దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

 

హితబోధ నెట్వర్క్ వారి పరిచర్యలో భాగంగా బ్రదర్ బిబు ఈమధ్యకాలంలో  బైబిల్ మిషన్ దేవదాసు అయ్యగారి బోధలలోని వాక్యవిరుద్ధమైన సంగతులను తన పుస్తకం మరియు వీడియోల ద్వారా బహిర్గతం చేసినప్పుడు ఆ సంస్థకు చెందిన కొందరు అనుచరులు విషయమంతా వదిలేసి‌, దేవదాసు అయ్యగారు చెప్పినవి ఏవిధంగా వాక్యానుసారమో రుజువు చెయ్యకుండా, కనీసం వారు బహిరంగంగా నిరూపించుకోగలిగే సవాలును కూడా స్వీకరించకుండా కొన్ని అనవసరపు విమర్శలు చెయ్యడం ప్రారంభించారు. దుర్బోధలను ఖండించే క్రమంలో ఇటువంటి అనవసరపు విమర్శలు మాకు కొత్తేంకాదు.

గతంలో మేము ఎడ్వర్డ్ విలియమ్స్ కుంటం వైఎస్ జగన్ పై చెప్పిన అబద్ధపు ప్రవచనాన్ని ఖండించినప్పుడూ, అద్దంకి రంజీత్ ఓఫీర్, పీడీ సుందరావు లాంటి మరికొందరి బోధలు కూడా వాక్యపు వెలుగులో సరికావని వివరించినప్పుడు కూడా , మాపై అటువంటి విమర్శలే సంధించబడ్డాయి. చెప్పినదానిలో ఉన్న విషయంతా వదిలేసి వారి ప్రియబోధకులను వాదన నుండి తప్పించడానికి కుయుక్తితో కొందరు చేసే ఆ అనవసరపు విమర్శలకు వివరణ ఇవ్వడానికే ఈ వ్యాసాన్ని రాస్తున్నాను.

1 - దేవదాసు అయ్యగారు కానీ, భక్తసింగ్ గారు కానీ ఇటువంటి పేరుమోసిన బోధకులు తమ జీవితంలో ఎంతో గొప్పపరిచర్యను చేసి ఎన్నో వేల లక్షల ఆత్మలను ప్రభువు కోసం సంపాదించారు; అటువంటివారు ఏదైనా ఒక పొరపాటు బోధ చేసినా అది ప్రభువు చూసుకుంటాడు, మధ్యలో వారిపై మీ విమర్శలు ఏంటని కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

ఇక్కడ వారు గ్రహించలేకపోతున్న విషయం ఏమిటంటే, ఒక బోధకుడు ఎంత గొప్పగా పరిచర్య చేసినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఎంతమందిని ప్రభువువైపు త్రిప్పినా, వాక్యవిరుద్ధమైన ఒక బోధను చెయ్యడానికి అతను ప్రభువు దగ్గర నుండి అనుమతి పొందుకోలేడు. అతను ఎంత గొప్ప బోధకుడైనా అతను చెప్పిన ఒక‌ బోధ వాక్యానుసారంగా లేనపుడు అది దుర్భోధే ఔతుంది. ఒక డాక్టర్ వందలమంది ప్రాణాలను కాపాడినప్పటికీ ఒకరిని హత్య చేస్తే, ఆ హత్య విషయంలో అతను హంతకుడే ఔతాడు‌ సుమా!

నేను  పైన ప్రస్తావించిన బోధకులను పేతురుతో పోల్చడం నాకు ఇష్టం లేనప్పటికీ మమ్మల్ని విమర్శించేవారికి విషయం అర్థం కావడానికి మాత్రం ఆ పోలికను తీసుకుని జవాబు చెప్పదలచాను. పేతురు గురించి మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు అపోస్తలులలో ఇతను ప్రముఖుడిగా గుర్తించబడి తన బోధతో అనేకులను ప్రభువు మార్గంలోకి నడిపించాడు. పెంతుకోస్తు పండుగ రోజున ఇతను చేసిన బోధ కారణంగానే మూడువేలమంది ప్రభువును హత్తుకుని ప్రారంభ క్రైస్తవ సంఘంగా ఏర్పడ్డారు.

అపొ. కార్యములు 2:41,42 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి.

కానీ, ఇంతగొప్ప బోధకుడు అప్పటి సంఘంలోని యూదులు, అన్యజనుల మధ్య ఏర్పడిన బేధానికి బలం చేకూర్చేలా ఒక తప్పిదం చేసినపుడు అందరికంటే చివరి అపోస్తలుడిగా ఎన్నుకోబడ్డ పౌలు అతణ్ణి గద్దించాడు.

గలతీయులకు 2:11-14 అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని; ఏలయనగా యాకోబునొద్దనుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకతీసి వేరైపోయెను. తక్కిన యూదులును అతనితో కలిసి మాయవేషము వేసికొనిరి గనుక బర్నబాకూడ వారి వేషధారణముచేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

ఈ సందర్భంలో సువార్త సత్యం‌ చొప్పున (యూదుడనీ, అన్యుడనీ బేధం లేదు) క్రమంగా నడచుకోలేదని పేతురులాంటి బోధకుడినే పౌలు ఎదిరించి గద్దించినపుడు ఈరోజు ఎంత గొప్ప పేరు మోసిన బోధకుడైనా వాక్యక్రమం చొప్పున బోధించనప్పుడు దానిని ఖండించడం సబబే కదా! (ఇక్కడ ఎవరైనా పేతురును గద్దించిన పౌలు స్థాయి గురించీ మా స్థాయి గురించీ మాట్లాడితే దానికి కూడా ఈ వ్యాసం పూర్తయ్యేసరికి వివరణ వస్తుంది)

2 - కొందరు మేము ఏ బోధకుల బోధలనైతే వాక్యానుసారంగా లేవని ఖండిస్తున్నామో, వారు పైన చెప్పినట్టుగా వేల లక్షల మందిని రక్షణలోకి నడిపించారని మేము ఆ విధంగా ఎంతమందిని రక్షించామో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

మానవ రక్షణ బోధకుడి చేతుల్లో కాదు ప్రభువు చేసిన నిర్ణయంపైనే ఆధారపడి‌ ఉంటుందనే కనీస అవగాహన ఉన్న ఎవరూ కూడా ఇటువంటి ప్రశ్నను మాపై సంధించలేరు. దేవుడు చేసే రక్షణ కార్యంలో బోధకుడు దేవుడు వాడుకునే సాధనమే తప్ప, రక్షణ బోధకుడి మూలంగా కలగదు.

రోమీయులకు 8:29,30 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను.

అపో.కార్యములు 13:48 అన్యజనులు ఆమాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

అపో.కార్యములు 16:14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పినమాటలయందు లక్ష్యముంచెను.

దీనిప్రకారం ప్రభువు ఒక బోధకుడి ద్వారా ఎంతమందిని రక్షించాలని నిర్ణయించాడో అంతమందినీ రక్షించుకుంటాడు. ఆ సంఖ్యను చూసి ఆ బోధకుడు కానీ, అతని శిష్యగణం కానీ ఇదంతా మా బోధకుడి చలవేయని అతిశయించే అవకాశం 0.1% కూడా లేదు. కాబట్టి ప్రభువు మా ద్వారా ఎంతమంది‌ని రక్షించాలని నిర్ణయించాడో అంతమందినీ రక్షించుకుంటాడు, ఇందులో మేము ఎవరికీ లెక్కలు చెప్పవలసిన అవసరం లేదు.

ఇక్కడున్న మరొక సమస్య ఏమిటంటే, ఒక బోధకుడి మాటలు వినేసి అతణ్ణి వెంబడించే మందంతా రక్షించబడిపోయినట్టు కాదు. ఈరోజు వాక్యవిరుద్ధమైన బోధలు చేసే ఎందరో బోధకులను ఎన్నోవేలమంది గుడ్డిగా వెంబడిస్తున్నారు, వారంతా రక్షించబడిపోయినట్టా?

ఉదాహరణకు, పైన మేము ప్రస్తావించిన బోధకులను బట్టి రక్షించబడ్డామని భావించి వారి సంస్థల్లో కొనసాగుతూ మమ్మల్ని విమర్శిస్తున్నవారు నిజంగానే రక్షించబడి ఉంటే, బెరయ సంఘస్తులవలే వాక్యపు వెలుగులో తమ బోధకుడి బోధలు పరిశీలించకుండా, ఆ బోధలు వాక్యానుసారం కాదని మాలాంటివారు స్పష్టంగా రుజువు చేసినప్పుడు కూడా వాటినే/వారినే ఎందుకు గుడ్డిగా సమర్థిస్తున్నారు? మాపై అనవసరపు విమర్శలకూ, దూషణలకూ ఎందుకు దిగుతున్నారు? నిజంగా రక్షించబడ్డవారు ప్రభుని వాక్యాన్ని హత్తుకుంటారు, ఒక సంస్థను కాదు. ప్రభువుకు మాత్రమే దాసులుగా ఉంటారు, వారి బోధకుడికి కాదు.  ఈరోజు చాలామంది అలా ఉండడం లేదంటే కారణమేంటి, వారు రక్షించబడకపోవడమే కదా!

3 - మా బోధకుడు ఎలాంటి బోధ చేసినా, దానిని/అతడిని విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారు, అది ప్రభువు చూసుకుంటాడు, ముందు మీరు మీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోండని కూడా కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

వారి బోధకుడు వాక్యవిరుద్ధమైన బోధలు చేస్తుంటే వాటిని ఖండించే హక్కు మాకు ప్రభువే ఇచ్చాడు.

తీతుకు 2:15 వీటిని గూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండించుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము.

రెండవ తిమోతికి 4:2-4 వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయమందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధిచెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను (ఆరోగ్యకరమైన భోదన) సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమకొరకు పోగుచేసికొని,  సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

సంఘాన్ని కలుషితం చేసే దుర్భోధలను ప్రభువే కాదు మనం కూడా చూసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన మన చేతిలో బైబిల్ ఉంచాడు. మమ్మల్ని విమర్శించేవారు ఇలాంటి అనవసరపు మాటలే కాకుండా మా కంటిలో ఏ దూలం ఉందో కాస్త బయటపెడితే దానిని తొలగించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము ఒక బోధకుడికి కాదు సత్యమైయున్న ప్రభువుకే దాసులము.

4 - మరికొందరు వారి బోధకులను విమర్శించడానికి మా స్థాయి సరిపోదనీ, కేవలం మేము పాపులర్ అవ్వడం కోసమే అలాంటి పనులు చేస్తున్నామని కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు.

లోకానుసారమైన మనస్సు కలిగినవారు మాత్రమే ఇలా స్థాయిల గురించి మాట్లాడుతుంటారు కానీ, క్రీస్తులో మనమంతా సమానమని గ్రహించినవారు మేము చెప్పేదానిలో సత్యముందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తారు. ఔనులెండి, వారు తమ బోధకుడి సంస్థలో కాకుండా బైబిల్ బోధించిన యేసుక్రీస్తు సంఘంలో సభ్యులైయుంటే ఈ సంగతి బాగా గ్రహించేవారు.

‌పౌలులాంటి ఉన్నతమైన పరిచర్య చేసిన బోధకుడు కూడా తనకివ్వబడిన ఆధిక్యతను బట్టీ, తాను చేస్తున్న పరిచర్యను బట్టీ ఏనాడూ అతిశయించలేదు, ఎందుకంటే అంత గొప్ప పరిచర్యను చేసే సామర్థ్యం అతనికి దేవుడే అనుగ్రహించాడనే సత్యాన్ని అతను బలంగా విశ్వసించాడు. ఆయనకే లేని ఆతిశయం మీకెందుకు?

2 కోరింథీయులకు 3:5 మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.

దీనిప్రకారం ఎవరి స్థాయిని బట్టీ వారి వాక్యవిరుద్ధమైన బోధను ఖండించకుండా మేము ఉండలేము. వాక్యం మనకు ఒకరు చెప్పే బోధను బట్టి స్పందించమంటుందే తప్ప, వారి స్థాయిని బట్టి కాదు. పౌలును అపోస్తలుడిగా ఎన్నుకున్న దేవుడే మమ్మల్ని విశ్వాసులుగా, బోధకులుగా ఎన్నుకుని మాపై కొన్ని బాధ్యతలను‌ ఉంచాడు. అందులో ఒకానొక బాధ్యతే దుర్భోధలను ఖండించడం. ఇంతకూ మా స్థాయి గురించి మాట్లాడుతున్న బోధకుల అనుచరులు మమ్మల్ని విమర్శించడానికి వారికున్న స్థాయి ఏంటో కాస్త వివరిస్తారా (వారి కొలమానం ప్రకారం)?

రెండవ కొరింథీయులకు 10:12
తమ్మును తామే మెచ్చుకొను కొందరితో జతపరచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింప జాలము గాని, వారు తమలోనే యొకరిని బట్టి యొకరు ఎన్నిక చేసికొని యొకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున, గ్రహింపులేక యున్నారు.
 

అదేవిధంగా, ఎవరినో అడ్డుపెట్టుకుని పాపులర్ అవ్వడానికి ప్రయత్నించవలసిన పరిస్థితిలో మేము లేము; మేము మనుష్యులలో పాపులర్ అవ్వడానికి ప్రయత్నించేవారం కాము, ఒకవేళ మా ఉద్దేశం అదే అయితే వాక్యానుసారమైన ఎదురీతను కాకుండా కొందరు బోధకులు ఎంచుకుంటున్నట్టు సులువైన మార్గాన్నే ఎంచుకునేవారం.

5 - దారినపోయేవాడెవడో ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వవలసిన అవసరం మా బోధకుడికి లేదని కూడా కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

ఔను నిజమే, దారినపోయేవాడు మీ బోధకుడి ఇంటి విషయాల గురించి ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వవలసిన అవసరం అతనికి ఉండదేమో కానీ, సంఘంలో బోధకుడిగా చలామణి అయ్యేవారెవరైనా తాను చేసే బోధల విషయంలో మరో బోధకుడు/విశ్వాసి వాక్యానుసారంగా ప్రశ్నించినపుడు దానికి సమాధానం ఇవ్వవలసిన అవసరం అతనికి ఖచ్చితంగా ఉంది. ఎవరుబడితే వాళ్ళు సంఘంలో ఇష్టమొచ్చినట్టు బోధలు చేస్తామంటే కుదరదు. ప్రతీ ఒక్కరూ బైబిల్ పరిధిలోనే తమ బోధలు కొనసాగించాలి.

యెషయా 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి; ఈ వాక్యప్రకారము వారు బోధించనియెడల వారికి అరుణోదయము కలుగదు.

గలతియులకు 1:8 మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక.

అదేవిధంగా, పౌలుచేస్తున్న పరిచర్యపై, అతని అపోస్తలత్వంపై ఆ కాలంలో కొందరు అతనిపై అక్కసుతో కొన్ని విమర్శలు లేవనెత్తినపుడు ఏ అవసరం ఉందని వారికి తన పత్రికలలో ఆయన సమాధానం‌ ఇచ్చాడు?

1కోరింథీయులకు 9:3 నన్ను విమర్శించువారికి నేను చెప్పుసమాధానమిదే.

మేము వారివలే అక్కసుతో కాకుండా కేవలం వాక్యంపైనున్న ఆసక్తితో ‌కొందరు బోధకుల దుర్బోధలను విమర్శిస్తున్నాము; అలాంటప్పుడు మాకు సమాధానం ఇవ్వవలసిన అవసరం వారికి లేదని ఎవరైనా అంటుంటే, వారి దృష్టిలో తమ బోధకులు పౌలుకంటే చాలా చాలా గొప్పవారేమో!

6 - మా బోధకుడు ఎవరిదీ రూపాయి ఆశించకుండా కష్టపడి సేవ చేస్తున్నాడు, అటువంటి నిస్వార్థపరుడిపై ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని కూడా కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

ఒక బోధకుడు రూపాయి ఆశించకుండా సేవ చేసినంత మాత్రానో, తనకున్న ఆస్తినంతా సంఘస్తులకు ధారపోస్తున్నంత మాత్రానో, ఆ బోధకుడి బోధలు వాక్యానుసారం అయిపోవు. ఆ బోధలు వాక్యానుసారంగా ఉన్నపుడు మాత్రమే అవి దేవుని బోధలుగా గుర్తించబడతాయి‌.

దుర్భోధవైపు సంఘం పయనించడమే సాతానుకు కావాలి; ఆ క్రమంలో వాడికి ఎటువంటి బోధకుడిని‌ సంఘానికి ఎరగా వెయ్యాలో, ఎటువంటి బోధకుడికి సంఘం ఆకర్షించబడుతుందో బాగా తెలుసు. అందుకే మనం బోధకుడు చేసే బోధను వాక్యంతో పోల్చిచూసి, అతను చెప్పే బోధను అంగీకరించాలే తప్ప అతనిలో‌ ఉన్న ఏదో ఒక మంచి లక్షణాన్ని బట్టి బోధను సత్యంగా స్వీకరించకూడదు. ఇతర మతాలకు చెందిన బోధకులలో కూడా మనకు కొన్ని మంచి లక్షణాలు కనిపిస్తుంటాయి, వాటిని బట్టి వారి బోధలను కూడా సత్యమని స్వీకరిద్దామా?

7 - మా‌‌ బోధకుడు రోజుకు అన్ని గంటలు ప్రార్థన చేస్తాడు, అన్నిసార్లు బైబిల్ చదివాడు, అప్పులు చేసి మరీ సువార్తసభలు నిర్వహించాడు, మీరలా చేయగలుగుతున్నారా అని కూడా కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

మేము రోజుకు‌ ఎన్నిగంటలు ప్రార్థన చేస్తున్నామో, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నామో అది మా వ్యక్తిగత విషయం. కొందరు బోధకులు చెప్పుకుంటున్నట్టుగా ఆ వివరాలు అందరికీ తెలియచెయ్యవలసిన అవసరం మాకు లేదు. మనమిక్కడ కొందరు చేస్తున్న బోధలు (అవి వ్యక్తిగతం కావు) వాక్యానుసారమా, కావా అనేదాని గురించి మాట్లాడుకుంటున్నాము తప్ప, ఎవరెంతసేపు ప్రార్థన చేస్తున్నారు, ఎన్నిసార్లు బైబిల్ చదువుతున్నారు అనేది తేల్చుకోవడానికి కాదు.

ఇంతకూ బైబిల్ గ్రంథంలో అప్పులు చేసి మరీ సువార్త సభలు నిర్వహించమని ఎక్కడుందో కాస్త రిఫరెన్స్ ఇవ్వగలరా?

మాకు తెలిసినంతమట్టుకు అప్పులు చేసి సువార్త సభలు నిర్వహించి (అందులో‌ కూడా బోధకుడి సొంత డబ్బా ఎక్కువ వినిపిస్తుంది) ఆ అప్పును సంఘంపైకి నెట్టివెయ్యమని కానీ, లేక ఆ అప్పులు సరిగా తీర్చలేక వారిచేత అవమానించబడమని కానీ ఎక్కడా రాయబడిలేదు. బైబిల్ ఖచ్చితంగా చేయమని ఆజ్ఞాపించని ఒక విషయంలో మమ్మల్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు.

ఇప్పటివరకూ మనం చూసిన విమర్శలు కొందరు బోధకుల అనుచరుల నుండి మాపై సంధించబడితే,  కొందరు సాధారణ క్రైస్తవులు కూడా మేము చేసేదానిని అపార్థం చేసుకుని దానిపై వారి అభ్యంతరాలను తెలియచేస్తున్నారు. వారికి కూడా ఇక్కడ ప్రేమపూర్వకంగా వివరణ ఇవ్వదలిచాము.

A) ప్రభువు మనకు సువార్త ప్రకటించమనే భారాన్ని అప్పగిస్తే మీరది చేయకుండా కొందరు బోధకులపై ఇటువంటి విమర్శలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటివి చేసి ఎంతమందిని రక్షిస్తున్నారని కొందరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.

ప్రభువు మనకు సువార్త ప్రకటించే బాధ్యత మాత్రమే కాదు సువార్త పేరిట జరుగుతున్న వాక్యవిరుద్ధ బోధలను ఖండించే బాధ్యతను కూడా అప్పగించాడని పైన‌ తెలియచేసాను. భిన్నమైన సువార్త సమాజంలో ప్రవేశించినపుడు దానిని బహిర్గతం చేసి, వాక్యం చెప్పే అసలైన సువార్త ఏదో ప్రజలకు అవగాహన కల్పించడం కూడా సువార్త పనిలో భాగమే.

సువార్త ప్రకటించడానికి స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చేతే నియమించబడిన అపోస్తలులు కూడా భిన్నమైన సువార్త సంఘంలో చెలరేగినప్పుడు దానిని ఖండించినట్టుగా వారి పత్రికలు సాక్ష్యమిస్తున్నాయి. అంటే వారు సువార్తను పక్కన పెట్టేసి విమర్శలు చెయ్యడం ప్రారంభించారని అర్థమా? అదేవిధంగా, మనం చేసే బోధలన్నీ అన్యులను రక్షణలోకి నడిపేందుకు మాత్రమే కాదు, అప్పటికే రక్షించబడ్డవారిని అభివృద్ధిలో నడపడానికీ, వాక్యవిరుద్ధమైన బోధలపై అవగాహన కల్పించడానికి కూడా దోహదపడతాయి.

కాబట్టి దుర్భోధలను‌ ఖండించేవారిని మీరు ఈవిధంగా చేస్తూ ఎంతమంది అన్యులను రక్షిస్తున్నారని ప్రశ్నించడం సరికాదు. అది నువ్వు స్నానం చెయ్యడం వల్ల ఆకలి తీరుతుందా అని ప్రశ్నించినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఆకలి తీరడానికి భోజనం చేస్తాడు, వ్యక్తిగత శుభ్రత కోసం స్నానం చేస్తాడు, అవి రెండూ ఆ వ్యక్తికి అవసరమే.

అదేవిధంగా దుర్భోధలను ఖండించేవారు ఆ సమయంలో ఆ పని చేస్తుంది అన్యులను రక్షించడానికి కాదు కానీ అప్పటికే రక్షించబడ్డామని భావించేవారికి వారు నమ్ముతున్న వాక్యవిరుద్ధమైన బోధలపై అవగాహన కల్పించడానికీ, మరికొందరు ఆ బోధలలో చిక్కుకోకుండా తప్పించడానికి మాత్రమే. అలా అని ఈ పని‌ చేస్తూ మేము సువార్తను ఎక్కడా నిర్లక్ష్యం చెయ్యడం లేదు, మా వెబ్ సైట్ లో సువార్తకు సంబంధించిన వ్యాసాలను కూడా మీరు చదవవచ్చు. ఇంతకూ మాపై ఈ ప్రశ్నను సంధిస్తున్నవారు వారి కొలమానం ప్రకారం మాపై ఈ ప్రశ్నను సంధించడం ద్వారా ఎంతమందిని రక్షించగలిగారు?

B) మీరు క్రైస్తవులైయుండి క్రైస్తవ సేవకులనే విమర్శిస్తూ క్రైస్తవ్యాన్ని చులకన చేస్తున్నారు, దేవుని నామాన్ని అవమానిస్తున్నారని మా విషయంలో కొందరు వాపోతున్నారు. క్రైస్తవ్యంలో ఉన్న భిన్నమైన సువార్తను (బోధను) బహిర్గతం చెయ్యడం క్రైస్తవ్యాన్ని అన్యుల ముందు చులకన చెయ్యడం అవ్వదు. అది క్రైస్తవ నైతికతనూ, సత్యం పట్ల వారికున్న రాజీపడని తత్వాన్నీ చాటి చెప్పడమే ఔతుంది. అన్యుల ముందు దేవుని నామం అవమానించబడేది దుర్భోధలను ఖండించేవారి వల్ల కాదు కానీ, దేవుని పేరుతో దుర్భోధలను చేస్తూ, చెడు ప్రవర్తనను అనుసరించేవారివల్లే అని వాక్యం చెబుతుంది.

రెండవ పేతురు 2:1,2 మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువును కూడ విసర్జించుచు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును.

ప్రస్తుతం మన సమాజంలో దేవుని నామం దూషించబడేదీ, క్రైస్తవ్యం చులకన చేయబడేదీ, స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు అంటూ దుర్భోధలు చేసే బోధకులను బట్టి కాదా? ఒకసారి మనం ప్రారంభ క్రైస్తవ సంఘచరిత్రను  పరిశీలిస్తే వారు అన్యుల ద్వారా, యూదుల ద్వారా చాలా హింసలు పడుతున్న సమయంలో కూడా అపోస్తలులు వారిలో ప్రవేశించిన దుర్భోధకులను బహిర్గతం చేస్తూ వచ్చారు (తరువాత చరిత్రలో కూడా ఇదే జరుగుతూ వచ్చింది).

వారంతా మనమిలా చేస్తే దేవుని నామం అవమానించబడుతుంది, క్రైస్తవ్యం చులకన చేయబడుతుందనే‌ అవగాహన లేకనే అలా చేసారంటారా? ఎవరిముందో చులకన ఔతామని భావించి వాక్యవిరుద్ధమైన బోధలతో, బోధకులతో రాజీపడి వారిని/వాటిని సహించడం వాక్యానికీ, దేవునికీ వ్యతిరేఖంగా మారడమే సుమా! దానివల్ల సంఘానికి కూడా ఎంతో నష్టం.

రెండవ తిమోతికి 2:17,18 కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;  వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.

C) కొందరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు అనే వాక్యభాగాన్ని ప్రస్తావిస్తూ మేము చేసేది తప్పైనట్టు నేరం మోపుతున్నారు.

వాస్తవానికి ఆ వాక్యపు సందర్భం‌ దుర్బోధల గురించి కానే కాదు, దుర్బోధలకు మనం తీర్పు తీర్చేవారిగా ఉండాలని కూడా ప్రభువు మనకు బైబిల్ ఇచ్చాడు, వాటిని ఖండించమని ఆజ్ఞాపించాడు. ఇంతకూ మనం ఎవరికీ తీర్పుతీర్చకూడదని భావించేవారు, మేము చేసేది తప్పని చెబుతూ మాకెందుకు తీర్పు తీరుస్తున్నారు?

D) కొందరు మేము  ఏ బోధకుల బోధలనైతే వాక్యానుసారంగా ఖండిస్తున్నామో వారిలో ఎవరొకరి పేరును ప్రస్తావించి, ఆయన చెప్పిన బోధమూలంగానే మేము రక్షించబడ్డామనీ/బలపరచబడ్డామని మా రక్షణకు/అభివృద్ధికి కారణమైన బోధకుడి మాటలు వాక్యవిరుద్ధమని ఎలా చెబుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మన రక్షణ అనేది బోధకుడి చేతుల్లో లేదని, దేవుని నిర్ణయంలోనే ఉందనీ, బోధకుడు కేవలం దేవుడు వాడుకునే సాధనం మాత్రమేయని పైన తెలియచేసాను.

ఒక బోధకుడు చెప్పిన మాటలవల్ల ఒక వ్యక్తి రక్షించబడినంత మాత్రాన (అది వాక్యానుసారమైన రక్షణే అయితే) ఆ బోధకుడు చేసిన మిగిలిన బోధలన్నీ సత్యమైపోవు. ఎంత పెద్ద దుర్భోధకుడైనా ఏదో ఒక సమయంలో సత్యబోధ చేయడం సహజం. మనం ఎంతో కౄరులుగా భావించే టెర్రరిస్టులు కూడా తమ జీవితంలో ఏదో ఒక మంచిపనైనా చెయ్యకుండా ఉండరు కదా? దేవుడు సాతానును కూడా వాడుకుని తన కార్యాన్ని జరిగించుకుంటాడు, అదేవిధంగా ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుడు ఎవర్నైనా వాడుకుంటాడు, కొన్నిసార్లు రోగాలనూ, శోధనలను కూడా వాడుకుంటాడు. కౄరుడైన కయప చేత కూడా ఆయన ఒక‌ సందర్భంలో యేసుక్రీస్తు మరణం గురించి ప్రవచనం చెప్పించాడు.

యోహాను సువార్త 11:49-52 అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండి మీకేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే యీలాగు చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండెను గనుక యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను.

ఈ వ్యాసం రాస్తున్న నేను కూడా గతంలో ఒక కల్ట్ కి చెందిన వ్యక్తి బైబిల్ గురించి చెప్పిన మాటలు విని, ఆసక్తితో బైబిల్ చదవడం ప్రారంభించాను. అలా చదువుతూ, మిగిలిన బోధకుల రచనలు, బోధలను పరిశీలించినప్పుడు, ఆ బోధకుడు  చెబుతున్న చాలా బోధలు వాక్యానుసారం కావని గ్రహించి ఆ బోధలపై చాలామందికి అవగాహన కల్పించడం ప్రారంభించాను. ఇప్పటికీ‌ ఆ తప్పుడు బోధలపై వ్యాసాలు రాస్తున్నాను. ఎందుకంటే నేను అ వ్యక్తిని బట్టే బైబిల్‌పై ఆసక్తి పెంచుకున్నప్పటికీ ‌నాలో ఆ ఆసక్తి పుట్టించినవాడు దేవుడేయని నేను గుర్తించాను.

గాడిదను వాడుకుని బిలాముకు బుద్ధి చెప్పిన దేవుడే, ఆ బోధకుడు చెప్పిన కొన్ని మాటల ద్వారా నాలో‌ ఆసక్తిని రేకెత్తించాడు. అలా అని ఆ వ్యక్తిపై నాకు అభిమానం లేకుండా పోలేదు, అందుకే ఇప్పటికీ ఆయన మారుమనస్సు పొంది సత్యాన్ని గ్రహించి తన తప్పుడు బోధలను బాహాటంగా సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి మన రక్షణలో దేవుడు సాధనంగా వాడుకున్న బోధకుడి‌ కోసం మనం సత్యంతో రాజీపడే ఘోరతప్పిదం‌ చెయ్యకూడదు, ఎందుకంటే క్రైస్తవుడు సత్యసంబంధి.

D) ప్రభువు విశ్వాసులందరినీ ఏకంగా ఉండమని ఆజ్ఞాపిస్తే మీరు సంఘంలో చీలికలు తీసుకువస్తున్నారని కూడా కొందరు మమ్మల్ని నిందిస్తున్నారు.

మనల్ని ఏకంగా‌ ఉండమని ఆజ్ఞాపించిన ప్రభువే మనం దేనితో ఏకమైయుండాలో కూడా తెలియచేసాడు.

యోహాను సువార్త 17:21,22 వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

దీనిప్రకారం విశ్వాసులు వాక్యంతో ఏకమైయుండాలి, వాక్యవిరుద్ధమైన బోధలతో కాదు. సత్యం, అసత్యం ఎప్పటికీ ఏకమైయుండలేవు.

E) మీరు ఇంటిగుట్టును ఇలా బయటపెట్టడం మతోన్మాదులకు క్రైస్తవ్యాన్ని విమర్శించే అవకాశం కల్పించడమే అని కూడా కొందరు మమ్మల్ని విమర్శిస్తున్నారు.

సాధారణంగా మతోన్మాదులు వారి మతానికి చెందినవారు ఏ తప్పిదం చేసినా బయటపడకుండా చూసుకుంటారు. కానీ నిజక్రైస్తవులు బైబిల్ బోధపై సంఘం వెలుపటి నుండి దాడి జరిగినా లోపటి నుండి జరిగినా సమానంగా బయటపెట్టి తమ నైతికతను చాటుకుంటారు.

మతోన్మాదులు మనం అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా బైబిల్ పైనా, క్రైస్తవ్యంపైనా విషం చిమ్మడం మానరు, అది వారి నైజం. ఏ అవకాశం ఉందని మిషనరీ సేవలను సైతం వారు నీచంగా అవమానిస్తున్నారు? సంఘంలోని దుర్భోధలను బహిర్గతం చెయ్యడం వల్ల మతోన్మాదులకు ఏదో అవకాశం ఇచ్చినట్టు‌ ఉంటుందని మనం జీవము గల దేవుని సంఘాన్ని బైబిల్ బోధ నుండి భిన్నమైన బోధ తట్టుకు నడిపిస్తున్నవారిని సహించాలా? ప్రభువు మనపై పెట్టిన బాధ్యతను విస్మరించాలా? కొరింథీ సంఘపువారు ఈ విధంగానే ఏవేవో కారణాలతో కొన్ని దుర్భోధలను సహిస్తున్నపుడు పౌలు వారితో వంగ్యంగా పలుకుతున్న మాటలు చూడండి.

రెండవ కొరింథీయులకు 11:2-4 దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగియున్నాను; ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని, మిమ్మును ప్రధానము చేసితిని గాని, సర్పము తనకు యుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, క్రీస్తు ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చినవాడెవడైనను మేము ప్రకటింపని మరియొక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరియొక ఆత్మను మీరు పొందినను,మీరు అంగీకరింపని మరియొక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే.

కాబట్టి, ఇకమీదట మేము ఎవరి బోధలనైనా దుర్భోధలుగా గుర్తించి ఖండిస్తున్నపుడు, మేము చెప్పేది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మాత్రమే పరిశీలిస్తూ దానిప్రకారం‌ మమ్మల్ని విమర్శించండి. లేదా ఇటువంటి అనవసరపు విమర్శలు ఏమైనా బాకీ ఉంటే వాటిని కూడా సంధించడానికి సిద్ధపడండి; అటువంటి విమర్శలు ఎన్ని వచ్చినా సమాధానం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఉంటాము.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.