రక్షణ

రచయిత: కె. విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 48 నిమిషాలు

 

విషయసూచిక

కొన్ని ప్రాథమిక అంశాలు1-అందరూ అంటే అందరూ కాదా?2- దేవుడు మంచి తండ్రి కాడా?3- రక్షణలో ముందు నిర్ణయాన్ని బట్టి దేవుడు పాపానికి కర్త అయిపోతాడా ?4- యేసుక్రీస్తు బలియాగాన్ని చులకన చేస్తుంది ఎవరు?5- యేసుక్రీస్తు అందరి కోసం చనిపోయాడు అనే వచనాల సంగతేంటి ?6-  మన స్వాతంత్రం ( Free Will ) సంగతేంటి?7- ముందే నిర్ణయిస్తే ఇక తీర్పు ఎందుకు?8-ముందే నిర్ణయిస్తే అందరి తలుపులు తట్టడమెందుకు? 9-లోకమంటే?10- రక్షణ పోదని ఎలా అంటారు?11- యేసుక్రీస్తు వచ్చింది పాపుల కోసం కాదా?12 -వాక్యాన్ని తిరగరాసేది ఎవరు?మా విమర్శకులకు కొన్ని చిక్కుముడులు

కొన్ని ప్రాథమిక అంశాలు

 ప్రభువైన యేసుక్రీస్తు నామంలో, జగత్తుపునాది వేయబడకముందే దేవునిచేత నిర్ణయించబడిన విశ్వాసులందరికీ మా వందనములు. కొన్నిరోజుల క్రితం మేము "రక్షణ యెహోవాదే" అనే వ్యాసం ద్వారా, యేసుక్రీస్తు చేసిన బలియాగం దేవుని చేత నిర్ణయించబడిన అందరి విషయంలోనూ విజయవంతం ఔతుందనీ, ఆయన నిర్ణయానుసారంగా రక్షణపొందిన వారెవ్వరూ   తమ రక్షణను కోల్పోవడం సాధ్యం కాదనీ, దేవుడు మానవుని వలే ఏ విషయంలోనూ తన ఆలోచనను, చిత్తాన్ని నెరవేర్చుకోలేక విఫలం కాడని వివరించడం జరిగింది. ఈ క్రమంలో యేసుక్రీస్తు బలియాగం మానవవులందరికోసమూ అనేటట్లుగా కనిపించే వచనాలకూ, మరి కొన్ని ప్రశ్నలకు కూడా అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా ఇప్పటివరకూ ఆ వ్యాసం చదవకపోతే కనుక, క్రింద ముందుగా అది చదవండి. అప్పుడే ఈ భాగంలో మేమేం చెబుతున్నామో అర్థమౌతుంది.

రక్షణ యెహోవాదే

ఈ భాగంలో కూడా అదే వ్యాసం‌లో‌‌ మేము చేసిన బోధకు వ్యతిరేకంగా కొందరు లేవనెత్తిన ప్రశ్నలకు, విమర్శలకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రశ్నలలోనికి వెళ్ళడానికంటే ముందుగా విశ్వాసుల "రక్షణ యెహోవాదే" అనే మా వ్యాసం విషయంలో కొందరు చేస్తున్న పొరపాట్లను మీకు తెలియచేయాలి అనుకొంటున్నాము.

మొదటిగా, బైబిల్ గ్రంధం నుండి రెండు లేఖణాలను పరిశీలిద్దాం.

యోహాను సువార్త 7:51 అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా ;

సామెతలు 18:13 సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.

ఈ వచనాల ప్రకారం, ఒక మనుష్యునికి కానీ, అతని బోధలకు కానీ తీర్పుతీర్చాలంటే ముందుగా ఆ వ్యక్తి చెప్పేది పూర్తిగా వినాలి. ఆ విధంగా చెయ్యకుండా, మాట్లాడేవాళ్లు కచ్చితంగా తమ మూఢత్వాన్ని బయట పెట్టుకొని సిగ్గుపడతారు.

ఈ రోజు మేము రాసిన వ్యాసం పైన విమర్శలు చేసే వారిలో కొందరు ఈ వాక్యభాగాలను  అనుసరించియుంటే, మాపైన, మేము ప్రకటించిన బోధపైన‌ కొన్ని విమర్శలు చేయకపోదురు. ఎందుకంటే, వారు మేము అందులో వివరణ ఇచ్చినవాటినే మరలా, ప్రశ్నలుగా లేవనెత్తుతూ, అపహాస్యం చేస్తూ సంభరపడుతున్నారు. దీనిప్రకారం వారు కనీసం దానిని ఒకసారి కూడా పూర్తిగా చదవలేదని అర్ధమౌతుంది. దీనివల్ల వారు పై లేఖన భాగంలో చెప్పబడినట్లుగా తమ మూఢత్వాన్ని వెల్లడిచేసుకుని సిగ్గుపడేస్థితిలో ఉన్నారు. 

ఇక రెండవదిగా;

HITHABODHA NETWORK  కి చెందిన మేమందరమూ, వాఖ్యాధారంగా TULIP అనబడే  ఐదు కృపాసిద్ధాంతాలను నమ్ముతాము. దీనికి చారిత్రకంగా "కాల్వినిజం" అనే ముద్ర పడినంత మాత్రాన మా విశ్వాసాన్ని మేము మార్చుకోవలసిన  అవసరం మాకు లేదు. జాన్ కాల్విన్ ఒకవేళ వాక్య వ్యతిరేకంగా ఏదైనా ప్రకటించియుంటే,  వాటిలో వాక్యానుసారంగా ఏమైన లోపాలున్నట్లుగా మాకు అనిపిస్తే తప్పకుండా  వాటిని తిరస్కరిస్తాం.  TULIP అనబడే ఐదు కృపాసిద్ధాంతాలు వాక్యానుసారంగా ఉన్నాయని మా పరిశీలణలో రుజువైంది కనుకనే వాటిని మేము విశ్వసిస్తున్నాము. మేము మాత్రమే కాదు క్రైస్తవసంఘంలో వందలయేళ్ళుగా పేరుపొందిన బైబిల్ పండితులు ఎంతోమంది ఈ కృపాసిద్ధాంతాలనే నమ్ముతు వచ్చారు. ఇది వాక్యానికి ఏమాత్రం వ్యతిరేకం కాదు.

అయితే "కాల్వినిజం" అనే పేరును అడ్డుపెట్టుకుని కొందరు మేము కాల్వినిస్టులమనీ, మేము వ్యక్తిచెప్పిన సిద్ధాంతాలపైన ఆధారపడి బోధించేవాళ్ళమే తప్ప వాక్యం పైన ఆధారపడేవారం కామని సోషల్ నెట్వర్క్ లో చిల్లర పోస్టులు పెట్టుకుంటున్నారు. ఇక్కడ నేను మరోసారి ఆ విషయానికి స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మేము ఒక వ్యక్తి చెప్పిన‌ సిద్ధాంతంపైన ఆధారపడి ఏ బోధలూ చేయడం లేదు.

దీనిని మరింత స్పష్టం చేయటానికి ఒక ఉదాహరణ తీసుకుందాం:

మనందరికీ మార్టీన్ లూథర్ తెలుసు. ఆయన మరియు ఆయన వంటి మరికొందరు బోధకుల కృషివల్లనే, నేడు మనం కొనసాగుతున్న ప్రొటెస్టెంట్ సంఘాలు ఏర్పడ్డాయి. ఆయన, విశ్వాసం ద్వారానే నీతికలుగుతుంది తప్ప, మన నీతిక్రియల వల్ల రక్షణ రాదనే సిద్ధాంతాన్ని బోధించి దాని ద్వారా రోమన్ కేథలిక్ సంఘం పునాదులు కదిలించారు‌. ప్రస్తుతం ప్రొటెస్టంట్ సంఘాలలో ఉన్న అందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని తప్పకుండా నమ్ముతారు. ఒకమాటలో చెప్పాలంటే అది నమ్మనివారు అసలు క్రైస్తవులే కాదు.

దీనిప్రకారం, అది నమ్మేవారంతా, బోధించే వారంతా వాక్యంపైన కాకుండా, మార్టీన్ లూథర్ అనే వ్యక్తి తీసుకొచ్చిన సిద్ధాంతంపైన ఆధారపడినట్లా? ముమ్మాటికీ కాదు ఎందుకంటే అతను తీసుకువచ్చిన ఆ సిద్ధాంతం తన సొంతంగా కల్పించింది కాదు. రోమా పత్రికలోనూ, మిగిలిన లేఖణాలన్నిటిలోనూ మనకు కనిపించే వాక్యపు ఆధారాలతోనే ఆ సిద్ధాంతం నిర్మాణమైంది. మేము చేస్తుంది కూడా అదే. మాలో ఎవరూ, జాన్ కాల్విన్ తన స్వంత జ్ఞానంతో చేసిన సిద్ధాంతాలను భుజాలపై వేసుకొని మొయ్యడం  లేదు, అయన చెప్పిన ఆ  కృపాసిద్ధాంతాలకు వాక్యపు ఆధారాలను చూపించి ఉండకపోతే మేము ఖచ్చితంగా వాటిని తిరస్కరించేవారం. అయితే మేము వాటిని వాక్యానుసారంగా పరిశీలించాం కాబట్టే సత్యమని నమ్ముతున్నాము. కనుక మేము వాటిని సత్యమని ప్రకటిస్తున్నాము. ఇలా ఏ వాక్య సత్యాన్నైనా నమ్మి ప్రకటించటం మా హక్కు మాత్రమే కాదు, ప్రభువు మాపైన పెట్టిన భాధ్యత కూడా.

ఇలా కాకుండా కేవలం ఒక వ్యక్తి ఏం చెప్పినా అది వాక్యానుసారమే అని నమ్మే జాబితాలో మేముంటే, జాన్ కాల్విన్ మరియు మార్టీన్ లూథర్ చెప్పిన మరికొన్ని విషయాలతో మేము విభేదించేవారము కాదు. 

ఉదాహరణకు జాన్ కాల్విన్ మరియు మార్టీన్ లూథర్ కూడా చిన్నపిల్లల బాప్టీస్మాలను సమర్ధించారు మేము వాటిని వ్యతిరేకరిస్తున్నాం ఎందుకంటే, అది వాక్యసమ్మతమైన చర్యగా మాకు అనిపించలేదు. మాకు వ్యక్తి కాదు, వాక్యమే ఆధారం‌ అనడానికి దేవుని ముందు, సంఘం ముందు మా చర్యలన్నీ సాక్ష్యంగా ఉన్నాయి.

ఒకవేళ జాన్ కాల్విన్ చెప్పిన ఐదు కృపాసిద్ధాంతాలు నమ్మినంత మాత్రన మేము కాల్వినిస్టులమైపోతే, నేను పైన చెప్పినట్లుగా లూథర్ చేసిన సిద్ధాంతాన్ని నమ్మనివారు అసలు క్రైస్తవులేకాదు. దీనిప్రకారం మమ్మల్ని కాల్విన్ పేరుతో అపహాస్యం చేసేవారిలో ఎవరైనా నిజంగా క్రైస్తవులు ఉంటే, వారు లూథర్ చెప్పిన సిద్ధాంతాన్ని నమ్ముతూనే ఉండాలి. కాబట్టి మేము వారిని "లూథరన్లు" అని పిలవచ్చా? మమ్మల్ని కాల్వినిస్టులని అపహాస్యం చేసేవారికి ఈ విషయంలో సమాధానం లభించిందని భావిస్తున్నాను.

ఒకవేళ ఈ బోధను నమ్మేవారిని, కాల్వినిస్టులనే పిలవాలని ఎవరైనా నిర్ణయించుకొంటే, ఈ బోధను నమ్మనివారికి కూడా క్రైస్తవసమాజంలో "అర్మీనియన్లు" అనే పేరుంది. దీనిప్రకారం మమ్మల్ని కాల్వినిస్టులని అపహాస్యం చేసేవారంతా "అర్మీనియన్లు" ఔతారు.

ఇక "రక్షణ యెహోవాదే" అనే వ్యాసం పైన కొందరు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

 

1-అందరూ అంటే అందరూ కాదా?

 మేము రాసిన ఆ వ్యాసంలో మనుషులందరూ రక్షణ పొంది (1తిమోతీ 2:4), మనుషులందరికీ రక్షకుడును ((1తిమోతీ 4:10) అనే రెండు వాక్యభాగాలకు వివరణ ఇవ్వడం జరిగింది. అయితే కొందరు దానిని చదవకపోవడం వల్ల బైబిల్ గ్రంధం నుండి అటువంటి మరో వాక్యభాగాన్నే చూపిస్తూ, మా బోధ తప్పని వాదించే  ప్రయత్నం చేస్తున్నారు.

అదేమిటో చూడండి;

రోమీయులకు‌ 5:18 కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను.

ఈ వచనంలో యేసుక్రీస్తు మరణం ద్వారా మనుష్యులందరికీ, జీవప్రదమైన నీతివిధించబడినట్లుగా రాయబడింది. దీని ఆధారంగానే వీరు, యేసుక్రీస్తు మరణం మేము చెప్పినట్లుగా దేవునిచేత ముందుగా నిర్ణయించబడిన వారికి మాత్రమే కాకుండా , మనుష్యులందరికోసమూ అని మమ్మల్ని విమర్శిస్తున్నారు.

ఈ వాక్యభాగాన్ని పై వచనం, క్రింది వచనంతో కలపి చదివితే, ఆ మనుష్యులందరూ లోకంలో ఉన్న మనుష్యులందరూ కాదని మనకు అర్థమౌతుంది. మమ్మల్ని విమర్శిస్తున్నవారు అంటున్నట్లుగా ఆ వాక్యభాగం లోకంలోని మనుష్యులందరికోసం అనే అర్ధంలోనే  రాయబడితే, అందరికీ జీవప్రదమైన నీతి ఎందుకు విధించబడడం లేదో వారే సమాధానం చెప్పాలి.

ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దాం.

రోమీయులకు 5:16-19 మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే యేలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.

ఈ సందర్భాన్ని మనం పరిశీలిస్తే, లోకంలో ఉన్న అ‌ందరి మనుష్యులకోసం కాదు కానీ, కొందరి కోసమే‌ అని అర్ధమౌతుంది. అందుకే క్రింది వచనంలో జీవప్రదమైన నీతివిధించబడేది మనుష్యులు అందరికి కాదని స్పష్టమయ్యేలా "అనేకులు"‌ అన్నట్లుగా రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఈ అనేకుల గురించి తన పరిచర్యకాలంలో ప్రస్తావించారు. దాని గురించి ఆ  వ్యాసంలో కూడా వివరించడం జరిగింది.

మత్తయి 26: 28 ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.

యేసుక్రీస్తు ఈ భూమిపైన మానవునిగా జన్మించడానికి ముందుగానే, ప్రవక్తయైన  యెషయా యేసుక్రీస్తు మరణం ద్వారా లోకంలో మనుష్యులందరికీ కాకుండా ఆయన ముందుగా ఏర్పరచుకున్న అ‌నేకులకు మాత్రమే జీవప్రదమైన నీతి విధించబడుతుందని (వారి పాపాన్ని మాత్రమే ఆయన భరిస్తాడని) ప్రవచించాడు.

యెషయా 53: 12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను.

ఈ వివరణ బట్టి, వాక్యాన్ని వక్రీకరించి కొత్త సిద్ధాంతాల్ని తయారుచేసేది మేమా లేక మమ్మల్ని విమర్శించే వారా అన్నది ప్రియ చదువరులందరూ గ్రహించాలి.

2-దేవుడు మంచి తండ్రి కాడా?

 ఈ అంశంపైన, కొందరు దేవుని వాక్యాన్ని కాకుండా మానవభావాలను మాత్రమే ఆధారంగా చేసుకుని, ఒక మంచి తండ్రి తనకున్న ఇద్దరు పిల్లల్నీ సమానంగా చూస్తాడనీ, ఇద్దరికీ సమానంగా అవకాశాన్ని ఇస్తాడని, ఒకవేళ అలా చెయ్యకుండా ఆ తండ్రి ఒకరినే ప్రేమించి, రక్షిస్తే అతను మంచి తండ్రి కాడనీ, అందుకే కాల్వినిస్టుల బోధప్రకారం దేవుడు మంచి తండ్రి కాకుండా పోతాడని విమర్శిస్తున్నారు. ఈ విమర్శను చేసేవారు బహుశా బైబిల్ గ్రంధాన్ని పూర్తిగా చదవలేదని మేము  భావిస్తున్నాము. ఎందుకంటే, దేవుడు మనుషులందర్నీ సృష్టించినప్పటికీ, మనుషులందరికీ ఆయన ఈవులు అనుగ్రహిస్తున్న కారణాన్ని బట్టి రక్షకునిగా ఉన్నప్పటికీ, మానవజాతిలో అందరూ దేవుని పిల్లలు కాదు.

అందుకే దేవుని వాక్యం ఏమని చెపుతుందో చూడండి;

ద్వితీయోపదేశకాండము 32:5 వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు; వారు కళంకులు మూర్ఖతగల వక్రవంశము.

రోమీయులకు 9:8 అనగా శరీరసంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు.

అసలు దేవుని పిల్లలుగా పిలవబడే అర్హతను దేవుడు ఎవరికి ప్రసాదించాడో కూడా చూడండి.

యోహాను సువార్త 1:12,13 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

ఈ వచనం ఆధారంగా యేసుక్రీస్తు నందు విశ్వాసముంచేవారే దేవుని పిల్లలు ఔతారు తప్ప, మిగిలిన మనుషులెవరూ ఆయన పిల్లలు కాదు. దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వారు మాత్రమే ఆయన్ని విశ్వసిస్తారని మనం ముందు వ్యాసంలో వివరంగా చూసాము. దీనినిబట్టి దేవుడు మంచి తండ్రి కనుకనే, తన పిల్లలుగా ఉండేందుకు ఆయన ముందుగా నిర్ణయించుకున్న వారందరిపైనా సమానంగా ప్రేమను చూపించి వారిని రక్షించుకొంటున్నాడు.

ఇప్పుడు ఈ విమర్శ చేసినవారు అనుసరించిన మానవ భావజాల కొలమానాన్ని వారిపైనే పెట్టి, దానిప్రకారం వారు దేవున్ని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారో చూద్దాం.

వీరి కొలమానం ప్రకారం, ఈ లోకంలో మంచి తండ్రి తన ఇద్దరు పిల్లలకూ సమనంగా అవకాశాన్ని ప్రేమను పంచుతున్నట్లు దేవుడు కూడా పంచాలి అప్పుడే ఆయన మంచి తండ్రి ఔతాడు అనుకుంటే, ఈ లోకంలో ఏ మంచి తండ్రి కూడా తన బిడ్డ చేసిన తప్పులకి అగ్నిలో వేసి శిక్ష విధించడు. కచ్చితంగా ఏదో ఒక సమయంలో తన కోపాన్ని విడిచిపెట్టి ఆ బిడ్డను శిక్షించడం ఆపేస్తాడు. కానీ బైబిల్ ప్రకారం దేవుడు ఈ లోకంలో మనిషి చేసిన అపరాధానికి శిక్షగా నిత్యం నరకాగ్నిలో వేదనపడేలా తీర్పుతీరుస్తున్నాడు. ఇది న్యాయమే అని మనమందరమూ ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ లోకంలో దేవుని పిల్లలతో పాటుగా అపవాది పిల్లలు కూడా ఉన్నారు (యోహాను 8:44)  అపవాది పిల్లలు అపవాదితో కలసి నిత్యం నరకంలో శిక్ష అనుభవించడం న్యాయమే.

అయితే, ఈ లోకంలో ఒక తండ్రికి పిల్లలకి ఉన్న సంబంధాన్ని దేవునిపైన కొలతగా పెట్టి,  లోకంలోని మనుషులందర్నీ దేవుని పిల్లలే అని చెబుతూ మా బోధను విమర్శించినవారి దృష్టిలో, నరకంలోని నిత్యశిక్షను బట్టి దేవుడు మంచి తండ్రి ఎలా ఔతాడు? ఈ లోకంలో ఒక మంచి తండ్రి తనబిడ్డ చేసిన నేరం విషయంలో కొంత కాలానికి కోపాన్ని విడిచిపెట్టి క్షమించినట్టు, నరకంలో పడిన పాపి విషయంలో దేవుడు చెయ్యడం లేదు కదా?  దీనిప్రకారం మా బోధను విమర్శించేవారంతా మన దేవున్ని ఒక జాలిలేని తండ్రిగా, తన బిడ్డలు కలకాలం‌ నరకంలో కాలుతూ ఉంటే చూసి ఆనందించే తండ్రిగా చిత్రీకరిస్తున్నారు.

3-రక్షణలో ముందు నిర్ణయాన్ని బట్టి దేవుడు పాపానికి కర్త అయిపోతాడా?

వాస్తవానికి మనం మాట్లాడుకుంటుంది, రక్షణలో దేవుని నిర్ణయం అనే అంశమైతే, లేఖనాల పరిధిలో అది ఉందా లేదా అనేది చూడకుండా కొందరు, అలాగైతే మానవుల పాపాన్ని కూడా దేవుడే నిర్ణయించాడా అని పక్కదారిపట్టిస్తూ, మధ్యలోకి చిన్నపిల్లలపై అత్యాచారాలు వంటివాటి ద్వారా సెంటీమెంట్ ట్రిక్ ప్లేచేయాలి అనుకుంటున్నారు.

ఆవిధంగా జనాల్లో దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని కౄరంగా చూపడమే వీరి ఎత్తుగడ‌. ఈ ప్రశ్నకు సమాధానంగా, వివరంగా రాసిన రెండు వ్యాసాలను ఇక్కడ పెడుతున్నాము వాటిద్వారా ఈ ప్రశ్నకు లేఖనాల పరిధిలో మీరు సమాధానం పొందుకోవచ్చు.

దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది ఎవరు?

దేవుడే ఆపలేని హేయమైన ఆకృత్యాలు - ప్రవీణ్ పగడాల వింతబోధ.

4- యేసుక్రీస్తు బలియాగాన్ని చులకన చేస్తుంది ఎవరు?

 మరికొందరు, మేము దేవున్ని కొందరికి మాత్రమే పరిమితం చేస్తున్నామని, యేసుక్రీస్తు బలియాగం కొందరికోసమే అని చెబుతూ దానిని చులకన చేస్తున్నామని విమర్శిస్తున్నారు. ముందు వ్యాసంలో కూడా దీనిగురించి ప్రస్తావించి, ఆయన మనుషులందరికీ ఏ విధంగా రక్షకుడు ఔతున్నాడో వివరించాము.

మత్తయి 5: 45 ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.

దేవుడు ఈ లోకంలో అందరికీ దేవునిగా ఉన్నాడు కనుకనే, ఈలోకంలో జీవిస్తు‌న్న అందరికీ భౌతికమైన ఈవులను అనుగ్రహిస్తున్నాడు. ఆయన లోకంలో అందరికీ దేవుడని చెప్పడానికి ఇది చాలు. అదేవిధంగా, ఆయన అ‌ందరికీ దేవుడు కనుకనే, తమ ‌పాపాల కారణంగా ఉగ్రతకు పాత్రులైన మానవుల్లో కొందరిని, కనికరంతో కూడిన తన‌ చిత్తానుసారమైన నిర్ణయం చెప్పున తన సన్నిధిలో నిలువబెట్టుకొంటున్నాడు,  మిగిలినవారి పట్ల తన న్యాయాన్ని అనుసరించి వారి పాపాలకు శిక్షవిధిస్తున్నాడు. ఇక్కడ ఇరు పక్షాలకూ దేవునిగానే దేవుడు వ్యవహరిస్తున్నాడు. అందర్నీ పాపాల నుండి విడిపిస్తే మాత్రమే ఆయన దేవుడు అవుతాడనే నియమం ఏమీలేదు.

 అదేవిధంగా, యేసుక్రీస్తు బలియాగం కొందరికి మాత్రమే అని బైబిల్ చెప్పిన బోధను మేము చెప్పడం వల్ల దానిని ఏమాత్రమూ చులకన చెయ్యడం లేదు. ఎందుకంటే, ఆయన ఎంతమందినైతే రక్షించాలనే సంకల్పంతో ప్రాణం పెట్టాడో అంతమంది విషయంలోనూ అది సఫలమౌతుంది. ఆయన సంకల్పం నెరవేరుతుంది. అయితే, మమ్మల్ని విమర్శించేవారు చెబుతున్నట్లుగా ఆయన అందరినీ రక్షించుకోవాలనే సంకల్పంతో ప్రాణం పెట్టి అందరినీ రక్షించుకోలేకపోతుంటే, ఆయన సంకల్పం ఖచ్చితంగా విఫలం ఔతుంది, బలహీనంగా చూపబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు బలియాగాన్ని చులకన చేసేది ఎవరో మీరే గ్రహించాలి. మేము యేసుక్రీస్తు బలియాగం విషయంలో, పరిధిని పరిమితం చేస్తున్నామే తప్ప, శక్తిని పరిమితం చేయడం లేదు ఎందుకంటే వాక్యం ఆ విధంగానే సెలవిస్తుంది. కానీ మమ్మల్ని విమర్శించేవారు ఆయన బలియాగపు శక్తిని పరిమితం చేస్తున్నారు‌. ఎందుకంటే, వారుచెప్పే దానిప్రకారంగా యేసుక్రీస్తు బలియాగం ఎవ్వరిని రక్షించడానికి దానంతట అదే శక్తిగలది కాదు. దానికి మనిషి తనకున్న విశ్వాసాన్ని జోడిస్తేనే అది పనిచేస్తుంది. ఇది యేసుక్రీస్తు బలియాగానికి ఘోర  అవమానం. మేము చెప్పేదేమిటంటే, యేసుక్రీస్తు బలియాగం ద్వారా దేవుడు నిత్యజీవాన్ని ఇవ్వడానికి ఎందరినైతే ముందుగా నిర్ణయించాడో, వారందరూ ఆ బలియాగాన్ని విశ్వసించేలా ఆయనే చేస్తాడు. తమంతట తాముగా విశ్వసించలేరు.

అపో.కార్యములు 16: 14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను.

అపో.కార్యములు 13: 48 అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

5-యేసుక్రీస్తు అందరి కోసం చనిపోయాడు అనే వచనాల సంగతేంటి?

 ముందు వ్యాసంలోనూ, ఈ వ్యాసంలో కూడా యేసుక్రీస్తు అందరికోసం చనిపోయాడని రాయబడిన మాటలయొక్క వివరణ ఏంటో తెలియచేసాము. కొందరు ఆ వివరణ బట్టి ఆ విధంగా ఉన్న ఇతర వచనాలను అలాగే అర్ధం చేసుకోకుండా అటువంటివే మరికొన్ని వచనాలు పెట్టి మురిసిపోతున్నారు.

అవేమిటో చూడండి.

రెండవ కొరింథీయులకు 5:14,15 క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు,
జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము.

ఈ వచనంలో కూడా అందరూ అనే మాట ‌మనకు కనిపిస్తుంది. జాగ్రతగా పరిశీలిస్తే, ఆ అందరూ కూడా యేసుక్రీస్తుతో పాటుగా మరణించారని, ఇక మీదట వారు తమకోసం జీవించర‌ని అర్ధమౌతుంది. దీనిప్రకారం ఎందరైతే ఆయన మరణంలో పాలివారై, ఆయన కోసం జీవిస్తున్నారో వారే ఆ అందరూ. ఆ అ‌ందరూ ముందుగా దేవుని నిర్ణయంలో ఉన్నవారే తప్ప లోకంలో ఉన్న అందరూ కాదు.

మరొక వచనం చూడండి;

హెబ్రీయులకు 2:9 దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు,దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము.

ఈ వచనంలో కూడా ఆయన ప్రతీ మనుష్యునికోసం మరణించినట్లుగా ఉంది. కానీ ఈ సందర్భం మా సిద్ధాంతాన్ని మరింత బలపరుస్తుంది. 

ఎలాగో చూడండి: ముందుగా అక్కడ మూలభాషలో మనుష్యునికోసం "Anthropos" అనే పదాన్ని వాడలేదు అక్కడ వాడిన గ్రీకు‌పదం 'παντὸς' pantos దీనికి "every/all" అనే అర్ధం వస్తుంది.
దీనిప్రకారం, ఆ ప్రతీ/అందరూ ఎవరో ఆ క్రిందివచనాల్లోనే స్పష్టంగా ఉంది చూడండి.

హెబ్రీయులకు 2:10-13 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగు చున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. పరిశుద్ధ పరచువారికిని పరిశుద్ధపరచబడువారికిని అందరికి ఒక్కటే మూలము. ఈ హేతువుచేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక  నీ నామమును నా సహోదరులకు ప్రచురపరతును, సమాజముమధ్య నీ కీర్తిని గానము చేతును అనెను. మరియు నేనాయనను నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు.

ఈ వచనం ప్రకారం ఆయన ఎవరికొరకైతే మరణించాడో, ఆ ప్రతీ/అందరు ఎవరంటే, దేవుని పిల్లలు, యేసుక్రీస్తు అనేకులైన సహోదరులే తప్ప లోకంలో ఉన్న అందరు మనుషులూ కాదు. లోకంలో దేవుని పిల్లలు మాత్రమే కాకుండా దుష్టుని పిల్లలు కూడా ఉన్నారని మనం‌ పై భాగంలో చూసాము. దేవుడు ముందుగా ఎంత మందినైతే యేసుక్రీస్తు నందు విశ్వాసముంచే పిల్లలుగా, ఆయన సహోదరులుగా నిర్ణయించి పరిశుద్ధపరుస్తున్నాడో వారి గురించే ఈ సందర్భంలో చెప్పబడుతుంది.

6-మన స్వాతంత్రం ( Free Will ) సంగతేంటి?

 లేఖణాలు చెప్పే సారాంశం ప్రకారం, దేవుడు మొదటి మానవుడైన ఆదామును స్వతంత్రునిగా సృష్టించాడు. అతడు పాపం చేసాక ఆ స్వతంత్రతను కోల్పోయి, పాపానికి దాసునిగా మారాడు. అప్పటినుండి, అతని నుండి వచ్చే ప్రతీ మనిషీ కూడా పాపానికి దాసులుగానే పుడుతున్నారు. దీనివల్లనే భూమిపైన పుట్టిన ప్రతీమానవుడూ తప్పకుండా పాపం చేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో దేవుని కృపపొందినవారు మాత్రమే ఆ పాప దాసత్వం నుండి విడిపించబడుతూ, దేవుని ప్రజలుగా జీవిస్తున్నారు‌. 

అయితే కొందరు మానవుడు ఇప్పటికీ స్వతంత్రునిగానే ఉన్నాడని, ఆ స్వతంత్రత కారణంగా ఇష్టమైనవారు తమకుతాముగా దేవుని చెంతకు ఆయన ప్రమేయం (నిర్ణయం) లేకుండా రాగలరనీ,  దీని ప్రకారం మా బోధ తప్పు ఔతుందని విమర్శిస్తున్నారు. ఈ విమర్శ దేవుని వాక్యం ముందు ఎలా‌ వీగిపోతుందో చూడండి.

రోమీయులకు‌ 6:6 ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

ఈ వచనం ప్రకారం‌ మనుషులు స్వతంత్రులుగా లేరు కానీ, పాపానికి దాసులుగా ఉన్నారు. విశ్వాసులు మాత్రమే యేసుక్రీస్తు బలియాగం ద్వారా ఆ పాప దాసత్వం నుండి‌ విడిపించబడుతున్నారు.

మరికొన్ని వచనాలు చూడండి;

రోమీయులకు 6:16-18 లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో, అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడినవారై, పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము.

రోమీయులకు 3:9-12 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.  ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు దేవుని వెదకువాడెవడును లేడు అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలిన వారైరి.మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

యోహాను 8:34 అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఈ వచనాల ప్రకారంగా కూడా, మానవుడు స్వతంత్రుడుగా లేడనీ, పాపానికి దాసునిగానే ఉన్నాడని మనకి అర్ధమౌతుంది. ఈ కారణంతో మానవుడు తనకు తానుగా దేవుని యొద్దకు రాలేడు, ఆత్మ సంభంధమైన సంగతులు గ్రహించలేడు.

మొదటి కొరింథీయులకు 2:9-14 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.  మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.

7-ముందే నిర్ణయిస్తే ఇక తీర్పు ఎందుకు?

 యేసుక్రీస్తు రాకడలో లోకానికి తీర్పు జరగబోతుందని బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.

ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

ప్రకటన గ్రంథం 22: 12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.

2కోరింథీయులకు 5: 10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

ఈ వచనాల ఆధారంగా కొందరు, మేము చెప్పే సిద్ధాంతం ప్రకారం దేవుడు ముందుగా రక్షించబడేవారిని నిర్ణయిస్తే, మళ్ళీ తీర్పుదినాన అందరినీ ఆయన ముందు నిలువబెట్టుకోవలసిన అవసరం ఏముందని విమర్శిస్తున్నారు. అయితే, మనం చూసిన పైవచనాల్లో ఆయన రెండవ రాకడలో తీర్పు‌తీరుస్తాడని ఉన్నదే తప్ప, ఆ తీర్పులో ఎందరు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారో, ఎందరు రక్షణకు పాత్రులుగా ఎంచబడతారో ఆయనకు తెలియదని లేదు.

బైబిల్ లో ఈ తీర్పు గురించి రాయబడిన మరికొన్ని సందర్భాలను పరిశీలిద్దాం;

యోహాను సువార్త 3:18,19 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పుతీర్చబడెను.  ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి.

2పేతురు 2: 3 వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనముకునికి నిద్రపోదు.

యూదా 1:4 ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు (మూలభాషలో-వ్రాయబడినవారు) .

మొదటి యోహాను 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమలేని వాడు మరణమందు నిలిచియున్నాడు.

ఈ వచనాలన్నిటినీ మనం పరిశీలిస్తే, తీర్పుదినాన ఏం జరుగుతుందో దేవునికి ముందే తెలుసని (నిర్ణయించాడని) అర్ధమౌతుంది. 

8-ముందే నిర్ణయిస్తే అందరి తలుపులు తట్టడమెందుకు?

 ప్రకటన గ్రంథం 3: 20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.

కొందరు ఈ వచనాన్ని కూడా చూపిస్తూ, మనుషులందరూ మారుమనస్సు పొందేలా దేవుడు ప్రేరేపిస్తాడనీ (తలుపు తట్టుచున్నాడని),  మనిషి తనకున్న స్వతంత్రతతో ఆయన స్వరం విని ఆయనకు తలుపుతీయాలని (అంగీకరించాలని), ఆయన ఎవరి హృదయంలోనికీ కూడా మనిషి అనుమతి లేకుండ ప్రవేశించడని మా బోధను విమర్శిస్తున్నారు.

పైసందర్భంలో మనిషి స్వతంత్రునిగా లేడనీ, పాపానికి దాసునిగా ఉన్నాడని చూసాము. దీనినే  బైబిల్ ఆత్మీయ మరణం అని కూడ పిలుస్తుంది.

ఎఫెసీయులకు 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను.

దీనిప్రకారం, ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తియొక్క హృదయ ద్వారాన్ని దేవుడు తట్టినప్పటికీ ఆ వ్యక్తి తలుపు తీయలేడు. ఎందుకంటే అతడు చనిపోయాడు. అందుకే దేవుడు ఆ వ్యక్తిని (తన నిర్ణయంలో ఉన్నవారిని) మొదటిగా ఆత్మీయంగా బ్రతికేలా చేసి, తనను విశ్వసించేలా చేస్తున్నాడు (హృదయాన్ని తెరుస్తున్నాడు).

ఎఫెసీయులకు 2: 4 అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి, మనము మన అపరాధముల చేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసుతో కూడ బ్రదికించెను.

అపో.కార్యములు 16: 14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్య ముంచెను. అందుచేతనే బైబుల్, మన రక్షణ అనేది మనవల్ల కలిగింది కాదని చెపుతుంది.

ఎఫెసీయులకు 2: 8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు దేవుని వరమే.అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు. ఒకవేళ దేవుడు తలుపుతడితే, మనంతట మనం విశ్వాసాన్ని సంపాదించుకొని ఆ తలుపును తీస్తే, అది మనవల్ల కూడా అయ్యినట్లేఅవుతుంది. కానీ లేఖణం చెప్పేదాని ప్రకారం, అది మనవల్ల అయ్యింది కాదు.

కొందరు ఈ వచనాన్ని అపార్ధం చేసుకుని, అక్కడ క్రియల గురించి మాట్లాడుతున్నాడే తప్ప, విశ్వాసం గురించి కాదని అభిప్రాయపడుతుంటారు. అయితే, ఆ సందర్భంలో ఇది మీవలన కలిగినది కాదు అన్నపుడు, విశ్వాసం గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ విశ్వాసం మనంతట మనం సంపాదించుకొన్నదే ఐతే, ఒకవేళ మనలను రక్షించడానికి అవసరమైన విశ్వాసం మనవల్ల కలిగింది  ఐతే మనం అతిశయయించడానికి తావుండేది. అయితే, కృప ఏవిధంగా దేవుని వరమో, విశ్వాసము కూడా అదేవిధంగా దేవుని వరముగా ఆయనే మనలో పుట్టించాడు కనుక మనం అతిశయించకూడదు. ఈ విధంగా మన రక్షణ మనవల్ల అయ్యింది కాదు (దీని గురించి కూడా ఆ వ్యాసం లో వివరించాం).

అదే విధంగా కొందరు లూదియ గురుంచి మేము చెప్పిన వివరణ కూడా వక్రీకరించి ఆమె అప్పటికే దైవభక్తి గల స్త్రీ కాబట్టి దేవుడు ఆమెలో విశ్వాసాన్ని కొత్తగా పుట్టించలేలా హృదయాన్ని తెరవలేదని చెప్పేప్రయత్నం చేస్తుంటారు‌. ఒకవేళ ఆమెకు మునుపున్న దైవభక్తి ఆమెను రక్షించేదే ఐతే  ఆమెకు మరలా సువార్త ఎందుకు, రక్షణకు గురుతైన బాప్తిస్మము ఎందుకు? ఆమెకున్న భక్తి యూదులు కలిగియుండే దైవభక్తి మాత్రమే, అది ఆమెను రక్షించలేదు. అందుకే ఆమె రక్షణపొందేలా దేవుడు ఆమె హృదయాన్ని తెరచాడు (ఆత్మీయంగా బ్రతికించి విశ్వాసం పుట్టించాడు).

ఇక ప్రకటన గ్రంధంలో చెప్పబడినమాట యొక్క వివరణ చూద్దాం; అసలు ఆ మాటలు యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలియని వారు మాత్రమే దాని ఆధారంగా మా‌బోధను విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే, ఆ మాటలలో దేవుడు  అవిశ్వాసుల తలుపులను  కొడుతున్నాడని  లేదు. అదే అధ్యాయం 13 వ వచనం ప్రకారం, ఈమాటలు లవదొకియ సంఘపువారి గురించి రాయబడ్డాయి. ఈ సంఘం ప్రకటనలో మనకు కనిపించే ఏడుసంఘాల్లో ఒకటి. ఈ సంఘాల గురించి రాయబడిన మాటలు చూడండి.

ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి  మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.

దీని ఆధారంగా, అక్కడ ప్రభువు తలుపుతడుతున్నాడాని రాయబడింది అవిశ్వాసుల గురించి కాదు కానీ, అప్పటికే ప్రభువు రక్తం చేత చచ్చిన స్థితినుండి బ్రతికించబడిన విశ్వాసుల గురించే. యూదులలో సహవాసానికి సంబంధించిన విషయాలలో భోజనం ఒకటి. బహుశా ఈ సంఘాన్ని సహవాసానికి సంబంధించిన విషయాలలో హెచ్చరించేందుకే ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ అధ్యాయాలలో కనిపించే సంఘాలకు ప్రభువు తన మాటలను వివరించాక మరోమాట కూడా చెప్పబడుతుంది.

ప్రకటన గ్రంథము 3:22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

ఈ వచనాన్ని మనం జాగ్రతగా పరిశీలిస్తే, ఆ సంఘాలలో సభ్యులుగా ఉన్నవారందరూ కూడా ప్రభువు మాటలు స్వీకరించలేరు (తలుపు తీయలేరు). ఎవరికైతే ఆయన చెవులను అనుగ్రహించాడో వారు మాత్రమే అవి వినగలరు, విని స్పందించగలరు. ఆయన రక్తంతో ఎంతమందైతే తమ పాపాలను కడుక్కొన్నారో, వారి విషయంలో మాత్రమే ఇది జరుగుతుంది.

ఈ వచనాలు చూడండి;

మొదటి కొరింథీయులకు 2:9,10 ఇందును గూర్చిదేవుడు తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచియున్నాడు; ఆ ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడు.

రోమీయులకు 11: 8 ఇందువిషయమైనేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును,చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చియున్నాడని వ్రాయబడియున్నది.

ఈ వచనాల ఆధారంగా, ఆత్మ చెప్పే మాటలు ఒక విశ్వాసి గ్రహించాలంటే దేవుడే అతనికి వినే చెవులు అనుగ్రహించాలి. ఒకవేళ మా బోధను విమర్శించేవారు చెబుతున్నట్టుగా ఆ సందర్భం అవిశ్వాసుల కోసమే అని వాదనకోసం అనుకున్నప్పటికీ, దేవుడు చెవులు అనుగ్రహించకుండా వారు ఆ మాటలు స్వీకరించలేరు, తలుపుతీయలేరు.

9-లోకమంటే?

 ముందు వ్యాసంలో మేము, యోహాను 3:16 లో దేవుడు ప్రేమించిన లోకం గురించీ, 1 యోహాను 2:2 లో, సర్వలోకము గురించీ వివరణ ఇవ్వడం జరిగింది. కొందరు అలాంటి మరో వచనాన్నే పెట్టి మమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

యోహాను సువార్త‌ 1:29,30 మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే యీయన.

ఈ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు లోకపాపము మోసుకొనిపోయే గొర్రపిల్లగా వర్ణించబడిన కారణంగా  ఆయన లోకంలోని ప్రతీమనిషి పాపాన్ని భరించి వారందరికోసమూ ప్రాణం పెట్టాడని కొందరు అపార్ధం చేసుకుంటున్నారు. అయితే యోహాను రాసిన మాటల్లోని కొన్ని సందర్భాలలో లోకము అన్నప్పుడు ప్రతీమనిషీ అనే అర్ధం రాదు. ఎందుకంటే ఇదే యోహాను సువార్త నుండి‌ మరోమాటను చూడండి.

యోహాను 17: 9 నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

ఈ సందర్భంలో యేసుక్రీస్తు చాలా స్పష్టంగా తన శిష్యులకోసం మరియు వారి వాక్యంవల్ల భవిష్యత్తులో ఆయన శిష్యులుగా మారేవారికోసం ప్రార్ధన చేస్తూ, లోకం గురించి ప్రార్ధన చేయడం లేదని చెబుతున్నాడు. ఒకవేళ యోహాను సువార్త 3:16 ప్రకారం తండ్రి ప్రేమించిన లోకం అనగానే ఈ ప్రపంచంలో అందరూ అనుకుంటే, యోహాను సువార్త‌ 1:29 ప్రకారం ఆయన పాపాన్ని మోసుకొని పోయే లోకం ఈ ప్రపంచంలో అందరూ ఐతే , ఈ సందర్భంలో యేసుక్రీస్తు చేసిన ప్రార్ధన తండ్రి చిత్తానికి వ్యతిరేకం ఔతుంది. ఎందుకంటే, తండ్రి ప్రేమించిన లోకం గురుంచి, ఆయన పాపాలు మోసుకునిపోవలసిన  లోకం గురుంచీ ఆయన ప్రార్ధన చెయ్యడం లేదు. దీనిప్రకారం, యేసుక్రీస్తు పాపాలు మోసుకుని పోయే లోకం, తండ్రి ప్రేమించిన లోకం, ప్రపంచంలో అందరి మనుషులనూ సూచించడం లేదు కానీ ఒక సమూహాన్ని మాత్రమే సూచిస్తుంది.

ఉదాహరణకు బైబిల్ లో యూదులు ఓక సందర్భంలో, ఒక సమూహాన్ని సూచించడానికి కూడా లోకము అనే పదాన్ని ఉపయోగించారు;

యోహాను 12:19 కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములెట్లు నిష్‌ప్రయోజనమై పోయినవో చూడుడి. ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి.

యోహాను రాసిన మరోమాట పరిశీలించండి;

1యోహాను 3: 1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే.ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.

ఈ సందర్భంలో, యోహాను విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ, వారిపై తండ్రి ప్రేమను చూపబట్టి వారు దేవుని పిల్లలుగా, మారారని చెబుతూ ఇందుచేత లోకం వారిని ఎరుగదని కూడా చెపుతున్నాడు. వీరిని ప్రేమించిన దేవుడు మిగిలిన లోకాన్ని కూడా ప్రేమించినప్పుడు, ఆయన మనపైన ప్రేమను చూపాడనీ, దీనివల్ల లోకం మనలని ఎరుగదని యోహాను ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన పరిచర్యకాలంలో, కొన్ని సందర్భాలలో లోకం నుండి తనను, తనవారిని ప్రత్యేకించి మాట్లాడుతున్నట్లు రాయబడింది.

10-రక్షణ పోదని ఎలా అంటారు?

 ప్రకటన గ్రంథము 3:1,2 సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలును గలవాడు చెప్పు సంగతులేవనగానీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే  నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.

కొంతమంది ఈ వచనాలను బట్టి కూడా మా బోధను విమర్శించే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే, మేము చెప్పేదాని ప్రకారం, రక్షణపొందిన వ్యక్తి ఎప్పటికీ తన రక్షణ కోల్పోడు (చనిపోడు). కానీ ఈ సందర్భంలో రక్షణ పొందిన సార్దీస్ సంఘం మృతమైనట్లుగా (రక్షణ కోల్పోయినట్లుగా) కనిపిస్తుంది. అయితే, ఇవి ఒక వ్యక్తి కోసం చెబుతున్న మాటలు కావు. ఇది సంఘాన్ని ఉద్దేశించి చెబుతున్న మాటలు. ఆ సంఘంలో విశ్వాసుల జాబితాలో ఉన్న కొందరిని ఉద్దేశించి ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు.

ముందు వ్యాసంలో కూడా చర్చులకు వెళ్లి, బాప్టీస్మాలు తీసుకుని మేము రక్షణ పొందామని చెప్పుకునే అందరూ కూడా నిజంగా రక్షించబనట్టు కాదని వివరించడం జరిగింది. నిజంగా ప్రభువు యొక్క నిర్ణయాన్ని బట్టి రక్షించబడినవారు, ఆ రక్షణకు గురుతులైన సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉంటారు. ఆ విధంగా అయ్యేలా ప్రభువే ప్రేరేపిస్తూ, సహాయం చేస్తుంటాడు.

ఈ సార్దీస్ సంఘంలో అందరూ నిజమైన విశ్వాసులే ఉంటే, వారి క్రియలు కూడా దేవుని యెదుట సరియైనవిగా కనిపించేవి. అయితే వారిలో ఆ విధంగా  లేనివారి గురించి ప్రభువు ఈ మాటలు చెబుతున్నాడు. వారు విన్నారు కానీ, దానిప్రకారం జీవించలేకపోయారు. అందుకే వారు పరిచర్య చేస్తున్నామనే బ్రమలో ఉన్నారే తప్ప, వాస్తవానికి వారి క్రియలు మృతమైనవిగా ఉన్నాయి. కానీ అదే సంఘంలో నిజంగా విశ్వాసులుగా ఉన్నవారి గురించి ప్రభువు చెబుతున్న మాటలు చూడండి.

ప్రకటన గ్రంథము 3:4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‌లో నీయొద్దఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.

దీనిప్రకారం ఆ మాటలు, సార్దీస్ సంఘంలోని విశ్వాసులుగా చలమాని అయ్యే కొందరి గురించే ప్రభువు ఈ విధంగా చెబుతున్నాడని అర్ధమౌతుంది. అదేవిధంగా,  కొన్నిసార్లు నిజమైన విశ్వాసులు కూడా కొన్ని క్రియల్లో తప్పిపోవడం సాధ్యమని దేవుని వాక్యం చెబుతుంది. అయితే, వారు పూర్తిగా తమ రక్షణ కోల్పోలేరు ఎందుకంటే, ప్రభువు తన వాక్యం ద్వారా హెచ్చరించి వారు మారుమనస్సు పొందేలా చేస్తాడు. ఈ సార్దీస్ సంఘం విషయంలో కూడా, బహుశా  ఎవరైన నిజమైన విశ్వాసులు తప్పిపోతున్నప్పట్టికీ  వారిని మరలా దారిలోకి తెచ్చేందుకు కూడా ప్రభువు ఈవిధంగా హెచ్చరిస్తున్నాడు‌. వారిలో నిజమైన విశ్వాసులు ఎవరైనా ఉంటే తప్పకుండా అ హెచ్చరికకు లోబడతారు ఎందుకంటే ఆ క్రింది వచనంలో ఏముందో చూడండి.

ప్రకటన గ్రంథము 3:6 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

ఈ మాటగురించి పై సందర్భంలో కూడా  మనం వివరించుకోవడం జరిగింది. ఆ క్రియల విషయంలో మృతమైనట్టుగా ఉన్న వారిలో దేవుని ఏర్పాటు చొప్పున విశ్వాసులుగా మారినవారు ఎవరున్నప్పటికీ, వారు ఆ హెచ్చరికకు లోబడి తమను తాము సరిచేసుకునేలా దేవుడు వారికి చెవులు అనుగ్రహిస్తాడు.

11-యేసుక్రీస్తు వచ్చింది పాపుల కోసం కాదా?

 1తిమోతికి 1: 15 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్య మైనదియునైయున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను.

వాస్తవానికి ఈ వచనం ఆధారంగా మమ్మల్ని విమర్శించేవారు, పైన మేము వివరించిన వాక్యభాగాల ఆధారంగా విమర్శచేసినవారికంటే అజ్ఞానులుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే, ఈ వచనం మమ్మల్ని విమర్శించడానికి ఏమాత్రమూ సరిపోదు‌. మేము కూడా అదే చెబుతున్నాము. అయితే లోకంలో అందరూ పాపులే ఉన్నప్పటికీ, వారిలో దేవుడు ముందుగా రక్షణపొందడానికి నిర్ణయించిన పాపులు ఎందరో, వారికోసమే ఆయన వచ్చాడని చెబుతున్నాం. దీనికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువు మాటల్లోనే చూద్దాం.

12-వాక్యాన్ని తిరగరాసేది ఎవరు?

 తీతుకు 2:11-13 ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము,  అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.

కొందరు ఈ వచనంలో, సమస్త మనుష్యులకూ దేవుని కృప ప్రత్యక్షమై బోధిస్తుందని, కాల్వినిస్టుల వాదన ప్రకారం ఈ వచనాన్ని 'దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన వారికి మాత్రమే ప్రత్యక్షమై' అని రాసుకోవాలని విమర్శిస్తున్నారు.

అయితే, బైబిల్ గ్రంధంలో అన్ని సందర్భాల్లోనూ, అందరూ లేదా సమస్థ మనుషులు అన్నపుడు  ఏ మినహాయింపూ లేకుండా అందరూ అనే భావం మాత్రమే రాదు. ఏ బేధం  ( స్త్రీ/పురుష/జాతి/ప్రాంతీయ ) లేకుండా అందరూ అనే భావం కూడా వస్తుంది.  దీనిగురించి ముందు వ్యాసంలో కూడా వివరించడం జరిగింది. ఒకవేళ అందరూ, సమస్త  మనుష్యులు అని రాయబడిన అన్ని సందర్భాలలోనూ ఏ మినహాయింపూ లేకుండా అందరూ అనే భావాన్నే తీసుకొంటే, రక్షణ విషయంలో చాలామంది మినహాయింపుగా ఉన్నట్లు మనకు  అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విమర్శ చేసిన వారి కొలమానం వారిపైనే పెడదాం.

మత్తయి 22:14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

రక్షణ అనేది ఏ మినహాయింపూ లేకుండా అందరికీ అని నమ్మే అర్మీనియనిస్టు సోదరులు, ఈ వచనానికి ఏ విధంగా అర్ధం చెప్పగలరు?  అందుకే వారు ఈ వచనాన్ని, పిలువబడినవారు అందరూ, ఏర్పరచబడినవారు కూడా అందరూ అని రాసుకోవాలి. 

మా విమర్శకులకు కొన్ని చిక్కుముడులు

ఇంతవరకూ, మేము నమ్మే సిద్ధాంతం పైన వస్తున్న విమర్శలకు మా‌ ముందు వ్యాసంలోనూ, ఇందులోనూ కూడా వాక్య ఆధారాలతో సమాధానం ఇచ్చాము. ఇకపైన కూడా ఎన్ని విమర్శలు వచ్చినా ఇస్తూనే ఉంటాము. అయితే ఇప్పటివరకూ మా సిద్ధాంతం‌ తప్పని చెప్పేవారెవరూ, మా ముందు వ్యాసం‌లో మేము ఏ వాక్య ఆధారాలతో ఆ సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో ఆ వచనాలకు భావాన్ని కానీ, అందులో మేము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కానీ ఇచ్చింది లేదు.

అయినప్పటికీ, కేవలం అవతలి వారికి సమాధానాలు ఇచ్చుకొంటూ వెళ్ళడమే కాకుండా, వారికి అవసరమైన ప్రశ్నలు కూడా వేయాలని ప్రభువు నేర్పించారు కాబట్టి,  ఇక్కడ మేము కొన్ని వచనాలను పెట్టి, మా సిద్ధాంతాన్ని తప్పని చెప్పేవారిని సమాధానం ఇవ్వమని ఆహ్వానిస్తున్నాము.

 (1) మొదటి పేతురు 2:7,8  విశ్వ సించుచున్న మీకు, ఆయన అమూల్యమైనవాడు; విశ్వ సింపనివారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయెను. మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయెను. కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి.

దేవుడు ముందుగానే తన చిత్తం‌చొప్పున ఎటువంటి నియమాన్నీ చేయకుంటే, 

ఈ సందర్భంలో కొందరు తొట్రిల్లేవారు అందుకే నియమించబడ్డారని ఎందుకు రాయబడింది?

(2) మొదటి సమూయేలు 2:22-25 ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకువచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను ఈ జనులముందర మీరుచేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?  నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవా వారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొఱ్ఱను వినకపోయిరి.

ఇక్కడ 'మాట విననందుకు యెహోవా వారిని నాశనం చేయాలనుకున్నాడు' అని కాకుండా 'యెహోవా వారిని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టి వారు మాట వినలేదు' అనటమేంటి?

(3) సామెతలు 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. 

దుష్టులను నాశన దినమునకు కలుగ జేయటంలో ప్రేమ ఎక్కడుంది? వారిని అసలు కలుగజేయకుండా ఉండుంటే అదే గొప్ప ప్రేమ అయిఉండేది కదా?

 (4) రోమా పత్రిక 9 వ అధ్యాయం, 10 నుంచి 23 వచనాల వరకూ ఉన్న వివరణ ఏమిటి?

(5) యోహాను సువార్త 10: 26 అయితే మీరు నా గొఱ్ఱెలలో చేరినవారుకారు గనుక మీరు నమ్మరు.

మీరు నమ్మరు కాబట్టి 'నా గొర్రెలు అనకుండా' 'నా గొర్రెలు కారు కాబట్టి నమ్మరు' అనడమేంటి?

(6) అపొ. కార్యములు 13:48 మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

ఇక్కడ 'విశ్వసించిన వారు నిత్యజీవానికి నియమించబడ్డారు' అనకుండా 'నిత్యజీవం కొరకు నిర్ణయించబడినవారు విశ్వసించారు' అనటమేంటి?

(7) మత్తయి సువార్త 11:21-23 అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోనుపట్టణములలో చేయబడిన యెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిదె వేసికొని మారుమనస్సు పొంది యుందురు. 22 విమర్శదినమందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను. 23 కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చింపబడెదవా? నీవు పాతాళమువరకు దిగి పోయెదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటివరకు నిలిచియుండును.

ఇక్కడ కొన్ని అద్భుతాలు, సూచక క్రియలు చేసుంటే కొన్ని పట్టణాలు మారుమనస్సు పొందుండేవి అని తెలిసికూడా దేవుడు ఆ పట్టణాల్లో ఆ అద్భుతాలు, సూచక క్రియలు ఎందుకు చేయించలేదు?

ఇప్పటికే, మా సిద్ధాంతాన్ని తప్పనిచెప్పేవారు మా ఒక్క వాదనకూ సరైన సమాధానం ఇచ్చుకోలేని కారణం చేత, వారిపైన ఎక్కువ భారం పెట్టకుండా ఈ ప్రశ్నలతోనే సరిపెట్టుకొంటున్నాము.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.