దుర్బోధలకు జవాబు

రచయిత: డా॥ జీవరత్నం బూరగ
చదవడానికి పట్టే సమయం: 2 గంటల 32 నిమిషాలు

విషయసూచిక

పరిచయం

ఉపోద్ఘాతం

1. మొదటి అధ్యాయము - ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందడం ఎప్పుడు?

2. రెండవ అధ్యాయము - పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నింపుదల – ఈ రెండు వేరువేరా లేక ఒకటేనా?

3. మూడవ అధ్యాయము - క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడడంలోని అంతరార్థం, దాని ఆవశ్యకత ఏమిటి?

4. నాల్గవ అధ్యాయము - పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించిన గుర్తులేవి?

5. ఐదవ అధ్యాయము - భాషల గందరగోళం ఏంటి?

6. ఆరవ అధ్యాయము - ఈనాడు అపొస్తలులున్నారా?

7. ఏడవ అధ్యాయము - ఈనాడు ప్రవక్తలున్నారా ?

8. ఎనిమిదవ అధ్యాయము - ఈనాడు కూడా దేవుడు స్వస్థపరుస్తాడా ?

9. తొమ్మిదవ అధ్యాయము - కలలు, దర్శనాలు, స్వరాల సంగతేంటి?

10. పదియవ అధ్యాయము - సంపూర్ణ సువార్త ఎంత సంపూర్ణము ?

11. పదకొండవ అధ్యాయము - పెంతెకోస్తువారు రక్షణ శాశ్వతమైనదని ఎందుకు నమ్మరు ?

పరిచయం

ఈ గ్రంథకర్తతో, గ్రంథ విషయంతో నన్ను సమైక్యం చేసుకోవడం నాకు ముదావహం, మహా గౌరవప్రదం. గ్రంథకర్తకు దేవుని వాక్యము యెడలగల భక్తి ప్రతిపత్తులకు, గ్రంథంలోని విషయ నిర్దిష్టతకు గ్రంథకర్త, గ్రంథం శ్లాఘనీయులు.

ప్రస్తుతదినాలు సంఘాలకు, బైబిల్ కళాశాలలకు దుర్దినాలు. కొందరు ఈ దినాలను అనువైన రీతిగా ఎదుర్కొనడం లేదు. ఈ దినాలను ఎదుర్కొని పొరాడడానికి కావలసిన దేవుని వాక్యజ్ఞానం పలువురు నాయకులకు లేదు. కొందరు సమస్యను అలక్ష్యము చేస్తున్నారు; మరికొందరు సమస్యను గూర్చి భయకంపితులగుతున్నారు. అందుచేత దుర్బోధలు మూలసిద్ధాంత పునాదుల్ని పెకలింప చూస్తున్నాయి.

ఈ మోసకర ప్రపంచంలో మనమంతా అతి మెలుకువగా నడవాల్సి వుంది. ఈ గ్రంథకర్త డా॥ బూరగ గారు ఎడతెరిపి లేకుండా సత్యాన్ని గట్టిగా పట్టుకొని, కారిస్మాటిక్ ఉద్యమస్థుల దుర్బోధలను గుర్తించి ఈ చివరిదినాలలో వారు కలిగిస్తున్న గలిబిలిని లోకానికి వెల్లడిజేసి, ప్రసంగాల ద్వారా, తన రచనల ద్వారా చాటి చెపుతున్నారు. వారి రచనలన్నింటిలోను సత్యపు పునాదులను కూలగొట్టడానికి యత్నించే ఏదో ఒక దుర్బోధను వెలుపలికి తెచ్చి దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ రీతిగా ఈ పుస్తకంలోను సత్యాన్ని సమీకరించి ఎలుగెత్తి చాటుచున్నారు. దాని ఫలితం విశ్వాసాన్ని బలంగా ధృడపరచడమే.

భాషల్లో మాట్లాడడం, స్వస్థతలు, కలలు, దర్శనాలు అన్న ఈ విషయాలను చర్చించి డా|| బూరగ గారు నిజమైన పునాదిని ప్రస్తావిస్తూ ఒకేమారు విశ్వాసులకు అనుగ్రహింపబడిన విశ్వాసాన్ని ధృడపరుస్తున్నారు. ఈ పెంతెకోస్తువారి దుర్బోధలను బట్టబయలు చేయడానికి మనకందరికీ స్థైర్యాన్ని, పటువైన సాధనాన్ని అందిస్తున్నారు. పెంతెకోస్తువారు, లేనిది సువార్తకు చేర్చి ప్రభువైన యేసుక్రీస్తుకు చెందవలసిన మహిమను పక్కతోవ పట్టిస్తున్నారు. దేవుని వాక్యానికి వున్న అసలు భావానికి వారిని వారు లోపరచుకోక ఈ 20వ శతాబ్దంలో వారు మహా అపచారము చేస్తున్నారు.

అధునాతన భాషల ఉద్యమాన్ని ఏ పేరుతో పిలిచినా, లేక ఏ విధంగా నిర్వచించినా అది నూతన నిబంధన పరిశుద్ధాత్మ సిద్ధాంతాన్ని ప్రతిబింబించుట లేదు. ఈ గ్రంథకర్త దీర్ఘకాలంగా సత్యం కోసం సాగిస్తున్న పోరాటపు ప్రతిఫలమే ఈ గ్రంథమని గుర్తించి నేను శ్లాఘిస్తున్నాను. ఈ గ్రంథం నా సాక్ష్యానికి కలుగజేసే పోద్బలం నిమిత్తం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అనేకుల నేత్రాలను తెరవడానికి ప్రభువు ఈ గ్రంథాన్ని వాడుకొంటాడని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను.

19 మార్చి 1993.

డా. బ్రయాన్ వెన్ హామ్

DR. BRIAN WENHAM, B.E., D.D. Australia.

 

ఉపోద్ఘాతం

అనేక సంవత్సరాలుగా పెంతెకోస్తువారి పదభ్రష్టత నా మనస్సులో చాలా భారంగా ఉండింది. ఈ అంశంపై అప్పుడప్పుడు "బైబిల్ బీకన్"లో వ్యాసాలు వ్రాశాను. ప్రస్తుతం పుస్తకరూపంలో వాటిని అందించే సమయం ఆసన్నమైందని విశ్వసిస్తున్నాను.

పెంతెకోస్తువారు, కరిస్మాటిక్ వారు, సాధారణంగా చెప్పుకొంటే (జీసస్ ఓన్లీ గుంపు మినహా) పరిశుద్ధాత్మ దేవత్వాన్ని, త్రిత్వాన్ని నమ్ముతారు. అయితే పెంతెకోస్తు ఉద్యమం తండ్రి కుమారులను త్రోసిపుచ్చి పరిశుద్ధాత్మను హెచ్చిస్తుంది. క్రొత్త నిబంధన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్న క్రమాన్ని మార్చి పరిశుద్ధాత్మ, కుమారుడు, తండ్రిగా తికమక చేసారు. అయితే పరిశుద్ధాత్మ తనను గూర్చి కాక క్రీస్తును గూర్చి మాట్లాడవలసి వుంది. తండ్రి కుమారులు ఆయన్ని ఈ లోకములోనికి పంపించారు. కుమారుణ్ణి లోకానికి వెల్లడిచేసి మహిమపరచే బాధ్యత ఆయనకు అప్పగింపబడ్డది (యోహాను 16:13-15).

పైగా పెంతెకోస్తు తత్త్వం దేవుని వాక్యాన్ని ప్రక్కన బెట్టి అనుభవాలు, అనుభూతులపై ఆధారపడి వుంది. “బైబిల్లో లేకపోవచ్చు గాని ఇది నా అనుభవం” అన్న అనురుక్తి ఈ గుంపుల్లో తరచుగా వింటాం. బైబిలు ప్రకటనలకు ఏలాంటి పొత్తు లేకుండనే “ప్రభువు ఇది నాకు చూపాడు" లేక “ప్రభువు ఇది నాతో చెప్పాడు" మొ||లైనవి తరచుగా వీరు చెప్పుకోవడం వింటాం. ఈరీతిగా అనుదిన విషయాలను గూర్చే కాక భవిష్యత్తు విషయాలను గూర్చి, పరలోకములో జరగబోయే విషయాలను గూర్చి కూడ మాట్లాడతారు. కలలు, దర్శనాలు, దివ్యవాక్కులు మొదలైన అనుభవాలు బైబిలుకు అతీతమైన ప్రత్యక్షతలకు సాధనాలయ్యాయి. ఆరీతిగా బైబిలును అసందర్భముగాను, నిరర్థకంగాను చేస్తున్నారు. తత్ఫలితంగా ఒక పక్షంలో బైబిలును దాటివేస్తున్నారు; మరో పక్షంలో తమ ఆత్మ గత లేక పారవశ్యక అనుభవాలను ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనాలుగా చూపుకొంటున్నారు. పెంతెకోస్తు ఉద్యమంలో చెప్పకోదగ్గ ఒక్క బైబిలు వ్యాఖ్యాత కూడ లేకపోవడానికి ఇదే కారణం. వారి పఠనాంశం బైబిల్లో లిఖితపూర్వకంగా ప్రత్యక్షం చేయబడ్డ దేవవాక్యం కాదుగాని దానికి బదులుగా దేవుని వాక్యంగా ఊహింపబడుతున్న వారి భావోద్రేక అనుభవాలే. భాషలు మాట్లాడడం పెంతెకోస్తువారికి ప్రత్యేకమైన ట్రేడ్ మార్కుగా వుంది, వారి విచిత్ర వర్తనకు సాదృశ్యంగా వుంది. ఇదే పెంతెకోస్తువారి ఆటబొమ్మ. ఈ భాషల సందర్భంలో, 'బాషలే పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి నిర్దిష్టమైన గుర్తు' అన్నదే ఇప్పుడు వివాదాంశం. 'భాషలు ప్రత్యక్షం కాకుంటే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందలేదు' అని వారి అర్థం. ఈలాంటి వాదనకు లేఖనాల్లో ఏ ఆధారమూ లేదు. ఈ 'పరిశుద్ధాత్మ బాప్తిస్మం' ఒక వ్యక్తి మారుమనస్సు పొందినప్పుడు కాక ఆటు తరువాత ఎప్పుడో కలిగే అనుభవంగా వారు వాదిస్తారు. దీనిని బట్టి క్రీస్తునందలి విశ్వాసికి దేవుని వాగ్దానానుకూలంగా రక్షణలో కలుగు ఉచిత స్వాస్థ్యాన్ని వారు లేదంటున్నారు. ఈ వాదనను బట్టి క్రీస్తునందలి కోట్లాది విశ్వాసులు ఆత్మలేని రక్షణ అనే స్థాయికి త్రోయబడుతున్నారు. అదే సమయంలో భాషలతో మాట్లాడినవారు పరిశుద్ధాత్మను పొందామని, దానితోపాటు పాపరహితమైన పరిపూర్ణతను కూడ పొందామనుకుంటున్నారు.

అయితే పెంతెకోస్తువారి సంఘాల్లోనే యింకను భాషల్లో మాట్లాడలేకపోయినవారు భయాందోళనల్లో సతమతమగుచు రక్షింపబడ్డామా లేదా అన్న అనిశ్చయతలో కుమిలిపోతున్నారు. ఇది శోచనీయం. మరి యితరులు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది భాషల్లో మాట్లాడి సాధించగల్గింది ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏం మెరుగు కాదు - వారు కూడ ఏ క్షణములో రక్షణను జారవిడచుకొంటామోనన్న భయాందోళనల్లో తటపటలాడుతున్నారు. పెంతెకోస్తువాదం, విశ్వాసి రక్షణ నిశ్చయతను అంగీకరించదు.

స్వస్థతసభలు పెంతెకోస్తు ఉద్యమంలో మరో విశేషం. ఈ సభల్లో సువార్తకంటే స్వస్థతకు ఎక్కువ ప్రాధాన్యత వుంది. ఆత్మరక్షణ కంటే శారీరక స్వస్థత ప్రాముఖ్యత వహిస్తుంది. ఊహాత్మకమైన, విడ్డూరమైన సంఘటనలను సాధించామని స్వస్థపర్చేవారు చెప్పుకోవడంతో ప్రభువు నామానికి అపకీర్తి, ఆశతో వచ్చినవారికి నిరాశ, నిస్పృహలను కలిగిస్తున్నారు. ఈ సంఘటనలన్నీ బాధాకరంగా వున్నాయి. నిజాయితీపరులైన క్రైస్తవులు తప్పుత్రోవలకు నడిపింపబడుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టడం లేక తప్పుగా వాఖ్యానించడం చేస్తున్నారు. విశ్వాసులకు పరిశుద్ధాత్మ లేదంటున్నారు. రక్షింపబడినవారికి నిత్యభద్రత నిరాకరిస్తున్నారు. అపొస్తలుడైన పౌలు భాషలు మాట్లాడుట అన్న వరం అతి అప్రధానమైనదని చూపిస్తే వీరు అత్యంత ప్రాముఖ్యమైనదిగా చూపిస్తున్నారు. అసాధారణంగా ఈనాడు అద్భుతాలకు, సూచనలకు ఆరాటం పెరిగిపోయింది.

ప్రపంచమంతటా ఈ కరిస్మాటిక్ విజృంభణ బైబిలును విశ్వసించు నాయకులకు కలవరం కలిగిస్తుంది. వాస్తవానికి ఈనాడు కరిస్మాటిక్ ఉద్యమం పెంతెకోస్తు సంఘాలకు మాత్రమే పరిమితమైలేదు. అన్ని ప్రొటెస్టెంట్, కేథలిక్ మత శాఖల్లోకి అది చొచ్చుకుపోయింది. బైబిలును విశ్వసించు సౌవార్తిక సంఘాలు కూడ దాని ప్రభావము నుండి పూర్తిగా తప్పించుకోలేకపోయినాయి. ఈ ఉద్యమాన్ని ప్రపంచ సంఘముల సమాఖ్య (World Council of Churches) సమ్మిళిత సాధనంగా పిలవడం సరిపోతుంది.

సౌవార్తిక సంఘనాయకులు తమ సంఘాలు కూడ పెంతెకోస్తువారి ప్రభావానికి గురయ్యాయని కలవరం చెందుతున్నారు. అయితే ఈ నాయకులు తమ సంఘాల్లో పరిశుద్ధాత్మను గూర్చిన సిద్ధాంతాన్ని కూలంకుషంగా పఠనం చేసి తమ ప్రజలకు బోధించక పోయినందువల్ల ఈ పరిస్థితికి పరోక్షంగా తామే బాధ్యులన్న సంగతి మర్చిపోయారు. బహుశ ఈ నాయకులే పరిశుద్ధాత్మను గూర్చిన సత్యాన్ని సంపూర్ణంగా నేర్చుకోలేదేమో. వారిలో కొందరు తాముకూడ పెంతెకోస్తు సిద్ధాంతానికి వత్తాసు పలుకుతున్నారని ప్రజలు అపార్థము చేసుకొంటారన్న భయంతో పరిశుద్ధాత్మ సిద్ధాంతాల్ని గట్టిగా బాహాటంగా చెప్పలేకపోతున్నారు.

బైబిలు సిద్ధాంతాల విషయంలో ప్రజలకు క్రైస్తవ మౌలిక సిద్ధాంతాల్లో పునాది లేకపోవడంతో వారు తమ జీవితాల్లో ఒకలాంటి శూన్యతను అనుభవిస్తూ, ఈ శూన్యతను నింపుకోవడానికి భావోద్రేకాలను రెచ్చగొట్టి పారవశ్యక అనుభవాలవైపు మళ్ళించబడతారు.

ఈ సందర్భంలో ఈ గ్రంథాన్ని మీకందించడానికి నేను ప్రోత్సహింపబడ్డాను. రక్షణ నిత్యభద్రత అన్న బైబిలు సిద్ధాంతాన్ని ప్రస్ఫుటంగా మనం బోదించాలి. ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాడు. ప్రతి విశ్వాసిలోను పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. ప్రతి విశ్వాసి ఆత్మచే ముద్రింపబడి, అభిషేకింపబడియున్నాడు కూడ. పరిశుద్ధ జీవితమే పరిశుద్ధాత్మకు ఖచ్చితమైన సూచన - భాషలు, కాదు మరేమీ కాదు. పెంతెకోస్తువారి ఉద్ఘాటనలు వాక్యానుసారము కావని, ప్రమాదకరమని దేవుని వాక్యపు వెలుగులో మనం అందరికీ చాటి చెప్పాలి. క్రైస్తవులను ఈలాగు హెచ్చరించవలసిన బాధ్యత మన మీద వుంది. ఈ గ్రంథం ఈ ప్రయత్నంలో సాధకము కాగలదని నా నమ్మకం.

సికింద్రాబాదు.
ఇట్లు,
ప్రభువు సేవలో
19-8-93
డా॥ జీవరత్నం బూరగ

కృతజ్ఞతలు

ఈ గ్రంథం ప్రప్రథమంగా ఇంగ్లీషులో రచించబడ్డది. ఈ గ్రంథాన్ని ఆంధ్రీకరించిన డా|| జోబ్ సుదర్శనం గారికి, భారత్ బైబిలు కాలేజి రిజిస్ట్రార్ రెవ.ఆర్.మోజెస్ ప్రేమానందంగారికి గాఢంగా ఋణపడివున్నాను. గతంలో మా విద్యార్థి, ప్రస్తుతం భారత్ బైబిల్ కాలేజిలో అధ్యాపకులుగా వున్న సహో|| సి.హెచ్.ఎలీఫజ్ గారు ముద్రణా బాధ్యతలను వహించి ఈ గ్రంథాన్ని బయటకు తెచ్చుటలో సహకరించినందులకు ఆయనను అభినందిస్తున్నాను. మా ముద్రణాలయం వారు ఈ గ్రంథాన్ని బయటకు తెచ్చుటలో మెచ్చుకోదగిన పనిని చేసారు. వారి కృషికై వారిని అభినందిస్తున్నాను.

ఈ పుస్తకంలోని సత్యాలను అనగా పెంతెకోస్తు గలిబిలిని ముఖచిత్రములో చక్కగా చిత్రించిన సహోదరుడు గుడిపాటి జెకర్యాగారికి నా నిండు కృతజ్ఞతలు. నాకెల్లప్పుడు ఆయన నడుపుదలను సహాయాన్నిచ్చి ఈ గ్రంథరచనలోను, ప్రచురణలోను నాకు సమస్తం దయచేసిన నా ప్రభువునకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. ఈ గ్రంథానికి పరిచయ వాక్కులు వాసిన నా స్నేహితుడు డా|| బ్రయన్ వెన్ హామ్ గారికి నా కృతజ్ఞతలు. - గ్రంథకర్త

మొదటి అధ్యాయము

ఒక విశ్వాసి పరిశుద్ధాత్మను పొందడం ఎప్పుడు?

ఈ అంశంపై నూతన నిబంధన అంతిమ బోధ ఏదంటే రక్షింపబడిన అనగా తిరిగి జన్మించిన ప్రతివ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. రోమా 8:9 ప్రకారము పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో లేకుంటే అతడు దేవునికి చెందినవాడు కాడు. “దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే కాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలేనివాడైతే వాడాయనవాడు కాడు”.

శిష్యుల యెడల తండ్రి వాగ్దానము నెరవేరునంత వరకు అనగా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేంత వరకు వారు వేచియుండాలని ప్రభువు చెప్పిన విషయాన్ని, పెంతెకోస్తు దినం వరకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడలేదు అన్న విషయాలను (అపొ.కా. 2 అధ్యా.) మన దృష్టికి తీసుకొని రావటానికి కొందరు ప్రయత్నిస్తారు. అంతేగాక అపొ. కా. 8వ అధ్యాయంలో ఫిలిప్పు పరిచర్య వల్ల రక్షింపబడిన సమరయలోని విశ్వాసులు కూడా పేతురు, యోహానులు యెరూషలేము నుండి వచ్చి ప్రార్థన చేసిన తరువాతనే ఆత్మను పొందారని కూడా సూచిస్తారు. అపొ.కా. 19వ అధ్యా.లో బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యుల విషయం కూడా తీసుకువచ్చి రక్షణ పొందిన తరువాత ఆత్మను పొందడానికి కొంత సమయం అవసరమని వీరు వాదిస్తారు. ఆ ఎఫెసి విశ్వాసులు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొంది, అపొస్తలుడైన పౌలు వారిపై చేతులుంచిన తరువాతనే ఆత్మ వారి పైకి వచ్చినట్టుగా అక్కడ చూస్తున్నాం.

పెంతెకోస్తువారి ఉద్దేశం - అపొస్తలుల కాలంలో ఎలా జరిగిందో ఇప్పుడూ అలాగే జరగాలని. అదే పద్ధతిలో ఇప్పుడూ జరగాలన్న మాట నిజంగా సమర్థనీయం కాదు. పరిశుద్ధాత్మ నడిపింపు క్రింద అపొస్తలులు క్రొత్త నిబంధన లేఖనాలను మనకు అందించారు. ఈనాడు క్రొత్త నిబంధనకు చేర్చదగినదేదైనా లేఖన ప్రత్యక్షత మనలో ఎవరికైనా కలిగిందా? అంతేగాక ఆదిక్రైస్తవులు పరిశుద్ధాత్మను ఎలా పొందారో గుర్తించదగిన ఒక క్రమబద్ధమైన పద్ధతి అపొ. కార్యాలలో మనకు కనిపించదు. ఉదాహరణకు సమరయ విశ్వాసులకు, యోహాను శిష్యులకు సంబంధించినంతవరకూ వారు క్రీస్తును నమ్మిన తరువాత పరిశుద్ధాత్మను పొందేంతవరకు కొంత వ్యవధి వున్నది. అయితే అపొ. కార్య. 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటివారి విషయంలో ఇలాంటిదేమీ కనిపించదు. వారు నమ్మినప్పుడే పరిశుద్ధాత్మ వారి పైకి దిగివచ్చాడు. రెండవదిగా అపొ.కార్య. 8, 19 అధ్యాయాల్లో ఆత్మ రావడానికి ముందు అపొస్తలులు హస్తనిక్షేపణ చేసారు. అయితే 10వ అధ్యాయంలో ఇది లేదు.

మూడవదిగా అపొ.కార్య. 10, 19 (2వ అధ్యా.లో కూడా) అధ్యాయాల్లో ఆత్మ దిగిరావడంతో బాటు భాషలు మాట్లాడడం కనిపించినట్టు మనం చదువుతున్నాము. అయితే 8వ అధ్యా.లో భాషల ప్రసక్తి లేదు. కాని 8:18లో ఆ సందర్భంలో సీమోను చూచినదానిని దీనితో మనం సరిపోల్చుకోవలసి వుంటుంది.

పెంతెకోస్తు దినాన జరిగిన సంఘటన (2వ అధ్యా.,) ఒక అసమానమైనది. తిరిగి జరిగేది కాదు. పెంతెకోస్తు మరల సంభవించాలనడం దాని చారిత్రక ప్రాధాన్యతను వెనకినెట్టడమే అవుతుంది. పెంతెకోస్తు దినముననే యోవేలు ప్రవచనం నెరవేరింది. ఆనాడే—మరోనాడు కాదు. పరిశుద్ధాత్ముడు శాశ్వతంగా ॥ క్రీస్తునందలి విశ్వాసులలో నిలిచియుండడానికి (యోహాను 14:17) ఎలాంటి మినహాయింపు లేకుండగా అనుగ్రహింపబడ్డాడు (యోహాను 7:39). ఆనాడే సంఘం ఉద్భవించింది. యూదులు, అన్యులు ఒకే క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మం పొందారు (1కొరింథీ 12:13; ఎఫెసి 4:5).

తండ్రి వాగ్దానం కోసం కనిపెట్టవలసిందని ప్రభువు అపొస్తలులను ఆదేసించింది. పెంతెకోస్తు దినాన్ని దృష్టిలో వుంచుకొని. వారు కనిపెట్టవలసిన స్థలం యెరూషలేము. పెంతెకోస్తు తరువాత క్రొత్త నిబంధనలో ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టవలనన్న ఉపదేశం ఎక్కడా లేదు. విశ్వాసులు ఆత్మకోసము వేచివుండాలన్న ఉపదేశం పెంతెకోస్తు దినము వరకు మాత్రమే వర్తిస్తుంది.

సరే. మరి సమరయ క్రైస్తవుల మాటేమిటి? ఆత్మ కొరకు కనిపెట్టమని వాళ్ళకు కూడా ఎవరూ చెప్పలేదు. వీరి విషయంలో వేచియున్నది పరిశుద్ధాత్ముడే సుమా. యెరూషలేము నుండి అపొస్తలుల రాకకొరకు పరిశుద్ధాత్మ కనిపెట్టాడు. సమరయలో ఆత్మ ప్రత్యక్షత యెరూషలేములో పెంతెకోస్తునాడు జరిగిన సంభవానికి ముడిబడి వుందని నిరూపించడానికి అపొస్తలులు ఈ సందర్భములో సమరయలో వుండటం అవశ్యకమని గుర్తించాలి.

ఎఫెసులోని యోహాను శిష్యుల విషయంలో నిజానికి వారు ఆత్మకొరకు కనిపెట్టిందేమీ లేదు. వారు నిజంగా క్రీస్తులో నమ్మకముంచారా అని రూఢిపరచుకోవడానికి పౌలు వేచి చూచాడు. వారి విశ్వాసానికి సాక్ష్యంగా వారు యేసు ప్రభువు నామంలోకి బాప్తిస్మం పొందినప్పుడు పౌలు వారిమీద తన చేతులుంచగా వారు ఆత్మను పొందారు.

ఏ విధంగా చూచినా అపొ.కా.ల్లో లిఖితమైనది తప్పనిసరిగా తుది సంఘటన కాదు. అది సంఘానికి ఎల్లప్పుడు నియమనిబంధన కాదు. సంఘములో విశ్వాసానికి, ఆచరణకూ అంతిమ అధికారంగా ప్రభువు స్థాపించినది అంతా అపొస్తలులు వ్రాసిన పత్రికల్లో ఉంది. ఒక సంగతి సువార్తలలో ప్రస్తావించబడి, అపొ. కార్యములలో నెరవేరడం మాత్రమే సరిపోదు. సంఘానికి దీర్ఘకాలం అన్వయింపుగా వుండేలా అది పత్రికలలో నిర్దేశించబడి వుండాలి.

నాలుగు సువార్తలు, అపొ.కార్యములు అనే ఈ పుస్తకాలు ధర్మశాస్త్రం, కృపాయుగాల సంధిలో జరిగిన వ్యవస్థాంతర చరిత్ర మాత్రమే. అపొ. కార్యములలో మనము చూసేది సంఘబాల్యానికి సంబంధించినది. పత్రికలైతే పరిపక్వత చెందిన సంఘాన్ని చూపిస్తున్నాయి. కాబట్టి అపొ.కా.ల్లో వ్రాయబడిన ఏదో ఒక సంఘటన సంఘానికి అంతిమ ఆదేశ సూత్రంగా పరిగణించరాదు.

అపొస్తలుల కార్యాల్లో కొందరు ఆత్మను పొందినప్పుడు కొన్ని బాహ్య గురుతులు కనిపించినందువల్ల ఇతర విశ్వాసుల విషయంలో బాహ్య గురుతులు కనిపించకపోవడంతో వారు పరిశుద్ధాత్మను పొందలేదని చెప్పలేం. కైసరయలో సంభవించినవాటిని సమర్థిస్తూ పేతురు (అపొ.కా. 10 అధ్యా., తనతో వాదిస్తున్న యూదులకు వెనుకటి పెంతెకోస్తు దినం జ్ఞాపకము చేస్తున్నాడు - "పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను” (11:15). అంటే పెంతెకోస్తు తరువాత యూదుల మధ్య ఆలాంటిది మరల జరుగలేదని ఇందువల్ల తెలుస్తుంది. అయితే అదేకాలములో అనేక మంది రక్షించబడి సంఘములో చేర్చబడ్డారని మనకు తెలుసు. పెంతెకోస్తుదినాన చేర్చబడిన మూడువేల మంది, అనుదినము వారితో చేర్చబడుతూ ఉన్నవారు (2:47), కుంటి వాడు బాగైన సంధర్భములో విశ్వాసముంచిన అయిదు వేల మంది (3వ అధ్యా.), విశ్వాసానికి విధేయులైన యాజకుల సమూహం (6:7), లుద్ద, షారోను ఊళ్ళలో నమ్మినవారు (9:35), యెప్పేలో దొరా తిరిగి బ్రతికినప్పుడు ప్రభువులో విశ్వాసముంచినవారు (9:42)_వీరంతా వారిలో ఉన్నారు. పెంతెకోస్తు దినాన జరిగినట్టు వీరికి జరుగలేదు గనుక వీరెవరూ కూడ పరిశుద్ధాత్మను పొందలేదనడం హాస్యాస్పదముగా ఉంటుంది.

ఇక పత్రికల్లోకి వస్తే వారు వీరని తేడా లేకుండా క్రీసునందు విశ్వాసముంచిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని నేర్చుకొంటున్నాము. ఆత్మను పొందండి అనిగాని, ఆత్మలో బాప్తిస్మము పొందండి అనిగాని ఎక్కడా క్రైస్తవులకు ఏ హెచ్చరికా ఇవ్వబడినట్టు చూడము.

ఈ విషయములో రోమా 8:9 నిష్కర్షగా ఉంది. ఆత్మ మనలో నివాసం చేయడం గురించి 8:11 కూడ చెప్తున్నది. ఇదే అధ్యాయం 15,16 వచనాలు మనం పొందిన ఆత్మ కుమారత్వానికి చెందిన ఆత్మ అని తెలియజేయుచున్నవి. అంటే ఆత్మ మనలో నివసించడం ద్వారా మనము తిరిగి జన్మించాము లేక దేవుని పిల్లలమయ్యాము.

1 కొరింథీ. 8:16 ప్రకారము సంఘము - విశ్వాసుల సమూహమని, సామూహికముగా దానిలో పరిశుద్ధాత్మ నివసిస్తాడని చూస్తున్నాము. 6:19లో విశ్వాసుల దేహాలు పరిశుద్ధాత్మ నివాసాలు అని తెలుస్తున్నది. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మూలంగా మనందరం క్రీస్తు శరీరములో అవయవాలమయ్యామని 12:13 బోధిస్తుంది. ఇప్పుడు మనము చర్చిస్తున్న విషయానికి ఈ వాక్యభాగం చాలా ప్రాముఖ్యమైనది. పెంతెకోస్తు దినాన జరిగిన ఒక బాప్తిస్మము అప్పటి నుండి క్రీస్తు విశ్వాసులందరికీ వర్తిస్తుంది - "ఒక ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి.” ఒక పాపి తన పాపాలను గూర్చి పశ్చాత్తాపపడి క్రీస్తులో విశ్వాసముంచిన క్షణాన్నే అతడు ఆత్మబాప్తిస్మము పొందుతాడు. క్రీస్తు శరీరములో అవయవమౌతాడు. అందువల్ల ఏ విశ్వాసినీ ఆత్మ బాప్తిస్మము పొందమని హెచ్చరించవలసిన అవసరము లేదు. పెంతెకోస్తు దినాన జరిగిన బాప్తిస్మము (అపొ.కా॥ 1:5) మూలంగా శిష్యులు ఆత్మను  పొందారని చెప్పినట్టయితే (యోహను 7:39) అదే బాప్తిస్మంలో పాలుపొందిన మనం మరి ఆత్మను పొందలేదా ?

2 కొరింథీ 1:21,22 మనం ఆత్మాభిషేకం పొంది ఆత్మచే ముద్రించబడ్డామని, ఆత్మ అనే సంచకరువు మన హృదయాలలో మనకు ఇవ్వబడిందని బోధిస్తుంది (5:5; రోమా 8:23 కూడా చూడండి)

క్రీస్తులో విశ్వాసముంచిన ప్రతివాడు ఆత్మను పొందాడని గలతి 3:2 చెప్తుంది. రోమా 8:15లోని సత్యాన్నే గలతి 4:6 కూడా తెలుపుతుంది. మనలో ఉన్న ఆత్మ కుమారుడైన క్రీస్తు ఆత్మయే.

చివరిగా, ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాడని, మన స్వాస్థ్యానికి హామీగా పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడ్డాడని ఎఫెసి 1:13, 14 స్థిరపరుస్తుంది.

మనం ఇందుమూలముగా నేర్చుకొన్నదేంటంటే, ఒక వ్యక్తి రక్షణలోనే పరిశుద్ధాత్మను పొందడం జరుగుతుందని. పరిశుద్ధాత్మను పొందడము రక్షించబడిన తరువాత ఎప్పుడో జరిగే విషయం కాదు. బైబిలుకు బిన్నమైన ఈ సిద్ధాంతం మూలంగానే రక్షింపబడిన అనేకులు పరిశుద్ధాత్మ కొరకు వేచి ఉండడంలో అసలు రక్షణ విషయములోనే సందిగ్ధములో పడిపోతున్నారు.

రెండవ అధ్యాయము

పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నింపుదల – ఈ రెండు వేరువేరా లేక ఒకటేనా?

పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి, పరిశుద్ధాత్మ నింపుదలకు మధ్య వున్న తేడాను తరచుగా మనము విస్మరిస్తాం. ఇవి రెండూ ఒకటి కాదు. ఆత్మ బాప్తిస్మం, ఆత్మ నింపుదలకు ముందు జరుగుతుంది. అంతేగాక బాప్తిస్మములోనే నింపుదల వుంది. అపొ.కా. 1:5 పెంతెకోస్తు దినాన రాబోయే బాప్తిస్మం గురించి చెప్తున్నది. అయితే 2:4 ఈ సంగతి నెరవేర్పును తెలియజేస్తూ ఉన్నప్పటికీ బాప్తిస్మం అనే మాటను పాడడం లేదు, నింపబడడం గురించే చెప్తుంది. అంటే అపొస్తలులు ఆత్మ బాప్తిస్మంలోనే ఆత్మ నింపుదల కూడా పొందారన్నమాట.

పెంతెకోస్తు దినాన జరిగినది ఆత్మ బాప్తిస్మము. ఈ బాప్తిస్మము ద్వారా యేసు క్రీస్తు సంఘం ఆవిర్భవించింది. “ఏలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్తులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి" (1కొరి. 12:13). పెంతెకోస్తు దినము నుండి క్రీస్తునందు విశ్వాసముంచినవారందరికీ ఈ బాప్తిస్మం వర్తిస్తుంది (ఎఫె.4:6). ఒక పాపి తన పాపాల విషయమై పశ్చాత్తాపపడి క్రీస్తునందు విశ్వసించిన తక్షణమే ఆ బాప్తిస్మములో పాలుపొంది క్రీస్తు శరీరమైన సంఘములో ఒక అవయవం అవుతాడు. 1కొరి. 12:13లో “పొందితిమి" అని ఉన్న మాట పెంతెకోస్తునాడే పొందాము అనే అర్థాన్ని యిస్తుంది. విశ్వాసి క్రీస్తు మరణ, పునరుత్థానాల్లో భాగస్వామి అయ్యాడని చెప్పబడిన సత్యాన్ని ఉదాహరణగా తీసికొని దీనిని అర్థం చేసుకోవచ్చు. "క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? (రోమా 6:3); "ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి....మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా ఆయన మిమును క్రీస్తుతో కూడ బ్రతికించెను” (ఎఫె 1:20-2:1) పెంతెకోస్తు ఎన్నడూ తిరిగి జరుగలేదు. యేసుక్రీస్తు పునరుద్ఘాటించిన (యోహాను 14:16-26; 15:26-27; 16:7-15). తండ్రి వాగ్దానము (యోవేలు 2:28, అపొ.కా. 1:4) పెంతెకోస్తు దినాన నెరవేర్పుకు వచ్చింది. ఆత్మ ఆనాడే అనుగ్రహింపబడ్డాడు. అంతకు ముందెన్నడూ కాదు (యోహాను 7:39).

ఆత్మ బాప్తిస్మము యుగములకు సంబంధించిన దేవుని ఏర్పాటు ప్రకారము సంఘ జీవితంలోను, వ్యక్తిగతంగా క్రీస్తువిశ్వాసి జీవితంలోనూ ఒక్కసారే జరుగుతుంది. అయితే ఆత్మ చేత నింపబడడం అనేకమార్లు జరగవచ్చు. శిష్యులు పెంతెకోస్తు దినాన తప్ప మరెన్నడూ ఆత్మ బాప్తిస్మము పొందలేదు. అయితే అపొ.కా. లో వారు అనేకసార్లు ఆత్మచేత నింపబడినట్టుగా చూస్తున్నాము. 2:4లో అపొస్తలులు పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడిరి. 4:8లో పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 4:31లో యెరూషలేము సంఘములో కూడి వచ్చిన వారందరు ఆత్మతో నింపబడిరి.  6:3,5లో పరిచారకులు ఆత్మతో నింపబడినవారై వుండిరి. 7:55లో స్తెఫను మరలా ఆత్మతో నింపబడ్డాడు. 9:17లో పౌలు ఆత్మతో నింపబడడం చూస్తాము. 11:23,24లో బర్నబా ఆత్మతో నింపబడ్డాడు. 13:9,10లో పౌలు మరలా ఆత్మతో నింపబడ్డాడు. 13:52లో అంతియొకయలోని శిష్యులందరు ఆత్మతో నింపబడిరి.

క్రైస్తవ అనుభవంలో ఆత్మ బాప్తిస్మము అత్యవసరము, ప్రాథమికము. అది లేకుండా మనము తిరిగి జన్మించామని గాని, ప్రభువుకు చెందినవారమని గాని చెప్పుకోలేము, (తీతు 3:5; రోమా 8:9). పరిశుద్ధాత్మ బాప్తిస్మము పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో వసించుటకు (యోహను 14:17, రోమా 8:11, 1కొరి.6:19), పరిశుద్ధాత్మ ముద్రకు (ఎఫె. 1:13), ఆత్మాభిషేకానికి (2 కొరి1:21, 1యోహను 2:27) సమానార్థకం, తదేక కాలములో సంభవించెడి అనుభవము. బాప్తిస్మము లేకుండగా నింపుదల లేదు. టూకీగా చెప్పాలంటే బాప్తిస్మము రక్షణ కొరకు, నింపుదల సేవకొరకు.

మరో విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు నందలి ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మను పొందాడు. యేసునందు విశ్వాసము వుంచినప్పుడే ఆత్మను కూడ పొందాము (యోహను 20:22; రోమా 8:15, గలతి 3:2). ఆత్మను పొందడము అంటే ఆత్మ బాప్తిస్మమే. అందువల్లనే అపొ. కా. 2వ అధ్యా, తరువాత యిక ఎక్కడా విశ్వాసులను ఆత్మకోసము ఎదురు చూడమని, ఆత్మలో బాప్తిస్మము పొందమని గాని హెచ్చరిక కనిపించదు. తాను క్రైస్తవుణ్ణని చెప్పుకునే వారెవరైనా ఆత్మకోసము ఎదురు చూస్తూ, ఆత్మలో బాప్తిస్మము పొందాలని కనిపెడుతూ ఉన్నట్లయితే అతడు యింకా దేవుని మూలంగా పుట్టలేదని తేటతెల్లము అవుతుంది (గలతి 4:6).

పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడము (ఎదురు చూడడము) అనే ఆలోచన పెంతెకోస్తు దినానికి పూర్వపు ఆలోచన. ఆది శిష్యులనే కనిపెట్టమని చెప్పడము జరిగింది గాని మనల్ని కాదు. కనిపెట్టవలసిన స్థలము యెరూషలేము (లూకా 24:49, అపొ.కా. 1:4,8). అపొస్తలుల కాలములో జరిగినదే యిప్పుడూ జరగాలని వాదించడము పెంతెకోస్తు దినానికున్న చారిత్రక ప్రాముఖ్యతను విస్మరించడమే గాక అపొస్తలుల ఆధిక్యతను కూడ కించపరచడమే అవుతుంది.

ఒక వ్యక్తి రక్షింపబడిన తరువాత కలిగే ఆత్మానుభవము ఆత్మనింపుదలేగాని, ఆత్మను పొందడముగాని, ఆత్మ బాప్తిస్మముు గాని కాదు.

మూడవ అధ్యాయము

క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడడంలోని అంతరార్థం, దాని ఆవశ్యకత ఏమిటి?

ఒకడు మద్యాన్ని సేవించినప్పుడు దాని స్వాధీనములో వుంటాడు. అలాగే పరిశుద్ధాత్మ నింపుదలగల క్రైస్తవుడు ఆయన స్వాధీనంలో వుంటాడు. ఇదే దాని ప్రాముఖ్యత. ఇదే పోలికను పౌలు చూపిస్తూ ఎఫె. 5:18లో “మరియు మద్యముతో మత్తులై యుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మ పూర్ణులై యుండుడి” అని ప్రభోదిస్తున్నాడు.

ఆయన బిడ్డల్లో ప్రతి ఒక్కరూ తన పరిశుద్ధాత్మ స్వాధీనంలో వుంటూ ఆత్మచేత నడిపించబడడం దేవుని కోరిక, సంకల్పము. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసికి ఇవ్వబడ్డ కారణం అతని హృదయంలో అతిథిగా వుండడానికి మాత్రమే గాక అతని జీవితంలో అధినేతగా కూడ ఉండడానికి  యివ్వబడ్డాడు. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక జీవితం పరిశుద్ధాత్మలోనే ప్రారంభమైంది గనుక అది పరిశుద్ధాత్మ స్వాధీనంలో వుండాలి (రోమా 8:9,10). కావున శరీరానుసారుడైన క్రైస్తవుడన్నది వైరుద్యభావం అయినప్పటికీ మనలో చాలామంది తిరిగి జన్మించామని ఆత్మ మనలో నివసిస్తున్నాడని చెప్పుకొంటూ శరీరముననుసరించి నడుస్తుంటాము. అందుకనే “ఆత్మపూర్ణులై యుండుడి” అన్న హెచ్చరిక.

అయితే ఒకడు “పరిశుద్ధాత్మ ద్వారా నింపబడడమెందుకు? రక్షింపబడడం చాలదా?" అని ప్రశ్నింపవచ్చు. అలా ప్రశ్నించడంలో పరిశుద్ధాత్మ శుద్ధీకరణకు వేరుగా రక్షణ లేదు అన్న వాస్తవాన్ని విస్మరించడమౌతుంది. ఆత్మతో నింపబడదమంటే పరిశుద్ధాత్మ శుద్ధీకరణ శక్తి క్రిందికి రావడమే. మారుమనస్సు సమయంలో ఆరంభమై జీవితాంతం కొనసాగే కార్యక్రమమే శుద్ధీకరణ. పరిశుద్ధాత్ముడు మనపై ఆధిక్యత కల్గి మనల్ని నడిపించునట్లు మనం సంపూర్ణ విధేయత చూపడమే దీనికి మార్గం. ఏలయనగా మన జీవితాలపై యేసు క్రీస్తు ప్రభుత్వాన్ని ఎప్పుడూ మనం గుర్తిస్తూ ఉండేలా సహాయము చేయడానికి ఆత్మ తన కార్యం మనలో జరిగిస్తూ ఉంటాడు (యోహాను 16:14; 1 కొరి. 12:3; 1 పేతురు 1:2). పరిశుద్ధాత్ముడు పరలోకం నుండి వచ్చిన ఆదరణకర్త. విశ్వాసిని ఆదరిస్తూ, నడిపిస్తూ అతనికి బోధిస్తూ ఉంటాడు. ఆత్మ పోషణ, క్రమశిక్షణ కొరకు ఆయన ఆధీనంలోకి క్రీస్తునందలి ప్రతి విశ్వాసి అప్పగించబడ్డాడు.

కాబట్టి మనం రక్షింపబడ్డామని చెప్పుకుంటూ మన జీవితాల్లో ఆత్మ పూర్ణతను ఎరగకుండా ఉన్నట్టయితే మన రక్షణనే మనము శంకించుకోవలసి వుంది. అస్తమానం అవిధేయతలో వుంటూ రక్షింపబడ్డామని చెప్పుకోలేము. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తునట్లయిన ఆత్మ నడిపింపును ఎప్పటి కప్పుడు గుర్తిస్తూ, ఆయనకు అనుగుణంగా మనం లోబడడం అంటే ఏమిటో గ్రహిస్తూ వుంటాం. ఎవరిలోనైతే స్వార్థము సిలువ వేయబడి మృత్యుంజయుడైన క్రీస్తు సింహాసనాసీనుడైయున్నాడో అతడే క్రైస్తవుడు. మనం రక్షింపబడి స్వార్థముతో నింపబడి వుండలేము. మనం రక్షణ పొంది కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో లేకుండా ఉండడమన్నది అనుచితం.

అలాగని రక్షించబడిన వ్యక్తి ఎప్పడూ ఆత్మతో నిండి ఉంటాడని అర్థము కాదు. కనీసం కొంతకాలమైనా ఆత్మ పూర్ణత కలిగి ఉండడం సాధ్యమే. స్తెఫను గురించి “విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను, నిండుకొనినవాడు” అని రాసి ఉంది. (అపొ కా 6:5;7:55). అయితే ఒకసారి ఆత్మతో నింపబడిన తరువాత ఇక ఎప్పుడూ నింపబడే ఉంటామనిలేదు. అది పరిశుద్ధాత్మ శుద్ధీకరణ యత్నానికి మనల్ని మనం నిరంతరము లోబరచుకొంటూ క్రీస్తునందలి మన భక్తిని పునరుద్ధరించుకొనుటయే ఈ నింపుదలకు మార్గము. దేవుని సార్వభౌమిక కృపాకార్యమే శుద్ధీకరణ. అయితే మన విధేయతావిశ్వాసాల పాత్ర కూడా ఇందులో ఉంది. పరిశుద్ధాత్మను మనం ఎప్పుడూ దుఃఖపరచలేదని, ఆర్పలేదని మనలో ఎవరమూ నిజాయితీగా చెప్పలేము (ఎఫె 4: 30; 1 థెస్స 5:19).

ఆత్మపూర్ణత, పాపరాహిత్యము ఒక్కటే అని భావించడం పొరపాటు. ఆత్మతో నింపబడడం ఒక మనిషిని లోపరహితంగా, దేవునివలె పరిపూర్ణంగా చెయ్యదు. అయితే తన హృదయం మోసకరమైనదన్న సంగతిని అతడు సూక్ష్మంగా గ్రహించేట్టు ఆత్మ నింపుదల చేస్తుంది. (యిర్మియా 17:9). తద్వారా తనలో దాగి ఉన్న లోపాలను కూడ అతడు కనుగొని (కీర్త. 19:12) వాటిని ఒప్పుకొని విడిచి పెట్టడము ద్వారా దేవునికి మహిమ కలిగిస్తాడు. పాపరహితమైన పరిపూర్ణత తనకు ఉందని ఎవరైనా అంటే తనకు సర్వజ్ఞత ఉందని చెప్పుకున్నట్టే. ఇది ఆతీక పక్షవాతానికి గుర్తు (1 కొరి. 4:4; 1 యోహాను 3:19,20). ఇలా చెప్పుకోవడం వల్ల అతడు తన్ను తాను సమర్థించుకోవడమే కాక దేవుణ్ణి అబద్ధికునిగా కూడా చేస్తాడు (1 యోహాను 1:10).

అంతేకాక అత్మపూర్ణత అనేది ఒకసారి సంభవించి అలా నిలిచిపోయే అనుభవము కాదు. ఇది పదే పదే కలిగే అనుభవం. ఇది కలిగిన ప్రతిసారీ స్థాయి హెచ్చవచ్చు లేదా తగ్గవచ్చు. ఎఫె. 6:18లో “ఆత్మ పూర్ణులై యుండుడి” అంటే అర్థం ఎప్పుడూ ఆత్మతో నింపబడుతూ ఉండండి అని. మనలో ఎంత పరిశుద్ధాత్ముడున్నాడని కాదు ప్రశ్న. మనలో ఎంత భాగాన్ని పరిశుద్ధాత్ముడు కలిగివున్నాడు అన్నదే. మనలో ఎవరమైనా సరే 'నేను పూర్తిగా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాను' అనడం అహంకారమే అవుతుంది.

క్రీస్తుసేవ కోసం మాత్రమే ఆత్మపూర్ణత అవసరం అని మనం అనుకోవచ్చు. అయితే ఆత్మపూర్ణత అన్నది ముందుగా వ్యక్తిగతమైన అవశ్యకత. ఆ తరువాతే పరిచర్య కోసం అది ఆవశ్యకం. ఇందులో దేవుని ఉద్దేశం ఆయన పిల్లలందరూ కూడా ఆత్మతో నింపబడి ఆయన కుమారుడైన క్రీస్తు స్వరూపంలోకి ఎప్పుడూ మార్చబడుతూ ఉండాలనే (2 కొరి.3:18). మనము ఆత్మతో నింపబడి ఉండకపోతే దేవునికి ఎంత మాత్రము ఉపయోగకరంగా ఉండలేము. అనుదిన ప్రాతిపదికపై యేసు క్రీస్తుతో మన వ్యక్తిగత సంబంధమే ఇది. ఆయనకు సంపూర్ణముగా లోబడని క్రైస్తవుణ్ణి బట్టి దేవుడు వాస్తవంగా ఆనందించలేడు. ఇక ఆయన సేవలో ఎలా ఉపయోగించుకుంటాడు!

క్రైస్తవ సేవ కోసము ప్రత్యేకించబడినవారికే గాక ప్రతి విశ్వాసికి ఆత్మతో నింపబడడం అవసరమని ఎఫె. 5:18 మూలంగా స్పష్టం అవుతుంది. ఎఫెసీ క్రైస్తవులందరినీ ఆత్మపూర్ణులుగా వుండండని పౌలు ఆదేశిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎలాంటి క్రైస్తవులుగా ఉండాలని కోరుతున్నాడో అలా ఉండాలంటే మనం పరిశుద్ధాత్మచేత నింపబడి ఉండాలి. ఈ ఏర్పాటుకు వెలుపట ఉండడం సరైన క్రైస్తవ జీవితం కాదు .

ఇందువల్ల ఆత్మ నింపుదల కొరకు దేవుణ్ణి అర్థించడం మన విధి. ఆత్మను అనుగ్రహించమని అర్థింపనక్కర్లేదు . మనం ఇప్పటికే ఆత్మను కలిగి ఉన్నాము (రోమా 8:9). అయితే మనలో నివసించే ఆత్మ ద్వారా మనల్ని పూర్తిగా స్వాధినము చేసుకోవలసిందని ఆయన్ని వేడుకోవాలి. పరిశుద్ధంగా జీవించేందుకు, మనకై మనము ఆయనకేదైనా చేయగలిగేందుకు మనకు శక్తి లేదని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మనల్ని మనం తథేచ్చతో, హృదయపూర్వకంగా పరిశుద్ధాత్మునికి లోబరచుకొని మనలో అవసరమైనదాన్ని దేవుడు చెయ్యగలడని నమ్మాలి.

॥ఈ అనుభవాన్ని పొందడానికి సులభమార్గంగానీ, మంత్రతంత్రాలుగాని ఏమీలేవు. విశ్వాసమార్గమే దేవునియొద్దకు చేర్చుతుంది. విశ్వాసం ద్వారా తప్ప దేవుని నుండి మనము ఏదీ పొందలేము. శుద్ధీకరణకు సరియైన మార్గమిదియే (యాకోబు 1:6,7). విశ్వాసంలో విధేయతుంది (అపొ.కా. 26: 18; 1 పేతురు 1:2).

ఆత్మతో నింపబడేందుకు ముందుగా మనం రిక్తులం కావాలి. స్వార్థాన్ని, అహాన్ని విసర్జించాలి. ఆత్మపూర్ణత అనగా అహంభావాన్ని సిలువ వేసిన అనుభవము. మనం ఆత్మతో నింపబడ్డామంటే క్రీస్తుతో నింపబడ్డామని అర్థం (గలతి 2:20).

నాల్గవ అధ్యాయము

పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించిన గుర్తులేవి?

అపొ.కా.ములగ్రంథంలోను, పత్రికల్లోను ఈ విషయాన్ని గూర్చి విపులంగా వ్రాసి ఉంది.

అపొ.కా. 2:4 ప్రకారము పెంతెకోస్తు దినాన శిష్యులు ఆత్మతో నింపబడ్డప్పుడు వారు ఇతర భాషల్లో మాట్లాడనారంభించారు. ఆత్మతో నింపబడడానికి తప్పనిసరిగా, శాశ్వతంగా ఇలా ఇతర భాషల్లో మాట్లాడడం అన్నది అనుబంధ ప్రక్రియ కాదు. ఈ సంగతిని తరువాత చూద్దాము.

దేవుడు ప్రారంభించిన మానవ విమోచన పథకంలో ఒక కొత్త దైవ వ్యవహార కాల ఆగమనం, అంటే హెబ్రీ భాష కాక ఇతర ప్రపంచ భాషల వారికి కూడ ఈ రక్షణ ద్వారం తెరచిన సమయాన్ని సూచించేందుకు పెంతెకోస్తు దినాన భాషలు మాట్లాడడం జరిగింది. భాషలు మాట్లాడడం ద్వారా ఆత్మప్రత్యక్షత కేవలము భాషాసంబంధమైన నూతనత్వము మాత్రమేకాదు, ఇలాటి భాషల మూలంగా శిష్యులు “దేవుని గొప్ప కార్యాలను” వివరించగలిగారు (వ 11).

అపొ.కా. 4:8లో పేతురు ఆత్మతో నింపబడినవాడై సువార్తకు విరోధులైనవారిని ధైర్యముగా ఎదిరించి, రక్షకుడైన యేసుక్రీస్తు విశిష్టతను విస్పష్టమైన పదజాలంతో ప్రకటించాడు (వ 12).

అదే అధ్యా. 31వ వచనం ఈ సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. సువార్త ప్రకటనలో దేవుని శక్తి ప్రత్యక్షత కోసం ప్రార్థనకు కూడి వచ్చిన యెరూషలేములోని విశ్వాసులు ఆత్మతో నింపబడ్డారు. తత్ఫలితంగా వారు “దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు." అపొ.కా. 6:3 పరిశుద్ధాత్మతో నింపబడిన ఒక వ్యక్తి తత్ఫలితంగా విశ్వాసముతో కూడ నింపబడి ఉంటాడని సూచిస్తుంది. ఆత్మ స్వాధీనంలో ఉన్న వ్యక్తి తప్పనిసరిగా ఆత్మననుసరించి సరియైన తీర్మానములను చేయగల్గుతాడు.

అపొ కా|| 6:5లో స్తెఫను “విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను” నిండినవాడని చదువుతున్నాం. దీన్ని బట్టి ఆత్మపూర్ణతతో బాటు విశ్వాసం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంది అని అర్థమౌతుంది. ఆత్మపూర్ణతకు పూర్వపరాలు విశ్వాసమే, దాని ఫలితమూ విశ్వాసమే. విశ్వాసం అంటే విధేయత. ఇదే ఆత్మతో నింపబడడానికి అర్హత. అదే సమయంలో ఆత్మఫలం కూడ విశ్వాసమే (గలతి 5:22).

అపొ.కా. 7:56-60లో స్తెఫను ఆత్మపూర్ణుడై యేసు కొరకు హతస్సాక్షి అయ్యాడని చూస్తున్నాం. విషమపరీక్ష సమయంలో మనం యేసుక్రీస్తు విశ్వాసులుగా స్థిరంగా నిలబడాలంటే దేవుని కృపను బట్టి మన అనుభూతులు, ఆలోచనలు, సంకల్పాలు మొత్తంగా మన వ్యక్తిత్వమే పరిశుద్ధాత్మ పవిత్రపరిచే ధీరోదాత్తతను అనుగ్రహించే ప్రభావం క్రిందికి వస్తే తప్ప అలా నిలబడలేము.

ఇంకా చదివితే పరిశుద్ధాత్మచేత నిండినవాడై స్తెఫను తనపై బడుతున్న వారికోసం ప్రార్థిస్తూ, దేవుడు వారిని క్షమించాలని విజ్ఞాపన చేసినట్టు చూస్తున్నాం. స్తెఫనులో క్రీస్తు పోలిక ఈ సంఘటనలో కనిపిస్తుంది. మనం పరిశుద్ధాత్మ అదుపులో ఉన్నప్పుడే మనం మన శత్రువుల్ని క్షమించి వారికోసం ప్రార్థించగలం. శత్రువులమైయుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డాం (రోమా 5:10). మనం దేవుని క్షమాపణను పొందామన్న సత్యాన్ని ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకొంటూ ఉండేందుకు దేవుని ఆత్మ మనకు కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేగాక క్షమాపణ పొందాం గాబట్టి ఇతరులను మనం క్షమించాలని గ్రహిస్తున్నాం.

అపొ.కా. 9:17లో పౌలు తన క్రైస్తవ ఆనుభవారంభంలోనే ఆత్మతో నింపబడ్డాడని చూస్తున్నాము. "తక్షణమే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెనని" లేఖనములు తెల్పుతున్నవి. ఆత్మపూర్ణత మనల్ని క్రీస్తును బాహాటంగా ఒప్పుకునేలా నడిపిస్తుంది. "పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడు” (1 కొరి. 12:3). పౌలు జీవితమంతా ఆయన పరిచర్య, రచనలు, క్రీస్తు కోసం ఆయన పొందిన బాధలు -- ఇవన్నీ అతడు దేవునికి పూర్తిగా లోబడి ఆత్మ అదుపులో ఉన్న వ్యక్తి అని అనర్గళంగా సాక్ష్యమిస్తున్నాయి.

అపొ. కా. 11:24లో బర్నబా “పరిశుద్ధాత్మతోను, విశ్వాసముతోను నిండినవాడని వ్రాసి ఉంది. 7:55లో ఆత్మపూర్ణతతో బాటు విశ్వాసం ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని చూశాం. 11:23లో బర్నబా ఆత్మపూర్ణుడైన మనిషి గనుక అంతియొకయలో దేవుని కృపాకార్యాన్ని చూసి సంతోషించాడు అని చెప్పబడింది. యెరూషలేములో హింసలమూలంగా అంతియొకయలో తలదాచుకొన్న వారి మూలంగా అక్కడ సువార్త ప్రకటించబడింది. అయితే మరొకరి బోధల మూలంగా కలిగిన విజయాన్ని చూచి సంతోషించడం ఆత్మతో నిండి ఉన్న మనిషికే సాధ్యం.

ఇంకా చూస్తే పేరుకు తగినట్టు బర్నబా విశ్వాసులను హృదయపూర్వకంగా ప్రభువును హత్తుకొని ఉండవలసిందని హెచ్చరిస్తూ ఉండేవాడు. 24వ వచనాన్ని బట్టి అంతియొకయలో బర్నబా పరిచర్య మూలంగా అనేక మంది ప్రభువు పక్షంగా చేరారని తెలుస్తుంది.

అపొస్తలుల సువార్తను వ్యతిరేకించిన ఎలుమ అనే "అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి" అయినవాణ్ణి పౌలు ఆత్మపూర్ణుడై బహుకఠినముగా మందలించినట్టుగా అపొ.కా. 13:9లో చూస్తున్నాము. అంతేకాదు, ప్రభువు నుండి అతనికి తక్షణశిక్షగా గ్రుడ్డితనాన్ని కలుగజేశాడు పౌలు. క్రైస్తవవర్గాలన్నీ ఏకము కావాలనేవారు, అన్ని మతాలూ ఒకే సత్యాన్ని ప్రబోధిస్తాయని వాదించేవారు క్రీస్తు సువార్తకు విరోధులైనవారి పట్ల ఇంత కఠినంగా వ్యవహరించడం సహనం లేని చర్య, క్రైస్తవ్యానికి విరోధము అని విమర్శిస్తారేగాని ఇది ఆత్మనింపుదలకు ఒక నిదర్శనమని వారు ఏమాత్రం గుర్తించరు.

తరువాత అపొ.కా. 13:52 చూస్తే “శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి" అని వ్రాసి ఉంది. ఆనందము ఆత్మఫలము (గలతి 5:22). దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మవలన ఆనందము ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటుంది (రోమా 14:17).

చివరిగా ఎఫె. 5:18లో అపొస్తలుడైన పౌలు ఎఫెసి క్రైస్తవులను ఆత్మతో నిండివుండాలని హెచ్చరిస్తూ అలాటి అనుభవమువల్ల కనిపించే ఫలితాలను తెలియజేస్తున్నాడు.

19 వచనములో ఆనందాన్ని గూర్చి ప్రస్తావిస్తూ “కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మ సంబంధమైన పాటలతో ఆనందించుడని పౌలు హెచ్చరిస్తున్నాడు. మన స్వరాలు మధురముగా ఉండకపోవచ్చు. అయితే హృదయములో పరిశుద్ధాత్ముడుంటే మనము తప్పక ప్రభువుకు ఆనందగానము చెయ్యవచ్చు.

అటుతరువాత అన్ని విషయాలలోను దేవునికి కృతజ్ఞులై ఉండవలసిన విషయాన్ని గూర్చి పౌలు ప్రస్తావించాడు. మనకు సంభవించే మేళ్ళు, కీళ్ళు వాటంతటవి జరుగవు. కాని మనకు సంభవించేవన్నీ ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తములో వడపోయబడి సంభవిస్తాయి. “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము” (రోమా 8:28). అయితే అన్ని స్థితిగతుల్లోను, దేవుని సంకల్పాన్ని సరిగా గుర్తించి ఆయన్ని స్తుతించాలంటే పరిశుద్ధాత్మతో నిండివున్న వ్యక్తికే అది సాధ్యం. యోబుకు కలిగిన విపత్తుల మధ్య అతడి అనుభవము ఇదే (యోబు 1:21; 2:10). పొందిన మేళ్ళను బట్టి దేవునికి, మనుష్యులకు కూడా కృతజ్ఞులై వుండడం ఆత్మపూర్ణతకు చిహ్నం. కృతఘ్నత అయితే స్వార్థానికీ, గర్వానికీ గుర్తు.

తరువాత 21వ వచనములో లోబడియుండడం ఆత్మపూర్ణతకు చిహ్నమని గుర్తిస్తున్నాము. మనం ఆత్మపూర్ణులమై వుంటేనే దేవుని భయములో నడుచుకుంటూ కక్ష వలన గాని ఆడంబరము వలన గాని ఏదీ చెయ్యకుండా వినమ్రతతో మనకంటే మన సాటివాళ్ళని యోగ్యులుగా ఎంచి గౌరవిస్తాము (ఫిలి. 2:3).

ఇక కుటుంబ పరిస్థితికి వస్తే భార్య ఆత్మతో నిండివుంటే ప్రభువుకు లోబడినట్టు తన భర్తకు ఆమె లోబడుతుంది. తన భర్తకు లోబడని భార్య ప్రభువుకు లోబడినట్టు కాదు. అవిధేయత వల్ల స్త్రీ ఒక క్రైస్తవ గృహములో దేవుడు ఏర్పరచిన క్రమాన్ని ఉల్లంఘిస్తుంది. అలానే భర్త ఆత్మతో నిండినవాడైతే తనవలె భార్యను ప్రేమిస్తాడు. తన వధువైన సంఘాన్ని ప్రేమించి ఆమెకోసము తన్ను తాను అప్పగించుకొన్న ప్రభువు ఆదర్శాన్ని భర్తలు పాటించాలి. తన భార్యను ద్వేషించేవాడు లేక ప్రేమించనివాడు దేవుని ఆత్మ అదుపులో ఉన్నానని చెప్పుకోరాదు. (వ 22_23).

ఇదే సంగతిని పిల్లలకు తమ తల్లిదండ్రులతో వున్న సంబంధం విషయములో కూడ చెప్పుకోవచ్చు. ప్రభువును బట్టి గౌరవ విధేయతలతో కూడినదై వుండాలి ఈ సంబంధం (6:1-3). అలాగే తల్లిదండ్రులు (ముఖ్యంగా తండ్రి), తమ పిల్లలను విసికించకూడదు. ప్రభువు యొక్క శిక్షణలోను, పోషణలోను వారిని పెంచాలి (4వ).

సేవకులు తమ యజమానులకు లోబడి యథార్థంగా, అనందంగా వారిని సేవించాలి. యజమానులు కూడా సేవకుల్ని దయగా, న్యాయంగా చూడాలి (5-9వ).

ఎఫెసీ పత్రికలోని ఈ విషయాలన్నింటిని బట్టి మనం నేర్చుకొనేది – ప్రేమ, విధేయత, దయ, యథార్థత యిలాంటి సులక్షణాలన్నీ దేవుని పరిశుద్ధాత్మతో నిండిన జీవితంలో ప్రత్యక్ష్యమౌతాయి.

'నింపబడడం' అని స్పష్టంగా వ్రాసివున్న పై వాక్యభాగాలు కాక, యిదే అనుభవాన్ని సూచించే అనేకమైన యితర పదాలు వాడిన వాక్యాలు బైబిల్లో వున్నాయి. ఆత్మతో నింపబడడం అంటే ఆత్మ అదుపులో వుండడం అని గుర్తు పెట్టుకుందాం.

1. పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తి ఆత్మలో ప్రార్థిస్తాడు (రోమా 8:26). ఆత్మలో ప్రార్థన చెయ్యడం అంటే లోపల నివాసము చేస్తున్న ఆత్మను ప్రార్థించనివ్వడమే. ఆత్మకు దేవుని మనసు తెలుసు. అందువల్ల దేవుని సంకల్పాన్ని అనుసరించి ఆత్మ మనకోసం విజ్ఞాపన చేస్తాడు. మనకు సవ్యంగా ప్రార్థించడం తెలియదు. మన స్వార్థ ప్రయోజనాల కోసమని దేవుణ్ణి ఆయా విషయాలు అడుగుతుంటాము. పరిశుద్ధాత్మ జనిత ప్రార్థనలు యేసుక్రీస్తు ప్రభువును మహిమపరిచేవిగా వుంటాయి. అసలు ప్రార్థనలన్నీ పరలోకములోనే పుడతాయి. దేనికోసం అడగాలో మనకు చెప్పేది. దేవుడే, అప్పుడు మనము అడిగినవాటిని యిచ్చేదీ ఆయనే.

అందువల్ల మన ప్రార్థనల వెనక ప్రేరణ పరిశుద్ధాత్మునిదేనా, అవి ఆయన అదుపులోనే వుంటున్నాయా అని మనల్ని మనము ప్రశ్నించుకుని పరీక్షించుకోవాలి. యూదా వ్రాసిన దాని ప్రకారం ఆత్మలో ప్రార్థించడాన్ని బట్టి మన అతి పవిత్ర విశ్వాసాన్ని కట్టుకోగల్గుతాము (యూదా 20వ). ఆ విశ్వాసమన్నది యిక్కడ మనము నమ్మిన క్రైస్తవ సిద్ధాంతం (3వ). అంటే దేవుని వాక్యములోని ఆయన వాగ్దానాలపై మన ప్రార్థన ఆధారపడి ఉన్నప్పటికీ దేవునివాక్కు పై మనకు సంపూర్ణమైన నమ్మకం ఉండవచ్చునన్న జ్ఞానము మన ప్రార్థనలకు దేవుడిచ్చే జవాబులో ఆత్మమూలముగా మనకు కల్గుతుంది.

2. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఆత్మలో జీవిస్తాడు (గల. 5:25). అంటే క్రైస్తవుడుగా అతని ఉనికి యావత్తు పరిశుద్ధాత్మునిలోనే వుంటుంది. పరిశుద్ధాత్మ జీవింపజేయు ఆత్మ (రోమా 8:2).

3. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఆత్మలో నడుచుకుంటాడు (గల. 5:25). క్రీస్తులో మన జీవితానికి మూలం ఆత్మే. ఆ జీవితాన్ని సాగించేందుకు శక్తినిచ్చేది ఆత్మే. మనం ఆత్మ మూలంగా ఆత్మలో నడుచుకుంటూ వున్నట్టయితే వట్టి ఆడంభరాలను కోరుకోము. ఒకరికొకరం కోపం రేపుకోము. ఒకరిపై ఒకరం అసూయపడం (5:26). ఆత్మలో నడుచుకుంటూ ఉన్నట్టయితే శరీరేచ్చలను నెరవేర్చం (గల. 6:6). ధర్మశాస్త్రంలో వెల్లడి అయిన నీతిన్యాయాలు మనలో నెరవేరేది ఆత్మలో నడుచుకోవడం మూలంగానే.

4. ఆత్మతో నిండినవాడు ఆత్మసంబంధమైన సంగతులనే లక్ష్యపెడతాడు (రోమా 8:5). అంటే అతడి అంతరంగ జీవితం, ఆలోచనలు ఆత్మ అదుపులో వుంటాయి. సత్యమైన, యథార్థమైన, న్యాయమైన, నిష్కల్మషమైన, మనోహరమైన, ఘనమైన, రమ్యమైన, పొగడదగిన సంగతులనే వివేచిస్తాడు (ఫిలిప్పి 4:8). తన హృదయ వాంఛలను పరలోక సంబంధమైన విషయాలపైనే తప్ప ఇహలోక విషయాలపై వుంచడు (కొలస్సీ 3:2).

ఆత్మానుసారమైన మనస్సు కలిగి వుండడమంటే ఆత్మ మనస్సును కలిగివుండడమే, క్రీస్తు మనస్సును ధరించుకోవడమే. “అది దీనమనస్సు, పరోపకారార్థ జీవనం" (ఫిలిప్పి 2:5,9).

శరీరానుసారమైన మనస్సు మరణానికి దారితీస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని, శాంతిని యిస్తుంది (రోమా 8:6).

5. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఆత్మ ద్వారా నడిపించబడతాడు (రోమా 8:14). మన ప్రభువు యిచ్చిన మాట ఇదే. ఆత్మ అనే ఆదరణకర్త మనలో వుంటూ, త్రోవ చూపిస్తూ సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. (యోహాను 16:13).

ఆత్మనడిపింపు అనేది ప్రతి విశ్వాసికి వున్న శ్రేష్ఠమైన వరం. "ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారు దేవుని పిల్లలనబడుదురు". మనం ఆత్మ ద్వారా నడిపించబడితే శరీరకార్యాలను అభ్యసించడానికి ధర్మశాస్త్రం క్రింద వున్నవాళ్ళం కాము (గలతి 5:18; రోమా 7:5).

6. ఆత్మతో నిండినవాడు శరీరకార్యాలను చంపివేస్తాడు (రోమా 8:13). ఆత్మసాయంతో పాపాన్ని, శోధననూ మనం అధిగమించి, పాపానికి మనల్ని మనమే మృతులుగా ఎంచుకుంటాం. క్రీస్తు విశ్వాసులుగా మనము ఆయనతో కూడ సిలువ వేయబడ్డాం. యిక జీవించేది మనం కాదు, మనలో క్రీస్తే జీవిస్తున్నాడు. అయితే మనం పరిశుద్ధాత్మ అదుపులో ఉంటేనే యిలాటి స్వయాన్ని ఉపేక్షించే కార్యాలు మన జీవితాల్లో ఆచరించగల్గుతాం (కొల. 8:6; రోమా 6:11; గల. 2:20).

7. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఆత్మలో దేవుణ్ణి సేవిస్తాడు (రోమా 1:9; 12:1). దేవుని పిల్లలకు సంబంధించినంత వరకూ దేవుని ఆత్మకూ, మానవ ఆత్మకూ తేడా ఏమీ చెప్పబడలేదు. "ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ" (యోహాను 3:6) అనే విషయాన్ని అలాటివారి విషయములోనే చెప్పగలం. దేవుని ఆత్మ, మన ఆత్మ రెండు వేర్వేరు ప్రత్యేక విషయాలు. కాని దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తున్నాడు కాబట్టి దేవుని ఆత్మశక్తి లేకుండా ఆత్మ సంబంధమైనదేదీ మనలో జరగదు. “నేను నా ఆత్మయందు సేవించుచున్న" (రోమా 1:9) అనే మాటని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. రోమా 12:1లో మన శరీరాలను పరిశుద్ధమైన, దేవునికి అంగీకారయోగ్యమైన సజీవయాగాలుగా సమర్పించుకోవడం యుక్తమైన సేవ అని వ్రాసి వుంది. కాని యిది నిజానికి మానసిక లేక ఆత్మసంబంధమైన సేవ (యోహాను 15:26,27).

8. ఆత్మపూర్ణుడైన వ్యక్తి దేవుణ్ణి ఆత్మలో ఆరాధిస్తాడు. "దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను" (యోహను 4:24). ఇక్కడ కూడ మనం ఏ ఆత్మ ద్వారా ఆరాధించాలో అది మన వ్యక్తిగత ఆత్మ. దేవుని ఆత్మ మూలముగా జన్మించకపోతే, లేదా దేవుని ఆత్మతో సన్నిహిత సంబంధం కలిగివుండకపోతే ఇలాటి ఆరాధన అసాధ్యం. "శరీరమును ఆస్పదముగా చేసికోనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తుయేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము” (ఫిలి. 3:3).

(గలతీ 5వ అధ్యా.లో ముఖ్యముగా 16,17 వచనాల్లో పౌలు ఆత్మకు, శరీరానికి జరిగే సమరాన్ని గురించి చర్చించేటప్పుడు అక్కడున్న "ఆత్మ" దేవుని పరిశుద్ధాత్మో లేక మన ఆత్మో ఖచ్చితంగా చెప్పలేము).

9. ఆత్మపూర్ణుడైన వ్యక్తి ఆత్మఫలాలను ఫలిస్తాడు. "ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వి కము, అశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమి యును లేదు" (గల. 5:22, 23).

ఒక వ్యక్తి జీవితము పరిశుద్ధాత్మ అదుపులో ఉంటే ఆత్మ లక్షణాలను అతడు తప్పనిసరిగా తన ప్రవర్తనలో ప్రదర్శిస్తాడు. అలాగాక అతడు తన శరీరాశలచేత నడిపించబడితే శరీరకార్యాలనే అతడు నెరవేరుస్తుంటాడు (వ 11-21).

తనకు లోబడిన వ్యక్తి జీవితంలో ఫలాలనిచ్చేది పరిశుద్ధాత్ముడే. ఆత్మఫలం అంటే క్రైస్తవుడి జీవితంలో ఆత్మ తన్ను తాను ప్రత్యుత్పత్తి చెయ్యడం అన్నమాట. ప్రభువు ఆత్మ ఉన్న చోట స్వాతంత్య్రం ఉంటుంది." ఇట్టి వాటికి విరోధమైన నియమమేమియును లేదు" (గల. 5:23). అయితే శరీర కార్యాలు అస్తమానమూ దాస్యంలోనే ఉంచుతాయి.

ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఏమంటే పరిశుద్ధాత్మ నింపుదలకు సంబంధించిన గుర్తులు ప్రాముఖ్యంగా మన జీవితంలో పరిశుద్ధతకు క్రీస్తు యెడల మనకుండవలసిన భక్తివిశ్వాసాలకు సంబంధించినవి.

ఐదవ అధ్యాయము

భాషల గందరగోళం ఏంటి?

ఈ సమస్య రెండు విధాల ప్రశ్న చుట్టూ పరిభ్రమిస్తుంది. కొత్తనిబంధనలోని భాషలవరం పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి ప్రథమ నిర్దిష్టపు చిహ్నమా? ఈ వరం ప్రస్తుతం సంఘంలో ఉన్నదా లేక తీసి వేయబడిందా ?

పెంతెకోస్తువారు, కారిస్మాటిక్ వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మంతో పాటు భాషలతో మాట్లాడడం ఉండి తీరాలంటారు. వారి దృష్టిలో ఆత్మబాప్తిస్మానికి ఆత్మపూర్ణతకు తేడా లేదు. ఆత్మబాప్తిస్మం మారుమనస్సు తరువాతే జరిగే విషయమని వీరు సాధారణంగా నమ్ముతారు. ఈ ఆత్మబాప్తిస్మంలోనే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందడం కూడ జరుగుతుందని వీరి నమ్మకం.

అయితే పైవిషయాలేవీ వాక్య పరీక్షకు నిలవవు. 1 కొరి. 12:13 ప్రకారము పెంతెకోస్తు నాటినుండి విశ్వాసులంతా ఆ రోజున సంభవించిన ఆత్మ బాప్తిస్మంలో పాలిభాగస్తులై ఉన్నారని, ఆ బాప్తిస్మం ద్వారానే క్రీస్తు శరీరంలో అవయవాలయ్యారని పౌలు బోధిస్తున్నాడు. అలానే రోమా 8:9లో కూడ ప్రతి విశ్వాసిలోను ఏ బేధము లేకుండా దేవుని ఆత్మ లేక క్రీస్తు ఆత్మ నివసిసున్నాడని అందువలన అలాటివాడు దేవునికి చెందినవాడని బోధిస్తుంది. అనగా ఆత్మబాప్తిస్మము నూతనజన్మకు లేక రక్షణకు సమరూపం.

బాప్తిస్మమా, నింపుదలా ?

ఆత్మబాప్తిస్మం, ఆత్మతో నింపబడడం రెండూ ఒకటి కాదు. ఆత్మబాప్తిస్మం మన జీవితములో జరిగే రక్షణ కార్యానికీ, శుద్ధీకరణ కార్యక్రమానికీ ప్రారంభం. ఇందులోనే నింపబడడం కూడ యిమిడివుంది. శిష్యులు పెంతెకోస్తు దినాన ఆత్మబాప్తిసంతో బాటు ఆత్మనింపుదల కూడ పొందారు (అపొ.కా. 1:5;2:4) హేతుబద్ధంగా బాప్తిస్మం వెంబడి నింపుదల వస్తుంది. బాప్తిస్మం ఒక్కసారే, కాని నింపబడడం అనేకసార్లు జరుగవచ్చు. ఒక విశ్వాసి కొంత కాలము ఆత్మపూర్ణుడుగా కొనసాగడం కూడ సాధ్యమే (అపొ.కా. 6:3,5).

ఇక ఆత్మబాప్తిస్మంతో బాటు భాషలు మాట్లాడడం కూడ తప్పనిసరిగా ఉండాలన్న వాదన గురించి చూద్దాం. క్రొత్త నిబంధన దీన్ని ఎంత మాత్రం అంగీకరించదు. అపొ.కా. 2,10,19 అధ్యాయాల్లో మనకు కనిపిస్తున్నటువంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప ఆత్మ బాప్తిస్మంతోగాని, ఆత్మ పూర్ణతతోగాని తప్పనిసరిగా భాషల్లో మాట్లాడడం ఉండాలి అనే అభిప్రాయానికి మరెక్కడా ఆధారం కనిపించడం లేదు. ఈ ప్రత్యేక సందర్భాలేంటో మనం తరువాత చూద్దాం.

అంతేగాక అపొ.కా. గ్రంథంలో ఆత్మనింపుదల లేక ఆత్మపూర్ణత గురించి ప్రత్యేకంగా చెప్పబడిన చోట్ల: అంటే 2వ అధ్యాయం తరువాత మరెక్కడా భాషల ప్రసక్తి లేదు. (4:8,31; 5:3; 6:3,5; 7:55; 11:24; 13:52).

యుగములకు సంబంధించిన దేవుని ఏర్పాటు ?

ఈ భాషల్లో మాట్లాడడం అనే విషయమంతటినీ నా ఉద్దేశ ప్రకారం సంఘం విషయమైన దేవుని ఏర్పాటు దృష్టిలో ఉంచుకొని పరిశీలించాలి. ఈ భాషల యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత నిస్సందేహంగా పైన చెప్పబడ్డ దేవుని ఏర్పాటుకు చెందినవే. మూడు సంగతులను ఇక్కడ తేలిగ్గా గుర్తించవచ్చు.

1. సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడాలన్న సంగతికి భాషల్లో మాట్లాడడం సూచనగా ఉంది. “మీరు సర్వ లోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి" అంటే వివిధ భాషలు మాట్లాడే వారందరికీ క్రీస్తులో విశ్వాసం మూలంగా కలగనున్న రక్షణను గురించిన వార్త ప్రకటించబడవలసిన సమయం వచ్చింది అనేదానికి ఈ భాషలవరం సంకేతంగా ఉంది.

2. యూదులు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారి విషయంలో దేవుని కార్యక్రమం ప్రస్తుతానికి నిలిపివేయబడింది. దేవుడు తన కృప చొప్పున అన్యజనుల వైపుకు తిరిగాడు.

3. ఆది. 11వ అధ్యా. లోని బాబేలుకూ, పెంతెకోస్తుకూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. గందరగోళానికీ, చెదరిపోవడానికీ బాబేలు గుర్తు. పెంతెకోస్తు అయితే అవగాహనకూ, సమకూర్పునకు గుర్తు.

ఈ విధంగా పెంతెకోస్తు (అపొ.కా. 2 అధ్యా.) మానవ విమోచన కార్యక్రమాన్ని దేవుడు కొనసాగించే వరుస క్రమంలో ఒక నూతన శకారంభం. వివిధ జాతులకు, వివిధ భాషలకు చెందినవాళ్ళు క్రీస్తు శరీరంలోకి పరిశుద్ధాత్మ మూలంగా బాప్తిస్మం పొందడం ద్వారా క్రీస్తు సంఘం ఉద్భవించింది. (ఆత్మ బాప్తిస్మం క్రీస్తు విశ్వాసులందరి ఐక్యత, సమానత్వాలకు సంకేతం). ఆనాటి ప్రపంచానికి అంటే ఆసియా, ఆఫ్రికా ఐరోప ఖండాల నుండి వచ్చిన వారందరికీ దాదాపు 17 వివిధ భాషల్లో దేవుని ఆశ్చర్యకార్యాలు ప్రకటించబడ్డాయి.

సమరయ విశ్వాసులు ఆత్మను పొందినప్పుడు (అపొ. కా. 8 అధ్యా.) ఆ సందర్భంలో సీమోను చూసినది (18వ) భాషలు మాట్లాడ్డం అనుకుంటే తప్ప వారు భాషలు మాట్లాడిన సంగతి గురించి ఖచ్చితంగా చెప్పలేము. ఏది ఏమైనా ప్రభువు సమరయ స్త్రీకి (యోహాను 4:23) చెప్పిన విధంగా గెరిజీము పర్వతంపై గాని, యెరూషలేములో గాని కాక “యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము" యిప్పుడు వచ్చింది. యిక్కడ ఆత్మ ప్రత్యక్షత ఆ సత్యానికి సూచనగా వుంది. ప్రపంచ సౌవార్తీకరణను గురించి ప్రభువు విశదపరిచిన కార్యక్రమానికి (అపొ.కా. 1:8లో రాసి వున్నరీతిగా) యిది సరిపోతున్నది.

కొర్నేలి మారుమనస్సు సందర్భంలో భాషలు మాట్లాడడం (అపొ.కా. 10) సమరయవారిలా కాక పూర్తిగా అన్యులైనవారికి దేవుని సర్వకృపను వెల్లడించడంతో ముడిపడి వుంది. కొర్నేలి రోమీయులకు ప్రతినిధిగా వున్నాడు.

ఎఫెసులో భాషలు మాట్లాడడం (అపొ.కా. 19) సువార్త గ్రీకువారికి (10, 17వ) లేదా "భూదిగంతముల వరకు" అందడంతో ముడిపడివున్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఎఫెసు పట్టణం ఐరోపా, ఆసియా ఖండాల కూడలి స్థానంలో వుంది. అది గ్రీకుల మహాదేవి అర్తెమి (డయానా) ఆరాధనా క్షేత్రం. గొప్ప వ్యాపార నగరం.

పై సందర్భాలన్నిటిలోను భాషలనేవి నిబంధన జనులను దాటిపోయి దేవుడు తన నామం కోసం అన్యజనులందరిలో నుండి మనుషులను పిలుస్తున్నాడని యూదులకు తెలియజేసే సంకేతం అన్నది నిర్వివాదాంశం.

ఈ మూణ్ణాలుగు సందర్భాల్లో ఆత్మ కుమ్మరింపుతో బాటు బయటికి కనిపించే విధముగా భాషలు మాట్లాడ్డం అనే దృగ్విషయం జరిగింది. అయితే అపొ.కా. గ్రంథంలో ప్రస్తావించబడిన మిగతా విశ్వాసులంతా ఆత్మను పొందలేదని గాని ఆత్మ బాప్తిస్మం పొందలేదని గాని అర్థం చేసుకోరాదు. అయితే వారందరూ అంటే పెంతెకోస్తు దినాన రక్షణ పొందిన మూడు వేలమంది (2:38), అనుదినం ప్రభువు వారికి కలుపుతూ వస్తున్నవారూ (2:47), కుంటివాడు బాగైనప్పుడు విశ్వాసముంచిన ఐదు వేల మంది (3 అధ్యా.), విశ్వాసానికి విధేయులైన యాజకుల సమూహము (6:7), ఫిలిప్పు బోధవల్ల విశ్వాసముంచిన ఇథియోపియా నపుంసకుడు (8:37), తార్సువాడైన సౌలు (9:17), ఐనెయ స్వస్థత పొందినప్పుడు ప్రభువు తట్టు తిరిగిన లుద్ద, షారోను కాపురస్థులంతా (9:35), యెప్పేలో దొర్కా చనిపోయి తిరిగి బ్రతికించబడ్డప్పుడు నమ్మినవారు (9:42), అంతియొకయ విశ్వాసులు (11:21), చిన్న ఆసియా, ఐరోపాలో పౌలు మిషనెరీ ప్రయాణాల మూలంగా అంతియొకయ, పిసిదియ ప్రాంతాలవారితో సహా ప్రభువును నమ్మినవారు (13:43), ఐకొనియ, లుస్రవారూ (14:1), లూదియ, ఫిలిప్పీలో చెరసాల నాయకుని కుటుంబం వారూ (16:14,34), అనేక మంది యూదులు, థెస్సలొనీకలోని గౌరవనీయులైన స్త్రీలు (17:4), బెరయ, ఏథెన్సు, కొరింథి మొదలైన చోట్ల విశ్వాసులు — వీరంతా ఆత్మను పొందారు లేక ఆత్మలో బాప్తిస్మం పొందారు. వీరు క్రీస్తులో విశ్వాసం వుంచగానే యిది జరిగింది. (గల. 3:2; ఎఫె. 1:13).

పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి లేక ఆత్మ నింపుదలకు భాషలనేవి వాటంతట అవే సూచనలు కావు. భాషలు లేవు కాబట్టి ఆత్మ బాప్తిస్మం జరగలేదనడం కేవలం తప్పు.

భాషలు ఒక సూచనార్థక వరం

కొరింథివారికి వ్రాసిన మొదటి లేఖలో అందరూ భాషల్లో మాట్లాడరని పౌలు స్పష్టంగా చెప్పాడు (12:30). అయితే పెంతెకోస్తువారు కొరింథి సంఘస్తుల్లో భాషల వరం విషయంలో యిది వాస్తవమే అంటారు గాని మొత్తం అపొ.కా.లలో ఒక సూచనార్థకంగా చూస్తే దీన్ని ఒప్పుకోరు. అయితే అపొ.కా. గ్రంథము, కొరింథీయులకు వాసిన మొదటి పత్రికలో యిలాంటి తేడా లేదు. నిజానికి కొరింథి లేఖలోనే భాషలు ఒక సూచనగా చెప్పబడ్డాయి (14:22). సంఘానికి ఆత్మ అనుగ్రహించిన కృపావరం యిది. అదే సమయంలో యిది సూచనార్థక వరం.

భాషలు అప్రధానం, తాత్కాలికం

సంఘములో భాషల వరం యొక్క శాశ్వతత్వం గురించి ఆలోచిస్తే ఈ భాషలు సంఘం విషయములో దేవుడుద్దేశించిన కార్యక్రమములో శాశ్వత ప్రాతిపదికలో లేవని నా అభిప్రాయాన్ని ఇంతకుముదే సూచించాను. ఈ విషయంలో దేవుని వాక్యంలో ఖచ్చితమైన బోధ వుంది. వాక్యంలోని కొన్ని ప్రత్యేక భాగాలను ఈ సందర్భంలో పరిశీలించక ముందు బైబీల్లో నుంచి, యితర ఆధారాల నుంచి కొన్ని సంగతులు చూద్దాం. భాషలు ద్వితీయశ్రేణి వరాలని, యివి తాత్కాలికమేననీ ఈ క్రింది సంగతులు విశదపరుస్తున్నాయి.

1. భాషలు ఆత్మవరాల్లో అప్రధానమైనది. సర్వోన్నతమైనది కాదు (1 కొరి. 14:5).

2. భాషలకంటే ప్రవచన వరాన్నే ప్రాముఖ్యమైనదిగా పౌలు ఎంచాడు (1 కొరి. 14:4, 5, 23-25).

3. సంఘములో భాషల వరం వాడుకను పౌలు కొంత నిర్బంధించాడు. దీన్ని ప్రోత్సహించలేదు. (1 కొరి. 14).

- అర్థం చెప్పే సదుపాయం వుంటే తప్ప భాషల్లో మాట్లాడరాదు (5, 28వ).

- భాషల్లో ప్రార్థించరాదు (14:9).

4. భాషల్లో మాట్లాడ్డం మన మేథాశక్తికి అడ్డుకట్ట వేస్తుంది. అస్తమానం అలా మాట్లాడుతూ వుండడం మన ఆధ్యాత్మిక అపరిపక్వతకు నిదర్శనం (1 కొరి. 13:11; 14:16-20)."

5. విశ్వాసులు భాషలు అన్వేషించకూడదు. "భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకములై యున్నవి" (1 కొరి. 14:22).

6. ఒక క్రొత్తశకం ఆరంభానికి అపొస్తలుల పరిచర్యను ధృవపరచడానికి భాషలు అపొస్తలీయ చిహ్నాలు మాత్రమే (హెబ్రీ 2:3,4; మార్కు 16:17,18; 2 కొరి. 12:12). కాబట్టి మొదటి పన్నెండుమంది నిష్క్రమించిన తరువాత, ఈ అపొస్తలీయ చిహ్నం కూడ తీసివేయబడిందని భావించవచ్చు (యూదా స్థానం నా ఉద్దేశంలో అపొస్తలుడైన పౌలు భర్తీ చేశాడు - 1 కొరి. 15:7-9.)

7. పౌలు వాసిన పత్రికలన్నింటిలోకి ఒక్క 1 కొరి. పత్రికలో మాత్రమే (ఇది క్రీ॥శ || 55లో వ్రాయబడింది) భాషల ప్రసక్తి ఉంది. తరువాత వ్రాసిన పత్రికల్లో అంటే రోమా (క్రీ||శ|| 60), ఎఫెసి (క్రీ|| || 65) ఆత్మ వరాల జాబితాల్లో భాషల వరం లేకపోవడం బహుశా అప్పటికే ఆ వరం ఆగిపోయిందో లేక యితర వరాలతో పోలిస్తే భాషలవరం ప్రాముఖ్యమైనది కాదని పౌలు తలంచాడో, మొత్తం మీద భాషల వరాన్ని ఈ జాబితాల్లో ఆయన చేర్చలేదు.

క్రీస్తు సంఘ శాస్త్ర సంబంధమైన, సామాజికమైన కొన్ని విషయాలు

పైన చెప్పిన ప్రాథమికమైన బైబిలు విషయాలే గాక ఇతర ఆధారాల నుంచి అంటే క్రీస్తు సంఘ శాస్త్ర సంబంధమైన ఆధారాలు (Ecclesialogical). సామాజిక శాస్త్ర సంబంధమైన (Sociological) ఆధారాలు పరిశీలిద్దాం . ఈనాటి క్రైస్తవ లోకంలో భాషల్లో మాట్లాడడం అనే దృగ్విషయం గురించి ఇవి వ్యతిరేక భావాన్ని వ్యక్తము చేస్తున్నాయి.

1. క్రొత్త నిబంధనలోని ఆత్మ వరాలన్నిటినీ తోసిపుచ్చి ఒక్క భాషల వరం చుట్టూ పరిభ్రమించేదే నేటి కారిస్మాటిక్ ఉద్యమం. అపొస్తలుల కాలంలో ఇలా భాషల్లో మాట్లాడటాన్ని ఆధారంగా చేసికొని బయలుదేరిన ఉద్యమం (ఒక్క కొరింథీ లోని ప్రమాదకరమైన పరిణామాలను మినహాయిస్తే) ఏదీ కనిపించదు. క్రొత్త నిబంధనలో భాషలు అప్రధానమైన వరం అయితే, కారిస్మాటిక్ ఉద్యమకారులు ఈ వరం ప్రాముఖ్యతను విపరీతంగా పెంచేసి, కొత్త నిబంధన భాషలవరానికి ఏ పోలికలు లేకుండా చేశారు.

2. కారిస్మాటిక్ ఉద్యమంవారు పరిశుద్ధాత్మను, భాషలను సమానం చేసి మాట్లాడుతుంటారు. అంటే ఈనాడు భాషలనెవరన్నా నిరాకరిస్తే అతడు పరిశుద్ధాత్ముణ్ణే నిరాకరించినట్టు వీరు భావిస్తారు.

3. ఒక వ్యక్తి భాషల్లో మాట్లాడేలా శిక్షణ ఇయ్యవచ్చని కారిస్మాటిక్ ఉద్యమకారుల నమ్మకం. ప్రఖ్యాత పెంతెకోస్తు కారిస్మాటిక్ లు ఓరల్ రాబర్ట్స్, స్టైల్స్, క్రిస్టెన్ సన్ మొదలైనవారు భాషల్లో మాట్లాడడం నేర్పించే కోర్సును ఆలా మాట్లాడాలని ఆశించేవారి కోసం తయారుచేశారు. భాషలకు అర్థం ఎలా చెప్పాలో తెలియజేసే పాఠాలను కూడ వీరు అందిస్తున్నారు. భాషల్లో మాట్లాడడం పరిశుద్ధాత్ముని సర్వాధికారం క్రింద, ఆయన అదుపులోను ఉండవలసి ఉందిగదా? మరి పైన చెప్పిన కోర్సులు, పాఠాల సంగతి ఏమనుకోవాలో పాలుబోవడం లేదు.

4. కొత్త నిబంధనలోని భాషలు మనుష్యులకు తెలిసిన భాషలు (మాట్లాడేవాడికి తెలియని భాషలు). వీటిని ఆ భాష మాట్లాడేవాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అయితే కారిస్మాటిస్టు మాట్లాడేది ఎవరికి బోధపడని అర్థం పర్థం లేని కారుకూతలు. చాలామట్టుకు ఇది కొన్ని పదాలను లేక మాటలను పదే పదే ఉచ్ఛరించడంగా అనిపిస్తుంది. భాషాప్రవీణులెవ్వరూ కూడ ఈ కారిస్మాటిక్ వారి భాషలను పరిశీలించిన మీదట, ఈ భూమిపై ఎక్కడైనా ఆ భాష మనుష్యులు మాట్లాడే భాషేనని చెప్పలేకపోయారు.

5. కారిస్మాటిక్ ఉద్యమం బైబిలు ప్రాథమిక సిద్దాంతాలకు కట్టుబడిందిగా (Fundamentalist) ఎంచలేము. ఇందులోని అనేకమంది క్రీస్తులో విశ్వాసి యొక్క శాశ్వత భద్రతను నమ్మరు. పరిశుద్ధాత్మ బాప్తిస్మము, భాషలు అనే “రెండో ఆశీర్వాదాన్ని" పొందామని చెప్పుకొనే వీరు, తాము శాశ్వత రక్షణ పొంది ఉన్నామని ఎందుకు నమ్మలేరో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. క్రీస్తు సిలువలో చేసిన ప్రాయశ్చితార్థబలి విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడడం మొదలైన క్రైస్తవ మూల సిద్ధాంతాల విషయంలో వారి అభిప్రాయాలను గురించిన అనేక ప్రశ్నలను యిది రేకెత్తిస్తుంది.

6. రోమన్ కాథలిక్ చర్చిలో కారిస్మాటిక్ ఉద్యమం త్వరితంగా అలుముకుంటున్నది. రోమన్ కాథలిక్ కారిస్మాటిక్ లు ఈ కారిస్మాటిక్ ఉద్యమం తమలో మరియమ్మ పట్ల ఒక క్రొత్త భక్తిప్రతిపత్తులను మేల్కొల్పిందని చెపుతున్నారు. సంస్కారాలు ముఖ్యంగా మాస్ లో (Mass) పాల్గొనడం మొదలైన విషయాల్లో ఈ కారిస్మాటిక్ లు మరింత ప్రాముఖ్యంగా వీటిని ఆచరించాలని ప్రోత్సహించబడుతున్నారు.

అంతేకాదు పెంతెకోస్తువారిలోని 'యేసునామం' (Jesus only) వాళ్లు ఈ భాషలు మాట్లాడడాన్ని అభ్యసిస్తున్నారు. వీరు త్రిత్వాన్ని అంగీకరించరు. అంతేగాక మార్మొనులు అనే దుర్భోదానుసారులు కూడా ఇలా చేస్తున్నారు.

7. కారిస్మాటిక్ ఉద్యమం భ్రష్ఠమైన క్రైస్తవవర్గ ఐక్యతా ఉద్యమం(Ecumenical Movement)తో చేతులు కలిపింది. కారిస్మాటిక్ ఉద్యమ నాయకులు తమలోని గుంపుల వారంతా ఒకే ప్రపంచ వ్యాప్త సంఘంగా సమకూడాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి వాటికన్ (రోమన్ కాథలిక్కుల ప్రపంచ కేంద్రం), ప్రపంచ సంఘాల సమాఖ్య (World Council of Churches) ఈ రెంటి మద్దతూ ఉంది. చాలామంది కారిస్మా టిక్ రోమన్ కేథలిక్కులు ఈ కారిస్మాటిక్ ఉద్యమం ద్వారా, భాషల వరం ద్వారా రోమన్ కాథలిక్కులు, పొటెస్టెంట్లు చివరికి ఐక్యం కాగలరని నమ్ముతారు.

ఈ కారిస్మాటిక్ ఉద్యమములోని వర్గ ఐక్యతాధోరణి ఆత్మసంబంధమైనది కాదు.

8. కారిస్మాటిక్ ఉద్యమకారులు, పెంతెకోస్తువారు కూడ ఆత్మపూర్ణతతో పాటు భాషలవరం తప్పక దాని వెన్నంటి వుండాలని నొక్కి చెప్తుంటే, ప్రపంచవ్యాప్తంగా కోట్లకొలది భక్తులు ఎప్పుడూ భాషల్లో మాట్లాడిన సందర్భం లేకుండానే ఆత్మతో తాము నింపబడడం గురించి సాక్ష్యమిస్తున్నారు. గొప్ప క్రైస్తవ నాయకులు, ఆత్మల సంపాదకులుగా ఘనమైన సేవ చేసినవారు కూడ ఇందులో వున్నారు. వీరంతా ఎన్నడూ భాషల్లో మాట్లాడలేదు. కాబట్టి వీరెప్పుడూ ఆత్మతో నింపబడలేదని చెప్పడానికి ఎవరికి ధైర్యం వుంది?

జీవిత పవిత్రతలోను, పరిచర్య ఫలభరితం కావడంలోను వున్న ఆత్మపూర్ణతను కారిస్మాటిక్లు గుర్తించడంలో విఫలమయ్యారు. ఆత్మాధీనతలో ఉన్న బ్రతుకు ఆత్మఫలాన్ని యిస్తుంది. అదేమిటంటే ప్రేమ, అనందం, శాంతి, దీర్ఘశాంతం, సాధుగుణం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం (గల. 5:22). అది పాపంపై విజయంతో కూడిన జీవితం (గల. 5:16). పరిశుద్ధాత్మ ఆనందముతో నిండిన జీవితం (రోమా 14:17; ఎఫె. 5:18-20). తగిన జీవిత విధానం లేకుండా అత్మపూర్ణత వుందంటే కుదరదు. అయితే భాషలు వుంటే చాలనుకుంటున్నారు కారిస్మాటిక్లు.

9. సంఘంలోను, ప్రపంచవ్యాప్తంగాను ఈనాడు కరిస్మాటిక్ ఉద్యమం పెద్ద అల్లకల్లోలానికి కారణం అయింది. భాషలు మాట్లాడ్డం విషయంలో క్రైస్తవగృహాలు తొట్రుపడడం, సంఘాలు, సంస్థలు చీలిపోవడం, వ్యక్తులు పెద్ద గందరగోళంలో పడిపోవడం నేనెరుగుదును. నిజమే, ఫలానా విషయాన్ని బట్టి వ్యక్తుల్లో, సంఘాల్లో కలతలు వచ్చాయి కాబట్టి ఆ విషయం మంచిదికాదు, ఆరోగ్య హేతువు కాదు అనలేమనుకోండి.

దేవుని ప్రజల్లో చీలికలు అభిలషణీయం కాదు. అయితే అహంభావ ధోరణి, పోటీ మనస్తత్వం, అనుమానం, భయం వీటి ఆధారంగా ఏది అయితే చెల్లుబాటు అవుతూ వుందో అది ఆత్మ మూలమైనది కానేరదు.

10. సంఘంలో ప్రవచించడం, భాషలు మాట్లాడం విషయాల్లో స్త్రీలు మౌనంగా వుండాలని పౌలు హెచ్చరించాడు. అయితే కారిస్మాటిక్ సంఘాల్లో, గుంపుల్లో స్త్రీలు, పురుషులకంటే గట్టిగా గొంతు చించుకొని అరవడం అందరూ యెరిగినదే. అంతేగాక స్త్రీలే అధికారంలోను, నాయకత్వంలోను వున్నారు. ఇది అక్రమం, తారుమారు పద్ధతి. దేవుని వాక్కుకు సూటిగా వ్యతిరేకం (1 కొరి. 14:26-40).

11. 2వ శతాబ్దంలో దుర్బోధానుసారులైన గుంపువారు వుండేవారు. మోంటానిస్టులనే వీరు తమకు ఆత్మ ద్వారా బైబిల్లో లేని సంగతులు కొన్ని వెల్లడి చేయబడ్డాయన్నారు. రెండవదిగా 19వ శతాబ్దపు 'కాథలిక్ , అపొస్తలిక్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండు, వారు (వీరి నాయకుడు ఎడ్వర్డు ఇర్వింగు పేరును బట్టి “ఇర్వింగైట్స్' అంటారు) క్రీస్తుకూడ మనందరి లాగానే పాప స్వభావం కలిగినవాడని అభిప్రాయపడ్డారు. వై రెండు గుంపులు తప్పించి అపొస్తలుల కాలం తరువాత సంఘ చరిత్రలో భాషలు వున్న విషయాల గురించి ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.

ఆదిమ క్రైస్తవ చరిత్రకారులు, రచయితలు అయిన పాలికార్పు, పేపియస్, యింకా 'షెపర్డ్ ఆఫ్ హెర్మాస్', లేదా డిడాకీ లేదా బర్నబాస్ పత్రిక, ' డయోనేటస్ కి వాసిన పత్రిక రచయితలు' ఎవరూ కూడ ఈ భాషల విషయం ప్రస్తావించక పోవడాన్ని మనము తేలిగ్గా కొట్టిపారెయ్యకూడదు. క్రొత్త నిబంధన కాలం నుంచి సామాన్యరీతిలో ఈ దృగ్విషయం కొనసాగివున్నటయితే ఈ అపొస్తలిక్ పితరులు ఒక్కరైనా ఈ సంగతిని తమ రచనల్లో ఉదాహరించేవారే.

ప్రస్తుత కార్మిస్మాటిక్ పునరుజ్జీవనం మొట్టమొదట అమెరికాలో 1850లో ప్రత్యక్ష్యమైంది. జోసెఫ్ స్మిత్ అనుయాయులైన మోర్మన్లు ఈ సందర్భంలో మనము గుర్తించదగ్గ మొదటి గుంపు. సంఘ చరితలో భాషలు ఎక్కడైతే కనిపించాయో, ఆ కనిపించిన చోటల్లా ఏదో ఒక ప్రమాదకరమైన తప్పుడు సిద్ధాంతంతో కలిసి ప్రత్యక్షం కావడం గమనించదగ్గ సంగతి కాదా?

12. ఈనాటి సంఘాల్లో భాషల వరం వ్యాపించి వుంటే మరి పెంతెకోస్తు మిషనెరీలు తమ సేవాప్రాంతాలకు వెళ్ళక ముందు క్రొత్త భాషలు నేర్చుకోనే పాఠశాలలకు హాజరౌతారు ఎందుకో. వారు మొదట్లో ఆ పరాయి భాష నేర్చుకోకముందు సువార్త ప్రకటించేందుకు వీలుగా పెంతెకోస్తు దినాన జరిగినట్టు పరిశుద్ధాత్ముడు వారికి క్రొత్త భాష మాట్లాడే వరం ఇవ్వలేదా?

13. అనేక క్రైస్తవేతర గుంపులు కూడా (హిందూ, ముస్లిం సంప్రదాయాల్లో) భాషల్లో మాట్లాడ్డం అభ్యసిస్తారన్న మాట అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ విషయంలో ప్రత్యేకంగా క్రైస్తవత్వానికి సంబంధించినది పెద్దగా లేదు.

14. భాషలు మాట్లాడ్డంలో మానసిక ధోరణి ప్రభావం కూడా వుంటుందని కారిస్మాటికులు ఒప్పుకుంటారు. దీన్ని బట్టి ఈ దృగ్విషయం తప్పని సరిగా పరిశుద్ధాత్మ సంబంధమైనదే అని అనుకోనక్కరలేదు.

15. దయ్యం పట్టినప్పుడు కూడా భాషలు మాట్లాడ్డం అనేది జరుగుతున్న సంగతి, నిరూపించబడిన సత్యం. ఈ సత్యాన్ని పెంతెకోస్తువారు, కారిస్మాటిక్కులు కూడా తేలిగ్గానే గుర్తిస్తారు.

కొరింథీ సంఘంలో భాషల వరం విషయంలో దయ్యాల సంబంధమైన నకిలీ వరాల్ని అపొస్తలుడైన పౌలు కనిపెట్టినట్టు అర్థమౌతుంది. (1 కొరి. 12:2,3). సైతాను వెలుగు దూత వేషంలో ఎప్పుడూ తిరుగులాడుతూ ఉంటాడు (2 కొరి. 12: 14). అందుకనే సంఘం ఎప్పుడూ ఆత్మల వివేచన వరం కలిగి ఉండాలి (1 కొరి. 12:10).

ఆ మాటకొస్తే సంఘంలో ఏ కృపావరాన్నైనా సైతాను అనుకరించి నకిలీ వరాన్ని తయారుచేసి ఉంచగలడు. అందువల్లనే అపొస్తలుడైన యోహాను హెచ్చరిస్తున్నాడు. "ప్రియులారా, అనేకులైన అబద్ధప్రవక్తలు లోకములోనికి బయలుదేరి వెళ్ళియున్నారు, గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి” (1 యోహా. 4:1).

భాషలు తాత్కాలికం

ఇక భాషలు తాత్కాలికమేనని బోధించే నిర్దుష్టమైన వాక్యభాగం 1 కొరి. 13:8-18. అక్కడి సందర్భము ఇతర ఆత్మ వరాలన్నిటి కంటే ప్రేమ శ్రేష్ఠమైనదని చెప్పడం.

8వ వచనం చెప్పేదేమిటంటే జ్ఞానం, ప్రవచనాలు నిరర్థకములౌతాయి, భాషలు నిలిచిపోతాయి; ప్రేమ శాశ్వతకాలం ఉంటుంది.

భాషలు నిలిచిపోవడం విషయంలో అసలైన ప్రశ్న: నిలిచిపోతాయా, లేదా? అని కాదు, నిలిచిపోయేదెప్పుడు అనేదే. పెంతెకోస్తువారు ఇక్కడి “నిలిచిపోవును" అన్న పదము నిత్యత్వానికి వర్తిస్తుందని వాదిస్తారు. అంటే ప్రభువు రెండవ రాకడలో భాషలు ఆగిపోతాయని వ్యాఖ్యానిస్తారు. అంటే జ్ఞానం, ప్రవచనాలతో బాటు భాషలు కూడా ఈ యుగాంత సమయంలోనే ఆగిపోతాయని వీరి భావం. 10వ వచనంలోని 'పూర్ణమైనది' అంటే దేవుని రాజ్యం లేక మహిమలో పరిశుద్ధుల అంతిమస్థితి అని వారంటారు.

భాషలు - దైవప్రత్యక్షత విధానము

పై వ్యాఖ్యానం సమంజసంగానే కనిపించినప్పటికీ ఇది ఊహజనీకం మాత్రమే. 'జ్ఞానము' అంటే తెలివి అన్న అర్థంతోను, 'ప్రవచనం' అంటే మనం ప్రకటించేది అన్న అర్థంతోను వాడబడినట్టయితే 10వ వచనంలో 'పూర్ణమైనది' పరలోకం అని అర్థం చేసుకోవచ్చు. కాని ఇలాచేస్తే ఆ వాక్యభాగాన్ని మనం తప్పుగా వ్యాఖ్యానించినవారమౌతాం. 9వ వచనంలో జ్ఞానం, ప్రవచనం రెండూ కూడా దైవప్రత్యక్షత సందర్భంతో ముడిబడి ఉన్నట్లు స్పష్టమౌతుంది. జ్ఞానం అనునది ప్రత్యక్షతను పొందిన విధానం (ఎఫె. 8:4,5), ప్రవచనమన్నది దానిని వెల్లడి చేయడం. ఈ విధంగా ప్రవచనం భవిష్యత్తుకు సంబంధించినదై జ్ఞానం నుండియే అనగా సత్యమును గూర్చిన ప్రత్యక్షత నుండియే వస్తుంది. (1కొరి. 14:6). జ్ఞానం, ప్రవచనం ఈ రెండూ కూడా భాషల్లాగే ఆత్మవరాల జాబితాలో ఉన్నాయి (1కొరి. 12:8-10). ఈ మూడూ కూడా ప్రత్యక్షత విధానానికి సంబంధించినవి. ఈ ప్రత్యక్ష్యత దశలవారీగా ఉందని చెప్పబడింది. - "కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము.” అందువల్ల “పూర్ణమైనది" అంటే తప్పనిసరిగా సంపూర్ణమైన ప్రత్యక్షత అన్నది నిర్వివాదం.

దైవ ప్రత్యక్షత యుగాంతం వరకూ కొనసాగుతూనే ఉంటుందని, జ్ఞానం ప్రవచనం నేటికీ మనతోనే ఉన్నాయని ఎవరైనా వాదనకు దిగితే దాన్ని నిరూపించవలసిన భారం వారి మీదే ఉంది.

విశ్వవ్యాప్తంగా క్రైస్తవసంఘం దైవప్రత్యక్షత నిలిచిపోయిందన్న సత్యాన్ని అంగీకరిస్తుంది. దేవుడు మానవులకు వెల్లడింపదలచుకున్న సత్యమంతా బైబిల్లోని 66 పుస్తకాల్లో ఇమిడి ఉంది. కొత్త నిబంధనలో వున్న 27 పుస్తకాలను ప్రమాణికమైనవిగా సంఘం గుర్తించింది గనుక ఇక వేరే సత్యం ఇంకా ఏదో వెల్లడి అయిందని ఎవరూ అనేందుకు వీలులేదు. అయితే ప్రత్యక్షతకు సాధనాలుగా జ్ఞానం, ప్రవచనం ఈనాటికి ఇంకా వినియోగకరంగా ఉన్నట్టయితే వీటి మూలంగా వస్తున్న ప్రత్యక్షతను మనము నిత్యమూ క్రొత్త నిబంధనతో కలుపుతుండవలసిందే. అయితే అపొస్తలులు దైవప్రత్యక్షత కలిగి పరిశుద్ధాత్మ అవేశమువల్ల దైవికజ్ఞానం పొంది ప్రవచించడం వల్లననే కలిగింది కొత్త నిబంధన.

ఇకపోతే పూర్ణ మైనది. నిత్యత్వముగానో పరలోకంగానో తీసికొంటే సంఘం ఈ భూమిపై ఉన్నంత కాలం బాల్యదశలోనే ఉన్నట్టుగా భావించవలసి వస్తుంది, ఎందుకంటే సంఘం పరలోకాన్ని చేరితేనేగాని పరిణితి చెందదు. 11వ వచనానికి ఇదొక్కటే మనం చెప్పుకోగలిగిన అర్థం అవుతుంది. కాని నేను నమ్మేదేమిటంటే: “పెద్దవాడనై" అనే మాటకి అర్థం సంఘం ఇక్కడ ఉన్నప్పుడే ప్రత్యక్షత కార్యక్రమం సంపూర్ణమైపోయి అది పరిణితి చెందిన సమయమని.

ఎఫె. 4:11-14లో పౌలు ఆత్మవరాల సందర్భంలో ప్రత్యక్షత కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ 'సంపూర్ణత' అంటే సిద్ధాంతపరమైన పరిణితి అని చెబుతున్నాడు. 12వ వచనం "మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయంలోను ఏకత్వము పొంది, సంపూర్ణ పురుషులమగువరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను" - ఇది ప్రత్యక్షత సంపూర్తి అయిందన్న సత్యాన్ని సూచిస్తుంది. తరువాత వచనం (14వ) 'అందువలన మనమిక మీదట పసిపిల్లలమైయుండి.... కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటుఇటు కొట్టుకొని పోవుచు అలలచేత ఎగర గొట్టబడిన వారమైనట్టుండక....” అనే మాటలు పరలోకంలో మనం పొందబోయే సంపూర్ణతను ఏ మాత్రం వివరిస్తున్నట్టుగా లేవు.

కాబట్టి జ్ఞానం, ప్రవచనం, భాషలు ఇవన్ని సంఘ బాల్య దశకు చెందినవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . సంఘం పరిణితి చెందిన తరువాత పిల్లచేష్టలు మానివెయ్యాలి. అంటే బాల్యానికి సంబంధించినవాటిని విడిచిపెట్టాలి.

12వ వచనంలో ప్రత్యక్షతకు చెందిన వర్ణన కూడా ఉంది. ఇది స్పష్టంగా సంఖా. 12:8ని తలంపుకు తెస్తుంది. అక్కడ మోషేకు యెహోవా వెల్లడించినది. ఈ విధంగా వర్ణించబడ్డది. ...... గూఢబావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును." ఇది పాక్షిక వెల్లడింపుకూ, సంపూర్ణ వెల్లడింపుకు మధ్య ఉన్న తేడా. పాక్షికమైన వెల్లడింపు మసకగా అద్దంలో చూస్తున్నట్లు ఉంటుంది. అయితే సంపూర్ణ ప్రత్యక్షత అడ్డంకి లేకుండా ముఖాముఖిగా చూస్తున్నట్టు ఉంటుంది. పాక్షిక ప్రత్యక్షత అసంపూర్ణమైన జ్ఞానము. సంపూర్ణ ప్రత్యక్షత వలన కలిగేది సంపూర్ణ జ్ఞానం.

అంటే ప్రత్యక్షపరచబడిన దానంతటి గురించి మనకు కలిగిన అవగాహన పరిపూర్ణమైనదని అర్థం కాదు. మన జ్ఞానం (అంటే మన మనస్సుతో గుర్తించ గలిగినది) ఎప్పటికీ అసంపూర్ణమే. మనం పరలోకానికి చేరిన తరువాత కూడ యిది అంతే. ఒక దినాన మనం సర్వజ్ఞులం (omniscient) అవుతామని బైబిల్ ఎక్కడా బోధించడం లేదు. మనం శాశ్వతంగా సృష్టించబడిన జీవులంగా అసంపూర్ణంగానే వుండిపోతాం. దేవుడొక్కడే వాస్తవంగా పరిపూర్ణుడు. మన పరిపూర్ణత ఎప్పుడూ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.

పరలోకంలో మన కొరకు పరిపూర్ణత సిద్ధం చేయబడి వుంది. కాని ఈ వాక్య భాగములో చెప్పబడిన విషయం అదికాదు. ఇక్కడ ఈలోకంలో సంఘం యొక్క ఉనికి, క్షేమాభివృద్ధికి సంబంధించిన ప్రత్యక్షతలోని సంపూర్ణత విషయమే చర్చించబడిన అంశం.

ఇదీ, నా అభిప్రాయంలో 1 కొరింథి 13 యొక్క సరియైన వ్యాఖ్యానము. అయితే ఎవరైనా యిలాగు చెప్పవచ్చు: ప్రస్తుతం మనం యెరిగిన కొత్త నిబంధన ప్రమాణిక లేఖనాల పరిపూర్ణత గురించి పౌలు ఊహించి వుంటాడా? ఊహించి వుండకపోవచ్చు. అయితే దేవుని ప్రత్యక్షత కార్యక్రమంలోనే తాను కూడ సాధనంగా వాడబడుతూ వున్నాడని మాత్రం అతనికి ఖచ్చితంగా తెలుసు. తానూ, తన సమకాలికులైన యితర పరిశుద్ధులగు అపొస్తలులూ, ప్రవక్తలూ (ఎఫె. 3:5), దేవుని మూలంగా దేవుని అధికారంతో వ్రాస్తున్నారని, తనకు అంత పరిచయం వున్న పాత నిబంధన లేఖనాలవలె తమ రచనలు కూడా సాక్షాత్తూ దేవుని వాక్కులేనని అతనికి ఎంత మాత్రము సందేహానికి తావులేకుండా తెలుసు (గల. 1:11; 1 కొరి. 11:23;14:37; 1 థెస్సె. 2:13). (అపొస్తలుడైన పేతురుకు కూడా తాను వ్రాసినది దైవావేశం వల్ల కలిగిందనీ తెలుసు. అంతేగాక పాత నిబంధన లేఖనాలవలె పౌలు రచనలు కూడ లేఖనాలేననీ అతడు భావించాడు - 2 పేతురు 3:2,15, 16తో 1:20, 21 పోల్చిచూడండి).

ఈ ప్రత్యక్షత కార్యక్రమం యుగాంతందాకా కొనసాగుతుందని అపొస్తలుడైన పౌలు నమ్మాడని గాని, ఆ విధంగా బోధించాడని గాని అనడం నిరాధారమైన ఊహాగానమే అవుతుంది. ప్రత్యక్షత ఎక్కడ అంతమౌతుందో తనకు తెలుసునని పౌలు ఎక్కడా చెప్పుకోలేదు. అయితే క్రొత్త నిబంధన లేఖనాల వెల్లడింపు పూర్తి అయింది అన్నది తిరుగులేని చారిత్రాత్మక సత్యం కాబట్టి “పూర్ణమైనది" వచ్చినప్పుడు పూర్ణము కానిది అంటే ప్రవచనం, జ్ఞానం, భాషలు వీటి అవసరం లేకుండా పోతుందని నిర్థారించడం సమంజసమే.

ఆరవ అధ్యాయము

ఈనాడు అపొస్తలులున్నారా?

చారిత్రాత్మకంగా 'అపొస్తలుడు' అన్న పదాన్ని మొదటిసారిగా మన ప్రభువు తన పన్నెండుమంది శిష్యులకు వాడాడు. పన్నెండుమంది కంటే ఎక్కువమంది శిష్యులున్నారు. వారిలో పన్నెండుమందిని ఎన్నిక చేసుకొని ప్రభువు వారిని అపొస్తలులు అని పిలిచాడు (లూకా 6:13). అపొస్తలుడు అన్న పదం గ్రీకు భాషలో అపోస్టోలాస్-అనగా పంపబడినవాడు, వర్తమానికుడు అని అర్థం. అపొస్టెల్లో (క్రియా) అనగా పంపుట. నామవాచకం అపోస్టోలాస్ అనగా వర్తమానికుడు. నూతన నిబంధనలో ఈ పదాలు సర్వసామాన్యముగా వాడబడ్డాయి. అయితే అపొహిలాస్ అన్న పదాన్ని ప్రతిస్థలంలో అపొస్తలుడు అని అనువాదం చేసినట్టయితే నూతన నిబంధనలో పన్నెండు మందికంటే ఎక్కువ మంది అపొస్తలులుంటారు. అలాగైతే పన్నెండుమందినే అపొస్తలులు అనడం అర్థరహితం; కనుక అపొస్తలుడు అన్న పదం సాంకేతికంగాను, సిద్ధాంతపరంగాను ప్రత్యేకంగా ప్రభువు ఎన్నిక చేసుకొన్న పన్నెండుమంది శిష్యులకే వర్తిస్తుంది.

అదేరీతిగా "ఎక్లిసియా" (సంఘం) సాంకేతికంగా లోకములోనుండి యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా దేవుని ప్రత్యేక సొత్తుగా పిలువబడ్డ యూదుల అన్యుల సముదాయమునకు యివ్వబడ్డది. “ఎక్లిసియా" అన్న గ్రీకు పదాన్ని సామాన్యంగా ఒక సభ లేక ఒక సమావేశము లేక ఒక కూడిక , యింకా ఒక గుంపుగా అనువదించవచ్చు. ఈ కారణాన్ని బట్టి "ఎక్లిసియా” సంఘము అని సర్వదా అనువాదం చేసారు.

కనుక ఈనాడు అపొస్తలులు వున్నారా లేరా అన్న ప్రశ్నకు జవాబును చూచుకొనేటప్పుడు, సాంకేతిక లేక సిద్ధాంతపరమైన భావానికి సామాన్య భావానికి తారతమ్యాన్ని గుర్తించాలి.

ప్రభువు ఆయన ఎన్నిక చేసుకొన్నవారిని ప్రత్యేకంగా అపొస్తలులు అని పిలిచినట్లు మనం చూచాం. అయితే ఆ రీతిగా క్రొత్త నిబంధన కాలములో యితరులను వేరెవ్వరిని అలాగు నియుక్తులని చేసినట్లు లేక అభిషేకించినట్లు మనం చూడం. అంతే కాక వారి అపొస్తలత్వాన్ని యితరులకు బదిలీ చేయటం కాని లేక వారి స్థానంలో మరొకరిని నియమించడానికి గాని ఎలాంటి సలహాగాని ఆదేశముగాని కొత నిబంధనలో కనిపించదు. దీనిని బట్టి అపొస్తలులు అన్నహోదా ఆ పన్నెండుమందితోనే అంతమైందని చెప్పవచ్చు.

అసలు అపొస్తలుల అర్హతలు ఏవి? కొత్త నిబంధనను బట్టి వారి అర్హతలను ఈ రీతిగా క్రోడీకరించవచ్చు.

1. అపొస్తలుని ప్రభువే ఎన్నిక చేసుకొని నియుక్తునిగా చేసాడు (మతయి 10:2; లూకా 6:13; మత్తయి
28:18-20; యోహాను 15:16).

2. అతడు ప్రభువు పునరుత్థానానికి సాక్షి(అపొ.కా. 1:22).

3. అతడు దేవ సత్యాల ప్రత్యక్షతను పొందినవాడు (ఎఫె. 3:5).

4. సువార్త ప్రకటన ద్వారా సంఘస్థాపనకు బాధ్యుడైనవాడు (ఎఫె. 2:20).

5. అతని పరిచర్య అద్భుతములచేతను, సూచక క్రియల చేతను స్థిరపర్చబడి వుండాలి (2 కొరి. 12:12).

ఏవిధంగానైనా మత్తీయాను యూదా ఇస్కరియోతు స్థానంలో పదకొండుమంది ఎన్నుకొన్న విషయం, పన్నెండు మందిలో ఒకడుగా పౌలుకు వున్న అర్హత, హక్కు చర్చనీయాంశాలు.

మత్తీయాను పదకొండుమంది ఎన్నుకొన్న విషయానికి సంబంధించి అపొ.కా. 1వ అధ్యా.లో గాని క్రొత్త నిబంధనలో మరెక్కడైనా గాని ప్రభువు అలాగు ఆజ్ఞాపించినట్లు కాని, ప్రభువు అంగీకరించినట్లుగాని ఏ సూచన లేదు. మత్తీయ ఎన్నిక చీట్లు వేసి ఎన్నుకోవడం నిరాధారమైనదని నేను భావిస్తున్నాను. యూదా స్థానాన్ని తీసుకోడానికి యూస్తును, మత్తీయాను ముందుకు తెచ్చారు. అయితే ఆ యిరువురిలో ఆ ఒక్కనినీ కూడ వీరే ఎంపిక చేసుకొని వుండవచ్చుగదా? మత్తీయ, యూస్తు ప్రభువు శిష్యుల మన్ననకు పాత్రులు అనడములో ఏ సంశయమూ లేదు. చరిత్రకారుడు యూసిబియస్ చెప్పినదాన్ని బట్టి ప్రభువు డెబ్బదిమంది శిష్యుల్లో వీరిద్దరున్నారని తెలుసుకొనవచ్చు. ఏది ఏమైనా యూదా స్థానాన్ని బర్తీ చేయడంలో ప్రభువు ఆజ్ఞ కోసం వేచియుండక అపొస్తలులు తొందరబడినట్లున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడు దావీదును ఎన్నిక చేసెంతవరకు ఓపిక పట్టలేక సౌలును ఎన్నిక చేసికొన్నట్లు ఈ ఎన్నిక వుంది. దావీదు దేవుని హృదయానుసారి.

అపొస్తలత్వానికి చెందినంతవరకు యూదా స్థానాన్ని పౌలు నింపాడని నేను దృఢంగా నమ్ముతున్నాను. అనుకూల సమయంలో ప్రభువే ఆ ఎంపిక చేసాడు. అకాలములో పుట్టినట్లున్న తనను పన్నెండుమందిలో ఒకనిగా ఆయన ఎంపిక చేసుకున్నాడు (1 కొరి. 9:1; 15:9) - "మనుష్యుల మూలముగానైనను ఏ మనుష్యుని వలననైనను కాక, యేసు క్రీస్తు వలనను ఆయన మృతులలోనుండి లేపిన తండ్రియైన దేవుని వలనను అసొస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును” (గల. 1:1); "..... మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటే నేను ఏ విషయములోను తక్కువవాడను కాను” (2 కొరి. 12:11). పౌలు అన్యులకు అపొస్తలుడు (2 తిమోతి 1:11). ఈ క్రింది విషయాలు అతని అపొస్తలత్వాన్ని దృఢపరుస్తున్నవి:

1. పన్నెండుమంది అపొస్తలుల వలనే పునరుత్థానుడైన క్రీస్తును అతడు చూచాడు (అపొ.కా.1:22; 1 కొరి. 15:8).

2. అన్యజనులకు అపొస్తలుడుగా ప్రభువే అతన్ని నియుక్తిని చేసాడు (అపొ.కా. 9:6, 15).

3. అపొస్తలులందరికంటెను ఉన్నతమైన రీతిగా క్రీస్తును గూర్చిన మర్మాన్ని పొందడానికి ఎన్నికైనాడు. (ఎఫె. 3:1-6).

4. పాలస్తీను వెలుపల దాదాపు నూతన నిబంధన సంఘాలన్నిటి స్థాపనలో అతడు సాధనమయ్యాడు (రోమా 16:4).

5. పౌలు సాధకత్వంవల్ల నూతన నిబంధనలో సగానికి పై భాగం మనకు లభించింది.

6. అపొస్తలత్వానికి సూచనలు “పౌలు పరిచర్యలో ప్రత్యక్షమయ్యాయి” (2 కొరి. 12:12).

పన్నెండు మంది అపొస్తలులేగాక ఇతరులు కూడా క్రొత్త నిబంధనలో అపొస్తలులుగా పిలువబడ్డారని ఒక వాదన ఉంది. బర్నబా అపొస్తలుడని పిలువబడ్డాడు (అపొ. కా. 14:4,14). అంతియొకయ సంఘం పౌలుతో అతన్ని పంపినప్పుడు ఉమ్మడిగా అపొస్తలులు అన్నారు (అపొ.కా. 18:2,3). ఈ రెండు సందర్భాలలో (14:4,14) అపొస్తలులు అన్న పదాన్ని సామాన్యమైన రీతిగా వర్తమానికులు లేక అధునాతన పదజాలములో మిషనరీలు అని అనువాదం చేసుకోవచ్చు. కాని సాంకేతికంగా అపొస్తలులు అని అనజాలము. పౌలు ఒక్కడే అపొస్తలుడు, బర్నబా కాదు.

అటుతరువాత రోమా 16:7లో అందానికు, యూనీయల విషయం చర్చించాలి. వీరిరువురు "అపొస్తలులలో ప్రసిద్ధికెక్కినవారని" పౌలు చెప్పాడు. ఈ భాగంలో కూడ 1కొరి. 8:28లో వలెనే వర్తమానికులు అని అనువాదం చేయడం సబబు.

వాస్తవానికి ఆరోజుల్లో ప్రతి సంఘములోను సంఘ వర్తమానాలను ఇతర సంఘాలకు చేరవేసే వర్తమానికుడు లేక వర్తమానికులు ఉండేవారు. ఈ విధంగా సంఘాలు పరస్పర ఆత్మోన్నతికీ, సహవాసానికీ కృషి చేసేవాళ్ళు. అంద్రానికు యూనియ ఏ సంఘానికి చెందినవారో మనకు తెలియదు. అయితే సంఘ వర్తమానికులలో వారు ప్రసిద్ధికెక్కినవారు.

గల. 1:19లో ప్రభువు సోదరుడైన యాకోబును గూర్చి ప్రస్తావించారు. ఈ సందర్భములో కూడ అపొస్తలత్వం మొదటి పన్నెండుమందిని అధిగమించినట్లు చూస్తున్నాం. కాని ఇతడు అల్పయి లేక క్లోపా కుమారుడైన చిన్న యాకోబు. అతడు పన్నెండుమందిలో ఒకడు (మత్తయి 10:3). అతన్ని ప్రభువు సోదరుడు అన్నారు. అనగా అతడు ప్రభువు పినతల్లి కుమారుడు. ప్రభువు తల్లి మరియ, యాకోబు తల్లి సోదరీలు (యోహా. 19:26; మార్కు 16:40).

ఈ యాకోబు ప్రభువు నలుగురి తమ్ముళ్ళలో ఒకడు అని నేను నమ్మను. అయితే ఆయన సహోదరులలో కొందరు గాని అందరుగాని ప్రభువు ఆరోహణానికి ముందే వారి అవిశ్వాసాన్ని వీడి ప్రభువు శిష్యులతో చేరిపోయారు అనటానికి కొన్ని ఆధారాలు వున్నాయి (యోహా. 7:3-5 వరకు అపొ.కా. 1:14) కాని గల. 1:19లో ఉన్న యాకోబే ప్రభువు తముళ్ళలో ఒకడని అతడు అపొస్తలుడిగా నియమింపబడ్డాడని ఖచ్చితమైన ఆధారాలు ఏమి లేవు.

అల్పయి కుమారుడైన యాకోబే అపొస్తలుడని నమ్మడానికి పునరుత్థానము తరువాత ప్రభువు అతనికి కన్పించాడు (1 కొరి. 16:7). గనుక ఈ విషయంలో నేను దృఢంగా ఒప్పించబడాను. అతడే యెరూషలేం సభలో (అపొ.కా. 15:13) అధ్యక్షత వహించాడు. యాకోబు పత్రిక కూడ ఇతడే రచించాడు.

1 థెస్స 1:1;2:6 ప్రకారం సిల్వాను (సీల) తిమోతిలను అపొస్తలులుగా పేర్కొన్నారు. 2:6లో పౌలు వారిని అపొస్తలులుగా ప్రస్తావించి తన సహపనివారిగా చూపుచున్నాడు. అయితే సాంకేతికంగా దీన్ని పరిశీలిస్తే పౌలు మాత్రమే అపొస్తలుడని గుర్తింపగలం. అయిననూ ఈ స్థలంలో కూడ అపొస్తలులు అను పదాన్ని వర్తమానికులుగా అనువదించవచ్చు.

అంతియొకయ సంఘం పౌలును సీలను వర్తమానికులుగా (క్రీ॥శ || 50సం||లో) పంపించారు. (అపొ.కా. 16:40). పౌలు మిషనెరీ ప్రయాణములో తిమోతి లుస్తలో వారిని కలుసుకొన్నాడు (అపొ. కా. 16:1). కొరింథీ పట్టణంనుండి వారు 1 థెస్సలొనీకయుల పత్రికను వ్రాసారు. ఆరీతిగా వారు ముగ్గురు క్రీస్తు వర్తమానికులుగా అంతియొకయ సంఘము ద్వారా నియుక్తులైనారు. గనుక పౌలుతో సరిసమానంగా సీలను తిమోతిని అపొస్తలులు అనడానికి అవకాశమేమీ లేదు. లేఖనాలలో పన్నెండు మంది అపొస్తలులవలె వీరిని సంబోధించినట్లు ఎక్కడా చూడము.

అంతియొకయ సంఘము వర్తమానికులుగా వీరిని నియుక్తులను చేయడమే గాక క్రీస్తు అపొస్తలులు అన్న పదజాలం క్రీస్తు వర్తమానికులు అని గ్రహించడానికి అనువుగా ఉంది.

2 కొరి. 8:23ను బట్టి తీతు విషయంగూడ గమనించాలి. మనం ముందుగా చూచిన రీతిగానే తీతును గూడ వర్తమానికుడుగా గుర్తించవచ్చు. తీతు సంఘం వలన పంపబడిన వర్తమానికుడు లేక అపొస్తలుడి ప్రతినిధి కాని అపొస్తలుడు కాదు. చివరిగా 1 కొరి. 4:6,9లో అపొల్లో ప్రస్తావన అప్రస్తుతము. 9వ వచనములో అపొస్తలులు అన్నపదము పౌలుకు కేఫాలకే చెందుతుందిగాని అపొగాకుగాదు (3:22). అపొల్లో అపొస్తలుడు కాదు. ఎక్కడైనా అతనిని అపొస్తలుడు అని ప్రస్తావించలేదు. మన వాదన కోసం అస్పష్టమైన భాగాలను తీసుకొనరాదు.

నూతన నిబంధనలోని ప్రతి భాగాన్ని నిష్పాక్షికంగా తరచిచూచి ఈనాడు ఆపొస్తలులు లేరు అని తీర్మానింపగలుగుతున్నాం. అపొస్తులులలో చివరివాడు ప్రభువు ప్రియశిష్యుడైన యోహాను. అతడు (19|| || 99సం||లో) ప్రభువు నందు నిద్రించాడు.

ఎఫెసి 4:11లో అపొస్తలులు అన్న వరం మొదటిది, అతి ప్రాముఖ్యమైనదిగా ప్రభువు సంఘానికిచ్చినట్లు పౌలు ప్రస్తావించాడు. దానితో పాటు ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులున్నారు. కొందరు అపొస్తులులు ప్రవక్తలుగా కూడ ఉన్నారు. సంఘము పెంతెకోస్తుదినాన ప్రారంభమైన నాట నుండి ఈ రెండు వరాలు ఒకదానితో ఒకటి సమకాలికంగా వచ్చాయి. ఆపొస్తులులు ప్రవక్తలుగా నూతన నిబంధన లేఖనాలను పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా మనకిచ్చారు. నూతన నిబంధనలో చిట్టచివరి పుస్తకం అపొస్తలుడైన యోహాను రచించిన ప్రకటన గ్రంథము. యోహాను ప్రకటన వ్రాసి ప్రభువునందు నిందించడంతో నూతన నిబంధన లేఖనాలు పూర్తి అయ్యాయి. అటుతరువాత అపొస్తలులు లేరు. లేఖనాలు రచించబడలేదు.

కనుక ఈనాడు అపొస్తలులు లేరుగాని వారు మనకందించిన లేఖనాలున్నాయి. నూతన నిబంధన లేఖనాలను బట్టే చరిత్రలో అపొస్తలుల పారంపర్యాన్ని సంఘములో అపొస్తలుల అధికారాన్ని నిర్ణయించగలం. ఇతరత్రా ఆ నిర్ణయము సరికాదు.

ఈనాడు ఎవరైనా నేను యేసు క్రీసు అపొస్తలుడను అని చెప్పుకొంటే అది సాహసోపేతం. ఆలా చెప్పుకోవడం కృత్రిమమని పైన పేర్కొన్న ప్రమాణాలతో పరిశీలించి నిరూపింపవచ్చు.

ఏడవ అధ్యాయము

ఈనాడు ప్రవక్తలున్నారా ?

ఈ ప్రశ్నకు జవాబు, "ఈనాడు అపొస్తలులు ఉన్నారా?” అన్న ప్రశ్నకు జవాబు మాదిరిగనే వుంటుంది. ఎఫె. 2:20; 3:5; 4:11లో అపొస్తలుడైన పౌలు అపొస్తలులు, ప్రవక్తలు అన్న పదాలను జంటగా వాడాడు. వీటిలో మొదటి సూచకం (2:20) అపొస్తలులు, ప్రవక్తల సువార్త ప్రకటన ద్వారా జరిగిన సంఘ వ్యవస్థాపనకు చెందింది. రెండవ సూచకం (3:5) నూతన నిబంధనలోని 27 పుస్తకాలలో క్రీస్తును గూర్చిన మర్మ ప్రత్యక్షతకు చెందింది. ఈ ప్రత్యక్షత అపొస్తలులు, ప్రవక్తలకు కలిగినదని మనము తెలుసుకొంటున్నాం. చివరి సూచకంలో (4:11) పునరుత్థానుడైన క్రీస్తు సంఘానికిచ్చిన కృపావరాల జాబితాలో అపొస్తలులు, ప్రవక్తలు ప్రథమంగా ప్రస్తావించబడ్డారు.

ఎఫె. 4:11లో వస్తావింపబడిన కృపావరాలు ప్రథమశ్రేణికి చెందినవి. ఇవి సంఘ పునాదికి, నిర్మాణానికి ఆధారమైన సైద్ధాంతిక చట్రానికి చెందినవి. అయితే రోమా 12, 1కొరి. 12వ అధ్యా.ల్లో పేర్కొనబడిన కృపావరాలు అనగా అద్భుతాలు, స్వస్థతలు, భాషలు అను వరాలు పై వరాలతో పోల్చినప్పుడు భవన నిర్మాణానికి పరంజా లాంటివి. అవి శాశ్వతమైనవి కావు. ఇవికాక సేవేతర, బోధనాంతర వరాలు అనగా పరిచర్య, ఆదరించుట, ఇచ్చుట, దయచూపుట, విశ్వాసము, ఆత్మలను వివేచించుట మొదలగు వరాలు సహాయక వరాలు. సంఘమనే భవనంలో వున్న యితర సభ్యులు ఈ వరాలను కలిగియుండవచ్చు.

అపొస్తలులు, ప్రవక్తలు ఒక ప్రత్యేక శ్రేణిగా వున్నారు. వీరి పరిచర్య సంఘ ప్రారంభదశకు చెందినది (ఎఫె. 2:20). ఇవి రెండు కొత్త నిబంధన ప్రత్యక్షతకు సమకాలికంగా వుండి అపొస్తలుడైన యోహాను ప్రత్యక్షీకరణ (ప్రకటన) గ్రంథ రచనతో అంతమగుచున్నవి. అపొస్తలుల ప్రవక్తల స్థానాలు పరస్పర మార్పిడి చెందుతుంటాయి. అనగా పలువురు అపొస్తలులు అదే సమయంలో ప్రవక్త పరిచర్య ధర్మమును నెరవేర్చారు. అపొస్తలులు అందరూ ప్రవక్తలుగా పరిగణింపబడినప్పటికీ ప్రవక్తలందరూ అపొస్తలులు కారు. అపొస్తలులు పండ్రెండుమంది మాత్రమే (లూకా 6:13). ఈ యిరువురిలో అపొస్తలులు అన్న పదము హోదాను సూచిస్తుండగా ప్రవక్త అన్న పదము కార్యనిర్వాహణను సూచిస్తుంది. అయితే అపొస్తలులు కాని ప్రవక్తలు కూడా వుండిరి (అపొ.కా. 13:1).

అపొస్తలత్వం నూతన నిబంధన క్రమం. ప్రభువు తానే అపొస్తలులను నియుక్తులను చేసినట్టు మనము గమనించగలం, కాని ప్రవక్తల క్రమము పాత నిబంధన కాలము నుండి అనగా మానవ చరిత్ర పారంభము నుండి వున్నట్టు గుర్తించగలం. పాత నిబంధన క్రమంలో మొదటి ప్రవక్త హానోకు అని, చివరి ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహానని మనం ఎరుగుదుము.

ప్రవక్త స్థానం అపొస్తలత్వం అంత వ్యవస్తీకరింపబడలేదు, అయితే అది అపొస్తలత్వము కంటే క్రియాశీలకమైంది. ప్రవక్తలనబడిన వారందరూ ఎలీషావలె అభిషక్తులు కారు. ఒకరు ప్రవక్తగా వుండడానికి అధికారరీత్య నియుక్తుడైనా కాకున్నా ఎవరికి దేవుని వాక్కు ప్రత్యేక్షమైందో అతడు ప్రవక్తే. ఆమోసు ఆ కోవకు చెందినవాడు (ఆమో. 7:14).

హెబ్రీ ప్రవక్త దేవుని పక్షంగా ప్రకటించేవాడు లేక మాట్లాడువాడు మాత్రమే కాదు గాని సహజంగా, మానవరీతిగా కలల ద్వారా దైవప్రత్యక్షతల ద్వారా దృగ్గోచరం గాని విషయాలను చూచేవాడు, అనగా దీర్ఘదర్శి (కొజే లేక రోయే). “నబి"అనే హెబ్రీ పదము యొక్క మూలార్థం పొంగడం అనగా ఆవేశంతో మాట్లాడడం. ప్రవక్త భవిషత్తును చూస్తాడు.

ఆరీతిగా అతడు భవిష్యత్తును తెలియజేసేవాడు; అదే సమయంలో అతడు విషయాన్ని ఎలుగెత్తి చెప్పేవాడు. నూతన నిబంధనలో ప్రవక్త (ప్రొఫెటీస్) అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి కూడ ఈ రెండు అర్థాలు వున్నవి.

ప్రవక్త దేవుని తరఫున మాట్లాడతాడు అనగా ప్రవచన ప్రకటనకు దేవుడే ఆధారం, అధికారం కూడా. తీర్పును లేక దీవెనను లేక హెచ్చరికను, సందర్భాన్ని బట్టి ప్రవక్త దేవుని అధికారంతో ప్రకటిస్తాడు. అంతేకాక దేవుని అధికారంతోనే, అవసరతను బట్టి అద్భుతాలు, మహాత్కార్యాలతో ఆ ప్రకటనను బలపరుస్తాడు. ప్రవక్తలు దేవుని ప్రత్యక్షతను మానవాళికి అందించడానికి దేవుడు అభిషేకించినవారు.

ప్రవక్తలు దేవుని నుండే మాట్లాడారు. ప్రతి ప్రవక్త ప్రవచనాత్మంగా మాట్లాడిందంతా మనకు లభించలేదు. ప్రారంభములో ప్రవచనాలు ఎక్కువభాగం వాచకాలు; కొన్ని మాత్రమే లిఖితాలు. వాచకమైనవాటిని అటుతరువాత ప్రవచించిన ప్రవక్తలు లేక మరొకరు లిఖితరూపంలో పెట్టారు. ఇరువురు కూడ ఈ కార్యం కోసం దేవునివలన ప్రేరేపింపబడ్డారు. గనుక మనకు సంబంధించిన ప్రవచనాలు అనగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనపై ప్రభావము కలిగివున్న ప్రవచనాలు లిఖితరూపంగా పరిశుద్ధ లేఖనాల్లో మనకు అందినవే. ప్రవక్తలు మాట్లాడిన ప్రవచనాల్లో లిఖితరూపంలో కనిపించేవాటినే మనం గణనకు తీసుకొంటున్నాం. “ఒకడు తన ఊహానుబట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగ లేదుగాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి" (1 పేతురు 1:20, 21).

మరోవిధంగా చెప్పాలంటే మనకిప్పుడు లేఖనమే ప్రవచనం. కావున ఈనాడు ప్రవక్తలున్నారా లేరా అన్న ప్రశ్నకు ప్రస్తుతము లేఖనాలు రచించబడుచున్నావా అన్న తాత్పర్యముతో జవాబు చెప్పుకోవాలి. లేఖనాలు సంపూర్ణాకృతిలో ఉన్నవని నమ్మితే, ప్రత్యక్షత నిలిచిపోయిందని స్థిరపరుస్తున్నాం. మరి ప్రత్యక్షత నిలిచిపోతే ప్రవచనం కూడ నిలిచిపోయింది. అలా కాకుండా ప్రస్తుతం సంఘంలో ప్రవచనమున్నదీ అంటే దేవప్రత్యక్షత కొనసాగుతున్నదని, లేఖనాలు అసంపూర్ణాలు అని అనడమౌతుంది. అయితే బైబిల్ లోని 66 పుసకాలు దైవ ప్రేరేపణవల్ల దేవుడు మానవునికి సంపూర్ణంగా తుదిరూపంలో యిచ్చిన ప్రత్యక్షత అని సార్వత్రికంగా సంఘం ఒప్పుకొంటుంది. ప్రత్యక్షత లిఖంచడం అన్న భావములోనే ప్రత్యక్షత ఆగిపోవలసి వున్నది, లేక ప్రవచనం ఆగిపోతుంది అనేది యిమిడియున్నది. ఆ రీతిగా లేఖనాలలో అన్నికాలాలకూ సార్వత్రికంగా ప్రామాణికమైన దేవప్రత్యక్షత వుంది. ఈనాడు సంఘములో మనకు కొత్తగా అందింపబడిన దేవ ప్రత్యక్షతను యిచ్చే ప్రవచన వరంగాని పరిచర్యగాని వున్నది అని నమ్మం. నూతన నిబంధన ముగింపుతోను పన్నెండుమంది అపొస్తలుల గతింపుతోను అపొస్తలులు, ప్రవక్తలు అన్న వరాలు ఆగిపోయాయి.

ఈనాడు మనం ప్రవచించమా అని మీరు అడగవచ్చు, అవును మనం ప్రవచిస్తాం. అంటే ఏది ప్రత్యక్షపరచబడి, లేఖనాలలో లిఖింపబడియున్నదో దానిని వివరించడం లేక ప్రకటించడం అన్న భావముతోనే ప్రవచిస్తున్నాం. ఏదైనా కొత్తగా ప్రత్యక్షపరచబడ్డది అని చెప్పుకోబడినదానిని అప్రామాణికంగా బైబిలుకు భిన్నమైనదిగా పరిగణించాలి. ప్రపంచం, ఇశ్రాయేలు, యింకా సంఘానికి సంబంధించిన భవిషత్తు అంతా బైబిలులో ముందే ప్రత్యక్షమై వుంది. క్రొత్త నిబంధన సంపూర్తి అయిన నాటినుండి కొత్తది ఏది దానితో చేర్చబడలేదు. ఈనాడు సంఘంలో బోధకులు, ప్రవక్తల పరిచర్యను నెరవేరుస్తున్నారు. 1కొరి. 14వ అధ్యాయంలో  ఉపదేశించుట, లేక లేఖనాలకు అర్థము చెప్పుట అన్న విషయాలను ప్రవచనంగా పౌలు మాట్లాడుతున్నాడు (4,5,22, 24, 29-31 వచనాలు చూడండి). ఈనాడు సంఘముగాని ఒక వ్యక్తిగాని అభ్యసింపగల ప్రవచన పరిచర్య లిఖితమైన దేవుని వాక్యమగు బైబిలు పరిధిలోనే వుండాలి.

ఎనిమిదవ అధ్యాయము

ఈనాడు కూడా దేవుడు స్వస్థపరుస్తాడా ?

ఈ ప్రశ్నకు 'అవును' అనే ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అయితే ఆ జవాబు అంత సామాన్యమైనది కాదు. దానిలో చాలా చిక్కు ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి సందర్భంలోనూ స్వస్థతను ఆశించగలమా ? వ్యాధి సాతాను నుండే వస్తుందా ? ఔషధం వాడడం తప్పా? స్వస్థత మహాసభలు, అద్భుతాలను గూర్చిన మాట ఏమిటి? ఇంకా అనేకమైన ప్రశ్నలు వస్తాయి.

ఈనాడు స్వస్థతలు ఉన్నవా? అన్న ప్రశ్న ప్రభువు కాలంలోను, అపొస్తలుల కాలంలోను స్వస్థతలు జరిగాయి అన్న ప్రాతిపదికపై ఆధారపడి ఉంది. ప్రపంచంలో వ్యాధులు, శారీరక వైకల్యాలు వున్నంతకాలం మానవుడు దేవునివైపు తిరగడం, స్వస్థతలు ఆశించడం సబబే. మొదటి శతాబ్దములో దేవుడు స్వస్థపరచగా ఈనాడు స్వస్థపరచడు లేక స్వస్థపరచలేడు అనుకోడానికి తగిన హేతువేముంది? ఏ విధంగానైనా దేవుడు మార్పు లేనివాడు, యేసుక్రీస్తు నిన్న, నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు అన్నప్పుడు ఆ సత్యాలను ఏ సందర్భములో చెప్పారో దానిని తగిన రీతిగా పరిశీలించాలి.

దేవుడు మారడు అన్న విషయం సత్యమే, అయితే దేవుడు మార్పు లేనివాడు అన్న విషయం ఆయన వ్యక్తిత్వానికీ, శీలానికీ సంబంధించిన విషయమే గాని చరిత్రలో ఆయన వ్యవహరించే విధానానికి కాదు. సృష్టి ప్రారంభము నుండి మానవజాతితో దేవుడు వ్యవహరించిన విధానం మనం చూచినట్టైతే దేవుడు మారడు అని గుర్తించగలం. ఉదాహరణకు మోషే నిబంధన ప్రకారం బలులు అర్పింపవలసి ఉన్నది, కాని నూతన నిబంధన కృపాయుగంలో బలుల అవసరత లేదు. ఎందుకనగా దేవుని గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఒక్కసారే బలి అయినాడు. అయితే దేవుడు మానవునితో వ్యవహరించడంలో మార్పు అన్నది హఠాత్తుగా పరిస్థితులను బట్టి జరుగలేదు. ఈ మార్పులు దేవుని సంకల్ప ఉద్దేశానుకూలంగా జరిగాయి. అనగా క్రొత్త నిబంధన కాలం నుండి ఈ నాటికి దేవుని యొక్క కార్యక్రమంలో స్వస్థతలకు చెందినంతవరకూ ఏమైనా మార్పు వచ్చిందా ? అన్న విషయం పరిశీలించాలి.


ప్రభువు, అపొస్తలులు చేసారన్నటువంటి అద్భుతాలు ఈనాడు కూడా సంభవిస్తున్నాయా ? ఆపొస్తలుల కాలం నుండి చనిపోయినవారిని ఎవరైనా లేపారా ? అప్పుడప్పుడూ ఇవి జరిగినవన్న వినికిడి ఉన్నా వీటిని నమ్మటానికి సరైన ఆధారాలేమి లేవు. ఈనాడు అద్భుతాలు లేవు అని నిష్కర్షగా చెప్పలేకపోయినా మన ప్రభువు అపొస్తలులు చేసినటువంటి అద్భుతాలు ఇప్పుడునూ జరుగుతున్నాయని యథార్థంగా చెప్పలేము. ఇందును బట్టి అద్భుతాలు చేయడానికి ప్రభువుకు శక్తి ఉందన్న సత్యాన్ని ఏమాత్రమూ శంకించడం కాదు. కాని బైబిలు కాలములో ప్రభువు చేసిన రీతిగానే ఈనాడు కూడా చేస్తున్నాడా ? ఆన్నది ప్రశ్న.

బైబిలులో సంభవించిన అద్భుతాల చరితను సామాన్యముగా పరిశీలించి చూస్తే యూదుల చరిత్ర కాలంలో ముఖ్యంగా వారి ఆత్మీయ పతన కాలంలో అప్పుడప్పుడూ అద్భుతాలు జరిగినట్టు గుర్తింపగలము. ఈ కాలవ్యవధులు మోషే, యెహోషువ, ఏలీయా, ఎలీషా రోజుల్లోనూ, చివరిగా మన ప్రభువు, అపొస్తలుల రోజుల్లోనూ గుర్తించబడ్డాయి. ఈ కాలాలు (గ్రీకులో కైరాస్) అనగా దేవుడు తన మహాశక్తిని అసాధారణంగా ప్రత్యక్షపరిచి తీర్పును లేక రక్షణను దయచేసిన దేవుని నిర్ణీత దర్శన కాలాలు. బైబిలు ప్రబోధనను బట్టి అలాంటి కాలం మరొకటి మహా శ్రమల కాలంలో యేసుక్రీస్తు రెండవ రాకడ సందర్భముగా వస్తుంది.

అద్భుతం అనే పదం గ్రీకు భాషలో మూడు పదాలు, మూడు భావాలతో వాడబడింది. అవి టేరాస్ అంటే అద్భుతం, డునామిస్ అంటే శక్తి లేక మహత్కార్యం, సెమెయ్యాన్ అంటే సూచక క్రియ. ఈ మూడు పదాలు అసాధారణ సంఘటనలోని అద్భుత స్వభావంవైపు మన దృష్టిని కేంద్రీకరింపజేస్తున్నాయి. అయితే సూచక క్రియ ఆ సంఘటన వైపే కాక దాన్ని సాధించిన వ్యక్తివైపు మన దృష్టిని మళ్ళింపజేస్తుంది. ఆ రీతిగా ప్రభువు చేసిన అద్భుతాలు, ఆయన మెస్సియ అనియు, ఆయన శిష్యులు అపొస్తలులనియు సూచిస్తున్నాయి. కాలముల సూచనలు అని మత్తయి 16:3లో ప్రభువు ప్రస్తావన చేసినవి, మనం జీవించుచున్న కృపా కాలపు ప్రారంభదశలో జరిగిన సహజాతీతమైన సంఘటనలకు సంబంధించినవి. 2 కొరి. 12:12 ప్రకారం పౌలు తన పరిచర్యలో ప్రత్యక్షమైన సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలు తాను అపొస్తలుడనడానికి చిహ్నములని పేర్కొంటున్నాడు.

ఇప్పుడు ఈ అద్భుతాలు జరిగిన కాలవ్యవధి ఆనగా మోషే కాలం నుండి క్రీస్తు, అపొస్తలుల కాలం వరకు పాత, క్రొత్త నిబంధనలు మనకు అనుగ్రహింపబడ్డ దేవుని ప్రత్యేక ప్రత్యక్షత కాలానికి సమాంతరంగా ఉంది.

అద్భుతాల సందర్భంగా ఇది ప్రత్యేకంగా గుర్తింపవలసిన విషయం. మోషే పంచమ గ్రంథాలను (బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు), వ్రాసిన నాట నుండి అపొస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాసినప్పటికి అద్భుతాలు బైబిల్ సత్య ప్రత్యక్షతను బలపరచేవిగా ప్రత్యక్షమైనట్టునూ, బైబిల్ ప్రత్యక్షతతో సమకాలికమైనట్టునూ గుర్తింపగలం.

కావున ఈనాడును దేవుడు స్వస్థపరుస్తున్నాడని నమ్మినను, దైవిక స్వస్థతలన్నీ తప్పనిసరిగా అద్భుత కార్యాలు అని చెప్పజాలం.

స్వస్థతాద్భుతం అంటే ఏమిటి ?

ఈ ప్రశ్నకు ప్రతివారికీ తోచే జవాబు: రోగులకోసం ప్రార్థించిన తక్షణమే స్వస్థత కలగడం. రెండవది: రోగి కొరకు ప్రార్థించిన తక్షణమే స్వస్థత కలగటంతోపాటు ఔషధముల వల్ల కుదురుబాటు కాని వ్యాధి లేక మరణకరమైన వ్యాధిని కుదుర్చుటలో ప్రత్యక్షమయ్యే మహాశక్తి. ఏది ఏమైనా స్వస్థతకు కొంత కాలం పడితే లేక ఔషధాలవల్ల కుదురుబాటైతే అది దేవునివల్ల కలిగింది కాదు అనటానికి తగిన హేతువేదీ లేదు. ఒకర్ని ఎప్పుడు, ఎలాగు స్వస్థపరచాలి అనేది మనం దేవునికి ఆజ్ఞాపింపలేము. ఒక్క క్షణంలోనే దేవుడు స్వస్థపరచగలడు లేక స్వస్థపర్చటానికి దేవుడు సమయం తీసుకోవచ్చు. ఔషధం లేకుండ దేవుడు స్వస్థపర్చగలడు. అయితే ఔషధాల ద్వారా కూడా ఆయన స్వస్థతనివ్వ నిర్ణయించవచ్చు. ఒక్కొక్క వ్యక్తిని వారి పరిస్థితులను బట్టి, అవసరతను బట్టి వేరు వేరుగా వ్యవహరించడానికి దేవునికి తగిన హేతువులున్నాయి.

ఔషధము వాడుకోవడం తప్పా ?

ఔషధము వాడుకోవడం తప్పా? దైవిక స్వస్థత ఔషధాల వాడుకను కాదంటుందా? ఈ ప్రశ్నలకు ఔను అన్న సమాధానం బైబిల్లో ఎక్కడా కనిపించదు. వాస్తవానికి ఔషధాలు వాడడం దేవుడు అంగీకరించినట్లు బైబిల్లో ఎన్నో నిదర్శనాలున్నాయి. ఉదాహరణకు యెషయా "అంజూరపు పండ్ల ముద్ద తీసికొని ఆ పుండుకు కట్టవలెను, అప్పుడు అతడు బాగుపడునని చెప్పెను” (యెషయా 30:21). “ఆయన ఇట్లు చెప్పి నేలమీద ఉమ్మి వేసి, ఉమ్మితో బురదచేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసెను” (యోహాను 9:6). అపొస్తలుడైన పౌలు తిమోతికి కడుపు జబ్బు నిమిత్తము కొద్దిగా ద్రాక్షారసము పుచ్చుకోమని సలహా యిచ్చాడు (1 తిమోతి 5:23).

ప్రపంచములో మానవుని బాధ నివారణకు వైద్యశాస్త్రము ఎంతో మేలు చేసింది. సూక్ష్మజీవి సంహారక ఔషధాలు ప్రతి వత్సరము అసంఖ్యాకుల్ని మరణము నుండి కాపాడుతున్నాయి. రోగులకు, బాధితులకు సేవ చేస్తున్న వైద్యులకోసం మనం దేవునికెంతో కృతజ్ఞత చెల్లించాలి. గనుక ఔషధాల్ని అనుచితంగా దుర్వినియోగం చేసిన పరిస్థితుల్లో తప్ప, వైద్యశాస్త్రం దేవుడు మానవాళికి యిచ్చిన ఒక ఈవిగా పరిగణించాలి.

మన వ్యాధికి కారణాలేవో తెలుసుకోడానికి మనం ప్రయత్నించవచ్చు. అయితే మన బాధను నివారించుకొని మనం ఆరోగ్యంగా వుండడానికి తగిన యత్నము చేయాలన్నది సామాన్య జ్ఞానం. వైద్యునియొద్దకు వెళ్ళొద్దని దేవుడు ఎక్కడా చెప్పలేదు. వైద్యునియొద్దకు వెళ్ళడానికి నిరాకరించి తన భార్యను చంపుకొన్న ఒక పాస్టర్ ఈ రచయితకు తెలుసు. ఎట్టకేలకు ఒక రోగిని స్వస్థపర్చడమన్నది దేవుడు చేసే పనేనని మనం నమ్మాలి. ఒకరిని స్వస్థపరచటం దేవుని చిత్తం కాకుంటే వైద్యుడుగాని, ఔషధాలుగాని ఏమీ చెయ్యలేవు.

రోగానికి ఎల్లప్పుడూ పాపమే కారణమా ?

పాపం వల్లనే ఎల్లప్పుడూ వ్యాధి సంభవిస్తుందా? కానే కాదు. మనము మంచి ఆరోగ్యాన్ని అనుభవిస్తున్నప్పుడల్లా పాపరహితులమైన పరిపూర్ణులమని భావించరాదు. (పరలోకానికి మనం చేరకముందు సంపూర్ణ ఆరోగ్యమును, పరిపూర్ణ పరిశుద్ధతను కలిగియుండడం సాధ్యం కాని విషయం). పాపఫలితంగా ప్రత్యక్షంగా గాని, పరోక్షంగాగాని వ్యాధి సంభవించవచ్చు. అయితే అది ఎల్లప్పుడు అలాగుగాదు. నిద్ర చాలకపోవడం, విశ్రాంతి లేకపోవడం, అధికంగా భుజించడం, అతి తక్కువగా భుజించడం లేక తినగూడనిది తినడం అన్న స్వల్ప కారణాలను బట్టి కూడ వ్యాధులు సంభవించవచ్చు. మాదక ద్రవ్యాలు, త్రాగుడు మొదలగు విషపూరిత పదార్థాలను సేవించడం వల్ల కూడా వ్యాధులు తప్పక వస్తాయి. ఆరోగ్యానికి హానికరమైనవాటిని తినడం, త్రాగడం పాపంగానే గణించాలి. లైంగిక అవినీతి, అభిచారము మొదలైనవి సుఖవ్యాధి సంబంధమైన సమస్యలను సంప్రాప్తము చేసినట్టే పై కార్యాలు కూడ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. మానసిక పాపాలు అనగా గర్వము, అసూయ, ద్వేషము, దురాశ మున్నగునవి శారీరక పాపాల కంటే భయంకరమైనవిగా వుంటవి. అట్టివాటిని బట్టి దేవుని ఉగ్రత వ్యాధిగా ప్రత్యక్షం కావచ్చు. ఈ దైవోగ్రత ఈ జీవితంలో శిక్షగాను, సరిదిద్దుబాటుగాను రావొచ్చు. అదంతా మనము చేసినదానిపై ఆధారపడి వుంటుంది. అయితే మరణానంతరము జరగబోయే చివరి తీర్పు శాశ్వతంగాను, శిక్షాత్మకంగాను వుంటుంది. పాప కారణంగా విశ్వాసులు, అవిశ్వాసుల మీద కూడ వ్యాధిరూపంలో దేవుని తీర్పురావడం బై బిల్ నందు అనేక సందర్భాల్లో చూడగలం. పాత నిబంధనలో కుష్ఠువ్యాధి రావడం మూడు సందర్భాల్లో చూస్తున్నాం. మోషేకు వ్యతిరేకంగా సణిగినందుకు మిర్యాముకు (సంఖ్యా. 12:10); దురాశ అనే పాపానికి ప్రతిఫలంగా గెహజికి (20. 5:27); యాజక ధర్మాన్ని అతిక్రమించినందుకు ఉజ్జియరాజుకు (2 దిన.26:20) సంప్రాప్తించింది. నూతన నిబంధనలో పక్షవాయువుగల వాని విషయం (మార్కు 2వ అధ్యా.); బేతెస్ధ కోనేటి వద్ద ప్రభువు స్వస్థపరిచినవాని విషయం (యోహా. 5:14); పురుగులు పట్టి చనిపోయిన హేరోదు (అపొ.కా. 12:23) విషయాల్లో ఈ సత్యాన్ని గుర్తించుకొంటున్నాం.

1 కొరి. 11:30లో అపొస్తలుడైన పౌలు మాట్లాడుచూ అయోగ్యంగా బల్లలో పాల్గొనేవారికి సంభవించే బలహీనత, వ్యాధి, మరణాలను గూర్చి హెచ్చరిస్తున్నాడు. యాకోబు 5:15లో కూడ పాపం వల్ల వ్యాధి రావచ్చని తెలిసికొంటున్నాం.

ఏది ఏమైనా పాప కారణంగానే కాకుండా యితర కారణాలను బట్టి కూడా వ్యాధి సంభవింప వచ్చని బైబిలు స్పష్టం చేస్తుంది. యోబు జీవితంలో అతడు పొందిన వ్యాధికి ఏ నిర్ణీత పాపం లేదు. వాస్తవానికి అతని వ్యాధి పాపకారణంగా కాకుండా నీతి కారణంగా వచ్చిందని గుర్తిస్తున్నాము. ఎలీషా ప్రవక్త వ్యాధి వల్ల మరణించాడు (2 రాజు. 13:14). గ్రుడ్డివాడు అతడు గుడ్డివాడుగా జన్మించటానికి ఎవరు కారణం అని శిష్యులు ప్రభువుని ప్రశ్నించినప్పుడు ప్రభువు — “వీడైనను వీనికన్న వారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" అని జవాబిచ్చాడు (యోహాను 9:3). ధనవంతుడు లాజరు గాథలో (లూకా 16వ అధ్యా.) లాజరు వ్యాధికి పాపకారణమేమీ కనిపించదు. తుదకు పౌలు తన జీవితంలో అనుభవించిన శారీరక రుగ్మత ఏదో ఒక ప్రత్యేక పాపమును బట్టి గాక అది వాస్తవంగా అతన్ని అహంభావమనే పాపానికి గురికాకుండ కాపాడింది.

విమోచనలో స్వస్థత ఉందా ?

యెషయా 53:4,5 వచనాలను తప్పుగా వ్యాఖ్యానించడం వల్ల విమోచనలో స్వస్థత అన్న సిద్ధాంతాన్ని రూపించుకొని వ్యాధిని పాపముతో సమీకరిస్తున్నారు కొందరు. ఈ వాక్యభాగములో క్రీస్తు మన పాపాల కొరకే కాదు, మన రోగాల కొరకు కూడ చనిపోయాడని వారు ప్రబోధిస్తారు. నాల్గవ వచనంలోని మొదటి భాగం “నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను” అన్నది క్రీస్తు సిలువలో మన కోసం జరిగించిన కార్యమంటారు. అయితే ఈ వ్యాఖ్యానము సరికాదు. యెషయా 53వ అధ్యా. పూరిగా సిలువ చిత్రనగా మనం తీసికొననక్కర్లేదు. మొదటి మూడు వచనాలు సిలువను గూర్చి మాట్లాడ్డం లేదు. నాల్గవ వచనం మొదటి భాగము కూడ సిలువను ప్రస్తావింపదు. సిలువ నాల్గవ వచనం రెండవ భాగమునుండి ప్రత్యక్షమౌతుంది. “అయినను మొత్తబడినవానిగాను, దేవునివలన బాధింపబడినవానిగాను, శ్రమనొందినవానిగాను మనమతని ఎంచితిమి".

మత్త. 8:17 ప్రకారం యెషయా 53:4 వచనం మొదటి భాగం ప్రభువు సిలువ మీద చనిపోకముందే ఆయన స్వస్థత పరిచర్యలో నెరవేరినట్టు చూస్తున్నాం . 5వ వచనం "మనయతిక్రమ క్రియలనుబట్టి అతడు గాయపరచబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది." ప్రాథమికంగా క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు. 8,10,11 వచనాల్లో "....అతడు నాజనుల అతి క్రమమును బట్టి మొత్తబడెను.... అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తన్ను గూర్చిన అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులనుగా చేయును” అన్న విషయాలు పై సత్యాన్ని స్థిరపరుస్తున్నది. మనం పొందిన స్వస్థత, పాపక్షమాపణ వల్లనైన ఆత్మీయ స్వస్థత.

శారీరక స్వస్థత విమోచనలో పరోక్షంగా ఆత్మీయ స్వస్థత ఫలితంగా యిమిడి ఉన్నదని చెప్పుకోవచ్చు. విమోచింపబడ్డవారంగా విశ్వాసం, వాగ్దానాలకు విధేయత చూపడంవల్ల ఆయన కృపను బట్టి ఇతరులకంటె ఎక్కువగా శారీరక స్వస్థతను కోరుకోవడానికి ఆధిక్యత, ప్రాధాన్యత కల్గి ఉన్నాం (నిర్గ. 15: 26; ద్వితి. 7:15; కీర్త. 103:3). అయితే ఒక వ్యక్తి ఆత్మీయతను శారీరక ఆరోగ్యాన్ని బట్టి అంచనా వేయడం సరికాదు. మరో మాటలో చెప్పుకొంటే విశ్వాసులకు శారీరక స్వస్థత క్రీస్తు విమోచనలో కలుగు ఉపోత్పత్తి. మన శరీరాలు యింకనూ విమోచింపబడలేదు అనడానికి బైబిలు నిరూపణ అవసరం లేదు. విమోచనంలో శారీరక విమోచన యిమిడి ఉన్నది అన్న విషయం వాస్తవం. అయితే దేవుడు మన విమోచన కార్యాన్ని యింకా పూర్తి చేయలేదు. ప్రస్తుతానికి మన శరీరాలు విలువ పెట్టి కొనబడినవి గాని (1 కొరి. 6:19,20) అవి విమోచించబడలేదు. ప్రభువు రాకడలో క్రీస్తునందు మృతులైనవారు లేపబడి సజీవులైన విశ్వాసులు మార్పు చెందినప్పుడు శారీరక విమోచన సంభవిస్తుంది. (ఫిలి. 3:21; 1కొరి. 15: 51,53; 1 యోహా. 3:1-3) వరకు.

వ్యాధి సాతాను వల్లనే కలుగుతుందా ?

మరో దురభిప్రాయం ఏమిటంటే వ్యాధి సాతాను వల్లనే కలుగుతుందని, స్వస్థపరచటం తప్ప వ్యాధితో దేవునికి మరో ప్రసక్తి లేదని.

ప్రతి శారీరక అస్వస్థత, సహజ విపత్తుల వెనుక ఒక పిశాచం ఉన్నదని టి.యల్. ఆస్ బార్న్ గారి అభిప్రాయం. దీన్ని సమర్థించుకోవడానికి లూకా 4:39లో యేసు క్రీస్తు పేతురు అత్త జ్వరాన్ని గద్దించిన సంఘటనను, మత్తయి 8:26, 27లో అలలను గాలిని గద్దింపగా అవి ఆయనకు విధేయత చూపిన సంఘటనను ప్రస్తావిస్తాడు. యేసు జ్వరాన్ని, సముద్రాన్ని, గాలిని సంబోధించినప్పుడు వాటిని రెచ్చగొట్టిన పిశాచాలను సంబోధించాడు, ఎందుకంటే ఎవరెనా వ్యక్తులతో మాట్లాడతారు గాని వస్తువులతో కాదు అని ఆయన వాదన. ఈ వాదన ఊహాజనితంగాను, హాస్యాస్పదంగాను వుంది.

ఏమైనప్పటికి సాతానుడు వ్యాధుల్ని అన్ని విధాలైనటువంటి శారీరక, మానసిక, అస్తవ్యస్త పరిస్థితులకు కారకుడని బైబిల్లో తగినంత ఆధారం వుంది. యోబు పశుగణాన్ని, దాసులను, కుమారులను నశింపజేసి చివరకు భయంకర వ్యాధిని యోబుకు కలిగించినవాడు సాతానేనని మనమెరుగుదుము (యోబు 1, 2 అధ్యాయాలు). లూకా 13:16లో పదునెనిమిది సంవత్సరాలు సాతాను బంధకాల్లో అలమటించిన స్త్రీని యేసు స్వస్థపర్చడం మనం గమనిస్తున్నాం. 1 కొరి. 5:5లో జారత్వము చేసినవాని శరీరము నాశనము చేయబడునట్లు సాతానుకి అప్పగింపమని అపొస్తలుడైన పౌలు ప్రతిపాదించినట్లు చదువుతున్నాం. 2 కొరి. 12:7లో తన శరీరంలో వున్న రుగ్మత “నన్ను నలుగగొట్టుటకు సాతాను దూతగా" ఉన్నదని పౌలు చెబుతున్నాడు.

వీటినిబట్టి ప్రతి ఆనారోగ్యము సాతానువల్లనే కలుగుతుందని మనం ఖండితంగా చెప్పలేం. దానికి ప్రతిగా ప్రతి విధమైన వ్యాధి దేవుని ఆధీనములోను, ఆయన అదుపులోను వున్నది అని చెప్పడానికి బైబిల్లో చాలినంత నిదర్శనముంది. ఒక వ్యక్తిని లేక ఒక జాతిని వ్యాధితోను లేక విపత్తులతోను పాపానికి తీర్పుగా శిక్షించడానికి దేవునికి సర్వాధికారం వుంది. దేవుడే మోషే హస్తం ద్వారా ఐగుప్తు పైకి తెగుళ్ళను పంపించాడు (నిర్గ. 15:26). ద్వితి. 28:27,28 వచనాలలో “యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధిచేతను, కుష్ఠుచేతను, గజ్జి చేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు. వెర్రితనము చేతను గ్రుడ్డితనము చేతను హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించును" అని వారు దేవుని యెడల చూపెడి అవిధేయతకు ప్రతిఫలంగా సర్వవిధాలైతే మానసిక శారీరక వ్యాధులను మోషే ప్రకటించాడు. 1 సమూ. 5:6లో యెహోవా ఫిలీష్తీయులు సాక్ష్యపు మందసాన్ని పట్టుకొని అష్టోదుకు తీసికొని వచ్చినప్పుడు వ్రణములతో శిక్షించాడు. ప్రకటన గ్రంథములోని ఏడు బూరల, ఏడు పాత్రల తీర్పులు అనేక రీతులుగా ఐగుప్తుపై దేవుడు పంపిన తెగుళ్ళను పోలియున్నాయి. ప్రక. 22:18లో దేవుడు ఆయన వాక్యానికి ఏదైనా చేర్చినవానిని తెగుళ్ళతో దేవుడు శిక్షిస్తాడని యోహాను హెచ్చరించాడు. ఈ వ్యాధుల విషయంలో విశ్వానికంతటికీ అధినేత, నీతిమంతుడైన న్యాయమూర్తిగా దేవుని సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించాలి. సమస్త మానవజాతి, దురాత్మలు, పాపం వలన కలుగు తీర్పు విషయంలో దేవుని ఆధీనతలో ఉన్నాయి. ప్రారంభంలో సాతానుడే మానవుణ్ణి పాపంలోనికి నడిపించాడు. అతడెన్నడూ మానవుని క్షేమాన్ని కోరడు, కోరజాలడు. అతనికి సాధ్యమైతే మానవ జాతినంతటినీ, మరి ముఖ్యంగా క్రీస్తు విశ్వాసులను అన్ని విధాలైన వ్యాధులతోను, భౌతిక విపత్తులతోను నాశనం చేయ్యాలని ఆశిస్తాడుగాని అతనికి ఆ శక్తి లేదు. ఒక వేళ ఏకారణం చేతనైనా దేవుడు తన ప్రజలను యోబు విషయంలో జరిగినట్లు మొత్తడానికి సాతానుకు సెలవిచ్చినా వాని కార్యాలన్నిటికీ దేవుడు ఒక హద్దు పెడతాడు.

అందుచేత సమస్త అస్వస్థతకు సాతానుడే మూలం అనడానికి తగిన బైబిలు ప్రాతిపదిక లేదు. మానవుని వ్యాధిని కుదర్చటమే కాదుగాని దానికి సంబంధించి దేవునికి ఇతర ఉద్దేశాలు కూడా ఉన్నవి. ప్రారంభములో వ్యాధి పాపఫలితమే. అందుచేత అది కోరదగినది కాదన్న విషయం వాస్తవమే. అయితే వ్యాధిని దేవుడు మానవుని శిక్షించడానికి గాని, ఆశీర్వదించడానికిగాని ఒక సాధనంగా వాడుకోవడానికి శకి కలిగి ఉన్నాడు. సాతాను హస్తంలో వ్యాధి ఎల్లప్పుడూ శాపవచనమే. అయితే దేవుడు తన కృపతో బట్టి మానవుడు పశ్చాత్తాపముతోను, విశ్వాసముతోను ఆయన వైపు తిరిగినప్పుడు ఆ శాపవచనాన్ని ఆశీర్వచనంగా మార్చగలడు. ప్రపంచమంతట్లో అసంఖ్యాకులు యేసుక్రీస్తు సువార్తను నమ్మునట్లు చేయుటకు వ్యాధి ఒక సాధనంగా ఉండవచ్చు.

కావున విశ్వాసులకు సంబంధించినంత వరకు దేవుడు ఈ క్రింది విషయాలను సాధించడానికి వ్యాధిని వాడుకొనవచ్చు:

1. మన విశ్వాసాన్ని పరీక్షించడానికి (యోబు 23:10);

2. ఆయనను గూర్చి మనకు స్పష్టమైన దర్శనాన్ని (దృశ్యాన్ని) యివ్వడానికి (యోబు 42:5);

3. మనలో వినంమ్రతను కలగచేయడానికి (2 కొరి.12:7);

4. దేవుని కృపను ఆశ్రయించ మనకు నేర్పించడానికి (2 కొరి. 12:9);

5. మన బలహీనతలో మనలను బలపర్చడానికి (2 కొరి. 12:9);

6. మనం దారి తప్పినప్పుడు మనలను శిక్షించడానికి లేక శిక్షణ చేయడానికి (1 కొరి. 11:27-30);

7. మనల్ని స్వస్థపర్చుటలో ఆయన నామాన్ని ఘనపర్చడానికి (యోహా. 11:4).

స్వస్థత దేవుని చిత్తానుసారంగా ఆయన నిర్ణీత సమయంలో సంభవిస్తుంది. స్వస్థపర్చువాడు ఆయనే - మానవుడు కాదు, మందు కూడా కాదు. ఆయన షరతులు సరిపడి ఆయన ఉద్దేశ్యం నెరవేరినప్పుడు ఆయన స్వస్థత కలిగిస్తాడు. స్వస్థపర్చువాడు ఎవరైననూ ఆయన పక్షంగా స్వస్థతలను సృష్టించడానికి ఆయన ఏ హక్కునూ యివ్వలేదు. స్వస్థత సభల విషయమేంటి ? ఈనాడు విశ్వాసం ద్వారా స్వస్థపరుస్తున్నామనేవారికి, వారి స్వస్థత సభలకు బైబిల్లో ఏ ఆధారం లేదు. బహు తరచుగా ఇలాంటి సభలు ప్రజల్లో ఆశకు బదులు నిరాశను, ప్రభువు నామానికి అప్రతిష్ఠను సమకూర్చుచున్నాయి. ఈ సభలు ఎక్కువ భాగం నిధుల సమాకూర్పుకు, వ్యక్తి ప్రచారానికి మాతమే పనికి వస్తున్నాయి. కాని ప్రజలకు దేవుని సహాయాన్ని అందించడం నామమాత్రం కూడ కనిపించదు. ఈ సభలో స్వస్థతలు కలిగినా, కలగకపోయినా సువార్త ప్రకటనకు మించి శారీరక స్వస్థత అతి ప్రాధాన్యం వహిస్తుంది. ప్రభువు, ఆయన శిష్యులు వారి బహిరంగ పరిచర్యలో అనుసరించిన క్రమానికి ఇది ప్రతికూలంగా ఉంది. ప్రభువు, అపొస్తలుల పరిచర్యలో సువార్త అతి ప్రాధాన్యం వహించింది. స్వస్థత అప్రధానంగాను, సువార్తకు సాధనంగాను ఉంది.

ఈ స్వస్థతసభల్లో మనం వినే మాటలు తరచుగా, దురభిమానంగాను, నిరాధారంగాను ఉంటాయి. తత్ఫలితంగా ప్రజలు నిస్పృహ, నిరాశలతో వెళ్లిపోతారు. ఈ సభల్లో ఏ స్వస్థతైనా జరిగి ఉంటే ప్రత్యేంగా స్వస్థపరచువానిని బట్టి కాదు కాని స్వస్థత పొందిన వ్యక్తికున్న విశ్వాస ఫలితంగానే అది జరుగుతుంది.

సువార్త ప్రకటన కంటే స్వస్థతలకు ప్రాధాన్యత కలగడానికి గల కారణం అద్భుతాల కోసం ఆరాటపడే 'కైస్తవ గారడీల' ఎత్తుగడ. వీరిని మన ప్రభువు నిశితమైన పదజాలంతో మందలించాడు. ప్రభువు నామాన ప్రవచించి, ఆయన నామాన దయ్యాలను వెళ్ళగొట్టి అద్భుతకార్యాలు చేసామని చెప్పుకొనే వీరినీ త్రోసివేసి 'అక్రమము చేయువారలారా' అని ప్రభువు నిందించడం (మత్త. 7:22-23) మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా ?

అద్భుతాలు, స్వస్థతలు స్వయంసిద్ధంగా దేవుని కార్యాలు లేక పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలే అని చెప్పజాలము.

బాప్తిస్మమిచ్చు యోహాను అద్భుతాలేమీ చేయలేదు గనుక ఆయన పరిచర్య శక్తి విహీనమని సాహసించి చెప్పగలమా ? (యోహాను 10:41).

మరి చివరి మాటేంటి ? ఈనాటి క్రైస్తవులకు యాకో.5:13-18 ప్రమాణికంగా యివ్వబడ్డదని ఈ రచయిత అభిప్రాయం. రోగుల కోసం ఎప్పుడైనా ఎక్కడైన మనం ప్రార్థించవచ్చు. అయితే సాధారణంగా విశ్వాసులు స్థానిక సంఘముతో సంబంధం కలిగి ఉండాలి.

సంఘ పెద్దలు లేక కాపరులను రోగి ప్రార్థనార్థం పిలిపించాలి. వారు ప్రభువు నామాన రోగిని నూనెతో అభిషేకించి ప్రార్థించాలి. కాపరులు లేక సంఘపెద్దలు నీతిమంతులుగా, విశ్వాసపరులుగా ఉన్నప్పుడు వారి ప్రార్థన చిత్తశుద్ధి కలిగి శక్తివంతమైనదిగా ఉంటుంది. అవసరమైతే రోగిగాని, ప్రార్థించువారు గాని, పాపపు ఒప్పుకోలు చెయ్యాలి. అప్పుడు ప్రభువు తన కృపనుబట్టి ఆ రోగిని స్వస్థపరుస్తాడు. క్రీస్తునందలి విశ్వాసులకు స్వస్థత కావాలంటే ఒకరితోనొకరు తమ పాపాలను ఒప్పుకొని ఒకరికోసం ఒకరు ప్రార్థించాలని హెచ్చరించబడ్డారు. కొందరు బలమైన విశ్వాసంగలవారు, మరికొందరు విశ్వాసంలో బలహీనులు. అయితే దేవుని బిడ్డలుగా తమకోసం, యితరుల కోసం కూడ ప్రార్థించి దేవుని నుండి స్వస్థత కోసం ఎదురుచూచే ఆధిక్యతను వారు కలిగి ఉన్నారు.

స్వస్థత సభలు సాధారణంగా స్థానిక సంఘ నియమాన్ని ఉల్లంఘిస్తాయి. పాపపుటొప్పుకోలు అన్నది ఈ సభల్లో కనిపించదు. పాపి తన ఆత్మరక్షణార్థం ప్రభువునొద్దకు మళ్లించబడడం అనేది అసలే ఉండదు. స్వస్థపరచేవారు దేవుడు తమ చేతుల్లోనే ఉన్నాడని నటిస్తూ ప్రజలను దేవునివైపు మళ్లించడానికి బదులుగా తమవైపుకే ఆకర్షించుకొంటారు. క్రైస్తవులు ప్రభువు నడుపుదలను బట్టి క్రైస్తవేతరుల్లో రోగుల కొరకు కూడ ప్రార్థించవచ్చు. అలాగు ప్రార్థించే సమయంలో ప్రథమముగా యేసు క్రీస్తును ప్రభువుగాను, రక్షకుడుగాను ప్రదర్శించడానికి అకుంటిత యత్నము చేయాల్సిందేగాని ఆయన్ని స్వస్థపరచేవాడుగా మాత్రమే ప్రదర్శింప ప్రయత్నించరాదు.

తొమ్మిదవ అధ్యాయము

కలలు, దర్శనాలు, స్వరాల సంగతేంటి?

బైబిల్లో చెప్పబడినవి గాక ఇప్పుడు కూడా దైవావేశమునకు సంబంధించిన కలలు, దర్శనాలు, పారవశ్యక అనుభవాలు ఉన్నవని చెప్పుకోవడం కొత్తేం కాదు. మనలో ప్రతివాళ్ళం, ప్రవచనాత్మక దర్శనం కలిగిందని లేక పరలోక దర్శనం పొందామని, దివ్యవాక్యం విన్నామని చెప్పుకోవడం ఏదో ఒక సమయంలో విన్నాం లేక చదివాము. ప్రస్తుతకాల సంఘచరిత్రలో ఈలాంటి అనుభవాలకు కొట్టవచ్చినట్టు కనిపించే సాదృశ్యాలుగా విలియం బ్రెన్‌హాం, ఒరల్ రాబట్స్, సాధు సుందర్ సింగ్, తండ్రి దేవదాసయ్య, యన్. డానియల్ గారు, దినకరన్ మొదలైనవారున్నారు. విలియం బ్రెన్‌హాంగారు ఆయన పొందిన అనేక దివ్యదర్శనాల్లో సహజాతీత దృశ్యాలు కనిపించడము, అగ్నిస్తంభము, మేఘ స్తంభము ఆయన మీదికి దిగిరావడం లాంటి అనుభవాలు ఎన్నో కలిగినట్టు చెప్పుకొన్నాడు. గతంలో ఒకమారు ఓరల్ రాబట్సు గారు 90 అడుగుల ఎత్తు యేసు దివ్యదర్శనాన్ని పొందాడని, దాని భావం 90 అంతస్తుల భవనాన్ని టుల్సాలో ఆయన నిర్మించాలని, అలా ఆయన చేయకుంటే దేవుడు ఆయన్ని చంపుతాడని ప్రకటించాడు. సాధు సుందర్ సింగ్ అనేకమార్లు యేసును చూచానని, పరలోక దర్శనాలు పొందానని చెప్పాడు. తన దర్శనాలన్నీ బైబిలు ప్రకారం సబబేనని ఆయన భావము. తన పరలోక దర్శనాల్లో మరణానంతరం మానవుడికి రక్షణ పొందడానికి రెండవ అవకాశమున్నదని ప్రభోదించాడు. తండ్రి దేవదాసయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో బైబిలు మిషన్ స్థాపించారు. ఈ వ్యవస్థాపన కలలు, దర్శనాలపై ఆధారపడ్డది. వివిధ మతాలవారికి సామూహికంగా ప్రార్థన సభలు జరిపారు. అలాంటి సభలను ఆయన నమ్మారు. ఆయన మరణానంతరం ఆయన అనుచరులు ఆరాధన స్థలాల్లో ఒక ఆసనాన్ని ఖాళీగా ఉంచడం వారు అవలంబిస్తున్నారు. ఆ ఖాళీ ఆసనాన్ని ఆయన ఆత్మ అధిష్టిస్తుందని వారి దృఢనమ్మకం. ఈ సంఘం పేరు బైబిల్ మిషన్. ఆ పేరుకు తగ్గ అర్హతలు ఆ సంఘానికి లేవు. ఆ సంఘ స్థాపన బైబిలు మీద కాక, కలలు, దర్శనాలపై ఆధారపడింది. లేమెన్ ఇవాంజిలికల్ ఫెలోషిప్ (Laymen Evangelical Fellowship) వ్యవస్థాపకులు యన్. డానియేల్ గారు ప్రేతాత్మవాది. వారి సహవాసానికి చెందిన శాఖలు ఆంధ్ర తీరప్రాంతాల్లో చెదరి వున్నవి. ఆ గుంపుల్లో కలలు చూడడం, స్వరాలు వినడం అన్న అనుభవాలు బైబిలుకంటె ఎక్కువ ప్రాధాన్యత వహించాయి. దినకరన్ గారు ఒకనాడు యేసుక్రీస్తు తన గదిలోనికి నడిచి వచ్చి తనతో మూడు గంటలు సంభాషించిన దర్శనాన్ని ఎప్పుడూ జ్ఞప్తికి తెస్తుంటాడు.

బైబిలు కాలంలో కలలు, దర్శనాలు, దివ్యవాక్కులు లేవనిగాని, దైవ ప్రత్యక్షతలకు అవి సాధనాలు కావనిగాని నేను ఎంతమాత్రం అనడం లేదు. కాని అసహజమైన సాధనాలుగా ఈనాడు కూడా యివి ఉన్నాయా? అన్నది ప్రశ్న.

కలలు కనడమనేది నిద్రావస్థలో ఒక భాగం. అది మానవునికి సహజం, సామాన్యం. మనస్తత్వవేత్తలు కలలలోని విచిత్రానుభవాలు ఐదు శాతం వరకు వున్నాయని, అవి సహజమేనని నిర్థారణ చేస్తున్నారు. సర్వసాధారణంగా మనం కనే కలలు బాధాకరం కానివ్వండి, ఆహ్లాదకరం కానివ్వండి - గతానుభవమునుబట్టి కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించినవి తప్ప, పీడ కలలన్నీ కూడ సహజమైనవే. అయితే మన కలలకు సహజాతీత ఆధారంకాని ప్రవచనాత్మక ప్రాధాన్యతను గాని ఆపాదించడం సందేహాస్పదంగా వుండడమే గాక ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. మన కలలు సహజంగా వుండి బైబిలు నియమాలకు విరుద్ధం కానంతవరకూ మనకు ఎలాంటి యిబ్బంది లేదు. కాని కలలు దైవిక లేక సహజాతీత మూలం వుందని చెప్పుకోవడం ధృవీకరణకు దూరమౌతుంది. కొన్ని సందర్భాలలో అసాధారణంగా కలలకు, అటు తరువాతి సంభవాలకు చక్కని పొందిక వుండవచ్చు. అలాంటి కాకతాళీయ సంఘటనలు జ్యోతిష్యములో కూడ జరుగవచ్చు.

దర్శనాలు, దేవవాక్కుల సంగతేంటి? దర్శనాలు, దివ్యవాక్కులు విను అనుభవాల్లో మతిభ్రమం లేదు అనలేము. దృశ్యశ్రవణ మతిభ్రమాలు వున్నాయి. వ్యవహారిక మతిభ్రమాలు దృశ్యాకృతిని కలిగివుంటాయి. తాగుడు - మాదకద్రవ్యాల వాడకం ఇంద్రియ విషయక మతిభ్రమాలకు చెందినవిగా వున్నాయి. తాగుబోతుల్లో మతిభ్రంశం స్పష్టమైన దృశ్యమతిభ్రమము అని మానసిక శాస్త్రజ్ఞులు నిర్థారణ చేసారు. యల్ యస్ డి (LSD) లాంటి మాదక ద్రవ్యాలు మతిభ్రమిక సారాన్ని ఉద్భవింపజేస్తాయని అందరికీ తెలుసు. సర్వసాధారణంగా మతిభ్రమణం మానసిక వ్యాధికి అనుబంధమైంది. ముఖ్యంగా పరస్పర విరుద్ధ మానసిక వ్యాధి (Schizophrenia) శ్రవ్య మతిభ్రమాలు పరస్పర విరుద్ధ మానసిక వ్యాధిలో ప్రధానంగా వుంటాయి.

కలలకు వలెనే, పారవశ్య దర్శనాలు, శ్రవ్య అనుభవాలు వ్యక్తులు చెప్పుకుంటున్న సమాచారమే గాని ఈ విషయాలను సరిచూచి ధృవీకరించినవారెవరూ లేరు. బైబిలు ప్రవచనాలవలె వీరు చెప్పుకొంటున్న అనుభవాలు, ప్రవచనాల నెరవేర్పు లిఖితరూపంలో ఎక్కడా కనిపించదు. ఈ దివ్యదృశ్యాల ద్వారా మోర్మన్ సంఘ వ్యవస్థాపకులైన జోసఫ్ స్మిత్ "బంగారు పళ్ళాలు" కనుగొన్నారు. ఆ బంగారు పళ్ళాలే మోర్మన్ గ్రంథానికి మూలమయ్యాయి. మోర్మన్ గ్రంథం మోర్మన్ శాఖంతటిలో బైబిలుతో సమానంగా ప్రామాణికంగా వుంటుంది.

క్రైస్తవులు బైబిలు ప్రత్యక్షతకు వేరుగా దేవుని నుండి కలలు, దర్శనాలు, దివ్యవాక్కుల కొరకు ఎదురుచూచినప్పుడు నకిలీ బైబిలు లిఖిత, అలిఖిత రూపాలలో తప్పక ప్రత్యక్షమౌతాయి. ఇదే ప్రమాదం. కలలు, దర్శనాల సందడిలో క్రైస్తవుల విశ్వాస జీవితానికి బైబిలు ప్రామాణ్యతను కోల్పోతుంది. మరోరీతిగా చెప్పుకొంటే మానవుడు తెలిసికొనవలెనని దేవుడు కోరే విషయాలన్నీ బైబిల్లో లేవన్న భావం వ్యక్తమగుతుంది. బైబిల్లో మానవరక్షణ, భద్రతల కోసం దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత చాలదన్నట్టు, ఆ ప్రత్యక్షత ఇప్పుడు కూడా కొనసాగుతుందని యివి సూచిస్తున్నాయి.

ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ఔను అని తప్పక జవాబు చెప్పాలి. అయితే ముందు ఏమి మాట్లాడాడో దాని ద్వారానే ఆయన యిప్పుడు మాట్లాడుతున్నాడు. మునుపు అయన ప్రవక్తలు, అపొస్తలుల ద్వారా మనతో మాట్లాడాడు. ఆ విషయాలే పాత, కొత్త నిబంధన లేఖన భాగాలుగా లిఖితరూపంలో మనకు లభించాయి. బైబిల్లోని చివరి గ్రంథంతో బైబిలు ప్రత్యక్షత పరిసమాప్తము కాలేదని చెప్పడానికి ఎవరైనా సాహసించగలరా? అయితే కలలు, దర్శనాలు, దివ్యస్వరాలవైపు మన మనస్సులను మళ్ళించినప్పుడు, మనం ఆరీతిగానే చెప్పుతున్నట్లు భావించవలసి వస్తుంది.

బైబిలు సంపూర్ణము, పరిసమాప్తమని గుర్తించాలి. మొదటి శతాబ్దములో బైబిలును పొందినవారికి ఎలాగో 20వ శతాబ్దములో ఉన్న మనకును విశ్వాస ఆచరణ విషయాలన్నింటిలో బైబిలు విషయైక, అంతిమప్రమాణం. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముని ద్వారా ఆయన మనకనుగ్రహించిన వాక్యమును అనుసరించే మనతో మాట్లాడుతాడు. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖడించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది".

లిఖితరూపంలో వున్న దేవుని వాక్యాన్నంతటిని మనం గ్రహించలేమన్నది వాస్తవం, అయితే మనలో నివసించుచున్న పరిశుద్ధాత్ముడు మన పరిస్థితికి ఉచితరీతిగ మనం నేర్చుకొనవలసిన విషయాలను ప్రభోదించి గ్రహింపజేస్తాడు.

అయితే కలలు, దర్శనాలు, దివ్యవాక్కుల కొరకైన ఆరాటంగలవారిని సాతానుడు తప్పుతోవ పట్టిస్తాడు.

దేవుని చిత్తాన్ని గ్రహించే విషయంలో ప్రమాదకరమైన ఆత్మగత వాతావరణాన్ని సృష్టించి దేవుని ప్రత్యక్షత పేరున అన్ని విధాలైనటువంటి మానసిక, వైశాచిక కార్యాలలోకి ఈడ్చుతాడు. పాత నిబంధనలో సౌలు రాజు సందర్భంగా ఈ విషయాన్ని గుర్తిస్తున్నాం. అతడు దేవుని ప్రత్యక్షతను విస్మరించి మాంత్రికుల వైపు తన మనస్సును మళ్ళించుకొని వినాశానికి గురియైయ్యాడు. దేవుడు మనకు ప్రత్యక్షం చేసిన ఆయన వాక్యాన్ని విస్మరించి కలలు, దర్శనాలవైపు మనం మళ్ళితే మోసానికి అందుబాటులో వుంటాం. మానవుణ్ణి మోసగించడానికి సాతానుడు వెలుగురూపం దాల్చాడని బైబిలు చెబుతుంది. కొరింథీ క్రైస్తవులు ఈలాంటి మోసానికి అనువుగా ఉన్నందువల్ల సాతాను దూతలు వారిలో చొరబడి క్రీస్తుకు విరోధంగా నకిలి క్రీస్తును, పరిశుద్ధాత్మకు ప్రతిగా భూటకపు ఆత్మను, సువార్తకు బదులుగా కల్పిత సువార్తను ప్రకటించడానికి చూచినట్లు అపొస్తలుడైన పౌలు గుర్తించి వారిని మందలించాడు (2 కొరి. 11:4).

పదియవ అధ్యాయము

సంపూర్ణ సువార్త ఎంత సంపూర్ణము ?

శారీరక స్వస్థత, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అన్యభాషల్లో మాట్లాడుట మొదలైన విషయాలు ఉంటేనే సువార్త సంపూర్ణం అవుతుంది అని నమ్మే సంఘాలు, సంస్థలవారు వాడుకొనే ఊతపదం సంపూర్ణ సువార్త. క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షణ లభిస్తుంది అన్న సుసమాచారం సంపూర్ణ సువార్త కాదని దీనివల్ల వ్యక్తమగుతుంది. రక్షణలో పాపక్షమాపణ మాత్రమే కాక పైన ప్రస్తావించినవన్నీ ఉండాలి అని వీరు నమ్ముతారు.

కాని లేఖనాలను పరిశీలిస్తే వీరి వాదన నెగ్గదు. పెంతెకోస్తు తదితర గుంపులవారి నిర్వచనాన్ని బట్టి స్వస్థత, పరిశుద్ధాత్మ బాప్తిస్మము, భాషల్లో మాట్లాడుట అన్నవి సువార్తకు అనుబంధాలు. వీటన్నిటిని జతపర్చి చూస్తే ఇది మరో సువార్తగా పరిణమిస్తుంది. యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించి సమాధి చేయబడి, తిరిగి లేచాడు. ఆయనయందు విశ్వాసముంచు ప్రతిపాపి తన పాపాల నిమిత్తము పశ్చాత్తాపపడిన ఎడల అతనికి పాపక్షమాపణ లభిస్తుంది. పాపక్షమాపణతో పరిశుద్ధాత్ముని నిత్యప్రసన్నత అతనికి కలుగుతుంది. తత్ఫలితంగా శోధన, పాపాలపై విజయం ప్రాప్తిస్తుంది (రోమా 8:4, 9,15). కొత్త నిబంధన ప్రకారం సువార్త అనగా యిది. విశ్వాసి ఎన్నడూ వ్యాధికి గురికాడు అనడంలో సమస్త వ్యాధులకు పాపమే మూలమని చెప్పడమౌతుంది. ఈ వాదనను బట్టి వ్యాధి పాపానికి, స్వస్థత రక్షణకు పర్యాయ పదాలగుతున్నాయి. స్వస్థపర్చడం అన్నది సువార్త ప్రకటించడం కాదు. విశ్వాసికి వ్యాధి అన్నది కొన్నిమార్లు దేవుని శిక్షణ సాధనంగా ఉంటుంది. కొందరి జీవితాల్లో దేవుని చిత్తాన్ని సాధించడానికి విశ్వాస పరీక్షగా కూడా ఉంటుంది. దేవుని చిత్తాన్ని అంగీకరించి తదనుగుణ్య షరతులను నెరవేర్చితేనే స్వస్థత లభిస్తుంది (యాకోబు 5 అధ్యా.).

ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందాలి అని బోధించడం క్రొత్త నిబంధన సిద్ధాంతాలకు ప్రతికూలం. 1 కొరి. 12:13 ప్రకారం పరిశుద్ధాత్మ బాప్తిస్మం వల్లనే ఆయన శరీరంలో అవయవములమౌతున్నామని నేర్చుకొంటున్నాము. క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మం పొందడం రక్షణ నుండి వేరైన అనుభవముకాదు. ఏలాంటి మినహాయింపు లేకుండా ప్రతి విశ్వాసి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందియున్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మ నీలో నివసిస్తున్నాడు. ప్రతివాని రక్షణలో పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం యిమిడియున్నది. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రసన్నత లేకుంటే రక్షణ లేదు.

చివరిగా, భాషల్లో మాట్లాడడం యేసు క్రీస్తునందు విశ్వాసముంచినవారికి అవశ్యకమని కొందరంటారు. ఇది శోచనీయం. వెంతెకోస్తువారు కారిస్మాటిక్ ఉద్యమం భాషలు మాట్లాడుట అన్న అంశం చుట్టు గింగరాలు తిరుగుతున్నారు. భాషలు వీరి ఆటవస్తువు. అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలో దేనిని అతి స్వల్పంగా పరిగణించాడో దానిని వీరు అతి ప్రధానంగా చూపిస్తున్నారు. భాషలను పరిశుద్ధాత్మతో సమానం చేస్తున్నారు. వాస్తవానికి వారు పరిశుద్ధాత్మ కంటే ఎక్కువగా భాషలనే కొరుకొంటారు. వారి దృష్టిలో ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియున్నాడా లేదా అన్నది సమస్య కాదు. ఆ వ్యక్తి భాషల్లో మాట్లాడాడా లేదా అన్నది వారికి ప్రధానాంశం. పరిశుద్ధాత్మ బాప్తిస్మానికి భాషల్లో మాట్లాడడం నిర్దిష్టమైన గురుతు కాదు. పరిశుద్ధాత్మ లేకనే భాషల్లో మాట్లాడగలరా? అన్న విషయాన్ని నిర్ణయించడడానికి మనమెంతో ప్రయాసడనవసరం లేదు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను కలిగియున్నాడా లేడా అనడానికి నిస్సందేహామైన సూచన పరిశుద్ధ జీవితం (1 థెస్స. 4:7,8).

నూతన నిబంధన కాలంలో భాషల్లో మాట్లాడినారు అన్నది నిస్సందేహం. అయితే బైబిల్ ప్రత్యక్షత పూర్తి కావడంలో భాషలు ఆగిపోయాయి. ఈ సత్యాన్ని 1 కొరి. 13:8-13 వరకు ఉన్న వాక్యభాగాన్ని పరిశీలించుట ద్వారా గ్రహించవచ్చు.

కనుక భాషలలో మాట్లాడుట ఆన్నది బైబిలు ప్రత్యక్షత విధానానికి చెందింది. బైబిల్లోని 66 పుస్తకాలు సంపూర్తి కావడంతో భాషలు నిల్చిపోయాయి.

ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాసము ద్వారా లభించే రక్షణ సువార్త సంపూర్ణం. స్వస్థత, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, భాషలు మాట్లాడుట అన్నవాటితో సువార్తను సంపూర్ణం చేయ ప్రయత్నించడంలో సువార్తను వాస్తవంగా అసంపూర్ణం చేయడమే అవుతుంది. సిలువలో క్రీస్తు సమాప్తము చేసిన కార్యానికి మనమేమీ చేర్చలేం. క్రీస్తు చేసింది రక్షణకు సరిపోతుంది. సువార్త మూలం ఆయనే (1 కొరి. 15:1-3వరకు). ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిపూర్ణతకు మనం మరేమియు చేర్చలేము.

పదకొండవ అధ్యాయము

పెంతెకోస్తువారు రక్షణ శాశ్వతమైనదని ఎందుకు నమ్మరు?

క్రొత్త నిబంధనలోని సిద్ధాంతాలన్నింటిలోను పరిశుద్దాత్ముని గూర్చిన సిద్ధాంతం క్రీస్తునందలి విశ్వాసి నిత్యరక్షణ సిద్ధాంతం పై ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంది. ఈ సిద్ధాంతములోని ప్రతి అంశం--ఆత్మ బాప్తిస్మము, ఆత్మ ప్రసన్నత, ఆత్మ నింపుదల, ఆత్మాభిషేకం, ఆత్మ సంచకరువు లేక ప్రథమ ఫలాలు, ఇంకా ఆత్మ ముద్ర - ఈ నిత్య రక్షణ సిద్ధాంతాన్ని బలపర్చడానికి ఉద్దేశింపబడ్డాయి.

పరిశుద్ధాత్మ బాప్తిస్మం విశ్వాసిని యేసుక్రీస్తు అదృశ్య ఆత్మీక శరీరములో సుస్థిరము చేస్తుంది (1 కొరి. 12:13). క్రీస్తుతో కూడ నిశ్చలమైన సమైఖ్యతానుభవాన్ని కలిగిస్తుంది.

పరిశుద్ధాత్మ ప్రసన్నత, మరో పక్షంలో, క్రీస్తును విశ్వాసిలో నివసింపజేస్తుంది. (యోహా. 14:17). పరిశుద్ధాత్ముడు మన నిత్యమైన సహచరుడు, ఎన్నడూ తొట్రిల్లని ఆదరణకర్త. క్రీస్తు ఆత్మ మనలో నివసించుటవల్లనే మనం దేవుని పిల్లలమయ్యాము (రోమా 8:16,26; 2 కొరి. 13:4), మరి క్రీస్తు స్వాస్థ్యమయ్యాము ( రోమా 8:9; 1 కొరి. 6:19). ఆత్మ ద్వారా మనలో ఉన్న క్రీస్తు మన మహిమ నిరీక్షణ (కొల. 1:27).

ఆత్మ నింపుదల విశ్వాసి యెల్లప్పుడు ఆత్మ ఆధీనంలోను, నడుపుదలలోను, ఉండేలా చేస్తుంది (ఎఫె. 5:18). పైన పరిశుద్ధాత్మకును, విశ్వాసికీ ఉన్నట్లు చెప్పబడిన సంబంధాల్లో విశ్వాసి ప్రస్తావన లేకుండనే దేవుని సార్వభౌమిక కృప ఆయన చొరవ వల్లనే అన్నీ జరిగినవి. అయితే పరిశుద్ధాత్మ నింపుదల విషయంలో విశ్వాసి స్వయేచ్ఛతో పరిశుద్ధాత్మ స్వాధీనానికి తన్ను తాను అప్పగించుకోవలసిన బాధ్యత కూడా ఉంది.

పరిశుద్ధాత్మ అభిషేకం (2 కొరి. 1:21) అభిషిక్తుడైన క్రీస్తు పక్షంగా ఈ భూమి మీద ఆయన ప్రతినిధులంగా ఉండే ఉత్కృష్టమైన గౌరవం, ఆధిక్యతను మనకు ఆపాదిస్తుంది. (1 యోహా 2:27). ఆత్మాభిషేకం క్రీస్తు రెండవ రాకడలో మన పునరుత్థానానికి హామీగా ఉంది (మత్త. 26:12). పరిశుద్ధాత్మ సంచకరవు లేక ప్రథమ ఫలములు మన మర్త్య శరీరాలకు పరిశుద్ధాత్మ ప్రసన్నత వల్ల కలుగబోయే రక్షణకు సంభంధించిన హామీకి చిహ్నంగా ఉంది. (2 కొరి. 1: 22; ఎఫె. 1:14).

చివరిగా పరిశుద్ధాత్మ ముద్ర దేవునికి తన ప్రజలపై ఉన్న యాజమాన్యపు హక్కునే కాక వారి సంరక్షణార్థం దేవుని పూచీకి కూడ గుర్తుగా ఉంది. యాజమాన్యాన్ని గుర్తింపజేయడానికి బానిసలకు, పశువులకు ముద్రవేస్తారు. దేవుడు అత్మతో మనల్ని ముద్రించాడు. మనమాయన సొత్తు. ఆరీతిగా మన సంరక్షణకు ఆయన పూచీ వహించాడు (2 కొరి. 1:22; ఎఫె. 1:13). మన విమోచనా పథకంలో అంతిమ దశ మన శరీరాల విమోచనే. ఈ స్థితిలో మనం యేసు క్రీస్తు పోలికకు అనురూపపర్చబడతాం (ఎఫె. 4:30).

సాధారణంగా పెంతెకోస్తువారు ఈ గుర్తులను విశ్వాసిలో పరిశుద్ధాత్మ కార్యానికి దేవుని ప్రారంభ విమోచన కార్యపు వివిధ పక్షాలుగా కాక విశ్వాసి జీవితంలోని వివిధ అనుభవాలుగా లేక అంతస్తులుగా తీసుకొంటారు.

మానవుని రక్షణ దేవుని సార్వభౌమ కృపాకార్యంగా కాక మానవుని సుగుణ సంపత్తి ప్రతిఫలంగా చూడడం ప్రాథమిక దోషంగా ఉంది. పెంతెకోస్తువారి పథకంలో రక్షణ సాధన, నిర్వహణ ఈ రెండూ కూడా మానవుడు స్వయంగా చేసుకొనే కార్యాలుగానే కన్పిస్తున్నాయి. మనం పరలోకానికెళ్ళేంత వరకూ మన రక్షణకు అభయం లేదు. మనం ఈ లోకంలో ఉండగా నిత్య జీవపు వాగ్దాన విషయంలో దేవున్ని నమ్మజాలమన్నట్లున్నది.

పరిశుద్ధాత్మ సిద్ధాంతంపై తమకు గుత్తాదిపత్యమున్నట్లు వ్యవహరించే పెంతెకోస్తువారు విశ్వాసి నిత్యరక్షణ, భద్రతను ఏలాగు తిరస్కరించగలిగారో నమ్మడం సాధ్యము కావడంలేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది, భాషల్లో మాట్లాడి, ప్రవచనాలు, అద్భుతాలు, దర్శనాలు ఇవన్నీ కలిగి కూడ నిరంతరం తమ రక్షణను ఎక్కడ జారవిడుచుకుంటామో అన్న భయముతో జీవిస్తున్నట్లే కనిపిస్తుంది. ఇదంతా కూడ పెంతెకోస్తువారి పరిశుద్ధాత్మ సిద్ధాంతం వాక్యానికి భిన్నంగా ఉన్నట్టు తెలుపుతుంది.

కొత్త నిబంధన పరిశుద్ధాత్మ సిద్ధాంతం అయితేనో యేసు క్రీస్తునందు విశ్వాసికిగల నిత్య భద్రతకు పరాకాష్టదశగా ఉంది. భధత లేకుండ రక్షణ లేదు. రక్షించేవాడు దేవుడు, భద్రపర్చువాడు కూడా దేవుడే. ఆదినుండి అంతం వరకు రక్షణ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సార్వభౌమ కృపాకార్యంగా ఉంది.

ఒక నిజవిశ్వాసి ఎన్నడైనా తప్పిపోతాడని గాని లేక తప్పిపోయాడని గాని ఒక సూచన లేక సలహానైనా బై బిల్లో కనిపించదు. దానికి ప్రతిగా రక్షణ శాశ్వతం అన్న బోధ బైబిల్ అంతటా ఉంది. ఒకసారి రక్షింపబడిన పాపి నిరంతరమూ రక్షింపబడే ఉంటాడు.

బైబిలునందు ప్రస్తావింపబడిన రక్షణ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు చెందింది. క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మన పాపపు శిక్ష నుండి రక్షణ పొందాం (1 పేతు.1:18; తీతు 3:5). ప్రస్తుతం పాపపు ప్రభావము నుండి రక్షింపబడుతున్నాం (1 కొరి. 1:18). ప్రభువును చూచినప్పుడు పాపపు సముఖం నుండి రక్షింపబడతాం (రోమా 5:10). వాస్తవానికి మన రక్షణ విషయంలో దేవుని సంకల్పానికి చెందినంతవరకూ దాని ప్రారంభము, పరిపక్వత కాలాన్ని అధిగమించి నిత్యత్వంలోకి వెళుతుంది.

దేవుడు జగత్పునాదికి ముందు యేసుక్రీస్తునందు మనలను పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపర్చబడి ఆయనయందలి విశ్వాసము ద్వారా రక్షణ పొందుటకు ఎన్నిక చేసుకున్నాడు (ఎఫె. 1:4; 2 థెస్స. 2:13). "తన కుమారునితో సారూప్యముగల వారమగుటకు" మనల్ని దేవుడు ముందుగా నిర్ణయించాడు (8:29); ఇది యేసుక్రీస్తు రెండవ రాకడలో జరుగుతుందని మనం తెలుసుకొంటున్నాం (కీర్త. 17:15; 1 యోహా. 3:2). పరలోకంలో మహిమతో పరిసమాప్తము కాని రక్షణ క్రీస్తులో లేదు. ఒక పాపి హృదయంలో దేవుని కృపాకార్యంగా ప్రారంభమైన రక్షణ పరాకాష్ఠను అందుకొంటున్నదన్న వాగ్దానం స్పష్టంగా ఉంది. ఈ వాగ్దానం “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు” (ఎఫె. 1:14). “దీని నిమిత్తం మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకనుగ్రహించి యున్నాడు” (2 కొరి. 5:5).

రక్షణ నిత్యజీవమని బైబిలు ప్రభోదిస్తుంది. నిత్య జీవం దేవుని జీవం. ఆ జీవము దేవుని నుండి వస్తుంది. (నిత్యత్వం దేవుని గుణలక్షణం, దేవుని కార్యాలన్ని కూడ నిత్యమైనవిగానే ఉంటాయి). మన పాపదోష శిక్షాపరిహారం నిత్యజీవం (యోహ. 3:16; 5:24). అదే యేసు క్రీస్తునందు దేవుని జ్ఞానం (యోహను 17:3). అసలు క్రీస్తే నిత్యజీవం (1 యోహా 5:20). ఒకప్పుడుండి అటు తరువాత ఉండకపోయేది నిత్య జీవమెలా అవుతుంది? ఎల్లప్పుడూ ఉండే జీవమే నిత్యజీవం. నశించని జీవమే నిత్యజీవం. క్రీస్తు ఉనికి ఎన్నడూ అంతంకాదు. దేవుడెన్నడూ క్షమాపణను ఉపసంహరించుకోడు (రోమా 8:34). దేవుడు పాపాన్ని క్షమించి దాన్ని మర్చిపోతాడు — “వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకం చేసికొనను అని ప్రభువు చెప్పాడు (హెబ్రీ 10:17). ప్రభువు ఆయన గొర్రెల గూర్చి ఈ రీతిగా చెప్పాడు: “నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికిని నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు” (యోహను 10:28,29). నిత్య జీవానికి క్రీస్తే కర్త(హెబ్రీ 2:10) - "ఈయన తన ద్వారా దేవుని యొద్దకువచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంత రంజీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు” (హెబ్రీ 7:25.) మన రక్షణార్థం చనిపోయిన క్రీస్తు సజీవుడై దేవుని సాన్నిధ్యములో నిరంతరము విజ్ఞాపన చేస్తున్నాడు. అందుచేత మన రక్షణ భద్రతకు అభయమున్నది. క్రీస్తు తిరిగి చనిపోతేనే ఒక విశ్వాసి రక్షణ పోగొట్టుకోవడం జరగవచ్చు. క్రీస్తు మరణం మనల్ని రక్షిస్తుంది. ఆయన జీవం మన రక్షణను భద్రపరుస్తుంది, లేక మన రక్ష ణను కొనసాగిస్తుంది.

రక్షణ ప్రారంభము నుండి చివరివరకు దేవుని కార్యమని, మానవుని పొత్తు లేదని గ్రహించినప్పుడు రక్షణ నిశ్చయతను గూర్చిన ఆందోళనలన్ని పటాపంచలౌతాయి. దేవుడే రక్షిస్తాడు. ఆయనే భద్రపరుస్తాడు (తీతు 3:5; 1 పేతురు 1:5; యూదా 24). రక్షణ, దేవుడు మానవుడు జంటగా సాగించే యత్నం కాదు. రక్షకుడు దేవుడు, మానవుడు పాపి. మనల్ని రక్షించడానికి మన సాయం దేవుడికక్కరలేదు. పాపి తనను తాను రక్షించుకోగలితే ఇక దేవుడు అక్కరలేదు. పాపి తన్ను తాను రక్షించుకోవడంలో పూర్తిగా నిర్వీర్యుడు. రక్షించువాడు దేవుడే. రక్షణ విషయంలో "తమకు తాము సహాయము చేసుకొనువారికి దేవుడు సాయం చేస్తాడు'' అన్న నానుడి చెల్లదు. దేవుడు నిస్సహాయులకే సాయం చేస్తాడన్నది సర్వసత్యం. మానవుడు తన్ను తాను రక్షించుకొననేరడు, భద్రపరచు కొనజాలడు. భద్రపర్చుకోవడానికి ఎంత ప్రయాస కావాలో రక్షించుకోడానికి కూడా అంతే కావాలి. ఆ రెండు కార్యాలకూ దేవుడే సర్వసమర్థుడు. భద్రత లేని రక్షణ లేదు. రక్షణలోనే భద్రత వుంది.

దేవుని సార్వభౌమిక కృపయే రక్షణను అనుగ్రహిస్తుంది. కృప అనుగ్రహిస్తుంది, విశ్వాసం స్వీకరిస్తుంది. కృప కారకం, విశ్వాసం సాధనం. రక్షణ “కృపచేత - విశ్వాసం ద్వారా” అన్న సూత్రం మనకు కాదు, సంపూర్ణంగా దేవునికే చెందినది (ఎఫె. 2:8). కృప దేవునికి చెందినదే. అయితే మానవుని పాత్రమైన విశ్వాసము కూడ దేవునివల్లే కలుగుతుంది. కృప విశ్వాసాన్ని కలిగిస్తుంది. రక్షణలో విశ్వాసం నిష్క్రియ గ్రహణశీల పాత్రనే వహిస్తుంది. విశ్వాసం క్రియాశీలకమైతే నిష్క్రియగానే క్రియాశీలకమౌతుంది. విశ్వాసం మౌలికంగా మన కార్యము కాదు. అయితే అది మనలో దేవుని కార్యము యొక్క పరిణామం మాత్రమే. “క్రీస్తే మన విశ్వాసానికి కర్త దాని కొనసాగించువాడు” (హెబ్రీ 12:2).

రక్షణ ప్రారంభము నుండి చివరివరకు దేవుని క్రియ గనుక రక్షింపబడిన వ్యక్తి తప్పిపోడానికి ఏ అవకాశం ఏమాత్రం లేదు. దేవుని చిత్తాన్ని వమ్ము చేయగల లేక మానవుని యెడల ఆయన కృపను చెరుపు చేయగల శక్తి ఏదియు కూడ లేదు.

"ఇట్లుండగా ఏమందుము? దేవుడు మనపక్షముననుండగా మనకు విరోధియెవడు? తన సొంతకుమారుని అను గ్రహించుటకు వెనుక తీయక మన అందరికొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతోపాటు సమ సమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునిచేత ఏర్పరచ బడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే; శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తుయే సే; అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్యమున ఉన్న వాడును మనకొరకు విజ్ఞా పనముకూడ చేయువాడును ఆయనే. క్రీస్తు ప్రేమనుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమయైనను బాధయైనను హింసయైనను కరవైనను వస్త్రహీనత యైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వాయబడినదేమనగా- నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడినవారము వధకు సిద్దమైన గొర్రెల మని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించినవాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను జీవమైనను దేవదూతయైనను ప్రధానులె నను ఉన్న విలె నను రాబో వునవియైనను అధికారులైనను ఎత్తయినను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను" రోమా 8:31-39.

ఈ వాక్య భాగంలో పౌలు దేవుడు పాపభూయిష్టుడైన మానవుని కోసం సాధించిన ఆయన సార్వభౌమకృపామహోన్నత విజయాన్ని వ్యక్తము చేస్తున్నాడు. మానవుడు స్వయంగా రక్షణ సాధించడానికి ఇక్కడ ఏ అవకాశము కనిపించదు. దేవుడే దాన్ని అనుగ్రహించాలి. దేవుడు చేసిందాన్ని ఎవ్వరూ పాడు చెయ్వలేరు. దేవుడు నీతిమంతునిగా తీర్చినవానికి ఎవరూ శిక్ష విధించలేరు. దేవుని ప్రేమాబంధకాలను ఎవ్వరు తుంచలేరు. మన ఆత్మల విరోధి ప్రలోభాలన్నింటికీ క్రీస్తే జవాబు. ఆయన మరణం ఒకేమారు మన పాపాలకు పరిష్కృతి చేసింది (హెబ్రీ 9:26).

ఆయన పునరుత్థానం మన విమోచనకు ముద్ర వేసింది. ప్రస్తుతం ఆయన తండ్రి కుడిపార్శ్వాన వుండి మనకై జరిగించుచున్న విజ్ఞాపన మనపై వున్న శిక్ష గతించిపోయిందనడానికి హామీ (రోమా 8:34; 1 యోహాను 2:1 కూడ చూడండి). "తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతోపాటు స మును మనకెందుకు అనుగ్రహించడు". అనగా మన రక్షణార్థమై తన ఏకైక కుమారుణ్ణి త్యాగం చేసిన దేవుడు మన రక్షణ భద్రత కోసం ఏది చెయ్యక మానుకొంటాడు? తన కుమారునికంటే దేవునికి అతి ప్రశస్తమైంది. మరేముంది? ఒక తల్లి ప్రసవవేదనతో ఒక బిడ్డను కన్న తరువాత ఆ బిడ్డ సంరక్షనార్థం అవసరమైంది ఏదైనా చెయ్యక మానుతుందా?

దేవుడు ఆయన పిల్లల పట్ల ప్రత్యేక భద్రతా ఏర్పాటు కలిగివున్నాడు. “దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుట కె సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము” (రోమా 8:28).

ఈ ఏర్పాటు స్వయంచాలకంగా గాని అకారణంగా గాని వచ్చింది కాదు. అది దేవుని సార్వభౌమిక చిత్తంలో పాతుకొని వ్యక్తిగత విశ్వాసమనెడి సూత్రం ద్వారా పనిచేస్తుంది. “కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసం ద్వారా దేవుని శక్తిచేత కాపాడబడు మీ కొరకు, ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్ర పరచబడియున్నది" (1 పేతురు 1:5). దేవుని పిల్లలను గూర్చిన ఆయన ఏర్పాటు శారీరక, దైనందిన అవసరాలకే కాక ఆత్మీక, నిత్యమైన అవసరాలకు కూడ సంబంధించి వుంది.

ఈ ప్రత్యేక దేవుని ఏర్పాటు మూడు నిశ్చితమైన మార్గాల ద్వారా ప్రాప్తిస్తుంది. అవేవనగా :

1. దేవుని వాక్యం

2. క్రీస్తు విజ్ఞాపన కార్యం

3. పరిశుద్ధాత్మ ప్రసన్నత

దేవుని వాక్యం అనగా బైబిలు. “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవా వేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరముగా" వుండడానికి యివ్వబడింది (2 తిమోతి 3:16-17). కీర్తనాకారుడు “నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను" అని దేవునితో ఒప్పందం చేస్తున్నాడు (కీర్తనలు 119:11). దేవుని వాక్యం సత్యం. ఆ సత్యం మనల్ని పవిత్రపరచి పాపం పై విజయాన్ని చేకూర్చుతుంది (యోహా. 17:17).

రెండవదిగా, పరలోకంలో యేసుక్రీస్తు తండ్రి సన్నిధిలో మన పక్షాన దేవునికి విజ్ఞాపన చేయడంలో కలువరి సిలువలో తన మరణం ద్వారా దేవుని నీతి కోరిందంతా ఒక్కసారిగా తీర్చబడినట్లు నిర్ధారణ ఔతుంది (రోమా 8:34). యేసుక్రీస్తును అంగీకరించడము వల్లనే పాపంపై మనకు ఎడతెరిపిలేని విజయము లభిస్తుంది. అనుతాపసహిత ఒప్పుకోలు ద్వారా పాప శుద్ధీకరణ కలుగుతుంది. (కీర్త. 51:4-7). యేసుక్రీస్తు విజ్ఞాపన పరిచర్యయే ఆయన రక్షణ కార్యాన్ని నిర్దిష్టంగా సంపూర్ణము చేస్తుంది. — “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు” (హెబ్రీ 7:25).

మూడవదిగా, పరిశుద్ధాత్ముడు నిత్యం మన సహచరుడుగా వుండడానికి - అనగా మనతో మాత్రమేగాక, మనలో వుండి మనలను సర్వసత్యంలోనికి నడిపించడానికి అనుగ్రహింపబడ్డాడు (యోహాను 14:17). మనలో జీవించే ఆత్మ మన పక్షాన విజ్ఞాపన చేయువాడు (రోమా 8:26). మన అంతిమ విమోచనకు ఆయనే అభయం (ఎఫె. 4:30).

దేవుడు మనల్ని ఒంటరిగా విడిచి పెట్టలేదు. మన నిత్య భద్రత కోసం అన్ని సదుపాయాలు చేసాడు. మనకు మనల్ని విడిచిపెడితే మనం తప్పిపోయే అవకాశం వుంది. అయితే దేవునితో అలా సంభవించడం సాధ్యం కాదు. మనలో మనం తొట్రిల్లే స్వభావంగలవారం. అయితే మనకు వాగ్దానము చేసిన దేవుడు తొట్రుబాటు లేనివాడు.

రక్షణ, భద్రత - ఈ విషయాలను గూర్చి రెండు కోవలకు చెందిన దేవశాస్త్ర భావాలున్నాయి. ఒక కోవకు చెందినవారు దేవుని సార్వభౌమత్వాన్ని ప్రధానంగా చూపిస్తారు. రెండవ కోవకు చెందినవారు. మానవ చిత్తస్వేచ్ఛను ప్రస్తావిస్తారు. ఒకరు కృపను మరొకరు విశ్వాసాన్ని ప్రధానంగా చూపిస్తారు. ఏదేమైన బైబిలు సూత్రము కృపవల్ల విశ్వాసము ద్వారా అన్నది సరియైన విషయం. మానవ పాత్ర దేవుని పాత్రకు అనుబంధమై, ఆధీనమై వుంది. మానవ చిత్తం దేవుని చిత్తానికి లోబడి వున్నప్పుడే స్వేచ్ఛను కలిగివుంటుంది. విశ్వాసం కృపాపర్యవసానం. చిట్టి చివరకు భద్రపరిచేది దేవుడే, మనల్ని మనం భద్రపర్చుకోజాలం.

ఈ రెండు భావాలను మార్జాలన్యాయం, మరకటన్యాయాలతో సాదృశ్యపరచవచ్చు. మార్జాలం తన పిల్లల్ని మోసుకువెళ్తుంది. మరకటం కూడా తన పిల్లల్ని మోసుకువెళ్తుంది, కానీ మార్జాలమువలె కాదు. కోతిపిల్ల తల్లిని గట్టిగా పట్టుకుంటుంది, తల్లి పట్టుకోదు.

నిత్యభద్రత సిద్ధాంతానికి ప్రతికూలంగా అనేక వాదనలు వున్నాయి:

1. విశ్వాసి వ్యక్తిగత బాధ్యతను ఈ సిద్ధాంతం త్రోసిపుచ్చుతుంది.

వ్యక్తిగత పూచిని త్రోసిపుచ్చడమన్న ప్రస్తకి ఏమీ లేదు. విశ్వాసికి బాధ్యత వుంది; అయితే అతడు చేసిన చెడుకే అతడు బాధ్యుడు. కాని అతడు చేసిన మంచి దేవుని వలననే కలుగుచున్నది కాని అతని వలన కాదు. మన బాధ్యత దేవుని శక్తికి అనుగుణ్యంగా నడుచుకోవడమే. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ క్రైస్తవులను హెచ్చరిస్తూ నిశ్చయత విషయంలో చెప్పిన విషయం గుర్తించండి: "....భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించు టకును కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే" (ఫిలిప్పి 2:12-13).

2. నిర్లక్ష్యాన్నీ, పాపాన్నీ ఈ సిద్ధాంతం ప్రోత్సహిస్తుంది.

ఇది సత్యం కాదు. దానికి ప్రతిగా ఈ సిద్ధాంతం విశ్వాసి మెలకువతో బాధ్యత కలిగి జీవించాలని కోరుతుంది. ఒక విశ్వాసి అలక్ష్యంగా, బాధ్యతారహితంగా, అలవాటుగా పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తుంటే అసలు ఆ వ్యక్తి ఎన్నడైనా రక్షింపబడ్డాడా అన్న సంశయాన్ని కలిగిస్తాడు. అందుకే అపొస్తలుడైన యోహాను “ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడైయున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు" (1 యోహాను 3:3,9) అని చెప్పాడు.

విశ్వాస స్థిరతకు బాధ్యతాయుత క్రైస్తవ జీవితానికి రక్షణ పరిపూర్ణత చెందుతుందన్న హామీ ప్రోత్సాహకరంగా వుంటుంది. మన రక్షణ సంపూర్ణమన్న నిశ్చయత లేనప్పుడే నిరాశ చెందడానికి అవకాశముంది. మనం ఆధిక్యతగలవారమని గుర్తించినప్పుడే భాధ్యతగలవారంగా ప్రవర్తిస్తాం. కారు ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తి అలక్ష్యంగా, బాధ్యతారహితంగా కారు నడిపిస్తాడు అన్నట్లు వున్నది వీరి వాదం. తమ సొంత కారు నడిపించేవారు ఈ వాదాన్ని ఎప్పుడు అంగీకరించరు-“దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపముచేయడని యెరుగు దుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసి కొనును గనుక దుష్టుడు వానిముట్టడు” (1 యోహాను 5:18).

3. ఒక విశ్వాసికి నిత్యభద్రత వున్నట్లయితే బైబిల్లో ఆత్మతృప్తికి లేక అలక్ష్యానికి ప్రతికూలంగా హెచ్చరికలెందుకు? విశ్వాసులు ఎల్లప్పుడు మెలకువగా వుండాలి అన్న అనుజ్ఞలెందుకు?

ఆత్మతృప్తికి ప్రతికూలంగా బైబిలు హెచ్చరికలు , మెలుకువ కలిగి వుండడానికి అనుజ్ఞలు (మత్త. 24:42; లూకా 21:36; 1 పేతురు 5:8; 2 పేతురు 1:10), క్రీస్తునందు విశ్వసిస్తున్నామని చెప్పుకొనేవారు, వారు నిజంగా విశ్వాసులో కాదో సరిపోల్చి చూచుకోడానికి ఉద్దేశింపబడ్డాయి. ప్రజలు తమ్మును తాము మోసగించుకోడానికి అవకాశాలెన్నో వున్నాయి. అయితే ఈ విషయంలో రక్షణ నిశ్చయత ప్రస్తావన లేదు. మెలుకువగలిగి వుండడం ప్రతి నిజక్రైస్తవుని సులక్షణం.

ప్రతి విశ్వాసి మెలుకువగా వుండాలి. ఆ విశ్వాసి నిర్విరామంగా అపవాది శక్తులతో పోరాడుతూ వుండాలి. మన ఆత్మలవిరోధి మనల్ని ఎల్లప్పుడు వెంటాడుతూ వుంటాడు గనుక మెలుకువగా వుండాలి. అతడు పాపముతో పోరాడుటలో రక్తము కార్చునంతగా పొరాడాలి. సాతానుడు అతనిని తన స్వాధీనములోకి తీసుకోకుండా చూచుకోవాలి. దేవుని మహాశక్తి అతనితో పుంటుందని వాగ్దానమున్నది. కనుక విజయం నిశ్చయం. ఆ ఆజ్ఞ, వాగ్దానాలు యిలా ఉన్నాయి: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవుసు" (యాకోబు 4:7).

దీనిని బట్టి విశ్వాసి తొట్రిల్లడని గాని, పాపరహితుడని గాని చెప్పడం లేదు. పాపములో పడడం ఒక విశ్వాసికి అసాధ్యమైందేమీ కాదు. ఈ సత్యాన్ని బైబిలు నుండి నిరూపించనవసరం లేదు. అనుదిన జీవితంలో చూస్తూనే వున్నాం. ఏ విశ్వాసి అయినా తాను మారుమనస్సు పొందినప్పటి నుండి ఏ పాపం చేయ్యలేదు అని చెప్పుకుంటే అతడు తన్ను మోసపుచ్చుకుంటున్నాడు, దేవుణ్ణి అబద్ధికుణ్ణి చేస్తున్నాడు. (1 యోహాను 1:8,10). అతడికి పాపాన్ని గూర్చిన సరియైన భావం లేదు. అతడు చేసేది పాపం కాదు అన్న అభిప్రాయంలో వుంటున్నాడు. అయితే “మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాప ములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:9). శుద్ధీకరణ, పునరుద్ధరణ దేవుని బిడ్డలకు సర్వదా లభిస్తుంది.

విశ్వాసి పాపం చేయరాదు. పాపం చేయడానికి ఏ సాకు లేదు (రోమ 6:1-2). అయితే అతడు పాపము చేసినప్పుడు సుఖప్రదంగా ఉండలేడు. విశ్వాసి పాపం చేసినప్పుడు తనలో వున్న దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాడు. క్రీస్తు నామానికి అపకీర్తి కలిగిస్తాడు. తన ఆత్మకు క్లేశం కలిగించుకొంటాడు. ఒక విశ్వాసి మనస్సాక్షి సమ్మతితో అవిచ్ఛిన్నంగా పాపము చేయడు. దేవుని కృపలో పాపాన్ని జయించడానికి అతడు శక్తి కలిగి ఉన్నాడు.

“దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయం మన విశ్వాసమే"

(1 యోహాను 5:4). విశ్వాసి గొర్రెలాంటివాడు; పందిలాంటివాడు కాదు. గొర్రె బురదలో పడ్డప్పుడు దానిలో హాయిగా ఉండలేదు. సాధ్యమైనంత త్వరగా బయటకి రావడానికి యత్నం చేస్తుంది. అయితే దానికి ప్రతికూలంగా పంది బురదను ప్రేమిస్తుంది, బురదలో ఆనందిస్తుంది; ఆ బురదలో నుండి దానిని ఎవరైనా బయటికి తీయడం దానికి సమ్మతం కాదు. అయినాగాని గొర్రె బురదలో పడదు, పడజాలదు అని చెప్పలేం -"నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు” (1యోహాను 2:1-2).

4. ఒక క్రైస్తవుడు పాపాన్ని ఒప్పుకోకుండా మరణిస్తే రక్షణ భద్రత వానికి చెందుతుందా ?

ఈ వాదన చనిపోకముందు తన పాపాలన్నీ ఒప్పుకొన్న లేక దోషరహితమైన జీవితాన్ని జీవించిన విశ్వాసులే పరలోకానికి వెళ్తారు అని లేక రక్షణ భద్రత తను కలిగి ఉంటారనే దురభిప్రాయం మీద ఆధారపడి ఉంది. అనగా మనం పరలోకానికి వెళ్లేంతవరకు మనం అక్కడ చేరతామన్న నమ్మకం లేదు.

మనం ముందుగా చూచినట్టు పరలోకానికి ఈ వైపున ఉండగా ఏ విశ్వాసికూడ సంపూర్ణంగా పాపరహితుడుగా ఉండజాలడు. మన పరిపూర్ణత నైతికంకాదు. మన స్థితికి సంబంధించింది. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం అసంపూర్ణులంగానే ఉంటాం (ఫిలి. 3:12). మనం ఈ శరీరాలను విడిచినప్పుడే మన ఆత్మలు పరిపూర్ణత చెంది పరలోకానికి అనువుగా ఉంటాయి (హెబ్రీ 12:23). ఇది దేవుడు తన బిడ్డలందరికీ తన సార్వభౌమిక కృపను బట్టి చేసే కార్యం. దాని కోసం మనం చేసేది కాని, చేయగలిందిగాని ఏమి లేదు.

పరిపూర్ణులు మాత్రమే పరలోకానికి వెళ్తారు ఆన్న విషయం నిజం. అయితే మనం పరిపూర్ణత చెందేవరకు మనకు రక్షణ భద్రత లేదు అన్నది సరికాదు. రక్షణ భద్రతకు పరిపూర్ణత అక్కరలేదు. ఈ అసంపూర్ణ పరిస్థితిలోనే మనకు భద్రత ఆవసరం, అది ఇక్కడే మనకున్నది.

ఒకానొక పాపంవల్ల నీ రక్షణ పొయేటట్లుంటే, ఆ పాపము చేసినప్పుడే రక్షణ పొవాలి, కాని మనిషి చనిపోయినప్పుడు కాదు. అలానైతే ఒక మనిషి పాపం చేసినప్పుడు దేవుడు రక్షణను వెనక్కు తీసుకొని అతడు పాపాన్ని ఒప్పుకొన్నప్పుడు తిరిగి యిస్తాడా ? విశ్వాసి పాపం చేసినప్పుడల్లా ఇలానే జరుగుతుందా ? ఈ రీతిగా మనం ఎన్నిసార్లు రక్షింపబడతాం? బైబిలు బోధ ప్రకారం రక్షణ అంటే ఒక్కమారు తిరిగి జన్మించడం, మళ్ళీమళ్ళీ కాదు. పైగా ఒక మనిషి పాపాన్ని ఒప్పుకోకుండా చనిపోతే రక్షణను కోల్పోయేట్లయితే అతడు పాపం చేసిన సమయం నుండి మరణించే కాలం వరకు రక్షణ సందిగ్ధంలో ఉంటుందా?

ఈ వాదన పాపాన్ని గూర్చిన చిన్నాభిన్నమయిన భావముపై ఆధారపడి వుంది. అంటే మానవుడు చేయగూడనిది చేసి, చేయవలసింది చేయకపోయినందున ప్రాప్తించే పాపాలను వీరు గణనకు తీసుకోలేదు. పాపాలంటే క్రియలే కాదు, పాపాలు తలంపులు, దృక్పథాలు కూడా. అందుకే దావీదు “రహస్య పాపాలు" అంటాడు (కీర్త. 19:12) - అనగా దాచబడిన పాపాలు; అంటే ఇతరుల నుండి మరుగైన పాపాలని కాదు __చేసేవానికే మరుగైన పాపాలు, ఒప్పుకోలు తెలిసిన పాపాలను గూర్చి మాత్రమే, మరి తెలియని పాపాల విషయమేంటి? వాటి నుండి కూడ మనకు శుద్ధీకరణ అవసరం (1 కొరి. 4:4).

వ్యక్తుల జీవితాల వివరణపై ఆధారపడి సిద్ధాంతీకరించడం ప్రమాదకరం. సిద్ధాంతం ఎల్లప్పుడు దేవుని వాక్యాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇతరుల అనుభవాలపై ఆధారపడి వ్యాఖ్యానించడం వ్యక్తిగతం. అది పక్షపాతానికి దారితీస్తుంది. ఒకానొక వ్యక్తి ఫలానా సమయంతో రక్షింపబడి ఇప్పుడు పతితుడై రక్షణ పోగొట్టుకొన్నాడు అని చెప్పడం మన పనికాదు. మనం తీర్పరులం కాదు. మొదటిగా ఆ వ్యక్తి రక్షించబడ్డాడని మనకెలా తెలుసు ? ఊహలపై మన బోధనలు ఆధారపడరాదు.

5. నిత్య సంరక్షణను నిరాకరిస్తునట్టున్న హెబ్రీ 6:4-6; 10:26-29 వరకు ఉన్న వాక్యభాగాల సంగతేంటి?

కొత్త నిబంధనంతటిలో ఈ రెండు వాక్యభాగాలు వివాదాస్పదాలని నాకు తెలుసు. అయితే ఆ రెండు వాక్యభాగాలు నిత్యభద్రతను నిరాకరిస్తున్నావని నేను నన్మును. క్రొత్త నిబంధన పుస్తకాలన్నింటిలో హెబ్రీ పత్రిక యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని సిలువకార్యాన్ని ఆధారం చేసుకొని నిత్యరక్షణను అతి స్పష్టంగా ప్రభోదిస్తుంది.

ఈ రెండు వాక్యభాగాల్లో ప్రస్తావించబడ్డవారు తాము క్రైస్తవులమని చెప్పుకొనేవారు మాత్రమే కాదు గాని వాస్తంగా క్రీస్తునందు విశ్వాసులమని నేను గుర్తిస్తున్నాను. హెబ్రీ పత్రిక 6వ అద్యా.లో వాడబడిన పదాలు ఈ గ్రంథంలో ఇతర భాగాల్లో కూడ వాడబడినట్టు చూడగలం. “వెలిగింపబడ్డ" అన్నపదం 10:32 లో కూడ ఉంది. ఈ వెలిగింపు రక్షణను సూచిస్తుంది (2 కొరి. 4:4-6). "రుచిచూచు” (హెబ్రీ 2:9) అన్నపదం మచ్చుకు రుచి చూడం కాదు గాని వాస్తవిక అనుభవాన్ని సూచిస్తుంది. క్రీస్తు మానవుడుగా వాస్తవిక మరణాన్ని అనుభవించాడు. "పాలు పొందు" లేక "పాలివాడు" అన్న పదం (2:14) క్రీస్తు నరావతార సందర్భములో వాడబడింది. క్రీస్తు మానవునివలె కనిపించడం మాత్రమే కాక వాస్తవంగా మానవుడయ్యాడు.

ఏది ఏమైనా ఈ భాగములో నిజమైన క్రైస్తవులు పతనమై నశించిపోయారనిగాని, అలాగు నశించిపోగలరనిగాని ఏమి లేదు. ఒకవేళ వారు ఆలాగు పతనమైపోయినట్లైతే వానిని మరలా నూతనపరచుట అసాధ్యము. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ "అసాధ్యము" అని ఉన్నది కాని "దుర్లభము" అని లేదు.

మనం గుర్తించవలసిన రెండు విషయాలున్నాయి : మొదటిది, తప్పిపోవుట అన్నది మారుమనస్సు తరువాత చేసిన ఏదో ఒక పాపాన్ని బట్టి ప్రభువు సహవాసములో నుండి తప్పిపోవుట అని భావించరాదు. అదికాక, కృప నుండి తప్పిపోయి (గల. 5:4) నాశనానికి తిరిగి వెళ్ళుట (హెబ్రీ 10:38). దేవుని నుండి సంపూర్ణంగా దూరమైపోవుట అన్న భావముతో కూడిన విశ్వాస భ్రష్టత్వం. ఇది విశ్వాస భ్రష్టత్వం. దీనినుండి పునరుద్దరణ లేనేలేదు. అయితే మనం ముందుగా చూచిన రీతిగా దేవుని బిడ్డలకు శుద్ధీకరణకు, పునరుద్ధరణకు యేసు క్రీస్తునందు ఎల్లప్పుడూ సదుపాయముంది. ఒక విశ్వాసి కృపనుండి పడిపోవుటగాని నాశనానికి ఈడ్వబడుటగాని లేదు. "అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము” (హెబీ 10:39).

రెండవది, ఇక్కడ చెప్పబడ్డ విషయం ఊహాగానం మాత్రమే. గల. 5:4లో కూడా యిదే భావముంది. “మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువా రెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృపలోనుండి తొలగిపోయి యున్నారు". ఇది ఒక షరతుతో కూడిన ప్రకటన. గలతీయులు ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడితే అప్పుడు వారికి క్రీస్తువలన ప్రయోజనము లేదు. గనుక వారు కృప నుండి తొలగిపోతారు. కాని గలతీయులు దర్మశాస్త్రము వలన నీతిమంతులుగా తీర్చబడుట అన్న సిద్ధాంతాన్ని తప్పుగా నిరూపించడానికి ప్రయాసపడనవసరము లేదు. గలతీ పత్రికలో ఏలాంటి సమస్య ఉత్పన్నమైందో హెబ్రీ పత్రికలో కూడా అదే సమస్య ప్రత్యక్షమౌతుంది. కనుక ఒక ఊహాప్రజ్ఞ పరిస్థితి హెబ్రీ క్రైస్తవుల ఎదుట వుంచబడింది. వారిలో క్రీస్తుకు దూరసులగుట వలన కలిగే ఘోరపరిణామాలు ఊహాప్రజ్ఞ రూపంలో హెచ్చరికగా వారి ముందుంచబడ్డాయి. అయితే విశ్వాసులు భ్రష్ఠులు కారు అన్నప్పుడు యిక వారికి హెచ్చరిక ఎందుకు? ఈ హెచ్చరిక కాలాతీతం కాకముందే పాఠకులకు క్రీస్తునందువారి విశ్వాసం నిర్ధారించుకొనుటకు సాయపడుతుంది. అదే సమయంలో యేసుక్రీస్తునందు మాత్రమే రక్షణగలదు అన్న విషయం వారి గమనికకు తెస్తుంది - "సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒక వేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి” (హెబ్రీ 3:12; 2 పేతురు 1:10).

ఈ భ్రష్టత్వ పరిస్థితి హెబ్రీ క్రైస్తవులలో బాహ్యంగా కనిపిస్తుంది. వారిలో క్రైస్తవులము అని చెప్పుకొనేవారికే చెందినట్లు వర్తిస్తుంది. క్రైస్తవులమని చెప్పుకొనేవారు నామకార్థపు క్రైస్తవులు కావచ్చు. అనగా వారు ఉందని చెప్పుకొనేది కలిగినవారు కాకపోవచ్చు. కాని బైబిలుకు సంబంధించినంత వరకూ నామకార్థపు క్రైస్తవులు, క్రైస్తవేతరులతో సమానమే. మేము పడిపోయాము అని వారు చెప్పితే, పడిపోవడానికి వారియొద్ద ఏమున్నదీ — వారు చెప్పుకోవడం మాత్రమే. వారు చెప్పుకోవడంలో గతంలో వారేదో సాధించామంటారు. కావున వారికి కావలసింది హృదయపరివరన. వారి పాపాల నిమిత్తం పశ్చాతాపపడి రక్షణ కోసం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. వారు ఇదివరకే క్షమించబడరానితనానికి (మత్త.12:32; రోమా 1:24-28), దిగజారినవారైతే తప్ప, దేవుని పరిశుద్ధాత్మ సహయంతో వారిది చేయవచ్చు. నిజ క్రైస్తవులైతే వారి పాపాల నిమిత్తం పశ్చాత్తాపపడి క్రీస్తునందు విశ్వాసముంచినవారు. అలాంటివారు తప్పిపోతే మారుమనస్సు కోసం వారిని మళ్ళించడం అసాధ్యం. అయితే వారు పడిపోరు. నిజవిశ్వాసులు విశ్వాసము, ఓర్పు ద్వారా వాగ్దానాలను స్వాస్థ్యంగా పొందువారైయున్నారు (హెబ్రీ 6:12). క్రొత్త నిబంధన అతి పురాతన అనువాదం సిరియా భాషలో "పెషిటో" అని పిలువబడుతుంది. ఆ అనువాదములో హెబ్రీ 6:6లోవున్న అసాధ్యం అన్న పదం "అడునాటన్" - తప్పిపోవుట, పునరుద్దరించుట అన్న రెండు స్థితులకు చెందిన పదంగా వాడబడ్డది. ఆరీతిగా ఆ వాక్యాన్ని అనువదిస్తే దాని భావం యిలా వుంటుంది: “ఒక్కసారి వెలిగింపబడినవారు తప్పిపోవుట, తిరిగి మారుమనస్సు పొందునట్లు పునరుద్ధరింపబడుట అసాధ్యం".

హెబ్రీ 10:26-29లోను 6వ అధ్యాయంలో ఒకటే సమస్య ప్రస్తావింపబడ్డది. నిజ విశ్వాసి వివరణ ఈ భాషలో వుంది. "సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమే” (26వ) రక్షణ — “మీరు సత్యమును తెలుసుకొందరు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును” (8:31,32). వారు నిబంధన రక్తముతో “పరిశుద్ధపరచబడిన"వారు అని చెప్పబడ్డది (29వ). అయితే తిరిగి రక్షింపబడిన వ్యక్తి తప్పిపోయినాడని కాని లేక తప్పిపోతాడని కాని ప్రస్తావింపబడలేదు. ఈ వాక్యం ఊహా ప్రజ్ఞగా వుంది (26వ). ఈ అధ్యాయంలోను, 6వ అధ్యాయంలోను పౌలు వాదనలు, హెచ్చరికలు, ఒకప్పుడు క్రీస్తునందు విశ్వాసముంచామని చెప్పుకొన్న హెబ్రీ క్రైస్తపులలో కొందరు ప్రస్తుతం క్రీస్తు విశ్వాసము నుండి తొలగిపోతున్నారన్న సందర్భంగా వ్రాస్తున్నాడు. వారు అలాగు క్రీస్తు నుండి తిరిగిపోతే వారి పాపాల కోసం చేయబడిన ఏకైక బల్యర్పణ నుండి, ఏకైక రక్షకుని నుండి తొలగిపోతున్నారు. రక్షణకు క్రీస్తే మార్గం గనుక (4:12), ఆయనను నిరాకరించడం తప్పించుకొనలేని వినాశనమే.

“ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్షము చేసినయెడల ఏలాగు తప్పించు కొందుము” (హెబ్రీ 2:3).

 

Add comment

Security code
Refresh

Comments  

# I am looking for this book to getP V Prasad 2021-09-02 23:09
I am P V Prasad Ex-RZIM Staff Hyderabad, since many years I am looking for this Book to get buy it is not available
in book shop, thank you for sending this book may God bless you.

Prasad P V
Evangelist.
Reply