దేవుడు

రచయిత: జాన్ జి.రీసింగర్
అనువాదం: సుహాసిని ముఖర్జీ
చదవడానికి పట్టే సమయం: 2 గంటల 32 నిమిషాలు

విషయసూచిక

పరిచయం

“ఏర్పాటునందు దేవుని సార్వభౌమత్వము” అనే పుస్తకంలో దేవుడు ప్రతి సంభవాన్ని తన సర్వాధికారంతో నిర్ణయించటం మాత్రమే కాక అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకొని తన ప్రణాళికను కొనసాగిస్తాడని, దీనికి అపవాదితో సహా ప్రతి వ్యక్తినీ ఉపయోగించుకుంటాడని వివరించాం.

ఈ సత్యం అలసిన మనస్సుకు, దు:ఖభరితమైన హృదయానికి ఎలా సేద దీర్చుతుందో చూపించాం. దీన్ని అర్థం చేసుకోలేకపోయినా, “నా కాలగతులు నీ హస్తములో నున్నవని” విశ్వసించటమే దేవుని యందలి నిరీక్షణకు మొదటి మెట్టు.

అయితే ఆ పుస్తకంలోని సత్యం ఒక హేతుబద్ధమైన ప్రశ్నకు తావిస్తుంది. అదేమిటంటే “దేవుడే అన్ని సంభవాలను ముందుగా నిర్ణయించినట్లయితే ఇక నేను ఎందుకు ప్రార్థించాలి? ఈ ప్రశ్నతోనే ఈ పుస్తకాన్ని ప్రారంభిస్తున్నాం. దానికి జవాబు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం.

దేవుని సార్వభౌమత్వమును పూర్తిగా త్రోసి పుచ్చిన వారు గాని లేదా దానిని లేఖనాలలో చూసికూడ, దానికీ ప్రార్థనకూ ఉన్న సంబంధాన్ని గ్రహించలేని వారు గాని అడిగే మొట్టమొదటి ప్రశ్న తప్పక ఇదే అయ్యుంటుంది. ప్రతి నిజ క్రైస్తవుడూ ఏదో ఒక సమయంలో ఈ రెంటి మధ్య గల సంబంధాన్ని గ్రహించటానికికష్టపడి యుండవచ్చుననుకుంటాను. దేవుని సంపూర్ణ సార్వభౌమత్వమనే బైబిలు సత్యాన్ని ఎదుర్కొన్న ప్రతి వ్యక్తీ ఈ ప్రశ్నతో సతమతమై యుండవచ్చునని మా నమ్మకం.

నేను ఇక్కడ కొన్ని కష్టమైన సమస్యలను పరిశీలించినప్పటికీ, వేదాంత పండితుల కోసం ఈ పుస్తకాన్ని వ్రాయనుద్దేశించటం లేదు. లోతైన జలముల గుండా నడుస్తున్న దేవుని బిడ్డలకు వాక్యానుసారమైన నిరీక్షణను కల్గించటమే నా ధ్యేయం. “ఆరోగ్యము, సంపద” సువార్తికులు ఈనాడు టి.వి.లలో బోధిస్తున్న ప్రార్థన సిద్ధాంతము నిజ విశ్వాసానికి గొడ్డలి పెట్టు అని చూపించటం నా రెండవ ధ్యేయం. కొందరు నేను మరింత కఠినంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతున్నానని తలంచవచ్చు. కాని అసత్యమైన నిరీక్షణను బోధించటం వలన కలిగిన నిస్పృహ మరియు అవిశ్వాసాలను నేను చూసినందున ఇలా మాట్లాడవలసి వచ్చింది.

సౌండ్ ఆఫ్ గ్రేస్ (Sound of Grace) పరిచర్యకు నమ్మకంగా తమ సహాయం అందించిన అనేకులను బట్టి నేను దేవునికి వందనస్థుడను. ఈ పుస్తకంలోని విషయాలన్నీ మొదట ఆ పత్రికలోనే అనువదించబడ్డాయి.

 

అధ్యాయం -1

దేవుని సార్వభౌమత్వము - ప్రార్థన

నిర్వచనం

"రైసింగర్ గారూ, జరుగబోయే సంఘటనలన్నిటిని దేవుడే ముందుగా నిర్ణయించినట్లయితే ఇక మనం ప్రార్థించటం ఎందుకు?”

దేవుని సర్వాధికారాన్ని సరాసరి త్రోసి పుచ్చిన వారు గాని, లేదా దీనిని లేఖనాలలో చూసికూడ ప్రార్థనకూ దీనికీ ఉన్న సంబంధాన్ని గ్రహించలేని వారు గాని అడిగే మొట్టమొదటి ప్రశ్న తప్పక ఇదే అయ్యుంటుంది. ప్రతి నిజ క్రైస్తవుడూ ఏదో ఒక సమయంలో ఈ రెండిటి మధ్య గల సంబంధాన్ని గ్రహించటానికి కష్టపడియుండ వచ్చునని నేను భావిస్తున్నాను. దేవుని సంపూర్ణ సార్వభౌమత్వమనే బైబిలు సత్యాన్ని ఎదుర్కొన్న ప్రతి వ్యక్తీ ఈ ప్రశ్నతో సతమతమై యుండవచ్చునని నా నమ్మకం.

ఇవి పరస్పర వైరుధ్యాలనే తలంపు సాధారణంగా ఈ క్రింది మూలాలలో ఒకదాని నుండి ఉద్భవిస్తుందని మొదట మనం గ్రహించాలి:

(1) ఇలా ప్రశ్నించేవారు దేవుని సార్వభౌమత్వమును గురించి లేదా ప్రార్థనను గురించి సరైన సిద్ధాంతమును కలిగి లేరన్నదివాస్తవం. సార్వభౌమత్వమును గురించిన వాక్యానుసారమైన దృక్పధాన్ని ప్రార్థన గురించిన వాక్యానుసారం కాని దృక్పథంతో జత చేయటం అసాధ్యం. అదే విధంగా ప్రార్థనను గురించిన వాక్యానుసారమైన దృక్పథాన్ని, సార్వభౌమత్వమును గురించిన వాక్యానుసారం కాని దృక్పధంతో జోడించటం సాధ్యం కాదు. బైబిలు సిద్ధాంతాలన్నీ నిజంగా వాక్యానుసారంగా ఉన్నప్పుడు మాత్రమే అవి చక్కగా సమ్మేళనం కలిగియుంటాయి. విచారకరమైన విషయమేమిటంటే ఈ తరము వారు సార్వభౌమత్వం, ప్రార్థన అనే ఈ రెంటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అనగా మనము తరచు దేవుని సార్వభౌమత్వమును గురించిన బైబిలు సిద్ధాంతాన్ని మానవ కేంద్రితమైన ప్రార్థనా సిద్ధాంతంతో కలపటానికి ప్రయత్నిస్తున్నాం. అయితే వాస్తవానికి ఇది సత్యమును పొరపాటుతో జత చేసే ప్రయత్నమే కాని ఇది అసాధ్యం. ఈనాడు బోధించబడుతున్న ప్రార్థన దృక్పధము వాక్యానుసారం కాదని ఒకడు గ్రహించే వరకు, దేవుని సర్వాధికార నిర్ణయాలకూ, ప్రార్థన చేయవలసిన అవసరతకు మధ్యగల సంబంధాన్ని ఎవరూ గ్రహించలేరు.

నిజానికి ఇక్కడనున్న ఈ సమస్య, దేవుని సార్వభౌమత్వమును మానవుని బాధ్యతతో సమన్వయపరచటానికి ప్రయత్నించేటప్పుడు ఎదురయ్యే సమస్య ఒక్కటే. “మానవుని స్వేచ్ఛా చిత్తము” అనేది ఒక మిథ్యయని గ్రహించే వరకు దేవుని సార్వభౌమత్వము యొక్క సత్యాన్ని ఎవరూ గ్రహించలేరు. ఈనాటి క్రైస్తవులు ఈ రెండు సిద్ధాంతాలను జత చేయటానికి ఇంత సతమతమవటానికి కారణం ఏమిటో కనుగొనటం సులభమే. వాక్యానుసారమైన విధంగా బోధించినప్పుడు ఆ రెంటిలో గల సత్యాన్ని వారు నిజంగా అర్థంచేసుకోరు. ఈనాటిఅనేక సౌవార్తిక శాఖలు, మానవునికి స్వేచ్ఛా చిత్తము ఉందనే దృక్పధంతో తమ సిద్ధాంతాలను రూపొందించుకుంటున్నారు. కాని దేవుడు మరియు ఆయన సర్వాధికార చిత్తము అనే అంశాలతోనే బైబిలు సిద్ధాంత బోధలన్నీ ప్రారంభమవుతున్నాయి.

(2) తరుచుగా తలెత్తే రెండవ సమస్య ఏమిటంటే దేవుని సార్వభౌమత్వం ప్రార్థన చేయవలసిన అవసరతను వ్యతిరేకిస్తున్నదనే కారణం చూపి దాన్ని త్రోసిపుచ్చేవారు “దేవుని సంకల్పమంతటిని ఎన్నడూ వినియుండరు. అలాంటి వ్యక్తుల దైవ శాస్త్రము ప్రార్థన పరిస్థితులను మార్చును” వంటి సాధారణ జన వాక్యాలపై ఆధారపడినదై ఉంటుంది. అలాంటి వారితో దేవుని వాక్యమును చర్చించటం నిష్ప్రయోజనం. గతంలో నేను కాపరిగా పనిచేసిన సంఘంలో “అతి భక్తిపరుడగు ఒకానొక వ్యక్తి మొండివాదం చేయటంలో ఘనుడు. దైవ వాక్యమే తన అధికారమని ప్రకటించే అతడు, స్థిరంగా కూర్చుని ఆ వాక్యం గురించి చర్చించేందుకు మాత్రం ఇష్టపడేవాడు కాదు. బైబిలులో పరిశుద్దాత్ముడేమీ వ్రాసినా, ఈ వ్యక్తి మాత్రం దానికి ఒక సాధారణ జన వాక్యంతో ప్రతిస్పందించే వాడు. అతడు బైబిలు గురించి బహుగా ఎరిగినవాడే కాని అందులో ఉన్న నిజ వర్తమానమును అర్థం చేసుకున్నది బహు తక్కువ. అతడు “నాకు స్థిరమైన దైవ శాస్త్రమేమీ లేదని చెప్పినా, కొన్ని నియతమైన నమ్మకాలు అతనికి ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు ప్రతి అంశానికీ అతని ప్రతిస్పందనను ఆ జన వాక్యాలే నిర్ణయించేవి. అవే అతనికి లేఖనాలకన్నా ప్రామాణికంగా ఉండేవి.

వాస్తవానికి మనం ఎదుర్కోవలసిన ప్రశ్న ఇదే. ప్రార్థన అనేది దేవుడు ఏర్పరిచిన ప్రణాళికను నెరవేర్చటానికి అవసరమైన ఒక సాధనమా? లేక అది మానవుడు ఈ ప్రపంచాన్ని, అందులో సంభవించే సంఘటనలను నియంత్రించి నడిపించేందుకు ఉపయోగించే సాధనమా? మొదట ఇది చాల స్పల్పమైన ప్రశ్నగా కనిపించ వచ్చు కాని, ఇది స్పల్పమైంది కాదు. వాస్తవానికి ఇదే అతి కీలకమైన ప్రశ్న.

మొదటిగా మనము దేవుని సర్వాధికారము, ప్రార్థన అను అంశం గురించి మాట్లాడేటప్పుడు ఏమి ఉద్దేశిస్తున్నామో, ఏమి ఉద్దేశించటం లేదో స్పష్టంగా గుర్తించాలి. ”ప్రార్థన పరిస్థితులను మార్చు”ననే మాట పూర్తిగా తప్పు అని అంటున్నామా? ఎంత మాత్రము కాదు, కాని ఆ మాట పూర్తి కథను చెప్పటం లేదని అంటున్నాం. ఆ జన వాక్యంలో సగం సత్యమే ఉంది. అయితే సగం సత్యాన్ని సంపూర్ణ సత్యంగా పరిగణిస్తే, అది అసలు సత్యమే కాదని, అది సత్య విరోధానికి దారితీస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఆ జన వాక్యము ఒక విలువైన సత్యంలోని అర్థ భాగం మాత్రమే, అయితే అది పూర్తి నిజమని భావిస్తే, అది తప్పుడు దైవ శాస్త్రానికి దారితీస్తుంది. ఆ తప్పుడు దైవ శాస్త్రం ఎల్లప్పుడూ చెడు అనుభవాలకు దారితీస్తుంది.

యథార్థవంతమైన ప్రార్థన ద్వారా ఆరడుగుల ఎత్తున్న బాలిక అయిదడుగుల నాలుగు అంగుళాలకు మార్చుకొనగలదని ఆ జన వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకొనవచ్చునా? “ప్రార్థన పరిస్థితులను మార్చును” అనే జన వాక్యంలోని పరిస్థితి” అనే మాటలో నా ఎత్తు, నా కళ్ల రంగు మొదలైనవన్నీ ఇమిడివున్నాయా? ”ప్రార్థన పరిస్థితులను మార్చును” అను వేదాంతంతో నా “స్వేచ్ఛా చిత్తము” యొక్క శక్తిని జత చేసినపుడు మత్తయి 6:27 లో యేసు మన ఎత్తును “మూరడెక్కువ చేసికొనుటను” గురించి చెప్పిన మాట సైతం తప్పుఅని నేను నిరూపించగలనా? మన:పూర్వకమైన ప్రార్థన ద్వారా నల్లని వాడు తెల్లగాను, తెల్లని వాడు ఎర్రగాను మారగలడా? ప్రార్థన గురించి ఇలాంటి దృక్పధం అర్థరహితం. అది దేవుని వాక్యానికి విరుద్ధం.

అయినప్పటికి వేలాది మంది యధార్ధపరులైన క్రైస్తవులు దానిని నమ్మటమే కాక ఇలాంటి సిద్ధాంతాలపై తమ 'పరిచర్యను' కట్టుకొనే ధనాశాపరులకు కోట్లాది ధనం విరాళంగా పంపుతున్నారు.

ఇక్కడ మరొక విషయాన్ని కూడ నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. ”ప్రార్థన పరిస్థితులను మార్చును” అంటే ప్రార్థన దేవున్ని గాని, ఆయన ప్రణాళికను గాని, ఆయన చిత్తాన్ని గాని మార్చుతుందని కాదు! విషాదకరమైన విషయమేమిటంటే చాలా మంది తెలియక (కొందరు బాగా తెలిసికూడ) ఈ జన వాక్యానికి ఇదే అర్థమని భావిస్తున్నారు. దేవుడు తన మనస్సు మార్చుకోవాలని చేసే ప్రార్థన ఎంత మాత్రమూ వాక్యానుసారమైనది కాదు. అలాంటి తలంపు అత్యంత అపాయకరమైనది. సుబుద్ధి కలవాడెవడైనా విశ్వాసాన్ని, ప్రార్థనను సాధనంగా వాడుకొని దేవుని మనస్సు మార్చ ప్రయత్నిస్తాడా? వివేకముగల వాడెవ్వడును ఆ రీతిగా చేయడు. “నేను దేవునియంతటి సార్వభౌముడనై యుంటే ఎన్నో విషయాలను మార్చేవాడిని. కాని దేవుని యంతటి వివేకినై యుంటే నా మట్టుకు నేను ఎన్నడూ మారని వాడనై యుంటాను” అని ఎవరో చెప్పిన మాటలు ఎంతో వాస్తవం.

ఒకవేళ దేవుడు ఏదో ఒక రీతిగా తన మనస్సును మార్చుకొన్నట్లయితే ఆమార్పు ఆయన ప్రణాళికను మెరుగు చేస్తుంది లేదా దిగజార్చుతుంది. ఒకవేళ అలాంటి మార్పు ఆయన ప్రణాళికను మెరుగుపరిస్తే అంత వరకూ ఆయన పరిపూర్ణుడు కాడని భావంఇస్తుంది కదా? అదే విధంగా అలాంటి మార్పు ఆయన ప్రణాళికను దిగజార్చినట్లయితే ఆయన పరిపూర్ణతకు భంగం వాటిల్లుతుంది కదా? కాని నిరంతరం పరిపూర్ణుడైన దేవుని ప్రణాళికలు కూడ ఆయన వలె పరిపూర్ణమైనవి. వాటిని మార్చవలసిన అవసరం లేదు. కాబట్టి “ప్రభువునైన నేను మార్పులేని వాడనని” దేవుడొక్కడే చెప్పగలడు.

అందుకే ఆయన గురించి ”ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనా గమనముల వలన కలుగు ఏ ఛాయయైనను లేదు” (యాకోబు 1:17) అని లేఖనములు వర్ణిస్తున్నాయి.

నీ వద్ద మార్పు యొక్క ఛాయయే కనిపించదు. నీవు మార్పులేని వాడవు, నీ కనికరము నన్ను వీడి పోదు నీవు పూర్వమున్నట్లే నిత్యముందువు

అని మనము ఆయనను గురించి గానము చేయుట యుక్తమే.

”ప్రార్థన పరిస్థితులను మార్చును” అనే ఫలకాన్ని మార్చి ”ప్రార్థన ప్రార్థించే వ్యక్తిని మార్చును” అనే మరొక ఫలకాన్ని మనం తయారు చేయవచ్చు. కాని అది కూడ అచ్చు మొదటి దాని వలె అర్థ సత్యాన్నే చెబుతుంది. కొన్నిసార్లు ప్రార్థన మనలను మార్చి, మనం మార్చుమని దేవున్ని వేడుకొన్న పరిస్థితుల్నే మనం అంగీకరించేలా చేస్తుంది! ఒకానొక సందర్భంలో పౌలుకు సంభవించింది ( 2 కొరింధీ 12:7-10 ) ఇదే కదా? అయినా ఇది కూడా సత్యంలోని సగ భాగమే. ప్రార్థన గురించిన ఈ కోణాన్ని మనం మరల పూర్తిగా పరిశీలిద్దాం. 'దేవుడు మన కొరకు దాచి యుంచిన నిధులను త్రవ్వి తీయటమే ప్రార్థన' అని జాన్ కాల్విన్ చెప్పాడు.

వాస్తవానికి ప్రార్థన మన నుండి గాని మన స్వేచ్ఛా చిత్తమునుండి గాని ఉద్భవించదు. దేవుడు తాను ఏర్పరచిన ప్రణాళికను నెరవేర్చటానికి వాడుకునే సాధనమే ప్రార్థన. మన:పూర్వకమైన ప్రార్థన చేయటానికి యథార్ధమైన ప్రేరేపణ పరిశుద్ధాత్మ నుండే కలుగుతుంది.

ప్రార్ధన మరియు సార్వభౌమత్వమును గురించి చర్చించేటప్పుడు మనం ప్రశ్నించలేని, అధిగమించ జాలని కొన్ని స్పష్టమైన బైబిలు సత్యాలను నేనిక్కడ చెప్పదలచుకున్నాను.

1. ప్రార్థించుమని దేవుడు మనకాజ్ఞాపించాడు.

2. మన ప్రార్థనలు విని వాటికి జవాబు దయచేస్తానని ఆయన వాగ్దానం చేశాడు.

మనము ప్రార్థన చేయకపోతే బుద్ధిపూర్వకంగా ఆయనకు అవిధేయత చూపిన వాళ్లమవుతాం. మనము “విసుకక నిత్యము ప్రార్థింపవలెననియు” (లూకా 18:1), “మనము” ఎడతెగక ప్రార్థన చేయవలెననియు” (1 థెస్స 5:15) ఆజ్ఞాపించబడియున్నాం. పౌలు పత్రికలన్నిటిలో తాను వ్రాసే సంఘాల కొరకైన తన విజ్ఞాపనల ప్రస్తావనలు మనకు సమృద్ధిగా కనిపిస్తాయి. ప్రార్థనను కాదనేది, లేదా నిత్యం ప్రార్థించవలసిన బాధ్యతను నిర్లక్ష్యం చేసేందుకు అనుమతించేది అయిన సార్వభౌమత్వ సిద్ధాంతాన్ని మనం నమ్మితే అది సరైన సిద్ధాంతం కాదు. మన ప్రార్థనలకు స్పష్టమైన జవాబులు రాని యెడల దేవునితో మనకున్న సంబంధం సరియైనదేనా అని తీవ్రంగా, లోతుగా పరిశీలించుకోవాలి. యాకోబు తన పత్రికలో“నీతిమంతుని ప్రార్థన బహు బలము కలదని చెబుతున్నాడు. ఈ సత్యాన్ని దైవశాస్త్ర పరంగా కాని, ప్రయోగాత్మకంగా గాని వ్యతిరేకించే ఏ సిద్ధాంతమైనా వాక్యానుసారమైంది కాదు. దేవుడు ప్రార్థించమని ఆజ్ఞాపించి, దానిని విని, జవాబు దయచేస్తాడనే సత్యం బైబిలులో దాదాపు ప్రతి పుట మీద ముద్రించబడి ఉంది. దీనిని కాదనే ఏ సార్వభౌమత్వ సిద్ధాంతమైనా స్పష్టమైన లేఖన బోధను వ్యతిరేకించేదే అవుతుంది.

అయినప్పటికి ప్రార్థన గురించి బోధించే ఈ నవీన కాలపు బోధకులు ప్రయోగించే లేఖన భాగాలు సందర్భ సహితమైనవి కావు. అలాంటి రెండు లేఖన భాగాలను ఇక్కడ ఉదహరిస్తున్నాం.

“ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము” (1 యోహాను 5:14).

ఈనాడు ఈ వాగ్దానం మనకు వర్తిస్తుందా? తప్పక వర్తిస్తుంది. అయితే ఆ మాటలను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలా? ఖచ్చితంగా అలాగే అర్థం చేసుకోవాలి. అయితే విశ్వాసంతో నేనేమి అడిగినా దానిని దేవుని వద్ద నుండి తప్పక పొందగలనా? నేను అడిగిన సమస్తాన్ని పొందవచ్చునని యోహాను చెబుతున్నాడా? అలాగని నువ్వు నమ్మితే త్వరలోనే నీ విశ్వాసాన్ని విడిచి పెడతావు. లేదా వాస్తవాలను ఎదుర్కొనేందుకు నిరాకరిస్తావు. అటువంటి సిద్ధాంతాన్ని హృదయ పూర్వకంగా విశ్వసించి, యథార్ధంగా క్రమం తప్పక ఆచరిస్తే నువ్వు అతి సులభంగా పిచ్చివాడి వవుతావు.

నేను ఆశించిన వాటన్నిటిని అడిగి అది 15వ వచనంలో ఉన్న వాగ్దానం క్రిందికి వస్తుందని నమ్మటానికి ఈ వాక్య భాగంలో ఏ ఆస్కారమూ లేదు. ఈ వచనం “మనమేది అడిగినను” అని చెప్పటం వాస్తవమే కాని దాని ముందున్న వచనం “ఆయనచిత్తానుసారముగా” అడిగితే అని స్పష్టం చేస్తుంది. ఏ మినహాయింపు లేకుండా ఈ వాగ్దానం కేవలం ఆయన చిత్తానికి అనుగుణంగా విన్నవించుకున్న వాటికి మాత్రమే వర్తిస్తుందని మనం గ్రహించాలి. ఈ వాగ్దానం ఆరంభమయ్యేది నా అవసరతలతో, నా స్వచిత్తంతో కాదు, దేవుని సార్వభౌమ చిత్తముతోను, ఆయన మహిమతోను మొదలవుతున్నది. మన హృదయం ఆయన ఉద్దేశాలకు విధేయత చూపి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలన్న కోరిక కలిగివుండాలని, ఆయన చిత్తాన్ని జరిగించటానికి కావలసిన కృపను అర్థించటమే మన మొదటి ఆశయమై యుండాలని ఈ వాక్యభాగం ఉద్భోదిస్తుంది. దీని అర్థమేమిటంటే ఆయన చిత్తాన్ని నాకు తెలియజేయుమని అడగటం కోసమే నేను దైవ వాక్యాన్ని పఠించి ప్రార్థిస్తున్నానే కాని ఆయన ప్రణాళిక ఏమై యున్నదో ఎరుగక నా యిష్టాన్ని ఆయనపై రుద్దటానికి ప్రయత్నిస్తున్నానని కాదు. ఈ వాక్యాన్ని సందర్భానుసారంగా పరీక్షించినప్పుడు ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది.

1 యోహానులో ఉన్న వాక్య భాగాన్ని యాకోబు పత్రికలో ఉన్న మరొక వాక్యంతో పోల్చి చూసినప్పుడు ఈ సత్యం మరింత స్పష్టమవుతుంది. ప్రార్థన గురించిన నీ దైవశాస్త్రంతో యాకోబు పత్రికలోని ఈ క్రింది వచనాలు ఎలా సరిపడతాయి?

“మీలో యుద్ధములును పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే కదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకుట లేదు; నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు” (యాకోబు 4:12).

మనం చర్చిస్తున్న అంశాన్ని గురించి ఈ వచనాలు రెండు విషయాలను చెబుతున్నాయి. మొదటిది, మన జీవితంలో తెగిపోయిన బంధాలకు, నిస్పృహలకు ముఖ్య కారణం మనం కోరిన వాటిని పొందటానికి ఇతరులను వాడుకోవాలన్న మన శరీరాశలే. రెండవది, ఈ కష్టం కలగటానికి కారణం మనం ప్రార్థించకపోవటమే- “దేవున్ని అడుగనందున మీకేమియు దొరుకదు.” మనము త్రోసి, లాగి, కుతంత్రాలు పన్ని, బుజ్జగించి, భయపెట్టి, అరిసి, కసిరి శత విధాలుగా ప్రయత్నించి మనం అనుకున్నది సాధించేందుకు ప్రయత్నించినా, విశ్వాస సహితమైన ప్రార్థనతో దేవున్ని అడుగనందున మనకేమీ దొరకదు. మన సొంత కోరికలను నెరవేర్చుకోటానికి, మనము బంధాలను చంపి, నమ్మకద్రోహం చేసి, దేనినైనా ఎవరినైనా నాశనం చేయటానికి సైతం వెనుకాడం. మన అంతరంగంలో చెలరేగుతున్న చెడు కోరికలు, ఆశలు దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని జరిగించే విశ్వాసయుతమైన ప్రార్థనకు విరోధమైనవి. “దేవుని అడుగనందున మీకేమియు దొరుకదు” అనే మాటను మనం జీవితంలో నిస్పృహకు లోనైనప్పుడెల్ల, నిష్పలమైన దినమును ఎదుర్కొన్నప్పుడెల్ల గుర్తుచేసుకోవాలి. “మీరు నిస్పృహ నొంది యుద్ధము చేయుదురు గాని, ప్రార్థించనందున మీకేమియు దొరుకదు” అనే మాటను ఒక ఫలకం మీద రాసి మన హృదయ కవాటమున వ్రేలాడదీయాలి. దేవునికియ్యవలసిన స్థానాన్ని మన స్వార్థం ఆక్రమించే ప్రయత్నం చేస్తుందని, అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి వైఖరే మనకున్న అనేక సమస్యలకు మూలం.

- యాకోబు పత్రిక 4వ అధ్యాయంలోని తరువాయి వచనం ఎంతో గంభీరమైనది. మన వాంఛలను తీర్చుకోవటానికి శారీరకంగా మనంచేసిన ప్రయత్నాలన్నీ నిష్పలమైనప్పుడు మనం దేవుని వైపు తిరుగుతాం. దీనిని ప్రార్థన అని పిలుస్తాం. ఇది సరికాదు. మనము త్రోసి లాగి గుద్దులాడి పొందలేని దానిని పొందటానికి దేవున్ని ఉపయోగించేందుకు ప్రయత్నిస్తాం. యాకోబు దీని నెంత స్పష్టంగా తెలియజేస్తున్నాడో గమనించండి.

“మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరుకుట లేదు” (యాకోబు 4:3).

ప్రార్థన గురించిన నేటి సిద్ధాంతానికి ఇది ఎంత భిన్నంగా ఉంది! యాకోబు చెబుతున్నదేంటో నువ్వు గ్రహించావా? మనం తరచుగా మన స్వార్థపూరితమైన దురాశతో కూడిన ఉద్దేశాలను ప్రార్థన అనే ముసుగులో దాచిపెడుతున్నామని చెబుతున్నాడు. మన స్వప్రయోజనం కోసం దేవున్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించి దానిని ప్రార్థన అని పిలవటానికి సాహసిస్తున్నామని అతడు మనలను హెచ్చరిస్తున్నాడు. “మేము ఎంతో ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాం' అని చెప్పుకొని, కేవలం తమ పదవులను నిలుపుకోవటానికి సంఘాలనే పతనానికి తెచ్చిన ఎంతో మంది సంఘ నాయకులను నేను చూశాను. వారి మాటలు వట్టి పనికి మాలినవని తెలుస్తున్నాయి కదా! ఎంతో ప్రార్థించిన మీదట పుట్టుకొచ్చిన ప్రేమ పేరిట సంభవించే ఇటువంటి కక్షలు, చీలికలకు సమాధానకర్తయగు పరిశుద్ధాత్ముడు నిందించబడటం ఆశ్చర్యం కాదా?

ఈనాడు అనేకులు చూస్తున్న విధంగా దేవుడు ప్రార్థనను చూడటం లేదన్నది స్పష్టం. మనలను ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా చేయటానికి దేవున్ని ఉపయోగించుకోవచ్చుననేప్రార్థన గురించిన తప్పుడు సిద్ధాంతాన్ని బోధించి డబ్బు సంపాదించాలని చూస్తే మతపరమైన చిల్లర వర్తకులు ఎందరో ఉన్నారు. ప్రవక్తయైన హోషేయా యిచ్చిన హెచ్చరిక వాళ్లని గురించే అని వారు గ్రహించటం లేదని నేను అనుకుంటున్నాను.

“హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలుకొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు” (హోషేయ 7:14).

ఇశ్రాయేలీయులు ప్రార్థన అని తలంచిన దానిని ప్రవక్త అపహాస్యం చేస్తున్నాడు. వారు ప్రార్థన అని పిలిచిన దానిని “శయ్యల మీద పరుండి కేకలు వేయుట” అంటున్నాడు దేవుడు. దేవునికి మొరపెట్టుకున్నట్లు వారు నటించినప్పటికీ, వాస్తవానికి వారు దెబ్బతగిలిన కుక్క లాగ మూలుగుతున్నారు. ఎన్నిసార్లు మన ప్రార్థనలు కూడ దేవుని సార్వభౌమత్వపు ఏర్పాట్ల పై సణుగులుగా మారుతున్నాయి? పరిస్థితులు మనకు అర్థం కానప్పటికి, ఆయనపై నమ్మక ముంచటానికి కావలసిన కృపను అర్థించి, ఆయన ఎదుట అణకువతో ఉండటానికి బదులుగా మనమెన్ని సార్లు మనకు కావలసిన వాటికోసం దేవుణ్ణి బలవంతపెడుతున్నాం!

నేను చెప్పదలచుకున్న ముఖ్య విషయం ఇదే. దేవుని సార్వభౌమత్వమును గురించిన సత్యంతో ఇటువంటి ప్రార్థనా సిద్ధాంతాన్ని (వాస్తవానికి ఇది ప్రార్థన కాదు. ఇది “శయ్యల మీద పరుండి కేకలు వేయుట మాత్రమే) జత చేయటం అసాధ్యం. నేడు ప్రార్థన గురించి ప్రాబల్యంలో ఉన్న తప్పుడు సిద్ధాంతం వాస్తవానికి దేవుణ్ణి సింహాసనం నుండి తొలగించి, ఆయన శాసనాలను కూలద్రోయటానికి ప్రయత్నించేదిగా ఉంది. ఇటువంటి సిద్ధాంతం దేవున్ని మానవుని సేవకునిగా చేసి శరీరాశలను ప్రార్థన యంత్రాంగ సహాయంతో తన స్వంత ద్యేయము వలన రూపొందించి నియంత్రించటానికి అనుమతిస్తుంది. ఇలాంటి దృక్పధం ఇంత విరివిగా వ్యాపించియున్న కారణాన ఈ 20వ శతాబ్దపు క్రైస్తవ లోకంలోని దైవశాస్త్రంలోను వ్యక్తిగతానుభవంలోను ఎంతో కలవరం నెలకొని ఉందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ విషాద పరిస్థితిలో మరింత ఘోరం ఏమిటంటే 1 యోహాను 5:14, 15 వంటి వాక్య భాగాలకు తప్పుడు అర్థాలు చెప్పటం వల్ల, ఈ కలవరాలను పుట్టించిన నింద బైబిలు మీద పడుతుంది.

ఈ వాక్య భాగాన్ని ఒక “బేషరతు వాగ్దానంగా ఉపయోగించక మునుపు మనం మన హృదయాన్ని మూడు ప్రశ్నలు అడగాలి:

1. దేవుని చిత్తమును నెరవేర్చటమే నా యథార్ధమైన కోరికనా?( యోహాను 7:17 ). ఈ కోరిక మన హృదయాలలో లేకుండా దేని గురించయినా ప్రార్థించటం వ్యర్ధ ప్రయాసమే అవుతుంది.

2.నా జీవితమంతటిలో నా కోసం దేవుని చిత్తమేమై యున్నదో తెలుసుకోటానికి నేనాయన వాక్యంలో దేవుని జ్ఞానమును వెదకుతున్నానా? మరల చెబుతున్నాను, దేవుడేమి కోరుతున్నాడో తెలుసుకోకుండ “నాకు కావలసిన వాటిని” అడగటాన్ని ప్రార్థన అనరు.

3.“అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక” అని నా ప్రభువు ప్రార్థించిన రీతిగా అదే వైఖరితో నేను యథార్ధంగా ప్రార్థించగలుగుతున్నానా? నేను ప్రార్థించేటప్పుడునా యజమాని కన్నా నేను అధికుడనా?

పై ప్రశ్నలకు సరిగా జవాబులివ్వ లేనట్లయితే, లేదా ఇయ్యనిష్టపడకపోతే మనము మన స్వచిత్తమును జరిగించుకోటానికి దేవున్ని ఉపయోగించు కునేందుకు ప్రయత్నిస్తున్నామని అర్థం. మన ఇష్టాన్ని ఇతరులపై రుద్దటానికి చివరికి దేవుని శక్తిని వాడుకునేందుకు సైతం వెనుకాడమని దీనికి అర్థం. దైవ చిత్తానికీ, ఆయన ప్రణాళికలకు సరిపోయినా, సరిపోకపోయినా మన సొంత కోరికలు ఏదో ఒక రీతిగా తృప్తి పరచబడాలని మన స్వార్థపూరిత స్వభావం కోరుకుంటుంది. వ్యక్తిగత ఆనందమే మన ధ్యేయమైనప్పుడు దేవుని గురించి, ప్రార్థన గురించి మనకున్న భావన భయంకరంగా అస్తవ్యస్తమై పోతుంది. ప్రార్థన గురించిన ఈ వాక్యంలో “మనమేది అడిగినను” అనే మాటను “ఆయన చిత్తానుసారముగా” అనేదానికి పరిమితం చెయ్యాలి. 1 యోహాను 5:14, 15 ; యాకోబు 4:3 ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివి. ఈ రెంటిలో దేనిని నిర్లక్ష్యం చేయటం లేక తృణీకరించటం సాధ్యం కాదు. ఆత్మీయ స్థితిని బేరీజు వేసుకోవటానికి మన ప్రార్థనా జీవితం ఒక కొలబద్దగా ఉన్నదని నేను మీకు గుర్తు చేయవలసిన అవసరం లేదని నమ్ముతున్నాను. ప్రార్థించటం గురించి ప్రసంగించటం గాని పుస్తకాలు రచించటం గాని యథార్ధంగా ప్రార్థన చేయటం కంటే ఎంతో సులువైనవి. ప్రార్థనపై కలిగే నిర్లక్ష్య వైఖరిని బట్టి అనుభవించినంత కన్నీటి పశ్చాత్తాపము క్రైస్తవ జీవిత క్రమశిక్షణలోని మరే ఇతర విషయాన్ని బట్టి నేను అనుభవించియుండక పోవచ్చును. సామ్యూల్ స్టార్మ్ ప్రార్థన గురించి తాను రాసిన అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేస్తూ రెయిన్ కోట్ వంటి నా సొంత అనుభవాన్ని ఇలా వర్ణించాడు.

“నేనీ పుస్తకాన్ని రాయటానికి గల కారణం మీరనుకునే దానికి భిన్నంగా ఉండవచ్చు. నేను దోషిననే భావమే నన్నీ పుస్తకం రాయటానికి పురికొల్పింది. నా ప్రార్థనా జీవితం ఉండవలసినవిధంగా ఎంత మాత్రం లేదు. లేఖనాల ననుసరించి చూస్తే ప్రార్థన విషయంలో రాజీపడటం సాధ్యం కాదని నాకు తెలుసు. అయినప్పటికి నేను దానిని ఒక “రెయిన్ కోట్” (Rain coat) లాగ చూడసాగాను. అంటే, బీరువాలో దాన్ని తగిలించి, వాతావరణం సరిగా లేని రోజున దానిని ఉపయోగించటానికి సిద్ధంగా ఉంచటమే తప్ప, ప్రతిరోజూ దానిని ఉపయోగించటంలో విఫలమయ్యాను. ఎండ కాస్తున్నప్పుడు "రెయిన్ కోట్” అవసరం లేనట్లే అన్ని సక్రమంగా ఉన్నప్పుడు ప్రార్థన అవసరత నాకు ఏ మాత్రమూ కనిపించదు. నా జీవితంలో అంతగా కష్టము దు:ఖము లేదు గనుక ఒక విధమైన నిర్లక్ష్యతలో పడిపోయి ప్రార్థనను వెనక్కి తోసాను.” రీచింగ్ గాడ్స్ ఇయర్” (Reaching God's Ear) డి. సామ్యూల్ స్టార్మ్, టింగేల్ హౌజ్ పబ్లిషర్స్,

మనం చూడబోయే రెండవ వాక్య భాగం అన్నిటి కన్నా ఎక్కువగా దుర్వినియోగపరచబడిన వాక్యం. ప్రార్థన గురించి వ్రాయబడిన ప్రతి గంథంలోను, చేసిన ప్రతి ప్రసంగంలోను ఈ వాక్య భాగం వినియోగించబడింది లేదా దుర్వినియోగించబడింది. ఈ వాక్య భాగం ఏమి చెబుతుందో సరిగా గమనించండి. (... మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిననను ఆయన మీకనుగ్రహించును” (యోహాను 16:23).

క్రీస్తు మనకు ఒక ఖాళీ చెక్బుక్ ఇచ్చి అందులోని చెక్కులపై ఆయన సంతకం కూడా చేశాడని నిరూపించటానికి ఈ వాక్యం వాడబడుతోంది. మనకు కావలసిన దానితో ఈ చెక్కునింపితే చాలు. మనకు విశ్వాసముంటే కావలసిన దేదైనా మనకు తప్పక లభిస్తుంది. దీన్ని చదువగానే దేవుని చిత్తం మీద కాక మన అవసరత మీదనే ఇది దృష్టి ఉంచుతుందని గ్రహించగలం. మన కోరిక ఏదైనా సరే,అది దొరికిందన్న విశ్వాసముంటే చాలు అది మనకు ఇవ్వబడుతుందట. మనము చేయవలసిందల్లా ఒకటే- కేవలం “యేసు నామమున” ప్రార్థించటం. ఇలాంటి దృక్పథాన్ని కలిగియున్న వారికి యేసు నామమొక మంత్రం వంటిది. అరేబియన్ నైట్స్ కథలలో “సెసేం-తెరుచుకో అనగానే పర్వత గుహ తెరుచుకున్నట్లే యేసు నామం పరలోక ద్వారాలను తెరుస్తుందని వారు భావిస్తారు.

యేసు నామంలో ప్రార్థించటం అంటే ప్రార్థన చివర ఆయన నామాన్ని జోడించటం మాత్రమే కాదు. దాన్ని మించింది ఎంతో అందులో ఇమిడి వుంది. మనం మన నామంలో గాని మనం సభ్యులముగా ఉన్న సంఘం యొక్క నామంలో గాని ఎందుకు ప్రార్థించం? యేసు నందు తప్ప దేవుని యెదుట మనకే అర్హత లేదని ఒప్పుకోవటానికే మనం యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. మనకు ఏ అర్హతా లేకపోయినా, కేవలం వాగ్దానాలను నమ్మటం వల్ల మాత్రమే మనమీ విధంగా దేవున్ని అడిగేందుకు తెగిస్తున్నాం. నేను ఒక “మెసోనిక్ లాడ్జ్' (Masonic Lodge) సభ్యుని భూస్థాపనకు వెళ్ళటం నాకింకా గుర్తుంది. ఆ ఆరాధనలో “మేసన్స్” పాలు పుచ్చుకున్నారు. సువార్తను కొంత వరకు అర్థం చేసుకున్న నా స్నేహితుడొకడు సమాధి వద్ద నా ముందు నిలబడ్డాడు. మేసన్లలో చాలామంది తమ లాడ్జిలో సభ్యులవటం వల్ల పరలోకం చేరుతామని నమ్మటం గురించి మునుపు ఒకసారి మేమిద్దరం చర్చించుకున్నాం. మేసోనిక్ అధికారి ఒకడు “మేసోనిక్ లాడ్జ్' నామమున మా ప్రియ సోదరుని నీ చేతులకు అప్పగిస్తున్నాం - అని చెప్పాడు. వెంటనే నేను నా స్నేహితుడి చెవిలో “మరి వారికి పరలోకంలో ఖాతా లేదే” అని గుసగుసలాడాను.

ఒక చెక్కు మీద ఒకే సంతకం చెల్లుతుంది. ఆ ఖాతాదారుడు ఎవరో అందులో డబ్బు ఎవరు జమ చేస్తున్నారో ఆ వ్యక్తి సంతకం మాత్రమే చెల్లుతుంది. అలాగే మన ప్రభువు ఒక్కడే దేవుని యెదుట ఆ అర్హతను కృపను కలిగి యున్నాడు గనుక ఆయన ఖాతా నుండి తప్ప మనవేమీ పొందలేం. ఆయన తన నామమును ఉపయోగించటానికి మనకు అనుమతి నివ్వటం నిజమే, అయితే అది ఆయన మహిమతోను చిత్తముతోను నిమిత్తం లేకుండ మన స్వంత ఆశలను తృప్తిపరచుకోవటానికి కాదు.

యోహాను 16:23 లో ఉన్న నియమాల ననుసరించి యేసు నామంలో ప్రార్థించటం అంటే ఏమిటో ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. మీ పట్టణంలో ఉన్న ఒక మద్యం దుకాణానికి వెళ్ళి నేను ఒక విస్కీ సీసా అడిగాననుకుందాం. ఆ తరువాత నేను “దీని ధర చెల్లించటానికి నా దగ్గర డబ్బు లేదు, కాని నా స్నేహితుడొకడు ఈ ధరను తన ఖాతాలో రాసుకోమన్నాడని, తానిక్కడికి మళ్లీ వచ్చినప్పుడు దాన్ని చెల్లిస్తానని చెప్పాడని” అన్నాననుకుందాం. దుకాణదారుడు ఆ స్నేహితుని పేరు అడిగినప్పుడు నేను నీ పేరు చెప్పాననుకో. అతనికి నువ్వు బాగా తెలుసని, నువ్వు క్రైస్తవుడవని కూడ అతనికి తెలుసని ఊహించుకుందాం. “ఏయ్, నీవు అబద్ధికుడివి. నువ్వు చెప్పిన వ్యక్తి తన కంఠంలో ప్రాణముండగా ఇలాంటి స్థలానికి రాడు. అతడు నిన్నిక్కడికి పంపలేదు. తన పేరును ఉపయోగించుకోమని చెప్పనూలేదు” అని నన్ను తరిమేస్తాడు గదా!

దేవుడెన్ని సార్లు మన ప్రార్థనలకు ఈ విధంగా స్పందిస్తాడో కదా! ఎన్నిసార్లు క్రీస్తునైనా ఆయన మహిమనైనా తలంచక మనంకోరిన దాన్ని పొంద ఆయన నామాన్ని వ్యర్థంగా ఉపయోగించటానికి సాహించాం! మనం కోరుకునేది క్రీస్తు కూడ కోరుతున్నాడని మనం ఖచ్చితంగా నమ్మితే తప్ప “యేసు నామమున ప్రార్థించలేం. యోహాను 16:23 లోని వాగ్దానం సంతకం చేసి ఇవ్వబడిన ఖాళీ చెక్కు కాదు. నా ప్రార్థన చివర “యేసు నామమును” చేర్చినంత మాత్రాన క్రీస్తు పరిచర్యతోను, దేవునికి నాపై గల ప్రణాళికతోను నిమిత్తం లేకుండా కోరే స్వార్థపూరితహృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడని ఈ వాక్య భాగం మనకు నేర్పించటం లేదు.

వాక్యానుసారమైన ప్రార్థన సిద్ధాంతం గురించి ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిలో ముఖ్యాంశాలను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం:

1. నా ప్రార్థన నేను సంతోషంగా ఉండటానికి నాకు తప్పకఅవసరమని భావించే ప్రతిదీ ఇచ్చే సేవకునిగా దేవుణ్ణి ఎన్నటికీ చేయజాలదు. దేవుడు స్వార్థపూరితమైన కోరికలనే నా సూట్ కేసును నేను ఆజ్ఞాపించిన చోటికెల్లా మోసుకొనిపోయే పనివాడుకాడు.

2. నా చిత్తం ప్రకారం దేవునికి ఆజ్ఞాపించటానికి గాని, దేవుడుతన చిత్తాన్ని మార్చుకునేలా చేయటానికి గాని ప్రార్థన నన్నెన్నడూ అనుమతించదు.

3.దేవునికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఉంది. అది అన్నిటికంటే శ్రేష్టమైన ప్రణాళిక. దేవుడు దాన్ని తప్పక నెరవేర్చాలన్న నిశ్చయత కలిగియున్నాడు. మన పాపాలు గాని “విశ్వాసయుతమైన” మన ప్రార్థనలు గాని ఆ నిర్ణయాన్ని దారి తప్పించవు. దేవుని నిర్ణయాలను ఏ విధంగాను మార్చజాలవు ( యోబు 23:13 ).

“దేవునికొక ప్రణాళిక ఉందనే మాటను సరిగా అర్థం చేసుకున్నప్పుడు అది వర్ణింపజాలని ఓదార్పు నిస్తుంది... ఎందుకంటే ఒక ప్రణాళికంటూ లేకుండా సమస్తాన్ని అస్తవ్యస్తంగా చేసే దేవుడిని ఎవరు ఘనపరుస్తారు? సర్వ కాలములకు సర్వ సంభవములకు వ్యాపించే ఒక గొప్ప చిత్తమును ఆయన కలిగి యున్నాడనటం ఎంత ఆనంద దాయకమైన సత్యం! ఎందుకంటే తద్వార అన్నీ తగిన స్థానంలో ఉన్నాయని, అవి మిగిలిన సంభవాలపై తగిన ప్రభావం చూపుతాయని మనం గుర్తెరగగలం. దేవుడు తన ప్రణాళికను అమలుచేస్తాడన్న సత్యం కూడా ఎంతో ఆనందదాయకం. ఎందుకంటే ఆయన ప్రణాళికలు మంచివి, జ్ఞాన యుక్తమైనవి. అలాంటివి అమలు పరచబడటం ఆశించదగిన విషయం కాదా? ఒక మంచి ప్రణాళికను అమలుచేయక పోవటం ఎంతో ప్రమాదకరం. కాగా దేవుని ప్రణాళికలు మరియు శాసనముల పట్ల మానవులెందుకు విసుగు చెందుతున్నారు?” ( యోబు 23:13 పై చార్లెస్ స్పర్జన్ గారి ప్రసంగం నుండి).

ప్రార్థనను గురించిన తప్పుడు దృక్పధం త్వరలో నిస్పృహకు, అపనమ్మకానికి దారితీస్తుంది. ఈనాడు యథార్ధపరులైన అనేకమంది విశ్వాసుల జీవితాల్లో నిరాశ, నిరుత్సాహం కలుగటానికి ఇదే ముఖ్యకారణం. ప్రత్యేకంగా రేడియో, టి.విలలో కనిపించే “స్వస్థత సేవకులమని పిలుచుకునే వారి కార్యక్రమాలను వినేవారు ఈ దుస్థితికి గురి అవుతున్నారు. నేను నడిపించే బైబిల్ స్టడీ తరగతులకు ప్రతి వారం హాజరయ్యే ఒకావిడ ఎంతో క్రుంగిన స్థితిలో వచ్చేది. కాని సాధారణంగా దేవుని కృపలో సంతోషిస్తూ తిరిగి వెళ్లేది. చివరికి ఆమె నాతో తాను ప్రతి ఆదివారం ఒకరి తరువాత ఒకరిగా టి.వి.బోధకుల ప్రసంగాలను వింటున్నానని ఒప్పుకుంది. వీరి ప్రసంగాలను వినటం వల్ల తన చింత మరింత అధికమైందని చెప్పింది. తాను స్వస్థత పొందనందున క్రీస్తు నందు తనకు విశ్వాసమున్నదా లేదా అనే అనుమానంలో పడింది. తాను స్వస్థత పొందాలని దేవుడు కోరుతున్నాడని, క్రీస్తు దాని కొరకు సమస్తమును సిద్ధము చేసియున్నాడని, అయితే లోపమంతా తన విశ్వాసంలోనే ఉందని ఆమె నిజంగా నమ్మింది. టి.వి. స్వస్థత బోధకుల అబద్దపు బోధలను వినవద్దని నేనామెకు ఎంత చెప్పినా వినలేదు. ఆమె శారీరక, ఆధ్యాత్మిక పరిస్థితి మరింత దిగజారసాగింది.

స్వస్థత బోధకుల ప్రార్థన మరియు స్వస్థతను గురించిన సిద్ధాంతం ఎంతో ప్రేమపూరితంగా కనిపిస్తుంది. స్వస్థపరచే వ్యక్తి మన క్షేమం గురించి నిజంగా ఆసక్తి కలిగిన సానుభూతిపరుడుగా కనిపిస్తాడు. అతని దేవుడు ఎంతో దయగల ఉదారునిగా అగుపిస్తాడు. కాని వాస్తవానికి స్వస్థతనిస్తానని చెప్పే ఆ బోధకుడు, అతని సిద్ధాంతం, అతని దేవుడు - వీరందరు ఎంతో క్రూరమైన వారు. ఈ స్వస్థత నిచ్చే బోధకులకు మన పట్ల ఆసక్తి లేదు. వారి ఆసక్తి అంతా మన ధనంలోనే. వీరిలో చాలామంది ప్రజల బాధ, నిస్పృహ, అనారోగ్యాలతో చిల్లర వ్యాపారం చేసి ధనవంతులవుతున్నారు. ఇవి చాలా కఠినమైన మాటలని నాకు తెలుసు. కాని ధనవంతులవటానికి బుద్ధిపూర్వకంగా క్రీస్తు నామాన్ని అబద్దపు ఆశలు రేకెత్తించటానికి వాడుకునే వారిని ఖండించేందుకు ఎంత కఠినమైన భాష అయినా సరిపోదు.

“ అయితే విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని” బైబిలు చెప్పటం లేదా? ఈ బోధకులు ఉపయోగించే యాకోబు చెప్పిన ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలిద్దాం. స్వస్థత వరమున్న
ఈ మహా పురుషులు ఎంత వరకు ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని అనుసరిస్తున్నారో చూద్దాం..

“మీలో ఎవడైనను రోగియై యున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింప వలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ...” (యాకోబు 5:14,15).

ఈ వచనాలననుసరించి చూస్తే రోగియైన వాడు ఏం చేయాలి? మొదటిగా అతడు సంఘ పెద్దలను పిలిపించాలి. “పెద్దలు” అనే మాట బహు వచనం. రోగి వారిని పిలిపించాలి. ఆ పెద్దలు (బహు వచనం) రోగి వద్దకు వచ్చి, “అతని కొరకు ప్రార్థన చేయవలెను.” ఒక వ్యక్తి డేరాలు వేసి రోగులను తన వద్దకు పిలుచుకోటానికి, ఈ పై వాక్య భాగానికి కొంత బేధం ఉంది. ఒక స్వస్థత కూటానికి స్పృహ తప్పిన రోగిని ఎప్పుడైన ఎవరైనా తేవడం మీరు చూశారా? స్వస్థత కోసం ప్రార్థించే సేవకుడు, సహాయమడిగిన వారికోసం ఆస్పత్రికి వెళ్ళి వారిని బాగు చేయటం ఎప్పుడైనా చూశారా?

రెండవదిగా, పెద్దలు “అతని కొరకు ప్రార్థించి అతనికి నూనె రాయాలి. ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నారో గమనించటం చాలా ముఖ్యం. ఈ వాక్య భాగం “ఆ పెద్దలు” అని చెబుతుంది. ఇక్కడ రోగి ప్రార్థించటం గురించి గాని, అతని విశ్వాసం గురించి గాని ఏమీ చెప్పటం లేదు.

మూడవదిగా, పెద్దలు చేసిన “విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును.” ప్రార్థన చేస్తున్న వారి విశ్వాసాన్ని బట్టే స్వస్థత కలుగుతుందని ఇక్కడ స్పష్టమవుతుంది. ఆ పెద్దలే ప్రార్థన చేస్తున్నారని ఈ వాక్య భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. విశ్వాసం ద్వారా స్వస్థతఅని చెప్పుకునేవారు ఈ వాక్యాన్ని పూర్తిగా తారుమారు చేసి, స్వస్థత పొందే బాధ్యతను అనారోగ్యంగా ఉన్న వ్యక్తిపైన మోపుతారు! కాని యాకోబు చెప్పిన దాని ప్రకారం రోగి స్వస్థత నొందకపోతే దానికి కారణం అతని స్వస్థత కొరకు ప్రార్థించిన వారి “విశ్వాస సహితమైన ప్రార్థనలో తగినంత విశ్వాసం లేకపోవటమే. అయితే టి.వి.లో స్వస్థత ప్రార్థనలు చేసేవారు ఆ నెపం రోగిపైన ఎందుకు మోపుతున్నారు? ఇటువంటి ప్రసారాలలో దేన్ని చూసినా, కూటం చివర “బొమ్మ పడితే నేను గెలిచినట్లు, బొరుసు పడితే నీవు ఓడినట్లు అన్న భావమే కనిపిస్తుంది, వినిపిస్తుంది. .

మొదట ఈ అద్భుత స్వస్థతలు చేసేవాడు, దేవుడు తనను ఎలా పిలిచాడో, స్వస్థత వరాన్ని తనకెలా యిచ్చాడో, ఈ స్వస్థత పరిచర్యను తనకు ఎలా అప్పగించాడో చెప్పుకుంటాడు. తరువాత, ఆ వరం యొక్క శక్తి తన గుండా ఎలా ప్రవహిస్తుందో తెలియజేస్తాడు. ఆ శక్తితో సంబంధము కల్పించుకొనుటకు” నువ్వు అతని చేతిని ముట్టుకోవాలి లేదా నీ చేతిని టి.వి.పై ఉంచాలి. తన వరాన్ని గురించి, దేవుని నుండి కలిగే శక్తిని గురించి ప్రేక్షకులకు నమ్మకం కలిగించిన తరువాత అతడు ఉద్రేకంతోను, బలంతోను “సాతాను కలిగించిన ఈ రోగము నుండి విడుదల పొందుమని ఆజ్ఞాపిస్తున్నానని” ప్రార్థిస్తాడు. తరువాత, “శక్తిగల యేసు నామమున సాతానును గద్దిస్తున్నానని” కేకలు వేస్తాడు. అందరూ చేతులు ఊపుతూ, అరుస్తుండగా గొప్ప స్వస్థత వరముగల ఆ వ్యక్తి “విశ్వాసయుతమైన” గొప్ప ప్రార్థనతో “సాతానును పారద్రోలిన” తరువాత రోగి తట్టు తిరిగి “ఇప్పుడు నువ్వు నీ విశ్వాసం ఉపయోగించి స్వస్థత పొందు” అని చెబుతాడు.

ఇది చాలా బావుంది! అద్భుతాలు చేసే ఈ వ్యక్తి తన స్వస్థత వరాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటూ, ఇప్పుడే ఒక గొప్ప విశ్వాస ప్రార్థన చేశాడు కదా! అయినా, రోగి తన విశ్వాసాన్ని సరఫరా చేసే వరకు ఏమీ జరుగదట. అంతా రోగి విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటే ఇక స్వస్థత వరమున్న వ్యక్తితో అవసరమేముంది? ఏది ఎలా సంభవించినా తాను మాత్రం ఓటమిపాలు కాకుండ స్వస్థత శక్తి కలదని చెప్పుకునే అతడు పరిస్థితిని మోసకరంగా తనకు అనుకూలంగా మలచుకుంటాడు. ఒకవేళ రోగి బాగుపడితే స్వస్థత వరము గల అతడికి జేజేలు (ప్రభువుకు కూడ కొంత స్తుతి). ఒకవేళ స్వస్థత జరుగకపోతే ఎవరిని నిందించాలి? స్వస్థపరచువానిని కాదు కాని “విశ్వాసముంచుటకు విఫలమైన “ఆ రోగినే”! ఈ సందర్భంలో నిజంగా జరిగిందేమిటి? స్వస్థత చేసే అతనికి ఆ రోగి కానుకగా చెల్లించిన డబ్బు, ఆ రోగికి మాత్రం యధాతధంగా తన జబ్బు మిగిలిపోయాయి. అయితే స్వస్థతలు చేసే అతడు మాత్రం రోగి తగినంత విశ్వాసాన్ని చూపి తన వంతు బాధ్యతను నెరవేర్చలేదని చెప్పి తప్పించుకుంటాడు. ఇప్పుడు పాపం రోగి తన అనారోగ్యంతో పాటు తాను తప్పిదస్తుడనన్న నెపం కూడ మోయవలసి వచ్చింది. అతనికి రోగం అలాగే ఉండటంతో పాటు దేవుని యందు తనకు విశ్వాసం లేదా? అన్న అనుమానంతో ఆ రోగి కొట్టుమిట్టాడతాడు. ఇటువంటి బోధ ప్రభావం వల్ల ఒక వ్యక్తి తాను బాగుపడకపోవటానికి నూటికి నూరు శాతం తానే బాధ్యుడనని నమ్మటం ఖాయం. దోషినన్న నెపం మనస్సాక్షిపై రుద్దినవాడు “విశ్వాస సహితమైన ప్రార్థన” గురించిన దైవ వాక్యాన్ని వక్రీకరించి బోధించిన ఆ మోసగాడే.

నేను దయ, ప్రేమ లేని వాడనని ఎవరైన భావిస్తే నన్నుక్షమించండి. అయితే బాధలో ఉన్నవారికి, దేవుడు వాగ్దానం చెయ్యని దాన్ని ఇస్తానని ప్రకటించి, ఆ తరువాత దానిని పొందే విశ్వాసం నీకు లేదని” వారిని నిందించటం కంటే అసహ్యకరమైనది, క్రూరమైనది మరొకటి లేదు. శక్తి నీ ద్వారా ప్రవహిస్తుందని చెప్పి, దానిని పొందే బాధ్యతనంతా రోగి పైకి త్రోసి చేతులు దులుపుకోవటం మరింత నీచం. ఇది మోసం, క్రూరత్వం.

ఇలా 'స్వస్థతను అమ్ముకునే' ఈ చిల్లర వ్యాపారుల క్రూరత్వాన్ని కళ్లారా చూడాలనుకుంటే, నువ్వు సోమవారం ఉదయం పక్షవాతం వంటి రోగాలున్నవారికి పరిచర్య చేసే సంస్థనొకదాన్ని దర్శించు. అక్కడ గత రాత్రంతా తన స్వస్థతను అడ్డుకొనునట్లు” తాను ఇంకా ఒప్పుకోనని పాపం యేదైనా తన జీవితంలో ఉన్నదా అని స్వపరిశీలన చేసుకొన్న ఒక వ్యక్తితో మాట్లాడి చూడు. కుదరని రోగంతో బాధపడుతున్న ఒక నిస్సహాయ వ్యక్తి బాధను గ్రహించు. “నేను స్వస్థపరచబడుటకు అవసరమయ్యే విశ్వాసం నాకెలా లభిస్తుంది?” లేదా దేవుడు నన్ను బాగు చేయటం లేదు గనుక ఆయన నన్ను ప్రేమించటం లేదు” అని చెప్తున్న వారి కష్టాన్ని అర్థం చేసుకో. ఇది చూడగానే టి.వి., రేడియోలలో కనిపించే ప్రేమగల ధనాశపరులను కొరడాలతో కొట్టి, వారి క్రూరత్వానికి ప్రతిఫలంగా వారిని ఖైదులో పెట్టించాలన్నంత కోపం పెల్లుబుకుతుంది.

పేరు గాంచిన ఒక స్వస్థత నిచ్చు వ్యక్తి రాసిన పుస్తకం నాకు గుర్తుకొస్తుంది. అందులో అతడు చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక వికలాంగురాలి గురించి వివరించాడు. ఆమె టి.వి.లో అతని గురించి విని అతని కూటాలకు హాజరు కావాలన్న ఆశతో చాలా మైళ్ళు ప్రయాణించి వచ్చింది. అతని వర్తమానాల ద్వారా “దేవుని శక్తినిగురించి, స్వస్థపరచుటకు ఆయనకు గల సంసిద్ధత గురించి ఆమె ఎంతో నిరీక్షణ కలిగి ఉండింది. అక్కడ జరిగిన సంభవం గురించి అతడా చిన్న పుస్తకంలో ఇలా రాశాడు.

“నేను నా హస్తాన్ని ఆమె తలపైన ఉంచి విశ్వాస సహితమైన ప్రార్థన చేశాను. దేవుని శక్తి నా గుండా ప్రవహించటం నేను అనుభవించి ఒక గొప్ప అద్భుతం జరుగుతుందని కనిపెడుతున్నాను. నేను నా కళ్లు తెరచినప్పుడు ఆ స్త్రీ ముఖంలోను, కళ్లల్లోను ఆశ స్పష్టంగా చూడగలిగాను. నేనామె చేతిని మృదువుగా పట్టుకొని నెమ్మదిగా నిలబెట్టటానికి ప్రయత్నించాను. ఆమె పైకి లేచేందుకు మొదలుపెట్టి హఠాత్తుగా ఆగిపోయింది. ఆమె కళ్లల్లో భయం ఆవహించగా ఆమె నిస్పృహతోను, అవిశ్వాసంతోను తిరిగి కుర్చీలో కూలబడింది.”

దీన్ని మొదట చదివినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో ఇప్పుడు చదువుతున్న మీకు కూడ అంతే కోపం వచ్చి ఉంటుందనుకుంటాను. కథ ఇంతటితో ముగియలేదు. ఇంకాస్త ముందుకు చదివినప్పుడు అతని క్రూరత్వానికి నేను మరింత కోపించాను.

నెమ్మదిగా నేనామె చేతిని విడిచిపెట్టాను. నేను చేయగలిగిన దంతా చేశాను. దేవుని స్వస్థత వర్తమానం ఆమెకు అందించాను. నమ్ముమని మాత్రమే నేనామెను బ్రతిమాలాను. అయితే స్వస్థపడటానికి అవసరమైన విశ్వాసం ఆమె కనుపరచలేదు. నేను ఆమెకు సహాయపడేందుకు చేయవలసిన దంతా చేశానని నాకు తెలుసు. అయినా నాకెంతో దు:ఖం కలిగింది.”

ఇంతకంటే క్రూరత్వం, హృదయ కాఠిన్యం గల వారినెవరినైనామీరు ఊహించగలరా? అతడు ఆ స్త్రీలో అసత్యపు నిరీక్షణను నింపాడు. సాతాను శక్తిని పారద్రోలుతున్నట్టు నటించాడు. విశ్వాసంతో ప్రార్థిస్తున్నట్లు ప్రదర్శించి, ఆమె చేయి పట్టి లేపాడు. తరువాత లేచి నిలువనందుకు ఆమెను నిందించాడు! ఆమెకు సహాయం చేయటానికి నేను చేయవలసిన దంతా చేశానని” చెప్పటానికి సైతం సాహసించాడు. అతడామెకు వాస్తవంగా ఏమి చేశాడో నీకు, నాకు తెలుసు. తానేమి చేసింది అంతరంగంలో అతనికి కూడ తెలుసు. అయితే విచారకరమైన విషయమేమిటంటే అతనికి డబ్బు దొరుకుతున్నంత వరకు అవేమీ లెక్క చేయడు. దీనిని ప్రేమ, దయ” అని పిలువగలిగితే నువ్వు రాతి గుండె కలవాడివే.

విచారించవలసిన విషయం ఏమిటంటే చాలా మంది క్రైస్తవులకు దైవశాస్త్రంలో ఆసక్తి లేదు. కనుక అనేక సమస్యలకు మూల కారణం ఏమిటో తరచుగా వారు గుర్తెరగలేక పోతున్నారు. స్వస్థతలు చేస్తామని చెప్పేవారి దైవశాస్త్రాన్ని గ్రహించేవారు అరుదు. అయినా అతడు యధార్థపరుడే కదా” అన్న వైఖరీ అనేకులు కలిగివుండటం వలన అబద్ధ బోధకులను బహిర్గతం చేయటం కష్టసాధ్యమవుతుంది. ఈ స్వస్థత కుట్ర అంతా ఒక తప్పుడు దైవశాస్త్రంపై ఆధారపడి ఉందని నువ్వు గ్రహించే వరకు దీనిలో దాగి ఉన్న మోసం బహిర్గతం కాదు. ఈ స్వస్థత బోధకులకు క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త కార్యం గురించి ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. క్రీస్తు మన పాప శిక్ష నిమిత్తం శ్రమ ననుభవించినట్లే మన శరీర రోగాల నిమిత్తం కూడ శ్రమను అనుభవించాడని వీరి నమ్మకం. విశ్వాసం ద్వారా పాప క్షమాపణను పొందినట్లే, విశ్వాసం ద్వారా స్వస్థత కూడ పొందగలమని వీరు బోధిస్తారు.

ప్రాయశ్చిత్తం గురించిన ఇటువంటి దైవశాస్త్రం నిజమైతే, అది రోగగ్రస్తులవటం కూడ ఒక పాపమే అన్న అర్థాన్ని ఇస్తుంది. పాప క్షమాపణను త్రోసివేయటం ఎంత భయంకరమో, రోగం నుండి స్వస్థత పొందనంగీకరించక పోవటం కూడా అంతే భయంకర పాపమవుతుంది. నశించి పోవు వారి రక్షణను అడ్డుకునేది కేవలం అవిశ్వాసమనే పాపమే అయితే, రోగుల స్వస్థతను అడ్డుకునేది కూడ కేవలం ఆ అవిశ్వాసమనే పాపమే. పశ్చాత్తాపం నొందని వారు పాపంలో నిలిచి వుండి ఎలా దోషులవుతున్నారో అలాగే స్వస్థత పొందని రోగులు కూడ రోగంలో నిలిచి ఉండటం వలన దోషులవుతున్నారు. కాబట్టి తన విమోచన కోసం “క్రీస్తు పూర్తి మూల్యమును చెల్లించాడన్న” వర్తమానం విన్న తరువాత పాప స్థితిలో కాని, రోగ స్థితిలో కాని కొనసాగటం ఒకనిని రెండింతలు దోషిగా చేస్తుంది. ఈ స్వస్థత బోధకుల యొక్క మూల సిద్ధాంతం సరైనదైతే దాని ఫలితాలు కూడ సరైనవే. అలా కాకుండా, వారి దైవ శాస్త్రం అసత్యమైనదైతే, అది బాధపడుతున్న పరిశుద్ధుల జీవితాలలో మరింత అల్లకల్లోలం రేపుతుంది. కనుక ఇప్పుడు ప్రాయశ్చిత్తం యొక్క నిజ స్వభావమూ, దాని ఉద్దేశాలను గురించిన సిద్ధాంతం, అంత ప్రాముఖ్యం కాదని ఎవరు చెప్పగలరు?

యాకోబు పత్రికను ముగించక మునుపు అతడు ఏలీయా ఆకాశమును మూసి కరువును తెప్పించటం గురించి ఏమి చెప్పాడో కొంత వరిశీలిద్దాం. ఈ క్రింది వచనాలలో శ్రేష్టమైన ఉపదేశాలున్నాయి.

“ఏలీయూ మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నరసంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను” (యాకోబు 5:17,18).

అంటే దేవుడు వాతావరణంపై తనకున్న అధికారాన్నంతా ఏలీయాకు అప్పగించి వర్షం ఎప్పుడు పడాలో ఎప్పుడు పడకూడదో అతడే నిర్ణయించే అధికారాన్ని అతనికిచ్చాడని మనం అర్థం చేసుకోవాలా? ఏలీయా మనవంటి మనుష్యుడే కాబట్టి మనం కూడ అతనిలాగే ప్రార్థించి వాతావరణాన్ని మన ఆధీనంలో ఉంచుకోవచ్చునని దేవుడు చెబుతున్నాడా? క్రైస్తవుడైన ఒక రైతు తన పంటల కోసం వర్షం ఇవ్వమని ప్రార్థిస్తుండగా అదే సమయంలో ఒక సువార్తీకుడు రెండు వారాల సువార్త కూటం నిమిత్తం వర్షం ఆగిపోవాలని ప్రార్థిస్తే ఎలావుంటుంది? ఎవరి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు?

నువ్వు ఏలీయాలాగ ఉండాలనుకుంటావా? ఆకాశం మూయబడాలని నువ్వు ప్రార్థిస్తే దాదాపు మూడు సంవత్సరాలు వర్షం కురువలేదనుకో. పచ్చిక లేక పశువులన్నీ దాదాపు చచ్చిపోయాయి. గింజలు లేక కోడిపిల్లలన్నీ చచ్చిపోయాయి. పోషకాహార లోపం చేత చిన్న బిడ్డలు చనిపోతున్నారు. ఇది చూసి ప్రజలు నిన్ను శపించి వర్షం కోసం ప్రార్థించమని అడుగుతారు. నువ్వు దయా దాక్షిణ్యం లేని రాక్షసుడవని అందరూ నిన్ను ఆడిపోసుకుంటారు. “నువ్వు వర్షం కోసం ఎందుకు ప్రార్థించవు అని వారు ప్రశ్నిస్తారు. ఏలీయా ఎందుకు ప్రార్థించలేదు? ప్రజలు శ్రమ పడటం చూసి ఆనందించే స్వభావమేమైనా అతనిలో ఉందా? దీనికి జవాబు చాలా సులభమైనది. ఏమి ప్రార్థించాలో, ఎప్పుడుప్రార్థించాలో దేవుడే ఏలీయాకు నిర్దేశించాడు. 1 రాజులు 17-18లో ఉన్న కథను తిరిగి చదువు. అక్కడ ఏలీయా నిజంగానే వరాన్ని ఆగమనీ తిరిగి కురువమనీ ఆజ్ఞాపించినట్టు చూడగలవు. అయితే ఆ విధంగా చేయుమని దేవుడు నిర్దేశించినప్పుడు మాత్రమే అతడు అలా చేశాడని ప్రత్యేకంగా గమనించాలి. ఈ సందర్భంలో దేవుడు ఒకానొక దేశాన్ని (ఇశ్రాయేలును) పశ్చాత్తాపానికి నడిపించేందుకు వారికి ఒక గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. ఆయన ఆ పాఠాన్ని ముగించే వరకు ఏలీయానే కాదు, ఎవ్వరూ వర్షం కురిసేలా చెయ్యలేరు.

ఆ సమయంలో కొందరు వర్షం కోసం ప్రార్థించటం కోసం రాత్రి అంతా ప్రార్థించే ఒక కూటాన్ని ఏర్పాటు చేశారని అనుకుందాం. వాళ్లు ఎంత మంది కూడి, ఎంత తీక్షణంగా, ఎంత సేపు ప్రార్థించినా, అదంతా వ్యర్థ ప్రయాసమే అవుతుంది. ఎందుకంటే కరువును పంపటంలో దేవుని ఉద్దేశం నెరవేరే వరకు వర్షం ఎంత మాత్రమూ కురువదు. ఏలీయా దేవుని చేతిలో ఒక సాధనం మాత్రమే. దేవుడే అసంభవాలను జరిగించువాడు. అయితే ఇలాంటి సందర్భంలో, “దేవుడు మంచివాడు! ఆయన మనకు వర్షం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన అలా చెయ్యాలంటే మనకు విశ్వాసం ఉండాలి” అని నేడు టి.వి.లలో ప్రలాపించే చిల్లర విశ్వాస వర్తకుడే దేశంలో ఉన్న వారిలో కెల్ల అత్యంత క్రూరుడు. అతడే దేవుని సర్వాధికార ఉద్దేశాలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్షం రాకుండ అడ్డగించేవాడు.

అయితే ఇక్కడ, దైవిక స్వస్థత యందు నాకు గట్టి విశ్వాసం ఉందని స్పష్టంచెయ్యాలనుకుంటున్నాను. వాస్తవానికి ప్రతి స్వస్థతాదైవికమైనదే. దేవుడు ఔషధాన్ని గాని, వైద్యుని హస్తాలను గాని (అతడు విశ్వాసి కాకపోయినా) దీవించకపోతే ఏ మేలూ జరుగదు. నేను అద్భుత స్వస్థతను సైతం నమ్ముతున్నాను. అది ఏ వైద్యమును ఉపయోగించక, దేవుడు నేరుగా కల్పించుకొని యిచ్చిన స్వస్థతే. అయితే నేను విశ్వసించనిది ఏమిటంటే క్రీస్తు తన బలి ద్వారా ప్రతి రోగము కొరకు స్వస్థతను కొనియున్నాడు కాబట్టి విశ్వాసం ద్వారా అద్భుత స్వస్థతను పొందగలనని అనుకోవటం.

“రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?” అని నువ్వు నన్ను ప్రశ్నిస్తేఅపొస్తలుల కార్యములు 16:31 చూడుమని చెబుతాను. అక్కడ పౌలు “ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము; అప్పుడు నీవును నీ యింటి వారును రక్షణ పొందుదురని” చెప్పాడు కదా. అయితే “స్వస్థత పొందుటకు నేనేమి చేయవలెనని” నీవు అడిగితే “దేవుని పరిపూర్ణ చిత్తము జరుగునట్లు ఆయనకు ప్రార్థించు. నీకు ధైర్యమును, చెదిరిపోని విశ్వాసమును ఇచ్చి ఆయన ఏది జరిగించినా ఆయనను నమ్మునట్లు కృప దయ చేయుమని ప్రార్థించుమని చెబుతాను. పాపము నుండి రక్షింపబడిన విధంగానే రోగము నుండి స్వస్థత పొందుతావని బైబిలులో ఏ వాక్యమూ నీకు నిశ్చయంగా చెప్పటం లేదు.

నేను దైవిక స్వస్థతను నిజంగా నమ్ముతున్నానని మరల చెప్తున్నాను. కాని దైవిక స్వస్థతలు జరిగిస్తామని చెప్పేవారిని మటుకు ఏ మాత్రం నమ్మను. దేవుడు తన కృప చేత, శక్తి చేత ఒక అద్భుతం జరిగించటం, ఆయన ఆ శక్తిని, కృపను ఇతరులపై క్రుమ్మరించే వరాన్ని ఒక మనుష్యుని కివ్వటమూ, పూర్తిగా భిన్నమైన రెండు విషయాలు. స్వస్థతలు చేస్తానని తనంతట తానుగా ప్రకటించుకునే వ్యక్తి తన మోసాన్ని కొనసాగించటానికి వాక్యాన్ని దుర్వినియోగం చెయ్యటాన్ని నేను పూర్తిగా వ్యతిరేకించి దు:ఖిస్తున్నాను. తద్వారా అతడు కలిగించే దుఃఖాన్ని, నిరాశను చూసి ఎంతో విచారిస్తున్నాను.

స్వస్థత కొరకైన ప్రార్థన చివర, “అయినను నా చిత్తము కాదు. నీ చిత్తమే సిద్ధించును గాక” అని జోడించటం మంచిదేనా? అని అద్భుత స్వస్థతలు చేసే ఒక వ్యక్తిని అడగండి. అలా జోడించటం అవిశ్వాసమనే పాపమేనని అతని నమ్మకం. ఎందుకంటే ప్రతి రోగం నుంచి స్వస్థపడటమే ఎల్లప్పుడు దేవుని చిత్తమని భ్రమపడతాడు గనుక అతడు అలా చెప్పి మోసపూరితంగా తప్పించుకోవాలని చూస్తున్నాడు. “నీకు కావలసింది విశ్వాసమొక్కటే.” స్వస్థపరచువాని ధన సంపాదన ప్రణాళిక అంతా ఈ చెడు దైవ శాస్త్రంపైనే ఆధారపడివుంది. గొప్ప పేరుగాంచిన స్వస్థత సేవకులు “ఎంతో దివ్యంగా బాగుచేసిన వ్యక్తులను కనీసం ఐదుగురిని నేను సమాధి చేశాను. వీరు “ఆ స్వస్థతను తమ విశ్వాసం ద్వారా గట్టిగా పట్టుకొననందున దాన్ని కోల్పోయారేమో!” యేసు స్వస్థపరచిన వారిలో ఎవరికైనా యిలా జరిగినట్టు నాకు చూపించండి!

స్వస్థపరుస్తామని చెప్పేవారి “ఆరోగ్యము, సంపద' అనే సువార్త ఆసియా, ఆఫ్రికా ఖండాలలోను ప్రపంచమంతటా ఉన్న పేదలు, రోగులైన విశ్వాసులకు ఒక అవమానంగా ఉంది. ప్యానీ క్రాస్ బి, జోనీ ఎరిక్సన్ వంటి వారు క్రీస్తు తమ కొరకు వెలయిచ్చి కొన్న స్వస్థతను పొందటానికి కావలసిన విశ్వాసం లేని దుష్టులైన అవిశ్వాసులని మనం నమ్మేలా ఇది మనలను బలవంతం చేస్తుంది. అంటే, ఈ గొప్ప క్రైస్తవులు తమ జీవిత కాలమంతా అవిశ్వాసంలోనే గడిపారని అర్థం. ఇది ఎంత అర్థరహితం!

దీన్ని చదువుతున్న ఒకానొక వ్యక్తి- “ఈ రచయిత ఈ అంశం గురించి నిజంగా అతిగా కలవరపడుతున్నాడని” తలంచవచ్చు. అది వాస్తవమే. మనుష్యులను ప్రేమించి, బైబిలు బోధించే దేవుని సార్వభౌమ కృపా వర్తమానమును ప్రేమించే ప్రతివాడు ఈ విధంగానే కలవరపడాలి. జిమ్మీ బేకర్ వంటి అద్భుత స్వస్థతలు చేసే పేరు గాంచిన వ్యక్తుల లైంగిక పాపాల కన్నా, వారు ప్రకటించే తప్పుడు సిద్ధాంతాలే సువార్తకు మరింత కీడు కలిగిస్తాయన్నది నిశ్చయం. శరీర సంబంధమైన ఈ పాపం అతని రాబడిని తగ్గించి, చివరికి అతన్ని చెరసాల పాలు చేసింది. అయితే అతని వక్ర సువార్త దాన్ని నమ్మే వారి ఆత్మలనే నాశనం చేస్తుంది. బేకర్ మరియు స్వగార్ట్ వంటి పేరుగాంచిన కొందరు మహానుభావుల అవినీతి కంటే, వారు ప్రకటించే వాక్యానుసారం కాని వర్తమానాలే మహా అపాయకరమైనవని ఎవరో ఒకరు నొక్కి చెప్పవలసిన సమయం ఆసన్నమైంది.

మనం ముందుకు కొనసాగక మునుపు ఇంతవరకు పరిశీలించిన ముఖ్యాంశాలను ఒకసారి పునరావలోకనం చేసుకుందాం.

(1) రెండు సిద్ధాంతాలలో ఒకటి నిజంగా వాక్యానుసారం కానిదైతే వాటిని జత చేయటం అసాధ్యం. ఈనాడు అనేక మంది క్రైస్తవులు “దేవుని సార్వభౌమత్వము మరియు ప్రార్థన అనే ఈ రెండింటి పట్ల తప్పుడు అభిప్రాయం కలిగియున్నారు. ఈనాడు సాధారణంగాఅంగీకరించబడే మానవ కేంద్రీతమైన ప్రార్థనను గురించిన దృక్పధంతో, దేవుని సర్వాధికార సత్యాన్ని జత చేయాలని ప్రయత్నించటం ఎంతో అవివేకం.

(2) ప్రార్థన చేయుమని క్రైస్తవులు ఆజ్ఞాపించబడ్డారు. మనప్రార్థనలు విని, వాటికి జవాబు లిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. గనుక ప్రార్థించవలసిన అవసరత కాని, ప్రార్థనలకు జవాబు పొందినప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించే అవసరం లేదని కాని బోధించే దేవుని సార్వభౌమత్వమును గురించిన ఎటువంటి సిద్ధాంతమైనా వాక్యానుసారమైంది కాదు (యాకోబు 4:1-3 ).

(3)యోహాను 16:23 మనం కోరిన కోరికలన్నిటిని నింపుకొనగలిగిన ‘ఖాళీ చెక్కు” (బ్లాంక్ చెక్కు కాదు. ఆ వాగ్దానం “నా నామమున” అనే మాటల పరిమితిలోనే నిర్వర్తించబడుతుంది. అదే రీతిగా1 యోహాను 5:14,15 లో ఉన్న “మనమేది అడిగినను” అనే మాటలు “ఆయన చిత్తానుసారముగా” అను మాటలకు పరిమితం చేయబడ్డాయి.

(4) ఈనాడు స్వస్థత నిస్తామని చెప్పే వ్యక్తులు యాకోబు 5:14,15 ను మెలిపెట్టి, ఒక రోగి స్వస్థత పొందకపోతే అతన్నే నిందిస్తున్నారు. ప్రార్థన గురించి, దేవుని సర్వాధికారంతో దానికి ఉన్న సంబంధం గురించి గల కొన్ని మూల సూత్రాలను మనమిప్పుడు వాక్యము నుండి ఎత్తి పరిశీలిద్దాం.

 

అధ్యాయం - 2

ప్రార్థన మరియు దేవుని సార్వభౌమత్వమును గురించిన

ఆరు ప్రాథమిక సత్యాలు

 

మొదటి మూల సత్యం

పాత క్రొత్త నిబంధనలలోని విశ్వాసులు నిరంకుశమైన దేవుని సార్వభౌమత్వాన్ని, ప్రార్థనా అవసరతను, ఈ రెంటిని, ఏ సమస్య లేకుండా విశ్వసించారు.

దానియేలు 9వ అధ్యాయంలో సర్వాధికారియైన దేవుడు ఏమి నెరవేర్చబోతున్నాడో ఖచ్చితంగా తెలిసి ఉండి కూడా దాని కోసం ఆ ప్రవక్త పట్టుదలతో ప్రార్థన చేశాడు. యిర్మియా ద్వారా అంతకు పూర్వమే చెప్పబడిన ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చబోయే నిర్దిష్ట సమయం దానియేలుకు తెలియజేయబడింది. దేవుడు ఏమి చేయబోతున్నాడో, దానిని ఎప్పుడు చేయబోతున్నాడో దానియేలు ఖచ్చితంగా తెలిసి వుండి కూడా, ఇవేవీ ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుమని ప్రార్థించటానికి అతన్ని అవరోధపరచలేదని మనం గమనించాలి. వాస్తవానికి సరిగా దీనికి భిన్నమైనదే ఎప్పటికీ నిజం! దేవుని సర్వాధికార వాగ్దానాలను గురించి, దైవిక ఏర్పాటును గురించిమనమెంత అధికంగా నిశ్చయత కలిగియున్నామో, అంతే అధికంగా నిబంధన ద్వారా మనకు సొంతం చేయబడిన వాటికోసం మనం ప్రార్థించాలి.

పెంతెకొస్తు దీనం తరువాత ఆదిమ సంఘంలో జరిగిన మొట్టమొదటి ప్రార్థనా కూడిక దీనికొక శ్రేష్టమైన ఉదాహరణ. ఇది దేవుని సార్వభౌమత్వం, ప్రార్థనలకు మధ్య గల సంబంధాన్ని స్పష్టంగా సూచిస్తుంది. ఆ వాక్యభాగాన్ని అపొ.కా. 4వ అధ్యాయంలో చదువగలం.

“వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి. వారు విని యేక మనస్సుతో దేవుని కిట్లు బిగ్గరగా మొరపెట్టిరి - నాధా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు .

- అన్య జనులు ఏల అల్లరి చేసిరి?

ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?

ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి,

అధికారులును ఏకముగా కూడుకొనిరి.

అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణము నందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ద సేవకుడైనయేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి యుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను. అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి” (అపొ.కా. 4:23-31).

సంఘము మొట్టమొదటిగా ఎదుర్కొన్న గొప్ప హింస కారణంగా ఈ ప్రత్యేక ప్రార్థన కూడిక జరిగింది. అపొస్తలులు కొట్టబడి యేసు నామంలో మరెన్నడూ బోధించరాదని హెచ్చరించబడ్డారు. 23వ వచనం- వారు తమ స్వజనుల యొద్దకు వచ్చి” జరిగిన సంభవములన్నిటిని వారికి తెలియజేశారని చెబుతుంది. వారు ఒక కమిటీ'ని ఏర్పాటు చేయలేదు. అర్చకులందరిని సమావేశం కమ్మని పిలుపునివ్వలేదు. సంఘమంతా ఈ విషయం గురించి చర్చించి సంఘమంతా కలిసి చర్య తీసుకున్నారు.

సంఘం ఎదుర్కొన్న ఈ భయంకరమైన పరిస్థితికి వారు ఎలా ప్రతిస్పందించారో 24వ వచనం తెలియజేస్తుంది. మనం సాధారణంగా చేసే విధంగా వారు తమ ప్రార్థనను ప్రారంభించకపోవటం ఆశ్చర్యం కాదా? వారు ఆరాధనతో ప్రారంభించి దేవునికి గొప్ప మహిమను సర్వాధికారమును ఆపాదించారు. మన ప్రణాళికలన్నీ తారుమారవటానికి సిద్ధంగా ఉంటే మనం- ప్రభువా, నీవొక్కడవే దేవుడవు. సమస్తమును సృజించిన వాడవు నీవే. ఈ క్షణంలో కూడ పరిస్థితులన్నీ, మనుష్యులంతా నీ ఆధీనంలో ఉన్నారు' అని మన ప్రార్థనను ప్రారంభించం. మనమైతే మూకుమ్మడిగా దేవుని సన్నిధిలోనికిచొరబడి, మన సమస్యను తత్తర పాటుతో బయటపెట్టి, దాని గురించి తక్షణమే ఏదో ఒకటి చెయ్యమని, లేకపోతే ప్రయాసం అంతా వృధా అవుతుందని ఆయనకు ఫిర్యాదు చేస్తుంటాం. మన ప్రార్థనలను నిజమైన ఆరాధన, స్తుతితో ప్రారంభించటం ఎందుకు అంత ముఖ్యం?

మొదటిగా, మన సమస్యలేమయినా సరే, దేవుడు మన ఆరాధనకు పాత్రుడు. రెండవదిగా, దేవుని సన్నిధిలో ప్రవేశించటం గొప్ప ఆధిక్యత అని మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ సత్యాలను గుర్తుంచుకోవటం వలన దేవునిని, మన సమస్యలను తగిన దృక్పధంతో చూడగలం. వీటిని మరచిపోవటం వలన ప్రార్థనలు కేవలం స్వార్థపూరితం అయిపోతాయి. ఈ విధంగా మన ప్రార్థనలతో దేవున్ని అవమానించిన వారమవుతాం.

నీ పట్టణంలోని స్థానిక అధికారులు నీకు అన్యాయం చేశారనుకో, నువ్వు న్యాయం కోసం పై అధికారులకు విన్నవించుకుంటూ చివరికి దేశాధ్యక్షుని వరకు వెళ్లావనుకుందాం. అధ్యక్షుడు స్వయంగా నిన్ను చూడటానికి అంగీకరించాడనుకో. ఆయన కార్యాలయపు గది తలుపులు తెరువబడగానే నువ్వు లోనికి దూసుకుపోయి ఆ దుర్మార్గులేం చేశారో నీకు తెలుసా? నువ్వీ దేశాధ్యక్షుడవు కదా? దీని విషయమై నువ్వేమి చేస్తావు?” అని చెబుతావా? చెప్పవు. ఎవ్వరూ ఈ విధంగా చెయ్యటానికి తెగించరు. మనం మొదటిగా ఆయన మనల్ని కలుసుకోవటానికి సమయం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఎంత ప్రముఖుడో మనకు తెలుసు. మనమీ విధంగా ప్రారంభిస్తాం“అయ్యా, ఈ దేశాధ్యక్షులైన మీరు నా వ్యక్తిగత విన్నపం ఆలకించే స్థాయికి దిగిరావటం చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను. నేనుయథార్థంగా లోతుగా ఈ ఆధిక్యతకు, ఘనతకు ఋణపడి ఉన్నాను” అని చెబుతాం. ఆయన అనుదినం వ్యవహరించే సమస్యల గురించి ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు ఇంత చిన్న సమస్యను గురించి మనం నిరాశ పడినందుకు సిగ్గుపడ ప్రారంభించవచ్చు. వాస్తవానికి ఆయన యెదుట నిలిచిన మనం ఆశ్చర్యంతో నిండి మన సమస్యనే మరచిపోవచ్చు! నేనిక్కడ చెప్పాలనుకున్నదేమిటంటే తరచుగా మనము మానవాధికారుల కిచ్చే గౌరవం కన్నా అతి తక్కువ గౌరవాన్ని దేవునికి ఇస్తుంటాం. కాని ఆదిమ సంఘం మనకంటే ఎంత మెరుగైన స్థితిలో ఉందో!

మూడవదిగా, మన ప్రార్థనను దేవునిని ఆరాధించటంతోను ఆయన మహాత్యమును, సార్వభౌమత్వమును బట్టి ఆయనను స్తుతించటంతోను ప్రారంభించటానికి కారణం ఏమిటంటే అది మనకు ప్రశాంతతను, నిశ్చయతను యిచ్చి రక్తపోటును కాస్త అదుపు చేస్తుంది. మనం సమస్య పైనే మన దృష్టిని లగ్నం చేసినంత వరకు దేవుని శక్తిని, అధికారాన్ని చూడటంలో విఫలమవుతాం. భూమ్యాకాశాలను సృష్టించిన ఆ గొప్ప దేవుని ముందు, ఈ మానవాధికారులు ఏపాటి వారు? ఆది క్రైస్తవులు దేవుని సంపూర్ణ సర్వాధికారమందలి విశ్వాసమనే పునాదిపై నిలిచి ప్రార్థించినట్లు మీరు గ్రహించగలుగుతున్నారని నమ్ముతున్నాను! వారు ప్రధమంగా తమకు దేవుని శక్తియందును ఆయన నిర్ణయాల యందును ప్రగాఢ నమ్మకం ఉందని ప్రకటించారు. కాబట్టే వారు కూడి యున్న చోటును దేవుడు కంపించేలా చేశాడని డా. లాయిడ్ జోన్స్ అభిప్రాయపడ్డారు (31 వ). అనగా “మీరు ప్రార్థించే విధానం నాకు ప్రీతికరంగా ఉన్నది. నా శక్తిమీద మీకున్న నమ్మకాన్ని చూసి నేను ఇష్టపడుతున్నాను. మీవిశ్వాసాన్ని మరల స్థిరపరచటానికి నా శక్తిని కొంతమట్టుకు మీకు చూపిస్తానని” చెప్పి దేవుడు వారున్న స్థలాన్ని కంపింప చేసినట్లుగా ఉంది. అవును ఆయన ఎవరినైనా, దేనినైనా కంపింప జేయగలడు. ఆయన సామ్రాజ్యాలనే వణికించి కూల ద్రోయగలడు.

25 నుండి 27 వచనాలు మనకెన్నో విషయాలను బోధిస్తున్నాయి. లోకము క్రీస్తును ద్వేషించటాన్ని గురించి దావీదు చెప్పిన ప్రవచనం ఆయనను సిలువ వేయటంలో స్పష్టంగా నెరవేరిందని సంఘము దేవుని ఎదుట ఎందుకు గుర్తుచేసుకుంది? ప్రతి ఒక్కరూ క్రీస్తును వ్యతిరేకించారు. మానవాధికారులందరూ ఆయనను శాశ్వతంగా నాశనం చెయ్యాలన్న ఉద్దేశం కలిగివున్నారు. తమకన్నా ముందుగా తమ జేష్టుడు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు తామున్నామని వారు తమకు తాము గుర్తుచేసుకొని దేవునికి విన్నవించుకున్నారు. ఆయన ద్వేషించబడి కష్టాల పాలైనట్లే వారూ ద్వేషించబడి కష్టాల పాలయ్యారు. అయినప్పటికి క్రీస్తు ఏ విధంగా తండ్రి హస్తాలలో భద్రంగా ఉన్నాడో అలాగే వారు కూడ ఆయన హస్తాలలో క్షేమంగా ఉన్నారు. ఇదంతా దేవుని కార్యమే. వారి స్వకార్యం కాదు. ఈ ఆటలో వారు పావులు మాత్రమే. ఆట నడిపించేది దేవుడే అని వారు గుర్తించారు.

అపొస్తలుల కార్యములు 4:28 చదివినప్పుడు నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది. క్రీస్తుకు ఆయన శత్రువులు ఖచ్చితంగా ఏం చేశారు? వాళ్ళందరూ ఒక బలమైన గుంపుగా ఎందుకు కూడారు? “ఏమి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించేనో” వాటినే దుష్టులైన ఆ శత్రువులు చేశారని ఆది సంఘంలో హింస ననుభవించిన ఆ విశ్వాసులు గుర్తు చేసుకొనితమ దేవునికి విన్నవించారు. దేవుని పరిపూర్ణ సర్వాధికారంలో నమ్మకముంచటం అంటే ఇదే. మానవుని స్వేచ్చాచిత్తం గురించి మనం మాటలాడవచ్చు. లేదా విపత్తులన్నిటిని అపవాదిపై మోపి వాని నిందించవచ్చు. అయితే నిజంగా శోధనలు మనలను ముట్టడించినప్పుడు మనకు దేవుని సార్వభౌమత్వం మీద గట్టి పట్టు లేకపోతే మన విశ్వాసం తొట్రుపడటం ఖాయం. శ్రమకు లోనైన ఆ ఆది క్రైస్తవులు పట్టుదలతో ప్రార్థించటానికీ, దేవుని సర్వాధికారయుతమైన శాసనాలకు మధ్య ఎటువంటి వైరుధ్యమునూ చూడలేదు. దేవునిచేత నిర్ణయించబడి క్రీస్తుకు వలె వారికి కూడా ఏదీ సంభవించలేదని వారు ఖచ్చితంగా ఎరిగి యున్నారు.

ఇటీవల నేనొక అధ్వాన్నమైన అనుభవం నా క్రైస్తవ జీవితంలో ఎదుర్కొన్నాను. కొందరు నాకు అబద్ధం చెప్పి, నన్ను గురించి అబద్ధ ప్రచారాలు చేశారు. నేను ప్రేమించిన వారే నన్ను వెన్ను పోటు పొడవటం నేను చూశాను. అసత్యం ఠీవిగా నిలబడగా సత్యం బురదలో ఈడ్వబడటం నేను చూశాను. 'వనీతం దానిని సాధించటానికి అనుసరించే మార్గాన్ని సమర్థిస్తుంది' అనే తత్వాన్ని ఉపయోగించి క్రైస్తవులు, తమ కోరికను సఫలపరచుకోవటానికి నిర్భయంగా అబద్ధాలాడి తప్పు త్రోవలు తొక్కటం నేను గమనించాను. ఇలాంటి అన్యాయాలు జరుగుతుండగా దేవుడు ఎక్కడున్నాడు? అపొస్తలుల కార్యములలో శిష్యులు దెబ్బలు తిన్నప్పుడు, కల్వరిలో క్రీస్తు మరణించినప్పుడు, సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొన్న దేవుడు ఈ పరిస్థితులను కూడ తన అదుపులో ఉంచుకున్నాడు. నా పరలోకపు తండ్రి అనుమతించనిదేదీ నాకు సంభవించలేదు. దీనిని నేను నమ్మకపోతే, క్రోధంతో ప్రతీకారం తప్పక కోరివుండే వాడిని.వీటన్నిటిలో నేను లోతుగా గాయపడలేదని చెబితే అది అబద్ధమే అవుతుంది. అయినా, వారిలో నన్ను అధికంగా వంచన చేసి, ద్వేషంతో వ్యవహరించిన కొందరిపై నేను యథార్థంగా జాలిపడుతున్నాను. నామట్టుకు నేను యథార్ధంగానే ప్రవర్తించి సరైన రీతిలోనే వ్యవహరించానని నాకు తెలుసు. ఫలితాలు ఎల్లప్పుడు దేవునికి చెందుతాయి. ఈనాడు ఎవరు విజయము పొందినట్లు కనపడినా, చివరికి దేవుని చిత్తమే సిద్ధిస్తుంది. కేవలం దేవుని యెడల, మనుష్యుల యెడల నిర్దోషమైన మనస్సాక్షిని కలిగియుండటమే నా ఏకైక విధి.

అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలోని ఆ చెడు ఫలితాలను చూసి విశ్వాసులు తామేదో పొరపాటు చేసినందుకే ఇలా జరిగిందని అనుకొన్నారా, లేక ఆ నాయకులు తమ్మును శ్రమల పాలు చేసినా తాము దేవుని చిత్తంలోనే ఉన్నామని నమ్మారా? “ఏదిఏమైనా, సమాధానమే ముఖ్యమని” తియ్యగా చెప్పేవాళ్లెవరైనా లేచి “వాస్తవానికి మనం బోధించిన విధానం వల్లనే మనమీ కష్టం కొని తెచ్చుకున్నామని మీకు తెలుసా? యూదులు ద్వేషించే అభ్యంతరకరమైన సిద్ధాంతాలను మనం బోధించకుండవలసింది. మనం అలాంటి మొండి వాదనలు చేయకుండ వలసింది” అని చెప్పటం ఊహించగలరా? దీనిని “క్రైస్తవ ప్రేమ, దైవ జ్ఞానము” అని సారహీనమైన నేటితరం వారు అభివర్ణించవచ్చు. అయితే ఇలా చెప్పటం ద్వారా తమ రక్తం కార్చి ఈ భూమిమీద సత్యాన్ని ప్రతిష్టించిన ఆది విశ్వాసుల ఆసక్తిని, ధైర్యాన్ని అవమానించటమే అవుతుంది.

లేదు స్నేహితుడా, దేవుని సార్వభౌమ నిర్ణయాలకూ మనఃపూర్వకమైన, విశ్వాస సహితమైన ప్రార్థనకు మధ్య ఏ విధమైనావైరుధ్యం లేదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయంలోని ఆ మాటలను మరొకసారి చదివి చూడు. సమస్తము దేవుడు నిర్ణయించినట్లే జరుగుతుందన్న సత్యం మీద వారికున్న దృఢ నమ్మకమే ఆ శ్రమల సమయంలో వారికి ధైర్యమును, ప్రార్థించటానికి విశ్వాసమును ఇచ్చింది. ఇది ఆ వాక్య భాగంలో స్పష్టంగా చూడగలం. బుద్ధిపూర్వకంగా వక్రీకరించి, మానవ కేంద్రిత దైవ శాస్త్రాలకు అనుగుణంగా మలచుకుంటే తప్ప ఆ మాటలను మరే విధంగానూ అర్థంచేసుకోలేం.

చివరికి 29వ వచనంలో, ఆ విశ్వాసులు దేవునికి తమ పరిస్థితిని విన్నవించుకోవటం చూడగలం. అంత వరకు వారు దేవున్ని ఆరాధిస్తూ, స్తుతిస్తున్నారు గాని తమకు కలుగుతున్న హింసను ఆపుమని గాని, హింసిస్తున్న వారిని నాశనం చేయుమని గాని అడగలేదు. ఇది ఆశ్చర్యం కాదా? అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, చివరికి వారు దేవున్ని సహాయం చేయుమని అర్థించినపుడు సైతం, వారి శ్రమకు హేతువైన సువార్త ప్రకటనను ధైర్యంగా కొనసాగించటానికి కావలసిన కృపనిమ్మని మాత్రమే వారు వేడుకొన్నారు. ఆ శ్రమల సంగతి దేవునికే విడిచి పెట్టి, ఫలితాలతో నిమిత్తం లేకుండా, వారు తెలుసుకొన్న దేవుని సత్యాన్ని ప్రకటించటానికి ధైర్యమీమ్మని ప్రార్థించారు. స్నేహితుడా, ఇదే నిజమైన ప్రార్థన. ఇక్కడ మనం చూసిన రీతిగా నిజమైన ప్రార్థన అంటే దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా మనం ఉపయోగించబడేలా ఆయన సార్వభౌమాధికారానికి సంతోషంగా విధేయులమవటమే. దేవుని చేత, ఆయన విధానంలో ఆయన మహిమ కొరకు వాడబడేలా ప్రార్థించటానికి మనం కొంత మేరకు భయపడుతున్నామనటంలో ఆశ్చర్యం లేదు.

దీనికంటే జిమ్మీ బేకర్ వంటి దుర్భోదకుల మాటలు విని "స్విమ్మింగ్ సూట్ దయచేయుము” వంటి ప్రార్థనలు చేయటం ఎంతో సులభం కదా! ఏ రంగువి కావాలో దేవునికి చెప్పటం మరచిపోకు సుమా!)


అపొస్తలుల కార్యములు 4:23-31 ని ఈ క్రింది విధంగా సంక్షిప్తపరచవచ్చు.

1) 23-28 వచనాలు - దేవుని సర్వాధికారము నందలి నమ్మకం - ప్రార్థనకు నిజమైన పునాది.

2) 29-30 వచనాలు - సరైన వాటి కొరకు అడుగుట - ప్రార్థనకు నిజమైన పరీక్ష.

3) 31 వచనం - దేవుని సన్నిధిని, శక్తిని అనుభవించి గ్రహించుట - ప్రార్థనకు నిజమైన జవాబు.

రెండవ మూల సత్యం

దేవుని చిత్తమని మనకు తెలిసిన దానికి లోబడకుండ నిరాకరించేందుకు ప్రార్థనను ఒక సాధనంగా వాడుకోవటం సాధ్యమే.

సహోదరులారా, మనం ఇప్పుడు నిజమైన ప్రార్థనలో ఉన్న అసలైన సమస్య వద్దకు వచ్చామని నాకనిపిస్తుంది. దేవుని ఏర్పాటు చొప్పున కలిగిన పరిస్థితుల నుండి తప్పించుకోటానికి తరచుగా మనం ప్రార్థనను ఒక సాధనంగా వాడుకుంటాం. దేవుని సార్వభౌమాధికారానికి తల వంచటానికి ఇష్టపడక ఆయన తలంపును ప్రార్ధన ద్వారా మార్చటానికి మనం సాహసిస్తాం. సర్వాధికారియైన మన దేవుని చిత్తానికి సంతోషంగా లోబడటమే నిజమైన ప్రార్థన! మన స్వచిత్తానికి వ్యతిరేకమైన పరిస్థితులు కలిగినప్పుడు దేవుని ఆలోచనను మార్చటానికి ప్రయత్నించే విషయంలో మనమంతాదోషులం కామా? మరింత ఘోరమైనదేమిటంటే మనకు కావలసిన దాన్ని చేయుమని దేవుని సన్నిధిలో గొణగటాన్ని మనం “ప్రార్థన” అని పిలిచేందుకు సాహసిస్తున్నాం! వాస్తవానికి, స్పష్టంగా బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని నిరాకరించటానికి మనం ప్రార్థన నొక సాధనంగా ఉపయోగిస్తాం. చివరికి దేవుని బిడ్డలలో శ్రేష్టులు సహితం ఈ భయంకరమైన పాపం చేస్తున్నారు. దీనికి ఉదాహరణగా అబ్రహాము జీవితంలో ఒక సంఘటనను పరిశీలిద్దాం.

"అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు దాచెదనా .... అనుకొనెను” (ఆది 18:17).

ఈ సందర్భంలో దేవుడు తాను సొదొమను నాశనం చేయబోతున్నానని అబ్రహాముకు తెలియజేయటం గురించి చూస్తాం. దేవుడు సరిగ్గా ఏం చేయబోతున్నాడో అబ్రహాముకు తెలియజేయబడింది. అయితే దేవుని ఉద్దేశంతో ఏకీభవించటానికి అబ్రహాము సిద్ధంగా లేడు. దేవుని ఆలోచనను మార్చాలన్న ఆశతో అతడాయనకు ప్రార్థన” చెయ్యాలని నిశ్చయించాడు. నేను చెప్పాలనుకుంటున్న విషయానికి ఈ సంభాషణ చక్కటి ఉదాహరణ.

“అప్పుడు అబ్రహాము సమీపించి యిట్లనెను- దుష్టులతో కూడ నీతి మంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ ఏబది మంది నీతిమంతులుండిన యెడల దానిలో నున్న యేబది మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వ లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా? అని చెప్పినప్పుడు యెహోవా - సొదొమ పట్టణములోఏబది మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతయు కాయదుననెను. అందుకు అబ్రహాము - ఇదిగో, ధూళియు, బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏబది మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే, ఐదుగురు తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన - అక్కడ నలువది యెదుగురు నాకు కనబడిన యెడల నాశనము చేయననెను. అతడింకా మాటలాడుచు - ఒకవేళ అక్కడ నలుబది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన - ఆ నలుబది మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పగా అతడు - ప్రభువు కోపపడని యెడల నేను మాటలాడెదను. ఒకవేళ అక్కడ ముప్పది మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన - అక్కడ ముప్పది మంది నాకు కనబడిన యెడల నాశనము చేయననెను. అందుకతడు - ఇదిగో, ప్రభువుతో మాటలాడ తెగించితిని, ఒకవేళ అక్కడ ఇరువది మందీయే కనబడుదురేమో అనినప్పుడు ఆయన - ఆ పది మందిని బట్టి నాశనము చేయక యుందుననెను. యెహోవా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన యింటికి తిరిగి వెళ్ళేను” (ఆది 18:23-38).

సొదొమ గొమొర్రాలను నాశనం చెయ్యాలన్న తన ఉద్దేశాన్ని దేవుడు అబ్రహాముకు తెలియచేయటం వల్లనే ఈ సంభాషణ జరిగిందని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు చేయబోయే దానిని అబ్రహాము అంగీకరించ లేకపోయాడు. 23, 24 వచనాలు చూసినప్పుడు దేవునితో తర్కిస్తూ లోతును కాపాడేందుకే అబ్రహాము ఆతురత చెందినట్లు మనకు అగుపిస్తుంది. కాని సొదొమలో యాబై మందినీతిమంతులు ఉండవచ్చునని అబ్రహాముకు యేమాత్రమైనా తెలుసా లేక అతని చింత యావత్తు కేవలం తన బంధువు లోతును గురించేనా? అబ్రహాము హృదయంలో ఉన్న అసలు చింత లోతును గురించే అని ఇద్దరికీ తెలిసినా, ఈ సంభాషణ అంతటిలో దేవుడు గాని, అబ్రహాము గాని లోతు పేరైనను ఎత్తక పోవటం ఆసక్తికరమే! ఒక విషయం గమనించండి. దేవుడు సొదొమ, గొమొర్రాలను నాశనం చేయబోతున్నాడని బయలుపరిచినప్పటికీ, ఈ సంభాషణలో అబ్రాహాముకు ప్రత్యుత్తరమిచ్చినప్పుడు కేవలం సొదొమ విషయం మాత్రమే ప్రస్తావించినట్లు చూస్తాం. అబ్రహాము చింత యావత్తు సొదొమను గురించే అయినప్పుడు గొమొర్రాను ప్రస్తావించటం ఎందుకు?

దేవుడు ఉదార స్వభావంతో అబ్రహాము షరతులకు ఒప్పుకొని అక్కడ యాబై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నాశనం చేయనని అంగీకరించాడు. అంతటితో ఆ విషయం అంతం కావలసింది. కాని అబ్రహాము మరింత ప్రార్థన” చేయటానికి నిశ్చయించాడు. అతడు మొదట తన వినయాన్ని ప్రదర్శించి, ఆ తరువాత తన కపటమును బయటపెట్టాడు. వాస్తవాలను వక్రీకరించి పావులు కదపటం అంటే ఏమిటో కనుగొనాలంటే 28వ వచనం చూడు. యాభై మంది నీతిమంతుల కొరకు పట్టణమంతటిని కాపాడుమన్నది అతని మొదటి అభ్యర్థన. కాబట్టి ఒకవేళ అబ్రహాము ఆసంఖ్య నుండి ఐదుగురిని తగ్గించాలనుకొంటే “నలుబది ఐదుగురు నీతిమంతులు ఆ పట్టణములో ఉన్నను, దానిని నాశనము చేయుదువా” అని అడిగి వుండవలసినది. కాని తన ప్రశ్నను “నలుబదీ ఐదుపై” కాక కేవలం ఆ “ఐదు”పై దృష్టిపడునట్లు రూపొందించాడు.

ఇది “ప్రభువా, నువ్వు ఒక ఐదుగురు మనుష్యులను బట్టి నీ మాటను వెనక్కి తీసుకుంటావా?” అని అడిగినట్టుంది. అబ్రహాము లెక్కలు తలక్రిందులుగా వేస్తున్నాడు. అయితే 28వ వచనం చివరిలో దేవుడు అబ్రహాము లెక్కను సరిచేస్తూ “నలుబది ఐదుగురు” నీతిమంతులు ఆ నగరంలో ఉన్నా దానిని నాశనం చేయనని వాగ్దానం చేశాడు.

ఇంతటితో అబ్రహాము తృప్తి చెంది, మౌనంగా ఉంటాడని మనం అనుకోవచ్చు. కాని అలా జరగలేదు! అబ్రహాము తన చిత్తాన్ని దేవునిపై రుద్ది దేవుని ఉద్దేశాన్ని సరిచేయ నిశ్చయించాడు. 29వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు అబ్రహాము నలబై ఐదు నుంచి నలబైకి, తరువాత ముప్పయికి, ఇరవైకి, చివరికి పదికి వెళ్ళినప్పుడు, ఒక మానవ మాత్రుడు కనపరచిన ఈ మొండితనాన్ని దేవుడు తప్పక శిక్షిస్తాడని మనమనుకుంటాం! అయినప్పటికి అలా జరుగలేదు. చివరికి అబ్రహాము భక్తితో "నేనింకొక సారి మాత్రమే మాటలాడెదను” అని అన్నప్పుడు కూడ అతనికి ఏ శిక్ష కలుగలేదు. అతడు ఇప్పటికే ఐదుమారులు అలా అన్నాడు. అయినప్పటికి అతనికి శిక్ష కలుగకపోవటానికి కారణమేమిటి? ఎందుకంటే, దేవుడు అబ్రహాము స్నేహితుడు. ఆయన అతన్ని గాఢంగా ప్రేమించాడు. తన బిడ్డల పట్ల ఆయన దీర్ఘశాంతం వహిస్తాడు. అబ్రహాము గతి తప్పినాడని దేవునికి తెలుసు. అతని ప్రార్థనలో దాగియున్న ఉద్దేశాన్ని దేవుడు కనిపెట్టాడు. అయినా దేవుడు అబ్రహాము హృదయాన్ని, మనస్థత్వాన్ని మార్చాలనుకున్నాడు. 33వ వచనం గమనిస్తే, అక్కడ దేవుడు ఈ సంభాషణను “మాటలాడుట” అని పిలుస్తున్నాడు. నేనైతే దానిని “విసికించుట” అంటాను. నేను దేవుడంత ఉదార స్వభావుణ్ణి కాను కదా!

ప్రార్థన నెరవేర్చే అనేక ప్రాముఖ్యమైన కార్యాలలో ఒకటి “మనలను మార్చటం” అని ఈ ఉదాహరణ మనకు బోధిస్తుంది. దేవుడు తన ఉద్దేశాన్ని మార్చుకోలేదు కాని అబ్రహాము వైఖరిని మార్చటానికి అతని ప్రార్థనను ఉపయోగించాడు. ప్రార్థన అబ్రహామును మార్చింది. దేవుని సర్వాధికార చిత్తాన్నికి సంతోషంగా లోబడటానికి బదులు కొన్నిసార్లు మనం ప్రార్థన ద్వారా దేవుని ఆలోచనను మార్చేందుకు ప్రయత్నిస్తాం. అయితే దేవుడు తన సంపూర్ణ సార్వభౌమత్వంతో మనలను వంచటానికి బదులు (అలా చేసే అధికారం ఆయనకు ఉన్నప్పటికి) మనం మన భయాలను, వ్యతిరేకతను బయట పెట్టే అవకాశమిచ్చి, చివరికి మనమెంత కారణరహితంగా ప్రవర్తిస్తున్నామో తెలియజేస్తాడు. నువ్వెప్పుడైనా నీకు సంభవించిన గోరంత విషయాన్ని కొండంతలుగా చేశావా? దాన్ని నువ్వు మనసులో ఉంచుకున్నంత వరకు అది మరింత పెద్దదిగా ఎదుగుతుంది. ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా చేసిన దాన్ని మనసులో ఉంచుకొని, దాన్ని చివరికి నీ ఎదుటి వానితో అతడెంత ఘోరంగా నీ పట్ల ప్రవర్తించాడో వర్ణించే ప్రయత్నం చెయ్యగా అది చప్పగా కూలబడటం ఎప్పుడైనా అనుభవంలోనికి వచ్చిందా? అప్పుడు అది చాల సామాన్యమైన విషయమని, దానినెప్పుడో విడిచి పెట్టి ఉండవలసిందని గ్రహిస్తావు. అతని పట్ల నీకున్న వ్యతిరేక భావాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నించి నిన్ను నీవే బుద్ధిహీనునిగా కనపర్చుకున్నావని తెలుసుకుంటావు. నువ్వు నీ నోరు మూసుకొని ఉంటే ఎంత బావుండేదని అనుకుంటావు. కాని నువ్వు దాన్ని మాటల్లో చెప్పనంత వరకు నీ తప్పును గ్రహించలేకపోయావు.

దేవుడు తరచుగా మనతో ఇదే విధంగా వ్యవహరిస్తాడు.మనమాయన మనస్సును మార్చటానికి ప్రయత్నించటం ఎంత హాస్యాస్పదమో మనం గ్రహించే వరకు ఆయన ఓపికతో మన మాటలు వింటాడు. దీని ఫలితంగా మన వైఖరి, ప్రార్థన మారతాయి. మనం దీనులమై ఆయన ఏమి చేసినా ఆరాధనా హృదయంతో తల వంచుతాం. మన పట్ల ఆయన చూపిన ఓర్పు కొరకు నూతనంగా ఆయనను స్తుతిస్తాం.

ఇది ఈ చర్చలోని తరువాతి అంశంలోనికి మనలను నడిపిస్తుంది.

మూడవ మూల సత్యం

“స్వార్థపరమైనది” అని కొందరు పిలిచే ప్రార్థన చేయటం తప్పు కాదు. నా పిల్లలు ప్రయాణం చేస్తుండగా వారిని కాపాడుమని గాని, వారికి మంచి ఉద్యోగాలు దొరికేలా చేయుమని గాని ప్రార్థించటం మంచిది కాదా? నా భార్య ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి వెళ్ళినపుడు అది విజయవంతం కావాలని ప్రార్థించటం నేరమా? ఈ విషయాలన్నిటిలో దేవుని నిర్ణయం నాకు తెలియదు. అబ్రహాము చేసిన ప్రార్థనలో యథార్థత తక్కువై యుండొచ్చు కాని, అతడు లోతు పట్ల చింత కలిగి అతని క్షేమం కోసం దేవుని వేడుకోవటం సరియేనా? మన ప్రియుల క్షేమం కొరకు చింతించి వారి మేలు కొరకు ప్రార్థించటం తగునా? బహుశా దీనిని అర్థం చేసుకోవటానికి వేరొక బైబిలు ఉదాహరణ మనకు సహాయం చేయవచ్చు. మనము దావీదు చేసిన ప్రార్థనలలో ఒకదాన్ని పరిశీలిద్దాం.

“....నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను - నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్ళేను” (2 సమూ. 12:13-15)..

దావీదు వ్యభిచారం, హత్య కూడ చేశాడని మీకు గుర్తుండి వుంటుంది. దేవుడు దావీదు వద్దకు నాతానును పంపి తన వర్తమానం ద్వారా అతడు చేసిన భయంకరమైన పాపాన్ని ఒప్పుకునేలా చేశాడు. పై వచనాలలో జరుగబోయే దానిని దేవుడు స్పష్టంగా బయలుపరిచాడు. పుట్టబోయే బిడ్డ మరణిస్తుంది. అబ్రహాముకు వలెనే దావీదుకు కూడ దేవుని చిత్తం లేదా ఆయన శాసనం స్పష్టంగా బయలుపరచబడింది. అయినప్పటికిని రోగియైన తన బిడ్డను బ్రదికించుమని దావీదు దేవున్ని బ్రతిమాలాడు.

“యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడియుండి బిడ్డ కొరకు దేవున్ని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడ భోజనము చేయక యుండెను” (2 సమూ. 12:16,17).

దావీదు ఇలా ప్రార్థించటం సరికాదా? ఆ బిడ్డ మరణిస్తుందని దేవుడు చెప్పినందున అలా ప్రార్థించటం సమయాన్ని వ్యర్థం చేయటమే కదా? దావీదు జీవితంలో జరిగిన ఈ సంఘటన నుండి ప్రార్థన గురించి మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోగలం. దావీదు దేవుని బ్రతిమాలినా బిడ్డ మరణించింది. ఆ సంగతి దావీదుకు తెలియజెప్పటానికి సేవకులు భయపడ్డారు. అతని మనోస్థితిని బట్టిఅతడేదైనా బుద్దిహీనమైన పని చేస్తాడేమో అని వాళ్లనుకున్నారు. దావీదు సంగతి గ్రహించి, “బిడ్డ మరణించేనా?” అని ప్రశ్నించాడు. సేవకులు, “అవును” అని చెప్పగా దావీదు ఏమి చేశాడో లేఖనం ఈ విధంగా చెబుతుంది..

“అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను” (2 సమూ. 12:20).

బిడ్డ మరణించిందని తెలిసిన మరుక్షణమే దావీదు దేవుని చిత్త సంకల్పాన్ని అంగీకరించాడు. అతడు మొదట దేవున్ని ఆరాధించిన తరువాత తన అనుదిన కార్యక్రమాలను కొనసాగించాడు. దావీదు సేవకులు ఆశ్చర్యపోయారు. వారతడు ఏడ్చి, అంగలార్చీ గతి తప్పుతాడేమో అనుకున్నారు. ఇలా ఎందుకు చేశావని వారతన్ని ప్రశ్నించినప్పుడు, దావీదు ఇచ్చిన జవాబు ప్రార్థన గురించిన ఈ పాఠానికి కేంద్రంగా ఉన్నది.

“అతని సేవకులు - బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి. నీవీలాగు చేయుట ఏమని దావీదు నడుగుగా అతడు - బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరల రాడని వారితో చెప్పెను” (2 సమూ. 12:21-23).

దావీదు ఏమంటున్నాడు? తన బిడ్డను బ్రతికించుమని అతడు దేవున్ని బ్రతిమాలినప్పుడు అతని హృదయ వైఖరి ఎలా ఉంది? దావీదు అంటున్నాడు, “బిడ్డలో ఊపిరి ఉన్నంత వరకు, అతని బ్రదికించగల దేవునికి ప్రార్థన చేశాను. దేవుడు “అది జరుగదు” అని చెప్పటానికి యిష్టపడ్డాడు. దానికి ప్రతిగా నేను “దేవుని నామము స్తుతింపబడును గాక” అని చెప్పి నా బ్రదుకు కొనసాగించాను. దేవుని సర్వాధికార చిత్తాన్నికి నేను దీనుడనై తల వంచుతాను. దావీదు బిగ్గరగా “అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక” అని చెప్పి యుండక పోవచ్చు. అయితే ఆయన తప్పక అదే హృదయ వైఖరితో ప్రార్థించాడు. మన హృదయ వాంఛలేవైనను వాటి కొరకు మనం ప్రార్థించవచ్చు. కాని మనం చేసే ప్రార్థనకు “అవును” లేదా “కాదు” అని జవాబిచ్చే నిర్ణయాన్ని దేవునికే విడిచిపెట్టాలి. ఈనాడు ప్రార్ధన గురించి బోధించబడుచున్న విధానానికిది వ్యతిరేకంగా ఉండవచ్చు. కాని ఇదే వాక్యానుసారమైనది. మన ప్రభువు సైతం“అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక” అని ప్రార్థించాడు. మన యజమాని కన్నా మనం అధికులమా?

వాక్యానుసారమైన ఈ సూత్రానికి మరొక ఉదాహరణ ఇవ్వటం మంచిదని భావిస్తున్నాను. నేను వ్రాసిన ఏర్పాటు నందు దేవుని సార్వభౌమత్వమ'నే చిన్న పుస్తకంలో హబక్కూకు గ్రంథాన్ని లోతుగా పరిశీలించాను. మనమిప్పుడు చర్చిస్తున్న ప్రార్థన సూత్రానికి ఈ గ్రంథం ఒక శ్రేష్టమైన ఉదాహరణ. దానిలోని ప్రారంభ వచనాలలో దేవుడు ఎందుకు పని చేయటం లేదని హబక్కూకు సవాలు చేశాడు. ఇందుకు జవాబుగా, ఇశ్రాయేలు దేశంపై దండెత్తి దాన్ని తుడిచి వేయటానికి తాను కల్దీయులను పంపుతున్నానని దేవుడు ప్రవక్తకుతెలియజేయగా అబ్రహాము ఏమి చేశాడో ఇతడు కూడా సరిగ్గా అదే చేశాడు. అలా చేయడం దేవుని పరిశుద్ధ స్వభావానికి సరిపోదని ఆయనను నమ్మించేందుకు ప్రవక్త ప్రయత్నించాడు. నిజమే, హబక్కూకుకుకూడ ఇశ్రాయేలు పూర్తిగా నాశనమవటం ఇష్టం లేదని మనం గ్రహించగలం. “యెహోవా తన పరిశుద్ధాలయములో నున్నాడని” దేవుడు హబక్కూకుకు గుర్తు చేసిన తరువాత ఆ ప్రవక్త వైఖరి పూర్తిగా మారిపోయింది. నిశ్చయతగల ఒకానొక హృదయం నుండి బయలు వెళ్ళిన యథార్థమైన ప్రార్థనను వినండి.

“ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన (వాయిద్యములతో పాడదగినది), యెహోవా, నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. . . నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండ కుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు (సెలా... నేను వినగా జనుల మీదికి వచ్చు వారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమ దినము కొరకు కనిపెట్ట వలసి యున్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా యెముకలు కుళ్లి పోవుచున్నవి. నా కాళ్లు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపక పోయినను ఒలీవ చెట్లు కాపులేక యుండినను చేనులోని పైరు పంటకు రాకపోయిననుగొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేక పోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్లవలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును” (హబక్కూకు 3:1,2,13,16-19).

హబక్కూకు తన ప్రార్థనలో దేవునితో చేసిన సంభాషణ, అతని దృక్పథాన్ని, వైఖరిని పూర్తిగా మార్చిందని స్పష్టమవుతుంది. దేవుడు ఎల్లప్పుడు అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకొని తన ఉద్దేశాలను జరిగిస్తున్నాడని, ఆ విధంగా చేయటంలో ఆయన ప్రతి ఒక్కరినిచివరికి దుర్మార్గులైన కల్దీయులను సైతం ఉపయోగించుకుంటాడని అతడు తెలుసుకున్నాడు. 2వ వచనం నిజమైన ప్రార్థన. 13వ వచనం దేవుని ఉద్దేశాలను ఎలా అర్థం చేసికొని, అన్వయించుకోవాలో తెలుపుతుంది. జరిగే ప్రతి సంభవం చివరికి దేవుని ప్రజలతో ఏదో విధంగా సంబంధం కలిగి వుంటుంది. 16-19 వచనాల్లో ఆశ్చర్యంతోను, భయభక్తులతోను దేవుడు ఆరాధించబడటం మనం చూడగలం. తన దేశం పైకి తీర్పు రానున్న సంగతి హబక్కూకునకు తెలుసు. అయితే దాని నుండి కూడా దేవుడు మేలు కలుగజేసి తన్ను తాను మహిమపర్చుకుంటాడని అతడు విశ్వాసంతో నిరీక్షించాడు. ఇదే సరైన ప్రార్థన విధానం. కాని కొన్నిసార్లు మనం తప్పుగా చేసిన ప్రార్థనలను దేవుడు మన వైఖరిని మార్చటానికి ఉపయోగించిన తరువాతనే, అటువంటి సరైన ప్రార్థన చేయటం సాధ్యమవుతుంది.

నాలుగవ మూల సత్యం

ప్రార్థన అంటే అడగటం. దేవుడు ఏం చెయ్యాలో చెప్పటం కాదు.

నిజంగా ప్రార్థన అంటే అర్థించటం' అని మనం తప్పక గ్రహించాలి. అయితే, మన ప్రార్థనకు 'అవును' అని కాని 'కాదు' అని కాని జవాబిచ్చే అధికారం దేవునికి ఉందని గ్రహించే వరకు మనం ఈ సత్యాన్ని చూడలేం. వాక్యానుసారంగా ప్రార్థనను అర్థం చేసుకున్నప్పుడు వైఖరి మరియు క్రియ, ఈ రెండు అందులో ఇమిడివుంటాయని మనం గ్రహించగలం. అభ్యర్థించే మాటలతో పాటు బైబిలులో బయలుపరచబడిన సత్యం పట్ల హృదయ ప్రతిస్పందన కూడ అందులో ఇమిడివుంటుంది. ఏది ప్రార్థన అనిపించుకొనదో, ఈ క్రింద వివరిస్తాను.

1. ప్రార్థన అంటే దేవుడు ఎప్పుడు, ఏమి చెయ్యాలో, ఎవరిద్వారా చెయ్యాలో ఆయనకు సలహా ఇవ్వటం కాదు. అలా చేస్తే, ఆ సమస్యను తీర్చే విషయమై దేవునికి తనకంటూఒక ప్రణాళిక లేనివానిగా పరిగణించినట్లవుతుంది.

2. ప్రార్థన అంటే దేవునికి తెలియని సమాచారమేదో నువ్వు ఆయనకు అందించటం కాదు. నువ్వెప్పుడైనా ప్రార్థించేటప్పుడు” పరిస్థితి ఏమిటో ఆయనకు జాగ్రత్తగా వివరించి, అది ముగించిన తరువాత, “ఇప్పుడు నిజంగా జరుగుతున్నదేమిటో ఆయన అర్థం చేసుకుని నా సలహా ఎంత తెలివైనదో చూడగల స్థితిలో ఉన్నాడు' అనితలంచావా? ఇది ఎంత దురహంకారం?

ఒక విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల కోసంప్రార్థించాలన్న తలంపు పుట్టిన ఒక వ్యక్తి గురించి మీరు వినివుండొచ్చు. అతడొక ప్రార్థన కూటంలో నిలబడి ఇలా ప్రార్థించటం మొదలుపెట్టాడు, “ప్రభువా, ఆ విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చుమని వేడుకొనుచున్నాను.” అయితే ఆ ప్రమాదం జరిగిన పట్టణం పేరు అతడు మరచిపోగా, “మరి ... మరి....” అంటూ ఆ పేరు జ్ఞాపకం తెచ్చుకొనేందుకు ప్రయత్నించి, చివరికి, “ప్రభువా, ఆ స్థలం పేరు జ్ఞాపకం లేదు. కాని నీకు తప్పక తెలుసునని నమ్ముతున్నాను. ఈ రోజు వార్తా పత్రికలన్నిటిలో ఆ పేరు ప్రకటించబడింది కదా” అన్నాడు. ఇది విని, “దేవునికి సరైన సమాచారం ఉన్న పత్రిక అందిందో లేదో పాపం” అనుకున్నాను. మనమీ కథ విని చిరునవ్వు చిందించ వచ్చు కాని, మనం కూడ కొన్నిసార్లు ప్రార్థించటం అయిపోయాక ఇదే వైఖరితో, “ఇప్పుడు దేవునికి అసలు కథ తెలిసింది” అని అనుకోవటం లేదా?

మనం ప్రార్థించటం ముగించిన తరువాత మనకు కలిగే అనుభూతి, మన వైఖరి, ఇవే మన విశ్వాసం ఎలాంటిదో నిరూపించే రుజువులు. మనం అంతా “విడిచి” దేవునిపై భారం వేద్దామని చెప్పుకుంటాం. పరిస్థితి ఆయన చేతిలో ఉందని ఒప్పుకుంటాం. ఇవన్నీ చెప్పుకోవడం వరకు మాత్రమే! ఆచరణలో మాత్రం తరచు ఇందుకు భిన్నంగానే ప్రవర్తిస్తాం. వాస్తవమేమిటంటే అన్నీ దేవునికి విడిచి పెట్టామని చెప్పుకుంటూనే ప్రతి పరిస్థితిలోను మన తెలివినుపయోగించి నేర్పుతో ముందుకు సాగాలని ప్రయత్నిస్తుంటాం. అన్నిటిని ఆయనకే “విడిచి పెట్టామని చెప్పుకుంటూనే శత విధాలుగా పన్నాగాలు పన్నుతుంటాం. “దేవునిపై భారం వేశామని” అంటూనే,మన స్వబుద్ధికి తోచిన ప్రయత్నాలన్నీ చేస్తుంటాం. కాని విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే సొంత ప్రణాళికల మీద ఆధారపడటం మనకు తగదు.

ఈ సత్యాన్ని చూపించటానికి జే ఏడమ్స్ ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. ఒకానొక వ్యక్తి ఎల్లప్పుడు నిరాశపరుడై ప్రతిదానికీ సణుక్కుంటూ ఉండేవాడు. తన కథంతా వినడానికి ఓ గంట ఖాళీ సమయం ఉంటేనే తప్ప, అతని స్నేహితులెవ్వరూ “నువ్వెలా ఉన్నావని అడగటానికి కూడా సాహసించేవారు కాదు. కాని ఒక రోజు తానెంతో సంతోషంగా ఉండటం చూసి, తన మిత్రుడతనితో, అందుకు కారణం ఏమిటని అతన్ని ప్రశ్నించినప్పుడు, అతడు “ఈ ప్రపంచంలో నేను విచారించవలసిన ఒక్క చింతా నాకిక లేదు” అని జవాబిచ్చాడు.

దానికతని మిత్రుడు ఆశ్చర్యపడి, “ఇది చాలా వింతగా ఉందే! నీ సమస్యలన్నీ ఎలా పోగొట్టుకున్నావు?” అని అడిగాడు. దానికతడు, “నా సమస్యలన్నిటిని నా కంటే చక్కగా మోసే ఒక వ్యక్తి నాకు దొరికాడు. నా సమస్యల్ని మోయటానికి అతనికి వారానికి ఐదు వందల రూపాయలు కూడా ఇస్తాను” అని జవాబిచ్చాడు. ఆ స్నేహితుడు ఆశ్చర్యంతో “అంత సొమ్ము నువ్వెక్కడ నుంచి సంపాదిస్తావు?” అని ప్రశ్నించినప్పుడు, అతడు “దాని గురించి చింతించటం కూడ అతని సమస్యే. నా సమస్య కాదు” అని జవాబిచ్చాడు. దీనిలోని అర్ధాన్ని మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. మనం దేవునికి మన సమస్యలను అప్పగించినప్పుడు వాటిని పూర్తిగా ఆయన చేతికే విడిచి పెట్టాలి.

మనమెన్నిసార్లు దేవుని యెదుట మన సమస్యలను ఉంచి,ఆయన సన్నిధిని విడిచిన వెంటనే మరల వాటిని తలకెత్తుకుంటున్నాం? ఎన్నిసార్లు వాటిని దేవుని కప్పగించి వాటి గురించి ఆయన ఏమి చేయగలడా అని చింతిస్తూ ఉంటాం? అలాంటి పరిస్థితులలో, మనం ఆశించే వాటిని చేయటం దేవునికి సాధ్యమవుతుందా అని చింతించటమే మన అసలు సమస్య.

వాక్యానుసారమైన ప్రార్థనను నెరవేర్చే మూడు స్పష్టమైన విషయాలను నేనిప్పుడు చెప్పబోతున్నాను. నిజమైన ప్రార్థన చేయటం ఎందుకంత కష్టమో ఇవి మనకు చూపిస్తాయి. సార్వభౌముడైన దేవుని చిత్తాన్ని యధార్థంగా వెదకి దానికి లోబడటానికి బదులు తరచుగా మనం మనకు కావలసిన దాన్ని దేవుడు అంగీకరించేలా చెయ్యటానికి ప్రయత్నిస్తాం.

1.నిజమైన ప్రార్థన అనగా దేవుడు, సార్వభౌముడని తిన్నగా ఒప్పుకోవటమే. వాస్తవానికి మనం ప్రార్థించినప్పుడు, ఆ సంగతి పూర్తిగా దేవుని హస్తాల్లోనే ఉందని ఒప్పుకుంటున్నాం. రేపటి దినము, అది కొనితెచ్చే పరిస్థితులు మన ఆధీనంలో కాక ఆయన ఆధీనంలోనే ఉన్నాయని చెబుతున్నాం. అవి ఆయన చేతిలోనే ఉన్నాయి. మన చేతిలో కాదు.

2.ప్రార్థన అనగా దేవుని సర్వాధికార చిత్తాన్నికి సంతోషంగా తలొగ్గటమే. దేవునికి ఏది మేలుకరమని తోచునో దాన్ని చేసే అధికారము, శక్తి, ఆయనకు ఉన్నాయని మనం ఒప్పుకుంటున్నాం. రేపటి దినాన దేవుడేమి చేసినా అది
రోమా 8:28లోని “సమస్తము”లో ఇమిడియున్న ఒక భాగమని మనం నమ్ముతున్నాం.

3. ప్రార్థన అనగా దేవుడు ఏమి చేసినా ఆయనను మహిమపరిచేకృపనిమ్మని ఆయనను యధార్థంగా అర్థించటమే. "తండ్రీ, నీవు 'అవును' అని చెప్పినా 'కాదు' అని చెప్పినా నీ బిడ్డగా నిన్ను నమ్మి, ఆ రీతిగా ప్రవర్తించే కృపనిమ్మని చెప్తున్నామనిఅర్థం.

మాంటిరీయల్ లో నేనొక ప్రసంగం చేసినప్పుడు పై నిర్వచనాలను ఉపయోగించటం నాకు గుర్తుంది. అక్కడ హాజరవుతున్న వారిలో ఒకామె అందుకు కోపించి ఆ తరువాత మూడు రాత్రులు కూటాలకు తిరిగి హాజరు కాలేదు. ఆమె తిరిగి వచ్చినప్పుడు నాతో “రైసింగర్ గారూ, రెండు సంవత్సరాలకు పైగా నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టటం లేదు. అయితే నిన్న రాత్రి మొట్టమొదటిసారి నేను హాయిగా నిద్రపోయాను” అని చెప్పి, దానికి కారణం వివరించటం మొదలు పెట్టింది. ఆమె కుమారుడు మాదక ద్రవ్యాలకు అలవాటుపడ్డాడు. అది దాచిపెట్టటానికి ఆమె అబద్ధాలాడేది. అతని గురించి ఆమె కన్నీరు కార్చింది, బతిమాలింది, వాగ్దానాలు చేసింది. ఇక ఏం చెయ్యాలో తోచలేదు. ఆమె యిలా చెప్పింది, “నిన్నటి రాత్రి నేను నా పడక ప్రక్క మోకరించి, నా కుమారున్ని దేవుని హస్తాలలో ఉంచాను. నా కుమారుణ్ణి నాశనం చేసి, తద్వారా మాదక ద్రవ్యాలను సేవించటంలో ఉన్న ప్రమాదానికి అతనినొక ఉదాహరణగా చూపించే అధికారం ఆయనకు ఉందని చెప్పాను. నా కుమారుణ్ణి రక్షించుమని దేవున్ని బతిమాలాను. ఏమి జరిగినా ఆయనను నమ్ముతాననే నిశ్చయత నాకు కలిగింది. నేను పడకమీదికి చేరి, గత రెండేళ్లల్లో ఎన్నడూ నిద్రించని రీతిలో నిద్రపోగలిగాను.”

ఈ స్త్రీ విషయంలో, మూడు నెలల తరువాత ఆమె కుమారున్నిదేవుడు రక్షించాడు. కాని అన్ని సందర్భాలలో ఈ విధంగా జరుగదు. అయినా మన జీవితాలను, ఉద్యోగాలను, పిల్లలను దేవుని చేతికి అప్పగించటం మనం నేర్చుకోవాలి. మనకిష్టమైనా కాకపోయినా వారాయన చేతిలోనే ఉన్నారు. అయితే హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా వారిని ఆయనకు అప్పగించటం అంటే దేవుని సర్వాధికార ఏర్పాటును విశ్వసించటం నేర్చుకోవటమే.

నిజమైన ప్రార్థన చేయటం చాలా కష్టసాధ్యమవటానికి గల ముఖ్య కారణాలలో ఒకటి ఇదే కదా? మనం ఆశించిన రీతిలో జవాబు రాదేమోనన్న అనుమానమే మన:పూర్వకమైన ప్రార్థనకు తరచు ఆటంకంగా నిలుస్తుందనటం వాస్తవం కాదా? రేపటిని గురించిన మన వైఖరిని యాకోబు నిందించటంలో ఇదొక భాగం కాదా? మన వ్యాపారంలోను, జీవితంలోను, ఏమి జరగాలని ఆశిస్తున్నామో మనకు తెలుసు- వాటి గురించి మనం ముందే ప్రణాళికలు వేసి కూర్చున్నాం కదా! ఇది ఇలా ఉన్నప్పుడు “అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక'' అని హృదయపూర్వకంగా చెప్పటం మనకు కష్ట సాధ్యంగా ఉంటుంది. దీని కన్నా “దేవా, నేను ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికను ఆశీర్వదించుమని” చెప్పటం ఎంతో సులభం. అయితే మన అసంపూర్ణతలను అవసరతలను గుర్తించామని ఒప్పుకోవటమే నిజమైన ప్రార్థన. అనుదినం అన్ని పరిస్థితుల్లో దేవునిపై ఆధారపడుతున్నామని మనం ఒప్పుకుంటున్నాం. యాకోబు చెప్పిన దాన్ని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా మనం ప్రార్ధన చెయ్యనప్పుడు ఈ మాటలు జ్ఞాపకముంచుకోవాలి.

“....నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక - ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది” (యాకోబు 4:13-16).

అంటే నువ్వు నీ ప్రణాళికల గురించి ప్రార్థన చెయ్యటం, లేదా ఆ ప్రణాళికలు వేసుకున్నప్పుడు దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించటం, ఈ రెంటిలో ఒక దాని విషయమై నువ్వు విఫలమౌతున్నావని” యాకోబు చెబుతున్నాడు. ఇంతకు ముందు, మనం ప్రార్థన చేయకపోవటం లేదా మన స్వార్థపూరిత కోరికల కొరకు మాత్రమే ప్రార్థించటం, ఈ రెంటి విషయమై యాకోబు మనలను గద్దించినట్లు చూశాం. కేవలం మన ప్రణాళికలను, ఆలోచనలను దేవుడు దీవించాలని మాత్రమే మనం కోరినంత వరకు యథార్థంగా ప్రార్థన చేయటం అసాధ్యం.

ఐదవ మూల సత్యం

దేవుని సార్వభౌమత్వంలో గల విశ్వాసం నిజమైన ప్రార్థనను ఆటంకపరచదు కాని దానిని బలపరుస్తుంది. .

వాక్యానుసారమైన ప్రార్థనను నాశనం చేసేది స్వేచ్చా చిత్తంపైన ఉండే విశ్వాసమే. స్వేచ్చా చిత్తాన్ని గురించిన బోధ “శయ్యలపై పరుండి కేకలు వేయుట” అని హోషేయ పిలిచిన ప్రార్థనను పుట్టించవచ్చేమో కాని, అది కూడా ఎక్కువ కాలం నిలవదు. స్వేచ్ఛా చిత్తంలోనమ్మకముంచి లేదా దేవుని సార్వభౌమత్వాన్ని కాదని తదనుగుణంగా ప్రార్థించిన ప్రార్థనా కూటంలో నీవెన్నడూ ఉండలేదని చెప్పటానికి నేను సాహసిస్తున్నాను. తన స్వేచ్ఛా చిత్తపు దృక్పధంలో ఎల్లప్పుడు ప్రార్థించటానికి ప్రయత్నించిన ఒక సంఘ పెద్ద నా సంఘంలో ఉండటం నాకు గుర్తుంది. అయితే అతడు ప్రతిసారి అలా చెయ్యటంలో విఫలమయ్యేవాడు. అతడు ప్రతి వారము, “ప్రభువా, నీవీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నీవు అమెరికా దేశంలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావని, నా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆత్మను రక్షింప ప్రయత్నిస్తున్నావని నాకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు (ఇప్పుడతడు మరింత నెమ్మదిగా మాటలాడుతూ, ప్రభువా, ఈ వీధిలో వారినందరినీ నీవు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నా ఇరువైపుల నున్న పొరుగు వారిని నీవు ప్రేమిస్తున్నావని నాకు తెలుసు.” ఇక ఆ వ్యక్తి ఇప్పుడు ఏడవటం ప్రారంభించి, “అయితే ప్రభువా, వారు సువార్తను వినరు. వారు ఆరాధనకు రారు. ఓ దేవా, నీ పరిశుద్ద ఆత్మను పంపి వారిని ఒప్పింపచేయుము. ఓ దేవా, వారిని నీ తట్టు ఆకర్షించుకొనుము” అని చెప్తాడు. ఆ పై వారం కూడ అతడు అదే విధంగా ప్రార్థిస్తాడు. అతడు ప్రార్థించిన ప్రతిసారి దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు నిర్భంద పెట్టబడ్డాడని గ్రహించటానికి అతడు విఫలమయ్యాడు. అతని ప్రార్థనలో మొదటి భాగం వాస్తవానికి ప్రార్థన కాదు, అది అతడు నన్ను ఉద్దేశించి చేసిన ప్రసంగం.)

క్రైస్తవులు తమ మోకాళ్ళపై ఉన్నప్పుడు మానవుల “స్వేచ్ఛా చిత్తము” అనేదాన్ని పూర్తిగా మరచిపోవటం ఆశ్చర్యం కాదాఅత్యవసర సమయాలలో ఆయన నామంలో ప్రార్థించేటప్పుడు దేవుని సంపూర్ణ సార్వభౌమత్వమును మనం ప్రేమించమా?

నేను న్యూయార్క్లో ఉండగా ఒక బైబిలు తరగతిని నడిపించేవాడిని. దానికి హాజరవుతున్న ఒక స్త్రీని నేనెప్పటికీ మరువలేను. ఆమె ప్రభువును ప్రేమించిందని నా నమ్మకం. అయితే సార్వభౌమ కృపను గురించిన సత్యం ఆమెకు ఎన్నడూ బోధించబడలేదు. రోమా పత్రికపై జరిగిన ఆ బైబిలు పఠనాన్ని ఆమె చాల సంతోషంగా వింటుంది. కాని దేవుని సార్వభౌమత్వ సిద్ధాంతం చివరికి వచ్చే సరికి ఆమె, “ఈ బైబిలు పఠన తరగతి నా ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తుంది. నేను మరల ఈ బైబిలు తరగతులకు రాను” అని చెప్పింది. అందుకు నేను “అమ్మా నేను దీని విషయమై నిన్ను నిందించను. అయినా, నీ ప్రార్థనా జీవితాన్ని పాడుచేసేలా నేను ఏం చెప్పానో తెలుసుకోచ్చా?” అని ప్రశ్నించాను. దానికామె, “స్వేచ్ఛా చిత్తము మరియు దేవుని సార్వభౌమత్వమును గురించిన నీ సిద్ధాంతమే. నువ్వు చెప్పిందే నిజమైతే, నేనెందుకు ప్రార్థన చెయ్యాలి?” అని అడిగింది. ఆ ఉదయం ఆమె దేనిని గురించి ప్రార్థించింది అని నేను అడిగినప్పుడు ఆమె తన పర్సు విప్పి పాతబడిన ఒక ప్రార్థన పట్టిక బైటికి తీసింది. ఆ ఉదయం ఆమె ఆఫ్రికాలో చెలరేగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న తన ఇరువురు స్నేహితురాళ్ళ గురించి ప్రార్థించానని చెప్పింది. వారక్కడ నర్సులుగా పనిచేస్తున్నారట. “నువ్వు దేవుడు ఏమి చెయ్యాలని ప్రార్థించావు?” అని నేను అడిగాను. దానికా ఏమీ సందేహించక ఇలా జవాబిచ్చింది. “నా ఇద్దరు స్నేహితులను క్షేమంగా ఉంచుమని ప్రార్థించాను. సైన్యం వారి పరిచర్యకు, వారికి కీడు చేయకుండాకాపాడుమని ప్రార్థించాను. వారి ఆస్తిపాస్తులను బాంబులు గాని తుపాకి గుండ్లు గాని నాశనం చెయ్యకుండా సంరక్షించుమని” ప్రార్థించాను అని చెప్పసాగింది. ఆశ్చర్యం నటిస్తూ నేనామెనిలా ప్రశ్నించాను. “నువ్వు నిజంగా అలా ప్రార్థించావా? ఆ సైనికులందరికీ స్వేచ్ఛా చిత్తాలు ఉన్నాయి కదా! దీని కన్నా ఒకానొక రాయబారిని ఆ యుద్ధ విషయంలో జోక్యం కల్గించుకునేలా అర్థించటం మేలు కదా? ఆ ఇద్దరు నర్సులను రక్షించటానికి ఆ యుద్ధ మంతటిని, ప్రతి సైనికుడిని, ప్రతి బాంబును, తూటాను తన ఆధీనంలో ఉంచుకోవాలని దేవుని నుండి నీవు ఆశించగలవా?” ఆమె కొంచెం వృద్దురాలైనందున ఆమె నా మాటల అర్థాన్ని గ్రహించి యుండక పోవచ్చు. అయితే మిగిలిన వారిలో చాలామంది అర్థం చేసుకొన్నారు. దైవభక్తి గల ఆ స్త్రీ దేవుని శక్తిని గురించి ఆలోచించక పోయినా, పాపులైన ఆ సైనికుల స్వేచ్ఛా చిత్తాన్ని గురించి తలంచకపోయినా, సార్వభౌముడగు దేవునికే ప్రార్థన చేసింది. దేవుడు ప్రతి సైనికుని, ప్రతి ఆయుధాన్ని తన ఆధీనంలో ఉంచుకొని తన స్నేహితులైన ఆ నర్సులను కాపాడి తన ప్రార్థనకు జవాబిస్తాడని ఆమె విశ్వసించింది. ఆమె సార్వభౌముడైన దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించింది.

సార్వభౌమ కృపకు సంబంధించిన బోధ విని మారుమనస్సు పొందినవారికి సాధారణంగా, సార్వభౌమత్వము, ప్రార్థన అనే వాటిని గురించి ఎటువంటి సందిగ్ధం లేకపోవటాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపడుతుంటాను. నా కోడలు మారుమనస్సు పొందిన తరువాత, నేను బోధించటానికి వేరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒకానొక ఆదివారం ఆమె మరొక ఆరాధనకు వెళ్ళింది. ఆ సాయంకాలం నేను ఆమెతో ఫోనులో మాట్లాడుతూ ఆరాధన ఎలా ఉందని అడిగాను.దానికామె, కొంత వినోదం కలిగించే జవాబు చెప్పింది “మావయ్య గారూ, అది నాకు కొంత వరకు చిత్రంగా తోచింది. ఆ పాస్టరు గారు బోధించినంత సేపు మీ అభిప్రాయాలతో విభేదించినట్లు కనబడింది. అయితే ఆయన ప్రార్థించటం ఆరంభించినప్పుడు నూటికి నూరు శాతం మీతో ఏకీభవించినట్లు అనిపించింది” అని చెప్పింది. ఆమె సరిగ్గానే చెప్పింది. నువ్వు అనేక “స్వేచ్ఛా చిత్తపు” (ఆర్మీనియన్) ప్రసంగములను వినవచ్చు. (అవి ప్రసంగీకుని మేదస్సు నుండి పుట్టుకొచ్చినవి). అయితే “స్వేచ్ఛా చిత్తపు” (ఆర్మీనియన్) ప్రార్థనను మాత్రము నువ్వేన్నడూ వినివుండవు (నిజమైన ప్రార్థన హృదయము నుండి వస్తుంది కాబట్టి).

ఆరవ మూల సత్యం

ప్రార్థన ఎంతో అవసరమైనది. ఎందుకంటే, దేవుడు తన నిర్ణయాలను నెరవేర్చటానికి దానిని ఒక సాధనంగా నియమించాడు.

“ప్రార్థన లేకుండా దేవుడు ఏమైనా చెయ్యగలడా, చెయ్యలేదా?” అన్నది ప్రశ్న కాదు. కాని “తాను నిర్ణయించిన దానిని నెరవేర్చటానికి దేవుడు తన సర్వాధికారంతో ప్రార్థనను ఒక సాధనంగా నియమించాడా?” అన్నదే అసలు ప్రశ్న. ప్రార్థన చెయ్యాలనే భారం మనలో నుండి ఉద్భవించేది కాదు. అది దేవుని వల్లనే కలుగుతుంది. ఒకవేళ ఈ సత్యాన్ని నువ్వు నమ్మని పక్షాన ప్రార్థన చెయ్యాలనే భారాన్ని కలిగి ఉండటానికి నువ్వొక నిర్ణయం తీసుకుని అది పని చేస్తుందో లేదో చూడు. ఒక మిషనరీ గురించి గాని వేరెవరిని గురించి గాని భారంతో ప్రార్థించాలని నిర్ణయం తీసుకో. సూర్యరశ్మి తగిలినప్పుడు మంచు బిందువులు ఆవిరైనంత సులభంగా నీ భారంకూడా మాయమవుతుంది. నేను భారం కలిగి ప్రార్థన చేస్తానని అనుకోని వాటి విషయంలోనే తరచుగా నువ్వు భారంతో ప్రార్థించే అనుభవం నీకు కలుగలేదా? నీకు అంతగా పరిచయం లేని వారిని గురించి దేవుడు కొన్నిసార్లు నీ పైన అధిక ప్రార్థనా భారం ఉంచుతాడు. నువ్వా వ్యక్తిని ఇష్టపడక పోవచ్చు, లేదా అతన్ని నువ్వు ఇటీవలనే కలసి ఉండవచ్చు. అయినా పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తిని మరల మరల నీ జ్ఞప్తికి తెచ్చి నువ్వతని గురించి ప్రార్థించేలా బలవంతపెడతాడు.

సార్వభౌమ ఎన్నిక గురించిన సత్యాన్ని ప్రప్రధంగా విన్నపుడు ఒక అమ్మాయి నామీద కోప్పడటం నాకు గుర్తుంది. దీన్ని నేను నమ్మితే, నా తల్లి రక్షణ కోసం నేను ప్రార్థన చేయటం మానేయాల్సి వస్తుంది” అని చెప్ప సాగింది. ఆ మాటల్లోనే ఆమె సందిగ్ధానికి నేను జవాబు చూడగలిగాను. “నీ తల్లి రక్షణ గురించి నమ్మకంగా ప్రార్థిస్తున్నావా?” అని ఆమెను ప్రశ్నించాను. ఆమె కన్నీటి పర్యంతమవుతూ నాకిలా జవాబిచ్చింది. “నేనామె కోసం దాదాపు అనునిత్యం ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు పని చేస్తున్నప్పుడు కూడ, ఈ విషయాన్ని బట్టి నిశ్శబ్దంగా నా హృదయాన్ని దేవుని వైపునకు లేవనెత్తుతాను. అప్పుడు నేను ఏడ్వటం వలన నీళ్లతో ముఖం కడుక్కోవలసి వస్తుంది. నా తల్లి ఆత్మ గురించి నాకు నిజంగా ఎంతో భారం ఉంది.” అప్పుడు నేను, “నీ తండ్రి గురించి నువ్వేమీ చెప్పలేదు, ఆయన క్రైస్తవుడా?” అని అడిగాను. దానికామె “లేదు” అని జవాబిచ్చింది. “మరి ఆయన నిమిత్తం ఎన్నిసార్లు ప్రార్థించావు? ఆయనను రక్షించుమని కన్నీటితో ఎప్పుడైనా ప్రార్థించావా?” అని అడిగాను. ఆమె నా వైపు వింతగా చూసి “నువ్విప్పుడు నన్నడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను ఎన్నడూ నా తండ్రి గురించి ప్రార్థించలేదుకాని, నా తల్లి గురించి అనుదినం ప్రార్థించటం మానను” అని చెప్పింది. నేను చిరునవ్వుతో “నువ్వు నీ తండ్రి గురించి ఎక్కువగా చింతించటం అవసరమని నాకు తోస్తున్నది. దేవుడు నీ తల్లిని రక్షించబోతున్నాడని నేను నమ్ముతున్నాను. నువ్వు కన్నీటితో దేవున్ని అడుగుతున్నావు కాబట్టి ఆయన ఆత్మే ప్రార్థించటానికి నిన్ను ప్రేరేపిస్తున్నాడని నువ్వు విశ్వసించ వచ్చు. పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రార్థించమని వ్యర్థంగా పురికొల్పడు” అని చెప్పాను.

ఆ అమ్మాయి ఎంత ప్రయత్నించినా స్వతహాగా తన తండ్రి కోసం ప్రార్థించే భారం ఆమెకు కలగటం అసాధ్యం. అదే విధంగా దేవుడు రక్షించే తన కృపా కార్యాన్ని జరిగించాలని ఉద్దేశించకపోతే, ఆమెకు తన తల్లిని గురించిన భారం కూడ కలిగి ఉండేది కాదు. ఆయన చిత్తంలో లేని అంశాలను గురించి ప్రార్థించటానికి దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించడు. మనంతట మనమే మనకు కావలసిన వాటిని ఎంపిక చేసుకొని వాటిని దేవుడు తన చిత్తంలో ఇమడ్చటానికి ఆయన్ని బలవంతం చెయ్యలేం. అలా చేయటం మనమీ లోకాన్ని మన ఆధీనంలో ఉంచుకొని, మన ప్రార్థనలతో దాన్ని నడిపిస్తున్నామని చెప్పినట్లవుతుంది.

అత్యాసక్తి గల కాల్వీనిస్టులు (హైపర్ కాల్వీనిస్టులు) దీన్ని చదివి బిగ్గరగా “ఆమేన్” అంటారని నాకు తెలుసు. కాని ఇక్కడ సమస్య ఏమిటంటే, ఎన్నడూ ప్రార్థించని చల్లారిన హృదయాన్ని నేను చెప్పిన మాటలు సమర్థించవు! నేను సూటిగా కొన్ని విషయాలను మీ ముందుంచుతాను. దేవుని సార్వభౌమత్వాన్ని గురించిన సిద్ధాంతాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొన్నామో లేదో తెలుసుకోవటానికి ఇవి తోడ్పడతాయి

ఒకటి: ప్రార్థన దేవునితో ప్రారంభమై ఆయన నిర్ణయాల నుండి బయలువెళుతుంది.

రెండు: దేవుడు తన ప్రణాళిక చొప్పున జరిగించబోయే వాటి విషయాల నిమిత్తం జనులు ప్రార్థించేలా పరిశుద్ధాత్ముడు వారికి భారం కలిగిస్తాడు.

ఈ రెండూ సత్యమైనట్లయితే (అవి సత్యములే) నువ్వూ, నేనూ దేవుని చిత్తంలో ఉన్నామో లేమో మనం ఆయన దీవెన పొందగలమో లేదో, మనకు భారభరితమైన హృదయమున్నదా అనే ప్రమాణం ద్వారా కనుగొనగలం. స్నేహితుడా, నువ్వు దేవుని కృపా సింహాసనం ఎదుట కన్నీరు కార్చని వ్యక్తివైతే, ఆయన నిన్ను వాడుకోవటం లేదని అది నిరూపిస్తుంది. నువ్వొక మూలన ఉన్నావని, లేదా మారుమనస్సు పొందలేదని అది సూచిస్తుంది. నీ హృదయం మంచు గడ్డవలె చల్లగా ఉన్నందున, బహుశా దేవుడు నీ ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చటం లేదేమో. దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చటం లేదని నేను చెప్పటం లేదు కాని వాటిని నెరవేర్చటంలో నిన్ను వాడుకోవటం లేదని మాత్రమే చెప్తున్నాను.

ఒక్క క్షణం నా మాటలు జాగ్రత్తగా గమనించండి. మన హృదయాలలో భారాన్ని కలుగ జేసేది దేవుడే అయినప్పుడు దానికి జవాబుగా ఆయన మన హృదయ వాంఛలను తీర్చటం కాని, వాటిని నిరాకరించి మన హృదయాలను విరవటం కాని జరుగుతుంది. అయితే భార భరిత హృదయం గాని, బ్రద్దలైన హృదయం కాని మనకు లేనట్లయితే, మన పరిస్థితిని ఏమని అర్థంచేసుకోవాలి? స్నేహితుడా, మనం దేవుని సింహాసనం ఎదుట భారముగల హృదయము నిమ్మని బ్రతిమాలినప్పుడు మాత్రమే ఆయన దాన్నిఇస్తాడు. ఆయన చేత వాడబడాలని ఆశిస్తున్నామని ఆయనకు చెప్పాలి. మనలో ఉన్న నిర్వేదాన్ని తొలగించి హృదయాన్ని ఉత్తేజపరచుమని దేవున్ని అర్థించాలి. ఆయన ఆత్మ మన హృదయాన్ని కదిలించే వరకు మనమాయన్ని వెదకాలి. ఈ క్రింది పల్లవిని మన ప్రార్ధనగా పాడాలి..

ఆత్మల గురించిన భారము నాకిమ్ము,

నా ద్వారా నీ ప్రేమను కనపరుచుము

వారిని నీకై గెలుచుకొనునట్లు

నా పాత్రను నిర్వహించ నడిపించుము.

నమ్మకమైన సాక్షిగా ఉండాలన్న కోరిక, భారము దేవుని నుంచే కలుగుతాయని ఈ పల్లవి ఒప్పుకుంటుంది. మనం ప్రేమించి, ప్రార్థించి, సాక్ష్యమివ్వాలన్న కోరికను, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించుమని, అది దేవుని మొరపెట్టుకుంటుంది. ఏ నిజ క్రైస్తవుడైనా దీని కన్నా తక్కువ ఆశించగలడా? అత్యాసక్తిగల నా హైపర్ కాల్వినిస్ట్ స్నేహితుడా, అది జరుగదు. నీవంత సులభంగా తప్పించుకోలేవు. దైవశాస్త్ర గ్రంథాల వెనుక చల్లబడిన నీ హృదయాన్ని దాగనివ్వను. దానిలోని దైవశాస్త్రం సరియైనదైతే సరే! అడుగుము, వెదుకుము, తట్టుము అని యేసు మనకు నేర్పించాడు. మనము పొందుతామని, కనుగొంటామని, ద్వారం తెరువబడుతుందని ఆయన వాగ్దానం చేశాడు. మరి నువ్వు పొందుతున్నావా? కనుగొంటున్నావా? అవకాశాలు నీకు తెరువబడుతున్నాయా? అయితే “మనము దేని నిమిత్తము అడుగుతున్నాము? దేనిని వెదకుతున్నాము? దేని కొరకు తట్టుతున్నాము?” అన్నదే ఇక్కడ అడుగవలసిన ముఖ్యమైన ప్రశ్న. తన నిర్ణయాలను నెరవేర్చే సాధనంగా దేవుడు ప్రార్థననునియమించాడని మనము ఒప్పుకున్నట్లయితే, ఆ ప్రక్రియలో భాగంగా మనము ఆసక్తితో అడిగి, వెదకి, తట్టలేని పక్షాన దేవుడు మనల్ని వాడుకోవటం లేదని మనం అర్థంచేసుకోవాలి.

ఈ చివరి సూత్రాన్ని కొన్ని వ్యక్తిగత ప్రశ్నలతో సమీకరించి, పునరుద్ఘాటించకోరుతున్నాను:

1. ఏదైనా ప్రత్యేకమైన విషయాన్ని బట్టి ప్రార్థన చేయాలని మనముభారము కలిగియున్నామా? లేనియెడల తన కృపా సంకల్పాన్నినెరవేర్చటానికి దేవుడు మనల్ని వాడుకోవటం లేదని అర్థం.

2. ఎవరీ రక్షణ కొరకు మనము భారంతో ప్రార్థిస్తున్నాము?అలాంటి వారెవరూ లేకపోతే తానెన్నుకున్న వారిని ప్రోగుచేసే ప్రక్రియలో దేవుడు మనల్ని వాడుకోవటం లేదని అర్థం.

3.. ఉజ్జీవం కొరకు మన సంఘంలో నుండి బయలు వెళ్ళినమూలుగులు, దేవుడు ఎన్నిమార్లు వినియుండవచ్చు? “దేవున్ని అడుగనందున మీకేమియు దొరకదు” అని యాకోబు చెప్తున్నాడు. మనము నిజంగా ఆశించిన వాటి కొరకు ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుకుంటామనటంలో ఏ అనుమానం లేదు. ఇది నిజం గనుక మన ప్రార్థనా జీవితం, మన క్రైస్తవ జీవితపు ఆత్మీయ స్థితిని కొలిచే బరోమీటరులా ఉంది. మనం నిజంగా కావలసిన దాని కొరకు భారంతో ప్రార్థించినప్పుడు - నేనింతకు ముందు చెప్పినట్లు దేవుడు ఆ కోరికను తీర్చాలి లేదా "కాదని చెప్పి మన హృదయాన్ని బ్రద్దలు చెయ్యాలి. అయితే ఎన్నిసార్లు మనం భారముగల హృదయం కాని, బ్రద్దలు చెయ్యబడినహృదయం కాని లేకుండా ఉన్నామో!

4. ఇదే క్షణంలో దేవుడు తన పరలోకపు ద్వారాలను తెరచి,మనము గత నెలంతా భారంతో ప్రార్థించిన ఆత్మీయ ఆశీర్వాదాలన్నిటిని మన హృదయాలలో కుమ్మరించాలని నిశ్చయించినట్లయితే మనలో ఎంత మంది ఎప్పటిలా ఆత్మీయంగా ఖాళీగానే మిగిలిపోతాం? మనం ఇలాంటి స్థితిలో ఉన్నట్లయితే, దానికి దేవుని సార్వభౌమత్వాన్ని నిందించేసాహసం చేయ్యగలమా?

దేవుని సార్వభౌమత్వంలో మనకున్న స్థిర విశ్వాసం నిజమైన ప్రార్థనను ఏ విధంగాను వ్యతిరేకించదు, ఆటంకం కలిగించదు. అందుకు భిన్నంగా, దేవుని సార్వభౌమత్వము నందు విశ్వాసముంచటం, ప్రార్థన మానివేయటం కంటే పరస్పర వైరుధ్యమైనది మరొకటి ఉండదు.

ప్రతి కాల్వినిస్ట్ లేదా రిఫార్మడ్ సంఘం ప్రసంగ వేదికల పైన ఈ క్రింది మాటలను సువర్ణాక్షరాలతో రాసి వ్రేలాడదీయాలని కోరుతున్నాను. (మనసులో కూడా వాటిని ముద్రించుకోవాలని కోరుతున్నాను.)

ప్రార్థన రహితమైన ఒక దినం దేవుని సార్వభౌమత్వమును తిరస్కరించి మానవ స్వేచ్చా చిత్తమునందును, స్వయం సమృద్ధియందును అతిశయించు దినమే.”

ఈ అధ్యాయంలోని సారాంశం

(1) పాత, క్రొత్త నిబంధనలలోని విశ్వాసులకు దేవునిసార్వభౌమత్వంతో ప్రార్థించవలసిన అవసరతను “జోడించటం”లో ఏ సమస్యా తలెత్తలేదు. వారు ఆ రెండుసత్యాలను విశ్వసించారని మనం కనుగొన్నాం.

(2) స్పష్టంగా బయలుపరచబడిన దేవుని చిత్తము నుండితప్పించుకోవటానికి తరచు ప్రార్థన ఒక సాధనంగావాడబడుతున్నదని గమనించాం.

(3) ప్రార్థన అంటే దేవున్ని అడగటమే గాని ఆయనకు సమాచారమందించటం కాని, మన ప్రార్థనకు ఏ విధంగా జవాబివ్వాలో సలహా ఇవ్వటం కాని కాదు. ప్రార్థనా రహితమైన దినం మనము దేవుని సర్వాధికారమునందు విశ్వసిస్తున్నామని చెప్పుకునే మన “అతిశయోక్తులను” అర్థరహితం చేస్తుంది. ప్రార్థన మరియు దేవుని సార్వభౌమత్వమును గురించి మరి కొన్ని అనుకూల వచనాలను పరిశీలిద్దాం.

 

అధ్యాయం - 3

ప్రార్థన ఎందుకు అంత ప్రాముఖ్యమైనది?

ప్రార్థన ప్రాముఖ్యతను మనము పరిశీలించటం ఎందుకంత అవసరం? దేవుడు మనలను ప్రార్థించమని ఆజ్ఞాపించాడు. దానికి జవాబు దయచేస్తానని వాగ్దానం కూడా చేశాడు. మానవుని స్వేచ్ఛా చిత్తమనే మధ్యపై ప్రతి దానిని ఆధారపడేలా చేసేవారు ఒక విధంగా ప్రార్థనను అస్తవ్యస్తం చేయగా, అత్యాసక్తిగల “హైపర్ కాల్వినిస్టులు” దానిని వేరొక విధంగా తారుమారు చేస్తున్నారు. ఈ రెండు పొరపాట్ల నుండి మనలను తప్పించగల కొన్ని బైబిలు సత్యాలను పరిశీలిద్దాం.

1. దేవుని ఉద్దేశాలు నెరవేరటానికి ప్రార్థన అవసరం

కొందరు ఈ మాట విని “ఇది నిజమా?” అని ఆశ్చర్యపడవచ్చు. బైబిలుతో ఈ మాటకు ఎలాంటి సంబంధం లేకపోతే ఇలా చెప్పటం పొరపాటే. కాని దేవుని ఉద్దేశాలను నెరవేర్చటంలో ప్రార్థనను ఒక సాధనంగా ఉపయోగించాలన్న మాటను బైబిలు వెలుగులో పరిశీలించినప్పుడు అది వాక్యానుసారమైన సత్యమని గుర్తించగలం. కేవలం “హైపర్ కాల్వినిస్టులు” మాత్రమే ఈ సత్యాన్ని వ్యతిరేకిస్తారు.

ఈ సత్యాలు ప్రార్థన, మరియు దేవుని సార్వభౌమత్వమును గురించిన పై మాటల్ని మరింత స్పష్టపరుస్తాయని నేనునమ్ముతున్నాను. ప్రార్థన ఖచ్చితంగా అవసరమనే వాస్తవాన్ని మనం అర్థంచేసుకోవటం మొదలుపెట్టామని ఆశిస్తున్నాను. మన ప్రార్థన లేకుండా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చలేనంత అశక్తుడు కాదు. అయితే మన ప్రార్థనల ద్వారా తన కార్యాన్ని జరిగించాలన్నది సార్వభౌముడైన మన దేవుని నియమం. బంగారు దూడను చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలను క్షమించ నుద్దేశించిన దేవుడే వారిని నాశనం చేయవద్దని విజ్ఞాపన చెయ్యడానికి మోషేను నిలబెట్టాడు కదా? (నిర్గమ 32:1-14 ). నిజమైన ప్రార్థన “ఆయన చిత్త ప్రకారమే” ఎల్లప్పుడు ప్రారంభమవుతుంది. ఎందుకంటే దానిని పురికొల్పేది దేవుడే గాని మనం కాదు. నిజమైన ప్రార్థన ఎల్లప్పుడు “దేవుని చిత్త ప్రకారమై” ఉంటుంది గనుక మనం ఆయన చిత్తంలో ఎల్లప్పుడూ నడుచుకునేవారమైయుండి, అదే సమయంలో ప్రార్థన చేయనివారిగా ఉండటం అసాధ్యం. మనం ప్రార్థన రహితులంగా ఉండటం దేవుడు మనలోను మన ద్వారాను పని చేయటం లేదని నిరూపించటమే.

మనం స్పష్టమైన రెండు బైబిలు సత్యాలను బాగా గుర్తెరగాలి. (1) దేవుని ఉద్దేశాలను సాధించటానికి ప్రార్థన అవసరం. ఎందుకంటే తన ప్రజల ప్రార్థనల ద్వారా తన చిత్తాన్ని (లేదా తన ఉద్దేశాలను) నెరవేర్చాలని ఆయన స్వయంగా నిర్ణయించాడు. దేవుని నిర్ణయాలలో ప్రార్థన కూడా ఒక భాగమే. (2) ప్రార్థన దేవుని చిత్తంతో ముడిపడి ఉంది కనుక మన అనుదిన ప్రార్థనా జీవితం మన ఆత్మీయ స్థితిని కొలిచే సాధనమై యున్నది. ఈ సత్యాన్ని ఇంత ముక్కు సూటిగా చెప్పటం వలన అనేకులు (నాతో సహా) దోషులమని గ్రహిస్తారు - అది మంచిదే! ఆసక్తితో నిత్యం ప్రార్థించలేనప్పుడు దాని కొరకు నేను తప్పక క్షమాపణ కోరాలి.

నేను చెప్పేదేమిటంటే, దేవున్ని నిజంగా మహిమపరచటానికి, ఆయనపై మనకున్న ప్రేమ, విశ్వాసాలను నిరూపించటానికి ప్రార్థన ఒక గొప్ప సాధనం. ఉదాహరణకు నువ్వు కోటీశ్వరుడివైనా, పట్టణంలో అతి పెద్ద బేకరీకి యజమానివైనా “నీ అనుదిన ఆహారము” కొరకు ప్రార్థించాలని లేఖనము ఆజ్ఞాపిస్తుంది. మనం అడుగక మునుపే దేవునికి మన అవసరతలు తెలుసు. అలాంటప్పుడు మన అనుదిన ఆహారాన్ని తేలిగ్గానే సంపాదించుకోగలమన్నట్లు అనిపిస్తుంది. పైగా మనం అడుగక మునుపే దేవునికి మన అవసరతలు తెలుసు. అయినా మనం అనుదినాహారం కొరకు మనము ప్రార్థించాలని బైబిలు చెబుతుంది. “అనుదినాహారము” అనే మాటలో మనం జీవించటానికి అవసరమైన వన్నీ జీవముతో సహా) ఇమిడివున్నాయని మనం గ్రహించగలం. సరిగా అర్థం చేసుకుంటే, అనుదినాహారం కొరకు ప్రార్థించటం అంటే ప్రతిదినము, ఆ దినానికీ సంబంధించిన ప్రతి విషయం దేవుని సర్వాధికార నియంత్రణలో ఉన్నాయని ఒప్పుకోవటవే. యాకోబు 4:13-15 లో ప్రబోధించబడింది కూడా ఇదే.

దేవుణ్ణి మన పరలోకపు తండ్రిగా భావించి ప్రతి దినము తనతో సంభాషించాలని ఆయన ఆశిస్తున్నాడు. మనతో మాటలాడాలని, తన నిధులలో నుండి మంచి వాటిని మనకీవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం అనుభవిస్తున్న ప్రతి దీవెనా ఆయన వద్ద నుంచే వస్తున్నదని, భవిష్యత్తులో ఏ దీవెన కొరకైనా ఆయన మీదనే ఆధారపడుతున్నామని మనము గ్రహించామని మన అనుదిన ప్రార్థన తెలియజేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తూ, అదే సమయంలో స్వయం సమృద్ధిని కలిగి యుండలేవు. అదేవిధంగా తనపై తాను ఆధారపడినవాడు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ఉండటం అసాధ్యం. నేనింతకు ముందు చెప్పిన దాన్ని మరల చెప్తాను. “ప్రార్థనారహితమైన ఒక దినం, దేవుని సర్వాధికారాన్ని తిరస్కరించటానికి అతి గొప్ప నిదర్శనం.”

హాస్టల్లో ఉండి చదువుతున్న విద్యార్థి యొక్క తండ్రితో ఈ సూత్రాన్ని నేను పోల్చగలను. అతడు హాస్టల్లో తన కుమారునికయ్యే ఖర్చులను రెండు విధాలుగా చెల్లించగలడు. నెల మొత్తానికి అయ్యే ఖర్చును ఒకేసారి ఒక చెక్కుతో చెల్లించవచ్చు, లేదా ఒక వారానికయ్యే ఖర్చును మాత్రమే అతనికి ఇవ్వవచ్చు. ఈ రెండు విధానాలు అతని అవసరాన్ని తీర్చగలవు. అయితే ఇవి నువ్వు అతని నుంచి ఉత్తరం గాని ఫోను 'కాల్' గాని ఎంత తరచుగా కావాలని కోరుతున్నావనే దానిపై ఆధారపడి ఉంటుంది. “వారానికి” ఒకసారి డబ్బు చెల్లిస్తే మరిన్ని ఉత్తరాలు, ఫోనులో పలకరింపులు వస్తాయి. ఇందులోని అంతరార్థం మీరు గ్రహించారని అనుకుంటాను. తన బిడ్డలు ఆయనతో మాట్లాడటం దేవునికి ఎంతో ఇష్టం. కాబట్టి మనం అనుదినం ఆయనతో సంభాషించాలని రోజువారి మన అవసరతలను తీర్చే పద్ధతిని ఆయన అనుసరిస్తున్నాడు..

సార్వభౌముడైన దేవుడు తన లక్ష్యాన్ని సాధించటానికి ప్రార్థనను ఒక సాధనంగా ఎన్నుకున్నాడు గనుక ప్రార్థన తప్పనిసరి అని మనం గ్రహించాలి. అదే సమయంలో దేవుడు తన శక్తిని ఉపయోగించటానికి మనం ప్రార్థన ద్వారా ఆయనకొక అవకాశం ఇస్తున్నామని ఎంత మాత్రం భావించకూడదు. దేవుని సార్వభౌమత్వము మరియు ప్రార్థించే అవసరత పరస్పర వైరుధ్యాలుగా అనిపించవచ్చు. కాని అవి రెండూ సత్యాలే. సర్వాధికారియైన దేవుడు ప్రార్థనను ఒక అవసరమైన సాధనంగా నియమించాడని బైబిలు బోధిస్తుంది. అయితే ప్రార్థనలేనట్లయితే తన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చటంలో ఆయన విఫలమౌతాడని బైబిలు బోధించటం లేదు. ప్రార్థించని వ్యక్తులు దేవుని సాధనాలుగా వాడబడ్డామనే ఆనందం పొందలేక పోవచ్చు. అయితే మనం ప్రార్థించకపోవటం వల్ల దేవుని ఉద్దేశాలు ఎన్నడూ ఆగిపోవు. ప్రార్థనలో మనమందించే సలహాలకు అనుగుణంగా దేవుడు తన ప్రణాళికలను క్షణ క్షణం మార్చడు. దేవుడు తన ప్రణాళికను ఏ మార్పులు చేయక జరిగిస్తాడు. దీన్ని ఎ.డబ్ల్యు. పింక్ చక్కగా వివరించాడు.

“దేవుని గురించి సరిగా అర్థం చేసుకోకపోవటం వలన ప్రార్థన గురించి మనమీ విధంగా ఆలోచిస్తున్నాం. క్షణ క్షణం రంగులు మార్చే ఊసరవెల్లి వంటి దేవునికి ప్రార్థించటం నిరుపయోగమని స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ దినం ఒక ఆలోచన, నిన్న మరొక ఆలోచన కలిగివున్న దేవుని తట్టు మన హృదయాన్ని లేవనెత్తటం వలన మనకేమి ప్రోత్సాహం లభిస్తుంది? ఒక దినం మన విన్నపాన్ని అంగీకరించి మరునాడు దాన్ని కాదనే ఈ లోక పరిపాలకునికి విన్నవించటం వలన కలిగే లాభమేమిటి? ప్రార్థనకు ప్రోత్సాహం ఇచ్చేది ఆయన మార్పులేని స్వభావమే కదా? ఆయన యందు ఏ చంచలత్వమును లేదు కనుక ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా ఆయన మన ప్రార్థన వింటాడన్న నిశ్చయత మనకుంది. “ప్రార్థన అంటే దేవుని అయిష్టతను ఎదిరించటం కాదు, కాని ఆయన ఇష్టాన్ని అందుకోవటం” అని లూథర్ చెప్పిన మాట యుక్తమే” (“దేవుని సార్వభౌమత్వము - ఆర్ధర్. డబ్ల్యూ. పింక్, 113 పేజి నుండి).

ఒక క్రైస్తవ కళాశాలలో బాస్కెట్ బాల్ జట్టుకు శిక్షణనిచ్చేవాడు - వారికి తగినంత విశ్వాసముండి ఎడతెగక ప్రార్థించినట్లయితే ప్రతిఆటలోను జయము కలిగి జాతీయ ఛాంపియన్లు కాగలరని వారికి చెప్పాడట. ఇదెంత వింతైన వేదాంతం?

ఒకసారి మీరీ విధంగా ఊహించండి, “ఎ' జట్టు తమకు జయాన్నివ్వమని ఒక గంటసేపు దేవున్ని ప్రార్థించగా ఆయన, “చాలా గొప్పగా ప్రార్థించినారు, మీరు ఆట గెలువబోతున్నారని చెప్పాడు. వారి ప్రత్యర్థులైన 'బి' జట్టు రెండు గంటలు ప్రార్థించగా దేవుడు “ఏ టీము వారలారా, నన్ను క్షమించండి, 'బి' టీము వారు మీ కంటే ఎక్కువ సేపు ప్రార్థించారు గనుక వారే గెలుస్తారు” అన్నాడు. వెంటనే ఆ జట్టు కళాశాల మొత్తం కూడ గట్టిగా ఆ రాత్రి అంతా ప్రార్థించగా దేవుడు మరల తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. ఇప్పుడాయన 'బి' జట్టుతో నన్ను క్షమించాలి. ఎందుకంటే వాళ్లు మీ కంటే ఎక్కువ ప్రార్థించారు కాబట్టి వాళ్లే గెలుస్తారు' అన్నాడు. ఈసారి 'బి' జట్టు పట్టణమంతటిని సమకూర్చి ఉపవాస ప్రార్థన చేసి, దేవుడు మరలా తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేశారు.” ప్రార్థన గురించిన ఇటువంటి అభిప్రాయం ఎంత పొరపాటో దీని అంతర్యం వలన మీరు గ్రహించారనుకుంటాను. ఇలాంటి ఊహ ప్రార్థన యొక్క సాఫల్యత ఎంత ఎక్కువగా ప్రార్థించారన్న దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పి, ఒక రాజకీయ పార్టీ ఏదైనా సాధించటానికి శాసన సభలో ప్రయోగించే వత్తిళ్ల స్థాయికి ప్రార్థనను దిగజారుస్తుంది. ఎవరెక్కువ వత్తిడి చేస్తే వారు తాము ఆశించింది పొందగలరు. ఇలాంటి దృక్పథాన్ని అనుసరించి ఎవరు ఎక్కువ మందిని సమకూర్చి ఎక్కువగా ప్రార్థిస్తారో, వారు దేవునిపై ఒత్తిడి తెచ్చి తాము కోరింది పొందగలరు. ఇది దేవుని సార్వభౌమత్వాన్ని తిరస్కరించటమే. ఆయన జ్ఞానమును, ఆయన ఉద్దేశాలను అనుమానించటమే అవుతుంది.

లూకా 11:5-10 లో యేసు బోధించిన పాఠం గురించి బహుశా ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనిని పట్టుదల కలిగిన స్నేహితుని ఉపమానం” అని అంటారు. ఈ ఉపమానంలో అడిగే వ్యక్తి యొక్క స్నేహితునికి, దేవునికి మధ్య గల భేదాన్ని, తారతమ్యంగా చూపించి తద్వారా మనలను ప్రార్థించమని ప్రోత్సహిస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు. కావున దేవుడు నిద్రిస్తూ, లేవటం ఇష్టపడని ఆ వ్యక్తి వంటి వాడని యేసు ఇక్కడ చెప్పటం లేదు. మన తండ్రియైన దేవుడు అలాంటి మానవునికి సరిగా భిన్నమైన వాడని యేసు చెప్తున్నాడు. ఈ ఉపమాన భావం ఇదే. నువ్వు మాటి మాటికి అడుగగా, విసికించ బడకుండ ఉండాలనే ఉద్దేశంతో ఒక మానవుడే నీ అవసరతను తీర్చినట్లయితే, తన పిల్లలు తన వద్దకు ఏ సమయంలో వచ్చినా ఆనందించే పరలోకపు తండ్రి వారి ప్రార్థన నాలకించి జవాబిచ్చేందుకు ఎంత అధికంగా సంసిద్ధత కలిగియుంటాడు! ఆ వాక్య భాగం నేను చేసిన బోధను వ్యతిరేకించటం లేదు, దాన్ని బలపరుస్తుంది.

మరొక ఉదాహరణ, నువ్వే దేవుడవనుకో. ఈ భూమి మీద ఉన్న నీ బిడ్డల్లో ఒక రైతుకు పంటల కోసం వర్షం అత్యవసరం. అతడు విశ్వాసంతో గట్టిగా దాని కొరకు యాకోబు పత్రికలోని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాడు. అదే సమయంలో ఆ ప్రక్కనే సువార్త కూటాలకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కూటాలు విజయవంతం కావటానికి వర్షం ఏ మాత్రం పడకూడదని కొందరు పట్టుదలగా ప్రార్థిస్తున్నారు. ఆ పరిస్థితిలో నువ్వు ఎవరి ప్రార్థనకు జవాబివ్వాలని నిర్ణయిస్తావు? ఇప్పుడు ప్రార్థన మన అవసరతలతో కాక దేవుని ఉద్దేశాలతో ప్రారంభమవుతుందని గ్రహించటం ఎందుకంత ప్రాముఖ్యమో చూడగలుగుతున్నావా?

2. జవాబు దొరకని ప్రార్థనల విషయమేమిటి?

పైన చెప్పిన ఉదాహరణ మనల్ని తరువాతి అంశానికి తీసుకొస్తుంది. “లేఖనంలో ఉన్న స్పష్టమైన వాగ్దానాల”తో “జవాబు పొందని ప్రార్థనల” వాస్తవికతను ఎలా సమన్వయపరచగలం? వర్షం కురవకపోతే ఆ రైతు దేవుడు తన ప్రార్థనకు జవాబివ్వలేదని అనుకోవచ్చా? వర్షం రాకపోవటం ఆ బైబిల్ మహా సభలోని వారికి ఆ రైతు కన్నా ఎక్కువ భక్తి, అధిక ప్రార్థనా శక్తి ఉన్నాయనటానికి నిదర్శనమా? ఇటువంటి ప్రశ్నలు ప్రార్థన పట్ల మనకున్న తప్పుడు అభిప్రాయాన్ని బయటపెడుతున్నాయి. “జవాబు దొరకని ప్రార్థన” అనే తలంపు, దేవుడు అంత సార్వభౌముడు కాదేమోనని, లేదా మన విశ్వాసం ఆయన హస్తాన్ని కదిలించగలిగినంత బలమైంది కాదేమోనని నమ్మేలా బలవంతం చేస్తుంది.

మన ప్రార్థన యొక్క నిజ స్వభావాన్ని ఒకసారి గ్రహించగలిగితే ఇక ఎటువంటి సమస్యా తలెత్తదు. ప్రార్థన అంటే దేవున్ని అడగటమే' గాని “దేవునికి చెప్పటం కాదు” అని మనం అర్థం చేసుకోగల్గితే “కాదు” అన్న జవాబు కూడా “అవును” అన్న జవాబుతో సమానమే అని గ్రహించగలం. మేం చెప్తున్న సత్యాలను అర్థం చేసుకున్న దేవుని బిడ్డ “జవాబు రాని ప్రార్థన' అన్నది లేదని గ్రహించగలడు. దేవుని వివేకము మరియు సార్వభౌమత్వాలపై నమ్మకం ఉన్నవారు, “అవును” అన్న ఆయన జవాబు ఎంత ప్రేమ పూర్వకమైనదో, 'కాదు' అన్న ఆయన జవాబు కూడా అంతే దయగలదని చూడగలరు. 'కాదు' అన్న జవాబు ప్రార్థనను మన్నించటానికి ఆయన అయిష్టుడని గాని అశక్తుడని గాని నిరూపించదు. 'అవును' అని చెప్పే ఆయన కృపవాత్సల్యతలే కాదు' అనే జవాబుకు కూడా ఆధారం. గతంలో మనమెంతో పట్టుదలతో చేసిన ప్రార్థనలకు 'కాదు' అని జవాబు చెప్పినందుకు మన:పూర్వకంగా దేవున్ని స్తుతించగల సందర్భాలు మనందరి జీవితంలో ఉండే ఉంటాయి కదా?

ప్రతి ప్రార్థనకు “అవున”ని కాని “కాద”ని కాని జవాబు లభిస్తుందని మనం గ్రహించాలి. కొన్నిసార్లు 'కాదు' అనే జవాబుకు వేచి వుండు, ఇంకా సరైన సమయం రాలేదని అర్థం. దేవుడు 'నా బిడ్డా, ఇది నీకు మంచిది కాదు' అని చెప్పినా, లేదా నువ్వడిగిన దాన్ని ఆయన దయచేసినా, విశ్వాసులు సమానంగా కృతజ్ఞత కలిగి ఉండాలని మరల చెప్తున్నాను. ప్రేమగల తల్లిదండ్రులు, చెడిపోయిన తమ బిడ్డ అడిగిన దానికి “కాదని” చెప్పడానికి కష్టపడ వచ్చు. అయితే దేవుడు అత్యంత ప్రేమ గలవాడు కనుక తన బిడ్డలు క్రమశిక్షణా రహితమైన వారిగా తయారవ్వటానికి ఇష్టపడడు. కట్టుబాటు లేని స్వార్థపరత్వంతో మనల్ని మనం నాశనం చేసుకోటానికి దయగల మన పరలోకపు తండ్రి ఒప్పుకోడు. కాబట్టి ఆయన మన ప్రార్థనలకిచ్చిన 'అవును' లేదా 'కాదు' అనే జవాబులన్నిటిని ఒకే రీతిగా కృతజ్ఞతతో స్వీకరించాలి.

మేమింత వరకు చెప్పిన వాటన్నిటిని వదే పదే గుర్తుచేసుకున్నట్లయితే అది కలవరముగా, వైరుధ్యాలుగా కనిపించే వాటిని తొలగించటానికి దోహదపడుతుంది. ప్రార్థన అంటే మనమాశించిన వాటిని దేవుని వద్ద నుండి పొందే సాధనమని తలంచేందుకు బదులు, నిజమైన ప్రార్థన దేవున్ని ఘనపరచటం అని గ్రహించగలం. మనం సరిగా ప్రార్థించినప్పుడు సంతోషంగా ఆయన విశ్వ పరిపాలనను అంగీకరిస్తున్నాం. మన దేవుడుసూర్యుడిని, వరాన్ని కూడ నియంత్రిస్తున్నాడని ఒప్పుకుంటాం. దేవుడొక్కడే మనల్ని పాపం నుండి దూరపర్చి, మన ప్రియులను అజ్ఞానము, చీకటి నుండి విమోచించగలడని వాక్యానుసారమైన ప్రార్థన మనకు తెలియజేస్తుంది. సరైన ప్రార్థన మన విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటించి, నిరూపిస్తుంది. మనం సంపూర్ణంగా దేవునిపై ఆధారపడుతున్నామని కనపరచినప్పుడు, మనం ఆయన్ని సంతోషపరచి మహిమపరుస్తాం. ప్రార్థన దేవున్ని ఆరాధించటమే. ఆయన ఏమై యున్నాడో, ఏవిధంగా తన్నుతాను బయలుపరచు కున్నాడో, వీటిని బట్టి మనమాయన్ని స్తుతిస్తాం. దీని వలన మరింత గొప్ప వాటిని అడగటానికి ధైర్యం తెచ్చుకోగలం. మన ప్రభువైన యేసు ఆలయాన్ని ప్రార్థన మందిరము” అని పిలిచాడు గాని “బలులర్పించు స్థలమని” పిలువ లేదు. దేవున్ని ఏ విధంగా సమీపించినా, కీర్తనల ద్వారా నేమి, అర్పణల ద్వారా నేమి, అది ఒక విధమైన ప్రార్థనే.

ప్రార్థన ఆత్మ సంబంధమైన దీవెనలు పొందే సాధనం. తద్వారా దేవుని కృపలోను, జ్ఞానంలోను ఎదుగగలం. ప్రార్థన ద్వారా మనం దీనులుగా చెయ్యబడి, స్వయంసమృద్ధి నుండి విడుదల పొందుతాం. ఇది మన విశ్వాసాన్ని, ఆరాధనను అభివృద్ధి చేస్తుంది. దేవుని పట్ల మనకున్న ప్రేమను, కృతజ్ఞతను కొలిచే కొలమానం ప్రార్ధన. మన ప్రార్థన సరైనదైతే కీర్తనాకారుని ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి:

“ యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవి యొగ్గెను కావున నా జీవిత కాలమంతయు నేనాయనకు మొర్రపెట్టుదును” (కీర్తనలు 116:1,2).

 

అధ్యాయం - 4

దేవుని పశ్చాత్తాపము మరియు ప్రార్థన

"రైసింగర్ గారూ, మీరు చెప్పినవన్నీ వాస్తవమైతే, దేవుడు ప్రార్థన విని తన మనసు మార్చుకున్న లేఖన సందర్భాల సంగతేమిటి?” అని మీరడగవచ్చు. ఇలాంటి ప్రశ్నకు తావిచ్చే ఒకానొక సందర్భాన్ని మనము నిర్గమ 32:1-14 లో చదువుతాం. ఇప్పటి వరకు నేను ప్రార్థన గురించి చెప్పిన దాదాపు అన్ని విషయాలను ఇటువంటి లేఖన భాగాలు కూలదోస్తున్నట్లు మనకు అనిపించ వచ్చు. దేవుడు తన మనస్సును మార్చుకున్నట్లుగా నిర్గమ కాండము 32:14 లో మనం స్పష్టంగా చూడగలం. ఈ వచనం యొక్క నిజమైన అర్థం ఏమిటి?

నిర్గమకాండం 32-34వ అధ్యాయాలు కుండలీకరణాలని మనకు తెలుసు. సీనాయి పర్వతం మీద మోషే దేవుని వద్ద నుండి రాతి పలకలను పుచ్చుకుంటుండగా, పర్వతం క్రింద ఇశ్రాయేలీయుల మధ్య జరిగిన ఒకానొక సంఘటన ఈ అధ్యాయాలలో దాఖలు చేయబడింది. వివరాల్లోకి వెళ్ళే ముందు అసలు జరిగిందేమిటో చూద్దాం.నిర్గమ 32:1-14 వ వచనాలను ఈ క్రింది విధంగా సంక్షిప్తపరుస్తున్నాను.

1. వారు చేసిన పాపం - అవిశ్వాసం గురించిన ఒక పాఠం (మ.1-6)

1వ వచనం:“మోషే కొండ దిగకుండ తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడా వచ్చి లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయెనో మాకు తెలియదని అతనితో చెప్పిరి.”

అవిశ్వాసం ఎంతో అసహనంతో కూడినది. అది కేవలం వెలి చూపును బట్టి నడుస్తుందే తప్ప విశ్వాసంతో కాదు. అదృశ్యుడైన దేవున్ని విశ్వాసంతో వెదకటం కన్నా, కంటికి కనిపించే ఒక బంగారు దూడ విగ్రహాన్ని కలిగియుండటం మేలని దాని యోచన.

2వ వచనం: “అందుకు అహరోను - మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా. ”

వారి తలంపు పాపమని అహరోనుకు బాగా తెలుసు. బహుశా ఆ విధంగా జరుగనియ్యకుండా కొంత కాలయాపన చేయటానికో, లేక తమ బంగారాన్ని ఇచ్చివేసే విషయాన్ని బట్టి వారు ఈ కోరికను గురించి పున: విచారణ చేస్తారనే ఉద్దేశంతోనో, అహరోను పై విధంగా స్పందించి యుండవచ్చు. కాని అతని కాలయాపన ఉపాయం పని చెయ్యలేదు. విగ్రహారాధన పట్ల ఇశ్రాయేలీయులకున్న ఆసక్తిని అతడు తక్కువ అంచనా వేశాడు.

3వ వచనం: “ప్రజలందరు తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి.”అవిశ్వాసం చాలా మొండిది. తన స్వచిత్తం నెరవేరేంత వరకు ఎంత వెల చెల్లించటానికైనా అది వెనుకాడదు.

4వ వచనం: "అతడు వారి యొద్ద వాటిని తీసికొని పొగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు - ఓ ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి.”

అవిశ్వాసం గత దీవెనలను మరచి, ఇప్పటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది.

5వ వచనం: “అహరోను అది చూచి దాని యెదుట ఒక బలి పీఠము కట్టించెను. మరియు అహరోను - రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా”

అవిశ్వాసం దేవున్ని సన్మానించటం అనే భక్తి ముసుగులో దాక్కొనగలదు.

6వ వచనం: “మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలుల నర్పించిరి. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి.”

అవిశ్వాసం మోసకరమైనదై, కామాతురతను సైతం ఆరాధనగా పరిగణిస్తుంది.

2. వారి పాపానికి విరోధంగా దేవుని న్యాయవంతమైన కోపోగ్రత (వ.7-10)

7వ వచనం: "కాగా యెహోవా మోషేతో ఇట్లనెను -నీవు దిగి వెళ్లుము; ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి.”

దేవుడు తన నిబంధనా ప్రజలను సంపూర్ణంగా త్రోసిపుచ్చినట్లు కనిపిస్తుంది.

8వ వచనం: “నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసికొని దానికి సాగిలపడి బలినర్పించి - ఓయి ఇశ్రాయేలూ, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరనెను.”

వారు ఇంత త్వరగా తిరుగుబాటు చేయటాన్ని బట్టి దేవుడు ఇక్కడ ఆశ్చర్యం వ్యక్తపరుస్తున్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి వర్తించే కొంత గుణపాఠం ఇందులో ఉంది.

9వ వచనం: “మరియు యెహోవా ఇట్లనెను - నేను ఈ ప్రజలను చూచియున్నాను. ఇదిగో వారు లోబడనొల్లనీ ప్రజలు.”

ఈ మాటలు వారి ధిక్కారమును, గర్వమును, దేవుని పట్ల వారి అవిధేయతను సూచిస్తున్నాయి.

10వ వచనం: “కావున నీవు ఊరకుండుము; నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసెదనని మోషేతో చెప్పగా. ”

దేవుడు ఒక దేశాన్నంతటిని తమ పాపం నిమిత్తము నాశనం చేసి, మోషేను ఒక గొప్ప జనముగా చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు. పై వచనాలను నిర్గమ కాండము 24:6-8 తో కలిపి చదవాలి. అక్కడ ఆ ప్రజలు నిబంధ నా రక్తము చేత ప్రోక్షింపబడినట్లుగా చూస్తాం. అనగా ఇశ్రాయేలీయులు ఇటీవలే దేవుని నిబంధన జనంగా ప్రత్యేకించబడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో దేవుడు కోపించటం తప్పనిసరి. ఎందుకంటే ప్రాయశ్చిత్తం జరుగకుండ పాపాన్ని క్షమించటం ఆయనకు న్యాయం కాదు.

న్యాయబద్ధంగా చూసినట్లయితే, మనం పాపం చేసిన ప్రతిసారి దేవుడు మనలను శిక్షించాలి. అయినప్పటికీ ఆయన ఆ విధంగా చేయకపోవటానికి కారణం ఒకటే; మనకూ, దేవునికీ మధ్య ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన మధ్యవర్తిత్వం చెయ్యకపోతే మనం నశించటం ఖాయం. దేవుని సార్వభౌమ ఉద్దేశాలు మరియు ప్రణాళికలు కూడ ఆయన నీతికి, పరిశుద్ధతకు అనుగుణంగా మాత్రమే నెరవేర్చబడతాయి. మనం క్షమించబడింది, దేవుని ప్రేమ వలన కాని, సార్వభౌమ శక్తి వలన కాని కాదని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. యథార్థమైన ప్రాయశ్చిత్తం వలన న్యాయ బద్దమైన విధంగా, పాప శిక్ష తొలగించబడితేనే తప్ప దేవుని ప్రేమ, పాపాన్ని క్షమించదు, క్షమించజాలదు. అదే విధంగా ఒక అంగీకారయోగ్యమైన మధ్యవర్తి, విజ్ఞాపన చేయటానికి లేని యెడల, దేవుని మహా సార్వభౌమ శక్తి సైతం ఏ పాపాన్నీ క్షమించదు, క్షమించజాలదు. మనకూ దేవుని ఉగ్రతకూ మధ్య ఒక మధ్యవర్తి నిలబడి, తన ప్రాయశ్చిత్తం వలన కలిగిన నూతన నిబంధన అనే వాగ్దాన దేశానికి కొనిపోవాలన్న దేవుని ఉద్దేశాలు కూడా వారు చేసిన విగ్రహారాధన అనే పాపానికి ఏ మినహాయింపును కల్పించజాలవు. దేవుడు వారి పాపంతో నీతిబద్దంగానే వ్యవహరించాలి. అంటే మోషే మధ్యవర్తిత్వం చెయ్యాలి లేదా ఇశ్రాయేలు నాశనం చెయ్యబడాలి. మరో ప్రత్యామ్నాయం లేదు.

3. మోషే మధ్యవర్తిత్వం - దేవుని సంతాపం (వ.11-14)

11వ వచనం: “మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని - యెహోవా, నీవు మహా శక్తి వలన బాహు బలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేల?”

12వ వచనం: “ఆయన కొండలలో వారిని చంపునట్లును, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకు వారిని తీసికొని పోయెనని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపపడుము.”

13వ వచనం: “నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసికొనుము. నీవు వారితో - ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానమును అభివృద్ధి జేసి నేను చెప్పిన యీ సమస్త భూమిని మీ సంతానమున కిచ్చెదననియు, వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను.”

14వ వచనం: “అంతట యెహోవా తన ప్రజలకు చేసెదనని చెప్పిన కీడును గురించి సంతాపపడెను” (నిర్గమ 32:11,14)..

ఈ మాటలు మనం ఏవిధంగా అర్థం చేసుకోవాలి? “దేవుడు సంతాపము నొందెను” అన్న మాటలను యధార్థంగా వ్యాఖ్యానించ టానికి ఎటువంటి తలంపులను పరిగణలోనికి తీసుకోవాలి? దేవుడు చపల చిత్తుడని, తన చిత్తాన్ని పదే పదే మార్చుకుంటాడని మోషే చెప్తున్నాడా? ఈ ప్రత్యేక సందర్భంలో మాత్రం మోషే దేవుని కంటే శక్తిమంతుడు, ప్రేమామయుడు, మరియు నీతిమంతుడుగా నిరూపించబడ్డాడని దీని భావమా? ప్రస్తుత సందర్భాన్ని, ఇతర లేఖన భాగాలను ప్రక్కన పెట్టి, కేవలం ఈ మాటలను మాత్రం ఉన్నది ఉన్నట్లుగా పరిగణలోనికి తీసుకుంటే, సదరు భావం కంటే మరొకటి మనకు కనిపించదు. సమయానికి మోషే కలుగజేసుకొని దేవుని మనస్సును మార్చి వుండకపోతే, ఆయన ఇశ్రాయేలును సర్వ నాశనంచేసి, తనను తాను అవివేకిగా కనబర్చుకునే వాడని మనం నమ్మాల్సి వస్తుంది. దేవుడు తన ఉద్దేశాలను తానే భగ్నపరచుకొని, అబ్రహాముతో చేసిన తన నిబంధనను త్రోసిపుచ్చాడని కూడ నమ్మవలసి వస్తుంది. వాస్తవంగా ఇదే దాని భావమైతే, మనం దేవునికి మారుగా మోషేను ఆరాధించటం ప్రారంభించాలి. కాబట్టి ఈ మాటల్లో పైకి కనిపించే భావం దాని అసలు అర్థం కాదని స్పష్టమవుతుంది. ఎందుకంటే అది “దేవుని కంటే మిన్నగా” తన ఉద్వేగాన్ని నియంత్రించుకొని కోపాన్ని అదుపులో ఉంచుకోగల్గిన మోషేను దేవుని కంటే గొప్పవానిగా చేసి, దేవున్ని మన వంటి పాపుల స్థాయికి దిగజార్చినట్లవుతుంది. అందుచేతనే ఈ మాటలను మరోవిధంగా వ్యాఖ్యానించవలసిన అవసరం ఉంది.

దేవుడు మనతో వ్యవహరించే విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగే విధంగా, బైబిలు తరచుగా సామాన్య మానవ పదజాలాన్ని, మానవ సహజమైన వర్ణనలను, దేవునికి అన్వయించటం మనం చూస్తాం. లేఖనాల రచయితలు, తరుచు వారు చూసినవాటిని యథాతదంగా వివరించినట్లు మనం గమనించగలం. మనం చేసేది కూడా ఇదే కదా? ప్రతిరోజూ వార్తలు చదివే వ్యక్తి, ఆ రోజు సూర్యుడు అస్తమించే సమయం, ఆ మర్నాడు సూర్యుడు ఉదయించే సమయం వెల్లడి చేస్తుంటాడు. సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అగుపించినా, అది వాస్తవం కాదని, సూర్యుడు వాస్తవానికి ఉదయించటం కాని అస్తమించటం కాని జరుగదని, ఆ వార్తలు చదివే వానికి, అది వినేవారికి తెలిసిన విషయమే. భూమి తిరుగుతున్నందున రాత్రింబగళ్ళ ప్రక్రియ జరుగుతుంది తప్ప సూర్యోదయం - అస్తమయం అనేవి సూర్యుని చలనం వలన కలిగినవికావు. అయినప్పటికీ మనం ప్రయోగించే సామాన్య పదజాలం, ఇందుకు భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది కదా?

దేవునిచేత ఎన్నిక చేయబడిన ఆయన గొర్రెలు కూడా, మందలో చేర్చబడక మునుపు ఆయన ఉగ్రత క్రిందనే ఉన్నాయి. అప్పుడు వారు కూడా శిక్షా విధికి లోనై యున్నవారే. “వారితో కలిసి మనమందరమును ... దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి” అని ఎఫెసీ 2:3లో పౌలు చెప్పిన మాటలకు అర్థం ఇదే. దేవుని ఎన్నిక-కృప దేవుని ఉగ్రతను తీసివేయటం కాని, పాపము నుండి మనలను రక్షించటం కాని చెయ్యలేదు. దేవుని ఎన్నిక, మనము రక్షింపబడి ఉగ్రత నుండి విడిపింపబడుతామని నిశ్చయపరచిందన్నది వాస్తవమే అయినప్పటికీ, ఏదైనా జరగాలని ఉద్దేశించటం నిర్ణీత సమయంలో వాస్తవంగా అది జరుగునట్లు చేసే అవసరతను ఏ మాత్రం మినహాయించదు. ఉదాహరణకు, క్రీస్తు మన పాపాల కోసం సిలువ మరణం పొందాలని దేవుడు సంకల్పించి ఉద్దేశించినది వాస్తవమే. అయినా ఈ వాస్తవం, క్రీస్తు అనుభవాత్మకంగా సిలువ వెయ్యబడి మరణ వేదన అనుభవించవలసిన అవసరతను ఏ మాత్రం మినహాయించదు. దేవుని గొర్రెల విషయంలో కూడ జరిగే వాస్తవమిదే. క్రీస్తు వెలుపల ఉన్న కారణంగా మనం అక్షరాల దేవుని ఉగ్రత క్రిందనే ఉంటిమి. అయినప్పటికి జగత్ పునాది వేయబడక మునుపే మనము ఆయన యందు ఎన్నిక చెయ్యబడిన కారణాన తప్పక రక్షింపబడవలసిన వారముగానే ఉన్నాం. ఈ రెండు విషయాలు ఒకే సమయంలో వాస్తవాలై ఉన్నాయి కదా!

మనం రక్షించబడినప్పుడు, మన పట్ల దేవుని మనస్సు మరియు వైఖరి పూర్తిగా మారినట్లనిపిస్తుంది. కాని వాస్తవానికి మారింది దేవుడుకాదు; మారింది మనమే. మనం బలంగా వీచే గాలికి ఎదురు నడుస్తున్న వ్యక్తి వలె ఉన్నాం. అతడు దాని శక్తివంతమైన తాకిడి నుండి తనను తాను సంరక్షించుకుంటూ, తన ముఖాన్ని తన అంగీతో కప్పుకొని, తల వంచుకొని, నడువగలిగినంత దూరం నడుస్తాడు. కొంతదూరం వెళ్ళి, తన దిశ మార్చినప్పుడు గాలి అతని వెనుక తట్టుకు తరలిపోయినట్లు అనుభవిస్తాడు. ఒక నిట్టూర్పు విడిచి, “హమ్మయ్మ! గాలి వీచే దిశ మారింది!” అని అనుకొంటాడు. అదే విధంగా మనం కూడా పరలోకం వైపు చూసినప్పుడు కేవలం దేవుని ఉగ్రతను మాత్రమే చూడగలిగాం. కాని ప్రభువైన యేసు క్రీస్తు ఎదుట పశ్చాత్తాప-విశ్వాసములతో మనము నిలిచినప్పుడు దేవుని ప్రేమను, కృపను చూసి అనుభవించాం. మన పట్ల దేవుని వ్యక్తిత్వం లేదా వైఖరి మారినట్లు అగుపిస్తుంది. కాని వాస్తవానికి మారింది దేవుడు కాదు; మారింది మనమే. అలాంటి మార్పు మనలను దేవుని గుణ లక్షణాలలో ఒక దాని నుండి మరొక దాని క్రిందకు నడిపించింది. అంటే, అప్పటి వరకు ఆయన ఉగ్రత క్రింద ఉన్న మనం ఆయన ప్రేమ క్రిందకు కొనితేబడ్డాం. దేవుడు ఇప్పుడెంత ప్రేమామయుడిగా ఉన్నాడో మనం రక్షింపబడక మునుపు కూడా అంతే ప్రేమామయుడిగా ఉన్నాడు. అదే విధంగా మన రక్షణకు మునుపు ఆయన పాపాన్ని ఎంతగా ద్వేషించాడో ఇప్పుడు కూడ దాన్ని అంతగానే ద్వేషిస్తున్నాడు. ఆయన క్షమాపణ క్రింద ఉన్నందున, మనమాయన గుణము మరియు ఉద్దేశాలకు ఉన్న మరో కోణాన్ని చూస్తున్నాం.

అదేవిధంగా నిర్గమ 32వ అధ్యాయంలో కూడ దేవుడు తప్పక తన మనస్సు మార్చుకున్నట్లు కనిపిస్తాడు. కాని వాస్తవానికి ఆయన తన నిబంధన వాగ్దానాలను గాని, తక్షణ ఉద్దేశాలను గాని ఎంతమాత్రం మార్చలేదు. ఆయన చేసిందల్లా ఒక్కటే; ఇశ్రాయేలు పట్ల తన సార్వభౌమ ఉద్దేశాలను నెరవేర్చుకోటానికి మోషేను, తన విజ్ఞాపనను అవసరమైన సాధనాలుగా వాడుకున్నాడు. “కాని ఒకవేళ మోషే ప్రార్థించటానికి సంసిద్ధంగా లేని పక్షంలో ఏమై యుండేది?” అని ప్రశ్నించటం అవివేకమే అవుతుంది. ఒకవేళ అలా జరిగి వుంటే ఇశ్రాయేలు నాశనమై పోయేది. దేవుని ఉద్దేశాలు కూడా తారుమారై పోయేవి. కాని అలా జరగటానికి ఈ “ఒకవేళ” అనేది వాస్తవంగా మారాలి. అలాంటి మార్పు అసాధ్యం కనుక ఆ విధంగా జరగనే జరగదు. “ఒకవేళ” అనే ఈ ప్రశ్నకు నేను చెప్పే ఏకైక జవాబు ఇదే. “అది అవివేకమైన ప్రశ్న; ఎందుకంటే అదొక అసాధ్యమైన ఊహపై ఆధారపడిన ప్రశ్న.”

జరిగిన ఒక సంభవం గురించి, “అలా జరిగి యుండకపోతే ఏమి జరిగేది” అని ఎవరైన ప్రశ్నిస్తే, “కాని అది జరిగింది కదా” అని మాత్రమే మనం జవాబు చెప్పాలి. దేవుని సార్వభౌమ ఎన్నిక సిద్ధాంతాన్ని వ్యతిరేకించే ఒకానొక స్త్రీ ఒకసారి నన్ను నువ్వు క్రీస్తును అంగీకరించిన ఆ రాత్రి, ఒకవేళ నువ్వు అలా చేసి యుండకపోతే, నీ పరిస్థితి ఏమై యుండేది?” అని అడిగింది. “కాని నేను అంగీకరించాను కదా!” అని మాత్రమే నేను ఆమెకు బదులిచ్చాను. జరగని దాని గురించి వాదించటానికి నేను నిరాకరించాను. అందుకు ఆమె కొంత ఆందోళన వ్యక్తపరిచింది. అయినా లేఖనాలను అధిగమించి మానవ మేధస్సుపై ఆధారపడిన ఒక దైవ శాస్త్రాన్ని గురించి వాదించటానికి నిరాకరించినప్పుడు, వాస్తవాలకు బదులు వేదాంతాలను నమ్మేవారు, ఆందోళన వ్యక్తపరచడం సహజమే కదా!

నేను చెప్పేదేమిటంటే, మనం రక్షింపబడక మునుపు దేవునిఉగ్రత క్రింద పాపులుగాను, దోషులుగాను ఉన్నప్పటికి, అదే సమయంలో మనం ఆయన చేత ఎన్నిక చెయ్యబడిన వారిగా, ఆయన కృపాయుతమైన ప్రణాళికలో చేర్చబడినవారిగా ఉన్నాం. యేసు క్రీస్తు నందు నిజమైన విశ్వాసం పొంది, అనుభవాత్మకంగా ఆ కృపలోనికి తేబడినప్పుడు దేవుడే మన పట్ల తన వైఖరిని మార్చుకున్నట్ల నిపించింది. కాని వాస్తవానికి మారింది మనమే. దేవుని మరొక గుణ లక్షణం క్రిందకు మనం వచ్చియున్నాం.

ఇప్పుడు మన ప్రస్తుత లేఖనాంశాన్ని వివరించే ప్రయత్నం చేద్దాం. దీని కొరకు ముందుగా నిర్గమ 32లోని సంఘటనలో అసలు ఏం జరిగిందో స్పష్టంగా గుర్తించాలి.

1. దేవుడు తన నిబంధనా షరతులను (పది ఆజ్ఞలను) ఇశ్రాయేలుకు స్పష్టంగా వెల్లడి చేశాడు (నిర్గమ 20).

2. ఇశ్రాయేలు జనాంగం షరతులన్నిటిని అంగీకరించి ఆ నిబంధనకు కట్టుబడి వుంటామని దేవుని ఎదుట వాగ్దానం చేశారు (నిర్గమ 24:7).

3. మోషే కొండ పైన ఆ నిబంధన యొక్క ప్రతిని లిఖితపూర్వకంగా పొందుతున్న సమయంలో ఇశ్రాయేలు దేవున్ని బహిరంగంగా ధిక్కరించి, ఆ నిబంధనలోని మొట్టమొదటి షరతునే అతిక్రమిస్తూ ఆరాధించేందుకు ఒక బంగారు దూడను చేసుకున్నారు.

4. నిబంధనా షరతుల ప్రకారం వారిని నాశనం చేయటం కంటే దేవునికి మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎన్నిక చేయబడిన జనమైనప్పటికి, న్యాయాన్ని పణంగా పెట్టి కృప చూపించటం సాధ్యం కాదు (కీర్తనలు 85).

అయితే ఒక ప్రాముఖ్యమైన మాటను నిర్గమ 32:10 లోగమనించాలి. నన్నడిగితే, ఈ వాక్య భాగానికి తాళం చెవి మనకు ఈ మాటల్లోనే దొరుకుతుంది. మోషే ఒక్క మాటయినా పలుకక మునుపే దేవుడు “నీవు ఊరకుండుము” అని ఎందుకంటున్నాడు? అబ్రహాముతో చేసిన ఒక బేషరతు నిబంధన ఆధారంగా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విమోచించిన దేవుడు ఇప్పుడు వారిని పూర్తిగా తుడిచిపెట్టి, వారికి మారుగా మోషేను ఒక గొప్ప జనంగా చేస్తానని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడు? మనం ఈ సన్నివేశాన్ని పూర్తిగా అర్థంచేసుకుంటే, మధ్యవర్తిత్వం చేసేలా దేవుడు మోషేని పురికొల్పుతున్నట్లు మనం చూడగలం. దేవుడు వాస్తవానికి, “మోషే, నీవు విజ్ఞాపన చెయ్యకుండ నన్నిలాగే విడిచిపెడితే వీరిని నాశనం చేయటం కంటే నాకు మరో ప్రత్యమ్నాయం లేదు” అని చెప్తున్నాడు. తరుచుగా మనం కూడా “నేను చెయ్యబోయే దానిలో నువ్వు “కలుగజేసుకోవద్దు” అని చెప్పినప్పుడు, వాస్తవానికి “కలుగజేసుకొని నేనలా చెయ్యకుండటానికి తోడ్పడు” మని పరోక్షంగా దాని భావం కదా?

దేవునికి, ఇశ్రాయేలు యొక్క న్యాయబద్ధమైన నాశనానికి మధ్య ఉన్నది మోషే ఒక్కడే అని అతనికి బాగా తెలుసు. అయినా దేవుడు మాట్లాడటానికి ఎంచుకున్న విధానం మోషేను కూడ పరీక్షించేదిగా ఉంది. ఒక క్రొత్త జనాంగానికి తండ్రి కావటానికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని మోషే హస్తగతం చేసుకుంటాడా? పితరుడైన అబ్రహాము స్థానాన్నే ఆక్రమించుకొనేంతగా తనలోని అహం చెలరేగుతుందా? లేదా దేవుని కృప తన హృదయంలో ఉందని నిరూపిస్తూ మోషే ఇశ్రాయేలును క్షమించుమని దేవునికి విజ్ఞాపన చేస్తాడా? మోషే ఏమి చేస్తాడో దేవునికి తప్పక తెలుసని మనకుతెలుసు. ఆ మాటకొస్తే, మోషే హృదయంలో అలాంటి సుగుణాన్ని ఉంచింది కూడ దేవుడే.

అయినా సరే, మోషే విజ్ఞాపన చెయ్యాలి; స్వచ్చందంగానే చెయ్యాలి. దేవుని కృప, సార్వభౌమ శక్తి వలన మోషే అలాగే చేశాడు. ఎందుకంటే అది ఇశ్రాయేలు పట్ల దేవుడు కలిగియుండిన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి ఆయనే నియమించిన సాధనం.

ఇక్కడ మోషే, ఆరాధ్యుడైన మన ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నాడు. యోహాను 17:9 లోని సత్యాన్ని సాదృశ్యపరిచే విధంగా మోషే ప్రవర్తించాడు. మన ప్రభువుకు వలె మోషే కూడా తన జనంతో తనను తాను ఐక్యపరచుకున్నాడు.

ఇదీ తాను స్వచ్ఛందంగానే చేశాడు. మన నమ్మదగిన రక్షకుని వలె మోషే కూడ తన జనాన్ని వారి పాపంతో నిమిత్తం లేకుండా ప్రేమించాడు.

మోషే తన ప్రార్థనలో

1. దేవుని కృపను ఆధారం చేసుకుని విన్నవించుకున్నాడు (11వవచనం). ఎందుకంటే ఇశ్రాయేలును ఐగుపు నుండి విమోచించింది ఆయన సార్వభౌమ కృప మరియు శక్తియే. నేడు మనం పాపంలో పడినప్పుడు కూడ, మనకున్న నిరీక్షణకు ఆధారం ఇదే కదా? (1 యోహాను 1:9 )

2. దేవుని మహిమను ఆధారం చేసుకుని విన్నవించుకున్నాడు(12వ వచనం). అన్యుల ఎదుట దేవుని ఘనత ఏమైపోతుందోనన్న చింతను మోషే వ్యక్తపరిచాడు.

3. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధననుఆధారం చేసుకొని విన్నవించుకున్నాడు (12-13వ వచనాలు). నిత్య నిబంధన రక్తాన్ని ఆధారం చేసుకొని ఇప్పుడు మన రక్షకుడు కూడ మన పక్షాన ఇదే విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు(1 యోహాను 2:1 ; హెబ్రీ 7:25 ).

మోషే చేసిన ఈ విజ్ఞాపన ఇశ్రాయేలు నుండి దేవుని ఉగ్రతను మళ్ళించింది. అటువంటి ప్రార్థన అవసరమైంది గనుక దేవుడే ఆ ప్రార్థనను ఏర్పరచాడు. ఇశ్రాయేలీయులను చంపాలని దేవుడు ఎన్నడూ యోచించలేదు. ఎందుకంటే పదవ వచనాన్ని బట్టి చూస్తే అలాంటి ప్రార్థన చేసేలా దేవుడే మోషేను పురికొల్పాడు అనిపిస్తుంది.

దేవుడు మనలను రక్షించి సంరక్షించే ఉద్దేశం కలిగివున్నప్పటికి, అది జరగటానికి క్రీస్తు వచ్చి మన కొరకు బలియై, ఆ తర్వాత మన కొరకు విజ్ఞాపన చేయటం అవసరమై యున్నది. నీవు, నేను, ఆయన విజ్ఞాపన వలన కాపాడబడుతున్న విధంగానే ఆనాడు ఇశ్రాయేలు కూడా మోషే విజ్ఞాపన వలన కాపాడబడింది. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించినా సరే, దేవుడు ఒక మానవ మాత్రుని వలె తన మనస్సు మార్చుకున్నాడనే విశ్లేషణ ఆ వాక్య సందర్భాన్ని మరియు ఇతర లేఖన భాగాలను నిర్లక్ష్యం చేయటమే అవుతుంది. దేవుడు తన నిబంధనా జనులను నాశనం చెయ్యబోతున్నట్లు మాట్లాడినా, అలా చెయ్యటం ఆయన వాగ్దానాన్ని ఉల్లంఘిస్తుంది. కాని మాట తప్పటం దేవునికి సాధ్యం కాదు; అబద్దమాడటం దేవునికి అసాధ్యం (హెబ్రీ 6:18 ) గనుక ఈ వాక్య భాగంలోనైనా మరే వాక్య భాగంలోనైనా దేవుడు తన మనస్సు మార్చుకున్నాడనే బోధ ఉందనే అభిప్రాయం లేఖనానుసారమైన వాక్య విశ్లేషణపై ఆధారపడింది కాదు.

ప్రస్తుతం మనం పరిగణలోనికి తీసుకున్న వాక్య భాగానికి నేను చేసిన వ్యాఖ్యానమే సరైన వ్యాఖ్యాన పద్దతి అని నేను వాదించటం లేదు. కాని ఒకటి ఖచ్చితంగా చెప్పగలను. దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నేను స్పష్టంగా దృడపరచలేక పోయినా, ఏ విధంగా అర్థం చేసుకోకూడదో నేను ఖచ్చితంగా చెప్పగలిగాను. 

ముగింపు 

బిల్లి భే భక్తిగల ఒక క్రైస్తవుడు. అతడు ఈ విధంగా చెప్పేవాడు: “నేను నా తండ్రితో దీని గురించి తప్పక చెప్పాలి.” అతడు ప్రతి విషయం గురించి ప్రార్థించాలని తలంచేవాడు. నేనతని గురించి గుర్తు చేసుకున్నప్పుడు, ఈ క్రింది కథ నాకు జ్ఞాపకం వస్తుంది.

వృద్ధుడైన ఒక విశ్వాసి, తన స్వస్థలానికి పది మైళ్ల దూరంలో ఉన్న నగరంలో జరుగుతున్న రెండు దినాల బైబిలు సమావేశానికి వెళ్లాలని దేవుడు తనను ప్రేరేపించినట్లు అనుకున్నాడు. అతడు మధ్యాహ్న భోజనం మూట గట్టుకుని, ఆ సభలకు నడిచి వెళ్ళి, బస్సు ప్రయాణపు ఖర్చు ఆదా చెయ్యాలనుకున్నాడు. మార్గంలో ఒక దైవ శాస్త్ర విద్యార్థిని అతడు కలుసుకున్నాడు. అతడు కూడ అదే సభలకు వెళ్తున్నాడు. మధ్యాహ్నం అయినప్పుడు వాళ్లిద్దరూ భోజనం చెయ్యటానికి కూర్చున్నారు. ఆ యువకుడు భోజనం కొరకు స్తుతి చెల్లించి సువార్త కూటాలను ఆశీర్వదించుమని ప్రార్థించాడు.

వృద్దుడు కూడా అలాగే ప్రార్థించాడు కాని మరికొన్ని వ్యక్తిగత అవసరాలను అందులో చేర్చాడు. “తండ్రీ, నాకు నిజంగా ఒక జత బూట్లు అవసరం. నాకు వాటిని దయచేయుమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ సభలలో వర్తమానాలను నేను బాగా వినాలని నువ్వు కోరుతున్నావని నాకు తెలుసు. అయితే నాకు సరిగ్గా వినిపించదని నీకు తెలుసు కదా. కాబట్టి నాకు అక్కడ కూర్చుండి మంచిగావినటానికి అనుకూలమైన స్థలం అనుగ్రహిస్తావని నమ్ముతున్నాను. చివరిగా, తండ్రి, హోటల్లో బస చేయటానికి కావలసిన సొమ్ము నా దగ్గర ఉంది, అయినా ఈ వారాంతాన్ని తమ గృహంలో గడుపుమని ఆహ్వానించటానికి నీ బిడ్డల హృదయాన్ని స్పందింప చేస్తావేమోనని ఆశిస్తున్నాను, ఆమేన్” అని ప్రార్థించాడు.

ఆ సెమినరీ విద్యార్థి ఇది విని కలవరపడి ఆ వృదున్ని మందలించాడు. మొదట బూట్ల కొరకు ప్రార్థించటమే సరికాదు. పైగా గృహ వసతి నిమ్మని దేవున్ని అడగటం మరింత ఘోరం అంటూ నిందించాడు. వారు సభా స్థలికి చేరేసరికి అన్ని కుర్చీలు నిండిపోయాయి. నిలబడటానికి మాత్రమే స్థలముంది. వృద్దుడు, విద్యార్థి వెనుక నిలబడి ఉన్నారు. వృద్ధుడు ప్రారంభంలో చేస్తున్న ప్రకటనలను చేయి చెవికాన్చి వినటానికి ప్రయత్నిస్తున్నాడు. విద్యార్థి - “సీటు కోసం నువ్వు చేసిన ప్రార్థనకు మంచి జవాబే దొరికింది” అని మనసులో నవ్వుకుంటున్నాడు.

ఆ హాల్లో మొదటి వరుసలో మాత్రం ఒక కుర్చీ ఖాళీగా ఉంది. దాని ప్రక్కనున్న కుర్చీలో ఒక యువతి కూర్చుంది. ఆమె పదే పదే వెనక్కి తల తిప్పి చూస్తూ ఉంది. ప్రకటనలు చేస్తున్న వ్యక్తి 'మనము మొదటి కీర్తన పాడి ఈ ఆరాధనను ప్రారంభిద్దాం” అని చెప్పగానే ఆయువతి అక్కడున్న ఒకతన్ని పిలిచి వెనక్కి చూపించి అతని చెవిలో ఏమో చెప్పింది. అతడు తిన్నగా వెనక నిలబడివున్న వృద్ధుని దగ్గరకొచ్చి- “నువ్వు వినటానికి కష్టపడుతున్నావా?” అని ప్రశ్నించాడు. దానికతడు “అవును” అని జవాబిచ్చాడు. అప్పుడతడు “మొదటి వరుసలో ఉన్న ఒక యువతి వాళ్ల నాన్నగారి కోసం ఒక కుర్చీ ఖాళీగా ఉంచింది. ఆయన డాక్టరు. ఆయన తన కుమార్తెతోకూటం ప్రారంభమయ్యే సమయానికి తానక్కడికి రాకపోతే తాను ఆపరేషను చేస్తున్నానని, ఆ కుర్చీని వేరొకరికి ఇవ్వమని చెప్పాడట. ఆ యువతి నిన్ను ఆ కుర్చీలో కూర్చోటానికి రమ్మని చెప్పింది” అన్నాడు. వెంటనే ఆ వృద్ధుడు తన కన్నులు పైకెత్తి, “తండ్రీ, నీకు వందనాలు” అని చెప్పాడు. ఆ విద్యార్థి అది చూసి, ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు.

ఆ ఆలయంలో ప్రార్థన జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ తమ సీటు ముందు మోకరించాలన్న వాడుక ఉండేది. ఈ వృద్ధుడు వెనక్కి తిరిగి కుర్చీ ఎదుట మోకరించినప్పుడు వేదికపైనున్న వారందరు అతని వెనుక భాగాన్ని, అతడు ధరించిన బూట్ల అడుగు భాగాన్ని చూశారు. కూటం ముగియగానే అధ్యక్షుడీ వృద్ధుని దగ్గరకు వచ్చి, “సోదరుడా, నీకెలా చెప్పాలో తెలియటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు నా జీవితంలో నేనెన్నడూ ఇలా చెయ్యలేదు. నిన్ను ఇబ్బంది పెట్టటం నా అభిమతం కాదు. అయితే నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు నీ బూట్లు చాలా పాడై సాక్సు బయటకు రావటం గమనించాను. నాకు ఒక చెప్పుల దుకాణం ఉంది. నీకొక జత బూట్లు యిమ్మని దేవుడు పదే పదే ప్రేరేపిస్తున్నట్లు నాకు అనిపించింది. అవి గత సంవత్సరం మోడల్ బూట్లే కాని క్రొత్తవే. వాటిని నా కానుకగా తీసుకోటానికి నీకు ఇష్టమేనా?” అని అడిగాడు. దానికా వృద్దుడు చిరునవ్వుతో, “తప్పక తీసుకుంటాను. ఈ దినమే ఈ అవసరత కోసం ప్రార్థించాను. నా తండ్రి దానికి జవాబిచ్చాడు” అని బదులిచ్చాడు. చెప్పుల షాపు యజమాని మిక్కిలి ఆనందించి, “నీ ప్రార్థనకు నేను జవాబునయ్యే ఆధిక్యత నాకిచ్చిన దేవునికి వందనాలు అన్నాడు.

ఆ యువతి ఆశ్చర్యపోయింది. ఈ కూటం జరిగే సమయంలో ఎక్కడ బస చేస్తున్నావని వృద్ధున్ని అడిగింది. అందుకతడు “నాకు సరిగా తెలియదు. నా తండ్రి నాకొక గది ప్రత్యేకించాడనే తలుస్తాను” అన్నాడు. దానికా యువతి, “నీ తండ్రా? నీకే 70 సంవత్సరాలు పైబడిన వయసు ఉన్నట్టు కనిపిస్తున్నావు!” అని, వెంటనే మరల “ఒహో నీ పరలోకపు తండ్రా? దయచేసి నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు”మని చెప్పింది. ఆమె సంఘ కాపరి గదికి వెళ్ళి తిరిగి వచ్చి, “మా నాన్న గారితో మాట్లాడాను, ఆయన ఆపరేషను ముగించాడు. ఆయనతో నిన్ను గురించి చెప్పగా ఆమంచి సోదరున్ని చూడాలి. ఈ వారంతం మన యింటిలో గడుపగలడేమో అడగమన్నాడు” అని చెప్పింది. వృద్దుడు చిరునవ్వుతో కనులు పైకెత్తి “తండ్రీ, వందనాలు” అన్నాడు.

ఇటువంటి సంఘటనలు నిజంగా సంభవిస్తాయని మనం నమ్మగలమా? నీ జీవితంలో ఈ విధంగా జరగటం నువ్వు చూశావా? మనమీ దినాల్లో అతిగా స్వయం సమృద్ధిగలవారమై ఇటువంటి స్వల్ప విషయాలతో దేవున్ని తొందర పెట్టటం ఎందుకని భావిస్తున్నామేమో. బహుశా మనం తప్పక బిల్లీ బ్రే పద్ధతి నవలంబించాల్సి ఉందేమో. బహుశా మనం ప్రతి దాని విషయము నా తండ్రితో మాటలాడటానికి నిశ్చయించుకోవాలేమో. ఎంతైనా, సార్వభౌముడైన మన తండ్రే సమస్తమును తన ఆధీనంలో ఉంచుకొని యున్నాడుకదా!

 

Add comment

Security code
Refresh