విమర్శలకు జవాబు

రచయిత: Marie Prasanth Perikala
చదవడానికి పట్టే సమయం: 23 నిమిషాలు

కొద్ది రోజుల క్రితం ఒక హైందవ సోదరుడు తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టారు. అదేమిటంటే, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును అని యెషయా గ్రంథం 7:14 లో ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో, అది తప్పుగా తర్జుమా చేయబడింది అని, మూల భాష అయిన హిబ్రూ బైబిల్ లో, అక్కడ “అల్మాహ్” అనే పదం వాడారని, ఆ పదానికి అర్థం “a young woman” అంటే ఒక “యువతి” లేదా “ఒక యవ్వనస్తురాలు” అనే అర్థం వస్తుందని, కానీ క్రైస్తవులు “అల్మాహ్” అనే ఈ పదానికి “virgin” లేదా తెలుగులో “కన్య” అని అన్వయించుకుని తప్పుగా తర్జుమా చేశారని, “యవ్వనస్తురాలు” అని అర్థం వచ్చే పదం “కన్య” గా ఎలా మారుతుంది? “యవ్వనస్తురాలు” కన్యగానే ఉండాలి అని లేదు కదా? అని ప్రశ్నించడం జరిగింది. అలాగే “కన్య” అనే పదానికి హిబ్రూలో “బెతూలాహ్” అనే పదం వాడతారని, కానీ యెషయా 7:14 లో “బెతూలాహ్” అనే పదం కాకుండా “అల్మాహ్” అనే పదం వాడారు కాబట్టి, కన్యక గర్భం ధరించడం అనేది శుద్ధతప్పు, ఇది కేవలం అన్వయింపు మాత్రమే అని వారు ఆ పోస్టులో చెప్పడం జరిగింది.

నిజంగా వీరు అడిగిన ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు. వీరు లేవనెత్తిన అంశం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అంత ప్రాముఖ్యమైనది అంటే, యేసు ప్రభువు కన్య మరియ గర్భమున జన్మించడం అనేది యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు అని చెబుతూ, పరిశుద్ధ మత్తయిగారు మత్తయి సువార్తలో, ఇదే వచనాన్ని, అంటే యెషయా గ్రంథము 7:14 వచనాన్ని ఉటంకించారు.

“ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను.”(మత్తయి సువార్త 1:22-23)

మొదటి శతాబ్ద కాలంలో ఇశ్రాయేలు దేశంలో నివసించిన యూదుడు, హెబ్రీయుడు అయిన మత్తయిగారికి “అల్మాహ్” అంటే యవ్వనస్తురాలు అనే విషయం తెలీదా? మత్తయిగారు యెషయా గ్రంథములో ఉన్న ప్రవచనాన్ని తప్పుగా అర్ధం చేసుకుని, దానిని కొత్త నిబంధనలో తప్పుగా అన్వయించారా? లేక “అల్మాహ్” అనే పదానికి యవ్వనస్తురాలు అనే అర్ధం వస్తుంది అని తెలిసినప్పటికీ, మత్తయిగారు కావాలనే దురుద్దేశంతో ఆ వచనాన్ని ఇలా తప్పుగా అన్వయించారా? ఒక వేళ ఇదే నిజమయితే గనక, యెషయా గ్రంథము 7:14 వచనాన్ని తప్పుగా తర్జుమా చేశారు అనే ఆరోపణ కంటే కూడా, మత్తయిగారు కావాలనే తప్పుగా అన్వయించారు అనేది ఇంకా చాలా పెద్ద సీరియస్ ఇష్యూ. అందువలన ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. ప్రతి క్రైస్తవునికి కూడా దీని గురించి అవగాహన ఉండాలి.

కాబట్టి ఈ ఆర్టికల్ లో మనం ముఖ్యంగా నాలుగు విషయాలను పరిశీలిద్దాం.

  1. యెషయా గ్రంథము 7:14వ వచనాన్ని యూదులు ఏ విధంగా అర్ధం చేసుకునేవారు? ఈ వచనంలో ఉన్న “అల్మాహ్” అనే పదాన్ని “కన్య” అని తర్జుమా చేసింది మొదటిగా క్రైస్తవులేనా లేక వేరే ఇంకెవరైనా కూడా ఇలాగే తర్జుమా చేశారా? అనే విషయాన్ని పరిశీలిద్దాం.
  2. అల్మాహ్ అనే పదం యొక్క concrete meaning ఏంటి? దాని మూల పదము మరియు మూల పదం నుండి వచ్చిన ఇతర పదాలను పరిశీలించడం ద్వారా మనకి అదనపు సమాచారం ఏమైనా తెలుస్తుందా? అనేది చూద్దాం.
  3. అల్మాహ్ అనే పదాన్ని బైబిల్ లో ఎక్కడెక్కడ ఏయే సందర్భాలలో ఉపయోగించారు? ఆ వచనాలలో ఎలాంటి అర్థం ఉంది? అనేది చూద్దాం.
  4. ఇక చివరిగా - అసలు కన్య అని చెప్పాలనుకుంటే, బెతూలహ్ అని స్పష్టంగా చెప్పి ఉంటే సరిపోయేది కదా, ఈ గొడవంతా ఉండేది కాదు. మరి అల్మాహ్ అనే పదాన్నే ఎందుకు వాడారు? అనే విషయాన్ని కూడా పరిశీలిద్దాం.

సరే మొదటి పాయింట్ ని చూద్దాం - ఇప్పుడు మీరు ఏ యూదుడి దగ్గరికైనా వెళ్లి, యెషయా గ్రంథము 7:14 వచనం చూపించి, ఈ వచనాన్ని మీరు ఎలా అర్ధం చేసుకుంటారు అని అడిగారనుకోండి, వాళ్ళు ఏమి చెబుతారో తెలుసా? అల్మాహ్ అంటే యవ్వనస్తురాలు అనే అర్ధం వస్తుంది. కన్యక కాదు అని చెబుతారు. కానీ, క్రీస్తు పూర్వం ఉన్న యూదులు, అలాగే క్రీస్తు శకం మొదటి శతాబ్దం లో ఉన్న యూదులు, ఈ వచనాన్ని వేరే విధంగా అర్ధం చేసుకునేవారు.

לכן יתן אדני הוא לכם אות הנה העלמה הרה וילדת בן וקראת שמו עמנו אל

ఇక్కడ మీరు చూస్తున్నది, హీబ్రూ బైబిల్ లో ఉన్న యెషయా గ్రంథము 7:14 వచనం. ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్లుగానే, ఇక్కడ వాడిన పదం “అల్మాహ్”. క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో, యూదులు తమ హీబ్రూ బైబిల్ ని గ్రీకు భాషలోకి తర్జుమా చేసుకున్నారు. 70 మంది యూదా పండితులు కలసి చేసిన తర్జుమా కాబట్టి, దానిని Septuagint అంటారు. ఈ Septuagint లో యెషయా గ్రంథము 7:14వ వచనాన్ని తర్జుమా చేస్తూ “పార్థెనోస్” అనే పదం వాడారు.

διὰ τοῦτο δώσει Κύριος αὐτὸς ὑμῖν σημεῖον· ἰδοὺ ἡ παρθένος ἐν γαστρὶ ἕξει, καὶ τέξεται υἱόν, καὶ καλέσεις τὸ ὄνομα αὐτοῦ ᾿Εμμανουήλ·
యెషయా గ్రంథము 7:14

“పార్థెనోస్” అనే గ్రీకు పదానికి అర్థం “కన్యక”. ఇందులో ఎలాంటి సందేహము లేదు. పార్థెనోస్ అంటే స్పష్టంగా కన్యక అనే అర్ధం. మీరు గ్రీకు క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 1:23వ వచనం చూసినట్లయితే అక్కడ వాడిన పదం కూడా “పార్థెనోస్”. యూదులు Septuagint లో ఏ పదం అయితే వాడారో, మత్తయి గారు కూడా కొత్త నిబంధనలో అదే పదం వాడారు.

ἰδοὺ ἡ παρθένος ἐν γαστρὶ ἕξει καὶ τέξεται υἱόν, καὶ καλέσουσι τὸ ὄνομα αὐτοῦ Ἐμμανουήλ, ὅ ἐστι μεθερμηνευόμενον μεθ᾿ ἡμῶν ὁ Θεός.
మత్తయి సువార్త 1:23

దీన్ని బట్టి మనకి అర్ధం అయ్యేది ఏమిటంటే, ఇక్కడ మత్తయి గారు కావాలని దురుద్దేశంతో చేసింది ఏమీ లేదు. క్రీస్తు పూర్వం మరియు మొదటి శతాబ్దంలో ఉన్న యూదా మత గురువులు, ఈ వచనాన్ని ఏ విధంగా అయితే అర్ధం చేసుకున్నారో, మత్తయి గారు కూడా అదే విధంగా interpret చేసారు. అప్పటి వరకు యూదులలో ఉన్న అవగాహననే మత్తయి గారు క్రైస్తవులకి అందించారు. ఈ వచనంలో ఉన్న “అల్మాహ్” అనే పదాన్ని కన్యక అని మొదటిగా తర్జుమా చేసింది క్రైస్తవులు కాదు. యూదులే ఆ విధంగా తర్జుమా చేశారు. అయితే మొదటి శతాబ్దం చివరి నాటికి క్రైస్తవ్యం ఒక ప్రత్యేక మతముగా అభివృద్ధి అవుతుండడంతో యూదులు ప్లేటు ఫిరాయించి, ఈ వచనంలో ఉన్న అల్మాహ్ అనే పదానికి కన్యక అనే అర్ధం రాదు, కేవలం యవ్వనస్తురాలు అనే అర్ధం వస్తుంది అని చెప్పడం మొదలు పెట్టారు. ఈ విధంగా యూదులు వాళ్ళ theology ని మార్చుకున్నారు కానీ, క్రైస్తవులు మాత్రం మొదటి నుండి ఉన్న ఆలోచననే కొనసాగించారు. మత్తయిగారు హెబ్రీయుడు. ఆయనకి హెబ్రీ భాష స్పష్టంగా తెలుసు. ఆ కాలంలో అప్పటి యూదులు ఈ వచనాన్ని ఎలా అర్ధం చేసుకునే వారు, అప్పటి సాంస్కృతిక నేపథ్యంలో ఈ పదాన్ని ఎన్ని రకాలుగా వాడేవారో, ఏయే సందర్భాల్లో ఎటువంటి అర్ధం వస్తుందో ఆయనకి బాగా తెలుసు.

ఇక అల్మాహ్ అనే పదం యొక్క కాంక్రీట్ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. అల్మాహ్ అనే పదం “అలాం”(עלם) అనే రూట్ వర్డ్ నుండి వచ్చింది. “అలాం” అంటే - మన కంటికి కనిపించనిది - అది దూరానికి సంబంధించినది అయినా అవ్వొచ్చు లేదా కాలానికి సంబంధించినది అయినా అవ్వొచ్చు. చాలా కాలం క్రితం జరిగిన విషయం, లేదా భవిష్యత్తులో జరగబోయేది, లేదా దూరంగా మన కంటికి కనపడని ప్రదేశం లేదా వస్తువు ఏదైనా అవ్వొచ్చు. స్థూలంగా చెప్పాలంటే, మన దృష్టికి అవతల ఉన్నది లేదా మన పరిధిలో లేనిది అనే అర్ధం వస్తుంది. “అలాం” అనే రూట్ వర్డ్ నుండి వచ్చిన ఇతర పదాలు

  • ఆలం - עָלַם (Strong’s #: 5956)
  • అల్మాహ్ - עַלְמָה (Strong’s #: 5959)
  • ఓలాం - עוֹלָם (Strong’s #: 5769)
  • త'అలూమాహ్ - תַּעֲלֻמָּה (Strong’s #: 8587)
  • ఏలోమ్ - עֵילוֹם (Strong’s #: 5865)

ఈ పదాలన్నిటిలో కామన్ గా “ఆయిన్”(ע), “లామెద్”(ל), “మెమ్”(מ) అనే అక్షరాలను మీరు గమనించవచ్చు. మీకు హీబ్రూ అక్షరాల గురించి బేసిక్ ఐడియా లేకపోతే గనుక ఇక్కడ మీరు కొంచెం తికమకపడే అవకాశం ఉంది. మెమ్ అనే అక్షరం ఏదైనా పదం చివరలో వచినప్పుడు regular form లో(מ) కాకుండా, final form లో(ם) రాస్తారు. కాబట్టి, చూడటానికి వేరువేరు అక్షరాల లాగా ఉన్నప్పటికీ, ఇవి రెండూ కూడా ఒక్కటే అక్షరాన్ని సూచిస్తాయి. సరే, ఇప్పుడు ఈ పదాలకి అర్ధం ఏమిటో చూద్దాం -

  1. “ఆలం” అంటే దాచిపెట్టబడటం లేదా కనపడకుండా ఉంచడం.
  2. “అల్మాహ్” అంటే యువతి.
  3. “ఓలాం” అంటే సాధారణంగా “eternal” అని తర్జుమా చేస్తారు. కానీ, Ancient Hebrew thinking ప్రకారం “ఓలాం” అంటే మనం గ్రహించలేనిది. నిత్యత్వం అనేది మనకు తెలియనిది, మనం తెలుసుకోలేనిది అని వారి ఆలోచన. అనుభవపూర్వకంగా అనుభవిస్తేనే కానీ eternity అంటే ఏంటో మనం గ్రహించలేము.
  4. “త'అలూమాహ్” అంటే secret - రహస్యంగా ఉంచబడింది.
  5. “ఏలోమ్” అంటే మనకి తెలియని అతిప్రాచీన కాలం లేదా భవిష్యత్తులో రానున్న కాలం.
עלם అలాం Beyond the field of vision of time or space.
עָלַם (Strong’s #: 5956) ఆలం Be out of sight; To be hidden; To be covered
עַלְמָה (Strong’s #: 5959) అల్మాహ్ Young maiden; A young female of marriageable age
עוֹלָם (Strong’s #: 5769) ఓలాం A place or time that cannot be perceived
תַּעֲלֻמָּה (Strong’s #: 8587) త'అలూమాహ్ Hidden; Secret
עֵילוֹם (Strong’s #: 5865) ఏలోమ్ The distant past or future

ఈ పదాలన్ని గమనిస్తే, అన్నీ కూడా interrelated words అని స్పష్టంగా అర్ధం అవుతుంది. దాచిపెట్టబడటం, గ్రహించలేనిది, తెలుసుకోలేనిది, రహస్యంగా ఉంచబడింది, తెలియని కాలానికి సంబంధించింది - ఇవి అన్ని కూడా same concept కి సంబంధించినవే. అయితే, వీటికి యవ్వనస్తురాలికి ఏంటి సంబంధం? Patriarchal Cultures, అంటే పితృస్వామ్యం ఉన్న సంస్కృతులలో - పెళ్లీడుకొచ్చిన యువతిని, కుటుంబసభ్యులు చాలా జాగ్రత్తగా పరపురుషుల కళ్ళు పడకుండా కాపాడుతూ ఉంటారు. బయట ఎక్కువగా తిరగనిచ్చేవారు కాదు. ఇంట్లోనే ఉంచేవారు. ఈ కాలంలో కూడా పెళ్లీడు కొచ్చిన యువతి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో మనకు బాగా తెలుసు. మరి ఓ రెండు మూడు వేల సంవత్సరాల క్రితం జీవించిన వాళ్ళు, ఆ రోజుల్లో పరపురుషుడి కళ్ళు పడకుండా పెళ్లి వయసులో ఉన్న యువతి విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉండేవారో మీరే ఆలోచించండి. కాబట్టి “అల్మాహ్” అంటే కేవలం యవ్వనస్తురాలు మాత్రమే కాదు. పెళ్ళికి సిద్ధంగా ఉన్న యువతి. పెళ్ళికి సిద్ధంగా ఉన్న యువతులు అందరూ కన్యలు అని generalize చేయలేము కానీ, కన్యలందరూ కూడా పెళ్లికి సిద్ధంగా ఉన్న యువతులు అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అసలు ఈ కాలంలో కూడా అక్కడక్కడా కొంతమందిని మినహాయిస్తే దాదాపుగా పెళ్ళికి సిద్ధంగా ఉన్న ప్రతీ యువతి కూడా కన్యగానే ఉంటుంది. మరి ప్రాచీన కాలంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. Almost every young female of marriageable age is a virgin.sense లో “అల్మాహ్” అనే పదాన్ని రెండు రకాలుగానూ వాడేవారు. ఆ కారణంగానే even Jewish Rabbi’s కూడా “అల్మాహ్” అనే హీబ్రూ పదాన్ని, గ్రీకులో “పార్థెనోస్” అని తర్జుమా చేశారు.

ఇక అల్మాహ్ అనే పదాన్ని బైబిల్ లో ఎక్కడెక్కడ ఏయే సందర్భాలలో ఉపయోగించారు, ఆయా వచనాలలో ఎలాంటి అర్ధం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. హీబ్రూ బైబిల్ మొత్తం మీద, అల్మాహ్ అనే పదం కేవలం ఏడు సార్లు మాత్రమే వాడారు. అంటే ఇది చాలా అరుదుగా ఉపయోగించిన పదం అని తెలుస్తుంది. యెషయా గ్రంథం ఏడవ అధ్యాయం 14వ వచనాన్ని మినహాయిస్తే, మొత్తం ఆరు చోట్ల ఈ పదం వాడారు. ఆదికాండము 24వ అధ్యాయం 43వ వచనంలో, ఇస్సాకునకు పెళ్లి సంబంధం చూడటానికి వచ్చిన అబ్రహాము సేవకుడు, పెళ్లి కూతురిని ఉద్దేశించి మాట్లాడుతూ “హ'అల్మాహ్” అనే పదం వాడాడు. ఇక్కడ రిబ్కా కన్య అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, ఈ వచనంలో అల్మాహ్ అనే పదం ఆమె కన్యత్వాన్ని తెలియచేయడానికి వాడిన పదం కాదు. ఇక్కడ యవ్వనస్తురాలు అని కూడా భావించవచ్చు.

నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో (העלמה) నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు
ఆదికాండము 24:43

ఇక రెండవ రిఫరెన్స్ - నిర్గమకాండం 2:8 వచనంలో మోషేను బుట్టలో పెట్టి నదిలో వదిలేసిన తరువాత, మోషే ఫరో కుమార్తెకు దొరుకుతాడు. ఆ సందర్భంలో మోషే సోదరి మిర్యామ్ దూరంగా ఉండి అంతా చూస్తూ ఉంటుంది. తరువాత ఫరో కుమార్తె చెప్పడంతో వెళ్లి తన తల్లిని పిలుచుకొస్తుంది. ఇక్కడ మోషే సోదరిని ఉద్దేశించి “హ'అల్మాహ్” అనే పదం వాడారు. ఇక్కడ కూడా మిర్యామ్ కన్యక అని తెలుస్తున్నప్పటికీ, ఈ వచనం యొక్క context ని చూస్తే, అల్మాహ్ అనే పదం కన్యత్వానికి సంబంధించి వాడినది కాదు. ఇక్కడ యవ్వనస్తురాలు అనే భావించాల్సి ఉంటుంది.

అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది (העלמה) వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.
నిర్గమకాండం 2:8

ఇక మూడవ సందర్భం - 68వ కీర్తన 24-25 వచనాలు చూసినట్లయితే, కన్యకలు తంబురలు వాయించుచుండగా అని ఉంటుంది. ఇక్కడ వాడిన పదం అల్మోత్ (అల్మాహ్ అనే పదానికి బహువచనం). ఈ వచనం యొక్క context లో కూడా మనకి వాళ్ళ కన్యత్వానికి సంబంధించి ఎలాంటి సమాచారము లేదు. ఇక్కడ కూడా మనం యువతి అని భావించవచ్చు.

దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు (עלמות) తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
కీర్తనల గ్రంథము 68:24-25

ఇక నాలుగవ సందర్భం - సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18-19 వచనాలలో “బె'అల్మాహ్” అనే పదం వాడారు. ఈ వచనంలో కూడా అల్మాహ్ అనే పదం కన్యత్వానికి సంబంధించి వాడలేదు.

నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో (בעלמה) పురుషుని జాడ.
సామెతల గ్రంథం 30:18-19

ఇక ఐదవ సందర్భం - పరమగీతములు మొదటి అధ్యాయం మూడవ వచనంలో “అల్మోత్” అనే పదం వాడారు. ఈ వచనం యొక్క context లో కూడా కన్యలు అనే అర్ధంలో వాడారు అనడానికి సరైన సమాచారం లేదు.

నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు (עלמות) నిన్ను ప్రేమించుదురు.
పరమగీతములు 1:3

ఇప్పటివరకు మనం చూసిన వచనాలలో అల్మాహ్ అనే పదానికి కన్యక అనే అర్ధంలో వాడారు అనడానికి ఖచ్చితమైన ఆధారం ఏమీ కనిపించలేదు. ఆరవ రిఫరెన్స్ లో ఏమైనా సమాచారం దొరుకుతుందేమో చూద్దాం. పరమగీతములు ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అరవై మంది రాణులు, ఎనభై మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యలు ఉన్నారు అని ఉంటుంది. ఇక్కడ వాడిన పదం “అల్మోత్”. ఈ వచనంలో అల్మాహ్ అనే పదాన్ని స్పష్టంగా కన్యకలను ఉద్దేశించి వాడారు.

అరువదిమంది రాణులును ఎనుబదిమంది ఉపపత్ను లును లెక్కకు మించిన కన్యకలును (עלמות) కలరు.
పరమగీతములు 6:8

ఆ విషయం మనకి సరిగ్గా అర్ధం కావాలంటే - రాణులు, ఉపపత్నులు మరియు “అల్మోత్” - విభిన్నమైన ఈ మూడు కేటగిరీల గురించి మనకి కొంచెం అవగాహన ఉండాలి. ప్రాచీన సంస్కృతులలో - అది ఐగుప్తీయులైనా, బబులోనీయులైనా, అషురీయులైనా, పర్షియా వారైనా, ఇశ్రాయేలీయులైనా... అది ఏ సంస్కృతి అయినా కూడా - రాజులు బహు భార్యత్వాన్ని కలిగి ఉండేవారు. రాణులకి High Status ఉండేది. వాళ్ళు రాజు గారికి అధికారికంగా భార్యలు. వాళ్ళు రాజుతో శారీరక సంబంధం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు కన్యలు కాదు. రెండవ కేటగిరీ - ఉపపత్నులు. వీళ్ళు కూడా రాజుతో శారీరక సంబంధం కలిగి ఉంటారు కానీ, వీళ్ళు అధికారికంగా భార్యలు కాదు. వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన హక్కులు అధికారాలూ ఉన్నప్పటికీ రాణితో సమాన హోదా వీరికి ఉండదు. రాజు గారికి ఎప్పుడైనా వీరిని చూడాలనిపిస్తే, రాజు స్వయంగా పిలిపించే వరకు వీరికి రాజుని చూసే అవకాశం కూడా రాదు. ఇక మూడవ కేటగిరీ - వీళ్ళు కన్యలు - వీళ్ళు ఏ పురుషుడితో కూడా శారీరక సంబంధం కలిగి ఉన్నవారు కాదు. అన్ని వేళలలో రాజు గారికి కన్యలను అందుబాటులో ఉంచే ఒక వ్యవస్థ ఆ రోజుల్లో ఉండేది. ఈ కన్యలు భవిష్యత్తులో ఉపపత్నులు అవ్వొచ్చు లేదా రాణి కూడా అవ్వొచ్చు.

concept మనకి ఎస్తేరు గ్రంథంలో కనపడుతుంది. మీరు ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం మొత్తం చదివితే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎనిమిదవ వచనంలో “కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడ్డారు” అని ఉంటుంది. పన్నెండవ వచనం ప్రకారం, ఈ కన్యలు అక్కడ పన్నెండు నెలల పాటు ఉంటారు. ఆరు మాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళ క్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను వాళ్ళను సిద్ధపరుస్తున్నట్లు ఉంటుంది. కానీ basic గా అది కన్యత్వ పరీక్ష. ఒకవేళ ఎవరైనా అక్కడికి రాకముందు గర్భవతి అయ్యుంటే కనుక, ఈ పన్నెండు నెలల కాలంలో అది బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు రాజుగారి దగ్గరకు కన్యలను మాత్రమే పంపడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక పద్నాలుగవ వచనం చూసినట్లయితే, పన్నెండు నెలల కాలం గడచిన తరువాత, ఈ కన్యకలు ఒక సాయంత్రం పూట, రాజుగారి దగ్గరకు వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతః పురమునకు తిరిగి వెళతారు. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరల వెళ్లకుండెను. అంటే ఒకసారి రాజు దగ్గరకు వెళ్లిన తరువాత, ఆ స్త్రీని కన్యకలు ఉన్న అంతఃపురానికి తిరిగి పంపకుండా, ఉపపత్నులు ఉండే రెండవ అంతఃపురానికి పంపుతారు. కాబట్టి Ancient Cultural Conext ప్రకారం, పరమగీతం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అల్మాహ్ అనే పదాన్ని కన్యకలను ఉద్దేశించి వాడారు అనేది సుస్పష్టం. కాబట్టి అల్మాహ్ అనే పదానికి కన్యక అనే అర్ధం కూడా ఉంది. కేవలం యవ్వనస్తురాలు అని చెప్పడానికి వీలులేదు.

ఇక చివరిగా, అసలు కన్య అని చెప్పాలనుకుంటే, “బెతూలహ్” అనే పదం వాడకుండా “అల్మాహ్” అనే పదం ఎందుకు వాడారు? అనే విషయాన్ని పరిశీలిద్దాం. అసలు ఈ వచనంలో అల్మాహ్ అనే పదం వాడటం వెనుక ఏదో మర్మం దాగి ఉంది అని మనం చెప్పొచ్చు. ఇంతకుముందు మనం చూసిన Concrete meanings లో - Secret, Something kept hidden, దాచిపెట్టబడటం ఇలాంటి concepts ని చూసాం. కాబట్టి ఇక్కడ మనకి కనపడుతున్న plain text క్రింద కనిపించని hidden message ఏమైనా ఉందా? ఈ అల్మాహ్ అనే పదం ఆ hidden message కి సంబంధించి clue అయ్యుంటుందా? ఈ పదం వాడిన వచనాలను మరొక్కసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం.

అల్మాహ్ అనేది చాలా అరుదుగా వాడిన పదం. బైబిల్ మొత్తంలో కేవలం ఏడు సార్లు మాత్రమే వాడారు. అయితే "definite article" తో కేవలం మూడుసార్లు మాత్రమే వాడటం జరిగింది. "Definite article" అంటే మనకు తెలుసు - ఒక particular వ్యక్తి గురించి కానీ, ఒక particular వస్తువు గురించి కానీ, లేదా ఒక particular స్థలం గురించి కానీ చెప్పేటప్పుడు మనం "definite article" వాడతాం. హీబ్రూలో “హే”(ה) అనే అక్షరాన్ని "definite article" గా వాడతారు. ఉదాహరణకు "Messiah" అంటే - అభిషేకించబడిన వ్యక్తి - ఎవరైనా అవ్వొచ్చు. కానీ, "The Messiah" అన్నప్పుడు మనం కేవలం ఒక్క యేసు క్రీస్తుని ఉద్దేశించి మాత్రమే మాట్లాడతాం. ఈ అల్మాహ్ అనే పదం "definite article" తో అంటే, “హ'అల్మాహ్”(העלמה) అనే పదం బైబిల్ మొత్తంలో కేవలం మూడు సార్లు మాత్రమే కనిపిస్తుంది. పరమగీతం మొదటి అధ్యాయంలోనూ, ఆరవ అధ్యాయంలోనూ “అల్మోత్” అనే పదం వాడారు. కాబట్టి ఈ వచనాలని మనం పక్కన పెట్టొచ్చు. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో వాడిన పదం “బె'అల్మాహ్”. కాబట్టి దీనిని కూడా మనం పక్కన పెట్టొచ్చు. 68వ కీర్తనలో కూడా “అల్మోత్” అనే పదం వాడారు. ఇది కూడా తీసేస్తే, ఇక మిగిలినవి ఆదికాండము 24వ అధ్యాయం 43వ వచనం, నిర్గమకాండం 2వ అధ్యాయం 8వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ఈ మూడు వచనాలలో కూడా “హ'అల్మాహ్” అనే పదం వాడారు.

  • ఆదికాండము 24వ అధ్యాయం 43వ వచనంలో రిబ్కాని ఉద్దేశించి “హ'అల్మాహ్” అనే పదం వాడారు. ఈమె పెళ్ళికి సిద్ధంగా ఉన్న కన్యక.
  • నిర్గమకాండం 2వ అధ్యాయం 8వ వచనంలో మోషేకు అక్క అయిన మిర్యామ్ ని ఉద్దేశించి “హ'అల్మాహ్” అనే పదం వాడారు. హీబ్రూ భాషలో మిర్యామ్ అంటే, మరియమ్మ - Mary.
  • ఇక యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఇమ్మానుయేలుకి జన్మనిచ్చే స్త్రీని గురించి చెబుతూ “హ'అల్మాహ్” అనే పదం వాడారు.

ఇప్పుడు ఈ మూడు వచనాలలో ఉన్న "hidden message" ని మనం కలిపి చదివితే కన్య మరియ గర్భము ధరించి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు, అనే "hidden message" మనకు కనిపిస్తుంది. దీనినే నేను "God’s Grand Design - God’s Finger Print in the Scriptures" అని అంటాను. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, “అల్మాహ్” అనే పదానికి ఖచ్చితమైన అర్ధం - పెళ్ళికి సిద్ధంగా ఉన్న యువతి అని. ఈ పదాన్ని కన్యకను ఉద్దేశించి కూడా వాడొచ్చు. అందులో ఎలాంటి సమస్యాలేదు. ఇది క్రైస్తవులు అన్వయించుకున్నది కూడా కాదు. క్రీస్తు పూర్వం జీవించిన యూదులు కూడా ఇలాగే interpret చేశారు.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.