రక్షణ

రచయిత: కె విద్యా సాగర్
 
 
                               Predestined by God devotional pink 800x600
 
నేటి క్రైస్తవ సంఘంలో చాలామంది విశ్వాసులకు తమ రక్షణకు సంబంధించిన దేవుని సంకల్పానుసారమైన నిర్ణయం గురించి తెలియకపోవడం వల్ల సువార్త ప్రకటనలోనూ, తమ రక్షణ నిశ్చయత విషయంలోనూ చాలా తప్పుడు అభిప్రాయాలను కలిగియుంటున్నారు. అంతేకాకుండా దేవుని సార్వభౌమత్వం, ఆయనకున్న తన చిత్తాన్ని నెరవేర్చుకునే‌ సామర్థ్యం గురించి క్రైస్తవులైన వారందరూ తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఒకోసారి దేవునికీ మనిషికీ ఏ తేడా లేదు అన్నట్టుగా అపార్థానికి గురౌతాము. ప్రస్తుతం చాలామంది విశ్వాసులూ బోధకులూ అలాంటి దుస్థితిలోనే ఉన్నారు కూడా.


నేటి సంఘం, రక్షణలో దేవుని నిర్ణయం గురించి తెలుసుకోకపోవడం వల్లే కొంతమంది సేవకులు తమ వాక్యపరిచర్య వల్ల రక్షించబడినవారిని తామే రక్షించాము అన్నట్టుగా అతిశయించడం, వారి ఆత్మలకు వీరే ప్రభువులు, నాయకులు అన్నట్లుగా పెత్తనం చెలాయించడం, మరి కొందరు సేవకులైతే తాము కష్టపడి సువార్త ప్రకటించినప్పటికీ ఎవరూ మార్పుచెందడం లేదని నిరాశ చెందడం, తమ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. వాక్యవిరుద్ధమైన ఈ రెండు అభిప్రాయాలూ కూడా మనం మాట్లాడుకుంటున్న ఆంశంపై అవగాహన లేకపోవడం‌ వల్లే సంఘంలో పుట్టుకువచ్చాయి.

కాబట్టి, ఈ వ్యాసంలో నేను ముందుగా, మానవుని రక్షణ దేవుని సంకల్పానుసారమైన నిర్ణయమనీ, అ రక్షణను మనిషి ఎప్పటికీ కోల్పోయే అవకాశం లేదని వాక్యాధారాలతో తెలియచేస్తాము. తరువాత, ఈ అంశంపైన ఉత్పన్నమయ్యే కొన్ని సందేహాలకు కూడా సమాధానం ఇస్తాను. మొదటిగా రక్షణ గురించి బైబిల్‌ ఏమని చెబుతుందో పరిశీలిద్దాం.

ఎఫెసీయులకు 1:4-6
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

ఎఫెసీయులకు 1:12
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

2థెస్సలొనికయులకు 2: 13
ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము.

ఈ వచనాల ప్రకారం,‌ నేడు క్రీస్తునందు విశ్వాసులైన వారంతా జగత్తు పునాది వేయబడకముందే, దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయాన్ని బట్టి ఆయనను విశ్వసించారని (రక్షించబడ్డారని) మనకు అర్ధమౌతుంది.

మరొక వచనాన్ని కూడా చూడండి -

రోమీయులకు 8:29,30
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను.

ఈ వచనాలలో క్రీస్తుతో సారూప్యం గలవారు అయ్యేందుకు దేవుడు ముందే కొందరిని నిర్ణయించాడనీ, వారందరినీ ఆయన పిలచి నీతిమంతులుగా తీర్చి మహిమపరుస్తున్నాడని స్పష్టంగా రాయబడింది. దేవుడు చేసిన ఈ నిర్ణయం‌ మనిషి భూమిపైన పుట్టాక అతని‌ క్రియలను బట్టి చేసేది కాదు కానీ, అది జగత్తుపునాది వేయబడకముందే చేయబడిన నిర్ణయమని ఇప్పటికే మనం ఎఫెసీ పత్రిక నుండి చూసాం.

కొందరు ఈ వచనాలలోని దేవుని నిర్ణయం అనేదానిని అపార్థం చేసుకుంటూ ఆయన తన భవిష్యత్తు జ్ఞానంతో ముందుకు తొంగిచూసి ఆయనను ఎందరు విశ్వసిస్తారో తెలుసుకుని తరువాత వారిని నిర్ణయించుకున్నాడని చెబుతుంటారు. ఈ వాదన ప్రకారం దేవుడు ముందుకు తొంగిచూసి ఏం జరుగుతుందో తెలుసుకున్నాడనీ అలా తెలుసుకోకపోతే ఆయన సృష్టిలో ఏం జరిగేదో ఆయనకే తెలియదని అర్థం వస్తుంది. పైగా, ఆయన తన భవిష్యత్తుజ్ఞానంతో ముందుకు తొంగిచూసి ఎవరు రక్షించబడతారో తెలుసుకున్నప్పుడు మళ్ళీ వారిని రక్షణకోసం నిర్ణయించుకోవడం ఎందుకు? ఇది తర్కలోపంతో కూడిన వాదన. లేఖనాలపై కనీస అవగాహన కూడా లేనివారు మాత్రమే ఇలా వాదిస్తుంటారు.

లేఖనాలలో "దేవుని భవిష్యత్తు జ్ఞానం" అని రాయబడినప్పుడు ఆయన ముందుకు తొంగిచూసి ఏదో తెలుసుకుంటున్నాడని‌ మనం భావించకూడదు‌, "ఆయన సంకల్ప జ్ఞానమే ఆయన భవిష్యత్తు జ్ఞానం". దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ‌ లింక్ ద్వారా సూచించబడిన వ్యాసం చదవండి.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

ఒకవేళ పై వచనాలలో మనం‌ చూసిన దేవుని నిర్ణయం మానవుల భవిష్యత్తును చూసి చేయబడిందే ఐతే అది మానవుల క్రియలను బట్టి చెయ్యబడిన నిర్ణయమని ఒప్పుకోవలసి ఉంటుంది. కానీ అది దేవుని సంకల్పానుసారమైన (స్వకీయ, చిత్తానుసారమైన) నిర్ణయమని వాక్యం స్పష్టంగా చెబుతుంది.

ఎఫెసీయులకు 1:12
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

ఎఫెసీయులకు 1:4-6
ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.

ఈ వచనం కూడా చూడండి.

2‌ తిమోతి 1: 9
మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు-

ఇప్పటివరకూ నేను చూపించిన వాక్యభాగాల ప్రకారం; ఈలోకంలో ఎవరు రక్షించబడి పరలోకం చేరాలో, దేవుడు ముందుగానే (జగత్తు పునాది వేయబడకముందే) నిర్ణయించాడు. ఆ నిర్ణయంలో ఉన్నవారు ఒక్కరుకూడా నశించిపోకుండా తప్పకుండా రక్షించబడతారు. ఎందుకంటే దేవుడు చేసిన నిర్ణయం, ఆలోచనను ఆయన తప్పకుండా నెరవేర్చుకుంటాడు. కొందరు లేఖనాలను సరిగా అర్థం చేసుకోలేక భావిస్తున్నట్టుగా లేక బోధిస్తున్నట్టుగా "ఆయన లోకంలో అందరినీ రక్షించాలి అనుకుంటుంటే అందరూ రక్షించబడడం లేదు కాబట్టి నశించిన వారి విషయంలో ఆయన ఆలోచన నెరవేరకుండా నిరర్థకం అవ్వడం లేదు". అది అసాధ్యమని వాక్యం చెబుతుంది.

యెషయా 46:10
నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను.

యోబు గ్రంథము 42:2
నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.

దానియేలు 4:35
ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.

ఒకవేళ దేవుడు అందర్నీ రక్షించాలనే ఆలోచనతో ఉండి, యేసుక్రీస్తు ఈ లోకంలోని అందరి కోసమూ ప్రాణం పెడితే, ఇక్కడ దేవుడు కూడా మానవుడివలే తన ఆలోచనను నెరవేర్చుకోలేక విఫలమయ్యాడనీ, అదేవిధంగా నశించినవారి విషయంలో యేసుక్రీస్తు బలియాగం కూడా ఎటువంటి ప్రభావాన్నీ చూపలేకపోయిందని మనం భావించవలసి వస్తుంది. కానీ అది అసాధ్యం.

యోహాను సువార్త 12:32,33
నేను భూమి మీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను. తాను ఏవిధముగా మరణము పొందవలసి యుండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను.

ఈ వచనం ప్రకారం యేసుక్రీస్తు ఎవరికోసమైతే ప్రాణం పెట్టాడో, వారందరూ ఆయనకు ఆకర్షించబడాలి లేకపోతే ఆయన పలికిన ఈ మాట తప్పిపోయినట్టే కదా! కాబట్టి, యేసుక్రీస్తుకు ఎవరైతే ఆకర్షించబడి ఆయన దగ్గరకు వస్తున్నారో వారికోసమే ఆయన ప్రాణం పెట్టాడు, వారంతా దేవుని నిర్ణయంలో ముందుగా ఏర్పరచబడినవారే.

ఐతే మీకిప్పుడు, యేసుక్రీస్తు అందరి కోసమూ ప్రాణం పెట్టలేదా? పై వచనంలో కూడా ఆయన అందరి కోసమూ ప్రాణం పెట్టాడని ఉంది కదా? ఒకవేళ దేవుడు కొంతమందినే రక్షణకోసం ముందుగా నిర్ణయించుకుంటే ఆయనలో పక్షపాతం ఉందా? ఆయన రక్షించబడేవారిని ముందే నిర్ణయించినపుడు సువార్త ప్రకటించాలనే భారం శిష్యులపై/సంఘంపై ఎందుకు పెట్టాడనే సందేహాలు ఎన్నెన్నో కలగవచ్చు. మీకు ఆ సందేహాలు కలగడానికి కారణమైన వాక్యభాగాలు కూడా గుర్తుకురావచ్చు. అవన్నీ సరైన సందేహాలే. వాటన్నిటికీ తప్పకుండా సమాధానం ఇస్తాను.

దానికిముందు నేను పైన ప్రస్తావించిన ప్రశ్నలకు మీరు కూడా సమాధానం ఆలోచించండి. దేవుడు అందరినీ రక్షించాలనే ఆలోచనతో ఉంటే, అందరూ రక్షించబడడం లేదుకాబట్టి వారి విషయంలో దేవుని ఆలోచన నెరవేరకుండా పోయిందా? మరి పైన మనం చూసిన లేఖనాలలో అది అసాధ్యమని ఎందుకు రాయబడింది? యేసుక్రీస్తు పలికిన మాటల ప్రకారం ఆయన పైకెత్తబడడం ద్వారా అందరినీ తనదగ్గరకు ఆకర్షించుకోవాలి కదా! ఆయనకు అందరూ ఎందుకు ఆకర్షించబడడం లేదు? ఆయన మాట కూడా తప్పిపోయిందా? ఆయన బలియాగం నశించినవారి విషయంలో విఫలమైందా?

దీనికి సమాధానంగా కొందరు, దేవుడు అందరినీ రక్షించాలి అనుకుని యేసుక్రీస్తు అందరికోసం ప్రాణం పెట్టినప్పటికీ మనుషుల్లో కొందరు కఠినమైన మనస్సుతో ఆయనను నమ్మడం లేదనీ, అందుకే వారు నశించిపోతున్నారనీ అంటుంటారు. అప్పుడు దేవుని ఉద్దేశం/చిత్తం కంటే మానవ స్వేచ్ఛయే గొప్పదని ఒప్పుకోవలసి వస్తుంది, ఎందుకంటే అక్కడ మానవుని స్వేచ్ఛ దేవుని ఆలోచనను/చిత్తాన్ని నెరవేరనీయకుండా చేస్తుందిగా? కానీ లేఖనం ఏం చెబుతుందో చూడండి.

రోమీయులకు 9: 19
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు?

పోని ఆ వాదన ప్రకారం చూసినా కూడా దేవుని ఆలోచన, యేసుక్రీస్తు బలియాగం ఆయనను నమ్మనివారి విషయంలో విఫలం ఔతున్నాయనే అర్థం వస్తుందిగా? కాబట్టి ఆ సమాధానం సరైంది కాదు. నేడు యేసుక్రీస్తును విశ్వసించి రక్షించబడేవారు అందరినీ దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడని సాక్ష్యమిస్తున్న మరికొన్ని లేఖన భాగాలను కూడా చూద్దాం.

మత్తయి సువార్త 15:12,13
అంతట ఆయన శిష్యులు వచ్చి పరిస య్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటల ప్రకారం, పరలోకపు తండ్రి నాటిన (నిర్ణయించిన) వారే ఆయనను విశ్వసించి చివరివరకూ నిలబడతారు. యేసుక్రీస్తును వ్యతిరేకరిస్తున్న పరిసయ్యులు ఆయన నాటిన మొక్కలు కాదు కాబట్టి అభ్యంతరపడ్డారు (పెల్లగించబడ్డారు). అక్కడ వారు పెల్లగించబడ్డారు కాబట్టి అవిశ్వాసులు కాలేదు, తండ్రి వారిని నాటలేదు కాబట్టే అవిశ్వాసులుగా మారి పెల్లగించబడ్డారు.

యోహాను 6:45
నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు; అంత్యదినమున నేను వానిని లేపుదును.

ఈ సందర్భంలో, యేసుక్రీస్తును విశ్వసించేవారంతా వారిని తండ్రి ఆకర్షించబట్టే ఆయన దగ్గరకు వస్తున్నారని తమంతట తాముగా ఎవరూ ఆయన దగ్గరకు రాలేరని అర్థం వచ్చేలా రాయబడింది.
వారందరూ తప్పిపోకుండా అంత్యదినాన లేపబడతారు. నేటి సంఘాలలో క్రీస్తును నమ్ముకున్నామని చెబుతూ సంఘసభ్యులుగా కొనసాగుతున్నవారంతా తండ్రి చేత ఆకర్షించబడే ఆయన దగ్గరకు వచ్చారని (రక్షించబడినవారే) మనం భావించకూడదు. ఆయన దగ్గరకు రొట్టెలకోసం (అవసరాల) కూడా కొంతమంది వస్తుంటారు.

యోహాను సువార్త 6:26
యేసు మీరు సూచనలను చూచుటవలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుటవలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

లూకా 13: 24
ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింపజూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

వీరు కొంతకాలం విశ్వాసులతో పాటు విశ్వాసుల్లానే కొనసాగినప్పటికీ తరువాత తప్పకుండా లోకంలో కలసిపోతారు. ఇరుకు మార్గంలో ప్రవేశించడం వారివల్ల కాదు; ఇలాంటివారి గురించి రాయబడిన కొన్ని సందర్భాలను చూడండి.

1తిమోతికి 6: 21
ఆ విషయములో ప్రవీణులమని కొందరనుకొని విశ్వాస విషయము తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక.

2తిమోతికి 4:10
దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి థెస్సలొనీకకు వెళ్లెను.

హెబ్రీయులకు 10:26,27
మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన (సువార్త వినడం) తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.

పైనం మనం చూసిన లేఖన భాగాలలోనూ మరికొన్ని సందర్భాలలోనూ తప్పిపోయినవారిగా మనకు కనిపించేవారంతా, దేవుని నిర్ణయంలో లేనివారే. దీనికి ఉదాహరణగా మనం ఇస్కరియోతు యూదా జీవితం చూడవచ్చు అతని గురించి రాయబడిన ఒక‌మాటను చూడండి.

అపొస్తలుల కార్యములు 1:25
తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.

ఈ వచనం ప్రకారం యూదా మిగిలిన శిష్యులతో కలసి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా చేసిన పరిచర్యలో కొంతకాలం కొనసాగాడు. కానీ అతను తప్పిపోయాడు, అతను చేసిన పాపానికి చచ్చేంతగా సంతాపపడినా, యూదుల దగ్గరకు వెళ్ళి తన తప్పును ఒప్పుకున్నా, దేవునివైపుకు మాత్రం తిరగలేకపోయాడు. పేతురు కూడా తప్పుచేసాడు యేసుక్రీస్తును తాను ఎరుగనని చెప్పడం చిన్నతప్పేమీ కాదు (లూకా 12:9) కానీ అతను తప్పిపోలేదు పశ్చాత్తాపపడ్డాడు. దేవుడుదానిని అంగీకరించాడు.

దేమా కూడా పౌలుతో కలిసి కొంతకాలం పరిచర్య చేసి తరువాత లోకాన్ని స్నేహించి తప్పిపోయాడు. ఒకవేళ వీరు కనుక నిజంగా తండ్రి నిర్ణయం చొప్పున యేసుక్రీస్తును విశ్వసించినవారైతే అలా తప్పిపోయేవారు కాదు. మారుమనస్సు పొందేవారు, అంత్యదినాన తప్పకుండా లేపబడేవారు.

యోహాను 6:45
అంత్యదినమున నేను వానిని లేపుదును.

ఈ వచనం ప్రకారం, తండ్రి నిర్ణయం చొప్పున రక్షించబడిన వారంతా, అంత్యదినాన లేపబడేటట్టు తమ రక్షణను కొనసాగిస్తారు. వారు అలా కొనసాగించేలా దేవుడే వారికి సహాయం చేస్తాడు.

ఫిలిప్పీయులకు 2:12,13
కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము, నాయెదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి యెక్కువగా నేను మీతో లేని యీ కాలమందును, భయముతోను, వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే.

ఈ‌ వచనాలను మనం పరిశీలిస్తే, పౌలు ప్రారంభంలో మీ రక్షణను‌ కొనసాగించమని అది‌ వారు చేసే పనిగా చెబుతూ, అది వారు కొనసాగించేలా దేవుడే కార్యసిధ్ధి కలుగచేస్తాడని కూడా చెబుతున్నాడు. అప్పటికే వారు విధేయులు. దీనిగురించి రాయబడిన మరికొన్ని మాటలు చూడండి.

ఫిలిప్పీయులకు 1:4
మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను.

1పేతురు 5:10
తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాధియగు దేవుడు, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును.

మొదటి కొరింథీయులకు 1:8,9
మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

ఈ వచనాల ప్రకారం దేవుని నిర్ణయం చేత రక్షించబడినవారు, తమ రక్షణను కొనసాగించేలా దేవుడే వారికి సహాయం చేస్తాడు. ఆయనే వారిని సంపూర్ణులుగా తీర్చిదిద్దుతాడు. వారు ఆ రక్షణనుండి తప్పిపోయే అవకాశం‌ ఏమాత్రమూ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు బలియాగం వారిని సదాకాలానికి సంపూర్ణులుగా చేసింది. ఆ సంపూర్ణత నుండి వారు శాశ్వతంగా తప్పిపోయి నరకానికి పోలేరు.

హెబ్రీయులకు 10: 14
ఒక్క అర్పణచేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసియున్నాడు.

1థెస్సలొనికయులకు 5: 9
ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు.

దేవుని నిర్ణయం చొప్పున రక్షించబడినవారి రక్షణ నిశ్చయత గురించి యేసుక్రీస్తు పలికిన మాటలు కూడా చూడండి.

మత్తయి 24:24
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు.

ఈ వచనంలో యేసుక్రీస్తు తాను ఆరోహణమయ్యాక లోకంలోకి ప్రవేశించే అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు చేసేటటువంటి సూచకక్రియలు, మహత్కార్యాలు, 'సాధ్యమైతే' ఏర్పరచబడినవారిని కూడా మోసం చేసేంత గొప్పవిగా ఉంటాయని చెబుతున్నాడు. అది ఏర్పరచబడినవారి విషయంలో అసాధ్యం కనుకనే ఆయన సాధ్యమైతే అనేపదాన్ని ఉపయోగించాడు.

సాధారణంగా చాలామంది బోధకులు, దేవునికీ విశ్వాసికీ ఉన్న సంబంధాన్ని తండ్రి కొడుకుల సంబంధంతో పోలుస్తారు. ఇది తప్పేమీకాదు దేవుని వాక్యంలో కూడా ఇటువంటి పోలికలు రాయబడ్డాయి. అయితే ఈ బోధకులు అక్కడ‌‌ పిల్లాడు తన తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తూ కొన్నిసార్లు దానిని విడిచిపెట్టేటట్టు, విశ్వాసి కూడా దేవుని చేతిని విడిచిపెట్టడం (రక్షణనుండి తప్పిపోవడం) సాధ్యమని బోధిస్తుంటారు.

ఇది సాధ్యం కాదని పై భాగంలో మనం‌ చూసాం. వీరు చెబుతున్నట్లుగా, రక్షణలో ఉన్నవ్యక్తి తాను అనుకున్నపుడు దేవుని చేతిని విడిచిపెట్టడానికి, దేవుని చేతిని అతను పట్టుకోలేదు, దేవుడే అతని చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు, నిత్యజీవం చేరేదాకా ఆయన ఆ వ్యక్తి చెయ్యిని విడిచిపెట్టడు.

యోహాను సువార్త 10:28,29
నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి యెవడును వాటిని అపహరింపలేడు.

ఈ వచనాలలో యేసుక్రీస్తు చెబుతున్నదాని ప్రకారం చూస్తే,

(1) విశ్వాసులు ఆయన చేతిని పట్టుకుని నడవడం లేదు, ఆయనే తన చేతిలో విశ్వాసుల్ని ఉంచుకుని కాపాడుతున్నాడు; ఆయన గొప్పవాడు కనుక నిత్యజీవం వరకూ వారిని భద్రపరుస్తాడు.
(2) ఒక విశ్వాసి తనకు తానుగా, తండ్రి చేతినుండి విడిపించుకోగలిగినా, లేక మరో వ్యక్తి విశ్వాసిని తండ్రి చేతిలో నుండి అపహరించగలిగినా వారు తండ్రికన్నా గొప్పవారు ఔతారు ఇది అసాధ్యం.

పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడనీ, మనం ఆయనయందు విమోచన దినం వరకూ ముద్రించబడి యున్నామని వాక్యం చెబుతుంది, దానిని‌ బట్టి ఒక విశ్వాసి తన రక్షణను కోల్పోవడం సాధ్యం కాదు.

రెండవ కొరింథీయులకు 1:21,22
మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు.

ఎఫెసీయులకు 1: 14
దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన (సొతైయిన ప్రజలకు) ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు.

"మరి పాపం చేసినా రక్షణను కోల్పోమా?" ఇప్పుడు ఈ ప్రశ్న మీ అందరి మనస్సుల్లోనూ మెదులుతుందని‌ నాకు తెలుసు. దానికి వాక్యం ఏం చెబుతుందో చూడండి.

ఎఫెసీయులకు 4: 30
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

ఈ వచనం ప్రకారం ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడే తప్ప ఆ వ్యక్తిని విడిచిపెట్టి పోవడం లేదు. ఎందుకంటే విమోచన దినం వరకూ ఆయన మనలోనే ఉంటాడు. పాతనిబంధనలో సౌలును విడిచిపెట్టి వెళ్ళినట్టు నేటి విశ్వాసులను విడిచిపెట్టి వెళ్ళడు.

యోహాను 14: 17
ఆయన మీతో కూడ నివసించును, మీలో ఉండును.

1కోరింథీయులకు 3: 16
మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?

మరొక వచనం కూడా చూడండి.

యూదా 1:24,25
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.

ఈ వచనం ప్రకారం దేవుడే మనం తొట్రిల్లకుండా కాపాడుతూ నిర్థోషులుగా ఆయనముందు నిలువబెట్టుకుంటాడు. అలా అని దేవుని నిర్ణయం చేత రక్షించబడినవారు ఎటువంటి పాపమూ చేయరని నేను చెప్పడం లేదు. పై వచనంలో మనం పాపం చెయ్యడం వల్ల మనలోని పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడని కూడా రాయబడింది‌ కదా!

అదేవిధంగా;

1 యోహాను 1:8-10
మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు.

ఈ వచనం ప్రకారం, విశ్వాసులలో కూడా పాపం‌ ఉంటుంది కానీ వారు దానిని ఒప్పుకుని విడిచిపెడతారు, గతకాలంలో వలే తాము చేసేది పాపమని తెలిసినా అలవాటుగా అది చెయ్యలేరు. అదే యోహాను పాపం గురించి చెబుతున్న మరోమాటను చూడండి;

1యోహాను 3:9
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.

ఈ వచనంలో యోహాను, దేవుని మూలంగా పుట్టినవాడిలో ఆయన బీజం ఉంటుంది కాబట్టి వాడు పాపం చేయజాలడు అని చెబుతున్నాడు. దీనికి కూడా పైన చెప్పినట్టుగా విశ్వాసి అసలు పాపం చెయ్యడని అర్థం కాదు. ఎందుకంటే అదే యోహాను మనం‌ పైన చూసిన వాక్యభాగంలో మనలో పాపం‌ ఉందని చెబుతున్నాడు. అంతేకాకుండా, 1 యోహాను 2:1,2 లో "మనం పాపం చేస్తే క్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి దగ్గర మన పాపాలకు శాంతికరమైయున్నాడని" కూడా చెబుతున్నాడు.

కాబట్టి దేవునిమూలంగా పుట్టినవాడు పాపం చెయ్యజాలడు అంటే ఆ పాపంలో‌ కొనసాగుతూ ఉండడని అర్థం. బైబిల్ లో చాలామంది భక్తులు పాపం చేసారు (దావీదు, సొలొమోను, సంసోను, పేతురు). కానీ, వారు ఆ పాపంలో కొనసాగలేదు.
దేవునివైపు తిరిగి పశ్చాత్తపపడ్డారు, మారుమనస్సు పొందారు.

ఉదాహరణకు; కొరింథీ సంఘానికి పౌలు మొదటిసారి పత్రికను రాసినప్పుడు వారిలో ఉన్న‌ పాపాల గురించి హెచ్చరించడం మనకు కనిపిస్తుంది. అదే కొరింథీయులకు ఆయన రెండవసారి పత్రికను రాసేటప్పుడు వారు తాము చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడినట్టుగా ఆయన పేర్కొన్నాడు.

రెండవ కొరింథీయులకు 7:8-10
నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను; నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలముమట్టుకే దుఃఖ పెట్టెనని తెలిసికొనియున్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదుగాని మీరు దుఃఖపడి మారుమనస్సు పొందితిరని యిప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయములోనైనను మా వలన మీరు నష్టము పొందకుండుటకై, దైవచిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.

ఈవిధంగా వారు ఎందుకు పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందారంటే వారిని రక్షించుకున్న దేవుడు ‌నమ్మదగినవాడు. వారు ఆవిధంగా పశ్చాత్తాపపడి నిరపరాధులుగా ఉండేలా ఆయనే సహాయం చేస్తాడు.

మొదటి కొరింథీయులకు 1:8,9
మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులైయుండునట్లు అంతమువరకు ఆయన మిమ్మును స్థిరపరచును. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు.

మరోసారి ఈ మాటలను జ్ఞాపకం చెయ్యదలిచాను, విశ్వాసి కూడా కొన్నిసార్లు పాపం చేస్తాడు, కానీ ఆ పాపంలో కొనసాగడు, ఆ పాపం విషయంలో పశ్చాత్తాపపడి దేవునియొద్దకు వస్తాడు, గుండెలు పగిలేలా దేవునిముందు రోదిస్తాడు (భక్తుల జీవితాల్లో మనం ఇదే చూస్తాం). దేవుడు ఆ పాపాలను క్షమిస్తాడు. ఈవిధంగా విశ్వాసి పాపం చేసినా తన రక్షణను ఎప్పటికీ కోల్పోడు.

యిర్మీయా 31:34
నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను.

హెబ్రీయులకు 8:12
నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడును జ్ఞాపకము చేసికొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

కానీ ఎవరైతే నేను పాపం చేసినా నా రక్షణను కోల్పోను కాబట్టి, పాపమే చేస్తానని తెగింపుగా అలా ప్రవర్తిస్తారో (కృపను పాపానికి అనుమతిగా భావిస్తారో) నిజానికి వారసలు రక్షించబడనే లేదు. రక్షించబడినవారిలో పాపభీతి ఉంటుంది. వారు పాపాన్ని ద్వేషిస్తారు, ప్రేమించరు.

రోమీయులకు 6:18
పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

మొదటి యోహాను 3:9,10
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో (రక్షించబడిన వానిలో) ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు (గతంలో వలే పాపంలో అలవాటుగా కొనసాగడు). వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దీనినిబట్టి దేవుని పిల్లలెవరో (రక్షించబడినవారెవరో) అపవాది పిల్లలెవరో (రక్షించబడనివారెవరో) తేటపడును.

ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించదలిచాను. ఒక విశ్వాసి పాపం చేసినా అతను తన రక్షణను కోల్పోడు అనేది వాస్తవం అయినప్పటికీ, కొన్నిసార్లు అతను చేసిన పాపాలను బట్టి ఈ భూమిపై క్రమశిక్షణ చెయ్యబడడాన్ని తప్పించుకోలేడు. ఉదాహరణకు దావీదు పాపం చేసాడు, ఆ పాపాన్ని బట్టి దేవుడేమీ అతణ్ణి నాశనం చెయ్యలేదు, తన సన్నిధినుండి‌ వెలివెయ్యనూ లేదు. ఐతే అతను ఆ పాపాన్ని బట్టి మరణంకంటే ఎక్కువబాధను అనుభవించేలా క్రమశిక్షణ చేసాడు. దావీదు జీవిత‌ చరిత్రలో మనమదే చూస్తాం. విశ్వాసుల జీవితంలో కూడా అదే జరుగుతుంది, వారు చేసే పాపాలను బట్టి తమ రక్షణను కోల్పోయి నరకానికి పోకపోవచ్చు, ఎందుకంటే "క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియూ లేదు" (1 కొరింథీ 12:1). అయినప్పటికీ కొన్నిసార్లు తమ పాపాలకు క్రమశిక్షణ చెయ్యబడడాన్ని తప్పించుకోలేరు. ఆ క్రమశిక్షణ కొన్నిసార్లు మరణంకంటే ఎక్కువబాధను కలిగిస్తుంది. అందుకే‌ విశ్వాసులు పాపం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీనిని సొలోమోను విషయంలో చెప్పబడిన మాటలతో పోల్చిచూడండి‌.

రెండవ సమూయేలు 7:14,15
అతడు పాపముచేసిన యెడల నరుల దండముతోను మనుష్యులకు తగులు దెబ్బలతోను అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను.

మన రక్షణ విషయంలో చేయబడింది కూడా ఇటువంటి కృపగల నిబంధనే.

యోహాను 1:17
ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను.

ఎఫెసీయులకు 2:8
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

అందుకే మనం పాపం చేసినా క్రమశిక్షణ చెయ్యబడతాము కానీ, రక్షణను కోల్పోయి నరకానికి పోము.

ఇప్పుడు ఈ అంశంపై ఉత్పన్నమయ్యే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

Q1. యోహాను 3:16 లో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడిని పంపాడని రాయబడింది కదా! మరి యేసుక్రీస్తు లోకమంతటి కొరకూ ప్రాణం పెట్టలేదా?

A. యేసుక్రీస్తు మనం ఆలోచిస్తున్న లోకమంతటి కొరకూ ప్రాణం పెడితే వచ్చే సమస్య ఏంటో ఇప్పటికే వివరించాను. కాబట్టి "దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించె‌ను" అన్నప్పుడు మనం ఆలోచిస్తున్నట్టుగా అది లోకమంతటికోసమూ చెప్పబడుతుందని కాకుండా పరిథిలో చెప్పబడిన మాటగా మనం అర్థం చేసుకోవాలి. "దేవుడు ప్రేమించిన లోకం" వేరే ఉంది. ఆయన నిర్ణయంలో ఉన్నవారే ఆ లోకం, "యేసుక్రీస్తు ఆ లోకం కోసమే తన ప్రాణం పెట్టాడు" (దీనిగురించి మరింత స్పష్టంగా తదుపరి ప్రశ్నలో వివరిస్తాను). ఒకవేళ మనం ఆలోచిస్తున్నట్టుగా ఆ సందర్భంలో లోకం అనగానే మొత్తం ప్రపంచం కోసం మాట్లాడుతుండి, యేసుక్రీస్తు ఆ లోకమంతటికోసమూ ప్రాణం పెడితే, యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడో ఒకసారి చూడండి.

యోహాను సువార్త 17:9
నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; "లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు", నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు "నేను లోకం కొరకు ప్రార్థన చెయ్యడం లేదు" అంటున్నాడు. అంటే ఆయన తండ్రి ప్రేమించిన లోకం కోసం ప్రార్థన చెయ్యకుండా తండ్రి ప్రేమకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడా? లేదు. ఆయన ఎవరికోసమైతే ప్రార్థన చేస్తున్నాడో వారే దేవుడు ప్రేమించిన లోకం (ఆయన నిర్ణయంలో ఉన్నవారు). ఆయన ప్రార్థించకుండా విడిచిపెట్టిన లోకం కూడా వేరే ఉంది. అయితే దీనికి కొందరు, అప్పటికి లోకంలో ఇంకా చాలామంది మారుమనస్సు పొందలేదు, అందుకే యేసుక్రీస్తు వారికోసం కాకుండా, మారుమనస్సు పొందినవారికోసమే ప్రార్థన చేస్తున్నాడని వాదించవచ్చు. కానీ యేసుక్రీస్తు అక్కడ ప్రార్థన చేస్తుంది కేవలం అప్పటికి ఆయనను విశ్వసించినవారికోసమే కాదు. భవిష్యత్తులో ఆయనను విశ్వసించబోయే అందరికోసమూ అక్కడ ప్రార్థన చేసాడు. అందులో నేటి విశ్వాసులమైన మనం‌కూడా ఉన్నాము. ఈ మాటలు చూడండి.

యోహాను సువార్త 17:21
వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; "వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను".

ఈ వచనం ప్రకారం; యేసుక్రీస్తు అప్పటికి తనను విశ్వసించినవారికోసం మాత్రమే కాదు, అపోస్తలుల బోధను బట్టి భవిష్యత్తులో విశ్వసించబోయే అందరికోసమూ ప్రార్థన చేసాడు. వారే తండ్రి ప్రేమించిన లోకం, ఆ లోకం‌కోసమే ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రార్థించకుండా విడిచిపెట్టిన లోకం వేరే ఉంది, వారే తండ్రి నిర్ణయంలో లేనివారు. తండ్రి వారిని ప్రేమించలేదు, యేసుక్రీస్తు వారికోసం ప్రాణం పెట్టనూ లేదు. "దేవుడు లోకమును ఎంతో ప్రేమించె‌ను" అని‌తన సువార్తలో ప్రస్తావించిన యోహాను, తండ్రి ప్రేమించిన అదేలోకం కోసం తన పత్రికలో కూడా జ్ఞాపకం చేస్తాడు.

1యోహాను 2: 2
ఆయనే మన పాపములకు శాంతికరమైయున్నాడు మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.

ఇక్కడ యోహాను తండ్రి ప్రేమించిన లోకాన్ని ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు ఆ సర్వలోకానికి శాంతికరంగా ఉన్నాడు అంటున్నాడు. అంటే యూదులకు మాత్రమే కాదు‌కానీ, తండ్రి నిర్ణయం చొప్పున యేసుక్రీస్తు ఎవరికోసమైతే ప్రాణం పెట్టాడో వారందరి పాపాలకూ (అన్యజనులకు సహా) ఆయన శాంతికరంగా ఉన్నాడని ఈ మాటలభావం. ఇప్పుడు చెప్పండి, ఈలోకంలో ఎంతోమంది నశించిపోయి, నరకానికి పోతున్నారు. వారందరిపాపాలకూ యేసుక్రీస్తు శాంతికరంగా ఉన్నాడా? ఉంటే వారి పాపాలను బట్టి నశించిపోగలరా? యేసుక్రీస్తు ఎవరి పాపాలకైతే శాంతికరంగా ఉన్నాడో వారు నశించిపోవడం అసాధ్యం. ఈ మాటలు కూడా "దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను" అని రాయబడిన వాక్యభాగంలోనే ఉన్నాయి. కాబట్టి యోహాను మాటల్లో లోకం (యోహాను 3:16), సర్వలోకం (1 యోహాను 2:2), అన్నప్పుడు "తండ్రి నిర్ణయంలో ఉన్నవారికోసం" "యేసుక్రీస్తు ప్రార్థన చేసినవారికోసం" "ఆయన ప్రాణం పెట్టినవారికోసం" అని అర్థం.

"లోకం" అనేమాటను యూదులు పరిథులతో (ఒక సమూహాన్ని సూచించడానికి) కూడా ఉపయోగిస్తారని అర్థమయ్యేందుకు ఒక స్పష్టమైన ఆధారం పెడుతున్నాను చూడండి.

యోహాను 12:19
కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. "ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని" చెప్పుకొనిరి.

ఇక్కడ యూదులలో పరిసయ్యులు అనబడే ఒక గుంపు, యేసుక్రీస్తును‌ వెంబడిస్తున్న సమూహాన్ని ఉద్దేశించి వారిని "లోకం" అని ప్రస్తావించింది. లోకం అని రాయబడినప్పుడల్లా అది ప్రపంచం మొత్తం కోసమూ అనుకుంటే, ప్రపంచం‌ మొత్తంలో అప్పుడు ఆయనను వెంబడించింది యూదయ ప్రాంతంలో ఉన్న‌ కొంతమందే కదా! చివరికి ఆ మాటలు పలుకుతున్న పరిసయ్యులు కూడా ఆయనను వెంబడించలేదు.

Q2. యేసుక్రీస్తు అందరికొరకూ, మనుష్యులందరికొరకూ ప్రాణం పెట్టాడని ఎన్నో లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఉదాహరణకు; "ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను" (మొదటి తిమోతికి 2:6), "తన సొంతకుమారుని అనుగ్ర హించుటకు వెనుకతీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు?" (రోమీయులకు 8:32). అలాంటప్పుడు యేసుక్రీస్తు అందరికోసమూ కాదు కొందరికోసమే ప్రాణం పెట్టాడని ఎలా చెబుతారు?

A. యేసుక్రీస్తు ఏ మినహాయింపూ లేకుండా అందరికొరకూ ప్రాణం పెడితే వచ్చే సమస్య ఏంటో ఇప్పటికే వివరించాను. మరి లేఖనాలలో ఆయన అందరికొరకూ ప్రాణం పెట్టాడని ఎందుకు రాయబడిందంటే, ఇది మనం యూదా నేపధ్యం నుండి ఆలోచించాలి. అప్పటి యూదులు దేవుడు తమకు మాత్రమే దేవుడు అన్నట్టుగా, ఆయన ఆశీర్వాదాలు అన్నీ వారికే స్వంతం అన్నట్టుగా అతిశయించేవారు. కానీ యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా కలుగబోయే రక్షణ కేవలం యూదులకు మాత్రమే పరిమితం కాదని, అది అన్యజనులకు కూడా వర్తిస్తుందని చెప్పడానికే అపోస్తలలు తమ రచనల్లో యూదులనూ, అన్యజనులనూ కలిపి "అందరూ" అనే పదప్రయోగం చేసారు. అందరూ అంటే ఏ మినహాయింపూ లేకుండా అందరూ అని కాదు, ఏ‌ బేధమూ లేకుండా అందరూ అని అర్థం. ఈ భావం పౌలు మాటల్లోనే స్పష్టంగా చూడండి.

గలతీయులకు 3:27,28
క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

రోమీయులకు 10:12
యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు; ఒక్క ప్రభువే అందరికి ప్రభువై యుండి, తనకు ప్రార్థనచేయువారందరియెడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై యున్నాడు.

దీనిగురించి మరింత స్పష్టతకోసం యేసుక్రీస్తు పలికిన మాటలను పరిశీలిద్దాం.

మార్కు 10:45
మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, "అనేకులకు" ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

ఈ సందర్భంలో‌ యేసుక్రీస్తు "అనేకులకు ప్రతిగా" తన ప్రాణం పెట్టబోతున్నాను‌ అంటున్నారు. అందరూ అన్నప్పుడు ఏ మినహాయింపూ లేకుండా అందరూ అనుకోవడానికీ, యేసుక్రీస్తు "అనేకులకు ప్రతిగా" అనడానికి మధ్య ఉన్న తారతమ్యాన్ని గమనించండి. "అనేకులు" అన్నప్పుడు ఏ మినహాయింపూ‌ లేకుండా అందరూ అనే భావం రాదు. ఏ బేధం లేకుండా అందరూ (గొప్ప సమూహం) అనే భావం వస్తుంది (యెషయా 53:11). ఇలా ఆయన ప్రాణం పెట్టిన అనేకులనే మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం.

ప్రకటన గ్రంథం 7:9,10
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెెపిల్లయెదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

యేసుక్రీస్తు తాను ఎవరికోసం ప్రాణం పెట్టబోతున్నాడో వివరించిన మరో ప్రాముఖ్యమైన సందర్భాన్ని చూడండి.

యోహాను సువార్త 10:11,15,26-28
నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును. తండ్రి నన్ను ఏలాగున ఎరుగునో నేను తండ్రిని ఏలాగు ఎరుగుదునో ఆలాగే నేను నా గొఱ్ఱెలను ఎరుగుదును, నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును. మరియు "గొఱ్ఱెలకొరకు నా ప్రాణము పెట్టుచున్నాను". అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు. నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు ఆయన గొఱ్ఱెల గురించి మాట్లాడుతూ, వాటికోసం‌ తన ప్రాణం పెట్టబోతున్నానని ప్రకటిస్తున్నాడు. మరలా ఆయనను తృణీకరిస్తున్న కొందరు యూదులను ఉద్దేశించి మీరు నా గొఱ్ఱెలు కాదని కూడా చెబుతున్నాడు. దీనిప్రకారం ఆయన ఎవరికోసమైతే ప్రాణం పెట్టాడో ఆ గొఱ్ఱెలలో అప్పటి యూదులు కొందరు మినహాయించబడ్డారు. అందుకే వారు ఆయన స్వరం వినలేదు. ఐతే ఆయన ప్రాణం పెట్టిన గొఱ్ఱెల జాబితాలో ఎందరైతే ఉన్నారో వారందరూ ఆయన స్వరం విని ఆయనను విశ్వసిస్తారు. వారంతా తండ్రి నిర్ణయంలో ఉన్నవారే.

అక్కడ యేసుక్రీస్తు పలికిన మాటలను జాగ్రతగా పరిశీలించండి, వారు (యూదులు) ఆయనను నమ్మలేదు కాబట్టి మీరు నా గొఱ్ఱెలు కాదని చెప్పడం లేదు. మీరు నా గొఱ్ఱెలు కాదు‌ కాబట్టే నన్ను నమ్మరని చెబుతున్నాడు. దీనిప్రకారం ఆయన ప్రాణం పెట్టిన గొఱ్ఱెలన్నీ ఆయనను నమ్ముతాయి.

యోహాను సువార్త 10:26,27
అయితే మీరు "నా గొఱ్ఱెలలో చేరినవారు కారు గనుక మీరు నమ్మరు". "నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును".

"అందరూ అన్నప్పుడు ఏ బేధం లేకుండా అందరూనే తప్ప, ఏ మినహాయింపూ లేకుండా అందరూ కాదని" చెప్పడానికి లేఖనాలు ఇస్తున్న మరో స్పష్టమైన ఆధారం చూడండి.

యోవేలు 2:28
తరువాత నేను "సర్వజనుల మీద" నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

అపొస్తలుల కార్యములు 2:17
అంత్యదినములయందు నేను "మనుష్యులందరి మీద" నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.

ఈ వచనాలలో ఆయన ఆత్మ సర్వజనుల‌/మనుష్యులందరి మీదా కుమ్మరించబడుతుందని రాయబడింది. అంటే భూమిపై ఉన్న అందరిపైనా ఆత్మ‌ కుమ్మరించబడిందా? పోని భవిష్యత్తులోనైనా అలా జరుగుతుందా? లేదు. ఈమాటలు కేవలం యేసుక్రీస్తు సిలువ మరణాన్ని విశ్వసించి, ఆయన వాగ్దానంచేసిన ఆత్మను పొందుకునే వారికోసమే రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ సర్వశరీరులూ, మనుష్యులందరూ అంటే, పరిశుద్ధాత్మను పొందుకునే విశ్వాసులు మాత్రమే. యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది వారికొరకు మాత్రమే. ఎందుకంటే వారు మాత్రమే తండ్రి నిర్ణయంలో ఉన్నవారు.

Q3. యేసుక్రీస్తు కొందరికోసమే ప్రాణం పెట్టాడని బోధించడం ఆయన బలియాగాన్ని చులకన చెయ్యడం కాదా?

A: లేఖనాలు ఏం చెబుతున్నాయో దానిని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించడం యేసుక్రీస్తు బలియాగాన్ని చులకన చెయ్యడం ఎలా ఔతుంది? ఇటువంటి లేనిపోని సందేహాలతో లేఖనాలలో లేనిదానిని చెబితే మాత్రం అది కచ్చితంగా దుర్బోధే ఔతుంది. ఇంతకూ యేసుక్రీస్తు బలియాగాన్ని చులకనగా చేస్తుంది ఎవరు? ఆయన ఎందరికోసమైతే తన ప్రాణం పెట్టాడో వారిలో ఒకరు కూడా నశించిపోకుండా రక్షించుకుంటాడని బోధించేవారా? లేక ఆయన లోకంలో ఉన్న అందరికోసమూ ప్రాణం పెట్టాడు కానీ అందరినీ రక్షించుకోలేకపోతున్నాడని బోధించేవారా? మేము యేసుక్రీస్తు బలియాగం విషయంలో సంఖ్యను తగ్గిస్తున్నాము కానీ శక్తిని కాదు, కానీ ఆయన లోకంలో ఉన్న అందరి కోసమూ ప్రాణం పెట్టాడని చెప్పేవారు మాత్రం ఆ బలియాగపు శక్తినే తగ్గించి చూపిస్తున్నారు.

Q4: విశ్వాసులను దేవుడే రక్షించుకుని ఆయనే వారిలో కార్యసిద్ది కలుగచేస్తున్నపుడు వారు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో బైబిల్ లో ఎందుకు ఆజ్ఞాపించబడింది.

A: పైన మనం చూసిన లేఖనాలలో ఆయనే మనలో కార్యసిద్ధి కలుగచేస్తాడనీ, పరిపూర్ణులుగా చేస్తాడని రాయబడింది. ఆయన ఆ కార్యసిద్ధిని మనలో తన వాక్యాన్ని సాధనంగా వాడుకుని జరిగిస్తాడు. నిజంగా రక్షించబడిన విశ్వాసి పరిశుద్ధాత్ముడి సహాయం ద్వారా లేఖనాలను ధ్యానిస్తూ అందులో దేవుడు తనకు బోధించిన విధులను గైకొనడానికి‌ ఆసక్తి చూపిస్తుంటాడు. ఆయన ఆజ్ఞాపించిన నీతిక్రియలను గైకొంటూ కార్యసిద్ధి పొందుతుంటాడు. పరిశుద్ధాత్ముడు ఆ లేఖనాలను ఆ వ్యక్తికి జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధపరుస్తుంటాడు.

1యోహాను 2: 5
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను.

రోమీయులకు 15: 4
ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి యున్నవి.

కీర్తనలు 119: 9
యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?

1కోరింథీయులకు 10: 11
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.

2తిమోతికి 3: 14,15
క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక, నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.

మొదటి థెస్సలొనీకయులకు 2:13
ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.

Q5: దేవుడు ముందుగానే కొందర్ని రక్షణకోసం నిర్ణయించుకున్నపుడు మనం అందరికీ ఎందుకు సువార్తను ప్రకటించాలి?

A: తన నిర్ణయంలో ఉన్నవారిని తన దగ్గరకు తెచ్చుకునే సాధనంగా ఆయన సువార్తను నియమించాడు కాబట్టి, సంఘం సువార్తను ప్రకటించాలి. ఆయన నిర్ణయంలో ఉన్నవారు ఎవరో మనకు తెలియదు కాబట్టి అందరికీ దానిని ప్రకటించాలి. ఆ సమయంలో దేవుని నిర్ణయంలో ఉన్నవారంతా సువార్తకు ప్రతిస్పందించి ఆయనను విశ్వసిస్తారు (యేసుక్రీస్తు తన గొర్రెలకోసం చెప్పినట్టుగా అయన స్వరాన్ని వింటారు). ఒక వ్యక్తి చనిపోయేవరకూ ఆ వ్యక్తి దేవుని నిర్ణయంలో ఉన్నాడా లేదా అనేదానిని మనం చెప్పలేము ఆ వ్యక్తి కూడా చెప్పలేడు. కాబట్టి దేవుడు మనపై పెట్టిన బాధ్యత ప్రకారం భారంతో ప్రతీవారికీ సువార్తను ప్రకటిస్తూ ఉండాలి.

అపొస్తలుల కార్యములు 18:9-11
రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.

ఇంతకూ మనం సువార్త ప్రకటించినప్పుడు ఒక మనిషి దానిని ఎలా విశ్వసిస్తాడు? తనంతట తానుగా విశ్వసించగలడా? లేదు. అది అసాధ్యమని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ప్రతీమనిషీ తన‌పాపం కారణంగా ఆత్మీయంగా చనిపోయాడు.

ఎఫెసీయులకు 2:1
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

ఈ వచనం ప్రకారం ప్రతీమనిషీ ఆత్మీయంగా చనిపోయాడు కాబట్టి, ఆత్మసంబంధమైన సువార్తను తనంతట తానుగా అంగీకరించలేడు. (అందుకే యేసుక్రీస్తు చెప్పినట్టుగా తండ్రి ఆకర్షించకుండా ఆయన దగ్గరకు రాలేరు)

మొదటి కొరింథీయులకు 2:14
ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

కాబట్టి, ముందుగా దేవుడు అతణ్ణి ఆత్మీయంగా బ్రతికించిప్పుడే (తిరిగి జన్మింపచేసినప్పుడే) అతను సువార్తను అంగీకరిస్తాడు.

ఎఫెసీయులకు 2:4,5
అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను. కృపచేత మీరు రక్షింపబడియున్నారు.

యెహెజ్కేలు 36:26,27
నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను

అపో.కార్యములు 16: 14
అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

దీనిగురించి మరింత స్పష్టత కోసం యేసుక్రీస్తు నికోదేముతో చెప్పిన మాటలు మనం చూడవచ్చు.

యోహాను సువార్త 3:3
అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా (లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు నికోదేముతో మాట్లాడుతూ ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని చెబుతున్నాడు. ఎవరూ తమకు తాముగా జన్మించలేరు. దేవుడే పైనుండి (తన ఆత్మను పంపి) వారిని జన్మింపచెయ్యాలి. అందుకే అక్కడ పుట్ నోట్ లో "పైనుండి" అనేపదం మనకు కనిపిస్తుంది (గ్రీకులో వాడిన పదానికి ఇదే అర్థం) విశ్వాసులు అంటేనే దేవుని మూలంగా పుట్టినవారు‌ (తిరిగి జన్మించినవారు).

మొదటి పేతురు 1:4
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను.

1యోహాను 3: 9
దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.

1యోహాను 5: 4
దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే.

యోహాను సువార్త 1:13
వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

కాబట్టి రక్షణలో మొదటి అడుగు దేవుడే వేస్తూ, చచ్చిన స్థితిలో ఉన్న వారిని తన పరిశుద్ధాత్మ ద్వారా బ్రతికింపచేస్తూ (తిరిగి జన్మింపచేస్తూ) వారు విశ్వసించేలా చేస్తున్నాడు.

యోహాను సువార్త 3:6
శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది.

తీతుకు 3:5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

జెకర్యా 12: 10
దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివాసులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృష్టియుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు,తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలా పించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు.

దీనిప్రకారం దేవుని నిర్ణయంలో ఉన్నవారంతా ఆయన ద్వారా (పరిశుద్ధాత్మ ద్వారా) తిరిగి జన్మింపబడి/ఆకర్షించబడి/హృదయం తెరువబడి సువార్తను విశ్వసిస్తారు.

అపో.కార్యములు 13: 48
అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు "నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి".

(కొందరు మనం ప్రారంభంలో చూసిన దేవుని నిర్ణయం అనేమాటను వక్రీకరించి అది రక్షణకోసం చేసిన నిర్ణయం కాదని స్వాస్థ్యం కోసం చెయ్యబడ్డ నిర్ణయమని ఏదేదో చెబుతుంటారు కానీ ఈ సందర్భంలో స్పష్టంగా 'వారు' (కొందరు) నిత్యజీవం (రక్షణ) కోసమే నిర్ణయించబడ్డారని రాయబడింది)

మిగిలినవారు యుగసంబంధమైన దేవత చేత నేత్రాలు మూయబడినవారై నాశనమౌతారు.

రెండవ కొరింథీయులకు 4:3,4
మా సువార్త మరుగుచేయబడిన యెడల నశించుచున్నవారి విషయములోనే మరుగు చేయబడియున్నది. దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.

యోహాను 8: 21
మరియొకప్పుడు ఆయన నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

రెండవ థెస్సలొనీకయులకు 2:10-12
దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను, నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించియుండును ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు.

ఇప్పటివరకూ నేను చెప్పినదాని ప్రకారం, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఒకరిని బ్రతికించిప్పుడే (తిరిగి జన్మింపచేసి/హృదయం తెరచి) ఒక వ్యక్తి సువార్తను విశ్వసిస్తాడు. కానీ అపోస్తలుల కార్యములు 2:38లో పేతురు మీరు మారుమనస్సు‌ పొంది బాప్తీస్మం తీసుకోవాలనీ తరువాత పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారనీ చెబుతున్నాడు.

అదేవిధంగా,

అపొస్తలుల కార్యములు 8:14-17
సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి. అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.

అపొస్తలుల కార్యములు 19:5,6
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

ఈ రెండు సందర్భాలలో కూడా కొందరు ప్రజలు యేసుక్రీస్తును విశ్వసించి బాప్తీస్మం పొందిన తరువాతే పరిశుద్ధాత్మను పొందుకు‌న్నారనీ, అంతకు ముందు ఆయన వారిపై దిగలేదనీ రాయబడింది‌. కాబట్టి మీరు ఈ సందర్భాలు చదువుతున్నపుడు అక్కడ వారు పరిశుద్ధాత్మతో పనిలేకుండానే యేసుక్రీస్తును విశ్వసించారు కదా అనే సందేహం కలగవచ్చు. ఆ సందేహానికి వివరణ చూసేముందు మనం యేసుక్రీస్తును విశ్వసించడానికి కారణం పరిశుద్ధాత్ముడే అని చెప్పే మరో మాటను చూడండి.

1కోరింథీయులకు 12: 3
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ ద్వారానే ఒకవ్యక్తి యేసుక్రీస్తు ప్రభువని చెబుతాడని రాయబడింది. దీనర్థం నోటితో ఊరికే ఆయన ప్రభువని చెప్పడం కాదు అలా చాలామంది చెబుతారు. కానీ, యూదులలో ఒక వ్యక్తి మరొకర్ని ప్రభువు అని ఒప్పుకోవడమంటే, ఇకపై తనకంటూ వేరే చిత్తం లేకుండా ఆ వ్యక్తి చిత్తానికే అప్పగించుకోవడం. రక్షణలో మనమంతా యేసుక్రీస్తు చిత్తానికి మనల్ని అప్పగించుకుంటూ ఆయన‌ మనకు ప్రభువని ఒప్పుకుంటాం.

రోమీయులకు 10: 9
అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.

దీనిప్రకారం, మనం యేసుక్రీస్తు మనకు ప్రభువని ఒప్పుకోడానికి (రక్షించబడడానికి) పరిశుద్ధాత్ముడే కారణం. మరి మనం పైన చూసిన సందర్భాలలో, వారు విశ్వసించి బాప్తీస్మం పొందిన తరువాతనే ఆయన వారిపైన ఎందుకు కుమ్మరించబడ్డాడు, పేతురు కూడా అలా‌ ఎందుకు చెప్పాడంటే.

(1) ఒకసారి అదే పేతురు కళ్ళముందు జరిగిన ఒక సంఘటనను చూడండి.

అపో. కార్యములు 10:44-48
పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను.

ఈ సందర్భంలో పేతురు కొర్నేలీ ఇంటిదగ్గర అ‌న్యులకు బోధిస్తుండగా వారు ఇంకా బాప్తీస్మం పొందకముందే వారిపై పరిశుద్ధాత్ముడు దిగాడు. ఒకవేళ అపోస్తలుల కార్యములు 2:38 లో పేతురు చెప్పిన మాటలు (1. మారుమనస్సు పొంది బాప్తీస్మం తీసుకోవాలి 2. ఆ తరువాత పరిశుద్ధాత్ముడు వారిపైకి వస్తాడు) వరుస క్రమంలో జరిగేవి అయితే, ఇక్కడ వారు బాప్తీస్మం తీసుకోకుండానే ఆయన వారిపైకి ఎలా వచ్చాడు?

కాబట్టి పేతురు అక్కడ వరుస క్రమంలో జరిగేవాటి గురించి చెప్పడం లేదు కానీ, పెంతుకోస్తు పండుగ దినాన ఆత్మ కుమ్మరింపును (బాషలు మాట్లాడడాన్ని) చూసి విభ్రాంతి పొందుతున్న ప్రజలకు అదంతా పరిశుద్ధాత్ముడి‌ మూలంగానే జరిగిందని దేవుడు మీకు కూడా ఆ వరాన్ని అనుగ్రహిస్తాడని తెలియచెయ్యడానికే అదంతా చెప్పాడు. వాస్తవానికి ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడి శక్తి కారణంగానే మారుమనస్సు పొందుతాడు. ఆ వెంటనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిలో నివసిస్తాడు తరువాత అతను దానికి బహిరంగ ఒప్పుకోలుగా బాప్తీస్మం తీసుకుంటాడు.

(కొందరు యేసుక్రీస్తు ప్రభువు ఒకడు నీటిమూలంగానూ ఆత్మమూలంగానూ జన్మించితేనే కానీ దేవుని రాజ్యముము చూడనేరడని పలికిన మాటలలో నీటిమూలంగా అనేది బాప్తీస్మం గురించి చెప్పబడిందని అపార్థం వేసుకుంటారు. కానీ అక్కడ నీటిమూలంగా అంటే బాప్తీస్మం గురించి కాదు బాప్తీస్మం పొందినవారంతా తిరిగి జన్మించినట్టు కాదు. కాబట్టి ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు సాధనంగా వాడుకునే వాక్యానికి సాదృష్యంగానే ఆమాట (నీటిమూలంగా) వాడబడిందని మనం అర్థం చేసుకోవాలి.

ఎఫెసీయులకు 5: 27
నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, "వాక్యముతో ఉదక స్నానముచేత" దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

దీనిగురించి మరింత వివరంగా తెలుసుకోడానికి ఈ వ్యాసాలు చదవండి.

బాప్తిస్మం ద్వార రక్షణ వస్తుందా?

నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట

రక్షణ క్రియలమూలంగా కాదని వాక్యం చెబుతుంది బాప్తీస్మం అనేది క్రియ)

(2) మరి; అపో.కార్యములు 8:14-7, 19:1-6 వచనాలలో సమరయులు మారుమనస్సు పొంది‌ బాప్తీస్మం తీసుకున్న చాలాకాలం వరకూ పరిశుద్ధాత్ముడు వారిపైకి రాలేదు కదా, ఎఫెసులో ఉన్న శిష్యులకు కూడా పౌలు మరలా బాప్తీస్మం ఇచ్చాకే ఆయన వారిపైకి దిగాడుగా? వీటి సంగతేంటంటే.

మనం అపోస్తలుల కార్యాలు చదువుతున్నపుడు అందులో చాలా విషయాలు సంఘప్రారంభ దశలో జరుగుతున్నాయని గుర్తుంచుకోవాలి. ఆ దశలో‌ భాగంగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు ద్వారా యూదులకు సువార్త ప్రకటించబడింది. వారు మొదటిగా రక్షణపొంది సంఘంలో చేర్చబడ్డారు. 8వ అధ్యాయంలో యూదులకూ అష్షూరీయులకూ పుట్టిన సమరయులకు (సంకరజాతి) ఫిలిప్పు ద్వారా సువార్త ప్రకటించబడింది. వారు రెండవదిగా రక్షణపొంది సంఘంలోకి చేర్చబడ్డారు. 10వ అధ్యాయం ప్రకారం అన్యులలో దేవుని భయం కలిగిన వారికి పేతురు ద్వారా సువార్త ప్రకటించబడింది. మూడవదిగా వారు కూడా రక్షణపొంది సంఘంలో చేర్చబడ్డారు. ఈవిధంగా సంఘం ఏ బేధం లేకుండా నింపబడింది. ఈ క్రమంలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పటికీ సంఘంలో జరుగుతాయని భావించకూడదు.

ఉదాహరణకు;

అపొస్తలుల కార్యములు 1:26
అంతట వారు వీరిని గూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.

ఈ సందర్భంలో అపోస్తలులు చీట్లువేసి 12వ అపోస్తలుడిని ఎన్నుకున్నట్టు మనం చూడగలం. ప్రస్తుతం మనం చీట్లు వేసి ఎవరినీ సంఘపెద్దగా‌ నియమించకూడదు.

ఇక విషయానికి వస్తే, సంఘం‌ అపోస్తలుల బోధక్రింద కొనసాగాలని ప్రభువు నియమించాడు.

మత్తయి సువార్త 28:20
నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.

అపొస్తలుల కార్యములు 2:42
వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

దీని ప్రకారం అపోస్తలులు కానివారు సువార్తను ప్రకటించినప్పటికీ అక్కడి ప్రజలు పొందుకున్న రక్షణను అపోస్తలులు ధృవీకరించి, యూదులకూ అన్యజనులకూ ఏ బేధంలేకుండా ఆత్మ అనుగ్రహించబడిందని‌ సాక్ష్యమివ్వాలి, సంఘంలోకి ఆహ్వానించాలి.

అపొస్తలుల కార్యములు 11:15-18
నేను మాటలాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను. అప్పుడుయోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్ధాత్మతో) బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసి యున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమ పరచిరి.

ఈ కారణం చేతే మనం చూసిన సమరయుల సందర్భంలో పేతురు యోహానులు వచ్చి ప్రార్థన చేసేవరకూ పరిశుద్ధాత్ముడు వారిలో‌ నివసించడానికి దిగలేదు. కానీ వారు మారుమనస్సు పొందింది మాత్రం పరిశుద్ధాత్ముడి మూలంగానే.

ఇక ఎఫెసులో శిష్యుల సంగతి చూస్తే, యోహాను చేత చాలామంది బాప్తీస్మం తీసుకున్నట్టే వీరుకూడా తమ పాపాలు ఒప్పుకుని బాప్తీస్మం తీసుకుని‌ శిష్యులుగానే కొనసాగుతున్నారు. కానీ వీరికి సంఘ బోధ గురించి సరిగా తెలియదు.

అపొస్తలుల కార్యములు 19:1,2
అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చికొందరు శిష్యులను చూచిమీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా వారుపరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.

అప్పుడు వారికి‌ పౌలు పరిశుద్ధాత్ముడి గురించీ క్రీస్తు గురించీ సువార్తను ప్రకటించాడు.

అపొస్తలుల కార్యములు 19:4,5
అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాస ముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

మనం మొదటినుండీ చూస్తున్నట్టుగా ఆ శిష్యులంతా దేవుని నిర్ణయంలో ఉన్నవారు కాబట్టే పరిశుద్ధాత్మ ద్వారా వారు ఆ బోధను విశ్వసించి బాప్తీస్మం పొందారు. ఈవిధంగా అప్పటినుండి వారు యోహాను బాప్తీస్మం క్రింద కాకుండా అపోస్తలుల బోధక్రిందకు రావాలని, ఆ బోధ మూలంగానే పరిశుద్ధాత్మ‌ వరాన్ని పొందుకుంటామని గుర్తించేలా పౌలు చేతులుంచేవరకూ ఆయన‌ వారిలో నివసించడానికి‌ దిగలేదు.

అపొస్తలుల కార్యములు‌ 19:6
తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.

అదేవిధంగా, పౌలు కూడా పేతురు, యోహానుల వంటి అపోస్తలుడేయని అతనిని తృణీకరిస్తున్న వారికి సాక్ష్యంగా ఉండేందుకు కూడా ఇలా జరిగిందని మనం భావించవచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అపోస్తలులు చేతులుంచినప్పుడు మాత్రమే సమరుయులపై కుమ్మరించబడ్డాడు. ఇక్కడ పౌలు విషయంలో కూడా అలా జరగడం వల్ల అతని‌ అపోస్తలత్వాన్ని తృణీకరిస్తున్నవారికి అతను సాక్ష్యం ఇవ్వగలిగాడు.

రెండవ కొరింథీయులకు 12:11,12
నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువవాడను కాను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను.

కాబట్టి, మనం చూసిన ఈ సందర్భాలలో పరిశుద్ధాత్ముడు అక్కడున్న పరిస్థితులను బట్టి మొదటిగా వారిని తిరిగి జన్మింపచేసి, అపోస్తలులు చేతులుంచాక వారిలో నివసించడానికి వచ్చాడు. ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు కాబట్టి అవి రెండూ ఒకేసారి జరుగుతాయి. ఎందుకంటే ప్రస్తుత సంఘం అపోస్తలుల‌‌‌ బోధక్రిందే ఉంది, సంఘంలో యూదులతో పాటుగా అన్యజనులకూ‌ సమాన ప్రవేశం కలిగింది.

యేసుక్రీస్తు బాప్తీస్మం పొందిన తరువాత ఆయనపైకి పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగివచ్చిన సంఘటనను బట్టి కూడా కొందరు బాప్తీస్మం తరువాతనే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడని భావిస్తుంటారు. కానీ అది కూడా వాస్తవం కాదు. ఆయనలోకి పరిశుద్ధాత్ముడు అప్పుడు కొత్తగా రాలేదు ఎప్పుడూ ఆయనతోనే ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో ఆయనపైకి మళ్ళీ పావురరూపంలో ఎందుకు దిగివచ్చాడంటే అది యోహానుకు సూచనగా ఉంది.

యోహాను సువార్త 1:32-34
మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ల బాప్తిస్మ మిచ్చుటకు నన్ను పంపినవాడునీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో (లేక, పరిశుద్దాత్మతో) బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను.

ఈ సందర్భంలో యోహానుకు దేవుడు చెప్పిన గుర్తుగా యేసుక్రీస్తే ఆయన కుమారుడని అతను తెలుసుకునేందుకు పరిశుద్ధాత్ముడు ఆయనపైకి అలా దిగివచ్చాడు. కానీ ఆయన మొదటినుండీ ఆత్మపూర్ణుడు.

యెషయా 11: 2
యెహోవా ఆత్మ జ్ఞానవివేకములకు ఆధారమగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ తెలివిని యెహోవాయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతనిమీద నిలుచును.

మరో విషయం యేసుక్రీస్తు బాప్తీస్మం తో మన బాప్తీస్మాన్ని ఎప్పుడూ పోల్చకూడదు. ఎందుకంటే మనం మన పాపాల నిమిత్తం మారుమనస్సు పొంది దానిని తీసుకుంటున్నాం. కానీ ఆయన పాపంలేని పరిశుద్ధుడు. కాబట్టి మనవలే ఆయన బాప్తీస్మం తీసుకోలేదు కానీ, దేవుని చిత్తానికి లోబడే వ్యక్తిగా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవేశపెట్టినదానిని నెరవేర్చడానికే తీసుకున్నాడు.

మత్తయి 3: 15
యేసు ఇప్పటికి కానిమ్ము; నీతి యావత్తు ఈలాగు నెర వేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను.

అదేవిధంగా ప్రభువు హృదయం తెరువగా (పరిశుద్ధాత్ముడు తిరిగి జన్మింపచెయ్యగా) పౌలుమాటలపై లక్ష్యముంచి, యేసుక్రీస్తును విశ్వసించిన లూదియ అప్పటికే భక్తిపరురాలు కదా అనే సందేహం కూడా కొందరికి రావొచ్చు.

అపో. కార్యములు 16: 14
అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

కానీ, ఆమెకున్న భక్తి యూదులకు సాధారణంగా ఉండే దైవభక్తే తప్ప సువార్త రక్షణకు సంబంధించిన భక్తికాదు. ఆమెకున్న భక్తి సువార్తకు రక్షణకు సంబంధించిన భక్తే అయితే మళ్ళీ ఆమె‌‌ సువార్తను అంగీకరించి బాప్తీస్మం పొందేలా ప్రభువు ఆమె హృదయాన్ని ఎందుకు తెరచినట్టు? అదేవిధంగా‌ ఆమెకున్న భక్తి యూదుల భక్తే అనేందుకు మనకు అక్కడ మరో ఆధారం‌ కూడా ఉంది, ఆమె యూదురాలు కాకపోతే యూదుల విశ్రాంతి దిన ప్రార్థనకు ఎందుకు వచ్చినట్టు?

అపో.కార్యములు 16: 13
విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి.

లూదియా విషయంలోనే కాదు, మరికొందరు యూదుల విషయంలో కూడా వారు భక్తిగలవారు అని రాయబడింది. కానీ వారిలో కొందరు సువార్తకు వ్యతిరేకులుగా ఉన్నారు.

అపో.కార్యములు 13: 50
గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.

అపో.కార్యములు 2: 5
ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.

ఇంతవరకూ మనం రక్షణకోసం దేవుడే కొందరిని ముందుగా నిర్ణయించుకున్నపుడు, మళ్ళీ సువార్తను ఎందుకు ప్రకటించాలనే సందేహానికి సమాధానం చూసాం. అయితే మనం చూసినదానితో పాటుగా సువార్త ప్రకటనలో దేవునికి మరో ఉద్దేశం కూడా ఉంది. అదేంటంటే, సువార్త ప్రకటన దేవుని నిర్ణయంలో ఉన్నవారిని రక్షించే సాధనంగానే కాకుండా ఆయన నిర్ణయంలో లేనివారిని శిక్షించడానికి సాక్ష్యార్థంగా కూడా ప్రకటించబడుతుంది.

మార్కు సువార్త 16:15,16
మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.

రెండవ కొరింథీయులకు 2:15,16
రక్షింపబడువారిపట్లను నశించువారిపట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.

ఉదాహరణకు, నోవహు కాలంలో అతను కడుతున్న ఓడ ఎలాగైతే ఆ ప్రజలకు సువార్తగా ఉండి వారిపై నేరస్థాపన చేసిందో అదేవిధంగా నేడు నశించేవారందరిపైనా సువార్త ప్రకటన నేరస్థాపన చేస్తుంది.

హెబ్రీయులకు 11: 7
విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపనచేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.

Q6: దేవుడు ముందే కొందరిని రక్షణకోసం నిర్ణయించుకుని మరికొందరిని విడిచిపెడితే ఆయనలో పక్షపాతం ఉందా?

A: దేవుడు పక్షపాతి కాదు కాబట్టే, క్రీస్తు యేసులో తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో పాటు అన్యజనులకు కూడా ఆయన సమాన రక్షణను అనుగ్రహించాడు. పేతురు దేవుడు పక్షపాతి కాదు అనేమాటను ఇదే భావంలో ప్రకటించాడు.

అపొస్తలుల కార్యములు 10:34,35
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.

అలా కాకుండా ఎవరైనా, ఆయన మనుషులందర్నీ రక్షించుకోవాలి అప్పుడు మాత్రమే ఆయన పక్షపాతి కాదనే కొలమానాన్ని పెడుతుంటే, దేవునికి వారి కొలమానం ప్రకారం నడుచుకోవలసిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన చేసే ప్రతీనిర్ణయమూ తన చిత్తానుసారమైన సంకల్పమని వాక్యం చెబుతుంది. కాబట్టి లేనిపోని కొలమానాలూ తర్కాలూ దేవునిపై పెట్టడం సాధ్యపడదు.

రోమీయులకు 9:19-21
అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరముమోపనేల అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీ వెవడవు? నన్నెందు కీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా? ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధి కారము లేదా?

ఎఫెసీయులకు 1:12
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

ఒకవేళ ఇదేకొలమానం అన్ని విషయాలలోనూ తీసుకుంటే? అందరికీ సమానమైన ఆయుష్షు సమానమైన ఆరోగ్యం ఎందుకు లేవు? ఇక్కడ కూడా దేవుడు పక్షపాతేనా? దీనికి సంబంధించిన ప్రాముఖ్యమైన సందర్భం ఒకటి చూడండి;

రోమీయులకు 9:10-15
అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము, పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయక ముందేపెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందునుగూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశావును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది. కాబట్టి యేమందుము? దేవునియందు అన్యాయము కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుదునో వానియెడల జాలి చూపుదును.

ఈ సందర్భంలో దేవుడు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించాడని అయినప్పటికీ ఆయనలో అన్యాయం లేదని రాయబడింది. ఎందుకంటే, యాకోబు‌ ఏశావులు ఇద్దరూ పాపులే, ఆయన ద్వేషానికి పాత్రులే. అయినప్పటికీ‌ ఆయన తన కృపతో యాకోబుపై ప్రేమ చూపించాడు ఏశావును ద్వేషానికే వదిలేసాడు. ఇందులో‌ అన్యాయమేముంది? అది ఆయన ఇష్టం కదా! పోని ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసించకుండా నశించిపోతున్నారో వారు అ విధంగా ఆయనను విశ్వసించకపోవడానికి కారణం వారి స్వంత పాపం కాదా? ఆ పాపం‌వల్ల కలిగే సుఖాన్ని వారు అనుభవించడం లేదా? ఈరోజు రక్షించబడినవారు కూడా పాపులే, అయినప్పటికీ దేవుడు తన నిర్ణయం చొప్పున వారిపై కృపచూపించి వారిని మరలా బ్రతికించుకున్నాడు. వారి హృదయాన్ని తెరచాడు. ఆయన దగ్గరకు తెచ్చుకున్నాడు అది ఆయన ఇష్టం. వీళ్ళను బ్రతికించినవాడివి వాళ్ళను ఎందుకు బ్రతికించవని అడిగే అర్హత, హక్కు పాపియైన మనిషికి లేవు.

దానియేలు 4: 35
భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడుకాడు.

Q7: 1కొరింథీ 9:27 లో పౌలు అనేకులకు ప్రకటించిన తరువాత నేను బ్రష్టుడనైపోతానేమో అనే ఆందోళనతో ప్రయాసపడితే, మీరు రక్షణపొందిన వ్యక్తి దానిని కోల్పోడని ఎలా చెబుతున్నారు?

A: అక్కడ పౌలు; నిజంగా రక్షణపొందిన వ్యక్తిలో ఉండే పోరాటం గురించీ, ప్రయాస గురించీ తనను మాదిరిగా పెట్టుకుని ఆ మాటలు చెబుతున్నాడు. దేవుని వాక్యం రక్షణ దేవునిదే అని చెబుతూ దానికి గుర్తులుగా మానవుడి బాధ్యతను (క్రియలను) కూడా బోధిస్తుంది. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి తన ఆత్మీయ స్థితిని పరిశీలించుకుంటూ రక్షణలో కొనసాగుతాడు తన శరీరాన్ని నలుగగొట్టుకుంటూ ప్రయాస పడతాడు. ఇది ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనేందుకు రుజువుగా ఉంది. ఒకవేళ ఇటువంటి పోరాటం, పరిశీలణ ఆ వ్యక్తిలో లేకపోతే అతను రక్షణపొందనట్టే. పౌలు ఈ సంగతిని వారికి తెలియచెయ్యడానికే ఆ మాటలు మాట్లాడుతున్నాడు.

మొదటి కొరింథీయులకు 10:12
తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను.

రెండవ కొరింథీయులకు 13:5
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా?

హెబ్రీయులకు 4: 1
ఆయనయొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంక నిలిచియుండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండ తప్పిపోవునేమో అని భయము కలిగియుందము.

హెబ్రీయులకు 12:15,16
మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుటవలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు,
ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి.

హెబ్రీయులకు 3: 12
సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్టహృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి.

(ఇలాంటి హృదయం ఉన్నవాడు అసలు రక్షించబడినవాడే కాదు అందుకే మనం దానిని జాగ్రతగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఈరోజు సంఘంలో‌ మేము రక్షించబడిపోయాము అనే నిశ్చయతతో ఉంటూ క్రియలమూలంగా దానిని చూపలేనివారు, ఇటువంటి పరిశీలన లేకుండా అలవాటుగా పాపం చేసేవారు అసలు రక్షించబడినవారే కాదు)

ఇక్కడ మరో విషయాన్ని గమనించండి, పై సందర్భంలో ఒకడు నిలుచుచున్నానని తలంచేవాడు పడిపోకుండా జాగ్రతగా చూసుకోవాలని రాయబడింది. అది రక్షించబడిన వ్యక్తి తన బాధ్యత ప్రకారం చేసుకోవలసిన పరిశీలణ. అయితే ఒక వ్యక్తి పడిపోకుండా ఎలా‌ ఉండగలుగుతాడు? తనంతట తానుగా ఉండగలడా? ఈ వాక్యం చూడండి.

రోమీయులకు 14: 4
అతడు నిలిచియుండుట యైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే; అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు.

యూదా 1:24
తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి-

అదేవిధంగా, పౌలు తన శరీరాన్ని నలుగగొట్టుకుంటూ ప్రభువుకోసం ఎంతో ప్రయాసపడినట్టు మనం చూసాం. పౌలు తనంతట తానుగా అలా చేసాడా? దీనిగురించి అతను చెబుతున్న మాటలే చూడండి.

1కోరింథీయులకు 15: 10
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృప వలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాస పడితిని. ప్రయాసపడినది నేను కాను,నాకు తోడైయున్న దేవుని కృపయే.

రక్షించబడిన ప్రతీ విశ్వాసీ తప్పకుండా ప్రభువుకోసం నీతి క్రియలు చేస్తాడు, ప్రయసపడతాడు. రక్షణలో కూడా అతను ప్రభువును విశ్వసించి నోటితో ఒప్పుకుని బాప్తీస్మం తీసుకున్నాడు కానీ అదంతా దేవుని మూలంగానే జరుగుతుంది. అక్కడ మనిషి కూడా పనిచేస్తున్నాడు కాబట్టి విశ్వసించాడు, ఒప్పుకున్నాడు, ప్రయాసపడ్డాడు, శ్రమలను భరించాడు అని అవన్నీ అతను చేసినవిగానే‌ మానవ కోణం నుండి రాయబడ్డాయి. కానీ ఒక విశ్వాసి అదంతా దేవుని కృపమూలంగానే చేయగలుగుతున్నాడు. అందుకే మనం లేఖనాలలో ఏవి మానవకోణంలో రాయబడ్డాయో, ఏవి దైవకోణంలో రాయబడ్డాయో గుర్తించాలి. నేను చెబుతున్నదానికి ఒక‌ మంచి ఉదాహరణను చూడండి.

2తిమోతికి 4: 7
మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని.

ఈ సందర్భంలో పౌలు తన పరుగును కడముట్టించి తన విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటున్నాడు కాబట్టి ప్రతీ విశ్వాసీ పౌలులా తన విశ్వాసాన్ని కాపాడుకోవాలి పరీక్షించుకోవాలి.

కానీ అసలు విశ్వాసం ఎలా కాపాడబడుతుందో (ముగిస్తుందో) ఈ లేఖనం చూడండి.

హెబ్రీయులకు 12: 2
మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.

మన తెలుగు బైబిల్ లో ఈ వచనంలో విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడు అని తర్జుమా చేసారు కానీ అక్కడ విశ్వాసానికి కర్త దానిని ముగించేవాడు అని చెయ్యాలి.

Hebrews 12:2 looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before Him endured the cross, despising the shame, and has sat down at the right hand of the throne of God.

దీనిప్రకారం మన విశ్వాసాన్ని ఆయనే (ఆత్మ ద్వారా) ప్రారంభించాడు. ఆయనే ముగిస్తాడు. కానీ మన బాధ్యత ప్రకారం దానిని పరీక్షించుకోవాలి ఇదేమాటను పౌలు పైన మనం చూసిన కొరింథీ 13:5 లో సంఘానికి జ్ఞాపకం చేసాడు. వాస్తవానికి విశ్వాసం అనేది మనంతట మనం సంపాదించుకుంది కానేకాదు. అది దేవుని వరం.

ఎఫెసీయులకు 2: 8
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే.

ఇదే విషయాన్ని పేతురు ఇంకా వివరంగా ప్రస్తావించాడు

2పేతురు 1: 1
యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవునియొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతినిబట్టి, "మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి" శుభమని చెప్పి వ్రాయునది.

ఇక్కడ పేతురు "మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందినవారికి" అంటున్నాడు (గ్రీకులో ఇక్కడ ఉన్న మూలపదం చీట్లు వేసి పంచేటపుడు ఎక్కువగా ఉపయోగించారు). దీనికి యేసుక్రీస్తు నీతినిబట్టి మనం విశ్వాసాన్ని పొందుకున్నాం అని అర్థం. ఈ విషయం ఇప్పటికే మనం హెబ్రీ పత్రిక నుండి చూసాం. మన రక్షణలో మన విశ్వాసం కూడా దేవుని వరం కాబట్టే లేఖనం ఆ విషయంలో మనల్ని అతిశయించవద్దు అంటుంది. ఒకవేళ విశ్వాసం మనకు మనం పుట్టించుకున్నదైతే రక్షణలో మనం చేసింది కూడా ఉందిగా? ఆయన ఎన్ని చేసినా మనం విశ్వాసించకపోతే మనకు నరకమే గతిగా? అలాంటప్పుడు ఎందుకు అతిశయించకూడదు? కానీ మన విశ్వాసం, రక్షణ, కృప ఇవన్నీ దేవుని వరాలు కాబట్టే మనం అతిశయించకూడదు. అందుకే పరలోకం వెళ్ళిన విశ్వాసులు ఆయనను ఎలా స్తుతిస్తారో చూడండి.

ప్రకటన గ్రంథము 7:9,10
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్తృములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్లయెదుటను నిలువబడి. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱెపిల్లకును "మా రక్షణకై స్తోత్రమని" మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి.

Q8: అయితే చిన్నపిల్లలలో కూడా దేవుని నిర్ణయంలో లేనివారు ఉండి వారు ఆ వయసులోనే చనిపోతే నరకానికి వెళ్తారా?

A: చిన్నపిల్లలలో కొందరు దేవుని నిర్ణయంలో ఉన్నారని మరి కొందరు లేరని వాక్యంలో ఎక్కడా చెప్పబడలేదు కాబట్టి ఈ సందేహానికి తావులేదు. వాక్యపు బోధ విషయంలో వాక్యపరిథిని దాటి కొన్నిటికి సమాధానం ఇవ్వలేము ఇవ్వకూడదు.

ద్వితీయోపదేశకాండము 29:29
రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

కానీ, నేడు నిజంగా రక్షించబడే అందరూ దేవుని నిర్ణయంలో ఉన్నవారని, నశించేవారు ఆయన నిర్ణయంలో లేనివారని మాత్రం వాక్యం స్పష్టంగా చెబుతుంది కాబట్టి దానిని నమ్మకతప్పదు. మరో విషయం ఈ ప్రశ్నవేస్తుంది కనుక, మనిషి దేవుని నిర్ణయంతో పనిలేకుండా, తన స్వచిత్తంలోనే‌ యేసుక్రీస్తును నమ్మగలడని వాదించేవారైతే, వారి ప్రశ్న వారికే చిక్కుగా మారుతుంది. ఎందుకంటే వారు ప్రస్తావించిన చిన్నపిల్లలు యేసుక్రీస్తును ఎరుగకుండా చనిపోతే వారు నరకానికే వెళ్తారని వారు నమ్ముతున్న సిద్ధాంతం చెబుతుంది. వారు ఈ చిక్కునుండి తప్పించుకోవాలి అనుకుంటే కొన్ని అవాంతర శాఖలతో కలసి పుట్టేపిల్లలకు జన్మపాపం అనేది ఏమీలేదనీ, వారికి ఒక వయస్సు వచ్చాకే వారు చేసే పాపాలు లెక్కించబడతాయని, అంతకుముందే చనిపోయిన పిల్లలు యేసుక్రీస్తు రక్తంతో పనిలేకుండానే పరలోకం వెళ్ళగలరని వాదించాలి.

Q9: దేవుడు కొందరిని రక్షణకోసం ముందుగా నిర్ణయించుకుంటే వారిలో ఏం చూసి నిర్ణయించుకున్నాడు.

A: రక్షణ అనేది మనిషి‌ క్రియల మూలంగా కలిగింది కాదని కేవలం దేవుని కృపమూలంగానే కలుగుతుందని లేఖనం చెబుతుంది.

తీతుకు 3: 5
మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.

(పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తీస్మం కాదు వాక్యము మనల్ని పవిత్రీకరించడం గురించి ఆ మాట సాదృష్యంగా వాడబడింది దీనిగురించి పైన కూడా జ్ఞాపకం చేసాను. ఆ మాట బాప్తీస్మం గురించే అయితే వచన ప్రారంభంలో క్రియలమూలంగా కాదని ఎందుకు రాయబడింది బాప్తీస్మం అనేది క్రియ)

ఎఫెసీయులకు 2: 8,9
మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు.

కాబట్టి, దేవుడు ఎవరినీ వారి క్రియలను బట్టి (చూసి) రక్షణకు నిర్ణయించుకోలేదు. కేవలం తన స్వకీయ సంకల్పం చొప్పునే నిర్ణయించుకున్నాడు. ఆ మాటలు స్పష్టంగా ఉన్న లేఖనాలను మనం ప్రారంభంలో‌ కూడా చూసాము. కొందరు చెబుతున్నట్టుగా, దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో మానవుల భవిష్యత్తును చూసి వారు చేసేదానిని బట్టి వారిని నిర్ణయించుకున్నాడనడం పూర్తిగా వాక్యవిరుద్ధం. దీనిగురించి ప్రారంభంలో కూడా వివరించాను.

1యోహాను 4: 10
మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమైయుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.

Q10: యేసుక్రీస్తు ఎందరికోసమైతే ప్రాణం పెట్టివారిని కొన్నాడో వారిలో ఎవరూ తప్పిపోవడం సాధ్యం కానప్పుడు 2 పేతురు 2:1లో అబద్ధప్రవక్తలను ఉద్దేశించి వారు కూడా యేసుక్రీస్తు చేత కొనబడిన (రక్షించబడిన) వారని ఎందుకు రాయబడింది వారు తప్పిపోయారు కదా?

2పేతురు 2:1
మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు.

A: అబద్ధప్రవక్తలు కూడా తాము క్రీస్తు చేత కొనబడిన దాసులమనే చెప్పుకుంటారు, కానీ వారి బోధలు క్రియలు ఆయనను విసర్జించినట్టే ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంలో పేతురు వారు సంఘంలో తమకు తాముగా ఒప్పుకునేదానిని ప్రస్తావించి వారు ఎవరికైతే దాసులమని చెప్పుకుంటున్నారో ఆ యేసుక్రీస్తునే తమ బోధల చేత క్రియల చేత విసర్జిస్తున్నారని చెబుతున్నాడు.

ఈ అబద్ధప్రవక్తలు/అబద్ధ బోధకుల గురించి రాయబడిన మరో సందర్భం చూడండి.

యూదా 1:4
ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో-వ్రాయబడినవారు).

ఈ సందర్భంలో యూదా పేతురు ప్రస్తావించిన అబద్ధబోధకుల గురించే ప్రస్తావిస్తూ వారు ఆ తీర్పుపొందడానికి పూర్వమందే సూచించబడినవారని (దేవుని నిర్ణయంలో లేనివారు) చెబుతున్నాడు.

ఇటువంటి మరో సందర్భం చూడండి;

హెబ్రీయులకు 6:4-6
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

ఈ సందర్భంలో కూడా కొందరు వెలిగించబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచిచూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యాన్ని రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావాన్ని అనుభవించిన తరువాత కూడా తప్పిపోయారని రాయబడింది. కొందరు దీని ఆధారంగా కూడా మనం పొందుకున్న రక్షణ పోతుందని వాదిస్తుంటారు. కానీ, ఒకవ్యక్తి దేవుని నిర్ణయానుసారంగా పొందుకున్న రక్షణ ఎప్పటికీ పోదని మనం చాలా ఆధారాలు చూసాము. అది సాధ్యమే అయితే దేవుని నిర్ణయం కూడా నెరవేరకుండా పోయిందని అర్థం వస్తుంది.

దీనికి పైన చూసిన సందర్భంలో పేతురు సంఘంలోని అబద్ధబోధకుల గురించి ప్రస్తావించి‌నట్టుగానే ఇక్కడ కూడా హెబ్రీగ్రంథకర్త సంఘాలలో విశ్వాసులుగా చలామణి ఔతున్న అవిశ్వాసుల గురించే చెబుతున్నాడు. వాస్తవానికి వారు రక్షించబడినవారు కాదు.

ఉదాహరణకు;
ఇస్కరియోతు యూదా జీవితాన్ని మనం మరోసారి పరిగణలోకి తీసుకుంటే, అతను కూడా యేసుక్రీస్తు బోధలు విని (వెలిగించబడి) ఆయనను విశ్వసించాడు కానీ ఆ వెలిగింపూ, విశ్వాసం దేవునిద్వారా కలిగింది కాదు. కేవలం అతనికి ఆ బోధలో కొన్ని విషయాలు నచ్చి అలా ఆయనదగ్గరకు వచ్చాడు (రొట్టెలకోసం కొందరు వచ్చినట్టు). ఈ విధంగా అధికారులు కూడా కొంతమంది ఆయనను విశ్వసించారు కానీ ఆయనను హత్తుకోలేకపోయారు.

యోహాను 12: 42,43
అయినను అధికారులలో కూడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరిగాని, సమాజములో నుండి వెలివేయబడుదుమేమోయని పరిసయ్యులకు భయపడివారు ఒప్పులొనలేదు. వారు దేవుని మెప్పుకంటె మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి.

ఒకవేళ వారి విశ్వాసం దేవునిమూలంగా పుట్టిందే ఐతే వారు తప్పకుండా ఆయన మెప్పునే కోరుకొందురు.

గలతియులకు 1: 10
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించు కొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.

అదేవిధంగా యూదా కానీ దేమా కానీ యేసుక్రీస్తు/పౌలుబోధలో పరలోక సంబంధమైన వరాన్నీ, రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావాన్నీ రుచిచూసారు. ఎలా అంటే, యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు నా రాకడలో పన్నెండు సింహాసనాలపై ఆశీనులై‌ ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాలవారికీ తీర్పు తీరుస్తారు అన్నపుడు యూదా కూడా మిగిలిన శిష్యులతో కలసి మురిసిపోయి ఉంటాడు, కానీ ఆ పన్నెండు మందిలో అతనులేడు. యేసుక్రీస్తు తన రాకడలో జరిగే విషయాలను చెబుతున్నపుడు అతను కూడా మిగిలిన శిష్యులతో పాటుగా విని సంతోషించి (రుచిచూసి) ఉంటాడు (ఇలా చాలామంది అవిశ్వాసులు కూడా సంఘంలో మేము పరలోకం వెళ్ళిపోతామనే నిశ్చయంతో ఉంటుంటారు) కానీ అది జరగదు.

దేమా ఆకాలంలో పరిశుద్ధాత్ముడు బాషలతో, వరాలతో చేయిస్తున్న సంఘ పరిచర్యలో (సభ్యుడిగా) పౌలుతో కలసి‌ పాలుపొందాడు పరిశుద్ధాత్ముడి కార్యాలను కళ్ళారా చూసాడు. కానీ వారు (యూదా,దేమా) పైన చెప్పినట్టుగా దేవుని నిర్ణయంలో లేరు కాబట్టి వారి విశ్వాసం దేవుని మూలంగా పుట్టింది కాదు కాబట్టి తప్పిపోయారు. వారు పరిశుద్ధాత్ముడు చేయిస్తున్న పరిచర్యలో యేసుక్రీస్తుతోనూ, పౌలుతోనూ కలసి పాలిభాగస్తులు అయ్యారే తప్ప పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఆయన వారిలో నివసించలేదు. హెబ్రీగ్రంథ కర్త అటువంటి అవిశ్వాసులు సంఘంలో ఉంటారనీ వారిని మనం ఎంత ప్రయత్నించినా మరలా నూతనపరచలేమని (వాక్యాన్ని అంగీకరించేట్టు చేయలేమని) తెలియచేసేందుకే ఆ మాటలు‌ చెబుతున్నాడు తప్ప, రక్షించబడినవారు తమ రక్షణను కోల్పోతారనే భావం అందులో లేదు.

అవి నిజంగా రక్షించబడిన/పరిశుద్ధాత్ముడు నివసిస్తున్న వారికోసం చెప్పబడిన మాటలు కావని ఆ క్రింది వచనంలోనే ఆయన తెలియచేసాడు చూడండి.

హెబ్రీయులకు 6:9
అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.

ఈ వచనంలో గ్రంథకర్త తాను పైన ఎవరిగురించైతే హెబ్రీ సంఘస్తులకు వివరించాడో, అలాంటివారు ఎవరూ వీరిలో లేకుండా వీరు రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని కచ్చితంగా నమ్ముతున్నాడు. అంటే రక్షణకరమైన స్థితిలో ఉన్నవారు ఎవరూ కూడా అలా తప్పిపోరు. కాబట్టి ఆ మాటలు నిజంగా రక్షణపొందినవారి గురించి కాకుండా రక్షణ పొందామని సంఘాలలో ప్రవేశించిన అవిశ్వాసుల గురించే చెప్పబడ్డాయి.

Q11: మీరు ప్రారంభంలో దేవుని చిత్తం, ఆలోచన ఎప్పటికీ విఫలం కావనీ ఆయన వాటిని తప్పకుండా ‌నెరవేర్చుకుంటాడని చెప్పారు. కానీ బైబిల్ ను ప్రారంభం నుండీ పరిశీలిస్తే ఆదాము హవ్వల విషయంలో దేవుని ఆలోచన విఫలమైనట్టు, నోవాహు కాలంలో ప్రజల పాపాన్ని బట్టి ఆయన సంతాపపడినట్టు, ఆయన స్వయంగా రాజుగా నియమించిన సౌలు తప్పిపోయినట్టు, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా ఆయన దృష్టికి ఎన్నోసార్లు అవిధేయత చూపినట్టు రాయబడిందిగా?

A: దేవుడు సార్వభౌముడని లేఖనాలు స్పష్టంగా మనకు బోధిస్తున్నాయి. సార్వభౌముడు కాని దేవుడు సర్వశక్తిమంతుడు కాదు.

ఎఫెసీయులకు 1: 12
ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు‌.

కీర్తనలు 115: 3
మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు.

కాబట్టి సృష్టిలో జరిగేదిఏదైనా ఆయన చిత్తాన్నే నెరవేరుస్తుంది. మనకు లేఖనాలలో బయలుపరచబడిన దేవుని చిత్తం మాత్రమే ఆయన చిత్తం కాదుకదా! మనకు తెలియని ఆయన రహస్యచిత్తమేదో పైన మనం చూసిన సందర్భాలలో నెరవేరింది.

ఉదాహరణకు;
ఏదేనుతోటలో ఆదాము హవ్వలు పాపం చేసేటప్పుడు దేవుడు దానిని ఎందుకు ఆపలేదు? ఆయన సృష్టిలోకి ఆయన అనుమతిలేకుండా సాతానుడు ఎలా ప్రవేశించాడు? ఒకవేళ సాతానుడు కనుక ఆయన సృష్టిలోకి ఆయన అనుమతి లేకుండా ప్రవేశించగలిగితే వాడు ఆయన సర్వశక్తిని అధిగమించి ప్రవేశించాడని ఒప్పుకోవలసి వస్తుంది. అప్పుడు దేవుడు కంటే సాతానే సర్వశక్తిమంతుడు ఔతాడు.

అదేవిధంగా పతనమైన మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు చేసిన బలియాగం దేవుని నిర్ణయమని ఆ నిర్ణయం జగదుత్పత్తికి ముందే చేయబడిందని వాక్యం చెబుతుంది.

అపొస్తలుల కార్యములు 4:27,28
ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.

అపొస్తలుల కార్యములు 2:23
దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.

మొదటి పేతురు‌‌ 1:19,20
అమూల్యమైన రక్తముచేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తన్ను మృతులలోనుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునియెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్ష పరచబడెను.

ఏదేను‌ తోటలో ఆదాము హవ్వల పతనాన్ని దేవుని చిత్తం అనుమతించకపోతే,‌ ఆయన ముందుగానే నిర్ణయించిన యేసుక్రీస్తు బలి ఎలా నెరవేరుతుంది? దేవుడు యేసుక్రీస్తు బలిద్వారానే లోకాన్ని తనతో మరలా సమాధానపరచుకోవాలి అనుకున్నాడు.

కొలస్సీయులకు 1: 20
ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయనద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

కాబట్టి ఏదేనులో జరిగిన సంఘటన ఆదాము హవ్వల పట్ల దేవునికున్న ఆలోచనను విఫలం చేసాయని మనం భావించకూడదు. కానీ, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన బయలుపరచిన చిత్తానికి వారు తమ స్వంత ఉద్దేశాలతో వ్యతిరేకంగా ప్రవర్తించారు కాబట్టి ఆయన వారిని శిక్షించాడు. ఉదాహరణకు, యేసుక్రీస్తు సిలువ మరణం అనేది ఆయన చేసిన నిర్ణయమని మనం పైన చూసాం.

ఇస్కరియోతు యూదా, యూదులు, పిలాతు ఆ నిర్ణయాన్నే ఆయనపట్ల నెరవేర్చారు. అయినప్పటికీ వారు అది చెయ్యడంలో వారికంటూ వేరే ఉద్దేశం ఉంది కాబట్టి, వారు శిక్షకు పాత్రులయ్యారు. ఇక్కడ నెరవేరింది దేవుని నిర్ణయమే కానీ, అందులో ప్రమేయం చూపిన వ్యక్తులు తమ స్వంత ఉద్దేశాలను బట్టి శిక్షించబడ్డారు.

అదేవిధంగా, దేవుడు మానవుల పాపాలను చూసి సంతాపపడ్డాడు అని రాయబడినప్పుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపం పట్ల ఆయనకున్న అసహ్యతను సూచించడానికి అలా రాయబడిందే తప్ప మనిషివలే దేవునికి అప్పటికప్పుడు భావనలు పుడతాయని మనం భావించకూడదు ఎందుకంటే దేవుడు కాలపరిధిలో లేనివాడు.

బైబిల్ మానవభాషలో, మానవునికి అర్థమయ్యేలా రాయబడిన కారణం చేత, దేవుడు ఆత్మ అయినప్పటికీ ఆయన ప్రత్యక్షతలు మానవునికి అర్థం అవ్వడానికి ఆయ‌నకు కూడా మానవునివలే దేహం ఉన్నట్లుగా ఎలా వర్ణించబడిందో (Anthropomorphism), అదేవిధంగా మానవునికి అర్థమవ్వడం కోసమే, దేవునికి కూడా మానవునికి ఉండే కొన్ని భావనలు ఉన్నట్లుగా బైబిల్ లో రాయబడడం జరిగింది ఈ విధంగా వర్ణించడాన్ని Anthropopathism అంటారు.

కాబట్టి సౌలు కానీ, ఇశ్రాయేలీయులు కానీ దేవుని ఆలోచనను నిరర్థకం చెయ్యలేదు ఈ సృష్టిలో దేవుని చిత్తమే నెరవేరుతుంది. కానీ పైన చెప్పినట్టుగా మానవుడు తన స్వంత ఉద్దేశాలతో దేవుని దృష్టికి పాపం చేస్తాడు కాబట్టి, బయలుపరచబడిన ఆయన నైతిక ప్రమాణానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు కాబట్టి, దోషిగా మారుతున్నాడు.

ఆదికాండము 3వ అధ్యాయపు వ్యాఖ్యానం చూడండి

Q12. మొదటి తిమోతీ 2:4లో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యం గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్టు రాయబడింది మీరు దానికేం చెబుతారు?

మొదటి తిమోతికి 2:4 ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.

A: ఈ సందర్భంలోని మాటలకు వివరణ చూసేముందు దేవుని వాక్యంలో రాయబడిన మరోమాటను చూద్దాం.

సామెతలు 16: 4
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను.

ఈవచనంలో ఆయన నాశన దినానికి ప్రత్యేకంగా భక్తిహీనులను కలుగచేసినట్టు రాయబడింది. ఈ మాటలను జాగ్రతగా పరిశీలించండి ఆయన భక్తిహీనుల కోసం నాశన దినాన్ని కలుగచెయ్యలేదు కానీ నాశన దినం కోసమే భక్తిహీనులను కలుగచేసాడు. అంటే ఇది కూడా దేవుని ఇష్టమేగా? అలా అని ఆయనకున్న ఈ ఇష్టంలో అన్యాయం ఏమైనా ఉందా అంటే లేదు వారు తమ తమ ఉద్దేశాలతోనే భక్తిహీనులుగా జీవించి, దానివల్ల సంతోషించారు కాబట్టి వారు నాశనం అవ్వడం న్యాయమే. ఆయన వారివిషయంలో ఇతరులకు చూపినట్టు తన కృపను చూపించడం లేదు. అది‌కూడా ఆయన ఇష్టమేగా.

ఇప్పుడు దీనిని‌ మనసులో పెట్టుకుని తిమోతీపత్రికలో‌ ఉన్న మాటలను అర్థం చేసుకుంటే, అక్కడ మనుష్యులందరూ అన్నపుడు మనం 2వ ప్రశ్నలో చూసినట్టుగా ఏ మినహాయింపూ లేకుండా అందరూ అని కాదు ఆయన నిర్ణయంలో ఉన్న అందరూ అని అర్థం చేసుకోవాలి.

ఆ మనుష్యులందరూ యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన అందరే అని ఆ క్రిందివచనాలలో రాయబడింది (యేసుక్రీస్తు అందరికోసం ప్రాణం పెట్టాడంటే ఎందరికోసమో మనం ఇప్పటికే వివరంగా చూసాం).

మొదటి తిమోతికి 2:6
ఈయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములయందు ఇయ్యబడును.

ఇటువంటి మరొక మాటను కూడా చూడండి.
2పేతురు 3: 9
కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.

ఈ సందర్భంలో కూడా ఆయన అందరూ మారుమనస్సు పొందాలని ధీర్ఘశాంతం గలవాడై యున్నట్టు (రాకడ ఆలస్యం ఔతున్నట్టు) రాయబడింది. దీని ఆధారంగా చాలామంది యేసుక్రీస్తు రాకడ ఆయన చేతుల్లో లేదు మనుషులు అంతా ఎప్పుడు మారితే అప్పుడే ఆయన వస్తాడు అన్నట్టుగా కూడా ప్రకటిస్తుంటారు. కానీ ఆయన రాకడ జరుగబోతుందో ఆయన ముందే నిర్ణయించినట్టు లేఖనాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి.

అక్కడ పేతురు విశ్వాసులను ఉద్దేశించి మీ యెడల ధీర్ఘశాంతము గలవాడైయున్నాడని అంటున్నాడే తప్ప లోకం గురించి అనట్లేదు. అంటే పేతురు ఏ విశ్వాసులతో అయితే మాట్లాడుతున్నాడో ఆవిధంగా దేవుని నిర్ణయంలో ఉన్నవారు కూడా మార్పుచెంది విశ్వాసులుగా మారేంతవరకూ ఆయన ధీర్ఘశాంతం వహిస్తున్నాడని అర్థం. ఆయన రక్షణపొంది సత్యం గురించి అనుభవజ్ఞానం‌ పొందుకోవాలని ఇష్టపడుతున్న మనుషులందరూ వారే.

దీనికి దగ్గరగా ఉన్న ఒక ఉదాహరణను చూడండి;

ప్రకటన గ్రంథము 6:10,11
వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియువారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.

ఈ అంశంపై ఉత్పన్నమయ్యే మరికొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చూడడానికి ఈ వ్యాసం చదవండి.

రక్షణలో దేవుని ముందు నిర్ణయం - కొన్ని విమర్శలకు సమాధానాలు

 
 

Add comment

Security code
Refresh

Comments  

# Assurance of ElectionSyambabu Kovvali 2020-04-22 10:14
Anna how can we be sure of our election or how can we know whether we are elected by God?
Reply
# RE: Assurance of ElectionSagarjesus 2020-06-27 14:52
John 6: 37
All that the Father giveth me shall come to me; and him that cometh to me I will in no wise cast out.
Reply
# Assurance of ElectionSyambabu Kovvali 2020-04-22 10:15
How can I know whether I am elected or not?
Reply
# RE: Assurance of ElectionSagarjesus 2020-06-27 14:54
Acts 13: 48
A as many as were ordained to eternal life believed.
Reply
# RE: రక్షణలో దేవుని ముందు నిర్ణయంV vijay 2020-04-25 12:01
దేవునికి ఇష్టం వచ్చినట్లు కొందరినే ఎందుకు రక్షించుకున్నారు? ఒకవేళ ఆయన సార్వభౌమాధికారం ఐతే ప్రణాళికలో లేని నన్ను పుట్టించి ఇంద్రియములు ఇచ్చి నరకానికి పంపడమే దేవుని ప్రణాళిక అయితే అదే దేవుని ప్రేమా??
Reply
# RE: రక్షణలో దేవుని ముందు నిర్ణయంSagarjesus 2020-06-27 15:01
ఇదే తర్కం ప్రకారం ఆలోచిస్తే ప్రస్తుతం నరకానికి వెల్తున్నవారి‌ విషయంలో‌ వారు‌ మార్పుచెందకుండా నరకాగ్నికే‌‌ వెల్తారని తెలిసినా కేవలం సువార్తను‌ వినే అవకాశం‌ ఇవ్వడానికి వారిని పుట్టించడం దేవుని ప్రేమ‌ అవుతుందా మీరే చెప్పాలి.
అసలు పుట్టించకుండా ఉంటే మరింత‌ గొప్ప ప్రేమ‌ అయ్యేది కదా..
Reply
# రక్షణలో దేవుని ముందు నిర్ణయంP. Rajesh Paul 2020-06-30 00:58
చాలా అద్భుతమైన వివరణ అన్నా. ఈ ఆర్టికల్ ద్వారా దేవుని గురించిన చాలా సందేహాలు క్లియర్ అయ్యాయి.
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.