వేదాలలోని 33 దేవుళ్ళలో ఒకరైన ప్రజాపతి మరెవరో కాదు యేసు క్రీస్తే అని కొందరు బోధిస్తున్నారు. ప్రజాపతిని దేవుళ్ళందరూ కలిసి బలిగా అర్పించారని ప్రజాపతి దేవుని కుమారుడైన యేసే అని నిస్సందేహంగా నిరూపించడానికి దోహదపడే అనేక లక్షణాలు అతనిలో ఉన్నాయని వారు చెబుతారు. ఈ దుర్భోధను లోతుగా పరిశీలించే ముందు, ఆర్యుల పవిత్ర గ్రంథాలతో కాస్త పరిచయం ఏర్పడటం అవసరం.
ఆర్యుల పవిత్ర గ్రంథాలు
ఋగ్వేదం:
భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు, భారతదేశంలోని స్థానిక నివాసులైన ద్రావిడులను ఓడించాలనుకున్నారు. ఆ విషయంలో తమకు సహాయం చెయ్యమని తమ దేవుళ్ళను వేడుకోవడం కోసం కొన్ని శ్లోకాలను కల్పించారు. దాదాపుగా ఇప్పుడున్న ఋగ్వేదంలోని శ్లోకాలన్నీ ఇంద్రుడు, అగ్ని, పూషన్ (పుఘన్), వరుణుడు మొదలైన దేవుళ్ళను కీర్తించే శ్లోకాలే. క్రైస్తవులమైన మనకు దీనితో ఏ సంబంధమూ లేదు.
యజుర్వేదం:
ఇందులో ప్రధానంగా దేవుళ్ళకు బలులు అర్పించేటప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలు ఉంటాయి. తాము సమర్పించిన బలిని దేవుళ్ళు తినేవారని, అగ్నిదేవుడు ఆ ఆహారాన్ని స్వర్గానికి తీసుకెళ్ళేవాడని ఆర్యులు భావించేవారు.
సామ వేదం:
ఈ గ్రంథంలో ఎక్కువగా ఋగ్వేదం నుండి తీసుకోబడిన శ్లోకాలే ఉంటాయి. ఇతర వేదాలలో లేనివి, ఇందులో మాత్రమే ఉన్న శ్లోకాలు కొన్నే ఉంటాయి.
అథర్వ వేదం/ అథర్వణ వేదం:
ఇతర ప్రాచీన ప్రజల మాదిరిగానే ఆర్యులు కూడా మంత్రాలవంటి వాటిని బాగా నమ్మేవారు. అథర్వ వేదంలో అలాంటి విషయాలే ఉంటాయి. మంత్రాల కోసమూ శాపాలు పెట్టడం కోసమూ ఈ వేదాన్నే ఈ రోజుకూ వినియోగిస్తున్నారు.
బ్రాహ్మణాలు:
ప్రతి వేదానికి భాష్యం కూడా ఉంటుంది. ఆ భాష్యాన్నే బ్రాహ్మణాలు అని పిలుస్తారు. ప్రజాపతి అనే ఈ అవాంతర శాఖకు సంబంధించిన కొన్ని ప్రధాన బోధలు ఈ బ్రాహ్మణాల నుండే తీసుకున్నారు. వాటిలో ఐతరేయ బ్రాహ్మణం మరియు శతపథ బ్రాహ్మణం ముఖ్యమైనవి.
అరణ్యకాలు:
'అరణ్యం' అనే సంస్కృత పదానికి 'అడవి' అని అర్థం. అరణ్యకాలు అనేవి అడవిలో ఉన్నప్పుడు మాత్రమే పఠించాల్సిన శక్తివంతమైన మంత్రాలు. మానవ నివాస ప్రాంతంలో వాటిని వల్లిస్తే రాక్షసులు వినాశనం కలిగిస్తారు.
ఉపనిషత్తులు:
కనుగొనబడ్డ ఉపనిషత్తులు వంద కంటే తక్కువే ఉంటాయి కానీ అవి వేల సంఖ్యలో ఉన్నాయని నమ్ముతారు. ఉపనిషత్తులలో తాత్విక సంభాషణలు ఉంటాయి.
ఇతర గ్రంథాలు:
ఈ గ్రంథాలతో పాటు, హిందువులు పవిత్ర గ్రంథాలుగా భావించే ఇతర గ్రంథాలు ఇంకా చాలానే ఉన్నాయి. రామాయణం, మహాభారతం, మహాభారతంలోని ఒక భాగమైన గీత, 18 పురాణాలు మరియు 18 ఉపపురాణాలు మొదలైనవి.
‘ప్రజాపతే క్రీస్తు’ అనే దుర్బోధ దశాబ్దాల క్రితం నుండే ఉనికిలో ఉన్నప్పటికీ అది కొన్ని సంవత్సరాల క్రితమే ఊపందుకుంది. పండితులమని చెప్పుకునే వీరిలో కొందరు ఇటీవల ప్రాచీన ఆర్యుల దేవుడైన ప్రజాపతిని తమ ప్రభువుగానూ రక్షకుడిగానూ అంగీకరించడంతో ఈ దుర్బోధ ఒక అవాంతర శాఖగా పరిణమిల్లింది. ఈ పండితులు చెప్పిన అబద్ధాల వల్ల సామాన్యులెందరో మోసపోయారు.
ప్రజాపతిలో ఉండే ఈ క్రింది లక్షణాలు యేసు క్రీస్తులో కూడా కనిపిస్తున్నాయి అని చెబుతారు.
వేదాలలోని ప్రజాపతిలో కనిపించే కొన్ని లక్షణాలు యేసుక్రీస్తులో కూడా కనిపిస్తున్నాయన్నదే ఈ అవాంతరశాఖ యొక్క ప్రధాన దుర్భోధ. సమస్త విశ్వానికి కర్త అయిన దేవుడు, మానవాళి యొక్క మోక్షానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళికను ఆర్యులకు వెల్లడించాడని వీరు చెబుతారు. కానీ అన్యజనులలో ఎవరికీ అలాంటి ప్రత్యక్షత ఇవ్వబడలేదని బైబిల్ చెబుతోంది. దేవుని వాక్యం యూదులకు మాత్రమే బయలుపరచబడింది (కీర్తన 147:19,20, రోమా 3:1, 2). వాదన కోసం, దేవుని వాక్కు ఆర్యులకు ప్రత్యక్షపరచబడింది అని ప్రజాపతి భక్తులతో సమ్మతించినప్పటికీ అది ఈ సమస్యను ఏ మాత్రమూ పరిష్కరించదు. ఎందుకంటే యేసుక్రీస్తులో ఉన్న ఏ లక్షణాలైతే ప్రజాపతిలో ఉన్నాయని వారు చెబుతున్నారో అవన్నీ అబద్ధాలే.
ప్రజాపతి పాపరహితుడా?
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఏ పాపమూ చెయ్యలేదు. వేదాలలోని ప్రజాపతి కూడా పాపరహితుడైతే ఆ ప్రజాపతి క్రీస్తే అని చెప్పడానికి అదొక మంచి రుజువుగా పనిచేస్తుంది. కాబట్టి, ప్రజాపతిని పాపరహితుడిగా చూపించడానికి ఈ అవాంతశాఖవారు శాయశక్తులా ప్రయత్నించారు. వారు వేదాలు మరియు ఉపనిషత్తుల నుండి కొన్ని భాగాలను తీసుకుని ప్రజాపతి పాపరహితుడే అని తీర్మానించేసారు. అయితే, వాస్తవం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఉదాహరణకు, ఐతరేయ బ్రాహ్మణం: 3.2.9 చూడండి.
ప్రజాపతి తన సొంత కూతుర్ని భార్యగా చేసుకోవాలనుకుంటాడు, ఇది తెలిసిన ఇతర దేవుళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాంటి పాపం చెయ్యకుండా ప్రజాపతిని అడ్డుకోవాలని ఇతర దేవుళ్ళు ప్రయత్నించారు. కానీ అతను వారి మాట వినలేదు. దానితో దేవుళ్ళు కోపోద్రిక్తులై ప్రజాపతిని చంపాలని ప్రయత్నించారు, కానీ చంపలేకపోయారు. అందుకని వారంతా ఏకమై రుద్రుణ్ణి సృష్టించారు. ఆ రుద్రుడు ప్రజాపతిని చంపడంలో విజయం సాధించాడు.
ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే: తన సొంత కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవుళ్ళచేత చంపబడిన ఈ ప్రజాపతిని యేసుక్రీస్తుగా పరిగణించవచ్చా? అతని మరణానికీ మన ప్రభువు త్యాగానికీ ఏమైనా సంబంధం ఉందా? అలాంటివాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తే అని ప్రచారం చేసే స్థాయికి ఎవరైనా ఎలా దిగజారగలరు?
అయితే అబద్ధానికి జనకుడు మరియు మోసగాడు అయిన దుష్టుడు, వేదాలలో చాలామంది ప్రజాపతులు ఉన్నారని తన కుమార్తెతో వ్యభిచారం చేసినవాడు విశ్వానికి సృష్టికర్త అయిన పురుష ప్రజాపతి కాదని తన అనుచరుల చేత చెప్పిస్తాడు. అయితే ఇదే బ్రాహ్మణంలోని తదుపరి శ్లోకాలను పరిశీలిస్తే మనిషిని సృష్టించిన పురుష ప్రజాపతి ఇతనే అని స్పష్టంగా చెప్పబడింది కనుక ఈ వాదనలో పసలేదు. ప్రజాపతి వీర్యం ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల స్త్రీ దానిని పట్టుకోలేకపోయిందనీ అలా కిందపడిన వీర్యం ఒక సరస్సు అయ్యిందనీ దాని నుండే మనిషి ఉనికిలోకి వచ్చాడనీ ఒక బ్రాహ్మణంలో చెప్పబడింది. ఇప్పుడు చెప్పండి! ఇతను కాదా అసలు ప్రజాపతి?
అదనంగా బృహదారణ్యక ఉపనిషత్తు ప్రజాపతి యొక్క పాపం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తుంది. చూడండి: 1. 4. 2 - 4. ప్రజాపతి ఒంటరిగా ఉన్నప్పుడు, అతను భయపడ్డాడు. అతను తన శరీరాన్ని రెండుగా విభజించాడు. ఒక సగభాగం పురుషుడు అయితే మరో సగభాగం స్త్రీ అయ్యింది. వారి కలయిక నుండి, మానవులు ఉనికిలోకి వచ్చారు. స్త్రీ ప్రజాపతిని ఇష్టపడకుండా పారిపోయి ఆవు రూపాన్ని ధరించింది. అప్పుడు ప్రజాపతి ఎద్దుగా మారి ఆమెతో కలిసాడు. ఆవులు ఈ విధంగా సృష్టించబడ్డాయి. ఆ స్త్రీ తర్వాత అన్ని రకాల జంతువులూ పక్షులూ మొదలైన వాటి రూపాలను ధరించింది మరియు ప్రజాపతి కూడా తదనుగుణంగా మారిపోయాడు. జీవరాశులన్నీ ఈ విధంగానే ఆవిర్భవించాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే: ఈ ప్రజాపతి మరియు యేసు ఒకరేనా? అస్సలు కానే కాదు!
ముళ్ళ కిరీటం
యేసుకు ముళ్ళ గుచ్ఛంతో పట్టాభిషేకం చేశారు. ప్రజాపతికి కూడా అలాంటి అనుభవం ఉందని నిరూపించగలిగితే ప్రజాపతే క్రీస్తు అని నిరూపించడం సులభతరం ఔతుంది. కాబట్టి ప్రజాపతి భక్తులు అలాంటిదేదో గుర్తించడానికి వారి స్థాయిలో వారు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. చివరికి బలిచ్చే గుర్రాన్ని స్తంభానికి కట్టడానికి వాడే గడ్డి తాడుతో వారు సంతృప్తి చెందాల్సి వచ్చింది.
శతపథ బ్రాహ్మణం ప్రకారం బలిచ్చే అశ్వాన్ని గడ్డి మరియు వండిన అన్నంతో తయారు చేసిన తాడుతో స్తంభానికి కట్టాలి. నిజానికి యేసుకు ధరింపచేసిన ముళ్ళ కిరీటానికీ దీనికీ ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అపవాది అజ్ఞానులను మోసగించడానికి దానిని ఉపయోగించాడు. గుర్రం ప్రజాపతి ఐతే ఆ ప్రజాపతి ఎప్పటికీ యేసు కాలేడు ఎందుకంటే గుర్రం యొక్క ఇతర లక్షణాలు యేసులో కనిపించవు. ఉదాహరణకు బలి ఇవ్వడానికి ముందు గుర్రానికి స్నానం చేయించేవారు. అలా చేయించేటప్పుడు చనిపోయిన కుక్కను దాని కాళ్ళ మధ్య నుండి దాటించాలి. అంతేకాదు, గుర్రాన్ని చంపే పద్ధతి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుర్రాన్ని ఊపిరాడకుండా చేసి చంపేస్తారు. ఈ లక్షణాలు యేసుతో సరిపోలడం లేదు!
ఇదంతా ఒకెత్తు, అతి చండాలమైన మరి కొన్ని సంగతులు ఉన్నాయి. గుర్రాన్ని చంపిన తర్వాత దాని శరీరాన్ని గుడ్డతో కప్పుతారు. అశ్వాన్ని బలి అర్పించే వ్యక్తి యొక్క భార్య, గుర్రంతో సంభోగం చెయ్యడం కోసం గుర్రం యొక్క మృతదేహంతో పడుకుంటుంది. ఇది సూర్యోదయం వరకు కొనసాగుతుంది. ఈలోగా భార్యాభర్తలు ఇద్దరూ బూతులు మాట్లాడుతూ ఒకరినొకరు దూషించుకుంటారు. ఇప్పుడు మరోసారి అసలైన ప్రశ్న : ఈ గుర్రం మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తుకు ఛాయగా ఉందా? కానే కాదు.
తిరస్కరణ
నిజానికి ఇందులో పెద్దగా పట్టించుకోవాల్సిన విషయాలు ఏమీ లేవు. ఒక వ్యక్తిని లేదా జంతువును తిరస్కరించకుండా బలి ఇవ్వలేము. యేసు సమస్తాన్నీ తిరస్కరించాడు మరియు తనను తాను బలిగా అర్పించుకున్నాడు. జంతువుల విషయంలో ప్రజలు ముందుగా దానిని తిరస్కరించి తర్వాతే దానిని బలిగా అర్పిస్తారు. ఎవ్వరైనా ఇలాగే చెయ్యాలి, ఎందుకంటే ఇలా కాకుండా వేరే విధంగా ఎవ్వరూ చెయ్యలేరు. అయితే ప్రజాపతి భక్తులు దీనిని ఒక విచిత్రమైన విషయంగా మార్చారు ఎందుకంటే ఐతరేయ బ్రాహ్మణంలో దాని బంధువుల సమ్మతితో ఒక ఆవు బలిగా అర్పించబడుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సమస్యలు ఇవే:
1. అది ప్రజాపతి కాదు, ఒక ఆవు.
2. ఆవు తిరస్కరించబడదు, కానీ దాని బంధువుల అనుమతితోనే అర్పించబడుతుంది.
3. ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం ఆవు మెదట్లో అయిష్టంగా ఉంది మరియు భయపడుతోంది. కానీ యేసు అయిష్టంగానూ లేడు, భయపడడమూ లేదు.
4. ఆవును ఊపిరాడకుండా చేసి చంపేస్తారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే ఆవు ఏ విధంగానూ యేసుక్రీస్తు కాదు.
; మౌనంగా వేదన అనుభవించాడు
యేసు తనను తాను బలిగా అర్పించుకున్నాడు మరియు ఇష్టపూర్వకంగానే ప్రతిదీ అనుభవించాడు. కాబట్టి ప్రజాపతి కూడా అలాంటిదే చేశాడని చూపించాలి. చాలా శోధించిన తర్వాత, అపవాది ఋగ్వేదం 5.46లో అలాంటిదేదో కనుగొన్నాడు. "ఒక గుర్రం లాగా బుద్ధిపూర్వకంగానే నన్ను నేను గడ కర్రకు కట్టించుకున్నాను. నేను విడుదల పొందడాన్ని కానీ వెనక్కి తిరగడాన్ని కానీ ఆశించలేదు". ప్రజాపతి ఎప్పుడైనా అలా మాట్లాడి ఉంటే మంచిదే. కానీ అతను ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఆ సందర్భంలో ఆ మాటలు మనకు ఏం తెలియచేస్తున్నాయి? ఋగ్వేదం. 5.46కూ ప్రజాపతికీ ఏ సంబంధమూ లేదు. ఆ సూక్తం రాసింది ప్రతిఖాత్ర అనే వ్యక్తి మరియు ఆ మాటలు అతను తన గురించి చెప్పినవి. ఒక గుర్రంలాగా గడ కర్రకి కట్టబడినది ప్రతిఖాత్రుడు, ప్రజాపతి కాదు. అయితే వేదాల మొహమే చూడని ప్రజలను అపవాది మోసం చేస్తున్నాడు. చాలామంది ప్రజలు వేదాలు చదివి వాస్తవాన్ని ధృవీకరించలేరని వాడికి తెలుసు.
అంతేకాకుండా ప్రజాపతి భక్తులు మిగిలిన సూక్తాలను ఉటంకించే సాహసం ఎప్పుడూ చెయ్యరు. ఎందుకో మీకు తెలుసా? కొందరు ప్రజాపతి భక్తులు వేదాలలో ఒకే దేవుడు ఉన్నాడని మరియు అది ప్రజాపతే అని ప్రచారం చేస్తున్నారు. మనలను రక్షించగలిగేది ప్రజాపతి ఒక్కడే అని వేదాలు చెబుతున్నాయని వీళ్ళు అంటారు. అయితే మిగిలిన సూక్తాలను ఎవరైనా చదివితే ఈ వాదన అబద్ధమని తేలిపోతుంది. ప్రజాపతిని వేడుకున్న విధంగానే, రక్షణ కోసం, మోక్షం కోసం ఇతర దేవుళ్ళైన అగ్ని, ఇంద్రుడు, వరుణుడు, మిత్ర, విష్ణువు, మరుత్తులు, రుద్రుడు, పుఘవలను మరియు ఆ దేవతల భార్యలందరినీ వేడుకునే సూక్తాలు వేదాల్లో చాలా ఉన్నాయి. ఇతర దేవతలను మహిమపరచడానికే రాయబడిన ఈ సూక్తాలకీ యేసుక్రీస్తుకీ ఏ సంబంధమూ లేదు.
సిలువతో పొంతనలేని గడకర్ర
వేదాలలో సిలువ గురించి ఏ విధమైన ప్రస్తావన లేదు. అయితే ప్రజాపతిని సిలువ వెయ్యడానికి వేదాలలోకి ఏదో విధంగా సిలువను తీసుకురావడం అవసరం. అందుకే అన్వేషణ ప్రారంభించబడింది, చివరికి ఏదో కనుగొనబడింది. బలిపశువును ఒక గడకర్రకి కట్టేవారు. నిజానికి ఇందులో అసాధారణంగా ఏమీ లేదు. జంతువును దేనికైనా కట్టకపోతే అది పారిపోతుంది కదా ! ఈ రోజుల్లో కూడా కటికవాళ్ళు జంతువులను చంపడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కానీ కొందరు ప్రజాపతి భక్తులు ఈ విషయాన్ని ఒక విశేషమైన అంశంగా చిత్రీకరిస్తున్నారు; ఎందుకంటే ఈ విధంగా అజ్ఞానులను తేలిగ్గా మోసం చేసే అవకాశం ఉంది. వేదాలలో యుప అనే గడకర్ర దేవుడిగా పరిగణించబడుతున్నప్పటికీ (ఋగ్వేదం. 3:8) ప్రజాపతి భక్తులు దీనిని మాత్రం ఎప్పుడూ ప్రస్తావించలేదు.
ఈ జంతువు గడకర్రకి కట్టివెయ్యబడింది కానీ యేసు మేకులతో సిలువకు కొట్టబడ్డాడు. దేవుడైన ఆ గడకర్రకీ సిలువకూ ఏ సంబంధమూ లేదు.
రక్తం
రక్తం చిందించకుండా బలి అర్పించడం సాధ్యం కాదు. బలి అర్పించేటప్పుడు రక్తం చిందించడం ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. తన సొంత కూతురితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు దేవతలచే చంపబడిన ప్రజాపతి యొక్క రక్తం చిందించబడి ఉండవచ్చు, కానీ దురదృష్టవశాత్తూ వేదాలలో అది ప్రస్తావించబడలేదు. కాబట్టి ఎక్కడో ఒకచోట కొంత రక్తాన్ని కనుగొనడం అవసరమని ఈ దుర్బోధకులు భావించారు. చివరకు బృహదారణ్యక ఉపనిషత్తులో రక్తం దొరికింది. ఇక్కడ మనిషిని ఒక చెట్టుతో పోల్చారు. మనిషి తలపై వెంట్రుకలు ఉన్నాయి, బదులుగా చెట్టుకు ఆకులు ఉన్నాయనీ చెట్టుకూ మనిషికీ చర్మం ఉంటుందనీ చెట్టు రసం మనిషి రక్తం లాంటిదనీ వర్ణించడం జరిగింది.
ఒక చెట్టును నరికితే గాయపడిన వ్యక్తి నుండి రక్తం కారినట్టు చెట్టు నుండి రసం కారుతుంది. ఇక్కడ ప్రజాపతి ప్రస్తావన లేదు. బలి అర్పణ ప్రస్తావన కూడా లేదు. కానీ అపవాది ఈ మాటల్లో కొన్నింటిని తేలిగ్గా మోసపోయేవారిని మోసగించడానికి ఉపయోగిస్తాడు.
ఎముకలు
యేసు ఎముకలు విరగగొట్టబడలేదు. కాబట్టి ప్రజాపతి ఎముకలు ఏ విధంగానూ విరగకుండా ఉంచడం మంచిది. కాబట్టి వక్రబుద్ధిగల అపవాది ఐతరేయ బ్రాహ్మణంలో ఏదో కనుగొన్నాడు. దాని బంధువుల సమ్మతితో బలి ఇవ్వబడిన ఒక ఆవు ఉంది. ఈ ఆవు శరీరం నుండి 26 ఎముకలను తీసి ఒక వరుసలో ఉంచారు. ఎముకలు విరిగాయో లేదో మనకు తెలియదు. అంతేకాకుండా ఇతర ఎముకలకు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పబడలేదు. అయితే అపవాదికి సంబంధించినంత వరకు ఇవన్నీ అనవసరం. ప్రజాపతికి ఎముకలు విరగలేదనే వాదన పుట్టించాడు.
పునరుత్థానం
హిందువుల ప్రకారం ఈ జీవితం మరణంతో ముగిసిపోదు. ఆత్మ ఒక రకమైన జంతువుగానో లేదా మానవుడిగానో ఈ లోకంలో మళ్ళీ పుడుతుంది. హిందువుల ఈ నమ్మకాన్ని కొందరు ప్రజాపతి భక్తులు అసందర్భంగా ప్రజాపతికి వర్తింపచేస్తూ అతను బలిగా అర్పించబడిన తర్వాత తిరిగి జీవం పోసుకున్నాడని చెప్తారు. బృహదారణ్యక ఉపనిషత్తులోని కొంత భాగాన్ని కూడా అసందర్భంగా వ్యాఖ్యానించారు (అంశం సంఖ్య 6 చూడండి). చెట్టును నరికితే మళ్ళీ చిగురిస్తుంది, బ్రతుకుతుంది.
కానీ ఒక మనిషి నరికివెయ్యబడినప్పుడు అతను మళ్ళీ ఎలా బ్రతుకుతాడు? అతను మళ్ళీ బ్రతుకుతాడు ఎలాగంటే అతని ఆత్మ మరో జన్మ తీసుకుని తిరిగి అవతరిస్తుంది. ఇక్కడ ప్రజాపతి గురించి కానీ ఏ బలి అర్పణ గురించి కానీ ప్రస్తావించబడలేదు. మనిషి కేవలం చెట్టుతో పోల్చబడ్డాడు. చాలా మందికి వేదాలలోని విషయాలు తెలియవు కాబట్టి సాతాను మరియు వాడి అనుచరులు అసత్యాలు ప్రచారం చెయ్యడం మరియు వేదాలలోని కొన్ని భాగాలను అసందర్భంగా ప్రయోగిస్తూ వారిని మోసం చేస్తున్నారు.
మనిషి యొక్క మాంసం
ఈ అబద్ధం ప్రభువు భోజనాన్ని వక్రీకరించేదిగా ఉంది. ఆర్యుల ప్రకారం, వారి దేవతలు తమ ఆహారం కోసం రుషులు అర్పించే బలి అర్పణలపై ఆధారపడేవారు. అందుకే ప్రజాపతి బలిగా అర్పించబడిన తర్వాత అతన్ని కూడా వారు తినేశారు. ఇది ప్రభువు భోజనానికి భిన్నమైనది. వేదాలలో ప్రజాపతిని దేవుళ్ళు చంపి తిన్నారు కానీ క్రైస్తవ మతంలో యేసు మరణానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షారసాలను భుజించేది ఆయనను చంపిన యూదులు కాదు ఆయనను విశ్వసించిన క్రైస్తవులు.
అంతేకాదు, బలి అర్పించిన జంతువుల మాంసాన్ని తినడంలో ప్రత్యేకత ఏమీ లేదు ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అలాంటి ఆచారం ప్రపంచమంతటా చాలా చోట్ల ఉంది. కాబట్టి ప్రజాపతి మాంసాన్ని దేవతలు తినడం అనేది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయమే కాదు.
ప్రజాపతి యొక్క వస్త్రం
ప్రజాపతి భక్తులలో కొందరు ప్రజాపతి వస్త్రాలు నలుగురు పూజారులు పంచుకున్నారని అబద్ధం చెబుతారు. అలాంటి సంఘటన ఎక్కడ ప్రస్తావించబడిందో మాత్రం ఎవరూ చెప్పలేదు. కొన్ని ప్రజాపతి వర్గాలు కూడా ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నాయి. అయినప్పటికీ భారతదేశంలోని అతిపెద్ద పెంతెకొస్తు డినామినేషన్ వారు తమ సండే స్కూల్ పాఠ్యపుస్తకాలలో ప్రజాపతి గురించీ అతనిలో ఉన్న అనేక లక్షణాల గురించీ ప్రస్తావించారు!
చిరిగిపోని వస్త్రం
ప్రజాపతి వస్త్రం చిరిగిపోలేదనే మరో అబద్ధం కూడా ఉంది. హిందూ గ్రంథాలలో అలాంటి ప్రస్తావన ఏదీ లేదు. ఆవు చర్మం (ఐటెమ్ నం. 3 & 7 చూడండి) చిరిగిపోకుండా తొలగించబడింది కాబట్టి ప్రజాపతి వస్త్రం చిరిగిపోలేదని నిస్సందేహంగా రుజువు చెయ్యబడినట్టు వారు వాదిస్తారు. అయితే ఆవు చర్మం చిరిగిందా లేదా అనేది ఏ గ్రంథాలలోనూ ఎక్కడా పేర్కొనబడలేదు. ఒకవేళ ఆవు చర్మం చిరిగిపోకపోయినా ప్రజాపతి వస్త్రాన్ని చిరిగిపోలేదనడానికి అది రుజువు కాదు ఎందుకంటే చర్మం వస్త్రం కాదు మరియు ఇక్కడ ప్రజాపతి లేడు, ఆవు మాత్రమే ఉంది.
సిలువకు వ్రేలాడదీశారా?
ప్రజాపతి యొక్క చేతులు మరియు కాళ్ళు స్తంభానికి మేకులతో కొట్టబడినట్టు ప్రజాపతి భక్తులకు బాగా తెలుసన్నట్టు మాట్లాడతారు కాని వేదాలలో ఆ సంఘటన ఎక్కడ ఉందో ఎవ్వరూ చూపించలేరు. అయితే అది వారికి పెద్ద విషయం ఏమీ కాదు. ప్రజాపతి చేతులు మరియు కాళ్ళు సిలువకు కొట్టబడ్డాయి మరియు ఈ కారణంగా ప్రజాపతి క్రీస్తే అని వారు ఇప్పటికీ ప్రకటిస్తారు మరియు బోధిస్తారు.
సోమరసం
ఆర్యులు ఒక రకమైన రసాన్ని ఒక విధమైన మత్తు పానీయంగా తయారుచేసికొని తాగేవారు. దేవతల రాజుకు అర్పించబడే సోమరసం 'గొప్ప సోమపానీయం'గా ప్రశంసించబడింది. కానీ ప్రజాపతి సోమరసం తాగినట్టు కాని, అలాంటి పానీయం అందించిన జంతువు కాని ఎక్కడా ప్రస్తావించబడలేదు. అయినప్పటికీ ప్రజాపతి బలిగా అర్పించబడినప్పుడు ఆయన చేత సోమరసాన్ని తాగించారనే అబద్ధాన్ని ప్రచారం చెయ్యడానికి అపవాది తన సేవకులను ఉపయోగిస్తున్నాడు. భారతదేశంలోని ఒక గొప్ప పెంతెకొస్తు చర్చివారు వారి సండే స్కూల్‌లో బోధించడం కోసం సండే స్కూల్ పాఠ్యపుస్తకంలో ఈ అబద్ధాన్ని (మిగిలినవాటితో పాటు) ప్రచురించారు.
కన్యక కుమారుడా?
ప్రజాపతి సేవకులలో కొందరు వేదాలలో కనబడే తమ ప్రభువైన ఆ ప్రజాపతి ఒక కన్యక కుమారుడని బోధిస్తారు. ఈ విషయం వేదాలలో లేదా ఇతర హిందూ గ్రంథాలలో ఎక్కడ నమోదు చెయ్యబడిందో ఎవ్వరూ చెప్పలేరు. వాస్తవానికి, వేదాలలో ఇలాంటిది ఏమీ ప్రస్తావించబడలేదు.
ఉనికిలో లేని శ్లోకాలు
వేదాలలో కనిపించే శ్లోకాలకు ఇచ్చిన తప్పుడు వివరణలతో పాటు చాలా మంది ప్రజాపతి భక్తులు కొత్త శ్లోకాలను తయారుచేసి వాటిని వేద మంత్రాలుగా వ్యాప్తి చేస్తున్నారు . ఉదాహరణకు, కన్య కుమారుడిని (ఓం శ్రీ కన్యక సుధాయ నమః) స్తుతించడంతో ప్రారంభమయ్యే ప్రసిద్ధ శ్లోకం ఏ వేదంలోనూ కనిపించదు. ఉత్తర భారతీయ బ్రాహ్మణులు స్నానం చేస్తున్నప్పుడు జపిస్తారని చెప్పబడే మంత్రం (పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవమ్) కూడా పచ్చి అబద్ధం. అలాగే మనందరికీ బాగా సుపరిచితమైన ‘సర్వపాప పరిహారో రక్తప్రోక్షణం ఆవశ్యకం తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం’ అనే శ్లోకం పాండ్య మహాబ్రాహ్మణ్యంలోనో ఎక్కడో ఉందని చెప్తారు. ఇలాంటి అబద్ధాలను కల్పిత శ్లోకాలను పరవస్తు సూర్యనారాయణ, పండిత సి హెచ్ ఫ్రాన్సిస్ తదితర పేరెన్నికగల “పండితులు” ప్రాచుర్యంలోనికి తెచ్చారు. ఈ కారణాన్ని బట్టి మూల గ్రంథాలను పరిశీలించకుండా చాలా మంది అవి నిజంగానే ఉన్నాయని భ్రమపడుతున్నారు. ఇలాంటి అబద్ధ ప్రచారాలు వాస్తవానికి స్వామి వివేకానంద నుండి ప్రారంభమయ్యాయి. యోహాను 1:1లో ఉన్న “వాక్యం” పురుష సూక్తంలో ఉన్న ఓంకార ప్రణవ నాదమే అని ఆయన తన రచనలలో ప్రకటించుకున్నాడు. ఇక అదే తడవుగా మనవాళ్ళు కూడా ఉన్నవీ లేనివీ కలిపి క్రీస్తుకూ వేదాలకూ ముడిపెట్టే పనిలో పడ్డారు. ఈ వ్యాసంలో ఉన్న ఆధారాల వెలుగులో ప్రజాపతి అనే అవాంతరశాఖ ఒక అబద్ధం, అబద్ధాలపై స్థాపించబడింది, అబద్ధికులచే వ్యాప్తి చెయ్యబడుతుంది.
ముగింపు
దేవుని సంఘం యేసుక్రీస్తుకు ప్రధానం చెయ్యబడింది. క్రీస్తుయేసులో మనకున్న సరళత కోల్పోయిన వెంటనే మనం అపవిత్రమైనవారం అయిపోతాము (2 కొరింథీ 11:2,3). కొంతవరకు యేసును పోలి ఉన్నంతమాత్రాన, మనం వేరొకరిని యేసును అంగీకరించలేము. వేదాలలోని ప్రజాపతి బైబిల్లోని యేసుక్రీస్తు కాదని మనం ఇప్పటికే చూశాము. ప్రజాపతి యేసును పోలి ఉన్నప్పటికీ అతను వేరొక క్రీస్తే కాబట్టి మనం అతన్ని అంగీకరించలేము.
ఈ విషయంపై పౌలు ఏమి చెబుతున్నాడో చూడండి: "అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు." (1 తిమోతి 4:1-2). ఈ ప్రవచనం మన కళ్ళ ముందే ప్రజాపతి ఆరాధన రూపంలో నెరవేరుతోంది. ఈ రోజుల్లో సంఘ నాయకులు ఈ క్రీస్తు వ్యతిరేక ఆత్మను గుర్తించడంలో విఫలమయ్యారు. ఇవాంజెలికల్స్ అని పిలవబడేవారు సైతం ఈ ప్రమాదకరమైన అవాంతరశాఖకు చెందిన నాయకులను అంకితభావంతో ఉన్న మిషనరీలుగా ప్రతిచోటా అనుమతిస్తున్నారు.
"మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు." (1 కొరింథీ 10:21).
క్రీస్తు విరోధి ఆత్మను గుర్తించి, అతని సేవకులతో సహా అతన్ని గెంటివేయాల్సిన సమయం ఆసన్నమైంది.
గమనిక: ప్రజాపతి యేసుక్రీస్తు కాదు, అలాంటి అనైతిక జీవితం కలిగిన వ్యక్తులతో పరిశుద్ధుడైన యేసుక్రీస్తును పోల్చడం అత్యంత నీచం అని ఇంతలా వివరించినప్పటికీ కొందరు అపవాది సంబంధులు "మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానం" అని ఏథెన్స్ లో పౌలు గ్రీకు దేవుడైన జియూస్(Zeus) గురించి ఎపీమెనడస్, అరాటస్ లు పలికిన మాటలను ప్రస్తావించడాన్ని చూపించి జియూస్ కూడా అనైతిక చరిత్ర కలిగినవాడే, మరి పౌలు అతని గురించి రాయబడిన మాటలను బైబిల్ దేవునికి ఎందుకు ఆపాదించాడు? కాబట్టి వారి చరిత్రలు మనకు అనవసరం, పోలికలు మాత్రమే చూడాలని వాదిస్తారని మాకు తెలుసు. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి; మొదటిది - ప్రజాపతికీ యేసుక్రీస్తుకూ మధ్య ఒక్క పోలిక కూడా లేదు, అవన్నీ అభూతకల్పనలు మాత్రమే. అవి ఇప్పటికే వివరించాము. రెండు - పౌలు సువార్తప్రకటనలో భాగంగా జియూస్ విషయమై రాయబడిన మాటలు ప్రస్తావించలేదు. ఎందుకు ప్రస్తావించాడో ఇప్పటికే మేము వివరంగా రాసాము. అలానే బైబిల్లో తప్ప మరెక్కడా దేవుని వాక్యం రాయబడలేదని కూడా బైబిల్ ఆధారాలతో నిరూపిస్తూ మరో వ్యాసం కూడా రాసాము. దానిని చదవగలరు.
ఏథెన్సులో పౌలు చేసిన బోధ సువార్తకు అన్యమతగ్రంథాలు అవసరమనే వాదనకు ఆధారమా?
అన్యమత గ్రంథాలలో దేవుని వాక్యం రాయబడడం వాస్తవమా?
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.