రక్షణ

రచయిత: ఆర్థర్. డబ్లు. పింక్
అనువాదం: టి. రజనీకాంత్
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు

ఆడియో

రక్షణను వివిధ కోణాల నుండి వీక్షించవచ్చు, విభిన్న అంశాలుగా విభజించి యోచించవచ్చు. ఐతే మనం ఏ కోణము నుండి చూసినా,"రక్షణ యెహెూవాదే” అని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. జగత్తు పునాది వేయబడకముందే తాను ఏర్పరచుకున్నవారి కోసం తండ్రి ఈ రక్షణను సిద్ధపరిచాడు. నరావతారియై పరిశుద్ధ జీవితం జీవించి, వారికి ప్రతిగా మరణించిన తన కుమారుని ద్వారా అది కొనబడింది. ఆ రక్షణ పరిశుద్దాత్ముని ద్వారా వారికి అన్వయింపబడి, వారి పక్షాన కార్యసిద్ధి కలిగిస్తుంది. అది లేఖనాల పరిశోధన ద్వారా అనుభవించబడి, విశ్వాసాన్ని అభ్యసించటం ద్వారా మరియు త్రియేక యెహెూవా దేవునితో సహవాసం చేయటం ద్వారా ఆనందింపబడుతుంది.

ఇక్కడ మనం భయపడవలసిన విషయమేమిటంటే క్రైస్తవ ప్రపంచంలో చాలామంది తాము రక్షింపబడ్డామని మన:పూర్వకంగా నమ్ముతున్నారు కాని నిజానికి వారు దైవకృపకు పూర్తిగా అపరిచితులు. దేవుని గూర్చిన సత్యం విషయంలో మేథోసంబంధ భావనలు స్పష్టంగా కలిగుండటం ఒక విషయమైతే, ఆ సత్యం విషయంలో వ్యక్తిగత హృదయానుభవం కలిగుండటం మరొక విషయం. పాపం ఎంత భయంకరమైనదని దేవుని వాక్యం చెబుతుందో నమ్మటం ఒక విషయమైతే, అంతరంగంలో దాని విషయమై పవిత్రమైన భయం మరియు ద్వేషం కలిగుండటం మరొక విషయం. దేవుడు కోరేది పశ్చాత్తాపం అని నమ్మటం ఒక విషయమైతే, మన పాపాన్ని బట్టి నిజంగా దు:ఖించి మూల్గటం మరొక విషయం. పాపులకు క్రీస్తే ఏకైక రక్షకుడని నమ్మటం ఒక విషయమైతే, ఆయనయందు హృదయపూర్వకంగా నమ్మకముంచటం మరొక విషయం.

సర్వశ్రేష్టుడు క్రీస్తే అని విశ్వసించటం ఒక విషయమైతే, అందరికన్నా ఎక్కువగా ఆయననే ప్రేమించటం అనేది మరొక విషయం. దేవుడు అందరికన్నా గొప్పవాడని, పరిశుద్ధుడని నమ్మటం ఒక విషయమైతే, ఆయన పట్ల భయభక్తులు కలిగుండటం మరొక విషయం. రక్షణ యెహెూవాదే అని నమ్మటం ఒక విషయమైతే ఆయన కృపాకార్యాలచేత ఆ రక్షణలో నిజంగా పాలుపొందటం మరొక విషయం.పరిశుద్ద లేఖనాలు మానవుని బాధ్యతను నొక్కి చెబుతున్నాయన్న మాట ఎంత నిజమో, జవాబుదారియైనవానిగానే లేఖనాలంతటిలో దేవుడు పాపితో వ్యవహరించాడన్న మాట ఎంత నిజమో, అలాగే ఆదాము సంతానంలో అందరూ తమ బాధ్యత, కర్తవ్యం నిర్వర్తించటలో విఫలమయ్యారని దేవుని వాక్యం పదేపదే స్పష్టంగా చెప్పటం మరియు అందరూ జవాబుదారీగా ఉండటంలో దారుణంగా విఫలమయ్యారని ప్రకటించటం కూడా అంతే నిజం. అందుకే ఒక పాపి తనకు తానుగా చేసుకోలేనివాటిని చేసిపెట్టటానికి దేవుని యొక్క అవసరం ఏర్పడుతుంది. “శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు”(రోమా.8:8).పాపి 'బలహీనుడైయున్నాడు'.(రోమా. 5:6).ప్రభువుకు వేరుగా ఉండి మనము ‘‘ ఏమీ చేయలేము’’ ( యోహాను 15:5).

వినే ప్రతివారికీ సువార్త ఒక పిలుపును, ఆజ్ఞను జారీ చేస్తుందన్న మాట వాస్తవమైనప్పటికీ, అందరూ ఆ పిలుపును బేఖాతరు చేసి, ఆ ఆజ్ఞకు అవిధేయత చూపుతున్న మాట కూడా అంతే వాస్తవం. "... వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి' - లూకా 14:18. ఇక్కడే పాపి అతి భయంకరమైన పాపం చేస్తాడు. దేవునిపట్ల మరియు ఆయన క్రీస్తు పట్ల భీషణ శతృత్వాన్ని పాపి వ్యక్తం చేస్తాడు; అతని అవసరాలకు అనుగుణమైన ఒక రక్షకునిని దేవుడు ఇవ్వజూస్తే, పాపి ఆయనను 'తృణీకరించి విసర్జిస్తాడు' (యెషయా 53:3).

పాపి తాను ఎంత సరిదిద్ద వీలుపడని తిరుగుబాటుదారుడో, నిత్యనరకానికి పాత్రుడో ఋజువుపరచుకునేది ఇక్కడే. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో దేవుడు తన విలక్షణమైన సార్వభౌమకృపను వ్యక్తపరుస్తాడు. తాను ఎన్నుకున్నవారి కొరకు రక్షణను ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, వాస్తవానికి దేవుడు ఆ రక్షణను వారికి అనుగ్రహిస్తాడు.

అయితే ఇలా రక్షణ అనుగ్రహింపబడటం అంటే కేవలం ప్రభువైన యేసునందే రక్షణ కలదన్న బహిరంగ ప్రకటన చేయడం మాత్రమే కాదు; క్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించటానికి అది పాపులకు ఆహ్వానం మాత్రమే కాదు. అది వాస్తవానికి దేవుడు తన ప్రజలను రక్షించటమే. అది ఏ మాత్రం యోగ్యత లేని, రక్షణ పొందే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని, వేయలేని పతనావస్థలో ఉన్నవారిలో తన శక్తిమంతమైన కృపాకార్యాన్ని చూపించటమే. నిజంగా రక్షింపబడినవారు దైవకృపకు తాము ఊహించేదానికంటే ఎంతో అధికంగా ఋణపడి ఉన్నారు. క్రీస్తు తమ పాపాల్ని పరిహరించటానికి మరణించినందుకు మాత్రమే కాదు,ఆయన ప్రాయశ్చిత్త మరణసుగుణాలు వారికి అన్వయించిన పరిశుద్ధాత్మకార్యము కొరకు కూడా వారు దేవునికి ఋణస్థులైయున్నారు.

సరిగ్గా ఇదే విషయమై చాలా మంది బోధకులు సత్యాన్ని వివరించటంలో విఫలమయ్యారు. పాపులకు క్రీస్తే రక్షకుడని వారిలో చాలా మంది నిశ్చయంగా బోధిస్తూనే ఆయన కేవలం మన సమ్మతితో మాత్రమే మన రక్షకుడయ్యాడని కూడా బోధిస్తారు. పాపాలు ఒప్పించడం పరిశుద్ధాత్ముని పని అని, కేవలం ఆయనే మన తప్పిపోయిన స్థితిని, క్రీస్తు యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాడని చెబుతూనే, రక్షణకార్యంలో నిర్ణయాత్మక పాత్ర పోషించేది మాత్రం మానవుని సమ్మతే అని వారు నొక్కి చెప్తారు. కానీ, 'రక్షణ యెహెూవాదే'(కీర్తన 3:8)అని, మరింకెవ్వరి ప్రమేయం అందులో ఏమాత్రం ఉండదని పరిశుద్ధ లేఖనాలు మనకు బోధిస్తాయి. దేవుని నుండి ఉత్పన్నమైనదే తప్ప మరేదీ దేవునిని ప్రసన్నం చేయజాలదు. 'ఒక పాపి తన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించినప్పుడే తనకు రక్షణ వ్యక్తిగతంగా ఆపాదించబడుతుంది' అన్నమాట వాస్తవమే. అయితే తనలో ఆ విశ్వాసాన్ని ఉత్పన్నం చేసేది కూడా పరిశుద్ధాత్ముడే. “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే”(ఎఫెసీ 2:8)

ఇక్కడ కనిపెట్టాల్సిన గంభీరమైన విషయమొకటి ఏమిటంటే ప్రకృతిసంబంధమైన మనిషి, క్రీస్తులో “నమ్మిక” ఉంచుతాడు, అయితే అది రక్షణార్థమైన విశ్వాసం మాత్రం కాదు. బౌద్ధమతస్థులు బుద్దునియందు ఎలా విశ్వసిస్తారో, క్రైస్తవ ప్రపంచంలో చాలా మంది ప్రజలు క్రీస్తును అలాగే నమ్ముతారు. పైగా ఆ “విశ్వాసం” కేవలం మేథోసంబంధమైనది మాత్రమే కాదు, ఆ “నమ్మిక” చాలాసార్లు అనుభూతులతో కూడినదై భావోద్రేకాలను రేకెత్తిస్తుంది. విత్తువాని ఉపమానంలో ఒక వర్గంవారిని గూర్చి చెబుతూ ప్రభువు " అతనిలో వేరులేనందున అతడు కొంతకాలము నిలుచును” (మత్తయి 13:21)అని ఆన్నాడు.

ఇది ఈనాటికీ జరుగుతున్న గంభీరమైన వాస్తవం. హేరోదు, యోహాను మాటలను “సంతోషముతో వినుచుండెనని" లేఖనాలు మనకు చెప్తున్నాయి. కాబట్టి, ఈ పుటలు తిరగేస్తున్న చదువరి,ఒక వ్యక్తి ఓ గొప్ప సువార్తికుని బోధను వింటున్నంతమాత్రాన ,అతడు తిరిగి జన్మించాడనడానికి అది ఋజువు కానే కాదు. బాప్తిస్మమిచ్చు యోహానును ఉద్దేశించి ప్రభువైన యేసు పరిసయ్యులతో, “మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి” అని చెప్పాడు, అయినా అక్కడ కృపాకార్యమేదీ కూడా వారిలో జరగలేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది.

అయితే లేఖనాల్లో ఈ విషయాలన్నీ కూడా గంభీర హెచ్చరికలుగా గ్రంథస్థం చేయబడ్డాయి.

పైన సూచించబడిన రెండు లేఖనభాగాల్లో వాడిన ఖచ్చితమైన పదాలు మనసుకు తగిలేలా, గంభీరంగా ఉన్నట్టు గుర్తించగలం. మార్కు 6:20లో యోహానును సంబోధిస్తూ వ్యక్తిగత సర్వనామాన్ని పదేపదే ఉపయోగించడం గమనించండి, “ఎందుకనగా యోహాను నీతిమంతుడును, పరిశుద్దుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి, అతనికి భయపడి ( ' దేవునికి భయపడి' కాదు సుమా!) అతని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను”.యోహాను వ్యక్తిత్వానికి హేరోదు ఆకర్షితుడయ్యాడు. ఈ రోజుల్లో ఇది ఎంత నిజం! బోధకుని వ్యక్తిత్వానికి ప్రజలు ఎంతగా ఆకర్షితులౌతున్నారు. బోధకుని శైలికి వారు ఆకర్షించబడి, ఆత్మల సంపాదన విషయంలో అతని చిత్తశుద్ధిని బట్టి ఆకట్టుకోబడతారు. కాని దీనికి మించినదేదీ వారికి లేకపోతే ఆకస్మికంగా నిద్రమత్తులో నుండి మేల్కొనే రోజు రానే వస్తుంది.

సత్యం ప్రకటించేవానిని ప్రేమించడం కాదు కానీ, సత్యాన్నే ప్రేమించడం కీలకమైనది. ఈ ఒక్క విషయమే నిజమైన దేవునిప్రజలకు మరియు అలాంటి బోధకులతో ఎల్లప్పుడూ సహవాసం చేసే 'మిశ్రిత జనాని'కి మధ్య ఉన్న విలక్షణమైన వ్యత్యాసం.

బాప్తిస్మమిచ్చు యోహాను గురించి పరిసయ్యులతోయోహాను 5:35లో క్రీస్తు ఇలాగన్నాడు " మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి”("నిజమైన వెలుగు" కాదు "అతని వెలుగులో"!) అలాగే ఈ రోజుల్లో చాలా మంది దేవునివాక్యపు మర్మాలను, అద్భుతాలను స్పష్టంగా తెలియజెప్పే సమర్థతగల బోధకునిని విని తాము చీకట్లో ఉంటూ కూడా “అతని వెలుగు”లోనే ఆనందిస్తారు. దీనికి కారణం వారు వ్యక్తిగతంగా ఎప్పుడూ "పరిశుద్దుని వలన అభిషేకం" 1 యోహాను 2:20పొందకపోవటమే. “సత్యమును నమ్ము”వారెవరంటే (2 థెస్సలోనికయులు 2:11) దైవికమైన కృపాకార్యము తమలో జరిగింపబడినవారే. వారు కలిగియున్నది లేఖనాలను గూర్చిన స్పష్టమైన మేథోసంబంధ అవగాహన కంటే మించినది: ఆ లేఖనాలు వారి ఆత్మలకు ఆహారంగాను, వారి హృదయాలకు ఆనందము కలగజేసేవిగాను (యిర్మీయా 15:16) ఉంటాయి. వారు సత్యాన్ని ప్రేమించేవారు కాబట్టి అసత్యాన్ని ద్వేషించి దాన్ని ప్రాణాంతక విషంగా తృణీకరిస్తారు. వారు వాక్యానికి కర్త అయినవానియందు ఆసక్తిగలవారు కాబట్టి ఆయనను అగౌరవపరిచే బోధకుని బోధను వినరు. తన భవిష్యత్తు తానే నిర్దేశించుకునేవానిగా మనిషిని సర్వోన్నత స్థలంలో నిలిపే ఏ బోధనూ వారు సహించరు.

“యెహెూవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు”(యెషయా 26:12). నిజమైన దేవుని ప్రజల యొక్క మనస్సు, నిష్కపటమైన వారి ఒప్పకోలు ఇక్కడ కనబడతాయి. “నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు” అన్న మాటను గమనించండి. ఒక యథార్థ విశ్వాసి హృదయంలో దేవుని కృప జరిగించిన కార్యాన్ని అది సూచిస్తుంది.

ఈ సత్యాన్ని తెలిపేది ఈ ఒక్క లేఖనభాగము మాత్రమే కాదు. ఈ క్రిందివాటిని గూర్చి జాగ్రత్తగా ఆలోచించండి! “తల్లి గర్భము నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరచెను”(గలతీ. 1:15, 16)."మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటన్నిటికంటెను, ఊహించువాటన్నిటికంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు”(ఎఫెసి 3:20), " మీలో ఈ సత్క్రియనారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను”(ఫిలిప్పీ 1:4), “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకు, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే”(ఫిలిప్పీ 2:13), " నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును” (హెబ్రీ 10:16), “సమాధానకర్తయగు దేవుడు...... తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను, తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్దపరచును గాక” (హెబ్రీ 13:20-21). దైవకృప అంతరంగంలో ఎలా పని చేస్తుందో పై ఏడు లేఖనభాగాలు తెలియజేస్తున్నాయి. మరో మాటలో చెప్పాలంటే అవి అనుభవాత్మక రక్షణను నిర్వచిస్తున్నాయి.

"యెహెూవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు”(యెషయా 26:12). ప్రియ చదువరీ, ఈ మాటలకు స్పందన నీ హృదయంలో ప్రతిధ్వనిస్తున్నదా? నీ పశ్చాత్తాపం ప్రకృతి సంబంధియైన వ్యక్తి శోకంతో కన్నీళ్లు విడవటం లాంటిదా లేక నిజమైన దు:ఖమా? దాని మూలము పరిశుద్దాత్ముడు నీ అంతరంగంలో చూపిన దైవకృపేనా? క్రీస్తునందున్న నీ నమ్మిక కేవలం మేథోసంబంధమైనదా? నీతో ఆయనకు గల సంబంధం కేవలం నువ్వు అతని పట్ల జరిగించిన కొన్ని పనుల వల్ల కలిగిందా లేక పరిశుద్దాత్ముని శక్తి ద్వారా నీవతనిలో మమేకమవ్వటం ద్వారా కలిగిందా? క్రీస్తుపట్ల నీ ప్రేమ కేవలం ఒక సదాచార అభిమానమేనా లేక దేవుడు నీలో పుట్టించిన సంపూర్ణ నూతనత్వం నుండే ఆ ప్రేమ జాలువారుతుందా? కీర్తనాకారునితో కలిసి “ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. నీవు నాకుండగా లోకము లోనిదేదియు నాకక్కరలేదు”(కీర్తనలు 73:25) అని నువ్వు చెప్పగలవా? నువ్వు చేసే పని నిజమైన సాత్వికంతో, తగ్గింపుతో చేస్తున్నావా? 'నేను అయోగ్యుడను, నిష్ప్రయోజకుడను' అని నీకు నువ్వు పేర్లు పెట్టుకోవటం చాలా సులభమే,కాని నిజంగా నీవలాంటివాడివే అన్న గ్రహింపు నీకుందా? “పరిశుద్ధులందరిలో అత్యల్పుడను” అని నువ్వు అనుకుంటున్నావా? పౌలు (ఎఫెసీ 3:11) అలా అనుకున్నాడు! అలా కాకుండా క్రైస్తవులందరికంటే నిన్ను నువ్వు హెచ్చించుకుని, ఎవరైతే వారి వైఫల్యాలకై మొరపెట్టి, తమ బలహీనతలను ఒప్పుకొని, "అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను" (రోమీయులకు 7: 24) అని విలపిస్తారో వారి కంటే నిన్ను నువ్వు ఉన్నతుడవుగా భావించుకుంటున్నావంటే నువ్వు దేవునికి ఇంకా అపరిచితుడవే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.

యథార్థమైన దైవభక్తికీ , మానవ మతాచారానికీ గల వ్యత్యాసం ఇదే : ఒకటి బాహ్యమైనది కాగా మరొకటి అంతరంగికమైనది. పరిసయ్యుల పట్ల క్రీస్తు తన అసంతృప్తిని ఇలా వెలిబుచ్చాడు - “మీరు గిన్నెయు, పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను, అజితేంద్రియత్వముతోను నిండియున్నవి”(మత్తయి 23:25)

శరీర సంబంధమైన మతం కేవలం బాహ్యమైనది. దేవుడు హృదయాన్నే లక్ష్యపెడతాడు, హృదయంతోనే వ్యవహరిస్తాడు. తన ప్రజలనుద్దేశించి దేవుడు ఇలా చెప్పాడు: “నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును” (హెబ్రీ 10:16).

"యెహెూవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదువు.” మనిషి యొక్క అతిశయాన్ని ఎంత కించపరిచే మాటలివి! తాను స్వయంసమృద్ధి గలవాడై, తనకవసరమైనదంతా తానే సాధించగలడనే ప్రవృత్తి విశ్వవ్యాప్తంగా మానవుల్లో ఉంటుంది. లవొదికయ సంఘపు వారి మాటల్లో చెప్పాలంటే: “నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదు..” ( ప్రకటన 3:17). అయితే ఇక్కడ మనల్ని రిక్తులనుగా చేసి, మన గర్వాన్ని అణిచే విషయం ఒకటుంది. దేవుడే మన పక్షమున నుండి మన పనులన్నిటిని సఫలపరిచాడు కాబట్టి మనలో అతిశయకారణమేమీ లేదు."ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగినవాటిలో నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేల?" (1 కొరింథీ 4:7)

ఈ ప్రకారంగా దేవుడు ఎవరిలో తన పని జరిగిస్తాడు? దైవికకోణం నుండి చూస్తే ఆయన దయాప్రాప్తులుగా, ఏర్పరచబడిన, విమోచింపబడిన ప్రజలు; మానవకోణం నుండి చూస్తే తమకు తాముగా ఆయన చూపుకి కూడా నోచుకోనివారు; అయోగ్యులు; ఆయన పవిత్ర ఉగ్రతను ప్రేరేపించేందుకు వెనుకాడనివారు; వారి జీవితాల్లో ఘోరంగా విఫలమైనవారు; దుర్మార్గపు అనైతిక వ్యక్తిత్వాలు కలవారు. అయినా పాపమెక్కడ విస్తరించెనో, అక్కడ కృప అపరిమితముగా విస్తరించి వారి కొరకై వారిలో వారు స్వయంగా చేయనిది, చేయలేనిది జరిగించింది.

అయితే దేవుడు తన ప్రజల్లో “జరిగించే పని” ఏమిటి? వారి పనులన్నిటిని ఆయన జరిగిస్తాడు. మొదటగా, ఆయన వారిని జీవింపచేస్తాడు; శరీరము కేవలము నిష్ప్రయోజనము (యోహాను 6:63). “సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను” (యాకోబు 1:18).

రెండవదిగా, మారుమనసును వారికి ప్రసాదిస్తాడు. “ఇశ్రాయేలునకు మారుమనస్సును, పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను, రక్షకునిగాను తన దక్షిణ హస్తబలము చేత హెచ్చించియున్నాడు”(అపో.కా. 5:31). "అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడు” (అపో. 11:18, 2తిమోతి 2:24).

మూడవదిగా, ఆయన వారికి విశ్వాసాన్ని వరముగా ఇస్తాడు: “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే”(ఎఫెసీ. 2:8). "దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడ మీరు లేచితిరి” (కొలస్సీ 2:12).

నాల్గవదిగా, ఆధ్యాత్మిక గ్రహింపును వారికి అనుగ్రహిస్తాడు: “మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము”(1యోహాను 5:19).

ఐదవదిగా, మన ప్రయాసను ఆయన సఫలం చేస్తాడు: “ వారందరికంటే నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే” ( 1కొరింథి 15:10).

ఆరవదిగా, మన రక్షణను ఆయన భద్రపరుస్తాడు: “...రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవునిశక్తిచే కాపాడబడు మీ కొరకు...” ( 1పేతురు 1:5).

ఏడవదిగా, మనల్ని ఫలింపచేస్తాడు: “నా వలననే నీకు ఫలము కలుగును” (హోషేయా 14:8). "ఆత్మ ఫలము" (గలతీ. 5:22). నిజమే, ఆయన మన పక్షముననుండి మన పనులన్నిటిని సఫలపరుస్తాడు.

దేవుడు ఈ విధంగా ఎందుకు 'మన పక్షమున ఉండి మన పనులన్నిటిని సఫలపరుస్తాడు?' ప్రప్రథమంగా, ఆయన అలా చేసుండకపోతే మనము నిత్యనరకంలో ఉండేవాళ్ళము (రోమా. 9:29). మనము “బలహీనులం”,దేవుని నీతి నెరవేర్చలేనివారమై ఉన్నాము. అయితే, మనము చెయ్యాల్సినవైనా, చెయ్యలేనివాటిని, దేవుడు తన సార్వభౌమ్య కృపచేత మనలో జరిగించాడు. రెండవదిగా, సమస్త ఘనత ఆయనకే చెందేలా ఇవన్నీ ఆయనే చేసాడు. “నేను రోషముగల దేవుడన"ని ఆయనే చెప్పాడు కదా. ఆయన తన ఘనతను వేరొకరితో పంచుకోడు. ఈ విధంగా ఆయన మన స్తుతిని పొందుకుంటాడు. ఇందులో మన అతిశయకారణమేమీ లేదు. మూడవదిగా, మన రక్షణ ఫలభరితమయ్యేలా మరియు భద్రపరచబడేలా ఆ విధంగా చేస్తాడు. మన రక్షణ విషయాన్ని మనకే వదిలివేసుంటే, అది ఎన్నటికీ ఫలవంతమూ కాదు, సురక్షితంగా ఉండేదీ కాదు. తాను తాకిన ప్రతివాటినీ మనిషి పాడు చేస్తాడు. తాను ప్రయత్నించిన ప్రతి విషయంలో ఓటమిని చవిచూస్తాడు. అయితే దేవుడు చేసిన ప్రతి పనినీ సంపూర్ణంగాను శాశ్వతంగాను ఉండేలా దానిని జరిగిస్తాడు: “దేవుడు చేయు పనులన్నియు శాశ్వతములని నేను తెలిసికొంటిని: దానికేదియు చేర్చబడదు, దానినుండి ఏదియు తీయబడదు: మనుష్యులు తనయందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసియున్నాడు”(ప్రసంగి 3:14).

అయితే నా "పక్షమున" నా పనులన్నిటిని దేవుడే జరిగించాడన్న నిశ్చయత నాకెలా కలుగుతుంది? ప్రధానంగా, వాటి ఫలితాల ద్వారా కలుగుతుంది. నువ్వు తిరిగి జన్మించినవాడవైతే, నీ లోపల ఆ నూతన స్వభావం ఉంటుంది. ఈ నూతన స్వభావము ఆధ్యాత్మికమైనది మరియు శరీరస్వభావానికి, దాని కోరికలకు, వాంఛలకు విరుద్ధమైనది. ఈ రెండు స్వభావాలూ ఒకదానికొకటి పరస్పర విరుద్ధంగా ఉండటం వలన వాటి మధ్య ఎడతెగని పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ అంతర్గత సంఘర్షణ నువ్వు అనుభవిస్తున్నావా?నీ పశ్చాత్తాపం దేవుని వలన కలిగినదైతే, నిన్ను నువ్వు అసహ్యించుకుంటావు, నీ పశ్చాత్తాపం మన:పూర్వకమైనదై, ఆధ్యాత్మికమైనదైతే, దేవుడు నిన్ను ఏనాడో నరకంలో పడేయలేదే అని ఆశ్చర్యపోతావు. నీ పశ్చాత్తాపం క్రీస్తుని వరమైతే, ప్రతిరోజు దేవుని అద్భుత కృపకు బదులు నువ్వు చేసే దౌర్భాగ్యపు పనుల పట్ల దు:ఖిస్తావు. నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు. ఎన్నోరకాలుగా నువ్వు చేసిన అతిక్రమాల విషయమై రహస్యంగా దేవుని ఎదుట పశ్చాత్తాపపడతావు. రక్షింపబడిన తొలిదినాల్లోనే కాదు, ఇప్పుడు కూడా ఈ విధంగానే చేస్తావు.

నీ విశ్వాసం దేవుని ద్వారా కలిగిందని చెప్పటానికి ఋజువు - ప్రకృతి సంబంధమైన దేనిలో కూడా నువ్వు నీ నమ్మిక ఉంచేందుకు ఇష్టపడవు ; నీ స్వాభిమానాన్ని, స్వనీతిని త్యజిస్తావు; నువ్వు చేసిన నీ పనులన్నిటినీ తిరస్కరిస్తావు. నీ విశ్వాసము 'దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసమైతే' (తీతుకు 1:1), నువ్వు దేవుని ఎదుట అంగీకారం పొందటానికి ఆధారముగా కేవలం క్రీస్తును మాత్రమే ఆశ్రయిస్తావు. ఒకవేళ నీ విశ్వాసము 'దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసమైతే', నువ్వు దేవునివాక్యాన్ని గాఢంగా నమ్మి, సాత్వికంతో దాన్ని అంగీకరించి, స్వంత ఆలోచనలకు సిలువ వేసి, చిన్నపిల్లవానివలె ఆయన చెప్పినదంతా అంగీకరిస్తావు.

ఒకవేళ క్రీస్తుపై నీకున్న ప్రేమ ఆత్మవరమైతే (గలతీ 5:25) అందుకు ఋజువు ఆయనకు ప్రసన్నం కలిగించని విషయాలకు దూరంగా ఉండి, ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టే కార్యాలు మాత్రమే చేయటంలో నువ్వు నిమగ్నమౌతావు; ఒక్క మాటలో చెప్పాలంటే విధేయత కలిగి నడుచుకుంటావు. ఒకవేళ క్రీస్తుపట్ల నీ ప్రేమ "నూతన పురుషుని" ప్రేమ ఐతే, నువ్వు ఆయన కోసం పరితపిస్తావు, అన్నింటికంటే మిన్నగా ఆయనతో పాలుపంచుకునేందుకు ఆపేక్షిస్తావు. క్రీస్తుకు నీ పట్ల ఏ రకమైన ప్రేమ ఉందో నీకు కూడా ఆయన పట్ల అలాంటి ప్రేమే ఉంటే, తన ప్రజలు ఎప్పటికీ ప్రభువుతో ఉండేలా ఆయన రెండవసారి వారిని స్వీకరించటానికి వస్తాడని ఆయన మహిమయొక్క ప్రత్యక్షత కోసం నువ్వు ఆతురతతో ఎదురుచూస్తుంటావు. ప్రియ చదువరీ, నీ క్రైస్తవ జీవితం వాస్తవికమా లేక బూటకమా, నీ నిరీక్షణ క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా లేక మానవ తీర్మానాలు, ప్రయత్నాలు, నిర్ణయాలు మరియు అనుభూతులు అనే ఊబియందు నిర్మించబడిందా - క్లుప్తంగా, నీ రక్షణ “ప్రభువు వలన”కలిగిందా లేక నీ మోసపూరిత హృదయపు వ్యర్థఊహల వలన కలిగిందా అని వివేచించే కృపను దేవుడు నీకు అనుగ్రహించును గాక.

Add comment

Security code
Refresh

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.