దుర్బోధలకు జవాబు

రచయిత: ఇ.యల్. బైనమ్
అనువాదం: పి. ఉషశ్రీ
చదవడానికి పట్టే సమయం: 25 నిమిషాలు
ఆడియో

Article Release long judge others min

ఈనాడు చాలామంది తప్పును బహిర్గతం చేయటం మరియు పేర్లను బయటపెట్టటాన్ని సరికాదు అనుకుంటున్నారు. స్వేచ్ఛావాదులు ఎప్పటికీ అలాగే నమ్మేవారు కాని, ఈ మధ్యకాలంలో బైబిల్‌కి కట్టుబడి ఉన్నామని చెప్పుకునే ఇవాంజిలికల్స్‌ మరియు ఆత్మవరాలు ఉన్నాయని చెప్పుకునే కారిస్మాటిక్సును కూడా ఇది ఎక్కువగా వరించింది.

బైబిలును నమ్ముతున్నట్లు చెప్పుకొనే మౌలికవాదులు (ఫండమెంటలిస్ట్స్‌) సహితం ఈ మధ్య ఇదే ప్రాణాంతకమైన తప్పుడు భావనను చాటించడం చూస్తున్నాము. బైబిలు ప్రకారము తప్పును బహిర్గతం చేయటంలో నమ్మకస్తులైనవారు ఇప్పుడు నిందించబడుతున్నారు. వారు ప్రేమలేనివారిగాను, దయలేనివారిగాను విమర్శింపబడుతున్నారు. అతికీలకమైన ఈ అంశంపై బైబిలు ఏమి బోధిస్తుందో నేను ఇక్కడ వివరించాలనుకుంటున్నాను.

1. బైబిలు ఆధారంగా తీర్పుతీర్చటం సరైనదే!

''మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు''(మత్తయి 7:1) అన్నది అత్యధికంగా దుర్వినియోగానికి గురిచేయబడిన వచనాలలో ఒకటి. సరియైన భావాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవటానికి లేఖనాలలోని ప్రతివచనాన్ని దాని సందర్భానుసారంగా చదవాలి. అదే అధ్యాయంలోని 2-5 వచనాలు చదివినప్పుడు 1వ వచనంలో ప్రస్తావించబడింది కపటంగా తీర్పు తీర్చడం గురించేనని స్పష్టమౌతుంది. తన కంటిలో దూలము ఉన్న ఒకడు, కంటిలో నలుసుగల మరొక సహోదరుడిని తీర్పు తీర్చకూడదు. ఇక్కడ మనము నేర్చకోవలసిన పాఠము తేటతెల్లమే - నువ్వు పాపంలో ఉంటూ అదే పాపాన్ని బట్టి ఇతరులను తీర్పు తీర్చరాదని ఈ వచనాల భావం.

తప్పును బహిర్గతం చేసేవారు తప్పు చేస్తున్నారని చెప్పటానికి, ''మీరు తీర్పు తీర్చకుడి'' అన్న మాటను పట్టుకుని వేలాడేవారు ఆ పూర్తి అధ్యాయాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. అదే అధ్యాయంలోని 15వ వచనంలో యేసు ''అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱె చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు''(వచనము15) అని హెచ్చరించాడు. దేవుని వాక్యపు వెలుగులో తీర్పు తీర్చకపోతే అబద్ధ ప్రవక్తలెవరో ఎలా గుర్తించగలము? వారిని గుర్తించిన తరువాత ఈ ''క్రూరమైన తోడేళ్ల'' విషయమై గొఱ్ఱెలను హెచ్చరించకుండా ఎలా ఉండగలము? వారిని గుర్తించి బహిర్గతం చేయాలని బైబిలు అంతటిలోనూ రుజువు కనిపిస్తుంది.

''వారి ఫలముల వలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లనైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? ఆలాగుననే ప్రతి మంచిచెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును''(16,17 వచనాలు). వారి మతసిద్ధాంతాలను బట్టి, వారి జీవితఫలాలను బట్టి ఆ చెట్టును (వ్యక్తిని) తీర్పు తీర్చకూడదని ఇక్కడ ప్రభువు భావమా? ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే తీర్పు తీర్చకుండా మనము వారిని గుర్తెరగలేము. అయితే తీర్పు తీర్చడం బైబిలుబోధను అనుసరించి చేయాలి కాని ఇష్టానుసారంగా కాదు, స్వంతఅభిప్రాయాలను బట్టి కాదు.

''వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను'' (యోహాను 7:24). "న్యాయమైన తీర్పు తీర్చుడి" అంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తీర్పు తీర్చమని ప్రభువు మనకిక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని వాక్యం కాకుండా మరేదైనా ఇతర ప్రాతిపదికన తీర్పు తీర్చినట్లైతే, అది మత్తయి 7:1 ని ఉల్లఘించినట్లవుతుంది. వెబ్‌స్టర్స్ డిక్షనరీ ప్రకారం, న్యాయమూర్తి అంటే "చట్టాన్ని ప్రకటించేవాడు." నమ్మకమైన క్రైస్తవుడు తప్పనిసరిగా దైవావేశము వలన కలిగిన ధర్మశాస్త్రమును అనగా బైబిల్ ను ఆధారం చేసుకొని వివేచిస్తాడు, తీర్పు తీరుస్తాడు.

1 కొరింథీ 5:1-13 లో జారుల గురించి ప్రస్తావించబడింది. పౌలు వారితో కూడా లేనప్పటికీ వారిని "తీర్పు తీర్చాడు" ( వ. 3 ) అలాగే లోపలి వారికి "తీర్పు తీర్చమని" కొరింథు సంఘానికి చెప్పాడు ( వ. 13 ). 'తీర్పు తీర్చువారు' అన్న మాటకు గ్రీకులో ఇక్కడ వాడబడిన పదమే మత్తయి 7:1 లో కూడా వాడబడింది. ఒక వ్యక్తిని తీర్పు తీర్చమని చెప్పడం లేక తీర్పు తీర్చమని సంఘానికి సూచించడం ద్వారా "మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు." అన్న వాక్యాన్ని పౌలు ఉల్లంఘించడం లేదు. ఎందుకంటే ఆ తీర్పంతా దేవుని వాక్యానుగుణమైనదే.

మంచి చెడులను వివేచించగల వ్యక్తి, ఆధ్యాత్మిక పరిపక్వత యొక్క ప్రధాన గుర్తులలో కనీసం ఒకదానిని కలిగి ఉంటాడు. "వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన అహారము వారికే తగును." (హెబ్రీ 5:14). డబ్ల్యు. ఈ. వైన్ ప్రకారం వివేచన అన్న పదానికి అర్థం ఏంటంటే 'ఒక ప్రత్యేకమైన, స్పష్టమైన విచక్షణ, వివేచన, తీర్పు తీర్చుట; 1 కొరింథీ 12:10 లో ఈ పదం 'వివేచన' అని అనువదించబడింది. ఈ వచనంలో ఆత్మలను వివేచించడం అనగా అవి దురాత్మలా లేక దేవుని వద్ద నుండీ వచ్చినవా అని ఆధార సహితంగా తీర్పు తీర్చడం గురించి చెప్పబడింది. స్ట్రాంగ్ కూడా దాని అర్థం తీర్పు తీర్చడమే అని ఒప్పుకుంటాడు.

ఈ విధంగా భేదాన్ని కనుక్కోవటానికి లేదా మంచిచెడులకు మధ్య తీర్పు తీర్చటానికి ఇష్టపడనివారు లేదా సమర్థత లేనివారు తమ అవిధేయతను లేదా అపరిపక్వతను కనపరుస్తున్నారు.

2. దుర్భోధకులను బహిర్గతం చేయటం సరైనదే!

 విశ్వాసులైన అనేకులు మౌనంగా ఉండటం చేత అబద్ధ బోధకులు తమ విషపూరితసిద్ధాంతాలను స్వేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందువలన గొఱ్ఱెచర్మంలో ఉన్న తోడేళ్లకు అనేకులను నాశనం చేసి, సంఘాన్ని ధ్వంసం చేసే అవకాశం లభిస్తోంది.

బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యులను, సద్దూకయ్యులను (అతని కాలంలో ఉన్న మతపెద్దలు) ''సర్పసంతానమా'' (మత్తయి 3:7) అని పిలిచాడు. ఆయన ఈ రోజుల్లో ఉండి ఉంటే ప్రేమలేనివాడనీ , దయలేనివాడనీ, అసలు క్రైస్తవుడే కాడనీ నిందింపబడుండేవాడు.

మతపరులైన పరిసయ్యులతో యేసు ప్రభువు ''సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా'' అన్నాడు (మత్తయి 12:34). కొందరు సువార్తికులకు మరియు మౌలికవాదులకు ఇది వాడకూడని భాషగా అనిపించొచ్చేమో కాని, ఇది బైబిలు ఆధారితభాష; ఇది స్వయంగా కుమారుడైన దేవుని నోటనుండి వెలువడిన మాట.

అబద్ధ బోధకులతో ముఖాముఖిగా నిలబడి దైవకుమారుడైన యేసుప్రభువే వారిని ''వేషధారుల''ని, ,''గుడ్డివార'' ని, ''అంధులైన మార్గదర్శకుల''ని, ''సున్నము కొట్టిన సమాధుల''ని, ''సర్పము''లని మరియు ''సర్పసంతానములని'' (మత్తయి 23:17,23-24,27) పిలిచాడు. ఐనా పరిసయ్యుల్లాగ తప్పుడు సిద్దాంతాలు గలవారితో మనం ప్రేమపూరిత సహవాసాన్ని కలిగుండాలని ఈ రోజుల్లో అనేకులు హెచ్చరిస్తున్నారు. బైబిలును నమ్ముతామని చెప్పుకునే కొంతమంది క్త్రైస్తవులు, రోమన్‌ క్యాథలిక్కులతో మరియు ఇతర అవాంతరశాఖలతో కలిసి పనిచేయాలని  వత్తిడి చేస్తున్నారు. అలా రాజీపడిన వారిని మనము గద్దించకూడదని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నారు.

తన పరిచర్య ప్రారంభంలో ''యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండట చూచి, త్రాళ్లతో కొరడాలు చేసి, గొఱ్ఱెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో - వీటిని ఇక్కడ నుండి తీసుకొనిపొండి, నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పెను''(యోహాను 2:13-16). నేడు మన రక్షకుడు దుర్భోధకుల పట్ల కూడా దయగలవానిగా ప్రేమగలవానిగా చిత్రీకరించబడుతున్నాడు కానీ ఇది పూర్తిగా తప్పు. దుర్భోధకులు మరియు అబద్ధ ప్రవక్తలతో వ్యవహరించేటప్పుడు ఆయన మాటలు పదునుగాను ఆయన ప్రవర్తన స్పష్టముగాను ఉంది.

తన బహిరంగ పరిచర్య చివరిలో, మందిరాన్ని మరొకసారి శుభ్రపరచటం అవసరమని క్రీస్తు అనుకున్నాడు. తప్పుడు సిద్ధాంతాలను, అలవాట్లను బహిర్గతం చేయటం ఒక ముగింపులేని బాధ్యత. అప్పుడు ఆయన ''నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలగుహగా చేసితిరనెను.''(మార్కు 11:17). నేటి  పరిస్థితులు దీనికన్నా ఏమైనా వేరుగా ఉన్నాయా? దొంగలు దేవుని ఇంటిలోకి చొరబడి దేవునిప్రజల నుండి దేవునివాక్యాన్ని దొంగిలించి, వారు వక్రీకరించిన వాక్యాన్ని వర్తకం చేస్తున్నారు. ఇలా దొంగలగుహలుగా మార్చబడిన సంఘాలు, దేవునిప్రజల వద్ద నుండి 'ప్రత్యేకపరచబడటం' మరియు 'పరిశుద్ధపరచబడటం' మొదలైన సిద్ధాంతాలను దొంగలిస్తున్నారు. అవి దొంగిలించబడితే ఇక దేవుని పిల్లలకు, లోకస్తులకు మద్య భేదమేదీ ఉండదు కదా! ఈ దొంగలను (అబద్ధ బోధకులను) బట్టబయలు చేయటం అవసరం కాదా?

ఈ రోజుల్లో ఈ అబద్ధ బోధకులు మన సంఘాల్లోకి వారి పుస్తకాలతోను, పాండిత్యంతోను, సినిమాలతోను, మనస్తత్త్వశాస్త్రాలతోను, సెమినార్లతోను వచ్చి తండ్రిగృహాన్ని దొంగలగుహగా మారుస్తున్నారు. దైవజనులు నిలబడి వారి తప్పుల్ని అందరూ చూసేలా బట్టబయలు చేసే సమయము ఆసన్నమైంది.

దుర్బోధలను బహిర్గతం చేయాలని బైబిలు హెచ్చరిస్తోంది.

A) మనం వారిని పరిశీలించాలి.

''ప్రియులారా! అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి'' (1యోహాను4:1). ప్రతిబోధను, బోధకునిని బైబిలు వెలుగులో మనము పరిశీలించాలి. ''ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు''(యెషయా 8:20)(వాడుక భాష అనువాదం - ధర్మశాస్త్రాన్ని, ఉపదేశాన్ని విచారించండి! ఈ మాట ప్రకారం వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకు తెల్లవారలేదన్నమాట!). ప్రతి సందేశం, సందేశకుడు మరియు సిద్ధాంతం దేవుని వాక్యప్రకారం తీర్పుతీర్చబడాలి. ఎఫెసులో ఉన్న సంఘము ''అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొనువారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివ''ని(ప్రకటన 2:2)స్వయంగా ప్రభువు నుండి మెప్పు పొందింది. అబద్ద బోధకులను సహించడం ఎప్పుడూ సరైనది కాదు. వారు దేవుని వాక్యప్రకారం పరీక్షించబడి బహిర్గతం చేయబడాలి; అయితే దేవుని వాక్యానికి అవిధేయులైనవారు ప్రతి విధంగానూ ఈ బాధ్యతను తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.

B) మనం వారిని కనిపెట్టి వారినుండి తొలగిపోవాలి

''సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయువారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి''(రోమా 16:17). వారిని కనిపెట్టి వారి నుండి తొలగిపోవాలి. దీనికొరకు, బైబిలు వెలుగులో వివేచించి తీర్పుతీర్చటం అవసరం. ఆధునిక ఇవాంజిలికల్స్‌ మరియు రాజీపడే మౌలికవాదులు, అందరం ఒకటేనని వాదిస్తారు; వారు లేఖనాధారమైన ఈ బోధకు విధేయత చూపే ప్రతీ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తారు. దేవునివాక్యపు వెలుగులో తీర్పుతీర్చనిదే వారిని (అబద్ద బోధకులను) కనిపెట్టి వారి నుండి తొలగిపోవటం అసాధ్యం.

C) మనం వారిని గద్దించాలి

''విశ్వాసవిషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్ధింపుము'' (తీతుకు 1:14). ఇది తీతుకు వ్రాయబడింది. ఎందుకంటే వారు ఇంటింటికీ వెళ్తూ కుటుంబాలకి కుటుంబాలనే తప్పుడు సిద్ధాంతాలతో పాడు చేస్తుండేవారు (తీతుకు 1:10-16). ఓరల్‌ రోబర్ట్స్‌, రోబర్ట్‌షల్లర్‌, రోడ్ని హౌవార్ట్‌-బ్రౌన్‌, ప్యాట్ రోబర్ట్‌సన్‌ వంటి అనేకులు(తెలుగు క్రైస్తవ నేపథ్యంలో రంజిత్ ఓఫిర్, పి.డి. సుందరరావు, శ్యామ్ కిశోర్ వంటివారు) నేడు కుటుంబాలకి కుటుంబాలనే పాడుచేస్తున్నారు. వారు అలా చేస్తుంటే, వారి బోధనుండి తప్పించుకోమని విశ్వాసులను గద్దించకుండా,హెచ్చరించకుండా  మనం మౌనంగా ఉండాలా? కాదు. నమ్మకమైన పనివాడు ''తాను హితబోధ విషయమై(ఆరోగ్యకరమైన బోధ విషయమై) జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను''(తీతుకు 1:9).

D) మనం వారితో సహవాసం కలిగుండకూడదు.

''నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి''(ఎఫెసీ 5:11). 'ఖండించుట' అంటే ఆక్షేపించటం, వ్యతిరేకించటం, తప్పుపట్టటం, గద్దించటం మరియు ఖండించటం. మనము వారిని దేవుని వాక్యానుసారంగా పరీక్షించనిదే ఈ ఆజ్ఞకు ఎలా కట్టుబడి ఉండగలము?

E) మనం వారినుండి తొలగిపోవాలి

''సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము'' (2 థెస్స 3:6). ఎవరి సిద్ధాంతం మరియు ప్రవర్తన వాక్యానుసారంగా ఉండదో వారి నుండి మనము తొలగిపోవాలి. హితబోధకు(సరైన సిద్ధాంతానికి) కట్టుబడి ఉండాలన్నదే ఇక్కడ పౌలు భావమని సందర్భం స్పష్టంగా తెలియజేస్తుంది. ''ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. అయినను అతనిని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధిచెప్పుడి'' (2 థెస్స 3:14,15). ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితబోధను, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశిస్తే, వారినుండి ''తొలగిపోవలెన''ని పౌలు తిమోతిని హెచ్చరించాడు. ( 1 తిమోతికి 6: 3-5 ).

F) మనం వారికి విముఖులై ఉండాలి.

అంత్య దినాల గురించి మాట్లాడుతూ పౌలు అంటాడు "పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము." ఎందుకంటే అటువంటివారు "సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడును పొందలే"రు. ( 2 తిమోతికి 3: 5-7 ). వారెవరో గుర్తించకుండా వారికి విముఖులుగా ఎలా ఉండగలం. అయితే వారిని గుర్తించాలంటే వారి బోధను దేవుని వాక్యంతో పోల్చి చూడాలి. "వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము." (2 తిమోతి 4:2) - ఇది ఒక నిజమైన బోధకుడు చెయ్యాల్సిన పని. ఇది సాధారణంగా చాలామంది ఆమోదించని, అభినందించని పని; అయినా ఆ పని చేయడమే దేవుని చేత పిలువబడినవారి బాధ్యత.

G) మనం వారిని మన ఇంట చేర్చుకోకూడదు

''ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును'' (2 యోహాను 10,11). ఇక్కడ యోహాను ఎవరి గురించి మాట్లాడుతున్నాడన్న విషయంలో సంశయమేమీ లేదు. ''క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాని"ని ఇక్కడ ఉద్దేశిస్తున్నాడు.(2 యోహాను 9). రేడియో, టీవి, రచనలు, తదితర మాధ్యమాల ద్వారా అబద్ధ ప్రవక్తలు ఈనాడు అనేక క్రైస్తవ గృహాల్లోకి  చొరబడుతున్నారు. సహోదరులారా ఇది తగదు.

H) మతభేదాలని కలిగించేవారిని (భిన్నాభిప్రాయాలు పుట్టించేవారిని) మనం నిరాకరించాలి

''మతభేదములు కలిగించు మనుష్యునికి ఒకటి రెండు మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము'' (తీతుకు 3:10). విమోచన క్రీస్తురక్తము ద్వారా మాత్రమే అని అంగీకరించనివారిని మనము తిరస్కరించాలి. దీనిని కాని, దేవుని వాక్యసంబంధమైన మరి ఏ ఇతర సిద్ధాంతాన్ని కానీ కాదనేవారు అనేకులున్నారు. బుద్ధి చెప్పినప్పుడు సరిదిద్దుకోకపోతే వారిని మనము విసర్జించాలి.

I) మరియొక సువార్తను బోధించేవారి గురించి మనం జాగ్రత్తపడాలి.

''పౌలు ''మరియొక యేసు.... మరియొక ఆత్మ లేదా మరియొక సువార్తను'' బోధించేవారి గురించి హెచ్చరించాడు. 2 కొరింథీ 11:4 వారి యేసును, వారి ఆత్మను, వారి సువార్తను దేవుని వాక్యాధారంగా తీర్పు తీర్చనిదే మనము వారిని ఎలా గుర్తించగలము? పౌలు వారిని గురించి ''అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించినవారైయుండి, దొంగ అపోస్తులులును, మోసగాండ్రగు పని''వారని అన్నాడు.(2 కొరింథీ 11:13). వచనము 14-15 లో వారిని ''సాతాను పరిచారకుల''ని పిలిచాడు; నేడు దేవునిచే పిలువబడినవారు కూడా సాతాను పరిచారకులను బహిర్గతము చేయవలసిన తమ బాధ్యత విషయంలో అంతే నమ్మకస్తులుగా ఉండాలి. 

''క్రీస్తు సువార్తను వక్రీకరించువారి''ని గురించి పౌలు గలతీయులను హెచ్చరించాడు. ''మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవునుగాక'' (గలతీ 1:6-9). అనేకులు ఈనాడు వక్రీకరించబడిన సువార్తను బోధిస్తున్నారు. రక్షణను కోల్పోయే అవకాశం ఉందని బోధించేవారు వక్రీకరించబడిన సువార్తను బోధిస్తున్నారు. క్యాథలిక్కులు, కారిస్మాటిక్‌లు, అనేక సౌవార్తిక శాఖలు, మౌలికవాదులతో సహా అనేకులు ఇలాంటి కలుషిత సువార్తనే బోధిస్తున్నారు. ఐనా, సువార్త ప్రకటించటంలోను, క్రైస్తవ పరిచర్యలోను మనము వారికి సహకరించాలంట! ఇలాంటి  అబద్ధ ప్రవక్తలను మనము బహిర్గతం చేయటంలో విఫలమైతే క్రీస్తును, సువార్తను మోసము చేసినవారమే.

J) మనం వారినుండి వేరుపడాలి 

''కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును''(2 కొరింథీ 6:17). విశ్వాసత్యాగం చేసినవారి నుండి మరియు దుర్బోధల నుండి మనము బయటకు రావలసిన అవసరత ఉంది. బైబిలును నమ్మినవారెవరైనా, అలాంటి సంఘాల లేదా జాతీయ/అంతర్జాతీయ సమితుల సభ్యులుగా ఉండగలరా? వారు ఏ మతభ్రష్టమైన సంఘములోనైనా ఎలా ఉండగలరు? వారు రాజీపడే సువార్తీకుల మధ్య, నామకార్థ మౌలికవాదుల మధ్య ఎలా ఉండగలరు?

3. పేర్లతో సహా బహిర్గతం చేయడం సరియైనదే

దుర్బోధను బహిర్గతం చేయటం, దుర్బోధకుల పేర్లు బయటపెట్టటం సరికాదని నేడు కొందరు నమ్ముతున్నారు. కాని బైబిలు ప్రకారం చూస్తే వారు పొరబడుతున్నారు.

పేతురు చేసిన పొరపాటును అతని పేరుతో సహా పౌలు బయటపెట్టాడు.

పేతురు వాక్యవిరుద్ధంగా ప్రవర్తించి తప్పు చేసాడు. ''అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబా కూడ వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవైయుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు''(గలతీ 2:11-14). ఇక్కడి సందర్భం అంతా రక్షణ ధర్మశాస్త్రము వలన కలుగుతుందా లేదా కృప చేత కలుగుతుందా అనే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. సువార్త యొక్క సత్యానికి మరియు పరిశుద్ధతకి ప్రమాదం వాటిల్లినప్పుడు అందుకు కారకులైన దుర్బోధకులను బయటపెట్టడంకంటే మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు.

లోకాన్ని ప్రేమించినందుకు పౌలు దేమాను పేరుతో సహా బహిర్గతం చేసాడు.

''దేమా యిహలోకమును స్నేహించి నన్ను విడిచి......''(2తిమోతి 4:10) లోకసంబంధులుగా జీవించటం కొరకు క్రీస్తును విసర్జించేవారిని పేర్లతో సహా బహిర్గతం చేయాలి.

పౌలు హుమెనెయును, అలెక్సంద్రును పేర్లతో సహా బహిర్గతం చేసాడు.

''నా కుమారుడైన తిమోతీ, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగినవాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి యీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, విశ్వాసవిషయమై ఓడ బద్ధలైపోయిన వారివలె చెడియున్నారు. వారిలో హుమెనైయును, అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని''(1తిమోతి 1:18-20). దేవుని నిజమైన సేవకులు మంచి పోరాటము సాగించాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నుండి తొలగినవారిని పేర్లతో సహా బహిర్గతం చేయాలి. పౌలు ఇక్కడ రక్షణను గురించిన విశ్వాసము కాదు కాని సైద్ధాంతికమైన విశ్వాసము (రక్షణను మనకు తెలియజేసే సువార్త సిద్ధాంతాన్ని విశ్వాసం అని పిలుస్తున్నాడు) గురించి చర్చిస్తున్నాడు. ఈ వ్యక్తులు, ఆ విశ్వాసవిషయమై ఓడ బద్దలైపోయినవారివలె చెడియున్నందుకు పౌలు వారిని పేర్లతో సహా బహిర్గతము చేసాడు. 

పౌలు హుమెనైయు మరియు ఫిలేతులను పేర్లతో సహా బహిర్గతం చేసాడు.

ఆయన తిమోతికి వ్రాస్తూ ఇలా అన్నాడు, ''దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుపుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు. వారు - పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యవిషయమై తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు''(2 తిమోతి 2:15-18). తప్పుడు సిద్ధాంతం కొందరి విశ్వాసాన్ని చెరిపివేస్తుంది కాబట్టి దానిని ప్రకటించేవారిని పేర్లతో సహా బహిర్గతం చేయాలి.

పౌలు అలెక్సంద్రు అనే కంచరివానిని పేరుతో సహా బహిర్గతం చేసాడు.

''అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడు చేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును; అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను''(2తిమోతి 4:14-15). ఇది సిద్ధాంతపరమైన సమస్యే కానీ వ్యక్తిగతమైన సమస్య కాదన్నది స్పష్టంగా తెలుస్తుంది. అలెక్సంద్రు పౌలు యొక్క మాటలను, సిద్ధాంతాల్ని ఎదిరించాడు. అతను సత్యానికి విరోధి. దైవికమైన కాపరులు ఇదే సమస్యను ప్రతిరోజు ఎదుర్కుంటున్నారు.వారు సంఘంలో నిలబడి సత్యాన్ని ప్రకటిస్తారు, వారి సంఘసభ్యులేమో అదే సత్యాన్ని తమ ఇళ్ళకు వెళ్ళి రేడియో,టీవి బోధకులు ఎదిరించడం చూస్తారు. అబద్ధ ప్రవక్తలు వారి ప్రచురణలను యథార్థమైన సంఘాలకు చెందిన సభ్యుల ఇళ్ళకు అనేకసార్లు పంపుతున్నారు. దీనికి సంఘకాపరి ఏమీ మాట్లాడకుండా ఉండాలని అనేకులు అభిప్రాయపడుతున్నారు. బైబిలుసత్యాల మీద దాడి జరుగుతున్నప్పుడు ఒక పిరికివాడు మాత్రమే మౌనముగా ఉంటాడు.

యోహాను దియొత్రెఫేను పేరుతో సహా బహిర్గతం చేసాడు.

''నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు''(3 యోహను 9). అతడు యోహానుకు వ్యతిరేకంగా చెడ్డమాటలు ఎలా వదరుతున్నాడో వివరించాడు (వ10) తర్వాత ఇలా రాసాడు, ''ప్రియుడా, చెడుకార్యమునుకాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు'' (వ11). దేవుని వాక్యానికి వ్యతిరేకమైన సిద్ధాంతాలు, ప్రవర్తన ఉన్నవారిని పేరుతో సహా బహిర్గతం చేయటం తప్పుకాదు.

అబద్ధ ప్రవక్తల్ని పేర్లతో సహా బహిర్గతం చేసిన ఎన్నో ఉదాహరణలు బైబిలులో ఉన్నాయి. తప్పును బహిర్గతం చేయకుండా ఈనాడు అనేకులు వాడుతున్న ప్రేమ అనే సాకు నిజానికి వాక్యానుసారమైన ప్రేమ కాదు; అది కేవలం నకిలీ ప్రేమ.

మోషే బిలామును పేరుతో సహా బహిర్గతం చేసాడు

(సంఖ్యా. 22-25 అధ్యాయాలు చూడండి) ''ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను'' అని పేతురు అతని గురించి బహిర్గతం చేసాడు ( 2 పేతురు 2:15,16 ).  కొంతమంది టీవిలో కనబడే అబద్ధ ప్రవక్తలవలె బిలాము కూడా డబ్బుకోసమే ప్రవక్తగా ఉన్నాడు. వారు అడుక్కుని రాజుల్లా జీవిస్తుంటే అమాయకులైన ప్రజలేమో తమ కష్టార్జితమైన డబ్బును వారికి పంపుతున్నారు.ఇలాంటి మతగారడీలవారి విషయమై మనం నోరుమూసుకొని ఉండాలని అనేకుల అభిప్రాయం. మనము ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండి దేవునికి నమ్మకమైనవారిగా ఎలా ఉండగలం? 

బిలాము చేసిన తప్పును యూదా బహిర్గతం చేసాడు. ( యూదా 11 )

యోహాను బిలాము దుర్బోధను బహిర్గతం చేస్తూ ఇలా వ్రాసాడు, ''విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు'' (ప్రకటన 2:14). వేర్పాటుసిద్ధాంతంలోని (ప్రతి విధమైన అబద్ధం నుండీ మనల్ని మనం వేరుచేసుకోవాలి అనే బోధ) మూలవిషయాన్ని ఇది సూటిగా తాకుతుంది. బిలాము ఇశ్రాయేలీయులను శపించటం వలన వచ్చే జీతాన్ని ఆశించినా ఎప్పుడూ వారిని శపించలేదు. ''ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి....... వారి దేవతలకు నమస్కరించిరి'' (సంఖ్యా 25:1,2). వారు ఎందుకు ఈ విధంగా చేసారు? ఎందుకంటే, ఇశ్రాయేలీయులను మోయాబీయులకు వేరుగా ఉంచిన అడ్డంకిని పడ్డగొట్టటం బాలాకుకు బిలాము నేర్పించాడు.ప్రకటన 2:14లో మరియు సంఖ్యా 31:16లో స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇది మనకు తెలిసింది. ఈ పాపం 24000 మంది ఇశ్రాయేలీయులైన పురుషులు దేవుని తీర్పులో చనిపోవటానికి దారితీసింది.

దేవునిప్రజలకు మరియు అబద్ధ మతానికీ మధ్యనున్న  అడ్డును అబద్ధ బోధకులు కూలదోస్తున్నారు. ప్రత్యేకపరుచుకోవటం అనే సిద్దాంతం గురించి నేడు అతి తక్కువగా బోధిస్తున్నారు.  ఇశ్రాయేలు పురుషులు మోయాబు స్త్రీలతో జారత్వానికి పాల్పడేలా చేసి బిలాము వ్యక్తిగతంగా 'ప్రత్యేకపరుచుకోవటం' అనే సిద్ధాంతానికి గండికొట్టాడు; అలాగే, దేవతకు ఇశ్రాయేలు మొక్కేలా చేసి సంఘపరంగా 'ప్రత్యేకపరుచుకోవటా'నికి గండికొట్టాడు. ఇది ఇశ్రాయేలీయులపై దేవుని శాపాన్ని కొనితెచ్చింది. 'వ్యక్తిగతంగా మరియు సంఘపరంగా ప్రత్యేకపరుచుకోవటం' అనే సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉండనంత వరకూ ఇప్పుడున్న దుర్గతి ఇలాగే కొనసాగుతుంది.

కొంతమంది, పేరుతో సహా బహిర్గతం చేయబడకూడనంత గొప్పవారని అనేకుల నమ్మకం. ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులు, పెద్దసంఘాల కాపరులు మరియు ఎక్కువమంది శ్రోతలు కల టీవి,రేడియో బోధకులని విమర్శించకూడదనే వైఖరి అనేకులలో కనిపిస్తుంది. వారు ఏది చేసినా లేదా ఏది చెప్పినా, అది బైబిలుకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా, అదేమి పరవాలేదనట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు, కానీ సత్యాన్ని మించినదేదీ లేదని గుర్తించాలి.

నాతాను దావీదును గద్దించాడు.

గొప్ప స్థానంలో ఉన్న ఆ మనిషి రహస్యంగా వ్యభిచరించాడు. ఆ రాజ్యంలోని అత్యున్నత స్థానంలో ఉన్న ఆ వ్యక్తి, ఒక దీనుడైన, అప్రసిద్ధుడైన ప్రవక్త చేత గద్దించబడటం సాధారణం కాదు. నాతాను తిన్నగా దావీదు సన్నిధిలోకి వెళ్లి పాపాన్ని కథారూపంలో చెప్పి ఆ తరువాత కోపగించుకున్న దావీదుతో ''ఆ మనుష్యుడవు నీవే'' ( 2 సమూయేలు 12:7 ) అని చెప్పాడు.

రాజైన యెహోషాపాతును పేరుతో సహా హనానీ బహిర్గతం చేసాడు.

యెహోషాపాతు చాలా కోణాల్లో మంచి రాజు; కాని, తనను తాను మతపరంగా ప్రత్యేకపరుచుకునే విషయంలో అతడు పొరపాటు చేశాడు. అతను దుష్టుడైన ఆహాబు కుమార్తెతో తన కుమారుడికి వివాహము జరిపించాడు (2 దిన 18:1; 21:1-6). ఆహాబుతో పొత్తు కుదుర్చుకొని రామోతు-గిలియాదు యుద్ధానికి అతనితో వెళ్లాడు. కరిస్మాటిక్స్‌తోను, క్యాథలిక్కులతోను  కలిసి పనిచేయాలని ఒత్తిడి చేసేవారికి ఒక ప్రశ్న - 'మీరు భక్తిహీనులకు సహయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులవ్వటం సబబేనా?' (2దిన 19:2).

అవును, తప్పును బహిర్గతం చేయటం, తప్పులో ఉన్నవారిని పేరుతో సహా బహిర్గతం చేయటం సరైనదే.

''పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుట''(యూదా 3) సరైనదే. అది ఒకసారే అప్పగింపబడినది; ఆ తర్వాత అది ఎప్పుడూ సవరించబడలేదు. మనము ''నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించు''(2 పేతురు 2:1)  అబద్ధ ప్రవక్తల విషయమై అప్రమత్తంగా ఉండాలి. నమ్మకస్తులైన దేవునిసేవకులు ఇటువంటి మతభ్రష్టులను బహిర్గతం చేయాలి. వారి గురించి కేవలం సూచనప్రాయంగా తెలియజేస్తే చాలదు. ఎందుకంటే చిన్న గొఱ్ఱెపిల్లలు అర్థం చేసుకోలేక తోడేళ్ల వల్ల నాశనమౌతాయి.

 

 

Add comment

Security code
Refresh

Comments  

# తీర్పు తీర్చటం సరియేనా?Raju 2020-11-29 15:54
ఎంతో అద్భుతంగా వివరించారు సార్..... ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.