విమర్శలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

 ఈ మధ్యకాలంలో కొందరు మతోన్మాదులు సమాజాన్ని క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రేరేపించాలనే కుట్రలలో భాగంగా కొందరు క్రైస్తవ‌ బోధకులను "మీ యేసుక్రీస్తును నమ్ముకుంటే ఎలాంటి పాపినైనా క్షమిస్తాడా?" అని ప్రశ్నిస్తున్నారు. దానికి వారు "పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులోకమునకు వచ్చెను" (1 తిమోతీ 1:15), "కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును" (మత్తయి 12:31) వంటి వాక్యభాగాల ఆధారంగా "ఔను క్షమిస్తాడు" అని సమాధానం‌ ఇస్తే వెంటనే వారు ఆ సమయంలో ప్రాచుర్యం పొందుకున్న కొన్ని అత్యాచారాలనూ హత్యలనూ ప్రస్తావించి అంటే మీ యేసుక్రీస్తును నమ్ముకుంటే ఆ నేరస్తులను కూడా క్షమిస్తాడా? అనంటూ ఆ అఘాయిత్యాల విషయంలో ఇంకా ఆగ్రహంగా ఉన్నవారి మనసుల్లో యేసుక్రీస్తుపైనా ఆయన సువార్తపైనా వ్యతిరేకత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అఘాయిత్యంలో చనిపోయిన వ్యక్తిపై సమాజంలో సానుభూతి ఉంటుంది, అలానే దానికి పాల్పడినవారిపట్ల ఆగ్రహమూ ఉంటుంది. అయితే ఈ సమాధానం ఆ చనిపోయిన వ్యక్తి యేసుక్రీస్తును నమ్మలేదు కాబట్టి ఆయన తనను నరకంలో వేస్తాడు. కానీ ఆ హంతకులు కనుక ఆయనను నమ్ముకుంటే వారిని పరలోకంలో కూచోబెడతాడు అన్నట్టుగా ఉంది కాబట్టి దాని ఆధారంగా సమాజాన్ని క్రీస్తుకూ ఆయన సువార్తకూ వ్యతిరేకంగా పురిగొల్పి, మొత్తం మీద సువార్తను నిర్వీర్యం చెయ్యాలన్నది ఆ మతోన్మాదుల కుట్రపూరితమైన ప్రయాస. అందుకే బైబిల్ ఇస్తున్నటువంటి ఆ సమాధానం వల్ల మనం కూడా వ్యక్తిగతంగా విమర్శించబడతామని, లేక ప్రజల మన్ననలు కోల్పోతామని గ్రహించిన కొందరు బోధకులు ఆ ప్రశ్నకు కాదని (క్షమించడు) కూడా సమాధానం చెబుతున్నారు. ఈమధ్యకాలంలో ఒక దుర్బోధకుడు అలానే చేసి సువార్త ఉద్దేశాన్ని తుంగలో త్రొక్కాడని సమాచారం.

అందుకే; ఈ విషయంలో బైబిల్ ఏం చెబుతుంది అనేది నిర్మోహమాటంగా పంచుకోవడానికి ఈ వ్యాసం రాస్తున్నాను. ఈ క్రమంలో అసలు ఒక వ్యక్తి నరకానికి ఎందుకు వెళ్తాడు? ఒక నేరస్తుడు క్షమించబడితే ఎలాంటి పరిధులతో క్షమించబడతాడు అనేవాటిని ప్రాముఖ్యంగా విశ్లేషించదలిచాను.

 ఒక మనిషి తన జీవితంలో యేసుక్రీస్తును విశ్వసించకుండా చనిపోతే కచ్ఛితంగా నరకానికి వెళ్తాడు.‌ అందుకే "మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును" (మార్కు 16:15) "ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు" (అపొ.కా 17:30,31) అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి నరకం నుండి రక్షించబడాలంటే యేసుక్రీస్తును విశ్వసించాలి. లేదంటే నిత్యనరకమే. ఆ వ్యక్తి "ఎంతో దారుణంగా ఎంతో అన్యాయంగా చంపబడినప్పటికీ" మినహాయింపులేవీ ఉండవు. తాను బ్రతికుండగా మారుమనస్సు పొందకుంటే నిత్యనరకమే. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఆ కాలంలో జరిగిన కొన్ని అమానుషమైన సంఘటనలను ప్రస్తావించి మరీ ఖండితంగా ఆజ్ఞాపించాడు.

లూకా 13:1-5 పిలాతు గలిలయులైన కొందరి రక్తము బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెనుఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిదిమంది, యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందనియెడల మీరందరును ఆలాగే నశింతురు.

ఇంతకూ ఒక వ్యక్తి యేసుక్రీస్తును నమ్మకుంటే నరకానికి ఎందుకు వెళ్తాడు? అనేది ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాలి. ఎందుకంటే మతోన్మాదులు కేవలం "యేసుక్రీస్తును నమ్మకుంటే నరకమే అనేమాటలనే" పరిగణలోకి తీసుకుంటూ నన్ను ప్రేమించకుంటే నీకు చావే అన్నట్టు ప్రవర్తించే ప్రేమోన్మాది తరహాలో ఆయనను చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆ విషయాన్ని విశ్వాసులైన ప్రతీఒక్కరూ గ్రహించాలి.

ఈ విషయం వాక్యానుసారంగా వివరించడానికి ముందు ఒకే భావం వచ్చే రెండు‌ ఉదాహరణలు చెబుతాను. మొదటిది; రాకపోకలు లేనటువంటి ఒక దీవిలో ఒక భయంకరమైన వ్యాధి వ్యాపించింది. అందులో ఆ వ్యాధి భారిన పడని మానవులంటూ ఎవరూ లేరు, వారు అదే వ్యాధితో కొంతకాలం బాధపడి చివరికి చనిపోతున్నారు. అలాంటి సమయంలో ఒక‌ వైద్యుడు అద్భుతకరంగా ఆ దీవిలో ప్రవేశించి ఆ వ్యాధికి మందును కనుగొన్నాడు. అప్పుడు వారందరికీ ఆ మందును అందుబాటులో ఉంచి తన మందును ఉపయోగించినవాడు బ్రతుకుతాడు లేనివాడు చస్తాడు. అలానే ఆ మందు తీసుకున్నవాడు మరలా ఆ వ్యాధి భారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆ ప్రకటనలో తెలియచేసాడు. ఇప్పుడు ఆ వైద్యుడు కనిపెట్టిన మందు తీసుకున్నవాడు మాత్రమే బ్రతుకుతాడు లేనివాడు చస్తాడు, అలానే ఆ మందు తీసుకున్నవాడు జీవితాంతం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనే ప్రకటన చేయించినందుకు అతను ఉన్మాది ఔతాడా? పోని వారికి అందుబాటులో ఉన్నప్పటికీ ఆ మందును తీసుకోకుండా చచ్చినవారిని ఆ వైద్యుడు చంపాడా లేక వారి మూర్ఖత్వం కారణంగానే చనిపోయారా? వారి కళ్ళముందే ఎంతోమంది ఆ మందును స్వీకరించి ఆ వ్యాధినుండి స్వస్థపడుతున్నప్పటికీ వారు కేవలం తమ మూర్ఖత్వం కారణంగా ఆ వైద్యుడిని విశ్వసించలేదు, ఆయన కనిపెట్టిన మందును స్వీకరించలేదు. కాబట్టి వారి చావుకు వారే బాధ్యులు. అక్కడ ఆ వైద్యుడు సత్యమైన తన మందును స్వీకరించని వారిని వారి చావుకు వారిని విడిచిపెట్టడం న్యాయమే.‌ బలవంతంగా వారిచేత ఆ మందును త్రాగించవలసిన అవసరం అతనికి లేదు.

రెండు నోవహు ఓడ; దేవుడు జలప్రళయం సంభవించబోతుంది నీ ఇంటివారికోసం ఓడ కట్టమని నోవహుకు ఆజ్ఞాపించాడు. నోవహు ఆ ఓడను కడుతూ ప్రజలందరికీ దానికి ప్రకటించాడు. దేవుడు కూడా ఆత్మరూపిగా వారికి ప్రకటించాడు. ఎంతో అద్భుతకరంగా వారి కళ్ళముందే ఎన్నో అడవి మృగాలు సహా ఓడలో ప్రవేశిస్తున్నాయి. కానీ వారిలో ఒక్కరు కూడా ఓడలో ప్రవేశించలేదు.‌ చివరికి జలప్రళయంలో చనిపోయారు.‌ ఇప్పుడు వారి చావుల విషయంలో ఓడలో ప్రవేశిస్తేనే రక్షణ అని ప్రకటించబడినందుకు తప్పు ఆ ఓడదా? లేక అందులో ప్రవేశించని ఆ మూర్ఖులదేనా? జ్ఞానం కలిగిన ఎవరైనా తప్పు ఓడలో ప్రవేశించని మూర్ఖులదే అని ఒప్పుకుంటారు. "యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షించబడతాడు నమ్మనివాడు శిక్షించబడతాడు అనగా నరకానికి పోతాడు" అనే సువార్తప్రకటన ఈ నోవహు ఓడ చరిత్ర వంటిదే (1 పేతురు 3:20,21).

ప్రతీ మనిషీ తన పాపం కారణంగా పరిశుద్ధుడైన దేవుని ఉగ్రతకు పాత్రుడిగా ఉన్నాడు (ఎఫెసీ 2:2,3). ఇది కాదనలేని వాస్తవం. లేదంటే పుట్టినప్పటినుండీ ఏ పాపమూ చెయ్యని పరిశుద్ధులెవరో ముందుకు రావాలి. కానీ అలా ఎవ్వరూ ఉండరు. అంటే దేవుని న్యాయం ప్రకారం ప్రతీమనిషీ చనిపోయాక నరకానికే పోవాలి. ఇది తిరుగులేని ఆయన న్యాయపు తీర్పు. ఉదాహరణకు మన న్యాయస్థానం నేరస్తులను శిక్షించడం న్యాయమా? క్షమించడం న్యాయమా? శిక్షించడమే న్యాయం. ఔను కదా! నేరస్వభావియైన మనిషే మరో నేరస్తుడిని శిక్షించడాన్ని న్యాయంగా భావించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు తన సృష్టిని అనుభవిస్తూ తన పరిశుద్ధతకు విరోధంగా పాపం‌ చేస్తున్నటువంటి మానవులను నరకంలో వెయ్యడం మరింత న్యాయమే కదా (ఇంతకూ నరకం అంటే ఏంటో మళ్ళీ మాట్లాడతా). పైన తెలియచేసినట్టు దీని ప్రకారం ప్రతీ మనిషీ నరకానికే పోవాలి. కానీ బైబిల్ దేవుడు న్యాయవంతుడు మాత్రమే కాదు కృపకలిగినవాడు కూడా. ఆయనలోని కృపాగుణం తాను సృష్టించిన మానవులంతా నరకానికి పోవడం సహించలేకపోయింది. అందుకే ఆయన తనను విశ్వసించబోయేవారి పాపాలకు ప్రాయుశ్చిత్తంగా యేసుక్రీస్తును నియమించాడు (అపో.కా 3:20, రోమా 3:24). ఆయన బలియాగం దేవుని న్యాయమైన ఉగ్రతను శాంతింపచేసి ఆయనను విశ్వసించిన వారందరినీ ఆ ఉగ్రతనుండి తప్పిస్తుంది (రోమా 5:8-11, యెషయా 53:5-12). ఆయనను విశ్వసించని వారు ఆ ఉగ్రత క్రిందే నిలిచియున్నారు కాబట్టి నరకానికే పోతారు.

నరకం అంటే దేవుని కృపకు సంపూర్ణంగా దూరమవ్వడం అనగా ఆయనతో పూర్తిగా తెగదెంపులకు గురికావడం. ఒక మనిషి ఈ భూమి మీద ఉన్నంతవరకూ ఆయన సృష్టిని అనుభవిస్తూ ఆయన కాపుదల అనుభవిస్తూ మారుమనస్సుకై అవకాశం పొందుకుంటూ ఏదోవిధంగా ఆయన కృపను రుచిచూస్తునే ఉంటాడు. కానీ ఆ మనిషి యేసుక్రీస్తును విశ్వసించకుండానే చనిపోతే అతనికి‌ ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకోనందుకు పూర్తిగా ఆయన కృపనుండి వేరు చెయ్యబడతాడు. ఎందుకంటే పాపులకు పరిశుద్ధుడైన దేవుడు ఉండే పరలోకంలో ప్రవేశం లేదు (కీర్తనలు 5:4,5). తనను పవిత్రపరిచే యేసుక్రీస్తు రక్తాన్ని ఆ మనిషి విశ్వసించలేదు. కాబట్టి ఆ మనిషి ఈ భూమిపై ఎంత గొప్పవాడిగా జీవించినా మంచివాడిగా జీవించినా సరే అతనికి నరకమే గతి. ఎందుకంటే నరకం నుండి తప్పించేది కేవలం యేసుక్రీస్తు రక్తం మాత్రమే (రోమా 5:11, ప్రకటన 7:14). దీనికి కారణం దేవుడు కాదు ఆ మనిషే. తనలో పాపముందని తెలిసినప్పటికీ ఆ మనిషి తనను పరిశుద్ధపరిచే యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించలేదు. నిజానికి నరకం పాపులకు శిక్ష అనడం కంటే వారు తమకు తాముగా ఎంచుకున్న మార్గం అని పిలవడం సరైనది.

(ఈ అంశం గురించి మరింత వివరంగా తెలియచేసే పుస్తకాన్ని త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాము)

ఈ వాదనకు మతోన్మాదులు మీ దేవుడు కృపకలిగినవాడు అయినప్పుడు "యేసుక్రీస్తును నమ్ముకుంటేనే" తన ఉగ్రత నుండి తప్పిస్తానని షరతు పెట్టడం ఎందుకు అందర్నీ తప్పించెయ్యొచ్చుగా అని ప్రశ్నిస్తారు. ఇక్కడే వారి కుటిల ద్వంద్వ వైఖరిని మనం గుర్తించాలి. "మీ యేసుక్రీస్తును నమ్ముకుంటే నేరస్తులను కూడా క్షమించేస్తాడా?" అని ప్రశ్నించి అదేదో అన్యాయం అన్నట్టుగా చిత్రీకరిస్తున్న వీరు ఇక్కడ మాత్రం "పాపులు అందరినీ క్షమించెయ్యొచ్చుగా?" అని ప్రశ్నిస్తున్నారు. అందరినీ అన్నప్పుడు అందులో బిన్ లాడెన్ కూడా ఉంటాడు. వీరు ప్రస్తావిస్తున్న నేరస్తులు కూడా ఉంటారు క్షమించాలా మరి? అక్కడ అన్యాయం అంటూ గగ్గోలు పెట్టిన బుద్ధి ఇక్కడేమైందో?

ఇక విషయానికి వస్తే; దేవుని న్యాయపు ఉగ్రతనుండి తప్పించుకోవడానికి పరిష్కారంగా ఆయన యేసుక్రీస్తును నియమించాడు. ఆయనను విశ్వసించి ఆయన రక్తంలో పవిత్రపరచబడడం మనిషి బాధ్యత. దేవుడు మనిషియొక్క బాధ్యతను తప్పించేవిధంగా ఆయనను నియమించలేదు. నీకు నువ్వు పాపివి అని అర్థమైనప్పుడు పాపివైన నీపై నిలిచియుండే న్యాయవంతుడైన దేవుని తీర్పునుండి తప్పించుకోవడానికి నీ బాధ్యతగా ఆయనను విశ్వసించాలి. అదే న్యాయం. నేను మొదట తెలియచేసిన ఉదాహరణలతో పోల్చి దీనిని అర్థం చేసుకోండి. అలా విశ్వసించని వారు చనిపోయాక నరకానికే పోతారు. అందుకే వారి గురించి "ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులైయున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాద ములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి" (రోమా 1:19-23). "ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచువారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతో కూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమ పరచబడుటకును, విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి" (2 థెస్సలొనిక 1:6-10) అని రాయబడింది. తనను సృష్టించిన దేవుణ్ణి, తన పాపపు వ్యాధికి విరుగుడుగా ఆయన నియమించిన యేసుక్రీస్తును విశ్వసించకపోవడమే ఒక మనిషి నరకానికి పోవడానికి న్యాయమైన కారణం.‌

గమనించండి; ఇప్పటివరకూ నేను వివరించిన మాటలు చిన్నపిల్లలకు కానీ బాల్యం నుండీ మానసికస్థితి బాలేనివారికి కానీ వర్తించవు. బైబిల్ లో వారు తీర్పులో ఉంటారని ఎక్కడా రాయబడలేదు. న్యాయవంతుడైన దేవుడు వారిపట్ల న్యాయంగానే ప్రవర్తిస్తాడు.

ఇక యేసుక్రీస్తును నమ్ముకుంటే ఎలాంటి నేరస్తుడైనా క్షమించబడతాడా అంటే ఔను. దానికి మంచి ఉదాహరణనే సిలువపై దొంగ (లూకా 23:32-43). ఆ దొంగ ఒక బందిపోటు (మార్కు 15:28). బందిపోటు దొంగలు తమ చర్యలకు అడ్డువచ్చే ప్రజలనూ సైనికులనూ చంపడం సహజం, అవసరమైతే వాళ్ళు చిన్నపిల్లలను కూడా కనికరం లేకుండా చంపేస్తారు. అంటే అతను అత్యంత క్రూరుడైన నేరస్తుడు. అందుకే అతనికి సిలువశిక్ష విధించబడింది. ఆ కాలంలో సిలువశిక్ష అనేది ప్రభుత్వ తిరుగుబాటుదారులకూ ఇలాంటి క్రూరులైన బందిపోటు దొంగలకే విధించేవారు (యేసుక్రీస్తుకు ఆ శిక్ష ప్రభుత్వ తిరుగుబాటు దారునిగా విధించారు). కానీ ఆ నేరస్తుడు యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు, ఆయన వాడిని క్షమించాడు "నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని" (లూకా 23:43) అతనికి వాగ్దానం చేసాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకుంటే ఎలాంటి పాపినైనా క్షమించి పరలోకం ఇస్తాడు అనేది తిరుగులేని సత్యం. అయితే ఇక్కడ మనం ప్రాముఖ్యంగా మూడు విషయాలు గమనించాలి.

1. ఆ దొంగ యేసుక్రీస్తును విశ్వసించాడు. యేసుక్రీస్తు వాడిని క్షమించి పరదైసును వాగ్దానం చేసాడు. కానీ అప్పటివరకూ అతను చేసిన నేరాలను బట్టి విధించబడిన శిక్షనుండి అనగా సిలువ నుండి అతన్ని విడిపించలేదు. ఆ దొంగ కూడా అలాంటి విడిపింపును కోరుకోలేదు. చివరికి మేకులు కొట్టబడిన కాళ్ళపై ఆనుకుని ఇక ఊపిరి తీసుకోకుండా కాళ్ళు విరగగొట్టబడి దారుణంగా చనిపోయాడు (యోహాను 19:31,32). అంటే అతను చేసిన దోపిడీలకూ హత్యలకూ చట్టపరంగా అనుభవించవలసిన శిక్షను అనుభవించాకే పరదైసుకు చేరాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముకుంటే క్షమించి పరలోకం ఇస్తాడు అన్నది వాస్తవమైనప్పటికీ అప్పటివరకూ అతను చేసిన నేరాల విషయమై చట్టపరమైన శిక్షనుండి తప్పించడు. అది అనుభవించవలసిందే.

2. ఆ దొంగ కూడా ఈయన నన్ను ఈ సిలువశిక్ష నుండి విడిపిస్తాడేమో అనే ఉద్దేశంతో ఆయనను విశ్వసించలేదు. అందుకే అలాంటి కోరికను వ్యక్తపరుస్తున్న తోటిదొంగను గద్దిస్తూ "నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదు" (లూకా 23:40,41) అని తన నేరాలకు ఆ శిక్షతగిన శిక్షయని ఒప్పుకుంటున్నాడు. దానికి లోబడుతున్నాడు. కాబట్టి శిక్షనుండి తప్పించుకోవడానికి యేసుక్రీస్తును విశ్వసించినంత మాత్రాన అది నిజమైన విశ్వాసం అయిపోదు. యేసుక్రీస్తు అలాంటివారిని క్షమించడు, పరలోకంలోనూ కూచోబెట్టడు. నిజంగా క్రీస్తును విశ్వసించిన నేరస్తుడు ముందు తనపై నిలిచియున్న చట్టపరమైన శిక్షకు లోబడతాడు. ఇంకో విధంగా చెప్పాలంటే అప్పటివరకూ చట్టం నుండి తప్పించుకుంటున్న నేరస్తుడు కూడా "నాకైతే ఆ శిక్ష న్యాయమే; నేను చేసినవాటికి తగిన ఫలము పొందుకోవాలి" అనుకుని చట్టానికి తన నేరాలు ఒప్పుకుంటూ చట్టానికి లొంగిపోతాడు. ఎందుకంటే‌ నిజమైన మారుమనస్సు న్యాయమైన ప్రవర్తనకు ప్రేరేపిస్తుంది (మీకా 6:8). మనం ఒకరిపట్ల వ్యక్తిగతంగా చేసిన అపరాధాన్నే నిజాయితీగా ఆ వ్యక్తి ముందు ఒప్పుకోవాలని నేర్పిస్తున్న బైబిల్ (యాకోబు 5:16) చట్టం ముందు మరింతగా మన నేరాలను ఒప్పుకోవాలని నేర్పిస్తుంది. అందుకే "ప్రతివాడును పై అధికారులకు లోబడియుండవలెను; ఏలయనగా దేవునివలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు; ఉన్న అధికారములు దేవునివలననే నియమింపబడి యున్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు; ఎదిరించువారు తమమీదికి తామే శిక్ష తెచ్చుకొందురు" (రోమా 13:2) అని రాయబడింది. అంటే చట్టం‌ నుండి తప్పించుకోవాలని చూసేవారు దేవుని నుండే తప్పించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి నిజంగా మారుమనస్సు పొందినవారు అలా చెయ్యలేరు. వారు మారుమనస్సు పొందగానే మొదట దేవుడు నియమించిన చట్టవ్యవస్థకు తమ నేరాలు ఒప్పుకుని లొంగిపోతారు.

3. పోని ఆ‌ సిలువపై దొంగ ఎలాగూ చస్తున్నాను. ఈయనను చాలామంది దేవుని కుమారుడు అంటున్నాడు. ఆ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, చీకట్లో రాయి వేసి‌ చూద్దాం అన్నట్టుగా కూడా ఆయనపట్ల విశ్వాసముంచలేదు. "నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను" (లూకా 23:42) అని పలకలేదు. నిజానికి ఆ దొంగ కూడా తోటిదొంగతో కలసి ఆయనను నిందించాడు (మత్తయి 27:44). కానీ ఆ సిలువపై దొంగ ఎప్పుడైతే ఆయనకు దగ్గరగా ఆయనను గమనించాడో ఆయనపట్ల అతనికి నిజమైన విశ్వాసం కలిగింది. అందుకే "యీయన ఏ తప్పిదమును చేయలేదు" అని రోదిస్తున్నాడు. కాబట్టి ఆ దొంగది నిజమైన మారుమనస్సు. అందుకే క్షమించబడి పరదైసుకు చేరుకున్నాడు. అలాంటి విశ్వాసం కేవలం దేవునిమూలంగానే కలుగుతుంది (యోహాను 6:37,45, ఎఫెసీ 2:8). కాబట్టి అతను క్షమించబడ్డాడు. ఇప్పటివరకూ నేను వివరించినదానిప్రకారం "యేసుక్రీస్తును నమ్ముకుంటే ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు" అనే సత్యంలో నేరం చేసిన ప్రతీఒక్కరూ శిక్షనుండి తప్పించుకోవడానికి కానీ చచ్చినా పర్లేదు పరలోకానికి పోదాం అన్నట్టుగా కానీ ఊరికే విశ్వసించే అవకాశం లేదు. ఒకవేళ సిలువపై దొంగతరహాలో ఎవరైనా ఆయనను నిజంగా విశ్వసిస్తే తన నేరాలను బట్టి పశ్చాత్తాపపడితే అప్పటివరకూ అతను చేసిన నేరాలను బట్టి తృణీకరించబడే అవకాశం కూడా లేదు. ఇందులో ఏ అన్యాయమూ లేదు. ఎందుకంటే ఆయన ఇతరులను చంపిన సిలువపై దొంగనే కాదు. తనను హింసిస్తున్న చంపుతున్నవారు కూడా నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు వారిని క్షమించాడు (యోహాను 19:34,35).

పౌలు జీవితంలో కూడా మనమిదే గమనిస్తాం (అపొ.కా 9) అతను "ప్రభువుయొక్క శిష్యులను బెదరించుటయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు" (అపొ.కా 9:1) ప్రవర్తించాడు. అంటే ఆయన పిల్లలు ఎంతోమందిని హింసించి చంపివేసాడు. అది స్వయంగా యేసుక్రీస్తును హింసిస్తున్నట్టే పరిగణించబడింది. అందుకే ఆయన పౌలును దర్శించినప్పుడు "సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని" (అపో.కా 9:4). ఈ పౌలు ఆయన భక్తుడైన స్తెఫను చావుకు కారణమైనవారిలో కూడా ఒకడు (అపొ.కా 7:60). అయినప్పటికీ అతను మారుమనస్సు పొందినప్పుడు ప్రభువు అతన్ని క్షమించాడు. తన నామంకోసం మిగిలిన అపోస్తలుల కంటే మరి ఎక్కువ హింసలు అనుభవించేలా వారందరికంటే ఎక్కువ బోధను సంఘానికి అందించేలా (13 పత్రికలు) అతన్ని నిర్ణయించాడు. అతను చట్టపరంగా క్రైస్తవులను హింసించినందుకు ఆ చట్టపరంగా శిక్షించబడనప్పటికీ మరి ఎక్కువగా శ్రమలు అనుభవించాడు.‌ చివరికి హతసాక్షిగా చంపబడ్డాడు.

మరో విషయం గమనించాలి. మనం మాట్లాడుకుంటుంది గతంలో నేరాలు చేసినవారిని ప్రభువు క్షమిస్తాడా లేడా అనేదాని గురించి మాత్రమే. ఇంతవరకూ చెప్పినట్టుగా అతను నిజంగా మారుమనస్సు పొందితే ప్రభువు తప్పకుండా అతన్ని క్షమిస్తాడు. ఒకవేళ మారుమనస్సు పొందిన వ్యక్తి కనుక మరలా అదే క్రూరత్వాన్ని ప్రదర్శిస్తే అనగా ఉద్దేశపూర్వకంగా నరహంతకుడిగా మారితే అతనికి ఇక క్షమాపణ ఉండదు. అందుకే "మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరులజోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింపతగదు" (1పేతురు 4:15). "ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు" (1యోహాను 3:15) అని రాయబడింది.‌ ఎందుకంటే "ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము" (1యోహాను 2:6). దీనికి ఎవరైనా పాతనిబంధనలో దావీదు అన్యాయంగా యోవాబును చంపిన ఉదాహరణకు కనుక తీసుకుని వాదిస్తే దానితో పాటు మరికొన్ని ఆరోపణలకు కూడా ఇప్పటికే సమాధానం ఇచ్చాను. ఈ వ్యాసం చదవండి.

హిందూమతోన్మాదుల అశ్లీలపు ఆరోపణలకు బైబిల్ సమాధానాలు

 

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.