నిజ క్రైస్తవ జీవితం

రచయిత: పాస్టర్ కరుణ కుమార్
చదవడానికి పట్టే సమయం: 11 నిమిషాలు

కొన్ని నెలల క్రితం ఒక ప్రయాణంలో నా ప్రక్కన కూర్చున్న వ్యక్తితో కాలక్షేపం కొరకు మాట్లాడదాం, వీలైతే సువార్తను తెలియచేద్దాం అని పలకరించాను. “మీ పేరేంటండీ, ఏం చేస్తుంటారు” అని సంభాషణ ప్రారంభించాను. ఆయన “నా పేరు ఏలియా నేను పాల వ్యాపారం చేస్తుంటాను” అని చెప్పాడు. బైబిల్ పేరు కదా అని “మీరు ప్రార్ధనకు వెళ్తారా?” అన్నాను. “నేను పెద్దగా వెళ్ళను కానీ, మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు, మేము క్రిస్టియన్సేనండి. మా తాతల నాటినుండి మా కుటుంబాలన్నీ క్రైస్తవులం” అని చెప్పాడు. ఆ మాట నన్ను బలంగా తాకింది, క్రైస్తవులు అంటే ఏమిటో నెమ్మదిగా, స్పష్టంగా అతనికి చెప్పడానికి ప్రయత్నం చేశాను...

ఆడియో

కొన్ని నెలల క్రితం ఒక ప్రయాణంలో నా ప్రక్కన కూర్చున్న వ్యక్తితో కాలక్షేపం కొరకు మాట్లాడదాం, వీలైతే సువార్తను తెలియచేద్దాం అని పలకరించాను. “మీ పేరేంటండీ, ఏం చేస్తుంటారు” అని సంభాషణ ప్రారంభించాను. ఆయన “నా పేరు ఏలియా నేను పాల వ్యాపారం చేస్తుంటాను” అని చెప్పాడు. బైబిల్ పేరు కదా అని “మీరు ప్రార్ధనకు వెళ్తారా?” అన్నాను. “నేను పెద్దగా వెళ్ళను కానీ, మా ఇంట్లో వాళ్ళు వెళ్తారు, మేము క్రిస్టియన్సేనండి. మా తాతల నాటినుండి మా కుటుంబాలన్నీ క్రైస్తవులం” అని చెప్పాడు. ఆ మాట నన్ను బలంగా తాకింది, క్రైస్తవులు అంటే ఏమిటో నెమ్మదిగా, స్పష్టంగా అతనికి చెప్పడానికి ప్రయత్నం చేశాను. అప్పుడతను “మీరు చెప్పినవారే నిజమైన క్రైస్తవులైతే నాకు తెలిసి భూమి మీద ఎవరూ క్రైస్తవులు లేరండి” అన్నాడు. “అలా ఏమి కాదండీ చాలా మంది ఉన్నారు, మీరు కూడా కావచ్చు” అని చెప్పాను.

ఈనాడు క్రైస్తవులు అని అనేకమంది పిలువబడుతున్నారు. ఆదివారం కాని, పండుగలకు కాని, ప్రత్యేక కార్యక్రమాలకు కాని, సంఘ కూడికలకు వెళ్ళే ప్రతి వారిని క్రైస్తవులని అనగలమా? క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నవారు స్వయంచాలికంగా క్రైస్తవులైపోతారా? కొన్ని కులాల వారందరు క్రైస్తవులా? కానే కాదు. అసలు నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు? అనే విషయాన్ని జాగ్రత్తగా దేవుని వాక్యంలోనుండి తెలుసుకుందాం. యేసు క్రీస్తు అనుచరులను లేదా శిష్యులను క్రైస్తవులు అని అంటారు. అపో. కా. 11:26 లో అంతియొకయలోని క్రీస్తు శిష్యులను మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలిచినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంధంలో మనం చూస్తాం. వాక్యానుసారంగా ఒక వ్యక్తి క్రైస్తవునిగా/క్రైస్తవురాలుగా పిలవబడుటకు కొన్ని లక్షణాలు వారు కలిగియుంటారు. అలాంటి వారి క్రైస్తవ ప్రయాణం ఎలా ప్రారంభం ఔతుందో, వారి తొలి అడుగులు ఏ విధంగా కొనసాగుతాయో వాక్యానుసారంగా పరిశీలన చేద్దాం.

"తిరిగి జన్మించిన వారు"

ఒక వ్యక్తి రక్షణ పొందడంలో జరిగే మొట్టమొదటి క్రియ తిరిగి జన్మించడం. ఒక వ్యక్తి తిరిగి జన్మించకుండా దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు క్రీస్తు చెప్పడం యోహాను 3:3 లో చూడగలం. ఇది దేవుని వలన జరిగే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడే రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాడు అని యెహే. 36:26లో చూస్తాం. ఒక వ్యక్తిలో రక్షణ క్రియను ప్రారంభించేది, కొనసాగించేది, క్రీస్తు దినం వరకూ తీసుకువచ్చేది దేవుడే అని ఫిలిప్పీ 1:6,ఎఫెసీ 1:3-12, 2:1-10లో మనం స్పష్టంగా చూడగలం. ప్రతీ మానవుడు తన పాపాలను బట్టి తనంతట తాను దేవుని దగ్గరకు రాలేని ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాడని, దేవుడే కరుణా సంపన్నుడై వానిని బ్రతికిస్తాడని ఎఫెసీ 2:4-5 వచనములలో చూడగలం. ఈ చనిపోయిన స్థితి నుండి బ్రతికించబడడమే తిరిగి జన్మించడం.పతనమైన లోకంలో పాపం శాపం అనే అంధకారంలో జీవిస్తున్న మానవునిపైన యేసుక్రీస్తును గురించిన సువార్త వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ వెలుగుకు తగినట్లు ఈ తిరిగి జన్మించిన వారు స్పందిస్తారు. ఆదిమ సంఘంలోని వారు ఆ విధంగా స్పందించారు అని అపో. కా. 2:37-42లో మనం చూడగలం. నిజంగా నేటి సంఘ సభ్యులు తిరిగి జన్మించిన వారేనా? వారికి అపోస్తలులు ప్రకటించిన ఏసుక్రీస్తును గురించిన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడిందా? అనే విషయాలు మనం తప్పక పరిశీలన చేసుకోవాలి.

"పాపానికి పశ్చాత్తాపపడినవారు"

మొదటి సంఘంలో యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడినప్పుడు వారు వారి పాప స్థితిని బట్టి హృదయంలో తీవ్రంగా నొచ్చుకొని, మా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చెయ్యాలి అని అడిగినట్లు అపో. కా. 2:37 లో చూడగలం. తిరిగి జన్మించినవారు ఎవరైనా సరే మొదటిగా సువార్త వినగానే, దాని అవసరతను గ్రహించి, వారి పాపాల తీవ్రతను చూడగలుగుతారు. ఆ పాపాన్ని బట్టి సిగ్గుపడి, దేవుని ముందు పశ్చాత్తాపపడతారు. సువార్త వెలుగులో దేవుని ఉన్నత పరిశుద్ధతను, మానవుని తీవ్ర పాపాన్ని గ్రహించిన వారు కన్నీటితో వారి పాపాలను ఒప్పుకోకుండా ఉండలేరు.

“పరిశుద్ధుడవైన నా సృష్టికర్తా, నా భయంకరమైన పాపాలను క్షమించు” అని పశ్చాత్తాపంతో, హృదయమందు పొడవబడినవారై, వేదనతో, దేవుని క్షమాపణ, పాప విమోచన కొరకు వేడుకుంటారు. ఇలాంటి నిజమైన దైవిక పశ్చాత్తాపము రక్షణలోనికి నడిపిస్తుంది. ఈ పశ్చాత్తాపం గలవారు వారి పాపాలనుండి క్షమాపణ, విడుదల పొందుతారని 1 యోహాను 1:9 లో స్పష్టంగా చూడగలం. ఇలాంటి దైవిక, రక్షణార్ధమైన పశ్చాత్తాపం మీరు అనుభవించారా? లేకపోతే మీరు ఇంకా నిజమైన రక్షణ పొందలేదేమో ఆలోచించండి.

"మారుమనస్సు పొందిన వారు"

పరిశుద్ధాత్మ వలన తిరిగి జన్మించిన వీరు, ప్రకటింపబడిన క్రీస్తు సువార్తను సంతోషంతో అంగీకరించి, యాదార్ధమైన పశ్చాత్తాపంతో వారి పాపాలను వారి సృష్టికర్త, పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒప్పుకుని పాప క్షమాపణ పొందిన వారు, ఆ తర్వాత లోకానికి, వారి పాత జీవితానికి, జీవన విధానానికి వ్యతిరేకంగా పూర్తి ‘యూ టర్న్’ తీసుకుని జీవించాలి ( అపో.2:40). ఇంతకు ముందు పాపం చెయ్యడానికి పరుగులెత్తిన వారు మారుమనస్సు పొందిన తర్వాత ఆ పాపాన్ని అసహ్యించుకుంటూ, దాని నుండి దూరంగా పారిపోతారు. ముందు మాట్లాడిన కల్మషమైన మాటలు మాట్లాడలేరు.

ముందు చేసిన అపవిత్రమైన ఆలోచనలు ఇక చేయలేరు. ముందు ప్రవర్తించినట్లుగా ఇస్టానుసారంగా, వారి శరీరాశల ప్రకారం ప్రవర్తించలేరు. పరిశుద్ధతను ప్రేమిస్తూ, దేవుని చిత్తానుసారమైన, వాక్యానుసారమైన ఒక క్రొత్త మనస్సును కలిగి నూతన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తారు. ఇదే నిజమైన మారుమనస్సు ( నెహె. 9:35) అని మనం వాక్యాన్ని బట్టి తెలుసుకోనగలం. ఈ మారుమనస్సు ప్రతి క్రైస్తవునికి ఖచ్చితమైన గుర్తు అని మనం మత్తయి 3:2, 4:17, 11:20, మార్కు 1:4,15; 6:12, లూకా 3:8, 5:32, 13:3, 5; 15:10, అపో. 2:38, 3:20, 17:30, 20:21 మొదలగు లేఖన భాగాల నుండి స్పష్టంగా గ్రహించగలం. మరి ఇలాంటి నిజమైన మారుమనస్సు అనుభవాన్ని కలిగి యున్నావా పరీక్షించుకో.

"యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన వారు"

‘సువార్త’ అనే మాటను ఒక్క పదంలో నిర్వచించమంటే “యేసుక్రీస్తు” అని చెప్పవచ్చు. మన పాపాల నిమిత్తం యేసు క్రీస్తు మరణించాడు సమాధి చేయబడ్డాడు, తిరిగిలేచాడు ఇదే సువార్త అని అపొస్తలుడైన పౌలు 1 కోరింథీ 15:1-5 లో చెబుతున్నాడు. పరిశుద్ధుడు, న్యాయాధిపతి, సృష్టికర్తయైన దేవుడు నరులను తన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించినప్పటికి, ఆ మొదటి మానవులు ఆయనకు వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు, పాపం వల్ల ఆయనకు దూరస్తులై శాపాన్ని పొందుకున్నారు (ఆది. 1-3 అధ్యాయాలు). అప్పటినుండి మానవులందరు కూడా తల్లి గర్భంలో రూపించబడిన నాటి నుండి పాపంలోనూ, దేవుని న్యాయ తీర్పు, ఉగ్రత క్రింద ఉన్నవారే.

ఆ మహోన్నతుడైన దేవుని న్యాయ శిక్ష తప్పించి, మరలా మానవులను ఆయనతో ఐక్య పరచగలిగిన మార్గం గాని, వ్యక్తి గాని లేరు. ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో దేవుడే తన ఏకైక కుమారుడైన ఏసుక్రీస్తును మన కొరకు పంపి, ఆయన మనందరి పాపాలను తనపై వేసుకుని, శిలువ మరణం ద్వారా దేవుని ఉగ్రతను అనుభవించి, తన నీతిని మనకు అపాదించి, ఆయన పునరుత్థానం ద్వారా పాప ఫలమైన మరణాన్ని ఓడించి ఆయన యందు విశ్వాసముంచు వారందరిని తిరిగి మరలా ఆయన కుటుంబంలో చేర్చుకోడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. దానిని తన పరిపూర్ణ జ్ఞానంలో, నిర్ణయం చొప్పున, తగిన కాలమందు నెరవేర్చాడు. హల్లెలూయ! ఈ విషయాన్ని హృదయపూర్వకంగా నమ్మి, యేసుక్రీస్తు శిలువమరణాన్ని గ్రహించి, ఆయనను మాత్రమే రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఆయనపై ఆధారపడటమే క్రీస్తు నందు విశ్వాసముంచడం. ఈ సువార్తపైన, క్రీస్తు పైన ఆ బలమైన, సంతోషకరమైన విశ్వాసాన్ని నిజంగా నీ హృదయంలో కలిగి యున్నావా?

"వాక్యమునకు లోబడి బాప్తిస్మం పొందినవారు"

యేసుక్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించిన వ్యక్తులు, పాప క్షమాపణ నిమిత్తం వారి పాపాన్ని బట్టి పశ్చాత్తాపపడి, మారుమనస్సును పొంది, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచిన తర్వాత దేవుని మాటకు లోబడి, ఒక స్థానిక సంఘానికి కట్టుబడి, బాప్తిస్మం పొందాలి ( లూకా 3:3, అపో. 2:38, 41, 8:12, 10:48). “ఇప్పటి నుండి నేను క్రీస్తుకు చెందిన వాడను” అని బహిరంగంగా సమాజం ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యమివ్వడమే బాప్తిస్మం. అంతరంగంలో జరిగిన మార్పుకు బహిరంగమైన గురుతే బాప్తిస్మం.

ముంచడం బాప్తిస్మం ద్వారా నేను క్రీస్తుతో కూడా పాపం విషయమై చనిపోయి, ఆయన పునరుత్థానం ద్వారా నిత్యజీవాన్ని కలిగియున్నానని సాదృశ్యరూపంగా తెలియచెయ్యడమే బాప్తిస్మం. క్రీస్తు శిష్యుడుగా ఉండే ప్రతి వ్యక్తీ తప్పక బాప్తిస్మం పొందాలని యేసుక్రీస్తు మరియు అపొస్తలులు ఖచ్చితంగా ప్రకటించారు (మార్కు 16:16, లూకా 3:3, అపో. 2:38, 8:12, 10:48, 22:16). ఇది దేవుని వాక్యం, ఆజ్ఞ కాబట్టి ప్రతి క్రైస్తవుడూ తప్పక బాప్తిస్మం పొందాలి. పశ్చాత్తాపం, మారుమనస్సు, విశ్వాసం లేకుండా కేవలం నీటిలో మునిగి లేవడం బాప్తిస్మం కాదు, ఆ బాప్తిస్మం వల్ల రక్షణ కలగదు. నిజంగా తిరిగి జన్మించిన వారు, తప్పక వారి పాపాలకు పశ్చాత్తాపపడతారు, యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుతారు, మారుమనస్సు పొందుతారు, బాప్తిస్మం పొందుతారు.

ముగింపు: సంఘం ద్వారా యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడినప్పుడు, రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన వారు తప్పక ఆ సువార్తకు స్పందించి ఈవిధంగా క్రైస్తవ్యం లోనికి అనగా క్రీస్తు శిష్యత్వం లోనికి నడిపించబడతారు. ఈ విధంగా ప్రారంభమైన క్రైస్తవ ప్రయాణం, సరియైన విధంగా, సక్రమంగా, బలంగా, ప్రభావవంతంగా, దేవుని చిత్తానుసారంగా, ఆయనకు మహిమకరంగా నిత్యత్వం వైపునకు సంఘం ద్వారానే నడిపించబడుతుంది. ఇలాంటి క్రైస్తవుల సమూహమే సంఘం. రోజు రోజుకు మరింత క్రీస్తు సారూప్యతను పొందుకుంటూ ఆయన శిష్యులుగా మారడమే సంఘ లక్ష్యం, దేవుని మహా ఆజ్ఞ (మత్తయి 28:18-20). వీరిని మాత్రమే క్రైస్తవులని, సంఘమని పిలువాలి. ఈ లక్షణాలు లేకుండా పేరు పెట్టుకున్నంత మాత్రాన వారు క్రైస్తవులు కారు, అది దేవుని సంఘం కాదు.

దేవుడు మనలను నిజ క్రైస్తవులుగాను, నిజ సంఘంగాను చేయును గాక!

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.