నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పి. సురేశ్ బాబు
చదవడానికి పట్టే సమయం: 22 నిమిషాలు

 

యేసుక్రీస్తును అంగీకరించిన విశ్వాసి

ఏయే విషయాలలో అవగాహన కలిగియుండాలి?

 

 

మొదటి అంశం

యేసు క్రీస్తుపై అవగాహన

 నూతనంగా క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన విశ్వాసి బైబిల్లో ఇమిడి ఉన్న కొన్ని సంగతులను అధ్యయనం చేయడానికి సమయాన్ని కేటాయిస్తాడు. సువార్త కూటాలకు వెళ్ళి ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశపడతాడు. ఎన్నో పుస్తకాలను చదివి, పలు సెమినార్లకు హాజరై గూఢాంశాలను తెలుసుకోవడానికి తాపత్రయపడతాడు. ఇది హర్షించదగిన విషయమే కాని దీనికంటే అతి కీలకమైన అంశాన్ని ఒక విశ్వాసి విస్మరిస్తాడు; అదేంటంటే - ప్రభువైన యేసు క్రీస్తు విషయమై లేఖనానుసారమైన అవగాహన కలిగియుండడం.

ఈ అంత్యదినాలలో నకిలీ క్రీస్తును గురించి బోధించే అవాంతర శాఖలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కారణంగా 'అసలు క్రీస్తు' విషయమై వాక్యానుసారమైన అభిప్రాయం కలిగియుండడం విశ్వాసికి అత్యవసరమే కాక క్రైస్తవ్యానికి తొలిమెట్టని  చెప్పక తప్పదు. నేటి కాలంలో అనేక మంది విశ్వాసులు బైబిల్లో నిక్షిప్తం చేయబడ్డ మర్మాలను వెలికి తీయాలనే అత్యుత్సాహానికి వెళ్ళి చివరికి క్రీస్తును గురించి లేఖనానుసారమైన అవగాహన లేకుండానే మిగిలిపోతున్నారు. ఈ కారణం చేత దుర్బోధలకు సులువుగా ప్రభావితులై చివరికి గలిబిలికి గురౌతున్నారు. యేసుక్రీస్తు దైవత్వంపై దాడి చేసే ప్రతీ వ్యాఖ్య అపవాది తంత్రమే. యేసు క్రీస్తును గురించి చెప్పడానికి లేఖనాన్ని చూపించినప్పటికీ, అది లేఖనబద్ధమైన వివరణేనా కాదా అని గ్రహించే పరిజ్ఞానం ప్రతి విశ్వాసికి తప్పక ఉండాలి. బైబిల్లో ఉన్న ఇతర మర్మాలను తెలుసుకోకపోతే కలిగే నష్టం కంటే క్రీస్తును లేఖనానుసారంగా తెలుసుకోకపోతే కలిగే నష్టం చాలా ఎక్కువ.

ఆనాటి యూదులు, మోషే ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల లేఖనాల్లోనూ, కీర్తన గ్రంథంలోను పొందుపరచబడ్డ ఎన్నో గూఢాంశాలను తెలుసుకున్నారు కానీ, మెస్సీయ జన్మించిన సంగతిని వారు గ్రహించలేకపోయారు. అన్యులైన జ్ఞానులు వచ్చి ఆ సంగతిని గుర్తు చేస్తేనే తప్ప క్రీస్తు పుట్టిన విషయాన్ని గ్రహించలేని ఆత్మీయ అంధత్వంలో ఉండిపోయారు. ఎన్ని గూఢాంశాలను తెలుసుకుంటే మాత్రం ఏం ప్రయోజనం క్రీస్తు గురించి తెలియనప్పుడు? కేవలం లేఖనాలలో మాత్రమే ప్రవీణులమైతే చాలదు. క్రీస్తును గురించి లేఖనానుసారమైన జ్ఞానాన్ని కలిగియుండాలి. అలా కాకపోతే లేఖనాలను మాత్రమే తెలుసుకుని క్రీస్తును కొల్పోయిన యూదులవలే ఉంటుంది మన పరిస్థితి.

మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఏ విశ్వాసి సాక్ష్యం చెప్పినా, ఏ ప్రసంగీకుడు వాక్యోపదేశం చేసినా యేసుక్రీస్తు పాపుల కొరకై మరణించి తిరిగి లేచిన విషయాన్ని తప్పనిసరిగా నొక్కి వక్కాణించి చెప్పాలి. ఆయన అనుగ్రహించిన ఉచిత రక్షణను ప్రస్తావించాలి. ఒక వ్యక్తి జీవితంలో కార్యసిద్ధి కలగచేయగల శక్తిసామర్థ్యాలు క్రీస్తుకు మాత్రమే ఉన్నాయి. ఆయన నామంలో తప్ప రక్షణ మరెవరిలోనూ లేదు (అపొ.కా. 4:12). ప్రసంగంలో కానీ, సాక్ష్యంలో కానీ ఈ రక్షణ సువార్తను కలిపి చెప్పకపోతే అది ఎంత గంభీరమైన ప్రసంగమైనా, సాక్ష్యమైనా నిర్జీవంగానే మిగిలిపోతుంది. ఆదికాండం నుండి మలాకీ వరకూ రాయబడ్డ పాత నిబంధన పుస్తకాలలో క్రీస్తును గురించిన ప్రస్తావన అడుగడుగునా అంతర్లీనంగా మనకు కనబడుతుంది. అంటే, ఆయన ఈ లోకంలో జన్మించడానికి ముందే ప్రవక్తలు తమ తమ గ్రంథాలలో ఆయనను గురించి వాఖ్యానించారు. కానీ, మనం ఆయన జన్మించి, జీవించి, మరణించి, తిరిగి లేచిన తరువాత కాలంలో జీవిస్తున్న విశ్వాసులం. కాబట్టి మన పూర్వప్రవక్తల కంటే అధికంగా క్రీస్తును గురించి వ్యాఖ్యానించుకోవాలి. మొదటిగా, ప్రభువైన యేసుక్రీస్తును గురించీ, ఆయన అనుగ్రహించిన పాపవిమోచన గురించీ అవగాహన కలిగియుండాలి. అప్పుడే విశ్వాసికి సార్థకత ఏర్పడుతుంది.

రెండవ అంశం

బాప్తిస్మంపై అవగాహన

పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం ఖచ్చితంగా పొందితీరాలి అనే విషయాన్ని లేఖనబద్ధంగా పరిశీలిద్దాం. ఒక వ్యక్తి తన ప్రాచీన పాపజీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు రక్తంలో శుద్ధి చేయబడి నూతన జీవితానికి నాంది పలకడమే రక్షణ. తన దోషాలన్నిటినీ ఒప్పుకుని సంపూర్ణంగా పశ్చాత్తాపపడి ప్రభువును తన స్వరక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆ వ్యక్తికి రక్షణ అనుగ్రహించబడుతుంది. దీనికి సూచనగా నీటిలో పూర్తిగా మునిగి లేపబడడమే బాప్తీస్మం. అంటే బాప్తీస్మం రక్షణకు చిహ్నంగా ఉంది తప్ప బాప్తీస్మం రక్షణ కాదు. రక్షణ క్రీస్తులోనే ఉంది. ఆయన సిలువలో మరణించి తిరిగి లేవడం వల్ల మన పాపాలకు తగిన మూల్యం చెల్లించబడి మనకు విమోచన కలిగింది. ఆయన పరిశుద్ధరక్తంలో మన పాపాలను కడుగుకోవడం ద్వారా మనం ఆయన చేత నీతిమంతులంగా గుర్తించబడతాం. ఇదే రక్షణ.

“..... దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసు నందు నిత్య జీవము (రోమా 6:23).

బాప్తీస్మం ద్వారానే మనం నిత్యజీవానికి వెళ్ళగలిగే అవకాశం ఉన్నట్టైతే క్రీస్తు సిలువలో మరణించాల్సిన ఆవశ్యకత ఏముంది? అయితే ఒక వ్యక్తి దేవునికి విధేయుడవ్వడానికి బాప్తీస్మం కూడా కీలకపాత్ర వహిస్తుంది. కాని దానిని పొందకపోవడం వల్ల పరలోకానికి వెళ్ళలేమని భావించడం లేఖన విరుద్ధం.

ఒక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుకు అతి చేరువలో ఉన్నాడనుకుందాం. అలాంటి సమయంలో సువార్తికుని ద్వారా క్రీస్తును గూర్చి తెలుసుకుని తన పాపజీవితాన్ని బట్టి సంపూర్ణంగా పశ్చాత్తాపపడి క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి మరణిస్తే తప్పకుండా అతడు పరలోకానికే వెళ్తాడు. మంచం మీద నుండి దిగి బయటకు వచ్చి బాప్తీస్మం పొందే అనుకూలత లేనప్పటికీ, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి అతడు పరలోకానికి వెళ్ళగలడని నిస్సందేహంగా నిర్ధారించవచ్చు. బాహ్యరూప బాప్తీస్మం లేకపోయినా అంతరంగ బాప్తీస్మం ఇక్కడ కీలక పాత్ర వహించింది. మరణ సమయంలో నేరస్థుడు క్రీస్తును అంగీకరించిన సందర్భంతో దీనిని పోల్చవచ్చు (లూకా 23:39-43 ).

అయితే నపుంసకుడి విషయంలో మాత్రం అలా కనిపించదు. బాప్తీస్మం పొందే సానుకూల పరిస్థితి ఉన్న కారణంగా అతడు తడవు చేయకుండా ఫిలిప్పు చేత బాప్తీస్మం పొందడం జరిగింది. అంతరంగ బాప్తీస్మంతో పాటు బాహ్యరూప బాప్తీస్మానికి కూడా ఇక్కడ అతడు విధేయుడయ్యాడు. ఈ దృష్టాంతం మనం బోధ పొందడానికే రాయబడింది (అపొకా 8:36 ). నపుంసకుడి విషయంలో మనకు తేటగా కనిపించేది ఏంటంటే, ఒక వ్యక్తి తన పాపాల విషయమై పశ్చాత్తాపం పొందినట్లు కనపరచడానికి నీటి బాప్తీస్మం ద్వారానే  బహిరంగ సాక్ష్యాన్ని కలిగియుంటాడు. నీటి బాప్తీస్మం పొందే అవకాశం ఉన్నప్పటికీ బాప్తీస్మాన్ని నిరాకరిస్తే, క్రీస్తుబిడ్డగా చెప్పుకునే నైతికహక్కును కోల్పోతాడు.

క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించానని చెప్పుకోనప్పటికీ, నీటి బాప్తీస్మాన్ని త్రోసిపుచ్చి దైవాజ్ఞకు అవిధేయుడైన వ్యక్తి దేవుని చేత నీతిమంతునిగా గుర్తించబడతాడని మనం ఎలా చెప్పగలం? కాబట్టి రక్షణకు సూచనగా పరిగణించబడే నీటి బాప్తీస్మం అత్యవసరమని స్వయంగా క్రీస్తే స్పష్టం చేశాడు (మత్తయి 28:18-19 ). అయితే సిలువలో నేరస్థుడు ఎదుర్కొంటున్న సంఘటనలాంటి పరిస్థితి ఒక వ్యక్తి ఎదుర్కొంటుంటే ఆ క్లిష్ట పరిస్థితి మినహా బాప్తీస్మం అత్యవసరం.

మూడవ అంశం

లేఖనాల పట్ల అవగాహన

దేవుని వాక్యపఠనాన్ని రకరకాల కారణాలను బట్టి చేస్తూ ఉండవచ్చు‌. కొందరు సాహిత్య అభిమానాన్ని తీర్చుకోవడానికి చదువుతారు. మరికొందరు తమతో విభేదించేవారితో సమర్థవంతంగా తర్కించడానికి చదువుతారు. ఇంకొందరు బైబిల్ సంగతుల విషయంలో ప్రావీణ్యత కలిగి ఉండడం బహు గౌరవనీయంగానూ, అది లేకపోవడం సంస్కారలోపంగాను ఉంటుందనే ఉద్దేశం కలిగి చదువుతారు. గమనించండి, ఇటువంటి కారణాలను బట్టి బైబిలును చదువడం వల్ల సంఘాలలో, విశ్వాసుల మధ్య ఘనులుగా చలామణి కావచ్చు కానీ ఆత్మీయ నైతికాభివృద్ధి కలగదు, ఆత్మకు బలం చేకూరదు. ప్రతీదినం సరైన సమయానికి ఆహారం తీసుకున్నప్పటికీ అందులో పోషకవిలువలు లేకపోతే శరీరం బలహీనతకు గురౌతుంది. అదేవిధంగా క్రమం తప్పకుండా బైబిలును పఠించినప్పటికీ పఠించే తీరు సరైనదిగా లేకపోతే మన ఆత్మ వర్థిల్లదు.

రసాయనశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను చదవడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకునేట్టుగా, కేవలం బైబిలును అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చనే అభిప్రాయం చాలా మంది విశ్వాసుల్లో ఉంది. తద్వారా ఒక మేథోసంబంధమైన జ్ఞానాన్ని పొందవచ్చేమో తప్ప ఆత్మీయజ్ఞానం మాత్రం కాదు. సహజాతీతమైన దేవుణ్ణి సహజాతీతంగానే తెలుసుకోవాలి. అందుకు బైబిలుపఠనంతో పాటు ప్రార్థన కూడా ఎంతో అవసరం. మేథోసంబంధమైన బైబిలు జ్ఞానాన్ని బట్టి ఇతరుల చేత ఘనులుగా గుర్తించబడాలనుకుంటే సహజాతీతమైన దేవునితో వ్యక్తిగత బాంధవ్యాన్ని కొల్పోవలసి వస్తుంది.

అన్యమత ప్రబోధకులు కూడా తమ తమ ఉపన్యాసాలలో బైబిలు లేఖనాలను ఉదహరిస్తూ, యేసు ప్రభువు ఇలా చెప్పాడు, అలా చెప్పాడని చెబుతుంటారు. అలా పారదర్శకంగా బైబిలు లేఖనాలను చూపించి సూక్తులు వల్లించినంత మాత్రాన వారికి దేవుని యొక్క గ్రహింపు, ఆత్మీయ పరిణతి ఉందని మనం చెప్పలేము. శాస్త్రులు, పరిసయ్యులు కూడా లేఖనాలను తీక్షణంగా పరిశోధించారు. అయినప్పటికీ వారు క్రీస్తును గురించి తెలుసుకోలేకపోయారు (యోహాను 5:39 ). చివరికి దేవుని గ్రహింపు కూడా వారికి లేకుండా పోయింది (యోహాను 8:19 ). కారణం ఏమిటంటే వారు లేఖన ఉపరితలాన్ని మాత్రమే చూసారు తప్ప అందులో పరమార్థాన్ని గుర్తించలేకపోయారు. పైగా దేవునితో అనుదినం బంధాన్ని కలిగి ఉన్నట్టు వారు అతిశయించారు తప్ప అది లేకుండానే మిగిలిపోయారు.

సైద్ధాంతికపరమైన జ్ఞానం (Theoretical knowledge) మాత్రమే కాక అనుభవపూర్వక జ్ఞానాన్ని (Practical knowledge) కూడా కలిగియున్నప్పడు అది మరింత గొప్పదిగా పరిగణించబడుతుంది. అలాగే బైబిలు లేఖనాల పట్ల కూడా మనం కేవలం సైద్ధాంతిక జ్ఞానం మాత్రమే కాక, అనుభవజ్ఞానాన్ని పొందే స్థాయికి ఎదగాలి. ఈ విషయమై అవగాహన ఉండాలి.

నాలుగవ అంశం

ప్రార్థనపై అవగాహన

అవసరమైన ఈవులను దేవునియొద్ద నుండి పొందుకోవడానికి ప్రార్థనను ఒక సాధనంగా భావిస్తాడు విశ్వాసి. ప్రతి అవసరతను ప్రార్థన ద్వారా పొందవచ్చనే వైఖరిని కలిగియుండటం తప్పు కాదు కానీ ప్రార్థన అనే అతి విలువైన సాధనాన్ని కేవలం అదే కోణంలో చూడటం మాత్రం చాలా తప్పు.

ప్రార్థన అంటే, దేవునికీ, విశ్వాసికీ మధ్యవున్న బాంధవ్యాన్ని పటిష్ఠపరిచే అద్భుతమైన ఉపకరణమని గుర్తించాలి. దేవునితో వ్యక్తిగత పరిచయాన్ని పెంపొందించే గొప్ప ఆత్మీయవరంగా పరిగణించాలి. కేవలం అవసరతల కొరకు మాత్రమే ప్రార్థనను దుర్వినియోగపరచకుండా నిస్వార్థంగా దేవునితో సంప్రదింపులు జరపడానికి ఉపయోగపడే ఆత్మీయ పనిముట్టుగా చూడాలి. అలా అలవాటుగా దేవునితో వ్యక్తిగత పరిచయాన్ని దృఢపరచుకునే పరంపరలో విశ్వాసి అవసరతలు సహజసిద్ధంగా దేవునికి తెలుస్తాయి. ఆతర్వాత దేవుని చిత్తానుసారమైన అవసరతలు విశ్వాసి కలిగియున్నప్పడు అతడు అడగకుండానే వాటిని పొందుకుంటాడు. మనమడిగే ప్రతీ అక్కర ద్వారా దేవునికి మహిమ కలిగేదిగా ఉందా లేదా అనే విషయం ఆలోచించుకోవాలి. ఆయన నామాన్ని మహిమపరచని ఏ కోరిక మనకు సిద్ధించదు. ఆయనకు ఘనత కలిగించని ఏ లౌకికమైన ఈవి గురించీ మనం ప్రార్థించి మొరపెట్టుకున్నా చివరికి ఫలితం మాత్రం శూన్యం (యాకోబు 4:3 ). ఆయన చిత్తానుసారంగా ఆయనను ఘనపరుచటానికి మనమేది అడిగినా ఆయన ఇస్తాడు (1యోహాను 5:14 ).

మనం అడిగి పొందే విషయంలో దేవుని కృప మీద ఆధారపడినవారమే తప్ప హక్కు, అధికారం కలిగినవారం కాదని గుర్తుంచుకోవాలి. ఆయన మనకనుగ్రహించిన రక్షణయే కృప ద్వారా కలిగినపుడు మిగతా ఈవులు అధికారంతో, హక్కుతో మనం ఎలా పొందగలం? కనుక విశ్వాసులు ప్రార్థనలో దేవునితో దెబ్బలాడుతూ, పోట్లాడుతూ అడిగినట్టు ఉండకుండా జాగ్రత్తపడాలి. నీ చిత్తమైతే నా పట్ల ఇది జరిగించు తండ్రి అని సాత్వికంతో, దీనమనస్సుతో, అణకువ కలిగి ప్రార్థించాలి. గమనించండి, ప్రార్థన ఎప్పుడూ కూడా వినయపూర్వకమైనదిగా ఉండేట్టు చూసుకోవాలి తప్ప హక్కుల కొరకు పోరాడేలా ఉండకూడదు.

మరొక ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, ప్రార్థించడానికి ప్రతీరోజూ కొంతసమయాన్ని కేటాయించుకోవడం  విశ్వాసికి తప్పనిసరి.  ప్రార్థించడాన్ని మనం అలవాటుగా మార్చుకోవాలి. రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థించడం ప్రభువు వాడుకగా మార్చుకున్నాడు. ఈవిధంగా మనం చెయ్యడం వల్ల అనుదినం విశ్వాసంలో బలపడతాం. పైగా మన ప్రార్థన వినడానికి దేవుడు సంసిద్ధంగా ఉంటాడని  గ్రహించి ఆ సమయాన్ని వ్యర్థపరచకుండా బాధ్యతాయుతంగా ప్రార్థనలో గడుపుతాం. కాబట్టి ప్రార్థనపై అవగాహన కలిగియుండాలి.

అయిదవ అంశం

శోధనలపై అవగాహన

యేసుక్రీస్తును నమ్ముకుంటే కష్టాలు, కన్నీళ్లు తొలగిపోతాయనే అభిప్రాయం చాలామంది విశ్వాసుల్లో బలంగా నాటుకుపోయింది. సువార్త మహాసభలలో కూడా ఇదే విషయాన్ని ప్రసంగీకులు ఉపదేశిస్తుంటారు. కానీ లేఖనానుసారంగా పరిశీలిస్తే  ఈ విషయాన్ని సవరించక తప్పదు.

ఈ లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించియున్నాననెను.” ( యోహాను 16:33).

క్రీస్తు స్వయంగా చెప్పిన ఈమాటలను బట్టి చూస్తే విశ్వాసులకు కష్టాలు, శ్రమలు ఎదురవ్వడం తప్పనిసరని అర్థమౌతుంది. అయితే  ఆ శ్రమల్లో క్రీస్తు అనుగ్రహించే ధైర్యం విశ్వాసిని ఆత్మీయజీవితంలో మరింత ముందుకు కొనసాగింపచేస్తుందని నమ్మాలి.

మనిషి చేసుకున్న స్వయంకృత అపరాధాలే కష్టాలకు, కన్నీళ్ళకు దారి తీస్తాయని మన పూర్వీకులు అంటుంటారు. కాని లేఖనాన్ని పరిశీలిస్తే, అది వాస్తవమే అయినప్పటికీ, కలిగే కష్టాలన్నీ స్వయంకృత అపరాధాల ఫలితమేనని అనుకోవడం చాలా పొరపాటు. యోబు నీతిమంతుడై ఉండి శ్రమలను, కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవునియందు తనకు ఉన్న విశ్వాసమే శ్రమలను జయించడానికి సహాయపడింది. పౌలు కూడా గొప్ప దైవజనుడై ఉండి ఎన్నో శ్రమలను, విపత్కర పరిస్థితులను రుచిచూశాడు. అయినప్పటికీ ప్రభువు ద్వారా ధైర్యపరచబడ్డాడు.

మోషే రాజకుటుంబములో పుట్టి పెరిగి సమస్తాన్ని వదులుకుని క్రీస్తు నిమిత్తమై శ్రమలను అనుభవించడం మేలని తలంచాడు (హెబ్రీ 11:24). ఇలా చెప్పకుంటూపోతే కష్టాలను రుచిచూడని దైవజనుడిని బైబిల్లో మనం చూడం. వారంతా ఆ శ్రమల్లో కృంగిపోకుండా, జారిపోకుండా క్రీస్తు ద్వారా బలపరచబడి విశ్వాసవీరులుగా గుర్తించబడ్డారు.

కష్టాలు, కన్నీళ్ళు ఎందుకు సంభవిస్తాయి అనే విషయం ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ, వాటి నుండి తప్పించడానికి దేవుడు తగిన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను (1 కొరింథీ 10:13 ). విశ్వాసి తన జీవితంలో సంభవించిన శ్రమలను జయించే గోప్ప సూత్రాన్ని చిన్న ఉదాహరణ ద్వారా గ్రహించవచ్చు. కుమ్మరి ఇనుమును కొలిమిలో వేసి సమ్మెటతో బలంగా కొడితేనే అది వంగుతుంది; కాని కంసాలి బంగారాన్ని కొలిమిలో వేసి సుత్తితో సున్నితమైన దెబ్బలు కొడితే వంగుతుంది. అదేవిధంగా విశ్వాసి కూడా దేవుని చేతిలో ఉన్నప్పుడు స్వలమైన దెబ్బలు కొడితే వంగే మృదువైన స్వభావాన్ని కలిగియుండాలి. లేకుంటే దేవుడు సమ్మెట దెబ్బలు కొట్టే కమ్మరిగా మారతాడు. కష్టాలు కన్నీళ్ళు లేని జీవితం అసలు జీవితమే కాదు. సుఖదు:ఖాలు కలిపితేనే జీవితం. కాబట్టి క్రీస్తును నమ్ముకుంటే, కష్టాలు, కన్నీళ్ళు రావని అనుకోవడం కంటే వాటి ద్వారా వెళ్ళడమే క్రైస్తవ జీవితానికి పరమార్థమని భావించాలి, ధన్యతగా గుర్తించాలి.

'క్రీస్తుకు సైతం శ్రమలు తప్పలేదు, చివరికి మనం ఓ లెక్కా' అనే తప్పుడు తలంపు కూడా కొందరు విశ్వాసులు కలిగియుంటారు. గమనించండి, మనం ముందు ప్రస్తావించుకున్న ప్రవక్తలూ, భక్తులూ నశించిపోయే మానవాళికై శ్రమపడలేదు. వారి నిమిత్తమే వారు శ్రమలను అనుభవించారు. కానీ క్రీస్తు ఒక్కడే మానవాళికై శ్రమలను అనుభవించాడు. పైగా ఆయన శోధించబడి, శోధనలను జయించినవాడై శోధించబడేవారికి జయాన్నిచ్చే వాడైయున్నాడు (హెబ్రీ 2:8 ).

దాసుడు యజమానుడి కంటే ఎన్నటికీ గొప్పవాడు కానేరడు. మన యజమానియైన క్రీస్తు యేసే శ్రమలను అనుభవించగా లేనిది శ్రమల నుండి తప్పించుకోవడానికి మనం ఆయనకంటే గొప్పవారం కాదు కదా! పైపెచ్చు మనకు బదులుగా ఆయన శోధించబడి శ్రమలను అనుభవించాడు తప్ప చివరికి ఆయన సైతం శ్రమలకు, శోధనలకు మినహాయింపు కాదని మనం భావించరాదు. కష్టాలు, కన్నీళ్ళు క్రైస్తవులకు కూడా సర్వసామాన్యమని, అయితే వాటిని జయించే శక్తి క్రీస్తు ద్వారా పొందుకోవచ్చనే విషయమై విశ్వాసులు అవగాహన కలిగియుండాలి.

ఆరవ అంశం

అన్యులు అనుసరించే ఆచారాల నుండి

విడుదల పొందడానికై అవగాహన

విశ్వాసులను దారి మళ్ళించడానికి అపవాది ఎన్నో తంత్రాలను ఉపయోగిస్తాడు. వాటిలో జ్యోతిష్యం, ముహుర్తం, వాస్తు శాస్త్రం, విగ్రహార్పితమైన (ప్రసాదం) తినడం, తాయెత్తులు కట్టుకోవడం మొదలైన హేయమైన నమ్మకాలు ఇమిడి ఉన్నాయి. ఈ పద్ధతులను అనుసరిస్తున్న అన్యుల వాటి విషయం తెలియక అనుసరిస్తున్నారులే అని సమర్థించవచ్చు. కాని విశ్వాసులుగా చెప్పకునే కొందరు క్రైస్తవులు సైతం వీటిని అనుసరిస్తుంటే మరి వీరిని ఎలా సమర్థించాలి? అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ అన్యులు అనుసరించే క్షుద్రపద్ధతులని నేటి విశ్వాసులకు ఖచ్చితంగా తెలిసినప్పటికీ వీటి వల నుండి బయటపడలేని మానసిక రోగాన్ని కలిగియున్నారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. పైన ప్రస్తావించిన పద్ధతులు మేలుకరంగా మనకు కనిపించినప్పటికీ లేఖన వెలుగులో చూస్తే మాత్రం అవన్నీ ప్రమాదకరమైన దయ్యపు నమ్మకాలని తెలుస్తుంది.

జ్యోతిష్యుడు చెప్పిన జ్యోష్యం అనతికాలంలోనే నెరవేరుతుంది, దుర్ముహూర్తంలో తలపెట్టిన కార్యం మధ్యలోనే ఆగిపోతుంది, జాతకాలు కలవకపోయినా తెగింపుతో వధూవరులకు వివాహం జరిపిస్తే కొద్ది రోజుల్లోనే వారిద్దరూ విడిపోతారు, వాస్తుశాస్త్రం ప్రకారం గృహాన్ని నిర్మించకపోతే అందులో కుటుంబసభ్యులు రోగాలతోనూ, మరికొన్ని సమస్యలతోనూ సతమతమౌతారు, మంత్రించి ఇచ్చిన తాయెత్తును కట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆ కఠిన పరిస్థితులన్నీ పరిష్కరించబడతాయి. సూటిగా చెప్పాలంటే, వీటిలో చాలామట్టుకు వాస్తవాలే, వీటిలో కొన్నిటిని మనం కొట్టిపారేయలేము.

మనం ప్రస్తావించుకుంటున్న ఈ పద్ధతులు, నమ్మకాలు కాస్తోకూస్తో శక్తి కలిగినవి కాకపోతే మనిషిని ఇవి ఎందుకు ప్రభావితం చేస్తున్నట్టు? అసలు వాటికి కనీస సామర్థ్యం లేకపోతే వాటి విషవలయంలో విద్యావేత్తలు, మేధావులు, చివరికి క్రైస్తవులు కూడా ఎందుకు చిక్కుకుపోతున్నట్టు? ఔను, ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి లేఖనానుసారమైన సమాధానాన్ని చూద్దాం.

అభిషేకంనొందిన కెరూబైన లూసిఫరు (అపవాది) తన జ్ఞానాన్ని బట్టి, తేజస్సును బట్టి గర్వించినవాడై, దేవునివలే ఆరాధించబడాలని ఆశించాడు. దేవుని దూతలను మచ్చిక చేసుకుని తన వైపు తిప్పుకుని, వారి సహాయంతో చివరికి దేవునిపైనే తిరుగుబాటు చేసి పరాజయం పొందాడు. దేవుణ్ణి నియంత్రించే శక్తిసామర్థ్యాలు వాడికి లేని కారణంగా దేవుని కుమారుడైన ఆదామును, అతని సంతానాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఎన్నో తంత్రాలనూ, మాయోపాయాలనూ ప్రయోగించడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రణాళికలోని విషగుళికలే పైన మనం ప్రస్తావించుకున్న నమ్మకాలూ, పద్ధతులు. అపవాది మనుషులకంటే శక్తిమంతుడు, దేవునికంటే శక్తిహీనుడు. అందుకే వాని ఆటలు అదుపు చేయడానికి క్రీస్తు అనుగ్రహించే శక్తిని మనం పొందాలి (ఎఫెసీ 6:10-16 ).

మనషులను మభ్యపెట్టడానికి, గలిబిలి చేయడానికి అపవాది కొన్ని కొన్ని సూచకక్రియలను, గారడీలను చేస్తాడు. ఫరో రాజదర్బారులో మోషే, అహరోనులు సూచకక్రియలను చేసినప్పుడు వాటిలాంటి సూచకక్రియలు ఐగుప్తు శకునగాండ్రు కూడా చేశారు. మోషే, అహరోనులు పేలు కలుగజేసినప్పుడు శకునగాండ్రు కూడ పేలు కలుగచెయ్యడానికి ప్రయత్నించారు, కానీ వారి వల్ల కాలేదు (నిర్గమ 8:18 ). దేవుడు మోషే, అహరోనులను ఉపయోగించుకున్నట్టే అపవాది కూడా శకునగాండ్రను ఉపయోగించుకున్నాడు. అక్కడ దైవకార్యాన్ని భంగపరచాలని చూశాడు. కానీ వాడి వల్ల కాలేదు. అపవాది తన పరిమిత శక్తి చేత కొన్ని సూచకక్రియలను చేయగలడు గాని దేవుని శక్తియెదుట వాడు నిలువలేడు.

జ్యోతిష్యులు చేతిని చూసి జాతకం చెప్పగలరు. ఏది మంచి ముహుర్తుమో, ఏది చెడు ముహుర్తమో చెప్పగలరు. అయితే అటువంటి అతీంద్రియ జ్ఞానం వారికెలా లభిస్తుంది? దీనికి జవాబు మనకు 1 సమూయేలు 28వ అధ్యాయంలో లభిస్తుంది. తనకు ఎదురయ్యే పరిస్థితి ఎలాంటిదో తెలుసుకోడానికి సౌలు సోది చెప్పే స్త్రీని ఆశ్రయించాడు. అంటే దైవప్రవక్తలు భవిష్యత్తును తెలియచేసే విధంగా అపవాది కూడా తన శక్తి చేత భవిష్యత్తును చెప్పడానికి కొందరు అనుచరులను ఉపయోగించుకుంటాడు. చెప్పిన భవిష్యత్తు జరిగినంత మాత్రాన విస్మయానికి గురి కావాల్సిన అవసరం లేదు. కారణం మనుష్యులను గలిబిలికి గురి చెయ్యడానికి వాడు ఆ గారడీ క్రియను కనుపరుస్తాడు. దీని విషయమై దేవుడు ఇశ్రాయేలీయులను గట్టిగా హెచ్చరించాడు (ద్వితియో. 13:1-4 ).

నెబుకద్నెజరు కాలంలో కూడా అపవాది అనుచరులు ఉండేవారు. రాజు కనిన కలను మరచిపోయినప్పుడు, తన కలను గుర్తు చేసి దాని ఆంతర్యాన్ని చెప్పాలని ఆజ్ఞాపిస్తూ శకునగాండ్రనూ, కల్దీయులను సమకూర్చాడు. అంటే అపవాది తన శక్తి చేత దేవుని కార్యాన్ని తారుమారు చేయడానికి కల్దీయులను ఉపయోగించుకున్నాడు. అయితే కలను గుర్తు చేసి భావాన్ని చెప్పడం వారి వల్ల కాకపోవడం ద్వారా అపవాదికి ఉన్న శక్తి పరిమితమని తెలుస్తుంది (దానియేలు.2:10-11 ).

నేటి కాలంలో కూడా ఇటువంటి అపవాది అనుచరులు విరివిగా చలామణి ఔతున్నారు. క్షుద్రశక్తుల సహాయం వల్ల భవిష్యత్తును చెప్పడం, ఏ రోజు మంచిదో, ఏ రోజు మంచిది కాదో, దురాత్మ సహాయం ద్వారా చెప్పడం ఇవన్నీ అపవాది క్రియలే. ఇలా చెయ్యడం వల్ల ప్రజలు ఏది దేవుని అద్భుతమో, ఏది అపవాది గారడియో తెలుసుకోలేని అయోమయంలో పడి చివరికి దేవునికి దూరమైపోతున్నారు. దేవుని బిడ్డలకు, దేవునికి ఎడబాటు కలగడానికి సాతాను పన్నిన కుట్రగా మనం దీనిని గ్రహించాలి.

అపవాది తంత్రాలలో అందరికీ సుపరిచితమైంది వాస్తుశాస్త్రం. దీని మాయలో పడి ఎంతో మంది విశ్వాసులు తొట్రిల్లిపడిపోతున్నారు. వాస్తును అనుసరిస్తున్న క్రైస్తవుల దగ్గరకు వెళ్ళి, అయ్యా మీరు వాస్తును ఎందుకు అనుసరిస్తున్నారు అని అడిగితే, దానికి జవాబుగా, బైబిలులో కూడ వాస్తు ప్రస్తావన ఉంది కదా అని నోవహు ఓడ గురించో, సొలోమోను దేవాలయాన్ని గురించో లేఖనాలు చూపిస్తారు. అంటే వాస్తు శాస్త్రాన్ని విభేదించడానికి బదులు దానిని సమర్థించుకోవడానికి చివరికి లేఖనాలను కూడ వక్రీకరించే దుస్థితికి దిగజారిపోయారు.

కానీ వాస్తుశాస్త్రాన్ని సమర్థిస్తున్నట్టు బైబిల్లో ఏ లేఖనాధారం లేదు. ఇది మనుష్యులను ప్రభావితం చెయ్యడానికి అపవాది ఏర్పాటు చేసిన హేయమైన పద్ధతి. ఒకవేళ వాస్తుశాస్త్రాన్ని సమర్థించే విధంగా ఏ విశ్వాసైనా లేఖనాన్ని చూపిస్తుంటే, తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి ఆ లేఖనాలను చూపిస్తున్నట్లు మనం గ్రహించాలి తప్ప వాస్తును బైబిలు సమర్థించడం లేదని గ్రహించాలి. అసలు వాస్తుశాస్త్రమంతా అన్యుల దేవుళ్ళ (అష్టదిక్పాలకుల) పేరిట రూపించబడ్డ కారణంగా అది బైబిలుకు సంబంధించినదిగా ఎలా ఔతుంది?

కాబట్టి ఓ విశ్వాసీ, అపవాది సంబంధిత ఆచారాలు, పద్ధతుల విషయంలో వివేకం కలిగి ఏది దైవ సూచకక్రియో, ఏది అపవాది క్రియో తెలుసుకునే లేఖన పరిణతి, పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి ఉండు.

క్రైస్తవుడిగా నీవు చలామణి ఔతూ ఇటువంటి అపవాది క్రియల పట్ల ఆసక్తి కనపరచి లేదా చిన్న విషయమే కదా అని నీ అంతరాత్మకు సర్దిచెప్పుకుని క్రీస్తుకు దూరం కావొద్దు. లోకులు అనుసరించే ఈ పద్ధతుల నీడలో నీవు ఉంటే, పాము పడగ నీడన తలదాచుకున్నట్టే. పాముపడగ నీడ ఏనాటికైనా ప్రమాదమే. తస్మాత్ జాగ్రత్త. 

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.