“మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టెదము" (2కొరింథీయులకు 10:5).
ప్రపంచములో అతి ప్రాచీన కాలం నుండి అనగా సుమారు 3000 వేల సంవత్సరాలనుండి వ్యాప్తిలో ఉండి మధ్య ఆసియా, ఈజిప్టు, కొన్ని ఐరోపా దేశాలు మరియు భారత ఉప ఖండాలలో మానవ జీవితాలను ప్రభావితం చేస్తున్న అంశం జ్యోతిష్య శాస్త్రం. దీని పునాది పూర్వం బబులోను సామ్రాజ్యంలో నుండి ఉద్భవించిదంటారు. ఆ తరువాత ఈజిప్టుకు వ్యాపించింది. తరువాత కాలంలో అలెగ్జాండర్ యొక్క ఆక్రమణలో ఆనియా అంతటా వ్యాప్తి చెందింది. అయితే బబులోను, ఈజిప్టు తరువాత గ్రీకు దేశాలతో ఉన్న సంబంధాల వల్ల భారత దేశంలో కూడా జ్యోతిష్య శాస్త్రం పరిచయం చేయబడి ఆ తరువాత కాలంలో అనేక రకాలుగా అభివృద్ధి చెంది విపరీతమైన వ్యాప్తిలోకి వచ్చి ప్రతీ భారతీయుని జీవితంలో ప్రభావం చూపుతుంది. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా ఐరోపా దేశాలలో 17వ శతాబ్దం వరకు వ్యాప్తిలోవుండి ఆ తరువాత కాలంలో వచ్చిన శాస్త్రీయ, విజ్ఞాన విప్లవాల వలన జ్యోతిష్య శాస్త్రం పూర్తిగ కనుమరుగై పోయింది. ఈ మధ్య కాలంలో మాధ్యమాల ద్వారా కాస్త తిరిగి వ్యాప్తిలోకి వచ్చింది. కాని భారత దేశంలో మాత్రం ముఖ్యంగ హిందూ సమాజంలో ప్రతి మనిషి జననం నుండి మరణం వరకు అన్ని వయస్కులలో చాల ప్రభావం చూపుతుంది.
ప్రాచీన కాలంలో అంటే సమయానికి సంబంధించిన యంత్రాంగాలు కనుగొనక మునుపు, మనుష్యులు కాలం యొక్క మార్పులు వర్షాలు, తుఫానులు, ఒక స్థలం నుండి మరొక స్థలానికి ప్రయాణాలు, అమావాస్య పౌర్ణమి, సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం వలన కలిగే మార్పుల కోసం ఖగోళములోని మార్పుల మీద ఆధారపడేవారు. ముఖ్యంగ వ్యవసాయానికి అనుగుణంగ ఉండడానికి ఉండే పరిస్థితులను ముందుగానే ఖగోళములో గమనించి వాటిని పాటించేవారు. అయితే సృష్టి మీద ఎక్కువగా ఆధారాపడే సృష్టినే దేవుడిగా ఆరాధిస్తూ ఈ ఖగోళములోని జరుగుచున్న మార్పులను దైవ సమాచారంగా భావించేవారు. మరి కొందరు దేవుడే ఈ ఖగోళములోని గ్రహాలు, నక్షత్రాల ద్వారా మనకి జీవిత విషయాలను తెలియపరుస్తున్నాడని గ్రంథాలలో లిఖించడం మొదలు పెట్టారు. ఇలా 3000 వేల సంవత్సరాల నుండి వివిధ ప్రదేశాలలో అనేక విధాలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఒక వ్యక్తి జన్మించిన సమయం, ప్రదేశం, ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి ఆయా రాశి, నక్షత్ర, భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా జాతకం చెప్పబడుతుండేది. అంటే నక్షత్రాలు, గ్రహాలు వాటి యొక్క కదలికలు మానవుని జీవితాలను, స్థితిగతులను నిర్దేశిస్తాయని చెప్పబడింది.
జ్యోతిష్య శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకారం ఏ మనిషికైనా భవిష్యత్ గురించి కొద్దీ గోప్పో బెంగ ఉంటుంది. రేపు తనకు జరగబోయే శుభా, అశుభాలను తెలుసుకోవటం, ఏవైనా భాదలుంటే వాటికి నివారణోపాయాలను వెతుక్కోవడం వంటివి లభిస్తాయని ఒక నమ్మకం. దీనికి ఒక మనిషియొక్క నక్షత్రం రాశి దానికి అపాదించబడిన గ్రహాలను ఉపయోగిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాశులను ఉపయోగించి వాటికి వివిధ నామ కరణాలు, విభజనలు చేసి జాతక చక్రం తయారుచేసి జాతకం చెబుతారు. అయితే గ్రహాలకు, నక్షత్రాలకు నామకరణాలు చేయడం వలన నష్టమేమి లేదు కాని ఊహా చిత్రాలుగా ఉండే రాశులను ఉపయోగించి వాటిని మనిషి జీవితానికి అపాదించడం హేతుబద్ధతకానిది మరియు శాస్త్రీయమైనది కాదు. అలాగే గ్రహాలకు, నక్షత్రాలకు, రాశులకు లక్షణాలు, లింగాలు, జాతులు వంటివి ఆపాదించడం శాస్త్రీయబద్దమైనది కాదు. ఎందుకనగా అవి కేవలం వ్యక్తిత్వం, ప్రాణంలేని నిర్జీవ పదార్థాలు. గ్రహాలు, నక్షత్రాలనేవి దేవుడు ఆదియందు సృష్టించిన సృష్టిలో ఒక భాగం. వాటికి లక్షణాలు, గుణాలు ఆపాదించి అవి మనిషి జీవితాన్ని నిర్దేశిస్తాయనటంలో ఏ మాత్రం హేతుబద్ధత లేదు. లింగ భేదమనది కేవలం సృష్టిలో ఉండే జీవులకు మాత్రమే ఉంటుంది. అలాగే గుణగణాలనేవి మంచి చెడుని వివేచించే లక్షణాలు కేవలం మనిషికి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఎవరో ఎప్పుడో ఎక్కడో ఈ గ్రహాలకు, నక్షత్రాలకు లింగాలకు, జాతులను, లక్షణాలను ఆపాదించారు. ఇది కేవలం ఆశాస్త్రీయం గ్రహాలలో కూడా లింగ వివక్ష, జాతి వివక్ష చూపుతూ వ్రాయటమనేది కేవలం మానవ కల్పితంలాగే ఉంది కాని అది దైవ ప్రేరేపణచే కల్గింది కాదు మరియు దైవ సమాచారం ఇస్తున్నదనీ కాదు.
జ్యోతిష్య శాస్త్రం శాస్త్రీయబద్దమైనదా?
అసలు ఒక సిద్ధాంతం లేక ఒక అంశం శాస్త్రీయబద్దంగా ఎలా నిరూపించబడుతుంది?
శాస్త్రీయత అంటే ఏమిటి?
శాస్త్రీయత అనగా పూర్తిగ హేతుబద్ధంగా ఆధారాపూర్వకంగ ఉండేది. ఒక సిద్ధాంతాన్ని కాని ఒక అంశాన్ని కాని శాస్త్రీయబద్దంగ నిరూపింపబడాలంటే అది అనేక హేతుబద్ధమైన, శాస్త్రీయబద్ధమైన ప్రయోగాలు, పరీక్షలకు నోచుకోవాలి. అలా అన్ని రకాల పరీక్షలకు నోచుకొని, పరీక్షించిన ప్రతిసారి ఒకే రకమైన ఫలితాలు పునర్పుత్పత్తి వచ్చేలా ఉండాలి. ఒక క్రొత్త సిద్ధాంతం ఉనికిలోకి వచ్చినప్పుడు దాన్ని ముందుగా పరిశీలించాలి, ఆ తరువాత అనేక రకమైన ప్రశ్నలతో, సందేహాలతో అధ్యయనం చేయాలి. తరువాత ఒక పరికల్పన కల్గించి, దాని మీద అనేక రకమైన ప్రయోగాలను ప్రయోగించి వచ్చిన ఫలితాలను విశ్లేషించి, దృడపరచి ముగింపు చేయాలి లేక ధృవీకరించాలి. ఇలా చివరికి వచ్చిన ఫలితాలను తిరిగి పరిశీలించి, పరీక్షించి తిరిగి అవ్వే ఫలితాలను పునరుత్పత్తి చేయగలిగితే అది శాస్త్రీయబద్ధమైన సిద్ధాంతం అవుతుంది. అలాగే అదొక సూత్రం లేక నియమంలాగా ఉండిపోతుంది.
ఇదే క్రమంలో దాన్ని మనం సందేహపడి తప్పుగా నిరూపించడానికి ప్రయత్నాలు కూడా చేయాలి. ఎందుకనగా ఆ క్రమంలోనే మనకు అనేక సందేహాలు తలెత్తి నిజనిర్ధారణ జరుగుతుంది. దీన్నే ఫాల్సిఫికేషన్ (Falsification) అని అంటారు.
కాబట్టి ఇలా అన్ని రకాల పరీక్షలకు, పరిశీలనలకు, ప్రయోగాలకు నోచుకున్న ఎన్నో శాస్త్రీయ బద్దమైన సూత్రాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని మనం ధ్యానిద్దాం.
ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు
1. విశ్వగురుత్వాకర్షణ నియమం (Law of Universal Gravitation)
ఈ నియమం ప్రకారం గురుత్వాకర్షణ శక్తి అనేది రెండు వస్తువుల మధ్య ఉన్నటువంటి వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్దానికి అమలోమానుపాతం మరియు దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది.
పై చెప్పబడిన నియమం ప్రకారం ఈ విశ్వంలోని గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఇంకా ఇతరేతర పదార్థాలు గురుత్వాకర్షణ శక్తి వలన ఆకర్షింపబడుతున్నాయి. గురుత్వము అనేది విశ్వవ్యాప్తంగా ఉంది. అయితే ఈ ఆకర్షణ శక్తి అనేది రెండు గ్రహాలు లేక (గ్రహాలు, ఉప గ్రహాలు, నక్షత్రాల) యొక్క ద్రవ్వరాశుల మీద ఆధారపడుతుంది. ఉదాహరణకు గ్రహాల యొక్క ద్రవ్యరాసం ఎక్కువ ఉంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగా ద్రవ్యరానం తక్కువ ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే గ్రహాల మధ్య ఉండే దూరం ఎక్కువగా ఉంటే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. గ్రహాల మధ్య ఉండే దూరం తక్కువగా ఉంటే ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇది ఖగోళంలో ఉండే అతి ప్రాముఖ్యమైన నియమం. (అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. మన భూమికి అది 9.8m/s²
2. కెప్లర్ గ్రహగమన నియమాలు (Kepler's Laws ofPlaretary Motion)
ఖగోళ శాస్త్రములో శాస్త్రవేతైన కెప్లర్ మూడు గ్రహ గమన నియమములను ప్రతిపాదించడం జరిగింది. కెప్లర్ నియమము ప్రకారం గ్రహములు సూర్యుని చుట్టు దీర్ఘవృత్తాకార కక్ష్యలలో తిరుగుతుంటాయి.
- ప్రతి గ్రహము దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది. దీర్ఘవృత్తం యొక్క రెండు నాభులలో ఏదో ఒక స్థానములో సూర్యుడు వుంటాడు.
- దీర్ఘవృత్తాకార మార్గంలో తిరిగే గ్రహమునకు సూర్యునికి కలిపే రేఖ సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యములను ఏర్పరుస్తుంది.
- గ్రహము యొక్క పరిభ్రమణ కాల వర్గం దీర్ఘవృత్తం యొక్క దీర్ఘాక్షు ఘనమునకు అమలోమాను పాతంలో ఉండును.
మరి కొన్ని ఖగోళ నియమాలు -
- అభికేంద్ర బలం (Law of Cervipetal Force)
- అపకేంద్ర బలం (Law of Centrifugal Force)
భౌగోళానికి సంబంధించినవి
1. ఉష్ణగతిక సూత్రాలు (Law of Thermo Dynamics)
2. న్యూటన్స్ సూత్రాలు (Newton's Laws of Motion) 3. జీవ శాస్త్రంలోని సూత్రాలు (Law of Biology)
ఇలా మరెన్నో సూత్రాలు లేక నియమాలు ఖగోళానికి మరియు భౌగోళానికి సంబంధించినవి శాస్త్రీయబద్దంగా నిరూపించబడి నేటికి అనేక పరిశోధనలకు ఉపయోగపడుతూ శాస్త్రీయ విజ్ఞానాన్నిపెంపొందిస్తూ... మానవాళి యొక్క ఎదుగుదలకు తోడ్పుడుతూ విద్య, వైద్య, సాంకేతిక మరియు అనేక రంగాలలో తోడ్పుడుతున్నాయి.
జ్యోతిష్య శాస్త్రంలోని అంశాలు ఎంత అశాస్త్రీయబద్దంగా మరియు హేతురహితంగా ఉన్నాయో మనమిప్పుడు గమనిద్దాం.
జ్యోతిష్యంలో 9 గ్రహాలను, 12 రాశులు, 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ 9 గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు గ్రహాలు కావు, సూర్యుడు ఒక నక్షత్రం, చంద్రుడు మన భూమికి ఒక ఉపగ్రహం. అలాగే రాహువు, కేతువు కేవలం ఛాయ గ్రహాలు కాని గ్రహాలు కావు. గ్రహణాల సమయలలో వచ్చే ఛాయలను ఆధారం చేసుకొని రాహువు, కేతువులను గ్రహాలుగా పరిగణిస్తారు. అలాగే కేవలం 27 నక్షత్రాలను మాత్రమే పరిగణలోనికి తీసుకుంటారు. కాని నిజానికి ఖగోళంలో చాలా నక్షత్రాలు కనుగొనబడ్డాయి. జ్యోతిష్యశాస్త్రం మొత్తం భూకేంద్రిక సిద్ధాంతం పైన (Geo-Centric Theory) రూపింపబడినది. అంటే భూమి చుట్టూ సూర్యుడు గ్రహాలు తిరుగుతున్నాయి అనే నమ్మకంపైనే నిర్మింపబడినది. కాని వాస్తవానికి గ్రహాలు సూర్యకేంద్రంగ తిరుగుతుండడం (HelioCentric Theory) నిరూపితమైన శాస్త్రం . - ఛాయా గ్రహాలైనటువంటి రాహువు, కేతువులకు ద్రవ్యరాశి ఉండదు ఎందుకంటే ప్రపంచంలో ఏ ఛాయకు ద్రవ్యరాశి (Mass) ఉండదు, కాబట్టి ఇది న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమానికి లోబడదు మరియు శాస్త్రీయతకు విరుద్ధమైనది.
ఒక వ్యక్తి జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది అతని జన్మ రాశిని, చంద్రుడికి దగ్గరలో ఏ నక్షత్రం ఉంటే అది జన్మ నక్షత్రం అని భావిస్తారు. అలాగే జన్మ నామం, నక్షత్ర పాదాలననుసరించి వ్యక్తికి నామకరణాలు చేస్తుంటారు. గ్రహాలు రాశులకు మరియు నక్షత్రాలకు అధిపతులు. అలాగే గ్రహాలకు కొన్ని గ్రహాలు మిత్రులుగా మరికొన్ని శత్రువులుగా పరిగణిస్తారు. అయితే ఇక్కడ గ్రహాలకు లక్షణాలను అపాదించి వాటిని అధిపతులుగా పరిగణించి వాటి ప్రభావం మనుష్యుల మీద ఉంటుందనటం ఏమాత్రం శాస్త్రీయమైనది కాదు. అధిపతులు, మిత్రువులు శత్రువులు అనే లక్షణాలు కేవలం జీవరాశులకు అంటే జీవంతో ఉన్నవాటికే వర్తిస్తాయి. ముఖ్యంగా మనుష్యులలో ఆ వ్యత్యాసాలు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని నదులకు మరేదైన నిర్జీవమైనవాటికి లక్షణాలు ఆపాదించడం హేతుబద్ధమైనది కాదు. మన యొక్క నైతిక విలువల మీద, ఆరోగ్యాల మీద, ఆర్థిక వ్యవహారాలు, ఆలోచనలు, కుటుంబ పరిస్థితులు, బాధలు, అప్పులు, వైవాహిక జీవితము, వ్యాపారాల మీద మరియు ఇతరతర విషయాల మీద ప్రభావం ఉండనే ఉండదు. ఎందుకంటే ఇవన్నీ మానవుడు తన యొక్క జీవనశైలిలో కష్టపడుతూ నైతిక విలువలను పాటిస్తూ కష్ట-సుఖాలను అనుభవిస్తూ అన్నింటికంటె అతి ప్రాముఖ్యంగ దేవుని మీద ఆధారపడుతూ మెరుగైన సమాజం కోసం జీవించే క్రమంలో ఎదురయ్యే అంశాలు.
జ్యోతిష్య శాస్త్రంలో మరో ముఖ్యమైన అంశం లగ్నం. ఒక వ్యక్తి జాతకాన్ని విశ్లేషించడానికి ప్రధాన ఆధారం లగ్నం. అతని శారీరక స్థితి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, సమాజంపట్ల అతనికున్న ధృకోణం, ఆలోచన విధానం, ఇలా అన్ని అంశాలు ప్రాథమిక అవగాహాన ఈ లగ్నం ద్వారా నిరూపిత మవుతుందటారు (దీని కోసం ద్వితీయ, తృతీయ భావం నుండి సప్తమ భావ కారకత్వములు, రాజ్య భావము నుండి వ్యయభావ కారకత్వములన్ని పరిశీలించి లెక్కకడుతుంటారు). ఈ జాతక విశ్లేషణలో అనేకసార్లు తప్పులు దొర్లుతుంటాయి. ఉదాహరణకు ఒక 10మంది జన్మ తేదిలు, స్థలాల వివరాలు ఇచ్చివారి లగ్నం గురించి చెప్పమంటే వివిధ జ్యోతిష్యులు వివిధ జాతకాలు ఇస్తారు. ఇచ్చిన ఆ జాతకాలలో పొంతన ఉండదు, ఒకవేళ ఎవరో ఇద్దరు ముగ్గురు ఒకే జాతకం చెప్పిన అది ఆ ఫలానా వ్యక్తి జీవితంలో సరిపోలి ఉండదు. ఇలా ఒకే జాతకం రాకపోవడానికి లేక ఖచ్చితమైన వాస్తవాలు (లక్షణాలు) తెలియకపోవడానికి ముఖ్యకారణాలు, ఒక నిరూపితమైన నియమం లేకపోవడం శాస్త్రీయపరమైన లోపాలు మరియు అప్రభావిత లక్షణాలను గ్రహాలకు, నక్షత్రాలకు ఆపాదించి వాటిని మనుష్య జీవితాలకు అంటకట్టడం.
ముహుర్తాలు చూడడం, గ్రహస్థితి, తారా బలాల వలన హేతుబద్దంగా శాస్త్రీయబద్ధంగా మనిషి జీవితంలో ఉపయోగం ఉంటుందా? వాటి ప్రభావం ఉంటుందా?
మన భారతదేశంలో చాలా కార్యాలు ముహుర్తాల మీద ఆధారపడి మొదలు పెడుతుంటారు. దీనికి కారణం కాలం యొక్క స్వభావాన్ని తెలుసుకొని మంచి కాలములో తగిన పనులు చేయాలని, అన్ని కాలాలు మనకు జయాన్ని ఇవ్వవని, ఒక సమయంలో ఒకరికి శుభం జరిగితే మరొకరికి కష్టం కలగవచ్చని, మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు మాత్రమే ప్రత్యేకంగా సరిపడు కాలం తెలుసుకోవాలని, దానికి సరిపడు నక్షత్ర, లగ్న సమయాలు ఉంటాయని భావిస్తుంటారు. దీని కోసం గ్రహస్థితి బలాలు, తారా బలలమీద ఆధారపడతారు. అయితే వాస్తవానికి పై చెప్పబడిన అంశాలు మనిషి యొక్క జీవితంలో అనేక విషయాలలో ఆచరణాత్మకంగా, హేతుబద్దంగా ఉండవు. ఉదాహరణకు మన జీవితంలో కొన్ని సంఘటనలు. గమనిస్తే...
1. ఒక విద్యార్థి తాను సంవత్సరమంతా కష్టపడి చదువుకొని, పరీక్షలకు సిద్ధపడి, కావాల్సినంత సాధనం చేసి తాను పడిన కష్టం మీద ఆధారపడి పరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడవుతాడు. ఇలా కాకుండా అతను తన గ్రహ స్థితి బలాలు, తార బలాలు, ముహుర్తాలను ఆధారం చేసుకొని కష్టపడకుండ, సాధనం చేయకుండ భవిష్యత్తులో తనకే సరిపడే కాలం ఉందని గ్రహించి పరీక్షలు వ్రాస్తే ఎట్టి పరిస్థితులలోను ఉత్తీర్ణుడుకాడు.
2. ఒక శాస్త్రవేత్త తాను తలపెట్టిన పని కార్యసాధకం కావాలని ఒక నూతనమైన పరికరం కనుగొనాలని ఎంతో కష్టపడి అనేక ఒడిదుడుకులు, వైఫల్యాలను తట్టుకొని అధిగమించి ఆఖరికి కనుగొనడం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలలో ఉదాహరణ ఒకటైన థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనుగొన్నాడు. ఒకవేళ ఆయన గ్రహబలాలు, ముహుర్తాల మీద ఆధారపడి ఉంటే జరుగుతున్న వైఫల్యాలను గమనించి సమయం నాకు సానుకూలంగ లేదని మనందరికి వెలుగునిచ్చే బల్బును కనుగొనలేకపోయ్యేవాడు.
3. ఒక దేశ సైన్యం యుద్ధానికి వెళ్ళేటప్పుడు శత్రువు యొక్క బలా బలహీనతలు తెలుసుకొని యుద్ధంలో కనుపర్చాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పై ఎత్తులు పన్నుతూ ముందుకెళ్తూ విజయం సాధిస్తుంటారు. ఒకవేళ అదే సైన్యం ముహుర్తం బాగాలేదని లేక గ్రహబలం, తారా బలం బాగాలేదని యుద్ధానికి వెళ్ళడం ఆపేస్తే దేశానికే నష్టం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో జరిగిన పుల్వామా దాడిలో మన సైనికులు 40 నుంచి 50 మంది వరకు మరణించారు. ఒకవేళ ముహుర్తాలు, జాతకాలే నిజమని భావించి ఉంటే వారందరిని లేక కొంతమందినైన రక్షించుకునేవారం. కాని అలా జరుగదు. ఎందుకంటే వాస్తవ జీవితంలో అది ఆచారణయోగ్యమైనది కాదు.
4. ఒక న్యాయ స్థానంలో, న్యాయమూర్తి దోషిని శిక్షించే క్రమంలో అతను చేసిన అనైతికమైన పనుల వలన మరియు చట్టం ఉల్లఘించుట వలన శిక్షను ఖరారు చేస్తాడు. అలా కాకుండ దోషి
యొక్క గ్రహస్థితి సరిగా లేదని లేక అతను వెళ్ళవలసిన మార్గంలో దోషం ఉండటం వలన నీవు తప్పు చేసావని తీర్పు తీరిస్తే ఎంత విడ్డూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
5. ఈ మధ్య కాలంలో జరిగిన ఎన్నికలను మనం గమనిస్తే ఎంతోమంది జ్యోతిష్యులు వీరు గెలుస్తారని కొందరు, వారు గెలుస్తారని మరికొందరు జ్యోతిష్యం చెప్పడం జరిగింది. అసలు అక్కడే వారి మధ్య ఏకాభిప్రాయం లేదని అర్థం అవుతుంది. వాస్తవానికి ఇక్కడ ప్రజలకోసం కష్టపడ్డ రాజకీయ నాయకుడు గెలువడం జరిగింది. ప్రజలకోసం కష్టపడనివాడు ఓడిపోవడం జరిగింది. అంతేకాని ఇందులో ముహుర్తాలు, గ్రహస్థితుల యొక్క ప్రాముఖ్యత లేనే లేదు.
6. అనారోగ్యంతో కృంగిపోయిన రోగికి వైద్యుడు చేయాల్సినంత వైద్యం చేస్తాడు. ఒకవేళ అతన్ని బాగు చేయలేని పక్షంలో దేవుడిని వేడుకో అంటాడు.
కాని జ్యోతిష్యం మీద, గ్రహ బలాల మీద ఆధారపడు అని అనడు, అలా ఎవరూ చెప్పరు.
7. జీవితంలో ముహుర్తాలు, జాతకాలు చూసే అతిముఖ్యమైన సంఘటన పెళ్ళి. వరుడు, వధువుల యొక్క జాతకాలను తెప్పించుకొని చూసి ముహుర్తాలు పెడుతుంటారు. దివ్యమైన ముహుర్తాలు చూసి, పెళ్ళి చేసుకున్నప్పటికిని ఎన్నో విడాకుల సంఘటనలు మనం గమనిస్తూనే ఉంటాము. దీనికి వరుడు జాతకంలో దోషమున్నదనో లేక వధువు జాతకంలో దోషమున్నదనో లేక నష్టజాతకురాలని అనేక విధాలుగా తప్పుడు నిర్ణయానికి వస్తూంటారు. కాని వాస్తవానికి వారివురు ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో జరిగిన తప్పిదాల వలన సమస్యలు ఉత్పనమవుతుంటాయి. జాతకాల వలన, ముహుర్తాల వలనో వారి జీవితాలలో ఏమేలు ఉండదు, కేవలం వారు ఒకరి బలాలు, బలహీనతలను అర్థం చేసుకొని దేవుని మీద ఆధారపడి జీవిస్తే సుఖవంతమైన జీవితం జీవిస్తారు.
శాస్త్రీయ సుత్రాలు విజ్ఞానానికి మరియు జ్యోతిష్య శాస్త్రానికి గల వ్యత్యాసాలు మనం గమనిస్తే... శాస్త్రీయ సుత్రాలు అన్ని రకాల శాస్త్రీయబద్దమైన, హేతుబద్ధమైన పరీక్షలు, నియమాలకు నిలబడినదై నిరూపితమైనది. అదే జ్యోతిష్య శాస్త్రంలో శాస్త్రీయతకు సంబంధించిన ప్రాథమిక అంశాలలో నిరూపింపబడ లేకపోతున్నది. నవగ్రహాల ఎన్నిక విషయంలోగాని, భూకేంద్రిక సిద్ధాంతం మీద ఆధారపడడంగాని, లక్షణాలు లేని గ్రహాలకు, నక్షత్రాలకు గుణాలు ఆపాదించడంగాని, ఉహా చిత్రాలుగా ఉండే నక్షత్రాల కూటములకు రాశులని విలవడం గాని ఇలా అన్ని విషయాలలో పూర్తిగ శాస్త్రీయతకు విరోధంగా ఉండి నిలువబడలేకపోతుంది.
ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ (Stephen Hawking) ఇలా అంటారు - శాస్త్రవేత్తలు జ్యోతిష్యశాస్త్రాన్ని విశ్వనించకపోవడానికి తిరస్కరించడానికి గల కారణం అది శాస్త్రీయ సూత్రాలు, నియమాలకు అనుకూలించకపోతుంది.
జ్యోతిష్యవాదులు చెప్పే మరొక వాదనైనటువంటిది, ఖగోళంలో ఉన్న గ్రహాల మధ్య ఆకర్షణ శక్తి ఆయస్కాంత క్షేత్రం మానవుల మీద ప్రభావం చూపుతుంది. అయితే దీనిలో ఎటువంటి శాస్త్రీయత లేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఖగోళంలో ఉన్న ఆయస్కాంత క్షేత్రంగాని, శక్తిగాని భూమిమీద మన ఇంటా ఉండే పరికరాలలో ఉండే ఆయస్కాంత క్షేత్రం శక్తి కన్నా చాలా తక్కవ. ఇంట్లో ఉండే పరికరాలే మన మీద ప్రభావం చూపనప్పుడు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకర్షణ శక్తులు, ఆయస్కాంత శక్తులు ఎలా ప్రభావం చూపెడతాయి. ఫిల్ ప్లేట్ (Phil Plait) అనే ఖగోళ శాస్త్రవేత్త ఇలా అంటారు - ఖగోళంలోని ఏ ఆకర్షణ శక్తి కూడా మానవుల మీద ప్రభావం చూవదు.
షాన్ కార్లనన్ (Shawn Carlson) అనే భౌతికవేత్త మరియు విజ్ఞానవేత్త 1985లో జ్యో తిష్య శాస్త్రం మీద పరీక్షలు నిర్వహించారు. దీని కోసం ప్రపంచంలోని 28 మంది జ్యోతిష్య పండితులకు 100 మంది యొక్క జన్మ తేదీలు, స్థలాలు ఇంకా ఇతరతరా వివరాలు అందించి డబుల్ బ్లెండ్ (Double blind Test) పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్ష తరువాత వచ్చిన ఫలితాలను గమనిస్తే, ఏ ఒక్క జాతకం కూడా వాస్తవానికి దగ్గరగా లేదు మరియు నిరూపితమవ్వలేదు. ఇది ప్రపంచంలో నిర్వహించిన అన్నీ పరీక్షలలోకల్లా అత్యున్నతస్థాయి పరీక్షగా విలువబడింది.
కాబట్టి మనమిక్కడ గమనించాల్సిందేమిటంటే శాస్త్రం అని పిలువబడే జ్యోతిష్యశాస్త్రం శాస్త్రీయబద్ధమైన పరీక్షలకు నిలువబడలేకపోవడం స్పష్టంగా కనబడుతుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిని అవాస్తవమైన లేక మిధ్యాజ్ఞానం (న్యూడో ఫైన్స్ Psuedo Science) అని పేర్కొన్నారు. న్యూడో నైన్స్ అంటే శాస్త్రీయబద్ధమైన నిరూపణ లేకుండ కేవలం గ్రుడ్డి నమ్మకాలు లేక మూఢ నమ్మకాల మీద ఆధారపడుతున్న శాస్త్రం కాని శాస్త్రం అని పిలువబడుతుంది. కేవలం కొన్ని సంఘటనలు జరిగాయని గ్రుడ్డి అనుభవాలను ఆధారం చేసుకొని చెప్పబడుతున్న ఆవాస్తవమైన జ్ఞానంగా పేర్కొనబడినది.
గ్రహాలు, రాశులు, నక్షత్రాలు మనిషి జీవితంలో ప్రతీ ఘట్టాన్ని అంశాన్ని, పరిస్థితిని నిర్దేశించే శక్తి సామర్థ్యాలు ఉంటే మరి దేవుని యొక్క అధికారం, ఆయన యొక్క ఆధిపత్యం ఏముటుంది?
“ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను” - ఆదికాండం 1:1.
దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఆయన ఈ విశ్వమంతటికిని ఆదిసంభూతుడు. యుగయుగములకు సజీవుడై యున్నాడు.
“నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై యున్నాను” - ప్రకటన 1:18.
కాలములు, సమయములు ఆయన ఆధీనములోనే ఉన్నవి - అపొస్తలుల కార్యములు 1:7.
ఖగోళంలోనివి, భూగోళంలోనివి దృశ్యమైనవి, అదృశ్యమైనవి అన్ని ఆయన చేతి క్రియలే, కాబట్టి జ్యోతిష్యవాదులు చెపుతున్నట్లు దేవుడు ఈ గ్రహాలు,
రాశులు, నక్షత్రాలలో భవిష్యత్ కాలాన్ని మనిషి యొక్క స్థితిగతులను దాచియుంచలేదు. ఎందుకంటే తాను సృష్టించిన ఈ ఖగోళానికి తన మహిమ నివ్వడానికి ఇష్టపడడు.
“యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవరికిని నా మహిమను నేనిచ్చువాడను కాను”- యెషయా 42:8.
అలా చేస్తే మనిషి దేవుని మీద ఆధారపడకుండ సృష్టియైన ఖగోళము మీద ఆధారపడతాడు. ఖగోళాన్ని దైవజ్ఞానంగా పూజిస్తాడు. గ్రహాలు, రాశులు, నక్షత్రాలు ప్రతి ఘట్టాన్ని పరిస్థితిని నిర్దేశించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తలంచి దేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని కొట్టెస్తాడు లేక తగ్గిస్తాడు.
“అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్” - రోమీయులకు 1:25.
జ్యోతిష్యం మనిషి యొక్క సామర్థ్యాలు, కష్టపడే తత్వం మరియు దేవుని మీద ఆధారపడే తత్వాన్ని తగ్గిస్తాయా?
అవును, జ్యోతిష్యం మనిషి యొక్క సామర్థ్యాలను కష్టపడే గుణాలను పూర్తిగ తగ్గిస్తాయి. ఎందుకంటే తన జీవితంలో పై స్థాయిలోకి రావాలన్న, ఏదైనా సాధించాలన్న తన కష్టం మీద శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండ తన జాతకం ఏమి చెబుతుందని గ్రహాలు ఏలా అనుకూలిస్తున్నాయని అనేక రకాల అసమర్థపు ఆలోచనల వలన ముందుకు వెళ్ళలేడు.
“తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు” - సామెతలు 12:11.
ఈ సృష్టికి సృష్టికర్తయైన దేవునిమీద ఆధారపడే తత్వాన్ని కోల్పోతాడు. ఎందుకంటే మనిషిన సృష్టించిన దేవుడు అతని ప్రతి అవసరతను, భవిష్యత్ జీవితాన్ని పూర్తిగ ఎరిగినవాడు. అతని కష్టాన్ని ఆశీర్వదించి, పై స్థాయిలోకి తీసుకొని రావడానికి తోడైయుంటాడు. మనిషి తన జీవితంలో కష్టపడుతూ, నిత్యమూ దేవుని మీద ఆధారపడుతూ ఉన్నత స్థాయిలోకి రావాలి.
"నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు. నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును” - కీర్తనలు 128:2.
జ్యోతిష్యం, మనిషి తన నైతిక విలువలను పాటించడం తగ్గిస్తుందా?
అవును, తనకేదైన కష్టంగాని, నష్టంగాని జరిగినప్పుడు దాని యొక్క కారణాలను వెతికే క్రమంలో తాను ఏదైన తప్పు చేసినా లేక దేవునికి విరోధముగా పాపము చేసినా అని అంత:ర్మథనం చేసుకోకుండా తనకు గ్రహాలు అనుకూలించడం లేదు, ఏదైన గ్రహ దోషం వాస్తు దోషం, దుర్ముహుర్తం, దిష్టి తగలడం, విధవరాలు అడ్డురావడం లేక ఏ ఇతరతరా మూఢ నమ్మకాల మీద ఆధారపడతాడు. ఈ మధ్య కాలంలో తనకు అనుకూలించే రాళ్ళను, వజ్రాలను, తాయత్తులను ధరించేలేకపోయమని లేక తనకు అనుకూలించే సంఖ్యకాని, అక్షరం కాని ఉపయోగించలేకపోయమని తప్పుడు భావనలో ఉంటున్నారు. సంతానం కలుగుట లేదని నష్ట జాతకురాలని, నష్ట జాతకుడని, వాస్తు దోషం ఉందని, ఇలా రకరకాల అపోహల్లోకి తప్పుడు అభిప్రాయాల్లోకి వెళ్ళిపోతుంటారు.
"యెహోవా సెలవిచుచున్నదేమనగా - అన్యజనుల ఆచారాముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి”- యిర్మియా 10:2.
జ్యోతిష్యం ఆచరించుట వలన మనిషి తన తప్పును సరిదిద్దుకొని పశ్చాత్తాపపడి, దేవుని దగ్గర తప్పులు ఒప్పుకొనే అవకాశం లేకుండ పోతుంది. ఇలా చేయకపోవడం వలన సమాజం తప్పుదారిలో వెళ్ళి నైతికతను కోల్పోయి, భ్రష్టుపట్టే పరిస్థితులు చాలా ఉన్నాయి. మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగ తాను చేసి పాపాలకు పశ్చాతాపపడి సరిదిద్దుకొని వాటిని విడిచిపెట్టడం, దీనికి నిజదేవుడైన
యేసు క్రీస్తును ఎరిగి ఆయన తన పాపాల కోసం మరణించాడని ఎరిగి క్షమాపణ పొందుకోవాలి. దీని ద్వారా అతను ఒక మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దగలుగుతాడు. అందరినీ సరైన మార్గంలో నడిపించగలుగుతాడు.
బైబిల్ జ్యోతిష్య శాస్త్రాన్ని గురించి ఏమని సంభోదిస్తుంది?
“నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని, సర్ప శకునములనుగాని చెప్పుదానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను, కర్ణ పిశాచి నడుగువానినైనను దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టుచున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యధార్థపరుడవై యుండవలెను” - ద్వితియోపదేశకాండం 18:9-14.
పై చెప్పబడిన వచనాలను మనం గమనిస్తే దేవుడు జ్యోతిష్య శాస్త్రమును దానికి సంబంధించిన అంశాలను,
జ్ఞానమును పూర్తిగ తిరస్కరిస్తున్నాడు. ఆయన యెదుట యధార్థపరుడై యుండవలెనని కోరుకొనుచున్నాడు.
“తిరుగుబాటు చేయుట సోదెచెప్పుట యన పాపముతో సమానము" - 1సమూయేలు 15:23.
ఈ తప్పుడు జ్ఞానం దేవునియందు తిరుగుబాటు చేయడంతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే అది ఖచ్చితంగా ఆయన సార్వభౌమత్వాన్ని, సర్వశక్తిత్వాన్ని, దైవత్వాన్ని, సృష్టికర్తను కాదని సృష్టిమీద ఆదరపడేలా చేస్తూ, అడ్డు తగ్గులుతున్న అవాస్తవమైన జ్ఞానముగా లేక ఒక తప్పుడు శాస్త్రంగా పరిగణిస్తున్నాడు. అవును ఇది ముమ్మాటికి సహింపలేనిది. ఆయన మహిమను దోచుకునే విధంగా
చేయడమే. సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించి, మహిమపరచడానికి మళ్ళింపబడుతున్న తప్పుడు జ్ఞానం. అది ఎంత మాత్రము మనిషికి ఉపయోగపడవు. అని బైబిల్ లోని యెషయా గ్రంథములో చెప్పబడడం జరిగింది.
“నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదికి వచ్చునని రాకుండ నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలమునుండి తమ్ము తాము తప్పించుకొనలేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు” - యెషయా 47:12-14.
అలాగే దానియేలు కాలంలో రాజైన నెబుకద్నెజరు తనకి వచ్చిన కలలను వివరించమని ఆయన దగ్గరున్న శకునగాండ్రను, గారడీ విద్యగల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలిపించాడు. అయినను వారు చెప్పలేకపోయి ఆఖరికి ప్రవక్తయైన దానియేలు ద్వారా తెలియబడడం జరిగింది.
“దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను - రాజడిగిన యీ మర్మము జ్ఞానులైనను గారడీవిద్య గలవారైనను శకునగాండ్రయినను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు...” - దానియేలు 2:27-28.
కాబట్టి మనకు ఏదైన సమస్య వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడాలన్న విషయం అనేక చోట్ల చెప్పడం జరిగింది.
“దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై యున్నాడు. ఆయన మరుగుమాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియును; వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది” - దానియేలు 2:20-22.
“దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాల మంచిదిగ నుండెను” - ఆదికాండము 1:31.
ఆదికాండములోని 1:10,13,19,21,25 వాక్యములను గమనించినప్పుడు దేవుడు తాను సృష్టించిన సృష్టంతయు చాలా మంచిదిగా అందమైనదిగా, గొప్పదిగా కనబడుతుంది. ఇందులో మంచి రోజులని, చెడ్డ రోజులని, మంచి సమయము, చెడ్డ సమయమని, మంచి గ్రహాలు, చెడ్డ గ్రహాలని లేనే లేవు. అది అంతా మానవుడు కల్పించిన కట్టు కథలు. దేవుడు సమస్తమును ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని లోపరచుకోనుడని చెప్పిన తరువాత ఆయన సృష్టించిన సృష్టిలో కొన్ని చెడ్డవని ఆపాదించకూడదు.
శాస్త్రీయపరంగ జ్యోతిష్యం, శాస్త్రం కాదని నిరూపించబడినప్పుడు, దేవుడిని కూడా శాస్త్రీయపరంగ నిరూపించలేము కదా, అయితే అది కూడా అశాస్త్రీయమైన అంశము లేక ఆయన ఉనికిలో లేనట్టా?
అవును దేవుడిని శాస్త్రీయపరంగా ఎప్పటికి నిరూపించలేము. ఎందుకనగా దేవుడు సమయము, స్థలము, పదార్థ లోకాలకు అతీతుడు. శాస్త్రీయ నిబంధనలకు పైనున్నవాడు. ఒకవేళ ఆయనను శాస్త్రీయపరంగ నిరూపించగలిగితే ఆయన దేవుడు కాడు, ఆయన ఒక సృష్టి అవుతాడు. శాస్త్రీయపరంగ నిరూపించలేనివి ఈ లోకంలో చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నైతిక విలువలు, ఆత్మ (మంచి ఆత్మ, చెడ్డ ఆత్మ) అద్భుతాలు, మానవుని లక్షణాలు (ప్రేమ, బాధ, కోపం, సంతోషం)
భావాలు. వీటికి శాస్త్రీయపరమైన సమాధానాలు ఇవ్వలేము. అందుకని వీటిని అశాస్త్రీయమైనవని అనలేము. ఇవి శాస్త్రానికి అందనిది పైనున్నది. కాబట్టి శాస్త్రీయపరంగా తప్పని నిరూపింపబడిన జ్యోతిష్యం అవాస్తవమైన లేక ఒక తప్పుడు శాస్త్రంగ, స్యూడో స్సైగా పరిగణించవచ్చు. మానవుడి సృష్టిలో ప్రతి జీవి యొక్క పుట్టుకకు, అలాగే ఈ విశ్వం యొక్క ఆవిర్భావానికి కారణాలను నేటికి శాస్త్రీయపరంగ నిరూపించలేకపోతున్నారు.
కాబట్టి ప్రియ సహోదరీ, సహోదరులారా ఏ అంశము శాస్త్రీయమైనదో, శాస్త్రీయమైనది కాదో, అలాగే శాస్త్రీయతకు పైనున్నదో గమనించి, పరిశీలించి మన జీవితాన్ని, సమాజాన్ని మెరుగుపరచాలి. అవాస్తవ శాస్త్రాలైన జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం, హస్త శాస్త్రం, మూఢ నమ్మకాలు, తప్పుడు సిద్ధాంతాలు వంటిది పరిశీలించి వాటి నుండి దూరంగ ఉండాలి. ఇవి కేవలం మనిషి యొక్క భయాల వలన, బలహీనతల వలన భవిష్యత్ లో తమకేమి జరుగుతుందో అనే కోరిక వలన హేతుబద్దంగ, శాస్త్రీయబద్దంగ మరియు నైతికంగ ఆలోచింపకపోవటం వలన సమాజంలో ఉద్భవించి మనుష్య జీవితాలను అతలాకుతలం చేస్తూ వారి అర్థిక, సామాజిక పరిస్థితులను దిగజార్చే విధంగా చేస్తున్నాయి.
“దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది" - రోమీయులకు 1:18.
అలాగే క్రైస్తవ్యంలో కూడా వాక్యానుసారం కానిది, అవాస్తమైన సిద్ధాంతాలు, సాంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు క్రైస్తవ సమాజాన్ని బలహీనపరుస్తున్నాయి. వాటిని కూడా అరికట్టాల్సిన భాద్యత దేవుడు మన పైన పెట్టాడు. దేవుడు శాస్త్రీయతకు వాటి అంశాలకు విరోధికాడు, అవి ఆయన సృష్టిలోని భాగమే. “ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు”- కొలొస్సయులకు 1:17.
కాని మానవుని తిరుగుబాటు స్వభావంతో తయారైన అవాస్తవమైన శాస్త్రాలను, మూఢ విశ్వాసాలను ఆయన పూర్తిగ వ్యతిరేకిస్తున్నాడు. ఆది నుంచి వాటికి వ్యతిరేకంగ తన ప్రవక్తలను, శిష్యులను, సంఘ సంస్కర్తలను ప్రోత్సహిస్తూ సమజాన్ని మంచి త్రోవలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. .
“పూర్వ కాలమందు నానా సమయములలోను నానా విధములగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను”- హెబ్రీయులకు 1:1.
“కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలె ప్రకాశించునట్లు ప్రవక్తలచేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను, నా నోటి మాటల చేత వారిని వధించి యున్నాను” - హూషేయ 6:5.
అలాగే శాస్త్రీయానుసారంగ నిరూపించలేని నైతిక విలువలను పాటించడం, ఆత్మీయంగా జీవించడం వంటివి మనిషి వాక్యానుసారంగ, ప్రార్థనతో, దేవుని సహాయంతో జీవిస్తూ అందరి జీవితాలలో వెలుగును నింపాలి. అన్నింటికంటే శ్రేష్ఠమైనది, అతి ప్రాముఖ్యమైనదైన యేసు క్రీస్తు సిలువను గురించి వార్తను గురించి, మనిషి తన పాపాల విషయమై పశ్చాతాపపడి మంచి మార్గంలో నడుస్తూ, దేవునితో సహవాసం గలవానిగా జీవించాలి.
“కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” - 2 కొరింథీయులకు 5:17.
కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతీ ఆటంకమును పడద్రోసి, ప్రతీ ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చేయడానికి మనవంతు ప్రయత్నం చేయాలి. ఆమేన్.
© 2024. ఈ వెబ్ సైట్ యొక్క సర్వ హక్కులు హితబోధ.కామ్ నకు చెందినవి.