్టినవాడవని యేసుని వారు నిందించారనే భావం పూర్తిగా అసందర్భమైనది. బ్రహ్మంగారు తమ అసందర్భ ప్రేలాపన కప్పిపుచ్చుకోవడానికి, యేసు అసందర్భప్రేలాపన చేసాడని నిందించడం నిజంగా హాస్యాస్పదం.

141. వీరబ్రహ్మం- యేసుని అనుసరించిన యూదులు అతనిపై రాళ్ళేందుకు రువ్వబోయారు?

యేసు పిచ్చివాగుడును భరించలేక, అతనికి దయ్యం పట్టిందనుకొని యూదులు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తారు. ఐతే అదృష్టవశాత్తు యేసు తప్పించుకు పారిపోయాడు. యోహాను 8:53లో యూదులు ఇలా అడిగారు. "మన తండ్రియైన అబ్రహాము చనిపోయెను గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలు చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నవని ఆయన నడిగిరి”. అందుకు యేసు “మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన యెడల మీవలే నేనును అబద్దీకుడనై యుందునుగాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రియైన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను” (యోహాను 8: 54-56) “అందుకు యూదులు నీకింకను ఏబది సంవత్సరములైన లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటకు వెళ్ళిపోయెను” (యోహాను 8:57-59).

జవాబు : యేసుని అనుసరించిన యూదులు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తారు అని బ్రహ్మంగారు వాపోయారు. యేసును అనుసరించినవారందరు ఆయన శిష్యులు కారు. ఆయన మీదికి రాళ్లెత్తింది ఆయనను వెంబడించిన వారైనప్పటికి ఆయనకు సమర్పించుకున్నవారు కారు. విమర్శించడానికి మాత్రమే వాక్యముపై శ్రద్ద చూపించేది కేవలం బ్రహ్మాంగారు మాత్రమే కాదని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమౌతుంది. ఇంతకీ ఈయనగారు ఉదహరించిన యేసు మాటల్లో పిచ్చివాగుడు ఎక్కడుందో మాకు అర్థంకాలేదు. ఐనా, ప్రతి పిచ్చోడు తనకు చికిత్స చేయడానికి వచ్చిన వైద్యునికి పిచ్చివుందని అనుకుంటాడు; ఇదీ అంతే.

142. వీరబ్రహ్మం- దేవుడు తన మహిమలను ప్రయోగపూర్వకముగా ఋజువు చేసి చూపించడానికి అంధులను పుట్టిస్తాడట!

ఇదేపని పరిశోధన కోసం ఎవరైనా సైంటిస్టు చేస్తే ఊరుకుంటారా? దేవుడు ఎంత నిర్దయుడు? ఎంత స్వార్థపరుడు? యోహాను 9:3లో ఒక గ్రుడ్డివాని ఉదంతం ఉంది. “దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను”.

జవాబు: ఇదే పని సైంటిస్టులు చేస్తే ఊరుకోము. ఎందుకంటే వారు చేసేవన్నీ ప్రయోగాలే అవి చాలా శాతం వరకూ విఫలమౌతాయి. ఐతే దేవుని క్రియలు ఖచ్చితమైనవి, అవి ఏ మాత్రం ప్రయోగాత్మకమైనవి కావు. దేవుడు చూపు రప్పించాడు కనుక ఆయన నిర్దయుడు కాడు, స్వార్థపరుడు అంతకన్నా కాడు. దైవత్వం కన్నా, మానవత్వం ఎన్నో రెట్లు మంచిది అని బ్రహ్మంగారు విమర్శించే ప్రయత్నం చేసారు, మరి వీరు గొప్పగా చెప్పుకుంటున్న మానవత్వం కూడా దేవుడిచ్చిన దయాగుణమా లేక రసాయనఉత్పాదకమా ?

143. వీరబ్రహ్మం- ప్రభు యేసుకృప వల్ల గ్రుడ్డివాడు చూపు పొందిన విధంబెట్టిది?

యోహాను 9:6-8లో ఇలా ఉంది. “(యేసు) నేల మీద ఉమ్మివేసి, ఉమ్మితో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురదపూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్లి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమును మాటకు పంపబడినవాడని అర్థము. వాడు వెళ్లి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను”.

జవాబు : మా వద్ద బైబిళ్ళు లేవనా, బ్రహ్మంగారు తన పుస్తకంలో వచనాలు వ్రాసి ప్రచురించారు? సరిగ్గా ప్రశ్న లేవనెత్తడం కూడా చేతకాలేదు. ఐనా అడిగిందే అడగడం ఈయనగారికి అలవాటు కాబట్టి 75, 76 ప్రశ్నలలో అడిగిందే ఇక్కడ కూడా అడుగుతున్నారేమో! అక్కడ మేమిచ్చిన జవాబు చూడండి.

144. బైబిలు దేవుడు పాపుల మొర ఆలకింపడు!

యోహాను 9:31లో ఇలా ఉంది. “దేవుడు పాపుల మనవి ఆలకింపడని యెరుగుదుము, ఎవడైనను దేవభక్తుడైయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును”. వాస్తవము ఇది కాగా, ఆ దేవుడి కుమారుడైన యేసు గురించి “యేసు క్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెను” అని ప్రచారం చేస్తారు ఏమిటి?

జవాబు: ఈ ప్రశ్న 3వ పాయింటులోనే ఆయ్యవారు లేవనెత్తారు, దానికి మేము సమాధానం కూడా చెప్పేశాము.

145. వీరబ్రహ్మం- యేసుకిదేం పాడు కోరిక ?

“యేసు - చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను. అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను” (యోహాను 9:39). చూడనివారు చూడాలనటం మంచిదే. కానీ, ఇదేం పాడు సంకల్పం చూచువారు గ్రుడ్డివారు కావాలనటం?

జవాబు: యేసు ఇక్కడ మాట్లాడుతున్నది శారీరక అంధత్వం గురించి కాదు. తమకు సమస్తము తెలుసని విఱ్ఱవీగే శాస్రుల యొక్క మరియు పరిసయ్యుల యొక్క ఆత్మీయ అంధత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. స్వస్థపరచబడిన గ్రుడ్డివాడు మనోనేత్రములు తెరవబడినవాడై యేసును విశ్వసించాడు (37 వచనం) కానీ శాస్త్రులు, పరిసయ్యులు తాము కనుదృష్టి కలిగివున్నప్పటికీ యేసు అద్భుతాన్ని మనోనేత్రముతో గ్రహించలేని గ్రుడ్డివారైపోయారు. అందుకే యేసు, తనను విశ్వసించకుండానే తాము నీతిమంతులమని భావించేవారిని పాపులుగానూ (ఆత్మీయ అంధులు), విశ్వసించిన పాపులను నీతిమంతులుగా( మనోనేత్రములు తెరవబడినవారు తీర్పుతీర్చడానికి నేను ఈ లోకానికి వచ్చానని అన్నాడు. బ్రహ్మంగారు తమ నాస్తిక అంధత్వంవల్ల ఈ భావాన్ని గ్రహించలేకపోయారేమోకానీ, విషయాన్ని సందర్భసహితంగా విశ్లేషించగలిగే ఇంగితం ఉన్నవారికి మేమిచ్చిన వివరణతో ఎలాంటి సమస్య ఉండదు (పూర్తి సందర్భం కొరకు 34-41 వచనాలు చదవండి).

146. వీరబ్రహ్మం- యేసు దృష్టిలో ప్రజలు గొట్టెలు, ఆయనకు ముందు వచ్చిన ప్రవక్తలందరు దొంగలు!


యోహాను 10:7, 8 వాక్యాలు ఇలా ఉన్నాయి. “గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునైయున్నారు, గొర్రెలు వారి స్వరమును వినలేదు”.

శిష్యులు కూడా ప్రజలను గొర్రెలుగానే భావించినట్లు హెబ్రీ 13:20 ద్వారా తెలుస్తోంది. “గొర్రెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువు” అని ఉంది.

జవాబు: బ్రహ్మంగారు తప్పుగా చిత్రీకరించారు, యేసుకంటే ముందుగా వచ్చిన ప్రవక్తలు దొంగలు అని వ్రాసారు. వాస్తవానికి యేసు చెప్పింది తనకంటే ముందుగా పంపబడిన దైవప్రవక్తలను గురించి కాదు, ఎందుకంటే వారందరూ కూడా “యేసుక్రీస్తు” అనే మార్గము గుండా వచ్చినవారే యోహాను 10:1, యోహాను 8:56 ; హెబ్రీ 11:24. ఐతే, దైవప్రవక్తలమని చెప్పుకుని ప్రజలను వంచించడానికి తమ సొంత మార్గం గుండా వచ్చిన అబద్దికులను గురించి యేసు ఇక్కడ చెప్పాడు, ముఖ్యంగా యేసు చెప్పిన ఈ మాటలు శాస్త్రులకు మరియు పరిసయ్యులకు వర్తించే విధంగా ఉన్నాయి.

ఇకపోతే, గొర్రెలు అనే అలంకారాన్ని పట్టుకొని బ్రహ్మంగారు మరోసారి కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నారు. మంచికాపరి తన గొర్రెలకు ఇచ్చే సంరక్షణ మరియు పోషణ దేవుడు తన ప్రజలకు ఇస్తున్నందున ఆయనను కాపరిగాను, వారిని గొర్రెలుగాను బైబిల్ అభివర్ణించింది. ఈ సాధారణ అలంకారాన్ని కూడా గ్రహించలేని నాస్తికుడు మనకు హితోపదేశం చేస్తాడట.

147. వీరబ్రహ్మం- దేవుడినని చెప్పుకుంటున్నందుకు యేసుని పట్టుకొని కొట్టబోయారు!

“యేసు - తండ్రియొద్దనుండి అనేకమైన మంచిక్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు - నీవు మనుష్యుడవైయుండి దేవుడని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము గాని మంచిక్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి” (యోహాను 10:32-54).

యేసు మళ్లీ తనను తాను సమర్ధించుకున్న తరువాత “వారు మరల ఆయనను పట్టుకొన చూచిరి గాని ఆయన వారిచేతినుండి తప్పించుకొని పోయెను” (యోహాను 10:39).

జవాబు : అవును బ్రహ్మంగారు అన్నది నిజమే, యేసు తాను దేవుడనని చెప్పుకున్నందుకు యూదులు ఆయనను కొట్టబోయారు. ఐతే, యేసు పలికిన ఈ మాటల్లో బ్రహ్మంగారికి కనిపించిన లోపమేమిటో చెప్పలేకపోయారు, ప్రశ్నేమిటో అడగలేకపోయారు. ఐనా, వాదించి నెగ్గలేనప్పుడు రాళ్లు రువ్వడం, రాళ్ళు రువ్వే అవకాశం కూడా లేనప్పుడు, వెటకారంతో సరిపెట్టుకోవడం సర్వసాధారణమే.

148. వీరబ్రహ్మం- దేవుని కుమారుడు మహిమపరచబడుటకు పాపం ఒకనికి వ్యాధి కల్పించబడింది!

“ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను” అని యోహాను 11:4లో ఉంది.

జవాబు: దేవుని కుమారుడు మహిమపరచబడుటకు ఒకనికి వ్యాధి కల్పించబడింది అని వ్రాసి ఉన్నట్లుగానే యేసు, చనిపోయిన లాజరును బ్రతికించి తన నామాన్ని మహిమపరచుకున్నాడు, అని కూడా వ్రాయబడింది. అది చూసిన అనేకమంది యూదులు ఆయనయందు విశ్వాసముంచారు (యోహాను 11:45) ఇందులో బ్రహ్మంగారికి వచ్చిన నష్టం ఏమిటో చెప్పనేలేదు. (142వ ప్రశ్నకు వ్రాసిన జవాబును పోల్చి చదవండి).

149. వీరబ్రహ్మం- యేసు ఆత్మలో మూలుగుతాడు! ఆత్మలో మూలగటం ఏమిటి ?

యోహాను 11:55లో ఇలా ఉంది. “ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు....

జవాబు: మూలగడం అంటే లోలోపల కుమిలి కుమిలి దు:ఖించడం అని అర్థం. లాజరు చనిపోయినప్పుడు అతని విషయమై యేసు ఎంతగా దు:ఖంచాడో యోహాను 11:33లో చెప్పబడింది. ఈమాత్రం దానికి బ్రహ్మంగారు ఇంతిలా మూలగడమెందుకు?

150. వీరబ్రహ్మం - యేసు కడపటి దినాల్లో అజ్ఞాతవాసం చేశాడు!

యోహాను 11:53,54 వాక్యాలు ఇలా ఉన్నాయి. “ఆ దినము నుండి వారు (తనవారైన యూదులు) ఆయనను చంపనాలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక, అక్కడనుండి అరణ్యమునకు సమీప ప్రదేశములోనున్న ఎఫ్రాయిమను ఊరికి వెళ్లి, అక్కడ తన శిష్యులతో కూడ ఉండెను. యోహను 12:37లో ఇలా ఉంది. “యేసు ఈ మాటలు చెప్పి వెళ్లి వారికి కనబడకుండ దాగియుండెను. ఆయన వారి యెదుట యిన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి”.

జవాబు: 5వ ప్రశ్నకు వ్రాసిన మా జవాబును చదవండి.

151. వీరబ్రహ్మం - ఈ తప్పు దేవుడిదే కదా?

యోహాను 12:40 లో ఇలా ఉంది. “వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వల్ల స్వస్థపరచబడకుండునట్లు ఆయన (దేవుడు) వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను”.

దేవుడు స్వస్థపరిచేవాడుగా ఉండాలి గాని, తద్విరుద్ధంగా ఉండటమేంటి? హృదయమును కఠినముచేసి వారిని పాషండులుగాచేయటమెందుకు? వారిని మంచివారుగానే చెయ్యొచ్చు గదా ?

జవాబు: 71 ప్రశ్నకు వ్రాసిన మా జవాబును చదవండి.

152. వీరబ్రహ్మం- యేసు ఆత్మలో కలవరపడి నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను!

బైబిలు రచనాశైలి గురించి పెద్దగా వ్యాఖ్యానించనవసరం లేదు. మీరే చిత్తగించండి. యోహను 13:21లో ఇలా ఉంది. “యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి - మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను”.

జవాబు: బైబిల్ రచనాశైలి గురించి పెద్దగా వ్యాఖ్యానించనవసరం లేదు అని బ్రహ్మంగారు బాగానే చెప్పారు. అందరికీ అర్థమయ్యే విధంగా వ్రాయబడింది. ఇస్కరియోతు యూదా యేసును అప్పగించటం ద్వారా, యేసు చెప్పిన మాట అక్షరాలా నెరవేరడం కూడా జరిగిపోయింది. ఇంతకీ ఇందులో సమస్యేమిటంట?

153. వీరబ్రహ్మం- ఇలాంటి సుత్తి ఎంతో మళ్లీమళ్లీ కూర్చితేనే అంత పుస్తకమయ్యింది!

యోహాను13:31, 32 వాక్యాలు ఇలా ఉన్నాయి. “వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను- ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమపరచబడి యున్నాడు. దేవుడును ఆయన యందు మహిమ పరచబడియున్నాడు. దేవుడు ఆయనయందు మహిమపరచబడిన యెడల, దేవుడు తనయందు ఆయనను మహిమపరచును;వెంటనే ఆయనను మహిమ పరచును”.

జవాబు: అవును ఇలాంటి సుత్తి ప్రశ్నలెన్నో కలిపితేనే కనీసం ఈపాటి పుస్తకాన్నైనా వ్రాయగలిగారు బ్రహ్మంగారు.

154. వీరబ్రహ్మం- “దేవుణ్ణి చూపించమంటారేమిటి? నన్ను చూస్తే ఆయన్ను చూసినట్లే”- యేసు

దేవుడు నా తండ్రి అంటావు గదా! నిజంగా నీవు దేవుడి కుమారుడివి ఐతే, ఆయన్ను మాకు చూపించుమని ఫిలిప్పు యేసును నిలదీస్తే అబద్ధాల యేసు జవాబు సూటిగా చెప్పలేక, అతి తెలివిగా తప్పించుకున్నాడు. మహిమపరచబడిన వాడే ఐతే తన మహిమను చూపించటానికి తన తండ్రియైన దేవుణ్ణి చూపించొచ్చుగా?

యోహాను 14:8, 9 లలో ఇలా ఉంది. “ఫిలిప్పు - ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయననతో చెప్పగా, యేసు - ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు”?

జవాబు : ఏ మనిషి తేజోమయుడైన దేవునిని ఇంతవరకూ చూడలేదు (యోహాను 1:18) అందుకే యేసు ఈ లోకానికి మానవ అవతారిగా వచ్చి దేవుని కనపరచాడు. అంతమాత్రమే కాదు, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది కొలొస్సీయులకు 2:9. కనుక క్రీస్తును చూస్తే దేవుని చూచినట్లే. అందుకే- నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు అని యేసు అన్నాడు.

యేసు అబద్దమాడాడని, జవాబు చెప్పలేక తెలివిగా తప్పించుకున్నాడని నిందించే ప్రయత్నం చేసారు బ్రహ్మంగారు. విమర్శించే ప్రతీసారీ బ్రహ్మంగారు నిందించే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఆ నిందను నిరూపించలేకపోతున్నారు, నిరూపించే సత్తా ఆయన ఆశ్రయించిన నాస్తికానికి కొరవడింది కాబోలు.

155. వీరబ్రహ్మం- పరిశుద్ధాత్మ వలన పుట్టిన యేసును జ్ఞాపకం చేయటానికి పరిశుద్ధాత్మ వస్తాడు!

యేసు పరిశుద్ధాత్మ వలన కన్య మరియకు పుట్టాడు. ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికి యేసు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తరువాత ఆయన చెప్పిన సంగతులు ప్రజలకు జ్ఞాపకం చేయటానికి పరిశుద్దాత్మ (ఉత్తరవాది) వస్తాడు అని ఉంది. మరియను గర్భవతిని చేసిన ఆ పరిశుద్దాత్మ, యేసును గురించి ప్రజల్లో జ్ఞాపకం చేసిన ఈ పరిశుద్దాత్మ ఒక్కడేనా? వేరువేరా? ఒక్కటి కాదని, పరిశుద్దాత్మలు ఇంకా ఎక్కువమంది ఉన్నారని అనుకోవాలి. యోహాను 14:26లో ఇలా ఉంది.

ఆదరణ కర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు బోధించి, నేను మీతో చెప్పిన సంగతులన్నింటిని మీకు జ్ఞాపకము చేయును”.

జవాబు : బైబిల్లో చెప్పబడిన పరిశుద్ధాత్ముడు ఒక్కడే, ఈ పరిశుద్ధాత్మ ద్వారానే కన్య మరియ గర్భవతి అయినది, ఈ పరిశుద్ధాత్మే ఆదరణకర్తగా చెప్పబడ్డాడు. ఈ పరిశుద్ధాత్మే యేసు చెప్పిన సంగతులన్నింటిని మనకు జ్ఞాపకము చేస్తాడు. ఒకే వ్యక్తి ఒక్కపనికంటే ఎక్కువ పనులు చేయలేడా? రెండుపనులు చేస్తే ఒకరు ఇద్దరవుతారా ? బ్రహ్మంగారు ఒక్కరే ఐనప్పటికీ ఎన్నోపనులు చక్కబెట్టుకోలేరా? ఏమిటి ఈ మతిచెడిన ప్రశ్న, ప్రశ్నల సంఖ్య పెంచుకోవడానికి కాకపోతే! 68 ప్రశ్నకు వ్రాసిన మా జవాబును చదవండి.

156. వీరబ్రహ్మం- దేవుడు లోకాధికారి కాడు. లోకాధికారితో యేసుకు సంబంధం లేదు !

యోహాను 14:30లో “ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియు లేదు” అని ఉంది. మొదటినుంచి యేసు తాను దేవుడి కుమారుడినని చెప్పుకున్నాడు. పై వచనాన్ని బట్టి దేవుడు లోకాధికారికాడని, ఆ లోకాధికారితో యేసుకి సంబంధమేమి లేదని అనుకోవాల్సి ఉంటుంది.

జవాబు : వాస్తవానికి, దేవుడే సృష్టిని అందులోని సమస్తాన్ని నిర్మించినవాడు, దేవుడే ఈ లోకానికి అధికారి. తన స్వరూపంలో పుట్టించిన మానవునికి సమస్త అధికారాన్ని అప్పగించాడు. (ఆదికాండము 1:29-31). ఐతే సాతాను చర్యల వల్ల మానవుడు మోసగింపబడినవాడై తన అధికారాన్ని కోల్పోయినప్పుడు అది సాతాను వశమైంది లూకా 4:6. అందుకే యేసు అపవాదిని “ఈ లోకాధికారీ” అని పిలిచాడు. అందుకే తనతో సాతానుకు ఏ సంబంధం లేదని యేసు అంటున్నాడు. ఐతే యేసు సిలువలో సాతానును ఓడించడం ద్వారా ఆ అధికారాన్ని తిరిగి తన ప్రజలకొరకు సంపాదించాడు లూకా 11:21-22, యోహాను 12:31; కొలొస్సీ పత్రిక 2:15 ; మత్తయి 28:18-19. కాబట్టి, పై వచనాన్ని బట్టి దేవుడు లోకాధికారి కాడని, ఆ లోకాధికారితో యేసుకి సంబంధమేమి లేదని ఇక బ్రహ్మంగారు దిగులుపడాల్సిన ఆవసరం లేదు.

157. వీరబ్రహ్మం- స్నేహించును అనొచ్చా?

యోహాను 15:19 లో ఇలా ఉంది. “మీరు లోకసంబంధులైన యెడల లోకము తనవారిని స్నేహించును”.

జవాబు : స్నేహించును అనొచ్చు, అలా అనడంలో వచ్చే నష్టమేమీ లేదు. చిన్నప్పుడు బడిలో అడిగి తెల్సుకోవాల్సినవి నాస్తికులు ఇలా పుస్తకాలు రాసి అడుగుతారన్నమాట.

158. వీరబ్రహ్మం- యేసు బోధించకుంటే పాపము లేకపోయేది !

యోహాను 15:22లో ఇలా ఉంది. “నేను (యేసు) వచ్చి వారికి బోధింపకుండిన యెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు” దీన్నిబట్టి అర్థమయ్యేది ఏమిటంటే, యేసు వచ్చి జనాల్లో తన బోధ చెయ్యకుండా ఉండి ఉంటే, వారికి పాపము లేక పొయ్యేది. తన బోధ వల్ల జనుల్ని పాపులుగా చేశాడు; అందువల్ల అతనూ పాపం మూటగట్టుకున్నాడు.

జవాబు : క్రీస్తు భూమి మీదకు వచ్చినా రాకపోయినా మనుష్యులందరూ పాపులే రోమా 3:9-19,23 రోమా 5:12. ఆయనను తృణీకరించిన యూదులు పాపంతో నిండి వున్నారుయోహాను 8:24,40,44; మత్తయి 23:13-15, 25, 28, 32-36. ఐతే, క్రీస్తు వారిదగ్గరికి రావడం మరింకేదీ బయటపెట్టలేనంత స్పష్టంగా వారి పాపపు గుణాన్ని బయటపెట్టింది. చీకటంటే వారికున్న ఇష్టం, దేవునిపట్ల వారి ద్వేషం తేటతెల్లమయ్యాయి యోహాను 3:19,20. వారి మతం అనే ముసుగు వారి దుర్మార్ధతను దాచి ఉంచలేకపోయింది. క్రీస్తు బోధ విన్న తర్వాత తాము చేస్తున్నది తప్పు అని తమకు తెలియదనేందుకు వారికి ఎలాంటి సాకూ లేదు. ఈ భావంలోనే “నేను (యేసు) వచ్చి వారికి బోధింపకుండిన యెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు” అని ఆయన ప్రకటించాడు. అంతేకానీ, బ్రహ్మంగారు సూచించినట్లు, వారి పాపాలకు ఆయన రాకే కారణమని భావంకాదు.

159. వీరబ్రహ్మం- యేసు చెయ్యలేని పని ఆదరణకర్త చేస్తాడట. ఇంతకీ ఇతడెవరు!

యోహను 16:17, 8 వాక్యాలు ఇలా ఉన్నాయి. “నేను (యేసు) వెళ్లిన యెడల ఆయనను (ఆదరణ కర్తను) మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన జేయును.

జవాబు: యేసుకు చేతకాని పని ఆదరణకర్త చేస్తాడని బ్రహ్మంగారు ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఐతే ఇది తనకు చేతకాని పని కాబట్టి ఆదరణకర్త వచ్చి చేస్తాడని యేసు ఇక్కడ చెప్పడం లేదు, యేసుకు చేతకాని కార్యమంటూ ఏదీ లేదు. ఫలానావారు ఈ పని చేస్తారని చెప్పడం చేతకానితనానికి నిదర్శనమని బ్రహ్మంగారి నిఘంటువు మాత్రమే నిర్వచిస్తుంది.

160. వీరబ్రహ్మం- యేసు లోకహితం కోరలేదు. ఆయన విశ్వమానవుడు, మహామనీషి కాడు!

“లోకాస్సమస్తాస్సుఖినోభవంతు” అనేది శ్రేయోధర్మ వాక్యం. ఇది విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి ప్రతీక. యేసు ఇందుకు భిన్నంగా సంకుచితవాది. ఆయన లోకహితము కోరి ప్రార్థన చేసేవాడు కాడు. కేవలం తనను నమ్మినవారి శ్రేయస్సు గురించి మాత్రమే ప్రార్థన చేసేవాడు. యోహాను 17:9లో యేసు ఇలా అన్నాడు “నేను వారి కొరకు (నమ్మిన వారి కొరకు) ప్రార్థనచేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట లేదు, నీవు (దేవుణ్ణి ఉద్దేశించి) నాకు అనుగ్రహించియున్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను”. యోహాను 17:21లో ఉన్నది కూడా ఇందుకు అనుకూలంగానే ఉంది. అదిలా ఉంది. ". . . . . వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై యుండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను”.

జవాబు: క్రీస్తును తిరస్కరించిన లోకస్తులు, దేవుడు వారి సమాధానార్థమై సిద్దపరచిన ఏకైక మార్గాన్ని వద్దనుకున్నారు. అలా కాదనుకున్నవారి కొరకు ప్రార్ధన చేయడం వ్యర్థమే. ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదనేది యేసు నియమం. దేవునిని ధిక్కరించిన వారికొరకు దీవెనలు కోరడం, దైవధిక్కారంలో వారితో చేతులు కలపడమే. యేసు అలాంటి పని ఎప్పుడూ చేయడు.

ఇక బ్రహ్మంగారు హితవు పలికినట్లు 'లోకాస్సమస్తాస్సుఖినోభవంతు' అనేది శ్రేయోధర్మ వాక్యమని బేషరతుగా అంగీకరించాల్సొస్తే లోకంలో ఉన్న ఉగ్రవాదులు, వేశ్యావర్తకులు, అసాంఘిక శక్తులు మొదలైనవారి కొరకు కూడా ఈ విశ్వమానవ సౌభ్రాతృత్వ ఆశీర్వచనం పలకాలంటారా? ఐతే ఆ ఆధిక్యతను నాస్తికులకే కేటాయిద్దాం.

161. వీరబ్రహ్మం- యేసును ముట్టుకుంటే ఆయనకు తండ్రి వద్దకు ఎక్కిపోయే శక్తి పోతుందా?

యోహాను 20:17లో యేసు ఇలా జాగ్రత్త తీసుకున్నాడు. “యేసు ఆమె (మరియ)తో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు” అని హెచ్చరించాడు.

జవాబు: మరియ ముట్టుకుంటే తండ్రి వద్దకు ఎక్కిపోయే శక్తి యేసు కోల్పోతాడని లేఖనంలో ఎక్కడుంది? ఎవరు ఎప్పుడు ఆయనను ముట్టుకోవాలో ఎవరు ఎప్పుడు ముట్టుకోకూడదో ఆయన నిర్ణయించగలడు. దీనికీ ఆయన శక్తిసామర్థ్యాలకు ఎలాంటి సంబంధమూ లేదు.

162. వీరబ్రహ్మం- కుమ్మరించటానికి ఆత్మ నీటిలాంటిదా, ఆముదంలాంటిదా లేక బూడిద వంటిదా?

అపొస్తలుల కార్యములు 2:16లో యోవేలు ప్రవక్త ఇలా చెప్పాడని పేతురంటున్నాడు. “అంత్య దినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను”.

జవాబు: వాస్తవానికి, పొగ పీల్చరాదు అని చెప్పాలి కానీ పొగత్రాగరాదు అంటారు. ఐనప్పటికీ భాషాపరంగా దానిని మనం తప్పుగా చూడం. అదేవిధంగా సునిశితశైలిలో అక్షరార్థంగా మాట్లాడాల్సిన పదాలు వ్యవహారిక శైలిలో మరోలా వినియోగించినప్పుడు వాటిని తప్పులుగా చూడడం కంటే బుద్ధిహీనత మరొకటుండదు.

ఆత్మకుమ్మరింపు కూడా ఈ కోవకు చెందినదే. పరిశుద్ధాత్మను మనుష్యులందరికి ఆనుగ్రహిస్తాడనే భావంలో ఈ మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను” అని చెప్పబడింది. ఇది వ్యవహారిక భాషాశైలిలో వ్రాయబడినదే తప్ప అక్షరార్థ భాషాశైలిలో చెప్పబడిన మాట కాదు. కాబట్టి' కుమ్మరించటానికి ఆత్మ నీటిలాంటిదా, ఆముదంలాంటిదా లేక బూడిద వంటిదా?' అనే ప్రశ్న ఆర్థరహితమైనది.

p163. వీరబ్రహ్మం- యేసు ప్రభువా? లేక దేవుని సేవకుడా ?

అ.కా 2:36 ప్రకారం యేసు ప్రభువు. అది ఇలా ఉంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను”. అకా. 3:26 ప్రకారం యేసు దేవుని సేవకుడు. అది ఇలా ఉంది. “దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను”.

 

జవాబు: దేవుడు తన సేవకుడిగా పుట్టించిన యేసును ప్రజలందరిపై ప్రభువుగా నియమించాడు. దేవుని సేవకుడు ప్రభువు కాకూడదని నియమమేదైనా వుందా? ఇదేదో పెద్ద అర్థంకాని జటిలమైన సమస్య అన్నట్టు బ్రహ్మంగారు విమర్శించే ప్రయత్నం చేసారు.

164. వీరబ్రహ్మం- అపొస్తలుల కార్యములు లేదా, దుండగుల (రౌడీల) పనులు !

యేసు యొక్క ముఖ్య శిష్యులు తదనంతర కాలములో అపొస్తలులుగా పిలువబడ్డారు. యేసు తన తదనంతరం బోధ చెయ్యటానికి వీరినే హక్కుదారులగా నియమించాడు. మతగురువుల వేషాల్లో వీరెంతటి ఘాతుకాలు, దారుణాలు చేసేవారో అ. కా. 5వ అధ్యాయంలో ఒక సంఘటన చదివితే తెలుస్తుంది.

సంపాదించింది సాంతం యేసుకు సమర్పించుకోవాలా ? అలా అననీయ సమీరా అనే సామాన్య దంపతులు చేయనందుకు యేసు ప్రధాన శిష్యులైన అపొస్తలులు అమానుషంగా చంపేశారు. చంపేశారు అని తెలిస్తే హంతకులుగా వారిపై ముద్ర పడుతుందని, అపొస్తలుల యొక్క మహిమా శక్తి వల్ల వారంతట వారే చచ్చిపోయారని గొప్పచేసి రాశారు.

అసలు విషయానికొస్తే క్రైస్తవులు దేవుడి సేవ కొరకు తాము సంపాదించుకుంటున్న దాంట్లో దశమభాగాన్ని సమర్పించుకోవాలి అనే ఆజ్ఞ ఉంది. కాగా, ఈ అపోస్తలులు దాన్ని అతిక్రమించి, అమాయకులైన సామాన్య విశ్వాసుల దగ్గర దౌర్జన్యంగానైనా సరే మొత్తం దండుకునే వాళ్లని తెలుస్తోంది. దానం చెయ్యటం అనేది దాతల ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అది స్వచ్ఛందమైన విషయం. అది బలవంతం మీద జరుగకూడదు. అలా జరిగేది దౌర్జన్యం అనిపించుకుంటుంది. అడుక్కోవటం అడుక్కునే పద్దతిలో జరగాలి. అంతేకానీ, దానికి అంతివ్వు, ఇంతివ్వు అనే నియమాలు పెట్టగూడదు. అపొస్తలుల రాక్షస కృత్యానికి ఒక ఉదాహరణగా అ.కా. 5:1-13లో ఉన్న ఒక సంఘటనను పేర్కొనవచ్చు. చదివి ఆలోచించండి.

“అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య యెరుకనే -వాడు దాని వెలలో కొంత దాచుకొని, కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాతను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించేను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి.

ఇంచుమించు మూడుగంటల సేపటికి వాని భార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె - అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల వద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని, ఈ సంగతులు వినిన వారందరికిని మిగుల భయము కలిగెను”.

జవాబు: అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వ్రాయబడింది, అపొస్తలుల ద్వారా దేవుడు జరిగించిన గొప్ప సూచకక్రియ. దేవునిని మోసగించినందుకు అననీయ సప్పీరాలకు పరిశుద్దాత్ముడు విధించిన న్యాయార్ధమైన శిక్ష అని ఆ సందర్భాన్ని చదివినవారికెవరికైనా తెలుస్తుంది. తాము అమ్మిన పొలానికి సంబంధించిన వెల విషయంలో దేవునితో అబద్దమాడినందుకు వారు చనిపోయారు తప్ప యేసు శిష్యులు మతగురువుల వేషాల్లో ఘాతుకాలకు పాల్పడలేదు. యేసు యొక్క ముఖ్య శిష్యులే వారిని చంపి, తమ హత్యానేరాన్ని కప్పిపుచ్చడానికి, అది దైవశక్తికి ఆపాదించారన్న బ్రహ్మంగారి ఆరోపణ వాస్తవమైతే, బహిరంగంగా జరిగిన ఈ సంఘటనను చూసి యూదామతాధికారులు లేదా అక్కడ వున్నవారందరూ అపొస్తలులపై హత్యానేరాన్ని ఎందుకు మేపలేదు ? అప్పటికే యేసు శిష్యులకు యూదామతాధికారుల యొద్ద నుండి తీవ్రమైన వ్యతిరేకత వున్నప్పటికీ శిష్యులను ఎందుకు శిక్షించలేదు? ఐతే, తరువాత వీరు చెరసాలలో వేయబడినప్పుడు కూడా యూదమతాధికారులు ఏలాంటి హత్యానేరాన్ని కానీ మరేయితర దోషారోపణ కానీ వీరిపై చేయలేకపోయారు. కాబట్టి అపొస్తలుల క్రియలు దైవికచర్యలే తప్ప బ్రహ్మంగారు చెబుతున్నట్టు దుండగుల (రౌడీల)పనులు కావు. ఆనాటి ప్రత్యక్షసాక్షులకు కూడా తెలియని విషయాలను సహితం ఈనాడు చూడగలిగిన బ్రహ్మంగారి సామర్థ్యం, మహభారతంలోని సంజీవుని దివ్యదృష్టిని సహితం మించిపోయిందని అభినందించక తప్పడం లేదు. వాస్తవానికి అపొస్తలులు ప్రజలను దేవునికి విధేయులు కమ్మని బ్రతిమాలుకున్నట్లు 207 పాయింట్లో బ్రహ్మంగారే స్వయంగా ఎత్తి చూపించారు. రౌడీలు, దుండగులు ప్రజలను బ్రతిమాలుకుంటారా ?

165. వీరబ్రహ్మం- యేసును సిలువ వేశారా? ఉరి తీశారా?

యేసును సిలువ వేసి చంపారు అనే విషయం మాత్రమే బయట ప్రచారంలో ఉంది. కానీ ఇందుకు భిన్నమైన విషయం బైబిల్లో మరుగునపడి ఉంది. అ.కా. 5:30, అ. కా. 10:39, అ.కా. 13:29 ప్రకారం యేసును ఒక చెట్టుకు ఉరి తీశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే యేసుది నిజ చరిత్రకాదు, మహిమలతో, అతిశయోక్తులతో కూడుకున్న కల్పితగాధ అనుకోవాలి. ఇలాకాక, నిజమే అనుకుంటే ఒకే సంఘటన రెండు రకాల కధనాలతో ఉండదు. ఏదో ఒక్కటి మాత్రమే నిజమవుతుంది. ఇలా చూచినట్లుయితే, యేసు చావు దగ్గరే విభిన్నమైన రెండు కధనాలు విన్పిస్తోంటే ఆయన ఎందుకు చంపబడినాడో చెప్పిన కారణం కూడా కల్పితమే అని స్పష్టమవుతుంది.

అ.కా 5:30లో ఇలా ఉంది. “మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను”. ఇది చెప్పింది. పేతురు, తదితర అపోస్తలులు.

అ.కా 10:39లో పేతురు ఇలా అంటున్నాడు. “ఆయన యూదుల దేశమందును, యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను (యేసును) వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి”.

అ.కా 13:29లో ఇలా ఉంది. " ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. గలతీ 3:14లో “మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది”.

1పేతురు 2:24లో ఇలా ఉంది. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను”.

జవాబు : సిలువ తయారు చేయబడింది చెట్టునుండే కనుక దానిని మ్రాను అని తెనిగించారే తప్ప సిలువ వేరు మ్రాను వేరు అని భావం కాదు. మ్రాను మీద వ్రేలాడదీసి చంపినట్టు బైబిల్లో పలు చోట్ల వ్రాయబడినంత మాత్రాన అక్కడికేదో చెట్టు కొమ్మకు తాడుతో మెడ బిగించి ఉరితీసి చంపబడినట్టు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టబడి ఆ మేకుల ఆధారంతో మ్రాను పైన యేసు వ్రేలాడాడు.

మూలభాషలో 'జులోన్' అనే పదానికి 'మ్రాను' అని పైవచనాలలో అనువాదం చేయబడింది. చెక్కతో చేయబడిన ఏ వస్తువునైనా గ్రీకుభాషలో 'జులోన్' (చెక్క వస్తువు ) అని అంటారు. కాబట్టి సిలువ అన్నా, మ్రాను అన్నా ఇందులో పరస్పర వైరుధ్యమేమీ లేదు. ఈ విషయం తెలియక, ఇక్కడేదో వైరుధ్యం దొరికిపోయినట్లు సంబరపడి, 'యేసుది నిజ చరిత్రకాదు, మహిమలతో, అతిశయోక్తులతో కూడుకున్న కల్పితగాథ' అని బ్రహ్మం గారు చేసిన ఆక్షేపణలో ఏమాత్రం నిజం లేదని ఇట్టే తేలిపోయింది.

166. వీరబ్రహ్మం-
దేవుడి కొరకు చర్చీలు కట్టొచ్చా?


దేవుడికి చర్చీలు కట్టగూడదు. ఆయన మానవ నిర్మితాలలలో నివసింపడు. సొలోమోను తన దేవుడి కొరకు ఒక మందిరాన్ని కట్టించాడు. అప్పుడు దేవుని ప్రవక్త ఆ పనిని వ్యతిరేకించాడు. అ.కా. 7:50లలో ఇలా ఉంది.

“ఆకాశము నా సింహాసనము

భూమి నా పాదపీటము

మీరు నా కొరకు ఏలాంటి మందిరము కట్టుదురు?

నా విశ్రాంతి స్థలమేది?

ఇవి అన్నియు నా హస్తకృతములు కావా?

అని ప్రభువు చెప్పుచున్నాడు - అని ప్రవక్త పలికిన ప్రకారము సర్మోన్నతుడు హస్తకృతాలంకారములలో నివసింపడు”.

జవాబు: అవును దేవుని కొరకు చర్చిలు కట్టకూడదు, ఎందుకంటే ఆయన మానవ నిర్మితాలలో నివసించడు. ఐతే ఆయన నివసించడానికి చర్చిలు కట్టకపోయినా ఆయనను ఆరాధించడానికి స్తుతించడానికి మాత్రం చర్చీలు కట్టవచ్చు (మత్తయి 18:20). దేవునికి నివాసస్థలముగా చేయాలనే ఉద్దేశంతో క్రైస్తవులెవరూ చర్చీలు నిర్మించరు. ఆయనను ఆరాధించడానికి నిర్మితమైన చర్చిలను నివాసస్థలముగా ఎవరూ పిలవరు. కాబట్టి ఆలయాలు విశ్వాసుల సౌకర్యార్థమై నిర్మించబడేవే తప్ప దేవునికి అవి నివాసములు కావు.

167. వీరబ్రహ్మం- పునరుత్థానం పొందిన యేసు ప్రజలకు కన్పించాడా?

యేసు పునరుత్థానం మామూలు కట్టుకథ. దీన్ని అల్లింది ఆయన శిష్యులే. చచ్చిలేచిన యేసును ప్రజలెవ్వరూ చూడలేదని శిష్యులే చెబుతున్నారు. దానికి కారణం వారికి ఆ అనుగ్రహం లేకపోవటమే అని బుకాయిస్తున్నారు అ.కా. 10:40, 41లలో ఇలా ఉంది. “దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలందరికి కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను”.

జవాబు : యేసు పునరుత్థానం పొందిన పిమ్మట శిష్యులకు తప్ప మరెవరికీ కనబరచుకోలేదని, ఆ విషయం స్వయానా శిష్యులే చెప్పారని బ్రహ్మంగారి వాదన. ఐతే ఇది ఆయనకు ఉన్న లేఖన అవగాహన లోపమే తప్ప వాస్తవం కాదు.

శిష్యులందరు ఆయనను బాగా ఎరిగినవారు. ఆయనతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి మృతిని గెలిచిన పిమ్మట యేసు మొట్టమొదటిగా వారికే కనిపించాలి. అటు పిమ్మట ఇతర ప్రజలకు కనిపించాలి. ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ పేతురు చెప్పిన మాటలను మనం అపొ.కా 10:40, 41లో చదవవచ్చు. తన ప్రత్యక్షతను శిష్యులకు కనపరచుకున్న తరువాత ఆయన దాదాపు ఐదు వందలమంది కంటే ఎక్కువ మందికి ఒకేసారి కనపరచుకున్నాడు (1కొరింథీ 15:4-5) . ఐతే యేసు తన శిష్యులకు తప్ప మరెవరికీ కనపరచుకోలేదని బ్రహ్మంగారు బుకాయించడానికి కారణమేమిటో ఆయనగారికే తెలియాలి, బుకాయించడం మానుకుని సత్యాన్ని అంగీకరించడం అలవరచుకోవాలి.

168. వీరబ్రహ్మం- పాపాలు చేసినందుకు కాదు, దేవుని మహిమపరచనందుకే హేరోదు రాజు పురుగులు పడి చచ్చాడట!

రెండేళ్ళలోపు ఉన్న పసిపిల్లల్ని అందర్నీ చంపించిన ఘోరపాపీ హేరోదు. అందుకతను దేవుని ఆగ్రహాన్ని చూడలేదు. కానీ, ఎందుకతడు శిక్షింపబడినాడో అ.కా. 12:23లో చూడండి. "అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను”.

జవాబు: బ్రహ్మంగారు బైబిలు గురించి ఏమాత్రం అవగాహన లేకుండానే విమర్శిస్తున్నారని నిగ్గుతేల్చడానికి పై ప్రశ్నే రుజువుగా వుంది. రెండేళ్ళలోపు మగపిల్లలందరినీ చంపించడానికి ప్రయత్నించిన హేరోదు (మత్తయి 2:16), దేవుని మహిమపరచనందుకు పురుగులుపడి చనిపోయిన హేరోదు ఒక్కరు కారు. రెండేళ్ళలోపు మగపిల్లలందరినీ చంపించడానికి ప్రయత్నించిన హేరోదు ముందే చనిపోయాడు (మత్తయి 2:19) . ఐతే పురుగులు పడి చచ్చిన హేరోదు వేరొక హేరోదు (అపొ 12:23). ఐగుప్తులో ఫరోలా, రోములో సీజర్లా, ఇశ్రాయేలును ఏలిన ఏదోమీయ రాజవంశం హేరోదు. 'హేరోదు' అనేది రాజవంశానికి చెందిన పేరే తప్ప ఒక వ్యక్తి పేరు కాదు, ఆ రాజవంశంలో పుట్టిన ప్రతీవారికీ ఆ బిరుదు ఇవ్వబడుతుంది. అనేక బైబిల్ కరెస్పాండెన్స్ కోర్సులు చదివి పూర్తిచేసి యోగ్యతా పత్రాలు పొందానని డాంభికంగా చెప్పుకున్న బ్రహ్మంగారికి ఈ చిన్న విషయం కూడా తెలీదా ?

169. వీరబ్రహ్మం- బైబిలు దేవుడు - పక్షపాతి, దురాక్రమణ దారుడు!

అ.కా. 13:17-19లో పౌలు ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలము చేత వారిని అక్కడినుండి తీసికొని వచ్చి ఇంచుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను. మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి (తనవారైన ఇశ్రాయేలీయులకు ) స్వాస్థ్యముగా పంచియిచ్చెను”.

జవాబు: దేవుడు ఆ ఏడు అన్యజాతివారిని వారి ప్రదేశమునుండి వెళ్లగొట్టి ఆ స్థలంలో ఇశ్రాయేలీయులను ప్రవేశపెట్టడానికి గల కారణం ఆ ఏడు అన్యజాతి ప్రజలు చేసిన పాపమే. అంతమాత్రమే కాకుండా తన ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా అలాంటి పాపక్రియలు గనుక చేస్తే వారికి కూడా అదే శిక్ష విధించబడుతుందని దేవుడు హెచ్చరించాడు. ఈ క్రింది వాక్యంలో ఇది స్పష్టం చేయబడింది, “ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపుర మున్నవారిని వెళ్లగక్కివేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా నున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్లగక్కివేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరించవలెను” ( లేవీయకాండము 18:25-28 ).

ఆపై ఇశ్రాయేలీయులు దేవుని మాట మీరి పాపక్రియలు చేసినప్పుడు ఆయన ఏమాత్రం పక్షపాతం చూపకుండా అషూరీయులను, మిద్యానీయులను, కల్దీయులను, ఫిలిషీయులను ఉపయోగించుకొని వారిని కఠినంగా శిక్షించి పై హెచ్చరికను నిజంచేసాడు. కాబట్టి పక్షపాతమున్నది అకారణంగా బైబిలును నిందించే బ్రహ్మంగారిలోనే తప్ప దేవునిలో కాదు.

170. వీరబ్రహ్మం- ఆసియాలో వాక్యము చెప్పగూడదు.

“ఆసియాలో వాక్యము చెప్పగూడదని పరిశుద్దాత్మ వారినాటంకపరిచి నందున . . . . ” (అ. కా. 16:6). “యేసు యొక్క ఆత్మ వారిని (ఆసియాకు) వెళ్లనియ్యలేదు” (అ.కా. 16:7).

జవాబు: సమయానుకూలంగా అపొస్తలులను నడిపిస్తూ , ఒక ప్రత్యేక సందర్భంలో వారిని ఆసియాకు వెళ్లకుండా పరిశుద్ధాత్ముడు ఆటంకపరిచాడే తప్ప మరింకెప్పుడూ ఆసియాలో వాక్యం చెప్పకూడదనే శాశ్వత నిషేధం లేఖనంలో ఎక్కడాలేదు. లేని తలంపును జొప్పించి, ఆసియాలో వాక్యము చెప్పగూడదు అని బ్రహ్మంగారు చెప్పింది శుద్ధ అబద్ధం.

171. వీరబ్రహ్మం- ఆసియాలో వాక్యము చెప్పగూడదనే యేసు ఆజ్ఞను ఆనాడే ఆయన శిష్యులే అతిక్రమించారు!

"ఆసియాలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను”. అ.కా. 19:10, 11.

"అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతట బహుజనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు, వినియునున్నారు. అ. కా 19:26.

“నేను ఆసియాలో కాలు పెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు. అ. కా 20:19.

జవాబు : 170వ ప్రశ్నకు మేము వ్రాసిన జవాబు, బ్రహ్మంగారు ఇక్కడ లేవనెత్తిన ప్రశ్న నిరాధారమైనదని రుజువు చేస్తుంది. పౌలు ఆసియాలో చేసిన పరిచర్య దేవుని ఆజ్ఞకు ఏ విధంగాను వ్యతిరేకం కాదని పై జవాబు వెలుగులో స్పష్టమౌతుంది. పైగా బ్రహ్మంగారే ఇక్కడ ఉదహరించిన అ.కా. 19:10,11లో “...ఆసియాలో కాపురమున్న వారందరును ప్రభువు వాక్యము వినిరి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను” అని చదువుతాము. ఆసియాలో వాక్యం చెప్పటం నిషిద్దమైయ్యుంటే దేవుడే పౌలు చేత విశేష అద్భుతాలు చేయించడం ద్వారా అక్కడ చేసిన పరిచర్యను ఆమోదించి ఉండేవాడు కాదు.

172. వీరబ్రహ్మం- తలనీలాలు సమర్పించుకోవటం క్రైస్తవుల్లోనూ ఉంది! ఇది అనాది ఆచారం. పౌలు కూడా మొక్కుబడి తీర్చుకున్నాడు. మ్రొక్కుబడి చెల్లించింది యేసుకి గానీ, ఆయన తండ్రికి గానీ కాదు? మరెవరికో తెలియదు!

మొక్కుబడులుతీర్చుకోవటం, బోడిగుండు చేయించుకోవటం (తలనీలాలు సమర్పించుకోవటం)ఇత్యాది మతాచారాలు ఒక్క హిందూ మతంలోనే కాదు, క్రైస్తవ మతంలోను ఉన్నాయి. అవి రోమన్ కేథలిక్కులలో సజీవంగా ఈనాటికీ కన్పిస్తున్నాయి. మరియమ్మ తిరునాళ్ళకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి, మ్రొక్కుబడులు చెల్లించి, గుండుచేయించుకుంటున్న వాళ్లను మనం చూస్తూనే ఉన్నాం. ఐతే ఈ ఆచారాలు అన్నీ దిగుమతి చేసుకున్నవి మాత్రం కాదు. క్రైస్తవ మతంలో ఇవి మొదట్నుంచీ ఉన్నాయి. ఆనాడే యేసు శిష్యుల్లో ముఖ్యుడైన పరిశుద్ద పౌలు అంతటివాడే తన వెండ్రుకలిచ్చి మొక్కుబడి తీర్చుకున్నాడు. ఐతే, ఆ మొక్కుబడి తీర్చుకున్నది తను రక్షకుడని నమ్మి ప్రచారం చేస్తున్న యేసుక్రీస్తుకుగాని, పరమపితకుగాని కాదు. ఎవరికీ తెలియదు. అంటే అతని దృష్టిలో యేసుని మించిన గొప్ప దేవుడు మరొకడున్నాడన్న మాట.

అ.కా. 18:18లో ఇలా ఉంది. “పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహెూదరుల యొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మొక్కుబడియున్నందున కెండ్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడనెక్కి సీరియకు బయలు దేరెను”.

అ.కా. 21:23, 24లో యాకోబు, పౌలుతో “మేము నీకు చెప్పినట్లు చేయుము. మొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్దయున్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడ శుద్ధి చేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారి కయ్యెడి తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యధావిధిగా నడుచుకొను చున్నావని తెలిసికొందరు” అని చెప్పాడు.

“అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని పోయి, వారితో కూడా శుద్ది చేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించువరకు శుద్దిదినములు నెరవేర్చదుమని తెలిపెను” (అ.కా 21: 26).

జవాబు: బోడి గుండు గీయించుకోవడం మొక్కుబడులు చెల్లించుకోవడమనే ఆచారాలు క్రైస్తవ్యంలో లేవు. ఐనప్పటికీ వీటిని రోమను కేథలిక్కువారు ఆచరిస్తున్నారంటే బహుశ బైబిల్ గూర్చి వారికి తెలిసివుండకపోవచ్చు. ఐతే పౌలు తలనీలాలు సమర్పించుకోవడంలోని ముఖ్యోద్దేశమేమిటంటే తాను మతనిష్ఠ కలిగిన యూదుడైయున్నప్పుడు ఏదో విషయంలో మొక్కుబడి చేసుకుని వుండవచ్చు, దానిని తీర్చుకోవడం తప్పనిసరి కాబట్టి తాను క్రైస్తవుడైనప్పటికీ తలనీలాలు సమర్పించుకున్నాడు. ఇది తెలియక బ్రహ్మంగారు క్రైస్తవుల్లోను ఈ ఆచారముందని అపార్థం చేసుకున్నారు.

పౌలు మొక్కుబడి తీర్చుకున్నది యేసుక్రీస్తుకుగాని, పరమపీతకుగాని కాదు అని అన్నారు. ఇది కూడా బ్రహ్మంగారు తెలియక అపార్థం చేసుకున్న విషయమే తప్ప వాస్తవం కాదు, ఎందుకంటే, పౌలు యూదా మతనిష్ఠ కలిగిన పరిసయ్యుడు కాబట్టి తాను నమ్మిన యెహెూవా దేవునికి మినహా మరెవనికి మొక్కుబడి చెల్లించలేదని రూఢిగా చెప్పవచ్చు. బ్రహ్మంగారు ఉటంకించిన అపొస్తలుల కార్యములు 21:23-26లో ఇది యూదుల ధర్మశాస్త్రానుగుణమైన క్రియ అని స్పష్టం చేయబడింది. కాబట్టి పౌలు తలనీలాలు ఏ దేవుడికి చెల్లించాడో అని బ్రహ్మంగారు ఇక లేనిపోని సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

173. వీరబ్రహ్మం- క్రైస్తవులు ప్రభుత్వాధికారులను నిందించగూడదు!?

ఒక మహాసభలో పౌలు మీద విచారణ జరుగుతోంది. అప్పుడు “దగ్గర నిలియున్నవారు -నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించెదవా? అని అడిగిరి. అందుకు పౌలు సూదరులార, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు - నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడియున్నదనెను” అ. కా. 23:4, 5.

జవాబు : అవును క్రైస్తవులు ప్రభుత్వ అధికారులను నిందించకూడదు; వారికి లోబడాలి రోమా 13:1-7. దేవుని ఆజ్ఞలతో విబేధించినప్పుడు మినహా అన్ని విషయాల్లోను వారితో సహకరించాలి అపొస్తలుల కార్యముల 4:19 ప్రభుత్వంపై తిరగబడడానికి మేమేమి స్టాలిన్, కార్ల్ మార్పు, లెనిన్ లాంటి నాస్తికులం కాము.

174. వీరబ్రహ్మం- నజరేతు ఉద్యమానికి (నజరైట్స్ మూమెంట్) నాయకులు యేసు, ఆ తరువాత పౌలు!

యూదాజాతిని ఏకం చెయ్యటానికి అప్పట్లో క్రొత్త మతోద్యమమొకటి అవసరమైంది. అదే నజరేయుల మతభేదము. ఈ నజరేయ ఉద్యమం జాత్యాభిమానంతో కూడుకున్నది. ఇది నజరేతులో పుట్టింది. యేసు దీని మూల పురుషుడు. అందుకే యేసును మొదటి నుండి నజరేయుడన్నారు. ఆయన మరణానంతరం (హత్యానంతరం) పౌలు దీనికి నాయకుడు.

గవర్నరు ఫేలిక్సు ఎదుట పౌలు మీద విచారణ జరిగే సందర్భంలో తెర్తులు చేసిన నేరారోపణ వల్ల నేడు క్రైస్తవంగా ప్రచారం పొందుతున్నది ఆనాటి నజరేయుల ఉద్యమమేనని తెలుస్తోంది. అ. కా 24:5-8లో ఇలా ఉంది. "ఈ మనుష్యుడు (పౌలు) పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడునై యున్నట్లు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను. గనుక మేము అతని పట్టుకొంటిమి”. నజరేయ మతోద్యమ మూల విరాట్టైన యేసు దేవాలయాలను ఉపయోగించుకున్నాడు. మనకు అనుభవమే కదా, మన దేశంలో సీఖు మతోద్యమ (ఖలిస్తాన్ మూవ్ మెంట్) నాయకులూ వారి దేవాలయాలను వాడుకున్నారు. అన్ని మతోద్యమాలకు ప్రార్థనా మందిరాలే ఆలవాలాలని దీన్నుంచి మనం గ్రహించాలి.

జవాబు : బ్రహ్మంగారికి బైబిల్ మీద మాత్రమే కాదు చరిత్ర మీద కూడా ఇసుమంతైనా అవగాహన లేదని తేలిపోయింది. కొంతమందిని వారు పుట్టిన లేదా పెరిగిన ప్రదేశపు పేరుతో మనం పిలుస్తాము. పొంతు అనే ప్రాంతానికి చెందినవాడు కాబట్టి పిలాతును పొంతిపీలాతు అని అనేవారు. అలాగే చరిత్రను చదివితే హిట్లర్ జర్మన్ నియంత అని దేశం పేరుతో పిలిచేవారు. అదేవిధంగా, యేసు నజరేతులో పెరిగాడు కాబట్టి ఆయన ఆ పట్టణపు పేరుతో పిలవబడ్డాడు మత్తయి 2:23; లూకా 4:16. అంతేగానీ నజరైట్స్ మూవ్ మెంట్ అనే విప్లవాన్ని తెచ్చాడు కనుక యేసుకు ఆ పేరు రాలేదు. క్రైస్తవ్యం నజరేయుడైన యేసు బోధలపై ఆధారపడింది కాబట్టి దానికి బ్రహ్మంగారిలాంటివారు 'నజరైట్స్ మూమెంట్' అనే వెక్కిరింపు పేరుని తగిలించారు.

'నజరేయు మతోద్యమ మూల విరాటైన యేసు దేవాలయాలను ఉయోగించుకున్నాడు' అని బ్రహ్మంగారు రాసారు. ఇది కూడా తప్పే. సువార్త ప్రకటించడానికి యేసు దేవాలయాన్ని ఉపయోగించుకున్నాడే తప్ప ఉద్యమాల కోసం కాదు. ఐతే సువార్త ప్రకటించడానికి కూడా కేవలం దేవాలయాన్ని మాత్రమే ఆయన ఉపయోగించుకోలేదు. సమాజమందిరాల్లో, సంతవీధుల్లో, అరణ్యంలో, కొండమీద, సముద్రతీరప్రాంతంలో, ఎండవేళ బావిదగ్గర, ఇంట్లో ఉన్నప్పుడు ఇలా అనేకచోట్ల యేసు తన రాజ్యసువార్తను ప్రకటించాడు. యేసు సాత్వికంతో ప్రకటించిన సువార్తకి, మన దేశంలో జరిగిన సిక్కు సాయుధ మతోద్యమానికి(ఖలిస్తాన్ మూవీమెంట్) ఎలాంటి పోలిక లేదు, ఉందనుకుంటే అది బ్రహ్మం గారి అపోహే తప్ప ఎంత మాత్రము నిజం కాదు. ఐనా వీటన్నిటివల్లా బ్రహ్మంగారికి కలిగిన నష్టమేంటో చెప్పనేలేదు.

175. వీరబ్రహ్మం- నీచమైన కోర్కెలు కల్గించేదెవడు? - దేవుడు! స్వలింగ సంభోగం (హెూమోసెక్స్) చేయించేదెవడు? మనస్సును భ్రష్టు పట్టించేదెవడు ? దేవుడు!

రోమా 1:26-29 లో ఇలా వుంది. “అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మము (లెస్బియనిజమ్ అనగా, స్త్రీల స్వలింగ సంభోగం)ను అనుసరించిరి. అటువలె పురుషులు కూడా వారియొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి , పురుషులతో పురుషులు అవాచ్యమైనది (సోడోమీ, అనగా పురుష స్వలింగ సంభోగము) చేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి యెడల కామతపులైరి.
మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారి నప్పగించెను.

జవాబు : బ్రహ్మంగారు ఉదహరించిన వాక్యభాగంలో, నీచమైన కోరికలు పుట్టించేది దేవుడు అన్న భావం లేనేలేదు. తమ అసహజ కోరికల నుండి విడుదల కలిగే ఏకైకమార్గాన్ని వారు వద్దనుకున్నారు కాబట్టి, దైవతిరస్కారులను దేవుడు తమ స్వీయతలంపులకు విడిచిపెట్టేసాడని ( “వారిని అప్పగించెను” ) ఇక్కడ పౌలు భావం. కనుక నీఛమైన కోరికలు కలగడానికి కారణం దేవుడు కాదు;నాస్తికత్వం వంటి దైవతిరస్కారమే వీటికి కారణం.

176. వీరబ్రహ్మం- దేవునికి పక్షపాతము లేదట!

రోమా 2:11లో "దేవునికి పక్షపాతము లేదు” అని ఉంది. రోమా 3:1-3లో తద్భిన్నంగా ఉంది. ఇందులో యూదులు అడిగినదానికి పౌలు ఏమని బదులిచ్చాడో చూడండి. యూదులపట్ల ఎంతటి పక్షపాతమో గమనించండి. “అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదులపరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి ?

జవాబు : యూదులకు గొప్ప అవకాశాలు ఇవ్వబడినప్పటికీ వారిని కూడా ఆ అవకాశాలు లేని అన్యులతో పాపం విషయంలో సమానంగా దేవుడు తీర్పుతీరుస్తున్నాడని రోమా 3వ అధ్యాయంలో పౌలు వాదిస్తున్నాడే తప్ప దేవుడు పక్షపాతని చెప్పడం లేదు. 9వ వచనం ఈ భావాన్ని రుజువు చేస్తుంది “అలాగైన ఏమందుము ? మేమువారికంటే శ్రేష్ఠులమా ?తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము”. కాబట్టి బ్రహ్మంగారు ఆరోపించినట్లు, దేవునిలో పక్షపాతం లేదనే సత్యానికి భిన్నంగా లేఖనంలో ఎక్కడా ఏమీ లేదు.

177. వీరబ్రహ్మం - అందరూ పాపము చేశారు. అందుకే ఏ ఒక్కడూ దేవుడి మహిమను చూడలేడు! బైబిల్.

బైబిల్ ప్రకారం మనుషులందరూ పాపులే. ఐతే, పుణ్యాత్ములనబడే వాళ్ళెవ్వరూ మనుషులు కారు. బైబిలు దృష్టిలో పుణ్యాత్ములు లేరు. అసలు మనుషులు మంచివారు కారు. మనుష్యులు కాకపోతే, ప్రాణుల్లో ఇక మంచివారు ఎవరు? జంతువులా?

రోమా 3:23 ఇలా చెబుతోంది. " ఏ భేదమును లేదు; అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు”.

రోమా 3:10లో ఇలా ఉంది. “ఇందుకు ప్రమాణముగా వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ”

జవాబు : మనుష్యులందరు పాపులు కాబట్టి ఎన్ని నీతియుక్తమైన క్రియలు లేదా సత్రియలు చేసినా దేవునికి అంగీకారమైనవారు కాలేరు. తాము చేస్తున్న నీతిక్రియల వలన పాపులు పుణ్యాత్ములు కాలేరని, యేసుక్రీస్తునందలి విశ్వాసమూలంగా మాత్రమే దేవుని దృష్టికి నీతిమంతులు కాగలరని రోమా పత్రిక సందేశం. బ్రహ్మంగారు 23వ వచనంతో ఆగిపోకుండా ఆ తర్వాత వాక్యం కూడా చదివుంటే ఇలాంటి అర్థరహితమైన విమర్శలకు పాల్పడియుండేవారు కాదేమో ! “కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు ” (రోమా 3:24). కాబట్టి, బ్రహ్మంగారు అపార్థం చేసుకున్నట్లు, మనుష్యులలో పుణ్యాత్ములు లేరని కాదు, ఏం చేస్తే మనుష్యులు పుణ్యాత్ములు ఔతారన్నదే రోమా పత్రిక సందేశం.

178. వీరబ్రహ్మం- విశ్వాసముంటే నీతిమంతులైనట్టే, అది లేకపోతే కానట్టే !

రోమా 3:28 లో ఇలా ఉంది. “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండ విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము”.

జవాబు : ఆయనగారు లేవనెత్తిన 177 పాయింటులోని ప్రశ్నకు 178 ప్రశ్నలో ఆయనే జవాబు చెప్పుకోవడం వింతగా లేదూ ! కాలక్షేపానికి బ్రహ్మంగారి లాంటి కొందరు ఇలాంటి పుస్తకాలు కూడా రాస్తారు కాబోలు.

179. వీరబ్రహ్మం- ధర్మశాస్త్రం లేకపోతే బాగుండేది !

రోమా 3:31లో "ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము” అని పౌలు చెప్పాడు. రోమా 5:13లో “ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను. గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు” అని ఉంది. ధర్మశాస్త్రము వచ్చిన తరువాతనే లోకములోకి పాపము వచ్చింది. కాబట్టి, ఆ ధర్మశాస్త్రము లేకపోతే ఈ లోకములో పాపమే ఉండేది కాదు కదా ! మరెందుకు అటువంటి ధర్మశాస్త్రమును ధృవపరచటం?

జవాబు : బ్రహ్మంగారు ఉదహరించిన వాక్యానికి, ధర్మశాస్త్రము ద్వారా పాపం ఆవిర్భవించిందని భావం కాదు, ఐతే ధర్మశాస్త్రము వచ్చినప్పుడు, ఏది పాపమో ఏది పాపం కాదో వివరంగా తెలియజేయబడినది. “ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ”(రోమా 3:20). మరోమాటలో చెప్పాలంటే ఏది పాపమో నిర్ధారించడానికి ధర్మశాస్త్రమే ప్రమాణం. అందుకే పౌలు దానిని ధృవపరచి సమర్థించాడు. 'న్యాయస్థానాలు లేకపోతే నేరస్థాపన జరగదు' అని ఒకవేళ ఎవరైనా అంటే న్యాయస్థానమే నేరాలకు కారణమని, అది లేకపోతే బావుంటుందని నాస్తికులు అర్థంచేసుకుంటారా ? మరి అదే భావంలో ధర్మశాస్త్రాన్ని సమర్థిస్తూ చెప్పబడిన మాటలపై ఎందుకో ఇంత రాద్ధాంతం?

180. వీరబ్రహ్మం - పాపాన్ని పెంచటానికే ధర్మశాస్త్రం వచ్చింది!
రోమా 5:20లో ఇలా ఉంది. “అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను”.

జవాబు : 179వ ప్రశ్నకు మేము చెప్పిన జవాబే దీనికి కూడా సరిపోతుంది. పాపం విస్తరించిందన్న వాస్తవం ధర్మశాస్త్రము రావడం వలన నిర్ధారించబడినది. అంతేకాని పాపాన్ని నిషేధించే ధర్మశాస్త్రమే ఆ పాపాన్ని విస్తరింపజేసిందని నిందించడం అవివేకం, మతిభ్రమకు సూచకం.

181. వీరబ్రహ్మం- ఒకడి తప్పిదం వల్ల అనేకులు చస్తే, అప్పుడు దేవుని కృప విస్తరిస్తుందట!

రోమా 5:15లో ఇలా ఉంది. “ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి యెక్కువగా దేవుని కృపయు, యేసు క్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను”.

జవాబు : ఒకని తప్పిదం వల్ల అనేకులు మరణించినప్పుడు వారిని ఆ మరణం నుండి విడిపించడానికి దేవుడు మార్గం సిద్దపరచడం వలన తన కృపను విస్తరింపజేసుకున్నాడని పైమాటలలోని భావం. ఇందులో సమస్యేముంది?

182. వీరబ్రహ్మం - బైబిల్లో దేవుడు, కుమారుడు, ఆత్మ, దేవదూత - అందరూ మగవాళ్ళే !

కన్య మరియతో నిన్ను పరిశుద్దాత్మ ఆవహిస్తోంది, నీవు గర్భం ధరిస్తావు, నీవు గర్భం ధరిస్తావు అని చెప్పిన గాబ్రియేలు దేవదూత మగవాడే. బైబిల్లో ఆడదేవతలు, ఆడదేవదూతలు అసలు కనపడరు. దేవుడు స్వయంపురుషుడు. “ఆత్మ”కూడా ఆడది కాదు మగదే. చూడండి “మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు”. (రోమా 8:16) "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు”. (రోమా 8:26)

జవాబు: బైబిల్లోని దేవుడు, కుమారుడు, ఆత్మ, దేవదూత ఇలా అందరూ మగవాళ్ళే అని బ్రహ్మంగారు తెగ బాధపడిపోతున్నారు కానీ అందరూ మగవాళ్ళే ఐనందుకు ఈయనగారికొచ్చిన నష్టమేంటో చెప్పనేలేదు. బ్రహ్మంగారు దేవుడిని నమ్మకపోవడానికి గల కారణం ఇదేనా?

183. వీరబ్రహ్మం - ఎవర్ని నమ్ముకున్న వారైనా సిగ్గుపడతారేమోకానీ, ఆయన్ని నమ్ముకున్నవారు మాత్రం సిగ్గుపడరు!

“ఆయన (యేసు) యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది” (రోమా 10:11)

జవాబు : యేసును నమ్ముకున్నవారెవరూ సిగ్గుపడరు, అవమానపరచబడరు. పైగా వారు క్రీస్తుచేత అంగీకరించబడి దేవునికుమారులుగా పరిగణించబడతారు.

బ్రహ్మంగారు ఏమరుపాటుతనంతో ఎన్నో రకాలుగా విమర్శించినా, ఈ పాయింటు మాత్రం చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. అవును యేసును నమ్ముకున్నవారు ఏనాటికీ సిగ్గుపడరు. 219లో ప్రశ్నకు వ్రాసిన జవాబును కూడా చూడండి.

184. వీరబ్రహ్మం- “విధేయులైన వారెవరూ జాలి చూపలేరు” !

రోమా 11:32లో ఇలా ఉంది. "అందరి యెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించియున్నాడు”. అనగా అవిధేయులే కరుణ చూపించగలరు. విధేయులుగా ఉండువారు కరుణ చూపలేరు.

జవాబు : పై వాక్యాన్ని పూర్తి సందర్భంలో చదివితే, దేవుడు అవిధేయులైన అందరియెడల జాలిచూపే విషయం ఇక్కడ ప్రస్తావించబడిందే తప్ప, అవిధేయులైనవారు ఇంకెవరిపై జాలిచూపే విషయాన్ని ఇది ప్రస్తావించట్లేదు. ఇంత సులభతరమైన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతే లోతుగా వ్రాయబడిన విషయాలు ఈయనగారు ఎలా అర్థంచేసుకోగలరు ?

185. వీరబ్రహ్మం- పగతీర్చే పని ప్రభువుదీ(దేవుడిది). ప్రభువు కూడా మనుష్యుల్లాగే పగబడతాడు!

ప్రభువు కరుణాయముడు కాడు, పగతీర్చుకునేవాడు! రోమా 12:19 ఇలా ఉంది. ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి -పగతీర్చుట నాపని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ”

జవాబు : దేవుడు ఎంత ప్రేమామయుడో అంతే న్యాయవంతమైన తీర్పరి కూడా. బ్రహ్మంగారు రోమా 12:19 చూపిస్తూ దేవుడు కూడా పగతీర్చుకునేవాడు అని అన్నారు. దుష్టులకు తమ దుష్టత్వాన్ని బట్టి దేవుడే ప్రతిఫలాన్ని ఇస్తాడని, కాబట్టి కీడుకు ప్రతికీడు చేయనక్కరలేదనే భావంలో పౌలు పగ అనే మాట వాడాడే తప్పు, మనుషులకు ఉన్నట్టు నీతి న్యాయాలు తప్పి పగతీర్చుకునే విధానం దేవునికి ఉండదు.
12:1

186. వీరబ్రహ్మం- ఎదిరించకుడి, తలదించుడి !
పాలకులను ప్రశ్నింపరాదు; అధికారులను ఎదిరించరాదు !


రోమా 13:1, 2లో ఇలా ఉంది. “ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడియున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శీక్ష తెచ్చుకొందురు. ”

2పేతురు 2:10 లో ఇలా ఉంది. “ప్రభుత్వమును నిరాకరించుచు, శీక్షలో ఉంచబడిన వారిని తీర్పుదినము వరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు”.

జవాబు : 173 వ ప్రశ్నకు మేము వ్రాసిన జవాబును చదవండి.

187. వీరబ్రహ్మం- పాలకులు దేవుని ప్రతినిధులు, వారు దౌర్జన్యం చేస్తే అది సమంజనమే !

రోమా 13:4లో ఇలా ఉంది. “నీవు చెడ్డది చేసిన యెడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు”.

జవాబు: కీడు తలపెట్టినవారికి, దేవుని ప్రతినిధులు ఆగ్రహాన్ని చూపించి ప్రతీకారం చేసే విషయాన్ని రోమా 13:4లో పౌలు చెబుతున్నాడే కానీ అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేస్తే అది సమంజసమనే భావం లేనే లేదు. ఐతే లేనిది ఉన్నట్టుగా కనిపిస్తే ఇదేదో మానసికవ్యాధికి చెందిన సంకేతమని గుర్తించాలి. ఒకవేళ అధికారులు దౌర్జన్యానికి పాల్పడితే వారితో వ్యవహరించాల్సిన తీరు అపొస్తలుల కార్యములు 4:19లో స్పష్టం చేయబడింది - “దేవునిమాట వినుటకంటే మా మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా” ?

188. వీరబ్రహ్మం- బలహీనమైన విశ్వాసాలు గలవారినందర్నీ  క్రైస్తవంలోకి చేర్చుకోండి. కానీ వాళ్ళతో వాదానికి మాత్రం దిగొద్దు!

రోమా 14:1లో ఇలా ఉంది. “విశ్వాసము విషయమై బలహీనుడైనవానిని చేర్చుకొనుడి, అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు”.

జవాబు : పై వచనం బలహీనులైనవారిని క్రైస్తవంలోనికి చేర్చుకోమని చెప్పడంలేదు. ఏ విశ్వాసాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడిందో ఆ తదుపరి వచనమే నిర్వచిస్తుంది. “ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరియొకడు బలహీనుడైయుండి, కూరగాయలనే తినుచున్నాడు. తినువాడు తిననివాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పుత్చీకూడదు;ఏలయనగా దేవుడతనిని చేర్చుకొనెను”. తినువాటి విషయమై విభిన్నమైన అభిప్రాయాలు పౌలుకాలంలో విశ్వాసులకు ఉండేవి. వాటివిషయమై సంఘం విభజింపబడకూడదని, ఒకరినొకరు ప్రేమతో చేర్చుకోవాలని, ఆహారవిషయంలో పట్టింపులు ఉన్నవారు బలహీనులని, వారిని తృణీకరించకుండా ఓర్పుతో సహించమని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు.

ఇకనైనా బ్రహ్మంగారు బైబిల్ ని అన్యాయంగా వక్రీకరించడం మాని, సంబర్భసహితంగా చదివి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే ఇలాంటి అర్థంపర్థం లేని పుస్తకాలు వ్రాసే శ్రమ వారికి తప్పుతుంది.

189. వీరబ్రహ్మం- క్రైస్తవుడు తినేది తనకోసం కాదు. ప్రభువుకోసం!

“తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువుకోసరమే తినుచున్నాడు”. రోమా 14:6

జవాబు: అవును. క్రైస్తవుడు ఏది చేసినా దేవుని మహిమ కొరకు ఆయన నామఘనత కొరకూ చేస్తాడు. “కాబట్టి మీరు భోజనముచేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి”

(1 కొరింథీయులకు-10:31), అనే నియమాన్ని నిజక్రైస్తవుడు సదా ఆచరిస్తాడు. అంతేగాని నాస్తికుల్లా క్రైస్తవులు తినడం కోసమే బ్రతకరు.

190. వీరబ్రహ్మం- ఇతర మతస్తుల పెళ్ళిళ్లు, పండుగలు, పబ్బాలు, నోములు, వ్రతాల్లో పెట్టే భోజనాలు క్రైస్తవులు తినకూడదా?

ఎందుకు తినగూడదు? లక్షణంగా తినొచ్చు! అయితే క్రొత్తగా తీర్థం పుచ్చుకున్నవాళ్ళ మిడిమిడి జ్ఞానం గలవాళ్ళు, మత దురహంకారంగల వాళ్ళు చాలామంది తాము మారుమనస్సు పొందామని, వాక్యం ప్రకారం నడచుకుంటామని, అన్యదేవుళ్లకు పెట్టిన పదార్థాలు తినమని, తాము కల్తీలేని నికారైన క్రైస్తవులమని తద్వారా చెప్పుకుంటుంటారు. ఇది చాలా తప్పు. ఇది క్రైస్తవులను ప్రత్యేకంగా సమాజం నుంచి వేరు చేయటానికి పాష్టర్లు తలకెక్కించిన కఠిన నియమమే గానీ, బైబిల్లో అలా లేదు.

ఇలా ఉంది. “సంతోషించువారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలసియుండుడి” (రోమా 12:16). "శక్యమైతే మీచేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి” (రోమా 12:18)

భక్ష్యపదార్థముల విషయమై “సహజముగా ఏదియు నిషిద్దము కాదని నేను (పౌలు) ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనను నిషిద్దమని యెంచుకొనువానికి అది నిషిద్దమే. నీ సహెూదరుడు నీ భోజన మూలముగా దు:ఖించిన యెడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొనువాడవు కావు” (రోమా 14:14,15)

ఇంకా ఇలా ఉంది. సమస్త పదార్థములు పవిత్రములేగాని అనుమానముతో తినువానికి అది దోషము. మాంసము తినుటగాని, ద్రాక్షరసము త్రాగుటగాని, నీ సహెూదరుని కడ్డము కలుగజేయునది మరేదియు గాని, మానివేయుట మంచిది. నీకున్న విశ్వాసము దేవుని యెదుట నీమట్టుకు నీవే యుంచుకొనుము, తాను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొననివాడు ధన్యుడు” (రోమా 14:20. 23)

“మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినచ్చును”. (1 కొరింథీ 10:25)

“అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో - ఇది బలి అర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి” (1 కొరింథీ 10:27, 28)

“కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకుతీర్పు తీర్చనెవనికి అవకాశమియ్యకుడి”. (కొలస్సీయులకు 2:16)

జవాబు : బ్రహ్మంగారు విమర్శించాలనుకున్నది బైబిలునా లేక లేఖనం సరిగ్గా తెలియక పొరపాట్లు చేసే పాష్టర్లనా? బైబిల్లో తప్పులు దొరకబట్టాలని చేసిన ప్రయత్నం కాస్తా బెడిసికొట్టేసరికి వేరే గత్యంతరం లేక కనీసం పాష్టర్లనైనా తప్పుపట్టుకోవడంతో సరిపెట్టుకోవాలని ఈయనగారి ఉద్దేశం, ఇదే మనం చూడబోతున్నాం. ఇతర మతస్థుల పెళ్ళిళ్ళకు, భోజనాలకు వెళ్ళొద్దని బైబిలులో ఎక్కడా చెప్పబడలేదు. ఒకవేళ వెళ్ళొద్దని ఎవరైనా బోధించినట్లయితే అది లేఖన అవగాహన లేని బోధకుల పొరపాటే తప్ప బైబిలుది కాదు. ఐతే విగ్రహాలకు అర్పించినవాటిని తెలిసీ తెలిసీ తినకూడదని బైబిలు ఆజ్ఞాపిస్తుంది. బ్రహ్మంగారు ఉదహరించిన వచనంలోనే ఇందుకు నిదర్శనం ఉంది “అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందుకు పిలిచినప్పుడు వెళ్లుటకు మీకు మనస్సుండిన యెడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో - ఇదీ బలి అర్పింపబడినదని చెప్పిన యెడల అట్లు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి” (1 కొరింథీ 10:27, 28).

191. వీరబ్రహ్మం- కొన్ని భక్ష్యాలను తినుట మానమని చెప్పువాడు అబద్దబోధకుడు!

1తిమోతి 4:3-5లో ఇలా ఉంది. " ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షిగలవారై, వివాహము నిషేధించుచు, సత్యవిషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలెనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన యెడల ఏదియు నిషేధింప తగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ”

జవాబు : అవును దేవుని వాక్యానికి విరుద్దంగా బోధించేవారెవరైనా వారు అబద్దబోధకులే. వారు సత్యవిషయమైన అనుభవజ్ఞానం లేనివారు. చివరికి తినే ఆహారపదార్థాల విషయంలో కూడా కొన్నిటిని నిషేధిస్తూ తమ సొంత మాటలను దైవోపదేశాలుగా బోధిస్తారు. వారి విషయంలో అబద్దబోధకులని బ్రహ్మంగారు చెప్పింది నిజమే. తినే ఆహారపదార్థాలనే నిషేధిస్తున్నవారు అబద్దబోధకులైతే, అసలు దేవుడే లేడని మాట్లాడుతూ, దేవుని మాటయైన బైబిలునే శంఖిస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఇంకెంత భయంకరమైన అబద్దబోధకులో మరి !

192. వీరబ్రహ్మం- మూర్ఖులుగా ఉండుడి. మూర్ఖులను దేవుడు ప్రేమించును ! ఆయనకు కావలసింది జ్ఞానులు కాదు, అజ్ఞానులు!


"జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది”. (1 కొరింథి 1:19) ఇదేమైనా మంచిపనా, గొప్పపనా, మెచ్చుకోవలసిందా? 1 కొరింథీ 1:27లో ఇంకా ఇలా ఉంది.

“ఏ శరీరియు దేవుని యెదుట అతీశయింపకుండునట్లు, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెట్టివారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడు”.

అన్ని విషయాలలోను అవివేకులుగా ఉండొచ్చు గాని, ప్రభువు చిత్తాన్ని గ్రహించటానికి అనే ఒక్క విషయంలో మాత్రం వివేకులుగా ఉండాలని ఎఫెసీ 5:17లో ఇలా చెప్పబడింది. “ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి”.

జవాబు : ముందుగా, పైన చెప్పబడిన “జ్ఞానులు” అనే మాట ఏ భావంలో చెప్పబడిందో గ్రహించినట్లయితే ఇక్కడ ఎలాంటి సమస్య ఉండదు. దేవునిని ఎరుగకుండా, తమకున్న జ్ఞానాన్ని బట్టి తామే గొప్పవారమని విర్రవీగే వారిని గురించి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఈ లోకజ్ఞానం వారిని అతిశయానికే గురిచేసింది కానీ దేవుని యొద్దకు నడిపించలేకపోయింది. దేవునియొద్దకు నడిపించలేని జ్ఞానం వ్యర్థమని నిరూపిస్తూ, వారి దృష్టికి వెర్రివారిగా కనిపించేవారికి దేవుడు తనను తాను కనపరచుకొని, జ్ఞానులను సిగ్గుపరిచాడని దీని భావం. కాబట్టి ఇది మంచిపనే, గొప్పపనే, మెచ్చుకోవలసిన పనే. అంతెందుకు, తనకు బైబిల్ ను విమర్శించేంత జ్ఞానముందని విర్రవీగే బ్రహ్మంగారి అజ్ఞానాన్ని బయట పెట్టడానికి మాబోటి వెర్రివారిని దేవుడు వాడుకున్నాడని చదువరులు ఈపాటికే గమనించియుండవచ్చు. ఇలాంటి జ్ఞానులు మరియు వెర్రివారిని గురించే పౌలు కూడా మాట్లాడుతున్నాడు. నిజమే బ్రహ్మంగారు ఇకనైనా తనను తాను జ్ఞాని అని అనుకోవటం మాని దేవుని చిత్తమేమిటో గ్రహించగలిగితే ఆయనకే మంచిది.

193. వీరబ్రహ్మం - ఈ లోకములో జ్ఞానముగలవాడు దేవుని దృష్టికి వెఱ్ఱివాడు !

1కొరింథీ 1:20 లో ఇలా ఉంది. “ఈ లోకజ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా!

జవాబు : అవును, అపరిమితమైన దేవుని జ్ఞానం యెదుట పరిమితజ్ఞానం కలిగిన మనిషి వెఱ్ఱివాడే. బ్రహ్మంగారు కూడా ఇందుకు మినహాయింపు కాదు.

194. వీరబ్రహ్మం - సువార్త ప్రకటన అంటే వెఱ్ఱితనమేనని పౌలు ఒప్పుకున్నాడు.

1కొరింథీ 1:21లో ఇలా ఉంది. ఈ సువార్త ప్రకటనయను వెఱ్ఱితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయెను”. అటువంటి వెఱ్ఱితనము నమ్మేవారినే దేవుడు రక్షిస్తాడట.

జవాబు: యేసుక్రీస్తు రక్తములో పాపక్షమాపణ ఉందనే సువార్తను నేడు బ్రహ్మంగారు వెఱ్ఱితనమని ఎలా తిరస్కరిస్తున్నారో, అలాగే నాటి ప్రజలు కూడా సువార్తను ప్రకటించిన పౌలు మాటలను వెఱ్ఱితనముగా భావించి తిరస్కరించారు. లోకం సువార్తను వెఱ్ఱితనంగా చూస్తుందన్న వాస్తవాన్ని వ్యక్తపరచడమే తప్ప సువార్త వెఱ్ఱితనమని చెప్పటం పౌలు ఇక్కడ ఉద్దేశం కాదు.

195. వీరబ్రహ్మం - దేవుడికీ వెఱ్ఱితనముంటుంది !

“దేవుని వెఱ్ఱితనము మనుష్య జ్ఞానముకంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మునుష్యుల బలము కంటే బలమైనది” 1కొరింథీ1:25

జవాబు : బ్రహ్మంగారికి కనీస భాషాలంకార విధానం తెలియదని మరోసారి నిరూపించబడింది. అపొస్తలులు బోధించిన దైవికమైన సంగతులు సువార్త వ్యతిరేకులకు మింగుడుపడలేదు, వారికున్న లోపం కారణంగానో లేదా వారి వెర్రితనముతో ఆ సంగతులను గ్రహించలేక చివరికి దేవునికే ఆ వెఱ్ఱితనాన్ని, లోపాన్ని అంటగట్టారు. దేవుని సూక్తులను అర్థంచేసుకోవడానికి బదులుగా దేవుడినే బలహీనుడని అవహేళన చేసారు, దానికి వ్యంగ్యంగా పౌలు వారితో మాట్లాడుతూ వారు దేవునికి ఆపాదించిన వెఱ్ఱితనము మనుష్యజ్ఞానము కంటే జ్ఞానముగలదని, వారు దేవునికి ఆపాదించిన బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనదని అంటున్నాడు. కాబట్టి వెఱ్ఱితనము బ్రహ్మంగారిలో ఉందే తప్ప దేవునిలో కాదు.

196. వీరబ్రహ్మం- దేవుడికి ఎవరు కావాలి? నీఛులా ?

1 కొరింథీ 1:29లో ఇలా ఉంది. "ఎన్ని కైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేనివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు”. కావున నీచులు ధన్యులు!

జవాబు : నీఛులుగా ఉన్నప్పుడు వారు ధన్యులని భావం కాదు, నీచులై ఉన్నప్పుడు దేవుడే వారిని ఎన్నుకుని తన సేవ నిమిత్తమై ఉపయోగించుకున్నాడు. నీఛులైనవారిని కూడా ధన్యులుగా మార్చే శక్తి దేవునికే ఉంది కాబట్టి ఆయన నీఛులను ఎన్నుకున్నాడు.

197. వీరబ్రహ్మం- అపొస్తలులను లోకము ఎలా భావించింది?

1కొరింథీ 4:13లో అపొస్తలులు ఇలా చెప్పుకున్నారు. “లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడియున్నాము”. వీరిని గురించి అలా లోకము అనుకోవటంలో తప్పేముంది? అలానే ఎంచుతుంది. అననీయ, సప్పీరా అనే విశ్వాసులైన దిక్కు మొక్కు లేని సామాన్య రైతు దంపతులు తమ పొలం అమ్ముకొనగా వచ్చిన సొమ్ము సమస్తాన్ని వీరికి సమర్పించుకోలేదని, వారిని చంపేసి, వారు చావటానికి కారణం దేవుని ఉగ్రత అన్నటువంటి క్రూర హంతకులు వీరు!

జవాబు: యేసుకు చెందినవారిని లోకం ద్వేషిస్తుందని, హీనంగా చూస్తుందని ముందుగానే యేసు చెప్పిన మాటలకు ఇది నెరవేర్పు యోహాను 15:18-20 . ఇది నేటికీ విశ్వాసుల అనుభవంలో నెరవేరుతూనే వుంది. దీనికి అననీయ, సప్పీరాల కథనానికి ఎలాంటి సంబంధం లేదు. వివరాలకు 164వ ప్రశ్నకు వ్రాసిన జవాబును చూడండి.

198. వీరబ్రహ్మం- క్రైస్తవుడు మడిగట్టుకు కూర్చోకూడదు. విగ్రహారాధకులతోను కలవవచ్చు. దొంగలతోనైనా సరే కలవచ్చు!

“ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యముచేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసి వచ్చును గదా” అని 1 కొరింథీ 5:10లో హితబోధ చేస్తాడు పౌలు.

"ఈ లోకపు జారులు” అని అనటం ఎందుకు? దొంగలు ఈ లోకంలోనే కాక, ఆ లోకంలో కూడా ఉంటారా?

జవాబు: యేసుక్రీస్తు పరిశుద్దుడైయుండి, పాపాన్ని ద్వేషిస్తూనే ఏ విధంగానైతే పాపులతో స్నేహం చేసాడో అదే మాదిరిని అనుసరించి విశ్వాసంలోనికి నడిపించడానికి ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొనువారితోనైనను, విగ్రహారాధకులతో మిరును సహవాసం చేయవచ్చని ఇక్కడ పౌలు ఉపదేశిస్తున్నాడు. యేసును విశ్వసించామని సంఘంలో చెలామణీ అవుతూ జారక్రియలు చేసేవారికి మరియు సంఘం వెలుపల వున్న అవిశ్వాసులైన జారులకు మధ్య వున్న వ్యత్యాసాన్ని చూపిస్తూ “ఈ లోకపు జారులు” అని పౌలు చెప్పాడే తప్ప పరలోకంలో కూడా దొంగలు, జారులు, లోభులు ఉంటారని భావం కాదు. బైబిల్ ను విమర్శించే తొందరలో 1 కొరింథీ 5:10ని మాత్రమే పరిగణలోనికి తీసుకున్నారు తప్ప 11వ వచనాన్ని చదవడం మర్చిపోయారు బ్రహ్మంగారు. ఒకవేళ చదివుంటే మా సహాయం లేకుండానే ఇందులోని తాత్పర్యం ఆయనకు అర్థమైయ్యుండేది. “ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధీకుడు గాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్న యెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయుచున్నాను”.

199. వీరబ్రహ్మం- దేవుని రాజ్యానికి వారసులు కాకపోవటానికి కొజ్జాలు చేసుకున్న పాపమేంటి?

కొజ్జాలు ఈ దేవుణ్ణి నమ్ముకుంటే ఫలితం శూన్యం !

“మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను, పురుషసంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొనువారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు” అని 1 కొరింథీ 6:10లో తెలియజేయబడింది. ఈ అనరుల చిట్టాలో కొజ్జాలనెందుకు చేర్చారో, వాళ్లు చేసిన తప్పేమిటో అర్ధం కాదు.

పురుష సంయోగులు కూడా దేవుని రాజ్యములోకి వెళ్ళలేరట. ఐతే స్త్రీ సంయోగులు (స్త్రీ స్వజాతి సంపర్కము గలవారు) వెళ్లగలరన్నమాట! అక్కడికి వెళ్లగలగటం, వెళ్లలేకపోవటం ఏమోగానీ, ఎయిడ్స్ వచ్చి హాస్పటల్ పాలుగాకపోతే అదే పదివేలు.

జవాబు: బైబిల్లో వాక్యాలు అర్థంచేసుకోవడం చేతకాక కొజ్జాలు దేవుని రాజ్యానికి వారసులు కారని బ్రహ్మంగారు లేని కొత్త రాతను ఇక్కడ పుట్టించారు. అపొస్తలుల కార్యములు 8:26-36 వరకూ వ్రాయబడిన సందర్భాన్ని చదివినట్లయితే నపుంసకుడు రక్షింపబడినట్లు వ్రాయబడివుంది. అనగా సహజసిద్దంగా పుట్టిన కొజ్జాలు లేదా నపుంసకులకు యేసును తమ స్వరక్షకుడిగా అంగీకరించినట్లయితే వారికి ఖచ్చితంగా రక్షణభాగ్యం లభిస్తుందని బైబిల్ చెబుతుంది. ఐతే 1 కొరింథీ 6:10లో ఆడంగితనంగలవారి గురించి చెప్పబడిన సందర్భం వేరు. అదేమిటంటే, పురుషులుగా పుట్టి తమ స్వాభావిక ధర్మాన్ని విడిచి స్త్రీలలా ప్రవర్తించి ఆడంగితనంతో తమ సహజత్వానికి విరుద్దమైన పాపపుక్రియలు చేస్తే అలాంటివారు శిక్షకు పాత్రులని గుర్తించాలి. ఇదే హెచ్చరిక స్త్రీ సంయోగులకు కూడా వర్తిస్తుంది (రోమా 1:26:27) . ఐనప్పటికీ ఇలాంటివారు అసలే దేవుని రాజ్యానికి వారసులు కాలేరని బైబిల్ చెప్పడం లేదు కాని తమ హేయప్రవర్తన మార్చుకుని యేసుక్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇలాంటివారికి కూడా దేవునిరాజ్యంలోకి ప్రవేశముందని తదుపరి వచనం సెలవిస్తుంది “మీలో కొందరు అట్టివారైయుంటిరి గాని, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధ పరచబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చబడితిరి”. యేసుక్రీస్తును అంగీకరించకపోతే ఈ అనరుల చిట్టాలో నాస్తికులు కూడా వుంటారు మరి!

200. వీరబ్రహ్మం- “స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు’!

1 కొరింథీ. 7:1లో ఇలా ఉంది. స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు”. 1 కొరింథీ 7:9 లో ఇలా ఉంది “అయితే మనస్సు నిలుపలేని యెడల పెండ్లి చేసికోనవచ్చును. కామతప్తులగుటకంటే పెండ్లి చేసికొనుట మేలు!”

పురుషుడు స్త్రీని ముట్టకుండా ఉంటే సృష్టి ఎలా కొనసాగుతుంది? ఎంతమంది నిజక్రైస్తవ సోదరులు ఈ హిత వచనాన్ని పాటిస్తున్నారు? పాటించగలరు?

జవాబు: మనుష్యుల మేలు కోసం దేవుడు వివాహాన్ని నియమించాడు ఆది 2:20-24 మత్తయి 19:4-6. పౌలు తానే వివాహ సంబంధాన్ని మనోహరమైన, అర్థవంతమైన భాషలో వర్ణించాడు ఎఫెస్సీయులకు 5:25-33. విశ్వాసులకు పౌలు వివాహాన్ని నిషేధించలేదు. అలా నిషేధించినవారెవరైనా ఉంటే వారు మోసపోయారని అతనికి తెలుసు 1 తిమోతి 4:1-3. పెళ్లి చేసుకునేందుకు, చేసుకోకుండా ఉండేందుకు, విశ్వాసులకు ఉన్న స్వేచ్ఛను పౌలు ఇక్కడ గట్టిగా నొక్కి చెప్పాడు. దేవుడు వివాహమనే కృపావరం కొందరికీ, వివాహంలేని జీవితమనే కృపావరం ఇంకొందరికి ఇస్తాడు. దేవుని వరాలన్నీ మంచివేనని నిస్సందేహంగా నమ్మవచ్చు. దేవుని కృపవల్ల కొందరికి పెళ్ళిచేసుకోవాలనే కోరిక, పెళ్ళాడే అవకాశమూ కలుగుతాయి. మరి కొందరికి దేవుని కృపవల్ల పెళ్ళి చేసుకోకుండా, లైంగిక అవినీతి లేకుండా ఉండగలిగే సామర్థ్యము కలుగుతుంది( మత్తయి 19:11-12). ఈ రెండూ మంచివే అని పౌలు అంటున్నాడు. (పైగా, ఇక్కడ వ్రాస్తున్నది ఆజ్ఞ కాదు అనే విషయం 6వ వచనంలో స్పష్టం చేయబడింది).

201. వీరబ్రహ్మం- “కుమార్తె పెండ్లి చేసినవాడికన్నా, చేయనివాడే బాగా ప్రవర్తించినట్టు !

కూతుళ్ళకు పెళ్ళిళ్ళు చెయ్యలేక బాధపడ్తున్న నిర్భాగ్య తండ్రులారా! యేసు ఏమంటున్నాడో చూచారా! “తన కుమార్తెకు పెండ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు. పెండ్లి చేయనివాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు” (1కొరింథి 7:38) మరి నిజమైన క్రైస్తవులు, కనీసం వాక్యపరిచర్య చేసే పాప్టర్లయినా తమ కుమార్తెలకు పెండ్లి చేయకుండా మరి బాగుగా ప్రవర్తింపవచ్చును కాదా ?

జవాబు : 273వ ప్రశ్నకు రాసిన జవాబు చూడండి.

202. వీరబ్రహ్మం- మగవాడు ప్రార్థన చెయ్యాలంటే లెక్క ప్రకారం గుండు కొట్టించుకోవాలి! ఇలాంటి ఆచారాల ఆచరణను గురించి వాదనకు దిగే క్రైస్తవుడికి లొంగిపోయి, వాడికి మినహాయింపు ఇవ్వబడింది !

1కొరింథీ11:13, 14లో ఇలా ఉంది. “మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్ధించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్దముగా మీకు తోచును. గదా”!

1 కొరింథీ 11:15, 16 వాక్యాలు ఇలా ఉన్నాయి. “స్త్రీకి తలవెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడెను. గనుక ఆమె తల వెంట్రుకలు ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన యెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వారు తెలిసికొనవలెను”.

చెప్పినదానికి కిమ్మనకుండా తల ఒంచినవాడు విశ్వాసీ, సత్య శోధనకు వాదన చేసేవాడు కలహప్రియుడు!

జవాబు : తనకిష్టానుసారమైన ఆంక్షలు విధించి ఇవి బైబిల్లో వున్నాయి అని బైబిల్ పై రుద్దడం బ్రహ్మంగారికి షరా మామూలే. మగవాడు ప్రార్థన చెయ్యాలంటే గుండు కొట్టించుకోవాలనే ఆంక్ష బైబిల్లోనైతే లేదు, ఇది బ్రహ్మంగారు విధించిన ఆంక్షే. పురుషుడు స్త్రీలాగ తలవెంట్రుకలు పెంచుకోకూడదని మాత్రమే చెప్పబడింది (1కొరింథీ 11:13, 14)పురుషులు కూడా స్త్రీలాగ తలవెంట్రుకలను పెంచుకోవడం నాస్తికులకిష్టమేమో కానీ క్రైస్తవ్యం ఇందుకు అంగీకరించదు. ఇలా అర్థంపర్థం లేకుండా మాట్లాడేవారిని మా పరిభాషలో కలహప్రియులనే అంటారు. ఐతే నాస్తిక పరిభాషలో వారిని సత్యపరిశోధకులని అంటారట పాపం.

203. వీరబ్రహ్మం- విగ్రహాల్లో కూడా మూగ విగ్రహాలు ఉంటాయి - దటీజ్ బైబిల్!

విగ్రహాల్లో కూడా మూగ విగ్రహాలు, చెవిటి విగ్రహాలు ఉంటాయా ?1కొరింథీ12:2లో ఇలా ఉంది. “మీరు అన్యజనులైయున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును.

జవాబు : విగ్రహాలు మూగవి అన్నందుకు బ్రహ్మంగారు బైబిల్ని వెక్కిరిస్తున్నారు. అవి జీవంలేనివి కాబట్టి మూగవి అని బైబిల్ చెప్పింది నిజమే. ఐతే నోరు ఉన్నంత మాత్రాన అవి మాట్లాడేస్తాయని నాస్తికులు భావిస్తున్నారేమో పాపం. దటీజ్ నాస్తికత్వం!

204. వీరబ్రహ్మం- “చచ్చితే” చచ్చును గానీ, “చచ్చితేనే” ఏల బ్రతికింపబడును?

విత్తనాన్ని విత్తితే అది చచ్చి, ఆ తరువాత బ్రతుకుతుందట. బైబిలు చెప్పే విజ్ఞానం అంతా ఇలానే ఉంటుంది. డైరెక్టుగా చచ్చిన విత్తనాల్ని విత్తి మొలకెత్తించ వచ్చుగా భక్త శిఖామణులు ?1 కొరింథీ 15:36 లో ఇలా ఉంది. “ఓ అవివేకీ, నీవు విత్తునది చచ్చితేనేగాని బ్రతికింపబడదు గదా”.

జవాబు : విత్తనం చావటమనే మాట, విత్తనం తన ప్రస్తుత ఉనికిని కోల్పోయి ఒక మొక్క రూపంలో మొలకెత్తుతుందన్న భావంలో చెప్పబడింది. ఇది చనిపోయిన విశ్వాసులు మహిమ శరీరాన్ని దాల్చి పునరుత్థానం పొందడాన్ని గురించి సాదృశ్యప్రాయంగా చెప్పబడిన మాట. కాబట్టి బ్రహ్మంగారు ఆందోళన చెందినట్టు ఇక్కడ విజ్ఞానశాస్త్రసంబంధమైన సమస్యేమీ లేదు. అన్నట్లు భక్తశిఖామణులు ఏం చెయ్యాలో నాస్తికశిఖామణులు నేర్పించనవసరం లేదు.

205. వీరబ్రహ్మం- జాగ్రత్త ప్రభువును ప్రేమించకపోతే శపించబడతారు!

1కొరింథీ 16:22లో ఇలా ఉంది. “ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక”!
“యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన” జరుగుతుందని 2 థెస్సలొనీకయులకు 1:8లో ఉంది. ప్రభువుని ప్రేమించనివాడు శపించబడతాడని హెచ్చరింపబడింది. ఐతే, యేసుక్రీస్తు కూడా శపింపబడినవాడే. కావాలంటే చూడండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 3:14లో ఇలా ఉంది. “మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు”. దీనిని బట్టి, యేసు, ప్రభువును ప్రేమించలేదని, అందువల్ల అతను కూడా శపించబడ్డాడని అనుకోవాలి.

జవాబు : నిజమే బ్రహ్మంగారు చెప్పింది వాస్తవమే, యేసును ప్రేమించకపోతే శపించబడతారు. మానవజాతి పాపంలో, శాపంలో ఉన్నప్పుడు యేసు ఆ మానవజాతి కోసం శాపంగా మారి ఆ శాపం నుండి విడుదల కలిగించాడు. యేసును ప్రేమించనివారు శాపం నుండి విడుదల పొందే ఏకైక మార్గాన్ని తృణీకరించారు కాబట్టి వారు ఇంకనూ శాపంలోనే ఉన్నారని ఇక్కడ పౌలు భావం. ఐతే శాపగ్రస్థులైన వారికోసం క్రీస్తు శాపంగా మారాడని గలతీయులకు 3:14లో స్పష్టం చేస్తుండగా ప్రభువును ప్రేమించనందుకు యేసు శాపంగా మారాడని బ్రహ్మంగారు అర్థంపర్థం లేని వ్యాఖ్యలకు పాల్పడ్డారు. బ్రహ్మంగారు ఇలాంటి అతిసాధారణ విషయాలను గ్రహించక(లేక)పోవడం కూడా తానున్న శాపం యొక్క దుష్ప్రభావమే.

206. వీరబ్రహ్మం- దేవుడికోసం ఇంగితజ్ఞానాన్ని విడిచిపెట్టి వెఱ్ఱివాళ్ళు కావాలి !

2కొరింథీ5:13లో పౌలు ఇలా అన్నాడు. “ఏలయనగా మేము వెఱ్ఱివారమైతిమా దేవుని నిమిత్తమే, స్వస్థబుద్ది గలవారమైతిమా మీ నిమిత్తమే ”.

జవాబు : దైవికమైన సంగతులను అర్థంచేసుకోవడం చేతగాక ప్రజలు పౌలును వెఱ్ఱివాడిగా లెక్కగట్టారు. ఒక్కోసారి యేసును కూడా ఇలాగే నిందించారు (మార్కు 3:21). పౌలు ప్రకటించే సువార్త నాటి ప్రజలకు వెఱ్ఱితనముగా అనిపించింది (1కొరింథీయులకు 1:18) . అర్థంచేసుకునే ఇంగితజ్ఞానం లేనివారందరూ తమను వెఱ్ఱివారిగా లెక్కగట్టినంత మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని ఇక్కడ పౌలు ఉద్దేశం. అంతే తప్ప దేవుని కోసం ఇంగితజ్ఞానాన్ని విడిచిపెట్టి వెఱ్ఱివాళ్ళు కావాలి అనే భావం ఇందులో లేదు.

207. వీరబ్రహ్మం- తనను నమ్ముకోమని దేవుడు అపొస్తలులను వేడుకున్నాడు. వారు ఇంకా దీనంగా జనాన్ని బతిమాలుకున్నారు!

దేవుడు కూడా వేడుకుంటాడు. అతడు సర్వోన్నతుడు అన్నారు. మరి అతడు శిష్యుల కాళ్లమీద పడడమేంటి? ఆ దేవుడికన్నా, దేవుడి వాక్యాన్ని ప్రచారం చేసే అపొస్తలులు గొప్పవారా ? అసలు క్రొత్త నిబంధన వీళ్ల సృష్ట అనిపిస్తోంది.

2 కొరింథీ 5:20 లో ఇలా ఉంది. ఈ దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము”.

జవాబు : నశించిపోతున్న మానవాళి పట్ల దేవుడు కనపరచాల్సిన ప్రేమ, కరుణ, అపొస్తలులు ప్రకటించే సువార్త ద్వారా కనపరుస్తున్నాడు. ప్రజలకు వారు ప్రకటించే సువార్త వైఖరి స్వయంగా దేవుడే బ్రతిమాలుకున్నట్టు, వేడుకొంటున్నట్టు వుందని పౌలు ఇక్కడ గుర్తుచేస్తున్నాడు, దేవుడు తన ప్రజలపట్ల కనపరచిన ఇలాంటి వైఖరి పాతనిబంధనలో కూడా వుంది (యెహెజ్కేలు 18:30) . ఇది తండ్రి తన పిల్లల పట్ల ప్రేమతో బ్రతిమాలుకునే విధానం. దీనిని వ్యక్తపరచడానికి దేవుడు తన అపొస్తలులను సాధనాలుగా ఉపయోగించుకున్నాడని ఇక్కడ భావం. అంతే తప్ప తనకు చేతకాని పని కోసం దేవుడు మరొక వ్యక్తిని బ్రతిమాలుకున్నాడని శిష్యుల కాళ్లమీద పడ్డాడని చిత్రీకరిస్తే అది లేఖనాన్ని గ్రహించడంలో బ