దేవుడు

రచయిత: పి. శ్రావణ్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు
ఆడియో

విషయసూచిక

    క్రీస్తు దైవత్వాన్ని గురించిన సాక్ష్యం (The Testimony For The Deity of Christ)

    1. తండ్రి అయిన దేవుని సాక్ష్యం

    2. క్రీస్తు యొక్క సాక్ష్యం

    3. పాత నిబంధన యొక్క సాక్ష్యం

    4. అపొస్తలుల సాక్ష్యం

ఈ వ్యాసంలో యేసు క్రీస్తు దేవుడా? తన గురించి తాను ఇలా ఎప్పుడైనా చెప్పుకున్నాడా? అన్న విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

కొంత మంది నన్ను ఈ విధంగా ప్రశ్నించారు, "అన్నా, మీరు చెప్పింది అంతా బాగానే ఉంది గాని యేసు ప్రభువు దేవుడు అని వాక్యంలో ఎక్కడైనా చెప్పబడిందా? తండ్రి తన కంటే గొప్పవాడు అని యేసు క్రీస్తే స్వయంగా చెప్పాడు కదా, మరి యేసు క్రీస్తు దేవుడు అని మనం ఎలా నమ్మాలి?"

ఈ విషయం గురించి నేను ఆలోచించినప్పుడు, యేసు దేవుడు కాదు అనే నిర్థారణకు నేను రాలేదు గాని, యేసు దేవుడు అని వాక్యానుసారంగా విశ్వాసులకు ఎలా తెలియజేయాలి అని లేఖనాలను పరిశీలించాను. నా పరిశీలనలో నేను తెలుసుకున్న విషయాలను మీ ముందు ఉంచుతున్నాను. జాగ్రత్తగా చదివి, ఇతరులకు ఈ విషయంలో దీవెనకరంగా ఉంటారని ఆశిస్తున్నాను.

క్రీస్తు దైవత్వాన్ని గురించిన సాక్ష్యం (The Testimony For The Deity of Christ)

యేసు క్రీస్తు దేవుడు అని మనం నమ్ముతున్నాం. అయితే యేసు క్రీస్తు దేవుడు అని నువ్వు ఎలా నిరూపించగలవు అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు (ప్రత్యేకంగా బైబిల్ ఆధారంగా ఎలా చెప్పగలవు), లేదా మనమే సరిగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం లేఖనాలని క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఈ వ్యాసంలో బైబిల్ నుండి యేసు క్రీస్తు యొక్క దైవత్వానికి ఉన్న సాక్ష్యాలను చూసి, ఆ విషయాన్ని నిర్థారించే ప్రయత్నం చేద్దాం.

1. తండ్రి అయిన దేవుని సాక్ష్యం

2. క్రీస్తు యొక్క సాక్ష్యం

3. పాత నిబంధన యొక్క సాక్ష్యం

4. అపొస్తలుల సాక్ష్యం

ఈ నాలుగు సాక్ష్యాల ద్వారా యేసు క్రీస్తు దేవుడు అని మనం చాలా ఖచ్చితంగా నిరూపించగలం.

1. తండ్రి అయిన దేవుని సాక్ష్యం

ముందుగా కొన్ని బైబిల్ వచనాలను చూద్దాం:

“మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను" - మత్తయి 3:17

“మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను" - మార్కు 1:11

“అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను" మత్తయి 17:5

“మరియు ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను" - లూకా 9:35

మొదటి రెండు వచనాలు యేసు క్రీస్తు బాప్తీస్మం తీసుకున్న తర్వాత తండ్రి అయిన దేవుడు, యేసు గురించి పలికిన మాటలు. తర్వాతి రెండు వచనాలు, రూపాంతరం కొండమీద యేసును గురించి తండ్రి పలికిన సాక్ష్యం.

రూపాంతరం కొండ మీద మోషే, ఏలీయా మరియు యేసు ఉన్నారు. అప్పుడు పేతురు ఇక్కడ మూడు పర్ణశాలలు కడదాము, ఇక్కడే ఉందామని అన్నప్పుడు, దట్టమైన ఒక మేఘం కమ్ముకొని, ఈ మాటలు వారికి ఆకాశం నుండి వినబడ్డాయి. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, యేసును మోషే కంటే మరియు ఏలీయా కంటే గొప్పవాడని చెప్తూ, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు.

హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలో తండ్రి అయిన దేవుడు యేసును గురించి ఏమి చెప్పాడో క్షుణ్ణంగా పరిశీలిద్దాం:

 “ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?" - హెబ్రీ 1:5

తండ్రి ఇక్కడ యేసు క్రీస్తు నా కుమారుడు అని చెప్తూ, తాను దేవదూతల కంటే గొప్పవాడు అనే సాక్ష్యాన్ని ఇస్తున్నాడు, అందుకే "నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా ?" అనే ప్రశ్న హెబ్రీ గ్రంథకర్త వేస్తున్నాడు.

 “మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు" - హెబ్రీ 1:6

దేవదూతలు యేసు క్రీస్తును ఆరాధించాలి అని తండ్రి ఇక్కడ చెప్తున్నాడు. "నమస్కారము" అని ఇక్కడ అనువదించబడిన పదం నిజానికి ఆరాధన అనే భావాన్ని ఇస్తుంది.

 “...గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది." - హెబ్రీ 1:8

ఇక్కడ తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తుని, "దేవా" అని సంబోధిస్తున్నాడు. "Theos" అనే గ్రీకు పదం ఇక్కడ వాడబడింది, Theos అనగా దేవుడు అని అర్థం. అంత మాత్రమే కాకుండా, తండ్రి కుమారుని గూర్చి, "నీ సింహాసనము నిరంతరము నిలుచునది" అని అంటున్నాడు; బైబిల్ గురించి మనకు కొంచెం అవగాహన ఉంటే, దేవుని సింహాసనం తప్ప ఏదీ నిరంతరమూ నిలువదు అని మనకు అర్థమౌతుంది, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని మనకు తెలుసు.

 “మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును" - హెబ్రీ 1:10,11

మరల ఇక్కడ, "ప్రభువా" అని కుమారుని గురించి తండ్రి సంబోధిస్తున్నాడు. "Kurios" అనే ఈ గ్రీకు పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. Kurios అనగా Sir, Master, Lord, Owner అనే భావాలతో ఈ పదం అనేకసార్లు బైబిల్ లో ఉపయోగించబడింది. అయితే ఈ పదాన్ని పాత నిబంధనలో YHWH అనే పదానికి సమానమైన పదంగా కూడా వాడారు. ఏదేమైనప్పటికీ, కుమారుడు సృష్టికర్త అని తండ్రి సాక్ష్యమిస్తున్నాడు. సృష్టి మీద క్రీస్తుకు అధికారం ఉంది అని కూడా సాక్ష్యమిస్తున్నాడు.

 “అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?" - హెబ్రీ 1:12

యేసు క్రీస్తును తన కుడిపార్శ్వమున కుర్చోమని తండ్రి చెప్తున్నట్టు ఇక్కడ చూస్తున్నాం. కుడి పార్శ్వమున కుర్చోవడం అంటే, అక్కడ ఎదో రెండు భౌతికమైన కుర్చీలు ఉన్నాయి, తండ్రి ఒక కుర్చీలో కుర్చున్నాడు, కుమారుడు తండ్రికి కుడి పక్కన ఉన్న కుర్చీలో కుర్చున్నాడు అని కాదు.

ఈ కుడి పార్శ్వమున కుర్చోవడం అనేది సమాన అధికారాన్ని లేదా సమానతత్వాన్ని తెలియజేస్తున్నాయి. అందుకే "దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?" అనే ప్రశ్నను ఇక్కడ చూస్తున్నాం. దూతలతో దేవుడు ఎప్పుడూ తన కుడిపార్శ్వమున కుర్చోమని చెప్పలేదు, ఎందుకంటే వారు దేవునితో సమానులు కారు. అయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువుకు మాత్రం తనతో సమానమైన అధికారం ఉంది అని తండ్రి సాక్ష్యమిస్తున్నాడు.

ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన సత్యాలు ఏంటి అంటే:

• తన సృష్టిని పాలించే అధికారాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు

• జనాలకు తన మాటలను తెలియజేసే అధికారాన్ని దేవుడు ప్రవక్తలకు ఇచ్చాడు

• తన ఆజ్ఞలను అమలు చేయడానికి అధిరాన్ని దేవుడు దేవదూతలకు ఇచ్చాడు

• అయితే కుమారునికి తండ్రి ఇచ్చిన అధికారం అనుగ్రహింపడినది కాదు. యేసు క్రీస్తు ప్రభువు "తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము" (యోహాను 17:5) అన్నాడు. కుమారుడు తనకున్న అధికారాన్ని, మహిమని విడిచి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని వాక్యంలో చూస్తున్నాం (ఫిలిప్పీ 2:6). పాపుల కోసం ఈ లోకానికి వచ్చాడు. గనుక కుమారునికి తండ్రి ఇచ్చిన అధికారం, కుమారునికి ముందు నుండి ఉన్నదే.

ఈ విషయాలను బట్టి:

• తండ్రి యేసును "నా ప్రియ కుమారుడు" అని సంబోధించాడు

• తండ్రి యేసును “దేవా” అని సంబోధించాడు

• తండ్రి యేసును ఆరాధించమని దేవదూతలకు చెప్పాడు

• యేసుని సింహాసనం నిరంతరం ఉంటుంది అని, ఆయనే సృష్టికర్త అని, సృష్టి మీద సర్వాధికారం యేసుకు ఉందని తండ్రి సాక్ష్యమిచ్చాడు

• తనతో కూడా యేసుకు సమాన అధికారం ఉందని, "తన కుడి పార్శ్వమున" కూర్చోబెట్టుకోవడం ద్వారా తండ్రి తెలియజేసాడు

దీనిని బట్టి యేసు దేవుడు అని తండ్రి చాలా స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూడగలం

2(a). క్రీస్తు యొక్క సాక్ష్యం (తన సొంత మాటలలో)

యేసు విచారణ కొరకు, ప్రధాన యాజకుని ముందు నిలబడి ఉన్న సందర్భాన్ని గుర్తు తెచ్చుకోండి.

కొన్ని వచనాలు చదువుకుందాం:

 “ప్రధానయాజకుడు వారి మధ్యను లేచి నిలిచి ఉత్తరమేమియు చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసు నడిగెను. అయితే ఆయన ఉత్తరమేమియు చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని ఆయననడుగగా యేసు అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశమేఘారూఢుడై వచ్చుటయు చూచెదరని చెప్పెను. ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పనియేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు మరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి." మార్కు 14:60-64

 “నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు. అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి." లూకా 22:67-71

ఈ రెండు వాక్యభాగాలని మనం చూసినప్పుడు, యేసు తన గురించి తాను సాక్ష్యమిచ్చుకుంటున్నట్టు చూస్తున్నాం. తాను దేవుని కుమారుడనని, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు అవుతానని చెప్పాడు.

అయితే, మీరు నన్ను ఇలా అడగొచ్చు -  బైబిల్ లో అనేకులు దేవుని కుమారులు అని పిలువబడ్డారు కదా, దీనిని బట్టి యేసు దేవుడు అని మనం ఎలా నిరూపించగలం?

అయితే దీనికి సంబంధించి ఇంకొక రెండు వాక్యభాగాలను చదువుదాం:

“నేనును తండ్రియును ఏకమైయున్నామని వారితో చెప్పెను. యూదులు ఆయనను కొట్టవలెనని మరల రాళ్లుచేత పట్టుకొనగా యేసు తండ్రి యొద్దనుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని; వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురని వారినడిగెను. అందుకు యూదులు నీవు మనుష్యుడవై యుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియుండలేదా? లేఖనము నిరర్థకము కానేరదు గదా, దేవుని వాక్యమెవరికి వచ్చెనో వారే దైవములని చెప్పినయెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు, తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? " - యోహాను 10:30-35

 “అయితే యేసు నా తండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. " - యోహాను 5:17,18

ఈ రెండు సందర్భాలలో, మనం ఒక విషయాన్ని చాలా కచ్చితంగా చూస్తున్నాం, యేసు క్రీస్తు తన గురించి తాను ఎవరు అని చెప్పుకున్న భావాన్ని యూదులు ఎలా గ్రహించారో తెలుస్తుంది. అందుకే వారు ఇలా అంటున్నారు "నీవు మనుష్యుడవైయుండి దేవుడనని చెప్పుకొనుచున్నావు ", "దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను".

గనుక యేసు క్రీస్తు తన గురించి తాను చెప్పుకున్న సాక్ష్యంలో యూదులకు, “తాను దేవునితో సమానుడు" అనే భావం ఉంది అని స్పష్టంగా గ్రహించారు, ఇది సత్యం.

మరొక వచనాన్ని మనం చూద్దాం - 

 “అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను; మరియు--ఈ మాటలు నమ్మకమును నిజమునైయున్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పెను మరియు ఆయన నాతో ఇట్లనెను సమాప్తమైనవి; నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను; దప్పిగొనువానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును; నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడై యుండును." - ప్రకటన 21:5-7

ఇక్కడ "నేనే అల్ఫాయు ఓమెగయు, అనగా ఆదియు అంతమునై యున్నవాడను" అనే వ్యక్తి జయించువారి గురించి మాట్లాడుతూ, "నేనతనికి దేవుడనైయుందును అతడు నాకు కుమారుడైయుండును " అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుడిని అని స్పష్టంగా చెప్పుకున్నాడు

దీనిని బట్టి

• యేసు తాను దేవుని కుమారుడినని, తాను దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాను అని చెప్పాడు

• దేవుడు తన తండ్రి అని, తనను తాను దేవుతో సమానునిగా చేసుకున్నాడు (ఆయన మాటలు యూదులకు ఇలానే అర్థం అయ్యాయి, దానిని యేసు ప్రభువు విస్మరించలేదు)

• నేను దేవుడినని యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు

2(b). క్రీస్తు యొక్క సాక్ష్యం (తన క్రియలలో)

దేవునికి మాత్రమే చెందినవి, దేవుడు మాత్రమే చేయగలిగినవి యేసు చేయడం ద్వారా తాను దేవుడినని తన క్రియల మూలంగా కూడా నిరూపించుకున్నాడు.

a. ఆరాధనను అంగీకరించడం (యోహాను 20:27,28)

 “తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను"

తోమా తనను, "నా ప్రభువా, నా దేవా" అని ఆరాధిస్తుంటే, నువ్వు అలా అనకూడదు, దేవుడిని మాత్రమే ఆరాధించాలి అని యేసు క్రీస్తు చెప్పలేదు. తరవాత వచనంలో "నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను." అని చూస్తున్నాం. అయితే దేవుడు మాత్రమే ఆరాధించబడాలి అనే దేవుని నియమానికి, యేసు క్రీస్తు ప్రభువు విరుద్ధంగా ప్రవర్తించాడా, కాదు, ఇంతక ముందు మనం చూసినట్టు తండ్రే కుమారుణ్ణి ఆరాధించమన్నాడు; కుమారుడు ఆరాధనను అందుకున్నాడు. దీనిని బట్టి యేసు దేవుడు అని అర్థం అవుతుంది

b. పాపాలను క్షమించడం (మార్కు 2: 7,10)

 “వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి..."

యూదులకు చాలా స్పష్టంగా దేవుడు తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు అని తెలుసు, అటువంటి అధికారం ఎవరికీ లేదు అని పాత నిబంధన తెలియజేస్తుంది. అయితే యేసు తనకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని అంటున్నాడు. దీనిని బట్టి ఆయన కచ్చితంగా దేవుడే అని చెప్పగలం

c. తనలో ఏ పాపమైనా ఉంటే దానిని చూపించమని సవాలు చేయడం (యోహాను 8:45,46)

 “నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్నయెడల మీరెందుకు నన్ను నమ్మరు?"

తన జీవితాన్ని చూసినప్పుడు ఎవరు కూడా యేసులో పాపం ఉంది అని నిరూపించలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఎటువంటి మచ్చయినను, కళంకమైనను లేదు అని బైబిల్ చెప్తుంది.

 “పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును" - లూకా 1:35

ఆయన జననంలో మనుష్యుల పాపస్వభావాన్ని సంతరించుకోలేదు, ఆయన జీవిత కాలంలో పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనలో పాపం ఉంది అని, ఆయన ఈ తప్పు చేసాడు అని నిరూపించేవారు ఎవరూ లేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు.

దేవుడు తప్ప పరిశుద్ధుడు ఎవరు? యేసుది పరిశుద్ధ జననం, పరిశుద్ధ జీవితం; ఇవి చూసినప్పుడు ఆయనకు పెట్టబడిన పేరు "ఇమ్మానుయేలు" ఎంత సరైనదో కదా - "దేవుడు మనకు తోడు". ఇది యేసు దేవుడు అని నిరూపిస్తుంది.

3. పాత నిబంధన యొక్క సాక్ష్యం

పాత నిబంధనలో అనేకమాటలు కొత్త నిబంధనతో పోల్చి చూసినప్పుడు అవి యేసు క్రీస్తు దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తాయి. 

నిర్గమ 3:14,15

అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.

యోహాను 8:58

యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను

కీర్తన 23:1

యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.

యోహాను 10:11

నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱెలకొరకు తన ప్రాణము పెట్టును

కీర్తన 27:1

యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?

యోహాను 8:12

మరల యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగుగలిగి యుండునని వారితో చెప్పెను

యెషయా 40:8

గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును

మత్తయి 24:35

ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు

యెషయా 48:12

యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను

ప్రకటన 1:18

నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను

 

ఏ మాటలైతే పాత నిబంధనలో యెహోవా దేవుని గురించి చెప్పబడ్డాయో, అవే మాటలు కొత్త నిబంధనలో యేసు క్రీస్తుకు కూడా అనేకసార్లు ఆపాదించబడ్డాయి. దీనిని బట్టి యెహోవా అనే నామం యేసుకు కూడా ఉంది అని మనం గ్రహించాలి. ఇది యేసు క్రీస్తు దేవుడు అనే విషయాన్ని నిరూపిస్తుంది. ఒకవేళ యేసు దేవుడు కాకపోతే, తండ్రి అయిన దేవునికి ఆపాదించబడిన విషయాలను యేసుకు కూడా ఆపాదించి తన మహిమను క్రీస్తుతో ఎందుకు పంచుకుంటాడు? నా మహిమను ఎవ్వరికీ ఇవ్వను అని తండ్రి చెప్తున్నాడు కదా? మరి అదే మహిమ యేసుకు ఆపాదించబడిందంటే యేసు దేవుడు అనే అర్థం.

4. అపొస్తలుల సాక్ష్యం

అపొస్తలుడైన యోహాను, యేసు గురించి సాక్ష్యం చెప్తూ, "వాక్యము దేవుడై యుండెను" అని, "ఆ వాక్యము శరీరధారియై మనమధ్య నివసించెను" అని, "కృపయు సత్యమును యేసు క్రీస్తుద్వారా కలిగెను" అని చెప్పాడు. అంటే ఈ వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువే అని చెప్తున్నాడు.

అపొస్తలుడైన పౌలు “ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది” (కొలొస్స 2:9) అని చెప్తున్నాడు. ఇంకా యేసు గురించి పౌలు ఈ మాటలు చెప్పాడు, "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. (కొలొస్స 1:15)"; "ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని." - (ఫిలిప్పీ 2:6)

అపొస్తలులు అందరూ యేసు క్రీస్తు దేవుడు అనే విషయాన్ని ఖచ్చితంగా నమ్మారు, ఆయన దైవత్వాన్ని అర్థం చేసుకున్నారు. అందుకే తమ ప్రాణాలను సహితం ఆయన కోసం అర్పించారు. యేసు క్రీస్తు దేవుడు కాకపోతే, ఆయన దైవత్వం కల్పనాకథ అయితే, అపొస్తలులు అందరూ తమ ప్రాణాలను ఎందుకు అర్పిస్తారు?

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.