ఆడియో
"నమస్కారమండీ, అయ్యగారు "
"ఏమిటిది?"
“దేవుని ప్రేమను గురించిన కరపత్రమండి"
"ఈ మత ప్రచార కరపత్రాలతో నింపివేస్తున్నారయ్యా. ఎక్కడ చూచినా కరపత్రాలే"
"అయ్యగారూ, అలా అనకండి, నరకంలో ఒక్క కరపత్రం కూడ కనబడదండీ"
కుర్రవాడి చేతిలో నుండి కరపత్రాన్ని అందుకున్న ఆసామి మనస్సులోకి 'నరకం' అనే చిన్న మాట పదునైన బాణంలాగా దూసుకుపోయింది. ఆయన హృదయంలో కుర్రవాని మాటలు పదేపదే జ్ఞాపకం వస్తున్నాయి, ఆసామి మనస్సాక్షి మేల్కొంది. ఔను, 'నరకంలో కరపత్రాలు ఉండవు' అన్న వాస్తవాన్ని అంగీకరించే తత్వంగల ఆసామి కుర్రవాడిచ్చిన కరపత్రాన్ని చదవడం ప్రారంభించాడు.
*దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16).
'దేవుడు..... ప్రేమించెను'. ముచ్చటైన ఈ మాటలు ఆసామి గమనాన్ని ఆకట్టుకున్నాయి.
"నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంత సేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరివంటివారే" (యాకోబు 4:13). "మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదేగాని, చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును" (ప్రసంగి 12:7, 14).
"ఆకాశమును భూమియు గతించును గాని నామాటలేమాత్రమును గతింపవు" అని యేసుప్రభువు చెప్పెను. (లూకా 21:33)
"హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధిగలది, దాని గ్రహింపగలవాడెవడు?" (యిర్మీయా 17:9).
ప్రభువైన యేసు మానవ హృదయాన్ని ఇలా వివరించాడు: “మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములును, దొంగతనములును, నరహత్యలును, వ్యభిచారములును, లోభములును , చెడుతనములును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, ఆహంభావమును, అవివేకమును వచ్చును" (మార్కు 7:21,22), సమస్త పాపాలు మొదట హృదయంలోని కోర్కెల నుండి జన్మించి రహస్యంగా పథకం వేయబడ్డ తరువాతే బహిరంగంగా జరిగించబడతాయి.
"పాపమువలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము"(రోమా 6:23). "ఏ భేదమును లేదు అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను (పరలోకము) పొందలేకపోవుచున్నారు" (రోమా 3:23).
పాపఫలితాన్ని బట్టి నరకానికి వెళ్తున్నారు. "పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును, విగ్రహారాధికులును, అబద్ధికులందరును అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము" (ప్రకటన 21:8).
ఆసామి ఈ మాటలు చదువుతుండగా దేవుడతనితో మాట్లాడాడు. దేవునియెదుట తాను పాపినని గ్రహింపు పొందాడు. తన ఆస్తి తన ఆత్మను పరలోకానికి చేర్చలేదని, తన చదువు, సంస్కారం, మేథస్సు, పాపపు అలవాట్ల సంకెళ్ళ నుండి విడిపించలేక పోయాయని గ్రహించగలిగాడు.
ఈ ఆసామి ప్రజలందరిచేతా పెద్దమనిషిగా గౌరవవందనాలు స్వీకరించేవాడు, అతనికి తినడానికీ, ధరించుకోవడానికి పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ హృదయంలో మాత్రం భవిష్యత్తును గురించిన మూగభయం-చింతలు కమ్మి ఉంది.
“ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము?" (మార్కు 8:36).
ధనవంతులైనా నిరుపేదలైనా ప్రతివారు ఏదో ఒక రోజున మరణించాల్సిందే! అయితే ఈలోకం విడిచిన తర్వాత నిత్యజీవం పొందాలనే దేవుని గొప్ప ఉద్దేశాన్ని, ప్రేమసంకల్పాన్ని మానవుడు గ్రహించాలి. మన పాపాల కోసం మరణించి తిరిగి లేచిన యేసుప్రభువును అంగీకరించడం వల్లే పాపక్షమాపణ, హృదయశాంతి కలుగుతాయి కాని, సిరిసంపదలు, జ్ఞానం మంచిపనులు మొ॥నవి మనల్ని పరలోకానికి ఎంతమాత్రం చేర్చవు. "ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు" అని యేసు ప్రభువు ఖండితంగా చెప్పాడు. (లూకా 12:15).
అంతటితో ఆసామి చేతిలోని కరపత్రం నిమ్మళమైన స్వరంతో మాటలాడుతుంది. యేసుప్రభువు నన్ను రక్షించగలడు. నా పాపాలను క్షమించి దేవుని రాజ్యంలో చేర్చగలడనే నమ్మకం, అతని మనస్సులో కలిగింది. యేసుప్రభువుపై విశ్వాసం కలిగి ఆయనను నమ్మి అతను నెమ్మది పొందాడు.
"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మ దగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను మించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును" (1 యోహాను 1:9).
"యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” (1 యోహాను 1:7).
"ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు. (అపొ.కార్య. 16:31).
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.