నిజ క్రైస్తవ జీవితం

రచయిత: డి. యశ్వంత్ కుమార్

గమనిక:- ఈ వ్యాసం ఒక సిరీస్ లో భాగంగా రాయబడింది కనుక సరైన అవగాహన కోసం ముందుగా 'దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 1&2' చదవండి.

 దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 1

దేవుని చిత్తమును కనుగొనుట - పార్ట్ 2

బిబు గారు 'దేవుని చిత్తాన్ని కనుగొనడం ఎలా?' అనే అంశంపై అనేకులు లేవనెత్తే ప్రశ్నలకు జవాబులు చెబుతూ ఒక వీడియోను చెయ్యడం జరిగింది. అందులోని సంగతులు 'దేవుని చిత్తమును కనుగొనుట' అనే ఈ అంశాన్ని మరింత లోతుగా, ఇంకా వివిధ కోణాల నుండీ అధ్యయనం చెయ్యడానికి దోహదపడతాయని భావించి, వాటిని ఈ వ్యాసం రూపంలో పొందుపరిచడానికి పూనుకున్నాను. ఈ మూడవ భాగంలో ప్రశ్నోత్తరాల రూపంలో ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేద్దాం.

ప్రశ్న 1: పాతనిబంధనలోనూ, కొత్తనిబంధనలోనూ మన దేవుడు మాట్లాడే దేవుడిగా కనబడుతున్నాడు. దేవుడు అదే విధంగా ఈ రోజుల్లో మనతో కూడా మాట్లాడతాడు అని ఎందుకు అనుకోకూడదు? లేఖనాధారాలతో తెలియచేయగలరు.

జవాబు: దేవుడు మనతో మాట్లాడతాడు అన్నది స్పష్టం. కానీ ఎలా మాట్లాడతాడు అనేది అసలు ప్రశ్న. బైబిల్ గ్రంథం రూపంలో దేవుని సంపూర్ణ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడింది. ఆ పరిశుద్ధ లేఖనాల ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఆ లేఖన సత్యాలనే మనం సరిగ్గా అర్థం చేసుకుని, వాటిని సరిగ్గా అన్వయించుకునే విషయంలో సహాయం చెయ్యడం ద్వారా మనల్ని నడిపిస్తాడు. అంతేకాని వాక్యానికి వెలుపల ఏదో కొత్త సమాచారం ఇవ్వడం కోసం దేవుడు నేరుగా మనతో మాట్లాడతాడు అని చెప్పడానికి ఎటువంటి లేఖనాధారం లేదు.

మరి దేవుడు ఆదాముతో మాట్లాడాడు, అబ్రాహాముతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, న్యాయాధిపతులతో, ప్రవక్తలతో, అపొస్తలులతో, అపొస్తలుల సహచరులతో ఇంకా అనేకులతో మాట్లాడినట్టు బైబిల్ లో చదువుతున్నాం కదా అనేది న్యాయంగా ఎవ్వరైనా అడిగే ప్రశ్న. అయితే పాఠకులు ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఎవరితో నేరుగా మాట్లాడాడు? ప్రాధమికంగా ప్రవక్తలతోనూ, అపొస్తలులతోనూ అలాగే అప్పుడప్పుడూ ప్రవక్తలతో, అపొస్తలులతో సంబంధం కలిగిన వారితోనూ దేవుడు నేరుగా మాట్లాడాడు. ఉదాహరణకు, దేవుడు కల ద్వారా ఫరోతో మాట్లాడాడు. కానీ ఆ కల భావాన్ని అతనికి తెలియచేయలేదు. మరి ఆ కల భావాన్ని అతనికి ఎవరు తెలియజేసారు? ఒక ప్రవక్త వచ్చి తెలియచేశాడు. అంటే ఒక ప్రవక్త పరిచర్యను నిలబెట్టడం కోసం దేవుడు ఫరోతో కల ద్వారా మాట్లాడాడు తప్ప ప్రవక్తతో సంబంధం లేకుండా, ప్రవక్తకు తెలియకుండా, అతని ప్రమేయం ఏమీ లేకుండా ఫరోకు దేవుడు ఏదో బయలుపరిచేసాడు అని అనుకునే అవకాశం లేదు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు కూడా పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి కలలు కనినట్టు చదువుతాము. కానీ ఆ సందర్భంలో కూడా తన ప్రవక్త అయిన యోసేపును హెచ్చించే క్రమంలో దేవుడు చేసిన కార్యంగా దాన్ని చూడాలి. అన్యరాజైన నెబుకద్నెజరు కల కన్నాడు. అంత మాత్రాన ఆ కల ద్వారా దేవుడు చెప్పాలనుకున్న అన్ని విషయాలు అతనికి తెలిసిపోయాయా? లేదు. ఒక అన్యదేశంలో దానియేలు పరిచర్యను నిలబెట్టే క్రమంలో దేవుడు చేసిన కార్యం అది. కొర్నేలీతో దేవుడు మాట్లాడాడు కానీ పేతురు సహాయం లేకుండా దేవుడు కొర్నేలీకి ఏదో ప్రత్యక్షపరిచేసాడు అని చెప్పడానికి వీల్లేదు. అలాగే ప్రవక్తలు, అపొస్తలులు కానటువంటి చాలా మందితో దేవుడు మాట్లాడిన ప్రతీ సందర్భంలో వారు ప్రవక్తలతోనూ, అపొస్తలులతోనూ ఏదో విధంగా సంపర్కం కలిగి ఉన్నట్టు మనం చూడవచ్చు. ఇలా కాకుండా ప్రవక్తలతో, అపొస్తలులతో ఏ సంబంధం లేని ఎవరికైనా దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించిన లేదా దేవుడు మాట్లాడిన దాఖలాలు బైబిల్ లో ఎక్కడైనా ఉన్నాయా? లేవు.

దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలోనైనా, కొత్త నిబంధనలోనైనా దేవుడు అందరితో మాట్లాడలేదు. విశ్వాసులందరికీ దేవుడు నేరుగా కనిపించి మాట్లాడినట్టుగా కానీ, కలల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడినట్టుగా కానీ ఎక్కడా చదవము. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో అతను అనుదినం చెయ్యాల్సిన ప్రతి నిర్ణయం విషయంలో ఉదాహరణకు నేను ఫలానా చోటికి వెళ్ళాలా? వద్దా? ఫలానా పని చెయ్యాలా? వద్దా? లాంటి విషయాలలో దేవుడు ప్రతి రోజూ అతనితో మాట్లాడి అతన్ని నడిపించినట్టుగా బైబిల్ లో ఎక్కడా కనిపించదు. బైబిల్ లో దేవుడు కొందరితోనే మాట్లాడినట్టుగా చదువుతున్నాం కానీ ప్రతి విశ్వాసితో దేవుడు ప్రతి రోజూ నేరుగా మాట్లాడుతుంటాడు అని ఎక్కడా లేదు.
దేవుడు ఆ కొందరికి అనుగ్రహించిన ఆ ప్రత్యక్షతను ఆధారం చేసుకుని అందరు విశ్వాసులు నడవాలి అన్నది దేవుడు ప్రారంభం నుండీ బోధించినట్టు వాక్యంలో స్పష్టమైన ఆధారం ఉంది. ద్వితీయో 29:29 - "రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు." ఈ వచనంలో రహస్యాలు యెహోవాకు మాత్రమే చెందినవనీ, వాటిని తెలుసుకోవడం మన పని కాదనీ, ధర్మశాస్త్రములో బయలుపరచబడిన సంగతులు మాత్రమే మనవి అని బోధించబడింది. వాటినే మనం శ్రద్దగా నేర్చుకోవాలి. వాటి ప్రకారమే జీవించాలి. వాటి నుండీ కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. ఇది దేవుడు విశ్వాసులందరికీ ఇచ్చిన ఆజ్ఞ. అంతేకానీ మీకు నేను రోజూ కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహిస్తూ ఉంటాను అని విశ్వాసులందరికీ దేవుడు ఎప్పుడూ వాగ్దానం చెయ్యలేదు.

అలాగే దేవుడు తల్లిదండ్రులకు ఇచ్చిన బాధ్యత గురించి ఆలోచిస్తే, ద్వితీయో 6:6-7 -
"6. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. 7. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను." ఈ వచనాలలో మీరు దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు మీకు కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహిస్తాడు, వాటిని మీరు మీ పిల్లలకు నేర్పించండి అని కాకుండా ధర్మశాస్త్రంలో బయలుపరచిన సంగతులు మీ హృదయంలో భద్రపరుచుకోండి, వాటిని మీ పిల్లలకు కూడా నేర్పించండి అని చెబుతున్నాడు. అంతేకానీ 'మీరు నా సన్నిధిలో కనిపెట్టండి, నేను మీకు ప్రతి రోజూ నా ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉంటాను, మీ పిల్లల్ని కూడా నా సన్నిధిలో అదేవిధంగా కనిపెట్టమని చెప్పండి' అని బోధించట్లేదు.

బైబిల్ గ్రంథం రూపంలో దేవుడు మనకు అనుగ్రహించిన తన ప్రత్యక్షతే మనకు ఆధారం. దేవుని చిత్తం సంపూర్ణంగానూ, స్పష్టంగానూ ఆయన వాక్యంలోనే మనకు బయలుపరచబడింది, దానినే మనం గైకొనాలి, దాని ప్రకారమే జీవించాలి అన్నది ప్రారంభం నుండీ దేవుడు నేర్పించిన పద్ధతి. అలాంటప్పుడు దేవుడు ప్రతి విశ్వాసితో అనుదినం నేరుగానో, కలల ద్వారానో మాట్లాడతాడు అని ఎందుకు అనుకోవాలి? బైబిల్ అంతటిలో సాధారణంగా దేవుడు అందరినీ ఎలా నడిపిస్తూ వచ్చాడో, నిన్ను కూడా అలాగే నడిపిస్తాడు. తన పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు ప్రతి విశ్వాసితో నేరుగా కానీ, కలల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ మాట్లాడతాడు అని బైబిల్ లో ఆధారం లేనప్పటికీ, అలాగని దేవుడు ఎప్పుడూ వాగ్దానం చెయ్యనప్పటికీ, అనేకులు అలాగని బోధిస్తున్నారు. దేవుడు వాగ్దానం చెయ్యనివాటిని ఆయన చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. సంఘంలోకి కొత్త బోధలను ప్రవేశపెట్టి గలిబిలి సృష్టిస్తున్నారు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అందులోని నియమాలను మనం జీవితంలోని అన్ని పరిస్థితులకు అన్వయించుకోవాలి. బైబిల్ గ్రంథం దేవుని సంపూర్ణ ప్రత్యక్షత. అది చాలినది, సరిపోయినది. దానిపైన ఆధారపడదాము. ఇంతకు మించి ఏవో కొత్త ప్రత్యక్షతల కోసం ఎవ్వరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు.

ప్రశ్న 2: యోవేలు 2:28-30 లో "28. తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.29. ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును" అని ఉంటుంది. "ఆ దినములు" అంటే ఏ దినములు? ఆ దినములు వచ్చినప్పుడు కుమారులు, కుమార్తెలందరూ ప్రవచనం చెప్తారా? ముసలి వారందరూ కలలు కంటారా? యవ్వనులందరూ దర్శములు చూస్తారా?

జవాబు: 'యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించబడిన ఈ ప్రవచనం ఏ దినాలలో అయితే నెరవేరాలో ఆ అంత్యదినాలు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. 'ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సంఘటనలన్నీ అనగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడటం, అపొస్తలులు భాషల్లో మాట్లాడటం మొదలైనవన్నీ ఆ ప్రవచనం నెరవేర్పుగానే జరుగుతున్నాయి' అని పేతురు చెప్పినట్టు అపొ.కార్య. 2:16-21లో చదువుతాము. అయితే ఈ ప్రవచనం పూర్తి స్థాయిలో ఈ సందర్భంలోనే నెరవేరిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. అలా జరగలేదనేది ఆ ప్రవచనం పూర్తిగా చదివిన వారెవ్వరికైనా స్పష్టంగా అర్థం ఔతుంది. అయితే ఈ సందర్భం కేవలం ఆ ప్రవచనం నెరవేర్పు యొక్క ప్రారంభం మాత్రమే. ఈ ప్రవచనంలోని కొన్ని సంగతులు అపోస్తలీయ కాలంలోనే నెరవేరిపోయాయి (అపొ.కార్య. 2:17. అంత్య దినములయందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. 18. ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు). మరికొన్ని ఇప్పటికీ నెరవేరుతూ ఉన్నాయి (21. అప్పుడు ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వారందరును రక్షణపొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు). మరి కొన్ని భవిష్యత్తులో నెరవేరాల్సి ఉంది (19. పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను. 20. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు). ఇవన్నీ అంత్యదినాల్లో జరగాల్సి ఉంది అని యోవేలు చెప్పినట్టుగా పేతురు చెబుతున్నాడు. ఆ అంత్య దినాలు పెంతెకోస్తు దినాన ప్రారంభమై, నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఇంకెంత కాలం కొనసాగుతాయో తెలీదు. కానీ ఈ ప్రవచనంలో పెంతెకోస్తు దినాన నెరేవేరిపోయిన యోవేలు ప్రవచనంలోని సంగతులను ఆధారం చేసుకుని ఈ రోజున దేవుడు కలలు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు అని చెప్పడం సాధ్యపడదు. ఎందుకంటే ఈ అంశానికి సంబంధించిన ఇతర కొత్త నిబంధన లేఖన భాగాలను పరిశీలించినప్పుడు దేవుడు అలా మాట్లాడటం అపోస్తలీయ కాలానికే పరిమితం అయిందనీ, ఆ తరువాత అటువంటి ప్రత్యక్షతల అవసరం లేని కారణంగా, అవి నిలిచిపోయాయి అని స్పష్టం ఔతుంది. కాబట్టి ఈ రోజుల్లో ప్రతీ విశ్వాసీ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుని వద్ద నుండీ కలలు, దర్శనాల ద్వారా కొత్త ప్రత్యక్షతలనూ, నడిపింపునూ పొందుకుంటాడు అని చెప్పడానికి ఈ వచనంలో ఎటువంటి ఆధారమూ లేదు.

ప్రశ్న 3: రోమా 8:16లో "మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు" అని చెప్పబడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడడు అని ఎలా చెబుతారు?

జవాబు: ఇంతకీ ఆత్మ ఏమని సాక్ష్యమిస్తున్నాడు? మనం దేవుని పిల్లలం అన్న నిశ్చయతను మనకు అనుగ్రహిస్తాడు. ఎలా సాక్ష్యమిస్తాడు? ఈ వచనం యొక్క సందర్భాన్ని పరిశీలిస్తే, పౌలు 8వ అధ్యాయం మొదటి వచనంలో "యిప్పుడు క్రీస్తుయేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు" అని ప్రారంభించి, మూడవ వచనంలో విశ్వాసులు "శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను"ను అని చెబుతున్నాడు. అలాగే 13వ వచనంలో మీరు "...ఆత్మచేత శారీర క్రియలను చంపినయెడల జీవించెదరు" అని చెబుతున్నాడు. ఈ మాటలన్నిటినీ బట్టి ఆత్మ చేత నడిపించబడటం లేదా ఆత్మానుసారంగా నడవడం అంటే ఆత్మ మనలో పుట్టించే ఆత్మ ఫలాలకు అనుగుణమైన క్రియలను చెయ్యడం అని అర్థం ఔతోంది. ఇలా ఎవరైతే ఆత్మ చేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు. కాబట్టి ఒక విశ్వాసి ఆత్మ చేత శరీర క్రియలను చంపుతూ, ఆత్మ ఫలాలకు అనుగుణమైన క్రియలు జరిగిస్తూ ఉంటే, అది ఆ విశ్వాసికి ఏమని సాక్ష్యమిస్తుంది? అతను దేవునికి చెందినటువంటి వాడు, దేవుని బిడ్డ అని సాక్ష్యమిస్తుంది. పరిశుద్ధాత్మ మనం ఆత్మానుసారంగా నడిచేటట్టు చేసి "నేను దేవుని బిడ్డని" అన్న ఆధ్యాతికమైన నిశ్చయతను మనకు ఇస్తున్నాడు. ఆత్మ ఫలాలు మనలో పుట్టించడం ద్వారా పరిశుద్ధాత్మ ఆ సాక్ష్యాన్ని మనకు ఇస్తున్నాడు. అంతేగాని "నువ్వు దేవుని బిడ్డవి" అని నీ చెవిలో చెప్పడు, లేదా కల ద్వారానో, దర్శనం ద్వారానో నీకు బయలుపరచడు. ఈ సందర్భంలో ఆయన అలా చేస్తాడు అనే భావం వచ్చే అవకాశమే లేదు. ఆత్మానుసారంగా నడిచేవారు క్రీస్తుకు చెందినవారు. ఆత్మ చేత నడిపించబడని వారు క్రీస్తుకు చెందిన వారు కారు. మనం ఆత్మానుసారంగా నడిపించబడుతున్నామన్న సాక్ష్యాన్ని మన జీవితంలో చూడగలిగితే, ఆత్మ ఫలము అని వాక్యం దేనినైతే చెబుతుందో, అది మన జీవితంలో ఉందని మనం నిర్ధారించుకోగలిగితే ఆ కార్యం మనలో జరిగించేది పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ మనలో అటువంటి కార్యం చేస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు అంటే మనం దేవుని బిడ్డలమై ఉండాలి అన్న నిర్ధారణ, రుజువు ఆయన మనకు ఇస్తున్నాడు అని పౌలు చెప్తున్నాడు. అంతేకానీ ఈ రోజుల్లో ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ కొత్త సంగతులు చెబుతాడు, కలల ద్వారా, దర్శనాల ద్వారా మీకు కొత్త ప్రత్యక్షతలు బయలుపరచి తద్వారా ప్రతి రోజూ మీకు కావాల్సిన నడిపింపును అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఈ వచనంలో ఏ ఆధారమూ లేదు.

ప్రశ్న 4: యోహాను 16:13లో "అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును" అని చెప్పబడింది. పరిశుద్ధాత్మ మాతో మాట్లాడకపోతే, ఎటువంటి ప్రత్యక్షతలు అనుగ్రహించకపోతే సంభవింపబోవు సంగతులను మాకు ఎట్లా తెలియచేస్తాడు?

జవాబు: యేసుక్రీస్తు అపొస్తలులతో మాట్లాడుతూ యోహాను 14:26 లో "ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును" అని చెబుతాడు. అయితే అలా యేసు క్రీస్తు అపొస్తలులకు బోధించిన సంగతులను జ్ఞాపకం చెయ్యడం మాత్రమే కాకుండా యోహాను 16:12లో "నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు" కానీ వాటిని మీకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు బయలుపరుస్తాడు అని చెబుతున్నాడు. అయితే ఏ సంగతులు బయలుపరుస్తాడు అని చెబుతున్నాడు అంటే క్రీస్తుకు సంబంధించిన సంగతులు. రాబోవు సంగతులైనా అవి క్రీస్తుకు సంబంధించిన రాబోవు సంగతులే. అవన్నీ సంపూర్ణంగా అపొస్తలులలకు దేవుడు బయలుపరిచాడు. వాటినే దేవుడు కొత్త నిబంధన రూపంలో గ్రంథస్థం చేయించాడు. ఉదాహరణకు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రాబోవు సంగతులన్నీ క్రీస్తుకు సంబంధించినవే. అంతేకానీ ఈ రోజుల్లో నేను ఏ అమ్మాయిని లేదా అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలి? నేను ఏ ఉద్యోగం చెయ్యాలి? అనే విషయాలలో ప్రతి విశ్వాసికి పరిశుద్ధాత్మ బయలుపరుస్తూ ఉంటాడని కాదు. సర్వసత్యంలోనికి నడిపించబడటం అనే మాటల భావం ఖచ్చితంగా అది కాదు.

ఒకవేళ దేవుడు అపొస్తలులకు బయలుపరిచినట్టు క్రీస్తుకు సంబంధించిన ప్రత్యక్షతలు ఈ రోజుకీ అనుగ్రహిస్తున్నాడు అని ఎవరైనా చెబుతుంటే, అపొస్తలులకు దేవుడు అనుగ్రహించిన 27 పుస్తకాల ప్రత్యక్షత ఎంత ప్రశస్తమైనదో, ఎంత శ్రేష్ఠమైనదో, ఆ కొత్త ప్రత్యక్షతలు కూడా అంతే ప్రాముఖ్యమైనవి. వాటిని తప్పకుండా బైబిల్ లో చేర్చాలి. అలా చెయ్యకూడదు అని చెప్పే అధికారం సంఘానికి లేదు. క్రీస్తుకు సంబంధించిన ఏ ప్రత్యక్షతయైనా అది సార్వత్రిక సంఘానికి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగచేసేదే అయ్యుంటుంది కనుక వాటిని రాసి బైబిల్ తో చేర్చాలి. కానీ ఈ రోజుల్లో దేవుడు తమకు ఈ సంగతులు బయలుపరిచాడు అని అనేకులు సాక్ష్యం చెబుతున్నారు. కొందరు పాస్టర్లు ఐతే జోతిష్యం చెప్పినట్టు, ఎప్పుడో అప్పుడు ఎలాగో ఓ లాగ నెరవేరే సంగతులే దేవుడు బయలుపరిచాడు అని చెబుతున్నారు. అవి ఎటూ నెరవేరతాయి కనుక అవి నెరవేరాక, మాకు దేవుడు బయలుపరచిన సంగతులు, మేము ముందే ప్రకటించాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మ ఇటువంటి సంగతులు మీకు బయలుపరుస్తాడు అని ఈ వచనంలో యేసు వాగ్దానం చేస్తున్నాడా? లేదు. యేసుక్రీస్తు తన పరిశుద్ధాత్మ ద్వారా ఏ ప్రత్యక్షతలైతే మనకు అనుగ్రహించాలి అని అనుకున్నాడో, క్రీస్తుకు సంబంధించిన ఆ సంగతులన్నీ ప్రవక్తలు, అపొస్తలుల ద్వారా మనకు 66 పుస్తకాల బైబిల్ గ్రంథం రూపంలో పొందుపరిచాడు. అది మనకు చాలినది.

ప్రశ్న 5: 1 కొరింథీ 2:10 - "10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు" అని ఉంటుంది. ఈ వచనంలో ఆత్మ మనకు బయలుపరుస్తాడు అని చెప్పబడింది, మీరేమో బయలుపరచడు అని చెబుతున్నారా?

జవాబు: ఈ వాక్యభాగ సందర్భాన్ని పరిశీలిద్దాం. "6. పరిపూర్ణులైనవారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది యీ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానమును కాదుగాని 7. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము; ఈ జ్ఞానము మరుగైయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 8. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసి యుండినయెడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు."
ఈ వచనాలలో పౌలు దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దీని గురించి మొదటి అధ్యాయంలోనే ప్రస్తావిస్తాడు. ఇంతకీ ఇది ఏ జ్ఞానమో 1:18 వ వచనంలో చెప్తున్నాడు చూడండి. "18. సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి."

యేసుక్రీస్తు గురించి ఎంతో స్పష్టంగా లేఖనాలలో దేవుడు బయలుపరిచినప్పటికీ, ఆయనను గుర్తించడానికి అవసరమైన సంగతులన్నీ వాక్యంలో స్పష్టంగా తెలియపరచినప్పటికీ, దాన్ని లోకాధికారులు చూడలేకపోయారు. లోకంలోని చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. యేసు క్రీస్తు ఎవరో మేధో సంబంధంగా తెలిసినప్పటికీ, యేసు క్రీస్తులో మనం (విశ్వాసులము) చూడగలుగుతున్న రక్షణ, మహిమ, నిత్య జీవపు ఆశీర్వాదం లోకంలోని వారు ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు వారికి అది వెర్రితనంగా కనబడుతుంది?
కారణం ఏంటో తరువాతి వచనంలో చెప్పబడింది. "9. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించువారికొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు."

దేవుడు మనకు తన ఆత్మ వలన వాటిని బయలుపరిచాడు. 'వాటిని' అంటే వేటిని? వాక్యంలో ఉన్న అవే సంగతులను చదువుతున్న చాలా మంది కంటికి అవి కనబడట్లేదు, వారి చెవికి అవి వినబడట్లేదు, వారు హృదయాలకు అవి గోచరం కాట్లేదు. కానీ అవే సంగతులు మనకు మాత్రం గొప్పగా ఎందుకు అనిపిస్తున్నాయి? యేసు క్రీస్తుకు సంపూర్ణంగా మన జీవితాలను సమర్పించుకునేలా, ఆయనలో ఉన్న రక్షణను మనం మాత్రమే ఎందుకు చూడగలుగుతున్నాం?

ఎందుకంటే దేవుడు తన ఆత్మ ద్వారా మనలో కార్యం చెయ్యడం వల్ల, మన మనో నేత్రాలను తెరవడం ద్వారా తిరిగి జన్మింపచేయడం ద్వారా మనం వాటిని చూడగలుగుతున్నాం.

ప్రకృతి సంబంధియైన వ్యక్తి దేవుని సంగతులను గ్రహించలేడు గానీ క్రీస్తుతో కూడా బ్రతికించబడిన మనం దేవుని రాజ్య సంగతులను గ్రహించగలుగుతున్నాం. దాని మహిమను చూడగలుగుతున్నాం. ఆయన రక్షణను అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతున్నాం.
"14. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.15. ఆత్మసంబంధియైనవాడు అన్ని టిని వివేచించును గాని అతడెవనిచేతనైనను వివేచింప బడడు."

ఈ సందర్భంలో దేవుని జ్ఞానం అని చెప్పబడింది అప్పటికి లేఖనాలలో బయలుపరచబడిన సంగతుల గురించే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే సువార్త గురించే తప్ప దేవుడు కొత్త సంగతులు మనకు అనుదినం బయలుపరచడం ద్వారా మనల్ని నడిపిస్తాడు అని చెప్పడానికి ఈ వాక్యభాగంలో ఏ ఆధారమూ లేదు.

ప్రశ్న 6: 1 కొరింథీ 14:29-30 - "29. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. 30. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను." ఈ వచనాలలో చాలా స్పష్టంగా దేవుడు బయలుపరుస్తున్నట్టుగా చెప్పబడింది కదా. దేవుడు ఈ రోజున మనకు కొత్త సంగతులు బయలుపరచడు అని ఎలా చెబుతారు?

- బాషా వరానికీ, ప్రవచన వరానికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని చూపించడం కోసం రాయబడిన అధ్యాయం ఇది. ప్రవచనం సంఘానికి క్షేమాభివృద్ధి కలుగచేస్తుంది కానీ బాషల విషయంలో అర్థం చెప్పే వారు ఉంటేనే కానీ క్షేమాభివృద్ధి కలుగదు అని పౌలు బోధిస్తున్నాడు. ప్రవచనం అనగానే భవిష్యత్తులో జరగబోయే వాటిని ప్రకటించడం అన్న భావంలోని తీసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే బయలుపరచబడిన సంగతులు బోధించడం, ప్రకటించడం కూడా ప్రవచనంగా చెప్పవచ్చు.
దేవుడు సంఘంలో బోధించే పరిచర్యను ఎందుకు నియమించాడో, అదే పరిచర్య ప్రవక్తలు కూడా చేశారు. దాని గురించే ఈ సందర్భంలో పౌలు మాట్లాడుతున్నాడు.
'బయలుపరచడం' అంటే ఏవో కొత్త సంగతులను బయలు పరచడం అని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికే బయలుపరచబడిన సంగతులను సరిగ్గా, లోతుగా అర్థం చేసుకోవడం, అప్పటివరకూ చూడని సంగతిని అప్పుడు చూసి గ్రహించగలగడం అన్న భావంలో ఆ మాట ఇక్కడ వాడబడింది. ఈ పదానికి గ్రీకులో వాడబడిన పదం యొక్క భావం - uncovering (ముసుగు తియ్యడం, విప్పి చెప్పడం). ఈ ఒక్క మాటను పట్టుకుని, దేవుడు ఈ రోజున ప్రతీ ఒక్కరికీ కొత్త సంగతులను ప్రతి రోజూ బయలుపరుస్తాడు అని చెప్పడం సాధ్యపడదు.

ప్రశ్న 7: యోహాను 14:12 - "నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను." గొప్ప కార్యాలు అంటే గొప్ప ప్రత్యక్షతలు అన్న భావంలో తీసుకోకూడదా?

జవాబు: యేసు క్రీస్తు 'తనకంటే గొప్ప కార్యాలు శిష్యులు చేస్తారు" అని చెప్పిన మాటలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అపొస్తలుల కాలం మొదలుకొని ఇప్పటి వరకూ నాణ్యతలో యేసు ప్రభువు వారు చేసిన కార్యాల కంటే గొప్ప కార్యాలు ఎవ్వరూ చెయ్యలేదు. యేసుక్రీస్తు నీళ్ళపై నడిస్తే, గాలిపై నడిచినవాళ్ళు కానీ, యేసుక్రీస్తు నీళ్ళను ద్రాక్షారసంగా మారిస్తే, ద్రాక్షారసాన్ని నీళ్ళగా మార్చినవాళ్ళు కానీ ఎప్పుడూ ఎక్కడాలేరు. యేసు క్రీస్తు ఐదు వేల మందికి ఆహారం పంచిపెడితే, నేను పదివేల మందికి ఆహారం పంచిపెడతాను అని చెప్పినవారు కానీ, అలాంటి అద్భుతాలు చేసిన వారు కానీ చరిత్రలో ఎవ్వరూ లేరు.

ఇంకొంతమంది పేతురు నీడ పడి కొందరు స్వస్థపరచబడ్డారు, పౌలు రుమాలును తాకిన కొందరు స్వస్థపరచబడ్డారు అని చెబుతారు. యేసు క్రీస్తు వస్త్రపు చెంగును తాకి స్వస్థపరచబడిన వారి గురించి సువార్తల్లో చెప్పబడింది కదా. అంత మాత్రమే కాదు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న వారిని కూడా ఆయన తాకకుండా, చూడకుండా, స్వస్థపరచిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు కంటే నాణ్యతలో గొప్ప కార్యాలు ఏ అపొస్తలుడూ, ఎప్పుడూ చెయ్యలేదు.
మరి యేసు ప్రభువు వారి ఈ మాటలు అపొస్తలుల విషయంలో ఎలా నెరవేరాయి? గొప్పతనం నాణ్యతలో కాదు కానీ విస్తీర్ణతలో, అనగా వివిధ ప్రాంతాల వరకూ వెళ్ళి, సంఖ్యలో యేసు ప్రభువు వారి కంటే ఎక్కువ జనసమూహాలకూ, ప్రజలకూ సువార్త ప్రకటించే పరిచర్యను వారు చేయడాన్ని బట్టి, యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు నెరవేరాయి. యేసు క్రీస్తు పరిచర్య దాదాపుగా యూదయ, గలిలయ ప్రాంతానికే పరిమితమయ్యింది. సమరయకు వెళ్ళినట్టు కూడా చదువుతాము. కానీ యేసు క్రీస్తు సిలువలో యూదులకు, అన్యులకూ ఉన్న మధ్య గోడను కూల్చిన తరువాత అపొస్తలులు ప్రపంచమంతటా యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించారు. అలా సంఖ్యాపరంగా, విస్తీర్ణతలో మాత్రమే శిష్యులు గొప్ప కార్యాలు చేశారు గానీ, నాణ్యతలో గొప్ప కార్యాలు ఎవరూ చెయ్యలేదు, చెయ్యలేరు.

సరే గొప్ప కార్యాలు అంటే గొప్ప ప్రత్యక్షతలు అన్న భావంలో ఈ మాటలను తీసుకోవాలనుకుంటే, యేసు క్రీస్తు బయలుపరచిన సంగతులకంటే గొప్ప సంగతులు దేవుడు అపొస్తలులకూ, మనకూ బయలుపరుస్తాడని భావించాలా? ఆయన పరలోక సంబంధ విషయాలు మాట్లాడితే, మనం అంతకంటే గొప్పదైన వేరొక పరలోకం గురించి మాట్లాడాలా? కాదు కదా. కాబట్టి ఈ వచనంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలకీ, దేవుడు విశ్వాసులందరికీ కొత్త ప్రత్యక్షతలు ఇస్తాడు అనడానికీ ఏ సంబంధమూ లేదు.

ప్రశ్న 8: బైబిల్ గ్రంథం సంపూర్ణమైనది, చాలినది అని చెబుతున్నారు. కానీ బైబిల్ లో rocket science , computer technology లేదు కదా. అలాంటప్పుడు బైబిల్ సంపూర్ణమైనది అని ఎలా చెప్తారు?

జవాబు: కేవలం విషయాన్ని తప్పుదారి పట్టించడానికి అనేకులు లేవనెత్తే ప్రశ్న ఇది. పరిశుద్ధ గ్రంథం ఇలా చెబుతుంది - "16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, 17. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.' (2 తిమోతి 3:16). దీని భావం మనం ఏ మంచి కార్యం చేయడానికైనా ఆ కార్యానికి సంబంధించిన అన్ని నిర్ణయాలు చెయ్యడానికి అవసరమైన నియమాలన్నీ లేఖనాల్లో ఉన్నాయి. ఆ భావంలో లేఖనాలు చాలినవి/సరిపోయినవి. ఇవి కాకుండా ఇంకేదైనా అదనంగా కావాలి అంటున్నాం అంటే, ఇది సరిపోయినది, చాలినది కాదు అని అంటున్నట్లే.
దేవునికి, రక్షణకూ సంబంధించిన విషయాలకు మాత్రమే వాక్యం పరిమితం, మిగతా విషయాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడతాయి అని చెప్పి కొందరు ఇటువంటి ఉదాహరణలు ఇస్తుంటారు - బైబిల్ లో rocket science, computer technology లేదు కదా. కాబట్టి బైబిల్ అసంపూర్ణం, అందులో అన్నీ లేవు.

వాదన కోసం, సరే, బైబిల్ లో computer గురించీ, rocket గురించీ లేదు అనుకుందాం. మరి వాటిని పరిశుద్ధాత్మే మనిషికి బయలుపరిచాడా? ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్లనే ఎవరైనా ఏదైనా తయారుచెయ్యగలుగుతున్నారు, కనిపెట్టగలుగుతున్నారు. అది నాస్తికులైన, ఆస్తికులైనా. అందులో ఏ అనుమానమూ లేదు. కానీ ఇది ఈ లోకానికి సంబంధించినది, ఈ లోకంలో మాత్రమే ఉపయోగపడే జ్ఞానం. ఇది ప్రత్యక్షత, బయలుపాటు కాదు. 'బైబిల్ నా ప్రతి నిర్ణయానికి చాలినది' అని చెబుతున్నప్పుడు, నైతికతకూ, ఆధ్యాత్మికతకూ సంబంధించిన విషయాల గురించి మాట్లాడుతున్నాం. అటువంటి విషయాలలో ప్రతీ నిర్ణయం చెయ్యడానికి బైబిల్ చాలినది/సరిపోయినది. అంతేగానీ ఈ లోక జ్ఞానానికి సంబంధించిన విషయాలన్నీ బైబిల్ లో ఉన్నాయి అని చెప్పడం లేదు.

ప్రశ్న 9: దేవుడు బైబిల్ ద్వారా మాత్రమే మాట్లాడతాడు అన్నప్పుడు, దేవుని శక్తిని మనం పరిమితం చేస్తున్నట్టే కదా? ఆయన ఈ మాధ్యమం ద్వారానే మాట్లాడతాడు అని చెప్పడం దేవుణ్ణి boxలో పెట్టినట్టు ఔతుంది కదా? ఆయన కావాలంటే ఎలాగైనా మాట్లాడగలడు కదా?

జవాబు: దేవుడు వేరే మాధ్యమం ద్వారా మాట్లాడలేడు అని మనం చెప్పట్లేదు. ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యేసు క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ అని బైబిల్ చెబుతోంది. అలా చెప్పడం దేవుణ్ణి boxలో పెట్టినట్టు ఔతుందా? ఇంకో మార్గంలో దేవుడు రక్షించలేడా? కానీ వాక్యం చాలా స్పష్టంగా యేసు క్రీస్తు మాత్రమే మార్గం అని ఎలా చెబుతుందో, మీరు నడవాల్సిన త్రోవ ఈ వాక్యంలో బయలుపరచబడిన త్రోవ అని కూడా చెబుతుంది. ఈ రెండింటినీ అంగీకరించడంతో మనకున్న ఇబ్బందేముంది. యేసు క్రీస్తు మాత్రమే మార్గం కాబట్టి ఆయన ద్వారానే దేవుని దగ్గరికి వద్దాము, ఇదే త్రోవ అని ఏదైతే బైబిల్ చెప్తుందో ఆ త్రోవలోనే నడుద్దాము. ఇలా చేస్తేనే తాను చేసినట్టు అని మనం గుర్తించడం కోసం దేవుడు తనకు తాను ఒక పరిమితి విధించుకుంటే, అనగా ఈ మార్గం ద్వారా వస్తేనే నాతో సమాధానపడినట్లు అని యేసు క్రీస్తు గురించి చెబితే, ఈ మాధ్యమం ద్వారా నేను చెప్పిన మాటలకు లోబడి జీవించడం ద్వారానే నా ప్రత్యక్షతకూ, నా చిత్తానికి లోబడి జీవించినట్టు అనే పరిధిని దేవుడే మనకు విధిస్తే, అది మనం దేవుణ్ణి boxలో పెట్టడం ఎలా ఔతుంది. ఆ పరిమితిని దేవుడే మనకు చూపించి, దేవుడే మాట్లాడుతున్నాడా లేదా ఇంకెవరైనా మాట్లాడుతున్నారో తెలుసుకోవడానికి, ప్రమాణీకరించుకోవడానికి దేవుడే నియమించిన విధానం. దానికి లోబడమని చెప్పడం దేవుణ్ణి మనం boxలో పెట్టినట్టు ఎందుకు ఔతుంది?

ప్రశ్న 10: సామెతలు 3:5-6 - "5. నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము 6. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును." నేను ఎలా నా ప్రవర్తన అంతటియందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి?

జవాబు: ప్రతీ చిన్న విషయానికీ, ప్రతీ పెద్ద విషయానికీ మనం దేవునిపై ఆధారపడాలి. దేవుడు ప్రతీ చిన్న విషయంలో మనల్ని నడిపిస్తాడు కూడా. కానీ ప్రతీ చిన్న విషయం గురించి దేవుడు మనతో మాట్లాడతాడా అనేది అసలు ప్రశ్న. సామెతలు 19:21 - "నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరము." నా ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ, దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చుకుంటాడు. ఎలాగైనా ఆయన నెరవేర్చుకోగలడు, అవన్నీ నాకు చెప్పి చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ నా బాధ్యతగా ఈ వచనంలో చెప్పబడిన మాట నా ప్రవర్తన అంతటియందు "ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం". ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించడమే ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం. బైబిల్ రూపంలో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ప్రకారం జీవిస్తే ఆయన నా త్రోవలను సరాళం చేస్తాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా దేవుని సహాయం మనకు అవసరమే కానీ దేవుడు అడుగడుగునా, నీ తరువాత అడుగు ఎక్కడ వెయ్యాలో ఒక స్వరం ద్వారా చెప్పడు.

ప్రశ్న 11: మెల్లని స్వరం వినబడి నడిపిస్తుందని పెద్ద పెద్ద దైవజనులు చెబుతుంటారు. దాని గురించి మీరేం చెబుతారు.

జవాబు: ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి, తాను అమెరికా వెల్లడం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేస్తున్నప్పుడు యెషయా 11:14 అతనికి దేవుని చిత్తాన్ని బయలుపరచిందట. ‘‘వారు ఫిలిష్తీయల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తి పోవుదురు’’ (యెషయా 11:14). ఇక్కడ ‘‘భుజము మీద ఎక్కి’’ (ఆంగ్లములో రెక్కల మీద ఎక్కి) అనే మాటను బట్టి తాను ఫ్లైట్ ఎక్కాలని, ‘‘పడమటి వైపుకు పరిగెత్తి పోవుదురు’’ అనే మాటను బట్టి తాను అమెరికా వెళ్ళాలని దేవుని చిత్తాన్ని గ్రహించాడట. ఇది వాక్యాన్ని చదివే సరైన విధానమేనా? ఎందుకంటే అనుదినం ఈ వ్యక్తిని నడిపించేటువంటి ఈ స్వరము, ఒక్కసారి కూడా 'నువ్వు బైబిల్ చదివే పద్ధతి తప్పు' అని ఎందుకు చెప్పట్లేదు? దీన్ని బట్టి మనకు ఏం అర్థం ఔతోంది. ఈ మెల్లని స్వరం అవసరమైన నడిపింపును ఇవ్వదు. కేవలం అందరూ సాధారణంగా చేసుకుంటూ పొయేటువంటి నిర్ణయాల విషయంలో మాత్రమే ఆ స్వరం వినబడి నడిపించేది ఐతే అంతకంటే చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉదా - బైబిల్ ఎలా చదవాలి? బైబిల్ ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే విషయంలో మాత్రం పొరపాట్లు చేస్తున్నప్పటికీ ఆ స్వరం ఎందుకు వారికి సరైన guidance ఇచ్చి నడిపించట్లేదు? అప్పుడు అసలు అది దేవుని స్వరమేనా, దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి నడిపింపేనా అని ప్రశ్నించాల్సి వస్తుంది.
ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలలో నీకు సహాయపడని ఆ స్వరము వింటూ, 'నేను దేవుని చిత్తంలో ఉన్నాను, దేవుని నడిపింపులో ఉన్నాను' అని నిన్ను భ్రమ పరిచే స్వరం ఇది.
ఇది పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే నడిపింపు స్థానంలో సాతాను ప్రవేశపెట్టిన వేరొక ప్రత్యామ్నాయం. ఆ స్వరం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏదో వినిపించింది కాబట్టి ఇది దేవుని స్వరమే. పెద్ద పెద్ద వాళ్ళకు కూడా వినిపించింది కాబట్టి ఇది సరైనదే అని అనుకోవద్దు. ఇది ఎంతో ప్రమాదకరమైన స్వరం. ఇది నిజమైన ఆధ్యాత్మిక సంగతుల విషయంలో ఎవ్వరినీ సహాయపడలేదు, నడిపించలేదు. అటువంటి అవసరతను అది తీర్చలేదు. అవసరం లేనివి లేదా అంత ప్రాముఖ్యం కానివి మాత్రమే చెప్పే స్వరం అది.

ప్రశ్న 12: 1 కొరింథీ 12లో ఆత్మ వరాల గురించి మాట్లాడుతూ, ప్రవచనం ద్వారా దేవుడు కొత్త ప్రత్యక్షతలు అనుగ్రహించే ఉద్దేశ్యం లేకపోతే, అటువంటి వరం సంఘానికి ఎందుకు ఇచ్చినట్టు? అలాగే 1 కొరింథీ 14:39లో "కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాటలాడుట ఆటంకపరచకుడి" అని ఉంటుంది. ఈ మాటలను ఎలా అర్థం చేసుకోవాలి?

జవాబు: ప్రవచనము అనే మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేవుని మాటలను ప్రజల ముందు నిలబడి, దాని సరియైన భావాన్ని వినేవారికి అర్థం అయ్యేలా తెలియచేయడం, ప్రకటించడమే ప్రవచించించడం. ఇది ఈ రోజుకీ ఉంది. కానీ బైబిల్ లో లేని కొత్త ప్రత్యక్షతలు చెప్పే కోణంలో, ఎలాగైతే ప్రవక్తలకీ, అపోస్తలులకీ ఇవ్వబడిందో, ఆ భావంలో ప్రవచనం ఇప్పుడు కొనసాగడం లేదు అని మాత్రమే చెబుతున్నాము. ప్రకటన 19:10 - "10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడు వద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసునుగూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పెను."
కాబట్టి ఎవరైతే యేసును గూర్చి సాక్ష్యమిస్తూ, ప్రకటిస్తూ ఉన్నారో, వారు ప్రవచిస్తున్నారు. ఈ భావంలో ఈ రోజుకీ ప్రవచన వరం ఉంది అని చెప్పడంలో ఏ ఇబ్బందీ లేదు కానీ, ఈ వచనాలను ఆధారం చేసుకుని దేవుడు నాకు అనుదినం కావాల్సిన నడిపింపును అనుగ్రహిస్తాడు అని చెప్పడం వాక్యానుసారం కాదు.

ప్రశ్న 13: 1 థెస్స 5 - 19. ఆత్మను ఆర్పకుడి. 20. ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. 21. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి." ప్రవచనం ద్వారా దేవుడు ఈ రోజున మనతో మాట్లాడడు అని మీరెలా చెప్తారు?

జవాబు: "ఆత్మను ఆర్పడము" అనేది మనం ఎప్పుడు చేస్తాము అంటే, దేవుడు తన వాక్యంలో బయలుపరచిన ఆజ్ఞలకు మనం వ్యతిరేకంగా నడచినప్పుడు. అలా చేసిన ప్రతీ సారి, విశ్వాసి ఆత్మను ఆర్పే పని చేస్తున్నాడు, ఆత్మను దుఃఖపెట్టే పని చేస్తున్నాడు. దేవుడు నాతో, లేదా నా ద్వారా మాట్లాడుతుంటే 'నువ్వుండు, అని ఆయనను అడ్డుకునే ప్రయత్నం చెయ్యకూడదు' అని చెప్పట్లేదు ఈ వచనం. ఇకపోతే ప్రవచనము అనే మాటను ఏ భావంలో అర్థం చేసుకోవాలో ఇప్పటికే వివరించాము.

ప్రశ్న 14: దేవుడు హాగరు, కయీను వంటి సాధారణ వ్యక్తులతో కూడా మాట్లాడాడు కదా?

జవాబు: హాగరు, అబ్రాహాముతో సంపర్కంలో ఉంది. ప్రవక్తయైన అబ్రాహాము జీవితంలో జరిగిన సంఘటనలతో ఆమె జీవితం ముడిపడి ఉంది. కయీను జీవితంలో జరిగిన ప్రతీది ప్రవక్తయైన ఆదాము కుటుంబానికి సంబంధించినదే. యేసుక్రీస్తు పుట్టుక సందర్భంలో గొల్లలకు, జ్ఞానులకు కలిగిన ప్రత్యక్షతలు కూడా మరియ ద్వారా అపొస్తలులకు చేరవేయబడి, అవి అపోస్తలీయ అధికారంతో నిర్ధారించబడే విధంగా దేవుడు అనుమతించాడు. కాబట్టి ప్రవక్తలు, అపొస్తలుల చేత నిర్ధారించబడని విధంగా ఏ కాలంలోనూ ఏ ప్రత్యక్షతా అనుగ్రహించబడలేదు.

ప్రశ్న 15: ఎఫెసీ 4:13 - "13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను." ప్రవక్తలు, అపొస్తలులు ఈ రోజుల్లో కూడా ఉంటె, వారికి దేవుని ప్రత్యక్షతలు వస్తాయి కదా. ఒకవేళ లేరు అంటే, ఈ రోజుల్లో కలల ద్వారా, దర్శనాల ద్వారా దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటున్నాం అని చెప్పేవారు అంతా అబద్ధికులేనా?

జవాబు: కాపరులు, సువార్తికులతో పాటు దేవుడు అపొస్తలులు, ప్రవక్తలను కూడా సంఘానికి అనుగ్రహించాడు. కానీ ఎలా అనుగ్రహించాడు? ఎఫెసీ 2:20 - "20. క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు." అంటే అపొస్తలులు, ప్రవక్తలు వేసింది పునాది పరిచర్య. ప్రవక్తల పరిచర్య గురించి పాత నిబంధనలో చదువుతాము, అపొస్తలుల పరిచర్య గురించి కొత్త నిబంధనలో చదువుతాము. వారి పరిచర్య పైన సంఘం కట్టబడింది. ఇప్పుడు కాపరులు, సువార్తికులూ, ఉపదేశకులూ ఆ పునాదిపైనే సంఘాన్ని కడతారు. ఎలా? ఆ పునాది సత్య బోధను ఆధారం చేసుకునే కడతారు. ఈ రోజుల్లో సంఘంలో అపొస్తలులు ప్రవక్తలు ఉన్నారా? ఉన్నారు. బైబిల్ గ్రంథం రూపంలో ఉన్నారు. ఈ బైబిల్ గ్రంథం ప్రవక్తల, అపొస్తలుల పునాది పరిచర్య ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఎప్పుడూ సంఘంతో పాటు ఉండటానికి సంఘానికి ఇవ్వబడినటువంటి పునాది బైబిల్.

లాజరు - ధనవంతుని కథలో లూకా 16: "27. అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు. 28. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను. 29. అందుకు అబ్రాహాము -వారియొద్ద మోషేయు ప్రవక్తలును ఉన్నారు; వారి మాటలు వినవలెనని అతనితో చెప్పెను". వారి మాటలు వినకపోతే, చనిపోయిన ఒకడు లేచి చెప్పినా వినరు అని చెబుతున్నాడు. అయితే మోషే, ప్రవక్తలు అప్పుడున్నారా? లేరు. అసలు మోషే, ప్రవక్తలు భూమి మీద ఒక్క కాలంలోనే బ్రతికినవారు కాదు. లేఖనాలను ఉద్దేశించి ఆయన ఆ మాటలు చెబుతున్నాడు.

అలాగే 2 థెస్స 2:15 - "కాబట్టి సహోదరులారా, నిలుకడగా ఉండి మా నోటిమాటవలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి." అపొస్తలులు నోటి మాటగా ఏవైతే ప్రకటించారో, వాటినే ప్రత్రికల రూపంలో రాశారు. ఒకవేళ వాళ్ళు 2000 సంవత్సరాలు బ్రతికి, ఈ రోజున మన మధ్యలో ఉన్నప్పటికీ, ఏ సంగతులు బోధించేవారు? బైబిల్ లో ఉన్న అవే సంగతులు బోధించేవారు. కొత్త సంగతులేమీ బోధించేవారు కాదు. అదే ప్రత్యక్షత రాత పూర్వకంగా మనతో పాటు ఉన్నప్పుడు, ప్రవక్తలు, అపొస్తలులు మనతో ఉన్నట్టే, సంఘానికి నేటికీ బోధిస్తున్నట్టే.

2 పేతురు 3:3 - "పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుకబడిన మాటలను, ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసికొనవలెనను విషయమును మీకు జ్ఞాపకముచేసి, నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను."

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.