నిజ క్రైస్తవ జీవితం

రచయిత: సాగర్
చదవడానికి పట్టే సమయం: 18 నిమిషాలు

 

క్రైస్తవ సమాజంలో దేవునికి ప్రార్థన చెయ్యనివారెవరూ మనకు కనిపించరు, ఒకవేళ ఎవరైనా అలా ఉన్నారంటే, వారిని విశ్వాసులు అని పిలవడం సాధ్యం కాదు. తండ్రితో ప్రతీదినం ప్రార్థనా సహవాసంలో గడిపేవారే నిజవిశ్వాసులూ ఆ దేవుని పిల్లలూ ఔతారు. అలా అని ప్రార్థన చేసేవారంతా ఆయన పిల్లలే అని మనం భావించకూడదు. కానీ, ఆయన పిల్లలు మాత్రం తప్పకుండా ప్రార్థన చేసేవారిగా ఉంటారని ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకూ ఉన్న లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నాయి.
 
ఇప్పుడు, ప్రార్థన విషయంలో చాలామంది విశ్వాసులు గురౌతున్న  అపార్థం గురించి ఇక్కడ పరిశీలిద్దాం. బైబిల్ గ్రంథం ప్రకటించే త్రియేక దేవుడు సార్వభౌముడిగా, అంటే తన చిత్తానుసారంగా సమస్తాన్ని నిర్ణయించి జరిగించేవాడిగా లేఖనాలలో ప్రత్యక్షపరచబడుతున్నాడు. 
 
ఎఫెసీయులకు 1:12  ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
 
దానియేలు 4: 35 భూనివాసులందరు ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు; ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.
 
ఈ మాటలను బట్టి, దేవుడు ఈ సృష్టిలో సమస్త కార్యాలనూ తన చిత్తప్రకారమే (నిర్ణయం చొప్పున) జరిగిస్తాడని అర్థమౌతుంది. అయితే, కొందరు విశ్వాసులు తమ  ప్రార్థనల్లో దేవునికి ఆదేశాలు‌ ఇస్తున్నట్టుగా హడావుడి చేస్తుంటారు. వీరి అవగాహనలో దేవునికి ఏం చేయాలో తెలియదు, వీరే ఆయనకు ఏం చెయ్యాలో చెబుతుంటారు, లేదా వీరు చెప్పినదానిని బట్టి దేవుడు తాను చెయ్యాలనుకున్న దానిని మార్చుకుంటూ ఉంటాడు. ఆవిధంగా దేవుడు కనుక ఒక విశ్వాసి ప్రార్థన మూలంగా తన చిత్తానుసారమైన నిర్ణయాన్ని మార్చుకుంటే ఆయన సార్వభౌముడు ఎలా ఔతాడు? మనిషి యొక్క ఆదేశాలపైన పనిచేసేవాడు ఔతాడు. బైబిల్ ప్రకటించే త్రియేక దేవుడు ఆ విధంగా తన చిత్తాన్ని మార్చుకోవడం అసాధ్యం, ఆయన ఎల్లప్పుడూ తాను చెయ్యాలని నిర్ణయించిన కార్యాలనే జరిగిస్తాడు.
 
యోబు 42: 2 నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని.
 
యెషయా 46: 10 నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెర వేర్చుకొనెదననియు, చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయు చున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియజేయుచున్నాను.
 
ఎఫెసీయులకు 1:12 ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
 
ఇప్పుడు మీలో చాలామందికి, దేవుడే తన చిత్తానుసారంగా అన్నీ చేసేటప్పుడు మనం ప్రార్థన చెయ్యడం/మనల్ని ప్రార్థన చెయ్యమనడం ఎందుకనే ప్రశ్న రావచ్చు. బైబిల్ గ్రంథంలో భక్తులు ప్రార్థించినప్పుడు ఆయన తాను చెయ్యాలనుకున్న కీడు చెయ్యకుండా సంతాపపడిన ఎన్నో సందర్భాలు జ్ఞాపకం రావచ్చు. అందులో వేటికీ నేనిక్కడ విరుద్ధంగా మాట్లాడటం లేదు, ఆ విషయం ఈ వ్యాసం పూర్తయ్యేసరికి మీకే అర్థమౌతుంది.
 
ఇప్పుడు బైబిల్ గ్రంథం నుండి మనందరమూ ప్రార్థన అనే అంశంలో చాలా ఎక్కువగా ప్రస్తావించుకునే ఒక సందర్భాన్ని చూద్దాం -
 
యాకోబు 5:17,18  ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే; వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరములవరకు భూమి మీద వర్షింపలేదు.  అతడు మరల ప్రార్థనచేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను.
 
ఈ సందర్భంలో ఏలీయా ప్రార్థనయొక్క ప్రాముఖ్యతను మనం చూస్తాం, దీని ఆధారంగానే మనం కూడా ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తుంటాం. అయితే, ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి పరిశీలించండి.
 
1 రాజులు 18:1 అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై-నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా-
 
ఈ అధ్యాయమంతటినీ మనం పరిశీలిస్తే, ప్రారంభంలోనే దేవుడు భూమిపై వర్షాన్ని కురిపించడానికి నిర్ణయించాడు, ఆ తరువాతే (42 వచనం) ఏలీయా దాని గురించి ప్రార్థన చేసాడు. ఇక్కడ ఏలీయా ప్రార్థన చేసాడు కాబట్టి వర్షం వచ్చిందా లేక, దేవుడు వర్షాన్ని రప్పించాలని ముందే నిర్ణయించాడు కాబట్టి ఏలీయా ప్రార్థన చేసాడా? రెండవదే వాస్తవమని లేఖనం చెబుతుంది. దేవుడు తన చిత్తానుసారమైన ఆ కార్యంలో, ఏలీయా యొక్క ప్రార్థనను సాధనంగా వాడుకున్నాడు. దీనిమూలంగానే, అది ఏలీయా ప్రార్థన వల్ల జరిగినట్టు యాకోబు పత్రికలో రాయబడింది.
 
మరొక సందర్భాన్ని కూడా చూడండి -
దానియేలు 9:1-3  మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయెను.  అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని. అంతట నేను గోనెబట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసికొని ఉపవాసముండి, ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని యెదుట నా మనస్సును నిబ్బరము చేసికొంటిని.
 
ఈ సందర్భంలో, యెరుషలేము పాడుగా ఉంటుందని దేవుడు చెప్పిన 70 సంవత్సరాలు పూర్తైన తరువాత దానియేలు దానియొక్క పునర్నిర్మాణం కోసం దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, ఆ తరువాతే యెరుషలేము మరలా నూతనంగా నిర్మించబడేలా రాజాజ్ఞలు జారీ అయ్యాయి‌. ఇంతకూ దానియేలు ప్రార్థన చేశాడు కాబట్టి, యూదులకు విడుదల లభించి యెరుషలేము నిర్మించబడిందా లేక, ఆయన ముందే 70 సంవత్సరాల తర్వాత ఆ విధంగా జరుగుతుందని చెప్పాడు కాబట్టి దానియేలు అలా ప్రార్థన చేసాడా? రెండవదే వాస్తవం. ఇక్కడ కూడా దేవుడు దానియేలు ప్రార్థనను సాధనంగా వాడుకుని తాను ముందు చేసిన నిర్ణయాన్ని‌ నెరవేర్చుకుంటున్నాడు.
 
మరొక సందర్భాన్ని కూడా చూడండి -
ఆదికాండము 15: 3-5 మరియు అబ్రాము ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చినీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పినీ సంతానము ఆలాగవునని చెప్పెను.
 
ఈ సందర్భంలో దేవుడు ఇస్సాకు గురించీ, అతని ద్వారా అబ్రాహాముకు కలుగబోయే సంతానం గురించీ జ్ఞాపకం చెయ్యడం మనం చూస్తాం. దేవుడు తన వాగ్దానం విషయంలో తప్పిపోవడం అసాధ్యమని మనందరికీ తెలుసు, పైగా ఈ విషయంలో ఆయన అబ్రాహాముతో ప్రాముఖ్యమైన ప్రమాణం కూడా చేసాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేస్తున్నాడో చూడండి.
 
ఆదికాండము 25: 21 ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన రిబ్కా గర్భవతి ఆయెను.
 
ఇక్కడ ఇస్సాకు చేసిన ప్రార్థన మూలంగానే అతని భార్య గర్భవతియై కుమారులను కన్నట్టు రాయబడింది. కానీ అది దేవుడు అబ్రాహాముకు చేసిన ప్రమాణం కదా! అంటే ఇక్కడ ఆయన ఇస్సాకు ప్రార్థనను ఆ ప్రమాణ నెరవేర్పుకు సాధనంగా వాడుకుంటున్నాడు. ఇస్సాకుకు కూడా దానిగురించి అర్థమైంది కాబట్టే, దేవుడు తన తండ్రితో చేసిన ప్రమాణాన్ని బట్టి నాకు ఎలాగైనా  పిల్లలు పుడతారులే అనుకోకుండా, తన ప్రార్థన ఆ ప్రమాణ నెరవేర్పుకు సాధనంగా మారుతుందని ప్రార్థించాడు.
 
అదేవిధంగా; ఆదికాండము 18వ అధ్యాయంలో అబ్రాహాము చేసిన ప్రార్థనను చూడవచ్చు. 
ఆ సందర్భంలో దేవుడు అబ్రాహాము ఇంటికి ఇద్దరు దూతలతో వచ్చి, అబ్రాహాము విందును స్వీకరించాక ఆ ఇద్దరు దూతలనూ సొదొమ పట్టణంలోని లోతు దగ్గరకు పంపి ఆయన మాత్రం అబ్రాహాము దగ్గరే ఉంటాడు. వాస్తవానికి ఆ సమయంలో అబ్రాహాము సొదొమ పట్టణం గురించి ప్రార్థించడానికి ముందే లోతును కాపాడటానికి ఇద్దరు దూతలను అక్కడికి ఆయన పంపించాడు. అంటే అబ్రాహాము ప్రార్థన చెయ్యకముందే లోతును కాపాడాలి అన్నది ఆయన చిత్తం.
 
2 పేతురు 2:7 దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను.
 
అయితే ఆ చిత్తనెరవేర్పుకు ఆయన అబ్రాహాము ప్రార్థనను సాధనంగా వాడుకున్నాడు, అందుచేతనే అబ్రాహాము ప్రార్థన చేసేదాకా అతన్ని ప్రేరేపిస్తూ అతని దగ్గరే ఉన్నాడు‌.
 
ఆదికాండము 19:29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.
 
ఈవిధంగా ప్రార్థన దేవుని‌ యొక్క చిత్తాన్ని మార్చదు కానీ, ఆయన చిత్తం నెరవేరేందుకు సాధనంగా మారుతుంది. అన్నిటినీ తన చిత్తానుసారంగా నిర్ణయించిన దేవుడు, ఆ నిర్ణయించిన కార్యాన్ని నెరవేర్చేందుకు సాధనంగా ప్రార్థనను కూడా నిర్ణయించాడు. విశ్వాసులైనవారు దేవుని ఆత్మతో ప్రార్థన చేస్తారని‌ లేఖనం చెబుతుంది.
 
1 కోరింథీయులకు 14:15  కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును.
 
రోమీయులకు 8:26,27  అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్దుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు.
 
మనలో ఉన్న పరిశుద్ధాత్ముడికి దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం తెలుసు కాబట్టి ఆ నిర్ణయం నెరవేరడానికి మన ప్రార్థన సాధనంగా మారేలా మనకు సహాయపడతాడు.  ఇందునిమిత్తమే మనం ప్రార్థన చేయాలి. మనంతట మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనలో మన స్వార్థం మాత్రమే ఉంటుంది, అందుకే "మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు."
 
నిజమైన విశ్వాసి యొక్క ప్రార్థనలు, అవి తన గురించైనా, ఇతరుల గురించైనా దేవుని నిర్ణయానికి సాధానాలుగా మారేందుకై పరిశుద్ధాత్మ సహాయంతో చెయ్యబడతాయి. వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే మనకు కొన్నిసార్లు కొన్నిటి గురించి, కొందరు వ్యక్తుల గురించి ప్రార్థన చేయాలనే భారం కలుగుతుంది; ఆ సమయంలో మనం చేసిన ప్రార్థన నెరవేరుతుంది. ఇదంతా కూడా ఆయన నిర్ణయానికి‌ మన ప్రార్థనలను సాధనాలుగా వాడుకోవడమే.
 
ఉదాహరణకు, దేవుడు ముందుగానే కొందరిని రక్షణకు పాత్రులుగా నిర్ణయించాడు (రోమా 8:29,30, ఎఫెసీ 1:5-12, అపో.కార్యములు 13:48) అలా నిర్ణయించబడినవారిని ఆయన సువార్త అనే సాధనం ద్వారా తగిన సమయంలో తన దగ్గరకు (రక్షణలోకి) తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా ఆయన విశ్వాసుల ప్రార్థనలను కూడా సాధనాలుగా వాడుకుని తన చిత్తాన్ని‌ నెరవేర్చుకుంటాడు (మార్చుకోడు). దేవుని చిత్తనెరవేర్పుకు నీ ప్రార్థనను కూడా ఆయన సాధనంగా నిర్ణయించాడు కనుకనే నువ్వు ప్రార్థన చేయాలి; అలా చెయ్యాలనే భారం నీకు లేకుంటే, నీకు దేవునికీ ఉన్న సహవాసంలో ఏదో పెద్దలోపం ఉందని అర్థం.
 
కాబట్టి ప్రార్థన అనేది దేవుని‌ చిత్తాన్ని మార్చడానికో,  ఆయనకు ఆదేశాలు ఇవ్వడానికో కాదని, ఆయన‌ నిర్ణయించిన చిత్తం నెరవేరడానికి సాధనమే అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.
 
1 యోహాను 5:13,14 ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.  మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము.
 
ఈ మాటల ప్రకారం, మన ప్రార్థన ఆయన చిత్తానుసారంగా ఉండాలి కానీ ఆయన చిత్తాన్ని మార్చేలా ఉండకూడదు. సాధారణంగా కొన్నిసార్లు ప్రార్థనలో మనం మనకు కావలసినవాటి కోసం తొందరపడే అవకాశం ఉంది, అటువంటి సమయంలో తప్పకుండా నీ చిత్తమైతే దీనినిచెయ్యి ప్రభువా అని అడగటం చాలా ప్రాముఖ్యం. ఆ మాటలు మనం దేవునికి ఆదేశాలు ఇస్తున్నట్టుగా కాకుండా ఆయన చిత్తనెరవేర్పుకు మన ప్రార్థనను సాధనంగా చేస్తున్నామని ఒప్పుకుంటున్నట్టు ఉంటాయి.
 
అదేవిధంగా, బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలలో భక్తులు ప్రార్థిస్తే దేవుడు తన చిత్తాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తుంది, అదే నిజమైతే, మారిపోయే (తొందరపాటు) నిర్ణయాలు తీసుకునే మనిషిలా దేవుణ్ణి కూడా చూడవలసి వస్తుందేమో? అటువంటప్పుడు ఆయనను సార్వభౌమునిగా భావించడంలో పెద్ద సమస్య తలెత్తుతుంది. కానీ ఇది అసాధ్యమని మనందరికీ తెలుసు.
 
మరి భక్తులు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు తన తీర్పు విషయంలో సంతాపపడిన సందర్భాలను ఎలా అర్థం చేసుకోవాలి? లేఖనాలలో అలాంటి ప్రతీ సందర్భాన్ని పరిశీలించినప్పుడు తన తీర్పునుండి ప్రజలను తప్పించడానికి ఆ భక్తులు ప్రార్థించేలా ఆయనే వారిని ప్రేరేపించి ఆ ప్రార్థన ద్వారా తన ఉగ్రతనుండి ప్రజలను కాపాడినట్టుగా అర్థమౌతుంది. ఇది మనం మాట్లాడుకుంటున్న అంశానికి ప్రతికూలంగా లేదు కానీ, అనుకూలంగానే ఉంది.
 
ఉదాహరణకు;
 
నిర్గమకాండము 32:7-14  కాగా యెహోవా మోషేతో ఇట్లనెనునీవు దిగి వెళ్లుము; ఐగుప్తుదేశమునుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవనుండి త్వరగా తొలగిపోయి తమకొరకు పోతపోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తుదేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను. మరియు యెహోవా ఇట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను; ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము; నా కోపము వారిమీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా- మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములోనుండి రప్పించిన నీ ప్రజలమీద నీ కోపము మండనేల? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడుకొరకే వారిని తీసికొనిపోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడుచేయక దానిగూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రాహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో ఆకాశనక్షత్రములవలె మీ సంతానము అభివృద్ధిజేసి నేను చెప్పిన యీ సమస్తభూమిని మీ సంతానమునకిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణముచేసి చెప్పితివనెను. అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. 
 
ఈ సందర్భాన్ని‌ మనం చదివినప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన పా‌పం నిమిత్తం‌ దేవుడు వారిని చంపాలనుకుంటుంటే, మోషే అడ్డుపడి ఆయనకు కొన్ని‌ విషయాలను జ్ఞాపకం చెయ్యగా,  వెంటనే ఆయన ఔను మోషే చెబుతుంది నిజమే కదా అనుకుంటూ సంతాపపడినట్టుగా అనిపిస్తుంది. అంటే, మన దేవునికి‌ కాస్త క్షణికావేశం ఉండి, మోషేకు ఉన్న సాత్వికం, ఆలోచన కూడా ఆయనకు లేదా?  అందుకే ఈ సందర్భాన్ని కాస్త వివరంగా పరిశీలిద్దాం. మొదటిగా, ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని వెంటనే నాశనం చెయ్యకుండా మోషేకు దాని గురించి తెలియచేస్తూ కిందకు దిగి వెళ్ళు అంటున్నాడు. ఆయన వారిని చంపాలని నిశ్చయించుకున్నపుడు మోషేను దిగి వెళ్ళమనడం ఎందుకు? మోషే దిగి వెళ్ళేది వారిని హెచ్చరించడానికే కదా. రెండవదిగా మోషే ఇంకా ఏమీ‌ మాట్లాడకముందే "ఊరకుండుము" అని దేవుడు అంటున్నాడు. ఇది, "మాట్లాడవేంటి" అంటూ విజ్ఞాపన చెయ్యడానికి మోషేను దేవుడు పురికొల్పుతున్నట్టుగా ఉంది. దేవుడు పలికిన ఆ మాటకు మౌనంగా ఉండమని అర్థం కాదని మోషేలో ఉన్న ఆత్మకు తెలుసు కాబట్టే, అతను ఇశ్రాయేలీయుల తరపున మొరపెడుతూ దేవుడు సంతాపపడేలా చేసాడు.
 
ఈ సందర్భంలో దేవుడు ఆవిధంగా సంతాపపడడమే ఆయన నిర్ణయం, దానికి ఆయన మోషేను ప్రార్థించేలా ప్రేరేపించి, దానిద్వారా ఆయన ఆ కీడు నిమిత్తం సంతాపపడుతున్నాడు. ఆమాత్రం దానికి  ఆయన వారిపైన కోపించడం ఎందుకనే సందేహం ఎవరికైనా తలెత్తితే అది పాపం పట్ల ఆయనకున్న అసహ్యతను సూచిస్తుందని తెలియచేస్తున్నాను. ఒకవేళ మోషే ప్రార్థన చెయ్యకుంటే, దేవుడు ఆ ప్రజలందరినీ నాశనం చేసేవాడా అంటే, అది ఆయన నిర్ణయం ‌కాదని‌ మనకు అర్థమౌతుంది. ఎందుకంటే, ఆ క్రిందఉన్న ప్రజల్లో ఒక గోత్రమైన యూదా గురించి ఆయన ప్రవచించిన మాటలు చూడండి.
 
ఆదికాండము 49:9,10  యూదా కొదమసింహము నా కుమారుడా, నీవు పట్టినదాని తిని వచ్చితివి సింహమువలెను గర్జించు ఆడు సింహమువలెను అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను అతని లేపువాడెవడు?  షిలోహు వచ్చువరకు యూదా యొద్దనుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు.
 
ఈ సందర్భంలో యాకోబు చెప్పిన ఈ ప్రవచనం యేసుక్రీస్తు గురించే - ఆయన యూదా గోత్రంలో పుడతాడని ఇది తెలియచేస్తుంది.
 
1దినవృత్తాంతములు 5:2 యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను.
 
ఒకవేళ దేవుడు క్రిందఉన్న ఇశ్రాయేలీయులందరినీ చంపేస్తే అందులో యూదాజాతి కూడా నశించి ఈ ప్రవచనం నెరవేరకుండా పోతుంది. మోషే ద్వారా విస్తరించేది లేవీ గోత్రమే తప్ప యూదా గోత్రం కాదు, మోషే ఒక లేవీయుడు. ఇలా మనం ఆలోచించి‌నప్పుడు, ఆ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయులను నశింపచేయాలన్నది ఆయన నిర్ణయం కాదని అర్థమౌతుంది. 
 
చివరిగా, తన పిల్లలందరికీ ఏ సమయంలో ఏం కావాలో ఆయనకు ముందే తెలిసినప్పటికీ, వారికి ఏమేం ఇవ్వాలో ఆయన ముందే నిర్ణయించినప్పటికీ, తగిన సమయంలో వాటిని వారు నోరారా అడిగేలా చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు; ఇది తండ్రికీ పిల్లలకూ ఉండే సంబంధం. అందుకే కొన్ని సమయాల్లో మనం అడగనివాటిని కూడా ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కొన్ని సమయాల్లో మన అవసరతలు, మన సహోదరుల అవసరతలు మనకు గుర్తు చేసి, వాటి నిమిత్తం ప్రార్థన చేసేలా మనలో భారం పుట్టించి తన నిర్ణయాన్ని నెరవేర్చుకుంటున్నాడు.
 
ఈ అంశం గురించి మరింత లోతుగా అధ్యయనం చెయ్యడానికి ఈ  వ్యాసం చదవండి.
 
దేవుని సార్వభౌమత్వం గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ  వ్యాసం చదవండి.
 
దేవుడు తన చిత్తప్రకారం ఈ సృష్టిలో అన్నిటినీ ముందే నిర్ణయిస్తే ఈ భూమిపై జరుగుతున్న పాపానికి కూడా ఆయనేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ  వ్యాసం చదవండి.
 
 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.