దుర్బోధలకు జవాబు

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 7 నిమిషాలు
చదివిన వారు: ఆర్. శ్రావణ్
ఆడియో

వాగ్దానాల లాటరీ

అనేక సంఘాలలో డిసెంబర్ 31న లేదా జనవరి 1వ తారీఖున బైబిల్లో ఉన్న వాగ్దానాలను చిన్నచిన్న చీటీలలో రాసి పంచిపెట్టడం, ఎవరికి ఏ వాగ్దానం వస్తే అది ఆ సంవత్సరం కోసం ప్రభువు ఇచ్చిన వాగ్దానంగా పరిగణించటం ఒక అలవాటు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు కాబట్టి, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు దానికి తగిన వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తాడనే విశ్వాసం ఈ అలవాటుకు ఆయువుపట్టు. ఎంతో ఆదరణనిచ్చే ఈ పరిచర్యను కూడా విమర్శిస్తారా? అది తప్పు, ఇది తప్పు అనటంకంటే మీకింకో పనే లేదా అనే ఆక్షేపణలకు, తిరస్కారానికి సిద్ధపడి, వాక్య అధికారంతో ఈ వాగ్దానాల లాటరీ పద్ధతిని ఖండిస్తున్నాను. ఇది సంఘాన్ని మూఢభక్తి వైపుకు నడిపించటం మాత్రమే కాకుండా, దేవుని వాక్యం చదవాల్సిన విధానాన్ని కూడా ప్రమాదంలోకి నెట్టే తప్పుడు అలవాటు. ఇందులో ఉన్న పొరపాటు ఏమిటో ఈ క్రింది విషయాలను నాతో కలసి విశ్లేషిస్తే మీకే అర్థమౌతుంది. ప్రార్థనాపూర్వకంగా పరిశీలించగలరని మనవి.

1) చీటీనందు కాదు, క్రీస్తేసునందే వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి ( 2 కొరింథీ 1:20)

క్రీస్తేసునందున్నవారికి బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ వర్తిస్తాయి. చీటీలో వచ్చినంతమాత్రాన ఎవ్వరికీ ఏ వాగ్దానాలు వర్తించవు. అన్ని వాగ్దానాలు క్రీస్తేసునందున్నవారివే అయినప్పుడు, పరిస్థితికి తగిన ఏ వాగ్దానాన్నైనా ఎత్తిపట్టుకుని ప్రార్థనలో దేవునిపై ఆధారపడొచ్చు. అలా ఆయన కృపాసింహాసనాన్ని సమీపించటానికి ధైర్యమిచ్చేది చీటీలు కావు, క్రీస్తేసునందున్నామనే నిశ్చయత మాత్రమే. ఈ ప్రాథమిక పాఠం నుండి తప్పించే చీట్ల వ్యవహారం దేవుడు ఆమోదించే పద్ధతి కాదు. 'క్రీస్తేసునందున్నాను కాబట్టి' అనే కారణం నుండి 'చీటీ వచ్చింది కాబట్టి' అనే మోసం వైపుకు తిప్పేది దేవుని ఆత్మకార్యం కాదు. రక్షణలో మాత్రమే లభించే ఈ వాగ్దానాల ఆధిక్యతను మరో పద్ధతిలో పంపిణీ చేసే అధికారం దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. 

2) వాగ్దానాలు క్రీస్తేసునందున్నవారికి మాత్రమే (2  కొరింథీ 1:20)

వాగ్దానాల చీటీలు పిల్లల రొట్టెను కుక్కపిల్లలకు పడవేసే ఒక అనాలోచిమైన పద్ధతి. క్రీస్తేసు వెలుపల ఉన్నవారందరూ శిక్షావిధికి లోనైయున్నారని మనకు తెలుసు (రోమా 8:1). వారి భాగం దేవుని ఉగ్రతే తప్ప దేవుని వాగ్దానాలు కావు. అయితే లాటరీ తీసుకున్నవారు ఒకవేళ రక్షణ లేకపోయినా,  తమకు వర్తించని వాగ్దానంతో దేవుడు మాట్లాడాడని తప్పుడు నిశ్చయతకు గురి చేయబడుతున్నారు. ఆ తప్పుడు నిశ్చయతతో మోసగించిన పాపానికి బాధ్యత ఆ లాటరీ పంచిపెట్టిన వారిదే ఔతుంది. ఉదాహరణకు, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా కలిగి లేని ఒకరికి, "యెహోవా నా పాపదోషములను పరిహరించియున్నాడు" అనే వాగ్దానం అందితే, అది సువార్తకు ఎంత పెద్ద అడ్డంకి కాగలదో ఆలోచించండి! యేసుక్రీస్తు వైపుకు పాపిని నడిపించటమే మనం అతనికి చేయగల అత్యంత గొప్ప ఉపకారం. అతనికి చెందని వాగ్దానాలతో అతనిలో ఉన్న చీకటిని వెలుగుగా భ్రమింపజేయటం అతనికి మనం చేయగల అతిఘోరమైన అపకారం. ఎవరికి ఏ వాగ్దానం రావాలో దేవుడే నిర్ణయిస్తాడు కాబట్టి రక్షణ లేనివారికి అలాంటి వాగ్దానాలు రాకుండా ఆయనే చూసుకుంటాడని మీరు అనొచ్చు. కాని వాగ్దానాలన్నీ క్రీస్తేసునందున్నవారికి మాత్రమే వర్తిస్తాయనే దేవుని నియమాన్ని ఉల్లంఘించి, అందిరికీ చాక్లెట్లలా వాటిని పంచిపెట్టి, ఆయనే చూసుకుంటాడులే అనుకోవటం ఎంత విడ్డూరమో ఆలోచించండి! వాగ్దానాలు పంచిపెట్టే ముసుగులో పాపిని మోసం చేయొద్దు, వాక్యానికి అన్యాయం చేయొద్దు.

3.) షరతులతో కూడిన వాగ్దానాల సంగతేమిటి?

లేఖనాలలోని అనేక వాగ్దానాలకు కొన్ని షరతులు జత చేయబడ్డాయి. ఆ షరతులు నెరవేర్చేవారికి ప్రతిఫలంగా చేయబడిన వాగ్దానాలు, వాటి పట్ల అవగాహన కాని, శ్రద్ధకాని లేనివారికి లాటరీలుగా ఇచ్చేయటం, దేవుని నడిపింపు ఆ ప్రక్రియలో లేదనటానికి బలమైన ఆధారం. షరతులు నెరవేర్చేవారికి వాగ్దానాలు ఉన్నాయి కాని చీటీ తీసుకున్నందుకు మాత్రమే వచ్చే వాగ్దానం అంటూ ఏది లేదు. ఆ షరతులకు వ్యతిరేకమైన జీవితాలు కలిగినవారికి వాటితో జత చేయబడిన వాగ్దాన చీటీ ఇవ్వటం వాక్యాన్ని అవహేళన చేయటమే ఔతుంది. ఉదాహరణకు "నీవు భూమి మీద దీర్గాయుష్మంతుడవైయుందువు" అనేది, తల్లితండ్రులను సన్మానించేవారికి చేయబడిన వాగ్దానం. తల్లితండ్రులను పట్టించుకోని ఒక కుమారుడికి అది చీటీ రూపంలో లభించినంతమాత్రాన దానివల్ల అతనికి ఒరిగిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఆ షరతు లోబడేవాడికి చీటీ లేకుండానే దేవుడు ఆ వాగ్దానాన్ని నేరవేర్చగలడు. కాని లాటరీ తగిలినంత మాత్రాన అది ఆ వాగ్దానాన్ని సంపాదించుకోవటానికి చాలిన అర్హత కాదు.

4.) వాగ్దానాలు చిలక జోతిష్యాలు కావు

క్రీస్తేసునందు ఉండి, ఆయా షరతులకు విధేయత చూపించటం ద్వారా అనుభవించే వాగ్దానాలు, రాబోయే సంవత్సరంలో దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలిపే చిలక జోతిష్య చీటీలుగా కూడా ఉపకరిస్తాయని తలంచటం ఎంత ప్రమాదకరమైన ఆలోచన. దేవుడు కలిగున్న ఉద్దేశానికి వెలుపల, ఆయన వాక్యాన్ని వినియోగించే అనుమతి దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. వివాహం, ఉద్యోగం, సంతాన వరం, లేదా ఇంకేమైనా మనస్సులో కోరే వారికి "యెహోవా నీ హృదయ వాంఛలను తీర్చును" అనే వాగ్దానం వచ్చి, వారనుకున్నది ఆ సంవత్సరంలో జరగకపోతే, అదిగో దేవుడు మాట తప్పాడని విశ్వాసభ్రష్టులవ్వటం వంటి కొందరి సాక్ష్యాలు నేను విన్నాను. వాగ్దానాల 'దుర్వినియోగం' విశ్వాసంలో బలపరిచేది పోయి, అవిశ్వాసానికి బీజం వేస్తుందని మరచిపోవొద్దు.

5.) బైబిల్ భాష్య నియమాలకు ఇది పూర్తిగా వ్యతిరేకం

దేవుని మాటలను వాటి అసలు సందర్భం నుండి వేరు చేసి, నా జీవిత పరిస్థితుల అనే కొత్త సందర్భాన్ని దానికి ఆపాదించటం ద్వారా ఆయన మాటలకు కొత్త భావాలు పుడతాయి. ఆ కొత్త భావాలు ఆయన మాటలు కావు. ఆయన చెప్పిన సందర్భంలో నుండి కలిగే భావం మాత్రమే నిజమైన దేవుని మాట. ఆ భావం నుండి పుట్టే నియమాలు మన జీవితానికి వర్తించే దేవుని బాట. ఈ భావంలో దేవుడు మాట్లాడతాడే తప్ప, సందర్భంతో నిమిత్తం లేకుండా తన వాక్యంలోని భాగాలను లాటరీలుగా విభజించి మన పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడతాడని అనుకోవటం వాక్యభావాన్ని నాశనం చేయటమే ఔతుంది. వాక్యాన్ని అర్థం చేసుకునే ఒక క్రమబద్ధమైన పద్ధతి ఉందనే సత్యం తెలియనివారు లేదా తెలిసి కూడా దానిని బేఖాతరు చేసేవారు మాత్రమే, ఈ లాటరీల పద్ధతి ద్వారా తమ సంఘాలను క్రమరహితంగా వాక్యాన్ని దుర్వినియోగపరుచుకునే ప్రమాదానికి ప్రోత్సహిస్తారు.

పైన చెప్పిన అంశాలను మరింత లోతుగా పరిశీలించి, సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసే పద్ధతులనే మీరు ప్రోత్సహించాలని, మూఢభక్తికి తావిచ్చే ఎలాంటి అలవాట్లతోనూ మీరు సహకరించొద్దని ప్రభువు నామంలో మనవి చేస్తున్నాను. కొందరు 'గొప్ప గొప్ప దైవ జనులు' కూడా ఈ లాటరీ పద్దతులను ప్రోత్సహించారని మాకు తెలుసు. వారి చేత స్థాపించబడిన 'గొప్ప గొప్ప సంఘాలలో' ఈ అలవాట్లు ఇంకా కొనసాగుతున్నాయని కూడా తెలుసు. వారు ఎంత గొప్పవారో, వారి బాధ్యత కూడా అంతే గొప్పది. అంతే ఎక్కువగా వారు దేవునికి లెక్క అప్పజెప్పాల్సిన ప్రమాదంలో ఉన్నారు. మనం మాత్రం ఈ చిలక జోతిష్యానికి దూరంగా ఉందాం. పుస్తకమంతా నాదైనప్పుడు ఎవరో తయారుచేసిన ఒక చీటీకి మాత్రమే నేనెందుకు పరిమితమవ్వాలి? క్రీస్తేసునందు నాకున్న వాగ్దానాలన్నీ నాకు కావాలి. షరతులతో కూడిన వాగ్దానాలన్నీ నన్ను మరింత విధేయతకు ప్రోత్సహించాలి. ఇది వాక్యవాగ్దానాలను సొంతం చేసుకునే ఏకైక పద్ధతి. అలాగే చేయగల కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.

 

Add comment

Security code
Refresh

Comments  

# సోషల్ మీడియాలో ప్రచురణVictorbabu 2021-01-08 22:16
సార్ నేను ఈ పోస్ట్ ను సోషల్ మీడియాలో(పేస్బుక్) ప్రచురించాలని ఆశపడుతున్నాను
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.