విమర్శలకు జవాబు

రచయిత: జి. బిబు

విషయసూచిక

ముందుమాట

బైబిల్ గ్రంథం చదవడానికీ, గ్రహించడానికీ తేలికైనదని తనకు తానుగా ఎన్నడూ చెప్పుకోలేదు. బైబిల్ గ్రంథం దేవునిచేత ప్రేరేపించబడినది గనుక దాని సందేశం పవిత్రమైనది, గంభీరమైనది మరియు లోతైన జ్ఞానమును బయలుపరచేదిగా ఉంటుంది.

మానవ మేధస్సు పరిశుద్ధాత్మపై ఆధారపడి వాక్యమందు ప్రయాసపడాలి. ఏది ఏమైనా విద్యావిహీనులు, అస్థిరులైన కొందరు తమ స్వీయ నాశనం కోసం బైబిల్ గ్రంథాన్ని తమకిష్టం వచ్చినట్టు వక్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు (2 పేతురు 3:16). అలాంటివారిలో ఒకరు కీ.శే. అహ్మద్ దీదాత్. అతడు మరణించినప్పటికీ, అనేకులు అతని రచనలను, ప్రసంగాలను గుడ్డిగా అనుసరిస్తున్నారు. కాబట్టి అతని రచనలను నలుగురి ముందు పెట్టి, వాటిని ఖండించవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో మనము అపొస్తలుల మాదిరిని (అపొ.కా.18:28 ) అనుసరించి, వారి హెచ్చరికను పాటించబద్దులమై యున్నాము (1 పేతురు 3:15 ).

 

ఈ పుస్తకంలో సహో.బిబు (ఎల్ ఎల్ ఎమ్) దీదాత్ వాదనల్లోని పసలేని తనాన్ని బయట పెట్టి ఓ న్యాయశాస్త్ర నిపుణుడిగా, బైబిల్ బోధకుడిగా తనదైన శైలిలో బైబిల్ గ్రంథం తరపున తన వాణిని అద్భుతంగా వినిపించాడు. ఉదాహరణకు, 1వ అధ్యాయంలో దీదాత్, విటివాటర్ గ్రౌండ్ అనే విశ్వవిద్యాలయానికి చెందిన ఓ వేదాంత విద్యార్థితో చేసిన తన సంభాషణను ఉటంకిస్తాడు. మొదట క్రైస్తవులపై మానసికంగా దాడి చేస్తే, ఆ తర్వాత అతని తప్పుడు తర్కాన్ని, రుజువులను వాళ్లు కళ్లుమూసుకొని అంగీకరిస్తారన్నదే దానిని ఉదహరించడంలో దీదాత్ ఉద్దేశం. ఏదిఏమైనా, ఆ వేదాంత విద్యార్థి నిజానికి ఒక వాస్తవిక దృక్పథాన్ని ప్రతి క్రైస్తవునికీ ఉండవలసినది) కలిగివున్నాడే తప్ప, దీదాత్ ఆరోపించినట్టు మొండి మనస్తత్వాన్ని కలిగినవాడు కాదన్న సంగతిని సహో.బిబు అమోఘంగా చూపించాడు. వాస్తవానికి సహో. బిబు ఈ పుస్తకంలో ఇతర క్రైస్తవ అపాలజిస్టుల వాదనల్నే వల్లెవేసే మనస్తత్వాన్ని అనుసరించలేదు గానీ స్వతంత్రంగా అధ్యయనం చేసి, అనేక మూలగ్రంథాలు పరిశోధించి, వివిధ పండితులు అందించిన రుజువులను విశ్లేషించి తన సొంత నిశ్చితాభిప్రాయాలను వెలిబుచ్చడం ద్వారా బైబిల్ గ్రంథాన్ని అమోఘంగా సమర్ధించాడు. అటువంటి స్వతంత్ర పరిశీలన, విశ్లేషణ చేసేవాళ్లని బైబిల్ “ఘనులైనవారు”గా పరిగణిస్తుంది (అపొ.కా.17:11 ).

పైగా, బైబిల్ కు ఒక ప్రమాణాన్ని, ఖురానుకు మరొక ప్రమాణాన్ని ఉపయోగించడంలో (ఇతర దావా ప్రచారకులు కూడ దీన్నే పాటిస్తారు) దీదాత్ అనుసరించిన రెండు నాల్కల ధోరణిని కూడ సహో.బిబు పదేపదే బయట పెట్టాడు. అద్భుతమైన ప్రశ్నలద్వారా ఎదుటివారి ఉద్దేశాలను, పక్షపాత ధోరణిని బయటపెట్టడం అనేది మన ప్రభువైన యేసుక్రీస్తే స్వయంగా అనుసరించిన పద్దతి అని పాఠకులు బాగా గుర్తించగలరు (మత్తయి 21:25-27 , 22:18-22 ). తరచుగా ముస్లింలతో గాని ఇతరులతో గాని చర్చలు జరిపేటప్పుడు క్రైస్తవులు ఈ అంశాన్ని పెద్దగా పట్టించుకోరు. వారి ప్రశ్నలకు మనం జవాబివ్వడం ఎంత ముఖ్యమో, తియ్యని మాటలతో లేదా సర్వం తెలిసిన పండితుల మాదిరి నటిస్తూ మత్తయి 22:15-22 లో ఉన్నట్టు, ప్రజలను చిక్కుల్లో పెట్టడమే అసలు ఉద్దేశంగా ఉన్న వారి ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టడం కూడా ముఖ్యమే. బైబిల్ గ్రంథాన్ని ప్రశ్నించే ముస్లింలు గాని, లేక మరెవరైనా గాని, వారు నిజమైన అన్వేషకులు, వాస్తవిక దృక్పథంతో ఆలోచించేవారైతే, వారి సొంత విశ్వాసాలను పరీక్షించుకొని, మనం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి కూడా వాళ్లు సుముఖంగా ఉండాలి.

అంతేకాకుండ, సహో.బిబు బైబిల్ గ్రంథం, తర్కశాస్త్రం, ఖురాన్, హాదిత్లనుంచి తన వాదనలకు కావలసినన్ని రుజువులను ఉదాహరణగా చూపించాడు. జస్టిన్ మార్టిర్ (క్రీ.శ. 100-165), అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంటు (క్రీ.శ.150-216), అలెగ్జాండ్రియాకు చెందిన అధనేసియస్ (క్రీశ.293373) మొదలైన ప్రాచీన సంఘ నిరూపణవాదుల నుంచి ఈ మధ్యకాలపు అపాలజిస్టైన కేరళకు చెందిన మహాకవి కె.వి. సైమన్ (క్రీ.శ.1883-1944) లాంటి వారి వరకు అందరూ అదేరీతిగా ఇతర మత గ్రంథాలు చదివి, అదేవిధంగా వాటిని ఉపయోగించినవారే. ఈ విషయంలో సహో, బిబు కూడ ఈ ఉద్దండ పండితులైన అపాలజిస్టుల సరసన నిలువదగినవాడు.

క్రైస్తవులు ఈ పుస్తకాన్ని కొని, చదివి, ముస్లిం సోదరులకు కూడ ఇవ్వవలసిన వారై యున్నప్పటికీ, వారు సహో.బిబు అనుసరించిన విధానాన్ని అంటే విషయాన్ని సమగ్రంగా చదివి, ప్రశ్నలడిగి, ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టి, వారివాదనలకు తగిన రుజువులు చూపగలిగే విధానాన్ని అవలంబించగలిగితే ఇంకా బావుంటుంది. ఇదంతా చెయ్యాలంటే దానికి ఎంతో ప్రయాస, త్యాగం అవసరమవుతాయి.

కంటిచూపు లేకపోయినా, సహో.బిబు కేవలం దేవుని కృప, దీవెనల సహాయం తోనే ఇంతటి అమూల్యమైన గ్రంథాన్ని రచించగలిగాడు. ఈ పుస్తకాన్ని నేను మీకు మనస్ఫూర్తిగా సిఫారసు చేస్తున్నాను. అనేకమంది విమర్శకుల కళ్లు తెరచి, దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవులు శ్రద్దగా అధ్యయనం చేసేలా వారిని ప్రోత్సహించునట్లుగా దేవుడు ఈ పుస్తకాన్ని దీవించును గాక!   క్రీస్తు నందు -జెర్రీ థామస్(సాక్షి అపోలోజెటిక్స్ నెట్వర్క్)

 

పరిచయం

ఈజ్ ద బైబిల్ గాడ్స్ వర్డ్? అనే శీర్షికన, బైబిల్ ను విమర్శిస్తూ, అహ్మద్ దీదాత్ అనే ఒక ముస్లిం దావా ప్రచారకుడు, 1981లో జూన్ 1వ తేదీన, సౌతాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఒక చిన్న పుస్తకాన్ని విడుదల చేసాడు. గత కొన్ని శతాబ్దాలుగా, క్రైస్తవ స్పందన ఎదుట నిలువలేని ఎందరో విమర్శకుల విఫలమైన, పురాతన, నిష్పలమైన హేతురహిత వాదనలనే తన పుస్తకంలో పునరుద్ఘాటించి, దీదాత్ తన అపరిపక్వతను, అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు. దీదాత్ ఆ పుస్తకాన్ని ప్రచురించినది మొదలు, అనేక దావా ప్రచారకుల చేతిలో అది అబద్దాల్ని విత్తి అనేకులను తమతోపాటు నిత్యనాశనానికి నడిపించే ఒక సాధనంగా మారింది. దీదాత్ చనిపోయిన దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు “బైబిల్ దేవుని వాక్యమా” అనే శీర్షికతో దానిని తెలుగులో అనువదించుకున్నారంటే, బైబిల్ ను విమర్శించడానికి వారు ఎంతగా దానిపై ఆధారపడుతున్నారో మనము అంచనా వేయగలము. ఐతే, ఆ మోసపు రచనలో పొందుపరచబడిన అపవాది అగ్నిబాణాలను నిర్వీర్యం చేస్తూ నేను ఆంగ్లంలో వ్రాసిన జవాబులు, తెలుగులో ఆ సవాళ్లు ఎదుర్కొనే క్రైస్తవులకు, వాటిచే మోసగించబడే క్రైస్తవేతరులకు, మరి ముఖ్యముగా సత్యాన్వేషకులైన ముస్లింలకు, తెలుగులో కూడా అందించడం అవసరమని భావించి, ఈ చిన్న ప్రయాసను సత్యస్వరూపియైన దేవుని సార్వభౌమ్య హస్తానికి సమర్పిస్తున్నాను. “వాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటి వాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును” (సామెతలు 18:17) అని బైబిల్ సెలవిస్తుంది. దీదాత్ బైబిల్ పై కల్పించిన విమర్శలు, సరైనవేనని నేటివరకు భావించిన వారికి సహితం అసలు సంగతి తేటతెల్లం చేసేందుకు ఈ పుస్తకాన్ని సిద్దపరచాను. ఇరుపక్షాల వాదనలను నిష్పక్షపాత వైఖరితో పాఠకులు పరిశీలించగలిగేలా, ఈ పుస్తకం ఒక సంభాషణాశైలిలో రూపొందించబడింది. మొదట దీదాత్ పుస్తకములోని ఒక భాగాన్ని “దీదాత్” అనే హెడ్డింగ్ క్రింద ఉదహరించి, తదుపరి “జవాబు” అనే హెడ్డింగ్ క్రింద నా స్పందనను అందించాను.

ఈ చర్చావిధానం క్రమబద్ధంగా కొనసాగేందుకు, దీదాత్ చేసిన ప్రతీ వాదనకు నా స్పందన జోడించి, ప్రతి జోడిని ప్రత్యేక సెక్షేన్లుగా విభజించి నంబరింగ్ చేసాను. ఈ క్రమంలో దీదాత్ పూర్తి పుస్తకాన్ని ఉన్నదున్నట్టుగా నా స్పందనతో పాటు పాఠకుల ఎదుట ఉంచుతున్నాను. దీదాత్ పుస్తకంలో నుండి క్రమం తప్పకుండా ఉన్నదున్నట్లుగా ఉదహరించాను కాబట్టి, ఉదహరించబడిన ప్రతీభాగం చివర, పుట సంఖ్యల రిఫరెన్స్లు ఇవ్వలేదని గమనించగలరు. దీదాత్ వాదనలకు నా ప్రతిస్పందనగా అందించిన సమాచారం ఎన్నో రచనలనుండి క్రోడీకరించి సమాధానాలుగాను, ప్రతివిమర్శలుగాను మలచడమైనది. కాబట్టి ఈ పుస్తకం ఎందరో దైవజనుల ప్రయాసల ఫలితమని, వారందరికీ నేను ఋణపడివున్నానని వినయంతో ఒప్పుకుంటున్నాను. దీదాత్ వాదనలు బైబిలుకు వ్యతిరేకంగా చెల్లవని, ఐతే ఖురానుకు వ్యతిరేకంగా అవి ఎంతో చక్కగా వర్తిస్తాయని ఈ విధంగా నిరూపించగలిగినందుకు హర్షిస్తున్నాను; సమస్త మహిమ ప్రభువుకే ఆరోపిస్తున్నాను. బైబిల్ మాత్రమే దేవుని వాక్యముగా నిత్యము వర్ధిల్లుతుంది.

గమనిక : "ఈజ్ ద బైబిల్ గాడ్స్ వర్డ్" అనే దీదాత్ పుస్తకాన్ని తెలుగు అనువాదం చేసి ప్రచురించిన ముస్లిం సోదరుల వెర్షన్ ని యధాతదంగా వాడటం వల్ల ప్రతి పాయింట్లో "దీదాత్" అనే శీర్షిక క్రింద ఉన్న భాషా కొంత అసౌకర్యాంగాను, అస్పష్టంగానూ ఉన్నప్పటికీ మేము దానిని మార్చే ప్రయత్నం చేయలేదని గమనించగలరు. ఈ అసౌకర్యానికి చింతుస్తున్నాము.

 

1వ అధ్యాయం

వాళ్లంటే సరిపోతుందా?

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో,
“వాళ్లేమంటున్నారు?” అనే మొదటి అధ్యాయానికి మా జవాబు.

1. దీదాత్

క్రైస్తవులే ఒప్పుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ క్రైస్తవ ప్రబోధనా సంస్థ అయిన చికాగోలోని మూడి బైబిల్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డా. డబ్ల్యూ. గ్రహమ్ స్కోర్లీ (DrW.Graham Scroggie) తన పుస్తకం "Is the Bible the Word of God?" (బైబిలు దైవ వాక్యమా?) లో, అదే ప్రశ్నకు సమాధానమిస్తూ 17వ పేజిలో,

“ఇది మనుషులదే, కాని దివ్యత్వం కలది” అని సమాధానమిచ్చి వున్నారు. ఆయన ఇంకా ఇలా ఒప్పుకొని వున్నారు... “అవును, బైబిలు మానవ (లిఖితమే). కొందరు అమితోత్సాహపరులు సరైన జ్ఞానంలేక ఈ మాటను అంగీకరించరు. ఆ పుస్తకాలు (బైబిలు పలు పుస్తకాల సమ్మేళనం) మానవ మస్తిష్కాలనుండే సాగుతూ, మానవ భాషలో, మానవ హస్తాలతో లిఖించబడి, మానవ లక్షణాలనే కలిగి వున్నాయి.”

జెరూసలేమ్ ఆంగ్ల బిషప్పు అయిన మరో ప్రముఖ క్రైస్తవ పండితుడు తన పుస్తకం THE CALL OF MINARET (మినారు పిలుపు) లోని 277వ పేజీలో పైన పేర్కొనబడిన వాస్తవాన్ని అంగీకరిస్తూ ఇలా రాశాడు:

“కాని నూతన నిబంధన మాత్రం ఇలా కాదు (ఇక్కడ అతను ఖురానుకు పోటీగా రాస్తున్నది). దానిలో క్లుప్తత, సంగ్రహీకరణ, దానిలో ఎంపిక,ప్రత్యుత్పత్తి, సాక్ష్యం వుంది. దీని గ్రంథకర్తల వెనుక చర్చీల మస్తిష్కం వుంది. అవి వారి అనుభవాల్ని, చరిత్రను ప్రతీకరిస్తాయి.

” (సంగ్రహీకరణ అని వాడిన పదానికర్థం కొత్త మాటల్ని కలపడమే)
పదాలకు సరైన అర్థాలంటూ వుంటే మనం మన వాదన నిరూపణ కోసం ఇతర పదాల్ని వాడాల్సిన అవసరముంటుందంటారా? లేదు. (అంతా తేట తెల్లమవుతుంది- అనువాద కర్త) .

ఉద్యోగ రీత్యా క్రైస్తవ ప్రబోధకులైన వాళ్లు మాత్రం తమ గుట్టు బయట పడిపోయినా కూడా ఇంకను బైబిలు సర్వోత్రుష్టుడైన పరిశుద్దుడైన దేవుని వాక్యమే అని, అందులో లేశమైనా అనుమానం లేదన్నట్లుగానే తమ పాఠకుల్ని మెప్పించాలని ప్రయత్నం చేస్తూనే వున్నారు. వాళ్లు శబ్దార్థాలతో చేసే కసరత్తు, పదాల గారడీ వింతగా వుంటుంది.

పైన పేర్కొనబడిన ప్రఖ్యాత క్రైస్తవమత విజ్ఞులు ఇద్దరూనూ బైబిలు అన్నది మానవ కల్పనతోనే కూడుకున్నదని, మనకు తెలిసిన మానవ భాషలో స్పష్టంగా తెలుపుతున్నారు. కానీ, దాన్తోపాటే విరుద్దంగా అలాకాదని నిరూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ రకమైన పండితుల గురించే, “ఇలాంటి వారు మత గురువులైతే సంఘాన్ని ఇక దేవుడే కాపాడాలి” అని అరబ్బీలో ఒక సామెత ఉంది.

మరిలాంటి సొల్లుకబుర్లతో, ఈ ఉత్సాహపూరితులైన సువార్తీకులు, బైబిలును నొక్కి వక్కాణించేవారు, విగ్రహారాధకుల్ని, అన్యజనుల్ని వెంటాడి వేటాడే 'ప్రేరణ' పొందారు. (ఇక్కడ డా|| సోగీ యొక్క మూడీప్రెస్ వారి How Lost Are The Heathen ('అన్యజనులెలా' భ్రష్టు పట్టి ఉన్నారు') చదవండి”.)

జవాబు

దీదాత్ తన అలవాటు ప్రకారం డా|| డబ్ల్యు గ్రహమ్ స్కోగ్స్ మరియు కెన్నెత్ క్రాగ్ చెప్పిన మాటలను సందర్భ రహితంగా ఉదహరిస్తున్నట్లు అనిపిస్తుంది. బైబిల్ దైవావేశము చేత వ్రాయబడేందుకు దేవుడు మనుష్యులను, వారి మస్తిష్కాలను, వారి శైలిని, వారి అనుభవాలను సాధనాలుగా ఉపయోగించాడన్న వాస్తవాన్ని బహుశా ఈ ఇరువురు పండితులు ప్రస్తావిస్తున్నారేమో? అయినా అసలు సమస్య వారేమంటున్నారన్నది కాదు. ఆ మాటకొస్తే బైబిల్ దేవుని వాక్యమనే సత్యాన్ని నేరుగా తృణీకరించే పేరుగాంచిన పండితులు క్రైస్తవులం” అని పిలుచుకునే వారి మధ్య లేకపోలేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. వాదన కొరకు దీదాత్ప్రస్తావించిన ఈ ఇరువురు క్రైస్తవ పండితులు కూడా ఆ కోవకు చెందినవారే అనుకుందాము. బైబిల్ లిఖించడములో, దైవమానవ మిళిత ప్రమేయముందని వారు అంటున్నట్లుగానే ఊహించుకుందాము. ఇప్పుడేమిటి పరిస్థితి?

బైబిల్ దేవుని వాక్యమా, దేవుని వాక్యము కాదా అనేది క్రైస్తవ పండితుల అభిప్రాయం మీద ఆధారపడి లేదు (2 పేతురు 2:1-3 ,అపో.కా. 20:29-31 ఖురాన్ దేవుని వాక్యమా అని పరిశీలించే సందర్భంలో ముస్లిం పండితులు చెప్పే మాటలను ఆధారం చేసుకుని ఖురాన్ దివ్యత్వాన్ని సవాలు చేస్తే, ముస్లిం మిత్రులు కూడా మేము చెప్పిన మాటనే జవాబుగా చెప్పరా? ప్రతి మతంలోను తమ మత గ్రంథాల సంపూర్ణ ప్రామాణికతను ఒప్పుకునేందుకు నిరాకరించే స్వేచ్ఛావాదులైన మత పండితులున్నారన్నది అందరికీ విదితమే. అయితే ఏదైనా మతగ్రంథము దేవుని వాక్యమో కాదో నిర్ణయించటానికి వారి అభిప్రాయాలను ఆధారం చేసుకోవడం అవివేకం. అయినా నేను తేల్చేసినంత సులభంగా దీదాత్ వాదనలో ఉన్న లోపాన్ని, బుద్దిహీనతను, బహుశా నా ముస్లిం మిత్రులు పసిగట్టియుండక పోవచ్చు. కాబట్టి ఒక చిన్న ఉదాహరణను గమనిద్దాం.

ఖురాన్ గుట్టురట్టు చేసిన రషీద్ ఖలీఫా

“ముస్లిం డైజెస్ట్” అనే పేరుతో దక్షిణాఫ్రికా దేశంలో ప్రచురించబడే ఒక పత్రిక, July To Oct-1986 సంచికలో ఒక సంచలనాత్మక ప్రకటన చేసింది.

“ఖురాన్ దివ్య వాక్యమని నిరూపించేలా 19 సంఖ్య ఆధారము చేసుకొని ఖురాన్ అంతటిలో వ్యాపించియున్న గణిత నమూనా కలదంటూ, ప్రశ్నార్థకమైన క్రొత్త సిద్ధాంతానికి తెరలేపిన శ్రీ రషాద్ ఖలీఫా, తన కపటాన్ని పాపభూయిష్టమైన ఉద్దేశ్యాన్ని, ఓ యథార్థ ముస్లిం ముసుగులో తెలివిగా కప్పిపుచ్చాడు. తన యీ 19 సంఖ్య కొత్త కథను నమ్మేలా ముస్లిం సముదాయాన్ని మోసగించి, ఇపుడు నెమ్మదిగా తన ముసుగు తొలగించి తన అసలు రంగు బయటపెడుతున్నాడు. తన కపటాన్ని బహిర్గతం చేసే తొలి నిదర్శనం “ముస్లిం పరస్పెక్టివ్” అనే తన మాసపత్రిక మార్చ్ 1985 సంచికలో ప్రచురమయ్యింది. ఈ సంచికలో “దైవ వాక్యాన్ని కలుషితం చేసిన రెండు తప్పుడు వచనాలను ఖురాన్ నందు కంప్యూటర్ గుర్తించింది. ఈ అబద్దపు ఆయత్తులను ఖురాన్ నుండి తొలగించే ముందు ఈ వాస్తవాన్ని నిర్ధారించే ఆధారాలను పరిశీలించమని ముస్లింలందరిని ఆహ్వానిస్తున్నాము' అంటూ ప్రకటన చేశాడు. ఆపై తన ఏప్రిల్ 1985 సంచికలో పెద్ద అక్షరాలలో ‘సుర 9 లోని చివరిరెండు ఆయత్తులు అబద్దమని నిర్ధారిస్తున్న మరిన్ని ఆధారాలు” అనే శీర్షికనుముస్లిం సమాజం ముందు నిర్భయముగా ప్రచురించాడు”.

(ది ముస్లిం డైజెస్ట్ (July, October - 1986) (జూలై, అక్టోబర్)

పరిష్కారం

ఈ సమస్యను పరిష్కరించేందుకు ముస్లింలు క్రింది రెండు ప్రత్యామ్నాయాలలో నుండి ఒక దానిని ఎంపిక చేసుకోవాలి.

ఎ) ఖురాన్ మానవ ప్రమేయము వలన కలుషితం చేయబడింది, లేదా

బి) ముస్లిమ్ డైజెస్ట్ ప్రకటించిన విధంగా రషాద్ ఖలీఫా యదార్థ ముస్లిమ్ ముసుగును ధరించిన మోసగాడు.

నమ్మకస్తులైన ముస్లింలందరు రెండవ ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ముస్లిమ్ పండితుల అభిప్రాయాల కంటే ఖురాన్ స్వీయ సాక్ష్యాన్నే వారి మనస్సాక్షి లక్ష్యపెడుతుంది. దీదాత్ కు మాత్రం అలా తోచలేదన్నది వేరే విషయం. అతగాడికి రషాద్ ఖలీఫా “ఇస్లాముకు ఉత్తమ దాసుని”లా అగుపించాడట “Alquran The Ultimate Miracle” అనే పుస్తకంలో ఇది పేర్కొనబడింది) అయితే రషాద్ ఖలీఫా మరియు దీదాత్ లాంటి వారితో చేతులు కలపని నమ్మకమైన ముస్లిములు కూడా వున్నారని నేను భావిస్తున్నాను. వారు ఖురాన్ ప్రామాణికతను శంఖించే ఇలాంటి పండితులతో తప్పక విభేదిస్తారని విశ్వసిస్తున్నాను.

మరి బైబిల్ కు మాత్రం వేరొక కొలమానమెందుకు?

నా పై మాటలతో ముస్లిం మిత్రులు ఏకీభవిస్తే, ఖురాన్ దేవుని వాక్యమా అని పరిశీలించటానికి వారు ఎన్నడునూ అంగీకరించని కొలబద్దను బైబిల్ కు అన్వయించటం న్యాయం కాదని కూడా వారు ఒప్పుకుంటారని నమ్ముతున్నాను. కాబట్టి క్రైస్తవ పండితుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా బైబిల్ దేవుని వాక్యమనే దాని స్వీయసాక్ష్యాన్ని నిలకడగా విశ్వసించడం క్రైస్తవులకు సమంజసమే.

ఖురాను పరలోకమునుండి ఊడిపడిందా?

దీదాత్ పేర్కొన్న గ్రహం ప్రోగీ వంటి క్రైస్తవులు, బైబిల్ ప్రత్యక్షపరచబడడానికి మానవ మస్తిష్కాలు సాధనాలుగా వాడబడ్డాయని ఒప్పుకున్నారు కాబట్టి, అదే బైబిల్ దేవుని వాక్యం కాదనడానికి ఆధారమన్నది దీదాత్ వాదన. మానవులు సాధనాలుగా ఉపకరించడం దైవప్రత్యక్షతకు గొప్ప అభ్యంతరమైతే, ఖురాను ప్రత్యక్షత సంగతేమిటి? అదేమైనా పరలోకము నుండి నేరుగా ఊడిపడిందా? అలాంటిదేమీ లేదని దీదాత్ తన మాటల్లో తానే ఎలా ఒప్పుకొంటున్నాడో గమనించండి:

“అంతిమ దైవప్రవక్త హజ్రత్ మహమ్మద్గారిపై అవతరించిన దైవవాక్యం “ఖురాను” అని, అది ఎలాంటి పొరపాట్లు లేని దైవవాక్యమని విశ్వసిస్తాము. అది దైవదూత “జిబ్రయీల్ (గాబ్రియేలు) ద్వారా ఆయన పై అవతరింపజేయబడింది” (అహ్మద్ దీదాత్, బైబిల్ దేవుని వాక్యమా? పేజి16).

చూసారు కదా! ఖురాన్ బయలుపడడానికి ఒక “దూత” మరియు ఒక మానవ మాత్రుడైన “ప్రవక్త” సాధనాలుగా వాడబడినప్పటికీ అది దైవ ప్రత్యక్షతయే అవుతుందట; ఐతే, బైబిల్ బయలుపరచబడడానికి మానవ మస్తిష్కాలు, కలములు ఏ మాత్రం ఉపకరించినా అది దైవవాక్యం కాకుండా పోతుందట!!!

ఇలా మొదలైన దీదాత్ రెండు నాలుకల ధోరణి, అతడి పుస్తకంలోని ప్రతీ భాగాన్ని అలంకరించిన ఒక ప్రత్యేక ఆభరణమని నా జవాబులు చదివిన ఎవరైనా ఒప్పుకోక తప్పదు.

2. దీదాత్

విటివాటర్ గ్రౌండ్ యూనివర్సిటీ (WITWATERSRAND UNIVERSITY) నుంచి ఇంకా పూర్తిగా పట్టభద్రుడు కాని ఓ క్రైస్తవ మిషనరీ విద్యార్థి, జోన్నెస్బెర్గ్ లోని మా న్యూటౌన్ మసీదుకు తరచూ మా సామూహిక ప్రార్థనల్ని (నమాజును) పరికించే సదుద్దేశంతో వస్తూ వుండేవాడు. నేనతనికి పరిచయమయ్యాను. అప్పటికే అతని ఉద్దేశాలు గ్రహించేశాను.

మసీదుకు ఆమడ దూరంలో వున్న మా తమ్ముడింటికి అతన్ని ఆహ్వానించాను. భోజన వేళలో బైబిలు ప్రమాణికతను గురించి మాట్లాడుతూ క్రైస్తవ ప్రఖ్యాత సిద్ధాంతీకరణలు అతనిలో ఎంతగా నాటుకుపోయి వున్నాయో గమనించాను. అందుకే “మీ మతతత్వ శాస్త్ర విభాగం ప్రధానోపాధ్యాయుడైన ప్రొఫెసర్ గీసర్ (GEYSER) బైబిలు గ్రంథాన్ని దైవవాక్యమని నమ్మటం లేదు” అన్నాను. అతను తలూపి “నాకు తెలుసు” అన్నాడు. అసలు పర్సనల్ గా ఆ ప్రొఫెసర్ భావాలు బైబిల్ని గురించి ఎలా వున్నాయో నాకు తెలీదు. అయినా క్రీస్తు దివ్యత్వం (క్రీస్తుదేవుడు, దేవుని కుమారుడన్న దృక్పథం) గురించిన ఓ తర్క వితర్కంలో ప్రొఫెసర్ గారు ప్రదర్శించిన భావాలు, దృక్పథాలు గమనించినందువల్లే, ఊహించి అలా అనగలిగాను.

ఈ దివ్యత్వం విషయంలో తార్కిక చర్చాగోష్ఠి కొన్నేళ్ళ క్రిందట ఆ ప్రొఫెసరకూ - ఆర్థడాక్సు చర్చీ విశ్వాసులకు మధ్య జరిగింది.

ఈ విషయాన్ని నేను ఇంకా సాగదీసాను. “నీ కాలేజీ లెక్చరరు ప్రబోధకుడు అయివుండి కూడా బైబిలు దైవవాక్యమని నమ్మటం లేదు” అన్నాను. దానికా విద్యార్థి “నాకు తెలుసు అని టక్కున జవాబిచ్చాడు. కాని వెంటనే నేను మాత్రం బైబిలు దైవ వాక్కనే నమ్ముతాను” అని తన నిర్ణయం చెప్పాడు. మరలాంటి రోగానికి మందేముంది? ఏసు (అ.స) కూడా అలాంటి రోగుల్ని గురించి వ్యధ చెందివున్నారు.

“చూచీ చూడరు, వినీ వినరు, అసలేమీ అర్థం చేసుకోరు” (మత్తయి 13:12)

దేవుని అంతిమ గ్రంథమైన పవిత్ర ఖురాను కూడా అలాంటి వారిని గురించి అలానే పలికింది.

“చెవిటివారు, మూగవారు, గ్రుడ్డివారు. వారు రుజుమార్గానికి మరలరు”
(ఖురాన్ 2:8).

జవాబు

క్రైస్తవుల హృదయంలో రోగముందని, అందుకే తమ బైబిల్ ప్రబోధకులు మరియు అధ్యాపకులు విశ్వసించకపోయినా వీరు మాత్రం తమ గురువులతో సహితం విభేదించేంతగా బైబిల్ దేవుని వాక్యమని విశ్వసిస్తున్నారని నిరూపించేందుకే ఈ పై సంఘటన దీదాత్ ఉదహరిస్తున్నాడు. అయితే బైబిల్ దేవుని వాక్యమా అనే మన ప్రస్తుత పరిశోధనకు, యిలాంటి ప్రస్తావనలు సందర్భోచితమైనవి కానేకావు. ఇది తేలికైన వ్యాఖ్యలా కనిపిస్తుంది కాబట్టి, దీని గంభీరత మా ముస్లిం మిత్రుల గమనాన్ని తప్పించుకునే అవకాశం ఎంతైనా లేకపోలేదు. అందుకే వారికి నచ్చచెప్పేలా ఈ క్రింది ఉదాహరణను ప్రస్తావిస్తాను.

దీదాత్ కు్ ఇస్లాం ప్రబోధించిన మతగురువు ఒక ఖాఫిర్

నేను ఇంతకు ముందే ప్రస్తావించిన ముస్లిమ్ డైజెస్ట్ సంచిక దీదాత్ కు ఇస్లాం బోధించిన గురువులలో ప్రముఖులెవరో బహిర్గతం చేసి అందరిని అబ్బురపరిచింది. ఆ పత్రికలో ఇలా చదువుతాము:

“బహాయి మతశాఖకు చెందిన జోసఫ్ పెర్ద్దు, అహ్మద్ దీదాత్ పై కలిగియున్న ప్రభావము ఎలాంటిదో మీకు తెలిపేందుకు డిసెంబర్ 6, 1957లో ప్రచురమైన “ది ఇండియన్ వ్యూస్” అనే పత్రికలో దీదాత్ నేరుగా ఇచ్చిన వివరణను ఇక్కడ ఉదహరిస్తున్నాము: “నేను ఇస్లాం గురించి గడిచిన 38 సంవత్సరాలలో పొందిన జ్ఞానము కంటే, జోసఫ్ పెర్డు గారి నుండే ఎక్కువ నేర్చుకున్నాను” అని దీదాత్ ఆ పత్రికలో పేర్కొన్నాడు.

ఇందులో ఆసక్తి గొలిపే విషయమేమిటంటే, ఈ జోసఫ్ పెర్డు అనే ఘనుడు, ఇస్లాం నేటి కొఱకు కాదు, అది ఆవిర్భవించినప్పటి నుండి వెయ్యి సంవత్సరాల వరకు మాత్రమే పరిమితమని నమ్మాడు. మొహమ్మదు అంతిమ ప్రవక్త అనే సిద్ధాంతాన్ని కూడా అతడు విస్మరించాడు. నేను ఇదివరకు పేర్కొన్న “ముస్లీమ్ డైజెస్ట్” సంచికలో 49-50 పుటలు చదివితే పూర్తి కథ మీకు అర్థమౌతుంది.

తనకో న్యాయం ఇతరులకో న్యాయమా?

దీదాత్ తన శ్రేష్ఠ గురువు విశ్వాసంతో ఏకీభవించి అన్ని విషయాలలో అతనివలె విశ్వసించాడా? అదే నిజమైతే, తాను ఇస్లాంకు ఇంత సేవ చేస్తుండేవాడు కాదు. దానిని గుర్తించి సౌదీ అరేబియా ప్రభుత్వము 'కింగ్ ఫైజల్' పురస్కారంతో అతనిని సత్కరించి ఉండేది కూడా కాదు. అయితే దీదాత్ తన గురువుకున్న అవాంతర అభిప్రాయాలను (ముస్లిం దృక్కోణం నుండి) బేఖాతరు చేసి తన విశ్వాసంలో దృఢత్వము కలిగియున్నంత మాత్రాన “చూచియు చూడడు” అనే యేసు మాటలు కానీ “ఋజు మార్గమునకు మరలరు”, అనే ఖురాన్ తీర్పు కానీ దీదాత్ అన్వయించడం సమంజసమేనా? అలా కాని పక్షాన అవి తమ గురువుల మాటలతో విభేదించే క్రైస్తవులపై ప్రయోగించడంలో వున్న ఆంతర్యమేంటో! తనకొక న్యాయము, ఇతరులకు వేరొక న్యాయమా? అన్నట్లు బైబిల్ ప్రామాణికతను పరిశోధించడానికి దీదాత్ ప్రయోగించిన ఇలాంటి కొలబద్దనే ఖురాన్ ప్రామాణికతను కొలవటానికి ఉపయోగించి, దాని ఆధారంగా ఖురాన్ దైవవాక్యం కాదని తేల్చేస్తే, ఒక యదార్థ ముస్లిం అందుకు సమ్మతిస్తాడా? ఆలోచించండి. దీదాత్ ఇక్కడ చేసిన పొరపాటేమిటో అప్పుడు మీకు అర్థమవుతుంది.

అసలు విషయానికొద్దాం

బైబిల్ ప్రామాణికతను కానీ ఖురాన్ ప్రామాణికతను కానీ పరిశోధించే ప్రక్రియలో, క్రైస్తవులేమంటున్నారు లేక ముస్లింలేమంటున్నారు అనే విషయాలు అప్రస్తుతం, అనవసరం. వారేమంటున్నా అది వ్యర్థమే. కాబట్టి వారి మాటలను అలా వుంచి ఈ అంశంపై వారి మతాల ప్రాథమిక మూలాలు వెల్లడించే వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే మనం ఆమోదాస్పదమైన ఏదైనా నిర్ణయానికి రాగలం. బైబిల్ దేవుని వాక్యమా? అనే ప్రశ్నకు బైబిల్ స్వీయసాక్ష్యమే చాలినది. అదేవిధంగా ఖురాన్ దేవుని వాక్యమా? అని నిర్ధారించేందుకు ఖురాన్ మరియు హదీసుల సాక్ష్యము చాలినది. ఈ ప్రాథమిక మూలాల వాంగ్మూలాలతో విభేదించే ఎంత భక్తిపూర్వకమైన సాక్ష్యమైనా, ఎంత పాండిత్యము కనబరచే ఆధారమైనా అది అంగీకరించదగినది కాదు. ఉదాహరణకు ఖురాన్ ప్రామాణికమని కానీ, అప్రమాణీకమని కానీ నిరూపించేందుకు, రషాద్ కలీఫా చూపించే ఋజువులు, జోసఫ్ పెర్డు అభిప్రాయాలు, ఆ మాటకొస్తే దీదాత్ వాదనలు సహితం పనికిరాని ఆధారాలే. ఆదిమ ఇస్లాం సాహిత్యాలు మాత్రమే ఈ పరిశోధనకు అవసరం. ఎలాంటి ఆధారాలను పరిగణలోనికి తీసుకోవాలో మచ్చుకొకటి ఈ క్రింద ఉదహరిస్తాను.

అబ్దుల్లా. బి.ఉమర్ ఇలా అన్నాడు:

“నేను ఖురాన్ పూర్తిగా కంఠత చేశానని ఎవ్వరునూ అనరాదు. అందున్న అధిక భాగములు నష్టమైపోయిన దృష్ట్యా, నేను అందలి శేషించిన భాగమును మాత్రమే కంఠత చేశానని అతడు అనవలెను.” (అల్ సుయుతి, అల్ ఇట్కాన్ఫీ ఉలమ్ అల్-ఖురాన్. పి. 524).

ఇలాంటి వాంగ్మూలాలే ఈ తరహా చర్చలలో గణనీయమైనవి. నేడు అందుబాటులో వున్న ఖురాన్ అల్లా మొహమ్మద్ కు బయలుపరిచిన సంపూర్ణ ప్రత్యక్షత కాదని, అందులో అధికభాగం నష్టమైపోయిందని ఈ వాంగ్మూలం అధికారపూర్వకంగా నిర్ధారిస్తుంది. ఇదేదో దీదాత్ వంటి మిడిమిడి జ్ఞానం కలిగిన వ్యక్తినోట నుండి వెలువడిన వాంగ్మూలం కాదు. ప్రామాణికమైన ఆదిమ ముస్లిమ్ సాహిత్యాలలో ప్రచురమైన ఆధారము. అదేవిధంగా బైబిల్ ప్రామాణికతను నిర్ధారించేందుకు, బైబిల్ వాంగ్మూలాన్నే ఆధారంగా చేసుకోవాలి. ఎందుకంటే ఖురాన్ కు హదీతులు అండగా వున్నట్లు బైబిల్ కు సాటియైనది మరేది లేదు- బైబిల్ తనకు తానే సాటి.

కాబట్టి బైబిల్ స్వీయ సాక్ష్యాన్ని ప్రక్కకు నెట్టి, ఏదో క్రైస్తవ పండితుడు చెప్పే మాటలను ఈ చర్చలోనికి లాగటం వలన బైబిల్కు ఒరిగే లాభం కానీ వాటిల్లే నష్టం కానీ ఏమీ లేదు. ఎందుకంటే నేను ముందు పేర్కొన్న విధంగా అవి ఈ పరిశోధనలో అప్రస్తుతం, అనవసరం, వాటిని బేఖాతరు చేసే క్రైస్తవులను 'గుడ్డివారు', 'చెవిటివారు’ వగైరాలు అంటూ ఆక్షేపించటం అవివేకం.

3. దీదాత్

“మరి ఈ పుటలు వ్రాయడం ఎలాంటి వారికంటే, మనస్పూర్తిగా వినమ్రతగా వుండే పవిత్ర వ్యక్తులకు, దైవ జ్యోతిని కాంక్షించి తద్వారా మార్గాన్ని అనుసరించే వారి కొరకు. ఇక ఇతరులంటారా!? వారి హృదయాల్లో రోగముంటుంది. ఈ సత్య సాక్ష్యాలు వారి రోగాన్ని ఇంకా పెంచుతాయి తప్ప వీటివల్ల వారికేలాభం ఉండదు.

(ఆ విద్యార్థి మమ్మల్ని చూసేందుకు మా మసీదు దగ్గరికొచ్చే వాడనుకున్నారా? కాదు... మాకు తన ప్రబోధనల్ని వినిపించి, మమ్మల్ని మతమార్పిడి చేసేందుకు మాత్రమే అతను మా దగ్గరికి వచ్చేవాడు!)”

జవాబు

దీదాత్ పక్షపాత ధోరణి ఇక్కడ మరోసారి బహిర్గతమైంది. తాను చేసే కసరత్తు దైవజ్యోతి కాంక్షించేవారికి మార్గదర్శకాలట! ఐతే, ఆ బైబిల్ విద్యార్థి చేసిన ప్రయత్నాలను మాత్రం “మతమార్పిడి” యత్నాలుగా పరిగణించాలట! నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం అన్నట్లుంది దీదాత్ వ్యవహారం. ఇక్కడ దీదాత్ మరచిపోయిన విషయమేమిటంటే మనస్ఫూర్తిగా దైవజ్యోతిని కాంక్షించే వినమ్ర పవిత్రులు, దారినపోయే ప్రతివాడు చెప్పే సొల్లు కబుర్లను గుడ్డిగా అంగీకరించరు. ప్రతి విషయాన్ని జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి వివేకముతో విచక్షిస్తారు. ఎక్కడ తన మాటలను కూడా అలాంటి పరిశీలనకు గురిచేసి, తన అబద్దాలు బహిర్గతం చేస్తారో అని, దీదాత్ తనతో విభేదించబోయేవారి హృదయంలో రోగముందని ముందుగానే తేల్చేస్తున్నాడు. ఇతడి మాటలను మరింత శ్రద్దతో పరిశీలించవలసిన అవసరముందని ఈ మాటలే స్పష్టం చేస్తున్నాయి. జాగ్రత్తగా పరిశీలించినపుడు, దీదాత్ బైబిల్ పై మోపిన నిందలు అన్నీ అబద్ధాలే అని, అవి ఖురాన్ కు మాత్రమే సరిగ్గా వర్తిస్తాయని నిర్ధారణ అవుతుంది.

ఈ పుస్తకాన్ని చదివే ముస్లిం చదువరి యదార్థవంతుడని, సత్యాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నాడని, సత్యంనుండి తప్పించుకుని పారిపోయే దుస్సాహసం చేయడని నా నమ్మకం. అలాగైతే మనం వివాదం తీర్చుకోవటం సులభమే. “మీరు సత్యమును తెలుసుకొందురు. అపుడు సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును” అన్న యేసు ప్రభువు మాటలు చదువరి జీవితములోనూ నిజమవ్వాలని వాంఛిస్తూ ఈ చర్చను కొనసాగిస్తున్నాను.

 

2వ అధ్యాయం

మూడు తరగతుల సాక్ష్యాలు - బైబిలకు మెప్పు ఖురానుకు ముప్పు

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో, ముస్లిముల
దృక్పథం” అనే రెండవ అధ్యాయానికి మా జవాబు.

4. దీదాత్

అపోహలకు గురైవున్న క్రైస్తవులు

తమ మతం కొత్తగా స్వీకరించే ఏ వ్యక్తికైనా పరిశుద్ధ బైబిలు గ్రంథమన్నది దైవవాక్యమని, అదే ధార్మిక భావాలన్నిటి పైనా తుది ప్రామాణిక అని చూచీ చూడగానే నమ్ముతుంటాడని, ఏ కాథలిక్కుగాని, ప్రొటెస్టంటుగాని, కలిస్టు గాని, వెయ్యిన్ని చిల్లర నామకరణాలున్న ఏ క్రైస్తవ ప్రబోధ సంస్థ వ్యక్తిగాని అంగీకరిస్తాడని మీరు నమ్మగలరా? ప్రబోధకుల వాదనలకు విశ్లేషణలకు విరుద్ధంగా వున్న బైబిలు వాక్యాలనే కొత్తగా మతమార్పిడి చేసుకున్న వ్యక్తి వారి ముందుంచుతాడు (అతని అనుమానాలు తీరాలిగా?)

జవాబు

బైబిల్ దేవుని వాక్యమని క్రైస్తవ ప్రబోధకులు చేసే వాదనలతో గానీ, విశ్లేషణతో గానీ, విభేదించే వచనాలేవీ బైబిల్లో లేవు. దీదాత్ లా బైబిల్ ను అపార్థం చేసుకున్న వారికి మాత్రమే ఆయా వాక్యభాగాలు ఆ విధంగా తోచాయి. అంత మాత్రాన క్రైస్తవ సత్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరు దీదాత్లాగే క్రైస్తవ ప్రబోధనలను తప్పు పట్టే పనిలోనే తమ విలువైన సమయాన్ని దుర్వినియోగపరుస్తున్నారని ఊహించుకోవడం హాస్యాస్పదమే. నిష్పక్షపాత వైఖరితో బైబిల్ ని పరిశీలించి అదిదైవ వాక్యమనే నిర్ధారణకు వచ్చే సత్యాన్వేషకులు కొందరైనా లేకపోలేదు. ఈ మా ప్రయాసంతా అలాంటి యథార్థ హృదయుల కొరకే గానీ,దీదాత్ లామొండి వైఖరిగల వారి కొరకు కాదు. “పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులయెదుట వేయకుడి” (మత్తయి 7:6) అనే మా ప్రభువు హెచ్చరికను మరవకుండా దీదాత్ లాంటి వితండవాదులు మాకు అనునిత్యం తోడ్పడుతూనే వున్నారు.

5. దీదాత్

మొండివైఖరి

ముస్లిం వ్యక్తి తన దృక్పథాన్ని, క్రైస్తవ పవిత్రగ్రంథం బైబిలు నుంచే నిరూపించే ప్రయత్నం చేసినప్పుడు, ఈ ఉద్యోగరీత్యా ప్రీస్టుగా, పార్సన్గా, మతగురువుగా వున్నవారు, ఆ వాదనను తిరస్కరించలేనప్పుడు, ఆ చిక్కునుంచి తప్పించుకోవటానికి “నీవు బైబిల్ని దేవుని వాక్యమని ఒప్పుకుంటావా? లేదా?' అని ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్న చాలా సాధారణమైందే కాని జవాబు మాత్రం “అవును” “కాదు” అనే చిన్న సమాధానంతో సరిపోదు కదా? చెప్పేముందు ప్రతి ఒక్కరు తమ స్థానాన్ని వివరించాలిగదా? కాని క్రైస్తవ సోదరులు ఆ అవకాశం ఇవ్వరు! అసలు వారికి ఆ ఓర్పు ఉండదు! “అవునా?” “కాదా?”అని నిలదీస్తారు. రెండువేల ఏండ్ల క్రిందట యూదులు ఏసయ్యను అలానే నిలదీశారు. అయినా నేడు వున్న ఇబ్బంది నాడు లేదనిపిస్తోంది.

ప్రతి విషయం “అయితే తెలుపు, లేకపోతే నలుపు” అని నీక్కచ్చిగా (అదీ వెంటనే) నిర్ణయించలేమని అందరికీ తెలుసు. ఈ రెండు రంగుల మధ్య ఎన్నో బూడిద రంగు ఛాయలుంటాయి. మీరు అవునంటే, ఇక అతనందించే సర్వం, అంటే బైబిల్లోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మనం మింగాల్సిందే. ఒకవేళ మీరు కాదంటే, ఇక అతను ప్రక్కకు సర్దుకుంటాడు. పైగా ప్రక్కనున్న తన తోటి మతస్తులతో “చూడండి! ఈయన బైబిల్ని నమ్మడు. మరి ఇతనికి మన పుస్తకంలోంచి ఏదైనా మాట్లాడే అధికారమేముంది?” అని నెట్టి పారేస్తాడు. ఈ విధంగా వాళ్లు జాగ్రత్తగా తప్పుకుంటారు. మరి ముస్లిం బోధకుడేం చేయగలడు? బైబిలు ప్రకారమే తన స్థానాన్ని తాను నిలదొక్కు కోవాల్సిందే కదా?”

జవాబు

ముస్లింలు బైబిల్ ను ఆధారం చేసుకొని చేసే వాదనల చిక్కు నుండి తప్పించుకోవటానికి క్రైస్తవ ప్రబోధకులు యిలా మొండి ప్రశ్నలు వేస్తారని దీదాత్ వేసిన ఈ అభియోగం ఒక అపనింద మాత్రమే అని నిరూపించేందుకు, దీదాత్ క్రైస్తవులతో చేసిన వాదప్రతివాదనలను సమీక్షించటం కంటే మించిన పరిశోధనేమి అక్కర్లేదు. దీదాత్తు, బెనోని న్యాయవాదియైన జాన్ గిల్క్రిస్ట్ట్ అనే క్రైస్తవ ప్రబోధకునికి మద్య చోటు చేసుకున్న ఒక వాద ప్రతివాదంలో జరిగిన సంఘటన, దీదాత్ మోపిన ఈ అభియోగం అబద్దమని నిరూపించేందుకు ఒక మచ్చుతునక. ఈ కార్యక్రమంలో, యేసు సిలువపై మరణించలేదని నిరూపించే ధ్యాసలో పడి దీదాత్ ఖురాన్ బోధ సహితం తారుమారయ్యే విధంగా తన ఖాదియాని అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటే, వాదన నెగ్గించుకోవటానికి బైబిల్ ని మాత్రమే కాదు ఖురాన్ని కూడా దీదాత్ తప్పుగా చిత్రీకరిస్తున్నాడని జాన్ గిల్క్రిస్ట్ ముస్లిం ప్రేక్షకుల ఎదుట దీదాత్ కుయుక్తిని బహిర్గతం చేసి అతన్ని తలదించుకునేలా చేశాడు. దీదాత్ ఎప్పటి లాగే యేసు సిలువ వేయబడ్డాడు కానీ సిలువపై మరణించటం మాత్రం జరగలేదనే ఖాదియాని వాదనను ప్రయోగించే ప్రయత్నం చేసి ఇలా దొరికిపోయాడు (ముస్లిమ్ డైజెస్ట్ జూలై-అక్టోబర్ 1986 సంచికలో పూర్తి కథను చదువగలరు).

ఈ సందర్భంలో క్రైస్తవ ప్రబోధకుడు చేసిందేమిటో గమనించారా? బైబిల్ దేవుని వాక్యమా కాదా అని నిలదీసే మొండి వాదనలకు అతడు పాల్పడినట్లుగా ఇక్కడ మనము చూడము గానీ వాదన గెలవటానికి తన స్వీయ మతాన్ని సహితం తప్పుగా చిత్రీకరించేంతగా దిగజారిన ఒక ప్రముఖ ముస్లిం బోధకునికి సరిగ్గా బుద్ది చెప్పినట్లుగా గమనిస్తాము.

అన్నట్లు క్రైస్తవులలో మొండివైఖరి కనబరిచే బోధకులు వున్నారో లేదో మాకు తెలియదు కానీ, ఒక వేళ వున్నా తన స్వీయ మతాన్ని సహితం తప్పుగా చిత్రీకరించటానికి మోసం చేసే దీదాత్ లాంటి ప్రసంగీకులకంటే, మొండి క్రైస్తవ ప్రబోధకులు తక్కువ ప్రమాదస్తులే. ఏమంటారు? మొండితనం విశ్వాస్యత వలన కూడా కలగవచ్చునేమో కానీ మోసం ఎప్పుడూ పాప భూయిష్టమైన నైజం నుండి మాత్రమే పుట్టుకొస్తుంది.

6. దీదాత్

సాక్ష్యమిచ్చేందుకు మూడు తరగతులుగా విభజన

ఎలాంటి ప్రత్యేక శిక్షణా లేకుండా, కొట్టవచ్చేటట్టు దృగ్గోచరమయ్యే సాక్ష్యాలు, బైబిలు గ్రంథంలో మూడు తరగతులుగా వున్నాయనే విషయంలో ముస్లిములైన మనం శంకించం. అవేమంటే:

1. బైబిలు గ్రంథంలో మీరు స్పష్టంగా “దేవుని వాక్యాలు” అన్నవి చూడగలరు.

2. అలానే 'దేవుని ప్రవక్త వాక్యాలన్నవి కూడా వేరుపరచగలరు.

3. ఇక మిగిలినదంతా చాలా పెద్ద భాగం. చూచి, విని చెప్పేవారి సాక్ష్యంగా,చరిత్రగా రికార్డు చేసిన విషయాలివి. అంటే 'చరిత్రకారుల' వాక్యాలుఅని కూడా గ్రహించగలరు.

ఈ సాక్ష్య ఉపమానాల కోసం బైబిలు గ్రంథంలో మీరు పెద్ద వేట సాగించాల్సిన పనిలేదు. క్రింద ఇవ్వబడ్డ వాక్యాలను వాటికి ఉదాహరణలుగా భావించవచ్చు.

మొదటి రకం

(అ) “వారి సహోదరుల నుండి నీవంటి ప్రవక్తను, వారికొరకు పుట్టించెదను.అతనినోట నా మాటలనుంచుదును. నేను అతని కాజ్ఞాపించునది యావత్తూఅతడు వారితో చెప్పును” (ద్వితీయోపదేశకాండం 18:18)

(ఆ) “నేను, నేనే యెహోవాను, నేను తప్ప మరొక రక్షకుడు లేడు” (యెషయా43:11)

(ఇ) “భూదిగంతముల నివాసులారా! నావైపు చూచి రక్షణ పొందుడి. దేవుడునునేనే. మరి ఏ దేవుడూ లేడు” (యెషయా 45:22).

చూడండి. సంబోధన ప్రథమ పురుషంలో, ఏకవచనంలో ఇవ్వబడింది. ఎలాంటి అనుమానం, ఇబ్బందీ లేకుండా ఇవి 'దేవుని వాక్యాలనీ” మనం గ్రహించగలం.

రెండవ రకం

(అ) "యేసు- ఏలీ, ఏలీ, లామా సబక్తానీ' అని బిగ్గరగా కేకవేసెను (మత్తయి 27:46)

(ఆ) “అందుకు యేసు ప్రధానమైనది ఏమనగా - ఓ ఇశ్రాయేలూ, వినుము,మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” అని సమాధానమిచ్చెను” (మార్కు 12:29).

(ఇ) యేసు-“నన్ను సత్పురుషుడని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడేగానిమరి ఎవరును సత్పురుషుడు కాదు."అనీ అతనితో చెప్పెను (మార్కు10:18).

“బిగ్గరగా కేకవేసెను”, యేసు సమాధానమిచ్చెను”, “యేసు చెప్పెను” అన్న మాటలు చూచి అవి దేవుని వాక్యాలు కావు, అవి దైవ ప్రవక్త ఏసు (అ.స) వాక్యాలని ఏ పసిపిల్లవాడైనా ఇట్టే గ్రహించగలడు.

మూడవ రకం

(అ) “ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా, ఆకులు తప్ప మరేమియు కనబడలేదు” (మార్కు 11:13).

దాదాపు బైబిలు గ్రంథంలో వున్నదంతాను ఈ మూడవ రకం వాక్యాలే. ఇవన్నీ మూడవ వ్యక్తి మాటలు. సర్వనామం (prono141) లో వుంటాయి. అవి దేవుని వాక్యాలు కావు, దేవుని ప్రవక్త ఏసు (అ.స) వాక్యాలూ కావు. అవి చరిత్రకారుని వాక్యాలు.”

జవాబు

ఈ మూడు రకాల సాక్ష్యాలను బైబిల్ నందు గుర్తించిన దీదాత్, మరో నాలుగవ రకాన్ని గుర్తించలేకపోవటం ఆశ్చర్యమే. ఈ నాల్గవ రకం ఏమిటో ఈ క్రింది ఉదాహరణలలో స్పష్టమౌతుంది.

నాల్గవ రకం

1)“అపవాది- నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను” (లూకా 4:3).

2) “అపవాది- యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా! నీవు అతనికిని అతని ఇంటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును. అని యెహోవాతో అనగా...” (యోబు 1:9-11).

ఏమంటారు! ఇవి సాతాను మాటలని ఒక పసిపిల్లవాడు సహితం ఇట్టే గ్రహించలేడా? అయితే ఒక పసిపిల్లవాడు గ్రహించినా, దీదాత్ వంటి పక్షపాత వైఖరి గల దైవ దూషకుడికి ఎన్నడూ గోచరం కాని వాస్తవం ఒకటుంది.

వివరణ:

బైబిల్ దేవుని వాక్యమని పిలువబడింది, దేవుడే ప్రతి మాటను ప్రత్యక్ష సంబోధన శైలిలో ప్రకటించినందుకో లేక దేవుడు ప్రతి సందర్భములోనూ తనకు ప్రథమ పురుష ఏక వచన సంబోధనను మాత్రమే ప్రయోగించి మాట్లాడినందుకో కాదని ముందు మనము గుర్తించాలి. మారుగా బైబిల్లోని ప్రతి మాటను దేవుడు తానే స్వయంగా తన ప్రవక్తల చేతను అపోస్తలుల చేతనూ వ్రాయించిన కారణాన్ని బట్టి ఆ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యమైంది (హెబ్రీ 1:1 ; 2:3-4 ). ఈ ప్రక్రియలో దేవుడు కేవలం వారి ఆలోచనా సామర్థ్యాన్ని పెంచాడని కాదు, వారి ఆలోచనలకు దిశానిర్దేశము చేశాడు. దేవుడు వారికి కేవలం సందేశాన్ని అందించలేదు కానీ వారు ఉపయోగించిన ప్రతీ పదము దైవావేశము చేతనే వారి మనసుల్లో కలిగాయి (2 తిమోతి 3:16-17 ;2 పేతురు 1:21 ).

“ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగ పలికిరి.

” మరో మాటలో చెప్పాలంటే, తన వాక్యమని ఆయన పిలిచే గ్రంథములో, ఏ ఏ మాటలు, ఏ ఏ అంశాలు ఉండాలో ఆయనే నిర్ణయించి, వ్రాసినవారు వాటినే రాసేలా వారిని పురిగొల్పాడు. ఈ కారణం చేతనే బైబిల్ లోని ప్రతీమాట, ప్రవక్త ప్రవచనమైనా, అపవాది అపహాసమైనా అది దేవుని ప్రేరణచేత వ్రాయబడిన మాట, దేవుని మాట. అది, దైవ చిత్తాన్ని ప్రత్యక్ష పరచేందుకు దోహదపడే ప్రతీ అంశాన్ని దేవుడే పొందుపరిచి, ప్రవక్తలు మరియు అపోస్తలుల మాధ్యమము ద్వారా అందించిన దైవిక సమాచార రవళి. కాబట్టి బైబిల్ లో ఎన్ని తరగతుల లేక రకాల సాక్ష్యాలు ఉన్నాయని వాదించినా, బైబిల్ దేవుని వాక్యము అనే సత్యానికి ఎలాంటి భంగము వాటిల్లదు.

అయినా దీదాత్ ఏ మాత్రము లొంగడు; అతనికున్న అసలు సమస్య యివన్నీ కాదు. అతని సమస్య బైబిల్ దేవుని వాక్యమైతే బైబిల్లోని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మింగాల్సొస్తుందన్నదే (ఇది 5వ పాయింట్లోఅతని మాటల్లోనే చూసాము). లేదంటే, ఖురాన్లో కూడా యిలాంటి తరగతులకు చెందిన సాక్ష్యాలే వున్నప్పటికీ, వాటిని కప్పిపుచ్చి, అలాంటివేవి ఖురాన్లో లేనట్లు నటించి, బైబిల్ ని విమర్శించటానికి మాత్రం వాటినొక సాధనంగా ప్రయోగించటంలో దీదాత్ మరియు ఈ దావ ప్రచారకుల ఆంతర్యమేమిటో! (వివరాలకు 7వ పాయింట్లో నా జవాబు చదవండి).

అన్నట్లు చదువరీ, ఒక వేళ దీదాత్ సూచించిన ఈ కారణము చేత బైబిల్ దేవుని వాక్యము కాదని నువ్వు భావించియుంటే, దేవుని యెదుట యధార్థతతో మరొకసారి ఆలోచించమనీ ప్రేమతో మనవి చేస్తున్నాను. నిష్పక్షపాతంగా ఆలోచిస్తే, దీదాత్ సమస్యగా ఎత్తి చూపించిన ఈ వివిధ తరగతుల సాక్ష్యాలు బైబిల్ దేవుని వాక్యము కాదని నిర్దారించేందుకు చాలినవి కావని, వాటిని అర్థము చేసుకునే మరో వివరణ కూడా వుందని గ్రహించటం కష్టతరమేమీ కాదు.

7. దీదాత్

“పైన చెప్పిన ఋజువు విధానాల ద్వారా ముస్లిం వ్యక్తి వీటిని సులభంగా వేరుపరచగలడు. ఎందుకంటే అవన్నీను అతని విశ్వాసంతో కూడా సంబంధం కల్గివున్నాయి. వివిధ మతస్థులకంటే ముస్లిం అదృష్టవంతుడు. అతని దగ్గర మూడు రకాల వేర్వేరు రికార్డులున్నాయి:

మొదటి రకం: 'దైవవాక్యం' అది పవిత్ర ఖురాను గ్రంథంలో వుంది.

రెండవ రకం: 'దేవుని ప్రవక్త వాక్యాలు” (ముహమ్మద్ - స. అ. సం గారివి) అవి “హదీసు’ గ్రంథాలు అనే పేరుతో ప్రత్యేకంగా ఉన్నాయి.

మూడవ రకం: ఇస్లామీయ చరిత్ర సంబంధమైన విషయాలు. ఇవి పలు గ్రంథాల్లో పొందుపరచబడి ఉన్నాయి. మహావిజ్ఞులు, ధర్మవేత్తలు వ్రాసిన చారిత్రాత్మక సత్యాలు వేరుపరచబడ్డాయి. వీటిలో ఎవరైనా కల్పితాలు, అసందర్భాలు కల్పించివుంటే వాటినన్నిటిని ఒక ముస్లిం అవలీలగా వేరుపరచగలడు.

ముస్లింలు ఈ విధంగా మూడు రకాల వాక్యాలను కడు జాగ్రత్తగా వేరువేరుగా ఏర్పరిచారు. పైగా అవన్నీను అధికారయుక్తంగా, దశలవారీగా వేరు చేసి పెట్టారు. ముస్లిం దృష్టిలో ఒకటి మరోదానికి సమానం కాదు. కాని పరిశుద్ధ బైబిలు మాత్రం నానా రంగులు కలిసిందిగా అన్నీ కలగాపులగమైన సాహిత్యమై కలవరం కలిగిస్తుంది. ఒకదాంట్లో నొకటిగా, నీఛమైన, హేయమైన విషయాలు కూడా మంచివాటితో కలిసిపోవడం జరిగింది. పాపం క్రైస్తవుడు అన్ని విషయాలను ఆధ్యాత్మికంగా ఒక్కటని, అధికారయుక్తంగా ఒక్కటేనని ఒప్పుకోవలసిన దురదృష్టం కలిగి వున్నాడు.”

జవాబు

పరిశుద్ద బైబిల్లో కలగాపులగంగా వివిధ రకాల సాహిత్యాలు కలవరం పుట్టించేలా కలసిపోయున్నాయన్న దీదాత్ వాదనకు, మునుపటి పాయింట్లో వివరణ అందించాం కదా. ఇక బైబిల్లో నీఛమైన, హేయమైన సంగతులున్నాయని దీదాత్ ఇక్కడ వేసిన అపనిందతో, సరైన స్థానంలో తగిన విధంగా ఈ పుస్తకంలోనే వ్యవహరించాను. అయితే దీదాత్ ఖురాన్ విషయమై పైన చెప్పుకున్న డంబములన్నీ అబద్దమని బహిర్గతం చేసే కొన్ని వాస్తవాలను యిపుడు మీ దృష్టికి తెస్తున్నాను, శ్రద్ధగా గమనించండి.

ఖురాన్ లో మూడు తరగతుల సాక్ష్యాలు

ఖురాన్లో దేవుని వాక్యాలుగా అగుపించే మొదటి రకం వాక్యాలు మాత్రమే వున్నాయన్న దీదాత్ చిత్రీకరణ పచ్చి అబద్దమని నిరూపించే నిదర్శనాలు, దాని ఉపరితలము పైనే కొట్టొచ్చినట్లుగా అందరికీ కనిపిస్తాయి. ఈ వాస్తవాన్ని నిర్ధారించేందుకు ఈ క్రింది ఉదాహరణలు చాలినవి.

మొదటి రకము

“నేను జిన్నాతులనూ, మానవులనూ నా ఆరాధన కొరకు తప్ప మరి దేని కొరకూ సృష్టించలేదు. నేను వారి నుండి ఎలాంటి ఉపాదిని కోరను వారు నాకు అన్నం పెట్టాలని నేను కోరను” (సుర 51:56).

ఇది దేవుడు మాట్లాడేలా అనిపించే కోవకు చెందిన వాక్యం. అయితే ఖురాన్లో ఈ రకానికి చెందిన మాటలు అరుదు.

రెండవ రకము

“ప్రవక్తా! మేము నీ ప్రభువు ఆజ్ఞ లేకుండా క్రిందికి దిగిరాము మా ముందు ఉన్న దానికీ, మా వెనుక ఉన్న దానికీ ఈ రెండింటి మధ్య ఉన్నదానికీ, ప్రతిదానికీ ప్రభువు ఆయనే, నీ ప్రభువు ఎన్నడూ మరచి పోయేవాడు కాడు. ఆకాశాలకూ, భూమికీ భూమ్యాకాశాల మధ్య ఉన్న సర్వానికీ ఆయన ప్రభువు కాబట్టి మీరు ఆయనకు దాస్యం చేయండి ఆయన దాస్యంలోనే స్థిరంగా వుండండి. మీకు తెలిసినంత వరకు, ఆయనతో సమమైన స్థాయి గలవాడెవడైనా వున్నాడా?” (సుర 19:64-65).

ఈ వచనాలలో మాట్లాడిన వ్యక్తి దేవుడు కాదు. ఇది దేవుని గురించి ఒక దూత లేదా ఒక ఆత్మ పలికిన మాటలు. అయితే దీదాత్ కొలమానము చొప్పున యిది రెండవ కోవకు అనగా దేవుడే నేరుగా మాట్లాడని కోవకు చెందిన వాక్యాలే. అల్లాహ్ కాదు యింకెవరో మాట్లాడుతున్నారు. దీదాత్ నియమాన్ని ఇక్కడ అన్వయిస్తే, ఖురాన్ దేవుని వాక్యం కాదని మరొక సాక్ష్యం అక్కర లేనంతగా యిక్కడే నిరూపితమవుతుంది.

ఖురాన్లోని మొట్టమొదటి సుర కూడా ఈ రకానికి చెందిన భాగమే.

సుర:1 “అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు ప్రతిఫల దీనానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తాము. సహాయం కొరకు నిన్నే అర్థిస్తాము. మాకు ఋజుమార్గం చూపించు - నీవు అనుగ్రహించినవారు, నీ ఆగ్రహానికి గురికానివారూ, మార్గ భ్రష్టులు కాని వారూ అనుసరించిన మార్గము.

” ఎలాంటి ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే పై వాక్యాలు దేవుని మాటలు కావని ఎవరైనా యిట్టే గుర్తించగలరు కదా! లేక అల్లాహ్ నే యింకెవరికో ప్రార్థిస్తున్నాడని యిక్కడ మనము భావించాలా!

మూడవరకము

“మర్యమ్ ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది. గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్లిపోయింది తరువాత ప్రసవ వేదన పడుతూ ఆమె ఒక ఖర్జూరపు చెట్టు క్రిందకు చేరింది” (సుర 19:22-23).

పై మాటలు, ఇవి చరిత్రకారుని మాటలు అని దీదాత్ బైబిల్లో గుర్తించిన మూడవ కోవకు చెందిన వాక్యము లాంటిదే. దీదాత్ బైబిల్లో కనుగొన్న మూడు రకాల సాక్ష్యాలు ఖురాన్లో కూడా మనము కనుగొన్న నేపథ్యంలో, ఖురాన్ దేవుని వాక్యము కాదని దీదాత్ కొలబద్ద ఆధారముగానే అధికారికంగా తేల్చేయవచ్చు. ఖురాన్ దేవుని మాటలుగా అగుపించే వాక్యాలతో ఎవరెవరో మాట్లాడిన మాటలు కలగలపి కలవరం కలిగించే కలగాపులగమైన సాహిత్యము కాదని ఎవరనగలరు?

నాల్గవ రకము

అయితే కథ యింతటితో ముగియలేదు. ఒక యధార్థ మనస్సాక్షికి వణుకు పుట్టించేలా ఖురాన్లో నాల్గవ కోవకు చెందిన ఒక సాక్ష్యము చొరబడిన సంఘటన కూడా లేకపోలేదు. సాతాను పురిగొల్పగా అవి అల్లాహ్ మాటలే అని మొహమ్మద్ వాటిని ఖురాన్లో భాగముగా వల్లించటం, ఆపై అవి తన మాటలు కావు, తన బద్దశత్రువు చేత ప్రేరేపించబడిన మాటలంటూ అల్లాహ్ వాటిని కొట్టిపారేయటం ఒకానొక సందర్భములో జరిగిందని ఇస్లాం చరిత్ర సాక్ష్యమిస్తోంది.

సుర 53:19 లో యిలా చదువుతాము: “ఇప్పుడు చెప్పండి. ఈ లాల్, ఈ ఉజ్జా, మూడోది ఒక దేవత అయిన మనాత్ ల వాస్తవికతను గురించి మీరు కాస్తయినా ఆలోచించారా? (ఆపై సాతాను మొహమ్మద్ నాలుక పై ఈ మాటలు వుంచాడు):

“వీరు అల్లాకు సమీపస్తులైన ఆరాధ్య స్త్రీలు నిశ్చయముగా వీరి మధ్యవర్తిత్వము కోరతగినది”.

ఈ దుర్ఘటన సంభవించిన పిదప యివి సాతాను మాటలని గాబ్రియేలు వాటిని కొట్టి వేశాడని మొహమ్మద్ ప్రకటించుకున్నాడు. అవును అవి సాతాను మాటలే. ఎందుకంటే అవి అరబ్ విగ్రహారాధికుల దేవతలకు ఆరాధ్య స్థానాన్ని కల్పించి వారి మధ్యవర్తిత్వాన్ని కోరమని ప్రేరేపిస్తున్నాయి. అవి సాతాను మాటలు కాకపోతే మరేమిటి? అవి కొట్టివేయబడ్డాయని, నేడు అవి ఖురాన్లో భాగము కావన్నది వాస్తవమే కావచ్చు కానీ ఎలాంటి పొరపాటు చేతను కలుషితము కాజాలని ఖురాన్, ఏకంగా సాతానే తల పెట్టిన కాలుష్యము నుండి శుద్ధి చేయబడవలసి వచ్చిందని నిరూపించడానికి యిది చాలిన నిదర్శనము కాదా? “దారి తప్పలేదు”, “తప్పుదారి పట్టలేదు” అని ఈ దుర్ఘటనకు గురియైన సుర ప్రారంభములోనే తన ప్రవక్తను గురించి అల్లాహ్ యిచ్చిన సాక్ష్యము అబద్దమని తేల్చి చెప్పటానికి ఈ సంఘటన సరిపోదా? ఒక ప్రవక్త సాతాను మాటలను దైవ వాక్యమని పొరబడడం, ఆ తరువాత దేవుడు మార్పులు, మరమ్మత్తులు చేసి సుర 16:103 మరియు 22:50-52 లాంటి వచనాలను బయలుపరచి జరిగిన దురదృష్టానికి సంజాయిషీలు సమర్ధింపులు యిచ్చుకోవడం, యివన్నీ వింతగా అనిపించటం లేదూ? యింత గొప్ప కీర్తి ఖురాన్ కు తప్ప మరే గ్రంథానికి లభించలేదు సుమా!ఖురాన్ దైవ గ్రంథమయ్యుంటే, అందులో యిలాంటి అనర్థం ఎపుడూ చోటు చేసుకోకుండా వుండవలసింది.

(ఈ పైన చెప్పినవన్నీ వాస్తవాలని ఇస్లాం సాహిత్యాల ఆధారంగా నిర్దారించేందుకు సురా 53:19-20 ని సహిబుఖారీ వాల్యూం 6, 385 మరియు వాల్యుం 2 నెంబర్ 175తో పాటు చదివి, వీటిని అల్-తబారి, సలామ, వాఖిది, అల్-జమక్షరీ, అల్-జలాలిన్ మున్నగువారి ఆదిమ ఖురాన్ తఫ్సీర్ల వెలుగులో పరిశీలించగలరు).

ఒక ముఖ్యమైన వ్యత్యాసము

బైబిల్లో వున్న నాల్గవ తరగతి సాక్ష్యానికి మరియు ఖురాన్లో వుండిన నాల్గవ తరగతి సాక్ష్యానికి మధ్య వున్న ఒక ముఖ్యమైన తారతమ్యాన్ని యిక్కడ ఎత్తి చూపించటం ఎంతైనా అవసరం. బైబిల్ లో సాతాను మాటలను వాని కుయుక్తి బహిర్గతం చేయటానికి దేవుడే వ్రాయిస్తే, ఖురాన్లో సాతాను మాటలు దైవ వాక్యపు ముసుగులో చొరబడి దానిని అపవిత్రం చేసినందున, అవి ఆపై తొలగించబడి ఖురాన్ శుద్ధి చేయబడవలసి వచ్చింది. అది అవతరించిన దినములలోనే, స్వయముగా అది బయలుపరచబడిన ప్రవక్త మాధ్యమము ద్వారానే సాతాను మాటలకు యింత సులభముగా గురి చేయబడిన ఖురానును యింకా నువ్వు విశ్వసించగలుగుతున్నావంటే, ప్రియ ముస్లిం స్నేహితుడా, నీ విషయమై నేను మిగుల విచారిస్తున్నాను.

అన్నట్లు ఈ మూడు తరగతుల సాక్ష్యాలు లేదా నాలుగు తరగతుల సాక్ష్యాలు, బైబిల్ దేవునివాక్యము కాదని నిరూపించటంలో విఫలమయ్యాయని, ఐతే యిదే ప్రమాణాలను ఖురాన్ కు అన్వయించినపుడు అది దేవునివాక్యము కాదని యిట్టే తేలిపోతుందని యిప్పుడు అందరూ స్పష్టంగా చూడగలరు. దీదాత్ వేసిన రాయి బైబిల్ ని కనీసం తాకకపోగా తిరిగి విసిరితే తన మతఛాందసవాదాన్నే చిన్నాభిన్నం చేయటానికి సరిపోయేదిగా వుంది. గాజు భవనాలలో నివసించేవాళ్లు యితరుల భవనాలపై రాళ్లు రువ్వటం మానితే వారికే మంచిదని మన పూర్వీకులు చెప్పేవారు, యిందుకే కాబోలు!

 

ఎన్నోరకాల బైబిలు గ్రంథాలు,
దహనమైపోయిన ఖురానుగ్రంథాలు

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో, “ఎన్నో రకాల
బైబిల్ గ్రంథాలు” అనే మూడవ అధ్యాయానికి మా జవాబు

8. దీదాత్

“క్రైస్తవుడు తన పరిశుద్ధ గ్రంథాన్ని గురించి ఏమని అనుకుంటాడో మనం సమీక్ష చేయడం సులభం.”

జవాబు

మీర తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును (మత్తయి 7:2).

9. దీదాత్

పొట్టు నుండి గింజను వేరుచేయడం

వివిధరకాల బైబిలు పాఠాంతరాలను గురించి, సూక్ష్మ పరీక్ష చేసుకునే ముందు, మనం దైవగ్రంథాలన్న వాటిపైని మన విశ్వాసాన్ని కొంచెం విశ్లేషించుకుందాం. ముస్లిములైన మనం 'తౌరాత్' (తోరా) ‘జబూర్' (కీర్తనలు), 'ఇంజిల్' (బైబిలు) 'ఖురాను” అన్న గ్రంథాలను విశ్వసిస్తామని అనడంలో అర్థమేమిటి?

అంతిమ దైవప్రవక్త హజ్రత్ ముహమ్మద్ ముస్తఫా (ఆయనపై దైవస్తోత్రశుభాశీస్సులు అందుగాక) గారిపై అవతరించిన దైవవాక్యం ‘ఖురాను' అనీ, అది ఎలాంటి పొరపాట్లు లేని దైవ వాక్యమని విశ్వసిస్తాము. అది దైవదూత ‘జిబ్రయిల్' (గాబ్రియేలు) ద్వారా ఆయన పై అవతరింపచేయబడిందనీ, గత పదిహేనువందల ఏళ్లుగా మానవహస్తాల తాకిడికి గురికాకుండా కలుషితం కాకుండా ఎలాంటి మార్పులూ చేర్పులు చెందకుండా నేటివరకూ పరిరక్షితమై వుందనీ మనం విశ్వసిస్తాము. ఇస్లాం మత వ్యతిరేకులు, విమర్శకులు సైతం మూలుగుతూనే ఖురాను పరిశుద్దతను గురించి రూఢీపరచివున్నారన్నది జగద్విఖ్యాత వాస్తవం!

“అత్యంత పరిశుద్ధ గ్రంథరూపంలో పండ్రెండు (నేటికి పదిహేను) శతాబ్దాలుగా ఈ ప్రపంచంలో ఏ పుస్తకం బహుశా వుండలేదు” (సర్ విల్లియం ముయిర్).”

జవాబు

తోర, జబూర్ మరియు యింజీల్ గురించి తర్వాత ముచ్చటించుకుందాం. ప్రస్తుతం దీదాత్ ఖురాన్ కు అర్పించిన నివాళి ఎంతవరకు సమర్ధనీయమో పరిశీలిద్దాం. దీదాత్ పైన పేర్కొన్న విధంగా, ఈ రోజున ఒక ముస్లిం చదివే ఖురాన్, 1500 సంవత్సరాల పూర్వం మొహమ్మద్ పై అవతరింపజేయబడి, “మానవ హస్తాల తాకిడికి గురి కాకుండా, కలుషితము కాకుండా, ఎలాంటి మార్పులు చేర్పులు చెందకుండా నేటి వరకు పరిరక్షితమయ్యున్నదన్నది నిజమా? అలా సర్ విలియమ్ ముయిర్ గారు సాక్ష్యమిచ్చినంత మాత్రాన సరిపోతుందా? ఈ రోజున ఒక ముస్లిమ్ చదివే ఖురాన్ అలనాడు మొహమ్మద్ గారిపై అవతరింపజేయబడిన ఖురాన్ కాదనటానికి ఎదురొడ్డలేని సాక్ష్యాధారాలు సమృద్ధిగా వున్నాయి.

మొహమ్మద్ పై ఎన్ని ఖురాన్లు అవతరింపబడ్డాయో మీకు తెలుసా?

ఉస్మాన్ తాను ఖలీఫాగా బాధ్యతలు చేపట్టిన దినాలలో పలువురి చేత సంగ్రహించబడిన వివిధ రకాల ఖురాన్ గ్రంథాలు అమలులో వుండడం చూసి మిగుల కలవరపడ్డాడట. విశేషమేమిటంటే, ఈ వివిధ ఖురాన్ గ్రంధాలలో ఏవి కూడా ఖాఫిర్ల చేత (ముస్లిమేతరుల చేత) క్రోడీకరించబడినవి కావు కానీ మొహమ్మద్తో సన్నిహిత సహవాసము కలిగి యుండిన ప్రముఖ ముస్లిమ్ విశ్వాసుల చేత సంగ్రహించబడినవే. ఈ ప్రముఖులలో పేర్కొనదగినవారు, ఉ భయ్ యిబ్ కాబ్, (మృతినొందినది క్రీ.శ. 638లో), అబ్దుల్లా యిబ్న్ మసూద్(మృతినొందినది క్రీ.శ. 662లో) మరియు మిక్టస్ యిబ్న్ అమర్ (మృతినొందినది. క్రీ.శ. 635లో). వింతేమిటంటే వీరంతా ఖురాన్ వల్లించటం నేరుగా మొహమ్మద్ నుండి నేర్చుకున్నప్పటికీ, వీరు క్రోడీకరించిన ఖురాన్లు మాత్రం ఒకటి మరొకదానితో వైవిధ్యము కలదిగా వుండింది. ఈ వివిధ రకాల ఖురాన్లన్నీ వెుహమ్మద్ నుండే వచ్చినవి ఎలా అవుతాయి? ఆయన పై అవతరింపజేయబడింది ఒకే ఖురాన్ కాదా? ఇదే ఉస్మాన్ ఎదుర్కొన్న అసలు సమస్య.

అయితే ఈ సమస్య ఎంత వింతైనదో, ఉస్మాన్ దానికి కనుగొన్న పరిష్కారం కూడా అంతే విడ్డూరమైనది. మరో ఖురాన్ ప్రతిని క్రోడీకరించి తన ఈ వినూత్న ప్రతి తప్ప మిగతా ఖురాన్లన్నిటిని దహించి వేయమని ఉస్మాన్ ఆదేశాలు జారీ చేశాడు. ఈ ఆదేశాలు నాటి ముస్లిమ్ సముదాయమంతటను అమలు చేయబడ్డాయి. ఉస్మాన్ తయారు చేయించిన ఖురాన్ తప్ప అన్ని ఖురాన్లు దహించి వేయబడ్డాయి.

యాస వైవిధ్యాలే తప్ప మరేం కాదంటూ మోసపూరిత విశ్లేషణలు:

అగ్నికి ఆహుతి చేయబడిన ఈ ఖురాన్ల మధ్య వుండిన వైవిధ్యాలన్నీ కేవలం యాసాపరమైనవేనని, అవి పట్టించుకోదగిన మార్పులేమి కావని నేటి దావా ప్రచారకులు సంజాయిషీ యిచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ మాత్రం పాపానికి వాటిని మాడ్చి మసి చేసేంత శిక్ష ఎందుకు విధించవలసి వచ్చిందో వివరణ ఏమీ యివ్వరు. ఖురాన్ ఏడు యాసలలో అనుమతించబడిందని మొహమ్మదే స్వయంగా ప్రకటించాడు (బుకారి సాహిహ్ వాల్యుమ్ 6: 514). అంటే ఈ యాస వైవిధ్యాలు అల్లాయే అనుమతించాడన్న మాట. మరి ఉస్మాన్ అల్లా అనుమతించినదానినే తగలపెట్ట పూనుకున్నాడని వీరు ఆరోపిస్తున్నారా? ఖురానుల దహన హోమానికి కారణం యాస వైవిధ్యాలే అన్న వాదన ఎంత ఆధారరహితమైందో యిపుడు స్పష్టమయ్యింది కదా! యికపై యిలాంటి అబద్దాలతో దావా ప్రచారకులు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగ్రత్త వహించండి.

ఖురానుల దహనానికి అసలు కారణం

హదీసుల ప్రకారం ఖురానుల దహనం ఒక జఠిలమైన సమస్యను పరిష్కరించడానికి తలపెట్టిన మరొక సమస్య. ఉభయ్ యిబ్ కాబ్ క్రోడీకరించిన ఖురాన్ ను వల్లించే సిరియా దేశస్థులు, ఇరాక్ దేశస్థులు ఎప్పుడు వినని కొన్ని ఆయత్తులువల్లిస్తున్నందున ఇరాకీయులు వారిని అవిశ్వాసులని నిందించసాగారు; అదేవిధంగా, ఇబ్న్ మసూద్ క్రోడీకరించిన ఖురాన్ ను వల్లించే ఇరాక్ దేశస్థులు, సిరియా దేశస్థులు ఎప్పుడూ వినని కొన్ని ఆయత్తులు వల్లించేవారు. (బుకారి సాహిహ్ వాల్యుమ్ 6, సం. 510, మిష్కత్ అల్-మసబి. ఆంగ్ల అనువాదం జేమ్స్ రాబ్సన్ ఆప్రఫ్ లాహోర్ 1963). ఈ సమస్యను పరిష్కరించేందుకు, యావత్ ముస్లిమ్ సముదాయానికి ఒకే ఒక ఖురానును ప్రమాణీకరించడం మినహా ఉస్మానుకు మరే మార్గము కనబడలేదు (సాహి అల్-బుకారి, వాల్యూం 6, పేజీ 479 మేము ప్రస్తావంచిన పై వాస్తవాలకు ఆధారం).

ఉస్మాన్ దహనకాండలో భస్మమైన మొహమ్మద్ వారి ఖురాన్

ముస్లిమ్ సముదాయమంతటికి ఒకే ఖురాన్ను ప్రమాణీకరించే ప్రక్రియలో, తాను సంగ్రహించిన ఖురాన్ ప్రతితో విభేదించే యితర ఖురాన్ ప్రతులన్నిటిని ఉస్మాన్ దహించివేశాడు. తన ఖురాన్ ప్రతిని క్రోడీకరించడానికి మొహమ్మద్ భార్యయైన హఫ్సావద్ద నుండిన ఒక ప్రతిని ఉస్మాన్ మూలముగా తీసుకున్నప్పటికీ, నాశనము నుండి హఫ్సా ప్రతికి కూడా మినహాయింపు లభించకపోవడం విశేషం. అబుబాకర్ క్రోడీకరించిన ఆ ప్రతిలో ఉస్మాన్ చేసిన మార్పులు చేర్పులు ఎక్కడ బహిర్గతమవుతాయోనని హఫ్సా మృతిచెందిన పిమ్మట మర్వన్ ఇబ్న్ అల్ హకమ్ ఆమెవద్దనుండిన ఆ ప్రతిని దహించి వేశాడు (ఇబ్న్ దావూద్ వ్రాసిన కితాబ్ అల్ మహిఫ్ పేజీ24 చూడండి).

ఐతే, దీనికి మించిన మరో గొప్ప సమస్యపై దృష్టి మరల్చుదాం. ఉస్మాన్ క్రోడీకరించిన ఖురాన్, మరియు ఇబ్న్ మసుద్ సంగ్రహించిన ఖురాన్ మధ్య కూడా వైవిధ్యాలు వున్నందున ఇబ్న్ మసుద్ ఖురాన్ దహించి వేయబడింది. కాని ఇబ్న్ మసుద్ ఖురానే మొహమ్మద్ పై “అవతరింపజేయబడిన” అసలు ఖురాన్ అని చెప్పటానికి బలమైన సాక్ష్యాధారాలు వున్నాయి. ఖురాన్ అధికారికంగా వల్లించువారిలో ఇబ్న్ మసుద్దే ప్రథమ స్థానమంటున్న మొహమ్మద్ స్వీయ సాక్ష్యము సహీహదీసుల్లో నమోదు చేయబడియుంది.

“మస్రుక్ తెలిపిన ప్రకారం, వారు అబ్దుల్లా బి. అమర్ సమక్షమున ఇబ్న్ మసుద్ ప్రస్తావన తేగా, ఖురాన్ వల్లించుట నలుగురి నుండి నేర్చుకోదగును. ఇబ్న్ మసుద్, అబు హుదాయిఫా సహచరుడైన సలీమ్, ఉభయ్ బి.కాబ్ మరియు మువద్ బి. జబుల్, అనీ అల్లాహ్ ప్రవక్త చెప్పగా నేను వినిననాటి నుండి ఇతని పై (ఇబ్న్ మసుద్) ప్రేమాభిమానాలు నిత్యము నా మనస్సులో తాజాగా మిగిలిపోయాయి! అని స్పందించాడు” (సహి ముస్లిమ్ () 4, పేజీ 1813).

గమనించండి, ఉస్మాన్, జయిద్, మర్వన్, తదితరుల పేర్లు ఆ జాబితాలో లేవుకానీ, ఇబ్న్ మసుద్ ఖురాన్ పై ఆధారపడదగిన అధికారిక ప్రమాణమని అక్కడ మొహమ్మదే స్వయంగా సర్టిఫికెట్ యిస్తున్నాడు. కాబట్టి ఒకవేళ ఇబ్న్ మసుద్ ఖురాన్ ఉస్మాన్ ఖురాన్ నుండి వ్యత్యాసముగా వుంటే, ఉస్మాన్ ఖురానని దహించి వేసి, ఇబ్న్ మసుద్ ఖురానును భద్రపరచియుండాల్సింది. అయితే అందుకు వ్యతిరేకంగా, ఇబ్న్ మసుద్ ఖురానీకు కూడా ఇతర ఖురానులతో కలిపి చరమగీతం పాడేశాడు ఉస్మాన్. అంటే మొహమ్మద్ పై అవతరించబడిన ఖురాన్ తో ఏకీభవించే ఖురాన్ ప్రతులన్ని ఉస్మాన్ ఖురాన్ ప్రతి నుండి వేరుగా వున్నాయని, అవన్ని తిరిగి పొందలేని విధంగా పంచభూతాల పాలైపోయాయని స్పష్టంగా ఋజువొవుతుంది. “ఖురాన్ గ్రంధ చరిత్రను కనీసం ఈ దశ వరకు సమీక్షించినా, ప్రస్తుతం అమలులో వున్న ఖురానును ప్రామాణికమైనదని నిర్ణయించినది ఒక మానవమాత్రుడే కానీ దేవుడు కాదని, అది మానవ విచక్షణ చేతనే తప్ప దైవ ప్రత్యక్షత వలన చేసిన నిర్ణయము కాదని స్పష్టమవుతుంది”. (జాన్ గిల్క్రిప్ట్, బైబిల్ మరియు ఖురాన్ గ్రంధ చరిత్ర). గత 1500 వందల సంవత్సరాల నుండి కలుషితం కాకుండా పరిరక్షించబడిందని దీదాత్ పలికిన అతిశయోక్తులు ఈ ఉస్మానియా ఖురాన్ కు వర్తిస్తాయేమో (అదికూడ పరిశీలించి నిర్ధారించాల్సి వుంది), కానీ అల్లాహ్ మొహమ్మద్ కు బయలుపరచిన అసలు ఖురానుకైతే ఎంత మాత్రమూ వర్తించవు. అసలదీ ఉనికిలో వుంటే కదా, పోనీ కనీసం తిరిగి పొందగలిగితే కదా, ఇలా గొప్పలు చెప్పుకొని మురియటానికి!

10. దీదాత్

“తౌరాత్” అన్నది అరబ్బీ పదం. “తోరా” అన్నదీ హిబ్రూపదం. అయినా ముస్లింలు విశ్వసించే తౌరాత్, నేటి యూదులూ క్రైస్తవులు విశ్వసించే “తోరా” ఒక్కటి కాదు.

పవిత్ర ప్రవక్త మోషే (దైవశాంతి ఆయనపై యుండు గాక) తన అనుచరులకు ప్రబోధించింది ప్రేరితమైన దైవ వాక్యం. అయినా మోషే ప్రవక్త దాని గ్రంథకర్త కాడు. యూదులు, క్రైస్తవులూ ఏ పుస్తకాలైతే ఆయనవని ఆరోపిస్తున్నారో వాటికి ఆయన గ్రంథకర్త కాడు. (ఈ పుస్తకం చివరన అది ఋజువు చేయబడి వుంది)

అలానే “జబూర్' (Psalms ‘కీర్తనలు') హజ్రత్ దావూద్ (David) ప్రవక్త పైన (దైవశాంతి ఆయనపై యుండుగాక) అవతరించిన దైవ గ్రంథమని ముస్లింలువిశ్వసిస్తారు, కాని ప్రస్తుతం 'కీర్తనలు” (Psalms) అన్నవి ఆయన పేరిట చెప్పబడ్డాయి కాని అవి దైవ ప్రేరితాలు కావు. క్రైస్తవులు కూడా 'కీర్తనలు' అన్న గ్రంథం ఆయన పై జరిగిన దైవ ప్రేరణదేనని చెప్పలేకపోతున్నారు. పుస్తకాంతంలో ఈ వివరణ కూడా ఇవ్వబడింది. క్రైస్తవ మేధావివర్గం దాన్ని గురించి -రచయిత ముఖ్యంగా దావీదే కాని దీనికి ఇతర రచయితలు కూడా వున్నారని అంటున్నారు.

ఇక ‘ఇంజీలు' (బైబిలు) మాటేమిటి?

‘ఇంజీలు' అంటే శుభవార్త, సువార్త (Gospel). తన చిన్న ప్రబోధనా జీవితంలో ఏసుపై (దైవశాంతి ఆయనపై యుండుగాక) అవతరించిన దైవవాక్కుసువార్తీకులు ఏసు (అ.స) సువార్తను ప్రకటిస్తూ పోయాడని అక్కడక్కడా తెలిపివున్నారు:

1. “యేసు వారి సమాజ మందిరములో బోధించుచూ, రాజ్య సువార్త ప్రకటించుచూ, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచూ, సమస్త పట్టణముల యందును, గ్రామముల యందును సంచారము చేసెను” (మత్తయి 9:35).

2. “తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించు కొనును” (మార్కు 8:35).

3. ప్రజలకు బోధించుచూ సువార్తను ప్రకటించుచున్నప్పుడు” (లూకా 20:1).

కాబట్టి "సువార్త' అన్నది పలుమార్లు వాడబడిన పదం. మరి ఏ సువార్తను ఏసు (అ.స) ప్రకటిస్తూ, ప్రబోధిస్తూ వచ్చింది? మన దగ్గరున్న నూతన నిబంధనల్లోని 27 పుస్తకాలలో ఓ అతి చిన్న భాగాన్నే ఏసు వాక్యాలుగా మనం అంగీకరించ గలం. సెయింటు మత్తయి ప్రకారం (According to St.Mathew), సెయింటు మార్కు ప్రకారం (According to St.Mark) సెయింటు లూకా ప్రకారం (According to St.Luke), సెయింటు యోహాను ప్రకారం (According to St.John) అని క్రైస్తవ పండితులు సువార్తల గురించి అన్వయించి చెప్పారు గాని ఏసు ప్రకారం (According to Jesus) అన్నది ఎక్కడా లేదు. ఏసు (అల్లాహ్ శాంతి శుభాశీస్సులు ఆయనపై యుండుగాక) ప్రబోధన చేసిందంతాను దైవం నుంచి వచ్చిన వాక్కులేనని ముస్లింలైన మనము మనస్పూర్తిగా విశ్వసిస్తాము. అదే, ‘ఇంజీల్', 'శుభవార్త. దైవం నుంచి ఇశ్రాయేలీయులకు, వారి సంతానానికి అవతరించిన మార్గదర్శకం. తన జీవిత కాలంలో ఏసు (అ.స) ఒక్క పదంరాయలేదు. మరి నేడు సువార్తలనీ ఏవైతే చెలామణిలో ఉన్నాయో అవన్ని అనామధేయమైన హస్తకృతులేగా?

జవాబు

“ముస్లింలు విశ్వసిస్తారు”, “ముస్లింలమైన మనము విశ్వసిస్తాము” అంటూ, ముస్లిం ప్రపంచమంతటికీ తానే ప్రతినిధి అన్న ధోరణిలో దీదాత్ మాట్లాడినవన్నీ వాస్తవానికి ఇస్లాంను తప్పుగా చిత్రీకరిస్తున్నాయని అధిక శాతం ముస్లింలు పసిగట్టి యుండకపోవచ్చు. ముస్లింలు విశ్వసించే తారాత్” మరియు యూదులు క్రైస్తవులు విశ్వసించే తోర ఒకటి కాదంటూ, తనకు అల్లాహ్ మరియు మొహమ్మద్ వారి కంటే కూడా ఎక్కువ జ్ఞానముందన్నట్లు విఱ్ఱవీగుతున్నాడు దీదాత్. నేడు అమలులో వున్న తోర, మొహమ్మద్ దినాలలో అందుబాటులో వున్న తోర వేరు అనటానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఈ తోరాను సంబోధిస్తూ “అల్లాహ్ ఆజ్ఞ వ్రాయబడియున్న తౌరాతు గ్రంథం వారి వద్ద ఉన్నప్పటికీ దాని పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తూనే వారు నిన్ను ఎలా న్యాయ నిర్ణేతగా చేసుకుంటారు” (సుర 5:43), అని అల్లాహ్ మొహమ్మదును ప్రశ్నిస్తున్నాడు. మొహమ్మద్ కాలంలో యూదులు కలిగియుండిన తోరా లోపరహితమైనదని, దానిని బయలుపరచింది తానే అని అల్లాహ్ స్వయంగా సాక్ష్యమిస్తుంటే, నేడు మోషేకు అపాదించబడే పుస్తకాలు దైవ ప్రేరేపితమైనవి కావంటాడు దీదాత్. అలనాడు మొహమ్మద్ సమక్షంలో చదవబడిన తోర మరియు నేడు అమలులో వున్న తోర వ్యత్యాసం గలవని అనడానికి ఎలాంటి ఋజువులు దీదాత్ చూపించలేదన్నది గమనార్హం. అయితే, 'అల్లాహ్ తన ఆజ ఆ తోరాలో ఉందంటున్నాడు కానీ ఆ తోరా పూర్తిగా ఆయన యిచ్చిన ప్రత్యక్షత అనలేదు కదా' అంటూ దావా మేధావులు అతిజ్ఞాన ప్రదర్శనలు చేసే ప్రమాదం లేకపోలేదు. కానీ, ఆ వాదన నిరూపించాలంటే క్రైస్తవులను మాత్రమే కాదు తమ ప్రవక్తను సహితం వారు పోరాడి జయించవలసి వుంటుంది. వారి ప్రవక్త తోరాను గురించి ఏమి విశ్వసించాడో తెలుసుకోవడానికి ఈ క్రింది సంఘటన సరిపోతుంది. అబ్దుల్లా ఇబ్న్ ఉమర్ తెలిపిన ప్రకారం:

“యూదులలో కొందరు, అల్లాహ్ సందేశహరునిని ఖుఫ్ కు రమ్మని ఆహ్వానించారు. ఆయన ఒకానొక అధ్యయన శాలలో వారితో భేటీ అయ్యాడు. మాలో ఒకడైన అబ్దుల్ కాసిం అనే వ్యక్తి ఒక స్త్రీతో జరత్వానికి పాల్పడ్డాడు. వారికి తీర్పు తీర్చమని వారు ఆయనను కోరారు. కూర్చుండుమని వారు ఒకదిండు ఆయనకు యివ్వగా, ఆయన దానిపై కూర్చుండి, తోరాను తీసుకొని రావలసిందిగా వారిని ఆజ్ఞాపించాడు. వారు ఆయన యొద్దకు తోరాను తీసుకొని వచ్చినప్పుడు, తాను కూర్చుండిన దిండును తీసి, తోరాను దాని పై వుంచి, నేను నిన్నును, నిన్ను అవతరింపజేసిన వానిని విశ్వసిస్తున్నాను”

అని స్పందించాడు” (అబుదావుద్ బుక్ 38, నంబర్ 4434) .

ఇక్కడ గమనించదగిన వాస్తవ మేమిటంటే, మొహమ్మద్ కాలము వరకు అనగా 6వ శతాబ్ది వరకు తోరా పరిపూర్ణమైన దైవప్రత్యక్షగ్రంథముగా పరిరక్షితమయ్యింది. ఆ తర్వాత తోరాలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగియుండవచ్చనటానికి చారిత్రకమైన ఆధారాలు కానీ దస్తావేజు రూపకమైన సాక్ష్యాలు కానీ (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) ఏమీ లేవు. (జబూర్ దేవుని వాక్యములో భాగముగా ఎందుకు ఎంచాలో గ్రహించటానికి 70వ పాయింట్లో మా జవాబు చూడండి).

ఇంజీలు గురించి కూడా ఖురాన్ తోరాకు ఇచ్చిన సాక్ష్యము వంటి వాంగ్మూలాన్నే యిస్తుంది. “మేము ఇంజీలు గ్రంథ ప్రజలను ఆ గ్రంథంలో అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చెయ్యాలని ఆజ్ఞాపించాము (సుర 5:47), ఇంజీల్ ఒకవేళ మొహమ్మద్ కాలంలో లోపరహితముగా పరిరక్షితమై యుండకపోతే, అల్లాహ్ దానిలో బయలుపరచిన తీర్పును గ్రంథ ప్రజలు ఎలా అమలు చెయ్యగలరు? మరొకసారి నొక్కి చెప్పవలసిన విషయమేమిటంటే, మొహమ్మద్ కాలంలో, అనగా 6వ శతాబ్దములో ఇంజీల్ అని పిలువబడిన గ్రంథమే చారిత్రకంగా క్రైస్తవులు ఎపుడూ కలిగియుండిన క్రొత్త నిబంధన. అనగా, ఆదిమ సంఘ పితరుల దీనాలు మొదలుకొని 4వ శతాబ్దంలో జెరోమ్ సమయం వరకు వున్న ప్రతులను సమీక్షించి, నేడు అమలులో వున్న ప్రతులతో వాటిని పోల్చితే ఎలాంటి మార్పులు చేర్పులు మనకు కనబడవు. ఇది ఎవరైనా తరచి చూడదగిన వాస్తవమే. కనుక 6వ శతాబ్దంలో అల్లాహ్ ప్రత్యక్షతగా ఖురాన్ గుర్తించిన అదే ఇంజీల్ నేడు అందుబాటులో వున్న నూతన నిబంధన కాదని ఎవ్వరూ నిరూపించలేరు. ఆరోపణే నిరూపణ అనుకుంటే యిక అంత కంటే విడ్డూరమేముంటుంది?

అన్నట్లు ఖురాన్ సాక్ష్యాన్ని సహితం ప్రక్కకు నెట్టి, అది నా ప్రత్యక్షత అని అల్లాహ్ ఇంజీలను గురించి, స్వయంగా సాక్ష్యమిస్తున్నప్పటికి, నేడు అమలులో వున్న ఇంజీల్ అనామధేయ రచన అని అబద్దమాడిన దీదాత్ ను ఆమోదించాలో తిరస్కరించాలో తేల్చుకోవాల్సింది ముస్లిం మిత్రులే.

యేసు చెప్పినందుకే వ్రాసారు

యేసు స్వయంగా ఏమీ రాయలేదని, ఎవరినీ వ్రాయమని ఆదేశించనూ లేదని దీదాత్ చేసిన ఆరోపణ కూడా ఆధారరహితమైనదే. యేసు శిష్యులు పరిశు ద్ధాత్మను పొందిన పిమ్మట ఆయనకు సాక్షులౌతారని ప్రభువునుండి వాగ్దానం పొందారు (యోహాను15:25-27 ). వారు పరిశుద్ధాత్మ పూర్ణులై, మౌఖికంగా మాత్రమే కాక, రానున్న అన్ని తరాలకు సాక్షీకరించగలిగేలా, లిఖితపూర్వకంగా కూడా ప్రభువుకు సాక్ష్యము వహించేందుకు పురికొల్పబడ్డారు (2 పేతురు 1:15 ,1 యోహాను 1:1-4 ). వారు వ్రాసిన ప్రతీమాట వెనుక, ప్రభువు వారికి చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును చూడగలము.

ఖురానును గ్రంథస్థం చేయమని మొహమ్మద్ ఆదేశించాడా?

(దీదాత్ బైబిల్ పై ప్రయోగించిన నియమాన్ని ఇప్పుడు ఖురానుపై ప్రయోగించి చూద్దాం. సహీ అల్ బుఖారీ వాల్యూం 6 బుక్ 61,) మరియు సహీ ఆల్ బుఖారీ వాల్యూం నెంబర్ 6, బుక్ 60, నంబర్ 501 లో నమోదు చేయబడిన హదీస్ కథనాన్ని పరిశీలించినప్పుడు, మహమ్మద్ తన జీవితకాలంలో ఖురానును క్రోడీకరించి ఒక గ్రంథరూపకంలో క్రమబద్ధంచేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదని, ఎవరిని అలా చేయమని ఆదేశించనూ లేదని మనకర్థమవుతుంది. ఖురానును గ్రంథస్థం చేయాలనే ఆలోచన మొదట ఉమర్కు కలిగింది. అది మొహమ్మద్ మరణానంతరం కలిగిన ఆలోచన. అతడు ఆ తలంపును అబుబకర్తో పంచుకున్నప్పుడు, “అల్లా సందేశహరుడే చేయని కార్యాన్ని నీవెలా చేస్తావ”ని అతను స్పందించాడు. దానికి ఉమర్ ఏమని బదులిచ్చాడు? మహమ్మద్ వారే అలా చేయమని ఆదేశించారనా? కాదు! “ఇదిచేయడం ఉత్తమం” అని అల్లామీద ఒట్టు పెట్టుకున్నాడు. అబుబకర్ ఒప్పించబడేంత వరకూ విడిచిపెట్ట లేదు. ఏదో విధంగా వారిరువురు కలిసి జైద్ ను కూడా ఈ పని చేయడం ఉత్తమమని ఒప్పించారు. మొదట జైద్ కూడా సరిగ్గా అబుబకర్ లాగే స్పందించి “అల్లా సందేశహరుడు చేయనిది మీరెలా చేస్తారని అడిగాడు. ఇలా ఖురాను గ్రంథస్థం చేయాలనే ఆలోచన కేవలం మానవ ఉద్దేశమే తప్ప దైవోద్దేశము కాదని, అల్లా కానీ, అల్లా ప్రవక్త కానీ అలాంటిదేమి ప్రయత్నించలేదని, ప్రతిపాదించనూ లేదని ఇస్లాం ప్రామాణిక సాహిత్యాలనుండే స్పష్టమౌతుంది. బైబిల్ పై బురద జల్లితే ఖురాను వాస్తవాలు దాగుతాయనా, దీదాత్ చేసే ఈ వ్యర్థ ప్రేలాపనలు?

11. దీదాత్

“నీవు బైబిలు దైవవాక్యమని అంగీకరిస్తావా?”అన్నది మన ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్న ఓ రకమైన ఆక్షేపణ, ఓ రకమైన ఛాలెంజి. ప్రశ్నించే వ్యక్తి తన జ్ఞానాభివృద్ధికై ప్రశ్నించడు. ఆ ప్రశ్న వేయడం ఓ వాదన. ఓ లాంఛనం. మనకూ అదే విధంగా, అదే దృక్పథంతో అడిగే హక్కుంది.

“ఏ బైబిలును గురించి నీవు మాట్లాడేది?” అని మనం అడిగితే, “ఏం? ఎందుకని? ఒక్క బైబిలేగా వుండేది” అని అతను గొణుక్కుంటాడు.

కాథలిక్కుల బైబిలు

రోమను కాథలిక్కుల బైబిలు పాఠ్యభాగం దోవే (Douay) బైబిలు చేతిలో తీసుకుని, “నీవు ఈ బైబిలు దైవవాక్యమని అంగీకరిస్తావా?” అని నేనడుగుతాను. ఎందుకో మరి కాథలిక్కు ట్రూత్ సొసైటీవారు తమ పాఠభేదాన్ని పొట్టిగా, లావుగా ప్రచురించారు. మార్కెట్లో దొరికే పలురకాల బైబిలు పాఠ్య భేదాల్లో ఇది మాత్రం వింతగా విడిగా కన్పిస్తుంది. ముందు మనకు ప్రశ్న వేసిన క్రైస్తవ సోదరుడు కాస్త వెనక్కు తగ్గి “అదేం బైబిలు?” అని అడుగుతాడు. “ఏం?” అని నేను గుర్తు చేస్తాను. “అవుననుకో” అతను అనుమానంతో గొణుగుతాడు. కానీ, అది ఏ వెర్షన్ / పాఠభేదం?” అని అడుగుతాడు.

“ఏం, దానివల్ల ఏం తేడా వస్తుంది?” అని నేనడక్కమానను. వాస్తవానికి చాలా భేదముంది.

వృత్తిరీత్యా ప్రచారానికి దిగిన వ్యక్తికి కూడా ఆ విషయం తెలుసు. పైకి మాత్రం అతను “ఒక్క బైబిలే” అని మాత్రం బొంకుతుంటాడు.”

జవాబు

ప్రత్యర్థిని బొంకులమారిగా చిత్రీకరించటానికి పైన దీదాత్ ప్రదర్శించిన విధానం కంటే మరొకటుండదు. తోలు బొమ్మలాట శైలిలో, వాడి పక్షాన మనమే బొంకడమన్న మాట!

సరే, అది అలా వుంచితే, “ఒక్క బైబిలే' అన్నది ఎవ్వరూ తిరస్కరించలేని నిజం. దేవుడు వ్రాసింది ఒకే ఒక బైబిలే కానీ, ఉస్మాన్ ఖలీఫాగా వున్నపుడు అతనిని కలవర పెట్టిన వివిధ ఖురాన్ పాఠ్యాంతరాల వంటి సమస్య బైబిల్ విషయంలో కూడా తలెత్తింది. ఐతే, ఆదిమ ముస్లిమ్ సముదాయానికి, ఆదిమ క్రైస్తవ సంఘానికి మధ్య వున్న భేద మేమిటంటే, వారు ఖురాన్ పాఠ్యాంతరాలను దహించి వేస్తే మేము అన్ని బైబిలు పాఠ్యాంతరాలను భద్రపరచి, ఒక ప్రతి దానితో వైవిధ్యము గల మరొక ప్రతితో కలసిపోకుండా జాగ్రత్త వహించి, వున్నవి వున్నట్లుగా వాటిని వాటి వైవిధ్యాలతో సహా పరిరక్షించి, వాటి పవిత్రతను, ప్రామాణికతను నిర్ధారించగలిగే సాధ్యతను నాశనం కాకుండా కాపాడాము. తత్ఫలితంగా ఈ పాఠ్యాంతరాలనే ఆధారము చేసుకుని దేవుని ప్రత్యక్షతగా బైబిల్ దానీ ప్రామాణికతను ఏ మాత్రం కోల్పోలేదని, పాఠ్యాంతరాలలో వున్న చెదురుమదురు మార్పులు వ్రాత ప్రతుల ప్రక్రియలో సాధారణంగా చోటు చేసుకునే అనుద్దేశపూర్వకమైన అంతరాలేనని నిరూపించగలిగే సామర్థ్యాన్ని నేటికీ సంఘము నష్టపోలేదు. ఈ విషయంలో క్రైస్తవులు ముస్లింల కంటే అదృష్టవంతులేనని చెప్పుకోవాలి. ఎందుకంటే మొహమ్మద్ పై అవతరింపజేయ బడిన ఒకే ఒక ఖురాన్ ను తిరిగి పొందలేని విధంగా ఉస్మాన్ నాశనం చేశాడు.

ఇదివరకే నేను నిరూపించిన ప్రకారం ముస్లింల కొరకు ఉస్మాన్ గింజను పొట్టు నుండి ఎప్పుడో వేరు చేసేశాడు. అయితే గింజను కాల్చి వేసి పొట్టును భద్రపరచాడన్నది మాత్రమే సమస్య. దీని ఫలితంగా బైబిల్ పాఠ్యాంతరాలలో లాగా ఖురాన్ పాఠ్యాంతరాలలో వుండినవి కూడా, దాని పవిత్రతను మరియు ప్రామాణికతను చెరుపలేని అనుద్దేశకపూర్వకమైన చెదురుమదురు మార్పులు మాత్రమేనని నిర్ధారించి నిరూపించగలిగే ఆధారాలను, సామర్థ్యాన్ని ముస్లింలు శాశ్వతంగా నష్టపోయారు. పాఠ్యాంతరాల మధ్య ప్రామాణికతను ఒక క్రైస్తవుడు ఎలా నిర్ధారిస్తాడో 15వ పాయింట్లో మా జవాబులో చర్చించాము. ప్రస్తుతం గమనించదగిన విషయమేమిటంటే, దీదాత్ తప్పుగా చిత్రీకరించిన విధంగా బైబిల్ పాఠ్యాంతరాలలో బైబిల్ ప్రామాణికతను సవాలు చేసేంత సమస్యేమి లేదు. అందుకు భిన్నంగా, దేవుని వాక్యము పట్ల ఆదిమ ముస్లిం సముదాయము కంటే క్రైస్తవసంఘమే నిజాయితీతో వ్యవహరించిందనటానికి ఈ పాఠ్యాంతరాలు దస్తావేజు రూపకమైన సాక్ష్యాధారాలుగా మిగిలిపోయాయి. వివిధ వ్రాతప్రతులలో అక్కడక్కడ చోటుచేసుకున్న అనుద్దేశపూర్వకమైన మార్పులు సహితం బైబిల్ సందేశాన్ని కానీ సిద్ధాంతాన్ని కానీ ప్రభావితం చేయగలిగే పరిమాణంలో లేవని, కాబట్టి ఒకటి కంటే ఎక్కువ బైబిళ్ళు ఉన్నాయనే వాదనలో ఏ మాత్రం సత్తాలేదని నిరూపించటానికి కూడా ఈ పాఠ్యాంతరాలే ఆధారాలు. అయినా, ఈ దావా ప్రచారకులకు అంత పరిశోధన చేసే సామర్థ్యము గనుక వుంటే, ఖురానునుమాత్రమే అపాయములోనికి నెట్టే ఈ కోణాన్ని వారు బైబిలకు వ్యతిరేకంగా ప్రస్తావించే వ్యర్థ సాహసాన్ని మాని వుండేవారు. ప్రత్యర్థికి తవ్విన గోతిలో మనమే పడటమంటే యిదేనేమో!

12. దీదాత్

“రోమన్ కాథలిక్కు బైబిలు రైమ్స్ (Rheims)లో 1582లో, జెరోమ్స్ లాటిన్ వర్గెట్ (Jerome's Latin Vulgate) ద్వారా ప్రచురితమైంది. దాన్ని డోవే (DOUAY) వాళ్లు మళ్లీ 1609లో ప్రచురించారు. కాని, RCV (Roman Catholic Version) అన్నది అత్యంత ప్రాచీన పాఠ్యభాగం. అయినా దాన్ని నేటికీ మనం కొనుక్కోగలం. ఇంత ప్రాచీన గ్రంథం వున్నా యావత్తు ప్రొటెస్టెంటు ప్రపంచం, పలు ఇతర పూజాపద్దతులున్న క్రైస్తవులు (సదాచార క్రైస్తవ సమాజమైన జెహోవా వీటినెస్ వారు, ది సెవెన్తడే అడ్వెంటిస్టువారు, ఇతర వేలకొలది రకాలు - ఒకరికి మరొకరంటే పడదు) రోమన్ కాథలిక్కువెర్షన్ బైబిల్ ని తిరస్కరిస్తారు. అందులో ఏడు పుస్తకాలు ఎక్కువగా వున్నాయి. వాటిని పైన చెప్పిన ఇతర క్రైస్తవ సమాజాలవారందరూ అపోక్రిఫా (Apocrypha) అంటే అనుమానంతో కూడినదనీ, అధికారం పొందనిదని తీసిపారేస్తారు. ఇలా చేసేవారికి ఓ భయానకమైన హెచ్చరిక ఆవిష్కరణ'లో (APOCALYPSE) బైబిలు అంతిమ ప్రకటనల్లో ఇవ్వబడిందన్న సంగతి మరచిపోతారు. అదే నేడు ప్రకటన గ్రంథం (REVELATION)గా ప్రొటెస్టంటుల బైబిల్లో వుంది. అంటే అది 'ప్రకటించబడింది? అని అర్థం. అది హెచ్చరిక!

“గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా- ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపిన యెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగ జేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన యెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను, పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును” (ప్రకటన గ్రంథం22:18-19).

కాని లెక్కచేసేవారెవరు? అసలు వాళ్లకు ఆ వాక్యాల మీద విశ్వాసముందంటారా? ప్రొటెస్టెంటులైతే అతి ధైర్యంగా (కాథలిక్కు పాఠ్యా భాగంలోని) ఆ ఏడు పుస్తకాలను తృణీకరించి దైవవాక్కునే బైబిలు గ్రంథంలోంచి తీసిపారేశారు.

మరి ఆ బహిష్కృత గ్రంథాలేవంటారా?

1. జూడితు గ్రంథం (The Book of Judith)

2. తోబియా గ్రంథం(The Book of Tobias)

3. బారూకు గ్రంథం (The Book of Baruch)

4. ఎస్తేరు గ్రంథం - (The Book of Esther)

5. మక్కబీయుల గ్రంథం -1 (The Book of Maccabians I)

6. మక్కబీయుల గ్రంథం -2 (The Book of Maccabians II)

7. ఎసద్రసు గ్రంథం (The Book of Esedras)

(ఈ అపోక్రిఫా గ్రంథాలను గురించి రాస్తే మరో గ్రంథమౌతుంది. నికొసియా సమావేశంలో కాన్స్టాంటైను రాజు పర్యవేక్షణలో దాదాపు 300కు పైగా సువార్తీకుల గ్రంథాలు తీసివేయబడ్డాయి. ఆ సమావేశం తరువాత సమావేశాల్లో మరెన్నో వందల బైబిలు గ్రంథాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ అపోక్రిఫా గ్రంథాలను గురించి తెలుసుకోవాలంటే నా పుస్తకం 'పాపం-పరిహారం-రక్షణ” అన్నది చూడండి- అనువాద కర్త).”

జవాబు

ప్రొటెస్టంట్లలో ఏ విభాగానికి చెందిన వారైనా సరే, రోమన్ కేథోలిక్ బైబిల్ ను పూర్తిగా తృణీకరించరు. వారు తృణీకరించే ఈ ఏడు పుస్తకాలు అప్రమాణికమైన గ్రంథాలు. ఇశ్రాయేలీయ లేఖన గ్రంథంలో భాగంగా అవి ఎప్పుడూ ఎంచబడలేదు. కాబట్టి దీదాత్ ఆరోపిస్తున్నట్లు ప్రొటెస్టంట్లు తీసి పారేసింది దేవుని వాక్యాన్ని కాదు. అందులో భాగంగా ఎన్నడూ చేర్చకూడని అప్రమాణిక గ్రంథాలను మాత్రమే వారు బహిష్కరించారు. ప్రకటన గ్రంథము నుండి దీదాత్ ఉదహరించిన హెచ్చరికను మీరింది, ఈ అప్రమాణిక గ్రంథాలను తొలగించిన ప్రొటెస్టంట్లు కాదు, వాటిని అందులో చేర్చిన రోమన్ కేథోలిక్లే. నిందించే ముందు దీదాత్ కొంత తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేది. అన్నట్లు రోమన్ కేథోలిక్ల ఆర్.సి.వి అతి ప్రాచీనమైన వర్షన్ అన్న దీదాత్ మాటలలో ఎంత బరువుందో మరో పాయింటుకు మా జవాబులో తగిన విధంగా పరిశీలించాము.

ఇక కాన్స్టాంటైన్ పర్యవేక్షణలో జరిగిన సమావేశాలలో బైబిళ్ళు ధ్వంసం చేయబడ్డాయనీ దీదాత్తు, అతని అనువాదకర్తకు తప్ప యింకెవ్వరికి తెలియకపోవటం అన్నిటి కంటే గొప్ప విశేషం. ఉస్మాన్ ఖురానులను కాల్చేశాడని మేము చెప్పినప్పుడు ఇస్లామ్ సాహిత్యాలలో నుండే వాటికి ఋజువులు అందించలేదా? చిన్న పిల్లల్లా అభాండాలు రువ్వటం కాదు, వాటిని పరిశోధనాత్మకంగా ఋజువుచేసే పాండిత్యం కూడా వుండాలి, పుస్తకాలు వ్రాయటానికి. గమనించదగిన వాస్తవమేమిటంటే, కాన్స్టాంటైన్ అధికారంలోనికి రాకముందు సంఘములో ఏ బైబిల్ చదవబడిందో అదే బైబిల్ నేడు కూడా అమలులో వుందనీ 2వ శతాబ్దిలో అనగా కాన్స్టాంటైన్ కు దాదాపు వందసంవత్సరాల ముందు వ్రాయబడిన ఇరేనియస్ టేషియన్ మరియు అమ్మోనియస్ల బైబిల్ సమీక్షలను పరిశీలిస్తే నిర్వివాదంగా నిరూపితమౌతుంది. పుస్తకం రాసే తొందరలో దీదాత్ యివ్వన్నీ చూసుండడు పాపం!

13. దీదాత్

ప్రొటెస్టెంటుల బైబిలు

అధికారిక పాఠ్యభాగమనిపించే (Authorised VersionAV) ప్రొటెస్ట్రాంటుల బైబిల్ని నేడు కింగ్ జేమ్స్ వెర్షన్ (KJV) అని పిలుస్తారు. దాని గురించి సర్ విన్సెంట్ చర్చిల్ (Sir Vincent Churchill) గారి అతి ఉపయుక్తమైన మాటల్ని వినండి:

“అధికారిక పాఠ్యభాగమైన (AV) బైబిలు 1611 సంవత్సరంలో అతి ఘనత వహించిన జేము రాజుగారి ఆజ్ఞతో ప్రచురితమైంది. ఆయన పేరుతోనే పిలువబడుంది.”

అయినా పాపం రోమన్ కాథలిక్కులు, తమ దైవ గ్రంథాన్ని ప్రొటెస్టాంటులు ఛిన్నాభిన్నం చేశారని విశ్వసిస్తూనే, తాము క్రైస్తవంలోనికి మత మార్పిడి చేయించిన జనమందరికీ అధికార పాఠభాగం అని పిలిచే (AV) బైబిల్నే కొనుక్కోమని ప్రొటెస్టెంటుల నేరాన్ని సహకరిస్తూనే వస్తున్నారు. ఎందుకంటే నేటి అభివృద్ధి చెందుతూ పోతున్న దేశాల్లోని దాదాపు 1500 భాషల్లో దొరికే పాఠ్యభాగం అదే కాబట్టి. అంటే తాము వెతికి పట్టి తెచ్చి పితికిన ఆవుపాలు ప్రొటెస్టెంట్లకు త్రాగనివ్వడం జరుగుతుంది. కాబట్టి అత్యధిక సంఖ్యలో వేలాది మంది ప్రొటెస్టెంటులు, కాథలిక్కులు అందరూ 'ఆ కింగ్ జేము వెర్షన్' అని మారుపేరుతో పిలువబడే ఆ అధికారిక పాఠ్యభాగాన్నే (AV)నే పఠిస్తారు.

జవాబు

మరొకసారి యిక్కడ స్పష్టం చేయవలసిన ఒకే ఒక అంశము ఏమిటంటే దీదాత్ కానీ, రోమన్ కెథోలిక్లు కానీ నిందించే విధంగా ప్రొటెస్టెంట్లు బైబిల్ ను ఏ విధంగానూ ఛిన్నాభిన్నం చేయలేదు. మునుపటి పాయింట్లోనే దీనికి చాలినంత వివరణ యిచ్చేశాను.

14. దీదాత్

మహత్తర ప్రశంసలు

సర్ విన్సెంట్ చర్చిల్ చెప్పినట్లుగా మొదట 1611 లో ప్రచురితమైన అధికార పాఠభాగం Authorised Version(AV) అనే ఈ బైబిలు 1881లో తప్పులు దిద్దుకుని పున: విమర్శ, పున:పరిశీలన చేయబడి ‘పున:పరిశీలన చెందిన పాఠ్యభాగం’ (Revised Version: RV) గా మార్చబడి, మళ్లీ పున:పరిశీలన కావించుకుని 'రివైస్ట్ స్టాండర్డ్ వర్షన్' 'సరికొత్త పాఠ్యభాగం' (Revised Standard Version: RSV)గా 1952లో మార్చబడి, మళ్లీ పున:విమర్శ, పున:పరిశీలన గావించుకుని సరికొత్త పాఠ్యభాగం' గా మన ముందున్నది.

ఈ అత్యంత పున:పరిశీలనలు, దిద్దుబాట్లు మాటిమాటికి చేసుకుంటూ పోయిన RSVని గురించి మన క్రైస్తవ ప్రపంచ భావాలెలా వున్నాయో చూడండి:

“ఈ శతాబ్దిలో ఉత్పత్తి అయిన అత్యంత చక్కటి పాఠ్యభాగం”
(చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ దినపత్రిక).

“అత్యుత్తమ ప్రతిభావంతులైన పండితులచే అనువదింపబడిన సంపూర్ణ నవ అనువాదం” టైమ్స్ లిటరెరీ సప్లిమెంట్) అత్యంత ప్రేమ పూరిత లక్షణాలు గల అధికార పాఠ్యభాగం (AV) కొత్త మేలైన అనువాదంలో కలపడం జరిగింది.” - లైఫ్ అండ్ వర్క్

“అసలైన మూల గ్రంథానికి అత్యంత దగ్గరి ఖచ్చితమైన భాషాంతరం” -(ది టైమ్స్)

దాని ప్రచురణకర్తలైన 'కాలిన్స్' (Collins) వాళ్లు ప్రచురించిన తర్వాత ఇచ్చిన నోట్సులో 10వ పేజీలో ఇలా రాసారు:

“ఈ బైబిలు (RSV) పునః పునః (మళ్లీ మళ్లీ) విమర్శనలు, పరిశీలనలు చేసుకున్న ప్రామాణిక పాఠ్యభాగం (Revised Standard Version) ముప్పై రెండు మంది మహా పండితులతోనూ వారికి సహకరించిన ఏభై సహకారవిభాగాలతో కూడిన సమావేశంతోను వుత్పత్తి చెందింది”

ఎందుకో ఈ బడాయిలు? మోసపోయి, అమాయకులు ఈ పుస్తకం కొనుక్కోవాలనే కదా? ఇలాంటి సాక్ష్యాలను చూసి కొనేవాడు తాను సరైన గుర్రాన్ని పట్టుకున్నానని అనుకుంటాడు. అసలు అతని పైనే ఎక్కి ఎవరైనా స్వారీ చేస్తున్నారేమో నన్నది గమనించడు.

జవాబు

గుర్రాన్ని తేలేది దీదాత్ లేదా దావా ప్రచారకులెవరైనా అయితేనే తప్ప, 'సరైన గుర్రం పైనే సవారి చేస్తున్నానా' అనే ప్రశ్నకు తావే లేదు. బైబిల్ విశ్వాసులకు ఆ సందిగ్దం అక్కరలేదు. ఎందుకంటే బైబిల్ భద్రముగా సంరక్షింపబడిన దైవ వాక్యం. ఖురాన్లా కాల్చివేయబడిన అనుమానాస్పదమైన గ్రంథమేం కాదు.

15. దీదాత్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విరివిగా అమ్ముడుపోయే సరుకు

మరి ప్రపంచంలో అత్యంత విరివిగా అమ్ముడుపోయే ఈ పుస్తకం అధికార పాఠ్యభాగం (Authorised Version) మాటేమిటి?

దీని పున: విమర్శకులు, సరిచూచే పున:పరిశీలకులంతా మంచి సేల్సుమెన్లు. దాని గురించి వాళ్లంతా గొప్ప మాటలే అంటారు. అయినా రివైజ్డ్ స్టాండర్డ్ వరైన్లోని పేజి iii లోని ముందుమాట (పీఠిక) ఇలా చెబుతుంది:

“ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ (మరో మాటలో అధికార పాఠ్యభాగం (RSV) అయిన బైబిల్) ఇంగ్లీషు గద్య రచనలో అత్యంత మహనీయమైన స్మారక చిహ్నంగా పేరుపొందటానికి ఓ మంచి కారణమే ఉంది. దాని నిష్కాపట్యం (సాదాతనం), దాని ప్రతిష్ట, దాని శక్తి, దానిలోని భావాల అందాల మలుపులు.... దాని రాగస్వర ధోరణి, దాని మంగళదాయకమైన లయవీటన్నింటి పట్ల 1881లో దాన్ని పున:పరిశీలన చేసినవారు తమ అభిమానం వ్యక్తం చేశారు. ఆంగ్ల భాష పలికే జనాల వ్యక్తిగత జీవన సరళిలో, జనబాహుళ్యసంస్థానాల్లో ఏ పుస్తకం చేరనటువంటి స్థానానికి ఇది చేరిపోయింది. దీనికిమనం లెక్కలేనంతగా ఋణపడి వున్నాము.

” మరి ప్రియమైన పాఠక సోదరులారా! మీరు ఈ గ్రంథాల గ్రంథం (Book of Books) కు ఇచ్చిన ఈ మహోన్నత ప్రశంసల కంటే హెచ్చు ప్రశంసలు ఊహించగలరా? నా మటుకు నేను ఊహించలేకపోతున్నాను. మరి విశ్వసించి వచ్చే క్రైస్తవ సోదరుణ్ణి, అతనిపై మత న్యాయాధిపతులు, నిర్దాక్షిణ్యంగా వేసే వేటు నుండి కూడా అతన్ని రక్షించండి. ఎందుకంటే, ఇంతగా పొగిడినవారే మరల ఏమంటున్నారో చూడండి:

“అయినా ఈ కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిలు అతి గంభీరమైన తప్పులతో నిండివుంది. మరి ఈ లోపాలు, తప్పులు ఎన్ని వున్నాయంటే, ఇంకా అవి ఎంత గంభీరమైనవంటే దీన్ని మళ్లీ పున:పరిశీలన చేయాలి.

” మరి ఇది కూడా వారి నోటి గుండా వచ్చినమాటే. ఎవరంటే, “అత్యంత ప్రతిభావంతులైన సదాచార క్రైస్తవుల” కలాల నుంచే ఈ ఉపేక్షించరాని అతి గంభీరమైన తప్పులకు కారణం వెదికే నిఘంటువు (Encyclopedia) ఒకటి తయారు చేసేందుకు, వారి అతి పవిత్ర ఆజ్ఞా పత్రికల్లోంచి వాటిని తీసివేసేందుకు మరో అనంతకోటి దివ్య ప్రేరిత విజ్ఞాన పండితులు కావాలి.

పున:పరిశీలితమై స్థిరపరచబడిన పాఠ్యభాగం Revised Standard Version, 1971 ముందుమాట చూడండి. పైన ఇచ్చిన ఇంగ్లీషు RSV పీఠికలోంచి కొన్ని వాక్యాలను అండర్లైన్ చేశాము. వాటి అనువాదం మాత్రం ఇవ్వదలిచాము చదవండి.

కింగ్ జేమ్స్ వెర్షన్ (బైబిలు) పలు సత్కారణాల ప్రకారం “అతి మహనీయమైన ఆంగ్ల గద్య కట్టడమనీ లెక్కించబడింది. దానిని పున:పరిశీలన చేసి వ్రాసినవారు దాని యొక్క అతి సహజత్వాన్ని, దాని గొప్పదనాన్ని, దాని శక్తిని, దాని ఆనందదాయకమైన భావ ప్రకటనను శ్లాఘించారు. దానిలోని శ్రుతిని, దానిలోని రాగరీతిని కొనియాడారు. దానికై మనం మిక్కుటంగా ఋణపడివున్నాము.

“అయినా దీ కింగ్ జేమ్స్ వెర్షన్లో అతి గంభీరమైన లోపాలు (తప్పులు) చాలా వున్నాయి. అవి ఎంత గంభీరమైన తప్పులంటే మనం వాటిని పున:విమర్శన చేయవలసి వుంది.”

జవాబు

దీదాత్ మరియు దావా ప్రచారకులకు బుర్రకెక్కని విషయమేమిటంటే, ఒక బైబిల్ అనువాదంలో తప్పులు మూల భాషతో సరితూచి సవరించగలిగే తప్పులయితే (పున:పరిశీలనకు అర్థం అదే), అవి భాషాంతరములో వున్న లోపాలే కానీ మూల ప్రతులలో వున్న లోపాలు కావు. ఈ విధమైన బైబిల్ పున:పరిశీలన ప్రక్రియతో ఖురాన్ పట్ల ఉస్మాన్ చేపట్టిన చర్యను పోల్చి చూడండి. అతని దృష్టికి వివిధ ఖురాన్లు (పాఠ్యాంతరాలు కాదు) కలిగియుండిన తప్పులు ఎంత తీవ్రమైనవంటే, ఎంత ఘోరమైనవంటే, అవి కనీసం పున:పరిశీలనకు సహితం నోచుకోలేదు కేవలం నాశన పాత్రమైనవిగా ఎంచబడ్డాయి.

బైబిల్ పాఠ్యాంతరాల వాస్తవికత

ఖురాన్ కు లాగే బైబిల్కు కూడా పాఠ్యాంతరాల సవాలు ఎదురైంది. కింగ్ జేమ్స్ అనువాదం అంతియొక శైలిలో రాయబడిన ప్రతులకాధారంగా చేయబడగా, ఆధునిక భాషాంతరాలు (రివైజ్డ్ వర్షన్స్) అలెగ్జాండ్రియా శైలిలో రాయబడిన ప్రతుల ఆధారంగా చేయబడ్డాయి. ఈ యిరు సముదాయాలకు చెందిన వ్రాత ప్రతుల మధ్య చెదురుమదురుగా పాఠ్యాంతరాలు చోటు చేసుకున్నాయి. నేడు శేషించిన వ్రాత ప్రతులలో అలెగ్జాండ్రియా సముదాయానికి చెందిన ప్రతులే యితర ప్రతుల కంటే ప్రాచీనమైనవి కాబట్టి బైబిల్ ను పున:పరిశీలన మరియు పున:విమర్శ (రివైజ్ చేసిన పండితులు పాఠ్యాంతరాలున్న సందర్భాలలో అలెగ్జాండ్రియా పాఠ్యాంతరాలనే ఎక్కువ ప్రామాణికత గలవిగా పరిగణించారు. కానీ యింకాస్త లోతుగా పరిశోధిస్తే క్రీ.శ. 100-165 (ఎ.డి) లో జీవించిన జస్టిన్ అనే ఆదిమ క్రైస్తవ సంఘ హతసాక్షి రచనల నుండి మొదలుకొని పరిశోధన సాగిస్తే, వారు ఉల్లేఖించిన బైబిల్ భాగాలు అంతియోక రాతప్రతులకు అనుగుణిస్తున్నవిగా కనుగొంటాము. జస్టిస్ గారి కాలము, బైబిల్ లోని చివరి గ్రంథము (ప్రకటన గ్రంథము) వ్రాయబడినది (96 క్రీIIశII) మొదలుకొని ఒక శతాబ్దిలోపే కాలము కాబట్టి అంతియొక రాతప్రతులే ఎక్కువ ప్రామాణికత గలవిగా నిరూపితమౌతున్నాయి. ఎందుకంటే అలెగ్జాండ్రియా శైలిలో వున్న బైబిల్ ఉల్లేఖనాలు ఓరిగెన్ (క్రీ||శ|| 185-254) మరియు సిరిల్ (క్రీ.శ.376-444)అనే రచయితల కాలము మొదలుకొని మాత్రమే మనకు కనిపిస్తాయి. అంతేకాక అంతియొక, అపోస్తలులు నివసించిన స్థలమే. అయితే అలెగ్జాండ్రియాను అపొస్తలులేవ్వరు కనీసం పర్యటించినట్లు సహితం దాఖలాలు లేవు. కాబట్టి సమయములోనూ, స్థలములోనూ, అపోస్తలులకు అత్యంత చేరువైన అంతియొక రాతప్రతులే అత్యంత ప్రామాణికమైనవని వేరే చెప్పనవసరం లేదు.

కాబట్టి క్రైస్తవులు నేడు అత్యంత ప్రామాణికమైన బైబిల్ పాఠ్యాంతరం ఏదో నిర్ధారించుకోగలరు. దానితో పాటు దానితో వ్యత్యాసముగల యితర వ్రాతప్రతులు సహితం నేడు వారికి అందుబాటులో వున్నాయి. అయితే దీదాత్ వంటి దావా ప్రచారకులను నిరుత్సాహపరిచే వాస్తవమేమిటంటే, అంతియొక ప్రతులలో వున్న వాక్యభాగమేదైనా యితర ప్రతులలో కనిపించకపోయినా, ఆ వాక్యభాగముతో విభేదించే వాక్యాలేవీ ఏ వ్రాతప్రతిలోనూ కనుగొనలేము. అందుకు భిన్నముగా, ఆ వాక్యభాగము ప్రకటించే సిద్ధాంతమును సమర్ధించే యితర వాక్యభాగాలు పాఠ్యాంతరాలున్న అన్ని వ్రాతప్రతులలోనూ భద్రముగా సంరక్షింపబడినట్లు చూస్తాము.

| పాఠ్యాంతరాలు చోటు చేసుకున్నప్పటికీ వాటి వ్యత్యాసాలు, కనీసం ఒక్క సైద్ధాంతిక విభేదాన్నైనా కలిగించలేకపోగా, వాటి మధ్య సైద్ధాంతిక ఐక్యత సంరక్షించబడడం, బైబిల్ పాఠ్యాంతరాలు బైబిల్ ప్రామాణికతను ఏ విధంగానూ ప్రభావితము చేయలేదనడానికి బలమైన ఆధారం.

వివిధ ఖురాన్లమధ్య అత్యంత ప్రామాణికమైన ఖురాన్ ఏదో ముస్లిమ్లు కూడా నిర్ధారించుకోగలరు. తేడా ఏమిటంటే, వారికది అందుబాటులో లేదు. దాని నుండి వ్యత్యస్తమైన ఉస్మానియా ఖురాన్తోనే సరిపెట్టుకోవాలే తప్ప మరో ప్రత్యామ్నాయం వారికి లేదు.

 

4వ అధ్యాయం

సవరించుకున్న బైబిల్ తప్పలు,
దహనం తప్పని ఖురాను తప్పులు

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో, “యాబైవేల
తప్పులు” అనే నాల్గవ అధ్యాయానికి మా జవాబు.

16. దీదాత్

“జెహోవా విట్ నెసెస్ (అతిప్రఖ్యాత క్రైస్తవ ప్రచార సమాజం) తన 8, సెప్టెంబరు 1957 నాటి 'అవేక్' (AWAKE) (మేలుకో) పత్రికలో అత్యంత సంభ్రమం కలిగించే శీర్షికనొకదాన్ని ప్రచురించింది. ఆ శీర్షిక పేరు “50,000 Errors In The Bible (బైబిలు గ్రంథంలో యాబైవేల తప్పులు).”

జవాబు

దీదాత్ ఈ తప్పులను గురించి సంచలనాత్మక ధోరణిలో ప్రస్తావించడం, అవి కేవలం తర్జుమాలో దొర్లిన తప్పులే కానీ మూలప్రతులలో వున్న లోపాలు కావన్న వాస్తవాన్ని మరుగు చేయడం, యివన్నీ బైబిల్ ను తప్పుగా చిత్రీకరించే తన పథకానికి అనుకూలించేలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడన్న సంగతి, తానే స్వయంగా మన ముందుంచిన 17వ పాయింట్లోని సంభాషణను శ్రద్దగా పరిశీలించినపుడు స్పష్టమౌతుంది. తనకు, ఒక యెహోవా సాక్షి మిషనరీకి మధ్య జరిగిన ఈ సంభాషణను జాగ్రత్తగా గమనించండి.

17. దీదాత్

“నేను నా ఈ చిన్న పుస్తకం పని మొదలెట్టేటప్పుడు ఓ ఆదివారం ఉదయం ఎవరో నా తలుపు తట్టారు. నేను తలుపు తెరిచాను. ఓ యూరోపియన్ విశాలంగా నవ్వుతూ నిలబడి “గుడ్ మార్నింగ్” అన్నాడు. నేనూ 'గుడ్ మార్నింగ్' అని తిరిగి సమాధానమిచ్చా. అతను తన దగ్గరున్న “అవేక్” “వాచ్ టవర్” పత్రికల్ని నాకందించాడు. అవును! అతను యెహోవా విట్ నెస్ సమాజానికి చెందిన వ్యక్తి. వారిలో ఎవరైనా మీ తలుపుతట్లే, ఆ తట్టడంలోని ఓ అహంకారాన్ని మీరు కనుక్కోగలరు. సరే! నేను లోపలికి ఆహ్వానించాను. అతను కూర్చున్న తర్వాత నేను ఓ పాత “అవేక్' పత్రికను చూపించి “ఇదీ మీదేగా?” అని అడిగాను. అవునని అతను తలూపాడు. "ఇందులో, బైబిలు గ్రంథంలో 50,000 తప్పులున్నాయని వుందే! ఇది నిజమేగా?” అని అడిగాను. “ఏమిటది?” అతను కాస్త ఆశ్చర్యపడ్డాడు. నేను మళ్లీ చెప్పాను “మీ బైబిలు గ్రంథంలో 50,000 తప్పులున్నాయని ఈ పత్రికంటుంది” అని.

అతను ఆశ్చర్యంగా అడిగాడు “ఇది మీకు ఎక్కణ్ణుంచి వచ్చింది? అని. (అది దాదాపు 23 సంవత్సరాల నాటిది. బహుశా అప్పుడతను చిన్న పిల్లవాడై వుండాలి!).

“ఆ మాటనలా వుంచు. ఇది మీదేనా?” అని ఆ పత్రిక పేరు 'అవేక్' ను చూపించాను.

“అవేక్” అని అతనూ ఉచ్చరించాడు. నేను చూడవచ్చా?” అని అడిగాడు. “తప్పకుండా” అంటూ నేను పత్రిక మొదటి పేజీ అతనికందించాను. అతను చదవసాగాడు.

జెహోవా విట్ నెస్ వాళ్లు చాలా బాగా తర్ఫీదు పొందిన ప్రచారకులు. వాళ్లకు “కింగ్డమ్ హాల్సు'లో వారానికి ఐదుమార్లు ట్రైనింగ్ క్లాసులు జరుగుతాయి. క్రైస్తవ ప్రపంచంలోని వేయిన్నొక్కప్రచార సమాజాల్లో వీరే సరైన మిషనరీలు. ఎక్కడైనా ఏదైనా చిక్కు ప్రశ్నవస్తే, ఇరకాటం కల్గితే, ఏ విషయాన్నీ తమకు తామై ఒప్పుకోకూడదని, దేనికీ నోరుగాని, ద్వారంగాని తెరవరాదని, పరిశు ద్ధాత్ముడు వచ్చి ఉత్తేజపరిచేవరకు ఆగాలని బాగా తర్ఫీదు పొందినవారు.

అతనలా కాగితాన్ని త్రిప్పుతూ వుంటే నేనతన్ని గమనిస్తూ పోయాను. టక్కున అతను తల పైకెత్తాడు. అతనికి సమాధానం దొరికినట్టుంది. “పరిశుద్ధాత్మఅతన్ని కదిలించాడామో!. అతను మొదలెట్టాడు. “ఈ వ్యాసం అంటుంది - ఆ తప్పుల్లోంచి చాలా తీసివేయబడ్డాయి” అని. దానికి నేను “చాలా వాటిని తీసివేశారంటే 50,000 తప్పుల్లోంచి ఇంకా ఎన్ని మిగిలుంటాయంటావు? ఐదువేలా? ఏభయ్యా? కనీసం ఏభై తప్పులు మిగులున్నా వాటిని దేవుని కంటగట్టాల్సిందేనా?” అని అడిగాను.

పాపం అతనికి మాట రాలేదు. క్షమించమని, తన చర్చీ సీనియర్ మెంబరు ఒకాయన్తో మళ్లీ వచ్చి కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడు. బహుశా ఆరోజు అంతా తేలిపోతుందని అనుకున్నాను. మరి ఆరోజు రాలేదు.”

జవాబు

ఆ సంభాషణను జాగ్రత్తగా గమనిస్తే, ఆ ప్రచారకుడు యిచ్చిన బదులు మిగుల జ్ఞానయుక్తమైనదని ఒప్పుకోక తప్పదు (యెహోవా సాక్షుల వంటి దుర్భోదకులు సైతం యిలా హితవు పలకటం చాలా అరుదు) బైబిల్లో 50,000 తప్పులున్నాయని ప్రకటించిన అదే వ్యాసం, ఆ తప్పులు చాలా వరకు తొలగించబడ్డాయని కూడా తెలిపింది. అయితే దీదాత్తు విషయం బుర్రకెక్కక, తీసివేసిన తరువాత యింకా ఎన్ని తప్పులు మిగిలాయంటూ నసగసాగాడు. ఎన్ని మిగిలాయన్నది కాదు, తీసి వేసిన తప్పులను తీసివేయడం ఎలా సాధ్యపడిందన్నదే అసలు పాయింట్. అవి తర్జుమా తప్పులే కానీ మూలప్రతులలో వుండిన తప్పులు కావని నిరూపించేందుకు, వాటిని సవరించి తీసి వేయగలిగారన్నదే అతిగొప్ప ఋజువు. అవి మూలప్రతులలోనే వున్న తప్పులయ్యుంటే, వాటిని అధికారికంగా సవరించడం లేదా తొలగించడం సాధ్యపడుండేది కాదని ఇంగితజ్ఞానం గల ఎవరికైనా తెలిసినసంగతే.

కాబట్టి యింకెన్ని తప్పులు మిగిలినా, వాటిని అనువాద వైఫల్యానికే ఆపాదించాలి తప్ప, దీదాత్ మూర్ఖంగా సూచించిన విధంగా వాటిని దేవుని కంటగట్టాల్సిన అవసరమేమీలేదు. యిక మిగిలిన తప్పులు ఎన్నైనా సరే వాటిని కూడా మూల ప్రతుల వెలుగులో సవరించుకుంటే లోపరహిత బైబిల్ అనువాదాన్ని కలిగియుండడం సాధ్యమే. సవరించగలిగే ఈ తప్పులు, బైబిల్లో లోపముందన్న దీదాత్ వాదనకు చాలిన నిదర్శనాలు కావు.

18. దీదాత్

“ఈ నా పుస్తకం అప్పటికి రెడీ అయిపోయుంటే అతనికిచ్చి చెప్పి వుండేవాడిని, “నీ పేరు, చిరునామా, ఫోన్ నంబరివ్వు. 'బైబిలు దైవవాక్యమా? (IS THE BIBLE GOD'S WORD?) నీకు 90 రోజులకు గాను అరువుగా ఇస్తాను. చదివి నాకు జవాబు వ్రాసి పంపు” అని. కొందరు ముస్లిం మిత్రులు ఆ పని చేస్తున్నారు. మీరూ ఆ పని చేస్తే ఆ మిషనరీ ప్రబోధకులు ఇంకెప్పుడూ మీ తలుపు మళ్లీ తట్టరు. నేటి వరకూ ఈ పుస్తకం ఆ అద్భుతం చేస్తూనే వస్తోంది. మాషాఅల్లాహ్!”

జవాబు

యిక ఎన్నడూ మిషనరీలు తలుపు తట్టకుండా ముస్లిమ్ గృహాలను కాపాడగలిగే ఈ అద్భుతమైన మాయా పుస్తకానికి కేవలం 90 రోజుల ఎక్స్ పైరీ గడువు యివ్వడమేమిటో! ఆ మాట అలా వుంచితే, ప్రభువైన యేసుక్రీస్తు మహా కృప చేత నేను ఇక్కడ రాసే జవాబు, 'బైబిల్ దేవుని వాక్యమా? అనే దీదాత్ పుస్తకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, మరలా ముస్లిమ్ తలుపులు తట్టి, యేసుక్రీస్తు సువార్త సందేశాన్ని వారికి అందించేలా మా మిషనరీలకు మార్గము సుగమం చేస్తుంది.

అన్నట్లు మా పేరు, ఫోన్ నంబర్, చిరునామా, యివన్నీ ఎందుకో! మా జవాబు ఎదురొడ్డ లేనిదిగా నిరూపితమయితే జిహాదీలను మా పైకి పంపించే కుట్రేమి యిందులో దాగిలేదు కదా!

19. దీదాత్

“శబ్దార్థ విన్యాసంతో, సదాచార త్రిత్వవాదులైన క్రైస్తవులతో 'దైవవాక్యం” విషయంలో, అతి గట్టిగా తప్పుపట్టి ఆ సమాజాలన్నింటిని తూలనాడే, ఈ జెహోవా వీటినెస్ సమాజం తానే అలాంటి ఆటలాడుతుంది. ప్రస్తుతం మాట్లాడిన వ్యాసం “బైబిలు గ్రంథంలో 50,000 తప్పులు” అన్న విషయంలో వాళ్లిలా అంటారు.

“బహుశా 50,000 తప్పులుండవచ్చు... ఆ తప్పులు బైబిలు గ్రంథంలో దొర్లి వుండవచ్చు..... 50,000 గంభీరమైన తప్పులా అందులో పెక్కు తప్పులనబడ్డవి..... మొత్తానికి బైబిలు సరైనది!”

జవాబు

త్రిత్వవాదుల పక్షాన మేము జవాబు చెప్పేశాము కదా: ఇక యెహోవా సాక్షుల శబ్దార్థ విన్యాసాలకు వారే సంజాయిషీ చెప్పుకోవాలి. అన్నట్లు బైబిల్లో తప్పులు వున్నాయని చెప్పుకొనే ఈ యెహోవా సాక్షుల వద్ద తప్పులు లేని బైబిల్ గ్రంథం ఒకటి వుండుండాలి కదా? లేని పక్షాన ఆ తప్పులను గుర్తించడం వారికెలా సాధ్యపడిందంట? లోపరహితమైన ఒక్క బైబిల్ ప్రతియైనా కనీసం అందుబాటులో లేని పక్షాన తప్పులున్నాయన్న అభియోగం ఆధారరహితమౌతుందని సామాన్య బుద్దిగల ఎవరికైనా తెలిసిన సంగతే కదా? ఒకవేళ వారివద్ద అలాంటి లోపరహితమైన బైబిల్ ఏదైనా వుంటే, బైబిల్ లో తప్పులున్నాయన్న వారి అభియోగానికి అదే పెద్ద గొడ్డలిపెట్టు. ఎందుకంటే ఏవో కొన్ని ప్రతులలో తప్పులు దొర్లినప్పటికీ, లోపరహితముగా భద్రపరచబడిన బైబిల్ కూడా అందుబాటులో వుందనీ అదే నిరూపిస్తుంది. అన్నట్లు, వారు తప్పులనీ వ్యాఖ్యానించుకున్నవి నిజంగా తప్పులేనా అన్నది వేరే విషయం. అయితే తమ పక్షపాత ధోరణిలో వారిని జోకొట్టే జోలపాటలు ఎవరు పాడినా, దీదాత్ మరియు అతనిని గ్రుడ్డిగా కాపీ కొట్టే దావా ప్రచారకుల విచక్షణా సామర్థ్యం యిట్టే మొద్దుబారిపోతుందనడానికి యిదే చాలిన నిదర్శనం.

20. దీదాత్

“రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ రచయితలతో వాళ్లు పున:పరిశీలన చేసి మార్చారన్న వేలాది తప్పులను అవి గంభీరమైనవా స్వల్పమైనవా అని తర్కించేందుకు మన దగ్గర అంత టైములేదు, జాగాలేదు. ఆ సదవకాశాన్ని ఆ బైబిలు పండితులకే విడిచి పెడదాం. ఇక్కడ మాత్రం ఓ అరడజను చిన్న మార్పులను గురించి మాట్లాడే కృషి చేస్తాను.”

జవాబు

బైబిల్లో వేలకొలది తప్పులున్నాయని నిరూపించడానికి దీదాత్ ఎన్నుకున్న అరడజన్ ఉదాహరణలు అతి బలమైన నిదర్శనాలయి వుండాలని తలంచడం తర్కబద్దమేకదా: అందుకే వాటిని జాగ్రత్తగా పరిశీలించి చూద్దాం. అయితే అతి బలమైన వీటిలోనే సత్తా ఏమీ లేదని నిరూపితమైతే, యిక మిగతా వాటిని మనము పట్టించుకోనవసరంలేదు.అంతేకాక, ఖురానును కూడా బైబిల్ ను కొలిచే అదే కొలమానముతోనే బేరీజు వేయగల అవకాశాన్ని పాఠకులు కలిగియుండాలి కాబట్టి, ఒక వైపు దీదాత్ బైబిల్లో ఎత్తి చూపించినవి తప్పులు కావని నిరూపిస్తూనే, మరోవైపు ఖురాన్లో చోటు చేసుకున్న మార్పులను లోపాలను కూడా బహిర్గతం చేశాము.

21. దీదాత్

1. “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” (యెషయా 7:14).

ఈ అనివార్యమైన 'కన్య' అన్న పదం ఆ వాక్యంలోంచి (రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ నుంచి) కొన్ని పదాల పొందికగా మారి “ఒక యువస్త్రీ' అని మార్చబడింది. అది వాస్తవానికి హిబ్రూ పదమైన 'అల్మాహ్' కు సరైన అర్థం. 'అల్మాహ్' అన్న పదమే హిబ్రూ బైబిలు గ్రంథంలో వున్నది. 'కన్య' అన్న పదానికి సమానార్థకమైన ‘బేతులాహ్” కాదు. (“బెతులాహ్' అంటే కన్య. అల్మాహ్' అంటే ఒక యువతి'. హీబ్రూ గ్రంథాలన్నిటిలో ‘అల్మాహ్' అని వుంది. బెతులాహ్ కాదు -అనువాద

పున:విమర్శన, పున:పరిశీలన చేసి మార్చబడిన ఇంగ్లీషు అనువాద బైబిలు ఒక్క రివైజ్డ్ స్టాండర్డ్ వర్జెన్ బైబిలు మాత్రమే. కాబట్టి ఈ సర్దుబాటు, మార్పు అందులో ఒక్కదానిలోనే జరిగింది (ఇతర భాషల అనువాదాల్లో కాదు!) ఆఫ్రికన్, ఆప్రికానర్, అరబ్బీ, జులూ (హిందీ, తెలుగు తదితర) వాస్తవానికి 1500 ఇతర ప్రపంచ భాషల్లో క్రైస్తవులు ఇంకను 'కన్య” అన్న తప్పుటర్థాన్నే మ్రింగుతూ వస్తున్నారు.”

జవాబు

ఇది దీదాత్ కు బైబిల్లో కనబడిన మార్పులు చేర్పుల జాబితాల్లో మొట్ట మొదటి తప్పు!! అయితే, అన్ని హీబ్రూ బైబిల్ గ్రంథాలలోనూ, యెషయా 7:14లో “అల్మాహ్' అనే పదమే వాడబడిందని, తానే స్వయంగా ఒప్పుకుంటున్నాడని గమనించండి అంటే, మూలభాషా ప్రతులలో ఏ మార్పు చేయబడలేదని తన కలంతో తానే సాక్ష్యం చెప్పి, మన పని సులభం చేశాడన్న మాట. కాబట్టి యిక్కడసమస్య బైబిల్లో మార్పులకు, సవరింపులకు సంబంధించినది ఎంత మాత్రమూ కాదు. ఇది అనువాదానికి, విశ్లేషణకు సంబంధించిన ప్రశ్న.

కన్య అనే మాటకు హీబ్రూ భాషలో సరియైన పదము “బెతుల', అల్మాహ్ అనే పదానికి అక్షరార్థ అనువాదం 'యువతి' అని ఆ భాష తెలిసిన అందరికీ విధితమే. కాబట్టి రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ అందిస్తున్నది అక్షరార్థంలో సరియైన అనువాదం. అయితే ఏ భాష నుండైనా మరో భాషకు అనువదించే ప్రక్రియలో కొన్ని సార్లు అక్షరార్థ అనువాదం, సందర్భములోని అసలు అర్థాన్ని మారుస్తుంది లేదా మరుగు చేస్తుంది. ఖురానును కూడా అరబ్బి నుండి యితర భాషలలోనికి అనువదించినవారికి, మేము అంటున్నదేమిటో సరిగా అర్థమౌతుంది. ఇలాంటి సమస్య ఎదురైనపుడు, ఏ మంచి అనువాదకుడైనా సరే, మూలభాషలోని సంధర్భానుసారమైన అర్థాన్నే అందించే ప్రయత్నం చేస్తాడు. అందుకే దాదాపు ప్రతి బైబిల్ అనువాదంలోనూ ‘అల్మాహ్' అనే ఈ పదం 'కన్య' అనే అనువదించబడింది ఎందుకంటే మూలభాష అందిస్తున్న సందర్భం, ఆ పదానికి అదే సరియైన అనువాదమని సూచిస్తుంది.

ఇంతకూ ఏమిటిక్కడ సందర్భం? ఒక కుమారుని గర్భము దాల్చడం ఇశ్రాయేలుకు సూచనగా చూపబడిన సందర్భమిది. అయితే ఒక 'యవ్వన స్త్రీ ఒక కుమారుని గర్భము ధరించడంలో అద్భుతం కానీ సూచన కానీ ఏముంది? అది సర్వలోకములో సర్వసాధారణముగా చోటు చేసుకునే సంగతే కదా. అయితే ఒక కన్యక గర్భము ధరించడం గొప్ప సూచకం. ఇది పురుష ప్రమేయం లేకుండగా జరిగే మహా అద్భుతం. ఇదీ ఇక్కడ సందర్భం కాబట్టి 'కన్య' అని చేయబడినదే సరియైన అనువాదం.

అలాగైతే, మూలభాషలో కన్య అని అర్థమిచ్చే 'బెతూలహ్' అనే పదం వాడకుండా అల్మాహ్' అని ఎందుకు వాడి యుండవచ్చు? ఎందుకంటే “బెతుల అనే పదం కన్య అని మాత్రమే కాదు, 'గుణవతియైన వితంతువు' అని కూడా అర్థాన్నిస్తుంది (యోవేలు 1:8ని మూల హీబ్రూ భాషలో పరిశీలించండి). కాబట్టి ఈ 'అల్మాహ్' అన్నా బెతూలహ్ అన్నా, ఆ పదాలను మాత్రమే ఆధారం చేసుకొని ఈ వచన భావాన్ని అర్థం చేసుకోలేము. సందర్భమే దాని సరియైన అనువాదానికి, విశ్లేషణకు ఆధారం. పైగా యేసు ప్రభువు జననమందు నెరవేరిన ఈ అద్భుత సూచన, ఈ ప్రవచనంలోని 'యావన స్త్రీ' 'కన్యక' యే అని రూఢి చేసింది (మత్తయి 1:18-25 ).

కాబట్టి 'కన్య” అన్నది దీదాత్ నిందించినట్లు తప్పుటర్థమేమీ కాదు. అదే సందర్భానుసారమైన సరియైన అనువాదం, అంతేకాదు, యిక్కడ దీదాత్ ఆశించినట్లు బైబిల్లో ఎలాంటి మార్పులు కానీ చేర్పులు కానీ చోటు చేసుకున్నట్లు ఋజువు చేసేలా ఏమీ లేదు. యిలా దీదాత్ ప్రయోగించిన మొట్టమొదటి 'బాణం', పాపం గురి తప్పింది!!

రాళ్లతో కొట్టి చంపాలన్న వచనం ఖురాన్ నుండి మాయం!

“ఇబ్న్ ‘అబ్బాస్' ప్రకారం:

చాలా కాలము గడిచిన పిమ్మట, 'రాజమ్' (రాళ్లతో కొట్టి చంపుట) గూర్చిన వచనము ఖురానులో లేదంటూ, అల్లా బయలు పరచిన మార్గము నుండి ప్రజలు తప్పిపోదురేమోనని భయపడుచున్నాను. నిశ్చయముగా వివాహితులైన వారు వ్యభిచరిస్తే అది సాక్షుల ద్వారా, లేదా గర్భము ద్వారా, లేదా ఒప్పుకోలు ద్వారా నిర్ధారణమయితే వారిని రాళ్లతో కొట్టి చంపవలెనన్నదే అల్లా నియమమని నేను రూఢి చేయుచున్నాను అని ఉమర్ చెప్పగా, నేనును ఈ మాటను ఈ విధముగానే కంఠత చేసియుంటిని” అని సుఫ్యాన్ కూడా నిర్ధారించాడు. ఉ మర్ మరలా, “అల్లాహ్ అపోస్తలుడు రాజం శిక్షను ఖండితంగా అమలు చేసాడు. మేము ఆయనను అనుసరిస్తున్నామని సెలవిచ్చాడు (బుకారి వాల్యుమ్ 8, బుక్ 82, సంఖ్య 816; వాల్యుమ్ 8, సంఖ్య 817 మరియు వాల్యుమ్ 9, సంఖ్య 424).

“అల్లాహ్ మొహమ్మద్ ను పంపి దైవ గ్రంథాన్ని ఆయన పై అవతరింపజేశాడు. రాళ్లతో కొట్టి చంపుటను గూర్చిన వచనము ఆయన పై అవతరింపజేయబడిన గ్రంథములో ఒక భాగము. అపొస్తలుడు దానిని అమలు చేశాడు, ఆయన మరణానంతరం మేము అది కొనసాగించాము. అయితే రానున్న దినములలో, రాళ్లతో కొట్టి చంపమన్న వచనము దైవగ్రంథములో లేదంటూ, అల్లాహ్ అవతరింపజేసిన ఈ నియమమును ప్రజలు అలక్ష్యము చేయుదురేమోనని భయపడుచున్నాను. నిశ్చయముగా, వివాహితులైన స్త్రీ-పురుషులు వ్యభిచరిస్తే వారిని రాళ్లతో కొట్టి చంపాలన్న నియమము దైవ గ్రంథములో ఒక భాగమే” (ఇబ్న్ ఇస్హాక్, సీరత్ రసూలల్లా, పే. 684) .

ఈ ఆదిమ ముస్లిం ప్రముఖులు వ్యక్తపర్చిన భయాందోళనలు అక్షరాల నిజమయ్యాయి. నేడు అందుబాటులో వున్న ఖురానులో రాళ్లతో కొట్టి చంపాలన్న సవరించుకున్న బైబిల్ తప్పులు, దహనం తప్పని ఖురాను తప్పులు వచన భాగము ఎక్కడా లేదు. అయితే మార్పులు చేర్పులు చేయబడ్డాయని ముస్లింలు ఆరోపించే తోరాలో (బైబిల్లో) మాత్రం ఆ నియమం నేటికి కూడా, చెక్కుచెదరకుండా భద్రపరచబడింది.

ఇక్కడ సమస్య, దీదాత్ బైబిల్ పై ఆరోపించినట్లుగా, ఏదో అనువాద లోపమో, విశ్లేషణా లోపమో కాదు. అనాది కాలము నుండి పరలోకపు రాతిపలకపై ముద్రించబడిన ఖురాను నుండి ఏకంగా ఒక వచన భాగము సంపూర్ణంగా మటుమాయమవ్వడం మామూలు సమస్యేం కాదని వేరే చెప్పనవసరం లేదనుకుంటాను! విషయం మీకర్థమయ్యింది కదా!!

22. దీదాత్

“కన్న' (పుట్టిన) - 'సృష్టించబడిని కాదు

ఏసు ఒక్కడే దేవుని కన్న కొడుకు', కన్నబిడ్డ కానీ సృష్టించబడిన బిడ్డకాదు. క్రింద ఇవ్వబడ్డ వాక్యాన్ని ఆసరాగా వాడి, ఇలానే సదాచార ప్రశ్నోత్తర సారాంశంగా కన్న కుమారుడని తీసుకోవడం జరిగింది.

2. “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను” (యోహాను 3:16).

మున్ముందు మతం మార్పిడి చేసుకునే వారికి ప్రచారం చేసేటప్పుడు కాస్త బుర్రవున్న ఏ మతప్రబోధకుడు కూడా ‘తండ్రి యొక్క ఒక్కగానొక్క కన్న కొడుకు' అని చెప్పడు. బైబిలు పున:పరిశీలకులు ఈ “కన్న BEGOTTEN అనే పదాన్ని తీసివేశారు. దానికి కారణం తెలుపకుండానే చర్చీ ఎలుకల్లా చడీచప్పుడూ లేకుండా చేసిన ఈ రహస్యపరమైన తీసివేతను, మార్పును గురించి ఏమీ పలకరు. ఈ దైవదూషిత ‘కన్న Begotten అన్నపదం బైబిల్లో నూతనంగా కల్పించిన పదం. ఈ నూతన మార్పును, దైవదూషణను వెనువెంటనే దేవుడు కఠినమైన పదాలతో ఖండించేసాడు. దాదాపు 2000 ఏళ్ళవరకూ “బైబిలు పండితులు గ్రహించేందుకని ఆగలేదు. కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నాడు అనివారు అంటారు:

ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు. కరుణామయునికి సంతానం వున్నదని వారు చేసే వాదన కారణంగా త్వరలోనే ఆకాశాలు పగిలిపోతాయేమో, భూమి బ్రద్దలౌతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినైనా కుమారునిగా చేసుకోవటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు” (పవిత్ర ఖురాను 19:88-92)

జవాబు

పాపం దీదాత్ యోహాను 3:16 అనువాద అంతరాలను పట్టుకొని వేలాడ చూసాడు కానీ మళ్లీ తాడు తెగింది, యోహాను 3:16 లోని “మోనో-జీన్” అనే మాట, రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్ లో 'అద్వితీయ' అని ఆథరైజ్డ్ వర్షన్ లో “కన్న” అని అనువదించబడినా, గ్రీకులో మాత్రం అన్ని ప్రతులలోనూ “మోనో-జీన్” అనే పదమే వాడబడింది. ఏ గ్రీకు ప్రతిలోనూ మరే మాట వాడబడలేదు. కాబట్టి ఇక్కడ బైబిల్ మూల పాఠములో ఏదైనా సవరింపు చేయబడిందనడానికి ఈ ఉదాహరణ సరైన నిదర్శనం ఎంత మాత్రమూ కాదు. ఇది అనువాదంలో వున్న సమస్యే కానీ మూల పాఠ్య ప్రామాణికతకు సంబంధించిన సమస్య కానే కాదు. మూల భాషలోని పాఠ్యములో ఏదైనా కలపబడిందని కానీ, తీసివేయబడిందని కానీ నిరూపించేలా ఇక్కడ ఎలాంటి ఆధారము లేదు.

అన్నట్లు 'అద్వితీయ' అనే మాట ‘మోనో' అనే మాటను మాత్రమే అనువదిస్తుంది; కానీ 'మోనో-జీన్' అంటే 'అద్వితీయ-కన్న కుమారుడు అని భావం. కాబట్టి ఆథరైజ్డ్ వర్షన్లో వున్నదే సరైన అనువాదం అందుకే దీదాత్ ఊహించిన విధంగా ఈ సందర్భం బైబిల్ ను ఖురానుకు ఒక యించుకైనా చేరువ చేయలేదు. యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కన్న కుమారుడనే సత్యాన్ని యోహాను 3:16 తో పాటుకీర్తనలు 2:7 ,అపోస్తలుల కార్యములు 13:33 , హెబ్రీ1:5 ,5:5, తదితర వచనాలు రూఢి పరుస్తున్నాయి. అయితే ఒక చిన్న మనవి. కన్న అనే మాట చూసిన వెంటనే దానిపై విరుచుకు పడడం మాని, అది ఏ భావంలో వినియోగించబడిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం ముస్లింలకు శ్రేయస్కరం. యేసుక్రీస్తు కుమారత్వాన్ని ప్రశ్నిస్తూ దీదాత్ వినియోగించిన ఖురాన్ ఆయత్తుల పై పౌలు చెప్పినదే అంతిమ తీర్పు.

“మేము ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూత యైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేమిది వరకు చెప్పిన ప్రకారమిప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరియొకటి ఎవడైనను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్థుడవును గాక ” (గలతీ 1:8,9).

మరో సందర్భంలో వ్యంగ్యంగా మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు యిలా సెలవిచ్చాడు:

“ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే (2 కొరింథీ 11:4).

“సహించుట యుక్తమే” అని యిక్కడ విపరీతార్థంలో చెప్పబడిందని సందర్భాన్ని చదివితే స్పష్టమౌతుంది. అలాంటి వారిని కూడా సహిస్తే యిక బాగుపడినట్లే అంటూ అపొస్తలుడు వ్యంగ్యమాడుతున్నాడు. పై బైబిల్ వచనాలు ఖురాన్ బోధించే మరియొక సువార్త' మరియు “మరియొక క్రీస్తు” నేపథ్యములో మొహ్మద్ కు నిర్వివాదంగా వర్తిస్తాయి. కాబట్టి ఏదో విధంగా మొహ్మద్ ను బైబిల్ ప్రవచనాలలో యిరికించాలని ప్రయాసపడే దావా ప్రచారకులు యిక కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.

చనుపాలు త్రాగుట గూర్చి ఖురాను నుండి తప్పిపోయిన ఆయత్తు

“ఆయేషా తెలిపిన ప్రకారం: పది మార్లు భార్య చనుపాలు త్రాగుట వలన ఒకని వివాహము ఆమెతో రద్దవుతుందని, అతడు ఆమెకు కుమారునిలా అవుతాడని, ఖురానులో మొదట బయలు పరచబడి, ఆపై పదిమార్లు' అనునది రద్దు చేయబడి ఐదుమార్లు అని మార్చబడింది. అల్లా అపొస్తలుడు మరణించక మునుపు ఇది ఖురానులో భాగముగా వుండినది కనుక ముస్లీమ్లు దీనినివల్లించే వారు. (సాహిహ్ ముస్లిం బుక్8, సంఖ్య 3421).

మొహ్మద్ వారి అతి ప్రియురాలైన భార్య అతి ప్రామాణికమైన సహి హదీసులో సాక్షీకరించిన ఈ అసభ్యకరమైన ఆహాత్, భద్రముగా దాచబడిన ఏదైనా ఒక ఖురాన్ ప్రతిని ఏ ముస్లిం అయినా నేడు మాకు చూపించగలడా?

ప్రియ ముస్లిం మిత్రుడా, నిన్ను సవాలు చేసి అవమానపరచడానికి ఈ మాట అడగడం లేదు. నీకు కనువిప్పు కలుగుతుందనే యదార్థ వాంఛతో ఈ సత్యాన్ని నొక్కి చెబుతున్నాను. మొహ్మద్ కాలము నుండి ఎలాంటి మార్పులు చేర్పులు జరగని ఖురాన్ నేడు అందుబాటులో వుందనుకొని నిన్ను నీవు భ్రమపరచుకోవడం మానితే మంచిది. భద్రముగా కాపాడబడిన దైవ వాక్యం బైబిల్ తప్ప మరొకటి లేదు.

23. దీదాత్

క్రైస్తవులు వేసిన తప్పుడు లెక్కలు

“ఆకాశమున సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, తండ్రి, వాక్యము మరియు పరిశుద్ధాత్మయు, ఈ ముగ్గురు ఏకీభవించివున్నారు” (యోహాను మొదటి పత్రిక 5:7).

సర్వసంగ్రహ నిఘంటువు (Encylopedia) అనబడే బైబిలు గ్రంథంలో, క్రైస్తవులు పలికే తమ పవిత్ర త్రిత్వ సిద్దాతానికి (TRINITY8) అత్యంత దగ్గరి వాక్యమిది. కానీ పున:పరిశీలన చేసుకున్న రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ (RSV) లో ఎలాంటి దగ్గరి రూపురేఖలూ లేకుండా పైవాక్యం మార్చివేయబడింది. ఆంగ్లభాష పలికే (చదివే) వారికై వ్రాసిన ఈ RSV (పున:పరిశీలన గావించి స్థిరంచేయబడ్డ పాఠ్యభాగం) బైబిల్లో ఈ పవిత్రమైన మోసం అతి గౌరవపరంగానే జరిగింది. కానీ ప్రపంచంలోని మిగిలిన 1499 భాషాలోకాలకు తమ తమ భాషల్లో ఈ తంతు విషయం తెలీదు. ఈ మోసపూరితమైన మార్పు అలానే ఉండి పోయింది. వాస్తవానికి ఈ సత్యం ప్రజలకు తీర్పుదినం వరకూ తెలియకుండా వుండిపోతుంది. కాని ముస్లింలైన మనం, మరోమారు ఇంగ్లీషు RSV నుంచి ఈ పండితులు చేసిన పనిని బాగా మెచ్చుకోవాలి. ఎందుకంటే వారి ఈ కృషి తమ పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్లాం పాఠ్యాలకు మరో అడుగు దగ్గర చేస్తుంది కాబట్టి “ముగ్గురు” అని అనకండి. ఇలా అనడం మానివేయ్యండి ఇది మీకే శ్రేయస్కరం అల్లాహ్ ఒక్కడే దేవుడు (పవిత్ర ఖురాన్ 4:171)

జవాబు

అలగ్జాండ్రియా వ్రాతప్రతులలో 1 యోహాను 5:7లోని పూర్తి వచనము ప్రారంభము నుండి లేదు. రివైజ్డ్ వర్షన్ దాని అనువాదం. అయితే అంతియొక వ్రాతప్రతులలో మొదటి నుండే ఆ వచనము పూర్తిగా వుంది. ఆథరైజ్డ్ వర్షన్ (కింగ్ జేమ్స్ వర్షన్) దాని అనువాదం. కనుక ఆర్.ఎస్.వి లో లేనంత మాత్రాన అది మార్పు కాదు. కె.జె. వి. లో వున్నంత మాత్రాన అది చేర్పుకాదు. పైగా, ఏ వ్రాతప్రతిని అనువదించినా, అనువాదకులు విశ్వాస్యతను కనబరచారని, ఒక దానితో సమన్వయపరచే ఉద్దేశంతో మరొక దానిని మార్చే దుశ్చర్యకు క్రైస్తవ సమాజమెప్పుడూ పాల్పడలేదని నిరూపించడానికి ప్రస్తుత సందర్భం ఒక చక్కటి తార్కాణం. అయితే 15వ పాయింట్లో వున్న మా జవాబులో “బైబిల్ పాఠ్యాంతరాల వాస్తవికత” అనే హెడింగ్ క్రింద మేము చర్చించిన వాస్తవాల వెలుగులో 1 యోహాను 5:7 ను ఆలోచిస్తే, ఆథరైజ్డ్ వర్షన్ వున్న పూర్తి వచనాన్నే సరియైందిగా పరిగణించాలి. ఇక్కడ పూర్తి వాస్తవాలను పాఠకులకు అందించకుండా వారిని తప్పు త్రోవ పట్టించే దీదాత్ ఉద్దేశం మరొకసారి కొట్టొచ్చినట్లుగా బహిర్గతమౌతుంది. ఈ పాఠ్యాంతరాల వెనుక వున్న వాస్తవాలను పూర్తిగా పరిశీలించకుండా, ఆర్.ఎస్.వి ఈ వచనాన్ని మార్చేసిందని, ఈ మార్పు బైబిల్ ను ఖురానుకు కొంత చేరువ చేసిందని, ఇలా ఏవేవో చెప్పి, మొత్తానికి దీదాత్ తన పాండిత్య లోపాన్ని బయట పెట్టుకున్నాడు.

ఇక్కడ గమనించదగినదేమిటంటే, కె.జె. వి. లో వున్న పూర్తి వచనం ఆర్.ఎస్.వి. లో లేని ఎలాంటి కొత్త సిద్ధాంతాన్ని బైబిల్ లోనికి ప్రవేశపెట్టలేదు. అలాగే ఆర్. ఎస్.వి లో వున్న అసంపూర్ణ వచనం కె.జే.వి లో వున్న ఏ సిద్ధాంతాన్ని లేశ మాత్రమైనా ప్రభావితం చేయలేదు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్యాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నమేమి దీదాత్ లబ్ది పొందజూసిన ఈ పాఠ్యాంతరము వలన నిరూపితమవ్వలేదు.

ఆ సురాలు ఏమయ్యాయి! పోయాయా?పోగొట్టారా?

“అబు హర్చ్ బి. అబు అల్-అస్వాద్ తన తండ్రి వద్ద విన్న సమాచారాన్ని ఈ విధంగా వెల్లడించాడు. అబు మూస అల్-అశాన్ ఒక దినాన బస్ర లో ఖురాన్ వల్లించే వారిని పిలువనంపాడు. వారు దాదాపు మూడు వందల మంది ఆయన యెదుట హాజరయి ఖురాన్ వల్లించగా వారిని సంబోధిస్తూ ఆయన ఇలా అన్నాడు.

“మీరు ఖురానును వల్లిస్తున్నందున బసలో వున్న వారందరికన్నా మీరే శ్రేష్టులు. ఐతే, మునుపు మీవలే వల్లించిన వారికి సంభవించినట్లు, అధిక కాలము వల్లించడము బట్టి మీ హృదయములు కఠినమైపోకుండా జాగ్రత్త వహించండి. మేమొక సురాను యిది వరకు వల్లించేవారము అది సుదీర్ఘతలోనూ గంభీరతలోనూ సుర అల్బారాత్ ను పోలియుండేది. అయితే ఈ చిన్న మాట తప్ప అందులో వున్న దేదియు నాకు జ్ఞాపకము లేదు. ఐశ్వర్య భరితమైన రెండు లోయలు కలిగి యుండినా, ఆదాము సంతతి మనస్సు మరో మూడవ లోయ కొరకు కనిపెట్టును. దూళి తప్ప ఏదియు అతని ఉదరమును నింపజాలదు.

అదేవిధంగా సుర ముసాబ్బిహత్ ను పోలిన మరో సురా మేము వల్లించే వారము. అయితే అందులోని ఈ చిన్న భాగము తప్ప అది కూడా నేను మరచిపోయాను ఓ విశ్వాసులారా, మీరు ఆచరించనివి ప్రకటింతురేమి! పునరుత్థానమున వాటి విషయమై మీరు లెక్క అప్పగించునట్లు మీకు విరోధంగా అవి నమోదు చేయబడుచున్నవి” (సాహి. ముస్లిం బుక్ 005, సంఖ్య 2286).

సురా అల్ బరాత్ లేదా సురా అల్తాఫ్ బాను (యివి సుర 9 కు గల రెండు పేర్లు) పోలిన సురాలో కనీసం 129 ఆయత్లు వుండుండాలి. పై ఆధారాన్ని పరిశీలిస్తే, అలాంటి సురా ఒకటి నేటి ఖురాన్ నుండి తప్పిపోయిందన్న మాట. అంతేకాదు ముసబ్బిహత్లలో (అనగా 17, 57, 59, 61, 62, 64 మరియు 77 వ సురాలలో) ఒక దానిని పోలిన సురా కూడా నేటి ఖురానులో జాడతెలియకుండా పోయిందని స్పష్టముగా తెలుస్తోంది. బైబిల్లో ఏదో ఒక వ్రాతప్రతిలో కనిపించని చిన్న మాటను చెరిపివేతగానూ విశ్వసనీయమైన యితర ప్రతులలో అవి వుండటాన్ని చేర్పులుగానూ చిత్రీకరించి కాకి గోల పెట్టిన దీదాత్, వందలాది వచనాలు ఖురాన్ నుండి మాయమైపోయిన అద్భుతాన్ని ఏ మాత్రం ప్రస్తావించకుండానే, ఆ గ్రంథము బయలుపడిన నాటి నుండి నేటి వరకు భద్రముగా దాచబడిందని నమ్మించడానికి చేసిన ప్రయత్నంలో దాగియున్న మోసాన్ని పసిగట్టగల్గితే ఇతడు నమ్మదగని జిత్తులమారి అని, ఇతని ఉరుములన్ని నీళ్లులేని మేఘాల వంటివని పాఠకులు ఒప్పుకుంటారు. అన్నట్లు బైబిల్ లోని ఒకవ్రాత ప్రతిలో లేని మాటలు మరో ప్రతిలో సురక్షితంగా వున్నప్పటికీ, ఖురాన్లో లేని వందల కొలది ఆయత్లు ఎక్కడ వెదికితే కనబడతాయో దావా ప్రచారకులేమైనా చెబితే విని తెలుసుకుంటాముగా! చెప్పరే మరి? పాఠ్యాంతరాలను దహించివేయాలని తలంచే విజ్ఞులెవ్వరూ సంఘములో లేకపోవడం క్రైస్తవుల అదృష్టమనే చెప్పుకోవాలి.

24. దీదాత్

ఆరోహణ (స్వర్గారోహణ)

పున:పరిశీలన చేసి మార్పు చెందిన RSV బైబిలు గ్రంథకర్తలు, అనువాదకులు“ఆ గంభీరమైన తప్పులలోంచి సరిదిద్దే ప్రయత్నం చేసిన మరో వాక్యం (విషయం) ‘ఆరోహణ' (ఆకాశంలోనికి ఏసు లేవనెత్తబడడం) అన్నది.

ఈ క్రైస్తవ ప్రపంచపు అత్యద్భుతకరమైన సంఘటన, (ఏసు ఆకాశానికి ఎత్తబడుట అనేది) ధర్మశాస్త్రకోవిదులు, సువార్తీకులైన- మత్తయి, మార్కు లూకా, యోహానులలో రెండుచోట్ల మాత్రం ఉచ్ఛరించబడింది. ఈ రెండు రిఫరెన్సులు 1952 వరకూ ప్రతి భాషలోని ప్రతి బైబిల్లోనూ ఇవ్వబడినవే (అంటే RSV పాఠ్యభాగం ఉనికిలోనికి వచ్చేముందు వరకూ) ఇవి ఇలా ఇవ్వబడ్డాయి:

4ఎ. “ఈలాగున ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చబడి, దేవుని కుడి పార్శ్వమున ఆశీనుడయ్యెను.” (మార్కు 16:19)

4బి. “వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.” (లూకా 24:51)

ఇప్పుడు, ప్రక్కన ఇవ్వబడిన ఫోటో కాపీలో 4ఎ కొటేషన్ పైభాగం చూడండి. మీకు ఆశ్చర్యం వేయక తప్పదు. మార్కు 16వ అధ్యాయం 8వ వాక్యానికే అంతమైపోతుంది. తర్వాత ఒక వింతైన ఖాళీజాగ ఇవ్వబడి ఉంటుంది. ఆ తర్వాత పేజి చివరన పైన ఇవ్వకుండా పోయిన వాక్యం అతి చిన్న అక్షరాలతో కన్పిస్తుంది. మీకు 1952 పునఃపరిశీలన గావించబడ్డ RSV బైబిలు పాఠ్యభాగం దొరికితే పరిశీలించండి. ఈ విషయం చివరి ఆరు పదాలు 4బి (పైనవి) and was carried up to heaven (స్వర్గానికి ఆరోహణుడయ్యెను లేదా పరలోకమునకు చేర్చుకోబడెను అన్నవి) ఒక చిన్న (ఎ) చిహ్నమిచ్చి క్రింద ఫుట్ నోట్ గా ఇవ్వబడ్డాయి.

ఏ సదాచార క్రైస్తవుడైనా ఏ బైబిల్లోని ఫుట్ నోట్ క్రింద ఇచ్చిన పదాలను దైవవాక్యమని ఎంచడు. మతం మౌలిక అంశాలతో ఈ మహా అద్భుతాన్ని, జీతం తీసుకుని ప్రచారంచేసే మిషనరీలు ఎందుకో ఒక ఫుట్ నోట్లో పడేశారు.”

జవాబు

చెరిపివేయబడ్డాయని దీదాత్ ఆరోపించిన మార్కు 16:19 మరియు లూకా 24:51, అలెగ్జాండ్రియ వ్రాత ప్రతులలో లేని కారణాన ఆర్.ఎస్.వి.లో లేవు తప్ప బైబిల్లో లేవని చెప్పడానికి యిది చాలిన ఋజువు కాదు. ఆర్.ఎస్.వి.లో లేనంత మాత్రాన ఏ వాక్యభాగాలను ప్రశ్నాస్పదమైనవని భావించనవసరం లేదని యిదివరకే వివరించాను కనుక, ప్రభువు ఆరోహణానికి సంబంధించిన ఈ రెండు వాక్యభాగాలు విశ్వసనీయమైనవేనని వేరే చెప్పనవసరం లేదు. అయితే యిక్కడ మార్కు మరియు లూకా గ్రంథాలలో వున్న ఈ రెండు వాక్యాలు తప్ప నాలుగు సువార్తలలోనూ ప్రభువు ఆరోహణం గురించిన ప్రస్తావన ఎక్కడా చేయబడలేదని దీదాత్ చేసిన పై ప్రకటన తప్పుత్రోవ పట్టించాలనే అతని మోసపు ఉద్దేశాన్ని మరొకసారి బట్టబయలు చేస్తుంది. నాలుగు సువార్తలలోనూ వున్న ప్రభువు స్వర్గారోహణకు సంబంధించిన అనేక వచనాలు, దీదాత్ ఒక అబద్దీకుడని, అబద్దాన్ని ప్రేమిస్తే తప్ప అతని మాటలు పట్టించుకోవద్దని బిగ్గరగా హెచ్చరిస్తున్నాయి. యోహాను సువార్తలోనే ప్రభువు ఆరోహణాన్ని గురించి కనీసం పదకొండు వచనాలున్నాయి. ఒక్క ఉదాహరణ చూడండి:

“యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లి-నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వానియొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుమనెను” (యోహాను 20:17).

అలాగే లూకా తన సువార్తతో పాటు “అపోస్తలుల కార్యములు” అనే గ్రంథాన్ని కూడా రచించాడు. ఇందులో ప్రభువు స్వర్గారోహణాన్ని తెలియచేస్తూ ఇలా ప్రకటించాడు:

... వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను ” (అపొ.కా.1:9)

అంతే కాక మత్తయి మరియు మార్కు యేసు పరలోకము నుండి దిగి వస్తాడని ప్రకటించడం మనకు తెలిసిందే (మత్తయి 26:64 , మార్కు 14:62 ). స్వర్గారోహణం జరగందే అక్కడినుండి దిగిరావడం ఎలా అని ఆలోచించే యింగితం కూడా సర్వలోకజ్ఞానిగా చలామణియైన దీదాత్ కు లోపించడం యిక్కడ గుర్తించదగ్గ విశేషం.

ఈ ఆయత్తుల అదృష్టం బాగున్నట్లుందే!

సురా 53:11-13 ప్రకారం మొహమ్మద్ అల్లాను చూశాడు. ఎన్నో సమస్యాస్పదమైన భాగాలను ఖురాను నుండి స్వాహా చేసినా ఉస్మాన్ కంట పడకపోవడం ఈఅయత్తుల అదృష్టమే అనీ చెప్పుకోవాలి. ఈ ఆయత్తులు ఖురానులో వుండడం ఆ గ్రంథానికి, దాని గ్రంథకర్తకూ ఏ మాత్రం శ్రేయస్కరం కానప్పటికీ యివి ఉ స్మాన్ దహనకాండను తప్పించుకోగలిగాయంటే అదృష్టం కాదా మరి!!! ఇంతకు ఈ ఆయత్తులలో వున్న సమస్య ఏమిటని ఆలోచిస్తున్నారా? అల్లాను చూడడం అసాధ్యమని ఖురాన్ (సురా 6:103, 42:51) ప్రకటించడంతో పాటు, మొహమ్మద్ అల్లాను చూశాడని సెలవిచ్చే వారెవరైనా పచ్చి అబద్దికులని సాహి హదీసులు కూడా నిగ్గు తేల్చేశాయి.

“అయేషా యిలా అన్నది: మొహమ్మద్ తన ప్రభువుని చూశాడని ప్రకటించేవాడు అబద్ధికుడు” (సాహి అల్ బుకారి, వాల్యూమ్ 6, బుక్ 60).

“అల్లా సందేశహరుడు యిలా సెలవిచ్చాడు: “ఆయన వెలుగయున్నాడు నేనాయనను ఎలా చూడగలను” (సాహి ముస్లిమ్ బుక్ 1)

సురా 53:11-13 అబద్దమని, ఇదొక అబద్దికుని సాక్ష్యమని పై ఋజువుల వెలుగులో బహిర్గతమైన దరిమిలా ఈ వచనాలను ఖురాను నుండి ఎందుకు చెరిపివేయకూడదు? అన్నట్లు యివి ఖురాను లోనికి ఎలా చొరబడినట్లు!! ఏ పొరపాటును దానిని సమీపించజాలదు గదా!!! ఉస్మాన్ గమనించలేదో మర్చిపోయాడో తెలియదు కానీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఆయనను మించిన దావా ప్రచారకులెందరినో నేడు మనము చూస్తున్నాము కదా. వారు యితర మతస్థులపై తొడ గొట్టడాలు మానుకొని యిలాంటి విషయాలలో ఉస్మానుకు కొంచెం సహాయపడితే మంచిదని మా సలహా. “తప్పు తప్పు! చెరపకూడదు! అది ఖురానులో భాగం కదా!” అనుకుంటే జాగ్రత్త సుమా! అది ఖురాన్ రచయిత ఒక అబద్దీకుడని ఒప్పుకొన్నట్లవుతుందట! అయేషా ఏమంటుందో విన్నారు కదా?

25. దీదాత్

“The Origin And The Growth of English Bible (ఆంగ్ల బైబిలు పుట్టుక, దాని పెరుగుదల) అనే చార్ట్ లో మీరు గమనించగలరు- బైబిలు పాఠాంతరాలన్నీను (1881లోని పునఃపరిశీలన చేసి స్థిరపడిన RSV బైబిలుకు ముందువి. అన్నీను) ఏసు జీవిత కాలానికి 5 లేక 6 వందల సంవత్సరాల తరువాతవి. RSV 1952 పున:పరిశీలకులే ఏసు తరువాత 3 లేక 4 వందల మధ్య కాలపు అత్యంత ప్రాచీన ప్రతులను మొట్టమొదటిసారిగా కనుగొన్న బైబిలు పండితులు. ఏ దస్తావేజుఅయినా అసలు మూలమైన దానికి ఎంత దగ్గరి కాలం లోనిదైతే అంత ఎక్కువ ప్రామాణికతను కలిగి వుంటుందని మనం ఒప్పుకోవాలి. ప్రాచీన ప్రతులు' అన్న వాటికంటే అత్యంత ప్రాచీన ప్రతుల'న్నవే విశ్వాసయోగ్యమైనవి. కనుకనే, “ఏసు ఆకాశానికి లేవనెత్తబడ్డాడన్న సరైన పదజాలమే అత్యంత ప్రాచీన ప్రతుల్లో లభించనందువల్ల క్రైస్తవ ఫాదరీలు RSV 1952 (పున:పరిశీలన చేయబడి స్థిరపడిన పాఠ్యభాగం) లోంచి కొట్టిపారేశారు.”

జవాబు

ప్రాచీనమైన వాటికంటే అత్యంత ప్రాచీనమైనవే ఎక్కువ ప్రామాణికత గల దస్తావేజులు అన్న దీదాత్ వాదనలో వున్న లోపాన్ని 11 మరియు 15వ పాయింట్లలో వున్న నా జవాబు వెలుగులో సునాయాసంగా గుర్తించగలరు. ప్రామాణికతకు అవి పరస్పరం సహకరిస్తాయే తప్ప పోటీపడవు. అలా సహకరించే దస్తావేజులు లేకపోవడమే యిప్పుడు తాము దివ్యమని భావించే తమ గ్రంథ ప్రామాణికతను సవాలు చేసే అతి పెద్ద ప్రమాదమని ఇక్కడి వరకు నా జవాబు చదివిన ముస్లింలెవరైనా ఒప్పుకోక తప్పదు.

26. దీదాత్

“గాడిద చాకిరి”

ఏసుక్రీస్తు ఆరోహణను గురించి పవిత్రాత్మతో ఉత్తేజితులైన ధర్మ బద్దులైన సువార్తీకులు, ఒక్కపదం కూడా వ్రాయలేదన్నది క్రైస్తవ ప్రపంచంలోని ఒక వింత ఒప్పుకోలు.

అయినా, “ఆయన కార్యక్రమం అంతిమదశకు చేరుకోబోతున్నప్పుడు వారి ప్రభువు, రక్షకుడు ఒక గాడిదపై ఎక్కి జెరూసెలేములో ప్రవేశించాడన్నది మాత్రం ఆ ఉత్తేజితులైన సువార్తీకులందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారు.

మత్తయి 21:7

మార్కు 11:7

లూకా 19:35

యోహాను 12:14

“ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని “వారు ఆ గాడిద పిల్లను యేసు వద్దకు వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా తోలుకొని వచ్చి, తమ బట్టలు దానిపై ఆయన బట్టల మీద కూర్చుండెను.” వేయగా, ఆయన దానిపై కూర్చుండెను.”

“తరువాత వారు యేసు వద్దకు దానిని “ఇదిగో నీ రాజు గాడిదపై ఆశీనుడై వచ్చుచున్నాడు” తోలుకుని వచ్చి, ఆ గాడిద పిల్లమీద తమ బట్టలు వేసి, యేసును దానిపై ఎక్కించి....”

సర్వేశ్వరుడైన దేవుడే బైబిలు గ్రంథకర్త అయితే పవిత్ర నగరానికి, తన కుమారుడి గాడిద సవారీలాంటి అసంగతమైన, అల్పమైన సంఘటనను అందరు సువార్తీకుల చేత వ్రాయించి, తన కుమారుడు దైవదూతల రెక్కలపై నెక్కి స్వర్గారోహణ చేసిన అత్యద్భుత వార్తను, తన ఉత్తేజపూరితులైన సువార్తీకుల చేత ఎలాకొట్టి వేయించాడు?”

జవాబు

యేసు క్రీస్తు స్వర్గారోహణ గురించి సువార్తీకులు ఒక మాటైనా వ్రాయలేదన్నది దీదాత్ చేసిన తప్పుడు చిత్రీకరణే తప్ప నిజం కాదని నేనిది వరకే ఋజువులతో సహా నిరూపించాను (24వ పాయింట్కు రాసిన జవాబు చూడండి). అయితే యిక్కడ ఒక విషయం. ప్రభువు గాడిదపై స్వారీ చేయడం అసంగతమైన సంగతి కానీ అల్పమైన సంఘటన కానీ ఎంత మాత్రమూ కాదు. మెస్సీయా జీవితములో నెరవేరవలసిన ఒకానొక ప్రాముఖ్యమైన ప్రవచన నెరవేర్పుగా యిది యేసుక్రీస్తే ఆ మెస్సీయా అని నిరూపిస్తుంది (జెకర్యా 9:9 ,మత్తయి 21:4-5 ) కాబట్టి సువార్తీకులందరు దీనిని ప్రస్తావించడం ఉచితమే.

27. దీదాత్

చాలాకాలం వరకు ఆగలేదు

సువార్త ప్రచారకులకు, బైబిలు వ్యాపకులకు ఇందులోని అసలు మర్మం ఇంకా అంతుపట్టలేదు. తమ ప్రబోధనల్లోని 'మూల పడేసిన రాయి (Cornerstone)గా మారిన ఈ 'ఏసు ఆరోహణ' క్రైస్తవ బైబిలు RSV మార్పుల వల్ల చులకన చేయబడ్డం చూసి, ఆ తప్పును గ్రహించే లోపలే RSV పాఠ్యభాగం బైబిలు అమ్మకంలో 15000000 (15 మిలియన్) డాలర్ల లాభాన్ని గడించివేసింది. అంత విరివిగా తప్పులున్న గ్రంథం అమ్ముడు పోయిందన్నమాట! 50 విభేదవర్గసమాజాల్లోంచి రెండు వర్గాల ప్రబోధకులు రచ్చారావిడీ చేయగా ప్రచురణవేత్తలు మళ్లీ కొత్తగా కూర్పుచేసి ఆ ఉత్తేజపూరితమైన దైవ పదం “స్వర్గారోహణ'ను తమ 1952 లోని కొత్త RSV ఎడిషన్లో చేర్చడం జరిగింది. పున:పరిశీలన, పున: పున: పరిశీలన చేసుకుంటూ పోయిన బైబిలు మూల ప్రతులు తమ దైవగ్రంథం, దైవవాక్కు తమకు అందిన నాటినుంచే దాన్ని మాటిమాటికి పున:పరిశీలన చేసి మార్చుతూపోవడం క్రైస్తవులకూ, యూదులకూ పాత ఆటే! అసలు విషయాలను మసిపూసి మారేడుకాయగా మార్చడం, మెరుగుదిద్ది బంగారమని చెప్పడం, గ్రంథానికి ముందుమాట” విషయార్థానికి ఫుట్ నోట్లు (క్రింద ఇచ్చే ఫుట్ నోట్లు) ఇవన్నీ ప్రాచీన దస్తావేజుదారులకు గ్రంథకర్తలకు తెలీవు. తెలిసుంటే వాళ్లు కూడా నేటి తప్పుడు దస్తావేజుదారుల్లాగానే మార్చి, ఏర్చి, కూర్చి ఏవేవో సాకులు చెప్పివుండేవారు.

కాలిన్సు బైబిలు (Collins, Version) పేజి 6,7 లో ఇవ్వబడిన “ముందుమాట'లో ఇలా వుంది:

“పెక్కు వ్యక్తులు ఎన్నో మార్పుల కోసం ఎన్నో సలహాలు కమిటీకి సమర్పించారు. రెండు వర్గాలను తప్పించి, కమిటీ అందరి సలహాల గురించి జాగ్రత్తగా శ్రద్ద చూపడం జరిగింది”.

గ్రంథంలోని రెండు భాగాలలో పెద్దది మార్కు 16 :9-20 తో అంతమయ్యేది... లూకాలో 24:51, మళ్లీ చేర్చడం జరిగింది. కూర్చడం చేర్చడం ఎందుకు? అంతకు మునుపు కొట్టివేయబడ్డాయి గనుక! మరి స్వర్గారోహణ' విషయం ముందెందుకు తీసి వేయబడింది? అత్యంత ప్రాచీన ప్రతుల్లో ఆ విషయం లేదు గనుక'. యోహాను మొదటి పత్రికలోని 5:7 లోని త్రిత్వం' విషయంలాగ మధ్యలో చేర్చబడిన పదజాలం (ఇంతకుమునుపు మనం చూపించాం) ఒకదాన్ని తీసివేసి, మళ్లీ మరోదాన్ని చేర్చడమెందుకు? ఆశ్చర్యపడకండి! ఇదంతా మీరు చదివి RSV (పున: విమర్శన చేసి స్థిరం చేసిన పాఠ్యభాగం) ఒకటి తీసుకునే లోపల ఆ పవిత్ర కమిటీ ఆ ముందుమాట' మొత్తం తీసివేసి, మరేదైనా వ్రాసివుంటే ఆశ్చర్యపడాల్సిన పనేలేదు.

జెహోవా వీటినేసెస్ క్రైస్తవ సమాజమైతే తమ 'ముందు మాట'లోని ఒకనాటి అతి గంభీరమైన 27 పేజీలు నేడు తొలగించివేసి యున్నది. వారి నేటి నూతన నిబంధనల పేరు New World Translation Of The Christian Greek Scriptures (క్రైస్తవ గ్రీకు గ్రంథాల నూతన ప్రపంచ అనువాదం).”

జవాబు

ఏ వాక్య ప్రామాణికతనైనా నిర్ధారించేందుకు ఆర్.ఎస్.వి. పున:పరిశీలకులు ఏం చేశారన్నది గీటురాయి కాదని ముందు గుర్తించాలి. వారి పున:పరిశీలనలోని కొట్టివేతలు కూర్పులు ఆర్.ఎస్.వి. కి మాత్రమే పరిమితం తప్ప, ప్రామాణికతకు ఆధారమైన మూలప్రతులను అవి ఏ విధంగానూ ప్రభావితం చేయవు. అయితే గమనించదగ్గ విషయమేమిటంటే, ఆర్. ఎస్.వి పున:పరిశీకులు తాము చేసినదంతా నిజాయితీతో ప్రకటించి, తమ అనువాదమే వేదమని భావించకుండా పరిశోధించి తెలుసుకొనేలా ప్రోత్సహించి తమ పారదర్శకతను చాటుకున్నారు. దీనిని దీదాత్ దేవుని వాక్యములో చేయబడిన సవరణలుగా చిత్రీకరించడం అతని అపరిపక్వతే తప్ప యిక్కడ చింతించతగ్గ సమస్యేమీ లేదు. అన్నట్లు ఆర్.ఎస్.వి అనువాదానికి ఆధారమైన అలగ్జాండ్రియా మూలప్రతుల కంటే, అంత ప్రాచీనము కానట్లు భావించబడే అంతియొక వ్రాతప్రతులనే ఎందుకు అధిక ప్రామాణికత గలవిగా భావించాలో నేను యిది వరకే 15వ పాయింట్లోని నా జవాబులో స్పష్టం చేశాను. కాబట్టి అంతియొక వ్రాతప్రతులలో ఎప్పుడూ సురక్షితంగా దాచబడిన ఈ స్వర్గారోహణ సంబంధమైన వాక్యాలు ప్రామాణికమైనవి కావని చెప్పేందుకు దీదాత్ అజ్ఞానం తప్ప వేరే ఆధారాలేమీ లేవు.

ఏదో మా ఉస్మాన్ చేసినట్లు మార్చి పూడ్చక, పాఠ్యాంతరాల వాస్తవాలను వున్నదున్నట్లు లోకమంతటికి తెలియనివ్వడమేమిటి? అంత నిజాయితీ పనికి రాదని బహుశా దీదాత్ హితవు పలుకుతున్నాడేమో!!

28. దీదాత్

“అత్యంత గౌరవనీయుడు Rev. C.I. Scofield, D.D. (స్కొఫీల్డ్), అందరూ DD లే అయిన తన 8 మంది సలహాదారుల సంగ్రహ కమిటీతో కలిసి, స్కాఫీల్డ్ రిఫరెన్సు బైబిల్లో దేవుడు అన్నదానికి హిబ్రూ పదమైన 'ఎలాహ్” (ELAH) ను సరిగా ఎలా ఉచ్చరించాలో అని అది నిరూపించాడు. ఇక క్రైస్తవులకు మాత్రం ఒక ఒంటెను మ్రింగినట్లయింది. ఏమయినప్పటికీ దేవుని పేరు హిబ్రూ మాతృకలో అలాహ్' అని ఒప్పుకోక తప్పలేదు. అయినా ఉచ్చరించేటప్పుడు మాత్రం 'ల' వత్తు (L) లేకుండా అతి కష్టంగా ఉచ్చరించేవారు. ALAH అన్న పదాన్ని రౌండప్ చేసి చూపించడం జరిగింది. గ్రంథకర్త స్కోఫీల్డు ప్రజాసభల్లో ప్రబోధనలుచేసి విశ్లేషించేటప్పుడు ఆ పదానికి తగు రిఫెరెన్సులు (అన్వయాలు) చూపించేవాడు. మీరు నమ్మండి! తదుపరి Scofield Reference Bible ఆదికాండంలోని ఆ 1:1 విశ్లేషణను ప్రతిపదం, తన తదుపరి ప్రచురణల్లో అలానే వుంచి, ఒక్క పదం ALAH మాత్రం ఎలానో మాయం చేసేసింది. ఆ పదం వుండిన చోటి జాగా కూడా తీసివేయడం జరిగింది. ఇది సదాచార క్రైస్తవుల బైబిలు గ్రంథం, ఇలాంటి ట్రిక్కుల్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకోవడం కష్టం .”

జవాబు

స్కోఫీల్డ్ బైబిల్ అనువాదకులు, 'ల' ఒత్తి పలకకుండానే అల్లా దేవుని పేరని ఒప్పుకున్నారంటూ,ఆదికాండము 1:1 కు ఆ బైబిల్ లో చేసిన వ్యాఖ్యాన పుటనొకదానిని ఫోటోకాపీ చేసి ఋజువుగా మనకందించాడు దీదాత్. వాస్తవానికి ఈ ఫోటో కాపీని మనం గమనిస్తే, చివర ఫుట్ నోట్ లో “ఎలోహిం” (దేవుడు) అనే హీబ్రూ పదము, “ఏల్” (శక్తి ) మరియు” అలాహ్ (ప్రమాణము) అనే రెండు మాటల కలయిక అనే వివరణ యివ్వబడిందే తప్ప, అలాహ్ అంటేనే దేవుడు అని ఒప్పుకున్నట్లు అక్కడ ఎలాంటి సూచన లేదు. “అలాహ్” అన్నది ప్రమాణము అనే అర్థాన్ని స్పురిస్తుందని స్కోఫీల్డ్ కమిటీవారు ఎంతో స్పష్టంగా వివరిస్తే, అది దేవుని పేరని ఒప్పుకున్నారంటూ దీదాత్ ఎవరినీ మోసం చేయాలనుకున్నాడో పాపం! దీదాత్ అబద్ధికుడని, అభాండాలు వేయడంలో తనకు తానే సాటి అని నిరూపించుకోడానికి ఋజువులను తానే స్వయంగా ఫోటో కాపీ చేసి మనకందించడమే యిక్కడ వింత, విశేషం. ఇది చాలదన్నట్లు అలాహ్ అనే మాట, తరువాత ప్రచురితమైన ప్రతులలో చేర్చలేదు కాబట్టి సదాచార క్రైస్తవ బైబిల్లో నుండి అది కొట్టివేయబడిందంటూ అభాండాలు వేసిన దీదాత్, ఏ సదాచార క్రైస్తవుడైనా, ఏ బైబిల్ లోని క్రింద ఫుట్ నోట్లో యిచ్చిన పదాలను దైవవాక్యమని ఎంచడు, అంటూ 24వ పాయింట్లో మనకు నేర్పజూసిన పాఠాన్ని రెండు పేజీలు రాసిన వ్యవధిలో తానే మరచినట్లు లేదూ?

ఇతరులకు నేర్పించాలనుకున్నవి తానే సరి చూసుకొని వుంటే అసలు ఈ పనికిమాలిన పుస్తకాన్ని రాసే దురాగతానికి దీదాత్ పాల్పడి యుండే వాడే కాదని పాఠకులు యిప్పటికే గ్రహించి యుంటారు. ఇంతకు యితని సమస్యేమిటో, ఈదూకుడంతా ఏమి నిరూపించడానికో తెలియదు కానీ, అబద్దానికి జనకుడు సాతాను అని, అబద్దీకులందరు సాతాను సంబంధులని దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథం తీర్పు చెబుతుందని మరచిపోకండి ( యోహాను 8:44 ).

పరిష్కార రహిత ఖురాన్ సమస్యలు

ఖురాన్లో తప్పిపోయాయని ఆధారాలతో సహా నేను చూపించిన అనేక భాగాలు, కనీసం వెదుక్కునే అవకాశం కూడా లేకుండా చేశాడు ఉస్మాన్. తన సంగ్రహంతో విభేదిస్తుందన్న నెపంతో అసలు ఖురానునే మంటకలిపేశాడు ఉస్మాన్. బహుశా తెలియకో లేక తెలిసి కూడా వేరే గత్యంతరం లేదనో, ముస్లిమ్లు యింకా తమ ఖురాన్ వినాశకుడు తమ కందించిన సంగ్రహాన్నే పరలోక రాతిపలకపై అనాది నుండి లిఖితమైన దైవవాక్కుగా భావించి తమను తాము మోసంలో వుండి పోనిస్తున్నారు. ఖురాను తిరిగి పొందలేని విధంగా నాశనమై పోయిందని, అలాంటి నాశనం దేవుని నిత్య వాక్యానికి గల లక్షణం కాదని, దేవుని కాపుదల మరియు భద్రతలో దాచబడిన బైబిల్ గ్రంథమే, సత్య దైవవాక్యమని మా ముస్లిం మిత్రులు గ్రహిస్తే అది వారికే శ్రేయస్కరం.

 

5వ అధ్యాయం

దీదాతను ముస్లిం బైబిల్

పండితునిగా మలచిన

మహాగురువులు

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో “నికృష్టమైన
ఒప్పుకోలు” అనే ఐదవ అధ్యాయానికి మా జవాబు.

29. దీదాత్

“ది సెవెన్త్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ ప్రవక్తురాలు (Prophetess) అయిన శ్రీమతి ఎలెన్ జి వైట్ తన బైబిల్ కామెంటరీ (విశ్లేషణ) VOLI, పేజీ 14లో పరిశుద్ధ గ్రంథంలోని లోప భూయిష్ట స్థితిని గురించి అంగీకరిస్తుంది:

“మనం నేడు చదివే బైబిలు చాలామంది అనుకరణదారుల చేతిపని. వారంతా చాలా సందర్భాల్లో తమ ఈ కార్యాన్ని అత్యంత మహత్తరంగా నిక్కచ్చిగానే చేశారు. అయినా, ఈ అనుకరణదారులు పొరపాట్లు తప్పులు లేని స్థితిగలవారు కారు. కడకు దేవుడు కూడా వారిని పూర్తిగా తమ అనువాదాల్లో, వ్రాతలేఖనాల్లో తప్పులు చేయకుండా కాపాడలేదు.”

ఇంకాస్త ముందుకుపోయిన తర్వాత శ్రీమతి వైట్ ఇలా రాస్తుంది:

“దేవుడు బైబిలు గ్రంథాన్ని ప్రత్యేకంగా కాపాడ్డం గమనించాను” (దేని నుండి?) “కాని ఎప్పుడైతే కొన్ని సందర్భాలలో పదాలు మారాయో వాటిని ఇంక సులభపరచాలని సాదాగా వుంచాలనే ప్రయత్నంలో (అనుకరణ దారులు) మరీ క్లిష్టతరం చేశారు . . . సరళమైన వాటిని తమ ఆచార వ్యవహారాలతో ముందుగానే స్థిరపరుచుకున్న భావాలకనుగుణంగా మలిచి ఇంకా మర్మపూరితం చేసేశారు.”

పెరిగే రోగం

మానసిక రోగమన్నది తెచ్చిపెట్టుకునేదే. ఆ రచయిత్రి, ఆమె అనుయాయులు, నేటికీ బైబిలన్నది వాస్తవంగా ఎలాంటి పొరపాటు స్థితికి లోనుకాని దైవవాక్యమని ఎలుగెత్తి అరుస్తారు.

“నిజమే అది కలుషితం చేయబడింది. అయినా అది పరిశుద్ధమైనది” అంటారు. “అది మానవ లిఖితమే కాని దైవలిఖితం” అని చెబుతారు.

ఇలా వాళ్ల పరిభాషలో పదాలకేమైన సరైన అర్థాలున్నాయా? ఉన్నాయి. ఎక్కడ అంటే వాళ్లు న్యాయవిచారణ చేస్తే కోర్టుల్లో కాని ధర్మశాస్త్రంలో మాత్రం కాదు. ఒక కవితా ధోరణి లైసెన్సు, తమ ప్రబోధనా విషయంలో వారు కల్పించుకున్నారు.

దీని గురించే అంతిమ దైవగ్రంథం ఖురాను ఇలా పలికింది:

“వారి హృదయాలకు ఒక రోగం పట్టుకుంది. అల్లాహ్ ఆ రోగాన్ని మరింత అధికం చేశాడు. వారు చెప్పే ఈ అబద్ధానికిగాను వారికి వ్యధాభరితమైన శిక్ష పడుతుంది. ఎందుకంటే వారు అసత్యవాదులు” (పవిత్ర ఖురాన్ 2:10).

జవాబు

“మానసిక వ్యాధి ” అంటూ దీదాత్ చేసిన వ్యాఖ్య శ్రీమతి ఎల్లెన్ జి. వైట్ గారి సందర్భంలో సమయోచితమైనదనే ఒప్పుకోవాలి. అందుకు ఋజువులను ఈ క్రింద పొందుపరుస్తున్నాను గమనించండి.

తొమ్మిదేళ్ళ వయసులో ఎల్లెన్. జి. వైట్ గారికి దాదాపు తన ముక్కు విరిగిపోయేంతగా ముఖానికి తీవ్రమైన గాయం తగిలింది. సుమారు మూడు వారాలు స్పృహ తప్పిన స్థితినుండి కోలుకోలేకపోయింది. ఈ సంఘటనను తన ‘టెస్టిమొనీస్' అనే పుస్తకంలో వాల్యూమ్ 1, పేజీలు 9-10 లో చదవగలరు.

తదుపరి ఆమెకు కలిగిన దర్శనాలన్నింటికి యిలా తీవ్రంగా దెబ్బతిన్న తన నాడీ వ్యవస్థ కారణం. ఆమె జీవిత చరిత్ర చదివితే తరచుగా స్పృహ కోల్పోయేదని, గుండెలో తీవ్రమైన నొప్పికి గురయ్యేదని, దాదాపు చనిపోయేంతగా అనారోగ్యానికి లోనయ్యేదని పదే-పదే ప్రస్తావించినట్లు చూస్తాము. ఇలా అనారోగ్యానికి గురయ్యే కొద్దిసమయానికి ముందే ఆమెకు దర్శనాలు కలిగేవట; అస్వస్థమైన ఆమె నాడీ వ్యవస్థ యిందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. “అసాధారణ రీతిలో నాఉద్రేకాలు సున్నితంగా వుండేవి” అని తన 'టెస్టిమొనీస్' వాల్యూం 1 పేజీ 12 లో ఆమె వ్రాసింది. గమనించండి, నాడీ వ్యవస్థ బలహీనంగా వున్న స్త్రీలు హిస్టీరియాకు గురయ్యే ప్రమాదమెక్కువ అని ఎన్ సైక్లోపిడియ అమెరికానాలో హిస్టీరియాకు సంబంధించిన వ్యాసంలో చూడగలము; అది ఆమెకు సరిగా వర్తిస్తుంది.

“టెస్టిమొనీస్” అనే తన పుస్తకంలో, తన అనారోగ్యం గురించి ఆమె స్వయంగా ఏమి పంచుకుందో గమనించండి.

“తొమ్మిదేళ్ళ వయసులో ఓ అమ్మాయి నా ముక్కు మీద ఓ రాయితో బలంగా మోదింది (వాల్యూం 1, పేజీ 9). మూడు వారాల పాటు నేను మంచంపై పడున్నాను' (వాల్యూం 1, పేజీ 10). నా ఆరోగ్యం క్షీణించి దాదాపు ఓ అస్థిపంజరంలా అయిపోయాను (వాల్యూం 1, పేజీ 11) కొలుకుంటాననే నమ్మకం ఏ మాత్రం మిగుల లేదు (వాల్యూం 1, పేజీ 12) నా నాడీ వ్యవస్థ తీవ్రంగా గాయపడింది' (వాల్యూం 1, పేజీ 13). తదుపరి సంవత్సరాలలో ఆమె ఎదుర్కొన్న హిస్టీరియాకి యిదే ప్రారంభం” (డా!! డి. ఎమ్. కెన్ రైట్ గారు 1914 లో రచించిన " సెవెంత్ డే ఎడ్వెంటిజం-రెనౌన్స్డ్) (ఎలెన్జి. వైట్ - ప్రోఫెటెస్ ఆర్ ప్లేజియరిస్ట్? నుండి సంగ్రహించబడింది

. ఇలాంటి మహాత్ముల రచనలే దీదాత్ ను ముస్లిమ్ బైబిల్ పండితునిగా చేశాయని తలుచుకున్నపుడు నవ్వాలనిపించడం లేదూ? ఇలాంటి ఉన్మాదుల మాటలు, “బైబిల్ దేవుని వాక్యమా” అనే పరిశోధనలో అసలు ప్రస్తావించదగిన సాక్ష్యాధారాలనీ స్వస్థబుద్ధి గలవారెవరైనా అనుకుంటారా? తమ నిత్య భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఒక తీర్మానాన్ని ముస్లిమ్లు కానీ, క్రైస్తవులు కానీ, యిలాంటి పిచ్చివారి మాటల పై ఆధారితం చేయాలని దీదాత్ చేసిన ఈ ప్రయత్నాన్ని దావా పరిభాషలో “పాండిత్యం” అని పిలుస్తారట. గ్రుడ్డివారిని నడిపించే గ్రుడ్డివారిలా, పిచ్చివారిని ప్రభావితం చేసే పిచ్చివారు కూడా వుంటారంటే నమ్మరే!

30. దీదాత్

“సాక్ష్యం ”

బైబిలు ప్రబోధకుల్లో జెహోవా విట్నెసెస్ సమాజంవారు చాలా బొబ్బరించేసమాజం. వారి బైబిలుకు ముందుమాట'లో (ఇంతకు మునుపు ఇచ్చి వున్నాం) వాళ్ల ఒప్పుకోలు కూడా ఇలా వుంది:

‘ఉత్ర్పేరిత అసలు గ్రంథాలను మానవ హస్తంతో ప్రతిలేఖనం చేయడంలో మానవ బలహీనత చోటు చేసుకుంది. కాబట్టి ప్రస్తుతం ఉనికిలోవున్న వేలాది బైబిలు పాఠ్యభాగాల్లో ఏవి కూడాను అసలు (మాతృక) భాషాప్రతులకు బాగా సరైన అనుకరణలు కావు”.

అందుకే వారి బైబిలు ముందుమాట” లోంచి 27 పేజీలు తీసివేయడం జరిగింది. వారి మాటల్ని వారి మెడల్లోనే అల్లాహ్ వేయించాడు.”

జవాబు

వేలాది పాఠ్యాంతరాలున్నా అవి అందించే సందేశంలో వ్యత్యాసాలు లేనంత వరకు బైబిల్ లోపరహితమైనదిగా భద్రము చేయబడ లేదని ఎవ్వరూ నిరూపించలేరు. కాబట్టి అడుక్కునే వాడికి బుడబుక్కలోడు తోడైనట్లు, ఏ మాత్రం పరిశీలించకుండా జెహోవా విట్నెసెస్ వారి ఆరోపణలకు గుడ్డిగా వత్తాసు పలికే దావా ప్రసంగీకుల అభియోగాలు, ఏమి నిరూపించడానికో, ఏమి సాధించడానికో వారికే తెలియాలి.

ఇక జెహోవా విట్నెసెస్ వారు తమ ముందు మాటలోని 27 పేజీలను ఎందుకు తొలగించారో వారే చెప్పి ఉంటే మంచిది. బహుశా యిది తప్పొప్పుకొనే వారి విధానమేమో! అన్నట్లు జ్ఞాపకముంది కదా, నేటి ఖురాను ప్రతులలో పాఠ్యాంతరాలు లేకపోయినా, మొహమ్మద్ కు యివ్వబడిన ఖురాన్ మాత్రం నేడు అందుబాటులో లేదని గత అధ్యాయంలో సమర్థవంతంగా నిరూపించేశాము. లేని దాని నుండి వున్నదాని తట్టుకు మరలడమే జ్ఞానయుక్తము, సురక్షితము.

31. దీదాత్

“అదృష్టం”

బైబిలు అసలు (మూలం) వ్రాతప్రతులన్నవి నాలుగువేలకు పైగా ఉన్నాయని ప్రగల్భాలు పలికిన క్రైస్తవ విజ్ఞులు, తమ ఇష్టానిష్టాలకు కాలానుగుణంగా వున్నాయని చెప్పి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను మాత్రమే ఎంచుకొని సువార్తలన్నారు. తగు సందర్భంలో మనం వాటిని విశ్లేషించగలం.

ప్రస్తుతం ఇక్కడ జెహోవా విట్నెసెస్ క్రైస్తవ సమాజం తమ బైబిలు ముందు మాటల్లోంచి (మనం పరిశోధించి చూడగా) తీసిన వాటిలోని కొన్నింటిని పరిశీలించాలి.

“నిదర్శనమేమంటే మూలమైన క్రైస్తవ గ్రీకు గ్రంథాలన్నవి (కొత్తనిబంధనలు)బాగా జోక్యం కల్గించబడ్డాయి. అదే విధంగా LXX కూడా.” (LXX అంటే 70)

ఏ మాత్రం మార్పును స్వీకరించని ఈ మతవిధానం జెహోవా విట్నెసెస్ వారు తమ 192 పేజీల పుస్తకం “బైబిలు వాస్తవంగా దైవవాక్యమేనా? (Is The Bible Really Word of God?) అన్నదాని మొదటి ప్రచురణలోనే 9 మిలియన్లు (9000000) కాపీలు అమ్మేశారు. మనమిక్కడ రోగ మస్తిష్కం గురించి చూద్దాం. ఎందుకంటే వారన్నట్టుగానే “ఎంత జోక్యం (మార్పు) చేసినా అసలు బైబిలు యథార్థంపై ప్రభావం వేయజాలదు” అన్నది. అదీ క్రైస్తవ లాజిక్కు”.

జవాబు

నేడు ప్రచురించిన మాటను రేపు తీసివేసే జెహోవా విట్నెస్ వంటి వారి సాక్ష్యాలను దీదాత్ ఎలా ఆమోదించగలుగుతున్నాడో తెలుసుకోవడం ఏ మాత్రం కష్టతరం కాదు. అతని ఖురాన్ రచయితకు కూడా నేడు చెప్పిన మాటను రేపు రద్దు చేసి దాని స్థానంలో తనకు మరింత “మెరుగైనది”గా తోచినది ప్రత్యక్షపరచడం పరిపాటే (సురా 2:106-108). ఈ ప్రక్రియనే వారు ముద్దుగా “అబ్రిగేషన్” అని పిలుస్తారు. యిలాంటివి దీదాత్ కు షరా మామూలై, వీటి లోపభూయిష్టతను గుర్తించలేనంత మొద్దుబారిపోయాడు. అయితే సాటి లేని స్థిరత గల బైబిల్ గ్రంథ నేపథ్యం నుండి ఆలోచించే క్రైస్తవులను, యిలాంటి అనుమానాస్పద సాక్ష్యాలు ఏ మాత్రం కదిలించలేవని అతనికి తెలియదు కాబోలు.

అదలా వుంచితే, నాలుగువేల అసలు రాతప్రతులలో నుండి తమ యిష్టాయిష్టాలకు అనుగుణంగా వున్న నాలుగు సువార్తలను (మత్తయి, మార్కు లూకా మరియు యోహాను) క్రైస్తవులు ఎన్నుకున్నారంటూ దీదాత్ చేసిన వ్యాఖ్య తన పాండిత్య నటనకు పెద్ద గొడ్డలిపెట్టు. నిజానికి ఈ నాలుగు వేల అసలు రాత ప్రతులన్నీ పూర్తి క్రొత్త నిబంధనలోని 27 పుస్తకాలకు చెందిన మూల ప్రతుల సంఖ్య. వాటిలో కొన్ని వందల ప్రతులు ఈ నాలుగు సువార్తలకు సంబంధించినవి. అయితే మన దావా పండితాగ్రేసరుడికి మాత్రం నాలుగు వేల వేరువేరు పుస్తకాల నుండి ఈ నాలుగు సువార్తలను మాత్రమే ఎన్నుకున్నారన్నట్లు గోచరమైందట. ఇతని విశ్లేషణా సామర్థ్యాన్ని అంచనా వేయడానికి యింతకంటే ఏ నిదర్శనం కావాలి? ఇతని ఈ పుస్తకము పాండిత్య ధోరణిలో చేసిన పరిశీలన కాదని, బైబిల్ వ్యతిరేక పక్షపాత వైఖరితో చేసిన అపరిపక్వ అపహాస్య కసరత్తు మాత్రమే అని గుర్తించడానికి కాస్త సామాన్య బుద్ది వుంటే చాలు.

32. దీదాత్

శ్రద్దతో వినాలి

మనం ఈ పుస్తకంలో ముందుగా చెప్పిన డా|| గ్రాహామ్ స్కోగ్గీ తన పుస్తకం “బైబిలు దైవవాక్యమా?” అన్నదాంట్లో పేజీ 29లో ఇలా చెప్పివున్నాడు:

“మనం ఈ విషయంలోకి (బైబిలు దైవవాక్యమా? అన్న విషయంలోకి అడుగు పెట్టేటప్పుడు బాగా నిష్పక్షపాత వైఖరితో వ్యవహరించాలి. అసలు బైబిలు గ్రంథం తనను గురించి తానేమంటుందో వినాలని మనసులో వుంచుకోవాలి. న్యాయస్థానంలో ఒక సాక్షి నిజమే పలుకుతాడని మనం నమ్మాలి. అతను చెప్పేది అంగీకరించాలి. మనకు అతన్ని అనుమానించే విషయాలు పటిష్టంగా వుంటేనే మనం అతను అబద్దాలు చెప్తున్నాడని నిరూపించగలం. కాబట్టి బైబిలుకు కూడా తాను వినబడేందుకు ఆ సదవకాశాన్ని మనం ఇవ్వాలి, అదేం చెప్తుందో దాన్ని శ్రద్ధతో, సహనంతో వినాలి.”

ఈ విన్నపం చాలా చక్కటిది. చాలా హేతుబద్ధమైనది. అతను చెప్పినట్లు మనం దానినే పాటించి బైబిలు గ్రంథం తనకు తానై ఏం పలుకుతుందో విందాం.”

జవాబు

వాస్తవానికి దీదాత్ నిష్పక్షపాత వైఖరితో బైబిల్ ఏమి చెబుతుందో వినట్లేదని యిప్పటికే పాఠకులకు తెలిసిపోయిందనుకుంటాను. ఏమి చెబుతుందో విందామన్న నెపంతో, బైబిల్ యిచ్చే సాక్ష్యాన్ని తారుమారు చేసి, వాక్యాలను వక్రీకరించి తన అబద్దపు అవగాహనను బైబిల్ వాస్తవికతగా చిత్రీకరించడానికే దీదాత్ ఈ పుస్తకాన్ని రాశాడని, లేశమాత్రం నిజాయితీగల ముస్లిమ్లు కూడా ఒప్పుకుంటారు.

33. దీదాత్

“బైబిలు గ్రంథంలోని మొదటి ఐదు పుస్తకాలు ఆదికాండం, నిర్గమకాండం,లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిలో దాదాపు 700 వివరణలు, దేవుడు వాటి గ్రంథకర్త కాడని, కడకు మోషే ప్రవక్తకు కూడా అందులో హస్తం లేదని తెలుపుతున్నాయి. ఈ పుస్తకాలను తెరచి ఉజ్జాయింపుగా చూడండి:

“మరియు దేవుడు అతనితో చెప్పెను - మీరు క్రిందికి దిగివెళ్లిపోండి.

” “మోషే ప్రభువుతో అనెను 'ఈ ప్రజలు రాలేదు ...”

“దేవుడు మోషేతో అనెను - “జనుల ముందుకు వెళ్లుము”

“దేవుడు మోషేతో అనెను - వెళ్లి ...”

వీటిని చూడగా ఈ పలుకులు దేవుడివి కావు, మోషేవి కూడా కావు పైగా మరో వ్యక్తి తాను విని వ్రాస్తున్నాడని తెలుస్తుంది.”

జవాబు

పై వాదనకు మేము రెండవ అధ్యాయంలో 6వ పాయింటుకు జవాబులో సుదీర్ఘమైన వివరణ అందించాము. మరోసారి ఆ అధ్యాయాన్ని చదివి యిలాంటి సందర్భాల నేపథ్యంలో బైబిల్ దేవుని వాక్యమని ఎలా నిర్ధారించామో గమనిస్తూ, అదే ప్రమాణాన్ని ఖురానుకు అన్వయించినప్పుడు అది దైవ వాక్యము కాదని ఎలా నిరూపించామో కూడా శ్రద్దగా అధ్యయనం చేయండి.

34. దీదాత్

తన మృతిని గురించి మోషే తానే వ్రాసుకున్నాడు!

తన మృతికి ముందు మోషే తానే వ్రాసుకున్నాడా తన మృతి గురించి? యూదులు తమ మృతి గురించి తామే ముందుగా రాసుకుంటారా?

“మోషే ... మృతిచెందెను. అతడు (దేవుడా?) అతనిని (మోషేని) పాతిపెట్టెను . . . అతను చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడు కలవాడు...... మోషే వంటి మరొక ప్రవక్త ఇశ్రాయేలీయులందు ఇదివరకుపుట్టలేదు - "(ద్వితీయోపదేశ కాండం 34: 5-12)

ఇతర కోణాల్లోంచి కూడా పాత నిబంధనల్ని పరిశీలించండి.”

జవాబు

మోషే తన మృతిని గురించి రాయలేదని, తన వారసుడైన యెహోషువాయే ద్వితియోపదేశకాండములోని చివరి అధ్యాయము మొదలుకొని, తదుపరి కొనసాగే గ్రంథాన్ని కూడా రాశాడని, మోషే ప్రారంభించినవన్నీ యెహోషువ ముగించిన విధమును బట్టి సులభంగా గ్రహించవచ్చు. అయితే మోషే ఒకవేళ తన మృతిని గురించి స్వయంగా రాసినా ఆశ్చర్యమేముంది? అతను దేవునితో నేరుగా సంబంధం కలిగి వుండిన ప్రవక్త కాబట్టి ప్రవచనాత్మకంగా తన మృతిని గురించి రాయడం అసంభవమే మీ కాదు కదా! పైగా జరగబోయే వాస్తవాన్ని జరిగిపోయిన సంఘటన వలే కచ్చితంగా ప్రకటించడం, బైబిల్ ప్రవచనాల శైలి, లక్షణం, సామర్థ్యం.

కాబట్టి యిలాంటివి బైబిల్ దైవవాక్యం అనడానికి సమర్థనలే తప్ప సమస్యలు ఎంత మాత్రము కాజాలవు (41 మరియు 70 పాయింట్లలో వున్న మా జవాబును కూడా పోల్చి చూడండి).

 

6వ అధ్యాయం

క్రీస్తు నూతన నిబంధన

“బైబిల్ దేవుని వాక్యమా” అనే దీదాత్ పుస్తకంలో, “క్రైస్తవం గురించి
నూతన నిబంధన” అనే ఆరవ అధ్యాయానికి మా జవాబు.

35. దీదాత్

ప్రకారంగా' (According To) ఎందుకు?

(ఇక్కడ గమనించదగ్గ విషయం - ఈ According To (ప్రకారం) అన్నది తెలుగు బైబిలు అనువాదాల్లో లేదు. ఆంగ్ల అనువాదాల్లో మాత్రముంటుంది. కొన్నింటిలో తీసివేయడం కూడా జరిగింది. ది గాస్పల్ ఎకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ (పరి. మత్తయి సువార్త ప్రకారం) ఇలా అన్నమాట – అనువాదకర్త)

'కొత్త నిబంధన' అనిపించుకున్న పుస్తకం గురించిన విషయమేమిటి? ప్రతి సువార్తకు గ్రంథానికి ముందు దాని పరిచయ శీర్షికపై According To (ప్రకారం) అని ఎందుకు రాశారు?

ఈ According To (ప్రకారం) అన్నది ఎందుకంటే, ఏ ఒక్క బైబిల్లోని గ్రంథం గాని సువార్త గానీ దాని రచయిత అనబడే వ్యక్తి యొక్క స్వీయరచనగా పక్కాగా తెలీదు. రూఢీగా తెలీదు.

ఇవి ఏ 4000 పుస్తకాలున్నా ఎవరు దేని రచయిత అన్నది నిర్ధారణ చేయబడలేదు. అందుకే బహుశా ఫలానా వారి ప్రకారం అని వ్రాయబడుతుంది. మనం లోతుగా పరిశీలించినా అదే అగుపిస్తుంది.”

జవాబు

“ఎకార్డింగ్ టు మాథ్యూ” లేదా” ఎకార్డింగ్ టు మార్కు”, అంటే మత్తయి ప్రకారం లేదా మార్కు ప్రకారం అని అర్థం. ఐతే మత్తయి మార్కు తదితరులు వారి సువార్తలను వ్రాయలేదనడానికి ప్రకారం” (According To) అనే ఈ మాటను ఆధారముగా తీసుకోవడం, తన అసమర్ధ వాదనలను సమర్ధించుకోవడానికి దీదాత్ ఎంత ఆరాటపడిపోతున్నాడో మరోసారి కొట్టొచ్చినట్లుగా తెలుపుతుంది. “ఫలానావారి ప్రకారం” అనే మాట వింటే సామాన్యబుద్దీ ఉన్న ఎవరికైనా, “అది వారి మాట” అనే అర్థమే స్ఫురిస్తుంది. వారి మాటో కాదో తెలియక “వారి ప్రకారం” అంటున్నారనే అర్థం దావా మేధావులకు మాత్రమే గోచరపడుతుంది. వారిది అసామాన్య బుద్ది కదా మరి!!!

36. దీదాత్

“మత్తయి సువార్త పేరు ఇవ్వబడినా అది అతను వ్రాసింది కాదు.

“యేసు అక్కడినుంచి వెళ్లుచు సుంకపు మెట్టు వొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను (ఏసును) వెంబడించెను” (మత్తయి 9:9)

కాస్త బుర్రవున్న వారికెవరికైన 'అతను' 'అతన్ని అన్న పైపదాలు చూస్తే ఏసు గాని, మత్తయిగాని రచయిత కాదని తెలుస్తుంది. మరెవరో మూడో వ్యక్తి తాను విన్నది లేదా చూచింది వ్రాస్తున్నారు. తన చెవిలో పడ్డ మాటల్ని మనకు వినిపిస్తున్నాడు. (మత్తయే రాసివుంటే ఇలా వ్రాసేవాడు “నేను సుంకపు మెట్టుదగ్గర కూర్చొని వుండగా ఏసువచ్చి తనను వెంబడించమని నాకు చెప్పగా నేను ఆయనని వెంబడించితిని' అని - అనువాదకర్త)

ఈ ‘కలల పుస్తకం' (మొదటి సువార్త అలా కూడా వర్ణించబడి వుంది) శిష్యుడైన మత్తయిది అని అనుకున్నా అది “దేవుని వాక్యము' ఎలా అవుతుంది?

జవాబు

ఈ వాదన రెండవ అధ్యాయంలో వున్న “మూడు తరగతుల సాక్ష్యములు” అనే వాదన వంటిదే. అక్కడే దీనికి తగిన జవాబు చెప్పేశాను. దీదాత్ లా నేను కూడా చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతూ పాఠకులను విసిగించడం సబబు కాదు.

ఐతే గ్రంథకర్త తనను తాను ఒక మూడవ వ్యక్తిగా సంబోధించడమనేది సాహిత్యలోకమంతా ఆమోదించే, అవలంబించే సాధారణ శైలి. ఆ శైలిలో వ్రాసినంత మాత్రాన గ్రంథకర్త గ్రంథకర్త కాకుండా పోతాడనే సూత్రాన్ని మొదట ఆవిష్కరించి లోకానికి బహుకరించిన ఘనత దీదాత్ కే దక్కాలి. అలా అని ఆ శైలి దీదాత్ స్వయంగా వాడలేదని భావిస్తే పొరపాటే.

28వ పాయింట్లో స్కోఫీల్డ్ దేవుని పేరు అల్లా అని ఒప్పుకున్నారని వాదించిన సందర్భంలో, దీదాత్ తనను ఇలాగే మూడవ వ్యక్తిగా సంబోధించుకున్న ఒక సందర్భాన్ని మనము ఇలా చదువుతాము. “గ్రంథకర్త స్కోఫీల్డ్ ప్రజాసభలలో ప్రబోధనలు చేసి విశ్లేషించేటప్పుడు ఆ పదానికి తగు రిఫరెన్సులు చూపించే వాడు”. తెలుగులో అనువాద లోపం వల్ల ఈ మాట స్కోఫీల్డ్గారి గురించి దీదాత్ ప్రస్తావించినట్లు అగుపిస్తోంది కానీ, ఇంగ్లీష్ లో దీదాత్ వ్రాసిన అసలు పుస్తకం చదివితే, అక్కడ దీదాత్ తనను తనే సంబోధిస్తున్నాడని స్పష్టంగా చూడగలం.

ఇంగ్లీషు పుస్తకంలోని పుట 21 లో ఇలా చదువుతాము: References were made in public lectures to this fact by the author of this booklet. అంటే, “ఈ లఘుపుస్తక రచయిత, ప్రజాసభలలో ప్రబోధనలు చేసి విశ్లేషించేటప్పుడు ఈ వాస్తవాన్ని ప్రస్తావించాడు” ( దీదాత్ గారి అనువాదవర్యులు తమ తెలుగు అనువాదంలో చేసిన పొరపాట్లు అంతో ఇంతో కాదు; ఐతే అవసరం కొద్దీ కొన్నింటినే ప్రస్తావించాను). ఇంతకూ ఇక్కడ విషయమేమిటంటే దీదాత్ తన రచనాశైలిలో తనను తాను “నేను” అని మొదటి వ్యక్తిగా కాక, “ఈ లఘుపుస్తక రచయిత” అని మూడవ వ్యక్తిగా సంబోధిస్తూ, ఇతరులు మాత్రం అలా చేస్తే అసలు రచయితలు కాకుండా పోతారని మాట్లాడడం దావా ప్రచారకులకు ఆకట్టుకునే తర్కంగా అగుపించినా, కాస్త బుర్రవున్న వారికెవరికైనా అది రెండు నాలుకల ధోరణిగా మాత్రమే వినిపిస్తుంది.

37. దీదాత్

“(మత్తయి ప్రకారం సువార్త) ను అసలు మత్తయి రాయలేదని మనమొక్కరమే అనడంగాదు. మరెవరో తెలీని వ్యక్తి వ్రాశాడని జె. బి. ఫిల్లిప్స్ తెలుపుతున్నాడని పరిశోధనల్లో తేలింది. J.B. PHILLIPS ఎవరోకాదు ఆంగ్లికన్ చర్చీలో ఉద్యోగి అయిన బోధకుడు, ఇంగ్లాండ్లోని చిచే స్టెర్ కాథడ్రల్కు (CHICHESTER CATHEDRAL) పురోహితుడు. అధికార చర్చీ వాక్కులను ఆక్షేపించే ఎటువంటి ఏ మోసమూ అబద్దమూ చెప్పాల్సిన అగత్యం అతనికేదీ వుండదు. మత్తయి సువార్తకు అతనిచ్చిన పరిచయ వాక్కులను దాని గ్రంథకర్తను గురించి ఫిలిప్పు ఏమంటున్నాడో చదవండి:

“పాత సాంప్రదాయాలు ఈ సువార్త అపోస్తలుడైన మత్తయిదని అంటున్నాయి. కాని నేటి కాలంలో దాదాపు అందరు పండితులూ ఈ అభిప్రాయాన్ని ఖండించారు.”

మరో మాటలో చెప్పాలంటే సెయింట్ మత్తయి తన పేరు పెట్టించబడిన సువార్తను తాను వ్రాయలేదు.

ఇది ప్రముఖ క్రైస్తవ విజ్ఞుల పరిశోధనా ఫలితం. హిందువులదో, ముస్లిములదో లేదా యూదులదోనైతే వారు ద్వేషబుద్ధితో వ్రాసారని అనుమానించగలరు. మన ఆంగ్లికన్ విజ్డుడు ఇంకా ఏమన్నాడో చూడండి:

“ఇప్పటికీ మన సౌలభ్యం కొరకు దీని రచయిత మత్తయి అని పిలవగలం...”

సౌలభ్యం ఎందువల్లనంటే మత్తయి సువార్తను గురించి చెప్పాలంటే మాటిమాటికి మనం “కొత్త నిబంధనల్లోని మొదటి పుస్తకం” “ఆ మొదటి పుస్తకం” అనాల్సి వస్తుంది. కాబట్టి ఒకరి తరపున ఒకపేరు ఈజీగా వుండాలని సౌలభ్యం కొరకు పేరుంచవచ్చు. కాబట్టి మత్తయి ఉంటే ఏం? 'మత్తయి ప్రకారం సువార్త' అనవచ్చు. ఫిలిప్పు ఇంకా ఇలా వ్రాసాడు:

“దీని రచయిత ఒక మర్మగర్భితమైన 'Q' అన్నది పైన చిత్రించాడు. అంటే ఇవన్నీను సాంప్రదాయంగా, చెప్పగా అందినవని అర్థం?” ఈ మర్మమైన Q ఏమిటి? ఇది వాస్తవానికి జెర్మెన్ పదం QUELLA కు సాంకేతికంగా వాడబడ్డ చిహ్నం. QUELLA అంటే SOURCES (మూలములు). అంటే ఆ విషయం, విషయాలు మరోచోటి నుండి అందినవని అర్థం. ప్రస్తుత అనువాద ప్రతులకు మూలంగా మరేవో మూలమైనటువంటి వ్రాత ప్రతులుంటాయి. వాటిని మూలంగా తీసుకుని ప్రస్తుత మత్తయి, మార్కు లూకా తదితర ప్రతులు వ్రాయబడినవని అర్థం. ఈ ముగ్గురు రచయితలు వారెవరైనాగాని ముగ్గురికీ ఒకే మూలంపై దృష్టి ఉండి వుండాలి. అందరూ ఒకే దృష్టితో వ్రాసివుండాలి. వారి దృష్టి ఒకే కోణంలో ఉండి, ఒకరి విషయాలలో మరొకరి పొత్తుతో దృష్టి కేంద్రీకృతమైంది కాబట్టి ఈ సువార్తలను సారసంగ్రహమైన సువార్తలు (Synoptic Gospels) అంటారు.”

జవాబు

పైన దీదాత్ ఉదహరించిన J.B. ఫిలిప్స్ గారి మత్తయి సువార్త పరిచయాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం.

1) ఫిలిప్స్ ప్రకారం, “పాత” (క్రైస్తవ) సాంప్రదాయాలు ఈ సువార్త అపొస్తలుడైన మత్తయిదే అని (ఏకగ్రీవంగా) అంటున్నాయి కాని నేటి కాలంలో దాదాపు అందరు పండితులు ఈ అభిప్రాయాన్ని ఖండించారు” (బ్రాకెట్లో ఉన్నవి దీదాత్ గారి తెలుగు అనువాదకుడు మ్రింగేసిన మాటలు).

గమనించండి, ఈ సువార్త ప్రతులు మొదట పొందుకున్న వారి ప్రాచీన సాక్ష్యాల కంటే, ఆధునిక పండితుల వ్యక్తిగత అభిప్రాయాలు బరువైనవి కాజాలవు. ఐనా దాదాపు నేటి పండితులందరు ఈ సువార్త మత్తయి వ్రాయలేదన్న విషయమై ఏకాభిప్రాయంతో ఉన్నారన్న వ్యాఖ్య నిజం కాదని ఇక్కడ నొక్కి చెప్పాలి. దేవుని సృష్టికార్యాన్ని ప్రశ్నించి, నోవహు కథనాన్ని ఒక కల్పనా కథగా ఆక్షేపించి, యోనా అద్భుతాన్ని అపహాసం చేసే ఒక ప్రత్యేక తరగతికి చెందిన పండితులు మాత్రమే ఈ విధంగా మత్తయి సువార్త ప్రామాణికతను కూడా అనుమానిస్తున్నారు. ఇలాంటి పండితులకు ఎంత విలువ కల్పించాలో దీదాతకు, దావా ప్రచారకులకు తెలియకపోయినా ఇతర ముస్లిములకు తెలుసని భావిస్తున్నాను. ఐతే ఈ సంఘటనలన్నీ చారిత్రక వాస్తవాలని నమ్మే పండితులందరు, మత్తయే తన పేరు గల సువార్తను వ్రాశాడని కూడా అంగీకరిస్తున్నారు.

2). ఫిలిప్స్ గారు అన్నట్లు “సులభంగా” అన్నది సౌలభ్యం కోసం” అనే అర్థంలో కాదని దీదాత్ మాటలను పక్కనపెట్టి ఫిలిప్స్ గారి మాటలపై మాత్రమే దృష్టి ఉంచితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రాచీన క్రైస్తవ సాంప్రదాయాలు కాని సంఘచరిత్ర కాని మత్తయి కాక మరెవ్వరిని ఈ సువార్త రచయితగా గుర్తించలేదు కాబట్టి, ఆధునిక పండితులు ఏమంటున్నా సరే, మత్తయే ఈ సువార్త రచయిత అని సులభంగా ఒప్పుకోవచ్చు.

3). ఆపై J.BPhilips ఒక “మర్మగర్భితమైన “Q” గురించి ప్రస్తావించారు. అది కేవలం ఈ ఆధునిక పండితుల మస్తిష్కాత్పాదన కాబట్టి మర్మగర్భితముగానే ఉంటుంది. వాస్తవానికి అలాంటి “Q”లు ఏమైనా ఉన్నట్లు ఎలాంటి చారిత్రక ఆధారాలు ఎక్కడా లభించవు. మరో మాటలో చెప్పాలంటే ఈ “మర్మగర్భితమైన Q” ఒక ఊహాకల్పనే తప్ప వాస్తవికత కాదు.

చెప్పింది క్రైస్తవ పండితుడే కదా, ఏ హిందువో, ముస్లీమో, యూదుడో, కాదుకదా, నమ్మేస్తే నష్టమేంటి అన్నది ఇక్కడ దీదాత్ ఆవేదన. క్రైస్తవులు చెప్పిందంతా క్రైస్తవులు నమ్మాలి, ముస్లిములు చెప్పిందంతా ముస్లిములు నమ్మాలన్నది పాండిత్య ధోరణి కాదు. మన జెండా పట్టుకున్న వారికెల్లా జేజేలు కొట్టాలని దీదాత్తు ఎవరు నేర్పారో కాని, ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా పరిశీలించమని, పరిశోధించమని దైవ వాక్యమైన బైబిలు గ్రంథం మాకు నేర్పింది.

38. దీదాత్

హోల్ సేల్ గా జరిగిన కాగితాల గమ్మత్తు

మరి 'ఉత్ర్పేరితం, ఉత్తేజితం' (Inspiration) “పరిశుద్ద ఆత్మ ద్వారా' అన్నది ఏమిటి? ఆంగ్లికన్ చర్చీ పౌరోహితుడు ఒక మేకు తల పై బిగించాడు. అతను సామాన్యుడు కాదు. అసలు సిసలైన (Original) గ్రీకు వ్రాతప్రతులతో సాహిత్యం పొందివున్న ప్రఖ్యాత బైబిలు శాస్త్రకారుడు. సదాచార ఎవాంజెలికల్ క్రైస్తవుడు. అతను ముద్దుగా ఏం చెప్తున్నాడో చదవండి. చల్లగా మెల్లగా అసలు రహస్యం బైటపడ్తుంది గమనించండి:

“అతను (మత్తయి) మార్కుసువార్తను బాగా ఉపయోగించుకున్నాడు”

మనం మన స్కూలు టీచర్ల నడిగితే “హోల్ సేల్ గా మార్కు నుంచి కాపీ కొట్టాడు” అని అర్థం చెప్తారు. కాని ఈ సంపూర్ణ గ్రంథచౌర్యాన్ని మన క్రైస్తవ సోదరులు ఇంకను 'దైవవాక్యమని' అంటారు.

మత్తయి బహుశా తన ప్రభువైన ఏసు ప్రబోధనా కార్యక్రమాన్ని తన జాతి బాగుకోసం ఆయన చేసిన కార్యాలను తను చూచిన లేదా విన్న ప్రత్యక్ష సాక్షిగా తన స్వీయ రచన అనే భావంతో వ్రాయడానికి బదులు, తన కంటే ఐదేళ్లు చిన్న వయస్కుడైన, యువకుడైన మార్కు రచనల నుంచి దొంగిలించి రాశాడంటే మీకు ఆశ్చర్యం కలగదూ? ఒక దృష్టసాక్షిగా ప్రత్యక్షంగా విన్న సాక్షి అనిపించుకున్న మత్తయి, తాను ఇతరుల చేత విని రాసిన మార్కును ఎందుకు కాపీకొట్టినట్టు? నిజమైన ఏసు శిష్యుడైన మత్తయి అలాంటి పని చేయలేడు. ఎవరిదో వ్రాతప్రతి (దస్తావేజు) మత్తయికి అంటగట్టబడిందని తేటతెల్లమవుతుంది.”

జవాబు

మత్తయి మార్కు నుండి కాపీ కొట్టాడని సదాచార ఇవాంజెలికల్ క్రైస్తవ గ్రీకు పండితుడు చెప్పినంత మాత్రాన పరిశోధించకుండా నమ్మేయాల్సిన దుర్గతి మాకులేదు. ఇక్కడ హాస్యాస్పదమైన విషయమేమిటంటే, క్రైస్తవ పండితులు బైబిలును సమర్థించి మాట్లాడినప్పుడు, ఋజువులు కావాలంటూ రభస చేసే దావా ప్రసంగికులు, బైబిలును విమర్శించడానికి అనువుగా ఉన్న క్రైస్తవ పండితుల మాటలను, ఎలాంటి ఆధారాలు అన్వేషించకుండానే ఆమోదించి, తమ వ్యాపారంలో విరివిగా వాడుకుంటున్నారు. సరే, అదలా ఉంచి కాస్త ముందుకు ఆలోచిద్దాం.

మత్తయి మార్కును కాపీ కొట్టాడా?

మత్తయి మార్కును కాపీ కొట్టాడా లేదా అని తెలుసుకోవడానికి అపార పాండిత్యానుభవమేమి అవసరం లేదు. సామాన్య పరిశోధన చేసిన ఎవరైనా, దీదాత్ మరియు ఫిలిప్స్ మాటలను సులభంగా కొట్టిపారేస్తారు. ఒకవేళ మత్తయి మార్కును కాపీ కొట్టినట్లయితే, మత్తయిలో వున్న యేసుక్రీస్తు వంశావళి మరియు ఆయన జనన వృత్తాంతము (అధ్యాయం1), ఆయన జననాంతర సంగతులు (అధ్యాయం 2), ఆయన శోధనను జయించిన

విస్తృత వివరణ (అద్యాయం 4), ఆయన కొండ మీది ప్రసంగము (అధ్యాయాలు 5-7), ఆయన శాస్త్రులకు పరిసయ్యులకు బుద్ది చెప్పిన సుదీర్ఘ సంగతులు (అధ్యాయాలు 21-23), ఆయన పలికిన కొన్ని ప్రధానమైన ఉపమానాలు (అధ్యాయం 25), తదితర ఎన్నో భాగాలు మార్కులో ఎక్కడున్నాయో ఎవరైనా చూపించగలరా? ఇంకా పరిశీలిస్తే ఈ ఇరువురు రచయితలకు సమాంతరము కాని కొన్ని అద్భుతాలు, ఉపమానాలు, ప్రవచనాల నెరవేర్పు వివరించే భాగాలు, తదితరమైనవెన్నో ఉన్నట్లు చూస్తాము. వేరువేరు కోణాల నుండి విశ్లేషిస్తున్నప్పటికీ, ఒకే వ్యక్తికి సంబంధించిన ఒకే జీవిత చరిత్రనే వీరిరువురు సమీక్షిస్తున్న కారణాన్ని బట్టి అనేక సమాంతర విషయాలు కూడా ఇరువురి రచనలలోను కనిపిస్తాయేమో తప్ప అదీ కాపీ కొట్టడం కాదని తెలుసుకోవడానికి ఒక గ్రీకు పండితుని సాక్ష్యము, సహాయము అవసరం లేదు. కాపీ కొట్టడమంటే అసలు అర్థం ఏమిటో, ఖురానును సరిగా పరిశీలిస్తే తెలుసుకోగలం. 40వ పాయింటుకు జవాబులో అలాంటి కొన్ని ఖురాను నిదర్శనాలను పాఠకుల పరిశీలన సౌలభ్యార్థం ప్రస్తావించాను.

మార్కు గురించి ఒక చిన్నమాట

మత్తయి సువార్తతో పాటు మార్కు సువార్త ప్రామాణికత పై కూడా అనుమానాలు విత్తే విధంగా దీదాత్ మాట్లాడినట్లు పై మాటల్లో చదివాము. యేసుక్రీస్తు పరిచర్య సమయంలో మార్కు చిన్న బాలుడు కాబట్టి అతను వ్రాసిన విషయాలకు అతను ప్రత్యక్ష సాక్షి కాదని, ఆ నోట ఈ నోట విన్న మాటలు వ్రాసాడని, అలాంటి రచనను మత్తయి ఎందుకు కాపీ కొడతాడని, ఇలా ఎన్నో వ్యంగ్య వ్యాఖ్యలు దీదాత్ చేసినట్లు చూసాం. కాబట్టి మార్కు సువార్త ప్రామాణికతను గురించి మనము తెలుసుకొని వుండడం మంచిది.

మార్కు పరిచర్య అపొస్తలుడైన పేతురు పర్యవేక్షణలో జరిగినట్లు క్రొత్తనిబంధనలో కావాల్సినంత ఋజువు మనకు లభిస్తుంది. పౌలు తనవెంట తీసుకుని వెళ్లలేనంత ఉదాసీన స్థితిలో మార్కును మొదట మనం చూస్తాము (అపొ.కా. 15:37-40 ). ఐతే, పేతురుకు మార్కు కుటుంబముతో ఎంతో సాన్నిహిత్యం వుందని, తాను చెరసాల నుండి విడిపించబడగానే నేరుగా మార్కు ఇంటికే వెళ్లిన సందర్భము నుండి తెలుసుకోగలము (అపొ.కా. 12:11-12 ). తనను నిరాకరించిన పౌలే స్వయంగా తనను పరిచర్యకొరకు పిలిపించేంత (2తిమోతి 4:11 ) ప్రయోజకునిగా మార్కును మలిచింది, పేతురుకు మార్కు ఇంటితో వున్న ఈ సాన్నిహిత్యమే అని వేరే చెప్పనవసరం లేదు. తన పర్యవేక్షణలో అంత పరిపక్వతకు ఎదిగినందుకే బహుశ పేతురు మార్కును తన “కుమారుడని” (1 పేతురు 5:13 ) సంబోధించినట్లు చూస్తాము. కాబట్టి, పేతురు పర్యవేక్షణ క్రింద పరిచర్య చేసిన మార్కు రచనలకు, అపోస్తలుడైన పేతురే మూలముగా ఉన్నాడన్న వాస్తవము, మార్కు సువార్త అప్రమాణికమని చెప్పే వాదనలన్నిటిని అధిగమించి,అపోస్తలుని నోట వెలువడిన ఆత్మ ప్రేరిత మాటలే మార్కు వ్రాసాడన్న నిశ్చయత మనకిస్తుంది. ఈ అపోస్తలీయ ఉత్ర్పేరిత సువార్తను దేవుడు తన వాక్యములో భాగంగా మనకివ్వడం మన గొప్ప ధన్యత.

39. దీదాత్

గ్రంథ చౌర్యమా? లేక ఇతరుల రచనల్ని అపహరించడమా?

ప్లాగియరిజం (Plagiarism) అంటే గ్రంథ చౌర్యం. ఇతరుల రచనల్ని మక్కీకి మక్కీగా కాపీకొట్టి తమ మాటలుగా వాటిని ప్రదర్శించుకోవడం, గ్రంథ చౌర్యం. బైబిల్లో గుర్తుతెలీని రచయితల వల్ల జరగడం ఇది సర్వసాధారణం. హోలీ బైబిలు (పరిశుద్ధ గ్రంథం) లోని 66 ప్రొటెస్టాంటు పుస్తకాల రచయితలను, 73 రోమన్ కాథలిక్కు పుస్తకాలను రచించినవారిని అందరిని ఒకే త్రాడుకలుపుతుందని క్రైస్తవ ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది. మత్తయికి, లూకాకు అలాంటి ఒకే త్రాడు (సంబంధం) వున్నా అది మార్కు వాక్యాల నుంచి 85% మక్కీకి మక్కీగా కాపీ చేసిందే. అత్యంత జ్ఞాని అయిన దేవుడు, అవే పదాలను ఈ ఒంటి చూపు (ఒకేదృష్టి) సినాప్టిక్ రచయితలకు డిక్టేట్ చేస్తూ రాయించలేడు కదా? మా పవిత్ర ఖురాను విషయంలో ప్రవక్త నోట పలికించిన ప్రేరణా (ఉ తేజ) జ్ఞానం మాదిరిగా వీళ్లంతా (సువార్తీకులు) మాటల్ని విని (ప్రేరణ పొందారన్నట్టు క్రైస్తవులు విశ్వసించరు. (దివ్య ఖురాన్ లోని ప్రతిమాట, ప్రతి అక్షరం దైవవహీ (ప్రేరణ) ద్వారా వచ్చిందన్నది నిరూపించబడి వుంది) దైవగ్రంథమనిపించుకున్న పాత నిబంధన రచయితల సాహిత్య అపహరణ ఈ మత్తయి లూకాలు చేసిన 85% గ్రంథ చౌర్యంతో సంచలనంగా ఏమీ తూగదు. అయినా ఇలాంటి వాటిని బిషప్పు కెన్నెత్ క్రాగ్ (BISHOP KENNETH CRAEG) లాంటి ప్రఖ్యాత క్రైస్తవ పండితుడు “పునరుత్పత్తి” (REPRODUCTION) అని చాటాడు.

“కాని నూతన నిబంధనలు మాత్రం అలాకాదు. వాటిలో క్లుప్తత, సంగ్రహీకరణ వుంది. దానిలో ఎంపిక, పునరుత్పత్తి, సాక్ష్యం వుంది. దాని రచయితల వెనుక చర్చీల మస్తిష్కం వుంది. అవి తమ అనుభవాల్ని, నాటి చరిత్రను ప్రతీకరిస్తాయి”

జవాబు

ఈ 85 శాతం మక్కికిమక్కి కాపి అభియోగం నిజం కాదని ముందు పాయింట్లు జవాబులో స్పష్టంగా నిరూపించాను. ఐనా ఈ అభియోగాన్ని మరియొక కోణము నుండి కూడా ఎదుర్కోవచ్చు. బైబిలు దేవుని వాక్యము కాదని నిరూపించగలిగే ఎలాంటి ఆధారాలు లేవు గనుక, దేవుడు ఒక చోట వ్రాయించిన అదే మాటను మరొకరి చేత మరోసారి వాయిస్తే దానిని పునరుద్ఘాటన అంటారే కానీ “కాపీ కొట్టడం” అనరు. బైబిలు దేవుని వాక్యం కాదని మరే ఋజువుల ద్వారాను నిరూపించబడలేదు కాబట్టి, దేవుడు తన మాటను తానే పునరుద్ఘాటించాడే తప్ప మరెవరినో కాపీ కొట్టాడని చెప్పడానికి ఆధారమేమిటి? చెప్పిందే మళ్లీ చెప్పిన కారణాన బైబిలు దైవ ప్రేరితం కాదనడం, దీదాత్ చేసిన అసమర్థ వాదనలన్నిటిలో అతి బలహీనమైనదని వేరే చెప్పనవసరం లేదు. ఒట్టి మాటలతోగట్టిగా వాదించేది ఎలా అనే దావా తర్ఫీదుకు తప్ప దీదాత్ రాసిన ఈ పుస్తకం ఎందుకు పనికి రాదనేందుకు ఇది మరొక నిదర్శనం. ఐతే దీదాత్ ఆశించినట్లు, ఖురానులోని ప్రతి మాట దైవ వహి వలన వచ్చిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోగా, దాని ప్రేరణకర్త యూదుల జానపద సాహిత్యాలు మరియు యూదా రబ్బియుల తప్పుడు అభిప్రాయాల నుండి ఎన్నో విషయాలు చోరీ చేసి గ్రంథస్థం చేసాడని చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నాయి. వాటిలో కొన్నిటిని తదుపరి పాయింటుకు జవాబులో మనం చూద్దాం; కాపీ కొట్టడమని, గ్రంథచౌర్యమని దానిననడం సమంజసం. అంతేగాని స్వీయ మాటలను పునరుద్ఘాటించడాన్ని బట్టి బైబిలు గ్రంథకర్తను అలా విమర్శించడం మాత్రం అవివేకం తప్ప ఇంకేమి కాదు.

అన్నట్లు దీదాత్ ఉదహరించిన బిషప్పు కెన్నెత్ క్రాగ్ మాటలకు మొదటి పాయింట్లోనే జవాబు చెప్పేశాను. జ్ఞాపకముంది కదూ !

40. దీదాత్

వక్రీకరించబడ్డ ప్రమాణాలు

కేప్ టౌన్ యూనివర్సిటీ లో నాకూ, ఆ యూనివర్సిటీ ధర్మశాస్త్ర ప్రధానోపాధ్యాయుడు (Head of the Department of Theology) అయిన ప్రొఫెసర్ కాంప్సకీ (Prof. Compky) కి మధ్య “బైబిలు దైవవాక్యమా? అనే విషయంలో సంవాదం జరిగింది. ఆనాటి సింపోజియంలో ఈ దైవప్రేరణ పొందిన బైబిలు గ్రంథకర్తలు చేసిన గ్రంథచౌర్యాన్ని నిరూపించేందుకు నేను నాటి ప్రేక్షకులను తమ దగ్గరున్న బైబిలు గ్రంథాలను తీసిచూడమన్నాను.

ధార్మిక సంవాదనలు, సింపోజియంలు జరిగేటప్పుడు కొంతమంది క్రైస్తవులు తమతమ పరిశుద్ధ గ్రంధాలను చంకలో పెట్టుకుని రావడానికి చాలా ఇష్టపడతారు. నేను చెప్పగానే పలువురు, తమ దగ్గరున్న గ్రంథాలని తెరిచారు. నేను అందరినీ యెషయా గ్రంథంలోని 37 వ అధ్యాయం పరికించమన్నాను. నేను చదువుతున్న నా దగ్గరి “యెషయా 37' ను వాళ్ల దగ్గరున్న దానితో పోల్చి చూస్తూ పొమ్మన్నాను. రెండూ బాగా పోలి యున్నాయా లేదా చూడమని అడిగాను. మెల్లమెల్లగా వాక్యాలు 1, 2, 10,15 ఇలా మొత్తం అధ్యాయం చదివి వినిపించాను. ప్రతి వాక్యం చదివి ఇది మీ దగ్గరున్న దానితో సరిగా పోలివుందా? అని అడుగుతూపోయాను. 'యా? 'యా' అంటూ అందరూ బిగ్గరగా సమాధానమిస్తూ పోయారు కోరస్. తరువాత నేను చదివిన అధ్యాయం అలానే పట్టుకుని వేదిక పైన నా ప్రక్కనున్న ఛైర్మనకు చూపించి అందరికీ తెలపమన్నాను. అతను దిగ్ర్భాంతి చెందాడు. నేను చదివినదంతాను 2వ రాజులు 19: నుండి ప్రేక్షకులందరిలో ఓ పెద్ద తత్తరపాటు చెలరేగింది. ఆ విధంగా బైబిలు గ్రంథంలో 100% గ్రంథచౌర్యాన్ని నేను వాళ్ల ముందు నిరూపించాను.”

జవాబు

బైబిల్లో గ్రంథచౌర్యము జరిగిందనే అభియోగానికి మునుపున్న పాయింట్లో నేను తగిన జవాబు చెప్పేశాను. యెషయా 37 మరియు 2 రాజులు 19, ఒకే సందర్భాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు వేరువేరు మాటలలో దానిని విశదపరచాల్సిన అవసరమేముంది? దేవుడు ఒకసారి చెప్పిన మాటను తు.చ. తప్పకుండా మరియొకసారి చెప్పడం ఆయనకు తగదా? అలా చెప్పకూడదనే నియమం కాని నిషేధం గాని ఏదైనా ఎక్కడైనా వుందా? పాఠకులే ఆలోచించాలి. అది అలావుంచి ఇప్పుడు మనము ఖురాను గ్రంథకర్త చేసిన గ్రంథచౌర్యాన్ని పరిశోధించి, అసలు కాపీ కొట్టడమనీ దేన్నంటారో పరిశీలిద్దాం.

ఖురానులో జరిగిన గ్రంథచౌర్యం

ఒకవేళ బైబిల్లో వున్న భాగాలు, బైబిలుకు పూర్వం వ్రాయబడిన కల్పనాకథల పుస్తకాల్లో నుండి చోరీ చేయబడ్డాయని దీదాత్ ఆధారాలు చూపించియుంటే, వాటిని కాస్త గంభీరంగా పరిగణించవలసిన అవసరం వుండేది. అయితే బైబిల్లో అలాంటి సందర్భాలేవి లేకపోగా ఖురానులో మాత్రం ఖురానుకు పూర్వము ప్రాచుర్యములో వున్న యూదా జానపద సాహిత్యాలు మరియు యూదుల కట్టు కథల నుండి చోరి చేసిన సంధర్భాలు ఎన్నో వున్నాయని నిర్ధారించే నిదర్శనాలు అంతా ఇంతా కాదు. అందులో ఒక ఉదాహరణ పరిశీలిద్దాం.

కను హేబెలును చంపిన సంఘటనను ఖురాను ప్రస్తావిస్తుంది (సురా 5:27-32) ఈ కథనం బైబిల్లోని ఆదికాండంలో కూడా నమోదు చేయబడినప్పటికీ, ఖురానులో వుండి బైబిల్లో లేని ఒక వింతైన మాటను పాఠకుల దృష్టికి తెస్తున్నాను.

“అప్పుడు అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను త్రవ్వసాగింది, తన సోదరుని శవాన్ని ఏవిధంగా దాచాలో అతడికి తెలుపటానికి. ఇది చూసిఅతడు రోధించాడు: “అయ్యో నేను పాడు గాను! నేను ఈ కాకిపాటి వాణ్ణి కూడా కాలేకపోయానే, నా సోదరుని శవాన్ని దాచే ఉపాయం వెతకలేక పోయానే!”

ఈ తలంపును ఖురాను ఎక్కడ నుండి కాపికొట్టింది? యూదుల ఒకానొక కాల్పనిక పుస్తకంలో ఇలాగే చనిపోయిన హేబేలు కొరకు దుఖి:స్తూ, ఆదాము అతని శవాన్ని ఏమి చేయాలో తెలియక కలవరపడుతున్న సమయంలో, ఒక కాకి తన చనిపోయిన తోటి కాకిని పాతిపెట్టడం ఆదాము చూసి, తన కుమారుని శవాన్ని కూడా అలాగే పాతి పెట్టాడని వ్రాసుకున్నారు. (పెర్కు రబ్బి ఎలియాజరు, అధ్యాయం 21). కాకి వద్ద అంత్య క్రియల పాఠము నేర్చుకున్నది యూదుల కథలో ఆదాము కాగా, ఖురాను కథలో కయీను. ఈ స్వల్ప ఎడ్జస్ట్ మెంట్తో పూర్తి కథను ఖురాను గ్రంథకర్త చోరీ చేసి తన ప్రత్యక్షతలలో ఒక ప్రత్యక్షతగా అవతరింపజేసుకు న్నాడన్నమాట. ఈ యూదా రచన ఖురానుకు పూర్వము ప్రాచర్యంలో వుంది కాబట్టి మహమద్ లేదా ఖురానును రాసిన ఎవరో ఈ యూదుల జానపద సాహిత్యంలో నుండి చోరీ చేసి రాసారని స్పష్టమవుతోంది. ఖురానులోని తదుపరి వచనం, పైన చెప్పిన సత్యాన్ని మరింత బలపరుస్తుంది.

"ఈ కారణం వల్లనే మేము ఇశ్రాయేలు సంతతికి ఈ ఫర్శాను వ్రాసి ఇచ్చాము, హత్యకు బదులుగా గాని లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు గాని కాక మరే కారణంవల్లనైనా ఒక మానవుణ్ణి చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవులప్రాణాలను కాపాడట్లే” (సురా 5:32)

ఒకరిని చంపితే అందరినీ చంపినట్లు, ఒకరిని కాపాడితే అందరిని కాపాడినట్లు ఎందుకౌతుంది? ఈ నియమానికి దాని ముందున్న కథకు ఎలాంటి సంబంధము లేనట్టుగా మొదట అనిపించినా, మరియొకసారి యూదా రబ్బీయుల రచనలలో వెదికినప్పుడు ఈ ఖురాను నియమానికి తీగ ఎక్కడిదో ఇట్టే తెలిసిపోతుంది. మిష్నా సన్ హెడ్రిన్ 4:5లో, ఆదికాండం 4:21లో హేబెలు “రక్తము” అనే మాటను గురించి, మూలభాషలో “రక్తము” అని కాక “రక్తములు” అని బహువచన ప్రయోగం వుంది కాబట్టి, ఒక వ్యక్తిని చంపితే అతని యావత్వంశమును చంపినట్లుగాను, ఒక వ్యక్తిని కాపాడి తే అతని యావత్వంశమును కాపాడినట్లుగాను లెక్కించబడుతుందనే ఈ వ్యాఖ్యానాన్ని చదువుతాము. ఈవ్యాఖ్యానము ప్రశ్నార్థకమైనదే. ఐతే అంతకంటే ప్రశ్నార్థకరమైనదేమిటంటే, యూదా రబ్బీయుల వ్యాఖ్యానాలను కాపీ కొట్టి దేవుని ప్రత్యక్షతలుగా మనకు పరిచయం చేసిన ఖురాను గ్రంథాన్ని మనము దేవుని వాక్యమని ఎందుకు నమ్మాలి? ఇంత స్పష్టమైన గ్రంథచౌర్యాన్ని తన ఖురానులో దాచుకొని, నిస్సిగ్గుగా, సాక్షాత్తూ దైవవాక్యమైన బైబిలు మీద గ్రంథచౌర్యమంటు దుమ్మెత్తి పోస్తే, అందరి కళ్లల్లో దుమ్ముకొట్టి ఇస్లామ్ నిజమని, ఖురాను దివ్యవాక్యమని నమ్మించొచ్చని దీదాత్ వేసుకున్న స్కెచ్ కాస్త అడ్డం తిరిగినట్లుంది కదూ!

పై వాస్తవాలను మహమ్మదు సమకాలికులు కూడా గ్రహించేసారని తెలుసుకున్న ఖురాను గ్రంధకర్త, తన గ్రంథచౌర్యాన్ని ఎలా సమర్థించుకుంటున్నాడో, ఈ క్రింది ఆయాతులలో మీరే చూడండి.

“ఇంకా ఇలా అంటారు. ఇవి పూర్వకాలం నాటి వారు వ్రాసిన విషయాలు, వాటికి ఇతను నకలు వ్రాయిస్తున్నాడు. అవి ఇతనికి ఉదయం సాయంత్రం వినిపించబడతాయి” (సురా 25:5).

“ఇతనికి ఒకానొక మనిషి నేర్పుతున్నాడు” అని వారు నిన్ను గురించి అంటున్న విషయం మాకు తెలుసు, వాస్తవానికి, వారు సూచిస్తున్న మనిషి మాట్లాడే భాష అన్యదేశపు భాష. ఇదేమో స్పష్టమైన అరబ్బీ భాష. యధార్థమేమిటంటే, అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారికి అల్లాహ్ ఎన్నడు సరియైన విషయం వరకు చేరుకునే భాగ్యాన్ని కలుగజేయడు. అటువంటి వారికి బాధాకరమైన శిక్షపడుతుంది. అబద్ధాలను దైవప్రవక్త కల్పించడు, అల్లాహ్ ఆయతులను విశ్వసించని వారే అబద్ధాలను కల్పిస్తున్నారు, అసలు వారే అసత్యవాదులు (సురా16:103-105).

ఆనాడు మహమ్మదు వ్యతిరేకులు అతడు కాపీకొడుతున్నాడని ఎందుకు నిందించారు? ఈనాడు కూడా అనేకులలో అదే అభిప్రాయం ఎందుకు వుందీ? ప్రమాదమేమిటంటే, మహమ్మదు మీద వేసే ఈ నిందలకు ఆధారముంటే, ఖురాను కాస్తా దైవవాక్యము కాదని నిరూపితమైపోతుంది. ఆది హంతకుని కథనంలోనే ఏడింటిలో రెండు ఆయతులు యూదుల కల్పనా కథలు మరియు గలిబిలి వ్యాఖ్యానాల కాపీ అని విస్పష్టంగా తెలుసుకున్నాక, ఖురాను దైవ వాక్యమని ఎందుకు నమ్మాలి? దీదాత్ నియమాన్ని బట్టి గ్రంథచౌర్యమున్న ఏ పుస్తకము కూడా దేవుని వాక్యము కానేరదు కదా? మరి కాకమ్మ కథలను కాపీకొట్టిన ఖురాన్ దైవవాక్యం ఎలా అవుతుంది? దేవుడు తన చిత్తానుసారమైన ఏ విధానము లోనైనా తన వాక్యాన్ని ప్రత్యక్షపరచగలడు, కానీ కాశీమజిలీ కథలలోనుండి కాపీ కొట్టి ఒక గ్రంథాన్ని బహుశ రాయించడేమో!! మీరేమంటారు?

41. దీదాత్

“సంక్షిప్తంగా చెప్పాలంటే యెషయా 37వ అధ్యాయానికి, 2 రాజులు 19వ అధ్యాయం పదం పదం పోలిక వుంటుంది. అయినా అవి రెండూను క్రైస్తవుల ప్రకారం, శతాబ్దాలు దూరంగా వున్న దేవుడి ఉత్తేజితులైన ఇద్దరు గ్రంథకర్తలకు అన్వయించినవి. ఎవరు ఎవరిని కాపీ చేస్తున్నారు? ఎవరు ఎవరి వద్దనుంచి దొంగిలించారు? ఆ 32 మంది ఖ్యాతి చెందిన RSV బైబిలు పండితులకు ‘రాజుల’ గ్రంథకర్త ఎవరో తెలీదు (UNKNOWN) అని అంటారు. ఈ పుస్తకాంతంలో కాలిన్స్ (COLLINS) బైబిలులోని గ్రంథకర్తల బోగట్టా ఫోటోకాపీ చూడండి. ఆ బైబిలు గ్రంథకర్తల జాబితాను ఎడిట్ చేసిందెవరంటారు? న్యూయార్క్ బైబిల్ సొసైటీ, జెనెరల్ సెక్రటరి అయిన రైట్. రెవరెండ్ డేవిడ్ జె సౌంట్ లిట్ డి. (Right-Rev. DavidJ. Fant. Litt. D. General Secretary Of The New York Bible Society)

ఒక్క లేశమాత్రమైనా బైబిలు దైవవాక్యమన్న విశ్వాసం వుంటే ఆ అత్యంత గౌరవనీయుడైన పండితుడు సహజంగా ఆ విషయాన్ని తెలిపివుండాలి. కాని నిజంగా ఆయన గ్రంథకర్త - తెలీదు” (Other Unknown) అని సిగ్గుతో ఒప్పుకోక తప్పలేదు.

కాబట్టి ఎవరో టామ్ - డిక్ - హారీ వ్రాసిన ప్రతులను తమ పెదాలసేవ (లిప్ సర్వీస్) ద్వారా 'దైవవాక్యమ'ని అందర్నీ నమ్మించే ప్రయత్నం మాత్రం కొనసాగుతూనే వస్తోంది (దైవం క్షమించుగాక).”

జవాబు

ఈ రాద్ధాంతమంతా రాజులగ్రంధకర్త ఎవరో తెలియదనే కదా? గ్రంథ ప్రామాణికత కొరకు రచయిత ఎవరో తెలిసియుండడం తప్పనిసరి అన్నది, దీదాత్ దేవుని వాక్యంపై రుద్దే కొత్త నియమం. ఐతే గ్రంథ రచయిత ఎవరో తెలియక పోయినా రాజులగ్రంథం దేవుని వాక్యమని అంగీకరించడానికి ఇంతకంటే ఖచ్చితమైన ప్రమాణమొకటి క్రైస్తవులు కలిగియున్నారు. యేసుక్రీస్తు ఈ గ్రంథాన్ని దైవవాక్యమని నమ్మి, ఇతర లేఖనాలతో సమానంగా అందులో నుండి ఉదహరించడం మనం చూస్తాము (1రాజులు 10:1 నుండిమత్తయి 12:42 , 1 రాజులు 17:10 , మరియు 2 రాజులు 5:1-14 నుండి లూకా 4:25-28 ). యేసు ప్రభువు రాజుల గ్రంథాన్ని నమ్మితే, ఆ గ్రంథ ప్రామాణికతకు ఇంతకంటే సాక్ష్యమేది మాకవసరంలేదు. యేసు మాటలను ప్రక్కన పెట్టి ఏ రెవరెండ్. డేవిడ్ జె. ఫాంట్, Litt.D., లేక అహ్మద్ దీదాత్ వంటి వారి మాటలను పట్టించుకోవడానికి, మేమేమి మహ్మదు సాక్ష్యాన్ని పక్కన పెట్టి ఉస్మాన్ ఖురానును నమ్మే దావా ప్రచారకులంత మందమతులం కాము (ఈ పుస్తకంలోని మూడవ అధ్యాయంలో ఇది నిరూపించాము. జ్ఞాపకముంది కదూ?)

42. దీదాత్

“ఒకరు చెప్పగా విన్నది ప్రేరణ ‘ఉత్తేజం' కాదుకదా?

(బైబిల్లోని అన్ని పాఠ్యలకు వాటి గ్రంథకర్తల జాబితా కావాలంటే పున:పరిశీలన గావించి స్థిరపడ్డ ప్రామాణిక లేఖనం (COLLINS) వారిది తీసుకొని చదవండి. వాటిపై వ్యాఖ్యానాలు కూడా వుంటాయి.) 'యెషయా గ్రంథాన్ని గురించి క్రైస్తవులేమంటారో తెలుసా?

“ప్రధానంగా అది యెషయాకే వర్తిస్తుంది. కాని కొన్ని భాగాలు బహుశా ఇతరులు వ్రాసివుండవచ్చు. “వీరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత మనం పాపం యెషయాను ఏమి అనలేం. మరి ఈ గ్రంథచౌర్యాన్ని దేవుడి పై నెట్టివెయ్యాలా? ఎంత దైవ దూషణ? నేనింతకుముందు చెప్పిన సింపోజియం అంతంలో ప్రశ్నల సమయంలో ప్రొఫెసర్ కంప్సకీ “క్రైస్తవులు బైబిలు గ్రంథాన్ని దేవుడు పలుకగా విన్న ప్రేరణ (Verbal Inspiration) గా విశ్వసించరు” అని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు మతిమరుపుతో ఒకే గాథను రెండుసార్లు (ఇద్దరికి) చెప్పి వ్రాయించలేడు కదా? బైబిలు - అన్న ఆ దైవవాక్కుతో మానవ హస్తాలు, మానవ మాత్రంగానే విధ్వంసాన్ని సృష్టించాయి. అయినా ఆ బైబిలు తరపుదారులు మాత్రం బైబిల్లోని “ప్రతి పదం, ప్రతి కామా, ప్రతి ఫుల్స్టాపూ దైవవాక్కని ఒత్తిడి తెస్తారు.

జవాబు

బైబిల్లో పునరుద్ఘాటించబడిన సంఘటనలను గ్రంథచౌర్యం అనడం తగదని నేనిదివరకే తేల్చేసాను. ఇక యెషయా గ్రంథానికొస్తే, రాజుల గ్రంథాన్ని దైవవాక్యమని నిర్ధారించడానికి వాడిన ప్రమాణమే ఇక్కడ కూడా సరిపోతుంది. క్రొత్తనిబంధన చదివిన ఎవరికైనా యేసు మరియు అపొస్తలులు ఎంత తరచుగా యెషయా గ్రంథాన్ని ప్రస్తావించారో లేక దాని నుండి ఉదహరించారో బాగా తెలుసు. ఇక బైబిలు దైవ ప్రేరితమో కాదో మనమిప్పటివరకు అనేక ఆధారాల వెలుగులో విస్తృతంగా చర్చించాం. ఐనా తెలియక అడుగుతాను, ఈ ప్రొఫెసర్ కంప్స్కీ”, లాంటి ముక్కు మొఖము తెలియనివారిని దీదాత్ ఎందుకు ఉదహరిస్తున్నాడు? దానివల్ల ఏమి నిరూపించగలడని ఈ వ్యర్థ ప్రేలాపనలు?

దైవ ప్రేరణా? లేక మనోవైకల్యమా?

క్రైస్తవులు ముస్లిములలా దైవప్రేరణను విశ్వసించరంటూ దీదాత్ మళ్లీ అసలు పాయింట్ మిస్ అవుతున్నాడు. క్రైస్తవులేమి విశ్వసిస్తున్నారు, ముస్లిములు ఏమి విశ్వసిస్తున్నారు అనేది ఇక్కడ అసలు సమస్య కాదు. వారి మత మూలాధారాలు ఏమంటున్నాయన్నదే ఇక్కడ పరిగణించదగిన విషయం. క్రైస్తవ మూలాధారమైన బైబిలులో,2 తిమోతి 3:16 మరియు2 పేతురు 1:21 వంటి వచనాలు, బైబిలు దైవప్రేరితమే అని ఖచ్చితమైన సాక్ష్యాన్ని మనకందిస్తున్నాయి. ఐతే ముస్లిం మూలాధారాలు అనేకసార్లు మహమ్మదు చేతబడి ప్రభావంతో మాయలో వుండేవాడని సాక్ష్యమిస్తున్నాయి.(సహిబుఖారి సంపుటి.4, నెంబరు 400). బహుశ అందుకేనేమో, మనము 7వ పాయింట్లో చూసినట్లు సాతాను మాటలను కూడా దేవుని ప్రత్యక్షత అని భ్రమపడ్డాడు. మరి అలాంటి వ్యక్తి ద్వారా వచ్చిన ఖురాను గ్రంథములో, ఏవి దైవప్రత్యక్షతలో ఏవి ప్రవక్తగారి భ్రమలో ఎలా తెలుస్తుంది? ఇలాంటి గ్రంధాన్ని నమ్మడం ఎంతవరకూ సురక్షితమో, ఎంత వరకు శ్రేయస్కరమో, ముస్లిం పాఠకులు ఆలోచిస్తే, తమకు తామే ఎంతో మేలు చేసుకున్నవారవుతారు.

 

7వ అధ్యాయం

అగ్ని పరీక్షలో వింత ఫలితాలు

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో, “అగ్నిపరీక్ష" అనే
ఏడవ అధ్యాయానికి మా జవాబు.

43. దీదాత్

“దేవుడి నుంచి అవతరించిన పుస్తకమని చెప్పుకొనే ఏ గ్రంథాన్నైనా మనం వాస్తవంగా దైవగ్రంథమని ఎలా తెలుసుకోగలం? దీనికి సంబంధించిన పలు పరీక్షల్లోని ఒక పరీక్ష ఏమిటంటే సర్వజ్ఞుడైన దేవుడి నుంచి ఉద్భవించే సందేశం సంగతమై ఏకరీతిగా అసంగతం లేకుండా ఫ్రీగా వుండాలి. ఈ విషయాన్నే అంతిమ నిబంధన అయిన ఖురాను గ్రంథంలో దేవుడు ఇలా అంటున్నాడు:

ఈ ప్రజలు ఖురానును గురించి ఆలోచన చేయరా? ఇది అల్లాహ్ తరపు నుండి కాక వేరొకరి తరపునుండి వచ్చి ఉన్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధాలైన విషయాలుండేవి (పవిత్ర ఖురాన్ 4:82).

సర్వజ్ఞుడైన దేవుడు తన గ్రంథపు ప్రామాణికత్వాన్ని గురించి ఈ పరీక్ష ద్వారా రూఢీ చేసుకోమంటున్నప్పుడు మనం ఆ పరీక్షా విధానాన్ని దేవుడి నుంచి వచ్చిన గ్రంథాలనిపించుకున్న ఇతర గ్రంథాలకు ఎందుకు ప్రయోగించి చూడకూడదు? క్రైస్తవులు ఇతరుల్ని బురిడీ కొట్టిస్తూ వస్తున్నట్టు, మేము కూడా ఉత్తమాటలతో అలా చేయదలచలేదు.

నేనింతకు ముందు ఇచ్చిన ప్రముఖ క్రైస్తవ విజ్జుల రిఫరెన్సులు, అన్వయింపులు మనకేం తెలుపుతున్నాయంటే అవన్నీ కూడా బైబిలు దైవవాక్యము కాదని ఋజువులిస్తున్నప్పుడు, మనల్ని దానికి విరుద్ధంగానే నమ్మేటట్లు వారు ప్రచారం చేస్తున్నారని ఒప్పుకోక తప్పదు.”

జవాబు

సర్వజ్ఞుడైన దేవుని నుండి ఉద్భవించిన సందేశం సంగతమై ఏకరీతిగా ఎలాంటి అసంగతము లేకుండా వుండాలనే అగ్ని పరీక్షతో నేను కూడా సమ్మతిస్తున్నాను. పరస్పర వైరుధ్యాలు లేని పుస్తకాలన్నీ దైవప్రేరితమైనవి కాకపోయినా, కనీసం ఒక్క వైరుధ్యమున్న ఏ పుస్తకం కూడా దేవుని ప్రత్యక్షత కాజాలదన్నది అందరికి విదితమే. కాబట్టి, బైబిలు అసంగతాలనీ దీదాత్ ఎత్తి చూపించిన భాగాలలో తను ఆరోపించినట్టుగా పరస్పర వైరుధ్యాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిద్దాం. దానికి తోడు, అదే అగ్నిపరీక్షను ఖురానుకు కూడా అన్వయించి, ఖురానులో అసంగత విషయాలు, పరస్పర వైరుధ్యాలు వున్నాయో లేవో తెలుసుకుందాం. ఎవరు ఎవరిని బురిడీ కొట్టిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఖురాను గ్రంథకర్త కోరిన అగ్ని పరీక్షను ఇతర గ్రంథాలకు మాత్రమే అన్వయించి, ఆయన ఆశించినట్లు ఖురానుకు అన్వయించకపోతే ఆయన మాత్రం నొచ్చుకోడా మరి! అన్నట్లు దీదాత్ ముందు ఉదహరించిన క్రైస్తవ పండితుల మాటలను బట్టి ఏదో నిరూపించేసాడని ఉప్పొంగిపోతున్నాడు కానీ, వాటిని ఏ దృక్పథంతో చూడాలో పాఠకులకు ఈ పాటికి అర్థమైయుంటుందని భావిస్తున్నాను.

44. దీదాత్

“ఈ రోగానికి సంబంధించిన బృహత్తర నిదర్శనం ఇటీవలే వెలుగులోనికి వచ్చింది. గ్రాహమ్స్ టౌన్ (Grahams Town) లో ఆంగ్లికను చర్చీవారి సభ ఒకటి జరిగింది. అతీగౌరవ పాత్రుడైన ఆర్కి బిషప్ రెవెరెన్స్ బిల్ బర్నెట్ (Rev. Bill Burnett) తన సమూహానికి ప్రబోధనలిస్తున్నాడు. తన ఆంగ్లికన్ క్రైస్తవ సమూహంలో ఆయన ఓ గందరగోళం సృష్టించాడు. ఆంగ్ల భాషా కోవిదులైన, ఆంగ్ల బిషప్పుల మాతృభాష అయిన ఆంగ్లంలోనే సంబోధిస్తున్న అత్యంత పాండిత్య పరిజ్జానం గల వ్యక్తి ఆయన. కానీ, అతి విజ్ఞానులైన ఆయన సహచరులు (ఆ సమూహం) ఆయన్ను అపరిమితంగా అపార్థం చేసుకున్నారు. అదెంత వరకు వెళ్లిందంటే, మరో ఆంగ్లికన్ ప్రీస్ట్ అయిన శ్రీ మాక్ మిలన్ తన ప్రఖ్యాత ఆంగ్ల పత్రిక (The Natal Mercury) (జన్మ బుధుడు) 11, డిసెంబర్ 1979లో, ఆ ఆర్కిబిషప్ కలిగించిన గందరగోళాన్ని గురించి తన మత పెద్దలకు ఇలా తెలియచెప్పాడు:

‘ఆర్కి బిషప్ బర్నెట్గారు ఎత్తి చూపించిన విషయాలు స్పష్టంగా తెలివిగావున్నాయి. కాని అవి బాగా నాటకీయ ఫక్కీలో అక్కడున్న వాళ్ల చేత అపార్థం చేయబడ్డాయి.”

ఆంగ్ల భాషను, దాని అర్థాలను మనం ఎలాంటి తప్పు పట్టలేం. అయినా క్రైస్తవులు తమ ధర్మ సంబంధిత అన్ని మాటల్లో సద్బుద్ధితో (సరైన మతితో) ఎలా ప్రవర్తిస్తారో మీరు చూడనవసరం లేదంటారా?

‘పవిత్ర సంసర్గం' (Holy Communion) లో 'రొట్టె' అన్నది 'రొట్టె కాదు అది మాంసం (శరీరం). 'ద్రాక్షసారా' అన్నది రక్తం'. ముగ్గురూ ఒక్కటే' అంటే “మానవత్వంలో దివ్యత్వం” (ఇలా రకరకాలుగా ఆంగ్ల భాషను వేరే అర్థాల్లో అన్వయం చేసుకోవటం జరుగుతుంది. కాని “భూలోక రాజ్యం” విషయంలో మాత్రం అతను నిక్కచ్చిగా అదే అర్థం చెప్తాడు. మనం క్రైస్తవులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. మీకు తెలీకుండానే మీరు అమ్ముడుపోగలరు. ప్రామాణికంగా, నిదర్శనాలుగా చూపించేందుకు నేనిస్తున్న విషయాలు, దైవగ్రంధం అనిపించుకుంటున్న ఆ గ్రంథంలోని వైభేద్యాలను చూపించేందుకే. ఏ చిన్న పిల్లాడైనా వాటిని అట్టే గ్రహించగలడు.

జవాబు

క్రైస్తవులు మాటలను అపార్థం చేసుకుంటారనే అనుకుందాం. దానికీ, బైబిలు దేవుని వాక్యమా అనే పరిశోధనకు ఏమిటి సంబంధం? రొట్టె మరియు ద్రాక్షారసము యేసు శరీర రక్తములకు సాదృశ్యంగా బైబిలులో చూపబడ్డాయి. సాదృశ్యాన్ని అక్షరార్థములో అపార్థం చేసుకున్నది క్రైస్తవులు కాదు దీదాత్. మరి దీదాత్, మాటలను అపార్థం చేసుకున్నాడు కాబట్టి ఖురాన్ దైవవాక్యం కాదని వాదిస్తే ముస్లిములు అంగీకరిస్తారా? దీదాత్ వాడిన లాజిక్ కూడా అలాంటిదే. అలాగే దేవుడు త్రియేకుడు అనేది బైబిల్ సుస్పష్టంగా బోధించే సిద్దాంతం. ఈ విషయం దీదాత్ కు అర్థం కాకపోతే అది తన బుద్ధిలోపమని ఒప్పుకోక అది బైబిల్ లేదా క్రైస్తవుల తప్పు అని సర్ది చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇక ఇతరులను తమకు తెలియకుండానే అమ్ముడుపోయేలా చేసే మోసగాళ్లు అన్ని మతాలలోను మనకు కనిపిస్తారు. దీదాత్తు ఆ తెలివితేటలు ఇంకెవరితో పోల్చుకున్నా కాస్త ఎక్కువే అని పాఠకులకు ఇప్పటికే తెలిసిపోయుండాలి. అంతమాత్రాన, ఇది ఖురాను దైవగ్రంథమా కాదా అనే పరిశోధనకు ఏ విధంగానైనా దోహదపడుతుందని ముస్లిములు ఒప్పుకోగలరా? మరి క్రైస్తవుల్లో లోపభూయిష్టత ఏదైనా వుంటే,అది బైబిలు దేవునివాక్యమా అనే పరిశోధనకు సంధర్భోచితమైనది ఎలా అవుతుంది? కాబట్టి, ఈ వట్టి మాటలను కట్టబెట్టి, దీదాత్ బైబిల్లో వైరుధ్యాలని ఎత్తి చూపించిన ప్రత్యేక భాగాలను ఇప్పుడు పరిశీలిద్దాం. తమకు తెలియకుండానే దీదాత్ అబద్దాలకు అమ్ముడుపోయిన వారికి సత్యమేమిటో తెలియజెప్పాలిగా మరి.

45. దీదాత్

దేవుడా? దెయ్యమా?

“ఇంకొకమారు యోహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరణ చేసి నీవు పోయి ఇశ్రాయేలువారిని, యూదావారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను” (1 దినవృత్తాంతములు 21)

"తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా” (2 సమూయేలు 24).

దినవృత్తాంతములు', 'సమూయేలు' గ్రంథాల రచయితలు ఇద్దరునూ దావీదు యూదుల జనసంఖ్యను లెక్కించవలసిన కథనే మనకు చెబుతున్నారని మీరు గమనించగలరు. ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగించేందుకు గాను ప్రేరణ దావీదుకు ఎక్కడ నుంచి కలిగింది? 2వ సమూయేలు 24:1 లో దానీ గ్రంథకర్త ఈ ప్రేరణ 'యోహోవా ద్వారా' అని అంటాడు. (RSVలో INCITED అని వుంది) ప్రేరేపించడం. దేవుడు కదిలించెను (GOD WHO MOVED). కాని 1వ దినవృత్తాంతములు 21:1 లో దాని గ్రంథకర్త దావీదును 'సాతాను” ప్రేరేపించినట్లు తెలుపుతున్నాడు.

సర్వేశ్వరుడైన దేవుడు ఈ వైభేద్యపు ప్రేరణలకు ఎలా మూలం కాగలడు? అదీ దేవుడా? సాతానా? దేవుడంటే సాతాను అని నానార్థంగా ఏ మతంలో వుందంటారు? ఒకవైపు దేవుడికి పట్టం కడుతూనే మరోవైపు సాతానుకు అధికారం ఇవ్వడం జరిగింది. దినవృత్తాంతము, ఆ రచయిత కల్పించిన ఈ వైభేద్యం మనకు ఓ కథను గుర్తుకు తెస్తుంది. ఓ ముసలావిడ ఓ క్రొవ్వొత్తి సెయింట్ మైఖేలుకు వెల్గించి మరోటి సాతానుకు వెళ్లించిందట. ఆమె స్వర్గానికెళ్లిందో నరకానికెళ్లిందో కాని ఆమెకు తోడెవరో అర్థంకాలేదు. దినవృత్తాంతముల గ్రంథకర్తకు మాత్రం దైవ న్యాయస్థానంలో తోడువున్నాడు. పైన దేవుడి కోర్టులోను క్రింద భూమి మీద కూడా అతనికి రెండు చోట్లా లాభం కావాలి మరి.”

జవాబు

బైబిలు మరియు ఖురాను బోధనలను సమగ్రంగా అర్థం చేసుకున్న ఎవరైనా, ఆ రెండు పుస్తకాలలోను సమాంతరంగా బోధించబడిన ఒక విశిష్టమైన సిద్ధాంతం పట్ల దీదాత్ తన పూర్తి అవగాహనాలోపాన్ని ఇక్కడ బయట పెట్టుకుంటున్నాడని ఇట్టే గుర్తించగలరు. సత్యాన్ని తెలుసుకోడానికి దీదాత్ ప్రస్తుత పరిశోధనను చేపట్టియుంటే, ఈ చిక్కుముడిని విప్పడానికి ఖురానునుండే అతనికి కావలసినంత సహాయం లభించియుండేది. ఖురానులో ఒకానొక ఆయతు ఇలా అంటుంది:

మేము సత్యధిక్కారుల మీదకు షైతానులను వదలిపెట్టి ఉన్న విషయాన్ని నీవు చూడటం లేదా? అవి వారిని (సత్యాన్ని వ్యతిరేకించండి అని) అమితంగా పురికొల్పుతున్నాయి ( సురా. 19:83).

ఈ ఆయతు ప్రకారం, “సత్యధికారులు” అవిశ్వాసానికి అమితంగా పురిగొల్పబడేలా వారిపై షైతానులను అనుమతించేది అల్లాయే ఐనప్పటికి, అల్లా అనుమతి మేరకు షైతానులే “సత్యధిక్కారులను” పురిగొల్పుతున్నాయి. కాబట్టి అవిశ్వాసులను అల్లా మరియు షైతానులు పురిగొల్పుతున్నారు. అంతమాత్రాన ఖురానులో వైరుధ్యముందని షైతాను అన్నది దేవునికి నానార్థంగా వాడబడిందనీ, వెటకారమాడితే ముస్లిములు ఒప్పుకుంటారా?

నిజానికి దేవుడు మహా సార్వభౌముడని, ఆయన అనుమతి లేకుండా ఆయన సృష్టిలో ఎవరు ఏమి చేయలేరని, సాతాను చర్యలు ఆయనకు విరోధంగా రూపొందించబడిన కుట్రలైనప్పటికి, ఆయన అనుమతి లేకుండా ఏమి చేయ్యలేడని, కాబట్టి జరిగే ప్రతి సంఘటనలో పరోక్షంగా దేవుని హస్తం వుందని ఖురాను మరియు బైబిలు రెండు ఒప్పుకుంటున్నాయి. దావీదుపై సాతాను తల పెట్టిన శోధనను దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పుతీర్చడానికి ఒక సాధనంగా వాడుకున్నాడని దీదాత్ ఉదహరించిన బైబిలు వచనాలు తెలియజేస్తున్నాయి. అలాగే, అల్లాను తిరస్కరించినవారి పై తీర్పుతీర్చడానికి షైతానులు పురిగొలిపే సత్య వ్యతిరేకతను అల్లా వాడుకొంటున్నాడని ఖురాను నుండి నేను ఉదహరించిన ఆయతు తెలియజేస్తుంది. ఈ రెంటిలో వైరుధ్యమేమి లేదు కాని, దేవుని సార్వభౌమత్వానికి సంబంధించిన చక్కటి పాఠాన్ని ఇవి నేర్పుతున్నాయి..

దీదాత్ ప్రయోగించిన పై కొలమానం సరియైనదైతే, బైబిలులో ఆరోపించిన అదే వైరుధ్యం ఖురానులో కూడా వున్నట్లు ఒప్పుకోవలసివస్తుందని గ్రహించలేక ఇలా తన అజ్ఞానాన్ని మరోసారి బయట పెట్టుకొని నవ్వులపాలయ్యాడు. వైరుధ్యముందని నిర్ధారించడానికి ఇక్కడ ఏమి దొరకదు కాని, కనీసం దీదాత్ ఎంత విద్యావిహీనుడో నిరూపించే మరో నిదర్శనమైనా దొరికింది కదా అని మనం సరి పెట్టుకోవల్సిందే.

ఇంతకీ వైరుధ్యాలంటే ఎలా వుంటాయి?

పరస్పర వైరుధ్యమనేది ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకుంటే, సాక్షాత్తు దేవుని వాక్యమైన బైబిల్లో దానిని వెదకడం వ్యర్థం. ఐతే, ఖురానులో అలాంటివెన్నో మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు సురా 58:2 లో ఇలా చదువుతాము.

“మీలో ఎవరు తమ భార్యలను “జిహార్” ద్వారా దూరంగా ఉంచుతారోవారికి వారి భార్యలు తల్లులు కాజాలరు. వారిని కన్నవారే వారి తల్లులు”.

ఇక్కడ “వారిని కన్నవారే వారి తల్లులు” అనే మాటను అండర్ లైన్ చేసుకోండి. కన్నవారు మాత్రమే తల్లులు అంటే సమస్యేమిటని ఆలోచిస్తున్నారా? సురా 53:6 చదివితే మీకే తెలుస్తుంది.

నిస్సందేహంగా విశ్వాసులకు దైవ ప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు, దైవ ప్రవక్త భార్యలు వారికి తల్లులు.

ఒక చోట “వారిని కన్నవారే వారి తల్లులు” అంటూ మరో చోట “దైవప్రవక్త భార్యలు వారి తల్లులు అనడం పరస్పర వైరుధ్యం అని చిన్న పిల్లలు సహితం గుర్తించగలరు. ఒక్క వైరుధ్యమున్నా, ఖురాను అల్లా నుండి వచ్చినది కాదనడానికి అదే ఋజువని ఖురానే ఒప్పుకున్నట్లు సురా 4:82లో మనం ఇది వరకే చూసాము, జ్ఞాపకముంది కదా?

46. దీదాత్

ఈ మధ్య కాలంలోనే కొంతమంది క్రైస్తవుల్లోనే సాతాను పూజలు, 'సాతానిజం (Satanism) పుట్టిన విషయాన్ని గురించి చర్చించదలచలేదు.” క్రైస్తవానికి క్రైస్తవమే సాటి! కమ్యూనిజమ్, ఫాసిజం, క్రిస్టియన్ సైన్టిజం, టోటలిటేరియనిజం, నాజిజం, మార్మోనిజమ్, మూనిజమ్, ఇటీవల సాటానిజమ్ - ఇంకా క్రైస్తవం ఏం ఏం ఉత్పత్తి చేయనున్నదో?ది హోలీ బైబిల్ (పరిశుద్ధ గ్రంథం) ఇలాంటి పలు విభేధార్థాలు ఇవ్వడం పరిపాటే. దీన్ని క్రైస్తవ ప్రపంచం గొప్పగా చెప్పుకుంటుంది.

“మానవ జాతికి తెలిసిన ప్రతి చెడూని న్యాయపరంగా గూర్చి చెప్పేందుకు బైబిలు వాక్యాలు (వ్యాసాలు) పరంపరగా దుర్వినియోగం చేయబడ్డాయని, అక్రమంగా అర్థం పలుకబడి మార్చబడ్డాయని పలువురు వాస్తవాన్ని గుర్తు చేసివున్నారు” అని దీ ప్లెయిన్ ట్రూత్ (The Plain Truth) అమెరికాకు సంబంధించిన క్రైస్తవ పత్రిక జూలై 1975 ఎడిషెన్లో “బైబిలు ప్రపంచంలోని అతి వివాదాస్పదమైన పుస్తకం” అనే శీర్షిక క్రింద వ్రాసింది.

జవాబు

మానవజాతికి తెలిసిన ప్రతి తప్పును న్యాయపరంగా సమర్థించి చెప్పేందుకు బైబిలు వాక్యాలు దుర్వినియోగం చేయబడ్డాయని, బైబిలు వాక్యాల అర్థం వక్రీకరించబడి వాడబడుతున్నాయని, సాటానిజం మొదలుకొని ఇంకా ఎన్నో “ఇజం” లను బైబిల్ ఉత్పత్తి చేసిందని, ఇలా దీదాత్ చేసిన వ్యర్థ ప్రేలాపనలు, బైబిలు దేవుని వాక్యము కాదని ఎలా నిరూపిస్తాయో దీదాత్కే తెలియాలి. బైబిల్ ఈ విధంగా దుర్వినియోగం చేయబడుతున్నదని ఒక వైపు ఒప్పుకుంటూనే, అది బైబిలు తప్పన్నట్లు దీదాత్ చిత్రీకరించడం, పక్షపాత ధోరణి ఎలాంటి అంధత్వాన్ని కలిగిస్తుందో మనకు హెచ్చరించే ఒక చక్కటి నిదర్శనం.

బైబిల్ వక్రీకరించబడి దుర్వినియోగం చేయబడితే అది దుర్వినియోగించిన వానిలో వున్న లోపమే కాని బైబిల్లో వున్న లోపం ఎలా అవుతుంది? బైబిలు పలు అర్థాలలో అపార్థం చేయబడడం బైబిలు తప్పని వాదించే ముస్లింలు, అదే కొలమానాన్ని ఖురానుకు అన్వయించడానికి సిద్దమేనా? ఒకవేళ ఖురానును అందరూ ఒకే విధంగా అర్థం చేసుకొనియుంటే, షఫీ, జఫారీ, హనాఫీ, హన్బలి, మాలికి మొదలుకొని, ఇస్లాంలో 72 వ్యత్యస్థ శాఖలు ఉద్భవించడానికి కారణమేమిటి? ఇస్లాం సాంప్రదాయక సిద్ధాంతాలను తూలనాడే ఖాదీయానీలు, సూఫీలు మున్నగువారు, తమ అవాంతర అభిప్రాయాలను సమర్ధించుకోవడానికి దుర్వినియోగపరిచేది ఖురానును కాదా? జీహాద్ పేరిట సాతాను ఆరాధికుల కంటే హీనంగా ప్రవర్తించే కొందరు ముస్లింలు, తమ దురాగతాలను సమర్థించుకోవడానికి ఖురానునే వక్రీకరించి దుర్వినియోగం చెయ్యడం లేదా?అంతమాత్రాన అది ఖురాను తప్పని మాట్లాడడం న్యాయమేనా? ఖురాను ప్రమాణికతను పరిశోధించడానికి తాము ఎన్నడు సమ్మతించని అనుచిత నియమాలను బైబిలుకు అన్వయించడం, మన దావా ప్రచారకుల రెండు నాలుకల ధోరణినే బహిర్గతం చేస్తుంది తప్ప, బైబిలుకు దీని వల్ల కలిగే నష్టమేమి లేదు.

47. దీదాత్

అసలు గ్రంథకర్తలెవరు?

ఇంకొక నిదర్శనం కూడా 'సమూయేలు'లో దినవృత్తాంతముల నుండి తీయబడి వుంది. ఈ పొరపాట్లకు దేవుడే గ్రంథకర్త అని నిర్ణయించకుండా, ఆ గ్రంథాల గ్రంథకర్తలెవరో తెలుసుకోవడం మంచిది. RSV (పున:పరిశీలన గావించి స్థిరపడ్డ పాఠ్యభాగం) పున:విమర్శకులు ఇలా వ్రాశారు.

(ఎ) సముయేలు - గ్రంథకర్త - తెలీదు (Unknown)

(బి) దినవృత్తాంతములు - గ్రంథకర్త -తెలీదు (Unknown)

(బహుశా ఎజ్రా వీటిని సేకరించి సంగ్రహపరిచి ఉండవచ్చు)

ఈ బైబిలు పండితులు వినమ్రంగా సత్యాన్ని ఒప్పుకునే పద్దతిని మనం కొనియాడవచ్చు. కాని వారి 'బహుశా ఉండవచ్చు' అనే అనుమానాస్పదమైన మాటలు మాత్రం వారి గొర్రెలను అపార్థంలో పడవేసి, వాటిని వాస్తవంగా అనే అర్థాన్ని పుట్టిస్తున్నాయి. ఈ గుర్తు తెలీని గ్రంథాల గ్రంధకర్తలుగా పాపం ఎజ్రాను, యెషయ్యాలను అనుమానంగా ఎందుకు అంటకట్టడం?

జవాబు

బైబిల్లోని గ్రంథాల ప్రామాణికత, వాటి రచయితల గుర్తింపుపై ఆధారపడిలేదని, యేసుక్రీస్తు వాటిని ఆమోదిస్తే, వాటి ప్రామాణికతకు అంతకంటే బలమైన నిదర్శనాలు అవసరం లేదని నేనిదివరకే స్పష్టంచేసాను. “లేఖనాలు” అంటూ పలుమార్లు సువార్త గ్రంథాలలో ప్రభువు ప్రస్తావించినప్పుడు, సమూయేలు మరియు దినవృత్తాంతాలు గ్రంథాలతో సహా నేటికి పాతనిబంధనలో నీలిచియున్న అన్ని గ్రంథాలు ఇమిడియున్న యూదుల సంపూర్ణ లేఖన సంగ్రహానికది వర్తిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. ఆ యూదుల లేఖన సంగ్రహంలో కొన్నిగ్రంథాలు అప్రమాణికమైనవై యుంటే, ప్రభువు అన్నిటికి తన ఆమోదము వర్తించేలా వాటిని ఒకే తాటిపై “లేఖనాలు” అని సంబోధించియుండేవాడు కాదు. యేసు సాక్ష్యాన్ని పక్కకు నెట్టి, R.S.V. పున:పరిశీలకులు, ఆధునిక పండితులు చెప్పే అనుమానాస్పద, ప్రశ్నాస్పద సాక్ష్యాలకు తావివ్వడానికి, దీదాత్తు పట్టినట్లు తన ప్రవక్త మాటలను ప్రక్కకు నెట్టి రషాద్ ఖలీఫా వంటి తన ఆధునిక గురువుల “తాన"కు "తందాన” పాడే మతభ్రష్ట దుర్గతేమీ మాకు పట్టలేదు.

48. దీదాత్

గుర్రపు దళాలా? పదాతి దళాలా?

ప్రక్కన ఇవ్వబడ్డ కొటేషన్లు చూడండి. దావీదు ఎంతమంది రధికుల్ని హతమార్చాడు? ఏడువందలా? ఏడువేలా? ఇంతేగాదు. అతను 40,000 మంది గుర్రపు రౌతుల్ని హతమార్చాడా లేక 40,000 మంది పదాతి దళాల్నా ? ఈ విభేదాల రికార్డులు2వ సమూయేలు 10:18 కును1వ దినవృత్తాంతములు 19:18 కు మాత్రం పరిమితం కావు. దేవుడికి వేలకు వందలకూ వున్న వ్యత్యాసం తెలియదు! 'గుర్రపు రౌతులకు” 'పదాతిదళాలకు” వున్న వ్యత్యాసం కూడా తెలియదు. మరి ఈ రకపు 'దైవదూషణ' క్రైస్తవంలో (ప్రేరణ'గా ఎంచబడిందా?

700లా 7000లా? అసలు 7000 నుండి ఒక సున్నా (0) తీసి వేయబడిందా లేక 700 లకు ఒక సున్నా (0) కలపబడిందా అన్నది బైబిలు ప్రేమికులకు ఇబ్బందికరమైన మాటే. ఇది బైబిలు గణిత శాస్త్రాన్ని ఇంకా క్లిష్టతరం చేస్తుంది.

“సిరియనులు సన్నిద్ధులై దావీదును ఎదుర్కొనవచ్చి అతనితో యుద్ధము చేసి ఇశ్రాయేలీయుల యెదుట నిలవజాలక పారిపోగా, దావీదు సిరియనులో ఏడు వందల మంది రధికులను, నలుబది వేలమంది గుఱ్ఱపు రౌతులను హతముచేసెను. మరియు వారి సైన్యాధిపతియగు షోబకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను.” (2వ సమూయేలు 10:18)

“అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువలేక తిరిగి పారిపోయిరి, దావీదు సిరియనులలో ఏడువేల రథికులను, నలుబది వేల కాల్బలములనుహతము చేసి, సైన్యాధిపతి అయిన షోబకును చంపి వేసెను” (1వ దినవృత్తాంతములు 19:18)

దేవుడు 'గుర్రపు రౌతులు” “కాల్బలముల మధ్య అస్పష్టత చెందాడు

ప్రేరణ, ఉత్తేజం పొందిన బైబిలు గ్రంథకర్తలు 'కాల్బలము' గుర్రపు రౌతుల' లో భేదాన్ని అర్థం చేసుకోకపోవడం 'కాల్బలానికి' గుర్రపు రౌతులకు ఉన్న భేదం దేవుడికి తెలియదనే నిందగా, ఆ ప్రేరణకు కారకుడైన దేవుడి పైనే వేయడం శోచనీయం. కొంపదీసి పారిపోయిన సిరియన్లు సెంటర్లు (గుర్రపుకాళ్లు శరీరం వుండి మనిషితల, మనిషి చేతులూ వుండే గ్రీకుపాత్రలు) అని లెక్కకట్టాలేమో లేదా మనల్ని మోసగించే గ్రంథకర్తకు ప్రేరేపించే సహాయంగా గ్రీకు పురాణాల్లోంచి ఆ శక్తులు సడన్ గా దాపురించాయా? వందలకు వేలకు తేడాగాని, గుర్రపు రౌతులకు కాల్బలానికి తేడాగాని దేవుడికి తెలియకుండా పోయిందనే దైవదూషణ ప్రేరణ ఉత్తేజరూపంలో క్రైస్తవ నిఘంటువుల్లో చోటు చేసుకుంది.

జవాబు

ఇక్కడ దేవునికి వందలకు మరియు వేలకు మధ్య బేధం తెలియకపోవడం కాదు. దీదాత్ కు రథములు మరియు మనుష్యులకు మధ్య తేడా తెలియకపోవడమే అసలు సమస్య. తెలుగు బైబిల్లో వున్న అనువాద లోపాన్ని బట్టి పాఠకులకు నేను చెప్పింది అంత సులభంగా అర్థం కాకపోవచ్చు కానీ, దీదాత్ ఉదహరించిన ఆంగ్ల కింగ్ జేమ్స్ అనువాదాన్ని చదివిన పసిపిల్లాడు సహితం, దీదాత్ ఇక్కడ ప్రయత్నించిన తప్పుడు చిత్రీకరణను ఇట్టే పసిగట్టగలడు. తెలుగు అనువాదంలో2వ సమూయేలు 10:18 లో దావీదు సిరియనులలో ఏడు వందల మంది రధికులను హతము చేసెను, అని వుంది. ఐతే గ్రీకు భాషకు అతి దగ్గర అనువాదమైన కింగ్ జేమ్స్ అనువాదాన్ననుసరించి ఈ వచనాన్ని ఇలా చదవాలి. "దావీదు ఏడు వందల రథముల మనుష్యులను, హతముచేసి” కాబట్టి ఈ వచనం తెలియజేసే “ఏడువందలు” అనే సంఖ్య దావీదు హతము చేసిన మనుష్యుల (రధికుల) సంఖ్య కాదు; వారు స్వారీ చేసిన రథముల సంఖ్య..

ఇప్పుడు 1వ దినవృత్తాంతములు 19:18 చదివితే, ఎంతో శ్రమకోర్చి దీదాత్ కల్పించిన గొప్ప సమస్యాస్పదమైన బైబిలు వైరుధ్యం కాస్తా ఒక్కసారిగా పటాపంచలైపోతుంది. అక్కడ ఇలా వుంది- దావీదు సిరియనులలో ఏడువేల రథికులను... హతముచేసి.... ఈ వచనం తెలియజేసే “ఏడు వేలు” అనే సంఖ్య “మనుష్యుల” (రథికుల) సంఖ్య. అనగా సగటున పది మంది యోధులు ఒక రథం పై సవారీ చేస్తారన్నమాట. సమస్య తొలగిపోయిందిగా? దావీదు చంపింది ఏడు వందల రథములపై యుద్దము చేసిన ఏడువేల మంది రధికులను అని ఈ రెండు వాక్యభాగాల సారాంశం.

తెలుగులో అనువాద లోపం వల్ల విడమర్చి చెప్పవలసి వచ్చింది కాని, స్వచ్ఛమైన ఇంగ్లీషులో ఈ వాక్యాన్ని ఉదహరిస్తూనే తప్పుందని చిత్రీకరించిన దీదాత్, ఉద్దేశపూర్వకంగానే అబద్దమాడుతున్నాడని, ఆంగ్ల కింగ్ జేమ్స్ అనువాదాన్ని చదివే ఎవ్వరైనా మీకు ధృవీకరించగలరు. ఇది చాలదన్నట్లు, సమూయేలు గ్రంథకర్త “నలుబదివేల మంది గుర్రపు రౌతులని,” దినవృత్తాంతముల గ్రంథకర్త “నలుబదివేల మంది కాల్బలం” (పదాతిదళం) అని చెబితే, అందులో కూడా దీదాత్ కు వైరుధ్యం కనబడిందంట, ఈ రెండు వాస్తవాలే. ఒకరు చెప్పింది మరొకరు ప్రస్తావించనంత మాత్రాన అది వైరుధ్యం కానవసరంలేదు. ఒకవేళ దినవృత్తాంతాల గ్రంథకర్త నలుబది వేలమంది పదాతి దళాలే కానీ గుర్రపు రౌతులు కావని వ్రాసియుంటే లేదా “నలువది మంది పదాతి దళాలే తప్ప ఇంకెవరిని చంపలేదని” వ్రాసియుంటే, అది సమూయేలుతో విబేధిస్తుందని చెప్పవచ్చు. ఐతే, ఈ ఇరుగ్రంథాలు అలాంటి పరస్పర కొట్టివేత మాటలేమి చెప్పడం లేదు కాబట్టి, ఇరువురు చెప్పింది వాస్తవమే, అంటే దావీదు మొత్తం నలభైవేల మంది గుర్రపుదళాలను, నలబైవేలమంది పదాతి దళాలను మరియు ఏడువందల రధములపై యుద్దము చేసిన ఏడువేల మంది సిరియా రధికులను చంపాడన్నమాట. ఈ వాస్తవం అలనాడు సిరియన్ల పై దావీదు విజయభేరి మాత్రమేకాదు ఈనాడు దీదాత్ పై మా విజయభేరి కూడా.

నరకంలో ఏం తింటారు?

సమూయేలు మరియు దినవృత్తాంతముల గ్రంథాల మధ్య వైరుధ్యం లేదని నిరూపిస్తూ, అవి ఒకదాని మాటలను మరొకటి కొట్టివేసే విధంగా మాట్లాడడం లేదని వాదించాను. ఐతే, నరకవాసులకు ఏమి ఆహారం లభిస్తుందో ఖురాను మనకు తెలియజేస్తు, ఒక ఆయతు మాటలను మరో ఆయతు ఎలా కొట్టివేస్తుందో గమనించండి.

"గాయాల కడుగు తప్ప అతనికి తినటానికి ఆహారం కూడా ఏదీ ఉండదు” (సురా. 69:36).

ఈ ఆయతు ప్రకారం నరకంలో తినడానికి గాయాల కడుగు తప్ప ఇంకేమి లభించదు. అది తప్ప ఏదీ లభించదు అంటే ఇంకే ఆహారము అక్కడ ఉండదనేగా అర్థం? ఐతే ఈ ఆయత్తో సురా 88:6 ను పోల్చి చదివినప్పుడు నరకంలోని మరో ఆహార పదార్థాన్ని పరిచయం చేస్తూ, ఇది తప్ప ఇంకేమి లభించదని ఖురాను అంటుంది చూడండి.

“వారికొరకు ఎండిన ముళ్ల గడ్డి తప్ప మరొక ఆహారం ఉండదు”.

ఇంతకు నరకంలో ఆకలేసినప్పుడు తినడానికి ఏమి దొరుకుతుంది? పుండ్లు కడిగిన నీళ్లా, లేక ముళ్లగడ్డా? ఇక్కడ రెండు వాస్తవమే అని చెప్పజూసే దావా ప్రబుద్దులు కూడా ఉంటారు సుమా! ఐతే, ఈ రెండు ఆయతులు మాత్రం అవి వడ్డించేవి తప్ప ఇంకేవి ఉండడానికి వీలు లేదంటు, పరస్పరం పోటీ పడుతున్నాయి. ఇంతకు, అక్కడ ఏమి తింటారో దావా ప్రచారకులను అడిగితే తెలుసుకోలేరు కాని, అంతం వరకు వారిని వెంబడిస్తే తప్పక తెలుస్తుంది; తస్మాత్ జాగ్రత్త.

అన్నట్లు వేలకు వందలకు మధ్య, గుర్రపు రౌతులకు మరియు పదాతిదళాలకు మధ్య భేదాన్ని మాకు నేర్పడం మాని, “పుండ్లు కడిగిన నీళ్లు” మరియు “ఎండిన ముళ్లగడ్డి" కి మధ్య తేడాను దావాలోకమంతా కలిసి అల్లాకు విన్నవించుకుంటే వారికి మంచిది. బహుశ మెనూలో మార్పులేమైనా చేస్తాడేమో!!!

ఎన్ని తూర్పులు? ఎన్ని పడమరలు? అల్లాకే తెలుసు!

బైబిలు గ్రంథకర్తకు వందలకు వేలకు మధ్య, గుర్రపు దళాలు మరియు పదాతి దళాలకు మధ్య భేదం తెలీదంటూ వెటకారమాడిన దీదాత్ అభియోగం ఆధార రహితమని చూసాం కదా; ఇప్పుడు ఖురాను గ్రంథకర్త ఎన్ని తూర్పులు ఎన్ని పడమరలు వున్నాయో మనకు బయలుపరచబోతున్నాడు, శ్రద్దగా చదవండి. సురా 26:28 ప్రకారం ఒక తూర్పు ఒక పడమర వున్నట్లు అక్కడ చేయబడిన ఏకవచన ప్రయోగాన్ని బట్టి తెలుసుకోవచ్చు.

“ఇందులో మనకు తెలియనిదేముంది” అనుకుంటున్నారా? తొందరపడకండి! మీకు తెలియనిది అల్లాకు తెలుసని మీకు తెలియదా? సర్వజ్ఞుడైన అల్లా ప్రకారం రెండు తూర్పులు, రెండు పడమరలు కూడా వున్నాయి తెలుసా?

“రెండు తూర్పు (దిక్కులకూ, రెండు పడమర (దిక్కులకు, అన్నింటికీయజమాని ప్రభువు ఆయనే” (సురా. 55:17)

ఇంతకు ఒక తూర్పు ఒక పడమరా? లేక రెండు తూర్పులు రెండు పడమరలా? సురా. 7:40లో కూడా “తూర్పులు” “పడమరలు” అంటూ బహువచన ప్రయోగం చెయ్యబడింది కాబట్టి, ఒకటుందో, రెండున్నాయో, ఇంకా అనేకములున్నాయో, అంతా ఆ అల్లాకే తెలియాలి. “కుడియెడమైతే పొరపాటు లేదోయ్” అని చిన్నప్పుడెక్కడో విన్న జ్ఞాపకం. ఐతే వాటి సంఖ్య పెరిగితే కూడా తప్పులేదా అన్నది పాఠకులే చెప్పాలి. ఇంతకు ఖురాను గ్రంథకర్తకు ఒకటి మరియు రెండు, వీటి మధ్యన భేదం తెలుసా? ఒకచోట ఒకే తూర్పు పడమర ఉన్నట్లే మాట్లాడుతూ, మరోచోట రెండు తూర్పులు, రెండు పడమరలు ఉన్నట్లు ప్రస్తావించడం పరస్పర వైరుధ్యం మాత్రమే కాదు, అసంభవం, అసంగతం కూడా. ఒకటి రెండని, మనకు తెలిసిన ఒకే తూర్పు పడమర తప్ప ఇంకేవైనా తూర్పులు పడమరలు వుంటాయని ఏ అద్భుతం కూడా నిరూపించలేదు. ఐతే మనం తొందరపడి అల్లాను అపహాస్యమాడకుండా జాగ్రత్త పడాలి. ఖురానులో పరస్పర వైరుధ్యముంటే ఆ గ్రంథం ఆయన వ్రాసింది కాదని ఆయన ముందే చెప్పేశాడుగా, మీరు చదవలేదా? ఐతే మళ్లీ చదవండి:

“ఈ ప్రజలు ఖురాను గూర్చి ఆలోచన చేయరా? ఇది అల్లా తరపు నుండి కాక వేరొకని తరపు నుండి వచ్చియున్నట్లయితే ఇందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలుండేవి” (సురా. 4:82).

49. దీదాత్

దేవుడు 3 సంవత్సరాల క్షామం నిర్ణయించాడా? లేక 7 సంవత్సరాల క్షామమా?

“కావున గాదు దావీదు వొద్దకువచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల యెదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా?” (2వ సమూయేలు 24 :13)

“కావున గాదు దావీదు నొద్దకువచ్చి యిట్లనెను - మూడేండ్లపాటు కరువుకలుగుట, మూడు నెలల పాటు శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవువారి యెదట నిలువలేక నశించి పోవుట...” (1 దినవృ. 21:11,12).

మన క్రైస్తవులు నమ్మినట్లు దేవుడే బైబిల్లోని ప్రతి పదానికి, వాక్యానికి, కామాలు ఫుల్ స్టాపులకు గ్రంథకర్త అయితే, పైన చూపించబడ్డ లెక్కల తప్పులకు కూడా దేవుడే గ్రంథకర్త కావాలికదా?

జవాబు

1వ దినవృత్తాంతములు 21:12 లో చదివిన విధంగా, దేవుడు ప్రతిపాదించింది మూడు సంవత్సరాల కరువు కాలమే, మరి 2 సమూయేలు 24:13 లో వున్న “ఏడు” సంవత్సరాలకు అర్థమేమిటి? ఈ సంఘటనకు మునుపున్న అధ్యాయాలు చదివితే, ఏ అర్థంలో ఏడు సంవత్సరాలని సమూయేలు చేత దేవుడు వ్రాయించాడో తెలుసుకోవడం సులభమే. సౌలు పాపం కారణంగా అదివరకే మూడు సంవత్సరాల కరువు కాలాన్ని వారనుభవించారు (2 సమూయేలు 21:1 ). ఇప్పుడు గాదు ద్వారా ప్రతిపాతించబడిన మూడేండ్లతో కలిసి ఆరు సంవత్సరాల కరువు కాలం కొనసాగనుంది. ఇక ప్రతీ యేడవ సంవత్సరము ఇశ్రాయేలులో విశ్రాంతి సంవత్సరంగా ఆచరించబడాలి (లేవీకాండం 25:1-7 ). దున్నడానికి, విత్తడానికి కోయడానికి అనుమతి లేని ఆ విశ్రాంతి సంవత్సరం, పైన సూచించిన రెండు కరువు కాలాల మధ్యంతరంగా వచ్చినా, లేక వాటి చివర కలసినా, అది ఏడవ కరువు సంవత్సరంగా పరిణమిల్లుతుంది. కాబట్టి సందర్భంలో చూస్తే, ఏడు సంవత్సరాల కరువు కాలం కొనసాగవలసిన ప్రమాదాన్ని ఎత్తి చూపే విధంగా సమూయేలు ఈ సంఘటనను వ్రాసాడని, ఐతే దినవృత్తాంతములలో వున్నది దావీదు పాపానికి మాత్రమే ఫలితంగా ప్రతిపాదించిన మూడు సంవత్సరాల కరువని ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తించగలము. ఇందులో వైరుధ్యమేముంది?

ఆరు నెలలా? తొమ్మిది నెలలా?

“లెక్కల తప్పులు” అంటూ బైబిలకు దీదాత్ చేసిన ఆరోపణ మరొకసారి ఆధారరహిత మైనదని గుర్తించాము కదా; ఐతే పిల్లలను గర్భము దాల్చడం మరియు వారికి పాలుపట్టడం గురించి కొన్ని సరికొత్త లెక్కలు ఖురాన్ మనతో పంచుకుంటుంది;

అవేమిటో చూద్దాం?

“తమ సంతానం యొక్క పాలుపట్టే గడువు పూర్తికావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ బిడ్డలకు పూర్తిగా రెండు సంవత్సరాలు పాలుపట్టాలి” (సురా 2:233).

ఈ ఆయత్, పిల్లలకు పాలుపట్టవలసిన పూర్తి కాలం రెండు సంవత్సరాలుగా గుర్తించింది. దీనిని మనసులో ఉంచుకొని సురా 46:15ను ఒకసారి పరీక్షించండి. అక్కడ ఇలా చదువుతాము:

“అతనిని గర్భంలో పెట్టుకొని మోసేందుకు, అతనికిచ్చే పాలు మాన్పించేందుకు ముఫ్పై మాసాలు పట్టింది (సురా 46:15)

ఈ ఆయత్తు ప్రకారం పిల్లలు గర్భవాసులైనది మొదలుకొని వారికి పాలుపాట్టడం ముగించేంతవరకు పూర్తి కాలం ముప్పది నెలలు అని ఖురాను సెలవిస్తుంది. సురా 2:233 గుర్తించిన ప్రకారం పాలుపట్టడానికి పూర్తి సమయం “రెండు సంవత్సారాలు”, అనగా ఇరువది నాలుగు నెలలు అన్నది వాస్తవమైతే, పిల్లలు గర్భంలో గడిపే పూర్తి సమయం 30 నెలలు - 24 నెలలు= ఆరు నెలలే అన్న మాట!!! మరి తొమ్మిది నెలలంటుందేమిటి ఈ వెట్టి లోకం? ఖురాను ఇచ్చే విలువైన సమాచారము తెలియక ఎంత కోల్పోతుందో ఈ పిచ్చి లోకం!!! ఇక్కడ సమస్య, పై రెండు ఆయతుల మధ్య పరస్పర వైరుధ్యం వలన కలిగిందా, లేక వాటికీ మరియు లోకమంతటికి తెలిసిన సామాన్య వాస్తవానికి మధ్య వైరుధ్యం వలన కలిగిందా అనేది బహుశ మన దావా ప్రచారకులేమైనా వివరించగలిగితే, వినడానికి ఇంకాస్త వినోదంగా వుంటుందేమో? బైబిల్లో లెక్కల తప్పులంటు ఆధారరహిత నిందలు వేయడం మాని, ఖురాన్ లోని ఆధారసహిత లెక్కల తప్పులను ఎలా సమర్థించుకోవాలో కసరత్తులు ప్రారంభించుకుంటే వారికే మంచిది.

50. దీదాత్

యెహెూయాకీను ఎన్నేళ్లవాడు? 8 లేక 18?

8కి 18కి మధ్య పదేళ్ల వ్యత్యాసముంది. దేవుడికి లెక్కలేయ్యడం చేతగాదని, 8కి 18కి మధ్య వ్యత్యాసం దేవుడికి తెలీదని మనం అనగలమా? (పాపం క్షమించుగాక!) మనం బైబిలు దైవ వాక్యమేనని అనుకుంటే, దేవాది దేవుడి అధికారాన్ని గొప్పతనాన్ని కించపరచినట్లవుతుంది.

“యెహోయాకీను ఏలనారంభించినప్పుడు పదునెనిమిదేండ్లవాడై యెరూషలేము నందు మూడు మాసములు ఏలెను. యెరూషలేము వాడైన ఎల్నాతాను కుమార్తెయగు నేహుషా అతని తల్లి” (2వ దినవృత్తాంతములు 36:9)

“యెహోయాకీను ఏలనారంభించినప్పుడు, ఎనిమిదేండ్ల వాడై యెరుషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను.” (2వ రాజులు 24:8).

జవాబు

పైన దీదాత్ ఉదహరించిన వచనాల మధ్య వైరుధ్యమేమి లేదని నిర్ధారించే కొన్ని వాస్తవాలను మీ దృష్టికి తెస్తున్నాను. మత్తయి 1:12 లో యెహోయాకీను (యెకోన్యా) యోషియ కుమారునిగా గుర్తించబడ్డాడు. యోషియా మనుమడైన యెహోయాకీనును లేఖనము అతని కుమారునిగా ఎందుకు గుర్తించింది? తన తండ్రి సహోదరుడైన సిద్కియాను (2 రాజులు 24:17 ) యెహోయాకీను సహోదరునిగా (2దినవృత్తాంతములు 36:10 ) లేఖనము ఎందుకు పేర్కొంది? (2 రాజులు 24: మరియు 1 దినవృత్తాంతములు 36 అధ్యాయాలు పోల్చి చదవండి). యాకోబు తన మనమండ్లను కుమారులుగా ఎలా పరిగణించాడో (ఆదికాండము 48:5 ), అలాగే యోషియా కూడా తన కుమారుడు దేవుని మార్గం విడిచి తన పితరుల దుష్ట మార్గమును ఎంచుకున్నాడని చూసి, తన మనుమడైన యెహోయాకీనును తన కుమారునిగా పరిగణించి, రాజ్యవారసునిగా అతనిని ఎంచియుండకపోతే, యెహోయాకీను యోషియ కుమారుడనబడేవాడు కాదు.

ఈ వాస్తవికత వెలుగులో, యెహోయాకీను తన ఎనిమిదవ యేట మరియు తన పద్దెనిమిదవయేట, ఈ రెండు పర్యాయములు రాజు ఎలా అయ్యాడో అర్థంచేసుకోవడం సులభమే. తన తాత మరణము ముందు, తన ఎనిమిదవయేట రాజ్యవారసత్వాన్ని పొందుకున్నప్పటికీ దినవృత్తాంతముల మరియు రాజుల గ్రంథంలో వున్న ఇతర పరిస్థితుల కారణంగా రాజ్యభారం మాత్రం తన పద్దెనిమిదవయేట పొందుకున్నాడు. కాబట్టి అతడు ఎనిమిదవ మరియు పద్దెనిమిదవ యేట రాజవ్వడాన్ని వైరుధ్యంగా కాకుండా చూసే ప్రత్యామ్నాయ విధానాలు కూడా వున్నాయి. మరి దీదాత్ అలా అన్నాడేమిటని ఆలోచిస్తున్నారా? ఉపరితలంపై స్పష్టంగా వున్న సాధారణ వాస్తవాలనే చూడలేని దావాంధునికి ఇంత పరిశోధనతో కూడిన విషయాలు ఎలా బోధపడతాయి? కాబట్టి అతని మాటలపై మనము అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు.

ఇక్కడ దావా ప్రచారకులు అతి తెలివి ప్రదర్శించి, “తన తండ్రి పదకొండేళ్లు రాజ్యమేలిన తర్వాత యెహోయాకీను రాజ్యభారాన్ని చేపట్టాడు కాబట్టి అతను పందొమ్మిదేండ్ల వాడైయుండాలి కదా అని ప్రశ్నించే ప్రమాదం లేకపోలేదు. కానీ అలాంటి ప్రశ్నలు యూదుల వాడుకల పట్ల వారి అజ్ఞానం నుండి పుడతాయి తప్ప అందులో పెద్ద సమస్యేమీ లేదు. పది సంవత్సరాలు పూర్తి చేసుకుని, పదకొండవ సంవత్సరంలో ఒక్కదినం అదనంగా సింహాసనంపై కూర్చున్నా దానిని యూదులు పదకొండు సంవత్సరాల ఏలుబడిగా లెక్కిస్తారు. కాబట్టి తన తండ్రి పదకొండు సంవత్సరాలు ఏలినా, యెహోయాకీను తన పద్దెనిమిదవ యేట రాజవ్వడం అసాధ్యమేమి కాదు.

ఖురానులో గందరగోళ గణితశాస్త్రం

దీదాత్ ఉదహరించిన బైబిల్ వచనాలలో, అతడు అవహేళన చేసినట్లు దేవునికి లెక్కలు వేయడం చేతకాదనే అనుమానానికి తావిచ్చేలా ఏమి లేదు. కాని, ఖురానులో వున్న వారసత్వ నియమాలను పరిశీలిస్తే, ఖురాను గ్రంథకర్తకు బొత్తిగా లెక్కలు రావని ఏ లెక్కల మాస్టారునడిగినా అవలీలగా తేల్చి చెప్పగలడు. ఈ క్రింది ఖురాను ఆయాతులను చదివితే, అల్లా లెక్కలు వేసి-వేసి, చివరికి ఒకని ఆస్తికి మించిన భాగాలను వారసులకు ఎలా పంచి పెట్టమన్నాడో చూడండి; అల్లా గణితశాస్త్ర చమత్కారమంతా మీకు కూడా అర్థమైపోతుంది.

“మీ సంతానం విషయంలో అల్లాహ్ మీకు ఇలా ఆదేశిస్తున్నాడు: ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం. ఒకవేళ (మృతునికి వారసులుగా) ఇద్దరికంటే ఎక్కువమంది ఆడపిల్లలు వుంటే, వారికి మొత్తం ఆస్తిలో మూడింట రెండు భాగాలు ఇవ్వాలి. ఒకే ఆడపిల్ల వారసురాలైతే, ఆస్తిలో అర్థభాగం ఆమెకు చెందుతుంది. మృతుడు సంతానం కలవాడైతే, అతని తల్లిదండ్రులలో ఒక్కొకరికి మొత్తం ఆస్తిలో ఆరోభాగం లభించాలి. ఒకవేళ అతడు సంతానం లేనివాడై అతని తల్లిదండ్రులు మాత్రమే అతనికి వారసులైతే అప్పుడు తల్లికి మూడోభాగం ఇవ్వాలి. మృతుడికి సోదరి సోదరులు కూడా వుంటే, అప్పుడు తల్లికి ఆరోభాగం లభిస్తుంది. మృతుడు రాసిన వీలునామా అమలు జరిపి అతనిపై ఉన్న అప్పులు తీర్చిన తరువాతనే (ఈభాగాల పంపకం జరగాలి). మీ తల్లిదండ్రులలో, మీ సంతానంలో ప్రయోజన రీత్యా మీకు ఎవరు ఎక్కువ సన్నిహితులో మీకు తెలియదు. ఈ భాగాలను అల్లాహ్ నిర్ణయించాడు. నిశ్చయంగా అల్లాహ్ యథార్థాలన్నీ తెలిసినవాడు, మర్మాలన్నీ ఎరిగినవాడు” (సురా 4:11).

“మీ భార్యలకు సంతానం లేనిపక్షంలో, వారు విడిచిపోయిన ఆస్తిలో మీకు అర్ధభాగం లభిస్తుంది. కాని వారికి సంతానం వుంటే అప్పుడు వారు విడిచి వెళ్లిన ఆస్తిలో మీకు నాలుగో భాగం లభిస్తుంది. ఇది వారు వ్రాసిపోయిన వీలునామా అమలు జరిపిన తరువాత, వారు చేసిపోయిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి. మీకు సంతానం లేని పక్షంలో మీరు విడిచిపోయే ఆస్తిలోని నాలుగో భాగానికి వారు (మీ భార్యలు) హక్కుదారులౌతారు. కాని మీరు సంతానవంతులైతే అప్పుడు వారికి ఎనిమిదో భాగం లభిస్తుంది. ఇది మీరు వ్రాసిన వీలునామాను అమలు జరిపిన తరువాత, మీరు చేసిన అప్పులు తీర్చిన తరువాత జరగాలి.

(మరణించిన పురుషుడు లేక స్త్రీ సంతానహీనులై వారి తల్లిదండ్రులు కూడా జీవించి ఉండకపోతే, కాని వారికి ఒక సోదరుడు లేక ఒక సోదరి ఉంటే అప్పుడు వారిద్దరిలో ఒకొక్కరికి ఆరోభాగం లభిస్తుంది. కాని సోదరీ సోదరులు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే అప్పుడు మొత్తం ఆస్తిలోని మూడో భాగానికి వారంతా భాగస్వాములౌతారు. మృతుడు వ్రాసిన వీలునామా అమలు జరిపిన తరువాత, అతడు చేసిన అప్పులు తీర్చిన తరువాత ఈ పంపిణీ జరగాలి. కాని ఇది (వారసులకు) నష్టం కలిగించేది కాకూడదు. ఇది అల్లాహ్ వైపు నుండి వచ్చిన ఆదేశం. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, అత్యంత మృధుస్వభావుడు. (సురా 4:12).

“ప్రవక్తా! ప్రజలు నిన్ను “కలాలా” విషయంలో ధార్మిక తీర్పు అడుగుతున్నారు. అల్లాహ్ మీకు ఈ ధార్మికతీర్పు ఇస్తున్నాడు అని చెప్పు. ఒక మనిషి గనుక సంతానం లేకుండా మరణిస్తే, అతనికి ఒక సోదరి వుంటే, అప్పుడు ఆమె అతని ఆస్తిలో సగభాగం పొందుతుంది. సోదరి గనుక సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమెకు వారసుడౌతాడు. ఒకవేళ మృతునికి (వారసులు) ఇద్దరు సోదరీమణులైతే, వారు అతని ఆస్తిలోని మూడింట రెండు భాగాలకు హక్కుదారులు అవుతారు. ఒకవేళ సోదరీ సోదరులు అనేకులు ఉన్నట్లయితే, అప్పుడు స్త్రీలకు ఒకవంతు పురుషులకు రెండు వంతులు లభిస్తాయి. అల్లాహ్ మీ కొరకు తన ఆజ్ఞలను విశదపరుస్తున్నాడు-- మీరు మార్గం తప్పి తిరగకుండా ఉండేందుకు. అల్లా కు ప్రతి విషయము తెలుసు”. (సురా 4:176)

ఈ నియమాలను ఆచరిస్తే తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయో గమనించారా? ఒకవేళ మృతుడికి వారసులుగా భార్య, ముగ్గురు కుమార్తెలు మరియు తల్లి తండ్రులు జీవించియుంటే, సురా 4:11 ప్రకారం ఆస్తిలో మూడింట రెండు భాగాలు ముగ్గురు కుమార్తెలకు, మూడింట ఒక భాగము తల్లి దండ్రులకు, మరియు సురా 4:12 ప్రకారం ఎనిమిదింట ఒక భాగము భార్యకు పంచిపెట్టాలి ఇది ఆస్తికి మించిన పంపకమని వేరే చెప్పనవసరం లేదు. అదే విధంగా, ఒకవేళ మృతునికి వారసులుగా తల్లి, భార్య, ఇద్దరు సోదరీమణులు మాత్రమే ఉంటే సురా 4:11 ప్రకారం తల్లికి మూడింట ఒక భాగము, సురా 4:12 ప్రకారం భార్యకు ఎనిమిదింట ఒక భాగము మరియు సురా4:176 ప్రకారం సోదరీమణులకు కలిపి మూడిట రెండు భాగాలు పంచిపెట్టాలి. ఇలా సరీగా లెక్కలు వేయడం చేతకాక, ఆస్తికి మించిన పంపకాలను ఆదేశించి, అది సర్వజ్ఞుడైన దేవునికి అంటకడితే, ఆయనకు ఇంతకుమించిన అవఘనత మరొకటుంటుందా? ఇలాంటి గందరగోళ గణిత శాస్త్రమున్న ఖురానును దైవవాక్యంగా అంగీకరిస్తే, అది దేవుని ఔన్నత్యాన్ని కించపరచినట్లు కాదా? ఉద్దేశపూర్వకముగా ఆయనను అవమానించినట్లే అనిపించుకోదా? తీర్మానం పాఠకులకే విడిచిపెడుతున్నాను.

51. దీదాత్

కాస్త హోంవర్కువుంది చూడండి

తన గొప్ప కోసం సోలోమోను రాజు ఓ రాచమందిర నిర్మాణం చేపట్టాడు. అది పూర్తయేందుకు దాదాపు పదమూడేళ్లు పట్టింది. ఇది మనకు 1 రాజులు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇంతకు మునుపు ఓసారి మనం డాక్టర్ పార్కర్ చెప్పివున్న గొప్పల్ని చూసాం.

“అన్ని పేజీలు అనామకమైన పేర్లతో నిండి ఉన్నాయా” అని. ఈ 7వ అధ్యాయం, యే హేజ్కేలులోని 45 అధ్యాయం, పిల్లతనానికి మచ్చు తునకలు. అందరూ తమ జీవితంలో కనీసం ఓసారి చదివి తీరాల్సిందే. దాని తర్వాత మీరు పవిత్ర ఖుర్ఆన్ ను కూడా చదివి పోల్చి చూడగలరు. మీరు ముస్లిములైయుండి, మీదగ్గర అలాంటి బైబిలు ఒకటి లేనిచో మీరు ఇక్కడ ఇవ్వబడ్డ చిరునామాకు వ్రాస్తే మీకు ఉచితంగా ఓ బైబిలు పంపబడుతుంది.

JESUS TO MUSLIMS (ముస్లిములకు ఏసు) 4బి, బ్రెట్ స్టేట్ బెనోని 1500, రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా.
(ఇది ప్రత్యేకంగా ముస్లిములకే ఉచితంగా ఇవ్వబడేది)

ఈ పుస్తకం చదువుతూ నేనిచ్చిన రిఫరెన్సులను మీరు రంగు పెన్సిళ్లతో ఆ బైబిల్లో గుర్తు పెట్టుకుంటూ పోగలరు.

ఉదాహరణకు బైబిల్లోని విభేదాలకు “పసుపురంగు” సెక్సు సంబంధమైన విషయాలకు ఎరుపు రంగు' మనం అంగీకరించదగ్గ, జ్ఞానమిచ్చే కొటేషన్లు (మనం ముందు ఇచ్చి వున్నాం), దేవుడి వాక్యాలని దేవుని ప్రవక్త వాక్యాలని అనిపించే వాటికి ‘పచ్చరంగు'. ఇలా మీరు రంగులతో గుర్తు పెట్టిన బైబిలు మీ సంతానానికి వారసత్వంగా ఇస్తే వాళ్లు భవిష్యత్తులో భేటీ చేయబోయే క్రైస్తవ ప్రచారకుల్తో సంవాదం జరిపేందుకు ఉపయోగపడ్డాయి.

“శాంతి కాలంలో మనం చెమట ఎక్కువగా కక్కగల్గితే యుద్ధ కాలంలో రక్తం కారడం తగ్గుతుంది.” (చియాంగ్ జైషేక్)

జవాబు

ఈ సప్తవర్ణాలు పులిమిన బైబిల్, మిషనరీలతో “సంవాదాలు” జరిపేందుకంటు తెలుగు అనువాదవర్యులు శ్రీ సీరాజ్ ఖాన్ గారు, దీదాత్ అసలు మాటలను మరుగున పడేసారు. పై భాగాన్ని ఆంగ్లంలో దీదాత్ స్వీయరచనలో చూస్తే, సంవాదం జరపడానికి కాదు, మిషనరీలను “కన్ఫ్యూజ్ చేసేందుకే ఈ రంగులు పులిమే కసరత్తంతా చేయమంటున్నాడని స్పష్టమవుతోంది. దీదాత్ ఈ పుస్తకం రాసింది సత్యాన్ని తెలుపేందుకు కాదు, ఏదో ఒక విధంగా కన్ ఫ్యూజ్ చేసి ఇతరులను ఖురాన్ మార్గంలోనికి రాబట్టడానికని, ఇంకే సాక్ష్యాధారాలకు పనిచెప్పకుండా తానే ఒప్పేసుకున్నాడు. ఐతే సత్యాన్ని ప్రేమించి నేనిస్తున్న ఈ జవాబు, కన్ ఫ్యూజ్ చేయడానికి కాదు, కన్ఫ్యూజన్లన్నిటిని పారద్రోలి, బైబిల్ తప్ప మరో దైవ ప్రత్యక్షత లేదని చాటిచెప్పడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఎన్ని రంగులు పులిమి తీసుకొచ్చినా, వాటిని మరలా బ్లాక్ ఆండ్ వైట్ గా మలచి ప్రతి కన్ ఫ్యూజన్ను నిర్వీర్యం చేసేలా, నా ఈ పుస్తకం, ప్రభువు తన మిషనరీల చేతిలో ఆయుధంగా వాడుకొనును గాక.

52. దీదాత్

ఎంతవరకు సమంజసం?

మరోటి చూడండి. 1 రాజుల గ్రంథకర్త 7:26 లో సోలోమోను రాజమందిరంలో 2000 స్నానపు గదులు కట్టించాడని లెక్కగట్టి చెప్పాడు. కాని 2వ దినవృత్తాంతముల గ్రంథకర్త అయితే 2వ దినవృత్తాంతముల 4:5 లో 50% ఎక్కువ చేసి 3000 స్నానపు గదులని ఖచ్చితంగా చెప్పాడు. 'దైవవాక్యమనిపించుకున్న ఈ గ్రంథంలో ఇలాంటి అతిగాని, తప్పుగాని ఏమిటి? మహా మహితాత్ముడైన దేవుడు ఎలాంటి పని చేయకుండా వున్నా ఇంత నీచంగా విభేదాన్ని యూదులకు ‘ఉత్తేజం' చేసివుంటాడా? బైబిలు దేవుని గ్రంథమా? దేవుని వాక్యమేనా అన్న ప్రశ్న ఉద్భవించకమానదు కదా?

జవాబు

షిరాజ్ ఖాన్ గారికి అనువాదంలో నోబెల్ పురస్కారం ఇచ్చినా తక్కువే! ఆంగ్లంలో “టు తౌసండ్ బాక్స్”, “త్రీ తౌసండ్ బాల్స్” అని చదవగానే, వాటిని బాత్రూములను కొని, “రెండు వేల స్నానపు గదులు”, “మూడు వేల స్నానపు గదులు” అని అనువదించి, ఇలా తన అనువాదక సామర్థ్యాన్ని చాటుకున్నారు! కాని, బైబిల్లో వున్న సందర్భాన్ని చదివితే, అక్కడ స్నానపుగదుల ప్రస్తావన కాదు, సొలొమోను నిర్మించిన సరస్సులో ఎన్ని నీళ్లు పడతాయన్న కొలతలను గురించిన ప్రస్తావన చూస్తాము. హెబ్రీ గ్రీకు ప్రతులకు అతి దగ్గర అనువాదమైన కింగ్ జేమ్స్ అనువాదాన్ని బట్టి చూస్తే, ఆ సరస్సులో “రెండువేల” గాలన్ల నీళ్లు పడతాయని 1 రాజుల గ్రంథకర్త 7:26తెలియజేస్తే, “మూడువేల” గాలన్ల నీళ్లు పడతాయని 2వ దినవృత్తాంతముల 4:5 లో చూస్తాము. కాబట్టి, ఈ రెండు కొలతలకు యాభై శాతం వ్యత్యాసమెందు కుందన్నదే ఇక్కడ దీదాత్ లేవనెత్తిన ప్రశ్న.

ఐతే గమనించదగిన విషయమేమిటంటే, రాజుల గ్రంధము ఇశ్రాయేలీయులు బబులోను దేశానికి కొనిపోబడకముందు వ్రాయబడిన కారణాన, అందులోని కొలతలన్నీ ఇశ్రాయేలీయుల వాడుక చొప్పున కొలువబడ్డాయి. దినవృత్తాంతముల గ్రంథము వ్రాయబడిన సమయానికి దాదాపు డెబ్బది సంవత్సరాలు బబులోనులో పరవాసులుగా వున్న ఇశ్రాయేలీయులు, అక్కడ అమలులో వున్న కొలతలు వినియోగించడం ప్రారంభించారు. ఇలా కొలతలలో మార్పులు చోటు చేసుకున్నందుకే, ఇశ్రాయేలీయుల పాత కొలతల చొప్పున ఎక్కడైనా చెప్పవలసివస్తే, “పూర్వపు కొలతల ప్రకారం” అని దీనవృత్తాంతముల గ్రంథకర్త ప్రత్యేకంగా సూచించాడు (ఉదాహరణకు 2వ దినవృత్తాంతముల 3:3
పరిశీలించండి).

ఇశ్రాయేలులో మొదట అమలులో వున్న కొలతలకు, ఇప్పుడు బబులోను వాడుక ప్రభావం క్రింద కొలిచే కొలతలకు మధ్య భేదము లేకపోతే, ఇలా ప్రత్యేకంగా “పూర్వపు కొలతల ప్రకారం” అని ఎత్తి చూపించవలసిన అవసరముండేది కాదు. ఈ నేపథ్యంలో ఆలోచిస్తే, ఇశ్రాయేలీయుల “రెండువేల” గాలన్లు, బబులోనీయుల “మూడువేల గాలన్లతో సమానం” అని గుర్తించినప్పుడు, ఇక్కడ వైరుధ్యముందని ఆరోపించడానికి ఎలాంటి అవకాశం వుండదు. నేటికి కూడా, స్థలాలను బట్టి ఇలాంటి కొలత వ్యత్యాసాలు వుండడం, పై వివరణ సంభావ్యతను మరింత బలపరుస్తుంది. అమెరికన్ల ఒక గాలన్ 8.785 లీటర్లకు సమానం కాగా బ్రిటీష్ వారి ఒక గాలన్ 4. 546 లీటర్లకు సమానమని అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ తెలుపుతోంది. వారు వీరు ఒకే కొలతను గాలన్లలో చూపించేటప్పుడు, ఆ గాలన్ల సంఖ్యలో మార్పొస్తుంది. అంతమాత్రాన, అది వైరుధ్యం కాదన్నది జగమెరిగిన సత్యమైనప్పటికి, విద్యావిహీనులైన దావా ప్రచారకులకు మాత్రమే విషయం బుర్రకెక్కదు. మదరసాలకు వెళ్లేముందు కాస్త బడికి కూడా వెళ్తుంటే మాబోటివాళ్లకు కొంత శ్రమ తగ్గించుండేవారు ఈ మేధావులు.

ఎంత త్రవ్వితే అంత గలిబిలి

ముందున్న పాయింట్లో నేను చర్చించిన ఖురాను గందరగోళ వారసత్వ నియమాలలో వున్న గలిబిలి, అంతటితో ముగియలేదు. సురా 4:11 ను 4:12 తో ఇంకాస్త సూక్ష్మంగా పోల్చి చదివితే, మరో వైరుధ్యం బయటపడుతుంది. తీసే ఓపికుంటే, ఇది రోజుకో బంగారు గుడ్డు పెట్టేలా వుందే!

సురా 4:11 “ఒక పురుషునికి భాగం, ఇద్దరు స్త్రీల భాగాలకు సమానం” అని సెలవిస్తుంటే, సురా 4:12 “ఒక సోదరుడు లేదా ఒక సోదరి వుంటే, వారిద్దరిలో ఒకొక్కరికి ఆరవభాగం లభిస్తుంది” అంటుందేమిటి? పురుషుడికి రెట్టింపు భాగము ఇవ్వాలనీ ఒక వైపు చెబుతూ, మరోవైపు సోదరితో సమానంగా సోదరుడికి కూడా ఆరవభాగమే పంచి ఇవ్వమని ఆజ్ఞాపించడం వైరుధ్యం కాదా? ఖురానులోనే కావలసినన్ని వైరుధ్యాలు పెట్టుకొని, బైబిల్లో లేని వైరుధ్యాలను కల్పించే ఈ దావా మేధావుల దూకుడు, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నంత ప్రమాదానికి వారిని గురిచేస్తుందని, పాపం గ్రహించలేకపోతున్నారు!

53. దీదాత్

కుప్పలు కుప్పలుగా అసంగతాలు, స్వవిరుద్దాలు

ఈ లెక్కకు మిక్కుటమైన అసంగతాలను, విరుద్దాలను ముగింపుకు తెచ్చేముందు ఒక ఉదాహరణ ఇవ్వదలిచాను. ఈ విభేదాలు వందలకు వందలున్నాయి. మళ్లీ ఓసారి సొలొమోనును చూడండి. ఆయన అన్నీను చాలా పెద్ద తరహాలోనే చేస్తాడు. గత ఇరానుషా కూడా ఆయన ముందు బలాదూర్.

|2వ దినవృత్తాంతముల 9:25 లో ఓ వేయి గుర్రపు శాలలు, స్నానపుతొట్లు ఎక్కువగానే ఇచ్చాడు. “మరియు సొలోమోను నాలుగువేల గుర్రపు శాలలు కలిగి” అని. కాని 1వ రాజుల గ్రంథకర్త మాత్రం 1వ రాజుల గ్రంథకర్త 4:26 లో నిజమైన రాజరికపు అట్టహాసపు ఊహతో పని చేసి తన రాజుకు 1000% శాలలు హెచ్చుగా ఇచ్చేసాడు. 4,000 శాలల నుండి 40,000 గుర్రపుశాలలు? మీ దగ్గరికి బాగా వాగే ప్రచారకుడెవడైనా వచ్చి “అదేముంది కొన్ని సున్నాలే (0) పెద్ద పొరపాటేం కాదుకదా? ఎవరో రాసేవాడు ఓ సున్నా లేదా రెండు ఎక్కువగా పడేసి వుంటాడు” అని అనకముందే, మీరు తెలుసుకోవాల్సిందేమంటే సోలోమోను రాజు కాలంలో యూదులకు సున్నా (ZERO) గురించి ఏమి తెలియదు. ఆ సున్నాని అరబ్బులే తూర్పు మధ్య ప్రపంచానికి అందించిన తర్వాత శతాబ్దాల తరువాత యూరపు దేశాలకది తెలిసింది. యూదులు తమ అంకెలను పదాలలో పలికేవారు. వాటిని అంకెలుగా వ్రాసేవారు కాదు.

మా ప్రశ్న ఏమంటే ఈ అత్యంత విచిత్రమైన పరస్పర విరుద్ధాలైన 36000ల తప్పులకు అసలు గ్రంథకర్త ఎవరు అన్నది? దేవుడా? మనిషా? మరి అది తెలుసుకోవాలంటే” “బైబిలు దైవవాక్యమా? లేదా మానవ వాక్యమా” చదవాలి.

జవాబు

|2వ దినవృత్తాంతముల 9:25 లో వున్న నాలుగు వేల గుఱ్ఱపు శాలలు మరియు 1వ రాజుల గ్రంథకర్త 4:26 లో వున్న నలువదివేల గుఱ్ఱపుశాలల మధ్య దీదాత్తు వైరుధ్యం కనిపించినా, బైబిలు చదివే వారందరు దీదాత్ లా అశ్రద్దగానే చదువుతున్నా రనుకుంటే పొరపాటే. సరీగా చూస్తే, సొలోమోనుకున్న గుఱ్ఱపుశాలల సంఖ్య నలువది వేలని 1వ రాజుల గ్రంథకర్త 4:26 స్పష్టం చేస్తుంది. ఐతే |2వ దినవృత్తాంతముల 9:25 లో వున్న నాలుగువేలు, అతని పూర్తి గుఱ్ఱపు శాలల సంఖ్య కాదు. అది రథాలు నిలువ వుంచే పట్టణాలలో మరియు యెరుషలేములో వున్న గుఱ్ఱపు శాలల సంఖ్య మాత్రమే అని అక్కడ ఎంతో స్పష్టంగా వ్రాసివుంది.2 దీన వృత్తాంతములు 8:6 లో రథములు నిలువవుంచే పట్టణాలు, ఇతర పట్టణాలలో నుండి ప్రత్యేకింపబడినవనే సూచన మనకు కనిపిస్తుంది. కాబట్టి మనము పరిశీలించిన ఇతర విమర్శలలా, ఇది కూడా ముసలయ్య కాలక్షేప ముచ్చట్లలో ఒకటే తప్ప పట్టించుకోతగ్గ సమస్యేమీ ఇందులో లేదు.

ఖురాన్ వేయి సంవత్సరాలన్నదా లేక యాభైవేల సంవత్సరాలన్నదా?
క్రింది రెండు ఆయాతులను పోల్చి చదవండి:

“ఆయన ఆకాశంనుండి భూమి వరకు గల ప్రపంచ వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు. ఆ నిర్వాహణా నివేదిక ఒక రోజున పైకి ఆయన సముఖానికి చేరుతుంది. ఆ రోజు పరిమాణం మీ అంచనా ప్రకారం వేయి సంవత్సరాలు”. సురా 32:4.

“అది ఆరోహణ సోపానాలకు స్వామి అయిన అల్లాహ్ తరుపునుండి సంభవిస్తుంది. యాభై వేల సంవత్సరాల ప్రమాణం గల ఒకరోజునదేవదూతలు, ఆత్మ, ఆయన సాన్నిధ్యానికి అధిరోహిస్తారు” సురా 70:4.

నాలుగువేల గుఱ్ఱపుశాలలకు మరియు నలువది వేల గుట్టపు శాలలకు మధ్య వైరుధ్యం చూడగలిగిన దీదాత్తు, ఒక దినం అల్లా దృష్టికి వేయి సంవత్సరాలతో సమానమని తెలిపిన సురా 32:5 మరియు ఒక దినము అల్లా దృష్టికి యాభైవేల సంవత్సరాలతో సమానమని తెలిపిన సురా 70:4కు మధ్య వైరుధ్యం ఎందుకు కనిపించలేదు? సున్నా కనుగొన్నది అరబ్బులు కాబట్టి ఇష్టమొచ్చినట్లు సున్నాలు పెట్టడానికీ, తీయడానికీ అరబ్ దేవునికి లైసెన్స్ వుంటుందా? ఇంతకు, సురా70:4కు ఒక సున్నా కలిపారా, లేక సురా 32:5 నుండి ఒక సున్నా తీసేసారా? సున్నాలమాట అలా వుంచితే “1” మరియు “56 అంకెల సంగతేమిటి ? ఐనా ఎంతసేపూ అరబ్బీలో వల్లిస్తే, ఇవన్నీ ఏమర్థమవుతాయి? ఇప్పటికీ మించి పోయిందేమి లేదు. కాస్త అర్థమయ్యే భాషలో ఖురాను చదువుకొని, అది దేవుని వాక్యం కాదని, దేవుని వాక్యమనీ నమ్మడానికి ఖురానుకంటే బైబిలు పోల్చలేనన్ని రెట్లు అర్హమైనదని తెలుసుకుంటే, ఈ జవాబు వ్రాయడంలో మా శ్రమ ఫలించినట్లే.

బైబిల్లో పరస్పర వైరుధ్యాలున్నాయని దీదాత్ ఎత్తి చూపించిన ప్రతి సందర్భాన్ని పరిశీలించి, దీదాత్ వేసిన అపనిందలన్నీ ఆధారరహితమైనవని, బైబిల్లో పరస్పర వైరుధ్యాలేమీ లేవని తేల్చేసాను. ఇంకా వందలాది వైరుధ్యాలున్నాయని చెప్పిన దీదాత్ అబద్దాన్ని మనము ఏ మాత్రము ఖాతరు చేయనవసరం లేదు. తన వందలాది వైరుధ్యాల లిస్టులో నుండి వాదనకు వాడినవే అతి బలమైన విమర్శలై యుండాలి కదా? అతి బలమైన అతని విమర్శలలో ఇంతే సత్తావుంటే, ఇక మిగతావి మనకెందుకు? ఐతే, ఖురానులో వందలాది వైరుధ్యాలున్నాయో లేవో మాకు తెలియదు కానీ, ఒక్కటున్నా అది దైవ వాక్యము కానేరదని ఖురాను గ్రంథకర్త చెప్పాడు, గుర్తుంది కదా?

ప్రియ ముస్లిం పాఠకుడా, సురా 4:82 ను మరొకసారి చదివి, ఖురాను బారినుండి తప్పించుకోగలిగితే, సువార్త సత్యాన్ని కాస్త బాధ్యతాయుతముగా ఆలోచించగలవేమో, ప్రయత్నించు, సత్యములోనికి నడిపించమని యేసు నామమున దేవుని ప్రార్థించు.

ముస్లిం పాఠకులకు ఓ చిన్నమనవి

మేము ఖురానునుండి ఉదహరించిన వైరుధ్యాలకు మీరు సంతృప్తికరమైన పరిష్కారాలు కనుక్కోగలిగితే, క్రైస్తవులు కూడా బైబిలు పై ఆరోపించబడిన వైరుధ్యాలకు సంతృప్తికరమైన పరిష్కారాలు వెదుక్కోగలరని మరచిపోవద్దు. అంతేకాదు, ఖురానుకు అన్వయించడానికి మీరు సమ్మతించని అసమంజసమైన కొలబద్దతో బైబిలుకు తీర్పు తీర్చడం మానండి. పైపైనే చదివి తెలిసీ తెలియని ఆక్షేపాలు చేయడం మాని, దాని సందేశాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు బైబిలు దేవుని వాక్యమని ఎందుకు నమ్మాలో మీకే అర్థమవుతుంది.

 

8వ అధ్యాయం

అశ్లీలత ఉన్నది బైబిల్లోనా

ఖురానులోనా?

“బైబిల్ దేవుని వాక్యమా?” అనే దీదాత్ పుస్తకంలో, “హేతుబద్దమైన అత్యంత బహిరంగ నిదర్శనం” అనే ఎనిమిదవ
అధ్యాయానికి మా జవాబు.

54. దీదాత్

క్రైస్తవ ప్రబోధకులు బైబిలు దైవవాక్యమని నిదర్శనంగా క్రింది వాక్యానిచ్చి అతి ప్రేమగా కోట్ చేస్తుంటారు:

“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును

ప్రయోజనకరమై యున్నది.” (2 తిమోతి 3:16) (AV by SCOFIELD)

(All scripture is given by inspiration of god, and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness)

ఇందులో ఇంగ్లీషులో IS అన్నది పెద్దక్షరాల్లో ఇవ్వబడింది. అంటే రేవేరేన్డ్ స్కాఫిల్డ్ మెల్లగా ఇది అసలు గ్రీకు బైబిల్లో లేదనే తెలుపుతున్నాడు. కానీ కొత్త ఆంగ్ల బైబిలు THE NEW ENGLISH BIBLE చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్, ది మెతడిస్ట్ చర్చ్, ది కాంగ్రిగేషనల్ చర్చ్, ది బాప్టిస్ట్ యూనియన్, ది ప్రెస్ బిటేరియన్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇతరత్రా వారంతా కలిసి వ్రాసిన కమిటీ అనువదించిన ది న్యూ ఇంగ్లీష్ బైబిల్ మరియు బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ వారు కలిసి అసలైన గ్రీకు నుంచి, అతి దగ్గరి అనువాదం చేసిన బైబిల్లో ఇలా వుంది:

“Every inspired scripture has its use for teaching the truth and refuting error or for reformation of manners and discipline in right living”

దీని అర్థం- “ఉత్ర్పేరితమైన (ప్రేరేపింపబడిన) ప్రతి గ్రంథం సత్యమును ఉపదేశించుటకు, తప్పును దిద్దుటకు లేదా సచ్చీల శిక్షణకు, నడవడిక మార్పులు చేయుటకును ఉపయోగము కలది” (2 తిమోతి 3:16)

ప్రొటెస్టాంటుల ఆథరైస్ట్ వెర్షన్ (AV) కంటే రోమన్ కాథలిక్కుల డోవే (DOVAY) వెర్షన్ కాస్త న్యాయసమ్మతంగా వుంది. వాళ్ళంటారు:

“సర్వగ్రంథం దైవ ప్రేరితం. అది ఉపదేశించుటకు, దిద్దుబాటుకు, చక్కదిద్దుటకు చాలా ప్రయోజనకారి.”

జవాబు

ఆంగ్లములో “ఈజ్” అని అనువదిస్తే తప్పేందుకు కాదో తగిన కారణాలు, దీదాత్ కు నేను వ్రాసిన ఆంగ్ల జవాబులో పొందుపరచాను (బైబిల్ ఆర్ ఖురాన్ విచ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పాయింట్ 55). తెలుగులో ఎలాగో ఆ సమస్యలేదు కాబట్టి ఇక్కడ అది విస్తారంగా చర్చించదలచలేదు. ఐతే, “ఈజ్” లేకుండా సరిగా అనువదించబడిన వర్షన్లలో కూడా 2 తిమోతి 3:16 ను సందర్భ సహితంగా సరిగ్గా చదివితే అర్థంలో మార్పేమి రాదు. అంతేకాదు, “ఈజ్” లేకుండా అనువదించడం గ్రీకులో నుండి అక్షర అనువాదం అవుతుంది కాని, సందర్భార్ధాన్ని “ఈజ్” లేకుండా స్పష్టపరచడం కష్టం కాబట్టి “ఈజ్” అని అనువదించిన వర్షన్లే ఆ వాక్యభావానికి పూర్తిగా న్యాయం చేసాయి (పాయింటు 21 లోని మా జవాబు పోల్చి చూడండి).

ఐనా, వాదన కొరకు “ఈజ్” వున్న ఆంగ్ల అనువాదంలో తప్పుందనే అనుకుందాం. ఖురాను ఆంగ్ల అనువాదాలలో తప్పులుంటే, వాటిని ఖురాన్లోని తప్పులుగా ముస్లింలు అంగీకరిస్తారా? మరీ బైబిలు పై ఎందుకు ఆ ప్రయోగం, పక్షపాతం కాకపోతే? ఇలా పదాలతో ఆటలాడుతూనే, తదుపరి పాయింట్లో, “మనం పదాలతో ఆటలాడాల్సిన అవసరం లేదని దీదాత్ నిస్సిగ్గుగా ఎలా అంటున్నాడో చూడండి.

55. దీదాత్

మనం పదాలతో ఆటలాడుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రైస్తవులమైనా గాని, ముస్లిములైనాగానీ దేవుడి నుంచి వచ్చినదేదైనా అది ప్రేరణగా మనకై అది ముఖ్యంగా నాలుగు రకాలుగా ప్రయోజనానికి సంబంధితమై యుండాలి. (నాలుగు సూత్రాలు తిమోతి ప్రకారం) (నాలుగు ప్రమాణాలు):

1. (DOCTRINE) సరైన సిద్ధాంతాలను ఉపదేశించాలి.

2. (REPROVE) తప్పు జరిగితే ఖండించేదిగా వుండాలి.

3. (CORRECTION) సరిదిద్దే మార్గాన్ని ఇవ్వాలి.

4. (RIGHTEOUSNESS)నైతికతకు, సచ్చీలతకు మార్గదర్శి కావాలి.

పై నాల్గింటికి తోడు మరో ఐదవ మేకును దైవవాక్య పరిశీలనకు తోడై వుండేందుకు తగిలించగలరా అని నేను గత సంవత్సరాలుగా క్రైస్తవ విజ్ఞులందరినీ అడుగుతూనే వస్తున్నాను. వాళ్లు అలాంటిదేమీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్లు చేసిన పరిశోధనలపై నేను మెరుగులు దిద్దటం లేదు. సరే, ఆ పైనాలుగు బాహ్య నిరూపణ సాక్ష్యాల విధానంతోనే మనం పరిశుద్ధ గ్రంథాన్ని కాస్త పరిశీలిద్దాం.

ఎంతోదూరం పోనక్కరలేదు

బైబిలు గ్రంథంలోని మొదటి గ్రంథమైన 'ఆదికాండమే' మనకు చక్కటి నిదర్శనాలెన్నింటినో సమకూరుస్తుంది. అందులో 38వ అధ్యాయం తీసి చదవండి. జూడియా (యూదా), జూడాయిజమ్ (యూదమతం) అనే పదజాలం యూద సంతతి తండ్రి అయిన జూడా (యూదా) ఇచ్చిన చరిత్ర మనకిక్కడ లభ్యమౌతుంది. ఈ యూద పితామహుడు వివాహం చేసుకున్న తరువాత దేవుడు అతనికి 'ఏరు” “ఓనాను', 'షెలాహ' అనే ముగ్గురు కుమారుల్ని ఇచ్చాడు. మొట్టమొదటి పుత్రుడు పెరిగి పెద్దవాడైన తరువాత యూదా అతన్ని 'తామారు” అనే స్త్రీతో వివాహం జరిపించాడు.

“యూదా జ్యేష్ట కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యోహోవా అతనిని చంపెను” (ఆది 38:7).ఈ విచార సంఘటనను పైన ఇవ్వబడిన తిమోతి యొక్క నాలుగు సూత్రాలలో దేనితో అన్వయింపజేయగలరు?

బహుశా రెండవది కావచ్చు. తప్పు చేస్తే ఖండించడం (REPROVE)తో; ఏరు చెడ్డవాడు గనుక దేవుడు అతనిని చంపెను. ఇక్కడ అందరికీ ఇవ్వబడ్డ నీతి ఏమంటే మనం చెడ్డతనం చేస్తే దేవుడిచేత చంపబడతాము (REPROOF).

యూదచరిత్రను పరికిస్తే వారి ఆచారం ప్రకారం ఒక సోదరుడు పిల్లలు లేకుండా చనిపోతే అతని రెండవ సోదరుడు చనిపోయిన వాని వంశావళిని కొనసాగించేందుకు తన వదినకు తన 'బీజాన్ని (రేతస్సును) ఇవ్వాలి. కాబట్టి యూదా తమ మతాచారాన్ని గౌరవిస్తూ తన రెండవ కుమారుడైన ఓనానుకు ఆ విధవ (తామారు) నిచ్చి ఆ విధి నిర్వహించాడు. కాని అతని (ఓనాను) హృదయంలో ఈర్ష్య పొడసూపింది. తన బీజాన్ని ఇవ్వగా తన సోదరుడి పేరెందుకు కొనసాగాలి. కాబట్టి ఈ ఇబ్బంది నుంచి తప్పించుకునేందుకు ‘ఓనాను ఆ సంతానము తనది కానేరదని యెరిగి ఆమెతో పోయినప్పుడు, తన అన్నకు సంతానము గలగ చేయకుండునట్లు “తన రేతస్సును (ఇంద్రియాన్ని నేలపై విడిచెను. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చం పెను” (ఆది 38:9-10) చూడండి. ఈ చంపటమన్నది తిమోతి ఇచ్చిన పై నాలుగు సూత్రాలలో దేనితో అన్వయింపబడుతుంది? రెండవదానితో 'ఖండించడం” (REPROOF) తో అనే సమాధానం. మీరు ఈ సమాధానాలు అతి సులువుగా చెప్పినా మీకెలాంటి బహుమతులు ఇవ్వబడవు. ఇవి మౌలికమైన విషయాలు. తప్పు చేస్తే పర్యవసానం అనుభవింపక తప్పదు. 'ఓనాను' ఇక దైవగ్రంథంలో తరువాత మరచి పోబడ్డాడేమో కానీ మన క్రైస్తవ లైంగిక శాస్త్రవేత్తలు (SEXOLOGISTS) మాత్రం అతని ఆ కార్యానికి ‘ఓనానిజమ్' అని పేరు పెట్టి ఆ పనిని శాస్త్రపరమైన భాషలో 'కాయిటస్ ఇంటరప్టస్ (COITUSINTERRUPTOS) అని తమ సెక్సు నిఘంటువుల్లో అతన్ని అమరుణ్ణి చేశారు.

ఇప్పుడు యూదా తన కోడలైన తామారును తన మూడవ కొడుకైన షెలాహ్, ఎదిగి పెద్దవాడయ్యేంతవరకు, ఆమె తండ్రి ఇంటికి పోయి ఉండమని పంపించి వేసాడు. ఆమె తిరిగి వచ్చిన తదుపరి తన మూడవ కుమారుడితో తన విధి నిర్వహణ పూర్తి చేయాలని భావించాడు.

స్త్రీ ప్రతీకారం

షెలాహ్ ఎదిగి బహుశా మరో స్త్రీని వివాహం చేసుకునుంటాడు. కానీ తామారుకు చేయవలసిన తన విధిని యూదా పూర్తిచేయలేదు. ఈ మంత్రగత్తెవల్ల తాను ఇప్పటికే ఇద్దరు కొడుకుల్ని పోగొట్టుకున్నానని అతను అంతరంగంలో బాగా భయపడి పోయివుంటాడు.

అప్పుడు యూదా - ఇతడు (షెలాహ్) కూడా తన అన్నలవలె చనిపోవునేమో అనుకునెను (ఆది 38:11).

అలా యూదా తన వాగ్దానాన్ని వదిలివేశాడు. కాని వ్యధ చెందిన ఆ యువతి తామారు మాత్రం తనకు రావలసిన ఆ 'బీజం' ను ఆపేసిన మామ పై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. యూదా తన గొర్రెల్ని మేపుకునేందుకు తిమ్నాతుకు వెళ్తున్నాడని తామారు తెలుసుకుంటుంది. అతన్ని దారిలోనే కలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అతని రాకకంటే ముందుగానే వెళ్లి తిమ్నాతు మార్గంలో బయలు ప్రదేశంలో కూర్చుని వుంటుంది. ఆమె ముఖంపై ముసుగు కప్పుకుని కూర్చుని వుంటే ఆమెను యూదా చూసి ఆమె ఒక వేశ్య (పడుపుకత్తె) గామోనని అనుకుంటాడు. దగ్గరికెళ్లి తన లైంగిక వాంఛను వెలిబుచ్చుతాడు.

“ఆమె తన కోడలని తెలీక నీతో పోయెదను రమ్మని చెప్పెను. అందుకామె నీవు నాతో వచ్చిన యెడల నాకేమి ఇచ్చెదవని అడిగెను.”

తను వెళ్లి ఓ గొర్రెపిల్లను ఇచ్చి పంపుతానని అతడు మాట ఇస్తాడు. అతను పంపుతాడని గ్యారెంటీ ఏమిటి? సరే దానికై ఏం కుదువ పెట్టాల”ని అతనడగ్గా అతని ముద్రయు, దాని దారమును, అతని చేతి కర్రను’ కుదువకై అడుగుతుంది. ఆ పెద్దాయన అవన్నీ ఆమెకిచ్చేస్తాడు.

“అతను వాటిని ఆమెకిచ్చి ఆమెతో పోయెను. ఆమె అతని వలన గర్భవతియాయెను” (ఆది 38:16-18)

మరి దీని నీతి ఏమిటి?

దైవప్రేరిత గ్రంథం తిమోతీ గొప్పదనాన్ని గురించి విని 3:16 వాక్యాన్ని చదివి పైన ఇవ్వబడ్డ నాలుగు ప్రమాణాలు చూడగా ఈ గాథ ఏ సూత్రానికి సరిపడుతుందనే ప్రశ్న మికైనా నాకైనా ఉద్భవిస్తుంది. దీని నీతి ఏమిటని?తామారు తీసుకున్న ఈ తీయని ప్రతీకారం వల్ల మన పిల్లలు నేర్చుకోవలసిన నీతి ఏమిటన్నది? మనం మన పిల్లలకు ఎన్నో కథలు వినిపిస్తాం. అవన్నీ వాళ్ల ఆహ్లాదానికే కాకుండా వాళ్ళకు కొంత నీతిని కూడా ఇవ్వాలనే మనం “నక్క ద్రాక్ష పండ్లు” “తోడేలు గొర్రెపిల్ల” “కుక్క దాని నీడ” లాంటి కథలు వినిపిస్తాం. ఎంత పిచ్చి కథైనా దాని వెనుక ఏదో ఒక నీతి వుంటుంది కదా?

జవాబు

ఈ కథలోని నీతిని మరో పాయింట్లో ప్రస్తావిస్తాను కాని, ప్రస్తుతం ఒక చిన్న మాటను మాత్రమే మనవి చేసుకుంటాను. “నక్క ద్రాక్షాపండ్లు” “తోడేలు గొఱ్ఱపిల్ల” “కుక్క దాని నీడ” వంటి కథలు నేర్చుకునే పసిప్రాయంలో, క్రైస్తవులు తమ పిల్లలకు వివాహం మరియు సెక్సుకు సంబందించిన పాఠాలు నేర్పించరు.

| పసిపిల్ల ఆయేషాకు తొమ్మిదేళ్ళకే తప్పని లైంగిక దుర్గతే పిల్లలందరికి వుండాలని లేదు కదా (ఖుఖారీ. సంపుటి. V. 234); కాబట్టి పిల్లలకు ఆ వయసులో, ఆ పాఠాలతో పనిలేదు. అర్థమయింది కదా?

56. దీదాత్

క్రైస్తవ తల్లిదండ్రుల ఇబ్బంది

డాక్టర్ వెర్నాన్ జోన్స్ (Dr. VERNAN JONES) అనే ప్రఖ్యాత అమెరికన్ మనస్తత్వ శాస్త్రవేత్త (PSYCHOLOGIST) స్కూలు పిల్లల మీద కొన్ని కథల ప్రభావం ఎలావుంటుందో అన్న పరిశోధనలు జరిపాడు. అందరికి వినిపించే ఆ కథల్లో హీరోలు (నాయకులు) అంతా ఒక్కటే అయినా వివిధ పిల్లల గ్రూపులో వివిధరకాలుగా ప్రవర్తించేవారై వుంటారు. ఉదాహరణకు ఒక గ్రూపు కథలో సెయింట్ జార్జ్ డ్రాగన్ ను నరికి చంపివేసే ఓ మహావీరుడిగా చెప్పబడితే మరోగ్రూపు పిల్లలకు అతను భయపడి పారిపోయి అమ్మ ఒళ్ళో దాక్కొనే పిరికిపందగా వర్ణించబడ్డాడు.

“ఈ కథలు కొంచెం అల్పమైనవని అనిపించినా పిల్లల నడవడికల్లో నిర్ణయాత్మకమైన మార్పుల్ని తెచ్చాయి (చిన్న క్లాసుల్లో సైతం) అని డా.జోన్స్ తెలియజేశారు. మనం మన దినపత్రికల్ని చూస్తే, పవిత్ర బైబిలు గ్రంథంలోని హత్యలు, రేపులు, వావివరుస తప్పిన వ్యభిచారాలు, జంతురతులు క్రైస్తవ పిల్లలపైఎలాంటి శాశ్వత విధ్వంసాన్ని కల్గిస్తున్నాయన్నవి లెక్కగట్టగలం. మరి పాశ్చాత్య నైతికతకు మూలం అలాంటిదైతే, నేడు మెథడిస్టు క్రైస్తవులు, రోమన్ కాథలిక్కులు, “స్వలింగ సంపర్కుల” మధ్య వివాహాన్ని తమ దైవ గృహాల్లో (చర్చీల్లో) గంభీరంగా, గౌరవంగా జరిపించడం వింతేమి కాదు.

“మరి 8000 మంది 'గేస్' (GAYS) (స్వలింగ సంపర్కులకివ్వబడిన మృదుపదం ఇది) తమ వేరుతో (WARES) లండన్ హైడ్ పార్కులో 1979 జూలైలో పెరేడు చేశారు” అనే వార్తలు మనకు TV ఛానల్స్ ద్వారా అందించబడ్డాయి.

జవాబు

బైబిల్లో హేయకృత్యాలు చేసిన వారి మాదిరిని అనుసరించమని దేవుడు ఎక్కడా ప్రోత్సహించలేదు. అలాంటి క్రియల పర్యావసానాల గురించి హెచ్చరించడానికి, అలాంటి ఘోర పాపులకు సహితం క్రీస్తులో క్షమాపణ మరియు నిరీక్షణ వుందని ప్రోత్సహించడానికి మాత్రమే దేవుడు బైబిల్లో ఆ సంఘటనలను వ్రాయించాడు. అంత మాత్రాన క్రైస్తవులు చేసే నేరాలకు అనీతి కార్యాలకు బైబిలును నిందిస్తే, ముస్లిములు చేసే అఘాయిత్యాలకు, ఘోరాలకు, వ్యభిచారాలకు, మానభంగాలకు, హత్యలకు ఎవరు బాధ్యులు? వారి నీతికి మూలం ఏమిటి? సురా 33:21 లో చూపించబడిన ముస్లింల ఆదర్శపురుషుడిని ఇవన్నిటికి బాధ్యునిగా ఎంచడానికి ముస్లిములు సమ్మతిస్తారా? హదీసుల్లో చిత్రీకరించబడిన అతని “ఆదర్శ” జీవితాన్ని పరీక్షిస్తే, అలాంటి నీతిని అనుసరణీయంగా నియమించిన ఖురాను గ్రంథం దేవుని వాక్యం ఎలా అవుతుందని ప్రశ్నించడం న్యాయం కాదంటారా? ఇక్కడ గమనించతగ్గ తారతమ్యమేమిటంటే, బైబిల్ యేసు మాదిరిని, ఆయనను వెంబడించడంలో దారి తొలగని పరిశుద్దుల మాదిరిని అనుసరించమని బోధిస్తుంది. మహమ్మదును మాదిరిగా తీసుకుంటే వచ్చే సమస్య ఏమిటో హదీసులు చదివిన ఎవరికైనా విదితమే, నేను చెప్పడమెందుకు?

ఇకపోతే, స్వలింగ సంయోగాన్ని బైబిల్ ప్రోత్సహిస్తున్నట్లు దీదాత్ పరోక్షంగా వేసిన నిందకు ఆధారాలేమీ లేకపోగా, ఖురానులోని కొన్ని భాగాలు విశ్వవ్యాప్తంగా వున్న స్వలింగ సంయోగులకు కొంత ప్రోత్సాహన్ని తప్పక ఇస్తాయి. ఉదాహరణకు:

“నిశ్చయంగా భయభక్తులు కలవారి కొరకు ఒక సాఫల్యం స్థానం ఉంది;ఉద్యాన వనాలు, ద్రాక్షాతోటలూ, బలిసిన గుండ్రటి వక్షోజాలు కలిగిన సమవయస్సు గల సుకన్యలూ, మద్యంతో నిండిన మధుపాత్రలూ వున్నాయి.”సురా. 78:32

పరదైసుకు వెళ్లే భక్తులలో పురుషులు మాత్రమే వుంటారా? లేక స్త్రీలు కూడా వుంటారా? స్త్రీలు కూడా వుంటే, వారికి కూడా బలిసిన గుండ్రటి వక్షోజాలున్న కన్యలతో వివాహం జరగాలి కదా? అదే నిజమైతే, స్వలింగ సంపర్క పాపంలో జీవించే స్త్రీలు, నేటి తమ సిగ్గుమాలిన జీవిత విధానాన్ని అల్లా పరదైసుకు పూర్వానుభవంగాను, గౌరవప్రదంగాను సమర్థించుకోవచ్చు కదా! కాదంటారా?

57. దీదాత్

మీరు ఆ 'పవిత్ర బైబిలు' గ్రంథం తెచ్చి ఆదికాండంలోని 38వ అధ్యాయాన్ని పూర్తిగా చదివి అందులోని శృంగారపూరిత పదాలను, వాక్యాలను “ఎరుపు” రంగుతో గుర్తించండి. మనం ఎక్కడికి చేరివున్నాం? మన నీతి పాఠంలోని 18వ వాక్యానికి చేరివున్నాం. అదే, “ఆమె అతనితో (మామతో) గర్భవతి యాయెను”

దాగని నిజం

తరువాతేం జరిగిందంటే, మూడు మాసాల తర్వాత, తన కోడలైన తామారు వేశ్యగా ప్రవర్తించిందని....

“మూడు నెలలైన తర్వాత నీ కోడలగు తామారు జారత్వము చేసెను, అంతేగాక ఆమె జారత్వమున గర్భవతియైనదని యూదాకు తెలుపబడెను. అప్పుడు యూదా ఆమెను బయటకు తీసుకుని రండి, ఆమెను కాల్చి వేయవలెను అని చెప్పెను” (ఆది 38:24, 25)

యూదా ఆమెను ఓ మంత్రగత్తె లెక్కన ఎంచి అత్యంత శాడిస్ట్గా ఆమెను కాల్చ నిర్ణయించాడు. కానీ ఆ జిత్తులమారి స్త్రీ ఆ ముసలాయన కంటే రెండాకులు ఎక్కువే చదివింది. ఆమె ఆ ముద్రను’ ‘దారాన్ని చేతికర్రను’ ఓ పనివాడికిచ్చి తన గర్భానికి కారకుడైన నేరస్తుణ్ణి పట్టుకొమ్మని తన మామకు కబురు పంపింది. ఇప్పుడు యూదా ఇరకాటంలో పడ్డాడు.

తర్వాత ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి యూదా మరి ఎప్పుడును ఆమెను కూడలేదు” (38:26).మరి ఈ సంఘటనను బైబిలు పలురకాల ప్రచురణలు పలురకాలుగా రాస్తాయి. మార్పులు సహజం. కానీ జెహోవా విట్నెసెస్ క్రైస్తవ సమాజం తమ NEW WORLD TRANSLATION (ప్రపంచ కొత్త అనువాదం) బైబిల్లో ఈ వాక్యాన్ని ఉన్నది వున్నట్లుగా ఇలా వ్రాశారు:

“ఆయన ఆమెతో తదుపరి మళ్లీ సంభోగం చేయలేదు.” మనం తామారును గురించి దైవవాక్యం బైబిల్లో విన్నది ఇంతవరకే. అయినా సువార్తల గ్రంథకర్తలు ఆమెని “ప్రభువు వంశావళి”లో మాత్రం అమరురాల్ని చేశారు.

వావివరుసలేని వ్యభిచారం (INCEST) గౌరవ ప్రదానం

నేనింక ఈ విషయంలో మిమ్మల్ని బోర్ కొట్టించదలచలేదు. అయినా ఆదికాండంలోని 38వ అధ్యాయంలోని అంతిమ వాక్యాలు తామారు గర్భంలోంచి బయట పడాలన్న విషయం గురించి. 'ప్రథమ సంతానం విషయంలో యూదులు కడు జాగ్రత్త వహిస్తారు. తండ్రి స్థానంలో ప్రథమ సంతానానికి ఆస్తిలో పెద్దవాటా. మరి తామారు గర్భంలోని ఈ పోటీలో ఎవరు నెగ్గి ముందుకొస్తారు? ఈ ప్రత్యేక పోటీకి సంబంధించి మనకు నాలుగు పేర్లు చాలా ముఖ్యమైనవి. అవి యూదా ద్వారా తామారు యొక్క ఫారెజు మరియు జారా. ఈ నాలుగు ఎలా ముఖ్యమన్నది ఇప్పుడే చూద్దాం. కానీ ముందు నీతి ఏమిటి అన్నది చూడాలిగా? పై గాథలోని నీతి ఏమిటి? తమ పలు చెడు కార్యాలకు ఏరును, ఓనానును దేవుడెలా శిక్షించాడో మీరు చూశారు. ఆ ఇద్దరి విషయంలో రెండవ ప్రామాణిక సూత్రం ఖండన (REPROOF) వర్తిస్తుంది. కాని వావివరుసల నతిక్రమించి యూదా, తామారు చేసిన ఈ అశ్లీల అక్రమ సంబంధాన్ని మన తిమోతి ఇచ్చిన నైతిక ప్రామాణిక సూత్రాల్లో దేనిలో వుంచుతారు? పైగా తదుపరి ఉద్భవించిన ఆ అక్రమ సంతానాన్ని తద్వారా పెరిగిన అక్రమ వంశావళిని ఏ ప్రమాణికలో వుంచుతారు? అయినా పైన అండర్లైన్ చేసిన పాత్రలు అశ్లీలతలతో కూడుకొని వున్నప్పటికీ దైవవాక్యమైన గ్రంథంలో గౌరవప్రదమైన పాత్రలు. వీరంతా దేవుని ఒక్కగానొక్క కన్న కుమారుడికి మహనీయులైన తాతలు, అమ్మమ్మలు!

ఓసారి మత్తయి 1:3 చూడండి. ఆంగ్లంలోని, పాతనిబంధనల్లోని ఆదికాండంలోని, 38వ అధ్యాయంలోని ఆ పాత్రల ఉచ్ఛారణలు (Spellings) నూతన నిబంధనల్లోని మత్తయి 1వ అధ్యాయంలో కొంచెం మార్చబడ్డాయి. పాత నిబంధనల్లోని PHAREZ ను PARES గా, ZARAH ను ZARA గాTAMAR ను TAMAR గా. ఏది ఏమైనా మనకు లభించే నీతిఏమిటి? ఈ అక్రమ సంబంధ నేరాన్ని చేసిన యూదాను, దేవుడు ఆశీస్సులతో సత్కరించాడే? కాబట్టి మీరు మీ రేతస్సును ఓనాన్ లా పారేస్తే దేవుడు చంపేస్తాడు, కాని కోడలైన తామారు పగతో, మోసంతో తన మామతో వ్యభిచరించి, ఆయన రేతస్సును సంపాదించి గర్భవతి అయితే ఆమెకు అభినందనలు! అప్పుడు, ఈ దైవ వాక్యమైన గ్రంథంలో ఇచ్చిన ఈ గౌరవ ప్రదానాన్ని మీరు ఏ ప్రమాణంలో వుంచుతారు?

1. సిద్ధాంతీకరణలోనా?

2. ఖండన లోనా?

3. దిద్దుబాటు లోనా?

4. మంచివైపుకు మరలించిన మార్గంలోనా?

మా ఇంటికొచ్చి, మీ తలుపు తట్టి మీకు బోధ చేయాలని వచ్చే మిషనరీలను ప్రశ్నించండి. వారు సరైన జవాబు చెబితే సరైన పారితోషికం ఇవ్వక తప్పదు. పై తిమోతి అందించిన దైవగ్రంథ ప్రామాణికాల్లో ఈ నీతి బాహ్యమైన అశ్లీలతకు ఎలాంటి తావులేదు. దీన్ని మనం ఐదవ ప్రామాణికగా ‘బూతువ్రాత” (PORNOGRAPHY)లో పెట్టాలి.

జవాబు

“యూదా - తామారు” “లోతు తన కుమార్తెలు” వంటి కథలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి అది దేవుని వాక్యం ఎలా అవగలుగుతుందన్నదే ఇక్కడ దీదాత్ ఆవేదన. జరిగిన వాస్తవాన్ని వున్నదున్నట్లుగా తెలిపి, ఎంతో ఘనులుగా భావించబడే వ్యక్తుల నిజస్వరూపాన్ని సహితం నిజాయితీగా బహిర్గతం చేసినందుకు బైబిల్ దైవవాక్యమయ్యే వీలు లేదన్న వాదన ఎంతమాత్రము తర్కబద్దమైనది కాదు. వారు దైవభక్తులని సహితం చూడకుండా, ఎలాంటి పక్షపాతము చూపకుండా వారి రహస్య చెడునడతను నిర్మొహమాటంగా బట్టబయలు చేసినందుకు బైబిల్ దేవుని వాక్యం కాదనడం వింతగా, విడ్డూరంగా అనిపించడం లేదూ? బైబిల్ అంతటిలో, దేవుడు పరిశుద్దుడని, పరిపూర్ణ నీతిగలవాడని అత్యంత ప్రేమాస్వరూపుడని చూస్తాము. బైబిలు బయలుపరిచే దేవుని గుణలక్షణాలలో ఏదైనా లోపమున్నట్లు దీదాత్ చూపించగలిగియుంటే, అది “బైబిల్ దేవుని వాక్యమా? అనే మన ప్రస్తుత పరిశోధనకు కనీసం పరిగణించదగిన కోణమనిపించుకునేది.కాని తన పుస్తకమంతటిలో అలాంటిదేది దీదాత్ నిరూపించలేకపోయాడు. అతడు ఉదహరించిన కథలన్నీ మనుష్యుల దుష్టత్వానికి సంబంధించినవే కాని దేవుని స్వభావానికి సంబధించినవి కావు.

ఇక ఇలాంటి కథనుండి నేర్చుకునే నీతిని 2 తిమోతి 3:16-17 లోని “ఉపదేశం” “ఖండిచడం”, “తప్పు దీద్దడం”, “నీతియందు శిక్ష చేయడం”, అనే శీర్షికలలో దేనిక్రింద చూడాలని దీదాత్ ప్రశ్నిస్తూ, అదేదో పెద్ద సవాలన్నట్లు, జవాబు చెప్పిన వారికి పారితోషికమంటూ బిల్డప్ ఇచ్చాడు కదా? ప్రభువును ప్రేమించి మేమిచ్చే ఈ జవాబుకు పారితోషికం తీసుకోవడానికి మేమేమి దావా చిల్లర వర్తకులం కామనీ దావా వర్గాలకు తెలిసినా తెలియకపోయినా, కనీసం పై ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం వారికి మంచిది. ఈ కథలను ఏ శీర్షికల క్రింద పరిగణించగలమో వివరిస్తున్నాను గమనించండి:

ఉపదేశం:

ప్రవక్తలు, ఘనులు, మహాత్ములతో సహా, మనుష్యులందరు పాపులే. నీతిమంతు డొక్కడును లేడు. దేవుని యొద్దనుండి కలిగే ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ మరియు పరిపూర్ణ నీతి ప్రాప్తిస్తాయి. ఐతే, ఆ కృప, క్షమాపణ మరియు నీతి, యేసుక్రీస్తుతో సంబంధం కలిగియుండడం వలన మాత్రమే లభిస్తాయి. యూదా, లోతు, దావీదు వంటి వ్యభిచారులు మరియు నరహంతకులు సహితం యేసుక్రీస్తు వంశావళిలో వున్నట్లు నమోదు చేసిన వెంటనే, “తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును” (మత్తయి 1:21) అని వ్రాయబడివుంది. కాబట్టి, ఇక్కడ ఎంతో ఆదరణతో కూడిన ఉపదేశం ఇదే. ఎంత ఘోరపాపియైనా యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధము ద్వారా, పాప మాలిన్యము మరియు పాపశిక్షనుండి రక్షించబడతాడు (యోహాను 1:12 , యోహాను 1:7-9 ).

ఖండన:

“తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును” అనే మాట, వారు చేసిన క్రియలు పాపభూయిష్టమైనవంటూ, వారి పాపములను ఖండిస్తుంది. క్షమాపణ అంటే పాపసమర్థనకాదు, పాపివిమోచన మాత్రమే.

దిద్దుబాటు:

బైబిల్లో ఇతరుల వైఫల్యాలు ఎందుకు వ్రాయబడ్డాయి?“ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ది కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకొను వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను” (1కొరింథీ 10:11-12).

జ్ఞానులు తమ తప్పులలో నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఐతే అధిక జ్ఞానులు ఇతరుల తప్పులలో నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు. స్త్రీ వ్యామోహం, మద్యంతో మత్తులుకావడం ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయో, ఈ సంఘటనలు మనకు చక్కటి గుణపాఠాలుగా వున్నాయి.

ఏది ఏమైనా, వావివరసలు తప్పి వ్యభిచరించినవారినీ, నరహంతకులను, ఘోరపాపులను క్షమించి, వారిలో పరివర్తన తీసుకురాగలిగే దేవునిని బయలుపరచే బైబిల్, దేవుని వాక్యమనిపించుకోవడం అభ్యంతరమేమి కాకపోగా, మృగప్రాయమైన విడాకులు, విచ్చలవిడిగా బహుభార్యత్వము ప్రోత్సహించే దేవుని బయలుపరచే ఖురాన్ దైవవాక్యమనీ ఎందుకు నమ్మాలో దావా ప్రచారకులే వివరించాలి (ఋజువు తదుపరి పాయింట్లో వుంది చూడండి).

58. దీదాత్

“ఈ పుస్తకాన్ని నిషేధించండి”

“భూమి మీద (ప్రపంచంలో) ఇది అత్యంత ప్రమాదకరమైన పుస్తకం. దీన్ని తాళం వేసి మూసిపెట్టండి” అని మహా రచయిత అయిన జార్జి బెర్నార్డ్ షా అనేశాడు. దీనిని మన పిల్లలకు దూరంగా పెట్టండని. కాని అతని మాటల్ని ఎవరు లెక్కచేస్తారు? అతను రెండవ జన్మ' (BORN AGAIN) ఎత్తిన క్రైస్తవుడు కాడుకదా?

అత్యంత నైతిక నిశ్చయ విలువల్ని పాటిస్తూ దక్షిణ ఆఫ్రికాలోని క్రైస్తవ పాలకులు “లేడీ చాటర్లీస్ లవర్” (LADY CHATERLEY'S LOVER) అనే నవలను ఒక్క నాలుగక్షరాల బూతుపదం అందులో వుండిందని, బహిష్కరించి వేశారు. మరి ఈ పవిత్ర బైబిలు గ్రంథమన్నది క్రైస్తవులది గాక ఏ హిందువుల గ్రంథమైనా లేదా ముస్లిం మతగ్రంథమైనా అయ్యుంటే అలానే తప్పక బహిష్కరించేసే వారు. కానీ అది వాళ్ల పరిశుద్ధ గ్రంథం. వారి 'రక్షణ' (మోక్షం) దానిపై ఆధారపడి వుంది కావున నిస్సహయులయ్యారు.

“బైబిలు గాథల్ని పిల్లలకు వినిపిస్తే పలువిధాలుగా సెక్సు నీతిని గురించిమాట్లాడే మార్గాలు తెరవబడతాయి. శుభ్రపరచబడని బైబిలుకు కొన్ని సెన్సారుల ద్వారా X రేటింగ్ (X-RATING) ఇవ్వాల్సి వుంటుంది.” (ది ప్లెయిన్ ట్రూత్ అక్టోబర్ 1977)

జవాబు

జార్జ్ బెర్నార్డ్ షా ఒక నాస్తికుడు. క్రైస్తవులు తమ మతగ్రంథాన్ని చదవాలా చదవకూడదా అనేది నాస్తికుల వద్ద నేర్చుకోవాలా? ఖురాను చదవాలా చదవకూడదా అనేది ముస్లింలు నాస్తికులనడిగి తెలుసుకుంటారా? సల్మాన్ రషీ, తస్లీమా నసీన్ అభిప్రాయాలను గౌరవించి, ముస్లింలు ఖురానును నిషేధిస్తారా? లేదే! అప్పుడు మాత్రం వారు వేరే భాష మాట్లాడుతారు. ఫత్వాలు జారీ చేసి, ఖురాన్ వ్యతిరేకుల ప్రాణాల వెంటపడి, వారిని అండర్ గ్రౌండ్లలోనికి తరిమి కొడతారు. ఖురాను వాస్తవాలు తెలిసినా, బహుశ ఇందుకేనేమో, ఎవరూ దానిని నిషేధించమనే సాహసం మాత్రం చేయరు.

| బైబిల్లో అశ్లీలత వుందంటూ ఎక్కువ రభస చేస్తే, ఖురాన్లో వున్న బూతు రాతల పైనుండి దృష్టి మరల్చొచ్చనుకున్నట్లున్నారు ఈ దావా ప్రచారకులు. మాటలలో దీదాత్ కనపరచే విశేష ధైర్యాన్ని చూసి, ఖురానులో వివాహం మరియు సెక్సుకు సంబంధించిన ఆదర్శ, ఆచరణీయ, సురక్షిత విలువలు వున్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఏ గ్రంథము తట్టుకు ఆకర్షించడానికి దీదాత్ తన ఈ పుస్తకం ద్వారా బైబిల్ పై బురదచల్లుతున్నాడో, ఆ ఖురాన్ గ్రంథములోని వివాహ విలువలను మీరు అభినందించగలిగేలా ఒక సంఘటన మీ దృష్టికి తెస్తున్నాను: జాగ్రత్తగా చదవండి.

ఇది మహమ్మద్ జీవిత చరిత్రలో ఎంతో ప్రసిద్ధిగాంచిన కథనం (అల్-తబరీ సంపుటి 22, పుటలు 12-13లో పూర్తి కథను చదవగలరు).

అతనికి జైద్ అనే పేరుగల ఒక దత్త కుమారుడు వున్నాడు. ఈ జైద్ భార్య పేరు జైనబ్. మహమ్మద్ జైనబ్ పై మనసుపడ్డాడని తెలుసుకున్న జైద్, “నువ్వామెను చేసుకుంటానంటే నేను విడాకులిచ్చేస్తాను” అని ఎంతో త్యాగపూరిత ప్రతిపాదన చేసాడు. మహమ్మద్ తన మంచితనాన్ని బట్టి వద్దనేసాడు. కానీ తన ప్రవక్త ఆ కోరిక విషయంలో అలా రాజీపడడం అల్లాహకు ఎంత మాత్రము నచ్చలేదు. ఇంకేముంది; హుటాహుటీన పరలోక రాతిపలకలపై అనాదినుండివ్రాయబడిన ఒకానొక ఆయతును మహ్మద్ గుండె పలకల పై అవతరింపజేసేసాడు. ఏమిటింతకు ఆ ఆయతు? “నువ్వు చెడును విసర్జించి మంచిని ఎన్నుకున్నందుకు నిన్ను దీవిస్తాన”నా? అలా అనుకోవడానికి, మనం మాట్లాడేది బైబిల్లో వున్న దేవుని గురించి కాదు సుమా! అల్లా ప్రత్యక్షత వహి) ఎంత ఆమోదయోగ్యమైనదో, ఎంత ఆదర్శప్రాయమైనదో, మిరే చదివి అభినందించండి.

“ఓ ప్రవక్తా! అల్లాహ్, “నీవు నీ భార్యను విడిచిపెట్టకు, అల్లాకు భయపడు” అని అంటున్న ఆ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నీవు అల్లాహ్ బయట పెట్టదలచిన విషయాన్ని నీ మనస్సులో దాచివుంచావు. నీవు ప్రజలకు భయపడుతున్నావు. వాస్తవానికి నీవు భయపడటానికి అల్లాహ్యే ఎక్కువ హక్కుదారుడు. తరువాత జైద్ ఆమె విషయంలో తన అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, మేము ఆమె (విడాకులు పొందిన స్త్రీ) తో నీకు వివాహం జరిపించాము. విశ్వాసులకు తమ దత్త పుత్రుల భార్యల విషయంలో, వారు తమ భార్యలకు సంబంధించిన తమ అవసరాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు. అల్లాహ్ ఆదేశం అమలులోకి రావలసిందే అల్లాహ్ తనకు విధించిన ఏ పనినైనా చేయటంలో దైవ ప్రవక్తకుఏ ప్రతిబంధకమూ లేదు” (ఖురాను 33:37-39).

దీనిని దీదాత్ వ్యభిచారమని ఎందుకు విమర్శించలేదు? విడాకులు తీసుకుంటే వ్యభిచారం కాస్త వివాహమైపోతుందా? నేను ప్రారంభంలో సూచించినట్లు “నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే వ్యభిచారం” అన్నట్లుంది దీదాత్ వ్యవహరం.

విషయానికొద్దాం: బైబిల్లో ఉన్న వ్యభిచారపు సంఘటనలు మానవ వైఫల్యాలు మాత్రమే. దేవుడు వాటిని క్షమించాడు కాని, ఎవరిని ఎప్పుడు అలా చేయమని ప్రోత్సహించలేదు. ఐతే, ఖురానులో మనం చూసిన ఈ బాగోతం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ప్రవక్త తప్పు చెయ్యొద్దనుకున్నప్పటికీ, దానిని చేయమని, అలా చేయడమే నా చిత్తమనీ, అల్లా ఆజ్ఞాపించినట్లు చూస్తాము. ఇప్పుడు చెప్పండి? ఏది దేవుని వాక్యం? పాపాన్ని శిక్షించడానికి , క్షమించడానికి, శక్తిగల పరిశుద్ద దేవునిని బయలు పరచే బైబిల్ గ్రంథమా, లేక పాపము చేయమని, అదే ఆయన చిత్తమని సెలవిచ్చే దేవునిని బయలుపరచే ఖురాను గ్రంథమా ? ఇది నీ నిత్య రక్షణకు, నీ మరణాంతర జీవితానికి సంబంధించిన అతి ప్రాముఖ్యమైన ప్రశ్న. దీనిని తేలికగా కొట్టిపారేయవద్దు. పాపం చేయించే దేవుడు బైబిలులో వున్న దేవుడు కాదు. బైబిల్లో వున్న దేవుడు పరిశుద్దుడు కాబట్టి ఆయనే పాపములను తీసివేసి నిజమైన పరిశుద్దతను అనుగ్రహించగలడు. బైబిలు ఇలా హెచ్చరిస్తుంది: “ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును” (సామెతలు 14:12).

దయచేసి ఈ హెచ్చరికను బేఖాతరు చేయొద్దు. ఖురాను మార్గంలో కొనసాగే ముందు మరొకసారి ఆలోచించుకో. ప్రియ ముస్లిం మిత్రుడా, ఇదంతా నిన్ను అవమానించడానికి కాదు, నిన్ను ప్రేమించి, సత్యాన్ని ఆలోచిస్తావనే ఆశతో చెబుతున్నాను.

59. దీదాత్

తండ్రినే చెరిచే కూతుళ్లు

ఆదికాండం 19:30 చదవండి. మళ్లీ ఈ గౌరవ ప్రతిష్టలను ప్రసాదించే మాటల్ని 'ఎర్ర' రంగుతో గుర్తు పెట్టండి. ఎలాంటి శంక అక్కర్లేదు. మీరు రంగులతో మార్కు చేసిన బైబిలు మీ పిల్లలకు ఓ మంచి ఆస్తిగా సంక్రమిస్తుంది. షా చెప్పినట్టు తాళం పెట్టమనడాన్ని నేనంగీకరిస్తాను. అయినా మన క్రైస్తవ సోదరులతో చేసే సంవాదంలో అది వాడక తప్పదే. ఇస్లామీయ ప్రవక్త యుద్ధాన్ని ఓ ఎత్తుగడ (STRATEGY) అన్నారు. ఎత్తుగడల్లో మన శత్రువుల ఆయుధాల్నే మనం వాడటం అవసరం. అక్కడ మన ఇష్టానిష్టాలతో ప్రమేయం వుండరాదు. ఆ 'ఒక్క పుస్తకం పండితులు” “బైబిలు ఇలా చెప్పింది” “బైబిలు అలా చెప్పింది” అంటూ మన తలుపుల్ని తడుతూ వున్నప్పుడు మనం మరి దాన్నే వాడక తప్పదు గదా? మన పవిత్ర ఖురానును తీసివేసి వారి పవిత్ర బైబిలుని మనకందించాలన్నది వారి ప్లాను. వారికి కనిపించకుండా పోయిన తప్పుల్ని మనమైనా వారికి చూపించాలి కదా? ఒక్కోసారి వాళ్లు దాన్ని మొట్టమొదటిసారిగా చూసినట్లు ఆశ్చర్యాన్ని ప్రకటిస్తారు కూడా! పైగా తమ ప్రబోధనలకు సరైన వాక్యాలతో సంసిద్దులై వుంటారు సుమా! చరిత్రను ఇంకాస్త సాగదీసి చూడండి - ఆ గ్రంథంలోనే వుంది. ప్రతి రాత్రి (NIGHT AFTER NIGHT) లోతు కుమార్తెలు బాగా తాగిన తమ తండ్రితో తమ తండ్రి రేతస్సును పొందాలనే పవిత్ర ఉద్దేశంతో చేరచడం మనం వింటున్నాం. ఈ పవిత్ర గ్రంథంలో ఈ రేతస్సు' (బీజం, SEED) చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని వుంది. ఈ చిన్నగ్రంథం 'ఆదికాండం'లోనే 47 మార్లు ఈ “బీజం' రేతస్సు ప్రస్తావన వచ్చింది. ఇలాంటి అక్రమ, వావివరుసల నతిక్రమించిన వ్యభిచారం ఇశ్రాయేలీయుల దేవుడి ప్రత్యేక ప్రేమను పొందిన “అమ్మోనై దులు” ముఆబైటుల” విషయంలో వస్తుంది. తదుపరి ఆ ప్రేమపూరితమైన దేవుడే ఫిలిస్తేనేయుల స్త్రీలను, పురుషుల్ని కడకు పిల్లల్ని కూడా అతిదారుణంగా చంపివేసేందుకు యూదులకు ఆజ్ఞ ఇవ్వడం కూడా మనం చూస్తాం. కడకు పశువుల వృక్షాలు సైతం నరకబడ్డాయి. కాని అమ్మోనీయులకు, మోయాబీయులకు ఎలాంటి బాధను, ఇబ్బందిని కలుగచేయరాదు. ఎందుకంటే వాళ్లు లోతు సంతానం (ఆయన బీజం) కదా! (ద్వితీయోపదేశ కాండం 2:19 ).

తల్లితో గాని, చెల్లితో గాని, కూతురితోగాని కడకు వివాహానికై ప్రధానమైన స్త్రీతోగాని లోతు చేసే అక్రమ సంబంధాన్ని ఏ పాఠకుడు కూడా జీర్ణించుకోజాలడు. అభినందనలంటారా అవి వేరే. ఇలాంటి మతి స్థిమితం దెబ్బతిన్న వారికే అవి అవసరం.

జవాబు

పై సంఘటనలోని నీతికి 57వ పాయింటులోనే జవాబు చెప్పేసాను. ఇక్కడ గమనించదగిన విషయమేమిటంటే, ఈ కథలు, తల్లులకు అక్కచెల్లెళ్లకు, కూతుర్లకు, వివాహం కొరకు ప్రధానం చేయబడిన స్త్రీకి, చదివి వినిపించడానికి ఉద్దేశించ బడినవి కావు. లోతులా, అతని కుమార్తెలలా పాపం చేసినవారికి సహితం, క్షమాపణ పొందే అవకాశముందని అభయమివ్వడానికి, పశ్చాత్తాపముతో లోతు దేవుని తట్టుకు తిరిగితే కనికరం పొందుతారనే నిరీక్షణను అందించడానికి, బైబిల్లో ఈ సంఘటన నమోదు చేయబడింది. ఐతే, ఈ అధ్యాయంలో దీదాత్ ఉదహరించిన ఏ సంఘటనలలోనైనా, “నీవునూ పోయి అలాగున చేయుము” అనే మాట బైబిల్లోనుండి ఏ దావా ప్రచారకుడైనా మాకు చూపించగలడా? ఇది వారికి మా లైఫ్ టైమ్ ఛాలెంజ్. కాగా, అందుకు భిన్నంగా, అలాంటి చర్యలను నిషేధించి అవి దేవునికి హేయమైన క్రియలని హెచ్చరించే ఎన్నో వచనాలను మేము బైబిలు నుండి చూపించగలం (ఉదాహరణగా లేవీకాండం 18వ అధ్యాయం, లేవీకాండము 20:10-23 చూడండి).

వినసొంపైన ఆయతులు

దీదాత్ నియమాన్ననుసరించి, దైవవాక్యమనబడే గ్రంథములోని వచనాలన్నితల్లులకు, అక్కచెల్లెళ్లకు, కూతుర్లకు చదివి వినిపించదగినవిగా వుండడం అవసరమైతే, ఈ క్రింది ఆయతులను ఒక్కసారి గమనించండి;

“మానవుడు తనను విచ్చలవిడిగా వదిలి పెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? అతడు (తల్లి గర్భంలో కార్చబడిన నీచమైన ఒక నీటి బిందువు (A drop of Sperm) కాడా” సురా 75:37.

“అనంతమైన కాలంలో మానవుడు చెప్పుకోదగిన వస్తువు కాకుండా ఉండిన సమయం ఏదైనా అతనిపై గడిచిందా? మేము మానవుణ్ణి పరీక్షించటానికి అతనిని ఒక మిశ్రమ వీర్యబిందువుతో సృష్టించాము” సురా 76:2

వీటిని ముస్లింలు తమ తల్లులకు అక్కచెల్లెళ్లకు కూతుర్లకు చదివి వినిపిస్తారా? పెన్నుందికదా అని పిచ్చిగీతలు గీసే ముందు గీసేవాటి పర్యావసానాలు కూడా ఆలోచించుకుంటే, దావా దందాను కనీసం పొట్ట కూటికొరకైనా మిగుల్చుకోవచ్చు.

60. దీదాత్

అంతే కాదు, ఈసారి యెహెజ్కేలు 23 చదివి దానిని కూడా ‘ఎర్ర’ రంగుతో మార్కు చేయండి. అందులో ఇద్దరు అప్పచెల్లెళ్ల వ్యభిచారం, అహాలాబు, అహోలిబాహ్ వ్యభిచారం (అక్రమ సంబంధమూ, వావివరుస దాటిన అక్రమ సంబంధమూ) గురించి మీకు తెలుస్తుంది. ఇందులోని సెక్సు విశేషాలు నిషేధించబడ్డ సెక్సు పుస్తకాలను సైతం సిగ్గుపడేలా చేస్తాయి. మరి ఈ అశ్లీలతను (తిమోతి మనకిచ్చిన నాలుగు ప్రామాణికల్లో ఏ ప్రమాణంలో పెట్టాలో మీ దగ్గరికొచ్చే క్రైస్తవ ప్రబోధకుల్ని అడిగి తెలుసుకోండి. ఏ 'దైవ వాక్యం' లోనూ అలాంటి అసహ్యాలకు తావు వుండరాదు.

జవాబు

యెహెజ్కేలు 23వ అధ్యాయ సందర్భాన్ని, అది తెలిపే సందేశాన్ని అర్థం చేసుకున్న వారెవరికి, దేవుని వాక్యంలో వుండకూడనివేవీ అందులో కనిపించవు. ఆ అధ్యాయంలో, విగ్రహారాధనను ఖండిస్తూ, అదీ ఆయన దృష్టికి ఎంత నీచమైనదిగా, హేయమైనదిగా అగుపిస్తుందో తెలిపే అలంకార భాషను దేవుడు ప్రయోగిస్తున్నట్లుగా చూస్తాము. అలంకారప్రాయంగా చెప్పబడినప్పటికీ, ఆ అధ్యాయంలో వర్ణించబడిన వ్యభిచారపు చర్యలపట్ల దేవుడు తన ద్వేషాన్ని వ్యక్తపరుస్తున్నాడని, అంతే హీనంగా విగ్రహారాధనను కూడా చూస్తున్నాడనే సందేశాన్ని ఎవరైనా అర్థం చేసుకోగలరు.

విమర్శించే ముందు ఆ అధ్యాయ సందేశాన్ని సరిగా అర్థం చేసుకునేందుకు కొన్ని నిమిషాలు వెచ్చించివుంటే, లేదా కనీసం ఆ అధ్యాయ సారాంశాన్ని క్లుప్తంగా తెలిపే దాని చివరి వచనాన్నైనా ఒక సారి గమనించియుంటే బాగుండేది. అక్కడ ఇలా చదువుతాము:

“నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింప బడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు” యెహేజ్కేలు 23:49.

ప్రవక్త ఆ ప్రజల వద్దకు వెళ్లి, సాధారణ భాషలో వారి విగ్రహారాధనను ఖండించియుంటే, అది వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపించి యుండేది కాదు. ఐతే, ఒక వేశ్య, మరియు వ్యభిచారపు చర్యల అలంకారభాషను ప్రయోగించి, విగ్రహారాధనను ఎంత హీనమైన చర్యగా దేవుడు చూస్తున్నాడో వర్ణించాడు. ఇది అందరిని కాస్త ఆలోచింపజేసే భాష ఒక పాపపు చర్య ఎంత హేయమైనదో నొక్కి చెప్పడానికి, ఖురాను కూడా కొన్ని సందర్భాల్లో, ఇలా ఆలోచింపజేసే కఠిన పదజాలం ప్రయోగించడం గమనిస్తాము. ఉదాహరణకు:

“మీలో ఎవరు ఎవరినీ పరోక్షంగా నిందించరాదు. మీలో ఎవరైనా మీ మృతసహోదరుని మాంసం తినడానికి ఇష్టపడతారా సురా,49:12.

సహోదరుని శవాన్ని తినడం కూడా హీనతలో వ్యభిచారపు చర్యల కంటే ఏ మాత్రం తీసిపోలేదు. ఐతే, సహోదరునికి విరోధంగా కొండెములాడొద్దని సాధారణ భాషలో చెబితే అంత ప్రభావము చూపించదని, సహోదరుని శవాన్ని తినే అలంకారాన్ని ఇక్కడ ఖురాను ప్రయోగించింది. అంతమాత్రాన, అల్లాహ్ శవాన్ని తినే తప్పుడు ఆలోచనలు మనలో పెడుతున్నాడని భావించే మూర్ఖుడు పండితుడనిపించుకుంటాడా? అది ఖురానుకు వ్యతిరేకంగా ఏదైనా నిరూపిస్తుందని చెబితే, ముస్లింలు సమ్మతిస్తారా? మరి బైబిలును కొలవడానికెందుకు ఈ పనికిమాలిన కొలబద్దలు, వింత ప్రమాణాలు? అది అలా వుంచితే, ఖండించే ధోరణిలో చెప్పిన యెహెజ్కేలు మాటలను, అశ్లీలమైనవిగా చిత్రీకరించి, అలాంటి పదజాలాన్నే పరదైసుకు ఆకర్షించుకునే వాణిజ్య ప్రకటనలుగా వినియోగించిన ఖురానును దీదాత్ దైవవాక్యంగా అంగీకరించడం అతని పక్షపాతానికి పరాకాష్ట. పరదైసులో ఏమేమి సదుపాయాలుంటాయో ప్రకటించే ఖురాను వర్ణనను మరి యొకసారి చదవండి:

“నిశ్చయంగా భయభక్తులు కలవారి కొరకు ఒక సాఫల్య స్థానం వుంది; ఉద్యానవనాలు, ద్రాక్షాతోటలు, బలిసిన గుండ్రటి వక్షోజాలు కలిగిన సమ వయస్సు గల కన్యలూ, మద్యంతో నిండిన మధుపాత్రలూ వున్నాయి” (ఖురాను 78:32).

తెలుగు అనువాదాలలో “బలిసిన గుండ్రటి వక్షోజాలు” అనే మాటను సెన్సార్ చేసేసారు. తల్లులకు అక్కాచెల్లెళ్ళకు, కూతుర్లకు చదివి వినిపించడం ఇబ్బందిగా వుంటుందనేమో! చూసారు కదా? వ్యభిచారచర్యలను ఖండించి మాట్లాడితే అది అశ్లీలం! పరదైసుకు వాణిజ్య ప్రకటనగా స్త్రీ వక్షోజాలను సహితం వాడుకుంటే అది దేవుని వాక్యం! ఇది దావా ప్రచారకుల న్యాయతీర్పు. ప్రియ పాఠకుడా నీ తీర్పేమిటి?

 

9వ అధ్యాయం

యేసు వంశావళులు

“బైబిల్ దేవుని వాక్యమా?? అనే దీదాత్ పుస్తకంలో “యేసు వంశావళి”
అనే తొమ్మిదవ అధ్యాయానికి మా జవాబు.

61. దీదాత్

ఏసు వంశావళి

తమ ప్రభువూ, రక్షకుడూ అయిన ఏసు క్రీస్తు (అలైహిసలామ్)కు నూతన నిబంధనల్లో క్రైస్తవ ఫాదరీలు, ఎంతటి హేయమైన అక్రమ సంబంధాల వంశావళిని అంటగట్టారో మీరు చూడగలరు. వాస్తవానికి ఆయన ఎలాంటి వంశ పరంపర లేని మహాత్ముడు. అయినా ఆయనకు ఓ వంశావళి ఉత్పత్తి చేశారు. అదీ ఎలాంటి వంశావళి? ఆరుగురు వ్యభిచారులు, వావివరుసలు తప్పి వ్యభిచరించిన వారి సంతానపు వంశాన్ని అంటగట్టారు. వాళ్లంతా ఎలాంటి స్త్రీలు, పురుషులంటే యూదుల మోషే ధర్మశాస్త్రం ప్రకారం, రాళ్లతోకొట్టి చంపబడవలసినవారు. అంతటి పాపాత్ములన్నమాట! తరాలపాటు బహిష్కరింపబడి తీసివేయబడవలసినవారు.

జవాబు

ఒకవేళ యేసుకు వంశావళీ ఉత్పత్తి చేసింది క్రైస్తవ ఫాదరీలైయుంటే, ఆయనకు ఎంతో ఘనమైన గౌరవప్రదమైన గొప్ప వంశావళినే తగిలించియుండేవారు. ఇలా వావివరసలు తప్పి వ్యభిచరించిన వారి వంశావళిని ఆయనకు ఎందుకు అంటకడతారు? ఐతే, మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని బయలుపరిచి తన నీతిని చాటుకున్న దేవుడు, యేసు ద్వారా ఎలాంటి పాపులకైనా క్షమాపణ వుందని, ఆయనతో బంధుత్వం పొందే అవకాశం వుందని, యేసుకు ఆయన అనుమతించిన వంశావళి ద్వారా చాటుకున్నాడు. ఐతే దావాహంకారముతో కళ్లుమూసుకునిపోయిన దీదాత్, ఈ వంశావళిలో ఆ ప్రేమపాఠాన్ని చదవగలడని ఎలా ఊహించగలం? అల్లాలో కాని, అతని వద్ద నుండి వచ్చిందని చెప్పుకునే ఖురాన్లో కాని ఇలా కృపా సహితమైనవేవి కనిపించవని బహుశ దీదాత్ ఈర్ష్యపడుతున్నాడేమో!

అన్నట్లు, ఏ వంశావళి లేని మహాత్ముడని దీదాత్ యేసును అభివర్ణించాడు కదా! తన దైవిక కోణం నుండి యేసుకు వంశావళీ లేదన్నది వాస్తవమైనప్పటికి, మానవ కోణం నుండి ఆయనకు వంశావళి వుంది. మరి ఆయన దైవిక కోణానికి సంబంధించిన వాస్తవాన్ని దీదాత్ ఒప్పేసుకున్నాడు కాబట్టి, దీదాత్తో ఏకీభవించే దావా ప్రచారకులు, యేసు దేవుని కుమారుడని కూడా ఒప్పుకుంటారా?

62. దీదాత్

తుచ్ఛమైన పూర్వీకులు

దేవుడు తన కుమారుడగు ఏసుకు (అ.స) ఒక తండ్రిని (యోసేపు) ఎందుకిచ్చాడు. ఎందుకంత తుచ్ఛమైన వంశావళినిచ్చాడు? ఒక విపరీతమతి ఇలా అంటాడు:

“అసలు అందమంతా ఇక్కడే వుంది! దేవుడు పాపుల్ని ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుడికి అలాంటి వంశీకుల్ని ఇచ్చేందుకు ఎలాంటి ఉపేక్ష చేయలేదు.”

జవాబు

దేవుడు యోసేపును తన కుమారుడైన యేసుకు తండ్రిగా ఎక్కడా ప్రకటించలేదు. అందుకు భిన్నంగా, లూకా 3:23 లో “యేసు తండ్రిగా” ఎంచబడిన “యోసేపు” అని ఎంతో స్పష్టంగా వ్రాయించాడు.

ఇకపోతే, మత్తయి నమోదు చేసిన యేసు వంశావళిలో నలుగురు స్త్రీలు పేర్కొనబడ్డారు. తన మామతో వ్యభిచరించిన తామారు, వేశ్యయైన రాహాబు, మోయాబీయురాలైన రూతు, మరియు దావీదుతో వ్యభిచరించిన బత్షెబ. ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా నైతికంగా దిగజారిన స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయని ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ పేర్లు చెప్పడం వల్ల యేసుకు అవఘనత కలుగుతుందని దేవుడు తలచియుంటే, యేసు వంశములో ఘనులైన శారా, రిబ్క వంటి సాధు స్త్రీలను పేర్కొనియుండేవాడు. యేసు వంశావళిని కలుషితం చేసిన ఈ నలుగురు స్త్రీలనే ఎందుకు పేర్కొన్నట్లు? వెటకారంగా చెప్పినా, దీదాత్ నిజమే ఒప్పుకున్నాడు, “అసలు అందమంతా ఇక్కడే వుంది!ఇది పాపులకు యేసు చూపవచ్చిన కరుణను, క్షమాపణను ప్రకటించే వంశావళీ పట్టిక. యేసు స్వీయ ప్రకటన ఈ వివరణను ధృవీకరిస్తుంది.

“రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు గదా. అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు” (మత్తయి 9:12-13).

63. దీదాత్

నియామకం ఇద్దరిది మాత్రమే

నాలుగు సువార్తీకుల్లో దేవుడు తన కుమారుడి' వంశావళిని వ్రాసేందుకు ఇద్దరినీ మాత్రమే ఉత్తేజపరిచాడు. ఆ ఇద్దరు ప్రేరేపించబడ్డవారు తయారు చేసిన జాబితాల్లో మీరు సులభంగా ఏసు యొక్క తాత తండ్రుల్ని పోల్చి చూసుకునేందుకు నేను పేర్లు మాత్రం ఇచ్చాను.

ఆ జాబితా చూడండి

According to MATTHEW 1:6-16

According to LUKE 3;23-31

DAVID

1. SOLOMON
2. ROBOAM
3. ABIA
4. ASA
5. JOSAPHAT
6. JORAM
7. OZIAS
8. JOATHAM
9. ACHAZ
10. EZEKIAS
11. MANASSES
12. AMON
13. JOSLAS
14. JECHONIAS
15. SALATHEL
16. ZOROBABEL
17. ABIUD
18. ELIAKIM
19. AZOR
20. SADOC
21. ACHIM
22. ELIUD
23. ELEAZAR
24. MATTHAN
25. JOCOB
1. NATHAN
2. MATTATHA
3. MENAN
4. MELEA
5. ELIAKIM
6. JONAN
7. JOSEPH
8. JUDA
9. SIMEON
10. LEVI
11. MATTHAT
12. JORIM
13. ELIEZER
14. JOSE
15. ER
16. ELMODAM
17.COSAM
18. ADDI
19. MELCHI
20. NERI
21.SALATHIEL
22.ZOROBABEL
23.RHESA
24.JOANNA
25.JUDA
26.JOSEPH
27.SEMEI
28.MATTATHIAS
29.MAATH
30.NAGGE
31.ESLI
32.NAUM
33.AMOS
34.MATTATHIAS
35.JOSEPH
36.JANNA
37. MELCHI
38.LEVI
39.MATTHAT
40.HELI

26.JOSEPH

41.JOSEPH

JESUS

దేవుడు తన కుమారుడికి దావీదు నుండి ఏసు వరకు 26 మంది పూర్వీకుల్ని మాత్రమే మత్తయిని ప్రేరేపించి వ్రాయించాడు.

కాని ప్రేరేపించబడిన లూకా మాత్రం ఏసు కొరకు 41 మంది తండ్రుల్ని తాతల్ని (పరంపరను) సేకరించాడు. ఈ రెండు జాబితాలలోను దావీదు నుంచి ఏసు మధ్య వరకు ఒక్క పేరు మాత్రం రెంటిలోను సరిగా వ్రాయబడి వుంది. అది యోసేపు. అదీను లూకా ప్రకారం (2:23) “ఎంచబడిన తండ్రి'. ఈ ఒక్కపేరు మాత్రం కొట్టవచ్చినట్టు ప్రత్యేకంగా కన్పిస్తుంది. దీన్ని వెతికి తీసేందుకు మీకు పెద్ద శ్రమ అక్కర్లేదు. ఆయన వడ్రంగి అయిన యోసేపు. మీరు చూడగానే అట్టే కనిపెట్టగలరు. రెండు చిట్టాలు ఒకదానికొకటి భిన్నంగానే వుంటాయి. మరి ఈ రెండు పద్దులు కూడాను ఒకే ఆధారం మూలమైన దేవుడి నుంచే ఉద్భవించిన వంటారా?

 

>జవాబు

మత్తయి మరియు లూకా పేర్కొన్న యేసు వంశావళుల్లోని పేర్లు వేరు వేరుగా వున్నాయి కాబట్టి, ఇక్కడేదో వైరుధ్యముంది కదా, ఈ సమస్యకు దేవుడెలా కర్త కాగలడన్నది దీదాత్ సందేహం. ఇక్కడ మొదట గమనించాల్సిందేమిటంటే, ప్రతీ వ్యక్తికి ఒకటి కాదు రెండు వంశావళులు వుంటాయి. ఒకటి తండ్రి తరపునుండి, మరొకటి తల్లి తరపునుండి. అలాగే మత్తయి, యేసు తండ్రిగా ఎంచబడిన యోసేపు వంశావళిని; లూకా, మరియ వంశావళిని ప్రస్తావిస్తున్నారు కాబట్టి, యాకోబు యోసేపుకు, హేలి మరియకు తండ్రి అని గుర్తించగలము. మత్తయి మరియు లూకా వ్రాసిన యేసు జనన వృత్తాంతం ఇందుకు ఋజువు. మత్తయి 1:18-25 యేసు జననాన్ని యోసేపు కోణమునుండి తెలుపగా,లూకా 1:26-56 యేసు జననాన్ని పూర్తిగా మరియ కోణమునుండి వివరిస్తుంది.

అదే నిజమైతే, మరియ హేలి కుమార్తె అని కాక యోసేపు హేలి కుమారుడని లూకా ఎందుకు వ్రాసినట్లు? దీనికి సమాధానం సులభమే. వంశావళిలో స్త్రీ పేరుకు బదులుగా ఆమె భర్తను పేర్కొనే హెబ్రీయుల ఆచారానుసారంగా లూకా మరియ స్థానంలో యోసేపు పేరు వ్రాసాడు. హెబ్రీయుల ఆచారం తెలిసినవారికి, స్త్రీ తన భర్త పేరుతో తెలియబడడం వారు ఎంత గౌరవప్రదంగా భావిస్తారో తెలుసు (యెషయా 4:1 ఇందుకు ఒక నిదర్శనం).లూకా యోసేపును మరియకు బదులుగా పేర్కొన్నాడనడానికి ఎన్నో ఆధారాలు వున్నాయి. గ్రీకు తెలిసినవారెవరైనా మనకు ధృవీకరించగలిగే మొదటి ఋజువేమిటంటే, లూకా తన జాబితాలోని ప్రతీ వ్యక్తికీ, అతడు ఫలానా వారికి కుమారుడు అని తెలుపుతు వాడిన ఉపపదం( డెఫినెట్ ఆర్టికల్) “యోసేపు హెలికి” అని చెప్పినప్పుడు వాడలేదు. కాబట్టి తెలుగులో లేదా ఆంగ్లంలో స్పష్టంగా తెలియకపోయినా గ్రీకు చదివే వారు, యోసేపు మరొకరి స్థానంలో పేర్కొనబడుతున్నాడని ఎలాంటి ఇబ్బంది లేకుండా గుర్తించగలరు.

పై వాదనను బలపరచే రెండవ వాస్తవమేమిటంటే, యాకోబు యోసేపును కనెను అని మత్తయి తెలుపగా, హేలి యోసేపును కన్నాడు అని లూకా చెప్పడం లేదు. యోసేపు హేలికి కుమారుడని మాత్రమే చెబుతున్నాడు. అంటే, యోసేపు యాకోబుకే కన్న కుమారుడైనప్పటికి, మరియతో వివాహం ద్వారా హెబ్రీయుల వాడుక చొప్పున ఆమె తండ్రికి కుమారుడనబడ్డాడు. కోడండ్లను కుమార్తెలుగాను, అల్లుళ్లను కుమారులుగాను పరిగణించడం, గౌరవించడం హెబ్రీయుల సాంప్రదాయం (రూతు 1:11 ).

మూడవదిగా, క్రీస్తును తమ బద్దశత్రువుగా భావించిన రబ్బీయుల యెరూషలేము తాల్ముడులో మరియను వారు హేలి కుమార్తెగా సంబోధించిన దాఖలాలు వున్నాయి (హగ్గగా 2:4), (ఫ్రెచెస్ బీమ్ 1993:1013). బైబిలేతర సాక్ష్యాలతో మనకు పనిలేనప్పటికి, శత్రువు నోట వెలువడిన సత్య వాంగ్మూలానీకున్న ప్రాధాన్యత ఇలాంటి ఆధారాలకు ఎలాగూ వుంటుంది కదా!

ఈ ఋజువులన్నిటి ఆధారంగా మత్తయి మరియు లూకాలు నమోదు చేసిన యేసు వంశావళుల మధ్య సమస్యలన్నీ నిర్వీర్యమై, దావోన్మాదులకు పాపం నిరాశే మిగిల్చింది!

64. దీదాత్

భవిష్యవాణి నెరవేరిందా?

“అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చొండ బెట్టుదును” (అపోస్తలుల కార్యములు 2:30). కూర్చొనవలసినదనే భ్రమలో మత్తయి, లూకాలు ఇరువురూ దావీదు రాజును ఏసు యొక్క ప్రథమ, ముఖ్య పూర్వీకుడిగా నియమించి ఉత్సాహాన్ని చూపించారు. కాని సువార్తలు ఈ ప్రవచనాన్ని బొంకాయి అని తెలుస్తుంది. ఎందుకంటే ఏసు తన తండ్రి (దావీదు) సింహాసనంపై కూర్చోవడానికి బదులుగా, ఒక రోమను గవర్నరైన, విగ్రహారాధకుడైన పొంతిపిలాతు దానిని అధిరోహించి, ఆ సింహాసనానికి హక్కుదారుడైన (?) ఆ ఏసుకు మరణ దండన విధించాడని ఆ వాక్యాలే మనకు తెలుపుతున్నాయి. “ఏం ఫర్వాలేదు. మొదటి రాకలో కాకపోయినా రాబోయే ఆయన రెండవ రాకడలో ఆ ప్రవచనాన్ని మరో మూడువందల ప్రవచనాలని ఆయన పూర్తి చేసి చూపిస్తాడు” అంటాడు ఎవాంజెలిస్టు (ప్రబోధకుడు).

జవాబు

యేసు క్రీస్తు సింహాసనాన్ని అధిరోహించేది తన మొదటి రాకడలో కాదు, రెండవ రాకడలోనే అని చెప్పింది ఇవాంజిస్టులు కాదు. ప్రభువే స్వయాన ఆ మాటను సెలవిచ్చాడు (మత్తయి 16:27 ,మత్తయి 19:28 ,25:31 ). దీదాత్ ఉదహరించిన అపొస్తలుల కార్యములు 2:30 కూడా ఆయన పునరుత్థాననంతరం సింహాసనాన్ని అధిష్టించే ప్రస్తావనే చేస్తుందని ఆ వాక్యసందర్భాన్ని చదివితే స్పష్టమౌతుంది (అపొస్తలుల కార్యములు 2:29-34 ). ఆయన మొదటి రాకడ, దావీదు సింహాసనంపై కూర్చోవడానికి కాదు, తన ప్రజలకొరకు “నిర్మూలం” చేయబడేందుకే జరిగింది (దానియేలు 9:26 ), ఐతే సింహాసనాసీనుడిగా రెండవసారి జరిగే ఆయన ప్రత్యక్షత మొదటి రాకడలా జననం వలన కాక, నేరుగా పరలోకమునుండి దిగిరావడం వలన జరుగుతుంది కాబట్టి, మొదటి రాకడలోనే దావీదు సింహాసనానికి హక్కుదారుడిగా నిర్ణయించే ఆయన వంశావళిని నిర్దారించవలసిన అవసరాన్ని మత్తయి మరియు లూకా పూర్తిచేసారు. ఐనా, పిలాతు ద్వారా దేవుడు యేసును మరణానికి అప్పగించడం ఒకవేళ యేసు నీత్యరాజ్యానికి సంబంధించిన ప్రవచనాలను నిర్వీర్యం చేసియుంటే, యేసు మరణానంతరం వ్రాసిన మత్తయి మరియు లూకా, తమ సందేశాన్ని బలపరచే వాస్తవాలుగా వీటిని తమ రచనలలో ఎందుకు చేర్చినట్లు? వాటిని దాచియుంచే, లేక దాటవేసే ప్రయత్నం ఎందుకు చేయనట్లు? ఆ మాటకొస్తే, అసలు ఈ సువార్తలనే ఎందుకు వ్రాసినట్లు? ఆయన పునరుత్థానుడని, మృత్యుంజయుడని, దావీదు సింహాసనం పై నిరంతరం ఆశీనుడవ్వాల్సిన దావీదు సంతతి ఆయనే అని నిర్ధారించేందుకు ఇవి బలమైన ఆధారాలు కాబట్టే ఇవన్నీ వ్రాసి మనకందించారు. ఐనా, ఒక్క ప్రవచనమైనా సరిగ్గా నెరవేర్చడం చేతకాని ప్రవక్తను వెంబడించే దీదాత్, నెరవేరే ప్రవచనమేదో,విఫలమయ్యే ప్రవచనమేదో మనకు నేర్పచూసే అమితోత్సాహాన్ని వెర్రి సాహసాన్ని అభినందించడానికి మాటలు చాలడం లేదు!!!

65. దీదాత్

కాని, అమితోత్సాహంతో ఏసు వంశపూర్వీకతను శారీరకంగా (అంటే రక్త పరంగా) దావీదుకు తగిలించాలన్న ప్రయత్నం జరిగింది. అదేగా బైబిలులోని అపొస్తలుల కార్యములు 2:30 లో అన్నది. “అతని గర్భఫలముల నుండి” అంటే శారీరకంగా (అంటే రక్తపరంగా) అన్న మాట. దావీదుతో చేర్చే కార్యంలో మొట్టమొదటి మెట్టు నుంచే సువార్తీకులు జారిపడ్డారు.

మత్తయి 1:6 ప్రకారం ఏసు 'సొలొమోను' ద్వారా దావీదు పుత్రుడని వ్రాయబడింది. .

కాని లూకా 8:31 ప్రకారం మాత్రం ఏసు “నాతాను” (NATHAN) ద్వారా దావీదు పుత్రుడని వుంది. దావీదు రేతస్సు ఏసుతల్లి గర్భం వరకు ఒకేసారిగా ఇటు నాతాను ద్వారా, అటు సొలోమోను ద్వారా చేరడం అసంభవమని చెప్పేందుకు ఎవరు కూడా పెద్ద గర్భకోశ నిపుణులు (Gynaecologist) కావలసిన అవసరం లేదు. మనకు ఈ ఇద్దరు సువార్తీకులు నిక్కచ్చిగా అబద్ధమాడుతున్నారన్నది బాగా స్పష్టమైపోతుంది.

ఎందుకంటే ఏసు (అ.స) జననమన్నది, ఏ పురుషస్పర్శ లేకుండా ఓ మహా అద్భుతంగా, మహత్తుగానే జరిగింది కాబట్టి!

శరీర సంబంధంగా అనగా రక్తసంబంధంగా కూడా ఏసు వంశ పూర్వీజులు దావీదు ద్వారా అని అనడంలో కూడా ఇరువురు సువార్తీకులు తప్పులోనే వున్నారు.

జవాబు

యేసు దావీదు కుమారుడైయింది సొలోమోను వంశావళి ద్వారానా (మత్తయి 1:6 ) లేక నాతాను వంశావళీ ద్వారానా? (లూకా 8:31 ). నిజమే, ఇది తేల్చడానికి ఒకడు గర్భశాస్త్ర నిపుణుడు కానవసరం లేదేమో కాని, దీదాత్ వంటి వారికి లోపించిన కామన్ సెన్స్ కొంత అవసరం. మత్తయి యోసేపు వంశావళిని, లూకా మరియ వంశావళీని నమోదు చేసారని ఇది వరకే చూసాము కాబట్టి, యో సేపు సొలోమోను నుండి, మరియు నాతాను నుండి, దావీదు సంతతివారయ్యారని స్పష్టమౌతుంది కదా. ఐనా మత్తయి లూకాలను అబద్దికులుగా చేయకపోతే దీదాత్ అబద్దాన్ని అందరు పసిగట్టేస్తారు కాబట్టి, పాపం, అంత కంటే ఏమి చేయగలడు?

66. దీదాత్

పక్షపాతాన్ని, దురభిమానాన్ని తీసివేయాలి

క్రైస్తవులు ఎంత చిత్తభ్రమలో వున్నారంటే మనం చేస్తున్న ఈ అతి స్వల్పమైన తర్కం కూడా వారి పక్షపాత మస్తిష్కానికి చేరదు. సరైన ప్రమాణం కోసం వారికి మనం అలాంటిదే ఒక ఉదాహరణనిద్దాం.

ఇస్లామునందించిన ప్రవక్త ముహమ్మద్ (స. అ. సం) ఇష్మాయేలు ద్వారా అబ్రహము కుమారుడని మనందరికి తెలుసు. మన దగ్గరికి ఎవరైన ఉత్తేజం పొందిన గ్రంథకర్త వచ్చి 'నాకు ఈ ప్రేరణ జరిగింది. ముహమ్మదు ప్రవక్త ఇస్సాకు ద్వారా అబ్రహాము కుమారుడవుతాడని అంటే మనం అతను అబద్దీకుడని గట్టిగా చెప్పగలం. ఎందుకంటే అబ్రహము రేతస్సు, ముహమ్మద్ (స. అ) తల్లి అయిన ఆమినా వరకు ఇటు ఇస్సాకు ద్వారా అటు ఇష్మాయేలు ద్వారాను ఒకేసారిగా చేరదు. ఈ ఇరువురు అబ్రహము పుత్రుల వంశపరంపరే ఇటు యూదుల అటు అరబ్బుల మధ్య భేదం.

కాబట్టి ముహమ్మదు (అ.స) విషయంలో ఎవరైనా ఇస్సాకు ఆయన పూర్వీకుడు, తాత అని అంటే మనం దాన్ని అసత్యమంటాం. కానీ అదే ఏసు విషయంలో మత్తయి, లూకా ఇద్దరిని అనేందుకు అనుమానమెందుకు? క్రైస్తవులు ఈ ఇద్దరిలో తమ దేవుడికి ఎవరు పూర్వీకులో నిర్ణయించుకునేంతవరకు మనం ఆ రెండు సువార్తలను అంగీకరించలేము. అది జరగడం లేదు. గత 2000 సంవత్సరాలుగా ఈ మర్మాన్ని విడదీయాలని క్రైస్తవ ప్రపంచం కడు యాతనలు పడుతూనే వుంది. పాపం ప్రయత్నం మానటంలేదు. వారి పట్టుదలను మనం అభినందించాలి. 'కాలం' సరైన పరిష్కారం ఇస్తుందని వాళ్లింకా నమ్ముతున్నారు కాబట్టి.

జవాబు

మహమ్మదుకు కాని ఆమాటకొస్తే ఇంకెవరికైనా సరే, తండ్రి తరపునుండి ఒకవంశావళీ, తల్లి తరపునుండి ఒక వంశావళి ఇలా రెండు వంశావళులు వుండి తీరాలి. లేని పక్షంలో, వానిని కన్న దంపతులలో ఒకరికి వంశావళి లేదని చెప్పుకోవలసి వస్తుంది; కాని అది అసాధ్యం. లేదా, ఆ దంపతులిరువురు ఒకే తల్లిదండ్రుల పిల్లలని చెప్పుకోవలసివస్తుంది; కాని అది అక్రమసంబంధమవుతుంది. అందుకే, ఇష్మాయేలు ఇస్సాకు తరములో కాకపోయినా, మహమ్మదు తల్లిదండ్రులైన అమీనా అబ్దుల్లా వంశావళులు ఏదో ఒక తరములో తప్పక వేర్పడి, ఇష్మాయేలు సంతానమైన ఇద్దరు వేరువేరు వ్యక్తుల వంశావళీ క్రమాలలో కొనసాగివుండాలి. లేని పక్షంలో వావివరసలు తప్పుతాయి. ఇలా మహమ్మదు అబ్దుల్లా తరపు నుండి మరియు అమీనా తరపు నుండి, అనగా, రెండు వేరువేరు వంశావళి క్రమాల ద్వారా అబ్రహాము వంశస్తుడౌతాడు. అదేవిధంగా, యోసేపు మరియల వంశావళులు కూడా నాతాను సొలోమోనుల తరములో వేర్పడినప్పటికి, ఇరువురు దావీదు సంతానమే. వారిరువురి తరపునుండి యేసు దావీదు కుమారుడే. కింగ్ ఫైజుల్ సన్మానగ్రహీతకు ఈ మాత్రం తెలియకపోవడం విచారకరమో లేక హాస్యాస్పదమో తేల్చుకోలేకపోతున్నాం. ఇలాంటివారిని సత్కరించడానికి కింగ్ ఫైజుల్ కాదు, కింగ్ఫుజూల్ పురస్కారమొకటి ప్రవేశపెడితే బాగుంటుందేమో!

ఇలా తెలివి తక్కువ వాదనలు చేసే దీదాత్ తాతముత్తాతలతో గత రెండువేల సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము పెనుగులాడుతూనే వచ్చిందన్నది వాస్తవమే. ఇంకెన్ని వేల సంవత్సరాలు పట్టినా, ఈ సర్పసంతానము మళ్లీ తలెత్తలేనంత వరకు పోరాడడానికి క్రీస్తు సంఘం సిద్దమే.

67. దీదాత్

ప్రతి నాస్తికుడి తృప్తి కోసం ధర్మశాస్త్రవేత్తలు పరిష్కరించలేకపోతున్న పలు విభేదాలు (పొరపాట్లు) ఉన్నాయి. చాలా గ్రంథ సంబంధమైన ఇబ్బందులున్నాయి. వాటికై విజ్ఞులు ఇంకా కుస్తీ పడ్తూనేవున్నారు. సరైన జ్ఞానం లేనివాడే, అలాంటివి ఇతరత్రా బైబిల్లో లేవని అనగలుగుతాడు.” (ది ప్లెయిన్ ట్రూత్, జూలై 1975)

జవాబు

నాస్తికులు బైబిలును మాత్రమే కాదు, ఖురానును కూడా ప్రశ్నిస్తున్నారు. వారి కల్పిత చిక్కుముడులను విప్పనంత మాత్రాన వాటికి జవాబులు లేవని అర్థం కాదు. నాస్తికులను తృప్తిపరిస్తేనే తప్ప బైబిలు దైవవాక్యం కాదనే నియమం ఖురానుకు కూడా అన్వయించడానికి ముస్లిము సిద్దమేనా? అన్నట్లు, దీదాత్ మనోస్థితిని ఇలా పాడుచేసిన మహాగురువులలో, బహాయిలు, స్వేచ్ఛావాదులు, మానసిక రోగులు మాత్రమే కాదండోయ్, దేవుడు లేడని నమ్మే నాస్తిక బుద్దిహీనులు కూడా వున్నారట పాపం!

68. దీదాత్

లూకా ప్రేరణకు' మూలం

మర్మంగా వుంచిన చిహ్నం (సంకేతం) 'Q' గురించి (ఇంతకు ముందు మనం దీని గురించి చెప్పుకొని ఉన్నాం) మత్తయి, లూకాల నుండి, మార్కు వరకూ 85% విషయాలను మనం మేకుల్లో బిగించాం.

“ఘనత వహించిన థియోఫిలా”అనిలూకా 1:3 లో కథగా ఏసుకు చెప్పింది, తనకు ఎవరి ప్రేరణ (ఉత్తేజం) వలనో కూడా మనం తెలుసుకుందాం.

లూకా సువార్తకు ముందుమాటగా ఏం రాయబడివుందో చూడండి. (ఇంగ్లీషు ఆథరైస్ట్ వెర్షన్లో) తనకంటే తక్కువ విద్యావంతులైన వారిమార్గాన్నే తను అనుసరిస్తున్నానని వారంతాను తన నాయకుడైన ఏసు విషయంలో వెర్రిసాహసం (తెగువ) చూపించే వ్రాశారని, లూకా మనకు స్పష్టంగా తెలుపుతున్నాడు. తానొక వైద్యుడు కాబట్టి ఆ బెస్తవాళ్ల కంటే, సుంకరులకంటే చక్కటి సాహిత్య పటిమను చూపించి వుండవచ్చు. ఇదంతా తానెందుకు చేశాడో తానే తెలుపుతున్నాడు. “నాకు అది బాగానే వుందనిపించింది, సరిగా వుందనిపించింది” అని తనకంటే ముందు వ్రాసినవారి రచనల్ని ఓ విధంగా సమర్థించుకున్నాడు.

సెయింట్ లూకా సువార్త యొక్క అనువాదానికి పరిచయ వాక్యాలు వ్రాస్తూ అతి ప్రముఖ క్రైస్తవ విజుడైన జె.బి. ఫిల్లిప్స్ ఇలా అంటాడు:

"లూకా తనకు దొరికిన, ప్రస్తుతం వున్న వ్రాత సంపద నుంచి పోల్చి చూచి, సంగ్రాహ్యం చేసి వ్రాశానని తానే ఒప్పుకున్నాడు. అతనికి ఇంకా ఎక్కువ వ్రాత సంపద అందుబాటులో వుండింది. (అయినా అది వాడలేదని) అతను తీసుకుని వ్రాసిన మూలప్రతుల నుంచి దానిని మనం చాలావరకు గమనించగలం.

” అయినా మీరు దీనిని 'దైవ వాక్యమంటారా?”

నూతన ఆంగ్లంలో సువార్త (The Gospel In Modern English) ఫోన్టనా (FONTANA) పబ్లికేషన్స్ వారిది ఒకటి సంపాదించండి. అది చాలా చీప్ ఎడిషన్. దాన్ని తొందరగా సంపాదించండి. లేకపోతే ఫిలిప్పు రాసిన పై వాక్యాలను క్రైస్తవులు తీసివేసినా ఆశ్చర్యపడనవసరం లేదు. రివైస్డ్ స్టాండర్డ్ వెర్టెన్ (RSV) గ్రంథకర్తలు కూడా ముందుమాట” (PREFACE) నీ తమ అనువాదం నుంచి తీసివేసినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ల చాలా చాలా పాత అలవాటు.

క్రైస్తవంలో ఏదైనా తప్పు ప్రచురితమై పట్టుబడితే, వెంటనే దాన్ని తీసి మార్చివేసి వ్రాయడం చాలా పాత అలవాటు. మనం 'నేడు' అని చూసిన వాటిని 'గతం' గా కూడా మార్చివేసే చరిత్ర వుంది.

జవాబు

జె.బి.ఫిలిప్స్ మాటలకు ఎంత విలువ కల్పించాలో 37వ పాయింట్లో స్పష్టం చేసాను. ఇక లూకా ముందుమాటను ఆధారం చేసుకొని దీదాత్ ఆరోపించినవన్నీ అపనిందలని మా వివరణ సహాయం లేకుండానే ఎవరైనా పసిగట్టగలరు. ఏ అపోస్తలునీ పర్యవేక్షణలో లూకా తన పరిచర్య చేపట్టాడో, ఆ పౌలే స్వయంగా లూకా రచనలు దైవప్రేరితమని సాక్ష్యమిచ్చాడు. 1తిమోతి 5:18 లో తన సిద్ధాంతాన్ని బలపరచే ఇతర లేఖనాలను ఉదహరిస్తూ, ద్వితియోపదేశకాండం 25:4 తో సమానంగా లూకా 10:7 ను కూడా ఉల్లేఖించి, మోషే వ్రాసింది ఎంత ప్రామాణికమో, లూకా వ్రాసింది కూడా అంతే ప్రామాణికమని పౌలు ధృవీకరించాడు.

మేము J.B. ఫిలిప్స్ను కాదు, పౌలును విశ్వసిస్తాము. మత్తయి కాపీకొట్టాడు లూకా కాపీ కొట్టాడు అంటూ ఫిలిప్స్ వంటి స్వేచ్ఛావాదుల మాటలతో తమ వ్యాపారాలను బలపరచుకునే దావా ప్రచారకులు, ఆదిమ ఇస్లాం సాహిత్యాలనే సరిగా పరిశీలించుంటే, ఖురాన్ రచనలో ఎందరి ప్రమేయముందో ఎన్ని మతాలలో నుండి కాపీ కొడితే అవి అనాది నుండి పరలోకపు రాతి పలకలపై ముద్రించడ మయ్యిందో తగిన విధంగా అర్థం చేసుకొనుండేవారు.

69. దీదాత్

ఇక మిగిలిన సువార్త

“యోహాను సువార్త” (The Gospel of St. John) గ్రంథకర్త ఎవరు? వాస్తవానికి దేవుడు కాదు, సెయింట్ యోహాను కాదు! మీరే చూడండి 'అతను' 'he' (?) తనను” (himself) (?) గురించి ఏమంటున్నాడో..

యోహాను 19:35 మరియు 21:24-25 చదవండి. ఎవరు అతని యొక్క “అతడు” (he) మరియు “అతని” (his) మరియు “ఇదీ” (this) మరియు “మన మెరుగుదుము” (we know) మరియు “నా ప్రకారం” (1 suppose). అతను కొంపదీసి తోటలో అత్యవసరమైన సందర్భంలో మతి స్థిమితంలేక ఆయనను వదలి వేసిన చపలమతి కాదు కదా? లేదా అంతిమ విందు (The Last Supper) లో బల్లమీద “ఏసు ప్రేమించిన” పదునాల్గో వ్యక్తికాదు కదా? ఇద్దరూ యోహానులే. యోహాను (JOHN) అన్నది యూదుల కాలంలో కడకు నేటి క్రైస్తవుల్లో కూడా ఓ సర్వ సాధారణమైన పేరు. పైన చెప్పిన వారిద్దరిలో ఎవడూ ఈనాలుగో సువార్త గ్రంథకర్త కాడు. అది ఎవరో గుర్తు తెలీని వ్యక్తి వ్రాసిందని నేడు స్పష్టమై పోయివుంది.

యోహాను సువార్తలో ఉపయోగించబడిన సర్వనామములను (PRONOUNS) చూడండి.

జవాబు

యేసు శిష్యులలో ఇద్దరు యోహానులున్నారన్నది దీదాత్ అల్లిన కొత్తకథ. అంతిమ విందులో ఆయనతో వున్న యోహానే తోటలో కూడా ఆయనతో ఉన్నాడు. శిష్యులందరు విడిచి పెట్టి పారిపోయినప్పుడు సహితం చివరి వరకు దూరముగా నుండైనా సరే యేసును వెంబడించి, ఆయన సిలువ మరణానికి సహితం ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన యోహానును, అత్యవసర పరిస్థితిలో పారిపోయినవానిగా చిత్రీకరించడం, వాస్తవాలను తారుమారు చేసే దీదాత్ నీఛమనస్తత్వాన్ని మరొకసారి బహిర్గతం చేస్తుంది.

ఇక పోతే, యోహాను సువార్త రచయిత ఎవరో తెలీదని వాదించడానికిదీదాత్ వాడిన యోహాను 21:24 ను సందర్భంలో చదివితే, ఈ సువార్త రచయిత ఎవరో, ఎంతో సులువుగా గుర్తించగలరు:

పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని- “ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడ”ని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి ప్రభువా యితని సంగతి ఏమగునని యేసును అడిగెను. యేసు- నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించుమనెను. కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని- నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమనియెరుగుదుము (యోహాను.21:20-24).

పై సందర్భంలో పేతురుకు యేసుకు మధ్య జరిగిన సంభాషణ యోహాను సువార్త అంతటిలో తనను తాను మూడవ వ్యక్తిగా సంబోధించుకున్న ఆ సువార్త రచయితను గురించే అని చూస్తాము. ఇంతకు అతనెవరు? అంతిమ విందులో యేసుతో కలిసి భోజనము చేసిన పన్నెండు మంది అపోస్తలులలో అతను కూడా వున్నాడు (20వ వచనం). ఆ విందులో యేసును అప్పగించే శిష్యుడెవరని రహస్యంగా ఆయనను అడిగింది అతనే. అంతటి సాన్నిహిత్యాన్ని యేసుతో కలిగియుండినది పేతురు, యాకోబు మరియు యోహాను మాత్రమే అని సువార్తలు చదివిన ఎవరికైనా తెలిసిందే. ఐతే పేతురు ఆ రచయితను గురించి యేసుతో మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ రచయిత పేతురు కాదు. ఇక యాకోబు ఈ సువార్త వ్రాయబడకముందే హతసాక్షి అయ్యాడు (అపోస్తలుల కార్యములు 12:1-2 ). ఇక మిగిలింది యోహానే. ఇది మాత్రమే కాదు యోహానుతో వ్యక్తిగత పరిచయమున్న పాలికార్ప్ అనే హతసాక్షి శిష్యుడైన ఐరేనియస్ మొదలుకొని, ఆదిమ సంఘ రచయితలందరు యోహానునే ఈ సువార్త రచయితగా పేర్కొన్నారు. ఏది ఏమైనా, ఈ సువార్త రచయిత పన్నెండు మంది అపోస్తలులలో ఒకడే అని దీదాత్ ఉదహరించిన వాక్యములనుండే ఇంత ఖచ్చితమైన సాక్ష్యము లభించిన దరిమిలా, ఈ రచన దైవప్రేరితమా కాదా అనే సందిగ్గానికి ఇక ఎలాంటి తావు లేదు.

70. దీదాత్

ఓసారి గ్రంథకర్తల్ని గురించి క్లుప్తంగా

50 'సహకరించే పలు క్రైస్తవ సమాఖ్యలు' మద్దతునివ్వగా 32 బైబిలు మహా విజ్ఞులతో కూడి, ఈ 'గ్రంథకర్తలను గురించిన తీర్పు ఏమిటో తెలిపి ఈ పుస్తకాన్ని ముగిస్తాను. ఈ గ్రంథకర్తల పోటాపోటీలో 'దేవుడు' కనిపించడు. ఆయనెప్పుడో తీసివేయబడ్డాడు. రివైస్డ్ స్టాండర్డ్ వెర్షన్ కోలిన్స్ (Revised Standard Version Collins) వారి The Books Of The Bible (బైబిలు పుస్తకాలు) అనే శీర్షిక మీద అమూల్యమైన సమాచారం వారి పుస్తకాంతంలో ఇవ్వబడింది. దానిలో కొంత భాగం మీ పరిశీలన నిమిత్తం ఇచ్చాను.

మనం బైబిలు గ్రంథంలోని మొదటి పుస్తకం 'ఆదికాండం' నుంచి ప్రారంభిద్దాం. దాని గ్రంథకర్తను గురించి పండితులేమంటున్నారంటే మోషే యొక్క ఐదు పుస్తకాలలో ఒకటి (One of the five books of Moses) బాగా గమనించండి ఇన్వర్టెడ్ కామాలు పెట్టి మధ్యలో “FIVE BOOKS OF MOSES” అని వ్రాయబడింది.

దీని అర్థం ఏమంటే, ఇది మోషే పుస్తకమని, మోషే దీని గ్రంథకర్త అని ఇతరులు ఇతర ప్రజలు అంటున్నారని కొటేషన్లు పెట్టి యుక్తిగా వ్రాయడం. అంటే ఇది మేము 52 మంది బైబిలు విజ్ఞులు అంటున్నమాట కాదని చమత్కారంగా తప్పుకోవడం.

మరి ఇతర నాలుగు పుస్తకాలు నిర్గమకాండం, లేవీయకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. వీటి రచయితా, గ్రంథకర్త ఎవరు? “సాధారణంగా మోషేకు చెందినవి” అంటారు. ఇదీ ఆదికాండానికి ఉపయోగించిన విధానమే.

మరి 'యెహోషువా' గ్రంథానికి గ్రంథకర్త ఎవరు?

జవాబు: “చాలా భాగం యెహోషువాకే చెందుతుంది”

మరి 'న్యాయాధిపతులు” గ్రంథం రచయిత ఎవరు?

జవాబు: “బహుశా సమూయేలు”

'రూతు' పుస్తకానికి గ్రంథకర్త ఎవరు? జవాబు: ‘పక్కాగా తెలియదు”

గ్రంథకర్త ఎవరు?

1వ సమూయేలు? - జవాబు: గ్రంథకర్త “తెలీదు” (Unknown)

2వ సమూయేలు? - జవాబు: గ్రంథకర్త “తెలీదు” (Unknown)

1వ రాజులు? - జవాబు: గ్రంథకర్త “తెలీదు” (Unknown)

2వ రాజులు? - జవాబు: గ్రంథకర్త “తెలీదు” (Unknown)

1వ దినవృత్తాంతములు? -జవాబు: “గ్రంథకర్త “తెలీదు” బహుశా...”

2వ దిన వృత్తాంతములు? - జవాబు: “గ్రంథకర్త “తెలీదు” మొత్తానికి...| ......కావచ్చు .”

మరి ఈ కథ ఇలానే సాగుతూ పోతుంది. ఈ గుర్తు తెలీని పుస్తకాల, గ్రంథకర్తల పుట్టుక అయితే మాత్రం తెలియదు” (Unknown) లేదు “బహుశా” (PROBABLY) లేదా “కావచ్చు” (LIKELY) లేదా “అనుమానాస్పదం” (DOUBTFUL).

మరిలాంటి గందరగోళానికి దేవుణ్ణి తప్పుపడితే ఎలా...?

జవాబు

రాజుల గ్రంథానికి నేను 41వ పాయింట్లో జవాబుగా వినియోగించిన ప్రమాణమే పై సమస్యకు కూడా వర్తిస్తుంది.మత్తయి 21:42 ,మత్తయి 22:29 , 26:54 , లూకా 24:44-45 , యోహాను 5:39 , తదితర ఎన్నో భాగాలలో యేసు “లేఖనాలు” అని సంబోధించిన సంగ్రహంలో, పైన దీదాత్ పేర్కొన్న పుస్తకాలన్నీ ఇమిడి యున్నాయి. రచయితల పేర్లు తెలియజెప్పని గ్రంథాలను లేఖనాలు కావంటు యేసు వాటిని తిరస్కరించలేదే! ముప్పై రెండుమంది పండితులో లేక దీదాతో కాదు, యేసు ఆమోదమే బైబిలు గ్రంథ ప్రామాణికతను నిర్ధారించే అతి గొప్ప ప్రమాణం.

71. దీదాత్

ఈ యూదుల నీచ దోషాలకు, అహంకారాలకు, దురభిమానాలకు వాళ్ల దురాశాభావాలకు, ఈర్ష్యా ద్వేషాలకు, జగడాలకు, దుష్కృత్యాలకు, చాలా కాలంగా వ్యధచెందుతున్న కరుణాకరుడైన దేవుడు తాను వాటికి గ్రంథకర్తకానని బైబిలు పండితుల ద్వారా చెప్పించేందుకు రెండు వేల సంవత్సరాల దాక ఆగలేదు. త్వరగానే వారంతా ఏం చేస్తున్నారన్నది బహిర్గతం చేసేశాడు.ధర్మ గ్రంథాన్ని తమ హస్తాలతో రచించి తద్వారా తుచ్ఛ ప్రయోజనం పొందే నిమిత్తం ఇది దేవుడి దగ్గరి నుండి వచ్చింది అని చెప్పేవారికి నాశనం తప్పదు. వారి ఈ స్వహస్త లిఖిత రచన కూడా వారి వినాశనానికి దారితీస్తుంది. వారి ఈ సంపాదన కూడా వారి సర్వవినాశనానికి కారణభూతమౌతుంది (దివ్య ఖురాన్ 2:79)

ఈ పుస్తక సమీక్ష మేము పైనిచ్చిన ఖురాను దివ్యసూక్తి తోనే ఆరంభించి దానితోనే అంతం చేసివుండే వారము. ఎందుకంటే మహా మహిమాన్వితుడైన దేవుడే తన తీర్పును “ఈ బైబిలు దైవగ్రంథమా?” అన్న శీర్షికపై తెలిపి వున్నాడు. కానీ మన క్రైస్తవ సోదరులు తమకు ఇష్టమైన విధంగా ఈ విషయాన్ని పూర్తి ప్రామాణికలతో పరించాలనే మేము ఈ విధంగా వ్రాస్తూ పోయాము (ఇక్కడ డా|| స్కోరీ ప్రతిపాదన మరోసారి చూడండి). సదాచార క్రైస్తవులు, రెండవ జన్మ పొందిన క్రైస్తవులు తమ పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని తమకున్న న్యాయనిర్ణేత కుశలబుద్దితో, తామే పరీక్షించుకోవాలన్నదే మా కోరిక.

జవాబు

బైబిల్ దేవునివాక్యం కాదని ఖురాన్ తీర్పు చెబుతుందంటూ దీదాత్ ఉదహరించిన సురా 2:79ను సందర్భ సహితంగా పరిశీలిస్తే, అది క్రైస్తవులను గురించి కానీ బైబిల్ ను గురించి కాని ఏమీ చెప్పడం లేదని, తమ కల్పిత ఆచారాలను దేవుని వాక్యముగా చిత్రీకరించే కొందరు యూదుల దుశ్చర్యను మాత్రమే ఖండిస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి, ఇది గ్రంథ ప్రజల వశములో ఉన్న దైవగ్రంథంపై ఖురాను తీర్పుకాదు. గ్రంథప్రజల వద్ద వున్న అలకితాబేను గూర్చి ఖురానులో ఎప్పుడు ప్రస్తావన కనిపించినా, అది నమ్మదగిన దైవవాక్యముగానే ప్రస్తావించబడింది.

ఉదాహరణకు: 3:7, 21, 28, 48, 84, 65, 93, 184, 199; 4:44, 51, 136; 5:15, 43-49, 57-59, 66-69, 118; 6:91, 154; 10:37; 11:17; 16:43; 17:2; 20:138; 21:7, 33; 23:49; 26:196; 32:23; 41:42-45; 46:10-12; 54:43; 57:27; 80:11-16; మరియు 87:18-19 తదితర ఆయాతులన్నీ యూదుల మరియు క్రైస్తవుల లేఖనాలను ఆమోదిస్తున్నాయే తప్ప తిరస్కరించడం లేదు.

కాబట్టి, కొందరు యూదుల కల్పిత రచనలను ఖండించిన ఆయాతును పట్టుకుని, ఇదిగో బైబిలుపై అల్లా తీర్పు అంటూ తన స్వీయ మతగ్రంథానికే వక్రభావాలు తగిలించిన దీదాత్, ఇతరుల మతగ్రంథాలతో నిజాయితీగా వ్యవహరిస్తాడని ఎందుకు నమ్మాలి? ఖురానునే ఇంత అజాగ్రత్తగా చదివినవాడు మనకు బైబిల్ ను గురించి ఏమి వివరించగలడు? ఏమీ వివరించినా దానిని ఎందుకు నమ్మాలి? వినేవాడు పిచ్చివాడైతే హరిదాసు కూడా ఆంగ్లంలో వినిపిస్తాడట హరికథ.

బైబిలును బలంగా సమర్థించిన ఖురాన్ సాక్ష్యం

మహమ్మద్ కాలంలో అందుబాటులో వున్న బైబిల్ పై ఖురాన్ ఎంత నమ్మకాన్ని ప్రకటించిందో ఈ సవాలుతో కూడిన ఆయత్ చదివినవారికి స్పష్టంగా తెస్తుంది.

“ఓ మహమ్మదు! ఒకవేళ నీ వైపునకు అవతరింపజేయబడిన విషయాలను గురించి నీకేమైనా సందేహం వుంటే నీకు పూర్వం వచ్చిన గ్రంథాన్ని చదువుతున్న వారిని అడుగు! వాస్తవంగా, నా ప్రభువు తరపునుండి నీ వద్దకుసత్యం వచ్చింది. కావున నీవు సందేహించేవారిలో చేరకు”.

మహమ్మద్ కంటే పూర్వము గ్రంథాలను చదివింది క్రైస్తవులు మరియు యూదులే అని ఒప్పుకోవడంలో ఎవరికీ ఎలాంటి వివాదమూలేదు. ఒకవేళ దీదాత్ ఆరోపించినట్లు క్రైస్తవులు మరియు యూదుల గ్రంధాలు చెడినవైయ్యుంటే, అలాంటి గ్రంథాలను చదివే వారిని ఖురాను ముస్లింలకు మార్గనిర్దేశకులుగా ఎందుకు నియమించియుండేది? ఈ ప్రశ్నకు ముస్లింలే జవాబు చెప్పుకోవాలి.

ఏది ఏమైనా, ఖురాన్ విషయంలో సహితం నిజనిజాలు తెలుసుకోవడానికి ముస్లింలు క్రైస్తవులపై మరియు యూదులపై ఆధారపడాలని కోరింది మేము కాదు; ఖురానే ఆ విధంగా ఆదేశిస్తున్నదని ముస్లింలు గమనించాలి. దీదాత్ తనతో పాటు అనేకులను మోసపరచి ఈ ఖురాను ఆజ్ఞకు వారిని అవిధేయులుగా మార్చాడు. ఐనా, ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. క్రైస్తవుల వద్ద నేర్చుకోవడానికే తప్ప వారితో వాదించడానికి ముస్లింలను ఖురాన్ అనుమతించడం లేదని గుర్తుంచుకుంటే అది వారికే శ్రేయస్కరం.

72. దీదాత్

మరి పవిత్ర ఖురాను మాటేమిటి? ఖురాను దైవవాక్యమా? - మరి దీని జవాబు అత్యంత శాస్త్రయుక్తంగా ‘అల్ ఖురాన్- అంతిమ అద్బుతం (Ultimate Miracle) లో ఈ రచయిత తన వినమ్రతతో కూడిన కృషితో మీ ముందు ఉంచివున్నాడు దాన్ని తెప్పించుకుని పరిశీలించగలరు.

జవాబు

దీదాత్ కు నేనిచ్చిన ఈ జవాబులో, బైబిల్ కు వ్యతిరేకంగా దీదాత్ లేవనెత్తిన ప్రశ్నలన్నిటినీ పరిష్కరించి, బైబిల్ దేవుని వాక్యమే అని నిరూపించడంతో పాటు, బైబిలకు దీదాత్ వాడిన ఆ కొలమానాలే ఖురానుకు అన్వయించి అది దేవుని వాక్యమో కాదో ఎలా బేరీజు వెయ్యగలమో కూడా చూపించాను. ఇక “అల్ ఖురాను అంతిమ అద్భుతం” అనే దీదాత్ గారి “అత్యంత శాస్త్రీయమైన” ఖురాన్ సమర్థన విషయమై, నేను మొదట్లో పేర్కొన్న “ముస్లిం డైజస్ట్” అనే సౌతాఫ్రికా ముస్లిం పత్రిక ఏమని ప్రశంసిస్తుందో ఒక్కసారి చూద్దామా?

1979లో వ్రాసిన “అల్ ఖురాన్ అంతిమ అద్బుతం” అనే లఘురచనలో రషాద్ ఖలీఫా ఆలోచనలకు దీదాత్ దాసోహం పాడాడు. తన యజమాని స్వరాన్నే ప్రతిధ్వనించాడు. దీదాత్ ఆ రచనలో ఇలా అన్నాడు: “ఇస్లాముకు ఉత్తమ దాసుడైన డా.రషాద్ ఖలీఫా (PHD) గారి అత్యంత శాస్త్రీయమైన ఆవిష్కరణలను, నా సొంత మాటల్లో మీకందించే వినమ్ర ప్రయత్నమిది. ఆయన అందించిన సమాచారాన్ని స్వేచ్ఛగా ఉపయోగించడంతోపాటు నామాటలు సరిపోవనిపించిన కొన్ని సందర్భాలలో ఆయన వాగ్దాటితో కూడిన మాటలనే ఉన్నదున్నట్లుగా ఉదహరించాను” (అహ్మద్ దీదాత్, ఖురాను అంతిమ అద్భుతం). ఈ లఘు రచన, డర్బన్ సౌతాఫ్రికాలో వున్న దీదాత్ సంస్థ నుండి ఉచితంగా సరఫరా చేయబడుతుంది. U.Kలో అక్టోబరు-1985లో చేసిన దీని మొదటి పున:ముద్రణలో 20,000 ప్రతులు ముద్రించబడ్డాయి. ఈ విధంగా, పవిత్ర ఖురాన్ నిజాయితీపై దాడిచేసే రషాద్ ఖలీఫాతో సహకరించి, దీదాత్ అతని నేరంలో సహదోషి అయ్యాడు” (ముస్లిం డైజస్ట్, జూలైఅక్టోబర్-1985 సంచిక, P.25-26)

ఇక ఇప్పుడు, దీదాత్  గారి, రెండవ గురువైన రషాద్ ఖలీఫా (మొదటి గురువు జోసఫ్ పెర్ద్దు అనే బహాయి), తన ముస్లిం పెర్స్ పెక్టివ్ అనే మాస పత్రికలో సురా 9లోని చివరి రెండు ఆత్తులు దైవ లిఖితం కావని, అవి ఖురాను నుండి తొలగించబడాలని అంటున్నాడు (ముస్లిం పెర్స్ పెక్టివ్, ఏప్రిల్ 1985 సంచిక).విశ్వవ్యాప్తంగా ముస్లింలు రషాద్ ఖలీఫాను ముర్తద్గా ముద్రవేస్తున్నారు. అతడో కాఫీర్ అని కొందరు, ఓ మునాఫిక్ అని ఇంకొందరు, అతడసలు ముస్లిమే కాదని, ఇస్లాముకు వెలుపలివాడని, మరికొందరు అంటున్నారు. దీదాత్తు ఇస్లాం బోధపడింది రషాద్ ఖలీఫాలాంటి అపాయకరమైన మూలములనుండైతే, ఇస్లాంపై అతడికున్న అవగాహన లోపభూయిష్టమైనది మాత్రమే కాదు, ప్రమాదకరమైనది కూడా. రషాద్ ఖలీఫా ప్రత్యక్షంగా కుఫ్ నేరానికి పాల్పడ్డాడు కాబట్టి, అతడి అభిప్రాయాలను రచనలను అమాయక ముస్లిం ప్రజలకు తన ప్రసంగాల ద్వారా వర్తకం చేసే దీదాత్ కూడా అదే ఖుఫ్ విషయమై నేరస్థుడనడంలో ఎలాంటి సందేహం లేదు” (ముస్లిం డైజస్ట్, జూలై-అక్టోబర్ 1986 సంచిక పుట 53).

ఖురాన్ దేవుని వాక్యమనే ధృక్పథాన్ని ప్రచురించే ముస్లిం డైజస్ట్, అదే స్వరంతో దీదాత్ అత్యంత శాస్త్రీయమైన “ఖురాన్ అంతిమ అద్భుతమనే” రచనను పచ్చి నాన్సెన్స్ అని ఎలా తూలనాడిందో చూసాక, తన స్వీయ మతగ్రంథాన్నే ఇలా ప్రమాదానికి నెట్టిన ఈ ప్రబుద్దుడు ఇతరుల మతగ్రంథాలపై చేసిన విశ్లేషణలను ఎందుకు గౌరవించాలో, ఎందుకు పరిగణలోనికి తీసుకోవాలో విజ్ఞత గలవారు ఆలోచించుకుంటే మంచిది. ఇంతకు జోక్ ఏమిటంటే, నాన్సెన్స్ వ్రాసి దానిని పాపం 'సైన్స్' అనుకుంటున్నాడు దీదాత్.

 

10వ అధ్యాయం

అంతిమ పలుకులు,

మా ప్రతిస్పందన

73. దీదాత్

నిష్పక్షపాత మస్తిష్కం గలవాడైవుంటే పాఠకుడు, ఇప్పటికే క్రైస్తవులు బైబిలును గురించి ఏమని వక్కాణిస్తున్నారో అదంతా సరిగాదని గ్రహించి వుంటాడు.

జవాబు

నిష్పక్షపాత వైఖరితో దీదాత్ కు నేనిచ్చిన జవాబులను పరిశీలించిన ఎవరైనా, అతడి వాదనలేవీ బైబిల్ దైవవాక్యము కాదని నిరూపించలేవని, ఐతే అతడి విమర్శలన్నీ ఖురాను దైవప్రేరితం కాదని నిరూపించగలిగే నియమాలను, నిదర్శనాలను మనకందించి ఏది దైవవాక్యమో గుర్తెరగడానికి ఎంతో సహాయకరంగా వున్నాయని ఒప్పుకోక తప్పదు. తనను ద్వేషించే నరుల ఆగ్రహాన్ని సహితం దేవుడు తన మహిమార్థమై ఎలా వినియోగించుకుంటున్నాడో తెలిపేందుకు దీదాత్ వ్రాసిన ఈ చిన్న పుస్తకం ఓ చక్కటి నిదర్శనం.

“నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించి యున్నావు” (కీర్తనలు 76:10).

74. దీదాత్

నేను బైబిలు మరియు క్రైస్తవం మీద ఇంత ప్రగాఢ విజ్ఞానాన్ని ఎలా సంపాదించానని, దాదాపు నలభై ఏళ్లుగా నన్ను పెక్కుమంది ప్రశ్నించేవారు.

వాస్తవానికి, ముస్లిమైయుండి ఇటు క్రైస్తవంలోను, యూద మతంలోను ఓ నిష్ణాతుడిగా నేనున్న స్థానం నా ఇష్టానుసారం జరిగింది మాత్రం కాదు. నన్ను ఇలా బలవంతంగా మార్చారు అన్నదే వాస్తవం.

జవాబు

దీదాత్ కు బైబిలుపై వున్న అపార్థాలను “ప్రగాఢ జ్ఞానం” గా పరిగణించిన వారు సామాన్య బుద్దిహీనులు కారు!! వారిని ఎంత అభినందించినా తక్కువే!! క్రైస్తవ్యం మరియు యూదా మతంపై మహా నిష్ణాతుడట! తనకు తానే శభాష్ అనుకుంటూ అజ్ఞానంతోపాటు డంభానికి కూడా తనలో కొదువేమిలేదని దీదాత్ ఎలా చాటుకున్నాడో చూసారు కదా?

75. దీదాత్

మొదటి కవ్వింపు

1939 లో నేను ఆడమ్స్ అనే క్రైస్తవ మిషనరీల షాపులో షాప్ అసిస్టెంట్గా పని చేస్తున్నప్పుడు జరిగింది. ఈ ఆడమ్స్ సెమినరీ, క్రైస్తవ ప్రబోధకుల్ని ప్రచారకుల్ని తయారు చేసే సంస్థ. అక్కడ నన్నూ, నాతోబాటు పని చేస్తుండిన పలు ముస్లిం పనివాళ్ళను క్రైస్తవ నవబోధకులు, ప్రచారకుల్లా మారబోయే క్రైస్తవ యువకులు చాలా కవ్వింపు చేసేవారు. మా పవిత్ర ప్రవక్తను, పవిత్ర ఖురానును, ఇస్లామునూ పలు రకాలుగా అవహేళనలు చేస్తూ, నన్నూ నాతోటి ముస్లిం విశ్వాసుల్ని వాళ్లు ఇబ్బందిపెట్టని రోజంటూ వుండదంటే నమ్మండి.

యావత్ మానవ జాతికి కరుణామయుడై ఉద్భవించిన, నాకు నా ప్రాణంకంటే ప్రియమైన మా ప్రవక్త ముహమ్మద్ (స. అ.సం)ను నేను ఏ విధంగానూ ఈ అవమానాల బారినుండి రక్షించుకోలేక పోతున్నానే అని కన్నీళ్లతో ఎన్నో రాత్రులు గడిపాను. అప్పటికి నేను 20 ఏళ్ల యువకుణ్ణి. ఇక తప్పదని, నేను ఖురానును, బైబిలును ఇతర సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాను. “ఇజారుల్-హబ్' (సత్యప్రకాశం) అనే పుస్తకం నా జీవితంలో ఓ మలుపునిచ్చింది. కొంతకాలంలోనే, ఆడమ్స్ మిషన్ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్న యువ ప్రబోధకుల్ని ఆహ్వానించి వారిని చెమట పట్టించి వారు ఇక ఇస్లాం అన్నా, పవిత్ర ప్రవక్త ముహమ్మద్ (స.అ. సం) అన్నా గౌరవం ఇచ్చేలా చేయించగలిగాను.

జవాబు

మొహమ్మద్ ను వెక్కిరించిన వారికి జవాబు చెప్పడం చేతకాక, వారిపై పగతీర్చుకోవాలనే ద్వేషభావంతోనే బైబిల్ ను విమర్శించపూనుకున్నాడని, కాబట్టి తన ఈ పుస్తకము సత్యాన్వేషకులకు సహయపడడానికే అంటూ అతను 3వ పాయింట్లో చెప్పిందంతా వట్టి నాటకమేనని పై మాటలలో దీదాత్ చెప్పకనే చెప్పేసాడు.

అయినా బైబిలుని విమర్శిస్తే, అదే మహమ్మదుపై క్రైస్తవులు చేసే దాడికి జవాబని భావించడం దీదాత్ అవివేకం కాకపోతే మరేమిటి? మహమ్మద్ మరియు బైబిల్, ఇవి రెండు వేరు వేరు అంశాలు. వాటిని వేరువేరుగానే పరిశోధించి వాటిపై వున్న అభియోగాలతో వ్యవహరించాలి. బైబిలు పై దాడిచేసి అదే మహమ్మద్ పై మోపిన అభియోగాలకు జవాబనుకుంటే, అంతకంటే మూర్ఖత ఇంకేముంటుంది? అన్నట్లు, తన కళ్లు తెరిపించిన “ఇజారుల్-హబ్” అనే రచన, దీదాత్ కు ఎంత జ్ఞానోదయం కలుగజేసిందో తన ఈ పుస్తకం ద్వారా తేటతెల్లమై పోయాక, ఈ దావా ప్రచారకుల పాఠ్యపుస్తకాల విలువేమిటో మనం బేరీజు వేసుకోలేమంటారా?

76. దీదాత్

ముస్లిములపై ఎల్లప్పుడూ దాడి జరుగుతూనే వుంటుంది

ముస్లిం సమాజంలో అజాగ్రత్తగా వున్న ముస్లిములెందరో, ఈ వాకిలి ఆ వాకిలి తట్టి సువార్త ప్రచారంచేసే వారి దాడికి గురౌతుండడం నేను గమనించాను. మంచి గృహస్థుడైన ముస్లిం ఇంటికి ఆహ్వానించబడి, ఆయనిచ్చిన సమోసాలు ఆరగించి ఆయన్ను ఆయన విశ్వాసానికి విరుద్దంగా వాదించి ఎలా ఇబ్బంది కల్గిస్తున్నారో ఆలోచించాను. ఈ హాట్ గాస్పెల్లర్స్, వాకిట వాకిట తిరిగి ప్రచారంచేసే క్రైస్తవ మిషనరీలకు, సిగ్గులేకుండా పవిత్ర ప్రవక్తను అవమానించే వారిని ఏ విధంగా కౌంటర్ చేసి, తమ ధర్మాన్ని రక్షించుకునే ఆయుధ సరఫరా చేసుకునే సరైన జ్ఞానాన్ని ముస్లిములకివ్వాలని నిర్ణయించుకున్నాను. క్రైస్తవ దాడి నుంచి ఏ కోశానైనా భయపడే అవసరమే లేదని నేను ముస్లిం సమాజానికి ఉపన్యాసాలివ్వ నారంభించాను. అసలు ఇస్లాం ఏమిటి, ఏసు (అ.స) ప్రబోధనల్లో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకున్నాయని నిరూపించేందుకు నా ఉపన్యాసాలకు క్రైస్తవుల్ని కూడా ఆహ్వానించేవాణ్ణి.

జవాబు

ఇంత శ్రమకోర్చి దీదాత్ ముస్లిమ్ విశ్వాస రక్షణార్థమై నిర్మించిన కంచుకోటను ఈ పుస్తకం ద్వారా ఛిన్నాభిన్నం చేయగలిగినందుకు హర్షిస్తున్నాను, ప్రభువును స్తుతిస్తున్నాను. ముస్లిమ్లు నమ్ముకున్న దీదాత్ వాదనలు తమను మోసం చేశాయని, క్రీస్తు సువార్త సత్యాన్ని ఎదిరించడానికి అవి చాలిన ఆయుధాలు కావని మా ముస్లిమ్ మిత్రులు గుర్తెరుగుతారని, బైబిల్ బోధించే రక్షణ మార్గానికి మరలుతారని వారికొరకు మా ఆకాంక్ష, మా ప్రార్థన.

77. దీదాత్

ఈ దాడి కొత్తదేమీ కాదు

క్రైస్తవ మిషనరీలు గత వందేళ్లకంటే పైగా ముస్లిం సమాజాన్ని పలువిషయాల్లో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈ విషయాలకు సమాధానాలు నివ్వడం, కొన్ని చోట్ల పార్శంగా ఇవ్వడం జరిగింది. అల్లాహ్ కృపవల్ల ఇస్లాం నుంచి దారి తప్పించే ప్రయత్నం చేసే వారికి సమాధానంగా నా పుస్తకాలు, చాలా వరకు తోడ్పడుతాయి. మనలో దోషం, లోపం లేకుండా వుండటం మాత్రం చాలా అవసరమైన విషయమని గుర్తుంచుకోండి.

జవాబు

గత వంద సంవత్సరాలుగా ఇస్లాంపై లేవనెత్తబడిన ప్రశ్నలకు జవాబు చెప్పేస్తామని మురిసిపోతున్న దీదాత్, ప్రశ్నలడిగే వారిని విమర్శించి, అదే వారి ప్రశ్నకు జవాబని సరిపెట్టుకుంటాడని ముందు పాయింటు చదివినవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహిస్తారు. అంతేకాదు, ప్రశ్నడిగేవారిని, తనను, తన ప్రవక్తను అవమానించి కించపరిచే వారిలా చిత్రీకరించి, పాఠకుల సానుభూతి వెనుక దాక్కునే ప్రయత్నాలు కూడా చేస్తాడు. ఇది మన దావా పితామహులవారి పరిస్థితి.

78. దీదాత్

వాళ్లు చేసే ఛాలెంజి విధానాల్లో ఒకటి - “ముస్లిములను క్రీస్తు వైపుకు ఎలా తీసుకెళ్లడం” “How to lead Muslims to Christ”” అనే జియో జి హార్రిస్ పుస్తకం. ఈ మిషనరీ ప్రబోధకులు చైనాలో ముస్లిముల మత మార్పిడికై ప్రయత్నంచేశారు. ఆ రచయిత తనకున్న పాశ్చాత్య సహజ దురహంకారంతో, దానితోపాటు నిర్గర్వ విధానంతో కలిపి పేజి 19లో “The Theory or Charge of Corruption” (అక్రమ విధాన ఆరోపణా లేక వాదమా) అన్న శీర్షికలో ఇలా వ్రాశాడు:

“మన క్రైస్తవ ధర్మగ్రంథాలకు విరోధంగా ముస్లిం ప్రపంచం నుండి కడు గంభీరమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నాము. ఈ ఆరోపణలకు మూడు దృక్కోణాలున్నాయి.

1. క్రైస్తవ ధర్మగ్రంథాలు ఎంతగా మార్పులు చేయబడ్డాయంటే, ఖురాను అభినందించిన పవిత్ర “ఇంజీల్' (బైబిలు)తో కొంచెం కూడా పోలిక లేకుండా పోయిందన్నది. దీనికి మనం క్రింది ప్రశ్నలతో జవాబు ఇవ్వగలం.

ఎ) ఎక్కడెక్కడా ఈ విధంగా మార్పులు చెందివున్నాయి? నీవు అసలైన ఆ‘ఇంజీలు' (బైబిలు) ప్రతివొక్కటి నా దగ్గరున్న ప్రస్తుత బైబిలుతో పోల్చిచూసేందుకు ఇవ్వగలవా?

బి) గత చరిత్రలోని ఏకాలంలో ఈ మార్పు చెందని ఇంజీల్ (బైబిలు)వాడకంలో వుండేది?

2. మన సువార్తలు అక్రమానికి గురైనవని. ఈ క్రింది ఐదు ప్రశ్నలు పక్కాగావుంటాయి. మనం వాటితో ప్రశ్నించే హక్కును కలిగి వున్నాము.

(ఎ) అలాంటి మార్పులు, అక్రమ పద్దతులు అన్నవి ఉద్దేశ్యపూర్వకమైనవా?

(బి) నా దగ్గరి బైబిల్లో అలాంటి అధ్యాయం వుంటే గుర్తు చూపగలవా?

(సి) ఈ అధ్యాయం అసలు (రూపం) లో ఎలా పఠించబడేది?

(డి) ఎప్పుడు, ఎవరి చేత, ఎలా ఎందుకు అది అలా అక్రమ విధానానికిలోనైంది., లేదా మార్చబడింది.

(ఇ) ఆ అక్రమ పద్దతి అనుసరణ అన్నది టెక్స్ట్ (Text)కు సంబంధించినదాలేదా అర్ధానికి సంబంధించిందా?

3. మన సువార్తలు ఆ అసలు 'ఇంజీల్' (బైబిలు)కు బూటక రూపాలు మాత్రమేనని. లేదా మన సువార్తలు మానవ చేతి ఉత్పత్తులనీ, ఏసుపైఅవతరించిన పవిత్రమైన ఇంజీలు మాత్రం కాదని.

ముస్లింలు అతి వేదనతో చేస్తున్న ఈ ఆరోపణలు అసలు విషయాన్ని బయట పెట్టాయి. అదేమంటే బైబిలుగానీ నూతన నిబంధనలు గాని వారెరుగరు. గతంలోఅవెలా వుండేవో నేడెలా ఉండాయో వారెరుగరు. మరి ఈ సంవాదపు మరో అర్థభాగానికెళ్లేముందు అవసరమైనది, ఆరోపణ చేసే వ్యక్తికి తన ఆరోపణ పనికిరాదని తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం మన గ్రంథంలోంచి కొన్ని పాఠ్యాలను అతనికందించాలి. అలా చేస్తే మనం సకారాత్మక విధానాన్ని అనుసరించినట్టుంటుంది. నకారాత్మకంగా కాదు.”

ముస్లిముల దగ్గర వీటికి జవాబుందా?

పై ప్రశ్నలకు మన దగ్గర ముస్లిములుగా ఏమైనా జవాబుందా? ప్రియమైన పాఠకుడా, నీవు ఈ పుస్తకాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చదివుంటే జియో జి. హార్రిస్కు భూమ్మీద నిలబడేందుకు చోటుండదని ఒప్పుకుంటావు. అతని గట్టి వాక్కులను నిర్వీర్యం చేసేందుకే నేను బైబిల్లోని అసలు పేజీలు (photostat) ఇచ్చాను.

ముస్లిములు ఛాలెంజీకి గురౌతున్నారు

ముస్లిముల దృక్పథాన్ని పట్టివేసి దానికై తన కామేడులకు జియో జి హార్రిస్ పేజీ 16లో సలహాలనిచ్చాడు: “మన ధర్మ గ్రంథాల ప్రామాణికతను గురించి, నిష్కల్మషత్వాన్ని గురించి మోపెమ్మడన్లు ప్రశ్నలు వేసి వున్నారన్నది మనం గ్రహించాము. మన స్థానాన్ని మనం పరిరక్షించుకునే ముందు “ఋజువు చేయవలసిన బాధ్యత ముస్లిములదేనని” మనం మనస్సులో వుంచుకోవాలి.

అల్హము లిల్లాహ్! నా ఈ పుస్తకంలో, నా ఇతరపుస్తకాలలో నేను ఈ క్రైస్తవ ఛాలెంజికి ఆ ఋజువులిస్తున్నాననే విషయం పాఠకులు గమనించే వుంటారు.

జవాబు

తాను వ్రాసిన పుస్తకం Geo G.Harris గారికి పెద్ద జవాబని దీదాత్ భావించినప్పటికీ, ఈ నా జవాబు ఆ అతిశయోక్తికి ఎలాంటి తావులేకుండా చేసి, మరలా Geo G.Harris ప్రశ్నలను ముస్లిం సమాజానికి ఓ సవాలుగా నిలబెట్టేలా ప్రభువు సహాయం చేసాడు. దావా ప్రచారకులు Geo G. Harris సవాళ్లకు కొత్త పరిష్కారాలు వెదుక్కోవాలి. దీదాత్ పాత చింతకాయపచ్చడి ఇక పనికిరాదు.

79. దీదాత్

బైబిలు ప్రామాణికతను గురించి ఈ క్రైస్తవులు అతి ధైర్యంగా వేసిన ప్రశ్నకు సమాధానం నేను గత 40 సంవత్సరాలుగా ఇస్తూనే వస్తున్నాను. ఎప్పుడూ నాదే విజయం.

జవాబు

నలువది ఏళ్లు సాధనచేసి సంపాదించిన ఇతడి జ్ఞానాన్ని, కనీసం ముఫ్పై ఆరు యేళ్లు కూడా పూర్తి కాకముందే ఇంత సమర్దవంతముగా నిరర్ధకం చేయగలిగినందుకు ప్రభువు నందు నేను మరి ఎక్కువగా అతిశయించాలి కదా? నిజానికి ఇతడి మూర్ఖత్వాన్ని 2004వ సంవత్సరంలోనే నా ఆంగ్ల ఎడిషన్ ద్వారా బయటపెట్టినప్పుడు నాకు కనీసం 26 సంవత్సరాలు కూడా లేవు. అంటే నేనేదో గొప్ప అని కాదు, ఇతడి 40 యేళ్ల కృషి ఫలితంగా సంపాదించిన వాదనలతో వ్యవహరించడం, పిల్లలు ఫుట్ బాల్ ఆడుకునేంత తేలిక అని నా ఉద్దేశం.

80. దీదాత్

గుర్తుంచుకోండి. ముస్లిములమైన మనం మన మత ప్రచారం కోసం ఇంటింటా వాకిటి వాకిటా తిరగటం లేదు.

(ఆఫ్రికాలో క్రైస్తవ ప్రచారం అలానే జరుగుతుంది) కానీ వివిధ రకాల క్రైస్తవ ప్రచారకులు మాత్రం మన ఇళ్ల చుట్టూ తిరిగి, మన అంతరంగాలకు భంగం కలిగించి, మన ఆతిథ్యాలు స్వీకరించి, మన ముస్లిములను ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు. క్రైస్తవులచే ప్రకోపించబడినా, మన ప్రవక్త ముహమ్మద్ (స.అ.స)ను అవమానం చేస్తుండగా చూసి ఎలాంటి జవాబివ్వలేక, సత్యాన్ని ప్రదర్శించలేక పోయే ముస్లిములు ఈమాన్ (విశ్వాసాన్ని) పరీక్షించుకోవాలి. తమ పనులు తాము చేసుకుంటూ పోయే అమాయక ముస్లిముల వెంటబడి తమ దాడిసలిపే మిషనరీల కొరకే నేను నా ఉపన్యాసాలను సిద్దం చేస్తాను. ఈ క్రైస్తవ ప్రబోధనా దాడిలో తమ గౌరవాన్ని స్థానాన్ని పోగొట్టుకున్న వారికై ఈ ఉపన్యాసాలు.

ఛాట్స్ వర్త్ (Chatsworth)లో, హానోవర్ పార్క్ (Hanover Park)లో, రెవిర్లియాస్ (Riverleas)లో ఏ విధంగా ముస్లిములను గ్రూప్ ఏరియాస్ ఆక్ట్ (Group Areas Act) అని చట్టం పెట్టి పేద ముస్లిములను అణగదొక్కివున్నారో ఆ ముస్లిములకై నా ఉపన్యాసాలు.

జవాబు

మేము ఇంటింటికి సువార్త వెలుగును అందించడం ఎంతమాత్రము మానుకోము. ముస్లిం తలుపులను తట్టడానికి కూడా ఎంత మాత్రము వెనుకంజ వేయము. మేము వారిని ప్రేమిస్తున్నాము కాబట్టి మాకు తెలిసిన రక్షణ సువార్తలో వారుకూడా పాలివారవ్వాలని నిరంతరం ప్రయత్నిస్తాము, ప్రయాసపడతాము, ప్రార్థిస్తాము. మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, మన అంతరంగాలకు భంగం కలుగజేస్తున్నారని, మన ఆతిథ్యాన్ని స్వీకరించి మన ముస్లింలను ఇబ్బందిపెడుతున్నారని, ఇలా దీదాత్ లాంటి వారి వెక్కిరింపులకు మేమెంతమాత్రము జడియము. ఇక దీదాత్ ప్రసంగాల విషయానికొస్తే, మా సువార్త దాడిని ఎదిరించగలిగే సత్తా వాటిలో ఏ మాత్రమూ లేదనడానికి నా ఈ పుస్తకమే ఓ చక్కటి నిదర్శనం.

81. దీదాత్

“బైబిలు దైవవాక్యమా?” అనే నా ఈ చిన్న పుస్తకం ప్రతి ముస్లిం యింటా వుండి, బైబిలు ప్రచారకులు కలిగించే ఇబ్బందికి జవాబు చెప్పగలిగితే ఏసు (అ.స) ప్రియ శిష్యుడొక్కడినైనా సన్మార్గం వైపుకు తీసుకెళ్లగలిగితే అసత్యాలను, కల్పితాలను దూరం చేయగలిగితే నాకంతే చాలు. ఇంకా పెద్ద పారితోషికం అల్లాహ్ వద్ద వుంది. ఆయన్నే నేను మార్గదర్శకానికై, కరుణకై ప్రార్థిస్తాను. నా కృషిని ఆయనకే వినమ్రతతో అంకితం చేస్తాను.

జవాబు

ముస్లిం ఇళ్ళను సువార్తనుండి కాపాడడానికి దీదాత్ చేసిన ఈ కృషి ఇక పనికి రాదు. దానిని నేను నిర్దాక్షిణ్యంగా తుత్తునీయలు చేసాను. ఐతే యేసు శిష్యులకు మాత్రం తన ఈ కృషి మంచి బహుమతేనని చెప్పుకోవాలి. వారిలో సోమరులైనవారు సహితం బైబిలును మరింత జాగ్రత్తగా చదివి సత్యంలో బలపడేలా, అనేక శోధనలు శ్రమలతో పాటు దీదాత్ వంటి సాతాను అనుచరులను, వారి కృషిని సహితం మా దేవుడు వాడుకుంటాడు. ఇక పారితోషకమంటారా? అది దీదాతకు అల్లా ఇవ్వడు, బైబిల్ వ్రాసిన యెహోవాయే ఇస్తాడు. ఆయన హెచ్చరిక ఏమిటో ఒక్కసారి చదవండి.

“గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను” (ద్వితీయోపదేశకాండము 27:18).

 

Add comment

Security code
Refresh