ఇతర అంశాలు

రచయిత: పి. శ్రావణ్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 25 నిమిషాలు

విషయసూచిక

  1. దేవదూతలు ఆత్మస్వరూపులు
  2. దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు?
  3. దేవదూతలు వ్యక్తిత్వం మరియు నైతికత ఉన్న జీవులు
  4. దేవదూతల సంఖ్య లెక్కకు మించింది
  5. దేవదూతలలో వివిధ శ్రేణులు లేదా తరగతులు ఉన్నాయి
  6. దేవదూతల పని ఏమిటి?
  7. దేవదూతల గురించిన అత్యాసక్తి

దేవదూతల గురించి వాక్యంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఈ విషయం గురించి క్రైస్తవ సంఘంలో చాలా అరుదుగా ప్రస్తావించడం జరుగుతుంది. కొన్ని సంఘాలలో దేవదూతల గురించి వాక్యం చెప్పని విషయాలను విశ్వాసులకు బోధించి వారిని తప్పు దారి పట్టిస్తున్నారు. కొన్ని ఉదాహరణలు గమనించండి:

   1) అమెరికాలో (బోస్టన్ అనే ప్రాంతంలో) ఒక సంఘకాపరి, తాను తరచుగా ఒక దేవదూతతో మాట్లాడుతున్నాను అని సంఘస్తులకు చెప్పాడు. కొన్ని వారాల తర్వాత, వేదిక మీద ఒక కుర్చీ వేసి ఇది పరలోక సందర్శకుని కోసం అని చెప్పాడు (ఆ దేవదూత ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాడు అని కూడా చెప్పాడు). చివరికి ఆ దేవదూత ఏవో మాటలు చెప్పాడని, ఆ మాటలనే ఒక పుస్తకంగా రాసానని సంఘాన్ని నమ్మించాడు

   2)కెనడాలో ఒక యువ సువార్తికుడు ఒక కూజాలో ఈకను (అది పక్షి ఈక అయ్యుండొచ్చు) చూపించి, అది తనను సందర్శించే దేవదూతకు చెందిందని సంఘానికి చెప్పాడు. ఆ దేవదూత, జరుగుతున్న కూటాలకు వస్తున్నాడని, ధనాన్ని మరియు స్వస్థతని విడుదల చేస్తాడని చెప్పాడు

   3) ఒక ప్రవక్త (తనని తాను ఆ విధంగా సంభోదించుకున్నాడు), దేవదూతలు సంఘంలో నిద్రపోతున్నారు అని చెప్పాడు

ఈ విధంగా దేవదూతల గురించి వాక్యం చెప్పని విషయాలను అనేకులు బోధించడం మనం తరచుగా చూస్తుంటాం. ఈ వ్యాసంలో దేవదూతల గురించి వాక్యంలో చెప్పబడిన విషయాలను క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి కావాల్సిన వివరణను ఇచ్చే ప్రయత్నం చేశాను. దీనిని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని అబద్ధ బోధలకు దూరంగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారని ఆశిస్తున్నాను

i) దేవదూతలు ఆత్మస్వరూపులు

దేవుడు దేవదూతలను సృజించాడు, గనుక దేవదూతలు దేవునిలాగా నిత్యులు కారు, వారు మనలాగ సృష్టిలో ఒక భాగమే. దేవదూతలుకు ఉన్న కొన్ని లక్షణాలు:

   a) వారి జ్ఞానం పరిమితమైనది (మత్తయి 24:36)

   b) వారికి శరీరం లేదు (హెబ్రీ 1:14)

   c) వారు ఆత్మ రూపులు (హెబ్రీ 1:14)

   d) వారికి మరణం లేదు (లూకా 20:36)

   e) వారు వివాహం చేసుకోరు (మత్తయి 22:30)

ii) దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు?

మొదటిగా సమస్తాన్ని దేవుడే సృష్టించాడు అని చాలా స్పష్టంగా వాక్యంలో చూస్తున్నాం -

“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను." కొలొస్సి 1:16

రెండవదిగా, సమస్తాన్ని దేవుడు 6 రోజులలో సృష్టించాడు అని చూస్తాం -

“ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను." నిర్గమ 20:11

“ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను" ఆది 2:1

దేవదూతలను 6 రోజుల సృష్టిలో భాగంగా సృజించలేదు, వారు ఇంకా ముందునుండే ఉన్నారు అని కొందరు చెప్తారు. ఆలా అయితే, ఆదికాండము 2:1 లో, "ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును" అని మోషే ఎందుకు అంటున్నాడు. భూమిలో ఉన్న సమస్త సమూహము అంటే మనకు తెలుసు, మరి ఆకాశంలో ఉన్న సమస్త సమూహం అంటే ఏంటి? ఇక్కడ ఆకాశ సమూహము అన్నప్పుడు, అవి సూర్యచంద్ర నక్షత్రాలు మాత్రమే అనుకోవచ్చు కదా అనే ప్రశ్న మనకు రావచ్చు. అయితే లూకా 2:13 లో పరలోక సైన్య సమూహము అనే మాట దేవదూతలకు ఆపాదించబడింది. తెలుగులో ఆకాశ సమూహము అని ఆదికాండము 2:1 లో పరలోకసైన్య సమూహము అని లూకా 2:13లో ఉన్నప్పటికీ, Englishలో రెండు చోట్ల heavenly hosts (హెవెన్లీ హోస్ట్స్) అనే మాటే వాడబడింది. దీనిని బట్టి, "వాటిలోని సమస్తము" అన్నప్పుడు, "దేవదూతల సమూహాన్ని" మినహాయించి ఈ మాటలు చెప్తున్నట్టు మనం అర్థం చేసుకోకూడదు; దేవుడు సమస్తాన్ని 6 రోజుల్లో సృజించాడు అందులో దేవదూతలు కూడా ఉన్నారు.

కీర్తనలు 33:6లో ఈ మాట చూస్తాం, "యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వసమూహము కలిగెను". ఇక్కడ కీర్తనాకారుడు కచ్చితంగా దేవుని 6 రోజుల సృష్టి గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు ఆకాశములో సర్వసమూహాన్ని సృష్టించాడు అని చెప్తున్నాడు.

దేవుడు ఆదియందు (in the begining) సృష్టిని ఆరంభించాడు అని చూస్తున్నాం. ఒక వేళ దేవదూతలను అంతకముందే సృష్టించి ఉంటే "ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను" అనే మాట వాడడం సాధ్యపడదు. ఎందుకంటే ఆదియందు దేవుడు దేవదూతలను సృష్టించెను, ఆతర్వాత సమస్తాన్ని చేసెను అని చెప్పుండాలి. అయితే వాక్యం మనకు ఆ విధంగా చెప్పట్లేదు.

పౌలు తన పత్రికల్లో యేసుక్రీస్తు సృష్టికర్త అని మాట్లాడుతున్నప్పుడు అది కచ్చితంగా దేవుడు చేసిన 6 రోజుల సృష్టి గురించే అని మనం అర్థం చేసుకోవాలి. అదే కోవలో పౌలు ఈ మాటలు చెప్తున్నాడు.

“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను." కొలొస్సి 1:16

ఇక్కడ పౌలు సమస్తము యేసు క్రీస్తు ద్వారా సృజించబడ్డాయి అని చెప్తున్నాడు, అంటే ఈ సమస్తంలో దేవదూతలు కూడా ఉన్నారు. అయితే పౌలు ఇక్కడ 6 రోజుల సృష్టి వేరుగా, దేవదూతలను చేసిన సృష్టి వేరుగా ఉంది అని చెప్పట్లేదు.

ఈ కారణాలన్నిటిని బట్టి దేవదూతలు కచ్చితంగా 6 రోజుల సృష్టిలో భాగమే అని చెప్పగలం.

దేవుడు దేవదూతలను 6 రోజుల సృష్టికంటే ముందే చేసాడు అని కొందరు నమ్ముతారు. దీనికి కారణం, యోబు 38: 4-6 వచనాలలో, "నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?......ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు?" అని చూస్తాం

దేవుడు భూమికి పునాదులు వేసినప్పుడు, దేవదూతలు సంతోషంతో జయధ్వనులు చేసారు అని వాక్యం చెప్తుంది, దీనిని మనం తృణీకరించట్లేదు. అయితే మొదటి రోజు దేవుడు దేవదూతలను చేసుండొచ్చు అదే రోజు భూమికి పునాది వేసుండొచ్చు. ఇలా జరిగే అవకాశం కచ్చితంగా లేకపోలేదు. కాబట్టి ఈ వచనాన్ని దేవదూతలు 6 రోజుల సృష్టిలో ఒక భాగం కాదు అని నిరూపించడానికి వాడలేము.

దేవదూతల 6 రోజుల సృష్టిలో ఒక భాగమైనప్పటికి, కచ్చితంగా ఏ సమయంలో చేయబడ్డారో వాక్యం చెప్పట్లేదు, గనుక మనం ఆ విషయంలో అత్యాసక్తి చూపాల్సిన అవసరం లేదు.

iii) దేవదూతలు వ్యక్తిత్వం మరియు నైతికత ఉన్న జీవులు

దేవదూతలకు వ్యక్తిత్వం ఉంది/వ్యక్తిగత లక్షణాల కూడా ఉన్నాయి.

   • తెలివైనవారు

   • నైతిక స్వభావం కలిగినవారు

   • సంకల్పం కలిగినవారు

a) వారి శక్తి మరియు తెలివితేటలు మనకంటే గొప్పవి (అయినప్పటికీ పరిమితమైనవి)

“యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. (ఇక్కడ వారి శక్తి గురించి మాట్లాడుతున్నారు) కీర్తన 103:20

“ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు. (ఇక్కడ దూతల జ్ఞానం గురించి వర్ణించబడింది) 2 సమూయేలు 14:20

మనకంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నా, వారు అపరిమితమైన జ్ఞానం కలిగినవారు కాదు. వారి జ్ఞానానికి పరిమితి ఉంది.

రక్షణకు సంబంధించిన కార్యాలను దేవదూతలు తొంగిచూడగోరుచున్నారు అని పేతురు చెప్తున్నాడు (1 పేతురు 1:12). అంటే దేవదూతలకు ఆ విషయాలు అంతక ముందు తెలియవు అని మనకు అర్థమౌతుంది. అదే విధంగా, యేసుక్రీస్తు తిరిగి వచ్చే దినం గురించి మాట్లాడుతూ, యేసు ఈ విధంగా చెప్పాడు, "ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు" మత్తయి 24:36. దీనిని బట్టి దేవదూతలకు యేసుక్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు అని అర్థమౌతుంది. ఈ ఉదాహరణలను బట్టి దేవదూతల జ్ఞానానికి పరిమితి ఉంది అని అర్థమౌతుంది. (యేసు క్రీస్తుకు తాను తిరిగి వచ్చే సమయం తెలుసా లేదా అనేది ఈ వ్యాసానికి సంబంధించింది కాదు గనుక దాటివేస్తున్నాను)

b) దేవదూతలు పాపం చేయగల సమర్థులు

దేవదూతలు పాపం చేసారని, దాని పర్యవసానంగా దేవుడు వారిని శిక్షించాడని వాక్యంలో మనం చూస్తున్నాం. దీనిని బట్టి దేవదూతలను దేవుడు స్వేచ్ఛాజీవులుగా చేసాడు, మంచిచెడ్డలు వారు ఎంచుకోగలరు అని అర్థమౌతుంది.

“దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను" 2 పేతురు 2:4

“మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను." యూదా 1:6

అయితే దేవదూతలు ఒకే ఒక్కసారి పాపం చేసినట్టు వాక్యం తెలియజేస్తుంది. సాతాను (తేజోనక్షత్రము, వేకువచుక్క) దేవుడు సృజించిన దేవదూతలలో అతి సౌందర్యవంతుడు (వాడు "అభిషేకము నొందిన కెరూబు" అని వాక్యం చెబుతుంది. తన తేజస్సును, సౌందర్యాన్ని చూసుకొని గర్వించి (యెహెజ్కేలు 28:17), "మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును" (యెషయా 14:14) అని అనుకొని పాపం చేసినప్పుడు, దేవుడు ఆ పాపాన్ని బట్టి వాడిని ఆకాశం నుండి పడద్రోశాడు (యెషయా 14:15). సాతాను (ఘటసర్పము) అతని దూతలు పరలోకంలో "మిఖాయేలును అతని దూతలతో" యుద్ధం చేసారు అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం (ప్రకటన 12:7-9). ఆ యుద్ధంలో ఓడిపోయి పరలోకంలో వారికి ఇక స్థలం లేక "భూమిమీద పడద్రోయబడ్డారు". సాతాను తనతో పాటు మూడోవవంతు దేవదూతలను తన పక్షాన నిలుపుకొన్నాడు, వారు కూడా శపించబడ్డారు (దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమునీడ్చి వాటిని భూమిమీద పడవేసెను - ప్రకటన 12:4). ఈ విధంగా సాతాను వాడి అనుచరులు మరియు పరిశుద్ధ దూతలు వేరుచేయబడ్డారు. దీని తర్వాత పరలోకంలో ఉన్న ఏ దేవదూత ఎప్పుడు పాపం చేసినట్టు వాఖ్యాధారాలు లేవు.

c) పాపం చేయని దూతలు పరిశుద్ధ దూతలు

సాతాను మరియు అతని దూతల పతనం తర్వాత పరలోకంలో మిగిలి ఉన్న దూతలు పరిశుద్ధ దూతలు అని వాక్యం చెబుతోంది. వారు దేవుని సేవిస్తూ, దేవుని మాటను నెరవేరుస్తూ ఉంటారు. వాక్యంలో పరిశుద్ధ దూతల ప్రస్తావన కోసం ఈ క్రింది వాక్యభాగాలలో చదవండి:

“నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ద దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును" లూకా 9:26

“పరిశుద్ధ దూతల యెదుటను గొఱ్ఱపిల్ల యెదుటను అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును." ప్రకటన 14:10

ఎందుకు సాతాను తర్వాత ఏ దేవదూత పాపం చేయలేదు అనే ప్రశ్నకు వాక్యం సమాధానం ఇస్తుంది. ఇప్పుడు పరలోకంలో ఉన్న దూతలను దేవుడు ఎన్నుకున్నాడు (లేదా ఏర్పరచుకున్నాడు). ఈ కారణాన్ని బట్టి దేవుడు వారిని కాపాడుతూ, తన కృపలో భద్రపరుస్తూ వస్తున్నాడు. దేవుడు తన కాపుదలను పరిశుద్ధ దేవదూతల పట్ల తొలగిస్తే వారు కూడా పాపం చేస్తారేమో అయితే దేవుడు వారిని సంరక్షిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి.

“విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమియుచేయక, నేను చెప్పిన ఈ సంగతులను గైకొనవలెనని దేవుని యెదుటను, క్రీస్తుయేసు ఎదుటను, ఏర్పరచబడిన దేవ దూతలయెదుటను నీకు ఆనబెట్టుచున్నాను." 1 తిమోతి 5:21

ఇక్కడ పౌలు, "ఏర్పరచబడిన దేవదూతలు" అని దేవదూతలను సంభోదిస్తున్నాడు. దీనిని బట్టి దేవుడు మనుషులను ఎన్నుకున్నట్టు, దేవదూతలను కూడా ఎన్నుకున్నాడు అని అర్థమౌతుంది.

iv) దేవదూతల సంఖ్య లెక్కకు మించింది

దేవదూతలు ఎంతమంది ఉన్నారు అంటే అనేకులు అని వాక్యం చెప్తుంది.

“ఇప్పుడైతే సీయోనను కొండకును జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతల యొద్దకును " 1 తిమోతి 5:21

ఇక్కడ "వేవేలకొలది దేవదూతలు" అని అనువదించబడిన పదం ఇంగ్లీషులో "innumerable angels" అని ఉంది. అంటే లెక్కించలేనంతమంది అని అర్థం.

“మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, పెద్దలను ఆవరించి యున్న అనేక దూతల స్వరము వినబడెను, వారి లెక్క కోట్లకొలదిగా ఉండెను " ప్రకటన 5:11

“ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? " మత్తయి 26:53

“వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను" లూకా 2:13,14

ఈ వచనాలలో మనం గమనిస్తే, "కోట్లకొలదిగా", "పండ్రెండు సేనా వ్యూహములు", "పరలోక సైన్య సమూహము" అనే పదాలు గమనిస్తాము. దీనిని బట్టి దేవదూతల సంఖ్య లెక్కకు విస్తారమైనదని, లెక్కకు మించింది అని మనం అర్థం చేసుకోవచ్చు.

v) దేవదూతలలో వివిధ శ్రేణులు లేదా తరగతులు ఉన్నాయి

బైబిల్ లో దేవదూతల శ్రేణులు గురించి కొంచెం చెప్పబడింది. థామస్ అక్వినాస్ (Thomas Aquinas 1224-1274 AD) తన 'సమ్మా థియోలాజిక' (Summa Theologica) అనే పుస్తకంలో దేవదూతల శ్రేణుల గురించి వివరించాడు.

   • Seraphim (సెరాపులు), Cherubim (కెరూబులు), and Thrones (సింహాసనాలు);

   • Dominations (ఆధిపత్యాలు), Virtues (ప్రభావాలు), and Powers (శక్తులు);

   • Principalities (ప్రధానులు) , Archangels (ప్రధానదూతలు), and Angels (దూతలు)

ఈ శ్రేణుల్లో పరిశుద్ధ దూతలు మరియు పతనమైన దూతలు ఉన్నారు. దూతలకు వాక్యంలో ఈ పేర్లు అన్వయించబడినప్పటికీ, ఇవి దూతల శ్రేణులు అని వాక్యంలో స్పష్టమైన వివరణ లేదు. సెరాపులు, కెరూబులు, మరియు ప్రధానదూతలు అనే మూడు భిన్నమైన శ్రేణులు ఉన్నట్టు గమనిస్తాం. ఈ మూడు శ్రేణుల్లో ఉన్న దూతలు, పరిశుద్ధ దూతలు. సెరాపులు, అన్ని దేవదూతలకంటే హెచ్చయినవారు అని కొందరు చెప్తారు, ఎందుకంటే యెషయా 6:2,3 ప్రకారం వీరు దేవుని చుట్టూ ఉండి దేవుని స్తుతిస్తున్నారు, అంటే దేవునికి చాలా సమీపంలో ఉన్న దేవదూతలు గనుక వీరు అత్యున్నతమైనవారు అని కొందరు అభిప్రాయపడతారు. ఇంకొందరు ప్రధానదూతలు (Archangels) అని పిలువబడేవారు దేవదూతలలో అత్యున్నతులు అని చెప్తారు. ఎందుకంటే మిఖాయేలు గురించి మనం చూస్తే అతను సాతానుతో పోరాడాడు అని చూస్తాం.

ప్రధానదూతల గురించి కొన్ని విషయాలు చూద్దాం:

“పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను. ఇంక పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను, అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ యధిపతియగు మిఖాయేలు గాక యీ సంగతులనుగూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు" దానియేలు 10:13,21

“అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించినప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను" యూదా 1:9

“అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా " ప్రకటన 12:7

ఈ వచనాలను గమనిస్తే, మిఖాయేలు ఒక ప్రధానదూత అని చెప్పబడింది. ప్రధానాధిపతులు అయిన దేవదూతలు ఒకరికంటే ఎక్కువమంది ఉన్నారు, అందుకే "ప్రధానాధిపతులలో మిఖాయేలను ఒకడు" అనే మాటను దానియేలు గ్రంథంలో చూస్తున్నాం. అంతమాత్రమే కాకుండా ప్రధానాధిపతి కొందరు దూతలకు పై అధికారిగా ఉంటాడు, అందుకే "మిఖాయేలును అతని దూతలును" అనే మాట ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. సుడిపిగ్రాఫా (pseudepigrapha) గ్రంథాలలో ఒకటైన హనోకు గ్రంథంలో (ఈ గ్రంథాలు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాసినవి కావు) ప్రధానదూతలు (Archangels) 7గురు మంది అని చెప్పబడింది , అందులో గాబ్రియేలు దూత పేరు కూడా ఉంది. అయితే వాక్యంలో గాబ్రియేలు దూత ప్రధానదూతనా? కాదా? అనే వివరణ ఇవ్వబడలేదు. ఏదేమైనప్పటికీ ప్రధానదూతలలో ఒకడైన మిఖాయేలు గురించి వాక్యంలో చాలా విషయాలు మనం చూస్తాం.

కెరూబులు గురించి వాక్యంలో అనేక చోట్ల మనం చూస్తాం. కొన్ని ఉదాహరణలు చూద్దాం:

“అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను" ఆది 3:24

“కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను " కీర్తన 18:10

ఇక్కడ "కెరూబులను" దేవుడు ఏదేనును కాచుటకు తూర్పు దిక్కున పెట్టాడు అని చూస్తున్నాం. దీనిని బట్టి కొందరు కెరూబులను Guarding Angels (కాపలా దూతలు) అని చెప్తారు. ఇంకా ఈ కెరూబుల మీద దేవుడు ప్రయాణిస్తాడు అనే భావాన్ని కీర్తనలో చూస్తున్నాం. బహుశా ఎలియాని తీసుకుపోయిన "అగ్ని గుఱ్ఱములు" ఈ కెరూబులేనేమో!

అదేవిధంగా పతనమైన దూతల పేర్లు కూడా వాక్యంలో కొన్ని ఇవ్వబడ్డాయి. ఈ క్రింది వచనాన్ని చదువుదాం:

“ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము " కోలొస్సి 1:16

ఇక్కడ "ప్రధానులు", "అధికారులు", "అంధకారసంబంధులగు లోకనాథులు", "దురాత్మల సమూహములు" అనే పేర్లు పతనమైన దూతలకు ఇవ్వబడ్డాయి. దీనిని బట్టి పతనమైన దూతలలో కూడా వివిధ శ్రేణులు ఉన్నాయి అని అర్థమౌతుంది.

vi) దేవదూతల పని ఏమిటి

దేవదూతలు చేసే అనేక పనులలో మూడు ప్రధానమైన వాటిని ఇక్కడ వివరించాను

   1) పరిచర్య (Ministering)

  2) రాయబారం (Messengers)

   3) దేవుని ఆరాధించడం (Worshipping The LORD)

దేవదూతలు దేవునికి లోబడతారు. ప్రభువు చెప్పినట్లు వారు చేస్తారు.

“వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? " హెబ్రీ 1:14

 

ఇక్కడ దేవదూతలు ఎవరికి పరిచర్య చేస్తున్నారో చెప్పబడింది — రక్షణ పొందబోవువారికి, రక్షించబడినవారికి. వారు చేసే పరిచర్య మనకు కనబడకపోవచ్చు, అయినప్పటికీ వారు మనకు పరిచర్య చేస్తున్నారు (భౌతికంగా/ఆధ్యాత్మికంగా) మనలను దేవుని ఆజ్ఞను బట్టి కాపాడుతున్నారు. ఉదాహరణకు, దేవుని చిత్తాన్ని బట్టి దేవదూత పేతురును చెరసాలలోనుండి బయటకు తీసుకువచ్చిన విషయాన్ని మనం ప్రస్తావించొచ్చు.

“ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రముపైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను." అపొ.కార్య 12:7-9

దూత ఇక్కడ పేతురుకు పరిచర్య చేసినట్టు మనం చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని బట్టి మరియు ఆయన ఆజ్ఞను బట్టి విశ్వాసుల జీవితాలలో ఉన్న అవసరాలను దేవదూతలు తీరుస్తారు అని ఇక్కడ తెలుస్తుంది. అయితే అవన్నీ మనకు కనబడకపోవచ్చు, తెలియకపోవచ్చు, దేవదూతలు మాత్రం వారి పరిచర్యను చేస్తూనే ఉంటారు.

దేవదూతలు రాయబారం తీసుకురావడం మనం బైబిల్ లో చాలాసార్లు చూస్తాం. దానియేలు, జెకర్యా, మరియ, ఇంకా అనేకులు దేవదూతల రాయబారం అందుకున్నవారు ఉన్నారు. ఉదాహరణకు ఈ క్రింది వచనాన్ని పరిశీలిద్దాం:

“అప్పుడా దూత అతనితో జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టదువు." లూకా 1:13

ఇక్కడ, బాప్తిస్మమిచ్చు యోహాను తండ్రి అయిన జెకర్యాకు దేవదూత ప్రత్యేక్షమై, దేవుని మాటలను (దేవుని చిత్తాన్ని) తెలియజేసినట్టు మనం చూస్తున్నాం. అదే విధంగా యేసు క్రీస్తు జననం గురించి మరియకు గాబ్రియేలు దూత తెలియజేసాడు.

దేవదూతలు సహాయకులు అనే మాటను మనం ఆలోచిస్తే, వారు కొంతమంది విశ్వాసులకే పరిచర్య చేస్తారు, కొందరికి చెయ్యరు అని ఏమి లేదు, అందరికి ఎదో రకంగా దేవదూతలు పరిచర్య చేస్తారు. ఈ క్రింది వచనాన్ని చూద్దాం:

“ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను." మత్తయి 18:10

ప్రతి విశ్వాసికి దేవుడు తన దూతలను పరిచర్య చేయడానికి నియమించాడు అనేది సత్యం.

దేవదూతలు దేవుని ఆరాధిస్తారు, హెబ్రీ గ్రంథంలో తండ్రి మాట్లాడుతూ, "దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు". ప్రకటన గ్రంథంలో మనం చూస్తే, "దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును ఆ నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమేన్‌; యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్‌" (ప్రకటన 7:11,12)

దేవదూతలు చేసే పనిని కీర్తనకారుడు చాలా చక్కగా వర్ణించాడు -

“యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి." కీర్తన 103:20,21

vii) దేవదూతల గురించిన అత్యాసక్తి

వాక్యంలో మనకు బయలుపరచబడినదానికంటే ఎక్కువగా ఏ విషయం గురించి మనం తర్కించాల్సిన అవసరం లేదు. దేవుడు మనకు అవసరమైన విషయాలను తన వాక్యంలో బయలుపరిచాడు. అదేవిధంగా దేవదూతల గురించి మనకు ఎంత అవసరమో అంత వివరణ వాక్యంలో పొందుపరిచాడు. దేవదూతల గురించి వాక్యంలో పొందుపరచబడిన విషయాలను గ్రహించడానికి వాక్యాన్ని ధ్యానించడంలో తప్పేమీ లేదు, అయితే వాక్యంలో దేవుడు చెప్పని విషయాలను దేవదూతలకు ఆపాదించి, మాకు దేవదూతల దర్శనం కలిగిందని, దేవదూతలు కొత్తగా వాక్యంలో లేని విషయాలను మాకు బయలుపరుస్తున్నాడు అని, లేదా దేవదూతలు జరగబోయే విషయాల గురించిన వివరణ మాకు తెలియజేస్తున్నాడు అని చెప్పి జనాలను మోసం చేసేవారు అనేకులు ఉన్నారు, ఇది చాలా ప్రమాదకరం.

గుర్తుంచుకోండి వాక్యంలో దేవుడు చెప్పనిదాని గురించి మనం ఊహించాల్సిన అవసరం లేదు. "మరి కొన్ని విషయాలు ప్రత్యేక్షంగా లేవు కదా, వాక్యంలో ఉన్న వివరాలను బట్టి వాటిని అర్థం చేసుకోవచ్చు" అని నేనంటే అది కూడా చేయకూడదా అంటారేమో; నేను ఆలా చెప్పట్లేదు. నా మాటలు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం:

1 కొరింథీ 13:1 లో పౌలు, "మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను" అని అంటున్నాడు. దీనిని ఆసరాగా తీసుకొని సంఘంలో అనేకులు తాము అన్యభాషలలో మాట్లాడుతున్నాము అంటూ ఎదో పిచ్చి పిచ్చి శబ్దాలు చేసి అవే దేవదూతల భాషలు అంటున్నారు. ఒకరు, 'రాబసీఖ, షాకాటబ' అంటే ఇంకొకరు 'సరాలను సీకర్రెల్హ్స్' అని ఇంకేవేవో పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. మరి వాక్యంలో దేవదూతల భాష ఏంటో చెప్పలేదు గనుక వీటిని మనం అగీకరించొచ్చా, తర్కించాల్సిన అవసరం లేదా అనంటే కచ్చితంగా ఉంది.

దేవదూతలు దేవుని ప్రజలతో తాము ఆ ప్రాంతంలో ఉన్న భాషనే మాట్లాడారు. ఉదాహరణకు, దానియేలుతో దేవదూత మాట్లాడినప్పుడు, దానియేలుకు అర్ధమయ్యే భాషలోనే మాట్లాడాడు అని మనం గ్రహించాలి, దానియేలుకు హెబ్రీ మరియు ఆరామిక్ భాషలు వచ్చు గనుక, తనకు దేవుని మాటలు తెలియజేయడానికి వచ్చిన దేవదూత కూడా అదే భాష మాట్లాడి ఉండాలి. ఇక్కడ పౌలు మాటలలో ఉన్న ఉద్దేశం దేవదూతలు ఒక భాష ఉందా అని నిరూపించడానికి కాదు గాని, అది ఒక అలంకరంగా వాడబడింది అని అర్థం చేసుకోవాలి. దేవదూతలు ఒక భాష ఉన్నప్పటికీ, అది అర్థంపర్థం లేని పిచ్చి పదాలు మాత్రం కాదు అని గ్రహించాలి. దేవదూతల భాష గురించిన వివరణ వాక్యంలో లేదు గనుక మేము మాట్లాడేది దేవదూతల భాష అని ఎవరైనా చెప్తే అది పచ్చి అబద్ధం.

బైబిల్ లో ఏ మాటనైనా పూర్తి వాక్యపు వెలుగులో వివరించాలి, వాక్యంలో లేనివి తెచ్చి బైబిల్ మాటలకు కలిపి కొత్త బోధలు సృష్టించకూడదు. ఇక్కడ నేను ఇందాక చెప్పిన విషయాన్నీ మళ్ళి చెప్తున్నాను, వాక్యంలో మనకు బయలుపరచబడనివి మనకు అవసరం లేదు.

దేవదూతలు మనకు పరిచర్య చేసేవారిగా ఉన్నారు గనుక వారికి మనం ఆఙ్ఞాపించాలి అని, నీకంటూ ఒక దేవదూత కాపలాగా ఇవ్వబడ్డాడని, వాక్యం చెప్పని అనేక విషయాలు తమ ఊహను బట్టి కొందరు చెప్తుంటారు. అలంటి వారితో జాగ్రత్త, వారు చెప్పేది వాక్యంలో నీకు కనబడకపోతే, నీవు వాక్యాన్ని అంటిపెట్టుకొని, ఆ బోధకులను వదిలేయడమే ఉత్తమం.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.