దుర్బోధలకు జవాబు

రచయిత: పి.బి. మనోహర్
చదవడానికి పట్టే సమయం: 1 గంట 15 నిమిషాలు
ఆడియో

ముందు మాట

దేవుని మహా కృపను బట్టి నేను మరియొక పుస్తకము వ్రాయగలిగాను. పుస్తకములు వ్రాయుటకు సమయం సరిపోవుట లేదని నేను 2007 మార్చి నెల 24వ తేదీన నేను చేయుచున్న రైల్వే ఉద్యోగమునకు స్వచ్ఛందముగా పదవీ విరమణ చేసితిని. అనేక ప్రాంతములలో సువార్తను ప్రకటించుటకు ప్రభువు ద్వారము తెరిచిరి. నేను వెళ్లిన చాలా చోట్ల చాలామంది మీ కథలను చదివి మేమెంతో ఆనందించు చున్నామని తెలియజేసారు. నేను ఇంకా పుస్తకములు వ్రాయగలుగునట్లు నా కొరకు ప్రార్థించమని మనవి చేయుచున్నాను.

నా పుస్తకములలో ప్రచురించబడిన కథలను కొందరు అనధికారముగా మక్కికి మక్కీ కాపీ కొట్టి తమ పత్రికలలో వారే వ్రాసినట్లు ప్రచురించు కొనుచున్నారు. వారికి వందనములు. అనేకు లు ఆ కథలను చదవాలనేదే నా ఉద్దేశ్యము. ఈ పుస్తకమునకు మాత్రం కాపీ రైటు లేదు. ఎవరు కావాలంటే వారు ముద్రించుకొన వచ్చును. దీనిలోని భాగములను తమ పత్రికలలో ప్రింటు చేసుకొనవచ్చును

శ్రీ ఆనుమల్లి నవీన్ (రాజమండ్రి) గారు ఈ పుస్తకము టైటిల్ డిజైన్ చేసి పంపారు. నేను చెప్పుచుండగా శ్రీమతి మేరి వ్రాసి టైపు చేసినారు.వారికి కృతజ్ఞతలు.  - డాక్టర్.పి.బి.మనోహర్

 

నా అభిప్రాయము

 ఏ విధంగానైనా సరే వాస్తవాన్ని వెల్లడి చెయ్యి. తప్పును ఖండించడంలో నిర్భయంగా వ్యవహరించు. అయితే అదే సమయంలో మానవతతోనూ, ప్రేమతోనూ, హుందాగానూ వ్యవహరించు - డబ్ల్యు. ఎస్. పున్సర్.

నేను కాలేజీలో చదువుతున్న రోజుల నుండి మనోహర్ అన్నయ్య రచనలకు అభిమానిని. ఆయన రచనలెప్పుడూ సాగదీసే రీతిలో కాక సరళంగా, సూటిగా హృదయాన్ని తాకుతాయి. నా సండేస్కూల్ పరిచర్యలో అన్నయ్య వ్రాసిన కథ లెన్నింటినో వాడుకొంటూ ఉంటాను. ఎప్పుడూ కథలే వ్రాసే అన్నయ్య ఒక రోజు బోధకుల నిజ జీవిత కథలను వ్రాసి అటు క్రొత్త బోధకులకు ఒక సవాలుగా, ఇటు బోధకుల బాధితులకు ఊరటగా ఉంటుందని కనీసం కొందరిలోనైనా చిన్ని మార్పు తేవాలని సంకల్పించాను అని అన్నారు.

మొదటిగా ఈలాగు వ్రాయడం వలన కొన్ని సమస్యలు వస్తాయేమోనని భయపడ్డాను. కానీ ఈ పుస్తక ప్రతిని చూచిన తర్వాత నేటి దినాల్లో ఇది అత్యంత అవసరమైన పుస్తకంగా నాకు కనిపించింది. బైబిల్ లో కూడా ఎన్నోసార్లు పరిశుద్ధాత్ముడు ఈ అబద్ధ ప్రవక్తల (అబద్ధ బోధకుల) గూర్చి హెచ్చరించాడు కదా? కావున అన్నయ్య లాంటి రచయితలు భయంకర బోధకులను గూర్చిన ఈ విషయాలను విశ్వాస లోకానికి తప్పక తెలియజేయాల్సిందే అని నా కనిపించింది. ఎందుకంటే నేను, నా కుటుంబం కూడా బోధకుల బాధితులమే. కేవలం ఈలాంటి వారి వలననే సువార్త పరిచర్యలో ఎన్నో ఆటంకాలు. ఎందరికో వీరు అడ్డు బండలు.

అందుకే మనోహర్ అన్నయ్యను మనస్పూర్తిగా అభినందిస్తూ బోధకులందరినీ ఒక్క సారి మీ పరిచర్యలోని లోపాలను గుర్తెరిగి తిరిగి సరియైన రీతిలో మొదలు పెట్టాలని చేతులెత్తి అడుగుచున్నాను. సహృదయంతో ఆదరించమని విమర్శక లోకాన్ని అభ్యర్థిస్తున్నాను. ఒక వేళ అన్నయ్య ఈలాంటి మరో పుస్తకం వ్రాస్తే దానిలో నా పేరు ఉండకుండా నా సేవను కొనసాగించేలా సహాయం చేయమని ప్రభువును ప్రార్థిస్తున్నాను.


ఇట్లు,
ప్రభువు సేవలో, 
మీ జ్యోతి శేఖర్
విశాఖ స్టీల్ ప్లాంట్

 

నా అభిప్రాయము

ఈ పుస్తకం యొక్క వ్రాత ప్రతిని చదివిన తరువాత నేటి క్రైస్తవ సమాజమునకు ఈ పుస్తకం చాల అవసరం అని నాకు తోచినది. ఆయన రచనలెప్పుడు సరదాగా ఉంటాయి అనుకొనే వాడిని. క్రైస్తవ సమాజమును సంస్కరించాలనే ఉద్దేశ్యము ఆయనకు కలిగినదంటే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉన్నది. ఇటువంటి సంఘటనలు నాకు కూడ అనుభవం.

మా ఇంటి ఎదురుగా ఒక పాస్టరు ఉన్నారు. ఉదయం 5 గంటలకు దడేల్ మని శబ్దం వచ్చింది. నేను మేల్కొని కిటికీ లోంచి చూస్తే పాస్టరు తన భార్య జుట్టు పట్టుకొని వంచి వీపుపై గుద్దు చున్నాడు. ఆమె ఒక పాత్రను పాస్టరుపై విసిరివేసింది. ఆదివారం కూడ వీరు దెబ్బలాడుకొంటున్నారు అనుకొన్నాను. 10 గంటలకు మైకులో పాస్టరు ప్రసంగం వినిపించింది. “నా సంఘస్తులారా ! ఉదయమే లేచి నేను నా భార్య కన్నీటితో ప్రభువు సన్నిధిలో కనిపెట్టాము. ప్రభువా! నీ బిడ్డలకు ఏమి చెప్పమంటావు? అని ఎలుగెత్తి ఏడ్చాము. అప్పుడు మేము ప్రభువు ఆత్మతో నింపబడ్డాము. ప్రభువు మాతో మాట్లాడారు.... ఇలా పాస్టరు ప్రసంగం కొనసాగింది.

మరొక పాస్టరు చర్చి కడతానని అందరి వద్ద ధనం వసూలు చేసాడు. సుమారు 10 లక్షలు ప్రోగుచేసి చక్కని చర్చి కట్టాడు. ఇంతలో ఆయన కొడుకుకు న్యూజిలాండులో ఉద్యోగం వచ్చింది. ఈయన 15 లక్షలకు చర్చిని వేరొక పాస్టర్ కు అమ్మేసి ఆ డబ్బుతో న్యూజిలాండు వెళ్లిపోయాడు. మేమంతా ఇచ్చిన ధనాన్ని స్వంత ఆస్తిలా అమ్మేసాడు.

ఇలా ఆలోచిస్తుంటే అనేక విషయాలు నాకు జ్ఞాపకం వస్తున్నవి. ఆంగ్లములో ఒక సామెత గుర్తుకు వస్తున్నది. 99% చెడ్డవారీ వలన మిగిలిన పాస్టర్లందరికీ చెడ్డ పేరు వస్తున్నది. పౌలు భక్తుడు “ మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొనిపోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగురగొట్టబడిన భారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఎఫెసీ 4:14 అని హెచ్చరించుచున్నాడు.

ఒక్క విషయం స్పష్టం చేస్తాను. ధనమిచ్చి ఆశీర్వాదమును కొనలేము. డబ్బులిచ్చి స్వస్థత పొందలేము. ఎంత గొప్ప పాస్టర్ అయినా బైబిల్ కు వ్యతిరేకంగా చెబితే నమ్మకండి. ఎంత చిన్నవాడైనా బైబిల్ లో ఉన్నది చెబితే నమ్మండి. షాలోమ్.

                            వి. విజయ కుమార్
                                        ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ (రైల్వే)

 

అబద్ధ ప్రవక్తలు

తనకు అందిన సమాచారం అసంపూర్ణమైనదనీ, తప్పు త్రోవ పట్టిస్తుందనీ తెలుసుకొనగల్గిన వాడే విద్యావంతుడు.

"మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు - ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చు చున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారై యున్నారు" - యెహెజ్కేలు 22:28.

ఈ పుస్తకములో నేను ఒక్క అబద్దము కూడ వ్రాయలేదు. ఎవరో చెప్పిన విషయములు, కర్ణా కర్ణిగా విన్నవి వ్రాయలేదు. ఎక్కువ భాగము నాకు సంభవించినవీ, నేను ముఖా ముఖిగా కలుసుకున్న అబద్ద ప్రవక్తల సంఘటనలే వ్రాసాను. ఇవి చాలా కాలము క్రితము జరిగిన సంగతులు కావు. ఈ విషయములు నేను వ్రాయుటకు ఒక సంగతి కారణము.

ఇటీవల సాక్షి పేపరులో (3-08-2010) ఒక అబ్బాయి వ్యాధిగ్రస్తుడై యుండగా ఒక పాస్టరు దంపతులు అతని తల్లిని సమీపించి "మందుల ద్వారా మీ అబ్బాయికి నయంకాదు. మాకు 20 వేల రూపాయలు, 2 తులముల బంగారము ఇస్తే మేము మీ ఇంటిలో కూర్చుని ప్రార్థన చేస్తాము. ఆ అబ్బాయిని స్వస్థపరుస్తాము” అన్నారు. ఆ అబ్బాయి తల్లి వారడిగిన ధనాన్ని ఇచ్చింది కానీ ఆ అబ్బాయి చనిపోయాడు. గ్రామస్తులు ఆ పాస్టరు దంపతులను చెట్టుకు కట్టివేసి బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు.

ఈ విషయంలో ప్రధానంగా పాస్టరు గారిదే తప్పు ఉన్నా అజ్ఞానములో ఉన్న ప్రజలను చైతన్య పరచవలసిన అవసరం ఉన్నదని నాకు తోచింది. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవియ్యగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని యెడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడువవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్ధతను విడువని యెడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించు కొందువు. యెహెజ్కేలు 33:8,9.

ఎవరికైనా స్వస్థత జరగాలంటే దేవుని చిత్తముతో పాటు మూడు విషయాలు అవసరం:

1. Wet eyes = కళ్లలో నీరు

2. Bent Knees = వంగిన మోకాళ్లు

3. Broken Heart = నలిగిన హృదయము

వీటితో చేసిన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇస్తారు.

ఈ పుస్తకము వ్రాయుటకు నేను పూనుకొనగా అనేకులు నన్ను నిరుత్సాహపరిచారు. “వారు అభిషేకము పొందిన సేవకులు. వారిని తీర్పు తీర్చుటకు నీవెవరవు?” అని నన్ను వారింప జూచారు.

God himself does not propose to judge a man until he is dead so why should you ? అని కొందరూ, We are called to be witnesses, not lawyers or judges. అని మరి కొందరూ నిరుత్సాహ పర్చిరి. నేను ఎంతో సంఘర్షణకు లోనయ్యాను. అయిననూ ప్రభువు వ్రాయమని ప్రేరేపించినందు వలన వ్రాయుటకు పూనుకున్నాను.

వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి. 1 కొరింథీ 5:12,13.

వ్రాసిన తరువాత తెనాలిలో ఉండు ఒక సహోదరునికి నేను చూపించగా ఆయన ఎంతో సంతోషించినారు. "ప్రస్తుతము ఇటువంటి పుస్తకములే కావలెను. మీరు వెంటనే వ్రాయండి” అని ఎంతో ప్రోత్సాహము నిచ్చారు.

ఈ పుస్తకము నేను ఎవరినీ విమర్శించుటకు వ్రాయలేదు. లోపములు ఎత్తి చూపుటకు వ్రాయలేదు. తీర్పు తీర్చుటకు వ్రాయలేదు. ఇటువంటి అబద్ద ప్రవక్తలు ఉన్నారని ప్రజలకు తెలియజెప్పుటకు వ్రాయుచున్నాను. ప్రజలను హేతు బద్దముగా ఆలోచించమని చెప్పుటకు వ్రాయు చున్నాను.

సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు - ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. యిర్మియా 23:16.

 అనేకమంది ప్రభువు మాతో పలికించు చున్నాడు అని చెప్పుచూ తమ స్వంత ఆలోచనలను చెప్పుచున్నారు. కొందరు దేవుడు మాచేత పలికిస్తున్నాడు అంటూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. గలిబిలి పుట్టిస్తున్నారు.

తెనాలిలో ఒక పబ్లిక్ మీటింగులో ఒక స్త్రీ ప్రవచనము చెప్పుచున్నది. “ఇక్కడ ఉన్న స్త్రీలలో ఒక స్త్రీ తన భర్త ఆఫీసుకు వెళ్లినప్పుడు ప్రక్కింటి వ్యక్తితో వ్యభిచారము చేయుటకు సిద్ధపడుచున్నది. చెల్లి వద్దమ్మా! ఆ పని చేయవద్దు. దేవుని శాపానికి గురి కావద్దు” అన్నది. ఈ ప్రవచనము వలన ఆ సోదరి మనస్సు మార్చు కున్నదో లేదో నాకు తెలియదు, కానీ మగవారు తమ భార్యలపై సందేహపడుటకు ఆస్కారమిచ్చింది.

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1 యోహాను 4:1.

మరొక అబద్ద ప్రవక్త “ఒక యువతీ ఒక యువకుడు లేచిపోతున్నారు” అని ఒక పబ్లిక్ మీటింగులో చెప్పారు. ఆ గ్రామములో ఆడపిల్లలు ఉన్న తల్లి తండ్రులందరూ ఆందోళన చెందారు. మగ పిల్లల తల్లిదండ్రులు కూడ మా అబ్బాయే ఈ పాడుపని చేస్తున్నాడని అనుమానంగా చూడసాగారు. వెరసి ఈ ప్రవచనాల వల్ల సంఘానికి గానీ, వ్యక్తులకు గానీ ఏ మేలూ జరగలేదు. పైగా గలిబిలి, పరస్పర సందేహాలు జరుగుటకు అవకాశమిచ్చినది.

   కలకంటిని,   కలకంటిని   అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను. యిర్మియా 23:25.

ప్రభువు సెలవిచ్చినట్లు ఇటువంటి ప్రవక్తలు నిజంగా గొర్రె చర్మమును కప్పుకొనిన క్రూరమైన తోడేళ్లు. ఒక గ్రామములో నేనూ, మరొక పాస్టరు గారూ సువార్తను ప్రకటించుటకు పిలువబడ్డాము. ఆ గ్రామములో చాలామంది హిందూ సోదరులు మైకు ద్వారా మా మాటలను వినుచున్నారు. నేను వాక్యము ప్రకటించిన తరువాత ఆ పాస్టరు గారు ప్రసంగము చేయుచూ ప్రవచనము చెప్పుట ప్రారంభించారు.

అక్కడ ఉన్న స్త్రీలలో ముగ్గురికి మెన్సస్ టైంలో ఉన్న సమస్యలను ప్రభువు స్వస్థపరుస్తున్నాడని చెప్పెను. తెలుగులో అతడు ఉపయోగించిన పదములు అభ్యంతరకరముగా ఉన్నవి. అందువలన ఆ గ్రామ పెద్ద మీటింగులు నిర్వహించుచున్న కన్వీనర్ ను పిలిచి “రేపు ఆ పాస్టరు వచ్చిన యెడల మైకు పెట్టుటకు వీలు లేదు” అని హెచ్చరించెను. పైగా “వంద మంది స్త్రీలు ఉన్నప్పుడు ముగ్గురికి స్త్రీ సమస్యలు ఉండుట సహజమే గదా? ఇది దేవుడు బయలు పరచుచున్నాడని చెప్పుట ఎందుకు?” అనెను. మరునాడు అతనిని పిలువలేదు. నేనొక్కడినే వర్తమానము అందించినాను.

మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచనవాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందుమీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి. 2 పేతురు 1:19-21

ఈ అబద్ద ప్రవక్తలు చెప్పు ప్రవచనములు వినుచున్నప్పుడు నాకు ఒక హాస్య కథ గుర్తుకు వచ్చుచున్నది. ఒక గ్రామములో ఒక దొంగ సన్యాసి ఉండెను. అతడు ప్రజలకు ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పుచూ ఉండెను. ఆ గ్రామములో ఒక తెలివైన యువకుడు ఉండెను. అతడు ఒకనాడు ఊరి పెద్దలతో కలసి సన్యాసి వద్దకు వచ్చి “నేను కూడ నీవలే భూత, వర్తమాన భవిష్యత్ లను చెప్పగలను. నేను చెప్పినది తప్పు అయిన యెడల వెయ్యి వరహాలు ఇచ్చేదను. నిజమని ఒప్పుకొనిన యెడల మీరు వెయ్యి వరహాలను నాకు ఇవ్వవలెను” అని పందెము కాచెను.

సన్యాసి “భూత, వర్తమాన, భవిష్యత్ కాలములను ఎవరునూ చెప్పలేరు. నేను ఏదో ఊహించి చెప్పుచున్నాను. ఈ యువకుడు చెప్పలేడు గనుక నాకు వెయ్యి వరహాలు వచ్చును” అని తనలో తాను సంతోషించి అతనితో “సరే నీవు నా భూత కాలము గురించి ఒకటి, వర్తమాన కాలము గురించి ఒకటి, భవిష్యత్ కాలము గురించి ఒకటి మొత్తం మూడు విషయములను చెప్పవలెను. ఏ ఒక్కటి తప్పైననూ నీవు వెయ్యి వరహాలు ఇవ్వవలెను” అనెను.

ఆ యువకుడు దానికి సమ్మతించి "మొదట మీ భూత కాలము : మీరు పుట్టినప్పుడు చాల చిన్నగా ఉన్నారు” అనెను. సన్యాసి కాదు అని అనలేక “సరే వర్తమానము విషయము ఒకటి చెప్పుము” అనెను. అప్పుడు అతడు “మీరు ఇప్పుడు నిద్రపోయేటప్పుడు కన్నులు మూసికొందురు” అనెను. సన్యాసి గతుక్కుమని “సరే భవిష్యత్ కాలము గురించి ఒక మాట చెప్పుము” అనెను. అప్పుడు ఆ యువకుడు “నీ ఆయుష్చు ఎంతో చెప్పెదను. నీవు చనిపోయే వరకు బ్రతికెదవు” అనెను. సన్యాసి తన ఓటమిని అంగీకరించి ఆ యువకునికి వెయ్యి వరహాలు ఇచ్చెను. ఈ కథలోని యువకునివలెనూ, దొంగ సన్యాసి వలెనూ ప్రవచనములు చెప్పు అబద్ద ప్రవక్తలు నేడు చాల ఎక్కువైపోయారు.

ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.1 యోహాను 4:1.

ఒక చిన్న పాస్టరు ఇలాగే అబద్ధ ప్రవచనములు చెప్పుచుండగా నేను అతనిని గద్దించి “మీరు ప్రవచనములు అస్పష్టముగా చెప్పకూడదు. ప్రభువు అననీయకు తిన్ననిదనబడిన వీధికి వెళ్లి యాదా అనువాని ఇంట తార్సు వాడైన పౌలు అనువాని కొరకు విచారించుము” అని స్పష్టముగా చెప్పెను. అదే సమయములో సౌలు కూడ అననీయ వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి యున్నాడు. అపొస్తలుల కార్యములు 9:10.

కొర్నేలీతో దేవుని దూత యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను అను ఒక చర్మకారుని యింట దిగియున్నాడు అని చెప్పెను.

అనేకమంది అబద్ధ ప్రవక్తలు పేరు పెట్టి పిలుచుట నేను చూసాను. కానీ వారు అస్పష్టముగా పిలుచుట చూసాను. ఉదాహరణకు నన్ను పిలిస్తే డోర్ నెంబర్ 8-17-11లో నివసించుచున్న కొర్నేలియస్ గారి కుమారుడైన మనోహర్ అని పిలిచిన యెడల అది ఖచ్చితముగా ఉండును. దేవునికి మన పూర్తి అడ్రసు తెలుసు కదా? వేయిమంది ఉండే సభలో యోహాను, లాజరు, మేరీ, రూతు, ఎస్తేరు మొదలగు పేర్లు ఉండుట సహజమే గదా! నా ప్రియ పాఠకుల్లారా కొంచెం అలోచించండి.

మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు, యిర్మియా 23:32.

నా సోదరి (మా పిన్ని కూతురు) ఒక ఊరిలో ఒక పాస్టరు గారు ప్రార్థన చేసి నాకు జరగబోయే విషయములు చెబుతానన్నాడు. తోడుగా రమ్మని నన్ను కోరినందు వలన నేను ఆమెను తీసుకొని వెళ్లినాను. ఆమెకు అనేక సంబంధములు వచ్చిననూ వివాహము నిశ్చయము కానందువల్ల ఆమె తల్లిదండ్రులు కొంచెము దుఃఖముతో ఉన్నారు. నేను తీసుకొని వెళ్లిన అబద్ద ప్రవక్త గారు ఆమె గురించి ప్రార్థన చేసి “దేవుడు బాగా చదువూ, మంచి ఉద్యోగమూ ఇవ్వబోవుచున్నాడు. కానీ వివాహము ఇప్పటిలో లేదు, ముందు చదువు పూర్తి కావలెను” అని చెప్పినాడు.

ఇది జరిగి 14 సంవత్సరములు అయినవి. ఆమెకు వివాహము అయినది. కానీ ఉద్యోగము రాలేదు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయలేక పోయినది. ఆమె నల్లగా ఉండుట వలన వివాహము అగుట కష్టమని అతడు ఊహించి చెప్పినాడు. కానీ దేవుడు బయలు పరచినది కాదు. కానీ అతడు దేవుడు నాకు బయలుపరచు చున్నాడని చెప్పుచూ ప్రతీ ఆదివారము వందలాది మందిని ఆకర్షించుచున్నాడు. దుఃఖకరమైన విషయం ఏదనగా జనులు వారి మాటలనే నమ్ముచున్నారు.

నేను మిమ్మును తోలివేయునట్లును, మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తలును నశించునట్లును, వారు నా నారుమునుబట్టి అబద్ధముగా ప్రవచించుచున్నారు. మరియు యాజకులతోను, ఈ ప్రజలందరితోను నేను ఈ తూటలను చెప్పితిని. యిర్మియా 27:15.

ఒక పాస్టరు గారు ఎవరి ఇంటికైనా వెళ్లినప్పుడు “మీ చుట్టూ మూడు దురాత్మలు ఉన్నవి. వాటిని పారద్రోల వలెననిన యెడల 3 దినములు మీ ఇంట ఉపవాస ప్రార్థన చేయవలెను. నేను చేస్తాను” అన్నారు. ఆయన తన భార్యతో ఉదయమే వచ్చి సాయంత్రము వరకు ప్రార్థించుచూ ఉంటారు. కుటుంబ సభ్యులు వీలున్న యెడల ప్రార్థనలో కూర్చుండ వచ్చును లేదా అతడు ఒంటరిగా కూర్చుందురు. సాయంత్రము ఉపవాసమును విరమించి చక్కగా భోజనము చేసి వెళ్లును. (మధ్య మధ్య ఆ ఇంటి వారు ఇచ్చే టీ లు, పళ్ల రసములు త్రాగు చుండును) మూడు రోజుల తరువాత దురాత్మ పారిపోయినదని చెప్పును. ఒకవేళ గృహస్థుడు ధనవంతుడైన యెడల దురాత్మల సంఖ్య పెరుగుచుండును.

ఒకసారి కొందరు పాస్టరులు మా ఇంటికి వచ్చిరి. నేను వారికందరికి భోజనము ఏర్పాటు చేసాను. భోజనము చేయుటకు ముందు రెండు గంటల పాటు ప్రార్థన చేసికొనవలెనని సంకల్పించితిమి. అంతలో ఒక పాస్టరు దంపతులు తమ సంఘ విశ్వాసులతో కలసి మా ఇంటికి వచ్చిరి. అందరము ప్రార్థన చేసికొంటిమి. ఒక పాస్టరు గారు ప్రార్థన అంతయూ నడిపించు చుండిరి. ఆయన క్లుప్త ప్రసంగము చేసిరి.

తరువాత “సిస్టరు గారూ! మీరు ముగింపు ప్రార్థన చేయండి” అని పాస్టరు గారి భార్యతో చెప్పెను. ఆమె తాను చేయకుండా తన సంఘ విశ్వాసిని చేయమని చెప్పెను. ఆ విశ్వాసి ప్రార్థించిన తరువాత పాస్టరు గారు ఆశీర్వాదముతో ఆనాటి ప్రార్థనా కూడిక ముగిసినది.

నేను నా భార్య కుర్చీలు వేయుట, అతిధులకు భోజన ఏర్పాట్లు చేయుట మొదలగు పనులలో ఉండగా ఆ పాస్టరు గారి భార్య నా వద్దకు వచ్చి “బ్రదర్ గారూ! మీ గురించి ప్రార్థన చేయవలెనని దేవుడు నన్ను ప్రేరేపించు చున్నాడు' అనీ నాతో అన్నది. నేను “అదేంటి సిస్టరు గారూ! ఆయన ప్రార్థన చేయమని అడిగినప్పుడు మీరు చేయలేదు. 5 నిముషముల తరువాత ఇప్పుడు ప్రార్థన చేస్తాను అంటున్నారు. సరే చేయండి” అని నేను చేతులు కట్టుకొని తలవంచి కండ్లు మూసికొన్నాను.

అందుకు ఆమె “అలా కాదు బ్రదర్. చాప మీద కూర్చుని చేద్దాం” అన్నది. నేను వచ్చిన అతిధులకు భోజన ఏర్పాట్లు చేయవలెనని కంగారుగా ఉన్నాను. ఈమె ప్రార్థన చేయుదునని అడిగినప్పుడు కాదు అనుట సరికాదు గనుక నేను చాపను పరిచి మోకరించాను. ఆమె కూడ మోకరించి కొద్దిసేపు ప్రార్థించి, అన్య భాషలలో మాట్లాడి ప్రవచనము చెప్పుట ప్రారంభించినది. ఆమె మూడు ప్రవచనములు చెప్పినది.

1. నీ అప్పులన్నీ తీర్చివేస్తాను.

2. నీవు కోరిన విధంగా మగపిల్లవాని అనుగ్రహించాను. గనక నీవు అతనిని సేవకు సమర్పించుము.

3. నీ భార్య నీకు అడ్డుబండగా ఉన్నది.

ఈ ప్రవచనములు విన్న నేను ఆశ్చర్యపోయాను. ఎందుకనగా అవన్నియు అబద్దములు.

1. నేను ఏనాడూ అప్పు చేయలేదు. రైల్వేలో ఉద్యోగము చేయు కాలములో డిపార్ట్ మెంట్ లోను కూడా తీసుకోలేదు. ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ సొసైటీ (Employes Co-Operative Society) లో జాయిన్ అవ్వలేదు.

2. నేను మెజీషియన్లు. నాకు వచ్చిన మేజిక్ అంతా ఒక అమ్మాయికి నేర్పించినట్లయితే ఆ అమ్మాయి ఇండియాలో ఫస్ట్ ప్రైజ్ పొందవచ్చును. అదే అబ్బాయి అయితే ఇంకా ఎక్కువ నేర్చుకొనవలెను. అందువల్ల అమ్మాయి పుట్టితే ఇండియాలో ఫస్ట్ మరియు బెస్ట్ మెజీషియన్ ను చేయవలెనని నేను అమ్మాయి పుట్టాలని కోరుకున్నాను. నా భార్య గర్భవతి కాగానే మేమిద్దరమూ చక్కని పేరును ఇండియాలో ఎవరికీ లేని అమ్మాయి పేరును సెలక్ట్ చేసికొన్నాము. అయితే దేవుడు తన చిత్తప్రకారము నాకు అబ్బాయిని అనుగ్రహించాడు. నేను ఇదేమి? (హెబ్రీ భాషలో “మన్నా") అని దేవునితో అన్నాను. మా అబ్బాయి పేరు మన్నా.

3. నేను వ్రాసే కథలను అప్పట్లో నా భార్య వ్రాసేది. ఫెయిర్ కాపీ చేయడం, రిఫరెన్సులు వెదకడం ఆమె పని. భార్య సహకరించనిచో 75 పుస్తకములు వ్రాయుట నాకెన్నటికీ సాధ్యమయ్యేది కాదు. ఉద్యోగము రాజీనామా చేయుటకు భార్య సహకారము లేనిచో సాధ్యమగునా? గనుక ఆమె ప్రవచించిన వన్నియు అబద్ధములని తెలియుచున్నది.

మరునాడు నేను ఆమె ఇంటికి వెళ్లి గంట కూర్చుని మీరు దైవాత్మ ఏదో, మానవాత్మ ఏదో విచక్షణ చేయలేక పోవుచున్నారు. స్వంత ఆలోచనలను దేవుడు చెప్పినాడని చెప్పుచున్నారు అని ఎంత చెప్పిననూ ఆమె ఒప్పుకొనలేదు.

ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు, యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు, ఆలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము; దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయుదురు? యిర్మియా 5:31.

నేను ఉద్యోగములో ఉన్నప్పుడు ప్రతీ క్రిస్మస్ నాడు అన్యులకు సువార్త ప్రకటించవలెననెడి ఉద్దేశ్యముతో సెమీ క్రిస్మస్ వేడుకలను జరిపేవారము. ఆఫీసులో ఉన్న ఇతర క్రైస్తవులు ఎవరికివారే తమ పాస్టరును పిలవమని బలవంతం చేసెడివారు. కొన్ని చర్చిలలో సంఘ పెద్దలుగా ఉండువారు. పేరు పొందిన పాస్టర్లను పిలిపించి ఆఫీసులో చందాలు వేసికొని వసూలు చేసిన డబ్బులో ఎక్కువ సొమ్మును వారికి ఇప్పించి తరువాత వారి సంఘములో మీటింగులు పెట్టుకొనినప్పుడు ఆ సేవకులనే పిలిచెడివారు.

అందువలన మా పాస్టరును పిలవండి, మా పాస్టరును పిలవండి అని పెద్ద వాదోపవాదములు జరిగేవి. ఒకసారి ఒక వ్యక్తి తమ పాస్టరును పిలువనందుకు కోపగించుకొని మొత్తం కార్యక్రమం అంతటినీ రసాభాస చేసినాడు. అందువలన మరుసటి సంవత్సరం ఆయన సూచించిన పాస్టరు గారినే పిలిచాము. అయితే ఆయన ఆఫీసు ఆవరణలోనికి రాగానే నాకు గుప్పుమని సారా` వాసన వచ్చినది. ఆయన అక్కడ స్టేజీమీదే పిలిచిన మరొక వక్తతో తగువు పడినందువల్ల ఆ వక్త మధ్యలోనే స్టేజీ దిగి వెళ్లిపోయినాడు.

ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 థెస్సలో 2:11-12

ఇటీవారి వలననే ప్రభువు నామము అన్యజనుల మధ్య దూషించ బడుచున్నది. గుంటూరు జిల్లాలో ఇద్దరు పాస్టర్లు ఉన్నారు. వారిద్దరూ సహోదరులు. ఆయా సమయములయందు వారిద్దరూ నిలబడి సంఘములో ప్రవచనములు చెప్పుదురు. ఒకాయన భాషలో మాటలాడుచుండగా తమ్ముడు తెలుగులో అనువదించి చెప్పుచుండును.

వీరిద్దరిలో తెలుగులో చెప్పు వానిదే కష్టమైన పని. ఎందుకనగా అన్య భాషలలో మాట్లాడు వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడుచుండును. దానికి అర్థవంతమైన మాటలను తమ్ముడు చెప్పవలెను. ఒక రోజు ఈ కార్యక్రమము అంతటిని వీడియో తీసినారు. నేను ఆ కార్యక్రమము చూసినప్పుడు ఇదంతయూ మోసమని గ్రహించినాను.

అన్న ఒక మాటను పలికెను. తమ్ముడు దానికి “మీరు దేవుని మాటను నిర్లక్ష్యము చేయకుడి” అని పలికెను. అన్న మరొక మాటను పలికెను. తమ్ముడు "మీరు దేవుని మాటను నిర్లక్ష్యము చేయకుడి” అని మరలా చెప్పెను. వెంటనే అది మోసమని నాకర్థమయ్యెను. నీజముగా తమ్ముడు అనువాదము చేయుచున్నచో ఒకే తెలుగు పదమునకు అన్న రెండు వేరు వేరు శబ్దములను ఎట్లు పలుకును?

ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంగ్లీషులో God is Great అనెను. తర్జుమా చేయు వ్యక్తి “దేవుడు గొప్పవాడు” అనెను. ఇంగ్లీషులో God is Gracious అనెను. తర్జుమా చేయు వ్యక్తి “దేవుడు గొప్పవాడు” అని మరలా అనెను. అతడు తప్పు చెప్పుచున్నాడని మనకు తెలియుచున్నది గదా?

వారిద్దరినీ చూచుచున్నప్పుడు బాల్యములో నేను క్రిస్మస్ కు వేసిన ఒక డ్రామా గుర్తుకు వచ్చింది. ఆ నాటకములో నాకు ఒక ఆఫ్రికా జాతి వాని వలె మేకప్ చేసారు. ముందుగా మా పాస్టరు గారు మైకు వద్దకు వెళ్లి మన క్రిస్మస్ పండుగలో పాల్గొనుటకు అనుకోకుండా ఒక నల్లజాతి దొర మన మధ్యకు వచ్చారు. ఆయనకు తెలుగు రాదు. ఆఫ్రికాలోని లుంబా భాషలో మాట్లాడుతారు. లక్కీగా మా అబ్బాయి జేమ్స్ కొన్ని నెలలు లుంబా తెగవారి మధ్య ఉన్నాడు గనుక అతనికి ఆ భాష వచ్చును. జేమ్స్ మనకు నల్లజాతి దొరగారి మాటలను తెలుగులో అనువదిస్తారు అనగానే ఆఫ్రికా దుస్తుల్లో ఉన్న నేను స్టేజీ మీదకు వచ్చాను. జేమ్స్ కూడా స్టేజీ మీదకు వచ్చాడు.

నేను : జింబాహో జింబా

జేమ్స్ : మీకందరికీ వందనాలు

నేను : కంజికో నపంజి సమంజా ఆఫ్రికా రపోలా క్రిస్మస్

జేమ్స్ : ఆఫ్రికా తరుపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు

నేను : సిమ్మకు నకేషు సలాఫనా రఫంగి కిరోష్

జేమ్స్ : ఈ పండుగ ఒక్కటే ప్రపంచమంతా జరుగుతుంది.

ఈ డ్రామాలో నేనేమీ కంఠస్థము చేయనక్కరలేదు. జేమ్స్ మాత్రం తన పోర్షన్ అంతా కంఠస్థం చేయాలి. పరిశుద్ధాత్మ పేరుతో ఇట్టి మోసములు చేయుట ఎంత శోచనీయము.

అపొ. కార్య 2వ అధ్యాయములో వారు పరిశుద్ధాత్మతో మాట్లాడినప్పుడు వారు పార్తీయులు, తూనీయులు లీలామీయులు, మెసొపొతమియు, యూదయ, కప్పదొరియ, సొంతు, ఆసియ, భుగియ, పంపులియ, ఐగుపు అను దేశముల యందలిఠారు, కురేనే దగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రావూ నుండి పరసులుగా వచ్చినవారు, యూదులు, యూదతుత ప్రవిత్తులు, ప్రేతీయులు, అరబియులు మొదలైన తన మందరమును, మీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అపొ.కార్య 2:9-11

కానీ ఇప్పటి ప్రవక్తలు మాట్లాడునప్పుడు దేవుని గొప్ప కార్యములను గురించి వివరించుట లేదు. వీరు తమ మాటలలో “సంఘమా భయపడకుము. నిన్ను హెచ్చించేదను. బలమైన జనముగా చేసెదను” అని పదే పదే ప్రతీ వారము చెప్పుచుందురు. కానీ పది సంవత్సరములు గడచిననూ ఆ సంఘములో ఒక్క ఆత్మ కూడ చేరకుండుట, రక్షింపబడ కుండుట చూచుచున్నాము. పైగా సంఘములోని వారు చీలి మరొక గుంపుగా అయి చర్చి కట్టుకొందురు.

యెహోవా నాతో ఇట్లనెను - ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, కారు అసత్య దర్శనమును, శకునమును మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. యిర్మియా 14:14

 చాలా మంది ప్రభువుకోసం ప్రాణం ఇస్తాము అని స్టేజీ పైన గంభీర ఉపన్యాసములు చేస్తారు. వారు తెలిసి మాట్లాడుచున్నారో లేక క్రొత్త మద్యముతో మత్తులై అట్లు మాట్లాడు చున్నారో నాకు తెలియదు కానీ వారు దేవుని కొరకు ఒక్క పూట భోజనము కూడ మానరు. ఒక్క రూపాయి కూడ ఇవ్వరు. పేపర్లలోనూ, క్రైస్తవ మాస పత్రికలలోనూ ఫోటోలు ముద్రించు కొందురు. నేను 20 వేల మంది అనాధ పిల్లలను పోషిస్తున్నాను. 2 వేల మంది వృద్దులకు ఆశ్రయము కల్పించు చున్నాను. వరద బాధితులకు 5 లారీల నిండా బట్టలు, దుప్పట్లు, వంట పాత్రలు, నిత్యావసర వస్తువులు అందించుచున్నామని వార్తా పత్రికలలో ఢంకా భజాయించు కొందురు. నిజమునకు వారి కష్టార్జితములో ఒక్క పైసా కూడా ఇచ్చియుండరు.

 వీరి తాత గారు, మా తాత గారు ఇంచుమించు ఒకే ఆర్థిక స్థితిని కలిగియున్న వారు. నిజమునకు మా ముత్తాత గారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర గ్రామములో మొదటిగా మేడ నిర్మించిన వ్యక్తి. ఆయన రంగూన్ వెళ్లి 1940 దశకంలో ఒక బస్తా నిండా వెండి రూపాయలతో (ఆ రోజుల్లో పేపరు నోట్లు లేనందు వలన వెండిరూపాయి బిళ్లలతో) తిరిగి ఇండియాకు వచ్చినారు. ఆయన ఆ రోజులలోనే వెండి గిన్నెలో భోజనము చేసెడివారు. ప్రస్తుతము ఆ వెండి గిన్నె (నాకు మా తాత గారి పేరు పెట్టినందు వలన) నా వద్దనే ఉన్నది. అంతటి ధనవంతుని మనవడినైన నేను సామాన్యునిగా ఉన్నాను. మరి వీరు ఏ విధముగా కోట్ల రూపాయలను, అనేక భవనములను, భూములను సమకూర్చు కున్నారు? వారి పిల్లలు అమెరికాలోను, యూరప్ దేశాలలోనూ చదువుచున్నారు. వారికి ఖరీదైన కార్లు, ఏ. సి. గదులు ఎట్లు వచ్చినవి?

 ఒక పోస్ట్ మ్యాన్ యం.ఓ. తెచ్చి నాకు ఇచ్చినాడు. ఆ యం.ఓ. హైదరాబాద్ లో ఉన్న మా తండ్రి గారు నాకు పంపారు. ఆ 1000 రూపాయలు నా చేతికి ఇచ్చినది పోస్ట్ మ్యాన్. నేను ఎవరిని ప్రేమించి గౌరవించవలెను? నా తండ్రినా? పోస్ట్ మ్యాన్ నా? నేడు ప్రజలందరూ పోస్ట్ మ్యాన్ ను పొగడుచున్నారు. వారు వచ్చుచుండగా పెద్ద పెద్ద కటౌట్లు, ఫ్లెక్సీ బేనర్లు, సినిమా స్టార్ల కంటే ఎక్కువగా నగరములో కనబడుచున్నవి. వారి ప్రచారము కొరకు ఎన్ని లక్షలో ఖర్చు అగుచున్నవి. పేపర్లలో ఎన్నో పేజీలలో వీరి ఫోటోలు వచ్చుచున్నవి. ముఖ్యంగా క్రైస్తవ పత్రికలలో వర్తమానములు, క్రైస్తవ కథలకు చోటు ఉండుట లేదు. వీరి ఫోటోలతోనే పేజీలు నిండిపోవు చున్నవి. ఇంత ప్రచారము అవసరమా? విజ్ఞులు ఆలోచించ గోరుచున్నాను.

 నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై యుండక వాటిని ఖండించుడి. ఎఫెసీ 5 :11.

తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారీ మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను. తీతు 1:9.

 టీ.వీ. వర్తమానికులు రైళ్లలో ఎ.సి కోచ్లలో తప్ప సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయరు. నేను రైల్వే ఉద్యోగిని గనుక నాకు ఫస్ట్ క్లాస్లో వెళ్లుటకు పాస్ కలదు. నేను ఎ.సిలో వెళ్లునప్పుడు అప్పుడప్పుడు టీ.వీ. వర్తమానికులు కనబడినప్పుడు నేను వారితో మాట్లాడుచుందును. వారు మాట్లాడుచుండగా కొన్నిసార్లు వారికి ఫోన్ వచ్చుచుండును.

 ఎవరో ఫోన్ చేసి మా అబ్బాయికి సీరియస్గ ఉందని చెప్పుదురు. వీరు “అలాగా! ప్రార్థన చేస్తాను” అని ఫోన్ లో ప్రార్థన చేయకుండా, తరువాత ఒక్క నిముషము అయినా ప్రార్థన చేయకుండా సెల్ ఫోన్ జేబులో పెట్టుకొని “చెప్పండి మనోహర్! ఎక్కడ ఆపాము?” అని నాతో మాట్లాడుచుందురు. ఫోన్ చేసినవారి నిమిత్తం ఒక్కక్షణమైనా ప్రార్థన చేయరు. మీ ప్రార్థనా అవసరతలు మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము అని చెబుతారు కానీ ప్రార్థన చేయనే చేయరు. నేను అనేకసార్లు ప్రత్యక్షంగా ఈ సంగతి చూసాను.

 సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. 2 థెస్సలో 3:6.

 ఎవరికైనా అనారోగ్యము వచ్చిన యెడల స్థానిక సంఘ కాపరిని, సంఘ పెద్దలను పిలిపించి ప్రభువు నామమున వారి చేత నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకొనవలెను. చాలా మంది అమాయకముగా టీ.వీ. వర్తమానికులకు ప్రార్థన చేయమని చెప్పినాము కదా అని స్థానిక సంఘ కాపరిని నిర్లక్ష్యము చేయుచున్నారు. కొందరు టీ.వీ. వర్తమానికులు కూలికి ప్రార్థన చేయువారిని నియమించుకొను చున్నారు. మీ సంఘ కాపరికి ఉన్నంత బాధ్యత, భారము ఇతరులకు ఉండునా?

 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటే ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అపొ.కార్య 17 : 11.

 కొందరు వాక్య ఆధారము లేని విషయములను బోధించుచున్నారు. తామేదో గొప్ప పరిశోధన చేసినామని జనులు భావించవలెనని అభూత కల్పనలు చెప్పుచున్నారు. వాటిలో కొన్ని వ్రాయుచున్నాను. విజ్ఞులు ఆలోచించగలరు.

1. యేసు ప్రభువు బ్లడ్ గ్రూపు ఎ పాజిటివ్.

2. ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు 108 చోట్ల గాయములు అయినవి.

3. 39 కొరడా దెబ్బలు యేసు ప్రభువును కొట్టినప్పుడు 512 చోట్ల గాయములు అయినవి. (ఈ మాటలు చెప్పిన వ్యక్తి యేసు ప్రభువు ప్రక్కనే ఉండి లెక్క పెట్టెనా?) యూదులు 39 కొరడా దెబ్బలు మాత్రమే కొట్టవలెను. రోమీయులకు ఆ పరిమితి వర్తించదు.

4. యూదా ఇస్కరియోతు 3 సార్లు యేసు ప్రభువును రాజుగా అభిషేకించుటకు ప్రయత్నించెను. (కరుణామయుడు సినిమా చూసి చెప్పిన మాటలు)

5. మందసము కల్వరీగిరీ అడుగున భూస్థాపితమై యున్నది.

6. సిలువపైనుండి కారిన రక్తము మందసముపై పడినది.

7. యూదా ఇస్కరీయోతు, బరబ్బా, సిలువపైన దొంగలు వీరంతా సహోదరులు.
వీరి గురించి పేతురు భక్తుడు

 “మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగ జేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించు కొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. 2 పేతురు 2:1-3.

 ప్రసంగ వేదికపైనుండి వీరు దేవుని వాక్యము కంటే తమ గురించి చెప్పుకొను విషయములు ఎక్కువగా ఉండును. నేను ప్రార్థన చేయుట వలనఒక పాస్టరు గారు చెప్పిన ఈ క్రింది కథను జాగ్రత్తగా చదవండి. “ఒక అబ్బాయికి హైదరాబాద్లో ఉద్యోగమునకు ఇంటర్వ్యూకు రమ్మని కాల్ లెటర్ వచ్చినది. ఆ అబ్బాయి ఆ లెటర్ తీసుకొని నా వద్దకు వచ్చినాడు. నేను ప్రార్థన చేసి “బాబూ! నీకు మేలు జరుగుతుందని దేవుడు నాకు బయలు పరచుచున్నాడు” అన్నాను. ఆ అబ్బాయి హైదరాబాద్ వెళ్లుటకు గోదావరి ఎక్స్ ప్రెస్లో రిజర్వేషన్ చేయించుకున్నాడు. స్టేషన్ కు వెళ్లేసరికి గోదావరి ఎక్స్ ప్రెస్ వెళ్లిపోయింది. తరువాత వచ్చే గౌతమీ ఎక్స్ప్రెస్లో జనరల్ బోగీలో ఎక్కి హైదరాబాద్ కు ప్రయాణం అయ్యాడు. అతనికి ఎదురుగా ఒక పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయన ఈ అబ్బాయిని పలుకరించాడు.

మాటల సందర్భములో ఆ అబ్బాయి తాను ఫలానా ఉద్యోగమునకు ఇంటర్వ్యూకు వెళ్లుచున్నానని చెప్పాడు. ఆ పెద్ద మనిషి తాను ఆ కంపెనీ రిక్రూటింగ్ ఆఫీసర్నని చెప్పి అతని కాల్ లెటర్ తీసుకుని దానిపై సెలక్టెడ్ అని వ్రాసాడు. “నీవు వరంగల్లో దిగి పోయి వెనక్కి వెళ్లి నీ తల్లి తండ్రులను తీసుకురా” అని చెప్పాడు. ఆ అబ్బాయి వరంగల్లో దిగి పోయి తిరిగి విజయవాడ వచ్చి తన తల్లిదండ్రులను తీసుకొని హైదరాబాద్ లో ఆయన చెప్పిన ఇంటికి వెళ్లాడు. ఆ పెద్ద మనిషి వాని తల్లి దండ్రులను చూచి "నేను మీ అబ్బాయికి ఉద్యోగము ఇచ్చినాను. మిమ్మును రమ్మని ఎందుకు పిలిచినాననగా మా అమ్మాయికి మీ అబ్బాయితో వివాహము జరిపించవలెనని ఆ విషయములు మాట్లాడుటకు పిలిపించినాను” అని చెప్పెను.

ఇందులో గల అబద్దములు.

1. ఇంటర్వ్యూకు వెళ్లు వ్యక్తి ఎంతో టెన్షన్లో ఉండును. గోదావరికి రిజర్వేషన్ చేయించుకుంటే అరగంట ముందుగా స్టేషన్ కి వచ్చి కూర్చుని యుండును. ఏ వ్యక్తికీ రైలు మిస్ కాదు.

2. నేను సాధారణ రైల్వే ఉద్యోగిని. నేను ఎ.సి. లో తప్ప ప్రయాణించను. అంత పెద్ద రిక్రూటింగ్ ఆఫీసర్ జనరల్ బోగీలో ప్రయాణించునా?

3. ఇంటర్వ్యూలో ముగ్గురు ఆఫీసర్లు ఉందురు. వారు విడివిడిగా ప్రశ్నలు వేసి ఎవరికి నచ్చిన మార్కులు వారు వేయుదురు. ఆ మార్కులు అన్నింటినీ కలిపి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగమును ఇచ్చెదరు. ఈ క్రూటింగ్ ఆఫీసరు వీటన్నింటినీ అధిగమించి ఆయన ఒక్కడే అపాయింట్మెంట్ ఆర్డరు ఇచ్చాడు.

4. ఆ అబ్బాయి ఎవరో కనబడి నేనే నీ రిక్రూటింగ్ ఆఫీసర్ ని అంటే సందేహించకుండా నమ్మి వరంగల్లో దిగి వెనక్కి విజయవాడ వచ్చాడు.

5. ఆ అబ్బాయి ఎటువంటి వాడో తెలుసుకోకుండా రిక్రూటింగ్ ఆఫీసర్ తన కుమార్తెను ఇచ్చుటకు సిద్ధపడి పోయాడు.

6. ఒక రిక్రూటింగ్ ఆఫీసరు తన కుమార్తెకు వివాహము చేయుటకు తన వద్ద ఉద్యోగమునకు వచ్చే కూలివాడే కావలసి వచ్చిందా?

ఈ విషయాలన్నీ ఆలోచించని ప్రజలందరూ కరతాళ ధ్వనులు చేసిరి.

మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింప గలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు, మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనినవారై క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావలెననియు ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీ 1:9-11

అదే పాస్టరు “ఒకసారి నేను ఒక స్త్రీ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ప్రార్థన చేయించు కొనుటకు నిర్లక్ష్యము చూపినది. అందువల్ల ఆమెకు ఏమి జరిగినదో వినండి” అని మరియొక సంఘటనను చెప్పెను.

“ఒక స్త్రీ వారి ఇంటికి ప్రార్థన చేయుటకు రమ్మని నన్ను పిలిచినది. నేను ఉదయము వారి ఇంటికి వెళ్లినప్పుడు ఆమె పాత్రలు తోముచున్నది. ప్రార్థన చేయుటకు వచ్చాను” అని చెప్పగా ఆమె “పాస్టరు గారూ! నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇక్కడ రెండు, మూడు క్రైస్తవ గృహాలు ఉన్నవి. అక్కడ ప్రార్థన చేసి రండి. అటుతరువాత నేను మీతో ప్రార్థన చేయించు కుంటాను” అన్నది.

అదే సమయములో ఒక భిక్షగాడు ఆమెను భిక్షమడుగగా ఆమె ఆ భిక్షగానితో “ఒరేయ్ రెండు, మూడు ఇళ్లు అడుగుకొని రా. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తరువాత నీకు భిక్ష వేస్తాను” అన్నది. నన్ను అన్న మాటలే వానిని అన్నది. వానిని అన్న మాటలే నన్ను అన్నది. (“ఒరేయ్” తప్పించి)

నేను వెంటనే వచ్చేసినాను. ఆరోజు సాయంత్రం వాళ్ల అబ్బాయి వచ్చినాడు. “పాస్టరు గారూ! మా అక్క స్కూలు నుండి వచ్చి ఉరి వేసికొని చనిపోయినది. నా చావుకు కారణం మా అమ్మ అని ఉత్తరం వ్రాసి పెట్టినది. అందువలన పోలీసులు మా అమ్మను అరెస్ట్ చేయుటకు వచ్చారు. నీతో ప్రార్థన చేయించుకొన్న తరువాత వెళదామని మిమ్మల్ని తీసుకు రమ్మని మా అమ్మ నన్ను పంపింది” అన్నాడు. “బాబూ! నేను రాను. పోలీసులు నన్ను కూడ వ్యాన్ ఎక్కమంటారేమో? ఉదయం నేను వస్తే తరువాత చేయించుకుంటాను అన్నది. అలా నిర్లక్ష్యము చేసినందు వలననే ఇటువంటి కీడు సంభవించింది” అన్నాడు.

ఈ కథలో అసంబద్దములు గమనించండి.

1. పాస్టరు గారిని ప్రార్థన చేయుటకు పిలిచిన ఆ స్త్రీయే పాస్టరు గారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు “తరువాత రండి” అని అనునా?

2. ఆమె పాత్రలు తోము చోటికి పాస్టరు గారు వచ్చినారా?

3. భిక్షగాడు వస్తే భిక్ష వేస్తాము లేదా పొమ్మంటాము. మరలా రమ్మని అంటామా?

4. ఆమె కుమార్తె ఇంటిలో ఉరి వేసుకుంటే సూసైడ్ నోటు పోలీసులకు ఎవరు ఇచ్చారు?

5. ఈ విషయము పోలీసులకు ఎట్లు తెలిసినది?

6. పోలీసులు వస్తే వెంటనే తీసుకుని వెళ్లిపోతారు కానీ పాస్టరు వచ్చి ప్రార్థన చేసే వరకు ఆగుతారా?

ఇటువంటి వారి గురించే పౌలు భక్తుడు కల్పనా వాక్యములు చెప్పువారు అని హెచ్చరించు చున్నారు. వీరికి ఎంతో మంది అనుచరులు ఉందురు. అనుచరుల గురించి ప్రభువు

అబద్ధమును నమ్మునట్లు భ్రష్ట మనస్సు వారికి అనుగ్రహించెను. అందుచేత సత్యమును నమ్ముక దుర్నీతియందు అభిలాషగల వారందరును శిక్షావిధి పొందుటకై, అబద్ధమును నమ్మునట్లు మోసముచేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. 2 థెస్స 2:11,12. అని హెచ్చరించుచున్నాడు.

ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన యెడలను, ఎన్నడును నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దానిని చెప్పను గనుక దానికి భయపడవద్దు. ద్వితియా 18:22.

దళిత క్రైస్తవులను షెడ్యూల్డు కులాల జాబితాలోనికి చేర్చాలని దాదాపు 40 ఆర్గనైజేషన్స్ వారు కృషి చేస్తున్నారు. వీరు అప్పుడప్పుడు తమ ఉనికిని చాటు కొనుటకు పేపర్లలో ప్రకటనలు ఇస్తారు. ముఖ్యమంత్రికి, ప్రధాన మంత్రికి మెమోరాండములు సమర్పిస్తారు. సుప్రీమ్ కోర్టులో పిటీషన్ దాఖలు చేస్తారు. దళిత క్రైస్తవుల అందరీ వద్ద చందాలు వసూలు చేస్తారు. ఏదైనా మత కలహాలు జరిగి క్రైస్తవులు హింసించబడి నప్పుడు వీరు వార్తా పత్రికలలో "ఖండిస్తున్నాము” అని ప్రకటనలు ఇస్తారు. దీనివల్ల హింసించబడిన వారికి ఏమీ లాభము ఉండదు. పైగా వారికి సహాయము చేస్తున్నామని అనేకమంది వద్ద చందాలు వసూలు చేసి తమ బొక్కసమును నింపుకొందురు. కాని బాధితులకు ఏవిధమైన సహాయము అందజేయరు. అలాగే మారు మూల ప్రాంతములో ఎవరూ దున్నని బీడు భూములను దున్నుచున్నామని అక్కడ సువార్త ప్రకటించు చున్నామని మన వద్ద చందాలు వసూలు చేయువారు కలరు. కానీ ఆ ధనమును తామే మ్రింగి వేయుదురు. లేదా అధిక భాగమును మ్రింగివేయుదురు. బహు పరాక్

 కొంతమంది ఎంతో అహంకారముగా మాట్లాడుదురు. ఒక పాస్టరు గారిని నేను "అయ్యా! మీరు ఏ సహవాసం” అని అడిగినాను. అతడు “హెబ్రోను సహవాసము అని చెప్పవచ్చును, లేదా పెంతెకోస్తు సహవాసం అని చెప్పవచ్చును, లేదా బాప్టిస్ట్ సహవాసం అని చెప్పవచ్చును. కానీ అతడు “యేసయ్య సహవాసం” అని చెప్పినాడు.

 నేను అతని చర్చికి వెళ్లి ఆ చర్చిలో కూర్చున్నప్పుడు ఆయన ప్రసంగం ఆపగానే మరొక చర్చివారు చేస్తున్న ప్రసంగం స్పష్టముగా వినబడేది. నేను ఆరాధన ముగిసిన తరువాత బయటకు వచ్చి చూడగా అతని ఇంటి ప్రక్కనే మరొక చర్చి కలదు. వారి మైకు ఈ చర్చి వైపు, వీరి మైకు ఆ చర్చి వైపు ఉన్నది. నేను ఆ పాస్టరు గారితో “వారి మైకు మీ వైపు, మీ మైకు అటువైపు ఉండుట వలన ఇద్దరికీ ఇబ్బందిగా ఉన్నది. కనుక మీరు అటువైపు స్పీకరును పెట్టవద్దు. అలాగే ఆ పాస్టరు గారిని ఇటువైపు స్పీకరును కట్ చేయమని చెబుదాం” అన్నాను.

 అందుకు ఆయన “నేను మైకు తీయుటకు సిద్ధమే. కానీ ఆయనే తీయడు” అన్నాడు. “మీరు చెప్పారా?” అన్నాను. అందుకాయన “నేను ఆయనతో మాట్లాడను” అన్నాడు. మీదే సహవాసము? అని అడిగితే నేను యేసయ్య సహవాసం అని చెప్పిన వ్యక్తి యొక్క పరిస్థితి ఈలాగు ఉన్నది.

 ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభముని కానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడువాని దుష్ట్ర క్రియలలో పాలిలాడగును. 2 యోహాను 1:10,11.

 ధర్మశాస్త్రమును, ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు. యెషయా 8:20.

 నేను ప్రతీ నెల 14వ తేదీన చిన్న సువార్త కూడికను ఏర్పాటు చేసేవాడిని. మంచి వర్తమానికులను ఎవరినైనా పిలవండి అని ఒక పాస్టరు గారిని కోరాను. ఆ పాస్టరు గారు తనకు బాప్తిస్మము ఇచ్చిన పెద్ద పాస్టరు గారు ఉన్నారనీ, ఆయనను పిలుస్తాననీ, ఆయనకు ఫోన్ చేసాడు. నేను ఆ పెద్ద పాస్టరు గారితో మాటలాడి 14వ తేదీన రమ్మని కోరాను. ఆయన వస్తానని చెప్పినాడు. 14వ తేదీ ఉదయం మరలా ఆయనకు ఫోన్ చేసి మరొకసారి గుర్తు చేసాను. "అయ్యా! మీటింగు సరిగ్గా 7 గంటలకు ప్రారంభమవుతుంది. అయినా మీరు 5 గంటలకే వచ్చేయండి. మనం కొంచెం సేపు ప్రార్థనలో గడుపవచ్చును లేదా అల్పాహారము తీసుకొన వచ్చును” అని అన్నాను. “సరే” అన్నాడు.

 ఉదయం 9 గంటలకు చిన్న పాస్టరు గారు మా ఇంటికి వచ్చాడు. “పెద్ద పాస్టరు గారితోపాటు ముగ్గురు సహాయకులు వస్తున్నారు” అన్నాడు. నేను వాళ్లు పాటలు పాడుతారా? లేక వాయిద్యములు వాయిస్తారా?” అని అడిగాను. "కాదండీ పెద్ద పాస్టరు గారు ఎవరి కోసమైనా ప్రార్థన చేస్తే వారు వెనక్కి పడిపోతారు. పట్టుకోడానికి ” అన్నాడు. “ప్రార్థన చేస్తే ఎందుకు వెనక్కి పడిపోతారు? వచ్చే సహాయకులు ఆడువారా” అన్నాను.

 అందుకు “కాదండీ పురుషులు” అన్నాడు. “పురుషులే అయితే నీవు నేను లేమా? ప్రత్యేకముగా అక్కడ నుండి తీసుకొని రావాలా? అయినా ఆయనను వర్తమానము ఇచ్చుటకు ఆహ్వానించుచున్నాను కదా ప్రార్థనలు ఎందుకు చేయడం” అన్నాను. అందుకు ఆ పాస్టరు “ఎవరైనా దురాత్మలు పట్టిన వారి గురించి ఆయన ప్రార్థన చేస్తే దురాత్మ వారిని వదలి పోయేటప్పుడు వారిని విల విల లాడించి పడవేస్తుంది గనుక సహాయకులు రావాలి”అన్నాడు.

  అప్పుడు నేను “ఇక్కడ ఎవరు దురాత్మలు పట్టినవారు లేరు కదా?” అన్నాను. అందుకు ఆయన “మా చర్చిలోని కొందరు ఈయన వస్తున్నాడని ప్రార్థన చేయించుకోడానికి ఇక్కడకు వస్తామని అన్నారు” అన్నాడు. అందుకు నేను “ఇక్కడ వద్దులే. ఓ పని చేద్దాం. ఆయన రాగానే నా వాహనం ఇస్తాను. నీవు మీ చర్చికి వారిని తీసుకొని వెళ్లు. దురాత్మలన్నీ అక్కడే వదిలించి ఆయన్ని మాత్రము ఇక్కడకు తీసుకొని రా” అన్నాను. చిన్న పాస్టరు వెళ్లిపోయినాడు.

 పెద్ద పాస్టరు ఆ రోజు కూటమునకు రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. మేము చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఆయన ఎప్పుడు మీటింగులు పెట్టుకున్నా గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు, కుంటి వారు నడుచు చున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడు చున్నారు, బీదలకు సువార్త ప్రకటింప బడుచున్నది. మత్తయి 11:5. ఈ మాటనే తన కర పత్రికలలో, వాల్ పోస్టర్లలో ముద్రించుతారు. కానీ ఒక్కసారి కూడా ఆయన ప్రార్థన విని దేవుడు ఎవరినీ స్వస్థపరచ లేదు. “స్వస్థత వరము కలిగిన దైవజనులు” అని ప్రముఖముగా ప్రచురించు కుంటారు.

 ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అని అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధియైనవాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. 1 కొరింథీ 2:14,15.

 సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలుకొను చున్నాను, వారిలో నుండి తొలగిపావుడి. రోమా 16:17.

 ఒక సైనికుడు సిద్దంగా ఉండి ఎ. కె. 47 తుపాకీని ఎక్కు పెట్టి ఉంటే శత్రువు అతని సమీపిస్తాడా? అలాగే దేవుని ఆలోచనలతో ఉన్న వ్యక్తి వద్దకు సాతాను వస్తాడా? ఆడంబరము, అహంకారము, గుర్తించబడాలి అనే తపన ఉన్న వారిలో పరిశుద్ధాత్మ ఉంటాడా?

 ఒక సోదరి తన వద్దకు వచ్చిన వారి గురించి ప్రార్థన చేసి కొన్ని విషయాలను దేవుడు నాకు బయలు పరుస్తాడని చెప్పేది. ఎవరైనా ఆమెను సమీపిస్తే ముందు కాసేపు అన్య భాషలలో మాట్లాడి తరువాత తాను మాట్లాడిన మాటలకు తెలుగులో అర్థం చెప్పేది. ఒక రోజు ఆమె నాతో మాట్లాడుతూ “నేనెప్పుడూ ఇలా అన్య భాషలలో మాట్లాడి తరువాత ఆ మాటలకు అర్థం చెప్తాను. అయితే మొన్న ఒక విచిత్రం జరిగింది” అని అన్నది. “ఏమిటండీ ఆ విచిత్రం?” అని అడిగాను.

 "నా వద్దకు ప్రార్థన చేయించు కొనుటకు ఒకామె వచ్చింది. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యధా ప్రకారము నేను అన్య భాషలలో మాట్లాడాను. కానీ ప్రార్థన ముగించిన తరువాత ఎంత ప్రయత్నించిననూ దానికి తెలుగు అర్థం చెప్పలేక పోయాను. వచ్చిన ఆమెతో "అమ్మా! నేను సాధారణంగా ప్రార్థన చేసిన తరువాత దేవుడు నాకు ఏదైనా ఒక విషయాన్ని బయలు పరుస్తాడు. నీకు మాత్రం ఏ విషయం బయలు పరచలేదు” అన్నది.

 ఆ వచ్చిన ఆమె “అదేమిటమ్మా! మీరు ఇప్పటి వరకు మా లంబాడీ భాషలో నాకు అనేక విషయాలు చెప్పారుగా” అన్నది. నాకు లంబాడీ భాష కొంచెం కూడా రాదు. అయినా దేవుడు నాతో ఆ భాషలోనే మాట్లాడించాడు” అన్నది. “ఆ లంబాడీ సోదరి అడ్రసు కాస్త చెప్పమ్మా?” అందాము అనుకున్నాను. కానీ మర్యాదగా ఉండదని మౌనంగా వచ్చేసాను.

 30 సంవత్సరముల క్రితము నేను తమిళనాడులో స్టేషన్ మాస్టరుగా ఉద్యోగము చేసే వాడిని. అక్కడ ఉన్న ఒక చర్చికి క్రమంగా వెళ్లేవాడిని. నాకు అప్పటికి వివాహము కాలేదు. తమిళ్ భాష కొద్దిగా మాట్లాడే వాడిని. ఆ చర్చిలో తమిళనాడులో ఉద్యోగము చేయుచున్న ఒక తెలుగు అమ్మాయి ఉండేది. ఆ చర్చి పాస్టరు గారు ఆమెకు బాప్తిస్మము ఇచ్చారు. ఆమెకు వివాహము చేయాలంటే ఉద్యోగము చేయుచున్న, తమిళనాడులో ఉంటున్న తెలుగు వాడు కావాలి. అతడు క్రైస్తవుడై ఉండాలి. ఈ లక్షణములు అన్నీ నాకు ఉన్నవి గనుక పాస్టరమ్మ గారికి ఒక రోజు ఆత్మ వచ్చి ప్రవచనము మొదలు పెట్టింది. తమిళ్ భాషలో “నా కుమారుడా! నీ కొరకు ఈమెను సిద్ధపరచాను” అని చెప్పినది. ప్రవచనము పూర్తి అయిన తరువాత నేను “దేవుడు నాతో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడతారు. నాకు రాని తమిళ్ భాషలో ఎందుకు మాట్లాడతారు? మీరు తెలుగు భాషలో ప్రవచించి ఉంటే నేను వెంటనే లోబడేవాడిని” అన్నాను.

 ఒక పాస్టరు గారు విజయవాడ నుండి వరంగల్ కు ఒక విశ్వాసిని దర్శించడానికి వెళ్లాడు. వరంగల్లో ఆయన దర్శించుటకు వెళ్లిన వ్యక్తి గంటసేపు మాట్లాడిన తరువాత అర్జెంటు పని ఉందని వెళ్లిపోయాడు. ఈయన వద్ద తిరుగు చార్జీకి డబ్బులు లేవు. వరంగల్ స్టేషన్ కు వచ్చి కూర్చున్నాడు. టిక్కెట్ కొనుటకు డబ్బులు లేవు. ఆకలి అగుచున్నది. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువు “ఆయనతో నీ తిండి గురించి, తిరుగు చార్జీ గురించి నీ వెందుకు ఆలోచిస్తావు? ఇక్కడ ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించు” అన్నాడు(ట). ఈయన వాళ్లకు సువార్త ప్రకటించ సాగాడు.

 అంతలో రైలు వచ్చింది. అందరూ రైలు ఎక్కారు. ఆయన కూడా రైలు ఎక్కాడు. అంతలో ఒకాయన చేతిలో బిర్యానీ ప్యాకెట్తో వచ్చి "బ్రదర్ మీకు టిక్కెట్ ఉందా?” అని అడిగాడు. “లేదు” అన్నాడు. ఇంతలో రైలు కదలింది. ఆయన బిర్యానీ ప్యాకెట్ టిక్కెట్టు ఆయన చేతిలో పెట్టి “నేను నిద్రపోవుచుండగా ప్రభువు కలలో కనబడి "నా సేవకుడు స్టేషన్లో టిక్కెట్లు లేక, ఆహారము లేక బాధపడుచున్నాడు” అని చెప్పగా నేను వెంటనే లేచి మీకు ఇవి తెచ్చి ఇస్తున్నాను” అన్నాడు.

 బ్రదర్ మీ పేరు ఏమి? అని పాస్టరు ఆయనను అడిగాడు. “ఆయన చెప్పాడు కానీ బండి హోరులో నాకు వినబడలేదు” అని పాస్టరు అన్నాడు. అప్పుడు నేను “అయ్యా! మీరు 3 తప్పులు చేసారు. తిరుగు ప్రయాణానికి డబ్బులు లేకుండా ఎట్లు బయలు దేరారు? ప్లాట్ ఫామ్ టిక్కెట్టు లేకుండా ప్లాట్ ఫామ్ పైకి ఎందుకు వెళ్లారు? టిక్కెట్టు లేకుండా రైలు ఎందుకు ఎక్కారు?” అన్నాను.

 చాలా కాలము తరువాత ఒక హిందూ సోదరునికి సరిగ్గా ఇలాంటి అనుభవమే జరిగిందని వ్రాసిన పుస్తకం నా కంట పడింది. పాస్టరు గారు ఈ కథ చదివి యాక్టర్స్ను మార్చి మనకు వినిపించాడని నాకు అర్థం అయింది.

 ఒకాయన ఒక పత్రిక నడిపిస్తున్నాడు. అడుగక పోయినా పత్రిక పంపించు చున్నాడని నా సోదరి ఆయన బ్యాంకు ఎకౌంటుకు 1000 రూపాయలు జమ చేసింది. అప్పుడు టైము మధ్యాహ్నం 1 గంట అయినది. నా సోదరి ఆయనకు ఫోన్ చేసి "అయ్యా! మీకు 1000 రూపాయలు బ్యాంకులో వేసినాను” అని చెప్పింది. “వందనాలండీ” అన్నాడు.

గంట తరువాత ఆయనే మరలా ఫోన్ చేసినాడు. “సిస్టరు గారూ ఈ రోజు నా వద్ద బియ్యము లేవు. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంతలో మీ ఫోను వచ్చింది. ఏ. టి. యం. కు వెళ్లి డబ్బులు డ్రా చేసి బియ్యం తెచ్చాను. దేవుడు మిమ్ములను ఆశ్చర్యకరంగా మిమ్మును ప్రేరేపించి నన్ను అద్భుత కరంగా పోషించాడు” అన్నాడు. నిజంగా ఆయన అవసరతలో ఉంటే దేవుడు నా సోదరిని 10 గంటలకే ప్రేరేపించాలి. వీరు ఇట్టి కథలను ఎందుకు చెప్పుదురు అనగా తాము దేవునిపైనే ఆధారపడి జీవించు చున్నామనీ ఎదుటి వారు అనుకొనవలెనని వారి ఆలోచన.

 ఈ పుస్తకము వ్రాయుటలో గల ముఖ్య ఉద్దేశ్యము అబద్ద ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారని కొంచెం తార్కికంగా ఆలోచిస్తేనే వారిని కనుగొన గలమని తెలియ జెప్పుటకు ఈ పుస్తకము వ్రాస్తున్నాను. నేను ఒరిస్సా వెళ్లినప్పుడు ఒక పాస్టరు ఒక అబ్బాయిని నా వద్దకు తీసుకొని వచ్చి ఇతని తల్లిని ఏడుగురు వ్యక్తులు మానభంగం చేసి చంపేశారని చెప్పాడు. మానభంగం చేసిన వారు దొరక లేదు. ఆమె చనిపోయినది. మరి ఈ విషయము మీకెట్లు తెలిసినది? అని అడుగగా ఆ పాస్టరు కంగారు పడినాడు.

 అనేక మంది మేము అనేక కష్టములు పడుచున్నాము అని చెప్పుచున్నారు. కానీ నిజముగా బాధితులను గుర్తించుట కష్టము. టీ. వీ. లో ప్రసంగము చేయువారు తమ బ్యాంకు నంబర్లను ఇచ్చుచున్నారు. పరీక్షల సమయములో మీ హాల్ టిక్కెట్లను జిరాక్స్ కాపీ తీసి మాకు పంపండి. మేము మీ గురించి ప్రార్థన చేస్తాము” అని చెప్పుచున్నారు. రిజల్టు వచ్చిన తరువాత “మీ గురించి మేమెంతో భారముగా ప్రార్థించినాము. దేవుడు మీకు విజయము అందించినాడు గనుక మీరు మీ కానుక పంపగలరు” అని చెప్పుదురు. మరలా బ్యాంక్ నంబరు చెప్పుదురు.

 ఇంగ్లీషులో సైమనీ (Simony) అనే మాట ఉన్నది. ఆక్సుఫర్డు నిఘంటువులో Buying or selling of ecclesiastical privileges దీని అర్థము ద్రవ్యమిచ్చుట ద్వారా ఆశీర్వాదములను పొందుకొనుట. సీమోను అను గారడీవాడు పేతురుకు ద్రవ్యమిచ్చి నేను అతనిమీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము తనకు ఇయ్యమని అడిగిను. వాని పేరు మీదనే సైమనీ అను మాట ప్రాచుర్యము లోనికి వచ్చినది.

 పేతురు వానికి చెప్పిన సమాధానమును ఒకసారి జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. అందుకు పేతురు - నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడ నశించును గాక. నీ హృదయము దేవుని యెదుట సరియైనది కాదు గనుక యీ కార్యముందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమునస్సు నొంది ప్రభువును వేడుకొనుము; ఒక వేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. అపొస్త కార్య 8:19-22. ధనమిచ్చి ఆశీర్వాదమును సంపాదించు కొనలేము. ఆ ఆలోచన దేవుని యెదుట సరియైనది కాదు. మరి టీ.వీ లో ఒక ఎపిసోడ్ ను స్పాన్సర్ చేసిన యెడల ఆశీర్వాదము లభించునని చెప్పు అబద్ధ ప్రవక్తల మాటలను మీరెట్లు విశ్వసించు చున్నారు? నా ప్రియ పాఠకుల్లారా ఆలోచించండి.

 మీరు విశ్వాసము గలవారైయున్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించు కొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసు క్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా? 2 కొరింథీ 18:5.

 పాప క్షమాపణ పత్రములను పదవ లియో అను పోపు ప్రారంభించారు. అతడు రోమాలో సెయింట్ పీటర్ అను ఒక బ్రహ్మాండమైన దేవాలయమును అతను నిర్మించెను. దానికి అవసరమైన ధనమును సంపాదించుటకు పాప క్షమాపణ పత్రికలు అమ్ముట ఆరంభమైనది. పోపు ఆధీనములో ఎంతో పుణ్యము ఉన్నదనియు, దానిని కావలసిన వారు ధనమిచ్చి కొనుక్కొన వచ్చునని అతడు ప్రకటించెను.

 పాపము చేసినవారు కొంత కాలము పర్గెటోరి (Purgatory) లో శిక్షను పూర్తిచేసి తరువాత పరలోకమునకు వెళ్లుదురు. పాప క్షమాపణ పత్రములను కొనిన యెడల శిక్షను తప్పించుకొని డైరెక్టుగా పరలోకమునకు వెళ్లవచ్చునని వారు భోదించిరి. దీనిని 1517లో మార్టిన్ లూథర్ ఎదిరించెను. ధనమును ఇచ్చి ఆశీర్వాదమును కొనలేము.

 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరియొక సువార్తను మేమైనను పరలోకమునుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. గలతీ 1:6.

 పౌలు వస్త్రములు తగిలినప్పుడు స్వస్థతలు జరిగినవి కదా! అలాగే మా చేతి రుమాలును మీకు తగిలిన స్వస్థతలు జరుగునని కొందరు చేతి రుమాలును అమ్ముచున్నారు. నీకు జబ్బుగా ఉన్న చోట ఈ జేబు రుమాలును ఉంచినచో స్వస్థత కలుగునని చెప్పుచున్నారు. అనేకులు ఎగబడి ఆ చేతి రుమాలులను కొనుచున్నారు. ఇది మరొక సైమనీ.

 మరొక అబద్ద ప్రవక్త బాల్ పాయింట్ పెన్నుపై జీసస్ అని స్క్రీన్ ప్రింటింగ్ చేయించి వాటిని అమ్ముచున్నారు. ఆ పెన్ను ఖరీదు మార్కెట్లో 7 రూపాయలు. కానీ ఆయన 15 రూపాయలకు అమ్ముచుండగా సినిమా రిలీజు మొదటి రోజు అయిన ప్రజలు ఎలా టికెట్ల కోసం ఎగబడి కొనెదరో అట్లు ప్రజలు వాటిని కొనుచున్నారు.

 ఆ అబద్ధ ప్రవక్త “ఈ పెన్నుతో వ్రాసిన యెడల మీకు మంచి మార్కులు వచ్చును. మంచి ర్యాంకులు వచ్చును” అని చెప్పుచున్నారు. అటువంటి మాయ మాటలకు విలువ ఇవ్వకండి. మీ అబ్బాయి బాగా చదువుకొనిన యెడల, కష్టపడిన యెడల మంచి మార్కులు వచ్చును. గానీ అటువంటి పెన్నుల వలన ఉపయోగము లేదు. ఇటువంటి సైమనీలను నమ్మవద్దని (ఆయన ఎంత గొప్ప పాస్టరు అయినా) మీకు మనవి చేస్తున్నాను.

 కొన్ని రోజుల క్రితము ఒక వ్యక్తి ఐదు గడ్డి పరకలను దారముతో కట్టి 10 రూపాయలకు ఒక కట్ట చొప్పున అమ్ముచున్నాడు. ప్రజలందరూ ఆ గడ్డి కట్టలను కొనుక్కొని వెళ్లుచున్నారు. వాటిని అమ్ము అబద్ధ ప్రవక్తలు “వీటిని మీ ఆవులకు, గేదెలకు తినిపించిన యెడల అవి ఎక్కువ పాలు ఇచ్చును” అని చెప్పుదురు. అనేకులు “పాస్టరు గారు ప్రార్థన చేసి ఇచ్చిన గడ్డి దీనిని మన పశువులకు తినిపించిన యెడల ఎంతో లాభము ఉండును” అని ప్రజలను మోసగించు చున్నారు. దయచేసి ఆలోచించండి. మీరు పెట్టే మేత వలన మీ పశువులు ఎక్కువ పాలు ఇచ్చును గాని ఆ గడ్డి కట్టలను తినుట వలన ఇవ్వవు.

 అదే వ్యక్తి మట్టి అమ్ముచున్నాడు. 'ఈ మట్టిని పొలములో చల్లిన యెడల పొలము బాగుగా పండును” అని చెప్పుచున్నాడు. నా ప్రియ పాఠకుల్లారా కొంచెం ఆలోచించండి.

 కొందరు కొబ్బరి నూనె సీసాలను అమ్ముచున్నారు. ప్రభువు ఇట్టి వారిని గూర్చియే “నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయకండి” అని చెప్పెను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. యెషయా 58:7.డబ్బు కోసమే ఇటువంటి వాక్య విరుద్ధమైన పనులను వారు చేయుచున్నారు. ఇటువంటి వారి వలన క్రైస్తవ్యమునకే మచ్చ వచ్చుచున్నది.

 ఒకసారి నేను మూడు రోజులు ఉపవాసము ఉండవలెనని సంకల్పించినాను. నేను సాధారణముగా ఆ విషయమును ఎవరికీ చెప్పను. నేను ఉపవాస ప్రార్థనలో ఉండగా ఒకాయన వచ్చి ఫలానా పాస్టరు వద్దకు తీసుకొని వెళ్లమని కోరాడు. నేను సరేనని ఆయనను స్కూటరుపై ఎక్కించుకొని ఆ పాస్టరు గారి వద్దకు వెళ్లినాను.

 మేము వెళ్లగానే ఆ పాస్టరు “నేను గుంటూరు వెళ్లవలెనని బయలు దేరితిని. అంతలో ప్రభువు నన్ను వెళ్లవద్దని చెప్పెను. ఆయన ఆజ్ఞకు లోబడి నేను వెళ్లలేదు. ఎందుకు వెళ్ల వద్దని అనుచున్నాడు అని నేను ఇంత వరకు మధనపడు చుంటిని. ఇప్పుడు నాకు విషయము అర్థము అయినది. మీరు వచ్చుచున్నారు గనుక వెళ్లవద్దని నాకు ఆజ్ఞాపించినాడు” అని చెప్పెను. నాతో వచ్చిన పాస్టరు “దేవుడు ఎంత అద్భుతమైన వాడండీ? ఈయన గుంటూరు వెళ్లి ఉంటే మన ప్రయాణం వృధా అయి ఉండేది” అన్నాడు. నేను “అవును” అన్నాను.

 అంతలో ఆయన మాకిద్దరికీ స్వీట్లు, అరటి పండ్లు, కాఫీ ఇచ్చెను. అప్పటి వరకు దేవుడే అతనికి వెళ్ల వద్దని బయలు పరచినాడనీ భ్రమలో ఉన్న నాకు అతని అబద్ధము అర్థం అయింది. నిజముగా దేవుడే అతనికి బయలు పరచినచో నేను ఉపవాసముతో ఉన్నాను గనుక స్వీట్లు,పలహారము, కాఫీ నాకు లేకుండా ఉండవలెను. అనేకులు ఇట్టి మాటలను చెప్పుచూ తామెంతో గొప్ప వారమని ఇతరులు అనుకొనవలెనని డంబ కీర్తిని కోరుచుందురు. వీరు ఎవరిని మోసము చేయుచున్నారు? మనుష్యులనా? దేవుడినా? నా ప్రియ పాఠకుల్లారా కొంచెం అలోచించండి.

 ఒక పాస్టరు గారు ఒక సభలో “ఇక్కడ ఉద్యోగము లేని వారందరూ చేతులు ఎత్తండి” అన్నారు. చాలమంది చేతులు ఎత్తారు. వారందరికీ "ఈ నెలలో ఉద్యోగములు వచ్చును” అని చెప్పినారు. “స్వంత గృహములు లేనివారు చేతులు ఎత్తండి” అన్నారు. చాలమంది చేతులు ఎత్తారు. “వీరందరికీ దేవుడు ఈ నెలలో స్వంత గృహములను ఇచ్చుచున్నాడు” అనిరి. ఇది జరిగి 3 సంవత్సరములు అయినది. ఇంత వరకు వారెవరికీ ఉద్యోగములు రాలేదు. ఎవరునూ ఇళ్లు కట్టుకొనలేదు.

 ఆయన అనారోగ్యముగా ఉన్న ప్రజలందరినీ నిలువబెట్టి “మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్ములను స్వస్థపరుస్తారు” అని చెప్పెను. ప్రార్థనా అనంతరము “మీలో స్వస్థ పడినవారు స్టేజీ పైకి వచ్చి సాక్ష్యము చెప్పండి” అని చెప్పెను. ఒక్కొక్కరు వచ్చి సాక్ష్యము చెప్పుచుండిరి. ఒక వ్యక్తి “నాకు ఎయిడ్స్ ఉన్నది. పాస్టరు గారు ప్రార్థన చేయగానే అది తగ్గిపోయినది” అని చెప్పెను.

 సభలో కూర్చున్న నేను లేచి అతడు స్టేజీ దిగి రాగానే అతని సమీపించాను. “ఏమండీ మీకు ముందు ఎయిడ్స్ ఉన్నదని ఎవరు చెప్పారు?” అని అడిగాను. “డాక్టరు గారు చెప్పారు” అన్నాడు. “మరి ఇప్పుడు తగ్గిపోయిందని మీకు ఎలా తెలిసింది?” అన్నాను. అతడు నీళ్లు నమల సాగాడు. నేను అతనితో “ఎయిడ్స్ వ్యాధి వచ్చినదో లేదో తెలిసికొనుటకు ఎలీసా అను టెస్ట్ చేయుదురు. నీకు ఆ టెస్ట్ చేసి ఉన్నదని డాక్టరు గారు చెప్పినారు. మరలా అదే టెస్ట్ చేసి లేదని చెప్పవలెను. అతడు నాతో కోపముగా “మీకెందుకండీ ఇవన్నీ” అంటూ విసురుగా వెళ్లిపోయాడు.


సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. 1 థెస్సలో 5:21.

ఇంతలో ఆ పాస్టరు గారే ఒక గొప్ప మోసము చేసినాడు. “ఇక్కడ ఉన్న వారిలో ఒక అబ్బాయి నన్నొక విచిత్రమైన కోరిక కోరినాడు. ఆ అబ్బాయిని స్టేజీ పైకి పిలుచుచున్నాను” అని 11 సంవత్సరాల బాలుడిని స్టేజీ పైకి పిలిచాడు. ఆ అబ్బాయి స్టేజీ పైకి వచ్చెను. ఆ అబ్బాయికి ఒక మైకు ఇచ్చిరి.

పాస్టర్ : నీ కోరిక ఏమి?

అబ్బాయి : నాకు పొడవు పెరగవలెనని ఉన్నది.

పాస్టర్ : ఎంత పొడుగు పెరగాలని అనుకుంటున్నావు?

అబ్బాయి : ఒక్క అంగుళం. నాకు ఇదంతా మోసమని అర్థమై పోయినది. మీరు 11 సంవత్సరాల వయస్సు గలిగిన అబ్బాయిని ఏమి కావాలో కోరుకోమంటే వారెవ్వరూ పొడుగు పెరగాలని కోరుకోరు. ఒక వేళ ఎవరైనా కోరుకున్నా అంగుళం మాత్రమే పెరగాలని కోరుకోరు. ఆ పాస్టరు గారు సెక్రటరీ వచ్చి ఆ అబ్బాయిని ఒక పోల్ కు నిలబెట్టి అతని పొడవు కొలిచి స్కెచ్ పెన్ తో గీత గీసాడు. స్టేజీపై చాప పరచి ఆ అబ్బాయిని దానిపై పండుకోమని ఆయన ప్రార్థన చేసిన తరువాత “ఆ అబ్బాయిని కొలువుమనీ” తన సెక్రటరీతో చెప్పెను. అతడు కొలిచి “అంగుళము పెరిగినదని” చెప్పెను.

ఇటువంటి చౌకబారు ట్రిక్కుల వలన దేవుని నామము దూషించ బడుచున్నది. పైగా ఆ పాస్టరు గారు “ఈ అబ్బాయి పొడుగు పెరగనిచో “నేను క్రీస్తుని ప్రకటించుట మానివేస్తాను” అన్నారు. అక్కడే ఇది ఏర్పాటు చేసికొన్నది అని తెలియుచున్నది. వీరు ఎవరిని మోసగించుచున్నారు? అననీయ, సప్పీరాలు ఎవరిని మోసగించారు? పేతురునా? దేవునినా?

అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్ద నున్నప్పుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అపొ.కార్య 5:3,4.

 మా అక్క గారికి ఇద్దరు కుమార్తెలు పుట్టినారు. మా బావగారు, అక్క గారు మగపిల్లవాడు కావలెనని ఎంతగానో ఆశపడినారు. మా అక్క గారు 3వ సారి గర్భవతి అయినపుడు ఒక అబద్ధ ప్రవక్త వారి ఇంటికి వచ్చాడు. ఆయన అన్య భాషలలో మాట్లాడి “దేవుడు మీకు మగపిల్లవాడిని అనుగ్రహించు చున్నానని చెప్పుచున్నాడు” అన్నాడు.

 మా బావ గారు ఆయనకు బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేసి భారీగా కానుక ఇచ్చి పంపెను. ఆ అబద్ధ ప్రవక్త ప్రతీ నెల వచ్చుచూ అదే మాటలను చెప్పుచూ ఉండెను. చివరికి మా అక్క గారికి అమ్మాయి పుట్టినది. ఆ అబద్ద ప్రవక్త రాగానే ఈ విషయమును అతనికి చెప్పిరి.

 అతడు వెంటనే నాకు ముందే తెలుసు. ప్రభువు నాకు బయలుపరచినాడు. దేవుడు మీకు మగ పిల్లవానినే ఇవ్వవలెనని మొదట సంకల్పించినాడు. కానీ కొన్ని కారణాల వల్ల తన మనస్సు మార్చుకున్నారు. దేవుడు ఒక్కొక్కసారి ఇట్లు మనస్సు మార్చు కొనుచుండును. నీనెవె పట్టణమును నిర్మూలము చేయుదుననెను. గానీ తరువాత మనస్సు మార్చుకొనెను” అన్నాడు. 

ఈ విషయము ప్రసవమునకు ముందు చెప్పకుండా ప్రతి నెలా పుష్టిగా భోజనం చేయుచు, అబద్ద విషయాలను చెప్పి దేవుడు నాకు బయలు పరచినాడని అబద్దం చెప్పెను.

 ఇటువంటి వారు మీకు ఎదురైన యెడల మీరు వారి మోసములో పడకుండా ఉండుటకు ఈ పుస్తకం వ్రాయుచున్నాను. అతడు చెప్పిన ప్రవచనము నెరవేరుటకు 50 శాతం అవకాశమున్నది. ఒక నాణెమును పైకి ఎగురవేస్తే అది క్రింద పడినప్పుడు బొమ్మ గానీ, బొరుసు గానీ పడుతుంది. ఒకవేళ ఆయన చెప్పినట్టుగా అబ్బాయి పుట్టి ఉన్నట్లయితే ఆయనకు పట్ట పగ్గాలు ఉండేవా? నా సహోదరులారా ఆలోచించండి.

 

నీవు హిత బోధకనుకూలమైన సంగతులను బోధించుము. తీతు 2:1.

 యిర్మియా కాలములో బబులోను పాలన క్రింద యూదా వారు 70 సంవత్సరములు శ్రమ పడవలెనని దేవుడు నియమించియుండెను. యిర్మియా ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు. యిర్మియా 25:11 అనెను. డెబ్బది సంవత్సరముల తరువాత యూదావారు తమ దేశమునకు తిరిగి వెళ్లుదురని దేవుడు చెప్పెను.

 మరియు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు - బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. యిర్మియా 29:10..

 అయితే హనన్యా అను ఒక అబద్ధ ప్రవక్త ప్రజలందరి యెదుట ఇట్లనెను. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. రెండు సంవత్సరములలోగా నేను బబులోను రాజైన నెబుకద్రెజరు కాడిని సర్వజనముల మెడమీద నుండి తొలగించి దాని విరిచివేసెదను; యిర్మియా 28:11 హనన్యా ఈ ప్రవచనమును అయిదవ నెలలో పలికెను.

 దానికి బదులుగా యిర్మియా “హనన్యా! వినుము; యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింప జేయుచున్నావు. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు - భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను, యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమౌదువు అని చెప్పెను. ఆ సంవత్సరమే యేడవ నెలలో ప్రవక్తయైన హనన్యా మృతి నొందెను. యిర్మియా 28:15-17.

 ఆ కాలములో అబద్ద ప్రవక్తలను దేవుడు అంత కఠినముగా శిక్షించేను. రెండు నెలలకే ఆ అబద్ద ప్రవక్తయైన హనన్యా మృతి నొందెను. ఇది కృపాకాలము గనుక ఇప్పుడు అబద్ద ప్రవక్తలందరూ విజృంభించు చున్నారు.

 అమెరికాలో ఉండు ఒక అబద్ధ ప్రవక్త దేవుడు ఆకాశమునుండి అగ్ని కురిపించి అమెరికాలో ఉన్న పురుష సంయోగుల నందరిని సంహరించబోవు చున్నాడని చెప్పెను. ఆయన ఈ ప్రవచనమును 1995లో జరుగునని చెప్పెను. 2010 సంవత్సరము వచ్చినది గాని ఆకాశము నుండి అగ్ని దిగి రాలేదు.

 మరియు ఆ అబద్ధ ప్రవక్త యేసు ప్రభువు శరీరధారిగా నైరోబీలో తన మీటింగులలో కనపడునని చెప్పెను. 2000 ఏఫ్రిల్ 29న తన మీటింగులో యేసు ప్రభువు స్టేజీ మీద కనబడును అని ప్రవచించెను. ఇట్టి మాటల గురించి యేసు ప్రభువే మనలను ముందుగా హెచ్చరించెను.


ఆ కాలముందు ఎవడైనను - ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన యెడల నమ్ముకుడి. అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. కాబట్టి ఎవరైనను - ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి - ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్ముకుడి ముత్తయి 24:23-26 అనెను.

 ఇట్టి వారి గురించియే దేవుడు యిర్మియాతో ఇట్లనెను. ప్రవక్తలు నా నాలుకను బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, తారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. యిర్మియా 14:14. మరియు నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి, మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవీలాగు చెప్పుము - యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధి ననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రము. యెజ్కేలు 13:2,3

 ఇటీవల ఈయన తన భార్యను విడచి తన వలె టీ. వీ.లో ప్రసంగము చేయుచున్న మరొక స్త్రీ ప్రసంగీకురాలితో చెట్టాపట్టాలు వేసికొని తిరుగు తున్నందు వలన ఆయన భార్య విడాకులు తీసుకున్నది. ఆయనకు వివాహము అయి 32 సంవత్సరములు అయినది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కూడ ఉన్నారు. ప్రతీ రోజూ ఆయన ప్రసంగం దాదాపు 200 దేశాలలో ప్రసారం అవుతున్నది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి శాపం పెడుచున్నానని ఆయనే అనేవాడు.

 ఆయన మాటల్లో Yes Lord. I will do it. I place a curse on every man and every women that will stretch his hand against this anointing. I curse that man who dares to speak a word against this ministry.) పైగా ఈ శాపమేదో నేను దేవుని చిత్తాను సారముగానే ఆయన ఆజ్ఞ మేరకే శిక్ష విధిస్తున్నానని అనేవాడు. నేనభికించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనను వారికి హింస చేయనియ్య లేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను కీర్తనలు 105 :14,15 అను వాక్యమును ఉదహరిస్తాడు..

 అయితే తన నాలుకతో దీనితో తండ్రియైన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మునుమ్యులను శపింతుము. ఒక్క నోటనుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్లును; నా సహోదరులారా, యీలాగుండకూడదు. యాకోబు 3:9,10. మరీ ఆయన ఆలాగు శపించవచ్చునా?

 నరకములో అన్ని అవయవములకంటే మొదట నాలుక ఎక్కువగా బాధపడును. మనం నాలుక తోనే ఎక్కువ పాపం చేయుట వలననేమో! ధనవంతుడు అబ్రాహాముతో తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడు చున్నానని కేకలు వేసి చెప్పెను. లూకా 16:24. ఈ నాలుకతో అబద్ద ప్రవచనములు చెప్పుట వలననూ, ఇతరులను శపించుట వలననూ ఈ ధనవంతుని వలె అగ్ని జ్వాలలలో యాతన పడవలసి వచ్చును.

 మరికొందరు అబద్ధ ప్రవక్తలు మేము పరలోకమునకు వెళ్లినామనీ, యేసు ప్రభువుతోను, అపోస్తలులైన పేతురుతోను, పౌలుతోను మాట్లాడినామని చెప్పుచున్నారు. ఒక అబద్ద ప్రవక్త అపోస్తలుడైన పౌలును చూచినాననీ, ఆయన కొంచెము పొట్టిగా ఉన్నాడనీ, భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనుభవించిన కొరడా దెబ్బల తాలూకు మచ్చలను చూచినాననీ చెప్పెను. నా ప్రియ పాఠకుల్లారా ఆలోచించండి. అది సాధ్యమేనా?

 నిజమునకు పేతురును, పౌలును సమాధిలో విశ్రాంతి తీసుకొనుచూ ప్రభువు యొక్క రెండవ రాకడలో పునరుత్థానమొందుటకు ఎదురుచూచు చున్నారు. వారిని కలిసి కొన్నానని చెప్పుట అబద్ధమును, మరియు దేవుని దృష్టిలో నేరము. పాత నిబంధనలో కర్ణ పిశాచము అని దీని గూర్చి వ్రాయబడింది.

 కొన్ని సంఘములు చాల పేరు పొందినవి. సిలోన్ పెంతెకొస్తు మిషన్ అను ఒక సంఘము ఉన్నది. ఇంగ్లీషులో దాని పొడి అక్షరములు సి.పి.యం. దానిలో నుండి బయటకు వచ్చిన కొందరు మరియొక సంఘమును స్థాపించిరి. దాని పొడి అక్షరములు సి.పి.యం. అలాగే ఎల్.ఇ.యఫ్ అను ఒక సంఘము ఉన్నది. చాలామంది మరియొక సంఘమును స్థాపించి దానికి వేరే పేరు పెట్టుకొనిరి. కానీ దాని పొడి అక్షరములు ఎల్. ఇ యఫ్. నేను వారితో మీరు అదే పేరు ఎందుకు పెట్టుకొన్నారు? అశ్వత్థామ హతః కుంజరః వలె ఉన్నది అని చెప్పినాను. బయటకు వచ్చిన సంఘము వారు అదే వీధిలో ఉందురు. కొత్తవారు కొంతమంది తికమక పడి ఆ చర్చికే వెళ్లుదురు.

 ఒకసారి మా ఇంటికి ఒక పాస్టరు గారు వచ్చారు. “మీరు ప్రసంగం ఎలా సిద్ధపడతారు?” అని నన్ను అడిగారు. నేను అతనితో నా వద్ద డేక్స్ బైబిలు, థాంప్సన్ బైబిలు, స్కాఫీల్డ్ బైబిలు, హేలీస్ హేండ్ బుక్, విల్లింగ్టన్ గైడ్ మొదలగు పుస్తకములు ఉన్నవి. వాటిని చదివి సిద్ధపడతాను” అని చెప్పి ఆ బైబిళ్లను అతనికి చూపించాను. గంట తరువాత ఆయన వెళ్లిపోవుటకు లేచినాడు. ఇంతలో నా భార్య “పాస్టరు గారూ! క్రొత్తగా పచ్చడి పెట్టినాను. తీసుకొని వెళ్లండి” అని ఆయనకు ఒక హార్లిక్స్ సీసాలో పచ్చడి నింపి ఇచ్చినది. ఆయన “వద్దమ్మా మేము పచ్చడి తినము” అన్నాడు. నేను “పచ్చడి ఇస్తుంటే వద్దంటావేమి? అన్నము వండుకుంటే కూర లేకపోయినా పచ్చడితో తినవచ్చు” అని బలవంతంగా ఆయన బ్యాగ్ తీసుకుని జిప్పు తీసి పచ్చడి సీసా దానిలో పెట్టబోయాను. జిప్పు తీయగానే నా గుండె ఝల్లు మన్నది. ఎందుకంటే నా బైబిల్స్ అతని బ్యాగ్లో ఉన్నవి. “ఇదేమిటి? నా బైబిల్స్ మీ బ్యాగ్లో ఎందుకు పెట్టుకున్నారు?” అని అడిగాను. అందుకు ఆయన “మీరే కదా తీసుకొని వెళ్లమని ఇచ్చారు” అన్నాడు. “నేను చూడమని ఇచ్చాను. కానీ నీవు దొంగిలించి తీసుకొని వెళ్లుచున్నావు. ఇంకెప్పుడూ మా ఇంటికి రావద్దు” అన్నాను. అతనిని మా ఇంటికి మరలా రానియ్యలేదు.

 ఈ రోజుల్లో అందరూ తమ పేరుకు ముందు రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు. ఇంగ్లీషులో Rev. అని తప్ప దాని పూర్తి స్పెల్లింగ్ గాని దాని అర్థము గాని వారికి తెలియదు. డాక్టర్ అంటే వైద్యుడు అనే అర్థము మాత్రమే తెలిసిన వారు కూడా తమ పేరుకు ముందు డాక్టర్ అని వ్రాసికొను చున్నారు. ఇటీవల కొన్ని సంస్థలు వచ్చినవి. వారికి కొంత సొమ్ము చెల్లిస్తే మీకు కావలసిన డిగ్రీని మీ ఇంటికే వచ్చి అందిస్తారు. అందువల్ల అనేక మంది బిషప్ అని తమ పేరుకు ముందు వ్రాసికొనుచున్నారు. ఆ డిగ్రీలను చూచి వీరెంతో విద్యాధికులని అనేకులు మోసపోవుచున్నారు.

 ఈ పుస్తకము యొక్క వ్రాత ప్రతిని చదివిన కొందరు “మీరు నాస్తికులకు, క్రైస్తవ్యమును ద్వేషించే వారికి ఎంతో ఉపకారము చేస్తున్నారు. వారికి కావలసిన మేటరీను మీరు అందిస్తున్నారు” అని నాతో అన్నారు. మోసపోయే వారు లేకపోతే మోసగించేవారు ఉండరు. మోసపోయే వారిని కొంచెం చైతన్య పరిస్తే వారు మోసగించేవారిని దూరంగా పెడతారు. తద్వారా క్రైస్తవసమాజమును ప్రక్షాళన చేసే చిన్న ప్రయత్నం చేస్తున్నాను.

 కొందరు “మీరు వ్రాసినంత మాత్రమున వారు మారిపోతారా?” అని అన్నారు. వారు మారరు అని నాకు బాగా తెలియును. ఈ పుస్తకములో నేను ఉదహరించిన ఒక అబద్ధ ప్రవక్త నాకు కనబడినప్పుడు “బ్రదర్! మీరు చెప్పుచున్న అబద్ధ ప్రవచనములను గురించి ప్రజలను హెచ్చరించుచూ నా పుస్తకములో వ్రాసినాను. అయితే మీ పేరు వ్రాయకుండా ఒక సోదరుడు అని వ్రాసినాను” అని చెప్పినాను. అందుకు ఆయన “పేరు పెట్టండి సార్. నా పూర్తి పేరు సెల్ నెంబరుతో సహితము వ్రాయండి. అలాగయినా నాకు పాపులారిటీ వస్తుంది” అన్నాడు. ఈ పుస్తకమునకు ముందు మాట వ్రాసిన సిస్టర్ జ్యోతి శేఖర్ గారు తన పేరు ఇటువంటి పుస్తకములో రాకూడదని ప్రార్థిస్తున్నానని వ్రాస్తే ఆయన తన పేరు వ్రాయమని కోరుచున్నాడు.

 ఈ పుస్తకము ఏదో విప్లవము తీసుకొచ్చి అనేకమందిని మారుస్తుందని నేను ఆశించడం లేదు. కనీసం ఒక్కరు అబద్ద ప్రవక్తలను గుర్తించి వారికి దూరంగా ఉంటే చాలు. నా కృషి ఫలించినట్లే.

 

Add comment

Security code
Refresh

Comments  

# అబద్ధ ప్రవక్తలుRaju 2020-11-22 03:49
అబద్ధ ప్రవక్త ల గురించి దొంగ బోధకుల గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు... మీ ప్రయాస ను { పరిచర్యను } దేవుడు ఇంకనూ ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.