బైబిల్

రచయిత: ఆర్థర్. డబ్ల్యు. పింక్
అనువాదం: టి. రజినీకాంత్

ఆడియో

విషయసూచిక

పరిచయం

దేవుడు ఏ ఉద్దేశంతో తన వాక్యాన్ని మనకందించాడో ఆ ఉద్దేశానుసారంగా మనము దానిని అధ్యయనం చేపట్టకపోతే దాని నుండి ఎటువంటి ఆత్మీయలాభం పొందలేమని, ఈ పుస్తకంలో ఆర్థర్‌. డబ్ల్యూ. పింక్‌ గారు బైబిలును ఆధారం చేసుకుని సుస్పష్టంగా వివరించారు. మన అనుదిన వాక్యధ్యానం నుండి మనమెంత వరకు ఆత్మీయలాభాన్ని పొంది, ఎంత వరకు ఆచరణాత్మకమైన జీవితాన్ని కలిగున్నామో బేరీజు వేసుకునేందుకు పది అధ్యాయాలలో ఏడు అంశాల చొప్పున 70 లేఖనాధార ప్రమాణాలతో ఈ పుస్తకం రూపొందించబడింది.

 

20వ శతాబ్దంలో సంఘక్షేమాభివృద్ధికి దేవుడు అనుగ్రహించిన రచయితలలో ఆర్థర్‌.డబ్ల్యూ.పింక్‌ గారిని అగ్రగణ్యునిగా చేయటంలో ఈ పుస్తకం ఎంతగానో దోహదపడిందనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు. సిద్ధాంతపరంగాను, అనుభవాత్మకంగాను, దేవునితో అతనకి గల సంబంధం ఎటువంటిదో ఈ పుస్తకం వివరిస్తుంది. 1952వ సంవత్సరంలో తాను ప్రభువును చేరుకునే ముందు, దాదాపు 30 సంవత్సరాలుగా 'స్టడీస్ ఇన్ స్క్రిప్చర్స్' (లేఖనాల అధ్యయనము) అనే మాసపత్రికకు సంపాదకునిగా రాసిన వ్యాసాలు, అంశాలవారీగా పొందుపరిచి రూపొందించబడిన అనేక పుస్తకాలలో ఈ పుస్తకమొకటి. ఈ పుస్తకంలోని మాటలు విమర్శనాత్మక వైఖరితో కాక, కేవలం వాక్యానుసారంగా మనల్ని మనం పరీక్షించుకునే దిశగా నడిపించేందుకే రాయబడినవని మనం గమనించాలి. సమస్తజ్ఞానంతో క్రీస్తువాక్యం సమృద్ధిగా నివసించునట్లు, దేవుని ప్రజలను వాక్యం అంగీకరించే దిశగా ఈ పుస్తకం ప్రోత్సహించాలని కొలస్సీ 3:16 మా ప్రార్థన. మరియు అందరికీ తేటగా కనబడే నిమిత్తము వారి విశ్వాసము, ఆచరణ, వాక్యపు ఆధీనంలో మాత్రమే ఉండాలని మా కోరిక.

మొదటి అధ్యాయం

లేఖనాలు మరియు పాపము

వాక్యం ధ్యానించటంలో ఉండాల్సిన ఉద్ధేశాలు

ఎన్నో సంవత్సరాలుగా దైవవాక్యధ్యానం మరియు వాక్యపఠనంలో నిమగ్నమైన అనేకులు, దాని నుండి ఏ ఆత్మీయలాభాన్ని పొందలేదని అనటానికి ఒక గంభీరమైన కారణముంది. పైగా, చాలా సందర్భాల్లో అది దీవెనగా కంటే శాపంగా మారిందని నేను భయపడుతున్నాను. ఇది ఘాటైన భాషని నాకు తెలుసు. అయినా ఇది సందర్భోచితమైనదే. దైవికవరాలు దురుపయోగపరచబడటం, దైవికకృపలు దుర్వినియోగం చేయబడటం సాధ్యమే. వాక్యధ్యానం విషయంలో కూడా ఇలా జరిగిందనటానికి ఋజువు, దాని నుండి కలిగిన ఫలాలే. ఒక ప్రకృతిసంబంధియైన వ్యక్తి కూడా ఇతర విషయాల్ని చదవటానికి చూపించే ఉత్సాహాన్ని,ఉల్లాసాన్ని చాలాసార్లు దైవ వాక్యధ్యానాన్ని చేయడానికి కూడా చూపించవచ్చు(చూపిస్తాడు కూడా). ఇలాంటప్పుడు అతని జ్ఞానం పెరుగుతుంది. దానితో పాటు అతని గర్వం కూడా పెరుగుతుంది. ఒక శాస్త్రవేత్త ఆసక్తి గొలిపే ప్రయోగాలు చేయటంలో ఎలా నిమగ్నమౌతాడో, వాక్యాన్ని భౌతికంగా వెతికే వ్యక్తి అందులో ఏదో ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నప్పుడు కూడా అలాగే ఉప్పొంగిపోతాడు. కాని ఆ శాస్త్రజ్ఞుడు పొందే ఆనందంలో ఆత్మీయత అనేది ఏమీ లేనట్టుగానే ఆ వ్యక్తి పొందే సంతోషంలో కూడా ఏమాత్రం ఆత్మీయత ఉండదు. అంతే కాకుండా, ఆ శాస్త్రజ్ఞుని విజయాలు అతని ప్రాముఖ్యతను పెంచి, అతని కంటే తక్కువ తెలివైన వ్యక్తులను అవహేళన చేసేట్లు చేస్తుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, దేవుని వాక్యంలో సంఖ్యాపరమైన విషయాలు, ప్రవచనాలు, సాదృశ్యాలు మొదలైన ఎన్నో విషయాలను పరిశోధించినవారిలో అనేకులు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు.

దేవుని వాక్యాన్ని వివిధ కారణాలతో చదవొచ్చు. కొందరు తమ సాహిత్యాభిమానాన్ని తీర్చుకోవటానికి చదువుతారు. కొన్ని సంఘాలలో బైబిలు విషయాల పట్ల అవగాహన కలిగుండటం ఎంతో గౌరవనీయంగా, అది లేకపోవటం ఒక సంస్కారలోపంగా చూస్తారు కనుక దానిని చదువుతారు. కొందరైతే ఒక ప్రఖ్యాతిగాంచిన పుస్తకాన్ని చదివినట్టే తమ జిజ్ఞాసను తృప్తిపరచుకునేందుకు దీనిని చదువుతారు. మరికొందరు తమ సంఘాభిమానాన్ని నిలబెట్టుకునేందుకు చదువుతారు - 'మా సిద్ధాంతాలు' అని వారి సంఘం ఎంచే కొన్ని బోధలకు నిర్ధారణ వాక్యాలు వెదికి, వాటిలో ప్రావీణ్యత కలిగుండటం తమ బాధ్యతగా వారు భావిస్తారు. ఇంకా కొంతమంది తమతో విభేదించేవారితో విజయవంతంగా వాదించటానికి చదువుతారు. కాని, వీటన్నిలో దేవునిగూర్చిన ఆలోచనగాని, ఆత్మీయాభివృద్ధి కొరకైన ఆపేక్ష గాని లేవు. కాబట్టి  ఆత్మకు పెద్దగా లాభం చేకూరదు.

మరైతే, వాక్యంనుండి నిజమైన లాభం పొందటం అంటే ఏమిటి? 2 తిమోతి 3:16,17వ వచనాలు ఈ ప్రశ్నకు సరైన జవాబునివ్వదా? ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది'' అని అక్కడ మనము చదువుతాం. అక్కడ మినహాయింపబడిందేంటో  గమనించండి. పరిశుద్ధ లేఖనాలు మనకు మేథోసంబంధమైన ఆనందం పొందటానికో లేక ఐహికంగా ఆలోచన చేయటానికో ఇవ్వబడలేదు గాని ఉపదేశించటం ద్వారా, ఖండించి, తప్పుదిద్దటం ద్వారా ''ప్రతి సత్కార్యమునకు'' పూర్ణముగా సిద్ధపడి ఉండటానికి ఇవ్వబడ్డాయి. మనమిప్పుడు ఇతర లేఖనభాగాల సహాయంతో ఈ విషయాన్ని విపులీకరించే ప్రయత్నం చేద్దాం.

1.వాక్యము పాపనిర్ధారణ చేసినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

ఇది వాక్యం చేసే మొదటి క్రియ, అంటే, మన భ్రష్టత్వాన్ని చూపించటం, మన నీఛత్వాన్ని బహిర్గతం చేయటం, మన దుర్మార్గతను తెలియపరచటం. ఒక వ్యక్తి నైతికజీవితం నిష్కళంకం కావచ్చు, తన సహచరులతో అతని వ్యవహారం లోపరహితమైనదే కావచ్చు, కాని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని తన హృదయానికి, మనస్సాక్షికి వర్తింపజేస్తాడో, ఎప్పుడైతే దేవునితో తనకుగల సంబంధాన్ని, వైఖరిని చూడగలిగేలా పాపం చేత గుడ్డిగా చేయబడ్డ కళ్ళు తెరవబడతాయో, అప్పుడు,''అయ్యో, నాకు శ్రమ, నేను నశించితిని,'' అని రోధిస్తాడు. ఈ విధంగా నిజంగా రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి క్రీస్తు యొక్క అవసరతను గ్రహించేందుకు సిద్ధపరచబడతాడు. ''రోగు లకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు'' (లూకా 5:31). అయినప్పటికీ, దైవికశక్తితో పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని అన్వయించేంత వరకు కూడా ఏ వ్యక్తి తాను రోగినని, మరణాంతకమైన రోగముగలవాడినని భావించలేడు.మనిషిని భయంకర వినాశనానికి గురిచేసిన పాపం విషయమై  హృదయంలో కలిగే ఈ దోషనిర్ధారణను, అతను ''మారుమనస్సు'' పొందిన వెంటనే కలిగే ప్రారంభ అనుభవానికి మాత్రమే పరిమితం చేయకూడదు. దేవుడు తన వాక్యంతో నా హృదయాన్ని సంధించిన ప్రతిసారి, ''మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి'' (1 పేతురు 1:15) అన్న ఉన్నత స్థాయికి చేరుకునేందుకు నేను ఎంత వెనుకబడి ఉన్నానో నాకు తెలుస్తుంది. అయితే, ఇక్కడ అన్వయించుకోవటానికి మొదటి పరీక్ష ఏమిటంటే లేఖనంలో వివిధ వ్యక్తుల ఘోరవైఫల్యాలు నేను చదువుతున్నప్పుడు, వారిలాగ నేను కూడా ఎంతో విచారకరమైన స్థితిలో ఉన్నానన్న గ్రహింపు అది నాకు కలుగజేస్తుందా? నేను క్రీస్తు యొక్క ధన్యకరమైన, పరిపూర్ణమైన జీవితం గురించి చదువుతున్నప్పుడు, నేను ఆయనలాగ లేనన్న ఘోర వాస్తవాన్ని గుర్తించగలుగుతున్నానా?

2.వాక్యము పాపము పట్ల దుఃఖం కలుగజేసినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

రాతి నేలను పోలినవానిగూర్చి ఇలా రాయబడి ఉంది, 'వాక్యము విని, వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరిస్తాడు, కాని అతనిలో వేరు ఉండదు' (మత్తయి 13:20,21). అయితే పేతురు ప్రసంగం చేత దోషులుగా తేల్చబడినవారు హృదయంలో నొచ్చుకున్నారని గ్రంథస్థం చేయబడింది (అపొ.కా. 2:37) .ఈ వ్యత్యాసం ఈనాటికీ అలాగే ఉంది. చాలామంది ఒక వినసొంపైన ఉపదేశాన్ని వింటారు, లేక 'నిర్వాహణయుగాల'(Dispensationalism) మీద ప్రసంగీకుని భాషానైపుణ్యాన్ని, మేథోసామర్థ్యాన్ని ప్రదర్శించే ఒక ప్రసంగం వింటారు. కాని సాధారణంగా అందులో మనస్సాక్షిని పరిశీలించే మాటలేవీ ఉండవు. కనుక దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు, కాని దాని ద్వారా ఎవరూ తగ్గింపబడి దేవునితో సన్నిహిత సహవాసంలోకి నడిపింపబడరు. అయితే ఒక నమ్మకమైన ప్రభువు దాసుడు,(తన 'సూక్ష్మబుద్ధి'ని ప్రదర్శించి ప్రశంసల్ని కోరకుండా కృప పొందిన దైవజనుడు) నడవడిని,ప్రవర్తనను దిద్దుబాటు చేసుకునే దేవునిలేఖనాలను బోధిస్తూ, శ్రేష్ఠమైన దైవజనుల ఘోరవైఫల్యాలను సహితం బహిర్గతం చేసినప్పుడు,ప్రజలు అతన్ని తిరస్కరించినప్పటికీ , నిజంగా మారుమనస్సు పొందినవారు మాత్రం దేవుని ఎదుట దు:ఖించి, ''అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను'' అని విలపించటానికి సహాయపడిన ఆ సందేశం కొరకు కృతజ్ఞులై ఉంటారు.ఇదే వ్యక్తిగత వాక్యపఠనం వలన కూడా జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని అన్వయించి నా అంతరంగంలో ఉన్న భ్రష్ఠత్వాన్ని చూపించి, గ్రహింపజేసినప్పుడే, నేను నిజంగా ఆశీర్వదింపబడతాను.

యిర్మీయా 31:19లో ''నేను సంగతి తెలిసికొని తొడ చరుచుకొంటిని, నాకు కలిగిన నిందను భరించుచు నేను అవమానమునొంది సిగ్గుపడితిని'' అని రాయబడి ఉంది. ప్రియచదువరీ, అలాంటి అనుభవమేదైనా నీకుందా? నీ వాక్యపఠనం విరిగిననలిగిన హృదయాన్ని కలుగజేసి దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకునేటట్లు చేసిందా? నువ్వు ప్రతిదినం నీ పాపాల గురించి దేవుని ఎదుట పశ్చాత్తాపపడేలా నీ వాక్యధ్యానం నిన్ను ఒప్పించగలుగుతుందా? ఆ గొఱ్ఱెపిల్ల మాంసాన్ని ''చేదుకూరలతో తినవలెను" (నిర్గమ 12:8) . మనం నిజంగా వాక్యాన్ని భుజిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దాన్ని మనకు ''చేదుపరిచి'', తర్వాత మనకు మధురంగా చేస్తాడు. ప్రకటన 10:9లో ఉన్న వరుసక్రమాన్ని గమనించండి, ''నేను ఆ దూతయొద్దకు వెళ్ళి - ఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయన - దాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.'' ఎప్పటికీ ఆచరించవలసిన వరుసక్రమం ఇదే - ఓదార్పుకు ముందు దుఃఖపడటం (మత్తయి 5:4), హెచ్చింపుకు ముందు దీనమనస్సు కలిగుండటం (1 పేతురు 5:6) .

3.వాక్యము పాపాన్ని ఒప్పింపజేసినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

లేఖనాలు ''ఖండించుట''కు ప్రయోజనకరం (2 తిమోతి 3:16); అలా ఖండించినప్పుడు, యథార్థమైన వ్యక్తి తన పొరపాట్లను అంగీకరిస్తాడు. శరీరాశలను అనుసరించి నడుచుకునేవారిని గురించి ఇలా చెప్పబడింది - ''దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్‌ క్రియలుగా కనబడుకుండునట్లు వెలుగునొద్దకు రాడు''(యోహాను 3:20). ''పాపినైన నా పట్ల కరుణ చూపుము దేవా'' (లూకా 18:13) అనేది మారుమనస్సు పొందిన వ్యక్తి యొక్క హృదయరోదన. వాక్యం చేత మనం ఉజ్జీవింపబడిన ప్రతిసారి (కీర్తన 119:50), మన అతిక్రమాలను గురించి తాజా గ్రహింపు కలిగి, దేవుని ఎదుట ఒక నూతనమైన ఒప్పుకోలు కలుగుతుంది. ''అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును'' (సామెతలు 28:13). మన రహస్యపాపాలు మన మనసులో దాచిపెట్టుకున్నంతవరకూ, ఆత్మీయాభివృద్ధి కానీ, ఫలించడం కానీ (కీర్తన 1:3) ) జరగదు. దేవునివాక్యం చేత మన పాపాలు సంపూర్ణంగా ఒప్పింపబడినప్పుడే, ఆయన దయను అనుభవించగలము.

 ఒప్పుకోని పాపం యొక్క భారాన్ని మోస్తున్నంతవరకూ మన మనస్సాక్షికి నిజమైన సమాధానం కానీ మన హృదయానికి నిజమైన విశ్రాంతి కానీ ఉండదు. అది పూర్తిగా దేవుని ముందు ఒప్పుకున్నప్పుడే ఉపశమనం కలుగుతుంది. దావీదు అనుభవాన్ని జాగ్రత్తగా గమనించండి - ''నేను మౌనినైయుండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా యెముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగానుండెను, నా సారము వేసవికాలమున ఎండినట్టాయెను''(కీర్తన 32:3,4). ఇది నీకు అర్థంకాని అలంకార భాషలా అనిపిస్తుందా? లేక నీ సొంత ఆత్మీయానుభవం దాన్ని వివరిస్తుందా? లేఖనంలోని చాలా వచనాలను మన వ్యక్తిగత అనుభవం  తప్ప మరి ఏ వ్యాఖ్యానాలు కూడా సంతృప్తిగా వివరించలేవు. ఐతే ఇక్కడ దాని తరువాతి వచనము చాలా ఆశీర్వాదకరమైంది - ''నా దోషమును కప్పుకొనక, నీ యెదుట నా పాపము ఒప్పుకొంటిని - యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించియున్నావు'' (కీర్తన 32:5).

4.వాక్యము పాపం పట్ల లోతైన ద్వేషం పుట్టించినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

''యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి'' (కీర్తన 97:10). 'దేవుడు ద్వేషించేదానిని ద్వేషించకుండా మనం దేవునిని ప్రేమించలేము. మనం చెడుతనాన్ని తప్పించుకోవటమే కాదు, దానిలో కొనసాగటాన్ని కూడా నిరాకరించాలి. దానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి, దాని పట్ల నిజమైన ద్వేషం కలిగుండాలి' (చార్లెస్‌ హెచ్‌.స్పర్జన్‌). ఒక వ్యక్తి మారుమనస్సు పొందాడని నిర్ధారించటానికి ఖచ్చితమైన పరీక్ష - పాపము పట్ల అతని హృదయధోరణి. పరిశుద్ధతానియమం ఎక్కడ నాటబడితే, అక్కడ తప్పకుండా అపవిత్రమైనదంతా అసభ్యకరంగా ఉంటుంది. చెడుపట్ల మన ద్వేషం యథార్థమైనదైతే, మనం అప్పటివరకూ గ్రహించని చెడును వాక్యం ఖండించి, బుద్ధి చెప్పినప్పుడు కూడా, మనం కృతజ్ఞులమై ఉంటాము.

ఇది కీర్తనాకారుని అనుభవం - ''నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధమార్గములన్నియు నాకసహ్యములు'' (కీర్తన 119:128). జాగ్రత్తగా గమనించండి, 'నేను దూరంగా ఉంటాను' అని కాదు గాని 'నాకు అసహ్యము' అని అంటున్నాడు; అలాగే 'కొన్ని' లేక 'చాలా' కాదు కాని 'ప్రతి అబద్ధ మార్గము' అని అంటున్నాడు; ''నీ ఉపదేశములన్నియు యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధమార్గములన్నియు నాకహస్యములు''. కాని దుష్టుల విషయం సరిగ్గా దీనికి వ్యతిరేకం. ''దిద్దుబాటు నీకు అసహ్యము గదా, నీవు నా మాటలను నీవెనుకకు త్రోసివేసెదవు'' - కీర్తన 50:17; అలాగే సామెతలు 8:13లో ''యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనము నహ్యించుకొనుటయే'' అని మనం చదువుతాం; దైవికమైన ఈ భయభక్తులు వాక్యం చదవటం వల్లనే కలుగుతాయి. ద్వితీ 17:18,19 చూడండి.

5.వాక్యము పాపాన్ని విడిచిపెట్టేలా చేసినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

''ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను'' (2 తిమోతి 2:19). ప్రభువుకు ఏది సంతృప్తికరమో, ఏది అయిష్టమో కనుక్కోవాలన్న నిర్దిష్ట ఉద్దేశంతో వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదువుతామో, అంతే ఎక్కువగా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాము. మన హృదయాలు ఆయనతో ఎంత సరైనవిగా ఉంటే, మన మార్గాలు కూడా అంతే ఎక్కువగా ఆయన చిత్తానుసారమౌతాయి. అప్పుడు ''సత్యమును అనుసరించి నడుచుకొనుట'' (3 యోహాను 4) ఉంటుంది. 2వ కొరింథీ 6వ అధ్యాయం చివరిలో అవిశ్వాసుల నుండి తమను తాము వేరుపరచుకొనేవారికి కొన్ని విలువైన వాగ్దానాలివ్వబడ్డాయి. అక్కడ పరిశుద్ధాత్ముడు వాటిని ఎలా అన్వయించాడో గమనించండి -  'మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక, సుఖంగా ఉండి తద్వారా తృప్తిపడదాం' అని వ్రాసిలేదు కాని, ''ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, శరీరమునకును ఆత్మకును కలిగిన ఆ సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము (2 కొరింథీ 7:1) అని వ్రాయబడింది.

''నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు'' (యోహాను 15:3). మనలను మనం తరచూ పరీక్షించుకోవడానికి ఇక్కడ మరో ముఖ్యమైన నియమముంది. దేవునివాక్యము చదివి ధ్యానించటం వలన నా మార్గాలలో ఏమైనా కల్మషం తొలగింపబడిందా? గతంలో కూడా ఈ ప్రశ్న అడగబడింది ''యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు?'' దానికి దైవావేశముచేత ఇవ్వబడిన జవాబు - ''నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే'' (కీర్తన 119:9). అవును, కేవలం వాక్యాన్ని చదివి, కంఠస్థం చేయటం ద్వారా కాదు కాని మన 'వ్యక్తిగత జీవితానికి' ఆ వాక్యాన్ని అన్వయించుకోవటం ద్వారా మాత్రమే, ''జారత్వమునకు దూరముగా పారిపోవుడి'' (1 కొరింథీ 6:18), ''విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి'' (1 కొరింథీ 10:14), (ధనవంతులగుటకు అపేక్షను) ''వీటిని విసర్జించుము'' (1 తిమోతి 6:11), ''యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము'' (2 తిమోతి 2:22) లాంటి ఉద్భోధలకు శ్రద్ధ వహించేలా నడిపించబడతాము. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోవటం మాత్రమే కాదు దాన్ని ''విడిచిపెట్టాలి'' (సామెతలు 28:13).

6.వాక్యము పాపానికి వ్యతిరేకంగా బలపరిచినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

పరిశుద్ధ లేఖనాలు మన అంతరంగ పాపస్వభావాన్ని బహిర్గతం చేసి, ''దేవుడు అనుగ్రహించు మహిమ''ను పొందలేకపోవటానికి ఎన్నో కారణాలను చూపించటానికి మాత్రమే కాకుండ పాపము నుండి ఎలా విడుదల పొందాలో, దేవునికి అయిష్టమైన విషయాల నుండి ఎలా దూరంగా ఉండాలో తెలిపేందుకు కూడా ఇవ్వబడ్డాయి. ''నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను'' (కీర్తన 119:11). మనందరం చేయవలసింది ఒకటుంది, ''ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను హృదయములో ఉంచుకొనుము'' (యోబు 22:22). ప్రత్యేకంగా, ఆజ్ఞలు, హెచ్చరికలు, ఉపదేశాలను మన సొంతవిగా చేసుకుని మనల్ని మనం పరీక్ష్షించుకోవాలి; వాటిని కంఠస్థం చేసి, ధ్యానించి, ప్రార్థించి, ఆచరణలో పెట్టాలి. ఒక పొలంలో కలుపు ఎక్కువగా పెరగకుండా చూడటానికి లాభసాటియైన మార్గము అందులో మంచి విత్తనాలు విత్తటమే - ''మేలుచేత కీడును జయించుము'' (రోమా 12:21). మనలో క్రీస్తువాక్యము ఎంత ''సమృద్ధిగా నివసింపనిస్తే'' (కొలొస్సీ 3:16), మన హృదయాల్లో, మన జీవితాల్లో పాపం అంత తక్కువగా చెలామణి అవటానికి ఆస్కారముంటుంది.

కేవలం లేఖనాల యథార్థతకు ఒప్పుకుంటే సరిపోదు, వాటిని ప్రేమతో స్వీకరించాలి. ''సత్యవిషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయిరి'' (2 థెస్స 2:9), ఇది విశ్వాసభ్రష్ఠత్వానికి అనువైన కారణమని పరిశుద్ధాత్ముడు నిర్దిష్టంగా చెబుతున్నాడని గ్రహించటం వివరించశక్యము కాని గంభీర విషయం. 'వాక్యం కేవలం నాలుక మీదనో లేక మనసులోనో ఉండి, ఊహాకల్పన చేయటానికో లేక ముచ్చటించటానికో ఉండే విషయమైతే, అది తొందరగా పోతుంది. త్రోవప్రక్కన పడిన విత్తనాలను పక్షులు మింగివేస్తాయి. ఎప్పుడైతే అది హృదయాన్ని ప్రభావితం చేసేలా ఏలుతుందో, అప్పుడే దాన్ని మనం ప్రేమతో ఆహ్వానిస్తాం - మనకు అతి ప్రియమైన వాంఛల కంటే అది ప్రియమైనప్పుడు, అది మనలో నిలిచి ఉంటుంది ' (థామస్‌ మాంటన్‌).

  దేవునివాక్యాన్ని ప్రేమతో స్వీకరించడం తప్ప ఏదీ కూడా మనల్ని ఈ లోకాశల నుండి, సాతానుశోధనల నుండి విడుదల కలిగించి, పాపానికి వ్యతిరేకంగా, బలంగా పరిరక్షించలేదు. ''వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు'' (కీర్తన 37:31). మనలో వాక్యం చురుకుగా ఉన్నంతవరకు, మనస్సాక్షిని కుదుపుతూ నిజంగా మనచేత ప్రేమించబడుతున్నంతవరకు, మనం పడిపోకుండా కాపాడబడగలం. పోతీఫరు భార్యచేత యోసేపు శోధించబడినప్పుడు, ''నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును?''(ఆది 39:9) అని అన్నాడు. వాక్యము ఆయన హృదయంలో ఉంది కాబట్టి అది అతని కామేచ్ఛలను నియంత్రించింది. దేవుని వర్ణనాతీతమైన పరిశుద్ధత, మహాబలము - రక్షించటానికి మరియు నాశనం చేయటానికి సమర్థమైనవి. మనం ఎప్పుడు శోధింపబడతామో తెలియదు. కాబట్టి దానికి వ్యతిరేకంగా సిద్ధపడటం అవసరం - ''మీలో ఎవడు చెవియొగ్గును? రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును?'' (యెషయా 42:23). అవును, మనం రాబోయే కాలాన్ని ముందుగా గ్రహించి దానికి వ్యతిరేకంగా బలపరచబడి, కలగబోయే అత్యవసర పరిస్థితి నిమిత్తం వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరచుకుందాం.

7.వాక్యం పాపానికి వ్యతిరేకమైనదాన్ని అవలంబించటం నేర్పినప్పుడు ఒక వ్యక్తి ఆత్మీయంగా లాభం పొందుతాడు

''ఆజ్ఞాతిక్రమమే పాపము'' (1 యోహాను 3:4). 'నువ్వు ఇది చేయాలి' అని దేవుడంటే, 'నేను చేయను' అని పాపం అంటుంది; 'నువ్వు ఇది చేయకూడదు' అని దేవుడంటే, 'నేను చేసి తీరుతాను' అని పాపమంటుంది. కాబట్టి, పాపమనేది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, నాకిష్టమైన మార్గానికి తొలిగే ధృఢసంకల్పం (యెషయా 53:6). ఆత్మీయ ప్రపంచంలో పాపం అనేది ఒక అరాచకవ్యవస్థ, దానిని దేవుని కళ్ళ ఎదుట ఎర్రజెండా ఊపడంతో సరిపోల్చవచ్చు. చట్టానికి లోబడి జీవించటమే అరాచకత్వానికి వ్యతిరేకమైనదని ఎలా అంటామో, అలాగే దేవునికి విరుద్ధంగా పాపము చేయటానికి వ్యతిరేకమైనది దేవునికి లోబడి ఉండటమే. లేఖనాలు ఇవ్వబడటానికి ఇది మరో ముఖ్యకారణం : దేవునికిష్టమైన మార్గాన్ని మనకు తెలియజేయటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు మాత్రమే కాదు కాని ''నీతియందు శిక్షచేయుటకు'' కూడా అవి ప్రయోజనకరము.

అయితే, ఇక్కడ మనల్ని మనం తరచూ పరీక్షించుకునేందుకు ఒక ముఖ్య సూత్రముంది. నా ఆలోచనలు, నా హృదయము, నా మార్గాలు, పనులు దేవునివాక్యం చేత క్రమపరచబడుతున్నాయా? ప్రభువుకు కావలిసింది ఇదే - ''మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి'' (యాకోబు 1:22). క్రీస్తు పట్ల కృతజ్ఞత, ప్రేమ ఈ విధంగా వ్యక్తపరచాలి - ''మీరు నన్ను ప్రేమించినయెడల, నా ఆజ్ఞలను గైకొందురు'' (యోహాను 14:15). దీనికి దైవిక సహాయమవసరం, ''నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువజేయుము'' (కీర్తన 119:35) అని కీర్తనాకారుడు ప్రార్థించాడు. 'ఆయన మార్గంలో నడవటానికి మనకు వెలుగు మాత్రమే చాలదు, నడవాలన్న మనస్సు కూడ ఉండాలి. మన మనస్సుల గ్రుడ్డితనము కారణంగా మార్గనిర్దేశం అవసరం; మన హృదయాలలోని చెడుతనం కారణంగా కృప యొక్క బలమైన ప్రభావం అవసరం. విధేయత చూపించటానికి మన బాధ్యతల్ని గురించిన అవగాహన మాత్రమే ఉంటే సరిపోదు, వాటిని హత్తుకుని అనుసరించాలి.' (థామస్ మాంటన్‌). ''నీ ఆజ్ఞల జాడ'' అని ఉంది గమనించండి. స్వయంగా ఎంచుకున్న మార్గం కాదు కాని తప్పకుండా నిర్దేశించబడిన మార్గం; ప్రజా'రహదారి' కాదు కాని వ్యక్తిగత 'బాట'.

ఇక్కడ పేర్కొన్న ఏడు సంగతులను బట్టి, రచయిత మరియు చదువరి యథార్థంగా,మెలకువగా తమను తాము దేవుని సన్నిధిలో బేరీజు వేసుకోవాలి. నీ వాక్యధ్యానం నిన్నింకా దీనునిగా చేసిందా లేక నువ్వు సంపాదించిన జ్ఞానంతో ఇంకా గర్విష్టుడిని చేసిందా? నీ తోటివారి మధ్యలో నీ ఘనతను పెంచిందా లేక దేవుని యెదుట దీనస్థితికి దారి తీసిందా? నీ గురించి నీకు ఇంకా లోతైన ఏవగింపు, అసహ్యత పుట్టించిందా లేక నీలో దురభిమానాన్ని పెంచిందా? నిన్ను కలుసుకునేవారికి లేక నువ్వు బోధించేవారికి - దేవుని వాక్యం గురించి నీకున్నంత జ్ఞానం నాకూ ఉంటే బాగుండేది అనేలా చేసిందా లేక నా స్నేహితునికి, నా బోధకునికి నువ్వనుగ్రహించిన విశ్వాసము, కృప మరియు పరిశుద్ధత నాకూ ఇవ్వు ప్రభువా అని ప్రార్థించేలా చేసిందా? ''నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము'' (1 తిమోతి 4:15).

రెండవ అధ్యాయము

లేఖనాలు మరియు దేవుడు

లేఖనాలలోని దేవుడిని తెల్సుకోవటం

పరిశుద్ధ లేఖనాలు పూర్తిగా ప్రకృతికి అతీతమైనవి. అవి 'దైవిక ప్రకటనలు'. ''ప్రతి లేఖనము దైవావేశమువలన కలిగింది'' (2 తిమోతి 3:16) అంటే లేఖనాలు రాయించటంలో దేవుడు కేవలం ప్రవక్తల ఆలోచనల స్థాయిని పెంచలేదు కాని వాటికి దిశానిర్దేశం చేశాడు. దేవుడు కేవలం ఊహలను మాత్రమే వారికి తెలియపరచలేదు కాని వారు వాడిన ప్రతి పదాన్ని ఆయనే రాయించాడు. ''ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి'' (2 పేతురు 1:21). లేఖనాల్లోని ప్రతీ మాట దైవావేశం వల్ల కలిగింది అన్న సత్యాన్ని ఖండించే ఏ 'మానవ సిద్ధాంతమైనా' సాతాను యొక్క తంత్రం, దేవుని సత్యంపై దాడి. బైబిల్లో ప్రతి పేజీపైన దేవుని స్వరూపం ముద్రించబడింది. అంత పరిశుద్ధత, అంత పరలోకభీతిని పుట్టించే రాతలు మానవుని చేత సృష్టింపబడలేనివి.

లేఖనాలు సహజాతీత దేవునిని తెలియపరుస్తాయి. ఇది ఎంతో తేలికైన మాట కావచ్చు. కాని ఈ రోజులలో దీనిని ఎంతగానో నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది క్రైస్తవులు ఆచరణాత్మకంగా విశ్వసించే 'దేవుడు', అంతకంతకూ అనాగరికంగా చేయబడుతున్నాడు. ఒక జాతి సంస్కృతిలో 'క్రీడల'కున్న ప్రాముఖ్య స్థానం, విలాసాన్ని అతిగా ప్రేమించటం, కుటుంబ జీవితాన్ని నిర్మూలించటం, మహిళల అసహ్యకరమైన ఆడంబరత, ఇవన్నీ ఒకే జబ్బుకు సంబంధించిన అనేక వ్యాధి లక్షణాలు. ఈ లక్షణాలే బబులోను, పర్షియా, గ్రీసు మరియు రోమా సామ్రాజ్యాల పతనానికి, చివరకు వారి మరణానికి దారితీసాయి. నామమాత్రపు 'క్రైస్తవ' దేశాలకు చెందిన అధిక సంఖ్యాకులు నమ్ముతున్న దేవుని గురించిన 20వ శతాబ్దపు భావన, ఎంతో వేగంగా పూర్వికుల దేవతలకు ఆపాదించబడిన లక్షణాలకు దగ్గరౌతుంది. అందుకు పూర్తి భిన్నంగా, పరిశుద్ధుడైన దేవుడు ఏ మానవమాత్రుడు కూడా ఆవిష్కరింపశక్యముకాని పరిపూర్ణతను, గుణలక్షణాలను ధరించుకొనియున్నాడు.

దేవుడు సహజాతీతమైన రీతిలో తనను తాను బయలుపరచుకుంటే తప్ప ఆయనను  తెల్సుకోలేము. వాక్యంలో తెలియపరిచినదానికి మించి ఆయనను సైద్ధాంతికంగా తెల్సుకోవటం కూడా అసంభవం. 'లోకము తన జ్ఞానము చేత దేవున్ని ఎరుగలేదు' (1 కొరింథీ 1:21) అనేది ఇప్పటికీ సత్యమే. ఎక్కడైతే లేఖనాలు ఉపేక్షించబడతాయో, అక్కడ దేవుడు ''తెలియబడని దేవుడు'' (అపొ.కా.17:23). మన ఆత్మ, దేవునిని నిజంగా, యథార్థంగా, వ్యక్తిగతంగా, అనుభవాత్మకంగా తెలుసుకోవటం కోసం లేఖనాలకు మించినదొకటి అవసరం. ఈ రోజున చాలా తక్కువమంది దీనిని గుర్తిస్తున్నారు. రసాయనశాస్త్రానికి సంబంధించిన పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయటం ద్వారా జ్ఞానాన్ని సంపాదించిన విధంగా కేవలం బైబిలు అధ్యయనం ద్వారా దేవుని గురించిన జ్ఞానాన్ని కూడా సంపాదించవచ్చనే భావన ఈ రోజుల్లో ఉంది.ఆ విధంగా ఒక మేథోసంబంధ జ్ఞానం ఆర్జించవచ్చేమో కాని ఆత్మీయజ్ఞానం కాదు. సహజాతీత దేవునిని సహజాతీతంగానే తెలుసుకోగలము (అంటే ప్రకృతిరీతిగా సంపాదించే జ్ఞానానికి అతీతంగా) అంటే హృదయానికి దేవుడు తనంతట తానే ప్రత్యక్షపరచుకునే సహజాతీతమైన బయలుపాటు ద్వారా మాత్రమే తెల్సుకోగలం. ''అంధకారములోనుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను'' (2 కొరింథీ 4:6). ఇటువంటి సహజాతీత అనుభవం అనుగ్రహింపబడిన ఒక వ్యక్తి ''నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము'' (కీర్తన 36:9) అని తెలుసుకుంటాడు.

దేవుడు ప్రకృతికి అతీతమైన శక్తి ద్వారా మాత్రమే తెలుసుకోబడతాడు. ''ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడు'' (యోహాను 3:3) అన్న క్రీస్తు మాటలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. కొత్తగా జన్మించనివారికి దేవునిని గురించిన ఆత్మీయ జ్ఞానముండదు.

''ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు'' (1 కొరింథీ 2:14). నీరు దానంతటదే మట్టం పెంచుకోలేదు, అలాగే ప్రకృతిసంబంధియైన వ్యక్తి ప్రకృతిని అధిగమించే విషయాలను తనకు తానుగా గ్రహింపలేడు. ''అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము'' (యోహాను 17:3). 'నిజదేవుడు' తెలియబడక మునుపే నిత్యజీవాన్ని కలిగుండాలి. 1 యోహాను 5:20 దీన్ని స్పష్టంగా ఇలా దృఢపరిచింది, ''మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము.'' దేవుడు ఆత్మీయంగా తెలియబడక మునుపు నూతన జన్మ ద్వారా 'వివేకము', 'ఆత్మీయవివేకం' ఇవ్వబడాలి.

దేవుని గురించిన సహజాతీత జ్ఞానము ఒక సహజాతీత అనుభవాన్ని కలగజేస్తుంది. చాలామంది సంఘసభ్యులకు ఇదొక అపరిచిత విషయం. ఈ రోజుల్లో 'క్రైస్తవ్యం' అంటే ఏదో 'పాత ఆదాము'ను (ప్రాచీన స్వభావాన్ని) మెరుగుపరుచుకోవటం అయిపోయింది. అంటే, లోపలున్న అవినీతికి పైపై మెరుగులు దిద్దటం అన్నమాట. అదొక పైరూపం మాత్రమే. మత విశ్వాసం గట్టిగా ఉన్నా, అది సంప్రదాయాలలో కూరుకుపోయింది. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, ఇది ఎప్పటినుండో ఉన్న సంగతి. క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు కూడా అలాగే ఉంది. యూదులు ఎంతో మతనిష్ఠగలవారు. ఆ రోజుల్లో వారు విగ్రహారాధనకు దూరంగా ఉండేవారు. యెరూషలేములో దేవాలయం ఉండేది, ధర్మశాస్త్రం వివరింపబడేది, యెహోవా ఆరాధింపబడేవాడు. అయినా క్రీస్తు వారితో ఇలా అన్నాడు, ''నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు'' (యోహాను 7:28). ''మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు నన్ను ఎరిగియుంటిరా నా తండ్రిని కూడా ఎరిగియుందురు'' (యోహాను 8:19). ''మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు, మీరు ఆయనను ఎరుగరు'' (యోహాను 8:54,55). జాగ్రత్తగా గమనించండి. లేఖనాలుండి, వాటిని శ్రద్ధగా వెదకి, అది దేవుని వాక్యమని నమ్మి అనుసరించే ప్రజలతో ఈ మాటలు చెప్పబడ్డాయి! సైద్ధాంతికంగా వారు దేవునితో మంచి పరిచయంగలవారు, కాని దేవుని గురించిన ఆత్మీయజ్ఞానం వారికి లేదు.

ఆనాటి యూదులలో ఉన్న పరిస్థితే నేటి క్రైస్తవ్యంలో కూడా ఉంది. నేడు పరిశుద్ధత్రిత్వాన్ని ''విశ్వసించే'' అనేకులకు సైతం దేవుని గురించిన ఈ సహజాతీత లేక ఆత్మీయజ్ఞానం పూర్తిగా కొరవడింది. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఫలలక్షణం అది కాసిన చెట్టు లక్షణాన్ని తెలియపరుస్తుంది. నీటిస్వభావం అది పొంగే ఊట స్వభావాన్ని తెలియజేస్తుంది. అలాగే దేవుని గురించిన సహజాతీత జ్ఞానం ఒక సహజాతీత అనుభవాన్ని కలిగిస్తుంది. ఆ సహజాతీత అనుభవం సహజాతీత ఫలాలను ఫలింపజేస్తుంది. అంటే హృదయంలో నివసించే దేవుడు జీవితాన్ని మార్చి పరివర్తనం కలిగిస్తాడు. సహజస్వభావం జరిగించలేనిది, దానికి నేరుగా వ్యతిరేకమైనది, ఇప్పుడు జరుగుతుంది. ఈనాడు, దేవుని పిల్లలమని చెప్పుకునే వందమందిలో తొంబైఅయిదు మంది జీవితాల్లో ఇది స్పష్టంగా కొరవడింది. ఒక సామాన్య క్రైస్తవుని జీవితంలో ప్రకృతి సంబంధమైనవి తప్ప చెప్పుకునేందుకు పెద్దగా ఏవీ లేవు. కాని యథార్థమైన దేవునిబిడ్డ జీవితము ఇందుకు పూర్తిగా భిన్నమైనది. నిజానికి, ఆ వ్యక్తి దేవునికృప యొక్క అద్భుతం! అతడు ''క్రీస్తులో నూతన సృష్టి'' (2 కొరింథీ 5:17). అతని జీవితం, అతని అనుభవం సహజాతీతం.

దేవునిపట్ల ఒక క్రైస్తవుని వైఖరిని బట్టి అతని సహజాతీతమైన అనుభవాన్ని చూడగలం. దేవుని ఆత్మను కలిగియున్నవాడిగా, ''దేవుని స్వభావమునందు పాలివాడగునట్లు'' (2 పేతురు 1:4) చేయబడినవానిగా, అతను దేవున్ని ప్రేమిస్తాడు. దేవుని సంగతులను ప్రేమిస్తాడు, దేవుడు ప్రేమించేవాటిని ప్రేమిస్తాడు మరియు దేవుడు ద్వేషించేవాటిని ద్వేషిస్తాడు. దేవునిఆత్మ, దేవునివాక్యం అతనిలో ఈ సహజాతీత అనుభవాన్ని కలుగుతుంది. వాక్యానికి అతీతంగా పరిశుద్ధాత్మ ఎన్నడూ పని చేయడు. దేవునిఆత్మ ఆ వాక్యం చేతనే త్వరపెడతాడు, ఆ వాక్యం చేతనే దోషనిర్ధారణ చేస్తాడు, ఆ వాక్యం చేతనే పవిత్రపరుస్తాడు, ఆ వాక్యం చేతనే అభయమిస్తాడు, ఆ వాక్యం చేతనే పరిశుద్ధతలో ఎదిగేలా చేస్తాడు. పరిశుద్ధాత్ముని అన్వయం వల్ల వాక్యపఠనం మనలో ఉత్పన్నం చేసే పరిణామాల ఆధారంగా వాక్యం నుండి మనం ఎంతమేరకు లాభం పొందుతున్నామో బేరీజు వేసుకోగలం. ఇప్పుడు మనం వివరాల్లోకి వెళదాం. యథార్థంగా, ఆత్మీయంగా లేఖనాల వల్ల లాభం పొందేవానిలో ఇవి కనిపిస్తాయి.

1.దేవుని అధికారాన్ని గురించిన స్పష్టమైన గుర్తింపు

సృష్టికర్తకు మరియు మానవులకు మధ్యగల గొప్ప వివాదమేమిటంటే, దేవుడు ఎవరై ఉండాలి? ఆయనా లేక వారా? వారి క్రియలను నిర్దేశించాల్సింది ఆయన జ్ఞానమా లేక వారి జ్ఞానమా? సర్వోన్నతమైనది ఆయన చిత్తమా లేక వారి చిత్తమా? లూసిఫరు తన సృష్టికర్తకు లోబడి ఉండటాన్ని అసహ్యించుకోవటమే వాని పతనానికి దారితీసింది. ''నేను ఆకాశమునెక్కి పోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును...మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?'' (యెషయా 14:13,14). మన మొదటి తల్లిదండ్రులను నాశనానికి ప్రలోభపెట్టిన ఆ సర్పం యొక్క అబద్ధం కూడా ఇదే - ''మీరు దేవతలవలె ఉందురు'' (ఆది 3:5). ఆ క్షణము నుంచి ప్రకృతిసంబంధియైన మానవుని హృదయ ప్రవృత్తి ఇలాగుంది - ''నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర లేదు, నీవు మమ్మును విడిచి పొమ్ము, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు?'' (యోబు 21:14,15),''మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడు?'' (కీర్తన 12:4), ''మేము స్వేచ్ఛగా తిరుగులాడువారమైతిమి, ఇకను నీ యొద్దకు రాము'' (యిర్మీయా 2:31).

''తనలోనున్న అజ్ఞానముచేత మానవుడు దేవునివలన కలుగు జీవములో నుండి వేరుపరచబడ్డాడు'' (ఎఫెసీ 4:18). అతని హృదయం దేవునికి ప్రతికూలం, అతని చిత్తం దేవుని చిత్తానికి వ్యతిరేకం, అతని మనస్సు దేవునికి విరోధం. అయితే రక్షణ అనేది సరిగ్గా దీనికి విరుద్ధం. అది దేవుని వద్దకు చేర్చబడటం: ''మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు,శరీరవిషయములో చంపబడియు,ఆత్మవిషయములో బ్రతికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను'' (1 పేతురు 3:18). అది దేవుని న్యాయానుసారంగా ఐతే ఇదివరకే పూర్తి చేయబడింది కానీ, ఆచరణాత్మకంగా మాత్రం నెరవేరే ప్రక్రియలో ఉంది. రక్షణ అంటే తిరిగి దేవుని వద్దకు చేర్చబడటం -  అందులో మనపై పాపపు గుత్తాధిపత్యం చేధించబడటం, మనలోని వైరం అంతమొందించబడటం, దేవుని కోసం హృదయం గెలవబడటం - ఇవన్నీ ఇమిడున్నాయి. నిజమైన మారుమనస్సు పొందటం అంటే: ప్రతీ విగ్రహాన్ని కూలద్రోయటం, మోసపూరిత లోకం యొక్క ఆడంబరాలను త్యజించటం మరియు మన పరిపాలకునిగా, మన సర్వస్వంగా దేవున్ని చేర్చుకోవటం. కొరింథీయుల గురించి మనం ఈ విధంగా చదువుతాం - ''మొదట ప్రభువునకును తమ్మును తామే అప్పగించుకొనిరి'' (2 కొరింథీ 8:5). కాబట్టి ''జీవించు వారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినవాని కొరకే జీవించాలి'' (2 కొరింథీ 5:15) అనేది యథార్థంగా మారుమనస్సు పొందినవారి కోరిక, సంకల్పం అయ్యుంటుంది.

దేవుని సత్యాలు ఇప్పుడు గుర్తించబడ్డాయి, మనపై తన న్యాయమైన ఏలుబడి అంగీకరించబడింది. ఆయనే దేవునిగా చేసుకోబడ్డాడు. మారుమనస్సు పొందినవారు తమ్మును తాము 'మృతులలో నుండి సజీవులమనుకొని, దేవునికి అప్పగించుకుంటారు.' మరియు వారి అవయవములను 'నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకుంటారు' (రోమా 6:13).మన దేవునిగా ఉండి, అలా మనచేత సేవించబడి, మననుండి ఏమి కోరుకుంటాడో, ఎలా ఉండి, ఏమి చేయాలని ఇష్టపడతాడో దానికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవాలని దేవుడు మన నుండి అవశ్యంగా కోరతాడు. లూకా 14:26,27,33 చూడండి. మనల్ని శాసించటం, నిర్దేశించటం, తన సంకల్పం చొప్పున నడిపించటం దేవుని అధికారము; ఆయన ఇచ్ఛానుసారంగా పాలించబడి, వ్యవహరింపబడి, వాడుకోబడటానికి అప్పగించుకోవటం మన బాధ్యత. దేవునిని మన దేవునిగా  చేసుకోవడమంటే మన హృదయపు సింహాసనాన్ని ఆయనకివ్వడమే. యెషయా 26:13 వచనపు వెలుగులో దాని భావం ''యెహోవా, మా దేవా, నీవు గాక వేరు ప్రభువులు మమ్మునేలిరి. ఇప్పుడు నిన్నుబట్టియే నీ నామము స్మరింతుము''. కీర్తనాకారునితో యథార్థంగా, కపటము లేకుండా ఇలా ప్రచురించటమే, ''దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును'' (కీర్తన 63:1). మన అనుభవం కూడా నిజంగా ఇలాంటిదే అయితే, లేఖనాల నుండి మనం లాభపడినట్లే. లేఖనాల్లో మాత్రమే దేవుని వాగ్దానాలు తెలపబడి అమలుపరచబడ్డాయి. మనము దేవుని అధికారాన్ని ఎంత స్పష్టంగా, సంపూర్తిగా వీక్షించి, ఆ మేరకు మనల్ని మనం లోబరచుకుంటామో, అంత మేరకు నిజంగా దీవింపబడతాము.

2.దేవుని ఘనత పట్ల మరింత భయం

''లోకులందరు యెహోవాయందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను'' (కీర్తన 33:8). దేవుడు మనకంటే గొప్పవాడు, ఆయన గొప్పదనాన్ని గూర్చిన ఆలోచన మనకు వణుకు పుట్టించాలి. ఆయన శక్తి ఎంత గొప్పదో గ్రహించినప్పుడు మనకు భయం కలగాలి. ఆయన పరిశుద్ధత ఎంత ఊహకందనిదో, పాపముపట్ల ఆయన ఏవగింపు ఎంత అపారమైనదో గ్రహించినట్లయితే, అసలు పాపం చేయాలన్న ఆలోచనే మనల్ని భయభ్రాంతులతో నింపాలి. ''పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టునున్న వారందరికంటే భయంకరుడు'' (కీర్తన 89:7).

''యెహోవాయందు భయభక్తులు కలిగియుండుటయే జ్ఞానమునకు మూలము'' (సామెతలు 9:10) -  'తెలివిని సరిగ్గా వినియోగించడమే జ్ఞానము'. దేవున్ని ఎంతమేరకు యథార్థంగా తెలుసుకుంటామో, అంతమేరకే ఆయనను గురించిన భయం మనలో ఉంటుంది. దుష్టులను గురించి ఇలా వ్రాయబడింది, ''వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు'' (రోమా 3:18). ఆయన ఘనత విషయమై వారికి గ్రహింపులేదు, వారిని తీర్పు తీర్చగలడన్న కలవరం లేదు. కాని తాను ఆమోదించిన ప్రజలయెడల దేవుడు ఇలా వాగ్దానం చేసాడు, ''వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను'' (సామెతలు 8:13),''యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుష్యులు చెడుతనమునుండి తొలగిపోవుదురు'' (సామెతలు 16:16). దేవుని భయంలో జీవించే వ్యక్తి ఈ మెలకువ కలిగుంటాడు - ''యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదనుండును, చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచుండును'' (సామెతలు 15:3). కాబట్టి దేవునిభయం కలిగిన వ్యక్తి తన వ్యక్తిగత జీవితం మరియు సంఘ జీవితంలో జాగరూకుడై ఉంటాడు. మనుష్యులు తనను చూస్తున్నప్పుడు పాపానికి దూరంగా ఉండి, ఎవరూ గమనించనప్పుడు పాపాన్ని జరిగించటానికి వెనుకాడనివాడు దేవుని భయం లేనివాడు. అలాగే, క్రైస్తవులు తన చుట్టూ ఉన్నప్పుడు నోటిని అదుపు చేసికొని, మిగతా సమయాల్లో అలా చేయనివానికి దేవుని భయం లేదు. దేవుడు ఎల్లప్పుడూ అతనిని చూస్తూ, వింటూ ఉన్నాడన్న భక్తిపూర్వక భయం అతనికి లేదు. నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి దేవునిని తిరస్కరించి, అవిధేయునిగా ఉండటానికి భయపడతాడు, అలా చేయటానికి ఇష్టపడడు కూడా. దేవునిని అన్ని విషయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో తృప్తిపరచటమే అతని నిజమైన, లోతైన కోరిక. అతని ప్రార్థన ఏమిటంటే, ''నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయుము'' (కీర్తన 86:11).

అయితే ఒక రక్షింపబడిన వ్యక్తికి కూడా దేవునిపట్ల భయాన్ని నేర్పించటం అవసరమై ఉంది కీర్తన 34:11 . ఎప్పటిలాగే ఈ బోధ మనకు లేఖనాల ద్వారానే ఇవ్వబడుతుంది సామెతలు 2:5. దేవుని కనుదృష్టి మనమీద ఉందని, మన క్రియలను ఆయన గుర్తిస్తాడని, మన ఉద్దేశాలను తూకంవేస్తాడని ఆ లేఖనాల ద్వారానే మనం నేర్చుకుంటాం. పరిశుద్ధాత్ముడు ఆ లేఖనాలను మన హృదయాలకు అన్వయించినప్పుడు,''నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము'' (సామెతలు 23:17) అన్న ఆజ్ఞకు మనం ఇంకా ఎక్కువగా లోబడతాము. కాబట్టి దేవుని అత్యున్నతమైన ఘనతను బట్టి మనం ఎంతగా భయకంపితులమౌతామో, ఎంత జాగరూకులుగా ఉంటామో, ''చూచుచున్న దేవుడవు నీవే'' (ఆది 16:13) అని ఎంత మెలకువగా జీవిస్తామో, ఎంతగా మన రక్షణను ''భయముతోను, వణకుతోను'' కొనసాగిస్తామో, అంతగా మన వాక్యపఠనం ద్వారా మనం నిజంగా లాభపడతాము.

3.దేవుని ఆజ్ఞలపట్ల అపారమైన గౌరవం

ఆదాము దేవుని ఆజ్ఞను ఉల్లంఘించటం ద్వారా ఈ లోకములోనికి పాపం ప్రవేశించి, పతనమైన అతని పిల్లలందరూ తన పోలికలో, తన భ్రష్టస్వరూపమందు జన్మించారు ఆది 5:3 . ''ఆజ్ఞాతిక్రమమే పాపము'' (1 యోహాను 3:4). రాజద్రోహం మరియు ఆత్మీయ అరాచకత్వం కోవకు చెందిందే పాపము. అది దేవుని ఏలుబడిని తిరస్కరించటం, ఆయన అధికారాన్ని త్రోసిపుచ్చటం, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా తిరగబడటం, మన స్వంత మార్గాన్ని అనుసరించటం. కాని రక్షణ అనేది పాపదోషము నుండి, పాపపు అధికారము మరియు శిక్ష నుండి విముక్తి. దేవునికృప యొక్క అవసరత తెలిపే ఆ పరిశుద్ధాత్ముడే మనల్ని పరిపాలించేందుకు దేవుని ప్రభుత్వం యొక్క ఆవశ్యకతను గురించి కూడ ఒప్పిస్తాడు. ''వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడైయుందును. వారు నాకు ప్రజలైయుందురు''(హెబ్రీ 8:10) అన్నది దేవుడు తన వాగ్ధానప్రజలతో చేసిన నిబంధన. పునరుజ్జీవింప చేయబడిన ప్రతి ఆత్మకు ఒక విధేయతాస్ఫూర్తి అనుగ్రహించబడింది. ''ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును'' అని యేసు చెప్పాడు (యోహాను 14:23). మనం అన్వయించుకోవల్సిన పరీక్ష ఉంది - ''మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము'' (1 యోహాను 2:3). మనమెవరమూ కూడా ఆ ఆజ్ఞలన్నిటిని పరిపూర్ణంగా గైకొనలేము, కాని నిజమైన ప్రతి క్రైస్తవుడు అలా చేయాలని కాంక్షించి ప్రయాసపడతాడు. అతను పౌలుతో, ''అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను'' (రోమా 7:22) అనీ, కీర్తనాకారునితో, ''సత్యమార్గమును నేను కోరుకొనియున్నాను'' (కీర్తన 119:30) అయినను, ''నీ శాసనములు నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను'' (కీర్తన 119:111) అని అంటాడు. దేవుని అధికారాన్ని కించపరిచే విధంగా, ఆయన ఆజ్ఞలను అలక్ష్యం చేసే రీతిగా, క్రైస్తవుడు ఏ విధంగానూ ధర్మశాస్త్రానికి లోబడిలేడని రూఢిపరిచే ప్రతి బోధ ఎంత మధురమైనదైనా అపవాది సంబంధమైనదే. క్రీస్తు తన ప్రజలను ధర్మశాస్త్రపు శాపము నుండి విమోచించాడే కాని దాని శాసనము నుండి కాదు. దేవుని ఉగ్రత నుండి వారిని ఆయన రక్షించాడే కాని ఆయన ప్రభుత్వం నుండి కాదు. ''నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమింపవలెను'' అన్న ఆజ్ఞ ఎన్నడూ రద్దు చేయబడలేదు, చేయబడదు కూడా.

''నేను క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను'' అని 1 కొరింథీ 9:21లో పౌలు స్పష్టంగా దృఢపరుస్తున్నాడు. ''ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడైయున్నాడు'' (1 యోహాను 2:6). మరి క్రీస్తు ఎలా ''నడిచాడు''? దేవునికి సంపూర్ణ విధేయత చూపించి, ఆయన నియమాలకు పూర్తిగా లోబడి, వాటిని గౌరవించి, మనసా వాచా కర్మణా వాటిని పాటించాడు. యేసు వచ్చింది ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికేగాని దానిని కొట్టివేయటానికి కాదు మత్తయి 5:17 . ఆయన పట్ల మన ప్రేమను ఇంపైన భావోద్రేకాలతోనో లేక అందమైన పదజాలంతోనో వ్యక్తపరచడం కాదు గాని, ఆయన ఆజ్ఞలను గైకొనటం ద్వారానే వ్యక్తపరచగలం (యోహాను 14:15). క్రీస్తు ఆజ్ఞలే దేవుని ఆజ్ఞలు (నిర్గమ 20:6). ఒక యథార్థ క్రైస్తవుడు పట్టుదలతో ఇలా ప్రార్థిస్తాడు, ''నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువజేయుము'' (కీర్తన 119:35). పరిశుద్ధాత్మ అన్వయింపు ద్వారా మన లేఖనాల అధ్యయనం మనలో దేవుని ఆజ్ఞల పట్ల ఎంత లోతైన గౌరవం, ఎంత ఎక్కువ ప్రేమ,ఎంత చురుకైన విధేయత కలిగిస్తుందో, అంత మేరకు మనం వాస్తవంగా వాక్యం నుండి లాభం పొందుతాము.

4.దేవుని సామర్థ్యం పట్ల దృఢమైన నమ్మిక

ఒక వ్యక్తి దేనిని విశ్వసిస్తాడో, ఎవరిపై ఆధారపడతాడో అదే అతనికి దేవుడు. కొందరు తమ ఆరోగ్యం మీద, మరికొందరు తమ ధనం మీద, ఇంకొందరు తమ ఆత్మవిశ్వాసం మీద, మరి కొంతమంది స్నేహితుల మీద తమ విశ్వాసముంచుతారు. పునరుజ్జీవం లేనివారందరి లక్షణం ఒక మానవమాత్రుని నమ్మి అతని మీద విశ్వాసముంచడమే. కాని, కృప ద్వారా ఎన్నిక చేయబడినవారి హృదయాలు సజీవుడైన దేవునిపై మాత్రమే నిలిచుండేలా 'సృష్టించబడిన ఏ ప్రాణి' పైనా ఇక ఆధారపడవు. ''నా దేవా, నీ యందు నమ్మికయుంచిన్నాను, నన్ను సిగ్గుపడనియ్యకుము''(కీర్తన 25:2) మరియు ''ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను''(యోబు 13:15) అన్నవి దేవునిప్రజల హృదయఘోష. వారి అవసరాలకై, భద్రతకై మరియు దీవెనకై దేవునిపై ఆధారపడతారు. వారు కనిపించని మూలాధారాన్ని చూస్తారు, అదృశ్య దేవునిపై విశ్వాసముంచుతారు, మరుగైయున్న బాహువుపై ఆనుకుంటారు.

నిజమే కొన్ని సందర్భాల్లో వారి విశ్వాసం హెచ్చుతగ్గులౌతుంటుంది, అయితే వారు నేలను పడినా, లేవలేకయుండరు కీర్తన 37:24. వారందరిది ఒకే విధమైన అనుభవం కాకపోయినప్పటికీ, కీర్తన 56:11లోని వాక్యము వారి ఆత్మల సాధారణ స్థితిని వ్యక్తపరుస్తుంది. ''నేను దేవునియందు నమ్మికయుంచి యున్నాను, నేను భయపడను, నరులు నన్నేమి చేయగలరు?''. వారి ప్రార్థనల్లా ఒక్కటే, ''ప్రభువా, మా విశ్వాసాన్ని అధికం చేయుము''(లూకా 17:5). ''వినుటవలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును'' (రోమా 10:17). లేఖనాలను విచారించి, అందులోని వాగ్దానాలు మనస్సులోకి చేర్చుకున్న కొద్దీ, విశ్వాసం బలపరచబడి, దేవునియందు నమ్మకం పెరిగి, ఆయనయందు నిశ్చయత మరింత లోతౌతుంది. మన బైబిలుపఠనం వల్ల లాభపడుతున్నామో లేదో కనుక్కోవటానికి ఇది దోహదపడుతుంది.

5.దేవుని పరిపూర్ణతలయందు మిక్కిలి సంతృప్తి

ఒక వ్యక్తి మిక్కిలి ఆనందించేది తన ''దేవుని''యందే. దురదృష్టవశాత్తూ, ఒక లోకానుసారుడైన వ్యక్తి  తన అన్వేషణల్లో, వినోదవిలాసాల్లో, ఆధిపత్య సంపాదనలో తృప్తి పొందుతుంటాడు. అసలు విషయాన్ని అలక్ష్యం చేసి, దాని నీడల వెంట వృథాగా అన్వేషిస్తాడు. అయితే ఓ క్రైస్తవుడు దేవుని అద్భుత పరిపూర్ణతల యందు సంతోషిస్తాడు. దేవునిని నిజంగా మన దేవునిగా సొంతం చేసుకోవాలంటే ఆయన రాజ్యాధికారానికి లోబడటం మాత్రమే కాదు కాని ఈ లోకం కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించాలి, అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా ఆయననే గౌరవించాలి.కీర్తనాకారునితో పాటు ''మా ఊటలన్నియు నీయందేయున్నవి'' అన్న అనుభవాత్మక గ్రహింపు మనం కూడా కలిగుండాలి - రక్షింపబడినవారు ఈ లోకమివ్వలేని ఆనందాన్ని పొందియుండటం మాత్రమే కాకండా, ''దేవునియందు అతిశయపడతారు'' (రోమా 5:11). కాని దీని గురించి పాపం! ఈ లోకసంబంధికి ఏమీ తెలియదు. ''యెహోవా నా భాగము'' (విలాప వాక్యములు 3:24) అన్నది రక్షింపబడినవారి హృదయపు మాటతీరు.

ఆత్మీయ అభ్యాసాలు శరీరానికి అసహ్యకరం, కాని ఒక నిజ క్రైస్తవుడు - ''నాకైతే దేవుని పొందు ధన్యకరము'' అనంటాడు (కీర్తన 73:28). శరీర సంబంధికి ఎన్నో తీవ్రమైన వాంఛలు, కోరికలుంటాయి కాని పునరుజ్జీవింపబడిన హృదయం ఇలా ప్రకటిస్తుంది - ''యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను'' (కీర్తన 27:4). అలా ఎందుకు? ఎందుకంటే అతని హృదయపు యథార్థప్రవృత్తి ఇలా ఉంటుంది - ''ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు'' (కీర్తన 73:25). అయ్యో, ప్రియ చదువరీ, దేవునిని ప్రేమించాలని, ఆయనలో ఆనందించాలని నీ హృదయంలో ఇంకా అనిపించకపోతే, అది ఆయన విషయమై ఇంకనూ మృతమే.

పరిశుద్ధుల వైఖరి ఇలాగుంటుంది - ''అంజూరపు చెట్లకు పూత పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతోషించెదను'' (హబక్కూకు 3:17,18). ఆహా! ఇది ఎంత సహజాతీత అనుభవం! అవును, ఒక క్రైస్తవుడు భూమిమీద తన ఆస్తి అంతా కోల్పోయినా, ఆనందించగలడు హెబ్రీ 10:34 చూడండి. చీకటి చెఱసాలలో పడవేసినా కూడా వారు దేవునికి స్తుతులు పాడగలరు అపొ.కా. 16:25. కాబట్టి ఈ లోకపు నిరర్ధక వినోదాల నుండి ఎంతగా నిన్ను నీవు విడిపించుకుంటావో, సర్వశ్రేష్టతకు ఆయనే ఆధారము మరియు సారాంశమని ఎంతగా కనుగొంటావో, ఎంతగా నీ హృదయం తనవైపు ఆకర్షితమౌతుందో, ఎంతగా నీ మనస్సు ఆయనపై నిలుస్తుందో, ఎంతగా నీ ఆత్మ ఆయనలో తృప్తిని, ఆనందాన్ని కలిగుంటుందో, అంతే ఎక్కువగా నువ్వు నిజంగా లేఖనాల వలన ప్రయోజనము పొందుతున్నావు.

6.దేవుని ఏర్పాట్లకు మరింత విధేయత

ప్రతికూల పరిస్థితులలో సణగటం సహజం, కాని ఓపికతో సహించటం సహజాతీతం లేవి 10:3 . మన ప్రణాళికలు తారుమారైనప్పుడు నిరాశ చెందటం సహజం, కాని ఆయన సంకల్పాలకు తలొగ్గడం సహజాతీతం. మన సొంత మార్గాల్లో నడవటం సహజం, కాని ''నా చిత్తం కాదు, నీ చిత్తమే జరుగనిమ్ము'' అనటం సహజాతీతం. ఒక ప్రియమైన వ్యక్తిని మననుండి మరణం దూరం చేస్తే సహజంగా తిరగబడతాం, కాని మన హృదయాంతరంగాలలోనుండి ''యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిపోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక'' (యోబు 1:21) అని చెప్పటం సహజాతీతం. దేవునికి మనం చేరువవుతున్న కొద్దీ, ఆయన జ్ఞానాన్ని కీర్తించటం నేర్చుకుంటాం,ఆయన అన్ని విషయాలు సక్రమంగా జరిగిస్తాడని తెలుసుకుంటాం. అలా ఎవరి మనసైతే దేవుని మీద ఆనుకుంటుందో, వారిని ''పూర్ణ శాంతి''గలవారిగా ఆయన కాపాడుతాడు యెషయా 26:3 . ఇక్కడ మరో ఖచ్చితమైన పరీక్ష: దేవుని మార్గం శ్రేష్టమైనదని నీ బైబిలు పఠనం నీకు నేర్పిస్తుంటే, ఆయన అధికారానికి అది నిన్ను ఖచ్చితంగా లోబరుస్తుంటే, అన్నిటి గురించి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులను అది చెల్లింపజేస్తుంటే ఎఫెసీ 5:20 , వాక్యం నుండి నువ్వు నిజంగా ప్రయోజనం పొందుచున్నట్లే.

7.దేవుని మంచితనం కొరకై మరింత మనఃపూర్వక స్తుతి

దేవునిలో సంతృప్తి చెందే ఒక హృదయపు జారువాలే స్తుతి. అలాంటివారి భాష ఇలా ఉంటుంది- ''నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును'' (కీర్తన 34:1). దేవుని ప్రజలు ఆయనను స్తుతించటానికి ఇది ఎంత గొప్ప హేతువు! ఆయన వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి, కుమారులుగాను, వారసులుగాను చేసి, వారి మేలుకొరకు సమస్తము సమకూర్చి జరిగించి, వారి ప్రతి అక్కరను తీర్చి, శాశ్వత పరమానందాన్ని వారి సొంతం చేయగా, వారి సంతోషసితారాలు ఎన్నటికీ మూగబోకూడదు. ''ఎంతైనా సుందరుడై''న ఆ దేవుని అన్యోన్య సహవాసాన్ని వారు ఆనందిస్తుంటే అవి నిశ్శబ్దంగా ఉండలేవు. దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుతున్న కొద్దీ, మనం ఆయనను ప్రస్తుతించాలి కొలొస్సీ 1:10. క్రీస్తువాక్యము మనలో సమృద్ధిగా నివసించినట్లయితేనే, మనం ఆత్మీయగీతాలతో నింపబడుతాం కొలొస్సీ 3:16, అప్పుడే ప్రభువు కొరకై మన హృదయాల్లో మాధుర్యం నాట్యమాడుతుంది. యథార్థమైన ఆరాధనకై ఎంతగా మన హృదయాలు ఆకర్షింపబడతాయో, ఎంతగా మన గొప్ప దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాయో, అంతే గొప్పగా మనం దేవుని వాక్యధ్యానం వలన లాభపడుతున్నామని తెలుసుకోగలం.

మూడవ అధ్యాయం

లేఖనాలు మరియు క్రీస్తు

లేఖనాలు క్రీస్తుమర్మాన్ని వెల్లడి చేస్తాయి

ఈ అధ్యాయాలలో మనం ఆచరణకు సంబంధించిన అంశాలను వరుసగా ధ్యానిస్తున్నాం. తన మీద తనకు పూర్తిగా విరక్తి చెందేటట్లు చేస్తే తప్ప మనిషికి దేవుని పట్ల ఆకాంక్ష కలగదు. సాతాను చేత మోసం చేయబడి పతనమైన ఈ మానవుడు, పాపపు గ్రుడ్డితనముగల తన కళ్ళు తెరువబడి తన యొక్క నిజస్వరూపాన్ని తనకు తెలియపరచబడేంతవరకు తనలో తానే తృప్తి పొందుతాడు. పరిశుద్ధాత్ముడు మొదట మనలో పనిచేసి, మన అజ్ఞానాన్ని, డాంబికాన్ని, దారిద్య్రాన్ని మరియు పతనాన్ని మనకు చూపించి, దేవునిలో మాత్రమే నిజమైన జ్ఞానం, యథార్థమైన ధన్యత, పరిపూర్ణ మంచితనం మరియు మచ్చలేని నీతి ఉన్నాయని మనం గ్రహించి, స్వీకరించేందుకు తోడ్పడతాడు. దేవునిలో ఉన్న పరిపూర్ణతలను మనం నిజంగా గుర్తించే ముందు మనలోని అసంపూర్ణతల విషయమై మేల్కొల్పు కలగాలి. దేవుని పరిపూర్ణతలను ధ్యానించేటప్పుడు, ఒక వ్యక్తి తనకూ అత్యున్నతుడైన దేవునికీ మధ్య అనంతమైన దూరం ఉందన్న విషయం ఇంకా ఎక్కువగా తెలుసుకుంటాడు. తన విషయమై దేవుని ఖండితమైన ఆజ్ఞల గురించి తెలుసుకుంటూ వాటిని తాను నెరవేర్చలేనని గ్రహించినప్పుడు, విశ్వసించేవారందరికీ ప్రతిగా మరో ''వ్యక్తి'' వాటన్నిటిని పూర్తిగా నెరవేర్చాడని విని, ఆ శుభవార్తను విశ్వసించడానికి సిద్ధపడతాడు.

''లేఖనములయందు . . . పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి'', అని ప్రభువైన యేసు అన్నాడు (యోహాను 5:39). నశించిపోతున్న పాపులకు క్రీస్తు ఒక్కడే రక్షకుడని, దేవునికి మానవులకు మధ్య ఏకైక మధ్యవర్తి ఆయనే అని, తండ్రి వద్దకు చేరటానికి తానొక్కడే మార్గమని ఆ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయనకున్న పరిపూర్ణతలు ఎంత అద్భుతమైనవో, ఆయన చేసే వివిధ కార్యాలు ఎంత మహిమాన్వితమైనవో, ఆయన పూర్తిచేసిన కార్యము ఎంత చాలినదో  లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. లేఖనాలకు వెలుపల ఆయన తెలియపరచబడలేడు. వాటిలోనే ఆయన ప్రకటింపబడ్డాడు. క్రీస్తును గురించిన విషయాలు పరిశుద్ధాత్ముడు తన ప్రజలకు తెలియపరిచినప్పుడు, వ్రాయబడినవాటినే తప్ప మరింకేది కూడా మన ఆత్మలకు బయలుపరచడు. లేఖనాలకు క్రీస్తే కీలకం అనే మాట ఎంత నిజమో, ''క్రీస్తు మర్మాన్ని'' ఎఫెసీ 3:4 వివరించేది లేఖనాలే అన్న మాట కూడ అంతే నిజం.

లేఖనాలు చదివి అధ్యయనం చేయటం ద్వారా మనమెంత వరకు ప్రయోజనం పొందుతున్నామో నిర్ధారించేందుకు క్రీస్తు మన హృదయాలకు ఎంత వాస్తవం, ఎంత అమూల్యం ఔతున్నాడో మనం కనుక్కోవాలి. 'కృపయందు అభివృద్ధి పొందటం' అనే మాటకు అర్థం 'మన ప్రభువును, రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు... జ్ఞానమందు అభివృద్ధి పొందట'మే (2 పేతురు 3:18). అపొస్తలుడైన పౌలు యొక్క సర్వోన్నత ఆకాంక్ష క్రీస్తును ''ఎరుగుట''ఫిలిప్పీ 3:10,11 - అతడు తనకు లాభకరములైన వాటినన్నిటిని అప్రధానంగా ఎంచుకునేంతగా ప్రభువును కాంక్షించాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చెప్పబడిన ''జ్ఞానము'' మేథోసంబంధమైనదో లేక సైద్ధాంతికమైనదో కాదు గాని ఆత్మీయమైనది మరియు అనుభవాత్మకమైనది, అదేదో జనసామాన్యమైనది కాదు కాని వ్యక్తిగతమైనది. అది పరిశుద్ధాత్ముని కార్యం ద్వారా ఒక పునరుజ్జీవింపబడిన హృదయానికి ఇవ్వబడిన లోకాతీత "జ్ఞానము". ఇలా క్రీస్తును గురించిన లేఖనాలు పరిశుద్ధాత్ముడు మనకు వివరించి, అన్వయింపజేస్తాడు.

ఒక విశ్వాసికి లేఖనాల ద్వారా లభించే క్రీస్తును గురించిన జ్ఞానం అతని వివిధ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి అనేక విధాలుగా ప్రయోజనకరమౌతుంది. ఇందుకు సాదృశ్యంగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యమార్గంలో సంచరించేటప్పుడు దేవుడు వారికిచ్చిన మన్నా విషయంలో, ''కొందరు హెచ్చుగాను, కొందరు తక్కువగాను కూర్చుకున్నారు''(నిర్గమ 16:17) అని వ్రాయబడింది. మన్నా సాదృశ్యపరిచిన క్రీస్తును గురించి మనము కూర్చుకున్న జ్ఞానం విషయంలో కూడా ఇది వాస్తవమే. మన ప్రతి పరిస్థితికి, సందర్భానికి, ప్రతి అవసరతకు - ఇప్పటికీ, ఎప్పటికీ ఖచ్చితంగా చాలినది క్రీస్తు అద్భుతమైన వ్యక్తిత్వంలో ఉంది. కాని దానిని మనం గ్రహించటానికి ఆలస్యించేవారంగాను, ఆ కార్యం కొరకై పనిచేయటానికి మరింత మందగించినవారంగాను ఉన్నాము. ప్రతి పరిస్థితిలో మనకు చాలినంత కృపను తోడుకునేలా ఎప్పటికీ తరగనంత సమృద్ధి క్రీస్తులో ఉంది(యోహాను 1:16);అయితే, ''మీ నమ్మికచొప్పున మీకు కలుగునుగాక!'' (మత్తయి 9:29) అన్న నియమమే క్రీస్తుయేసునందున్న కృపలో మనము ఎంతగా బలపడుతున్నామో నిర్థారిస్తుంది.  ((2 తిమోతి 2:1).

1.క్రీస్తు యొక్క అవసరతను గ్రహించినప్పుడే ఒక వ్యక్తి లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాడు

మనిషి తన సహజస్థితిలో తనకు తాను స్వయంసమృద్ధిగలవానిగా భావిస్తాడు. నిజమే, తనకూ దేవునికీ మధ్య సంబంధబాంధవ్యాలు అంత బాగా లేవన్న గ్రహింపు అతనికి ఉంటుంది. అయినప్పటికీ దేవునితో సమాధానపడటానికి తాను స్వయంగా ఏమైనా చేయగలనని తనను తాను ఒప్పింపజేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు. కయీను స్థాపించిన ఈ మత ''మార్గములో'' యూదా 11 వ. ఇప్పటికీ చాలామంది నడుస్తున్నారు. మతపరమైన విషయాల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తితో ''శరీర స్వభావముగలవారు దేవునిని సంతోషపరచనేరరు'', అనంటే ఆ వ్యక్తికి కోపమొస్తుంది. ''మన నీతి క్రియలన్నియు మురికి గుడ్డలాయెను'' (యెషయా 64:6) అన్న సత్యాన్ని ఆ వ్యక్తి దృష్టికి తెస్తే, అతని కపట నాగరికత ఒకేసారి కోపానికి తావిస్తుంది. క్రీస్తు ఈ భూమ్మీద ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది. అత్యంత మత నిష్ఠ కలిగినటువంటి ప్రజలైన యూదులకే తాము ''నశించా''మన్న గ్రహింపు కాని, శక్తిశాలియైన రక్షకుడు అత్యంత అవసరమన్న గ్రహింపు గాని లేవు.

''రోగులకేగాని ఆరోగ్యముగలవారికి వైద్యుడక్కరలేదు'' (మత్తయి 9:12). లేఖనాల అన్వయింపు ద్వారా పాపులను తమ విషమ పరిస్థితిని బట్టి దోషులుగా తేల్చి, ''ఆపాదమస్తకం'' వారిలో ఏ మంచితనమూ లేదన్న స్థితిని వారికి చూపించి, ''ఎక్కడ చూసినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు'' (యెషయా 1:6) తప్ప ఏమీ లేవని తెలియజెప్పేది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడు మన పాపాలను బట్టి, దేవునిపై మన విశ్వాస ద్రోహాన్ని బట్టి, సణగులను బట్టి, ఆయన్నుండి మనం దూరంగా వెళ్ళిపోవటాన్ని బట్టి , దేవుని ఆజ్ఞలను బట్టి, మన ప్రేమ, విధేయత, ఆరాధనను పొందే ఆయన హక్కును బట్టి, ఆయనకు చెల్లించాల్సిన మహిమ నిమిత్తమై మన బాధాకరమైన వైఫల్యాలను బట్టి మనకు దోషనిర్దారణ చేసినప్పుడే క్రీస్తు మన ఏకైక నిరీక్షణ అని, ఆశ్రయం కొరకు ఆయన దగ్గరికి వెళ్తే తప్ప దేవుని నీతియుక్తమైన ఉగ్రత మన మీద ఖచ్చితంగా పడుతుందని గుర్తించగలము.

ఈ గ్రహింపు మారుమనస్సు పొందిన మొదటి అనుభవానికే పరిమితం కాదు. పునరుజ్జీవింపబడిన ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఎంత లోతుగా తన కృపాసహిత కార్యాన్ని జరిగిస్తాడో, అంతగా ఆ వ్యక్తి తనలోని కల్మషాన్ని, పాపగుణాన్ని, కపటత్వాన్ని గురించి  మేల్కొల్పబడతాడు; అంతే ఎక్కువగా పాపాలన్నిటి నుండి పవిత్రపరచే ఆ అతిపరిశుద్ధ రక్తము యొక్క విలువను, అవసరాన్ని కనుగొంటాడు. పరిశుద్ధాత్ముడు క్రీస్తును మహిమపరిచేందుకే ఉన్నాడు. అందుకు ఆయన చేసే ప్రధాన కార్యము, క్రీస్తు ఎవరి నిమిత్తం మరణించాడో వారి కళ్ళు తెరవటం, తద్వారా ఇలాంటి  కుళ్ళు పట్టిన, నరకప్రాప్తులైన, దౌర్భాగ్యజీవులకు ఆయన ఎలా సరిపోతాడో తెలియజేయటమే. ఎంతగా క్రీస్తు అవసరతను గుర్తిస్తామో అంతగా మనము లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాము.

2.లేఖనాల వలన ఒక వ్యక్తికి క్రీస్తు మరింత వాస్తవమైనప్పుడే వాటి నుండి అతను ప్రయోజనం పొందుతాడు

ఇశ్రాయేలు జనాంగంలో అత్యధికులు దేవుడు వారికి ఆజ్ఞాపించిన సంస్కారాలు, ఆచారకర్మకాండలలోని పైరూపాన్ని మాత్రమే చూసారు. అయితే వారిలో నుండి పునరుజ్జీవింపబడిన శేషం మాత్రము వాటిలో క్రీస్తును చూడగలిగారు. కాబట్టి ''అబ్రహాము నా దినమును చూతునని మిగుల ఆనందించెను'' అని క్రీస్తు చెప్పెను (యోహాను 8:56). మోషే ఐగుప్తు ధనముకంటె ''క్రీస్తు విషయమైన నింద'' గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు (హెబ్రీ 11:26). క్రైస్తవలోకంలో కూడా ఇలాగే ఉంటుంది. చాలామందికి క్రీస్తు కేవలం ఒక వ్యక్తి మాత్రమే, మహా అయితే ఒక చరిత్ర పురుషుడు. ఆయనతో వారికేలాంటి వ్యక్తిగత సంబంధాలు ఉండవు. ఆయనతో ఎలాంటి ఆత్మీయసహవాసాన్ని వారానందించరు. ఎవరైనా అతని ఔన్నత్యాన్ని గురించి అనుభవాత్మకంగా మాట్లాడితే అతనిని ఒక చాంధసవాదిగానో లేక ఉన్మాదిగానో పరిగణిస్తారు. వారికి క్రీస్తు అవాస్తవికం, అస్పష్టం, అనిశ్చితం. అయితే ఒక నిజక్రైస్తవుని అనుభవం ఇందుకు ఎంతో భిన్నంగా ఉంటుంది. అతని హృదయవైఖరి ఇలా ఉంటుంది:

 యేసుని స్వరమును విన్నాను
యేసే చాలని అన్నాను
యేసుని ముఖదర్శనము పొందాను
నా ఆత్మ నిండుగా సేద తీరేను

అయినా ఈ ఆనందకర దృశ్యం పరిశుద్ధులకు, మార్పుచెందని స్థిరానుభవమని చెప్పలేం. సూర్యునికి, భూమికి మధ్య ఎలాగైతే మేఘాలు వస్తాయో, అలాగే అపజయాలు క్రీస్తుతో మనకున్న సహవాసానికి అంతరాయం కలిగించి, ఆయన ముఖకాంతిని మనమీది నుండి దూరంగా ఉంచుతాయి. ''నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందును'' (యోహాను 14:21). అవును, ఎవరైతే కృప ద్వారా విధేయతామార్గంలో నడుస్తారో వారికే ప్రభువైన యేసు తనను తాను బయలుపరచుకుంటాడు.ఇలాంటి ప్రత్యక్షత ఎంత ఎక్కువగా, ఎంత దీర్ఘకాలంగా ఉంటుందో, అంతే అనుభవాత్మకంగా ఆయనను మనము తెలుసుకుంటాం. అప్పుడే మనం యోబుతో కలిసి, ''వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను'' (యోబు 42:5) అని చెప్పగలం. కాబట్టి ఎంత ఎక్కువగా క్రీస్తు నాకొక జీవన వాస్తవమౌతాడో, అంతగా నేను వాక్యము నుండి లాభం పొందుతాను.

3.క్రీస్తు పరిపూర్ణతలతో ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా లీనమౌతాడో,లేఖనాల నుండి అంత ప్రయోజనం పొందుతాడు

మొదట, ఒక అవసరతా భావం క్రీస్తు వైపు మనలను నడిపించినా, తర్వాత ఆయన శ్రేష్ఠతను గురించిన గ్రహింపే మనల్ని ఆయన వెంటపడేలా చేస్తుంది. క్రీస్తు ఎంత ఎక్కువగా మనకు వాస్తవమౌతాడో, అంత ఎక్కువగా మనమాయన పరిపూర్ణతలవైపు ఆకర్షితులమౌతాం. మొదటగా, ఆయనను రక్షకునిగా మాత్రమే గుర్తిస్తాం, కాని రాను రాను క్రీస్తును గురించిన విషయాలను పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందుంచుతున్నప్పుడు, ఆయన శిరస్సుపై ''అనేక కిరీటములు'' ఉన్నాయని కనుగొనగలం. పూర్వం ఆయనను గురించి , ''ఆశ్చర్యకరుడు అని అతనికి పేరు'' (యెషయా 9:6) అని చెప్పబడింది. లేఖనాల ప్రకారం ఆయనేమైయున్నాడో ఆయన పేరు సూచిస్తుంది. అతని అధికారాలు, వాటి సంఖ్య, వైవిధ్యం మరియు సంతృప్తిపరిచే గుణం 'అద్భుతం'. ప్రతి ఆపత్కాలంలో సహాయకారిగా ఉండేందుకు సహోదరుని కంటే అన్యోన్యంగా ఉండే స్నేహితుడాయన. మన దౌర్భల్యాలను చూసి జాలిపడే గొప్ప ప్రధానయాజకుడు యేసు. సాతాను మనల్ని నిందించిన ప్రతిసారి, మన పక్షాన తండ్రితో వాదించే న్యాయవాది.

క్రీస్తుతో నిమగ్నమైయుండి, 'మరియ' కూర్చున్నట్లు ఆయన పాదాల వద్ద కూర్చుండి, ఆయన సర్వసమృద్ధి నుండి పొందుకోవటం మనకు ఎంతో అవసరం. ''మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు''(హెబ్రీ 3:1) మన ఆనందానికి ముఖ్యకారణంగా ఉండాలి. ఆయనతో మనకున్న వివిధరకాల సంబంధాలను ధ్యానించటం, ఆయన వాగ్దానం చేసినవాటిని ఆలోచించటం, ఆయనకు మనపై ఉన్న అద్భుతమైన, మార్పులేని ప్రేమలో నిమగ్నమయ్యుండటం మన ఆనందానికి ముఖ్యకారణమైయ్యుండాలి.అలా చేస్తున్నప్పుడు,ఈ ఇహలోక సమ్మోహనధ్వనులు మన ధ్యానాన్ని ఆకర్షించలేనంతగా మనము ప్రభువులో  ఆనందిస్తాము. ఓ చదువరీ, నీ స్వంత అనుభవంలో ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా? నీ హృదయానికి క్రీస్తు పదివేలలో అతి సుందరుడా? నీ హృదయాన్ని క్రీస్తు గెలుచుకున్నాడా? ఆయనతో ఒంటరిగా సమయం గడుపుతూ, ఆయనతో ఆక్రమితమవ్వడం నీకు అన్నిటికన్నా ఎక్కువ ఆనందం ఇస్తుందా? అలా కాకపోతే, నీ బైబిలు పఠనం నీకు అంతగా లాభం చేకూర్చలేదు సుమా!

4.క్రీస్తు ఒక వ్యక్తికి అమూల్యమైనప్పుడే అతను లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాడు

''విశ్వసించుచున్నవారికి క్రీస్తు అమూల్యమైనవాడు'' (1 పేతురు 2:7). ''తమ ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా వారు ఎంచుకుంటారు'' (ఫిలిప్పీ 3:8). ''ఆయన పేరు వారికి పరిమళ తైలముతో సమానము'' (పరమగీతము 1:3). ఆనాటి ఆలయపు మనోహర రమ్యత్వములోను మరియు సొలోమోను జ్ఞానములోనూ, వైభవంలోనూ ప్రత్యక్షమైన దేవుని మహిమ భూదిగంతముల నుండి ఆరాధికులను ఎలా ఆకర్షించిందో, ఆ మహిమ వలన సాదృశ్యపరచబడిన క్రీస్తు యొక్క అద్వితీయ శ్రేష్టత తన ప్రజల హృదయాలను అంతకంటే బలంగా ఆకర్షిస్తుంది. సాతానుకు ఈ విషయం బాగా తెలుసు, కాబట్టే క్రీస్తుకు అవిశ్వాసులకు మధ్య ఈ లోకపు ప్రలోభాలను ఉంచి, వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసే పనిలో నిర్విరామంగా మునిగియున్నాడు. ఒక విశ్వాసితో పోరాడటానికి కూడా దేవుడు వానిని అనుమతిస్తాడు, కాని ''అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్ద నుండి పారిపోవును'' (యాకోబు 4:7) అని వ్రాయబడింది. పట్టుదల కలిగి నిర్దిష్ట ప్రార్థనతో వానిని ఎదిరించి, క్రీస్తు పట్ల మీ ప్రేమానురాగాలను పెంచమని పరిశుద్ధాత్మను అభ్యర్థించండి.

క్రీస్తు పరిపూర్ణతలను మనమెంతగా ధ్యానిస్తే, అంతగా మనమాయనను ప్రేమించి పూజిస్తాం. మన హృదయాలు ఆయన కొరకు పరితపించకపోవడానికి కారణం ఆయనతో మనకు అనుభవాత్మక పరిచయం లేకపోవడమే. కాని ఎప్పుడైతే క్రైస్తవుడు ప్రతిదినం క్రీస్తుతో యథార్థమైన సహవాసం కలిగుండటం అలవర్చుకుంటాడో, కీర్తనాకారునితో కలిసి ఆ వ్యక్తి ఇలా చెప్పగలుగుతాడు: ''ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు''(కీర్తన 73:25). ఇదే నిజక్రైస్తవ సారాంశం; ఇదే క్రైస్తవ్యాన్ని అన్నిటి నుండి ప్రత్యేకపరిచే లక్షణం. అత్యాసక్తి కనబరిచే స్వనీతిపరులు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను పదవ వంతు చెల్లించటంలో మత్తయి 23:23 నిమగ్నులై, ఒక వ్యక్తిని తమ మతంలో కలుపుకోవటానికి సముద్రాన్ని, భూమిని చుట్టివచ్చే పనిలో మత్తయి 23:15 తలమునకలై ఉండి కూడా క్రీస్తునందు దేవునిపై ప్రేమలేనివారుగా ఉండవచ్చు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. ''నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము'' (సామెతలు 23:26) అనేది దేవుని ఆజ్ఞ. క్రీస్తు మనకు ఎంతగా విలువైనవాడో, అంతగా మనము ఆయనలో సంతృప్తి చెందుతాము.

5.లేఖనాల నుండి ప్రయోజనం పొందిన వ్యక్తికి క్రీస్తులో మరింతగా విశ్వాసం పెరుగుతుంది

విశ్వాసము రెండు రకాలు - 'అల్పవిశ్వాసము' (మత్తయి 8:26) మరియు 'గొప్ప విశ్వాసము' (మత్తయి 8:10).''సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసముతో'' (హెబ్రీ 10:22), ''పూర్ణహృదయముతో ప్రభువును నమ్మవచ్చు'' (సామెతలు 3:5). ''నానాటికి బలంలో అభివృద్ధి'' ఎలా పొందుతారో (కీర్తన 84:7), అలాగే ''అంతకంతకు విశ్వాసము''లో ఎదుగటం (రోమా1:17) గురించి మనం చదువుతాం. మన విశ్వాసం ఎంత బలంగా మరియు స్థిరంగా ఉంటుందో, అంతగా ప్రభువైన యేసు ఘనపరచబడతాడు. నాలుగు సువార్తలను స్థూలంగా చదివితే ఒకటి మనకు బోధపడుతుంది - మన రక్షకునిని సంతోషపెట్టింది ఆయన మీదే ఆధారపడి ఉన్న ఆ కొద్దిమంది ఆయనపై ఉంచిన ఆ దృఢనమ్మకమే  తప్ప మరొకటి కాదు. స్వయంగా ప్రభువే విశ్వాసాన్ని బట్టి జీవించాడు, నడిచాడు; మనము కూడా ఎంతగా ఆయనలా జీవిస్తామో, ఆయనలా నడుస్తామో అంతగా మన నాయకునిని అనుసరిస్తాము. అన్నిటికంటే ముఖ్యంగా, దృష్టి పెట్టి, మెలకువతో పట్టుదల కలిగిన ప్రార్థనతో ఆయనను అడుగవలసింది ఒకటుంది - మన విశ్వాసము పెంపొందింపజేయమని. ''మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది'' (2 థెస్స 1:3) అని పౌలు థెస్సలోనికయ పరిశుద్ధులకు చెప్పగలిగాడు.

క్రీస్తు తెలియనంతవరకు ఆయనను విశ్వసించలేం. ఆయనను గూర్చి ఎంత ఎక్కువగా తెలిస్తే అంతగా మనం ఆయనలో నమ్మకముంచుతాం, ''నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు'' (కీర్తనలు 9:10). మన హృదయానికి క్రీస్తు ఎంత యథార్థమౌతాడో, ఆయనకున్నవివిధ పరిపూర్ణతలను గుర్తెరగటం వలన ఆయన మనకు ఎంత ఎక్కువగా విలువైనవాడుగా కనిపిస్తాడో, అంతగా ఆయనలో మనకున్న విశ్వాసం బలపడుతుంది. అది ఎంతగా బలపడుతుందంటే మనం రోజూ శ్వాస తీసుకునేంత సహజసిద్ధమౌతుంది. క్రైస్తవ జీవితంలో విశ్వాసమూలంగా నడుచుకోవలసి ఉంటుంది2 కొరింథీ 5:7 . ఆ మాటకర్థం నిరంతర ప్రగతి, భయాందోళనల నుండి మరింత విముక్తి మరియు దేవుడు వాగ్దానం చేసినదంతా జరిగిస్తాడనే దృఢవిశ్వాసం. విశ్వాసులందరికి అబ్రహాము తండ్రి కాబట్టి, ప్రభువు పట్ల లోతైన నమ్మకమంటే ఏంటో ఆయన జీవితం నుండి తెలుస్తుంది. మొదటగా, అబ్రహాము కేవలం దేవుని మాటకు స్పందించి తన శరీరానికి ఇష్టమైన విషయాల నుండి వెనుదిరిగాడు. రెండవదిగా దేవుని మీద ఆధారపడటం కొనసాగిస్తూ, వాగ్దానదేశంలో తనకు ఒక్క ఎకరం భూమి కూడా స్వంతం కానప్పటికి అన్యునిగా, పరవాసిగా అక్కడ నివసించాడు. మూడవదిగా, అతని అవసానదశలో వారసునిని వాగ్దానం చేయబడినప్పుడు, దాని నెరవేర్పులో అవరోధాలను ఎంచలేదు కాని, విశ్వాసంలో దృఢంగా ఉండి, దేవుడ్ని మహిమపరిచాడు. చివరిగా, తన కుమారుడైన ఇస్సాకును ఇవ్వమని ఆజ్ఞాపించినప్పుడు, ''మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని'' ఆయన ఎంచాడు (హెబ్రీ 11:19). అపనమ్మకముగల దుష్ఠహృదయాన్ని కృప ఎలా జయిస్తుంది, శరీరంపై ఆత్మ ఏవిధంగా విజేతగా నిలుస్తుంది, దేవుని చేత అనుగ్రహింపబడి, కాపాడబడిన విశ్వాసము యొక్క లోకాతీత ఫలాలు మనలాంటి శరీరస్వభావముగల ఒక వ్యక్తిలో ఎలా ఉత్పన్నమవుతాయి మొదలైన అబ్రహాము చరిత్ర ద్వారా మనకు స్పష్టం చేయబడ్డాయి. ఇది మనల్ని ప్రోత్సహించటానికి రాయబడింది. అలాగే విశ్వాసులకు తండ్రియైనవానిలో, వాని ద్వారా తేబడిన మార్పు, మనలో కూడా తీసుకురావటం ప్రభువుకు ప్రీతికరంగా ఉండాలని ప్రార్థించేలా ప్రోత్సహించటానికి ఇది రాయబడింది. తమ పూర్ణహృదయాలతో చిన్నపిల్లలవంటి విశ్వాసము, దృఢనమ్మకము మరియు నిరీక్షణా హృదయము కలిగినవారి కంటే క్రీస్తును సంతృప్తిపరిచే, ఘనపరిచే, మహిమపరిచేవారు మరొకరుండరు. మనం లేఖనాల నుండి ప్రయోజనం పొందుతున్నామనటానికి క్రీస్తునందు మరింత విశ్వాసం కలిగుండటం కంటే గొప్ప ఋజువు ఇంకొకటి చెప్పనవసరం లేదు.

6.క్రీస్తును సంతోషపెట్టాలనే లోతైన తృష్ణ కలిగినప్పుడే ఒక వ్యక్తి లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాడు

''మీరు మీ సొత్తుకారు, విలువపెట్టి కొనబడినవారు'' (1 కొరింథీ 6:19,20) అనే గొప్పసత్యాన్ని మొదట క్రైస్తవులు తెలుసుకొని తీరాలి. ''జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగిలేచినవాని కొరకే జీవించుటకు'' (2 కొరింథీ 5:15) పిలువబడ్డారు. తనను ప్రేమించేవారిని సంతోషపెట్టటంలో ప్రేమ ఆనందిస్తుంది. ''ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నామాట గైకొనును'' (యోహాను 14:23). క్రీస్తును అధికంగా ఘనపరచేది మన సంతోషభావోద్రేకాలూ కాదు, మన విశ్వాసము యొక్క బాహ్యఒప్పుకోలూ కాదు కానీ తన కాడిని నిజంగా స్వీకరించి, ఆచరణాత్మకంగా తన బోధలకు లోబడటమే.

ప్రత్యేకంగా ఈ విషయాన్ని బట్టి మన విశ్వాసపు ఒప్పుకోలు యొక్క వాస్తవికత పరీక్షించబడి, నిరూపించబడుతుంది. క్రీస్తుచిత్తం తెలుసుకునేందుకు ప్రయాసపడనివారికి అసలు ఆయనయందు విశ్వాసముందా? తన పౌరులు ఒక రాజు యొక్క ప్రకటనలు చదువటానికి నిరాకరిస్తే అది అతనికెంతటి ధిక్కారం! క్రీస్తులో విశ్వాసము ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల అనుసరించటంలో సంతోషం ఉంటుంది, వాటిని మనం అతిక్రమించిన చోట దుఃఖం మిగులుతుంది. క్రీస్తును మనం అసంతుష్టపరిచినప్పుడు మన వైఫల్యాలకై మనం దుఃఖపడాలి. దేవుని కుమారుని ప్రశస్తరక్తం చిందించేందుకు కారణమైన నా పాపాలను ద్వేషించకుండా నేను ఆయనను విశ్వసించటం నిజంగా అసాధ్యం. నా పాపాల క్రింద క్రీస్తు మూలిగితే, నేను కూడా వాటి విషయమై ప్రలాపిస్తాను. మన ఆర్తనాదాలు ఎంత హృదయపూర్వకంగా ఉంటాయో, అంతే పట్టుదలతో మన  విమోచకునిని అసంతృప్తిపరిచే వాటన్నినుండి విడుదలకై కృపను, ఆయనకు సంతృప్తి కలిగించేవాటిని జరిగించేందుకు శక్తిని వేడుకుందాం .

7.క్రీస్తు రెండవరాకడ నిమిత్తమై ఆకాంక్షింపజేసినప్పుడు ఒక వ్యక్తి లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాడు

తనను ప్రేమించేవారిని చూస్తేనే తప్ప ప్రేమ తృప్తి పొందదు. నిజమే, ఇప్పటికి కూడా విశ్వాసము ద్వారా క్రీస్తును మనం ''అద్దములో చూచినట్టు'' చూస్తున్నాం. కాని, ఆయన రెండవరాకడలో మనమాయనను ''ముఖాముఖిగా చూతుము'' (1 కొరింథీ 13:12). అప్పుడు ''తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెయుననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి'' అని చెప్పిన మాటలు నెరవేరతాయి (యోహాను 17:24). ఇది మాత్రమే దేవుని హృదయపు ఆకాంక్షలను పూర్తిగా తీరుస్తుంది ,ఆయనచేత విమోచింపబడినవారి ఆకాంక్షలను కూడా తీరుస్తుంది. అప్పుడే ''ఆయన తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును'' (యెషయా 53:11) మరియు ''నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసెదను, నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును'' (కీర్తన 17:15).

క్రీస్తురాకడతో పాపము శ్వాశతంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఎన్నిక చేయబడినవారు తన కుమారునితో సారూప్యముగలవారవటానికి ముందుగా నిర్ణయింపబడ్డారు. క్రీస్తు తన ప్రజలను తానే చేర్చుకున్నప్పుడు మాత్రమే ఆ దైవోద్దేశం నెరవేరుతుంది.''ఆయనయున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము''(1 యోహాను 3:2). ఆయనతో మనకుగల సహవాసం ఇక ఎన్నటికీ తెంచివేయబడదు, మన అంతర్గత భ్రష్టత్వాన్ని గురించి మరెప్పుడూ సణుగులు గొణుగులుండవు, మన అపనమ్మకత్వం ఇక ఎప్పుడూ మనల్ని వేధించదు.''ఆయన తన సంఘమును మహిమగల సంఘముగాను తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, అది కళంకమైనను, ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధపరిచాడు''(ఎఫెసీ 5:27). ఆ ఘడియ కోసం మనం ఆతృతతో ఎదురుచూస్తున్నాము. మన విమోచకుడి కొరకు ప్రేమతో చూస్తున్నాము. రాబోయే ఆయన కోసం మనమెంతగా పరితపిస్తామో, మన దివిటీలను ఎంతగా చక్కపరచుకుంటామో, అంతగా వాక్యజ్ఞానము నుండి మనం లాభపడుతున్నామనడానికి ఋజువు.

పాఠకులు మరియు రచయిత నిజాయితీగా తమను తాము దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలి. ఈ ప్రశ్నలకు మనం నిజమైన సమాధానాలు వెతుకుదాం. క్రీస్తు అవసరత యొక్క లోతైన గ్రహింపు మనకుందా? ఆయన తనంతట తానే మనకు ప్రకాశవంతమైన సజీవ వాస్తవంగా ఉన్నాడా? ఆయన పరిపూర్ణతల్లో నిమగ్నమవుట మనకు మరింత ఉత్తేజాన్నిస్తుందా? క్రీస్తు తానే ప్రతి రోజు మనకు మరింత ప్రశస్తమౌతున్నాడా? ప్రతి విషయంలో ఆయనయందు నమ్మకం ఉంచేందుకు వీలుగా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుందా? మన జీవితంలోని ప్రతి అంశంలో ఆయనను నిజంగా సంతోషపెట్టాలని చూస్తున్నామా? వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆయన వస్తాడని మనకు ఖచ్చితంగా తెలిస్తే, ఆనందంతో పొంగేలా ఆయన కొరకు మనమపేక్షిస్తామా? ఇలాంటి సూటి ప్రశ్నలతో పరిశుద్ధాత్ముడు మన హృదయాలను సంధించును గాక!

నాల్గవ అధ్యాయం

లేఖనాలు మరియు ప్రార్థన

ప్రార్థన క్రైస్తవుని శ్వాస

'ప్రార్థనలేని క్రైస్తవుడు' అనేది పరస్పర వైరుధ్యం. జీవము లేకుండ పుట్టిన బిడ్డ ఎలాగైతే మృతమో, విశ్వాసిగా చెప్పుకునే ప్రార్థనలేని వ్యక్తి కూడా ఆత్మీయంగా మృతమే. ఒక పరిశుద్ధునిలో ఉన్న నూతన స్వభావానికి దేవునివాక్యం ఎలాగైతే ఆహారమో అలాగే ప్రార్థన దాని ఊపిరి. తార్సువాడైన పౌలు నిజంగా మారాడని దమస్కులోని అననీయకు ప్రభువు అభయమిచ్చినపుడు, అతనితో - ''ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు'' (అపొ.కా. 9:11) అని చెప్పాడు. ఆ స్వనీతిపరుడైన పరిసయ్యుడు చాలాసార్లు దేవుని ఎదుట మోకాళ్ళూని తన భక్తిని వ్యక్తపరిచి ఉండవచ్చు, కాని ఇలా నిజంగా ప్రార్థన చేయడం ఇదే మొదటిసారి. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించనివారున్న నేటి రోజుల్లో ఈ ప్రాముఖ్యమైన భేదాన్ని నొక్కిచెప్పాల్సిన అవసరం ఉంది 2 తిమోతి 3:5 . దేవున్ని లాంఛనప్రాయంగా సంబోధించి తృప్తిపడేవారికి అసలు దేవుని గురించి తెలీదు ఎందుకంటే ''కరుణనొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ'' జెకర్యా 12:10. ఎన్నటికీ వేరుచేయబడవు. దేవుడు పునరుజ్జీవింపజేసిన కుటుంబంలో ఆయనకు మూగబిడ్డలేవరూ ఉండరు; ''దేవుడు తాను ఏర్పరచుకొనినవారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?'' (లూకా 18:7). అవును, ఆయనకు 'మొఱ్ఱ పెట్టుకొనేవారే ఆయనకు బిడ్డలు', కేవలం ప్రార్థనలు వచించేవారు కాదు.

ప్రభువు యొక్క సొంత ప్రజలు సహితం ప్రార్థనలో జరిగించే పాపం బహుశా ఇక ఏ ఇతర పనుల్లో కూడా జరిగించరని ఈ రచయిత ధృఢవిశ్వాసంతో ప్రకటిస్తే, చదువరి ఆశ్చర్యపోతాడా? యథార్థత ఉండాల్సిన చోట ఏంటి ఈ నయవంచన! తగ్గింపు ఉండాల్సిన చోట ఏంటి ఈ దబాయించే అహంకారం! నలిగిన హృదయం ఉండాల్సిన చోట ఏంటి ఈ ఆచారవ్యవహారం! మనమొప్పుకునే పాపాల విషయమై ఎంత స్వల్పంగా బాధపడతాం, మనం కోరుకునే కనికరాల అవసరతను ఎంత తక్కువగా గుర్తిస్తాం! ఈ భయంకర పాపాల నుండి దేవుడు విముక్తి కలిగించినప్పటికీ ఎంత ఉదాసీనత, ఎంత అపనమ్మకం, ఎంత స్వేచ్ఛాపరత్వం,ఎంత స్వీయతృప్తి! ఈ విషయాలపై దుఃఖించనివారిలో పవిత్రతా భావం అస్సలు లేదు.

దేవుని వాక్యమే ప్రార్థనలో మన మార్గదర్శియై ఉండాలి. అయ్యో, ఎన్నిసార్లు శరీర అవసరాలే మన ప్రార్థనకు మార్గదర్శకాలుగా నిలిచాయి. ''దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు'' పరిశుద్ధ లేఖనాలు మనకివ్వబడ్డాయి (2 తిమోతి 3:17). మనము ''పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి'' యూదా 1:20. కాబట్టి మన ప్రార్థనలు లేఖనాలను అనుసరించి ఉండాలి. ఎందుకంటే లేఖనాల కర్త ఆయనే. దీనిని ఇలా కూడా చెప్పవచ్చు. క్రీస్తువాక్యం మనలో ఎంత పరిమాణం చొప్పున నివసిస్తుందో, అంతే పరిమాణం చొప్పున మన విన్నపాలు పరిశుద్ధాత్మ మనసుతో ఏకీభవిస్తాయి. ఎందుకంటే ''హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును'' మత్తయి 12:34. దేవునివాక్యం మన హృదయంలో ఉండి, పవిత్రపరుస్తూ, మనల్ని మలుస్తూ, అంతరంగ పురుషుని క్రమపరుస్తున్న కొద్దీ, దేవుని దృష్టిలో మన ప్రార్థనలు అంగీకారయోగ్యములౌతాయి. అప్పుడే మనం, దావీదు వేరొక సందర్భంలో చెప్పినట్లు, ''నీ సంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము'' 1 దినవృత్తాంతాలు 29:14 అని చెప్పగలం.

లేఖనాలు చదివి అధ్యయనం చేయటం ద్వారా మనమెంత మేరకు లాభపడుతున్నామో నిర్ధారించేందుకు మరో సూచిక మన ప్రార్థనాజీవితపు పవిత్రత మరియు శక్తి. మన దేవుని వాక్యపఠనం, పరిశుద్ధాత్మ యొక్క దీవెన క్రింద ఉండి, ప్రార్థనలేమి అనే పాపాన్ని బట్టి మనకు దోషనిర్ధారణ చేసి, మన అనుదిన జీవితాలలో ప్రార్థన యొక్క స్థానాన్ని, ప్రాముఖ్యతను బయలుపరిచీ, మహోన్నతుని చాటున ఎక్కువ సమయం నివసించే విధంగా చేయకపోతే మనం వాక్యధ్యానంలో గడిపిన సమయం ఆత్మాభివృద్ధికి దోహదపడనట్లే. దేవునికి అంగీకారమయ్యేలా ప్రార్థించటం నేర్చుకుని, దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకుని, వాటిని ఆయన ముందు ఎలా వేడుకోవాలో తెలుసుకుని, ఆయన ఆజ్ఞలను అన్వయించుకుని, వాటిని విజ్ఞాపనలుగా ఎలా మార్చుకోవాలో గ్రహించేంత వరకు, వాక్యపఠనం ద్వారా మనం సముపార్జించిన జ్ఞానం రానున్న రోజుల్లో మనల్ని శిక్షకు పాత్రులుగా చేస్తుంది. “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్యప్రకారము ప్రవర్తించువారునైయుండుడి” (యాకోబు 1:22) అన్న మందలింపు ఇతర విషయాలతో సమానంగా ప్రార్థనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఏడు ప్రమాణాలను పరిశీలిద్దాం.

1. ప్రార్థన యొక్క లోతైన ప్రాముఖ్యతను గ్రహింపజేసినప్పుడే మనం లేఖనాల వలన ప్రయోజనం పొందగలం

ఈ రోజున నిజంగా భయం కలిగించే విషయమేమిటంటే, బైబిలు చదివే వ్యక్తులకు (బైబిలు విద్యార్థులతో సహా) ప్రతిరోజు దేవునితో నడవటానికి, సహవాసం కలిగుండటానికి ఖచ్చితమైన ప్రార్థనాజీవితం తప్పనిసరి అన్న లోతైన దృఢవిశ్వాసాల్లేవు. మనలో నిలిచియున్న పాపపుశక్తి నుండి విడుదల కొరకు, ఈ లోకపు ప్రలోభాలకు గురికాకుండా ఉండేందుకు మరియు సాతాను దాడుల నుండి తప్పించుకునేందుకు ప్రార్థనాజీవితం తప్పనిసరి. నిజంగా అలాంటి దృఢవిశ్వాసము వారి హృదయాల్ని పట్టుకుని ఉంటే, వారు దేవుని ఎదుట సాగిలపడి మరింత ఎక్కువ సమయం గడపరా? అన్నిటికన్నా దారుణమైన జవాబు ఏమిటంటే, నేను తప్పకుండా చేయాల్సివచ్చే పనుల ఒత్తిడి వలన ప్రార్థనకు సమయం కేటాయించలేకపోతున్నాను. అయితే, మన రక్షకుని కంటే ఎక్కువ ఒత్తిడి కలిగిన జీవితాన్ని ఎవరు జీవించారు? అయినప్పటికీ ప్రార్థన కోసం ఎక్కువ సమయం కేటాయించినదెవరు? నిజంగా మనం దేవుని ఎదుట విజ్ఞాపనలు చేసేవారిగా ఉండాలని కాంక్షించి, మన దగ్గర ఇప్పుడున్న సమయాన్ని పూర్తిగా వినియోగించాలనుకుంటే, ఆయన మన పరిస్థితులను అనుకూలం జేసి, ఎక్కువ సమయం దొరికేలా చేయగలడు.  ప్రార్థన యొక్క లోతైన అవసరతను గుర్తించకపోవటం క్రైస్తవుల సంఘజీవితం ద్వారా తేటతెల్లమౌతున్నది. “నా మందిరము ప్రార్థన మందిరమనబడును” అని దేవుడు స్పష్టంగా చెప్పాడు(మత్తయి 21:13). గమనించండిః 'మందిరము, ఉపదేశించటం మరియు పాటలు పాడటం కొరకే కాదు', కాని 'ప్రార్థన కొరకైన'మందిరము. అయినప్పటికీ, సనాతన భావాలుగల సంఘాలుగా పిలవబడే చాలా సంఘాలలో సహితం ప్రార్థనాపరిచర్య కొద్దిపాటిగానే ఉండి, సౌవార్తీకరణోద్యమాలు, బైబిలు బోధనాసదస్సులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాని ప్రత్యేక ప్రార్థన నిమిత్తమై రెండు వారాలు కేటాయించిన దాఖలాలు చాలా అరుదు! సంఘాలలో ప్రార్థనాజీవితాలు బలపరచకపోతే ఈ బైబిలు బోధనాసదస్సులు నిర్వహించి ఏమి ప్రయోజనం? కాని దేవుని ఆత్మ ఎప్పుడైతే మన హృదయాలకు శక్తిని అన్వయిస్తాడో, అప్పుడు “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగానుండి ప్రార్థన చేయుడి” (మార్కు 14:38), "ప్రతి విషయములోను ప్రార్థనావిజ్ఞానపనములచేత కృతజ్ఞతగలవారై దానియందు మెలకువగా ఉండుడి” (కొలొస్సీ 4:2) వంటి వాక్యాల నుండి లాభపడతాం.

2. ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదన్న భావన కలిగింపజేసినప్పుడు మనం లేఖనాల వలన ప్రయోజనం పొందుతాము.

“మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు” రోమా 8:26. ఎంతమంది క్రైస్తవులు దీనిని నిజంగా విశ్వసిస్తారు! తాము దేని విషయంలో ప్రార్థించాలో ప్రజలకు చాలా బాగా తెలుసు, కాని వారు పట్టింపు లేక, దుష్టత్వం కలిగి, వారి కర్తవ్యం నిర్వర్తించటంలో విఫలమౌతారనీ సాధారణ తలంపు. అయితే ఈ తలంపు రోమా 8:26లోని దైవావేశపు ప్రకటనతో విభేదిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం - శరీరడంబాన్ని అణిచే ఈ ప్రకటన కేవలం ప్రజలందరి గురించి మాత్రమే చెప్పబడలేదు కాని, మరి విశేషంగా దేవుని పరిశుద్దుల విషయమై చెప్పబడింది. వారిలో ఈ అపొస్తలుడు (పౌలు) తన్ను తాను చేర్చుకునేందుకు సంకోచించలేదు. “మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు”. పునరుజ్జీవింపబడినవారి పరిస్థితే ఇలాగుంటే మరి తిరిగి జన్మించనివారి సంగతేమిటి? ఈ వచనం చదివి, అదేం చెబుతుందో సమ్మతించటం ఒక ఎత్తు అయితే, దాని అనుభవాత్మక ఆచరణ మరొక ఎత్తు . దేవుడు మననుండి ఆశించేదాన్ని మన హృదయం గ్రహించాలంటే ఆయనే తనంతట తాను మనలో, మన ద్వారా పనిచేయాలి.

     ఎన్నో మార్లు ప్రార్థనలు వల్లించానే కానీ
                            ఎపుడైనా ప్రార్థించానా? ఏమో!
        నా పలుకులలో నా హృదయాలోచనలు వినిపించానో లేదో
ఉత్తుత్తి మాటల వ్యర్థ ప్రార్థననే చేసిన, అది విగ్రహాలు చెంత మోకరించుటేగా!

 రచయిత తన తల్లి వద్ద చాలా ఏళ్ళ క్రితం ఈ మాటలు నేర్చుకున్నా, వాటి భావం మాత్రం నేటికీ ఎంతో బలంగా అతన్ని తాకుతూనే ఉంటుంది. పరిశుద్దాత్ముడు నేరుగా సాధ్యపరిస్తే తప్ప ఓ క్రైస్తవుడు ప్రార్థన చేయడం అసాధ్యం. ఇది నిజం, ఎందుకంటే నిజమైన ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనలో జాగృతపరిచే అవసరతాభావం. అలా అయినప్పుడే క్రీస్తునామంలో మనం దేవుని పవిత్రచిత్తానుసారమైన దానిని అడుగుతాం. “ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును” (1 యోహాను 5:14). అయితే దేవుని చిత్తానుసారంగా లేనిదాన్ని అడగటం ప్రార్థన అనిపించుకోదు, కాని ప్రార్థించామని ఊహించుకోవటమే ఔతుంది. నిజమే, దేవుడు బయలుపరిచే తన చిత్తం తన వాక్యంలో తెలపబడింది, కాని వంట పద్దతుల పుస్తకంలోని ఉపాయాలు, చిట్కాలు లాగ కాదు. లేఖనాలు చాలా నియమాలను పేర్కొంటాయి, వివిధ పరిస్థితులలో వాటి అన్వయం కొరకు నిరంతర హృదయసాధన మరియు దైవికసహాయం అత్యవసరం. “ప్రభువా మాకు ప్రార్థనచేయ నేర్పుము” (లూకా 11:1) అని మొఱ్ఱపెట్టే లోతైన అవసరత మనకు నేర్పించబడినప్పుడే లేఖనాల వలన మనం లాభం పొందుతాం, అప్పుడే ప్రార్థనాస్ఫూర్తి నిమిత్తమై యాచించేందుకు బలవంతపెట్టబడతాం.

3. ప్రార్థన చేయటానికి పరిశుద్దాత్ముని సహాయం మనకవసరమన్న జాగరూకత కలిగింపజేసినప్పుడే మనం లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాం

మొదటిగా, పరిశుద్దాత్ముడు మన నిజమైన అవసరాలేమిటో తెలియజేయాలి. మన లౌకిక అవసరాలనే ఉదాహరణగా తీసుకుందాం. ఇబ్బందులు మన మీద ఒత్తిడి కలగజేసినప్పుడు, ఆ ఇబ్బందుల నుండి విడుదల పొందాలని మనం కోరుకుంటాం. ఇక్కడ స్పష్టంగా దేనికొరకై ప్రార్థించాలో మనకు తెలుసని భావిస్తాం. కాని నిజానికి మనకు తెలీనే తెలియదు; ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందాలన్న సహజ కోరికున్నప్పటికీ, మనమెంత అజ్ఞానులమంటే, మన వివేకం ఎంత మందమైనదంటే, దేవుని ఇష్టానికి ఎంత లోబడియుండాలని దేవుడు ఆశిస్తున్నాడో, ఈ వ్యథలను మన ఆత్మీయ మేలుకొరకై ఎలా ఉపయోగించాలని ఉద్దేశిస్తున్నాడో గ్రహించలేని పరిస్థితి మనది. కాబట్టి ఈ వ్యథల నుండి ఉపశమనాన్ని పొందగోరేవారి విన్నపాలను దేవుడు 'కేకలు' అంటాడే గాని హృదయపూర్వకంగా బ్రతిమిలాడటం అని అనడు హోషేయ 7:14. “మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియును?” ప్రసంగి 6:12. మన లౌకిక అవసరాలను తెలుసుకుని వాటిని దేవుని చిత్తానుగుణమైన ప్రార్థనలుగా మలుచుకోవడానికి పరలోక జ్ఞానమవసరం.

 పై మాటలకు ఇంకాస్త జతచేస్తే బాగుంటుందేమో. ఈ మూడంచెల పరిమితితో లౌకిక విషయాల నిమిత్తమై లేఖనానుసారంగా ప్రార్థించవచ్చు మత్తయి 6:11. మొదటగా, ప్రధానంగా కాకుండా సందర్భవశాత్తుగా. ఎందుకంటే ప్రధానంగా లౌకికావసరతల విషయమై క్రైస్తవులు చింతించువారు కారు మత్తయి 6:33,34. లౌకిక విషయాలకన్నా ఎక్కువ విలువ మరియు ప్రాముఖ్యత కలిగిన పరలోకసంబంధ, శాశ్వత విషయాలను మాత్రమే మొట్టమొదటగా వెదకాలి కొలొస్సీ 3:1. రెండవదిగా,ఉపకరణంగా,ఒక లక్ష్యాన్ని చేరుకునే సాధనంగా. దేవునియొద్ద నుండి భౌతికావసరతలు పొంది మనసులో తృప్తిపడాలని కాదు, కాని ఆయన్ను మరింత తృప్తిపరిచేందుకు అది ఒక సాధనంగా ఉండాలి. మూడవదిగా, నిరంకుశంగా కాదు అణకువతో. ఎందుకంటే లౌకికమైన కనికరం మన మంచితనానికి నిజంగా దోహదపడుతుందో లేదో మనకు తెలియదు కీర్తన 106:18. కాబట్టి మనం దాన్ని దేవుని నిర్ణయానికే వదిలివేయాలి.  మనకు అంతరంగిక మరియు బాహ్యకోరికలు ఉంటాయి. వీటిలో కొన్నిటిని మనస్సాక్షి వెలుగులో పరిశీలించవచ్చు; పాపపు దోషము మరియు అపవిత్రత, సహజ జ్ఞానానికి మరియు ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన పాపాలు అయినప్పటికీ, మన మనస్సాక్షి ద్వారా మన గురించి మనకు తెల్సిన జ్ఞానం ఎంత స్వల్పం మరియు అస్తవ్యస్తమైనదంటే, పరిశుద్ధాత్మకు వేరుగా, పరిశుద్ధపరిచే నిజమైన ఊటను మనమెట్టి పరిస్థితుల్లోనూ కనుగొనలేం. పరిశుద్ధులు ప్రాముఖ్యంగా దేవునియొద్ద తమ అంతరంగికస్థితిని గురించి మరియు వారి ఆత్మీయస్వభావం గురించి విన్నవించుకోవాలి. దావీదు తనకు తెలిసి జరిగించిన అన్ని అతిక్రమాలను గురించి సొంత పాపమును ఒప్పుకొని కీర్తన 51:1-5. తృప్తి పడలేదు. తన “రహస్య పాపాల” నుండి నిర్దోషిగా తీర్చమన్నప్పుడు కీర్తన 19:12. కూడా దావీదు తన పొరపాట్లను కనుగొనగలవాడెవడని అంగీకరిస్తూ తృప్తిచెందలేదు. దేవుడు "అంతరంగములో సత్యాన్ని కోరతాడని” (కీర్తన 51:6) తెలుసుకున్న దావీదు తన హృదయంలో ఆయాసకరమైన మార్గమేమైనా ఉన్నదేమో తెలుసుకోవాలని కీర్తన 139:23-24. దేవునిని ప్రాధేయపడ్డాడు. కాబట్టి 1 కొరింథీ 2:10,12.వ వచనాలను దృష్టిలో ఉంచుకొని దేవునికంగీకారంగా ప్రార్థించటానికి  పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని అర్థించాలి.

4. ప్రార్థించటంలో సరైన ధ్యేయాన్ని పరిశుద్ధాత్మ మనకు బోధించినప్పుడు మనం లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాం

ప్రార్థన అనే ఆజ్ఞను దేవుడు ఒక మూడంచెల ఆకృతితో రూపొందించాడు.మొదటిగా, ప్రార్థన అంటే త్రియేకదేవుని ఆరాధించే ఒక  క్రియగా, అంటే అనుగ్రహించే తండ్రికి, తనయొద్దకు చేరుకునే ఏకైక మార్గమైన కుమారుని నామంలో, పరిశుద్దాత్ముని నడిపింపు ద్వారా, ఆ గొప్ప త్రియేక దేవుడు ఘనపరచబడేలా అర్పించే ఓ నివాళి.

రెండవదిగా, మన హృదయాలను తగ్గించుకునేందుకు ఒక సాధనంగా. ఎందుకంటే మనల్ని ఆధారపడే స్థానానికి తీసుకుని వచ్చి, మనలో నిస్సహాయతాభావాన్ని పెంపారజేసేది ప్రార్థనే. ప్రభువు లేకుండా మనమేమీ చేయలేమని ఒప్పుకుంటూ, మనమేమైయున్నామో, మనమేమి కలిగున్నామో, మన సమస్తం ఆయన దాతృత్వపు వరమని తెలుసుకోవాలి. అయితే పరిశుద్దాత్ముడు మన చేయిపట్టుకొని, మనలోని గర్వాన్ని తొలగించి, మన హృదయాల్లో, ఆలోచనల్లో దేవునికి సరైన స్థానమివ్వాలని గ్రహింపజేసేంతవరకు మనము ఈ వాస్తవాన్ని తెలుసుకోలేం. 

మూడవదిగా, మనమడిగే మంచివిషయాలను పొందుకునే మార్గంగా. మనం చేసే చాలా ప్రార్థనలకు సమాధానం రాకపోవటానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి మనమొక తప్పుడు, అయోగ్య లక్ష్యాన్ని కలిగుండటం. ఇది ఎంతో భయంకరమైన విషయం. "అడుగుడి మీకియ్యబడును” (మత్తయి 7:7) అని మన రక్షకుడు చెప్పాడు; కాని కొందరి విషయమై యాకోబు ఇలా రూఢిపరిచాడు, “మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకదు” (యాకోబు 4:3). ప్రార్థన దేవుని ఉద్దేశాలకు అనుగుణంగా కాక ఇతర దురుద్దేశాలకొరకైతే, అది వృథా ప్రార్థనే అవుతుంది. మన వివేకం మరియు చిత్తశుద్దిపట్ల మనకెంత నమ్మకమున్నా, మనం ఒంటరిగా విడిచిపెట్టబడితే, మన లక్ష్యాలు దేవునిచిత్తానికి తగినట్లుగా ఎప్పుడూ ఉండవు. పరిశుద్ధాత్ముడు మన శరీరాన్ని నిగ్రహించేంత వరకు మన స్వాభావిక, రోగగ్రస్త అభిమానాలు మన విన్నపాల్లో కలగలిసిపోయి, అవి వృథా విన్నపాలౌతున్నాయి. “మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి” (1 కొరింథీ 10:31), అయితే పరిశుద్ధాత్ముడు తప్ప వేరెవ్వరు కూడా మన కోరికలన్నిటిని దేవునికి మహిమ తెచ్చేలా ఆయనకు లోబరిచేందుకు సహాయపడరు.

5. దేవుని వాగ్దానాలను ఎలా అర్థించాలో మనకు బోధించినప్పుడు లేఖనాల వలన ప్రయోజనం పొందుతాం

విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి రోమా 10:14. లేకపోతే దేవుడు దాన్ని వినడు. విశ్వాసానికి దేవుని వాగ్దానాల పట్ల గౌరవముంటుందిహెబ్రీ 4:1;రోమా10:21. కాబట్టి దేవుడు దేనినైతే వాగ్దానం చేసి ఇవ్వజూస్తున్నాడో అది తెలియకపోతే, అసలు ప్రార్థనే చేయలేము. దేవుని వాగ్దానాలు ప్రార్థనాంశాలతో నిండియుండి, ప్రార్థనా పరిమాణాన్ని నిర్ణయిస్తాయి. దేవుడు వాగ్దానం చేసిందే తప్ప, ఇక ఏ ఇతర విషయాన్నిగురించి కూడా మనం ప్రార్థన చేయకూడదు. “రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును” ద్వీతీ 29:29. కానీ ప్రకటించబడిన ఆయన చిత్తము మరియు బయలుపరచబడిన ఆయన కృప మనకు చెందుతాయి, అవి మన నియమాలు. మనం దాని అవసరాన్ని గుర్తించకముందే దేవుడు మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేసాడు, అది కూడా మనకుపయోగపడేలా, ఉత్తమంగా, కొన్ని షరతులతో సమకూర్చాడు. కాబట్టి దైవిక వాగ్దానాల గూర్చిన జ్ఞానం ఎంత ఎక్కువగా కలిగుంటామో మరియు వాటిలో ప్రస్తావించబడిన దేవుని మంచితనం, కృప మరియు దయ ఎంత ఎక్కువగా అర్థం చేసుకునేటట్లు చేయబడతామో, అంతగా మనం అంగీకారయోగ్యమైన ప్రార్థన కొరకు సిద్దపాటు కలిగుంటాం.

దేవుని వాగ్దానాల్లో కొన్ని సాధారణమైనవి, కొన్ని నిర్దిష్టమైనవి; కొన్ని నియమబద్ధమైనవి, మరికొన్ని రాబోవు కాలంలో నెరవేరేవి. ప్రస్తుతం మనమున్న సందర్భానికి, ఒక నిర్దిష్టమైన అవసరతకు ఏ వాగ్దానం సరిపోతుందో, విశ్వాసం ద్వారా దాన్ని ఎలా అన్వయించుకుని దేవుని యొద్ద వేడుకోవాలో కూడా మనంతట మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే మనకు స్పష్టంగా ఇలా చెప్పబడింది - “ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి యెవనికి తెలియును? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి యెవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవునియొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము” (1 కొరింథీ 2:11,12). ప్రార్థన అంగీకరింపబడాలంటే ఇంత అవసరమా? మీరు సూచించినదానికన్నా తక్కువ శ్రమతో దేవుని ఎదుట సరిగా విన్నవించుకోలేమా? ఇలాగైతే చాలా తక్కువమంది ఇందులో కొనసాగుతారు అని ఎవరైనా అంటే, ఇలా ఆక్షేపించే వ్యక్తికి ప్రార్థించటం అంటే ఏమిటో తెలియదు, నేర్చుకోవడానికి కూడా సుముఖంగా లేడన్నదే మా జవాబు.

6. దేవునికి పూర్ణవిధేయత చూపించటం నేర్చుకున్నప్పుడే మనం లేఖనాల నుండి ప్రయోజనం పొందుతాము

పైన చెప్పిన విధంగా, ప్రార్థనను ఒక ఆజ్ఞగా నియమించటంలోగల ఒకానొక దైవికసంకల్పం మనల్ని మనం తగ్గించుకోవాలని - ప్రభువు ఎదుట మన మోకాళ్లను వంచినప్పుడు ఇది బాహ్యంగా ప్రకటించబడుతుంది. ప్రార్థన అంటే మన నిస్సహాయతను ఒప్పుకొని, మనకు సహాయమంతటినీ అందించేవాని వైపు చూడడం. మన ప్రతి అవసరాన్ని తీర్చగలిగే ఆయన ఏర్పాటును సొంతం చేసుకోవడమే ప్రార్థన. 'మన విన్నపాలను దేవునికి తెలియజేయుటయే' ఫిలిప్పీ 4:6. దాని అర్థం. కానీ, విన్నపానికి, దబాయింపుకి చాలా తేడా ఉంది. 'మనం వచ్చి దేవుని ఎదుట ఉద్వేగాన్ని వెలువరించేందుకు కాదు కృపా సింహాసనం నిలబెట్టబడింది' (విలియం గుర్నాల్). మనం దేవుని ఎదుట మన వేదనను వినిపించాలి, కాని దానితో ఎలా వ్యవహరించాలన్నది దేవుని అత్యున్నత జ్ఞానానికి విడిచిపెట్టాలి. ఎలాంటి ఆదేశాలుండకూడదు, దేవుని ముందు మనమేమీ వ్యాజ్యమాడలేము, ఎందుకంటే కేవలం ఆయన కరుణ మీదే ఆధారపడున్న యాచకులం మనం. మన ప్రతి ప్రార్థనలో ఇలా జోడించటాన్ని మరిచిపోకూడదు, “అయినను, నా చిత్తం కాదు, నీ చిత్తమే” సిద్ధించును గాక.

అయితే విశ్వాసము దేవుని వాగ్దానాలను అర్థించి జవాబునాశించదా? తప్పకుండా, కానీ అది దేవుని జవాబైయుండాలి. పౌలు తన శరీరంలో ఒక ముల్లు తొలగిపోవాలనీ ప్రభువును ముమ్మారు వేడుకున్నాడు, కాని దాన్ని తీసివేసేందుకు బదులు తన కృపనిచ్చి ప్రభువు సహింపజేసాడు (2 కొరింథీ 12). దేవుని వాగ్దానాలలో కొన్ని వ్యక్తిగతమైనవి కావు. తన సంఘానికి దేవుడు కాపరులను, బోధకులను మరియు సువార్తీకులను వాగ్దానం చేసాడు, కాని ఎన్నో సంఘాలు, అటువంటివారు లేని నికృష్ట స్థితిలో ఉన్నాయి. కొన్ని వాగ్దానాలు నిరంకుశము మరియు సార్వత్రికమైనవి కావు కానీ నిరవధికము మరియు సామాన్యమైనవి. ఉదాహరణకు ఎఫెసీ 6:2,3. చూడండి. మనం విశ్వాసంతో అడిగినా కూడా మనమడిగిన నిర్దిష్ట విషయాన్ని అనుగ్రహించేందుకు దేవుడు కట్టుబాట్లు కలిగిలేడు. పైగా, తన దయావాత్సల్యత మనపై కుమ్మరించేందుకు సరైన సమయం మరియు కాలాన్ని నిర్దేశించే హక్కు ఆయనే స్వయంగా కలిగున్నాడు. “దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధుల ననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి..... ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు” (జెఫన్యా 2:3). నాకు దేవుడు ఇహలోక ఆశీర్వాదాన్ని అనుగ్రహించటం ఆయన చిత్తమైయుండే అవకాశం ఉంది కాబట్టి నేను ఆయన పైన ఆధారపడి దాని కొరకు ప్రాధేయపడటం నా కర్తవ్యం. అయినా సరే అది ఇవ్వాలా వద్దా అనే ఆయన నిర్ణయానికి లోబడుతూనే నేనలా చేయాలి.

7. ప్రార్థన యథార్థంగా, లోతుగా ఆనందమిచ్చినపుడే లేఖనాల నుండి మనం లాభం పొందుతాం

ప్రతి ఉదయసాయంత్రాలు కేవలం మన ప్రార్థనలు 'వల్లించడం' అనేది విసుగెత్తించే పని, దానిని కేవలం ఒక బాధ్యతగా పరిగణించి నిర్వర్తించినప్పుడల్లా కొంత ఊరట లభించునట్లుంటుంది కానీ నిజంగా దేవుని సన్నిధిలోకి వచ్చి, మహిమాయుతమైన ఆయన ముఖకాంతిని దర్శించుకుని, కృపాసింహాసనం వద్ద ఆయనతో కలిసి గడిపితే అది పరలోకంలో మనకొరకే వేచియున్న శాశ్వతానందము యొక్క పూర్వానుభవం. ఇలాంటి అనుభవంతో దీవించబడిన వ్యక్తి కీర్తనాకారునితో కూడ కలిసి ఇలా అంటాడు, “నాకైతే దేవుని పొందు ధన్యకరము” (కీర్తన 73:28). అవును, హృదయానికి ధన్యకరము, ఎందుకంటే అది శాంతించబడుతుంది; విశ్వాసానికి ధన్యకరము, ఎందుకంటే అది బలపరచబడుతుంది; ఆత్మకు ధన్యకరము, ఎందుకంటే అది దీవించబడుతుంది. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి మూలకారణం దేవునితో మన ఆత్మలు ఏకీభవించకపోవడం.“యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును” (కీర్తన 37:4).  పరిశుద్దాత్మ దీవెనతో, ప్రార్థనలో ఇంత ప్రసన్నతను కలిగించి వృద్ధిపరిచేదేంటి? మొదటిగా మన ప్రార్థన వినువాడు దేవుడేనన్న హృదయానందం, మరీ ముఖ్యంగా దేవుడే మన తండ్రి అనే గుర్తింపు మరియు గ్రహింపు. ఇలా, తమకు ప్రార్థన నేర్పుమని శిష్యులు యేసు ప్రభువునడిగినపుడు, ఆయన “కాబట్టి మీరీలాగు ప్రార్థన చేయుడి - పరలోకమందున్న మా తండ్రీ”, అని అన్నాడు. “అబ్బా, తండ్రి, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను” (గలతీ 4:6); పిల్లలు తమ తల్లిదండ్రులను అత్యంత ప్రేమపూర్వకంగా సంబోధించే విధంగా దేవునిలో పవిత్రమైన సంతృప్తి కలిగుండటం ఇందులో ఇమిడియుంది. మన విశ్వాసం బలపరచుకునేందుకు మరియు హృదయ ఓదార్పు కొరకు ఎఫెసీ 2:18 .ఇలా చెబుతుంది. ఆయన (క్రీస్తు) ద్వారానే మనం ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగియున్నాము. మన తండ్రిని చేరగలుగుతున్నామని తెలిస్తే మన ఆత్మకు ఎంత సమాధానం, ఎంత ధీమా, ఎంత స్వేచ్ఛ.

రెండవదిగా, దేవుడు తన కృపాసింహాసనం మీద కూర్చున్నాడని మన ఆత్మ చూసినప్పుడు, మన హృదయాంతరంగంలో దీనిని గ్రహించినప్పుడు ప్రార్థనలో ప్రసన్నత పెరుగుతుంది. ఈ దృష్టి లేదా ఆశ, ఏదో శారీరక ఊహ వలన కాదు గాని ఆత్మీయవెలుగు వలన కలిగిందే; ఎందుకంటే విశ్వాసాన్ని బట్టే మనం “అదృశ్యమైనవానిని చూడగలం” (హెబ్రీ 11:27); విశ్వసించేవారికి వారు ఆరాధించేవానిని ఋజువుపరిచి వారి ఎదుట నిలిపే విధంగా “విశ్వాసమనునది అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది” (హెబ్రీ 11:1). దేవుడు “సింహాసనం” మీద కూర్చుండే దృశ్యం హృదయాన్ని పులకరింపజేస్తుంది. అందుకే మనకు ఈ విధంగా చెప్పబడింది - “మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము” (హెబ్రీ 4:16).  మూడవదిగా, పైన పేర్కొనిన చివరి వచనంలో చూసినట్లుగా పాపులమైన మనపట్ల దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన కృప మరియు కనికరం చూపించటానికి సిద్ధపడియున్నాడనే స్పృహ ద్వారా మనకు ప్రార్థనలో స్వాతంత్రం మరియు సంతృప్తి రేకెత్తుతాయి. ప్రార్థన ద్వారా మనము అధిగమించాల్సిన అయిష్టత ఏదీ దేవునిలో ఉండదు. మనం పుచ్చుకునేదానికన్నా ఆయన ఇవ్వడానికి ఎక్కువ సిద్ధపడి ఉన్నాడు. అందుకే యెషయా 30:18లో ఆయన్ను గూర్చి ఇలా చెప్పబడింది “మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడియున్నాడు”. ఆయనను నువ్వు అభ్యర్థించాలని, ఆయన నిన్ను దీవించడానికి సిద్దంగా ఉన్నాడని నువ్వు విశ్వసించాలన్నది ఆయన కోరిక. నీతిమంతుల మొఱ్ఱ వినటానికి ఆయన ఎప్పటికీ చెవియొగ్గియుంటాడు. అప్పుడు “సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము” (హెబ్రీ 10:22); “ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకును మన తలంపులకును కావలియుండును” (ఫిలిప్పీ 4:6,7).

ఐదవ అధ్యాయము

లేఖనాలు మరియు సత్క్రియలు

సత్యాన్ని వక్రీకరించడంలో ఉన్న ప్రమాదాలు

 ఇరువైపుల నాశనకరమైన, అపాయకరమైన కొండచరియల మధ్య ఉన్న ఇరుకైన మార్గంతో దేవుని సత్యాన్ని పోల్చవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే, అది అగాధాల వంటి రెండు పొరపాట్ల మధ్యలో  ఉంటుంది. ఒక కొననుండి మరొక కొనకు కొట్టుకుపోవటానికి మొగ్గే మన మనోదౌర్భల్యాన్ని బట్టి ఈ సాదృశ్యం ఎంత సరైనదో తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడే సమతుల్యాన్ని భద్రపరిచేందుకు సహాయపడగలడు. అలా కాని పక్షంలో తప్పిదంలోకి పడటం అనివార్యం. ఆ తప్పిదం సత్యాన్ని నిరాకరించటం కాదు, దాన్ని వక్రీకరించటమే. అంటే సత్యంలోని ఒక కోణానికి మరొక కోణంతో వైరుధ్యముగా చూపించటం.

దైవశాస్త్ర చరిత్ర ఈ సత్యాన్ని ఎంతో గంభీరంగా తేటపరుస్తుంది. ఒక తరంవారు తమ కాలానికి చాలా అవసరమైన సత్యంలోని ఒక కోణాన్ని సరైన రీతిలో పట్టుదలతో తర్కించారు. ఆ తర్వాత తరంవారు అందులో కొనసాగుతూ ముందుకు సాగవలసింది పోయి, తమ శాఖను ప్రత్యేకపరిచే సిద్ధాంతంగా దాని కొరకు పోరాడటం మొదలుపెట్టారు; వక్రీకరణకు గురైన ఆ కోణాన్ని కాపాడే క్రమంలో, దాని సమతుల్యపరిచే వేరొక కోణాన్ని వారి ప్రత్యర్థులు తరచూ నొక్కి చెబుతున్నప్పటికీ వినటానికి వారు నిరాకరించారు. దాని పర్యవసానంగా వారు సమగ్ర అవగాహనను కోల్పోయి వారు నమ్మినదానినే లేఖనాలు చెప్పే పరిమాణాలకు మించి నొక్కి చెప్పడం ప్రారంభించారు. ఫలితంగా, తర్వాత తరంలో నిజమైన దైవసేవకుడు వారి దృష్టికి ఎంతో విలువైన ఆ కోణాన్ని దాదాపు ఉపేక్షించేంతగా వారిచే నిరాకరించబడిన సత్యాలను నొక్కి చెప్పటానికి పిలవబడ్డాడు.  'కాంతికిరణాలు, అవి సూర్యునినుండైనా, నక్షత్రం లేక క్రొవ్వొత్తి నుండైనా తిన్నగా పయనిస్తాయి; అయినప్పటికీ దేవునికార్యాలతో పోలిస్తే మన పనులెంత అల్పంగా ఉంటాయంటే ఎంతటి నిశ్చలమైన చేయి ఐనా పరిపూర్ణమైన తిన్నని రేఖ గీయలేకపోవడమే కాదు, తన సమస్త నైపుణ్యంతో ఇంతటి స్వల్పమైన పనిని చేయగల పరికరాన్ని కూడా మనిషి కనిపెట్టలేకపోయాడు' (టి. గుయి 1867). ఇది నిజమా కాదా అన్న సంగతి అలా ఉంచితే ఒక ఖచ్చితమైన విషయమేమిటంటే, వైరుధ్యాలుగా కనపడే  రెండు సిద్దాంతాల మధ్య సమతుల్యాన్ని కాపాడే చిన్న గీతని గీయడం మాత్రం తమకు తాముగా మనుష్యులకు అసాధ్యం; ఉదాః i.దేవుని సార్వభౌమాధికారం మరియు మానవుని బాధ్యత; ii.కృప ద్వారా ఎన్నిక మరియు విశ్వవ్యాప్త సువార్త ప్రకటన; iii.పౌలుయొక్క “నీతిమంతులుగా తీర్చిదిద్దే విశ్వాసము” మరియు యాకోబు “నీతియుక్త క్రియలు”. దేవుని సంపూర్ణ సార్వభౌమాధికారమును గురించి ఎక్కడ నొక్కి చెప్పబడిందో, అక్కడ మనుష్యుని జవాబుదారీతనాన్ని ఉపేక్షించడం చాలా సార్లు జరిగింది.ఎక్కడైతే బేషరతు ఎన్నిక గురించి చెప్పబడిందో, అక్కడ రక్షింపబడనివారికి నిరాటంకంగా సువార్త ప్రకటించటం విడిచిపెట్టబడింది. మరో ప్రక్క మానవుని జవాబుదారీతనాన్ని ఆమోదించి, సువార్త ప్రకటనా పరిచర్య ఎక్కడైతే సమర్ధించబడిందో, అక్కడ దేవుని సార్వభౌమాధికారం మరియు ఎన్నికలోని సత్యం కోత పెట్టబడ్డాయి లేక పూర్తిగా ఉపేక్షించబడ్డాయి. 

పైన చెప్పబడినటువంటి సత్యాన్ని తేటపరిచే ఉదాహరణలను మనలో చాలామంది చూసి ఉంటారు. కాని విశ్వాసానికి, సత్క్రియలకు మధ్య ఖచ్చితమైన సంబంధాన్ని చూపించగోరినప్పుడు కూడా అలాంటి సమస్యే ఉత్పన్నమౌతుందని బహుశ చాలా తక్కువమంది గ్రహించి ఉంటారు. లేఖనాలు సమర్ధించని స్థానాన్ని సత్క్రియలకు ఆపాదించి కొందరు తప్పు చేస్తే, లేఖనాలు ప్రత్యేకించే స్థానాన్ని సత్క్రియలకు ఇవ్వలేక మరికొందరు తప్పుచేస్తారు. సత్క్రియల ద్వారా మనకు దేవునియొద్దనుండి విమోచన లభిస్తుందనుకోవడం ఎంత తప్పో పరలోకానికి చేరేందుకు సత్క్రియలు అసలు అవసరమే లేదని అనుకోవడం కూడా అంతే తప్పు. ఇప్పటికే కత్తిమీద సాము చేస్తున్నానని, దుర్బోధకుడిననే ముద్రపడే ప్రమాదానికి లోనైయున్నానని గ్రహించియుంటారు. ఈ సంకటస్థితి నుండి బయటపడేందుకు దైవికసహాయం అనివార్యమనీ నమ్ముతూ,వీటిని స్వయంగా దేవునికే అప్పగిస్తున్నాను.

కొందరు సత్క్రియలను భూతద్దంలో చూపించాలన్న ఉత్సుకతలో విశ్వాసాన్ని చులకన చేశారు. సనాతన భావాలున్న మరికొందరైతే సత్క్రియలకు సరైన స్థానాన్ని చాలా అరుదుగా ఆపాదిస్తారు; అంతేకాదు క్రైస్తవులు చిత్తశుద్దితో వాటిని కొనసాగించాలన్న పిలుపు చాలా అరుదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే విశ్వాసాన్ని వారు ఎక్కడ తక్కువ అంచనా వేస్తారోనన్న వారి భయం మరియు పాపులు క్రీస్తు యొక్క నీతియందు కాక తమ స్వంతకార్యాల్లో ఎక్కడ నమ్మికయుంచుతారోనన్న ఆందోళన. కాని ఒక ప్రసంగీకుడు “దేవుని సంకల్పమంతయు” ప్రకటించడానికి ఇవేమి అడ్డంకులు కాకూడదు. నశించినవారు రక్షకుడైన క్రీస్తుయందు విశ్వాసముంచటమే అతని అంశమైతే, ఎలాంటి మార్పులు లేకుండా ఆ సత్యాన్నే ప్రకటించాలి. రక్షణ పొందుటకు తానేమి చేయవలెనని ఫిలిప్పీ చెఱసాల నాయకుడు అపొస్తలుల్ని అడిగినప్పుడు వారిచ్చిన జవాబునే అపొ.కా. 16:31. అనుకరించాలి. ఒకవేళ సత్క్రియలే అతని అంశమైతే, లేఖనం చెప్పే విషయాన్ని ప్రకటించటాన్ని ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు; "దేవునియందు విశ్వాసముంచినవారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచునట్లు నీవీసంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలెనని ...” తీతు 3:2,8.లోగల ఆ దైవికాజ్ఞను మరిచిపోనీయకండి.

విశృంఖలత, నిరర్థకత మరియు డంబపు మాటలతో నిండియున్న ఈ దినాల్లో పై వాక్యం ఎంతో ఉపయుక్తమైనది. “సత్క్రియలు” అన్న పదం క్రొత్త నిబంధనలో దాదాపు ముప్పై సార్లు కనబడుతుంది. అయినప్పటికీ, విశ్వాసమందు పటుత్వం కలిగియున్న చాలామంది బోధకులు ఆ మాటను ఉపయోగించే, నొక్కి చెప్పే, విడమరిచే విధానం చూస్తుంటే వినేవారికి ఈ మాట దేవునివాక్యంలో ఒకటి రెండు సార్లకంటే ఎక్కువగా ప్రస్తావించబడలేదనిపిస్తుంది. వేరొక సందర్భంలో ప్రభువు యూదులతో ఇలా అన్నాడు, “దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు” (మార్కు 10:9). మన హృదయాల్లో మరియు మనస్సుల్లో ఎన్నటికీ వేరుపరచజాలనీ రెండు ప్రాముఖ్యమైన, దీవెనకరమైన సంగతుల్ని దేవుడు ఎఫెసీ 2:8-10. లో కలిపాడు. అయినప్పటికీ నేటి వేదికల్లో అవి రెండూ విడగొట్టబడుతున్నాయి. 8,9 వచనాల మీద ఎన్ని ప్రసంగాలు చేయబడ్డాయి. ఐతే 'రక్షణ అనేది క్రియల వలన కాదు కాని విశ్వాసమువలననే' అన్న మాటలతో మొదలైన ఈ వాక్యభాగము ఎలా ముగుస్తుందో గమనించండి. “వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.” 

దేవునివాక్యం వేర్వేరు కారణాలను బట్టి అధ్యయనం చేయబడుతుందని, నానా ఉద్దేశాలతో పఠించబడుతుందని ఎత్తి చెబుతూ ఈ పుస్తకాన్ని ఆరంభించాం. అయితే ఈ లేఖనాలు దేనికోసం "ప్రయోజనకరమో” 2 తిమోతి 3:16,17లో తెలుస్తుంది. అనగా ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతియందు శిక్షచేయుటకు, “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండుటకు అది ప్రయోజనకరము.” దేవునివాక్యం దేవుడు మరియు క్రీస్తు గురించి ఏమని నొక్కిచెప్తుందో, పాపాన్ని ఎలా ఖండించి తప్పుదిద్దుతుందో, ప్రార్థన విషయంలో ఎలా ఉపదేశిస్తుందో తెలుసుకున్నాం కాబట్టి, ఇవన్నీ "ప్రతి సత్కార్యము” కోసం మనల్ని ఎలా సిద్దపరుస్తాయో ఇప్పుడు చూద్దాం. పరిశుద్దాత్ముని సహాయం ద్వారా మన వాక్యధ్యానం లాభసాటిగా ఉందో లేదో బేరీజు వేసుకునేందుకు ఇది మరో గీటురాయి.

1. సత్క్రియల యొక్క నిజమైన స్థానం మనకు నేర్పించినప్పుడే మనం లేఖనాల నుండి లాభపడతాం

ఛాందసత్వాన్ని ఒక వ్యవస్థగా సమర్ధించే తమ ఉత్సుకతలో చాలా మంది కృప ద్వారా రక్షణ గురించి ఉన్నతంగా మాట్లాడుతూ పరిశుద్ధతను, దేవునికి సమర్పించిన జీవితాన్నిగూర్చి చులకనగా మాట్లాడతారు. కానీ పరిశుద్ధ లేఖనాల్లో దీనికాధారమేమీ లేదు. ఏ సువార్త ఐతే క్రీస్తు రక్తంలో విశ్వసించటం ద్వారా కృప చేత ఉచితంగా రక్షణ కలుగుతుందని ప్రకటించి, ధర్మశాస్త్రోక్తమైన క్రియలేమీ చేయకుండానే రక్షకుని విశ్వసించటం ద్వారా ఆయన నీతి వారికి ఆపాదింపబడి  పాపులు నీతిమంతులుగా తీర్చబడతారని బలంగా ఉద్ఘాటిస్తుందో, అదే సువార్త పరిశుద్దత లేకుండా ఏ మనిషి కూడా దేవునిని చూడలేడని, పాపపరిహారార్థ రక్తంతోనే పరిశుద్ధులు కడగబడతారని, ప్రేమతో పనిచేసే 'లోకాన్ని జయించే విశ్వాసము' ద్వారా వారి హృదయాలు పవిత్రపరచబడతాయని కూడా హామీ ఇస్తుంది.అలాగే, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవునికృపను పొందినవారికి భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఈ లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను,భక్తితోను బ్రతకాలని అది బోధిస్తుంది. "లేఖనాల ఆధారంగా సత్క్రియలను బలంగా ఉపదేశించటం చేత కృపాసిద్ధాంతం నిర్వీర్యమైపోతుందేమోనన్న భయం దైవికసత్యాన్ని గూర్చిన అసమగ్ర, అసంపూర్ణ అవగాహనను బట్టబయలు చేస్తుంది. ఆ మాటకొస్తే, నిజమైన క్రైస్తవ విశ్వాసఫలాలైన సత్క్రియలకు అనుగుణంగా లేఖనాలలోగల సాక్ష్యాన్ని మరుగుపరచటానికి చేసే ప్రతి ప్రయత్నము దేవుని వాక్యాన్ని వక్రీకరించటమే' (అలెగ్జాండర్ కార్సన్).

 సత్క్రియలకు సంబంధించిన ఈ దైవికాజ్ఞకు మనం శ్రద్ధగా విధేయత చూపించడంలో విఫలమైనప్పటికీ, క్రీస్తు యొక్క నీతి ఆపాదింపబడటం మూలాన నీతిమంతులుగా తీర్చబడి అవి లేకుండానే రక్షింపబడతాం కాబట్టి ఆ క్రియల వలన ప్రయోజనమేమిటని కొందరు ప్రశ్నిస్తారు. ఇలాంటి అర్థరహిత ఆక్షేపణ, విశ్వాసి యొక్క ప్రస్తుత స్థితి మరియు అతనికి దేవునితో గల సంబంధాన్ని గురించిన పూర్తి అజ్ఞానం యొక్క ఫలితమే. దేవుని ఆజ్ఞలకు లోబడితేనే నీతిమంతులుగా తీర్చబడతారని ఒకవేళ చెప్పుంటే, విధేయత చూపించేలా అది ఎంతగా ప్రభావితం చేసుండేదో, అంతే బలంగా,అంతే ఫలభరితంగా పునరుజ్జీవించబడినవారిని ఇప్పుడది ప్రభావితం చేయ్యట్లేదని అనుకోవడం నిజమైన విశ్వాసం యొక్క స్వభావాన్ని గుర్తెరగకపోవడమే మాత్రమే కాకుండా క్రైస్తవుల మనసులను ప్రధానంగా ప్రేరేపించి,బలవంతపెట్టే ఉద్దేశాలను,ప్రేరణలను అర్థం చేసుకోకపోవడం కూడా ఔతుంది. పైగా ఇది నీతిమంతులుగా తీర్చబడటానికి, పరిశుద్ధపరచబడడానికి మధ్య దేవుడేర్పరచిన విడదీయరాని సంబంధాన్ని అపార్థం చేసుకోవడమే. ఈ రెండిటిలో ఒకటి లేకుండా ఇంకొకటి ఉండటం సాధ్యమని భావించడం, సువార్త అంతటినీ కూలద్రోయటమే. ఈ అభ్యంతరాన్నే అపొస్తలుడైన పౌలు రోమా 6:1-3.లో వ్యవహరిస్తాడు.

2. సత్క్రియల యొక్క అత్యావశ్యకత మనకు బోధించగలిగినప్పుడే లేఖనాల నుండి మనం ప్రయోజనం పొందుతాము

"రక్తము చిందింపకుండ పాప క్షమాపణ కలుగదు” (హెబ్రీ 9:22), “విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము” (హెబ్రీ 11:6) అని చెప్పిన సత్యవాక్యమే, "పరిశుద్దత లేకుండ ఎవడును ప్రభువును చూడడు” (హెబ్రీ 12:14) అని కూడా ప్రకటిస్తుంది. పరిశుద్ధులు పరలోకములో జీవించే జీవితం, తిరిగి జన్మించిన తరువాత వారు భూమ్మీద జీవించిన జీవితానికి సంపూర్ణత. ఈ రెండు జీవితాలకు మధ్య ఉన్న వ్యత్యాసము స్థితిలో కాదు కానీ స్థాయిలోనిది. “నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును” (సామెతలు 4:18). ఇక్కడ దేవునితో కలిసి నడవకపోతే పరలోకములో దేవునితో సహజీవనం ఉండదు. ఇక్కడ ఆయనతో సరియైన సహవాసము లేకపోతే నిత్యత్వములో అసలే ఉండదు. మరణం మన హృదయాన్ని అంతగా ప్రభావితం చేయదు. నిజమే, మరణించినప్పుడు పాపపుశేషాలు ఎప్పటికీ విడిచిపెట్టబడతాయి, కాని అప్పుడు నూతన స్వభావమేమీ ఇవ్వబడదు. అందుకే చావుకు ముందు ఆ వ్యక్తి పాపాన్ని ద్వేషించి, పరిశుద్ధతను ప్రేమించకపోతే, ఆ తర్వాత అసలే చేయలేడు.

నరకానికి వెళ్లాలని నిజంగా ఎవ్వరూ కోరుకోరు. అయితే అక్కడికి చేర్చే ఆ విశాలమార్గాన్ని తృణీకరించేవారు చాలా అరుదు! పరలోకానికి వెళ్లాలని అందరూ అనుకుంటారు కాని నిజమైన క్రైస్తవులు మాత్రమే అక్కడికి చేర్చే ఇరుకుమార్గంలో నడవడానికి ఇష్టపడతారు. ఇక్కడ మనము రక్షణప్రక్రియలో సత్క్రియలకు కేటాయించబడిన సరియైన స్థానాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. ఆ క్రియలు రక్షణ పొందేందుకు ఏమాత్రమూ దోహదపడవు. అయినా అవి రక్షణ నుండి విడదీయరానటువంటివి; పరలోకము వెళ్లేందుకు అవి ఒక అర్హతను సంపాదించిపెట్టవు, కాని అవి అక్కడికి వెళ్ళేవారి కోసం దేవుడేర్పరిచిన సాధనాలు. ఎట్టి పరిస్థితుల్లోను, సత్క్రియలు నిత్యజీవం తెచ్చే కారణాలు కాలేవు కాని అవి అందుకు సాధనాలు మాత్రమే(పరిశుద్దాత్మ మనలో జరిగించే క్రియ మరియు మనము కనబరిచే మారుమనస్సు, విశ్వాసము, విధేయత లాగే). క్రీస్తు మనకోసం కొన్న స్వాస్థ్యాన్ని పొందుకునేందుకు, మనమొక మార్గంలో నడవాలని దేవుడు నిర్దేశించాడు. క్రీస్తు తన ప్రజలకొరకై కొన్న స్వాస్థ్యాన్ని స్వీకరించాలంటే ప్రతిరోజూ దేవునికి విధేయత చూపించే జీవితం జీవించడమొక్కటే మార్గం. ఇప్పుడు విశ్వాసం ద్వారా అందులో ప్రవేశిస్తాం,కానీ మన మరణమందు కాని ఆయన రెండవ రాకడయందు గాని వాస్తవంగా ప్రవేశిస్తాం.

3. సత్క్రియల యొక్క ఉద్దేశాన్ని మనకు బోధించినప్పుడు వాక్యము నుండి మనం ప్రయోజనం పొందుతాం

ఇది మత్తయి 5:16లో స్పష్టంగా తెలపబడింది; “మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” 'సత్క్రియలు' అనే ఈ పదం ఇక్కడే మొట్టమొదటిసారిగా వాడబడిందన్నది గమనించదగిన విషయం; సాధారణంగా, మొదటిసారి లేఖనాలలో ఒక పదం ఏ భావంతో వాడబడుతుందో,అది తదుపరి సందర్భాలలో ఆ పదము వినియోగించబడిన ఉద్దేశాన్ని, పరిమితిని సూచిస్తుంది.క్రీస్తు శిష్యులు తమ విశ్వాసప్రకటనను తమ  నిశ్శబ్దమైన క్రైస్తవజీవిత సాక్ష్యం ద్వారా రూఢీపరుచుకోవాలని  ఇక్కడ నేర్చుకుంటాం (ఎందుకంటే “వెలుగు” ప్రకాశించేటప్పుడు చప్పుడు చేయదు). ఇలా చేయటం ద్వారా మనుష్యులు మీ సత్క్రియలను చూసి (డంబపు మాటలు విని కాదు), పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచాలి. దేవునిని మహిమపరచటమే ఇక్కడ వాటి ప్రాథమిక ఉద్దేశం.

 మత్తయి 5:16లోని భావం తరచూ అపార్థమయ్యి వక్రీకరించబడుతుంది. కాబట్టి దాన్ని ఇంకొంచెం వివరంగా చూద్దాం. సత్క్రియలే వెలుగు అని తరచుగా అనుకుంటారు. అయితే, 'వెలుగు' మరియు 'సత్క్రియలు' విడదీయరానివైనప్పటికీ రెండూ ఒకటి కావు. 'వెలుగు' అంటే క్రీస్తు కొరకైన మన సాక్ష్యం, కాని మన జీవితం దానిని నిదర్శించకపోతే ఏమి ప్రయోజనం? సత్క్రియలను చేయటంలోగల ఉద్దేశం ఇతరులను మనవైపు ఆకర్షించటం కాదు కాని, వాటిని మనలో పుట్టించిన దేవుని వైపుకు నడిపించటమే. ఇది మానవసహజ స్వభావము నుండి పుట్టలేదని, దేవుడే వాటిని కలగజేస్తున్నాడని అవిశ్వాసులు సహితం గుర్తించేంత యోగ్యమైన, నాణ్యమైన సత్క్రియలు మనము కలిగుండాలి. ప్రకృతికి అతీతంగా ఫలం ఫలించాలంటే ప్రకృతికి అతీతమైన వేరు ఉండాలి. ఇది వారు గుర్తించగలిగినప్పుడే మన తండ్రి మహిమపరచబడతాడు. లేఖనంలో చివరిసారిగా సత్క్రియలు గురించి ప్రస్తావించిన 1 పేతురు 2:12వ వచనం కూడా అంతే ప్రాముఖ్యమైనది. “అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి, వాటిని బట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై యుండవలెను”. కాబట్టి లేఖనంలో సత్క్రియల గురించి మొదట మరియు చివర వాడబడిన వచనాలు ఆ క్రియల ఉద్దేశాన్ని ఉద్ఘాటిస్తున్నాయి. ఈ లోకంలో తన ప్రజల ద్వారా తన క్రియలను బట్టి దేవుడు మహిమపరచబడాలి. 

4. సత్క్రియల నిజస్వభావాన్ని మనకు బోధించినప్పుడు వాక్యము నుండి మనం ప్రయోజనం పొందుతాం 

తిరిగి జన్మించనివారికి ఇది పూర్తిగా తెలియని విషయం. వారు వెలుపలివాటినే విచారించి, లోక ప్రమాణాలతో అంచనా వేసి, దేవుని దృష్టిలో ఏది ఉన్నతమో ఏది కాదో కూడా నిర్ణయించలేని అసమర్థులు. మనుష్యులు వేటినైతే సత్క్రియలుగా పరిగణిస్తారో వాటినే దేవుడు కూడా ఆమోదిస్తాడని అనుకుని పాపము చేత  గుడ్డితనం కలగజేసిన అజ్ఞానంలో ఉండిపోతారు. వారి తప్పుల్ని ఎవరూ ఒప్పించలేరు. ఆఖరికి పరిశుద్దాత్ముడే వారి జీవితంలో కొత్తదనాన్ని నింపి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకునిరావాలి. అప్పుడే సత్క్రియల నిజస్వభావాన్ని గుర్తించి అవి కేవలము దేవునిచిత్తానికి లోబడి చేసిన పనులేనని రోమా 6:16. దేవుని పట్ల ప్రేమ చూపటం చేత హెబ్రీ 10:24. క్రీస్తునామములో కొలొస్సీ 3:17. దేవుని మహిమ నిమిత్తమై 1 కొరింథీ 10:31. చేసే పనులేనని తెలుసుకుంటారు.

'సత్క్రియల' నిజస్వభావాన్ని ప్రభువైన యేసు పరిపూర్ణముగా నిదర్శించాడు. ఆయన చేసినదంతా తండ్రి పట్ల విధేయతతో జరిగించాడు. ఆయన “తన్ను తాను సంతోషపరచుకొనలేదు” రోమా 15:3. కాని తనను పంపినవాని చిత్తము నెరవేర్చాడు (యోహాను 6:18). “నన్ను పంపిన వానికిష్టమైన కార్యమును నేనెల్లప్పుడును చేయుదును” (యోహాను 8:29) అని ఆయన చెప్పగలిగాడు. తండ్రి చిత్రానికి లోబరుచుకోవటంలో క్రీస్తుకు ఏ పరిమితి లేదు. "ఆయన మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపాడు” (ఫిలిప్పీ 2:8). అలాగే క్రీస్తు చేసినదంతా తండ్రికొరకు మరియు తోటి సహోదరుని కొరకైన ప్రేమతో చేశాడు. ధర్మశాస్త్రపు నెరవేర్పే ప్రేమ, నిజమైన ప్రేమ లేకుండా ధర్మశాస్త్రానికి సమ్మతించటం కేవలం బానిస చూపే విధేయతే అవుతుంది. ప్రేమామయుడైన దేవునికి ఇవి అంగీకారం కావు. క్రీస్తు యొక్క విధేయత ప్రేమ నుండే ప్రవహించిందనేందుకు నిదర్శనం కీర్తన 40:8లో కనబడుతుంది. “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము”. అలాగే తండ్రిని మహిమపరిచే దృక్పథంతోనే క్రీస్తు అన్నీ జరిగించాడు. "తండ్రీ, నీ నామము మహిమపరచుము” (యోహాను 12:28) అనే మాట నిరంతరం ఆయన ఎదుట ఉన్న లక్ష్యాన్ని బయలుపరిచింది.

5. సత్క్రియల నిజమైన మూలాన్ని మనకు నేర్పించినప్పుడే మనం వాక్యం నుండి ప్రయోజనం పొందుతాం

పునరుజ్జీవించబడని మనుష్యులు కూడా మంచిపనులు చేయగలరు (అయితే అవి ఆత్మీయ భావంలో కాదు, కేవలము సాంఘిక మరియు సహజ భావంలోనే మంచి పనులు). బయటికి మంచిగా కనిపించే పనులు వారు చేయవచ్చు. ఉదా: దేవుని వాక్యపఠనం, వాక్యపరిచర్య చేయటం, పేదలకు దానాలు చేయటం మొదలైనవి; కాని వారి క్రియలకు మూలాధారమైన దైవికోద్దేశం వారికి లేనందున ఆ పరిశుద్ధుని ఎదుట అవి మురికి గుడ్డలుగా ఎంచబడతాయి. పునరుజ్జీవం రుచిచూడని వీరికి ఆత్మీయ తరహాలో పని చేసేందుకు ఏ శక్తి ఉండదు, అందుకే రోమా 3:12 ఇలా చెబుతుంది, “మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు”.“వారి మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు” (రోమా 8:7). అందుకే "భక్తిహీనుల క్షేమము పాపయుక్తము” (సామెతలు 21:4). విశ్వాసులు కూడా తమంతట తామే ఆలోచించి సత్క్రియలు చేసే సమర్థులు కారు 2 కొరింథీ 3:5. "ఎందుకంటే వారు ఇచ్ఛయించుటకును, కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేర్చుటకై వారిలో కార్య సిద్ది కలుగజేయువాడు దేవుడే" (ఫిలిప్పీ 2:13).

"కూషు దేశస్థుడు తన చర్మమును, చిరుతపులి తన మచ్చలను మార్చుకొన గలిగినయెడల కీడు చేయుటకు అలవాటుపడిన మీరును మేలు చేయవల్లపడును” (యిర్మీయా 13:23). తిరిగి జన్మించనివారు జరిగించే సత్క్రియలు ముండ్ల పొదలలో ద్రాక్షపండ్లను కోసినట్లు, పల్లేరుచెట్లలో అంజూరపుపండ్లను కోసినట్లు ఉంటాయి. మొదటిగా, “మనము క్రీస్తుయేసునందు సృష్టింపబడినవారమై” (ఎఫెసీ 2:10), “తన కుమారుని ఆత్మను మన హృదయములో కలిగిఉన్నవారమై” (గలతీ 4:6). “ఆయన కృప మన హృదయంలో నాటబడినవారమై” ఎఫెసీ 4:7.; 1 కొరింథీ 15:10. ఉంటే ఆ తరువాత మంచిపనులు చేసే సామర్థ్యం ఉంటుంది. కాబట్టి క్రీస్తుకు వేరుగా ఉండి మనమేమీ చేయలేము (యోహాను 15:5). "చాలాసార్లు మేలైనది చేయవలెనను కోరిక మనకు కలుగవచ్చును గాని, దానిని చేయుట మనకు కలుగదు” (రోమా 7:18). అప్పుడు మనం మోకాళ్ళూని, “యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించేందుకు, ప్రతి మంచి విషయంలోను తన చిత్తప్రకారము చేయుటకు మనల్ని సిద్ధపరచుమని” దేవునిని బ్రతిమాలుకుంటాం (హెబ్రీ 13:21). అప్పుడు మనం స్వయంసమృద్ధి గలవారము కాదని మనల్ని మనము రిక్తపరుచుకొని, మన ఊటలన్నియు దేవునియందేయున్నవన్న (కీర్తన 87:7) గ్రహింపుకు నడిపించబడతాం. అప్పుడు మనల్ని బలపరచువానియందే సమస్తమును చేయగలమని (ఫిలిప్పీ 4:13) మనము కనుగొనగలం.

6. సత్క్రియల యొక్క గొప్ప ప్రాముఖ్యతను బోధించినప్పుడే లేఖనముల నుండి మనం ప్రయోజనం పొందుతాం

మత్తయి 5:16.ను కుదించి చెప్పాలంటే, సత్క్రియల వలన దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి అవి ఎంతో ప్రాముఖ్యమైనవి; సత్క్రియల వల్ల మనల్ని దూషించువారి నోళ్ళు మూయబడతాయి 1 పేతురు 2:12.; సత్క్రియల వలన మన విశ్వాసం మన:పూర్వకమైనదని ఋజువుపరుస్తాం యాకోబు 2:12-17.; “మనమన్ని విషయములయందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించుట” తీతు 2:10. చాలా అవశ్యకం; క్రీస్తునామము కలిగి ఆయన సామర్థ్యాన్ని బట్టి ఆయన మార్గము మరియు ఆత్మతో నిరంతరము జీవించటం కంటే క్రీస్తుకు ఘనత తెచ్చిపెట్టేది ఏదీ లేదు. పాపులను రక్షించేందుకు క్రీస్తు లోకానికి వచ్చెనను వాక్యము “నమ్మతగినది” అని పౌలు ద్వారా లిఖింపజేసిన ఆ పరిశుద్దాత్ముడే అతన్ని ప్రేరేపించి “ఈ మాట నమ్మదగినది గనుక దేవునియందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్దగా చేయుట యందు మనస్సుంచాలి” (తీతు 3:8) అని కూడా వ్రాయించాడు. మనం “సత్క్రియలయందాసక్తి గలవారమవుదుము గాక!తీతు 2:14. ఆమేన్.

7. సత్క్రియల యొక్క నిజమైన పరిమితిని మనకు బోధించినప్పుడు మనం లేఖనముల నుండి ప్రయోజనం పొందుతాం

దేవుడు మనకు ఇచ్చిన అన్ని మానవసంబంధాల పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఈ సత్క్రియల పరిధిలోకే వస్తాయి. ఇక్కడ ఆసక్తికరమైన సంగతేమిటంటే పవిత్ర లేఖనాల్లో “మంచి కార్యము”గా మొదట పిలవబడింది బేతనియలో మరియ తన రక్షకునిని అభిషేకించటం(మత్తయి 26:10; మార్కు 14:6. మనుష్యుల మెప్పుకు, నిందకు తటస్థంగా ఉండి, తన విలువైన అత్తరును “పదివేలలో అతి కాంక్షనీయుని” మీద కుమ్మరించింది. మరొక స్త్రీ, దొర్కా "సత్క్రియలను బహుగా చేసియుండెను” అపొ.కా. 9:36. అని చెప్పబడింది. ఆరాధన తర్వాత పరిచర్య, మనుష్యుల మధ్య దేవునిని మహిమపరచటం, ఇతరులకు హితం చేయటం వస్తాయి.

“ప్రతి సత్కార్యములో సఫలులగుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు మేము దేవుని బతిమాలుచున్నాము” (కొలొస్సీ 1:10). పిల్లలను పెంచటం, ఆత్మీయపరదేశులకు ఆతిథ్యమివ్వటం, పరిశుద్ధుల పాదములు కడగటం మరియు శ్రమపడువారికి సహాయము చేయటం 'సత్క్రియలకు' ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు (1 తిమోతి 5:10). మన లేఖనాధ్యయనం మనల్ని యేసుక్రీస్తు యొక్క మంచి సైనికులుగా, మనం నివసించే దేశపు మంచి పౌరులుగా, మన ఇహలోక కుటుంబములోని మంచి సభ్యులుగా, ప్రతి సత్కార్యమునకు సన్నద్ధులుగా తీర్చిదిద్దకపోతే మనం వాక్యం నుండి ఎంత మాత్రము లాభం పొందటం లేదు అని అర్థం.

ఆరవ అధ్యాయము

లేఖనాలు మరియు విధేయత

లోకంలో క్రీస్తును ఘనపరచటం

క్రైస్తవులందరు కనీసం సైద్ధాంతికంగా సమ్మతించేదొకటి ఉంది. అదేమిటంటే తన నామము కలిగియున్నవారందరూ ఈ లోకంలో క్రీస్తును ఘనపరిచి, మహిమపరచబద్ధులైయున్నారని. కాని దీనిని ఎలా చేయాలి, ఈ విషయమై మన నుండి ఆయన ఏమి కోరుకుంటున్నాడనే దానిపై రకరకాల భేదాభిప్రాయాలున్నాయి. చాలామంది క్రీస్తును ఘనపరచటం అంటే ఏదో ఒక 'సంఘం'లో చేరి, అందులోని వివిధమైన కార్యకలాపాల్లో పాల్గొనటమే అనుకుంటారు. మరికొందరైతే ఆయనను గురించి ఇతరులతో మాట్లాడి, తమ 'వ్యక్తిగత' పనుల్లో శ్రద్దగా నిమగ్నమైతే చాలనుకుంటారు. ఇంకొంతమందైతే ఆయన పరిచర్యకై తాము ప్రేరేపించబడినకొలది ధారాళముగా ఆర్థిక సహాయం చేయడమే క్రీస్తును ఘనపరచటం అనుకుంటూ ఉంటారు. క్రీస్తు కొరకు మనం పరిశుద్ధులంగా జీవించి, ఆయన బయలుపరిచిన చిత్తానికి లోబడి నడవటం వలనే క్రీస్తు ఘనతనొందుతాడని చాలా తక్కువమంది గ్రహిస్తారు. "బలులు అర్పించుటకంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటే మాట వినుటయు శ్రేష్టము” అని నమ్మేవారు ఇంకా అరుదు (1 సమూయేలు 15:22).

మనం పూర్తిగా లోబడి “ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించి” కొలొస్సీ 2:6. ఉంటేనే క్రైస్తవులం. వాక్యాన్ని శ్రద్దగా పరిశీలించమని మనవి చేస్తున్నాను. 'క్రీస్తు పూర్తి చేసిన పని'లో నమ్మకముంచితే చాలు తమకు రక్షణ లభిస్తుందని సాతాను చాలామందిని నమ్మిస్తున్నాడు. కాగా, వారి హృదయాలు మార్పులేనివిగాను వారి స్వీయచిత్తం ఇంకా వారి జీవితాలను శాసిస్తున్నట్లుగాను ఉన్నాయి. అయితే దేవునివాక్యం వినండి. “భక్తిహీనులు నీ కట్టడలను వెదకుట లేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది” (కీర్తన 119:155). నిజంగా ఆయన కట్టడలను వెదకుతున్నావా? ఆయనాజ్ఞాపించింది కనుగొనేందుకు నిజంగా నీవాయన వాక్యం వెదకుతున్నావా? “ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్దీకుడు, వానిలో సత్యము లేదు” (1 యోహాను 2:4). ఇంతకన్నా స్పష్టంగా ఇంకేం కావాలి?

“నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?” (లూకా 6:46) కేవలం పెదవులపై ప్రకాశించు మాటలు కాదు కానీ, ప్రభువుకు విధేయత కలిగిన జీవితమే క్రీస్తు మననుండి కోరుకునేది. యాకోబు 1:22లో ఎంత గంభీరమైన మాట: “మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునైయుండుడి”. వాక్యం వినేవారు చాలామంది ఉంటారు. క్రమం తప్పక వినేవారు, గౌరవంతో వినేవారు, శ్రద్ధతో వినేవారు; కానీ ఆశ్చర్యమేంటంటే వారు వినేది వారి జీవితంలోనికి చేర్చుకోబడటం లేదు. అది వారి మార్గాన్ని క్రమపరచటం లేదు. విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించని వాళ్ళు తమను తామే మోసపుచ్చుకుంటున్నారని దేవుడు చెబుతున్నాడు.

అయ్యో, ఈ రోజున క్రైస్తవ లోకంలో ఎంతోమంది ఇలా ఉన్నారు! వారు పచ్చి వేషధారులు కారు కానీ, మోసగించబడినవారు. కృప ద్వారా రక్షణ అనే అంశం వారికి స్పష్టంగా అర్థమైంది కాబట్టి వారు రక్షింపబడ్డారని అనుకుంటారు. బైబిలును ఒక నూతన పుస్తకముగా వారికి పరిచయం చేసిన ఒక వ్యక్తి పరిచర్య క్రింద వారున్నారు. కాబట్టి కృపలో ఎదుగుతున్నామని వారనుకుంటారు. దైవవాక్యజ్ఞానం సంపాదించటంలో వారెదిగారు కాబట్టి మరింత ఆత్మీయంగా అయ్యామని భావిస్తారు. దైవసేవకుని మాటలు వినటం లేక ఆయన రచనలు చదవటమే వాక్యపోషణ అని అభిప్రాయపడుతుంటారు. కాని అలా కాదు. మనం చదివినదానిని లేక వినినదాన్ని వ్యక్తిగతంగా వినియోగించుకుని నమిలి జీర్ణించుకుంటేనే మనం ఆ వాక్యం వలన “పోషింపబడగలం". దేవుని వాక్యానికి అనుగుణంగా మన హృదయం, మన జీవితం ఎదగకపోతే, జ్ఞానార్జన మనల్ని మరింత శిక్షాపాత్రులుగా చేస్తుంది. "తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును” (లూకా 12:47).

“యెల్లప్పుడును నేర్చుకొనుచున్నను, సత్యవిషయమైన అనుభవజ్ఞానము ఎప్పుడూ పొందలేనివారు" ఇటువంటివారే (2 తిమోతి 3:7). మనం నివసిస్తున్న భయంకరమైన రోజుల యొక్క ప్రాముఖ్యమైన లక్షణాల్లో ఇదొకటి. బోధకుల వెంబడి బోధకుల మాటలు వింటూ, ఈ సమావేశాలు, ఆ సమావేశాలకు హాజరై, దేవుని వాక్య సంబంధ విషయాలపై పుస్తకాల మీద పుస్తకాలు చదివి కూడా సత్యంతో అనుభవాత్మకమైన సజీవ పరిచయం సంపాదించని అనేకమంది నేడున్నారు. తద్వారా వారి హృదయాలపై దాని ప్రభావం ఎంతో వారికి తెలియదు. ఆత్మీయ జలోదరమనే ఒక జబ్బు ఉంది, చాలామంది దాని బారినపడ్డారు. వింటుంటే వారికి ఇంకా ఎక్కువ వినాలనిపిస్తుంది; వారు ప్రసంగాలను, ఉపన్యాసాలను తీవ్రమైన ఆకాంక్షతో త్రాగుతుంటారు కాని జీవితాలు మాత్రం మారవు. వారు జ్ఞానంతో ఉన్మత్తులౌతారు కాని దేవుని ఎదుట తగ్గింపు కలిగియుండరు. “దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము భక్తికి ఆధారమైన సత్యవిషయమైన అనుభవజ్ఞానము” (తీతు 1:1), కాని చాలా మంది దీనికి పూర్తిగా అపరిచితులు.  మనకుపదేశించడానికి మాత్రమే కాకుండా దిశానిర్దేశం చేయడానికి కూడా దేవుడు మనకు తన వాక్యాన్నిచ్చాడు. అంటే మనమేమి చేయాలని ఆయన కోరతాడో అది చేయడానికని మొదట మనం గ్రహించాలి. దేవుడు మననుండి ప్రప్రథమంగా ఆశించేది మన కర్తవ్యం గురించిన స్పష్టమైన జ్ఞానం, ఆ జ్ఞానానికి అనుగుణమైన జీవితం. “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును, ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు” (మీకా 6:8), “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి” (ప్రసంగి 12:13). ఈ విషయాన్నే రూఢిపరుస్తూ యేసుప్రభువు ఇలా అన్నాడు, “నేను మీకాజ్ఞాపించువాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు” (యోహాను 15:14).

1. దేవుడు తన నుండి కోరువాటిని తెలుసుకోవటం ద్వారా ఒక వ్యక్తి వాక్యం నుండి లాభం పొందుతాడు

ఈ కృపాకాలములో దేవుడు తన ఆజ్ఞల ప్రమాణాన్ని తగ్గించాడనుకోవడం తీవ్రమైన, గంభీరమైన పొరపాటే అవుతుంది. అలా అనడం అంతకుపూర్వం ఆయన ఆజ్ఞ కటువైనదని, అన్యాయమైనదని చెప్పడమౌతుంది. కానీ అలా కాదు! "ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునైయున్నది” (రోమా 7:12). దేవుని ఆజ్ఞల సారాంశమిదే: “నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను” (ద్వితీ 6:5); ప్రభువైన యేసు మత్తయి 22:37లో దీనిని మళ్ళీ చెప్పాడు. అపొస్తలుడైన పౌలు ఇదే విషయాన్ని 1 కొరింథీ 16:22లో నొక్కి చెబుతూ “ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక” అని అన్నాడు.

2. తాను దేవుని ఆజ్ఞలను నెరవేర్చటంలో ఎంత సంపూర్తిగా, ఎంత పాపయుక్తంగా విఫలమయ్యాడో తెలుసుకున్నప్పుడే ఒక వ్యక్తి వాక్యం నుండి లాభం పొందుతాడు

 దేవుని ఉన్నతమైన ఆజ్ఞల తన నుండి ఏమి కోరుకుంటున్నాయో స్పష్టంగా గ్రహించనంతవరకు, ఏ మనిషి కూడా తానెంత పాపియో, దేవుని ప్రమాణాలకు తానెంత దిగువనున్నాడో తెలుసుకోలేడు! ప్రతి మానవుని నుండి దేవుడు ఆశించే స్థాయిని బోధకులు ఎంతమేరకు తగ్గిస్తారో, అంతే మేరకు వినువారికి తమ పాపస్వభావం గూర్చి అసమగ్ర భావన కలుగుతుంది. కాని ఒకసారి ఒక వ్యక్తి తననుండి  దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఎంత దారుణంగా తాను వాటికి విధేయత చూపించడంలో విఫలమయ్యాడు అన్న యథార్థ గ్రహింపులోనికి వస్తాడో, అప్పుడు తానున్న విషమ పరిస్థితిని గుర్తిస్తాడు. కాబట్టి సువార్త బోధించే ముందు ధర్మశాస్త్రాన్ని బోధించి తీరాలి.

3. తన ప్రజలు తన ఆజ్ఞలకు విధేయులవటానికి కావలసినవన్నీ దేవుడు తన అనంత కృపలో సమకూర్చాడని గ్రహించినవుడు ఒక వ్యక్తి వాక్యం నుండి లాభం పొందుతాడు

ఈ విషయంలో కూడా నేటి బోధ చాలా లోపపూరితంగా ఉంది. 'సగం సువార్త' అని పిలిచి, దాన్ని ఈ రోజున బోధిస్తున్నారు, కాని వాస్తవానికి ఇది నిజమైన సువార్తను తిరస్కరించడమే. క్రీస్తును వారు వాడుకుంటారు. తనను విశ్వసించేవారికి బదులుగా క్రీస్తు దేవునియొక్క ప్రతి ఆజ్ఞకు లోబడ్డాడన్నది వాస్తవమైనప్పటికీ, సత్యంలో అదొక భాగమే. ప్రభువైన యేసు తన ప్రజల కోసం, వారికి బదులుగా దేవుని నీతి కోరినవన్నీ తీర్చడమే కాకుండా వ్యక్తిగతంగా వారు కూడా నెరవేర్చేందుకు వాటిని పదిలపరచాడు. తమ విమోచకుడు సిద్ధపరచి ఉంచినదానిని పరిశుద్దాత్ముడు వారిలో జరిగించాలని క్రీస్తు ఆయనను పంపాడు.

రక్షణ యొక్క ఘనమైన, మహిమాయుతమైన అద్భుతం ఏమిటంటే రక్షింపబడినవారు పునరుజ్జీవించబడటం. రూపాంతరపరిచే పనిని వారిలో జరిగించబడటం. వారి మనోనేత్రాలను వెలిగించి, హృదయాలలో మార్పు తెచ్చి, వారి సంకల్పాలను పునరుద్ధరించటం. వారు “యేసుక్రీస్తులో నూతన సృష్టి”గా చేయబడతారు 2 కొరింథీ 5:17. ఈ కృపాయుతమైన అద్భుతాన్ని దేవుడిలా తెలియజేస్తున్నాడు: “వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును” హెబ్రీ 8:10. హృదయం ఇప్పుడు దేవుని ధర్మశాస్త్రము వైపు మొగ్గి ఉంది; ఆయన చిత్తప్రకారం చేయడానికి అది సిద్ధంగా ఉంది; అది జరిగించాలని యథార్థంగా కోరుకుంటుంది. ఇలా ఉజ్జీవింపబడిన ఆ వ్యక్తి ఈ విధంగా చెప్పగలడు “నా సన్నిధి వెదకుడని నీవు సెలవియ్యగా - యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను” (కీర్తన 27:8).

తనను విశ్వసించే ప్రజలు నీతిమంతులుగా తీర్చబడాలని క్రీస్తు ధర్మశాస్త్రానికి సంపూర్ణ విధేయత చూపడమే కాకుండా, వారు పవిత్రపరచబడాలని పరిశుద్దాత్మ యొక్క సహాయాన్ని సిద్దపరచి ఉంచాడు. ఇది మాత్రమే శరీరసంబంధులను రూపాంతరపరచి దేవునికి అంగీకారయోగ్యమైన విధేయతను చూపించేందుకు దోహదం చేస్తుంది. క్రీస్తు “భక్తిహీనుల” కొరకు చనిపోయినప్పటికీ రోమా 5:6. వారిని నీతిమంతులుగా తీర్చేటప్పుడు వారిని భక్తిహీనులుగా కనుగొన్నప్పటికీ రోమా 4:5. వారిని ఆ అసహ్యకరమైన స్థితిలో ఆయన విడిచిపెట్టడు. ఇందుకు విరుద్ధంగా, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని (తీతు 2:12) ఆయన ఆత్మ ద్వారా మనకు బోధిస్తాడు. రాయి నుండి బరువును, అగ్ని నుండి వేడిని ఎలా వేరుపరచలేమో, అలాగే నీతిమంతులముగా తీర్చబడే ప్రక్రియ నుండి పరిశుద్ధపరచబడటాన్ని వేరుచేయలేం.

తన మనస్సాక్షి ఆవరణములో దేవుడు నిజంగా ఒక పాపిని క్షమించినప్పుడు, ఆ ఆశ్చర్యమైన కృప ద్వారా హృదయం పవిత్రపరచబడి, జీవితం చక్కదిద్దబడి, మనిషి పూర్తిగా పరిశుద్ధపరచబడతాడు. “సమస్త దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్క్రియల యందాసక్తిగల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అప్పగించుకొనెను” (తీతు 2:14). ఎలాగైతే ఒక వస్తువు దాని గుణాలతో విడదీయలేని సంబంధం కలిగుంటుందో, అలాగే రక్షణార్థమైన విశ్వాసము నుండి దేవునిపట్ల మన:పూర్వక విధేయతను కూడా విడదీయలేం. అందుకే “విశ్వాసమునకు విధేయత" అని రోమా 16:26.లో మనం చదువుతాం.

“నా ఆజ్ఞలను అంగీకరించి, వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు”, అని యేసు ప్రభువు చెప్పాడు (యోహాను 14:21). తన ఆజ్ఞలను గైకొనువాడు తప్ప ఎవ్వరూ తనకు ప్రేమికులు కాలేరని పాతనిబంధనలో, సువార్తలలో, పత్రికలలో దేవుడు చెప్పాడు. ప్రేమ అంటే కేవలం మనోభావమో లేక భావోద్రేకమో కాదు, అది ఒక క్రియానియమం,అది తాను ప్రేమించు వ్యక్తికి ఇష్టమయ్యే క్రియలు చేయడం. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట” (1 యోహాను 5:3). ఓ చదువరీ, నీవు దేవుని ప్రేమిస్తున్నాననుకొని ఆయన ఎదుట విధేయతతో నడవటానికి ఏ వాంఛా లేక, ఏ ప్రయత్నమూ చేయకపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు.

అయితే దేవుని యెడల విధేయత అంటే ఏమిటి? యాంత్రికంగా కొన్ని కర్తవ్యాలు నిర్వర్తించటం మాత్రమే కాదు. నేను క్రైస్తవ తల్లిదండ్రుల పెంపకంలో పెరిగి, కొన్ని నైతిక అలవాట్లు అలవర్చుకుని ఉండొచ్చు, అయినప్పటికీ యెహోవా నామము వ్యర్థంగా ఉచ్ఛరించినప్పుడు, దొంగిలించినప్పుడు, మూడవ,ఎనిమిదవ ఆజ్ఞలకు విధేయత చూపించనట్లే. అలాగే, దేవుని ప్రజల ప్రవర్తనకు అనుగుణంగా నడుచుకోవటమే దేవునికి విధేయత అనిపించుకోదు. విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించేవారితో నేను నివసిస్తూ, వారిని సంతోషపెట్టాలన్న కోరికతోనో లేక ఏడు రోజులకొకసారి విశ్రాంతి తీసుకోవటం మంచిదన్న తలంపుతోనో నేను ఆ రోజు అన్ని పనుల నుండి దూరంగా ఉండి కూడా నాలగవ ఆజ్ఞను పాటించకుండా ఉండడం సాధ్యం. విధేయత అంటే కొన్ని ధర్మశాస్త్ర విధులను బహిరంగంగా నిర్వర్తించటం కాదు, కాని నా దేవుని అధికారానికి లోబడటమే. దేవునికి విధేయత అంటే ఆయన ప్రభుత్వాన్ని మన హృదయంలో గుర్తించటం. ఆజ్ఞాపించే హక్కు ఆయనకుందని ఎరిగి, దాన్ని పాటించటమే మన కర్తవ్యమని తలంచటం. అది క్రీస్తు యొక్క దీవెనకరమైన కాడికి నా ఆత్మను పూర్తిగా లోబరచుకోవటం.

దేవునికి కావలసిన విధేయత ఆయనను ప్రేమించే హృదయమే చూపగలదు. "మీరేమి చేసినను ప్రభువు నిమిత్తమని మనస్పూర్తిగా చేయుడి” (కొలొస్సీ 3:24). శిక్షకు భయపడి చూపించే విధేయత నీఛమైనది. దేవుని అనుగ్రహం పొందేందుకు చూపే విధేయత స్వార్థపూరితం మరియు శారీరకం. అయితే అంగీకారయోగ్యమైన, ఆత్మీయమైన విధేయత సంతోషంగా లోబడుతుంది. దేవునికి మనపట్ల గల ప్రేమ మరియు అయోగ్యులమైన మన పట్ల ఆయన చూపే ఆదరణకు మన హృదయపు స్పందనే విధేయత.

4. దేవునికి విధేయత చూపటం మన కర్తవ్యమని తెలుసుకోవటమే కాక, ఆయన ఆజ్ఞలపట్ల మనలో నిజమైన ప్రేమ పుట్టినప్పుడే మనం వాక్యము నుండి లాభం పొందుతాం

“యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు” మనుష్యుడే “ధన్యుడు” (కీర్తన 1:2). ఈ కింది ప్రశ్నలు నిజాయితీగా ఎదుర్కోవటం మన హృదయాలకు గొప్ప పరీక్ష. ఆయన వాగ్దానాలకు విలువనిచ్చినట్లు, 'ఆజ్ఞలకు విలువనిస్తున్నానా? అలా చేయకూడదా? ఎందుకంటే ఈ రెండూ కూడా ఆయన ప్రేమ నుండి పుట్టినవే. క్రీస్తు మాటకు మన హృదయపు అంగీకారమే సమస్త ఆచరణాత్మక పరిశుద్ధతకు పునాది.

ప్రియ చదువరీ, ఈ అంశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో, ఏ వ్యక్తి అయినా తాను రక్షింపబడ్డాననుకుంటూ, దేవుని ఆజ్ఞల పట్ల మనఃపూర్వక ప్రేమ కలిగియుండకపోతే తనను తాను మోసపరచుకుంటున్నట్లే. కీర్తనాకారుడు ఇలా అన్నాడు, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది” (కీర్తన 119:97). “బంగారుకంటెను అపరంజికంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి” (కీర్తన 119:127). అది పాతనిబంధనలో కదా అని ఎవరైనా ఆక్షేపిస్తే, వారిని నేను తిరిగి ప్రశ్నిస్తున్నాను. పరిశుద్దాత్ముడు పాతనిబంధన కాలంలో చేసినదానికంటే, ఇప్పుడు పునరుజ్జీవింపచేసిన వారి హృదయాల్లో తక్కువ మార్పు కలిగిస్తాడా ? మరైతే, ఒక క్రొత్తనిబంధన పరిశుద్ధుడు ఇలా వ్రాశాడు, “అంతరంగ పురుషునిబట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను” (రోమా 17:22). ప్రియ చదువరీ, నీ హృదయము "దేవుని ధర్మశాస్త్రము”నందు ఆనందించకపోతే, నీలో తీవ్రమైన తప్పిదమొకటుంది, నీవింకా ఆత్మీయంగా మృతుడవై ఉన్నావనటానికి చాలా ఆస్కారముంది.

5. ఒక వ్యక్తి యొక్క హృదయము మరియు చిత్తము దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడినప్పుడు అతడు వాక్యము నుండి లాభం పొందుతాడు

పాక్షిక విధేయత అసలు విధేయత కానే కాదు. పవిత్రమైన మనస్సు దేవుడు నిషేధించినదాన్ని నిరాకరించి, ఎలాంటి మినహాయింపులు లేకుండా ఆయన కోరుకున్నదాన్ని జరిగిస్తుంది. మన మనస్సులు దేవుని ఆజ్ఞలన్నిటికీ లోబడకపోతే, వాటిని ఆజ్ఞాపించిన దేవునికి అసలు లోబడనట్లే. మన కర్తవ్యాన్ని పూర్తిస్థాయిలో మనము ఆమోదించకపోతే, అందులో ఒక భాగాన్ని మాత్రమే ఇష్టపడుతున్నామనుకోవడం పెద్ద పొరపాటే అవుతుంది. తనలో పరిశుద్ధతా నియమం లేని వ్యక్తి కూడా దుర్వ్యసనాల వైపు మొగ్గు చూపకుండా సుగుణాల్ని ఆచరణలో పెట్టటంలో సంతృప్తిపడొచ్చు, ఎందుకంటే దుర్వ్యసనాలు అయోగ్యమైనవని, సుగుణాలు యోగ్యమైనవని అతని భావన. అతని అంగీకారానంగీకారాలు దేవుని చిత్తానికి తాను లోబడినందువలన వచ్చినవి కావు.

యథార్థమైన ఆత్మీయవిధేయత నిష్పాక్షికం. పునరుద్ధరించబడిన హృదయం దేవుని ఆజ్ఞలలో కొన్నిటినే ఎన్నుకోదు. ఒక వేళ అలా చేస్తే ఆ వ్యక్తి దేవుని చిత్తానికి బదులు తన సంకల్పాన్నే నెరవేరుస్తున్నాడు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అన్ని విషయాల్లో దేవునిని తృప్తిపరిచే యథార్థమయిన కోరిక మనలో లేకపోతే, ఏ ఒక్క ఆజ్ఞ విషయంలో కూడా ఆయనను తృప్తిపరిచే కోరిక మనలో ఉండదు. మనం వాంఛించే ఏవో కొన్ని విషయాలను ఆచరించటం కాదు, మనల్ని మనమే ఉపేక్షించుకోవాలి. తెలిసి ఏ పాపమునైనా ఇష్టపూర్వకంగా అనుమతిస్తే సమస్త ఆజ్ఞల విషయంలో అపరాధులమవుతాం యాకోబు 2:10,11. “నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు” (కీర్తన 119:6). యేసుప్రభువు, యోహాను 15:14లో ఇలా అన్నాడు, “నేను మీకాజ్ఞాపించువాటిని చేసినయెడల, మీరు నా స్నేహితులై యుందురు.” నేను ఆయనకు స్నేహితుణ్ణి కాకపోతే, ఆయన శత్రువునే- వేరే ప్రత్యామ్నాయమే లేదు (లూకా 19:27ను చూడండి).

6. విధేయత చూపటానికి కృప పొందే నిమిత్తం మన ఆత్మలు చిత్తశుద్ధితో ప్రార్థనచేసేలా కదిలింపబడినప్పుడు వాక్యము నుండి మనం లాభం పొందుతాం

పునరుజ్జీవించబడినప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడే వాక్యానుసారమైన విధేయతాస్వభావాన్ని పరిశుద్ధాత్ముడు పుట్టిస్తాడు. రక్షణలో దేవుడు హృదయాన్ని గెలుచుకుంటాడు. కాబట్టి ఆయనను సంతృప్తిపరచాలనే మనఃపూర్వకమైన, లోతైన వాంఛ కలుగుతుంది. అయితే ఈ నూతనస్వభావానికి స్వయంగా ఏ శక్తి లేదు, పాతస్వభావం లేక 'శరీరం' దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది మరియు అపవాది ఎదిరిస్తాడు కూడా. అప్పుడు క్రైస్తవుడు, "మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుట లేదు” (రోమా 7:18) అని నిర్ఘాంతపోతాడు. దానర్థం అతడు మార్పు చెందక ముందున్నట్టుగా ఇప్పుడు కూడా పాపానికి బానిస అని కాదు కాని తన ఆత్మీయాభిలాషలు ఎలా నెరవేర్చుకోవాలో అతనికి పూర్తిగా తెలీదు. అందుకే ఇలా ప్రార్థిస్తాడు, “నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దానియందు నన్ను నడువజేయుము” (కీర్తన 119:35).“నీ వాక్యమును బట్టి నా యడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనియ్యకుము” (కీర్తన 119:133).

ఆయా వివరణల వలన మీ మనస్సుల్లో బహుశ కొన్ని ప్రశ్నలు తలెత్తియుండవచ్చు. వాటికి సమాధానాలు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ జీవితంలో సంపూర్ణ విధేయతను దేవుడు మననుండి కోరుతున్నాడని మీరు రూఢిపరుస్తున్నారా? అవును అనేదే మా జవాబు. అంతకన్నా తక్కువ ప్రమాణాన్ని దేవుడు ఉంచడు 1 పేతురు 1:15. మరైతే యథార్థమైన క్రైస్తవుడు ఆ స్థాయిని అందుకోగలడా? అవును మరియు కాదు! అతని హృదయంలో అందుకోగలడు, ఎందుకంటే “యెహోవా హృదయమును లక్ష్యపెట్టును” 1 సమూ 16:7. పునరుజ్జీవించిన ప్రతి వ్యక్తి హృదయంలో దేవుని ఆజ్ఞల పట్ల నిజమైన ప్రేమ ఉంటుంది, అన్నిటిని పాటించాలని అతడు హృదయపూర్వకంగా కాంక్షిస్తాడు. కేవలం ఈ భావంలో మాత్రమే క్రైస్తవుడు ఆచరణాత్మకంగా “యథార్థవంతుడు”. యథార్థవంతుడు అనే మాట పాత నిబంధనలో యోబు 1:1.; కీర్తన 37:37. మరియు క్రొత్త నిబంధనలో ఫిలిప్పీ 3:15: ఈ అర్థములోనే వాడబడింది. 'యథార్థంగా' అన్న మాట  “వేషధారిగా” అన్న  మాటకు వ్యతిరేకం.

“యెహోవా, బాధపడువారి కోరికను నీవు వినియున్నావు” (కీర్తన 10:17). ఒక పరిశుద్దుని కోరికలు అతని హృదయపు భాషయైయున్నది. “తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును” (కీర్తన 145:19) అన్నది వాగ్దానం. అన్ని విషయాల్లో దేవునికి విధేయుడవటం క్రైస్తవుని కోరిక, క్రీస్తుయొక్క సారూప్యములోనికి పూర్తిగా మార్చబడటం అతని అభిలాష, అయితే పునరుత్థానములోనే (రెండవ రాకడ) ఇది వాస్తవిక రూపందాల్చుతుంది. అంతవరకు “క్రీస్తు పరిశుద్ధులలో” ఉన్న అభిలాషను దేవుడు దయతో క్రీస్తు నిమిత్తము వారి యథార్థతగా పరిగణిస్తాడు 1 పేతురు 2:5. ఆయన హృదయాలనెరిగినవాడు గనుక తన బిడ్డల హృదయాలలో ఆయన ఆజ్ఞల పట్ల వారికున్న యథార్థమైన ప్రేమను, వాటిని ఆచరించాలని వారికున్న ఆకాంక్షను చూస్తాడు. కాబట్టి దేవుడు మనఃపూర్వక ఆకాంక్షను, సాదర ప్రయాసను సంపూర్ణ విధేయతకు సమానంగా అంగీకరిస్తాడు 2 కొరింథీ 6:12. అయితే ఈ పైన చెప్పినవి కేవలము యథార్థవంతుల ఆదరణకోసం మరియు నిశ్చయత కోసమే చెప్పబడినవి కాని ఇష్టపూర్వకంగా అవిధేయతలో జీవించేవారి సమర్ధింపు కోసమో లేక వారికి మోసపూరిత సమాధానాన్ని అందించడానికో ఉద్దేశించి చెప్పినవి కావు.

ఒక పునరుజ్జీవించబడిన ఆత్మకుండే 'కోరికలే’ నాకున్నాయని ఎలా తెలుసుకోగలనని ఎవరైనా అడిగితే, రక్షణార్థమైన కృప పరిశుద్ధతకు అనుగుణమైన వైఖరిని పుట్టిస్తుందన్నదే నా జవాబు. మన "కోరికల”ను ఇలా పరీక్షించాలి: అవి స్థిరంగా, అవిచ్ఛిన్నంగా ఉన్నాయా? అవి హృదయపూర్వకముగా తీవ్రంగా ఉండి “నీతి కొరకైన ఆకలి దప్పులు” (మత్తయి 5:6) కలిగిస్తున్నాయా? "దేవుని కొరకు” తృష్ణ కలిగిస్తున్నాయా (కీర్తన 42:1)? అవి ఆచరణాత్మకంగా సమర్థంగా ఉన్నాయా? చాలామంది నరకము నుండి తప్పించుకోజూస్తారు, కాని వారిని తప్పనిసరిగా అక్కడికి తీసుకువెళ్లే విషయాలను కావలసినంత దృఢంగా వారు ద్వేషించరు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఇష్టపూర్వకంగా పాపం చేయడం. చాలామందికి పరలోకములో చేరాలనే కోరిక ఉంటుంది, కాని అక్కడికి తీసుకొని పోయే “ఇరుకు మార్గం”లో ప్రవేశించే అంత గొప్ప కోరికైతే ఉండదు. అయితే యథార్థమైన ఆత్మీయ కోరికలున్నవారు కృపామార్గం ద్వారా వాటిని సాధించేందుకు బహు ప్రయాసపడుతారు మరియు వారి ముందుంచబడిన గురివైపు ప్రార్థనాపూర్వకంగా ఎడతెగక సాగుతారు.

7. ప్రతిరోజు మనము విధేయత యొక్క ప్రతిఫలాన్ని అనుభవించగలిగితే మనము వాక్యము నుండి లాభం పొందుతాము

"దైవభక్తి అన్ని విషయములలో ప్రయోజనకరమవును” 1 తిమోతి 4:8. విధేయతతో మన ఆత్మలను మనం పవిత్రపరచుకొంటాము 1 పేతురు 1:21. ఎలాగైతే మన అవిధేయత మన ప్రార్థనలకు అడ్డుగా నిలుస్తుందో, అలాగే విధేయత వలన మన ప్రార్థనలు ఆలకించబడతాయి (యెషయా 59:5; యిర్మీయా 5:25). విధేయత ద్వారా మన ఆత్మలకు క్రీస్తు యొక్క ప్రశస్తమైన ప్రత్యక్షత కలుగుతుంది యోహాను 4:21. మనం విధేయత మార్గములో సంచరిస్తున్నపుడు, "దాని మార్గములు జ్ఞాన మార్గములు, దాని త్రోవలన్నియు క్షేమకరములు” (సామెత 5:17) అని కనుగొంటాము. “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” (1 యోహాను 5:3), “వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును” (కీర్తన 19:11).

ఏడవ అధ్యాయము

లేఖనాలు మరియు లోకము

క్రొత్తనిబంధనలో క్రైస్తవునికి ఈ 'లోకం' గురించి గాని, దానిపై అతడు కలిగియుండవలసిన వైఖరిని గురించి గాని చాలా వ్రాయబడింది. దాని నిజస్వభావం స్పష్టంగా నిర్వచింపబడింది, విశ్వాసి దాని గురించి గంభీరంగా హెచ్చరించబడ్డాడు. దేవుని పరిశుద్ధ వాక్యము పరలోకము నుండి వచ్చి, “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది” 2 పేతురు 1:19. ఆ వాక్యపు కిరణాలు, పై పై మెరుగులతో పూత పెట్టియున్న ఐహిక ఆకర్షణలలోనికి చొచ్చుకొనిపోయి వాటి అసలు రంగును బహిర్గతం చేస్తాయి. ఏ లోకము పైనైతే విస్తారమైన శ్రమ,ధనం వెచ్చించబడుతుందో, ఏ లోకాన్నైతే మనుష్యులు ఉన్నతంగా హెచ్చించి, ఘనమైనదిగా ఎంచుతారో లేఖనాలలో ఆ 'లోకము' 'దేవుని శత్రువు'గా ప్రకటింపబడింది. అందుకే దేవుని పిల్లలు దానిని “అనుసరించటా'న్ని నిషేధించి, వారి ప్రేమానురాగాలు దానిపై చూపించకూడదని హెచ్చరింపబడ్డారు.

ఇంతకు ముందు మనం చర్చించుకున్న విషయాల మాదిరిగానే ఈ అంశం కూడా చాలా ప్రాముఖ్యత గలది, కాబట్టి ఒక చిత్తశుద్దిగల చదువరి, దైవకృపనభ్యర్థించి ఈ విషయమందు కూడా తన్ను తాను బేరీజు వేసుకోవడం, అతనికి/ఆమెకు ఎంతో లాభకరం. తన పిల్లలనుద్దేశించి దేవుడు చేసిన ఒకానొక ఉద్బోధ ఇలా ఉంది: “క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తమై, ఆ పాలను అపేక్షించుడి” (1 పేతురు 2:2). మనలో ప్రతి ఒక్కరమూ నిజాయితీతో శ్రద్దగా ఈ కోవకు చెందుతామో లేదో కనుక్కోవటం మంచిది. అయితే లేఖనజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడంతోనే మనం సంతృప్తిపడకూడదు. మనము ఎక్కువగా శ్రద్ధ చూపాల్సిన విషయం మన ఆచరణాత్మక ఎదుగుదల మరియు అనుభవాత్మకంగా క్రీస్తుసారూప్యంలోనికి మారటం. దేవుని వాక్యపఠనం మరియు వాక్యజ్ఞానం నన్ను లోకాశలనుండి తప్పించగలుగుతుందా అన్నది మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన ఒక విషయం.

1. లోకపు నిజస్వభావాన్ని గుర్తెరిగేందుకు మన కళ్ళు తెరవబడితే మనం వాక్యం నుండి లాభం పొందుతాము

ఒక కవి ఇలా వ్రాశాడు, 'దేవుడు పరలోకములో ఉన్నాడు, లోకంలో అంతా సాఫీగానే ఉంది'. ఒక కోణము నుండి అది నిజమే, కానీ మరో కోణము నుండి అది తీవ్రమైన పొరపాటు, ఎందుకంటే "లోకమంతయు దుష్టునియందున్నది” 1 యోహాను 5:19. పరిశుద్దాత్ముడు మన హృదయాలకు లోకాతీత జ్ఞానోదయం కలుగజేసినప్పుడే మనం “మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము” లూకా 16:15. అన్న వాస్తవాన్ని గ్రహించగలుగుతాం. ఈ "లోకాన్ని” ఒక బ్రహ్మాండమైన మోసంగా, పనికిమాలిన డాబు వస్తువుగా, విలువలేని ఆభరణముగా, నీచమైనదానిలా, ఏదో ఒక దినాన కాలిపోయే వస్తువులా మన ఆత్మలు చూడగలిగినప్పుడు మనమెంతో ధన్యులం.

అయితే మొదట మనం, క్రైస్తవుడు ప్రేమించకూడదని చెప్పబడిన ఆ “లోకాన్ని” నిర్వచిద్దాం. పరిశుద్ధ లేఖనాలలో నానార్థములతో వాడబడిన కొన్ని పదాలలో ‘లోకము' ఒకటి. అయినా, వాటి సందర్భాలను జాగ్రత్తగా పరిశీలిస్తే, అది ఏ భావాన్ని ఉద్దేశించి వాడబడిందో కనుగొనగలం. ఈ “లోకము” స్వయంసంపూర్తిగా ఉన్న ఒక వ్యవస్థ. ఏదైనా ఒక అంశం చొరబడాలని చూస్తే, అది త్వరితంగానే అందులోకి చేర్చుకోబడుతుంది. పతనమైన మానవ శాపగ్రస్తనైజం, మానవసమాజాన్నంతా దానికి అనుగుణంగా నడుచుకునే వ్యవస్థగా మలచుకుంది. అదే ‘లోకం'. కాబట్టి, అది “దేవునికి విరోధమైన, శరీరానుసారమైన మనస్సు” యొక్క సంఘటిత రాజ్యం. అందుకే అది “దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు” రోమా 8:7. “శరీరానుసారమైన మనస్సు” ఎక్కడుంటుందో అక్కడ 'లోకం' ఉంటుంది, అందుకే లోకమంటే 'దేవుడు లేని లోకం' అని అర్థం.

2. ఈ లోకము, ఎదిరించి అధిగమించాల్సిన శత్రువని మనం గ్రహించినప్పుడు వాక్యము నుండి లాభం పొందుతాము

“విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుటకు...” 1 తిమోతి 6:12. ఒక క్రైస్తవుడు పిలవబడ్డాడు, అంటే ఓడించి జయించేందుకు శత్రువులున్నారని దానర్థం. పరిశుద్ధ త్రిత్వము - తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు - ఉన్నట్టే దుష్ట త్రిత్వమూ ఉన్నది - శరీరము, లోకము మరియు అపవాది. దేవుని బిడ్డ వీటితో ఒక ప్రాణాంతక పోరాటం పోరాడేందుకు పిలవబడ్డాడు. 'ప్రాణాంతక' అని ఎందుకంటున్నామంటే ఈ వ్యక్తి వాటిని అంతమొందిస్తాడు లేక అవే అతన్ని నాశనం చేస్తాయి. ప్రియచదువరీ, ఈ లోకమొక భయంకర శత్రువని తెలుసుకో. నీ హృదయములో దానిని ఓడించి, జయించకపోతే నీవు దేవుని బిడ్డవు కావు, ఎందుకంటే ''దేవుని మూలముగా పుట్టినవారందరు లోకమును జయించుదురు” (1 యోహాను 5:4).

ఈ లోకాన్ని ఎందుకు జయించాలో తెలుసుకునేందుకు ఈ క్రింద పేర్కొన్న కారణాలు దోహదపడతాయి. మొదటిగా, దానిలోని ప్రలోభపెట్టు సంగతులు మన గమనాన్ని మరలించి, మన హృదయపు ప్రేమానురాగాలను దేవుని నుండి అన్యాక్రాంతం చేస్తాయి. ఎందుకంటే దృశ్యమైనవి అదృశ్యమైనవాటి నుండి మన హృదయ గమనాన్ని మరల్చివేస్తాయి. రెండవదిగా, ఈ లోకాత్మ క్రీస్తుఆత్మకు బద్ధవిరోధి; అందుకే అపొస్తలుడు ఇలా వ్రాశాడు, “మనము లౌకికాత్మను కాక దేవునియొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము” (1 కొరింథీ 2:12) దేవుని కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు, కాని “లోకమాయనను తెలిసికొనలేదు” ( యోహాను 1:10; అందుకే లోకాధికారులు ఆయనను సిలువ వేసారు (1 కొరింథీ 2:8. మూడవదిగా, ఈ లోకపు వ్యవహారాలు, చింతలు పరలోకసంబంధమైన జీవితానికి పరస్పర విరుద్ధం. తక్కిన మనుష్యుల్లాగే క్రైస్తవులు వారంలో ఆరు రోజులు కష్టించాలని దేవుడు కోరుకుంటున్నాడు; కాని అలా పనిచేస్తూ ఉండగా వారు నిరంతర జాగరూకులై ఉండాలి. లేకపోతే బాధ్యతలు నెరవేర్చటం కన్నా స్వప్రయోజనాలే వారిని ఆధీనంలో ఉంచుకుంటాయి.

“లోకమును జయించిన విజయము మన విశ్వాసమే” (1 యోహాను 5:4). దేవుడనుగ్రహించిన విశ్వాసము తప్ప ఏదీ కూడా లోకాన్ని జయించదు. అయితే మన హృదయము ఎప్పుడైతే అదృశ్యమైన నిత్యత్వపు వాస్తవాలతో నిండియుంటుందో, అప్పుడే అది ఈ లోకపు దుష్టప్రభావము నుండి విడుదలవుతుంది. విశ్వాసపు నేత్రాలు ఐహిక విషయాల నిజస్వరూపాన్ని వివేచించి, అవి శూన్యము, నిరర్థకమని గ్రహించి, నిత్యత్వపు మహిమాయుతమైన, రమ్యమైన విషయాలతో పోల్చజాలనివని గ్రహిస్తాయి. దేవుని పరిపూర్ణతలను, ఆయన ఔన్నత్యాన్ని అవగతం చేసుకున్నప్పుడు ఈ లోకము శూన్యమనిపిస్తుంది. తన పాపాల నిమిత్తం మరణించి, తనకు అభయమిచ్చేలా నిరంతరం విజ్ఞాపన చేస్తూ, తన నిత్యరక్షణ నిమిత్తం ఏలుబడి చేసే విమోచకుడిని చూస్తుంటే, ఒక క్రైస్తవుడు విస్మయముతో, “నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు” అని అంటాడు.

ఇది చదువుతున్న నీ పరిస్థితేంటి? ఈ మాటలకు నీవు సాదరంగా అంగీకారం తెలుపవచ్చు, కాని నిజానికి నీ పరిస్థితి ఎలా ఉంది? అన్యులు గొప్పగా ఎంచే విషయాలు నిన్ను ఆకర్షించి వశపరచుకుంటున్నాయా? లోకసంబంధియైన ఒక వ్యక్తి నుండి, అతనికి ప్రీతికరమైన ఏదైనా ఒక వస్తువును తొలగించటం అస్సలు సహించలేడు. మరి నీ పరిస్థితి కూడా అదేనా? లేక నీయొద్దనుండి ఎన్నటికీ తొలగించబడలేని నిత్యత్వపు విషయాల నుండే ప్రస్తుతం నీకు సంతోషానందాలు లభిస్తున్నాయా? ఈ ప్రశ్నలను కొట్టిపారవేయొద్దు. వీటి విషయమై నీవు దేవుని సన్నిధిలో తీవ్రంగా ఆలోచించమని నా మనవి. ఈ ప్రశ్నలకు నీ యథార్థ సమాధానం నీ ఆత్మీయ నిజస్థితికి సూచిక. తద్వారా నిన్ను నీవు “యేసు క్రీస్తులో నూతన సృష్టి” అని అనుకుని మోసపరచుకుంటున్నావో లేదో తెలుస్తుంది.

3. మనల్ని “ఈ దుష్ట లోకము నుండి” (గలతీ 1:4) విమోచించటానికి క్రీస్తు మరణించాడని తెలుసుకున్నప్పుడు వాక్యము నుండి మనం లాభం పొందుతాము

దేవుని కుమారుడు ధర్మశాస్త్రాన్ని “నెరవేర్చటాని"కి మాత్రమే రాలేదు మత్తయి 5:17 కాని, “మన పాపాల నుండి మనల్ని రక్షించ”టానికి (మత్తయి 1:21), "అపవాదియొక్క క్రియలు లయపరచ”టానికి 1 యోహాను 3:8, "రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించ”టానికి (1 థెస్స 1:10: వచ్చాడు. “మన పాపాలనుండి మనల్ని రక్షించ”టానికి (మత్తయి 1:21) మాత్రమే రాలేదు కాని ఈ లోకపు దాస్యం నుండి మనల్ని విడిపించటానికి,మోసపరిచే దాని ప్రభావము నుండి విడుదల కలిగించేందుకు కూడా వచ్చాడు. ఇశ్రాయేలుతో దేవుడు వ్యవహరించిన తీరు ఈ విషయాన్ని ప్రతిబింబిస్తుంది. ఐగుప్తులో వారు బానిసలు: “ఐగుప్తు” లోకానికి సాదృశ్యం. వారు క్రూరమైన దాస్యత్వములో, ఫరో కొరకు ఇటుకలు చేస్తూ వారి సమయాన్ని గడిపారు. వారిని వారు విముక్తులుగా చేసుకోలేకపోయారు. కాని తన మహాశక్తితో యెహోవా వారిని విముక్తుల్ని చేసి, వారిని 'ఇనుప కొలిమి'లో నుండి రక్షించాడు. అలాగే క్రీస్తు కూడా తనవారి పట్ల చేస్తాడు. వారి హృదయాలపై ఉన్న ఈ లోకప్రభావాన్ని బద్దలు చేస్తాడు, వారిని స్వతంత్రులుగా చేసి, దాని ఆమోదాన్ని ప్రేమించకుండా, దాని తిరస్కారానికి భయపడకుండా చేస్తాడు.

తన ప్రజల పాపాల నిమిత్తం క్రీస్తు తనను తాను బలిగా అర్పించుకొని, తత్ఫలితంగా ఈ లోకములోని దుష్టత్వము యొక్క నాశనశక్తి మరియు ప్రభావము నుండి వారు తప్పించబడాలని ఈ లోకాధికారియైన సాతాను నుండి, ప్రభావితం చేసే ఆశల నుండి, దానికి చెందిన మనుష్యుల వ్యర్థమైన నడవడి నుండి తప్పింపబడాలని తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ దైవికకార్యములో, పరిశుద్ధులలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు క్రీస్తుతో సహకరిస్తాడు. ఆయన వారి ఆలోచనలను, ప్రేమానురాగాలను ఐహికవిషయాల నుండి పరసంబంధమైన విషయాల వైపు మళ్ళిస్తాడు. ఆయన శక్తి వలన, వారి చుట్టూ ఉన్న అనైతికతను తొలగించి, వారిని పరలోకప్రమాణాలకు అనుగుణంగా చేస్తాడు. ఒక క్రైస్తవుడు కృపలో ఎదుగుతూ ఉంటే, ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం జరిగిస్తాడు. ప్రస్తుత దుష్టప్రపంచం' నుండి పూర్తి విముక్తిని కోరుతూ, దానినుండి పూర్తి విడుదల కోసం దేవునిని అర్థిస్తాడు. ఒకప్పుడు తనను ఆకర్షించింది, ఇప్పుడు వెగటు పుట్టిస్తుంది. తన ప్రభువు తీవ్ర అప్రతిష్టపాలవుతున్న ఈ లోకాన్ని విడిచివెళ్ళే ఆ సమయం కొరకు అతను పరితపిస్తాడు.

4. మన హృదయాలు లోకము నుండి విడిపింపబడినప్పుడు వాక్యము నుండి మనము లాభం పొందుతాము

"ఈ లోకమునైనను, లోకములోనున్న వాటినైనను ప్రేమింపకుడి” (1 యోహాను 2:15). ఒక యాత్రికునికి తన ప్రయాణములో ఆటంకమేలాగో, పరుగెత్తే వ్యక్తిపై బరువు ఏలాగో, ఎగురుతున్న పక్షికి ముళ్ళకొమ్మలేలాగో, క్రైస్తవునికి ఈ లోకపు ప్రేమ అలాంటిది. అది అతన్ని పూర్తిగా మళ్లించి, బహుగా మభ్యపెట్టి, బలవంతంగా దేవునినుండి త్రిప్పివేస్తుంది (నతానియేల్ హార్డీ, 1660). ఇక్కడ సత్యమేంటంటే ఈ లోకాశల నుండి హృదయం శుద్ధిచేయబడే వరకు, దైవికోపదేశాన్ని చెవి వినిపించుకోదు. ఈ అశాశ్వత, అవివేక విషయాలను అధిగమించే వరకు, మనం దేవునికి విధేయతతో లోబడలేము. గుండ్రంగా ఉన్న వస్తువుపై నీళ్లు పోస్తే ఎలా జారుతాయో, ఐహిక మనస్సు నుండి పరలోకపు సత్యాలు కూడా అలాగే జారుతాయి.

ఈ లోకం క్రీస్తును నిరాకరించింది, కాబట్టే ఆయన నామము, ఎన్ని చోట్ల ప్రకటింపబడినా కూడా, దానికి పట్టింపు లేదు. ఈ లోకసంబంధుల ఆశలు, ఉద్దేశాలు స్వీయతృప్తి కోసమే. వారి ఆశలు, వాటిని అందుకొనే విధానాలు వేరు వేరైనా, స్వీయతృప్తి వారి ధ్యేయం. అయితే క్రైస్తవులు లోకములో ఉన్నారు. ప్రభువు వారికోసం నియమించిన జీవితకాలాన్ని పూర్తిచేయువరకు వారు అందులో నుండి బయటకు రాలేరు. ఇక్కడే వారు సంపాదించుకోవాలి, కుటుంబాలను పోషించుకోవాలి, లోకములో ఇతరత్రా వ్యవహారాలు కూడా చూసుకోవాలి. కాని ఈ లోకమే వారిని సంతోషపెడుతుందన్నట్టుగా వారు ఈ లోకాన్ని ప్రేమించకూడదు. వారి “నిధి” మరియు “నిత్యనివాసం” మరోచోట ఉన్నదని మరువకూడదు.

పతనమైన మానవుని ప్రతి కోరికను ఈ లోకం తృప్తిపరుస్తుంది. అతన్ని ఆకర్షించేందుకు ఈ లోకము వద్ద ఎన్నో మార్గాలున్నాయి. అవి అతని గమనాన్ని ఆకర్షించి, అతనిలో వాటి కొరకైన ప్రేమను, కోరికను పుట్టిస్తాయి. ఆ తర్వాత అవి ఖచ్చితంగా అతని హృదయం మీద ఏదో తెలియని లోతైన ముద్ర వేస్తాయి. ఈ ఆకర్షణ అన్ని వర్గాలకు చెందినవారిపై అదే ప్రాణాంతక ప్రభావం కలిగియుంటుంది. అవి ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలా  కనపడినా, ఈ లోకములోని సకల భోగాలు, ప్రయత్నాలు ఈ జీవితములో మాత్రమే సంతోషాన్నిచ్చే విధంగా రూపొందించబడి పొందుపరచబడ్డాయి. అందుకే, “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” (మత్తయి 16:26) అని వ్రాయబడియుంది. క్రైస్తవుడు పరిశుద్దాత్మ ద్వారా బోధింపబడతాడు, ఆయన అతని ఆత్మకు క్రీస్తును కనపరచడం ద్వారా అతని ఆలోచనలు ఈ లోకము నుండి మళ్ళించబడతాయి. ఒక చిన్నపిల్లవాడు తన చేతిలో ఉన్నదాని కన్నా ఎక్కువ ఆకర్షణీయమైన వస్తువుని చూస్తే, ఎలాగైతే ఆ వస్తువును క్రింద పారేస్తాడో, అలాగే దేవునితో సహవాసమును అనుభవించిన హృదయం ఇలాగంటుంది, “నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను... సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను” (ఫిలిప్పీ 3:8-11).

5. ఈ లోకము నుండి వేరుగా నడిచినప్పుడు మనం వాక్యము నుండి లాభం పొందుతాము

“ఈ లోకస్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” (యాకోబు 4:4). ఇలాంటి ఒక వచనం మన హృదయాన్ని చొచ్చుకొని పోయి, మనల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. దేవుని కుమారునిని సిలువ వేసిన ఈ లోకపుభోగాన్ని వెదకి నేను దానితో ఎలా స్నేహం చేయగలను? అలా నేను చేస్తే, దేవుని శత్రువులకూ నాకూ ఏ మాత్రం భేదం వుండదు. ప్రియ చదువరీ, ఈ విషయంలో పొరపాటు చేయొద్దు. అందుకే, "ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు” (1 యోహాను 2:15) అని వ్రాయబడియున్నది.

దేవుని ప్రజలను గూర్చి ఇలా చెప్పబడింది, “ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు” (సంఖ్యా 23:9). తిరిగి జన్మించిన వ్యక్తికీ, లోకరీతిగా ఉన్న వ్యక్తికీ ఉన్న గుణలక్షణాలు, మార్గదర్శకత్వం, కోరికలు, ప్రవృత్తులు అన్నీ వేరు వేరు కాబట్టి వారిరువురినీ అవి వేరుపరచాలి. మన పౌరసత్వం పరలోకములో ఉన్నదని ఎలుగెత్తి చాటే మనం, మరో ఆత్మతో నడిపింపబడే మనం, మరో నియమంతో నిర్దేశింపబడే మనం, మరో దేశానికి ప్రయాణించే మనం, ఇవన్నిటినీ తుచ్ఛమైనవాటిగా ఎంచేవారితో కలిసి జీవించలేం. కాబట్టి మనలోని ప్రతీదీ క్రైస్తవయాత్రికుల లక్షణాలను ప్రదర్శించునుగాక. నిజంగా మనం “సూచనలుగా ఉండు ప్రజలమై” (జెకర్యా 1:8), “ఈ లోక మర్యాదను అనుసరింపకయుందుము” గాక రోమా 12:2.

6. ఈ లోకం మనలను ద్వేషించినప్పుడు వాక్యము నుండి లాభం పొందుతాము

ఈ లోకానికి తన వాస్తవస్థితిని మరుగుపరిచి, తన్ను తాను మాన్యంగా కనుపరచుకోవడానికి గల తంత్రాలు ఎన్నో, ఎన్నెన్నో. సభ్యమర్యాదలు, సంప్రదాయాలు, దానధర్మాలు, కారుణ్యతలు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు. అలాగే అందులోని సంఘాలు, వాటి యాజకులు, పెద్దలు అందులో కూరుకుపోతున్న అవినీతికి భాష్యం చెప్పేందుకు కావాలి. దానికి కొంచెం బలం చేకూరేందుకు క్రైస్తవత్వాన్ని కలిపి, ఆయన “కాడి”ని ఎన్నడూ ఎత్తుకోని వేలకొలది ప్రజలు తమ పెదవులపై క్రీస్తు యొక్క పవిత్రమైన నామాన్ని ఉచ్ఛరిస్తారు. వారిని ఉద్దేశించి దేవుడు ఇలా అంటాడు, "ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది” (మత్తయి 15:8). మరి అలాంటివారి పట్ల నిజమైన క్రైస్తవుల వైఖరి ఎలా ఉండాలి? లేఖనం చాలా స్పష్టంగా జవాబిస్తుంది. “ఇట్టివారికి విముఖుడవైయుండుము” 2 తిమోతి 3:5: “మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి” (2 కొరింథీ 6:17). మరీ ఈ దైవికాజ్ఞను పాటించినప్పుడు ఏమి జరుగుతుంది? “మీరు లోకసంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది” (యోహాను 15:19), అని క్రీస్తు చెప్పిన మాటలు సత్యమని నిర్ధారణ ఔతుంది.

ఏ “లోకము” గురించి ఇక్కడ ప్రస్తావింపబడింది? పైన ఉదహరించిన వచనము దీనికి జవాబు చెబుతుంది కదా! "లోకము మిమ్మును ద్వేషించిన యెడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు” (యోహాను 15:18). ఎలాంటి "లోకము” క్రీస్తును ద్వేషించి, ఆయనను వెంటాడి చంపింది? దేవుని మహిమ కొరకు అత్యుత్సాహాన్ని కపటంగా ప్రదర్శించిన ఆ మతవ్యవస్థే గదా. ఇప్పుడు కూడా అలాగే ఉంది. క్రీస్తును ఘనహీనునిగా చేస్తున్న ఈ క్రైస్తవలోకానికి విరోధంగా ఒక క్రైస్తవుడు ఎదురుతిరిగినప్పుడు అతని ప్రచండ శత్రువులు, జాలిపడని, నీతినియమాలు లేని విరోధులెవరంటే తమను తాము క్రైస్తవులుగా ప్రకటించుకునేవారే! కాని, “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీమీద అబద్దముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి” (మత్తయి 5:11,12). ప్రియ చదువరీ, ఈ మతపరమైన లోకం నిన్ను ద్వేషించినప్పుడు అది ఒక శుభసూచకం, నువ్వు వాక్యము నుండి ప్రయోజనము పొందుతున్నావనటానికి ఖచ్చితమైన చిహ్నం. అయితే, నీవింకా సంఘాల్లో లేక సమావేశాల్లో', 'మంచి స్థాయిని కలిగియుంటే, నీవు దేవుని మెప్పుకంటే మనుష్యుల మెప్పు పొందేందుకు ఇష్టపడుతున్నావేమోనని భయపడేందుకు మిక్కిలి ఆస్కారముంది.

7. లోకానికి అతీతంగా మనము జీవించగలిగినప్పుడు వాక్యము నుండి మనము లాభం పొందుతాము

మొదటిగా, ఈ లోకపు ఆచారాలు మరియు పద్దతులకు అతీతంగా. నేడు అమల్లో ఉన్నటువంటి అలవాట్లకు, పద్ధతులకు ఈ లోకపు వ్యక్తి ఓ బానిస. కాని దేవునితో నడిచే వ్యక్తి అలా కాదు, అతని లక్ష్యమంతా 'దేవుని కుమారుని సారూప్యములోనికి మార్చబడటమే'. రెండవదిగా, ఈ లోకపు చింతలు మరియు విచారాలకు అతీతంగా. పరిశుద్ధుల గురించి ఇలా చెప్పబడింది - వారికి “మరి శ్రేష్ఠమైనదియు, స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, వారి ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి” (హెబ్రీ 10:34). మూడవదిగా, ఈ లోకపు ఆకర్షణలకు అతీతంగా. “యెహోవాను బట్టి సంతోషించువారికి” ఈ లోకపు మిరుమిట్లు గొలిపే ప్రకాశం ఏపాటిది? నాల్గవదిగా, ఈ లోకపు అభిప్రాయాలు మరియు ఆమోదాలకు అతీతంగా. లోకాన్ని ధిక్కరించి, స్వతంత్రంగా జీవించటం నువ్వు నేర్చుకున్నావా? నీ పూర్ణహృదయముతో దేవుని తృప్తిపరచాలనుకుంటే, ఈ లోకపు అభిప్రాయాలను నువ్వు బొత్తిగా పట్టించుకోవు.

ప్రియ చదువరీ, ఈ అధ్యాయపు విషయాలను బట్టి నిన్ను నువ్వు బేరీజు వేసుకోవాలనుకుంటున్నావా? అయితే ఈ క్రింది ప్రశ్నలకు యథార్థమైన జవాబు వెదకు. మొదటగా తీరిక సమయాల్లో నీ మనసులో మెదిలే విషయాలేమిటి? ఎక్కువగా నువ్వు దేని గురించి ఆలోచిస్తావు? రెండవదిగా, నీకిష్టమైన సంగతులేమిటి? ఒక సాయంత్రాన్నిగాని, సబ్బాతురోజు మధ్యాహ్నాన్నిగాని ఎలా గడపాలని ఇష్టపడతావు? మూడవదిగా, నీవెక్కువగా చింతించేదెప్పుడు - ఈ లోకసంగతులను పోగొట్టుకున్నప్పుడా లేక దేవునితో సహవాసాన్ని కోల్పోయినప్పుడా? నీకెక్కువ విచారం కలిగించేది ఏమిటి? - నీ ప్రణాళికలు తారుమారవడమా లేక క్రీస్తు పట్ల నీ హృదయం ఉదాసీనంగా ఉండడమా? నాల్గవదిగా, నీకిష్టమైన చర్చావిషయమేమిటి? నేటి వార్తలనుగూర్చి ముచ్చటించటమా లేక “అతికాంక్షనీయుని" గూర్చి మాట్లాడుకునే వారిని కలవటమా? ఐదవదిగా, నీ 'సదుద్దేశాలు' సఫలమవుతున్నాయా, లేక అవి వట్టి పగటికలలుగానే మిగిలిపోతున్నాయా? నీ మోకాళ్ల మీద ఇంతకు ముందు కంటే ఎక్కువ లేక తక్కువ సమయం గడుపుతున్నావా? వాక్యం ఇంకా మధురంగా ఉందా, లేక నీ ఆత్మ దానిపై అభిరుచిని కోల్పోయిందా?

ఎనిమిదవ అధ్యాయము

లేఖనాలు మరియు వాగ్దానాలు

తన ప్రజల కొరకు దేవుని వాగ్దానాలు

దైవిక వాగ్దానాలు, తన ప్రజలపై దేవుడు కుమ్మరించగోరు కృపా ఐశ్వర్యాలను గురించిన సంకల్పాన్ని వెల్లడి చేస్తాయి. నిత్యత్వము నుండి తన ప్రజలను ప్రేమించి ముందుగానే వారికి సమస్తాన్ని సిద్ధపరచిన ఆ దేవుని హృదయపు బహిరంగసాక్ష్యాలే ఈ వాగ్దానాలు. ఈ యుగంలోను మరియు నిత్యత్వములోను, వారి సంపూర్ణ రక్షణార్థమై కావలసినవన్నీ దేవుడు తన కుమారుని ద్వారా సమకూర్చాడు. ఇందును గురించిన సత్యమైన, స్పష్టమైన మరియు ఆత్మీయమైన అవగాహనను వారికి కలిగించటానికి అందమైన నక్షత్రాలతో శోభితము చేయబడిన అంతరిక్షమును పోలినట్లుగా దేవుని వాక్యము వాగ్దానాలతో అలంకరించబడి ఉంది. యేసుక్రీస్తునందు వారి నిమిత్తము దేవుని చిత్తమేమైయున్నదో గ్రహించటానికి, వారు ఆయనయందు అభయమునొంది వారి స్థితిగతులు తెలుసుకుని, అన్ని సమయాలలోను ఆయనతో సహవాసము కలిగి ఉండటానికి ఈ వాగ్దానాలు వారికి దోహదపడతాయి. దైవిక వాగ్దానాలు, మంచిని ప్రసాదించి, చెడును తీసివేసేందుకు ఇవ్వబడిన ప్రకటనలు. అవి తన ప్రజలకు దేవుని ప్రేమను తెలియపరిచి స్పష్టం చేసే  దీవెనకరమైన వాక్కులు. దేవుని ప్రేమకు సంబంధించి మూడు మెట్లు ఉన్నాయి. మొదటిది, దానిని చూపించటంలో ఆయన ఉద్దేశం; చివరిది, ఆ ఉద్దేశ్యాన్ని వాస్తవంగా నెరవేర్చడం; ఈ రెండింటికీ మధ్య ఈ ఉద్దేశాన్ని దాని లబ్దిదారులకు ముందుగానే తెలియచేయటం వలన, ఆయన యుక్తకాలంలో కనపరచనున్న ప్రేమను వారికి బయలుపరచటమేకాక, ఆలోపు ఆయన యొక్క కనికరపూర్వకమైన ప్రణాళికను గురించి వారు తెలుసుకునేలా చేసి, తద్వారా ఆయన మధుర ప్రేమలో సేదతీర్చుకొని, ఆయన ఖచ్చితమైన వాగ్దానాల మీద సౌఖ్యంగా పరుండేలా చేయడం. అక్కడ ఇలా మనం చెప్పగలం, “దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తమెంత గొప్పది” (కీర్తన 139:17).

 2 పేతురు 1:4 లో ఈ దైవిక వాగ్దానాలు “అమూల్యములు, అత్యధికములు” అని పేర్కొనబడ్డాయి. లండన్ నగరపు ప్రియమైన ప్రసంగీకులు స్పర్జన్ గారు ఇలా అభిప్రాయపడ్డారు- 'విలువ మరియు ఆధిక్యత చాలా అరుదుగా కలిసుంటాయి, అయితే ఈ ప్రత్యేక సందర్భములో మాత్రం అవి అత్యున్నత శ్రేణిలో కలిసున్నాయి.' యెహోవా తన నోటిని తెరిచి తన హృదయాన్ని బహిర్గతం చేసేందుకు ఇష్టపడినప్పుడు, ఆయన తనకు తగిన రీతిలోనే చేస్తాడు, సర్వోత్తమ శక్తి, ఘనమైన పదాలతో వ్యక్తపరుస్తాడు. స్పర్జన్ గారు ఇలా అభిప్రాయపడ్డారు, 'అవి గొప్ప దేవునినుండి, ఘోర పాపుల కొరకు ఇవ్వబడి గొప్ప ఫలితాలను తెచ్చిపెట్టి, గొప్ప సంగతులతో వ్యవహరిస్తాయి.’ సహజజ్ఞానం వాటి గొప్పతనాన్ని గ్రహించగలుగుతుంది. అయితే తిరిగి జన్మించిన హృదయం మాత్రమే వాటి వర్ణింపశక్యం కాని గొప్ప విలువను రుచించగలుగుతుంది. అప్పుడు కీర్తనాకారునితో వారు కూడా, “నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనెకంటే తీపిగా నున్నవి” (కీర్తన 119:103) అని చెప్పగలుగుతారు.

1. వాగ్దానాలెవరికి చెందుతాయో గ్రహించినప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

క్రీస్తులో ఉన్నవారికి మాత్రమే అవి చెందుతాయి. “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందే అవునన్నట్టుగాయున్నవి” (2 కొరింథీ 1:20). పరిశుద్ధుడైన దేవునికి, పాపులకు మధ్య, వారి తరఫున దేవునిని తృప్తిపరచిన మధ్యవర్తి ద్వారా తప్ప, ఏ సంబంధమూ ఉండనేరదు. కాబట్టి క్రీస్తును తిరస్కరించినవారు కనికరము కొరకు దేవునిని అర్థించినా, ఒక చెట్టుని ప్రార్థించినా, రెండూ సమానమే.

వాగ్దానాలు మరియు వాగ్దానం చేయబడిన విషయాలు , ఈ రెండూ కూడా ప్రభువైన క్రీస్తుకు అప్పగించబడి ఆయన ద్వారా పరిశుద్ధులకు అందించబడతాయి. “నిత్యజీవము అనుగ్రహింతుననునది ఆయన తానే మనకు చేసిన (ప్రధాన మరియు శ్రేష్ట) వాగ్దానము” (1 యోహాను 2:25). ఐతే అదే పత్రికలో, “ఈ జీవము ఆయన కుమారునియందున్నది” (5:11) అని వ్రాయబడి ఉంది. అలా ఐతే, క్రీస్తులో ఇంకా లేనివారు ఈ వాగ్దానాల వలన ఏ మేలు పొందుతారు? ఏమీ పొందరు. క్రీస్తు వెలుపల ఉన్న వ్యక్తి దేవుని దయ వెలుపల ఉన్నాడు. అవును, దేవుని ఉగ్రత క్రింద ఉన్నాడు; దేవుని బెదిరింపులే అతని వంతు, కాని వాగ్దానాలు కావు. గంభీరాతిగంభీరమైన విషయమేమంటే, క్రీస్తు లేనివారు “ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులు” (ఎఫెసీ 2:12). కేవలం “దేవుని పిల్లలే వాగ్దాన సంబంధులైన పిల్లలు” (రోమా 9:8). ప్రియ చదువరీ, నీవూ అందులో ఒకనివని నిర్థారించుకో.

ఇదిలా ఉండగా రక్షింపబడినవారికి, రక్షణ లేనివారికి ఒకే విధముగా దైవిక వాగ్దానాలను అనాలోచితంగా వర్తింపజేసే ప్రసంగీకుల పాపం ఎంత గొప్పది! వారి గ్రుడ్డితనం ఎంత దారుణమైనది! వారు "పిల్లల రొట్టె తీసికొని కుక్క పిల్లలకు వేయుట” మాత్రమే కాకుండా “దేవుని వాక్యమును వంచనగా బోధిస్తున్నారు” (2కొరింథీ 4:2), అలా చేసి అనేకులను మభ్యపెడుతున్నారు. ఎవరైతే వారి మాటలు విని, లక్ష్యపెడతారో వారి దోషము ఎంత మాత్రమూ తక్కువ కాదు. ఎందుకంటే దేవుడు లేఖనాలలోని సత్యాలను తమంతట తామే వెతుక్కోవాలని వారిని బాధ్యులనుగా చేసి, వారు చదివింది లేక విన్నది నిర్దిష్టమైన ప్రమాణం ప్రకారముగా ఉందో లేదో పరీక్షించుకోమంటాడు. ఒక వేళ అలా చేయటానికి సోమరులై వారి గ్రుడ్డి నిర్దేశకుల్ని అనుసరించాలనుకుంటే, వారి రక్తానికి వారే బాధ్యులు. సత్యమును “కొనాలి” ( సామెతలు 23:23  ), దాని క్రయం చెల్లింపనిష్టం లేనివారు వట్టి చెతులతో తిరిగి వెళ్ళాలి.

2. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునేందుకు మనం ప్రయాసపడినప్పుడు వాక్యము నుండి లాభపడతాం

ఇది చేయాలంటే ముందుగా వాటితో పరిచయం ఏర్పరచుకోవటానికి కొంచెం శ్రమపడాలి. వాగ్దానాలు పరిశుద్దుల నిధియని, వారి వారసత్వపు హక్కు ఆ వాగ్దానాలలోనే ఉందని తెలిసినప్పటికిని వారికి ఏ మాత్రమూ తెలియని వాగ్దానాలు లేఖనాలలో ఎన్నో ఉన్నాయనడం ఆశ్చర్యం. క్రైస్తవులిప్పటికే అద్భుత దీవెనల గ్రహీతలు, అయినప్పటికీ వారి మూలధనం, సంపదలోని అధికాంశం, రాబోయే నిత్యత్వంలో పొందుతారు. వారిప్పటికే 'సంచకరువు'ను( 2 కొరింథీ 1:22  ) పొందారు కాని క్రీస్తు వారి కొరకు ఖరీదు చేసినదానిలో శ్రేష్టమైన భాగం ఇంకా దేవుని వాగ్దానంలోనే నిద్రాణమై ఉంది. అలాగైతే ఆయన వాగ్దానాలలో బయలుపరచిన చిత్తాన్ని తెలుసుకోవటంలో,  “ఆత్మ వలన బయలుపరచబడిన” ( 1 కొరింథీ 2:10  ) మంచి సంగతులను పరిచయం చేసుకోవటంలో, వారి ఆత్మీయనిధి యొక్క జాబితా తయారుచేసుకోవటంలో వారెంత మెలకువ కలిగుండాలి!

నిత్య నిబంధన ద్వారా నా కోసం ఏమి చేయబడిందో తెలుసుకోవటానికి మాత్రమే కాదు, నా మనస్సులో పదే పదే మననం చేసుకునేందుకు, ఆ వాగ్దానాలను ధ్యానించి, వాటి ఆత్మీయ అర్థాన్ని నాకు తెలుపమని ప్రభువుకు మొఱ్ఱపెట్టేందుకు నేను లేఖనాలను వెదకాలి. తేనెటీగ పువ్వుల వైపు తేరిచూడటం ద్వారా తేనెను సంగ్రహించుకోలేదు. అలాగే క్రైస్తవుడు కూడా తన విశ్వాసం ద్వారా ఆ వాగ్దానాలను గ్రహించి, వాటి మీద మనస్సుంచితే గాని వాటి వలన నిజమైన ఓదార్పు మరియు ధైర్యం పొందలేడు. సోమరి ఆశను తీరుస్తానని దేవుడెన్నడూ వాగ్దానం చేయలేదు కాని, “శ్రద్ద గలవాని ప్రాణము పుష్టిగానుండును” ( సామెత 13:4 ) అని ప్రకటించాడు. అందుకే యోహాను 6:27లో క్రీస్తు ఇలా అన్నాడు, “క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి”. వాగ్దానాలు మన మనస్సుల్లో నిల్వచేసుకుంటే, అవి ఎక్కువగా అవసరమున్నప్పుడు పరిశుద్ధాత్మ వాటిని మన జ్ఞప్తికి తెస్తాడు.

3. దేవుని వాగ్దానాల దీవెనకరమైన ఉద్దేశాన్ని గుర్తించగలిగినప్పుడు మనం వాక్యము నుండి లాభపడతాం

‘రోజువారీ జీవితములో అది ఒక సాధారణ విషయమైనట్లు ఉండే కపటమైన వైఖరి కొంతమంది క్రైస్తవులు దైవభక్తిని కోరుకోకుండా అడ్డుపడుతుంటుంది. అది వారికి వాస్తవిక విషయంలా కాక ఏదో కాల్పనిక, ఇంద్రియాతీత, కృత్రిమ విషయంలాగే ఉంటుంది. వారు ఆత్మీయ విషయాల కోసం, రాబోయే జీవితము కోసం దేవునిని విశ్వసిస్తారు; అయితే నిజమైన "దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవున”ని (1 తిమోతి 4:8) వారు పూర్తిగా మర్చిపోతారు. దైనందిన జీవితములోని చిన్నచిన్న విషయాలను గూర్చి ప్రార్థించటం వారికి ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తుంది. వారి విశ్వాసపు వాస్తవికతను ప్రశ్నించేందుకు ఈ చిన్న విషయాన్ని అడిగే సాహసం నేను చేస్తే బహుశ ఉలిక్కిపడతారు. జీవితములో చిన్నచిన్న సమస్యలకు ఆ విశ్వాసం సాయపడకపోతే, మరణమంత గొప్ప శోధనలో అది సహకరిస్తుందా??' (సి.హెచ్.స్పర్జన్)

 "దైవభక్తి యిప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును” (1 తిమోతి 4:8). ప్రియ చదువరీ, దేవుని వాగ్దానాలు నీ అనుదినజీవితములో అన్ని అంశాలకు , అన్ని పరిస్థితులకు వర్తిస్తాయని నీవు నమ్ముతున్నావా? లేక పాతనిబంధన వాగ్దానాలు కేవలం యూదులకు మాత్రమేనని, “మన వాగ్దానాలు” ఆత్మీయదీవెనలకే గాని భౌతికదీవెనలకు సంబంధించినవి కావని 'వితరణ వాదులు'(Dispensationalist) ఎవరైనా నిన్ను భ్రమింపజేశారా? ఎంతోమంది క్రైస్తవులు హెబ్రీ 13:5 నుండి ఓదార్పు పొందటం లేదా? “నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను”, అన్న మాట యెహోషువ 1:6 నుండి ఉదహరించబడింది! అలాగే 2 కొరింథీ. 7:1లో కూడా "ఈ వాగ్దానములు మనకు ఉన్నవి”, అని చెబుతుంది. అయితే అందులోనున్న ఒకటి లేవీయ కాండము 6:18 నుండి తీసుకొనబడింది. 

బహుశ కొంతమంది ఇలా అడుగవచ్చు, 'దీనికి అంతమెక్కడిది, పాత నిబంధనలో ఏ వాగ్దానం నాకు సరిగా చెందుతుంది?’ దీనికి జవాబుగా, కీర్తన 84:11 ఏమని చెబుతుందంటే, “...యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు”. నీవు నిజంగా 'యథార్థంగా’ నడచుకొనువాడవైతే, ఆ ధన్యకరమైన వాగ్దానాన్ని అన్వయించుకునేందుకు అర్హుడివి; నీకవసరమైన 'ఏ మేలైనను' చేయక మానని ప్రభువును విశ్వసించటానికి అర్హునివి. “దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును” (ఫిలిప్పీ 4:19). నీ ప్రస్తుత పరిస్థితికి సరిగ్గా సరిపోయే వాగ్దానం దేవుని వాక్యములో ఎక్కడైనా ఉంటే, నీ అవసరానికి అనుగుణంగా దానిని నీవు స్వతంత్రించుకో. తండ్రి యొక్క వాగ్దానాన్ని నీకు చెందకుండా సాతాను అడ్డుకునే ప్రతిప్రయత్నాన్ని ధైర్యంగా ఎదురించు.

4. దేవుని వాగ్దానాల మధ్య సరైన విచక్షణ చూపించగలిగినప్పుడే మనం వాక్యము నుండి లాభపడతాం

ప్రభువు యొక్క ప్రజలలో చాలా మంది తమకు కాకుండా ఇతరులకు చెందాల్సిన వాగ్దానాలను తమకు తాము అన్వయించుకుంటుంటారు. ఎన్నిక చేయబడి, విమోచించబడిన వారి విషయములో ప్రభువైన యేసు క్రీస్తుతో చేయబడిన కొన్ని వాగ్దాన నిబంధనలు ఎలాంటి షరతులతో కూడి లేవని నా అభిప్రాయం; అయితే మరికొన్ని వాగ్దానములలోని దీవెనలు, వాటికి జతచేయబడిన షరతులను మనం నిర్వర్తిస్తేనే తప్ప అన్వయించలేనట్లుగా ఉన్నాయి. నీవు చేయవలసినదల్లా ఆయన వాగ్దానం చేసినవి నెరవేరేలా షరతులను నిర్వర్తించటమే. వాగ్దానములకు జతచేయబడిన షరతులను మనము నిర్వర్తిస్తేనే, ఆ వాగ్దానాలు మనపట్ల నెరవేరతాయని మనం ఆశించవచ్చు.

దైవిక వాగ్దానాలు చాలా వరకు కొన్ని నిర్దిష్ట లక్షణాలుగలవారికి ఉద్దేశించబడ్డాయి. ఉదా: కీర్తన 25:9లో ప్రభువు “న్యాయవిధులను బట్టి దీనులను నడిపించును” అని ఉంది; అయితే నేను ఆయనతో సహవాసం లేకుండా ఉంటే, నా స్వంతచిత్తాన్నే పాటించే క్రమంలో నేనుంటే, నా హృదయమే ఒకవేళ గర్వితంగా ఉంటే, ఈ వచనమందించే ఓదార్పుకు నేను అనర్హుడను. అలాగే యోహాను 15:7లో ప్రభువు, “నాయందు మీరును, మీ యందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును ” అని సెలవిచ్చెను. అయితే నేనాయనతో అనుభవాత్మక సహవాసం కలిగియుండకపోతే, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా నా ప్రవర్తనను క్రమపరచుకొనకపోతే, నా ప్రార్థనలకు ఏ జవాబూ ఉండదు. అయితే దేవుని వాగ్దానాలు కేవలం ఆయన ఉచితమైన కృపచొప్పున ఇవ్వబడినా “నీతి ద్వారా కృప ఏలుతుంది” (రోమా 5:21) అని మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి. అంతేకాక దేవుని కృప మానవబాధ్యతను ఎన్నడూ మినహాయించదు. ఒకవేళ ఆరోగ్యసూత్రాలను నేను విస్మరిస్తే, అనారోగ్యం దేవుని లౌకిక అనుగ్రహాలను అనుభవించకుండా నాకు అడ్డం పడుతుంది; అదే మాదిరిగా దేవుని ఉపదేశాలను ఉపేక్షిస్తే, దేవుని వాగ్దానాల నెరవేర్పును అందుకోలేనందుకు నన్ను నేనే నిందించుకోవాలి.

పరిశుద్ధతకు కావల్సిన అవసరతలను ఉపేక్షించేంతగా దేవుడు వాగ్దానాల ద్వారా తనకు తాను కట్టుబడియున్నాడని ఎవరూ అనుకోకూడదు; తన పరిపూర్ణతలలో వేటిని కూడా ఆయన ఒక దానికి మరొకటి పణంగా పెట్టడు. దేవుడు పశ్చాత్తాపం చెందని, శ్రద్ధలేనివారి పై తన ఫలాలను ప్రసాదిస్తే తద్వారా క్రీస్తుయొక్క త్యాగపూరిత క్రియ చాలా గొప్పగా చిత్రీకరించబడుతుందని ఎవరూ అనుకోవద్దు. ఇక్కడ సత్యము యొక్క సమతుల్యం భద్రపరచాల్సి ఉంది; అయ్యో, ఈ రోజులలో ఆ సమతుల్యం కోల్పోవడం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం; దైవిక కృపను ప్రశంసించే సాకుతో మనుష్యులు దానిని "కామాతురత్వమునకు దుర్వినియోగపరుచుచున్నారు"(యూదా :4). “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము, నేను నిన్ను విడిపించెదను” (కీర్తన 50:15) అను ఈ మాట నేటిరోజులలో ఎంత తరచుగా వింటాం. కానీ దానికన్నా ముందు వచనములో “మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము” అని వ్రాయబడిన ఈ మాట ఎంత అరుదుగా వింటాం. అలాగే “నీ మీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” (కీర్తన 32:8) అను ఈ మాట ఎంత తరచుగా వింటాము. కానీ ఈ మాట ఏ సందర్భములో చెప్పబడిందో, పట్టించుకోము! ఎవరైతే యెహోవా సన్నిధిలో తమ “అతిక్రమములు” ఒప్పుకుంటారో ఈ వాగ్దానం వారికి మాత్రమే ( కీర్తన 32:8 ). నాలో ఒప్పుకోని అతిక్రమము ఏదైనా ఉంటే, లేదా దేవునిపై ఆధారపడటానికి బదులుగా ( కీర్తన 62:5 ) మానవమాత్రుని పై నేను ఆధారపడియుంటే, నాకు ఆలోచన చెప్పి నడిపించునట్లు ఆయన దృష్టి నాపై ఏలా ఉంటుంది? ఆయనతో సహవాసము కలిగియున్నప్పుడే ఈ వాగ్దానము నాలో నెరవేరుతుంది. ఎందుకంటే ఆయనకు దూరంగా ఉన్నప్పుడు నాకు మార్గదర్శకము చేసే ఆయన కన్నులను నేను ఎలా చూడగలను?

5. దేవుని వాగ్దానాలను నిశ్చయమైన ఆశ్రయంగా చేసుకోగలిగినప్పుడు మనం వాక్యము నుండి లాభపడతాం

దేవుడు తన వాగ్దానాలను మనకివ్వడానికి ఇదొక కారణం; ఆయన కృపాయుతమైన ప్రణాళికను బయలుపరచటం ద్వారా తన ప్రేమను మనకు వెల్లడిపరచటానికేకాక, మన హృదయాలను ఓదార్చి విశ్వాసాన్ని బలపరచేందుకే వాగ్దానాలను మనకిచ్చాడు. దేవునికిష్టమైతే వాగ్దానం చేయకుండానే, అనగా ఏ సూచన ఇవ్వకుండానే ఆయనకిష్టానుసారమైన యీవులన్నీ మనకు ఇవ్వగలిగియుండేవాడు. ఒకవేళ అలా చేసుంటే, మనం విశ్వాసులం కాకపోయి ఉండేవాళ్లం; వాగ్దానములేని విశ్వాసం నిలబడేందుకు నేల లేని కాలు వంటిది. దయగల మన తండ్రి తన యీవులను మనం రెండంతలుగా అనుభవించాలని తలచాడు; మొదట విశ్వాసముతో, తర్వాత ఫలసిద్దితో. ఇలా చేయటం ద్వారా లోకసంబంధ విషయాల నుండి ఆత్మసంబంధ విషయాలవైపు మరియు నశించిపోయే విషయాల నుండి నిత్యము నిలచు సంగతులవైపు మన హృదయాలను మరల్చుతాడు. 

ఒకవేళ వాగ్దానాలే లేకపోయి ఉంటే, విశ్వాసముతో పాటు నిరీక్షణ కూడా ఉండేది కాదు. దేవుడు మనకిస్తానని ప్రకటించిన విషయాల నిజస్వరూపమే నిరీక్షణ. విశ్వాసం వాగ్దానము వైపు చూస్తుంది, నిరీక్షణ దాని నెరవేర్పును చూస్తుంది. అబ్రాహాము గురించి ఇలా చెప్పబడింది, “నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి... విశ్వాసమునందు బలహీనుడుకాక, రమారమి నూరేండ్లు వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక, దేవుని మహిమపరచి, రూఢిగా విశ్వసించెను” (రోమా 4:18-20). మోషే విషయములో కూడా ఇలాగే చూస్తాము. “ఐగుప్తుధనముకంటే క్రీస్తు విషయమైన నింద గొప్పభాగ్యమని యెంచుకొని; ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను” (హెబ్రీ 11:26). పౌలు విషయములో కూడా ఇలాగే చూస్తాం. “నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని దేవుని నమ్ముచున్నాను” (అపొ.కా. 27:25) అని చెప్పెను. ప్రియ చదువరీ, నీ విషయంలో కూడా ఇలాగే ఉందా? అబద్దమాడజాలని దేవుని వాగ్దానాలే నీ దీనహృదయానికి విశ్రాంతి స్థలమా?

6. దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం సహనంతో వేచి చూడగలిగితే మనము వాక్యం నుండి లాభపడతాం

 అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని వాగ్దానం చేసాడు, కాని దాని నెరవేర్పు కొరకు అతడు చాలా ఏళ్ళు నిరీక్షించాడు. సుమయోను, “ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్దాత్మ చేత బయలుపరచబడియుండెను” (లూకా 2:26). అయినప్పటికీ అతడు మరణపు అంచుల మీద ఉన్నప్పుడే ఇది సఫలమైంది. ప్రార్థన అను విత్తనం విత్తు సమయానికి మరియు జవాబు అను కోతకోయు కాలానికి మధ్య ఒక సుదీర్ఘమైన కఠినమైన శీతాకాలముంటుంది. పంతొమ్మిది వందల(ఇప్పుడు రెండు వేలు) సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు స్వయంగా చేసిన ప్రార్థనకు (యోహాను 17) నేటికీ సంపూర్ణమైన జవాబు దొరకలేదు. తన ప్రజల కొరకైన దేవుని శ్రేష్ఠమైన వాగ్దానాలు వారు మహిమనొందేంత వరకు సాఫల్యం పొందవు. నిత్యత్వమంతా తమ వినియోగంలో ఉన్నవారు తొందరపడనవసరము లేదు. “ఓర్పు తన క్రియను కొనసాగింపవలెనని” కొన్నిసార్లు దేవుడు మనల్ని వాగ్దాన నెరవేర్పుకై ఎదురుచూడనిస్తాడు. అయినప్పటికీ మనమాయనను సంశయింపకుండా ఉందాం. “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును” (హబక్కూకు 2:3).

“వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, దూరమునుండి చూచి వందనము చేసి, తాము భూమి మీద పరదేశులమును, యాత్రికులమునై యున్నామని ఒప్పుకొని, విశ్వాసము గలవారై మృతి నొందిరి” (హెబ్రీ 11:13). ఇక్కడ విశ్వాసము యొక్క సంపూర్ణ క్రియ ఇలా వివరించబడి ఉంది: జ్ఞానము, నమ్మకము, ప్రేమ పూర్వక అనుసరణ. ఈ వచనములో “దూరమునుండి చూచి' అనునది వాగ్దానం చేయబడిన సంగతులను సూచిస్తుంది. వాటిని వారు  'ఛాయ వెనక వాస్తవికతలు'గా గ్రహించి, దేవుని జ్ఞానాన్ని, మంచితనాన్ని అందులో కనుగొన్నారు. వారు “ఒప్పింపబడ్డారు', సందేహించలేదు, కాని వాటిలో తాము పాలిభాగస్థులమని నమ్మి అవి ఎన్నడూ వారిని నిరుత్సాహపరచవని తెలుసుకున్నారు. 'వందనము చేసి' అంటే వారి సంతోషాన్ని, గౌరవాన్ని వ్యక్తపరిచి అని అర్థం. వారి హృదయం ప్రేమపూర్వకముగా ఆ వాగ్దానాలతో జతచేయబడి, వాటిని సాదరంగా ఆహ్వానించి అతిథ్యమిచ్చారు. వారి సంచారాలు, శోధనలు, వేదనలలో ఈ వాగ్దానాలు వారికి ఓదార్పునిచ్చాయి.

వాగ్దానాల నెరవేర్పును ఆలస్యం చేయటంలో దేవుడు ఎన్నోలక్ష్యాలను నెరవేర్చుకుంటాడు. విశ్వాసము యొక్క స్వచ్చత ఇంకా స్పష్టంగా తెలుసుకోవటానికి దానిని పరీక్షకు గురిచేసి, సహనాన్ని పెంపొందించి, నిరీక్షణను అభ్యసించే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, దైవిక చిత్తానికి లోబడియుండడాన్ని కూడా ఇది ప్రోత్సహిస్తుంది. 'లోకమునుండి విడిపించబడే ప్రక్రియ మనలో ఇంకా పూర్తి కాలేదు; మనం తోసిపుచ్చాలని ప్రభువు ఉద్దేశించిన సుఖసౌఖ్యాలను విడిచిపెట్టేది పోయి మనమింకా వాటి వెంటపడుతున్నాం. తన కుమారుడైన ఇస్సాకు పాలు విడిచినప్పుడు అబ్రాహాము గొప్ప విందు చేశాడు;  మనపట్ల కూడా మన పరలోకపు తండ్రి అలాగే చేస్తాడేమో. గర్వితహృదయమా, తలొగ్గుము. నీ విగ్రహాలను విసర్జించుము, నీ అనురాగక్రియలను విడనాడుము, అప్పుడు వాగ్దానం చేయబడిన ఆ సమాధానం నీకు లభిస్తుంది' (సి. హెచ్. స్పర్జన్).

7. వాగ్దానాలను మనం సద్వినియోగపరచుకోగలిగితే వాక్యము నుండి మనం లాభపడతాం

మొదటిగా, స్వయంగా దేవునితో మన వ్యవహారాలలో, ఆయన కృపాసింహాసనాన్ని మనం సమీపించటం ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రాధేయపడేందుకే అయ్యుండాలి. అవి మన విశ్వాసము నిలబడేందుకు పునాది ఏర్పరచేందుకే కాకుండా, మన అభ్యర్థనల సారాంశం కూడా అయ్యుండాలి. మనమాయన చిత్తప్రకారం అడిగితే ఆయన వింటాడు. ఆయన మనపై కుమ్మరిస్తానని ప్రకటించిన శ్రేష్టమైన సంగతులలో ఆయన చిత్తం బయలుపడుతుంది. అలా ఆయన ప్రతిజ్ఞ చేసిన వాగ్దానాలను పట్టుకొని, ఆయన ఎదుట పరచి, “నీవు సెలవిచ్చిన మాట దృఢపరచుము” (2 సమూ 7:25) అని ప్రార్థించాలి. యాకోబు తనకివ్వబడిన వాగ్దానాన్ని గూర్చి ఆది 32:12లో  ఎలా ప్రాధేయపడ్డాడో గమనించండి; అలాగే నిర్గమ 32:12లో  మోషే కూడా చేశాడు. అలాగే కీర్తన 119:58లో  కీర్తనాకారుడు కూడా చేశాడు. అలాగే 1 రాజులు 18:25లో  సొలోమోను కూడా చేశాడు. అలాగే ప్రియ చదువరీ, నీవు కూడా చేయుము.

రెండవదిగా, ఈ లోకములో మనం జీవించే జీవితములో. హెబ్రీ 11:13లో  విశ్వాసవీరులు దైవిక వాగ్దానాలను పరిశీలించి, విశ్వసించి, వందనం చేయడం మాత్రమే కాకుండా, వాటి ద్వారా వారు ఎలా ప్రభావితం చేయబడ్డారో కూడా చెప్పబడింది. “తాము భూమి మీద పరదేశులమును, యాత్రికులమునైయున్నామని ఒప్పుకొని”, అనగా వారి విశ్వాసాన్ని గూర్చి బహిరంగప్రకటన చేశారని దాని అర్థం. ఈ లోకసంబంధపు విషయాల్లో వారికి ఆసక్తి లేదని వారొప్పుకొని, దానిని వారి ప్రవర్తన ద్వారా ఋజువుపరిచారు; వారు సొంతం చేసుకున్న వాగ్దానాల్లో వారి వంతు వారికి లభించింది. వారి హృదయాలు పైనున్న వాటిమీదే ఉంచారు. “నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము నుండును” (మత్తయి 6:21).

“ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసికొనుచు, శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషమునుండి మనలను పవిత్రులనుగా చేసికొందుము” (2 కొరింథీ 7:1); వాగ్దానాలు అంతటి ప్రభావాన్ని మనలో చూపాలి, ఒకవేళ విశ్వసిస్తే అవి చూపిస్తాయి కూడా. “ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును, అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, దైవస్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను” (2 పేతురు 1:4). ఈ సువార్త మరియు అమూల్యమైన వాగ్దానాలు, ధారాళముగా కుమ్మరింపబడి, శక్తిమంతంగా వినియోగించబడినవై, హృదయశుద్ది మరియు ప్రవర్తనపై ప్రభావం చూపి, భక్తిహీనతను, లోకాశలను విసర్జించటం నేర్పించి, స్వస్థబుద్ధి గలిగి, నీతియుక్తంగా, దైవభక్తి కలిగి జీవించాలని బోధిస్తాయి ( తీతు 2:12,13 ). దైవిక ప్రభావితమైన సౌవార్తీక వాగ్దానాల పరిణామాలెంత గొప్పవంటే అవి మనుష్యులను అంతరంగములో దైవిక స్వభావమునందు పాలివారగునట్లుగా చేసి, బహిరంగముగా ప్రస్తుత అవినీతి, భ్రష్టత్వాల నుండి విముఖులనుగా చేయగలవు ( 2 పేతురు 1:4 ).

తొమ్మిదవ అధ్యాయము

లేఖనాలు మరియు సంతోషము

నిజమైన సంతోషము క్రీస్తులో మాత్రమే లభిస్తుంది

దుష్టులు ఎల్లప్పుడూ సంతోషాన్ని వెదకుతూ ఉంటారు, కాని వారికది దొరకదు; దాని అన్వేషణలో వారు అలిసిపోతారు, కాని ఫలితముండదు. ప్రభువు నుండి వారి హృదయాలు త్రిప్పుట వలన, సంతోషం కోసం ఎక్కడో వెతుకుతుంటారు, కాని అది అక్కడ ఉండదు; అసలు సంగతిని ప్రక్కనబెట్టి, దాని నీడ వెంట శ్రద్దతో పరుగెడుతుంటారు. చివరికి అపహాస్యమే వారికి మిగులుతుంది. క్రీస్తునందు దేవుడు తప్ప నిజంగా సంతోషపెట్టేది మరొకటి ఉండరాదని దేవుని సార్వభౌమ్య నిర్ణయం ( యిర్మీయా 2:13 ). అయినా వారు దీనిని నమ్మరు, అందుచేత వారు ప్రతి వస్తువును, ప్రతి పగిలిపోయిన ఘటాన్ని వెదకి, శ్రేష్టమైన సంతోషమెక్కడ దొరుకుతుందో అని పరిశోధిస్తుంటారు. వారినాకర్షించే ప్రతి ఇహలోక వస్తువు - నాలో సంతోషం దొరుకుతుందని అంటుంది. కాని వెంటనే నిరుత్సాహపరుస్తుంది, అయినప్పటికీ, వారిని నిన్న మోసం చేసిన విషయాన్నే ఈ రోజు మళ్లీ వెదకనారంభిస్తారు. చాలా ప్రయత్నాల తర్వాత కూడా ఒక వస్తువులో ఉన్నశూన్యతను వారు ఒకవేళ కనుగొన్నా, వారు ఇంకొక దానివైపు తిరిగి, ప్రభువు చెప్పిన ఈ మాటలను దృఢపరచుకొంటారు, "ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును” (యోహాను 4:13).

ఇపుడింకో రకమైన ప్రజలను చూస్తే, సంతోషించటం పాపమని అనుకునే కొంతమంది క్రైస్తవులుంటారు. కొంతమంది చదువరులు ఈ మాట విని ఆశ్చర్యపడతారని అనడంలో సందేహం లేదు, అలాగైతే వారు బహు ధన్యకరమైన వాతావరణంలో పెరిగినందుకు కృతజ్ఞులైయుండాలి; అలాంటి ధన్యత లేనివారి విషయమై నేను ఇక్కడ ప్రయాసపడుచుండగా నన్ను సహించాలి. విషాదభరితంగా ఉండటమే వారి కర్తవ్యమని కొందరికి బోధింపబడింది. ఈ బోధ నేరుగా కాక అన్యాపదేశంగానూ, ఎప్పుడూ విషాదంగా ఉండే మాదిరిని చూపటం ద్వారానూ బోధించబడింది. అపవాదే వెలుగుదూతగా ప్రత్యక్షమై సంతోషానుభూతులను కలిగిస్తాడని వారి నమ్మకం. మనం నివసిస్తున్న ఈ పాపపులోకంలో సంతోషముగా ఉండటం ఓ రకమైన దుర్మార్గత అని వారు అభిప్రాయపడతారు. క్షమించబడిన పాపాలను బట్టి హర్షించటం గర్వమని వారి నమ్మకం. ఒకవేళ క్రైస్తవయువకులెవరైనా అలా చేస్తే వారు విషణ్ణమైన బురదనేలలో వికారంగా ఈదడం ఖాయమని వారికి చెబుతుంటారు. అలాంటి వారందరూ ఈ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా పర్యాలోచించాలని మా విన్నపం.

“ఎల్లప్పుడును సంతోషముగా ఉండుడి” (1 థెస్స 5:16). దేవుడు ఆజ్ఞాపించింది చేయడం వలన ఖచ్చితంగా ఏ హానీ జరుగదు. సంతోషించటం విషయమై దేవుడు ఏ నిషేధాజ్ఞ విధించలేదు. అయితే సాతానే మనం అలా సంతోషించకుండ నిరోధిస్తాడు.'ఎల్లప్పుడును ప్రభువునందు విచారపడుడి, మరల చెప్పుదును విచారపడుడి' అని దేవుని ఆజ్ఞలేవీ మనకు చెప్పవు. కాని కీర్తన 33:1లో,“ నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము” అని మనం ప్రేరేపింపబడ్డాం. ప్రియ చదువరీ, నీవు నిజంగా ఓ క్రైస్తవుడవైతే, క్రీస్తు నీవాడు; ఆయనలో ఉన్నదంతా నీదే. ఆయన నిన్నిలా ఆహ్వానిస్తాడు, “నా సఖులారా, భుజించుడి లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా, పానము చేయుడి” (పరమగీతము 5:1), ఆయన ప్రేమవిందుకు వ్యతిరేకంగా నీవు చేయగల పాపము, నిన్ను నీవు పరిమితి చేసుకోవటమే. “మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనియ్యుడి” (యెషయా 55:2) అనే మాట ఇప్పటికే పరలోకములో ఉన్నవారికి చెప్పబడలేదు కాని భూమ్మీదనున్న పరిశుద్ధులకే చెప్పబడింది. ఇది మనల్ని ఏయే తలంపులకు నడిపిస్తుందో ఈ క్రింద పరిశీలన చేద్దాం.

1. సంతోషమొక కర్తవ్యమని గ్రహించినప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

"ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును అనందించుడి” (ఫిలిప్పీ 4:4). ఆనందించడమనేది దేవుని పిల్లలు జరిగించాల్సిన ఒక వ్యక్తిగత, ప్రస్తుత, శాశ్వత కర్తవ్యంగా పరిశుద్దాత్ముడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. మనం సంతోషముగా ఉండాలో లేక దుఃఖంతో ఉండాలో ప్రభువు మన ఇష్టానికి వదిలి పెట్టలేదు కాని సంతోషాన్ని ఒక కర్తవ్యంగా చేశాడు. ఆనందించకుండా ఉండటం ఒక పాపముగా పరిగణించబడుతుంది. ఈసారి ఒక సంతోషించే క్రైస్తవునిని మీరు కలిసినప్పుడు అతన్ని మందలించకండి కాని సందేహంలో బ్రతికే మిమ్మల్ని మీరే మందలించుకోండి, ఆ వ్యక్తి ఉల్లాసపూరితమైన దైవిక ఊటను ప్రశ్నించేందుకు సిద్దపడే బదులు మీ దుర్బలమైన స్థితిని గూర్చి చింతించండి. 

నేను ఇక్కడ ప్రస్తావించేది శారీరక సంతోషము గురించి కాదు, ఎందుకంటే అది భౌతికాధారమైనది. భూసంబంధమైన సంపదలలో సంతోషాన్ని వెదకటం వ్యర్థం. ఎందుకంటే అవి తరుచూ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. కొంతమంది తమ కుటుంబాలలో సంతోషం కోసం వెదకుతారు, కాని అది కొన్నేళ్లపాటే నిలుస్తుంది. మనకు 'నిత్యసంతోషం' కలగాలంటే, అది నిత్యము నిలిచియుండేదాని నుండి రావాలి. ఇక్కడేదో పిచ్చిసంతోషం గురించి నేను మాట్లాడటం లేదు. ఉద్రేకపూరిత స్వభావముగల కొంతమంది, వారు సగం పిచ్చివారైతేనేగాని సంతోషంగా ఉండరు. ఆయితే ఇక్కడ నేను ప్రభువునందు కలిగిన నిశ్చలమైన, నిర్మలమైన హృదయానందం గురించి మాట్లాడుతున్నాను. దేవుని ప్రతి గుణాన్ని విశ్వాసంతో ధ్యానించినప్పుడు అది హృదయాన్ని ఉప్పొంగజేస్తుంది. సువార్తలోని ప్రతి సిద్ధాంతాన్ని నిజంగా తెలుసుకున్నప్పుడు అది సంతోషాన్ని కలుగజేస్తుంది.

సంతోషంగా ఉండటం క్రైస్తవుని కర్తవ్యం. 'సంతోషం మరియు దుఃఖపు భావోద్రేకాలు నా ఆధీనములో లేవు; పరిస్థితులు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటాను' అని బహుశ చదువరి గట్టిగా కేక పెట్టొచ్చు. కాని నేను మళ్ళీ చెబుతున్నాను, “ప్రభువునందు ఆనందించుడి” అనేది దేవుని ఆజ్ఞ, దానికి విధేయత చూపడమనేది చాలావరకు మన చేతులలో ఉంది. నా భావోద్రేకాల నియంత్రణ నా బాధ్యత. నిజమే, దుఃఖపూరితాలోచనల నడుమ నేను దు:ఖించకుండా ఉండలేను, కాని వాటి గురించే ఎప్పుడూ ఆలోచించకుండా ఉండేందుకు నా మనస్సును నేను ఆధీనములో పెట్టుకోగలను. ఉపశమనం కొరకు నా హృదయాన్ని ప్రభువు ముందుంచగలను, నా భారాలన్నీ ఆయన మీద వేయగలను. ఆయన మంచితనము, వాగ్దానాలు మరియు నా కొరకై సిద్ధపరచిన గొప్ప భవిష్యత్తును గూర్చి ధ్యానించేందుకు ఆయన కృపను కోరగలను. నేను వెళ్ళి వెలుగులో నిలుచుంటానా లేక చీకట్లో దాక్కుంటానా అన్నది నేనే నిర్ణయించుకోవాలి. ప్రభువునందు ఆనందించకుండా ఉండటం గొప్ప దౌర్భాగ్యం; అది ఒప్పుకొని, విడిచి పెట్టాల్సిన తప్పిదం.

2. నిజమైన సంతోషరహస్యాన్ని కనుగొనగలిగితే వాక్యము నుండి మనం లాభపడతాం

ఆ రహస్యం 1 యోహాను 1:3,4లో వెల్లడి చేయబడింది: “మన సహవాసమైతే తండ్రితో కూడను, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది; మీ సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము.” దేవునితో మన సహవాసమెంత కొద్దిపాటిదో, ఎంత సారహీనమైందో పరిశీలిస్తే, చాలామంది క్రైస్తవులు అంత నిస్సంతోషంగా ఎందుకున్నారో తెలుసుకోగలం. కొన్నిసార్లు మనమిలా పాడుతాం, 'నా రక్షకుడును, దేవుడవైన నీమీద గురియుంచిన రోజు ఎంత సంతోషకరమైన రోజు, ఈ ప్రకాశించు హృదయం సంతోషించి, పరమానందాన్ని అన్ని దిక్కులా తెలిపే రోజు!' అవును, అలాంటి సంతోషాన్ని కొనసాగించాలంటే, హృదయాన్ని,మనస్సును క్రీస్తుకు నిరంతరం ఆధీనపరుస్తుండాలి. ఎక్కడైతే విశ్వాసము, దాని ఫలితమైన ప్రేమ ఎక్కువగా ఉంటాయో, అక్కడే సంతోషం అధికంగా ఉంటుంది.

"ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి". మనం 'ఎల్లప్పుడు’ ఆనందించదగిన ఏ ఇతర విషయమూ లేదు. ప్రతియొక్క విషయం, ప్రతియొక్క వస్తువు మార్పు చెందుతూ, అస్థిరంగా ఉంటుంది. ఈ రోజు తృప్తిపరిచే విషయం, రేపు విషాదం కలుగజేస్తుంది. కానీ ప్రభువు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు, అనుకూల అననుకూల సమయాల్లో ఒకేలా ఆనందించేందుకు సహాయకారిగా ఉంటాడు. ఆ తర్వాత వచనమేమీ చెబుతుందో గమనించండి, “ప్రభువు సమీపముగా ఉన్నాడు” (ఫిలిప్పీ 4:5). బాహ్య విషయాలను గూర్చి మితంగా ఉండండి; అవి సంతృప్తికరంగా ఉన్నప్పుడు వాటి వెంటపోవడం, అసంతుష్టి కలుగజేసినప్పుడు కలవరపడడం చేయకండి. లోకం మిమ్మల్ని చూసి నవ్వితే హెచ్చింపబడి, కోపదృష్టితో చూస్తే క్రుంగిపోకండి. వెలుపలి సుఖాల పట్ల నిగ్రహంతో ఉండి, ప్రతి సందర్భములోను ఆత్మసంయమనం కలిగియుండండి. స్వయముగా ప్రభువే సమీపముగానున్నప్పుడు వాటితో ఎందుకు ఆక్రమితమవ్వాలి? ఒకవేళ హింస అధికంగా ఉంటే, లౌకికంగా ఎక్కువ నష్టపోతే, ప్రభువే “అపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్తన 46:1). తనపై భారం వేసినవారిని ఆదుకొని, ఊరట కలిగించే ఆయనే మీ గురించి చింతిస్తున్నాడు, కాబట్టి “దేనిని గూర్చియు చింతపడకుడి” (ఫిలిప్పీ 4:6). లోకసంబంధులు తుచ్ఛమైనవాటిని వెంటాడతారు, కాని క్రైస్తవులు అలా ఉండకూడదు.

“మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను” (యోహాను 15:11). క్రీస్తు యొక్క ఈ అమూల్యమైన మాటలు హృదయములో ధ్యానిస్తూ, మదిలో నిలుపుకుంటే, అవి సంతోషాన్ని తప్ప మరేమి కలిగించగలవు? యేసునుగూర్చిన జ్ఞానం, ఆయన సత్యం పట్ల ప్రేమ పెరుగుతుంటే హృదయం అంతకంతకు ఆనందిస్తుంది. “నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి” (యిర్మీయా 15:16). ప్రభువువాక్కులు భుజించి విందు చేసుకుంటేనే ఆత్మలు క్రొవ్వెక్కి, ఆయనను బట్టి మన హృదయాలు కీర్తించి, ఉత్సాహధ్వని చేయగలుగుతాయి.

“అప్పుడు నేను దేవుని బలిపీఠము నొద్దకు, నాకు ఆనంద సంతోషము కలుగజేయు దేవునియొద్దకు చేరుదును” (కీర్తన 43:4). బలిపీఠము సాదృశ్యపరచిన క్రీస్తు వద్దకు విశ్వాసులు ఎంత సంతోషానందాలతో రావాలి! దేవునిగూర్చిన స్పష్టమైన గ్రహింపు, ఆయనయందు ఆనందాన్ని ఇంకా ఉధృతం చేయాలి. ఇక్కడ కీర్తనాకారుడు బలిపీఠాన్ని కాదు లక్ష్యపెట్టింది. ఎందుకంటే అతడు విగ్రహారాధీకుల వలె కర్మకాండల పట్ల నమ్మిక ఉంచేవాడు కాదు. ఆయన హృదయం, ఆత్మీయసహవాసాన్ని కోరుకుంది - స్వయంగా దేవునితో సహవాసం. ప్రభువే వాటిలో లేకపోతే ఆరాధన కర్మకాండలను పాటించి ప్రయోజనమేమిటి? అవి కేవలం శూన్యమైన పెంకులు, మంటిఘటాలు. దావీదుకు తన ప్రభువు కేవలం ఆనందము మాత్రమే కాదు, అమితానందం; సంతోషపు ఊట కాడు, దానిని కలుగజేయువాడు కాదు లేక పోషించి, కొనసాగించేవాడు కూడా  కాదు కానీ స్వయంగా ఆయనే ఆ సంతోషము. 'నా ఆనందోత్సాహము నీవే' అంటే నా ఆనందపు సారం, సర్వస్వం, ప్రాణమూ నీవే' (సి.హెచ్.స్పర్జన్).

“అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను, ఒలీవచెట్లు కాపులేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తయైన నా దేవునియందు సంతోషించెదను” (హబక్కూకు 3:17, 18). లోకానికి ఏ మాత్రం తెలియని అనుభూతి ఇది; బాధాకరమేంటంటే ఎంతో మంది క్రైస్తవులు కూడా ఈ అనుభవానికి అపరిచితులే! నిత్యము నిలిచే ఆత్మీయానందపు ఊట దేవుని నుండే ఉద్భవిస్తుంది; ఆయన నుండే అది పొంగిపొర్లుతుంది. “మా ఊటలన్నియు నీయందే ఉన్నవి” (కీర్తన 87:7) అని సంఘమేనాడో ఈ విషయాన్ని గుర్తించింది. ఈ రహస్యము బోధింపబడిన ఆత్మ ధన్యమైనది.

3. సంతోషపు గొప్పవిలువను మనకు బోధించినప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

పక్షికి రెక్కలేలాగో, ఆత్మకు ఆనందం అలాంటిది. అది భూమి మీదున్న విషయాలకు పైన ఎగిరేందుకు దోహదం చేస్తుంది. నెహెమ్యా 8:10లో ఇది స్పష్టంగా చెప్పబడింది. "యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు.” ఇశ్రాయేలు చరిత్రలో నెహెమ్యా కాలం ఎంతో క్లిష్ట సమయం. బబులోను నుండి ఒక శేషం విముక్తి చేయబడి పాలస్తీనాకు తిరిగివచ్చింది. ఒకప్పుడు బందీలచే నిర్లక్ష్యము చేయబడిన ధర్మశాస్త్రము నూతనముగా ఏర్పడిన ఈ కృపా సామ్రాజ్యములో ఒక నిబంధనగా స్థాపించబడింది. గతంలో జరిగించిన చాలా పాపాలు జ్ఞప్తికి వచ్చి, మళ్ళీ ఒక జాతిగా ఏర్పడి దైవికారాధన, దైవికశాసనం వారి మధ్య స్థాపించబడినందుకు స్వాభావికముగా వారి కన్నీళ్ళు కృతజ్ఞతాభావంతో రాలాయి. వారి గురించి పూర్తిగా తెలిసిన నాయకులు ఒకవేళ వారు నిరుత్సాహపడితే, వారు ఇబ్బందులనెదుర్కొని జయించలేరని ఎరిగి, వారితో ఇలా అన్నాడు, “ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్టితమాయెను” (దేవునికి ఆరాధనా రోజుగా ఈ దినాన విందు ఏర్పాటు చేశాము, కాబట్టి మీరు దుఃఖపడకుడి), “యెహోవాయందు ఆనందించుటవలన మీరు బలమొందుదురు.” 

పాపాన్ని ఒప్పుకోవటం, దాని గురించి దుఃఖించటం, ఈ రెండూ లేకుండా దేవునితో కలిసి ఉండలేం. అయినప్పటికీ, నిజమైన పశ్చాత్తాపం అభ్యసించినప్పుడు, దేవునితో మంచి సంబంధం కలిగియున్నప్పుడు, “వెనుక ఉన్న విషయాలు మరచి, ముందున్న విషయాల కోసం వేగిరపడాలి” (ఫిలిప్పీ 3:13). మన హృదయాలు సంతోషంగా ఉండటం చేత ప్రసన్నతతో మనం ముందుకు సాగగలం. మరణించి నిశ్చలంగా పడున్న తన ప్రియుని వద్దకు చేరుకోవడం ఒక వ్యక్తికి ఎంత బాధాకరంగా ఉంటుంది! అయితే అదే వ్యక్తి తన పెళ్ళికుమార్తెను కలిసేందుకు సాగుతున్నప్పుడు తన కదలికలు ఎంత ఉత్సాహంగా ఉంటాయి! జీవిత పోరులకు విలాపం పనికిరాదు. నిరాశా నిస్పృహలున్న చోట విధేయత కొరకైన సామర్థ్యం ఇక ఏ మాత్రమూ ఉండదు. సంతోషం లేకపోతే, ఆరాధన ఉండనేరదు.

ప్రియ చదువరులారా, చేయాల్సిన పనులున్నాయి, ఇతరులకు చేయాల్సిన సేవలున్నాయి. అధిగమించాల్సిన శోధనలున్నాయి, పోరాడాల్సిన యుద్ధాలున్నాయి; మన హృదయాలు ప్రభువులో ఆనందిస్తున్నకొలది మనం ఆచరణాత్మకంగా వాటి కొరకు పనికొస్తాం. మన ఆత్మలు క్రీస్తులో సేదదీరితే, మన హృదయాలు ప్రశాంత సంతోషంతో నిండియుంటే, మన పనులు సులభమవుతాయి. కర్తవ్యాలు ఉల్లాసకరమై, విచారం భరించతగినదై, సహనశీలంగా ఉండగలుగుతాం. గత వైఫల్యాల జ్ఞాపకాలు గాని, బలమైన తీర్మానాలు గానీ మనల్ని ముందుకు తీసికొనిపోలేవు. చేయి బలంగా దెబ్బతీయాలంటే, తేలికపాటి హృదయం వలన అది చేయాలి. స్వయంగా రక్షకుని గురించి ఇలా వ్రాయబడింది, “తన యెదుట ఉన్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించెను” (హెబ్రీ 12:2).

4. సంతోషపు మూలాన్ని శ్రద్దగా మనం గ్రహించగలిగినపుడు వాక్యము నుండి లాభపడతాం

ఆనందపు ఊట విశ్వాసమే; "నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోను, సమాధానముతోను మిమ్మును నింపును గాక” (రోమా 15:13). మన వద్దనుండి తీసివేయటానికి, మనకివ్వటానికి, సువార్తలో ఒక అద్భుత ఏర్పాటు ఉంది - క్రైస్తవ హృదయాలకు నిశ్చలమైన, స్థిరపరిచే వెలుగునివ్వటానికి సమాధానపుమాటల ద్వారా దుఃఖపూరిత మనస్సాక్షియొక్క దోషభారాన్ని అది తీసివేస్తుంది. శిక్షావిధి క్రింద ఉన్న ఆత్మ నుండి దేవునిభీతిని, మరణపుభయాన్ని అది తీసివేస్తుంది. అది స్వయంగా దేవునినే మన హృదయాలకు స్వాస్థ్యంగా, మన సహవాసానికి ఆధారంగా చేస్తుంది. మన ఆత్మలు దేవునిలో సేదదీరుతున్నందున సువార్త మనకు సంతోషాన్నిస్తుంది. కానీ మనం వ్యక్తిగతంగా అన్వయించుకున్నప్పుడే ఈ దీవెనలు మనవవుతాయి. విశ్వాసముతో వాటిని స్వీకరించాలి, అది స్వీకరించినప్పుడు హృదయము సమాధాన సంతోషాలతో నిండియుంటుంది. నిరంతరానందానికి రహస్యం సంతోషానికి మార్గం తెరచి ఉంచడమే, మనమెలా మొదలు పెట్టామో అలా కొనసాగించడమే. అవిశ్వాసం ఆ మార్గాన్ని ఆటంకపరుస్తుంది. థర్మామీటరు చుట్టూ కొంచెం వేడిమిగా ఉంటే, అందులోని పాదరసం కూడా కొంతమేరకే పైకి వెళ్తుంది. విశ్వాసం బలహీనంగా ఉంటే ఆనందం బలీయంగా ఉండటం సాధ్యం కాదు. సువార్త యొక్క అమూల్యతను గూర్చిన నూతనగ్రహింపు కోసం రోజూ ప్రార్థన చేయాలి. అందులోని దివ్యమైన విషయాల నూతనఅన్వయింపు కొరకు ప్రార్థించాలి, అప్పుడే మన ఆనందం నూతనంగా ఉంటుంది.

5. మన ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగినప్పుడు మనం వాక్యము నుండి లాభపడతాం

“పరిశుద్దాత్మలో ఆనందం” అనేది మన సహజ సంతోషానికి భిన్నమైనది. మన హృదయాల్లో, శరీరాల్లో ఆదరణకర్త నివసిస్తూ, క్రీస్తును మనకు ప్రకటిస్తూ, మన క్షమాపణ మరియు శుద్ధి చేయబడే అవసరానికి సంతృప్తినిస్తూ, దేవునితో సమాధానంగా నిలుపుతాడు; క్రీస్తును మనలో రూపింపజేసి, మన ఆత్మలను ఆయన ఏలే విధంగా, ఆయన ఆధీనములోనికి మనల్ని తెస్తాడు. శోధించే  ఏ పరిస్థితులైనా కూడా మనలోని ఈ ఆనందాన్ని అడ్డుకోలేవు. ఎందుకంటే "ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి” అనేది ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఇచ్చిన వ్యక్తికి మన జీవితాలను ఆవరించే నిరాశ గూర్చి, మనల్ని ఆవరించే పాపాలు మరియు దుఃఖాల గూర్చి, ఎలాంటి “మహా శ్రమల” గుండా దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించాలి మొదలైనవాటి గురించి తెలుసు. సహజ ఆనందాన్ని కలిగియున్నవారు కూడా ఈ లోకవ్యాకులతలను కొంత పట్టించుకోరు. కాని జీవితపు శ్రమల నడుమ అది వెంటనే నిష్పలమవుతుంది. స్నేహితులను, లేక ఆరోగ్యాన్ని పోగొట్టుకోవడం అది జీర్ణించుకోలేదు. అయితే మనకుద్బోధించబడిన ఆనందం, ఏదో కొన్ని సందర్భాలకో లేక కొన్ని రకాల వ్యక్తిత్వాలకో పరిమితమైంది కాదు; మన మానసికావస్థలు లేక పరిస్థితులను బట్టి అది అస్థిరం కాదు. 

యేసు లాజరు సమాధి దగ్గర కన్నీళ్ళు విడిచినట్లుగా సహజ స్వభావం మనలో కూడా బహిర్గతమవుతుంది. అయినప్పటికీ, “దుఃఖపడిన వారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము” (2 కొరింథీ 6:10) అని పౌలుతో మనము బిగ్గరగా చెప్పగలము. క్రైస్తవుడు ఎన్నో తీవ్రమైన బాధలతో నిండి ఉండొచ్చు, అతని ప్రణాళికలు బెడిసికొట్టొచ్చు, అతని ఆశలు నాశనమై ఉండొచ్చు, భూమి మీద అతని జీవితానికి ప్రసన్నత, మధురత కలిగించిన ప్రియుడు మరణించి ఉండవచ్చు, అయినప్పటికీ, ఈ నిరాశ, దుఃఖాల నడుమ కూడా, అతని ప్రభువు అతన్ని “సంతోషించ”మనే చెబుతాడు. ఫిలిప్పీ చెఱసాలలోని అపొస్తలుల విషయం గమనించండి. వారు చావడిలోనికి ఈడ్చబడి, కాళ్ళకు బొండవేయబడి, బెత్తముల చేత చాలా దెబ్బల వలన రక్తం కారుతున్న వీపులతో పడున్నారు. అయితే వారు ఎలా ప్రతిస్పందించారు? సణుగులు గొణుగులతోనా? లేక ఈ శిక్ష పొందటానికి మేమేమీ చేశామని అడుగుతూనా? కాదు, “మధ్య రాత్రి వేళ పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి” (అపొ.కా. 16:25). వారి జీవితాలలో పాపం లేదు, వారు విధేయులై నడుచుకుంటున్నారు, కాబట్టి పరిశుద్ధాత్ముడు క్రీస్తు సంగతులు జరిగించేందుకు, అవి వారికి చూపించేందుకు స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. తద్వారా వారు ఉప్పొంగేలా చేశాడు. మన సంతోషాన్ని మనం నిలబెట్టుకోవాలనుకుంటే పరిశుద్దాత్ముని దుఃఖపరచకుండా ఉండాలి.

మన హృదయాలలో క్రీస్తే సర్వోన్నతమైనప్పుడు, అది సంతోషముతో నిండుతుంది. ప్రతి కోరికకు ఆయనే ప్రభువైనప్పుడు, ప్రతి ప్రేరణకు ఆయనే ఆధారమైనప్పుడు, ప్రతి లాలసను ఆయనే వశపరచుకున్నప్పుడు, హృదయం ఆనందముతో నిండి, పెదవులతో స్తుతి ఆరోపిస్తుంది. దీనిని పొందుకునే నిమిత్తం ప్రతి నిమిషం మనం సిలువనెత్తుకోవాలి; ఈ రెండు విషయాలను దేవుడెలా పొందుపరిచాడంటే, ఒకటి లేకుండ మరొకటి జరగటం సాధ్యం కాదు. ఆత్మసమర్పణ, కుడిచెయ్యి నరుకుకోవటం, కుడికన్ను పెరికివేయటం - ఇవన్నీ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశించేందుకు మార్గాలు (అంటే ఆటంకపరిచేవాటిని తొలగించటం), అలా మనలో ప్రవేశించినప్పుడు తనతోపాటు దేవునికి అంగీకారయోగ్యమైన చిరునవ్వు, అతని ప్రేమ, చిరకాల సన్నిధి మొదలైన సంతోషాలను మనకు తెచ్చిపెడతాడు. ప్రతి దినాన్ని మనమేవిధంగా మొదలుపెడతామనే స్ఫూర్తి మీద కూడా చాలా ఆధారపడి ఉంది. ప్రజలు మనల్ని బుజ్జగించి తలకెక్కించుకోవాలని మనము ఒకవేళ ఆశిస్తే, అది కేవలము నిరాశకు గురిచేస్తుంది. మన గర్వాన్ని పోషించుకోవాలని మనం కోరితే, అలా జరగనప్పుడు మనం బాధపడతాం. స్వయాన్ని మరిచిపోయి, ఇతరుల ఆనందం కోసం పరిచర్య చేయటమే సంతోషపు రహస్యం. "పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము”, కాబట్టి ఇతరులకు పరిచర్య చేయటమే సంతోషకరమైన విషయం.

6. ఆనందానికి అవరోధాలను తొలగించటంలో మనం నిరంతరం శ్రమిస్తే, వాక్యము నుండి మనం లాభపడతాం

చాలామంది క్రైస్తవులకు ఎందుకు అంత తక్కువ ఆనందముంటుంది? వారు వెలుగు సంబంధులు కారా? దేవుని స్వభావాన్ని, ఆయనతో మన సంబంధాన్ని, మన భవిష్యత్తాంతము వివరించేందుకు లేఖనంలో చాలాసార్లు వాడబడిన 'వెలుగు' అన్న పదం సంతోషాన్ని, ప్రసన్నతను సూచిస్తుంది. ప్రకృతిలో వెలుగుకంటే ఏ ఇతర వస్తువు/విషయం అంత ఉపయుక్తంగా, మనోహరంగా ఉంటుంది? “దేవుడు వెలుగైయున్నాడు, ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు” (1 యోహాను 1:5). దేవునితో మనం వెలుగులో నడుస్తున్న కొద్దీ, హృదయం నిజంగా ఆనందంగా ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా మనం కొన్ని సంగతులను నుమతించుట వలననే ఆయనతో మన సహవాసం దెబ్బతిని, మన ఆత్మలు ఉదాసీనంగా నిరాశామయమౌతాయి. అతిలాలసత్వం, లోకంతో మైత్రి, నిషేధించబడిన మార్గాల్లో ప్రవేశం - ఇవన్నీ మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసి, నిరాశాజనకంగా మారుస్తాయి.

"నా రక్షణానందము నాకు మరల పుట్టించుమని” (కీర్తన 51:12) దావీదు మొఱ్ఱపెట్టవలసి వచ్చింది. అతడు సడలిపోయి సొంత కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టాడు. శోధన దానంతటదే తనకు కనబరచుకున్నప్పుడు అడ్డుకునే శక్తి అతనికి లేకపోయింది. అతను లోబడ్డాడు, ఒక పాపం మరొక పాపానికి దారి తీసింది. అతను దేవునితో సహవాసం కోల్పోయి భ్రష్టుడయ్యాడు. ఒప్పుకోని పాపము అతని మనస్సాక్షిపై భారంగా నిలిచింది. ఓ ప్రియ చదువరీ, అలా పడిపోకుండా మన సంతోషాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే మనల్ని మనం ఉపేక్షించుకొని శరీరాశలను అనుభూతులను సిలువ వేయాలి. శోధనను గూర్చి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మన మోకాళ్ల మీద ఎక్కువ సమయం గడపాలి. జీవజలపు ఊట నుండి తరచూ త్రాగుతూ ఉండాలి. ప్రభువు కొరకే పూర్తిగా సమర్పించుకోవాలి.

7. దుఃఖానికి సంతోషానికి మధ్య సమతుల్యాన్ని మనం శ్రద్ధగా భద్రపరచుకోగలిగితే వాక్యము నుండి లాభపడతాం

క్రైస్తవ విశ్వాసానికి ఆనందం కలగజేసే తత్త్వం ఉంటే, అదే పరిమాణంలో దుఃఖాన్ని ఉత్పన్నం చేసే ప్రవృత్తి కూడా ఉంటుంది. ఈ దుఃఖం పవిత్రమైంది, ఉత్తమమైంది, వీరోచితమైనది. “దుఃఖపడినవారమైనట్లుండియు ఎల్లప్పుడు సంతోషించువారము” (2 కొరింథీ 6:10) అన్నది క్రైస్తవ జీవితపు నియమం. మన స్థితి, స్వభావం మరియు పాపాల మీద విశ్వాసం దృష్టి సారించినపుడు దుఃఖం కూడా దాని ప్రభావమై ఉంటుంది. ఓర్పుతో మౌనంగా ఉన్న దుఃఖఛాయ లేని సంతోషం కన్నా కృత్రిమమైనది, అల్పమైనది లేనేలేదు, దానంత అసహ్యం కలిగించేది మరొకటి ఉండదు. దుఃఖం ఎందుకంటే నేనేమిటో, ఏమైయుండాలో నాకు తెలుసు కాబట్టి; దుఃఖం ఎందుకంటే ప్రపంచం వైపు చూసిన ప్రతిసారి నవ్వు, ఉల్లాసం వెనుక నరకాగ్ని రగలటం చూస్తాను కాబట్టి. అది చూసినప్పుడు మనుష్యులు దేనివైపు పరుగులిడుతున్నారో చూస్తాను, అందుకే దుఃఖం.

“చెలికాండ్రకంటే హెచ్చగునట్లుగా ఆనందతైలముతో అభిషేకింపబడిన వానిని" గూర్చి (కీర్తన 45:7) “వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిననుభవించిన వాడుగాను” ఉండెను అని కూడా వ్రాయబడి ఉంది. యథార్థంగా తనను చేర్చుకున్న ప్రతిహృదయముపై తన సువార్తను అమలుపరచునప్పుడు ఈ రెండు లక్షణాలు అభివ్యక్తమవుతాయి. ఒకవైపు మననుండి భయాందోళనలు తీసివేసి మనల్ని ఒక సహవాసములోనికి నడిపించి మనలోకి నిరీక్షణను నింపి, మనల్ని ఆనందతైలంతో అభిషేకిస్తుంది. మరో వైపేమో, మనలో ఉందని అది బోధించే కపటస్వభావం కారణంగా, శరీరాత్మల మధ్య ఉన్న పరస్పర విరోధము కారణంగా, ఓ రకమైన దుఃఖాన్ని మనలో పుట్టించి, “అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను!” (రోమా 7:24) అని ఆశ్చర్యపోయేట్టు చేస్తుంది. ఈ రెండూ పరస్పర విరుద్ధం కాదు కాని ఒకదానికి మరొకటి సహాయకారి. “చేదుకూరలతో ఆ గొర్రెను తినవలెను” (నిర్గమ 12:8).

పదవ అధ్యాయము

లేఖనాలు మరియు ప్రేమ

క్రైస్తవుని హృదయం వాక్యానికి లోబడుతుంది

మనం లేఖనాలను వెదికి చదువటం వలన మన ఆత్మలు నిజంగా దీవెన పొందుతున్నాయో లేదో నిర్ధారించుకోవటానికి కొన్ని మార్గాలను గత అధ్యాయాలలో నేను చూపే ప్రయత్నం చేశాను. చాలామంది జ్ఞానం సంపాదించాలన్న ఆతురతను 'సత్యవిషయమైన ప్రేమ' గా ( 2 థెస్స 2:9 ) పొరపడి, వారి జ్ఞానఖజానాన్ని మరికొంచెం నింపుకోవడమే కృపలో ఎదగటం అని తలచి మోసపోతుంటారు. దేవుని వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మనకున్న ఉద్దేశం పైన ఎంతో ఆధారపడి ఉంది. అది కేవలం దానిలోని విషయాలను పరిచయం చేసుకోవడానికో లేదా దాని వివరాలలో పాండిత్యం సాధించడానికో అయితే మన ఆత్మల తోట నిష్ఫలంగానే ఉంటుంది; కాని వాక్యం చేత మందలింపబడి, సరిదిద్దబడే ప్రార్థనాపూర్వక కోరికతో, ఆత్మ చేత శోధింపబడాలనే ఆశతో దాని పవిత్ర ఆజ్ఞలకు మన హృదయాలు సరిపోల్చుకోవాలనే కాంక్షతో దానిని ధ్యానించినట్లయితే, మనం దేవుని దీవెనను ఆశించవచ్చు. 

వ్యక్తిగత దైవభక్తిలో మనమెంత మేరకు ప్రగతి సాధిస్తున్నామో కనుగొనేందుకు ప్రాణాధారమైన విషయాలను గుర్తించే ప్రయత్నం మునుపటి అధ్యాయాల్లో నేను చేయడం జరిగింది. ఈ రచయిత మరియు చదువరి యథార్థంగా తమ్మును తాము పరీక్షించుకునేందుకు విభిన్న ప్రమాణాలివ్వబడ్డాయి. ఇలాంటి కొన్ని పరీక్షలున్నాయి; పాపమువలన ఇంకా ఎక్కువ ద్వేషాన్ని గడించి, దాని శక్తి, కల్మషం నుండి నిజంగా విముక్తుడనవుతున్నానా? దేవునితో మరియు దేవుని క్రీస్తుతో లోతైన పరిచయం సంపాదించుకుంటాన్నానా? నా ప్రార్థనాజీవితం ఆరోగ్యవంతమైనదిగా ఉందా? నా సత్క్రియలు సమృద్ధిగా ఉన్నాయా? నా విధేయత సంపూర్తిగా, సంతోషకరంగా ఉందా? నా మార్గాలలో, నా ప్రేమానురాగాలలో నేను లోకము నుండి వేరుగా ఉన్నానా? దేవుని వాగ్దానాలు సరైన రీతిలో లాభయుక్తంగా వాడుకోవటం నేర్చుకొని తద్వారా ఆయనయందానందమే నా దినదిన బలమని ఆయనలో నేనానందిస్తున్నానా? నా విషయంలో ఇవన్నీ వాస్తవమని చెప్పగలిగినప్పుడే, నా లేఖనపఠనం లాభసాటియని, లేని పక్షంలో అది నాకేమీ ఒనగూర్చడం లేదని బహుగా భయపడాలి.

క్రైస్తవ ప్రేమను గూర్చి ఆలోచించేందుకు ఒక అధ్యాయాన్ని పూర్తిగా వినియోగిస్తే తప్ప ఈ ధ్యానాన్ని ముగించటం యుక్తం కాదు. దేవుని వాక్యపు ధ్యానపూర్వక పఠనం ఆత్మీయంగా నాకెంత మేరకు సాయపడిందో గ్రహించేందుకు ప్రేమ అనే ఈ ఆత్మీయ కృప ఎంత మేరకు నాలో అలవరచుకోబడినదో లేక అలవరచుకొనబడలేదో, క్రమబద్దీకరించబడినదో లేక క్రమబద్దీకరించబడలేదో, అన్నది మరో సూచిక. ప్రేమను గూర్చి లేఖనాలలో ఎంత అధికంగా రాయబడిందో దానిని శ్రద్దగా చదివే ఏ ఒక్కరూ గుర్తెరగకుండా ఉండలేరు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క ప్రేమ నిజంగా ఆత్మీయమైనదో కాదో జాగ్రత్తగా, ప్రార్థనాపూర్వకంగా నిర్ధారణ చేసుకోవటం మంచిది; అది ఆరోగ్యకరమైన స్థితిలో ఉండి, సరైన రీతిలో అభ్యసించబడుతుందో లేదో తెలుసుకోవటం మేలు. 

క్రైస్తవప్రేమ అనే అంశము యొక్క విభిన్నకోణాలను ఒకే అధ్యాయం యొక్క పరిధిలో పరిశీలించటం చాలా విస్తారమౌతుంది. దేవుడు మరియు ఆయన క్రీస్తు పట్ల మనం చూపించే ప్రేమను పరిశీలించే ఉద్దేశంతో మనం మొదలు పెట్టటం సముచితం, కాని ముందటి అధ్యాయాల్లో ఈ విషయాన్ని చర్చించాం కాబట్టి ఇప్పుడు వదిలేద్దాం. మన కుటుంబస్తులకి మరియు మనతోటి మనుష్యులకూ మనం ఋణపడియున్న సహజ ప్రేమను గూర్చి కూడా చాలా చెప్పవచ్చు, కాని ఇప్పుడు నా మనస్సులో ఉన్నదాని గురించి రాయటం దీనికంటే ఎక్కువ అవసరం. ఇక్కడ మనము క్రీస్తులో సహోదరుల మధ్య ఉండవలసిన ఆత్మీయ ప్రేమను గూర్చి అవలోకనము చేద్దాం.

1. క్రైస్తవప్రేమ యొక్క ఘనమైన విశిష్టతను తెలుసుకున్నప్పుడే వాక్యము నుండి మనం లాభపడతాం

1 కొరింథీ 13వ అధ్యాయంలో స్పష్టం చేయబడినంతగా ఈ విషయం మరెక్కడా నొక్కి చెప్పబడలేదు. అక్కడ పరిశుద్దాత్ముడు మనకేం చెబుతాడంటే, ఓ క్రైస్తవుడు దేవుని విషయాలను స్పష్టంగా వాగ్ధాటితో మాట్లాడగలిగినా ప్రేమ లేనివాడైతే మ్రోగె కంచులా, నిర్జీవుడే. ప్రవచించగలిగి, మర్మాలు, జ్ఞానాలన్నిటినీ ఎరిగినవాడైనా, కొండలను పెకిలింపగల గొప్ప విశ్వాసం గలవాడైనా ప్రేమ లేనివాడైతే ఆత్మీయంగా వ్యర్ధుడే. బీదల పోషణ కొరకు తన ఆస్తినంతా ఇవ్వగలిగే దయగలవాడైనా, తన శరీరాన్ని బలిగా అర్పించినా, ప్రేమ లేనివాడైతే నిష్ప్రయోజకుడే. ప్రేమకు ఎంతగా విలువ ఇవ్వబడిందో, అది పొందుకోవటం నాకెంత అవసరమో ఖాయపరచుకోవాలి.

“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైన యెడల దీనినిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు” (యోహాను 13:35) అని ప్రభువన్నాడు. క్రైస్తవ శిష్యత్వానికి ప్రేమనొక చిహ్నంగా క్రీస్తు చేయడం వలన దాని గొప్ప ప్రాముఖ్యతను మనం చూస్తాం. మన విశ్వాసపు ఒప్పుకోలు యొక్క యథార్థతకు అదొక ఆవశ్యక పరీక్ష; క్రీస్తు యొక్క సహోదరులను ప్రేమించకుండా క్రీస్తును ప్రేమించలేము, ఎందుకంటే వారందరూ ఆయనతో కూడా ఒకే “జీవపుమూటలో” ( 1 సమూ 25:29 ) కట్టబడియున్నారు. ఆయన విమోచించినవారి పట్ల ప్రేమను కనుపరచటం స్వయంగా ప్రభువైన యేసుపై మనకు గల సహజాతీతమైన ఆత్మీయ ప్రేమకు ఖచ్చితమైన ఋజువు. ఎక్కడైతే పరిశుద్ధాత్ముడు సహజాతీతమైన జన్మను కలగజేస్తాడో, అక్కడ ఆ స్వభావాన్ని ఆచరణలోకి తెచ్చి, సహజాతీత గుణాలను పరిశుద్దుల హృదయాల్లో, జీవితాల్లో మరియు ప్రవర్తనల్లో కలగజేస్తాడు; అందులోని ఒక గుణం క్రీస్తు నిమిత్తం ఆయనవారందరినీ ప్రేమించటం.

2. క్రైస్తవ ప్రేమ యొక్క బాధాకరమైన వక్రీకరణలను కనిపెట్టటం నేర్చుకున్నప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

నీరు తన మట్టం కన్నా ఎక్కువగా ఎల పెరగలేదో, అలాగే “ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, గ్రహింపజాలడు” ( 1 కొరింథీ 2:14 ). తిరిగి జన్మించని, నామమాత్రపు క్రైస్తవులు మానవాభిమానాలను, సహజ సాన్నిహిత్యాలను చూసిఅదే ఆత్మీయప్రేమ అని పొరపడితే మనమాశ్చర్యపోకూడదు. కాని కొంతమంది దేవుని ప్రజలు ఎంత అల్పస్థాయికి దిగి ఆలోచిస్తారంటే, మానవ స్నేహపూర్వక స్వభావాన్ని మరియు ప్రేమగా మాట్లాడటాన్ని క్రైస్తవ ప్రేమగా అపార్థం చేసుకుంటారు. సాత్వికత్వం మరియు మృదుత్వం చేత ఆత్మీయప్రేమ చిత్రీకరించబడినప్పటికీ, అది శారీరక మర్యాదలు, దయాళుత్వం కన్నా ఎంతో ఉన్నతమైంది.

పిల్లల పట్ల నిజమైన వాత్సల్యత కలిగి ఉండటం మరియు వారిని శిక్షించటం - ఈ రెండూ పొంతన లేనివన్న తప్పుడు తలంపు కలిగి ఎంతమంది మూర్ఖపు తండ్రులు తమ కుమారులపై క్రమశిక్షణ చేసే బెత్తం వాడటం మానారు! ఎంతమంది మూర్ఖపు తల్లులు తమ పిల్లలను క్రమశిక్షణ చేయటం మాని 'ప్రేమ' అనే పదాన్ని నైతికమాంద్యానికి, క్రమశిక్షణారాహిత్యానికి అన్వయించి తమ ఇంట ప్రేమ ఏలుతుందని గొప్పలు చెప్పుకుంటున్నారు! కానీ ఇతర సంగతులలో, సంబంధాలలో చాలామంది మనస్సులను పరిపాలించేది ఈ ప్రమాదకరమైన ఆలోచనే. తమ శరీరసంబంధ లోకాశలను ఒకవేళ దైవజనుడు గద్దిస్తే, ఒకవేళ దేవుని రాజీపడని వాదనలతో గనుక అతడు బలవంతపెడితే, అతడు 'ప్రేమలేనివాడు' అన్న నేరం అతనిపై మోపబడుతుంది. అయ్యో, ఈ ముఖ్యమైన అంశంలో ప్రజలు ఎంత దారుణంగా సాతాను చేతిలో మోసపోతున్నారు!

3. క్రైస్తవ ప్రేమ యొక్క నిజమైన స్వభావాన్ని మనకు బోధించినప్పుడు వాక్యము నుండి మనము లాభపడతాం

పరిశుద్దుల ఆత్మలలో విశ్వాసము మరియు నిరీక్షణతో కట్టబడున్న ఆత్మీయవరమే క్రైస్తవ ప్రేమ ( 1 కొరింథీ13:13 ). అది వారు పునరుజ్జీవించబడినప్పుడు వారిలో రూపుదిద్దుకునే పవిత్ర స్వభావం ( 1 యోహాను 5:1 ). పరిశుద్దాత్మ ద్వారా దేవునిప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడియుంది ( రోమా 5:5  ). అది ఇతరుల మంచిని కోరుకునే నీతిసూత్రం. మనలో స్వాభావికంగా ఉన్న స్వీయప్రేమ మరియు స్వలాభాపేక్షకు ఇది వ్యతిరేకం. అది కేవలం క్రీస్తుస్వరూపము కలిగున్న వారందరిపట్ల ప్రేమపూర్వక మర్యాద మాత్రమే కాదు, వారి అభ్యున్నతికి మద్దతిచ్చే శక్తివంతమైన కోరిక. అదేదో తొందరగా ఉద్రేకము తెప్పించే అస్థిర ప్రవృత్తి కాదు కాని 'అగాధ సముద్రజలము'ల ఉదాసీనత ఐనా, 'నదీప్రవాహము'ల అసమ్మతి ఐనా ఆర్పజాలని/ముంచజాలని ( పరమగీతము 8:7  ) దృఢమైన శక్తి. స్థాయిలో అది ఆయన ప్రేమకు బహు తక్కువదైనప్పటికీ అదే సారాన్ని కలిగియుంటుంది. ఆ ప్రేమను గూర్చి మనం ఇలా చదువుతాం, "లోకములోనున్న తనవారిని ప్రేమించి, అంతము వరకూ ప్రేమించెను” ( యోహాను 13:1  ).

క్రైస్తవప్రేమ యొక్క స్వభావాన్ని గూర్చిన సరైన భావన గ్రహించాలంటే ప్రభువైన యేసులో, ఆయన ద్వారా దాని పరిపూర్ణ నిదర్శనను గురించి సమగ్ర అధ్యయనం చేయడమే క్షేమకరమైన, ఖచ్చితమైన మార్గం. 'సమగ్ర అధ్యయనం అంటే ఆయనను గూర్చి నాలుగు సువార్తలలో వ్రాయబడినదానిని సంపూర్ణంగా పరీక్ష చేయటమే, అంతేగాని మనకు నచ్చిన కొన్ని సంఘటనలకు/భాగాలకు మనల్ని మనం పరిమితం చేసుకోకూడదు. ఇలా జరిగిస్తుండగా, ఆయన ప్రేమ కనికరముగలది, ఉత్తమమైంది, ఆలోచనాపూర్ణమైంది, మృదువైనది, నిస్వార్ధమైనది, త్యాగపూరితమైనది, ఎన్నడూ మారనిది, ఓరిమిగలది మాత్రమే కాదు కాని ఇంకా ఎన్నో అంశాలు అందులో ఉన్నాయని మనం కనుగొంటాము. ప్రేమ అత్యావశ్యక విన్నపాన్ని నిరాకరించగలదు ( యోహాను 11:6  ), తల్లిని గద్దించగలదు ( యోహాను 2:4  ), కొరడా ఝుళిపించగలదు ( యోహాను 2:15  ), శంకించు శిష్యులను మందలించగలదు ( లూకా 24:25  ), వేషధారులను ఖండించగలదు (మత్తయి 23:18-33). ప్రేమ కఠినంగా ఉండొచ్చు ( మత్తయి 16:23 ), కోపంగానూ ఉండొచ్చు ( మార్కు 3:5 ). ఆత్మీయ ప్రేమ పవిత్రమైనది; దేవునికి నమ్మకమైనది; సమస్త దుర్నీతి పట్ల రాజీపడనిది.

4. క్రైస్తవప్రేమ దేవుడు కలిగించేదని తెలుసుకున్నప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

“మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము” (1 యోహాను 3:14). సహోదరుల పట్ల ప్రేమ సహజాతీతమైన నూతన జననము యొక్క ఫలితము. పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో కలగజేసిన ప్రేమ, జగత్తు పునాది వేయక ముందే తండ్రియైన దేవుడు క్రీస్తులో మనల్ని ఎన్నుకున్నాడనేందుకు దీవెనకరమైన ఋజువు. క్రీస్తును, ఆయనకు చెందినవాటిని, ఆయనలో ఉన్న మన సహోదరులను ప్రేమించటం, తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని పాలిభాగస్తులనుగా చేసిన ఆ దైవిక స్వభావానికి అనుకూలమైనది. సహోదరుల ఈ ప్రేమ అసాధారణంగా పునరుజ్జీవింపబడినవారు తప్ప మరెవ్వరూ చూపించలేనిదై, వారు తప్ప ఇంకెవ్వరూ అభ్యసించలేనిదై ఉండాలి, లేకపోతే అపొస్తలుడు అంత ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించేవాడు కాదు; అదెలాంటిదంటే దానిని కలిగి లేనివారు పునరుజ్జీవం లేని స్థితిలో ఉన్నట్లే. 'తన సహోదరుని ప్రేమించనివాడు మరణంలోనే నిలిచియున్నాడు' (ఎస్.ఈ.పియర్స్).

సహోదరుల పట్ల ప్రేమ అంటే నా సొంత అభిప్రాయాలతో సమ్మతించే లేక నాలాంటి వ్యక్తిత్వమే కలిగుండే మనుష్యులను కనుగొనటం కన్నా ఎంతో మించినది. అది కేవలం స్వభావానికి సంబంధించినది మాత్రమే కాదు కాని ఆత్మీయ, సహజాతీతమైన విషయం. క్రీస్తును గురించిన విషయాలు నేనెవరిలో గ్రహిస్తానో వారివైపు నా హృదయాన్ని నిలుపుకోవటం; అంటే దేవుని కుమారుని స్వరూపము నేను ఎవరిలో చూస్తానో వారినందరినీ స్వీకరించటం. వారిలో క్రీస్తును గురించిన విషయాలను చూస్తాను కాబట్టి క్రీస్తు నిమిత్తము వారిని ప్రేమించటం. నా సహోదరీసహోదరులలో క్రీస్తు నివసించటాన్ని బట్టి పరిశుద్దాత్ముడు నన్ను ఆకర్షించి, ఆకట్టుకోవడమే. కాబట్టి యథార్థమైన క్రైస్తవప్రేమ కేవలం దైవిక వరమే కాదు కాని దాని ఉనికికి, ఆచరణకు పూర్తిగా దేవుని మీదే ఆధారపడుతుంది. పరిశుద్దాత్ముడు మన హృదయాల్లో కుమ్మరించిన ఆ ప్రేమ, దేవునివైపు మరియు ఆయన ప్రజల వైపు ఆచరణలో వ్యక్తం కావాలని ప్రతిరోజు మనం ప్రార్థించాలి.

5. క్రైస్తవ ప్రేమను మనం సరిగా ఆచరించినప్పుడు వాక్యము నుండి లాభపడతాం

ఇది మన సహోదరులను తృప్తిపరచటం లేక వారి దృష్టిలో మనకు మెప్పు కలిగేలా చేసుకోవటం ద్వారా కాదు కాని, వారి అభ్యున్నతిని కోరటం ద్వారా జరుగుతుంది. “మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము” (1 యోహాను 5:2). స్వయంగా దేవుని పట్ల నా వ్యక్తిగత ప్రేమ కొరకు నిజమైన పరీక్ష ఏమిటి? ఆయన ఆజ్ఞలను నేను గైకొనటమే ( యోహాను 14:15,21,24;   15:10,14  చూడండి). దేవుని పట్ల నా వాస్తవికత మరియు శక్తి, నా మాటలతో గాని లేక ఆయనను గూర్చి నేను ఎంత అత్యాసక్తితో పాటలు పాడగలననే దానితో కొలవలేము గానీ ఆయన వాక్యానికి నేను చూపించే విధేయత వలననే ఇది సాధ్యమవుతుంది. నా సహోదరులతో నా సంబంధాల విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది.

“మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము." నా సహోదరీసహోదరుల తప్పిదాలను నేను సమర్థిస్తుంటే, వారిని సంతృప్తిపరిచే దిశగా నేను నా స్వచిత్తం ప్రకారం నడుస్తూ ఉంటే, నేను వారిని ప్రేమించనట్లే. “నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను” (లేవీ 19:17). ప్రేమను దైవికపద్ధతిలోనే చూపించాలి కాని, దేవునిని ప్రేమించటాన్ని పణంగా పెట్టి కాదు; ఇంకా చెప్పాలంటే దేవునికి నా హృదయంలో సరైన స్థానం కల్పించినప్పుడే నేను నా సహోదరుల పట్ల ఆత్మీయప్రేమను చూపించగలను. నిజమైన ఆత్మీయ ప్రేమ వారిని సంతోషపెట్టే ప్రయత్నం చేయదు కాని దేవునిని తృప్తిపరచి, వారికి సాయపడుతుంది; ఐతే దేవుని ఆజ్ఞల బాటలోనే నేను వారికి సహాయపడగలను.

ఒకరినొకరు తలకెక్కించుకోవటం సహోదర ప్రేమ అనిపించుకోదు; మనముందున్న పందెములో ముందుకు సాగటానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, 'యేసు వైపు చూచేందుకు వారికి ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడుతూ (క్రీస్తుతో మన అనుదిన నడక ద్వారా వారికి మాదిరిగా ఉంటూ) ఉండటం చాలా సహాయకరం. సహోదర ప్రేమ అనేది పవిత్రమైన విషయం, మనం నడిచే మార్గము పట్ల అదొక శారీరక ప్రవృత్తి లేక నిర్లక్ష్య వైఖరి కాదు. దేవుని ఆజ్ఞలు ఆయన ప్రేమను మరియు అధికారాన్ని వ్యక్తం చేసే వాక్కులు. కాబట్టి ఒకరికొకరు అనురాగం చూపించే ప్రయత్నంలో వాటిని అలక్ష్యం చేయటం అసలు ' ప్రేమ’ కానే కాదు. మనం ప్రేమను వ్యక్తపరచడం దేవుడు బయలుపరిచిన నిర్దేశానికి ఖచ్చితంగా అనుగుణంగా ఉండాలి. మనము “సత్యమును బట్టి ప్రేమించాలి” (1 యోహాను 1).

6. క్రైస్తవప్రేమ యొక్క విభిన్న ప్రత్యక్షతలు మనకు బోధించినప్పుడు వాక్యము నుండి మనం లాభపడతాం

మన సహోదరులను ప్రేమించటం, ఆ ప్రేమను అన్నివిధాలుగా వ్యక్తం చేయటం మన నియమిత కర్తవ్యం. కాని ఇది యథార్థముగా ఫలప్రదంగా, ఆడంబరరహితముగా కృపాసింహాసనము యొద్ద వారితో సహవాసం చేయటం ద్వారానే తప్ప మరెక్కడా చేయలేం. భూమి నలుదిక్కులా క్రీస్తునందు సహోదరీ సహోదరులున్నారు, వారు అనుభవిస్తున్న శోధనలు, సంఘర్షణలు, దుఃఖాల వివరాల గూర్చి నాకేమీ తెలియదు. అయినప్పటికీ వారి తరపున, చిత్తశుద్దిగల విన్నపాలతో, విజ్ఞాపనలతో వారి పట్ల నా ప్రేమను వ్యక్తపరచి, దేవుని ఎదుట నా హృదయాన్ని కుమ్మరించగలను. ఓ క్రైస్తవుడు తన తోటి యాత్రికుల పట్ల అనురాగపూరిత మర్యాదను, వారి తరపున ప్రభువైన యేసులో తన ప్రయోజనాలను అన్నిటినీ వెచ్చించి, తన దయాకరుణలు వారికి ఉపయోగంగా చేయటం ద్వారా వ్యక్తపరచగలడు.

“ఈ లోకపు జీవనోపాధి గలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంత మాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును? చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను, సత్యముతోను ప్రేమింతము” (1 యోహాను 3:17,18). చాలా మంది దేవుని ప్రజలు ఈ లోకపు ఆస్తుల విషయాలలో చాలా దయనీయంగా ఉన్నారు. కొన్నిసార్లు ఇలాగెందుకు జరుగుతుందని ఆశ్చర్యపోతారు; అది వారికో గొప్ప శోధన. ప్రభువు దీన్ని అనుమతించేందుకు ఒక కారణమేమిటంటే ఇతర పరిశుద్ధులు తమ దయాళుత్వాన్ని చూపించి, దేవుడు వారికి సమకూర్చిన సమృద్దిలో నుండి వీరి లౌకికావసరాల నిమిత్తం సాయపడాలని. నిజమైన ప్రేమ అత్యంత ఆచరణాత్మకమైనది; ఒక సహోదరుడిని తన కష్టాల్లో నుండి విడుదల చేయించేందుకు అది ఏ కార్యాన్ని కూడా మరీ తక్కువగా, ఏ స్థాయిని కూడా మరీ నీఛంగా పరిగణించదు. ప్రేమామయుడైన ప్రభువు ఈ భూమ్మీద ఉన్నప్పుడు, జనసమూహాల శారీరక ఆకలిని గూర్చి ఆలోచించాడు మరియు తన శిష్యుల పాదాలను కడగటం కూడా నీఛమైనదిగా భావించలేదు ( యోహాను 13:14 ).

ప్రభువు ప్రజలు కొందరు ఎంత పేదరికంలో ఉన్నారంటే ఇతరులతో పంచుకునేందుకు వారి వద్ద ఏమీలేదు. అప్పుడు వారేంచేయాలి? పరిశుద్దులందరి ఆందోళనలు విజ్ఞాపనలుగా ఎందుకు చేసుకోకూడదు; పరిశుద్ధులందరి తరపున వారే కృపాసింహాసనము వద్ద విజ్ఞాపన చేయాలి! మన సొంత పరిస్థితులు, సంగతులను బట్టి ఇతర పరిశుద్దుల అనుభూతులు, దుఃఖాలు మరియు ఫిర్యాదులు ఎలాంటివో మనకు తెలుసు. అసంతృప్తి మరియు సణుగులకు తావివ్వడం ఎంత సులభమో మన కఠిన అనుభవము నుండి మనకు తెలుసు. మనం మొరపెట్టినప్పుడు తన నెమ్మదిగల హస్తాన్ని ప్రభువు మనమీద ఎలా ఉంచాడో, ఒక అమూల్యమైన వాగ్దానాన్ని ప్రభువు మన జ్ఞప్తికి తెచ్చినప్పుడు మన హృదయానికి ఎంత సమాధానం, ఎంత ఓదార్పు కలిగాయో కూడా మనకు తెలుసు. దుస్థితిలో ఉన్న తన పరిశుద్దులందరి పట్ల ఒకే రకంగా కటాక్షించమని ఆయనను వేడుకుందాం. వారి భారాలను మనవాటిగా చేసుకుని, ఏడ్చేవారితో ఏడ్చి, సంతోషించేవారితో సంతోషిద్దాం. అలా క్రీస్తులో ఉన్నవారి పట్ల మన యథార్థప్రేమను వ్యక్తపరుద్దాం. ఎలాగంటే వారిని శాశ్వత దయతో గుర్తు చేసుకోమని ప్రభువును వేడుకుందాం.

ప్రభువైన యేసు తన శిష్యులపట్ల తన ప్రేమను ఇలా వెల్లడి చేస్తున్నాడు, “ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు” (హెబ్రీ 17:25); వారి సమస్యలను, చింతలను తన సొంతవాటిగా చేసుకుంటాడు. వారి పక్షమున ఆయన తండ్రికి మొఱ్ఱపెడుతున్నాడు. ఆయన దేనిని కూడా మరిచిపోలేదు; ప్రతి ఒంటరి గొర్రె మంచికాపరి యొక్క హృదయముపై మోయబడుతుంది. కాబట్టి మన సహోదరుల వేర్వేరు అవసరాల కొరకు మన అనుదినప్రార్థనలలో మన ప్రేమను వెల్లడిపరచటం ద్వారా మన గొప్ప ప్రధానయాజకునితో సహవాసానికి తీసికొనిరాబడతాం. అంత మాత్రమే కాదు, దాని ద్వారా పరిశుద్దులు మనకు ప్రియముగా చేయబడతారు; దేవునిప్రియులుగా వారికోసం ప్రార్థించటం వలన వారి పట్ల మన ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. మన సొంతహృదయాలలో వారి పట్ల నిజమైన ప్రేమానురాగాలు లేకుండా వారిని మన హృదయాల మీద కృపాసింహాసనము వద్దకు తీసుకొనిపోలేం. మనల్ని అభ్యంతరపరచిన సహోదరునికి వ్యతిరేకంగా ఉన్న చేదుస్పూర్తిని అధిగమించగలిగేది అతని కొరకు ఎక్కువగా ప్రార్థించటమే.

7. క్రైస్తవ ప్రేమను సక్రమంగా పెంపొందించుకోవటాన్ని బోధించినపుడు వాక్యము నుండి మనం లాభపడతాం

దీనికి నేను రెండు లేక మూడు నియమాలను సూచిస్తాను. మొదటగా, నా సహోదరుల ప్రేమను బహుగా శోధించేలా నాలో ఎంత కొదువ ఉందో, నా ప్రేమను పరీక్షించేలా వారిలో కూడా అంతే ఉంటుందని గుర్తించాలి. మనమందరము ఈ అంశముపై మనస్సుల్లో గుర్తుంచుకోదగిన గొప్ప హెచ్చరిక ఏమిటంటే 'ప్రేమతో ఒకనినొకడు సహించాలి' (ఎఫెసీ 4:3). 1 కొరింథీ 13లో ఆత్మీయ ప్రేమకున్న మొట్టమొదటి గుణం ఏమిటంటే "ప్రేమ దీర్ఘకాలము సహించును” (4వ వచనము).

రెండవదిగా, ఏదైనా ఒక సుగుణాన్ని అలవర్చుకోవటానికి ఉత్తమమైన మార్గం దానిని అభ్యసించటమే. క్రియారూపం దాల్చకుండా దానిని గురించి మాట్లాడి చర్చించటం వలన ఏ ప్రయోజనమూ చేకూరదు. చాలా చోట్ల వ్యక్తపరచబడే ప్రేమ యొక్క శూన్యత గురించి ఈ రోజుల్లో ఎన్నో ఫిర్యాదులు వినిపిస్తున్నాయి; నేను మంచి మాదిరిగా ఎందుకు ఉండాలనడానికి ఇదే గొప్ప కారణం! ఇతరుల క్రూరత్వము, ఉదాసీనత మీ ప్రేమకు అవరోధం కలిగించనివ్వకండి. కాని "మేలు చేత కీడును జయించుము” (రోమా 12:21). 1 కొరింథీ 13ను ప్రార్థనాపూర్వకంగా కనీసం వారానికోసారి ఆలోచించండి.

మూడవదిగా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం దేవుని ప్రేమ యొక్క వెలుగు, వెచ్చదనంలో ఆనందించేలా చూసుకో. స్వజాతి స్వజాతిని కంటుంది. క్రీస్తు యొక్క అలయని, మాట తప్పని, లోతైన ప్రేమతో ఎంత ఎక్కువగా ఆక్రమితమై ఉంటే, అంతే ఎక్కువగా ఆయన ప్రజల పట్ల నీ హృదయం ప్రేమతో ఉప్పొంగుతుంది. దీనికి రమ్యమైన నిదర్శనం ఏమిటంటే సహోదర ప్రేమను గూర్చి ఎక్కువగా వ్రాసిన అపొస్తలుడు తన యజమానుని రొమ్మును ఆనుకున్నవాడే. తన కృపామహిమ కీర్తించబడే నిమిత్తం, తన ప్రియులైన ప్రజలందరి ప్రయోజనం నిమిత్తం, ఈ నియమాలు పాటించేందుకు ఈ రచయితకు (ఇతనికంటే ఎక్కువగా ఎవరికీ అవసరం లేదేమో), మరియు చదువరికి కావలసిన కృపను ప్రభువు అనుగ్రహించును గాక.

Add comment

Security code
Refresh