విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala

ఈ మధ్య కొంతమంది హైందవ మతోన్మాదులు బైబిల్ పై చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే… యెహోవా అనే పేరు ఋగ్వేదంలో 21 సార్లు వచ్చిందట. యెహోవా అంటే అగ్ని దేవుడట. “యహ్వం యహ్వం యహ్వం” అని అంటే యెహోవా యేనట. వీరు చెప్పేదాని ప్రకారం “మహేశుడు” అనే పేరుగల మోషే తన మామగారి ఇంట్లో అగ్ని పూజను చూచి యహ్వా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాడు.

 

సంస్కృతంలో “యహ్వ” అనే పదం ఉన్నమాట వాస్తవమే. ఈ పదానికి నిరంతరము ప్రవహించునది అనే అర్థం వస్తుంది. అగ్ని, ఇంద్రుడు, సోముడు - వీళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఋగ్వేదంలో కొన్నిసార్లు యహ్వ అనే పదాన్ని వాడిన మాట కూడా నిజమే. అయితే ఇక్కడ మనం తేల్చుకోవలసిన కీలకమైన విషయాలు ఏంటంటే, మోషే గారు నిజంగానే తన మామగారింట్లో అగ్ని పూజను చూసి అగ్ని దేవుడ్ని ఆరాధించడం మొదలుపెట్టాడా? యెహోవా అనే పేరుతో మోషే గారు ఆరాధించినది అగ్ని దేవుడినేనా? సంస్కృత భాషలోని యహ్వ అనే పదమే యెహోవాగా హీబ్రూ భాషలోకి ప్రవేశించిందా?

 

సరే కాసేపు వీళ్ళు చెప్పేది నిజమే అని అనుకుందాం. అంటే దాని అర్థం - “యహ్వం” లేదా “యహ్వ” అనే సంస్కృత పదాన్ని తీసుకుని యూదులు అగ్ని దేవుడ్ని యెహోవా అనే పేరుతో పిలుస్తున్నారన్నమాట. ఒకవేళ ఇదే నిజమయితే గనక మనం etymological గా చూసినప్పుడు యెహోవా అనే పదానికి హీబ్రూ భాషలో అసలు అర్ధమే ఉండకూడదు. ఎందుకంటే వీరు చెప్పేదాని ప్రకారం ఇది సంస్కృత పదం కదా. మనం ఏదైనా ఒక పదాన్ని ఇతర భాష నుండి అప్పు తెచ్చుకున్నప్పుడు ఆ పదానికి సంబంధించిన అర్ధాన్ని మూలభాషలోనే వెతకాల్సి ఉంటుంది. అలాగే యెహోవా అనే పదానికి సంబంధించిన మూలపదం హీబ్రూ భాషలో కాకుండా సంస్కృత భాషలో ఉండి ఉండాలి. లేదు సంస్కృత భాష నుండి అప్పు తెచ్చుకున్న తరువాత హీబ్రూ భాషలో కూడా యెహోవా అనే పదానికి అర్ధాన్ని సృష్టించుకున్నారు అని అనుకుంటే గనక హీబ్రూ భాషలో కూడా ఈ పదానికి అగ్ని దేవుడు లేదా అగ్ని అనే అర్ధమే రావాలి. ఎందుకంటే అగ్ని పూజను చూసే కదా మోషేగారు యహ్వా దేవుడ్ని ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి హీబ్రూ భాషలో యెహోవా అనే పదానికి అసలు అర్థం ఉందో లేదో కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 

యెహోవా అనేది నాలుగు అక్షరాల పదం. యుద్ (י), హే (ה), వావ్ (ו), హే (ה) అనే నాలుగు అక్షరాలు ఉంటాయి. యుద్ అనే అక్షరం నుండి ‘య’ అనే శబ్దం, హే అనే అక్షరం నుండి ‘హ’ అనే శబ్దం, అలాగే వావ్ అనే అక్షరం నుండి ‘వ’ అనే శబ్దం వస్తుంది. ఈ అక్షరాలను ఇంగ్లీష్ లోకి transliterate చేసినప్పుడు YHWH లేదా YHVH అని రాస్తారు. ఈ నాలుగు హల్లులకు అచ్చులను కలిపి యెహోవా అని పలుకుతాం. హీబ్రూ భాషలో “హహ్ (הה)” అనే two letter root word ఒకటుంది. ఈ పదానికి Breathe, Exist - “ఊపిరి”, “ఉనికి కలిగి ఉండటం” లేదా “ఉండటం”… ఇలాంటి అర్ధాలు వస్తాయి. ఊపిరి ఉన్నంతవరకే కదా మనం ఉండేది, ఊపిరి ఆగిపోతే మనం ఉండము. అందుకే హెబ్రీయుల ఆలోచనా విధానంలో ఊపిరిని మనిషి యొక్క వ్యక్తిత్వానికి పర్యాయపదంలా కూడా వాడతారు. మన సంస్కృతిలో కూడా ఒక మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయినా లేకపోతే తన పరువు పోగొట్టుకున్నా - అతను బ్రతికున్నా చనిపోయిన వాడితో సమానమే అని అంటారు. “హహ్” అనేది చాలా concrete word. ఈ శబ్దాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినా కూడా దీనికున్న అర్థం ఏమిటి అనేది మీరు చాలా తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. మనం బాగా ఊపిరి తీసుకుని నోటితో బలంగా వదిలినప్పుడు “హహ్” అనే శబ్దమే వస్తుంది. ఈ పదం నుండి మూడు క్రియా పదాలు వచ్చాయి - “హయాహ్ (היה)”, “హోవెహ్ (הוה)”, “ఇహియెహ్ (יהיה)”. ఈ మూడు క్రియా పదాలను కలపగా వచ్చిన compound word “యెహోవా (יהוה)”. “హహ్” అని అంటే To Exist - “ఉండటము” అని ఇదివరకే చెప్పుకున్నాం కదా. “హయాహ్” అని అంటే He Was... నిన్న ఉన్నవాడు... ఇది గతాన్ని సూచిస్తుంది. “హోవెహ్” అని అంటే He Is... నేడు ఉన్నవాడు... ఇది వర్తమానాన్ని సూచిస్తుంది. “ఇహియెహ్” అని అంటే He Will Be... రేపు కూడా ఉంటాడు... ఇది భవిష్యత్తును సూచిస్తుంది. కాబట్టి యెహోవా అని అంటే “నిన్న నేడు రేపు నిరంతరము ఉన్నవాడు, నిత్యుడు” అనే అర్థం వస్తుంది. అందుకే నిర్గమకాండం 3:14 లో "నీ పేరు ఏమిటి?" అని మోషే అడిగినప్పుడు, אֶהְיֶה אֲשֶׁר אֶהְיֶה (ఎహ్'యే ఆషేర్ ఎహ్’యే) - I AM THE BEING - "నేను ఉన్నవాడను అను వాడను" అని స్వయంగా దేవుడే మోషేతో అంటాడు. అలాగే ప్రకటన గ్రంథం 1:4 లో యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాస్తూ, "వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు" అని మొదలుపెడతాడు. మీరు హీబ్రూ బైబిల్ ని కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న క్రియా పదాలు మీకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఉదాహరణకు ఆదికాండము 1:2 లో "וְהָאָרֶץ הָיְתָה תֹהוּ וָבֹהוּ" - భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను" అని ఉంటుంది. అలాగే మూడవ వచనంలో "וַיֹּאמֶר אֱלֹהִים יְהִי אוֹר וַיְהִי אוֹר" దేవుడు వెలుగు కలుగును అని అనగానే వెలుగు కలుగుతుంది. ఇలా బైబిల్ మొత్తంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ పదాలకు “ఉండెను”, “ఉండాలి”, “ఉంటుంది”, “కలిగెను”, “కలిగింది”... ఇలాంటి అర్ధాలే వస్తాయి కానీ అగ్ని అనే అర్థంలో ఎక్కడా కూడా వాడలేదు. అగ్నిని హీబ్రూ భాషలో ఏష్ (אֵשׁ) అని అంటారు. కాబట్టి భాషాపరంగా చూసినప్పుడు యెహోవా అనే పదానికి మూలాలు హీబ్రూ భాషలోనే ఉన్నాయి. ఇది సంస్కృతం నుండి అప్పు తెచ్చుకున్న పదం కాదు అనేది చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. అలాగే మోషేగారు కానీ ఇశ్రాయేలీయులు కానీ "ఉన్నవాడు" అనే పేరు కలిగిన దేవుడ్ని ఆరాధిస్తూ దహనబలులు అర్పించారే కానీ, వాళ్ళు అగ్ని దేవుడ్ని ఆరాధించారు అని అనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు.

 

ఇక పురావస్తు ఆధారాలను పరిశీలించినట్లయితే క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికి చెందిన Soleb Inscription లో మనకు యెహోవా అనే పేరు కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ప్రాచీన శిలాశాసనాలలో యెహోవా అనే పేరు ఉన్న అతి పురాతనమైన శిలాశాసనం ఇదే. ప్రస్తుతం ఉన్న సూడాన్ దేశంలోని నుబియా అనే ప్రాంతంలో సోలెబ్ అనే పట్టణంలో Amun-Ra అనే ఒక దేవుడికి క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో Amenhotep అనే ఒక ఐగుప్తు ఫరో ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయ ప్రాంగణంలో కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల మీద తన శత్రుదేశాల పేర్లను చెక్కించాడు. ప్రతి స్తంభం మీదా ఒక మనిషి రూపం కనిపిస్తుంది. ఆ వ్యక్తి చేతులను వెనక్కి కట్టేసినట్లుంటుంది. అలాగే ఆ వ్వక్తి ఏ దేశానికి చెందినవాడు అనే విషయం కూడా ఆ స్తంభం మీద వ్రాసి ఉంటుంది. దాదాపు అన్ని స్తంభాల మీదా కూడా ఆఫ్రికా జాతులకు చెందిన మనుషుల రూపాలు కనిపిస్తాయి కానీ ఒక స్తంభం మీద మాత్రం సెమిటిక్ జాతులకు చెందిన ఒక వ్యక్తి రూపం కనిపిస్తుంది. బహుశా అతను హెబ్రీయుడు అయ్యుండొచ్చు. ఆ స్తంభం మీద Egyptian hieroglyphics లిపిలో “the land of the Shasu (nomads) of Yahweh” - యెహోవాకు చెందిన సంచార జాతుల ప్రజలు నివాసం ఉండే ప్రాంతం అని వ్రాసి ఉంది. అంటే యెహోవా అనే దేవుడ్ని ఆరాధించే ప్రజలు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నారో ఆ ప్రాంతాన్ని సూచించడం కోసం అక్కడ ఆ స్తంభాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది.

Soleb Inscription

మరి క్రీస్తు పూర్వం 15వ శతాబ్దానికంటే ముందు “యహ్వా” అనే పేరు కలిగిన శిలా శాసనాలు సంస్కృత భాషలో ఏమైనా ఉన్నాయా అంటే? - లేవు. ఉండవు కూడా. ఎందుకంటే అప్పటికి అసలు సంస్కృత భాష అనేదే లేదు. సంస్కృతం అనేది నిన్న గాక మొన్న వచ్చిన భాష. చాలా ఆధునిక భాష. ఆ పేరులోనే తెలిసిపోతుంది. సంస్కృతం - అంటే సంస్కరించబడినది. అప్పటివరకు ఉన్న కొన్ని భాషలను standardize చేసి మార్పులు చేర్పులు చేసి సంస్కృతం అనే భాషను వాడుకలోకి తెచ్చారు. అసలు సంస్కృతానికి లిపి అనేదే లేదు. ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న లిపి ఏదైతే ఉంటుందో ఆ లిపిలోనే సంస్కృతం కూడా వ్రాసేవారు. మొదటిసారిగా క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో బ్రహ్మీ లిపిని ఉపయోగించి వ్రాశారు. ఈ బ్రహ్మీ లిపి అనేది అరామిక్ లిపి నుండి వచ్చినదే. అరామిక్ అంటే మనందరికీ తెలిసిందే. హీబ్రూ భాషకు చాలా దగ్గరగా ఉండే భాష. ఆ తరువాత శారదా లిపి అని, నగరి లిపి అని, దేవనాగరి లిపి అని ఇలా రకరకాల లిపులను ఉపయోగిస్తూ సంస్కృతాన్ని వ్రాస్తూ వచ్చారు. క్రీస్తు శకం రెండవ శతాబ్దానికంటే ముందు సంస్కృతం వ్రాసేవారు అని అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఋగ్వేదం కూడా సంస్కృత భాషలో వ్రాయబడలేదు. ఇందులో వాడిన భాష అవెస్తా అనే ఒక పర్షియన్ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇప్పుడున్న ఇరాన్ దేశాన్నే అప్పట్లో పర్షియా అని పిలిచేవారు. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో కనాను దేశానికి ఆనుకుని ఉత్తర దిక్కున మిత్తానీ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఈ రాజ్యంలోని వాళ్ళు అప్పట్లో మాట్లాడిన భాషను హుర్రియన్ భాష అని అంటారు. ఆర్యులు ఈ ప్రాంతంలో నివసిస్తున్న రోజుల్లో వీళ్ళ పక్కనే అషూరు రాజ్యం ఉండేది. అషూరులు అంటే వీరినే “అసురులు” అని కూడా అంటారు, ఆర్యులనేమో “సురులు” అంటే “సిరియా” వాళ్ళు అని పిలిచేవారు. ఈ సురులకు అసురులకు అసలు పడేది కాదు. మిత్తానీయులు ఆరాధించే దేవుళ్లలో మిత్ర, వరుణ, ఇంద్ర, అశ్విని మొదలయిన దేవుళ్ళు ఋగ్వేదంలో కనిపిస్తారు. అంటే ఈ ఆర్యులు సిరియా నుండి ఇరాను, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ లో ఉన్న సింధూ నదీపరివాహక ప్రాంతానికి వలస వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ దేవుళ్లను కూడా ఇక్కడికి దిగుమతి చేశారు. ఆ సమయంలోనే ఋగ్వేదాన్ని compose చేయడం మొదలుపెట్టారు. క్రీస్తు పూర్వం పదవ శతాబ్దం నాటికి అది final form లోకి వచ్చింది. ఋగ్వేదంలో వాడిన భాషకు సంస్కృతానికి చాలా తేడా ఉంది. అయితే ఈ భాషను సులభంగా identify చేయడం కోసం దీనికి ఒక పేరు పెట్టాలి కాబట్టి scholars ఏమి చేశారంటే దీనికి Vedic Sanskrit అని పేరు పెట్టారు. Scholorly world లో అసలు సంస్కృత భాషనేమో Classical Sanskrit అని వ్యవహరిస్తారు. Vedic Sanskrit మరియు Classical Sanskrit - ఇవి రెండూ ఒకటి కాదు. వీటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి.

 

ఏది ఏమైనప్పటికీ అటు ఆర్కియాలజీ పరంగా చూసినా లేకపోతే ఇటు భాషా పరంగా చూసినా కూడా హెబ్రీయులు యెహోవా అనే పదాన్ని సంస్కృత భాష నుండి కానీ వేదాల నుండి కానీ తీసుకోలేదు, దీని మూలాలు హీబ్రూ భాషలోనే ఉన్నాయి. హైందవ మతోన్మాదులు చెప్పేవన్నీ కూడా అభూత కల్పనలే అనే విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.