సాక్ష్యాలు

రచయిత: రచయిత్రి - శ్రీమతి విజయా జూడ్
చదవడానికి పట్టే సమయం: 1 గంట 10 నిమిషాలు

ముందు మాట

మాధవి పుట్టడంతో ఆ కుటుంబంలో వెల్లి విరిసిన ఆనందం, సందడి ఇంతా అంతా కాదు. ముద్దుగా బొద్దుగా, తెల్లగా, అందంగా, చక్రాల్లాంటి కళ్లతో, నల్లని జుట్టు, ఒత్తుగా, అందరి కలల రూపంగా రేపటి వెలుగులా,రంగుల కలలా, ఆ ఇంట్లో అడుగుపెట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన బుడిబుడి నడకలతో, ముద్దుముద్దు మాటలతో అందరి మనసులూ ఇట్టే దోచేస్తూ సాగిపోతున్న బాల్యాన్ని హఠాత్తుగా ఏదో అంతు చిక్కని రోగం కాటేసింది. జీవితాంతం ఆ అంగవైకల్యం చెరలో ఆమె మ్రగ్గిపోవాల్సి ఉంటుందని అప్పుడు ఎవరూ ఊహించనే లేదు.

నాలుగు సంవత్సరాలు నిండీనిండక ముందే మాధవిని గూర్చి అంతా ఆశించిన రంగుల ప్రపంచం అంధకారమైపోయింది. ఆ రాత్రి అందరిలాగా అమ్మ ప్రక్కనే పడుకుని నిద్రపోయింది. ఉదయం లేచేసరికి పడకమీద చేష్టలుడిగి ఒళ్లంతా బిగుసుకుపోయి అచేతనంగా బిత్తర చూపులు చూస్తోంది. ఆమె ముద్దు ముద్దు మాటలు, వింతవింత పలుకులు, చిట్టి నడకలు ఉడిగిపోయాయి.

తల్లిదండ్రులు తిరగని హాస్పిటల్స్, దర్శించని గుళ్లూ లేవు, మొక్కని దేవుళ్లూ లేరు. వెళ్లని స్వస్థత కూటాలు, అడుగు పెట్టని దైవజనుల గడపలు లేవు. చివరికి ఆమెకు అంగవైకల్యం, కుటుంబానికి కన్నీళ్లు, సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలాయి.

రాత్రి గడిచాక ఉదయ ఉషస్సులు, మంచుతెర వెనుక విచ్చుకొనే అద్భుతాలు ఉన్నట్లే, మాధవిని ఆవరించిన క్రీస్తు ప్రేమ ఆమె కన్నీటి కథను గొప్ప మలుపు తిప్పింది.

ఒకసారి యేసు ప్రభువును శిష్యులు అడిగారు, తమకెదురైన గుడ్డివాని అంగవైకల్యానికి కారణం వాడి పాపమా, లేక వాడి తల్లిదండ్రుల పాపమా అని. “దేవుని క్రియలు ఇతని మూలముగా వెల్లడి కావడం కోసం అతడు గ్రుడ్డివాడుగా పుట్టాడు” అన్నాడు ప్రభువు.

మాధవి సాక్ష్యం కూడా అదే. "నా అంగవైకల్యం దైవశాపం కాదు. అది నా భాగ్యం” అంటోంది. తనను చూడ్డానికి వచ్చే అనేకులకు తనలో సాక్షాత్కరించిన క్రీస్తు ప్రేమను ప్రకటిస్తోంది.

అదెలా సాధ్యపడిందో చదవండి, మీకే తెలుస్తుంది.

1. పంచదారకు తీపి కలిసింది

అది గ్రీష్మ కాలం. ఎండలు మండిపోతున్నాయి. చిన్న చిరుజల్లులా 1978 జూన్ 8న ఓ సుందర సుకుమార సుమం కుసుమించింది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా, చక్కెరపురం తణుకుకు తీపి కలిసినట్లు పుణ్యవతి, నారాయణరావులు ఓ పండంటి పాపకు జన్మనిచ్చారు. ఆమె పేరే మాధవి. అంటే మధురం అని అర్ధం. ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉన్న పాపను చూచిన తల్లిదండ్రుల, బంధువుల ఆనందానికి అవధులు లేవు. ఆమెకంటే 2 సం|| పెద్దవాడు విజయ్ రామ్ కుమార్. ఆ వయస్సులోనే చెల్లిని ఎంతో ప్రేమగా చూసేవాడు. 2 సంవత్సరాలు ఆ ఇంట్లో ఎంతో సంతోషంగా గడిచిపోయాయి.

1980 జూన్ 8న మాధవి మూడవ పుట్టిన రోజు చాలా ఘనంగా జరుపుకున్నారు. తన ముద్దు మాటలతో అందరినీ అలరించేది. ఆమె వయస్సుకు మించిన తెలివి తేటలకు తల్లిదండ్రులు అబ్బురపడేవారు. ఆ వయస్సులోనే పెద్దలను గౌరవంగా చూసేది. ప్రేమగా మాట్లాడేది. ఆ 3వ పుట్టిన రోజు ఎంతో సంతోషంగా గడిచిపోయింది. మంచి మంచి గౌన్లతో, ముద్దుగా, బొద్దుగా, తెల్లగా, అందంగా, నల్లని ఒత్తయిన జుట్టుతో, చక్రాల్లాంటి కళ్ళతో హుషారుగా ఇల్లంతా బుడి బుడి అడుగులతో నడుస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు తమ బిడ్డను చూసి ఎంతో మురిసిపోయారు, గర్వించారు. ఆమె తండ్రి వృత్తి ఫొటోగ్రఫీ. ఆయనది సొంత స్టూడియోనే గనుక తన బంగారు బిడ్డను ఎన్నో ఏంగిల్స్ లో ఫోటోస్ తీసి అవి చూసి మురిసిపోయాడు. ఇక తాను స్కూల్ కి వెళతానని పేచీ పెట్టింది (చదువంటే అంత ఇంట్రస్ట్ ఆ పాపకు). స్కూల్ కి వెళ్ళాలంటే ఎవరైనా పిల్లలు ఏడుస్తారు. కానీ ఆమె అలా ఏడ్చేది కాదు. అలా 3 సంవత్సరాల 7 నెలలు గడిచాయి.

2. చీకటి సంకెళ్ళు

అది ఫిబ్రవరి నెల. శీతాకాలపు మంచు బిందువులు చెట్ల ఆకులనుండి బొట్లు బొట్లుగా నేలను తాకుతున్నాయి. చీకటి తెరలు తొలగి లోకానికి ఉషాకిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. కానీ మాధవి జీవితంలో అప్పుడప్పుడే చీకటి అలుముకోబోతోందని ఎవరికీ తెలీదు. ఆ రోజు అకస్మాత్తుగా జ్వరం వచ్చింది. మామూలు జ్వరం అనుకుని హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. జ్వరానికి మందులు ఇచ్చి ఇంటికి పంపేసారు. ఆ రోజు విపరీతమైన తలనొప్పితో చాలా బాధపడింది. తర్వాత 3 రోజులకు జ్వరం తగ్గుముఖం పట్టింది. మరునాడు ఒక పండుగ సందర్భంగా మాధవి నానమ్మగారి ఊరు తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళ తాలూకా ఐ. పోలవరం వెళ్లింది. అన్నయ్యతో కలిసి గోదావరి పాయలో పడవెక్కి నీళ్ళలో ఆడుకుంటూ సరదాగా సమయం గడిపింది. ఇసుకలో ఆటలు ఆడింది. గుఱ్ఱం బండి ఎక్కి నానమ్మ ఇంటికి వెళ్ళింది. ఆ చిన్న బిడ్డ రాకతో ఆ ఇల్లు కూడా కళ కళ లాడింది. చిన్ని చిన్ని మాటలతో వారిని ఆడించేసి అలసి, అలసి అన్నం తిని అమ్మ పక్కకు చేరింది.

ఆ రాత్రే ఆ చిన్న బిడ్డకు చీకటి రాత్రి అనీ, ఆ రాత్రే కల్మషం, కపటం తెలీని అమాయకమైన ఆ పాపకు చీకటి సంకెళ్ళ రాత్రనీ, శ్రమలు మొదలయ్యే రాత్రి అనీ ఎవరికీ తెలీదు, ఆ దేవునికి తప్ప. ఆ తల్లిదండ్రుల హృదయంలో తీరని దుఃఖం, ఆవేదన మొదలయ్యే రోజు. మానవులకు తమ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలీదు. తెలిసినా ఏమి చేయగలరు? పైనున్నవాడు ఎలా నడిపిస్తే అలా నడవాలి, అంతే. సరే, మాధవి ఆ రాత్రి చాలా ప్రశాంతంగా పడుకుంది. ముందు ముందు ఆ ప్రశాంతత తనకు దొరకదేమో; కరువైపోతుందేమో అని గాబోలు, చక్కగా పడుకుంది.

తెల్లవారుజామున తల్లిదండ్రులు లేచి నానమ్మకు పెద్దమ్మలకు మాధవిని చూసుకోమని చెప్పి ప్రక్క ఊరిలో ఉన్న (ముమ్మిడివరం) గ్రామంలో బాలయోగి దర్శనానికని వెళ్ళారు. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటల వేళకు తిరుగుముఖం పట్టారు. ఆ ఊరు దాటి సగం దూరం వచ్చేసరికి తెలుసున్న అబ్బాయి కనిపించి మీ అమ్మాయికి నీర్సంగా ఉంది. ప్రొద్దుటనుండి లేవలేదని చెప్పాడు. అంతే, వేగంగా, త్వరత్వరగా ఇంటికి చేరారు. వెంటనే తమ బిడ్డ దగ్గరకు వెళ్ళి కూర్చున్నారు. మాధవి మాట్లాడుతున్నదే గానీ, ఆమె శరీరం తన అదుపులో లేక స్పర్శ కోల్పోయి పడుంది. మెడనుండి అరికాళ్ళ వరకూ కదలికలు లేక ఒళ్ళంతా ముద్దలా అయిపోయింది. కదలలేని పరిస్థితిలో పడుంది. తల్లిదండ్రులు ఏడుస్తూ అసలు ఏం జరిగింది? అని అడిగారు. నానమ్మ, పెద్దమ్మలు ఏడుస్తూ చెప్పారు. ఉదయం అయినా లేవలేదని. దగ్గరగా వెళ్లి చూసారు. రాత్రి నుండి యూరిన్ కూడా అవలేదు. చూస్తానే ఉంది కానీ లేవలేక పోయింది. ఎంత లేపాలని ప్రయత్నించినా, లేపినా పడిపోతుందని చెప్పారు. వారి ఆవేదన, దుఃఖానికి హద్దులు లేవు. 'మా బంగారు తల్లికి, చిట్టి తల్లికి ఇన్ని కష్టాలు వచ్చాయేంటి' అని భోరున విలపించారు. మాధవిని పట్టుకొని "అమ్మా! లేమ్మా నా బంగారు తల్లీ లేమ్మా !” అని ఎంత లేపాలని ప్రయత్నించినా అవయవాలు పనిచేయక లేవలేకపోతోంది. ఏం జరిగిందో తెలీదు. ఎందుకు అలా జరిగిందో తెలీని పరిస్థితి. ఎంతో ఏడ్చి చాలా వేదనపడ్డారు. వారి ఉద్వేగం ఉప్పెనలా అందరినీ ఊపేసింది.

3. అంతులేని అయోమయం

ఆ రాత్రే గుఱ్ఱం బండి మీద మురమళ్ళ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. డాక్టర్ ఇంజక్షన్ చేశారు. యూరిన్ మాత్రం ఫ్రీ గా అయింది. "ఇక మేమేమీ చేయలేం, కాకినాడ తీసుకెళ్ళండి” అని చెప్పారు. ఆ రాత్రి నానమ్మ వాళ్ల ఇంట్లోనే ఉన్నారు. మాధవి లేవలేదు. అమ్మ తినిపిస్తే కొంచెం అన్నం తిన్నది, అంతే. ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయలేదు... తను మాట్లాడుతున్నది కానీ లేవలేని పరిస్థితి. చేతులు గానీ, కాళ్ళుగానీ ఏమీ కదపలేకపోతుంది. నిర్జీవంగా పడి ఉంది. ఆ రాత్రి ఎలాగో భారంగా గడిపారు. అది పల్లెటూరు. రాత్రికి రాత్రే వెళ్లే మార్గం లేదు. వెళ్ళాలంటే యానాం రేవు దాటి కాకినాడ వెళ్ళాలి. ఆ టైంలో పడవలు తిరగవు. చీకటి, భయం, ఆ రాత్రి వేదనతోనే గడిపారు. మాధవి తల్లిదండ్రులకు, బంధువులకు కంటి రెప్ప వాలలేదు.

మరునాడు తెల్లవారుఝామున పాపను తీసుకుని కాకినాడ వెళ్ళారు. పిల్లల స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళారు. డాక్టరు అన్ని పరీక్షలు చేసి మందులు ఇచ్చి, బలమైన ఆహారం పెట్టమని, 20 రోజులలో తగ్గిపోతుందని చెప్పి 10 రోజులు హాస్పిటల్ లో ఉంచారు. ఇక వారికి హాస్పిటల్ బాధలన్నీ మొదలయ్యాయి. తమ ఊరు, ఇల్లు వదిలి ఎక్కడో తెలీని చోట కన్నబిడ్డ ఆరోగ్యం కోసం వారు పడే తాపత్రయం, ఇంతా అంతా కాదు. చిన్న వయస్సులోనే తన బిడ్డకు దాపురించిన శ్రమను చూసి తల్లి తట్టుకోలేక పోయింది. తండ్రి తన వ్యాపారాన్ని వదిలి ఆ హాస్పిటల్ లో తన బిడ్డతో దిక్కుతోచని స్థితిలో, బాధతో, కన్నీటితో కనిపెట్టుకోవలసి వచ్చింది. మాధవి అన్నకి అప్పుడు 5 సం||ల వయస్సు. చెల్లెలికి ఇలాంటి బాధ, దుఃఖం, అనారోగ్యం అని ఆ చిన్న వయస్సులో తన చిన్ని మనస్సుతో అర్థం చేసుకొని తన చెల్లిని లెమ్మని లేపేవాడు. ఆ వయసులోనే, అప్పుడే బాధ్యతలు, చెల్లి మీద ఎంత ప్రేమో, ముందు ముందు భవిష్యత్తులో ఈ అన్నే తనకి ఎంతో మంచి సహకారిగా ఉంటాడని ఆ చిన్న బిడ్డ మాధవికి అప్పట్లో అర్థం కాలేదు.

మాధవికి కడుపులో జీర్ణశక్తి బాగున్నా, నరాలు పనిచేయక విరేచనం అయ్యేది కాదు. డాక్టర్స్ ఎనీమా ఇచ్చి మోషన్ అయ్యేలా చేసేవారు. ఏది చెయ్యాలన్నా మోసుకునే వెళ్ళేవారు. అలా ఒక వారం మందులు వాడాక ఒక రోజు మాధవి తన చిటికెన వేలు కదపగలిగింది. 'వేలు కదులుతున్నట్లు ఉంది చూడమ్మా' అని ఆ 4 సంవత్సరాల పాప ఎంతో తెలివిగా చెప్పింది. వెంటనే ఆనందంగా చూసారు ఆమె తల్లిదండ్రులు. బాగై పోతుందని ఎంతో ఆనందపడ్డారు. డాక్టర్ చూడడానికి వచ్చినపుడు చూసి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది అని చెప్పి మందులు వ్రాసి ఇంటికి తీసికెళ్ళచ్చు, 15 రోజులకు ఒకసారి తీసుకురమ్మని చెప్పారు. 10 రోజుల చికిత్స తర్వాత హాస్పిటలనుండి డిశ్చార్జ్ అయిన మాధవిని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళారు. ఎందుకంటే మాధవి తల్లికి చిన్న వయస్సు కారణంగా ఆమె పరిచర్య చెయ్యలేదని వాళ్ళ అమ్మమ్మ మాధవిని తమ ఊరు నవాబ్ పాలెం తీసికెళ్ళిపోయింది.

అక్కడ మాధవిని వదిలేసి ఆమె అన్నయ్య, తల్లిదండ్రులు కలిసి తణుకు వచ్చేసారు. ఇంటినుండి ఎంతో సంతోషంగా వెళ్ళిన నలుగురూ ముగ్గురుగా విషణ్ణ వదనాలతో తిరిగి వచ్చారు. ఆ రోజునుండి వారానికోసారి మాధవిని చూడానికి వెళ్ళి వచ్చేవారు. 15 రోజుల కొకసారి కాకినాడ హాస్పిటల్ కి తీసుకెళ్ళేవారు. మాధవి పని అమ్మమ్మే చూసుకునేది. బలమైన ఆహారం తిని బలమైన మందులు ద్వారా మాధవికి బాగా ఒళ్ళు వచ్చింది. ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే కష్టంగా ఉండేది. ఇంకా కూర్చోవడం కూడా కుదిరేది కాదు. 5 సంవత్సరాలు వచ్చేశాయి.

4. అందం, అంగవైకల్యం

ఐదవ సంవత్సరంలో ఎంతో ఎదిగి నడవాల్సిన బిడ్డని చంటి బిడ్డలా పట్టుకొని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేసేవారు కూర్చోవాలని ఆమె కూడా ఆశపడేది. చెక్క కుర్చీలో ఇటు, అటు దిండ్లు పెట్టి బొమ్మలాగే కూర్చోబెట్టి పడిపోతుందేమో అని అక్కడే కూర్చొని కనిపెట్టుకోవలసి వచ్చేది.

పాదాలనుండి తొడల వరకూ బెల్టులతో, స్ప్రింగ్ లతో చేయించిన స్పెషల్ బూట్లు చేయించారు. అవి తొడిగించినా నడవలేక పోయింది అక్కడ కూడా తగ్గినట్లు కనిపించకపోయేసరికి వైజాగ్ లో బోన్ స్పెషలిస్ దగ్గరకు తీసుకెళ్ళారు.

అక్కడ డాక్టర్ వయస్సు వచ్చాక ఆపరేషన్ చేద్దామని, నడవడానికి వీలయ్యేలా చేద్దామని చెప్పారు. అక్కడ కూడా మందులు వ్రాసారు. అవి కూడా నిరుపయోగమయ్యాయి. విచిత్రం ఏంటంటే ఆమెకు ఏ మందులూ పనిచేయట్లేదు. జ్వరం వచ్చినా, ఏది వచ్చినా సరే, దానంతట అదే తగ్గాల్సిందే. ఇలా అయితే ఈ అనారోగ్యాలకు పరిష్కారం ఏంటి?

మళ్ళీ నవాబ్ పాలెం తీసుకెళ్ళిపోయారు. ఇక ఏ వైద్యం పడితే ఆ వైద్యం చేయించేవారు ఉదా:- నాటు, ఆయుర్వేదం, హోమియో, తైలాలు వ్రాస్తుండేవారు. అలా రెండు సంవత్సరాలకు అంటే ఆమెకి 7 సంవత్సరాల వయస్సులో కూర్చోగలిగింది. అంటే తనకి తానుగా కాదు. ఎవరైనా కూర్చోబెడితేనే. చంటి పిల్లలా కూర్చునే స్థితికి వచ్చింది. ఒక సారి గుడివాడలో కరెంటు పెట్టి చేసే సొంత వైద్యం 10 నెలల్లో తగ్గిస్తామని, నడవలేని స్థితిలో ఉన్నవారు నడుస్తారని పేపరులో చూసి అక్కడికి తీసుకెళ్ళారు. వాళ్ళు 10 నెలలు ఇక్కడే ఉంచాలి అని చెప్పితే, 10 నెలలకు 10 వేల రూపాయలు కట్టి జాయిన్ చేసారు. ఆ హాస్పిటల్ లోనే ఒక రూమ్ అద్దెకు తీసుకొని మాధవి దగ్గర అమ్మమ్మ ఉండి చూసుకునేది.

అక్కడ రోజు ప్రొద్దున్నే తైలం వ్రాసేవారు, కరెంటు పెట్టేవారు. నడుముకు బెల్ట్ పెట్టి కరెంటు పెడితే అది నడుమును ఊపేసేది. నరాలకు కూడా కరెంటు పెట్టేవారు. కాళ్ళను వెదురు బద్దలతో గాజు బట్టలతో బిగించి గట్టిగా కట్టి నడిపించడానికి ప్రయత్నం చేసేవారు. నడవడానికి ప్రయత్నం చేయమనే వారు, కరెంటు పెట్టేటపుడు ఆమె చాలా బాధపడేది. పోట్లు వచ్చేసేవి. దానివల్ల శరీరం కాలినట్లుగా అయిపోయి బాధతో ఏడ్చేది. తల్లిదండ్రులు ప్రతివారం వచ్చి అన్నీ కొని యిచ్చి, స్టూడియోలో వచ్చిన డబ్బు వచ్చింది వచ్చినట్లు మాధవికే ఖర్చు పెట్టేవారు. 10 నెలలు అన్నది 20 నెలలు అయిపోయాయి. ఇంత ప్రయాసపడినా ఏమీ ఫలితం కనిపించక పోయేసరికి విసుగు చెంది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేశారు. మాధవిని 10 రోజులు తణుకులో, 10 రోజులు అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లేవారు. 8 సంవత్సరాలు వచ్చేశాయి. అలాగే ఉంది పరిస్థితి. ఇంత శ్రమలో వారు ఎన్నో విగ్రహాలకు మ్రొక్కుకున్నారు. అవే బాగు చేస్తాయని అనుకున్నారు. వారి మ్రొక్కులు, వారి పూజలు మాధవిని బాగుచేయలేక పోయాయి. ఎక్కడ గుడి ఉంటే అక్కడ మాధవి నడిస్తే ఆ దేవతకు వెండిపాదాలు ఇస్తామని ఇంకా ఎన్నో మ్రొక్కులు మొక్కారు. అయినా స్వస్థత లేదు, శాంతి లేదు.

రోజులు గడుస్తున్నాయి. అలాగే కాలం వెళ్ళబుచ్చుతున్నారు. తన భవిష్యత్ మీద, తన జీవితం మీద నిరీక్షణ కోల్పోయిన సమయంలో ఒకసారి కాళ్ళమీద కూర్చోగలిగింది. ఆ రోజు చాలా ఆనందం కలిగింది ఇంట్లో వాళ్ళకు. తర్వాత కొంచెం కొంచెంగా దేకడం మొదలు పెట్టింది. ఉసూరంటున్న నరాలు ఉరకలెత్తుతున్నట్లనిపించింది.

పాలకొల్లు హాస్పిటల్లో ఆపరేషన్ కేంప్లు పెట్టినపుడు అక్కడకు కూడా తీసుకెళ్ళితే రెండు ఆపరేషన్లు చేసారు. రెండు కాళ్ళకూ సిఎం పోతలు పోసేసారు. కొన్ని వందల మంది మధ్యలో అందరిలో (రూమ్ లో కాకుండా) అలాగే దోమల్లో, రాత్రుళ్ళు గడుపుతూ వారం రోజులు ఉన్నారు. యూరిన్, మోషన్ మంచం మీదే పట్టేవారు. ఆపరేషన్ కుట్లు విప్పాక ఇంటికి పంపించేశారు. తర్వాత కాళ్ళు విపరీతమైన పోట్లు వచ్చేవి. ఆ చిన్న బిడ్డ ఎన్నో బాధలు పడింది. కాళ్ళకు ఎక్సర్ సైజ్ చేయించేవారు. అయినా ఇంకా బాధలు వచ్చేవి. ఇన్ని చేసినా అక్కడ కూడా తగ్గలేదు. అక్కడ నుండి వైజాగ్ లో వేరే హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితి బాగా లేక, పిల్లలను సరిగా చూడకపోవడం అవీ చూసి జాయిన్ చేయకుండానే వెనక్కి తీసుకొచ్చేసారు. అప్పటికి 10 సంవత్సరాలు నిండాయి. వారి బంధువుల పెండ్లికి కడియం వెళ్ళి అక్కడనుండి వీరవాసరం కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా వైద్యం చేయించారు. అక్కడ కూడా చాలా బాధలు, హింసలు పడ్డారు. తర్వాత అదంతా మోసం అని తెలిసింది. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇక వైద్యం ఆపేసి చదువులోకి తీసుకెళ్ళారు. ఆమెకు వైద్యం చేయిస్తూనే 4 వ తరగతి వరకు ఇంట్లోనే చదువు చెప్పించారు.

5. కారుచీకటిలో కాంతిరేఖ

కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఆ కుటుంబం బాధలు, భారాలు మోసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతోంది. కారుచీకటిలో కాంతిరేఖ మెరిసినట్లు వారి జీవితంలో ప్రభువైన దేవున్ని తెలుసుకొనే సమయం ఆసన్నమయ్యింది. ఒక సహోదరి 'మీరు దేవున్ని నమ్ముకోండి. ఆయనే పాపను స్వస్థపరుస్తాడు' అని సువార్త చెప్పింది. ఎలాగయితేనేం, పాప స్వస్థపడడమే కావాలి అని ప్రార్థన చేసుకొనేవారు. యేసు ప్రభువుకు నమస్కారం చేసుకొనేవారు. ఆ సోదరి ఒక చర్చికి తీసుకెళ్తూ ఉండేది. వాళ్ళకు అక్కడకు వెళ్ళినా అక్కడ ఏమీ అర్ధం అయ్యేది కాదు. కానీ, ఏదో విశ్వాసం. 'ఇక మా బిడ్డ స్వస్థపడుతుంది' అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక్కడ కూడా వైద్యానికి తిప్పినట్లే తిప్పేవారు. ఇలా చేస్తూనే ఒక పక్క ఎక్కువగా విగ్రహారాధన చేసేవారు. వ్రతాలు పూజలు మామూలే. తర్వాత పాపని చదువుకోసం ఆ వీధిలోనే ప్రైవేట్ కి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి తీసుకొచ్చేవారు. 2 సంవత్సరాల్లో 4 క్లాసులు వరకు ఇంట్లోనే చదివింది. తర్వాత స్కూల్ కి కూడా పంపారు. 2 నెలలు స్కూల్ కి రిక్షా మీద పంపించారు. అక్కడ బాత్ రూమ్ కి వెళ్ళాలంటే అన్నీ ఇబ్బందులే. అయినప్పటికీ ఆమె మీద జాలితలచో, లేక దేవుని దయవలనో ఆ స్కూల్ పిల్లలే ఎత్తుకొని బాత్ రూమ్ కి తీసుకెళ్ళేవారు. టీచర్స్ కూడా బాగా చూసేవారు. అయినా భయం వల్ల, దూరం వల్ల క్రొత్త వల్ల భయపడి ఏడ్చి అక్కడ మానేసింది.

తర్వాత దగ్గరలో ఉన్న స్కూల్ లో జాయిన్ చేసారు. ఆమె అన్న విజయ్, మాధవిని సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు. ప్రతిరోజు తెలుగు టీచర్ తన పాఠాన్ని గ్రౌండ్ లో చెప్పేవారు. ఆమె మాత్రం క్లాసురూమ్ లో ఒక్కతే ఉండిపోయేది. ఆమెని తీసుకెళ్ళేవారు ఎవరూ ఉండేవారు కాదు. ఏకాకిగా మిగిలిపోయేది. అయినా చదువు మీద ఇంట్రస్ట్ వలన అన్నిటినీ సమర్ధించుకునేది. ఒక రోజు మధ్యలో మాధవి నాన్నగారు వచ్చి చూడగా క్లాసురూమ్ లో ఒక్కతే కూర్చొని ఉండడం చూసి కారణం అడిగితే 'రోజూ ఇంతే' అని చెప్పి ఏడ్చింది. టీచర్తో ఆయన సీరియస్ గా మాట్లాడారు మాధవి మాత్రం మంచితనంతో సర్ది చెప్పింది. మాధవి మంచితనాన్ని చూసి ఆ టీచర్ అప్పటినుండి ప్రేమగా చూసేది. ఆమె అన్న, నాన్నగార్ల దినచర్య ప్రైవేట్ కి, స్కూల్ కి తిప్పడం.

ఈ మధ్యలో ఎక్కడో స్వస్థత సభలలో స్వస్థత కలుగుతుందని విని ఆమె తండ్రిని ఒప్పించి బస్ మీద తీసుకెళ్ళడం మొదలు పెట్టారు. ప్రతి వారం ఇలా నానా అగచాట్లు పడేవారు. ఆ తల్లికి తన బిడ్డ భారం కాదుగదా? భుజానికి అమ్మాయిని ఎత్తుకోడం కష్టమైనా అలాగే భారంగా మోసేది. తల్లి చివరి రోజున బోధకుని దగ్గరకు తీసుకెళ్ళి ప్రార్థన చేయించాలని స్టేజి చివర కూర్చోబెట్టింది. అమ్మాయి పాక్కుంటూ ఆయన దగ్గరకు వెళ్ళింది. “నేను చేతులు కడిగేసుకున్నాను. నాలోంచి ఆత్మ వెళ్ళిపోయింది, ఇప్పుడింకెవరినీ ముట్టుకోను, ప్రార్థించను” అన్నాడు. మాధవి జాలిగా మళ్ళీ అడిగింది, “నాకు ఇంక రావటం కుదరదు, ప్లీజ్” అని బతిమాలి, ప్రార్థించమని అడిగితే ఆ బోధకుడు "ఈ అమ్మాయి ముందుకు వచ్చేస్తుంది. వెనక్కు లాగేయండి” అంటుంటే తనే సిగ్గుపడి వెనక్కి వచ్చేసింది. ఆ ముగ్గురూ కలిసి గట్టిగా ఏడ్చేశారు. ఆఖరికి ప్రార్థన కూడా కరువైపోయింది అని బాధపడ్డారు. సరే, అక్కడనుండి ఇంటికి వచ్చేసారు. మళ్ళీ మామూలుగా బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం చేసేవారు. దేవుడు అంటే స్వస్థపరిచే వాడు అని అనుకునేవారు. ఆయనే రక్షణ కర్త అని తెలియలేదు వారికి. దేవుడు అంటే ఇంక ఎవరు చెప్పినా స్వస్థపరుస్తాడు, ఆయన మేలు చేస్తాడు అని చెప్పడం వల్ల ఆ మేలు వీరికి తెలీదు. స్వస్థత కావచ్చని ఆశగా చూసేవారు. మారుమనస్సు, రక్షణ అంటే ఏమిటో వీరికి తెలీదు.

6. మాధవి -మానవీయత

మాధవి 7వ తరగతి సెకండ్ క్లాసులో పాసైంది. 8వ, 9వ తరగతులు కూడా అలాగే పాసయ్యింది. సంవత్సరాలు బాధగా, భారంగా గడుస్తున్నా అన్నీ ఉన్న మనుష్యుల్లా తను కూడా అందరిలా అన్ని ఆనందాలు అనుభవించింది. పిక్నిక్ లకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, జైంట్ వీల్ ఎక్కడం, అన్నీ చేసేది. తన అన్నయ్యే తన గురించి ఏ మాత్రం సిగ్గుపడక అన్నిటికీ తీసుకెళ్ళి తిప్పేవాడు. ప్రతిరోజు స్కూల్ కి ఆమె అన్నయ్యగాని, డాడీగాని తీసుకెళ్ళేవారు, తీసుకొచ్చేవారు. ఒకోసారి వాళ్ళు వెళ్ళడం మర్చిపోతే తను రిక్షా ఎక్కి ధైర్యంగా వచ్చేసేది. తన ఫ్రెండ్ లలిత తనకు తోడుగా ఉండేది. లంచ్ బాక్స్ లేటయితే టీచర్స్ కూడా మాధవిని వదిలి వెళ్ళలేక పోయేవారు. వాళ్ళ బాక్సులు విప్పి ఆమెకు లంచ్ పెట్టేవారు.

ఓసారి 10వ తరగతి చదివేటపుడు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని ప్రైవేటు క్లాసుకు వాళ్ళ డాడీ తీసుకొచ్చి దింపారు. కానీ, ఇంకా తలుపులు తెరవలేదు. అయినా అక్కడే కూర్చొంది. తరువాత కొంచెం సేపటికి మాష్టారు, పిల్లలు అందరూ లోపలికి వెళ్ళిపోయారు. తను ఒక్కతే వెళ్ళలేక అలాగే గుమ్మం దగ్గరే కూర్చొని ఉండిపోయింది. దుఃఖం పొర్లుకొచ్చింది. నడవలేని జీవితం ఇంతేగదా ? అని విలపించింది. ఒంటరితనం, అంగవైకల్యం ఎంత బాధాకరం అనుకుంది మాధవి. కానీ, దేవుడు తనను ఒంటరిగా విడువడని, తోడుగా ఉంటాడని తెలీక బాధపడిపోయింది. దేవుడు తన జీవితంపట్ల గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడనీ, తనను అందుకోసమే ఏర్పాటు చేసుకున్నాడనీ ఆమెకి అప్పుడు తెలీదు. మానవులం కదా! భవిష్యత్ గురించి తెలీనివాళ్ళం . అపుడు మాష్టారు వచ్చి ఎత్తుకొని లోపలికి తీసుకెళ్ళారు. ఆ సంవత్సరం చాలా వీక్ అయిపోయి నరాలన్నీ బలహీనంగా అయిపోయి నీరసించి పోయింది. కళ్ళు బాగా ఎర్రగా అయిపోయి తలపోటు బాధిస్తుంటే డాక్టర్ కి చూపించి కళ్ళజోడు వేయించారు.

తర్వాత 10వ తరగతి పాస్ అయింది. మాధవి అమ్మ నాన్న గార్ల కష్టం ఫలించింది. చాలా సంతోషించారు. బాధలోనే సంతోషం ఇరుకులోనే విశాలత వారి జీవితాలలో కనిపిస్తున్నాయి కదా ! తర్వాత వారి బంధు మిత్రులందరినీ, తన కిష్టమైన వారినందరినీ పిలిచి చాలా గ్రాండ్ గా విందు చేసారు. గొప్ప గొప్ప వాళ్ళకు కూడా జరగని ఆ సంతోషం, అట్టహాసం అంతా “అయ్యో! పాపం మాధవి” అనుకునేలా చేశాయి. మాధవి అంటే ఆ కుటుంబంలో అందరికీ అంత ఇష్టం.

తర్వాత కాలేజిలో జాయిన్ అయింది. సి.ఇ.సి. గ్రూప్ తీసుకుంది. 10వ తరగతి అయ్యాక కూడా ఆమె తన పట్టు విడవకుండా తన ధైర్యాన్ని, తన మనోనిబ్బరాన్ని మరోసారి రుజువు పరచుకుంది. కాలేజిలో మంచి ఫ్రెండ్స్ దొరికారు. అయినా కాలేజికి వెళ్ళాలంటే మామూలుగానే కొంచెం టెన్షన్‌గా ఫీలయ్యేది. అందరిలాంటి మనిషిని, అందరిలాంటి అమ్మాయిని కాలేకపోయానే అని తనలో తాను చాలా మధనపడేది. క్లాసెస్ ఒక్కోసారి వెంటనే వదిలేస్తారు. ఒక్కోసారి 2 గంటల వరకు ఉంచేస్తారు. కంటిన్యూ చేస్తారు, అని భయపడేది. తను అక్కడ ఫస్ట్ ఇంటర్ చదివి అది పూర్తయ్యాక సెలవుల్లో వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి 10 రోజులు ఉన్నది. ఆ సెలవు రోజుల్లో బైబిల్ చదివేది. ఎక్కువగా కీర్తనల గ్రంథం చదివేది. అయినా సరిగా అర్థం అయ్యేది కాదు. ఆ సెలవు రోజులు చాలా జాలీగా గడిపింది. తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. సెకండ్ ఇయర్ కి బుక్స్ కొనమని వాళ్ళ డాడీతో చెప్పింది.

కాలేజికి వెళ్ళడం అంటేనే తనకెన్నో సమస్యలు. ఇలా తన సమస్యలన్నీ వివరంగా చెప్పాలంటే ఈ పుస్తకం సరిపోదు. ఎన్నో సమస్యల కష్టాల సుడిగుండంలో ఏకాకిగా, వేదన పడుతున్న మాధవి జీవితం
ఎలా మలుపు తిరిగిందో చూద్దాం.

7. మేలు మలుపు

ఆ రోజు 8, జూలై 1995. తన ఫ్రెండ్స్ తో ' గడిపింది. 4 సినిమాలు టి.వి.లో చూసి, కేరమ్స్ ఆడుతూ లోకంలో ఉండే తాత్కాలికమైన సంతోషంతో ఆనందించింది. ఏదో నామకః బైబిల్ చదివి పాటలు పాడుకుంటూ దేవుని గురించి పూర్తి సత్యం తెలియక నామకార్డ భక్తిని అనుసరిస్తూ స్వస్థత కోసమే యేసుప్రభువు అనుకొని అసత్యంలోనే ఉండిపోయింది. సత్యం చెప్పేవాళ్ళు లేరు. బోధకులే సత్యం చెప్పకపోతే ఇలాంటి ఎన్నో ఆత్మలు నశించిపోక ఏమవుతాయి? సరే, మధ్యాహ్నం అంతా బాగానే గడిచింది. సాయంత్రం 6.30 నిమిషాలకు తలపోటుగా ఏంటోలా ఉందని చేతుల మీదే ఇంట్లోకి పాక్కుంటూ వచ్చి టి.వి. దగ్గర కూర్చొని టి.వి. చూస్తున్న ఆమెకు ఒక్కసారిగా కళ్ళు చీకటిగా అయిపోయి, వెంటనే పెద్దగా అరిచింది. 'బాబోయ్, నాకళ్లు కనిపించడం లేదు. అంతా చీకటి. నా శరీరం అంతా ఏదోలా అయిపోతుంది' అని అలాగే క్రిందకి వాలిపోయింది. శరీరం అంతా తిమ్మిరిగా పట్టు వదిలేసినట్లుగా అయిపోయింది. తలదిమ్మెక్కి సత్తువంతా పోయి తన శరీరం పూర్తిగా తన ఆధీనంలో లేకుండా పోయింది. అలాగే తనను తీసుకెళ్ళి మంచంమీద పడుకోబెట్టారు. కళ్ళు కనిపించడం మానేసాయి. మొత్తం అంధకారమైపోయింది. తన జీవితమే చీకటైపోయింది అనుకొంది. ఒళ్లంతా బెండువారిపోయింది. చేతులు కదపలేక పోతోంది. వెంటనే యూరిన్ కూడా అయిపోయింది. తణుకు హాస్పటల్ లో కష్టంగానే జాయిన్ చేసుకున్నారు. ఆ తల్లి ఏడుస్తూ 'నా బిడ్డకు ఏం జరిగింది. అంటే అతను విసుక్కుని 'మీ వాళ్ళందరికీ కబురు చేయండి. ఈ అమ్మాయి బ్రతకదు' అని చెప్పాడు. వాళ్ళు అందరికి కబుర్లు పెట్టారు. ఆ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డ మరణం కోసం ఎలా సిద్ధపడతారు? దాన్ని ఎలా ఎదుర్కొంటారు?

ఒక్కగానొక్క బంగారు కూతురు గురించి కన్న కలలన్నీ చెదరిపోయాయి వారి ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. దుఃఖ సాగరంలో మునిగిపోయారు వాళ్ళ వీధిలో మాధవి చనిపోయిందని చెప్పుకొని చూడ్డానికి వీధి వీదంతా సిద్ధపడ్డారు. జ్వరం కంట్రోల్ కాలేదు. బ్రెయిన్ ఫీవర్ అన్నారు. ఎమర్జెన్సీ రూమ్ లో జాయిన్ చేసారు. 4 రోజులు బ్లడ్, యూరిన్ పరీక్షలే చేసారు 18 రోజులు ట్యూట్ల ద్వారానే యూరిన్ తీసేవారు. ఎవర్నీ ఆమె దగ్గర ఉండనిచ్చేవారు కాదు. ఆ 18 రోజులు వెల్లకిలానే పడుకొంది. తర్వాత కొంచెం సేపు అటు, కొంచెం సేపు ఇటు తిప్పమని తల్లిని అస్తమానం అడిగేది. ఆమె తల్లికి రాత్రి పగలు నిద్ర ఉండేది కాదు. మాధవికి తలపోటు, మెడపోట్లు ఎక్కువై కూర్చో పెట్టమనేది, వెంటనే పడుకోబెట్టమనేది. ఇలా ఎన్నో రాత్రులు నిద్రకాచారు. ఇంట్లో అందరూ తండ్రి, తల్లి, అన్న మాధవి గురించే ఆలోచిస్తూ ఉంటే ఈ కుటుంబం చెల్లాచెదురు అయిపోయినట్లుగా అనిపించేది. హాస్పటల్ లో ఉన్న మాధవి దగ్గరకు ఆమె ఫ్రెండ్స్ వచ్చేవారు. వాళ్ళతో తన చదువు గురించి మాట్లాడి 'నాకు బాగయితే నేను కాలేజికి వచ్చేస్తాను. అంతవరకు నా నోట్స్ వ్రాసి పెట్టండి' అని ప్రాధేయపడింది. మనిషికి జీవితాన్ని ఇచ్చినవాడు, బతుకు మీద ఆశలు పెంచినవాడు దేవుడే. ఆ దేవుడే లేకపోతే మనం జీవించలేము.

మాధవి హాస్పటల్ లో ఎన్నో బాధలు పడుతూనే ఉంది. రాత్రులు అయితే ఇంకా బాధపడేది. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేది. శ్వాస అందక రాత్రులు చాలా బాధపడేది. వేదన పడేది. పగలు, రాత్రి 24 గంటలు ఏదో తెలీని బెంగ ఆమె మనస్సులో ఆవరించేది. తనకు ఇంక తగ్గదేమో అని ఒక్కోసారి చెప్పలేని నిరాశలో మునిగిపోయేది. తన వయస్సును బట్టి తాను ఎంతో చదువుకోవాలని, ఎన్నో కలలు కనేది. ఆ కలలు కలలుగానే మిగిలి పోతాయేమో అని ఆలోచిస్తూ ఉంటే భరించలేకపోయేది. ఒకరోజు నర్సు ఆమెకి ఇంజెక్షన్ చేసి చర్మంలో సూది వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత వాళ్ళ అమ్మగారు చూసి కంగారుపడి నర్సుని పిలిస్తే అప్పుడు తీసింది. ఆమెకు మాత్రం స్పర్శ లేదు. రోజూ యూరిన్ను ట్యూబ్స్ ద్వారానే తీసేవారు. ఒకరోజు యూరిన్ మామూలుగా జరగాలని ట్యూబ్ తీసేసి వెళ్ళిపోయారు. కొంతసేపటికి పొట్ట ఉబ్బిపోయింది. కాని యూరిన్ అవ్వలేదు. ఇదేమీ మాధవికి తెలియదు. ఆమె తల్లి చూసి గబగబా మందుల షాపుకి వెళ్ళి ట్యూబ్ తెచ్చిపెట్టారు. ఒక రోజు మాధవి తల్లి తండ్రి ఇంటికి వెళ్ళారు. మళ్ళీ పొట్ట ఉబ్బిపోయి యూరిన్ అవలేదు. డాక్టర్ వచ్చి పొట్టను నొక్కితే అపుడు యూరిన్ అయింది. తర్వాత మళ్ళీ జ్వరం వచ్చేసేది. ఆమె తల్లి అనుక్షణం మాధవిని కనిపెట్టుకోవలసి వచ్చేది.

మాధవి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న కరుణ అనే విశ్వాసి ఒక రోజు ఆమె వెళ్ళే బేతేల్ అసెంబ్లీ చర్చి పాస్టర్ జాషువా జూడ్ గారిని ఆయన శ్రీమతిని మాధవి వద్ద ప్రార్థన చేసేందుకు హాస్పిటలకు తీసుకెళ్ళింది. ఆ విధంగా మాధవికి జాషువా జూడ్ దంపతులు మొదటిసారి పరిచయం అయ్యారు. కొంచెం సేపు ఆమెను ఆదరించి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళారు. వారి పరిచయం వల్ల ఆమెకు చాలా ఆదరణ కలిగింది. దైవజనులు వెళ్ళి వాక్యం చెప్పటంద్వారా ఆమెకు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎంతో ధైర్యం కలిగింది.

ఒక రోజు హాస్పిటల్లో కరెంటు పెట్టారు. అన్ని అవయవాలు కదులుతున్నాయి. ఫర్వాలేదు, బాగయిపోతుంది అని ధైర్యం కలిగేది వాళ్ళకు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజు వాళ్ళ నాన్నగారిని దగ్గరకు పిలిచి "నేను ఒకటి అడుగుతాను అడగమంటారా నాన్నా?” అంది మాధవి. "నీ ఇష్టం, నువు ఏది అడిగితే అది ఇస్తాను” అన్నాడు తండ్రి. “నేను బాప్తిస్మం తీసుకుంటాను” అని అడిగింది. ఆయనకు ఇష్టం లేకపోయినా మాధవి మీద ప్రేమను బట్టి "సరే, నీ ఇష్టం” అన్నారు. తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేసారు. యూరిన్ తనకు తెలియకుండానే మంచంమీదే అయిపోయేది. 2 సంవత్సరాల వరకు అలాగే చిన్నబిడ్డకు చేసినట్లు బట్టలు మార్చేది మాధవి తల్లి ఎంతో ఓపికతో. ఒక రోజు మాధవి ఫ్యాన్స్, అంటే బంధువులు రోజుకు 10 నుండి 20 మంది వచ్చేవారు. ఒక ప్రక్క మాధవిని చూచుకొంటూనే వాళ్ళకి టిఫిన్స్, భోజనాలు అన్నీ వండి పెట్టాల్సి వచ్చేది. హాస్పిటల్ లో ఉన్నపుడు చిన్న పుండు పడితే మందు రాస్తే అదే తగ్గిపోతుందని ఊరుకున్నారు. అయితే ఇంటికి వచ్చాక అది పొరకింద ఉండిపోయి చేయి పట్టే అంత లోతు పుండు పడిపోయింది. రోజూ ప్రొదున. సాయంత్రం ఆ పుండుకు డ్రెస్సింగ్ చేసేవారు. ఆ పుండును ఎవరైనా చూస్తే అసలు డ్రెస్సింగ్ చేయలేరు.

ఒక రోజు మాధవి తల్లి ఆలోచిస్తూ మాధవి ఇలాగే ఉంటే ఎన్నాళ్ళని ఇలా చేయగలం అని నిరాశ ఆవరించి దుఃఖంతో ఇద్దరూ కుమిలి పోయేవారు. ఏడవని రోజు అంటూ లేదు. ఇంట్లో మనశ్శాంతే ఉండేది కాదు. పగలంతా పనులు, రాత్రులు తలుపులు వేసేవరకు అందరు వారి దుఃఖం తీరేవరకు, అలసిపోయేవరకు ఏడ్చేవారు. వారి కన్నీళ్ళే వారికి నేస్తాలయ్యాయి. ఒకసారి విజయ్ ఫ్రెండ్ ఒక సేవకుని తీసుకొచ్చి ప్రార్థించమని కోరగా, అతడు చాలా హడావిడి చేసి దయ్యం ఉందని చెప్పి మాధవి వేలు పట్టుకొని గట్టిగా నొక్కుతూ 'నీ పేరు ఏంటి?” అని బైబిల్ తలమీద పెట్టి 'బరువుగా ఉందా?' అంటే 'బైబిల్ ఎంత బరువు ఉంటుందో అంతే బరువు ఉందని' తెలివిగా సమాధానం చెప్పింది. 'నీ పేరు ఏంటి ?' అంటే 'మాధవి' అంది. 'కాదు, నీ అసలు పేరు చెప్పు' అని దయ్యం ఉందని చాలా హడావిడి చేసి 'తర్వాత వస్తాను' అని వెళ్ళిపోయాడు. వేరే సేవకుడు అప్పుడప్పుడు వస్తుండేవాడు. అతను వచ్చేసరికి మాధవి టి.వి. చూస్తుండడం చూసి, 'నీకు అనారోగ్యం ఉందన్న బెంగేలేదు. టి.వి. చూస్తున్నావు!” అనగానే విజయ్ కి కోపం వచ్చి 'మాకు ఎంత బాధ ఉందో మీకేం తెలుసు? దేవునికి తెలుసు. ఆదరించడానికి రావాలి కానీ, ఇలా బాధపెట్టడానికైతే అసలు రావద్దు' అని చెప్పేశాడు. అతను ఇంకెప్పుడూ రాలేదు.

కొన్ని రోజుల తర్వాత దేవుని ఎరిగిన ఓ బంధువురాలు కొంతమంది సిస్టర్స్ ని తీసుకొచ్చింది. వాళ్ళు భాషలతో ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. ఆ బంధువురాలు మాధవితో ఎవరికోసం ప్రార్థన చేసినా ఏడుపు వచ్చేది కానీ, నీకోసం ప్రార్థిస్తుంటే ఏడుపు రావట్లేదు' అని అన్నది. 'మా బాధల గురించి మాకు ఏడుపు వస్తుంది కానీ, మీకెందుకు వస్తుందని మాధవి అన్నది. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే దేవుని సంకల్పంలో మాధవి లేదు అని. మనుష్యుల ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు ఒకటెలా అవుతాయి? ఒక సేవకుడు ప్రతివారం వచ్చి మాధవి గురించి ప్రార్థన చేసి కానుక ఇస్తే తీసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు అతను వచ్చినపుడు మాధవి వాక్యం చెప్పమని అడిగితే 'నాకు ఖాళీ లేదు' అని వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు. మాధవి మాత్రం దేవున్ని విడిచి పెట్టలేదు. వాక్యం కోసం, దేవుని మాటల కోసం తపిస్తూ ఉండేది. కానీ ఆమెను సరైన సత్యంలోకి, సత్యమైన వాక్యంలోకి నడిపించేవారు ఎవరూ ఆమెకు దొరకలేదు.

వేసవికాలంలో మాధవికి చాలా నీర్సంగా ఉండేది. సాయంత్రం వేళ బయట మంచం వేసి పడుకో బెట్టేవారు. ప్రతిరోజు ఇంటి ముందున్న విశ్వాసి బైబిల్ చదివి ప్రార్థన చేసి వెళ్ళేది. ఆమె గండి ఇశ్రాయేలు గారు వ్రాసిన జక్కయ్య, అపొస్తలుల బోధన ఇంకా ఎన్నో పుస్తకాలు, ఎన్నో పత్రికలు తెచ్చి మాధవికి చదువుకోమని ఇచ్చేది. అవన్నీ చదివేది మాధవి. ఆమె ఆత్మీయంగా చాలా బలపడుతోంది.

8. పరలోకం దిగి వచ్చిన వేళ

తర్వాత తణుకు లో బేతెల్ చర్చి పాస్టర్ జాషువా జూడ్, ఆయన భార్య విజయ 1993వ సంవత్సరం నుండి దేవుని సేవలో ఉన్నారు వారిరువురూ మాధవిని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. మాధవికి రక్షణ పొందాలనే ఆశ రోజురోజుకు తీవ్రమయ్యింది. తన హృదయాన్ని దేవునికి సమర్పించాలని తీర్మానం చేసుకుంది. మేలు జరిగితే నిను నమ్ముతాను అంటారు చాలామంది. కాని మేలు జరిగినా నమ్మరు కొంతమంది. అయితే మాధవి జీవితంలో శరీర స్వస్థత కలగక పోయినా ఆమె ఆత్మీయ స్వస్థతను కోరుకుంది. తన పాపాలు క్షమింపబడాలని కోరుకుంది. ఈ లోక పాప ఆశలన్నీ విడిచి పెట్టడానికి, పూర్తిగా మారిపోవడానికి హృదయపూర్వకంగా దేవుని ప్రేమించడానికి తీర్మానించుకుంది. మారుమనస్సు పొందాలనే ఆమె ఆశను చూసి అంతా చాలా సంతోషించారు. ఆరోజు పాస్టర్ జూడ్ దంపతులు మాధవి దగ్గరకు వెళ్లి కొంచెం సేపు వాక్యాన్ని ధ్యానించి తీర్మానం చేయించారు. అపుడు మాధవి తన హృదయంలో చెప్పనశక్యమైన సంతోషాన్ని అనుభవించింది. మాధవి రక్షణ పొందింది. పరలోకంలో దేవదూతలంతా గొప్ప సంతోష విందు చేసుకొని ఉంటారు. 16-11-97వ తేదీన మాధవి యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించింది. ఎంతో ఉన్నతమైనవారు, లోకంలో ఘనులకు లేని సంతోషం, ఘనత, ధన్యత ఆమె పొందింది. ఆమెను ముద్దు పెట్టుకొంటుంటే సొంత సొదరిలా అనిపించిందన్నారు దంపతులు. ఇపుడు వారంతా ఆత్మీయంగా ఒక ఇంటివారు అయ్యారు. తనని చూస్తూ తనతో మాట్లాడుతూ ఉంటే ఏంటో ఆమె దగ్గరే అలా ఉండిపోవాలనిపిస్తుంది.

బాప్తిస్మానికి కూడా సిద్ధపడింది మాధవి. అయితే చాలా టెన్షన్ ఫీల్ అయింది. కాని బాప్తిస్మం కోసం సిద్ధపడడంలో ఆమె పట్టుదల సడలిపోలేదు. అయితే తన బలహీనతల వైపు దృష్టి మరలిస్తే తన
పరిస్థితులలో నలిగిపోయేది మాధవి. ఆమె అన్నయ్య, అమ్మ మాధవిని తీసుకొని టేక్సీలో తాడేపల్లిగూడెం వెళ్ళారు. మందిరం దగ్గరయ్యే కొద్దీ మాధవి టెన్షన్ ఫీలయ్యింది. అందరు తనను చూస్తారు, ఏమనుకుంటారో అని అందోళన చెందింది. ఆ రోజు బాప్తిస్మానికి ముందు వాక్యం చెప్తుండగా "జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమచేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను” (ఎఫెసీ 1:6) అన్న వాక్యంలో మాధవి ఎంతో ఆనందాన్ని నిరీక్షణను అనుభవించగలిగింది. నేను పుట్టినప్పటి నుండే దేవుడు నన్ను ఏర్పరచుకొన్నాడు అనుకొంది. అయితే నేను పుట్టక మునుపే, ఇంకా జగత్తు పునాది వేయబడక మునుపే నేను దేవుని ఏర్పాటులో ఉన్నానా అని ఆమెకు తెలీని సంతోషం, ధైర్యం, ఆశ్చర్యం కలిగాయి. తన కుటుంబంలో ఎవ్వరూ దేవుడు అంటే ఏంటో రుచి తెలియనివాళ్ళే.

అయితే మాధవి ఒక్కతే బాప్తిస్మానికి సిద్ధపడింది. 1998 జనవరి 18న బాప్తిస్మం తీసుకుంది. బాప్తిస్మానికి వెళ్ళేటపుడు ఆమె అన్న విజయ్ తన చెల్లిని ఎత్తుకొని చేతులమీద తీసుకెళ్ళాడు. తనకు నమ్మిక లేకపోయినా చెల్లి మీద ప్రేమతో తాను కూడా నీళ్ళలో దిగాడు. చెల్లిని ఎత్తుకొని మెట్ల మీద నుండి నీళ్ళలోకి దిగుతుంటే జారి పడిపోబోయి ఆపుకున్నాడు. దేవుని ఆజ్ఞను నెరవేర్చడం కోసం మాధవి పడే కష్టాలను చూసి ఇంకా రక్షణ పొందని వారు, బాప్తిస్మం నిరాకరించేవారు, ఆలస్యం చేసేవారు సిగ్గు తెచ్చుకోవాలి. తర్వాత తన అన్నయ్య పట్టుకొనగా, పాస్టర్ గారు మాధవికి ముంచడం బాప్తిస్మం ఇచ్చారు. అందరూ సంతోషంగా ఇంటికి వచ్చేసారు. బాప్తిస్మం తీసుకున్న 2 సంవత్సరాలకు 1999 డిసెంబర్ 31 రాత్రి వాగ్దానాల పండుగకు తణుకులో ఉన్నా ఎప్పుడూ మందిరానికి రావడం కుదరని మాధవిని ఆ రోజు టేక్సీలో తీసుకొచ్చారు. ఆమె తల్లి ఆమెని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొచ్చి ఇల్లంతా చూపించారు. 'ఇన్నాళ్ళకు మా ఇంటికి వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు శ్రీమతి విజయా జూడ్.

1.1            1.2

 

1.3                  1.4

1.5             1.6

 

9. జూడ్ దంపతుల ఆధ్యాత్మిక పోషణలో....

మాధవి ప్రతివారం మందిరానికి వచ్చి బల్ల ఆరాధన తీసుకొనే పరిస్థితిలో లేదు. అయినా దేవుడు ముందుగానే ఎలా ఏర్పాటు చేసాడో. ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు మన ఊహకు అందవు. ప్రతి మానవుని జీవితంలో ఆయన తీసుకొనే శ్రద్ధ ఈ లోకంలో ఎవరూ తీసుకోలేరు. అంతవరకు ఎందుకు, మన గురించి మనమే శ్రద్ధ తీసుకోలేము. దేవుడు మనకంటే ఎక్కువగా మనగురించి చింతిస్తాడు. మనల్ని మనం ప్రేమించుకున్న దానికంటే ఆయన మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఫిబ్రవరి 1వ తేదీన మాధవి ఇంటి ఎదురుగా ఉన్న విశ్వాసి ఇంట్లోనే ఆరాధన జరిగించడం, ప్రతివారం జాషువా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళడం మొదలైంది. తన ఇంటి ఎదురుగా వాక్యం చెప్తున్నా ఆమె వినడానికి కుదరలేదు. పాస్టర్ గారు మైక్ పెట్టుకొని మాధవి వాళ్ళ ఇంటిలో తన గదిలో రేడియో ఎఫ్.యం. లో వాక్యం వినేలా ఏర్పాటు చేసారు. ఆమెకున్న ఆసక్తి, వాక్యం వినాలనే ఆపేక్ష చూసి అందరికి ఆశ్చర్యం కలిగేది.

ప్రతివారం వాక్యం చెప్పి, ప్రభువు భోజనం ఇచ్చి వచ్చేవారు పాస్టర్ గారు. మనకి కూడా ఆశ ఉండాలే గాని, దేవుడు తప్పక మన ఆశను తృప్తిపరుస్తాడు. మాధవి ఆశ ఏంటంటే 'తాను రక్షింపబడింది, అలాగే తన తల్లి, తండ్రి, అన్నయ్య కూడా మారాలి, రక్షణ పొందాలి' అన్నదే. దానికోసం ఆమె ఎంతో ఏడుస్తూ ప్రార్థించేది. ఆమె తండ్రి, అన్నయ్య కూడా దేవుడంటే అంత ఇష్టంగా ఉండేవారు కాదు. వాక్యం వస్తున్నా సరే, పట్టించుకోకుండా కోపంగా ఉండేవారు. మాధవి నాన్నగారు విగ్రహాలనే పూజించేవారు. విజయ్ మాత్రం ఎవర్నీ నమ్మేవాడు కాదు. తన చెల్లికి ఎందుకు ఇలా వచ్చింది. తన బంగారు చెల్లి ఎందుకిలా అయిపోయింది అనే కోపంతో దేవుడంటే నమ్మేవాడు కాదు.

ఒక రోజు మాధవి వాళ్ళ పెదనాన్నగారు వచ్చారు. ఆయన యేసు ప్రభువును నమ్ముకున్నారు. ఆయనంటే మాధవి నాన్నగారికి చాలా గౌరవం, అభిమానం. ఆయనెలా చెప్తే అలా వింటారు. మాధవి తన తండ్రి గురించి పెదనాన్నగారితో చెప్పి ఆయనను ఎలాగయినా మార్చాలి అని చెప్పింది. మాధవి పెదనాన్నగారు స్వయంగా ఆయనే విగ్రహాలన్నీ తీసేసారు. మాధవికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు. ఒక రోజు మాధవి తల్లిగారి ఫ్రెండ్స్ వచ్చి 'బాప్తిస్మం తీసుకుంది కదా మాధవి, తనకి ఏమైన స్వస్థత కలిగిందా?” అని హేళనగా మాట్లాడారు. వాళ్ళ మాటలకు మాధవి తల్లి ధైర్యంగా 'మాకు ఈ లోకంలో శ్రమలు వచ్చినా రాబోయే కాలంలో పరలోకంలో, నిత్యం జీవించే జీవితం ఉన్నది' అని సమాధానం చెప్పారు. ఆమె ఇలాంటి ఎన్నో ఎన్నో నిందలు, లోకం మాట్లాడే ఎత్తిపొడుపు అవిశ్వాసపు మాటలు ధైర్యం చెడిన పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వచ్చేది. విజయ్ కూడా దేవున్ని నమ్మేవాడు కాదు. 'చెల్లికి స్వస్థత కలగలేదు కాబట్టి నేను నమ్మను' అని అనేవాడు. అయితే అతనికి ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఉండేవాడు. అతడు ఎప్పుడు కలిసినా ప్రభువు గురించి సువార్త చెప్తూ ఉండేవాడు. మామూలుగానే ఒక రోజు చెప్తూ ఉంటే విజయ్ కి పట్టుదల వచ్చి 'నేను సవాలు చేస్తున్నాను. నెల రోజులు మోకాళ్ళ మీద ప్రార్థిస్తాను. ఈ నెల రోజుల్లో దేవుడు నా చెల్లిని బాగుచేస్తే అప్పుడు నమ్ముతాను. బాగవ్వకపోతే దేవుడు లేడు' అని దేవునికి నెల రోజులు టైం పెట్టాడు. అయితే అతని ఫ్రెండ్ 'మనం మానవులం, ఆయన దేవుడు, ఆయనకు టైం పెట్టకూడదు. ఆయనెలా చెప్తే అలా మనం లోబడాలి. ఆయన సమయంలో ఆయన ఇష్టానుసారంగా మానవుల జీవితాల్లో చేస్తాడు. మనం అడగడానికి సరిపోము' అని మందలించాడు. అవును, దేవుని చిత్తం ఏమై ఉందో దానికొరకు మనం కనిపెట్టాలి. ఆయన కుమ్మరి, మనం మట్టి. ఆయన మనలను ఎలా రూపించినా అడగడానికి సరిపోము. మనం పడిన ఏ శ్రమయైనా ఒప్పుకున్నా దాన్ని వ్యర్ధంగా పోనివ్వడు. కనుక 'దేవుడు మాధవి జీవితంలో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని ఈ శ్రమద్వారా అర్థం చేసుకోవాలి' అన్నాడు.

ఒక రోజు శ్రీమతి జూడ్ గారు మాధవికి కొత్త నిబంధన కేసెట్ గిఫ్ట్ గా ఇచ్చారు. తను బైబిల్ ఎక్కువ సేపు చదవడానికి వీలు లేకపోవడం వల్ల ఆ కేసెట్ ద్వారా క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ వినగలిగింది. ఆ గిఫ్ట్ చూసి ఆమె చాలా సంతోషించింది.

మాధవి తల్లి మందిరానికి తరచు ఫోన్ చేసి దేవుని గురించి అన్ని అడిగి తెలుసుకొనేది. ఆమెకి కూడా దేవుడంటే ఆసక్తి. అయితే ఆమె భర్తకి పెద్దగా ఇష్టం లేకపోవడం వలన లోలోపలే ప్రార్థించుకొనేది. ఒక రోజు మాధవి నాన్నగారు షాపుకి వెళుతూ టర్నింగ్ లో యాక్సిడెంట్ అయి క్రిందపడిపోయారు. కానీ ఏ దెబ్బా తగలనివ్వలేదు దేవుడు. ఆయనకు దేవుడంటే నమ్మిక లేకపోయినా ఆయన్ని దేవుడు మాత్రం విడిచి పెట్టలేదు. ఆయన జీవితంలో కూడా ఒక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు అని అర్థమవుతుంది. ప్రతి శ్రమ వెనకాల ఒక మేలును ఉంచుతాడు.

ఆ రోజే సాయంకాలం తన భార్యతో షాపుకి వెళ్దాం అని ఎందుకో చెప్పకుండా బయలుదేరారు. తణుకులో ఉన్న బేతెల్ చర్చి అడ్రసు వాళ్ళిద్దరికి తెలీదు. చర్చికి ఎందుకు రావాలనిపించిందో ఏంటో అడ్రసు కనుక్కొని మరీ మందిరానికి వచ్చారు. ఆమె సంతోషానికి పగ్గాలు లేకుండా అయిపోయింది. నా ఆశను దేవుడు అడగకుండానే నెరవేర్చాడు. అని ఆమె మనసులోనే దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నది. 'నా భర్తకి ఇంత మంచి మనస్సు ఎలా వచ్చింది?” అని ఆశ్చర్యపోయింది. ఫ్రూట్స్, డ్రింక్స్ అన్నీ కొని తీసుకొచ్చి పాస్టర్ గారితో చాలా సమయం గడిపి చాలా సంతోషించారు, ఆయనకొచ్చిన శ్రమే ఆయనను ఇలా మార్చింది. ఆయన మారే సమయం వచ్చేసింది అని మాధవి చాలా సంతోషంతో దేవుని స్తుతించింది. 'నాన్నగారు ఇంత త్వరగా మారతారని అనుకోలేదు' అని ఆశ్చర్యపోయింది. తన ప్రార్థనలకు ఇంత త్వరగా దేవుడు జవాబు ఇస్తాడని ఊహించలేదు. కృంగిపోయి ఉన్న తన హృదయాన్ని సంతోషంతో నింపడం కోసం దేవుడు ఆమె కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరిని మార్చడం మొదలు పెట్టాడు. మానవుని జీవితంలో ఆయన కున్న శ్రద్ధ, ఆసక్తి ఎంతో గొప్పది, అమూల్యమైనది. 

మధ్య మధ్యలో శ్రీమతి జాషువా గారు, పాస్టర్ గారు, వెళ్లి అందరికి వాక్యం చెప్పి ప్రార్థించి వచ్చేవారు. మాధవి, పాస్టర్ గారి కుటుంబంలో ఒక సోదరిలా కలిసిపోయింది. ఒక రోజు మాధవి తన హృదయంలో కృంగిపోయి ఇన్ని బాధల్లో నేను ఎందుకు బ్రతకాలి అని చచ్చిపోతే బాగుణ్ణు అని, మనస్సులో ఎంతో వేదనపడుతూ వాక్యం ద్వారా ఆదరణ, బాధలో నెమ్మది దొరుకుతుందని బైబిల్ తీసింది. తన అనుదిన వాక్యం యెషయా 43వ అధ్యాయం ద్వారా దేవుడు ఆమెతో మాట్లాడి ఆదరించాడు. అపుడు ఆమె ఎంతో ధైర్యం తెచ్చుకుంది. తర్వాత ఒక రోజు జాషువా దంపతులు 'నీ పుట్టిన రోజు ఎప్పుడు?” అని అడిగినపుడు తన ముఖంలో బాధతో "నా పుట్టిన రోజు ఇపుడు ఎందుకు? గుర్తు చేసుకోవద్దు, నేను చెప్పలేను” అని బాధతో చెప్పలేదు. అయినా వారు పట్టుదలగా అడిగితే "జూన్ 8వ తేదీన” అని చెప్పింది. “మా బాబు హెరాల్డ్ పుట్టినరోజు కూడా అదే రోజు. దాన్ని మేము బాగా గుర్తుపెట్టుకోగలం” అని చెప్పారు. దైవికంగా కూడా ఆ రోజు ఆమెతో చాలా ప్రోత్సాహంగా గడిపేవారు. మాధవికి భక్తులంటే ఎంతో ప్రేమ, గౌరవం. వారి ద్వారా ఎంతో సంతోషం, ఆదరణ పొందుతున్నానని చెప్పేది. దైవభక్తుల ద్వారా తాను, తన కుటుంబం, ఎంతో ఆదరణ పొందుతూ ఉన్నాం అనేది. 

లండన్ నుండి మిషనెరీగా ఇండియా వచ్చిన ఒకాయన ఒకసారి మాధవిని కలిసి మాధవి సాక్ష్యాన్ని విని ఎంతో సంతోషించారు. ఆయన తమ దేశంలో అనేక స్కూల్స్ లో పిల్లలకు సువార్త చెప్పి మాధవి సాక్ష్యాన్ని పంచుకున్నారు. ఆయన ఎలా సువార్త చెప్పేవారంటే, “ఇండియాలో నేనొక 20 సంవత్సరాల అమ్మాయిని చూసాను. మెడనుండి క్రిందవరకు ఏమీ కదపలేని దుస్థితిలో మంచం పట్టి ఉంది. ఇలాంటి ఆమె ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది కదా ?” అని పిల్లలను ప్రశ్నించగా “అవును” అని ఏక కంఠంతో జవాబిచ్చారు పిల్లలు. వెంటనే పెద్దదిగా చేయించిన మాధవి ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ఫోటోను పిల్లలకు చూపించి, 'మాధవి విచారంగా ఉందా?” అని అడగా “లేదు” అని పిల్లలందరూ ఒప్పుకున్నారు. అప్పుడు ఈ మిషనరీ 'మాధవి సంతోషానికి, నిజమైన శాంతి రహస్యం క్రీస్తు ప్రభువును తాను సొంత రక్షకునిగా కలిగి ఉండటమే' అని చెప్పారు. ఆరోగ్యం , డబ్బు, సౌఖ్యాలు ఉన్న అనేక మందికి లేని నిజమైన, నిత్యమైన శాంతి, సంతోషం , నిరీక్షణ మాధవి కలిగి ఉండడానికి కారణం దేవుడే. లోకంలో ఏది ఉన్నా లేకపోయినా క్రీస్తును కలిగి ఉంటే చాలు. ఎందుకూ పనికిరాను అనుకున్న మాధవి జీవితం ద్వారా అనేకమంది క్రీస్తును తెలుసుకుంటున్నారు. 'నాజీవితం వ్యర్థం, ఎందుకూ పనికిరాని నేను బ్రతక్కూడదు' అనుకున్న మాధవి అనేకమందికి ఆశీర్వాదకరంగా ఎలా మారిందో నాకే అద్భుతంగా ఉంటుంది. కొంతమంది పేరు వీధి దాటదు. తాను ఇంట్లోనే ఉంటూ ఎక్కడో వేరే దేశంలో తన జీవిత సాక్ష్య ప్రభావం ద్వారా, తన ప్రభువైన రక్షకున్ని చాటడం గొప్ప సంగతి. 

ఒక ఆదివారం మాధవి వాక్యం వింటుండగా పాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. వియత్నాం యుద్ధంలో ఒక విశ్వాసి బాంబు ప్రేలుడులో తన కళ్ళు పోగొట్టుకున్నాడు. వాక్యం చదవకుండా ఉండలేని అతను బ్రెయిలీ లిపిలో బైబిల్ తెప్పించుకుని వేళ్ళతో చదువుదామని చూస్తే వేళ్ళకి స్పర్శ లేదు. ఎంతో బాధతో పెదవులతో చదువుదామని ప్రయత్నిస్తే పెదవులకు కూడా స్పర్శ పోయింది. ఆ ప్రయత్నంలో తన నాలుక ఆ లిపికి తగిలించి నాలుకతో చదవడం మొదలుపెట్టాడు. ఒక  భక్తుడు అతని గురించి  వ్రాసేటప్పటికే అతను 4 సార్లు పూర్తిగా బైబిల్ చదివేశాడు. కళ్ళున్న మీరు బైబిలు ఎన్నిసార్లు చదివారు? అని ప్రశ్నించారు. మాధవి అతన్ని సవాలుగా తీసుకొని అప్పటి నుండి బైబిలు సంవత్సరానికి 2 సార్లు పూర్తిగా చదవడం మొదలు పెట్టింది. అస్వస్థతకు గురైన మాధవియే ఇన్నిసార్లు బైబిల్ చదవగల్గితే మనం ఇంకెన్నిసార్లు చదవాలి? 

తన అన్న, నాన్నగారు కూడా మారాలి, వారు కూడా రక్షణ పొందాలి అని ఆశతో ఉండేది మాధవి. తన తల్లి, మాధవి ఉపవాసంతో ప్రార్ధించేవారు. లోకానికి భయపడి ఆయన బాప్తిస్మానికి ఒప్పుకొనేవారు కాదు. ఒక వైపు వాక్యం వింటూనే అటు లోకంవైపు కూడా ఉండేవారు. తన భార్య బాప్తిస్మం తీసుకుంటానని అన్నప్పుడల్లా 'నువ్వు బొట్టు తీయడం కుదరదు' అని కోపపడేవారు. ఈయన ఎప్పుడు మారతారో అని రోజూ పట్టుదలగా ప్రార్థించేవారు. ఇలా ఉండగా మాధవి తన అమ్మమ్మకు వాక్యం చెప్పి, సువార్త చెప్పి, ఆమెను రక్షణలోకి నడిపించింది. తన అన్నయ్యకు ప్రభువు గురించి చెప్తుంటే అతడు వాదించేవాడు. ఒక్కోసారి మాధవి, 'తండ్రీ! నాయనా' అని దేవుని పిలుస్తుంటే 'అన్నయ్యా అని పిలువు. అపుడు నేను వచ్చి సాయం చేస్తాను కానీ, నాయనా, తండ్రీ అంటే ఎవరు వస్తారు?” అని హేళనగా మాట్లాడాడు విజయ్. 'దేవుడు ఎంత శక్తిమంతుడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియక తను అలా మాట్లాడాడులే' అని మాధవి భారమైన మనస్సుతో మౌనంగా అతని గురించి ప్రార్థించేది. 

ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చేవారు. ఆమెను ఆదరించవలసింది పోయి ఇంకా నిరుత్సాహపరచేవారు. అయినా ఆమెకి దేవుని మీద ఉండే స్థిరమైన విశ్వాసం పడిపోకుండా కాపాడుకోడానికి చాలా కష్టపడేది. తాను అవిశ్వాసం చెందకుండా 'అందరికీ కష్టాలు వస్తాయి, అయితే దేవుని నమ్మితే ధైర్యం, శాంతి, నిరీక్షణ ఉంటుంది' అని చెప్తూ, 'అయినా ప్రభుని నమ్మనివారికి మాత్రం కష్టాలు రాకుండా ఉంటాయా?' అని ఎదురు ప్రశ్న వేసేది. ఒకామె వచ్చి 'నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా? అవునులే, తీసేసుకోవాలిలే మరి' అని ఒక రకమైన అర్థంతో అంటే (ఇంక చనిపోతావు కదా అని) మాధవి ఎంత బాధపడి ఉంటుందో అర్థం చేసుకోగలం. అలా ఎవరు వచ్చినా ఏదో రకంగా బాణాల్లాంటి మాటలు విసురుతూనే ఉండేవారు. ఆమె విశ్వాసానికి పరీక్షలు ఎదురవుతూ ఉండేవి. దేవుడిచ్చే శాంతి లోకమిచ్చినట్లుగా ఉండదు అన్నట్లు ఆమెను దేవుడు నిత్యము తన శాంతితో నింపేవాడు.

10. చిన్ని ఆశయం 

కొన్నాళ్ళు పోయిన తర్వాత విజయ్ సింగపూర్ ప్రయాణం కోసం డబ్బు కట్టాడు. మద్రాసు వెళ్ళిపోయాడు. ఏజెంటు రాలేదు. మోసం జరిగింది. విజయ్ కంగారుగా టెన్షన్ పడి బాధగా తిరిగి వచ్చేశాడు. ఈ సమస్య ద్వారా అతడు దేవుని సహాయం కోరి మందిరానికి వచ్చాడు. ఈ సమస్యే తన భవిష్యత్తుని మార్చబోతోందని అతనికి తెలియదు. అవును, శ్రమలు, కష్టాలు మనల్ని దేవునికి దగ్గరగా తీసుకొస్తాయి. విజయ్ జీవితంలో ఇదే అక్షరాల నిజం అయింది. అతనికి పాష్టర్ గారు వ్యక్తిగతంగా వాక్యం చెప్పి ప్రార్థించారు. ఆ రోజునుండి దేవుని మీద కొంచెం విశ్వాసం మొదలయింది. అతడు తన చెల్లిని, దేవుని గురించి చెప్పు అని ఆసక్తిగా అడగడం మొదలుపెట్టాడు. ఎంత మార్పు! మాధవి ఆసక్తితో, పట్టుదలతో కూడిన ప్రార్థనలే ఆమె అన్నను మార్చాయి. 4 నెలల తర్వాత సౌదీ వెళ్లాడు. విజయ్ వెళ్ళేటపుడు 'బైబిల్ ని తీసుకొని వెళతాను, అది లేనిదే నేను వెళ్ళను' అని బైబిల్ ని తీసుకెళ్ళాడు. ఇంత త్వరగా అతడు మారడం ఆ కుటుంబంలో ఒక అద్భుతమే. 'దేవుని చిత్తమైతే నేను వెళతాను. బైబిల్ గురించే నన్ను ఆపేస్తే వెనక్కి తిరిగి వచ్చేస్తాను' అని గొప్ప విశ్వాసం కనపరచి బైబిల్ ను పెట్టెలో సర్దుకున్నాడు. తన చెల్లితో ప్రార్థన చేయించుకున్నాడు. చెల్లిని వదలలేక వదలలేక వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ముంబాయిలో ఒక రూమ్ లో దిగారు. విజయ్, వాళ్ళ నాన్నగారు ప్రక్కనే పడుకున్నారు. తెల్లవారు ఝామున చూసుకుంటే ప్రక్కన విజయ్ కనిపించలేదు. కంగారుగా లేచి చూసేసరికి ఒక మూల మోకాళ్పూని ప్రార్థన చేసుకోవడం కనిపించింది. తండ్రికి చాలా సంతోషమైపోయింది. 'నా చిన్న బిడ్డే అంత విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటుంటే నేనెందుకు మారకూడదు? నేనెందుకు ప్రార్థించ కూడదు?” అని అప్పుడే ఆయన కూడా తీర్మానించుకున్నారు. 

మర్నాడు ఎయిర్పోర్టుకి వెళ్ళారు. అక్కడ తన వస్తువులన్నీ చెక్ చేసారు. అయితే క్లీన్‌గా పంపించేసారు. ఆశ పడిన ప్రాణాలను సేద దీర్చి తృప్తిపరచేవాడు ఆయనే. తన ప్రయాణం కన్ఫర్మ్ అయింది. సౌదీ వెళ్ళిపోయాడు. తన జీవితంలో దేవున్ని ఆయన వాక్యాన్ని ముఖ్యంగా ఎంచుకొన్నాడు. కనుకనే అతడు అడిగినదాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. మాధవికి తన అన్న గురించిన భారం తగ్గింది. ఇక దేవునిలోకి నడిపించడానికి నాన్నగారు ఉన్నారు. ఇది తనకి దేవుడిచ్చిన బాధ్యతగా పెట్టుకొంది. ఆమె అంత అనారోగ్యం , శ్రమలో ఉండికూడా తన కుటుంబం రక్షించబడాలని, ఇతరులను ప్రభువు వైపు తిప్పాలనే ఆసక్తిని చూస్తూంటే మనం కూడా ఆమెలా ఆత్మల దాహంతో ప్రజలను రక్షకుడైన దేవుని వైపు తిప్పాలని అనిపించడం లేదా? సౌదీ వెళ్ళాక తన అన్న రాసిన లెటర్స్ చదివి మాధవి దేవుణ్ణి ఎంత స్తుతించినా ఈ స్తుతులు చాలవు అనుకునేది తన మనస్సులో. “చెల్లీ, మన జీవితకాలం దేవుని యెడల విశ్వాసంతో భయభక్తులతో కృతజ్ఞత కలిగి ప్రభువును వెంబడించాలి. దేవుని ఎన్నడు విడిచి పెట్టకూడదు” అని రాసేవాడు విజయ్. ఇలా ఎన్నో విలువైన ఆత్మీయమైన దైవ తలంపులతో ఉత్తరాలు రాసేవాడు. 

ఇక తన తండ్రితో దేవుని గురించి వాదిస్తూ ఆయనకి వాక్యం చెప్పి ఆయన్ను ఒప్పించడం మొదలు పెట్టింది. దేవుని గురించి చెప్పినపుడు ఆయన 'అంతా ఒకటే' అనేవారు. మాధవి చాలా జ్ఞానంగా సమాధానం చెప్పింది. " జ్ఞానం లేనపుడు చిన్న పిల్లవాడు ఎవర్ని చూసినా 'నాన్నా, నాన్నా' అంటాడు. అయితే జ్ఞానం వచ్చి ఎదిగాక తన తండ్రి ఎవరో తెలుస్తుంది. ఒకడే తన తండ్రి అని గ్రహిస్తాడు. అలాగే జ్ఞానం లేనపుడు ఏది చూసినా అన్నీ దేవుళ్ళనే అనుకుంటాం. కాని జ్ఞానం వచ్చాక, ఎదిగాక దేవుని తెలుసుకోవాలి కదా!” అని ధైర్యంగా చెప్పింది. సమయం దొరికినపుడు ప్రతిసారి ప్రభువు గురించి చెప్పనిదే వదిలేది కాదు. తన తండ్రి ఏదో ఒక రోజు మారకపోతాడా అనే నిరీక్షణతో ఉండేది.  

బంధువులు ఎవరు వచ్చినా ప్రభువు గురించి చెప్పేది. ఒక రోజు గర్భవతి అయిన ఒక క్రైస్తవ స్త్రీ మాధవి దగ్గరకు వచ్చింది. మాటల మధ్యలో 'అన్ని దేవుళ్ళూ నాకు సమానమే' అన్నది ఆమె. మాధవి చాలా తెలివిగా సమాధానం ఇచ్చింది. 'ఇపుడు నీవు గర్భవతివి కదా ఈ ఊరిలో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు. ఉదా: పశువుల డాక్టర్స్ కూడా ఉన్నారు గదా? అయితే మీకు సంబంధించిన అవసరమైన డాక్టర్ దగ్గరకే వెళతారు కదా! అలాగే మనకోసం ఒక్క దేవుడే ప్రాణం పెట్టాడు ఆయనే యేసుక్రీస్తు. మన పాపాలను పోగొట్టే ఆయనే మనకు అవసరమైన రక్షకుడు. కనుక లోకంలో కలిసిపోక ప్రత్యేకంగా ఉండండి' అని 2కొరింథీ 6:18 వాక్యాన్ని గుర్తు చేసి చెప్పేసరికి ఆమె ఆశ్చర్యపోయి వెళ్ళిపోయింది. 

మరొకసారి ఒకామె వచ్చి 'మేము కొబ్బరి ముక్క ఇస్తే మీరు తీసుకోరు. మేము దేవుని నమ్ముకున్నాం. అంటారు. మేము మాత్రం మీరు మీటింగ్ ప్రసాదం ఇస్తే అది తింటాం. అదే వచ్చింది మీకు మాకు' అని నిష్ఠూరంగా మాట్లాడింది. ఆ మాటలకు మాధవి 'మీరు దిష్టి తీసిన కొబ్బరి ముక్క తింటారా?” అన్నది. ఆమె 'తినం' అంటే 'ఎందుకు తినరు?” అని అడిగింది. ఎందుకంటే అవి దయ్యానికి పడేస్తాం. అందుకు' అని ఆమె చెప్పింది. అపుడు మాధవి “మీకు అది ఎలాగో మీరు ఇచ్చిన కొబ్బరి ముక్క మాకు అలాగే ఉంటుంది. బైబిల్ లో విగ్రహాల దగ్గర పెట్టింది తినకూడదు అని ఉంది. యేసుక్రీస్తే దేవుడు అని వ్రాసి ఉంది” అని చెప్పింది. 'నీకు జబ్బు తగ్గకపోయినా నమ్ముకున్నావు' అని ఆమె అంటే 'అనారోగ్యంతో నేను చనిపోయినా మాకు పరలోకం ఉంది గనుక' అని మాధవి అన్నది. “నువ్వు చూసొచ్చావేంటి?” అంటే “చూచి నమ్మినవారికంటే చూడక నమ్మినవారు ధన్యులు” అని సమాధానం చెప్పింది. అంతే, ఆమెకి కోపం వచ్చి మాధవితో ఇంక మాట్లాడకుండా వెళ్ళిపోయింది. 

మాధవి బంధువురాలు ఒకామె శ్రమలో దేవుని నమ్మింది. కానీ ఆమె మందిరానికి (చర్చికి) ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఒక రోజు ఆమె  మాధవి వాళ్ళ ఇంటికి వచ్చింది, మాటల్లో "నువ్వు చర్చికి ఎందుకు వెళ్ళటం లేదు" అని అడిగితే "ఇంట్లో బైబిల్ చదివితే చాలు, మందిరానికి వెళ్ళక్కర్లేదు” అన్నది. ఆ మాటకు మాధవి “మీ అబ్బాయి రాజాని స్కూలుకి పంపకుండా ఇంట్లోనే బుక్స్ చదివించవచ్చుకదా ! స్కూలుకి ఎందుకు పంపుతున్నారు?” అని అడిగేసరికి ఆమె మాట్లాడలేక పోయింది. “పుస్తకాలను మనం చదివితే ఎలా అర్థం చేసుకోలేమో, అలాగే ఇంట్లో బైబిల్ చదివినంత మాత్రాన పూర్తిగా అర్థం కాదు. మందిరానికి వెళితేనే బైబిల్ జ్ఞానం, మర్మాలు అర్థమవుతాయి” అని ఎంతో చక్కగా ఒప్పించింది. ఆమె భర్తకు కూడా చెప్పి ధైర్యపరచి ప్రోత్సహించింది. అప్పటినుండి వారిద్దరూ మందిరానికి వెళ్ళడం మొదలు పెట్టారు. 

ఒకసారి ఊరు నుండి వచ్చిన అంకుల్ మాధవితో మాట్లాడుతూ 'అందరూ ఒకటే మాధవీ, అప్పుడు రాముడు, ఇప్పుడు యేసుప్రభువు, అలా ఒక్కో ప్రదేశంలో ఒక్కొక్కళ్ళు. రూపాలు వేరు, నామాలు వేరు. రాజకీయాల్లో ఒకరి తర్వాత ఒకరు ఎలా వస్తారో అలాగే ఈ దేవుళ్ళు కూడా  లోకంలో అందరి కోరికలు తీర్చాలంటే ఒక దేవుని వలన అవదు కనుక అక్కడక్కడ కొన్ని నామాలు ఉన్నాయి. అంతా ఒక్కటే' అని పెద్ద లెక్చర్ ఇచ్చారు. మాధవి కూడా టక్కున సమాధానం ఇచ్చింది. 

“ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక తండ్రే కదా తన బిడ్డలను పోషిస్తాడు. అలాగే ఒక దేవుడు ఈ లోకాన్ని పుట్టించి, తన బిడ్డలను కలుగజేసి పోషించే శక్తి తండ్రియైన దేవుడు ఒక్కడికే ఉంది” అని సమాధానం చెప్పింది. ఆయన 'నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వదు' అంటూ 2 గంటలపాటు వాదించాడు. “మీ గురించి దేవునికి ప్రార్థన చేస్తాను” అని మాధవి చెప్పింది. 

మాధవి అత్త ఒకావిడ “మీరు పూజలు చేసేవారు కదా? మరి ఇప్పుడెందుకు మానేసారు?” అంటే, మాధవి అన్నది, “మీ మనమడు ఇప్పుడు బురదలో కాలు పెట్టేసాడు. పెదయ్యాక అది బురద అని తెలిసి మళ్ళీ వెళతాడా?” అని అడిగింది మాధవి. "అయితే ఏంటి? ఇపుడు మా విగ్రహాలు బురదలా?” అని ఆవిడ ప్రశ్నించగా నవ్వుతూ, “మరి అంతేకదా?” అని అన్నది. 

బాప్తిస్మం గురించి మాధవి నాన్నగారు ఎప్పుడూ వాయిదా వేస్తుండేవాడు. 2000 డిసెంబర్‌లో ఆ కుటుంబం ప్రార్ధన పెట్టించుకున్నారు. ఇశ్రాయేలుగారు ప్రభువు ఎందుకు వచ్చాడో అని సువార్త చెప్పారు. అపుడు మాధవి తండ్రి పాస్టర్ గారితో దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు మేమే దేవునికి దూరంగా ఉన్నాం జనవరిలో బాప్తిస్మం తీసేసుకుంటాం అని అన్నారు గాని తీసుకోలేదు. తర్వాత కూడా వాయిదా వేసేవారు. తన తండ్రి తల్లి రక్షణ గురించి బాప్తిస్మం గురించి మాధవి దేవుణ్ణి ప్రార్థించేది. వాళ్ళు 'మార్చి 25న కూటంలో తీసుకుంటాము' అన్నారు. బాప్తిస్మానికి కావలసిన బట్టలు అన్నీ సిద్ధం చేసుకున్నారు. పుణ్యవతి గారు 2 రోజుల ముందు 22న నారాయణరావు గారిని మందిరానికి తీసుకొచ్చారు. పుణ్యవతి గారికి, నారాయణరావుగారికి పాస్టర్ జాషువా గారు వాక్యం చెప్పి తీర్మానం చేయించారు. కీర్తన 6:11 వాక్యాన్ని రోజూ గుర్తుచేసుకొని ప్రార్థన చేసుకోండి అని తీర్మానం చేయించారు. మాధవి తల్లితండ్రులు కూడా రక్షణ పొందారు. ఆ కుటుంబం ఎంత ధన్యమైనది. “అవును ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు?” గొప్ప రక్షణను ఆ కుటుంబానికి దయచేసిన దేవున్ని మనసారా స్తుతించుకుందాం. మాధవి సంతోషానికి అవధులు లేవు. బాప్తిస్మం తీసుకునే వరకు మాధవికి వాళ్ళ నాన్నగారి మీద నమ్మకం లేదు. పాస్టరమ్మగారు శ్రీమతి విజయ, వారి అత్తయ్య గారు ఒంటరిగా ఉన్న మాధవికి ఫోన్ చేసి “మీ అమ్మగారు, నాన్నగారు బాప్తిస్మం తీసికొన్నారు” అని చెప్పగానే ఎంత భారం దిగిపోయిందో మాధవికి! 

2000 సంవత్సరంలో పాస్టరుగారు నిర్వహిస్తున్న రేడియో వాక్యం 'జుంటి తేనె ధారలు' మధ్య మధ్యలో కొన్ని వారాలు ఆగిపోయింది. 2 నెలల తర్వాత పాస్టర్ గారు 'ఆ డేటు మర్చిపోతే ఎలా? ఇపుడు ఏ డేటులో వాక్యం రాలేదో ఎలా తెలుసుకోవాలి' అనుకుంటూ మాధవి కంప్యూటర్ మైండ్ని అడిగారు. ఫోన్ చేసి మాధవిని అడిగారు వరుసగా డేట్సు చెప్పేసింది. ఎంత జ్ఞానం? ఎంత జ్ఞాపకశక్తి. ఇలా చెప్తే ఎవరు నమ్ముతారు? ఈ పుస్తకం చదువుతున్న మీరు నమగలుగుతున్నారా? నమ్మాలి, ఎందుకంటే ఈ పుస్తక రచయిత్రి స్వయంగా, సాక్షిగా మాధవి జ్ఞానానికి విస్తుపోయారు. షేబ దేశపురాణి సొలొమోను జానాన్ని విన్నట్టుగా వారు ఆమె జ్ఞానానికి ఆశ్చర్యంతో విస్మయం చెందారు. ఆమెకు అందరి బర్త్డేలు గుర్తె. ఒక్కసారి చెప్తే చాలు, ఎక్కడా రాసుకోనక్కర్లేదు. మైండ్లో ప్రింట్ అయిపోతాయి.

సరే, ఇక ఆమె అన్నయ్య ఫోన్ చేస్తే అతనిని రక్షణ తీర్మానం చేసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి అని ఎప్పుడూ కంగారు పెట్టేది. “నేను సౌదీ నుండి రాగానే బాప్తిస్మం తీసేసుకుంటాను. నువ్వేమీ దిగులు పడకు” అని చెప్పాడు. ఇప్పుడిక బంధువులు కూడా రక్షణ పొందాలి అనేదే ఆమె ఆశ. ఆత్మల దాహంతో ఆతృతపడిపోతోంది మాధవి. 

2001లో తమ ఇంటిపైన మరో అంతస్తు కట్టుకున్నారు. ఇదంతా దేవుడిచ్చిన దీవెనే. మాధవికి క్రింద ఉన్నప్పుడు వరుస గదుల వల్ల ఎవరు వెళ్ళినా ఇబ్బంది పడేది. 'నాకు ఒక గది ఉంటే బాగుండేది' అని ఆశపడేది. అయితే దేవుడు పైన పెద్ద ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు మాధవికి ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేయబడింది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆమెను చూడ్డానికి వెళ్ళేవారికి ఆమె గది చిన్ని పరలోకంలా అనిపిస్తుంది. అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. 

మాధవి తల్లి మాధవికి 7 సంవత్సరాలుగా సేవ చేస్తున్నా ఏనాడూ ఆమెలో విసుగుదల కనిపించలేదు. ఎప్పుడూ ఒకే రకంగా ప్రేమిస్తూనే . ఆమెకే కాదు, మాధవి తండ్రి, అన్నలకి మాధవి అంటే ఎంత ప్రెమో! మాధవి ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా ఎందుకు నాకు ఇలా వచ్చింది?” అని ఏ మాత్రం అనుకోకుండా 'ఈ అనారోగ్యం వల్ల దేవుడిని తెలుసుకున్నాను' అని తన అనారోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుకుంటుంది. అయితే ఆ బాధలు తట్టుకోలేక దేవుని రాజ్యానికి ఎంత త్వరగా వెళ్ళాలో అని ఎప్పుడూ ఆశపడుతూ ఉంటుంది. ఎప్పుడు పరలోకం వెళతానో నా బాధలన్నీ అప్పుడు తీరుతాయి' అని పరలోకం కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది.

ఒక రోజు మాధవి జాషువా జూడ్ గారి వాక్యం ఎఫ్.యం. ద్వారా వింటుండగా ఒక బంధువురాలు మాధవి వాళ్ళ ఇంటికి వచ్చింది. సృష్టికర్త ఒక్కడే. ఆయన్నే పూజించాలి. కాని మానవులు సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తున్నారు. ఇది చాలా పాపం' అని వాక్యం వినబడుతున్నది. ఆ బంధువురాలు అది విని "అదే మీతో వచ్చిన చిక్కు. మీ ప్రార్థనలు మీరు చేసుకోకుండా మమ్మల్ని విమర్శిస్తారు” అని కఠినంగా మాట్లాడింది. మాధవి మనసు నొచ్చుకొని ఈ విధంగా సమాధానం చెప్పింది. “ఒక కుటుంబంలో ఒక మంచి వ్యక్తి, ఒక చెడ్డ వ్యక్తి ఉన్నారు. మంచి వ్యక్తిలోని మంచి లక్షణాలను, చెడ్డ వ్యక్తిలోని చెడ్డ లక్షణాలను గురించి వివరించి చెప్తేనేకాని అర్థం కాదు. అదే విధంగా ఇది వివరించడమే గాని, విమర్శించడం కాదు” అని చెప్పింది. దానితో ఆవిడ ఇంక ఏమీ మాట్లాడలేక పోయింది.

మరొకసారి ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకాయన వచ్చారు. ఆయన “మీరు బొట్టు ఎందుకు తీసేస్తారు. బైబిల్ లో తీయమని లేదు కదా. పెట్టుకున్నా ఫరవాలేదు. మీరు దేవుని నమ్ముకున్నట్లు ఆయనకు తెలిస్తే చాలు, లోకానికి తెలియనవసరంలేదు” అన్నారు. అందుకు మాధవి “దేవుని నమ్ముకున్న వాళ్ళు ఈ లోకంలో ప్రత్యేకంగా ఉండాలని బైబిల్లో ఉంది. ఉదాహరణకు పోలీసులు యూనిఫాం ఎందుకు ధరిస్తారు? సామాన్య ప్రజానీకంలో కలిసిపోకుండా ప్రత్యేకంగా పోలీసు అని గుర్తింపబడడానికి. అలాగే లాయర్ కూడా. వీళ్ళే ఇలా ప్రత్యేకంగా ఉన్నపుడు నిజమైన దేవుని నమ్ముకున్నవారు బొట్టు తీసివేయడం ద్వారా ఈ లోకంలో తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు కదా?” అంది. ఆయన మారు మాట్లాడలేదు.

చివరిగా ఒక మాట... 

 మాధవి కథ అయిపోలేదు. ఆమెకిప్పుడు ఇరవై ఎనిమిదేళ్ళు. వయసుతో బాటు ప్రభువులో ఆమె భక్తి, సమర్పణ కూడా పెరుగుతోంది. ఆమె ఇల్లు ఇప్పుడు ఎంతోమందికి ఆధ్యాత్మిక పాఠాలు నేర్పే బడిలా మారింది. ఎంతోమంది ఆమెను చూడాలని, పాపం, అంగవైకల్యంతో బాధలో ఉంది కదా ఆదరించి వెళదామని' వచ్చినవారు ఆమెలోని ప్రత్యేకతను, ప్రభువులో ఆమె సంతోషాన్ని చూసి, ఆమె చెప్పే మాటలు విని తమకు కావలసిన ఆదరణ పొంది తిరిగి వెళ్తున్నారు. 

మాధవి బైబిలును ఇప్పుడు 15 వ సారి చదువుతోంది. ఎంతమంది విశ్వాసులు, ఆ మాటకొస్తే బోధకులు, సంఘ కాపరులు సైతం బైబిలును ఎన్నిసార్లు చదివి ఉంటారు? మనకు ఓపిక ఉండాలే గాని, 119వ దావీదు కీర్తన పూర్తిగా కంఠతపట్టి మనకు అలవోకగా అప్పజెప్పుతుంది. 

ఆమె ఇల్లు ఇప్పుడో చిన్నపరలోకం. అందరూ ప్రభువుపట్ల అచంచలమైన విశ్వాసంతో జీవిస్తున్నారు. శ్రమలన్నా, మరణమన్నా వారి దృక్పథమే పూర్తిగా మారిపోయింది. మరణం అంటే వారికి పరలోకానికి ఒక మహిమద్వారం. అయితే ఆ ఇంటికి ఎవరు వెళ్ళినా, ఏ పనిమీద వెళ్ళినా అక్కడ "సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్” మాధవే. ఆమె అన్న తణుకులోనే తమ స్వంత ఫోటో స్టూడియో నడిపించుకుంటూ చెల్లిని బాల్యం నుండి ఎంత ప్రేమగా, ఆప్యాయంగా చూశాడో అంతే ప్రేమగా, అంతే ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. అతనికి ఒక బాబు, ఒక పాప. 

ప్రభువు తనకు అవకాశమిస్తే ఆయా సభల్లో కూర్చొని ప్రభువు యొక్క గొప్పతనం, తన జీవితంలో ఆయన చూపిన నమ్మకత్వం గురించి సాక్ష్యం చెప్పాలని ఆశిస్తోంది. ఎన్ని శ్రమలైనా, బాధలైనా ప్రభువులో నిలిచి ఉండి, అనేకమందిని క్రీస్తు వద్దకు నడిపించగలిగేలా తనకోసం ప్రార్థించమని విశ్వాసులను ఆమె కోరుతోంది. 

మాధవి ప్రార్థనా జీవితం, ప్రభువులో చెక్కుచెదరని ఆమె విశ్వాసం అనేకమందికి ఆదర్శంగా నిలవాలని ఆమె కోసం పాఠకులంతా ప్రార్థించాలని నా మనవి. 

శ్రీమతి విజయా జూడ్,

రచయిత్రి  

నా మాట 

 ప్రభువునందు ప్రియులైన నా స్నేహితులకు, మిమ్నల్ని ఈ రీతిగా కలుసుకుంటున్నందుకు నాకు చాలా ... సంతోషంగా ఉంది. 

దేవుని కృపవలన ఆయన నన్ను రక్షించినప్పటి నుండి నేటి వరకు తన కాపుదలలో భద్రపరచి, నన్ను ఆత్మీయంగా బలపరుస్తూ, నన్ను సజీవంగా కాపాడి, నా అనుభవాలను మరొకసారి మీతో పంచుకోవడానికి దేవుడు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. 

నేను శారీరికంగా చాలా బలహీనపడుతున్నప్పటికీ దేవుడు నన్ను ఆత్మీయంగా అనుదినమూ బలపరుస్తూ ఉన్నాడు. 2 కొరింథీ 4:16 లో ఉన్నట్టుగా నా జీవితంలో నెరవేరుతూ ఉంది. “మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ” లోకంలో ప్రతి మనిషికి శ్రమలు సహజం. నిజదేవుడైన యేసుక్రీస్తును నమ్మిన మనమైతే శ్రమలు తట్టుకునే శక్తినిచ్చే, విడిపించే దేవుణ్ణి కలిగి ఉన్నాం. శ్రమలు - యెరికో ప్రాకారంలా, ఎర్ర సముద్రంలా, అడ్డుబండలుగా ఉన్నప్పటికీ దేవుడు వాటన్నిటినుండి విడిపించగల సమర్థుడు. 

ప్రియ స్నేహితులారా, మీలో చాలామందికి చెప్పుకోలేని ఎన్నో ఇబ్బందులుంటాయి. అయినా మీరు అధైర్యపడవద్దు. దేవుణ్ణి విడిచిపెట్టవద్దు. 2 కొరింథీ 10:13 ప్రకారం మనం సహించగలిగినంత వరకే ఒప్పుకుంటాడు. తప్పించుకొనే మార్గం కలుగజేస్తాడు. 

నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, పాటలు పాడుకుంటూ ఉండగా నేను ఎంతో ఆదరణ, ఆనందం పొందుతూ ఉంటాను. ఇలా ఉండగా ఒకసారి నా మనసులో ఒక ఆశ పుట్టింది. జీవితంలో ఒక్కసారైన దేవుని మందిరంలో నా మనసారా ఆయనను ఆరాధించాలని ఎంతో ఆశపడ్డాను. ఇదే విషయం అమ్మతో చెప్పాను. దేవుణ్ణి ఆరాధించుకొని వచ్చేద్దామనుకున్న నాకు నా ఆత్మీయ సహోదరి విజయ జూడ్ గారి ఆహ్వానం మేరకు వారి ఇంట్లో నేను గడిపిన రెండు రోజులలో వారి ఆప్యాయతను కూడా దేవుడు నాకందించాడు.  

కదలలేని స్థితిలో ఉన్న నేను ఆశపడినపుడు దేవుడు నా ఆశ తీర్చాడు. అయితే ఆరోగ్యంగా ఉండీ, విశ్వాసులమని చెప్పుకుంటూ కూడా చాలామంది దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, మందిరానికి త్వరగా వెళ్ళి, వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించి, ఆయన ఇచ్చే మేళ్ళు మీరందరూ పొందాలని నా ఆశ. కీర్తన 84:10 ప్రకారం “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వేయి దినములకంటే శ్రేష్టము. (కీర్తన 95:7; కీర్తన 42:1,2) 

శరీరరీతిగా ఈ శ్రమను బట్టి ఎన్నోసార్లు నేను నిరాశపడినప్పుడు, ప్రతి ఆదివారం జాషువాగారు చెప్పే దైవ వర్తమానాల (రికార్డర్) ద్వారా దేవుడు తన వాక్యంతో నన్ను ఎంతో ఆదరిస్తున్నాడు. జాషువాగారి కుమారుడు హెరాల్డ్ బైబిల్ గ్రంథంలో నుండి చెప్పిన వర్తమానాలు- ఫిలిప్పీ 3:20,21; కీర్తన 119:50 లో ఉన్నట్టుగా దేవుని వాక్యమే నన్ను బ్రతికించి, బాధలలో నాకు నెమ్మది నిచ్చింది. దేవుడు ఇచ్చే రక్షణ శాశ్వతమైనది, నిజమైనది. ప్రతివారూ ఈ రక్షణను పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ రోజు దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో అనే ఆశ నన్ను బైబిలు చదవకుండా ఉండనివ్వదు. ఇపుడు 27వ సారి నేను బైబిల్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. యెషయా 65:2; ప్రకటన 3:20. 

ఈ నా సాక్ష్యం చదివి ఎంతో మంది ఫోన్‌ ద్వారా నన్ను ఆదరిస్తున్నారు. వారు ఆదరణ పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం శ్రమలు పొందుతున్నప్పటికీ, నిత్యత్వంలో మహిమ పొందుతానన్న నిరీక్షణ నాకుంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీ విషయంలో నా కోరిక ఏమిటంటే, నేను ఎలాగైతే విగ్రహాలను విడిచి నిజదేవుడైన యేసుక్రీస్తుని నమ్ముకొని, రక్షించబడి, పరలోకాన్ని సంపాదించుకున్నానో, మీరు కూడా క్రీస్తును దేవునిగా అంగీకరించి నాతోపాటు పరలోకంలో, మహిమలో ఉండాలని యుగయుగాలు దేవుని దగ్గర సంతోషంగా జీవించాలని, ఇదే నా ఆశ, ఆకాంక్ష ,

 క్రీస్తునందు మీ సహోదరి,

మాధవి  

 

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.