సాక్ష్యాలు

రచయిత: డి. యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 29 నిమిషాలు
ఆడియో

నా పేరు యశ్వంత్ కుమార్. మా సొంతూరు తెలంగాణలోని నిజామాబాదు జిల్లా, బోధన్ పట్టణం. నేను 1996 లో ఒక హైందవ కుటుంబంలో పుట్టాను. చిన్నతనం నుండే అంటే సుమారు నా 6 వ ఏట నుండే కొన్ని ప్రశ్నలు నా మదిని తొలుస్తూ ఉండేవి. అవేంటంటే - "అసలు ఈ భూమినంతటినీ సృష్టించింది ఎవరు? దీనినంతటినీ ఉనికిలో ఉంచుతున్నది ఎవరు? నా పుట్టుకకు గల కారణం ఏమిటి? అసలు దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? అంతమాత్రమే కాదు, హృదయంలో ఏదో వెలితి. నేను అనుకున్నట్లుగా, నేను కోరుకున్న విధంగా జీవించలేకపోతున్నాననే మనోవ్యధ. ఇంకేదో కావాలి. నెమ్మది లేదు. శాంతి లేదు. ఏదో తెలియని శాంతి కొరకు, నెమ్మది కొరకు ఆరాటం. ఎలా పొందుకోవాలో తెలీదు. ఎక్కడ దొరుకుతుందో తెలీదు".

వీటిలో కొన్ని ప్రశ్నలకు జవాబుగా నా తండ్రీ కొంత మంది బంధువులూ హైందవ దేవుళ్లను చూపించి - "వీళ్ళే మన దేవుళ్ళు, వీళ్ళనే మనం పూజించాలి" అని తరతరాల నుండి వారి తాత ముత్తాతలు వారికి నేర్పించిన భక్తిని నాకూ నేర్పించారు. అందులో భాగంగానే నా 6 వ ఏట నుండి 10 వ ఏట వరకూ ఐదు సార్లు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. ఆ తరువాత నా 14 వ ఏట వరకూ సాయి బాబాను కూడా పూజించాను. ప్రతీ సంవత్సరం షిరిడీకి కనీసం రెండు లేదా మూడు సార్లు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఓ వారం అక్కడే ఉండేవాడిని. గుడి ప్రాంగణాలను ఊడవడం, సంస్థానం అంతటి చుట్టూ, ఇంకా కొన్ని ప్రత్యేకమైన స్థలాల చుట్టూ అనేక సార్లు ప్రదక్షిణలు చేసేవాడిని. సాయి బాబా చరిత్రను గురించిన పుస్తకాన్ని పారాయణం చేయడం, గుడికి వెళ్లి రావడం, సత్సంగం(సాయి బాబా నామాన్ని భజన చేయడం) వంటివి కొంతకాలం పాటు నా అనుదిన దినచర్యలో భాగంగా ఉండేవి.

భక్తి అనే ముసుగులో నే జీవించిన నా పాత జీవితం - ఒక రోత జీవితం

అందరికీ యశ్వంత్ మంచి బాలుడు అన్నట్లుగా కనిపించాలని ప్రయత్నించేవాడిని. బయటకు కనిపించే భక్తి చేష్టలూ, కొన్ని మంచి పనులూ, చదువు కూడా కాస్త బాగా చదవడంతో అందరూ మెచ్చుకునేవారు. వారు మెచ్చుకునేదాన్ని బట్టి, ఇంకా బాగా నటించడం నేర్చుకున్నాను. నేను నిజంగా ఎటువంటివాడిని అనేది నాకూ ఆ దేవుడికీ తప్ప ఎవ్వరికీ తెలీదు. హృదయంలో ఎన్నో పాప సంబంధమైన విషయాలు ఉండేవి. ఎన్నో చెడ్డ తలంపులు. వాటితో నిత్యం పోరాటమే. వాటిని అధిగమించి నీతిగా, నేను పూజించే దేవుని దృష్టికి మంచి వాడిగా జీవించాలని నేను తీర్మానించుకునేవాడిని.

కానీ పాపానికి లొంగిపోయి, పడిపోయి చతికిలబడిన సందర్భాలు లెక్కలేనన్ని. ప్రతిసారి మిగిలేది నిరుత్సాహం, వేదన. నా సమస్యకు పరిష్కారం నాకు దొరకలేదు, సహాయం చేసేవారూ కనిపించలేదు. నేను పూజించిన దేవుళ్ళెవరూ నాకు పరిష్కారం చూపించలేకపోయారు. ఎందుకంటే ఆ రాతి విగ్రహాల దగ్గరా, మనుష్యులు సృష్టించిన ఆ మట్టి బొమ్మల దగ్గరా అసలు పరిష్కారమే లేదని తరువాత గ్రహించాను. మరి నేను ఇలా పాపంలో జీవిస్తూ చనిపోతే ఎక్కడికి వెళ్తాను? అనే ప్రశ్న నన్ను ఎంతో భయాందోళనకు గురి చేసేది.

పాపాంధకారంలో కూరుకుపోయిన నాపై సువార్త వెలుగు ప్రసరించిన వేళ

నా 15 వ ఏట, ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజీ, హైదర్ నగర్ బ్రాంచ్ లో చేరాను. మొదటి సారి ఇంటిని విడిచి హాస్టల్ లో చేరడం వల్ల చాలా బెంగగా ఉండేది. టైం దిరికితే ఏడుస్తూ కూర్చునేవాడిని. ఒక జూనియర్ లెక్చరర్ నా పరిస్థితి గమనించి నన్నెంతో ఆదరించారు. రోజులు గడిచే కొద్దీ ఆ ఆదరించే సంభాషణల్లోనే యేసును గురించిన ప్రస్తావన తేవడం మొదలు పెట్టారు. ఆయన యేసు ప్రభువు గురించి చెబుతున్నాడు అని తరువాతెప్పుడో గ్రహించాను. ఎందుకో తెలీదు, నాలో తెలియని ఆసక్తి ఏదో బయలుదేరింది. ఆ మాటలు వినాలనీ ఆయన చెప్పే దేవుడి గురించి తెలుసుకోవాలనీ. ఆయన చెప్పేదంతా ఓ ఆరు నెల్ల పాటు అలా వింటూ ఉండిపోయాను.

నాకు బాగా గుర్తు, ఒక్కోరోజు రాత్రి పన్నెండూ రెండూ అయ్యేది. సంక్రాంతి సెలవులకు ముందు ఆ ఆరు నెల్ల కాలంలో బైబిల్ చదవకుండానే కేవలం ఆ లెక్చరర్ చెప్పిన సువార్త ద్వారా దేవుడు నా హృదయంలో కార్యం చేసాడు. ఆ సంగతి ఆరు నెలలకు నేను గ్రహించాను. అప్పటివరకూ నేను చేస్తూ ఉండిన విగ్రహారాధనకు స్వస్తి చెప్పి, యేసు మాత్రమే నిజమైన దేవుడనీ, ఆయన్ని మాత్రమే ఆరాధించాలనీ తీర్మానించుకున్నాను. అయితే నన్ను ఆ నిర్ణయం చేసేలా పురికొల్పిన కొన్ని సత్యాలను నెన్నటికీ మరిచిపోలేను. ఎందుకంటే ఆ సత్యమే నేను రక్షణ పొందడానికి దోహదపడింది, నిజ దేవుణ్ణి ఎరిగే మార్గం చూపించింది. అంతకు ముందు నాలో లేని శాంతీ సమాధానాలు యేసు నందు విశ్వాసముంచుట చేతనే నాకు లభించాయి. నాలో ఏదో వెలితి ఉండేదని, తెలియని దాని కొరకు ఆరాటపడుతుండేవాడినని చెప్పాను కదా. ఆ బాధ ఇక లేదు. దానికి నేను పరిష్కారం కనుగొన్నానని సంతోషించాను (తర్వాత తెలిసింది ఆయనే నన్ను వెదకి, రక్షించుకున్నాడు అని).

ఇంతకీ ఆ కారణాలేంటంటే..

దేవుడు అనే వాడు ఒక్కడే అయ్యుండాలి. లక్షల కోట్ల దేవుళ్ళూ దేవతలూ ఉంటారు అనడంలో అర్ధం లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు ఒక వేళ సర్వ సమర్ధుడు, సర్వ జ్ఞాని అయినప్పుడు ఇంకొకరి అవసరం ఏముంటుంది. ఒక వేళ ఇంకొకరి అవసరం వస్తుందంటే ఆ మొదటి వాడు దేవుడు కాదనేగా. అసలు దేవుడు అని ఎవరినైనా అనడానికి ఎటువంటి అర్హతలు/ గుణగణాలు అవసరం లేకపోతే ప్రతి బాబా, స్వామిజీ, ఫకీరు, ఫాదర్ ఆ మాట కొస్తే ప్రతి మనిషీ దేవుడయిపోతాడు కదా. ఇటువంటి కొన్ని లక్షణాల గురించి ఆ లెక్చరర్ నాకు వివరించారు.

ఒక రోజు ఒక పాస్టర్ చర్చిలో ప్రసంగిస్తూ ఇలా అన్నాడు - "మనం ఆరాధించే దేవుడు మాత్రమే పరిశుద్ధుడు" అని. ఆ "మాత్రమే" అన్న మాట నన్ను పట్టుకుంది. మా లెక్చరర్ తో దాని గురించి చర్చించి యేసు మాత్రమే ఎలా పరిశుద్ధుడో తెలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. నేను అంత వరకూ పూజించిన దేవుళ్ళూ దేవతలతో పోల్చి చూసుకుంటే, వారిలో ఆ పరిశుద్ధత నాకు కనిపించలేదు. ఇంకా కొన్ని వేరే లక్షణాలు కూడా యేసులో ఉన్నవి, వారిలో లోపిస్తున్నాయని గ్రహించాను. నేను పూజించిన దేవతలూ దేవుళ్లూ, వారి గురించిన కథలు అవన్నీ మానవుని మనస్సులో నుంచి వచ్చిన కల్పితాలేనని నేను గ్రహించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఆ కథలన్నీ కోపం ,ద్వేషం, కామం, పగ, ప్రతీకారం వంటి చెత్తతో నిండి ఉన్నాయని గ్రహించాను. వారితో పోల్చి చూసినప్పుడు యేసు మాత్రమే "దేవుడు" అని అనడానికి అర్హుడని అర్ధమయ్యింది. అలాగే నేను పాపిని అని గ్రహించడానికి దేవుడు సహాయం చేసాడు. నేను రక్షించబడునట్లు ఆయన నా కొరకు చనిపోయి, నా పాపానికి నేను పొందుకోవాల్సిన శిక్షను నాకు బదులుగా ఆయన సిలువలో ఆ శిక్షనంతటినీ భరించాడని, నన్ను విడిపించడానికి తాను రక్తం చిందించాడని తెలుసుకొని పశ్చాత్తాపంతో నా పాపాలను ఒప్పుకుని, యేసుని నా సొంత రక్షకుడిగానూ, ప్రభువుగానూ అంగీకరించాను.

నేను యేసుని వెంబడించాలని నిర్ణయించుకుంటే, నా భవిష్యత్తేంటని కొంత కాలం ఆలోచించుకున్నాను. నా కుటుంబం గురించి నాకు తెలుసు. నా నిర్ణయం వారిని సంతోషపెట్టదనీ నాకు తెలుసు, నన్ను దూరం పెడతారనీ తెలుసు. ఇక నా జీవితంలో ఎప్పటికీ వారు ఉండకపోవచ్చు అని అనిపించింది. అవన్నీ ముందుగానే ఆలోచించుకునే కృపనిచ్చాడు దేవుడు. ఎవరున్నా లేకున్నా, ఎవరు నన్ను అంగీకరించినా అంగీకరించకపోయినా - యేసు మాత్రమే దేవుడనీ ఆయన తప్ప వేరొక దేవుడు లేడనీ నేను నమ్మాను. ఆయన మాత్రమే నన్ను రక్షించగలడని నమ్మాను. ఆయన్ను మాత్రమే వెంబడించాలని తీర్మానించుకున్నాను. అటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు.

అయితే ఇంట్లో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా నీ తల్లి తండ్రులను విడిచి రావొద్దని మా లెక్చరర్ ముందుగానే నన్ను కౌన్సిల్ చేశారు. ఆయన ఎం చెప్పారంటే - "వారిని కూడా రక్షణలోకి నడిపించే బాధ్యత నీపైనే ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు విడిచి రావొద్దనీ ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని పై ఆధారపడుతూ ప్రార్ధనాపూర్వకంగా దేవుని సహాయం కోసం కనిపెట్టమనీ చెప్పారు". అంతకు ముందే ఆయన నాకొక బైబిల్ ఇచ్చారు. భాష కొంచెం విచిత్రంగా అనిపించడంతో చదవడానికి ఇబ్బంది పడేవాడిని. కానీ అలవాటు చేసుకోవాలనుకున్నాను.

సెలవులకు ముందు పరీక్షలే, సెలవుల్లోనూ పరీక్షలే

సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లాను. ఒక రోజు పొద్దున్నే లేచి బైబిల్ చదువుతూ ప్రార్ధన చేస్తూ మా నాన్న కంట్లో పడ్డాను. ఎప్పుడూ లేని ఆ వింత చేష్టల గురించి మా నాన్నకు అనుమానం వచ్చింది. ఆ రోజు సాయంత్రం నన్ను కూర్చోబెట్టి విషయమేంటని అడిగారు. నేను యేసుని వెంబడించాలని తీర్మానించుకున్నట్లు ఆయనతో చెప్పాను. మా నాన్నకి ముందు కోపం వచ్చినా, అనేక విధాలుగా నాకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఆ సెలవు రోజులన్నీ అలా గడిచిపోయాయి. ఏడుస్తూ, కోపంతో అరుస్తూ, బుజ్జగిస్తూ అన్ని రకాలుగా చెప్పారు. నేను యేసుని వెంబడించడమూ బైబిల్ చదవడమూ మానేది లేదని ఖరాకండీగా తేల్చి చెప్పాను. నేను అంతటి ధైర్యసాహసాల్ని ప్రదర్శించిన ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా 'అది నేనేనా' అని అప్పట్లో అనిపించేది. ఖచ్చితంగా ఆ ధైర్యం నాది కాదు. ఎందుకంటే అప్పటికే నాలో పరిశుద్దాత్మ కార్యం చేస్తున్నాడనీ, అది ఆయన ఇచ్చిన ధైర్యమేనని తరువాత గ్రహించాను. మా నాన్న మాత్రం చాలా బాధబడ్డారు. ఆ సమయంలో నా నిర్ణయాన్ని చెబుతూనే ఆయనకీ సువార్త చెప్పడం జరిగింది. తరువాత నేను హాస్టల్ కి తిరిగి వెళ్ళిపోయాను.

మా అమ్మా, బంధువులూ - "వాడేదో చిన్న పిల్లాడు, పిల్ల చేష్టలు, నాలుగు రోజులు పోతే వాడే పద్దతి మార్చుకుంటాడు" అనుకున్నారు. 16 వ ఏట అంటే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో అడుగు పెట్టాను. క్యాంపస్ షిఫ్ట్ చేశారు. మా లెక్చరర్ తో సహవాసం ఇక లేదు. "వాతావరణం మారింది కాబట్టి ఇబ్బంది ఉండదు" అని మా నాన్నా బంధువులూ అనుకున్నారు. కానీ దేవుడు ముందుగానే నా కోసం కొంతమందిని అక్కడ సిద్ధపరచి ఉంచాడని వారికి తెలీదు. అప్పటికే ఆ క్యాంపస్ లో ప్రతీవారం ఒక రూమ్ లో ప్రార్ధన జరుగుతూ ఉండేది. కొంత కాలానికి ఆ సంగతి నాకూ తెలిసింది. నేను కూడా బైబిల్ పట్టుకొని వెళ్లడం మొదలు పెట్టాను. అలా కొంతమంది క్రైస్తవ మిత్రులు పరిచయం అయ్యారు. అందులో మరీ ముఖ్యంగా కొందరు మాత్రం నాకు బాగా దగ్గరయ్యారు. ఇక అప్పటి నుంచీ ప్రతి రోజూ రాత్రి స్టడీ అవర్స్ అవ్వగానే మేము ఒక రూమ్ లో కూడుకుని ప్రార్ధన చేసుకునేవాళ్లం. ఒక పాట పాడుకుని, మాలో ఒకడు ఆ వారంలో దేవుడు అతనితో మాట్లాడిన సంగతులు మిగిలినవారితో పంచుకునేవాడు. అదంతా కొంత సేపే అయినా, ప్రతి రోజూ జరిగేది కాబట్టి ఆ సహవాసం నన్నెంతో బలపరిచింది.

ఇంటికి సెలవులకు వెళ్ళినప్పుడు నా పద్ధతీ ప్రార్ధన అలవాటూ మారకపోవడంతో మా నాన్న చాలా బాధపడుతూ, నాపై కోప్పడేవారు. ఒకసారి సెలవుల్లో నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అత్త, నాయనమ్మ, తాతయ్య చాలా గొడవ చేశారు. వారు వెళ్ళిపొమ్మన్నారో లేక నేనే వెళ్లిపోయానో సరిగ్గా గుర్తులేదు గానీ, మొత్తానికి ఊరు అవతల ఉండే ఒక చర్చికి వెళ్ళిపోయాను. అక్కడ పాస్టర్ లేరు, ఊరు వెళ్లారని అక్కడున్న ఒక సహోదరుడు చెప్పారు. ఆ సహోదరుడే నన్ను బలపరచి ఆ రోజు రాత్రి చర్చిలో నేను పడుకోవడానికి ఏర్పాటు చేశారు. ఆ మరుసటి రోజు మా తమ్ముడు బోధన్ అంతా నా కోసం వెతుకుతూ సాయంత్రానికి ఎలాగో నేను ఏ చర్చిలో ఉన్నానో కనుక్కొని, అక్కడికి వచ్చి, పెద్దవాళ్ళు మాట్లాడాలంటున్నారు అని చెప్పి నన్ను తీసుకెళ్లాడు. ఆ తరువాత నేను హాస్టల్ కి వెళ్ళిపోయాను.

నేను ఎంత చెప్పినా వినడం లేదని మా నాన్న వేరే ప్లాన్ వేసాడు. అంతవరకూ మౌనంగా ఉంది కాబట్టి నన్ను సమర్దిస్తున్నదన్న నెపంతో మా అమ్మను కొట్టడం, బాధపెట్టడం చేసేవారు. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు నాకింకా కళ్ళకు కట్టినట్లు గుర్తున్నాయి. అమ్మకు కాయిన్ బాక్స్ నుండీ ఫోన్ చేసి, ఏమీ మాట్లాడకుండా కేవలం అమ్మ చెప్పేది వింటూ ఏడుస్తూ ఉండేవాడిని. ఇలా కొన్ని రోజుల పాటు సాగింది. ఫోన్ చేసినప్పటి నుండి బ్రేక్ టైం అయ్యేవరకూ నా కన్నీటి ధార ఆగేది కాదు. నేను రక్షించబడిన తరువాత యేసుని నమ్ముకున్న కారణాన్ని బట్టి ఎవరిచేత దెబ్బలు తిన్నది లేదు కానీ మా అమ్మ నా గురించి భౌతికంగానూ, మానసికంగానూ ఎంతో వేదనకు గురయ్యింది. ఏమీ చెయ్యలేక, బాధపడుతూ ఉన్న సమయంలో ఒక క్రైస్తవ సహోదరుడు, నాకొక తప్పుడు ఆలోచన చెప్పాడు. అబ్రాహాము అంతటి వాడే అబద్దం ఆడాడు అని వాక్యాన్ని వక్రీకరించి, నాకు నచ్చ చెప్పి, 'ఇక నేను బైబిల్ చదవట్లేదు' అని మా నాన్నతో చెప్పేలా నన్ను ప్రోత్సహించాడు. మా నాన్న మా అమ్మని బాధపెడుతుంటే సహించలేక ఫోన్ చేసి ఆ సహోదరుడు చెప్పినట్లుగానే చెప్పి, అమ్మను ఇక బాధ పెట్టొద్దని విజ్ఞప్తి చేసాను. అంతటితో పరిస్థితి కాస్త సర్దుమణిగినట్లుగానే అనిపించింది.

నా 17 వ ఏట, మెడిసిన్ సీట్ కోసం లాంగ్ టర్మ్ చెయ్యడానికి విజయవాడ వెళ్లాను. మా నాన్నతో అబద్దమైతే చెప్పాను కానీ, నాలో ఆ ఆలోచన మెదులుతూనే ఉండేది. నేను తప్పు చేస్తున్నాను అని నా మనసాక్షి నాపై నేరారోపణ చేస్తూ ఉండేది. నేను బైబిల్ చదవడం, ప్రార్ధన చెయ్యడం, చర్చికి వెళ్లడం అవన్నీ దొంగతనంగా చేస్తూ ఉన్నాను అన్న ఆలోచన నన్నెంతో ఇబ్బంది పెట్టేది. ఆ సంవత్సరమే నేను మా కాలేజీకి దగ్గర్లో ఉన్న ఒక చర్చికి వెళ్లడం ప్రారంభించాను. ఆ చర్చి పాస్టర్ ని సలహా అడిగాను. ఆయన ఆ అబ్రాహాము కథ యొక్క అసలు భావాన్ని నాకు అర్ధమయ్యేలా వివరించి చెప్పారు. ఇక అది విన్నాక, సెలవులకు ఇంటికి వెళ్ళినప్పుడు నేను బైబిల్ చదవడం మానలేదన్న నిజాన్ని నాన్నకు చెప్పేసాను. కొన్ని గొడవలయ్యాయి. సెలవలు అయిపోవడంతో కాలేజీకి తిరిగి వచ్చాను.

ఆ కాలేజీలో కొంత మంది క్రైస్తవ విద్యార్థులను పోగు చేసి మేము వారానికి ఒక రోజు ప్రార్థన చేసుకోవడానికి అనుమతించమని ప్రిన్సిపాల్ నీ వైస్ ప్రిన్సిపాల్ నీ రిక్వెస్ట్ చేసాం. వారు ముందు నిరాకరించినా మేము పదే పదే అడిగే సరికి ఒప్పుకున్నారు. మా జూనియర్ లెక్చరర్స్ లో ఒకరు ముందుండి మమ్మల్ని నడిపించారు. వాక్యం బోధించేవారు. దేవుని కృప, అక్కడ కూడా కొంతమంది మంచి క్రైస్తవ మిత్రులు దొరికారు నాకు. మేము కొంతమంది ప్రతి రోజూ కలిసి ప్రార్ధన కూడా చేసుకునేవాళ్లం. ఆ సంవత్సరం పూర్తయ్యి ఇంటికి వెళ్ళాక ఇంట్లో గొడవలు ఎక్కువవ్వసాగాయి. నువ్వు ఆ మతాన్నీ, బైబిల్ నీ విడిచిపెడతావా లేదా అని ఒకటే గొడవ. నేను అలాగే స్థిరంగా నిలబడడానికి దేవుడు సహాయం చేసాడు.

ఒక రోజు గొడవ మరీ తీవ్రమయి, మా నాన్న నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపొమ్మన్నారు. ఆయన మనసు మార్చుకుంటారేమోనని ఒప్పిగ్గా వేచి చూసాను. సాయంత్రం వరకూ చాలా గొడవ చేశారు. ఖచ్చితంగా నేను వెళ్లిపోవాల్సిందేనని ఆయన అరిచి గొడవ చేసేసరికి, నేను కదలాల్సొచ్చింది. బైబిల్ చేత పట్టుకొని బయల్దేరాను. ఆ గొడవ అయిన తరువాత మా నాన్న ఏడుస్తూ ఇంట్లో నుండి వెళ్లిపోయారు. ఆయన వెనకాలే నేనూ బయల్దేరాను. గడప దాటంగానే మా అమ్మ నా వెనకే పరుగెత్తుకుంటూ వచ్చి నన్ను ఆపింది. నా చెయ్యి తన తలపై పెట్టుకొని, నేను తిరిగొచ్చేంత వరకూ ఇక్కడి నుండి కదిలితే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి ఇంట్లోకి పరుగెత్తింది. కాసేపటికి ఒక 500 రూపాయల కాగితం తెచ్చి నా చేతిలో పెట్టి, ఎక్కడికి వెళ్లినా ఫోన్ చెయ్యమని చెప్పి పంపించింది.

అంతకు ముందు విజయవాడ కాలేజీలో పరిచయం అయిన జూనియర్ లెక్చరర్ గుర్తుకు వచ్చారు. ఆయన తండ్రి పాస్టరనీ వాళ్ళ ఊరిలో ఒక చర్చిని నడిపిస్తారనీ ఒకసారి ఆయన నాతో చెప్పినట్లు గుర్తు. అప్పటికే నా దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది. వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఇదీ పరిస్థితి అని చెప్పాను. ఆయన - వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి రమ్మనీ, పరిస్థితి చక్కబడేంత వరకూ చర్చిలో ఉండవచ్చుననీ చెప్పాడు. వెంటనే బస్సు ఎక్కి నిజామాబాదు వెళ్లి అక్కడి నుండి వరంగల్ వరకూ బస్సులో వెళ్లి అక్కడి నుండి ట్రైన్ ఎక్కి వరంగల్ లోని కేసముద్రం చేరుకునేసరికి తెల్లవారింది. రెండు రోజుల తరువాత అక్కడ చర్చిలోని యవ్వనస్థులు నా పరిస్థితి గురించి ఆరా తీశారు. నన్ను నేను పోషించుకోవడం కోసం నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నట్లు వారితో చెప్పాను.అయితే 10 వ తరగతిలోనూ ఇంటర్మీడియట్ లోనూ మంచి మెరిట్ ఉండడంతో డిగ్రీ చెయ్యమని వారు నన్ను ప్రోత్సహించారు. ఆర్ధికంగా అవసరమయ్యే ఖర్చు తాము భరిస్తామనీ, హైదరాబాద్ వెళ్లి నిజాం కాలేజీలోనూ, సిటీ కాలేజీలోనూ అడ్మిషన్ కోసం అప్లై చెయ్యమనీ, దారి ఖర్చులకి కొంత డబ్బు ఇచ్చి నన్ను హైదరాబాద్ పంపించారు.

నేను వెళ్ళేటప్పటికి సిటీ కాలేజీలో అడ్మిషన్స్ అయిపోయాయి. నిజాం కాలేజీలో అప్లై చెయ్యడానికి వెళ్తే వారు నా సర్టిఫికెట్స్ కావాలని అడిగారు. సర్టిఫికెట్స్ కోసం ఇంటికి ఫోన్ చేస్తే, వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఇంటికి వెళ్లి, సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చెయ్యబోతే, వెళ్లాల్సిన అవసరం లేదు, ఉండిపోవచ్చునన్నారు. అర్ధం కాక అమ్మను అడిగితే అప్పుడు చెప్పింది. నన్ను ఇంట్లో నుండి గెంటివేశాక మా తాతయ్య వాళ్ళూ బంధువులూ నన్ను ఇంట్లో నుండి గెంటివేసిన కారణాన్ని బట్టి మా నాన్నని కాస్త మందలించారనీ, అందుకనే ఆయన మనసు మార్చుకున్నారనీ చెప్పింది. ఆ తరువాత నిజాం కాలేజీలో ఫ్రీ సీట్ రావడంతో నేను హైదరాబాద్ వెళ్లాల్సొచ్చింది. నన్ను ఇంట్లో అయితే ఉండనిచ్చారు గానీ, మా నాన్నా, బంధువులూ నాతో మాట్లాడ్డం మానేశారు


నేను హైదరాబాద్ వెళ్లిన తరువాత మా నాన్న ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆయనకు ఎన్నో సంవత్సరాల నుండీ మద్యం తీసుకొనే అలవాటు ఉండింది. దానికి తోడు జాండీస్ వచ్చి కొన్ని నెలలపాటు తగ్గకపోవడం, అప్పటికే కిడ్నీస్, లివర్ పూర్తిగా చెడిపోవడంతో ఆయన పరిస్థితి ఇంకా విషమించింది. నా మనుగడకు ముప్పు ఏర్పడింది. ఆర్ధికంగా నేను స్వతంత్రుడనై నా కాళ్ళ మీద నేను నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. క్రమంగా ఇంటి దగ్గరి నుండి డబ్బు రావడం తగ్గింది. ఇక నేను ఆర్ధికంగా ఆయనపై ఆధారపడకూడదనీ, ఏదైనా పార్ట్ టైం జాబ్ చెయ్యాలనీ నిర్ణయించుకున్నాను. చిన్న ఉద్యోగం ఏదైనా దొరుకుతుందేమో అని హైదరాబాద్ అంతా తిరిగాను. ఎక్కడ తప్పిపోయినా సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుండి నా రూమ్ కి వెళ్ళేవాడిని. ఒక నాలుగు అయిదు నెలలకి హోమ్ ట్యూషెన్స్ చెప్పే అవకాశం వచ్చింది. జీతం తక్కువైనా అప్పుడదే నన్ను ఆదుకుంది. పగలు నేను కాలేజీకి వెళ్తూ, సాయంత్రాలు ట్యూషన్ చెప్తూ ఉండేవాడిని. ఆ సంవత్స్రం డిసెంబర్ నెలలో మా నాన్న చనిపోయారు. ఊహించని సంఘటన కావడంతో కొన్ని రోజుల పాటు షాక్ లో ఉన్నాను. పెద్ద కొడుకుని కావడంతో పెద్ద వాళ్ళు చెప్పినట్లుగా అన్ని కార్యక్రమాలూ చేసాను. అప్పుడు నా వయస్సు 18 సంవత్సరాలు.

డిగ్రీకి బ్రేక్ తీసుకొని మళ్ళీ మెడిసిన్ సీట్ కోసం ప్రయత్నించాను. అయినా రాలేదు. "ఇన్ని సార్లు ప్రత్నించినా నీకు సీట్ రాకపోవడమేంటని" కొంత మంది స్నేహితులూ, బంధువులూ ఆశ్చర్యపడ్డారు, నేనూ బాధ పడ్డాను. కానీ మా అందరికీ ఆ రోజు తెలియని విషయం ఏంటంటే దేవుడికి నా గురించి ఇంకా ఉన్నతమైన ఉద్దేశాలున్నాయని. మరుసటి సంవత్సరం అంటే అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలు. అలాగే ట్యూషెన్స్ చెప్పుకుంటూ డిగ్రీ చదువు మళ్ళీ మొదలు పెట్టాను. ఆ టైంలోనే నాకు సువార్త చెప్పిన జూనియర్ లెక్చరర్ మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేశారు. నేను ఇంకా అదే విశ్వాసంలో కొనసాగడమూ, అంతవరకూ దేవుడు నడిపించిన తీరు, అన్నీ తెలుసుకొని దేవుణ్ణి స్తుతించారు. అప్పటికే మా లెక్చరర్ కి పెళ్లి అయ్యింది. కూకట్ పల్లీలో కాపురముండేవారు. నేను అంతక ముందు ఉండే రూమ్ ఖాళీ చేసి కూకట్ పల్లీలో మా లెక్చరర్ వాళ్ళ ఇంటికి దగ్గర్లో ఉన్న క్రిస్టియన్ బాచిలర్స్ రూమ్ కి షిఫ్ట్ అయ్యాను. కేపీహెచ్ బి లో ఒక చర్చికి వెళ్ళేవాడిని.

ఆ సంఘానికి వెళ్తూ ఉన్నప్పుడే ఫిబ్రవరి 14వ తారీఖున బాప్తీస్మం తీసుకున్నాను. సంవత్సరం పాటూ వెళ్లినా నన్ను ఎవ్వరూ పెద్దగా పట్టించుకునేవారు కారు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్లి వస్తుండేవాడిని. ఆ సంవత్సరం అంతా మా లెక్చరరూ, వారి కుంటుంబం యొక్క సహవాసాన్ని ఎంతో ఆనందించాను. అదే సంవత్సరం మా నాన్న సంవత్సరికానికి నన్ను రమ్మని మా బంధువులు నాకు కబురు పెట్టారు. నేను చెయ్యవలసిన కార్యక్రమాలను చేసి వెళ్ళవలసిందిగా కోరారు. నేను వెళ్లాను కానీ ఆ కార్యక్రమాలన్నీ చెయ్యనన్నాను. దాని గురించి పెద్ద గొడవ జరిగింది. అయినా నేను వారి మాట వినకపోవడంతో వారికి కోపం వచ్చింది కానీ చేసేదేమీలేక, ఆ కార్యక్రమాలన్నీ మా తమ్ముడి చేత చేయించుకున్నారు. అప్పటి నుండి నాతో మాట్లాడ్డం పూర్తిగా మానేశారు. కానీ ఆ తరువాత పెద్దగా నన్నెవరూ కదిలించలేదు. ఎందుకంటే ఆ కార్యక్రమాలన్నీ నేను చెయ్యను అనే సరికి ఇక వీడు మారడు అని వాళ్లందరికీ అర్ధం అయిపోయింది. ట్యూషన్స్ చెప్పుకుంటూ డిగ్రీ పూర్తి చేసాను. డిగ్రీ సెకండ్ ఇయర్ లో (అంటే అప్పుడు నా వయస్సు 20 సంవత్సరాలు) దేవుడు నాకు పరిచర్య గురించిన భారాన్నిచ్చాడు. దాని కోసం థీయాలజీ చేస్తే బాగుంటుందని డిగ్రీ మూడవ సంవత్సరం పూర్తయ్యాక అంటే 2018 లో గోవా వెళ్లాను.

అనేకులు అడిగిన ప్రశ్నలు

నేను రక్షణ పొందినప్పటినుండీ నన్ను ఎంతో మంది అడిగిన ప్రశ్న. నా స్నేహితులూ, కాలేజీలో సహ విద్యార్థులు, బంధువులూ, తెలిసినవారూ, ఇలా చాలా మంది అడిగిన ప్రశ్న- "అసలు నువ్వు ఎందుకు లేదా ఎలా యేసు ప్రభువుని నమ్ముకున్నావు ?" నేను యే సువార్త ద్వారా రక్షణ పొందానో, ఆ సువార్త గురించి వారికి చెప్తే, వారు వినడానికి ఇష్టపడేవారు కాదు ఎందుకంటే వారు ఆశించే సమాధానం అది కాదు. ఏదైనా అద్భుతమో, స్వస్థతో జరిగి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు నేటి సంఘాల్లో, అటువంటి సాక్ష్యాలు వినీ వినీ నేను కూడా అటువంటి సాక్ష్యమే చెప్తాననుకొని, చివరికి నా సమాధానం విని నిరుత్సాహ పడేవారు.

మరికొందరు - "ఇలా మతం మార్చుకుంటే నీకెవరైనా డబ్బులు ఇస్తామన్నారా లేక వేరేదైనా సాయం చేస్తామన్నారా" అని కూడా అడిగారు. అసలు అలా డబ్బులిచ్చి ఓ మనిషిని మారుస్తారన్న సంగతి కూడా నాకు తెలియదప్పుడు కాబట్టి ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే కొంత ఆశ్చర్యపోతూ అటువంటిదేమీలేదనీ బదులిచ్చేవాడిని. కొందరు - "నీ తల్లితండ్రుల మాట కాదని, వారినంత క్షోభ పెట్టి ఎం సాధిస్తావు? ఎందుకింత మొండి పంతం?" అని ప్రశ్నించారు. వారిని క్షోభకు గురిచేయడం నా ఉదేశ్యమూ కాదు, అందులో నాకు ఎటువంటి సంతోషమూ లేదు. పైపెచ్చు వారితో పాటు నాకు కూడా చాలా బాధ ఉంటుంది. ఒకవేళ నేనేమయినా తప్పు చేసి, దాన్ని సరిచేసుకోమంటే సరిచేసుకుంటాను కానీ నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడమూ సత్యాన్ని గ్రహించడమూ యేసును వెంబడించడమూ నీచమైన నా బతుకుని మార్చుకోవడమూ తప్పేలా అవుతుంది. వారు "తల్లీ తండ్రీ గురువు దైవం" అని నమ్ముతారు కాబట్టి వారు ఆ ప్రశ్న వేయడం సబబే.

కానీ నేను నిజమైన దేవుడెవరో తెలుసుకున్నాను కాబట్టి ఇక మనుషులు సృష్టించిన నకిలీ దేవుళ్లనూ వారి మాటలను నేను నమ్మాల్సిన అవసరం లేదు, తూచా తప్పకుండా ఆచరించాల్సిన అవసరం అసలు లేదు. అయితే "బైబిల్ లో దేవుడు ఆదేశించినట్లుగా జీవించడానికి వారు అడ్డుపడనంత వరకూ, బైబిల్ లో చెయ్యకూడదని దేవుడు చెప్పిన పనులను చెయ్యమని వారు బలవంతపెట్టనంత వరకూ తల్లితండ్రుల మాటకు తప్పక విధేయత చూపమనీ, వారిని సన్మానించమనీ బైబిల్ సెలవిస్తున్నది" అని వారికి జవాబిచ్చేవాడిని. అయితే నా జవాబు వారికి కొత్తగానూ, అంగీకరించడానికి కష్టంగానూ తోచేది.

ఎక్కువ మంది బంధువులు అడిగిన ప్రశ్న ఇది - "నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకొని ఇంత కాలం అయ్యింది కదా, నీకు ఏం మంచి జరిగింది? నిన్ను ఆ దేవుడు ఏం ఉద్దరించాడు? నువ్వు ఏం బాగుపడ్డావు?" వారా ప్రశ్న అడగడానికి గల కారణం తెలియాలంటే తరతరాలనుండీ వారు దేవుణ్ణి ఎలా అర్ధం చేసుకుంటూ వచ్చారో అది తెలియాలి. దేవుడు అంటే వారి అవసరాలూ కోరికలు తీర్చేవాడు, ఆపదలో రక్షించేవాడు, జబ్బు చేస్తే నయం చేసేవాడు, కావాల్సినంత లేదా అడిగినంత డబ్బిచ్చేవాడు, ఇటువంటి కొన్ని కారణాల కోసం తప్ప వారికి దేవుడితో వేరే పనేమీ లేదు.

అంత మాత్రమే కాదు ఎవ్వరినైనా వారు దేవుడు అని అంగీకరించి పూజించేస్తారు కానీ ఒక షరతు - వారికి కావాల్సింది వారికి అనుగ్రహించాలి అంతే. "నేను పాప క్షమాపణనూ, నిత్య జీవాన్నీ కోరుకున్నాను, దేవుడు నాకు వాటిని అనుగ్రహించాడు" అని చెప్తే ఎవ్వరూ నమ్మేవారు కాదు ఎందుకంటే అటువంటి వాటి అవసరం యే మనిషికైనా ఎందుకు ఉంటుంది అని వారి అభిప్రాయం. వారి దృష్టిలో అవి పెద్ద అవసరాలు కావు. ఇక పాపాల సంగతి అంటారా, వారు చేసే పూజలు, మంచి పనుల ద్వారా ఆ పాపాన్ని కడిగేసుకుందామనే ఆలోచనలో వారుంటారు.అయితే ఇలా చర్చించే కొన్ని సందర్భాల్లో కొంత మందికి సువార్త చెప్పే అవకాశం కూడా లభించింది. అందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను.

మరి కొన్ని సంఘటనలు

ఒక రోజు నేను హైదరాబాద్ లో ఉండే మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదో మాటల సందర్భంలో నేను యేసుప్రభువుని నమ్ముకోవడం గురించిన ప్రస్తావన వచ్చింది. మాట్లాడుతూ ఉండగా మా అత్తకు విపరీతమైన కోపం వచ్చి నా చెంప చెళ్లుమనిపించింది, అంతే కాకుండా నీకు ఇటువంటి విషయాలు చెప్పి నిన్ను ఇలా మార్చడం సరైన పనేనా అని అక్కడ స్థానికంగా ఉండే ఒక పాస్టర్ తో గొడవపడడానికి బయల్దేరింది. సుమారు అర్థరాత్రి పన్నెండు గంటలకి ఇద్దరం ఆటోలో ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్లాం. ఆయన ఊరు వెళ్లారని వాచ్ మెన్ చెప్పడంతో తిరిగి వచ్చేసాం. అంతటితో ఆ గొడవ ముగిసింది. మరోసారి ఇంకో అత్త ఒక పెళ్ళిలో, అందరిలో నన్ను పట్టుకొని - "వీడు తక్కువ కులం దేవుణ్ణి నమ్ముకున్నాడు, వాళ్ళలో కలిసిపోయాడు" అని నన్ను అవమానించే ప్రయత్నం చేసింది. ఇతర బంధువులు కూడా అనేక మాటల చేత నన్ను ఇబ్బంది పెట్టేవారు. అలా చేస్తే నేను మనసు మార్చుకుంటానేమోనని వాళ్ళ ఆశ.

ముగింపు

మా బంధువులంతా నాతో మాట్లాడకపోయినా, క్రీస్తు ప్రేమను బట్టి నేనే వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరించి వస్తుండేవాడిని. నేను క్రీస్తు ప్రేమను కనపరచటం మానదలుచుకోలేదు. వాళ్ళు పలకరించకపోయినా, ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం మంచినీళ్లు తాగుతావా అని అడగకపోయినా, కొన్ని సంవత్సరాల పాటు నేనే ఫోన్ చేస్తూ, మాట్లాడిస్తూ వచ్చాను. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఇబ్బందుల గుండా దేవుని కృప నాకు స్థిరవిశ్వాసాన్ని అనుగ్రహించి నిలబెడుతూ వచ్చింది.

 తోటి విశ్వాసుల సహవాసం ద్వారా కూడా దేవుని కృప నన్ను బలపరిచింది. నా బంధువులకూ, నాన్నకూ దూరంగా ఉన్నాననే సంగతి జ్ఞాపకం వచ్చి, బెంగతో నేను ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ. తోటి విశ్వాసుల ప్రేమ, ఆప్యాయత నన్ను ఆ విషయమై బాధపడనివ్వలేదు. నేను ఎక్కడికి వెళ్లినా, ఎం చేస్తున్నా నన్ను పట్టించుకొని, నా భౌతిక, ఆత్మీయ యోగక్షేమాలు చూసుకోవడానికి దేవుడు ఎప్పుడూ నా కొరకు కొంతమంది యవ్వనస్థులనీ లేదా ఒక కుటుంబాన్ని సిద్ధపరచి ఉంచేవాడు. ఈ ప్రక్రియలో దేవుడు అనేక కుటుంబాలను వాడుకున్నాడు. వారందరినీ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆ విధంగా కూడా దేవుని కృప నాకు నిరంతరమూ తోడై ఉన్నది. అనేక రీతులుగా నా పట్ల కృప చూపించిన ఆ అద్వితీయ దేవునికి వందనస్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని చదువరుల జీవితాల్లో కూడా ఫలింపజేయమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.

 

 

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.