ఆత్మీయత, పరిశుద్ధత లేని నేటి క్రైస్తవ ఆరాధన
‘‘ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు’’ -ఎఫెసీయులకు 5:19.
‘‘దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను’’ -యోహాను సువార్త 4:24.
గత 1,2 దశాబ్దాల నుండి క్రైస్తవ లోకంలో ఆరాధన పద్ధతిలో పరిశుద్ధతను, వాక్యభావాన్ని మరచి లోకపరమైన పోకడలను, ఆకర్షణీయమైన పద్ధతులను అవలంబిస్తూ వస్తుంది. టి.వి. మాధ్యమం, సామాజిక మాధ్యమం ఎక్కువగా అందుబాటులోకి రావడం వలన, ప్రజలు, సంఘ సభ్యులు తమని తాము ప్రదర్శించుకోవడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నేటి యువత వాక్యం లోని లోతైన అవగాహన కూడా లేకుండా పాటలు రాసి, పాడి సమాజంలో దేవుని నామానికి ఘనత కలిగించ లేకపోతున్నారు. ఇది పెద్దవారిలో కూడా కనబడుతుంది. అలాగే క్రైస్తవ్యంలో ఇబ్బంది పెడుతున్న మరొక అంశం అపవిత్రమైన నృత్య ప్రదర్శనలు లోక పరమైన నృత్యాలను సంఘంలోనికి తీసుకొచ్చి అపవిత్ర పరుస్తూ దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. పరిశుద్ధంగా ఉండవలసిన సంఘ స్థలాలు అపవిత్రమైన సంగీత, నృత్య ప్రదర్శనలు చోటుచేసుకుంటున్నాయి. ఇలా ఆరాధన పద్ధతులు, పరిశుద్ధమైన ఆరాధన, సంఘాలలో ప్రదర్శిస్తున్న సంగీత, నృత్య కార్యక్రమాలు గురించి గమనిద్దాం.
1. ఆరాధన అంటే ఏమిటి?
సంగీతం అనేది మానవ జీవితంలో స్వాభావికంగా అంతర్గతంగా భాగమైపోయిన అంశం. అన్ని కాలాలలో ప్రతి జాతులలో ప్రజలు తమ హావ భావాలతో సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. బైబిల్‌లో ఆరాధన గురించి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దేవుడు ఆరాధనకు చాలా విలువైన ప్రాముఖ్యతను దయ చేశాడు. కీర్తనలు, పరమ గీతం, విలాప వాక్యాలు వంటి గ్రంథాలు మరియు అనేకచోట్ల ప్రవక్తలు, రాజులు, శిష్యులు కీర్తనలను, పాటలను పాడుతూ దేవుని స్తుతించారు.దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను, ఆయన ప్రజల పట్ల చేసిన అద్భుత కార్యాలను, ఆయన పరిశుద్ధతను, ఆయన న్యాయపరమైన ఉగ్రతను, శిక్షను, ఆయన పట్ల విశ్వాసం నిలిపిన వారికి ఆయన యొక్క విశ్వాస్యతను, ఆయన ప్రేమను, కృపను, ప్రజల యొక్క క్రమశిక్షణ రాహిత్యాన్ని ఖండిస్తూ, ఎన్నో కీర్తనలు రచించి పాటలు పాడారు. అనేక రకమైన సంగీత వాయిద్యాలు ఉపయోగించి దేవుని కీర్తించారు.
అయితే వీటిలో ఎక్కడ కూడా అపవిత్రత, లోక పరమైన పోకడలు, ఆకర్షణలకు, స్వకీయ ఘనతలకు చోటివ్వలేదు. ఆత్మతోను, సత్యముతోను, పరిశుద్ధతతోను తమని తాము ఉపేక్షించుకొని దేవుని కీర్తించారు మరియు నిష్కళంకమైన ప్రేమతో, నిస్వార్థంతో ఆయనను ఆరాధించారు. ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్నిటికంటే ప్రముఖంగా యేసుక్రీస్తు మనందరి పాపాల నిమిత్తం మరణించాడని, అందుకోసం ప్రజలు వారి పాపాలనిమిత్తం పశ్చాత్తాపపడి, హృదయంలో నొచ్చుకుని ఆయన ఎదుట ఒప్పుకొనేలా పాటలు వ్రాయడం మరియు పాడటం జరగాలి. అలాంటి భావంతో కీర్తనలు అభివృద్ధి చేయాలి. అన్యజనులు దేవుని సువార్తను, కీర్తన ల ద్వారా విని ఆయనను నమ్మి, ఆయనకు దగ్గరయ్యేలా చేయగలగాలి. సంఘములో ప్రజలను దేవునితో సంబంధాన్ని ఏర్పరచగలగాలి. ఇలా పైవన్నీ జరగాలంటే ప్రజలు తమ స్వార్ధాన్ని విడిచి తమని తాము
ఉపేక్షించుకొని దేవుని హెచ్చించి కీర్తనలు వ్రాసి పాడగలిగితే ఆయన నామానికి మహిమ కలుగుతుంది.
‘‘యేసు తన శిష్యులను చూచిఎవడైనను నన్ను వెంబడిరపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను’’ -మత్తయి సువార్త 16:24.
నృత్య ప్రదర్శనలో చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్యకాలంలో సినిమాల ప్రభావం యువత మీద ఎక్కువగా ఉండడంతో, యువతీ యువకులు వాటిలో కనబడే నృత్యాలను అనుసరిస్తూ సంఘాలలో దేవుని పాటలకు జోడిస్తూ ఆయన నామానికి అవమానాన్ని కూడగడుతున్నారు. సంఘ కాపరులు, పెద్దలు వారిని ఖండిరచి, నిలువరించి, బుద్ధి చెప్పే కార్యక్రమాలు చేయడం లేదు. దీనివలన యువత ఇలాంటి నృత్యాలను దైవారాధనగా భావిస్తున్నారు.
‘‘మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి’’ -I కొరింథీయులకు 6: 19-20.
వాస్తవానికి నృత్యమనేది చాలా చాలా జాగ్రత్తలు వహించి హద్దుల్లో ఉండి చేయవలసినది. లోక పరమైన నృత్యాలకు తావు లేదు. చాలా పవిత్రతతో, పరిశుద్ధతతో జరిగిం చాల్సిన కార్యక్రమం. సంతోషంతో దేవుని కీర్తిస్తూ ఆరాధించాలి.
‘‘నీవు యౌవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము’’ -II తిమోతికి 2:22.
‘‘మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి’’ -రోమీయులకు 12:2.
2. పరిశుద్ధత అంటే ఏమిటి ?
‘‘రాజైన ఉజ్జియా మృతినొందిన సంవత్సరమున అత్యు న్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని; ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను.. ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను. వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరమువలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యములకధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిననుకొంటిని’’ -యెషయా 6:1-5.
‘‘మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి’’ -I పేతురు 1:16.
‘‘నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్దపరచుకొనవలెను’’ - లేవీయకాండము 11:44.
‘‘నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించు నట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు.
నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను’’ -ప్రసంగి 5:12.
‘‘దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను’’ -ఆదికాండము 1:26.
కాబట్టి మన నడవడి పరిశుద్ధత కలిగివుండాలి. ఆయనను పోలి సృష్టింపబడ్డాము కాబట్టి అయన పరిశుద్ధత కలిగి లోకపరమైన పాపపు క్రియలు వాటి సంబంధిత మూలలను సంఘములోనికి రానివ్వకూడదు. జారత్వము, అపవిత్రత అసహ్యకార్యలకు చోటివ్వకూడదు.మనల్ని మనం తగ్గించుకుంటే తప్పకుండ అయన పరిశుతను కలిగియుండడానికి సుగమం అవుతుంది. దేవుడు పరిశుద్ధుడు అని సంఘ కాపరులు, పెద్దలు సంఘానికి భోదిస్తూ యువతకు నిత్యము జ్ఞాపకము చేస్తూ తెలియపరచాలి. అపవిత్రమైన నృత్యాలకు చోటివ్వకుండా జాగ్రత్తపడాలి.
3. లోతైన భావము, విషయము లేని పాటలు :
‘‘ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది’’. - హెబ్రీయులకు 4 :12.
‘‘సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీరసంబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొనువారు కారా?’’ -I కొరింథీయులకు 3:1-3.
నేటి క్రైస్తవ సంగీత- ఆరాధన పరిచర్యలో వస్తున్న పాటలలో ఎక్కువ శాతంలో లోతైన భావము,విషయ పరిజ్ఞానం లేకుండా పోతుంది. దీనికి ముఖ్య కారణం సంఘము వాక్యం పట్ల లోతైన అవగాహన లేకపోవడం, వాక్య పరిశోధన లేకపోవడం, ప్రార్థనా భారము లేకపోవడం, దేవునితో సరియైన సంబంధం లేకపోవడం, ఆత్మీయ జీవితము లేకపోవడం, రక్షణానుభవం లేకపోవడం వలన ఆత్మీయ గీతాలను రచించ లేకపోతున్నారు. ఇందువలన ఆరాధన క్రమంలో సువార్త పరిచర్య మారుమనస్సు అనుభవం లేకుండా పోయి సంఘము మరియు అన్య ప్రజలు దేవునిపట్ల ఆకర్షితులు కాలేక పోతున్నారు.
సుమారు 60-70 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు హెబ్రోను గీతాలు ఇంకా అనేక పాటలు నేటికీ క్రైస్తవలోకంలో చెరగని ముద్ర వేయగలుగుతున్నాయి. ఆ కాలంలో భక్తులు వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేసుకొని దేవుని పట్ల తమకున్న అపారమైన ప్రేమతో తమ రక్షణ అనుభవంతో ఆత్మానందంతో చక్కని పాటలు రచించి పొందుపరిచారు. తద్వారా అనేకులు ఆ పాటల పట్ల ఆకర్షితులై దేవుని సువార్త పట్ల ఆసక్తి పెంపొందించుకుని తమ పాపాల విషయమై పశ్చాత్తాపపడి మారుమనస్సు పొందుకొని ఆయనను విశ్వసించారు.
ఆయన మనుష్యలయెడల చేసిన ఆశ్చర్య క్రియలు, తన సిలువ త్యాగం ద్వారా వారిని రక్షించిన తీరుపై ప్రజలు ఆయన యందు విశ్వాసం పెంపొందించేలాగున కీర్తనలు రచించి వినసొంపుగా ఉండేలాగున, అందుబాటులో ఉన్న సంగీత వాయిద్యాల ద్వారా చక్కని గేయాలు పాడేవారు. అయితే నేటి కాలంలో పై చెప్పబడిన అనుభవాలు లోపించడం వలన ప్రజలనూ దేవుని వైపు ఆకర్షించ లేకపోతున్నారు. చాలా పాటలలో భావము లేకుండా కేవలము కొన్ని పదాలతో జపిస్తూ, అదే స్తుతించడం అని అపోహ పడుతున్నారు. వాస్తవానికి దావీదు, సొలోమోను, మోషే ఇంకా అనేకమంది రచించిన కీర్తనలలో దేవుడు చేసిన క్రియలను విషదీకరిస్తూ కొనియాడుతూ స్తుతించారు, జపించారు.
భావము, విషయ పరిజ్ఞానము, లోతైన వాక్య పరిశీలనలేని పాటలకు వికారమైన నృత్యాలను జోడించి దేవుని నామానికి అవమానకరంగా నిలుస్తున్నారు. లోక పరమైన ఆకర్షణలకు తావిచ్చి సినిమా పాటలు, సంగీత నృత్యాల తీరులో సంఘములోనికి తీసుకొచ్చి జారత్వము, అసహ్యకరమైన, అనైతికమైన ఏహ్యభావాన్ని కలిగించే విధంగా అపవిత్రతకు చోటు ఇస్తున్నారు. అన్యజనులు వీటిని చూసి ఎగతాళి చేసే విధంగా మారుస్తున్నారు. అయితే ఈ తరహా వక్రీకరణను సంఘ కాపరులు, పెద్దలు వెంటనే ఖండించాలి.
‘‘జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీర మునకు హానికరముగా పాపము చేయుచున్నాడు’’ -I కొరింథీయులకు 6:18.
4. శిక్షణ లేని ఆరాధన :
‘‘యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడనున్న ప్రవీణులైన పాటకుల లెక్క రెండువందల ఎనుబది యెనిమిది’’ -I దినవృత్తాంతములు 25:7.
‘‘బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు’’ -సామెతలు 22:6.
‘‘మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను’’ -అపొ. కార్యములు 7:22.
‘‘వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును’’ -హెబ్రీ 5:14.
ఈ కాలంలో అనేక మంది సరైన శిక్షణ లేకుండా సంగీతం, నృత్యాల పట్ల అవగాహన లేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా పాటలు రచించడంలో వాక్య పరిశీలన కలిగి బైబిల్ వేదాంత విద్య యందు కొంత శిక్షణ కలిగి రచిస్తే కీర్తనలు సుందరంగా, అనుభవపూర్వకంగా రూపుదిద్దుకుని ఉంటాయి. ఇందులో కూడా ఆత్మీయత ఖచ్చితంగా కలిగి ఉండాలి. నృత్య ప్రదర్శనలు, డ్రామాలు వంటివి శిక్షణ పొందేటప్పుడు పెద్ద వారి సమక్షంలో మరి ముఖ్యముగా మన దేవుడు పరిశుద్ధుడు అని జ్ఞాపకం ఉంచుకొని ప్రదర్శించాలి.
5. ఆకర్షణీయమైన స్థలాలు, విదేశీ పర్యాటక స్థానాలు :
‘‘మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముముÑ మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది.అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నదిÑ అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను’’ -యోహాను సువార్త 4:20-24.
‘‘పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి’’ -కొలస్సయులకు 3:2.
గత 15 - 20 సంవత్సరాల నుండి ఆరాధన క్రమంలో రూపుదిద్దుకుంటున్న మరొక ముఖ్య అంశం విదేశాలలోనైనా, స్వదేశాలలోనైనా ఆకర్షణీయమైన స్థలాలలో పాటలు పాడడం.
విపరీతమైన ఖర్చు చేసి ఆ స్థలాలకు వెళ్ళి పాటలు చిత్రీకరిస్తున్నారు. వాస్తవానికి ఆత్మీయ పాటలు, కీర్తనలకు స్థలాలతో సంబంధం లేదు. దైవాత్మ కలిగి, ఆత్మీయ ప్రేరణతో మనం ఉన్న స్థలాలలోనే దేవుణ్ణి కీర్తించవచ్చు. దేవుని వాక్యాన్ని స్థలంతో నిమిత్తం లేకుండా చెప్పేటప్పుడు, పాటలు పాడడానికి వివిధ ఆకర్షణీయమైన స్థలాలు ఉపయోగించడం దేనికి? ఆయనను ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించవలెను. మన హృదయమే ఆయన ఆలయము.
‘‘మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?’’ -I కొరింథీయులకు 3:16.
ఒకప్పటి కాలంలో వీడియోలు, టీవీలు అందుబాటులో లేనప్పుడు ఎన్నో అద్భుతమైన పాటలను రచించి పాడి ప్రజలను దేవుని వైపు ఆకర్షితులు చేయగలిగారు. నేటి కాలంలో సామాజిక మాధ్యమాలు మరియు అనేక మాధ్యమాలు అందుబాటులో రావడం ద్వారా వాటిలో తమనితాము ఆకర్షణీయంగా మార్చుకోవడానికి తమ పాటలు ప్రజలలో అధికముగా ఆమోదించుకోవడానికి విదేశీ స్థలాలను ఎంచుకుని విచ్చలవిడిగా పెట్టుబడి పెడుతున్నారు. దీనికి లక్షలలో ఖర్చు చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఒక విదేశీ పర్యటనకు కనీసం ఐదు నుండి పది మందికి పైగా వెళ్తే లక్షలు ఖర్చు అవుతుంది. ఇలా ఉపయోగంలేని స్థలాలు, విదేశీ స్థలాలు, స్వదేశీ పర్యటనల వలన ఆత్మీయ ఆరాధన సువార్త ప్రకటన జరుగదు. ఒకవేళ చక్కని ఆత్మీయ పాటలు రచించి పాడాలి అనుకున్నా అవి భారీ సెట్టింగులు విదేశీ లొకేషన్లు స్థలాల్లో అవసరంలేదు. తగు మాత్రపు ఖర్చుతో ఆయనను ఆరాధించవచ్చు.
ప్రజల దగ్గర నుండి సువార్త ప్రకటనకై అర్ధిస్తున్న దశమ భాగాలు, విరాళాలతో సంఘ కాపరులు, పెద్దలు, సభ్యులు ఉపయోగం లేని విదేశీ పర్యాటక స్థలాలలో పాటలు పాడటం నృత్యాలు వేయడం మరియు వాటిని సందర్శించాలని తమ మనసులోని కోరికలను ఆస్వాదించడం అనేది దేవుని మోసం చేయడమే. ఇంత ఖర్చును ఇలాంటి పర్యటనలకు ఖర్చు చేసే దానికంటే సువార్త పరిచర్యకు, పేద ప్రజల విద్య అవకాశాలకు, వైద్యం కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం, మరీ ముఖ్యంగా మన దేశంలోని పేదరిక నిర్మూలన కొరకు, మూఢనమ్మకాల అరికట్టడానికి సంఘము తమ వంతు కృషి చేయాలి. తద్వారా సువార్త ప్రకటన సులువుగా చేరడానికి అవకాశాలు ఉంటాయి.
‘‘కీడుచేయుట మానుడి మేలుచేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి తండ్రిలేనివానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి’’ -యెషయా 1:17.
‘‘పేదలకును తలిదండ్రులులేనివారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవారికిని దీనులకును న్యాయము తీర్చుడి’’. - కీర్తనల గ్రంథము 82:3.
‘‘అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి, అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరామర్శించెను. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చి ఇతని పరామర్శించుము, నీవింకేమైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయెను’’ -లూకా సువార్త 10:33-35.
6. సంగీత వాయిద్యాలకు అధిక మొత్తంలో ఖర్చు పెడుతున్న పరిస్థితి :
నేటి కాలంలో క్రైస్తవ ఆరాధన ఈ క్రమంలో ఇబ్బంది పెడుతున్నా మరొక భారమైన అంశం అధిక వ్యయంతో సంగీత వాయిద్యాలకు ఖర్చు చేయడం. వీటికి ఎక్కువ ఖర్చు పెట్టడంలో చాలా సంఘాలు ముఖ్యంగా యువత ఎక్కువగా ఆరాటపడుతున్నారు. మరీ ముఖ్యంగా లోకంలోనున్న సినిమా మరియు ఇతర సంగీతానికి సమాంతరంగా ఉండాలని ఆశతో వాటి పోకడలను ఆదర్శంగా తీసుకొని సంఘంలో సంగీతాన్ని తయారుచేయాలని వాయిద్యాలకు ఖర్చు పెడుతున్నారు.
‘‘మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవముగల దేవుని ఆలయమై యున్నాము. అందుకు దేవుడీలాగు సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలునై యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు’’ -2 కొరింథీయులకు 6:14-18.
అంతేకాకుండా ఒక సంఘంలోనున్న సంగీత వాయిద్యాలకు మించి మరొక సంఘంలో ఉండాలనే కోరికతో పోటీపడుతూ విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు చిన్న డప్పుతో కీర్తనలు పాడుతూ సువార్త ప్రకటించేవారు. అందుబాటులోనున్న కొన్ని వాయిద్యాలతో చాలా మొత్తంలో కీర్తనలు పాడుతూ సువార్త ప్రకటించేవారు.
నేడు ఎన్నో రకాల వాయిద్యాలు ఉపయోగిస్తున్నప్పటికీ భావము లేని పాటలు మారుమనస్సు- రక్షణ అనుభవంలేని కీర్తనలు పాడుతున్నారు. దీనికి ముఖ్య కారణం వాక్యంలో లోతైన పరిశీలన, విషయ పరిజ్ఞానం లేకపోవడం. మరీ ముఖ్యంగా స్వకీయ మహిమ కొరకు తమ స్వంత ప్రతిభను కనుపరచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు. దేవునిని ఘనపరచడానికి బదులు తమని తాము ఘనపరచుకుంటున్నారు. వాయిద్యాలు వాయించడం అనేది పాటకు కేవలం ఒక అదనపు ఆకర్షణగా ఉండి సువార్త ప్రకటన లో దేవుని వైపు ప్రజలను ఆకర్షించడానికి ఒక మాద్యమంలాగా ఉంటుంది. సువార్త ప్రకటనకు మించి వాయిద్యాల ప్రాముఖ్యత పెరగకూడదు. సంగీతానికి ఎక్కువ విలువ నిచ్చి వాక్యానికి ప్రాధాన్యం తగ్గించకూడదు. మరీ ముఖ్యంగా నేటి యువత వాక్య పరిశీలనకు బదులు సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచి సూచిక కాదు మరియు అది ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడదు. తగు మాత్రపు వ్యయ పరిణితి చెందిన సంగీత వాయిద్యాలను కొనుగోలు చేస్తే మంచిది. సంఘము దగ్గరనుండి దశమ భాగాల రూపంలో, కానుకల రూపంలో వస్తున్న డబ్బును ఇలా సువార్త ప్రకటనకు మించి వాయిద్యాలకు ఖర్చుచేయడమనేది నిధులను తప్పుదోవపట్టించడం మరియు వక్రీకరించడం అవుతుంది.
అయితే రాజైన దావీదు రాసిన 150వ కీర్తనలో చూసినట్లయితే అనేక వాయిద్యాలను ఉపయోగించినట్లు పేర్కొనబడిరది. ఇక్కడ సారాంశాన్ని బట్టి దావీదు తనను తగ్గించుకొని కేవలం దేవున్ని మాత్రం ఘనపరుస్తూ అనేక వాయిద్యాలతో ఆయనను కీర్తించాలని చెబుతాడు. అయినప్పటికీ దావీదు దృష్టిలో దేవున్ని ఘనపరచడానికంటే, సువార్త ప్రకటనకంటే ఎక్కువగా సంగీత వాయిద్యాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకోవడం లేదు.
‘‘అందుకు పేతురు ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి?’’ -అపొ. కార్యములు 5:9.
‘‘సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలాభసాధనమై యున్నది.మనమీలోకములోనికి ఏమియు తేలేదు, దీనిలోనుండి ఏమియు తీసికొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తిపొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములును హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును.ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలముÑ కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి’’ -I తిమోతి 6:6-10.
కాబట్టి లోకపరమైన పోకడలకు పోకుండా సంఘము మరొక సంఘముతో పోటీ పడకుండా తగు మాత్రపు ఖర్చుతో కీర్తనలతో సంగీత వాయిద్యాలతో దేవుని కీర్తిచాలి.
‘‘నీ రాబడి అంతటిలో ప్రథమఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము’’ -సామెతలు 3:9.
ఖరీదైన వాయిద్యాలతో ప్రజలను దేవుని వైపు ఆకర్షితులను చేయలేకపోవచ్చు కానీ కేవలం ఆత్మతో ఆయనను కీర్తించడం ద్వారా సువార్త మెండుగా ప్రకటించబడుతుంది.
7. తప్పుడు బోధలను, సిద్ధాంతాలను ఖండించలేకపోవుట :
‘‘సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి’’ -కొలస్సయులకు 3:16.
‘‘సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టియుండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలోనుండి తొలగిపోవుడి’’ -రోమీయులకు 16:17.
‘‘ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దుÑ శుభమని వానితో చెప్పను వదు’’ -2 యోహాను 1:10.
సంగీతం అనేది సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఖండిరచడానికి ఒక మంచి ఆయుధం వంటిది. ఎన్నో సంవత్సరాల నుండి అనేకమంది సంగీతాన్ని ఉపయోగించుకుని అనేక అన్యాయాలను, అక్రమాలను,అవినీతిని తమ పాటలతో ఖండిరచేవారు. అయితే నేటి మన క్రైస్తవ సమాజం సంగీతాన్ని ఉపయోగించుకొని సంఘంలోని తప్పుడు బోధలను, ఆచారాలను, సిద్ధాంతాలను నిధుల దుర్వినియోగం వంటివి తమ కీర్తనల ద్వారా ఖండిరచలేకపోతున్నారు. తద్వారా సంఘం గాని యువత గాని సంఘం పట్ల, క్రైస్తవ అభివృద్ధి పట్ల మరియు తప్పుడు బోధలను ఖండిరచడం పట్ల అవగాహన లేక పాటలు రాయలేక పోతున్నారు పాడలేక పోతున్నారు. ఫలితంగా సంఘంలో అక్రమాలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దావీదు తన కీర్తనల ద్వారా, కొన్నిచోట్ల యేసుక్రీస్తు, ఆయన శిష్యులు, ప్రవక్తలు తప్పుడు బోధలను ఖండిరచారు, తప్పుడు సిద్ధాంతాలను అలాగే అన్యాయాలను ఖండిరచారు.
‘‘అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు’’ -మత్తయి సువార్త 7:15.
‘‘ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదుÑ సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును’’ -I కొరింథీయులకు 11:13-15.
వాస్తవానికి సంగీతం ద్వారా ఎన్నో సంస్థలు, రాజకీయ పార్టీలు, సంస్కర్తలు సమాజంలోని అన్యాయాలను పోరాడారు అనేక ఉద్యమాలకు నిరసనలకు పునాదులు వేశారు. కానీ మన నేటి క్రైస్తవ్యం సంగీతాన్ని ఇలా ఉపయోగించుకోవడం లేదు. సంగీతాన్ని తప్పుడు బోధలను ఆచారాలను వాక్య విరుద్ధం ప్రచారాలను ఖండిరచడానికి ఉపయోగించుకుంటే అది సువార్త ప్రకటన మరియు సత్యాన్ని వెలికి తీయడానికి మరింత వేగంగా ఉపయోగపడుతుంది. ఇలా ప్రజలను సత్యం వైపు నడిపించి, ప్రభువుకు దగ్గరగా చేర్చడం అనేది ఆయనను మహిమ పరచడమే అవుతుంది.
‘‘ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి’’ -1 యోహాను 4:1.
ఆయన మనందరికీ నిరీక్షణాస్పదమని యెంచి నిజమైన వాక్యాన్ని బోధించిన వారమవుతాము. సంఘము మరియు యువత ఇలాంటి నైతిక బాధ్యత కలిగి సంఘంలోని వక్రీకరణ బోధలు, ఆచారాలను ఎండగడుతూ అలాగే సమాజంలోని అన్యాయాలను దౌర్జన్యాలను ఖండిస్తూ కీర్తనలు పాటలు రాయాలి పడాలి.
‘‘యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నానుÑ ఇదే యెహోవా వాక్కు’’ -యిర్మియా 22:3-5.
‘‘వీటినిగూర్చి బోధించుచు, హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్భోధను ఖండిరచుచునుండుము నిన్నెవనిని తృణీకరింపనీయకుము’’ -తీతుకు 2:15.
‘‘మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నదిÑ న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు’’ -మీకా 6:18.
8. స్వీయ ఘనత, స్వకీయ మహిమ కొరకు ఆరాటం :
‘‘అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు. ద్రోహులు మూర్కులు గర్వాంధులు దేవునికంటె సుఖానుభవమునెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము’’ -II తిమోతికి 3:1-5.
‘‘అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయెను’’ -I కోరింథీయులకు 1:31.
స్వీయ ఘనత మరియు తమని తాము హెచ్చించుకోవడం నేటి క్రైస్తవ ఆరాధనలో అధికమైపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో స్వార్థం, స్వార్థ దురాశలు పెరిగిపోవడం అని చెప్పవచ్చు. అనేకమంది సంఘ పెద్దలు యువత తమని తాము దేవుని కంటే ఎక్కువగా ఘనపర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఫలితంగా పాటలలో, కీర్తనలలో లోతైన భావము, విషయ పరిజ్ఞానము, వాక్య అవగాహన లేకుండా పోతుంది. ఒక వినోదభరితమైన కార్యక్రమాలుగా తీర్చిదిద్దే పరిస్థితి తీసుకొస్తున్నారు. తమ ప్రతిభను, గొప్పతనాన్ని, అందాన్ని కనుపరచుకోవడానికి, తమ సంస్థలను అభివృద్ధి చేసుకోవడానికి దేవుని కీర్తనలను వాడుకుంటున్నారు. సంఘము గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే తమ ప్రతిభను లేక తమని తాము కనుపరుచుకోవడానికి క్రైస్తవ ఆరాధన ఒక వేదిక కాదు.
‘‘ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించియొకని ప్రేమించును. లేదా యొకని పక్ష ముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు’’ -మత్తయి సువార్త 6:24.
అది కేవలము దేవునిని ఆయన గొప్పతనాన్ని మహిమ పరచడానికి ఉపయోగించాల్సిన పరిశుద్ధమైన వేదిక. సంఘము వారి ప్రతిభను ఉపయోగించి దేవుని మహిమ పర్చాలి గాని వారిని వారు కనపరచుకొనకూడదు. వారి ప్రతిభను ఉపయోగించుకొని తమని తాము మెచ్చుకోవడానికి, ఘన పరుచుకోవడానికి లోకంలో అనేక రకమైన వేదికలు కలవు, దయచేసి వాటిని ఉపయోగించుకోవచ్చు.
‘‘యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి, నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను’’ -మత్తయి సువార్త 21:12-13.
ఇక్కడ సంఘములో మాత్రం తమని తాము తగ్గించుకుని ఉపేక్షించుకొని ఆయనకు అర్పించుకొని ఆరాధించవలెను. ఇలా చేయడం వలన మంచి విషయ పరిజ్ఞానం కలిగిన పాటలు రాసి పాడటమే కాకుండా వాటిద్వారా సువార్తను సంఘంలోనూ, అన్యజనులలోనూ వారి హృదయం లోతుల్లోకి తీసుకొని వెళ్ళవచ్చు, మార్పు తీసుకుని రావచ్చు. దేవుడిని హెచ్చించి ఘనపరచి తమని తాము తగ్గించుకోవడం వలన స్వయంచాలకంగా సంఘము, పాడిన వారు కూడా ఘనపరచబడతారు. పాటలు రాయడం, కీర్తించడం అన్ని కూడా తమని తాము తగ్గించుకొని దేవుని మహిమ పరచడానికి ఉపయోగించాలి.
‘‘ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను’’ -ఫిలిప్పీయులకు 3:11.
9. కుటుంబ ప్రదర్శనకు ప్రాధాన్యం పెరిగిపోవడం :
నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది సంఘకాపరులు, దైవజనులు దేవుని సువార్త చాటించేదాని కన్న కుటుంబ ప్రదర్శనకే, అంటే వారి వారసులను (కుమారులను) లేక కుటుంబాన్ని ఎక్కువగా దృష్టిపెట్టడం లేక సంఘము ముందు పైకి తీసుకొనిరావడం జరుగుతుంది. వారి తరువాత వారి కుమారులే వారి వారసులుగా ప్రదర్శిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఖండిరచాల్సిన విషయం. ఎందు కంటే సువార్త ప్రకటనలో వారసులను అంటే దైవజనులను ఎంచుకొనే విషయంలో తప్పక బైబిల్ చెప్పిన బోధను పాటించాల్సిన అవసరముంది. ‘‘ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధి ప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధినపరచు కొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునైయుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను’’ -I తిమోతి 3:1-7.
దేవుని వాక్యం కోసం, సత్యం కొరకు నిలబడే వ్యక్తిని ఎంచుకొని వారసులనుగా ఎంచుకోవడం ఎంతైనావుంది. కేవలం కుమారులను, కుమార్తెలను, కోడళ్ళను, అలుండ్లను, మనువండ్లను, మనువరాండ్లను ఇలా కుటుంబాన్ని ఒక సినిమా లేక సీరియల్ ప్రదర్శనలాగా ప్రదర్శించడం చాలా బాధకరమైన విషయం. సంఘంలో ఎంతోమంది దేవునిమీద ఆసక్తికలిగి మంచి ప్రతిభను కనుపరిచే యువ దైవజనులను, అనుభవముండి దేవుని వాక్యాన్ని చక్కగా విడమర్చి బోధించే సామార్థ్యమున్న వారిని, చక్కని స్వరంతో పాడేవారిని, ఆత్మానుసారమైన సంగీత వాయిద్యాలను వాయించేవారిని ప్రోత్సాహించాలి. అంతేకాని కేవలం తమ కుమారులే వాక్యం చెబుతారు, కుమార్తెలే పాటలు పాడుతారు. వాయిద్యాలు వాయిస్తారనుకొని ఇతరులను ప్రోత్సాహించకపోతే అది పక్షపాతవైఖరి మరియు సువార్త వ్యాప్తికాదు. సంఘంలో అందర్ని క్రీస్తును వెంబడిరచే శిష్యులుగా, శిష్యురాండ్లుగా తర్ఫీదునిస్తూ... వారికి పరిశుద్ధాత్మడిచ్చిన కృపవరాలను, సామార్థ్యలను గుర్తించి ఆయా పరిచర్యలో వారిని సంఘక్షేమాభివృద్ధి కొరకును, ప్రభువు మహిమ కొరకును వాడుకోవాలి మరియు సర్వసృష్టికి సువార్తను అందించే గొప్ప సువార్తికులుగా తయారుచేయాలి.
మొదటి శతాబ్దపు క్రైస్తవులలో ఎక్కడకూడా కుటుంబ ప్రదర్శనకు చోటులేదు. ఇంకా యేసు ప్రభువు ఒకానొక చోట ఉండగా... నీ తల్లియు, సహోదరులు వేచియున్నారంటే, నా తల్లియు, సహోదరులు ఎవరని అడుగుతూ కుటుంబ సభ్యులకంటే, పరలోకమందున్న తండ్రి చిత్తానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి మంచి మాదిరిని చూపాడు.
10. వీక్షకుల సంఖ్య పెంచుకోవడానికి అడ్డదారులు పట్టడం :
‘‘మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి’’ -రోమీయులకు 12:2.
నేటి ఆరాధన క్రమాన్ని పక్కదోవ పట్టిస్తున్న మరొక ప్రాముఖ్యమైన అంశము సామాజిక మాధ్యమాలలో తమ పాటలను, నృత్యాలను, వాక్య ప్రసంగాలు తమ సంస్థలను హెచ్చించు కోవడానికి, ఆకర్షించుకోవడానికి No. of Likes, No. of Views, No. of Subscribers వంటివి పెంచుకుంటూ వీక్షకులను, సభ్యులను పెంచుకుంటూ వాటి సంఖ్యలను వాక్యము కంటే ఎక్కువగా ప్రదర్శించు కోవడం. సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని వాక్యాన్ని సువార్తను ఆరాధనను ప్రకటించాల్సిందిపోయి No. of Likes, No. of Views, No. of Subscribers పెంచుకుని వాటి ద్వారా డబ్బు సంపాదించుకోవడానికి, పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి సాంకేతికతను వాడుకుంటున్నారు. ఇది చాలా బాధాకరం.
ఇందుకోసం అన్ని రకాల దిగజారుడు ప్రయత్నాలు చేయడం అనేది క్రైస్తవ్యానికి ముఖ్యంగా దేవుని నామానికి ఎంతో అవమానకరం. సంఘ కాపరులు యువత తమ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వకీయ దురాశల కోసం వాక్యాన్ని, ఆరాధనను వ్యాపారంగా మార్చడం వలన దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వడమే కాకుండా సువార్త ప్రకటనకు ఆటంకంగా మారుతున్నారు.
‘‘ఎందుకనగా ధనాపేక్షసమస్తమైన కీడులకు మూలము; కొందరు దానిని ఆశించి విశ్వాసమునుండి తొలగిపోయి నానాబాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి’’ -I తిమోతి 6:10.
‘‘ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా’’ -హెబ్రీయులకు 13:5.
వాస్తవానికి ఆత్మీయ ఆవేదనతో దేవుని ఆరాధిస్తే అందుకోసం సాంకేతికతను సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తే ఆటోమేటిక్‌గా స్వయంచాలకంగా వీక్షకులు పెరుగుతారు, కానీ వీక్షకులు పెరగడానికి వాక్యాన్ని, ఆరాధనను వాడుకోవడం దిగజారుడుతనం అవుతుంది. దీనిని దేవుడు ఏమాత్రం ఆమోదింపడు మరియు నిజమైన సువార్త ప్రకటన జరుగదు. వాక్య ప్రకటనైనా, ఆరాధనైనా నృత్యమైన పరిశుద్ధంగా పవిత్రంగా ఆత్మీయంగా జరగవలసినది.
‘‘మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది.. ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను’’ -తీతుకు 2:12-14.
కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ప్రాథమికంగా జ్ఞాపకముంచుకొవలసిన విషయమేమిటంటే ఆరాధన క్రమంలో దేవుడు పరిశుద్ధుడు. ఆరాధనలో, సంగీతంలో, వాక్యంలో, నృత్యాలలో, నాటక, ప్రదర్శనలో ఆయన పరిశుద్ధతను కనుపరచాలి. అపవిత్రతకు, అనైతికతకు, ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి అపవిత్రమైన నృత్యాలను సంగీతాన్ని నిషేధించడం మంచిది. యువత వాక్యంలో లోతైన పరిశీలన చేసి విషయ పరిజ్ఞానం కలిగి ఆత్మ ప్రేరణతో పాటలు వ్రాసి పాడాలి. సంఘ కాపరులు ఆరాధనలో కానీ నృత్యాలలో కానీ అపవిత్రత చోటుచేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలి. సంఘము, యువత తమనితాము తగ్గించుకొని ఉపేక్షించుకొని దేవుని మహిమపరచాలి.
లోక పరమైన పోకడలకు తావివ్వకూడదు. స్వకీయ ఘనతలు, హెచ్ఛులు, స్వీయ ప్రదర్శనలకు ఇది వేదిక కాదని గ్రహించి జాగ్రత్త వహించాలి. యేసు ప్రభువును మనకంటే ఎక్కువగా ప్రదర్శించాలి. మనల్ని మనం హెచ్చించుకోవడమనేది ఒక వ్యర్థమైన కార్యంగా గుర్తించాలి. దేవుడు తమను హెచ్చించుకునేవారిని అంగీకరించడు మరియు సువార్త పరిచర్య కూడా అన్యజనులకు ఇతరులకు చేరుకోదు. సాంకేతికతను జాగ్రత్తగా, సమర్ధవంతంగా కేవలం దేవుని మహిమ కొరకే ఉపయోగించుకోవాలి. అంతేకానీ తమని తాము ఘనపరచుకోవడానికి, తమ సంస్థలను పోషించుకోవడానికి వ్యక్తిగత ఆకర్షణకు ఉపయోగించకూడదు. మనకు ఏకైక లక్ష్యము ఉద్దేశము ఆత్మలను రక్షించుటకు కొరకు యేసుక్రీస్తు సిలువ త్యాగాన్ని గుర్తు చేస్తూ అందరూ తమ పాపాల నిమిత్తము పశ్చాత్తాప పడుటకు కొరకు మరియు ఆయన మనందరి సమస్యల పరిష్కారం కొరకు విశ్వాదింపదగిన వాడని కీర్తనలు వ్రాసి పాడగలగాలి. ఇందుకోసం దేవుడు తన కృపను దయచేయును గాక. ఆమెన్.
‘‘ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావుÑ అవి లోకసంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును’’ -1 యోహాను 2:15-17.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.