విషయసూచిక
ఒక వ్యక్తి రక్షణలో దేవునితో పాటు ఆ వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉంటుంది. రక్షణలో మానవుని పాత్ర యొక్క ఆవశ్యకతను అత్యాసక్తిగల కాల్వినిస్టులు తిరస్కరిస్తే, దేవునిక్రియ యొక్క నిజస్వభావాన్ని ఆర్మీనియన్లు తిరస్కరిస్తారు. కానీ, బైబిల్, దేవునిరక్షణ ప్రణాళికలో ఈ ఇరువురి భాగస్వామ్యాన్ని ప్రస్ఫుటంగా మన ముందుంచుతుంది. అలా అని, ఆర్మీనియన్లు అంటున్న విధంగా ‘ప్రతీ వ్యక్తికీ ఉచితమైన రక్షణను అందించటం దేవుని వంతైతే, ఆ రక్షణను స్వేచ్ఛాచిత్తంతో అంగీకరించటం మానవుని వంతు' అని నేను అనటంలేదు. పై భాగంలో నేనలా చెప్పనూలేదు, ఆ విధంగా బైబిల్ బోధించటమూ లేదు. దేవునివాక్యం ఈ విషయమై నిజంగా ఏమి బోధిస్తుందో తెలియటానికీ, అలాగే ఆధారరహితమైన కొన్ని ఆక్షేపణలకు సమాధానమివ్వటానికి, ఈ అంశాన్ని ఒకొక్కటిగా నిరూపిస్తూ ముందుకు వెళ్దాము.
మొదటి అంశం :
ఒక వ్యక్తి రక్షింపబడటానికి, అతడు నిజంగా మారుమనస్సు కలిగి సువార్తను నమ్మాలి. పాపము నుండి క్రీస్తు వైపు ఇష్టపూర్వకంగా మరలకుండా,ఏ వ్యక్తీ , ఎన్నడూ క్షమింపబడనూలేదు, దేవునిబిడ్డగా చేయబడనూలేదు. మారుమనస్సు మరియు విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి రక్షింపబడగలడని బైబిల్లో ఎక్కడా సూచనప్రాయంగానైననూ బోధింపబడలేదు. అందుకు విరుద్ధంగా ఒక వ్యక్తిలో మారుమనస్సు మరియు విశ్వాసం తప్పనిసరి అని బైబిల్ నొక్కిచెబుతుంది. "రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను?" అన్న ప్రశ్నకు పరిశుద్ధ గ్రంథమిచ్చే ఒకే ఒక్క సమాధానము "ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు" (అపో.కార్యాలు 16:31)
రెండవ అంశం :
పాపం విషయమై పశ్చాత్తాపపడి, సువార్తయందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. సువార్తలోని ఆజ్ఞకు స్పందించి క్రీస్తు వద్దకు వచ్చే ప్రతీ ఆత్మ, ఏ మినహాయింపు లేకుండా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియైన దేవుని చేత స్వీకరించబడి, క్షమించబడతాడు. ఫిలిప్పు బ్లిస్సు అన్న వ్యక్తి ఈ భాగాన్ని ‘అంగీకరించినవాళ్ళందరూ అంతం వరకూ నిలిచి ఉంటారు’అని విశదీకరించారు. మనం నిశ్చయత కలిగుండేదంటూ ఏదన్నా ఉందంటే, అది, తన వద్దకు వచ్చు ప్రతివానిని స్వీకరిస్తానన్న తన వాగ్దానాన్ని క్రీస్తు ఎన్నడూ తప్పడు అన్న సత్యమే. జాన్ బన్యన్ చెప్పినట్లుగా,‘రమ్ము, అంగీకరించబడుము’అన్నదే పాపులకై రక్షకుని నిత్యఆహ్వానం.
మూడవ అంశం:
మారుమనస్సు మరిము విశ్వాసం మానవుని స్వేచ్ఛాక్రియలు. మానవుడు తన స్వబుద్ధితో, స్వీయహృదయంతో, స్వచిత్తంతో పాపాన్ని పరిత్యజించి క్రీస్తును స్వీకరించాలి. దేవుడు ఎన్నడూ ఎవరి స్థానంలోనూ పశ్చాత్తాపపడలేదు, విశ్వసించనూలేదు. భవిష్యత్తులోనూ అలా చేయబోడు. పాపాన్ని విడిచిపెట్టి, విశ్వాసంతో క్రీస్తు వద్దకు రావడం మానవుడే చేయవలసిన క్రియ, అతడు నిజంగా అలా చెయ్యాలని కొరుకున్నాడు కాబట్టే సువార్త పిలుపుకు ఆ విధంగా స్పందిస్తాడు. అతడు క్షమించబడాలని కోరుకుంటున్నాడు, పశ్చాత్తాపపడి, విశ్వాసముంచినపుడే క్షమింపబడగలడు. దేవునితో సహా ఎవరూ, మన స్థానంలో పాపాన్ని విడిచిపెట్టలేరు. అది మనమే చెయ్యాల్సిన పని. మన స్థానంలో ఎవరూ క్రీస్తునందు విశ్వాసముంచలేరు. రక్షించబడటానికి మనమే వ్యక్తిగతంగా, బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా ఆయనయందు విశ్వాసముంచాలి.
ఇక్కడ, ఎవరైనా 'ఇదే విషయాన్ని ఆర్మీనియను కూడా చెబుతున్నాడు గదా !' అని ప్రశ్నించవచ్చు. ప్రియస్నేహితుడా, పరిశుద్దగ్రంథము ఈ విధంగానే - స్పష్టంగానూ, ఖచ్ఛితంగానూ - బోధిస్తుంది. ‘అయితే, కాల్వినిస్టు, పై మూడు అంశాలనూ తిరస్కరించటం లేదా?’,అని మీరడగవచ్చు. వంద రకాల కాల్వినిస్టులు ఉంటారు గనుక నేను వారి గురించి మాట్లాడటమూ లేదు, వారిని సమర్థించటానికి ప్రయత్నించటమూ లేదు. నీకు తెల్సిన ఏ వ్యక్తి ఐనా పైన చెప్పబడిన వాస్తవాన్ని తిరస్కరిస్తే, తనను తాను ఏ వాదం వాడని ఆ వ్యక్తి చెప్పుకున్నా, అతడు బైబిల్ యొక్క విస్పష్టమైన వర్తమానాన్ని తిరస్కరిస్తున్నాడని అర్థం. నా వరకు మాత్రమే నేను మాట్లాడగలను, కాబట్టి దేవుని వాక్యం ఇంత స్పష్టంగా బోధిస్తున్న విషయాన్ని నేను కాదనలేను.
కానీ,‘మానవుడు ఇష్టపూర్వకంగానూ, తన స్వేచ్ఛాక్రియగానూ పాపవిషయమై పశ్చాత్తాపపడి విశ్వాసముంచాలన్న విషయాన్ని అంగీకరించటం ద్వారా మానవుని స్వేచ్ఛానిర్ణయాధికార సిద్ధాంతాన్ని స్థిరపరచి, దేవుని ఎన్నికను నిరాధారపరచలేదా?’అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. నేను స్వేచ్ఛానిర్ణయాధికారాన్ని స్థిరపరచనూ లేదు, దేవుని ఎన్నికను నిరాధారపరచనూలేదు. ఎందుకంటే అలా చేయటం అసాధ్యం. ఒకడు రక్షింపబడటానికి ఏమి చెయ్యాలని బైబిల్ చెబుతుందో, నేను కూడా అదే చెబుతున్నాను. ఇపుడు, ‘ఒక పాపి, ఏమి చేయగలడు, ఏమి చేయలేడు’అన్న విషయాన్ని గురించి దేవునివాక్యం ఏమి చెబుతుందో చూద్దాము.
నాల్గవ అంశం:
మానవుడు రక్షింపబడటానికి మారుమనస్సు పొంది విశ్వసించాలని చెప్పిన బైబిలే, మానవుడు తన పాపస్వభావం వలన, మారుమనస్సు పొందటానికి, విశ్వసించటానికి పూర్తిగా అశక్తుడని కూడా విస్పష్టంగా బోధిస్తుంది :` సువార్త సత్యాన్ని స్వీకరించాల్సిన మానవుని మనసు, హృదయం, మరియు చిత్తానికి అటువంటి సత్యాన్ని గ్రహించే సామర్థ్యం కానీ, అటువంటి సామర్థ్యాన్ని పొందాలనే కోరికగానీ స్వత:సిద్ధంగా లేనేలేదు. వాస్తవానికి, దానికి విరుద్ధమైనదే నిజం. మానవుడు, క్రీస్తు చెంతకు రావడానికీ, రావాలని కొరుకోవడానికీ పూర్తిగా అశక్తుడు. అంతే కాకుండా, అతని స్వభావం మొత్తం క్రీస్తును, సత్యాన్ని పూర్తిగా వ్యతిరేకించేదిగా ఉంది. యేసుక్రీస్తుని ప్రభువుగానూ, స్వంతరక్షకునిగానూ అంగీకరించకపోవటం, కేవలమొక యథాలాప చర్య కాదు కానీ, ఒక ఉద్దేశపూర్వకమైన, స్వచ్ఛందమైన నిర్ణయం. అది తెలిసి తేలిసీ క్రీస్తుని వద్దని, శరీరాన్ని, పాపాన్ని కావాలని చేసుకునే ఎన్నిక. దేవునికీ మరియు ఆయన అధికారానికి సంబంధించినంతవరకూ ఎవరూ తటస్థులు కారు. విశ్వాసం లాగ, అపనమ్మకం కూడా మనస్సు, హృదయం మరియు చిత్తం చేసే బుద్ధిపూర్వకమైన పని. ఇదే విషయాన్ని యోహాను 5:40లో ప్రభువు ‘‘....మీరు నా యొద్దకు రానొల్లరు’’(బుద్ధిపూర్వకంగా మీరు అలా నిర్ణయించుకున్నారు) అని చెబుతున్నాడు. ఔను, అపనమ్మకం చిత్తం యొక్క క్రియ; అసలు, అపనమ్మకం అనేది జవసత్వాలుగల విశ్వాసమే, కానీ దురదృష్టవశాత్తూ, అది నాయందు నాకున్న విశ్వాసము.
పైనున్న ఒకటీ, రెండూ, మూడూ అంశాలను నమ్మి, వాటిని మాత్రమే బోధించి నాల్గవ అంశాన్ని బోధించకపోతే, దేవుని కృపాసువార్తను తప్పుగా తెలియజేయటమే ఔతుంది. ఆవిధంగా చేయటం, పాపిని మరియు అతని అసలు అవసరాన్ని తప్పుగా చిత్రీకరించడమే. అటువంటి బోధ పతనమైన మానవుని అతి ముఖ్యమైన అవసరాన్ని అసంపూర్ణంగా చిత్రీకరించి, అతని పాపస్వభావాన్ని, అందువలన వచ్చే దుష్పరిణామాన్ని అధిగమించే సామర్థ్యం అతనిలో లేదన్న సత్యాన్ని అలక్ష్యం చేస్తుంది. అటువంటి దృక్పథంతో కల్పించబడిన ‘సువార్త’ అసంపూర్ణమైన సువార్త. ఆధునిక సువార్తీకరణ ఘోరంగా విఫలమౌతుంది ఇక్కడే. అది మానవుని బాధ్యతను అతని సామర్థ్యంగా అపార్థం చేసుకుని, దేవుడు ఆజ్ఞాపించే ప్రతి పనినీ నెరవేర్చే నైతిక సామర్థ్యం పాపికి ఉందని అపోహపడుతుంది. రక్షణార్థమైన దేవునికృప అనే నిజసువార్తను ఇలా కలుషితం చేయడం ద్వారా ‘మానవుడు అసమర్థుడు’అని బైబిల్లో రాయబడిన వాక్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడటమో, లేదా వక్రీకరించబడటమో జరుగుతుంది.
తప్పిపోయిన మానవుడు ఏయే కార్యాలు చేయలేడని బైబిల్ నిర్ధిష్టంగా చెబుతుందో, వాటిలో కొన్నిటిని పరిశీలించి సత్యాన్ని గ్రహిద్దాము.
1. యోహాను 3:3 - `మానవుడు చూడలేడు , అతడు మొదట తిరిగి జన్మిస్తేనే తప్ప.'
2. 1కొరింథీ 2:14- `మానవుడు ( తనకు తానుగా) అర్థం చేసుకోలేడు, గ్రహింపజాలడు,అతనికి మొదట నూతన స్వభావము అనుగ్రహించబడితేనే తప్ప.'
3. యోహాను 6:44,45:` మానవుడు క్రీస్తుయొద్దకు ( తనకు తానుగా) రాలేడు, అతడు మొదట ` పరిశుద్ధాత్ముని' ద్వారా సార్థకముగా పిలవబడితేనే తప్ప.
ఇక్కడ మానవుని అసమర్థతను చూపించే అనేక ఇతర లేఖనభాగాల్ని ఉదాహరించలేకపోయినా, పై మూడు వాక్యాలు ` పాపి స్వభావములో, దేవుడు మొదట ఏదైనా కార్యము ఆరంభించితేనే కానీ ఆ పాపి క్రీస్తు దగ్గరకు రాలేడు అని చెబుతున్నాయ'ని గమనించండి; 'రాడు' అని కాదు కానీ 'రాలేడు' అని చెప్పబడింది. ఈ 'ఏదైనాకార్యా'న్నే పరిశుద్ధ గ్రంథము "మరలా జన్మించుట","నూతన జన్మ" లేదా "మారుమనస్సు" అని పిలుస్తుంది. ఇది పరిశుద్ధాత్మదేవుని ప్రత్యేకమైన క్రియ. ఇందులో మానవుని ప్రమేయం ఏమాత్రమూ లేదు. నూతన జన్మ అనుగ్రహించబడే కార్యంలో మానవునికి ఏ భాగస్వామ్యమూ లేదు.
ఐదవ అంశం:
నూతనజన్మ (లేదా పునరుజ్జీవించబడటం) అంటే పాపబానిసత్వం వలన మనము చేయలేనిదీ, దేవుని దృష్టిలో మనము చేయవల్సిందీ ఐన పశ్చాత్తాపపడటం మరియు విశ్వాసముంచటం అనే బాధ్యతలను నెరవేర్చటానికి దేవుడు మనకు ఆత్మీయ జీవాన్ని, సామర్థ్యాన్ని అనుగ్రహించటమే : మానవుడు మరణించాడు అని బైబిల్ చెప్పినప్పుడు మానవుని మనస్సు, హృదయం మరియు చిత్తం పాపం వలన ఆత్మీయంగా మృతిచెందాయని అర్థం. మనము పాపబంధకంలో ఉన్నామని బైబిల్ చెప్పినప్పుడు, మన చిత్తంతో సహా మన పూర్తి ఉనికి పాపబానిసత్వం మరియు పాపశక్తి క్రింద ఉందని అర్థము.
క్రీస్తు చనిపోయి, మన పాపము నిమిత్తమై విమోచనా క్రయధనంగా చెల్లింపబడటం మనకు నిజంగా ఎంత అవసరమో, అదే విధంగా పునరుజ్జీవంలో మనకు నవీనస్వభావాన్ని ఇవ్వటానికి పరిశుద్ధాత్మదేవుని కార్యమూ అంతే అవసరం. దేవుని కుమారుడు మనల్ని పాపశిక్ష నుండి న్యాయంగా విమోచిస్తాడు. కానీ, పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని పాపభ్రష్టత్వశక్తి నుండి, అందువలని మరణము నుండి విమోచిస్తాడు. రక్షింపబడాలంటే, మనకు క్షమాపణ అవసరం; ఆయన మృతి ద్వారా, తన యొక్క సంపూర్ణమైన క్షమాపణను, నీతిని క్రీస్తు మనకు అనుగ్రహించాడు.
అయితే, మనకు ఆత్మీయ జీవమూ, ఆత్మీయ సామర్థ్యము కూడా అవసరము గనుక, వాటిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుజ్జీవము ద్వారా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముని కార్యమైన ఈ నూతనజన్మ ద్వారా మాత్రమే పాపపరిహారార్థంగా శిలువపై యేసుక్రీస్తు ప్రభువు జరిగించిన బలియాగాన్ని, యథార్థమైన విశ్వాసంతో స్వీకరించటానికి మనకు సామర్థ్యం కలుగుతుంది.
దేవుడు త్రిత్వమైయున్నాడు. కాబట్టి, త్రిత్వంలోని ప్రతి వ్యక్తి రక్షణలో విస్పష్టమైన, అత్యావశ్యకమైన పాత్రలను పోషిస్తున్నారని తెలుసుకుంటేనే తప్ప “ఇంత గొప్ప రక్షణ”ను ఎవరూ అర్థం చేసుకోలేరు. పాపుల రక్షణ అనే దైవికక్రియలో ముఖ్యమైనవని చెబుతూ, “మహిమాన్వితమైన క్రీస్తుసువార్త”ను మాత్రమే ప్రకటించి, ఎన్నికచేసే తండ్రియైన దేవుని యొక్క సార్వభౌమ్య ప్రేమ మరియు పరిశుద్ధాత్మ దేవుని పునరుజ్జీవశక్తి పాపులను రక్షించే దేవునికార్యంలో కీలకమైనవని గుర్తించనిదే మహిమాన్వితమైన ఆ కృపాసువార్తను యథార్థంగా ఎవరూ ప్రకటించలేరు.
రక్షణలో దేవుని పని కేవలం క్షమాపణ అందించటం మాత్రమేనని, అయితే ఆ క్షమాపణను స్వీకరించటం మనుష్యుని పని అని చెప్పటం, తండ్రి ప్రేమతో చేసిన ఎన్నికనూ, పరిశుద్ధాత్ముని పునరుజ్జీవ శక్తిని విస్మరించటమే. ఈ విధంగా బోధించటం, రక్షణలో మానవునిని దేవునితో సమభాగస్థునిగా చేయటమే కాక, రక్షణలో మానవుడే నిర్ణయాత్మక పాత్రను నిర్వహిస్తున్నాడని చెప్పటం ఔతుంది.
శిలువపై చేసిన యాగానికి, ప్రభువైన యేసుక్రీస్తును మహిమపరుస్తూనే, తండ్రియైన దేవుడు నిత్యత్వంలో చేసిన కార్యానికీ(ఎన్నిక), పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చేసిన కార్యానికీ(మారుమనస్సు/నూతనజన్మ), పాపిని ఘనపరచటం ఎంత ఘోరమూ, ఎంత హాస్యాస్పదం!
'పరిశుద్దాత్మదేవునిని నువ్వు అనుమతిస్తేనే కానీ అద్భుతంగా ఆయన నిన్ను పునరుజ్జీవింపచేసి తన కార్యాన్ని నెరవేర్చడు' అని అనటం ఆయనను అవమానపరచటమే ఔతుంది. అలా చేయటం, సమాధుల మధ్యలో నిల్చుని చనిపోయినవారితో 'ఇదిగో మీరు విశ్వాసంతో నన్ను అడిగితే, మీకు జీవమిచ్చి మిమ్మల్ని మీ సమాధుల్లో నుండి లేపుతాను' అని చెప్పటం వంటిది. ఇలా బోధించేవారు పాపి యొక్క సంపూర్ణమైన ఆత్మీయ అశక్తతను ఎంతగా అలక్ష్యం చేస్తున్నారు! అమోఘం !
ఆర్మీనియను స్వేచ్ఛానిర్ణయాధికార'సువార్త'లోని అసలు దోషమేమిటంటే, అతడు రక్షణ విషయంలో మనుష్యుని పశ్చాత్తాపం మరియు విశ్వాసాలను దేవునికార్యం యొక్క ఫలాలనీ, తన వంతుగా పాపి అందించేటటువంటి భాగాలు కావనీ గుర్తించలేకపోవటమే. క్రీస్తు వైపు మరలిన ప్రతి వ్యక్తీ, మనఃపూర్వకంగానే క్రీస్తువైపు మరలుతాడు. కానీ, ఆ మన:పూర్వకముగా మరలటమనేది 'తండ్రియైన దేవుడు ప్రేమతో చేసిన ఎన్నిక' మరియు 'పరిశుద్ధాత్మ దేవుని సార్థకమైన పిలుపు' యొక్క ప్రత్యక్ష ఫలితమే.‘నువ్వు నమ్మితే దేవుడు నీ విశ్వాసాన్ని బట్టీ నీకు మారుమనస్సును దయచేస్తాడు’అని చెప్పటం మానవుని అసలు అవసరతను అపార్థం చేసుకోవటం మాత్రమే కాక దేవుని అతి విలువైన కార్యాన్ని తప్పుగా వెల్లడి చేయటం కూడా ఔతుంది.
ఆరవ అంశం:
విశ్వాసము మరియు పశ్చాత్తాపము అనేవి పునరుజ్జీవానికి ఋజువులే కాని కారణాలు కావని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది :
ఉదాహరణకు, ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి, మార్గంలో తారసపడ్డాడని అనుకుందాము. అతడు చనిపోయి ఉండటానికి విసుగు చెంది, అద్భుతకార్యం చేసి తనకు జీవమివ్వమని ఒక గొప్ప వైద్యుని వద్దకు వెళ్ళి అడిగాడని నువ్వు భావిస్తావా? లేదు. నువ్వు ఎంతో ఆశ్చర్యపడి, "అరె, నీకేమైంది? నిన్నెవరు తిరిగి బ్రతికించారు? " అనడగుతావు. అతడు నడుస్తున్నాడు కాబట్టి, ఊపిరి తీసుకుంటున్నాడు కాబట్టి అతడు సజీవుడని గుర్తించగలిగావు. నడవటమూ, ఊపిరి తీసుకోవటము అనేవి అతనిలో వేరెవరో చేసిన అద్భుతకార్యం యొక్క ఋజువులే కాని, తన స్వశక్తి మరియు స్వచిత్తం వలన జరగలేదని నీకు తెలుసు. అదే విధంగా, ఆత్మీయంగా మృతి చెందిన ఒక వ్యక్తి, విశ్వాసము మరియు పశ్చాత్తాపము అనే ఆత్మీయకార్యాలు చేయడం చూసినపుడు, ఆ ఆత్మఫలం అతనిలో నూతనజీవం అనే అద్భుతం జరిగిందని తెలుపుతుంది .
ఒక బైబిలు దృష్టాంతంతో ఈ విషయాన్ని మరింత విపులీకరిస్తాను. అపో.కా. 16:14 వచనం, పై విషయానికి సంబంధించిన ఖచ్చితమైన ఋజువు. అన్నట్లూ, నాకు తెలిసినంతవరకూ నూతననిబంధన మొత్తంలో ''హృదయము తెరచెను" అనే పదప్రయోగం ఈ చోట మాత్రమే కనిపిస్తుంది. అంతే కాకుండా, ఈ "హృదయము తెరుచుట" అనేది పూర్తిగా దేవుని శక్తివలనే జరుగుతుందనీ మానవుని చిత్తమువలన కాదనీ పరిశుద్ధగ్రంథము తెలియజేస్తుంది. కానీ ఆధునిక సువార్తీకరణ, ఇందుకు పూర్తి విరుద్ధముగా "హృదయము తెరచుట" అనేది మానవుని స్వశక్తి/ స్వచిత్తము వలన జరుగుతుందని చెబుతుంది. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయమేమిటంటే, మానవుడు తన హృదయం తెరవబడటానికి సమ్మతించాలా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ చర్చించటం లేదు. ఎందుకంటే ఆ విషయాన్ని మనము (ఇంతకు ముందే) ఒకటి, రెండూ, మూడు అంశాల్లో నిరూపించాము. మనమిక్కడ అటువంటి ఆత్మీయకార్యాన్ని జరిగించటానికి మానవునికి శక్తినిచ్చిన మూలాధారాన్ని వెతుకున్నాము. ఆ శక్తిని మానవుని స్వేచ్ఛానిర్ణయాధికారం కలగజేస్తుందని ఆర్మీనియను చెబుతుండగా, బైబిల్ మాత్రము, పరిశుద్ధాత్మ దేవుడే మారుమనస్సును కలిగించటం ద్వారా ఆ శక్తిని అనుగ్రహిస్తాడని ప్రకటిస్తుంది.
ఇపుడు,లేఖనాలలో "హృదయము తెరచెను" అని వాడబడిన ఏకైక వచనాన్ని పరిశీలించి, మనమిదివరకే చెప్పుకున్న విషయాలతో అది సరిపోలుతుందో లేదా చూద్ధాము.
అపో.కా. 16:14లో పౌలు చెప్పిన మాటలు విని స్పందించటానికి ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచాడు.
మొదటిగా, మనము పౌలు చెప్పిన వాక్యం లూదియ విన్నదని గమనించగలము. ఆమె ఆ వర్తమానాన్ని ఆనందంగా విని, మన:స్ఫూర్తిగా నమ్మింది. మనమిదివరకే అంగీకరించిన రీతిగా, సువార్త వలన మేలు పొందే నిమిత్తము, లూదియ ఆ విధంగా చేయటం అవసరం. వాస్తవంగా, లూదియ నమ్మటానికి నిర్ణయించుకుంది. మరియు మనస్పూర్తిగా అలా చేయటానికి ఇష్టపడింది కాబట్టే నమ్మగలిగింది. ఆమె అయిష్టంగా నమ్మనూలేదు, ప్రభువు ఆమె స్థానంలో విని నమ్మనూ లేదు. ఇది ఆమె స్వంతనిర్ణయం, మన:పూర్వకమైన నిర్ణయం.
ఇది మనమిదివరకే చర్చించిన ఒకటి, రెండు, మూడు అంశాలను దృఢపరచి, సువార్త విన్నా వినకపోయినా ఎన్నిక చేయబడినవారు ఏదో విధంగా రక్షణలోనికి వస్తారులే అంటు సువార్తీకరణను నిర్లక్ష్యపెట్టే హైపర్‌కాల్వినిస్టు దృక్పథం పెద్ద పొరపాటని రుజువుపరుస్తుంది.
ఆ తరువాత, లూదియ కొరకు దేవుడు ఏమి చేసాడో ఇక్కడ మనము స్పష్టంగా గుర్తిస్తాము. లూదియ రక్షించబడటానికి పూర్వము దేవుడు ఏమి చెయ్యాలో ఇక్కడ నిరూపించబడింది.
1.బోధించటానికి యోగ్యమైన "కృప వలన, విశ్వాసము ద్వారానైనటువంటి" రక్షణను ప్రభువు ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి మరియు పునరుత్తానం అనే సువార్త సత్యాన్ని పౌలు స్పష్టంగా బోధించాడు. నిశ్చయంగా ఈ గొఱ్ఱెపిల్ల దేవుని కృపాసహితమైన ఏర్పాటే.
2.దేవుడు లూదియకు తన ఏర్పాటుకు సంబంధించిన వర్తమానాన్ని కూడా అందించాడు. తన సంకల్పమైన ఈ రక్షణను వివరించటానికి ఒక బోధకునిని దేవుడు లూదియ వద్దకు పంపించాడు. అటువంటి ఉన్నతమైన సువార్తను సిద్ధపరచటానికి దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. అందునిమిత్తము ఆయన తన అద్వితీయ కుమారునినే అప్పగించాడు. అంతే కాకుండా, పౌలు వంటి ఉత్కృష్టమైన బోధకునిని సిద్ధపరచటానికి కూడా ప్రభువు ఎంతో వేదనకోర్చాడు. అపో.కార్యము 22వ అధ్యాయంలో పౌలు సాక్ష్యంలో ఈ విషయాన్ని చదవండి.
ఇక్కడే ఆర్మీనియను సిద్ధాంతము, బైబిలుబోధ నుండి వైదొలిగి, పైన చెప్పబడిన వాస్తవాలకు మానవతర్కాన్ని ఉపయోగించటం ఆరంభించింది. మరియు ఈ విషయమై బైబిలు ఇంకా ఏమి బోధిస్తుందో పూర్తిగా చూడకుండానే, దేవుడు చేయవలసిన కార్యం ఇంకొకటుందని గ్రహించటంలో ఘోరంగా విఫలమయ్యింది.
3.లూదియ నమ్మకం ఉంచటానికి దేవుడు ఆమె హృదయాన్ని తెరవాలి (ఆమెకు తన జీవాన్ని అనుగ్రహించాలి). ఆమె ప్రకృతిసంబంధమైన మనస్సు గ్రుడ్డిది, ఆమె ప్రకృతిసంబంధమైన హృదయానికి దేవుడంటే అయిష్టం, ఆమె ప్రకృతిసంబంధమైన చిత్తం పాపానికి బానిసై, ఆత్మీయపతనంలో ఉంది. ఈ ఆత్మీయపతనం అనే సమాధి నుండి దేవుని శక్తి మాత్రమే ఆమెను విమోచించగలుగుతుంది. ఈ నూతనజీవాన్ని, ఈ శక్తిని దేవునికార్యం మాత్రమే అనుగ్రహిస్తుందని గమనించండి. లూదియ హృదయాన్ని తెరిచింది దేవుడేనని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది.
లేఖనంలో మీరది గమనించకపోయుంటే, "ప్రభువు ఆమె హృదయము తెరచెను" అన్న మాట సరిగ్గా చదవనేలేదనుకుంట.
లూదియ మారుమనస్సు పొందటంలో కారణానికీ ఫలితానికీ గల సంబంధాన్ని పరిశుద్దాత్ముడు మనకు ఎంత స్పష్టంగా బోధిస్తున్నాడో చూడండి. లూదియ హృదయాన్ని తెరచింది దేవుడు - ఇది 'కారణం'. తద్వారా ఆమె పౌలు బోధించిన సత్యాన్ని గ్రహించగలిగింది - ఇది 'ఫలితం'; ఇలా దేవుని వాక్యం చెబుతుంది. ఇది మృతవేదాంతశాస్త్రమని దీనిని తృణీకరించటం లేదా కాల్విన్ మహశయుడిని విమర్శించటం లాంటివి బదులు, మీకు మీరే ఈ వాక్యభాగాన్ని బైబిల్లో చదవండి. దేవుడు ప్రత్యేకంగా లూదియ హృదయాన్ని తెరిచి, ఆమె నమ్మిక ఉంచటానికి శక్తినివ్వటం వలన లూదియ సువార్తను విని అర్థం చేసుకుని నమ్మింది అన్న విషయాన్ని నువ్వు తిరస్కరిస్తే, జాగ్రత సుమా! నువ్వు దేవుని వాక్యంతో పోరాడుతున్నావు. ఈ విషయంలో మానవుని స్వేచ్ఛా నిర్ణయాధికారం లూదియ మారుమనస్సు పొందటంలో నిర్ణయాత్మక అంశంగా నువ్వు పరిగణిస్తే మాత్రం, నువ్వు దేవుని వాక్యాన్ని తెలిసితెలిసి వక్రీకరిస్తున్నావు.
దేవుని కృప మనకు రక్షణను అనుగ్రహించటం మాత్రమే కాక, దేవునిశక్తి ఆ రక్షణను కోరుకోవటానికీ, స్వీకరించటానికీ మనకు సామర్థ్యం ఇస్తుంది. 'మనము ఇచ్చయించుటకునూ, కార్యము చేయుటకునూ ఆయన మనలో క్రియ జరిగిస్తారు. మనము ఇచ్ఛయించేలా ఆయన చేసే కార్యమే నూతన జన్మ.' నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పునరుజ్జీవక్రియ సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునిదే.
ఎప్పుడైతే మనం విశ్వాసము ద్వారా రక్షింపబడటానికీ ( ఇది మానవుని పని) పరిశుద్ధాత్ముని ద్వారా నూతన జన్మ పొందటానికీ ( ఇది దేవుని పని ) మధ్య తేడాని విస్మరిస్తామో, అప్పటినుండి మనం అపాయంవైపు, అయోమయంవైపు పయనించడం ప్రారంభిస్తాము. ఏ విషయాన్ని మానవుడు చేయలేడని బైబిలు సుస్పష్టంగా చెబుతుందో ఆ విషయాన్ని మానవుడు చేయగలడని మనము ఒప్పింపబడటం కూడా ప్రారంభిస్తాము. ఈ విధంగా, పరిశుద్దాత్ముని కార్యం యొక్క ఆవశ్యకతను దైవశాస్త్రపరంగా తిరస్కరించిన తర్వాత , ఆ విషయం ఆచరణలోనూ దాటవేయబడటానికి ఎంతో కాలము పట్టదు. ఇది నేటి సువార్తీకరణ యొక్క దయనీయ పరిస్థితి. నూతనజన్మ పొందటం మానవుని చిత్తము యొక్క శక్తిసామర్థ్యాలలో ఉందని వీరు రూడీగా నమ్ముతున్నారు గనుక, బైబిల్లోని వేదాంతసారం కన్నా ఇటువంటి మానవుని ఆలోచనాపద్ధతి వీరికి ముఖ్యమైపోయింది. పరిశుద్దాత్మదేవుని యొక్క కార్యం పూర్తిగా మరువబడి, కార్యక్రమాలు మరియు ప్రకటనలే సువార్త సభ విజయవంతం అవటానికి ముఖ్యావసరాలు ఐపోయాయి. ఈ సువార్త కూటాలు విజయవంతంగా జరగటానికి పరిశుద్ధాత్ముని సహాయం కొరటం అవసరమని వారు పైపై మాటలు చెప్పటం వాస్తవమే. ప్రతి రోజూ ఈ సభ కొరకు ప్రార్థన చేస్తాను అన్న వాగ్ధానపత్రాలు మహాసభకు ఎన్నో నెలల ముందుగానే పంచబడుతున్నాయన్నది కూడా వాస్తవమే. అయితే ఈ సువార్త కూటాల విజయానికి ప్రార్థనా సహకారమే కారణమని ఒకవైపు, మీ ఆర్థిక సహాయం లేనిదే ఈ కూటాలు విజయవంతంగా జరగకపోయేవని మరోవైవు ప్రకటిస్తూ ఉంటే, ఇంతకీ ఆ రెండిటిలో ఈ కూటాల విజయానికి తోడ్పడింది ఏది అన్నదే అనేకులకు అంతుపట్టని విషయం. అయినా, ఇది వేరొక రోజు కొరకు వేరొక వర్తమానం అనుకోండి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments