దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 52 నిమిషాలు

 

సార్వత్రిక క్రైస్తవసంఘం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ప్రభువు తమకు ఆజ్ఞాపించిన బోధలను ప్రకటించి అనేకులను ఆయనకు శిష్యులుగా తయారుచేస్తున్న తరుణంలో, అది సహించలేని అపవాది సంఘ బోధకుల రూపంలోనే తన అనుచరులను రేపి, సంఘాన్ని, సంఘబోధనీ కలవరపరిచే ప్రయత్నాన్ని ప్రారంభం నుండీ చేస్తూ వచ్చాడు.

రెండవ కొరింథీయులకు 11:14,15 ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు.

అపోస్తలుల కాలంలోనూ, తరువాత కాలంలోనూ అనేకులైన సంఘ సేవకులు ప్రభువు వారికి అనుగ్రహించిన శక్తి, జ్ఞానం ద్వారా ఈ అపవాది పరిచారకుల విషపు బోధను ఖండిస్తూ వచ్చినప్పటికీ నేటికి కూడా ఆ అపవాది పరిచారకుల మనుగడ, వారి బోధలు ప్రబలుతూనే ఉన్నాయి. అందుకే క్రైస్తవ సమాజానికి బైబిల్ ఏమని ఆజ్ఞాపిస్తుందో చూడండి.

తీతుకు 2:15 వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము.

ఈ అపవాది పరిచారకులనూ, వారి దుర్బోధనూ మనం చాలా సులభంగా గుర్తించవచ్చు. వీరు సార్వత్రిక క్రైస్తవ సంఘం విశ్వాస పునాదులుగా విశ్వసించే వాక్యానుసారమైన సిద్ధాంతాలను విస్మరిస్తూ, తాము తీసుకువచ్చిన కొన్ని పనికిమాలిన సిద్ధాంతాలతో, వంకరమాటలతో సంఘాలను దారితప్పించే ప్రయత్నం చేస్తుంటారు‌. వీరి గురించి పౌలు కూడా సంఘానికి జాగ్రతలు తెలియచేసాడు.

అపొస్తలుల కార్యములు 20:29,30 నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.

ఈ విధంగా వాక్య సారాంశంతో నిర్మాణమైన సార్వత్రిక క్రైస్తవ సంఘ విశ్వాస పునాదులను వంకర మాటలతో విస్మరిస్తూ, తమ పనికిమాలిన సిద్ధాంతాలతో సంఘాన్ని కలవరపరిచే వారికి క్రైస్తవ సంఘం "కల్ట్" (దుర్బోధగుంపు) అని నామకరణం చేసింది. ఈ "కల్ట్" అనే పదం లాటిన్ భాషలోని "కల్టస్" అనే పదం నుండి ఉద్భవించింది. ఈ కల్టస్ అనే పదానికి దేవుణ్ణి ఆరాధించడం అనే అర్థం వస్తుంది. అయితే ఆ ఆరాధన వాక్యానుసారమైనది కాకుండా వారి స్వచిత్తం నుండి పుట్టినదై ఉంటుంది. ఇటువంటి కల్ట్స్ ప్రస్తుత సమాజంలో చాలా ఉన్నప్పటికీ వాటిలో ఒకానొక ప్రాముఖ్యమైన కల్ట్ గురించీ, వారు చేసే దుర్బోధల గురించీ ఈ వ్యాసం లో వివరించబోతున్నాను.
ఆ కల్ట్ (దుర్భోధ గుంపు) పేరే Church of Christ (CoC). ఈ కల్ట్ ద్వారా క్రైస్తవ సంఘంలో  అపవాది చేయిస్తున్న దుర్బోధల గురించి తెలుసుకునే ముందు అసలు ఈ కల్ట్ ఎలా స్థాపించబడిందో చరిత్రను తెలుసుకుందాం.

ప్రస్తుత క్రైస్తవ సంఘం అపోస్తలులు స్థాపించిన సంఘం వలే ఉండకుండా దారి తప్పిపోయిందనీ, తిరిగి అపోస్తలీయ బోధను సంఘంలో స్థాపించి క్రైస్తవ్యాన్ని ఏకం చేయాలనే నినాదంతో అమెరికా దేశంలో 1790 సంవత్సరం నుండి 1840 వరకూ American Restoration Movement అనేది ఒకటి జరిగింది. ఆ Movement లో రెండు వేరు వేరు గుంపులు ప్రధానమైన పాత్రను పోషించాయి. ఈ రెండు వేరు వేరు గుంపులనూ ప్రధానంగా "బార్టన్ డబ్ల్యు స్టోన్" అనేవ్యక్తి, మరియు "థామస్ కెంప్ బెల్" అనే వ్యక్తి విడివిడిగా ముందుకు నడిపించారు. ఈ రెండు వేరు వేరు గుంపులకు ఇంచుమించు ఒకే రకమైన అభిప్రాయాలు ఉండడం వల్ల 1832వ సవత్సరం నుండీ 1906వ సంవత్సరం వరకూ కలసి‌ ఒకే గుంపుగా కొనసాగారు. తరువాత ఇదే గుంపు Disciples of Christ, Churches of Christ, మరియు Church of Christ అనే మూడు గుంపులుగా వేరైపోయింది. ప్రస్తుతానికి ఇందులోని‌ మొదటి రెండు గుంపుల ఉనికిని గుర్తించడం కష్టమే కానీ, మూడవ గుంపు అయిన Church of Christ (CoC) మాత్రం తన ఉనికిని కోల్పోకుండా విస్తరిస్తూనే ఉంది. దీని చరిత్రను ఇంత వివరంగా ఎందుకు తెలియచేయవలసి వచ్చిందంటే వీరు బైబిల్ లో క్రీస్తు సంఘం (Church of Christ) అనే పదాన్ని చూపించి అపోస్తలుల కాలం‌ నుండీ వీరి సంఘం ఉందని, వీరి సంఘం అపొస్తలుల‌ ద్వారా స్థాపించబడిందనే మాటలను పదేపదే చెబుతూ చరిత్ర తెలియని వారిని మోసగిస్తూ ఉంటారు. ఇదెలా ఉంటుందంటే మన ముందుకు యోహాను అనే పేరుగల వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు ప్రియశిష్యుడైన యోహాను పేరు బైబిల్ నుండి చూపించి, ఆ యోహానూ నేనూ ఒకరే అంటే ఎలా ఉంటుందో, వీళ్ళు చెప్పేది కూడా అంతే అజ్ఞానంగా ఉంటుంది. మీకు ఇది అర్థం కావాలనే చరిత్ర నుండి ఈ Church of Christ ఎలా ఏర్పడిందో తెలియచెయ్యడం జరిగింది. ఇక ఈ గుంపు చేసే ప్రాముఖ్యమైన దుర్బోధల గురించి పరిశీలిద్దాం.

వీరు మొదటిగా, మనం సంఘంగా కూడుకుని ప్రభువును ఆరాధించే CHURCH BUILDING కు క్రీస్తుసంఘం (Church of Christ) అనే పేరు ఉంటేనే  అది ఆయన సంఘం ఔతుందనీ, లేకపోతే అది క్రీస్తు యేసుకు చెందిన సంఘం కాదనీ, అటువంటి వారికి రక్షణ లేదని వంకర బోధలు బోధిస్తుంటారు. దీనికి వారు బైబిల్ నుండి వక్రీకరించే ప్రధానమైన వాక్యభాగం చూడండి;

రోమీయులకు 16:16 క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.

వీరు ఈ వచనాన్ని వక్రీకరించి, వివాహమైన ప్రతీ స్త్రీ తన భర్త పేరుతో పిలవబడుతుందనీ, సంఘం క్రీస్తుయేసుకు భార్యయైతే ఆ సంఘం కూడా క్రీస్తు పేరుతోనే పిలవబడాలని లేనిపోని ఉదాహరణలు చెబుతూ ఉన్న సంఘాన్ని తమవెంట ఈడ్చుకుపోయే ప్రయత్నం చేస్తుంటారు.

వాస్తవానికి పౌలు విశ్వాస సమాజాన్ని ప్రస్తావిస్తూ వారు క్రీస్తు యేసు మూలంగా సంఘంగా ఏర్పడ్డారనే భావంతో వారి గురించి క్రీస్తు సంఘములు అంటున్నాడే తప్ప ఆ సంఘాల వారు కూడుకునే స్థలాలకు క్రీస్తు సంఘం (Church of Christ) అనే పేరు పెట్టుకుని వారు క్రీస్తు సంఘంగా ఉన్నారనే భావం ఆయన మాటల్లో కనిపించడం లేదు. ఎందుకంటే పౌలు కాలంలో క్రైస్తవ సంఘాల వారు కూడుకోడానికి ప్రత్యేకమైన స్థలాలను నిర్మించుకోడం కానీ, ఆ నిర్మాణాలకు పేర్లను పెట్టుకోవడం కానీ సాధ్యం కాలేదు. వారంతా తమకు అనుకూలంగా ఉన్న గృహాలలోనూ, యూదుల సమాజ మందిరాలలోనూ, మరికొన్ని ప్రదేశాలలోనూ కూడుకుని ప్రభువును ఆరాధించేవారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో వివిధ వ్యక్తుల పేర్లతో, మిషనరీల పేర్లతో, స్థలాల పేర్లతో నిర్మాణమైన అనేకమైన CHURCH BUILDINGS ఉన్నాయి. ఉదాహరణకు లూథరన్, బాప్టిస్ట్, జిడిఎం, ఇటువంటి పేర్లతో పిలవబడుతున్న ఈ నిర్మాణాలన్నీ కేవలం ఆ సంఘంవారు కూడుకునే స్థలాలకు గుర్తింపుగా పెట్టిన పేర్లే తప్ప, అందులోని విశ్వాసులు ఎవరూ కూడా క్రీస్తు యేసును‌ బట్టే తాము రక్షించబడి సంఘంగా కూడుకున్నామనే మూలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించరు, ఆయనను పక్కనపెట్టేసి వారు కూడుకుంటున్న స్థలానికి పెట్టిన పేరుగల వ్యక్తిని దేవునిగా ఆరాధించరు. పౌలు ఏ ఉద్దేశంతోనైతే క్రైస్తవ సమాజాన్ని క్రీస్తు సంఘాలు అని పిలిచాడో ఆ ఉద్దేశంతోనే విశ్వాసులు వివిధ పేర్లతో పిలవబడే స్థలాలలో కూడుకుంటున్నారు కాబట్టి వారు ఆత్మీయంగా క్రీస్తు సంఘం కాకుండా పోలేదు.

అదేవిధంగా, బైబిల్ గ్రంథం ఈ విధంగా క్రీస్తు ద్వారా ఏర్పడిన సంఘాన్ని క్రీస్తు సంఘమనే కాకుండా జీవముగల దేవుని సంఘం, అని కూడా పిలవడం జరిగింది.

1తిమోతికి 3: 15 అయినను నేను ఆలస్యము చేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునైయున్నది.

బైబిల్ లో రాయబడినట్టుగానే విశ్వాసులు కూడుకునే స్థల నిర్మాణానికి క్రీస్తు సంఘం (Church of Christ) అనే పేరు పెడితేనే  అది క్రీస్తు సంఘం ఔతుందని, లేకపోతే ఆయన సంఘం కాదని వాదన చేసే Church of Christ కల్ట్‌ వారు పై‌వచనాల ప్రకారం తమ చర్చీలకు పెట్టుకున్న క్రీస్తు సంఘం (Church of Christ ) అనే పేరు తీసేసి (బోర్డు తీసేసి) అదే బైబిల్ లో సంఘాన్ని ఉద్దేశించి రాయబడిన జీవము గల దేవుని సంఘం అనే పేరు పెట్టుకోవడానికి  సిద్ధపడతారా? బైబిల్ ఈ పేరుతో కూడా సంఘాన్ని‌ పిలిచిందిగా మరి? మనం ఇక్కడే వారికున్న కుయుక్తిని అర్థం చేసుకోవాలి. బైబిల్ లో సంఘం అన్నప్పుడైనా, క్రీస్తు సంఘం అన్నప్పుడైనా, జీవముగల దేవుని సంఘం అన్నప్పుడైనా దానికి విశ్వాసులు కూడుకునే నిర్మాణమనే అర్థం రాదు (అప్పటికి నిర్మాణాలు లేవు) కానీ, లోకంలో నుండి యేసుక్రీస్తు రక్తం వల్ల దేవుని సొత్తుగా కొనబడిన ప్రజలనే అర్థం వస్తుంది.

యోహాను 15:19 అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని;

1కోరింథీయులకు 6: 20 విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి.

1పేతురు 2: 9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునైయున్నారు.

ప్రకటన గ్రంథము 5:9,10 ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు.

వాక్యం ఇంత స్పష్టంగా సంఘం అంటే మనుషుల చేతిపనైన నిర్మాణం కాదనీ, క్రీస్తు ద్వారా లోకంలో నుండి దేవుని సొత్తుగా, రాజ్యంగా పిలవబడిన విశ్వాస సమూహమని వివరణ ఇస్తుంటే ఈ Church of Christ కల్ట్ మాత్రం BUILDING పేరు గురించి వివాదాలు సృష్టిస్తుంటారు. వాస్తవానికి వారు ఇదంతా చేస్తుంది నిజంగా క్రీస్తు పైనున్న ప్రేమతో కాదు కానీ, తమ కల్ట్ ని వెంబడించే వారి సంఖ్యను పెంచుకుని, తద్వారా బైబిల్ ప్రకటించే బోధ నుండి విశ్వాసులను దారి తప్పించడానికేయని మనమంతా వివేకంతో గుర్తించాలి, ఇది సాతాను యొక్క తంత్రం. సాతాను విశ్వాసులను మోసం చెయ్యడానికి తనపేరుతో సంఘంలో ప్రవేశించడు అలా చేస్తే మనంతా వాడిని అంగీకరించము కాబట్టి,  క్రీస్తు పేరుతోనే, అపోస్తలుల బోధ పేరుతోనే సంఘంలో ప్రవేశించి వంకరమాటలతో సంఘాన్ని వాక్య బోధనుండి దారితప్పిస్తాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 24:5 లో దీనిగురించి జ్ఞాపకం చేస్తూ అనేకులు నా పేరిటే వచ్చి మోసం చేస్తారు కాబట్టి జాగ్రతగా ఉండమంటున్నాడు.

మరొక విషయం ఏంటంటే ఒకవేళ వీరు చెబుతున్నట్టుగా విశ్వాసులు కూడుకునే నిర్మాణానికి క్రీస్తు సంఘమని పేరు పెట్టుకుంటునే ఆ విశ్వాసుల సమూహం నిజంగా క్రీస్తు సంఘం ఔతుందంటే, వీరు అక్షరాలైన పేరులోనే రక్షణ ఉందని బోధిస్తున్నట్టు.

ఒకవేళ Church of Christ వారు యేసు నామంలోనే రక్షణ అంటూ పేతురు అపోస్తలుల కార్యములు 4:8 లో చెప్పిన మాటలు చూపించి సందర్భానికి వేరుగా అక్షరాలతో నిర్మాణమైన పేరులోనే రక్షణ ఉందని వాదిస్తారేమో? అలా చెయ్యాలంటే దానికంటే ముందు వారు తమ చర్చిలకు Church of Christ అనే పేరు తీసేసి Church of Jesus అని కూడా పెట్టుకోవలసి వస్తుంది. ఎందుకంటే పేతురు ఆ వచనంలో "యేసు" నామం గురించి కదా మాట్లాడుతున్నాడు. ఇకపోతే బైబిల్ గ్రంథంలో "నామం" అని ప్రస్తావించినప్పుడు ఆ నామన్ని కేవలం అక్షరాలతో నిర్మాణమైన పేరుగా మాత్రమే భావించకూడదు.

ఉదాహరణకు:

యోహాను సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అను గ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ప్రార్థన చేస్తూ తన శిష్యులకు ఆయన నామాన్ని ప్రత్యక్షపరచినట్టు చెబుతున్నారు. యేసుక్రీస్తు తన పరిచర్య కాలంలో తండ్రి నామంగా చెప్పబడిన  యెహోవా అనే పేరును ప్రస్తావించలేదు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొక్క ప్రేమ, శక్తి, కనికరం‌ వంటి గుణలక్షణాలను మాత్రమే తన శిష్యులకు ప్రకటించారు. అదేవిధంగా బైబిల్ లో మరొక సందర్భాన్ని చూద్దాం.

నిర్గమకాండము 34:4-7 మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ రెండు రాతిపలకలను చేతపట్టుకొని సీనాయికొండ యెక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతనియెదుట యెహోవా అతని దాటి వెళ్లుచుయెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను.

ఈ సందర్భంలో దేవుడు అప్పటికే యెహోవా అనే నామం తెలిసిన మోషేకు నా నామాన్ని ప్రకటిస్తానని చెబుతూ ఆయన గుణలక్షణాలను ప్రకటించినట్టుగా రాయబడింది. దీనిని బట్టి బైబిల్ లో నామం‌ అంటే అది దేవుని గుణలక్షణాలను కూడా సూచిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా అనే నామం కూడా దేవుడు ఉన్నవాడు అనే ఆయన గుణాన్నే సూచిస్తుంది.

అపోస్తలుడైన పేతురు యేసు నామంలోనే రక్షణ అంటే అక్షరాలతో నిర్మాణమైన యేసు అనే పేరులో ఏదో ఉందని కాదు కానీ, ఆ యేసును బట్టే మనకు రక్షణ కలుగుతుందనే భావంతో అలా మాట్లాడుతున్నాడు. పోని ఈ వాదనంతా పక్కన పెట్టేసి, Church of Christ కల్ట్ వారు చెబుతుందే నిజం అనుకుని అక్షరాలతో నిర్మాణమైన క్రీస్తు అనే పేరులోనే రక్షణ ఉందని నమ్మి, క్రీస్తు సంఘం అని మన చర్చ్ నిర్మాణానికి బోర్డు తగిలించుకోవాలంటే యేసుక్రీస్తు అసలైన పేరు హీబ్రూలో ישו (yeshuas), గ్రీకు బాషలో ఆయన పేరు Χριστός (Christos) అని రాయబడింది. మన తెలుగులోకి ఈ పేర్లను యేసుగా, క్రీస్తుగా లిప్యంతరీకరణ చేసారు. ఒరిజినల్ గా అపోస్తలులు యేసు క్రీస్తును ప్రకటించిన అక్షరాలతో నిర్మాణమైన పేర్లు ఇవి కావు కదా? దీనిని‌ బట్టి Church of Christ కల్ట్ వారంతా తమ సంఘాలకు (నిర్మాణాలకు) క్రీస్తుసంఘం ( church of Christ) అనేది తొలగించి , అపోస్తలులు ప్రకటించిన మూలభాషలోని పేర్లనే పెట్టుకోవాలి. దీనికి వారు సిద్ధమా?

చివరగా ఈ Church of Christ కల్ట్ వారి బోర్డు (పేరు) బోధకు సమాధి కడదాం. ఆ క్రమంలో ఈ కల్ట్ వారు ఇతర సంఘాలపైన ఏ కొలమాన్ననైతే పెడుతున్నారో, అదే కొలమానాన్ని వీరిపైనా పెట్టి దానిప్రకారం బైబిల్ దృష్టిలో వీరేమౌతారో చూద్దాం. ఈ నియమాన్ని మనకు స్వయంగా యేసుప్రభువు నేర్పించారు.

మార్కు 4:24 మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును.

Church of Christ కల్ట్ కొలమానం ప్రకారం బైబిల్ లో సంఘాన్ని క్రీస్తు సంఘం (Church of Christ) అని పిలవడం జరిగింది కాబట్టి, ప్రస్తుతం ఉన్న ప్రతీ సంఘానికీ (నిర్మాణానికీ) క్రీస్తు సంఘం (Church of Christ) అనే పేరే  ఉండాలి, ఆ పేరుతోనే పిలవబడాలి. అప్పుడు మాత్రమే రక్షణ సాధ్యం, లేకుంటే నరకం. ఇప్పుడు బైబిల్ లో విశ్వాసులను ఉద్దేశించి రాయబడిన మాటలను చూడండి.

1 కోరింథీయులకు 6: 15 మీ దేహములు క్రీస్తునకు అవయవములైయున్నవని మీరెరుగరా? నేను క్రీస్తుయొక్క అవయవములను తీసికొని వేశ్యయొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు.

ఎఫెసీయులకు 5:30 మనము క్రీస్తు శరీరమునకు అవయవములమైయున్నాము.

మొదటి కొరింథీయులకు 12:27 అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు.

కొలొస్సయులకు 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి

ఎఫెసీయులకు 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను.

కొలస్సీయులకు 1:24 ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను.

పౌలు విశ్వాసులను రోమా 16:16 లో క్రీస్తు సంఘాలని ఎలాగైతే సంబోధించాడో, అలానే  పై వచనాల్లో వారిని క్రీస్తు శరీరంగా, క్రీస్తు అవయవాలుగా కూడా వర్ణించాడు. దీని ప్రకారం  Church of Christ కల్ట్ వారు; వారికి తమ తలితండ్రులు పెట్టిన సొంతపేర్లతో పిలవబడకుండా క్రీస్తు అవయవం, క్రీస్తు శరీరం అనే పిలవబడాలి. ఒకవేళ అలా పిలవబడకుండా తమ తల్లితండ్రులు పెట్టిన సొంత పేర్లతో పిలవబడుతుంటే  మాత్రం వారు క్రీస్తు అవయవం, క్రీస్తు శరీరం కాదని వారు ఇతర సంఘాలపైన పెట్టిన కొలమానమే వారికి తీర్పుచెబుతుంది. సొంత పేర్లతో పిలవబడకుండా బైబిల్ చెప్పినట్టుగా క్రీస్తు అవయవం, క్రీస్తు శరీరంలో భాగమని పిలవబడేందుకు ఈకల్ట్ వారు సిద్ధపడతారా?
అందుకే దేనిని ఆత్మీయకోణంలో తీసుకోవాలో, దేనిని అక్షరార్థంగా తీసుకోవాలో తెలుసుకుని వాదనలకు దిగాలి. ఇది అర్థం అయ్యేందుకు మరో సులభమైన మాటను చెబుతున్నాను.

పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలను ఉద్దేశించి నా పేరుపెట్టబడిన నా జనులని సంబోధించడం జరిగింది (2 దినవృత్తాంతములు 7:14). దీనిని బట్టి ఇశ్రాయేలీయుల్లో ఎవరికీ సొంత పేర్లు లేకుండా, యెహోవా అని పిలవబడ్డారని అర్థమా? కాదుకదా! అది యెహోవా దేవునితో వారికున్న సంబంధాన్ని సూచిస్తుంది. అదేవిధంగా క్రీస్తు సంఘం అన్నప్పుడు కూడా క్రీస్తుతో విశ్వాసులకు ఉండే సంబంధాన్నే సూచిస్తుంది (ఆయన ద్వారానే మనం దేవునికి సంఘంగా ఏర్పడ్డాం, అదే ఆ సంభంధం).

రెండవదిగా

సార్వత్రిక క్రైస్తవ సంఘం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల్ని త్రిత్వమైన ఏకదేవునిగా ఆరాధిస్తుంది. ఎందుకంటే దేవుడు  లేఖనాలలో తనను తాను బహుళత్వం కలిగిన ఏక దేవునిగానే పరిచయం చేసుకున్నాడు.

ద్వితీయోపదేశకాండము 6:4 ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.

ఈ వచనంలో యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్నప్పుడు హెబ్రీభాషలో వాడిన పదం "యెఖాద్" (אחד) ఈ పదానికి సంఖ్యాపరంగా ఒక వ్యక్తి అనే అర్థం రాదు కానీ, బహుళత్వంలో ఏకత్వాన్ని సూచించేందుకు ఈ పదాన్ని వాడతారు.

ఉదాహరణకు:

ఆదికాండము 2: 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.

ఈ వచనంలో ఏకశరీరం అన్నప్పుడు వాడిన పదం "యెఖాద్" (אחד) అక్కడ రెండు శరీరాలు ఉన్నప్పటికీ వారి శరీరాల ఏకత్వాన్ని సూచించడానికి ఈ పదాన్ని వాడారు.

ఆదికాండము 11: 6 అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే

ఈ వచనంలో జనము ఒక్కటే అన్నప్పుడు కూడా "యెఖాద్".(אחד) అనే పదాన్నే వాడారు. జనంలో అనేకమంది ఉన్నప్పటికీ వారి ఏకత్వాన్ని సూచించేలా ఈ పదాన్ని వాడారు. తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్మ ముగ్గురు వేరు వేరు వ్యక్తులైనప్పటికీ వారు ఒకే దైవత్వం, ఒకే గుణలక్షణాలు, కలిగిన ఒకే దేవునిగా బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరచబడుతున్నారు. బైబిల్ గ్రంథం మనకు ఒకే దేవుడున్నాడని బోధిస్తూ ఆ దేవునిగా తండ్రినీ, కుమారున్ని, పరిశుద్ధాత్మనీ సమానంగా చూపిస్తుంది. దీనినే సార్వత్రిక క్రైస్తవ సంఘం "త్రిత్వము" అని పిలుస్తుంది. దీనిగురించి మరింత వివరంగా తెలుసుకునేందుకు ఈ వ్యాసం  చదవండి.

త్రిత్వ సిద్ధాంత నిరూపణ?

Church of Christ కల్ట్ వారు వాక్యపు సారాంశంతో ప్రకటించబడే త్రిత్వ సిద్ధాంతాన్ని కానీ, త్రిత్వంలో రెండవ వ్యక్తిగా‌ లేఖనాలు స్పష్టంగా పరిచయం చేసే ప్రభువైన యేసుక్రీస్తు దైవత్వాన్ని కానీ విశ్వసించరు . ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే తప్ప దేవుడు కాదనేది వీరు బోధించే విషపూరితమైన దుర్బోధల్లో ప్రధానమైనదిగా ఉంటుంది. అందుకే త్రిత్వసిద్ధాంతం గురించిన కొద్దిపాటి వివరణ తెలియచేసి, దానిని మరింత లోతుగా తెలియచేసే వ్యాసాన్ని మీకు పరిచయం చెయ్యడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుడని లేఖనాలు ప్రత్యక్షపరిచే కొన్ని ఆధారాలు పరిశీలిద్దాం.

అపో.కార్యములు 20: 28 దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి.

ఈ వచనంలో తన స్వరక్తాన్ని కార్చి సంఘాన్ని సంపాదించిన యేసుక్రీస్తు దేవుడని రాయబడింది. ఒకవేళ Church of Christ కల్ట్ వారు ఇక్కడ దేవుడు అని ఉన్నచోట తెలుగు బైబిల్ పుట్ నోట్ లో ప్రభువు అనే మాట చూపించి అక్కడ దేవుడని మూలభాషలో లేదని ‌వాదించే ప్రయత్నం చేస్తారేమో, గ్రీకు భాషలో అక్కడ "థియోస్" అని రాయబడింది. దాని అర్థం దేవుడు.

మరొక వచనాన్ని చూడండి:

ప్రకటన గ్రంథం 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించు కొనును; నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.

ఈ వచనంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు తాను దేవుడినని తెలియ చేస్తున్నారు. ఆయన తన గురించి స్వయంగా చెబుతున్న మాటలను కూడా ఈ Church of Christ విస్మరిస్తుందంటే వీరు ఎంత దారుణమైన క్రీస్తువిరోధులో మనం గుర్తించాలి. యోహాను సువార్త 1:1 వచనంలో యోహాను ఆయనను దేవుడని పరిచయం చెయ్యడం మనం చూస్తాం. ఒకవేళ ఈ Church of Christ వారు వాక్యభాగాల్ని వక్రీకరించడంలో మేథావులు కాబట్టి నిర్గమకాండం 7:1 వచనంలో మోషే దేవుడు కానప్పటికీ, దేవుడు ఫరోకు అతనిని దేవునిగా నియమించినట్టుగానే, యేసుక్రీస్తు కూడా దేవుడు కానప్పటికీ తండ్రి ఆయనను మనకి దేవునిగా నియమించాడని చెప్పే ప్రయత్నం చేస్తారేమో.

ఈవచనాలు చూడండి.

కొలస్సీయులకు 2: 9 ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;

మోషేలో దేవత్వం నివసించలేదు, యేసుక్రీస్తులో ఆ దైవత్వం పరిపూర్ణంగా నివసించింది. పాతనిబంధన కాలంలో దేవుని ప్రతినిధులుగా పనిచేసిన కొందరిని దైవాలని సంబోధించేవారు. కేవలం దైవాలని పిలవడానికీ దైవత్వాన్ని కలిగి ఉనికిని చాటడానికి చాలా తేడా ఉంది (నిర్గమకాండము 4:16, 7:1 వ్యాఖ్యానం చూడండి)

ఫిలిప్పీయులకు 2:6,7,8 ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.

ఈ వచనాలు యేసుక్రీస్తు దేవునితో సమానుడైన దేవుడని, ఆయన తండ్రి చేత మోషే వలే నియమించబడిన దేవుడు కాదని సాక్ష్యమిస్తున్నాయి. బైబిల్ ఇంత స్పష్టంగా యేసుక్రీస్తు దేవునితో సమానుడైన దేవుడని చెబుతుంటే ఆయనను మోషేను పోల్చడం అజ్ఞానం అనుకోవాలా, కుయుక్తి అనుకోవాలా?

ప్రభువైన యేసుక్రీస్తు తండ్రితో సమానుడైన దేవుడని ఈ వచనమే కాకుండా బైబిల్ లో మరెన్నో వచనాలు దృఢంగా సాక్ష్యమిస్తున్నాయి. వాటిలో మరికొన్నిటిని పరిశీలించండి.

యెషయా గ్రంథము 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును.

యూదులు ఎదురుచూస్తున్న మెస్సీయ‌ (యేసుక్రీస్తు) గురించి రాయబడిన ఈ ప్రవచనంలో ఆయన బలవంతుడైన దేవుడని రాయబడింది. బలవంతుడైన దేవునిగా పిలవబడే అర్హత యెహోవాకు మాత్రమే ఉంది.

యెషయా 49: 26 యెహోవానైన నేనే నీ రక్షకుడననియు యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుష్యు లందరు ఎరుగునట్లు నిన్ను బాధపరచువారికి తమ స్వమాంసము తినిపించె దను క్రొత్త ద్రాక్షారసముచేత మత్తులైనట్టుగా తమ రక్తము చేత వారు మత్తులగుదురు.

తీతుకు 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు మహాదేవుడని రాయబడింది. కొందరు ఈ వచనాన్ని వక్రీకరించి;
మహాదేవుడు అంటే యెహోవా మన రక్షకుడు అంటే యేసుక్రీస్తు అని విడదీసే ప్రయత్నం చేస్తుంటారు. కానీ గ్రీకులో ఆ మాటలు చదివితే అలా విడదీసే ఆస్కారం ఏమాత్రం లేదు. మన తెలుగు బైబిల్ లోనైనా  సందర్భానుసారంగా దానిని చదివితే ఇటువంటి అనుమానాలకు తావులేదు. ఎందుకంటే, విశ్వాసులు ఎదురుచూసేది యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసమే కదా! కాబట్టి ఈ వచనంలో మహాదేవునిగా పిలవబడింది యేసుక్రీస్తే. ఇప్పుడు పాతనిబంధనలో మహాదేవునిగా తండ్రియైన దేవుని గురించి రాయబడిన మాట చూడండి.

ద్వితియోపదేశకాండము 10: 17 ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.

మరొక సందర్భం చూడండి.

రోమీయులకు 9:5 శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు సర్వాధికారియైన దేవునిగా సంబోధించబడ్డాడు. కొందరు ఈ వచనాన్ని కూడా వక్రీకరించి ఇది యేసుక్రీస్తు గురించి కాదని చెప్పే ప్రయత్నం చేస్తారు కానీ, సండే స్కూల్ పిల్లాడు ఈ వచనాన్ని చదివినా వారి వక్రీకరణను కనిపెట్టేసి ఈ వచనంలో సర్వాధికారియైన దేవుడు యేసుక్రీస్తే అని ఒప్పుకుంటాడు. ఎందుకంటే అక్కడ సందర్భం ఆయన గురించే, శరీరమును బట్టి వారిలో (యూదులలో) పుట్టింది ఆయనే.

ప్రకటన గ్రంథము 1:8 అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

ఈ వచనంలో కూడా యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడని రాయబడింది. పాతనిబంధనలో సర్వాధికారం‌, సర్వశక్తి కలిగిన దేవునిగా యెహోవా దేవునిగురించి ఎన్నో వచనాలు రాయబడ్డాయి. కాబట్టి యేసుక్రీస్తు తండ్రితో పాటు సర్వాధికారం, సర్వశక్తి కలిగిన దేవుడు.

మత్తయి 12: 8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడనెను.

విశ్రాంతి దినాన్ని నియమించిన తండ్రియైన  యెహోవా మాత్రమే విశ్రాంతి దినానికి ప్రభువు. ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు దానిని‌ తనకు ఆపాదించుకుంటూ తనను తాను దేవునితో సమానుడిగా చాటుకొంటున్నాడు. ఆయన తండ్రితో పాటు సమానదేవుడు మాత్రమే కాదు, సమానంగా ఆరాధించబడుతున్న దేవుడు కూడా.

ఈ వచనాన్ని చూడండి;

ప్రకటన గ్రంథము 5:12,13,14 వారు వధింపబడిన గొఱ్ఱెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై యున్నవానికిని గొఱ్ఱెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. ఆ నాలుగు జీవులు - ఆమేన్‌ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారముచేసిరి.

మనం పాతనిబంధనను చదివేటప్పుడు యెహోవా దూతగా ఒకరు పరిచయం చెయ్యబడి, దేవునిగా, యెహోవాగా తన ఉనికిని చాటుకుంటారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆ అంశం గురించి మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం  చదవండి.

యెహోవా దూత ఎవరు?

మూడవదిగా;

ఈ Church of Christ కల్ట్, సార్వత్రిక క్రైస్తవసంఘం లేఖనాల ఆధారంగా విశ్వసిస్తున్న జన్మపాపం అనేది తప్పుడు బోధ అని ప్రచారం చేస్తారు. లేఖనాలు చాలా స్పష్టంగా ఆదాము హవ్వలు చేసిన పాపం‌ వల్ల లోకంలోకి పాపం, మరణం వచ్చాయని చెబుతున్నాయి.

రోమీయులకు 5: 12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఆదాము నుండి పుట్టుకు వస్తున్న యావత్తు మానవజాతి అంతా పాపం చేసే స్వభావంతోనే పుడుతున్నారని, అందుకనే ఒక్క నీతిమంతుడు కూడా భూమి పైన లేడని బైబిల్ చెపుతుంది.

రోమీయులకు3:10,11,12 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు. అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఈ కారణం చేతనే పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులు సైతం నెరవేర్చాలనే ఆశను కలిగియున్నప్పటికీ వారిలో ఉన్న పాపపు స్వభావం వలన చేయకూడని పాపాన్ని చేస్తూ ధర్మశాస్త్రములోని పరిశుద్ధమైన ఆజ్ఞలను కచ్చితంగా అనుసరించే విషయములో విఫలమవుతూ దేవుని దృష్టికి మరింత పాపులుగా మారుతున్నారు.

రోమీయులకు 7:14- 21 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేష్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది.

అందుకే మానవులంతా వారిలోని స్వభావసిద్ధమైన పాపం కారణంగా దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉన్నారు.

ఎఫెసీయులకు 2:3 వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి.

మానవుడు పాపం చేస్తాడు కాబట్టి పాపి కాలేదు, మానవుడు స్వభావసిద్ధంగా పాపి కాబట్టే పాపం చేస్తాడు. సృష్టిలో ప్రతీదీ కూడా తన స్వభావాన్ని బట్టే ఉనికిని చాటుకుంటుంది. ఆదాము హవ్వల పాపం తరువాత వారి సంతానమంతా స్వభావసిద్ధంగా పాపులుగా పుడుతున్నారు. అంటే మనుషులు పుడుతూనే పాపం చేస్తారని కాదు కానీ, పాపానికి మొగ్గుచూపే స్వభావం వారిలో అప్పటినుండే ఉందని అర్థం. ఈ కారణం వల్లే మానవులకు కృపద్వారా రక్షణ అవసరమైంది. ఎందుకంటే స్వభావసిద్ధంగా పాపియైన మనుషుడు దేవుడు ఏర్పాటు చేసిన నీతిక్రియలను తూచా తప్పకుండా పాటించడంలో విఫలమౌతున్నాడు. కాబట్టి మానవులకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించే కృపద్వారా రక్షణ మార్గాలను తెరిచాడు. కృప అనగా మానవునికి ఏది రావాలో అది ఇవ్వకుండా, మానవుడు దేనిని సంపాదించుకోలేడో దానిని అనుగ్రహించడం. మానవుడు తాను చేసే పాపానికి ప్రతిఫలంగా శిక్షను పొందుకోవాలి. దేవుడు ఆ శిక్షను మానవుడికి ఇవ్వకుండా ఆ మానవుడు పాపం‌ కారణంగా సంపాదించుకోలేని రక్షణను అనుగ్రహించాడు. దీనిప్రకారం, జన్మపాపాన్ని విస్మరించే Church of Christ కల్ట్ వారు యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని కూడా విస్మరిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ఈలోకంలోకి ఎందుకు వచ్చాడో చూడండి.

మార్కు 10:45 మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.

ఈ వచనాలలో యేసుక్రీస్తు అనేకుల విమోచన క్రయధనంగా తన ప్రాణాన్నిని ఇవ్వడానికి వచ్చినట్టుగా  చెబుతున్నారు. దేనినుండి విమోచించడానికి ఆయన తన ప్రాణం పెట్టాడు పాపం నుండేకదా. ఇప్పుడు ఇంకొక మాటను చూడండి.

యోహాను 14: 6 యేసు నేనే మార్గమును,సత్యమును,జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు.

ఈ వచనంలో యేసుక్రీస్తు‌ నా ద్వారానే ఎవరైనా తండ్రిదగ్గరకు వెళ్ళగలరని చెప్పడానికి కారణం;
ఆయన తన మరణం ద్వారా ఎందరి పాపాలకైతే విమోచన క్రయధనాన్ని చెల్లించాడో, వారికి మాత్రమే తండ్రి దగ్గరకు వెళ్లే అవకాశం దక్కుతుంది. ఇప్పుడు Church of Christ కల్ట్ వారి వాదన ప్రకారం ప్రతీ మనిషీ జన్మతహ పాపి కాకుండా, ఒక వయస్సు అనేది వచ్చినప్పుడే పాపిగా మారితే ఆ పాపిగా మారే వయస్సుకు ముందే ఎవరైనా చనిపోతే యేసుక్రీస్తు చెల్లించే విమోచన క్రయధనంతో కానీ, కృపతో కానీ పనిలేకుండా వారికి వారే తండ్రిదగ్గరకు వెళ్ళగలరు. దీని ప్రకారం యేసుక్రీస్తు నా ద్వారా తప్ప ఎవడూ పరలోకం వెళ్ళలేడని పలికిందీ, కృపచేత మాత్రమే రక్షణ అనేదీ అబద్ధం ఔతుంది.

ఎఫెసీయులకు 2: 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వాక్యం కానీ, యేసుక్రీస్తు కానీ అబద్ధం అని చెప్పే అవకాశం లేదు.

దీనిప్రకారం, Church of Christ అబద్ధాలు చెప్పి యేసుక్రీస్తు అనుగ్రహించిన కృపనూ, ఆయన బలియాగాన్నీ చులకన చేస్తుందని మనం గ్రహించాలి, ఇది సాతాను తంత్రం. సాతాను మాత్రమే ప్రారంభం నుండీ యేసుక్రీస్తు బలియాగాన్నీ, ఆయన అనుగ్రహించిన కృపనూ నిర్వీర్యం చేయాలని ఎన్నోవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు.

గలతీయులకు1:6,7 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచినవానిని విడిచి, భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరియొక సువార్త కాదుగాని, క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు.

పాతనిబంధనలోని భక్తులు కూడా యేసుక్రీస్తు వారి పాపాలకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని చెల్లించి కృపను అనుగ్రహిస్తేనే పరలోకం వెళ్తారు. ఉదాహరణకు మనందరికీ యోబు గురించి తెలుసు. ఆయన గురించి స్వయంగా దేవుడే చెబుతున్న మాటలు చూడండి.

యోబు గ్రంథము 1:8 అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు.

ఇక్కడ స్వయంగా దేవుడే యోబు యథార్థవంతుడనీ, న్యాయవంతుడనీ, చెడుతనం లేనివాడనీ సాక్ష్యమిస్తుంటే యోబు మాత్రం ఆత్మప్రేరేపణతో ఏమంటున్నారో చూడండి.

యోబు 19: 25 అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేనెరుగుదును.

యోబు ఈ వచనంలో యేసుక్రీస్తు గురించి ప్రవచిస్తూ యేసుక్రీస్తును తన విమోచకునిగా పేర్కొంటున్నాడు. ఒక వ్యక్తిలో పాపం ఉన్నప్పుడు మాత్రమే అతనికి విమోచకుడు కావాలి. యోబు ఆయన అర్పించే బలులను బట్టి, దేవుని పట్ల కనపరచే భయభక్తులను బట్టి , పాపపు క్రియలకు దూరంగా ఉండడాన్ని బట్టి న్యాయవంతునిగా, చెడుతనాన్ని విసర్జించినవాడిగా, యథార్థవంతునిగా దేవునిచేత పిలవబడినప్పటికీ యోబులో కూడా పాపం ఉంది. అందుకే యేసుక్రీస్తు కలిగించే విమోచన అతనికి అవసరం అయ్యింది. ఆ పాపం అతనికి ఆదాము హవ్వలనుండి స్వాభావికంగా సంక్రమించింది. యేసుక్రీస్తు కనుక యోబులోని పాపపు స్వభావానికి క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించకపోతే ఆయన కూడా తండ్రి దగ్గరకు వెళ్ళలేడు.‌ ఎందుకంటే దేవుడు 1% పాపంతో కూడా రాజీపడడు.

సాధారణంగా జన్మపాపాన్ని విస్మరించేవారంతా బైబిల్ లో ఒక వచనాన్ని ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తుంటారు.

ప్రసంగి 7:29 ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించు కొని యున్నారు.

ఈ వచనంలో ఆయన మానవులను యథార్థవంతులుగా పుట్టించెను అనేమాట కనిపిస్తుంది. దానిని బట్టే వారు మానవుడు జన్మతహ పాపికాడని వాదించే ప్రయత్నం చేస్తారు. యథార్థవంతుడు అన్నప్పుడు అతనిలో పాపపు స్వభావం కూడా లేదనే అర్థం రాదు కానీ, కేవలం క్రియలమూలంగా పాపి కాలేదు అనే అర్థం మాత్రమే వస్తుంది. పుట్టేబిడ్డ పాపం చేయడు కానీ, పాపపు స్వభావంతోనే ఉన్నాడని పైన జ్ఞాపకం చేసుకున్నాము. అదేవిధంగా యోబు కూడా దేవుని చేత యథార్థవంతుడని పేర్కొన్నప్పటికీ అతనిలోనూ పాపం ఉందని యోబు మాటల్లోనే గ్రహించాము. పుట్టే పిల్లలు క్రియల మూలంగా పాపులు కానప్పటికీ వారు తరువాత దేవునికి వేరుగా వివిధ తంత్రాలను కల్పించుకోవడాన్ని ‌బట్టి వారిలో పుట్టుక నుంచీ వచ్చిన పాప స్వభావాన్ని కనుపరచుకుంటున్నారు.

దీనికి ఆధారంగా మరోమాటను చూడండి;

కీర్తనల గ్రంథము 51:5 నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.

ఈ సందర్భంలో, దావీదు తన క్రియల మూలంగా చేసిన పాపాన్ని ఒప్పుకోవడమే కాకుండా, ఆయన అలా పాపం చెయ్యడానికి కారణం, పుట్టుక నుండే తనలో పాపం ఉందని చెబుతున్నాడు. తనలోకి తల్లిగర్భం నుండే ప్రవేశించిన పాపపు స్వభావం వల్లే క్రియలమూలంగా తాను పాపం‌ చేసానని, చెబుతూ మానవుడు జన్మతహ పాపి అనడానికి దావీదు స్పష్టమైన ఆధారాన్ని మనకిస్తున్నాడు.
కొందరు దావీదు మాటలను తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తూ, దావీదు తల్లి వ్యభిచారం చేసి గర్భం ధరించిందని అందుకే దావీదు ఈ విధంగా చెబుతున్నాడని పొరపడుతుంటారు. ఒకసారి ఈ వచనాన్ని పరిశీలించండి.

యెషయా 11: 1 యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును వాని వేరులనుండి అంకురము ఎదిగి ఫలించును.

యేసుక్రీస్తు గురించి రాయబడిన ఈ ప్రవచనంలో ఆయన యెష్షయి మొద్దు నుండి పుట్టే చిగురుగా వర్ణించబడ్డాడు. యేసుక్రీస్తు దావీదు సంతానంలో జన్మించాడు.

రోమీయులకు 1: 5 యేసుక్రీస్తు, శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను.

ఒకవేళ దావీదు తల్లి వ్యభిచారం చేసి అతనిని కనుంటే, దావీదు యెష్షయి కొడుకు కాకుండా పోతాడు, దావీదు సంతానంలో పుట్టిన యేసుక్రీస్తు యెష్షయి మొద్దు నుండి పుట్టే చిగురు కాకుండా పోతాడు. కాబట్టి దావీదు నేను పాపంలో పుట్టాను పాపంలోనే నాతల్లి నన్ను గర్భాన ధరించెననే మాటల్లో అతని తల్లి వ్యభిచరించిందనే ఉద్దేశం లేదు. అదేవిధంగా మరికొందరు దావీదు తల్లితండ్రుల కలయికను ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడుతున్నాడని భావిస్తారు,అది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే;

హెబ్రీయులకు 13: 4 వివాహము అన్ని విషయములలో అందరిలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును.

ఇప్పుడు జన్మపాపం లేదని ప్రచారం చేసే వారు తీసుకువచ్చే కొన్ని ప్రశ్నలకు సమాధానం చూద్దాం;

పుట్టే మనిషికి పాపం ఉంటే స్త్రీ పురుషుల కలయిక పాపమా? దేవుడు ఆ కలయికను నిష్కల్మషమైనదని పేర్కొన్నాడుగా?

సమాధానం: జన్మపాపం అనే అంశాన్ని బోధించే సార్వత్రిక క్రైస్తవ సంఘం వివాహం తరువాత భార్యభర్తల కలయికలోని పాపం కారణంగా, పుట్టే పిల్లలు పాపులుగా పుడుతున్నారని ఎక్కడా చెప్పదు. మానవజాతికి ఆది తల్లితండ్రులైన ఆదాము హవ్వల పాపం కారణంగానే లోకంలోకి పాపం అనేది ప్రవేశించిందని పైభాగంలో వాక్యాధారంతో సహాయ చూసాం.

గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని బైబిల్ చెబుతుంది, ఆ గర్భఫలాన్ని దేవుడే పాపంతో ఇస్తున్నాడా?

సమాధానం: ఆదాము హవ్వల ద్వారా ఈలోకంలోనికి మానవజాతిని విస్తరింపచెయ్యడం దేవుని ఉద్దేశం. దేవుడు ఇచ్చే ప్రతీ గర్భఫలం వారి నుండే వస్తుంది. ఆదాము హవ్వలు పాపులు అయ్యారు కాబట్టి వారి నుండి జన్మించే గర్భఫలానికి కూడా ఆ పాపపు స్వభావం సోకుతుంది. ఇక్కడ దేవుడు పుట్టబోయే బిడ్డలో పాపాన్ని పెట్టి పుట్టించడం లేదు కానీ, అప్పటికే పాపులైన ఆది దంపతుల నుండి ఈ మానవజాతి విస్తరిస్తుంది కాబట్టి దేవుడు దానిని కొనసాగిస్తున్నాడు.

ఎఫెసీయులకు 1:12 ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

ఈ ప్రశ్నవేసే వారికి నా ప్రతిప్రశ్న - హెచ్. ఐ. వి. సోకిన దంపతులకు పుట్టే పిల్లలకి అదే హెచ్. ఐ. వి. వ్యాధి ఎందుకు సోకుతుంది? దేవుడు ఆ వ్యాధిని తీసేసి ఎందుకు పుట్టించడం లేదు?

ఆదాము హవ్వలు పాపం చేస్తే మనకెందుకు పాపస్వభావం రావాలి? వారితో కలసి మనమేమీ పాపం చేయనప్పుడు దేవుని దృష్టిలో మనం ఎందుకు దోషులం కావాలి? ఇది అన్యాయం కాదా?

సమాధానం: ఈ ప్రశ్న వేసేవారు ముందుగా ఆదాము హవ్వలకు దేవుడు చేసిచ్చిన సృష్టిని ఎందుకు అనుభవిస్తున్నారో, వారి ఆశీర్వాదమైన ఫలించడం, అభివృద్ధి చెందడం వంటివి వీరి జీవితంలో ఎందుకు నెరవేరుతున్నాయో, సమాధానం చెప్పాలి. ఆదాము హవ్వల పాపం మనకు ప్రాప్తించడం అన్యాయమైతే వారి ఆశీర్వాదాలూ, సృష్టీ మనం అనుభవించడం అన్యాయం కాదా మరి? ఆదాము హవ్వల పాపం నుండి మనకు పాపస్వభావం సంక్రమించింది కాబట్టే, యేసుక్రీస్తు చేసిన నీతికార్యాన్ని, బలియాగాన్ని దేవుడు విశ్వాసులకు ఆపాదించి వారికి రక్షణ కలిగేలా చేసాడు.

రోమీయులకు 5: 18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.

1 పేతురు 2: 24 మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.

రోమీయులకు 3: 26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.

ఆదాము నందు ప్రతీ మనుష్యుడూ పాపిగా మారాడు, క్రీస్తునందు ప్రతీ విశ్వాసీ నీతిమంతునిగా మారుతున్నాడు. ఇందులో ఏ అన్యాయమూ లేదు. ఇవి జన్మపాపాన్ని విస్మరించేవారి ప్రశ్నలు; చదువరులకు ఇతర ప్రశ్నలు ఏమైనా తలెత్తితే కామెంట్ ద్వారా తెలియచేయగలరు.

నాలుగవదిగా;

ఈ Church of Christ కల్ట్ వారిలో కొందరు పాత నిబంధనలో ఉన్నదేదీ కూడా మనకి ప్రామాణికం కాదని బోధిస్తారు. దీనికి వీరు వక్రీకరించే వాక్యభాగాలు చూడండి.

రెండవ కొరింథీయులకు 3:14-16 మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాత నిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.

హెబ్రీయులకు 8: 7 ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవదానికి అవకాశముండనేరదు.

వాస్తవానికి అపోస్తలుడైన పౌలు పాతనిబంధన కొట్టివేయబడింది అన్నప్పుడు ఆదికాండం నుండి మలాకీ వరకూ ఉన్న 39 గ్రంథాల గురించి మాట్లాడటం లేదు. పౌలు కాలం నాటికి ఆ 39 గ్రంథాలకూ పాతనిబంధన అనే పేరు కూడా పెట్టబడలేదు. పౌలుకాలం‌ నాటికి హెబ్రీయులు వాడే లేఖనాలు ఐదు భాగాలుగా ఉండేవి, అప్పటికే గ్రీకులోకి అవి తర్జుమా చేసిన సెప్టువజింటు ఉన్నప్పటికీ, అది కూడా పాతనిబంధనగా పిలవబడలేదు.

క్రైస్తవ సంఘపెద్దలు క్రీస్తు శకం 2 తరువాత లేఖనాలు "ప్రామాణీకరణ" (Canonization/కేననైజేషన్) చేసే సమయంలో మాత్రమే బైబిలోని యిర్మియా 31:31 లోని పాతనిబంధన, కొత్తనిబంధన అనే పేర్లను తీసుకుని ఆ పేర్లతో బైబిల్ ను రెండుగా విభజించడం జరిగింది. ఆదికాండం నుండి మలాకీ వరకూ ఉన్న లేఖనాలకు పాతనిబంధన అనే పేరులేని సమయంలో పౌలు పాతనిబంధన కొట్టివేయబడింది అంటే, అది ఇప్పుడున్న పాతనిబంధనే అని బోధించే Church of Christ వారిని  (కొందరిని) ఎంత జ్ఞానవంతులనుకోవాలో మీరే ఆలోచించండి.

పౌలు పాతనిబంధన కొట్టివేయబడిందని ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు సున్నతి, క్రీస్తు బలియాగానికి ఛాయగా ఉన్న బలులు, క్రీస్తు ద్వారా విశ్వాసులు పొందబోయే విశ్రాంతికి ఛాయగా ఉన్న విశ్రాంతిదినం. వీటిని విధిరూపకమైన ఆజ్ఞలు అంటారు.

ఎఫెసీయులకు 2:14 ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకము చేసెను.

కొలొస్సయులకు 2:13-17 మరియు అపరాధముల వలనను, శరీరమందు సున్నతిపొందక యుండుటవలనను, మీరు మృతులైయుండగా, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలవలన మనమీద ఋణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి,మనకు అడ్డములేకుండ దానిని ఎత్తి వేసి మన అపరాధములనన్నిటిని క్షమించి, ఆయనతో కూడ మిమ్మును జీవింపచేసెను;ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది.

ఐదవదిగా;

ఈ Church of Christ కల్ట్ వారు యోహాను 4:24 లో దేవున్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనే యేసుక్రీస్తు మాటలను చూపించి, మన ఆరాధనల్లో సంగీత వాయిద్యాలు వాడకూడదనీ, అలావాడితే పాపమని బోధిస్తారు. పాతనిబంధనలో భక్తులు అనేక సందర్భాల్లో సంగీత వాయిధ్యాలతో దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తాం, కీర్తనలు గ్రంథంలో రాయబడిన అనేకమైన కీర్తనలు సంగీత వాయిద్యాలు వాయిస్తూనే భక్తులు పాడేవారు. ప్రవక్తల సమూహాలు కూడా వాయిధ్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించేవారు.

కీర్తనల గ్రంథము 150:3,4,5 బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలముతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి. గంభీరధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి.

1 సమూయేలు 10:5 ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు.

ఈ వచనాలను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు అవసరమైనంత మట్టుకు సంగీత వాయిద్యాలు వాయించవచ్చనీ, భక్తులు కూడా వాటిని ఉపయోగించి దేవుణ్ణి ఆరాధించారనీ, అందులో ఎటువంటి పాపమూ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ Church of Christ వారు పాతనిబంధన ఆచారాలను కొత్తనిబంధన కాలంలో ఆచరించకూడదనీ, ఒకవేళ పాత నిబంధనలోని వాక్య ఆధారాలు చూపించి వాయిద్యాలు వాయించడం సరైనదని నిరూపించేవారెవరైనా పాతనిబంధనలో రాయబడిన సున్నతిని పాటించాలని, బలులు అర్పించాలని వాదించే ప్రయత్నం చేస్తుంటారు.

అయితే పైభాగంలో పాతనిబంధనలో విధిరూపకమైన ఆజ్ఞలు అనగా క్రీస్తునందు కొట్టివేయబడిన విధిరూపకమైన, ఆజ్ఞలు మినహా పాతనిబంధనలో మిగిలినవన్నీ మనకి ప్రామాణికమే అని తెలియచేసాను. సున్నతి, బలులు క్రీస్తునందు కొట్టివేయబడ్డాయని కొత్తనిబంధన స్పష్టంగా చెబుతుంది కాబట్టి ఇప్పుడు వాటిని మనం పాటించాల్సిన అవసరం లేదు.

కొలస్సీయులకు 2: 11 మీరును, క్రీస్తు సున్నతియందు, శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయనయందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి.

గలతియులకు 6: 15 క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందక పోవుట యందేమియు లేదు.

హెబ్రీయులకు 9:11-14 అయితే క్రీస్తు రాబోవుచున్న(అనేక ప్రాచీన ప్రతులలో కలిగియున్న, అని పాఠాంతరము) మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణ మైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదె చల్లుటయు, శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినయెడల, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కువగా శుద్ధిచేయును.

ఈ విధంగా కొత్తనిబంధన ఎక్కడైతే పాతనిబంధనలోని ఆచారాలను కొట్టివేస్తుందో అటువంటివాటిని మనం పాటించాల్సిన అవసరం లేదు కానీ కొత్తనిబంధన కొట్టివేయనటువంటి పాతనిబంధనలోని క్రమాన్ని మనం అనుసరించడంలో పొరపాటు లేదు. కొత్తనిబంధనలో ఎక్కడా కూడా ఆరాధనలో సంగీత వాయిధ్యాలు వాయించడం పాపం అని రాయబడలేదు, వాటిని చేయవద్దని ఆజ్ఞాపించనూ లేదు.

ప్రస్తుత మన సంఘాలు ఆరాధ‌నలో సంగీత వాయిద్యాలు అవసరమైనంత మట్టుకు వాడడం దేవుని దృష్టిలో సరైన ఆరాధనే ఔతుంది. అయితే Church of Christ కల్ట్ వారు కొత్తనిబంధనలో భక్తులెవరూ తమ ఆరాధనల్లో సంగీత వాయిద్యాలు వాయించినట్టుగా ఎందుకు రాయబడలేదని ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నవేసే Church of Christ కల్ట్ వారికి నేను కూడా ఒక ప్రశ్న వేయాలి అనుకొంటున్నాను. కొత్తనిబంధనలో ఎక్కడా చర్చి బిల్డింగ్ కట్టినట్టుగా రాయబడలేదు.  మరి  మీరెందుకు చర్చి బిల్డింగులు కడుతున్నారు? కొత్తనిబంధన రాయబడిన కాలంలో సంఘమంతా రోమా ప్రభుత్వం నుండీ యూదుల నుండీ హింసను ఎదుర్కొంటూ, తమ ఆరాధనలు రహస్యంగా జరుపుకోవలసిన  పరిస్థితిలో ఉండింది. అటువంటి సమయంలో సంగీత వాయిద్యాలు వాయించడం సాధ్యమౌతుందా?

బహుశా కొత్తనిబంధనలో సంఘపువారు తమ ఆరాధనలో సంగీతవాయిద్యాలు వాయించినట్టుగా  ఉండకపోడానికి ఇదొక కారణం కావచ్చు. (ఆరాధనలో అవి తప్పనిసరి అయితే భయపడకుండా తప్పకుండా వాయించేవారేమో, మనమిక్కడ వాటిని తప్పనిసరి అనడం లేదు కానీ అసలు వాటిని ఉపయోగించడమే పాపమనే వాదనను ఖండిస్తున్నాం). ఇంకో విషయం కొత్త‌నిబంధనలో కూడా ఒక సందర్భంలో త్రియేకదేవుణ్ణి సంగీత వాయిద్యాలతో ఆరాధిస్తున్నట్టుగా రాయబడింది.

ప్రకటన 15:2-4 మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగల వారై, ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచియుండుట చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు(అనేక ప్రాచీన ప్రతులలో-జనములకు అని పాఠాంతరము) రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు? నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరు వచ్చి నీ సన్నిధిని నమస్కారముచేసెదరని చెప్పుచు, దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.

ఈ వచనంలో విశ్వాసం ద్వారా అపవాదిని జయించిన భక్తులందరూ దేవుని వీణలుగలవారై పాటలు పాడుతున్నట్టుగా  రాయబడింది. ఒకవేళ ఆరాధనలో సంగీత వాయిద్యాలు వాయించడం పాపమే ఐతే, పాపమైన వాటిని పరిశుద్ధాత్ముడు అలంకార ప్రాయంగానైనా ఈ సందర్భంలో ఎందుకు రాయించాడో Church of Christ కల్ట్ వారు సమాధానం చెప్పాలి. ఇకపోతే దేవుణ్ణి  ఆత్మతోనూ, సత్యంతోనూ ఆరాధించాలనే యేసుక్రీస్తు మాటలను ఆధారం చేసుకుని ఆరాధనలో సంగీతవాయిద్యాలు వాడకూడదు, చప్పట్లు కొట్టకూడదు అనేది church of Christ కల్ట్ వారి కొలమానం ఐతే ఆరాధనలో నోరు కూడా తెరవకూడదుగా?

ఎందుకంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఆ సందర్భంలో ఆత్మతో సత్యంతో అని ఉందికానీ, నోటితో అని లేదుగా? Church of Christ కల్ట్ వారు తమ ఆరాధనల్లో నోర్లు తెరవకుండా ఆరాధిస్తున్నారో ఏమో వారికే తెలియాలి. సార్వత్రిక క్రైస్తవ సంఘం అవసరమైనంత మట్టుకు తమ ఆరాధనల్లో వాక్యం చెప్పినట్టుగా సంగీత వాయిద్యాలు వాయిస్తారు, చప్పట్లు కొడతారు ఇది దేవుని దృష్టికి అంగీకారమే (ఎవరైనా శృతిమించి ఎక్కువ చేస్తుంటే అది వారిలోపం).

చివరగా ఈ church of Christ కల్ట్ వారు సంగీత వాయిద్యాలు వాయించకూడదు అని నిరూపించేందుకు బైబిల్ నుంచి వక్రీకరించే మరొక సందర్భాన్ని చూద్దాం. సాధారణంగా మన క్రైస్తవ సంఘంవారు సంగీత వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించడంలో దావీదుతో పోల్చుకుంటూ ఉంటారు. దావీదు సంగీతవాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి ఎంత గొప్పగా ఆరాధించేవాడో మనకందరికీ తెలుసు, అయితే ఈ Church of Christ కల్ట్ వారు సందర్భానికి వేరుగా ఒక వచనాన్ని చూపించి, దానిని  వక్రీకరించి దావీదువలే మనం సంగీత వాయిద్యాలు వాయించకూడదని చెప్పేప్రయత్నం చేస్తారు. ఆ వచనాన్ని చూడండి.

ఆమోసు 6:5 స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించుకొందురు.

Church of Christ కల్ట్ వారు ఈ వచనాన్ని చూపించే దావీదులా మనం సంగీతవాయిద్యాలు వాయించకూడదంటూ వాదిస్తారు. వాస్తవానికి ఈ ఆమోసు గ్రంథంలో కేవలం సంగీత వాయిద్యాలే కాదు వారు అర్పించే బలులు, వారు పాటించే పండుగలు, విశ్రాంతి దినాన్ని దేవుడు ద్వేషిస్తున్నట్టుగా రాయిస్తాడు (ఆమోసు 5:21, 8:5). దేవుడు ఈవిధంగా వారు చేస్తున్న అన్నింటినీ ఎందుకు అసహ్యించుకుంటున్నాడో ఆమోసు గ్రంథం మొత్తం చదివితే మనకు అర్థమౌతుంది. వారు ఒకవైపు దేవుని దృష్టికి అన్యాయాన్ని, పాపాన్నీ జరిగిస్తూ మరోవైపు దైవభక్తులవలే దైవకార్యాలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుచేతనే వారు అర్పించే బలులను కానీ, వారు ఆచరించే పండుగలను కానీ, వారు వాయిద్యాలతో పాడే పాటలను కానీ లక్షపెట్టననీ, అవి చేయడం వల్ల వారికే ప్రయోజనం లేదని దేవుడు బుద్ధి చెపుతూ ఈమాటలు రాయిస్తున్నాడు. ఈ Church of Christ కల్ట్ వారికి సందర్భానుసారంగా వాక్యాన్ని అర్థం చేసుకొనే సామర్థ్యమే ఉంటే ఇన్ని పనికిమాలిన బోధలు ఎందుకు చేస్తారు పాపం! వారికి వాక్యం అర్థం కాకుండా అపవాది వారి నేత్రాలను మూసి తన కార్యాన్ని జరిపించుకుంటున్నాడు.

ఈ విధంగా Church of Christ కల్ట్ వారు ప్రధానంగా చేసే కొన్ని దుర్భోధలన్నీ సమాధికి చేరాయి. భవిష్యత్తులో వారు చేసే మరికొన్ని దుర్భోధలను ఖండిస్తూ మీ ముందుకు వస్తాను.

 

Add comment

Security code
Refresh

Comments  

# KSamuel k 2020-02-21 08:45
It is very useful and good expose.
Reply
# RE: సమాధికి చేరి కుళ్లిపోయిన Church of Christ వారి దుర్భోధలుRaju 2020-11-20 09:30
Wonderful explanation....
God bless you sir.......
Reply
# Wonderful explanation...Raju 2020-11-20 09:33
Wonderful explanation....
God bless you sir....
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.