ఆడియో
క్రైస్తవ సమాజానికి ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలలో ఒకటైన యెరూషలేము యాత్ర పథకాన్ని వెంటనే రద్దు చేయాలి. ఎందుకనగా యెరూషలేము యాత్ర వాక్యానుసారమైనది కాదు. యెరూషలేము పుణ్యక్షేత్రము కాదు. పుణ్యక్షేత్రము అనగా ఫలానా స్థలంలో మనకు పుణ్యం అనగా మోక్షం లేక రక్షణ (స్వర్గం) వస్తుందని ఒక నమ్మకం లేక విశ్వాసం.
ఆ స్థలాలను దర్శించడం వలన వారికి పుణ్యం ప్రసాదించబడుతుందని నమ్మకం. ముఖ్యంగా చాలా మతాలు, వారి యొక్క వ్యవస్థాపకులు, గురువులు, బాబాలు జన్మించారని లేక మరణించారని ఆ స్థలాలను పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తారు. అలాగే కొన్ని స్థలాల్లో ప్రత్యేక మహిమలు ఉంటాయని, స్వస్థతలు, సూచక క్రియలు జరుగుతాయని నమ్ముతుంటారు. వీటి కోసం శారీరకంగా ఎంతో శ్రమపడి, ధనం ఖర్చుపెట్టి అనేక విధాలుగా కష్టపడి సందర్శిస్తుంటారు. అయితే వాస్తవానికి వాక్యానుసారంగా మనం ఆలోచించినప్పుడు యెరూషలేము, దాని చుట్టు ప్రక్కల ప్రదేశాలు గాని పుణ్యక్షేత్రాలు కావు. ఎందుకంటే క్రైస్తవ్యంలో రక్షణ అనేది కేవలం క్రీస్తు సిలువ మరణంలోనే ఉన్నది. కాని మరి దేనిలోనూ లేదు. అది ప్రపంచంలో మారుమూలలోనున్న ఏ మనిషైనా తన పాపముల నిమిత్తమై క్రీస్తు మరణించాడని యెరిగి పశ్చాత్తాపడి మారుమనస్సు పొందుకొని పరిశుద్దాత్మతో జీవించాలి.
యోహాను సువార్తలో సమరయ స్త్రీతో జరిగిన సంభాషణ మనం గమనిస్తే, “మీ పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధించాల్సిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను - అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు (వెదకుచున్నాడు). దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరా ధింపవలెనుఅనెను” (యోహా 4:20-24).
యేసుక్రీస్తు మాట్లాడుచూ ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు మీరు ప్రదేశములు ఆధారము చేసుకొనక, దేవుడిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధిస్తారు అని అన్నాడు. పాతనిబంధన కాలంలో యెరూషలేము మందిరం సమస్త విధములైన ఆరాధనలకు, ఆచారాలకు కేంద్రీకృతంగా ఉండేది. ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వచ్చి పాపపరిహారార్థ బలులుగాని, అపరాధపరిహారార్థ బలులుగాని మరేవిధమైన బలులుగాని అర్పించడానికి వచ్చేవారు. అయినప్పటికిని వాక్యానుసారంగా యెరూషలేము పుణ్యక్షేత్రం కాదు. అక్కడ దేవాలయాన్ని సందర్శించడం వలన పుణ్యం దక్కదు.
ఎందుకంటే దేవుడు తనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను పూర్ణహృదయంతో ఆరాధిస్తూ తమ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడి బలిపీఠముపై బలులు అర్పిపింపవలెను. దేవాలయములో ధర్మశాస్త్ర పఠనము, ప్రవక్తల సందేశాలు, దేవుని స్తుతియారధనలు జరిగేవి. అయితే పై విధానాలు మనం గమనించినప్పుడు ఎక్కడ కూడా కేవలం యెరూషలేము సందర్శించడం ద్వారా పుణ్యం లేక మోక్షము లేక రక్షణ కలుగదని అర్థమవుతుంది. సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో కూడా ప్రభువు ఒక కాలము వచ్చుచున్నది. అప్పుడు యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు, సర్వసృష్టికి సువార్త ప్రకటింపబడుతుంది. ప్రపంచంలో వివిధ ప్రదేశాలలో తండ్రిని ఆత్మతోను, సత్య ముతోను ఆరాధిస్తారని చెప్పడటం జరిగింది. ప్రభువే మనందరి హృదయాలను దర్శించడం జరుగుతుంది. "ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము" ప్రకటన 3:20.
ఆయన సిలువ మరణం తరువాత పునరుత్తానుడై ఆరోహణమై వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు సర్వలోకమునకు సువార్త ప్రకటిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్దాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇస్తూ వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వివిధ దేశాలలో హతస్సాక్షులయ్యారు. ఇలా మన భారతదేశానికి అపొస్తలుడైన తోమా వచ్చి సువార్త ప్రకటిస్తూ హతస్సాక్షి అయ్యాడు. అయితే వీరిలో కాని మొదటి శతాబ్దపు క్రైస్తవులలోగాని ఆ తరువాతి కాలంలో సువార్త ప్రకటించిన క్రైస్తవ మిషనరీలలోగాని ఎవరూ కూడా యెరూషలేమును లేక చుట్టు ప్రక్కల ప్రాంతాలను దర్శించాలని తద్వారా వారికి పుణ్యం లేక మోక్షం ఆశీర్వాదం లభిస్తుందని భోదించలేదు.
యెరూషలేము యాత్రను ఎప్పుడు, ఎవరు ప్రారంభించారు?
జెరోమ్ అనే ఫాదర్ గారు దీనిని ప్రారంభించారని ఆ తరువాత కాన్స్టాంటిన్ చక్రవర్తి తల్లిగారైన హెలెన్ గారు దానిని స్థాపించారని చరిత్ర చెబుతుంది. ఆ తరువాతి కాలంలో క్యాథలిక్ ఫాదర్లు, పోపులు యేసుక్రీస్తు జన్మస్థలం, జీవించిన ప్రదేశాలు, మరణించిన స్థలం, ఆరోహణమైన స్థలం, శిష్యులు తిరిగిన స్థలాలు మరియు రోమ్ పట్టణాలను సందర్శించడాన్ని ప్రోత్సహించారు. మన దేశంలో దక్షిణరాష్ట్రాలలో గత 15- 20 సం||రాల నుండి క్రైస్తవ పెద్దలు, సంస్థలు, యెరూషలేము యాత్రను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది.
ముఖ్యంగా మీడియా సంస్థలు వచ్చినప్పటి నుండి రవాణా సదుపాయాలు పెరిగినప్పటి నుండి యెరూషలేము యాత్ర మరియు పరిసరాల ప్రాంతాల దర్శనాలు ప్రోత్సాహాలు చాలా పెరిగిపోయాయి. అక్కడికి వెళ్తే రక్షణ వస్తుందని, ఆశీర్వాదం లభిస్తుందని అక్కడి మట్టి, నీరు, గాలి వలన ఆశీర్వాదం వస్తుందని, తప్పనిసరిగా అందరూ దర్శించాలని విపరీతమైన ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. అందుకుగాను ఎంతోమంది క్రైస్తవులు అక్కడికి వెళ్తే తమకి ఆశీర్వాదం, రక్షణ వస్తుందని తలంచుకొని తమ దగ్గరున్న ధనాన్ని సమకూర్చుకొని వెళ్తున్నారు. ఇదే కోణంలో మన దేశంలో కూడా చాలా చోట్ల చర్చిలను పుణ్యక్షేత్రాలుగా మలుస్తున్నారు. “ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారిచేత మ్రింగివేయబడుదురు" - యెషయా 9:16.
ప్రభుత్వాలు యెరూషలేము యాత్రకు ప్రోత్సాహకాలను తక్షణమే రద్దు చేయాలి
ప్రభుత్వాలు అనేకమంది ప్రజల అభ్యుదయం కొరకు వివిధ రాష్ట్రాల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు ప్రవేశపెడుతుంటాయి. వీటి కోసం ప్రజల దగ్గర నుండి పన్నుల రూపంలో, రెవెన్యూ రూపంలో, రసీదుల రూపాలలో మరియు ఇతరతర పద్ధతుల్లో డబ్బులు వసూలు చేస్తూ, తిరిగి ప్రజల సంక్షేమం కోసం అన్ని మతాల ప్రజల అభ్యుదయం కోసం ఖర్చుపెడుతుంటాయి. అయితే పుణ్య క్షేత్రాల ధర్శనాలనేవి ఎక్కువగా హిందూ, ఇస్లాం మరియు ఇతర మతస్తుల వేదాంతాలలో లిఖితమైయున్నవి. ముస్లింలకు హజ్ యాత్రగా హిందువులకు అనేక దేవాలయాల ధర్శనాలకు యాత్రలుగా పేర్కొనబడినవి. అందుకోసం ప్రభుత్వాలు వారికి ప్రోత్సాహకాలను అందిస్తుంటాయి. కాని వాస్తవానికి క్రైస్తవ్యంలో పుణ్యక్షేత్ర దర్శనం అనే కార్యం వాక్యంలో లేనేలేదు. గత 5-10 సం||రాల నుండి మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ మొదలగు రాష్ట్ర ప్రభుత్వాలు యెరూషలేము యాత్రకు సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలను అందజేయడానికి పథకాలను ప్రవేశపెట్టాయి. ఈ పథకాలను రూపించడంలో వాక్యపరంగా అవగాహనలేని కొన్ని క్రైస్తవ సంస్థలు మరియు క్రైస్తవ పెద్దలు ప్రభుత్వాన్ని బలంగా ప్రభావం చూపించారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం GO MS No 99 Minorities Welfare (SDM) Dept, Dt 19-102013 ఆధారంగ 20,000 రూ||లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60,000 రూ||లు అందిస్తున్నాయి. ఈ పథకాల అమలు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి 60,000 ఆరువై వేల రూ||లు ఇస్తే 100 మందికి (60) ఆరువై లక్షలు, 1000 మందికి 6 కోట్ల ఖర్చు అవుతుంది. వాస్తవానికి ఈ పథకం ద్వారా క్రైస్తవ సమాజానికి అర్థికంగా, సామాజికంగా మరియు ఆథ్యాత్మికంగా ఎటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వాలు ఈ పథకానికి పెట్టే ఖర్చును నిరుపేద క్రైస్తవుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ఖర్చు చేస్తే చాలా బాగుంటుంది.
ముఖ్యంగ క్రైస్తవులపై జరుగుచున్న దాడులను అరికట్టడంలో, సువార్త ప్రకటనలకు ఆటంకంగా ఉండే చట్టాలను నివారించడంలో, సువార్త నిమిత్తం అన్యాయంగా చెరసాలలో బంధింపబడిన క్రైస్తవులను విడుదల చేయడంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో సువార్త ప్రకటించడానికి చట్టాలను రూపొందిస్తే బాగుంటుంది. నిరుపేద క్రైస్తవుల అభ్యుదయం కొరకు సంక్షేమ పథకాలను రూపొందించాలి. ఇందుకోసం క్రైస్తవ పెద్దలు, సంస్థలు ప్రభుత్వానికి మార్గదర్శకాలు చేయాలి. ఎందుకంటే ప్రభుత్వాలకు, న్యాయస్థానాలకు క్రైస్తవ వేదాంతం పైన సంపూర్ణ అవగాహన ఉండదు. “ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము" - సామెతలు 11:14.
క్రైస్తవ సమాజం, సంఘ పెద్దలు, సంస్థలు దీని విషయం స్పందించి ఇలాంటి యాత్రలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కోరరాదు. అయితే క్రైస్తవులు వారి ఇష్టపూర్వకంగా తమ స్వంత ఖర్చులతో, తమకు కలిగిన సంపాదన మేరకు యెరూషలేము మరియు పరిసర ప్రాంతాలను సందర్శించుకోవచ్చు. అది కూడా కేవలం ఆ ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగానే పరిగణించి సందర్శించుకోవచ్చు. మరియు బైబిల్ లోని స్థలాలును పరిశీలించి చెప్పబడిన వాక్యం నిజమని గ్రహించి విశ్వసించి సంతోషపడి దేవుని స్తుతించాలి. అయినప్పటికిని అక్కడికి వెళ్ళడమనేది రక్షణతో, ఆశీర్వాదంతో కూడుకొన్నది కాదని, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అవి ప్రసాదించబడతాయని గ్రహించి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. అనాలోచనగా, అనవసరపు ప్రచారాలకు ప్రలోభాలకు లొంగిపోకూడదు. ఇందుకోసం ప్రభువు మనకందరికి తన కృపతో సహాయం చేయును గాక, ఆమేన్.
- అభినవ్ (హైద్రాబాద్)