- మొదటిది, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపం చేయడని యెరుగుదుము. (1 యోహాను 3:9, 5:18)
- రెండవది, యేసే క్రీస్తయియున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు (1యోహాను 5:1):
- మూడవది, నీతిని జరిగించు ప్రతివాడూ దేవుని మూలంగా పుట్టియున్నాడు ( 1 యోహాను 2:29 )
- నాల్గవది, మనము సహెూదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటియున్నామని యెరుగుదుము (1యోహాను 3:14)
- ఐదవది, దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు (1యోహాను 5:4)
- ఆరవది, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు (1యోహాను 5:18)
నువ్వు తిరిగి జన్మించావా? ఇది దైవభక్తికి సంబంధించిన అతిముఖ్యమైన ప్రశ్న. ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు (యోహాను 3:3).
'నేను సంఘానికి చెందినవాడిని కాబట్టి నేను తిరిగి జన్మించాను' అనుకుంటే సరిపోదు. వేలాదిమంది నామకార్థ క్రైస్తవులలో వాక్యం తెలియజేసే నూతనజన్మ గుర్తులు మరియు లక్షణాలేమాత్రం లేవు. నూతనజన్మ గుర్తులు మరియు లక్షణాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? శ్రద్ధగా వింటే, వాటిని మొదటి యోహాను పత్రిక నుండి నేను నీకు చూపిస్తాను.
మొదటిది, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, దేవుని మూలంగా పుట్టినవాడెవడును పాపం చేయడని యెరుగుదుము. (1 యోహాను 3:9, 5:18)
తిరిగి జన్మించినవాడు అలవాటుగా పాపం చేయడు. కొత్తగా జన్మించని వ్యక్తిలా, అతను హృదయపూర్వకంగా, ఇష్టంతో, మనసారా పాపం చేయడు. ఒకప్పుడు అతను చేసే పనుల్లో పాపం ఉందా లేదా అని ఆలోచించి ఉండకపోవచ్చు, పాపం చేసి కూడా దాని గురించి బాధపడని సమయం కూడా ఉండివుండవచ్చు. అప్పుడు అతనికీ పాపానికీ మధ్య ఏ వైరమూ లేదు; వారు మంచి స్నేహితులు. ఐతే ఇప్పుడు అతడు పాపాన్ని ద్వేషించి, దాని నుండి పారిపోయి, దానికి వ్యతిరేకంగా పోరాడి, దానిని అతి గొప్ప తెగులుగా ఎంచి, దాని భారం కింద మూలుగుతూ, దానితో ప్రభావితమైనపుడు దు:ఖపడి, దాని నుండి విడుదల పొందాలని ఆరాటపడతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు పాపం అతనికి ఎలాంటి సంతోషమూ ఇవ్వదు. దాన్ని తేలికగా కూడా తీసుకోడు; అతనిప్పుడు అత్యంత హేయమైనదిగా ద్వేషించే విషయం పాపం. తన అంతరంగంలో పాపాన్ని నివారించలేడు.
తనలో పాపము లేదని చెప్పుకుంటే తనలో సత్యముండదు (1 యోహాను 1:8) . అయితే దానిని హృదయపూర్వకంగా ద్వేషిస్తున్నాడని, దానిని ఎప్పటికీ చేయకూడదన్నదే తన హృదయవాంఛ అని చెప్పగలడు. చెడు ఆలోచనలు రాకుండా, తన మాటల్లో, క్రియల్లో కొరతలు, తప్పిదాలు, లోపాలు లేకుండా ఆపలేడు. “అనేక విషయములలో మనమందరము తప్పిపోవుచున్నాము” (యాకోబు 5:2) అని అతనికి తెలుసు. అయితే ఇవన్నీ అతనికి ఆయాసకరమైనవని, అతని నూతన స్వభావం వాటికి సమ్మతించదని యథార్థంగా దేవుని ఎదుట చెప్పగలడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్పగలడు? నువ్వు తిరిగి జన్మించావా?
రెండవది, యేసే క్రీస్తయియున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టియున్నాడు (1యోహాను 5:1):
తిరిగి జన్మించిన వ్యక్తి యేసు క్రీస్తు మాత్రమే రక్షకుడని, ఆయనలో మాత్రమే క్షమాపణ లభిస్తుందని నమ్ముతాడు. ఈ కార్యం కొరకు తండ్రి చేత నియమించబడిన దైవమానవుడు ఆయన మాత్రమే అని, ఆయన కాకుండా వేరొక రక్షకుడే లేడని నమ్ముతాడు. తనలో అయోగ్యత తప్ప ఏమీ చూడడు కాని క్రీస్తులో సంపూర్ణ నిశ్చయతను కనుగొంటాడు. క్రీస్తును విశ్వసించడం వల్ల తన పాపాలు సంపూర్ణంగా క్షమించబడతాయని నమ్ముతాడు. క్రీస్తు సిలువపై చేసిన కార్యం మరియు సిలువ మరణం ఆధారంగా, దేవుని ఎదుట తాను నీతిమంతుడిగా తీర్చబడ్డాడని నమ్మి, మరణం మరియు తీర్పును గురించిన భయం లేకుండా ఉంటాడు.
కాని తను కొన్నిసార్లు భయాందోళనలకు గురికావచ్చు. తనకు అసలు విశ్వాసమే లేనట్టుగా అనిపిస్తుందని నీకు చెప్పవచ్చు. అయితే అతనిని తన నిత్యత్వం యొక్క నిరీక్షణ గురించి అడగండి. అది తన మంచితనం మీద, తన మార్చుకున్న క్రియల ద్వారా, తన ప్రార్థనచేత, తన పరిచారకుడి మీద లేదా తన సంఘం మీద ఆధారపడుతుందా అని అడిగితే ఏమని సమాధానం చెప్తాడో చూడండి. అతడు క్రీస్తును వదిలి వేరే మతంలో తన యొక్క నిరీక్షణను ఉంచుతాడేమో అడగండి. తాను బలహీనుడననీ, చెడ్డవానిననీ ఒప్పుకున్నప్పటికీ, లోకమంతా ఇచ్చినా తాను క్రీస్తును మాత్రం కాదననని చెప్తాడు. క్రీస్తులో ప్రశస్తమైనదానిని తాను పొందుకున్నాడని, తన ఆత్మకు చాలినదానిని క్రీస్తులో పొందాడని, ఇక ఎక్కడా అది దొరకదని నమ్మి, దానిని మాత్రమే హత్తుకుంటాడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా?
మూడవది, నీతిని జరిగించు ప్రతివాడూ దేవుని మూలంగా పుట్టియున్నాడు ( 1 యోహాను 2:29 )
తిరిగి జన్మించిన వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తి. అతడు దేవుని చిత్తప్రకారం జీవించాలనే తపన కలిగుండి, దేవునిని ప్రీతిపరిచేవాటిని చేస్తాడు. దేవుడు ద్వేషించే వాటికి దూరంగా ఉంటాడు. దేవున్ని పూర్ణహృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణమనస్సుతోను, పూర్ణబలంతోను ప్రేమించడం, అలాగే తనవలే తన పొరుగువానిని ప్రేమించడం తన కోరిక మరియు లక్ష్యం. రక్షకుడిగా మాత్రమే కాకుండా తనకు మాదిరిగా కూడా ఎల్లప్పుడు క్రీస్తు వైపు చూస్తాడు. ఆయన ఆజ్ఞలను గైకొనడం ద్వారా తాను క్రీస్తు స్నేహితుడనని కనపరచుకుంటాడు. ఇదే తన కోరిక, అతడు సంపూర్ణుడు కాడు అనడంలో సందేహమేమీ లేదు, ఆ విషయాన్ని ఇతరుల కంటే ముందు తానే ఒప్పుకుంటాడు. తనలో ఉన్న మాలిన్యాన్ని గురించి అతడు మూలుగుతాడు. కృపకు ఎల్లప్పుడు వ్యతిరేకంగా పోరాడి, తన్ను దేవుని నుండి వేరు చేసే ఒక పాపనియమాన్ని తనలో కనుగొంటాడు. అయితే దాని ఉనికి లేకుండా చేయలేకపోయినా, దానితో అతను సమ్మతించడు. అతనికెన్ని కొరతలున్నా సరే, తన నడత మాత్రం పరిశుద్ధతకే మొగ్గు చూపుతుంది. అతని క్రియలు పరిశుద్ధమైనవి, అతని ఆశలు పరిశుద్ధమైనవి, అతని అలవాట్లు పరిశుద్ధమైనవి. ఎదురుగాలి చేత కొట్టబడుతున్న ఒక నావలా తన జీవితం కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, తన పయనం మాత్రం దేవుని వైపుకే మరియు దేవుని కొరకే.
కొన్నిసార్లు తను అసలు క్రైస్తవుడేనా అని కూడా అతడు అనుమానించినా, జాన్ న్యూటన్ గారితో స్వరం కలిపి ఇలా చెప్పగలడు, 'నేను ఏమై ఉండాలో అలా లేను, నేనేమై ఉండగోరుతున్నానో అలా లేను, నేను పరలోకంలో ఏమై ఉంటానని నిరీక్షిస్తున్నానో అలా లేను, అయినా ఒకప్పుడు నేను ఏమై ఉన్నానో అలా లేను, నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయ్యున్నాను.' ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా?
నాల్గవది, మనము సహెూదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోకి దాటియున్నామని యెరుగుదుము (1యోహాను 3:14)
తిరిగి జన్మించిన వ్యక్తికి నిజమైన యేసు శిష్యులందరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. పరలోకమందున్న తన తండ్రిలాగే సాధారణంగా అందరి పట్ల అతనికి ప్రేమ ఉంటుంది. అయితే తనతో ఏకమనస్సు కలవారి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. తన రక్షకుడు మరియు ప్రభువువలె, అతడు హీనమైన పాపిని కూడా ప్రేమించి వారిని గురించి మొర్రపెట్టువాడిగా ఉంటాడు. కాని అతనికి విశ్వాసుల పట్ల విశిష్టమైన ప్రేమ ఉంటుంది. వాళ్ల సహవాసంలో ఉన్నంత ఆనందాన్ని ఇంకెక్కడా అనుభవించలేడు. అంత ఆనందాన్ని పరిశుద్ధుల మధ్యలో తప్ప లోకంలో ఘనులైనవారి మధ్యలో కూడా అతడు పొందలేడు. ఇతరులు తాము ఎన్నుకున్న స్నేహంలో విద్యకు, తెలివితేటలకు, కలుపుగోలుతనానికి, ఐశ్వర్యానికి మరియు స్థాయికి విలువనిస్తారేమోగాని, తిరిగి జన్మించిన వ్యక్తి ఐతే కృపకు మాత్రమే విలువనిస్తాడు. ఎక్కువ కృప పొంది, ఎక్కువగా క్రీస్తును అనుసరించేవారినే అతడు ఎక్కువ ప్రేమిస్తాడు.
విశ్వాసులు అందరూ కూడా తనతో పాటు ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తాడు. ఒకే శత్రువుతో పోరాడే తన తోటిసైనికులుగా వారిని ఎంచుతాడు. ఒకే మార్గం గుండా పయనించే సహయాత్రికులుగా అతడు వారిని పరిగణిస్తాడు. అతడు వారిని అర్థం చేసుకుంటాడు, వారు అతన్ని అర్థం చేసుకుంటారు. అతడికీ, వారికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉండి వుండవచ్చు. స్థాయిలో, స్థలంలో, ఆస్తిపాస్తుల్లో బేధముండవచ్చు. ఐతే ఏమిటి? వారు యేసు క్రీస్తుకి సంబంధించినవారు. వారు అతని తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలు కాబట్టి అతడు వారిని ప్రేమించకుండా ఉండలేడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా?
ఐదవది, దేవుని మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు (1యోహాను 5:4)
తిరిగి జన్మించిన ఒక వ్యక్తి మంచి, చెడులను వివేచించడానికి ఈ లోకాభిప్రాయాల్ని ఆధారం చేసుకోడు. లోకం పోకడలు, ఆలోచనలు మరియు ఆచారాల ప్రవాహానికి వ్యతిరేకంగా నడవడానికి అతడు సంకోచించడు. అతని జీవితాన్ని మలిచేది మనుష్యుల మాటలు కావు. అతడు లోకానుసారమైన ప్రేమను జయిస్తాడు. తన చుట్టూ ఉన్నవారు సంతోషించే విషయాలలో అతనికి ఎటువంటి ఆనందమూ ఉండదు. వారి వినోదాలను అతడు ఆస్వాదించలేడు. అవి అతనికి విసుగు పుట్టిస్తాయి. అవి అతనికి వ్యర్థమైనవిగాను, నిష్ప్రయోజనమైనవిగాను, అనర్హమైనవిగాను కనబడుతాయి. అతడు ఈ లోకానుసారమైన భయాన్ని జయిస్తాడు. అతడు చేసే పనులను ఇతరులు అనవసరమైనవిగా ఎంచినా, అతడు వాటిని సంతృప్తిగా చేస్తాడు. వారు అతనిని నిందించినా అది అతనిని కదల్చదు. వారు అతనిని హేళన చేసినా, అతడు వారికి లొంగడు.
అతడు మనుష్యుల మెప్పు కంటే దేవుని మెప్పును అపేక్షిస్తాడు. అతడు మనుష్యులను బాధపెట్టటం కంటే దేవుణ్ణి బాధపెట్టడానికే ఎక్కువ భయపడతాడు. శిష్యరికపు వెలను చెల్లించడానికి అతడు సిద్ధంగా ఉంటాడు. వారి పొగడ్తలూ, నిందలూ అతనికి లెక్కకు రావు. లోకపు పోకడలకూ, ఆచారాలకూ అతడు దాసుడు కాడు. లోకాన్ని సంతోషపెట్టడం అతనికి ఏమాత్రం ప్రాముఖ్యమైనది కాదు. అతని ముఖ్యమైన లక్ష్యం దేవుణ్ణి సంతోషపెట్టడం. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా?
ఆరవది, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుంటాడు (1యోహాను 5:18)
తిరిగి జన్మించిన వ్యక్తి తన ఆత్మ విషయమై ఎంతో జాగ్రత్త వహిస్తాడు. అతడు పాపాన్ని మాత్రమే కాదు, పాపానికి దారితీసే ప్రతిదానినీ తొలగించడానికి ప్రయాసపడతాడు. అతడు ఎవరితో స్నేహం చేస్తున్నాడు అనే విషయమై చాలా జాగ్రత్త వహిస్తాడు. 'దుష్టసాంగత్యములు మంచి నడవడిని చెరుపును', అని అతనికి తెలుసు. ఆరోగ్యం కంటే సులభంగా వ్యాధి ఎలా సోకుతుందో, అలాగే మంచిప్రవర్తన కంటే దుష్టనడవడే ఎక్కువ ప్రభావితం చేస్తుందని అతడు గుర్తిస్తాడు. సమయాన్ని జాగ్రత్తగా వెచ్చిస్తాడు. సమయాన్ని సద్వినియోగపరుచుకోవడమే అతని ధ్యేయం. అతడు మిత్రులను జాగ్రత్తగా ఎంచుకుంటాడు. మనుష్యులు, వాత్సల్యంగా, ప్రీతిగా మంచిగుణము కలవారైయుంటే సరిపోదు, అదంతా మంచిదే అయినా వారు అతని ఆత్మీయ మేలుకు దోహదపడతారా? అతడు తన అనుదిన అలవాట్లు మరియు ప్రవర్తన విషయమై శ్రద్ధ తీసుకుంటాడు. తన హృదయం మోసకరమైనదనీ, లోకం దుష్టత్వంతో నిండి ఉందనీ, తనకు కీడు తలపెట్టడానికి సాతాను నిత్యం యత్నిస్తున్నాడనీ అతడు ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ అతడు తనను తాను యథార్థంగా భద్రం చేసుకుంటాడు.
శత్రుదేశంలో ఉన్న ఒక సైనికుడిగా నిత్యం సర్వాంగకవచాన్ని ధరించినవాడై, శోధనను ఎదుర్కొనడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నది అతని హృదయవాంఛ. శత్రువుల మధ్యలోనే ఉన్నాడని తన అనుభవం వలన తెలుసుకొని, మెలకువగా, సాత్వికంగా, ప్రార్థనాపూర్వకంగా ఉండడం అలవర్చుకుంటాడు. ఈ గుర్తును నీ ఎదుట ఉంచుతున్నాను. అపొస్తలుడు నీ గురించి ఏమి చెప్తాడు? నువ్వు తిరిగి జన్మించావా?
ఇవి నూతన జన్మకు ఖచ్చితమైన ఆరు లక్షణాలు.
వీటిని నాతో కలిసి పఠించినవారు మళ్ళీ మళ్ళీ చదివి, హృదయంలో వీటిని భద్రంగా దాచుకోవాలని కోరుతున్నాను. ఒక్కొక్కరిలో ఈ లక్షణాలకున్న లోతులోను, వైవిధ్యంలోను వ్యత్యాసముందని నాకు తెలుసు. కొందరిలో అవి క్షీణంగా, మసకగా, బలహీనంగా కనిపించీ కనిపించనట్టుగా ఉన్నాయి. మరి కొందరిలో అందరూ గుర్తించే విధంగా అవి తేటగా, పదునుగా, స్పష్టంగా, సూటిగా మరియు నిస్సందేహంగా కనిపిస్తాయి. వీటిలో కొన్ని కొందరిలో, ఇంకొన్ని మరికొందరిలో ఎక్కువగా కనిపించవచ్చు. ఒక వ్యక్తిలో అన్ని లక్షణాలూ ఒకే పరిమాణంలో చూడగలగడం చాలా అరుదు. ఇవన్నీ ఒప్పుకోవడానికి నేను సిద్ధమే.
అయితే ఇవన్నీ పరిగణలోనికి తీసుకున్నా సరే, ఇక్కడ మనం స్పష్టంగా వివరించబడిన ఆరు లక్షణాలను చూస్తున్నాము.
అపొస్తలుడు ఆత్మప్రేరణతో క్రీస్తుసంఘానికి చిట్టచివరి సార్వత్రిక పత్రిక రాస్తూ, తిరిగి జన్మించినవాడు పాపం చేయడని, యేసే క్రీస్తని నమ్ముతాడని, నీతిని జరిగిస్తాడని, సహెూదరులని ప్రేమిస్తాడని, లోకాన్ని జయిస్తాడని, తనను తాను భద్రం చేసుకుంటాడని మనకు చెప్తున్నాడు. వీటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించాలని చదువరిని కోరుతున్నాను. వీటికి మనం ఏమని బదులివ్వగలం? నూతన జన్మ అనేది కేవలం బాహ్యమైన సంఘపు ప్రయోజనాలకు మాత్రమే పరిమితమైనదని తలంచేవారు వీటికి ఏమని జవాబు చెప్పగలరో నాకు నిజంగా తెలీదు. నా మట్టుకు నేను ధైర్యంగా ఒకే ఒక్క తుది నిర్ణయానికి రాగలను. అదేమిటంటే, ఈ ఆరు లక్షణాలు తమలో కలిగున్నవారు మాత్రమే తిరిగి జన్మించినవారు; అవి లేని ఏ పురుషుడైనా, స్త్రీయైనా తిరిగి జన్మించలేదు. మనము ఈ నిర్ణయానికి రావాలన్నదే అపొస్తలుని ఉద్దేశమని నేను నమ్ముతున్నాను. ప్రియ చదువరీ, నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నువ్వు తిరిగి జన్మించావా?
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.