దేవుడు

రచయిత: జి. బిబు
చదవడానికి పట్టే సమయం: 31 నిమిషాలు
ఆడియో

trinity

విషయసూచిక

  1. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు - జవాబులు
  2. దేవుడు త్రిత్వమైయున్నాడనటానికి రుజువు
  3. ముగింపు

I. కొన్ని ప్రాథమిక ప్రశ్నలు - జవాబులు

1) ప్రశ్న: దేవుడు త్రిత్వమైయున్నాడు అంటే అర్థం ఏమిటి ?

జవాబు: దేవుడు ఒక్కడే అని బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది. అయితే ఆ ఒక్క దేవుని సంపూర్ణ దైవత్వ నామాలను, లక్షణాలను, కార్యాలను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులకు సమానంగా ఆపాదిస్తుంది. దేవుడు ఒక్కడే అన్న సత్యంతో రాజీపడకుండానే ఈ ముగ్గురు వ్యక్తుల సంపూర్ణ దైవత్వాన్ని ఒప్పుకునే బోధనే "త్రిత్వ సిద్ధాంతం" అని పిలుస్తాము.

దేవుడు ఒక్కడే; అయితే ఈ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన ఉనికి కలిగున్నాడు. ముగ్గురు వేరు-వేరు దేవుళ్ళు ఒక్క వ్యక్తిగా ఉన్నాడని కాదు; ముగ్గురు వేరు-వేరు వ్యక్తులు ఒకే దేవుడు అంటే, దేవుణ్ణి మూడు భాగాలుగా విడగొడితే ముగ్గురిలో ఒక్కో వ్యక్తి ఒక్కో భాగమని, ఆ ముగ్గురిని కలిపితే సంపూర్ణ దేవుడని దీని అర్థం కాదు. తండ్రి పూర్తిగా దేవుడు, కుమారుడు పూర్తిగా దేవుడు, పరిశుద్ధాత్మ కూడా పూర్తిగా దేవుడు, అయినా వారు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు.

అంతమాత్రాన తండ్రే కుమారుడని, కుమారుడే పరిశుద్ధాత్మ అని, పాతనిబంధన కాలంలో తండ్రిగా, కొత్త నిబంధన కాలంలో కుమారుడుగా, ప్రస్తుతకాలంలో పరిశుద్ధాత్మగా, ఇలా వేరువేరు కాలాలలో ఒకే వ్యక్తి పోషించిన మూడు వేరువేరు పాత్రలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా అనుకోవాలని అనేకులు పొరబడుతున్న తప్పుడు అభిప్రాయానికి ఇక్కడ తావు లేదు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి లేదా కుమారుడు కాదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. అందుకే ఈ ముగ్గురూ ఒకే వ్యక్తి అని చెప్పినా, ముగ్గురు దేవుళ్ళని చెప్పినా, దేవునిలో మూడు భాగాలని చెప్పినా, దేవుడు పోషించిన మూడు వేరువేరు పాత్రలని చెప్పినా అవేవీ త్రిత్వ సిద్ధాంత సత్యబోధలో భాగం కాదు. దేవుడు ఒక్కడే; ఆ ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగున్నాడు. ఇదే త్రిత్వ సిద్ధాంత నిర్వచనం.

2) ప్రశ్న: "త్రిత్వం" అనే మాట బైబిల్లో లేనప్పుడు అది బైబిల్ ఆధారిత బోధ ఎలా ఔతుంది?

జవాబు: బైబిల్లో ఉన్న బోధను మన స్వంత మాటలలో వ్యక్తపరచడం తప్పు కాదు. ఇది ప్రతివారం, ప్రతి సంఘంలోనూ జరుగుతున్న తంతే. వాక్యపరిచర్యను నియమించి, వాక్యోపదేశకులను సంఘానికి అనుగ్రహించటం ద్వారా స్వయంగా దేవుడే అలా వాక్యసత్యాలను వ్యక్తపరచే స్వేచ్ఛను ఆమోదించాడు. అనేక స్వంత మాటలతో చేసే ఒక ప్రసంగం తప్పు కాదు. ఎందుకంటే దాని ద్వారా వ్యక్తపరిచేది దేవుని వాక్యసత్యాలే. అలాగే "త్రిత్వం" అనే ఒక్క మాట ద్వారా ఒక వాక్యసత్యాన్ని సమర్థవంతంగా వ్యక్తపరచగలిగితే వచ్చిన ఇబ్బందేంటి? అలా వ్యక్తపరిచిన భావం వాక్యంలో ఉందో లేదో నిర్థారించుకోవాలి తప్ప, ఆ మాట బైబిల్లో లేదు కాబట్టి అది వాక్యసత్యం కాదు అనటం, అలాంటి విమర్శలు చేసేవారి పరిపక్వతకు అద్దం పడుతోంది.

3) ప్రశ్న: అసలు ఈ త్రిత్వ సిద్ధాంతం గొడవ మనకెందుకు?

జవాబు: దేవుడు తన గురించి తాను చెప్పుకున్న పరిచయం బైబిల్లో ఉంది. "నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు" అని మనకు ఇచ్చిన ఆజ్ఞను అర్థవంతం చేసేది ఆయన తన గురించి చెప్పుకున్న నిర్వచనమే. దేవుని గురించి మనం చెప్పే నిర్వచనం ఆయన స్వీయపరిచయానికి భిన్నంగా ఉంటే, మనం ఆరాధించేది బైబిల్లో ఉన్న దేవునిని కాదు. మన స్వంత ఊహలలో మనం కల్పించుకున్న దేవునిని ఆరాధించే ప్రమాదానికి ఇది దారి తీస్తుంది. దేవుడు త్రిత్వమై ఉన్నాడన్నది బైబిల్ ఆయనకు ఇచ్ఛే పరిచయమైతే, ఇతర ఏకేశ్వరవాద సిద్ధాంతాలలో లాగే ఆయన ఒక్క వ్యక్తి అని నమ్మినా, లేదా బహుదేవత ఆరాధికులలాగే ఆయన ఒక్క దేవుడు కంటే ఎక్కువ అని నమ్మినా, మరే భిన్న సిద్ధాంతాన్నైనా ఆయనకు పులిమే ప్రయత్నం చేసినా, అది వేరొక దేవుడు నీకుండకూడదనే ఆజ్ఞకు అతిక్రమణే ఔతుంది. అందుకే, బైబిల్ దేవునిని ఏమని నిర్వచించిందో పరిశీలించటం, "త్రిత్వం" అనే మాటలో వ్యక్తపరిచే భావం ఆ నిర్వచనంతో సరిపోతుందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం దేవుని బిడ్డలందరికీ తప్పకుండా ఉంది.

 4) ప్రశ్న: త్రిత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదని త్రిత్వవాదులందరూ అంటారు కదా; అర్థం చేసుకోలేనిదాని కోసం ఇంత కసరత్తెందుకు ?

జవాబు: దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవడం ఏ మానవుని వశంలోను లేదు. ఎందుకంటే దేవుడు అతీతుడు అన్నది ఆయన గుణలక్షణాలలో ఒక ప్రాముఖ్యమైన లక్షణం. అతీతుడు అంటే అందనివాడు అని అర్థం. ఆయన మన ఊహలకు, భావాలకు, అవగాహనకు అందని అనంతుడు. అయితే, దేవుడు ఎంత మేరకు తనను తాను బయలుపరచుకున్నాడో అంతవరకూ తప్పక ఆయనను తెలుసుకోవటం సాధ్యమే.

దేవునికి తమ స్వంత నిర్వచనాలు పులిమి, ఆయనను పూర్తిగా అర్థం చేసేసుకున్నామని జబ్బలు చరుచుకునేవారికి మనం లోకువైపోయినా, దేవుడు తనకు తాను ఇచ్చిన పరిచయ పరిమితులలో ఎంతవరకు అర్థం చేసుకోగలమో అంతవరకే పరిమితమవ్వటం మన బాధ్యత. అయినా, ఈ సిద్ధాంత అధ్యయనంలో మనం చేసేది దైవత్వపు సంపూర్ణ మర్మాన్ని వెలికి తీసే ప్రయత్నం కాదు కాని దేవుని గురించిన మన అవగాహన, వాక్యంలో ఆయన తన గురించి చెప్పుకున్న నిర్వచనంతో సరిచూసుకుని, దానికే పరిమితమవ్వాలనే ప్రయాస మాత్రమే. మరో మాటలో చెప్పాలంటే, ఇది త్రిత్వ మర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటానికి చేసే కసరత్తు కాదు, త్రిత్వ సిద్ధాంతం బైబిల్ చెప్పే సత్యమో కాదో నిర్థారించుకునే ప్రయత్నం మాత్రమే.

 5. ప్రశ్న: త్రిత్వం నమ్మకపోతే పరలోకం వెళ్ళమా?

జవాబు: మంచి క్రియలు చేస్తే నేను పరలోకానికి వెళ్తానా అనే ప్రశ్నలాంటిదే ఇది కూడా. రక్షణ మంచి క్రియలు చేయటం వలన ఎలాగయితే సంపాదించుకోలేమో, అలాగే సరైన సిద్ధాంతాన్ని నమ్మటం ద్వారా కూడా రక్షణ రాదు. ఎందుకంటే రక్షణ కేవలం దేవుని ఉచితమైన కృప చేత మాత్రమే కలుగుతుందని బైబిల్ బోధిస్తుంది (ఎఫెసీ 2:8-9). అయితే ఆ ఉచితమైన కృప నాలో రక్షణ కార్యం జరిగించిందనటానికి రుజువులేంటి? ఖచ్చితంగా రెండు గుర్తులు దీనికి ఆధారాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియల పట్ల ఆసక్తి కనబరచి వాటియందు నడుచుకోవటం (ఎఫెసీ 2:10), తీతు 2:14), రెండవది దేవుడు బయలుపరచిన సర్వసత్యంతో ఏకీభవించి సత్యబోధకే కట్టుబడి ఉండటం (యోహాను 8:47, 10:26-27, 1 యోహాను 4:6). ఎలాగయితే మంచి క్రియల ద్వారా రక్షణ కలగకపోయినా అవి చేయనివారికి రక్షణ ఉందనటానికి ఆధారముండదో, అలాగే త్రిత్వ సిద్ధాంతం లేదా మరే వాక్యసత్యాన్నయినా నమ్మటం ద్వారా రక్షణ రాకపోయినా, వాటిని తిరస్కరించినవారికి రక్షణ ఉందని చెప్పటం కూడా సాధ్యం కాదు.

 

II. దేవుడు త్రిత్వమైయున్నాడనటానికి రుజువు

దేవుని గురించి బైబిల్ బోధించే మూడు మౌలిక సత్యాలను ఒక్క మాటలో కుదించి ఆయన "త్రిత్వం" అయియున్నాడని అంటాము. కాబట్టి దేవుడు త్రిత్వమని నిరూపించటానికి ఆ మూడు మౌలిక సత్యాలు బైబిల్లో ఉన్నాయని రుజువు చేస్తే సరిపోతుంది. అవేమిటంటే:

1) దేవుడు ఒక్కడే

2) దేవునిలో బహుళత్వం ఉంది

3) దేవునిలో ఉన్న బహుళత్వం తండ్రి కుమార పరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం

ఈ మూడు సూత్రాలు వాక్యం బోధించే సత్యమైతే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగున్న ఒక దేవుడని రుజువౌతుంది. అదే త్రిత్వ సిద్ధాంత సారాంశం. ఇప్పుడు ఈ మూడు సూత్రాలు వాక్యంలో ఉన్నాయో లేవో పరిశీలించి చూద్దాం

1) దేవుడు ఒక్కడే

"యెహోవానైన నేనే దేవుడను; నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు" (నిర్గమకాండం 20:3) అనే మొట్టమొదటి ఆజ్ఞలోనే దేవుడు ఒక్కడే అని, ఆ స్ఠానం మరియు స్థాయి వేరొకరికి ఆపాదించకూడదని స్పష్టం చేయబడింది. ఇదే సత్యం అనేక లేఖనభాగాలలో పదే-పదే నొక్కి చెప్పబడింది.

"నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును నుండడు" (యెషయా 43:10).

"నేను మొదటివాడను కడపటివాడను; నేను తప్ప ఏ దేవుడును లేడు" (యెషయా 44:6).

"నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియు లేదు. ఉన్నట్టు నేనెరుగను" (యెషయా 44:8).

"దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను, నన్ను పోలినవాడెవడును లేడు" (యెషయా 46:9).

"మనకందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?" (మలాకీ 2:10).

ఇది పాత నిబంధనలో మాత్రమే మనకు కనబడే సిద్ధాంతం కాదు. క్రొత్త నిబంధన కూడా అంతే స్పష్టతతో అదే సత్యాన్ని పదే పదే నొక్కి చెప్పబడింది:

"ఓ ఇశ్రాయేలూ వినుము: మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు" (మార్కు 12:29).

"అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము" (యోహాను 17:3).

"దేవుడొక్కడే గనుక" (రోమా 3:30).

"దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే; ఆయన క్రీస్తు యేసను నరుడు" (1 తిమోతి 2:5).

"దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు; ఆలాగు నమ్ముట మంచిదే" (యాకోబు 2:19).

కాబట్టి బైబిల్ గ్రంథం మొదటి నుండి చివరి వరకు దేవుడొక్కడే అన్న సత్యానికి కట్టుబడి ఉంది. ఈ సత్యాన్ని తిరస్కరించే ఏ బోధైనా వాక్యవిరుద్ధమని స్పష్ఠం ఔతుంది. 

2) దేవునిలో బహుళత్వం ఉంది

దేవుడొక్కడే అని బైబిల్ ఎంత ఖచ్చితంగా నొక్కి చెబుతుందో, అంతే స్పష్టంగా ఈ ఒక్క దేవునిలో బహుళత్వముందని కూడా ప్రకటిస్తుంది. ఒక మనిషి ఒక్క వ్యక్తిగానే ఉండాలనే నియమం దేవునికి కూడా వర్తించాల్సిన అవసరం లేదు. ఆయన అస్తిత్వాన్ని సృష్టిలో దేనితోనూ పోల్చటం సాధ్యం కాదు. ఆయన ఒక్కడే అయినా బహుమంది వ్యక్తులుగా తన ఉనికి కలిగున్నాడని బైబిల్ నిర్వివాదంగా నిర్థారిస్తుంది.

దేవునిలో బహుళత్వం ఉందని నిరూపించే నాలుగు ఆధారాలను ఇక్కడ పరిగణలోనికి తీసుకుందాం:

A) దేవుని గురించి వాడిన బహువచన సంబోధన ఆయనలో బహుళత్వముందని నిరూపిస్తుంది:

"ఇశ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా" (ద్వితీయోపదేశకాండమ 6:4).

ఇక్కడ "అద్వితీయుడు" అన్న మాట, మూలభాషలో "ఎకాద్" అనే మాట నుండి అనువదించబడింది. "ఎకాద్" అనే మాట, బహుళత్వంలో ఐక్యతను సూచించటానికి వాడబడే మాట. ఉదాహరణకు, వివాహంలో జతపరచబడిన స్త్రీపురుషులు "ఏకశరీరం" ఔతారు. ఇక్కడ ఇద్దరూ ఒక్కటే అనే భావాన్ని "ఎకాద్" అనే మాట సరిగ్గా వ్యక్తపరుస్తుంది. 'మనమంతా భారతీయులం, మనమంతా ఒక్కటే'. ఇక్కడ 'ఒక్కటే' అనే ఆలోచనను సరిగ్గా వ్యక్తపరచే హీబ్రూ పదం "ఎకాద్". ఇలా కాకుండా, కేవలం ఒక వ్యక్తి, లేదా ఒక్క వస్తువు మాత్రమే ఉందని సూచించటానికి, హీబ్రూ భాషలో "యాకిద్" అనే పదం వినియోగించబడుతుంది.

నీ దేవుడైన యెహోవా "అద్వితీయుడు" అని చెప్పటానికి కేవలం ఏకత్వాన్ని సూచించే "యాకిద్" అనే పదం వినియోగించే అవకాశమున్నప్పటికీ, బహుళత్వంలో ఐక్యతను సూచించే "ఎకాద్" అనే పదాన్ని వినియోగించటం వల్ల దేవుడు తన ఐక్యతగల బహుళత్వ ఉనికిని వ్యక్తపరచాలనే ఉద్దేశాన్ని స్పష్టం చేస్తున్నాడు. దేవునిలో బహుళత్వముందనటానికి ఇది ఒక ఆధారం.

B) దేవుడు తనతో సమానులైనవారితో సంభాషించిన సందర్భాలు ఆయనలో బహుళత్వముందని నిరూపిస్తున్నాయి:

దేవుడు తనతో సమానులైనవారితో సంభాషించాడా? అసలు 'దేవునితో సమానులు' అనే మాట వాడొచ్చా? "దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు" అని మన ప్రభువు గురించి రాయబడింది (ఫిలిప్పి 2:6) కాబట్టి ఆ మాట నేను కల్పించింది కాదు. దేవునితో సమానులైనవారు ఎవరైనా ఉంటే వారు ఎవరయ్యుండాలి? దేవుడే అయ్యుండాలి కదా! దేవుడు తనతో సమానులైనవారితో మాట్లాడిన కొన్ని సందర్భాలు గమనించండి:

"మన పోలికలో మన స్వరూపమందు నరుని చేయుదము" (ఆదికాండము 1:26). 'నా' పోలికలో, 'నా' స్వరూపమందు కాదు "మన" పోలిక, "మన" స్వరూపం అంటున్నాడు. ఇక్కడ "మన" అనేది బహుళత్వం కాదు గౌరవప్రదం మాత్రమే అని, రాజులు తమను తాము గౌరవప్రదంగా సంబోధించుకునే విధంగా 'మేము', 'మా' లాంటి గౌరవప్రద బహువచనాన్నే దేవుడు వాడుతున్నాడని కొందరు అంటున్నారు. కాని సరిగ్గా చూడండి, 'మా' పోలికలో 'మేము' చేస్తాము అని కాదు, "మన" పోలికలో "చేయుదము" అంటున్నాడు. తనతో పాటు మరొకరిని కలుపుకుంటే తప్ప వాడలేని సంబోధనా పద్ధతికి అలాంటి భిన్న భావాలు తగిలించి తప్పించుకోవటం అంత సులభమేమీ కాదు. తనతో పాటు ఆ క్రియ చేయటానికి ఇంకెవరినో ఆహ్వానిస్తున్నాడు. అది సృష్టించే కార్యం కాబట్టి దేవుడు తప్ప ఎవ్వరూ అది చేయలేరు. ఆయన కాకుండా వేరొక సృష్టికర్తను బైబిల్ గుర్తించదు. కాబట్టి ఇది బహుళ దైవవ్యక్తుల మధ్య జరిగిన సంభాషణే తప్ప, దేవునికీ తన దూతలతోనో, అప్పటికే ఉనికి కల్పించబడిన ప్రకృతితోనో లేదా ఇంకేదయినా సృష్టింపబడిన వ్యక్తి లేదా శక్తితోనో జరిగిన సంభాషణ కాదు. సృష్టికర్త తండ్రి మాత్రమే కాదు (ఎఫేసి 3:9)యేసు క్రీస్తు కూడా అని (యోహాను 1:1-3), యేసు క్రీస్తు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ కూడా (ఆదికాండము 1:2, యోబు 33:4) అని లేఖనాలు స్పష్టత ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడ సంభాషిస్తున్న వ్యక్తులను గుర్తించటం కష్టమేమీ కాదు.

డా. జాన్ గిల్ గారు త్రిత్వ సిద్ధాంతాన్ని సమర్థిస్తూ రాసిన తన పుస్తకంలో ఒక వింతైన సంగతిని ఆధారసహితంగా ప్రస్తావించారు. "మన పోలికలో మన స్వరూపమందు" (ఆదికాండము 1:26) అనే మాటలు దేవునిలో బహుళత్వముందనే క్రైస్తవ సిద్ధాంతాన్ని బలపరుస్తుందని తెలుసుకున్న యూదులు, ఆ సిద్ధాంతాన్ని ఎదుర్కోవటానికి ఈ వచనంపై తమ వ్యాఖ్యానంలో ఒక కథ జోడించుకున్నారు. మోషే ఈ వచనం రాసినప్పుడు ఆగి 'సర్వలోకానికి దేవుడవైన ప్రభువా, ఇలా రాయటం సత్య వ్యతిరేకులకు తప్పుగా మాట్లాడే అవకాశమివ్వదా?' అని అడిగాడట. అందుకు దేవుడు, 'నువ్వు రాయి, తప్పిపోయేవాడు తప్పిపోతాడు గాక' అన్నాడట. నవ్వుకోటం ఒక్కటే కాదు ఈ కథ వల్ల ప్రయోజనం; బహుళత్వ భావం ఈ వచనంలో ఎంత బలంగా ఉందో, దానిని తప్పించుకోటానికి మొదటి నుండి దుర్బోధకులు ఎలాంటి కసరత్తులు చేసారో కూడా ఇది తెలియజేస్తుంది.

ఇలా దేవుడు తనతో సమానులైనవారితో సంభాషించిన ఇతర వాక్యభాగాలు కూడా ఉన్నాయి. ఆదాము మంచిచెడ్డల తెలివినిచ్చు వృక్షఫలములను తిన్న తరువాత దేవుడు మాట్లాడుతూ "నరుడు మనలో ఒకనివంటివాడాయెను" (ఆదికాండము 3:22) అన్నాడు. 'నాలో' లేదా 'మాలో' అని కాదు, "మనలో" అనే మాటను గమనించండి. బాబెలు గోపురం దగ్గర కొత్త భాషలను పుట్టించిన సందర్భంలో కూడా "మనము దిగిపోయి వారి భాషలను తారుమారు చేయదము రండని" దేవుడు సంభాషించటం గమనిస్తాము (ఆదికాండము 11:7). కొత్త భాషలను సృష్టించిన సృష్టికర్త, తనతో సమానంగా ఆ కార్యం చేయగలవారిని "రండి" అని పిలుస్తున్నట్లు స్పష్ఠం ఔతుంది. ఇలా దేవుడు తనతోపాటుగా సృష్టించే సామర్థ్యంగల ఇతరులతో మాట్లాడిన సందర్భాలు, ఆయనలో బహుళత్వం ఉందని నిరూపిస్తున్నాయి.

C) యెహోవా దూత ప్రత్యక్షమైన సందర్భాలు దేవునిలో బహుళత్వముందని నిరూపిస్తున్నాయి

పాత నిబంధనలో తరచుగా ఒక వ్యక్తి ప్రత్యక్షమవ్వటం మనం గమనిస్తాము. యెహోవా వద్ద నుండి సమాచారం తెచ్చిన వ్యక్తిగా అతడు "యెహోవా దూత" అని పిలవబడ్డాడు. అయితే ఈ దూతకు ఉన్న పేరు గాబ్రియేలో, మిఖాయేలో కాదు. తనను పంపిన యెహోవా పేరే ఈ దూతకు కూడా ఉంది కాబట్టి ఆయన "యెహోవా' అని లేదా "దేవుడు" అని సంబోధించబడటం మనం గమనిస్తాము. అలాంటి కొన్ని ఉదాహరణలు జ్ఞాపకం చేస్తాను.

హాగరు తన యజమానురాలి నుండి తప్పించుకొని పారిపోయే సందర్భంలో "యెహోవా దూత" ఆమెకు ప్రత్యక్షమయ్యాడు (ఆదికాండము 16:7). ఇలా ప్రత్యక్షమైన దూతను మోషే "యెహోవా" అని సంబోధించి, హాగరు ఆయనను "చూచుచున్న దేవుడు" అని పిలిచిందని పేర్కొన్నాడు (ఆదికాండము 16:13). మరోమాటలో చెప్పాలంటే, ఇక్కడ ప్రత్యక్షమైన యెహోవా దూత "యెహోవా" అని, "చూచుచున్న దేవుడు" అని పేర్కొనబడ్డాడు. ఈ వివరణను ధృవీకరించే మరిన్ని సందర్భాలను ముందు గమనిద్దాము.

యాకోబు తన పితరులైన అబ్రాహాము, ఇస్సాకుల దేవునిని సంబోధిస్తూ, తనను కూడా పుట్టినది మొదలుకొని పోషించి సంరక్షించిన ఆ దేవుడిని గురించి మాట్లాడుతూ, "నన్ను కాపాడిన ఆ దూత" అని ఆయనను పిలవటం గమనిస్తాము (ఆదికాండము 48:15-16).

మోషేతో మండుతున్న పొద నడుమ నుండి మాట్లాడిన "యెహోవా దూత" (నిర్గమ 3:2), తనను తాను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని పరిచయం చేసుకుని (నిర్గమ 3:6) తన నామము "యెహోవా" అంటే "ఉన్నవాడు" అని ప్రకటించుకున్నాడని గమనించగలం (నిర్గమకాండం 3:14).

ఇంతకూ యెహోవా అనే నామం కలిగిన ఈ దూత ఎవరు? అరణ్య ప్రయాణంలో ఒక దూతను ఇశ్రాయేలీయులకు ముందుగా పంపిస్తూ "నా నామము ఆయనకున్నది" అని దేవుడు సెలవిచ్చాడు (నిర్గమకాండం 23:20). ఈ వచనంలోనే వారిని హెచ్చరించి, ఆ దూతకు లోబడి ఉండమని, అతని కోపము రేపొద్దని, రేపితే అతడు మీ అతిక్రమములను పరిహరించడని దేవుడు సెలవిచ్చాడు. అయినా వారు ఆయన కోపాన్ని రేపి ఆయన ఉగ్రతకు గురి అయిన సందర్భాన్ని అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ, వారు ప్రభువును (క్రీస్తును అని ఫుట్ నోట్) శోధించిన విధంగా మనం చేయకుండా జాగ్రత్తపడాలని హెచ్చరించాడు (1 కొరింథీ 10:9). కాబట్టి యెహోవా దూతగా, యెహోవా నామం కలిగి మొదటి నుండి ప్రత్యక్షం ఔతూ వచ్చిన ఈ దూత యేసుక్రీస్తు ప్రభువే అని నిర్థారించబడింది. పురాతనకాలము మొదలుకొని శాశ్వతకాలం వరకు ప్రత్యక్షమైన ఈయనే ఇశ్రాయేలును ఏలే అధిపతిగా బెత్లేహెం ఎఫ్రాతాలో శిశువుగా పుట్టాడని ప్రవచనం కూడా సాక్ష్యమిస్తుంది (మీకా 5:2).

దేవునికి మాత్రమే ఆపాదించతగిన "ఉన్నవాడు" అనే గుణవాచకం, దేవునికి, ఆయన చేత పంపబడిన ఒకానొక దూతకు కూడా ఆపాదించబడటం, ఆయనలో ఉన్న బహుళత్వాన్ని ప్రస్ఫుటంగా నిర్ధారిస్తుంది. ఈ యెహోవా దూతకు సంబంధించిన మరిన్ని వాక్యాధారాల కోసం, "యెహోవా దూత యేసుక్రీస్తే" అనే వ్యాసాన్ని ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చదవగలరు: 

యెహోవా దూత ఎవరు?

D) ఓకే సందర్భంలో ఒకరికంటే ఎక్కువమంది వ్యక్తులు, "యెహోవా" అని కాని, "దేవుడు" అని కాని సంబోధించబడిన సందర్భాలు దేవునిలో బహుళత్వం ఉందని నిరూపిస్తున్నాయి

"అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొఱ్ఱా మీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించెను" (ఆదికాండము 19:24).

ఇక్కడ యెహోవా, యెహోవా వద్దనుండి గంధకమును అగ్నిని కురిపించాడని చదువుతున్నాము. అగ్నిగంధకాలను ఎవరు కురిపించారు? యెహోవా కురిపించాడు. ఎవరి వద్ద నుండి కురిపించాడు? యెహోవా వద్ద నుండి కురిపించాడు. అగ్నిగంధకాలను కురిపించిన యెహోవా ఒకరు, ఎవరి వద్ద నుండి అవి కురిపించబడ్డాయో ఆ యెహోవా ఇంకొకరు. ఇలా ఇద్దరు వ్యక్తులు ఇక్కడ యెహోవా అని పిలవబడ్డారు.

దీనికి అభ్యంతరంగా కొందరు, సర్వనామం వాడకుండా రెండుసార్లు ఒకే వ్యక్తిని నామవాచకంతో సంబోధిస్తున్నారే తప్ప ఇద్దరు వేరువేరు వ్యక్తులు ఉన్నారని చెప్పటానికి ఇది సరిపోదని వాదిస్తారు. కాని వేరొక వాక్యభాగం కూడా ఇక్కడ ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఉన్న వాస్తవాన్ని నిర్థారిస్తుంది. "దేవుడు సొదొమ గొమొఱ్ణాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నా తట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు." (ఆమోసు 4:11). అక్కడ యెహోవా మాట్లాడుతూ, దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను బోర్లద్రోసిన విధంగా నేను కూడా చేసాను అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న యెహోవా ఒకరు, ఏ దేవుని గురించి ఆయన సొదొమగొమొఱ్ఱాలను బోర్లద్రోసి అని మాట్లాడుతున్నాడో, ఆ యెహోవా ఇంకొకరు అని చాలా స్పష్టంగా తెలుస్తుంది.

"దేవా నీ సింహాసనము నిరంతరముండును, నీ దండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించితివి గనుక దేవుడు, నీ దేవుడు, చెలికాండ్లకంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించియున్నాడు" (కీర్తనలు 45:6-7). ఇక్కడ "దేవా" అని దేవునిని సంబోధిస్తూ నిన్ను "దేవుడు" అభిషేకించాడు అని రాయబడటం గమనించండి. అభిషేకించినవాడు దేవుడే, అభిషేకించబడినవాడు దేవుడే అయినప్పుడు ఇద్దరు వేరు-వేరు వ్యక్తులు దేవుడని పిలవబడ్డారని గుర్తించటానికి ఎలాంటి ఇబ్బంది లేదు.

"పిమ్మట ఆమె మరల గర్భవతియై కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగాదీనికి లోరూహామా అనగా జాలి నొందనిది అని పేరు పెట్టుము; ఇకమీదట నేను ఇశ్రా యేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను.అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును" (హోషేయ 1:6-7). ఇక్కడ నేను యూదావారిని రక్షిస్తానని సెలవిచ్చే యెహోవా ఒకరు, ఎవరి ద్వారా రక్షిస్తానంటున్నాడో ఆ యెహోవా ఇంకొకరు అని స్పష్టంగా చూడగలం.

"నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసికొందురు. సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగా నుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్య జనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసికొందురు." (జెకర్యా 2:9-11). నేను మీ మధ్యకు వచ్చి నివాసముంటానని యెహోవా సెలవిచ్చి, ఆ దినాన అనేకులు నన్ను హత్తుకొని యెహోవాకు జనులౌతారని కూడా అంటున్నాడు. ఎంతో స్పష్టంగా ఇక్కడ ఇద్దరు వేరువేరు వ్యక్తులు యెహోవాగా పిలవబడ్డారు.

"ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము"  (కీర్తనలు 110:1).  ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని అంటున్న కీర్తనాకారుడు, తనకు యెహోవా మాత్రమే ప్రభువని ఎంతో స్పష్టంగా ప్రకటించిన కారణాన (కీర్తనలు 16:2) ఇక్కడ ఆయన ప్రభువని ప్రస్తావిస్తున్న ఇద్దరు వేరువేరు వ్యక్తులు కూడా యెహోవాయే అని ఒప్పుకోక తప్పదు. ఇందులో ప్రభువైన ఒక యెహోవా మెస్సియాయే అని స్వయంగా ప్రభువే స్పష్టత ఇచ్చాడు (మార్కు 12:37).

యోహాను 1:1: "ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడైయుండెను". దేవుని వద్ద ఉన్న వాక్యం కూడా దేవుడే అయినప్పుడు ఇద్దరు వేరువేరు వ్యక్తులు దేవుడుగా గుర్తించబడ్డారని తప్ప ఇంకెలా అర్థం చేసుకోగలం?

ఇంకా ఇలాంటి ఎన్నో వాక్యభాగాలు ఉన్నప్పటికీ ఒకరికంటె ఎక్కువమంది "దేవుడు" అని, లేదా "యెహోవా" అని, ఓకే సందర్భంలో ప్రస్తావించబడిన సత్యాన్ని రుజువు చేయటానికి ఈ ఆధారాలు సరిపోతాయని భావిస్తున్నాను.

దేవుడు బహువచనంతో సంబోధించబడటం, తనతో సమానులైనవారితో సంభాషించటం, 'యెహోవాదూత' 'యెహోవా' అనే నామంతోనే ప్రత్యక్షమవ్వటం, అనేక సందర్భాలలో ఒకరికంటే ఎక్కువమంది వ్యక్తులు 'దేవుడు' అని, లేదా 'యెహోవా' అని సంబోధించబడటం, దేవునిలో బహుళత్వం ఉందనే వాస్తవాన్ని బహుస్పష్ఠంగా నిరూపిస్తున్నాయి.

3. దేవునిలో ఉన్న బహుళత్వం తండ్రికుమారపరిశుద్ధాత్మలనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం

దేవుడు ఒకడే అని, అయితే ఈ ఒక్క దేవునిలో బహుళత్వం ఉందని లేఖనాల ఆధారంతో నిర్థారించుకున్నాం. అయితే ఈ బహుళత్వంలో ఎంతమంది ఉన్నారు అని పరిశీలించినప్పుడు, తండ్రి కుమార పరిశుద్దాత్మలనే ముగ్గురు వ్యక్తులకు మాత్రమే ఈ సమాన దైవత్వ నామాలు, లక్షణాలు మరియు కార్యాలు ఆపాదించబడ్డాయని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. (దైవనామాలు ఈ ముగ్గురికీ సమానంగా ఆపాదించబడ్డాయి అని అన్నప్పుడు, "తండ్రి" అనే నామం కుమారునికి, "కుమారుడు" అనే నామం పరిశుద్ధాత్మకు,"పరిశుద్ధాత్ముడు" అనే నామం తండ్రికి లేదా కుమారునికి సమానంగా వర్తిస్తాయని భావం కాదు; ఇవి ఈ ముగ్గురినీ వేరువేరుగా గుర్తించడానికి లేఖనాలు ప్రత్యేకంగా వాడిన నామాలు. ఇవి కాకుండా మిగిలిన అన్ని దైవనామాలు ఈ ముగ్గురికీ సమానంగా ఆపాదించబడ్డాయి. కాబట్టి "తండ్రి"ని కుమారుడు అనకూడదు, "కుమారుడి"ని పరిశుద్ధాత్మ అనకూడదు,"పరిశుద్ధాత్ముడి"ని తండ్రని లేదా కుమారుడని అనకూడదు; ఎవరి ప్రత్యేక నామాలతో వారినే సంబోధించాలి.) 

A) "దేవుడు" అని తండ్రిని మాత్రమే కాదు (యోహాను 17:3), కుమారునిని (యోహాను 1:1-14) మరియు పరిశుద్ధాత్మను కూడా (అపొస్తలుల కార్యములు 5:3-4), లేఖనాలు దేవుడు అని పిలుస్తున్నాయి. "దేవుడు" అని పిలవబడినవారు లేఖనాలలో ఇంకా అనేకులు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురికి ఉన్నవిధంగా ఇంకెవ్వరికి దైవలక్షణాలు లేవు. కేవలం దేవునికి ప్రతినిధులుగా వ్యవహరించిన కారణాన కొందరికి ఆ బిరుదు ఇవ్వబడింది తప్ప తండ్రికుమారపరిశుద్ధాత్మలకు మాత్రమే ఆపాదించబడిన దేవాధిక్యతలు వారందరికీ కూడా ఉన్నాయని కాదు.

B) "యెహోవా" అనే నామం దేవునికి మాత్రమే ఆపాదించదగిన నామం. "ఉన్నవాడు" అనే భావాన్నిచ్ఛే ఈ నామం ఆయన నిత్య ఉనికిని చాటి చెబుతుంది. అయితే, తండ్రిని మాత్రమే కాదు (నిర్గమ 23:20), కుమారునిని (యెషయా 48:12-16) మరియు పరిశుద్ధాత్మను కూడా (2 సమూయేలు 23:2-3, ద్వితీయోపదేశకాండం 32:12 & యెషయా 63:14, కీర్తనలు 95:6-11 & హెబ్రీ 3:6-11)) లేఖనాలు "యెహోవా" అని పిలుస్తున్నాయి.

C) "సృష్టికర్త" అనేది దేవునికి మాత్రమే ఆపాదించదగిన నామం. సృష్టికర్త అని లేఖనాలు తండ్రిని గురించే కాదు (ఎఫెసీ 3:9, అపొ. కార్యములు 4:24-25), కుమారుని గురించి (యోహాను 1:2-3) మరియు పరిశుద్ధాత్మను గురించి కూడా (యోబు 33:4, కీర్తనలు 33:6) సాక్ష్యమిస్తున్నాయి.

D) నిత్యరక్షణ అనుగ్రహించే రక్షకుడు దేవుడు మాత్రమే. అయితే తండ్రి మాత్రమే కాదు (2 థెస్సలొనీక 2:13), కుమారుడు (తీతు 2:13) మరియు పరిశుద్ధాత్మ కూడా (తీతు 3:5, యోహాను 3:6), ఆ నిత్య రక్షణ మనకు ఇచ్చే రక్షకులుగా పిలవబడ్డారు.

E) దేవుడు శరీరధారిగా రావటం కేవలం దేవుని కార్యం. అందులో ఈ ముగ్గురి ప్రమేయం ప్రస్ఫుటంగా కనబడుతుంది (యెషయా 48:12-16, లూకా 1:35).

F) నీతి యావత్తు నెరవేర్చిన కుమారుని బాప్తిస్మము దేవుని కార్యం (మత్తయి 3:13-17). ఇందులో ఈ ముగ్గురి ప్రమేయం స్పష్టంగా కనిపిస్తుంది (మార్కు 1:10-11).

G) పరిశుద్ధాత్మ తన స్థానంలో పంపబడే దైవకార్యంలో ఈ ముగ్గురి పాత్రను ప్రభువే స్వయంగా వివరించాడు (యోహాను 14:16-17).

H) ప్రభువు మరణమే శాశ్వతమైన నీతిని సంపాదించిన బలియాగం. ఆ దైవకార్యంలో ఈ ముగ్గురి ప్రమేయం ఉంది (జెకర్యా 13:7, యోహాను 10:17, హెబ్రీ 9:14).

I) ప్రభువు పునరుత్థానం క్రైస్తవ్యం నిజమనటానికి నిదర్శనం. ఇంత గొప్ప దైవకార్యంలో ఈ ముగ్గురి ప్రమేయం ఉంది (రొమా 6:4, యోహాను 2:19, రొమా 8:11-13).

J) ఈ ముగ్గురి నామములో బాప్తిస్మము ఇవ్వాలని ప్రభువే స్వయంగా ఆజ్ఞాపించాడు (మత్తయి 28:20). అపొస్తలుల కార్యములలో శిష్యులు యేసు నామంలో బాప్తిస్మము ఇచ్చారని రాయబడిన సందర్భాలు చూపించి (అపొస్తలుల కార్యములు 2:38, 8:16, 10:48, 19:5), ప్రభువు మత్తయి 28:20లో చెప్పిన పద్ధతికి భిన్నంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల నామంలో కాకుండా కేవలం యేసు నామములో మాత్రమే బాప్తిస్మము ఇవ్వబడిందని కొందరు వ్యాఖ్యానించటం శోచనీయం. క్రీస్తుకు సంబంధించింది అనే ఆలోచనను వ్యక్తపరచటానికి లేఖనాలలో "క్రీస్తు నామములో", "క్రీస్తు నామమునుబట్టి" అనే మాటలు తరచుగా వాడబడ్డాయని వీరు గమనించకపోవటమే ఈ పొరపాటుకు కారణం (లూకా 24:44, అపొ. కార్యములు 15:26, 26:9, రోమా 15:20).

K) అపొస్తలులు ఈ ముగ్గురి నామములో ఆశీర్వచనాలు పలికినట్లు చదువుతాం (2 కొరింథీ 13:14, ప్రకటన 1:4-8). కుమారుని నుండి కృపను, తండ్రి నుండి ప్రేమను, పరిశుద్ధాత్మ నుండి సమాధానాన్ని కోరటమంటే ఆ ముగ్గురికి ప్రార్థన చేయటమే. దేవునికి మాత్రమే ప్రార్థనలు చేయాలి. ఆయన మాత్రమే ప్రార్థన ఆలకించటానికి అర్హుడు, సమర్థుడు. దేవుడు మాత్రమే చేయగలిగే ఈ కార్యాన్ని ఈ ముగ్గురికి అపొస్తలులు సమానంగా ఆపాదించారు.

పైన పేర్కొన్న సందర్భాల నుండి ఈ ముగ్గురితో ఒకరిని కలపటం కానీ, వారి నుండి ఎవరినైనా న్యాయంగా తీసేయటం కాని సాధ్యపడదు. అందుకే ఒక్కడైన దేవునిలో ఉన్న బహుళత్వం ముగ్గురు వ్యక్తులకు మాత్రమే పరిమితం. ముగ్గురికంటే ఎక్కువా కాదు తక్కువా కాదు.

 

ముగింపు

బైబిల్ మనకు ప్రత్యక్షపరచిన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అస్తిత్వం కలిగిన ఒకే ఒక దేవుడు. మన పరిమిత తాత్విక ఆలోచనలకు, తర్కాలకు ఒదిగే దేవుడు మన ఊహల నుండే పుడతాడు. మన ఊహలకు అందని ఈ త్రిత్వ దేవునిని కేవలం ప్రత్యక్షత వలన మాత్రమే తెలుసుకోగలం. ఆయనే వాక్యంలో తన గురించి ఈ పరిచయం ఇవ్వకపోయుంటే, అనేక ఏకేశ్వరవాదులు నమ్మిన విధంగా దేవుడు ఒకే వ్యక్తి అని, లేదా విగ్రహారాధికులు నమ్మిన విధంగా దేవుళ్ళు అనేకం అని, లేదా సర్వేశ్వరవాదులు నమ్మినట్లు దేవుడు ప్రపంచం నుండి వేరు కాదని మనం కూడా నమ్ముండేవాళ్ళం. ఎందుకంటే ఇవన్నీ మానవతర్కంలో ఒదిగే ఆలోచనలే. అయితే, ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నాడని, ఆ ముగ్గురు వ్యక్తులు సంపూర్ణంగా దేవుడైనప్పటికీ ముగ్గురు దేవుళ్ళు కాదని, ఒకే దేవుడని లేఖనాలు చెప్పే సిద్ధాంతం తర్కానుసారం కాదు తర్కాతీతమైనది. అందుకే మన ఊహలకు, అంచనాలకు, తర్కాలకు, తాత్విక ఆలోచనలకు ఆయన అందని అతీతుడు.

ఆయనకు సమమైనది ప్రకృతిలో మరేదీ లేదు. ఎవరిని ఆయనకు సమము చేయగలం? అందుకే ఆయనను వర్ణించగల నమూనా ప్రకృతిలో ఏదీ లేదు. ఏ ఉదాహరణ కూడా ఆయనను సరిపోల్చి చూపించజాలదు. అందుకే ఉదాహరణలతో త్రిత్వాన్ని వివరించే ప్రయత్నం వ్యర్థం. గుడ్డు, నీళ్లు, అగ్ని, సూర్యుడు, మానవుని ప్రాణాత్మదేహాలు, తదితర ఎన్నో ఉదాహరణలు కొందరు వాడుతుంటారు. కాని అవన్నీ మూడు అంశాలు, మూడు భాగాలు, మూడు లక్షణాలు లేదా మూడు స్థితులు కలిగిన ఓకే వస్తువులు లేదా విషయాలు. ఉదాహరణకు సూర్యుడ్ని తీసుకుంటే, అగ్ని-వేడి-వెలుగు సూర్యునిలో ఉంటాయి కాని అగ్నే సూర్యుడు కాదు, వెలుగే సూర్యుడు కాదు, వేడే సూర్యుడు కాదు. కాని తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అయినా ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకే దేవుడు. అలాగే, నీళ్లు ఐస్ గడ్డగా, ద్రవపదార్థంగా, మరియు ఆవిరిగా ఉండగలదు. అయితే ఒకవేళ ఒకే వ్యక్తి తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్మగాను రూపాంతరీకరణ అయ్యుంటే కొంతవరకు ఈ ఉదాహరణ సబబుగా ఉండేది. కానీ, ఈ ఉదాహరణ కూడా త్రిత్వాన్ని వర్ణించటానికి సరిపోదు. ఎందుకంటే ఇక్కడ, తండ్రే కుమారుడవ్వడని, కుమారుడే పరిశుద్ధాత్మ అవ్వడని మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఇలా ఏ ఉదాహరణ తీసుకున్నా, పరిశుద్ధ త్రిత్వాన్ని వర్ణించే నమూనాగా దేనిని పరిగణించినా, అవి దేవుని త్రీయేకతతో ఏమాత్రం పొసగవు.

పరిశుద్ధ త్రిత్వాన్ని వివరించటం సాధ్యం కాదు. బైబిల్ ప్రత్యక్షపరచిన దేవుడు త్రిత్వమైయున్నాడని నిర్థారించటం మాత్రమే సాధ్యం. అది కూడా ఈ వ్యాసంలో చేసిన విధంగా కేవలం లేఖనాలను క్రమంగా వ్యాఖ్యానించటం ద్వారా మాత్రమే సాధ్యం. ఇతరేతర ప్రయత్నాలన్నీ వ్యర్థమే.

దేవుని వాక్యం సత్యమైనది. అందులో బయలుపరచబడినవి నాకు అర్థమైనా, కాకపోయినా అవన్నీ నమ్మదగినవి. కాబట్టి బైబిల్ పరిచయం చేసే ఈ త్రియేక దేవుడు నాకు అర్థం కాకపోయినా, ఆయనే నిజదేవుడు. దేవుని గురించి ఇందుకు భిన్నంగా కల్పించబడిన ప్రతి ఆలోచన అబద్ధం. అది లేఖనాలు చెప్పని వేరొక దేవుణ్ణి తయారు చేసే ధిక్కారం. ఆలాంటి ప్రతి ఆలోచనను దేవునిబిడ్డలు ఎదిరించాలి, ఖండించాలి. సత్యదేవుడైన పరిశుద్ధ త్రిత్వాన్నే నమ్మి, ఆరాధించి, ప్రకటించాలి. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు.

 

Add comment

Security code
Refresh

Comments  

# 9841201899BURADA JOGARAO 2021-04-17 18:05
Book
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.