దుర్బోధలకు జవాబు

రచయిత: పి. సురేశ్ బాబు
చదవడానికి పట్టే సమయం: 36 నిమిషాలు

ఆడియో

 

యేసుక్రీస్తు దేవునికుమారుడు మాత్రమే కాదు
కుమారుడైన దేవుడు

 సర్వోన్నతమైన నాణ్యతాప్రమాణాలు కలిగిన దేవోక్తులను, క్రైస్తవుల స్వచ్ఛమైన విశ్వాసాన్ని అడ్డగించే లోపభూయిష్టమైన సిద్ధాంతాలు పౌలు కాలంలోనే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. నాసిరకపు ప్రమాణాలు కలిగిన బోధలు నిరాధారమైన ఉపదేశాలు గుట్టలుగుట్టలుగా బయలుదేరి నాటి విశ్వాసులను ఆందోళనకు గురి చేశాయి. ఈ కారణాన్ని బట్టి పౌలు ఏ సంఘాన్ని దర్శించినా, ఏ పత్రిక వ్రాసినా హితవాక్యంతో సంఘాలను బలపరుస్తూ దుర్బోధ నిమిత్తమై జాగ్రత్త వహించమని హెచ్చరించాడు.

“క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగినవాడవై,నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము.” (2 తిమోతి 1:13)

“.... నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాపేక్షమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.” (తీతు 2:8) 

“మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక నువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక.” (గలతీ 1:8)

“....మనమిక మీదట పసిపిల్లలమైయుండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను,తప్పు మార్గమునకు లాగ కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగరగొట్టబడినవారమై నట్టుండక, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.” (ఎఫెసీ 4:14,15)

నాటి క్రైస్తవ విశ్వాసులను పెడదోవపట్టించే మోసపూరిత దుర్బోధకులు యేసు క్రీస్తు దైవత్వంపై నిర్దిష్టమైన అవగాహన లేకుండా ఆయన అర్హతలకూ, శక్తిసామర్థ్యాలకూ హద్దులు ఏర్పరిచారు. యేసుక్రీస్తు కేవలం ఒక ప్రధానదూతయని కొందరు అబద్ధికులు ప్రచారం చేస్తే, మరి కొందరు అబద్దికులు ఆయన దైవకుమారుడే తప్ప దేవునితో సమానుడు కాడని వాదించేవారు. ఇంకొందరు అబద్ధ బోధకులైతే యేసుక్రీస్తుకు మానవత్వాన్ని మాత్రమే ఆపాదించి దైవత్వం కలిగినవాడు కాడని తర్కించేవారు. ఇలా ఎవరికి తోచినట్టు వారు ఇష్టమొచ్చినట్టు క్రీస్తు గురించి వ్యాఖ్యానించేవారు. ఇటువంటి ఆత్మీయ పరిణతి లేని అప్రమాణిక బోధ ఆయా సంఘాలకు తగిలినప్పటికీ, దీని దుష్ప్రభావం వల్ల ఫిలిప్పీ మరియు కొలస్సీ సంఘస్థులు మాత్రం తీవ్ర అలజడికి గురయ్యారు. ఈ కారణంగానే పౌలు యేసు క్రీస్తు దైవత్వాన్ని గురించి నొక్కి చెబుతూ ఈ రెండు సంఘాలకు పటిష్టమైన లేఖలు వ్రాశాడు. అప్పటివరకు క్రీస్తు దైవత్వంపై అనుమానాలతో ఊగిసలాడుతున్న నాటి సంఘవిశ్వాసులు పౌలు వ్రాసిన లేఖలు చదివి బలపరచబడి స్థిరపరచబడ్డారు.

“ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని” ......... (ఫిలిప్పీ 2:6)

ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని కాని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” (కొలస్సీ 2 : 8)

క్రీస్తు దైవత్వాన్ని తప్పుపట్టుకునే అబద్ధబోధకుల బారి నుండి నాటి సంఘస్తులను దేవోక్తుల ద్వారా పౌలు కాపాడగలిగాడు. అయితే నేటికాలంలో కూడా క్రీస్తు శక్తిసామర్థ్యాలకు మహిమ ప్రభావాలకు గీతగీసి హద్దులు పరిమితులు ఏర్పరచే మతశాఖలు బయలుదేరిన తరుణంలో మనం వీరి కల్పిత సిద్ధాంతాలను కలుషిత ఉపదేశాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్నదే ప్రశ్న. దేవుడు గొప్పవాడు. నాటి దుర్బోధ ప్రభావం నుండి విశ్వాసులను కాపాడడానికి పౌలును ఎన్నుకున్నాడు. నేటి దుర్బోధను ఖండించడానికి బైబిల్ ను మనకందించాడు.

ఇక అసలు విషయానికొద్దాం. Institute of Bible Technology వ్యవస్థాపకులైన డాక్టర్ బొంకూరి జాన్ గారు “యేసుక్రీస్తు ఎవరు" అనే 8 పేజీలు కలిగిన కరపత్రాన్ని ఆ మధ్య ముద్రించారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాడని, దేవునితో సమానుడు కాడని తీర్మానిస్తూ జాన్ గారు తన కరపత్రంలో బైబిల్లో నుండి విస్తృతమైన లేఖనాలను ఉదహరించారు. పాఠకులకు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేయాలని భావిస్తున్నాము.

1. మనుషులు కల్పించుకున్న సిద్ధాంతాలకు అనుకూలంగా లేఖనాన్ని వక్రీకరించి ఉదహరించడం వేరు.

2. లేఖనానుసారమైన వ్యాఖ్యానానికి తగ్గట్టుగా వాక్యాన్ని ఉదహరించడం వేరు.

అసలు నోటుకు నకలు నోటుకు మధ్య ఉన్న తేడాను గుర్తించే వివేకం లేకపోతే మనం ఎలా మోసపోతామో, దేవోక్తికీ దుర్భోధకీ మధ్య ఉండే తారతమ్యాన్ని పసిగట్టే లేఖన పరిణతి మనకు లేకపోతే అదేవిధంగా మోసపోతాం. యేసుక్రీస్తును శోధించడానికి అపవాది లేఖనాన్ని ఉదహరించినప్పటికీ, దాని ఆంతర్యాన్ని వక్రీకరించాడు. కానీ క్రీస్తు వాడి కుయుక్తిని ఎరిగి మరొక లేఖనాన్ని చూపించి ఎదిరించాడు. లేఖనాన్ని ఉదహరించడం తప్పు కాదు గానీ దానికున్న భావాన్ని మరుగు చేసి కలుషితం చేయడం తప్పు. డాక్టర్ జాన్ గారు తన కరపత్రాన్ని ముద్రించే విషయంలో కూడా సరిగ్గా ఇదే దోషపూరిత పరిస్థితి చోటు చేసుకుంది. తాను సొంతంగా పోగుచేసుకుని కల్పించుకున్న చౌకబారు వ్యాఖ్యానాలకు లేఖనాలను తగిలించుకున్నారే తప్ప వాక్యానుసారంగా వ్యాఖ్యానిస్తూ లేఖనాలను ఉదహరించలేదు.

వాక్యానుసారంగా వ్యాఖ్యానించకుండా లేఖనాన్ని ఉదహరించడం  తగినదేనా?

ఇంతకూ మేము చెప్పేది ఏమిటంటే ఎంతో శ్రమించి పరిశోధించి జాన్ గారు రాసిన “యేసు క్రీస్తు ఎవరు?” అనే కరపత్రాన్ని లేఖన ఆధారాలతో తూర్పారబడుతూ సంస్కారవంతంగా ఖండిస్తూ ఈ వ్యాసాన్ని రాస్తున్నాము.

1) యేసు క్రీస్తును తండ్రియైన దేవుడని నమ్మి నిత్యాగ్ని దండనకు గురౌతున్నవారిని  గురించి జాన్ గారు తన కరపత్రంలో ఇలా వ్రాశారు.

'కాలక్రమంలో తన చిత్తంలో భాగంగా దేవుడే ఏరికోరి

ఎన్నుకొన్న ఇశ్రాయేలు జనాంగము తమ స్వనీతితో ఆయనను

అర్థము చేసుకోలేక, తమను రక్షించడానికి వచ్చిన క్రీస్తును

దేవుని కుమారునిగా అంగీకరించలేక అన్యాయమైపోయారు

(రోమా 10:1-3). నాటి నుండి నేటి వరకున్న క్రైస్తవ జనాంగములోని అనేకులు క్రీస్తు యేసును దేవుని కుమారుడిగా అంగీకరించలేక అన్యాయమైపోతున్నారు(రోమా 1:18-31).

నేటి క్రైస్తవులలో అత్యధికులు కూడ క్రీస్తు యేసును దేవుని

కుమారుడిగా అంగీకరించక తమ స్వనీతితో యేసే తండ్రియైన

దేవుడని నమ్మి నిత్యాగ్ని దండనకు గురవుతున్నారు. పేజీ 1

విమర్శ:

క్రైస్తవశాఖలపై అవగాహనలేని డా|| జాన్ గారు ఇక్కడ పొరబడ్డారు. ఏ క్రైస్తవశాఖకు చెందిన విశ్వాసులైనా యేసుక్రీస్తును దేవునికుమారుడిగా అంగీకరిస్తారు. ఒకవేళ తండ్రియైన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చేసాడని ఎవరైనా బోధించినట్లయితే వారు లేఖనానుసారమైన క్రైస్తవులు కారని గుర్తించాలి. పైగా “ నాటినుండి నేటివరకున్న క్రైస్తవ జనాంగంలోని అనేకులు క్రీస్తుయేసును దేవుని కుమారుడిగా అంగీకరించలేక అన్యాయమైపోతున్నారు” అని తన వాఖ్యను సమర్థించుకోవడానికి రోమా 1:18-31ను రాసారు కానీ ఆ వచనాలపై జాన్ గారికి అసలు వివరణే తెలీదు. దేవుణ్ణి గ్రహించక విగ్రహారాధన చేస్తున్న రోమీయులకూ, అన్యులకూ పౌలు ఈ వాక్యాన్ని చెబుతున్నాడే తప్ప నిత్యాగ్ని దండనకు గురౌతున్న క్రైస్తవుల కొరకు కాదు. అన్నట్టు ఏ క్రైస్తవశాఖకు చెందినవారు యేసు క్రీస్తును దేవునికుమారుడిగా అంగీకరించట్లేదో జాన్ గారు మాకు తెలియజేయాలి.

అదేవిధంగా త్రిత్వ సిద్ధాంతంపై లేఖనపరమైన అవగాహన లేని అవాంతర శాఖలు క్రీస్తును గురించి అసమగ్రమైన అభిప్రాయాలు కలిగి ఉంటాయి. అందులో ఒక వర్గంవారు తండ్రియైన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చేశాడని నమ్మి అన్యాయమైపోతే, డా|| బి.జాన్ గారు లాంటి మరొక వర్గంవారు యేసును కేవలం దేవుని కుమారుడిగా మాత్రమే విశ్వసిస్తూ అన్యాయమైపోతున్నారు.

2) లేఖనాల పట్ల సరైన అవగాహన లేక, సైద్ధాంతిక నిపుణత లేని కొందరు విశ్వాసులను గురించి వాఖ్యానిస్తూ డాక్టర్ జాన్ గారు ఇలా రాశారు - 

తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి, ఆయనే ఈయన,

ఈయనే పరిశుద్ధాత్మ అని కూడ వాదించేవారిని చూస్తే ...” (పేజీ 2,3)

విమర్శ:

పైన మేము తెలియచేసినట్టు, త్రిత్వ సిద్ధాంతంపై అవహగానలేనివారు తండ్రియైన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చేశాడని, యేసుక్రీస్తే తండ్రియైన దేవుడని తెలిసీ తెలియని విధంగా మాట్లాడతారు. కాని త్రిత్వసిద్ధాంతంపై అవగాహన ఉన్నవారెవరూ అలా చెప్పరు. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగియున్నాడని చెబుతారు. ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఎలా ఉనికి కలిగియున్నాడు అని కొందరు పాఠకులు సంశయం వ్యక్తపరుస్తారు. అయితే దీనికి కూడ మేము లేఖన ఋజువును చూపిస్తున్నాము. ముందుగా యెషయా 48:12-16 చదవండి.

“యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవి యొగ్గి వినుము.

నేనే ఆయనను నేనే మొదటి వాడను కడపటి వాడను” యెషయా 48:12

పైన ఉదహరించిన లేఖనభాగంలో మాట్లాడే వ్యక్తి ఎవరు? దేవుడే కదా! ఇదే వ్యక్తి తన సంభాషణను కొనసాగిస్తూ “ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను” అని 16వ వచనంలో మాట్లాడుతున్నాడు.

ఈ లేఖనభాగంలో గుర్తించవలసిన అతికీలకమైన విషయాలు ఏమిటో ఒక్కొక్కటిగా చూద్దాం.

ఎ) ఈ సందర్భంలో మాట్లాడే వ్యక్తి దేవుడు

బి) మాట్లాడే ఈ వ్యక్తిని పంపింది ప్రభువగు యెహోవా మరియు ఆయన ఆత్మ

సి) దైవత్వంలోని ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ సందర్భంలో మాట్లాడిన వ్యక్తిని పంపినట్టు మనం చదువుతున్నాం. కాబట్టి దైవత్వంలో ఎంతమంది వ్యక్తులను మనం ఇక్కడ చూడగలం? ముగ్గురు వ్యక్తులని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు

ఒక తత్వవేత్త ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని మరొక తత్వవేత్త అర్థం చేసుకోగలడు. ఒక శాస్త్రవేత్త కనిపెట్టిన సూత్రాన్ని ఇంకొక శాస్త్రవేత్త అవగాహన చేసుకోగలడు. తత్వశాస్త్రం లోకజ్ఞానంపై, శాస్త్రజ్ఞానం ప్రకృతిధర్మంపై ఆధారపడి ఉంటాయి కాబట్టి అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఇహలోక జ్ఞానానికి మించింది, ప్రకృతి ధర్మానికి అతీతమైంది ఏ సిద్ధాంతమైనా ఉన్నట్టైతే దానిని మనం అర్థం చేసుకోగలమా? హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఏ కొలబద్దతోనైనా కొలవగలమా? అది సాధ్యమయ్యే పని కాదు (1 కొరింథీ 2:14). దేవుడు ప్రకృతికి అతీతుడు, ఆయన క్రియలు సృష్టిధర్మానికి మించినవి అయినా మనం ఆయనను విశ్వసిస్తున్నాం. అదే విధంగా త్రిత్వసిద్ధాంతం మానవ మేధాశక్తికి అతీతమైందిగా ఉంది. లౌకిక జ్ఞానంతో మనం అర్థం చేసుకోవాలనుకోవడం బుద్దిహీనతౌతుంది. దేవుడున్నాడని తెలియచేస్తున్న లేఖనమే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిని కలిగియున్నాడని తెలియచేస్తున్న కారణంగా నిరాక్షేపంగా దానిని అంగీకరించి తీరాలి తప్ప వితండవాదం చేయకూడదు.

3) శ్రుతి ప్రమాణాలను విశ్వసించని డా|| జాన్ గారు క్రీస్తును గూర్చి పరిపక్వతలేని సారహీనమైన విషయాలు వ్రాసి తన డొల్లతనాన్ని బట్టబయలు చేసుకున్నారు. క్రీస్తును దేవునిగా అంగీకరించేవారిని గురించి ఆయన తన కరపత్రంలో ఇలా రాశారు.

“యేసు నేను దేవుని కుమారున్నని ఎన్ని విధాలుగా సాక్ష్యము

చూపిన కాదు దేవుడవే పొమ్మంటున్నారు నేటి క్రైస్తవులు

(యోహాను:55:17,18). ఇదే పరిశుద్ధాత్మను దూషించడం,

ఎదిరించడం (అ.కా. 7533–51) అనియు, ఇదియే

మరణకరమైన పాపము అని ఎవరు కూడా ఆలోచించడం లేదు.”

(పేజీ 3)

విమర్శ:

ఇక్కడ జాన్‌గారు రెండు పొరపాట్లు చేశారు. మొదటిది యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరించడం మరణకరమైన పాపమని ప్రస్తావించడం. రెండవది, తన వంకర పలుకులకు లేఖనాన్ని తగిలించుకోవడం. హానికరమైన తన సిద్ధాంతాలకు లేఖనాధారం ఉంటేనే తప్ప విశ్వాసులు ప్రామాణికంగా గుర్తించరని అనుకున్నారో ఏమో తన కరపత్రాల్లో బైబిల్ రిఫరెన్సులు విస్తారంగా ఇచ్చారు.

యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించడం పరిశుద్ధాత్మను దూషించడమని కానీ, ఎదిరించడమని కానీ, మరణకరమైన పాపమని కానీ అపో.కా. 7:33-51లో అసలు లేనే లేదు. అవసరమైతే పాఠకులు మరలా మరలా ఆ వాక్యాన్ని చదవండి. ఒకవేళ జాన్ గారు చెప్పేది వాస్తవమైతే తోమా క్రీస్తును "నా దేవా” అని పిలిచి మరణకరమైన పాపం చేశాడా?

జాన్ గారు చెప్పినట్టు ఒకవేళ యేసు క్రీస్తును దేవునిగా అంగీకరించడం మరణకరమైన పాపమైతే, సాక్షాత్తూ ఆ యేసు క్రీస్తే, “నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును” అని చెప్పాడు. ఈ విషయాన్ని యోహాను భక్తుడు ప్రకటన 21:6-7 లో రాశాడు. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే తాను దేవుడినని ఎలా చెప్పుకుంటాడు? దీనికి సమాధానం డా|| జాన్ గారు మాకు తెలియచెయ్యాలి. పైగా అపోస్తలుడైన యోహాను కూడ యేసు క్రీస్తును దేవునిగా నమ్మినట్టు ప్రకటన 21:6-7 వచనాలను బట్టి గ్రహించగలం. మరి యేసుక్రీస్తును దేవునిగా నమ్మి యోహాను భక్తుడు పరిశుద్ధాత్మను దూషించి ఎదిరించి మరణకరమైన పాపం చేసాడా? డా|| జాన్ గారు మాకు సంజాయిషీ ఇచ్చుకోవాలి. లేదా అతుకుల బొంతయైన తన కరపత్రాన్ని సవరించుకోవాలి.

యేసుక్రీస్తు దేవుడని నిరూపిస్తున్న అపొస్తలుడైన జాన్ గారి మాటలను నమ్ముదామా లేక ఆయన దేవుడు కాడని డొంకతిరుగుడు మాటలు చెబుతున్న IBT జాన్ గారి మాటలను నమ్ముదామా? పాఠకులు ఆలోచించండి.

4) బైబిల్లో ఉన్న వాక్యాలకు పొంతనలేని ఉదాహరణలు, పొసగని ఉపమానాలు చెప్పి ప్రజలను తప్పుడు మార్గంలో నడిపించి పతనానికి గురిచేయడం ఎంతో నేరం. అనుచిత వ్యాఖ్యలకు తగ్గట్టుగా లేఖనాన్ని బలవంతంగా తమ వైపు త్రిప్పుకుని కల్తీ చేసిన ఉపదేశాలను ప్రజలకు నూరిపోయడం ఎంతో ఘోరం. జాన్ గారి కరపత్రంలో ఇవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. హెబ్రీ 1:7-8 ను వక్రీకరిస్తూ జాన్గారు ఇలా ప్రస్తావించారు -

“దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది” (హెబ్రీ 1:7,8;కీర్తన 45:6-7).

ఇక్కడ తండ్రియే యేసు ప్రభువును దేవా! అని పిలుస్తున్నాడు

గదా! అని కొందరి వాదన. ఈ మాట యేసు లోకమునకు

రాకముందు వాక్యము కూడ దేవునిగా ఆయన యొద్ద ఉన్నప్పుడు

చెప్పినది. అయినా ఇందులో కూడ తన కుమారునితో చెప్పాడు

అని వివరంగా ఉంది.... మనము మన కుమారున్ని, కుమార్తెను

ప్రేమతో ఒరే నాన్న (డాడి అనో), ఓ మమ్మీ అనో గారాభంగా

పిలుస్తామా? లేదా? అలాగే దేవుడు తన ప్రియ కుమారున్ని

కూడ ప్రేమతో దేవా అని పిలిచాడు అని అర్థం చేసుకొని తీరాలి. (పేజీ 4)

విమర్శ:

యేసు క్రీస్తు సార్వభౌమత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తూ అలవోకగా రాసేసారు జాన్ గారు. పైగా లేఖనం ఎటు సాగదీస్తే అటు సాగే రబ్బరుబ్యాండు వంటిదని ఆయన ఉద్దేశం కాబోలు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని జీర్ణించుకోవడం చేతకాక తన పొంతనలేని ఉదాహరణలతో వాక్యాన్ని కలుషితం చేసి అసలైన భావాన్ని మరుగుపరిచారు. హెబ్రీ 1వ అధ్యాయంలో యేసు క్రీస్తు దైవత్వాన్ని సూచించే అనేక విషయాలు ఇమిడున్నాయి. వాటిలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మేము ప్రస్తావిస్తున్నాము. దేవుడు క్రీస్తును నమస్కరించమని/ఆరాధించమని దేవదూతలకు ఆజ్ఞాపించాడు (హెబ్రీ 1:6). దేవుడు మాత్రమే ఆరాధనకు అర్హుడైయుండగా, క్రీస్తు దేవుడు కాకపోతే ఆయనను ఆరాధించమని తండ్రియైన దేవుడు దూతలకు ఎందుకు ఆజ్ఞాపించాడు? మరొక విషయాన్ని గమనించండి. దేవుడైన యెహోవా క్రీస్తును సృష్టికర్తయగు ప్రభువని, మార్పులేనివాడని, నిత్యుడని అభివర్ణిస్తూ దేవునికి మాత్రమే ఆపాదించదగిన గుణలక్షణములను క్రీస్తుకు ఆపాదించాడు  (హెబ్రీ 1:10-12).

కాబట్టి జాన్ గారు పొరబడుతున్నట్టు హెబ్రీ 1:8 లోదేవుడు క్రీస్తును దేవా అని పిలవడం గారాబంతో కూడింది కాక ఆరాధనకు పాత్రుడైన దేవుడు, మార్పు చెందని దేవుడు, నిత్యుడైన దేవుడు కాబట్టి దేవా అని పిలిచాడని మనం గ్రహించాలి.

యేసు క్రీస్తు దైవత్వంపై కలిగిన‌ కష్టమైన ప్రశ్నలకు జవాబులు సంతృప్తిగా లేని కారణం చేతనో, హేతువాదుల, ముస్లిముల, చేతిలో చావు దెబ్బలు తినకూడదనే పిరికితనం చేతనో లేఖనాలను దారి మళ్ళించడం ఆత్మీయ నేరం. బైబిల్లో రాయబడిన ప్రతివాక్యానికి స్వంత వ్యాఖ్యలు పులిమి, లేనిపోని ఉదాహరణలు అంటగట్టి, విశ్వాసుల మనోభావాలను దెబ్బతీయడం మహా పాపం. పైగా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో లేఖనాలను వక్రీకరించి యేసు క్రీస్తు దైవత్వానికి హద్దులు నిర్ణయించాలనుకోవడం కూడా అంతే అవివేకం.

5) క్రీస్తును ఆరాధించి - పూజించమని లేఖనంలో చెప్పలేదు కదా అని జాన్ గారు తన కరపత్రములో ప్రస్తావించారు.

“అక్కడా, ఇక్కడా, అప్పుడు, ఇప్పుడు, ఎక్కడైనా,

ఎప్పుడైనా ప్రతివాని మోకాలు యేసు నామంలో (అనగా దేవుని మాట

అయిన క్రీస్తు ద్వారానే) తండ్రియైన దేవుని ముందు మోకరిల్లాలని

చెప్పాడే గాని యేసు ముందే మోకరిల్లమని, యేసునే ఆరాధించి

- పూజించమని బైబిల్లో ఎక్కడా చెప్పలేదు కదా'! (పేజీ 6)

విమర్శ:

యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాకపోతే జ్ఞానులు ఆయనను ఎందుకు ఆరాధించారు?  ( మత్తయి 2:2). జ్ఞానులు ఆరాధించిన విధానం వారి ఆచారంలోనో, సంప్రదాయంలోనో ఒక భాగం అని జాన్ గారు చెబితే అపోస్తలుడైన యోహాను భక్తుడు యేసుక్రీస్తు ఆరాధనకు యోగ్యుడని ధృవీకరించాడు.

“వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును పొందనర్హుడని గొప్పస్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును - సింహాసనాసీనుడై యున్నవానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు - ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి” (ప్రకటన 5:13-14). ఈ లేఖనభాగాన్ని బట్టి క్రీస్తు ఆరాధనకు పాత్రుడని మనకు నిర్థారించబడుతుంది.

క్రీస్తుయేసు ఆరాధనకు పాత్రుడు కాడనీ, ఒకవేళ ఆయన ఆరాధనకు పాత్రుడైనా మనం ఆయనను ఆరాధించకూడదనీ లేఖనాలకు భిన్నంగా రాస్తూ డా|| జాన్‌ గారు క్రైస్తవ విశ్వాసులను పెడదోవ పట్టిస్తున్నారు, ఇందుకు ఇదిగో ఋజువు‌.

“ఆయన అనగా క్రీస్తు స్తోత్రించటానికి అర్హుడైనా, మనం

ఆయనను స్తుతించగూడదన్న మాట ”

( డా|| జాన్ గారు వ్రాసిన దేవుడెవరు, 2007 ఎడిషన్ పేజీ. 80)

కానీ లేఖననం ఏం చెబుతుందో పరిశీలించి తెలుసుకోవడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత. మేము చెప్పినా, జాన్ గారు చెప్పినా, పరలోకం నుండి దూతయే దిగి వచ్చి చెప్పినా అది లేఖనాధారమైన బోధ కాకపోతే అలా బోధించినవాడు శాపగ్రస్తుడని లేఖనం స్పష్టం చేస్తుంది ( గలతీ. 1:8-9).

యేసుక్రీస్తును ఆరాధించకూడదని లేఖనాలు ఎక్కడా మనకు బోధించడం లేదు; అయితే దానికి భిన్నంగా అనేకులు ఆయనకు మ్రొక్కినట్టు కొత్త నిబంధన స్పష్టం చేస్తుంది. క్రీస్తు తనకు మ్రొక్కిన వారి విన్నపాలు మన్నించి, వారి అవసరతను తీర్చి, వారిని దీవించినట్టు ప్రతి సందర్భంలోను మనం చదవగలం.

నన్ను మ్రొక్కవద్దని కానీ, అలా మ్రొక్కడం మొదటి ఆజ్ఞను ఉల్లంఘించినట్టు ఔతుందని కానీ, క్రీస్తు తనను ఆరాధించినవారికి చెప్పిన దాఖలాలు ఏ ఒక్క సందర్భంలోనూ మనకు కనిపించవు. ఒకవేళ మ్రొక్కడం ఆరాధించడం ఒకటి కాదని జాన్ గారు వాదిస్తే ఈ రెంటి మధ్య బేధమేమీ లేదని క్రీస్తు స్పష్టం చేసాడని మేము జ్ఞాపకం చేస్తున్నాం. లూకా. 4:7లో “నన్ను మొక్కితివా" అని అపవాది ఆయనను శోధింప ప్రయత్నించినప్పుడు క్రీస్తు ఏమని జవాబు చెప్పాడు? నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెననెను. కాబట్టి మ్రొక్కబడడం కేవలం దేవునికి మాత్రమే చెందుతుందని క్రీస్తు ధృవీకరించాడు. తాను దేవుడైయుండకపోతే  మ్రొక్కబడడాన్ని నిరాకరించి ఉండేవాడు కదా! కానీ ఆయనను మ్రొక్కినవారిని ఆయన ఆటంకపరచలేదు, వ్యతిరేకించనూ లేదనే విషయాన్ని లేఖనాలు ఋజువు చేస్తున్నాయి. మత్తయి. 8:214:3315:25.

ఒకవేళ ఇది సిలువ వేయబడక మునుపు జరిగిందనీ, సిలువవేయబడ్డ తర్వాత ఆయనను ఎవరూ మ్రొక్కలేదని జాన్ గారు వాదిస్తే మత్తయి 28:9,17లో మరలా యేసు క్రీస్తును ఆయన శిష్యులు మ్రొక్కినట్టు మనం చదువుతాం. ఇది సిలువ వేయబడి, మరణించి పునరుత్థానుడైన క్రీస్తు విషయమై చెప్పబడింది. మత్తయి 28:17 వచనంలో కొందరాయనను ఆరాధించారని, మరికొందరు సందేహించారని రాయబడింది. మేము ఆయనను మ్రొక్కినవారితో ఏకీభవిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, కానీ డా|| జాన్ గారు మాత్రం ఈ విషయమై ఇంకా సందేహించడం చాలా బాధాకరం. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆయన మనుషుల చేత మాత్రమే కాదు దేవదూతల చేత కూడా  ఆరాధించబడాలని స్వయంగా తండ్రియైన దేవుడే ఆజ్ఞాపించాడు (హెబ్రీ. 1:6) అంతేకాదు, పరలోకమందూ భూమియందూ భూమిక్రింద ఉన్న సృష్టమంతా దేవునిని మరియు గొఱ్ఱపిల్లను ఆరాధించినట్టు ప్రకటన 5:11-13 లో మనం ఇదివరకే చదవాం. కాబట్టి క్రీస్తును ఆరాధించే విషయమై జాన్ గారు బోధిస్తున్న సంగతులు దుర్బోధలని పాఠకులు గుర్తెరగాలి.

6) డా|| జాన్ గారు తన ఉపన్యాసాల్లో తనకు అర్థం కాని ప్రతి వాక్యానికీ, మింగుడు పడని ప్రతి లేఖనానికీ తప్పుడు విశ్లేషణను తగిలించి విశ్వాసులకు నూరిపోస్తారు. ఈ విషయాన్ని మనం ఆయన కరపత్రంలో నుండే చదువుదాం. క్రీస్తు దేవుని కుమారుడే తప్ప దేవునితో సమానుడు కాడని తెలియజేస్తూ జాన్ గారు ఇలా రాసారు.

“మనమంతా తండ్రియైన దేవుడు కాదుగదా! ఆయనతో

సమానులము కూడా కాదు. ఆయనకు పిల్లలము మాత్రమే.

అలాగే ప్రభువైన యేసు కూడా ఆయన స్వరూపములో ఉన్నా

నిజమైన దేవుని కుమారుడే తప్ప తండ్రియైన దేవుడే కాదు.

దేవునితో సమానుడు కూడా కాదు ( యోహాను 10:29;13:16;

14:28యెషయా 40:18, 2546:9). (పేజీ 5)

విమర్శ:

బైబిలు లోతుగా పరిశోధించి M.Th,B.Th, Ph.D చేసిన డా|| జాన్ గారు క్రీస్తును గురించి నాణ్యమైన హితోక్తులు రాయాల్సింది పోయి, పెన్నుంది కదా అని ఇష్టం వచ్చినట్లు రాసేసారు. పైగా తాను మిశ్రమం చేసి బయటకు తీసిన సిద్ధాంతాన్ని కనీసం లేఖనంతో కూడా పోల్చిచూడకుండా కీలకమైన తప్పులు రాసారు. తండ్రియైన దేవుని స్వరూపంలో నిర్మింపబడ్డ మనం దేవునికి ఎలా కుమారులమో అలాగే క్రీస్తు కూడా దేవుని స్వరూపం కలిగిన కుమారుడే తప్ప దేవునితో సమానుడు కాడని జాన్ గారి ఉద్దేశం. అయితే ఇది క్రీస్తు విషయమై జాన్ గారికి ఉన్న అవగాహనాలోపమే తప్ప లేఖనం మాత్రం అలా చెప్పడం లేదు. ఇప్పుడు జాన్ గారి వాఖ్యలను లేఖనకాంతితో బేరీజు వేద్దాం. 'దేవునికి మనకి మధ్యవున్న కుమారత్వం వేరు, దేవునికి యేసుక్రీస్తుకి మధ్యవున్న కుమారత్వం వేరు.' పాఠకులు దీనిని శ్రద్ధగా గమనించాలి, లేకపోతే లేఖనం అర్థం చేసుకోవటం చేతగాక మోసపోయిన డా|| జాన్ గారిలాగే పాఠకులు కూడా మోసపోయే ప్రమాదం వుంది.

యేసుక్రీస్తు దేవుని కుమాడైనప్పటికీ దేవునికి గల అపారశక్తి,  త్రికాల జ్ఞానం, సృజనాత్మకత మొదలైనవన్నీ ఆయనలో ఉన్నాయి. కానీ మనం దేవుని కుమారులమైయుండీ ఇలాంటి సహజసిద్ధ దైవార్హతలను కలిగిలేము. ఒకవేళ కలిగే ఉంటే అపవాది చేత మోసగించబడేవారం కాము. శరీరధారిగా భూమి మీదకు వచ్చిన క్రీస్తు, శ్రేణి (ర్యాంక్) విషయంలో తనకంటే తండ్రి గొప్పవాడని అన్నాడే తప్ప, శక్తి సామర్థ్యాలలో, దైవిక గుణలక్షణాలలో కాదు.

యేసు క్రీస్తు దేవునితో సమానుడు కాడని వ్రాస్తూ జాన్ గారు పెద్ద పొరపాటే చేసారు. ఏదైనా ఒకానొక సిద్ధాంతాన్ని తప్పుగా నిరూపించాలంటే దానికి మించిన ప్రమాణాలు కలిగిన మరొక సిద్ధాంతం మన వద్ద ఉండి తీరాలి. పరమ ప్రామాణికమైన బైబిలుకు మించిన కొలబద్ద ఈ ప్రపంచంలో లేదని క్రైస్తవుల ప్రగాఢ విశ్వాసం. “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదని” క్రీస్తు గురించి పౌలు రాసిన లేఖనాన్ని వక్రీకరించి క్రీస్తు దేవునితో సమానుడు కాడని జాన్ గారు తన కరపత్రంలో రాసుకున్నారు.ఈ విషయాన్ని ఆయన ఏ ప్రమాణాన్ని, కొలబద్దను అనుసరించి రాశారో మాకు తెలియచెయ్యాలి. పైగా క్రీస్తు ఏ విషయంలో దేవునితో సమానుడు కాడో కూడా  జాన్ గారు మాకు తెలియచెయ్యాలి.

యేసు క్రీస్తు తండ్రి కంటే గొప్పవాడు కాడని తెలియచెయ్యడానికి జాన్ గారు యోహాను 10:29 వచనాన్ని ఉదహరించారు తప్ప, 30వ వచనాన్ని మాత్రం వదిలి పెట్టేసారు. యేసు సర్వాధికారమంతా ఆ 30వ వచనంలోనే నిక్షిప్తమై ఉందని పాఠకులు గ్రహించాలి.మేము మరలా మరలా గుర్తుచేసేది ఏమిటంటే శరీరధారిగా భూమికి వచ్చిన క్రీస్తు శ్రేణి (ర్యాంక్) విషయంలో తన కంటే తండ్రి గొప్పవాడని చెప్పాడే తప్ప శక్తి సామర్థ్యాలలో కాదు. దైవత్వం విషయంలో మాత్రం తండ్రితో క్రీస్తు ఏ మాత్రం తక్కువవాడు కాదు. పైగా తండ్రి వలే ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఉన్నవాడై ఉన్నాడు. ఈ తేడాను అర్థం చేసుకోవడం తెలియని జాన్ గారు యేసు క్రీస్తు దేవునితో సమానుడు కాడని సరిపెట్టేసుకున్నాడు.

7) యేసు క్రీస్తు దైవత్వాన్ని అదుపు చెయ్యడానికి జాన్ గారు శక్తివంచన లేకుండా కృషి చేసి కొన్ని తర్కబద్ధ వ్యాఖ్యలు పోగు చేసుకొన్నారు. అవి ఆయన కరపత్రం నుండే పరిశీలిద్దాం.

“నేను మొదటివాడను, కడపటివాడను జీవించువాడను,

మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై యున్నాను

( ప్రకటన 1:8 22:13 ). ఇక్కడా ప్రభువు చాలా స్పష్టముగానే మాట్లాడాడు. దేవుని సృష్టిలో మొదట పుట్టినవాడను నేనే (సామెతలు 8:22-31కొలస్సీ 1:15-17).ఆయనకిష్టమైన

వారిలో నేనే కడపటి వాడను. జీవించువాడనే గాని

జీవింపజేయగలవాడనైన తండ్రిని అనలేదు గదా! అలాగే

మృతిపొంది, తిరిగి లేచి పరలోకము చేరిన వారిలో కూడా

మొదటి వాడను. నాకు ఆది, అంతము లేదు. ఎందుకంటే

దేవుని వాక్యముగా ఆయన ఉన్నప్పటి నుండి ఉన్నాడు.” (పేజీ 5-6)

విమర్శ:

జాన్‌గారు సూత్రప్రాయంగా వెల్లడించిన పైవిషయంలో కూడ అతి భయానకమైన పరస్పర వైరుధ్యాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు చూద్దాం. కొలస్సీ 1:15లో గల 'ఆదిసంభూతుడు' అనే మాటకు నిర్వచనాన్ని దాని సందర్భంలోనే వెదకడం సముచితం. ఆదిసంభూతుడు అని చెప్పబడిన మాటను బట్టి క్రీస్తు మొదట పుట్టినవాడని డా|| జాన్ గారు గ్రుడ్డిగా వివరణ ఇవ్వడం హాస్యాస్పదం కాకపోతే మరేమిటి? సమస్తానికి ఆధారభూతుడైన క్రీస్తు అసలు ఆదిసంభూతుడెలా అయ్యాడో కొలస్సీ 1:18 లో స్పష్టంగా చెప్పబడింది.

".... ఆయన ఆదియై యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను.” అంటే అన్నిటిలో ప్రాముఖ్యత కలిగే నిమిత్తం ఆయన ఆదిసంభూతుడు అనే బిరుదును కలిగున్నాడే తప్ప ఆ పదానికి 'ముందు పుట్టినవాడని' అర్థం కాదు.

క్రీస్తు మొదటిగా పుట్టినవాడని జాన్ గారు చూపిస్తున్న ఈ వచనాలన్నిటికీ భావం వివరంగా తెలుసుకోవడానికి ఈయన మాజీగురువుగారికి హితబోధ వారు రాసిన వ్యాసాన్ని చదవండి - 
https://hithabodha.com/books/answer-to-false-doctrines/245-was-jesus-christ-created-by-god-the-father.html

ఇకపోతే క్రీస్తు పుట్టుకను గూర్చి జాన్ గారు రాస్తూ పెద్ద పొరపాటులో ఇరుక్కున్నారు. 'దేవుని సృష్టిలో మొదట పుట్టిన వాడను నేనే' అని ఒక వైపు రాస్తూ మరోవైపు 'నాకు ఆది అంతం లేదు ఎందుకంటే దేవుని వాక్యంగా ఆయన ఉన్నప్పటి నుండి ఉన్నాను' అని రాసారు. ఇంతకీ మా సందేహమేమిటంటే 'దేవుని సృష్టిలో మొదటిగా పుట్టిన క్రీస్తు, వాక్యంగా దేవుడున్నప్పటి నుండి ఉనికిలో ఉండడం ఎలా సాధ్యం?' క్రీస్తు దేవుని సృష్టియైనా అయ్యుండాలి; లేదా సృష్టికర్తయైనా అయ్యుండాలి. క్రీస్తు దేవుడున్నప్పటి నుండీ వాక్యంగా ఉన్నాడని జాన్‌గారు అంగీకరించిన కారణం చేత మరొకరిచే సృజించబడే అవసరత లేకుండా క్రీస్తు ఎలా ఉనికిలో వున్నాడో జాన్ గారు మాకు వివరణ ఇవ్వాలి. లేదా తన కరపత్రాన్ని సవరించుకునే పనిలో పడాలి.

8) ఉన్నవాడైన దేవునికీ, మధ్యలో కలిగిన మనకూ వ్యత్యాసం తెలియక డా|| జాన్ గారు ఏవేవో రాసేసారు. అవి ఆయన రాతల్లోనే చదువుదాం.

“నాకు ఆది అంతము లేదు. ఎందుకంటే దేవునివాక్యముగా

ఆయన ఉన్నప్పటి నుండి ఉన్నాను. ఇప్పుడు కుమారునిగా

ఆయన కుడిపార్శ్వమున ఎల్లప్పుడు ఉంటాను అన్నాడు. ఇందులో

అబద్ధము లేదు సత్యమే చెప్పాడు. అలాగే ప్రతి మనిషి ఆత్మకు

కూడా వుంది. అంతము లేదు. సృష్టికి ముందే దేవునిలో ఉన్నాము

(కీర్తన 90:1). తర్వాత మనం మనిషిగా వచ్చాము. ఆ తర్వాత

యుగయుగములు ఉంటే నిత్యత్వములో కానీ నిత్యాగ్ని

దండనలోగాని ఉంటాము గదా! మనలను దేవుళ్ళుగా దేవుడే

పిలిచాడు(కీర్తనలు 82:1-6యోహాను 10:34-36). దానికి

తగ్గట్లు బ్రతికి దేవుని యొద్దకు చేరాలి గాని మనమంతా

యెహోవాలము ఎలా కాదో, తన ప్రియకుమారుడైన యేసు

కూడా అంతే.” (పేజీ 6)

విమర్శ:

గమనిక:- జాన్ గారు లేఖనవిషయంలో మళ్ళీ తొట్రిల్లారు. తండ్రి కుడిపార్శ్వాన నేను ఎల్లప్పుడూ ఉంటానని క్రీస్తు చెప్పినట్టు జాన్ గారు రాసారు. 'నేను ఎల్లప్పుడూ దేవుని కుడిపార్శ్వాన ఉంటానని క్రీస్తు చెప్పినట్టు బైబిల్లో ఆధారమేమైనా ఉందా?' జాన్ గారు మాకు ఆధారం చూపించాలి.  బైబిల్ నిపుణులైన డా|| జాన్ గారు మరోసారి బోర్లాపడ్డారు. మనమంతా సృష్టికి ముందే దేవునిలో ఉన్నామని తేల్చి చెప్పడానికి కీర్తన 90:1 వచనాన్ని ఆయన పరిగణలోనికి తీసుకున్నారు. కానీ సృష్టికి ముందే దేవునిలో మనమందరమూ ఉన్నామని నిర్ధారించడానికి ఈ లేఖనంలో ఏ ఆస్కారం లేదు. మనుష్యుల తరములను గురించి ఉద్దేశిస్తూ మోషే 'తరములు' అనే మాటను ప్రయోగించాడే తప్ప అవి దేవునికి చెందిన తరాలు కాదు. తరమైనా, యుగమైనా, కాలమైనా, సమయమైనా మనకు చెందినదై ఉంటుంది తప్ప దేవునికి ఇవేవీ చెందవు. మనం కాలం లోపల ఉండేవారం కానీ దేవుడు కాలానికి వెలుపల ఉంటాడు. కీర్తన 90:1లోని 'తరములు' అనే మాట 'మానవ తరమే' తప్ప దైవికతరం కాదని మనకు ద్వితి 32:7-8చదివితే స్పష్టంగా అర్థమౌతుంది.

కాబట్టి ఇకముందు లేఖనాలకు భావం చెప్పేముందు జాన్ గారు జాగ్రత్తపడితే మంచిదని మా అభిప్రాయం.

 9యేసును గురించి మనం వ్యాఖ్యానించే సమయంలో మనం రెండు నాలుకల ధోరణి  కలిగి ఉండకూడదని జాన్‌గారు రాసారు.

"......యేసు దేవుడా? దేవుని కుమారుడా? అని ప్రశ్నిస్తున్న

ప్రతి వారికి యేసే నిజమైన దేవునికుమారుడైన క్రీస్తు అని ఒకే

సమాధానం చెప్పాలి. కానీ ఆయనే దేవుడు అనిగాని, దేవుడు

మరియు దేవుని కుమారుడు కూడా అని రెండునాల్కలతో

మాట్లాడకూడదు.” (పేజీ 7)

విమర్శ:

యేసు దేవునికుమారుడు మాత్రమేకాక కుమారుడైన దేవుడని లేఖనం స్పష్టం చేస్తుంది. యేసు యొక్క దైవత్వం మరియు కుమారత్వం పరస్పర వైరుద్ధ్యాలు కావు కాని ఒకే సత్యానికి ఉన్న రెండు విభిన్న కోణాలు. కాబట్టి ఇది రెండునాలుకల ధోరణి అనబడదు. ఇలాంటి దృష్టాంతం మరొకటి చూద్దాం. లోకపాపాలను మోసికొనిపోవు 'దేవుని గొర్రెపిల్ల' అని యోహాను 1:36 లో మనం క్రీస్తు గురించి చదువుతాం. అదే యోహాను 10:14 లో క్రీస్తు నేను గొర్రెలకు మంచి కాపరిని అని పలికిన వాక్యాన్ని కూడా చదువుతాం. ఈ రెండు వాక్యాలు క్రీస్తుకు సంబంధించినవే అని  మనందరికీ తెలుసు. మరైతే ఆయన గొర్రెపిల్లా లేక గొర్రెల కాపరా? లేఖనానుసారంగా అంగీకరించాలంటే రెండింటిని అంగీకరించి తీరాలి. అలాగని దీనిని రెండునాలుకల ధోరణి అందామా?

ఇక జాన్ గారి విషయానికొస్తే ఆయన మాటలు మరీ అస్తవ్యస్తంగానూ, అసంబద్ధంగానూ ఉన్నాయి. ఒకవైపు యేసు దేవుడని అంగీకరిస్తూ తన కరపత్రపు ముగింపులోకి వచ్చేసరికి దేవుని కుమారుడని రాసుకున్నారు. అంటే 4వ పేజీ 3వ లైన్లో “ఈ భూలోకానికి రాకముందు వాక్యము కూడా దేవుడైయుండెను” అని రాస్తూ 7వ పేజీ చివరి పేరాలో మాత్రం “యేసే నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒకే సమాధానం చెప్పాలి” అని రాసుకున్నారు. మరి దీనినేమనాలి? క్రీస్తు దైవత్వపు విషయంలో విశ్వాసులను దారిమళ్ళింపు చర్యలకు పాల్పడి చివరికి జాన్ గారే దారి తప్పిపోవడం హాస్యాస్పదంగా ఉంది.

10) కష్టతరం కాని లేఖనాలకు లౌకిక ఉదాహరణలు తగిలించి, కష్టతరమైన లేఖనాలను వివరించవలసివస్తే వాటిని పరిగణలోనికి తీసుకోకుండా దాటివేయడం మనం జాన్‌గారి కరపత్రంలో గమనించవచ్చు.

“ఇంకా రోమా 9: 5లోని తర్జుమా తప్పును, తీతు 2:13లోని

అచ్చు తప్పును గూర్చి కూడా వివరించాలంటే స్థలం సమయం

లేదు గనుక క్లుప్తంగా కొన్నింటిని మాత్రమే వ్రాశాను.” (పేజీ 7)

విమర్శ:

కనీసం తెలుగు బైబిలు మీద ప్రాథమిక అవగాహన కూడా లేని డా|| జాన్ గారు రోమా 9:5 నూ మరియు తీతు 2:13 నూ వివరించడానికి బదులు అవి తర్జుమా తప్పులు, అచ్చుతప్పులు అనేసి సింపుల్ గా తేల్చిపడేసారు, అయితే ఆయన రాసిన ' దేవుడెవరు' , 'సిలువవేయబడిన క్రీస్తు' అనే పుస్తకాల్లో సదరు వాక్యాలకు సంబంధించిన వివరణ ఇచ్చారు. బైబిల్ సొసైటీ వారు ముద్రించిన తెలుగు బైబిల్లో ఈ వాక్యాలు కామా లేని కారణంగా కేవలం క్రీస్తుకు చెందిన వాక్యాలుగానే గుర్తించబడుతున్నాయనీ, కామాను జోడించి చదువుకుంటే అవి క్రీస్తుతో పాటు తండ్రికి కూడా చెందినవిగా కనబడతాయని ఆయన హితవు పలికారు. (సిలువ వేయబడిన క్రీస్తు అనే పుస్తకంలో, 9 నుండి 12 పేజీలు చదవండి, దేవుడెవరు పుస్తకంలో 84 పేజీ చదవండి)

ఈ రెండు వాక్యాల పరిశీలన, పరిశోధన నిమిత్తం 4,5 ఇంగ్లీష్ ఎడిషన్లు మరియు కాథలిక్ అనువాదాన్ని ఆశ్రయించారు తప్ప మూలభాషయైన గ్రీకును మాత్రం సంప్రదించలేదు. ఈ కారణంచేత తన పరిశోధనలో సత్ఫలితాలను పొందాల్సిన జాన్ గారు తనకు తెలియకుండానే నిష్ప్రయోజనమైన అన్వేషణలో పడిపోయారు, పురోగమనానికి వెళ్లాల్సింది పోయి తిరోగమనానికి వెళ్లిపోయారు. అదేమిటో ఇప్పుడు చూద్దాం.

డా|| జాన్ గారు చెప్పిన రీతిగా రోమా 9:5 లో 'ఈయన సర్వాధికారి' అనే మాట తరువాత కామా పెట్టటానికి మూలభాషయైన గ్రీకులో ఏ ఆస్కారం లేదు. పైగా దేవుడు నిరంతరం స్తోత్రారుడు అని తర్జుమా చేయబడ్డ గ్రీకులోని 'థియోస్యులో గెతోస్' అనే పదాలకు మధ్య 'ఎస్టీన్' అనే పదంలేని కారణాన ఈ రెండు వివరణలనూ కామాను ఇరికించి విడదీయడానికి అవకాశం లేదని అర్థమౌతుంది. కాబట్టి ఇది క్రీస్తుకే చెందిన వివరణగా నిరూపించబడుతున్నది.

అదే విధంగా తీతు 2:13 లో ఉన్న వాక్యాన్ని డా|| జాన్‌ గారు వివరించిన విధంగా 'మహాదేవుడు' అనే పదం తండ్రియైన దేవునికి, 'మనరక్షకుడైన యేసుక్రీస్తు' అనే పదం క్రీస్తుకు ఆపాదించడానికి గ్రీకు మూలభాషలో కొంచెమైనా ఆధారం లేదు. గ్రీకుభాషలో 'మెగాలోవ్ ధియెవ్ కయి సొటరోస్' అనే మాట ఒకనిని( క్రీస్తును) గురించి మాత్రమే ప్రస్తావించి మన ప్రొటెస్టంట్ బైబిల్ తర్జుమాను సమర్థిస్తుంది.

ఒకవేళ జాన్ గారు చెబుతున్నట్టు 'మహాదేవుడు' అనేమాట తండ్రికి, 'మన రక్షకుడగు యేసుక్రీస్తు' అనే మాట క్రీస్తుకు ఆపాదిస్తే గ్రీకులో ఈ వచనం ఇలా వుండాలి.

* 'మెగాలోవ్ థియోవ్ కయి హ సొటరోస్'.

కాని 'హ' అనే శబ్దం (propositave Article) అక్కడ లేని కారణం చేత ఈ వచనంలో పేర్కొనట్టు ' థియోవ్' (దేవుడు) అనేమాట క్రీస్తుకు చెందినదిగా ఖచ్చితంగా నిరూపించబడుతుంది. ఇక జాన్ గారి పరిశీలన విషయానికొద్దాం. రోమా 9: 5నూ తీతు 2:13నూ విశదీకరించడానికి ఆయన నాలుగైదు ఇంగ్లీషు ఎడిషన్లు చూసాను అని నామమాత్రంగా చెప్పుకున్నారు తప్ప అసలు అవి ఏ ఎడిషన్లో, ఎవరు పబ్లిష్ చేసినవో ఋజువులు చూపించలేదు. పైగా తన వాదనను బలపరచుకోవడానికి రోమన్ కాథలిక్ అనువాదాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే కాథలిక్ అనువాదకులు ముద్రించిన పవిత్రగ్రంథంలో అవకతవకలు వెలుగుచూస్తాయని ముందుగానే గ్రహించి వారు ఇలా మనవి చేశారు.

“ఇట్టి బృహత్కార్యములో ఎంత జాగ్రత్త వహించినను కొన్ని పొరపాట్లు దొరలుట

సహజము. పాఠకులు వాటిని వీలైనంత త్వరలో మాకు తెలియజేయుదురు

మలిముద్రణామకాశము కలిగినపుడు వానిని సవరించుటకు తప్పక యత్నింపగలము”

( పవిత్ర గ్రంథము పరిచయము చదవండి)

అలా వారికి తెలియకుండా రోమా 9: 5 లో తీతు 2:13 లో కామాలు ముద్రింపబడ్డ అనువాదాన్ని తీసుకుని జాన్ గారు తన వాదనకు బలాన్ని చేకూర్చుకునే పనిలో పడిపోయారు. కాబట్టి కేథలిక్ అనువాదం నుండి తీసుకున్న ఆ ఆధారం చెల్లుబాటు కాదు, చెలామణి అవ్వదు. ఇక ఆయన పరిశీలించి, పరీక్షించిన నాలుగైదు ఇంగ్లీషు ఎడిషన్లు గ్రీకు బైబిలుకంటే ప్రమాణికమైనవి కావని నిస్సందేహంగా చెప్పవచ్చు. సింహాగర్జన లాంటి గ్రీకు బైబిలే యేసు సర్వోన్నతుడైన దేవుడని, మహా దేవుడని నిరూపిస్తున్న తరుణంలో ఆ భాషలో నుండి అనువదింపబడ్డ ఇంగ్లీషు ఎడిషన్లు లక్షలుకొలదిగా ఉన్నా లెక్కకు రావు.

ఒకవేళ మేము ఇస్తున్న గ్రీకు బైబిలు వివరణను బట్టి జాన్ గారు విబేధిస్తే మా వాదన తప్పని నిరూపించాలి.

తెలుగు బైబిల్లో తర్జుమా తప్పులు, అచ్చుతప్పులు ఉన్నాయనే విషయం వాస్తవమే. ఆ విషయాన్ని ఆధారంగా తీసుకుని తేటగా ముద్రింపబడ్డ లేఖనాలను వక్రీకరించాలనే ప్రయత్నం అయోమయానికి, దిక్కు తెలియని పరిస్థితికి నడిపిస్తుంది.

డా|| జాన్ గారి కలం నుండి జాలువారిన 'యేసుక్రీస్తు ఎవరు?' అనే కరపత్రంలో ఉన్న అనేక తప్పులలో కొన్నిటిని మాత్రమే తీసి జవాబులు అడగాలనుకుంటున్నాము. జాన్ గారికి మాకు మధ్య ఎటువంటి అంతర్గత విభేదాలు కానీ, పొరపొచ్చాలు కానీ లేవు. ఉన్నవల్లా సైద్ధాంతిక విభేదాలే. లేఖనాన్ని వక్రీకరించి క్రీస్తుసువార్తను అల్పస్థాయికి దిగజార్చేవారెవరితోనూ మేము రాజీపడము. ఈ విషయంలో మాకు జాన్ గారు కూడా మినహాయింపు కాదు. ఉన్నవి తీసివేయకుండా, లేనివి కలపకుండా లేఖనానుసారమైన సువార్త సేవ కనుక చేస్తుంటే మా ప్రార్థన సహకార సహవాసాలు జాన్ గారికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే లేఖనాన్ని దారి మళ్ళించి హానికరమైన సిద్ధాంతాలు ప్రతిపాదించినట్లయితే వాటిని ఆత్మఖడ్గంతో ఖండించే విషయంలో కూడా మేము ఏ మాత్రం సందేహించము. కాబట్టి ఆయన విడుదల చేసిన కరపత్రం నుండి అంశాలను సహేతుకంగా విమర్శించి ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. జాన్ గారు ఇక నుండి తన కరపత్రాన్ని దిద్దుబాటు చేసుకునే పనిలో పడతారో లేక మా వాదనను ఎదుర్కొని చర్చకు సిద్ధపడతారో ఆయన ఇష్టానికి విడిచిపెడుతున్నాం. కాబట్టి మాకు సమాధానాలు చెప్పేవరకూ లేదా తన కరపత్రాన్ని సవరించుకునే వరకూ మా సవాల్ ఆయనపై నిలిచే ఉంటుంది. 

 

Add comment

Security code
Refresh

Comments  

# యేసుక్రీస్తు దైవత్వంRaju 2020-11-29 20:30
ఈ వెబ్ సైట్ ద్వారా దేవుని గురించి తేటతెల్లగా తెలుసుకుంటున్నాను.
నేనే కాదు ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.