విషయసూచిక
- పరిచయం
- దేవుని చిత్తాన్ని తెలుసుకోవటంలో అనుసరించే కొన్ని తప్పుడు విధానాలు
- దేవుని చిత్తంలోని రెండు భాగాలు:
- మరి నా విషయమేంటి?
- ముగించే ముందు ఓ ముఖ్యమైన హెచ్చరిక!
దేవుని చిత్తమును కనుగొనుటకు ముఖ్యమైన సూత్రాలు
1. రక్షణ సంబంధమైన దేవుని చిత్తం
2. ఆత్మపూర్ణులై ఉండాలని దేవుని చిత్తం
3. పరిశుద్ధతా సంబంధమైన దేవుని చిత్తము
4. మన జీవిత సాక్ష్యానికి సంబంధించిన దేవుని చిత్తము
5. మన హృదయ వైఖరికి సంబంధించిన దేవుని చిత్తము
పరిచయం
దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని కలిగుండాలన్నది ప్రతి యధార్థ క్రైస్తవుని ఆకాంక్ష. తాను చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం, తిరిగే ప్రతి మలుపు దేవుని చిత్తానుసారమై ఉండాలని అతడు హృదయపూర్వకంగా వాంఛిస్తాడు. దేవుని చిత్తములోనే అతనికి క్షేమము ఉంటుందని, తన స్వబుద్ధిపై ఆధారపడటం చాలా అపాయకరమని అతనికి బాగా తెలుసు.
అంతేకాదు, ‘‘దేవా నీ చిత్తమును నెరవేర్చుటకే నేను వచ్చియున్నాను’’ (హెబ్రీ 10:9) అని చెప్పిన క్రీస్తు యేసు మనసూ అతనిలో కూడా ఉన్నందున, ‘అయినను నా చిత్తము కాదు తండ్రీ, నీ చిత్తమే సిద్ధించును గాక’ అనే వైఖరిని ఎల్లప్పుడు కలిగి ఉంటాడు. ‘‘లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును’’ (1యోహాను 2:17) అనే వాగ్ధానంపై నిరీక్షణ ఉంచి, ‘‘దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియు’’ అని మార్కు 3:35లో రక్షకుడు అనుగ్రహించిన ఆధిక్యతపై లక్ష్యముంచి, ‘‘మీరు ఈ లోకమర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి’’ (రోమా 12:2) అనే ఆజ్ఞకు ఎల్లప్పుడు విధేయుడై ఉండాలని అతడు యధార్థంగా ప్రార్థిస్తాడు, ప్రయత్నిస్తాడు.
అయితే సాధారణంగా అందరినీ కలవరపెట్టే ప్రశ్న ఒకటుంది- ‘దేవుని చిత్తాన్ని నేనెలా కనుక్కోగలను?’ అవును, ఈ ప్రశ్న ఎంతో ప్రాముఖ్యమైంది, ఎంతో కీలకమైంది. దేవుని చిత్తము ఏమైయుందో తెలుసుకోనిదే, దానిని నెరవేర్చటం ఎలా సాధ్యపడుతుంది? కాబట్టి దేవుని చిత్తాన్ని ఎలా నిర్ధారించుకోవాలో తెలుసుకోవటం మన అత్యవసరత, అతి ముఖ్యమైన బాధ్యత.
దేవుని చిత్తాన్ని తెలుసుకోవటంలో అనుసరించే కొన్ని తప్పుడు విధానాలు
దేవుని చిత్తమును కనుగొనాలన్న ఈ అవసరతను, బాధ్యతను గుర్తించిన సున్నితమైన మనస్సాక్షి గల విశ్వాసుల వలన లాభం పొందాలని స్వయంకల్పిత విధానాలను రూపొందించుకొని అనేకులను మోసపరిచే చిల్లరవర్తకులెందరో బయలుదేరారు. ‘దేవుడు మాకు బయలుపరుస్తాడు! మీపై చేతులుంచి ప్రార్థన చేస్తాము! మీ పట్ల ఆయన చిత్తము ఏమైయున్నదో తెలియజేస్తామంటూ’ యేసు పేరిట ముందు ఆస్తిని, ఆ తరువాత ఆత్మలనూ దోచుకునే సోదెగాళ్ళు ప్రతిచోటా లేస్తున్నారు. అంతేకాక, విశ్వాసులు తామే తమ అమాయకత్వం వల్లనో లేదా లేఖనాలపై గల తమ అవగాహనాలోపం వల్లనో, వాక్యానుసారం కాని ఎన్నో విధానాల ద్వారా దేవుని చిత్తాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. మనస్సాక్షి ఒత్తిళ్ళను దేవుని స్వరంగా పరిగణించేవారు కొందరైతే, నెమ్మదిగా దేవుని సన్నిధిలో ఏకాగ్రతతో గడిపే ప్రార్థన సమయంలో మనసులో కలిగే తలంపులు దేవుడు పుట్టించే ఆలోచనలని భావించేవారు మరి కొందరు. చీట్లువేసి దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోగలమని తలచేవారు కొందరైతే, బైబిల్ తెరిచినపుడు కళ్లముందు కనిపించే వాక్యమే దేవుని చిత్తము యొక్క బయలుపాటని పొరబడేవారు మరికొందరు. ఇవన్నీ స్వయంకల్పితమైనవే తప్ప దేవుని వాక్యపు వెలుగులో సమర్ధించ తగిన విధానాలు కావు. కాబట్టి వీటి వలన దేవుని చిత్తాన్ని కనుగొన్నామనే భ్రమలో ఆయన చిత్తానికి వ్యతిరేకమైనదానిని వెంబడించే ప్రమాదం ఉంది.
ఏదో ఒక స్వరాన్ని గాని దర్శనాన్ని గాని ఆశ్రయించి, అది దేవుని బయల్పాటని నమ్మితే, అది దేవుని నుండి వచ్చిందో లేక వెలుగుదూతలా మోసపరిచే సాతాను నుండి వచ్చిందో, లేదా మనలో మనము భ్రమపడటం వలన వచ్చిందో, ఖచ్చితంగా వివేచించి చెప్పగలమా? మనస్సాక్షి నుండి కలిగే ప్రతివిధమైన ఒత్తిడినీ దేవుని స్వరంగా పరిగణిస్తే, అన్యులు కూడా తమ మనస్సాక్షిని బట్టి తమ దేవతలకు మొక్కుబడులు చెల్లించటానికి, పూజా హోమాలు జరిగించటానికి, ఇంకా ఎన్నో ఆచార కర్మకాండలు నెరవేర్చటానికి పురికొల్పబడుతున్నారు గదా! ఈ నేపథ్యంలో, మనస్సాక్షి తెచ్చే ఒత్తిడి అంతా దేవుని నుండి వచ్చే స్వరమే అని చెప్పగలమా?
ప్రార్థన చేసేటప్పుడు కలిగే తలంపులను దేవుని నుండీ కలిగే ఆలోచనలుగా పరిగణిస్తే, ఏకాగ్రతను భంగం చేస్తూ ఎప్పుడూ లేని తలంపులు ప్రార్థన సమయంలోనే పుట్టుకొస్తాయని చదువరికి అనుభవపూర్వకంగా తెలుసని భావిస్తాను. మరి వాటన్నిటిని దేవుని ఆలోచనలుగా పరిగణించగలమా?
చీట్లు నేటికీ దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోవటానికి నియమించబడిన విధానమైతే, చీట్లు వేసి మత్తీయను పన్నెండవవానిగా శిష్యులు ఎన్నుకున్నప్పటికీ, తరువాత సంఘ పెద్దలని ఎన్నుకోవటానికి దేవుడు అదే విధానాన్ని సంఘంలో ఎందుకు కొనసాగించనట్లు? చీట్లు వేసి 'దేవుడా' అనడం కంటే, వాక్యానుసారమైన నియమ నిబంధనలను బట్టి నిర్ణయాలు తీసుకోవడమే సంఘానికి దేవుడు నియమించిన విధానమని ఇది మనకు నేర్పించదా?
ఇక బైబిల్ తెరచినపుడు కంటబడిన వచనం ద్వారా దేవుడు మాట్లాడే విషయానికొస్తే, లేఖనాలు ఆ విధంగా వాడబడే ఉద్ధేశ్యంతో దేవుడు వాటిని రాయించలేదని, ఆదిమంగా అవి వ్రాయబడిన ప్రతులే సూచిస్తున్నాయి. చర్మపు చుట్టలపై అధ్యాయ-వచనాల సంఖ్య సహితం లేకుండా వ్రాయబడిన ఆదిమ ప్రతులు, ప్రస్తుతం మనం బైబిలు తెరిచి చూసే పద్దతికి అనుకూలంగా లేవన్నది స్పష్టం గనుక, అచ్చువేసే యంత్రాలు, కాగితాలు వాడుకలోకి వచ్చిన తరువాతే ఇలా మాట్లాడే విధానాన్ని దేవుడు అవలంభిస్తున్నాడని మనం భావించాలా?
తామున్న ప్రత్యేక పరిస్థితిని గురించి, తమ అనుదిన వాక్యధ్యాన భాగం నుండే దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడని భావించే వారి పొరపాటు కూడా ఇలాంటిదే. వాక్య సందర్భాన్ని పక్కనపెట్టి, తమ పరిస్థితుల వెలుగులో వాక్యానికి కొత్త భావాలు తగిలించేలా ఈ పద్ధతి అనేకులను పెడతోవ పట్టిస్తుంది. ఇలాగే ఒక వ్యక్తి, తాను అమెరికా వెళ్లటం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేస్తున్నపుడు యెషయా 11:14 అతనికి దేవుని చిత్తాన్ని బయలుపరచిందట. ‘‘వారు ఫిలిష్తీయల భుజము మీద ఎక్కుదురు పడమటి వైపుకు పరిగెత్తి పోవుదురు’’ (యెషయా 11:14). ఇక్కడ ‘‘భుజము మీద ఎక్కి’’ (ఆంగ్లములో రెక్కల మీద ఎక్కి) అనే మాటను బట్టి తాను ఫ్లయిట్ ఎక్కాలని, ‘‘పడమటి వైపుకు పరిగెత్తి పోవుదురు’’ అనే మాటను బట్టి తాను అమెరికా వెళ్లాలని దేవుని చిత్తాన్ని గ్రహించాడట. వాక్యసందర్భం ఎలా ఉన్నా, దేవునికి నేనున్న పరిస్థితి తెలుసు కాబట్టి, నాకు తగిన అన్వయింపును దాని నుండి దయచేస్తున్నాడని ఇలాంటి వారి భ్రమ. అయితే, వాక్యానికి వక్ర భాష్యాలు పుట్టించడానికి ఇలాంటి ఆలోచనే పునాది అని వారు మరచిపోతున్నారు. సందర్భేతరమైన భావం వాక్య భావం కాదు, స్వీయభావమే అవుతుంది. ఎవరికి తగ్గట్టు వారు వాక్యాన్ని మెలిపెట్టి అన్వయించుకునే స్వేచ్ఛ దేవుడు ఎవ్వరికీ ఇవ్వలేదు. ఈ పద్ధతిలో దేవుని చిత్తం తెలుసుకోవచ్చని బైబిల్లో కనీసం అన్యోపదేశంగానైనా చెప్పబడలేదని మరచిపోవద్దు.
చివరిగా, ‘‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము’’ అని ఫిలిప్పీ 4:7లో చెప్పబడిన మాటను ఆధారం చేసుకొని, దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక వింత పద్ధతిని కొందరు ఆవిష్కరించారు. ఒక విషయాన్ని గురించి ప్రార్థన చేసినపుడు నెమ్మది అనుభవిస్తే, అది దేవుని చిత్తమని, కలవరమనిపిస్తే అది ఆయన చిత్తం కాదని వీరి ఆలోచన. అయితే ఆ వాక్య సందర్భం దేవుని చిత్తాన్ని తెలుసుకునే ఒక విధానాన్ని తెలియజేయడంలేదని, ప్రార్థన ద్వారా తమ భారమంతటిని దేవునిపై మోపడం వలన పొందే సమాధానాన్ని గురించి అది మాట్లాడుతుందని ఆ వాక్య సందర్భం నుండి ఎవ్వరైనా నిర్ధారించుకోవచ్చు (సందర్భం కొరకు 6 & 7 వచనాలు కలిపి చదవండి). అయితే, వీరు పొరబడుతున్నట్లు ఈ ‘‘సమాధానం’’ దేవుని చిత్తంతో ముడిపడి ఉందని భావించడంలో ఉన్న తిరకాసును ఎత్తి చూపించే ఒక ఉదాహరణ, గెత్సమనే సన్నివేశంలో మనకు విస్పష్టంగా కనిపిస్తుంది. యేసు సిలువ మరణం నిర్వివాదంగా దేవుని చిత్తమే (యోహాను 10:17,18). అయినా దాని కొరకు సిద్ధపడుతున్నపుడు, ‘సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానముతో నేను నింపబడుచున్నాను’ అని ప్రభువు చెప్పలేదు. అందుకు భిన్నంగా, ‘‘మరణమగునంతగా నా ప్రాణము బహు దు:ఖములో మునిగియున్నది’’ అని తన శిష్యులతో పంచుకున్నట్లు చదువుతాము (మత్తయి 26:38). అంతమాత్రాన, ఆయన చేయబోయే పని దేవుని చిత్తం కాదని భావించటం వాక్యవిరుద్ధమౌతుంది (యోహాను 6:38). కాబట్టి మనకు ఎలా అనిపిస్తుందన్నది దేవుని చిత్తానికి సూచిక కాదని గమనించాలి.
దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోవటానికి పైన సూచించిన విధానాలన్నిటికంటే నమ్మదగినది, స్థిరమైనదైన మరొక మాధ్యమం మనకుంది. ‘‘మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది’’ (2పేతురు 1:19). ఈ ప్రవచన వాక్యమే పరిశుద్ధ గ్రంథం. మరే చోటను బయలుపరచనంత స్పష్టంగా దేవుడు తన చిత్తాన్ని ఈ గ్రంథంలోనే బయలుపరిచాడు. అయితే బైబిల్లోని వచనాలను లాటరీల పద్ధతిలో ఏరుకోవటం వలన ఆ చిత్తాన్ని గుర్తెరుగలేము గాని, క్రమబద్ధంగానూ, సమగ్రంగానూ అందులోని బోధలను గ్రహించి, ఆ బోధల నుండి ఆవిర్భవించే సూత్రాలను మన జీవితంలోని పరిస్థితులన్నిటికి అన్వయించినట్లైతే, ప్రతి నిర్ణయాన్ని వాటి ఆధారంగానే చేసినట్లైతే, జీవితపు ప్రతి మలుపులోనూ వాటినే మన మార్గదర్శకాలుగా తీసుకున్నట్లైతే, ఖచ్చితంగా మనం దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నామనటానికి ఏ మాత్రమూ సందేహించనవసరం లేదు. లేఖనాలు దేవుని చిత్తం యొక్క బయలుపాటు గనుక లేఖనానుసారమైన జీవితమే దేవుని చిత్తానుసారమైన జీవితం.
ఇంత వరకు బాగానే ఉంది కాని, బైబిల్లో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అధ్యాయమేదీ లేదు కదా! నేను ఏ కాలేజీలో చేరాలి, ఏ ఉద్యోగం చేయ్యాలి, ఏ అమ్మాయిని/అబ్బాయిని వివాహమాడాలి, తదితర వ్యక్తిగత నిర్ణయాలను బైబిల్ ఆధారంగా ఎలా చెయ్యాలి? ఇది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. అయితే దీనికి జవాబు కనుగొనే ముందు ఒక విషయాన్ని గుర్తించటం అవసరం. అనేకులు తలిచే రీతిగా, దేవుడు నాపట్ల గల తన చిత్తాన్ని దాచి ఉంచాడని, నేను దానిని వెతికి వెలికి తీయాలని భావించటం సరికాదు. నేనేమి చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడో, దానిని నా నుండి దాచితే నేనెలా దానిని నెరవేర్చగలను? మనం తెలుసుకోకుండా ఆయన ఒక విషయాన్ని దాచి ఉంచితే, దానిని వెతికి కనుక్కోవటం ఎవరితరమౌతుంది? కాబట్టి నేనాయన చిత్తాన్ని నిర్ధారించుకోగల మార్గమొకటి ఆయన ఖచ్చితంగా రూపొందించి ఉండాలి. ఆ మార్గాన్ని లేఖనాల నుండి మాత్రమే గ్రహించగలం.
దేవుని చిత్తంలోని రెండు భాగాలు:
‘‘రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడునవి ఎల్లప్పుడు మనవియు మన సంతతివారివియునగును’’ (ద్వితీయ 29:29). పై వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని చిత్తాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. మొదటిది, దేవుని రహస్య చిత్తం. అది దేవునికి చెందింది. దానిని నెరవేర్చటం మన బాధ్యత కాదు. రెండవది, బయలుపరచబడిన దేవుని చిత్తం. అది ఆయన వాక్యంలో స్పష్టంగా బయలుపరచబడి మనకివ్వబడింది. దానిని నెరవేర్చటం మన బాధ్యత. మనకు చెందిన ఈ రెండవ భాగాన్ని విడిచిపెట్టి సాధారణంగా మనం దేవునికి చెందిన ఆ మొదటి భాగాన్ని కనుక్కోటానికి ప్రయత్నిస్తుంటాము. కాని బయలుపరచబడిన ఆయన చిత్తాన్ని నెరవేర్చటంలో మనము శ్రద్ధవహించకపోతే, బయలుపరచబడని ఆయన చిత్తం మనకు తెలియజేయబడాలని ఎలా అపేక్షించగలము? అందుకే మొదట మనము బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని క్రమబద్ధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యయనం చివరికి మన వ్యక్తిగత విషయాలలో దేవుని చిత్తాన్ని నిర్ధారించుకొనగలిగే రహస్యాన్ని కూడా మనకు బయలుపరుస్తుంది. కింద నేను చెప్పబోయే అంశాలు సాధారణమైనవిగా అనిపించినా, మీకు బాగా తెలిసిన విషయాలే అయినా వాటిని శ్రద్ధగా చదవాలని మనవి. ఎందుకంటే, వాటి ఆధారంగా మనకు తేలే ఫలితార్థము, మన వ్యక్తిగత నిర్ణయాలలో దేవుని చిత్తాన్ని నిర్ధారించుకోవటానికి ఖచ్చితమైన మార్గదర్శకాన్ని మనకందించగలదు. చదువు, ఉద్యోగం, వివాహం తదితర ప్రతి వ్యక్తిగత నిర్ణయాలను కూడా ఖచ్చితంగా దేవుని చిత్తానుసారంగా చేయగల ఒక మార్గాన్ని ఇప్పుడు కనుక్కోబోతున్నాము. కాబట్టి వీటిని శ్రద్ధగానూ, ఓపికగానూ, ప్రార్థనాపూర్వకంగానూ చదవగలరు.
దేవుని చిత్తమును కనుగొనుటకు ముఖ్యమైన సూత్రాలు
1. రక్షణ సంబంధమైన దేవుని చిత్తం
‘‘కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్ధానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరూ మారుమనస్సు పొందవలెనని కోరుచూ, మీ యెడల దీర్ఘశాంతము గలవాడైయున్నాడు’’ (2పేతురు 3:9). పేతురు తన పత్రికలను దేవుడు ఏర్పరచినవారిని ఉద్దేశించి వ్రాస్తూ (1పేతురు 1:1,2; 2పేతురు 3:12), మీలో ఎవరూ నశింపక అందరూ మారుమనస్సు పొందాలన్నది దేవుని చిత్తమని స్పష్టం చేస్తున్నాడు. దేవుని రక్షణార్థమైన ఈ చిత్తానికి లోబడని వారెవ్వరూ తమ జీవితాల్లో ఆయన చిత్తాన్ని కనుగొనలేరు. దేవునితో సత్సంబంధానికి రక్షణే మొదటి మెట్టు. నువ్వు మారుమనస్సు పొంది దేవుని కుమారునియందు విశ్వసించి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే, ‘నా పట్ల దేవుని చిత్తం ఏమైయుందని’ నువ్వు అన్వేషించటం వ్యర్థమే. ‘ఇది నా చిత్తమని’ ఆయన స్పష్టంగా బయలుపరచిన ఈ ప్రాథమిక విషయంలో నువ్వు విధేయత చూపించకపోతే, ఇతర విషయాలను గురించి ఆయన చిత్తమేమైయుందో అడిగే నైతిక హక్కు నీకేమాత్రమూ లేదు. అందుకే, మొదట ఆ రక్షణానుభవాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో అన్వేషించటం యుక్తము. అయితే ప్రియ చదువరీ, ఒకవేళ నువ్వు రక్షింపబడిన దేవుని బిడ్డవైతే దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే.
2. ఆత్మపూర్ణులై ఉండాలని దేవుని చిత్తం
‘‘ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులైయుండుడి’’ (ఎఫెసీ 5:17,18). దేవుని చిత్తాన్ని గుర్తెరగనివారిని ఈ వాక్యభాగం ‘అవివేకులని’ పిలుస్తుంది. మరి ఈ వాక్యభాగంలో దేవుని చిత్తమని బయలుపరచబడినదేమిటి? మనం ఆత్మపూర్ణులమై ఉండాలన్నదే ఇక్కడ బయలుపరచబడిన దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తమని మొదట పేర్కొన్న విషయానికి అనగా రక్షణార్థమైన దేవుని చిత్తానికి లోబడినవారికి మాత్రమే సాధ్యం. ఎందుకంటే రక్షించబడినవారిలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అయితే రక్షించబడిన వ్యక్తి కూడా ఆత్మపూర్ణుడై జీవించాలన్నది దేవుని చిత్తం. దీని భావం ఈ వాక్యం నుండే స్పష్టంగా తెలుస్తుంది. మద్యంతో నిండియుండక ఆత్మపూర్ణులై ఉండమని ఇక్కడ హెచ్చరించబడుతున్నాము. మద్యంతో నిండియున్న వ్యక్తి, తన నియంత్రణను కోల్పోయి, తను సేవించిన మద్యం చేత నియంత్రించబడతాడు. అయితే ఇది సరికాదు. ఎఫెసీయులు అన్యులుగా ఉన్నపుడు, తమ అన్యమతాచారాలలో, ఇలా మద్యంతో నిండినవారై తమను తాము మరచిపోయి తమ దేవతలతో సంపర్కములోనికి రాగలరని నమ్మేవారని చరిత్ర మనకు తెలియజేస్తోంది. అయితే ఇప్పుడు రక్షించబడిన ఎఫెసీయులు, మునుపటివలె మద్యంతో నియంత్రింపబడటానికి తమను తాము అప్పగించుకోకుండా, ఆత్మపూర్ణులై ఉండాలని, అంటే తమను సంపూర్ణంగా నియంత్రించేలా పరిశుద్ధాత్మ నడిపింపుకు తమను తాము అప్పగించుకోవాలన్నదే దేవుని చిత్తమని ఈ వాక్యభావం. పాపము వలన ఆత్మను ‘‘దు:ఖపరచుట’’ (ఎఫెసీ 4:30) సాధ్యం. అవిధేయత వలన ‘‘ఆత్మను ఆర్పుట’’ (1థెస్స 5:19) సాధ్యం. ఆత్మను దు:ఖపరచక, ఆర్పక, ఆత్మపూర్ణులై, పరిశుద్ధాత్మ నియంత్రణ కింద ఎల్లప్పుడు జీవించాలన్నది దేవుని చిత్తం.
ఇంతకీ పరిశుద్ధాత్మ చేత నియంత్రించబడటం అంటే ఏమిటి?ఆయన మనల్ని ఏవిధంగా నియంత్రిస్తాడు? దీనికి జవాబు కనుక్కోవటం ఎంతో సులభం. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలకు కర్త. లేఖనాలు ఆయన మనసు యొక్క ప్రతిబింబం. కాబట్టి లేఖనాల చేత నియంత్రించబడటం, ఆత్మచేత నియంత్రించబడటంతో సమానం. ఇది నా స్వంత అభిప్రాయం కాదు. లేఖనాలే ఈ సత్యాన్ని స్పష్టంగా తెలుపుతున్నాయి. ఇక్కడ కొంత వివరణ అవసరం. ఎఫెసీ 5:18లో చెప్పబడిన రీతిగా ఆత్మపూర్ణులై ఉండటం వలన కలిగే ఫలితాల జాబితా, ఆ తర్వాతి వచనాలలో మనకు కనిపిస్తుంది. కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హృదయంలో దేవుని కీర్తించటం, అన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఒకరికొకరు లోబడటం, సంఘంలో ప్రేమపూర్వకమైన నడవడిని కలిగుండటం, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, యజమానులకు దాసులకు మధ్య సత్సంబంధాలు నెలకొనటం - ఇవి ఆ జాబితాలో పేర్కొనబడిన కొన్ని ముఖ్య విషయాలు.
సరిగ్గా ఇదే ఫలితాల జాబితా మనకు కొలస్సీ 3:16 నుండి ఆ తర్వాతి వచనాలలో కూడా కనిపిస్తుంది. ఐతే ఒక చిన్న వ్యత్యాసమేంటంటే, ఇది ఎఫెసీ 5లో ఆత్మపూర్ణులై ఉండటానికి ఫలితాలుగా పేర్కొనబడగా, కొలస్సీ 3లో ఇవి క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా నివసించటానికి ఫలితంగా పేర్కొనబడ్డాయి. ఫలితాలు ఒకటైనపుడు వాటి హేతువు కూడా ఒకటై ఉండాలి కదా. కాబట్టి లేఖనాలను శ్రద్ధగా చదివినపుడు, ఆత్మపూర్ణులై ఉండటం, అంటే పరిశుద్ధాత్మచేత నియంత్రించబడి మరియు క్రీస్తువాక్యం మనలో సమృద్ధిగా నివసించటం, అనగా వాక్యం చేత మనం నియంత్రించబడటం, ఇవి రెండూ ఒకటేనని తెలుస్తుంది.
ఈ విధంగా ఆత్మపూర్ణులై జీవించటం, వాక్యానుసారంగా జీవించటం దేవుని చిత్తమై ఉంది. ఈ విధంగా జీవించనివారు స్పష్టంగా బయలుపరచబడిన దేవుని చిత్తంలోని ఒక ప్రాముఖ్యమైన భాగానికి అవిధేయత చూపుతున్నారు. ఐతే ప్రియచదువరీ, నువ్వు రక్షించబడి, ఆత్మపూర్ణునిగా జీవిస్తున్నావని యథార్థంగా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం. నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే.
3. పరిశుద్ధతా సంబంధమైన దేవుని చిత్తము
‘‘మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము’’ (1ధెస్స 4:3-5). రక్షించబడి పరిశుద్ధాత్మ నివాసంగా మార్చబడిన వ్యక్తి హృదయంలో పరిశుద్ధత నియమం నాటబడుతుంది గనుక దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధపరచబడటానికి అతడు మొగ్గు చూపుతాడు. అపవిత్రతను అసహ్యించుకోని వ్యక్తి ఇంకా రక్షించబడలేదనీ, ఇంకా పూర్వస్థితిలోనే ఉన్నాడని సందేహించటానికి ఎంతైనా కారణం ఉంది. ఎందుకంటే రక్షించబడిన ప్రతీ వ్యక్తి పరిశుద్ధపరచబడే ప్రక్రియను తనలో అనుభవిస్తాడు. రక్షించబడినపుడు అతనికివ్వబడిన నూతన హృదయం నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించే హృదయము. అటువంటి హృదయం లేనివాడు పరిశుద్ధతా సంబంధమైన దేవుని ఈ చిత్తానికి లోబడడు, లోబడనేరడు. ఐతే ప్రియ చదువరీ, నువ్వు ఒకవేళ శరీరసంబంధమైన వాంఛలకు వ్యతిరేకంగా పోరాడుతున్నావని, దేవుని పరిశుద్ధత కొరకు ఆకాంక్షిస్తున్నావని యధార్థంగా చెప్పగలిగితే దేవునికి స్తోత్రం! నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే.
4. మన జీవిత సాక్ష్యానికి సంబంధించిన దేవుని చిత్తము
‘‘ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తనగవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము’’ (1పేతురు 2:15). ఈ వచనంలో ‘యుక్తమైన ప్రవర్తన’ అని పేర్కొనబడిన ‘దేవుని చిత్తము’ ఇతరుల ఎదుట మనము కలిగుండవలసిన మంచి సాక్ష్యజీవితాన్ని సూచిస్తుందని ఆ వాక్యసందర్భము నుండి స్పష్టమౌతుంది. 1పేతురు 2:12 నుండి ఆ అధ్యాయం చివరివరకూ చదివినపుడు, మనలను దూషించేవారి ఎదుట సత్‌ప్రవర్తన కలిగుండటం, ప్రభుత్వానికి, మన పై అధికారులకు లోబడటం, అందరినీ సన్మానించటం, సహోదరులను ప్రేమించటం, దేవునికి భయపడటం, క్రీస్తు కనపరచిన దీర్ఘశాంతాన్ని క్షమాగుణాన్ని ప్రదర్శించటం, మొదలైన ఎన్నో విషయాల జాబితా మనకు కనిపిస్తుంది. ‘యుక్తమైన ప్రవర్తన’లో ఇవన్నీ ఇమిడి ఉన్నాయని ఇటువంటి యుక్తమైన ప్రవర్తన కలిగుండటం వలన, అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మూయించాలని, అంటే దేవునినీ, ఆయన బిడ్డలను, క్రీస్తునూ ఆయన సువార్తను దూషించేవారిని, మంచి సాక్ష్యం వలన గెలుచుకోవాలని లేదా నిశబ్దపరచాలని దేవుని చిత్తం. అన్యజనులు దేవుని నామాన్ని దూషించటానికి మన జీవితాలు కారణమైతే, మనము దేవుని ఈ చిత్తానికి లోబడనట్లే. ‘ఎవరేమనుకుంటే నాకెందుకు, నా జీవితం నా ఇష్టం’ అనేవారు ఇంకా తమ కొరకే జీవిస్తున్నారు కానీ క్రీస్తు నామమహిమార్ధంగా జీవించటం లేదు. ఐతే ప్రియ చదువరీ, ఒకవేళ నీ సత్‌ప్రవర్తన చూసి ఇతరులు నీ దేవుని గౌరవించి, ఘనపరిచేలా ప్రేరేపించబడితే దేవునికి స్తోత్రం! నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే.
5. మన హృదయ వైఖరికి సంబంధించిన దేవుని చిత్తము
‘‘... ఎల్లపుడూనూ సంతోషముగా ఉండుడి యెడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము’’ (1థెస్స 5:15-18). పరిస్థితులతో నిమిత్తం లేకుండా ఎల్లపుడూ ప్రభువులో ఆనందించటం, ఆయనయందు మాత్రమే మనము సంతృప్తి పడుతున్నామని, ఆయన ఉండగా వేరెవ్వరూ వేరేవిూ అక్కరలేదనే హృదయ వైఖరిని వ్యక్తపరుస్తుంది. ఎడతెగక ప్రార్థించటం, మనం స్వబుద్ధిపై ఆధారపడక పూర్ణహృదయంతో ఆయనను నమ్మి, మన ప్రవర్తన అంతటిలోనూ ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నామని (సామెతలు 3:5,6) నిర్ధారిస్తుంది. అన్ని విషయాలలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన హస్తం నుండి వచ్చినవన్నీ మన మేలు నిమిత్తమే పంపబడ్డాయనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. ఇటువంటి హృదయవైఖరిని కలిగుండాలన్నది మనపట్ల దేవుని చిత్తం. వీటి విషయమై దేవునికి హృదయపూర్వకంగా లోబడనివారు, దేవుని చిత్తానికి అవిధేయులు .
ఐతే ప్రియచదువరీ, ఒకవేళ నువ్వు నీ జీవితంలో వీటిని యధార్థంగా అనుభవించగలిగితే దేవునికి స్తోత్రం! నీ జీవితం దేవుని చిత్తానుసారమైన జీవితమే.
మరి నా విషయమేంటి?
‘ఇదంతా బాగానే ఉంది కాని, నా వ్యక్తిగత నిర్ణయాలలో - నా చదువు, ఉద్యోగము, వివాహము, తదితర విషయాలలో దేవుని చిత్తాన్ని ఎలా నిర్ధారించుకోవాలి అనే విషయమై ఏమీ చెప్పలేదేమిటి? ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే కదా' అని మీరు ప్రశ్నించవచ్చు. ఆ విషయానికే వస్తున్నాను. దేవుడు తన వాక్యములో, ఆయన చిత్తమిది అని బయలుపరచిన ఐదు ప్రాముఖ్యమైన అంశాలు పైన ఉదహరించబడ్డాయి. ప్రియచదువరీ, ఇతర విషయాలలో దేవుని చిత్తాన్ని తెలుసుకోవటానికి గాను, మొదట ఈ ఐదు సూత్రాలను బట్టి నిన్ను నువ్వు బేరీజు వేసుకో.
1) నువ్వు యధార్థంగా రక్షించబడ్డావా?
2) ఆత్మపూర్ణునిగా జీవిస్తున్నావా? వాక్యానుసారమైన వాటిని ఆమోదించి, అవలంభించి, వాటిచేత నియంత్రించబడి, లేఖన విరుద్ధమైన ప్రతి విషయాన్ని ఏ మాత్రమూ రాజీపడక విసర్జించే హృదయం నీకుందా?
3) పరిశుద్ధ జీవితాన్ని కలిగుండి, జారత్వాన్ని, కామాభిలాషను, అపవిత్రమైన వాటినన్నిటినీ అసహ్యించుకుంటున్నావా?
4) ఇతరుల ఎదుట దేవునికి మహిమ తెచ్చే మంచి సాక్ష్యాన్ని కలిగున్నావా?
5) అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువునందు ఆనందించి, ఎడతెగక ప్రార్థిస్తూ, అన్నిటిలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయవైఖరిని కలిగున్నావా?
ఇవన్నీ యధార్థంగా నీలో ఉంటే, నీ వాంఛలు, నీ శరీరసంబంధమైన మనసు చేత కాక దేవుని ఆత్మచేతనే నియంత్రించబడుతున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. కాబట్టి, ఈ ఐదు విషయాలు నీలో యధార్థంగా ఉన్నట్లయితే నీ వ్యక్తిగత నిర్ణయం విషయంలో నువ్వు ఏమి కోరుకుంటున్నావో అదే నీ పట్ల దేవుని చిత్తము. ఇది మా స్వంత ఆలోచన కాదు. దేవుని వాక్యము దీనిని స్పష్టంగా ప్రకటిస్తుంది ‘‘యోహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును’’ (కీర్తన 37:4). ‘‘యెహోవాయందు సంతోషించుట’’ అనే మాటకు పైన సూచించిన ఐదు సూత్రాలు ఒక సంపూర్ణ సమగ్ర నిర్వచనాన్ని అందిస్తున్నాయి. వీటిని కలిగున్నవాడే యెహోవాయందు యధార్థంగా సంతోషించేవాడు. ఐతే ఇలా చేసేవానికి దేవుని వాక్యం వాగ్ధానం చేసే దీవెన ఏమిటి? ‘అతని హృదయ వాంఛలు’ తీర్చబడతాయి. అంటే ఈ రీతిగా జీవించువాని హృదయవాంఛలన్నీ ఖచ్చితంగా దేవుని చిత్తానుసారములే. కానపుడు దేవుడు వాటిని ఎందుకు తీరుస్తాడు?
గమనించండి, ఎవరేమి కోరుకుంటే అదే దేవుని చిత్తమని నేను చెప్పడం లేదు. షరతులు వర్తిస్తాయి. లేఖనానుసారంగా నేను చూపించిన ఐదు సూత్రాలు ఎవరి జీవితంలో అనుభవాత్మకంగా వాస్తవమై ఉన్నాయో, వారి కోరికలు దేవుని చిత్తానుసారమైనవని చెబుతున్నాను.
ప్రియ చదువరీ, ‘దేవుని చిత్తాన్ని నేనెలా కనుక్కోగలను’ అనే ప్రశ్నకు ఇంతకంటే మంచి జవాబు నాకెక్కడా లభించలేదు. లేఖనాలలో దేవుని చిత్తమని బయలుపరచబడిన ఈ సూత్రాలకు నేను లోబడటం వలన, యెహోవాయందు సంతోషించేవాడినైతే, ఆహా, నా వ్యక్తిగత విషయాలలో, అంటే నేనేమి చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని పెళ్ళి చేసుకోవాలి, తదితర అన్ని విషయాలలోనూ, నా హృదయవాంఛ ఏమైయుందో అదే దేవుని చిత్తము. అందుకే ఆయన వాటిని నెరవేరుస్తాడు. ఇక మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోటానికి, ఎవరెవరినో సంప్రదించటం, ఏవేవో చేయటం మాని, దేవుని సన్నిధిలో మోకరించి ఈ ఐదు సూత్రాల విషయమై మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవటం యుక్తము.
ముగించే ముందు ఓ ముఖ్యమైన హెచ్చరిక!
పైన చెప్పిన మాటలతో ఒక ముఖ్యమైన హెచ్చరికను జతచేయటం ఎంతైనా అవసరం. ‘నేను యధార్థముగా రక్షించబడ్డాను, పైన సూచించిన సూత్రాలన్నీ నా జీవితంలో నేను అనుభవాత్మకంగా చూడగలుగుతున్నాను. నేను యెహోవాయందు సంతోషించేవాడినే’ అని అనుకుని మోసపోయే క్రైస్తవులెందరో ఉన్నారు. దేవుని చిత్తాన్ని కనుగొనే ఈ విధానము అలాంటివారికి తమ సొంత కోరికలను సమర్ధించుకొనే ఓ సులభమైన మార్గంగా మారే ప్రమాదం లేకపోలేదు. దేవుని బిడ్డల ఆదరణ మరియు నిశ్చయత కొరకు చెప్పిన పైమాటలు, తాము తిరిగి జన్మించామనుకుని మోసపోయేవారి ఇష్టానుసారమైన జీవితాన్ని సమర్ధించుకునే మార్గముగా ఎన్నడూ మారకూడదు. కాబట్టి, ఈ హెచ్చరిక ఎంతో అవసరం.
పై సూత్రాలను అనుభవాత్మకంగా ఎరిగిన వ్యక్తి కోరికలు ఎల్లప్పుడూ దేవుని వాక్యానుసారంగానే ఉంటాయి. అందుకే యెహోవాయందు సంతోషించేవాని హృదయవాంఛలు దేవుని చిత్తానుసారమైన కోరికలే అనటం ఎంత నిజమో, అతడు యెహోవాయందు యథార్ధముగా సంతోషిస్తున్నాడో లేదో గుర్తించేందుకు అతని కోర్కెల లక్షణమే సూచికులు అనటం కూడా అంతే నిజం.
1) యెహోవాయందు సంతోషించే వ్యక్తి మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకుతాడు (మత్తయి 6:33).
యెహోవా తన హృదయవాంఛలను తీరుస్తాడన్నది అతడు యెహోవాయందు సంతోషించటానికి హేతువు కాదు. అది దాని ఫలితం మాత్రమే. తన కోర్కెలను తీర్చుకోవటానికే యెహోవాయందు సంతోషించేవాడు స్వార్థపరుడు. క్రీస్తుతో కూడా లేపబడినవాడు పైనున్న వాటినే వెదకుతాడు. తన హృదయ వాంఛలపై దృష్టి నిలిపేవారికి అవి లభిస్తాయని పాల్ యాంగిచో వంటివారు బోధిస్తారేమో గాని దేవుని వాక్యమైతే మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకమని, అప్పుడు అవన్నీ అనగా మనకు అవసరమైనవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని బోధిస్తుంది. దేవుని కంటే తన హృదయ వాంఛలనే ఎక్కువగా ప్రేమించేవానికి దేవుని చిత్తము విషయమై ఎలాంటి ఆసక్తీ లేదు. క్రీస్తు కంటే తమను తాము ఎక్కువగా ప్రేమించుకునేవారు ఆయనకు యోగ్యులు కారని మరిచిపోవద్దు.
2) యెహోవాయందు సంతోషించే వ్యక్తి దుష్టుల ఆలోచన చొప్పున నడవడు (కీర్తన 1:1).
ఉదాహరణకు తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవలసి వచ్చినపుడు రక్షించబడని తన బంధు మిత్రుల అభిప్రాయాన్ని లక్ష్యపెట్టక తప్పదని తన ప్రాచీన స్వభావం ఎంత ఒత్తిడి చేసినా ‘‘నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయేపోవుదును’’ (గలతీ 1:10) అనే వాక్యము అతనిని మందలించి దేవుడిని సంతోషపెట్టే నిర్ణయాన్ని వాంఛించేలా నడిపిస్తుంది. కులము, కట్నము అంటూ అతడు లోకస్తులవలె ప్రవర్తించడు. విశ్వాసితోనే జోడు కలిగి ఉండాలనే తన హృదయవాంఛ శరీరసంబంధమైన మనసు కోరే ఇతర విషయాలన్నిటినీ కాదనేంత బలంగా ఉంటుంది. వివాహాన్ని ఉదాహరణగా పేర్కొన్నాను గాని అన్ని విషయాలలోనూ దేవునిబిడ్డ ఆయన సంతోషించేవాటిని వాంఛించి, ఆయన ద్వేషించేవాటిని విసర్జించేలా వాక్యము చేత బోధ పొంది నడిపించబడతాడు. ఇలాంటి మనసు లేనివారు తాము యెహోవాయందు సంతోషిస్తున్నారని గాని, తమ హృదయవాంఛలు ఆయన చిత్తానుసారమైన నియమం చేతనే నియంత్రించబడుతున్నాయని గాని అనుకోవడం తమను తాము మోసపుచ్చుకోవటమే అవుతుంది.
3) యెహోవాయందు సంతోషించే వ్యక్తి ఈ లోక మర్యాదననుసరించి నడువడు (రోమా 12:2).
ఉదాహరణకు తన తోటి క్రైస్తవులు ఉద్యోగావకాశాల కొరకు నకిలీ సర్టిఫికెట్లు వాడటం చూసినపుడు అబద్దపు సంపాదన దేవుని నుండి వచ్చేది కాదు గనుక అతడు అలాంటి పాపానికి దిగజారక న్యాయమైన అవకాశం కోసం దేవుని వైపు చూస్తాడు. నేను దేవుని బిడ్డనని ప్రతిచోటా సాక్ష్యమిచ్చి ఎస్సీ సర్టిఫికెట్ల వలన కలిగే లాభాల కొరకు మండల ఆఫీసులో మాత్రమే ప్రభువుని తృణీకరించి తాము హిందువులమని చెప్పే తన సహ క్రైస్తవులతో అతడు ఎన్నడూ చేతులు కలపడు. ‘‘ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని’’ అతనికి ఎవరూ బోధించనక్కరలేదు. అతని హృదయ వైఖరే ఆ విధంగా మారుతుంది. అలాంటి వైఖరి లేని హృదయము ఇంకా ఘోర దుష్టత్వంలోను, దుర్నీతి బంధకంలోనే ఉందనటానికి సందేహించనక్కరలేదు.
ప్రియ చదువరీ, వాక్యపరిమితిలో మాత్రమే తన స్వేచ్ఛను వినియోగించేవాడే యెహోవాయందు సంతోషించేవాడని మరిచిపోవద్దు. ఈ సూత్రము మన జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలలోను వర్తిస్తుంది. యథార్థమైన దేవుని బిడ్డ దేవుని చిత్తాన్ని కనుగొంటాడు అనడం కంటే అతని హృదయవాంఛలు దేవుని చిత్తానుసారంగా ఉంటాయని చెప్పడమే సరి. అందుకే దేవుడు వాటిని నెరవేరుస్తాడు కూడ. దేవుడు తన చిత్తానుసారమైన వాంఛలను మన హృదయంలో పుట్టించునట్టి జీవితాన్ని మనం కలిగియుందుము గాక!
"దేవుని చిత్తమును తెలుసుకొనుట - పార్ట్ 2
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.
Comments
Just I have read your book. You wrote wonderful information,
I am from UESI, iam accepting with your words. God's to be Glory
Thank you
David Ravikiran
Missionary from Uttarakhand