నిజ క్రైస్తవ జీవితం

రచయిత: కెన్ రెమీ
అనువాదం: నగేష్ సిర్రా

వాక్యాన్ని సరిగ్గా
వినడం ఎలా?

రచయిత
కెన్ రెమీ

అనువాదం
నగేష్ సిర్రా

ప్రచురణ
ది రిఫార్మ్డ్ యూనియన్

 కెన్ రేమీ (M. Div., D. Min., The Master's Seminary)
టెక్సాస్ లోని మొంటేగోమెరీలో లేక్సైడ్ బైబిల్ చర్చ్ కాపరిగా బోధకునిగా పనిచేస్తున్నారు.
కెన్, కెల్లీ దంపతులకు జెకర్యా, హన్నా, జేకబ్ అనే ముగ్గురు పిల్లలున్నారు.

 

విషయసూచిక

ప్రశంసలు

వివరణాత్మకమైన ప్రసంగ పద్ధతి (ఎక్స్పోజిటరీ ప్రీచింగ్) గురించిన పుస్తకాలు నా దగ్గర రెండు అలమర (సెల్ఫు)ల నిండా ఉన్నాయి, అవన్నీ సంఘకాపరులను గురిగా పెట్టుకుని రాయబడినవే. అయితే నేను చదివిన పుస్తకాల్లో వివరణాత్మకమైన ప్రసంగాన్ని వినే పద్ధతి గురించి సంఘంలోని విశ్వాసులకు అంతర్దృష్టినీ,ఉపదేశాన్నీ అందించిన తొలి పుస్తకం ఇదే. ఇది అత్యంత ఆచరణాత్మకమైనది, ఎప్పుడో అందుబాటులోకి రావలసినది.  సంపూర్ణంగా, స్పష్టంగా, క్లుప్తంగా ఈ అంశానికి న్యాయం చేసిన పుస్తకం ఇది. కెన్ రేమీ మంచి ప్రసంగీకుడు, కాపరి హృదయం కలిగిన బోధించే విషయంలో చక్కటి వరం కలిగిన ఉపదేశకుడు. ఈ అంశాన్ని అతడు చక్కగా వివరించి, సంఘానికి వెలకట్టలేని ఉపకరణాన్ని అందించినందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి.

-జాన్ మెకార్థర్ (కాపరి, బోధకుడు)
గ్రేస్ కమ్యూనిటీ చర్చ్, సన్ వ్యాలి, కాలిఫోర్నియా.

కెన్ రేమీ రాసిన ఈ పుస్తకాన్ని నేను సంతోషంగా చదివాను, ఇది అన్నిచోట్లా పంపిణీ చేయబడాల్సిన పుస్తకమని నేను నమ్ముతున్నాను. సంఘ జీవితంలో నిర్లక్ష్యం చేయబడిన అవసరాన్ని ఇది తీరుస్తోంది. సంఘానికి హాజరయ్యే వారిలో శ్రద్ధగా వినాల్సిన అవసరం గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా అది సరిపోదు. ఈ సమస్యకు కెన్ రేమీ ఎంతో విలువైన పరిష్కారాలను ప్రతిపాదిస్తున్నారు. కొన్ని ఆచరణాత్మకమైన సహాయకరమైన మార్గాలను సూచిస్తూ ప్రజలను వినమని ప్రోత్సహించాల్సిన విధానం ఏంటో ఆయనకు తెలుసు. ప్రసంగాలను వినడం అనే రంగంలో ఎంతో మితంగా ఉన్న  ఉపకరణాలకు విలువైన ఈ పుస్తకం కూడా తోడయ్యింది. ప్రతి సంఘ కాపరి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా తనకు తాను, తన సంఘానికి కూడా గొప్ప సహాయం చేసినవాడు అవుతాడు. అందువల్ల ఈ పుస్తకాన్ని ప్రతి సంఘ కాపరికి నేను సిఫారసు చేస్తున్నాను. నేడే దీన్ని సంపాదించండి!
-జే యాడమ్స్, రచయిత, Be Careful How You Listen: How to Get the Most Out of a Sermon

మంచిగా వినడం అనేది నేడు అన్ని సంబంధాలలోనూ, అన్నిటికంటే ముఖ్యంగా సంఘంలోనూ  కొరవడుతోంది. మంచిగా ప్రసంగించే విధానంపై ఎన్నో పుస్తకాలు రాయబడ్డాయి కానీ చక్కగా వినడం గురించి ప్రచురించబడిన పుస్తకాలు చాలా తక్కువగా ఉండడం ఆశ్చర్యకరం. కెన్ రేమీ రచించిన "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అనే పుస్తకం ఈ శూన్యాన్ని పూడుస్తోంది, లేఖనాలనుంచి వాక్యాన్ని వినే విషయంలో ఒక ప్రాథమికమైన అవసరాన్ని, దైవశాస్త్రాన్ని స్థాపిస్తూ విశ్వాసులు వాక్యం వినడానికి సిద్ధపడే విషయంలోనూ తాము విన్నదాన్ని వివేచించే విషయంలోనూ ప్రసంగాలను తమ సొంత జీవితాలకు అన్వయించుకునే విషయంలోనూ కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలను ఇందులో చూపించారు. ఇలాంటి పుస్తకం కోసం సుదీర్ఘకాలంగా నేను వేచి చూస్తున్నాను. ప్రతి చోట ఉన్న క్రైస్తవులు దీనిని చదవాలి, ఆచరణలో పెట్టాలి.
-జోల్ బీకి, ప్రెసిడెంట్, ప్యూరిటన్ రిఫార్మ్ డ్ థియలాజికల్ సెమినరీ, గ్రాండ్ రాపిడ్స్, మిచిగాన్

చక్కగా సిద్ధపడిన ప్రసంగీకులు చక్కగా సిద్ధపడిన సంఘాన్ని ఎదుర్కొన్నప్పుడు అదొక శక్తివంతమైన సముదాయం అవుతుంది. ప్రసంగానికి నిజంగా సిద్ధపాటు అవసరమైంది కేవలం సంఘ కాపరికేనని క్రైస్తవులు తరచూ భావించడం శోచనీయం. దీనికి విరుద్ధంగా బైబిల్ విస్తారంగా మాట్లాడుతోంది. దేవుని వాక్య వివరణను మనం హత్తుకోవలసిన విధానం గురించి లేఖనాల ఉపదేశాన్ని క్రైస్తవులందరూ అత్యవసరంగా వినాలని కెన్ రేమీ ఇస్తున్న పిలుపును బట్టి నేను కృతజ్ఞుణ్ణి. "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అనే ఈ పుస్తకం సంఘ జీవితంలో నిర్లక్ష్యం చేయబడిన ఈ అంశం విషయంలో ఎంతో అవసరమైనది. ప్రసంగీకులు శ్రోతలు తమ వాక్యానుసారమైన బాధ్యతలను తీవ్రంగా తీసుకుంటుండగా అనేక సంఘాలను దేవుడు బలంగా మార్చాలన్నది నా ఆశ.
-డాక్టర్ మైకేల్ ఫ్యాబరేజ్, సీనియర్ పాస్టర్, కాంపస్ బైబిల్ చర్చ్, అలీసో విఎజో, కాలిఫోర్నియా.

నైపుణ్యంతో వినడం కంటే మరింత ముఖ్యమైనది క్రైస్తవ జీవితానికి ఏదీ లేదు. మన దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం చక్కగా వినడం చాలా అవసరం. వక్త యొక్క భావాన్ని అనగా దేవుని ఉద్దేశాన్ని గ్రహించడం అనేది చక్కగా వినడంలో భాగం. దేవుడు మాట్లాడితే వినాలని, ఆయన వాక్యం యొక్క అర్థం తెలుసుకోవాలని కోరుకునే వాళ్లందరికీ కెన్ రేమీ రాసిన "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అనే ఈ పుస్తకం ఎంతో ఆవశ్యకమైనది. ఈ పుస్తకాన్ని తీసుకోండి, చదవండి, వినండి.
- THABITI ANYABWILE, సీనియర్ పాస్టర్, ఫస్ట్ బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ గ్రాండ్ కేమన్, కేమన్ ఐలాండ్స్

మన కాపరులు దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తుండగా మనకు ఎంతో ఉన్నతమైన అంచనాలు ఉండడం క్రైస్తవులమైన మనకు సబబే. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి అర్థంచేసుకోవడానికి వాళ్ళు తమను తాము అంకితం చేసుకోవాలని, పరిశుద్ధతతో కూడిన జీవితాలను వాళ్ల జీవించాలని, సువార్త కేంద్రీతంగా ఆత్మశక్తితో నిండిన ప్రసంగాలను సిద్ధం చేసుకోవడానికి ఆవశ్యకమైన కృషి సలపాలని మనం వారి నుంచి ఆశిస్తాం. క్లుప్తంగా చెప్పాలంటే వారు ఏ బాధ్యత నిమిత్తమైతే పిలవబడ్డారో దాని నిమిత్తం తమను తాము అంకితం చేసుకుని సిద్ధపడి ప్రసంగ వేదిక దగ్గరకు రావాలని మనం ఆశిస్తాం. అయితే మన సొంత సిద్ధపాటు విషయంలో ఎంతో నాసిరకపు ప్రమాణాలతో మనం సంతృప్తిచెందడం ఎంత విచిత్రం? మన విషయంలో కూడా మనకు సమానమైన, ఉన్నతమైన అంచనాలు ఉండి తీరాల్సిందే అని కెన్ రేమీ ఈ పుస్తకంలో చూపిస్తున్నారు. ఎందుకంటే కాపరి ప్రసంగిస్తుండగా మనం వాక్యాన్ని వినడానికి శ్రద్ధగా వినడానికి, గ్రహించడానికి, వివేచించడానికి, అన్వయించుకోవడానికి మనం సిద్ధపడి ఉండాలి.  వాక్యానుసారంగా వినాలని వాక్యానుసారమైన ప్రసంగం డిమాండు చేస్తుంది.‌ నువ్వు వినడానికి ఇబ్బందిపడుతూ ఉంటే నువ్వు వినడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ప్రార్థనాపూర్వకంగా ఈ పుస్తకాన్ని చదువు, ఇందులోని పాఠాలకు చెవియొగ్గు.
-టిమ్ చాలిస్, బ్లాగర్, రచయిత.
www.discerningreader.com, Ontario, Canada

కాపరి ప్రసంగించే విధానాన్ని బట్టి మాత్రమే తరచూ సంఘాలు పరీక్షించబడుతున్నాయి. మొదలుపెట్టాల్సింది ఇక్కడే, కానీ ఇదే పూర్తి పరీక్ష కాదు. ప్రజలు ఎలా వింటారనే విషయం కూడా సమానమైన ప్రాముఖ్యత కలిగిందే. ఎలా ప్రసంగించాలనే విషయంలో అనేక పుస్తకాలు ఉన్నాయి, అయితే ప్రసంగాలను ఎలా వినాలి అనేదే ఇప్పటి వరకు దాదాపుగా పరిశీలనకు నోచుకోని విభాగం. దేవుని వాక్యం నమ్మకంగా ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని ఎలా వినాలి దాని నుంచి ఎలా ప్రయోజనం పొందాలి అనేదానికి కెన్ రేమీ గారు రాసిన "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అనే ఈ పుస్తకం ఒక మార్గదర్శకం లాంటిది. సంఘానికి హాజరయ్యే వ్యక్తిని శ్రద్ధగా ఉండే ఒక శ్రోత నుంచి ప్రసంగంలోనూ దేవుని ఆరాధనలోనూ ఒక చురుకైన వ్యక్తిగా ఉండేందుకు ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. అదే "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అని ఈ పుస్తకాన్ని నిజంగా జీవితాన్ని మార్చే పుస్తకంగా చేస్తోంది. ఇలాంటి పుస్తకం వేరేదేదైనా ఉందేమో నాకు తెలియదు.
-రిక్ హాలాండ్, ఎగ్జిక్యూటివ్ పాస్టర్, గ్రేస్ కమ్యూనిటీ చర్చ్, సన్ వ్యాలి, కాలిఫోర్నియా.

ప్రసంగం వినడం వార్తల గురించి వాతావరణ గురించి క్రీడల గురించి వినడం లాంటిది కాదు. చక్కగా ప్రసంగం వినడానికి శ్రద్ధ చూపడం కంటే ఇంకా ఎక్కువ అవసరం ఉంది. "వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?" అనే ఈ పుస్తకంలో ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని చక్కగా వినడం గురించి బైబిల్ ఏం చెబుతుందో కెన్ రేమీ మీకు చూపిస్తారు, దాన్ని ఎలా చేయాలో ఆచరణాత్మకమైన మార్గాలను కూడా ఆయన మీకు చూపిస్తారు. అంతేకాదు వ్యక్తిగత పఠనం కోసం మాత్రమే కాదు గ్రూపు స్టడీకి కూడా ఈ పుస్తకం విలువైనదిగా ఉంటుంది.

డోనాల్డ్ యస్. విట్నీ, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ బిబ్లికల్ స్పిరిచువాలిటీ, సదరన్ బాప్టిస్ట్ థియలాజికల్ సెమినరీ,
లూయివల్, కెంటకీ

అంకితం
ప్రతీవారం నా ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ తమ దురద చెవులను గోకించుకోవాలని కాక వాక్య సత్యం చేత గద్దించబడడానికే ప్రాధాన్యత నిచ్చే లేక్సైడ్ బైబిల్ చర్చ్ అనే నా ప్రియమైన సంఘానికి ఈ పుస్తకాన్ని అంకితమిస్తున్నాను.

ముందుమాట

ఆరాధన కోసం పూర్తిగా సిద్ధపడని స్థితిలో ఎన్నడైనా ఆదివారం నాడు సంఘానికి చేరుకున్నారా? అంతకు ముందు రాత్రి మీరు బహుశా అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండి ఉండవచ్చు, సిద్ధపడుతుండగా మీ భాగస్వామితో వాదించి ఉండవచ్చు, మీ పిల్లలపై అరిచి ఉండవచ్చు, ఇంటి బయటకు వస్తుండగా మీ కుక్కను తన్ని ఉండవచ్చు. సంఘానికి మీరు చేరుకునే సమయానికి ప్రసంగాన్ని వినడానికి మీరు నిజంగా సిద్ధంగా లేరు. వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా? అనే ఈ పుస్తకం మీ మనసును, హృదయాన్ని సిద్ధం చేసుకోమనే కచ్చితంగా మీ నుంచి కోరుతుంది.

ప్రసంగాన్ని వినడం, నిజంగా వినడం అనగా ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ప్రసంగీకుని ఆలోచన సరళిని అనుసరిస్తూ దాని అర్థంపైన దృష్టిసారిస్తూ మీ జీవితానికి దాని యొక్క అన్వయింపును ఆలోచిస్తూ వినడం అనేది కష్టంతో కూడిన పని. కేవలం ప్రసంగాన్ని వినడం సులభమే. మీ చెవులు సరిగ్గా పనిచేస్తే వినడం అనే ప్రక్రియ జరిగిపోతుంది. అయితే అది వాస్తవానికి స్తబ్దంగా ఉండే పని. దేవుని వాక్య ప్రకటనను చురుగ్గా వినడానికి మానసికమైన అప్రమత్తత, ఏకాగ్రత, ఆధ్యాత్మికంగా వాక్యాన్ని అంగీకరించే హృదయం అవసరమవుతాయి. ఆ విధంగా వినమని సొలొమోను తన సొంత కుమారులకు మనవి చేశాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగి యుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును” (సామెతలు 2:1-5). అది ఎంతో చురుకైన, శక్తి కృషి అవసరమైన అభ్యాసాన్ని వర్ణిస్తోంది, ప్రతీ ఆదివారం ఆరాధనలో ఉన్నప్పుడు మనం ఇదే చేయాలని దేవుడు కోరుతున్నాడు. విశ్వాసి జీవితాన్ని మార్చడానికి బైబిల్ ప్రకటనే ప్రాథమిక మార్గం (1 కొరింథీ 1:18; 1 తిమోతి 4:13; 2 తిమోతి 3:16-17). కాబట్టి దేవుని పరిశు ద్ధ వాక్యం నుంచి ప్రసంగాలను వినడానికి మనల్ని మనమే సిద్ధపరచుకోవడం ఎంతో అవసరం.

పై పేరాగ్రాఫ్లో నేను దేనినైతే చెప్పానో కచ్చితంగా ఆ కారణం చేతనే డాక్టర్ కెన్ రేమీ “వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?' అనే ఈ పుస్తకాన్ని రచించారు. విస్తృతంగా ఉన్న క్రీస్తు శరీరానికి ఈ సమయంలో ఈ పుస్తకం ఎంతో ముఖ్యమైనది, ఆవశ్యకమైనది. క్రైస్తవ ప్రసంగం ఎలా చేయాలనే అంశంపై పుస్తకాలు విస్తారంగా ఉన్నాయి, కానీ క్రైస్తవ ప్రసంగాన్ని వినడం అనే అంశం గురించిన పుస్తకాలు దాదాపుగా లేవు. ప్రసంగాలను సరిగ్గా వినే విధానం గురించి విశ్వాసులకు బోధించాలనే ఏకైక ఉద్దేశంతో రాయబడిన పుస్తకాల సంఖ్యను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చనే మాట వాస్తవమే. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నది నిజంగానే ఎంతో ప్రత్యేకమైన, విశిష్టమైన పుస్తకం.

వివరణాత్మకమైన ప్రసంగానికి సరిగ్గా వినడానికి మధ్యనున్న విడదీయరాని బంధాన్ని చూపిస్తూ నా స్నేహితుడు కెన్ రేమీ రాసిన ఈ పుస్తకాన్ని బట్టి నేను ఎంతో సంబరపడుతున్నాను. ఎంతో విలువైన ఈ పుస్తకంలో అతడు బోధిస్తున్న దాన్నిబట్టి క్రైస్తవ సంఘం అతనికి రుణపడిపోయింది. “వాక్యాన్ని సరిగ్గా వినడం ఎలా?” అనే ఈ పుస్తకాన్ని చదవడానికి మనం వెచ్చించే సమయం ప్రయాసల ఫలితంగా దేవుని మహిమార్థమై వాక్యాన్ని ప్రకటించడం ద్వారా వాక్యాన్ని వినడం ద్వారా మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తును మనందరం సేవించుదుము గాక!
-లాన్స్ క్విన్
పాస్టర్-టీచర్, ద బైబిల్ చర్చ్ ఆఫ్ లిటిల్ రాక్, లిటిల్ రాక్, అర్కాన్సాస్
జనవరి, 2010

ప్రకటించబడే దేవుని వాక్యం దగ్గరకు మనం వస్తున్నప్పుడు అత్యున్నత ప్రాముఖ్యత కలిగిన విషయం దగ్గరకు వస్తున్నాం; కాబట్టి మనల్ని మనమే పురికొల్పుకోవాలి, గొప్ప భక్తితో వినాలి.
-థామస్ వాట్సన్

 పరిచయం

వాక్యాన్ని ఆహ్వానించడం

వినుటకు చెవులుగలవాడు వినుగాక.
మత్తయి 11:15

చరిత్ర అంతట్లో సంఘ భవనాల నిర్మాణ ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రసంగం యొక్క విలువను ఏ విధంగా దిగజార్చాయో గమనించడం ఆశ్చర్యకరంగా ఉంటుంది. గతంలో ప్రసంగ వేదికలు సంఘంలో విశ్వాసులు కూర్చునే ప్రదేశానికి ఎంతో ఎత్తున నిర్మించబడేవి, ప్రసంగీకుడు ప్రసంగ వేదిక వెనక నిలబడడానికి ఎన్నో మెట్లు ఎక్కాల్సి వచ్చేది. ప్రసంగ వేదిక ఎత్తున ఉండడం అనేది తన ప్రజలపై దేవుని వాక్యపు అధికారాన్ని పాలనను సూచించేది. కాలం గడిచే కొలది ప్రసంగ వేదిక ఒక స్టేజ్ స్థాయికి తీసుకురాబడింది. ఆ తర్వాత ప్రభు రాత్రి భోజనం సంస్కారంలో ఉండే రొట్టె ద్రాక్ష రసాలను పెట్టడానికి సిద్ధం చేయబడిన బలిపీఠానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రసంగ వేదికను ఒక మూలకు నెట్టేశారు.

ఒకప్పుడు చెక్కతో తయారు చేయబడిన పోడియం వంటిది ప్రసంగ వేదికపై ఉండేది. అది వాక్య ప్రకటన యొక్క వైభవాన్ని, శక్తిని సూచించేది. దానిని ఈ మధ్యకాలంలో ఎంతో ఆడంబరంగా, తళ తళ మెరిసే గాజుతో తయారుచేయబడిన పోడియం స్థానభ్రంశం చేసింది. కొన్ని సంఘాల్లో భారీ స్టేజ్ సెట్టింగుల కోసం సంగీత విద్వాంసుల కోసం వాయిద్యాల కోసం స్థలాన్ని ప్రత్యేకించడానికి ప్రసంగ వేదికలే తొలగించబడ్డాయి. వక్త తన ఆలోచనలను సలహాలను పంచుకోవడానికి స్టూలు మీద కూర్చోవడమే ఎంతో సహజమైన, బెదిరించని వాతావరణాన్ని సృష్టిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే తమ సంఘ కాపరిని ఒక సోఫాలో ఇతరుల పక్కనే కూర్చోబెడుతూ తద్వారా దీనత్వానికి నిదర్శనం ఇదేనని వ్యక్తపరిచే స్థాయికి వెళ్ళిపోయారు.

నేటి సంఘంలో వాక్య ప్రకటనకు ఉండాల్సిన ఉన్నతమైన, శ్రేష్ఠమైన స్థానం కనుమరుగైపోయింది. సంఘానికి హాజరయ్యే సగటు వ్యక్తి నేటి దినాన వాక్యానుసారమైన ప్రసంగాన్ని ఇక ఏ మాత్రమూ అభినందించట్లేదు, దాన్ని కనీసం సహించలేకపోతున్నాడు. దేవుని వాక్యాన్ని వినాలనే ఆసక్తిలేని నిర్లక్ష్యంగల శ్రోతలు తమ సొంత మార్గాలను కలిగి ఉన్నారు, ప్రజలను సంతోషపెట్టాలని కాపరులు కూడా సంతోషంగా వాటికి అంగీకరిస్తున్నారు. 2 తిమోతి 4:1-2 లో పౌలు తిమోతికి జారీచేసిన ఆజ్ఞ వెలుగులో ఇది అస్సలు ఏ మాత్రమూ మనల్ని ఆశ్చర్యానికి గురి చేయకూడదు. సంఘంలో ప్రజలు "హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును" అనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటించాలనే ధర్మం ప్రసంగీకునికి ఉంది అనే మాటను పౌలు స్పష్టంగా చెప్పాడు (వ. 3-4). ఆ సమయం ఆసన్నమయ్యింది.

ఇలాంటి పరిస్థితులకు ఓడరేవు ఉండే థెస్సలోనిక అనే పట్టణంలో మొదటి శతాబ్దపు సంఘం యొక్క స్పందన గురించి పౌలు చెప్పిన సాక్ష్యం పూర్తి విరుద్ధంగా ఉంది. దేవుని వాక్య ప్రకటనను వారు అంగీకరించిన విధానాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు ఎంతో కృతజ్ఞతుడిగా ఉండేవాడు (1 థెస్స 2:13). ఆ పట్టణంలో పౌలు కొద్దికాలం చేసిన పరిచర్యలో వారికి అతడు సువార్త ప్రకటిస్తుండగా పరిశుద్ధాత్మ యొక్క సహజాతీతమైన శక్తిని అతడు అసాధారణమైన రీతిలో అనుభవించాడు, వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాన్ని జరిగించేలా దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని ఉపయోగించుకున్నాడు (1 థెస్స 1:5). రాత్రికి రాత్రే విగ్రహాలను పూజించే ఈ అన్య జనులు యేసుక్రీస్తుకు ఎంతో అంకితమైన అనుచరులుగా సమూలంగా మార్పుచెందారు (1:9).

ఇంత నాటకీయమైన మార్పుకు కారణం ఏంటి? "మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని" వాళ్లు అతని ఉపదేశాన్ని అంగీకరించారు (2:13). "అంగీకరించారు" అనే పదం మీ గృహంలోనికి అతిధిని ఆహ్వానించడాన్ని వర్ణించడానికి ఉపయోగించబడేది. థెస్సలోనిక సంఘంలోని విశ్వాసులు తమ హృదయ ద్వారాలను విశాలంగా తెరిచి ఎంతో ప్రియమైన అతిధి మాదిరిగా వాక్యాన్ని హృదయపూర్వకంగా హత్తుకున్నారు. పౌలు యొక్క ప్రసంగంలోని మాటలను హృదయపూర్వకంగా ఆహ్వానించడం ద్వారా తమ హృదయాల్లోనికి జీవితాల్లోనికి స్వయంగా దేవుని అధికారపూర్వకమైన ఆలోచనను తాము ఆహ్వానిస్తున్నట్లు వాళ్లు గ్రహించారు.

అందువల్ల దేవుని వాక్యానికి నీ స్పందన ఎలా ఉంది? థెస్సలోనికలో ఉన్న పరిశుద్ధుల గురించి పౌలు ఎంతో సంతోషించిన విధంగా నీ గురించి పౌలు సంతోషిస్తాడా? వినే విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ పుస్తకం విశిష్టమైనది, ఎందుకంటే ప్రసంగాన్ని బైబిల్ ప్రకటనను వినవలసిన విధానం గురించి రాయబడిన పుస్తకం ఇది. ప్రసంగం ఎలా చేయాలనే విషయం గురించి ప్రసంగీకులకు రాయబడిన పుస్తకాలు సంఖ్యకు మించి ఉండగా, శ్రోతలు ఎలా వినాలి అనే అంశంపై రాయబడిన పుస్తకాలు ఆర్టికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. శ్రేష్ఠమైన ప్రసంగీకులుగా తయారవ్వడానికి  శిక్షణనిచ్చే సన్నద్ధుల్ని చేసే ఎన్నో ఉపకరణాలు ప్రసంగీకులకు ఉన్నాయి. అయితే శ్రేష్ఠమైన శ్రోతలుగా తయారవ్వడానికి శిక్షణనిచ్చే సన్నద్ధుల్ని చేసే ఉపకరణాలు శ్రోతలకు దాదాపుగా లేవు.

ఇది నిజానికి ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసే విషయం, ఎందుకంటే ప్రసంగీకుల సంఖ్యతో పోలిస్తే వినేవారి సంఖ్య ఎంతో అధికం. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని వివరించి అన్వయించే ప్రసంగీకుని బాధ్యత గురించి బైబిల్ మాట్లాడిన దానికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించవలసిన శ్రోత యొక్క బాధ్యత గురించి బైబిల్ ఎక్కువగా మాట్లాడుతుందని నువ్వు గ్రహించినప్పుడు ఆ కలవరం ఇంకా ఎక్కువవుతుంది. బైబిల్ మొదటి నుంచి చివరి వరకు చూస్తే దేవుని వాక్యాన్ని విని దానికి లోబడటం యొక్క కీలకమైన ఆవశ్యకత గురించి మాట్లాడే వచనాలతో వాక్యభాగాలతో అది నిండిపోయి ఉంది. ప్రసంగీకులు ప్రసంగించే విధానం గురించి దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు. అయితే వినడం గురించి రాయబడిన వచనాల పరిమాణాన్ని బట్టి చూస్తే శ్రోతలు ఎలా వింటారనే విషయంలో కూడా దేవుడు అంతే శ్రద్ధ కనబరుస్తాడనే మాట పొరపాట్లకు తావులేనిది.

సమిష్టి కృషి

దేవుని వాక్యాన్ని వివరించడానికి దేవునిచే పిలువబడిన సేవకునిగా ప్రజల హృదయాల్లో మార్పు కలిగించే విషయంలో ఒక ప్రసంగీకునిగా నా అసమర్థత గురించి నాకు మంచి అవగాహనే ఉంది. ఆ అవగాహనే నేను ప్రకటించే ప్రసంగాల ద్వారా హృదయాలను జీవితాలను మార్చాలనే ఆయన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవునిపై పూర్తిగా ఆధారపడేలా నన్ను చేస్తుంది. జె.ఐ.ప్యేకర్ వారి మాటల నుంచి నేను గొప్ప ఆదరణను ధైర్యాన్ని పొందుకుంటాను. "పరిశుద్ధాత్ముడు సార్వభౌముడు. పరిశుద్ధాత్మ చర్య ద్వారా దేవుని వాక్యం ప్రసంగీకునిలోనూ వినేవానిలోనూ అజేయమైనదిగా మారుతుంది. మానవ జ్ఞానంపైన సామర్థ్యంపైన ఫలితం ఆధారపడి ఉంటే ఏ ప్రసంగీకుడూ ఒక్క మాటైనా మాట్లాడటానికి సాహసించడు. ఎందుకంటే ఏ ప్రసంగీకుడు కూడా తాను తగినంత జ్ఞానమూ సామర్థ్యమూ కలిగిన వాడినని ఎన్నడూ భావించడు."1

ప్రసంగీకునిగా నాకున్న పరిమితులు గురించి నాకు అవగాహన ఉంది, అయితే దేవుని వాక్యం ఎన్నడూ నిష్ప్రయోజనంగా తిరిగి రాదనే ధైర్యం నమ్మకం నాకుంది (యెషయా 55:10-11). అయితే వినేవాడు విధేయత చూపించేవాడు ఎవ్వడూ లేకపోతే ఒక ప్రసంగాన్ని సిద్ధపడడానికి ప్రకటించడానికి ప్రసంగీకుడు పడే ప్రయాస అంతా నిరుపయోగమే అవుతుంది. వాక్య ప్రకటన అనేది కేవలం ఏకపక్ష ప్రయత్నం కాదు. ప్రసంగీకుడు శ్రోత కలిసి చేయాల్సిన సమిష్టి కృషి. బౌలింగ్ చేసేవాడు ఫీల్డింగ్ చేసేవాళ్లు సమిష్టిగా ఆడినట్లు శ్రోత ప్రసంగీకునితో కలిసి ఒక బృందంగా పనిచేస్తేనే విజయవంతమైన ప్రసంగాలు ఫలితాలనిస్తాయి. ఆటలో బ్యాట్స్ మాన్ బౌలర్లు ఫీల్డర్లు అందరికీ ముఖ్యమైన పాత్ర ఉంటుంది.‌ కేవలం ఎవరో ఒక్కరి భుజస్కంధాలపైనే మొత్తం బాధ్యత అంతా ఉండదు. అదేవిధంగా వాక్య ప్రకటనలోని బాధ్యత అంతా ప్రసంగీకుని భుజాలపైనే ఉండదు. ప్రసంగ ప్రక్రియలో శ్రోత కూడా కీలక పాత్ర పోషిస్తాడు.

మీరు వినే ప్రసంగాల నుంచి అధిక ప్రయోజనం పొందుకోవడానికి మీరు ప్రసంగీకునితో భాగస్వామ్యం కలిగి ఉండాలి, తద్వారా మీ  జీవితాన్ని మార్చాలనే దేవుని వాక్య ఉద్దేశం నెరవేరుతుంది. ఆత్మశక్తితో నిండిన ప్రసంగీకుని ప్రసంగాలు ఆత్మ వెలిగింపుతో నిండిన శ్రోతను మెరుపులా తాకినప్పుడు జీవితంలో కలిగే మార్పు ఒక మహా విస్ఫోటనంలా అగ్నిపర్వతం బద్దలైనట్లు ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ప్రసంగీకుల్లో ఒకడైన జార్జ్ విట్ఫీల్డ్ ఒకసారి ఇలా చెప్పాడు: "ఇప్పుడు నేను వాళ్లకి ప్రసంగించిన దానిని అభ్యాసం చేయడానికి విన్న వాళ్ళందరూ ఎంతో తీవ్రంగా తమ హృదయాలకు అన్వయించుకుంటే ఎంత బాగుంటుంది! అప్పుడు సాతాను మెరుపులా ఆకాశం నుంచి పడడాన్ని సేవకులు చూడగలుగుతారు, ప్రకటించబడిన వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం కంటే పదునుగా బలంగా ఉన్నట్లు, దేవుని ద్వారా అపవాది యొక్క బలమైన దుర్గాలు కూలిపోయినట్లు ప్రజలు కనుగొంటారు.

దేవుని వాక్యాన్ని నమ్మకంగా వివరించి అన్వయించే వ్యక్తి దగ్గరికి ఎన్నడైనా వాక్యాన్ని నమ్మకంగా విని దానికి లోబడే వ్యక్తి సమీపించినప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మ జరిగించే శక్తివంతమైన ప్రభావాన్ని మాటల్లో చెప్పలేము. 

ఈ శక్తివంతమైన సమిష్టి చర్య దేవుని వాక్యాన్ని అజేయమైనదిగా చేస్తుంది, శ్రోతల స్పందనకు వాక్యాన్ని ప్రకటించే వాళ్లను కృతజ్ఞతతో ఉప్పొంగేలా చేస్తుంది. ఈ పుస్తకంలోని సారాంశమంతా ఇదే. మాట్లాడుతున్నది పౌలు కాదు, దేవుడేనని థెస్సలోనికయులకు తెలుసు. తాను దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాననే విషయంలో పౌలుకు గాని అపోస్తలుడైన పేతురుకు గాని సందేహాలు లేవు. ప్రసంగించే/బోధించే వరాన్ని కలిగిన వారితో పేతురు ఎలా చెబుతున్నాడు: "ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను" (1 పేతురు 4:11). వాస్తవానికి దేవుని పక్షంగా ధైర్యంగా మాట్లాడవలసిన పవిత్రమైన బాధ్యత కలిగిన దేవుని ప్రతినిధులుగానే అపోస్తలులు ప్రవక్తలు అందరూ చివరికి యేసు కూడా తమను తాము పరిగణించుకున్నారు (యిర్మీయా 1:9; 5:14; యోహాను 14:24; 2 కొరింథీ 5:20). ప్రకటించుట అనే పదమే (గ్రీకు: కెరుక్సాన్) వార్తాహరునిగా ప్రకటించడం అని అర్థం. పురాతన కాలంలో రాజులకు పరిపాలకులకు తమ పక్షంగా ప్రజలకు ప్రకటనలు చేసే ప్రత్యేకమైన వార్తాహరులు ఉండేవాళ్లు. వాళ్లు రాయబారులుగా పనిచేసేవారు. రాజు పక్షంగా మాట్లాడుతూ అతడు వారికి ఏం చెప్పాలనుకున్నాడో దానిని కచ్చితంగా చెప్పడమే వారి ధర్మం.

రాజులకు రాజైన దేవుని ప్రతినిధిగా ఆయన తన వాక్యంలో చెప్పిన దానిని ధైర్యంగా ప్రకటించవలసిన బాధ్యతను అధికారాన్ని ప్రసంగీకులు పొందుకున్నారు. అదే విధంగా అంతే సమానమైన బాధ్యతను శ్రోతలు కూడా కలిగి ఉన్నారు. మానవాళి అంతటికి "యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము" అని దేవుడిచ్చే పిలుపును హృదయపూర్వకంగా తీవ్రమైన అపేక్షతో నిండిన శ్రోతలుగా వాళ్లు తమను తాము కార్యోన్ముఖుల్ని చేసుకోవాలి (యెషయా 1:2).

తరువాయి పేజీల్లో వినమని దేవుడిచ్చే పిలుపును మనం పరిశోధిస్తాం. వాక్యానుసారమైన శ్రవణేంద్రియ శాస్త్రాన్ని అనగా వినడం గురించి బైబిల్ యొక్క విస్తారమైన బోధను చర్చిస్తూ మనం ప్రారంభిస్తాం. పునాది వేయబడిన తర్వాత ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ దైవశాస్త్రం మీ హృదయంలో మనసులో జీవితంలో ఎలా పనిచేయాలో మనం చూడనారంభిస్తాం. మీరు సగటు క్రైస్తవులైతే వారానికి కనీసం ఒకటి లేదా రెండు ప్రసంగాలు వింటారు. ఉదాహరణకి మీరు 10 ఏళ్ళ వయసులో క్రీస్తు దగ్గరకు వచ్చి, 75 సంవత్సరాలు జీవించారనుకోండి. వారానికి రెండు ప్రసంగాల చొప్పున మీరు వింటే మీ జీవితకాలం అంతట్లో మీరు ఏడు వేల ప్రసంగాలకు పైనే వింటారు. ఈ జీవితం ముగిసిన తర్వాత దేవుని ముందు నిలబడి మీరు విన్న ప్రతి ప్రసంగం నిమిత్తం దేవునికి లెక్క అప్పగిస్తారు. ఆ రోజున "నువ్వు నా వాక్యాన్ని వేలసార్లు విన్నావు. దాని ఫలితంగా నీ జీవితం ఎలా మారింది?" అని దేవుడు నిన్ను ప్రాథమికంగా ప్రశ్నిస్తాడు.‌ కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ ఆహ్వానించడం, మీరు విన్న దానిని ఆచరణలో పెట్టడానికి శ్రద్ధగా ప్రయత్నించడం, తద్వారా మిమ్మల్ని మీరు కేవలం వాక్యాన్ని వినువారు మాత్రమై యుండి మోసపుచ్చుకునేవారిగా కాక వాక్యం ప్రకారం ప్రవర్తించువారిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం" చాలా ముఖ్యమని మనం చూస్తున్నాం (యాకోబు 1:22).

శ్రోతలకు మనవి

దేవుని వాక్యాన్ని వినమని ఆయన ఇచ్చే పిలుపును హృదయంలోకి తీసుకున్నవారు నేటి సంఘంలో కనబడుతున్న నిరుత్సాహకరమైన వైఖరులకు అతీతంగా ప్రవర్తిస్తారు. ప్రసంగ వేదికపైన నిలబడేవారు కూర్చుని వింటున్న విశ్వాసులు కూడా దేవుని వాక్యం నుంచి స్పష్టంగా ఒప్పించేవిధంగా అధికారంతో వెలువడే ప్రసంగాన్ని విలువ లేనిదిగా ఎంచుతున్నారు.

1980-90ల కాలంలో చర్చ్ గ్రోత్ మూమెంట్ ఆకస్మికంగా విజృంభించింది. ఈ ఉద్యమం సాంకేతికంగా పురోగతి సాధించిన, ప్రసార మాధ్యమాలతో నిండిపోయిన మన సమాజంలో వాక్య ప్రకటన అనేది భావవ్యక్తీకరణలో ప్రాచీన కాలపు కళ అని అభిప్రాయపడింది. జీవితంలో తాము ఎదుర్కొనే అనుదిన సమస్యలను (మీ జీవిత భాగస్వామితో మీకున్న సంబంధంలో, పిల్లల్ని పెంచే విషయంలో, దన ఘనతల కోసం పోటీపడే ప్రపంచంలో, మత్తు పదార్థాలతో పోరాటంలో ఎదురయ్యే సమస్యలను) పరిష్కరించే వినోదభరితమైన ప్రేరణ నిచ్చే సందేశాలను వినడానికి ఎక్కువ మంది శ్రోతలు ఆసక్తి చూపిస్తున్నారని నివేదికలు కనుగొన్నాయి.

ప్రజలు సత్యవాక్య అధికారాన్ని లేదా ప్రసంగీకుని అధికారాన్ని ఏ మాత్రమూ గుర్తించట్లేదని ప్రకటిస్తూ గత కొన్ని సంవత్సరాలలో ఎమర్జెంట్ చర్చి మూవ్మెంట్ వాక్యానుసారమైన ప్రకటన యొక్క విలువను మరింత దారుణంగా దిగజార్చింది. ఫలితంగా ప్రసంగీకులు అధికారంతో బోధించకుండా కేవలం డైలాగులను ఎక్కువగా మాట్లాడుతూ వాక్యానుసారమైన గద్దింపును కేవలం ఒక సంభాషణ మాదిరిగా మార్చేసారు. వాస్తవానికి, సనాతన వాక్య ప్రకటన పద్ధతి సంఘానికి హానికరమని ధైర్యంగా ప్రకటించే స్థాయికి ఈ ఉద్యమంలో కొందరు వెళ్ళిపోయారు.2 "శ్రోతలు తిరిగి మాట్లాడలేని పరిస్థితిని సౌండ్ సిస్టం కల్పిస్తుంది కాబట్టి చివరికి సౌండ్ సిస్టం వినియోగం కూడా సహాయకరం కాదని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని మరింత మోసకరంగా చేసేది ఏంటంటే మైక్రోఫోన్ శక్తితో ఒక వ్యక్తి ఉన్నప్పుడు అతడు దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడని ఊహించుకుంటున్నాడు".3 నమ్మకమైన వార్తాహరుడు, తీవ్రత కలిగిన శ్రోతలు అనే శక్తివంతమైన ద్వయాన్ని సృష్టించడానికే కదా సంఘం కచ్చితంగా నియమించబడింది?

థెస్సలోనిక సంఘ విశ్వాసులు ఈ సహజాతీతమైన శక్తిని అర్థం చేసుకున్నారు, అందువల్ల ప్రకటించబడిన వాక్యాన్ని గొప్పగా అభినందిస్తూ దాని యెడల మక్కువ చూపించారు.‌ పౌలు చేసిన వాక్య ప్రకటనను వాళ్లు అమితంగా ఇష్టపడ్డారు.‌ "వాక్య ప్రకటనను ఉత్సాహంగా వినేవాళ్లు" "వాక్య ప్రకటన కోసం చెవి కోసుకునే వాళ్ళు" అని వాళ్లను వర్ణించడం సబబుగా ఉంటుంది. మండుతున్న దాహంతోను ఆసక్తిగల హృదయాలతోను వాక్య ప్రకటనకు హాజరు కమ్మని అగస్టీన్ తన సంఘానికి మనవి చేసేవాడు.5 "ఎవరైనా వ్యక్తి దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రకటిస్తున్నప్పుడు మనుషులు వింటున్నది వాస్తవానికి దేవుని స్వరాన్ని. అందువల్ల మీరు వినే ప్రతి ప్రసంగానికి ఎంతో శ్రద్ధ కనపరచాలి" ‌అని చెబుతూ వాక్యాన్ని వివరించే ఈ ప్రక్రియను ప్యూరిటన్లు కూడా అర్థం చేసుకున్నారు. ఈ పుస్తకం అంతట్లోనూ మనం దాన్ని చూస్తాం. కాపరిగా పనిచేయమని దేవుడు ఏ సంఘానికైతే నన్ను పిలుచుకున్నాడో ఆ సంఘానికి వివరణాత్మకమైన ప్రసంగాలను నేను ప్రకటించడం మొదలుపెట్టిన తొలి ఆదివారం నుంచే వారిలో బైబిల్ నుంచి నేరుగా వస్తున్న ప్రకటన పట్ల తీవ్రమైన ఆకలిని నిజమైన అభినందనను బైబిల్ చెప్పిన దేనినైనా చేయాలనే రాజీలేని తీర్మానాన్ని పెంపొందించడానికి నేను ప్రయత్నించాను.

దేవుడు ఏం చేశాడో ఏం చేస్తున్నాడో ఏం చేయమని తమను పిలుస్తున్నాడో ఒక్కసారి గనక ప్రజలు గ్రహిస్తే ఆయనను స్తుతించాలనే ఆయనకు లోబడాలనే సంపూర్ణ ఉద్దేశంతో ఆయన మాటను భయభక్తులతో వింటారు. దానికంటే ఎక్కువగా మరెన్నడూ సంఘాలు దేవుణ్ణి ఘనపరచలేవని సాధారణంగా వాళ్లకు తెలుసు.6 ప్రకటించబడిన వాక్యం ద్వారానే దేవుడు తమతో మాట్లాడతాడు అని సంఘాలకు తెలుసు. కాబట్టి దేవుని వాక్యాన్ని వివేచన కలిగిన శ్రోతలుగా వింటూ, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా పాటిస్తూ, ఆయన వాక్యాన్ని అంకితభావంతో ప్రేమిస్తూ, దాహంతో అలమటిస్తున్న వ్యక్తి నీళ్లు తాగాలని అపేక్షించిన విధంగా తన వాక్యాన్ని ప్రకటించాలని అపేక్షిస్తూ, ప్రకటించబడిన వాక్యాన్ని వినాలని తీవ్రమైన పరితాపం కలిగిన హృదయాలను కలిగి ఉండే సంఘాలను చూడడమే ఈ పుస్తకంలో నేను రాసిన సందేశం యొక్క ముఖ్యోద్దేశం.

ఆత్మ యొక్క నిత్య క్షేమం నిమిత్తమే వినడం అనే వసతిని దేవుడు సమకూర్చాడు, ఆత్మ యొక్క శ్రేయస్సు వినడంపైనే ఆధారపడి ఉంటుంది. వినే విషయంలో మీరు విఫలమైతే మీ ఆత్మలో విరుగుడు లేనివై నశిస్తాయి. ఎందుకంటే విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినడం అనేది నిత్య పర్యవసానం ఉన్న చర్య. మనం వినే విధానానికి అనుగుణంగానే మన ఆత్మల నిత్య స్థితి ఉంటుంది.
-డేవిడ్ క్లార్క్సన్

అధ్యాయం 1

బైబిల్లోని శ్రవణేంద్రియ శాస్త్రం:
వినుటను గురించిన అధ్యయనం

ఎందుకనగా ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును. వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైనవాటినిగూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడియున్నది అయినను అందరు సువార్తకు లోబడలేదు ప్రభువా, మేము తెలియజేసిన సమాచారమెవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు గదా? కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. రోమా 10:13-17

వినడం అనేది విలువైన విషయం. మనం విశ్వాసం కలిగి ఉండడానికి కూడా వినడం అనేది అవసరమేనని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. శ్రద్ధగా మనసుపెట్టి వినడం అనేది కూడా ఉంది, వినే వాళ్ళందరూ శ్రద్ధగా మనసుపెట్టి వినరు. అంటే వాతావరణంలోని పీడనం మూలంగా ఉత్పత్తి అయ్యే అత్యంత సూక్ష్మమైన, కోట్లాది శబ్దాలు నీ చెవి లోపల ఉండే ఊహకు అతీతమైన సంక్లిష్టమైన యంత్రాంగాన్ని చేరుకుని, నీ మెదడులో అనేక భావాలను రూపించగల పదాలుగా వివరించన శక్యమైన విధానంలో మారినప్పటికీ నువ్వు వాస్తవానికి వినట్లేదని అర్థం. ఆ సమాచారంతో ఏమీ చేయకూడదని నువ్వు నిర్ణయించుకునే అవకాశం ఉంది. వాస్తవానికి నువ్వు వినే విషయంలో అనేక సమస్యలు ఉండి ఉండవచ్చు. నువ్వు వింటున్నది వాక్యానుసారమైన ప్రసంగమో కాదో తెలుసుకునే వివేచన నీకు బహుశా ఉండి ఉండకపోవచ్చు.

బహుశా విస్మరించడానికి చేయగలిగిన దానినంతా చేస్తూ నువ్వు ప్రసంగాన్ని వింటున్నావేమో. నీ గురించి నువ్వు మంచిగా అనుభూతి చెందేలా చేస్తున్న ప్రసంగాన్ని మాత్రమే బహుశా నువ్వు వెదుక్కున్నావేమో. లేదంటే ప్రసంగం మంచిగానే ఉన్నప్పటికీ నువ్వే సమస్య అయ్యుండవచ్చు. లేదంటే అతిగా వినడం వల్ల నువ్వు అలసిపోయావేమో. నువ్వు చేస్తున్నదంతా కేవలం వినడమే అయ్యుండవచ్చు, కాని నీ జీవితంలో ఎదుగుదలను మార్పును ఏ మాత్రమూ నువ్వు అనుభవించట్లేదేమో. ప్రతి వారము మంచి ప్రసంగాలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తున్నావేమో. అవి ఎన్నడూ నీ మనసు లోతుల్లోకి చొచ్చుకుపోవట్లేదేమో , నీ హృదయాన్ని చీల్చట్లేదేమో, నీ జీవితాన్ని మార్చట్లేదేమో. వివేచించగలిగే సామర్థ్యమూ విధేయ చూపించాలనే కోరికయూ నీకు ఉన్నప్పటికీ బహుశా వారమంతటిలోనూ ఏ మాత్రమూ ముఖ్యంకాని పూర్తిగా వాస్తవంకాని వాటిని విస్తారంగా వింటూ చూస్తూ కేవలం సగం మాత్రమే వినే విధంగా నీకు నీవే శిక్షణ నిచ్చుకున్నావేమో, ఆదివారం ఉదయాన కూడా ఆ అలవాటు నుంచి నువ్వు తప్పించుకోలేకపోతున్నావేమో. దేవుని వాక్యాన్ని సరిగ్గా అభినందించేలా ఆచరణాత్మకంగా అన్వయించుకునేలా ఎన్నడూ శిక్షణ పొందకపోవడమే వినడంలోని ఈ సమస్యలన్నింటికీ మూల కారణం!

వాక్య ప్రకటనను ఫలవంతంగా వినే విషయంలో మనకు దైవశాస్త్రపరమైన ఆచరణాత్మకమైన ఉపదేశం యొక్క అవసరత ఎంతో తీవ్రంగా ఉంది. వాక్యానుసారమైన శ్రవణేంద్రియ శాస్త్రాన్ని అనగా వినడం గురించిన ప్రాథమికమైన బైబిల్ బోధను స్థాపించడం ద్వారానే శ్రేష్ఠమైన శ్రోతగా తయారవ్వడం అనేది ఆరంభమవుతుంది. లేఖనంలో వినడం అనేది ఒక ప్రబలమైన అంశం కాబట్టి దీనిని సూత్రీకరించడం చాలా సులభం. బైబిల్లోని దాదాపు ప్రతి గ్రంథంలోనూ దేవుని వాక్యాన్ని వినడం గురించిన విధేయత చూపించడం గురించిన ప్రస్తావన కొంత ఉంటుంది. పాత నిబంధనలో కవుల ద్వారా ప్రవక్తల ద్వారా, కొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా అపోస్తలుల ద్వారా వెరసి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తాను చెప్పేది విని, విధేయత చూపించమని దేవుడు మనకు ఆదేశిస్తున్నాడు. తాను చెప్పినదానిని వినమని బైబిల్ దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, వినకపోతే శిక్ష వస్తుందని హెచ్చరిస్తున్నాడు, వింటే దీవెన వస్తుందని వాగ్దానం చేస్తున్నాడు. బైబిల్లోని ఈ పద్ధతి మన గ్రహించ వీలులేనంత కష్టమైనది కాదు. మొదటిగా ఆజ్ఞ, వినకపోతే హెచ్చరిక, వింటే వాగ్దానం అనే క్రమంలో ఈ బోధ మనకు కనబడుతుంది. వీటి మధ్యలో దేవునికి విధేయులుగా ఉండడానికి పాటుపడిన హనోకు అబ్రాహాము స్తెఫను వంటి భక్తుల జీవితాలనూ, విధేయులు కావడానికి ఇష్టపడని ఆదాము ఫరో యూదా వంటి వ్యక్తుల జీవితాలనూ వర్ణించే చారిత్రాత్మక కథనాలు ఉన్నాయి.

వినడం అనే అంశం గురించి బైబిల్ బోధించే ప్రతి దానిని నాలుగు క్లుప్తమైన మాటల ద్వారా లేదా దైవశాస్త్ర సంబంధమైన సత్యాల ద్వారా వ్యక్తపరుస్తూ దీనిని మనం క్రమబద్ధీకరించవచ్చు.

1. దేవుడు మాట్లాడాడు, తాను చెప్పినదానిని విని విధేయత చూపించమని మనకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు.
2. దేవుని మాటను విని ఆయనకు విధేయత చూపించడంలో మనందరం విఫలమయ్యాం, తద్వారా ఆయన శిక్షకు పాత్రులమయ్యాం.
3. యేసుక్రీస్తు నందు విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం, దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపించే సామర్థ్యాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు.
4. దేవుని మాటను విని మనం ఆయనకు విధేయత చూపిస్తే ఇప్పుడూ నిత్యత్వమంతా కూడా ఆయన మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

లేఖనంలోని ముఖ్యమైన అనేక ఇతర దైవశాస్త్ర అంశాలకు పై నాలుగు వాక్యాల్లోని ప్రతీదీ ఏ విధంగా ముడిపడి ఉందో గమనించండి. మొదటి వాక్యం, దేవుని స్వభావానికి ఆయన వాక్యానికి సంబంధించినది. రెండవ వాక్యం, మనిషి స్వభావానికి పాపానికి సంబంధించినది. మూడవ వాక్యం, రక్షణ స్వభావానికి పరిశుద్ధాత్మకు యేసుక్రీస్తుకు సంబంధించినది. నాలుగవ వాక్యం, పవిత్రీకరణకు భవిష్యత్తులోని సంగతులకు సంబంధించినది. అందువల్ల సిస్టమాటిక్ తియాలజీలోని దాదాపు ప్రతి అంశానికి వినడం గురించిన బైబిల్ బోధ అవినవభావ సంబంధాన్ని కలిగి ఉంది. వినడానికి సంబంధించిన బైబిల్ బోధలోనే దాదాపు కేటకిజం (ప్రశ్నోత్తరాల ద్వారా వాక్యోపదేశం) అంతా, విశ్వాస ప్రమాణం అంతా ఉన్నట్లు కనిపిస్తోంది.

వినడం గురించిన ఈ నాలుగు దైవశాస్త్రపరమైన వాక్యాలను ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం.

1. దేవుడు మాట్లాడాడు తాను చెప్పిన దానిని విని విధేయత చూపించమని మనకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు.

దేవుడు ఈ విశ్వానికి సృష్టికర్త, నిర్వాహకుడు. మానవాళితో సంబంధం కలిగి ఉండాలనే కోరికతో, ఆ సంబంధం ద్వారా తన మహిమను ప్రదర్శించాలనే ప్రేరణతో, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి మనం ఏం తెలుసుకోవాలో ఏం చేయాలో మనకు వెల్లడి చేయాలనే ఉద్దేశంతో తన వాక్యమైన బైబిల్ని ఆయన మనకు అనుగ్రహించాడు. సుమారు 1500 సంవత్సరాలకు పైగానే (క్రీ.పూ. 1400 నుంచి క్రీ.శ. 90 వరకు), దేవుడు సుమారు 40 మందిని ఎంపిక చేసుకుని వారి ద్వారా మాట్లాడాడు. హెబ్రీ పత్రిక ఈ మాటలతో మొదలవుతుంది: "పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను" (1:1-2). తన ఆత్మ యొక్క పర్యవేక్షణలో యోబు మోషే యెహోషువ సమూయేలు ఎజ్రా నెహెమ్యా దావీదు సొలొమోను యెషయా యిర్మీయా దానియేలు మత్తయి లూకా మార్కు యోహాను పేతురు పౌలు వంటి భక్తులు మనం ఏం తెలుసుకోవాలని ఏం చేయాలని దేవుడు కోరాడో వాటన్నింటినీ కచ్చితంగా రాశారు. "ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి" అని పేతురు చెప్పాడు (2 పేతురు 1:20-21).

మానవాళికి తన వాక్యాన్ని దేవుడు అనుగ్రహించిన ప్రక్రియనే లేఖనాల పదసంబంధమైన, సంపూర్ణమైన ప్రేరణ అని పేర్కొంటారు (2 తిమోతి 3:16-17). దీని అర్థం ఏంటంటే బైబిల్లోని ప్రతి పదమూ కచ్చితంగా దేవుడు చెప్పాలనుకున్నదే. మరొక రీతిగా చెప్పాలంటే బైబిల్ అంటే సాక్షాత్తు దేవుని మాటలే, కాబట్టి అవి సంపూర్ణంగా సత్యమైనవి నమ్మదగినవి. దేవుడు మాట్లాడాడు కాబట్టి, ఆయన మాటలు కచ్చితంగా గ్రంథస్థం చేయబడి లేఖన పత్రాల్లో సురక్షితంగా భద్రపరచబడ్డాయి కాబట్టి, "బైబిల్ మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడతాడని" 2 ధైర్యంతో మనం చెప్పవచ్చు.

అంతేకాదు ప్రసంగికుడు నమ్మకంగా బైబిల్ని ప్రసంగించినప్పుడు మాట్లాడుతున్నది ప్రసంగీకుడు కాదు, దేవుడని దీని అర్థం (యోహాను 14:24; అపొ 13:7, 44). మాట్లాడింది దేవుడే అనే వాస్తవాన్ని బట్టి మనం వినాలి, విధేయత చూపించాలి.

అది ఆయన వాక్యం.

బిడ్డ తన తల్లిదండ్రులు చెప్పిన మాట విని, విధేయత చూపించాలి. వాళ్ళు ఆ బిడ్డకి తల్లిదండ్రులయిన ఒకే ఒక్క కారణాన్ని బట్టి అలా చేయడం సరైనదవుతుంది, అంతేగాని వేరే ఏ కారణాన్నిబట్టీ‌ కాదు (ఎఫెసీ 6:1-2). మన పరలోక తండ్రి ఏమై ఉన్నాడు అనేదాన్ని బట్టి ఆయన చెప్పిన దానిని మనం వినాలి విధేయత చూపించాలి. దేవుడేమై ఉన్నాడు అనేదాన్ని వర్ణించేదే దేవుని వాక్యం. తన మహిమ, ప్రేమ, కృపా కనికరాలు, శక్తి, ఉగ్రత, న్యాయం, దయ, నమ్మకత్వం తదితర లక్షణాల గురించి మనం తెలుసుకోవాలని ఆయన తన వాక్యాన్ని మాట్లాడాడు. దేవుని స్వభావం ఆయన వాక్యంలో సహజసిద్ధంగా ఉంది (కీర్తన 138:2). బైబిల్ ఎంతో శక్తి గలదిగా మన హృదయాలను ఎంతో కచ్చితంగా చేధించగలిగిన సామర్థ్యం కలిగినదిగా మన జీవితానికి సంబంధించిన ప్రతి విభాగాన్ని ఎంతో కచ్చితంగా వివేచించగలిగినదిగా ఉండడానికి కారణం అది సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యం కాబట్టే (హెబ్రీ 4:12-13). మనం దేవుని వాక్యానికి బహిర్గతమైన ప్రతిసారి సాక్షాత్తు మనం దేవునికే బహిర్గతమవుతున్నాం (1 కొరింథీ 14:24-25). దేవుని వాక్యాన్ని ఘనపరచడానికి దానికి లోబడడానికి అదొక్క ప్రేరణ మనకు చాలు.

పాత కొత్త నిబంధనల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి పిలువబడిన వాళ్ల నమ్మకం ఇదే. తరచూ వారి నోటి నుండి వెలువడిన తొలిమాటలు: "యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు", "ప్రభువు వాక్యమును ఆలకించుడి". ఈ ప్రతినిధుల ద్వారా దేవుడు కేవలం మనతో మాట్లాడడం మాత్రమే కాదు, వినమని విధేయత చూపించమని కూడా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు.

వినమని, విధేయత చూపించమని బైబిల్ అంతటా జారీచేయబడిన అనేక ఆజ్ఞల్లో కొన్నింటిని గమనించండి:3

"నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి" (ద్వితీ 5:1).

"నా ప్రజలారా, ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ, నీవు మా మాట వినినయెడల ఎంత మేలు!"..."అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!" (కీర్తన 81:8, 13).

ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; "ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించు చున్నాను, ఈయన మాట వినుడని" చెప్పెను (మత్తయి 17:5).

మార్పులేని, శాశ్వతమైన, జీవమిచ్చే, జీవితాన్ని మార్చే దేవుని వాక్యమే బైబిల్ అనీ, దాని మాట వింటే మనకు మేలనే వాస్తవాన్ని అది ప్రతి చోట నొక్కిచెబుతోంది (యెషయా 40:5, 8; 51:4; 55:10-11; యిర్మీయా 23:29; హెబ్రీ 4:12). వాస్తవానికి మన జీవితం ఎంత బాగా కొనసాగుతోంది ఎంత బాగా ముగుస్తుంది అనే విషయం మనం దేవుని వాక్యాన్ని ఎంత బాగా విన్నాం దానికి ఎంత బాగా విధేయత చూపించామనే దానిచేత నిర్ధారించబడుతుంది. "నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేశారా లేదా అనేదానిపైనే మీ ఆధ్యాత్మిక మనుగడ ఆధారపడి ఉంటుంది" అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు. ​"మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటివలె మనలను బ్రదికించు నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి యీ కట్టడల నన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను" అని ద్వితీయోపదేశ కాండం 6:24 చెబుతున్నది. తన మాట విని, దానికి విధేయత చూపించడం జీవ మరణాలకు సంబంధించిన విషయమని దేవుడు పలుమార్లు ఇశ్రాయేలీయులతో చెప్పాడు (4:1; 8:3). ద్వితీయోపదేశకాండం 30:19-20 లో "నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచియున్నాను...కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను నట్లును జీవమును కోరుకొనుడి" అని మోషే చెప్పాడు. దేవుని మాటలకు విధేయత చూపడం, దేవుని ప్రపంచంలో జీవిత సంతృప్తి పొందడం అనే వాటిమధ్య దేవుని ప్రజలు ఒక ముఖ్యమైన సంబంధం పెట్టుకునేందుకు సహాయం చేయడమే వారికి మోషే చేసిన పరిచర్యలో ముఖ్యాంశం. ఎందుకంటే "ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాటవలన నరులు బ్రదుకుదురు" (8:3).

తాను ఎన్నుకున్న తన సొంత ప్రజలను దాటి దేవుడు తన వాక్యాన్ని తన పిలుపును విస్తరింపచేసి వాటికి విధేయత చూపమని ఆజ్ఞాపిస్తున్నాడు. సార్వభౌముడైన సృష్టికర్త అధికారంతోనే మానవాళి అంతటిని ఆయన పిలుస్తున్నాడు: "నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణమును సారమైన దానియందు సుఖింపనియ్యుడి. చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు" (యెషయా 55:2-3). తన సొంత ఆజ్ఞలకు విధేయత చూపిస్తే సత్ఫలితాలు వస్తాయని కేవలం దేవుడు మాత్రమే హామీ ఇవ్వగలడు. విధేయతతో వినడం మూలంగా కలిగే దీవెనను యేసు నిత్యత్వానికి విస్తరింపచేశాడు: "నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యోహాను 5:24-25). తర్వాత "నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునైయున్నవి" అని ఆయన చెప్పాడు (6:63). ఎంతోమంది తన దగ్గర నుంచి వెనక్కి వెళ్ళిపోయిన విధంగానే "మీరు కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోతారా?" అని యేసు శిష్యుల్ని అడిగినప్పుడు, "ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు" అని పేతురు జవాబిచ్చాడు (వ. 68).

దేవునితో సంబంధాన్ని స్థాపించుకుని కొనసాగించడానికి ఆయన మాట వినడమూ విధేయత చూపించడమే కీలకం. దాని మూలంగా ఇప్పుడు సమృద్ధియైన జీవమూ పరలోకంలో ఆయనతో గడిపే నిత్యజీవమే ఫలితాలు. అయితే దేవుడు ఆజ్ఞాపించిన విధంగా వినే విషయంలో విధేయత చూపించే విషయంలో మనలో ఏ ఒక్కరూ కనీసం దగ్గరకు కూడా రాకపోవడమే సమస్యగా ఉంది.

2. దేవుని మాట విని ఆయనకు విధేయత చూపించడంలో మనందరం విఫలమయ్యాం, తద్వారా ఆయన శిక్షకు పాత్రులమయ్యాం.

ఆరంభ నుంచే దేవుడు చెప్పినదాన్ని విని, విధేయత చూపించడంలో మానవాళి విఫలమయ్యింది. దేవుడు మనిషితో మాట్లాడిన మొట్టమొదటి మాటలకే ఆదాము హవ్వలు అవిధేయులయ్యారు. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించి, వారిని ఏదేను వనంలో ఉంచి, ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా వాళ్లతో చెప్పాడు: "మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను" (ఆది 2:16-17). అయితే సాతాను వచ్చి, హవ్వ యొక్క చెవిని వంచాడు. దేవుడు చెప్పింది కాక, వాడు చెప్పినదాన్నే వినడానికి ఆమె నిర్ణయించుకుంది (3:1-6). ఆదాము హవ్వల అవిధేయత దేవునితో వారి సంబంధంలో ఆధ్యాత్మికమైన ఎడబాటుకు కారణమయ్యింది. ఫలితంగా దేవుడు వాళ్ళను శపించి, ఆ తోటనుంచి వాళ్లను బహిష్కరించాడు.

దేవుని సృష్టికే శిఖరాగ్రం లాంటివాళ్ళు ఆయన మొట్టమొదటి మాటలకే విధేయత చూపకపోవడం ఎంత విడ్డూరం, ఎంత విషాదకరం! దేవుడు చెప్పిన మాటను విని, దానికి విధేయత చూపించడంలో విఫలం కావడం వలన జన్మ పాపం (మూల పాపం) ఫలితంగా వచ్చింది. ఆనాటి నుంచి జీవించిన ప్రతి వ్యక్తి పాపంతో దుర్నీతిమయమై, దేవుని నుంచి వేరైపోయాడు (రోమా 5:12). మనమందరం పాప స్వభావంతో జన్మిస్తున్నాం, అది మనల్ని ఆధ్యాత్మికంగా మృతులనుగా చేస్తోంది, తద్వారా దేవుని మాటను వినే విషయంలో మనం అసమర్థులుగా ఉంటున్నాం (కీర్తన 51:5; ఎఫెసీ 2:1-3). మృతుడు దేన్నీ వినలేడు. మానవాళి యొక్క పాప స్వభావాన్ని వర్ణిస్తూ "తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషమువంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసికొనునట్టి చెవిటి పామువలె వారున్నారు" (కీర్తన 58:3-5) అని దావీదు రాశాడు.

స్వభావరీత్యా మనమందరం దేవునికి దూరస్థులుగా, వినికిడి సమస్య కలిగిన వాళ్ళుగా ఉన్నాం. "దేవుని నుంచి సుదూరంలో, అనంతమైన ఎడబాటులో ఉన్న మనుషుల ఆత్మలు...దేవుడు పిలుస్తున్నప్పటికీ...వెయ్యి మైళ్ళ దూరంలో ఉన్న మనుషుల కంటే ఎక్కువ వినలేవు" అని ప్యూరిటన్ తోమస్ షెపర్డ్ రాశారు4. పాపం మన జీవితంలోని విభాగాలన్నింటినీ నాశనం చేసింది, ఆలోచించి వివేచించగలిగే మన సామర్థ్యం నుంచి వినగలిగే మన సామర్థ్యం వరకు అన్నింటినీ పాపం ధ్వంసం చేసిందనే అభిప్రాయానికి సంపూర్ణ భ్రష్టత్వం అనే సిద్ధాంతం మనల్ని నడిపిస్తున్నది (ఈ సిద్ధాంతాన్ని సంపూర్ణమైన అసమర్థత అని పేర్కొనడం సబబు) . మనం దేవుడు చెప్పింది వినాలనుకోవట్లేదు దానికి తోడు, వినలేము కూడా! "ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు" అని రోమా 8:7-8 చెబుతున్నది. సహజంగానే దేవుని వాక్యానికి మనందరం విరోధులంగా ఉంటాం. మనలోని పాపం చేసే తిరుగుబాటు చేసే స్వభావం మనల్ని మొండివారిగా చేస్తుంది, దేవుడు చెప్పేదానిని వినేందుకు విముఖత చూపించేలా చేస్తుంది. ఆయనతో ఎలాంటి సంబందాన్నీ మనం కోరుకోము, ఒకవేళ కోరుకున్నా దేవుడు చెప్పినదాన్ని గ్రహించడం మనంతట మనకు అసాధ్యం.

దేవుడు చెబుతున్నదాని పట్ల శ్రద్ధ చూపించేందుకు మనకు చాలా కష్టమవ్వడం మాత్రమే కాదు, అసలు విషయం. దేవుడు చెప్పిన మాటల్ని అర్థంచేసుకోవడం గురించి కొంతసేపు పక్కనపెడితే, పాపంలో పడిపోవడం మూలంగా కలిగిన అత్యంత ప్రాథమికమైన పర్యవసానాల్లో ముఖ్యమైనది  అర్థంచేసుకోగలిగే విషయంలో మన అసమర్థతే. "మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననేగదా?...దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని యేసు చెప్పాడు"  (యోహాను 8:43, 47). దేవుని వాక్యాన్ని గ్రహించడంలో ప్రకృతి సంబంధియైన మనిషికున్న అసమర్థతను పౌలు ధృవీకరించాడు: "గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు" (రోమా 3:11). మనుషులందరూ "అంధకారమైన మనస్సుగలవారై" యున్నారు (ఎఫెసీ 4:18). "నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనముగా ఉన్నది" (1 కొరింథీ 1:18). మరొకరీతిగా చెప్పాలంటే తమ సహజమైన పాపపు స్థితిలో ఉన్న వ్యక్తులకు సువార్త సందేశం ఏమీ అర్థం కాదు. కారణమేంటంటే "ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయ ములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు" (1 కొరింథీ 2:14). దేవుడు తన వాక్యంలో చెప్పినదానిని విని, గ్రహించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించేది దేవుని ఆత్మయే.

దేవుని వాక్యాన్ని వినేందుకు మనల్ని అనుమతించే ఈ ముఖ్యమైన విషయం లేకుండానే మనందరం జన్మిస్తున్నాం. ఇది దేవుడు ఒక ఛానల్లో తన వాక్యాన్ని ప్రసారం చేస్తుంటే మనం వేరొక ఛానల్ చూస్తున్నట్లు ఉంది. మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు నివాసం చేయకపోతే వెలిగించే ఆయన సన్నిధి లేకపోతే మనమందరం చేయగలిగేది ఏదీ ఉండదు. అందువల్లనే బైబిలు, ప్రసంగము అవిశ్వాసులకు అర్థం కావు. బైబిలు వారిని అయోమయానికి గురిచేస్తుంది, విసిగిస్తుంది, కోపోద్రేక్తుల్ని చేస్తుంది. అదే సమయంలో తమలో పరిశుద్ధాత్మను కలిగిన విశ్వాసులు సైతం పాపంతో ఇప్పటికీ ఇబ్బంది పడుతుంటారు. దీన్నే పాపపు మైకం అని మా సెమినరీ ప్రొఫెసర్లలో ఒకాయన పిలుస్తూ ఉండేవాడు. లేఖనంలో రాయబడిన విషయాలను బట్టి చూస్తే దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించే విషయంలో దేవుని ప్రజలే అత్యంత దారుణమైన దోషులు అని తెలుస్తోంది.

దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించే విషయంలో విఫలమైన వారికి పాత నిబంధనలో ఉన్న కొన్ని ఉదాహరణలను పరిశీలించండి.5
యెహోవా మనకు ఏ దేశమును ఇచ్చెదనని వారి పితరులతో ప్రమా ణముచేసెనో, పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి యుండెను గనుక ఐగుప్తులోనుండి వచ్చిన ఆ యోధు లందరు యెహోవా మాట వినకపోయినందున వారు నశించువరకు ఇశ్రాయేలీయులు నలువది సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. (యెహోషువ 5:6)

"మీరు పోయి దొరికిన యీ గ్రంథపు మాటలను గూర్చి నా విషయములోను జనుల విషయములోను యూదావారందరి విషయములోను యెహోవాయొద్ద విచారణచేయుడి; మన పితరులు తమ విషయములో వ్రాయబడియున్న దానంతటి ప్రకారము చేయక యీ గ్రంథపు మాటలను విననివారైరి గనుక యెహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుచున్నది." (2 రాజులు 22:13).

"విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు...మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది." (యిర్మీయా 6:10, 17).

తన వాక్యాన్ని తన ప్రజలు వినాలనే దేవుని కోరిక గురించి, తన ప్రజలు వినడంలో విఫలం చెందారనే విషయం గురించి సుదీర్ఘమైన విచారమైన వ్యాఖ్యానమే పాత నిబంధన మొత్తంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు జాతి చరిత్రను క్లుప్తంగా చెబుతూ వారి సమాధిపై చెక్కబడిన స్మారక శ్లోకం ఏంటంటే "ప్రభువైన దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు, కానీ వాళ్ళు వినడానికి నిరాకరించారు" అని చెప్పవచ్చు. 6 దేవుని వాక్యాన్ని వినడంలో విఫలమైన ప్రజలకు ఏం జరుగుతుందో అనేదానికి విషాదకరమైన దృష్టాంతం ఇశ్రాయేలు ప్రజలే. వాళ్లు మొండివాళ్ళు, మెడ వంచలేనివాళ్ళు, దేవుడు వాళ్ళకిచ్చిన చెవుల్ని ఉపయోగించడానికి నిరాకరించేవారు. ఫలితంగా వారిని శిక్షిస్తానని లెక్కలేనన్నిసార్లు జారీచేసిన హెచ్చరికలను ఆయన అమలుచేశాడు.7

నీ యెదుటనుండకుండ యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవు డైన యెహోవా మాట మీరు వినకపోయినయెడల మీరును వారివలెనే నశించెదరు. (ద్వితీ 8:20)

అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును. (1 సమూ 12:15)

నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడును లేక పోయెను నేను మాటలాడినప్పుడు వినువాడొకడును లేక పోయెను. (యెషయా 66:4)

కొత్త నిబంధనలో కూడా తాను చెప్పిన మాటలను వినడానికి తాను చెప్పిన దానికి విధేయత చూపించడానికి నిరాకరించిన వారిపై ఇదే విధమైన తీర్పు వస్తుందని యేసు హెచ్చరించాడు. ఇసుకపై తన ఇంటిని కట్టుకున్న వానితో అతణ్ణి పోల్చి, భయంకరమైన తుఫాను దానిని పూర్తిగా నాశనం చేసిందని ఆయన చెప్పాడు (మత్తయి 7:24-27; లూకా 6:46-49). క్రీస్తు మాటలను వినకుండా, వాటికి విధేయత చూపించకుండా ఉండే ప్రతి ఒక్కరికి జరిగేది అదే. తీర్పు రోజున భూమి అంతటినీ దేవుని ఉగ్రత తుడిచి పెట్టేస్తున్నప్పుడు వారి ప్రాణాలు తుడిచిపెట్టబడతాయి, వారి ఆత్మలు దేవుని నిత్యమైన ఎడబాటును అనుభవిస్తాయి. తాము దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపి ఉంటే బాగుండేదని కోరుకునే ప్రజలతో నరకం నింపబడి ఉంటుంది. దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించడంలో విఫలమైన ప్రజలకు కొన్ని కొత్త నిబంధన ఉదాహరణలను పరిశీలించండి: 8

ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించు చున్నాను.ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించరు (మత్తయి 13:13).

వాడు ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి; మీరెందుకు మరల వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా యేమి అని వారితో అనెను. (యోహాను 9:27)

ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతు లున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. (హెబ్రీ 5:11)

దేవుని విశ్వంలో ఆయన చెప్పేది వినడం జీవులకు ఒక ప్రాథమికమైన అవసరం. మానవాళి దానికి అంగీకరించకపోవడం ఎంతో ఆశ్చర్యకరం. మన సృష్టి కర్త యొక్క విలాపాన్ని యెషయా ప్రవక్త ఈ విధంగా వ్యక్తపరిచాడు: "నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు. ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నా జనులు యోచింపరు" (యెషయా 1:2-3). బరువులు మోసే గాడిదలే తమ యజమానులకు తలొగ్గుతాయి, కానీ కుమారులే తిరుగుబాటు చేస్తారు. దేవుని సహనం శాశ్వత కాలం నిలువదు అనేదేమీ ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు. దేవుడు చెప్పేది వినకపోవడం వల్ల తుది శిక్ష ఏంటంటే మనం చెప్పేదాన్ని దేవుడు వినక పోవడమే. దేవుడు చెప్పేదాన్ని మనం వినకపోతే మనం చెప్పేదానిని ఆయన ఇక ఏ మాత్రమూ వినని రోజొకటి వస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడు (ద్వితీ 1:43-45; సామె 28:9; యిర్మీయా 11:14; జెకర్యా 7:13). దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించడం కంటే గొప్ప ప్రోత్సాహకం బహుశా ఏదీ లేదు.

3. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించే సామర్థ్యాన్ని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు.

మానవాళి పాపంలో పడిపోవడం మూలంగా దేవుడు తన వాక్యంలో చెప్పినదానిని అర్థం చేసుకోవడంలోనూ విధేయత చూపించే విషయంలోనూ మనం అసమర్థులంగా మారిపోయాము, కాబట్టి మనమందరం ఎంతో దారుణమైన శ్రోతలం. పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే దేవుని వాక్యాన్ని గ్రహించి, దానిని అంగీకరించడం మనకు అసాధ్యమే (1 కొరింథీ 2:11-14). దేవుని వాక్యాన్ని అంగీకరించి, దానిని అన్వయించుకోవడానికి దేవుని ఆత్మ మనకు ఎంతో అవసరం. అందువల్లనే నూతనంగా జన్మింపచేసి వాక్య వెలిగింపును అనుగ్రహించే పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని అర్థంచేసుకోవడం మన విధి.

మనం దేవుని వాక్యాన్ని చెవులతో విని, హృదయంతో గ్రహించగలగడానికి మొదట మనం పరిశుద్ధాత్మ మూలంగా తిరిగి జన్మించబడాలి. నూతన జన్మ అనే ప్రక్రియను యేసుక్రీస్తు తిరిగి జన్మించడంతో పోల్చాడు, అయితే భౌతికంగా కాదు, ఆధ్యాత్మికంగా! (యోహాను 3:3-8) తిరిగి జన్మించడం అనేది దేవుని ఆత్మ చేసే సహజాతీత కార్యం. ఆ కార్యం ద్వారా పాపంలో మరణించిన వారికి ఆయన ఆధ్యాత్మిక జీవాన్ని అనుగ్రహిస్తాడు, వాళ్లను సంపూర్ణంగా నూతన వ్యక్తులుగా మారుస్తాడు (ఎఫెసీ 2:1-6). మృతులను ఆధ్యాత్మికంగా జీవానికి తీసుకురావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించే పనిముట్టు దేవుని వాక్యమే (ఎఫెసీ 1:13; 6:17; యాకోబు 1:18: 1 పేతురు 1:23). పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని తన పాపం విషయంలో ఒప్పింపచేసి, రాబోయే దేవుని తీర్పును తప్పించుకోవడానికి అతడు యేసుక్రీస్తు యొక్క నీతితో అలంకరింపబడాలని ఒప్పించినప్పుడు అతడు తిరిగి జన్మిస్తాడు (యోహాను 16:8). ఒక వ్యక్తి తిరిగి జన్మించిన క్షణంలోనే పరిశుద్ధాత్మ దేవుడు అతనికి నూతన స్వభావాన్నిస్తాడు. అతని జీవితంలో చోటు చేసుకునే మార్పు ద్వారా ఆ నూతన జన్మ స్పష్టమవుతుంది (రోమా 12:2; ఎఫెసీ 4:22-24; తీతు 3:5).

దేవుని వాక్యం యెడల ప్రేమ కలిగి ఉండడమే ఒకడు నిజంగా తిరిగి జన్మించాడు అనడానికి స్పష్టమైన రుజువుల్లో ఒకటి. పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి జన్మింప చేయడానికి ముందు దేవుని వాక్య ప్రకటన మనకు చికాకు తెప్పిస్తుంది, విసుగు పుట్టిస్తుంది. ఒక్కసారి మనం రక్షించబడగానే అకస్మాత్తుగా అది మనకు అర్థమవుతుంది, ఆసక్తికరంగా ఉంటుంది, మన జీవితాలపై మార్పు తీసుకొచ్చే ప్రభావాన్ని కనపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సంఘాలకు హాజరయ్యే ప్రజల్లో చాలామంది తమ జీవితకాలమంతా సంఘానికి వెళుతూనే ఉన్నా దేవుని వాక్య ప్రసంగంలో ఏ విధంగానూ ఆసక్తిని కలిగి ఉండరు. వాళ్లెన్నడూ తిరిగి జన్మించలేదు అనడానికి అదే సాక్ష్యం. క్రీస్తునందు విశ్వాసముంచామనే మాట వారు చెప్పి ఉండొచ్చు కానీ ఆయనను తమ ప్రభువుగా రక్షకునిగా వాళ్లు నిజంగా ఎన్నడూ ఎరిగి ఉండరు. దేవుడు తన వాక్యంలో చెప్పినదానిని అంగీకరించి, దానికి స్పందించగలగాలంటే యేసుక్రీస్తును ఎరుగుట అనివార్యమైన అవసరత. "దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు" అని స్వయంగా యేసే చెప్పాడు (లూకా 8:21). యేసు పొరబడే అవకాశమే లేదు. తన కాలంలో మత నాయకులతో "మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు గనుక నన్ను చంప వెదకుచున్నారు" అని యేసు చెప్పాడు. అదే సందర్భంలో "దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు" అని చెప్పాడు (8:47). దేవుని సంబంధిగా ఉండి, దేవుని వాక్యాన్ని విని, దానికి లోబడడానికి మనం తిరిగి జన్మించాలి (యోహాను 18:37; 1 థెస్స 2:13; హెబ్రీ 4:2; 1 యోహాను 4:5-6).

మనల్ని తిరిగి జన్మింపచేసిన తర్వాత దేవుని ఆత్మ మనలో నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. యేసు పరలోకానికి తిరిగి చేరుకోవడానికి ముందు తన అనుచరులు తన మాటలను నేర్చుకుని వాటిని పాటించడంలో సహాయపడేందుకు పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన వాగ్దానం చేశాడు (యోహాను 14:16; 16:12-15; 1 యోహాను 2:27). దేవుని వాక్య సత్యాన్ని వినాలనే కోరికను మాత్రమే కాక దానిని గ్రహించగలగడానికి లోబడగలిగే సామర్థ్యాన్ని కూడా మనకు అనుగ్రహించేది మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క సన్నిధే. ప్రతి విశ్వాసి జీవితంలో పరిశుద్ధాత్మ చేసే ఈ నిరంతర కార్యానికి వెలిగింపు అని పేరు. ఈ కార్యం ద్వారా పరిశుద్ధాత్ముడు విశ్వాసులను వెలిగిస్తాడు, వాక్యాన్ని అర్థంచేసుకునే తమ జీవితానికి అన్వయించుకునే సామర్థ్యాన్ని వారికి అనుగ్రహిస్తాడు.

మనం తిరిగి జన్మించిన క్షణంలోనే దేవుని వాక్యంలో మనం ఇంతకుముందు వినలేకపోయిన చూడలేకపోయిన సత్యాల్ని వినడానికి చూడడానికి దేవుడు మనకు కొత్త వినికిడి యంత్రాలను కొత్త కళ్ళజోళ్లను అనుగ్రహిస్తున్నట్లు ఉంది ఈ కార్యం. అప్పటి నుంచే దేవుడు చెప్పినదానిని మనం గ్రహించగలుగుతున్నాం, అంతేకాదు ఇప్పుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం చెబుతున్నదాని విషయంలో మనల్ని ఒప్పిస్తున్నాడు, అంతేకాదు దానికి అనుగుణంగా మన జీవితాలను మలుస్తున్నాడు. అందువల్లనే మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటున్నామో దాని అర్థం ఏంటో మన జీవితానికి అదెలా పనికొస్తుందో గ్రహించేలా మన మనసుల్ని హృదయాల్ని వెలిగించమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగడం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్యానికి కచ్చితంగా భాష్యం చెప్పడానికి ఆచరణాత్మకంగా దానిని అమలుచేయడానికి దానిని ప్రేరేపించిన వాడు తప్ప మనకు శ్రేష్ఠమైన సహాయం ఎవరు చేయగలరు?

పరిశుద్ధాత్ముడు తిరిగి జన్మింపచేసే కార్యాన్ని, వెలిగించే పరిచర్యను జరిగించకపోతే మనం దేవుని వాక్యాన్ని వినలేము, దానికి విధేయత చూపించలేము. విశేషం ఏంటంటే యేసుక్రీస్తును మనం స్వీకరించే వరకు మనం పరిశుద్ధాత్మను పొందలేము, దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే యేసుక్రీస్తును మనం పొందలేము, పరిశుద్ధాత్మ దేవుడు వినడానికి మన చెవులను తెరవకపోతే మనం దేవుని వాక్యాన్ని అంగీకరించలేము, మన చెవుల్ని చేసింది దేవుడే తనకు నచ్చినట్లుగా వాటిని తెరుస్తాడు మూసేస్తాడు (నిర్గమ 4:11; సామె 20:12; ద్వితీ 29:4; యోబు 33:16; 36:10-12; కీర్తన 40:6; మార్కు 7:37; రోమా 11:8). క్రీస్తు వాక్యాన్ని వినే విషయంలో మనకున్న సామర్థ్యమే దైవ ప్రత్యక్షతకు మన ఆత్మ రక్షణకు మధ్యనున్న సంబంధం అనేది ఎంత సత్యమో, ఫలితం విషయంలో మనం పూర్తిగా దేవుని సార్వభౌమత్వంపైన ఆధారపడి ఉన్నామనే విషయం కూడా అంతే సత్యం. మనుషుల్ని సాధు పరచడానికి రక్షించడానికి పవిత్రపరచడానికి కాక దేవుడు కొన్నిసార్లు మనుషుల్ని కఠినపరచాలని నాశనం చేయాలని తన వాక్యాన్ని పంపిస్తుంటాడు (యెషయా 55:10-11; 2 కొరింథీ 2:15-17). అందువల్లనే మనం ఆయన వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించేలా మన చెవుల్ని తెరవమని త్వరితగతిన మనం ఆయనకు మొరపెట్టాలి (యెషయా 50:4-5), మన జీవితమూ నిత్యగమ్యమూ దానిపైనే ఆధారపడి ఉన్నాయనే వాస్తవపు వెలుగులో మరిముఖ్యంగా మనం ఇలా చేయాలి.

4. దేవుని మాటను విని, మనం ఆయనకు విధేయత చూపిస్తే ఇప్పుడూ నిత్యత్వమంతా కూడా ఆయన మనల్ని దీవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

నేను ఇంతకుముందే ప్రస్తావించిన విధంగా బైబిల్లో దేవుడు చెప్పినదానికి మనం స్పందించే విధానమే భూమిపై ఇక్కడ మన జీవిత విధానాన్ని నిత్యత్వం మనం ఎక్కడ గడుపుతామనే విషయాన్ని అంతిమంగా నిర్ధారిస్తుంది. సమృద్ధియైన జీవాన్ని ఇప్పుడు అనుభవించడానికి, పరలోకంలో నిత్యత్వాన్ని ఆయనతో గడపడానికి కీలకమైన విషయం దేవుడు చెప్పేది విని దానికి విధేయత చూపించడమే. దేవుని వాక్యాన్ని వినకపోతే ఆయనకు విధేయత చూపించకపోతే ఆయన సహాయం లేకుండా నిరీక్షణ లేకుండా జీవితాన్ని జీవించాల్సి వస్తుంది, నరకంలో నిత్యమూ ఆయననుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించే వారి కోసం బైబిల్లో ఉన్న అనేక వాగ్దానాల్లో కేవలం కొన్నింటిని పరిశీలించండి: 9

"కాబట్టి మీ పూర్ణహృదయముతోను మీ పూర్ణాత్మ తోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయెడల
మీ దేశమునకు వర్షము, అనగా తొలకరివానను కడవరివానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షా రసమును నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తిపొందునట్లు నీ పశువులకొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను" (ద్వితీ 11:13-15)

నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. సామెతలు 1:33

దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. లూకా 11:28

ఇక్కడే బైబిల్ కి అనుగుణమైన శ్రవణేంద్రియ శాస్త్రం ఉంది. ఈ నాలుగు నియమాలే వినడం గురించి దైవశాస్త్రపరమైన పునాదిని వేస్తున్నాయి. ఈ పుస్తకంలోని మిగిలిన ఆచరణాత్మక ఉపదేశం ఈ పునాదిపైనే ఆధారపడి ఉంటుంది. మనం ముందుకు వెళ్తుండగా వినే విషయంలో నీకున్న వ్యాధుల్ని నిర్ధారించడానికి వాటికి వైద్యం చేయడానికి నేను సహాయం చేస్తాను. మనం మొదటిగా, ముఖ్యంగా దృష్టిసారించాల్సింది మన హృదయంపైనే. ఎందుకంటే హృదయం నుంచే జీవధారాలు బయలుదేరును (సామె 4:23). వినే విషయంలో నీకున్న సమస్య నీ హృదయ సమస్య అయ్యుండవచ్చు.

అధ్యయనం/చర్చ కోసం

1. వినడం గురించి విధేయత గురించి మాట్లాడే విస్తారమైన బైబిల్ వచనాలలో అత్యంత నిర్బంధించేవి ఆజ్ఞలా? హెచ్చరికలా? వాగ్దానాలా? లేదా దృష్టాంతాలా? కారణం ఏంటి?

2. కీర్తన 58:3-5; యోహాను 8:43, 47; రోమా 3:11; 8:7-8; 1 కొరింథీ 1:18; 2:14 వాక్యభాగాలను చదవండి. దేవుని వాక్యాన్ని విని, దానికి విధేయత చూపించే నీ సామర్థ్యాన్ని సంపూర్ణ భ్రష్టత్వం ఎలా ప్రభావితం చేసింది?

3. ద్వితీ 8:3; 30:19-20; యెషయా 55:2-3; యోహాను 5:24-25; 6:63, 68 చదవండి. వినడానికి, ఈ భూమిపై మీ జీవితానికి, మీ నిత్య గమ్యానికి మధ్యనున్న సంబంధం ఏంటో ఈ వచనాలలో పరిశీలించండి.

దేవుని వాక్యాన్ని వినగలిగి దానికి విధేయత చూపించగలిగి ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి ఉండే విధంగా కృపతో నీ చెవులను తెరిచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెప్పు. దేవుని వాక్యాన్ని వినడంపైనే నీ జీవితం ఆధారపడి ఉందన్నట్టుగా వినడమెలాగో నేర్చుకోవడానికి సహాయం చేయమని ఆయనను అడుగు.

 మీరు వినేది మీకు అస్సలు సంబంధం లేదన్నట్లు నిర్లక్ష్య హృదయంతో వినడానికి రావొద్దు. కానీ మీరు వినాల్సిన పవిత్రమైన వాక్యం వివరింపనశక్యమైన భారాన్ని ఆవశ్యకతను పర్యవసానాన్ని కలిగినదనే భావనతో రండి. అది మీకు ఎంత ప్రయోజనకరమైనదో మీరు అర్థంచేసుకున్నప్పుడు జీవ వాక్యంగా మీరు దాన్ని నిజంగా ప్రేమించినప్పుడు ప్రతి సత్యం గురించిన మీ అవగాహనకు అది గొప్పగా తోడ్పడుతుంది. మనిషి దేనినైతే ప్రేమించడో దేనినైతే ఆవశ్యకమైనదని భావించడో అతడు దానిని పెద్దగా పట్టించుకోడు, శ్రద్ధగా వినడు, అతని మనసుపై అది ఏ మాత్రమూ ప్రభావాన్ని కనుపరచదు.
-రిచర్డ్ బాక్స్టర్

అధ్యాయం 2

నీ హృదయంతో వినడం

​విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను.
మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను. మరి కొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటి నణచివేసెను.
మరికొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచువినుటకు చెవులు గలవాడు వినును గాక అని బిగ్గరగా చెప్పెను. లూకా 8:5-8

నేను మొదటిసారి కాపరిగా పనిచేసిన సంఘం విత్తువాని ఉపమానానికి 21వ శతాబ్దపు నమూనాగా ఉంది. "నువ్వు తప్పనిసరిగా ఇక్కడ చాలా పోరాటమే చేయాల్సి వస్తుంది" అని నేను ఆ సంఘాన్ని తొలిసారి దర్శించినప్పుడే హెచ్చరించబడ్డాను. కాబట్టి ఆ స్థానాన్ని తీసుకోవడానికి నేను నిజంగానే భయపడ్డాను. నన్ను ప్రోత్సహించడానికి, కందిరీగల తుట్టెలా ఉన్న ఆ సంఘంలో పనిచేయాలనే నా భయాన్ని ఉపశమింపచేయడానికి ఆ సంఘ సిబ్బందిలో ఒకరు: "పౌలు పద్ధతి ఏంటంటే  నగరంలోకి వెళ్లి, అక్కడ ఒక అల్లరి సృష్టించి, తర్వాత జైలుకు వెళ్లిపోవడమే. మేము నిన్ను జైలు నుంచి బయటపడేయడానికి ప్రయత్నిస్తాము" అని అన్నారు. చివరికి నేను ఆ సంఘంలో పనిచేయడానికి వెళ్ళాను, ఆ సంఘంలో గొడవ మొదలవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ సంఘం ప్రమాదం వైపుకు దూసుకు వెళ్తుందనడానికి మొదటి సూచన నా ప్రసంగాలకు వచ్చిన విభిన్నమైన స్పందనలే.

ఒకానొక ఆదివారం నాడు జరిగిన సంఘటనను నేను ఎన్నడూ మర్చిపోలేను. సంఘానికి హాజరైన వాళ్ళు తమ ఇళ్లకు వెళ్లిపోతుండగా వారిని పలకరించడానికి నేను వెనుక ద్వారం వద్ద నిలబడి ఉన్నాను. ఒక వ్యక్తి ఎంతో ఉత్సాహంతో నన్ను సమీపించి నా చేయి గట్టిగా పట్టుకుని "ఇంతవరకు నేను విన్న ప్రసంగాల్లో ఇదే అత్యంత శ్రేష్ఠమైనది" అని చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో విశ్రాంతి గది దగ్గర అసంతృప్తికి లోనైన కొద్దిమంది గుంపుకూడి ఉండడం నేను గమనించాను. తాము విన్న ప్రసంగాల్లో అత్యంత చెత్త ప్రసంగం అదేనని వాళ్లు చర్చించుకుంటున్నట్లు తర్వాత నాకు సమాచారం అందించబడింది.

తర్వాత నెలల్లో సంఘంలో అంతకంతకూ చీలికలు ఎక్కువై పోయినప్పుడు అలాంటి సవాలుకరమైన సమయాల్లో నేను స్థిరంగా కొనసాగడానికి అవసరమైన ఆదరణను ధైర్యాన్ని ఆ ప్రత్యేకమైన సన్నివేశం నాకు సమకూర్చింది. దేవుని వాక్య ప్రకటనకు వచ్చిన రెండు పూర్తి విభిన్నమైన స్పందనలే సంఘంలో కాదు, మనుషుల హృదయాల్లో ఏం జరుగుతుందనే సరైన దృక్పథాన్ని కొనసాగించడానికి నన్ను అనుమతించింది. దేవుని వాక్యం అనే విత్తనాన్ని నమ్మకంగా నేను విత్తడం కొనసాగించినప్పుడు అది విభిన్నమైన నేలలపై పడింది, భిన్నమైన స్పందనలు కలిగించింది. కొందరు దాన్ని బాహాటంగా తృణీకరించారు, ఇతరులు దాన్ని సహించారు, ఇంకొందరు తమకు కావలసినంత పొందుకోలేకపోయారు.

మనం వింటున్న ప్రసంగాలకు మనందరం భిన్నంగా స్పందించడానికి కారణం మన చెవులు కాదు, మన హృదయాలు అని మీరు గమనిస్తున్నారా? మానవ దృక్పథం నుండి చూస్తే మన జీవితాలను దేవుని వాక్యం ప్రభావితం చేసే విధానం మన హృదయాల సిద్ధపాటు పైన వ్యవసాయ పరిభాషలో చెప్పాలంటే నేల యొక్క స్థితి పైన ఆధారపడి ఉంటుంది. విత్తువాడు విత్తనం నేలలు గురించి యేసు చెప్పిన ఉపమాన సారాంశం అదే. నేలలు గురించిన ఉపమానం అనే శ్రేష్ఠమైన రీతిలో పేర్కొనబడే ఈ తొలి ఉపమానమే ఇతర ఉపమానాలన్నింటికీ పునాది వేసింది. వాస్తవానికి ఈ ఉపమానాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే వేరే ఏ ఇతర ఉపమానాలను నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్పే స్థాయికి మార్కు వెళ్లిపోయాడు (4:13). యేసు చెప్పిన అనేక ఇతర ఉపమానాలకు భిన్నంగా ఈ ఉపమానానికి ఆయన స్పష్టమైన విపులమైన భాష్యాన్ని/వివరణను సమకూర్చాడు. యేసుక్రీస్తు విత్తువాడు (మనుష్య కుమారుడు- మత్తయి 13:37- దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు). దేవుని వాక్యమే విత్తనం (వ. 11). విత్తనం ఏ నేల మీదయితే పడిందో అది మానవ హృదయం (వ. 12).

యూదుల మనుగడకు వ్యవసాయమే కీలకమైనది. తమకు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని, జీవనం కొనసాగించడానికి వ్యవసాయమే మార్గం. పంటలను పండించే ప్రక్రియను ప్రతి ఒక్కరూ అర్థంచేసుకునేవారు. రైతు ఒక సంచిలో విత్తనాలను తీసుకుని, తన భుజంమీద పెట్టుకొని, పొలమంతటా నడుస్తూ, పిడికెడు విత్తనాలను తీసుకుని, నేలపై చల్లుతూ ఉండేవాడు. బహుశా యేసు ఈ ఉపమానం చెబుతున్నప్పుడు ఒక రైతు తన పొలంలో విత్తనాలు చల్లుతూ ఉండి ఉండవచ్చు. ప్రజలు వాస్తవానికి పొలాల్లో విత్తనాలు చల్లుతున్న రైతుల్ని చూస్తూ ఉండి ఉంటారు. ఆ విత్తనాల్లో కొన్ని పొలాలకు మధ్యలో ఉన్న గట్లపైన పడుతున్న విషయం ప్రతి ఒక్కరు ఎరిగినదే. కొన్ని రాతి నేలమీద, కొన్ని ముళ్ళ పొదల్లో, కొన్ని మంచి నేలపై పడేవి.

విత్తనాల స్థితి, చేతికొచ్చే పంట ఇలా ప్రతీదీ ఆ నేల పరిస్థితిపైనే ఆధారపడి ఉండేది. ఈ నాలుగు రకాల నేలలను దేవుని వాక్యం పడే నాలుగు రకాలైన హృదయాలను ఉదాహరించడానికి యేసు ఉపయోగించాడు.

కొద్దిమంది శ్రోతలకు మొండిదైన, తిరస్కరించే హృదయం ఉంటుంది.

కొద్దిమంది శ్రోతలకు లోతులేని సారహీనమైన హృదయం ఉంటుంది.

కొద్దిమంది శ్రోతలకు లోకానుసారమైన, అణిచివేయబడే హృదయం ఉంటుంది.

కొద్దిమందికి మృదువైన, అంగీకరించే హృదయం ఉంటుంది. దేవుని వాక్యానికి మనం సరిగ్గా స్పందించాలంటే మనందరికీ ఇలాంటి హృదయమే కావాలి.

దేవుని వాక్య ప్రకటనకు నాలుగు భిన్నమైన హృదయ స్పందనలను మనం పరిశీలిద్దాం.

రాటుదేలిన త్రోవ

పాలస్తీనా ప్రాంతం పొలాలతో నిండి ఉంటుంది. పొలాల మధ్యన సరిహద్దులుగా గోడలు కంచెలు ఉండేవి కావు. కేవలం పొలం గట్లు మాత్రమే ఒక పొలం నుంచి వేరొక పొలాన్ని వేరుచేసేవి. బాటసారులందరూ ఈ పొలంగట్ల మీదనే నడవడం వల్ల ఇవి కాంక్రీటు అంత గట్టిగా తయారయ్యేవి. త్రోవలో పడిన విత్తనాలు రాటుతేలిన ఆ నేల లోపలికి చొచ్చుకుపోలేక పోయేవి. అందువల్ల బాటసారులు వాటిని తొక్కేసేవారు, పక్షులు వాలి, వాటిని తినేసేవి. రహదారిగా మారిన ఈ నేల దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టంలేని, కఠిన హృదయం కలిగిన వ్యక్తిని సూచిస్తున్నది. ఈ లోకంలోని చాలామంది వ్యక్తులు ఈ జాబితాలోకి వస్తారు. వాళ్లకు దేవుని వాక్యంపైన ఏ మాత్రమూ అవగాహన ఉండదు, దేవుని వాక్యానికి వాళ్ళు ఏ మాత్రమూ చలించరు. బైబిలు, సంఘము వారి జీవితాలకు సంబంధం లేనివి. ఇలాంటి హృదయం కలిగిన కొందరు సంఘానికి అప్పుడప్పుడు వస్తుంటారు, కొన్ని సందర్భాలలో క్రమంగానే హాజరవుతుంటారు. అయితే ప్రసంగ వేదిక నుంచి చెప్పబడే దేని విషయంలోనూ వాళ్ళు శ్రద్ధ వహించరు. వాళ్లకు ఆసక్తి ఉండదు, త్వరగా వారి దృష్టి వేరే విషయాలపైకి మళ్లిపోతుంది, ప్రసంగం వారిని విసిగిస్తుంది. ప్రసంగం ఒక చెవిలో నుంచి లోపలికి వెళ్తుంది, మరొక చెవి నుంచి బయటికి వచ్చేస్తుంది. తారు మీద పడిన విత్తనం మాదిరిగా, ఉదాసీన వైఖరిగల, కఠినమైన హృదయంపై దేవుని వాక్యం ఎగిసిపడుతుంది.

వాక్యం లోపలికి చొచ్చుకుపోలేనంత కఠినంగా వారి హృదయం ఉండడానికి కారణం, అది పూర్తిగా పాపంతో నిండి ఉండడమే. పాపపు తలంపులు పాపపు చర్యలు పాపపు మాటలు ఒక సైన్య సమూహంలా వారి హృదయాన్ని తొక్కిపడేసాయి. తమ దుర్నీతితో వాళ్ళు సత్యాన్ని అణిచేస్తున్నారు (రోమా 1:18), పాపం యొక్క మోసంతో హృదయం కఠిన పరచబడేలా వాళ్ళు అనుమతించారు (హెబ్రీ 3:13). అందువల్ల దేవుని వాక్య ప్రకటనను వారి హృదయం ఏ మాత్రమూ స్వీకరించలేదు, దానికి స్పందించలేదు. తమ పాపాన్ని బట్టి ఏ విధంగానూ దుఃఖాన్ని దోష భావనను విరిగినలిగిన మనస్సును పశ్చాత్తాపాన్ని, దేవుని యెడల ఇతరుల యెడల శ్రద్ధను వారి హృదయము ఏ మాత్రమూ కనపరచదు. వాళ్లు విశ్వాసముంచకుండా తద్వారా రక్షించబడకుండా ఉండేలా దేవుని వాక్యం అనే విత్తనం వారి హృదయమనే నేలపైన పడగానే దానిని ఎత్తుకొని పోవడానికి సాతాను క్రూరమైన రాబందు మాదిరిగా వారి హృదయాలపై ఎంతో ఆసక్తిగా ఎగురుతూ ఉంటాడు. క్రీస్తు ద్వారా రక్షణను అనుభవించకుండా మనుషుల్ని అడ్డుకోవడంలో సాతాను యొక్క వ్యూహాన్ని పౌలు స్పష్టంగా వర్ణించాడు: "దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను" (2 కొరింథీ 4:4). ఈ వర్ణన నీ హృదయం గురించినదేనా? మొండిదైన, గ్రహించని హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా?

ఆసక్తికరమైన విషయం ఏంటంటే యేసు ఉపమానాలనే బోధించడానికి ఉపయోగించడం వెనకున్న ఉద్దేశం కఠినులైన శ్రోతల రాతి గుండెలను బహిర్గతం చేయడమే. ఉపమానాలు విశ్వాసులకు సత్యాన్ని వెల్లడి చేస్తాయి, అవిశ్వాసుల నుంచి సత్యాన్ని మరుగుచేసే విషయంలో కూడా అంతే ప్రభావంతో పనిచేస్తాయి. ఈ ఉపమానం చెప్పడానికి దానికి అర్ధాన్ని వివరించడానికి మధ్యలో యేసు తన శిష్యులతో "దేవుని రాజ్యమర్మము లెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయు, వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమానరీతిగా బోధింపబడుచున్నవి" అని చెప్పాడు (లూకా 8:9-10; మత్తయి 13:10-16). రాజ్య మర్మాలు అంటే దేవుని రహస్యాలు అని అర్థం. దేవుని వెలిగింపుతో మాత్రమే వాటిని మనం అర్థంచేసుకోగలం. నీకు నువ్వుగా తెలుసుకోలేనివి, ఉపమానాల ద్వారా కేవలం దేవుడు మాత్రమే తెలియచేయాల్సినవి కొన్ని ఉన్నాయి. యెషయా 6:9 ని యేసు ఉటంకించాడు. ఆ వాక్యభాగంలో ఇశ్రాయేలు జనాంగం ప్రవక్త యొక్క మాటలను ఇష్టపూర్వకంగా తృణీకరించి, ఆ సత్యానికి ఉద్దేశపూర్వకంగానే తమ కళ్ళను చెవులను మూసేసుకున్నది. ఆ సత్యాన్ని వాళ్లు చూడాలనుకోలేదు, వినాలనుకోలేదు. అందువల్ల ఆ సత్యాన్ని దేవుడే మసకపరిచి, వారి నుంచి దానిని దాచిపెట్టాడు. ఇశ్రాయేలీయులు చేసిన విధంగానే తనకు కూడా చేసే మనుషులు ఉన్నారని యేసు అవగాహన కలిగి ఉన్నాడు. అందువల్లనే ఆయన సత్యాన్ని మసకపరిచి, వారినుంచి దాచిపెట్టాడు. తరచూ అంకితభావంలేని ప్రేక్షకులు యేసు ఏం మాట్లాడుతున్నాడో అనే విషయాలు ఏ మాత్రమూ అర్థంచేసుకోలేకపోయారు, దానిని వివరించమని ఆయనను అడగాలని కూడా ఎన్నడూ ప్రయత్నం చేయలేదు, కాబట్టి ఉపమానాలే అవిశ్వాసానికి ప్రతిఫలమైన శిక్షను సూచిస్తున్నాయి. దానికి భిన్నంగా వాళ్లు తమ చూపు పక్కకి తిప్పుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు. అయితే ఇది కూడా దేవుని ప్రణాళికే. జాన్ పైపర్ గారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు:

దేవుని వాక్య ప్రకటన హృదయాన్ని మృదువుగా చేయనప్పుడు రక్షించనప్పుడు స్వస్థపరచనప్పుడు కూడా అది ప్రభావం లేనిది కాదు. దేవుని వాక్య ప్రకటన భయంకరమైన తీర్పుతీర్చే దేవుని కార్యాన్ని జరిగిస్తుండవచ్చు. అది బహుశా మనుషుల్ని కఠిన పరుస్తుండవచ్చు, మరొక్కసారి ఎన్నడూ వినాలనే కోరికలేనంతగా వారి చెవులను మొద్దు బారుస్తుండవచ్చు. దేవుని వాక్యాన్ని వారం తర్వాత వారం వినడాన్ని బట్టి గర్వించకు. అది హృదయాన్ని మృదువుగా చేయకపోతే, రక్షించకపోతే, స్వస్థపరచకపోతే, ఫలాలను కలిగించకపోతే, బహుశా అది కఠినపరుస్తుండవచ్చు అంధుల్ని చేస్తుండవచ్చు మొద్దుబారిపోయేలా చేస్తుండవచ్చు.2

అంగుళం లోతున్న నేల

రెండవ నేల, రాళ్లతో నిండి ఉన్న నేలను సూచించట్లేదు. రైతులు ఎంతో జాగ్రత్తగా తమ పొలాలను దున్ని, అందులోని రాళ్ళను తొలగిస్తారు. అయితే ఇశ్రాయేలు ప్రాంతంలో భూమి లోపల పొరల్లో ఒక సున్నపురాయి పొర  అలుముకుని ఉంటుంది, కొన్ని ప్రదేశాలలో అది ఉపరితలానికి కేవలం కొన్ని అంగుళాల లోతులో మాత్రమే ఉంటుంది (మార్కు 4:5). మట్టి లోతుగా లేని నేలపై పడిన విత్తనాలు వెంటనే తమ వేళ్ళను లోపలికి పంపించ నారంభిస్తాయి. అయితే మట్టి లోతుగా లేనందువల్ల, వేర్లు లోపల ఉన్న సున్నపురాతి బండను తాకి, లోపలికి చొచ్చుకుపోలేక, పైకి ఎదగడం ప్రారంభిస్తాయి. అందువల్ల అది వేగంగా ఎదిగి, మిగిలిన పంట అంతటి కంటే ఎక్కువ ఆకులను ఉత్పత్తి చేస్తుంది. అయితే వేర్లు సరిపడినంత తేమను పొందలేవు కాబట్టి అది వేగంగానే వాడిపోతుంది. ఎలాంటి ఫలాన్నీ ఉత్పత్తి చేయడానికి ముందే, అది ఎండకు మాడిపోయి చచ్చిపోతుంది.

చెల్లించాల్సిన వెల గురించి ఏ మాత్రం ఆలోచించకుండానే దేవుని వాక్యానికి ఉద్రేకంతో ఉత్సాహంతో స్పందించే వారిని రాతినేల సూచిస్తున్నది.‌ తక్షణ ఉద్రేకంతో వాళ్లు సువార్త సందేశాన్ని హత్తుకుంటారు, కానీ యేసుక్రీస్తును అనుసరించడంలో తమను తాము అంకితం చేసుకోవడం అంటే అర్థం ఏమిటో దానిలోని ప్రాముఖ్యత ఏంటో వాళ్ళు అర్థంచేసుకోరు. వారి విశ్వాసం అల్పకాలం ఉంటుంది (మార్కు 4:17). వారు ఏదైనా శ్రమను అనుభవించిన వెంటనే క్రీస్తునందు తాము వ్యక్తపరిచిన విశ్వాసాన్ని బట్టి హింసను ఎదుర్కొన్న వెంటనే వాళ్లు తమ విశ్వాసాన్ని వదిలిపెట్టి, సంఘాన్ని విడిచిపెడతారు. వాళ్లు "కేవలం సహోదరులని పిలువబడిన వాళ్ల" కంటే ఎక్కువ కాదని ఇది నిరూపిస్తుంది (1 కొరింథీ 5:11).

ఇలాంటి వ్యక్తులు నాకు తెలుసు. వీళ్లు పరిచర్యలో నాకు అత్యంత నిరాశ కలిగించిన వారిలో కొందరు. ప్రసంగం పూర్తయిన వెంటనే వీళ్ళు పరిగెత్తుకు వచ్చి, ఆ సందేశం ఎంత అద్భుతంగా ఉందో, తాము ఎంతగా ఒప్పించబడ్డారో నాకు చెబుతుంటారు. తమ జీవితాలను జీవించే విధానం గురించి వాళ్లు నిజంగా విరిగిపోయినట్లు కనిపిస్తారు. తమ కళ్ళనిండా కన్నీళ్ళతో క్రీస్తునందు విశ్వాసముంచామని చెబుతారు. బైబిల్ చదవడం ప్రార్థించడం సంఘానికి రావడం గురించి వాళ్లెంతో ఉత్సాహాన్ని కనపరుస్తారు. వాళ్లకు ఎప్పుడు అవకాశం వచ్చినా మాట్లాడుతుంటారు, తమ ఉత్సాహంతో అత్యంత పరిణతి చెందిన క్రైస్తవులను సైతం వాళ్లు సిగ్గుపరుస్తారు. వాళ్లు నిజమైన భక్తుల్లాగానే కనిపిస్తారు. అయితే క్రైస్తవులుగా ఉన్నందుకు వెల చెల్లించాల్సి వచ్చిన వెంటనే నిలబడాల్సి వచ్చిన వెంటనే వారిలోని ఉద్వేగపూరిత వెంటనే ఆసక్తి కనుమరుగైపోతుంది. శ్రమలు శోధనలు వచ్చిన వెంటనే వాళ్లు తమ పాత జీవనశైలికి వెళ్ళిపోతారు, మరలా ఎన్నడూ కనబడరు. ముగింపు: వీరి స్పందన పూర్తిగా తాత్కాలికమైన, ఉద్రేకపూరితమైన స్పందన. "వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి" అని 1 యోహాను 2:19లో వర్ణించబడిన వాళ్లు ఇలాంటి వారే. ఇది నీ హృదయాన్నే వర్ణిస్తోందా? లోతులేని పైపై భక్తినే నువ్వు కలిగి ఉన్నావా?

కలుపుమొక్కల వలన మరణం

మూడవ రకపు నేల ఉపరితలంపైన బాగానే కనిపిస్తుంది, కానీ ఉపరితలానికి కింద కలుపు మొక్కలతో ముళ్ళతో నిండిన విషపూరితమైన వల ఉంటుంది, మొక్క చుట్టూ పెరగడానికి వేచి చూస్తూ ఉంటుంది. మొక్కల కన్నా పెద్దగా వేగంగా కలుపు మొక్కలు పెరుగుతుంటాయి. కలుపు మొక్కల పెద్ద ఆకులు సూర్యుని వెలుతురు మొక్కలపైన పడకుండా నిలువరిస్తాయి, వాటి బలమైన వేళ్ళు వాటి చుట్టూ ఉన్న తేమ అంతటినీ పీల్చుకుని, మొక్క కోసం దేనినీ విడిచిపెట్టవు. ఫలితంగా మొక్క ఎలాంటి ఫలమూ ఫలించడానికి ముందే అది అణచివేయబడి, మరణిస్తుంది (మత్తయి 13:22; మార్కు 4:7).

దేవుని వాక్యాన్ని అంగీకరించినా లోక విషయాలతో హృదయం, మనస్సు నిండిపోయి ఉండడం వల్ల, ఫలించడానికి సువార్తకు స్థానం లేనందువల్ల, ఏ వ్యక్తిలోనైతే సువార్త ఊపిరాడక మరణిస్తుందో ఆ వ్యక్తిని ఈ నేల వర్ణిస్తుంది. అది వెంటనే మరణించదు కానీ నెమ్మదిగా ఎండిపోతుంది. దానికి మరణం చాలా నెమ్మదిగా సంభవిస్తుంది.

ఒక వ్యక్తి జీవితంలో వాక్యాన్ని ఎడగనివ్వని మూడు విషయాలను యేసు వర్ణించాడు. మొదటిది, చింతలు. ప్రతిరోజు ఉండే బాధలు జీవితంలో ఒత్తిళ్లు అనగా కుటుంబం స్నేహితులు స్కూలు పని ఆర్థికపరమైన విషయాలు ఆరోగ్యం తదితర విషయాలు ఇందులో ఉంటాయి. మన హృదయాల్లో ఆందోళన పుట్టించే విషయాలు ఇవే. రెండవది, సిరి సంపదలు. దేవుని వైపు నుంచి మన దృష్టి మళ్లించే, జీవితంలో ఇహసంబంధమైన వాటన్నింటినీ అనగా ధనం వస్త్రాలు ఇల్లు కార్లు బోట్లు తదితర విషయాలను ఇది సూచిస్తున్నది. మూడవది కోరికలు. శృంగారం మత్తు పదార్థాలు విలాసాలు వంటి పాపేచ్ఛలు మాత్రమే కాదు, ప్రభువు నుంచి సమయాన్ని శక్తిని ధనాన్ని దొంగిలించే ఆటలు చదువు అలవాట్లు ఇందులో ఉంటాయి. మన నమ్మకత్వాన్ని అనురాగాన్ని కోరే క్రీస్తుతో ఈ మూడు విషయాలు పోటీపడతాయి, తరచూ క్రీస్తు ఓడిపోతుంటాడు (మత్తయి 6:24-25; 1 తిమోతి 6:9-10; 1 యోహాను 2:15-16).

అన్ని సమయాల్లోనూ ఇది జరుగుతుండడం నేను చూస్తూనే ఉంటాను. ఎవరో ఒకరు క్రీస్తునందు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు, ఆ తర్వాత వేరే వ్యక్తి/వస్తువు అతనికి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా/వస్తువుగా మారిపోతారు. అప్పుడు క్రీస్తు పక్కకు నెట్టివేయబడతాడు. వాళ్లు సంఘానికి హాజరవడం బైబిల్ చదవడం ప్రార్థించడం క్రమక్రమంగా తగ్గించేస్తారు క్రీస్తు యెడల అంకిత భావాన్ని అంతకంతకు కోల్పోతుంటారు. దీనంతటికీ కారణం లోకంలోని విషయాలపై మమకారం పెంచుకుని, దృష్టి మరల్చుకుని, వాటితో నిండిపోయి, వాటిని తీవ్రంగా అనుభవించి, వాటికి బానిసలయ్యి, వాటిచే అణగదొక్కబడి, చివరికి ఊపిరాడక మరణించడమే. క్రీస్తుకు బదులుగా లోకాన్ని ఎంచుకున్న వ్యక్తికి దేమాయే విచారకరమైన దృష్టాంతం (2 తిమోతి 4:10). ఇది నీ హృదయాన్ని వర్ణిస్తోందా? లోక విషయాలతో నిండిపోయి, దాని మూలంగా అణగదొక్కబడే లోకానుసారమైన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా?

వాక్యానికి సరైన నేల

విత్తనం మొలకెత్తి ఎదగడానికి మంచి నేల పరిపూర్ణమైన వాతావరణాన్ని సమకూరుస్తుంది. ఈ నేల  మెత్తగా ఉంటుంది, లోతుగా ఉంటుంది, ముళ్ళు కలుపు మొక్కలు లేనిదై ఉంటుంది. ఈ నేలలో విత్తనం వర్ధిల్లి, నాటబడిన దానికంటే వందరెట్లు ఎక్కువగా పంటను ఉత్పత్తి చేస్తుంది.

దేవుని వాక్య ప్రకటన విని, గ్రహించి, అంగీకరించే వారిని మంచి నేల సూచిస్తుంది (మత్తయి 13:23; మార్కు 4:20). దేవుని వాక్యం యెడల వారికి తెరవబడిన అంగీకారయోగ్యమైన హృదయం ఉంటుంది. దాని అర్థం ఏంటో గ్రహించడానికి మాత్రమే కాదు, దానికి విధేయత చూపించడానికి, తమ జీవితంలో అమలు చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తుంటారు. వాళ్లు కేవలం వాక్యాన్ని వినేవాళ్ళు మాత్రమే కాదు, దాని ప్రకారం జీవించేవాళ్లు (యాకోబు 1:22). ఫలితంగా వాక్యం వారి జీవితంలో నిరంతరం ఫలితాలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. వారి వినే ప్రసంగాల వలన వాళ్ళు నిజమైన, నిలిచి ఉండే మార్పును అనుభవిస్తారు.

ఈ ఉపమానంలో ఫలం యొక్క ఉనికే మంచి నేలను ఇతర మూడు నేలల కంటే భిన్నమైనదిగా చేస్తోంది. ప్రతి నిజమైన క్రైస్తవుడు తమ జీవితంలో ఆధ్యాత్మిక ఫలాన్ని స్థిరంగా ఫలిస్తాడు (మత్తయి 7:16; గలతీ 5:22-23). అయితే క్రైస్తవుడు వెనక్కి జారి, కొంతకాలం క్రీస్తు నుంచి దూరంగా ఉండడం సాధ్యమే. అయితే వాళ్లు నిజ విశ్వాసులైతే చివరికి క్రీస్తు దగ్గరకు తిరిగి వచ్చి మారుమనస్సుకు తగిన ఫలాలను ఫలిస్తారు (మత్తయి 3:8; అపో 26:20). ఫలరహిత క్రైస్తవుడు అనే విషయం ఏదీ లేఖనంలో మనకు కనబడదు. క్రైస్తవులందరూ ఒకే విధంగా ఫలించరు అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాను. వ్యక్తి జీవితంలో ఫలాల పరిమాణం కాదు, ఫలాల ఉనికి ముఖ్యాంశం. "మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు" అని యేసు చెప్పాడు (యోహాను 15:8). ఇది నీ హృదయాన్ని వర్ణిస్తోందా? నిజ విశ్వాసి ఫలాన్ని కలిగించే మృదువైన, వాక్యాన్ని స్వీకరించే హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావా?

నేలల గురించిన ఉపమానానికి తర్వాతనే యేసు చెప్పిన మరొక ఉపమానాన్ని వ్యూహాత్మకంగా లూకా రాశాడు. తన కుటుంబంలోని సభ్యులు దేవుని వాక్యాన్ని వినడంలో దానికి విధేయత చూపించడంలో ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి యేసు చేసిన సంభాషణ ఆ ఉపమానం తర్వాత మనకు కనబడుతుంది. ఫలవంతమైన జీవితాన్ని శక్తివంతమైన వెలుగుగా యేసు వర్ణించాడు: ​"ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును.తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు" (లూకా 8:16-17).

ఇంకొక రీతిగా చెప్పాలంటే ఫలవంతమైన జీవితం అవిశ్వాసులకు సాక్ష్యంగా ఉంటుంది (మత్తయి 5:16). అంతేకాదు ఒకానొక రోజున నీ హృదయ స్థితి బట్టబయలవుతుందని యేసు వివరించాడు. అందువల్ల "కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను" (లూకా 8:18). నేల అనే సాదృశ్యం నుంచి వెలుగు అనే సాదృశ్యానికి యేసు సంభాషణను మార్చినప్పటికీ మొత్తం వాక్య భాగమంతటికీ ఇదే అత్యంత కీలకమైన మాట. ఆయన చెప్పేది ఏంటంటే నువ్వెలా వింటున్నావనే విషయంలో శ్రద్ధగా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వెలా వింటున్నావనే విషయమే నీకు మరింత ఎక్కువగా (మంచి నేల) ఇవ్వబడుతుందో లేదో నీ దగ్గర ఉన్నది తీసివేయబడుతుందో లేదో నిర్ధారిస్తుంది. ప్రతి సందర్భంలోనూ తాము ఏం కలిగి ఉన్నామని మూడు నేలలు ఆలోచించాయో అది చివరికి అపవాది ద్వారా శ్రమల ద్వారా లోకం ద్వారా తీసివేయబడింది. ఏదైతేనేం అదంతా తీసివేయబడింది.

ఆయన కుటుంబ సభ్యులు వచ్చారని ఆయనతో చెప్పడానికి వచ్చిన వారితో యేసు చేసిన సంభాషణను గ్రంథస్థం చేస్తూ లూకా ఈ భాగాన్ని ముగించాడు: "ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులును నిన్ను చూడగోరి వెలుపల నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి. అందుకాయన దేవుని వాక్యము విని, దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను" (8:19-21).

ఇంకొక రీతిగా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని విని విధేయత చూపించడమే నువ్వొక క్రైస్తవుడవని నిరూపించే అంతిమ సాక్ష్యం. దేవుని వాక్యాన్ని వినడంపై యేసు ఉంచిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పడానికే లూకా ఈ భాగమంతటినీ ఉద్దేశించాడు (వ. 8,18,21). మంచి నేల దేవుని వాక్యం నుంచి విధేయత అనే ఫలాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫలభరితమైన ఆ జీవితమే చుట్టూ ఉన్నవారు చూడడానికి ప్రకాశించే, వెలుగులాంటిది.‌ ఆ వెలుగే యేసుతో నువ్వు ఆధ్యాత్మికంగా ఐక్యమయ్యావు అనేదానికి నిజమైన రుజువుగా ఉంది. 

వాక్యం నీపైన పడినప్పుడు అది ఎలాంటి నేలను కనుగొంటుంది? దేవుని వాక్యం యెడల నీకు ఎలాంటి హృదయం ఉంది?

                                               అధ్యయనం/చర్చ కోసం

1. కీర్తన 95:6-11 చదవండి. త్రోవపక్కన ఉండే కఠినమైన నేలకు ఇశ్రాయేలీయులు ఒక దృష్టాంతంగా ఎలా ఉన్నారు? పాపం నీ హృదయాన్ని ఎలా కఠిన పరుస్తుంది? దేవుని వాక్యం చొచ్చుకుపోకుండా ఎలా చేస్తుంది? (హెబ్రీ 3:12-13)
2. మత్తయి 6:24-25; 1 తిమోతి 6:9-10; 1 యోహాను 2:15-16 చదవండి. క్రీస్తుతో నీ సంబంధాన్ని చెడగొట్టిన చెడగొట్టగలిగిన శ్రమలు శోధనలు హింసలు లోక సంబంధమైన విషయాలు ఏవి?
3. మత్తయి 7:16-20; యోహాను 15:8 చదవండి. యేసు చెప్పిన మాటల ప్రకారం విశ్వాసికీ అవిశ్వాసికీ మధ్య వ్యత్యాసాన్ని మీరు ఎలా గుర్తిస్తారు? నువ్వు నిజంగా రక్షించబడ్డావని నిరూపించడానికి నీ జీవితంలో నువ్వు చూసే సాక్ష్యం ఏంటి?

ఏ హృదయంలోనైతే విత్తనం లోతుల్లోకి వెళ్లి, ఆయన మహిమ నిమిత్తం నీ జీవితంలో అధిక ఫలాన్ని ఫలించేలా ఎదుగుతుందో అలాంటి మృదువైన దీనమైన నేర్చుకునే హృదయాన్ని నీలో పెంపొందించమని దేవునికి ప్రార్థించు.

సిద్ధపాటు లేకుండా సేవకులు ప్రసంగించకూడదని మనం విన్నాం. దీనికి ఒప్పుకుంటాను. అయితే సిద్ధపాటు లేకుండా ప్రజలు వాక్యాన్ని వినకూడదు అనే మాటను మనం దీనికి జత చేయాలి. విత్తువానికి అత్యంత ఎక్కువ సిద్ధపాటు అవసరమా? నేలకు సిద్ధపాటు అవసరమా? మీరేమనుకుంటున్నారు? విత్తువాడు శుభ్రమైన హస్తాలతో వస్తే సరిపోతుంది. కానీ విత్తనాలను చల్లకముందు నేలను బాగా దున్నాలి, చెత్తను ఏరి పారేయాలి, మట్టి పెళ్లలను చితక్కొట్టాలి. విత్తువానికి అవసరమైన దానికంటే నేలకే ఎక్కువ సిద్ధపాటు అవసరమని ప్రసంగీకుని కంటే వినేవాడికే సిద్ధపాటు ఎక్కువ అవసరమని నాకు అనిపిస్తుంది.   చాల్స్ స్పర్జన్.

అధ్యాయం 3

వినేందుకు నీ హృదయాన్ని చదునుచేయడం


ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి.
యిర్మీయా 4:3

యేసు చెప్పిన నేలల ఉపమానంలో ఏదైనా ప్రోత్సాహం మనకు కనిపించిందంటే అది నేల మారగలదనే వాస్తవంలోనే దాగి ఉంది. "మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని" యేసు చేసిన ఉపదేశాన్ని శ్రద్ధగా వినేవాడికి నిరీక్షణ ఉంది (లూకా 8:18). మన కఠిన హృదయాలు మృదువుగా మారగలవు. లోతులేని మన హృదయాలు సుసంపన్నం కాగలవు, లోతుగా మారగలవు. లోకానుసారమైన, దృష్టి మళ్లిన మన హృదయాలు దేవుని వాక్యాన్ని తాజాగా స్వీకరించేందుకు పవిత్రపరచబడగలవు.

న్యూ ఇంగ్లాండులో బాలునిగా ఎదుగుతున్నప్పుడు అనేక వేసవి కాలపు రోజుల్లో తోటలో పనిచేస్తూ గడిపాను. ఇది సగటు పరిమాణంలో ఉండే తోట కాదు. ఇది ఎంత పెద్ద తోట అంటే ప్రతి వసంత కాలంలోనూ మా నాన్నగారు మా ఇంటి పక్క ఉన్న రైతును పిలిచి, తన ట్రాక్టరుతోను నాగలితోను ఆ నేలను సాగుచేయడానికి దున్నమని చెప్పేవారు. ఆ నేలను దున్నిన తరువాత లోతైన నాగటి చాళ్లు పెద్దపెద్ద మంటి పెళ్ళలు ఆ తోట అంతటా ఉండేవి. ఆ తర్వాత ఆ రైతు తన ట్రాక్టరుకు ఒక చెక్కమానును (నేలను దున్నిన తరువాత మట్టిని కదల్చడానికి చదును చేయడానికి ఉపయోగించే పనిముట్టును) బిగించి, ఆ నాగటి చాళ్ళను చదును చేయడానికి ఆ మట్టి పెళ్ళలను పగలగొట్టడానికి ఆ తోట అంతా ముందు వెనుకకు దానిని ఈడ్చుకెళ్లేవాడు. అప్పుడు ఆ నేల అంతా చదును చేయబడి, మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉండేది. చలికాలం ఆ తోట నేలను ధ్వంసం చేసినప్పటికీ, సరైన కృషితో మరల సాగుకు ఆ నేల సిద్ధంగా ఉండేది.

"నా వాక్యాన్ని స్వీకరించేలా మీ హృదయాలను సిద్ధం చేసుకోవడానికి వాటిని దున్నండి" అని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఈ సాదృశ్యాన్ని ఉపయోగించి పాత నిబంధనలో సవాలు చేశాడు. యిర్మీయా 4:3లో "ముళ్లపొదలలో విత్తనములు చల్లక మీ బీడుపొలమును దున్నుడి" అని దేవుడు చెప్పాడు. హోషేయా 10:12లో "యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి" అని ఆయన చెప్పాడు. బీడు భూమి అంటే దున్నబడినదే, కానీ కలుపు మొక్కలు చచ్చిపోయేలా లేదా నేల సారవంతం అయ్యేలా చేయడానికి ఒకటి లేదా రెండు పంట కాలాల పాటు విత్తనం చల్లబడని భూమిని సూచిస్తున్నది. ఆ భూమి సాగుచేయబడనిది, ఉపయోగించబడనిది, ఫల రహితమైనది. ఫలితంగా అది కఠినమై, నిరుపయోగంగా మిగిలిపోయింది. వేటినైనా నాటకముందే దానిని దున్ని, మెత్తన చేసి, విత్తనాలు నాటడానికి సిద్ధపరచాల్సిన అవసరం ఉంది.

"మీ బీడు భూములను దున్నండి" అనే ఆజ్ఞ ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో ప్రవక్తలు చేసిన మనవిని క్లుప్తంగా తెలియచేస్తోంది.

ఇశ్రాయేలీయులు నిరంతరం తమ హృదయాలను కఠినపరచుకుని, దేవునికి ఆయన వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేశారు. వాళ్లను దేవుడు చేయమని చెప్పిన పనులను చేయకుండా, చేయొద్దని చెప్పిన పనులనే చేస్తూ దేవుని మాటను వినడంలో తరచూ విఫలమయ్యారు. అందువల్ల వాళ్ళు తన వాక్యాన్ని స్వీకరించేలా తమ హృదయమనే నేలను దున్నమని వాళ్లను ఆదేశించేందుకు యిర్మీయా, హోషేయాలాంటి ప్రవక్తలను ఆయన పంపించాడు. మనం జాగ్రత్తగా లేకపోతే దేవుని వాక్యానికి మన హృదయాలు కూడా కొన్నిసార్లు ఆ విధంగానే కఠినపరచబడతాయి. అతి కొద్దిగా నేర్చుకుని అతి కొద్దిగా మార్పుచెందే కాలాల గుండా మనం వెళ్లే అవకాశం ఉంది. మన హృదయాలు దున్నబడాల్సిన అవసరం ఉందని అప్పుడే మనం తెలుసుకోవాలి.

దేవుని వాక్యానికి మన హృదయాలను కఠినం చేసుకోకుండా పాపం యొక్క భ్రమచేత మన హృదయాలను కఠినం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండమని హెబ్రీ గ్రంథకర్త మనల్ని హెచ్చరిస్తున్నాడు. 95వ కీర్తనను ఉటంకిస్తూ అతడిలా రాశాడు:

"మరియు పరిశుద్ధాత్మయిట్లు చెప్పుచున్నాడు. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి.‌ నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరమువారివలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు నా మార్గములను తెలిసికొనలేదు.‌ గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినినయెడల, కోపము పుట్టించి నప్పటివలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను" (హెబ్రీ 3:7-13).

తమ అరణ్య యాత్రలో ఇశ్రాయేలు ప్రజలు దేవునియందు ఆయన వాక్యం నందు పదేపదే తమ అవిశ్వాసాన్ని కనపరిచారు. అత్యద్భుతమైన ఆయన పోషణకూ భద్రతకూ అనేక దృష్టాంతాలను చూసినా వాళ్లు సణగడం ఫిర్యాదు చేయడం ఆయన చెప్పినదానికి అవిధేయత చూపించడం కొనసాగించారు. ఫలితంగా తిరుగుబాటు చేసే ఆ తరాన్ని వాగ్దాన భూమిలో స్థిరపడనీయకుండా వారి కోసం తాను సిద్ధంచేసిన దీవెనలను ఆస్వాదించకుండా దేవుడు అడ్డుకున్నాడు. తన వాక్యంలో దేవుడు చెప్పిన దానికి అవిధేయత చూపించినప్పుడు మనం ఆస్వాదించాలని దేవుడు ఉద్దేశించిన దైవ దీవెనలను మనం కూడా కాలదన్నుకుంటాం. సత్యాన్ని పదేపదే విని దానిని ఆచరించడంలో విఫలమైనప్పుడు మన హృదయం సత్యానికి మరింతగా కఠినపరచబడి చివరికి దేవుని వాక్యానికి పూర్తిగా మొద్దు బారిపోతుంది. దేవుని వాక్యం ఎన్నిసార్లు దానిని గుచ్చినప్పటికీ మనలో చలనం ఉండదు, మన ఒంటిపై కాచిన కాయపై సూదితో గుచ్చినప్పుడు నొప్పి లేనట్లుగానే ఇది కూడా ఉంటుంది. మనం ఎంత ఎక్కువగా పాపంచేస్తే, దేవుని వాక్యానికి అంత ఎక్కువగా మన హృదయం మొద్దు బారి పోతుంది, కఠిన పరచబడుతుంది. పాపం మనల్ని మోసగిస్తుంది, దేవునికి దూరంగా నడిపిస్తుంది (ఆది 3:13; 2 కొరింథీ 11:3), అది దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపాటు లేనిదిగా చేస్తుంది.

దేవుని వాక్య పరిచర్య నిమిత్తం నీ హృదయాన్ని సిద్ధంచేసుకోవడానికి నువ్వు చేయగలిగిన కొన్నింటిని ఈ అధ్యాయంలో నేను సూచించాలనుకుంటున్నాను. వెలుగునిచ్చే వాక్య ప్రవేశం నిమిత్తం నీ హృదయాన్ని తెరవడానికి ఉద్దేశించబడిన నాగలికి ఉండే పదునైన నక్కులు ఇవి (కీర్తన 119:130). నిలబడి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రతివారం సిద్ధపడడమే ప్రభువు యెడల ఒక ప్రసంగీకునికి ఉన్న అంకితభావం. ప్రతి వారం కూర్చుని దేవుని వాక్యాన్ని వినేందుకు సిద్ధపడి ఉండడమే ప్రభువు యెడల మీకుండాల్సిన అంకితభావం. వీలైనంత శ్రేష్ఠమైన ప్రసంగీకుడిగా ఉండడమే నా లక్ష్యం కావాలి. వీలైనంత శ్రేష్ఠమైన శ్రోతగా ఉండడమే నీ లక్ష్యం కావాలి. ప్రసంగీకుడు తన భాగాన్ని నిర్వర్తించినప్పుడు నువ్వు నీ భాగాన్ని నిర్వర్తించాలి. అప్పుడు నీ జీవితంలో తన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు తన వాక్యాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటాడు.

ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివి, ధ్యానించు

ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పఠించడమే నీలో దేవుని వాక్యం యెడల ఆరోగ్యకరమైన ఆకలిని పెంపొందిస్తుంది. వారమంతా దేవుని వాక్యాన్ని నువ్వు భుజించకపోతే ఆదివారం నాడు దేవుని వాక్యం యెడల ఆకలితో నువ్వు సంఘానికి ఆశపడుతూ రావడం వ్యర్థమే.

అనుదిన వాక్య పఠనాన్ని జాన్ ఫైపర్ గారు ఆకలి పుట్టించే పదార్థాన్ని తినడంతో పోల్చారు. అది ఆదివారం నాటి ప్రసంగం కోసం ఆధ్యాత్మికమైన ఆకలిని పెంపొందిస్తుంది. అంటే అసలు భోజనం కోసం అది నీ అంగిలిని సిద్ధం చేసి, దానికి శిక్షణనిస్తుంది. బైబిల్లోని గ్రంథాలను ఒక్కొక్కటిగా బోధించే ప్రసంగీకుని కింద కూర్చునే ఆధిక్యతను నువ్వు కలిగి ఉంటే వచ్చే ఆదివారం మీ సంఘ కాపరి వివరించబోయే ఆ వాక్యభాగాన్ని అధ్యయనం చేయడమే ఆదివారం నాడు అసలైన భోజనం చేయడానికి నిన్ను సిద్ధపరిచే స్టార్టర్ లాంటిది. "ఏకాంతంలో ఉన్నప్పుడు పరిశుద్ధ లేఖనాలను చదివి ధ్యానించు. అప్పుడు బహిరంగంగా ప్రకటించబడే దానిని నువ్వు చక్కగా అర్థం చేసుకోగలుగుతావు" అని రిచర్డ్ బాక్స్టర్ చెప్పారు.1

కీర్తన 1:1-3 లో వాక్యధ్యానం గురించిన ఈ ప్రాథమిక నియమం స్పష్టంగా స్థాపించబడింది:

"దుష్టుల ఆలోచనచొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును".

భాష్యానికి అన్వయింపుకు మధ్యన అనగా ఒక వాక్యభాగం యొక్క అర్థమేంటో తెలుసుకోవడానికి దానిని ఆచరణలో పెట్టడానికి మధ్యన వాక్యధ్యానం ఒక వారధిలా పనిచేస్తుంది. ధ్యానించడం అంటే వాక్యభాగం గురించి సుదీర్ఘ సమయం తీవ్రంగా ఆలోచించడమే, ఆవు గడ్డిని నెమరువేసే విధంగానే నీ మనసులో వాక్యాన్ని పదేపదే మననం చేసుకోవడమే. ప్రసంగం ముగిసిన తర్వాత దానితో ఏం చేయాలనే దాన్ని వర్ణిస్తూ రిచర్డ్ బాక్స్టర్ ఈ స్పష్టమైన సాదృశ్యాన్ని ఉపయోగించాడు: వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత రహస్యంగా దాన్నంతటిని జ్ఞాపకం చేసుకోండి, ధ్యానం ద్వారా దానిని మీకు మీరే ప్రసంగించుకోండి. ప్రసంగికుడు దానిని నిస్సారంగా ప్రకటిస్తే ఆ అంశం ఎంత గొప్ప విలువైనదో ఆలోచించి, మీ సొంత హృదయాలకు దానిని భారభరితంగా ప్రసంగించుకోండి."2

కొన్నిసార్లు లేఖనంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క అన్వయింపు చాలా స్పష్టంగా ఉంటుంది. మరికొన్నిసార్లు ఒక వాక్యభాగం నీ జీవితానికి ఎలా పనికొస్తుందో నువ్వు గ్రహించడానికి ముందు ఎంతో సమయము శక్తి పడుతుంది. లేఖనంలోని ఒక ప్రత్యేకమైన వాక్యభాగాన్ని ధ్యానిస్తుండగా నీకు నీవే కొన్ని ప్రశ్నలు వేసుకోవడం వలన నీ జీవితానికి ఆ వాక్యభాగం ఆచరణలో ఎలా పనికొస్తుందో నిర్ధారించుకోవడానికి నీకు సహాయపడుతుంది. 2 తిమోతి 3:16 ప్రకారం "ఉపదేశం కోసం ఖండించడం కోసం తప్పుదిద్దడం కోసం నీతియందు శిక్ష చేయడం కోసం లేఖనం ప్రయోజనకరం. దీన్ని ఆధారం చేసుకుని బైబిల్ చదివిన ప్రతిసారి నీకు నీవే ఈ కింద ఉన్న నాలుగు ప్రశ్నలను వేసుకోవడంతో మొదలుపెట్టు:

  • నేనేమి నేర్చుకున్నాను ("ఉపదేశం")?
  • నేనెక్కడ తప్పిపోతున్నాను ("ఖండించుట")?
  • దాని గురించి నేనేం చేయాల్సి ఉంది ("తప్పుదిద్దుట")?
  • *దీన్ని నా జీవితంలో ఒక స్థిరమైన భాగంగా నేను ఎలా చేయగలను ("శిక్షణ")?

ఈ ప్రశ్నలన్నింటితో వాక్యభాగాన్ని నువ్వు పదే పదే ఢీ కొట్టినప్పుడు కనీసం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువే ఆచరణాత్మక విధానంలో నీ జీవితానికి నువ్వు అన్వయించుకోగలిగే ఏదో ఒక విషయాన్ని చూపిస్తుంది. ఆ తదుపరి దేవుని వాక్య ప్రకటనను నువ్వు వింటున్నప్పుడు ప్రసంగం అంతటా నీ మనసును తిరిగేలా చేయడానికి బదులు ఆ వాక్యభాగానికి ఇవే ప్రశ్నలను అన్వయిస్తూ నీ హృదయం శిక్షణ పొందుతుంది.

వారమంతా ప్రార్థించు

మొదటిగా నీ నిమిత్తమే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని విని అంగీకరించే నిజాయితీగల మంచి హృదయాన్ని నీకు అనుగ్రహించమని, నీ జీవితంలో నిలిచి ఉండే ఫలాన్ని ఆ వాక్యం ఫలించేలా చేయమని, ఆయన వాక్యానికి నీ హృదయం మృదువుగా ఉండేలా దానిని స్వీకరించేలా అనుగ్రహించమని, ధన సంపదలకంటే ఎక్కువగా ఆహారం కంటే ఎక్కువగా ఆయన వాక్యంలోని సత్యం యెడల నీ హృదయం ఆనందించేలా చేయమని, ఆయన నీకు చెప్పాలనుకున్న దానిని విని విధేయత చూపడానికి నీ చెవులను తెరిచేందుకు సహాయం చేయమని నువ్వు దేవునికి ప్రార్థించాలి. నువ్వు మారేందుకు మరింతగా ఆయనలా తయారయ్యేందుకు చాలా శక్తివంతమైన ఆచరణాత్మకమైన మార్గంలో నీతో మాట్లాడమని ఆయనను అడుగు. వాక్యం యొక్క అర్థం ఏంటో, నీ జీవితానికి అది ఎలా పనికొస్తుందో గ్రహించడానికి, లేఖనాలు వివరించబడుతుండగా నీ హృదయం నీలో మండేలా కేవలం వాక్యాన్ని నువ్వు వినువానిగా కాక ఆచరించే వానిగా ఉండడానికి నీ మనసును కృపతో వెలిగించమని ఆయనను అడుగు. నీకు నువ్వుగా మార్పు చెందలేవని నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు. నీకు దేవుని సహాయం అవసరం. "భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే" అని పౌలు చెప్పాడు (ఫిలిప్పీ 2:12-13). "యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్‌" అని తన పాఠకులకు గుర్తుచేస్తూ హెబ్రీ గ్రంథకర్త తన పత్రికను ముగించాడు (హెబ్రీ 13:21).

రెండవది ప్రసంగీకుని గురించి నువ్వు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రసంగీకుడు గొప్ప స్వాతంత్రంతో ధైర్యంతో స్పష్టతతో వాక్యాన్ని ప్రకటించాలని (ఎఫెసీ 6:19-20; కొలస్సీ 4:3-4); దేవుని మహిమ నిమిత్తం ప్రజల జీవితాలను మారుస్తూ దేవుని వాక్యం వేగంగా వ్యాప్తిచెందాలని (2 థెస్స 3:1); దేవుని ఆత్మ ప్రసంగీకుణ్ణి శక్తితో నింపి, దేవుని వాక్యం యెడల దేవుని యెడల నీ అవగాహన పెంచుకోవడంలో నీకు సహాయపడేందుకు అతణ్ణి ఉపయోగించుకుని నీ జీవితంలోనూ నీ సంఘ జీవితంలోనూ ఆయన సంకల్పాలను నెరవేర్చాలని ప్రార్థించండి.

ఫిలిప్ జి. రైకెన్ ఈ క్రింది విధంగా రాశారు:
పాస్టరుగారు ఆదివారం నాడు తన నోరు తెరిచినప్పుడే ప్రసంగం మొదలవుతుందని సంఘానికి హాజరయ్యే అనేకమంది భావిస్తుంటారు. అయితే ప్రసంగాన్ని వినడం అనేది వాస్తవానికి వారం ముందే మొదలవుతుంది. ప్రసంగం కోసం పాస్టరుగారు సిద్ధపడుతూ ఉన్నప్పుడు బైబిల్ని అధ్యయనం చేస్తూ ఆయన గడిపే సమయాన్ని దీవించమని దేవుణ్ణి అడుగుతూ ఆయన కోసం మనం ప్రార్ధించినప్పుడు ప్రసంగాన్ని వినడం మొదలవుతుంది. మన ప్రార్థనలు ప్రసంగీకునికి సహాయం చేయడంతో పాటు దేవుని వాక్య పరిచర్య నిమిత్తం మనలో ఒక విధమైన ఆతురతను కలిగిస్తాయి. అందువల్ల ప్రసంగం విషయానికొస్తే సంఘంలోని విశ్వాసులు దేని గురించైతే ప్రార్థించారో దానినే సాధారణంగా పొందుకుంటారు అని చెప్పడానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి.3

"మీ ప్రసంగ పరిచర్య యొక్క శక్తికి ప్రభావానికి రహస్యం ఏంటి?" అని ఒకరు ఒకనాడు స్పర్జన్ గారిని అడిగారు. "నా సంఘంలోని విశ్వాసులు నా నిమిత్తం ప్రార్థిస్తారు" అని అతడు ముక్తసరిగా జవాబిచ్చాడు. తన సంఘంలో స్పర్జన్ గారు ప్రసంగిస్తున్న ప్రతి సందర్భంలోనూ అనేకమంది కింది అంతస్తులో ఉండి ఆయన పక్షంగా విజ్ఞాపన చేస్తుండేవారు. ఒక సంఘం తన ప్రసంగీకుని నిమిత్తం స్థిరంగా భారంగా ప్రార్థించడం మొదలుపెట్టినప్పుడు అతని ప్రసంగం గొప్ప శక్తితో నింపబడి ఆ సంఘంలోనూ సమాజంలోనూ ఉజ్జీవం వచ్చిందని  సంఘ చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. స్పర్జన్ గారి సమయంలో వచ్చినటువంటి ఉద్యమం అలాంటి ఉజ్జీవాల్లో కేవలం ఒకటి మాత్రమే.

నీ పాపాన్ని ఒప్పుకో

వాక్యాన్ని నువ్వు ఎన్నడైనా పొందుకోవడానికి ముందే నీ జీవితంలోని పాపాన్ని నువ్వు వదిలించుకుని తీరాలి. "అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి" అని యాకోబు 1:21 చెబుతున్నది. నీ హృదయమనే ఇంటిని నువ్వు శుభ్రం చేసే వరకు వాక్యం లోపలికి కనీసం చొచ్చుకుపోవడం కూడా మొదలవ్వదు. ఒప్పుకోని పాపం, సమాధానపడని సంబంధాలు దేవుని వాక్యాన్ని విని, విధేయత చూపే నీ సామర్థ్యాన్ని ఆటంకపరుస్తాయి. దేవుడు నీకు చెప్పాలని ఇష్టపడినదానిని నువ్వు వినకుండా ఆటంకపరిచే నీ చెవుల్లోని గులిమి లాంటిది ఇది. నీ హృదయంలోని పాపంతో నువ్వు నిరంతరం వ్యవహరించాలి. నీ కుటుంబ సభ్యుల్లోగాని నీ సంఘంలోని తోటి సభ్యుల్లోగాని ఎవరికైనా విరుద్ధంగా నువ్వు పాపం చేసినప్పుడు లేదా వాళ్లే నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు వారితో సమాధానపడడానికి నువ్వు తీసుకునే చొరవ కూడా ఇందులో భాగమే (మత్తయి 5:23-24; 18:15-17).

"ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని,
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి" అని పేతురు రాశాడు (1 పేతురు 2:1-3). మనం నిజంగా దేవుని వాక్యాన్ని అపేక్షించాలంటే భక్తిలో ఎదగాలంటే ఆయన స్వరూపంలోనికి మారాలంటే మొదటిగా మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం విసర్జించాలి. దేవుని వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని మనం వినడానికి అంగీకరించడానికి ఇది ఆవశ్యకం. దేవుడు మనతో చెప్పాలనుకున్న దానిని వినే మన సామర్థ్యాన్ని పాపం ఆటంకపరుస్తుంది, మనలో ఆయన చేయదలచిన దానిని అడ్డుకుంటుంది. అందువల్లనే మనం ఏదైనా పాపంలో ఉన్నామని తెలుసుకున్నప్పుడు దానిని దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాతనే మనం సంఘానికి వచ్చేలా మనం నిశ్చయించుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రార్థన ద్వారా దేవునితో మన సంభాషణను పాపం ఆటంకపరిచే విధంగానే (1 పేతురు 3:7), ప్రసంగం ద్వారా దేవుడు మనతో చేసే సంభాషణను కూడా పాపం ఆటంకపరుస్తుంది. అంటే దేవుని వాక్యం అనే విత్తనాన్ని స్వీకరించడానికి మన హృదయాలను సిద్ధపరచాలంటే మన హృదయంలోని పాపం అనే మంటి పెళ్లలను పగలగొట్టాలి, తొలగించాలి. దేవుని వాక్య ప్రకటన నిమిత్తం నీ హృదయాన్ని సిద్ధపరచుకునే అత్యంత సులభమైన శక్తివంతమైన మార్గాల్లో ఒకటి ఏంటంటే శనివారం రాత్రిగాని ఆదివారం ఉదయంగాని నీ జీవితాన్ని ప్రార్థనా  పూర్వకంగా పరీక్షించుకోవడానికి దేవుని ముందు నీ పాపాలను దీనత్వంతో ఒప్పుకోవడానికి కొంత సమయాన్ని గడపడమే. దేవుని ముందు నీ హృదయాన్ని సరిచేసుకోవడానికి కీర్తన 51 లో దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న దృష్టాంతం నువ్వు అనుసరించేందుకు ఒక ఆచరణాత్మకమైన మార్గంగా పనికొస్తుంది.

మీడియాతో నువ్వు గడిపే సమయాన్ని తగ్గించుకో

తాజా నివేదిక ప్రకారం సగటు అమెరికా దేశస్థుడు రోజుల్లో నాలుగు గంటలకు పైగానే టీవీ చూస్తున్నాడు. దీనికి తోడు రేడియో ఇంటర్నెట్ సినిమాలు ఇంకా ఇతరత్రా ప్రసార మాధ్యమాలను కలిపితే రోజుకి సుమారు తొమ్మిదిన్నర గంటలకు పైనే సగటు వ్యక్తి తన సమయాన్ని వెచ్చిస్తున్నాడు. మన సమాజంలో ప్రసార మాధ్యమాలతో గడిపే సమయం మన హృదయాలను నీరసింపచేసే మరణకరమైన ప్రభావాన్ని కలిగిస్తున్నది. మనం నిరంతరం ప్రసార మాధ్యమాల్లోని దృశ్యాలను చూసి ప్రేరేపించబడుతున్నాము. అవి దేవుని వాక్య ప్రకటనను వినే, అర్థంచేసుకునే మన సామర్థ్యాన్ని క్షీణించిపోయేలా చేస్తున్నాయి. బహిరంగ సమావేశాల్లో సంభాషించడం అనే అంశంపై తాను రాసిన పుస్తకంలో Duane Litfin "నేటి పాశ్చాత్య సమాజం ప్రాథమికంగా చెవులతో వినేదిగా కాక కళ్ళతో చూసే సంస్కృతిగా మారిపోయింది. కంటిచూపు మీద ఆధారపడే ఈ ప్రవృత్తి పెరిగిపోయినందువల్ల వినే మన సామర్థ్యం నిరుపయోగమై మరుగున పడిపోయింది."4 అని చెప్పారు.

ఇదే విషయం ఈ మధ్య కాలంలోనే తిమోతి టర్నర్ గారు రాసిన పుస్తకం Preaching to the Programmed People: Effective Communication in a Media-Saturated Society లో కనబడుతుంది. టీవీ చూడడం, ప్రసంగాన్ని వినడం ఏ విధంగా ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయో ఆయన ఈ పుస్తకంలో వివరించారు. టీవీ చూడడం దృశ్యమైనది, ప్రసంగాన్ని వినడం హేతుబద్ధమైనది. టీవీ కంటితో చూస్తాం, ప్రసంగాన్ని చెవులతో వింటాం. టీవీ చలనరహితమైన వీక్షకులను సృష్టిస్తుంది, ప్రసంగానికి చురుకైన శ్రోతలు అవసరం. "టీవీ సమాచారాన్ని అందిస్తుంది ఎలాంటి స్పందననూ కోరదు, తద్వారా వీక్షకులలో సోమరితనాన్ని జడత్వాన్ని కలిగిస్తుంది. ప్రసంగం ఏదో ఒక విధమైన మార్పును కలిగించాలని ప్రయత్నిస్తుంది" అని టర్నర్ గారు వివరిస్తున్నారు.

నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే సోఫాలో కూర్చుని సమాచారాన్ని తీసుకుంటూ దానితో ఏమీ చేయని సోమరియైన శ్రోతలా టీవీ చూడడం నిన్ను మార్చేస్తుంది. సాధారణంగా మనుషులు టీవీలో లీనమై చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోతుంటారు. వాళ్లు తమ మెదడును ఉపయోగించడం మానేసి పూర్తిగా వినోదాన్ని పొందాలని ఆశపడుతుంటారు. టీవీల్లో కనబడే దృశ్యాలు మనుషుల గమనాశక్తిని క్షీణింపచేశాయి, చలనరహితమైన ప్రేక్షకుని వైఖరి సృష్టించాయి, దాని మూలంగా మనుషులు విని విధేయత చూపించే వాళ్ళుగా కాక కేవలం వీక్షకులుగానే ఉండిపోతున్నారు. వారమంతటా టీవీ చూసి సినిమాలకు వెళ్లి ఇంటర్నెట్లో అనేక విషయాలను పరిశోధించి ఆదివారం నాడు సంఘానికి హాజరై ఎంతో ఏకాగ్రతను డిమాండు చేసే సుదీర్ఘమైన ప్రసంగాన్ని వినడానికి కూర్చుంటున్నావు. అది నీకు అలవాటు లేని విషయం. క్రియాశూన్యమైన వీక్షకునిగా ఉంటున్న నిన్ను రాత్రికి రాత్రే క్రియాశీలకమైన శ్రోతగా మారిపోవాలని సంఘ పరిస్థితులు డిమాండు చేస్తున్నాయి.

వినడానికి ఎంతో ఏకాగ్రత, స్వీయక్రమశిక్షణ అవసరం. సత్య వాక్యాన్ని ప్రకటించడం, వినడం కూడా కష్టంతో కూడిన పనే. అందువల్ల వినడానికి మనల్ని మనం అప్పగించుకుందాం" అని అగస్టీన్ చెప్పాడు.5 "ఈ రోజున చాలామంది తమ మనసుల్ని మూసేసుకుని సంఘంలోకి ప్రవేశించి కుర్చీలో తల వేలాడేసుకుని కూర్చుంటారు. మిగిలిన పని అంతా ప్రసంగీకుణ్ణి చేయమని ఆశిస్తుంటారు. సహోదరి సహోదరుడా నిన్ను నీవే పరీక్షించుకో: ఆదివారం ఉదయాన కుర్చీలో ఒక నిర్జీవ పదార్థంగా కూర్చుంటూ అపరాధం చేసిన వ్యక్తిగా నీవున్నావా?"6 అని జే యాడమ్స్ గారు రాశారు.

వాక్య పరిచర్యను దృష్టిలో పెట్టుకొని నీ వారమంతటి గురించి ముందుగానే ప్రణాళికను సిద్ధంచేసుకో

చాలామంది ప్రజలకు, చివరికి సంఘ సభ్యులకు కూడా తమ వారమంతట్లో సంఘం అనేది మొదటి ప్రాధాన్యత కాదు. సంఘానికి హాజరవడం కంటే కూడా తరచూ స్కూలు, ఉద్యోగం, ఆటలు, ఇతర కార్యక్రమాలే ప్రధానంగా ఉంటాయి. వారంలో చివరి రోజుల్ని విశ్రాంతి తీసుకోవడానికి ఆటలు ఆడుకోవడానికి రాత్రి అంతా మెలకువగా ఉండి ఎక్కువసేపు నిద్ర పోవడానికి అన్నట్లు లోకం చూస్తుంటుంది. సంఘ సభ్యులకు కూడా తమ సమయాన్ని లోక పద్ధతులకు అనుకూలంగా గడపాలనుకుని పొరపాటు చేస్తుంటారు. అయితే క్రైస్తవులకు ఆదివారం వారంలోనే అత్యంత ముఖ్యమైన రోజుగా ఉండి తీరాలి. సంఘం చుట్టూనే నీ పనిని కార్యక్రమాలను సహవాస సమావేశాలను సెలవు దినాలను గడపడానికి నువ్వు ప్రయత్నించాలి. ఆదివారపు ఉదయం అనేది శనివారం రాత్రి మొదలవుతుందని నియమంతో నువ్వు జీవించాలి. ప్రభు యొక్క దినాన్ని నువ్వు ఎలా ప్రాధాన్యతగా ఎంచాలో ఇక్కడ కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు ఉన్నాయి:

  • ➤ శనివారం రాత్రి ఇంటి దగ్గరే ఉండే అలవాటు చేసుకోండి.
    ➤ ఆ తర్వాత రోజు నీ మనసు యొక్క దృష్టిని మళ్లించడానికి కారణమయ్యే దేనినైనా చేయకుండా చూడకుండా చదవకుండా ఉండేలా జాగ్రత్త తీసుకో.
    ➤ ఆదివారం ఉదయానికి అవసరమయ్యే వస్తువులను, విషయాలను శనివారం రాత్రికి సిద్ధం చేసుకుని ఉండు. (ఉదా: దుస్తులు ఆహారం కానుక పిల్లలకి అవసరమైన వస్తువులు వగైరా).
    ➤ దేవుణ్ణి ఆరాధించడానికి ఆయనకు సేవ చేయడానికి చురుకుగా బలంతో ఉండడానికి శనివారం రాత్రి మంచిగా నిద్రపో. కునికిపాట్లు పడుతున్నప్పుడు వినడం కష్టం.
    ➤ మధ్యాహ్న భోజనం వరకు నిన్ను బలంగా ఉంచగలిగే సరైన ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తిను. నీ కడుపులో ఆకలి శబ్దాలు వినబడుతుండగా వాక్యాన్ని వినడం కష్టమవుతుంది.
    ➤ ఆరాధనకు వెళుతుండగా భక్తితో కూడిన వాతావరణాన్ని స్థాపించడానికి కొనసాగించడానికి నీ కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి పనిచెయ్యి. సంగీతం విను, పాటలు పాడు, మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థించు.
    ➤ 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్లడానికి బదులు 10 నిమిషాలు ముందుగానే సంఘాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. తద్వారా నీ వాహనం పార్కింగుకు స్థలం కనుగొనేందుకు, పిల్లలను నర్సరీలో/సండేస్కూల్ క్లాసెస్ లో విడిచిపెట్టడానికి, ఒక కప్పు కాఫీ తాగడానికి, నీ స్నేహితులను పలకరించడానికి, కుర్చీ కనుగొనడానికి నీకు తగినంత సమయం దొరుకుతుంది.

ముందుగానే ప్రణాళిక వేసుకోవడంలో నువ్వు విఫలమైనప్పుడు ఆదివారం ఉదయం ఒక గందరగోళంతో నిండిన సంక్షోభంగా ముగుస్తుంది. సంఘానికి చేరుకునే సమయానికి నువ్వు విసిగి, వేసారి పోతావు. నీ హృదయం వాక్యాన్ని స్వీకరించే స్థితిలో ఉండదు. కానీ నువ్వు చక్కగా ప్రణాళిక వేసుకున్నప్పుడు ప్రశాంతంగా ముందుగానే చేరుకోగలిగినప్పుడు వాక్యాన్ని ఎంతో చక్కగా స్వీకరించగలిగే మానసిక స్థితిలో నువ్వుంటావు.

సంఘానికి హాజరయ్యే విషయంలో స్థిరంగా ఉండు

ఇంట్లో ఉండి ఒంటరిగా ఆరాధన చేసుకోవడంలో ఉన్న అపాయాల గురించి మొత్తం సంఘ అవసరాలకు ఆ పద్ధతి ఎంత అసంపూర్ణమైందో హెబ్రీ గ్రంథకర్త ఎరిగినవాడే. "వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము" (హెబ్రీ 10:23-25). సంఘ కాపరులకు సాధారణంగా ఉండే విసుగును గురించి డేవిడ్ ఏబీ (David Eby) వివరిస్తున్నారు.

వాక్యాన్ని అత్యంత అవసరంగా తీసుకోకుండా, మనస్సాక్షిలో ఏ విధంగానూ వేదనపడకుండా, ప్రతి పనికిమాలిన కారణాన్ని బట్టి సంఘ కార్యక్రమాలకు హాజరవ్వని అస్థిరుల విషయంలో మీరు దుఃఖపడుతుంటారు. రాత్రి పగలు తేడా లేకుండా టీవీలు సినిమాలు చూసి ఎరుపెక్కిన కళ్ళతో, క్రీడా వినోదాలతో, విందులు విలాసాలతో, విహార యాత్రలతో సమయాన్ని ఆనందంగా గడుపుతూ, దేవుని వాక్యాన్ని బట్టి విసుగుచెందే తరం గురించి మీరు విలపిస్తుంటారు.7

చక్కగా వినడానికి మరి ముఖ్యంగా మీ సంఘ కాపరి బైబిల్లో ఒక గ్రంథాన్ని లేదా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రసంగిస్తున్నప్పుడు వినడానికి సంఘానికి క్రమంగా హాజరవడం సహాయపడుతుంది. అప్పుడప్పుడు సంఘానికి హాజరవడం క్రమంగా బోధించబడుతున్న ప్రసంగాంశాన్ని వినడంలో అంతరాయం కలిగిస్తుంది. సినిమా చూస్తుండగా మధ్యలో రెస్ట్ రూమ్ (టాయిలెట్)కి వెళ్లి రావడం వలన జరుగుతున్న దాన్ని అర్థంచేసుకోవడానికి కీలకమైన సమాచారాన్ని మీరు మిస్సయినట్లుగానే ఒక గ్రంథంలో  ఒక అధ్యాయాన్ని మీరు మిస్సయిపోతారు. ఒకవేళ సరైన కారణాన్ని బట్టి మీరు సంఘ కార్యక్రమాన్ని మానేయాల్సి వస్తే మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆ గ్రంథ అధ్యయనాన్ని సమానంగా అర్థంచేసుకోవడానికి ఆ ప్రసంగం యొక్క సి.డి.ని తీసుకోవడం, ఇంటర్నెట్ నుంచి దానిని డౌన్లోడ్ చేసుకుని వినడము ఎల్లప్పుడూ మీకు సహకరిస్తుంది.

దీనత్వంతో, నేర్చుకోవాలని మనసుతో, ఆశకలిగిన హృదయంతో సంఘానికి వెళ్ళండి

మీ జీవితంపై శాశ్వతమైన ప్రభావాన్ని చూపించే విధంగా తన వాక్యం ద్వారా మీతో  మాట్లాడమని దేవుని నుంచి సంపూర్ణంగా ఆశిస్తూ ఎదురుచూస్తూ సంఘానికి వెళ్ళండి. కీర్తనాకారుడు ప్రార్థనలో ఇలాంటి అపేక్షను వ్యక్తపరుస్తున్నాడు: "నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతు లను చూచునట్లు నా కన్నులు తెరువుము" (కీర్తన 119:18). మీరేం నేర్చుకోబోతున్నావో మిమ్మల్ని ఒప్పించడానికి సరిదిద్దడానికి ఆదరించడానికి మార్చడానికి దేవుడు తన వాక్యాన్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నాడో చూడడానికి మీరు ఎంతో ఆత్రంగా ఉండాలి. ఆరాధన కార్యక్రమానికి మనం సమీపించాల్సిన విధానాన్ని జే యాడమ్స్ గారు వివరిస్తున్నారు:

నువ్వొక ప్రసంగాన్ని వినడానికి వెళ్తున్నప్పుడు "దేవుడు నాతో ఏం చెబుతాడు" అనేదానిపైనే నువ్వు దృష్టిసారించాలి. దేవునిపైనే దృష్టిసారించు. ప్రసంగం అనేది నీకు ప్రసంగీకునికి మధ్యన జరిగే లావాదేవీగా కాక, దేవునికి నీకు మధ్య జరిగే లావాదేవీగా చూడు. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రసంగీకుడు ఒక మాధ్యమం మాత్రమే. దేవుని వాక్యాన్ని వినడానికి అలాంటి ఆశతో వెళ్ళు. దానికి విధేయత చూపించినప్పుడు అది నీ జీవితాన్ని మారుస్తుంది.8

నీ పూర్ణ హృదయంతో ఆరాధించు

ప్రసంగానికి దగ్గరవుతున్న క్షణాలే శ్రోతకు అత్యంత కీలకమైన ఘడియలు. అత్యంత కీలకమైన ఈ సమయాన్ని నువ్వు అత్యధికంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. పాటలు ప్రార్థనలు ప్రసంగానికి పరిచయంగా పనికొస్తాయి. దేవుని వాక్యానికి సిద్ధం చేసే విధంగానే ఆరాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆరాధన కార్యక్రమం అంతటికి ముగింపు ప్రసంగమే. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు దేవునితో మాట్లాడతారు, ప్రసంగం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎక్కడ కొన్ని సలహాలు ఉన్నాయి:

  • పాటల్లోని పదాల గురించి ఆలోచిస్తూ వాటిని వ్యక్తిగతమైన స్తుతులుగా మనవులుగా పరిగణిస్తూ ఉత్సాహంగా పాడు.
  • లేఖనం చదవబడుతున్నప్పుడు నీ సొంత బైబిల్లో దాన్ని అనుసరించు, నీకు అత్యంత ప్రత్యేకంగా వర్తించే వచనాలను గమనిస్తూ ఉండు.
    ఇతరులు చేస్తున్న ప్రార్థనలను శ్రద్ధగా విను. నువ్వు వింటున్న వాటికి "ఆమెన్" అని చెబుతూ ఆ ప్రార్థనలను ఆమోదిస్తూ స్పందించు.
  •  ప్రసంగాన్ని వింటున్నప్పుడు మీ సొంత బైబిల్స్ లో చూస్తూ దానిని వినండి. ప్రసంగీకుడు చెప్పే క్రాస్ రిఫరెన్సులను మీకు సాధ్యమైనంతగా తీసి చూడడానికి ప్రయత్నించండి.
  • తన బిడ్డలు తన వాక్యాన్ని అధ్యయనం చేస్తూ బైబిల్లోని పేజీలను తిప్పుతున్నప్పుడు వచ్చే శబ్దం దేవునికి ఇష్టమైనది.
  • నోట్సు రాసుకోండి. నీ జీవితంపై ప్రసంగం యొక్క ప్రభావాన్ని పెంచడానికి అత్యంత సులభమైన మార్గాల్లో ఇది కూడా ఒకటి. నువ్వు ఏకాగ్రత కలిగి ఉండడానికి అది సహకరిస్తుంది ముఖ్యమైన విషయాలను గుర్తించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మొత్తం ప్రసంగమంతా రాసుకోవడానికి ప్రయత్నించవద్దు. ముఖ్యమైన అంశాలను, అతిగా గుర్తు చేసుకోవాలనుకుంటున్న నియమాలను మాత్రమే రాసుకో. ఇంటికి తీసుకువెళ్లి ధ్యానించడానికి ప్రసంగంలో బోధించబడిన సత్యాలను ఇతరులతో చర్చించడానికి నీ జీవితంలో వాటిని అమలు పరచడానికి ఒక ప్రణాళిక వేసుకునేందుకు ఈ నోట్సు పనికొస్తుంది.

నీ దృష్టిని మళ్లించే విషయాలతో పోరాడు

అనేక పనులు పెట్టుకుని తొందరపడిన మార్తాకు ప్రభువు చేసిన ఉపదేశాన్ని ఎవరు మర్చిపోగలరు? "అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే" అని చెప్పెను (లూకా 10:41). వాక్యం ప్రకటించబడిన ప్రతిసారి ఆధ్యాత్మికమైన యుద్ధం జరుగుతుంది.  నువ్వు దేవుని వాక్యాన్ని వినడం సాతానుకు  ఏ మాత్రమూ ఇష్టం ఉండదు.  వాక్యం నీ హృదయంలో మొలకెత్తి ఎదిగి ఫలించకుండా ఉండేలా నీ హృదయం నుంచి మనసు నుంచి దానిని ఎత్తుకొనిపోవడానికి దాన్ని వినకుండా నీ దృష్టి మార్చడానికి వాడు తన శక్తి మేరకు ప్రయత్నిస్తాడు. అందువల్ల నీ దృష్టి అటు ఇటు వెళ్లిపోకుండా ఉండడానికి ఇతరుల దృష్టిని మళ్లించకుండా ఉండడానికి నువ్వు కృషిచేయాలి.

"నువ్వు నిశ్శబ్దంగా కూర్చోక పోతే సంఘంలో మన వెనక కూర్చున్న కొందరు బహుశా నరకానికి వెళ్లిపోతారు" అని మా అమ్మ నా చెవిలో చెబుతున్నప్పుడు ఆమె వెచ్చటి ఊపిరిని నేనింకా అనుభూతి చెందగలను. నేను అప్పటికి అల్లరి చేయడం ఆపకపోతే నా తొడపై ఆమె పొడుగైన గోళ్ళతో గిచ్చడం ప్రారంభించేది. ఆ విధంగా సంఘంలో అల్లరి చేయకుండా ఇతరుల దృష్టి మళ్లించకుండా ఉండడం నేను నేర్చుకున్నాను. నీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేయకుండా బాత్రూంకు వెళ్లడానికి పైకి కిందకి ఎక్కి దిగుతుండడం ద్వారా ఇతరులకు నువ్వు ఒక ఆటంకంగా ఉంటావు. ఒకవేళ నువ్వు కచ్చితంగా ఆరాధన కార్యక్రమాన్ని విడిచిపెట్టాల్సివస్తే, తిరిగి వచ్చినప్పుడు వెనుక సీట్లో కూర్చో, లేదంటే నీ సీటుకు నువ్వు తిరిగి వెళ్లడానికి సరైన సమయం కోసం వేచి చూడు.

ప్రసంగ సమయంలో నువ్వు ఎక్కడ కూర్చుంటావు ఎవరితో కూర్చుంటావు అనే విషయం ఏకాగ్రత నిలపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముందు వరుసలో కూర్చోవడం వలన నీ వెనక జరిగే అనేకమైన ఆటంకాలను నువ్వు చూడలేవు కాబట్టి నీ దృష్టి మళ్లించే అనేక విషయాలను తొలగించుకోవడానికి అదే అత్యంత సులభమైన మార్గాల్లో ఒకటి. ప్రసంగానికి స్పందిస్తూ ఉండడమే దృష్టి నిలపడానికి మరొక సహాయకరమైన మార్గం. కుర్చీలోనే ఒక రాయిలా కూర్చుండిపోకు. ప్రసంగీకునివైపే చూస్తూ చిరునవ్వు నవ్వుతూ నీ తల ఊపుతూ ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ పాస్టర్ ప్రస్తావిస్తున్న వచనాన్ని నీ నోటితో చెబుతూ సరైన సందర్భంలో "ఆమెన్" అని చెబుతూ నువ్వు ప్రసంగంపై దృష్టిసారిస్తున్నట్లు కనపరచు. ప్రసంగం జరుగుతుండగా నువ్వేం చెబుతావో ఏం చేస్తావో అనే విషయాలు నువ్వు ఎన్నడైనా తెలుసుకునే దానికంటే ప్రసంగీకుణ్ణి ఎక్కువ ప్రభావితం చేస్తాయి.

ప్రసంగీకుడు చెప్పే మాటలను నువ్వు వినట్లేదని నిద్రపోతున్నావని నీ పక్కన ఉన్న వ్యక్తితో గుసగుసలాడుతున్నావని ప్రసంగం మధ్యలో లేచి వెళ్ళిపోతున్నావని అతడు చూసినప్పుడు అది అతణ్ణి నిరుత్సాహపరుస్తుంది. ప్రసంగాన్ని వినడంలో నువ్వు పూర్తిగా లీనమయ్యావని చూపించడానికి నీ హావభావాలు మాటల్లోని స్పందనలు కనబడుతూ ఉంటే అది ఆటల పోటీల్లో పాల్గొనే వ్యక్తిని చూస్తున్న ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నట్లు ప్రసంగీకుణ్ణి ప్రోత్సహిస్తుంది.

వినడంతో ఉన్న సవాలు ఏంటంటే ప్రసంగీకుడు మాట్లాడగలిగిన దానికంటే వేగంగా నువ్వు వినగలగడమే. సగటు శ్రోత నిమిషానికి 400 పదాలకు పైగానే వినగలిగితే సగటు వక్త నిమిషానికి కేవలం 100 నుంచి 200 పదాలను మాత్రమే మాట్లాడగలడు. వక్త తన మాటలను పోగు చేసుకుంటుండగా వేచి చూస్తూ నీ మనసుకి దొరికిన అదనపు సమయం వెలుగులో నిద్రపోకుండా ఉండడానికి, మధ్యాహ్నం భోజనం గురించి పగటి కలలు కనకుండా ఉండడానికి, ఈరోజు ఎవరు ఆడుతున్నారో వచ్చేవారం ఆ పెద్ద ప్రాజెక్టు ఎలా ముగించాలో అని ఆలోచించకుండా నువ్వు చేయగలిగింది చేయాలి. మీకు చిన్న పిల్లలు ఉంటే నర్సరీని పిల్లల నిమిత్తం నిర్వహించబడే సంఘ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి. అలా చేయడం వలన మీ చుట్టూ కూర్చున్నవారిని మీ పిల్లలు ఇబ్బందిపెట్టకుండా ఆపడం మాత్రమే కాదు, మీరు కూడా ఎలాంటి అవాంతరాలూ లేకుండా వాక్యం వినడానికీ, మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నారో అనే విషయం గురించి అతిగా చింతపడకుండా ఉండేందుకు మీకు సహాయపడుతుంది. సంఘంలో మీ పిల్లల్ని మీతో ఉంచుకోవడం ద్వారా వాళ్ళు ఎదిగినప్పుడు కూడా ప్రసంగం వినకుండా వారికి మీరు జాగ్రత్తతోనే శిక్షణ నిస్తుండవచ్చు. యాడమ్స్ గారు జ్ఞానంతో ఇలా చెబుతున్నారు

ప్రసంగీకుడు చెప్పేదాన్ని అర్థంచేసుకునే సామర్థ్యాన్ని పొందక ముందే సంఘంలోనికి పిల్లల్ని ఈడ్చుకు రావడం దేవుణ్ణి సంతోషపెడుతుందని తప్పుగా ఆలోచిస్తూ 30-40 నిమిషాలు పిల్లలు ప్రసంగం వినడం కాకుండా వేరే ఏదో ఒక పనిచేస్తూ కూర్చొనమని వాళ్లు తమ పిల్లలకు బోధిస్తున్నారు. కొందరు కార్లతో బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు, ఇతరులు బొమ్మలు గీస్తూ, మరికొందరు ఆ ప్రదేశంలో ఉన్న కాగితాలను చించి వాటితో విమానాల టోపీల బొమ్మలను చేస్తుంటారు, చాలామంది నిద్రపోతుంటారు.9

ప్రసంగం జరుగుతుండగా ఇవన్నీ పిల్లలను పరధ్యానంగా ఉండడం నేర్పిస్తాయి, జీవితంలోని తర్వాత దశలో ఈ అలవాటును మానుకోవడం కష్టతరమవుతుంది.

శ్రద్ధ, వివేచనలతో వినండి

బెరయా సంఘస్థులు ప్రతి దానిని లేఖనాలలో వెదికారు, నువ్వు కూడా అదే విధంగా చేయాలి (అపో 17:11). ప్రసంగీకుడు చెబుతున్నది వాక్యానుసారంగా ఖచ్చితంగా ఉందో లేదో నిర్ధారించుకునే వ్యక్తిగతమైన బాధ్యతను దేవుడు నీపైనే పెడుతున్నాడు (ద్వితీ 13:1-5; 1 యోహాను 4:1; 2 యోహాను 1:7-11). మీరు వింటున్న దాని గురించి విమర్శనాత్మకంగా ఆలోచించాలి. ప్రసంగీకుడు చెప్పాడు కాబట్టి దానిని మీరు అంగీకరించకూడదు. దేవుడు చెప్పిన దానినే అతడు చెబుతున్నాడో లేదో నిర్ధారించుకోండి. "ప్రసంగించబడే వాక్యాన్ని వింటున్న వాళ్ళు శ్రద్ధతో సిద్ధపాటుతో ప్రార్థనతో దానిని వినాల్సిన అవసరం ఉంది. వాళ్లు వింటున్న దానిని లేఖనాలతో పరీక్షించాలి.‌ విశ్వాసంతో ప్రేమతో సాత్వికంతో సిద్ధమనస్సుతో దేవుని వాక్యాన్ని సత్యంగా స్వీకరించాలి. దాన్ని ధ్యానించాలి, తమ హృదయాల్లో భద్రపరుచుకోవాలి, తమ జీవితాల్లో దానికి తగిన ఫలాన్ని ఫలించాలి" అని వెస్ట్ మినిస్టర్ లార్జర్ కేటకిజం చెబుతున్నది.

నువ్వొక ప్రసంగాన్ని వింటున్నప్పుడు అది ఎంత సృజనాత్మకంగా తెలివిగా ఉంది అనే దానిపైన దానిని విమర్శించకు. ప్రసంగ శైలి కంటే కూడా ప్రసంగ సారాంశమే అత్యంత ముఖ్యమైనది. ఒక వచనానికి లేదా వాక్యభాగానికి ప్రసంగీకుడు సరిగ్గా భాష్యం చెప్పాడా? దానిని సరిగ్గా వివరించాడా? బైబిల్లోని ఇతర వాక్యభాగాలతో అతని అభిప్రాయాన్ని సరిగ్గా సమర్ధించుకున్నాడా? నీ జీవితానికి ఆచరణాత్మకంగా అన్వయించాడా? అని నిన్ను నీవే ప్రశ్నించుకో.

హృదయాత్మల సిద్ధపాటు

అలిస్టర్ బెగ్ గారి ప్రసంగ పరిచర్యను  బట్టి నేను వ్యక్తిగతంగా దీవించబడ్డాను. ఆయన ప్రసంగించడం విన్న ప్రతిసారి కూడా ఆయన ఎంత శక్తితో ఒప్పింపుతో ప్రసంగిస్తాడో చూసి నేను ఎంతో ప్రేరణ పొందాను. నేను యూత్ పాస్టరుగా పనిచేస్తున్నప్పుడు మా విద్యార్థి పరిచర్యలో ఆయనను ప్రసంగించమని ఆహ్వానించే ఆధిక్యత దక్కింది. ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన కారు దగ్గరికి నడిచి వెళుతూ "మీ శక్తివంతమైన ప్రసంగానికి కీలకమైనది ఏంటి?" అని అడిగాను. "శక్తివంతమైన ప్రసంగానికి కీలకమైనది సిద్ధపాటు అని మార్టిన్ లాయిడ్ జోన్స్ చెప్పాడు. ప్రసంగానికి సిద్ధపడితే సరిపోదు, హృదయానికి ఆత్మకి కూడా సిద్ధపాటు అవసరమే" అని ఆయన చెప్పిన జవాబును నేను ఎన్నటికీ మర్చిపోను.

సిద్ధపాటు గురించిన నియమం మరి ముఖ్యంగా హృదయాత్మల సిద్ధపాటు అనేది కేవలం ప్రసంగీకులకు మాత్రమే కాదు, వినే వారందరికీ కూడా వర్తిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. దేవుని వాక్యాన్ని శక్తివంతంగా ప్రసంగించడానికి ప్రసంగీకుని హృదయానికి మనసుకు సరైన  సిద్ధపాటు ఎంత కీలకమో దేవుని వాక్య ప్రకటన చేత శక్తివంతంగా ప్రభావితం కావడానికి కూడా శ్రోత యొక్క హృదయానికి మనసుకు సరైన సిద్ధపాటు అంతే కీలకం. శ్రద్ధ కలిగిన, సరైన సిద్ధపాటు కలిగిన హృదయంతో స్వీకరించకపోతే అత్యంత నైపుణ్యంతో చెక్కబడిన చెప్పబడిన ప్రసంగాలు కూడా నీ జీవితాన్ని మార్చడంలో విఫలమవుతాయి.

 అధ్యయనం/చర్చ కోసం

1. ఎఫెసీ 6:19-20; కొలస్సీ 4:2-4; 2 థెస్స 3:1 చదవండి. ప్రసంగీకుని గురించి ఏయే ప్రత్యేకమైన విషయాలలో నువ్వు ప్రార్థించాలి? మీ సంఘ కాపరిపై మీ సంఘంపై మీ సమాజంపై మీ ప్రార్థనలు ఎలాంటి శక్తివంతమైన ప్రభావాన్ని కనపరచగలిగాయి?
2. వాక్యానుసారమైన ప్రసంగాన్ని వినగలిగే పాటించగలిగే నీ సామర్థ్యాన్ని సామాజిక మాధ్యమాలలో నువ్వు గడిపే సమయం ఏ విధంగా క్షీణింపచేసింది? టీవీ చూడడానికి, ప్రసంగాన్ని వినడానికి మధ్యనున్న వ్యత్యాసం ఏంటి?
3. ప్రసంగాన్ని వింటున్నప్పుడు ఏకాగ్రత చూపించకుండా నీ గమనాన్ని మళ్లిస్తున్నది ఏమిటి? ఆ అవాంతరాలకు విరుద్ధంగా నువ్వు పోరాడగలిగే కొన్ని ఆచరణాత్మక మార్గాలు ఏవి?

దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి నీ హృదయాన్ని చక్కగా సిద్ధపరచుకునే విషయంలోనూ వాక్యాన్ని వినాల్సి వచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడం ఎలాగో నిర్ధారించుకోవడానికి నీకు సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్ధించు.

 వినడానికి కుతూహలంతో కాదు, మీ బాధ్యత ఏంటో తెలుసుకుని దానిని నిర్వర్తించడానికి నిజాయితీగల కోరికతో రండి. మన హృదయాలు మార్పు చెందాలని కాకుండా కేవలం మన వీనులకు విందు కలగాలని మాత్రమే ఆయన మందిరంలోనికి ప్రవేశించడం మహోన్నతుడైన దేవునికి ఎంతో ఆయాసకరంగాను మనకు ఎంతో నిష్ప్రయోజనకరంగాను ఉంటుంది. - జార్జ్ విట్ఫీల్డ్

అధ్యాయం 4

దురద చెవులు అనే అంటువ్యాధి

దేవుని యెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును. 2 తిమోతి 4:1-4

అమెరికాలోనే అత్యంత పెద్దదైన, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదిగా పేర్కొనబడుతున్న సంఘానికి దగ్గర్లోనే నేను సేవ చేస్తుంటాను. వ్యక్తిగత వికాసానికి ప్రేరణ కలిగించే విధంగా వాక్చాతుర్యంతో మాట్లాడే ఒక అందమైన వక్త చెప్పేదానిని వినడానికి మా నగరం అంతటి నుంచి ప్రతి శనివారం రాత్రి ఆదివారం ఉదయం వేలాదిగా ప్రజలు తరలివస్తుంటారు.  ప్రజలను ప్రోత్సహించడానికే తనను దేవుడు పిలిచాడు, కాబట్టి పాపం అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే తాను ప్రస్తావించనని అతడు ఒప్పుకున్నాడు. ప్రతి వారము అతడు చెప్పే సందేశం ప్రాథమికంగా ఒక్కటే: "ప్రతికూలమైన ఆలోచనలు మానుకోండి. నిన్ను నువ్వు ఒక బాధితునిగా పరిగణించుకోవడం మానేయ్. దేవుడు నీకోసం శ్రేష్ఠమైన విషయాలను దాచి ఉంచాడని నమ్ము. నీలోని విజేతను కనిపెట్టు. నీవు ఇప్పుడున్న దానికంటే శ్రేష్ఠమైన వ్యక్తిగా తయారవ్వ గలవు!"
ఇతడు బోధించేది నార్మన్ విన్సెంట్ పీలే అనే వ్యక్తి రచించిన "పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్" అనే పుస్తకంలో కనబడే మాటలనే, వ్యత్యాసం కేవలం ఇతడు క్రైస్తవ పదజాలాన్ని ఉపయోగించి ఆ పుస్తకంలోని సందేశాన్ని చెప్పడమే!

పాముల్ని ఆడించే వ్యక్తిలాంటి ఈ ప్రసంగీకుణ్ణి నేను టీవీలో విన్న ప్రతిసారి అతడు ఒక్కటే సందేశాన్ని చెప్తున్నట్లే నాకు అనిపిస్తుంది. అయినా సరే ప్రజలు ప్రతి వారమూ తిరిగి వచ్చే విధంగా మోసగించబడుతున్నారు. నేను ఇలాంటి ఒక అభిప్రాయానికి వచ్చాను, ఎందుకంటే వాళ్లు ప్రతినిత్యం వింటున్న దాన్ని ఇష్టపడుతున్నారు, అదే ప్రసంగాన్ని మళ్లీ మళ్లీ వినడానికి ఇష్టపడుతున్నారు.

ఈ వ్యక్తి యొక్క ప్రసంగంలో అత్యంత దారుణంగా ప్రజల్ని తప్పు దారిపట్టించేది ఏంటంటే ప్రతివారం అతడు తన ప్రసంగాన్ని మొదలు పెట్టడానికి ముందు ప్రతి ఒక్కరినీ తమ బైబిల్ని చేతుల్లో పైకి ఎత్తిపట్టుకోమని చెప్పి ఈ కింది ప్రమాణం చేయిస్తుంటాడు:

ఇది నా బైబిల్. నేను ఏమై ఉన్నానని ఇది చెబుతుందో అదే నేను. నేను ఏమి కలిగి ఉన్నానని ఇది చెబుతుందో అది నా దగ్గర ఉంటుంది. నేను ఏమి చేయగలనని ఇది చెబుతుందో నేనది చేయగలను. ఈ రోజు దేవుని వాక్యం నాకు బోధించబడుతుంది. నా మనస్సు మెలకువగా ఉందని నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నాను. నా హృదయం వాక్యాన్ని స్వీకరిస్తుంది. అక్షయమైన శాశ్వతమైన సజీవమైన దేవుని వాక్యం అనే విత్తనాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎన్నటెన్నటికీ ఇదే విధంగా ఉండిపోను. యేసు నామంలో, నేను ఎన్నటెన్నటికీ ఇదే విధంగా ఉండిపోను."

అయితే అతని ప్రసంగ వేదిక నుంచి దేవుని వాక్యం బోధించబడడం అత్యంత అరుదు. ప్రతి ఒక్కరి బైబిల్ మొత్తం ప్రసంగం అంతట్లోనూ ప్రజల ఒళ్లోనే ఉన్నప్పటికీ అతడు దాన్ని అస్సలు ప్రస్తావించడు. అతని ప్రసంగాల్లో బైబిల్లోని మాటలు చాలా తక్కువ ఉంటాయి, కొన్నిసార్లు అసలే ఉండవు. కానీ అవి చాలా ప్రోత్సాహపరిచేవిగా  ఉంటాయి. ఈ వేలాది శ్రోతల హృదయాలు సరిగానే ఉన్నాయని మనం చెప్పవచ్చు. ప్రసంగీకుడు చెప్పే ప్రతి మాటను ప్రతి సందేశాన్ని వాళ్లు ఉత్సాహంతో హత్తుకుంటున్నారు. సమస్య ఏంటంటే ఆ సందేశమే అనారోగ్యకరమైనది.

అత్యంత పెద్దదైన ఈ సంఘంలో ఇలాంటి వందలాది సంఘాల్లోనూ తరచూ కనపడేది అవసరం కొద్దీ సరఫరా అనే నియమమే (principle of supply and demand). ప్రజల అవసరమే వస్తువుల డిమాండును సృష్టిస్తుంది. ఈ రోజు సంఘంలో ఎంతో అనారోగ్యకరమైన బోధ ఉండడానికి కారణం చాలామంది తమ చెవులకున్న దురదను తగ్గించుకోవాలని కోరుకోవడమే. సిద్ధాంతంపై దృష్టిసారించే సుదీర్ఘమైన ప్రసంగాలను వినడానికి ప్రజలు ఇష్టపడట్లేదు అని చర్చి గ్రోత్ నివేదికలు చూపిస్తున్నాయి. తమకున్న అవసరాలను (అనగా కుటుంబ విషయాలు ఆర్థిక విషయాలు సంబంధ బాంధవ్యాలు కోపం ఆందోళన మనస్థాపం తదితర విషయాలను) పరిష్కరించడానికి క్లుప్తమైన ప్రోత్సాహకరమైన సందేశాలను మాత్రమే వారు వినాలనుకుంటున్నారు. ప్రజలు ఏం వినాలని అనుకుంటున్నారో తెలుసుకుని ప్రతి వారము అదే సందేశాన్ని చెప్పడం ద్వారా చాలామంది ప్రసంగీకులు అనేకమంది అనుచరులను పోగు చేసుకున్నారు. అలాంటి సందేశాలను చెప్పేవారి మాటల్ని వినడానికే ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. పెద్ద సంఘం అంటే సత్యాన్ని ప్రకటిస్తున్నందుకు బహుశా దేవుడు ఆ సంఘ కాపరిని దీవిస్తుండవచ్చని భావించడం సహజమే. అయితే మన తరంలో సంఘానికి హాజరయ్యే వారిలో అత్యధిక ప్రజలకు దురద చెవులు అనే అంటురోగం సోకి విస్తరిస్తున్నందువల్ల సంఘంలో అత్యధిక జనాభా ఉన్నారంటే బహుశా ఆ ప్రసంగీకుడు ప్రజలు వినాలనుకున్న దానిని మాత్రమే చెబుతున్నాడనడానికి ఒక సూచన అయ్యుండవచ్చు.

దురద చెవులు అనే వ్యాధి నిర్ధారణ

నేటి ప్రసంగంలోని సమస్యకు కారణం ప్రసంగ వేదికలపైన నిలబడిన వారు మాత్రమే కాదు, కుర్చీల్లో కూర్చున్న వారు కూడా. ఏమి వినాలో శ్రోతలు మర్చిపోయారు. వాళ్ళు తమ వాక్య వివేచనను కోల్పోయారు. బైబిల్లో 2 తిమోతి 4:1-4 కంటే వేరే ఏ ఇతర వాక్య భాగమూ నేడు ప్రజలు వినడంలో ఉన్న సమస్య గురించి ఒక గొప్ప తలంపును సమకూర్చడం లేదు. వాక్య ప్రకటన గురించి సత్యమైన, ప్రాథమికమైన సంగతిని తెలియజేసే సుపరిచితమైన వాక్యభాగం ఇదే. పిచ్చివాడైన రోమా చక్రవర్తి నీరో చేత శిరచ్ఛేదనం చేయబడడానికి కొన్ని వారాల (బహుశా కొన్ని రోజుల) ముందే అపోస్తలుడైన పౌలు సపరిచితమైన ఈ చివరి మాటల్ని రాశాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం యొక్క ప్రాముఖ్యతపైనే ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని వినడం యొక్క ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని ఈ వచనాలు మనకు చూపిస్తున్నాయి. ఈ రెండు ఒకదాన్నుంచి మరొకటి విడిపోనంతగా ముడి వేయబడ్డాయి.

"దేవుని వాక్యాన్ని సరిగ్గా వినడం గురించి తన సంఘానికి జాన్ కాల్విన్ తరచు ఉపదేశించేవాడు. వాక్య ప్రకటన విషయంలో తనకున్న ఉన్నతమైన భావాన్ని బట్టి కాల్విన్ సరిగ్గా వినడం గురించి ఉద్ఘాటించేవాడు" అని జోయెల్ బీకీ చెప్పారు.1 దేవుని వాక్యాన్ని సరిగ్గా ప్రకటించే విధానం గురించిన ఖచ్చితమైన అవగాహనతోనే, ఆ అవగాహన నుంచే దేవుని వాక్యాన్ని వినే సరైన విధానం గురించిన ఖచ్చితమైన అవగాహన కలుగుతుందని కాల్విన్ నిస్సందేహంగా నొక్కిచెప్పి ఉంటాడు. అతని దినములు లెక్కించబడ్డాయని ఎరిగి పౌలు చివరిసారిగా తన కలాన్ని కాగితంపై పెట్టి తన తుది శ్వాసను విడవడానికి ముందు తన ప్రియమైన శిష్యునికి ఈ కింది మాటలు రాశాడు.

దేవునియెదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు ఎదుటను, ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు, నేను ఆనబెట్టి చెప్పునదేమనగా
వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. (వ. 1-2)

ఈ చివరి ఆజ్ఞ యొక్క గాంభీర్యతను నొక్కి చెప్పడానికి దానికి నమ్మకంగా ఉండడానికి విధేయత చూపించడానికి తిమోతిని ప్రేరేపించేలా ఈ మహోన్నతమైన సందర్భానికి దేవుణ్ణి, యేసుక్రీస్తును పౌలు సాక్షులుగా పిలిచాడు. తిమోతి పరలోకంలో దేవుని సింహాసనం ముందు నిలబడి ఉన్నట్లు, తిమోతిని చేయమని ఆజ్ఞాపిస్తున్న సందర్భాన్ని తండ్రి కుమారులు చూస్తున్నట్లు వింటున్నట్లు, అతడు భావించాలని పౌలు కోరాడు. ఇది స్వయంగా దేవుడే జారీ చేసిన అంతిమమైన శాసనమని తిమోతి గ్రహించాలని పౌలు కోరుకున్నాడు.

అది తగినంత ఒత్తిడి కాకపోతే, "దేవుడు నియమించిన న్యాయాధిపతి, దేవుని కుమారుడు, ప్రభువైన యేసుక్రీస్తు ముందు ఒకానొక రోజున నువ్వు నిలబడాలి. ఈ ఆజ్ఞకు నువ్వు నమ్మకంగా విధేయత చూపించావో లేదో లెక్క అప్పగించాలి" అని పౌలు తిమోతికి గుర్తుచేస్తున్నాడు. న్యాయపీఠం (బీమా సీట్) గురించి అనగా విశ్వాసి యొక్క ప్రతి క్రియ సమీక్షించబడే తగినవిధంగా ప్రతిఫలం ఇవ్వబడే సందర్భాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు (రోమా 14:10-12; 1 కొరింథీ 3:10-15; 2 కొరింథీ 5:10). దేవుని వాక్యానికి ప్రసంగీకులుగా బోధకులుగా పరిచర్య చేసేవారు అత్యంత కఠినమైన విచారణను, న్యాయ పీఠం దగ్గర అత్యంత తీవ్రమైన తీర్పును ఎదుర్కొంటారు.

"నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి" అని యాకోబు 3:1 చెబుతున్నది. ప్రతి ప్రసంగీకుడు దేవుని వాక్యంతో ఎలా వ్యవహరించాడు అనేదాన్ని ఆధారం చేసుకుని తీర్పు పొందుతాడు. అందువల్లనే "దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము" అని ఇంతకుముందే పాలు తిమోతికి ఆదేశించాడు (2 తిమోతి 2:15). తీర్పు రోజున దేవుని ఆమోదాన్ని పొందాలనే కోరికే దేవుని వాక్యాన్ని నమ్మకంగా ప్రసంగించడానికి ప్రతి ప్రసంగీకునికి అంతిమమైన ప్రేరణగా ఉండాలి.

తన సొంత జీవితాన్ని దేవుని వాక్యం ఎంత శక్తివంతంగా ప్రభావితం చేసిందో ఇతరుల జీవితాలపై కూడా ప్రభావితం చేయడానికి సంపూర్ణంగా అతణ్ణి ఎలా సిద్ధపరిచిందో ఇంతకుముందు అధ్యాయంలోనే పౌలు తిమోతికి గుర్తుచేశాడు. 2 తిమోతి 3:15-17లో పౌలు ఇలా రాశాడు:

"నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది."

వేరే విధంగా చెప్పాలంటే దేవుని వాక్యం యొక్క అధికారం గురించి సామర్థ్యం గురించి సంపూర్ణత గురించి తిమోతి సంపూర్ణంగా ఒప్పించబడాలని పౌలు కోరాడు. లేఖనాలకున్న దివ్య స్వభావం గురించి అతనికున్న నమ్మకమే దాన్ని ప్రసంగించేలా అతణ్ణి నిర్బంధించింది. బైబిల్ గురించి ఒక ప్రసంగీకునికి ఉన్న నమ్మకాలే అతడు దాన్ని ప్రసంగించే విధానంలో కనిపిస్తాయి. బైబిల్ నిజంగా దైవ ప్రేరేపితమైందనీ తప్పులు లేనిదనీ లోపాలు లేనిదనీ ఉపదేశానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతియందు  శిక్ష చేయడానికి ప్రయోజనకరమైందనీ అతడు నిజంగా నమ్మితే అప్పుడు అతడు చేసే ప్రతి ప్రసంగంలో అంశానికి మూలం బైబిలే అవుతుంది. ప్రసంగ వేదిక నుంచి అతడు తన సొంత ఆలోచనలను అభిప్రాయాలను ప్రకటించడు. తన కలలను దర్శనాలను ఇతర వ్యక్తిగత అనుభవాలను అతడు పంచుకోడు. అతడు జోకులు కథలు చెప్పడు. కారణం ఏంటి? దేవుడు ఇంతకుముందు చెప్పిన దానికంటే మరేదీ అంత ప్రాముఖ్యమైనది కాదని అతడు అర్థంచేసుకుంటాడు కాబట్టే. వాస్తవానికి బైబిల్ చెబుతున్న దానికి భిన్నంగా చెప్పడానికి తన దగ్గర ఏమీ లేదని అతడు నొక్కిచెబుతాడు.

బైబిల్ నుంచి నేరుగా తీసుకున్న ఒక వచనాన్ని లేదా  ఒక వాక్యభాగాన్ని ప్రసంగీకుడు వివరించినప్పుడే అది బైబిల్ కి అనుగుణమైన ప్రసంగం అవుతుంది. ఆ వచనం యొక్క వాక్య భాగం యొక్క అర్థాన్ని అక్షరానుసారంగా చారిత్రాత్మకంగా వ్యాకరణానుసారంగా వివరించాలి, నేటి ప్రజల జీవితాలకు పనికొచ్చే నిత్యసత్యంగా దాని అర్థాన్ని సృజనాత్మకంగా రూపుదిద్దాలి. గ్రంథకర్త తన మొదటి శ్రోతలకు రాసిన దానిని ప్రసంగీకుడు మొదటిగా వివరిస్తాడు, ఆ తర్వాత ఆ అసలైన అర్ధాన్ని నేటి తన శ్రోతలకు ఎలా వర్తిస్తుందో చూపిస్తాడు. ఈ ప్రసంగ పద్ధతినే వాక్యానుసారమైన బైబిల్ బోధ లేదా ఎక్స్ పోజిటరీ ప్రీచింగ్ అంటారు.

ఎక్స్ పోజిటరీ ప్రీచింగ్ గురించి దైవశాస్త్ర పండితుడైన వేయిన్ గ్రూడెం ఒక అసాధారణమైన సారాంశాన్ని సమకూర్చారు.

"సంఘ చరిత్ర అంతట్లోనూ అత్యంత గొప్ప ప్రసంగీకులు లేఖనాల్లోని పదాలను వివరించి, తమ శ్రోతల జీవితాలకు స్పష్టంగా వాటిని అన్వయించడమే తమ బాధ్యతగా చూశారు... వాళ్లు ప్రాథమికంగా ప్రసంగ వేదికపై నిలబడి, బైబిల్లోని మాటలని చూపిస్తూ "ఈ వచనం యొక్క అర్థం ఇదే. ఆ అర్ధాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారా? అయితే మీరు దాన్ని నమ్మాలి. మీ పూర్ణ హృదయంతో దానికి విధేయత చూపించాలి. ఎందుకంటే దేవుడే మీ సృష్టికర్త, మీ ప్రభువు. ఈ రోజు ఆయనే దీనిని మీకు చెబుతున్నాడు" అని తమ సంఘంతో వాళ్లు చెప్పేవారు.2

ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించడమే ప్రసంగం యొక్క ప్రాథమికమైన ఉద్దేశం, తద్వారా వాళ్లు దేవుడు కోరిన విధంగా జీవించగలుగుతారు. ప్రసంగం విన్న తర్వాత కూడా నీ జీవితం యెడల దేవుని ఉద్దేశం ఏంటో నీకు స్పష్టమైన అవగాహన రాకపోతే నువ్వు విన్నది వాక్యానుసారమైన ప్రసంగాన్ని కాదు. నీ జీవిత భాగస్వామితో నువ్వెలా ప్రవర్తించాలో నీ పిల్లల్ని ఎలా పెంచాలో నీ ధనాన్ని ఎలా నిర్వహించుకోవాలో కొన్ని ఆచరణాత్మకమైన సూచనలనే నువ్వు విని ఉంటావు.

నువ్వు కొద్దిసేపు నవ్వుకొని ఉంటావ్, ఏడ్చి ఉంటావ్, ప్రోత్సహించబడి ప్రేరేపించబడి అక్కడ నుంచి వెళ్లి ఉంటావ్. అయితే నువ్వు విన్నది వాక్యానుసారమైన ప్రసంగానికి నిజంగా అర్హమైనది కాదు.

బైబిల్లో అక్కడక్కడ ఉన్న వచనాలను ప్రస్తావించకూడదని నేను చెప్పట్లేదు. అయితే నేడు ఎంతో ప్రజాదరణ పొందిన అంశ ప్రధాన ప్రసంగాల్లో కొన్ని వచనాలను దాటిపోయి, మరికొన్ని సమయాల్లో సందర్భం నుంచి ఆ వచనాలను బయటకు తీసి, ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఉపయోగిస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే అది దేవుడు ఉద్దేశించిన వివరణ కాదు. తరచూ ఒక వచనంగాని వాక్య భాగంగాని ప్రసంగీకుడు ఏ విషయాన్నయితే బోధించాలనుకున్నాడో దానికి ఉపోద్ఘాతంగా తప్ప మరి దేనికీ పనికిరావు. అంశ ప్రధాన ప్రసంగాలే ప్రమాణంగా ఉన్న సంఘాల్లో ప్రజలు నమ్మకంగా బైబిల్ని మోసుకెళ్తారు, ప్రసంగానికి ఆరంభంలో భయభక్తులతో చదువుతారు, కానీ తర్వాత అవి ప్రజల ఒళ్ళో తెరవబడే ఉంటాయి, కానీ ఎన్నడూ వాటిని తిరిగి చూడరు. మరికొన్ని సంఘాల్లోనైతే చాలామందికి తమ బైబిళ్లను సంఘానికి తీసుకురావాలనే భావన కూడా కలుగదు, ఎందుకంటే ప్రసంగీకులు వాటిని ఉపయోగించమని ఎన్నడూ వాళ్లను ప్రోత్సహించరు, మరో కారణం ప్రసంగంలో ప్రస్తావించబడే వచనాలు తెరపైన ప్రదర్శించబడతాయి.

అయితే సంఘానికి హాజరయ్యే అనేకమందిని ఈ విషయమేమీ బాధ పెడుతున్నట్లు కనిపించట్లేదు. బైబిల్లోని గ్రంథాలను ఒక క్రమ పద్ధతిలో వచనం తర్వాత వచనాన్ని వివరించే ప్రసంగం మీకు కావాలా? లేదంటే వివాహం, పిల్లల పెంపకం, శృంగారం, ధనం, ఉద్యోగం, డేటింగు, ఒత్తిడి లాంటి ఆచరణాత్మకమైన విషయాలపైన ప్రత్యేకమైన ప్రసంగాలను సృష్టించే విధంగా బైబిల్లో ఉన్న అక్కడక్కడ వచనాలను తీసుకునే అంశ ప్రధాన సందేశాలు మీకు కావాలా? అని అడిగితే సంఘానికి హాజరయ్యే అనేకమంది అంశ ప్రధాన ప్రసంగాలనే ఎంచుకుంటారు. ఎందుకంటే వారి మనసులకు అవే సులభతరమైనవిగా, వినడానికి అత్యంత ఆస్వాదించదగినవిగా, తమ అనుదిన జీవితాలకు అవే అత్యంత సహాయకరంగా అనిపిస్తాయి. ఇది మనల్ని ఏ మాత్రమూ ఆశ్చర్యపరచనక్కర్లేదు, ఎందుకంటే భవిష్యత్తులో సంఘం "హితబోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగుకాలము వచ్చును" అనే అభిప్రాయంతోనే పౌలు తిమోతికి ఈ ఆజ్ఞను జారీ చేశాడు కాబట్టి (2 తిమోతి 4:3-4). పౌలు తిమోతిని ఏ కాలం గురించైతే హెచ్చరించాడో అదే కాలంలో మనం జీవిస్తున్నాం.

ఆరోగ్యకరమైన, సిద్ధాంతపరమైన ప్రసంగాన్ని సహించలేని ప్రజలు నేటి సంఘాల్లో అనేకమంది ఉన్నారు. తమ పాపపు జీవనశైలిని గద్దించే, తమను అసౌకర్యంగా చేసే సత్యాన్ని బోధించడానికి ప్రసంగ వేదిక వెనుక నిలబడే ఎవరినైనా వాళ్లు సహించలేరు. కూర్చుని అలాంటి ప్రసంగాన్ని వినడానికి వాళ్ళు ఏ మాత్రమూ అంగీకరించరు. ప్రసంగీకుడు తమకు అభ్యంతరం కలిగించేలా తమ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నట్లు వాళ్లు భావిస్తే అతణ్ణి తమ సంఘం నుంచి బయటకు పంపేస్తారు, లేదా తమ దురద చెవులను గోకుతూ తమ గురించి తాము మంచి అనుభూతులు కలిగేలా చేసే సంఘానికి వాళ్లు వెళ్లిపోతుంటారు. తమను గద్దించే ప్రసంగికులను కాక బుజ్జగించేవారిని తాము వినాల్సిన దానిని బోధించేవారిని కాక వాళ్లు వినాలనుకున్న దానిని బోధించేవారిని తమ చుట్టూ పెట్టుకుని బైబిల్లోని అభ్యంతరకరమైన సత్యాన్నుంచి తమను తాము విజయవంతంగా దూరం పెట్టుకుంటున్నారు. ఉపదేశం లేఖనాల బోధకు అనుగుణంగా ఉందా? లేదా? అనే ప్రమాణాన్ని పెట్టుకోకుండా అది తమ భ్రమలను ప్రోత్సహిస్తోందా? లేదా? తమ దురద చెవులను గోకుతోందా? లేదా? తాము ఎల్లప్పుడూ ప్రోత్సహించబడాలి రంజింపబడాలి అనే తమ కోరికను సంతృప్తి పరుస్తోందా? లేదా? అనే విషయాలను ప్రమాణంగా పెట్టుకుని వాళ్లు ప్రసంగీకులను పరీక్షిస్తున్నారు. తేలికైన, ప్రోత్సాహాన్ని నింపే, వినోదాన్ని పంచే సందేశాలనే వినడానికి అత్యధిక శాతం ప్రజలు ఇష్టపడుతున్నారు. అవకాశమిస్తే బైబిల్లోని సత్యాలను వినడం కంటే కల్పిత కథలను వినడానికే వాళ్ళు ఇష్టపడతారు.

ఎంతోమంది సత్యాన్ని పెడచెవిన పెట్టడం వల్ల నేటి ఇవాంజెల్లికల్ (బైబిల్ని నమ్మే) సంఘంలో సత్యమే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. సుమారు వంద సంవత్సరాల క్రితం వాక్యసత్యం నుంచి తన రోజుల్లోని సంఘం దూరంగా కొట్టుకెళ్లిపోతోంది అని చాల్స్ స్పర్జన్ గారు ఎంతో వేదన చెందారు. దేవుని వాక్యాన్ని ప్రసంగించడమే స్పర్జన్ గారి ఏకైక భారం. వాక్యానుసారమైన ప్రసంగం విషయంలో సంఘం యొక్క సహనం క్షీణించ నారంభించిందని ఆయన నమ్మాడు. దేవుని వాక్యాన్ని విషయంలో రాజీపడిన, ప్రత్యామ్నాయమైన పద్ధతులతో సంక్షిప్తమైన సందేశాలతో ప్రయోగాలు చేస్తున్న ఇతర ప్రసంగీకులను ఆయన చూశాడు. అదుపు తప్పిన వాహనం శృతిమించిన వేగంతో కొండపై నుంచి దొర్లుకెళ్తున్న విధంగా సంఘం కూడా గొప్ప అపాయంలో ఉందని ఆయన నమ్మాడు. నాసిరకమైన వాక్యోపదేశం (downgrade) అని తాను పేర్కొన్నదానికి విరుద్ధంగా నిలబడి, దానికి వ్యతిరేకంగా ధైర్యంతో మాట్లాడేలా అతడు నిర్బంధించబడ్డాడు. "ఎక్కడ చూసినా ఉదాసీనతే ఉంది. ప్రకటించబడేది సత్యమా అసత్యమా అనే విషయాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. విషయం ఏదైనా ప్రసంగం ప్రసంగమే. కేవలం సంక్షిప్తమైన ప్రసంగమే శ్రేష్ఠమైనది" అని ఆయన చెప్పాడు.3 స్పర్జన్ గారు ఈ మాటలు చెప్పి వంద సంవత్సరాలు దాటిపోయినప్పటికీ బైబిల్ని నమ్మే నేటి సంఘంలో ఇప్పుడు జరుగుతున్న దానిని ఆ మాటలు కచ్చితంగా వర్ణిస్తున్నాయి.

ఎన్నో విషయాల్లో జాన్ మెకార్థర్ గారిని నేటి స్పర్జన్ గారు అని పిలవొచ్చు. ఎక్స్ పోజిటరి ప్రీచింగుకు పెద్దపీట వేసేవారిలో మెకార్ధర్ గారే అగ్రగణ్యుడు, నేటికీ సజీవంగా ఉన్న ఆదర్శప్రాయుడు. ఆయన ఈ కింది విధంగా రాశారు:

వివరణాత్మకమైన (ఎక్స్ పోజిటరి), సిద్ధాంతపరమైన ప్రసంగం నుంచి తొలగిపోతూ అనుభవాలకు ప్రాధాన్యతనిచ్చే, ఆచరణకే గాని ఆదర్శాలకు విలువ లేని, లోతులేని, అంశ ప్రాధాన్యత కలిగిన ప్రసంగం వైపే తరలిపోతున్న ధోరణి నేడు ప్రసంగ వేదికల్లో కనబడుతోంది. సంఘానికి హాజరయ్యే వ్యక్తులు వినియోగదారుల్లా కనబడుతున్నారు. ప్రసంగీకులు వారికి కావలసిన వాటిని అమ్మాలనుకుంటున్నారు. దేవుడు ఏం ప్రకటించాలనుకుంటున్నాడో దానిని కాకుండా ప్రజలు ఏం వినాలి అనుకుంటున్నారో దాన్నే కాపరులు ప్రకటిస్తున్నారు.4

వివేచనగల చెవులను వృద్ధి చేసుకొనుట

దేవుని వాక్యాన్ని చక్కగా ఉపదేశిస్తూ నీ ఆత్మను నమ్మకంగా పోషించే కాపరి ఉన్న మంచిదైన, స్థిరమైన సంఘానికి నువ్వు మార్గాన్ని కనుగొన్నప్పటికీ వివేచన గల చెవిని వృద్ధి చేసుకోవడం నువ్వు కొనసాగించాలి, ఇది ముఖ్యమైన విషయం. అసత్యం నుంచి సత్యాన్ని వివేచించడం నువ్వు నేర్చుకుని తీరాలి, అప్పుడు మాత్రమే నువ్వు తప్పుదారిలో నడిపించబడవు. ప్రజల్ని మోసగించి సత్యం నుంచి వారిని దారిమళ్లించే ప్రతి విధమైన అబద్ధ బోధకులతో అబద్ధ బోధలతో సంఘం మునిగిపోతుందని కొత్త నిబంధన గ్రంథకర్తలు పదేపదే హెచ్చరించారు.

"ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు." (మత్తయి 24:23-24)

"నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మను ష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి." (అపో 20:29-31)

"మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ద బోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు" (2 పేతురు 2:1-3).

యేసు, పౌలు, పేతురు ముందుగానే ప్రవచించిన కాలాల్లో మనం జీవిస్తున్నాం. నేటి సంఘంలో తప్పు బోధల పరిమాణం, శైలి చాలా భయంకరంగా ఉంది. ప్రపంచ చరిత్రలో ఇంతకుముందున్న తరాల కంటే అధికమైన మత సమాచారానికి ఉపదేశానికి ప్రస్తుత తరంలో భాగమైన మీరు బహిర్గతమవుతున్నారు. క్రైస్తవ టీవీలు రేడియోలు పుస్తకాలు మ్యాగజైన్లు వీడియోలు ప్రసంగీకులు వక్తలు రచయితలు సమావేశాలు సెమినార్లు మీ పైన నిరంతరం దాడి చేస్తున్నాయి. ఇవన్నీ కూడా బైబిల్ నుంచే సత్యాలను బోధిస్తున్నాయని తమ గురించి తామే చెప్పుకుంటున్నాయి.

సత్యమైన సరైన ఆరోగ్యకరమైన తమకు మేలైన బోధను ఎంపిక చేసుకుని అసత్యమైన అబద్ధమైన అనారోగ్యకరమైన తమకు హానికరమైన బోధను వెనుక విడిచిపెట్టే విధంగా నేటి సగటు క్రైస్తవునికి విస్తారమైన ఈ ఆధ్యాత్మిక ఉపదేశకులు ఉపదేశాలు శిక్షణ నివ్వకపోవడం విచారకరం.

మంచి బెరయునిగా ఉండడం

"అంగిలి ఆహారమును రుచి చూచునట్లు చెవి మాటలను పరీక్షించును. న్యాయమైనదేదో విచారించి చూతము రండి మేలైనదేదో మనంతట మనము విచారించి తెలిసికొందము రండి" అని యోబు గ్రంథం చెబుతోంది (34:3-4).

ద్రాక్షరసాన్ని రుచి చూడడంలో నిపుణుడు మంచి ద్రాక్షలకు చెడ్డ ద్రాక్షలకు మధ్యన, మంచి ద్రాక్షలకు శ్రేష్ఠమైన ద్రాక్షలకు మధ్యన, శ్రేష్ఠమైన ద్రాక్షలకు అత్యంత శ్రేష్ఠమైన ద్రాక్షలకు మధ్యన వ్యత్యాసాన్ని కనుగొన్నట్లే చెడ్డ ప్రసంగాలకు మంచి ప్రసంగాలకు మధ్యన, మంచి ప్రసంగానికి శ్రేష్ఠమైన ప్రసంగాలకు మధ్యన, శ్రేష్ఠమైన ప్రసంగాలకు అత్యంత శ్రేష్ఠమైన ప్రసంగాలకు మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కనిపెట్టగలిగే ప్రసంగ సారాన్ని గ్రహించే నిపుణుల్లా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడంలో మనం విఫలమైతే సత్యం మాదిరిగానే  కనిపించే విధంగా అబద్ధానికి ఉద్దేశపూర్వకంగా మారువేషం వేసే అబద్ధ బోధకులకు మనం సులభమైన ఎరగా చిక్కిపోతాం. "మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లు" మనం ఉంటుండగా తుది ఫలితం ఏంటంటే గందరగోళంతోనూ అయోమయంతోనూ నిండిన జీవితాలే (ఎఫెసీ 4:14).

అందువల్లనే ప్రతి శ్రోత వివేచనను అభ్యాసం చేసుకోవడం నేర్చుకోవాలి, ఇది అత్యంత కీలకమైన విషయం. "వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి" అని బెరయలో విశ్వాసుల గురించి లూకా వర్ణించాడు (అపో 17:11). వాళ్లు తీర్పుతీర్చేవాళ్ళుగా విమర్శకులుగా ఉన్నారని నేడు చాలామంది చెప్పవచ్చు, కానీ తమకు బోధించబడుతున్నది వాక్యానుసారంగా ఉందో లేదో నిర్ధారించుకోవాలని బెరయ వాళ్ళు కోరుకున్నట్లు లూకా వాళ్ళను అభినందించాడు. వాళ్లు సత్యాన్ని ప్రేమించారు కాబట్టి దాన్ని తెలుసుకోవాలనుకున్నారు. అందువల్ల అపోస్తలుడైన పౌలు చెబుతున్నది దేవుని వాక్య సత్యానికి అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి వాళ్ళు అతని మాటల్ని లేఖనంతో పోల్చి చూశారు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతను నేరుగా పొందుకుంటూ మాట్లాడుతున్న అపోస్తలుడైన పౌలునే బెరయవాళ్లు పరీక్షిస్తుంటే సంఘంలో నువ్వు వింటున్న దానిని రేడియోలో వింటున్న దానిని పుస్తకాల్లో చదువుతున్న దానిని క్రైస్తవ పుస్తకాల షాపులో కొంటున్న దానిని నువ్వు ఎంత ఎక్కువగా పరీక్షించాలి?

పాల నుంచి మాంసాహారానికి మారుట

నేటి సంఘంలో ఆధ్యాత్మిక వివేచనా స్థాయి అత్యంత హీనస్థితిలో ఉంది. అసత్యం నుంచి సత్యాన్ని సరికాని దాని నుంచి సరైన దానిని చెడు నుంచి మంచిని వేరు చేయాలనే కోరిక సామర్థ్యం కలిగిన క్రైస్తవులు చాలా చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఈ మధ్యనే వచ్చిన సమస్య కాదు. హెబ్రీ 5:11-14 లో వివేచన లేమి గురించి హెబ్రీ గ్రంథకర్త తన పాఠకులను గద్దించాడు. ఆధ్యాత్మికమైన పురోగతి (ఆధ్యాత్మిక పరిణతి) కొదువుగా ఉండడం యొక్క ప్రత్యక్ష ఫలితమే ఆధ్యాత్మిక వివేచన కొరతకు కారణమని వాళ్లు గ్రహించాలని అతడు కోరుకున్నాడు. అవి రెండూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి, ఒకదానితో ఒకటి చేయిపట్టుకుని నడుస్తాయి:

ఇందునుగూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి గాని, మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గాని బలమైన ఆహారము తినగలవారుకారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువేగనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును (హెబ్రీ 5:11-14).

యూదు క్రైస్తవులు గతంలో లేవీయుల యాజకత్వం కింద ఉండేవారు. అయితే దానికంటే ఎంతో శ్రేష్ఠమైన మెల్కీసెదెకు (ఆది 14) యొక్క యాజకత్వపు క్రమంలో యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజక పరిచర్య ఉందని ఈ వాక్యభాగంలో వారికి హెబ్రీ గ్రంథకర్త చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే తాను వాళ్లకు బోధిస్తున్నది వాళ్ళ బుర్రలకు అందట్లేదని అతడు చింతించాడు. దానికోసం వాళ్లు సిద్ధంగా లేరు. తన విద్యార్థులకు అర్థంకావట్లేదని గ్రహించిన ప్రతి ఉపాధ్యాయుడు చేసే విధంగానే ఈ గ్రంథకర్త కూడా తన వివరణను మధ్యలోనే ఆపి, తన పాఠకుల ఆధ్యాత్మిక అపరిపక్వతను బట్టి వాళ్లను గద్దించాడు. వాళ్లతో పంచుకోవాలని అతని హృదయం మనసు పలు అంశాలతో నిండి ఉన్నప్పటికీ తాను చెప్పదలచిన దానిని అర్థం చేసుకునే అభినందించే సరైన ఆధ్యాత్మిక స్థితిలో వాళ్లు లేరని అతడు చెప్పగలిగాడు. తన ఉపదేశంలో ముందుకెళ్లడానికి వారి ఆధ్యాత్మిక అపరిపక్వత అతణ్ణి ఆటంకపరచింది. ఇదే విధంగా యేసు కూడా తన శిష్యులతో "నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింపలేరు" అని చెప్పాడు (యోహాను 16:12).

సమస్య ఉపదేశకునిలోనూ లేదు, అతడు చెప్పే సందేశంలోనూ లేదు. సమస్య పాఠకులలోనే ఉంది. వినే విషయంలో వాళ్ళు మందబుద్ధి గలవారైపోయారు. వినుటకు మందులైనందున అనే పదబంధానికి వాళ్లకు వినేందుకు ఉత్సుకత లేదు అని అర్థం. వాళ్లు నేర్చుకునే విషయంలో ఎంతో నెమ్మదిగా ఉండేవారు, నిదురమత్తులో ఉండే శ్రోతలు వాళ్లు, అక్షరానుసారంగా చెప్పాలంటే సోమరితనంతో నిండిన చెవులు గలవాళ్లు అని అర్థం. "ప్రసంగం చాలా విసుగుగా ఉంది కాబట్టి మాకు చర్చికి వెళ్లాలని లేదు" అని తరచూ కొందరు చెబుతారు. అయితే వాళ్లు గుర్తించని విషయం ఏంటంటే వాళ్లే వినే విషయంలో మంద బుద్ధితో ఉన్నవాళ్లు. వాళ్లు గతంలో ఎల్లప్పుడూ అలానే ఉండి ఉండకపోవచ్చు. తన పాఠకులు ఎల్లప్పుడూ ఇదే విధంగా లేరని హెబ్రీ గ్రంథకర్త పరోక్షంగా చెబుతున్నాడు. అయితే ఆరంభంలో దేవుని వాక్యాన్ని విని, దానికి స్పందించే వారి ఆసక్తి చల్లారిపోయింది. వారి సోమరితనం వలన మందబుద్ధి వలన వాళ్ళు ఇక ఏమాత్రం శ్రద్ధగా వినేవారు కాదు నిశితంగా ఆలోచించేవారు కాదు కాబట్టి సత్యం విషయంలో నెమ్మదిగా వాళ్ళు ఆధ్యాత్మికమైన సోమరులుగా మారిపోయారు. ఆధ్యాత్మిక పరిణతి అనే మార్గంలో వాళ్ళు ఎంతో ముందుకు వెళ్లి ఉండాల్సిన వాళ్లు. విశ్వాసం విషయంలో ఎంతో లోతుగా నిలదొక్కుకునేందుకు తగినంత సమయం వారికి దొరికింది. ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళ నేర్చుకున్న సత్యాలను ఇతరులకు అందించగలిగే పరిపక్వతలోనికి వాళ్లు వచ్చి ఉండాల్సింది.

ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవులుగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా ఎన్నడూ ఎదగని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఆదివారం నాడు సువార్తను పదేపదే చెప్పడం ద్వారా అవిశ్వాసులు శ్రోతలుగా ఉన్నారని చెబుతూ తమ ఉపదేశాన్ని సబబు కాని రీతిలో అత్యంత పలుచన చేయడం ద్వారా కొన్ని సంఘాలు విశ్వాసుల ఎదుగుదలకు ఆటంకంగా నిలుస్తూ దోషులుగా ఉన్నాయి. మేకలకు వినోదం అందించడంపైనే గానీ గొర్రెలను పోషించడంపైన వారి దృష్టి లేదు కాబట్టి విశ్వాసులు యేసుక్రీస్తు యొక్క పరిణతి కలిగిన శిష్యులుగా మారడానికి ఎన్నడూ శిక్షణ పొందట్లేదు సిద్ధపరచబడట్లేదు. ప్రాథమికమైన విషయాలను దాటి ఎదిగే వాళ్ళు దాదాపుగా కనబడట్లేదు. ఈ హెబ్రీ క్రైస్తవులు ఇతరులకు సత్యం బోధించగలిగిన సమర్థులుగా ఉండడానికి బదులు ప్రాథమిక పాఠశాలకు వెళ్లి వేరొకరి చేత మరొక్కసారి ఓనమాలు నేర్చుకోవలసిన స్థితిలో ఉన్నారు. పసిపిల్లల మాదిరిగా వాక్యము అనే పాలను మాత్రమే వాళ్ళు తాగగలుగుతున్నారు కానీ బైబిల్ కి సంబంధించిన ఆరోగ్యకరమైన స్థిరమైన మాంసాహారాన్ని అరిగించుకునే సామర్థ్యం వారికి లేదు.

కొరింథీయులను కూడా పౌలు ఇదే విషయంలో గద్దించాడు:

"సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?" (1 కొరింథీ 3:1-3)

పాలతో ఎలాంటి సమస్యా లేదు. కొత్తగా జన్మించిన శిశువులు ఆరోగ్యంగా ఎదగడానికి బలపడడానికి పాలు శ్రేష్ఠమైనవే ఆవశ్యకమైనవే. పసిపిల్లలు పాలు తాగుతుండడం సహజమే. అయితే టీనేజ్ లో ఉన్న మీ బిడ్డను పాలసీసాతో మీరు ఇంకా నిద్రపుచ్చుతుంటే అది సహజం కాదు, విచారకరం. అయితే 15 సంవత్సరాలకు పైగానే క్రైస్తవులుగా ఉన్నవారు కూడా ఇంకా పాలనే తాగుతున్నారు, అది సరికాదు. బలమైన ఆహారం తింటూ వాళ్ళు బలపడి ఉండాల్సింది. సమస్య ఏంటంటే లేఖనం యొక్క లోతైన సత్యాలను అరిగించుకోవడానికి వారికి నైపుణ్యమూ లేదు శిక్షణా లేదు. వాళ్లకు బైబిల్లోని వృత్తాంతాలు తెలుసు, కొన్ని వచనాలను ఉటంకించగలరు. అయితే అనుదిన అంశాలకూ తమ జీవితంలోని పరిస్థితులకూ ఆచరణాత్మకంగా వాటిని అన్వయించుకునే పద్ధతి మాత్రం వాళ్లకు తెలియదు.

మనం సప్లయి, డిమాండు అనే నియమానికే తిరిగి వెళ్ళాం, ఈ అధ్యాయాన్ని దానితోనే మనం ఆరంభించాం. పరిణతి చెందిన విశ్వాసులు దేవుని వాక్యంలోని బలమైన నియమాలను తిని అరిగించుకోగలరు ఎందుకంటే వాళ్లు వివరణాత్మకమైన వాక్యోపదేశం (ఎక్స్ పోజిటరీ ప్రీచింగ్) కింద స్థిరంగా కూర్చోవడం వల్లనే. వాక్యం అనే మాంసాహారాన్ని వాళ్లు భుజిస్తుండగా, ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతారు. దానితోనే వివేచనలో ఎదుగుదల కూడా వస్తుంది. లోతులేని, అంశ ప్రధానమైన ప్రసంగాలను వాళ్లు ఏమాత్రం ఇష్టపడరు, అబద్ధ బోధకుల్లోని వారి వ్యాఖ్యల్లోని కుట్రలను వాళ్ళు చూడగలుగుతారు. "దేవుని వాక్యంపై పట్టు సాధించకపోతే ఏ ఒక్కడూ నిజంగా వివేచన కలిగి ఉండలేడు. లేఖనాన్ని నువ్వు అధ్యయనం చేయకపోతే ప్రపంచంలో ఉన్న కోరిక అంతా కూడా నిన్ను వివేచన కలిగిన వ్యక్తిగా చేయలేదు.. వివేచన కలిగిన వ్యక్తిగా నువ్వు నిజంగా ఉండాలనుకుంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు అధ్యయనం చేసి తీరాలి" అని జాన్ మెకార్ధర్ గారు రాశారు.5 లేఖనాల జ్ఞానం పొందడానికి అత్యంత సంపూర్ణమైన అపేక్షను నువ్వు పెంపొందించుకుంటుండగా మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పగలిగే సామర్థ్యంలో నువ్వు ఎదుగుతావు. పాకే వయసులో ఉన్న బిడ్డ ఏది శుభ్రమైనది? ఏది తినదగినది? ఏది మురికిగా ఉంది? ఏది ఆరోగ్యానికి తగినది కాదు? అని తెలుసుకోవడంలో వివేచన లేనందువల్ల కనబడే ప్రతి దానిని వెంటనే తన నోట్లో పెట్టుకుంటుంది. నువ్విక ఏ మాత్రమూ అలా ఉండవు. ఏ ప్రసంగీకుడు చెప్పేదైనా విని, ఏ పుస్తకాన్నయినా చదివి, ఏ సంఘానికయినా వెళ్లి తనకు అది మంచిదా? కాదా? అని చెప్పగలిగే సామర్థ్యం లేకపోవడం నూతన విశ్వాసి యొక్క లక్షణం. అయితే దేవుని వాక్యాన్ని క్రమశిక్షణతో అధ్యయనం చేయడం ద్వారా ఆ నూతన విశ్వాసి చెడు ఉపదేశానికి మంచి ఉపదేశానికి మధ్య వ్యత్యాసాన్ని వివేచించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడు.

సత్యమైన దానిని చేపట్టడం

వివేచన గురించి బైబిల్లో కనబడే అత్యంత ముక్కుసూటి అయిన వివరణ 1 థెస్స 5:21-22లో కనబడుతుంది. "సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి" అని పౌలు చెప్పాడు. థెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్న తన లేఖను ముగిస్తూ క్రైస్తవ జీవితానికి ఆవశ్యకమైన విషయాలను అనగా క్రైస్తవులుగా జీవించడానికి ప్రాథమికమైన ఆవశ్యకతలను తెలియజేసే ఆజ్ఞల జాబితాను అతడు క్లుప్తంగా పొందుపరిచాడు. ఈ ఆజ్ఞల జాబితాలో చివరిది వివేచనను అభ్యాసం చేయడమే. వివేచన గురించిన ఈ మొత్తం ఆజ్ఞలో వాస్తవానికి మూడు ఆజ్ఞలు నిక్షిప్తమై ఉన్నాయి. "పరీక్షించండి" "చేపట్టండి" "దూరంగా ఉండండి" అని పౌలు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. వివేచన కలిగిన శ్రోతగా మారడానికి ఈ మూడింటిని నువ్వు చేస్తూ ఉండాలి.

మొదటిగా నువ్వు వినే ప్రతి దానిని జాగ్రత్తగా పరీక్షించాలి (వ.21). ఈ వచనానికి ఆరంభంలో "అయితే" అనే పదం మూల భాషలో కనిపిస్తుంది. ఈ పదం పౌలు ఇంతకుముందు చెప్పిన మాటతో ఇప్పుడు చెబుతున్న మాటను ముడిపెడుతోంది. వచనం 20 లో ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకండి అని అతడు థెస్సలోనిక విశ్వాసులకు ఆజ్ఞాపించాడు. సంఘం యొక్క తొలి దినాల్లో, నూతన నిబంధన పూర్తిగా రాయబడకముందు, దేవుడు కొద్దిమంది వ్యక్తులకు ప్రవచన వరాన్ని అనుగ్రహించాడు. అపోస్తలులతోపాటు వాళ్లు కూడా దేవుని నుంచి నేరుగా ప్రత్యక్షతను పొందుకొని దేవుని ప్రజల క్షేమాభివృద్ధి కోసం ఉపదేశం కోసం ఆదరణ కోసం వారికి దానిని తెలియజేసేవారు (1 కొరింథీ 14:3). పరిశుద్ధాత్ముడు ఈ ప్రవక్తలను ప్రేరేపించాడు, దేవుడు కచ్చితంగా వాళ్లను ఏమి మాట్లాడమన్నాడో ఏమి రాయమన్నాడో వాటినే వాళ్లు మాట్లాడారు, రాశారు. అదే కొత్త నిబంధన అయ్యింది (2 పేతురు 1:20-21). పౌలు ఈ పత్రికను రాస్తున్న సమయానికి లేఖన ప్రత్యక్షత ఇంకా ఇవ్వబడుతోంది. లేఖనాలు రాయడం అనే ఈ పవిత్రమైన బాధ్యతకు తాను ఎంచుకున్న కొద్దిమంది మనుషుల ద్వారా దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చే ప్రక్రియలోనే ఉన్నాడు. ఫలితంగా ఎవరు దేవుని చేత నిజంగా ప్రేరేపించబడుతున్నారో ఎవరు ప్రేరేపించబడట్లేదో ఆ రోజుల్లో నివసిస్తున్న క్రైస్తవులు గుర్తించాల్సి వచ్చింది.

దైవ ప్రత్యక్షత మాట్లాడుతున్న ప్రవక్తలమని ఆ రోజుల్లో కొద్దిమంది తమ గురించి తాము చెప్పుకోవడం సర్వసాధారణంగా జరిగేది. ఎవరు నిజం చెబుతున్నారో ఎవరు అబద్ధం చెబుతున్నారో గుర్తించడానికి విశ్వాసులకు ఒక మార్గం అవసరమయ్యింది. ప్రవచన వరంతో పాటు వివేచించే వరం కూడా అనుగ్రహించబడింది, ఎవరు దేవుని పక్షంగా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడట్లేదో వివేచించగలగడానికి తగిన సామర్థ్యం వివేచన వరం ద్వారా కలుగుతుంది (1 కొరింథీ 12:10). భాషలు మాట్లాడే వరాన్ని పరీక్షించడానికి దేవుడు భాషలకు అర్థంచెప్పే వరాన్ని అనుగ్రహించిన విధంగానే ప్రవచన వరాన్ని పరీక్షించడానికి దేవుడు వివేచన వరాన్ని అనుగ్రహించాడు (1 కొరింథీ 14:26-29). పసితనంలో ఉన్న సంఘానికి దేవుడు ఈ నాలుగు వరాలను తాత్కాలికంగా అనుగ్రహించాడు. సంఘం ఎదిగి అభివృద్ధి అవుతుండగా ఈ నాలుగు వరాలు ఇక ఏ మాత్రమూ ఆవశ్యకం కాదు కాబట్టి, మరి ముఖ్యంగా లేఖన ప్రమాణం ముగిసింది కాబట్టి, ఈ వరాలు నిలిచిపోయాయి.

కొందరు అబద్ధ ప్రవక్తలు థెస్సలోనిక సంఘంలోనికి వచ్చి, సంఘం ఎత్తబడడం గురించి క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి స్థానిక క్రైస్తవులను మోసగించి, అయోమయానికి గురి చేశారు. "ప్రభువు యొక్క దినం" ఇంతకుముందే జరిగిపోయిందని కొద్దిమంది ప్రజలు భావించారు. మరికొద్దిమందైతే ఇంతకుముందు మరణించిన వాళ్లు రెండవ రాకడను కోల్పోతారని చింతపడ్డారు. బహుశా థెస్సలోనిక సంఘంలోని విశ్వాసులు ప్రవచనాలను తృణీకరించడం మొదలుపెట్టి ఉంటారు.
ఐతే వాళ్లు ఆ ప్రవచనాలను ప్రాముఖ్యత లేనివిగా  పరిగణించి ఉంటారు, లేదా పూర్తిగా వాటిని తృణీకరించి ఉంటారు. తప్పు బోధ వలన మోసగించబడకుండా ఉండడానికి అయోమయానికి గురికాకుండా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం అదే.

అయితే వాళ్లు ప్రవచనాన్ని వినాల్సిన అవసరం ఉందని పౌలు వాళ్లకు చెప్పాడు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని వారు  పెడచెవిన పెట్టాలని అతడు కోరుకోలేదు. దానికి భిన్నంగా "మీరు వింటున్నప్పుడు వివేచనను అభ్యాసం చేయండి. అవివేకంగా ఉండవద్దు మీరు వినే ప్రతిదానిని గుడ్డిగా అంగీకరించకండి ప్రతి దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి" అని అతడు చెప్పాడు. "పరీక్షించండి" అనే పదానికి గ్రీకుమూలం "డోకిమడ్జో". దేనికైనా తీర్పు తీర్చడం, పరీక్షించడం, విశ్లేషించడం, ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి పరీక్ష పెట్టడం అని ఈ పదానికి అర్థాలు. లోహం విలువైనదా? కాదా దానిలోని స్వచ్ఛత ఎంత? అని తెలుసుకోవడానికి ఈ పదం ఉపయోగించబడేది. అవి స్వచ్ఛమైనదిగా ఉన్నాయని నిరూపించబడితే, వాటికి ఆమోదముద్ర వేసేవారు.

నగల వ్యాపారి ఒక వజ్రాన్ని లేదా రంగు రాయిని చూసి అది నిజమైనదా? నకిలీదా? అని పరీక్షించడానికి దానిలోని అసంపూర్ణతలను లోపాలను పసిగట్ట కలిగినట్లు, నీకు బోధించబడుతున్నది సత్యమా? అసత్యమా? నువ్వు వింటున్న దానిలో ఏవైనా తప్పులు ఉన్నాయా? లేదా? సగం మాత్రమే నిజాలు ఉన్నాయా? అని పరీక్షించడమే క్రైస్తవునిగా నీ ధర్మం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నువ్వు వింటున్న ప్రతిదీ మూడు ప్రాథమిక పరీక్షలకు నిలబడగలగాలి.

బైబిల్ పరీక్ష (యెషయా 8:20; 1 తిమోతి 6:3; 2 తిమోతి 1:13)

ప్రతి దాన్ని పరీక్షించడానికి మనకున్న అంతిమ ప్రమాణం బైబిల్ మాత్రమే. నువ్వు చూసే, చదివే, వినే, అనుభూతిచెందే, అనుభవించే ప్రతి దాన్ని తీసుకుని బైబిల్ చెబుతున్నదానితో అవి ఏకీభవిస్తున్నాయో లేదో నిర్ధారించుకుని తీరాలి. దేవుడు తన వాక్యంలో ఇంతకుముందు చెప్పిన దానితో అది విభేదిస్తుంటే, అది ఇక సత్యం కాదు. ఈ మాటకు తిరుగు లేదు.

పరిశుద్ధాత్మ పరీక్ష (యోహాను 16:13; 2 తిమోతి 1:14; 1 యోహాను 2:27)

సత్యాన్ని అసత్యాన్ని వివేచించడంలో నీకు సహాయపడేందుకు దేవుడు పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించాడు. పరిశుద్ధాత్ముడు నీ మనసును వెలిగిస్తాడు, తద్వారా దేవుని వాక్యాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. అసత్యాన్ని నువ్వు విన్నప్పుడు, దానిని పసిగట్టగలిగి, తృణీకరించగలుగుతావు.

యేసు పరీక్ష (1 యోహాను 4:1-3; 2 యోహాను 1:7-11)

తప్పు మతాలు అబద్ధ బోధకులు అత్యంత తరచుగా వక్రీకరించేది క్రీస్తు గురించిన సిద్ధాంతాన్నే. ఐతే వాళ్లు ఆయన దైవత్వాన్ని మానవత్వాన్ని ఆయన పాపరాహిత్యాన్ని ఆయన విశిష్టతను ఆయన అద్భుతాలను ఆయన మరణ పునరుత్థానాలను తృణీకరిస్తారు లేదా ఆయన రెండవ రాకడను తృణీకరిస్తారు. యేసుక్రీస్తు యొక్క దైవ మానవ స్వభావాల గురించి ఆయన జీవిత మరణ పునరుత్థానాల గురించి ఒక వ్యక్తి లేదా ఒక సమూహం యొక్క అభిప్రాయం బైబిల్ యొక్క ఉపదేశంతో కచ్చితంగా ఏకీభవిస్తుందో లేదో నువ్వు నిర్ధారించుకోవాలి.

ఏదైనా బోధ సత్యమో అసత్యమో సరైనదో సరికానిదో మంచిదో చెడ్డదో ఒక్కసారి నువ్వు నిర్ధారించుకోగానే నువ్వు రెండు కార్యాల్లో ఏదో ఒకటి చేయాలి. అది సత్యమైతే దాన్ని నువ్వు చేపట్టాలి (1 థెస్స 5:21). ఇంకొక రీతిగా చెప్పాలంటే హృదయపూర్వకంగా దాన్ని హత్తుకోవాలి, దానికి ప్రమాదమని మీరు భావించిన ప్రతి విధమైన తప్పు బోధ నుంచి దానిని రోషంతో భద్రపరచాలి (2 తిమోతి 1:13; తీతు 1:9; యూదా 1:3). అది అసత్యమైతే నువ్వు దాన్నుంచి తొలగిపోవాలి (1 థెస్స 5:22). కీడుకు దూరంగా ఉండడం అంటే నిన్ను నువ్వు పూర్తిగా దానికి దూరంపెట్టుకోవడమే. 

రోమా 12:9 లో ఈ రెండు విరుద్ధమైన స్పందనల సారాంశాన్ని పౌలు తెలియజేశాడు: "చెడ్డదాని నసహ్యించుకొని మంచిదానిని హత్తుకొని యుండుడి". వివేచన కలిగిన శ్రోతగా ఉండడం అంటే అర్థం అదే. వాక్యం అనే పవిత్ర సత్యాన్ని మాత్రమే గుర్తించేలా ఆస్వాదించేలా నీ హృదయాన్ని నిమగ్నం చేసి నీ మనసుకు శిక్షణనివ్వడం ద్వారా మంచి అనుభూతి కలిగించే ప్రసంగానికి పిలుపునందుకుని తండోపతండాలుగా గుమికూడే వైఖరికి నువ్వు స్వస్తి పలకవచ్చు.

 అధ్యయనం/చర్చ కోసం

1. 2 తిమోతి 4:3-4లో దురద చెవులు గురించి పౌలు ప్రవచించిన యుగంలోనే మనం జీవిస్తున్నాం అనడానికి నేటి సంఘంలో మీరు చూస్తున్న రుజువులు ఏంటి? తప్పుడు శ్రోతలు తప్పుడు బోధ అనే విషయాలకు సంబంధించి సప్లయి డిమాండు అనే నియమాన్ని అది సంఘం యొక్క ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే విధానాన్ని వివరించండి.
2. హెబ్రీ 5:11-14 చదవండి. వినే నీ అలవాట్ల విషయంలో నువ్వు ఒక సోమరివైన శ్రోతవా? లేదా ఉత్సాహం కలిగిన శ్రోతవా? నువ్వొక చిన్న బిడ్డలాంటి క్రైస్తవునివా? లేదా పరిణతి చెందిన క్రైస్తవునివా? పాలు తాగేవాడివా? లేదా మాంసం తినేవాడివా? వివేచన విషయంలో నీకున్న నైపుణ్యాలను శిక్షణ నిచ్చుకోవడానికి పెంపొందించుకోవడానికి కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఏవి?
3. 1 రాజులు 3:9-12; కీర్తన 119:66; సామెతలు 2:3-5; ఫిలిప్పీ 1:9-10; యాకోబు 1:5 చదవండి. వివేచనను పెంపొందించుకునే విషయంలో ప్రార్థన పోషించే కీలకపాత్ర గురించి ఈ వాక్యభాగాలు ఏమి బోధిస్తున్నాయి?

దేవుని వాక్యాన్ని నీ వ్యక్తిగతమైన అధ్యయనం ద్వారా, వివేచన కలిగిన ప్రసంగీకుల నుంచి నువ్వు వినే ప్రసంగాల ద్వారా, వివేచనగల విశ్వాసులతో నువ్వు కలిగి ఉండే సంభాషణల ద్వారా నీకు వివేచన అనుగ్రహించమని దేవునికి మొరపెట్టు. 

మీరు పొందగలిగినంత స్పష్టమైన, ప్రత్యేకమైన, ఒప్పించే ఉపదేశం కింద జీవించండి. తెలివైన, స్పష్టమైన, ప్రత్యేకమైన, నైపుణ్యంగల ప్రసంగీకునికీ అజ్ఞానియైన, అయోమయానికి గురైన, సామాన్యుడైన, విసుగు కలిగించేవాడైన, గంట సమయం ఏదో ఒక విషయం చెప్పడానికి ఒకదానికొకటి పొంతనలేని మాటలను మాట్లాడే ప్రసంగీకునికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ రెండు రకాల ప్రసంగీకుల్లో ఎవరి ప్రసంగాలను వినాలని నిర్ణయించుకుంటారనే విషయమే శ్రోతల క్షేమాభివృద్ధిని చెప్పనశక్యమైన రీతిలో ప్రభావితం చేస్తుంది...మీరు పొందగలిగితే అత్యంత సమర్ధుడైన అత్యంత పరిశుద్ధుడైన బోధకుణ్ణి ఎంచుకోండి, మీరు ఎవరు చెప్పేదైతే వింటారో వారి విషయంలో ఉదాసీనంగా ఉండవద్దు. - రిచర్డ్ బాక్స్టర్

అధ్యాయం 5

వివేచనగల శ్రోత

నేను మాసిదోనియకు వెళ్లుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకథలును మితము లేని వంశావళులును, విశ్వాససంబంధమైన దేవుని యేర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్యపెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించు టకు నీవు ఎఫెసులో నిలిచియుండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ఉపదేశసారమేదనగా, పవిత్ర హృదయమునుండియు, మంచి మనస్సాక్షినుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి, తాము చెప్పువాటినైనను, నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై యుండగోరి నిష్‌ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. 1 తిమోతి 1:3-7

చాలామంది ప్రసంగీకులకు పాత నిబంధనలో శాస్త్రియైన ఎజ్రా ఒక హీరో. అతని జీవితం మొత్తం దేవుని వాక్య పరిచర్యకే అంకితం చేశాడు. దేవుని వాక్యానికి నకళ్లు రాస్తూ దాన్ని కంఠతం చేస్తూ దాన్ని అనుసరిస్తూ ప్రజలకు దాన్ని వివరిస్తూ దానికి విధేయత చూపమని వారికి ఉపదేశిస్తూ ఉండడం శాస్త్రిగా అతని బాధ్యత. ఈ కారణాన్ని బట్టి దీవెనకరమైన దేవుని హస్తం ఎజ్రా జీవితంపైన పరిచర్యపైన అసమానమైన రీతిలో ఉండేది. "దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున...
ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసికొనెను" అని ఎజ్రా 7:9-10 చెబుతున్నది. నెహెమ్యా 8లో యెరూషలేము చుట్టూ నూతనంగా నిర్మించబడిన గోడలను ప్రతిష్టించడానికి ఎజ్రా ఆహ్వానించబడ్డాడు. ఈ చారిత్రాత్మక సంఘటనకు సుమారు 42 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. ఆ గోడల్ని నిర్మించడానికి సుమారు రెండు నెలల పాటు చాలా కఠినంగా పనిచేసిన తర్వాత ప్రజలు దేవుని వాక్యంతో సేద తీరాలనుకున్నారు.

ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ప్రజలు మొరపెట్టారు (వ.1). అందువల్ల ఎజ్రా కొద్దిమంది మనుషుల్ని ఎంపిక చేసుకుని ఈ ప్రత్యేకమైన సంఘటన నిమిత్తం నిర్మించబడిన ఒక ఎత్తైన వేదిక మీద నిలబడ్డాడు, దేవుని వాక్యాన్ని ఘనపరుస్తూ ప్రజలందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు ఎజ్రా "దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పెను" (వ.8). లేఖనాలను లోతుగా అర్థంచేసుకుని అన్వయించుకోవడంలో ఇతరులకు సహాయ పడాలని తరతరాలుగా ప్రయత్నిస్తున్న అనేకమంది ప్రసంగీకులకు ఆదర్శంగా ఎజ్రా చేసిన వివరణాత్మక పరిచర్య పనికొచ్చింది. అదే విధంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని అక్కడ సమావేశమైన ప్రజలు దేవుని వాక్యాన్ని విన్న పద్ధతి కూడా శ్రోతల విషయంలో దేవుని ఉద్దేశానికి గొప్ప ఆదర్శంగా ఉన్నది.

కొత్త నిబంధనలో నమ్మకమైన కాపరికి ఉపదేశకునికి స్పష్టమైన ఆదర్శంగా యేసు ఉన్నాడు. తన శిష్యులకు జన సమూహాలకు పాతనిబంధనలోని వాక్యాన్ని వివరించడంలో అన్వయించడంలో యేసు ఏ విధంగా తన అధిక సమయాన్ని వెచ్చించాడో సువార్త గ్రంథాలు గ్రంథస్తం చేశాయి. వాక్యాన్ని వివరణాత్మకంగా బోధించడంలో ఆయన చేసిన ప్రసంగాలు శ్రేష్ఠమైన నమూనాగా ఉన్నాయి (మత్తయి 5-7). తన పునరుత్థానం తర్వాత ఎమ్మాయి దారిలో శిష్యులతో ఆయన చేసిన సంభాషణ కొత్త నిబంధనలో ఎక్స్ పోజిటరీ ప్రీచింగ్ కి అత్యంత శ్రేష్ఠమైన ఉదాహరణను సమకూరుస్తుంది. "మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను" అని లూకా గ్రంథస్థం చేశాడు (24:27). తమతో మాట్లాడింది యేసేనని ఆ ఇద్దరు శిష్యులు తర్వాత గుర్తించినప్పుడు "ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి" (వ.32). నమ్మకమైన, క్రమబద్ధమైన వాక్య వివరణ సిద్ధపాటు కలిగిన శ్రోతల హృదయాలను మండించింది.

పరిశుద్ధాత్మ ప్రేరణతో క్రీస్తు యొక్క ఆజ్ఞను అపోస్తలులు నెరవేర్చిన విధానాన్ని పరిచర్యలో ఆయన పద్ధతిని ఎంతో సన్నిహితంగా అనుసరించిన విధానాన్ని అపోస్తలుల కార్యాలు గ్రంథస్థం చేసింది. క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాల ద్వారా పాత నిబంధనలోని దేవుని వాగ్దానాలు నెరవేర్చబడిన పద్ధతిని అపోస్తలులు నమ్మకంగా వివరించడానికి పూనుకున్నారని, అందువల్ల ప్రజలు మారుమనస్సు పొంది యేసుక్రీస్తును తమ రక్షకునిగా ప్రభువుగా అనుసరించాలని పేతురు స్తెఫను యాకోబు పౌలుల ప్రసంగాల నుంచి స్పష్టమవుతున్నది (అపో 2,7,15,17). అపోస్తలులందరిలోనూ నమ్మకమైన ప్రసంగానికి పౌలు అత్యున్నతమైన ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఎఫెసీ సంఘ పెద్దలకు వీడ్కోలు చెప్పే సందర్భాల్లో దేవుని వాక్యాన్ని తాను ఎంత శ్రద్ధగా బోధించాడో అతడు వారికి గుర్తుచేశాడు. "ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు...దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు" అని అతడు చెప్పాడు (అపో 20:20, 27). విశ్వాసులు  ఏం తెలుసుకోవాలని ఎలా ఉండాలని  దేవుడు కోరాడో దాన్ని అంతా తెలియచేయడానికి పౌలు లేఖనాలలోని సారాంశమంతటిని ఒక క్రమ పద్ధతిలో తాను ఎఫెసీలో ఉన్న మూడు సంవత్సరాల కాలంలో బోధించాడని అతని మాట సూచిస్తున్నది.

క్రూరమైన తోడేళ్లు

మనం అన్వేషించవలసిన సహాయం చేయవలసిన గొప్పదైన మహిమకరమైన పరిచర్య తమదేనన్నట్లు ఈ తప్పు బోధకులు వాళ్ళ పరిచర్యను మనముందు ప్రదర్శిస్తున్నారు.  అయితే మనం దూరంగా తొలగిపోవాల్సిన బట్టబయలు చేయాల్సిన బోధకులు ఎలా ఉంటారో అనే దానికి రుజువులు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. భిన్నమైన బోధలు చేసేది వీళ్ళే, వీళ్ళ గురించే పౌలు తిమోతిని తీవ్రంగా హెచ్చరించాడు (1 తిమోతి 1:3). సృష్టి ఆరంభం నుంచి కూడా మనుషుల్ని సత్యం నుంచి తప్పుదారిలో నడిపించడానికి సాతాను గాడు దేవుని వాక్యాన్ని చతురతతో కుయుక్తితో వక్రీకరించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒక సర్పం మాదిరిగా తనను తాను మారువేషంలో కనపరచుకొని ఆదాము హవ్వలకు దేవుడు చెప్పిన మాట అబద్ధమని యుక్తిగా చెప్పినప్పుడు ఏదేను వనంలోనే ఇదంతా మొదలైంది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినవద్దని, ఒకవేళ తింటే మరణిస్తారని దేవుడు వాళ్లకు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. "మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో" చెబుతూ సాతాను హవ్వను శోధించాడు (ఆది 3:4-5). హవ్వ దేవుని మాటను గాక సాతాను మాటను విని, మానవజాతిని పాపంలో ముంచేసింది.

కొరింథి సంఘానికి తాను రాసిన పత్రికల్లో ఒకచోట సాతాను యొక్క అసలైన వంచనకు అత్యంత శ్రేష్ఠమైన వ్యాఖ్యానాన్ని అపోస్తలుడైన పౌలు రాశాడు. "సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళతనుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను" అని అతడు చెప్పాడు (2 కొరింథీ 11:3). "అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు" అని చెబుతూ కొరింథులో ఉన్న విశ్వాసులను పౌలు హెచ్చరించడం కొనసాగించాడు (వ.13-15).

కొండమీద ప్రసంగం చివర్లో యేసు జారీ చేసిన హెచ్చరికకు అనుగుణంగానే పౌలు యొక్క హెచ్చరిక ఉంది. "అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు" అని యేసు చెప్పాడు (మత్తయి 7:15). ఇంకొక రీతిగా చెప్పాలంటే తప్పుడు బోధకుల రూపం వాళ్లకు దుష్ట యజమానియైన సాతాను గాడి రూపం మాదిరిగానే మోసపూరితంగా ఉంటుంది. సంఘంలో నిజమైన కాపరుల ఉపదేశకుల పెద్దల మాదిరిగానే వాళ్లు తమను తాము కనపరచుకుంటారు.

గొర్రెల మంద ఉన్న దొడ్డిలోనికి ఆకలితో ఉన్న క్రూరమైన తోడేలు చొరబడితే అవన్నీ గమనించి చెదిరిపోతాయి. అయితే ఒక కాపరి మాదిరిగానే వేషం మార్చుకుని ద్వారంగుండానే అది వెళ్తే అదొక తోడేలు అని చెప్పడం గొర్రెలకు కష్టమవుతుంది. అదొక కాపరా? తోడేలా? అని గొర్రెలు వివేచించగలిగే ఏకైక మార్గం దాని స్వరాన్ని వినడమే. యేసు ఇలా చెప్పాడు.

"ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరుపెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల వాటికి ముందుగా నడుచును; గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని" వారితో యేసు చెప్పాడు (యోహాను 10:2-5).

క్రీస్తు యొక్క గొర్రెల్లో ఒకదానిగా ఎవరి నుంచి పారిపోవాలో ఎవరిని అనుసరించాలో తెలుసుకోవడానికి నిజమైన కాపరి యొక్క స్వరానికి అన్యుని యొక్క స్వరానికి మధ్యనున్న తేడాను గమనించుకునేలా నీ చెవులకు నువ్వు శిక్షణ నిచ్చుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యొక్క మందను మోసగించడానికి మింగేయడానికి సాతాను చేత ఉపయోగించబడుతున్న క్రైస్తవ ప్రసంగీకులు ఉపదేశకులు క్రైస్తవ రచయితలు క్రైస్తవ కౌన్సిలర్లు క్రైస్తవ నాయకులు మొదలైన వారు మారువేషాల్లో వస్తున్నారు, కాబట్టి వారి బోధలను  విన్నప్పుడు మీరు వెంటనే వాళ్ళను తోడేళ్లు అని గుర్తించగలగాలి. ఎంతోమంది క్రైస్తవులు అన్యుల స్వరాలను అమాయకంగా అనుసరిస్తూ దేవుని వాక్య సత్యం నుంచి తప్పుదారిలో నడిపించబడడం ఎంతో విచారకరం, భయంకరం.

పౌలు రోజుల్లో కూడా పరిస్థితి భిన్నంగా ఏమీ ఉండేది కాదు. క్రూరమైన తోడేళ్లు కాపరుల మాదిరిగా వేషం ధరించుకొని సంఘం యొక్క నాయకత్వ స్థానాల్లోకి కుయుక్తిగా చొరబడి ప్రజల విశ్వాసాన్ని చెరిపే విధంగా సత్యం నుంచి వారిని దారితప్పించే విధంగా బోధించేవారు. ఈ తప్పుడు బోధకులు కనుమరుగు చేయాలనుకునే వాక్య సత్యాలను స్పష్టంగా బోధించడం ద్వారా వీరిని నోరు మూయించాలని పౌలు తిమోతికి ఆదేశించాడు. యవ్వన కాపరియైన తిమోతికి తాను రాసిన మొదటి లేఖలో వీళ్లను ఎలా పట్టి జల్లించాలో 3-11 వచనాలలో అతడు వివరిస్తున్నాడు. వారి బోధకు ఆధారాన్ని, వారి బోధ యొక్క ఫలితాన్ని, వారి బోధ యొక్క లక్ష్యాన్ని, మరి ముఖ్యంగా వారు  బోధిస్తున్న సువార్తను అత్యంత శ్రద్ధగా పరిశీలించాల్సిన అవసరం వచ్చింది. మీరు ఎదుర్కొన్న ఏ ఉపదేశకునికైనా ఈ ప్రశ్నలను మీరు అన్వయించవచ్చు.

వారి ఉపదేశం దేవుని వాక్యంపైనే ఆధారపడి ఉందా? లేఖనం చెబుతున్న దానికి అది అనుగుణంగా ఉందా?

పౌలు తన రెండవ సువార్త యాత్రలో ఎఫెసులో తొలిసారిగా సంఘాన్ని స్థాపించాడు. విశ్వాసుల సమూహానికి శిక్షణనిస్తూ వారిని పరిచర్యకు సిద్ధం చేస్తూ సుమారు మూడు సంవత్సరాలు అతడు అక్కడ గడిపాడు. రోమ్ నగరంలో గృహబందీగా ఉన్నప్పుడు ఎఫెసులో ఉన్న సంఘానికి అతడొక లేఖ రాశాడు. తర్వాత అతడు కొద్దికాలం పాటు విడుదల చేయబడి తాను స్థాపించిన ముఖ్యమైన సంఘాల్లో కొన్నింటిని పునర్దర్శించడానికి ప్రయాణించాడు. అతడు ఎఫెసు పట్టణానికి చేరుకున్నప్పుడు అపో 20వ అధ్యాయంలో ఎఫెసీ సంఘ పెద్దలతో తన చివరి సమావేశంలో ప్రవచించిన విధంగానే తప్పుడు  బోధకులు చేత సంఘం అణగదొక్కబడడం చూసి అతడు పరితాపం చెందాడు. తప్పుడు  బోధ చేస్తున్న వ్యక్తుల్ని గద్దించిన తర్వాత, పౌలు మాసిదోనియాకు ప్రయాణించి, సంఘ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియకు పై విచారణ చేయడం కోసం దేవుడు తొలుత ఉద్దేశించిన మార్గానికి ఆ సంఘం చేరుకునేందుకు సహాయం చేయడం కోసం పరిచర్యలో తనకు ప్రియ భాగస్వామియైన తిమోతిని వెనుక విడిచి వెళ్ళాడు.

ఆ సంఘంలో డిమాండ్లు వత్తిళ్లు చాలా తీవ్రంగా ఉండడం వల్ల తిమోతి అక్కడ నుంచి మూటా ముళ్ళూ సర్దేసుకుని వెళ్లిపోవాలని శోధించబడ్డాడు. అక్కడే ఉండి తాను అప్పగించిన సవాలుకరమైన పరిచర్యను ముగించమని ప్రోత్సహించడానికి పౌలు తిమోతికి రాస్తున్నాడు. భిన్నమైన సిద్ధాంతాలు (గ్రీకు మూలం హెటెరోడిడస్కాలియ) బోధిస్తున్న వారితో తీవ్రంగా వ్యవహరించడమే పౌలు తిమోతిని అక్కడే ఉండమనడం వెనకున్న ప్రధాన కారణం. హితబోధకు విరోధమైన బోధ ఇది. దేవుని వాక్య సత్యాన్ని వక్రీకరించే, తప్పుగా చూపించే తప్పుడు సిద్ధాంతం (అసత్యం, వంచన, అబద్ధాలు) ఇది. క్రీస్తు, అపోస్తలులు ఇంతకుముందే బోధించిన దానికి భిన్నంగా ఉన్న బోధను వర్ణించడానికి పౌలు ఈ కొత్త పదాన్ని ఆవిష్కరించినట్లు కనబడుతోంది. ఆ సమయానికే స్థాపించబడిన ఒక ప్రామాణిక సత్యం సంఘంలో ఉంది, దానితో ఉపదేశమంతటిని పరీక్షించి చూడాలి, బేరీజువేసి చూడాలి (అపో 2:42; ఎఫెసీ 2:20; 1 తిమోతి 6:3; 2 తిమోతి 1:13). ఈ రోజు ఉపదేశమంతటిని పరీక్షించడానికి బేరీజువేసి చూడడానికి ఉన్న ప్రమాణం 66 గ్రంథాలున్న బైబిలే. ఒక వ్యక్తి బోధిస్తున్నది బైబిల్ బోధించే దానితో ఏకీభవించకపోతే ఆ వ్యక్తిని తప్పుడు  బోధకుని జాబితాలో చేర్చాలి. సులభంగా చెప్పాలంటే బైబిల్ బోధిస్తున్న దానికి భిన్నంగా ఉన్నదానిని బోధించే వాడే అబద్ధ బోధకుడు.

ఎఫెసు సంఘంలో అబద్ధ బోధకులు ఏం బోధిస్తున్నారో స్పష్టంగా తెలియదు. వాళ్లు ప్రాధాన్యత లేని అంశాలకు ప్రాధాన్యతనిస్తూ అర్థరహితమైన విషయాల కోసం వాదాలు (డిబేట్లు) పెట్టడానికి ఇష్టపడేవారని పౌలు సూచించాడు. ఎలాంటి వాక్యాధారమూ లేని కల్పనా కథలంటే మితములేని వంశావళులు అంటే వాళ్లకి ఆసక్తి ఉండేది (1 తిమోతి 1:4; 2 తిమోతి 4:4; తీతు 1:14). రబ్బీల రచనల్లో ఇలాంటి విషయాలు విస్తారంగా ఉండేవి. సువార్త గ్రంథాలు రాయబడక ముందు క్రీస్తు జీవితం గురించి ఎన్నో కథలను కల్పించడం తప్పుడు బోధకులకు సులభంగా ఉండేది. ఉదాహరణకు తోమా గ్రంథంలో యేసు యొక్క బాల్యం గురించిన కల్పిత కథలు రాయబడ్డాయి. ఆయన మట్టి నుంచి ఏ విధంగా పిచ్చుకలను చేశాడో ఇతరులను అవమానించిన పిల్లలను గాలిలో తేలేలా ఏ విధంగా చేశాడో అందులో రాయబడ్డాయి. తమ వంశవృక్షపు వేర్లు ఎక్కడిదాకా ఉన్నాయో తెలుసుకోవాలనే లోతైన ఆసక్తి కూడా యూదులకు ఉండేది (తీతు 3:9). పేర్ల జాబితాలు అనేకం పాత నిబంధనలో ఉన్నాయి. బహుశా అబద్ధ బోధకులు కొత్త పేర్లను వాటిలో ఇరికించి వారి కథలను అలంకరించి వాటికి కొత్త అర్థాలను కల్పించి తమను దేవుడు ఎన్నడూ చెప్పమని ఉద్దేశించని వాటిని చెప్పి ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ కల్పిత కథలకు వంశావళులన్నింటికి మూలం దైవ ప్రత్యక్షత కాదు, మానవ ఊహయే!

నేటి దినాన ప్రసంగీకులు రచయితలు గాయకులు తాము చెబుతున్న దానికి ఎలాంటి లేఖనాధారమూ చూపించకుండానే ఎంతో ధైర్యంగా కొన్ని మాటలు చెప్పడం సర్వసాధారణమైపోయింది. వాళ్లు చెప్పే మాటల్లో అధిక శాతం బైబిల్ పై కంటే కూడా వ్యక్తిగత అనుభవంపైనో వృత్తిపరమైన పరిశోధనపైనో ఆధారపడి ఉంటాయి. ప్రజలు లోకంలోని భావజాలాన్ని, వ్యక్తిగత అభిప్రాయాలను లేఖనంతో జోడించినప్పుడు తమకు తెలియకుండానే లేఖనం యొక్క నిజమైన అర్ధాన్ని మార్చేస్తారు. కొందరు తమ లక్ష్యాలకు పనికొచ్చే విధంగా తాము చెప్పాలనుకున్న దానిని లేఖనం చెప్పేలా చేయడానికి ఉద్దేశం పూర్వకంగానే లేఖనాన్ని వక్రీకరిస్తారు. కొందరు వాక్యం లోతుల్లోకి వెళ్లాలనుకుంటారు, కేవలం అక్షరానుసారమైన చారిత్రకమైన వ్యాకరణానుసారమైన లేఖన భాష్యానికి మించి వెళ్లి తాము నూతనమైన విప్లవాత్మకమైన సంగతులను కనుగొన్నామని చెప్పడం కోసం లేఖనం చెబుతున్న దానికి మించిన మాటలు చెబుతుంటారు. ఆర్. సి. స్ప్రౌల్ గారు ఎంతో జ్ణానంతో ఇలా రాశారు. 

2000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవడం గురించి మనం మాట్లాడినప్పుడు ఆ గ్రంథంలోని సారాంశంపై పాశ్చాత్య చరిత్రలోనే అత్యంత శ్రేష్ఠులైన వ్యక్తులు అధిక సమయాన్ని గడిపినప్పుడు ఆ పుస్తకం యొక్క అర్ధాన్ని సమూలంగా మార్చేసే విప్లవాత్మకమైన సరికొత్తదైన అంతర్దృష్టి మాకు కలిగిందని ఎవరైనా చెప్పడం పూర్తిగా అసంభవమే.1

ఒక ముఖ్యమైన బండ గుర్తు ఏంటంటే ఏదైనా ప్రసంగం వింతగా అనిపిస్తే అది బహుశా వింతైనదే. ఇంతకుముందు ఎన్నడూ వినని మాటను నువ్వు వింటే అది బైబిల్ కు సంబంధంలేని వేరే మూలం  నుంచి రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. క్రమమైన బైబిల్ అధ్యయనమే  అబద్ధ బోధకుల మూలంగా మోసపోకుండా ఉండడానికి అత్యంత శ్రేష్టమైన రక్షణ  (1 తిమోతి 4:6). నీ మనసును ప్రతి రోజు లేఖనాల బోధకు బహిర్గతం చేస్తుండగా సత్యాసత్యాలను వివేచించగలిగే నీ సామర్థ్యంలో నువ్వు ఎదుగుతావు. అమెరికా దేశపు ఆర్థిక విభాగం తన ప్రజలకు నకిలీ నోట్లను పసిగట్టడానికి అసలైన నోట్ల గురించి ఎంతో లోతైన శిక్షణ అందిస్తుందని నేను విన్నాను. తద్వారా వాళ్లు అసలైన నోట్ల గురించి ఎంతో పరిజ్ఞానం కలిగి ఉంటారు, అప్పుడు నకిలీ నోట్లను పసిగట్టడం వాళ్లకు సులభమవుతుంది. అదే విధంగా దేవుని వాక్య సత్యాన్ని అధ్యయనం చేయడానికి పరీక్షించడానికి నువ్వు అధిక సమయాన్ని వెచ్చించాలి, తద్వారా నీకు అసత్యాన్ని గుర్తించడం ఎంతో సులభమవుతుంది.

ఒక ప్రసంగీకుని లేదా ఒక ఉపదేశకుని సందేశాన్ని నువ్వు వింటున్నప్పుడల్లా నీకు నీవే ఈ ప్రశ్నలు వేసుకోవాలి: వారి బోధకు ఆధారం ఏంటి? అది వారికి ఎలా తెలుసు? అలాంటి ఆలోచనను వాళ్ళు ఎక్కడినుంచి తీసుకున్నారు? వారి నమ్మకాలను అభిప్రాయాలను దేని ఆధారంగా ఏర్పరచుకుంటున్నారు? వాళ్లు చెప్పేది మంచిగా అనిపించినా వాళ్ళు చెబుతున్నదానికి కొన్ని వచనాలైనా ఆధారంగా లేకపోతే దానిని అంగీకరించవద్దు.

వారి బోధ భక్తిలో ఎదుగుదలను కలిగిస్తోందా? క్రీస్తు యొక్క శరీరాన్ని ఐక్యపరుస్తోందా? దానికి క్షేమాభివృద్ధి కలిగిస్తోందా?

ఈ కల్పిత కథలు వంశావళుల సారాంశం ఏంటో మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ వాటికి ఎలాంటి ఆత్మసంబంధమైన విలువా లేదనే విషయంలో మాత్రం మనం నిశ్చయత కలిగి ఉండవచ్చు‌. వాదాలను లేవనెత్తడానికి సంఘంలో చీలికలను సృష్టించడానికి మాత్రమే పనికొచ్చే వ్యర్థమైన ఊహలే ఈ కల్పనా కథలు, వంశావళులు. ప్రజల మనసుల్లో అవి సందేహాలను సృష్టించాయి, జవాబుల కంటే ప్రశ్నలనే ఎక్కువగా లేవనెత్తాయి. ఫలితంగా ఎఫెసులో ఉన్న విశ్వాసులను తమ విశ్వాసంలో స్థాపించడానికి బదులు ఈ తప్పుడు  బోధకులు వారి విశ్వాసాన్ని కలవరపరిచారు, ఒకవేళ దీన్ని పసిగట్టకపోతే వాళ్లు ప్రజలు ఆధ్యాత్మిక జీవితాలను నాశనం చేసుకొని ఉండేవారు (2 తిమోతి 2:14, 16-18, 23; తీతు 1:10-11; 3:9-11).

దేవుని వాక్యం గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండేందుకు ప్రజలకు సహాయం చేయటానికి బదులు బైబిల్ ఏ విషయం గురించైతే స్పష్టతనివ్వలేదో దాని గురించి కేవలం కల్పితాలను బోధిస్తూ తమకెన్నడూ దేవుడు చెప్పమని ఉద్దేశించని వాటిని లేఖనాలు చెబుతున్నాయన్నట్లు వాటికి ఆత్మీయ అర్థాలు చెప్పి తప్పుడు  బోధకులు ప్రజలను అయోమయానికి ఆందోళనకు గురి చేస్తుంటారు. అర్థరహితమైన ఫలరహితమైన ద్వితీయ స్థాయికి చెందిన కల్పితాలపైన మాత్రమే దృష్టిసారిస్తూ, అత్యంత విలువైన సత్యాలనుంచి మిమ్మల్ని దూరం చేసే ప్రసంగీకులతో బోధకులతో మీరు ఎలాంటి సంబంధాన్నీ కలిగి ఉండొద్దు. ఒక ప్రసంగీకుడుగానీ బోధకుడుగానీ దారితప్పి
అతడు ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియకుండా మాట్లాడుతుంటే ఆ ప్రసంగానికి ఒక లక్ష్యం అంటూ లేకపోతే నీకు నీవే "ఈ ప్రసంగంలో ముఖ్యాంశం ఏంటి?" క్రీస్తుతో నా నడకలో నేను ఎదగడానికి పరిణతి చెందడానికి ఇది నాకు ఎలా సహాయపడుతుంది? అనే ప్రశ్నలు వేసుకోవాలి. అలాంటి వ్యర్థమైన సమాచారానికి నువ్వు సమయం ఇవ్వకూడదు. నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని, క్రీస్తు శరీరంలో ఇతరుల ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టేందుకు అవసరమైన క్రైస్తవ విశ్వాసంలోని గొప్ప సత్యాలను అధ్యయనం చేయడానికి ధ్యానం చేయడానికి నీ సమయాన్ని, శక్తిని నువ్వు వెచ్చించాలి.

ప్రజలను మారుమనస్సుకు, క్రీస్తు యేసునందు విశ్వాసానికి తీసుకొచ్చి వారిని క్రీస్తు రూపంలోకి ఎదిగేలా చేసేందుకు తనకున్న సంకల్పాన్ని ప్రణాళికను నెరవేర్చుకోవడానికి ఈ సమయంలో దేవుడు ఉపయోగించుకునే ప్రాథమికమైన పనిముట్టు క్రీస్తు శరీరమైన సంఘమే (ఎఫెసీ 4:11-16).
ద్వితీయ స్థాయి అంశాల గురించిన వ్యర్థమైన ఊహలు ఫలరహితమైన చర్చలు సంఘ క్షేమాభివృద్ధికి ఏ మాత్రమూ మేలు చేయవు. వాస్తవానికి అవి పూర్తి విరుద్ధమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అవి సంఘాన్ని పూర్తిగా కూలదోస్తాయి. తప్పు బోధ దేవుని పనికి ఆటంకంగా ఉంటుంది, దానిని దారి మళ్ళిస్తుంది. అందువల్లనే తిమోతి ఎఫెసులో ఉండి తప్పుడు బోధకుల నోళ్లు ముయించాలని పౌలు ఎంతో పట్టుబట్టాడు. లేకపోతే, ప్రజల జీవితాల్లో ఆరోగ్యకరమైన సిద్ధాంతం కలిగించే ఆధ్యాత్మిక ఎదుగుదలను ఎఫెసీ సంఘం ఎన్నటికీ అనుభవించి ఉండేది కాదు.

నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా ఉంటుందో పౌలు వర్ణించడం కొనసాగించాడు. అబద్ధ బోధకులకు భిన్నంగా పౌలు యొక్క ఉపదేశం ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని, ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని కలిగి ఉండేది. అబద్ద బోధ ప్రజలను ఎక్కడికీ నడిపించేది కాదు, పౌలు చేసిన సత్యమైన బోధ వారిని క్రీస్తు దగ్గరకు నడిపించేది. సత్యమైన బోధ ప్రజలను గొప్ప భక్తిలోనికి, మరింత దేవునిలా మారడానికి నడిపించేది. బైబిల్ ఉపదేశమంతటి యొక్క అంతిమ లక్ష్యం భక్తి గల జీవితాలను జీవించడానికి ప్రజలకు సహాయం చేయడమే. 

భక్తిగల జీవితంలో అనేక మంచి లక్షణాలు ఉంటాయి. మొదటిది ప్రేమ, ఇది షరతులు లేనిది, దేవుని యెడల ఇతరుల యెడల త్యాగపూరితమైన నిబద్ధతతో కూడినది (మార్కు 12:29-31). ప్రేమ అనేది క్రైస్తవుని ప్రత్యేకమైన గుర్తు (యోహాను 13:35). ఆరోగ్యకరమైన సిద్ధాంతం ప్రజల జీవితాల్లో కలిగించే మొట్టమొదటి ఫలం: దేవుని యెడల, ఇతరుల యెడల గొప్ప ప్రేమ.

ఆరోగ్యకరమైన బోధ పవిత్రమైన హృదయాన్ని కలిగిస్తుంది. బైబిల్లో హృదయం అనేది ఒక వ్యక్తి యొక్క కేంద్రాన్ని, మనుషుల కోరికలన్నింటికీ నిర్ణయాలన్నింటికీ మూలాధారాన్ని సూచిస్తున్నది. పవిత్ర హృదయాన్ని కలిగి ఉండడం అంటే అర్థం నీ అంతరంగ జీవితం మలినం కాకుండా పాపంతో కళంకితం కాకుండా ఉండడం. బైబిల్ అంతట్లోనూ ఇదే అతి శ్రేష్ఠమైన అంశం. "యెహోవా పర్వతమునకు ఎక్కదగినవాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగినవాడెవడు?
వ్యర్థమైనదానియందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులును శుద్ధమైన హృదయమును కలిగి యుండువాడే" అని దావీదు రాశాడు (కీర్తన 24:3-4). "హృదయ శుద్ధిగలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు" అని యేసు చెప్పాడు (మత్తయి 5:8). ఆరోగ్యకరమైన సిద్ధాంతం ఎంతో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ప్రజలు జీవించేందుకు కారణమవుతుంది.

మూడవదిగా ఆరోగ్యకరమైన సిద్ధాంతం మంచి మనస్సాక్షిని కలిగిస్తుంది. మీ మనస్సాక్షి మంచి ఏదో చెడు ఏదో మీకు చెప్పేందుకు దేవుడు అనుగ్రహించిన మానసికమైన విభాగం (రోమా 2:14-15). మీరేదైనా తప్పు చేసినప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని నిందిస్తుంది, ఒప్పిస్తుంది. అది మీరు అపరాధ భావనతో ఉండేలా చేస్తుంది. అంతేకాదు మీరు సరైన పనులు చేసినప్పుడు మీ మనస్సాక్షి మిమ్మల్ని సమర్థిస్తుంది, ఆమోదిస్తుంది. మీరు సరైన పని చేశారని అది మీకు ఆనందాన్ని శాంతిని ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది.  ఏది సరైనదో ఏది సరికానిదో ఆరోగ్యకరమైన సిద్ధాంతం మీకు బోధిస్తుంది, తద్వారా సరైన పనులు మీరు చేయగలుగుతారు, శుద్ధమైన మనస్సాక్షిని కొనసాగించగలుగుతారు.

చివరిగా ఆరోగ్యకరమైన సిద్ధాంతం యథార్ధమైన విశ్వాసాన్ని అనగా వేషధారణ లేని విశ్వాసాన్ని కలిగిస్తుంది. "వేషధారి" అనే మాట "హుపోక్రిటోస్" అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. నాటక రంగంలో ఒక పాత్ర పోషిస్తున్న నటుణ్ణి వర్ణించడానికి ఈ పదం ఉపయోగించబడేది. ఒక సన్నివేశంలో ఆ నటుడు విచారంగా ఉండే ముసుగును ధరిస్తాడు, ఆ తర్వాత సందర్భంలో సంతోషకరంగా ఉండే ముసుగును వేసుకుంటాడు. వేషధారి అంటే ముసుగును ధరించే వ్యక్తి అని అర్థం. నకిలీ, మోసం అని అర్థం. అయితే ఆరోగ్యకరమైన బోధను వినేవాడు స్వచ్ఛమైన యథార్ధమైన రక్షణార్థమైన విశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు, తిమోతిలో కచ్చితంగా ఇలాంటి విశ్వాసమే పుట్టింది (2 తిమోతి 1:5). దీనికి భిన్నమైన వారు అబద్ధ బోధకులు మరియు వేషదారుల సమూహమే. వాళ్లు తమను తామే ప్రేమించుకుంటారు, వాళ్లకు మలినమైన భ్రష్టుపట్టిన హృదయాలు ఉంటాయి, వారి మనస్సాక్షులు వాత వేయబడి ఉంటాయి అపవిత్రమైనవిగా ఉంటాయి, స్వచ్ఛమైన అంతరంగంలోని భక్తినికాక భక్తి యొక్క బాహ్య రూపాన్ని వాళ్ళు హత్తుకుంటారు (1 తిమోతి 4:2; 2 తిమోతి 3:2-5; తీతు 1:12-16).

పౌలు ఈ వాక్య భాగంలో వర్ణించిన భక్తిని తప్పుడు  బోధ పుట్టించదు, పుట్టించలేదు. వాస్తవానికి అది భక్తిహీనతనే పుట్టిస్తుంది (2 తిమోతి 2:16-17). అబద్ధ బోధకులను వర్ణిస్తూ "వాడేమియు ఎరుగక తర్కములనుగూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటిమూలముగా అసూయ కలహము దూషణలు దురనుమానములును" కలిగి ఉంటారని పౌలు రాశాడు (1 తిమోతి 6:4). అబద్ధ బోధవలన ఐదు భక్తిహీనమైన వైఖరులు కలుగుతాయని పౌలు తెలియచేశాడు. ఈ మాటలన్నీ సంబంధాల్లో పూర్తి విచ్చిన్నతను వర్ణిస్తున్నాయి. ఇంకొకరీతిగా చెప్పాలంటే తప్పు బోధ వలన సంఘంలో పూర్తిగా గందరగోళం అయోమయం నెలకొంటాయి. ఇవి ఆత్మ ఫలాలు  కావు, శరీర కార్యాలు (గలతీ 5:19-23). తమ ఫలాలను బట్టి అబద్ధ బోధకులను మీరు తెలుసుకోగలరు అని యేసు చెప్పాడు (మత్తయి 7:15).

దానికి భిన్నంగా ఆరోగ్యకరమైన బోధ యొక్క ఫలం బలమైన ఆరోగ్యకరమైన ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన ప్రజలను పుట్టిస్తుంది, వారి జీవితాలు ప్రేమ పవిత్రత యథార్థత నిజాయితీ అనే వాటితో నిండి ఉంటాయి. స్పష్టమైన ఖచ్చితమైన దేవుని వాక్యోపదేశాన్ని క్రమంగా వినే ప్రజలు ఈ విధంగానే కనబడతారు. మనుషుల జీవితాల్లో ఈ లక్షణాలను కలిగిస్తుందా లేదా అనేదే సత్యమైన బోధ అంతటికి పరీక్ష. "నాకు బోధించబడుతున్నది దేవుణ్ణి మరింత ఎక్కువగా ప్రేమించడానికి, ఇతరుల యెడల అధికమైన ప్రేమను కలిగి ఉండడానికి, మరింత పరిశుద్ధమైన నిందారహితమైన జీవితాన్ని జీవించడానికి, క్రీస్తుతో సంబంధంలో మరింత యథార్ధంగా నిజాయితీగా ఉండడానికి కారణమవుతోందా? లేదా?" అని నిన్ను నీవే ప్రశ్నించుకో. ఒక్క మాటలో చెప్పాలంటే మరింత భక్తిగా జీవించడానికి అది నీకు సహాయపడుతోందా? వారు దేవుణ్ణి ఘనపరచడానికి ఇతరులకు సహాయం చేయడానికి దీనత్వంతో ప్రయత్నిస్తున్నారా? అది ఉచితంగా బోధించబడుతోందా? డబ్బులు కోసం మనవి చేయకుండానే ఉంటుందా?

ప్రేమ, పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, యథార్ధమైన విశ్వాసం అనే వాటి గురించి అబద్ధ బోధకులు పట్టించుకోరు. వారి బోధ ఇలాంటి వాటిని కలిగించదు. కలిగించడానికి కనీస ప్రయత్నం కూడా చేయదు. వాళ్లు ఒక లక్ష్యంపైన గురిపెట్టరు. దారి తప్పిన బాటసారి ఎన్నడూ గమ్యాన్ని చేరనట్లు, ఎలాంటి లక్ష్యమూ లేకుండా వాళ్ళు తప్పుదారిలో తిరుగుతుంటారు. వారి సందేశాలు వ్యర్థమైన నిరుపయోగమైన శూన్యమైన సంభాషణ కంటే వాదాల కంటే ఎక్కువేమీ కాదు. సంఘంలో ప్రసంగించే ఉపదేశించే స్థానాన్ని అహంకారంతో స్వార్థంతో వాళ్లు కోరుకుంటారు, గాని బోధించే సామర్థ్యాన్ని వాళ్లు కలిగి ఉండరు. వాళ్లు స్వార్థప్రియులు, తమకు అన్నీ తెలుసని వాదించేవారు, వాళ్ళు చెబుతున్నది సత్యమని మీరు భావించేలా చేయడానికి వాళ్లు ధైర్యాన్ని ప్రదర్శిస్తారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కనీస అవగాహన కూడా వాళ్లకు ఉండదు (2 తిమోతి 3:6-7).

తప్పుడు బోధకులు వివిధ ప్రేరణల చేత ప్రేరేపించబడుతుంటారు. కొందరు తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటారు. మరికొందరు తమ బ్యాంకు ఖాతాలో డబ్బును పెంచుకోవాలనుకుంటారు. ఇంకొందరు తమ లైంగికేచ్ఛలను సంతృప్తిపరచుకుంటారు, లేదా గుర్తింపును కోరుకుంటారు. వాళ్లు దీనత్వంతో దేవుణ్ణి ఘనపరచాలని ఇతరులకు సహాయపడాలని ప్రయత్నించరు. వాళ్లు స్వార్థపరులు, అహంకారులు (1 తిమోతి 6:3-5; తీతు 1:10-11).

ఆరంభం నుంచే, అమాయక ప్రజలను ఎరగా చిక్కించుకుని, సహాయం చేస్తామని వారికి వాగ్దానం చేసి, వారి ధనాన్ని దోచుకునే మతపరమైన అక్రమకారులు ఉంటూనే ఉన్నారు. బిలాము (2 పేతురు 2:15-16), గారడీవాడైన సీమోను (అపో 8:9-24), "కానుకల పెట్టెలో నాణెం టంగునపడిన ప్రతిసారి పర్గేటోరి నుంచి విశ్వాసి ఆత్మ చెంగున గెంతుతుంది" అని సిగ్గులేకుండా ప్రజలకు పాపపరిహార పత్రాలను అమ్మిన టెట్జెల్, ఎంతో ఖరీదైన వేదికలపై అత్యంత విలువైన సూట్లు ధరించి విస్తారమైన బంగారు నగలను పెట్టుకుని మీ ధనాన్ని వాళ్లకు పంపిస్తే అదే విధమైన అభివృద్ధి మీకు కలుగుతుందని వాగ్దానం చేసే నేటి టీవీ ప్రసంగీకులు అనేకులు ఇలాంటి వాళ్లే. వారి విలాసవంతమైన జీవితం గొప్ప విశ్వాసం మూలంగా దేవుడు తమ జీవితాలపై కురిపించిన దీవెనని చెప్పుకుంటూ వారి విలాసవంతమైన జీవితాన్ని సమర్ధించుకుంటారు. వాళ్లు నమ్మినట్లే నువ్వు కూడా దేవుణ్ణి నమ్మితే మీరు కూడా వారిలా ఉండవచ్చని మీరు నమ్మాలని వాళ్లు కోరతారు.

వారి ఉపదేశం యొక్క లక్ష్యాన్ని పరీక్షించడమే వారి మాటలు వినడం వారి దగ్గర నుంచి నేర్చుకోవడం విలువైనదో కాదో వివేచించగలిగే శ్రేష్ఠమైన మార్గాల్లో ఒకటి. వాళ్లు తమ గురించి తామే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారా? కేవలం ధనం గురించే మాట్లాడుతున్నారా? వాళ్ల పరిచర్య దేవుని మహిమపై దృష్టిసారిస్తోందా లేదా తమ సొంత ఘనతపై దృష్టిసారిస్తోందా? తాము ఎవరికైతే పరిచర్య చేయాలో వాళ్లను ఉపయోగించుకుని‌ తాము విలాసవంతంగా జీవిస్తున్నారా? తరచూ ఆర్థిక సహాయం చేయాలని మనవి చేస్తున్నారా? వాళ్ళు గర్విష్టులుగా కనబడుతున్నారా? లేదా దీనులుగా కనబడుతున్నారా?

వారి సువార్త సందేశం ఏంటి? స్పష్టంగా సరిగ్గా వాళ్లు దాన్ని వివరిస్తున్నారా? అది క్రియలతో రక్షణ పొందవచ్చనే మానవ కేంద్రిత సందేశమా? లేదా కృప ద్వారా రక్షణ అని ఉపదేశించే దేవుణ్ణి మహిమపరిచే సందేశమా?

చివరిగా ఒక ప్రసంగీకుని/ఉపదేశకుని సువార్తను వీరు పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఈ తప్పుడు  బోధకులు ధర్మశాస్త్రోపదేశకులుగా ఉండాలనుకుంటారని పౌలు చెప్పాడు (1 తిమోతి 1:7). అయితే వాళ్లు ధర్మశాస్త్రాన్ని అపార్థం చేసుకుని, తప్పుగా అన్వయించేవారు. అయితే ధర్మశాస్త్రం చెడ్డదని దాని ఉద్దేశం కానే కాదు. ధర్మశాస్త్రము, సువార్త పరిపూర్ణమైన సామరస్యతతో కలిసి పనిచేసే విధానాన్ని పౌలు స్పష్టంచేశాడు. ధర్మశాస్త్రం మానవాళి అంతటి విషయంలో దేవుని చిత్తమైయున్నది. మనందరం జీవించడానికి దాన్నే ప్రమాణంగా పెట్టుకోవాలని ఆయన కోరుతున్నాడు. పది ఆజ్ఞల రూపంలో దాని సారాంశం ఇవ్వబడింది.

ఈ తప్పుడు  బోధకులు క్రైస్తవ్యాన్ని యూదు మతంతో మిళితం చేస్తూ, క్రియలపైన ఆధారపడిన ఒక విధమైన నీతిని ప్రచారం చేస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా అనగా సత్క్రియలు  చేయడం ద్వారా మనిషి తన రక్షణను సంపాదించుకోగలడని ఉపదేశిస్తుండేవారు. సంఘం పసితనంలో ఉన్నప్పటి నుంచి దానిని పట్టి పీడించిన అత్యంత సాధారణమైన తప్పుడు  బోధ ఇదే. అది అనేక అవతారాలు ఎత్తింది, అయితే "రక్షణ కోసం క్రీస్తునందు విశ్వాసం సరిపోదు" అనేదే అన్ని సమయాల్లోనూ దాని సారాంశం. మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసముంచాలి, దీనికితోడు సంస్కరణల్లో పాల్గొనాలి, (లేదా) కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను విధులను జరిగించాలి, (లేదా) బాప్తీస్మం పొందాలి, (లేదా) ఒక ప్రత్యేకమైన సంఘంలో చేరాలి, (లేదా) కొంత నిర్దిష్టమైన కానుక ఇవ్వాలి, (లేదా) మరొక విధమైన మంచి పని చేయాలి" అనే విధంగా ఈ  తప్పుడు బోధలు మనకు ఈ రోజుకూ కనబడతాయి. అయితే మంచి పనులు చేయడం ద్వారా ఏ ఒక్కడూ రక్షణ సంపాదించుకోలేడని బైబిల్ పదేపదే చెబుతోంది. రక్షణ అనేది దేవుని కృప మూలంగా కలిగే ఉచితమైన వరం, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే దాన్ని మనం పొందుకుంటాం (2 తిమోతి 1:9; తీతు 2:11-14; 3:5, 8)

మనమేదో ధర్మశాస్త్రాన్ని పాటించి మన రక్షణ సంపాదించుకొనేలా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఒక మార్గంగా మనకివ్వలేదు. దాన్ని మనం పాటించలేమనీ, మనల్ని మనమే రక్షించుకునేంత మంచివాడు మనలో ఏ ఒక్కడూ లేడనీ, మనకు ఎంతో తీవ్రంగా ఒక రక్షకుని అవసరం ఉందనీ చూపించడానికే ఆయన మనకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. మన పాపపు స్వభావాన్ని బట్టబయలుచేసి, దేవుని ప్రమాణానికి మనం ఎంత దూరంగా పడిపోయామో, పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఎంత తీవ్రంగా అభ్యంతరపరిచామో చూసేలా మనకు సహాయపడాలన్నదే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం. తద్వారా రక్షణ నిమిత్తం మారుమనస్సుతో, విశ్వాసంతో క్రీస్తు చెంతకు పరిగెత్తాలన్నది ఆయన ఉద్దేశం (రోమా 3:20; 7:7; గలతీ 3:24).

ధర్మశాస్త్రం ఎవరి పాపాలను బట్టబయలు చేయడానికి నియమించబడిందో వివిధ రకాలైన ఆ ప్రజల సుదీర్ఘమైన జాబితాను తెలియజేస్తూ పౌలు కొనసాగించాడు: "ధర్మశాస్త్రము ధర్మవిరోధులకును అవిధేయులకును భక్తి హీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూష కులకును పితృహంతకులకును మాతృహంతకులకును నర హంతకులకును వ్యభిచారులకును పురుషసంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును,
హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల, అట్టివానికిని నియమింపబడెను" (1 తిమోతి 1:9-10). ఈ వచనాల్లో పది ఆజ్ఞలతో స్పష్టమైన సంబంధం మనకు కనిపిస్తుంది. ఈ జాబితాలో మొదటి మూడు జతలు దేవుని యెడల జరిగించే అపరాధాలకు అనగా 10 ఆజ్ఞలలో మొదటి విభాగానికి సంబంధించినవి. ఆ తర్వాత మన పొరుగువానికి సంబంధించి, రెండవ విభాగంలో ఉన్న ఆజ్ఞలను ఉల్లంఘించే వారి జాబితాను తెలియజేస్తూ పౌలు కొనసాగించాడు. "శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్తప్రకారము... ​హితబోధకు విరోధియైనవాడు మరి ఎవడైనను ఉండిన యెడల" అని చెబుతూ దేవుని వాక్యానికి విరోధంగా ఉండే ప్రతి ప్రవర్తనను ఆ జాబితాలో చేర్చి అతడు ముగిస్తున్నాడు (వ. 9, 11). అంటే దేవుని వాక్యాన్ని పవిత్రంగా కచ్చితంగా ఆరోగ్యకరంగా బోధించే సువార్తకు విరుద్ధంగా నడుచుకునే ఏ ప్రవర్తనైనా ఈ జాబితాలోకి వస్తుంది.

దేవుడు పౌలుకు అప్పగించిన సువార్త సందేశమే సత్యాసత్యాలను మంచి చెడులను ఏంటో తెలుసుకోవడానికి అతడు ఉపయోగించిన కొలకర్ర. "మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పర లోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రక టించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక" అని పౌలు గలతీయులను హెచ్చరించాడు (గలతీ 1:8). ధర్మశాస్త్రానికి సువార్తకు మధ్యన తగాదా ఏమీ లేదని స్థాపిస్తూనే అతడు ఎంతో పట్టుదలగా సువార్తను సమర్థించాడు. అవి రెండూ ఒకదానికొకటి సహాయ సహకారాలను అందించుకుంటూ సమానమైన ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నాయి. మరణానికి నరకానికి మాత్రమే పాత్రులమైన ఘోరమైన పాపులం అని ధర్మశాస్త్రం మనకు చూపిస్తుండగా, యేసు మరణించి తిరిగి లేచాడని తద్వారా మారుమనస్సు పొంది రక్షణ నిమిత్తం తన యందు విశ్వాసముంచిన వారందరికీ క్షమాపణనూ నిత్యజీవాన్నీ అనుగ్రహిస్తాడని సువార్త మనకు చూపిస్తున్నది. సులభంగా చెప్పాలంటే మనం ఎందుకు రక్షించబడాల్సిన అవసరం ఉందో ధర్మశాస్త్రం మనకు చూపిస్తుండగా, మనం ఎలా రక్షించుకోబడగలమో సువార్త మనకు చూపిస్తున్నది.

ఒక వ్యక్తి నిజమైన బోధకుడా తప్పు బోధకుడా అని వివేచించడానికి నాలుగవ, చిట్టచివరి పరీక్ష ఏంటంటే ధర్మశాస్త్రానికి సువార్తకు మధ్యనున్న సంబంధం గురించి వారి అవగాహనను పరీక్షించడమే. సువార్త సందేశానికి సిద్ధపాటుగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారా? లేదా రక్షణ పొందడానికి ఒక మార్గంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగిస్తారా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. కృపచేత మాత్రమే, క్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే, దేవుని మహిమ నిమిత్తం మాత్రమే ఒక మనిషి రక్షించబడగలడు అని వాళ్ళు  బోధిస్తున్నారా?

సులభమైన, ముక్కుసూటియైన ఈ ప్రశ్నలు తప్పుడు  బోధకులు ఎవరో పసిగట్టగలగడానికి మీకు సహాయపడతాయని నేను నమ్ముతున్నాను. తద్వారా అనారోగ్యకరమైన వారి ఉపదేశాన్ని మీరు పెడచెవిన పెట్టి, మీ ఆత్మను పోషించే మీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఎదుగుదలను విస్తరింపచేసే ఆరోగ్యకరమైన సంపూర్ణమైన బోధను మాత్రమే వినేలా మీరు నిశ్చయించుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన బోధను స్థిరంగా వినడం చాలా ముఖ్యమైన విషయం. "దేవుని వాక్యం యెడల ఆయన ప్రజలకున్న ఏకాగ్రతపైనే వారి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది... దేవుడు తన ప్రజలను తన వాక్యం ద్వారానే జీవింప చేస్తాడు, పోషిస్తాడు, ప్రేరేపిస్తాడు, నడిపిస్తాడు... అందువల్లనే ఆయన స్వరాన్ని దీనమనసుతో, విధేయతతో వినడం వల్లనే సంఘం పరిపక్వతలోనికి ఎదగగలదు అనే విషయం లేఖనమంతట్లోనూ స్పష్టంగా ఉంది" అని జాన్ స్టాట్ వివరిస్తున్నారు. 2

అందువల్లనే నువ్వు స్తబ్దుగా ఉండే శ్రోతగా ఎన్నడూ ఉండకూడదు. అలా ఉంటే క్రైస్తవునిగా నీ ఎదుగుదల, పరిపక్వత ప్రమాదంలో పడతాయి. వాక్యానుసారమైన ప్రసంగాన్ని విన్నప్పుడు దానిని వివేచించగలిగే నీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ నువ్వు విన్నదాన్ని నీ జీవితానికి అన్వయించుకుంటూ ఉంటే నీ జీవితంలో దేవుని ప్రభావం అంతకంతకు పెరుగుతుంది, అప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలని ఆయన కోరుతున్నాడో ఆ విధంగా ఎదగడానికి మారడానికి నీకు గొప్ప అవకాశం ఉంటుంది. మా సంఘంలో దేవునితో తమ నడకలో అతి గొప్పగా ఎదుగుతున్న వాళ్ళు తమ జీవితాల్లో అత్యంత నాటకీయమైన మార్పులను అనుభవిస్తున్న వాళ్ళు ఎవరంటే దేవుని వాక్య ప్రకటనను అత్యంత సహృదయంతో అంగీకరిస్తూ దానికి స్పందించేవాళ్లే అని నేను గమనించాను. ఇంకొక రీతిగా చెప్పాలంటే శ్రేష్ఠులైన శ్రోతలే శ్రేష్ఠులైన క్రైస్తవులుగా తయారవుతున్నారు. కారణం? వాళ్లు వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే కాదు, అది వారి జీవితాల్లో భాగమవుతుంది కాబట్టి! వారు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడతారు. దాన్ని అన్వయించుకుంటారు. దాన్ని అభ్యాసం చేస్తుంటారు. చివరి అధ్యాయంలో నేను దాని గురించే మాట్లాడాలని అనుకుంటున్నాను.

అధ్యయనం/చర్చ కోసం

1. నేటి సంఘంలో దేవుని వాక్యాన్ని ఎంతో యుక్తిగా వక్రీకరిస్తూ ప్రజల్ని సత్యం నుంచి తప్పుదారిలో నడిపిస్తున్న కొందరు అబద్ధ కాపరులు ఎవరు?
2. 1 తిమోతి 1:5ను 1 తిమోతి 4:2; 6:3-5; 2 తిమోతి 2:16-17; 3:2-5; తీతు 1:12-16 లతో పోల్చండి. ఒక వ్యక్తి జీవితంలో హితబోధ, తప్పుడు బోధ కలిగించే స్వభావంలో కొన్ని వ్యత్యాసాలు ఏమిటి?
3. సువార్త సందేశంలో ధర్మశాస్త్రము, కృప ఏ విధంగా ఇమిడిపోతాయి? ఒక ప్రసంగీకుడు/ఉపదేశకుడు సువార్తను ప్రకటిస్తున్న విధానంలో ఏ ముఖ్యమైన తప్పుడు  బోధ కోసం మనం పరీక్షించాలి (ఎఫెసీ 2:8-9)?

ఈ అధ్యాయంలో వివరించబడిన నాలుగు సరళమైన ప్రశ్నలను అడుగుతూ మీరు వింటున్న ప్రతి బోధకుణ్ణీ జాగ్రత్తగా పరీక్షించే అలవాటును పెంపొందించుకోవడంలో మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి.

మీరు సరైన వాక్యమే వింటూ ఉంటే మీరు విన్నదానిని అభ్యాసం చేయండి... "ప్రభువా, నేను అనేక ప్రసంగాలను విన్నాను" అనే మాట తీర్పు రోజున నిన్ను కాపాడదు. "నువ్వు ఎలాంటి విధేయత ఫలాలను ఫలించావు?" అని దేవుడు అడుగుతాడు. ప్రకటించబడిన వాక్యం నీకు సమాచారాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, నిన్ను మార్చడానికి కూడా!... నువ్వు వాక్యం విని, దాని మూలంగా మరింత శ్రేష్ఠంగా జీవించకపోతే, నువ్వు వాక్యాన్ని వినడం నీ శిక్షావిధిని మరింత పెంచుతుంది... ఎక్కడ వినాలో తెలియని వారి గురించి మనం జాలిపడతాం; ఎలా వినాలో పట్టించుకోని వారి విషయంలో ఈ జాలి మరింత తీవ్రంగా ఉంటుంది. కృప పొందని అవిధేయులైన శ్రోతలకు ప్రతి ప్రసంగమూ నరకపు జ్వాలల్ని పెంచే కట్టెల మోపు అవుతుంది. సంఘ సంస్కారాలు అనే బరువుతో నరకానికి వెళ్లడం ఎంతో విచారకరం! అయ్యో, ప్రకటించబడిన వాక్యం సార్ధకమయ్యేలా చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి వేడుకోండి! సేవకులు చెవులకు వినబడేలా మాత్రమే మాట్లాడగలరు, పరిశుద్ధాత్ముడు హృదయాలతో మాట్లాడతాడు. - థామస్ వాట్సన్

అధ్యాయం 6

మీరు విన్నదానిని ఆచరించండి


నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును, విఱ్ఱవీగుచున్న దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి. ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవునుగదా అయితే స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, క్రియను చేయువాడైయుండి తన క్రియలో ధన్యుడగును. - యాకోబు 1:19-25

ప్రవక్తయైన యెహెజ్కేలు చెబుతున్న మాటలను ఇశ్రాయేలు ప్రజలు విన్న విధంగానే అనేకమంది శ్రోతలు ప్రసంగీకులు చెప్పే మాటలను వింటూ దోషులవుతున్నారు. యెహెజ్కేలు 33:30-32 లో దేవుడు యెహెజ్కేలుకు ఇలా చెప్పాడు:

"మరియు నరపుత్రుడా; నీ జనుల గోడదగ్గరను ఇంటి ద్వారము లందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు, ఒకరి నొకరు చూచిపోదము రండి, యెహోవాయొద్దనుండి బయలుదేరు మాట యెట్టిదో చూతము రండి అని చెప్పు కొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించు చున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు."

బహుశా యెహెజ్కేలు చాలా వాక్చాతుర్యం కలిగిన వక్త అయ్యుంటాడు, అయితే నీకు ఇష్టమైన రేడియో ప్రసంగీకునిలాంటి వాడయ్యే అవకాశం లేదు. ఇశ్రాయేలు ప్రజలు అతడు చెప్పిన మాటలను వినడానికి ఇష్టపడినందువల్ల అతడు చెప్పేది వినడానికి గుమికూడేవారు. అయితే అతడు చెప్పినదాన్ని ఆచరించడంలో వాళ్లు విఫలమయ్యారు. అతని ప్రసంగాలు వాళ్లను ఆకర్షించేవి, కానీ వాళ్లు అందులో ఒక్క మాటకు కూడా విధేయత చూపే వాళ్ళు కాదు. వినోదం కోసం మాత్రమే వాళ్ళు అతని మాటలు వినాలనుకునేవారు కానీ వాళ్లు విన్నదానిని ఆచరణలో పెట్టాలనే ఉద్దేశమే వాళ్లకు ఉండేది కాదు. హేరోదు, ఏథెన్సు ప్రజలు కూడా ఇదేవిధంగా దోషులయ్యారు (మార్కు 6:21; అపో 17:21). మీలో కొందరు ఎన్నడూ ఒక్క ప్రసంగాన్ని కూడా మిస్సవ్వరు, మీరు విన్న మాటల్లో అనేకమైన విషయాలను మీ జీవితంలో ఆచరణలో పెట్టడానికి విఫలమవుతుంటారు. "అది ఒక చెవిలో నుంచి లోపలికి వెళ్లి మరొక చెవిలో నుంచి బయటకు పోతుంది" అని మీ పెద్దలు చెప్పినట్లు ఉంటుంది.

"మీరు ప్రసంగించిన దానిని పాటించండి" అనే మాట మీకు సుపరిచితమై ఉంటుందని నేను భావిస్తున్నాను. ప్రసంగ వేదిక వెనుక నిలబడిన వ్యక్తి తాను చెప్పేదానిని చేస్తాడని సంఘానికి హాజరైన వాళ్ళు నమ్ముతుంటారు. అయితే తన సంఘాన్ని చేయమని చెప్పే మాటను ప్రసంగీకుడు ఆచరించనప్పుడు అంతకుమించిన వేషధారణ, దేవునికి అవమానం ఏదీ ఉండదు. ఒక ప్రసంగీకునిగా నేను బోధించేదానిని పాటించాలని ఆశించే హక్కు ప్రజలకు తప్పనిసరిగా ఉంటుందని నేను గ్రహించగలను. అయితే ఒక శ్రోతగా నువ్వు విన్నదానిని ఆచరణలో పెట్టాలని కోరుకునే హక్కు ప్రసంగీకునికి ఉంటుందని నువ్వు గుర్తించాలి.

నేటి సంఘంలో ఎంతోమందికి వివేచన లేకపోవడం వల్ల తమకు సహాయం చేసే సందేశాన్ని కాక తమకు హానిచేసే చెడ్డ ప్రసంగాన్ని వింటున్నారు. అయితే తమకు సహాయపడే మంచి ప్రసంగాన్ని వినేవారు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి వారము మంచి మంచి ప్రసంగాలు వారి మనస్సులలోనికి చొచ్చుకొని పోకుండా వారి హృదయాలను గుచ్చకుండా వారిని మార్చకుండానే గాలిలో కలిసిపోతుంటాయి.

వాళ్లు ఎలాంటి ఎదుగుదలను గాని మార్పును గాని తమ జీవితాల్లో అనుభవించరు. కారణం ఏంటి? వినడం అంటే స్తబ్దుగా ఉండడమేనని వారు ఊహించుకోవడమే. జోల్ బీకీ ప్రకారం, "దేవుని వాక్యాన్ని నిజంగా వినడం అంటే దాన్ని అన్వయించుకోవడమే. వాక్యాన్ని విన్న తర్వాత దాన్ని పాటించకపోతే నువ్వు దేవుని సందేశాన్ని నిజానికి వినలేదు." దేవుని ఆజ్ఞలకు లొంగిపోకుండా ఉండేలా తమకు తాము శిక్షణనిచ్చుకున్న వినని శ్రోతలు ఉంటారు. వారు అసలైన సారాన్ని కోల్పోతున్నారు. గొప్ప సువార్తికుడైన డీ.యల్. మూడీ "మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి కాదు, మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు బైబిల్ని అనుగ్రహించాడు" అని చెబుతుండేవాడు.2 ఇంకొక రీతిగా చెప్పాలంటే ప్రసంగం అనేది ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి కేవలం ఒక మార్గం మాత్రమే. దేవుని వాక్య ప్రకటన యొక్క లక్ష్యం మార్పే, అనగా ప్రజల జీవితాలు మారి, యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి మరింత ఎక్కువగా రావడమే. విధేయత చూపించాలనే ఉద్దేశంలేని శ్రోతల్లో చాలామంది లేఖనం చేత ఒప్పించబడతారు కూడా. అయితే వారు చదివిన దాన్ని బట్టి లేదా విన్నదాన్ని బట్టి మార్పు చెందడానికి తమ జీవితాల్లో ప్రత్యేకమైన విధానాలేంటో ఆలోచించడానికి సమయం మాత్రం తీసుకోరు. యాడమ్స్ గారు ఈ క్రింది మాటలు రాశారు:

కేవలం  ప్రసంగీకుడే తమకోసం మొత్తం పనంతా చేయాలని శ్రోతలు ఆశిస్తుంటారు. వాక్య భాగాన్ని ప్రత్యేకంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులకు అన్వయించాలని, తమకున్న ప్రశ్నలన్నింటికీ జవాబులు చెప్పాలని, తమకు సంబంధించిన విషయాల్లో వివిధ పరిస్థితులకు సంఘటనలకు అవసరమైన సలహాలు అందించాలని శ్రోతలు ప్రసంగీకుని నుంచి కోరుకుంటారు. వేరే రీతిగా చెప్పాలంటే మొత్తం పని అంతా అతడే చేయాలని వాళ్ళు కోరుకుంటారు. సంఘంలో వేరే వ్యక్తులు ఉన్నారని, తమ పరిస్థితి గురించి ప్రసంగీకుడు పూర్తిగా ఆలోచించలేడని స్వార్థంతో వాళ్ళు మర్చిపోతారు...అయితే సాధారణమైన నియమాలను శ్రోతలు తమ జీవితాలకు అన్వయించుకోవాలని ఆశించడం మాత్రం అత్యాశే. అది కష్టమైన పని! 3

వినడం అనేది కష్టంతో కూడిన పని ఎందుకంటే అందులోనే పాటించాల్సిన విషయం మిళితమై ఉంటుంది. నువ్వు విన్నదాన్ని బట్టి ఏదో ఒకటి చేయడానికి ఆ సమాచారాన్ని నీ జీవితానికి ముడి పెట్టుకోవాలి. ఒక్కసారి నువ్వు ప్రసంగం వినగానే నిర్ణయం నీ చేతిలోనే ఉంటుంది. ప్రసంగాన్ని అన్వయించుకోవడంలో విఫలం కావడం కేవలం సోమరితనంతో వినడం కాదు, అది పాపం. "కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును" అని యాకోబు చెప్పాడు (యాకోబు 4:17).

వాక్యానికి ద్వారాలు పూర్తిగా తెరవండి

యాకోబు యెరూషలేము సంఘంలో నాయకుడు. హింస ఎదురవడం వల్ల యెరూషలేములో ఉన్న తమ గృహాలను సంఘాన్ని విడిచి పెట్టేలా నిర్బంధించబడిన యూదు క్రైస్తవులకు అతడు రాస్తున్నాడు. వాళ్లు ఆసియా ఖండమంతటా ఇప్పుడు చెల్లాచెదురైపోయారు, ప్రతి విధమైన కష్టాన్ని అనుభవిస్తున్నారు. అయితే తాము విశ్వసించామని చెప్పిన దానికి అనుగుణంగా వాళ్లలో కొందరు జీవించట్లేదనే సమాచారం యాకోబు దగ్గరకు వచ్చింది. తాము విశ్వసించామని చెబుతున్న దానివలన తమ జీవితాలు జీవించే విధానంలో ఎలాంటి మార్పూ కలగకపోతే వారు కలిగి ఉన్నది మృత విశ్వాసాన్నే, ఈ విశ్వాసం మాటల్లో యేసు గురించిన ఒప్పుకోలు కంటే బుర్రలో ఉన్న సమాచారం కంటే ఎక్కువైనదేమీ కాదు, రక్షించడానికి ఇలాంటి విశ్వాసానికి శక్తి ఉండదు అని యాకోబు వాళ్ళను హెచ్చరించాడు. దీన్ని మనసులో పెట్టుకుని వాళ్లకు నిజంగా రక్షణార్థమైన విశ్వాసం ఉందో లేదో పరీక్షించుకోవడానికి తమ జీవితాలను పరిశీలించుకోవాలని యాకోబు వాళ్లకు సవాలు చేశాడు.

ఈ విధంగా తమను తాము పరీక్షించుకోవడంలో వారికి సహాయం చేయడానికి వారి విశ్వాసం యొక్క నిజ తత్వాన్ని నిర్ధారించుకోవడానికి అతడు వారికి కొన్ని ఆచరణాత్మకమైన పరీక్షలు పెట్టాడు. అతడు వారికి పెట్టిన మొదటి పరీక్ష శ్రమలకు శోధనలకు వారి స్పందన గురించినదే (యాకోబు 1:2-18). తన లేఖలో ప్రారంభ వచనాల్లోనే నిజమైన క్రైస్తవుడు శ్రమలకు శోధనలకు స్పందించే విధానాన్ని యాకోబు వివరించాడు. అతడు వాళ్లకు పెట్టిన రెండో పరీక్ష దేవుని వాక్యానికి వారి స్పందన గురించినది (వ. 19-25). ఈ వచనాల్లో నిజ క్రైస్తవుడు దేవుని వాక్యానికి స్పందించే విధానాన్ని యాకోబు వివరిస్తున్నాడు. వాక్యాన్ని వినే విషయంలో మీరు ఒక గొప్ప విజయాన్ని అనుభవించాలనుకుంటే ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకొని దాన్ని అన్వయించుకోవడం ఎంతో కీలకమైన విషయం.

మొదటిగా, అంగీకరించే హృదయాన్ని అనగా వాక్యమనే విత్తనానికి అనువైన నేలను యాకోబు వర్ణిస్తున్నాడు.

సంపూర్ణంగా నేర్చుకునే వారిగా ఉండండి (వ. 19-20).

వెంటవెంటనే మూడు ఆజ్ఞలు జారీచేస్తూ యాకోబు మొదలుపెట్టాడు. మీరు "వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై యుండవలెను." ఈ ఆజ్ఞలు మూడు మంచి సలహాలుగా ఒక దానికొకటి సంబంధం లేనివిగా కనబడుతున్నాయి. అయితే ఇవి కేవలం సాధారణమైన ఆజ్ఞలు కావని సందర్భం మనకు చెబుతోంది. దేవుని వాక్యానికి మనం స్పందించాల్సిన విధానం గురించి అవి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాయి. ఈ ఆజ్ఞలకు ముందున్న వచనంలో దేవుడు మనల్ని సత్య వాక్యం చేత కన్నాడని యాకోబు వివరించాడు (వ.18). ఈ ఆజ్ఞలు జారీ చేసిన వెంటనే తర్వాత వచనాల్లో "లోపల నాటబడిన వాక్యాన్ని అంగీకరించమని" "వాక్యం ప్రకారం ప్రవర్తించువారిగా మిమ్మల్ని మీరు నిరూపించుకోమని" తన పాఠకులకు యాకోబు ఉపదేశించాడు (21-22). అందువల్ల దేవుని వాక్యానికి సంబంధించిన విషయంలో మీరు వినడానికి వేగంగా మాట్లాడడానికి కోపించడానికి నిదానంగా ఉండాలి. ఈ మూడింటిలో ప్రతిదీ నేర్చుకునే గుణాన్ని ప్రదర్శిస్తోంది.

వినడానికి వేగిరంగా ఉండడం అనే మాట దేవుని వాక్యాన్ని వినడానికి మీరు ఆసక్తి చూపించాలని సూచిస్తున్నది. మీరు ఏకాగ్రత కలిగిన, శ్రద్ధ కలిగిన శ్రోతగా ఉండాలి (మత్తయి 13:9; లూకా 8:18; ప్రక 2:7). "దేవుడు మనకు రెండు చెవులను, ఒక్క నోరును అనుగ్రహించాడు. మనం మాట్లాడిన దానికి రెండంతలు వినాలని అది మనకు గుర్తుచేస్తోంది" అని ఎవరో చక్కగా చెప్పారు. యాకోబు ఈ లేఖను రాసే సమయానికి క్రైస్తవులకు తమ సొంతవైన, వ్యక్తిగతమైన బైబిళ్లు లేవు. ఎవరైనా చదువుతున్నప్పుడు బహిరంగ కార్యక్రమాల్లో వివరించబడుతున్నప్పుడు వింటూ వాళ్లు వాక్యాన్ని నేర్చుకునేవారు. అందువల్ల పాత నిబంధన లేఖనాలను ఎవరైనా వివరిస్తున్నప్పుడు లేదా క్రీస్తు గురించి ఒక అపోస్తలుడు ప్రకటిస్తున్నప్పుడు వాళ్లు శ్రద్ధగా వినాలని వాళ్లకు ఆజ్ఞాపించబడింది.

"మాట్లాడుటకు నిదానంగా ఉండడం" అంటే "వేగంగా కఠినంగా, మాట్లాడకూడదు" అని అర్థం. మీ సొంత నమ్మకాలను, అభిప్రాయాలను పంచుకోవడానికి ఆత్రపడవద్దు (యాకోబు 3:1). నీ నోట్లో నుంచి వచ్చే ప్రతి నిర్లక్ష్యపూరిత మాట నిమిత్తం తీర్పురోజున దేవునికి నీవు లెక్క అప్పగించవలసి ఉంటుంది (మత్తయి 12:36). అందువల్లనే మితంగా మాట్లాడే వ్యక్తిగా ఉండడమే జ్ఞానం (సామె 10:19; 17:28).

"నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచుకొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను" అని ప్రసంగీ 5:1-2 చెబుతున్నది.

యాకోబు రోజుల్లో సంఘ కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం నిర్వహించబడడం తక్కువ. ప్రజలు ప్రసంగీకుడు చెబుతున్న దానితో విభేదించాలనుకున్నా వాదించాలనుకున్నా అతణ్ణి అడ్డుకునే స్వేచ్ఛ కలిగి ఉండేవారు. ప్రసంగీకునితో వాదించడానికి వేగిరపడవద్దని యాకోబు తన పాఠకులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకవేళ ప్రసంగీకుడు తన పనిని తాను సక్రమంగానే నిర్వర్తిస్తూ తన సొంత ఊహలను అభిప్రాయాలను కాక కేవలం దేవుని వాక్యాన్ని వివరిస్తూ ఉంటే నువ్వు వాదిస్తున్నది ప్రసంగీకునితో కాదు దేవునితో. దేవుని వాక్యంతో వాదించవద్దని యాకోబు వారికి జాగ్రత్తలు చెబుతున్నాడు. "ఒకని సొంత ఆలోచనలను వివరించాలనే తాపత్రయం దేవుని వాక్యాన్ని విని దానికి విధేయత చూపించాలనే ఆసక్తిని తొలగిస్తే త్వరలోనే తీవ్రమైన వాదాలు పెరుగుతాయి... తాము చెప్పేది ఖచ్చితమని భావించేవారు కోపంతో నిండిన వాదం పెట్టుకోకుండా జాగ్రత్తపడాలి" అని హోమర్ కెంట్ వ్యాఖ్యానించాడు.4

"కోపించుటకు నిదానంగా ఉండడం" అంటే "నీ అంతరంగంలో దేవుని వాక్యం యెడల ఏర్పడిన విరోధ భావాన్ని శత్రుత్వాన్ని ప్రతీకారాన్ని అనుమతించకుండా అడుపుచేయడం" అని అర్థం. ఈ పదబంధానికి "ఒకని నమ్మకాలకు అనుగుణంగా లేని లేఖన సత్యానికి విరోధమైన మనస్సు" అని, "వాక్యాన్ని నమ్మకంగా బోధించే వారికి విరోధంగా వెల్లడయ్యే వైఖరి" అని అర్థం.పాపాన్ని గద్దించినప్పుడు, తమకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగత నమ్మకాన్ని అలవాటును విమర్శించినప్పుడు మనుషుల్లో దేవుని వాక్యంపై కోపగించుకునే వైఖరి ఉంటుంది. తమకు ప్రసంగించిన వానిపై సాధారణంగా ఆ కోపం ఎక్కుపెట్టబడుతుంది.

ప్రవక్తయైన మీకాయా ఎన్నడూ తన గురించి మంచిగా ప్రవచించనందువల్ల అహాబు రాజు అతణ్ణి ద్వేషించాడు. ప్రతి ఒక్కరూ రాజు వినాలనుకున్న దానినే అతనికి చెబుతున్నారని తెలిసినా, "మీకాయా- యెహోవా నాకు సెల విచ్చునదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదుననెను" (1 రాజులు 22:14). "రాబోయే యుద్ధంలో నువ్వు మరణిస్తావు" అని మీకాయా రాజుకు చెప్పినప్పుడు, కోపంతో అహాబు "ఇతణ్ణి యుద్ధం నుంచి నేను తిరిగి వచ్చేవరకు బంధించండి" అని ఆ ప్రవక్తను చెరసాలలో వేయించాడు. అహాబు యుద్ధం నుంచి ఎన్నడూ ప్రాణాలతో తిరిగి రాలేదు.‌ తన సొంత పట్టణంలో ప్రజలు తనను మెస్సియాగా హత్తుకోలేదని యేసు ప్రజలను గద్దించినప్పుడు "సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయ వలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటువరకు ఆయనను తీసికొనిపోయిరి" (లూకా 4:28-29). తమ పాపాన్ని సూటిగా బట్టబయలు చేసినందుకు యూదులు స్తెఫను ప్రసంగాన్ని ద్వేషించి అతణ్ణి పట్టణం నుంచి బయటకు వెళ్ళగొట్టి రాళ్లతో కొట్టి చంపారు (అపో 7:51-58).

విశ్వాసులు సైతం కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని, దానిని ప్రసంగించే బోధకుణ్ణి కూడా ద్వేషించే అవకాశం ఉంది. గలతీలో ఉన్న విశ్వాసులను పౌలు వ్యంగ్యంగా "నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా?" అని అడిగాడు (గలతీ 4:16). తాను ఎవరికైతే ఈ లేఖను రాసాడో ఆ విశ్వాసులను భ్రష్టుపట్టించిన పగను శత్రుత్వాన్ని శేషంతో  సహా తొలగించాలని యాకోబు ప్రయత్నిస్తున్నాడు. "కోపించడానికి మీరు నిదానించాలి, కారణమేంటంటే పాపానికి అన్యాయానికి తప్పు బోధకు విరోధంగా కలిగే నీతిగల కోపానికి విరుద్ధంగా నరుని కోపం మన జీవితాల్లో దేవుడు చేయదలచిన దానికి ప్రతికూలంగా పనిచేస్తుంది" అని అతడు వారికి చెప్పాడు. నీలో దేవుడు తన నీతిని కలిగించాలనుకుంటున్నాడు, తద్వారా ఆయన దృష్టికి సరైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ఇది ఎన్నడూ జరగకుండా ఆయన వాక్యంపై కోప్పడడం అడ్డుకుంటుంది. అందువల్లనే దేవుని వాక్య ప్రకటనను నువ్వు విన్న ప్రతిసారి నేర్చుకోవాలనే వైఖరినే నువ్వు కొనసాగించాలని నీకు ఆజ్ఞాపించబడుతోంది.

నీ హృదయాన్ని పవిత్రపరచుకో (వ. 21)

21వ వచనంలో "వాక్యమును... అంగీకరించుడి" అన్నదే ప్రధాన ఆజ్ఞ. అయితే యాకోబు మాటల ప్రకారం మీరు వాక్యాన్ని ఎన్నడైనా అంగీకరించడానికి ముందే మొదట మీ జీవితంలో ఉన్న పాపాన్ని మీరు వదిలించుకుని తీరాలి. మురికి వస్త్రాలను విడిచి పెట్టడం అనే సాదృశ్యాన్నే యాకోబు తన మాటలతో చిత్రీకరిస్తున్నాడు. పవిత్రీకరణ ప్రక్రియను వర్ణించడానికి పౌలుకి అత్యంత ఇష్టమైన సాదృశ్యాల్లో ఇది కూడా ఒకటిగా ఉండేది. ఎఫెసీ 4:22, 31 లో "కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని...సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి" అని పౌలు చెప్పాడు. కొలస్సీ 3:8లో కూడా అదే విషయాన్ని అనగా "ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి" అతడు చెప్పాడు. అదేవిధంగా "సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి" అని పేతురు రాశాడు (1 పేతురు 2:1-2).

విడిచిపెట్టవలసిన కొన్ని ప్రత్యేక పాపాల జాబితాను పౌలు పేతురు తెలియజేయగా, దేవుని వాక్యానికి హృదయాన్ని తెరిచి అంగీకరించడానికి యాకోబు ప్రస్తావించిన పాపం "మాలిన్యం" అని పేర్కొనబడింది. చెవిలో గులిమి అనే దానికి ఇదొక వైద్యపరమైన పదం. నీ జీవితంలో పాపాన్ని కలిగి ఉండడం అంటే దేవుడు నీకు చెప్పాలనుకున్న దానిని వినకుండా అడ్డుకునే నీ చెవిలోని గులిమిని కలిగి ఉండడం లాంటిదే. "మీ హృదయాల్లో నిలిచి ఉన్న పాపాన్ని మీరు విసర్జించండి" అని యాకోబు తన పాఠకులకు ఆజ్ఞాపించాడు. దేవుని వాక్యాన్ని అంగీకరించగలగడానికి నువ్వు నిరంతరం నీ హృదయం నుంచి పాపాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి. వాక్యాన్ని అంగీకరించడానికి పవిత్రత అనేది అత్యావశ్యకమైనది.

వాక్యం ముందు నిన్ను నువ్వు తగ్గించుకో (వ. 21)

దేవుని వాక్యానికి కోపంతో స్పందించడానికి బదులు (వ. 19), దాన్ని సాత్వికంతో అంగీకరించండి అని యాకోబు తన పాఠకులకు చెప్పాడు. ఇది దీనమైన సాత్వికమైన వైఖరిని సూచిస్తున్నది. ఈ వైఖరి దేవుని వాక్యానికి నీ చిత్తాన్ని లోపరుచుకునేందుకు మొండిగా వ్యతిరేకించే నీ సొంత అభిరుచులను అభిప్రాయాలను పక్కన పెట్టేందుకు నీకు సహకరిస్తుంది. దేవుని వాక్యాన్ని అంగీకరించడం అనేది దేవుని వాక్యాధికారానికి దీనమనసు కలిగి లోబడడంతో మొదలవుతుంది. "ఎవడు దీనుడై నలిగిన హృదయముగలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను" అని దేవుడు యెషయాతో చెప్పాడు (యెషయా 66:2)

Jeremiah Burroughs తన సంఘానికి ఈ విధేయతను వర్ణించారు:

సంఘానికి ప్రకటించబడే దేవుని వాక్య అధికారానికి కింద సంఘాన్ని ఉంచడం అత్యంత శ్రేష్ఠమైన విషయం...మీ ఆస్తుల్ని మీ ఆత్మల్ని మీ దేహాల్ని మీ సమస్తాన్ని మీరు కలిగి ఉన్న సమస్తాన్ని తన వాక్యానికి లోపరచాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా ఆయన నామాన్ని పవిత్రపరిచే మరొక అంశం అది, దీనత్వంతో దానికి అందరూ లోబడి తీరాల్సిందే.6

దేవుని వాక్యం కింద కూర్చుని, నీ గర్వాన్ని నీ వ్యతిరేకతను పక్కనపెట్టి, లేఖనంలో ఉన్న శస్త్రచికిత్స నిపుణుణ్ణి నీ చిత్తంపై పనిచేసేందుకు అనుమతించడం కంటే మీ ఆత్మలకు శ్రేష్ఠమైనది ఏదీ లేదు (హెబ్రీ 4:12).

క్రైస్తవ దీనత్వంలో ఆవశ్యకమైన అంశం దేవుని వాక్యాన్ని విని అంగీకరించాలనే ఇష్టంలోనే ఉంటుంది. "యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేందుకు ఆయన పాదాల దగ్గర దీనత్వంతో మౌనంగా ఆశతో కూర్చోవడమే మనకున్న అవసరాలన్నింటిలో అత్యంత గొప్పది" అని జాన్ స్టాట్ రాశారు.7 యేసు వాక్యాన్ని వినడానికి ఆయన పాదాల దగ్గర ప్రశాంతంగా దీనత్వంతో అణకువతో కూర్చున్న వ్యక్తికి మరియ నమూనాగా ఉన్నది (లూకా 10:39). ప్రకటించబడుతున్న దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో అప్పుడు బాలుడైన సమూయేలు మాదిరిగా దీనమైన లోబడే హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు "యెహోవా మాట్లాడు. నీ దాసుడు ఆలకిస్తున్నాడు" అని అతడు స్పందించాడు (1 సమూ 3:10).

వాక్యానికి ఆతిథ్యం ఇవ్వండి (వ.‌ 21)

ఆతిథ్యం ఇవ్వడం అంటే "అతిధిని హృదయపూర్వకంగా ఉదాత్తంగా ఆహ్వానించడం" అని లేదా "వేరే వ్యక్తితో స్నేహభావంతో ఉండడం" అని అర్థం. చాచిన చేతులతో దేవుని వాక్య సత్యాన్ని ఆహ్వానించమని యాకోబు తన పాఠకులను ప్రోత్సహించాడు. ఇంకొక రీతిగా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఎదిరించకూడదు, వక్రీకరించకూడదు, దానితో వాదించకూడదు. అది చెబుతున్న మాటల్ని సాంతం అంగీకరించు.

దేవుని వాక్య ప్రకటన యెడల అత్యంత గొప్ప మర్యాదను కనుపరిచిన వారికి అత్యంత శ్రేష్టమైన దృష్టాంతాలుగా థెస్సలోనిక, బెరయా సంఘాల వారు ఉన్నారు (1 థెస్స 2:13; అపో 17:11). నీ హృదయం లోనికి వాక్యాన్ని ఆహ్వానించినప్పుడు అది వేరుపారుకుని ఎదగనారంభించిన విత్తనంలా ఉంటుంది అని యాకోబు చెప్పాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతావో దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తావో దేవుని వాక్య ప్రకటనను ఎంత ఎక్కువగా వింటావో నీ ఆధ్యాత్మిక జీవితం అంతగా వర్ధిల్లుతుంది, నువ్వు క్రైస్తవునిగా అంత అధికంగా ఫలిస్తావు.

వాక్యం యొక్క శక్తిని తెలుసుకోండి (వ.21)

బైబిల్ అంతట్లోనూ బోధించబడిన దానిని యాకోబు దృవీకరించాడు, నీ ఆత్మను రక్షించడానికి దేవుడు ఉపయోగించుకునేది లేఖనమేనని అతడు ఉద్ఘాటించాడు  (2 తిమోతి 3:15-17; 1 పేతురు 1:23). "దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానముచేత దేవునిని ఎరుగకుండినందున, సువార్త ప్రకటన యను వెఱ్ఱి తనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా పూర్వక సంకల్పమాయెను" అని పౌలు చెప్పాడు (1 కొరింథీ 1:21). "రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై యున్నాము. నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము" అని తన సొంత ప్రసంగ పరిచర్య గురించి పౌలు చెప్పాడు (2 కొరింథీ 2:15-16). తాను సువార్త ప్రకటించిన ప్రతిసారి తన శ్రోతల యొక్క ఆత్మల నిత్య గమ్యం పరలోకానికి నరకానికి మధ్యన ఊగిసలాడుతోందని పౌలు భావించినప్పుడు ఆ బాధ్యత యొక్క తీవ్రతను బట్టి తన యొక్క అసంపూర్ణతను బట్టి అతడు తీవ్రమైన ఉద్వేగానికి గురయ్యేవాడు.

సుప్రీమసి ఆఫ్ గాడ్ ఇన్ ప్రీచింగ్ అనే తన శ్రేష్ఠమైన పుస్తకంలో జాన్ పైపర్ తాను ప్రసంగించడానికి సిద్ధపడుతున్నప్పుడు ఈ వచనం తనను ప్రభావితం చేసే విధానాన్ని ఈ కింది విధంగా వివరిస్తున్నారు.

ఆదివారం ఉదయాన నువ్వు నిద్ర మేల్కొన్నప్పుడు ఒక పక్కన నరకంలోని పొగను నువ్వు వాసన చూడవచ్చు, మరొక పక్కన పరలోకం నుంచి వచ్చే ఆహ్లాదకరమైన వాయువుల్ని నువ్వు అనుభూతి చెందవచ్చు. నువ్వు అధ్యయనం చేసిన నీ స్టడీ రూమ్ కి వెళ్తావు అత్యంత దారుణంగా ఉన్న నీ రాత ప్రతిని చూడు మోకరించి "దేవా, ఇది చాలా బలహీన సిద్ధపాటు. నా గురించి నేను ఏమి అనుకుంటున్నాను? మూడు గంటల్లో నా మాటలు నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉంటాయని ఆలోచించడం ఎంతటి సాహసం! నా దేవా, వీటికి చాలినవాడెవడు?" అని మొరపెట్టు.8

దేవుని వాక్యపు శక్తి ఒక ప్రసంగీకుణ్ణి ఈ విధంగా ఒడిసి పట్టుకున్నప్పుడు, వినేవాడిని ఇంకెంతగా ఒడిసి పట్టుకుంటుంది? ప్రకటించబడిన వాక్యాన్ని నువ్వు విన్న ప్రతిసారి నీ ఆత్మ యొక్క నిత్య గమ్యం తక్కెడలో తూయబడుతోందని నువ్వు గ్రహించినప్పుడు దేవుని వాక్యానికి ఎంతో గొప్ప తీవ్రతతో శ్రద్ధతో నువ్వు స్పందిస్తావు. రిచర్డ్ బాక్స్టర్ ఈ విధంగా రాశారు: 

దేవుడు మీకు ఉపదేశిస్తున్నాడు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీతో వ్యవహరిస్తున్నాడు, మీ ఆత్మలను రక్షించడం కంటే తక్కువైన దానికోసం కాదని గుర్తుచేసుకో. కాబట్టి మీ రక్షణ నిమిత్తమే అన్నట్లు వినడానికి రండి. దేవుడు సంధి కుదర్చాలనుకుంటుంది పరలోకం గురించి పాతాళం గురించి అని సరిగ్గా ఆలోచించే హృదయం స్తబ్దంగా ఉండగలదా?9

దేవుని వాక్యపు శక్తిని అర్థం చేసుకోవడం దాని యెడల సహృద్భావంతో ఉండడానికి దానిని అంగీకరించడానికి ఆవశ్యకమైనది. 

దేవుని వాక్యాన్ని అంగీకరించేలా ఉండడం అనేది నేర్చుకోవాలనే, పవిత్రమైన, దీనమైన, ఆమోదయోగ్యమైన, స్వస్థబుద్ధిగల హృదయంతో దానిని అంగీకరించాలనే సంసిద్ధత ద్వారా గుర్తించబడుతుంది. వినే విషయానికి వచ్చేటప్పటికి ఇది నీ హృదయాన్నే వర్ణిస్తోందా? జే యాడమ్స్ గారు ఈ కింది విధంగా రాశారు:

క్రైస్తవుడా సత్యం యెడల విశాలంగా తెరిచిన హృదయంతో, పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గపు పోట్ల నుంచి భద్రపరచబడని హృదయంతో నువ్వు ప్రసంగాన్ని వింటావా? లేదా ఒక నిర్దిష్టమైన ఉపదేశానికి నీ హృదయం కఠినంగా ఎదిరించేదిగా ఉంటుందా? కొన్ని పాపాల గురించి నీ మనస్సాక్షి నిన్ను ఏమాత్రం నిందించలేనంతగా నువ్వు నీ పాపాన్ని సమర్థించుకున్నావా?  ఎంతో విజయవంతంగా నీ హృదయం చుట్టూ నిర్మించుకున్న అడ్డుకట్టలను బద్దలుకొట్టడానికి ఇదే సమయం. వాక్య ప్రకటనకు వాటిని బట్టబయలుచేయి. విని, గ్రహించి, అన్వయించుకుని, విధేయత చూపించడానికి ఇష్టంతో ఆలకించు. మీరు అది చేసేవరకు ప్రసంగం వాస్తవానికి విలువ లేనిదిగానే ఉంటుంది.10

వినడం అంటే విధేయత చూపడమే

తెరచి ఉంచిన, అంగీకరించే హృదయాన్ని కలిగి ఉండడంతోనే దేవుని వాక్యానికి సరైన స్పందన మొదలవుతుంది. అయితే దీనత్వంతో సంతోషంతో వాక్యాన్ని అంగీకరిస్తే సరిపోదు. దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. దేవుని వాక్యానికి నువ్వు స్పందించి తీరాలి. రసాయనిక చర్య అంటే రసాయనాలు మార్పుకు గురవుతాయి. బహుశా మీ హైస్కూల్లో రసాయన శాస్త్ర ప్రయోగాలు మీకు గుర్తుండే ఉంటాయి. రెండు రసాయనాలను కలిపిన తర్వాత టెస్ట్ ట్యూబ్ మండుతూ ఉండడం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రెండు రసాయనాలు మార్పుకు గురవడమే అలా మండడానికి కారణం. దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించినప్పుడు అది వెంటనే ఏదో విధమైన ప్రతిస్పందన కలిగించాలి. నీలో ఏదో ఒక విధమైన మార్పును అది కలిగించాలి.

వినడానికి, విధేయత చూపించడానికి బైబిల్లో విడదీయరాని సంబంధం ఉంది. లేఖనమంతటిలోనూ వినడం అనేది విధేయతతో సమానం చేయబడింది, ఎన్నో వాక్యభాగాలు వినడానికి విధేయతకు మధ్యన ఒక ప్రత్యక్షమైన సంబంధం ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తున్నాయి (నిర్గమ 15:26; ద్వితీ 6:3-5; లూకా 6:47; 8:21; 11:28). అవి ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల్లాంటివి. అవి పర్యాయపదాలు. వాస్తవానికి పాత, కొత్త నిబంధనల్లో "వినడం" "విధేయత చూపడం" అనే పదాల మధ్యన నేరుగా నిఘంటుపరమైన (లెక్సికల్) సంబంధం ఉంది. వినడం అనే పదానికి పాత నిబంధన మూలం "షమా". "విధేయత" అనే పదానికి కూడా ఇదే హెబ్రీ పదం ఉపయోగించబడింది. పాత నిబంధనలో "లోబడుట" అనే పదానికి వేరే ప్రత్యేక పదం ఏదీ లేదు. కొత్త నిబంధనలో వినడం అనే పదానికి గ్రీకు మూలం "అకూవో". విధేయత అనే పదానికి గ్రీకుమూలం "హుపకూవో", దీనికి అక్షరానుసారమైన అర్థం "కింద ఉండి వినడం". "వినడం" అనే పదం నుంచే ఇది ఉత్పన్నమయ్యింది. దీని నుంచి మనకర్థమయ్యే విషయం ఏంటంటే దేవుని మనస్సులో వినడం, విధేయత చూపించడం అనేది ఒక్కటే.

వినడం అంటే ప్రేమించడమే

వినడం/లోబడడం మరియు ప్రేమించడం అనే వాటి మధ్యన దగ్గర సంబంధం ఉందని కూడా లేఖనాలు చూపిస్తున్నాయి. దేవుని వాక్యాన్ని విని దానికి లోబడడానికి ముఖ్యమైన ప్రేరణ దేవుని యెడల ప్రేమ మూలంగానే కలుగుతుంది. వాగ్దానదేశంలోనికి ప్రవేశించబోతున్న ఇశ్రాయేలీయుల కొత్త తరానికి ధర్మశాస్త్రాన్ని తిరిగి చెబుతూ మోషే ఈ విధంగా ప్రకటించాడు:

"కాబట్టి ఇశ్రాయేలూ, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెనుఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహో వాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను" (ద్వితీ 6:3-6).

"నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి" అని కీర్తనకారుడు అధికంగా ఆనందిస్తూ చెప్పాడు (కీర్తన 119:127). తన వీడ్కోలు ప్రసంగంలో తన శిష్యులతో "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని యేసు చెప్పాడు (యోహాను 14:15). ఇంకొక రీతిగా చెప్పాలంటే మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి ఆయన చెప్పేది వినాలి. నువ్వు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వాళ్లు నిన్ను చేయమని చెబుతున్న దానిని శ్రద్ధగా విని, దానిని ఆసక్తిగా చేయడం ద్వారా వాళ్ళని సంతోష పెట్టడానికి నువ్వు  పరితపిస్తారు. దేవుని విషయంలో కూడా అంతే. వాస్తవానికి లైఫ్ టుగేదర్ అనే తన శ్రేష్ఠమైన పుస్తకంలో "దేవుని యెడల ప్రేమ అనేది ఆయన వాక్యాన్ని వినడంతో మొదలవుతుంది" అని డియట్రిచ్ బోన్హోఫర్ గారు చెప్పారు.11

క్రీస్తును తన వ్యక్తిగత ప్రభువుగా రక్షకునిగా ఒక వ్యక్తి నిజంగా ఎరిగియున్నాడా? లేదా? ప్రేమిస్తున్నాడా? లేదా? అనడానికి శ్రేష్ఠమైన రుజువుల్లో ఒకటి దేవుని వాక్యానికి విధేయత చూపించడం. "మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను" అని యోహాను రాశాడు (1 యోహాను 2:3-5).

యాకోబు పత్రికపై తాను రాసిన వ్యాఖ్యానంలో జాన్ మెకార్థర్ గారు ఈ కింది విధంగా రాశారు:

మార్పు చెందిన జీవితం దేవుని వాక్యం కోసం ఆకలి దప్పికలు కలిగి, దానికి విధేయత చూపించాలని కోరుకుంటుంది. ఒక వ్యక్తి తనకు క్రీస్తునందు విశ్వాసం ఉందని ఒప్పుకున్నప్పటికీ అతని జీవితంలో అలాంటి మార్పు కనబడకపోతే, ఆ ఒప్పుకోలు కేవలం నామమాత్రమైనదే. సాతాను అలాంటి ఒప్పుకోళ్ళను ప్రేమిస్తాడు, ఎందుకంటే అలాంటి ఒప్పుకోళ్ళు సంఘ సభ్యులు వాస్తవానికి రక్షించబడనప్పటికీ వాళ్లకు తాము రక్షించబడ్డామనే నాశనకరమైన అభిప్రాయాన్ని కలిగిస్తాయి. వాళ్లు ఇప్పటికీ సాతానుకు చెందిన వాళ్లే, దేవునికి కాదు.12

ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతోమంది ప్రజలు మోసగించబడుతున్నారని అతడు చెబుతున్నాడు. "మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండుడి" అని తన పాఠకులకు రాస్తున్నప్పుడు వారు అలా మోసగించబడకుండా తప్పించుకోవడానికే యాకోబు సహాయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు (1:22). యాకోబు పత్రిక సారాంశమంతా ఈ చిన్న వాక్యంలో నిక్షిప్తమై ఉంది. తామ వాస్తవానికి క్రైస్తవులు కానప్పుడు తమను తాము క్రైస్తవులమని భావించుకుంటూ మోసగించబడకుండా ఉండేలా తమ జీవితాలను పరీక్షించుకోవాలని యాకోబు తన పాఠకులకు సవాలు విసురుతున్నాడు.

అందువల్లనే దేవుని వాక్యాన్ని వినేవారిగా కాక దానికి విధేయత చూపించే అలవాటు కలిగిన వ్యక్తులుగా తన పాఠకులు ఉండాలని యాకోబు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని మాట వింటే సరిపోదు. ఆయన చెప్పిన దానిని మీరు చేసి తీరాలి. ఒక ఉపదేశం వినడానికి హాజరయ్యి, ఆ ఉపదేశకునికి శిష్యునిగా ఉండని వ్యక్తిని వర్ణించడానికి గ్రీకులు "వినేవారు" అనే పదాన్ని ఉపయోగించేవారు. మన రోజుల్లోనైతే ఇది ఒక తరగతిలో సమాచారాన్ని వినడానికి వెళ్లే విద్యార్థి అని చెప్పవచ్చు. ఆ తరగతులు చాలా సులభంగా ఉంటాయి కాబట్టి కాలేజీలో అవే నాకు అత్యంత ఇష్టమైన తరగతులు. నువ్వు ఒక తరగతికి వెళ్లి సమాచారం అంతా రాసుకోవచ్చు, కానీ నువ్వు ఎలాంటి హోంవర్కూ చేయనక్కర్లేదు, పరీక్షలూ రాయనక్కర్లేదు. ఈ విధంగానే చాలామంది ప్రజలు ప్రతివారం ఆదివారం సంఘానికి హాజరవుతారని నేను అనుకుంటున్నాను. వాళ్లు ప్రసంగాన్ని రాసుకుంటారు, బయటకు వెళ్లేటప్పుడు "ఇది చాలా అద్భుతమైన ప్రసంగం" అని ప్రసంగీకునితో చెబుతారు, కానీ సంఘాన్ని విడిచివెళ్లిన తర్వాత వాళ్లు నేర్చుకున్న దానితో ఎన్నడూ ఏదీ చేయరు. ప్రసంగం ముగిసిన తర్వాతనే నిజానికి అది మొదలవుతుందని గ్రహించడంలో వాళ్ళు విఫలమవుతారు. జోల్ బీకి ఇలా రాశారు: "సేవకుడు ఆమెన్ అని చెప్పినప్పుడే ప్రసంగం ముగియదు. వాస్తవానికి నిజమైన ప్రసంగం అప్పుడే మొదలవుతుంది. ఒక పురాతన స్కాటిష్ కథలో "ప్రసంగం ముగిసిందా?" అని ఒక భార్య తన భర్తను అడుగుతుంది. "లేదు, అది కేవలం ప్రకటించబడింది, ఇంకా మనం దాన్ని పాటించాల్సి ఉంది" అని ఆ భర్త జవాబిచ్చాడు.13

అద్దంలో వాక్యం

నేను ఎన్నడైనా పొందుకున్న అత్యంత గొప్ప అభినందనల్లో ఒకటి ఎవరైనా నా దగ్గరకు వచ్చి "పాస్టర్ గారు బైబిల్ ఏం చేయమని చెబుతుందో అది మేము చేయాలని మీరు నిజంగా మా నుంచి ఆశిస్తున్నారని నేను చెప్పగలను" అని అనడమే. అలాంటి ఆశ, బైబిల్ని కేవలం విశ్లేషించి దాని అర్థం గురించి చర్చించాలని మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించలేదనే నమ్మకం నుంచి పుట్టిందే. ఒక వాక్య భాగపు అర్థాన్ని తెలుసుకోవడం బైబిల్ అధ్యయన ప్రక్రియలో కేవలం సగం మాత్రమే. మిగతా సగం మన జీవితాలకు అర్ధాన్ని అన్వయించుకోవడమే. ప్రసంగీకుని పని ఒక వాక్యం యొక్క అర్థం ఏంటో వివరించడం, తర్వాత దానిని తమ జీవితాలకు అన్వయించుకోమని తన శ్రోతలకు ఆదేశించడమే. ఒక ప్రసంగీకుని గురించిన కథ ప్రచారంలో ఉంది. ఒక నూతన సంఘంలో వాక్య పరిచర్య చేయడానికి అతడు నియమించబడ్డాడు. అయితే కొన్ని వారాలపాటు ఒకే ప్రసంగాన్ని అతడు ప్రసంగించాడు. విసిగిపోయిన కొంతమంది సంఘ సభ్యులు "ప్రతి ఆదివారము మీరు ఇదే ప్రసంగాన్ని ఎందుకు ప్రసంగిస్తున్నారు?" ఆయనను అడిగారు. దానికి జవాబిస్తూ "మీరు ఆ ప్రసంగాన్ని జీవించడం మొదలుపెట్టినప్పుడే నేను వేరే ప్రసంగానికి వెళ్తాను" అని ఆయన చెప్పాడు.14

నువ్వు నిజాయితీపరుడవైతే నీవు ప్రస్తుతం అభ్యాసం చేస్తున్న దానికంటే ఎంతో ఎక్కువగా నీకు తెలుసని ఒప్పుకుని తీరాలి. నువ్వు ఇంకొక ప్రసంగాన్ని ఎన్నడూ వినకపోయినా నీ జీవితమంతా అన్వయించుకోవడానికి సరిపడేంత వాక్య సత్యాన్ని నువ్వు ఇప్పటికే కలిగి ఉన్నావు. ప్రతి ఆదివారం సంఘానికి వెళుతున్నావని ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తున్నావని ప్రతి వారం బైబిల్ స్టడీకి వెళ్తున్నావని భావిస్తూ నువ్వు ఆధ్యాత్మికంగా సంతృప్తి చెందుతున్నావేమో. అయితే నువ్వు చదువుతున్నది వింటున్నది నువ్వు అన్వయించుకోకపోతే కేవలం నిన్ను నువ్వే అపహస్యం చేసుకుంటున్నావు. మొట్టమొదటిగా దేవుని వాక్యంలో తొంగిచూడడం యొక్క మొత్తం ఉద్దేశాన్ని నువ్వు మర్చిపోతున్నావు.

దేవుని వాక్యాన్ని యాకోబు అద్దంతో పోల్చాడు. అద్దం యొక్క ఉద్దేశం నువ్వు ఎలా ఉన్నావో నీకు చూపించడమే, తద్వారా ఏమి సరిచేసుకోవాలో మార్చుకోవాలో నువ్వు చూడగలుగుతావు. కొన్నిసార్లు నీ దుస్తులు మార్చుకోవాల్సి వస్తుంది, జుట్టు దువ్వుకోవాల్సి వస్తుంది, షేవింగ్ చేయించుకోవలసి వస్తుంది. అద్దంలో చూసి మార్చుకోవాల్సిన వాటన్నిటినీ  గమనించి కూడా నువ్వు చూసిన దాని గురించి ఏమీ చేయకుండానే ఇంకా దారుణంగా నువ్వు చూసిన దానిని మర్చిపోయి అక్కడ నుంచి వెళ్లిపోవడం ఎంత అజ్ఞానం. నువ్వు బైబిల్ని చదివి ప్రసంగాన్ని విని నువ్వు చదివినదాని గురించి విన్నదాని గురించి ఎన్నడూ ఏదీ చేయకుండానే నువ్వు జీవిస్తుంటే కచ్చితంగా నువ్వు చేస్తున్నది అదే. యాకోబు మాటల ప్రకారం నువ్వొక మర్చిపోయే శ్రోతవు (1:25).

దేవుని వాక్యం యెడల ఇలాంటి వైఖరి అజ్ఞానంతో కూడినది మాత్రమే కాదు, అది అపాయకరమైనది కూడా. ఒక వ్యక్తి నిరంతరం దేవుని వాక్యాన్ని వింటూ తాను విన్న సత్యానికి సరిగ్గా స్పందించకపోతే అతనికి ఇంతకుముందే ఉన్న సత్యాన్ని కూడా పోగొట్టుకునే ప్రమాదానికి తన్ను తాను గురిచేసుకుంటాడు (మత్తయి 13:10-13). నువ్వు చదివినదానిని అన్వయించుకోవడానికి ప్రణాళిక వేసుకోకపోతే బైబిల్ని చదువుతూ నీ సమయాన్ని వృథా చేసుకోకు. సంఘంలో నువ్వు విన్నదాని ప్రకారం చేయడానికి ప్రణాళిక వేసుకోకపోతే సంఘానికి వెళుతూ నీ సమయాన్ని వృథాచేసుకోకు. నువ్వు కేవలం నీ సమయాన్ని వృథా చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసుకోవడం ద్వారా తీర్పును నీపైన నువ్వే కుప్పగా పేర్చుకుంటున్నావనే విషయం అత్యంత ముఖ్యమైనది. ప్రకటించబడిన దేవుని వాక్యాన్ని నువ్వు విన్న ప్రతిసారి ఐతే లోబడడానికి లేదా అవిధేయత చూపడానికి నీకు నువ్వే శిక్షణ నిచ్చుకుంటున్నావు. దేవుని వాక్యం వింటూ దానిని నీకు అన్వయించుకోకపోతే జరిగే భయంకరమైన విషయం ఏంటంటే నీ హృదయం చివరికి దాని విషయంలో కఠినంగా మారిపోతుంది. 'వెన్నను కరిగించిన అదే సూర్యుడు మట్టిని గట్టిపరుస్తాడు" అనే నానుడిని మనం వింటూ ఉంటాం. దేవుని వాక్యం విషయంలో తటస్థ పరిస్థితి ఉండదు. నువ్వు వాక్యాన్ని విన్న ప్రతిసారి ఐతే దాని మూలంగా మృదువుగా మారతావు లేదా కఠినపరచబడతావు.

అందువల్లనే యాకోబు చెప్పిన ప్రకారం నువ్వు వాక్యాన్ని బాగుగా  ప్రవర్తించువానిగా ఉండాలి (1:25), నువ్వు విన్నదానిని అన్వయించుకోవడానికి ఎంతో శ్రద్ధగా మార్గాలను మాధ్యమాలను వెదుకుతుండాలి. ప్రార్థనతో ప్రసంగీకుడు ముగించినప్పుడు ప్రసంగం పూర్తయింది అనే ఆలోచనలోకి వెళ్ళిపోవద్దు. అప్పుడే అసలైన పని మొదలవుతుందని గుర్తుంచుకో. నువ్వు తీక్షణంగా దేవుని వాక్యంలోనికి చూడాలి, నువ్వు మార్పు చెందాలని అది నీకు చూపించిన నీ జీవితంలోని విభాగాలను జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అద్దం మాదిరిగా దేవుని వాక్యం ఎన్నడూ అబద్ధం చెప్పదు. అది ఎల్లప్పుడూ సత్యమే చెబుతుంది. దాని నిజాయితీ ఎంతో తీవ్రమైనది, అందువల్ల కొన్నిసార్లు నీ గురించి అది నీకు చూపించేదానిని నువ్వు ఇష్టపడవు. ఐనప్పటికీ స్వాతంత్రమునిచ్చే సంపూర్ణమైన నియమం (వ.‌ 25) విషయంలో నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలి, అది పాపపు బానిసత్వం నుంచి నీకు విడుదలనిస్తుంది, మార్పు చెందడానికి యేసుక్రీస్తు స్వరూపంలోనికి ఎదిగేందుకు నీకు సామర్థ్యాన్నిస్తుంది. దేవుని వాక్యానికి లోబడి నువ్వు మారినప్పుడు నీ జీవితంపై తన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు.

దేవుడు యెహోషువాను ఈ మాటలతో ప్రోత్సహించాడు:

ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపో కూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు, (యెహో 1:8).

కీర్తనలు ఈ వాగ్దానంతో మొదలవుతాయి:

దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తన 1:1-3

దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని యేసు చెప్పాడు (లూకా 11:28). "ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు" అని కూడా ఆయన చెప్పాడు (యోహాను 13:17). ఈ వచనాలు దేవుని వాక్యంలోని అత్యంత ప్రాథమికమైన నియమాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. బైబిల్ చెబుతున్న సారాంశం ఇదే: నువ్వు దేవునికి లోబడితే ఆయన నిన్ను దీవిస్తాడు. నువ్వు దేవునికి అవిధేయత చూపిస్తే ఆయన నిన్ను శపిస్తాడు. నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? శపించబడాలనుకుంటున్నావా? అదంతా తన వాక్యంలో దేవుడు చెప్పిన దానికి నువ్వు ఎంత శ్రద్ధగా నిలబడతావనే విషయంపైన, ఆయన చెప్పిన దానిలో కొంతకాదు, ఎక్కువ శాతం కూడా కాదు, అంతటినీ నువ్వు అనుసరిస్తావా? లేదా? అనేదానిపైనా ఆధారపడి ఉంటుంది.

నీ జీవితం దేవుని వాక్యానికి సంపూర్ణంగా ఏకీభవించినప్పుడు నీ జీవితంలో ఆయన వాక్యాన్ని ఆచరణాత్మకంగా పాటించినప్పుడు దేవుడు అధిక ఘనత పొందుతాడు (తీతు 2:5, 8, 10). దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని నీ జీవితం ఐతే మంచిగానో లేదా చెడ్డగానో చూపిస్తుంది. తమను తాము క్రైస్తవులమని చెప్పుకునే వాళ్ళు దేవుని వాక్య నియమాలకు అనుగుణంగా జీవించకపోవడం కంటే ఎక్కువగా దేవునికి ఆయన వాక్యానికి గొప్ప అవమానం తీసుకొచ్చేది ఏదీ లేదు. ఇలాంటి జీవితం "సంఘానికి హాజరవుతూ బైబిల్ నుంచి ఆ ప్రసంగాలన్నింటినీ వింటూ బైబిల్ స్టడీలన్నింటికీ వెళ్తూ ప్రతిరోజు బైబిల్ని చదువుతూ ఉండడం మూలంగా కలిగే ప్రవర్తన ఇలాంటిదైతే బైబిల్ తో నాకు ఎలాంటి సంబంధమూ వద్దు" అని అభిప్రాయపడడానికి మనుషులకు అవకాశమిస్తుంది. అయితే బైబిల్ సందేశాన్ని విని దానిని నువ్వు ఆచరణలో పెట్టడం వల్ల అది నిన్ను ప్రభావితం చేసిందని ఇతరులు గ్రహించినప్పుడు అది వారిలో ఆసక్తిని పెంచుతుంది, దేవుని వాక్య సత్యాన్ని తమ జీవితం ద్వారా దేవుని ఘనపరచాల్సిన విధానాన్ని నువ్వు వాళ్లతో పంచుకునేందుకు నీకు అవకాశమిస్తుంది (మత్తయి 5:16; 1 పేతురు 2:12). ఈ విధంగా వాక్యమనే విత్తనం సమృద్ధియొన పంటను కోస్తుండగా, మంచి శ్రోతలు తమను తాము విస్తరింప చేసుకుంటారు.

దేవుని యొక్క ఆయన వాక్యం యొక్క కీర్తి ప్రతిష్ఠలు ప్రమాదంలో ఉన్నాయనే ఆలోచనే నీ జీవితం దేవుని వాక్యం బోధిస్తున్నదానిని కచ్చితంగా ప్రతిబింబించేలా నువ్వు ప్రతి ప్రసంగాన్ని ఎంతో శ్రద్ధగా వినడానికి నువ్వు విన్న ప్రతి ప్రసంగాన్ని పాటించడానికి నీకు ప్రేరణ నివ్వాలి. "వాక్యాన్ని వినడం ద్వారా దేవుని నామాన్ని ప్రతిష్టించడం" అనే ఆదివారపు ఉదయకాల ప్రసంగానికి ముగింపులో ప్యూరిటన్ సంఘ కాపరి జెర్మియా బరోఫ్ తన సంఘానికి ప్రేరణ నిచ్చే ఈ ఉపదేశాన్నిచ్చాడు:

సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు దేవుని వాక్యాన్ని మహిమ పరచమని, వాక్యంలో దేవుని నామాన్ని మహిమ పరచమని యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయాన మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీలో ఏ ఒక్కడు దేవుని వాక్యానికి అవమానకరంగా ఉండకుండును గాక!... దానికి బదులుగా "నా మూలంగా దేవుని వాక్యం ఎన్నడైనా అవమానించబడటం కంటే నేను మరణించి పాతి పెట్టబడి భూమిలో కుళ్లిపోవడమే నాకు మేలు" అని మీరు ఆలోచించాలి. ఎన్నడైనా వాక్యం మూలంగా నువ్వు ఏదైనా మేలు పొంది ఉంటే "నేను ఏ దేవుని వాక్యం మూలంగానైతే ఎంతో మేలు పొందానో దానిని ఘనపరచడానికి నా జీవితంలో దినాలన్నీ ప్రయాసపడతాను" అనే తీర్మానంతో నువ్వు ముందుకు సాగిపోవాలి. ఈ ఉదయాన మీలో ప్రతి ఒక్కరి హృదయ తీర్మానం ఇదే ఐతే ఇది ఒక ధన్యకరమైన ఉదయకాలపు కార్యంగా ఉంటుంది.

ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయ తీర్మానం ఇదే ఐతే ఇది ఒక ధన్యకరమైన కార్యమని నేను భావిస్తాను.

అధ్యయనం/చర్చ కోసం

1. నీకు ఇంతకుముందే తెలిసిన వాక్య సత్యాల్లో వేటిని నీ జీవితంలో ఆచరించట్లేదు? ఇప్పుడే నువ్వు ఆచరణలో పెట్టాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యం ఏది?

2. యోహాను 14:15; 15:14; 1 యోహాను 2:3-5 చదవండి. ఒక వ్యక్తి యొక్క రక్షణ యథార్థం అనేందుకు ఉన్న అత్యంత గొప్ప రుజువు ఏంటి? నీకు నిజంగా దేవుడు తెలుసు, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అనేందుకు నీ జీవితంలో ఉన్న రుజువు ఏంటి?

3. ఈ అధ్యాయంలో దేవుని వాక్యం అనే అద్దంలోనికి నువ్వు చూసినప్పుడు నీ జీవితంలో నువ్వు మార్చుకోవాల్సిన ఒక్క విషయం ఏముంది? మారడానికి నువ్వేం చేయాలి? నువ్వు తీసుకోవలసిన మొదటి చర్య ఏంటి? ఎప్పుడు ఎక్కడ దానిని మొదలు పెడతావు?

నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించేలా నీలో మార్పు అవసరమైన విభాగాల్లో ఆయన వాక్యాన్ని అన్వయించుకోవడానికి ఆచరణాత్మకమైన మార్గాలను కనుగొనడంలో శ్రద్ధ చూపించే విధేయునిగా నిన్ను చేయమని దేవుణ్ణి అడుగు.

మీరు వినే ప్రతి ప్రసంగం నిమిత్తం మీరు లెక్క అప్పగించవలసి ఉంటుంది... మీరు లెక్క అప్పగించవలసిన ఆ న్యాయాధిపతి దేవుడే...ఆ లెక్క అప్పగించడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రకటించబడిన ప్రతి వాక్యాన్ని ఏ విధంగా పాటించాలో కదా! వాక్యాన్ని వింటున్నప్పుడు ఎదురయ్యే అవాంతరాలన్నింటిని తొలగించుకుని మత్తును వదిలించుకుని మన చెవులను వాక్యమనే సంకెళ్లతో బంధిద్దాం. -థామస్ వాట్సన్

ముగింపు

వినడంపైనే నీ జీవితం ఆధారపడి ఉన్నట్లు వినడం

కాబట్టి యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను గాని దాని పునాది బండమీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు యీ నా మాటలు విని వాటిచొప్పున చేయని ప్రతివాడు ఇసుకమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటిమీద కొట్టెను, అప్పుడది కూలబడెను; దాని పాటు గొప్పదని చెప్పెను. మత్తయి 7:24-27

ప్రసంగ వేదిక గురించి మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని ఆరంభించాను, ఆ అంశంతోనే దీనిని ముగించడం ముఖ్యమైనదిగా అనిపిస్తోంది. వినే వాళ్ళందరి జీవితాల్లో దేవుని వాక్యం అనే ఇంధనాన్ని మండించడానికి అవసరమైన నిప్పురవ్వను పుట్టించే ప్రదేశంగానే దేవుడు ప్రసంగ వేదికను నియమించాడు.

మన సంస్కృతిలో ప్రజలు ప్రసంగాన్ని వినే పద్ధతిని ప్రభావితం చేసే విషయాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రసంగీకులను ఉద్దేశించి రాసిన అనేక పుస్తకాల్లో ప్రధాన గురి ఆ మార్పుల్ని అర్థంచేసుకొని వాటిని అవలంబించడంపైనే ఉంది. తన ప్రసంగాన్ని వినేవారిని అర్థంచేసుకోవడం ప్రసంగీకునికి ఎంత ముఖ్యమో నొక్కిచెబుతున్న నేటి పుస్తకాల పత్రికల సంఖ్య నాటకీయంగా  పెరగడాన్ని నేను గమనించాను.

21వ శతాబ్దంలో ప్రసంగీకులు సమర్థవంతంగా సంభాషించాలంటే అత్యాధునిక కాలానికి చెందిన శ్రోతలతో కనెక్ట్ అవ్వగలగే విధానాన్ని ఎరిగి ఉండాలి. నేటి ప్రజలకు ఉండే వివిధ అవసరాల గురించి పోరాటాల గురించి ప్రసంగీకులకు అవగాహన ఉండి తీరాలి, తద్వారా వాళ్ల జీవితాలకు అవసరమైన విధానంలో మనం వారిని అర్థంచేసుకోగలుగుతాం.  కాపరులు తమను తాము పునరావిష్కరించుకోవాలి అత్యాధునిక సాంస్కృతిక మార్పుకు తగిన విధంగా తమ ప్రసంగశైలిని మార్చుకోవాలి ప్రసారమాధ్యమాలతో అధికారం గురించి అనుమానంతోనూ నిండిపోయిన శ్రద్ధలేని సమాజంలో ఆసక్తిని రేకెత్తించగలగాలి. నీ శ్రోతలెవరో, వారి ఆలోచనలను అనుభూతులను వినే పద్ధతిని వారు నివసిస్తున్న సంస్కృతి ఏ విధంగా మలుస్తుందో దానిని తెలుసుకోవడమే కీలకం. ఇదంతా నీ శ్రోతలను అర్థం చేసుకోవడం గురించినదే.

విచారకరమైన విషయం ఏంటంటే నేటి ప్రజలు అవసరాలుగా గుర్తించబడిన వాటికి అనుగుణంగా ప్రసంగీకులు తమ పవిత్రమైన ధర్మాన్ని పునర్నిర్వచిస్తున్నారు. నేటి ప్రజలకు ప్రసంగం అధికార పూర్వకమైనదిగా కాక సంభాషణలా ఉండి తీరాలి. దేవుని పక్షంగా మాట్లాడుతున్నామని ప్రసంగీకులు భావించకూడదు. ప్రసంగాలలో ఎక్కువ సంభాషణ ఉండాలి, ఏకభాషణ తక్కువ ఉండాలి. కాపరులు గద్దించేవారిగా ఉండకూడదు, సంభాషణ జరిగించేవారిగానే ఉండాలి. ఫలితంగా మొత్తం తరమంతా కూడా తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులనే తమ కోసం పోగు చేసుకునేందుకు అనుమతించబడుతున్నది (2 తిమోతి 4:3).

అయితే సత్యం ఏంటంటే కాపరి దేశ సంస్కృతిని అధ్యయనం చేసే విద్యార్థిగా ఉండి తీరాలి, అదే సమయంలో ఏ సంస్కృతికైనా ప్రయోజనకరంగా ఉండే దేవుని సత్యానికి మొట్టమొదటిగా అతడు విద్యార్థిగా ఉండాలి. వాక్యానుసారంగా వినడం గురించిన ఈ పుస్తకం ముగింపుకు వస్తున్న ఈ తరుణంలో ప్రసంగీకులు  శ్రోతలు  ప్రమాదంలో ఉన్న విషయం గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను.

"క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ప్రసంగించేవాళ్ళు వినేవాళ్లు లెక్క అప్పగించి తీరాలి అని తెలుసుకోవడం కంటే అత్యంత ప్రయోజనకరమైన విషయం ఏముంటుంది?" అని నిన్ను నీవే ప్రశ్నించుకో. తుది తీర్పు సమయంలో ప్రసంగీకుల పక్కనే శ్రోతలు కూడా నిలబడతారు, దేవుని వాక్య ప్రకటనలో వాళ్ళు నిర్వర్తించిన భాగం విషయంలో వాళ్ళు జవాబుదారులుగా ఎంచబడతారు (2 తిమోతి 4:1-3). ప్రసంగీకులకు శ్రోతలకు దేవుడు తన వాక్యాన్నే గంభీరమైన ప్రమాణంగా ఉంచి తీర్పుతీరుస్తాడు (యోహాను 12:47-48). తాము చేసిన ప్రసంగాలను బట్టి ప్రసంగీకులు తీర్పుపొందుతుండగా తాము విన్న ప్రసంగాలను బట్టి శ్రోతలకు తీర్పు తీర్చబడుతుంది. ఒకానొక దినాన అందరూ తీర్పు తీర్చబడతారు అనే వెలుగులోనే ప్రసంగాలను వినమని తమ సంఘాలను ప్యూరిటన్ ప్రసంగీకులు తరచూ ఆదేశించేవారు. రిచర్డ్ బాక్స్టర్ ఈ విధంగా రాశారు:

గుర్తుంచుకోండి, ప్రసంగాలన్నీ సమీక్షించబడతాయి, నువ్వు శ్రద్ధగా విన్నావా? నిర్లక్ష్యంతో విన్నావా? అసలు విన్నావా? లేదా? అనే ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పి తినాలి, నువ్వు విన్న వాక్యమే చివరి రోజున నీకు తీర్పు తీరుస్తుంది. కాబట్టి తీర్పుకు వెళ్తున్నవారిలా, తాము వినే విషయంలో విధేయత చూపే విషయంలో లెక్క అప్పగించవలసిన వారిలా వాక్యాన్ని విను.1

డేవిడ్ క్లార్క్సన్ ఇలా చెప్పారు:

తీర్పు రోజున ప్రతి ప్రసంగం గురించి, ప్రతి ప్రసంగంలో ఉన్న ప్రతి సత్యం గురించి లెక్క అప్పగించవలసి ఉంటుంది... గ్రంథాలు తెరవబడతాయి, నువ్వు విన్న ప్రసంగాలన్నీ ప్రస్తావించబడతాయి, నీకు బయలుపరచబడిన సత్యాన్ని నువ్వు ఎందుకు ఖైదు చేశావని, ఒక పాపం గురించి నువ్వు హెచ్చరించబడినప్పటికీ దాన్ని ఎందుకు చేశావని, నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యతల్ని ఎందుకు నిర్లక్ష్యం చేశావని దేవుడు నిన్ను అడుగుతాడు...అది ఎంత  భయంకరంగా ఉండబోతుందో!2

కాబట్టి దేవుని వాక్య ప్రకటనను నువ్వు వినడానికి కూర్చున్నప్పుడు నువ్వు విన్న ప్రసంగాన్ని అంగీకరించిన స్పందించిన విధానాన్ని ఆధారం చేసుకుని నువ్వు తీర్పుతీర్చబడే ఆ భయంకరమైన రోజే నీ మనసులో కదలాడాలి. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయంలో ఇంతకుముందే చెప్పిన విధంగా దేవుడు తన వాక్యంలో చెప్పినదానితో నువ్వేం చేస్తావనే విషయం భూమి మీద నువ్వు ఎలాంటి జీవితాన్ని గడుపుతావనే విషయాన్ని మాత్రమే కాదు నిత్యత్వాన్ని నువ్వు ఎక్కడ గడుపుతావనే విషయాన్ని కూడా నిర్ధారిస్తుంది. అత్యంత గొప్పదైన ప్రసంగంగా పేర్కొనబడే కొండమీద ప్రసంగం యొక్క సారాంశం అదే (మత్తయి 5-7). గలిలయ సముద్రానికి దగ్గరలో ఉన్న కొండ ప్రాంతాల్లో జన సమూహాలు సమకూడారు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కంటే యేసు యొక్క అనుచరులు ఎంతో భిన్నంగా జీవించాల్సిన విధానాన్ని ఆయన వివరిస్తుండగా వినేందుకే వాళ్లంతా సమకూడారు. తన మాటలు వింటున్న వారందరినీ తాను చెప్పిన దాని ప్రకారం ప్రవర్తించమని పిలుపునిస్తూ యేసు ప్రఖ్యాతిగాంచిన తన ప్రసంగాన్ని ముగించాడు. తాను ప్రసంగించిన ప్రతిదాన్ని అమలులో పెట్టమని ఆయన వారికి సవాలు చేశాడు.

తాను చెప్పిన దానికి లోబడమని జన సమూహాన్ని ప్రేరేపించడం కోసం ముగింపులో యేసు ఒక సాదృశ్యాన్ని ఉపయోగించాడు. ఈ సాదృశ్యం ఇద్దరు విభిన్నమైన భవన నిర్మాణకుల గురించినది. ఆ ఇద్దరిలో ఒకడు జ్ఞానం కలిగిన నిర్మాణకుడు, మరొకడు మూర్ఖుడైన నిర్మాణకుడు. క్రీస్తు యొక్క మాటలకు ప్రజలు స్పందించే రెండు విధానాలకు ఈ ఇద్దరు నిర్మాణకులు సూచనలుగా ఉన్నారు. జ్ఞానం కలిగిన నిర్మాణకుడు ఆయన వాక్యాన్ని విని లోబడే ప్రజలకు సూచనగానూ, ఆయన వాక్యాన్ని విని అవిధేయులయ్యే  వారికి మూర్ఖుడైన నిర్మాణకుడు సూచనగానూ ఉన్నారు. మనందరం ఇంటిని నిర్మించే ప్రక్రియలోనే అనగా మన జీవితాలను జీవించే ప్రక్రియలోనే ఉన్నాం. ఈ ఇద్దరు నిర్మాణకుల్లో మనందరం ఎవరో ఒకరిలా ఉన్నాం. మనం ఎలాంటి నిర్మాణకులమనే విషయమే మన జీవితం ముగిసే విధానాన్ని నిర్ధారిస్తుంది. మనం నిర్మించే విధానం నిత్య పర్యవసానాలను కలిగి ఉంటుంది, అది ఐతే నిత్య రక్షణకు లేదా నిత్యానాశనానికి నడిపిస్తుంది. దేవుని వాక్యాన్ని వినే విషయానికి వచ్చేటప్పటికి పరలోకం నరకం అనే విషయాలు తెరపైకి వస్తాయి. ఈ పుస్తకాన్ని చదువుతున్న మీలో కొందరు పరలోకంలోనూ కొందరు నరకంలోనూ జీవితాన్ని ముగిస్తారన్నది వాస్తవం. ఈ పుస్తకంలో మీకు బోధించబడిన దానితో మీరేం చేస్తారనే విషయమే మీరు మీ నిత్యత్వం ఎక్కడ గడుపుతారనే విషయాన్ని నిర్ణయిస్తుంది.

తన ముగింపును మొదలుపెట్టడానికి ముందే తనను రక్షకునిగా ప్రభువుగా చెప్పుకునే ప్రతి ఒక్కరి హృదయాన్ని గుచ్చే ఒక భయంకరమైన వాక్యాన్ని యేసు చెప్పాడు:

"ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచిప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును" అని ఆయన చెప్పాడు (మత్తయి 7:21-23).

నా అభిప్రాయం ప్రకారం మొత్తం బైబిల్ అంతట్లోనూ ఇది అత్యంత భయానకమైన సన్నివేశం. తాము వాస్తవానికి క్రైస్తవులం కాకపోయినా క్రైస్తవులమని భావిస్తూ తుది తీర్పులో నిలబడే ప్రజలకు సంభవించబోయే దాన్ని ఇది వివరిస్తుంది. వీళ్లు దేవునికి బాహాటంగా తిరుగుబాటు చేస్తూ జీవించే నాస్తికులు కాదు, అజ్ఞేయవాదులు కాదు. వీళ్ళు మతాన్ని స్వీకరించినవాళ్లే, యేసుక్రీస్తును నమ్ముతారు, మంచిగా నైతికంగా జీవిస్తారు, ప్రతి ఆదివారం సంఘానికి హాజరవుతారు, బాప్తిస్మం పొందుతారు, క్రమంగా ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటారు, పరిచర్యలో ఏకీభవిస్తారు, సండే స్కూల్ బోధిస్తారు, పెద్దగాను పరిచారకునిగాను చివరికి కాపరిగాను పనిచేసే వారే అయ్యుండవచ్చు. బాహ్యంగా వాళ్లు దేవుని విషయాలకు అత్యంత అంకితభావం కలిగిన వారుగా కనబడతారు. అయితే అంతరంగంలో వాళ్లు ఎన్నడూ యేసుక్రీస్తును ఎరిగి ఉండరు, కాబట్టి నిత్యత్వమంతా నరకంలో ఉండేలా ఆయన వాళ్లను త్రోసివేయడం వలన వాళ్ళు నిశ్చేష్టులవుతారు. పరలోకానికి వెళుతున్నానని భావిస్తూ ఎంతో ఆలస్యంగా నువ్వు నరకానికి వెళ్తున్నానని తెలుసుకోవడమే అత్యంత ఘోరమైన భ్రమ.

యేసు చెప్పిన మాటల ప్రకారం అనూహ్యమైన ఇలాంటి దుస్థితిని అనుభవించేది కేవలం కొద్దిమంది నామకార్థ క్రైస్తవులు మాత్రమే కాదు. చాలామంది అలాంటి వాళ్ళుంటారని ఆయన చెప్పాడు. ఎ.డబ్ల్యూ. పింక్ ఇలా రాశారు:

నేటి దినాన ఉన్నట్లుగా భూమిపైన ఇన్ని లక్షల మంది నామకార్థ క్రైస్తవులు ఎన్నడూ లేరు. నిజమైన క్రైస్తవుల శాతం ఇంతకన్నా తక్కువ ఎన్నడూ లేదు... వాస్తవానికి తమపైన దేవుని ఉగ్రత నిలిచి ఉండగా తాము ఆధ్యాత్మికంగా బాగానే ఉన్నామని నమ్మి, మోసగించబడిన జన సమూహాలతో సంఘాలు నిండి ఉన్న క్రైస్తవ శకం ఇదేనా? చరిత్రలో ఎన్నడైనా ఉందా? అని మనం  తీవ్రంగా సందేహిస్తున్నాం.3

అన్ని సరైన విషయాలనే నమ్మి, అన్ని సరైన వాటినే చేస్తూ, పరలోకానికి చేరుకోవడానికి అదే సరిపోతుందని ఆలోచించే వారందరికీ ఇదొక బలమైన హెచ్చరిక. క్రైస్తవ్యం అంటే సరైన నమ్మకాల గురించినదో సత్క్రియల గురించినదో కాదు, యేసు క్రీస్తుకు విధేయతతో కూడిన జీవితాన్ని జీవించడమే క్రైస్తవ్యం. ఆయనను నీ వ్యక్తిగత ప్రభువుగా రక్షకునిగా నువ్వు నిజంగా ఎరిగావని నువ్వు నిర్ధారించుకోగలిగే ఏకైక మార్గం అదే. మిగిలినదంతా కేవలం పెదాలతో పరిచర్య మాత్రమే, లేదంటే చెవులతో చేసే పరిచర్య మాత్రమే.

పాపులైన మనుషులంగా మనం కూడా నిజమైన అంకితభావం అంటే కేవలం మాటలు మాత్రమే కాదని గుర్తిస్తాం. "నేను నీకు కట్టుబడి ఉన్నాను" అని నా భార్యకు కేవలం మాటల్లో చెబితే సరిపోదు, ఆమెను చూసుకునే విధానం ద్వారా నేను దాన్ని నిరూపించాలి. "నువ్వంటే నాకు ఎంతో ప్రేమ" అని చెప్పి ఆ తర్వాత ఆమెతో చాలా కఠినంగా వ్యవహరిస్తే, నా మాటలు వ్యర్థమే. ఒక వ్యక్తి తనకు నచ్చింది ఏదైనా చెప్పగలడు కానీ అతడు ఏం చేస్తాడన్నదే అసలైన విషయం అని మనకు తెలుసు. "మీరు కేవలం మాట్లాడుతారు కానీ పనులు చేయరు" "మాటలకంటే చేతలే గట్టిగా మాట్లాడతాయి" అనే మాటలు మనం చెబుతాం. ఒకటి మాట్లాడి, వేరేది చేసే వ్యక్తులకు వర్ణించే మాటొకటి మనకు ఉంటుంది. వాళ్లను మనం వేషధారులు అంటాం. మొత్తంగా చెప్పాలంటే "నువ్వేం చెబుతావన్నది విషయం కాదు నువ్వేం చేస్తావన్నదే ముఖ్యం" అని యేసు చెబుతున్నాడు. నీకు నచ్చినది ఏదైనా నువ్వు చెప్పవచ్చు, నీకు నచ్చినది ఏదైనా నువ్వు నమ్మవచ్చు, కానీ నువ్వు క్రీస్తుకు విధేయత చూపుతావా లేదా అనేదే నీకు నిజంగా ఆయన తెలుసా లేదా అనేదానికి అంతిమమైన సాక్ష్యం (యోహాను 3:36; 1 యోహాను 2:3-6; 3:7-10).

ఈ విషయాన్ని తన మాటలను విని వాటి ప్రకారం ప్రవర్తించే వారితో తన మాటలను విని వాటి ప్రకారం ప్రవర్తించని వారిని పోల్చడం ద్వారా యేసు నొక్కిచెప్పాడు. "వినడం" "లోబడడం" అనే ఈ నియమాన్ని అద్దంలోకి చూసే రెండు విధానాలను వర్ణిస్తూ యాకోబు ఉదాహరించాడని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్య భాగంలో ఒక భవనాన్ని నిర్మించే రెండు విభిన్నమైన మార్గాలను వర్ణిస్తూ కచ్చితంగా ఇదే నియమాన్ని యేసు ఉదాహరించాడు. పాలస్తీనాలో నెలల తరబడి సంవత్సరాల తరబడి నీళ్లు లేకుండా ఎండిపోయిన, ఇసుక నేలలతో కూడిన నది గట్లు చాలా ఉంటాయి. అయితే అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసినప్పుడు ఎండిపోయిన ఆ నది గట్లు తన దారిలో అడ్డొచ్చిన ప్రతిదాన్ని తుడిచిపెట్టేసే శక్తి కలిగిన ఉధృతమైన నదిలా మారిపోతాయి. ప్రాచీన కాలపు ఇశ్రాయేలులో అకస్మాత్తుగా వచ్చే వరదలు అనూహ్యమైన రీతిలో దారిమళ్ళి, మొత్తం శిబిరాలన్నింటిని ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేస్తూ, ప్రజలను జంతువులను చంపుతూ ప్రతి దాన్ని నాశనం చేస్తుండేవని పేరుగాంచాయి.

జ్ఞానం కలిగిన నిర్మాణకులు అనూహ్యరీతిలో వచ్చే ఈ వరదల ప్రమాదాన్ని అర్థం చేసుకొని ఈ లోతట్టు ప్రాంతాలకు దూరంగా తమ గృహాలను నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక బలమైన బండ కనబడే వరకు లోతుకు తవ్వడానికి సమయాన్ని తీసుకుని దానిపైన ఇంటిని నిర్మించుకునేవారు. బండ పైన ఇంటిని కట్టుకోవడానికి ఎంతో అధికమైన సమయం శక్తి అవసరమయ్యేవి. అయితే వారి శ్రమకు తగిన ఫలితం దొరికేది, ఎందుకంటే అకస్మాత్తుగా తుఫానులు వరదలు సంభవించినప్పుడు వారి ఇల్లు వీచే తుఫానుకు ఉధృతంగా వచ్చే వరదలకు తట్టుకొని నిలబడగలిగేది.

జ్ఞానం కలిగిన నిర్మాణకునికి విరుద్ధంగా మూర్ఖుడైన నిర్మాణకుడు భవిష్యత్తును పరిగణనలోనికి తీసుకునే విషయంలో విఫలమయ్యేవాడు. ఒకనాడు నది ప్రవహించిన మార్గం మధ్యలోనే ఒక అందమైన ఇసుకమేటను చూసి, "పునాది ఎవరికి కావాలి?" "అదంత ముఖ్యం కాదు" అని చెప్పి వెంటనే ఒక ఇంటిని నిర్మించేవాడు. తుఫాను దానిని తాకే వరకు బండమీద బుద్ధిమంతుడు నిర్మించుకున్న ఇల్లు మాదిరిగానే ఆ ఇల్లు కూడా మంచిదిగా సురక్షితమైనదిగా సౌకర్యమైనదిగా కనబడేది. అది తుఫాను తాకిడికి పూర్తిగా కుప్ప కూలిపోయేది, పూర్తిగా నష్టం వాటిల్లేది.

ఈ సాదృశ్యంలో యేసు ప్రస్తావిస్తున్న తుఫానులు కచ్చితంగా జీవితంలో మనందరం ఎదుర్కొనే శ్రమలకు వర్తిస్తుంది. కేవలం వాక్యాన్ని వినే వాళ్ళ కంటే ఎంతో శ్రేష్ఠమైన రీతిలో వాక్యం ప్రకారం ప్రవర్తించే వాళ్ళు శ్రమల్లో నడుచుకుంటారు. వాస్తవానికి శ్రమలే ఎవరు వాక్యం ప్రకారం ప్రవర్తిస్తారో ఎవరు కేవలం వినేవారిగా మాత్రమే ఉంటారో బట్టబయలు చేస్తాయి. జీవితం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కడూ ఒకే విధంగా కనబడతాడు. అయితే క్యాన్సర్ ఉందని నిర్ధారణ ఐనప్పుడు బిడ్డ తిరుగుబాటు చేసినప్పుడు ఉద్యోగం ఊడినప్పుడు ఇల్లు వేలం వేయబడినప్పుడు క్రీస్తు యెడల ఒక వ్యక్తికి ఉన్న అంకితభావం యొక్క యథార్థత పరీక్షించబడుతుంది వెల్లడవుతుంది. అప్పుడు నీ విశ్వాసం నిజమైందో కాదో నీకు తెలుస్తుంది.

జీవితమనే తుఫానుల్లో నువ్వెలా ముందుకు సాగుతావనే విషయమే ఆఖరి తీర్పులో నువ్వెలా నిలబడతావనే దానికి శ్రేష్ఠమైన సూచిక. అంతిమంగా, యేసు ఇక్కడ ప్రస్తావిస్తున్న తుఫాను అదే. దేవుని వాక్యాన్ని కేవలం వినడం మాత్రమే కాక దానికి లోబడే వాళ్ళు దేవుని ఉగ్రతను తప్పించుకుని పరలోకంలో నిత్య రక్షణను ఆస్వాదిస్తారు. అయితే దేవుని వాక్యాన్ని కేవలం విని, దాని గురించి ఏమీ చేయనివాళ్ళు దేవుని ఉగ్రతను పొందుకొని నరకంలో నిత్య నాశనాన్ని అనుభవిస్తారు.

1994 సంవత్సరంలో నార్త్రిడ్జ్ భూకంపం సంభవించినప్పుడు నా భార్య, నేను దక్షిణ కాలిఫోర్నియాలో నివసిస్తున్నాం. నన్ను అతిగా ఆకర్షించిన విషయం అక్కడ  చోటుచేసుకున్న విధ్వంసంలో ఉన్న వైవిధ్యం. కొన్ని నెలల పాటు ధ్వంసమైన ఇళ్లలోని శిథిలాలతో వీధులు నిండిపోయాయి. వీధిలోకి కారు నడిపించుకుంటూ వెళ్లినప్పుడు రెండు పక్కపక్కనే ఇళ్ళు, ఒకటి చెత్తకుప్పలా మరొకటి నిలబడి ఉండడం చూసినప్పుడు ఎంతో వింతగా అనిపించేది. భూకంపానికి ముందు రెండు ఇళ్లు కచ్చితంగా ఒకే విధంగా కనబడ్డాయి, రెండు కూడా నిర్మాణపరంగా బాగానే అనిపించాయి. అయితే భూకంపం ఒక పెద్ద వ్యత్యాసాన్ని వెల్లడించింది. భయంకరమైన భూకంపానికి నిలబడిన ఇళ్లన్నీ సహజమైన నేలపైన నిర్మించబడగా కూలిపోయినవన్నీ మట్టితో నింపబడిన నేలపై నిర్మితమయ్యాయి. ఒక ఇల్లు బలమైన పునాదిని కలిగి ఉందా? బలహీనమైన పునాదిని కలిగి ఉందా? అనే విషయమే ఈ సందర్భంలో ముఖ్యమయ్యింది.

నీ జీవితంలో కూడా ఇంతే. నీ జీవితం ఏ పునాదిపైన ఆధారపడిందో ఆ పునాది ఎలాంటిది అనేది ముఖ్యమైన విషయమవుతుంది. మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మాదిరిగానే నువ్వు కూడా కనబడవచ్చు. నువ్వు అవే పాటలను పాడవచ్చు, అవే ప్రసంగాలను నువ్వు వినవచ్చు, అవే బైబిల్ స్టడీలకు నువ్వు వెళ్ళవచ్చు, అవే పరిచర్యలో నువ్వు సేవ చేయవచ్చు, కానీ చివర్లో అన్ని కంపించినప్పుడు మీలో కొందరు క్రీస్తు యొక్క నీతితో నిలబడతారు మరికొందరు నరక శిక్షను పొందుతారు. నీ జీవితమనే ఉపరితలం కింద ఉన్నదే దాన్ని నిర్ధారించే విషయమవుతుంది. ఇదంతా నీ పునాది గురించిన విషయమే.

నీ పునాది ఏంటి? కేవలం వాక్యం వినడం అనే కూరుకుపోయే ఇసుక మీద నీ జీవితం నిర్మించబడుతోందా? లేదా వాక్యం ప్రకారం ప్రవర్తించడం అనే స్థిరమైన బండపైన నిర్మించబడుతోందా? దేవుని వాక్యానికి నువ్వు స్పందించే విధానాన్ని బట్టి నీ నిత్య గమ్యం నిర్ధారించబడుతుందనే గంభీరమైన హెచ్చరికయే ఈ వాక్య భాగం. దేవుని వాక్యాన్ని విని లోబడితే నువ్వు పరలోకానికి వెళ్తావు. అయితే దేవుని వాక్యాన్ని విని అవిధేయత చూపిస్తే నువ్వు నరకానికి వెళ్తావు. దేవుని వాక్యానికి ఇప్పుడు నువ్వు స్పందించే విధానం నువ్వు నిత్యత్వాన్ని ఎక్కడ గడుపుతావని నీకు చెబుతోంది? హియరింగ్ ద వోర్డ్ అనే తన ప్రసంగంలో ప్యూరిటన్ డేవిడ్ క్లార్క్సన్ ఇలా రాశారు:

ఆత్మ యొక్క నిత్య శ్రేయస్సు కోసమే వినుట అనే సదుపాయాన్ని దేవుడు సమకూర్చాడు ఆత్మ యొక్క శాశ్వత శ్రేయస్సు వినడం పైనే ఆధారపడి ఉంటుంది మీరు ఇక్కడ విఫలమైతే విరుగుడు లేకుండానే మీ ఆత్మలు నశిస్తాయి. ఎందుకంటే  విశ్వాసం మూలంగానే రక్షణ కలుగుతుంది,  వినటం మూలంగానే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినడం అనేది నిత్య పర్యవసానం ఉన్న చర్య. మనం వినేదాని ప్రకారమే నిత్యత్వానికి తగిన విధంగా మన ఆత్మల స్థితి ఉంటుంది.4

శ్రోతలకు మార్గదర్శకాలు

శ్రోతగా నీ బాధ్యతకు సంబంధించి వ్యక్తులకు కుటుంబాలకు కొన్ని ఆచరణాత్మకమైన సలహాలు కింద ఉన్నాయి. మీరు వినే ప్రసంగాల నుంచి అధిక మేలును పొందడానికి ఈ సలహాలు మీకు సహాయపడతాయి.

ఎదురుచూపు:
వాక్యం ప్రకటించబడడానికి
ముందు శ్రోత యొక్క బాధ్యత

ఆధ్యాత్మిక సిద్ధపాటు

1. ప్రతీరోజూ దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి సమయాన్ని వెచ్చించండి  (వ్యక్తిగత మౌన ధ్యానం).
2. పురుషులారా, వారమంతా మీ భార్య పిల్లల్ని క్రమంగా ఆరాధనలో నడిపించండి (కుటుంబ ఆరాధన, బైబిల్ పఠనం, ప్రార్ధన, పాటలు).
3. శనివారం రాత్రి లేదా ఆదివారం ఉదయం ఆరాధన కోసం మీ హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి సమయం తీసుకోండి 
4. దేవుణ్ణి ఆరాధించడంపైన వ్యక్తిగత పాపాన్ని శుద్ధి చేసుకోవడంపైన దృష్టిసారించే ఒక భాగాన్ని దేవుని వాక్యంలోనుంచి చదవండి 
5. దేవుణ్ణి ఆరాధించడానికి క్రీస్తు ద్వారా ధైర్యంగా ఆయన సన్నిధిలోకి మీరు రాగలుగుతున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి.
6. వారమంతట్లో ఏ పాపాలనైనా ఒప్పుకునే విషయంలో పశ్చాత్తాపపడే విషయంలో మీరు విఫలమైతే వాటిని నిమిత్తం దేవుని క్షమాపణ అడగండి.
7. దేవుడు ఎలాంటి ఘనతకైతే అర్హుడో దానికి నీ శ్రేష్ఠమైన అత్యంత తీక్షణమైన ఆరాధనా ప్రయత్నాలు కూడా ఏ మాత్రమూ దగ్గర్లో లేవని నీకు అర్థమయినట్లు దేవునికి వ్యక్తపరచండి . ఆత్మతో సత్యంతో హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించడానికి నీకు సహాయం చేయమని ఆయనను వేడుకోండి 
8. నీ హృదయాన్ని మృదువుగా చేసి తన వాక్యాన్ని అంగీకరించేలా, తద్వారా అది వాక్యం లోతుల్లోకి వేరు పారుకొని నీ జీవితంలో శాశ్వతమైన ఫలాన్ని ఫలించేలా ఎదగడానికి సహాయం చేయమని దేవుణ్ణి బ్రతిమాలండి.
9. వాక్యానికి అర్థమేంటో, అది నీ జీవితానికి ఎలా వర్తిస్తుందో గ్రహించడానికి కృపతో నీ మనసును వెలిగించమని, కేవలం వాక్యాన్ని వినువానిగా కాక దాని ప్రకారం ప్రవర్తించువానిగా మిమ్మల్ని  చేయమని దేవుణ్ణి అడుగండి.
10. దేవుని వాక్యాన్ని ప్రసంగించే/బోధించే వారు  పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఎంతో స్పష్టంగా ధైర్యంగా మాట్లాడేలా నీ జీవితంలోనూ నీ సంఘ జీవితంలోనూ తన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆయనచే శక్తివంతంగా వాడబడేలా  ప్రార్థించండి.
11. మీరు ఒకవేళ ఎవరికైనా వ్యతిరేకంగా పాపం చేసినా లేదా ఎవరైనా (అనగా నీ భార్య, తల్లిదండ్రులు, పిల్లలు, సహోదరి, సహోదరుడు, తోటి సంఘ సభ్యుడు) మీకు వ్యతిరేకంగా పాపం చేసినా వాళ్లతో సమాధాన పడడానికి మీరే  మొదటి అడుగెయ్యండి.
12. మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చే మార్గాల్లో తన వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని సంపూర్ణంగా ఆశిస్తూ ఎదురుచూపుతో సంఘానికి రండి.

భౌతికమైన సిద్ధపాటు
1. శనివారం రాత్రి ఇంటి దగ్గరే ఉండే అలవాటు చేసుకోండి (ఆదివారం ఉదయం అనేది శనివారం రాత్రే ఆరంభం అవుతుంది).
2. ఆ తర్వాత రోజు నీ మనసును దృష్టి మళ్లించడానికి కారణమయ్యే దేనినీ చేయకుండా చూడకుండా చదవకుండా ఉండడానికి జాగ్రత్తపడండి.
3. ఆదివారం ఉదయాన ఉద్రిక్తత పెరిగి పోవడానికి కారణమయ్యే విషయాలను (అనగా దుస్తులను, ఆహారాన్ని, కానుకను, పిల్లలకు అవసరమైన వస్తువుల్ని సిద్ధం చేసుకోవడం; వాహనాల్లో ఇంధనాన్ని నింపుకోవడం తదితర విషయాలను) శనివారం రాత్రే సిద్ధం చేసుకోండి.
4. రాత్రిపూట కంటి నిండా నిద్రపోండి, తద్వారా దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మీతో చెప్పేదాన్ని వినడానికి మెలకువగా బలంగా మీరు ఉండగలుగుతారు.
5. మధ్యాహ్న భోజనం వరకు నిన్ను నిలబెట్టగలిగే మంచి ఉదయకాలపు ఆహారాన్ని తినండి.
6. సిద్ధపడడంలో ఒకరికొకరు సహాయపడేలా కష్టపడండి.
7. సంఘానికి వెళ్తున్న దారిలో దైవికమైన వాతావరణాన్ని స్థాపించడానికి కొనసాగించడానికి ప్రయత్నించండి (స్తుతి గీతాలను వినండి పాడుతూ ప్రార్థిస్తూ ఉండండి).
8. 10 నిమిషాలు ఆలస్యంగా కాక 10 నిమిషాలు ముందుగానే సంఘానికి చేరుకోండి (ముందుగానే ప్రణాళిక వేసుకుంటే ఇది సాధ్యమే!)

సిద్ధపాటు లేకుండా సేవకులు ప్రసంగించకూడదని మనం విన్నాం. దీనికి ఒప్పుకుంటాను. అయితే సిద్ధపాటు లేకుండా ప్రజలు వాక్యాన్ని వినకూడదు అనే మాటను మనం దీనికి జత చేయాలి. విత్తువానికి అత్యంత ఎక్కువ సిద్ధపాటు అవసరమా? నేలకు సిద్ధపాటు అవసరమా? మీరేమనుకుంటున్నారు? విత్తువాడు శుభ్రమైన హస్తాలతో వస్తే సరిపోతుంది. కానీ విత్తనాలను చల్లకముందు నేలను బాగా దున్నాలి, చెత్తను ఏరి పారేయాలి, మట్టి పెళ్లలను చితక్కొట్టాలి. విత్తువానికి అవసరమైన దానికంటే నేలకే ఎక్కువ సిద్ధపాటు అవసరమని ప్రసంగీకుని కంటే వినేవాడికే సిద్ధపాటు ఎక్కువ అవసరమని నాకు అనిపిస్తుంది. -చాల్స్ స్పర్జన్.

శ్రద్ధ కలిగి ఉండడం:
వాక్యం ప్రకటించబడుతుండగా
వినేవాని బాధ్యత

1. సంఘానికి చేరుకున్నప్పుడు ఒకరినొకడు హృదయపూర్వకంగా పలకరించుకోండి.
2. ఆరాధన ఆరంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు కూర్చుని, మీరు వినబోయే దాని నిమిత్తం నీ హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి మౌనంగా ప్రార్థనలో కొన్ని క్షణాలు గడపండి. 
3. లేఖనాన్ని చదువుతున్నప్పుడు మీ బైబిల్లో దాన్ని అనుసరిస్తూ మీకు బాగా వర్తించే వచనాలను ప్రత్యేకంగా గమనిస్తూ ఉండండి.
4. సంతోషంగా ఉత్సాహంగా పాడండి. ఆ పాటల్లోని మాటల గురించి ఆలోచిస్తూ వ్యక్తిగతమైన ప్రార్థనలు స్తుతులు చెల్లించడానికి వాటిని ధ్యానించండి.
5. ఇతరులు చేస్తున్న ప్రార్థనలను శ్రద్ధగా వినండి. మీరు వింటున్నదానికి సరైన సందర్భంలో "ఆమెన్" అని చెబుతూ, ఆ ప్రార్థనలకు మీ ఆమోదం తెలియజేస్తూ స్పందించండి.
6. ప్రసంగం వింటూ నోట్స్ రాసుకోండి, తద్వారా ఇంటికి తీసుకువెళ్లి ధ్యానించడానికి నీకంటూ కొంత సమాచారం ఉంటుంది. ఆ సందేశపు సారాంశాన్ని మీరు గుర్తుంచుకోవాలనుకున్న కొన్ని ముఖ్యమైన నియమాలను పాఠాలను రాసుకోండి.
7. ప్రసంగీకుడు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినడం ద్వారా అతణ్ణి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేయండి (అతని వైపే చూస్తూ, చిరునవ్వు నవ్వుతూ, తల ఊపుతూ, ఆమెన్ అని చెబుతూ)
8. అంతరాయాలన్నింటినీ అధిగమించండి (ఏకాగ్రత చూపండి, ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నించండి), (మాట్లాడుతూ, ముందుకు వెనక్కి అటు పక్కకి ఇటు పక్కకి ఊగుతూ, ఆరాధన జరుగుతుండగా పైకి కిందికి దిగుతూ ఉండడం లాంటి పనులు చేస్తూ) ఇతరులకు ఆటంకం అంతరాయం కలిగించకుండా చూసుకోండి.
9. మీరు వింటున్న ప్రతిదాన్ని లేఖనాలతో పోలుస్తూ ప్రసంగీకుడు చెబుతున్నది దేవుడు చెప్పినదానితో ఏకీభవిస్తోందా? లేదా? అని నిర్ధారించుకోవడానికి వివేచనను అభ్యాసం చేయండి.

వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వినేవాళ్లు శ్రద్ధతో సిద్ధపాటుతో ప్రార్థనతో వినాల్సిన అవసరం ఉంది. వాళ్లు వింటున్న దానిని లేఖనాలతో పరీక్షించాలి. సత్యాన్ని విశ్వాసంతో ప్రేమతో సాత్వికంతో సిద్ధమనస్సుతో దేవుని వాక్యంగా అంగీకరించాలి. దానిని ధ్యానించాలి, దాని గురించి చర్చించాలి. తమ హృదయాలలో దానిని భద్రపరుచుకోవాలి, తమ జీవితాలలో దాని ఫలాలను ఫలించాలి. - వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ లార్జర్ కేటకిజం

అన్వయింపు:
వాక్యం ప్రకటించబడిన
తర్వాత వినే వ్యక్తి యొక్క బాధ్యత

ప్రభువు దినాన

1. ఆరాధన కార్యక్రమం ముగిసిన తర్వాత వాక్య సందేశం ఏ విధంగా మిమ్మల్ని ప్రోత్సహించిందో సవాలు చేసిందో ప్రసంగీకునికి ప్రత్యేకంగా తెలియజేయండి.
2. సంఘంలో మీరు ఏం నేర్చుకున్నారో చర్చించడానికి కుటుంబంతో గాని స్నేహితులతో గాని మధ్యాహ్న సమయంలో గాని సాయంత్రం వేళలో గాని సమావేశమవ్వండి.
ఈ కింది ప్రశ్నలను ఒకరినొకరు అడగండి:
• ఆదివారం ప్రసంగం ఏంటి? సండే స్కూల్ పాఠం ఏంటి?
• దేవుడు వ్యక్తిగతంగా నీతో ఏం మాట్లాడాడు?
• మీరు విన్నదాని ఫలితంగా మీ జీవితం ఎలా మారాల్సి ఉంది?
3. ఒకరి నిమిత్తం మరొకరు ప్రార్థించడం కోసం సమయాన్ని వెచ్చించండి.
4. తన వాక్యం నుంచి దేవుడు మీకు  బోధించిన దాని నిమిత్తం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయండి.
5. మీరు నేర్చుకున్న దాన్ని ప్రకారం జీవించడానికి మీకు సహాయపడమని దేవుణ్ణి అడగండి.
6. ఆ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్కరి (అనగా విశ్వాసుల అవిశ్వాసుల) హృదయాల్లో పనిచేయడం కొనసాగించమని దేవుణ్ణి అడగండి.

వారం అంతట్లోనూ
1. మీరు రాసుకున్న నోట్సుతో పాటు ప్రసంగంలో వివరించబడిన వచనాలను చదవండి, మీరు ఏం నేర్చుకున్నారో మారడానికి మీరు ఎలాంటి ప్రణాళిక వేసుకున్నారో మీ మనసులో ధ్యానించండి. ఈ కింది ప్రశ్నలకు ప్రత్యేకమైన జవాబులు రాసుకోవడానికి మీరు ప్రయత్నించవచ్చు:
• నేను ఏ విషయంలో మారాలని దేవుడు కోరుతున్నాడు? (ఒక ప్రత్యేకమైన నమ్మకం విషయంలోనా? ప్రవర్తన విషయంలోనా? వైఖరి విషయంలోనా?)
• మారడానికి నేను ఏమి చేయాలి?
• మారడానికి నేను వేయాల్సిన మొదటి అడుగు ఏంటి?
• నేను ఎప్పుడు ఎక్కడ మొదలుపెట్టాలి?
2. నీ జీవితంలో మీరు తీసుకోవాల్సిన మార్పుల విషయంలో మీరు అనుసరించవలసిన మార్గాన్ని తెలియజేయడానికి అవసరమైన ప్రోత్సాహం జవాబుదారీతనం సమకూర్చగలిగిన ఏకమనస్సు కలిగిన ఇతర విశ్వాసులతో సమావేశమవ్వండి.
3. తర్వాత మీరు వినబోయే ప్రసంగం కోసం  ఎదురుచూపుతో నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవడం ప్రారంభించండి. 

దేవుడు ఏం చేశాడో...ఎందు నిమిత్తం తమను పిలుస్తున్నాడో సంఘాలు ఒక్కసారి గమనించినప్పుడు ఆయనను స్తుతించాలనే ఘనపరచాలనే సంపూర్ణ ఉద్దేశంతో ఆయన వాక్యాన్ని భయభక్తులతో వింటాయి. ఇలా చేయడం కంటే మరీ ఏ విధంగానూ సంఘాలు దేవుణ్ణి అధికంగా ఘనపరచవు. - జె.ఐ. ప్యాకర్

END NOTES

పరిచయం

1. J. I. Packer, "Why Preach?" in The Preacher and Preaching, ed. by Samuel T. Logan Jr. (Phillipsburg: Presbyterian and Reformed, 1986), 28.
2. Doug Pagitt, Preaching Re-Imagined (Grand Rapids: Zondervan, 2005), 76.
3. Ibid., 214.
4. Sermon 28 from The Works of the Reverend George Whitfield published by E. and C. Dilly, London, 1771-1772. http://www. monergism.com/threshold/articles/onsite/how to listen.html (accessed 21 April 2008).
5. Augustine in Jay E. Adams, Be Careful How You Listen (Birmingham, AL: Solid Ground Christian Books, 2007), 76.
6. J. I. Packer in The Preacher and Preaching, ed. Samuel T. Logan Jr. (Phillipsburg: Presbyterian and Reformed, 1986), 20.

మొదటి అధ్యాయం
1.శ్రవణేంద్రియ శాస్త్రం(ఆడియాలజీ): రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న అనేకమంది సైనికుల వినికిడి లోపాల్ని పరిష్కరించాల్సిన అవసరం నుండి ఈ శాస్త్రం పుట్టింది. వినికిడి సమస్యలను గుర్తించి, వాటిని వినికిడి ఉపకరణాలు మరియు ఇంప్లాంట్ల ద్వారా లేదా శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించడంలో ఆడియాలజిస్టులు నైపుణ్యం కలిగి ఉంటారు.

2. B.B.Warfield తన ప్రసిద్ధ రచనైన The Inspiration and Authority of the Bibleలో చెప్పిన మాట (P & R Publishing, 1948)

3. వినమని, విధేయత చూపించమని చెప్పే ఈ పూర్తి ఆజ్ఞల జాబితా - కంటికి కనిపించేంత వరకూ సాగే కాంక్రీటు లారీల లైనును పోలి - విని విధేయత చూపించడానికి అవసరమైన దైవశాస్త్ర పునాదిని వేస్తుంది: ద్వితీయోపదేశాకాండము 5:1; 6:3-4; 9:1; 12:28; 13:4; 20:3; 27:9; 32:1; యెహోషువ 3:9; 1సమూయేలు 15:1, 1రాజులు 22:19; 2రాజులు 7:1; 20:16; 2దినవృత్తాంతములు 18:18; 2 2దినవృత్తాంతములు 20:15; యోబు 37:2-5; 42:4; కీర్తనలు 34:11; 50:7; 81:8, 13; 95:6-8; సామెతలు 1:8; 2:2; 4:1, 20; 5:1, 7, 13; 7:24; 8:6, 32-33; 19:20; 22:17; 23:12, 19, 22;ప్రసంగి 5:1; యెషయా 1:2, 10; 8:9; 28:14, 23; 32:9; 34:1; 39:5; 41:1; 42:23; 44:1; 46:3, 12; 48:1, 12, 14; 49:1; 51:1, 4, 7; 55:2-3; 66:4-5; యిర్మియా 2:4; 5:21; 7:2; 10:1; 13:15; 17:20; 19:3; 21:11; 22:2, 29; 23:18; 28:7; 29:20; 31:10; 34:4; 44:24-26; యెహెజ్కేలు 3:27; 6:3; 13:2; 16:35; 18:25; 20:47; 25:3; 33:30;34:7- 9; 36:1-4; 37:4; 40:4;44:5; హోషేయ 4:1; 5:1; యోవేలు 1:2; ఆమోసు 3:1; 4:1; 5:1; 8:4; మీకా 1:2; 3:1, 9; 6:1-2; జెకర్యా 3:8; మత్తయి  11:15; 13:9, 43; 17:5; 21:33; మార్కు  4:3, 9, 23-24; 7:14; లూకా  8:8, 18; 9:44; 14:35; 16:29; ఆపో. కార్యములు  2:14, 22; 7:2; 13:16; 22: 1; హెబ్రీ  3:7-8, 15; 4:7; యాకోబు  1:19; 2:5; ప్రకటన  2:7,11,29; 3:6,13,22.

4. Thomas Shepard, "Of Ineffectual Hearing the Word," The Works of Thomas Shepard (New York: AMS Press, 1967), 3:366.

5. 5. దేవుని వాక్యాన్ని విని మరియు విధేయత చూపడంలో విఫలమైనవారి పాతనిబంధన ఉదాహరణలు: నిర్గమకాండము 7:13, 22; 8:15, 19; 9:12; ద్వితీయోపదేశాకాండము 1:43; 9:23-24; యెహోషువ 5:6; న్యాయాధిపతులు 2:20-21; 1సమూయేలు 15:22-23; 1రాజులు 20:36; 2 రాజులు 17:14, 40; 22:13;2దినవృత్తాంతములు 24:19; నెహెమ్యా 9:16-17, 29-30; కీర్తనలు 81:11; 95:6- 11; 106:25; సామెతలు 5:13; యెషయా 1:2, 6:9-10; 30:9; 42:20; 48:8; 65:12;యిర్మియా 5:21; 6:10, 17, 19; 7:13, 24-27; 11:6-10; 13:10-17; 16:11-13; 17:23; 22:21; 25:3-9; 26:4-5; 29:19; 32:33;34:14; 35:14-17; 36:31; 37:2; 40:3; 44:5-6, 16; యెహెజ్కేలు 2:5-7; 3:4-11; 12:2; దానియేలు 9:6; జెఫన్యా 3:2; జెకర్యా 1:4; 7:11-14.

6. John R. Stott, The Contemporary Christian (Downers Grove, IL: Intervarsity Press, 1992), 104.

7. దేవుని వాక్యాన్ని విని మరియు విధేయత చూపడంలో విఫలమైనవారికైన హెచ్చరికలు: లేవీయకాండము 26:14-27;ద్వితీయోపదేశాకాండము 8:20; 9:23; 18:19; 28:15-68; 1సమూయేలు 12:15; సామెతలు 1:24-33; యెషయా 66:4;యిర్మియా 11:3; 12:17; 13:10-17; 16:11-13; 18:10; 19:15; 25:8-11; 26:2-6; 29:18-19; 35:14-17; 42:6-17; యెహెజ్కేలు 20:34-39; హోషేయ 9:17; మలాకీ 2:2; మత్తయి  7:24-27; లూకా  6:46-49; ఆపో. కార్యములు  3:22-23.

8. దేవుని వాక్యాన్ని విని మరియు విధేయత చూపడంలో విఫలమైనవారి కొత్త నిబంధన ఉదాహరణలు: మత్తయి  13:15; యోహాను  9:27; ఆపో. కార్యములు 7:51, 57; 17:21; 28:26- 27; రోమా . 11:8; హెబ్రీ  5:11.

9. దేవుని వాక్యాన్ని విని మరియు విధేయత చూపేవారికైన ఆశీర్వాద వాగ్దానాలు: నిర్గమకాండము 15:26; 19:5-6; ద్వితీయోపదేశాకాండము 7:12-16; 11:13-15; 26-28; 13:17-18; 15:4-6; 28:1-14;30:11-16; 31:12-13; 1రాజులు 11:38; సామెతలు 1:33; 8:34; 15:31-32; యిర్మియా 7:22-23; 11:3-5; 18:10; యెహెజ్కేలు 20:39; మత్తయి  13:16; లూకా  11:28; ప్రకటన 1:3.

రెండవ అధ్యాయం
1. మూడు సమదృక్పథ సువార్తలలోనూ గ్రంథస్తం చేయబడిన కొన్ని ఉపమానాలలో ఒకటైన నేలల గురించిన ఉపమానమే మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలలో ప్రస్తావించబడిన మొదటి ఉపమానం కావడము, అదే యేసు చెప్పిన మొదటి ఉపమానమని సూచిస్తుంది
2. John Piper, "Take Care How You Listen," Pt. 1&2, delivered 22 February 1998, 6.

మూడవ అధ్యాయం
1. Richard Baxter, The Practical Works of Richard Baxter, Vol. 1, A Christian Directory (Morgan, PA: Soli Deo Gloria, 1996), 473.
2. Ibid., 475.
3. Philip G. Ryken, "How to Listen to a Sermon." www.tenth.org. http://www.tenth.org/wowdir/wow2002-09-22.htm.
4. Duane Litfin, Public Speaking: A Handbook for Christian (Grand Rapids: Baker, 1992), 143.
5. Augustine in Jay E. Adams, Be Careful How You Listen (Birming- ham, AL: Solid Ground Christian Books, 2007), 76.
6. Ibid., 51.
7.David Eby, Power Preaching for Church Growth: The Role of Preaching in Growing Churches (Ross-shire, Great Britain: Chris tian Focus Publications, 1996), 13.
8. Be Careful How You Listen, 40-42.
9. Ibid., 85-86.

నాల్గవ అధ్యాయం
1. Joel R. Beeke, The Family at Church: Listening to Sermons and Attending Prayer Meetings (Grand Rapids: Reformation Heri tage Books, 2004), 1.
2. Wayne Grudem, Bible Doctrine: Essential Teachings of the Christian Faith (Grans Rapids: Zondervan, 1999). 40.
3. John MacArthur Jr., Ashamed of the Gospel: When the Church Becomes Like the World (Wheaton: Crossway Books, 1993), xi
4. John MacArthur Jr., Our Suffieciency in Christ (Dallas: Word Publishing, 1991), 134.
5. John MacArthur Jr., Reckless Faith: When the Church Loses Its Will to Discern (Wheaton: Crossway Books, 1994), 87-88.

ఐదవ అధ్యాయం
1. Eric J. Alexander, et al., Feed My Sheep: APassionate Plea for Preaching (Morgan, PA: Soli Deo Gloria, 2002), 153, 155.
2. John R. Stott, Between Two Worlds: The Art of Preaching in the Twentieth Century (Grand Rapids: Eerdmans, 1982), 113, 133.

ఆరవ అధ్యాయం
1. Joel R. Beeke, The Family at Church: Listening to Sermons and Attending Prayer Meetings (Grand Rapids: Reformation Heritage Books, 2004), 17.
2. Richard Warren, Twelve Dynamic Bible Study Methods (Wheaton: Victor Books, 1981), 14.
3. Jay E. Adams, Be Careful How You Listen (Birmingham, AL: Solid Ground Christian Books, 2007), 49.
4. Homer A. Kent Jr., Faith That Works: Students in the Epistles of James (Winona Lake, IN: BMH Books, 1986), 63.
5. John MacArthur Jr., James (Chicago: Moody Press, 1998), 72. 6. Jeremiah Burroughs, Gospel Worship (Ligonier, Penn: Soli Deo Gloria, 1990), 186.
7. John R. W. Stott, The Contemporary Christian (Downers Grove, IL: Intervarsity Press, 1992), 184.
8. John Piper, The Supremacy of God in Preaching (Grand Rapids: Baker, 1990), 37.
9. Richard Baxter, The Practical Works of Richard Baxter, Vol. I, A Christian Directory (Morgan, PA: Soli Deo Gloria, 1996), 475.
10. Be Careful How You Listen, 59.
11. The Contemporary Christian, 109.
12. James, 77-79, 81, 84.
13. The Family at Church, 16.
14. Michael Fabarez, Preaching That Changes Lives (Nashville: Thomas Nelson, 2002), 184.

ముగింపు

1. Richard Baxter, The Practical Works of Richard Baxter, Vol. I, A Christian Directory (Morgan, PA: Soli Deo Gloria, 1996), 473- 477.
2. David Clarkson, "Hearing the Word," The Works of David Clarkson, vol. 1 (Edinburg: Banner Truth Trust, 1988), 434.
3. James Montgomery Boice, Matthew ((Grand Rapids: Baker, 2006), 259.
4. The Works of David Clarkson, vol. 1, 431.

Add comment

Security code
Refresh