దేవుడు

రచయిత: ఆర్థర్ డబ్ల్యు పింక్
అనువాదం: నగేష్ సిర్రా

 

విషయసూచిక

 

ముందుమాట

మొదటి ఆంగ్ల ముద్రణకు ముందుమాట

దేవుని వాక్యపు వెలుగులో అత్యంత గంభీరమైన ప్రశ్నలకు ఈ పుస్తకంలో జవాబులు చెప్పడానికి ప్రయత్నం చేశాను. గతంలో ఎంతోమంది ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కృషి చేశారు. వారి ప్రయాసలు మనకెంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. నేను రాసినవన్నీ నా సొంత ఆలోచనలూ, తలంపులూ అని నేను చెప్పను. కానీ పూర్తిగా భిన్నమైన కోణంలో నేను ఈ అంశాన్ని చర్చించడం జరిగింది. Augustine, Acquinas, Calvin, Melanchthon, Jonathan Edwards, Ralph Erskine, Andrew Fuller, Robert Haldane మొదలైనవారి రచనలను నేను శ్రద్ధగా అధ్యయనం చేశాను. ప్రస్తుత తరానికి ఇలాంటి గొప్ప దైవజనులు ఏ మాత్రమూ పరిచయం లేకపోవడం శోచనీయం. వారు చెప్పిన మాటల్లో కొన్నిటితో నేను ఏకీభవించకపోయినా వారు చేసిన బోధలను బట్టీ, రాసిన గ్రంథాలను బట్టీ వారికెంతో రుణపడి ఉన్నాను. ఈ గొప్ప దైవశాస్త్ర పండితుల మాటలను నేను చాలా ఎక్కువగా ప్రస్తావించగలను. అయితే, పాఠకుల విశ్వాసం మనుషుల జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నేను ఆ పని చేయలేదు. కేవలం లేఖనాలనే ఉపయోగిస్తూ నేను చెప్పిన ప్రతీ ముఖ్యమైన మాటకు ఆధారంగా లేఖనాన్నే చూపించే ప్రయత్నం చేశాను.

ఈ పుస్తకం ప్రజామోదం పొందాలని ఆశించడం వెర్రితనమే. ఎందుకంటే సృష్టికర్తను మహిమపరచడం కంటే మనిషిని దేవుని స్థాయికి హెచ్చించడం ప్రస్తుతం మనకు సంఘంలో ఎక్కువగా కనబడుతోంది. హేతువాదమనే పులిపిండి శరవేగంతో క్రైస్తవ్యమంతటినీ ఆవరిస్తోంది. డార్వినిజం మనం ఊహించినదానికంటే ఎంతో ఎక్కువగా దాని దుష్ప్రభావాన్ని విస్తరింపజేస్తోంది. వాక్యానుసారంగా ఉండేవారిగా పరిగణించబడే క్రైస్తవ నాయకులను లేఖనమనే త్రాసులో పెడితే వాళ్ళు  వాక్యవిరుద్ధమైనవారని తేలిపోతారు. ఇతర విషయాల్లో స్పష్టత కలిగి ఉన్నవారు సిద్ధాంత సత్యం విషయంలో సరిగ్గా ఉండడం అరుదు. మనిషి సంపూర్ణంగా భ్రష్టుడు అనే సత్యాన్ని నమ్మేవాళ్ళు ఈ రోజున చాలా తక్కువగా ఉన్నారు. మనిషి యొక్క స్వతంత్ర చిత్తం (free will) గురించి మాట్లాడుతూ రక్షకుణ్ణి అంగీకరించడానికీ, తృణీకరించడానికి మనిషికి సహజ సామర్థ్యం ఉన్నదని పట్టుబట్టేవాళ్ళు పతనమైన ఆదాము సంతానపు నిజమైన స్థితిని గురించి వారికున్న అవగాహనా లోపాన్ని బయటపెట్టుకుంటున్నారు. పాపి యొక్క స్థితిని పూర్తిగా నిరీక్షణ లేనిదని నమ్మేవాళ్ళే చాలా తక్కువగా ఉంటే, దేవుడు సంపూర్ణ సార్వభౌముడని నిజంగా నమ్మేవాళ్ళు అత్యంత తక్కువగా ఉన్నారు.

లేఖనవిరుద్ధమైన బోధ మూలంగా కలిగిన దుష్ప్రభావాలతో పాటు, నేటి తరం యొక్క లోతులేని భక్తితో కూడా మనం వ్యవహరించాల్సి ఉంది. బైబిల్ సిద్ధాంతంపై పుస్తకం రాశామనే ఒక్కమాట చాలు ఎంతోమంది సంఘసభ్యులు, ప్రసంగీకులు విమర్శల బాణాలు ఎక్కుపెట్టడానికి! నేటి సంఘప్రజలు రుచికరమైన, ఆకర్షణీయమైన సంగతుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ హృదయాలనూ, మనస్సులనూ సవాలు చేసే సంగతులను శ్రద్ధగా అధ్యయనం చేసే ఓపిక గానీ, కోరిక గానీ ప్రజలకు లేవు. దేవుని గురించి లోతైన సంగతులను అధ్యయనం చేయాలనే ఆశ ఉన్నా, దానికి అవసరమైన, చేయాల్సిన కృషి చేయడానికి వారికి చాలా కష్టంగా ఉంటుంది. అయితే మనస్సుంటే మార్గం ఉంటుంది అనే మాట సత్యం. ఇంతవరకు నిరుత్సాహపరిచే విషయాలను ప్రస్తావించాను. అయితే ఇప్పుడు కూడా భక్తిగల శేషజనం ఉన్నారు. ఈ పుస్తకంలోని అంశాన్ని శ్రద్ధగా పరిశీలన చేయడానికి వారు ఆనందిస్తారు. దీనిలో ఆరోగ్యకరమైన ఆహారముందని కనుగొంటారు.

'ఓటమిపాలైన ప్రత్యర్థి చేసే ఆఖరు దాడి నిందారోపణ చేయడం' అని ఒకాయన అన్నారు. ఈ పుస్తకాన్ని 'హైపర్ కాల్వినిజం' అని నిందించి కొట్టిపారేయడం సబబు కాదు. వివాదాలంటే నాకు ఆసక్తి లేదు. ఈ పుస్తకాన్ని నేను ప్రభువు హస్తాలకే అప్పగిస్తున్నాను. తన ప్రజలను వెలిగించడానికి ప్రభువు దీనిని ఒక ఉపకరణంగా ఉపయోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ పుస్తకంలో నా పొరపాటు వలన కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చు. ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే ప్రభువే నన్ను క్షమించాలనీ, చదివేవారిపై ఆ తప్పుల ప్రభావం పడకూడదనీ నేను ఆయనను వేడుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాస్తుండగా నాకు కలిగిన ఆనందం, ఆదరణ దీనిని చదివేవారికి కూడా కలుగుతాయి. ఆత్మసంబంధమైన సంగతులను వివేచించడానికి మనల్ని బలపరిచే కృపగల దేవునికి మాత్రమే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.

జూన్ 1918                                                                                                                        ఆర్థర్ డబ్ల్యు పింక్

ఈ మధ్యకాలంలో దేవుని సార్వభౌమత్వం గురించి అద్భుతంగా బోధించినవారిలో Dr Rice, J.B.Moody, Bishop తదితరులున్నారు. వారి రచనల నుండి కూడా నేను పలు విషయాలను నేర్చుకున్నాను.

రెండవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట

ఈ పుస్తకపు మొదటి ఆంగ్ల ముద్రణను క్రైస్తవ సమాజానికి అందించి ఇప్పటికి రెండు సంవత్సరాలయ్యింది. నేను ఊహించినదానికంటే ఎక్కువ ఆదరణ ఈ పుస్తకానికి లభించింది. దేవుని సార్వభౌమత్వం అనే అంశం బోధించడానికీ, రాయడానికీ కష్టమైనప్పటికీ, దానిని వివరించడానికి నేను చేసిన ప్రయత్నం వల్ల తమకు ఎంతో సహాయం, దీవెనలు కలిగాయని చాలామంది నాకు తెలియజేశారు. నాకు అందిన ప్రతీ అభినందన నిమిత్తం దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన వెలుగులోనే మనం వెలుగును చూస్తున్నాము. కొంతమంది కఠినమైన, పరుషమైన పదజాలంతో ఈ పుస్తకాన్ని విమర్శించారు. “తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు” (యోహాను 3:27 ) అనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారిని దేవునికీ, ఆయన యొక్క కృపాసహిత వాక్యానికీ అప్పగిస్తున్నాను. కొందరు స్నేహపూర్వకమైన విమర్శలు నాకు పంపించారు. వీటిని నేను శ్రద్ధగా పరిశీలించాను. కొన్ని సవరణలు చేశాను. అందువల్ల మొదటి ముద్రణ కంటే ఈ ముద్రణ విశ్వాసగృహంలో సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నా నమ్మకం.

దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నేను వివరించిన విధానం మరీ విపరీత స్థాయిలో ఉందని క్రీస్తునందున్న గౌరవనీయులైన సహోదరులు కొందరు భావిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు సత్యాన్ని సమపాళ్ళలో భద్రపరచాల్సిన అవసరముందని కొందరు చెప్పారు. ఈ మాటతో నేను హృదయపూర్వకంగా ఏకీభవిస్తున్నాను. దేవుడు సార్వభౌముడు, మనిషి తన చర్యలకు బాధ్యత వహించాల్సినవాడు. ఈ రెండు సత్యాలు వివాదానికి అతీతమైనవి. మనిషి తన చర్యలకు బాధ్యుడనే విషయాన్ని అంగీకరిస్తున్నాను కానీ ప్రతీ పేజీలోనూ ఈ విషయాన్ని చర్చించలేదు. కేవలం దేవుని సార్వభౌమత్వం గురించి మాత్రమే నేను ఈ పుస్తకంలో చర్చించాను. నేడు సార్వత్రికంగా విస్మరించిన దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్నే నేను నొక్కి చెప్పడానికి ప్రయత్నించాను. నేటి క్రైస్తవ సాహిత్యం దాదాపు 75 శాతం మనుషుల బాధ్యతలనూ, ధర్మాలనూ వివరించేందుకు తనను తాను అంకితం చేసుకుంది. మనిషి యొక్క బాధ్యత గురించి వివరించడానికి ప్రయత్నించినవాళ్ళే ఎక్కువ శాతం దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నిర్లక్ష్యం చేసి సత్యసమతుల్యతను కాపాడుకోలేకపోయారనేది వాస్తవం. మనిషి యొక్క బాధ్యత గురించి నొక్కి చెప్పడం సరైన విషయమే. మరైతే దేవుని సార్వభౌమత్వం గురించి చెప్పాలా, వద్దా? ఆయనకు హక్కులు లేవా? సత్యసమతుల్యతను తిరిగి పొందాలంటే ఇలాంటివి వంద పుస్తకాలు రచించబడాలి, ఈ అంశంపై దేశమంతా పదివేల ప్రసంగాలు ప్రకటించబడాలి. దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని నిర్లక్ష్యం చేసి, మానవుని కర్తవ్యానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం వల్లనే సత్యసమతుల్యత దెబ్బతింది. అందువల్ల ఎక్కువ శాతం నిర్లక్ష్యం చేయబడిన అంశాన్నే నేను ఈ పుస్తకంలో రాశానని ఒప్పుకుంటున్నాను. మనిషిని ఘనపరచి దేవుణ్ణి అల్పునిగా చేయడం ప్రమాదమా? లేదా మనిషిని అల్పునిగా చేసి దేవుణ్ణి ఘనపరచడం ప్రమాదకరమా? దేవుని సార్వభౌమత్వం సంపూర్ణమైనదనీ, విశ్వవ్యాప్తమైనదనీ నొక్కిచెప్పడం నేరమా?

ఈ అంశంపై సర్వశక్తిమంతుడైన దేవుడు తన బిడ్డలకు ఏమి వెల్లడి చేయాలని ఇష్టపడ్డాడో తెలుసుకోవాలనే తాపత్రయంతో రెండు సంవత్సరాలు పరిశుద్ధ లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేసిన తర్వాత, ఇంతకుముందు నేను రాసినదానిలో దేనినీ వెనక్కి తీసుకోవడానికి నాకు సరైన హేతువు కనబడలేదు. ఈ పుస్తకంలోని సమాచారాన్ని పునరమరిక చేశాను. కానీ సారాంశాన్ని గానీ, సిద్ధాంతాన్ని గానీ మార్చలేదు. దీనికై దేవునికి లెక్కలేని స్తుతులు. మొదటి ముద్రణను దీవించిన దేవుడే ఈ రెండవ ముద్రణను కూడా దీవించును గాక!

1921 స్వెంగెల్, పెన్సిల్వేనియా                                                                                                     ఆర్థర్ డబ్ల్యు పింక్

 

మూడవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట

ఈ పుస్తకం మూడవసారి ముద్రణకు రావడాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకమైన స్తుతులు చెల్లిస్తున్నాను. ఆధ్యాత్మిక అంధకారం ముసురుకుంటున్న సమయంలో, మనుషుల నటనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్న సందర్భంలో సమస్తానికీ యజమాని అయిన దేవుని అధికారాలను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 20వ శతాబ్దపు క్రైస్తవ్యంలో ఎన్నో తప్పుడు బోధలు ఎంతోమందిని కలవరపెడుతుండగా, ఎంతో స్పష్టంగా దేవుని సేవకులు ప్రజల హృదయాలకు నెమ్మది కలుగజేసే సత్యాన్ని ప్రకటించబద్దులైయున్నారు. ప్రభువే ఈ విశ్వమనే సింహాసనంపై ఆసీనుడై సమస్తాన్నీ తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున జరిగిస్తున్నాడనే విషయం కంటే నెమ్మదినిచ్చే, స్థిరపరిచే అంశం మరొకటి ఏదీ లేదు.

లేఖనాల్లో అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలు కొన్ని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు మనతో చెప్పాడు. అయితే అవి కష్టమైనవే కానీ అసాధ్యమైనవి కానివని గమనించండి. ప్రభువు దగ్గర ఓపికతో కనిపెట్టి, లేఖనాలతో లేఖనాలను శ్రద్ధగా పోల్చి చూస్తే తరచూ మనకు ఇంతకుముందు స్పష్టంకాని విషయాలపై పూర్తి అవగాహన కలుగుతుంది. గత 10 సంవత్సరాల్లో దేవుడు తన వాక్యంలోని కొన్ని భాగాలపై మరింత వెలుగును నాకు అనుగ్రహించాడు. అందువల్ల కొన్ని వాక్యభాగాల వివరణను మెరుగుపరచడానికి నేను ఆ వెలుగును ఉపయోగించాను. అయితే ఇంతకుముందు ముద్రణల్లో ఉన్న సిద్ధాంతాన్ని మార్చడం అనవసరమని నేను భావించాను. దాని నిమిత్తమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాలం గడిచేకొద్దీ, మన జీవితాల్లో ప్రతీ రంగానికి దేవుని సార్వభౌమత్వం అనే సత్యపు అవసరత పెరుగుతూనే ఉంటుందని నా అభిప్రాయం.

ఈ పుస్తకం తొలి రెండు ముద్రణల వలన అందిన సహాయం గురించీ, దీవెనల గురించీ చెబుతూ ఎన్నో ప్రాంతాల నుంచి ప్రజలు రాసిన లేఖలను బట్టి నా హృదయం ఆనందంతో పులకరించింది. ఒక క్రైస్తవ స్నేహితుడు ఈ పుస్తకాన్ని చదివి ఎంతగానో ప్రోత్సహించబడ్డాడు. ఇందులోని సత్యం చేత పురికొల్పబడ్డాడు. ఈ పుస్తకంలోని మహిమకరమైన సందేశం ప్రపంచమంతటా ప్రకటించబడాలనే ఉద్దేశంతో 50కి పైగా విదేశాల్లో ఉన్న మిషనరీలకు ఉచితంగా ఈ పుస్తకాలు పంపించమని ఒక చెక్కును పంపించాడు. అంధకార శక్తులతో తాము చేస్తున్న పోరాటంలో ఈ పుస్తకంలోని సందేశం తమను ఎంతగానో బలపరచిందని చెబుతూ ఎంతోమంది నాకు ఉత్తరాలు రాశారు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక! గొప్పదైన తన నామాన్ని ఈ మూడవ ముద్రణ ద్వారా ఆయన ఘనపరుచుకొనును గాక! లోకమంతటా చెదిరిపోయిన, ఆకలితో అలమటిస్తున్న తన గొర్రెలను పోషించడానికి ఈ పుస్తకంలోని సత్యాన్ని దేవుడు ఉపయోగించుకొనును గాక!

1929 మార్టన్స్ గ్యాప్, కెంటకీ                                                                                                           ఆర్థర్ డబ్ల్యు పింక్

నాలుగవ ఆంగ్ల ముద్రణకు ముందుమాట

విలువైన, సహాయకరమైన ఈ పుస్తకాన్ని మరొకసారి ముద్రించగలుగుతున్నందుకు సర్వోన్నతుడైన దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాము. సంఘంలో నేడు అత్యధికంగా ప్రకటించబడుతున్న దానికి విరుద్ధంగా ఇందులోని ఉపదేశం ఉంది. అయినాసరే, దేవుని ఏర్పాటులో ఉన్నవారి విశ్వాసాన్ని బలపరచడానికీ, వారిని ఆదరించడానికీ, వారికి నిరీక్షణను ఇవ్వడానికీ ఇదెంతగానో ఉపయోగపడుతుంది. మనం ఎవరిని ఘనపరచడానికి ఆనందిస్తున్నామో ఆయనకు ఈ నూతన ముద్రణను అంకితం చేస్తున్నాము. తన కృపామహిమకు కీర్తి కలిగేలా, తన ప్రజలకు మరింత వాక్యపు వెలుగు కలిగేలా, దేవుని ఔన్నత్యం గురించీ, ఆయన సార్వభౌమ కనికరం గురించీ ప్రజలకు స్పష్టమైన అవగాహన కలిగేలా ఆయన ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువెళ్ళాలని మా ప్రార్థన.

1949                                                                                                                                                        ఐ.సి. హెరెన్డీన్

పరిచయం

ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? పరలోకంలో పరిపాలన దేవునిదే అని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఈ లోకాన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు అనే మాటను అందరూ తృణీకరిస్తున్నారు - ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా! మనుషులు తాత్వికంగా, హేతుబద్ధంగా ఆలోచిస్తున్నామంటూ దేవుణ్ణి తెరవెనుకకు నెట్టేస్తున్నారు. భౌతిక ప్రపంచం గురించి ఆలోచించండి. సమస్తాన్నీ నేరుగా వ్యక్తిగతంగా దేవుడు సృష్టించాడని ప్రజలు అధికశాతం తృణీకరించడమే కాదు, తన చేతి పనులను నిర్వహించడంలో ఆయన నేరుగా జోక్యం చేసుకుంటాడనే విషయాన్ని కూడా పెద్దగా ఎవ్వరూ నమ్మట్లేదు. నిర్జీవమైన, వ్యక్తిత్వం లేని ప్రకృతి నియమాలే సమస్తాన్నీ క్రమంగా నిర్వహిస్తున్నాయనీ, నడిపిస్తున్నాయని ప్రజలు భావిస్తున్నారు. ఆ విధంగా మనుషులు సృష్టికర్తను తన సృష్టి నుంచి వెలివేస్తున్నారు. భ్రష్టమైన, పతనమైన ఆలోచనలతో మానవ జీవితాల నుంచి దేవుణ్ణి నెట్టివేయడం మనకు ఆశ్చర్యాన్ని కలిగించాల్సిన అవసరం లేదు. మనిషి స్వేచ్ఛాజీవి కాబట్టి తన జీవితంలో జరిగే అనూహ్యమైన పరిస్థితులకు తానే కారకుడు, తన భవిష్యత్తుకు తానే నిర్ధారకుడు అనే సిద్ధాంతాన్ని క్రైస్తవ ప్రపంచమంతా నమ్ముతూనే ఉంది. దీనికి భిన్నమైన సత్యాన్ని నమ్మేవాళ్ళు అత్యల్ప సంఖ్యలో ఉన్నారు. సమస్తానికీ మనిషే బాధ్యుడు అని చెప్పేవారున్నారు. అయితే, మానవుని బాధ్యత గురించి అధిక ప్రసంగాలు చేసేవారు, తమ సొంత హృదయాల్లో నుండి బయలువెళ్ళే దుష్కార్యాలకు మాత్రం (మార్కు 7:21-23) సాతానుని నిందిస్తూ తమ సొంత బాధ్యత నుండి తప్పించుకుంటున్నారు.

అయితే ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల అభిప్రాయాన్ని సేకరించడానికి ప్రయత్నించండి. ప్రతి వైపు నుంచి ఎంతో అయోమయమైన, అస్తవ్యస్తమైన పరిస్థితే మనకు తారసపడుతోంది. పాపం ప్రబలిపోతోంది, అక్రమం విస్తరిస్తోంది, దుష్టులు, వంచకులు అంతకంతకు చెడిపోతున్నారు(2తిమోతి 3:13). నేటి దినాన ప్రతీదీ అదుపు తప్పినట్లుగానే కనబడుతోంది. సింహాసనాలు తత్తరిల్లుతున్నాయి. ప్రాచీన రాజవంశాలు తలక్రిందులౌతున్నాయి, ప్రజాస్వామ్యాలు తిరుగుబాటు చేస్తున్నాయి, నాగరికత విఫలమౌతోంది. క్రైస్తవ్యంలో సగభాగం ఈమధ్య కాలంలోనే మరణ పోరాటంలో చిక్కుకుపోయింది. ప్రపంచం ప్రజాస్వామ్యానికి అనుకూలంగా తయారు చేయబడిందనే అభిప్రాయానికి విరుద్ధంగా, ప్రపంచానికి ప్రజాస్వామ్యం ఏ మాత్రమూ సురక్షితం కాదని తెలుసుకున్నాం. అశాంతి, అసంతృప్తి, అక్రమాలు ప్రతీచోటా విస్తరిస్తున్నాయి. మరొక ప్రపంచయుద్ధం ఎంత త్వరలో రాబోతుందో ఏ ఒక్కరం చెప్పలేము. రాజనీతిజ్ఞులు, ప్రముఖులు కలవరపడుతున్నారు, తడబడుతున్నారు. భూమి మీద సంభవించబోతున్నవాటి విషయమై మనుషులు భయాందోళనలకు గురై, ధైర్యము చెడి కూలిపోతున్నారు (లూకా 21:26). దేవుడు సంపూర్ణంగా లోకాన్ని నియంత్రిస్తున్నాడనేలా ఈ పరిస్థితులు కనబడుతున్నాయా?

అయితే ఆధ్యాత్మిక ప్రపంచానికి మన గమనాన్ని పరిమితం చేద్దాం. సువార్తను గత 19 శతాబ్దాలుగా ప్రకటిస్తూనే ఉన్నప్పటికీ, మనుషులు ఇంకా క్రీస్తును అవమానిస్తూ, తృణీకరిస్తూనే ఉన్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, లేఖనాల్లో వెల్లడి చేయబడిన క్రీస్తును ప్రకటించేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు చాలా చాలా తక్కువమందే ఉన్నారు. ఆధునిక ప్రసంగ వేదికల్లో ఆయన అవమానించబడుతున్నాడు, తృణీకరించబడుతున్నాడు. జనసమూహాలను ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ అత్యధిక సంఘాలు జనాలతో నింపబడటానికి బదులు ఖాళీ ఔతున్నాయి. సంఘానికి హాజరు కాని ప్రజల పరిస్థితి ఏమిటి? నాశనానికి నడిపించే విశాలమైన మార్గంలో అనేకమంది ప్రజలున్నారనీ, జీవానికి నడిపించే ఇరుకు మార్గంలో ప్రయాణించేది కొద్దిమందేననీ లేఖనాలు చెబుతున్నాయి. ఈ సత్యాన్ని లేఖనాల వెలుగులో మనం నమ్మేలా బలవంతపెట్టబడుతున్నాము. క్రైస్తవ్యం ఒక ఘోరమైన వైఫల్యమని కొందరు అభిప్రాయపడుతున్నారు. పలువురి ముఖాల్లో నిర్వేదం కనబడుతోంది. ప్రభుని సొంత ప్రజలే ఎంతోమంది గాబరాపడుతున్నారు. వారి విశ్వాసం తీవ్రంగా పరీక్షించబడుతోంది. దేవుని స్వభావం ఎలాంటిది? ఆయన చూడగలడా? వినగలడా? ఆయన అసమర్థుడా? లేదా ఉదాసీన వైఖరిగలవాడా? 'గతంలో సంభవించిన రెండవ ప్రపంచ మహాయుద్ధం జరగకుండా దేవుడు ఆపలేకపోయాడు, దాన్ని అంతమొందించలేకపోయాడు' అని క్రైస్తవ నాయకులుగా పరిగణించబడేవాళ్ళు మనకు చెబుతున్నారు. పరిస్థితులు దేవుని చేయి దాటిపోయాయని బహిరంగంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే దేవుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడని అనిపిస్తోందా?

ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా? లేక సాతానా? అప్పుడప్పుడు సువార్త సభలకు హాజరయ్యే లోకానుసారుల మనస్సులపై ఎటువంటి ప్రభావం పడుతోంది? “వాక్యానుసారమైన” బోధ చేసేవారి మాటలు సైతం వినేవారికి ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి? క్రైస్తవులు నమ్ముతున్నది భంగపడిన దేవుణ్ణి అనే అభిప్రాయం కలగదా? నేటి సగటు సువార్తికుని మాటల్ని యథార్థంగా పట్టించుకునేవారు, అతను ప్రకటించే దేవుడు దయావాత్సల్యాలతో నిండిన ఉద్దేశాలున్నప్పటికీ వాటిని నెరవేర్చుకోలేకపోతున్నాడని, ఆయన ఎంతో యథార్థంగా మనుషుల్ని దీవించాలని అపేక్షిస్తున్నా, వాళ్ళు ఆయనను అందుకు అనుమతించడం లేదని నమ్మడానికి బలవంతపెట్టబడటం లేదా? ఈ పరిస్థితుల్లో సాతాను పైచేయి సాధించాడని, కాబట్టి దేవుణ్ణి నిందించడానికి బదులు ఆయనపై జాలిపడాలనే నిర్ణయానికి వినేవారు రావడం సబబు కాదా?

దేవునికంటే సాతానే ఎక్కువగా భూలోక సంగతుల్ని నియంత్రించడంలో నిమగ్నమై ఉన్నట్లు కనిపించడం లేదా? ఇదంతా మనం విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్నామా లేదా వెలిచూపును బట్టి జీవిస్తున్నామా అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. ప్రియ చదువరీ, ఈ లోకం గురించిన, దానితో దేవునికున్న సంబంధం గురించిన మీ ఆలోచనలు మీరు చూస్తున్నదానిపైనే ఆధారపడి ఉన్నాయా? ఈ ప్రశ్నను తీక్షణంగా, నిజాయితీగా మీరు ఎదుర్కోండి. మీరు క్రైస్తవుడైతే దుఃఖంతో, అవమానభారంతో తలవంచుకుని 'ఔను, నా ఆలోచనలు అలాగే ఉన్నాయి' అని ఒప్పుకోవాలి. అయ్యో, మనం విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడం చాలా చాలా తక్కువగా జరుగుతోంది. ఇది వాస్తవం. అసలు విశ్వాసాన్ని బట్టి నడుచుకోవడమంటే అర్థం ఏమిటి? 'పరిశుద్ధ లేఖనాలే మన ఆలోచనలకు రూపమివ్వాలి, మన చర్యలను నియంత్రించాలి, మన జీవితాలను మలచాలి' అని అర్థం. ఎందుకంటే, “కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును” (రోమా 10:17). ఈ లోకంతో దేవునికున్న సంబంధమేమిటో మనం తెలుసుకోవాల్సింది కేవలం సత్యవాక్యం నుంచే కానీ మనం చూస్తున్నవాటి నుంచి కాదు!

ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా, లేక సాతానా? లేఖనాలు ఏమి చెబుతున్నాయి? ఈ ప్రశ్నకు సూటైన జవాబు కనుక్కోవడానికి ముందు, ఇప్పుడు మనం చూస్తున్న, వింటున్నవాటిని లేఖనాలు ముందే ప్రవచించాయి అని గమనించాలి. యూదా రాసిన ప్రవచనం ఇప్పుడు నెరవేరే ప్రక్రియలో ఉంది. దీనిని పూర్తిగా చర్చించడం మొదలుపెడితే మన ప్రస్తుత అంశం నుండి దృష్టి మరలే అవకాశం ఉంది. అయితే నేను ఈ పత్రికలోని 8వ వచనంలో ఉన్న ఒక మాటను పరిగణలోకి తీసుకోవాలనుకుంటున్నాను - "అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు”; ఔను, సర్వోన్నతుడైన మహాత్ముడు, సార్వభౌముడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినవానినే వాళ్ళు దూషిస్తున్నారు. ప్రామాణిక సత్యాలను లెక్కచేయని వింతైన తరం మనది; మన స్వతంత్రానికీ, ఇష్టానికీ అడ్డుపడే ప్రతిదానినీ తృణీకరించే యుగం మనది. అందువల్ల అక్రమం మన భూమిని శరవేగంగా, పెను ఉప్పెనలా ముంచేస్తోంది. ఈ తరం అత్యంత దుష్టమైనది. తల్లిదండ్రుల అధికారం క్షీణించిపోవటం ప్రభుత్వాధికారానికి వాటిల్లబోయే నిర్మూలనకు ఖచ్చితమైన సూచనగా ఉంది. చట్టవ్యవస్థను గౌరవించకపోవడం, సన్మానించాల్సినవారిని సన్మానించకపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు అయిన దేవుని గొప్పతనాన్నీ, అధికారాన్ని తెర వెనుకకు నెట్టివేయడం, వీటికి లోబడమని బోధించేవారి పట్ల తీవ్రమైన అసహనం చూపడం వంటివి చూసి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు రాబోయే కాలంలో ఏ మాత్రమూ బాగుపడకపోగా ఇంకా విషమిస్తాయని మరి స్థిరమైన ప్రవచన వాక్యం మనకు తెలియజేస్తోంది. ఈ ప్రవాహాన్ని అడ్డుకోగలమని కూడా మనం భావించనవసరం లేదు. ఎందుకంటే అది మనకు అందనంత ఎత్తుకు ఎప్పుడో ఎగిసిపోయింది. మనం చేయగలిగిందల్లా మన తోటి పరిశుద్ధుల్ని ఈ తరంలో ఉన్న దుష్టత్వం గురించి హెచ్చరించి, నాశనకరమైన దాని ప్రభావం వారిపై పడకుండా అవరోధించడమే.

ప్రస్తుతం భూలోకంలోని సంగతుల్ని ఎవరు నియంత్రిస్తున్నారు? దేవుడా, లేక సాతానా? లేఖనాలు ఏమి చెబుతున్నాయి? సూటిగాను స్పష్టంగాను లేఖనాలు ప్రకటించేవాటిని విశ్వసిస్తే ఒక్క సందేహానికి కూడా ఆస్కారం ఉండదు. తన విశ్వపు సింహాసనంపై దేవుడు ఆసీనుడై ఉన్నాడని, రాజదండం ఆయన చేతుల్లోనే ఉందని, తన చిత్తప్రకారమైన సంకల్పాన్ని బట్టి ఆయన సమస్తాన్ని నడిపిస్తున్నాడని లేఖనాలు పదేపదే బోధిస్తున్నాయి. సమస్తాన్ని సృష్టించడమే కాదు, తన చేతి పని అంతటిపై ఆయన ఏలుబడి చేస్తున్నాడని లేఖనాలు ఉపదేశిస్తున్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడనీ, ఆయన చిత్తం స్థిరమైనదనీ, సమస్త సృష్టిపైన ఆయన సార్వభౌముడనీ లేఖనాలు ముక్తకంఠంతో వివరిస్తున్నాయి. తప్పనిసరిగా ఇదే నిజమయ్యుండాలి; రెండే రెండు ప్రత్యామ్నాయాలున్నాయి - దేవుడే పరిపాలించాలి, లేదా దేవుణ్ణే వేరెవరైనా పరిపాలించాలి. ఆయనే సమస్తాన్ని నియంత్రించాలి, లేదా ఆయన్నే వేరెవరైనా నియంత్రించాలి. ఆయన చిత్తం నెరవేరాలి, లేదా ఆయన చిత్తం సృష్టి చేత భంగపరచబడాలి. ఆయన సర్వోన్నతుడు, ఆయన మాత్రమే సార్వభౌముడు, రాజులకు రాజు, సంపూర్ణ జ్ఞాని, మితిలేని శక్తి గలవాడు అని అంగీకరిస్తే, కేవలం నామమాత్రంగానే కాదు, నిజంగా కూడా ఆయనే దేవుడని అంగీకరించక తప్పదు.

పైన క్లుప్తంగా ప్రస్తావించినవాటి వెలుగులో, దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వసమృద్ధిగలవాడు, సార్వభౌముడు అనే అంశాలను లోతుగా పరీక్షించి వినూత్న విధానంలో ప్రకటించాలని ప్రస్తుత పరిస్థితులు బలవంతపెడుతున్నాయి. దేవుడు ఇప్పటికింకా జీవిస్తూనే ఉన్నాడనీ, పరిశీలిస్తూనే ఉన్నాడనీ, పరిపాలిస్తూనే ఉన్నాడనీ ఈ దేశంలోని ప్రతీ ప్రసంగ వేదికల నుండి వాక్యోపదేశకులు గర్జించాలి. విశ్వాసం ఇప్పుడు మూసలో ఉంచబడింది. అగ్నిచేత అది పరీక్షించబడుతోంది. మనస్సుకూ, హృదయానికీ దేవుని సింహాసనం దగ్గర కాకుండా మరెక్కడా స్థిరమైన, చాలినదైన విశ్రమస్థానం లేదు. ఇంతకు ముందెన్నడూ చెప్పని విధంగా ఇప్పుడు దేవుని దైవత్వం గురించి సంపూర్ణంగా, స్థిరంగా చెప్పాల్సిన అవసరముంది. కఠినమైన వ్యాధులకు కఠినమైన చికిత్స చేయాలి. చప్పని, సాధారణమైన మాటల్ని వినీ వినీ ప్రజలు విసిగిపోయారు. వాళ్ళకు స్థిరమైన, బలమైన సత్యం అవసరం. తియ్యని పానకం పెడితే పిల్లలకు పనిచేయవచ్చేమో కానీ పెద్దలకు మాత్రం బలమైన ఔషధమే కావాలి. దేవుని సంపూర్ణ స్వభావాన్ని లేఖనాల వెలుగులో అవగతం చేసుకోవడం కంటే ఆత్మశక్తిని మనలోనికి ప్రవహింపచేయగలిగే మరొక విధానం నాకు తెలియదు. “తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు” (దానియేలు 11:32) అని రాయబడి ఉంది.

ప్రపంచం నిస్సందేహంగా సంక్షోభం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది; ప్రతీచోట ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారు. అయితే దేవునికి ఎలాంటి భయాందోళనలూ ఉండవు. ఆయనను ఎవ్వరూ ఆశ్చర్యపరచలేరు. అత్యవసరమైన, అనూహ్యమైన పరిస్థితి ఏదీ ఆయనను ఇరకాటంలో పెట్టదు. ఎందుకంటే 'తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నవాడు' ఆయనే (ఎఫెసీ 1:11-12). అందువల్ల లోకం భయంతో వణుకుతున్నప్పటికీ, విశ్వాసికి చెప్పబడిన మాట “భయపడవద్దు! ” "సమస్త కార్యములు” దేవుని నియంత్రణలోనే ఉన్నాయి; దేవుని నిత్యసంకల్పాలకు అనుగుణంగానే “సమస్త కార్యములు” జరుగుతూ ఉన్నాయి. కాబట్టి “దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి”. అది అలాగే జరగాలి; ఎందుకంటే “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి” (రోమా 11:36). అయితే కనీసం దేవుని ప్రజలైనవారు కూడా ఈ సంగతుల్ని నేడు ఎంతో అరుదుగా గుర్తిస్తున్నారు! భూమిపై జరుగుతున్న సంగతుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా దూరం నుండి వాటిని చూస్తున్న ప్రేక్షకుడు దేవుడని చాలామంది భావిస్తున్నారు.

మనిషికి చిత్తం ఉందనేది ఎంత సత్యమో, దేవునికి కుడా చిత్తం ఉందనేది అంతే సత్యం. మనిషికి శక్తి అనుగ్రహించబడిందనే మాట ఎంత వాస్తవమో, దేవుడు సర్వశక్తిమంతుడనే మాట కూడా అంతే వాస్తవం. భౌతిక ప్రపంచం ప్రకృతి నియమాలచే నిర్వహించబడుతుందనే మాట నిజమే. అయితే ఆ నియమాల వెనుక వాటిని నియమించినవాడు, నియంత్రించేవాడు ఉన్నాడనే మాట కూడా అంతే నిజం. మనిషి సృష్టించబడినవాడు, దేవుడు సృష్టికర్త. మనిషి వెలుగును చూడటానికి లెక్కలేని యుగాలకు ముందే “బలవంతుడైన దేవుడు” (యెషయా 9:8) ఉనికిలో ఉన్నాడు. లోకం స్థాపించబడక ముందే ఆయన తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు అనంతమైన శక్తి కలిగినవాడు. మనిషికి ఉన్న శక్తి పరిమితమైనది. తన చేతులతో సృష్టించుకున్న జీవుల వలన అనంతుడైన దేవుని ప్రణాళికలు, ఉద్దేశాలు ఆటంకపరచబడవు.

జీవితం గంభీరమైన సమస్యలతో కూడినదనీ, మనకు అంతుచిక్కని ఎన్నో విషయాలు మన చుట్టూ ఉన్నాయనీ మనం నిస్సందేహంగా ఒప్పుకుంటాం. తమ మూలాన్నెరుగని, తమ ముందున్నవాటి గురించి అవగాహన లేని భూజంతువుల్లాంటి వాళ్ళం కాదు మనం. మనకు మరింత స్థిరమైన ప్రవచనవాక్యం ఉంది. దీని గురించే పేతురు ఇలా చెబుతున్నాడు, “తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది; దానియందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు” (2 పేతురు 1:19). మనం లక్ష్యపెడితే మనకు మేలు కలిగించేది ఈ ప్రవచన వాక్యమే. ఈ వాక్యం మానవమేథస్సు నుండి కాక దేవుని మనస్సు నుండి ఉద్భవించినది. “ఎందుకంటే ప్రవచనము ఎప్పుడునుమనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి” (2 పేతురు 1:21). మరొకసారి చెబుతున్నాను, మనం లక్ష్యపెట్టాల్సింది ఈ వాక్యాన్నే, అప్పుడే మనకు మేలు చేకూరుతుంది.

మనం ఈ వాక్యం వైపు మళ్ళి, దాని ఉపదేశాన్ని గైకొంటే, ప్రతీ సమస్యకూ అన్వయించాల్సిన ఒక ప్రాథమిక నియమాన్ని కనుగొంటాం: మనిషితో లోకంతో మొదలుపెట్టి దేవుణ్ణి సమీపించకుండా, దేవునితో మొదలుపెట్టి మనిషి దగ్గరకు రావాలి. “ఆదియందు దేవుడు” అనే నియమాన్ని ప్రస్తుత పరిస్థితికి అన్వయించండి. నేటి ప్రపంచంతో మొదలు పెట్టి దేవుని వైపు మనం వెళ్తుంటే, ఈ ప్రపంచంతో దేవునికి అస్సలు ఎలాంటి సంబంధమూ లేనట్టు కనిపిస్తుంది. అయితే దేవునితో మొదలు పెట్టి, లోకం వైపుగా రండి; అప్పుడు సమస్య పైన ఒక నూతన వెలుగు ప్రసరిస్తుంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపంపై ఆయన కోపం రగులుకుంటుంది. దేవుడు “నీతిమంతుడు” కనుక ఆయనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేవారిపై ఆయన తీర్పులు వెలువడతాయి. దేవుడు నమ్మదగినవాడు కనుక తన వాక్యంలోని గంభీరమైన హెచ్చరికలు నెరవేరతాయి. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక ఆయనను ఎవ్వరూ విజయవంతంగా ఎదిరించలేరు, ఆయన ఆలోచనను నిర్వీర్యం చేయలేరు. దేవుడు సర్వజ్ఞాని కాబట్టి ఏ సమస్య ఆయనపై అధికారం చెలాయించలేదు, ఏ కష్టమూ ఆయన జ్ఞానాన్ని కలవరపరచలేదు. దేవుడు ఎవరైయున్నాడో, ఏమైయున్నాడో దాని ఫలితంగానే మనం ఈ లోకంలో చూసేవి సంభవిస్తున్నాయి - అవి ఆయన న్యాయతీర్పు కుమ్మరించబడటానికి కేవలం ప్రారంభాలు మాత్రమే. ఆయన స్థిరమైన న్యాయాన్నీ, పరిపూర్ణమైన పరిశుద్ధతనూ దృష్టిలో పెట్టుకుంటే, మనం చూస్తున్నవాటికన్నా మెరుగైన పరిస్థుతులను అపేక్షించలేము.

దేవుడు సర్వాధికారి, ఇదొక దీవెనకరమైన సత్యం. విశ్వాసాన్ని సాధన చేస్తూ ఉండగా హృదయం ఈ సత్యాన్ని బట్టే నెమ్మది పొందుతుంది. ఈ సత్యాన్నే ఆస్వాదిస్తుంది. నిజమైన విశ్వాసపు నైజం అదే. విశ్వాసం ఎల్లప్పుడూ దేవునితోనే నిండి ఉంటుంది. సిద్ధాంతపరమైన జ్ఞానానికీ, విశ్వాసానికి ఉన్న వ్యత్యాసం ఇదే. విశ్వాసం అదృశ్యుడైనవానిని నిలకడగా చూస్తుంది (హెబ్రీ 11:27). పొరపాటు చేయలేనంత జ్ఞాని మరియు నిర్దయ చూపలేనంత ప్రేమస్వరూపి అయిన దేవుని హస్తాల నుండే సమస్తమూ వస్తున్నాయని గ్రహించడం ద్వారా విశ్వాసజీవితంలో ఎదురయ్యే నిరాశానిస్పృహలను, కష్టనష్టాలను, హృదయవేదనలనూ అది సహిస్తుంది. దేవునితో కాకుండా మరి దేనితోనైనా మనం నిండి ఉన్నంత కాలం హృదయానికి నెమ్మదీ, మనస్సుకు శాంతీ ఉండదు. అయితే మన జీవితాల్లోకి ప్రవేశించేదాన్నంతటినీ ఆయన హస్తం నుంచే పొందుతున్నామని గ్రహించినప్పుడు మన పరిస్థితులేవైనా, మనం నివసిస్తున్నది పూరి గుడిసెలోనైనా, చీకటి చెరసాలలోనైనా, హతస్సాక్షిగా దహించబడడానికి కట్టెలపై పేర్చబడినా, “మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను” అని మనం చెప్పగలుగుతాం (కీర్తన 16:6). అది వెలిచూపు భాష కాదు, విశ్వాసపు భాష!

అయితే పరిశుద్ధ లేఖనాల సాక్ష్యానికి శిరస్సు వంచకుండా, విశ్వాసాన్ని బట్టి జీవించకుండా, వెలిచూపును బట్టి హేతువును మాత్రమే ఆధారం చేసుకుని జీవిస్తుంటే మనం నాస్తికత్వం అనే ఊబిలో పడిపోతాము. ఇతరుల అభిప్రాయాలతో, ఆలోచనలతో మనం నియంత్రించబడితే మనకు ప్రశాంతత దూరమౌతుంది. పాపంతోనూ, శ్రమతోనూ నిండియున్న ఈ ప్రపంచంలో మనల్ని భయకంపితుల్ని చేసేవి, దుఃఖపరిచేవి చాలా ఉన్నాయి. దేవుడు సమకూర్చి జరిగిస్తున్నవాటిలో కూడా మనల్ని కలవరపరిచేవి, నివ్వెరపరిచేవి చాలా ఉన్నాయి. అయినంత మాత్రాన 'నేనే దేవుణ్ణయ్యుంటే, దీన్ని అనుమతించను, దాన్ని సహించను' అని చెప్పే అవిశ్వాస లోకస్థునితో ఐక్యమయ్యేందుకు అది హేతువు కాకూడదు. మనల్ని విస్మయానికి గురిచేసే పరిస్థితులు మధ్యలో ఉన్నప్పుడు, “దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని” అని కీర్తనకారునిలా మనం చెప్పాలి (కీర్తన 39:9). “ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు” అని లేఖనం మనతో చెబుతుంది (రోమా 11:33). విశ్వాసంలో పరీక్షించబడాలంటే, ఆయన జ్ఞానాన్ని నమ్మాలంటే, నీతిలో బలపడాలంటే, ఆయన పరిశుద్ధ చిత్తానికి లోబడాలంటే అలాగే జరగాలి.

విశ్వాసికీ, అవిశ్వాసికీ మధ్యనున్న ప్రాథమికమైన వ్యత్యాసమిదే. అవిశ్వాసి లోకానికి చెందినవాడు. లోక ప్రమాణాలతోనే ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు. ఇహలోకమే శాశ్వతం అనే భావనతో జీవితాన్ని చూస్తూ ఉంటాడు.తాను శరీరరీతిగా ఏర్పరచుకున్న త్రాసులోనే ప్రతిదానినీ తూస్తాడు. అయితే విశ్వాసి దేవుణ్ణి తెరపైకి తీసుకొస్తాడు. ఆయన కోణం నుండే సమస్తాన్ని చూస్తాడు. ఆత్మసంబంధమైన ప్రమాణాలను బట్టి సమస్తాన్ని నిర్ధారిస్తాడు. నిత్యత్వపు వెలుగులో జీవితాన్ని చూస్తూ ఉంటాడు. అలా చేస్తూ తాను పొందేది ఏదైనా, దాన్ని దేవుని హస్తం నుండే పొందుకుంటున్నానని నమ్ముతాడు. అందువల్ల భయంకరమైన తుఫాను మధ్యలో కూడా అతని హృదయం ప్రశాంతంగా ఉంటుంది, దేవుని మహిమ గురించిన నిరీక్షణలో అతడు ఆనందిస్తూ ఉంటాడు.

ఈ పుస్తకంలో చర్చించిన ఆలోచనా విధానాన్ని క్లుప్తంగా ఈ ప్రారంభపు మాటల్లో తెలియజేశాను. 'దేవుడే దేవుడు కనుక ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు, కేవలం ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు, ఎల్లప్పుడూ ఆయన ఇష్టాన్నే జరిగిస్తాడు; ఆయన చిత్తం నెరవేరి ఆయనకు మహిమ కలగటమే ఆయన ప్రథమ ఉద్దేశం; ఆయన సర్వోన్నతుడు కాబట్టి ఆయనే విశ్వానికి సార్వభౌముడు' అన్న విషయమే నా మూల ప్రతిపాదన. ఈ ఆలోచనను ఆధారం చేసుకుని దేవుడు మొదటిగా సృష్టిలో, రెండవదిగా పరిపాలనలో, మూడవదిగా తాను ఏర్పరచుకున్నవారి రక్షణలో, నాలుగవదిగా దుష్టులను తిరస్కరించడంలో, అయిదవదిగా మనుషులపై మరియు మనుషులలో జరిగించే కార్యాలలో తన సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తున్నాడని వివరించాను. ఆపై మనిషి చిత్తానికి, మనిషి బాధ్యతకు సంబంధించి దేవుని సార్వభౌమత్వం పనిచేసే విధానాన్ని మరియు సృష్టికర్త ఔన్నత్యం పట్ల మనిషి కలిగుండాల్సిన ఒకే ఒక్క సరైన వైఖరిని చూపించడానికి ప్రయత్నించాను. క్లిష్టమైన అంశాలను చర్చించడానికీ, పాఠకుల మనసుల్లో ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఒక అధ్యాయాన్ని ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ప్రార్థనలో దేవుని సార్వభౌమత్వం గురించి మరింత శ్రద్ధగా, అదే సమయంలో సంక్షిప్తంగా పరీక్షించడానికి మరొక అధ్యాయాన్ని కేటాయించాను.

చివరగా, మన హృదయాల ఆదరణ కోసం, మన ఆత్మలను బలపరచడం కోసం, మన జీవితాలను దీవించడం కోసం, లేఖనాల్లో దేవుని సార్వభౌమత్వం అనే సత్యం మనకు బయలుపరచబడిందని నేను చూపించడానికి ప్రయత్నం చేశాను. దేవుని సార్వభౌమత్వం గురించిన సరైన అవగాహన ఆరాధనతో కూడిన మనస్సును పెంపొందిస్తుంది. ఆచరణీయమైన భక్తికి ప్రోత్సాహాన్నిస్తుంది. పరిచర్యలో ఆసక్తిగా కొనసాగేందుకు ప్రేరణనిస్తుంది. దేవుని సార్వభౌమత్వం అనే సిద్ధాంతం మానవ హృదయాన్ని ఎంతో దీనమైనదిగా మారుస్తుంది. తనను రూపించిన దేవునిని మహిమ పరిచేందుకు మనిషి ధూళిలో కూర్చుని తనను తాను తగ్గించుకునే స్థాయికి తీసుకెళ్తుంది.

నేను రాసినవన్నీ నేటి క్రైస్తవ సాహిత్యానికీ, ప్రసంగాలకూ పూర్తి విరుద్ధంగా ఉన్నాయని నాకు తెలుసు. దేవుని సార్వభౌమత్వం అనే సిద్ధాంతం ప్రకృతి సంబంధమైన మనిషి అభిప్రాయాలకూ, ఆలోచనలకూ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అయితే మనం ఈ విషయాల గురించి ఆలోచించటము సాధ్యం కాదనేది సత్యం. దేవుని స్వభావాన్నీ ఆయన మార్గాలనూ సంపూర్ణంగా అర్థం చేసుకునే సామర్థ్యం మనకు లేదు. అందుకే దేవుడు తన మనస్సును మనకు బయలుపరిచాడు. ఆ బయలుపాటులో ఎంతో స్పష్టంగా ఆయన ఇలా అంటున్నాడు, “నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు.”

“ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి” (యెషయా55:8,9). ఈ లేఖనాల వెలుగులో బైబిల్లోని అత్యధిక అంశాలు దేవునికి విరోధంగా ఉండే శరీరసంబంధమైన మనస్సు యొక్క నమ్మకాలకూ, ఇష్టాలకూ పూర్తి విరుద్ధంగా ఉంటాయని అంచనా వేయొచ్చు. అందువల్ల ప్రస్తుతం ప్రజాదరణ పొందిన నమ్మకాలను గానీ, సంఘవిశ్వాస ప్రమాణాలను గానీ కాకుండా, యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఆయన ప్రమాణ వాక్యాన్ని మాత్రమే నేను ఆధారం చేసుకుంటున్నాను! సత్యమనే దీపపు వెలుగులో ప్రార్థనాపూర్వకంగా నేను రాసినదాన్ని శ్రద్ధగా, నిష్పక్షపాతంగా పరీక్షించమని నేను అందరినీ వేడుకుంటున్నాను. "సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి” (1 థెస్స 5:21) అనే దైవాజ్ఞను ప్రతీ పాఠకుడు వినునుగాక!

అధ్యాయం 1

దేవుని సార్వభౌమత్వం - నిర్వచనం

“యెహోవా, భూమ్యాకాశములయందుండు సమస్తమును నీ వశము; మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించికొనియున్నావు” (1దిన 29:11). దేవుని సార్వభౌమత్వం అనే మాట ఒకప్పుడు ప్రజలకు అతి సులభంగా అర్థమయ్యేది. క్రైస్తవ సాహిత్యంలో అది విరివిగా ఉపయోగించబడిన పదం. ప్రసంగ వేదిక నుంచి అది తరచూ బోధించబడిన అంశం. ఎన్నో హృదయాలకు ఆదరణనూ, క్రైస్తవ స్వభావానికి అది శక్తినీ, స్థిరత్వాన్ని ఇచ్చిన సత్యం. అయితే దేవుని సార్వభౌమత్వం గురించి మాట్లాడటం, నేడు అనేకులకు ఏదో అన్యభాషలో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మన ప్రసంగాంశం దేవుని సార్వభౌమత్వం అని సగటు ప్రసంగ వేదిక నుంచి ప్రకటించగానే, అంతరించిపోయిన భాషలోని ఒక పదాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చినట్లే ప్రజలకు వినిపిస్తుంది. అయ్యో! ఇది చరిత్రలో ఎంతో కీలకమైన సిద్ధాంతం. ఇది లేఖనంలో పూర్తిగా ఇమిడిపోయిన అంశం, క్రైస్తవ దైవశాస్త్రానికి పునాది. ఈ సిద్ధాంతాన్ని ఇంత దయనీయంగా నిర్లక్ష్యం చేయడం, ఇంత స్వల్పంగా అర్థం చేసుకోవడం ఎంతో విచారకరం.

దేవుని సార్వభౌమత్వం అంటే 'దేవుని సర్వాధిపత్యం, దేవుని రాజరికం, దేవుని దైవత్వం' అని అర్థం. దేవుడు సార్వభౌముడు అని చెప్పడం, 'దేవుణ్ణి దేవుడు' అని ప్రకటించటమే. దేవుడు సార్వభౌముడు అని చెప్పడం, 'ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు; ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు' అని ప్రకటించడమే (దాని 4:35); దేవుడు సార్వభౌముడు అని చెప్పడం, 'పరలోకంలోనూ భూమి మీదా ఆయన సర్వాధికారాన్ని కలిగియున్నవాడు, ఆయన ఆలోచనలను ఓడించగలిగినవాడు గానీ ఆయన ఉద్దేశాన్ని ఆటంకపరచగలిగేవాడు గానీ, ఆయన చిత్తాన్ని ఎదిరించేవాడు గానీ ఎవ్వడూ లేడు అని ప్రకటించడమే (కీర్తన 115:3); అన్యజనులలో ఏలువాడు ఆయనే అని ప్రకటించడమే (కీర్తన 22:28); తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి రాజ్యాలను స్థాపిస్తూ, సామ్రాజ్యాలను కూలగొడుతూ, రాజవంశాల మార్గాలను నిర్దేశించేవాడని ప్రకటించడమే; ఆయన మాత్రమే సర్వాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునైయున్నాడు అని ప్రకటించడమే (1తిమోతి 6:15). ఈ దేవుడే బైబిల్లోని దేవుడు.

ఆధునిక క్రైస్తవ ప్రపంచం బైబిల్ దేవుణ్ణి ఎంత భిన్నంగా చూపిస్తుందో కదా! లేఖనాల ఉపదేశాన్ని వింటున్నామని చెప్పుకునేవారి మధ్యన సైతం దేవుని గురించిన అవగాహన ఘోరమైన వ్యంగ్యచిత్రంలా, సత్యాన్ని ఎగతాళి చేస్తున్నట్లుగా ఉంది. మన ఆధునిక ప్రపంచపు దేవుడు, ఆలోచనాపరుడైన ఏ మానవుని చేతనూ గౌరవించబడజాలని నిస్సహాయుడైన ఆడంగి. నేటి ప్రజల ఆలోచనలలోని దేవుడు సున్నితమైన భావోద్రేకాల నుండి పుట్టినవాడే. నేటి ప్రసంగవేదికల నుంచి ప్రకటించబడుతున్న దేవుడు తనపై భయభక్తులు కాకుండా జాలిని పుట్టించేవానిగా ఉన్నాడు.

మన తోటి మానవుల్లో అధికశాతం తమ పాపాల్లోనే మరణిస్తూ, నిరీక్షణ లేని నిత్యత్వానికి వెళ్తున్నారని స్పష్టంగా తెలుస్తున్నా సరే, తండ్రియైన దేవుడు సర్వమానవాళి రక్షణను ఉద్దేశించాడనీ, కుమారుడైన దేవుడు మానవజాతినంతటినీ రక్షించడానికి మరణించాడనీ, లోకమంతటినీ క్రీస్తు కోసం సంపాదించడానికి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నిస్తున్నాడనీ చెప్పడం తండ్రియైన దేవుడు నిరాశకు గురవుతున్నాడనీ, దేవుని కుమారుడు అసంతృప్తి చెందుతున్నాడనీ, పరిశుద్ధాత్మ దేవుడు ఓటమి పాలవుతున్నాడనీ చెప్పడమే అవుతుంది. నేను ఈ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేశాను.

మానవాళినంతటినీ రక్షించడానికి దేవుడు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడనీ, కానీ అధికశాతం మనుషులు తమను రక్షించకుండా దేవుణ్ణి అడ్డుకుంటున్నారని కొందరు వాదిస్తున్నారు. అంటే సృష్టికర్త చిత్తం అసమర్థమైనదనీ, స్పష్టం యొక్క చిత్తం సర్వశక్తిగలదనీ దీని భావం. కొందరు అపవాది పైకి నిందను మళ్ళిస్తున్నారు. అలా చేయడం కూడా సమస్యను తొలగించదు. ఎందుకంటే సాతాను దేవుని ఉద్దేశాన్ని ఓడించగలుగుతున్నాడంటే సాతాను సర్వశక్తిమంతుడనీ, దేవుడు సర్వోన్నతుడు కాడని అర్థం .

పాపం మూలంగా సృష్టికర్త యొక్క అసలైన ప్రణాళికకు అవరోధం ఏర్పడిందని ప్రకటించడం దేవుణ్ణి సింహాసనంపై నుండి దించివేయడమే ఔతుంది. ఏదేనువనంలో జరిగిన పాపం దేవుణ్ణి ఆశ్చర్యానికి గురిచేసిందనీ, ముందుగా ఊహించకపోవడం వలన జరిగిన ఉపద్రవానికి విరుగుడు ఇవ్వడానికి ఆయన ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడనీ చెప్పడం సర్వోన్నతుడైన దేవుణ్ణి పరిమితుడైన, నిమిత్తమాత్రుడైన, పొరపడే మనిషిస్థాయికి దిగజార్చినట్లే ఔతుంది. మనిషి స్వేచ్ఛాజీవి, తన భవిష్యత్తును తానే నిర్ధారించుకునేవాడు; కాబట్టి తనను నిర్మించినవాణ్ణి ఓడించగల శక్తి అతనికి ఉందని వాదించడం దేవునికున్న సర్వశక్తిని ఆయన నుండి దూరం చేసినట్లే ఔతుంది. సృష్టికర్త నియమించిన హద్దుల్ని మనిషి దాటేసాడనీ, ఆదాము పతనం మూలంగా కలిగిన పాపం ముందు, శ్రమ ముందు దేవుడు ఇప్పుడు ఒక నిస్సహాయుడైన ప్రేక్షకునిలా ఉన్నాడని చెప్పడం "నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు" (కీర్తన 76:10) అని చెప్పిన పరిశుద్ధలేఖనాలను తృణీకరించడమే ఔతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని సార్వభౌమత్వాన్ని తృణీకరించడమంటే నాస్తికత్వాన్ని చేపట్టడమే!

లేఖనాలు తెలియజేస్తున్న దేవుని సార్వభౌమత్వం సంపూర్ణమైనది, అబేధ్యమైనది, అనంతమైనది! దేవుడు సార్వభౌముడు అని మనం చెప్పినప్పుడు, తన మహిమ నిమిత్తం చేసుకున్న విశ్వాన్ని తనకు నచ్చినట్లుగా పరిపాలించుకునే హక్కు దేవునికి ఉంది అని మనం స్థాపిస్తున్నాం. మట్టిపై కుమ్మరికి ఏ విధమైన హక్కు ఉంటుందో - అంటే ఒక మట్టిముద్ద నుంచి ఒక పాత్రను ఘనమైనదిగా, మరొక పాత్రను ఘనహీనమైనదిగా తయారుచేసే హక్కు ఎలా ఉంటుందో - అదేవిధంగా దేవునికి ఈ విశ్వంపై హక్కు ఉంటుందని మనం స్థాపిస్తున్నాం. ఆయన ఏ అధికారం కిందా లేడు, ఆయన తన చిత్తానికీ, స్వభావానికీ అతీతమైన ఏ నియమానికీ లోబడి ఉండేవాడు కాదు. దేవుడు తనకు తానే కట్టుబడి ఉంటాడు. ఆయన స్వభావమే ఆయనకు ధర్మశాస్త్రం. తాను చేస్తున్న కార్యాల గురించి ఆయన ఎవ్వరికీ లెక్క అప్పగించాల్సిన అవసరం లేదు.

సార్వభౌమత్వం దేవుని అస్థిత్వమంతటికీ ఉన్న లక్షణం. దేవుడు తన గుణలక్షణాలన్నిటిలోనూ సార్వభౌముడు. దేవుడు తన శక్తిని ఉపయోగించే విషయంలో సార్వభౌముడు. ఆయన తాను కోరిన విధంగా, కోరినప్పుడు, కోరిన ప్రదేశంలో తన శక్తిని ప్రదర్శిస్తాడు. లేఖనంలోని ప్రతీ పేజీలోనూ ఈ వాస్తవానికి రుజువు ఉంది. సుదీర్ఘకాలంపాటు ఆ శక్తి నిద్రావస్థలో ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ ఒకానొక సమయంలో అకస్మాత్తుగా అపరిమితమైన బలంతో అది ప్రదర్శించబడుతుంది. అరణ్యంలోకి వెళ్ళి యెహోవాను ఆరాధించాలని తలచిన ఇశ్రాయేలును ఆటంకపరచడానికి ఫరో తెగించాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు, తన ప్రజలను విడుదల చేశాడు. తన ప్రజలను క్రూరంగా హింసించిన యజమానుల్ని వధించాడు.

కొంతకాలం తర్వాత ఇదే ఇశ్రాయేలీయులపై దాడి చేయడానికి అమాలేకీయులు సాహసించారు. అప్పుడేం జరిగింది? ఎర్ర సముద్రం దగ్గర తన బాహువును కనపరచిన విధంగా ఈ సందర్భంలో తన శక్తిని దేవుడు ప్రదర్శించాడా? లేదు, “(తనకు) అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమని” యెహెూవా ప్రమాణం చేశాడు (నిర్గమ 17:16).

ఆ తర్వాత ఇశ్రాయేలు కనాను దేశంలోకి ప్రవేశించినప్పుడు దేవుని శక్తి అద్భుతంగా ప్రదర్శింపబడింది. వారి ప్రవేశాన్ని యెరికో పట్టణం అడ్డుకుంది. అప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు కత్తి దూయలేదు, బాణాలు ప్రయోగించలేదు. ప్రభువు తన చేయి చాచాడు, గోడలు కుప్పకూలిపోయాయి. అయితే ఇలాంటి అద్భుతం ఎన్నడూ పునరావృతం కాలేదు. మరి ఏ ఇతర పట్టణమూ ఈ విధంగా కూలిపోలేదు. మిగిలిన ప్రతీ పట్టణాన్నీ ఖడ్గం చేతనే బంధించాల్సి వచ్చింది.

దేవుడు తన శక్తిని సార్వభౌమత్వంతో ప్రదర్శిస్తాడు అని నిరూపించడానికి ఎన్నో సంఘటనలను ప్రస్తావించవచ్చు. మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. దేవుడు తన శక్తిని కనపరిచి మహాబలుడైన గొల్యాతు నుంచి దావీదును విడిపించాడు. సింహాల నోళ్లు మూయబడ్డాయి, దానియేలు ఎలాంటి గాయాలూ లేకుండా తప్పించుకున్నాడు. ముగ్గురు హెబ్రీ యువకులు భగభగ మండే అగ్నిజ్వాలల్లోకి విసిరివేయబడినా, ఎలాంటి హానీ పొందకుండా బయటికి వచ్చారు. అయితే తన ప్రజలను విడిపించడానికి అన్ని సమయాల్లోనూ దేవునిశక్తి అదే విధంగా జోక్యం చేసుకోలేదు. అందుచేతనే “మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను ఖైదును అనుభవించిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, ఖడ్గముతో చంపబడిరి” అని మనం చదువుతున్నాం (హెబ్రీ 11:36, 37). విశ్వాసులైన ఈ వ్యక్తుల్ని దేవుడు ఇతర వ్యక్తులను విడిపించినట్లు ఎందుకు విడిపించలేదు? ఇతరులు వీళ్ళలా చంపబడేలా ఎందుకు అనుమతించబడలేదు? దేవుని శక్తి కొందరిని రక్షించడానికి ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఇతరులను ఎందుకు విడిచిపెట్టేయాలి? స్తెఫను రాళ్లతో కొట్టబడి మరణించడానికి ఎందుకు అనుమతించాలి? పేతురును చెరసాల నుండి ఎందుకు విడిపించాలి?

తన శక్తిని ఇతరులకిచ్చే విషయంలో దేవుడు సార్వభౌముడు. తన సమకాలీకులందరి కంటే మెతూషెల ఎక్కువకాలం జీవించేలా దేవుడు అతనికి ఎందుకు సామర్థ్యాన్నిచ్చాడు? ఏ మానవుడూ ఎన్నడూ కలిగి ఉండని భౌతిక బలాన్ని దేవుడు సంసోనుకు ఎందుకు ఇచ్చాడు? “నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనవలెను. ఏలయనగా .... మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే” (ద్వితీ 8:18). అయితే అందరికీ ఒకేలా ఈ శక్తిని దేవుడు అనుగ్రహించడు. ఎందుకు? Morgan, Carnegie, Rockefeller మొదలైనవారికి ఆయన అంత ఆర్థికశక్తిని ఎందుకిచ్చాడు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు: దేవుడు సార్వభౌముడు కాబట్టి తాను కోరిన విధంగా సమస్తాన్నీ తాను జరిగించుకుంటాడు.

కరుణ చూపించే విషయంలో దేవుడు సార్వభౌముడు. ఇది సత్యం! ఎందుకంటే కరుణ చూపించే వ్యక్తి యొక్క చిత్తాన్ని బట్టే కరుణ చూపించబడుతుంది. కరుణ పొందడమనేది మనిషికి ఉన్న హక్కు కాదు. కరుణ అనేది దేవుని పూజింపదగిన గుణలక్షణం. ఆ కరుణనుబట్టే ఆయన దుష్టుల పట్ల జాలిపడతాడు, వాళ్ళను విడిపిస్తాడు. కనికరం పొందేవాళ్ళందరూ దుష్టులే. దుష్టత్వపు ఫలితం దుఃఖం; దుష్టత్వానికి తగినది శిక్షే గాని కరుణ కాదు. అందువల్ల కరుణకు యోగ్యులు అని చెప్పడం మాటల్లో వైరుధ్యం. తన ఇష్టాన్ని బట్టే కొందరికి ఆయన కరుణ చూపిస్తాడు. తన ఇష్టాన్ని బట్టే ఇంకొందరికి కరుణ చూపించడు. అందువల్లనే "ఆయన ఎవరిని కనికరింపగోరునో వారిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును” (రోమా 9:18).

ఈ వాస్తవానికి అద్భుతమైన ఉదాహరణ - దాదాపు ఒకే విధమైన పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు చేసిన ప్రార్థనకు దేవుడు స్పందించిన విధానంలో మనకు కనబడుతుంది. ఒక అవిధేయమైన కార్యం చేసినందుకు మోషేకు మరణశిక్ష విధించబడింది. ఆ శిక్షను రద్దు చేయమని అతడు ప్రభువును వేడుకున్నాడు. అయితే అతని కోరికని దేవుడు మన్నించాడా? లేదు. అందుకు మోషే, “యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను” అని ఇశ్రాయేలుతో చెప్పాడు (ద్వితీ 3:26).

ఇప్పుడు హిజ్కియాకు జరిగినదాన్ని గురించి ఆలోచించండి. “ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి - నీవు మరణమవుచున్నావు, బ్రదుకవు గనుక నీవు నీ యిల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని - యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీసన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకమునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతియైన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము - నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నాకు సెలవిచ్చునదేమనగా - నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని; నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను, నేను నిన్ను బాగుచేసెదను; మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుషు నీకిచ్చెదను; మరియు నా నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను” (2రాజులు 20:1-6).

ఈ ఇద్దరు వ్యక్తులు తమకు రాబోయే మరణం గురించి విని ఆ మరణశిక్షను రద్దు చేయమని ప్రభువును ఇద్దరూ వేడుకున్నారు. 'నా మాట యెహోవా వినకపోయెను” అని ఒకరు రాశారు. అతడు దేవుడు చెప్పినట్లే మరణించాడు. అయితే మరొకరితో “నీ ప్రార్థన నేను విన్నాను” అని దేవుడు చెప్పాడు. అతన్ని మరణం నుండి తప్పించాడు. రోమా 9:15లో వ్యక్తపరచబడిన సత్యానికి ఇది ఎంత చక్కటి ఉదాహరణగా ఉన్నదో కదా! రోమా 9:15 ఇలా అంటుంది, “అందుకు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు - ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపుదును.”

దుష్టుల పట్ల చూపించే దయనే దేవుని కనికరం అంటాం. యెహోవా శరీరధారియై మనుషుల మధ్య జీవించినప్పుడు తన కనికరాన్ని సార్వభౌమునిగా ప్రదర్శించాడు. ఉదాహరణను గమనించండి. యూదుల పండుగల్లో ఒకదానికి ప్రభుయేసు యెరూషలేముకు వెళ్ళాడు. ఆ సంధర్భంలోనే బేతెస్థ కోనేటి దగ్గరకు వచ్చాడు. అక్కడ అంధులు, అంగవైకల్యం కలవాళ్ళు, పక్షవాతం వచ్చినవాళ్ళు అనేకమంది ఉన్నారు. అంతమంది రోగుల్లో 38 సంవత్సరాల నుండి అక్కడే పడి ఉన్న వ్యక్తి కూడా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది?

“యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని యెరిగి - స్వస్థపడగోరుచున్నావా అని వానినడుగగా, ఆ రోగి - అయ్యా, నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉ త్తరమిచ్చెను. యేసు - నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తుకుని నడిచెను” (యోహాను 5:6-9).

అక్కడ ఎంతోమంది వ్యాధిగ్రస్థులుండగా యేసు ఎందుకు ఆ వ్యక్తినే స్వస్థపరిచాడు? 'ప్రభువా, నన్ను కరుణించు' అని అతడు మొర్రపెట్టాడని లేఖనం చెప్పలేదు. యేసు దయను ప్రత్యేకంగా పొందడానికి అతను అర్హుడని తెలియజేసే ఒక్క మాట కూడా ఇక్కడ ప్రస్తావించబడలేదు. అందువల్ల దేవుని కనికరాన్ని యేసు తన సార్వభౌమ చిత్తంతో చూపించాడు. ఆ వ్యక్తిని బాగుచేసినట్లే అక్కడున్న అనేకమంది రోగుల్ని కూడా యేసు ఎంతో సునాయసంగా స్వస్థపరచగలిగి ఉండేవాడు. అయితే ఆయనలా చేయలేదు. ఆయన తన శక్తిని ఉపయోగించి, ఆ వ్యక్తిని మాత్రమే అతని దుస్థితి నుండి విడిపించాడు. కారణం ఆయనకు మాత్రమే తెలుసు. ఇతరులకు అలా చేయడానికి ఆయన ఇష్టపడలేదు. ఇక్కడ కూడా “ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును; ఎవని యెడల జాలి చూపుదునో వాని యెడల జాలి చూపుదును” అనే రోమా 9:15లోని మాటలకు ఎంతో చక్కటి ఉదాహరణ మనకు కనబడుతుంది!

దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచే విషయంలో సార్వభౌముడు. అయ్య బాబోయ్!! ఇదెంత కఠినమైన మాట! దీన్నెవడు స్వీకరించగలడు? “తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని యెవడును ఏమియు పొందనేరడు” అని రాయబడి ఉంది (యోహాను 3:27). తన ప్రేమను వ్యక్తపరిచే విషయంలో దేవుడు సార్వభౌముడు, అంటే తాను ఎన్నుకున్నవారిని ఆయన ప్రేమిస్తాడని అర్థం. దేవుడు ప్రతీ ఒక్కరినీ ప్రేమించడు. ఆయన ప్రతీ ఒక్కరినీ ప్రేమించేవాడైతే, సాతానును కూడా ప్రేమించాలి. సాతానును దేవుడెందుకు ప్రేమించడం లేదు? ఎందుకంటే వాడిలో ప్రేమించడానికి ఏమీ లేదు. దేవుని హృదయాన్ని ఆకర్షించేది ఏదీ వాడిలో లేదు. ఆదాము యొక్క పతనమైన సంతానంలో కూడా దేవుని ప్రేమను ఆకర్షించేది ఏమీ లేదు. స్వభావరీత్యా వాళ్ళందరూ దైవోగ్రతకు పాత్రులైనవాళ్ళే (ఎఫెసీ 2:3). మానవజాతిలో దేవుని ప్రేమను ఆకర్షించేది ఏదీ కూడా లేకపోయినా, దేవుడు కొంతమందిని ప్రేమిస్తున్నాడంటే, ఆ ప్రేమకు కారణం ఆయనలోనే ఉందని అర్థం. అంటే తన దయా సంకల్పాన్ని బట్టే పతనమైన మనుషుల పట్ల దేవుడు తన ప్రేమను కనబరుస్తున్నాడని భావం.

తుది విశ్లేషణను బట్టి చూస్తే దేవుడు తన ప్రేమను వ్యక్తపరచడమనే దానికి మూలం ఆయన సార్వభౌమత్వంలోనే ఉంది. లేదంటే ఆయనను ప్రేమించమని ఏదో ఒక నియమం నిర్బంధిస్తున్నట్లే కదా! ఆయన ఏదో ఒక నియమానికి లోబడి ప్రేమిస్తున్నట్లయితే, ఆయన ప్రేమ ఆ నియమం కింద ఉన్నట్లే. అప్పుడు ఆయన సర్వాధికారి కాలేడు. ఎందుకంటే ఆయన కూడా ఒక ధర్మశాస్త్రం/చట్టం చేత పరిపాలించబడుతున్నట్లే. 'మొత్తం మానవ జాతినంతటినీ దేవుడు ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని మీరు తృణీకరించడం లేదు కదా?' అని మీరు అడగడానికి అవకాశముంది. “నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను” అని రాయబడిందన్నదే మీ ప్రశ్నకు మా జవాబు (రోమా 9:13). యాకోబు, ఏశావులిద్దరూ జన్మించి మంచైనా, చెడైనా చేయడానికి ముందే దేవుడు యాకోబును ప్రేమించి, ఏశావును ద్వేషించాడంటే ఆయన ప్రేమకు హేతువు ఆయనలోనే ఉంది కాని వాళ్ళలో లేదని భావం .

దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచేది తన సార్వభౌమ సంకల్పాన్నిబట్టే అనే విషయం ఎఫెసీ 1:3-5లోని భాషను బట్టి కూడా స్పష్టమమౌతుంది. “మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన యెదుట పరిశుద్ధమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను” (ఎఫెసీ 1:3-6).

యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటానికి తాను ఏర్పరచుకున్నవారిని తండ్రియైన దేవుడు తన కోసం ముందుగా ప్రేమతో నిర్ణయించుకున్నాడు. దేనిని బట్టి? ఆయన వాళ్ళలో కనుగొన్న ఏదో గొప్పతనాన్ని బట్టా? కాదు! మరి దేనిని బట్టి తండ్రియైన దేవుడు వాళ్ళను ముందుగా నిర్ణయించుకున్నాడు? వాళ్ళు ఏమవుతారో ముందుగా చూడడాన్ని బట్టా? కాదు! ఆత్మ ప్రేరేపణతో పౌలు చెప్పిన జవాబును చూడండి, “తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున” తండ్రియైన దేవుడు వాళ్ళను ముందుగా నిర్ణయించుకున్నాడు.

దేవుడు తన కృపను కనపరిచే విషయంలో సార్వభౌముడు. కృప అంటే అయోగ్యమైనవారికి - ఇంకా స్పష్టంగా చెప్పాలంటే - నరకపాత్రులైనవారికి దయ చూపించడం. కాబట్టి ఇది అత్యవసరం. కృప అనే దైవలక్షణం న్యాయం అనే దైవగుణానికి వ్యతిరేకమైనది. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయమని న్యాయం కోరుతుంది. ప్రతీ ఒక్కడూ తనకు న్యాయంగా రావాల్సినదానిని హెచ్చుతగ్గులు లేకుండా పొందుకోవాలని న్యాయం కోరుతుంది. న్యాయం వ్యక్తులను ఏ మాత్రమూ భిన్నంగా చూడదు. జాలి, దయ అనేవాటిని న్యాయం చూపించలేదు. అయితే న్యాయమంతా సంపూర్ణంగా నెరవేరిన తర్వాత కృప ముందుకొస్తుంది. న్యాయాన్ని ఫణంగా పెట్టి దేవుడు తన కృపను కనపరచడు. నీతి ద్వారా కృప ఏలుబడి చేస్తుంది (రోమా 5:21). కృప ఏలుబడి చేస్తుందంటే కృప సార్వభౌమత్వం కలదే ఔతుంది.

కృప అనేది సంపాదించుకోలేని దేవునిదయగా నిర్వచించబడింది. అది సంపాదించలేని కృప ఐతే, కృప పొందడం తమ హక్కని ఎవ్వరూ వాదించలేరు. కృప సంపాదించలేనిదైతే, దానిపైన ఎవ్వరికీ హక్కు ఉండదు. కృప అనేది వరమైతే ఎవ్వరూ అది ఇవ్వమని దబాయించలేరు. రక్షణ అనేది కృప చేతనే కలుగుతుంది, అది దేవుడిచ్చే ఉచితమైన బహుమానం. కాబట్టి ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికిస్తాడు. రక్షణ కృప చేతనే కాబట్టి పాపుల్లో ఎంత ప్రధానుడైనా అతడు దైవకృపకు అతీతుడు కాడు. రక్షణ కృప చేతనే కాబట్టి అతిశయించకూడదు, దేవుడే సమస్త మహిమనూ పొందాలి.

దేవుడు తన కృపను తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి కనపరుస్తూ ఉంటాడు. లేఖనాల్లో ఈ సత్యం దాదాపు ప్రతీ పేజీలోనూ ఉదాహరించబడింది. అన్యజనులు తమ సొంత మార్గాల్లో నడిచేలా దేవుడు వాళ్ళను విడిచిపెట్టాడు కానీ, ఇశ్రాయేలు ప్రజలు మాత్రం యెహోవాకు నిబంధన జనులయ్యారు. జ్యేష్టుడైన ఇష్మాయేలు దీవించబడకుండానే వెళ్ళగొట్టబడ్డాడు కానీ, ఇష్మాయేలు తండ్రికి వృద్ధాప్యంలో జన్మించిన ఇస్సాకు వాగ్దానపుత్రునిగా ప్రకటించబడ్డాడు. ఏశావు కన్నీళ్ళతో దీవెన కోసం వేడుకున్నప్పటికీ అది అతనికి దొరకలేదు కానీ, బలహీనుడైన యాకోబు స్వాస్థ్యాన్ని పొందాడు, ఘనతకు పాత్రగా ఎంచబడ్డాడు. కొత్త నిబంధనలో కూడా ఇదే సత్యం మనకు కనబడుతుంది. దేవుని సత్యం జ్ఞానుల నుంచీ, వివేకం కలిగినవారి నుంచీ మరుగుచేయబడి, పసిబాలురకు బయలుపరచబడింది. పరిసయ్యులను, శాస్త్రులను తమ సొంత మార్గాల్లో జీవించేలా దేవుడు విడిచిపెట్టి అదే సమయంలో సుంకరులను, వ్యభిచారులను ప్రేమ పాశాలతో తన దగ్గరకు ఆకర్షించుకున్నాడు.

కృప అంటే అనర్హులకు చూపించే దయ అని కొందరు చెబుతుండగా, కృప దానికి మించినదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నా దగ్గరకు వచ్చిన అపరిచిత యాత్రికుణ్ణి పోషించడం అనర్హునికి చూపించే దయ అవుతుంది. కానీ అది కృప అయ్యే అవకాశం లేదు. ఐతే ఒకవేళ ఈ యాత్రికుడే నన్ను దోచుకున్నాడని ఊహించండి. అప్పుడు కూడా ఈ యాత్రికుని అకలి తీరిస్తే అది కృప అవుతుంది. అందువల్ల కృపను బహుమానంగా పొందే వ్యక్తులకు దాన్ని పొందే అర్హత ఉండదు.

రక్షకుని జీవన సమయంలో దేవుని కృప అద్భుతమైన రీతిలో ప్రదర్శించబడింది. దేవునికుమారుడు శరీరధారి కావడం అనేది మానవజాతి చరిత్ర అంతటిలోనూ అత్యంత మహోన్నతమైన సంఘటన. అయితే అది జరిగిందనే వార్త ఆ సమయంలో మానవజాతి అంతటికీ తెలియజేయబడలేదు. దానికి భిన్నంగా బేత్లెహేములోని గొర్రెలకాపరులకూ, తూర్పుదేశపు జ్ఞానులకూ మాత్రమే అది బయలుపరచబడింది. ఈ సంఘటన ప్రస్తుత యుగమంతటిలోనూ జరగబోయేదానికి ఒక సూచనగా, ప్రవచనంగా ఉంది. ఎందుకంటే నేడు కూడా క్రీస్తు అందరికీ ప్రకటించబడడం లేదు. దేవదూతల సమూహాన్ని ప్రతి దేశానికి పంపించి, తన కుమారుని జననాన్ని ప్రకటన చేయించడం దేవునికి చాలా సులభమయ్యుండేది. అయితే దేవుడు అలా చేయలేదు. సర్వమానవాళి యొక్క గమనమంతటినీ నక్షత్రం ద్వారా దేవుడు సునాయాసంగా ఆకర్షించగలిగి ఉండేవాడు. అయితే దేవుడలా చేయలేదు. ఎందుకు? దేవుడు సార్వభౌముడు కాబట్టి తన ఇష్ట ప్రకారం కృపను చూపిస్తాడు! రక్షకుని జననాన్ని దేవుడెవరికి తెలియపరిచాడో ప్రత్యేకంగా గమనించండి. రెండు విభిన్నమైన వర్గాలవారైన నిరక్ష్యరాస్యులైన గొర్రెల కాపరులకూ, అన్యులైన జ్ఞానులకూ దేవుడు ఈ శుభవార్తను తెలియజేశాడు. ఏ దేవదూత కూడా సన్హెద్రన్ సభ ఎదుట నిలబడి ఇశ్రాయేలీయుల మెస్సీయ రాకడను ప్రకటించలేదు. గర్వంతో, స్వనీతితో లేఖనాలను పరిశోధిస్తున్న శాస్త్రులకు, మతపెద్దలకు ఏ నక్షత్రమూ కనబడలేదు. ఆయన ఎక్కడ జన్మిస్తాడో తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతో శ్రద్ధగా లేఖనాలను పరిశోధించారు. అయితే ఆయన వచ్చినప్పుడు మాత్రం ఆ సంగతి వాళ్ళకు తెలియజేయబడలేదు. దేవుని సార్వభౌమత్వం ఎంత అద్భుతంగా ప్రదర్శింపబడుతుందో గమనించండి. నిరక్ష్యరాస్యులైన గొర్రెల కాపరులను వింతైన ఘనత పొందడానికి దేవుడు ఎన్నుకున్నాడు. పండితులను, గౌరవనీయులైన మతపెద్దలను దేవుడు దాటిపోయాడు. రక్షకుని జననం గురించి, తాను ఎవరి మధ్య జన్మించారో వారికి కాకుండా అన్యులైన ఈ జ్ఞానులకు ఎందుకు బయలుపరచబడింది? మొత్తం క్రైస్తవ యుగమంతటిలోనూ జరగబోయే దేవుని చర్యలను ఇవి ముందుగా సూచిస్తున్నాయి. దేవుడు తాను కోరినవారికి తన కృపను అనుగ్రహిస్తాడు, ఆయన సార్వభౌమ కృప తరచూ అయోగ్యులకూ, మనం ఊహించని జనులకూ చూపిస్తుంటాడు.

తన కుమారుని జన్మస్థలం ఏదై ఉండాలని నిర్ణయించినప్పుడు కూడా దేవుని సార్వభౌమత్వం ఎంతో స్పష్టంగా ప్రదర్శింపబడింది. మహిమగల ప్రభువు గ్రీసుకో, ఇటలీకో రాలేదు. ఏ మాత్రం గుర్తింపూ లేని పాలస్తీనాకు ఆయన వచ్చాడు. రాజనగరమైన యెరూషలేములో కాకుండా యూదాలోని స్వల్పగ్రామాల్లో ఒకటైన(మీకా 5:2) బేత్లెహేములో ఇమ్మానుయేలు జన్మించాడు. అందరిచేత అసహ్యించుకోబడిన నజరేతులో ఆయన పెరిగాడు. నిజంగా దేవుని మార్గాలు మన మార్గాల వంటివి కావు!

అధ్యాయం 2

సృష్టిలో దేవుని సార్వభౌమత్వం

“ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానినిబట్టియే సృజించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు, తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి” (ప్రకటన 4:11).

దేవుని గుణలక్షణాలన్నీ ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టే పని చేస్తుంటాయని ఇంతకుముందు అధ్యాయంలో చర్చించాము. ఇప్పుడు ఆయన మార్గాలన్నిటిలోనూ, చర్యలన్నిటిలోనూ ఈ సార్వభౌమత్వం ఎలా కనబడుతుందో చూద్దాం.

ఆది 1:1కి ముందు మహా విశాలమైన నిత్యత్వముండేది. అప్పటికి విశ్వమింకా నిర్మించబడలేదు, సృష్టి కేవలం ఆ గొప్ప సృష్టికర్త యొక్క ఆలోచనలోనే ఉంది. తన సార్వభౌమ మహిమలో దేవుడు మాత్రమే ఒంటరిగా వసించాడు. ఆకాశాలు, భూమి సృష్టించబడడానికి ముందున్న ఆ అనంతమైన యుగం గురించి నేను మాట్లాడుతున్నాను. అప్పుడు దేవునికి స్తుతులు పాడేందుకు దేవదూతలు లేరు. ఆయన గమనాన్ని ఆకర్షించడానికి సృష్టిలోని ప్రాణులు ఏవీ లేవు. అదుపు చేయాల్సిన తిరుగుబాటుదారులు ఎవ్వరూ లేరు. తన విశాల విశ్వంలో గంభీరమైన నిశ్శబ్దంలో ఆ మహాదేవుడొక్కడే నివసించాడు. ఒకవేళ దాన్ని కాలమని సంబోధించగలిగితే, ఆ కాలంలో కూడా దేవుడు సార్వభౌముడే!

తన చిత్తానుసారమైన సంకల్పాన్ని బట్టి ఆయన సృష్టించడానికీ, సృష్టించకుండా ఉండటానికీ కూడా ఆయనకు అధికారముంది. ఏ విధంగానైనా సృష్టించే స్వేచ్ఛ ఉంది. ఒకే ప్రపంచాన్ని, లేదా లక్షలాది ప్రపంచాలను సృష్టించే స్వతంత్రముంది. ఆయన చిత్తాన్ని ఎదిరించడానికి అప్పుడు ఎవరున్నారు? లక్షలాది వివిధ ప్రాణుల్నిఉనికిలోకి తీసుకొచ్చి, సంపూర్ణ సమానత్వాన్ని వాటికిచ్చి, ఒకే విధమైన సామర్థ్యాలను అనుగ్రహించి, వాటన్నిటినీ ఒకే రకమైన పరిస్థితుల్లో, వాతావరణంలో ఆయన ఉంచగలడు. లేదంటే ఒకదానికొకటి భిన్నంగా ఉండే ప్రాణుల్ని, అంటే సృష్టించబడడంలో తప్ప మరి ఏ విషయములోనూ పోలిక లేని జీవులను సృష్టించే స్వేచ్ఛ ఆయనకు ఉంది. ఆయనకున్న హక్కును సవాలు చేయగలిగినవాడెవడు? ఆయనకు నచ్చితే, పరిమితులకు అతీతమైన, విస్తారమైన ప్రపంచాన్ని ఆయన ఉనికిలోకి తెచ్చుండేవాడు. ఆయనకిష్టమైతే కేవలం అత్యంత శక్తివంతమైన సూక్ష్మదర్శిని(మైక్రోస్కోపు) మాత్రమే మానవ నేత్రాలకు చూపించగలిగేంత చిన్నదైన ప్రాణిని ఆయన సృష్టించగలిగి ఉండేవాడు. తన సింహాసనం చుట్టూ మండే మహాసెరూఫుల్ని సృష్టించడానికీ, పుట్టిన ఘడియలోనే చనిపోయే అతిసూక్ష్మమైన పురుగును సృష్టించడానికీ సార్వభౌమునిగా ఆయనకు హక్కు ఉంది. ఉన్నతులైన సెరాఫులు - నేలమీద ప్రాకే జంతువులు, విశ్వమంతా పరిభ్రమించే గ్రహాలు - తేలియాడే అణువులు, అఖిల ప్రపంచం - సూక్ష్మ ప్రపంచం, ఇవన్నీ ఒకదానికొకటి చాలా భిన్నమైనవి. బలవంతుడైన దేవుడు వీటిని తన విశ్వంలో సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అలా కాకుండా సమస్తాన్నీ ఒకేరీతిగా సృష్టించాలనుకుంటే, ఆయన సార్వభౌమ సంకల్పాన్ని ప్రశ్నించగలిగిన వాడెవడున్నాడు?

నరుడు వెలుగును చూడటానికి చాలాకాలం ముందే దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఎలా ప్రదర్శించాడో చూడండి. సృష్టిని చేయడానికీ, సృష్టిలోని ప్రాణుల వివిధ తత్వాలను చేయడానికీ దేవుడు ఎవరితో సంప్రదింపులు జరిపాడు? పక్షులు ఆకాశంలో ఎగురుతున్నాయి, పశువులు భూమిపై సంచరిస్తున్నాయి, చేపలు సముద్రంలో ఈదుతున్నాయి. వాటిని అలా భిన్నంగా చేసిందెవరు? భిన్న ప్రదేశాలనూ విభిన్నమైన తత్వాలనూ తన సార్వభౌమ చిత్తంతో వాటికి నియమించింది వాటి సృష్టికర్త కాడా?

ఆకాశాల వైశాల్యం వైపుకు మీ దృష్టి మరల్చండి. ఆలోచన కలిగిన ఏ వీక్షకుణ్ణయినా కట్టిపడేసే దేవుని సార్వభౌమ మర్మాలను పరిశీలించండి. "సూర్యునిమహిమ వేరు, చంద్రుని మహిమ, నక్షత్రముల మహిమ వేరు. మహిమనుబట్టి యొక నక్షత్రమునకు మరియొక నక్షత్రమునకు భేదము కలదు గదా” (1కొరింథీ 15:41). అయితే అవెందుకు అలా ఉండాలి? ఇతర గ్రహాలన్నిటికంటే సూర్యుడెందుకు ఎంతో మహిమకరంగా ఉండాలి? కొన్ని నక్షత్రాలు బ్రహ్మాండంగానూ, మరికొన్ని వాటితో పోలిస్తే చిన్నవిగానూ ఎందుకుండాలి? ఎందుకు అలాంటి అమోఘమైన అసమానతలున్నాయి? ఆకాశమందున్న కొన్ని గ్రహాలు ఇతర గ్రహాల కంటే సూర్యునికి ఎందుకు దగ్గరగా ఉంచబడ్డాయి? మార్గము తప్పి తిరిగే చుక్కలు, రాలిపోయే చుక్కలు అంటే నాశనమయ్యే నక్షత్రాలు ఎందుకుండాలి (యూదా 13)? “నీ చిత్తమును బట్టి అవి సృష్టించబడ్డాయి” అనేదే ఆ ప్రశ్నకు జవాబు (ప్రకటన 4:11).

ఇప్పుడు మనం నివసిస్తున్న భూగ్రహానికి మన దృష్టి మళ్ళిద్దాం. భూఉపరితల భాగం మూడువంతులు నీటితో ఎందుకు నింపబడి ఉండాలి? మిగిలిన భూభాగంలో ఎంతో తక్కువ భాగం సాగుకూ, నివాసానికీ పనికిరానిదిగా ఎందుకుండాలి? చిత్తడి నేలలు, ఎడారులు, మంచుతో కప్పబడిన ప్రాంతాలు విస్తారంగా ఎందుకుండాలి? ఒక దేశం విస్తీర్ణత విషయంలో మరొక దేశం కంటే తక్కువగా ఎందుకుండాలి? ఒక దేశం సారవంతంగానూ మరొక దేశం అత్యంత నిస్సారమైన బీడు భూమిగానూ ఎందుకుండాలి? ఒక దేశం ఖనిజలవణాలతో సమృద్ధిగానూ, మరొక దేశం ఏమీ లేకుండానూ ఎందుకుండాలి? ఒక దేశంలో వాతావరణం ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరంగా ఎందుకుండాలి? మరొక దేశపు వాతావరణం అనారోగ్యకరంగా అనాహ్లాదకరంగా ఎందుకుండాలి? ఒక దేశంలో నదులు, సరస్సులు ఎందుకు సమృద్ధిగా ఉండాలి? మరొక దేశంలో అవి అస్సలు కంటికి కానరాకుండా ఎందుకుండాలి? ఒక దేశంలో ప్రజలు నిరంతరం భూకంపాలకు ఎందుకు భయపడుతూ ఉండాలి? మరొక దేశం వీటి బెడద ఏ మాత్రమూ లేకుండా ఎందుకుండాలి? ఎందుకు? సృష్టికర్తకూ, సమస్తాన్ని నిర్వహించేవానికి అలా ఉండటమే నచ్చింది కాబట్టి!

జంతుప్రపంచాన్ని చూసి, వాటిలోనున్న అద్భుత వైవిధ్యాన్ని గమనించండి. సింహాంతో గొర్రెపిల్లనూ, ఎలుగుబంటితో కుందేలునూ, ఏనుగుతో ఎలుకనూ పోల్చడంఎలా సాధ్యపడుతుంది? గుర్రం, కుక్క లాంటి జంతువులకు ఎంతో తెలివి ఇవ్వబడింది. గొర్రె, పందివంటి వాటికి తెలివి ఉండదు. ఎందుకు? కొన్ని బరువులు మోసే జంతువులుగా నిర్మించబడితే, మరికొన్ని స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదిస్తాయి. కంచరగాడిద, గాడిదలు వెట్టిచాకిరి చేయడానికి బంధింపబడుతుండగా, సింహం, పులులు ఎంతో స్వేచ్ఛగా అడవిలో సంచరిస్తున్నాయి. ఎందుకు? కొన్ని ఆహారానికి అనువుగా, మరికొన్ని ఆహారానికి పనికిరానివిగా ఉంటాయి. కొన్ని అందంగానూ, మరికొన్ని వికృతంగానూ ఉంటాయి. కొన్నిటికి చాలా బలం ఉంటుంది, కొన్ని చాలా బలహీనంగా, నిస్సహాయంగా ఉంటాయి. కుందేలు వంటి జంతువులు ఎంతో వేగంగా పరిగెడతాయి, తాబేలు వంటి జంతువులు చాలా నెమ్మదిగా ప్రాకుతాయి. కొన్ని మనుషులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి, కొన్ని అస్సలు పనికిరావు. కొన్ని జంతువులు కొన్ని దశాబ్దాలు జీవిస్తాయి. మరికొన్ని మహా అయితే కొన్ని నెలలపాటే బ్రతుకుతాయి. కొన్ని సాధుస్వభావం గలవి, మరికొన్ని క్రూరమైనవి. అయితే ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు, వైవిధ్యాలు? జంతువుల విషయంలో ఏది వాస్తవమో పక్షుల, చేపల విషయంలో కూడా అదే వాస్తవం.

ఇప్పుడు పూలమొక్కల్లో, ఫలవృక్షాల్లో ఉండే వైవిధ్యం గురించి ఆలోచించండి. గులాబి మొక్కలకు ముళ్ళెందుకుంటాయి? లిల్లీ పువ్వులు ముళ్ళు లేకుండా ఎందుకు ఎదుగుతాయి? కొన్ని పుష్పాలు ఎందుకు సువాసనలు వెదజల్లుతాయి? మరికొన్ని పువ్వులకు ఎలాంటి సువాసనా ఉండదు, ఎందుకు? ఒక చెట్టు రుచికరమైన ఫలాలను ఇస్తుండగా, మరొకటి విషపూరిత ఫలాలను ఇస్తుందెందుకు? కొన్ని కూరగాయల మొక్కలు మంచును తట్టుకోగలవు, కాని మరికొన్ని మంచులో వడిలిపోతాయి, ఎందుకు? ఒకే తోటలో, ఒకే సమయంలో నాటబడిన రెండు యాపిల్ చెట్లలో ఒకటి యాపిల్ పళ్ళతో నిండి ఉండగా, మరొకదానికి కనీసం ఒక్క పండైనా కాయదు. కారణమేంటి? ఒక్కొక్క పూలమొక్క సంవత్సరానికి 12 సార్లు పూస్తుంది గానీ మరొక రకం కేవలం వందేళ్ళకొక్కసారే పూస్తుంది. కారణమేంటి? “యెహోవా ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహా సముద్రములన్నిటియందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు” (కీర్తన 135:6).

దేవదూతల సమూహాల గురించి ఆలోచించండి. ఇక్కడైనా మనకు ఏకరీతి, సమానత్వం కనబడాలి. కానీ ఇక్కడ కూడా పరిస్థితి అలా లేదు. ఇతర విషయాల్లో మాదిరిగానే సృష్టికర్త యొక్క సార్వభౌమ సంకల్పం ఇక్కడ కూడా ప్రదర్శించబడుతోంది. కొందరు దేవదూతలు ఇతరుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నారు. కొందరు ఇతర దేవదూతల కంటే ఎక్కువ శక్తి కలిగి ఉన్నారు. కొందరు దేవదూతలు ఇతరుల కంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. దేవదూతల్లో వివిధ స్థాయిలు ఉన్నాయని లేఖనం స్పష్టంగా బయలుపరుస్తుంది. ప్రధానదూతలు, సెరాఫులు, కెరూబులు మొదలైనవారి నుంచి ప్రధానులు, అధికారుల వరకూ (ఎఫెసీ 3:10), ప్రధానుల, అధికారుల నుంచి లోకనాథుల వరకూ (ఎఫెసీ 6:12), చివరకు దేవదూతల వరకూ, వారి మధ్యలో సైతం ఎన్నుకోబడిన దేవదూతల వరకూ (1 తిమోతి 5:21) మనం వివిధ స్థాయిలు చూస్తూ ఉన్నాం. హోదాలోనూ, క్రమంలోనూ ఈ అసమానత్వం, వైవిధ్యాలు ఎందుకున్నట్లు? మనం చెప్పగలిగినదల్లా “మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు” (కీర్తన 115:3).

సృష్టి అంతటిలోనూ దేవుని సార్వభౌమత్వం ప్రదర్శింపబడడం మనం చూస్తుండగా, మనుషుల మధ్యలో అది పనిచేయడం ఎందుకు వింతగా కనబడాలి? ఒకనికి 5 తలాంతులనూ ఇంకొకనికి ఒక్క తలాంతునే ఇవ్వాలని దేవుడు ఇష్టపడితే దాని గురించి మనం ఎందుకు వింతగా ఆలోచించాలి? ఒకడు ఎంతో దేహధారుడ్యంతో జన్మించి, అతని తల్లిదండ్రులకే పుట్టిన మరొకరు బలహీనంగా, వ్యాధిగ్రస్థునిగా ఉంటే మనకు ఎందుకు ఆశ్చర్యం కలగాలి? హేబెలు యవ్వనంలోనే హత్యకు గురయ్యేలా, ఎన్నో సంవత్సరాలపాటు కయీను శిక్షను అనుభవించేలా దేవుడు అనుమతించాడు. అది ఎందుకు వింతైన సంఘటనగా పరిగణించబడాలి? కొందరు నల్లగా పుడుతున్నారు, కొందరు తెల్లగా పుడుతున్నారు. కొందరు మూర్ఖులుగానూ, మరికొందరు మేథావులుగానూ జన్మిస్తున్నారు. కొందరు సోమరులుగానూ మరికొందరు ఎంతో చురుకుతనం, ఉత్సాహంగల వ్యక్తులుగా జన్మిస్తున్నారు. కొందరు స్వార్థపరులుగా, అహంకారులుగా, కోపంతో మండిపడేవారిగా, మరికొందరు సహజంగానే త్యాగపూరితమైనవారిగా, లోబడేవారిగా, సాత్వికులుగా జన్మిస్తున్నారు. దీన్ని ఎందుకు విడ్డూరంగా చూడాలి? కొందరు నడిపించడానికీ, పరిపాలించడానికి అర్హులుగా ఉంటుండగా మరికొందరు కేవలం అనుసరించడానికి, సేవ చేయడానికి మాత్రమే తగినవారుగా ఉంటున్నారు. దీన్ని ఎందుకు వింతగా చూడాలి? ఈ వైవిధ్యాలకూ అసమానతలకూ మూలకారణం అన్ని సందర్భాల్లోనూ వారసత్వం, పరిస్థితులు కారణం అని చెప్పలేము. ఒకరిని మరొకరికి భిన్నంగా చేస్తున్నది దేవుడే. ఆయన ఎందుకలా చేయాలి? “తండ్రి, అలా చేయడం నీ దృష్టికి అనుకూలమాయెను” అని మనం జవాబు చెప్పాలి.

కాబట్టి ఈ ప్రాథమిక సత్యాన్ని నేర్చుకోండి! సృష్టికర్త సంపూర్ణ సార్వభౌమత్వం కలవాడు, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. తన దయాసంకల్పం బట్టి సమస్తాన్నీ జరిగిస్తూ ఉంటాడు. ఆయన తన మహిమ గురించి తప్ప మరి దేని గురించి ఆలోచించడు. “యెహోవా ప్రతీ వస్తువును దాని దాని పని నిమిత్తము (తన కోసమే) కలుగచేసెను” (సామెతలు 16:4). అలా చేయడానికి సంపూర్ణమైన హక్కు ఆయనకు లేదా?

దేవుడే దేవుడు. కనుక ఆయనకున్న ఆధిక్యతను సవాలు చేయడానికి ఎవరు సాహసిస్తారు? ఆయనకు వ్యతిరేకంగా సణుగుకోవడం ఘోరమైన తిరుగుబాటు చేయడమే. ఆయన మార్గాలను ప్రశ్నించడమంటే ఆయన జ్ఞానాన్ని ఎగతాళి చేయడమే, సవాలు చేయడమే. ఆయనను విమర్శించడమంటే తీవ్రమైన పాపం చేయడమే. ఆయన ఎవరో మనం మరచిపోయామా? “ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగా యుండును, ఆయన దృష్టికి అవి అఖాతముగాను, శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు” (యెషయా 40:17,18)?

అధ్యాయం 3

పరిపాలనలో దేవుని సార్వభౌమత్వం

“యెహోవా ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరచియున్నాడు; ఆయన అన్నిటిమీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు” (కీర్తన 103:19).

ఈ భౌతిక ప్రపంచాన్ని దేవుడు పరిపాలించాల్సిన అవసరం ఉంది.దాని గురించి నేను మొదటిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ భౌతిక ప్రపంచాన్ని దేవుడు పరిపాలించడం లేదని ఒక్కసారి ఊహించుకోండి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించి, కొన్ని నియమాలను (ప్రకృతి నియమాలను) ఏర్పాటు చేసి, ఆ నియమాలే ఈ లోకాన్ని నడిపించేవిగా చేసి, తెరపై నుండి ఆయన తప్పుకున్నాడని ఊహించండి. అంటే జ్ఞానసంపన్నుడైన పరిపాలకుడు ఈ లోకానికి లేడని అర్థం. ప్రకృతి నియమాల దయాదాక్షిణ్యాలపైన, పనితీరు పైన ఆధారపడి ఈ లోకం నడిపించబడుతుందని భావం. పరిస్థితులను వ్యక్తిత్వం లేని నియమాలు నియంత్రిస్తున్నాయని తాత్పర్యం. ఈ భావననే భౌతికవాదమనీ, తీవ్రమైన నాస్తికవాదమనీ అంటారు. ఒకవేళ ప్రస్తుత ప్రపంచం ఇలానే నడిపించబడుతూ ఉంటే, 'త్వరలోనే ఈ ప్రపంచం నాశనం కాదనే నిశ్చయత ఏదైనా మనకుంటుందా?” ప్రకృతి నియమాలను పైపైనే గమనించండి. వాటి పనితీరు ఎప్పుడూ ఒకేవిధంగా ఉండదని మీకు వెంటనే అర్థమవుతుంది. ఏ రెండు కాలాలూ (seasons) ఒకే విధంగా లేవన్నదే ఈ మాటకు రుజువు. ప్రకృతి నియమాలు క్రమరహితంగా పనిచేస్తున్నప్పుడు భయంకరమైన విపత్తు మన భూమిని తాకదన్న నిశ్చయత ఏదైనా ఉందా? “గాలి తనకిష్టమైన చోటను విసరును.” అంటే మనిషి దాన్ని నియంత్రించలేడు, నిరోధించలేడు. కొన్నిసార్లు గాలి ప్రచండమైన వేగంతో వీస్తుంది. భూమిపైన పెనుతుఫానుకి కారణమవుతుంది. గాలిని నియంత్రించేది ప్రకృతినియమాలకు మించినది కాకపోతే, బహుశా రేపే ఒక భయంకరమైన పెనుతుఫాను భూమి పైన దాడిచేసి, దాని పైనున్న ప్రతి దానినీ ఊడ్చిపెట్టే అవకాశముంది! అలాంటి విపత్తు చోటుచేసుకోదనే నిశ్చయత మనకు ఎలా కలుగుతుంది? గతంలో కొన్నిసార్లు అనూహ్యమైన రీతిలో కుండపోతగా వర్షం కురిసి పలుప్రాంతాల పైకి వరదలు ముంచెత్తి, విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగించాయని మనం విన్నాం, చదివాం. మనిషి వాటిముందు నిస్సహాయుడే, ఎందుకంటే అకస్మాత్తుగా కురిసే వర్షాన్ని అడ్డుకోవడానికి సైన్సు ఏ విధమైన మార్గాన్ని కనుగొనలేదు. అకస్మాత్తుగా కురిసే వర్షాలు అమాంతం పెరిగిపోయి, మొత్తం భూమి అంతా నీట మునిగిపోదనే నిశ్చయత మనకేదైనా ఉందా? నోవహు జలప్రళయం మరొకసారి ఎందుకు పునరావృతం కాకూడదు? భూకంపాల సంగతేంటి? భూకంపాల వలన ప్రతీ కొన్ని సంవత్సరాలకు ఏదో ఒక ద్వీపమో, పెద్ద నగరమో ఉనికిలో లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది. మనిషి ఏం చేయగలడు? త్వరలోనే భీభత్సమైన భూకంపం వచ్చి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయదనే నిశ్చయత మనకేమైనా ఉందా? పలుచని భూఉపరితలానికి కింది పొరల్లో విపరీతమైన ఉష్ణోగ్రతలతో అగ్నిజ్వాలలు ఉన్నాయని సైన్సు మనకు చెబుతుంది. ఈ అగ్నిజ్వాలలు అకస్మాత్తుగా వ్యాపించి మన భూమి అంతటినీ దహించేయవు అన్న నిశ్చయత మనకేమైనా ఉందా? ప్రతీ పాఠకుడూ నేను చెప్పదలచుకున్న విషయాన్ని గ్రహిస్తున్నాడని నేను భావిస్తున్నాను. దేవుడు పరిపాలకుడు కాదనీ, “తన మహత్తు గల మాటచేత సమస్తాన్నీ నిర్వహించడం" లేదని (హెబ్రీ 1:5) చెబితే భద్రత అనేది ఏ మాత్రమూ మనకు లేనట్టే!

మానవజాతికి సంబంధించిన విషయాలను కూడా ఇదే విధంగా ఆలోచిద్దాం. మనఈ ప్రపంచాన్ని దేవుడే పరిపాలిస్తున్నాడా? దేశాల భవిష్యత్తును మలిచేది ఆయనేనా? సామ్రాజ్యాల గమనాన్ని నియంత్రిస్తున్నది ఆయనేనా? రాజవంశాల వ్యవధులను నియమిస్తున్నది ఆయనేనా? 'ఇవే మీకు హద్దులు. వీటిని మీరు దాటకూడదు?” అని దుష్క్రియలు చేసేవారికి ఆయన పరిమితులను నిర్దేశించాడా? వీటికి విరుద్ధమైన పరిస్థితే ఉన్నట్టు మనం ఊహిద్దాం. దేవుడు తన సృష్టిలోని ప్రాణుల చేతికే అధికారాన్నిఅప్పగించాడని అనుకుందాం. ఈ ఊహ మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సంపూర్ణమైన స్వేచ్ఛ కలిగిన చిత్తంతో మనిషి ఈ లోకంలోకి ప్రవేశిస్తున్నాడనీ, అతని స్వేచ్ఛకు భంగం కలిగించకుండా అతన్ని ఒప్పించడం గానీ నిర్బంధించడం గానీ అసాధ్యమనీ కొంత సేపు ఊహించండి. ప్రతీ మనిషికీ మంచిచెడుల గురించిన జ్ఞానం ఉందనీ, వాటిలో తనకు నచ్చినదానిని ఎంచుకోగలిగే సామర్థ్యం ఉందనీ, తాను కోరినదల్లా చేయడానికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందని అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? మనిషి సార్వభౌముడని అర్థం. ఎందుకంటే తనకు నచ్చినదాన్ని అతడు చేస్తాడు, తన భవిష్యత్తుకు తానే నిర్మాణకుడు. అలా అయితే త్వరలోనే ప్రతీ మనిషీ మంచిని తృణీకరించి చెడును ఎంచుకోడని నిశ్చయత ఏమిటి? అలా అయితే మానవజాతి మొత్తం నైతిక ఆత్మహత్యకు పాల్పడదని నిశ్చయత ఏమిటి? దేవుడు నియమించిన హద్దులన్నిటినీ తొలగించి మనిషిని పూర్తి స్వేచ్ఛతో వదిలేస్తే, నైతిక నియమాలన్నీ తక్షణమే అంతర్థానమైపోతాయి. మనుషులలోని ఆటవిక ప్రవృత్తి ప్రపంచమంతా విస్తరిస్తుంది. అయోమయ పరిస్థితులే ప్రపంచాన్ని ఏలుతాయి. ఇలా కాకుండా వేరే విధంగా జరుగుతాయని ఎందుకు అనుకోవాలి? ఒక దేశం దాని పాలకులను గద్దె దించి, దాని రాజ్యాంగాన్ని తిరస్కరించినప్పుడు, మిగిలిన దేశాలు అలా చేయకుండా అడ్డుకునేది ఏముంటుంది?

ఒక శతాబ్దం క్రితం ప్యారిస్ వీధుల్లో విప్లవకారుల రక్తం ఏరులై పారింది. ఈ శతాబ్దం ముగిసేలోపు ప్రపంచంలోని ప్రతీ నగరంలో జనం అలాంటి దృశ్యాన్ని చూడరనే నిశ్చయత ఏముంది? విశృంఖలమైన అక్రమానికి, అధికారానికి వ్యతిరేకంగా విశ్వవ్యాప్తమైన తిరుగుబాటునీ ఆటంకపరిచేది ఏముంది? అందువల్ల సింహాసనాన్ని దేవుడే అధిష్టించి పరిపాలనను తన భుజస్కంధాలపై వేసుకుని, తన సృష్టిలోని ప్రాణుల చర్యలనూ, స్థితిగతులనూ నియంత్రించాల్సిన అవసరముందని నేను ప్రతిపాదిస్తున్నాను.

అయితే ఈ లోకంపై దేవుని ప్రభుత్వాన్ని గ్రహించడం విశ్వాసికి ఏమైనా కష్టంగా ఉంటుందా? ఎంతో అయోమయంగా, అస్తవ్యస్థంగా ఉన్న పరిస్థితుల మధ్యలో మనుషుల సంగతులను, అనుదిన జీవితానికి సంబంధించిన సామాన్య సంగతులను సైతం సర్వోన్నతుని హస్తమే నియంత్రిస్తుందనీ, నిర్వహిస్తుందనీ దేవునిబిడ్డ వివేచించలేడా?

ఉదాహరణకు, రైతుల గురించి, వారి పంటల గురించీ ఆలోచించండి. దేవుడు వాళ్ళను వాళ్ళ స్వేచ్ఛకు విడిచిపెట్టేశాడని ఊహించండి. అప్పుడు వాళ్ళు తమ సారవంతమైన భూముల్ని సేద్యం చేయడం మానివేసి, పూర్తిగా పశువుల పెంపకానికి పూనుకుని పాల సరఫరాకు తమను తాము అంకితం చేసుకోకుండా ఆటంకపరిచేది ఏముంటుంది? ఒకవేళ రైతులు అలాంటి పనే చేస్తే, ఏం జరుగుతుంది? అహారకొరత ఏర్పడి, ప్రపంచమంతటా కరువు తాండవం చేస్తుంది.

మరో ఉదాహరణకు, పోస్ట్ ఆఫీస్ పనిని తీసుకోండి. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ కేవలం సోమవారాల్లోనే ఉత్తరాలు రాయాలని నిర్ణయించుకున్నారని ఊహించండి. అప్పుడు మంగళవారాల్లో పోస్ట్ ఆఫీస్ అధికారులు పని ఒత్తిడిని తట్టుకోగలరా? ఆ వారంలోని తర్వాతి రోజుల్లో వాళ్ళు తమ సమయాన్ని ఎలా వెచ్చిస్తారు? దుకాణాల్లో పనిచేసేవాళ్ళ గురించి ఆలోచించండి. ప్రతి గృహిణి బుధవారమే నిత్యావసర సరుకులు కొనుక్కోవాలనీ, మిగతా రోజులన్నీ ఇంటి దగ్గరే ఉండాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుంది? అయితే ఇలా జరగడానికి బదులు, మానవజాతికున్న విస్తారమైన అవసరాలకు సరిపడేంతగా ప్రపంచ దేశాల్లోని రైతులు పశువులను పెంచుతున్నారు. వివిధ రకాలైన పంటల్ని పండిస్తున్నారు. వారంలోని ఆరు రోజులూ సమానంగా ఉ త్తరాలు రాయబడుతున్నాయి, పంపిణీ చేయబడుతున్నాయి. కొందరు గృహిణులు సోమవారం, మరికొందరు మంగళవారం షాపింగ్ చేస్తున్నారు. దేవుని హస్తమే పరిపాలిస్తుందనీ, నియంత్రిస్తుందనీ ఇవన్నీ స్పష్టంగా నిరూపించడం లేదా?

ఇప్పటివరకు మన ప్రపంచాన్ని దేవుడే పరిపాలించాల్సిన అవసరత గురించి క్లుప్తంగా చర్చించాము. దేవుడు సమస్త సృష్టినీ, సమస్త ప్రాణుల్నీ పరిపాలిస్తున్నాడనే వాస్తవాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

1. జీవము లేనివాటిన్నిటినీ కూడా దేవుడే పరిపాలిస్తున్నాడు

జీవము లేనివాటిని దేవుడే పరిపాలిస్తున్నాడు. విశ్వవ్యాప్తంగా ఉన్న జడ పదార్థమంతా ఆయన ఆజ్ఞకు లోబడుతుంది; ఆయన శాసనాలను నెరవేరుస్తుంది. ఈ విషయం దైవప్రత్యక్షత యొక్క మొదటి పేజీలోనే స్పష్టం చేయబడింది. “వెలుగు కమ్మని” దేవుడు పలికాడు, “వెలుగు కలిగినట్టు” మనం చదువుతున్నాం. “ఆకాశము క్రిందనున్న జలములొక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక” అని దేవుడు పలికాడు, అలాగే జరిగింది. “గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక” అని దేవుడు పలికాడు, అలాగే జరిగింది. “ఆయనమాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను” అని కీర్తనకారుడు ప్రకటిస్తున్నాడు (కీర్తన 33:9).

ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పబడిన సత్యమే బైబిల్ అంతటిలోనూ కనబడుతుంది. ఆదాము సృష్టించబడిన 16 శతాబ్దాల వరకూ భూమిపైన వర్షం కురవలేదు, అంటే నోవహు కాలం వరకు “ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను” (ఆది. 2:8). అయితే నోవహు ముందుతరపు మనుషుల దోషాలు సంపూర్ణమైనప్పుడు, “ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండ నాశనము చేయడానికి భూమి మీదకు జల ప్రవాహాన్ని రప్పించబోతున్నాను. లోకమందున్న సమస్తమునూ చనిపోతాయి” అని దేవుడు చెప్పాడు (ఆది 6:17). దీనికి నెరవేర్పుగా “నోవహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల యేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నియు ఈ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నలువది పగళ్ళును, నలువది రాత్రులును ప్రచండ వర్షము భూమి మీద కురిసెను” (ఆది 7:11,12).

ఐగుప్తు తెగుళ్ళ విషయంలో నిర్జీవమైనవి ఏ విధంగా దేవుని సంపూర్ణ, సార్వభౌమ నియంత్రణకు లోబడ్డాయో గమనించండి. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే వెలుగు చీకటిగానూ, నదులు రక్తంగానూ మారిపోయాయి. వడగళ్ళు కురిశాయి, నైలునది పరీవాహకప్రాంతమైన ఐగుప్తు పైకి మరణం దిగి వచ్చింది. అహంకారి అయిన చక్రవర్తి ఈ తెగుళ్ళ నుంచి విడుదల కోసం దేవునికే మొరపెట్టేలా ఇవి చేసాయి. పంచభూతాల పైన దేవుని సంపూర్ణ ఆధిపత్యాన్ని దైవావేశం కలిగిన గ్రంథం ఎలా నొక్కి చెబుతుందో ప్రత్యేకంగా గమనించండి. "మోషే తన కర్రను ఆకాశము వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుముల్నీ, వడగళ్ళనూ కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను.యెహోవా ఐగుప్తు దేశం మీద వడగళ్ళు కురిపించాడు. ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కలిసిన పిడుగులూ బహు బలమైనవాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్య మైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు. ఆ వడగళ్ళు ఐగుప్తు దేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నవి యావత్తును నశింపజేసెను. వడగళ్ళు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను. పొలములోని ప్రతీ చెట్టును విరుగగొట్టెను. అయితే ఇశ్రాయేలీయులున్న గోషేను దేశములో మాత్రము వడగళ్ళు పడలేదు” (నిర్గమ 9:23-26). 9వ తెగులు విషయంలో కూడా ఇలాంటి ప్రత్యేకతే కనబడింది. “అందుకు యెహోవా మోషేతో - ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను. మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటనుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలీయులందరికిని వారి నివాసములలో వెలుగుండెను” (నిర్గమ 10:21-23).

పైన చెప్పిన ఉదాహరణలు కొన్ని మాత్రమే. దేవుడు శాసించగానే అగ్నిగంధకాలు పరలోకం నుండి దిగివచ్చి, సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేశాయి. సారవంతమైన లోయ నిస్సారమైన మృతసముద్రంగా మారిపోయింది. ఆయన ఆజ్ఞాపించగానే ఎర్రసముద్ర జలాలు రెండుగా చీలిపోయాయి. ఇశ్రాయేలీయులు ఆరిన నేలపై దాన్ని దాటిపోయారు. ఆయన సెలవియ్యగానే అవి వెనుకకు మళ్ళి, ఇశ్రాయేలీయులను వెంబడిస్తున్న ఐగుప్తు సైనికులను నాశనం చేశాయి.

ఆయన మాట చెప్పగానే భూమి నోరు తెరిచింది. కోరహు, అతనితో పాటు తిరుగుబాటు చేసిన బృందం మింగివేయబడ్డారు. నెబుకద్నెజరు నిప్పుల కొలిమిని సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏడు రెట్లు ఎక్కువ చేయించి, ముగ్గురు దేవునిబిడ్డల్ని అందులో విసిరేయించాడు. వాళ్ళను విసిరిన వ్యక్తులు ఆ మంటల వేడికి మాడిపోయారు కాని దేవునిబిడ్డల వస్త్రాలనైనా మంటలు తాకలేకపోయాయి.

సృష్టికర్త శరీరధారిగా వచ్చి మనుషుల మధ్య జీవించినప్పుడు పంచభూతాలపై ఆయన ప్రభుత్వ ప్రదర్శన ఎంతగా జరిగిందో చూడండి. దోనె వెనుకభాగంలో నిద్రిస్తున్న ఆయనను పరికించండి. తుఫాను చెలరేగింది, గాలి గర్జిస్తుంది, కెరటాలు మహోద్రేకంతో ఎగిసిపడుతున్నాయి. ఆయనతో ఉన్న శిష్యులు తమ దోనె మునిగిపోతుందనే భయంతో తమ యజమానిని నిద్రలేపి మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? అని అడిగారు. ఆయన లేచి, గాలిని గద్దించాడు. "నిశ్శబ్దమై ఊరకుండుము” అని సముద్రానికి ఆదేశించాడు. “గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను” (మార్కు 4:39). ఆయన ఆజ్ఞాపించగానే సముద్రం దాని కెరటాలపై ఆయనను మోసింది. ఆయన మాట విని అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆయన తాకిన వెంటనే రోగం పారిపోయింది.

ఆకాశ వస్తువులను కూడా వాటిని రూపించినవాడే పరిపాలిస్తున్నాడు. అవి ఆయన సార్వభౌమ సంకల్పాన్ని నెరవేరుస్తున్నాయి. రెండు ఉదాహరణలు తీసుకోండి - హిజ్కియా యొక్క సందేహాన్ని నివృత్తి చేయడం కోసం అహాజు యొక్క ఎండ గడియారంపై నీడ పది మెట్లు వెనక్కు వెళ్ళేలా దేవుడు సూర్యుణ్ణి ఆదేశించాడు. కొత్త నిబంధన కాలంలో తన కుమారుని జన్మను ప్రకటించడానికి దేవుడొక నక్షత్రాన్ని ఏర్పరిచాడు. ఆ నక్షత్రమే తూర్పుదేశపు జ్ఞానులకు కనబడింది. ఈ నక్షత్రం ఆ శిశువు ఉన్నచోటికే మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచిందని మనం చదువుతున్నాం (మత్తయి 2:9).

ఇదెంత గంభీరమైన ప్రకటనో గమనించండి! “భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును. గొబొచ్చు వంటి మహిమ కురిపించువాడు ఆయనే. బుడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞనివ్వగా అవన్నియు కరిగిపోవును, ఆయన తన గాలి విసరజేయగా నీళ్ళు ప్రవహించును” (కీర్తన 147:15-18). పంచభూతాల్లో మార్పులు దేవుని సార్వభౌమ నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాన్ని కురవకుండా ఆపేది దేవుడే. ఆయనకిష్టమైన చోట ఆయనకిష్టమైన సమయంలో ఆయనకిష్టమైనవారిపై ఆయనకు ఇష్టమొచ్చినట్లు వర్షాన్ని కురిపించేది కూడా దేవుడే. వాతావరణ శాస్త్రజ్ఞులు వాతావరణం గురించి కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. అయితే వారి మాటల్ని దేవుడెంత తరచుగా ఎగతాళి చేస్తాడో కదా! సూర్యునిపై మచ్చలు, గ్రహాల యొక్క భిన్నమైన చర్యలు, తోకచుక్కల దర్శన అంతర్థానాలు (అననుకూల వాతావరణం వీటి మూలంగానే ఏర్పడుతుందని కొందరు చెబుతుంటారు), ఈ వాతావరణ మార్పులన్నీ ద్వితీయ కారణాలు, వాటన్నిటి వెనకున్నది సాక్షాత్తూ దేవుడే. మరొకసారి ఆయన వాక్యాన్ని మాట్లాడనిద్దాం. “మరియు కోతకాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరొక పట్టణం మీద కురిపించలేదు. ఒకచోట వర్షం కురిసింది, వర్షం లేని ప్రదేశం ఎండిపోయింది. రెండు మూడు పట్టణాల వాళ్ళు నీళ్లు తాగడానికి ఒక పట్టణానికి వెళ్ళగా అక్కడ నీళ్ళు వాళ్ళకు చాలకపోయెను. అయినా మీరు నా తట్టు తిరగలేదు. ఇదే యెహోవా వాక్కు, మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుక చేతను నేను పాడుచేశాను. గొంగళిపురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవ చెట్లను తినివేశాయి. అయినా మీరు నా తట్టు తిరగలేదు. ఇదే యెహోవా వాక్కు, మరియు నేను ఐగుప్తీయుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్ళు పంపించాను. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులకు ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రాలను కొల్లపెట్టించాను. అయినా మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు. ఇదే యెహోవా వాక్కు". (ఆమోసు 4:7-10).

అందువల్ల జీవము లేనివాటన్నిటినీ దేవుడే పరిపాలిస్తున్నాడనే మాట సత్యం. భూమ్యాకాశాలు, నీరు, నిప్పు, వడగళ్లు, మంచు, ప్రచండమైన వాయువులు, భీకరమైన సముద్రాలు మొదలైనవన్నీ ఆయన శక్తిగల మాటకు లోబడతాయి. ఆయన సార్వభౌమ సంకల్పాన్ని నెరవేరుస్తాయి. అందువల్ల మనం వాతావరణం గురించి ఫిర్యాదు చేస్తున్నప్పుడు నిజానికి మనం దేవునికి వ్యతిరేకంగా సణుగుతున్నట్టే.

2. వివేకము లేని ప్రాణులను దేవుడే పరిపాలిస్తున్నాడు

జంతుప్రపంచాన్ని దేవుడే పరిపాలిస్తున్నాడు అనడానికి ఆది 2:19 ఎంతో చక్కటి ఉదాహరణ కదా! “దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.” ఇది ఏదేను వనంలో ఆదాము పతనం కావడానికి, ప్రతీ ప్రాణిపై శాపం రావడానికి ముందు జరిగిన సంఘటన. ఇప్పుడు మరొక వచనం చూద్దాం. “మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును” (ఆది 6:19,20). చూడండి, పై వచనాలలో కూడా దేవుడు జీవరాశుల్ని ఎలా నోవహు దగ్గరకు వచ్చేలా చేశాడో! జంతువులన్నీ దేవుని సార్వభౌమ నియంత్రణలోనే ఉన్నాయి. మృగరాజైన సింహం, భారీకాయమున్న ఏనుగు, ధృవపు ఎలుగుబంటి, క్రూరమైన చిరుత, వశపరచుకోలేని తోడేలు, భయానకమైన పులి, ఆకాశంలో విహరించే గ్రద్ద తదీతర జంతువులు వాటి వాటి ప్రదేశాల్లో ఎంతో భయంకరమైనవైనా, వాటిని సృష్టించినవాని చిత్తానికి మౌనంగా లోబడుతూ, జతలు జతలుగా నోవహు నిర్మించిన ఓడలోకి వచ్చాయి.

జడపదార్థం పైన దేవుని ప్రభుత్వాన్ని ఉదాహరించడానికి ఐగుప్తు పైకి పంపబడిన తెగుళ్ళను మనం పరిశీలించాం. వివేకం లేని జంతు ప్రపంచంపై ఆయన పరిపూర్ణమైన పరిపాలనను చూడడానికి మరొకసారి ఆ తెగుళ్ళ వైపు మన గమనాన్ని మళ్ళిద్దాం. దేవుడు మాట సెలవియ్యగానే నది విస్తారమైన కప్పల్ని పుట్టించింది. ఈ కప్పలు ఫరో యొక్క రాజసౌధంలోకీ, అతని సేవకుల ఇళ్ళలోకి వెళ్ళాయి. వాటి సహజ స్వభావానికి విరుద్ధంగా పడక గదుల్లోనికి, మంచాల మీదికి, పొయ్యిలలోనికి, పిండి పిసుకు తొట్లలోనికి ప్రవేశించాయి (నిర్గమ 8:13). ఈగల గుంపులు ఐగుప్తు దేశంపై దండెత్తాయి. అయితే గోషేను ప్రాంతంలో ఈగలు లేవు (నిర్గమ 8:23). ఆ తర్వాత పశువులు మొత్తబడ్డాయి, “ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుర్రముల మీదికిని గాడిదల మీదికిని ఒంటెల మీదికిని ఎద్దుల మీదికిని గొర్రెల మీదికిని వచ్చును, మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును. అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను, ఐగుప్తుపశువులను వేరుపరచును. ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను. మరునాడు యెహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెను గాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు” అని మనం చదువుతాం (నిర్గమ 9:3-6). అదే విధంగా దేవుడు మిడతల దండుల్ని ఫరోపైకి, అతని దేశం పైకి పంపించాడు. దేవుడే ఆ మిడతలు వచ్చే సమయాన్ని నియమించాడు, వాటికి గమ్యాన్ని నిర్దేశించాడు, అవి వేటిని నాశనం చేయాలో హద్దుల్ని ఏర్పరిచాడు.

దేవుని ఆజ్ఞకు లోబడేది కేవలం దేవదూతలు మాత్రమే కాదు. క్రూరమృగాలు కూడా ఆయన సంకల్పాన్ని దేవదూతల్లాగానే నెరవేరుస్తాయి. పవిత్రమైన నిబంధన మందసం ఫిలిప్తీయుల దేశంలో ఉంది. కాని స్వదేశానికి అదెలా తీసుకురాబడింది? దేవుడు ఎంచుకున్న సేవకుల్ని (ఎద్దుల్ని) గమనించండి. అవి ఎంత సంపూర్ణంగా ఆయన ఆధీనంలో ఉన్నాయో పరిశీలించండి. “ఫిలిప్పీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి యెహోవా మందసమును ఏమి చేయుదము? ఏమి చేసి స్వస్థలమునకు దాని పంపుదుము? అని అడుగగా... మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలి తెచ్చి బంటికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి యింటికి తోలి యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరాధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. అది బేల్బెమెషుకు పోవు మార్గమునబడి ఈ దేశపు సరిహద్దు దాటిన యెడల ఆయన ఈ గొప్ప కీడు మనకు చేసెనని తెలిసికొనవచ్చును. ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశము చేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందుమనిరి” (1 సమూ 6:2,7-9). తర్వాత ఏం జరిగింది? చూడండి, ఆశ్చర్యకరమైన సంఘటన! “ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవుచూ, అరుస్తూ, బేతైమెషు మార్గమున నడిచెను. ఫిలిప్పీయుల సర్దారులు వాటి వెంబడి బేతైమెషు సరిహద్దు వరకు పోయిరి” (1 సమూ 8:12). ఏలీయా విషయంలో కూడా ఇంతే ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. “పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని” (1 రాజులు 17:2-4). ఎరను వెంటాడే ఈ పక్షుల సహజలక్షణాలను దేవుడు నియంత్రించాడు. అందువల్ల ఆహారాన్ని అదే తినకుండా, ఏకాంతంగా ఉన్న యెహోవా సేవకునికి తీసుకెళ్ళాయి.

ఇంకా రుజువులు అవసరమా? అయితే రుజువులు సిద్ధంగానే ఉన్నాయి. అబద్ధ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని గద్దించడానికి మూగజీవమైన గాడిదను దేవుడు ఉ పయోగించుకున్నాడు. ఎలీషాను ఎగతాళి చేసిన 42మంది బాలురను చీల్చడానికి రెండు ఆడ ఎలుగుబంట్లను అడవిలో నుండి పంపించాడు. దుర్మార్గురాలైన యెజెబెలు విషయంలో తాను పలికిన మాటను నెరవేర్చుకోవడానికి ఆమె రక్తాన్ని కుక్కలు నాకేలా ఆయన చేశాడు. దానియేలు సింహాలబోనులో పడవేయబడినప్పుడు ఆ బబులోను సింహాల నోళ్లను ఆయన మూయించాడు. తర్వాత ప్రవక్త అయిన దానియేలును నిందించినవారిని చంపి తినివేసేలా వాటిని ఉసిగొల్పాడు. అవిధేయుడైన యోనాను మింగివేయడానికి ఆయన పెద్ద చేపను సిద్ధం చేశాడు. తాను నిర్ణయించిన సమయం రాగానే నేలపైన అతన్ని కక్కివేసేలా ఆ చేపకు ఆదేశించాడు. ఆయన ఆజ్ఞాపించగానే పన్ను చెల్లించడానికి చేప ఒక నాణేన్ని మోసుకొచ్చింది. తన మాట నెరవేర్చుకోవడానికి పేతురు తనను తృణీకరించిన సందర్భంలో కోడి రెండుసార్లు కూసేలా ఆయన చేశాడు. ఆ విధంగా భూజంతువులనూ, ఆకాశ పక్షులనూ, సముద్రంలోని చేపలనూ ఆయన పరిపాలిస్తున్నాడు. అవన్నీ ఆయన సార్వభౌమ ఆజ్ఞను నెరవేరుస్తున్నాయి.

3. దేవుడు నరుల సంతానాన్ని పరిపాలిస్తున్నాడు

ఈ పుస్తకంలో ఇదే అత్యంత కష్టమైన అంశం. ఈ అంశాన్ని రాబోయే అధ్యాయాల్లో సమస్యను చర్చించడానికి ముందే ఆ అంశాన్ని మనం పరిశీలిద్దాం.

రెండు ప్రత్యామ్నాయాలు మన ఎదురుగా ఉన్నాయి. ఈ రెండిటిలో ఏదో ఒకదాన్ని మనం అంగీకరించి తీరాలి. అయితే దేవుడే పరిపాలిస్తున్నాడు, లేదా దేవుడు పరిపాలించబడుతున్నాడు. అయితే దేవుడే ప్రభుత్వం చేస్తున్నాడు, లేదా దేవుడు ప్రభుత్వానికి లోబడుతున్నాడు. అయితే దేవుడే తనకు నచ్చినట్లు చేస్తున్నాడు, లేదా మనుషులు తమకు నచ్చినట్లు చేస్తున్నారు.

ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవడం కష్టమా? దేవుని నియంత్రణకు అతీతమైనంతగా అదుపు తప్పిన జీవిని మనం మనిషిలో చూస్తున్నామని చెప్పవచ్చా? త్రియేక పరిశుద్ధుని అధికార పరిధికి ఎంతో దూరంగా పాపం పాపిని తీసుకెళ్ళిపోయిందా?

దేవుడు మనిషికి నైతిక బాధ్యతనిచ్చాడు. అందువల్ల కనీసం నిర్ణయకాలం వరకైనా అతన్ని దేవుడు పూర్తి స్వేచ్ఛగా వదిలేయాలని మనం చెబుదామా? 

ప్రకృతి సంబంధియైన మనిషి పరలోకానికి బహిష్కృతుడు కాబట్టి, దేవుని ప్రభుత్వానికి తిరుగుబాటుదారుడు కాబట్టి అతని ద్వారా దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాడనే మాట సత్యమవుతుందా?

దుర్మార్గుల దుష్టచర్యల ప్రభావాన్ని ఆయన తిప్పికొడతాడనీ, దుష్టులను తీర్పులోనికి తీసుకొచ్చి వాళ్ళను శిక్షిస్తాడనీ మనమే కాదు, ఎంతోమంది క్రైస్తవేతరులు కూడా నమ్ముతున్నారు. మనం మాట్లాడుతున్నది దీని గురించి కాదు.

దేవుని సృష్టిలో ఆయనకు వ్యతిరేకంగా అత్యంత ఘోరంగా తిరుగుబాటు చేసే ప్రతీ కార్యమూ కూడా పూర్తిగా ఆయన సర్వోన్నతమైన రహస్య శాసనాలను నెరవేరుస్తుందన్నదే నా ఉద్దేశం. ఇస్కరియోతు యూదా విషయంలో ఇది నిజం కాదా? ఇంతకు మించిన దుర్మార్గుణ్ణి ఎంచుకోవడం సాధ్యమా? ఇంత బద్దవిరోధి దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నప్పుడు, తిరుగుబాటుదారులందరి విషయంలో ఇదే జరుగుతుందని నమ్మండని చెప్పడం చాలా పెద్దభారాన్ని మోపినట్లవుతుందా?

ఈ గంభీరమైన అంశం గురించి లేఖనాల బోధను నొక్కిచెప్పడమే గాని తాత్విక, భౌతికేతర విచారణ చేయడం మన ప్రస్తుత లక్ష్యం కాదు. మనం దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్నే పరిశీలిద్దాం. వాక్యం చెప్పే సాక్ష్యాన్నే విందాం. ఎందుకంటే వాక్యమే దేవుని ప్రభుత్వం యొక్క స్వభావస్వరూపాలనూ, తీరుతెన్నులనూ, దాని పరిధినీ మనకు నేర్పిస్తుంది. తన చేతి పనులపై, మరి ముఖ్యంగా తన స్వరూపంలోనూ పోలికలోనూ చేయబడినదానిపై తన పరిపాలన గురించి తన దివ్యమైన వాక్యంలో మనకు బయలుపరచడానికి ఆయనకు ఇష్టమయ్యింది. “మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగియున్నాము” (అపొ.కా. 7:28). ఎంత ఖచ్చితమైన మాట ఇది! గమనించండి, ఈ మాటలను పౌలు చెప్పింది దేవుని సంఘాలకు కాదు, భక్తిలో శిఖరాలకు చేరిన పరిశుద్ధుల సమాజానికి కాదు గానీ అన్యజనులైనవారికి, “తెలియబడని దేవుణ్ణి ఆరాధిస్తున్నవారికి”, మృతుల పునరుత్థానం గురించి విన్నప్పుడు ఎగతాళి చేసినవారికి. ఏథెన్సులోని తత్తవేత్తలకూ, ఎపిక్యూరియన్లకూ, స్తోయికులకూ. వాళ్ళు దేవునిలోనే జీవిస్తున్నారు, చలిస్తున్నారు, ఉనికి కలిగి ఉన్నారు అని చెప్పడానికి పౌలు వెనుకాడలేదు. వాళ్ళ ఉనికి, భద్రత విషయాల్లో ప్రపంచాన్నీ, అందులో సమస్తాన్నీ చేసినవానికి రుణపడి ఉన్నారనే కాదు, చివరికి వాళ్ళ చర్యలు కూడా భూమ్యాకాశాలకు ప్రభువైనవానిలోనే ఉన్నాయి, ఆయన చేతనే నియంత్రించబడుతున్నాయి అని అపొ.కా.17:28 సూచిస్తుంది (దానియేలు 5:23తో పోల్చండి).

“హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుట యెహోవా వలన కలుగును” (సామెతలు 16:1). ఈ వచనాన్ని పరిశీలించండి. ఇది కేవలం విశ్వాసుల గురించి చెప్పబడినది కాదు, మనుషులందరి గురించి తెలుపబడిన మాట. “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును” (సామెతలు 16:9). మనిషి వేసే అడుగులను ప్రభువే నడిపిస్తున్నప్పుడు, దేవుడే అతన్ని అదుపు చేస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు అనడానికి అది రుజువు కాదా? "నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును.యెహోవా యొక్క తీర్మానమే స్థిరము” (సామెతలు 19:21). ఈ వచనం చెబుతున్నదేమిటి? ఆలోచించండి! మనిషి ఏం కోరుకున్నా, ఎలాంటి ప్రణాళిక వేసుకున్నా అతన్ని చేసినవాని చిత్తమే జరుగుతుంది. దీనిని ఎవరు కాదనగలరు? ఉదాహరణకు లూకా 12లో ధనవంతుడైన మూర్ఖుని గురించి ఆలోచిద్దాం. అతని హృదయాలోచనలను లేఖనం మనకు తెలియజేసింది. “అప్పుడతడు - నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనతో తాను ఆలోచించుకొని, నేనీలాగు చేయుదును. నా కొట్లు విప్పి, వాటికంటే గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో 'ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను" (లుకా 12:17-20). ఈ ధనవంతునికి ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. అయితే ప్రభువు యొక్క ఆలోచనే నెరవేరింది. 'నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను' అని ఆ ధనవంతుడు చేసుకున్న ఆలోచనలు నెరవేరలేదు. ఎందుకంటే, “వెర్రివాడా, ఈ రాత్రే నేను నీ ప్రాణమునడుగుచున్నాను” అని దేవుడు అతనితో చెప్పాడు (లూకా 12:17-20).

“యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును” (సామెతలు 21:1). ఇంతకన్నా స్పష్టం ఏం కావాలి? “హృదయములో నుండి జీవధారలు బయలుదేరును” (సామెతలు 4:23). ఒక మనిషి తన హృదయంలో ఏమి ఆలోచిస్తాడో అదే అతని తత్వం. హృదయం ప్రభువు చేతిలోనే ఉన్నప్పుడు తనకిష్టం వచ్చినట్లు దాన్ని తిప్పుకుంటున్నప్పుడు, నాయకులు, పరిపాలకులు, మనుషులందరు పూర్తిగా సర్వశక్తిమంతుడైన దేవుని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నారనే విషయం స్పష్టం కావడం లేదా?

పైన చేసిన ప్రకటనలకు హద్దులు పెట్టకూడదు. కొంతమంది మనుషులు దేవుని చిత్తాన్ని అడ్డగిస్తారు, ఆయన సంకల్పాలను భగ్నం చేస్తారు అని వాదించడం ఎంతో స్పష్టంగా ఉన్న ఇతర లేఖనాలను తృణీకరించడమే అవుతుంది. ఈ కింది వచనాలను బాగా పరిశీలించండి. "అయితే ఆయన ఏకమనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును” (యోబు 23:13). “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును” (కీర్తన 33:11). "యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనయైనను ఆలోచనయైనను నిలువదు" (సామెతలు 21:30). "సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు?” (యెషయా 14:22). “చాల పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేనే కలుగబోవువాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంక జరుగని వాటిని తెలియజేయుచున్నాను" (యెషయా 46:9,10). ఈ వాక్యభాగాల్లో అస్పష్టత ఏమీ లేదు. యెహోవా సంకల్పాన్ని నిరర్థకం చేయడం అసాధ్యమని ఈ వాక్యభాగాలు అత్యంత నిస్సంశయమైన, స్పష్టమైన పదజాలాన్ని ఉపయోగిస్తూ స్థాపిస్తున్నాయి.

ప్రభువైన దేవుడే దుష్టుల, సజ్జనుల చర్యలను పరిపాలిస్తున్నాడని గుర్తించడంలో మనం విఫలమైతే మనం లేఖనాలను వ్యర్థంగా చదువుతున్నట్టే. నిమ్రోదు, అతని అనుచరులు బాబేలు గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు తలపెట్టిన కార్యం నెరవేరకముందే దేవుడు వాళ్ళ ప్రణాళికలకు భంగం కలిగించాడు.దేవుడు అబ్రాహామును మాత్రమే పిలిచాడు (యెషయా 51:2). అయితే అతడు కల్దీయుల దేశంలో ఉర్ నుంచి ప్రయాణమైనప్పుడు అతని బంధువర్గం కూడా అతన్ని అనుసరించి వచ్చారు. అప్పుడు దేవుని చిత్తం నిరర్థకం చేయబడిందా? కానే కాదు! తర్వాత ఏం జరిగిందో చూడండి. కనానుకు చేరుకోకముందే తెరహు మరణించాడు (ఆది 11:32). లోతు తన పెదనాన్న అయిన అబ్రాహామును వెంబడించి వాగ్దానభూమికి చేరుకున్నా, త్వరలోనే అతడు అబ్రాహమును విడిచిపెట్టి సొదొమలో స్థిరపడ్డాడు. స్వాస్థ్యాన్ని దేవుడు యాకోబుకే వాగ్దానం చేశాడు. అయితే యెహోవా శాసనానికి భిన్నంగా ఇస్సాకు ఏశావును దీవించడానికి ప్రయత్నించినా అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మరొకసారి ఏశావు యాకోబుపై పగ తీర్చుకుంటానని తీర్మానించుకున్నాడు. అయితే వీళ్ళిద్దరూ తర్వాతి రోజుల్లో కలుసుకున్నప్పుడు ద్వేషంతో పోరాటం చేసుకోవడానికి బదులు ఒకరినొకరు కౌగలించుకుని ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు. యోసేపు సహోదరులు అతన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి దుష్ట ఆలోచనలను దేవుడు నెరవేరనివ్వలేదు. యెహోవా ఉపదేశాలను ఇశ్రాయేలు నెరవేర్చకుండా ఫరో అడ్డుకున్నాడు. ఇశ్రాయేలీయులను శపించమని బాలాకు బిలామును నియమించుకున్నాడు. అయితే దేవుడు వాళ్ళను దీవించేలా అతన్ని నిర్బంధించాడు. మొర్దెకై కోసం హామాను ఉరికొయ్యను ఏర్పాటు చేశాడు. అయితే అతడే దాని మీద ఉరి తీయబడ్డాడు. బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని యోనా ఎదిరించాడు. అయితే అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి.

'అన్యజనులు అల్లరి రేపవచ్చు, జనులు వ్యర్థమైనదానిని తలంచవచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధంగా నిలబడవచ్చు. ఏలికలు ఏకీభవించి “మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి” అని చెప్పుకోవచ్చు" (కీర్తన 2:1-3). దుర్భలులైన తన సృష్టము చేసే తిరుగుబాటును చూసి గొప్ప దేవుడు కలవరపడతాడా? ఆందోళన చెందుతాడా? కానే కాదు. నిజానికి “ఆకాశమందు ఆసీనుడైనవాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు” (వ.4). ఆయన అందరికంటే అనంత స్థాయిలో హెచ్చించబడినవాడు. మహారాజ్యాల కూటమైనా, భూసంబంధమైన సేవకులైనా ఆయన ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఎవరైనా తీసుకునే అత్యంత విస్తారమైన, తీవ్రమైన ప్రణాళికలు ఆయన దృష్టికి హాస్యాస్పదంగా ఉంటాయి. బలహీనమైనవారి ప్రయత్నాలనూ, పన్నాగాలనూ చూసి ఆయన ఏమాత్రమూ భయపడడు, వారి మూర్ఖత్వాన్ని చూసి నవ్వుకుంటాడు. వాళ్ళ అసమర్థతను చూసి అపహాస్యం చేస్తుంటాడు. తనకిష్టం వచ్చినప్పుడు వాళ్ళను పురుగుల్ని నలిపినట్లు నలిపి పారేస్తాడు. తన నోటి ఊపిరి చేత ఒక్క క్షణంలో వాళ్ళను దహించేస్తాడు. భూమికి చెందిన మట్టికుండ మహిమగల పరలోకానికి చెందిన మహోన్నతునితో పోరాటం చేయడం కేవలం వ్యర్థం. మన దేవుడు మహిమోన్నతుడు, మనం ఆయనను ఆరాధించాలి.

మనుషులతో వ్యవహరించేటప్పుడు దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఎలా ప్రదర్శించాడో గమనించండి. మోషే నాలుకమాంద్యం గలవాడు. అయితే అతని అన్నయ్య అహరోను మాటమాంద్యం లేనివాడు. అయితే అణచివేతకు గురైన తన ప్రజలను ఐగుప్తు నియంత నుంచి విడిపించడానికి తనకు రాయబారిగా మోషేనే దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు మోషేను తనకు అత్యంత ప్రియమైనవానిగా చేసుకున్నాడు. అయితే అతడు నిర్లక్ష్యంతో పలికిన ఒకే ఒక్కమాట అతన్ని కనాను నుండి బహిష్కరించింది. అదే సమయంలో ఏలీయా ఎంతో సణుక్కున్నాడు. అయినా దేవుడు అతన్ని చిన్నగానే మందలించి, ఆ తర్వాత మరణాన్ని చూడనివ్వకుండా పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఉజ్జా కేవలం నిబంధన మందసాన్ని తాకాడు. తక్షణమే దేవుడు అతన్ని మొత్తాడు. అయితే దేవుణ్ణి అవమానపరిచే రీతిలో ఫిలిప్తీయులు దాన్ని తీసకువెళ్ళినా వాళ్ళకు వెంటనే ఏ హానీ కలగలేదు. నాశనం చేయబడిన సొదొమ ఎదుట అద్భుతాలు చేసుంటే అది మారుమనస్సు పొంది ఉండేది, కానీ అవే అద్భుతాలు అత్యంత ఆధిక్యత పొందిన కపెర్నహూమును ఏ విధంగానూ కదిలించలేకపోయాయి. మహాత్కార్యాలు తూరుసీదోను పట్టణాలను సువార్తతో చెరపట్టి ఉండగలిగేవి, కాని విమర్శించబడిన గలిలయలోని పట్టణాలు మాత్రం సువార్తను తృణీకరించి శాపానికి గురయ్యాయి. అవి సొదొమ గొమొర్రాల్లో, తూరుసీదోనుల్లో గొప్ప మార్పును కలిగించగలిగితే కపెర్నహూము, కోరాజీను, బేత్సయిదా పట్టణాలను ఎందుకు మార్చలేవు? ఈ అద్భుతాలు, సూచక క్రియలు గలిలయలోని పట్టణాలను విడిపించడానికి సామర్థ్యం లేనివైతే వాటిని ఎందుకు చేయడం? సర్వోన్నతుడైన దేవుని సార్వభౌమ చిత్తాన్ని ఇవి ఎంత అద్భుతంగా ప్రదర్శిస్తున్నాయో కదా!

4. దేవుడు పరిశుద్ధ దేవదూతలను, అపవిత్రమైన దేవదూతలను కూడా పరిపాలిస్తున్నాడు

దేవదూతలు దేవుని సేవకులు. ఆయనకు రాయబారులు, రథాలు. ఆయన నోటి నుంచి వెలువడే మాటను ఎల్లప్పుడూ విని, ఆయన ఆజ్ఞలను వాళ్ళు నెరవేరుస్తుంటారు. “యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు తన దూతను పంపెను. అతడు నాశనము చేస్తుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని ఆయన ఆజ్ఞాపించాడు.... అప్పుడు ఆ దూత తన కత్తిని మరల ఒరలో వేసెను” (1దిన 21:18,27). దేవదూతలు తమ సృష్టికర్త యొక్క చిత్తానికి లోబడి ఆయన ఆజ్ఞను శిరసావహించేవాళ్ళు అని చూపించడానికి పలు లేఖనభాగాలను చూపించవచ్చు. "పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి నన్ను తప్పించియున్నాడని నాకు నిజముగా తెలియునని అనుకొనెను” (అపొ.కా. 12:11). "ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవించవలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను” (ప్రకటన 22:6). మన ప్రభువు తిరిగి వచ్చినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. “మనుష్యకుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు” (మత్తయి 13:41). మరల మనం చదువుతాం, “మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేస్తారు”(మత్తయి 24:31).

అపవిత్రాత్మల విషయంలో కూడా ఇదే నిజం. అవి కూడా దేవుని సార్వభౌమ శాసనాలను నెరవేరుస్తాయి. అబీమెలెకు అనుచరుల్లో తిరుగుబాటును లేవనెత్తడానికి దేవుడు ఒక దురాత్మను పంపించాడు. దేవుడు అబీమెలెకు దగ్గరకు, షెకెము మనషుల మధ్యలోనికి ఒక దురాత్మను పంపించాడు. ఆ దురాత్మ అతడు తన సహోదరులను చంపడానికి సహకరించింది (న్యాయాధి 9:23). అహబు ప్రవక్తల నోటిలో అబద్ధపు ఆత్మగా ఉండడానికి ఆయన మరొక దురాత్మను పంపించాడు. “యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు” (1 రాజులు 22:23). సౌలును ఇబ్బంది పెట్టడానికి ప్రభువు మరొక దురాత్మను పంపించాడు. "యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ యొకటి వచ్చి అతన్ని వెంబడించింది" (1 సమూ 16:14). ఇలాగే కొత్త నిబంధనలో కూడా జరిగింది. ప్రభువు వచ్చి వాటిని పందుల మందలోనికి ప్రవేశించడానికి అనుమతించేంతవరకూ బహుసంఖ్యలో ఉన్న దయ్యాలు ఆ వ్యక్తిని విడిచిపెట్టలేదు.

కాబట్టి పరిశుద్ధ దూతలు, అపవిత్రాత్మలు కూడా దేవుని నియంత్రణలోనే ఉన్నాయనీ - ఇష్టపూర్వకంగా కొన్ని, ఇష్టం లేకుండా మరికొన్ని - దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాయనీ లేఖనం నుంచి స్పష్టమవుతోంది. చివరికి సాతాను కూడా సంపూర్ణంగా దేవుని అధికారం కిందే ఉన్నాడు. ఏదేను వనంలో తీర్పు తీర్చబడినప్పుడు ఆ భయానకమైన శిక్ష గురించి మౌనంగా విన్నాడే గానీ ఒక్క మాటైనా తిరిగి పలుకలేదు. దేవుడు అనుమతించే వరకు యోబును తాకలేకపోయాడు. పేతురును జల్లించడానికి ముందు మన ప్రభువు అనుమతి తీసుకోవలసి వచ్చింది. "సాతానా, పొమ్ము” అని క్రీస్తు అపవాదిని గద్దించినప్పుడు "అపవాది ఆయనను విడిచిపోయాడని” మనం చదువుతున్నాం (మత్తయి 4:11). అంతంలో వాడి నిమిత్తం, వాడి దూతల నిమిత్తం సిద్ధం చేసిన అగ్నిగుండంలోకి వాడు విసిరివేయబడతాడు.

సర్వశక్తుడూ, ప్రభువు అయిన దేవుడు పరిపాలన చేస్తున్నాడు. నిర్జీవ ప్రపంచం పైన, వివేచన లేని పశువుల పైన, నరపుత్రుల పైన, పరిశుద్ధ దూతల పైన, అపవిత్రాత్మల పైన, చివరికి సాతాను పైన కూడా ఆయన తన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు, ప్రభుత్వం చేస్తున్నాడు. దేవుని నిత్య సంకల్పం లేకపోతే ప్రపంచం పరిభ్రమించదు. ఏ నక్షత్రమూ ప్రకాశించదు, తుఫాను చెలరేగదు, ఏ ప్రాణీ చలించదు. మనుషుల చర్యలూ, దేవదూతల ప్రయత్నాలూ, అపవాది కార్యాలూ ఈ విశాల విశ్వంలో నెరవేరవు. ఆత్మకు ఖచ్చితమైన, స్థిరమైన లంగరు ఉంది. ఈ లోకాన్ని పరిపాలించేది గుడ్డి విధిరాత కాదు, అదుపులేని దుష్టత్వం కాదు, మనిషి కాదు, సాతాను కూడా కాదు. కానీ సర్వశక్తిమంతుడైన ప్రభువే తన దయాసంకల్పం ప్రకారం తన నిత్యమహిమ కోసం ఈ విశ్వాన్ని ఏలుతున్నాడు.

అధ్యాయం 4

రక్షణలో దేవుని సార్వభౌమత్వం

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు”(రోమా 11:33).

“రక్షణ యెహోవా యొద్దనే దొరకును” (యోనా 2:9). అయితే యెహోవా అందరినీ రక్షించడం లేదు. ఎందుకని? ఆయన కొందరినే రక్షించుకుంటున్నాడు. ఆయన కొందరినే రక్షించుకుంటున్నట్టయితే, ఇతరులను ఎందుకు రక్షించుకోవడం లేదు? అంటే వాళ్ళు చాలా భయంకరమైన పాపులనా? ఘోరమైన భ్రష్టులనా? కాదు కదా! “పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టివారిలో నేను ప్రధానుడను” అని అపొస్తలుడు రాశాడు (1తిమోతి 1:15). కాబట్టి పాపుల్లో ప్రధానుడినే దేవుడు రక్షించుకుంటే, ఎవరూ మినహాయించబడటానికి వారి భ్రష్టత్వం కారణం కాకూడదు; మరైతే దేవుడు అందరినీ ఎందుకు రక్షించుకోడు? కొందరు గెలుచుకోవడానికి వీలుకానంత కఠిన హృదయులు కావడం వల్లనా? కానే కాదు. ఎందుకంటే, “దేవుడు వారి శరీరములలో నుండి రాతిగుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇస్తాడు” అని రాయబడింది (యెహెజ్కేలు 11:19). దేవుడు తన దగ్గరకు ఆకర్షించుకోలేనంత మొండిగా, మూర్ఖంగా, అవిధేయులుగా కొందరు ఉ న్నందువల్లనా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు ఇంకొక ప్రశ్నను అడుగుదాం. క్రైస్తవ పాఠకుడా, నీ అనుభవం గురించి ఈ ప్రశ్నను అడుగుదాం.

స్నేహితుడా, దుష్టుల ఆలోచన చొప్పున నడిచి, పాపుల మార్గంలో నిలిచి, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుని "ఇతడు మమ్మునేలుట మాకిష్టము లేదని” వారితో పలికిన సందర్భం లేదా? (లూకా 19:14). జీవం పొందునట్లు క్రీస్తు దగ్గరకు రావటానికి ఇష్టం లేని పరిస్థితి నీ జీవితంలో ఎపుడూ లేదా? (యోహాను 5:40). “నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు. నీవు మమ్మును విడిచిపొమ్మని, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగువాడెవడు? అని దేవునితో మాట్లాడిన వారితో నువ్వు కూడా నీ గొంతు కలిపిన సందర్భం లేదా?" (యోబు 21:14,15). ఆ సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయని నువ్వు సిగ్గుతో తలదించుకోక తప్పదు. అయితే అలాంటి నువ్వు ఇప్పుడు పూర్తిగా మారిపోవటానికి కారణం ఏమిటి? అహంకారిగా, ఎవరి సహాయమూ అక్కరలేనివానిగా జీవించిన నువ్వు ఇప్పుడు దీనుడిగా, ప్రార్థించేవానిగా మారిపోవడానికి కారణమేంటి? ఒకప్పుడు దేవునికి శత్రువుగా ఉ న్న నువ్వు ఇప్పుడు ఆయనతో సత్సంబంధం కలిగి ఉండడం ఎలా సాధ్యమయ్యింది? ఒకప్పుడు అతిక్రమం చేసేవాడివి, ఇప్పుడు ఆయనకు లోబడుతున్నావు. ఒకప్పుడు ద్వేషించేవాడివి ఇప్పుడు ప్రేమిస్తున్నావు. ఇదెలా జరిగింది? ఆత్మ మూలంగా జన్మించినవానిగా నువ్వు వెంటనే “నేనేమైయున్నానో అది దేవుని కృపనుబట్టే అయి ఉన్నాను” అని జవాబు చెబుతావు (1 కొరింథీ 15:10). అందువల్ల ఇతర తిరుగుబాటుదారుల్ని కూడా దేవుడు రక్షించుకోకపోవడానికి కారణం 'దేవునిలో శక్తి కొదువై కాదు, ఆయన మనిషిని నిర్బంధించలేక కాదు' అని నువ్వు చూడగలుగుతున్నావా? నీ నైతిక బాధ్యతతో జోక్యం చేసుకోకుండానే దేవుడు నీ చిత్తాన్ని లోబరచుకుని, నీ హృదయాన్ని గెలుచుకోగలిగినప్పుడు ఇతరుల విషయంలో కూడా ఆయన అదే కార్యం చేయలేడా? తప్పనిసరిగా ఆయన చేయగలడు. మరి అలాంటప్పుడు దుష్టుల ప్రస్తుతమార్గం గురించీ, వారి అంతిమస్థితి గురించి మాట్లాడుతూ 'దేవుడు వారిని రక్షించుకోలేడు, వాళ్ళు తమను ఆయన రక్షించడానికి అనుమతించరు' అని చెప్పడం ఎంత అసంబద్ధమైన మాట! ఎంత అజ్ఞానంతో కూడిన మాట!

'సమయం ఆసన్నమైనప్పుడు క్రీస్తును నా రక్షకునిగా స్వీకరించడానికి నేను ఇష్టపడ్డాను' అని నువ్వు చెబుతావా? అది నిజమే, కానీ నువ్వు ఇష్టపడేలా చేసింది ఆయనే (“నీవు నీ బలపరాక్రమాలను కనుపరచే రోజున, నీ ప్రజలు ఇష్టపూర్వకంగాముందుకు వస్తారు” - కీర్తన 110:3 - వాడుక భాషలో; ఫిలిప్పీ 2:13). మరైతే పాపులందరూ క్రీస్తును ఇష్టపడేలా ఆయన ఎందుకు చేయట్లేదు? కేవలం ఆయన సార్వభౌముడు అయినందువల్లే, తనకు నచ్చినట్లే ఆయన సమస్తాన్నీ జరిగిస్తాడు కాబట్టి! ఇప్పుడు మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు తిరిగి వెళదాం.

అందరూ ఎందుకు రక్షించబడటం లేదు? మరి ముఖ్యంగా సువార్త విన్నవాళ్ళందరూ ఎందుకు రక్షించబడట్లేదు? అధిక శాతం మనుషులు విశ్వసించడానికి తిరస్కరిస్తున్నందుకే అని ఇంకా మీరు అంటారా? అవును, అది నిజమే, కానీ అది సత్యంలో సగభాగం మాత్రమే. అది మానవ దృక్కోణం నుండి కనబడే సత్యం. అయితే దైవ కోణం అనేది కూడా ఉంది. దైవకోణం వైపు నుంచి ఉన్న సత్యాన్ని కూడా నొక్కి చెప్పాల్సిందే. లేదంటే దేవుని మహిమను దొంగిలించినట్లే అవుతుంది. రక్షించబడనివాళ్ళు నశిస్తారు, ఎందుకంటే వారు విశ్వసించడానికి నిరాకరించారు. ఇతరులు నమ్ముతున్నారు కాబట్టి రక్షించబడుతున్నారు. అయితే ఆ ఇతరులు ఎందుకు విశ్వసిస్తున్నారు? క్రీస్తులో నమ్మకముంచేలా వీళ్ళను పురికొల్పుతున్నదేమిటి?

వీళ్ళు తమ పొరుగువారికంటే మేథావులనా? లేదా రక్షణ గురించిన తమ అవసరతను గుర్తించడంలో వీళ్ళు చాలా వేగంగా స్పందించారనా? అసలు ఈ ఆలోచనే సరి కాదు. 'నిన్ను ప్రత్యేకించింది ఎవరు? నీవు పొందినది తప్ప నీకు కలిగినది ఏముంది? అన్నీ పొందినవే ఐనా పొందినవి కానట్టు ఎందుకు అతిశయిస్తున్నావు?' (వాడుక భాషలో 1కొరింథీ 4:7). ఎన్నికైనవారికీ, ఏర్పాటులో లేనివారికీ మధ్యన వైవిధ్యాన్ని కలగజేసేది దేవుడే, ఎందుకంటే తనవారి గురించి ఇలా రాయబడింది, “మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమనుగ్రహించియున్నాడని యెరుగుదుము” (1యోహాను 5:20).

విశ్వాసమనేది దేవుని బహుమానం. “విశ్వాసము అందరికి లేదు” (2థెస్స 3:2). అందువల్ల దేవుడు ఈ బహుమానాన్ని అందరికీ అనుగ్రహించడని మనం చూస్తున్నాం. ఈ రక్షణార్థమైన కృపను ఆయన ఎవరికి అనుగ్రహిస్తాడు? 'తన ఏర్పాటులో ఉన్న తన ప్రజలకే అనుగ్రహిస్తాడు' అని మనం జవాబు చెబుతాం. “నిత్యజీవమునకు నిర్ణయింపబడినవారందరూ విశ్వాసముంచారు” (అపొ.కా. 13:48). అందువల్ల ఈ విశ్వాసాన్ని “దేవుడు ఏర్పరచుకొనినవారి విశ్వాసము” అని మనం చదువుతున్నాము (తీతు 1:1). దేవుడు తన కృపను అనుగ్రహించేవారి విషయంలో పక్షపాతం చూపిస్తాడా? అలా ఉండే హక్కు ఆయనకు లేదా? ఇంటి యజమానుని మీద సణుగుకునేవారు ఇప్పటికీ ఉన్నారా? అయితే ఆయన స్వయంగా పలికిన మాటలే తగిన సమాధానం - "నాకిష్టము వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా?” (మత్తయి 20:18). భౌతిక ప్రపంచంలోనూ, ఆత్మ సంబంధమైన లోకంలోనూ తన వరాలను అనుగ్రహించే విషయంలో దేవుడు సార్వభౌముడు. ఇప్పుడు మరింత క్షుణ్ణంగా ఈ అంశాన్ని పరిశీలిద్దాం.

రక్షణలో తండ్రియైన దేవుని సార్వభౌమత్వం

తన సృష్టిలోని ప్రాణుల అంతిమ గమ్యాన్ని నిర్ణయించడంలో దేవుడు సంపూర్ణ సార్వభౌముడు. ఈ విషయాన్ని నొక్కి చెప్పే లేఖనభాగాల్లో రోమా పత్రిక 9వ అధ్యాయం ఒకటి. మనం ఇక్కడ మొత్తం అధ్యాయమంతటినీ పరిశీలించము కానీ కేవలం 21-23 వచనాలనే సమీక్షిద్దాం. “ఒక ముద్దలో నుండియే యొక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెనని యున్ననేమి?” (రోమా 9:21-23). పతనమైన మానవజాతి నిర్జీవమైన మట్టి ముద్దలా అచేతనమైందనీ, అసమర్థమైందనీ ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ఎన్నికైనవారికీ, ఎన్నికలో లేనివారికీ మధ్యన ఎలాంటి వ్యత్యాసమూ లేదని ఈ లేఖనభాగం రుజువు చేస్తుంది. వాళ్ళందరూ ఒకే ముద్దలోని మట్టే. ఇది ఎఫెసీ 2:3 తో ఏకీభవిస్తుంది. మనుషులందరూ స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులే అని ఎఫెసీ 2:3 చెబుతుంది. ప్రతీ వ్యక్తి యొక్క అంతిమ గమ్యాన్ని దేవుడు తన చిత్తానుసారంగా నిర్ణయిస్తాడని ఇది మనకు బోధిస్తుంది. ఇదెంతో ధన్యకరమైన విషయం. ఒకవేళ దేవుడు మన అంతిమగమ్యాన్ని మన చిత్తాలకే వదిలేస్తే, మనందరం అగ్నిగుండంలోనే పడి నశిస్తాం. తన సృష్టిలోని ప్రాణులకు భిన్నమైన గమ్యస్థానాలను నిర్ణయించేది దేవుడేనని ఇది ప్రకటిస్తుంది. ఎందుకంటే ఒక పాత్రను ఘనత కోసం మరొక పాత్రను ఘనహీనత కోసం దేవుడు తయారుచేస్తున్నాడు. కొందరు నాశనానికి సిద్ధపడిన ఉగ్రతాపాత్రమైన ఘటాలు, ఇతరులు మహిమ పొందటానికి ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటాలు.

కుమ్మరిచేతిలో మట్టిలా యావత్ మానవజాతిని దేవుని చేతిలో చూడటం మనిషి యొక్క అహంకార హృదయాన్ని ఎంతో అణచివేసే విషయం. అయితే ఖచ్చితంగా నిత్యమైన లేఖనాలు పరిస్థితులను ఇలాగే మనకు చూపిస్తున్నాయి. మనిషికున్న శక్తిసామర్థ్యాలను బట్టి అతడిని ఎంతో పొగుడుతూ, అతనికి దైవత్వాన్ని ఆపాదించ తెగిస్తున్న ఈ ప్రస్తుత కాలంలో కుమ్మరి తన కోసమే పాత్రల్ని తయారుచేసుకుంటాడనే సత్యాన్ని నొక్కి చెప్పాల్సిన అవసరముంది. మనిషి తనను రూపించినవానితో ఎంతగా పోరాడినా, పరలోక కుమ్మరి హస్తాల్లో అతడు మట్టికుండ తప్ప మరేమీ కాదనేది వాస్తవం. దేవుడు తన సృష్టిలోని ప్రాణులతో న్యాయంగా వ్యవహరిస్తాడు. సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయమే చేస్తాడు. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఆయన తన కోసమే, తన దయా సంకల్పం ప్రకారమే తన పాత్రలను తయారుచేసుకుంటాడు. తన సొంతవాటితో తనకు నచ్చినట్లు వ్యవహరించే హక్కు దేవునికి ఉంటుంది. ఇది నిస్సందేహమైన వాస్తవం.

తన స్వహస్తాలతో చేసుకున్న ప్రాణులను తనకు నచ్చినట్లుగా చేసుకునే హక్కు దేవునికి ఉంది. ఆ హక్కును ఆయన వినియోగించుకుంటాడు. తన 'ముందు నిర్ణయాన్ని బట్టి చూపించే కృప' (Predestinating grace)లో అది ఎంతో స్పష్టంగా మనకు కనబడుతుంది. లోకానికి పునాది వేయడానికి ముందే దేవుడు ఒక ఎంపిక చేసుకున్నాడు. ఆదాము యొక్క సమస్త వంశావళి సర్వజ్ఞానంగల ఆయన కంటిముందు నిలబడినప్పుడు, అందులో నుండి తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చడం కోసం కొంతమందిని ప్రత్యేకించుకున్నాడు. వారిని నిత్యజీవం కోసం ముందుగానే నిర్ణయించుకున్నాడు, నియమించుకున్నాడు. ఈ దివ్యసత్యాన్ని బోధించే లేఖనాలు అనేకం ఉన్నాయి. అందులో ఏడు వాక్యభాగాల పైన మనం దృష్టి సారిద్దాం.

“నిత్యజీవమునకు నిర్ణయించబడినవారందరూ విశ్వాసముంచిరి” (అపొ.కా. 13:48). కొందరు తమకున్న జ్ఞానమంతటినీ ఉపయోగించుకుని ఈ లేఖన భాగానికున్న పదునును మొద్దుబారిపోయేలా చేస్తున్నారు, ఈ వచనంలోని మాటలకున్న స్పష్టమైన అర్థాన్ని కొట్టిపారేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నం వృథా. కానీ వారిచ్చే వివరణ ఈ వాక్యభాగానికే కాదు ఇలాంటి అనేక వాక్యభాగాలకు ఎన్నడూ న్యాయం చేయదు. ప్రకృతిసంబంధి అయిన మనిషికి ఇవి అర్థం కావు. 'నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వాళ్ళందరూ విశ్వాసముంచారు.” ఈ మాట నుండి మనం నాలుగు విషయాలను నేర్చుకుంటున్నాం. మొదటిది: విశ్వాసముంచడం అనేది దేవుని నిర్ణయం మూలంగా కలిగిన ఫలితమే గాని దేవుని నిర్ణయానికి మూలం కాదు. రెండవది: నిత్యజీవానికి నిర్ణయింపబడినవారి సంఖ్య పరిమితం. ఒకవేళ ఎలాంటి మినహాయింపూ లేకుండా దేవుడు అందరినీ నిర్ణయించి ఉంటే “నిత్యజీవానికి నిర్ణయించబడిన వారందరూ” అనే మాట అర్థరహితం ఔతుంది. మూడవది: దేవుడు తీసుకున్న ఈ నిర్ణయం బాహ్యమైన ఆధిక్యతల కోసం కాదు, నిత్యజీవం కోసం. సేవ కోసం కాదు, రక్షణ కోసం. నాలుగవది: “వారందరూ” - దేవుడు నిర్ణయించుకున్నవాళ్ళందరూ తప్పనిసరిగా విశ్వసిస్తారు. నిర్ణయించబడినవారి సంఖ్యలో ఒక్కటి కూడా తగ్గదు.

పై వాక్యభాగంపై స్పర్జన్ చేసిన వ్యాఖ్యలు మనం దృష్టి సారించడానికి తగినంత యోగ్యమైనవి. ఈ మాటలు “ముందు నిర్ణయం” (Predestination) గురించి బోధించడం లేదని నిరూపించడానికి పలు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ ప్రయత్నాలు ఇక్కడున్న అసలు అర్థాన్ని చాలా ఘోరంగా వక్రీకరిస్తున్నాయి. వారి వక్రీకరణలకు జవాబులు చెబుతూ నేను సమయాన్ని వృథా చేయదలచుకోలేదు. “నిత్యజీవమునకు నిర్ణయించబడినవారందరు విశ్వాసముంచారు” అని నేను చదువుతున్నాను. నేను ఈ వాక్యభాగాన్ని వక్రీకరించను. కానీ ప్రతీ వ్యక్తి యొక్క విశ్వాసాన్నీ దేవుని కృపకు ఆపాదిస్తూ దేవుని కృపను మహిమపరుస్తాను. విశ్వసించడానికి మనసును అనుగ్రహించేది దేవుడు కాదా? మనుషులు నిత్యజీవానికి నియమించబడితే, ప్రతీ సందర్భంలోనూ అలా నియమించింది దేవుడు కాదా? కృప చూపించడం దేవుని పొరపాటు ఔతుందా? కృప చూపించే హక్కు ఆయనకుంటే, దాన్ని అనుగ్రహించాలని సంకల్పించడం పొరపాటు ఔతుందా? ఈ రోజు కృప అనుగ్రహించాలని సంకల్పించడం తప్పు కానప్పుడు, మునుపెన్నడో అలా సంకల్పించడం తప్పు కాదు; ఆయన నిత్యుడు కనుక నిత్యత్వం నుండే ఆ సంకల్పం కలిగుండటం కూడా తప్పు కాదు.

“ఆలాగుననే అప్పటి కాలమందు('ఇప్పటి కాలమందు' అనేది సరైన అనువాదం) సయితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలియున్నది. అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు. లేనియెడల కృప ఇకను కృప కాకపోవును” (రోమా 11:5,6). “ఆలాగుననే” అనే మొదటి పదం అంతకుముందు వచనంతో ఈ వచనాలు ముడిపడి ఉన్నాయని తెలియజేస్తుంది. “బయలుకు మోకాళ్ళూనని ఏడు వేలమంది పురుషులను నేను శేషముగా ఉంచుకొనియున్నాను” అని మనకు ఆ వచనంలో తెలియజేయబడుతుంది. “ఉంచుకొనియున్నాను” అనే ప్రత్యేకమైన పదాన్ని గమనించండి. ఏలీయా రోజుల్లో విగ్రహారాధన చేయకుండా దేవుని చేత భద్రపరచబడి నిజదేవుని గురించిన జ్ఞానం అనుగ్రహించబడిన ఏడువేలమంది పురుషులున్నారు. వారిలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు గానీ కేవలం దేవుని ప్రత్యేక కార్యం మరియు ప్రభావం వల్లనే ఈ భద్రత మరియు వెలిగింపు కలిగాయి. దేవుని చేత ప్రత్యేకించుకోబడిన ఆ వ్యక్తులకు ఎంతటి ఉన్నతమైన ఆధిక్యత దక్కిందో కదా! 'ఏలీయా రోజుల్లో దేవుడు ప్రత్యేకించుకున్న శేషజనం ఉన్న విధంగానే, ఈ ప్రస్తుత కాలంలో కూడా శేషజనం ఉన్నారని' అపొస్తలుడు చెబుతున్నాడు.

'కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము.” ఇక్కడ ఏర్పాటుకు కారణం దేవుడే అని తెలియజేయబడింది. దేవుడు ఈ శేషజనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆధారం వాళ్ళు విశ్వాసముంచుతారని ఆయన ముందుగానే చూడటం కాదు. ఎందుకంటే మనుషులు సత్క్రియలు చేస్తారని ముందుగానే చూసి ఆ సత్క్రియల పై ఆధారపడి చేసుకున్న ఎంపిక కృప అవ్వదు. ఎందుకంటే “అది కృపచేతనైనను ఇకను క్రియల మూలమైనది కాదు. లేనియెడల కృప ఇకను కృప కాకపోవును” అని అపొస్తలుడు అంటున్నాడు. అంటే కృప, క్రియలు ఒకదానికొకటి వ్యతిరేకమైనవి. వాటి మధ్య పోలికేదీ లేదు. నూనె, నీళ్ళు ఎలా ఒకదానితో ఒకటి కలవవో అదేవిధంగా కృప, క్రియలు కలువవు. అందువల్ల ఎంపిక చేయబడిన, స్వభావసిద్ధమైన మంచినీ, వాళ్ళు చేయబోయే ఘనకార్యాలనూ దేవుడు ముందుగానే చూశాడనే ఆలోచననే పూర్తిగా కొట్టిపారేయాలి.

"కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము” అనే మాట 'షరతులు లేని ఎన్నికను' సూచిస్తుంది; దేవుని సార్వభౌమకృప మూలంగా అది కలుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అది సంపూర్ణంగా కృపాసహితమైన ఏర్పాటు.

“సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గానిఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైనవారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు. ఎన్నికైనవారిని వ్యర్థము చేయుటకు లోకములో నీఛులైనవారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు” (1 కొరింథీ 1:26-29).

ఈ వాక్యభాగంలో మూడుసార్లు దేవుని ఏర్పాటుకు సంబంధించిన ప్రస్తావన ఉంది. ఏర్పాటు అంటే తప్పనిసరిగా ఎన్నిక గురించే మాట్లాడుతుంది. అంటే కొందరిని తీసుకోవడం, ఇతరుల్ని విడిచిపెట్టడం. ఇక్కడ ఎన్నిక చేసుకునేవాడు సాక్షాత్తూ దేవుడే. “మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మును ఏర్పరచుకొనియున్నాను” అని ప్రభుయేసు అపొస్తలులతో చెప్పాడు (యోహాను 15:16). ఎన్నిక చేయబడినవారి సంఖ్య ఖచ్చితంగా తెలియజేయబడింది. “జ్ఞానులైనను ఘనులైనను అనేకులుపిలువబడలేదు.” ఈ మాట మత్తయి 20:16తో ఏకీభవిస్తుంది ('పిలువబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు కొందరే' - తెలుగు బైబిలులో ఈ వచనం అనువదించబడలేదు). “కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటి వారగుదురు.పిలువబడినవారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరు” (మత్తయి 22:14). ఇప్పుడు ఆయన ఎవరిని ఎంపిక చేసుకున్నాడో గమనించండి.

దేవునిచే ఏర్పరచుకోబడినవాళ్ళు లోకములో బలహీనులు, తృణీకరింపబడినవాళ్ళు, ఎన్నిక లేనివారు. ఎందుకు ఇలాంటి వాళ్ళను ఏర్పరచుకున్నాడు? తన కృపను ప్రదర్శించడానికీ, ఘనపరచడానికి. దేవుని మార్గాలు, ఆయన ఆలోచనలు మనుషుల మార్గాలకూ, ఆలోచనలకూ పూర్తిగా భిన్నమైనవి. దేవుడు 'సంపన్నులనూ, శక్తివంతులనూ, సద్గుణశీలురనూ, సంస్కృతీ సంప్రదాయాలు తెలిసినవాళ్ళనూ ఏర్పరచుకుని ఉంటే వాళ్ళ ఆడంబరత్వాన్ని బట్టీ, శరీర సంబంధమైన గొప్పతనాన్ని బట్టి లోకం క్రైస్తవ్యం ఆమోదించేది, అభినందించేది' అని శరీరసంబంధి అయిన మనిషి అనుకుంటాడు. “అయ్యో, మనుష్యులలో ఘనముగా ఎంచబడునది దేవుని దృష్టికి అసహ్యము (లూకా 16:15). దేవుడు తృణీకరించబడినవాటిని ఎన్నుకుంటాడు. పాతనిబంధన కాలంలో దేవుడు ఆలాగే చేశాడు. తన పరిశుద్ధ లేఖనాలను పొందటానికీ, వాగ్దానం చేయబడిన సంతానం వచ్చే మాధ్యమంగా ఉండటానికి దేవుడు ప్రత్యేకించుకున్నది పురాతన ఐగుప్తీయులను కాదు, బలవంతులైన బబులోనీయులనూ కాదు, అత్యంత ఉన్నతమైన నాగరికత, సంస్కృతులు గల గ్రీకులనూ కాదు. యెహోవా తనకు ప్రియమైనవారిగా ఎంచుకున్నదీ, తన కనుగుడ్డుగా పరిగణించిందీ తృణీకరించబడిన, సంచారజీవులైన హెబ్రీయులను. మన ప్రభువు మనుష్యుల మధ్య జీవించినప్పుడు కూడా అదే జరిగింది. అధికశాతం పామరులైన జాలరులనే తనకు అత్యంత సన్నిహిత స్నేహితులుగా ఎన్నుకుని, తనకు రాయబారులుగా నియమించుకున్నాడు. అప్పుడూ ఇప్పుడూ ఆయన ఎంపిక విధానం ఒకేలా ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అత్యంత కృపనొందిన అమెరికాలోకంటే అత్యంత తృణీకారమొందిన చెనాలోనే ప్రభువుకు ఎక్కువమంది జనమున్నారు, నాగరికత తెలిసిన జర్మనీ ప్రజల్లోకంటే నాగరికతను ఎరుగని నల్లజాతి ఆఫ్రికా వాళ్ళలోనే ప్రభువుబిడ్డలు ఎక్కువగా ఉన్నారు. ఈ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి బలమైన కారణం - ఏ శరీరియు తన యెదుట అతిశయించకూడదు. తాను ఏర్పరచుకున్నవాళ్ళలో దేవుని ప్రత్యకమైన కృపలకు అర్హమైనది ఏదీ లేదు కాబట్టి స్తుతి అంతా దేవుని కృపాబాహుళ్యానికీ, విస్తారమైన కనికరానికి ఆపాదించబడుతుంది.

“మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతీ ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.... మనము తన యెదుట పరిశుదలమును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను... ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు” (ఎఫెసీ 1:3,6,122). యేసు క్రీస్తు ద్వారా తన బిడ్డలుగా ఎవరుండాలో దేవుడు ఏర్పాటు చేసుకున్న కాలం (ఒకవేళ దాన్ని 'కాలం' అని పిలవగలిగితే) గురించి ఇక్కడ పౌలు మనకు చెబుతున్నాడు. ఆదాము పతనమైన తర్వాత, తన సంతానమంతటినీ పాపంలోను దుష్టత్వంలోనూ ముంచేసిన తర్వాత కాదు, ఆదాము వెలుగును చూడటానికి చాలాకాలం ముందే లోకం స్థాపించబడటానికి ముందే దేవుడు మనల్ని క్రీస్తులో ఎన్నుకున్నాడు. ఇక్కడ కూడా తాను ఏర్పరుచుకున్నవారిని ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడో మనకు చెప్పబడింది. ఆయన యెదుటవాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలన్నదే ఆ ఉద్దేశం. తన బిడ్డలుగా వాళ్ళను దత్తత చేసుకోవాలన్నదే ఆ ఉద్దేశం. వాళ్ళు స్వాస్థ్యం పొందాలన్నదే ఆ ఉద్దేశం. కొంతమందిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయనను పురికొల్పిన ప్రేరణను కూడా మనం ఇక్కడ చూస్తాం. “యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని... ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.” తన సృష్టిలోని ప్రాణులు జన్మించడానికి ముందే వాళ్ళ నిత్యగమ్యాన్ని నిర్ణయించడం దేవుణ్ణి క్రూరుడైన నియంతగా, అన్యాయస్థునిగా చేస్తుందని తరచూ ఆయనపై చేసే ఆరోపణను ఈ వచనం కొట్టిపారేస్తుంది. ఆయన కొందరిని ఏర్పరచుకున్నప్పుడు ఎవరినీ సంప్రదించలేదనీ, ఆయన తన చిత్తానుసారమైన దయాసంకల్పం చొప్పున మనలను ముందుగా నిర్ణయించుకున్నాడనీ మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది.

“ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై యున్నాము” (2థెస్స 2:13). ఇక్కడ మనం ప్రధానంగా దృష్టి సారించాల్సిన విషయాలు మూడు ఉన్నాయి; మొదటిది: దేవునిచే ఎన్నుకోబడినవారు రక్షణ పొందడానికి ఎన్నుకోబడ్డారు. భాష ఇంతకన్నా స్పష్టంగా ఉండడం అసాధ్యమనే చెప్పాలి. ఏర్పాటు అంటే కేవలం బాహ్యసంబంధమైన ఆధిక్యతలకూ, పరిచర్యలో ఉన్నతస్థాయికి మాత్రమే సంబంధించినదని కొందరు చెప్పే కుతర్కాలనూ, వక్రోక్తులనూ ఈ మాటలు ఎంత ముక్కుసూటిగా కొట్టిపారేస్తున్నాయో గమనించండి! దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది రక్షణ కోసమే. రెండవది: ఆ రక్షణ పొందుకోవడానికి సరైన మార్గాన్ని ఉపయోగించడాన్ని రక్షణ నిమిత్తమైన ఏర్పాటు తృణీకరించదని మనం ఇక్కడ హెచ్చరించబడుతున్నాం. ఆత్మ పరిశుద్ధపరచడం వలన, సత్యాన్ని నమ్మడం వలన రక్షణను పొందుకోవచ్చు. దేవుడు ఒక వ్యక్తిని రక్షణ నిమిత్తం ఏర్పరుచుకుంటే ఆ వ్యక్తి ఇష్టమున్నా, లేకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా రక్షించబడతాడనేది సత్యం కాదు. లేఖనాలు ఎక్కడా ఈ విధంగా బోధించలేదు. లక్ష్యాన్ని ముందుగా నిర్ణయించిన దేవుడే, దాన్ని చేరుకునే మార్గాన్ని కూడా నియమించాడు. రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న దేవుడే ఆ రక్షణ పరిశుద్ధాత్మ కార్యం ద్వారా, సత్యాన్ని నమ్మడం ద్వారా పొందాలనే శాసనం చేశాడు. మూడవది: దేవుడు మనల్ని రక్షణ నిమిత్తం ఏర్పరచుకున్నాడనే విషయం అధికస్తుతులు చెల్లించడానికి మనల్ని పురికొల్పవలసిన గంభీరమైన కారణం. అపొస్తలుడు దీన్ని ఎంత బలంగా వ్యక్తపరుస్తున్నాడో గమనించండి. “ప్రభువు వలనప్రేమింపబడిన సహోదరులారా.... రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై యున్నాము.” 'ముందు నిర్ణయం' అనే సిద్ధాంతం గురించి విన్నప్పుడు భయాందోళనలతో విశ్వాసి ముఖం చాటేయడు కానీ దేవుని వాక్యంలో ఈ ధన్యకరమైన సత్యం అతనికి బయలుపడినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కారణాన్ని కనుగొని, వర్ణింపనశక్యమైన బహుమానంగా ఇవ్వబడిన విమోచకుడే మహిమపరుస్తాడు.

"మన క్రియలనుబట్టి కాక అనాది కాలముననే క్రీస్తుయేసునందు తన స్వకీయ సంకల్పమును బట్టియు తన కృపను బట్టియు మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన పిలిచెను" (2 తిమోతి 1:9). పరిశుద్ధ లేఖనాల్లో భాష ఎంత స్పష్టంగా, సూటిగా ఉందో కదా! మనిషి తన మాటలతో ఈ ప్రత్యక్షతను మరుగు చేస్తున్నాడు. ఇక్కడ చెప్పినదానికంటే ఈ అంశాన్ని మరింత స్పష్టంగా, బలంగా చెప్పడం అసాధ్యం. మన రక్షణ మన క్రియలను బట్టి మనకు కలగడం లేదు. అంటే మనలో ఉన్న దేనిని బట్టి, మనం చేసినదానికి ప్రతిఫలంగానో దేవుడు దాన్ని మనకు అనుగ్రహించడం లేదు. కానీ కేవలం దేవుని సంకల్పాన్ని బట్టీ, కృపను బట్టీ, లోక ప్రారంభానికి ముందే ఈ కృపను క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. కృప చేతనే మనం రక్షించబడుతున్నాం. దేవుని సంకల్పంలో ఈ కృప మనపై కుమ్మరించబడింది. కేవలం మనం వెలుగును చూడడానికి ముందు మాత్రమే కాదు, కేవలం ఆదాము పతనానికి ముందు మాత్రమే కాదు, ఆదికాండం 1:1కి చాలాకాలం ముందే! దేవుని ప్రజలకు ఆదరణ, భద్రత ఈ మాటలోనే ఉన్నాయి. ఆయన ఎంపిక నిత్యత్వం నుండి ఉందంటే అది నిత్యత్వం వరకూ కొనసాగుతుందని అర్థం.

"... తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి...” (1 పేతురు 1:1,2). ఇక్కడ కూడా రక్షించబడుతున్నవారిలో పరిశుద్ధాత్మ కార్యానికంటే ముందుగానే, విశ్వాసాన్ని బట్టి విధేయులవడం కంటే ముందుగానే, తండ్రి యొక్క ఏర్పాటు జరిగిందని స్పష్టంగా ఉంది. అందువల్ల రక్షణ మనిషి యొక్క గొప్పతనాన్ని బట్టీ, ఘనకార్యాల్ని బట్టి కలగదనీ సర్వశక్తుని యొక్క సార్వభౌమ ఆనందాన్ని బట్టే కలుగుతుందని అర్థమౌతుంది. “తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానం” అంటే 'సమస్త కార్యాలను గురించి ముందే దేవునికి ఉన్న జ్ఞానం' అని కాదు. కానీ 'దేవుని మనస్సులో పరిశుద్ధులందరూ క్రీస్తునందు నిత్యత్వమంతా ఉన్నారు' అని అర్థం. 'దేవుడు ముందు ఎరిగెను' అనే మాటకు అర్థం 'సువార్తను విన్న కొంతమంది విశ్వసిస్తారని' కాదు కానీ కొంతమందిని ఆయన నిత్యజీవానికి నియమించాడని అర్థం. మనుషులందరిలోనూ దేవుడు చూసింది పాపం యెడల వారికి ఉన్న ప్రేమనూ, తన యెడల ఉన్న ద్వేషాన్నీ!

దేవుని భవిష్యత్ జ్ఞానం అనేది ఆయన శాసనాలపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయం అపొ.కా. 2:23 నుండి స్పష్టమౌతుంది. “దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టులచేత సిలువ వేయించి చంపితిరి” (అపొ.కా. 2:23). ఈ వచనంలో ఉన్న క్రమాన్ని గమనించండి. మొదటిది, “దేవుడు నిశ్చయించిన సంకల్పం” (ఆయన శాసనం), రెండవది, “ఆయన భవిష్యత్ జ్ఞానం.” ఇప్పుడు రోమా 8:28,29 చూద్దాం. “ఎందుకనగా.... దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను.” ఈ వచనంలో “ఎందుకనగా” అనే మొదటి పదం అంతకు ముందు వచనంలో ఆఖరు ఉప వాక్యానికి (clause) - అనగా "తన సంకల్పం చొప్పున పిలువబడినవారు” అన్న మాటతో - ముడిపడి ఉంది. అంటే 'ఆయన ముందుగా ఎరిగిందీ, ముందుగా నిర్ణయించుకున్నదీ తన సంకల్పం చొప్పున పిలువబడినవాళ్ళనే'!

చివరిగా ఒక విషయాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. దేవుడు “ఎరగడం” గురించి మన లేఖనంలో చదువుతున్నప్పుడు ఆ పదం 'అంగీకారంతో, ప్రేమతో' ఎరగడం అనే భావంతో ఉపయోగించబడింది. “ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే” (1 కొరింథీ 8:3). “నేను మిమ్మును ఎన్నడూ ఎరగను” అని వేషధారులతో క్రీస్తు చెబుతాడు. అంటే ఆయన ఎన్నడూ వారిని ప్రేమించలేదని అర్థం.

'తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి ఏర్పరచబడినవాళ్ళు' అనే మాట 'ఆయన తన అనురాగాన్నీ, ప్రేమనూ వాళ్ళకు ప్రత్యేక రీతిలో కనపరచడానికి ఎన్నుకోబడిన వాళ్ళు' అని అర్థం. ఈ 7 వాక్యభాగాలూ బోధించే సారాంశం: దేవుడు కొంతమందిని నిత్యజీవం కోసం నియమించాడు. ఫలితంగా వాళ్ళు తగిన సమయంలో విశ్వాసముంచుతారు. దేవుడు తన ఏర్పాటులో ఉన్నవారిని రక్షణకు నియమించింది వారిలో ఏ మంచినో, వాళ్ళ ఘనకార్యాలనో చూసి కాదు. కేవలం ఆయన తన కృపనుబట్టే వాళ్ళను నియమించుకున్నాడు. తన యెదుట ఏ శరీరియూ అతిశయించకూడదని తన ప్రత్యేకమైన కృపలకు పాత్రులుగా దేవుడు ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అయోగ్యులను ఏర్పరచుకున్నాడు. లోకానికి పునాది వేయడానికి ముందే క్రీస్తులో దేవుడు తన ప్రజలను ఎన్నుకున్నాడు. అయితే వాళ్ళు పరిశుద్ధులని కాదు గానీ, తనయెదుట వాళ్ళు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఆయన వాళ్ళను ఏర్పరచుకున్నాడు. దేవుడు కొంతమందిని రక్షణ కోసం ఏర్పాటు చేసుకోవడమే కాదు, తన నిత్యసంకల్పం నెరవేరే విధానాన్ని కూడా ఆయన శాసించాడు. మనం ఏ కృప చేతనైతే రక్షించబడ్డామో ఆ కృపను లోకారంభానికి ముందే క్రీస్తుయేసులో దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునిచే ఎన్నుకోబడినవాళ్ళు నిజానికి సృష్టించబడటానికి ముందే దేవుని మనసు ఎదుట నిలబడి ఉన్నారు. ఆయన ముందుగానే వాళ్ళను ఎరిగియున్నాడు. అంటే నిత్యప్రేమకు వాళ్ళు పాత్రులుగా చేయబడ్డారు.

ఈ అధ్యాయంలో తర్వాతి భాగానికి వెళ్ళే ముందు దేవుడు తన 'ముందు నిర్ణయం చొప్పున చూపించే కృప' (God's predestinating grace)కు పాత్రులైనవాళ్ళ గురించి మరొక మాట చెప్పాలనుకుంటున్నాను. కొంతమందిని రక్షణ కోసం ముందుగా నిర్ణయించుకోవడంలో దేవుని సార్వభౌమాధికారం అనే సిద్ధాంతంపైన అత్యంత తరచుగా దాడి జరుగుతుంది కాబట్టే మరొకసారి ఈ అంశాన్ని చర్చించుకుంటున్నాం. ఈ సత్యాన్ని వక్రీకరించేవాళ్ళు, కొంతమంది పాపులకు రక్షణ అనుగ్రహించటానికి, దేవుని స్వచిత్తానికి బయటున్నదేదో ఒకటి ఆయనను పురికొల్పిందని చెప్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సృష్టికర్త యొక్క హస్తాల నుండి దయను స్వీకరించడానికి అర్హమైనదిగా చేసే ఏదో ఒకదాన్ని మనిషికి ఆపాదిస్తారు. కాబట్టి, 'దేవుడు కొంతమందిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుని హృదయాన్ని ఆకర్షించింది ఎన్నికైనవారిలో ఏముంది?” అని నేను అడుగుతున్నాను.

వాళ్ళు కలిగున్న కొన్ని సద్గుణాల కారణంగా దేవుడు వాళ్ళను ఎన్నుకున్నాడా? వాళ్ళు దయాహృదయులనీ, సాధువులనీ, సత్యాన్ని మాట్లాడేవారనీ దేవుడు వాళ్ళను ఏర్పరచుకున్నాడా? వాళ్ళు మంచివాళ్ళని చూసి దేవుడు ఎంపిక చేసుకున్నాడా? కాదు, “దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు” అని మన ప్రభువు చెప్పాడు (మార్కు 10.10). వాళ్ళు జరిగించిన సత్క్రియలను బట్టి వాళ్ళను ముందుగా నిర్ణయించుకున్నాడా? కాదు, “మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు” అని రాయబడి ఉంది (రోమా 3:12). దేవుని గురించి వాళ్ళు భారంగా, ఆసక్తితో అన్వేషించినందుకు దేవుడు వాళ్ళను ముందుగా ఎరిగాడా? కాదు, “దేవుణ్ణి వెదుకువాడు లేడు, ఒక్కడును లేడు” అని రాయబడి ఉంది (రోమా 3:11).

వాళ్ళు విశ్వసిస్తారని దేవుడు ముందుగా చూశాడు కాబట్టేనా? కాదు, ఎందుకంటే పాపాల్లోనూ, అపరాధాల్లోనూ మరణించినవాళ్ళు ఏ విధంగా క్రీస్తునందు విశ్వాసముంచుతారు? విశ్వాసం మనుషులకు అసాధ్యమైనప్పుడు దేవుడు వాళ్ళను విశ్వాసులుగా ఎలా ముందుగా ఎరుగుతాడు? మనం కృప ద్వారానే విశ్వసిస్తాం అని లేఖనం ప్రకటిస్తుంది (అపొ.కా. 18:27). విశ్వాసం దేవుని వరం. ఈ వరం పొందకపోతే ఎవ్వరూ విశ్వసించలేరు.

అందువల్ల దేవుని ఎంపికకు కారణం అలా ఎంపికైనవారిలో కాదు గాని, దేవునిలోనే ఉంది. ఆయన వాళ్ళను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టే ఎన్నుకున్నాడు.

2. రక్షణలో కుమారుడైన దేవుని సార్వభౌమత్వం

క్రీస్తు ఎవరి నిమిత్తం మరణించాడు? తండ్రి కుమారుణ్ణి మరణించడానికే అనుగ్రహించాడనీ, తన ప్రాణం పెట్టడమే కుమారుని ఖచ్చితమైన లక్ష్యమనీ, అనాదికాలము నుండీ ఆయన కార్యములన్నియు దేవునికి తెలియుననీ (అపొ.కా. 15:18) అందరూ అంగీకరిస్తారు. ఈ విషయం వాదించాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు. అయితే తండ్రి ఉద్దేశం ఏమిటి? కుమారుని లక్ష్యం ఏమిటి? దేవుని ఏర్పాటులో ఉన్నవారి కోసమే క్రీస్తు మరణించాడన్నది మన జవాబు.

క్రీస్తు యొక్క మరణం కేవలం ఎన్నికైనవారి కోసమేనని పరిమితం చేయడం ఎంతో వివాదాస్పదమైనదన్న వాస్తవాన్ని నేను విస్మరించడం లేదు. లేఖనంలో బయలుపరచబడిన ఏ సత్యమైనా వివాదాన్ని కలిగించకుండా ఉందా? ప్రభువుయొక్క వ్యక్తిత్వానికీ, కార్యానికి సంబంధించిన ప్రతిదానినీ ఎంతో భయభక్తులతో పరిగణించాలనీ, నేను చెప్పే ప్రతీ మాటకూ “యెహోవా ఇలా సెలవిస్తున్నాడు” అనే రక్షణలో దేవుని సార్వభౌమత్వం మాట మద్దతుగా నిలవాలనీ నేను మర్చిపోవడం లేదు. ధర్మశాస్త్రాన్నీ, ప్రమాణవాక్యాన్ని అనుసరించి నేను బోధిస్తున్నాను!

క్రీస్తు ఎవరి కోసం మరణించాడు? తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన విమోచించదలుచుకున్నది ఎవరిని? సిలువకు వెళ్ళడానికి ముందే ఎవరిని రక్షించుకోవాలో అనే సంపూర్ణమైన సంకల్పం ప్రభుయేసుకు తప్పనిసరిగా ఉంది. ఆయనకు సంపూర్ణమైన సంకల్పం ఉంటే, ఆ ఉద్దేశపు పరిధికి పరిమితి ఉంటుంది. ఎందుకంటే సంపూర్ణమైన సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరాలి. క్రీస్తుకున్న సంపూర్ణమైన సంకల్పం సర్వమానవాళిని రక్షించుకోవడమే అయితే, మానవజాతి అంతా తప్పనిసరిగా రక్షించబడుతుంది.

ఈ తప్పనిసరి వాస్తవాన్ని తప్పించుకోవడానికి, క్రీస్తు ఎదుట ఎలాంటి సంపూర్ణమైన సంకల్పమూ లేదని చాలామంది చెబుతుంటారు. అంటే ఆయన మరణం ద్వారా సర్వమానవాళి నిమిత్తం షరతులతో కూడిన రక్షణ సిద్ధం చేయబడింది. అయితే ఈ మాటకు వ్యతిరేకమైన వాక్యం తండ్రి కుమారునికి చేసిన వాగ్దానాల్లో కనబడుతుంది. కుమారుడు సిలువ వెయ్యబడకముందే, ఆయన శరీరధారి అవ్వకముందే ఈ వాగ్దానాలు చేయబడ్డాయి. పాపుల పక్షంగా కుమారుడు అనుభవించబోయే శ్రమలకు ఒక ఖచ్చితమైన బహుమానాన్ని తండ్రి వాగ్దానం చేశాడని పాతనిబంధన లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంలో మనకు సుపరిచితమైన యెషయా 53వ అధ్యాయంలో ఒకటి రెండు మాటలకు మనల్ని మనం పరిమితం చేసుకుందాం. “అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును .... అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినొందును... నీతిమంతుడైన దేవుని సేవకుడు అనేకులను నిర్దోషులుగా చేయును” (యెషయా 53:10,11).

ఇక్కడ మనం కొంత సేపు ఆగి ఆలోచిద్దాం. మానవజాతిలో కొందరి వ్యక్తుల రక్షణను దేవుడు శాసించకపోతే, ఆ రక్షణ ఖచ్చితం కాకపోతే, క్రీస్తు తన సంతానాన్ని చూడటం, తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందడం ఎలా ఖచ్చితమౌతాయి? క్రీస్తును తమ రక్షకునిగా స్వీకరించడానికి ప్రత్యేకంగా ఎవ్వరికీ కార్యసాధకమైన మార్గం ఏర్పాటు చేయబడకపోతే క్రీస్తు అనేకులను నీతిమంతులుగా తీర్చడం ఎలా సాధ్యమౌతుంది?

ప్రభుయేసు సర్వమానవాళి రక్షణను స్పష్టంగా ఉద్దేశించాడని కొందరు వాదిస్తున్నారు. ఇప్పుడు నన్ను రెండు ప్రశ్నలు అడగనివ్వండి. క్రీస్తు యొక్క ఉద్దేశం సర్వమానవాళి యొక్క రక్షణే అయితే, అది ఎన్నటికైనా నెరవేరుతుందా? ఎన్నటికీ నెరవేరదు. తన ఉద్దేశం ఎన్నటికీ నెరవేరదని క్రీస్తుకు తెలుసా? ఆయన సర్వజ్ఞాని కాబట్టి ఆయనకు తప్పనిసరిగా తెలుస్తుంది. దీనిని బట్టి మనం ఏం చెప్పవచ్చు? తాను సంకల్పించినది ఎన్నటికీ నెరవేరదని తెలిసి కూడా ఆ పనికి పూనుకునేవాడు తెలివైనవాడు ఎలా ఔఔతాడు? క్రీస్తు అందరి రక్షణను ఉద్దేశించాడు అనెవరైనా వాదిస్తే, వాళ్ళు క్రీస్తుని వెర్రివాడు అని నిందించిన ఔతుంది. అందువల్ల ఇక మనకు మిగిలిన ప్రత్యామ్నాయం: ఆయన మరణాన్ని ముందుగా ఉద్దేశించింది కేవలం ఎన్నిక చేయబడినవారి కోసమే. స్పష్టంగా చెప్పాలంటే, సర్వ మానవాళికి రక్షణను కేవలం అందుబాటులోకి తీసుకురావడానికి క్రీస్తు మరణించలేదు. కానీ తండ్రి తనకు అనుగ్రహించిన వాళ్ళందరి రక్షణను నిశ్చయం చేయడానికి ఆయన మరణించాడు. పాపాల క్షమాపణను సాధ్యం చేయడానికి కాదు, పాపనివారణ చేయడానికే క్రీస్తు మరణించాడు (హెబ్రీ 9:26). ఎవరి పాపం నివారణ చేయడానికి? ఎన్నికైనవారి పాపాలను ("లోకపాపము” - యోహాను 1:29, దేవుని ప్రజల 'లోకం') నివారణ చేయడానికే అని లేఖనం మనకు స్పష్టం చేస్తుంది.

(1) తండ్రి రక్షణ నిమిత్తం కొంతమందిని ఎన్నిక చేసుకున్నాడనే సత్యమే క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తాన్ని పరిమితం చేస్తుంది. ప్రభువు శరీరధారి కావడానికి ముందు “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను” అని చెప్పాడు (హెబ్రీ 10:7). ఆయన శరీరధారి అయిన తర్వాత “నా యిష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని” అని చెప్పాడు (యోహాను 6:38). క్రీస్తు యొక్క చిత్తం తండ్రి చిత్తంతో పరిపూర్ణంగా ఏకీభవిస్తుంది. కాబట్టి ఒకవేళ దేవుడు ప్రారంభం నుండే కొంతమందిని రక్షణ నిమిత్తం ఏర్పాటు చేసుకుని ఉంటే, క్రీస్తు ఆయన ఏర్పాటును విస్తరింపజేయడానికి ప్రయత్నించడు.

పైన చెప్పిన మాట కేవలం నా ఊహను బట్టి చెప్పింది కాదు. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా బోధించేదానితో పూర్తిగా ఏకీభవిస్తున్న మాట. మన ప్రభువు పదే పదే 'తండ్రి తనకనుగ్రహించినవారి' గురించి ప్రస్తావించాడు. వారి నిమిత్తమే ప్రత్యేకంగా ఆయన పంపబడ్డాడు. “తండ్రి నాకు అనుగ్రహించువారందరును నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది” అని చెప్పాడు (యోహాను 6:37,39). మరొకసారి ఆయన ఇలా చెప్పాడు, “తండ్రి నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. వారు నీవారై యుండిరి. నీవు వారిని నాకనుగ్రహించితివి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు. నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతో కూడా ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి” (యోహాను 17:1,2, 6, 9, 24). జగత్తు పునాది వేయబడక మునుపే ఒకే ప్రజను తన కుమారునితో సారూప్యంగలవారిగా చేయడానికి దేవుడు ముందుగా నిర్ణయించాడు. ప్రభుయేసు యొక్క మరణపునరుత్థానాలు ఆ దైవసంకల్పాన్ని నెరవేర్చడానికే ఉన్నాయి.

(2) పాపులకు అన్వయించే విషయంలో ప్రాయశ్చిత్తాన్ని పరిమితం చేసింది దేవుని సంకల్పమే అని ప్రాయశ్చిత్తం యొక్క స్వభావం రుజువు చేస్తుంది. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తాన్ని రెండు ముఖ్య కోణాల నుండి చూడాలి. ఒకటి దైవకోణం, రెండవది మానవకోణం. దైవకోణంలో చూస్తే క్రీస్తు యొక్క సిలువకార్యం ఒక శాంతింపచేసే బలి, అది దైవోగ్రతను చల్లార్చింది, దేవుని న్యాయాన్నీ, పరిశు ద్దతనూ సంతృప్తి పరచింది. మానవకోణంలో చూస్తే క్రీస్తు మరణం ఒక ప్రత్యామ్నాయం, అంటే దోషుల స్థానాన్ని నిర్దోషి భర్తీ చేశాడు. అనీతిమంతుల కోసం నీతిమంతుడు మరణించాడు. ప్రత్యామ్నాయంగా పనిచేసినవాడు జరిగించిన బలిని న్యాయమూర్తి అంగీకరిస్తే, అప్పుడు ఆ ప్రత్యామ్నాయం చేసినవాడు ఎవరి నిమిత్తం పనిచేశాడో, ఎవరి స్థానాన్ని తీసుకున్నాడో వాళ్ళు తప్పనిసరిగా విడిపించబడాలి.

ఉదాహరణకు, నేను ఒకరికి అప్పుపడ్డాను అనుకోండి. దాన్ని చెల్లించలేకపోయాను. వేరొక వ్యక్తి ముందుకొచ్చి నాకు అప్పు ఇచ్చిన వ్యక్తికి నా పక్షంగా పూర్తి ధనాన్ని చెల్లించి, ఆ రుణపత్రాన్ని వెనక్కు తీసుకున్నాడనుకోండి. అప్పుడు చట్టం దృష్టిలో నాకు అప్పిచ్చినవానికి నాపై ఎలాంటి అధికారమూ ఉండదు. సిలువపై ప్రభుయేసు తనను తాను విమోచనాక్రయంగా అర్పించుకున్నాడు. దానిని దేవుడు అంగీకరించాడు. 3 రోజుల తర్వాత తెరవబడిన సమాధి ద్వారా దేవుడు దానిని ధృవీకరించాడు. మనం ఇక్కడ లేవనెత్తే ప్రశ్న ఏంటంటే: ఈ విమోచన క్రయధనం ఎవరి నిమిత్తం చెల్లించబడింది? ఇది మానవాళి అంతటి నిమిత్తం చెల్లించబడితే, ప్రతి మనిషికీ ఉన్న రుణం మాఫీ చేయబడాలి. క్రీస్తు మ్రానుపై తన దేహంలో సర్వమానవాళి యొక్క అంటే, మనుషులందరి యొక్క పాపాలను భరిస్తే , వాళ్ళలో ఒక్కరు కూడా నశించరు. ఆదాము సంతానమంతటి నిమిత్తం క్రీస్తు శపించబడితే, అందులో ఏ ఒక్కడూ శిక్షావిధి కింద ఇప్పుడు లేడు. దేవుడు క్రీస్తు దగ్గర నుండి రుణాన్ని తీసుకుని, మళ్ళీ నా దగ్గరకొచ్చి రెండవసారి రుణాన్ని చెల్లించమని అడగడు. ఒకవేళ క్రీస్తు ఎలాంటి మినహాయింపూ లేకుండా సర్వమానవాళి యొక్క రుణాన్ని చెల్లించకపోతే, చెరసాలల్లో వేయబడేవాళ్ళు కొంతమంది ఉంటారు (1 పేతురు 3:19తో పోల్చండి). ఈ వచనంలో “చెరసాల”కు ఇదే విధమైన గ్రీకుపదం ఉపయోగించబడింది. "కడపటి కాసు చెల్లించేవరకు అక్కడనుండి వాళ్ళు వెలుపలికి రాలేరు” (మత్తయి 5:26).

క్రీస్తు సర్వమానవాళి పాపం నిమిత్తం మరణించలేదు. ఎందుకంటే తమ పాపాల్లోనే మరణించేవాళ్ళు కొందరున్నారు (యోహాను 3:21). వారి పాపం నిలిచే ఉంటుంది (యోహాను 9:41). ఆదాము సంతానమంతటి నిమిత్తం క్రీస్తు శాపంగా చేయబడలేదు, ఎందుకంటే “శపించబడినవారలారా, నా నుండి తొలగిపొండి” అని ఆయన కొంతమందితో చెప్పబోతున్నాడు (మత్తయి 25:41). క్రీస్తు అందరి నిమిత్తం మరణించాడనీ, యావత్ మానవజాతి అంతటికీ ఆయన ప్రత్యామ్నాయంగా పనిచేశాడనీ, పూచీకత్తు ఇచ్చాడనీ, మనుషులందరి పక్షంగా ఆయన శ్రమపడ్డాడనీ చెబితే, ఆయన ఎవరి శాపాన్ని అయితే భరించాడో, వారిలో చాలామంది తమకు తామే ఇంకా ఆ శాపాన్ని భరిస్తున్నారని చెప్పినట్టు ఉంటుంది! ఎంతోమంది శిక్షను ఆయన భరించాడు కానీ వాళ్ళు ఇప్పుడు నరకంలో యాతన పడుతున్నారు అని చెప్పడమే ఔతుంది! ఆయన ఎంతోమంది కోసం విమోచనా క్రయధనాన్ని చెల్లించాడు. అయితే చాలామంది ఇప్పుడు ఆ మూల్యాన్ని నిత్యవేదన రూపంలో చెల్లిస్తున్నారు. ఎందుకంటే పాపం మూలంగా వచ్చే జీతం మరణం' - G.S. Bishop

అయితే లేఖనాలు చెప్పినట్టుగా దేవుని ప్రజల అతిక్రమాల కోసం క్రీస్తు మొత్తబడ్డాడనీ, తన గొర్రెల కోసం ఆయన ప్రాణం పెట్టాడనీ, అనేకులకు ప్రతిగా విమోచనా క్రయధనంగా తన ప్రాణం ఇచ్చాడనీ చెప్పడమంటే ఆయన చేసిన ప్రాయశ్చిత్తం పూర్తిగా పాపాలను పరిహరిస్తుందని చెప్పడమే! ఆయన చెల్లించిన వెల నిజంగా విడుదల చేస్తుందని చెప్పడమే! ఆయన నిజంగా రక్షించే రక్షకుడని చెప్పడమే!

(3) మన ప్రభువు యొక్క ప్రధాన యాజకత్వం గురించి లేఖనాల బోధకూ, మనం పైన చెప్పినదానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ బోధ మనం పైన చెప్పినదాన్ని ధృవీకరిస్తుంది. గొప్ప ప్రధానయాజకునిగా క్రీస్తు ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే ఆయన ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు? మొత్తం మానవజాతి కోసమా? లేదా కేవలం తన ప్రజల కోసమేనా? ఈ ప్రశ్నకు కొత్త నిబంధన చెప్పే జవాబు సూర్యకాంతిలా చాలా స్పష్టంగా ఉంది. “యిప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు రక్షకుడు పరలోకమందే ప్రవేశించాడు” (హెబ్రీ 9:24). అది పరలోక సంబంధమైన పిలుపులో పాలుపొందినవారి కోసమే (హెబ్రీ 3:1). మరొకసారి ఇలా రాయబడింది, “ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు” (హెబ్రీ 7:25).

పాతనిబంధనలోని గుర్తుతో ఇది ఖచ్చితంగా ఏకీభవిస్తుంది. బలిపశువును వధించిన తరువాత అహరోను దేవుని ప్రజల పక్షంగా ఒక ప్రతినిధిలా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. తన మైమరువు పైన ఇశ్రాయేలు గోత్రాల పేర్లు చెక్కబడి ఉండేవి. వారి పక్షంగానే అతడు దేవుని ముందుకు వెళ్ళేవాడు. యోహాను 19:9లోని ప్రభుని మాటలు దీనితో ఏకీభవిస్తున్నాయి. "నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు, నీవు నాకు అనుగ్రహించియున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను” (యోహాను 19:9).

ఈ భాగంలో పూర్తిగా దృష్టి సారించాల్సిన మరొక లేఖనభాగం రోమా 8వ అధ్యాయంలో కనబడుతుంది. 33వ వచనంలో పౌలు ఈ ప్రశ్న అడుగుతున్నాడు, “దేవునిచే ఏర్పరచబడినవారి మీద నేరము మోపువాడెవడు?” ఆ తర్వాత దైవావేశ మూలమైన జవాబు కనబడుతుంది. “నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయినవాడు క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును ఆయనే” (8:33,34). క్రీస్తు యొక్క మరణం వలన, విజ్ఞాపన వలన ప్రయోజనం పొందేవాళ్ళు ఒక్కరే! పాత నిబంధనలో క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్న యాజకుని ప్రార్థన విజ్ఞాపనలు ఎలాగైతే ఇశ్రాయేలు నిమిత్తం మాత్రమే చేయబడ్డాయో, అలాగే కొత్త నిబంధనలో క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త విజ్ఞాపనలు దేవుని బిడ్డలకే వర్తిస్తాయి. క్రీస్తు కేవలం ఏర్పరచబడినవాళ్ళ కోసమే విజ్ఞాపన చేస్తుంటే, ఆయన మరణించింది వాళ్ళ కోసమే కాని లోకం కోసం కాదు!

ప్రభుయేసు యొక్క మరణం, పునరుత్థానం, మహిమ, విజ్ఞాపనలే దేవుని ఏర్పాటులో ఉన్నవారి పైన ఎవ్వరూ నేరం మోపలేకపోవడానికి కారణం అని గమనించండి. మనం బోధిస్తున్నదానిని వ్యతిరేకించేవారు ఈ కింది ప్రశ్నను శ్రద్ధగా పరిశీలించాలి. క్రీస్తు యొక్క మరణం అందరికీ సమానంగా వర్తిస్తే, ఐనా విశ్వసించనివారందరూ శిక్షావిధికి గురౌతున్నప్పుడు (యోహాను 3:18), నేరం మోపబడకుండా ఆయన మరణం కాపాడుతుందని ఎలా చెప్పగలము?

(4) క్రీస్తు యొక్క మరణం మూలంగా కలిగే ప్రయోజనాల్లో పాలుపొందేవారి సంఖ్య కేవలం ప్రాయశ్చిత్త స్వభావాన్ని బట్టి, క్రీస్తు యొక్క యాజకత్వాన్ని బట్టి మాత్రమే కాదు, ఆయన శక్తిని బట్టి కూడా నిర్ధారించబడుతుంది. సిలువపై మరణించిన క్రీస్తు శరీరాన్ని ధరించిన దేవుడు కాబట్టి తాను సంకల్పించినదానిని నెరవేర్చుకోగలడు; కొనుక్కున్నదానిని స్వాధీనం చేసుకోగలడు; దేనిపై హృదయాన్ని పెడతాడో దాన్ని భద్రపరచుకోగలడు. భూమ్యాకాశాల్లోని సమస్త శక్తినీ ప్రభుయేసు కలిగి ఉన్నాడు కాబట్టి ఎవ్వరూ ఆయన చిత్తాన్ని విజయవంతంగా ఎదిరించలేరు.

'ఇది నిజమే కాని క్రీస్తు ఈ శక్తిని ప్రదర్శించడానికి ఇష్టపడడు, తనను రక్షకునిగా స్వీకరించమని ఎవ్వరినీ ఆయన బలవంతం చేయడు' అని కొందరు అనవచ్చు. ఒక కోణం నుండి చూస్తే ఇది నిజమే కానీ మరొక కోణం నుండి ఇది నిజం కాదు. పాపి రక్షించబడే విషయములో దైవశక్తి ప్రదర్శించబడుతుంది. స్వభావరీత్యా పాపి దేవునికి విరోధిగా ఉన్నాడు. దైవశక్తి తప్ప మరేది ఆ శతృత్వాన్ని అధిగమించడానికి సహాయపడదు! అందువల్లనే ఇలా రాయబడింది. "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు” (యోహాను 6:44). పాపిలో దేవునియెడల ఉండే సహజమైన శతృత్వాన్ని అధిగమించేది దేవుని శక్తే. తాను జీవం పొందునట్లు క్రీస్తు చెంతకు వచ్చేందుకు ఇష్టాన్ని కలిగించేది ఆ దైవశక్తే. అయితే ఈ శతృత్వం ప్రజలందరిలో ఎందుకు అధిగమించబడట్లేదు? కొందరిలో ఉన్న శతృత్వం క్రీస్తు కూడా అధిగమించలేనంత శక్తి కలిగినదా? క్రీస్తు కూడా ప్రవేశం పొందలేనంతగా కొన్ని హృదయాలు ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యాయా? 'అవును' అని ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడం ఆయన సర్వశక్తిని తృణీకరించడమే.

తుది విశ్లేషణలో చెప్పేదేమిటంటే ఈ అంశం పాపి యొక్క ఇష్టాయిష్టాల పై ఆధారపడి లేదు, ఎందుకంటే స్వభావరీత్యా అందరూ క్రీస్తు దగ్గరకు రావడానికి ఇష్టపడరు. మానవహృదయంలో, చిత్తంలో దైవశక్తి పనిచేసినప్పుడు , మనిషిలో ఉన్న సహజమైన, తీవ్రమైన శతృత్వాన్ని అధిగమించినప్పుడు ప్రజలు క్రీస్తు దగ్గరకు రావడానికి ఇష్టపడతారు. 'నీవు నీ బలపరాక్రమాలను కనుపరచే రోజున, నీ ప్రజలు ఇష్టపూర్వకముగా ముందుకు వస్తారు' (వాడుక భాషలో కీర్తన 110:3) అని రాయబడి ఉంది. తానంటే ఇష్టపడనివారిని క్రీస్తు తనకోసం గెలుచుకోలేడని చెప్పడం భూమ్యాకాశాల్లో సమస్తశక్తి ఆయనదే అనే సత్యాన్ని తృణీకరించడమే. మనిషి యొక్క బాధ్యతను నాశనం చేయకుండా క్రీస్తు తన శక్తిని ప్రదర్శించలేడని చెప్పడం ఇక్కడ లేవనెత్తబడిన ప్రశ్నను తిరిగి అడగడమే. ఎందుకంటే ఆయన తన శక్తి ప్రదర్శించి తన దగ్గరకు వచ్చినవారిని ఇష్టపూర్వకంగా వచ్చేలా చేశాడు; ఇతరుల్లో కూడా ఆయన ఎందుకలా చేయలేడు? ఒక పాపి హృదయాన్ని తన కోసం ఆయన గెలుచుకోగలిగినప్పుడు, ఇతరుల్ని కూడా ఆయన ఎందుకు గెలుచుకోలేడు? ఇతరులు ఆయనను అనుమతించట్లేదని చెప్పడం ఆయన శక్తిసామర్థ్యాలను శంకించడమే. ఈ విషయం ఆయన చిత్తానికి సంబంధించినది. ప్రభుయేసు సర్వమానవాళి రక్షణను శాసిస్తే, కోరుకుంటే, సంకల్పిస్తే మొత్తం మానవజాతి అంతా రక్షించబడుతుంది; లేదంటే ఆయన తన ఉద్దేశాలను నెరవేర్చుకోలేని శక్తిహీనుడనే భావం స్ఫురిస్తుంది. లేదంటే “అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తినొందును” అనే మాటను ఎన్నడూ ఆయన చెప్పి ఉండేవాడు కాడు. ఇక్కడ అసలు విషయం రక్షకుని యొక్క దైవత్వానికి సంబంధించినది, ఎందుకంటే ఓడిపోయిన రక్షకుడు దేవుడు కాలేడు.

క్రీస్తు మరణం యొక్క ఉద్దేశం ఎన్నికైనవారికి మాత్రమే పరిమితం చేయబడిందనే సత్యాన్ని నమ్మడానికి అవసరమైన కొన్ని సాధారణ నియమాలను ఇప్పటివరకు మనం పరిశీలించాం. ఈ సత్యాన్ని స్పష్టంగా వివరించే లేఖనభాగాలపై ఇప్పుడు మనం దృష్టి సారిద్దాం. యెషయా 53వ అధ్యాయం అద్భుతమైనది, అసమానమైనది. ఇందులో దేవుడు తన కుమారుని గురించి మనతో ఇలా చెబుతున్నాడు. “అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను” (వ.8). దేవదూత యోసేపుతో చెప్పిన మాటలు సంపూర్ణంగా ఈ వచనంతో ఏకీభవిస్తున్నాయి. “తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను” (మత్తయి 1:21). "తన ప్రజలు” అంటే 'కేవలం ఇశ్రాయేలు మాత్రమే కాదు, తండ్రి కుమారునికి అనుగ్రహించినవారందరూ' అని అర్థం .

మన ప్రభువే స్వయంగా ఇలా చెప్పాడు, “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను” (మత్తయి 20:28). ఎలాంటి మినహాయింపూ లేకుండా అందర్నీ దేవుడు రక్షించుకోవాలనుకుంటే, “అనేకులకు ప్రతిగా” అని ప్రభువు ఎందుకు చెప్పాడు? ఆయన విమోచించింది తన ప్రజలనే (లూకా 1:68), మంచి కాపరి తన ప్రాణం పెట్టింది గొర్రెలకోసమే కానీ మేకల కోసం కాదు (యోహాను 10:11), తన స్వరక్తంతో దేవుడు కొనుక్కున్నది తన సంఘాన్నే (అపొ.కా. 20:28).

ఈ బోధను సమర్థించుకోవడానికి నేను ఉపయోగించుకోగలిగే అతి ముఖ్యమైన లేఖనభాగం యోహాను 11:49-52. “అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడై యుండి 'మీకేమియు తెలియదు. మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు' అని వారితో చెప్పెను. తనంతట తానే ఈలాగు చెప్పలేదుగాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైయుండెను గనుక యేసు ఆజనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును, చావనైయున్నాడని ప్రవచించెను” (యోహాను 11:49-52). కయప ఇక్కడ తనకు తానుగా ప్రవచించలేదు గాని పాతనిబంధన కాలంలో దేవునిచే నియమించబడినవారిలా (2 పేతురు 1:21 చూడండి) అతడు ప్రవచించాడు. అతని ప్రవచనానికి మూలం అతనిలో లేదు గాని పరిశుద్ధాత్మ మూలంగా ప్రేరేపింపబడినవాడై ఆ ప్రవచనాన్ని మాట్లాడాడు. క్రీస్తు మరణించింది ఆ జనము కోసమని ఇక్కడ యోహాను ఖచ్చితంగా తెలియచేస్తున్నాడు. ఆ జనం అంటే ఇశ్రాయేలు అని అర్థం. ఒక్క శరీరం అయిన తన సంఘం కోసం కూడా క్రీస్తు మరణించాడు. ఈ సంఘంలోనికే వివిధ దేశాల్లో చెదరిపోయిన దేవుని బిడ్డలందరూ ఇప్పుడు సమకూడి ఒక్క శరీరంగా వస్తున్నారు.

క్రీస్తు మరణించడానికి ముందే సంఘసభ్యుల్ని ఇక్కడ దేవునిబిడ్డలని పేర్కొనడం విశేషమైన సంగతి కాదా? సంఘంలో విస్తారమైన జనం ఇంకా అప్పటికి జన్మించనే లేదు, అయినా వాళ్ళు దేవుని బిడ్డలుగా పరిగణించబడ్డారు. ఎందుకంటే వాళ్ళు జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో ఎన్నుకోబడ్డారు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి వాళ్ళు దత్తపుత్రులుగా నిర్ణయించబడ్డారు (ఎఫెసీ 1:4,5). అదే విధంగా “ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు కూడా నాకు ఉన్నాయి” అని క్రీస్తు చెప్పాడు (యోహాను 10:16) మన రక్షకుని హృదయంలోనూ, సంభాషణలోనూ సిలువ యొక్క నిజమైన ఉద్దేశం ఎప్పుడైనా తీవ్రరూపం దాల్చిందంటే అది ఆయన భూమిపై చేసిన పరిచర్య యొక్క చివరి వారంలోనే! ఆయన పరిచర్యలో చివరి వారం గురించి, మనం ప్రస్తుతం విచారిస్తున్న సంగతి గురించి లేఖనాలు ఏం గ్రంథస్థం చేశాయి? “తాను ఈ లోకము నుండి తండ్రియొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకుముందే యెరిగినవాడై, లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను” (యోహాను 13:1) అని లేఖనాలు చెబుతున్నాయి. “తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టేవానికంటే ఎక్కువైన ప్రేమగల వాడెవడును లేడు” అని ఆయన అన్నాడు (యోహాను 15:13). “వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను” అని ఆయన చెప్పిన మాటలను లేఖనాలు గ్రంథస్థం చేశాయి (యోహాను 17:19). అంటే తన సొంత ప్రజల కోసం, తండ్రి తనకు అనుగ్రహించినవారి కోసం ఆయన సిలువపై మరణించడానికి తన్ను తాను ప్రత్యేకించుకున్నాడు. క్రీస్తు మనుషులందరి కోసం ఎలాంటి వివక్షా లేకుండా మరణిస్తే, మీరెందుకు అలా వివక్ష చూపిస్తున్నారు? అని కొందరు అడగటానికి అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో ఈ భాగాన్ని ముగించకముందు క్రీస్తు యొక్క మరణం మూలంగా ఆయన చేసి ప్రాయశ్చిత్తం అపరిమితమైందని బలంగా బోధించినట్లు కనబడే కొన్ని వాక్యభాగాలను క్లుప్తంగా పరిశీలిద్దాం. 2 కొరింథీ 5:14లో “ఏలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను” అని మనం చదువుతాము. అయితే ఈ వచనం బోధిస్తున్నది అపరిమితమైన ప్రాయశ్చిత్తాన్ని కాదు. మొత్తం వచనాన్ని, వాక్యభాగాన్ని సందర్భానుసారంగా పరీక్షించి చూస్తే క్రీస్తు మరణం కేవలం ఎన్నికైనవారికి మాత్రమే పరిమితమైందనే బోధను నొక్కి చెబుతున్నట్లు మనం గ్రహించగలుగుతాం. మొత్తం వచనం ఇలా ఉంది “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతి పొందారు”. గ్రీకులో రెండవసారి ఉపయోగించబడిన “అందరును” అనే పదం ముందు ఒక డెఫినెట్ ఆర్టికల్ ఉంది, క్రియ Aorist Tenseలో ఉంది, అందువల్ల దాన్ని మనం ఇలా చదవాలి - "అందరి కొరకు ఒకడు మరణిస్తే, వాళ్ళు అందరూ మరణించారు”. అంటే 'ఎవరికోసమైతే ఆ ఒకడు మరణించాడో వాళ్ళు కూడా మరణించారని' అపొస్తలుని ఉద్దేశం. ఆ తరువాత వచనం ఇలా చెబుతుంది “జీవించువారిక మీదట తమ కొరకు కాక, తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచినవాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము”. క్రీస్తు మరణించడమే కాదు తిరిగి లేచాడు కూడా. అదే విధంగా ఆయన ఎవరికోసమైతే మరణించాడో వాళ్ళు కూడా మరణించారు, తిరిగిలేచారు; ఎందుకంటే వాళ్ళు జీవిస్తున్నారు అని ఈ వచనం చెబుతుంది.

ఎవరికి ప్రతినిధిగా ఇంకొకరు పనిచేస్తారో, వారే ఆ పని చేసినట్టు చట్టం పరిగణిస్తుంది. చట్టం దృష్టిలో ప్రతినిధి, అతను ప్రాతినిధ్యం వహించే వ్యక్తి, ఇద్దరూ ఒక్కటే. ఆ చట్టం మరెవరో కాదు దేవుడే. క్రీస్తు తన ప్రజలతో ఒకటిగా పరిగణించబడ్డాడు, తన ప్రజలు క్రీస్తుతో ఒకటిగా పరిగణించబడ్డారు. అందువల్ల ఆయన మరణించినప్పుడు చట్టబద్ధంగా వాళ్ళు కూడా చనిపోయారు. ఆయన తిరిగి  లేచినప్పుడు వాళ్ళు కూడా ఆయనతో లేచారు. ఈ వాక్యభాగంలో మరొక విషయాన్ని పౌలు మనకు చెబుతున్నాడు (వ.17). “ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి”: వాస్తవంలోనూ చట్టం దృష్టిలోనూ అతడు నూతన జీవాన్ని పొందుకున్నాడు; అందువల్ల క్రీస్తు ఎవరి కోసమైతే మరణించాడో వాళ్ళు “అందరూ” తమకోసం కాక తమ నిమిత్తం మరణించి తిరిగి లేచినవాని నిమిత్తం జీవించాలని ఆదేశించబడుతున్నారు. ఇంకొకరీతిగా చెప్పాలంటే ఈ వచనంలో ప్రస్తావించిన “అందరు” అనేవారి కోసం క్రీస్తు మరణించాడు. వాళ్ళందరూ తమ అనుదిన జీవితాల్లో తమ కోసం మరణించిన క్రీస్తు నిమిత్తం జీవించాలి, చట్టబద్ధంగా వాళ్ళ విషయంలో ఏది సత్యమో ఆ సత్యాన్ని వాళ్ళు తమ జీవితాల్లో ప్రదర్శించాలి.

“అందరి కొరకు ఒకడు మృతి పొందెను” అనే మాట మనకొరకు నిర్వచించబడింది. క్రీస్తు ఎవరి నిమిత్తమైతే మరణించాడో ఆ “అందరు” జీవిస్తున్నారని, వాళ్ళు ఆయన కోసం జీవించాలని తెలియచేయబడింది. అందువలన ఈ వాక్యభాగం 3 ముఖ్యసత్యాలను బోధిస్తుంది. కొంతమందిని తమ కోసం కాక క్రీస్తు నిమిత్తం జీవించమని పౌలు ఆదేశిస్తున్నాడు; ఈ విధంగా ఆదేశించబడినవాళ్ళు ఆత్మీయంగా జీవించేవాళ్ళు, అంటే దేవుని బిడ్డలు. ఎందుకంటే మానవజాతిలో వాళ్ళకు మాత్రమే ఆత్మసంబంధమైన జీవం ఉంది. మిగిలినవాళ్ళందరూ తమ అపరాధాల్లోనూ, పాపాల్లోనూ చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ విధంగా జీవించేవాళ్ళే ఆ “అందరూ”. క్రీస్తు మరణించి మరలా లేచింది వాళ్ళ కోసమే. అందువల్ల క్రీస్తు మరణించింది ఎన్నిక చేయబడి, తండ్రి చేత తనకు అనుగ్రహించబడిన తన ప్రజలందరి కొరకే అని ఈ వాక్యభాగం బోధిస్తుంది. ఆయన మరణపునరుత్థానాల ఫలితంగా వాళ్ళు జీవిస్తున్నారు, అలా జీవించేవాళ్ళు కేవలం ఎన్నికైనవారు మాత్రమే; క్రీస్తు ద్వారా వాళ్ళు పొందిన జీవితాన్ని ఆయన కోసమే జీవించాలి, అలా జీవించటానికి క్రీస్తు ప్రేమ ఇప్పుడు వారిని బలవంతపెట్టాలి.

“దేవుడు ఒక్కడే, దేవునికిని మనుషులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్నుతానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును” (1తిమోతి 2:5,6). “అందరి కొరకు విమోచ క్రయధనముగా తన్ను తాను సమర్పించుకున్నాడు” అనే మాటలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. లేఖనంలో “అందరు” అనే మాట మానవజాతి విషయములో రెండు విధాలుగా ఉపయోగించబడింది. కొన్ని సందర్భాల్లో “అందరు” అంటే ఎలాంటి మినహాయింపూ లేకుండా మానవజాతిలో ప్రతీ ఒక్కరూ అని అర్థం. ఇతర సందర్భాల్లో ఎలాంటి బేధమూ, వివక్షత లేకుండా ప్రతి ఒక్కరూ అని అర్థం. ఏ వాక్యభాగంలోనైనా “అందరు” అనే మాటకు ఈ రెండు అర్థాల్లో ఏది వర్తిస్తుందో అనే విషయం సందర్భాన్ని బట్టి, సమానాంతర వాక్యభాగాల్ని బట్టి నిర్థారించబడుతుంది. ఎలాంటి భేదమూ, వివక్ష లేకుండా 'అందరూ' అనే అర్థాన్ని సూచించే కొన్ని వాక్యభాగాలని ఉదాహరణగా చూద్దాం -

“అంతట యూదయ దేశస్థులందరును యెరూషలేము వారందరును, బయలుదేరి అతని యొద్దకు వచ్చి, తమ పాపములను ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతనిచేత బాప్తిస్మము పొందుచుండిరి” (మార్కు 1:5). యూదయ యెరూషలేము ప్రాంతాల్లో ఉన్న ప్రతీ స్త్రీ, ప్రతి పురుషుడూ యొర్దాను నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందారని దీని అర్థమా? కానే కాదు! లూకా 7:30 ఇలా చెబుతోంది, “పరిసయ్యులును ధర్మశాస్తోపదేశకులనును అతని చేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి”. మరైతే 'అందరును అతని బాప్తిస్మం పొందారు' అంటే అర్థం ఏంటి? ఎలాంటి మినహాయింపూ లేకుండా అందరూ అని అర్థం కాదు కాని 'ఎలాంటి బేధమూ, వివక్ష లేకుండా అన్ని వర్గాలవారు' అని అర్థం. లూకా 3:21కి ఇదే వివరణ వర్తిస్తుంది.

“తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను” (యోహాను 8:2). "ప్రజలందరు” ఆనే ఈ మాటను మనం ఖచ్చితంగా (absolutely) తీసుకోవాలా? సందర్భానుసారంగా (relatively) తీసుకోవాలా? ప్రజలందరూ అంటే ఎలాంటి మినహాయింపూ లేకుండా ప్రతీ ఒక్కరూ అని అర్థమా? లేక ఎలాంటి బేధమూ లేకుండా అన్ని వర్గాలవారు, అన్ని స్థాయిలకు చెందినవారు అని అర్థమా? రెండవ అర్థమే సరైనది; ఎందుకంటే పర్ణశాలల పండుగ సమయంలో దేవాలయ ప్రాంగణంలో ప్రతీ ఒక్కరూ పట్టేంత స్థలం ఉండదు.

అపొ.కా. 22:15లో మనం ఇలా చదువుతాం. “నీవు చూసిన వాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల యెదుట ఆయనకు సాక్షివై యుందువు”. ఇక్కడ "సకల మనుషులు” అంటే “మానవజాతిలో ప్రతీ ఒక్కరూ” అనే అర్థం అస్సలు రాదు. అందువల్ల 1తిమోతి 2:6లో “ఆయన అందరికొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను” అనే వచనములో “అందరు” అంటే 'ఎలాంటి బేధమూ లేకుండా అన్ని వర్గాలవారు, అన్ని జాతులవారు' అని అర్థం. అన్ని జాతులవారి కోసం, అన్ని తరాలవారి కోసం, అన్ని వర్గాల వారి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికైనవాళ్ళందరి కోసం విమోచన క్రయధనంగా ఆయన తన్ను తాను అర్పించుకున్నాడు. ప్రకటన 5:9లో మనం ఇలా చదువుతాం “నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడువారిలోను ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొన్నావు.” 1తిమోతి 2:6లో “అందరు” అనే పదానికి అర్థం ప్రకటన 5:9లో కనబడే “ప్రతి వంశము, ఆయా భాషలు మాట్లాడేవారు, ప్రతి ప్రజ, ప్రతి జనము” అని అర్థం. “అందరు” అనే పదానికి ప్రకటన 5:9 నుంచి మనం తీసుకున్న అర్థం నిర్హేతుకమైనది కాదనే విషయం మత్తయి 20:28 నుంచి స్పష్టమౌతుంది. మత్తయి 20:28లో మనం ఇలా చదువుతాం “ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను”. ఇక్కడ “అనేకులు” అంటే “అందరు” అని అర్థం కాదు, అందువల్ల యేసు విమోచన క్రయధనము ఎలాంటి మినహాయింపూ లేకుండా ప్రతీ ఒక్కరికీ చెల్లించాడని చెప్పడం అర్థరహితం అవుతుంది. “దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలములయందు ఇయ్యబడును” అనే మాటలు 1తిమోతి 2: 5,6లో మొదటి భాగాన్ని వివరిస్తున్నాయి. ఈ మాటను మనం విశ్లేషించాలి.

అనేకమంది మనుషులు తప్పనిసరిగా నిత్యనాశనానికి గురవుతారని తెలిసి కూడా క్రీస్తు తన్ను తాను మొత్తం మానవజాతి అంతటి కోసం విమోచన క్రయధనముగా అప్పగించుకుంటే, దాని గురించి 'యుక్తకాలమందు ఏవిధంగా సాక్ష్యమియ్యబడుతుంది'? అయితే ఒక వేళ మన వాక్యభాగానికి (1 తిమోతి 2:5,6) క్రీస్తు తన్ను తాను ఎలాంటి భేదమూ లేకుండా - ఎలాంటి జాతి భేదమూ లేకుండా, సామాజిక హోదాలనూ, నైతిక గుణగణాలను, వయోలింగ బేధాలనూ చూడకుండా - దేవుని ఏర్పాటులో ఉన్నవారికోసం అర్పించుకుంటే అప్పుడు “దీనినిగూర్చి యుక్తకాలములయందు సాక్ష్యం ఇవ్వబడును” అనే మాట అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే సరైన సమయంలో వారిలో ప్రతి ఒక్కరి రక్షణను విజయవంతం చేయడం ద్వారా దాని గురించి సాక్ష్యమియ్యబడుతుంది.

“దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము” (హెబ్రీ 2:9) ఈ వాక్యభాగం మనల్ని సుదీర్ఘ సమయం నిర్బంధించదు. అనువాదంలో తప్పు ఉండడం వల్ల దీనిపై ఒక తప్పు బోధ కట్టబడింది. “ఆయన ప్రతి మనుష్యుని” అని మనం ఈ వచనాన్ని చదువుతున్నాం గాని గ్రీకులో “మనుష్యుని” అనే పదం లేదు. కొన్ని అనువాదాల్లో “ప్రతీదానికోసం ఆయన మరణాన్ని అనుభవించాడు” అని ఉంది. ఇది కూడా పొరపాటే. “ప్రతీ” అనే పదం తర్వాత ఏ పదం ఉండాలో తెలుసుకోవాలంటే దాని తర్వాత కనబడే మాటల్ని గమనించాలి, అవే మనకు వివరణ ఇస్తాయి. “ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో యెవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును”. ఆయన మరణాన్ని కుమారుల కోసం అనుభవించాడని అపొస్తలుడు ఇక్కడ రాస్తున్నాడు. అందువల్ల “ప్రతీ...... కొరకు మరణం అనుభవించునట్లు” అనే ఖాళీలో “కుమారుడు” అనే పదాన్ని బ్రాకెట్ లో చేర్చడం యుక్తమైన వివరణ అవుతుంది. అందువల్ల హెబ్రీ 2:9,10 వచనాలు క్రీస్తు మరణం యొక్క ఉద్దేశం అపరిమితం అని బోధించడానికి బదులు "పరిమితం” అని బోధించిన ఇతర లేఖనభాగాలను సమర్థిస్తున్నాయి. మన ౦ప్రభువు మరణాన్ని అనుభవించింది సమస్త మానవాళి కోసం కాదు కాని కుమారుల కోసమే. (అనుబంధం-4లో 1యోహాను 2:2ని సమగ్రంగా మనం పరీక్షిద్దాం).

ఈ అధ్యాయంలో ఈ భాగాన్ని ముగిస్తుండగా మనం చెబుతున్న విషయాలివే! ప్రాయశ్చిత్తం పరిమితంగా ఉండటానికి కారణం కేవలం సార్వభౌమాధికారమే; క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్తపు విలువ అనంతమైనది, శక్తి అపరిమితమైనది, కాని ఉద్దేశం, అన్వయింపు పరిమితమైనవి.

రక్షణలో పరిశుద్ధాత్మ దేవుని సార్వభౌమాధికారం

త్రిత్వంలో పరిశుద్ధాత్ముడు ఒకడు. కాబట్టి మిగిలిన ఇద్దరు వ్యక్తుల చిత్తంతో, ఉద్దేశంతో ఆయన పూర్తిగా ఏకీభవిస్తాడు. ఏర్పాటులో తండ్రి యొక్క నిత్య సంకల్పం, కుమారుని మరణంలో పరిమితమైన ఉద్దేశం, పరిశుద్ధాత్మ కార్యాల్లో మితమైన పరిధి పరిపూర్ణంగా ఏకీభవిస్తాయి. జగత్తు పునాది వేయబడకముందు తండ్రి కొందరినే ఏర్పాటు చేసుకుని వాళ్ళను కుమారునికి అనుగ్రహిస్తే, కుమారుడు వాళ్ళ కోసమే విమోచనా క్రయధనముగా తన్ను తాను అర్పించుకుంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కార్యం చేసేది లోకమంతటినీ క్రీస్తు దగ్గరకు తీసుకురావటానికి కాదు. క్రీస్తు యొక్క విమోచనార్పణ మూలంగా కలిగే ప్రయోజనాలను అన్వయించడమే లోకంలో నేడు పరిశుద్ధాత్మ చేసే పరిచర్య. అందువల్ల ప్రశ్న పరిశుద్ధాత్ముని శక్తిని గురించినది కాదు. ఆయన శక్తి అనంతమైనది, అందులో సందేహమేమీ లేదు. అయితే ఆయన శక్తి, ఆయన కార్యాలు దైవజ్ఞానం చేత, సార్వభౌమత్వం చేత నడిపించబడతాయని చూపించడమే నా ప్రయత్నం.

పైన చెప్పిన మాటను అంటే దేవుని జ్ఞానమూ, ఆయన సార్వభౌమత్వమూ పరిశుద్ధాత్మ యొక్క శక్తినీ, కార్యాలనూ నడిపిస్తాయనే మాటను నిరూపించడానికి మన ప్రభువు నీకొదేముతో చెప్పి మాటలను గమనిద్దాం. “గాలి తన కిష్టమైన చోటను విసరును. నువ్వు దాని శబ్దము విందువే గాని అది యెక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడు” (యోహాను 3:8). గాలికి ఆత్మకు మధ్యన పోలిక ఈ వచనంలో కనబడుతుంది. ఈ పోలికలో రెండు కోణాలు ఉన్నాయి. మొదటిది: ఆత్మ, గాలి రెండూ కూడా తమ చర్యల్లో సార్వభౌమత్వం గలవే. రెండవది: ఆత్మ, గాలి రెండూ కూడా తమ చర్యల్లో మర్మయుక్తంగానే ఉంటాయి. “ఆలాగే” అనే పదం ద్వారా ఈ పోలికను ప్రభువు తెలియచేశాడు. “తనకిష్టమైన చోట” అనే పదాల్లో పోలిక యొక్క మొదటి కోణం కనబడుతుంది. “నీకు తెలియదు” అనే మాటల్లో ఈ పోలిక యొక్క రెండవ కోణం కనబడుతుంది. ఇప్పుడు పోలికలో రెండవ కోణం గురించి చర్చిద్దాం, మొదటి కోణం గురించి తర్వాత పరిశీలిద్దాం.

“గాలి తనకిష్టమైన చోటను విసరును..... ఆత్మమూలంగా జన్మించిన ప్రతివాడును ఆలాగే ఉన్నాడు”. గాలి మనిషి నియంత్రించలేనిది, నిరోధించలేనిది. గాలి మనిషిని సంప్రదించదు, అతని ఆలోచనలను బట్టి నడుచుకోదు. ఆత్మ కూడా అలాగే పనిచేస్తాడు. దైవజ్ఞానమే గాలిని నడిపిస్తుంది. కాబట్టి మనిషికి సంబంధించినంతవరకు గాలి తన చర్యల్లో పూర్తిగా సార్వభౌమత్వంగలది. ఆత్మ కూడా అంతే! కొన్నిసార్లు గాలి చాలా నెమ్మదిగా వీస్తుంది, అప్పుడు ఒక్క ఆకు శబ్దం కూడా వినిపించదు, మరి కొన్నిసార్లు ఎన్నో మైళ్ళ దూరం నుండి కూడా వినగలిగేంత భీకరంగా గర్జిస్తూ వీస్తుంది. నూతనజన్మ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది, పరిశుద్ధాత్ముడు కొందరితో చాలా మృదువుగా వ్యవహరిస్తాడు, అందువల్ల చూసే మనుషులకు ఆయన కార్యం కనపించకుండా జరిగిపోతుంది. కొందరిలో ఆయన చర్య చాలా శక్తివంతంగా, విప్లవాత్మకంగా, తీక్షణంగా ఉంటుంది, అందువల్ల ఆయన కార్యాలు ఆ వ్యక్తుల్లో ప్రస్ఫుటంగా కనబడతాయి. కొన్ని సమయాల్లో గాలి కేవలం స్థానికంగా మాత్రమే ప్రభావం చూపుతుంది, ఇతర సమయాల్లో దాని ప్రభావం విస్తృతంగా ఉంటుంది. పరిశు ద్దాత్ముని కార్యం కూడా అలాగే ఉంటుంది. నేడు ఆయన ఒకరి లేదా ఇద్దరి ఆత్మల్లో పనిచేస్తాడు, రేపటి దినాన పెంతెకొస్తు రోజున చేసినట్లు కొన్ని వేలమంది హృదయాలు నొచ్చుకొనేలా చేస్తాడు. ఆయన కొంతమందిలో పనిచేసినా, అనేకమందిలో కార్యం చేసినా ఆయన ఏ మనిషినీ సంప్రదించడు. ఆయన తనకు నచ్చినట్టుగా పనిచేస్తాడు. నూతన జన్మ అనేది పరిశుద్ధాత్మ యొక్క సార్వభౌమ చిత్తాన్నిబట్టే కలుగుతుంది.

మన రక్షణకు సంబంధించిన విషయంలో త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తులు శ్రద్ధ కలిగి ఉన్నారు. తండ్రి ముందు నిర్ణయం చేశాడు, కుమారుడు దైవోగ్రతను శాంతింపచేసే యాగం చేశాడు, పరిశుద్ధాత్ముడు నూతన జన్మ కలుగచేస్తాడు. తండ్రి మనల్ని ఎన్నుకున్నాడు; కుమారుడు మన కోసమే మరణించాడు; ఆత్మ మనల్ని బ్రతికిస్తాడు. తండ్రి మన గురించి చింతించాడు, కుమారుడు మన కోసం రక్తాన్ని చిందించాడు; పరిశుద్ధాత్ముడు తన కార్యాన్ని మనలో జరిగిస్తాడు; తండ్రి చేసిన కార్యం నిత్యమైనది; కుమారుడు నెరవేర్చిన కార్యం బాహ్యమైనది; పరిశుద్ధాత్ముడు జరిగించే కార్యం అంతర్గతమైనది. ఆత్మకార్యం గురించి, మరి ముఖ్యంగా నూతనంగా జన్మింపచేయడంలో ఆయన సార్వభౌమకార్యం గురించే మనం ఇప్పుడు పరిశీలిద్దాం. తండ్రి మన నూతన జన్మని ఉద్దేశించాడు; కుమారుడు తన శ్రమల ద్వారా నూతన జన్మకు అవసరమైనదాన్ని సిద్ధం చేశాడు; పరిశుద్ధాత్ముడే నూతన జన్మను కలిగిస్తున్నాడు. అందువల్లనే “ఆత్మమూలంగా జన్మించువాడు” అనే మాటను మనం చూస్తున్నాం (యోహాను 3:6).

నూతనజన్మ అనేది పూర్తిగా ఆత్మదేవుని కార్యం, మనిషికి అందులో ఏ భాగస్వామ్యమూ లేదు. జన్మించేవాడు తన జననంలో ఎలాంటి పని కానీ, ప్రయత్నం కానీ చేయడు. ఏ విధంగానైతే మన భౌతికజననంలో మన ప్రమేయం ఏమీ ఉండదో మన ఆత్మసంబంధమైన జననంలో కూడా మన ప్రమేయం ఏమీ ఉండదు. నూతనజన్మ అనేది ఆత్మసంబంధమైన పునరుత్థానం, మరణంలో నుండి జీవంలోనికి దాటిపోవడం(యోహాను 5:24), పునరుత్థానంలో ఏ విధంగానూ మనిషి పాత్ర ఉండదు. ఈ విషయం స్పష్టం! ఏ మృతదేహమూ తన్ను తానే తిరిగి బ్రతికించుకోలేదు. అందువల్లనే “ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ప్రయోజనము” అనే మాట రాయబడింది (యోహాను 6:63).

అయితే పరిశుద్ధాత్ముడు ఎందుకు ప్రతీ ఒక్కరినీ జీవింపచేయడు? 'ఎందుకంటే ప్రతి ఒక్కరూ విశ్వసించరు కాబట్టి' అని ఈ ప్రశ్నకు సాధారణంగా జవాబు చెబుతుంటారు. విశ్వసించినవాళ్ళను మాత్రమే పరిశుద్ధాత్ముడు జీవింపచేస్తాడని కొందరు భావిస్తున్నారు. ఇది గుర్రం ముందు బండిని కట్టినట్టుంది. విశ్వాసం అనేది నూతన జన్మకు మూలం కాదు కానీ ఫలితం. రక్షణార్థమైన విశ్వాసం మనిషి హృదయంలో రూపుదిద్దుకోదు, మనిషి హృదయానికి అది ఆకర్షణీయంగా కనబడదు. ఒకవేళ విశ్వాసమనేది మానవహృదయంలో సహజంగా పుట్టేదైతే, మానవ స్వభావం సాధన చేసే సాధారణ నియమమైతే, “విశ్వాసము అందరికి లేదు” అనే మాట ఎన్నటికీ రాయబడి ఉండేది కాదు. విశ్వాసమనేది ఆత్మసంబంధమైన కృప, ఆత్మీయఫలం. ఎందుకంటే తిరిగి జన్మించనివాళ్ళు "అపరాధాల్లోనూ, పాపాల్లోనూ” చనిపోయినవారు, ఆత్మసంబంధమైన మృతులు కాబట్టి విశ్వాసముంచడం వాళ్ళకు అసాధ్యం. ఎందుకంటే మృతమైవాడు దేన్నీ నమ్మలేడు. “కాబట్టి శరీర సంబంధులు దేవుణ్ణి సంతోషపెట్టలేరు” (రోమా 8:8). శరీరానికి నమ్మడం సాధ్యమైతే వాళ్ళు సంతోషపెట్టగలిగేవాళ్ళు. దీన్ని హెబ్రీ 11:6తో పోల్చండి. “విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము”. దేవుడు తన నుండి కలగని దేనిబట్టైనా సంతోషిస్తాడా? సంతృప్తి చెందుతాడా?

మనం విశ్వసించకముందే మనలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుందనే విషయాన్ని 2 థెస్స 2:13 సుస్పష్టంగా స్థాపించింది. “ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను”. సత్యమును నమ్ముటకు” ముందే “ఆత్మ పరిశుద్ధపరచడం” అనేది వచ్చింది గమనించండి! “ఆత్మ పరిశుద్ధపరచడం” అంటే ఏమిటి? “నూతన జన్మ” అనేదే నా జవాబు. లేఖనంలో అన్ని సమయాల్లోనూ “పరిశుద్ధత, పరిశుద్ధపరచుట” అంటే 'ప్రత్యేకించబడటం' అని అర్థం. 'ఒకదాని నుండి ప్రత్యేకించబడటం', వేరొకరిని లేదా వేరొకదానిని హత్తుకోవడం అని భావం. ఇప్పుడు “ఆత్మ పరిశుద్ధపరచడం” అనే మాట “నూతనజన్మకు” సంబంధించిందనే నా జవాబునూ, అది దేవుని దృష్టిలో మన స్థానాన్ని మారుస్తుందనే నా అభిప్రాయాన్నీ సమగ్రంగా చర్చిద్దాం. దేవుని సేవకుడు ఒకాయన రక్షించబడని 100మంది ఉన్న సంఘంలో సువార్త ప్రకటిస్తున్నాడు అనుకోండి. అతడు లేఖనాలను బోధిస్తూ, నాశనమైన పతనమైన వారి స్థితిని వారికి వివరిస్తున్నాడు; దేవుని గురించీ, ఆయన స్వభావం గురించీ, ఆయన నీతి ఏమి కోరుతుంది అనే విషయాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు కోరేదంతా క్రీస్తు నెరవేర్చాడనీ, అనీతిమంతుల కోసం నీతిమంతుడు మరణించాడనీ, ఈ క్రీస్తు ద్వారా పాపక్షమాపణ ప్రకటించబడుతుందని చెబుతున్నాడు. దేవుడు తన వాక్యంలో చెప్పినదానిని నమ్మి తన కుమారుణ్ణి తమ వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించమని నశించినవారైన ఆ 100మందిని వేడుకుని ఆ సేవకుడు తన ప్రసంగాన్ని ముగించాడు. ఆ సభ ముగిసింది, సంఘం ఎక్కడి వాళ్ళక్కడకు వెళ్ళిపోయారు. అయితే 100వ వ్యక్తి జీవవాక్యాన్ని విన్నాడు, దేవుడు సిద్ధం చేసిన హృదయమనే నేల పైన వాక్యమనే విత్తనం పడింది. అతడు సువార్తను నమ్మాడు, అతని పేరు జీవగ్రంథంలో రాయబడిందనే ఆనందంతో ఇంటికెళ్ళిపోయాడు. అతడు తిరిగి జన్మించాడు. భౌతిక ప్రపంచంలో కొత్తగా జన్మించిన శిశువు నిస్సహాయతతో తన తల్లిని హత్తుకున్నట్టు, నూతనంగా జన్మించిన ఈ వ్యక్తి క్రీస్తును హత్తుకున్నాడు. “ప్రభువు లూదియ హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను” (అపొ.కా. 16:14) అని మనం చదివిన విధంగా పైన చెప్పిన ఉదాహరణలో ఆ వ్యక్తి సువార్త సందేశాన్ని విశ్వసించకముందు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తికి జీవాన్నిచ్చాడు. కాబట్టి “ఆత్మ పరిశుద్ధపరచడం” అంటే ఇదే; తిరిగి జన్మించిన ఈ వ్యక్తి మిగతా 99మంది నుండి ప్రత్యేకించబడ్డాడు. ఆత్మమూలంగా తిరిగి జన్మించినవారు అపరాధాల్లోనూ, పాపాల్లోనూ చనిపోయినవారి నుండి ప్రత్యేకించబడతారు.

మరొకసారి 2 థెస్స 2:13 చదువుదాం. “ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముటవలనను రక్షణ పొందుటకు దేవుడు మిమ్మును ఆదినుండి ఏర్పరచుకొనును గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై యున్నాము”. ఇక్కడ పౌలు ఆలోచనలో ఉన్న క్రమం అత్యంత ముఖ్యమైనది, ఉపదేశానుసారమైనది. మొదటిది :- దేవుని నిత్యమైన ఏర్పాటు; రెండవది: ఆత్మ పరిశుద్ధపరిచే కార్యం; మూడవది: సత్యాన్ని నమ్మటం. సరిగ్గా ఇదే క్రమం 1 పేతురు 1:2లో కనబడుతుంది. “తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానమునుబట్టి, ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును, ఏర్పరచబడినవారికి”. ఈ వచనంలో "విధేయత" అంటే “విశ్వాసమునకు విధేయత” అని అర్థం (రోమా 1:5). ప్రభుయేసు యొక్క ప్రోక్షించబడిన రక్తం వలన కలిగే ప్రయోజనాలను ఈ విశ్వాసం సొంతం చేసుకుంటుంది. (విశ్వాసమునకు) విధేయత (హెబ్రీ 5:9) అనేదానికి ముందు మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మకార్యం ఉంది, దానికి ముందు తండ్రియైన దేవుని ఏర్పాటు ఉంది. ఆత్మ వలన పరిశుద్ధపరచబడేవారు ఆది నుండి దేవునిచే రక్షణకు ఏర్పరచుకోబడినవారు (2 థెస్స 2:13), తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎన్నికైనవారు (1 పేతురు 1:2).

అయితే 'ప్రస్తుతం పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య లోకాన్ని పాపం గురించి ఒప్పించడం కాదా?' అని ఎవరైనా అడగడానికి అవకాశం ఉంది. అది కాదు ఆయన ప్రస్తుత పరిచర్య అని నేను జవాబిస్తున్నాను. పరిశుద్ధాత్మ పరిచర్య మూడు విధాలుగా ఉంది. క్రీస్తును మహిమపరచడం, ఎన్నికైనవారిని జీవింపచేయడం, పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి కలగచేయడం. యోహాను 16:8-11 ఆత్మ యొక్క లక్ష్యాన్ని వర్ణించట్లేదు గాని, లోకంలో ఆయన సన్నిధి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ఈ వాక్యభాగం పాపులకు క్రీస్తు ఎంత అవసరమైయున్నాడో చూపించి, వారి మనస్సాక్షులను పరిశోధించి, వారి హృదయాల్లో భయాన్ని పుట్టించే అంతరంగమైన ఆయన కార్యాన్ని గురించి ఇది మాట్లాడట్లేదు. ఈ వాక్యభాగంలో మనం చూసేది పూర్తిగా బహిరంగమైన విషయం. ఉదాహరణను గమనించండి. నేనెవరినైనా ఉరికంబం పైన వేలాడుతుండగా చూశాను అనుకోండి. ఆ విషయం నన్ను ఏమని ఆలోచింపచేస్తుంది? అతడొక ఘోరమైన నేరస్తుడనో లేదా హంతకుడనో తెలియచేస్తుంది. నేను ఆ అభిప్రాయానికి ఎలా వచ్చాను? అతని నేరచరిత్రను చదవడం వలనా? లేదా అతడు తన నోటితో చెప్పింది వినడం వలనా? కాదు, అతడు ఉరికంబంపై వేలాడుతున్న వాస్తవాన్ని బట్టే! పరిశుద్ధాత్ముడు ఇక్కడున్నాడనే వాస్తవమే లోకపు ద్వేషానికి, దేవుని నీతికి, అపవాది తీర్పుకు సాక్ష్యమిస్తుంది.

పరిశుద్ధాత్ముడు ఇక్కడ అస్సలుండాల్సిన అవసరం లేదు. ఇది కలవరాన్ని కలిగించే మాట, అయితే ఉద్దేశపూర్వకంగానే నేను ఈ మాట చెప్పాను. ఇక్కడ ఉండాల్సినవాడు క్రీస్తు. తండ్రి ఆయనను ఇక్కడికి పంపించాడు. లోకం ఆయనను కోరుకోలేదు, ఆయనను ఇష్టపడలేదు, ఆయనను ద్వేషించి బయటకు నెట్టేసింది. ఆయన స్థానంలో పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఉండటము లోకం యొక్క దోషానికి రుజువుగా ఉంది. ప్రభు యేసు యొక్క పునరుత్థానం, ఆరోహణ, మహిమలకు సాక్ష్యంగా పరిశుద్ధాత్మ యొక్క రాకడ ఉంది. ఇశ్రాయేలు యొక్క ప్రధాన యాజకుని ఇంటి ఆవరణలోను, రోమా అధిపతి ప్రాంగణంలోను జరిగిన దేవదూషణకరమైన తీర్పును, అంటే భూమిపై లోకపు తీర్పును దేవుడు లక్ష్యపెట్టలేదని పరిశుద్ధాత్మ భూమిపై ఉండటం తెలియచేస్తుంది. లోకం అతని సాక్ష్యాన్ని అంగీకరించినా, తృణీకరించినా పరిశుద్ధాత్మ చేసే ఖండన నిలిచే ఉంటుంది.

మనుషులకు క్రీస్తు అవసరం గురించి అవగాహన కలిగిస్తూ వారిలో జరిగించే కృపాకార్యం పరిశుద్ధాత్ముడు చేస్తాడని మన ప్రభువు యొక్క ఉద్దేశం అయ్యుంటే, మనుషులకు వాళ్ళ దుర్నీతి గురించి అంటే నీతి లేకపోవడం గురించి పరిశుద్ధాత్మ వాళ్ళను ఒప్పించేవాడని యేసే చెప్పి ఉండేవాడు. అయితే ఇక్కడ ప్రభువు ఉద్దేశం అది కానే కాదు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దిగిరావడం దేవుని నీతినీ క్రీస్తు యొక్క నీతినీ స్థాపిస్తుంది. క్రీస్తు తండ్రి దగ్గరకు వెళ్ళాడనే విషయమే దానికి రుజువు. క్రీస్తును వంచకుడని ఆనాటి యూదుల మతాధికారులు ఆయనను తృణీకరించారు. ఒక వేళ అదే నిజమైతే తండ్రి ఆయనను స్వీకరించేవాడు కాదు. తండ్రి క్రీస్తును ఘనపరచి తన కుడి పార్శ్వాన ఆయనను కూర్చుండబెట్టుకున్నాడనే వాస్తవమే యూదులు ఆయనపై మోపిన ఆరోపణలన్నిటి విషయంలో క్రీస్తు నిర్దోషి అని రుజువు చేస్తోంది. తండ్రి క్రీస్తును స్వీకరించాడనే దానికి సాక్ష్యమే ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్ముని సన్నిధి, ఎందుకంటే క్రీస్తు పరిశుద్ధాత్మను తండ్రి దగ్గర నుండి పంపించాడు (యోహాను 16:7)! లోకం యేసును వెళ్ళగొట్టి దుర్నీతిమయం అయ్యింది, ఆయనను మహిమపరచి తండ్రి నీతిమంతుడయ్యాడు; ఇక్కడున్న ఆత్మసన్నిధి దీన్నే స్థాపిస్తుంది. “ఈ లోకాధికారి తీర్పు పొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనచేయును” (వ.11). ఇదే తార్కికమైన, తప్పనిసరైన ముగింపు. క్రీస్తును తృణీకరించినందుకు, ఆయనను స్వీకరించడానికి నిరాకరించినందుకు లోకం దోషి అయింది. తృణీకరించబడిన (యేసును) ఘనపరచి తండ్రి లోకంపై తీర్పును ప్రదర్శించాడు. కేవలం తీర్పు తప్ప మరేదీ లోకం కోసం, దాని అధికారి కోసం ఎదురుచూడట్లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉండటాన్ని బట్టి ఇప్పటికే సాతానుకు తీర్పు స్థాపించబడింది, ఎందుకంటే మరణ బలం కలిగిన అపవాదిని క్రీస్తు తన మరణం ద్వారా జయించాడు (హెబ్రీ 2:14). పరిశుద్ధాత్ముడు ఈ భూమిని విడిచిపెట్టడానికి దేవుడు నిర్ణయించిన సమయం వచ్చినప్పుడు సాతానుకు, లోకానికి ఆ శిక్ష విధించబడుతుంది. అందుకే క్రీస్తు చెప్పిన మాటలు మనల్ని ఆశ్చర్యపరచకూడదు. “ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు” (యోహాను 14:17) లోకం ఆయనను కోరుకోదు; ఆయన లోకానికి శిక్ష విధిస్తాడు.

“ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు లోకాధికారి తీర్పుపొంది యున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనచేయును” (యోహాను 16:8-11). పరిశుద్ధాత్మ భూమిపై ఉండటం లోకానికి మూడు విషయాలను చూపిస్తోంది. మొదటిది, లోకం క్రీస్తునందు విశ్వాసముంచడానికి నిరాకరించింది కనుక దాని పాపం గురించి. రెండవది, తృణీకరించబడిన యేసును లోకం చూడకుండా, తన కుడి పార్శ్వమున చేర్చుకోవడంలో దేవుని నీతి గురించి. మూడవది, లోకాధికారి అయిన సాతానుకు ఇప్పటికే తీర్చబడిన తీర్పు గురించి; అయితే ఆ తీర్పు అమలు చేయబడేది భవిష్యత్తులోనే.

పరిశుద్ధాత్ముడు తన కార్యాల్లో సార్వభౌముడు; ఆయన పరిచర్య దేవుని ఏర్పాటులో ఉన్నవారికే పరిమితమై ఉంటుంది. వాళ్ళనే ఆయన ఆదరిస్తాడు, ముద్రిస్తాడు, సర్వసత్యంలోకి నడిపిస్తాడు, జరగబోయే సంగతుల్ని చూపిస్తాడు. తండ్రి యొక్క నిత్యసంకల్పం పూర్తిగా నెరవేరడానికి పరిశుద్ధాత్మ కార్యం అత్యవసరం. దేవుడు కేవలం పాపుల నిమిత్తం క్రీస్తును మరణానికి అప్పగించి ఊరుకుంటే ఒక్క పాపి కూడా ఎన్నటికీ రక్షించబడడు. పాపి రక్షకుని యొక్క అవసరాన్ని చూడడానికి, తనకు అవసరమైన రక్షకుణ్ణి స్వీకరించే ఇష్టం కలగడానికి అతనిలో పరిశుద్ధాత్మ కార్యం జరగాలి.

దేవుడు కేవలం క్రీస్తును పాపుల కోసం మరణించడానికి అప్పగించి, క్రీస్తు ద్వారా రక్షణ ప్రకటించడానికి తన సేవకుల్ని పంపించి, పాపుల్ని పూర్తిగా వాళ్ళ ఇష్టానికే విడిచిపెట్టి, వాళ్ళకు నచ్చితే క్రీస్తును అంగీకరించమని నచ్చకపోతే తృణీకరించమని విడిచిపెడితే, ప్రతీ పాపి క్రీస్తును తృణీకరించి ఉండేవాడు, ఎందుకంటే ప్రతీ వ్యక్తి హృదయంలో దేవుణ్ణి ద్వేషిస్తాడు, ఆయనకు శత్రువుగానే ఉన్నాడు. అందువల్ల పాపిని క్రీస్తు దగ్గరకు తీసుకురావడానికి, తనలోని వ్యతిరేకతను అధిగమించడానికి, దేవుడు సిద్ధం చేసినదానిని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ కార్యం అవసరం. పాపిని ఆయన బలవంతం చేస్తాడు అని నేను అంటున్నాను. ఇదే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు, చేయాల్సిన అవసరముంది. 'బలవంతం చేయడం' అనే పదం 'లోపలికి పరిశుద్ధాత్ముడు ఎవరిని తీసుకొస్తాడో వాళ్ళు రావడానికి ఇష్టం చూపించరు' అని స్పష్టంగా తెలుపుతుంది. స్వభావరీత్యా దేవునిచే ఏర్పరచబడినవారు కూడా ఇతరులవలే ఉగ్రతపాత్రులైన పిల్లలు (ఎఫెసీ 2:3), అందువల్ల వాళ్ళ హృదయాల్లో దేవుడంటే శతృత్వం ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు ఆ శతృత్వాన్ని అధిగమిస్తాడు. వాళ్ళు వచ్చే విధంగా ఆయన బలవంతం చేస్తాడు. 

సారాంశం ః

దేవుని మార్గాల్లో ఉన్న పరిపూర్ణ ఐక్యతను చూపించటానికి నేను ప్రయత్నించాను. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఒకరితో మరొకరు అన్ని విషయాల్లోనూ సంపూర్ణంగా ఏకీభవిస్తారు. తండ్రియైన దేవుడు కొంతమందిని రక్షణ కోసం ఎన్నుకున్నాడు, కుమారుడైన దేవుడు ఎన్నుకున్నవారి కోసం మరణించాడు, పరిశుద్ధాత్ముడు ఎన్నికున్నవారిని జీవింపజేస్తాడు.

 

అధ్యాయం 5

నిత్యనాశనంలో దేవుని సార్వభౌమత్వం

“కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయినవారిమీద కాఠిన్యమును .... చూడుము” (రోమా 11:22)

గత అధ్యాయంలో, రక్షణలో తండ్రియైన దేవుని సార్వభౌమత్వాన్ని అధ్యయనం చేసినప్పుడు 7 వాక్యభాగాలను పరిశీలించాము. ఈ వాక్యభాగాలు ఆయన మనుషుల్లో నుండి కొంతమందిని ఎన్నిక చేసుకున్నాడనీ, కొంతమందిని తన కుమారునితో సారూప్యముగలవారు అవడానికి ముందుగానే నిర్ణయించుకున్నాడని తెలియచేస్తున్నాయి. 'మరైతే నిత్యజీవానికి నియమించబడని వారి పరిస్థితి ఏంటి?” అని ఆలోచించే పాఠకుడు సహజంగానే అడుగుతాడు. 'ఎన్నుకోబడనివాళ్ళు దేవుని మార్గాన్ని తిరస్కరించారు కాబట్టి, ఆయన నియమించిన రక్షకుణ్ణి తృణీకరించారు కాబట్టి దేవుడు వాళ్ళను దాటిపోయి, వాళ్ళను తమ సొంత మార్గానికి విడిచిపెట్టి చివర్లో అగ్నిగుండంలో వాళ్ళను పడవేస్తాడు' అని ఈ ప్రశ్నకు సాధారణంగా జవాబు చెబుతుంటారు. ఇలా జవాబు చెప్పేవాళ్ళలో దేవుని సార్వభౌమత్వం గురించి లేఖనాలు బోధిస్తున్నదాన్ని నమ్ముతున్నామని చెప్పుకునేవారు కూడా ఉన్నారు. అయితే ఇది కేవలం సత్యంలో ఒక భాగం మాత్రమే; మిగిలిన సగభాగం అత్యంత కఠినమైన సత్యం. అందువల్లనే శరీరసంబంధమైన మనసున్నవాళ్ళు ఈ సత్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు, తృణీకరిస్తుంటారు.

మనం చర్చిస్తున్నది ఎంతో గంభీరమైన అంశం. తమను తాము కాల్వినిస్టులుగా చెప్పుకునేవాళ్ళు కూడా దీన్ని తృణీకరిస్తున్నారు. దేవుని సార్వభౌమత్వం గురించిన సత్యం అత్యంత మర్మయుక్తమైనది, వివాదాస్పదమైనది. అయినంతమాత్రాన మనం ఈ సత్యాన్ని తిరస్కరించాల్సిన హేతువేదీ లేదు. కొందరైతే తమ పరిమితమైన సామర్థ్యాలకు తగినవాటిని, తాము సంతృప్తికరంగా జవాబులు చెప్పగలిగిన అంశాలను మాత్రమే అంగీకరించి, కొన్ని మింగుడుపడని సత్యాలను విస్మరిస్తున్నారు. ఇది తగని పని.

'దేవుడు కొందరిని నాశనానికి నియమించాడా?' ఆలోచించండి! చాలామంది నిత్యనాశనానికి గురవుతారని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి; ప్రతివాడు తాను చేసిన క్రియలను బట్టి తీర్పు పొందుతాడనీ, తాను విత్తినదాన్నే కోస్తాడనీ, దానికి ప్రతిఫలంగా కలిగే నాశనం న్యాయమైందనీ (రోమా 3:8) బైబిల్ బోధిస్తోంది. ఎన్నుకోబడనివాళ్ళు ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోవాలన్నది దేవుని నిర్ణయమని ఇప్పుడు నేను లేఖనం నుండి రుజువు చేస్తాను.

కొంతమందిని దేవుడు రక్షణ కోసం ఎన్నుకున్నాడని చూశాము. మిగతావారి గురించి ఒకవేళ లేఖనాలు మౌనంగా ఉన్నా, వాళ్ళు తృణీకరించబడ్డారని మనం చెప్పవచ్చు. ప్రతీ ఎన్నిక, స్పష్టంగా తప్పనిసరిగా తృణీకారాన్ని సూచిస్తోంది. ఎందుకంటే దేనినీ, ఎవరినీ విడచిపెట్టకపోతే ఎన్నిక చేసుకోవడమనేది ఉండనే ఉండదు. దేవుడు రక్షణ కోసం ఏర్పరచుకున్న కొందరున్నారంటే (2 థెస్స 2:13), రక్షణ కోసం ఏర్పరచుకోబడనివాళ్ళు కూడా కొంతమంది ఉండి తీరాలి. తండ్రి క్రీస్తుకి అనుగ్రహించినవాళ్ళు (యోహాను 6:37) కొందరున్నారంటే, క్రీస్తుకు ఆయన అనుగ్రహించని ఇతరులు కూడా కొంతమంది ఉండి తీరాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు రాయబడినవాళ్ళు కొంతమంది ఉన్నారంటే, ఆ గ్రంథంలో పేర్లు రాయబడనివాళ్ళు కూడా ఉండి తీరాలి. ఇదే విషయాన్ని నేను పూర్తిగా నిరూపించాలనుకుంటున్నాను.

జగత్తు పునాది వేయబడకముందే ఎవరు క్రీస్తును తమ రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరు ఆయనను తృణీకరిస్తారో దేవునికి ఖచ్చితంగా ముందే తెలుసనీ, ముందే చూసాడనీ అందరూ ఒప్పుకుంటారు. ఎవరు క్రీస్తును తృణీకరిస్తారో తెలిసి కూడా దేవుడు వాళ్ళకు ఉనికినీ, జననాన్నీ ఇచ్చాడంటే తప్పనిసరిగా వాళ్ళను ఆయన నాశనం కోసమే సృష్టించాడు. దీన్ని విన్న వెంటనే అందరూ 'ఇది నిజం కాదు, వీళ్ళు క్రీస్తును తృణీకరిస్తారని దేవునికి ముందే తెలుసు కానీ అలా తృణీకరించాలని ఆయన నిర్ణయించలేదు' అని కొందరంటారు. కానీ ఈ సమాధానం అసలు ప్రశ్నకు సరిపోయినది కాదు. దేవుడు ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో మనుష్యులను సృష్టించాడు, ఈ వ్యక్తిని లేదా ఆ వ్యక్తిని సృష్టించటం వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, వారి అంతిమ గమ్యం విషయంలో, ఫలానా వ్యక్తి పరలోకంలో నిత్యమూ ఉండాలని లేదా ఫలానా వ్యక్తి అగ్నిగుండంలో నిత్యమూ ఉండాలని ఆయన సంకల్పించాడు. ఒక వ్యక్తిని సృష్టించకముందే అతడు రక్షకుణ్ణి తృణీకరిస్తాడనీ ముందే తెలిసి, అలా తెలిసినా అతన్ని దేవుడు ఉనికిలోకి తీసుకొస్తున్నాడు అంటే, అతడు నిత్యనాశనం పొందాలని ఆయన ఉద్దేశించాడనీ, నియమించాడనీ స్పష్టమవుతోంది.

విశ్వాసమనేది దేవుడిచ్చే బహుమానం. ఆ విశ్వాసాన్ని కొంతమందికే ఇవ్వడం యొక్క ఉద్దేశం ఇతరులకు దాన్ని ఇవ్వకుండా ఉండడమే. విశ్వాసం లేకుండా రక్షణ లేదు. “విశ్వసించువాడు నశించడు”. కాబట్టి ఆదాము సంతానంలో కొంతమందికి విశ్వాసాన్ని ఇవ్వకూడదని ఆయన ఉద్దేశించడాన్ని బట్టి వాళ్ళు నశించాలనే ఆయన నియమించినట్లు అర్థమవుతోంది.

చరిత్ర కూడా ఈ వాస్తవాన్ని నిర్ధారిస్తుంది. యేసు శరీరధారణకు ముందు, సుమారు 2వేల సంవత్సరాలు మానవజాతిలో అత్యధిక శాతానికి దేవుడు కృప చూపించిన దాఖలాలు లేవు. అంటే వాళ్ళకు దేవుని వాక్యప్రకటన లేదు, దేవుని చిత్తాన్ని వెల్లడి చేసే లేఖనాలు ఎన్నో శతాబ్దాలుగా తనను తెలుసుకునే ప్రత్యేకమైన ఆధిక్యతను కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే అనుగ్రహించాడు. “ఆయన గతకాలములో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను” (అపొ.కా. 14:16). “భూమిమీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను” (ఆమోసు 3:2). ఫలితంగా ఇతర దేశాలన్నిటికీ దేవుని వాక్యప్రకటన వినే అవకాశం దక్కలేదు. అందువల్ల వాళ్ళు విశ్వాసాన్ని పొందలేదు, ఎందుకంటే 'వినుటవలననే విశ్వాసం కలుగుతుంది' (రోమా 10:17). ఈ దేశాల ప్రజలకు దేవుని గురించి అవగాహన లేకపోవడమే కాదు, ఆయనను సంతోషపెట్టే మార్గం, ఆయనతో సమాధానపడే మార్గం, ఆయనను శాశ్వతకాలం ఆస్వాదించే మార్గం కూడా వాళ్ళకు తెలియదు.

దేవుడు వాళ్ళకు రక్షణ ఇవ్వదలిస్తే, రక్షణ పొందేందుకు మార్గాన్ని కూడా వాళ్ళకు అనుగ్రహించడా? వాళ్ళ రక్షణకు అత్యవసరమైనవి కూడా వాళ్ళకు అనుగ్రహించి ఉండేవాడు కాడా? తప్పనిసరిగా అనుగ్రహించి ఉండేవాడు. కాని రక్షింపబడడానికి అవసరమైనవన్నీ ఆయన వాళ్ళకు అనుగ్రహించలేదన్నది ఎవ్వరూ తృణీకరించలేని వాస్తవం. కొందరికి వారి పాపాల కారణంగా రక్షణకు అవసరమైన కృపాసాధనాలు అందించకుండా తీవ్రమైన అంధకారంలోనూ, అవిశ్వాసంలోనూ బంధించడం, దేవుని న్యాయం, కృప మరియు కనికరానికి విరుద్ధం కానప్పుడు, కొందరికి, లేదా అనేకులకు కృపనే అందించకుండా, దాని వలన కలిగే నిత్యజీవాన్ని కూడా అందించకుండా ఉంటే అది ఆయన పరిపూర్ణ గుణలక్షణాలకు విరుద్ధమని ఎందుకు అనుకోవాలి?

సువార్త అందని లెక్కలేనంతమంది అన్యజనుల సంగతి విడిచిపెట్టి ప్రస్తుతం మన దేశప్రజల గురించి ఆలోచించండి. సువార్త ప్రకటించబడే దేశాల్లో, సంఘాలతో నిండిపోయిన దేశాల్లో, దేవునికీ ఆయన పరిశుద్ధతకూ అపరిచితులుగా ఉంటూ మరణించేవారు అనేకమంది లేరా? కృపాసాధనాలు వారికి అందుబాటులో ఉన్నాయనేది సత్యం, అయితే చాలామంది వాటిని తెలుసుకోలేదు. క్రైస్తవులందరినీ వేషధారులుగానూ, ప్రసంగీకులందర్నీ ఘోరమైన వంచకులుగానూ పరిగణించమని ఉగ్గుపాలతోనే నేర్పించబడినవాళ్ళు వేలసంఖ్యలో ఉన్నారు. మరికొందరు పసితనం నుంచి రోమన్ కేథలిక్ బోధల్లో పెరుగుతూ ఇవాంజెలికల్ క్రైస్తవ్యాన్ని ప్రాణాంతకమైన తప్పుడు బోధగానూ, చదవడానికి బైబిల్ అత్యంత హానికరమైన గ్రంథంగానూ పరిగణించాలని శిక్షణ పొందుతున్నారు. కొందరు 'క్రిస్టియన్ సైన్సు' అనే తప్పుడుబోధను నమ్మే కుటుంబాల్లో పుట్టి పెరగడం వలన సువార్తనెరుగని అన్యజనుల మాదిరిగానే క్రీస్తును గురించిన సత్యసువార్తను ఏ మాత్రమూ ఎరగడం లేదు. శాంతి మార్గాన్ని తెలుసుకోకుండానే వీరిలో అధికశాతం ఎంతో అజ్ఞానంలో మరణిస్తున్నారు. వీళ్ళందరికీ కృపను చూపించడం దేవుని చిత్తం కాదని మనకు స్పష్టం కావట్లేదా? నిజంగా వారికి ఆయన కృప చూపించాలకుంటే, చూపించగలిగేవాడు కాదా? ప్రస్తుతకాలంలో తన కృప వాళ్ళకు చూపించడానికి నిరాకరిస్తున్నాడంటే, నిత్యత్వమంతా ఆయన చిత్తం అదే అయ్యుండాలి. ఎందుకంటే ఆయన చిత్తం కూడా ఆయన మాదిరిగానే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది. దేవుడు అనుగ్రహిస్తున్నవి ఆయన శాసనాల ప్రత్యక్షతలు; ప్రస్తుత కాలంలో దేవుడు చేస్తున్నవి, నిత్యత్వంలో ఆయన సంకల్పించాడు. ఆయన చర్యలన్నిటికీ మూలం ఆయన చిత్తమే కాబట్టి ఈ మాట చెబుతున్నాను. నిజానికి కొందరిని పశ్చాత్తాపం లేని స్థితిలో, అవిశ్వాసంలో ఆయన విడిచిపెడుతున్నాడు కాబట్టి అదే ఆయన నిత్యసంకల్పమని మనం తప్పనిసరిగా అనుకోవచ్చు; అందువల్ల జగత్తు పునాది వేయబడకముందే ఆయన కొందరిని తృణీకరించాడు.

'జరగబోయే సంగతులన్నింటినీ దేవుడు అత్యంత జ్ఞానం కలిగిన పరిశుద్ధమైన తన చిత్తానుసారంగా, స్వేచ్ఛగా, మార్పు లేని విధంగా నిత్యత్వం నుంచే నియమించాడు' అని వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ తెలియచేస్తోంది. ఈ మాటలపై వాఖ్యానిస్తూ 'సంభవించబోయే సంగతులు ఏవైనా వాటిని దేవుడు తన మహిమ కోసం నియమించుకున్నాడనే మాట అక్షరసత్యం' అని F.W. Grant అనే భక్తుడు చెప్పాడు. మానవచరిత్రలో ప్రతిరోజూ జరుగుతున్నదేంటి? ఈ లోకాన్ని విడిచిపెట్టి మనుషులు నిరీక్షణ లేని నిత్యత్వంలోకి, శ్రమలూ, శాపమూ ఉన్న నిత్యత్వంలోనికి వెళ్ళిపోవడమే! జరగబోయే ప్రతీ సంగతినీ దేవుడు ముందుగానే నియమించాడంటే, అగ్నిగుండంలో నిత్యమూ వేదన అనుభవించడానికి విస్తారమైన సంఖ్యలో మనుషులు రక్షించబడకుండానే ఈ లోకాన్ని విడిచిపెట్టాలని ఆయన నిర్ణయించి ఉంటాడు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే ఇది సమంజసంగా అనిపించట్లేదా?

కొందరు పై పారాగ్రాఫులు చదివి మీరు చెప్పినవన్నీ తర్కబద్ధంగానే ఉన్నాయి కానీ అవి కేవలం ఊహలు మాత్రమే అనే అవకాశముంది. అయితే ఈ గంభీరమైన సత్యాన్ని ఎంతో స్పష్టంగా బోధించే అనేక వాక్యభాగాలను మీ ముందు ఉంచుతాను. ఇవి ఎవ్వరూ అపార్థం చేసుకోనంత స్పష్టంగానూ, ఎవ్వరూ తోసిపుచ్చలేనంత బలంగానూ ఉన్న వాక్యభాగాలు. ఎంతోమంది మంచి భక్తులు ఇంత స్పష్టమైన లేఖనభాగాలను తృణీకరించడం ఆశ్చర్యంగా ఉంది.

“బహు దినములు యెహోషువా ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైనహివ్వీయులు గాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరిఏదియు లేదు. ఆ పట్టములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలియులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు వారి హృదయములను కఠినపరచియుండెను” (యెహో 11:18-29). ఇంతకన్నా స్పష్టత ఏముంటుంది? ఇక్కడ విస్తారమైన సంఖ్యలో కనానీయులున్నారు, వాళ్ళ హృదయాలను యెహోవా కఠినపరిచాడు, ఆయన వారిని సమూలంగా నాశనం చేయాలని ఉద్దేశించాడు, ఆయన వాళ్ళకు ఎలాంటి దయ చూపించలేదు; వాళ్ళు దుష్టులు, దుర్నీతిపరులు, విగ్రహారాధికులు అనే విషయాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అయితే వాళ్ళు దక్షిణ సముద్ర ద్వీపంలోని దుర్నీతిపరులు, నరమాంస భక్షకులు అయిన ప్రజలకంటే (అలాంటి అనేక దేశాల ప్రజలకంటే) దుర్మార్గులా? కానే కారు. ఈ దక్షిణ సముద్ర ద్వీపవాసులకు దేవుడు జాన్ జి. పేటన్ ద్వారా సువార్తను అనుగ్రహించాడు. కానీ ఆ కనానీయులకు తన ధర్మశాస్త్ర విధులను బోధించమనీ, నిజ దేవునికి బలులు అర్పించడం గురించి ఉపదేశించమనీ యెహోవా ఇశ్రాయేలీయులకు ఎందుకు ఆజ్ఞాపించలేదు? ఎందుకంటే కనానీయులను నాశనం కోసం ఆయన సిద్ధం చేశాడని స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ప్రణాళిక నిత్యత్వమంతటా ఆయన కలిగి ఉన్నాడు.

“యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగచేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగచేసెను” (సామెతలు 16:4). ప్రభువే ప్రజలందరినీ సృష్టించాడనే మాటను ఈ పుస్తకాన్ని చదివే ప్రతీ వ్యక్తి అంగీకరిస్తాడు. తన కోసమే దేవుడు అందరినీ తయారు చేసుకున్నాడని మాత్రం కొందరు నమ్మరు. మనల్ని మన కోసం కాదు ఆయన కోసమే నిర్మించుకున్నాడు. ఈ మాటల్ని లేఖనం పదే పదే తెలియచేస్తుంది. (ప్రకటన 4:11). అయితే సామెతలు 16:4 ఇంకాస్త ముందుకెళ్ళి, యెహోవా భక్తిహీనులను కలుగచేసింది నాశనదినం కోసమే అని స్పష్టంగా ప్రకటిస్తుంది. వాళ్ళకు ఉనికినివ్వడానికి ఆయనకున్న కారణం అదే. రోమా 9:17 కూడా ఇలా మనకు చెబుతుంది, “మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను. నేను నీ యందు నా బలము చూపుటకును, నా నామము భూలోక మందంతటప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని”. దేవుడు తన శక్తిని ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే దుష్టుల్ని కలుగచేశాడు. కఠినాత్ముడైన తిరుగుబాటుదారుణ్ణి అణిచివేయడం, బలమైన శత్రువుని కూలద్రోయడం తనకు ఎంత సులభమో దేవుడు లోకానికి చూపిస్తున్నాడు. “అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును” (మత్తయి 7:23). “ఎరుగుట” అనే మాట దేవుని విషయంలో ఉపయోగించబడినప్పుడు, అది ఆయన వ్యక్తిగతమైన జ్ఞానాన్ని, ఆమోదాన్ని సూచిస్తోంది. “భూమిమీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను” అని చెప్పినప్పుడు 'నీకు మాత్రమే నేను కృపాకనికరాలు చూపించాను' అని ఆయన ఉద్దేశం. దేవుడు తన ఇశ్రాయేలును “విసర్జింపలేదు” (రోమా 11:2) అని మనం చదువుతున్నాం. 'దేవుడు తన ప్రేమకు పాత్రులుగా ఏర్పాటు చేసుకున్న ఆ ప్రజలను తృణీకరించలేదు' అని స్పష్టమవుతోంది, (ద్వితీ 7:7,8తో పోల్చండి). అదేవిధంగా మత్తయి 7:23ని మనం అర్థం చేసుకోవాలి. తీర్పు రోజున ప్రభువు చాలామందితో “నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను” అంటాడు. గమనించండి “మీరు నాకు తెలియదు” అనే మాట కంటే ఇది ఎక్కువే. ఆయన చేసే గంభీరమైన ప్రకటన “నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను” అంటే “నేను మిమ్మల్ని ఎన్నడూ ఆమోదించలేదు' అని అర్థం. దీనికి భిన్నంగా “నా గొర్రెలను నేను ఎరుగుదును (ప్రేమిస్తున్నాను) అవి నన్ను ఎరుగును (ప్రేమిస్తాయి)” (యోహాను 10:14). తన గొర్రెల్ని, తాను ఏర్పరచుకున్నవారిని, ఆ కొంతమందినీ ఆయన ఎరుగును. అయితే భక్తిహీనులను ఎన్నిక చేయడు, వారిని, ఆ అనేకులనూ ఆయన ఎరుగడు, జగత్తు పునాది వేయబడకముందు కూడా వాళ్ళను ఆయన ఎరుగడు.

ఎన్నుకోబడినవారి విషయంలోను, ఎన్నుకోబడనివారి విషయంలోను దేవుని సార్వభౌమత్వం గురించి రోమా పత్రిక 9వ అధ్యాయం సమగ్రంగా చర్చిస్తోంది. ఇంత ముఖ్యమైన అధ్యాయానికి సమగ్రంగా వ్యాఖ్యానం చెప్పడం మనకు ప్రస్తుతం సాధ్యం కాదు. అందువల్ల మనం అధ్యయనం చేస్తున్న అంశాన్ని నేరుగా బోధించే వచనాల పైన దృష్టి పెడదాం.

వచనం 17- "మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను నేను నీ యందుబలము చూపుటకును నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని”. ఈ వచనంలోని మాటలు 13,14 వచనాలకు ముడిపడి ఉన్నాయి. 13వ వచనంలో యాకోబు యెడల దేవుని ప్రేమ, ఏశావు యెడల ఆయన ద్వేషం ప్రకటించబడ్డాయి. “దేవుని యందు అన్యాయము కలదా?” అని 14వ వచనంలో పౌలు అడుగుతున్నాడు. ఇక్కడ 17వ వచనంలో ఆ అభ్యంతరానికి అపొస్తలుడు తన జవాబు చెప్పడాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ వచనంపై కాల్విన్ వ్యాఖ్యల్ని మనం గమనిద్దాం. 'ఇక్కడ మనం గమనించాల్సిన రెండు విషయాలున్నాయి. ఫరోని నాశనం చేయాలనే ముందు ర్ణయం మొదటిది: ఇది గతకాలంలో దేవుడు చేసుకున్న రహస్య ప్రణాళిక, అది మనకు దాచబడింది. రెండవది: ఫరోని నాశనం చేయడం వెనకున్న ఉద్దేశం : దేవుని నామాన్ని ప్రచురం చేసుకోవడం. కొందరు ఈ వచనానికి వక్రభాష్యం చెప్పడానికి ప్రయాసపడుతున్నారు. అయితే మనం మొదటిగా గమనించాల్సిన మాట "నేను నిన్ను నియమించితిని”. దేవుడు ఫరో యొక్క అత్యాగ్రహాన్ని ముందుగానే చూశాడు. దాన్ని నిరోధించడానికి మార్గాన్ని సిద్ధం చేసి,దాన్ని అమలు చేసి, ఫరో నాశనాన్ని ఆపగలడు. అయితే ఫరోయొక్క ఆగ్రహాన్ని నియంత్రించాలని దేవుడు అనుకోలేదు; ఫరో తన కోపాన్ని కొనసాగిస్తే, దేవుడు తన ఉగ్రతను ఫరోకి చూపించి తన శక్తిని ఎంతో అద్భుతంగా కనపరచవచ్చు. అందుకే దేవుడు ఫరోని నియమించాడు'. నిజానికి “నేను నిన్ను నియమించాను” అనే మాటపైనే ఈ సిద్ధాంతం, వాదం ఆధారపడి ఉన్నాయి కాబట్టి పౌలు ఆ రోజుల్లో సర్వసాధారణంగా ఉపయోగించిన LXX వాచకం (సెప్టువజింట్)లో ఉండే "ఇందుకోసమే నీవు భద్రపరచబడ్డావు” అనే మాటను పక్కన పెట్టి హీబ్రూ భాషలో ఉన్న “నేను నిన్ను నియమించితిని” అనే మాటను పౌలు తీసుకున్నాడు.

ఫరో సంఘటన మనిషికి, అతని సృష్టికర్తకు మధ్యనున్న గొప్ప వివాదానికి బలమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇప్పుడు మనం ఈ విషయాన్ని మరింత సమగ్రంగా పరిశీలించాలి. “భూమిమీద ఉండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును. నాబలమును నీకు చూపునట్లును, భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని” (నిర్గమ 9:15,16). ఈ మాటలకు నేను కిందున్న వివరణ ఇస్తున్నాను.

మొదటిగా : నిర్గమ 14,15 అధ్యయాలలో ఫరోను, తన దుర్మార్గతను బట్టి దేవుని హస్తమే కొట్టివేసిందని మనకు తెలుసు. వృద్ధాప్యాన్ని బట్టి వచ్చే వ్యాధుల వలనో, అనుకోని ప్రమాదాల వలనో కాదు కానీ దేవుని తీర్పుకు గురయ్యే ఫరో మరణించాడు.

రెండవదిగా : కొట్టివేయడానికే, కొత్త నిబంధన భాషలో చెప్పాలంటే, నాశనం చేయడానికే ఫరోని దేవుడు నియమించాడు. ముందు ప్రణాళిక వేసుకోకుండా దేవుడు ఎన్నడూ ఏ కార్యమూ చేయడు. అతనికి ఉనికినివ్వడంలో, పసితనంలో, బాల్యంలో అతన్ని భద్రపరిచే విషయంలో, ఐగుప్తు సింహాసనం అధిరోహింపచేయడంలో దేవునికున్న లక్ష్యం అదే. మోషే ఐగుప్తుకు వెళ్ళి దేవుని ప్రజల్ని అరణ్యంలోకి 3 రోజుల దూరమంత ప్రయాణం చేయనిచ్చి, ఆయనను ఆరాధించడానికి పంపాలని ఫరోని అడగకముందే దేవునికి ఈ ఉద్దేశం ఉందని స్పష్టమౌతుంది. “అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. అతడు ఈ జనులను పోనియ్యడు” (నిర్గమ 4:21). ఇంతే కాదు, దేవుని ఉద్దేశం దీనికంటే చాలాకాలం క్రితమే ప్రకటించబడింది. మోషేకు ఈ మాటలు చెప్పడానికి 400 సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రాహాముతో ఇలా చెప్పాడు - "నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు” (ఆది 15:13, 14). ఫరోకు ఉనికినివ్వడానికి ఎంతోకాలం ముందే ఇది దేవుని ఉద్దేశమని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

మూడవదిగా ఫరోతో దేవుడు వ్యవహరించిన విధానాన్ని పరిశీలిస్తే, ఐగుప్తురాజు నిజానికి నాశనం కోసం సిద్ధపరచబడిన ఉగ్రతపాత్ర ఘటంగా ఉన్నాడని స్పష్టమవుతోంది. ఐగుప్తు సింహాసనంపై దేవుడు అతన్ని కూర్చోబెట్టాడు, పరిపాలనా పగ్గాలు అతని చేతికప్పగించాడు. ఆనాటి ప్రపంచ దేశాల్లో మహాశక్తివంతమైన దేశానికి అతడు అధిపతిగా ఉన్నాడు. ఆనాడు ఫరోని నియంత్రించగలిగే, శాసించగలిగే చక్రవర్తి ఒక్కడు కూడా లేడు. ఇంతటి ఉన్నత స్థానానికి దేవుడు ఈ భక్తిహీనుణ్ణి లేవనెత్తాడు. అతని అంతిమస్థితికి అతడిని సిద్ధపరచడానికి అదొక సహజమైన, అత్యవసరమైన మార్గం. దేవుని వాక్యం ఇలా చెబుతోంది, “నాశనమునకు ముందు గర్వము నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును” (సామె 16:18). అంతేకాదు ఫరో ప్రవర్తనను ప్రశ్నించి బాహ్యమైన ప్రతీ బంధకాన్ని దేవుడు తొలగించాడు. ఇది చాలా ముఖ్యమైన, లోతైన విషయం. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫరోని రాజుగా చేసి అతనికి అపరిమితమైన అధికారాన్నిచ్చి ఎలాంటి చట్టమూ అధికారమూ అతనిపై లేకుండా దేవుడు చేశాడు. దీనికి తోడు అతని ఎదుట నుండి, అతని రాజ్యం నుండి మోషేను దేవుడు తొలగించాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి "..మాటలయందును, కార్యములయందును ప్రవీణుడై యుండెను”. ఒక వేళ మోషే సింహాసనానికి సమీపంగా ఉండి ఉంటే అతని మాదిరి మరియు ప్రభావం రాజు యొక్క దుర్మార్గతనూ, నియంతపాలననూ శక్తివంతంగా అదుపు చేసుండేవి అన్నది నిస్సందేహమైన విషయం. మోషేను మిద్యాను దేశానికి పంపించడంలో దేవునికున్న ఉద్దేశాల్లో ఇది కూడా ఒకటి. మోషే గైర్హాజరీలో ఈ ఐగుప్తు దుర్మార్గరాజు అత్యంత క్రూరమైన శాసనాలు జారీ చేశాడు. ఈ విధంగా తన పాపాల్లో పూర్తిగా కూరుకుపోవడానికి, ముందుగా నిర్ణయించబడిన నాశనానికి సంపూర్ణంగా సిద్ధపడటానికి ఫరో పూర్తి స్వేచ్ఛను పొందాడు.

నాలుగవదిగా, తాను చేస్తానని ముందు ప్రకటించినట్లుగానే ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు (నిర్గమ 4:21). పరిశుద్ధ లేఖనాలు చెబుతున్న విషయాలతో ఇది పూర్తిగా ఏకీభవిస్తోంది. “హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కటి ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవా వలన కలుగును” (సామెతలు 16:1). "యెహోవాచేతిలో రాజు హృదయము నీటి కాలువలవలెనున్నవి. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును” (సామెతలు 21:1). అందరి రాజుల హృదయాల మాదిరిగానే, ఫరోరాజు యొక్క హృదయం కూడా ప్రభువు చేతిలోనే ఉంది; దాన్ని తనకిష్టమైన దారిలోకి మళ్ళించే అధికారం మరియు సామర్థ్యం కూడా దేవునికి ఉన్నాయి. మంచి అనేదానికి అంతటికీ విరుద్ధంగా దాన్ని మళ్ళించడం ఆయనకు ఇష్టమయింది. ఫరోను పూర్తిగా కూలదోసేందుకు అతన్ని సంపూర్ణంగా సిద్ధపరిచేవరకు మోషే చేసిన మనవిని అంగీకరించకుండా దేవుడు అతన్ని అడ్డగించాడు. దేవుడు అతని హృదయాన్ని కఠినపరచకపోతే దేవుని చిత్తం నెరవేరదు.

చివరిగా ఫరోతో దేవుడు వ్యవహరించిన విధానాల్లో దేవుని నీతి ఎలా రుజువు చేయబడిందో మనం శ్రద్ధగా పరిశీలించాలి. దేవునికి అనుకూలంగానూ తనకు తానే విరోధంగానూ సాక్షాత్తు ఫరోయే సాక్ష్యం పలకడం అత్యంత విశేషమైన విషయం. దేవుడు ఏ ఉద్దేశంతో ఫరోను ఉన్నతస్థాయికి చేర్చాడో మనం నిర్గమ 9:15,16లో తెలుసుకున్నాం. ఇదే అధ్యాయం 27వ వచనంలో ఫరో ఇలా అన్నాడు, “నేను ఈసారి పాపము చేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము”, తనను నాశనం చేయడానికే దేవుడు తనను లేపాడనీ, తీవ్రమైన తీర్పులు అతనిపైకి పంపబడ్డాయనీ, తన హృదయాన్ని తానే కఠినపరచుకున్నాననీ తెలుసుకున్న తర్వాత ఫరో ఈ మాటలు చెప్పాడని గమనించండి. ఈ సమయానికే ఫరో యొక్క పాపం తీర్పు పొందేంతగా పక్వానికి వచ్చింది. దేవుడు అతడికి అన్యాయం చేశాడా లేదా దేవునికే అతడు అన్యాయం చేశాడా అని గుర్తెరిగే స్థితికి తేబడ్డాడు; తాను పాపం చేశాననీ, దేవుడే నీతిమంతుడనీ అతడు పూర్తిగా అంగీకరించాడు. ఫరో విషయంలో దేవుని ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసిన సాక్షి మోషే. ఫరో విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో మొదట్లోనే అతడు విన్నాడు; దేవుడు అతనితో వ్యవహరించిన తీరును మోషే కళ్లారా చూశాడు. నాశనానికి సిద్ధపరచబడిన ఉగ్రతపాత్రయైన ఘటం యెడల దేవుని దీర్ఘశాంతాన్ని మోషే గమనించాడు. చివరిగా ఎర్రసముద్రం దగ్గర దేవునితీర్పులో ఫరో కొట్టివేయబడటాన్ని అతడు చూశాడు. అప్పుడు మోషేకు ఎలాంటి అనుభూతి కలిగింది? అన్యాయం జరిగిందని అతడు కేకలు చేశాడా? దేవుడు అన్యాస్థుడని అతడు ఆరోపించ తెగించాడా? కానే కాదు. దానికి భిన్నంగా అతడు ఇలా అంటున్నాడు, “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు? పరిశుద్ధతనుబట్టి నీవు మహనీయుడవు, స్తుతికీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు?” (నిర్గమ 15:11).

ఎర్రసముద్రపు జలాల్లో ఇశ్రాయేలుకు బద్ధశత్రువు కొట్టివేయబడటం చూసి అతనికి తగిన శాస్తి జరిగిందని మోషే సంబరపడ్డాడా? ఖచ్చితంగా కాదు. దీని గురించి సందేహాలన్నిటినీ పూర్తిగా తొలగించుకోవడానికి, తీవ్రమైన దేవుని తీర్పులను చూసిన తర్వాత పరలోకంలో ఉన్న పరిశుద్ధులు ఎలా స్పందించారో చూస్తే మనకు అవగతమౌతుంది. “ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి; యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునైయున్నవి” అని చెబుతూ దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు (ప్రకటన 15:3,4,6). ఫరోతో దేవుడు వ్యవహరించిన తీరును ఇది పూర్తిగా సమర్థిస్తుంది. ఫరోని, అతని సైన్యాన్ని కూలదోయడంలో దేవుడు అన్యాయస్థుడు కాడు గానీ న్యాయవంతుడు, సత్యవంతుడు అని ప్రకటిస్తూ దేవుని సేవకుడైన మోషే యెహోవాకు పాడిన పాటను పరలోకంలో పరిశుద్ధులు పాడుతుంటారు. అందువల్ల ఉగ్రతపాత్రయైన ఫరోను సృష్టించడంలోనూ, నాశనం చేయడంలోనూ సర్వలోకానికి తీర్పరి అయినవాడు న్యాయమే చేశాడని మనం నమ్మి తీరాలి.

భక్తిహీనుల్ని దేవుడు నాశనానికి సిద్ధం చేశాడనే సిద్ధాంతాన్ని ఫరో వృత్తాంతం స్థాపిస్తోంది, ఉదాహరిస్తోంది. దేవుడు నిజానికి ఫరోను తృణీకరిస్తే, తన కుమారుని స్వారూప్యంలోనికి మార్చడానికి ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించుకోలేదో వాళ్ళందరినీ ఆయన తృణీకరిస్తున్నాడని మనం చెప్పడం వాస్తవమే ఔతుంది. ఫరో విషయంలో దేవుని ఉద్దేశాన్ని తెలియచేసిన తరువాత 18వ వచనంలో “కావున” అనే పదంతో అపొస్తలుడు తన బోధను కొనసాగిస్తున్నాడు. ఎన్నికలో దేవుని సార్వభౌమత్వం ఉన్నట్టుగానే తృణీకరించడంలోనూ దేవుని సార్వభౌమత్వం ఉందని నిరూపించడానికి ఫరో వృత్తాంతం ఇక్కడ ప్రస్తావించబడింది.

చివరిగా, ఫరోని కలుగచేయడంలో దేవుడు న్యాయాన్యాయాలను కాదుగానీ కేవలం తన సార్వభౌమత్వాన్నే ప్రదర్శించాడని నేను చెబుతున్నాను. పాత్రలను తయారుచేయడంలో కుమ్మరి సార్వభౌముడైన విధంగా నైతిక ప్రతినిధులను తయారుచేయడంలో దేవుడు సార్వభౌముడు.

వచనం 18:- “కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వారిని కఠినపరచును”. యాకోబును ప్రేమించడంలో ఏశావును ద్వేషించడంలో దేవుడు అన్యాయస్థుడు కాదు, ఈ వాస్తవాన్ని ఉదాహరించడానికి ఫరోతో దేవుడు వ్యవహరించిన తీరును వివరించిన తర్వాత అపొస్తలుడు ఈ అంశాన్ని ముగిస్తూ "కావున” అనే పదాన్ని రాశాడు. యాకోబును ప్రేమించడానికీ, ఏశావును ద్వేషించడానికి మూలం సృష్టికర్త యొక్క సార్వభౌమ చిత్తమే. ఆయన ఒకర్ని ప్రేమిస్తాడు, మరొకర్ని ద్వేషిస్తాడు, కొందరియెడల కనికరపడతాడు, ఇతరులను కఠినపరుస్తాడు. దీనికి మూలం మనుషులు చేసే క్రియల్లో కాదు కానీ ఆయన సార్వభౌమ చిత్తంలోనే ఉంటుంది.

“ఎవని కఠినపరచగోరునో వారిని కఠినపరచును” అనే మాటను చూసి శరీరసంబంధమైన మనసున్నవాళ్ళు అత్యంత తీవ్రమైన అభ్యంతరాన్ని లేవనెత్తుతారు, చాలామంది వ్యాఖ్యానకర్తలు, ప్రసంగీకులు కేవలం ఇక్కడే సత్యాన్ని కలుషితం చేస్తున్నారు. 'ఈ వ్యక్తులు మొదట దేవుని సత్యాన్ని తిరస్కరించి, తరువాత ఆయననే తృణీకరించారు కాబట్టి అందుకు శిక్షావిధిగా మాత్రమే దేవుడు వీళ్ళను కఠినపరిచాడనే తప్ప అంతకు మించినదేదీ అపొస్తలుడు చెప్పట్లేదు' అన్నది అత్యంత సాధారణమైన, జనాదరణ పొందిన అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని చేపట్టేవాళ్ళు తమ వాదనను సమర్థించుకోవడానికి రోమా 1:19-26 లాంటి లేఖనాలను ప్రస్తావిస్తుంటారు. “దేవుడు... వారిని అప్పగించాడు”. ఎవరు “వీళ్ళు?” దేవునినెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచనివాళ్ళు (వ.21). వాళ్ళు 2 థెస్స 2:10-12ను కూడా ప్రస్తావిస్తుంటారు. అయితే ఈ రెండు వాక్యభాగాల్లోనూ “కఠినపరిచే కార్యం గురించి అస్సలు ఏ మాత్రమూ ప్రస్తావించట్లేదు. దేవుని సత్యాన్ని ఇంతకుముందే తృణీకరించినవాళ్ళ గురించి పౌలు ఇక్కడ మాట్లాడట్లేదు కానీ దేవుని సార్వభౌమత్వం గురించే అతడు బోధిస్తున్నాడు. ఆయన కనికరించాలనుకున్నవారిని కనికరించి, కఠినపరచాలనుకున్నవారిని కఠినపరుస్తాడు. “ఎవనిని” అనే మాట ఇక్కడ ఉంది కానీ 'ఆయన సత్యాన్ని తిరస్కరించినవారందరినీ' అని ఇక్కడ లేదు. ఫరో గురించి ప్రస్తావించిన వెంటనే “ఆయన కఠినపరుస్తాడు” అనే మాట వాటి అర్థాన్ని స్పష్టంగా నిర్ధారిస్తోంది. ఫరో వృత్తాంతం ఎంతో స్పష్టంగా ఉంది కానీ తన తెలివైన భాష్యంతో మనిషి ఈ సత్యాన్ని దాచడానికి తన వంతు కృషి చేస్తున్నాడు.

వచనం 18 :- “కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును; ఎవని కఠినపరచగోరునో వాని కఠినపరచును”. సార్వభౌమత్వంతో పాపుల హృదయాలను కఠినపరిచే కార్యానికీ, శిక్షావిధిగా కఠినపరిచే కార్యానికీ వ్యత్యాసముంది. ఇదొక్కటే కాదు, యోహాను 12:37-40 “ఆయన వారియెదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచలేదు. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడెవడు? ప్రభువుయొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి” (ఎందుకు?), ఎందుకంటే ఆయన వారి కన్నులకు అంధత్వాన్ని కలుగచేశాడు, హృదయాన్ని కఠినపరిచాడు (ఎందుకు?) వాళ్ళు క్రీస్తునందు విశ్వాసముంచలేదు కాబట్టేనా? ఇదే అందరికీ ఉన్న అభిప్రాయం. అయితే లేఖానాలిచ్చే జవాబును గమనించండి! “వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు,” అని యెషయా చెబుతున్నాడు. దేవుడు తన వాక్యంలో వెల్లడి చేసినదానిని, ప్రియ పాఠకుడా, నువ్వు నమ్ముతావా? నమ్మవా? అనేదే ప్రశ్న. సుదీర్ఘ కాలపు అన్వేషణ వల్లనో, విస్తారమైన పరిశోధన వల్లనో ఈ సిద్ధాంతం అర్థమవ్వదు, దీనికి పసిబిడ్డల్లాంటి మనస్సు కావాలి.

వచనం 19:- "అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు”. నేడు ప్రజలు లేవనెత్తుతున్న అభ్యంతరం ఖచ్చితంగా ఇది కాదా? అపొస్తలుడు ఇక్కడ అడుగుతున్న ప్రశ్నల వెనకున్న ఉద్దేశం ఇదే; సమస్తమూ దేవునిచిత్తం పైన ఆధారపడి ఉంది. ఆయన చిత్తాన్ని ఏ ఒక్కరూ అడ్డగించలేరు, తన చిత్తానుసారంగానే సార్వభౌముడైన దేవుడు సమస్తాన్నిచేస్తాడు కాబట్టి, ఆయన ఎవరిని కనికరించాలనుకుంటే వానిని కనికరిస్తాడు, ఎవరిని కఠినపరచాలనుకుంటే వానిని కఠినపరిచి శిక్షిస్తాడు కాబట్టి, అందరూ విధేయత చూపించేలా, దోషాల్ని ఎంచే అవకాశం లేకుండా చేసేలా ఆయన అందరికీ కనికరం చూపించడానికి ఎందుకు ఇష్టపడకూడదు? ఈ అభ్యంతరం దేనిపై ఆధారపడిందో ఆ ఆలోచనను అపొస్తలుడు తిరస్కరించట్లేదు. ఈ విషయాన్ని మనం శ్రద్ధగా గమనించాలి. దేవుడు నేరం మోపడని అతను చెప్పట్లేదు, మనుషులు ఆయన చిత్తాన్ని ఎదిరిస్తారని కూడా అతను చెప్పట్లేదు. దీనికి తోడు ఈ అభ్యంతరాన్ని అతడు త్రోసిపుచ్చలేదు. 'ఆయన చిత్త ప్రకారం కొంతమందికి దయచూపిస్తాడు, ఆయన చిత్త ప్రకారం కొంతమందితో కఠినంగా వ్యవహరిస్తాడు' అని నేను చెప్పిన మాటల్ని మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు' అని పౌలు చెప్పట్లేదు. 'అయితే ఈ అభ్యంతరాన్ని లేవనెత్తడానికి నీకు ఎలాంటి హక్కూ లేదు. ఈ అభ్యంతరాన్ని లేవనెత్తడానికి నీకు హేతువేదీ లేదు' అని అతడు అంటున్నాడు, (Vide Dr. Brown) ఈ అభ్యంతరం ఏ మాత్రమూ సముచితం కాదు, అది దేవుని ధిక్కరించి మాట్లాడినట్టు అవుతుంది, దేవుడు చేసిన కార్యం గురించి ఫిర్యాదు చేసినట్టు, వాదించినట్టు ఉంటుంది!

వచనం 19 :- “అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు”. అభ్యంతరం లేవనెత్తే వ్యక్తి నోట్లో అపొస్తలుడు పెడుతున్న భాష ఎంతో స్పష్టంగా సూటిగా ఉంది, కాబట్టి దానిని అపార్థం చేసుకోవడం సాధ్యం కాదు. దేవుడు ఎందుకు నేరం మోపుతున్నాడు? ప్రియ పాఠకుడా, ఈ మాటలకు అర్థం ఏంటి? నా జవాబును చదవకముందే మీరు దీనికి జవాబును ఆలోచించండి... అపొస్తలుడు వేస్తున్న ప్రశ్న ఈ కింది మాటకు ఏమైనా భిన్నంగా ఉందా? “దేవుడు ఎవని కనికరింపగోరునో వానిని కనికరిస్తాడు, ఎవని కఠినపరచగోరునో వానిని కఠినపరుస్తాడు”, అయితే మానవ బాధ్యత విషయమేంటి? ఇదే నిజమైతే మనుషులు రోబోట్లకు మించినవాళ్ళు కారు. ఇదే నిజమైతే తన సృష్టిలోని నిస్సహాయులైన ప్రాణులపై నేరం మోపడం దేవుడు చేసే అన్యాయమవుతుంది. “అట్లయితే ... నీవు నాతో చెప్పుదువు” అనే మాటల్ని గమనించండి. తాను చెబుతున్నదాని నుండి అభ్యంతరం తెలిపే వ్యక్తి గ్రహించిన తప్పుడు అభిప్రాయాన్ని అపొస్తలుడు ఈ మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. ఈ అభ్యంతరం తలెత్తుతుందని అపొస్తలుడు ముందుగానే ఊహించాడు. ఒక వేళ కొందరిలో ఐనా(దేవుని కృప చేత జయించబడని శరీరసంబంధమైన మనస్సుల్లో ఐనా) ఇలాంటి అభ్యంతరం తలెత్తకపోతే నేను రోమా 9వ అధ్యాయంలో ఉన్న బోధను మీకు స్పష్టంగా వివరించడంలో విఫలమైనా అయ్యుండాలి లేదా అపొస్తలుని కాలం తర్వాత మానవ స్వభావంలో మార్పు చోటు చేసుకునైనా ఉండాలి.

19వ వచనంలో మిగిలిన భాగాన్ని గురించి ఇప్పుడు ఆలోచించండి. అదే అభ్యంతరాన్ని కాస్త భిన్నమైన రూపంలో అపొస్తలుడు పునరావృతం చేశాడు. తన ఉద్దేశాన్ని అపార్థం చేసుకోకూడదన్నదే అతని అభిప్రాయం. “ఆయన చిత్తాన్ని ఎదిరించినవాడెవడు?” అనేదే ఆ అభ్యంతరం. మనం ఈ సందర్భంలో చర్చిస్తున్నది దేవునిచిత్తం గురించి, అంటే ఆయన సార్వభౌమ మార్గాల గురించి అనే విషయం సుస్పష్టం. 17,18 వచనాలపై మనం చెప్పినదానిని ఇది స్థిరపరుస్తోంది; సత్యాన్ని తృణీకరించినందుకు దేవుడు కఠినపరిచాడు అనేది ఈ సందర్భంలో వాస్తవం కాదు. కానీ పతనమైన, పాపులైన మనుషులు చేసిన క్రియలను బట్టి కాకుండా సార్వభౌముడైన దేవుని చిత్తాన్ని బట్టే ఈ కఠినపరచడం అనేది జరిగిందని మనం 17,18 వచనాలను వివరిస్తున్నపుడు చెప్పాను. అందువల్లనే “ఆయన చిత్తాన్ని ఎదిరించినవాడెవడు?” అని అపొస్తలుడు అడిగాడు. ఈ అభ్యంతరాలకు అపొస్తలుడు చెప్పే జవాబు ఏంటి?

వచనం 20 :- "అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?" ఈ అభ్యంతరం అర్థరహితమైనది, నిరాధారమైనది అని అపొస్తలుడు చెప్పలేదు, దానికి భిన్నంగా అభ్యంతరాన్ని తెలిపే వ్యక్తి యొక్క భక్తిహీనతను అతడు గద్దిస్తున్నాడు. 'నువ్వొక మనిషివి, సృష్టించబడినవాడివి, కాబట్టి దేవునితో వాదించడానికి, ఆయనకు జవాబు చెప్పడానికి నీకు అర్హతే లేదు' అని అపొస్తలుడు అతనికి గుర్తుచేస్తున్నాడు. “నువ్వు రూపించబడినవాడవు, అంతకు మించినవాడవు కావు” కాబట్టి నిన్ను రూపించినవానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం వెర్రితనం, దేవదూషణ అని అపొస్తలుడు అంటున్నాడు. ఈ వచనాన్ని విడిచిపెట్టక ముందు ఈ వచన రెండవ భాగంలో ఉన్న మాటల్ని మరొకసారి గమనించండి. “నన్నెందుకీలాగు చేసితివి” అనే మాటలు మనం చర్చిస్తున్న అంశాన్ని నిర్ధారించడానికి సహాయపడతాయి. “ఇలాగు” అనే పదానికి అర్థం ఏమిటి? ఏశావుకు ఒక వేళ అవకాశమిస్తే, 'నన్నెందుకు ద్వేషించావు? నీ ద్వేషానికి ఎందుకు పాత్రునిగా చేశావు?” అని ప్రశ్నిస్తాడు. ఫరోకు ఒక వేళ అవకాశమిస్తే, “కఠినపరచడానికే నన్ను ఎందుకు చేశావు?” అని ప్రశ్నిస్తాడు. కాబట్టి “ఇలాగు” అంటే “ఏశావులాగా, ఫరోలాగా” అని అర్థం.

ఈ వాక్యభాగమంతటిలోనూ అపొస్తలుని లక్ష్యాన్ని స్పష్టంగా మన ముందుంచుకోవడం అత్యవసరం. దేవుడు తాను ప్రేమించేవారిపై అంటే ఘనత నిమిత్తమైన పాత్రల విషయంలో, కరుణాపాత్ర ఘటాల యెడల తన సార్వభౌమత్వాన్ని ఎలా చూపిస్తున్నాడో, అలాగే, దేవుడు తాను ద్వేషించేవారిపై, తాను కఠినపరిచేవారిపై అంటే ఘనహీనత నిమిత్తమైన పాత్రల విషయంలో, ఉగ్రతాపాత్రల యెడల తన సార్వభౌమత్వాన్ని ఎలా చూపిస్తున్నాడో అపొస్తలుడు చర్చిస్తున్నాడు.

వచనాలు 21-23 :- “ఒక్క ముద్దలోనుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా? ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగుపరచుటకు, తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి? మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటముల యెడల ... తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్ననేమి?”. 19వ వచనంలో లేవనెత్తబడిన అభ్యంతరాలకు అపొస్తలుడు ఈ వచనాల్లో సంపూర్ణంగా జవాబు చెబుతున్నాడు. “మంటిమీద కుమ్మరి వానికి అధికారము లేదా?” అని మొదట అతడు అడుగుతున్నాడు. ఇక్కడ "అధికారం” అంటే 'సృష్టికర్త యొక్క హక్కులనూ లేదా సార్వభౌమ ఆధిక్యతలనూ' సూచిస్తోంది. ఈ వాస్తవం మనకు యోహాను 1:12లో ఉపయోగించిన అదే విధమైన గ్రీకుపదాన్ని బట్టి అవగతమవుతోంది - "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను” (యోహాను 1:12). ఇక్కడ కూడా అధికారం అంటే దేవుని కుమారుడు కావడానికి హక్కు లేదా ఆధిక్యత అని అర్థం.

వచనం 21 :- ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఇక్కడ కుమ్మరి ఆ దేవుడే;" “దేవునికి ఎదురుచెప్పుటకు నీవెవడవు?” అని అపొస్తలుని అడుగుతున్న ఇంతకుముందు వచనం నుంచి కుమ్మరి దేవుడే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. “రూపించబడినది తన్ను రూపించినవానితో” అని కొనసాగిస్తున్నాడు. 'కుమ్మరి కొన్ని పాత్రల్ని ఇతర పాత్రలకంటే ఘనహీనమైన రీతిలో వాడబడేందుకు చేసినా వాటిని కూడా కొంతమేరకు ఉపయోగపడాలనే చేస్తాడు' అని వాదిస్తూ ఈ మాటల్లో ఉన్న తీవ్రతను కొందరు తగ్గించేస్తున్నారు. “ఒక్క ముద్దలోనుండియే ఒక ఘటము ఘనతకును ఒకటి తక్కువ ఘనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?” అని అపొస్తలుడు అడగట్లేదు కాని కొన్ని పాత్రలు ఘనహీనత కోసమే చేయబడతాయని' అతడు చెబుతున్నాడు. ఎన్నుకోబడనివారి నాశనం ఆయన మహిమను ప్రచురం చేస్తుందని తర్వాత వచనం మనకు చెబుతోంది. కాబట్టి దేవుని జ్ఞానం సంపూర్ణంగా నిర్దోషమైనదని నిరూపించబడుతుంది.

తర్వాత వచనాన్ని వివరించే ముందు ఈ వచనమూ, అంతకుముందు రెండు వచనాలూ చేస్తున్న బోధ యొక్క సారాంశాన్ని గుర్తు చేసుకుందాం. “అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించినవాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు”, అనే రెండు ప్రశ్నల్ని పౌలు అడుగుతున్నాడు (వ.19). ఈ రెండు ప్రశ్నలకు మూడు కోణాల జవాబును నేను చెబుతాను. మొదటిది :- సృష్టికర్త యొక్క కార్యాలకు తీర్పు తీర్చే హక్కు సృష్టించబడినవానికి లేదని 20వ వచనంలో అపొస్తలుడు చెబుతున్నాడు. 'అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెడవు?' దేవుని చిత్తం యొక్క యథార్థతను ప్రశ్నించకూడదు అని అపొస్తలుడు నొక్కి చెబుతున్నాడు.ఆయన చేసేదేదైనా న్యాయమై ఉంటుంది. రెండవది :- సృష్టికర్తకు తన సృష్టిలోని ప్రాణులతో తనకు తోచిన విధంగా వ్యవహరించే హక్కు ఉంటుందని 21వ వచనంలో అపొస్తలుడు ప్రకటిస్తున్నాడు. “ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?” ఈ వచనంలో “అధికారం” అనే మాటకు గ్రీకుమూలం “ఎక్సూసియ”. దేవుడు తన అధికారాల్ని తన న్యాయానికి అనుగుణంగా ఉపయోగించుకుంటాడు. మూడవది :- తన సృష్టిలోని ప్రాణులతో ఒక్కొక్కరితో ఒకొక్క రకంగా దేవుడు వ్యవహరించడానికి 22,23 వచనాల్లో అపొస్తలుడు కారణాలను తెలియచేస్తున్నాడు; తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, తన మహిమైశ్వర్యము కనపరచుటకును.

“ఒక ముద్దలోనుండియే యొక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటిమీద కుమ్మరివానికి అధికారము లేదా?” దేవుడు సృష్టికర్త కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఆ అధికారం ఉంది. ఐతే దేవుడు ఈ అధికారాన్ని వినియోగించుకుంటాడా? అవును వినియోగించుకుంటాడు. “ఇందు నిమిత్తమే నేను నిన్ను (ఫరోను) నియమించితిని” అని 13,17 వచనాలు మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి.

వచనం 22 :- “ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశానమునకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి?” కొందరిని కనికరించి ఇంకొందరిని కఠినపరచి, ఒక పాత్రను ఘనత నిమిత్తం మరొక పాత్రను ఘనహీనత నిమిత్తం చేస్తూ దేవుడు ఒక్కొక్కరి యెడల ఒక్కొక్క విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడో ఇక్కడ అపొస్తలుడు మనకు చెబుతున్నాడు. 23వ వచనంలో కరుణాపాత్ర ఘటాలను ప్రస్తావించకముందే 22వ వచనంలో అపొస్తలుడు ఉగ్రతపాత్ర ఘటాల గురించి మొదటిగా మాట్లాడుతున్నాడని గమనించండి! ఎందుకిలా అపొస్తలుడు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే 19వ వచనంలో అభ్యంతరం లేవనెత్తిన వ్యక్తి దృష్టిలో ఉన్నది “ఉగ్రతాపాత్ర ఘటాలే” కాబట్టి. దేవుడు కొన్ని పాత్రలను ఘనహీనత కోసం ఎందుకు తయారుచేస్తాడనే ప్రశ్నకు అపొస్తలుడు 2 కారణాలు చెబుతున్నాడు. మొదటిది తన ఉగ్రత చూపించడానికి; రెండవది, తన ప్రభావాన్ని కనపరచడానికి. ఫరో విషయంలో ఈ రెండూ కనపరచబడ్డాయి.

పై వచనంలో మనం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన విషయం ఒకటుంది. “నాశనమునకు సిద్ధపడిన ఉగ్రత పాత్రమైన ఘటాలు” అనే మాటల్లో, “నాశనమునకు సిద్ధపడిన” అనే మాటకు సరైన అనువాదం “నాశనమునకు సిద్ధపరచబడిన” - నాశనానికి వాళ్ళను సిద్ధపరిచింది ఎవరు? 'తమ దుష్టత్వాన్ని బట్టి ఎన్నిక చేయబడనివారు తమను తామే నాశనానికి సిద్ధపరుచుకుంటారు' అని సాధారణంగా చాలామంది జవాబు చెబుతుంటారు. దేవుడు వీళ్ళను నాశనానికి సిద్ధపరచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తమ భ్రష్టత్వాన్ని బట్టి వీళ్ళకు ఇంతకుముందే తమను తాము సిద్ధం చేసుకున్నారు కాబట్టి. ఈ వచనంలో “నాశనం” అనే పదానికి “శిక్ష” అని అర్థం ఐతే, ఎన్నుకోబడనివారు తమను తాము సిద్ధపరచుకుంటారు అనే జవాబు పూర్తిగా సత్యమౌతుంది. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ తమ తమ క్రియలనుబట్టి తీర్పు పొందుతారు కాబట్టి. అయితే అపొస్తలుడు ఉద్దేశం ఇదేనా? కానే కాదు అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ఒక్కసారి 11-13వచనాలను పరిశీలించండి. ఏశావు తనను తాను దేవుని ద్వేషానికి పాత్రునిగా సిద్ధం చేసుకున్నాడా? లేదా పుట్టకముందే దేవుని ద్వేషానికి పాత్రుడయ్యాడా? అంతేకాదు ఫరో తనను తానే నాశనానికి సిద్ధపరచుకున్నాడా? లేదా ఐగుప్తు మీదికి తెగుళ్లను పంపడానికి ముందే దేవుడు అతని హృదయాన్ని కఠినపరిచాడా? నిర్గమ 4:21 చూడండి!

21వ వచనంలో మొదలైన తలంపుకి కొనసాగింపు 9:22 అని స్పష్టమవుతోంది. 20వ వచనంలో లేవనెత్తబడిన ప్రశ్నలకు అపొస్తలుడు చెప్పే జవాబులో భాగం 21వ వచనం. కాబట్టి ఉగ్రత పాత్రమైన ఘటాలను నాశనానికి సిద్ధపరిచేది దేవుడేనని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నుకోబడనివారిని దేవుడు దేన్ని ఆధారంగా చేసుకుని నాశనానికి సిద్ధపరుస్తాడు? తాను ముందుగా నియమించిన శాసనాలను ఆధారంగా చేసుకుని; దేవుడు ఎందుకు ఎన్నుకోబడనివారిని నాశనానికి సిద్ధం చేస్తాడు? తన న్యాయం, శక్తి, ఉగ్రతలనే గుణలక్షణాలను ప్రచురం చేసుకోవడానికి!

“మనుషులను రక్షణకు ఏర్పాటు చేసుకోవడంలోనూ, నాశనానికి ఏర్పాటు చేసుకోవడంలోనూ దేవునికున్న మహోన్నతమైన లక్ష్యం తనను తాను మహిమ పరచుకోవడమే” (రాబర్ట్ హల్డేన్) (Robert Haldane).

వచనం 23:- “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల యెడల తన మహిమైశ్వర్యమును కనుపరచవలెనని”. ఈ వచనంలో మన గమనాన్ని కోరే విషయం ఒకే ఒకటుంది. “మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన కరుణాపాత్ర ఘటములు” అనే మాటను గమనించండి. ఇంతకుముందు వచనంలో “ఉగ్రత పాత్రమైన ఘటములు” ముందుగానే నాశనానికి సిద్ధపరచబడినవని అపొస్తలుడు రాయలేదు. కాబట్టి సృష్టికి ముందే దేవుడు వాళ్ళను నాశనానికి సిద్ధపరచలేదు కాని సృష్టి జరిగిన తర్వాత ఎన్నుకోబడనివాళ్ళు తమను తాము నాశనానికి సిద్ధం చేసుకున్నారని' చాలామంది చెబుతున్నారు. అయితే ఈ వివరణ ఏ మాత్రమూ సరైంది కాదు. ఒక్కసారి 21వ వచనాన్ని తిరిగి పరిశీలించండి. అందులో పౌలు మట్టిని సాదృశ్యంగా తీసుకున్నాడు. మట్టి అచేతనమైనది, అల్పమైనది, శిథిలమైనది. అందువల్ల పతనమైన మానవజాతిని సూచించడానికి సరిపోయే పదార్థమది. మానవాళిపై దేవుని సార్వభౌమత్వాన్ని పతనం నేపథ్యం నుండి చర్చిస్తున్నాడు కాబట్టే ఉగ్రతాపాత్రమైన ఘటాలు ముందుగానే నాశనం కోసం సిద్ధపరచబడ్డాయని అపొస్తలుడు చెప్పట్లేదు; ఎందుకంటే పతనమైన తరువాతే ఇక్కడ మట్టితో పోల్చబడిన పరిస్థితికి వాళ్ళు దిగజారారు. ఇక్కడున్న అపార్థాన్ని సరిచేయటానికి నొక్కి చెప్పాల్సిన ఒకే ఒక్క విషయమేమిటంటే ఉగ్రతాపాత్రమైన ఘటాలు 'నాశనానికి తగిన పాత్రలని' అపొస్తలుడు చెప్పలేదు (ఒక వేళ నాశనానికి తమ దుష్టత్వాన్ని బట్టి తమను తామే సిద్ధపరచుకున్నది నిజమే అయితే “నాశనానికి తగిన పాత్రలు” అని అపొస్తలుడు వాళ్ళను సంబోధించి ఉండేవాడు).కానీ వాళ్ళను “నాశనానికి సిద్ధపరచబడిన పాత్రలు” అని పౌలు ప్రస్తావించాడు. కాబట్టి వారిని నాశనానికి సిద్ధపరచడం 'సృష్టికర్త యొక్క సార్వభౌమ నిర్ణయం' అన్నదే దీని అర్థం అయ్యుండాలని ఈ మొత్తం సందర్భాన్ని బట్టి తెలుస్తుంది.

ఈ వాక్యంపై కాల్విన్ యొక్క స్పష్టమైన మాటల్ని నేను ఉటంకిస్తున్నాను. 'నా నిమిత్తం సిద్ధం చేయబడిన పాత్రలున్నాయి అంటే ఇవి నాశనానికి విడిచిపెట్టబడినవి, నియమించబడినవి; దేవుని యొక్క ప్రతీకారానికీ, అసహ్యానికి ఉదాహరణలుగా ఉండేలా నిర్మించబడిన, నియమించబడిన ఉగ్రతాపాత్రమైన ఘటములు కూడా వాళ్ళే. ఉగ్రతాపాత్ర ఘటాలు నాశనం నిమిత్తం సిద్ధపరచబడ్డాయి అనే మాటలో “దేవుడే ముందుగా” అనే మాటలు లేవు కాని కరుణాపాత్ర ఘటాల విషయంలో “దేవుడే ముందుగా” అనే మాటలున్నాయి. అయినాగాని ఉగ్రతపాత్రమైన ఘటాలనూ కరుణాపాత్ర ఘటాలను సిద్ధపరచడం అనేది దేవుని రహస్య సంకల్పానికి సంబంధించిన విషయమే అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. లేదంటే ఎన్నుకోబడనివారు తమను తామే నాశనానికి అప్పగించుకున్నారు అని పౌలు చెప్పి ఉండేవాడు. కానీ ఇక్కడ 'వాళ్ళింకా జన్మించకముందే వాళ్ళు ఈ స్థితికి నిర్ణయించబడినవాళ్ళని' అతడు తెలియచేస్తున్నాడు. దీనితో నేను మనస్ఫూర్తిగా ఏకీభవిస్తున్నాను. తమను తామే నాశనానికి సిద్ధం చేసుకున్న పాత్రలని గానీ, వాళ్ళు నాశనానికి తగినవారని గానీ ఉగ్రతాపాత్ర ఘటాల గురించి రోమా 9:22 చెప్పడం లేదు కానీ వాళ్ళు నాశనానికి సిద్ధపరచబడిన పాత్రలని ఈ వచనం చెబుతుంది. దేవుడు తన నిత్య శాసనాలకు అనుగుణంగా ఎన్నుకోబడనివారిలో ఏమీ చేయకుండానే వాళ్ళను నాశనానికి సిద్ధం చేశాడని సందర్భం స్పష్టంగా చూపిస్తోంది.

ఎన్నుకోబడనివారిని దేవుడు తృణీకరిస్తున్నాడు అనే సిద్ధాంతాన్ని రోమా 9వ అధ్యాయం ఎంతో స్పష్టంగా బోధిస్తోంది. ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావించే వాక్యభాగాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని వాక్యభాగాలను ఇప్పుడు మనం సంక్షిప్తంగా పరిశీలిద్దాం. “ఆలాగైన ఏమగును? ఇశ్రాయేలు వెదకునది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందినవారికి అది దొరికెను; తక్కినవారు కఠినచిత్తులైరి” (రోమా 11:7). ఇక్కడ పౌలు మనకు రెండు భిన్నమైన వర్గాలను వర్ణిస్తున్నాడు. వీళ్ళు ఒకరికొకరు పూర్తి విరుద్ధంగా ఉన్నారు. వీళ్ళు “ఏర్పాటునొందినవారు”, మరియు "తక్కినవారు”; 'దొరికినవారు' మరియు 'కఠినపరచబడినవారు'. ఈ వచనం పై చిరస్మరణీయుడైన జాన్ బన్యన్ గారి వ్యాఖ్యల్ని నేను ప్రస్తావిస్తున్నాను. 'ఇవి గంభీరమైన పదాలు. 'ఏర్పాటులో ఉన్నవారు' - 'తక్కినవారు'; 'ఎంపికైనవారు', 'విడిచిపెట్టబడినవారు'; 'హత్తుకోబడినవారు' - 'తిరస్కరించబడినవారు' అని మనుష్యుల్ని ఈ మాటలు విభజిస్తున్నాయి. తక్కినవారు అంటే ఏర్పాటులో లేనివారు, ఎందుకంటే ఈ మాటలు ఒకదానికొకటి వ్యతిరేకంగా రాయబడ్డాయి. అందువల్ల ఏర్పాటులో లేనివారంటే, వాళ్ళు నాశనానికి నియమించబడినవారు తప్ప మరెవరు?'

“ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు” (1 థెస్స 5:9) అని పౌలు థెస్సలొనికయలో ఉన్న పరిశుద్ధులకు ప్రకటించాడు. దేవుడు ఏ ఒక్కరినీ ఉగ్రతకు నియమించకపోతే ఈ మాటకు అర్థం లేదు. 'దేవుడు మనల్ని ఉగ్రత పాలగుటకు నియమించలేదు' అని చెప్పడం 'ఆయన ఉగ్రతకు నియమించినవారు కొందరున్నారని సూచిస్తోంది. ఎంతోమంది క్రైస్తవులు పక్షపాతంచేత గుడ్డివారయ్యారు. లేకపోతే దీన్ని స్పష్టంగా చూడటంలో వాళ్ళు విఫలమయ్యేవాళ్ళు కాదు.

“అది అడ్డు రాయియు అడ్డుబండయు ఆయెను. కట్టువారు వాక్యమునకవిధేయులై తొట్రిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి” (1 పేతురు 2:8). “దానికే” అనే మాట 'వాక్యమునకు అవిధేయులవటం, తొట్రిల్లడం' అనేవాటిని సూచిస్తోంది. అంటే 'అవిధేయతకే నియమించబడినవారు' (1థెస్స 5:9లో ఉపయోగించబడిన గ్రీకు పదం) కొందరున్నారని ఇక్కడ దేవుడే స్పష్టంగా తెలియచేస్తున్నాడు. దీని గురించి వాదించడం మన బాధ్యత కాదు గానీ పరిశుద్ధ లేఖనాలకు తలొగ్గడమే మన విధి. దేవుడు చెప్పినదానిని అర్థం చేసుకోవడం కంటే దాన్ని నమ్మడమే మన ప్రధాన కర్తవ్యం .

“వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేక శూన్యములగు మృగములవలె ఉండి, తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు, తమ దుష్ప్రర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు,తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు” (2 పేతురు 2:12). ఈ గంభీరమైన వాక్యం చేస్తున్న స్పష్టమైన బోధను తప్పించుకోవడానికి కొందరు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ వచనంలో “పట్టబడి చంపబడేది” వివేకశూన్యములైన మృగాలే కాని, వాటితో పోల్చబడిన మనుషులు కాదని వాళ్ళు మనకు చెబుతుంటారు. ఈ కుతర్కాన్ని కొట్టిపారేయడానికి చేయాల్సినదల్లా ఈ వ్యక్తులకూ, వివేకశూన్యములైన మృగాలకు మధ్యనున్న పోలిక వెనుక ఉద్దేశమేంటో కనుక్కోవడమే! “వారైతే... మృగముల వలె ఉండి” అనే మాటలకు అర్థమేంటి? ఎంతో స్పష్టంగా వివేక శూన్యములైన మృగాల్లా పట్టబడి చంపబడుతున్నది ఈ మనుషులే! నేను పైన చెప్పిన వివరణను ఈ వచనం చివర్లో ఉన్న మాటలు ధృవీకరిస్తున్నాయి - “తాము చేయు నాశనముతోనే తాము నాశనము పొందుదురు”.

“ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు, మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమంటే సూచింపబడినవారు” (యూదా 4). వేరొక బైబిల్ అనువాదాన్ని చూపించి ఈ వచనంలో స్పష్టంగా ఉన్న తీవ్రత నుంచి తప్పించుకోవడానికి కొందరు పలు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలేమీ మన నాలుకకు రుచించనిదాని నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరచలేదు. “పూర్వమందే సూచింపబడినవారు” అనే మాటకు అర్థం ఏంటి? వీళ్ళ గురించిన ప్రస్తావన ముందు పాత నిబంధనలో చేయబడిందా? ఈ ప్రశ్నకు జవాబు కాదనే చెప్పాలి. ఎందుకంటే పాత నిబంధనలో అక్కడక్కడా క్రైస్తవ సమాజాల్లోకి దుష్టులు చొరబడడం గురించిన ప్రస్తావన లేనే లేదు. “పూర్వమందే సూచింపబడినవారు” అనే దానికి గ్రీకు మూలం 'ప్రోగ్రాఫో', అంటే 'ముందుగానే రాయబడింది' అని అక్షరానుసారమైన అర్థం. పాత నిబంధనలో వీరి గురించిన ప్రస్తావన ఎక్కడా లేదు కాబట్టి వీరి గురించి మరి ఎక్కడ రాయబడినట్లు? కేవలం దేవుని శాసనాల గ్రంథం గురించే ఇది ప్రస్తావిస్తోందని మనం గ్రహించాలి, “పూర్వమందే సూచింపబడినవారు” అనే మాటకు మూలం ఎక్కడున్నప్పటికీ, 'దేవుడు కొంతమందిని ఈ తీర్పు పొందడానికి నియమించాడనేది' మాత్రం తప్పించుకోలేని వాస్తవం.

“భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు (క్రీస్తువిరోధికి) నమస్కారము చేయుదురు” (ప్రకటన 13:8). ఇక్కడ జీవగ్రంథంలో పేర్లు రాయబడని వ్యక్తులు కొందరున్నారని పై వచనం నిర్థారిస్తోంది. ఇలా వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడకపోవడం వలన వాళ్ళు క్రీస్తువిరోధికి అంకితమై వాడికి మొక్కుతారు.

దేవుడు కొందర్ని తన ఉగ్రతకు పాత్రులుగా నియమించుకున్నాడనే సిద్ధాంతాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా బోధించిన వాక్యభాగాలను మనం ఇప్పటివరకు చూశాం. దేవుడు భక్తిహీనుల్ని నాశనదినం కోసం కలగచేశాడనీ, ఘనహీనత కోసం కొన్ని పాత్రల్ని ఆయన రూపించాడనీ, తన నిత్యశాసనాన్ని బట్టి వాటిని నాశనానికి సిద్ధపరిచాడనీ, వివేకశూన్యములైన మృగాల్లాగానే వాళ్ళు పట్టబడి నాశనం చేయబడతారనీ, ఈ శిక్షావిధి కోసం వీళ్ళు ముందుగానే నియమించబడినవారనీ ఈ వాక్యభాగాలు బోధిస్తున్నాయి. ఈ లేఖనభాగాల వెలుగులో 'దేవుడు కొంతమందిని రక్షణ కోసం, మరికొందరిని నాశనం కోసం ముందుగానే నిర్ణయించుకున్నాడని' మనం నిర్మొహమాటంగా, నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఈ బోధను అపార్థం చేసుకుని, తప్పుమార్గంలో జీవించకుండా పాఠకుల్ని అడ్డుకోవడానికి కొన్ని ముఖ్యమైన సంగతులను ఇప్పుడు నేను తెలియచేస్తాను. మొదటిది: దేవుడు కొందరిని తన ఉగ్రత చూపించడానికే నియమించుకున్నాడనే సిద్ధాంతానికి అర్థం ఆయన కొందరు అమాయక ప్రాణుల్ని తీసుకుని వాళ్ళను దుష్టులుగా చేసి ఆ తర్వాత వాళ్ళను నాశనం చేస్తాడని కాదు. “దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు” (ప్రసంగి 7:29) అని లేఖనం చెబుతుంది. నాశనం చేయాలనే ఉద్దేశంతో దేవుడు పాపుల్ని సృష్టించలేదు, తన సృష్టిలో మనుషులు చేసిన పాపానికి దేవునిపై నేరారోపణ చేయకూడదు. పాపం చేసిందీ, దానికి బాధ్యత వహించాల్సిందీ మనిషే!

నిత్యనాశనానికి నిర్ణయించబడినవారి విషయంలో దేవుని శాసనం ఆదాము సంతానాన్ని పతనమైనవారిగా, పాపస్వభావంగలవారిగా, చెడిపోయినవారిగా, దోషులుగా చూస్తోంది. ఇలాంటి స్థితిలో ఉన్న కొందరిని దేవుడు తన సార్వభౌమ కృపను ప్రదర్శించడానికి రక్షించాలని సంకల్పించాడు, తన న్యాయాన్నీ, ఉగ్రతనూ కనపరచడానికి తక్కినవారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మనుషులు తమకు చట్టబద్ధమైన ప్రతినిధియైన ఆదాములో ముందే పతనమయ్యారు; అందువల్ల వాళ్ళు పాపస్వభావంతో జన్మిస్తున్నారు, వాళ్ళను తమ పాపాల్లోనే ఆయన వదిలేస్తున్నాడు. వాళ్ళు దీన్ని బట్టి ఫిర్యాదు కూడా చేయట్లేదు. దీన్నే వాళ్ళు కోరుకుంటున్నారు; పరిశుద్ధత గురించిన అపేక్ష వాళ్ళకు లేదు; వాళ్ళు వెలుగును కాక చీకటినే ప్రేమిస్తున్నారు. వాళ్ళ హృదయాభిలాషలకు దేవుడు వాళ్ళను అప్పగిస్తే అందులో అన్యాయం ఎక్కడుంది? (కీర్తన 81:12).

రెండవది: - దేవుడు కొందరిని తన ఉగ్రత చూపించడానికి నియమించుకున్నాడనే సిద్ధాంతం 'ఆసక్తితో రక్షణను అన్వేషించేవారికి దేవుడు రక్షణనివ్వడానికి నిరాకరిస్తాడని' చెప్పట్లేదు. నశిస్తున్నవారికి రక్షకుని గురించిన తృష్ణ ఉండదు. కోరదగినంత సౌందర్యం ఆయనలో వారికి కనబడదు. వాళ్ళు క్రీస్తు దగ్గరకు సమీపించరు. మరైతే దేవుడు వాళ్ళను ఎందుకు బలవంతం చేయాలి? వచ్చేవాళ్ళను ఆయన వెనక్కి పంపేయడు - వారిని ముందుగానే నాశనానికి నిర్ణయించడంలో దేవుడు చేసిన అన్యాయం ఏముంది? దేవుడు క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నాడనీ, నియంతలా వ్యవహరిస్తున్నాడనీ ఎందుకు చెప్పాలి? దేవుడు మనుషుల్ని సృష్టించాడే కానీ
వాళ్ళ దుష్టత్వాన్ని సృష్టించలేదని గుర్తుంచుకోండి. దేవుడు వాళ్ళ ఉనికికి రచయితే కానీ వాళ్ళలో పాపాన్ని నింపినవాడు కాడు. గుర్రపుస్వారీ చేసే వ్యక్తి పరిగెత్తడానికి మొరాయిస్తున్న గుర్రాన్ని తన్ని మరీ పరుగు పెట్టిస్తాడు. దేవుడు కూడా ఇదేవిధంగా దుష్టుల్ని పాపం చేయమని బలవంతం చేస్తాడని కొందరు అంటున్నారు. కాని ఇది ఏ మాత్రమూ నిజం కాదు. అయితే 'వాళ్ళను తమ మార్గానికి వదిలేయండి' అనే భయంకరమైన మాటను మాత్రం దేవుడు చెబుతాడు (మత్తయి 16:14). అయితే పాపం చేయకుండా వాళ్ళను అడ్డుకోవడానికి దైవికమైన పాశాలను ఆయన ఉపయోగించడు, రక్షణార్థమైన కృపా ప్రభావాన్నిఆయన నిలిపేస్తాడు. అందువల్ల భ్రష్టుడైన వ్యక్తి త్వరలోనే తప్పనిసరిగా స్వచ్ఛందంగానే తన దోషాలను బట్టి పతనమవుతాడు. ఆ విధంగా నిత్యనాశనానికి నిర్ణయించబడినవారి విషయంలో దేవుని శాసనాలు మనిషి యొక్క పతనమైన స్వభావానికి అడ్డుపడవు, అతని పాపానికి అతన్ని తక్కువ బాధ్యునిగా చేయవు.

మూడవది: కొందరిని దేవుడు తన ఉగ్రతను కనపరచడానికి నియమించు కున్నాడనే బోధ దేవుని మంచితనానితో ఏ విధంగానూ విభేదించదు. ఎన్నికైనవారు ఆయన మంచితనాన్ని ఆస్వాదించినంతగా, పొందే విధంగా ఎన్నికలో లేనివారు పొందరనేది వాస్తవమే, కానీ వాళ్ళు అస్సలు ఏ మాత్రమూ దేవుని మంచితనాన్ని అనుభవించరు అనేది సత్యం కాదు. తాత్కాలికమైన దీవెనలను దేవునిబిడ్డలతో సమానంగా, అనేక సందర్భాల్లో దేవునిబిడ్డల కంటే ఎక్కువగా వాళ్ళు అనుభవిస్తుంటారు. అయితే ఇహలోక దీవెనలు వాళ్ళను బాగుచేస్తాయా? బాగుచేయదు; దేవుని యొక్క తాత్కాలికమైన దయ వాళ్ళను మారుమనస్సుకు నడిపిస్తుందా? నడిపించదు; వాళ్ళ కాఠిన్యాన్ని బట్టి, మార్పుపొందని వాళ్ళ హృదయాన్ని అనుసరించి ఆయన యొక్క అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరస్తూ ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు తమకు తామే ఉగ్రతను సమకూర్చుకుంటారు. (రోమా 2:4,5). అందువల్ల రాబోయే శాశ్వతయుగంలో ఆయన దయకు పాత్రులుగా ఉండనందుకు వాళ్ళు ఏ న్యాయమైన ఆధారంతో సణుక్కుంటారు? పతనమైన దేవదూతలందర్నీ తమ భ్రష్టత్వాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టేసినా అది ఆయన కృపాకనికరాలకు విరుద్ధం కానప్పుడు (2 పేతురు 2:4), పతనమైన మానవజాతిలో కొందర్ని తమ పాపాల్లోనే వదిలేసి, ఆ పాపాలను బట్టి వారిని శిక్షిస్తే అది ఆయన దైవ పరిపూర్ణతలకు ఎలా విరుద్ధమవుతుంది? కానే కాదు.

ఆఖరిగా మనందరం ఒక అత్యవసరమైన జాగ్రత్తను తీసుకోవాలి. ప్రస్తుత జీవిత కాలంలో ఎన్నిక చేయబడని వ్యక్తులెవరో నిర్ధారించడం మనలో ఎవ్వరికైనా పూర్తిగా అసాధ్యం. ఒక వ్యక్తి ఎంతటి దుష్టుడైనా మనం అతన్ని ఎన్నుకోబడనివాడు అని తీర్పు తీర్చకూడదు. అత్యంత ఘోరమైన పాపి కూడా కృపసహితమైన ఏర్పాటు చేయబడి, ఒకానొక దినాన కృపగల ఆత్మచేత బ్రతికించబడటానికి అవకాశముందని మనందరికీ తెలుసు. ప్రతీ మనిషికీ సువార్త ప్రకటించమని దేవుడు మనకు స్పష్టంగా ఆజ్ఞను జారీ చేశాడు. మనం ఆ ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే మనకు శ్రమ. మన బాధ్యతను మనం నిర్వర్తిస్తే మనం నిర్దోషులమవుతాం. మనుషులు వినడానికి నిరాకరిస్తే, వాళ్ళ రక్తాపరాధం వాళ్ళపైనే ఉంటుంది. అయితే “మనం రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనయైయున్నాము. నశించువారికి మరణార్థ మైన మరణపు వాసనగాను రక్షింపబడువారికి జీవార్డమైన జీవపు వాసనగాను ఉన్నాము” (2 కొరింథీ 2:15,16).

దేవుడు కొన్ని పాత్రల్ని నాశనానికి సిద్ధపరచడనీ లేదా కొందరిని శిక్షావిధి కోసం నియమించడనీ చూపించాలనే కొందరు తరచూ చూపించే కొన్ని వాక్యభాగాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. మొదటిగా “ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు?” (యెహె 18:31)ని పరిశీలిద్దాం. ఈ వచనాన్ని ఆగస్టస్ టాబ్లెడి కంటే మెరుగుగా నేను వివరించలేను కాబట్టి ఆయన మాటల్ని నేనిక్కడ ఉదహరిస్తున్నాను - 'ఈ వాక్యభాగాన్ని, ఇంతవరకు ఈ అధ్యాయంలో మనం బోధించిన సత్యాన్నంతటినీ ఒక్క దెబ్బలో పిండి పిండిగా చేసే సుత్తిలాంటి వచనం ఆన్నట్టు ఆర్మీనియన్లు చాలా తరచుగా, నిర్లక్ష్యంగా ఉపయోగిస్తుంటారు. అయితే ఈ వచనంలో ప్రస్తావించబడిన మరణం ఆత్మసంబంధమైనదీ కాదు, నిత్యమైనదీ కాదు. ఈ అధ్యాయం యొక్క ముఖ్యోద్దేశాన్ని గమనిస్తే అది స్పష్టమవుతుంది. ఇది రాజకీయ సంబంధమైన మరణం, దేశాభివృద్ధికి శాంతిభద్రతలకూ సంబంధించిన మరణం అని ప్రవక్త యొక్క ఉద్దేశం. ప్రవక్త యొక్క ప్రశ్నను మనం ఈ విధంగా వివరించవచ్చు; బానిసత్వంతో, బహిష్కరణతో, ప్రజావినాశనంతో ప్రేమలో పడేలా మిమ్మల్ని చేస్తున్నదేమిటి? విగ్రహాలను పూజించడం మానేస్తే అది మిమ్మల్ని ఈ విపత్కర పరిస్థితుల నుండి కాపాడి, మరొకసారి గౌరవప్రదమైన దేశంగా మిమ్మల్ని చేస్తుంది. ప్రజల నాశనం మూలంగా కలిగిన బాధలు మీ లక్ష్యాన్ని ఆశించేంత ఆకర్షణీయంగా ఉన్నాయా? “మీరెందుకు మరణము నొందుదురు?” ఇశ్రాయేలు ఇంటివారిగా ఒకే రాజకీయగృహంగా ఉన్నా “మీరెందుకు మరణము నొందుదురు?” ఈ విధంగా ప్రవక్త ప్రశ్నించి,ఈ మాటల్ని అదనంగా మాట్లాడాడు. “మరణమునొందువాడు మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు; ఇదే యెహోవా వాక్కు”. దీని అర్థం మొదటిగా యూదులు ఒక దేశంగా చెరలో ఉండడం దేవుని సంతోషాన్ని ఏమీ పెంచలేదు. రెండవదిగా, యూదులు విగ్రహారాధన నుంచి తొలగిపోయి, ఆ విగ్రహాలను విసిరేస్తే వాళ్ళు విదేశంలో శత్రుదేశంలో మరణించరు కానీ తమ సొంత దేశంలో శాంతిసమాధానాలతో జీవించవచ్చు. స్వతంత్రులుగా తమ హక్కుల్ని ఆస్వాదించవచ్చు. పైనున్నదానికి మనం అదనంగా ఈ కింది మాటల్ని చేర్చవచ్చు - యెహె 18:31,32లో ప్రవక్త ప్రస్తావించింది రాజకీయ సంబంధమైన మరణమే అనటానికి వాళ్ళు ఇంతకుముందే ఆధ్యాత్మికంగా మరణించారు అనేదే స్పష్టమైన కారణం.

కొన్ని పాత్రల్ని దేవుడు నాశనం కోసం సిద్ధపరచలేదని చూపించడానికి కొంతమంది తరచూ మత్తయి 25:41ని ఉపయోగించుకుంటారు. “అప్పుడాయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి.” 'దేవుడు కొంతమందిని తన ఉగ్రత చూపించడానికి నియమించాడు' అనే వాక్యసత్యాన్ని కొట్టిపారేయడానికి కొందరు ప్రధానంగా ఉపయోగించుకునే వచనాల్లో ఇది కూడా ఒకటి. తప్పిపోయినవారి కోసం ఎదురుచూస్తున్న తీర్పు యొక్క తీవ్రత గురించి ఈ వచనం మాట్లాడుతోంది. ఇంకొక రీతిగా చెప్పాలంటే నిత్యాగ్ని యొక్క భయంకరత్వం గురించే పై లేఖనం మాట్లాడుతుంది కానీ అందులో ప్రవేశించేవారి గురించి కాదు. అపవాది కోసం వాడి దూతల కోసం సిద్ధపరచబడిన అగ్ని ఎంత భరింపనశక్యంగా ఉంటుందో కదా! దేవుని ప్రధానశత్రువైన సాతాను శిక్ష అనుభవించబోయే నిత్య వేదనకరమైన స్థలంలోనే అవిశ్వాసులు పడుతున్నారంటే, ఆ ప్రదేశం ఎంత భయానకమైనదో!

కొంతమందిని మాత్రమే దేవుడు రక్షణ కోసం ఎన్నుకుంటే, “అంతటా అందరూ మారుమనస్సు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు” అని లేఖనం మనకు ఎందుకు చెబుతోంది? (అపొ.కా. 17:30). మనుషులందర్నీ మారుమనస్సు పొందమని దేవుడు ఆజ్ఞాపించడం ఈ లోకంపై నీతిగల అధికారిగా తనకున్న హక్కుల్ని అమలు పరచడమే అంతటా అందరూ ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయడం చూసి మారుమనస్సు పొందమని ఆజ్ఞాపించకుండా ఎలా ఉండగలడు? ఆయన అలా ఆజ్ఞాపించడం లోకంలోని మనుషులందరి పైనా ఉన్న బాధ్యతను సూచిస్తోంది. అయితే అంతటా అందరికీ మారుమనస్సును అనుగ్రహించడం (అపొ.కా. 5:31) దేవుని సంకల్పమని ఈ లేఖనం ప్రకటించట్లేదు. దేవుడు ప్రతి మనిషికీ మారుమనస్సును అనుగ్రహించాడని అపొస్తలుడైన పౌలు నమ్మలేదు. ఈ విషయం 2 తిమోతి 2:25లో అతని మాటల ద్వారా స్పష్టమౌతుంది - "సత్యవిషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై, దేవుడొకవేళ ఎదురాడువారికి మారుమనస్సు దయచేయును.... అందువలన ప్రభువు దాసుడు.... అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను.”

దేవుడు కేవలం కొంతమందిని మాత్రమే నిత్యజీవానికి నియమించడమే నిజమైతే “మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు” (తిమోతి 2:4) అని మనం లేఖనంలో అన్ని సందర్భాల్లోనూ 'మానవజాతిలో ప్రతీ ఒక్కరూ' అనే అర్థం లేఖనంలో లేదు, వాక్యభాగాన్ని సందర్భంలో శ్రద్ధగా పరిశీలిస్తేనే అది 'ప్రతీ ఒకర్ని సూచిస్తోందా?” లేదా 'కొన్ని వర్గాలవారిని గానీ జాతులవారిని గాని సూచిస్తోందా?” అనే విషయం బోధపడుతుంది. ఉదా: మార్కు 1:5; యోహాను 6:45; 8:2; అపొ.కా. 21:28; 22:15; 2 కొరింథీ 3:2 మొదలైన వాక్యభాగాలను పరిశీలిస్తే, 'అందరు' అనగా 'సర్వమానవాళి' కాదు అని నేను చెప్పిన భావానికి స్పష్టమైన రుజువు లభిస్తుంది. 1 తిమోతి 2:4 సర్వమానవాళి రక్షణను ఆయన కోరుకుంటున్నాడని బోధించట్లేదు,అలా కోరుకుని ఉంటే మానవాళి అంతా రక్షించబడి ఉండేది - "అయితే ఏకమనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో ఆదే చేయును” (యోబు 23:13).

“దేవుడు పక్షపాతము లేనివాడు” అని లేఖనాలు పదే పదే చెబుతున్నాయి కదా? అని కొందరు అడుగుతుంటారు. అవును లేఖనాలు అలాగే చెబుతున్నాయి; ఎన్నికలో దేవుని కృప దాన్ని నిరూపిస్తుంది. యెషయికి ఉన్న ఏడుగురు పెద్ద కుమారులు శారీరకంగా చూస్తే దావీదుకు జ్యేష్ఠులు, అతనికన్నా శ్రేష్ఠులు. అయితే దేవుడు వాళ్ళందరినీ దాటి చిన్నవాడూ, గొర్రెలకాపరీ అయిన దావీదును ఎంచుకున్నాడు. ప్రభుయేసు శాస్త్రుల్ని, ధర్మశాస్తోపదేశకుల్ని కాకుండా పామరులైన జాలరుల్ని తనకు అపొస్తలులుగా ఎన్నుకున్నాడు. దైవసత్యం జ్ఞానులకును వివేకులకును మరుగు చేయబడి పసిబాలురకు వెల్లడి చేయబడింది. అధికసంఖ్యలో జ్ఞానులు, ఘనులు విస్మరించబడ్డారు, కానీ బలహీనులు, అల్పులు, ఎన్నికలేనివారు పిలవబడుతున్నారు, రక్షింపబడుతున్నారు. వేశ్యలు, సుంకరులు సువార్త విందుకు ఆనందంగా ఆహ్వానించబడుతుండగా, స్వనీతిపరులైన పరిసయ్యులు తమ వేషధారణలోనే నాశనమయ్యేలా విడిచిపెట్టబడుతున్నారు. అవును, దేవుడు బాహ్యరూపాల్ని చూసి నిర్ణయాలు తీసుకోడు, లేదంటే నన్ను రక్షించి ఉండేవాడు కాడు.

దేవుడు కొందరిని తన ఉగ్రత చూపించడానికే నియమించుకున్నాడనే వాక్యబోధ శరీరానుసారమైన మనస్సుగలవారికి చాలా కఠినమైనది. అవును నిజమే! అయితే నిత్యశిక్ష గురించిన బోధకంటే ఇది కఠినమైనదా? లేఖనం ఎంతో స్పష్టంగా ఈ అంశాన్ని బోధిస్తోందని చూపించడానికి నేను ప్రయత్నించాను. దేవుని వాక్యంలో బయలుపరచబడిన సత్యాల్లో కొన్ని ఎంపిక చేసుకుని, కొన్ని వదిలేయడం మనకు తగదు. తమకు అనుకూలమైన సిద్ధాంతాలను స్వీకరించి, తమకు పూర్తిగా అర్థం కానివాటిని తృణీకరించేవారిని తలుచుకుంటే మన ప్రభువు చెప్పిన తీక్షణమైన మాటలు గుర్తుకొస్తున్నాయి. “అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా” (లూకా 24:25). మందమతులు కాబట్టి అవివేకులు! వీళ్ళ హృదయాలు మొద్దుబారిపోయాయి, బుర్రలు కాదు!

మరొకసారి కాల్విన్‌ గారి మాటల నుంచి కొంత ప్రయోజనాన్ని పొందుకుందాం. 'లేఖనాల్లోని బోధను ఎలాంటి అస్పష్టత, అసందిగ్ధత లేకుండా నేను ఇంతవరకు ప్రకటించాను. అయితే పరలోక వాక్కులు తమ గౌరవమర్యాదలకు భంగం కలిగిస్తాయేమోననే భయంతో వాటిని బోధించడానికి కొందరు సంకోచిస్తున్నారు. ఎలాంటి వివాదాల్లోనూ తలదూర్చకుండా ఉండడమే తమ కీర్తిప్రతిష్ఠలను కాపాడుకునే మార్గమని భావిస్తూ, దేవుడు కొందర్ని తన ఉగ్రత చూపించడానికే నియమించుకున్నాడనే వాక్యబోధ తమకు అర్థం కానట్లు వాళ్ళు నటిస్తుంటారు. ఇది ఎంతటి గర్వమో ఆలోచించండి! అందుకే వాళ్ళు 'ఈ అంశంలో మేము జోక్యం చేసుకోము అంటుంటారు.” ఒకవేళ వాళ్ళు బహిరంగంగా తమ వాదాన్ని వ్యక్తపరిచినా, పరలోకానికి వ్యతిరేకంగా వాళ్ళు చేసే చేతకాని ప్రయత్నాల వలన వాళ్ళకు ఒరిగేది ఏముంటుంది? ఈ వాక్యసత్యానికి వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత కొత్తదేమీ కాదు; అన్ని కాలాల్లోనూ భక్తిహీనులుఈ లేఖనబోధను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే చాలాకాలం క్రితం దావీదు నోట పరిశుద్ధాత్మ పలికించిన సత్యాన్ని వాళ్ళు అనుభవిస్తారు. "తీర్పు తీర్చునప్పుడు నీవు నిర్మలుడుగా అగపడుదువు” (కీర్తన 51:4) అని దావీదు పలికాడు. దేవునితో పోల్చినప్పుడు ఎవ్వరైనా అల్పులే. అయినా కొందరు మూర్ఖులు దేవునికి వ్యతిరేకంగా వాదించడానికి ఆయనకు తీర్పు తీర్చే అధికారం తమకుందన్నట్లు వ్యవహరిస్తూ మితిమీరిన అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే పరలోకానికి వ్యతిరేకంగా అలాంటి వెర్రివాళ్ళు చేసే దేవదూషణల వలన దేవునికి ఎలాంటి నష్టమూ జరగదనీ, ఆ దూషణలను సూర్యకాంతి పొగమంచును చెల్లాచెదురు చేసిన విధంగా చెల్లాచెదురు చేస్తూ ఆయన తన నీతిని అద్భుతంగా వెల్లడి చేసుకుంటున్నాడనీ దావీదు క్లుప్తంగా చెబుతున్నాడు; మన విశ్వాసం కూడా దేవుని వాక్యంపై ఆధారపడి ఉంది. కాబట్టి అది లోకమంతటికంటే శ్రేష్ఠమైనది, వెర్రివాళ్ళు చేస్తున్న దేవదూషణలను పరలోకం నుంచి అది ఏహ్యభావంతో పరికిస్తోంది' (జాన్ కాల్విన్).

ఈ అధ్యాయాన్ని ముగించడానికి ముందు 'క్రైస్తవ మతోద్దారణ' సమయం నుంచి ఉన్న కొందరు ముఖ్య వేదాంతపండితులు చేసిన రచనల నుంచి కొన్ని మాటలను మీ ముందు ఉంచదలచుకుంటున్నాను. ఆ పండితులు ఎంత గొప్పవాళ్ళయినా కావచ్చు, కానీ నేను ఈ అధ్యాయంలో చర్చించిన అంశానికి ప్రధానమైన అధారం మనుషులైన ఆ పండితులు కాదు. మన విశ్వాసం మానవజ్జానం పైన, అధికారం పైన ఆధారపడకూడదు. అయితే ఈ పుస్తకంలో నేను రాసిన మాటలు 20వ శతాబ్దానికి కొత్తవి కాదు: క్రైస్తవ చరిత్రలో అత్యంత గొప్ప భక్తులు, పరిశుద్ధ లేఖనాలను బోధించిన పండితులు ఈ బోధ చేశారని చెప్పడమే నా ఉద్దేశం.

ప్రతి మనిషి యొక్క నిత్యత్వం ఎలా ఉండబోతుందో దేవుడు తానే తన చిత్తానుసారంగా ఒక శాసనం చేశాడు. దాన్నే మనం 'ముందు నిర్ణయం' (Predestination) అని పిలుస్తున్నాం. దేవుడు అందర్ని ఒకే ఉద్దేశంతో సృష్టించట్లేదు. కొందర్ని నిత్యజీవానికి ఇంకొందరిని నిత్యనాశనానికి ఆయన ముందుగానే నియమించాడు. అందువల్ల ఈ రెండు గమ్యాల్లో ఏదో ఒకదాన్ని చేరుకునేందుకే ప్రతీవ్యక్తి సృష్టించబడుతున్నాడు, అంటే దేవుడు ప్రతీవ్యక్తినీ అయితే జీవానికి లేదా మరణానికీ ముందుగానే నిర్ణయించాడు (Institutesలో జాన్ కాల్విన్ రాసినది ఇదే). జాన్ కాల్విన్ మాటల్ని ప్రస్తావిస్తున్నది కేవలం ఇది దేవుని వాక్యంలో బోధించడిందన్న ఒకే ఒక్క కారణంతోనే అని పాఠకులు గమనించాలి.

మార్టిన్ లూథర్ యొక్క రచనల్లో అతి శ్రేష్టమైన 'Free Will a Slave'(స్వతంత్ర చిత్తం ఒక బానిస) అనే పుస్తకంలో ఇలా రాశాడు - 'సమస్త సంగతులు దేవుడు నియమించినట్లే జరుగుతాయి, ప్రతీ సంభవమూ ఆయన నిర్ణయించినదానిపైనే ఆధారపడి ఉంటుంది. జీవవాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారో, ఎవరు నమ్మరో, ఎవరు తమ పాపాల నుంచి విడిపించబడతారో, ఎవరు తమ పాపాల్లోనే కఠినపరచబడతారో, ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరు శిక్షావిధి పొందుతారో అనే సంగతులన్నిటినీ దేవుడు ముందుగానే నియమించాడు. 'స్వతంత్ర చిత్తం/నిర్ణయ స్వేచ్ఛ' అనే తప్పుడుబోధను పునాదులతో సహా కూలగొడుతున్న సత్యం ఇదే! కొందరి యెడల దేవుని నిత్యప్రేమ, మరికొందరి యెడల శాశ్వతద్వేషం ఎన్నటికీ మారవు, తారుమారు కావు.

ఆంగ్లభాషలో ఒకప్పుడు అతి శ్రేష్టమైన పుస్తకం 'హతసాక్షుల గ్రంథం'. దీనిని రచించినది జాన్ ఫాక్స్. ఆయన ఇలా రాశాడు, 'ముందు నిర్ణయం అనేది దేవుని నిత్య శాసనం. మనుషులందరిలో ఎవరు రక్షణ పొందాలో ఎవరు నాశనానికి గురవ్వాలో తన చిత్తానుసారంగా ఆయన చేసిన సంకల్పంలో ఉంటుంది.” General Assembly of the Presbitarian Church, The Larger Westminster Catechism (1688)ను ఆచరించడం మొదలుపెట్టింది; అది ఇలా ప్రకటిస్తోంది - దేవుడు కొంతమంది దేవదూతల్ని మహిమ నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఆయన కొంతమంది మనుషుల్ని నిత్యజీవం నిమిత్తం ఎన్నుకుని, దాన్ని పొందుకునే మార్గాన్ని కూడా వాళ్ళకు అనుగ్రహిస్తున్నాడు. ఇది దేవుడు చేసిన నిత్యమైన, మార్పుచెందని శాసనం; ఆయన కేవలం తన ప్రేమనుబట్టే ఈ శాసనం చేశాడు, తన కృపామహిమకు కీర్తి కలగాలన్నదే ఆయన ఉద్దేశం; అంతేకాదు తన సార్వభౌమ శక్తిని బట్టి, తన చిత్తానుసారమైన గ్రహింపశక్యం కాని సంకల్పాన్ని బట్టి ఆయన కొందరికి తన కృప అనుగ్రహించకుండా దాటిపోతున్నాడు. ఎందుకంటే ఆయన వాళ్ళను ఘనహీనత కోసం, ఉగ్రత కోసం ముందుగా నియమించాడు, తమ పాపశిక్షను తామే భరించేలా వాళ్ళను విడిచిపెట్టాడు. తనలోని న్యాయం అనే గుణలక్షణానికి మహిమ కలగాలనే ఉద్దేశంతోనే దేవుడు దీన్ని సంకల్పించాడు.'

'యాత్రికుని ప్రయాణం' అనే పుస్తక రచయిత జాన్ బన్యన్. ఈయన Reprobation (నిత్యనాశనంలో దేవుని ముందు నిర్ణయం) పై ఒక గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథంలో నుంచి మనం ఒక చిన్న భాగాన్ని తీసుకుందాం - 'ఉగ్రత నిమిత్తం నియమించబడడం అనేది ఒక వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి, మంచైనా, చెడైనా చేయడానికి ముందే జరుగుతుంది. రోమా 9:11లో దీనికి రుజువు ఉంది. మేలైనా, కీడైనా చేయడానికి ముందే, మంచి చెడ్డలు చేసేందుకు బలం పొందకముందే, పుట్టడానికి ముందే, దేవునిచే నిత్యత్వం నిర్ణయించబడిన ఇద్దర్ని మీరు తమ తల్లి గర్భంలో చూస్తారు. ఒకరు నిత్యజీవానికీ మరొకరు నిత్యమరణానికి నిర్ణయించబడినవారు, ఒకరు ఎన్నిక చేయబడినవారు, మరొకరు తృణీకరించబడినవారు; ఒకడు అంగీకరించబడినవాడు, మరొకడు తిరస్కరించబడినవాడు. 'Sighs from Hell' అనే తన పుస్తకంలో జాన్ బన్యన్ ఇలా రాశాడు 'దేవుని వాక్యాన్ని తిరస్కరించి, అవమానించేవారు ఎక్కువశాతం నాశనానికి నియమించబడ్డారు. ”

“ఆలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమునుచూపుటకును ఇచ్ఛయించినవాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి?” (రోమా 9:22) అనే మాటల పై వాఖ్యానిస్తూ జోనాతన్ ఎడ్వర్డ్స్ ఇలా చెప్పాడు, 'దేవుని కోపంలో ఆయన ఔన్నత్యం ఎంత గంభీరంగా కనబడుతుందో కదా! దుష్టుల్ని నాశనం చేయడం వెనకున్న ఉద్దేశం ఇదేనని మనం గ్రహించాలి.' (Vol 4, P.306-1743 AD)

Rock of Ages లాంటి ఎన్నో గేయాలను రచించిన భక్తుడు ఆగస్టస్ టొప్లాడి. అతడిలా రాశాడు, 'పతనమైన ఆదాము సంతానంలో కొందరిని తమ పాపాల్లోనే విడిచిపెట్టాలని, క్రీస్తులోనూ, ఆయనలోనుంచి కలిగే ప్రయోజనాల్లోనూ, వారు భాగస్వామ్యం పొందకుండా విడిచిపెట్టాలని దేవుడు నిత్యత్వంలోనే శాసనం చేశాడు'. దేవుని కృపామహిమకు కీర్తి కలిగే విధంగా కొందరి నిత్యజీవాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. దేవుని న్యాయమనే గుణలక్షణానికి మహిమ కలిగే విధంగా కొందరిని నిత్యమరణానికి దేవుడు నిర్ణయించాడు. అయితే వీళ్ళు అనుభవించబోయే మరణం వాళ్ళు చేసిన పాపాలకు న్యాయంగా కలిగే శిక్ష!

18వ శతాబ్దంలో ఎంతోమందికి దీవెనకరంగా దేవునిచేత వాడబడిన సేవకుడు జార్జ్ విట్ ఫీల్డ్ ఇలా రాశాడు - 'దేవుని ఎన్నిక, దేవుని తృణీకారం అనే సిద్ధాంతాలు కలిసి నిలబడతాయి, లేదా కలిసే కూలిపోతాయి అనేది నిస్సందేహమైన విషయం. రక్షణార్థమైన కృపను యేసుక్రీస్తు ద్వారా దేవుడు కేవలం కొంతమందికి మాత్రమే అనుగ్రహిస్తాడు. ఆదాము పతనం తర్వాత మిగిలిన మానవాళిని తమ పాపాల్లోనే కొనసాగేలా దేవుడు విడిచిపెట్టాడు. ఆ పాపాలను బట్టి వాళ్ళు న్యాయంగా నిత్యమరణాన్ని పొందుతారు'.

“నాశనమునకు సిద్ధపడిన” (సిద్ధపరచబడిన) (రోమా 9:22) అనే పదబంధం గురించి డాక్టర్ హాడ్జ్ మాట్లాడుతూ 'నాశనమునకు సిద్ధపరిచింది దేవుడే' అని చెప్పాడు. ఎందుకంటే “సిద్ధపరచబడిన” అనే గ్రీకు అసమాపక క్రియకు కర్త దేవుడే అనేది స్పష్టం! డాక్టర్ హార్డ్ రోమా పత్రికపై రాసిన వ్యాఖ్యానం సుపరిచితమైనది, విస్తృతంగాపరించబడినది.

అవసరమైతే Wycliffe, Huss, Ridley, Hooper, Crammer, Ussher, John Trapp, Thomas Goodwin, Thomas Manton(Chaplain to Cromwell), John Owen, Witsius, John Gill(స్పర్జన్ కి పూర్వికుడు) ఇంకా అనేకమంది చెప్పిన మాటల్ని నేను ప్రస్తావించగలను. గతంలో ఎంతోమంది భక్తులు, దేవునిచే అద్భుతంగా వాడుకోబడినవాళ్ళు ఈ సిద్ధాంతాన్ని నమ్మారు, బోధించారు అని చెప్పడానికే వీరిని నేను ప్రస్తావిస్తున్నాను. ఈ చివరి దినాల్లో పాతబోధను సహించని వ్యక్తులు ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా ద్వేషిస్తున్నారు.

“ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్!! ” (రోమా 11:33-36).

 

అధ్యాయం 6

నిర్వహణలో దేవుని సార్వభౌమత్వం

 “ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమెన్!” ( రోమా 11:36).

జరుగుతున్న ప్రతీ సంగతినీ దేవుడు ముందుగానే నియమించాడా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలను దేవుడే శాసించాడా? అంటే ప్రస్తుత ప్రపంచాన్ని, అందులోని సమస్తాన్ని, ప్రతీ ఒక్కరినీ ఇప్పుడు దేవుడే పరిపాలిస్తున్నాడా? ఒకవేళ దేవుడే లోకాన్ని పరిపాలిస్తున్నట్లయితే ఆయన దాన్ని ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో పరిపాలిస్తున్నాడా? లేదా ఎలాంటి లక్ష్యమూ లేకుండానే, ఏ క్షణంలో ఏమి చేయాలనిపిస్తే దాని ప్రకారం పాలిస్తున్నాడా? ఒక వేళ ఆయన ఒక లక్ష్యంతో పరిపాలిస్తుంటే, ఆ లక్ష్యాన్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? దేవుడు నిరంతరం తన లక్ష్యాన్ని మార్చుకుంటూ, రోజుకొక కొత్త లక్ష్యాన్ని ఏర్పరచుకుంటుంటే, ఆయన లక్ష్యం మొదటి నుంచి నియమించుకున్నదేనా? పరిస్థితులకు తగినట్లుగా మన చర్యలు మారిపోయినట్లు దేవునిచర్యలు కూడా పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటాయా? లేదా ఆయన క్రియలన్నీ తన నిత్యమైన లక్ష్యం యొక్క ఫలితాలేనా? మనిషిని సృష్టించకముందే దేవుడు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటే, ఆ లక్ష్యం తాను మొదట చేసుకున్న ప్రణాళికలకు అనుగుణంగానే అమలు చేయబడుతోందా? ఇప్పుడు దేవుడు ఆ లక్ష్యం దిశగానే పనిచేస్తున్నాడా? ఇంతకూ లేఖనాలు ఏం చెబుతున్నాయి? “ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు” అని అవి ప్రకటిస్తున్నాయి (ఎఫెసీ 1:11).

దేవునికి సమస్తమూ తెలుసు, సమస్తమూ ఆయనకు ముందుగానే తెలుసు అనే మాటలను ఈ పుస్తకాన్ని చదివే ఎవ్వరూ ప్రశ్నించరు, కానీ ఇంతకుమించి ముందుకెళ్లడానికి చాలామంది సంశయిస్తారు. అయితే దేవునికి సమస్తమూ తెలుసు అన్నప్పుడు ఆయన సమస్తాన్ని ముందుగానే నియమించాడనేది స్పష్టం కావట్లేదా? జరగవలసినదాన్ని దేవుడే శాసించాడు కాబట్టి ఆయనకు సమస్తమూ ముందే తెలుస్తాయని సుస్పష్టంగా తెలియట్లేదా? జరుగుతున్న సంఘటనలు దేవుని భవిష్యత్తు జ్ఞానానికి మూలం కాదు కానీ సమస్త సంఘటనలు ఆయన నిత్యసంకల్పానికి ఫలితం. ఏ కార్యాన్నైతే దేవుడు శాసించాడో అది జరుగుతుందని ఆయనకు తెలుసు. దేవుడు ముందుగా నియమించకపోతే ఏదీ జరగదు. జరుగుతున్న ఏ సంఘటన అయినా ఆయన నియమించినదానిలో ఉండకపోదు. యేసుక్రీస్తు యొక్క సిలువను ఉదాహరణగా తీసుకోండి. ఈ అంశంపై లేఖనబోధ సూర్యకిరణాలంత స్పష్టంగా ఉంది. రక్తం చిందించిన గొర్రెపిల్ల అయిన క్రీస్తు జగత్తు పునాది వేయబడక ముందే నియమించబడ్డాడు (1 పేతురు 1:20).


గొర్రెపిల్ల యొక్క వధను నియమించిన దేవునికి ఆయన వధకు తీసుకొనిపోబడతాడని తెలుసు, అందువల్లనే దానిని ప్రవక్తయైన యెషయా ద్వారా తెలియచేశాడు. ప్రభువైన యేసు అప్పగించబడింది ముందుగానే ఆయన అప్పగించబడతాడని దేవునికి తెలియడం వల్ల కాదు కానీ దేవుడు నిశ్చయించిన సంకల్పాన్ని, ఆయన నియమించిన ఏర్పాటును అనుసరించి ఆయన అప్పగించబడ్డాడు (అపొ.కా. 2:23). దేవుని భవిష్యత్తుజ్ఞానానికి ఆధారం ఆయన చేసిన శాసనాలే. అందువల్ల జరగబోయే ప్రతీదాన్ని దేవుడు ముందుగానే ఎరిగాడంటే దాన్ని ఆయన సృష్టికి పూర్వమే జరగాలని నియమించాడని అర్థం. సృష్ట్యారంభం నుంచే తన కార్యాలన్ని దేవునికి తెలుసు; దీన్ని బట్టి చూస్తే దేవునికి ఒక ప్రణాళిక ఉందనీ, ఆయన కార్యాలన్నీ యాదృచ్ఛికంగా మొదలవ్వలేవనీ ఇది చూపిస్తోంది.

సమస్త సృష్టిని దేవుడే కలుగచేశాడు. పరిశుద్ధ లేఖనాల సాక్ష్యానికి తలొగ్గే ఎవ్వరూ ఈ సత్యాన్ని ప్రశ్నించరు. సృష్టి యాదృచ్ఛికంగా జరిగిందని ఎవ్వరూ వాదించరు. సృష్టించాలని దేవుడు మొదట సంకల్పించాడు, ఆ తర్వాత దేవుడు సృష్టి చేసి ఆ సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. నిజ క్రైస్తవులందరూ కీర్తనకారుడి మాటల్ని వెంటనే అంగీకరించి, అతనితో పాటు “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి! జ్ఞానముచేత వాటన్నిటిని నిర్మించితివి” (కీర్తన 104:24) అని చెబుతారు. ఈ మాటల్ని నమ్మేవాళ్ళు ఎవరైనా దేవుడు తాను సృష్టించి లోకాన్ని పరిపాలించాలని సంకల్పించాడన్న విషయాన్ని తృణీకరించగలరా? కేవలం లోకాన్ని సృష్టించడం ఒక్కటే దేవుని సంకల్పం కాదు. లోకాన్ని సృష్టించి అందులో మనిషిని ఉంచడం మాత్రమే దేవుని లక్ష్యం కాదు; లోకాన్ని సృష్టించి మనిషిని అందులో పెట్టి ఆ లోకాన్ని మనిషినీ తమ దారికి తమను వదిలేయాలని దేవుని ఉద్దేశం కాదు. దేవునికి గొప్ప లక్ష్యం ఉంది, ఆయన పరిపూర్ణతలకు తగిన లక్ష్యం అది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన ఇప్పుడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు, ఇదే వాస్తవం. “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును” (కీర్తన 33:11).

“చాలా పూర్వమున జరిగినవాటిని జ్ఞాపకము చేసికొనుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను నన్ను పోలినవాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనెదననియు చెప్పుకొనుచు ఆదినుండి నేను కలుగబోవు వాటిని తెలియచేయుచున్నాను. పూర్వకాలమునుండి నేనే యింక జరుగనివాటిని తెలియచేయుచున్నాను” (యెషయా 46:9,10). దేవునికి ఈ లోకం విషయంలో, మనిషి విషయంలో ఎన్నో ఉద్దేశాలున్నాయి, అవన్నీ తప్పనిసరిగా నెరవేరతాయన్న విషయాన్ని నిరూపించే ఎన్నో లేఖనభాగాల్ని చూపించవచ్చు. అలా నెరవేరతాయని నమ్మినపుడే ఆ ప్రవచనభాగాల విలువని మనం సరిగ్గా గ్రహించగలము. బలవంతుడైన దేవుడు మనల్ని ప్రవచనం ద్వారా తన నిత్యమైన సంకల్పాలున్న రహస్య గదిలోనికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఆయన చేయాలని నిర్ణయించుకున్నదాన్ని అంతటినీ మనకు తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. పాత, కొత్త నిబంధనల్లో కనబడే వందలాది ప్రవచనాలు భవిష్యత్తులో జరుగబోయేవాటిని మనకు తెలియచెప్పే జోస్యాలు కావు, జరుగబోయే సంగతులను దేవుడే సంకల్పించాడని తెలియచేసే దైవప్రత్యక్షతలు.

ఈ లోకాన్నీ, మానవజాతినీ దేవుడు గొప్ప సంకల్పంతో సృష్టించాడు. మరైతే ఆ గొప్ప సంకల్పం ఏంటి? యెహోవా సమస్తాన్ని తన కోసమే సృష్టించుకున్నాడు. “ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి; నీ చిత్తమునుబట్టి అవి యుండెను. దానిని బట్టియే అవి సృష్టించబడెను” (ప్రకటన 4:11). సృష్టిని చేయడంలో దేవునికున్న గొప్ప లక్ష్యం తన మహిమను ప్రత్యక్షపరచడమే. “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన 19:1). అయితే తన పోలికలోనూ, స్వరూపంలోనూ సృష్టించబడిన మనిషి ద్వారానే దేవుడు ప్రధానంగా తన మహిమను ప్రత్యక్షపరచుకోవాలని ఉద్దేశించాడు. అయితే ఆ గొప్ప సృష్టికర్త మనిషి ద్వారా ఏ విధంగా మహిమపరచబడతాడు? మనిషిని సృష్టించకముందే ఆదాము యొక్క పతనాన్నీ, దాని మూలంగా అతని సంతానానికి కలిగే నాశనాన్నీ దేవుడు చూశాడు. అందువల్ల మనిషి నిర్దోషమైన స్థితిలో కొనసాగుతూ తనను మహిమపరచాలని దేవుడు ఉద్దేశించి ఉండడు. దానికి తగిన విధంగానే 'పతనమైన మనుషులకు రక్షకునిగా ఉండడానికి జగత్తుకు పునాది వేయబడడానికి ముందే క్రీస్తు నియమించబడ్డాడని' లేఖనం మనకు బోధిస్తోంది. క్రీస్తు ద్వారా పాపుల్ని విమోచించడమనే కార్యం దేవునికి మనిషి పతనమైన తర్వాత కలిగిన ఆలోచన కాదు, అది మొదటి నుండీ దేవుని ఏర్పాటు. అందువల్ల మనిషి పతనమైనప్పుడు దేవుని దయ, న్యాయాలు చేయిచేయి పట్టుకుని నడిచినట్లు ఆయన చూశాడు.

సృష్టికి పూర్వమే దేవుడు మన లోకాన్ని ఒక వేదికగా ఉండాలని ఉద్దేశించాడు. నశించిన పాపుల విమోచన ద్వారా తన అద్భుతమైన కృపను, జ్ఞానాన్ని దేవుడు ఆ వేదికపై ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. “దేవుడు మన ప్రభువైన క్రీస్తుయేసు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించాడు” (ఎఫెసీ 3:8,9). ఈ మహిమకరమైన ఉద్దేశంతోనే ఆది నుంచి దేవుడే ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు, చివరివరకు అలాగే తన పాలనను కొనసాగిస్తాడు. 'సంఘాన్ని, అంటే “పిలువబడినవారిని” రక్షించడంలో దేవుని యొక్క నానావిధమైన జ్ఞానాన్ని ప్రదర్శించడం అనే ఏకైక మహిమకరమైన లక్ష్యంతో పదివేల భాగాలతో తయారుచేయబడిన ఒక సంక్లిష్టమైన యంత్రంలా ఈ లోకం పనిచేస్తుందని మనం అర్థం చేసుకునేంతవరకూ ఈ లోకం పట్ల దేవుని ఏర్పాటును మనం గ్రహించలేము' అని ఒక భక్తుడు చాలా చక్కగా చెప్పాడు.

ఈ లోకంలో ఏది జరుగుతున్నా అది ఈ కీలకమైన ఉద్దేశాన్ని నెరవేర్చడంలో భాగమే. ఈ ప్రాథమికమైన సత్యాన్ని అర్థం చేసుకున్న అపొస్తలుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇలా రాశాడు, “అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తుయేసునందలి రక్షణ పొందవలెనని నేను వాని కొరకు సమస్తమును ఓర్చుకున్నాను” (2 తిమోతి 2:10). ఈ లోకపాలనలో దేవుని సార్వభౌమ నిర్వహణ గురించి మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం.

భౌతిక ప్రపంచం పై దేవుని పరిపాలన గురించి ఇప్పుడు పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. జడపదార్థంపై, వివేకంలేని ప్రాణుల పై సంపూర్ణాధికారం సృష్టికర్తకే ఉందని మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చూశాము. స్థిరంగానూ, కొన్నిసార్లు క్రమంగానూ, మరికొన్నిసార్లు భిన్నంగానూ పనిచేసే ప్రకృతి నియమాలు భౌతిక ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని మనందరం ఒప్పుకున్నప్పటికీ దేవుడే ఈ నియమాలను ఏర్పాటు చేశాడనీ, ఆయన కోరినప్పుడు వాటికి అతీతంగా ఆయన పనిచేయగలడనీ మనకు లేఖనాలు, చరిత్ర, అనుభవం నేర్పిస్తున్నాయి. తన సృష్టిలోని ప్రాణులపైకి దీవెనలనూ లేదా తీర్పులనూ పంపేటప్పుడు, తన ప్రజల నిమిత్తం యుద్ధం చేయడానికి సూర్యుణ్ణి, నక్షత్రాలనూ వాటి కక్ష్యల్లో నిలబెట్టగలడు (యెహో 10:13). ఆయన తన అనంతమైన జ్ఞానానికి అనుగుణంగా తొలకరి వర్షాన్ని పంపించగలడు, ఆపగలడు. ఆయన రోగంతో మొత్తగలడు, ఆరోగ్యంతో ఆశీర్వదించగలడు. ఆయన సార్వభౌముడు కాబట్టి ఆయనను ఏ ప్రకృతి నియమాలూ నియంత్రించవు, ఆయన వేటికీ బద్దుడు కాడు. తనకు నచ్చిన విధంగానే ఈ భౌతికలోకాన్ని ఆయన పరిపాలిస్తాడు.

అయితే మానవాళి పై దేవుని పరిపాలన సంగతేంటి? మానవజాతి పై దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఎలా ప్రదర్శిస్తాడని లేఖనం బయలుపరుస్తోంది? నరపుత్రుల్ని ఏ మేరకు, ఏ పద్ధతుల్లో దేవుడు నియంత్రిస్తాడు? ఈ ప్రశ్నకు మన జవాబును రెండు భాగాలుగా చూద్దాం. నీతిమంతులతో, తాను ఏర్పరచుకున్నవారితో దేవుడు ఎలా వ్యవహరిస్తాడో మొదట చూద్దాం; ఆ తర్వాత దుష్టులతో ఆయన వ్యవహరించే పద్ధతి ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.

I. నీతిమంతులతో దేవుడు వ్యవహరించే పద్ధతి

1. తాను ఏర్పాటు చేసుకున్నవారిని దేవుడు జీవింపచేస్తాడు

తాను ఏర్పరచుకున్నవారిపై జీవింపచేసే శక్తిని దేవుడు ప్రదర్శిస్తాడు. స్వభావరీత్యా దేవుని ప్రజలు తమ అపరాధాల్లోనూ, పాపాల్లోనూ చచ్చినవారు. వాళ్ళ మొదటి అవసరం ఆత్మసంబంధమైన జీవం - “ఒక మనిషి మరలా జన్మిస్తేనే కానీ, అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు” (యోహాను 3:3). కొత్తజన్మలో దేవుడు మనకు మరణాన్నుండి జీవాన్నిస్తాడు (యోహాను 5:24). ఆయన మనకు తన స్వభావాన్ని అనుగ్రహిస్తాడు (2 పేతురు 1:4). ఆయన మనల్ని అంధకారసంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, తన ప్రియకుమారుని రాజ్యనివాసులుగా చేస్తాడు (కొలస్సీ 1:13). మనకు మనంగా దీన్ని చేయలేము, ఎందుకంటే మనం బలహీనులం ( రోమా 5:6), అందువలన మనము క్రీస్తుయేసునందు సృష్టించబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము (ఎఫెసీ 2:10).

నూతనజన్మలో మనం దైవస్వభావంలో పాలివారమవుతాం. ఆత్మమూలంగా జన్మించిన మనకు ఒక నియమం, ఒక బీజం, ఒక జీవం అనుగ్రహించబడుతుంది. అందువలన మనం ఆత్మసంబంధులం; పరిశుద్ధాత్మ మూలంగా జన్మించాం కాబట్టి పరిశుద్ధులం. నూతనజన్మ ద్వారా మనకు ఈ పరిశుద్ధ, దైవ స్వభావం అనుగ్రహించబడకపోతే, మనలో ఏ ఒక్కరమూ ఆత్మసంబంధమైన ప్రేరణను పుట్టించుకోలేము, ఆత్మసంబంధమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకోలేము, ఆత్మసంబంధంగా ఆలోచించలేము, ఆత్మసంబంధమైన సంగతుల్ని గ్రహించలేము, ఆత్మసంబంధమైన కార్యాలు సైతం చేయలేము. 'పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి ప్రభువును చూడడు'. అయితే ప్రకృతిసంబంధి అయిన మనిషికి పరిశుద్ధత గురించిన కోరిక ఉండదు, దేవుడు సమకూర్చిన ఏర్పాటును అతడు కోరుకోడు. తనకు ఇష్టం లేనిదాని గురించి మనిషి ప్రార్థిస్తాడా? అన్వేషిస్తాడా? ప్రయాసపడతాడా? ఖచ్చితంగా ఈ పనులు చేయడు. ఒక మనిషి సహజంగా అసహ్యించుకొనే దానినే అనుసరిస్తుంటే, ఒకప్పుడు ద్వేషించే వ్యక్తిని ఇప్పుడు ప్రేమిస్తుంటే, అది అతనిలో ఒక అద్భుతమైన మార్పు చోటుచేసుకోవడం వల్లనే సాధ్యమయింది, అతనికి బయట ఉన్న శక్తి అతనిపై పనిచేసినందువల్లనే అది జరిగింది. అతని ప్రాచీన స్వభావానికి పూర్తి విరుద్ధంగా ఉన్న స్వభావం అతనికి అనుగ్రహించబడటం వల్లనే అది సంభవించింది. అందువల్లనే ఇలా రాయబడింది, “కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వారు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను” (2 కొరింథీ 5:17). మనం ఇప్పుడు వర్ణించిన వ్యక్తి మరణం నుండి జీవానికి దాటిపోయాడు, చీకటి నుండి వెలుగులోకి మారిపోయాడు. సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగాడు (అపొ.కా. 26:18). ఈ గొప్ప మార్పును మరిక దేనికీ ఆపాదించలేము. పాపం వలన తాత్కాలికంగా కలిగే దు:ఖంతో కార్చే కొన్ని కన్నీళ్లకు మించినది నూతన జన్మ. ఈ నూతన జన్మ దురలవాట్లను విడిచిపెట్టి మంచి అలవాట్లను అలవరచుకుని జీవనశైలి మార్చుకోవడం కంటే కూడా శ్రేష్టమైనది, ఉన్నతమైన భావాలను సమర్థిస్తూ ఆచరించడానికి భిన్నమైనది, ప్రముఖ సువార్తికుని ప్రకటనకు స్పందించి, ప్రమాణ పత్రంపై సంతకం చేసి లేదా సంఘానికి హాజరవడం కంటే కూడా ఎంతో మహోన్నతమైనది. నూతనజన్మ అంటే కేవలం వ్యక్తిగత పురోభివృద్ధి కాదుగాని నూతన జీవానికి ఆరంభం, నూతన జీవ స్వీకారం. ఇది కేవలం సంస్కరణ కాదు సంపూర్ణమైన రూపాంతరం. క్లుప్తంగా చెప్పాలంటే నూతనజన్మ ఒక అద్భుతం, దేవుని యొక్క సహజాతీత కార్యపు ఫలితం. ఇది సమూలమైనది, విప్లవాత్మకమైనది, శాశ్వతమైనది.

ఈ లోకంలో తాను ఏర్పాటు చేసుకున్నవారిలో దేవుడు చేస్తున్న తొలికార్యం ఇదే! ఆధ్యాత్మికంగా మృతి చెందినవారిని పట్టుకుని, వారిలో నూతనజీవాన్ని ప్రవేశపెడుతున్నాడు. పాపంలో జన్మించినవాణ్ణి తీసుకుని తన కుమారుని స్వారూప్యంలోనికి మారుస్తున్నాడు. అపవాదికి బందీగా ఉన్నవాణ్ణి బంధించి, విశ్వాస గృహంలో సభ్యునిగా చేస్తున్నాడు. బిచ్చగాణ్ణి లేవనెత్తి క్రీస్తుతో కూడా సహవారసునిగా చేస్తున్నాడు. తనకు బద్ధవిరోధిగా ఉన్న వ్యక్తి దగ్గరకొచ్చి తన యెడల సంపూర్ణమైన ప్రేమతో నిండి ఉన్న నూతన హృదయాన్ని ఇస్తున్నాడు. స్వభావరీత్యా తిరుగుబాటుదారుని స్థాయికి తగ్గించుకుని, ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగచేసికొనుటకును తన దయాసంకల్పము నెరవేరుటకై కార్యసిద్ధి కలగచేస్తున్నాడు. ఎవ్వరూ ఎదిరించలేని తన శక్తితో పాపిని పరిశుద్ధునిగా, శత్రువుని స్నేహితునిగా, అపవాదికి బానిసని దేవుని బిడ్డగా ఆయన మారుస్తున్నాడు.

 2. బలపరిచే తన శక్తిని దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నవారిపై ప్రదర్శిస్తాడు

'విశ్వసించువారి యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో వాళ్ళు తెలుసుకొనేలా' (ఎఫెసీ 1:18), అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు (ఎఫెసీ 3:16) వారి మనోనేత్రాలు వెలిగింపబడాలని అపొస్తలుడు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధుల గురించి దేవునికి ప్రార్థించాడు. ఆ ప్రకారం విశ్వాసంలో మంచి పోరాటం పోరాడే విధంగా, తమతో నిరంతర పోరాటం చేసే శత్రుబలగాలతో యుద్ధం చేసే విధంగా దేవుడు తన బిడ్డల్ని బలపరుస్తాడు. స్వతహాగా వాళ్ళు బలహీనులు. వాళ్ళు గొర్రెల్లాంటివాళ్ళు; గొర్రెలు ఏ మాత్రమూ స్వీయపరిరక్షణ చేసుకోలేని జంతువులు! అయితే ఆయన చేసిన వాగ్దానం నిశ్చయమైనది - "సొమ్మసిల్లినవారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే” (యెషయా 40:29).

దేవుడు నీతిమంతులలో ప్రదర్శించే ఈ బలపరచు శక్తి ఆయనకు నచ్చిన విధంగా సేవ చేసే సామర్థ్యాన్ని వారికి కలిగిస్తుంది. “యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పుతీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడినవాడనై యున్నాను” అని పూర్వము ప్రవక్తల్లో ఒకరు చెప్పారు (మీకా 3:8). "పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చున్పుడు మీరు శక్తినొందెదరు” (అపొ.కా. 1:8) అని మన ప్రభువు తన అపొస్తలులతో చెప్పాడు. వీరి గురించే మనం తర్వాత ఇలా చదువుకుంటున్నాం, “ఇదియుగాక అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను” (అపొ.కా. 4:33). అపొస్తలుడైన పౌలు విషయంలో కూడా ఇదే జరిగింది – “నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తియ్యని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించితిని” (1 కొరింథీ 2:5). అయితే ఈ శక్తి కేవలం పరిచర్యకు మాత్రమే పరిమితం కాలేదు. 2 పేతురు 1: లో మనం ఇలా చదువుతున్నాం, “తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటిని మనకు దయచేయుచున్నది”. అందువల్ల క్రైస్తవుని స్వభావంలో వివిధ సద్గుణాలైన "ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం” మొదలైనవి నేరుగా దేవునికే ఆపాదించబడాలి, ఎందుకంటే వీటిని ఆత్మఫలం అని పౌలు పేర్కొన్నాడు (గలతీ 5:22), ఎఫెసీ 5:9తో పోల్చండి.

3. తాను ఏర్పాటు చేసుకున్నవారిని దేవుడు నడిపిస్తాడు

 తన ప్రజలైన ఇశ్రాయేలీయులు అరణ్యయాత్ర చేస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంలోనూ, రాత్రి అగ్ని స్తంభంలోనూ ఉండి దేవుడు నడిపించాడు. అయితే ఈ రోజుకీ ఆయన తన పరిశుద్ధులను నడిపిస్తూనే ఉన్నాడు. అయితే బయట నుంచి కాకుండా విశ్వాసుల లోపల ఉండి ఆయన నడిపిస్తున్నాడు. “ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై యున్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును” (కీర్తన 48:14). తన దయాసంకల్పము నెరవేరుటకై ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగచేయుకు ఆయన మనలో పనిచేస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని ఆ విధంగా నడిపిస్తున్నాడనే విషయం ఎఫెసీ 2:10లో అపొస్తలుని మాటల ద్వారా స్పష్టమవుతోంది - "మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తుయేసునందు సృష్టించబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము”. ఈ విధంగా అతిశయించడానికి ఆధారమేదీ లేకుండా తొలగించబడింది కాబట్టి సమస్త మహిమ దేవునికే కలుగుతుంది; కనుక ప్రవక్తతో మనం ఏకీభవించి, “యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటిని సఫలపరచుదువు” (యెషయా 26:12) అని చెప్పాలి. అందువల్ల “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును” అనే మాట ఎంత వాస్తవం (సామెతలు 16:9). కీర్తన 65:4, యెహెజ్కేలు 36:27లతో పోల్చండి.

4. దేవుడు తాను ఏర్పాటుచేసుకున్నవారిని భద్రపరుస్తాడు

ఈ దివ్యమైన సత్యాన్ని బోధించే లేఖనభాగాలు చాలా ఉన్నాయి. “ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలోనుండి ఆయన వారిని విడిపించును” (కీర్తన 97:10). “ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నయెన్నటికి కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును” (కీర్తన 37:28). "యెహోవా తన్ను ప్రేమించు వారినందరిని కాపాడును. అయితే భక్తిహీనులనందరిని ఆయన నాశనము చేయును” (కీర్తన 145:20). ఈ సందర్భములో విశ్వాసుల బాధ్యత, నమ్మకత్వాల గురించి వాదాన్ని లేవనెత్తడం గానీ, వాటిని నిరూపించడానికి లేఖనాలను చూపించాల్సిన అవసరం కానీ లేదు. దేవుడు మనకి ఊపిరినివ్వకపోతే మనం ఎలా బ్రతకలేమో అలాగే దేవుడు మనల్ని భద్రపరచకపోతే మనం అంతం వరకూ కొనసాగలేము. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తిచేత మనం కాపాడబడుచున్నాము (1 పేతురు 1:5). [simple_Tooltip content='తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.']1దిన. 18:6[/simple_tooltip]తో పోల్చండి.

II దుష్టులతో దేవుడు వ్యవహరించే పద్ధతి

ఏర్పాటులో లేనివారిని దేవుడు పరిపాలించే విషయంలో, వారిపై ఆయన నాలుగు విధాలుగా తన శక్తిని ప్రదర్శిస్తాడని గమనించగలము. డాక్టర్ రైస్ సూచించిన ఈ నాలుగు విధాల ప్రభావాలను ఇక్కడ పరిగణలోనికి తీసుకుంటున్నాను -

1) దుష్టులు సహజంగా చేయదలుచుకున్నవాటిని అదుపు చేయటం ద్వారా వారిపై దేవుడు తన ప్రభావాన్ని కనపరుస్తాడు

గెరారుకు రాజైన అబీమెలెకు విషయంలో దీనికొక స్పష్టమైన ఉదాహరణ కనబడుతుంది. అబ్రాహాము తన భార్యయైన శారాతో గెరారుకు వెళ్ళాడు. శారా తనకు భార్య అని తెలిస్తే అక్కడి ప్రజలు తనను చంపేస్తారని భయపడి అబ్రాహాము తన భార్యయైన శారాను తనకు సోదరి అని చెప్పమన్నాడు, నటించమన్నాడు. శారాను అవివాహితురాలైన స్త్రీగా పరిగణించి అబీమెలెకు ఆమెను వివాహం చేసుకోవడానికి తీసుకెళ్లాడు; ఆ తర్వాత శారా యొక్క గౌరవాన్ని కాపాడడం కోసం దేవుడు తన శక్తిని ఎలా ప్రదర్శించాడో మనం చూస్తాం - “అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు” (ఆది 20:6). దేవుడు జోక్యం చేసుకోకపోతే అబీమెలెకు శారా విషయంలో ఘోరమైన తప్పిదం చేసి ఉండేవాడు. అయితే ప్రభువు అతన్ని అడ్డుకున్నాడు, తన హృదయాలోచనలను నెరవేర్చుకోవడానికి అతన్ని దేవుడు అనుమతించలేదు. యోసేపుతో అతని సహోదరులు ప్రవర్తించిన విధానంలో ఇలాంటి ఉదాహరణే మరొకటి కనబడుతుంది. యాకోబు తన కుమారులందరిలో యోసేపును అమితంగా ప్రేమించాడు; అందుకు యోసేపును అతని సహోదరులు ద్వేషించారు. తమ చేతులకు చిక్కాడని భావించినప్పుడు అతని చంపుటకు దురాలోచన చేశారు (ఆది 37:18). అయితే వారి దురాలోచనలను నెరవేర్చడానికి దేవుడు వారిని అనుమతించలేదు. వారి చేతుల్లోనుండి యోసేపును తప్పించడానికి ఆయన మొదటిగా రూబేనును ప్రేరేపించాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఇష్మాయేలీయులకు అతన్ని అమ్మేద్దామనే ఆలోచన యూదా ద్వారా వారికి కలిగించాడు. ఆ ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లారు. దేవుడే వారి దురాలోచనను అడ్డగించాడని తన సహోదరులకు తనను తాను వెల్లడి చేసుకున్నప్పుడు యోసేపే స్వయంగా చెప్పాడు. “దేవుడే గాని మీరు నన్నిక్కడికి పంపలేదు” అని అతడు చెప్పాడు (ఆది 45:8).

ఇశ్రాయేలీయులను శపించడానికి బాలాకు నియమించుకున్న అబద్ద ప్రవక్త బిలాము. ఇతని విషయంలో కూడా దేవుడు జోక్యం చేసుకుని అతని దురాలోచనలను అడ్డుకున్నాడు. బాలాకు ఇవ్వచూపిన ధనానికి బిలాము ఆకర్షితుడయ్యాడనీ, దాన్ని అంగీకరించాడనీ మనకు దైవప్రేరేపిత వృత్తాంతం తెలియచేస్తోంది. అతని సొంత ఒప్పుకోలులోనే అతని హృదయాభిలాషలను దేవుడు ఏ విధంగా నిరోధించాడో స్పష్టంగా మనం చూడవచ్చు - “ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే! ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే! ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను. ఆయన దీవించెను; నేను దాని మార్చలేను” (సంఖ్యా 23:8,20).

కేవలం వ్యక్తుల్ని మాత్రమే కాదు వ్యక్తుల సమూహాలను కూడా ఆయన నిర్బంధించగలడు. నిర్గమ 34:24లో చక్కటి ఉదాహరణ మనకు కనబడతుంది - “ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసెదను, మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడును నీ భూమిని ఆశింపడు.” ప్రతీ పురుషుడు సంవత్సరంలో 3సార్లు యెహోవా యొక్క పండగల్ని ఆచరించడానికి తన ఇంటినీ, ఆస్తినీ విడిచిపెట్టి యెరూషలేముకు ప్రయాణం చేసేవాడు; వాళ్ళు యెరూషలేములో ఉండగా భద్రత లేకుండా ఉన్న వారి గృహాలను ఆక్రమించుకోవాలనే అన్యజనుల ప్రణాళికలనూ, ఆలోచనలనూ అడ్డగించి సంరక్షిస్తానని పై లేఖనంలో దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడని మనం చూస్తున్నాం.

2) దుష్టులు వారి సహజ ప్రవృత్తికి విరుద్ధంగా మృదువుగా ప్రవర్తించి దేవుని ప్రణాలికను నెరవేర్చే విధంగా వారిపై దేవుడు తన ప్రభావాన్ని కనబరుస్తాడు.

పై మాటలను పరిశీలించడానికి యోసేపుకు ఐగుప్తులో ఎదురైన అనుభవాలను ఇప్పుడు గమనిద్దాం. యోసేపు పోతీఫరు ఇంట్లో ఉన్నప్పుడు, “యెహోవా యోసేపుకు తోడైయున్నాడు, యెహోవా అతనికి తోడైయున్నాడని అతని యజమానుడు గమనించాడు”. ఫలితంగా యోసేపు మీద అతనికి కటాక్షము కలిగింది, కాబట్టి అతన్ని పోతీఫరు తన ఇంటిమీద విచారణకర్తగా నియమించాడు (ఆది 39:3,4). తర్వాత అన్యాయంగా యోసేపు చెరసాల్లో వేయబడినప్పుడు, "యెహోవా యోసేపునకు తోడైయుండి, అతనియందు కనికరపడి అతనిమీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను” (ఆది 39:21). ఫలితంగా చెరసాల అధిపతి యోసేపుకు దయ చూపించాడు, అతన్ని ఘనపరిచాడు. చెరసాల నుంచి విడుదలైన తర్వాత, అపొ.కా. 7:10లో మనం ఇలా చదువుతున్నాం. “ప్రభువు యోసేపుకు దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో యెదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతన్ని అధిపతిగా నియమించెను”.

తన శత్రువుల హృదయాలను కూడా దేవుడు తన శక్తితో కరిగిస్తాడనటానికి అద్భుతమైన ఉదాహరణ ఫరో కుమార్తె పసిబాలుడైన మోషే విషయంలో ప్రవర్తించిన తీరులో కనబడుతుంది. ఈ వృత్తాంతం సుపరిచితమైనదే! ఇశ్రాయేలీయుల్లో ప్రతీ మగబిడ్డనూ చంపేయమని ఫరో ఒక శాసనాన్ని చేశాడు. లేవీయుడొకడు ఒక మగబిడ్డను కన్నాడు. మూడు నెలలపాటు తల్లి ఆ బిడ్డను దాచిపెట్టింది. తర్వాత ఇక ఏ మాత్రం అతని దాచిపెట్టలేక అతన్ని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నది ఒడ్డున అతన్ని ఉంచింది. ఆ జమ్ము పెట్టెను మరెవ్వరో కాదు రాజకుమార్తె చూసింది, ఆమె అక్కడికి స్నానం చేయడానికి వచ్చింది. తన తండ్రి చేసిన దుర్మార్గపు శాసనాన్ని బట్టి ఆ బిడ్డను నదిలోకి విసిరేయడానికి బదులు, ఆమె ఆ బిడ్డయందు కనికరపడింది! (నిర్గమ 2:6) దాని మూలంగా ఆ చంటిబిడ్డ బ్రతికాడు, ఆ తర్వాత యువరాణికి దత్తపుత్రుడయ్యాడు!

మనుషులందరి హృదయాలు దేవునికి అందుబాటులోనే ఉంటాయి. తన సార్వభౌమ సంకల్పానికి అనుగుణంగా వాటిని కరిగిస్తాడు లేదా కఠినపరుస్తాడు. తన సోదరుడైన యాకోబు తననూ, తన తండ్రినీ మోసగించినందుకు ఏశావు అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత అతడు యాకోబును కలిసినప్పుడు అతన్ని చంపడానికి బదులు ఏశావు అతని మెడ మీద ముద్దుపెట్టుకున్నాడు! (ఆది 32:4) యెజెబేలుకు భర్త అయిన అహాబు బలహీనుడు, దుష్టుడు. ప్రవక్తయైన ఏలీయా మూడున్నర సంవత్సరాలు ఆకాశం మూయబడేందుకు కారణమయ్యాడని విని అహాబు కోపంతో రగిలిపోయాడు. ఏలీయాను శత్రువుగా భావించి, ప్రతీ దేశంలోనూ, రాజ్యంలోనూ అతన్ని వెదికించినా లాభం లేక చివరికి అతడొక ప్రమాణం చేసుకున్నాడు (1రాజులు 18:10). అయితే తర్వాత ఏలీయాను కలిసినప్పుడు అతన్ని చంపడానికి బదులు అతని ఆజ్ఞకు లోబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలందర్ని బయలు ప్రవక్తలందరినీ కర్మెలు పర్వతం దగ్గర సమావేశం కావాలని ఆదేశించాడు (వ.20). ఎస్తేరు దీనురాలైన యూదురాలు. మాదియ పర్షియా చక్రవర్తి అయిన అర్తహషస్త రాజసభలోనికి చట్టవిరుద్ధమైనప్పటికీ ప్రవేశించింది (ఎస్తేరు 4:16). ఆమె మరణ శిక్షను ఊహిస్తూ లోపలికి ప్రవేశించింది. “అయితే రాణియైన ఎస్తేరును చూడగానే ఆమెయందు అతనికి దయ కలిగింది. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపాడు (5:2)” అని మనం చదువుతున్నాం. యవ్వనుడైన దానియేలు విదేశీ రాజదర్బారులో బందీగా ఉన్నాడు. దానియేలు కోసం, అతని స్నేహితుల కోసం అనుదిన ఆహారపానీయాలను రాజు ఏర్పాటు చేశాడు. అయితే రాజు నియమించిన ఆహారాన్ని తిని తన్ను తాను అపవిత్రపరచుకోనని దానియేలు తన హృదయంలో దృఢనిశ్చయం చేసుకున్నాడు. తనకు యజమాని అయిన నపుంసకుల అధిపతికి తన నిర్ణయాన్ని తెలియచేశాడు. తర్వాత ఏం జరిగింది? అతని యజమాని అన్యజాతికి చెందినవాడు, రాజుకు భయపడేవాడు. దానియేలుపై కోప్పడి, రాజు ఆదేశాలను పాటించాల్సిందే అని వత్తిడి చేశాడా? లెదు, “దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపాకటాక్షము నొందననుగ్రహించెను” (దాని 1:9) అని మనం చదువుతున్నాం.

“యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలవలె నున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును” (సామెతలు 21:1). పర్షియాకు రాజైన కోరేషు ఉదంతంలో దీనికొక విశేషమైన ఉదాహరణ కనబడుతుంది. దేవుని ప్రజలు చెరలో ఉన్నారు, వారి చెరలో ఉండాల్సిన కాలం ముగియబోతోందని ప్రవచనం చెబుతోంది. ఈ సమయంలో యెరూషలేములోని దేవాలయం శిథిలావస్థలో ఉంది. దూరదేశంలో బానిసలుగా ఉన్న యూదులకున్న నిరీక్షణ ఏంటి? ప్రభుని మందిరం పునర్నిర్మించబడటానికి అవకాశం ఏది? ఇప్పుడు దేవుడేం చేశాడో చూడండి. “పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను” (ఎజ్రా 1:1). "పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు” (వ.2).

కోరేషు అన్యజాతికి చెందినవాడని గుర్తుంచుకోండి, ఇతడొక దుష్టుడని చరిత్ర సాక్ష్యమిస్తోంది. అయినప్పటికీ 70ఏళ్ల క్రితం ప్రవక్తయైన యిర్మీయా ద్వారా తాను పలికిన మాట నెరవేర్చుకోవడం కోసం ప్రభువు కోరేషును ఆ శాసనం జారీ చేసేలా ప్రేరేపించాడు. ఎజ్రా 7:27లో ఇలాంటి మరొక ఉదాహరణ కనబడుతుంది. కోరేషు ఆజ్ఞాపించిన దేవుని మందిర నిర్మాణాన్ని పూర్తి చేయడానికీ, తీర్చిదిద్దడానికి దేవుడు అర్తహషస్త రాజును ప్రేరేపించినందుకు ఎజ్రా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. “యెరూషలేములో నుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను... మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక!” (ఎజ్రా 7:27).

3) దుష్టులు చేయదలిచిన దుష్కార్యం నుంచి మేలు జరిగేలా దేవుడు వాళ్ళ చర్యలను నియంత్రిస్తాడు

మరొకసారి ఈ వాస్తవాన్ని నిరూపించడానికి యోసేపు చరిత్రకు తిరిగి వెళదాం. క్రూరంగా, నిర్దయగా అతని సోదరులు అతన్ని ఇష్మాయేలీయులకు అమ్మేశారు. యోసేపును అడ్డు తొలగించుకోవాలన్నదే వారి లక్ష్యం, అప్పుడు అటుగా ప్రయాణిస్తున్న వ్యాపారులు వారి లక్ష్యం సునాయాసంగా నెరవేరడానికి సహాయపడ్డారు. ఈ యవ్వనస్తుణ్ణి ఒక బానిసగా అమ్మటం వారికి ధనం సంపాదించుకోవడం కోసం ఒక అవకాశం తప్ప మరి ఇంకేమీ కాదు. అయితే దేవుడు వాళ్ళ దుష్కార్యాలను కొట్టిపారేస్తూ రహస్యంగా ఎలా పనిచేస్తున్నాడో గమనించండి. ఇష్మాయేలీయులు సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చేలా దేవుడు సమకూర్చి జరిగించాడు, అందువల్ల యోసేపును హత్య చేయాలనే ఆలోచనకు తెరపడింది. అంతేకాదు ఈ ఇష్మాయేలీయులు ఐగుప్తుకు ప్రయాణం చేస్తున్నారు, యోసేపును దేవుడు పంపించాలనుకున్న దేశం ఖచ్చితంగా అదే! వాళ్ళు యోసేపును కొనుక్కోవాలని దేవుడు నియమించాడు. దేవుని హస్తం ఈ సందర్భంలో ఉంది. ఇది యాదృచ్చికంగా జరిగింది కాదు. తర్వాత కాలంలో తన సోదరులతో యోసేపు చెప్పిన మాటలను బట్టి ఇది స్పష్టమౌతుంది. “మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను” (ఆది 45:7).

దేవుడు దుష్టులను నడిపిస్తాడు అనే మాటకు యెషయా 10:5-7లో మరొక ఆశ్చర్యకరమైన ఉదాహరణ కనబడుతుంది. “అష్బూరీయులకు శ్రమ. వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర్ర నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది. భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల పెట్టుటకును వీధులను తొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారి కాజ్ఞాపించెదను. అయితే అతడు ఆలాగనుకొనడు అది అతని ఆలోచన కాదు; నాశనము చేయవలెననియు చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన”. ప్రపంచానికి అధిపతి కావాలనీ, అనేక దేశాలను, జాతులను నాశనం చేయాలనీ అష్బూరు రాజు దృఢనిశ్చయం చేసుకున్నాడు. అయితే అతని రాజ్యాహంకార దాహాన్ని, దురుద్దేశాన్ని దేవుడు నియంత్రించి, పెద్దగా ప్రాముఖ్యతలేని జనాంగమైన ఇశ్రాయేలును జయించడంపై మాత్రమే అతని దృష్టిని మళ్ళించాడు; గర్విష్టి అయిన రాజు హృదయంలో అలాంటి ఆలోచన లేదు - “అయితే అతడు ఆలాగనుకొనడు” - అయితే దేవుడు అతనికి ఈ పని అప్పగించాడు, దాన్ని నెరవేర్చడం తప్ప ఆయన మరేమి చేయడు. న్యాయాధి 7:22తో పోల్చండి.

దుష్టుల్ని దేవుడు నియంత్రిస్తాడు, నడిపిస్తాడు అనే దానికి అతి శ్రేష్ఠమైన ఉ దాహరణ క్రీస్తు యొక్క సిలువ, దానికి సంబంధించిన పరిస్థితులు. అది చరిత్రలోనే అత్యంత కీలకమైన సంఘటన. ఆ సంఘటనలోని ప్రతీ విషయాన్ని దేవుడు జగత్తు పునాది వేయడానికి ముందే నిర్ణయించాడు. విధిరాతకో, మనుషుల ఊహలకో దేవుడు దేన్నీ విడిచి పెట్టలేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా తన ప్రియ కుమారుడు మరణించాలో దేవుడు నిర్ణయించాడు. సిలువ గురించి దేవుని ఉద్దేశించినదానిలో అత్యధిక శాతం పాతనిబంధన ప్రవక్తల ద్వారా తెలియచేయబడింది. అవి ఖచ్చితంగా అక్షరానుసారంగా నెరవేరాయి. దుష్టులను దేవుడు నియంత్రిస్తాడు, నడిపిస్తాడు అనే వాస్తవానికి స్పష్టమైన సాక్ష్యం, సంపూర్ణమైన రుజువు సిలువ కార్యంలో కనబడుతున్నాయి. దేవుడు నియమించినది కాక మరేది జరగలేదు, ఆయన నియమించినదంతా ఆయన ఉద్దేశించినట్లుగానే నెరవేరింది. రక్షకుడు తన సొంత శిష్యుల్లో ఒకనిచేత, అత్యంత ఆప్తమిత్రునిచేత అప్పగించబడతాడని దేవుడు శాసించాడు, లేఖనం ప్రవచించింది. కీర్తన 41:9ని చూడండి, మత్తయి 26:50తో పోల్చండి. అపొస్తలుడైన యూదాయే ఆయనను అమ్మేసిన వ్యక్తి! అప్పగించే వ్యక్తి చేసే ద్రోహకార్యానికి అతనికి 30 వెండి నాణాలు ఇవ్వబడతాయని నిర్ణయించబడింది. సరిగ్గా ఇంతే ధనాన్ని ప్రధానయాజకులు అతనికిచ్చేలా ప్రేరేపించబడ్డారు. ఈ ధనంతో ఒక కుమ్మరివాని పొలం కొనబడుతుందని శాసించబడింది, అప్పుడు దేవుని హస్తం యూదాను ఆ ధనం తిరిగి ప్రధానయాజకులకు ఇచ్చేయమని నడిపించింది, అప్పుడు వారి సభ (మత్తయి 27:7) ఖచ్చితంగా ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ ఒక కుమ్మరివాని పొలాన్ని కొన్నది. మన ప్రభువుకి వ్యతిరేకంగా అబద్దసాక్ష్యం పలికేవాళ్ళుంటారని శాసనం చేయబడింది (కీర్తన 35:11), దానికి తగినట్లుగానే వాళ్ళు నియమించబడ్డారు. మహిమగల ప్రభువు మోము పైన ఉమ్మివేయబడుతుందనీ, కొరడాలతో కొట్టబడతాడనీ శాసించబడింది (యెషయా 50:6), ఖచ్చితంగా రోమా సైనికులు చేసింది ఇదే. రక్షకుడు అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడునని శాసించబడింది, దేవునిచేత నడిపించబడిన పిలాతు ఈ సత్యాన్ని ఎరుగకుండానే ఆయనతో పాటు ఇద్దరు దొంగల్ని సిలువ శిక్షకు అప్పగించమని ఆదేశాలు జారీ చేశాడు. ఆయన సిలువపై వేలాడుతున్నప్పుడు చేదుచిరక ఆయనకు త్రాగడానికి ఇవ్వబడుతుందని నియమించబడింది, ఈ దేవుని శాసనం అక్షరాలా నెరవేరింది. కఠినహృదయులైన సైనికులు ఆయన వస్త్రాల కోసం ఓట్లు వేసుకుంటారని శాసించబడింది, వాళ్ళు అలాగే చేశారు. ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరవబడదని శాసించబడింది (కీర్తన 34:20), రోమా సైనికుడు దొంగల మోకాళ్ళు విరగొట్టినా మన ప్రభువు యొక్క కాళ్లు విరగొట్టకుండా దేవుని హస్తం అతన్ని నియంత్రించింది. క్రీస్తు దేహంలో ఒక్క ఎముకను విరగొట్టడానికి రోమా సేనలన్నిటిలో సరిపడనంత సైనికులు లేరు, సాతాను అనుచరుల్లో తగినన్ని దయ్యాలు లేవు. ఎందుకు? ఎందుకంటే సర్వశక్తిమంతుడైన సార్వభౌముడు ఒక్క ఎముక కూడా విరవబడకూడదని శాసించాడు కాబట్టి! ఈ తలంపుని మనం ఇంకా పొడిగించాల్సిన అవసరం ఉందా? సిలువకు సంబంధించి లేఖనం ప్రవచించినవన్నీ ఖచ్చితంగా అక్షరానుసారంగా నెరవేరాయి. ఆ మహాదినాన జరిగిన ప్రతీ కార్యాన్ని సర్వశక్తిమంతుడైన దేవుడు నడిపిస్తున్నాడు, పర్యవేక్షిస్తున్నాడు అనడానికి ఇదొక నిస్సందేహమైన రుజువు కాదా?

4) దేవుడు దుష్టుల హృదయాలను కఠినపరుస్తాడు, వారి మనస్సులకు గ్రుడ్డితనం కలుగచేస్తాడు

దేవుడు మనుషుల హృదయాలను కఠినపరుస్తాడా? మనుషుల మనసులకు గ్రుడ్డితనం కలుగచేస్తాడా? అవును, లేఖనం ఆయనను అలాగే చూపిస్తోంది. ప్రపంచ నిర్వహణలో దేవుని సార్వభౌమత్వం అనే అంశాన్ని గురించిన అధ్యయనంలో మనం అత్యంత కీలకమైన దశకు చేరుకున్నాం. కాబట్టి పరిశుద్ధ లేఖనాలు చెప్పే సాక్ష్యాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆయన వాక్యం చెబుతున్నదానికి మించి ఒక్క అడుగు కూడా మనం ముందుకెళ్ళకుండా దేవుడు మనల్ని అడ్డుకొనును గాక! అయితే ఆయన వాక్యం వెళ్ళినంతమట్టుకు మనం కూడా వెళ్ళగలిగేలా ఆయన మనకు కృప అనుగ్రహించును గాక! రహస్యములు యెహోవాకే చెందును అనేది సత్యం. అయితే బయలుపరచబడినవి మనకును, మన పిల్లలకును చెందినవనేది కూడా సత్యమే. “తన ప్రజలను ద్వేషించునట్లును, తన సేవకుల యెడల కుయుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను” (కీర్తన 105:25). యాకోబును, అతని కుటుంబాన్ని ఐగుప్తుకు ఆహ్వానించిన ఫరో మరణించినప్పుడు ఆ దేశంలో యాకోబు వంశస్థుల యాత్ర గురించిన ప్రస్తావన ఇక్కడ వుంది. యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. ఐగుప్తీయుల సంఖ్యను మించేలా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజుల్లో విస్తరించారు. అప్పుడు వారి హృదయాలను తన ప్రజలను ద్వేషించేలా దేవుడు త్రిప్పాడు.

ఐగుప్తీయుల ద్వేషానికి చిక్కిన ఇశ్రాయేలీయులకు ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాళ్ళు భరించ వీలులేనంత కఠినంగా ఐగుప్తీయులు వాళ్ళచేత సేవ చేయించుకున్నారు, కనికరం చూపించని యజమానుల్ని వారిపైన నియమించారు. నిస్సహాయ స్థితిలో, దిక్కు తెలియని పరిస్థితిలో ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. ఆ ప్రార్థనలకు స్పందిస్తూ ఆయన మోషేకు వాళ్ళకు రక్షకునిగా నియమించాడు. తాను ఏర్పాటు చేసుకున్న సేవకునికి దేవుడు తన్ను తాను వెల్లడి చేసుకున్నాడు, ఐగుప్తీయుల రాజసభలో కనపరచడానికి అద్భుత సూచనలను అతనికిచ్చి ఫరో దగ్గరకు పంపించాడు. అరణ్యంలోనికి తన ప్రజల్ని యెహోవానైన తనను ఆరాధించడానికి అరణ్యంలోనికి 3రోజులు ప్రయాణమంత దూరం వెళ్ళనిమ్మని ఫరోను కోరాడు. అయితే మోషే తన ప్రయాణాన్ని మొదలుపెట్టక ముందే ఫరో గురించి ఈ హెచ్చరిక చేశాడు, “నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు” (నిర్గమ 4:21). దేవుడు ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు? “అతనియందు దేవుడు తన ప్రభావమును కనపరచడానికి” అని లేఖనం స్వయంగా జవాబు చెబుతోంది (రోమా 9:17). ఇంకొకరీతిగా చెప్పాలంటే, చీమను కాలితో నలిపి చంపేయడం మనషులకెంత సులభమో అదేవిధంగా అహంకారి, శక్తిమంతుడు అయిన ఈ చక్రవర్తిని కూలదోయడం తనకంతే సులభమని కనపరచడానికే ప్రభువు ఫరోను కఠినపరిచాడు. తన శక్తిని కనపరచడానికి దేవుడు అలాంటి పద్ధతిని ఎందుకు ఎంచుకున్నాడు? 'సార్వభౌముడిగా తనకు నచ్చినట్లు పనిచేసే హక్కును దేవుడు తనకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు' అనేది ఈ ప్రశ్నకు జవాబు.

ఇశ్రాయేలీయులను పోనియ్యడానికి అనుమతించకుండా దేవుడు ఫరో హృదయాన్ని కఠినపరిచాడు. అంతేకాదు, దేవుడు ఐగుప్తుపై తీవ్రమైన తెగులును పంపించిన తర్వాత షరతులతో కూడిన అనుమతిని ఫరో ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. తర్వాత ఐగుప్తీయుల తొలిచూలు సంతానాన్ని అంతటినీ చంపాడు. అప్పుడు బానిసలుగా తామున్న దేశాన్ని ఇశ్రాయేలీయులు విడిచిపెట్టారు. అప్పుడు దేవుడు మోషేతో ఇలా చెప్పాడు, “ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు; నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథములవలనను అతని గుర్రపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను” (నిర్గమ 14:17,18).

ఆ తర్వాత కాలంలో హెషోనుకు రాజైన సీహోసు విషయంలోనూ ఇదే జరిగింది. వాగ్దానభూమికి ప్రయాణిస్తూ మార్గమధ్యలో హెష్బోను గుండా ఇశ్రాయేలీయులు వెళ్ళవలసి వచ్చింది. తమ చరిత్రను గుర్తుచేసుకుంటూ మోషే ప్రజలతో ఇలా చెప్పాడు, “అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశమార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగచేసెను” (ద్వితీ 2:30).

ఇశ్రాయేలు కనానులో ప్రవేశించిన తరువాత కూడా ఇలాగే జరిగింది. “ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియు లేదు. ఆ పట్టణములన్నిటిని వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చునట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను” (యెహో 11:19,20). కనానీయుల ఘోరమైన దుష్టత్వాన్ని బట్టి దుర్నీతిని బట్టి వాళ్ళను నాశనం చేయాలని దేవుడు ఉద్దేశించాడని ఇతర లేఖనాలు చెబుతున్నాయి.

ఈ గంభీరమైన సత్యం గురించిన ప్రత్యక్షత పాత నిబంధనకు మాత్రమే పరిమితం కాలేదు. యోహాను 12:37-40లో మనం ఇలా చదువుతున్నాం, “ఆయన వారి యెదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయనయందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవనికి బయలు పరచబడెను? అని ప్రవక్తయైన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడ కుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగచేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరియొక చోట చెప్పెను”. ఇక్కడ దేవుడు ఎవరి కళ్ళకైతే గుడ్డితనం కలుగచేశాడో, ఎవరి హృదయాలైతే కఠినపరిచాడో, వాళ్ళు దేవుని కుమారుని గురించిన సాక్ష్యాన్ని తిరస్కరించినవాళ్ళు, వెలుగును ఉద్దేశపూర్వకంగా ఎగతాళి చేసినవాళ్ళు అని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.

అదే విధంగా 2 థెస్స 2:11,12లో మనం ఇలా చదువుతున్నాం - “ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గల వారందరును శిక్షావిధి పొందుటకై అబద్దమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు”. ఈ లేఖనాల నెరవేర్పు భవిష్యత్తులోనే జరుగుతుంది. ఒకనాటి యూదులకు చేసినదాన్నే క్రైస్తవ్యానికి కూడా ఆయన చేయబోతున్నాడు. క్రీస్తు రోజుల్లో ఉన్న యూదులు ఆయన సాక్ష్యాన్ని తృణీకరించి ఫలితంగా అంధులయ్యారు. అదే విధంగా దోషభరితమైన క్రైస్తవలోకం సత్యాన్ని తృణీకరించినప్పుడు, వాళ్ళు ఒక అబద్ధాన్ని నమ్మేవిధంగా దేవుడు వాళ్ళ మీదకి మోసపరిచే శక్తిని పంపబోతున్నాడు. దేవుడు నిజంగా లోకాన్ని పరిపాలిస్తున్నాడా? మానవజాతిపై ఆయన తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడా? మానవజాతిపై ఆయన పరిపాలన పద్దతి ఏ విధంగా ఉంటుంది? మానవపుత్రులను ఆయన ఏ విధంగా, ఏ మేరకు నియంత్రిస్తాడు? దుష్టుల హృదయాలు తనకు విరోధంగా ఉన్నాయని ఎరిగిన దేవుడు వారిపై ఏ విధంగా తన ప్రభావాన్ని కనపరుస్తాడు? ఈ అధ్యాయంలో ఈ ప్రశ్నలకు లేఖనాల నుంచి జవాబు చెప్పడానికి నేను ప్రయత్నించాను. తన ఏర్పాటులో ఉన్నవారికి దేవుడు నూతన జీవాన్నిస్తాడు, బలపరుస్తాడు, నడిపిస్తాడు, భద్రపరుస్తాడు. ఆయన తన అనంతజ్ఞానానికి అనుగుణంగా తన నిత్యసంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి దుష్టులను ఆటంకపరుస్తాడు. మృదువుగా వ్యవహరించేలా మారుస్తాడు, నడిపిస్తాడు, కఠినపరుస్తాడు, గుడ్డితనం కలుగచేస్తాడు. దేవుని శాసనాలు అమలు చేయబడుతున్నాయి, ఆయన నియమించినది నెరవేరుతోంది, మనిషి యొక్క దుష్టత్వం బంధించబడుతోంది. దుష్టులు, వారి దుష్కార్యాల యొక్క హద్దుల్ని నియమించేది దేవుని శాసనాలే, ఆ హద్దులు దాటడానికి ఎవ్వరికీ అవకాశం ఉండదు. చాలామందికి తెలియకపోయినా, మనుషులందరూ - సజ్జనులు, దుర్జనులు - అంతిమ సార్వభౌముడైనవాని అధికార పరిధిలోనే సంపూర్ణంగా బందీలుగా ఉన్నారు. “హల్లెలూయా; సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు” (ప్రకటన 19:6). ఆయన అందరినీ, అన్నిటినీ పరిపాలిస్తున్నాడు!

అధ్యాయం 7 

దేవుని సార్వభౌమత్వం మరియు మానవ చిత్తం

“మీరు ఇచ్చయించుటకు కార్యసిద్ధి కలుగచేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే” (ఫిలిప్పీ 2:13).

పతనమైన మనిషి చిత్తం యొక్క స్వభావం గురించి నేటి దినాన ఎంతో అయోమయం నెలకొని ఉంది. చాలామంది దేవుని బిడ్డలు కూడా మానవచిత్తం గురించి తప్పుడు అభిప్రాయాలను కలిగున్నారు. 'మనిషికి స్వతంత్ర చిత్తం/నిర్ణయ స్వేచ్ఛ' (free will) ఉంది, పాపి తన చిత్తంతో పరిశుద్ధాత్మకు సహకరించడం ద్వారా రక్షణ కలుగుతుంది' అనేది ప్రస్తుతం అత్యంత జనాదరణ పొందిన, అనేక ప్రసంగ వేదికలపై నుంచి బోధించబడుతున్న అభిప్రాయం. మనిషికి స్వతంత్ర చిత్తం ఉందనీ, మంచిని ఎంచుకునే శక్తి ఉందనీ, క్రీస్తును అంగీకరించే సహజసామర్థ్యం ఉందన్న అభిప్రాయాన్ని తృణీకరిస్తే వాక్యానుసారంగా జీవిస్తున్నామని చెప్పుకునేవారి ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. అయితే లేఖనం నొక్కి చెబుతున్న విషయం ఏమిటంటే, “కాగా పొందగోరువాని వలనైనను ప్రయాసపడువాని వలనైనను కాదు గాని, కరుణించు దేవుని వలననే అగును” (రోమా 9:16). మనం ఎవరిని నమ్మాలి? దేవుణా లేక ప్రసంగీకులనా?

అయితే యెహోషువా ఇశ్రాయేలీయులతో “మీరు ఎవని సేవించెదరో నేడు కోరుకొనుడి” అని చెప్పలేదా? అని ఎవరో ఒకరు అడగడానికి అవకాశముంది. అవును, అతడలా చెప్పాడు. అయితే ఈ వచనాన్ని మీరు పూర్తిగా ఎందుకు చదవరు? "నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమ్మోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో మీరు కోరుకోండి” అని యెహోషువా ఆజ్ఞాపిస్తున్నాడు (యెహో 24:15). అయితే లేఖనానికి విరుద్ధంగా లేఖనాన్ని ఉపయోగించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? లేఖనం లేఖనంతో ఎన్నడూ విభేదించదు. “దేవుని వెదకువాడెవడును లేడు” అని వాక్యం స్పష్టంగా ప్రకటిస్తుంది ( రోమా 3:11). తన సమయంలో ఉన్న మనుషులతో “మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు” అని క్రీస్తు చెప్పలేదా? అవును, కొంతమంది ఆయన దగ్గరకొచ్చారు. ఆయనను స్వీకరించారు. వాళ్ళెవరు? యోహాను 1:12, 13 మనకు ఇలా చెబుతోంది: “తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలన గానీ శరీరేచ్ఛల వలనగానీ మనుషేచ్ఛల వలనగానీ పుట్టినవారు కారు”.

ఇచ్చయించిన వారెవ్వరైనా రావచ్చని లేఖనం చెప్పట్లేదా? అవును చెబుతోంది, కాని ప్రతీ ఒక్కరికి రావడానికి ఇష్టముందని దీని అర్థమా? రానివారి పరిస్థితి ఏమిటి? 'ఇచ్ఛయించిన వారెవ్వరైనా రావచ్చు' అనే మాట 'పతనమైన మనిషి తనకు తానుగా రాగలడని, అతనికి ఆ శక్తి ఉందని' చెప్పట్లేదు. ప్రకృతిసంబంధియైన మనిషికి క్రీస్తును తృణీకరించే శక్తి మాత్రమే స్వతహాగా ఉంది. తనకు తానుగా క్రీస్తును అంగీకరించే శక్తి అతనికి లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు విరోధమైన మనసు ప్రకృతి సంబంధికి ఉంది (రోమా 8:7); ఆయనను ద్వేషించే హృదయం అతనికి ఉంది (యోహాను 15:18). మనిషి తన స్వభావానికి అనుగుణమైనదానిని ఎంచుకుంటాడు. అందువల్ల అతడు దైవికమైనదానినీ, ఆత్మసంబంధమైనదానినీ ఎంచుకోవడానికి ముందు, నూతన స్వభావం అతనికి అనుగ్రహించబడాలి; ఇంకోవిధంగా చెప్పాలంటే, అతడు తిరిగి జన్మించాలి.

'పాపి యొక్క పాపాలను ఒప్పింపచేసి, అతనికి క్రీస్తు అవసరాన్ని తెలియచేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి యొక్క శతృత్వాన్ని, ద్వేషాన్ని అధిగమించడా? నశిస్తున్న అనేకమందిలో కూడా దేవుని ఆత్మ అలాంటి ఒప్పుకోలునే కలిగించడా?' అని ఎవరైనా అడగటానికి అవకాశముంది. ఒకవేళ ఆ వ్యక్తి యొక్క శతృత్వం నిజంగా అధిగమించబడితే, అతడు ఇష్టపూర్వకంగా క్రీస్తు వైపుకు తిరుగుతాడు. అతడు రక్షకుని దగ్గరకు రావట్లేదంటే, అతనిలో దేవుని యెడల ఉన్న శతృత్వం అధిగమించబడలేదని స్పష్టమవుతోంది. అయితే వాక్య ప్రకటన ద్వారా పరిశుద్ధాత్మ ఒప్పింపుకు గురైన అనేకమంది చివరికి అవిశ్వాసంలోనే మరణిస్తున్నారనేది కూడా నిజమే. అయితే ఎన్నుకోబడనివారిలో చేసేదానికంటే, ఎన్నికైనవారిలోనే పరిశుద్దాత్ముడు ఎంతో ఎక్కువగా పనిచేస్తాడనే వాస్తవాన్ని మర్చిపోకూడదు. "ఇచ్ఛయించేలా దేవుని దయా సంకల్పం నెరవేరేలా” ఆయన వారిలో పని చేస్తాడు (ఫిలిప్పీ 2:13).

మనం పైన చెప్పినదానికి జవాబుగా ఆర్మీనియన్లు ఇలా చెబుతారు - 'మార్పు చెందినవారిలోనూ, మార్పు చెందనివారిలోనూ పరిశుద్ధాత్మ యొక్క ఒప్పింపు చేసే కార్యం ఒకే విధంగా ఉంటుంది. వ్యత్యాసం ఏంటంటే మార్పు చెందినవాళ్ళు ఆయన కార్యానికి లొంగిపోతుండగా, మార్పు చెందనివాళ్ళు ఆయన కార్యాన్ని ఎదిరిస్తున్నారు'. ఒకవేళ ఇదే నిజమైతే పరిశుద్ధాత్మకు సహకరించినందుకు అతిశయించడానికి, స్వీయఘనతకూ క్రైస్తవునికి అవకాశం దక్కుతుంది. అయితే ఇది ఎఫెసీ 2:8ను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది - “మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే”.

క్రైస్తవ పాఠకుణ్ణి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. క్రీస్తు దగ్గరకు రావడానికి నీవు ఇష్టపడని సమయం గతంలో లేదా? ఉంది కదా! ఆ పరిస్థితిలో నుంచే బయటపడి ఆయన దగ్గరకు మీరు వచ్చారు. దాని కోసం సమస్త మహిమను ఆయనకు చెల్లించడానికి ఇప్పుడు సిద్ధపడి ఉన్నారా? (కీర్తన 115:1). క్రీస్తంటే ఇష్టం లేని స్థితి నుంచి ఆయనను ఇష్టపడే స్థితికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తీసుకురావడం వల్లనే మీరు క్రీస్తు దగ్గరకు వచ్చారని గుర్తించట్లేదా? గుర్తిస్తున్నారు కదా! మరైతే పరిశుద్ధాత్ముడు మీలో చేసినదానిని అనేకమందిలో చేయలేదనేది స్పష్టమైన వాస్తవం కాదా? 'ఎంతోమంది సువార్తను విన్నారు, క్రీస్తు గురించి వాళ్ళకున్న అవసరత వాళ్ళకు తెలియచేయబడింది, అయినా వాళ్ళు రావడానికి విముఖంగానే ఉన్నారు' అనే విషయాన్ని ఒప్పుకుంటున్నాను. అందువల్లనే వారిలో కంటే పరిశుద్ధాత్మ మీలోనే ఎక్కువ పని చేశాడని అంటున్నాను. 'నాకు గుర్తుంది, ఒకనాడు సువార్త నాకు ప్రకటించబడినప్పుడు 'నా చిత్తం పని చేసిందనీ, క్రీస్తు నానుండి కోరినవాటికి నేను లొంగిపోయాననీ' నా మనస్సాక్షి సాక్ష్యమిస్తోంది' అని మీరు జవాబు చెబుతారా? నిజమే మీరు లొంగిపోవడానికి ముందే, దేవునికి వ్యతిరేకంగా మీ మనస్సులో ఉన్న శతృత్వాన్ని పరిశుద్ధాత్ముడు అధిగమించాడు. అయితే ఈ శతృత్వాన్ని ఆయన అందరిలోనూ అధిగమించడు. 'తమలోని శతృత్వాన్ని అధిగమించడానికి వాళ్ళు ఆయనకు అవకాశమివ్వరు, వాళ్ళకది ఇష్టముండదు' అని అంటారా? అయన సర్వశక్తి ఉపయోగించి, హృదయంలో కృపతో అద్భుతం చేసేవరకు ఏ ఒక్కడూ ఇష్టాన్ని కనపరచడు.

'మానవ చిత్తం' అంటే ఏంటో ఇప్పుడు విచారిద్దాం. 'చిత్తం' అనేది 'తనకు తానుగానే' స్వతంత్రంగా పనిచేసే విభాగమా? లేక వేరేది ఏదైనా, వేరే ఎవరైనా దానికి దిశానిర్దేశం చేస్తారా? చిత్తం సార్వభౌమురాలా లేక సేవకురాలా? మన వ్యక్తిత్వంలో ప్రతీ విభాగాన్ని పరిపాలించేంత అధికారం చిత్తానికి ఉందా? లేదా మిగతా విభాగాల ప్రేరణకు గురై, వాటి కోరికకు లోనై ఉంటుందా? చిత్తం మనసును పరిపాలిస్తుందా? లేదా మనస్సే చిత్తాన్ని నియంత్రిస్తుందా? చిత్తానికి తనకిష్టమైనదానిని చేసే స్వతంత్రం ఉందా? లేదా చిత్తమే వేరే దేనికైనా లోబడాల్సిన అవసరముందా? చిత్తం ఒక మనిషిలోని వేరే ఇతర భాగాలకు అతీతంగా పనిచేస్తుందా? లేదా కలిసే ఉండి పని చేస్తుందా? మొదటిగా ఆలోచన పుడుతుంది, తర్వాత కోరిక/అసహ్యం కలుగుతుంది, చివరిగా క్రియ జరుగుతుంది. మనిషిలో చిత్తానిది ప్రథమ కీలకస్థానమా? లేదా ఇతర విభాగాలకు కింద ఉండి బానిసగా పనిచేస్తుందా? నైతికచర్య యొక్క నిజతత్వం, దాని ప్రక్రియ ఆదికాండం 3:6లో జరిగినట్లే ఉంటుందా? 'ఆ చెట్టు ఆహారానికి మంచిదిగా (ఇంద్రియ జ్ఞానం, ఆలోచన), కన్నులకు అందంగా వివేకమిచ్చు రమ్యమైనదిగా (అభిరుచులు, కోరిక) ఉందని చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసికొని తిన్నది (చిత్తం)' - (G.S.Bishop). ఇవి కేవలం తత్వసంబంధమైన ప్రశ్నలు మాత్రమే కాదు, ముఖ్యమైనవి, ఆచరణాత్మకమైనవి.

1. మానవ చిత్తం యొక్క స్వభావం

చిత్తం అంటే ఏంటి? చిత్తం అంటే నిర్ణయం తీసుకునే విభాగం, చర్యలన్నిటికీ తక్షణ కారకం. 'ఎంపిక' అనే పదమే 'ఒక దాన్ని అంగీకరించడం, మరొకదాన్ని తిరస్కరించడం' అనే భావాన్ని సూచిస్తుంది. ఎంపిక చేసుకోవడానికి ముందే మనసు ముందు అనుకూలమైనదీ, ప్రతికూలమైనదీ ఉంచబడాలి. చిత్తం చేసే ప్రతీ ఎంపికలోనూ ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వడమనేది ఉంటుంది, అంటే ఒకదానికంటే ఎక్కువగా మరొకదాన్ని కోరుకోవడం ఉంటుంది. ఒకదాని కంటే మరొకదానికి ప్రాధాన్యత లేకపోతే, అక్కడ ఎంపిక చేసుకోవడమనేదే ఉండదు. ఇచ్ఛయించడం అంటే ఎంపిక చేసుకోవడం, ఎంపిక చేసుకోవడమనేది రెండు లేదా అంతకుమించిన ప్రత్యామ్నాయాల్లో ఒకదానిని ఎన్నుకోవడం. అయితే ఈ ఎంపికను ప్రభావితం చేసేదొకటి ఉంటుంది; నిర్ణయాన్ని నిర్దేశించేది ఒకటేదో ఉంటుంది. చిత్తం ఏదో ఒకదానికి సేవకురాలు కాబట్టి అది సార్వభౌమత్వంగలది కాదు. చిత్తం అనేది ఒకేసారి సార్వభౌమత్వంగలదిగానూ, సేవకురాలిగానూ ఉండలేదు. అలాగే చిత్తం అనేది ఒకేసారి కారకంగానూ (cause) ఫలితంగానూ (effect) ఉండటం సాధ్యం కాదు. చిత్తం దేనికీ మూలకారణం కాదు, ఎందుకంటే నిర్ణయాన్ని నడిపించేదొకటి ఉంటుంది. ఎంపిక అనేది ఎన్నో తర్జనభర్జనల చేత ప్రభావితం చేయబడుతుంది, ఎంపిక చేసుకునే వ్యక్తి పైన ఎన్నో ప్రేరణలు, పరిస్థితులు పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల చిత్తం అనేది ఎన్నో తర్జనభర్జనల, ప్రేరణల, పరిస్థితుల ఫలితం. వాటివల్ల కలిగే ఫలితం వాటికి సేవకురాలే కదా. చిత్తం అనేది వాటికి సేవకురాలైతే, అది సార్వభౌమత్వంగలది కాలేదు. చిత్తం సార్వభౌమత్వంగలది కాకపోతే, దానికి సంపూర్ణమైన స్వతంత్రం ఉన్నట్లు కాదు. చిత్తం చేసే పనులు వాటికవే జరిగిపోవు. కారకం లేకుండా ఫలితం రాదు. శూన్యం పదార్థాన్ని సృష్టించలేదు.

అయితే ప్రతీ తరంలోనూ 'మానవ చిత్తం సంపూర్ణ స్వేచ్ఛ కలిగిందనీ, సార్వభౌమత్వం కలదనీ' వాదించినవాళ్ళున్నారు. చిత్తానికి స్వయంగా తనను తాను నిర్దేశించుకునే శక్తి ఉందని వాళ్ళు వాదిస్తున్నారు. ఉదాహరణకు, నా కళ్ళు పైకెత్తి నేను ఆకాశాన్ని చూడగలను, కిందకు దించి భూమినీ చూడగలను. మనస్సు నేనేమి చూసినా దేన్నీ పట్టించుకోదు, చిత్తమే నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇది పరస్పరం విరుద్ధమైనది. ఇదేమి చెబుతోందంటే - నేను ఒకదానికంటే మరొకదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాను, అదే సమయంలో నేను ఏమీ చేయకుండా కూడా ఉన్నాను. ఒక పక్కన నిర్ణయం తీసుకుంటూ మరొక ప్రక్కన నిశ్చలంగా, జడపదార్థంలా ఉన్నానని చెప్పడం పరస్పర విరుద్ధంగా ఉంది, అందువల్ల ఈ రెండూ ఒకే సమయంలో నిజం కాలేవు. మనస్సు ఏదో ఒకదానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ముందు తటస్థంగా ఉంటుంది, ఆ సమయానికి చిత్తం కూడా తటస్థంగా, నిశ్చలంగానే ఉంటుంది. అయితే తటస్థ పరిస్థితి తొలగిపోగానే నిర్ణయం చేసుకోవడమనేది జరుగుతుంది.

చిత్తాన్ని నడిపించేది, దానికి దిశానిర్దేశం చేసేది ఏదో ఉంటుంది. చిత్తం నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమౌతుంది. మరి మనిషి చిత్తాన్ని నడిపిస్తున్నదేది? దానిని అత్యంత బలంగా ప్రేరేపించే శక్తి ఏంటి? ఈ ప్రేరణా శక్తి సందర్భాన్నిబట్టి మారుతూ ఉంటుంది. కొందరిని హేతువు ప్రేరేపించవచ్చు, మరి కొందరిని మనస్సాక్షి భావోద్వేగాలు పురికొల్పవచ్చు. కొందరు శోధకునిచే ప్రేరేపించబడవచ్చు, ఇంకొందరు పరిశుద్ధాత్మ శక్తిచేత ప్రేరణ పొందవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే, మనిషి చిత్తం చేసే పని మానసిక స్థితి చేత నిర్ణయించబడుతుంది, నడిపించబడుతుంది (మనస్సు లోకంచేత గానీ, శరీరం చేతగానీ, అపవాది చేతగానీ లేదా దేవునిచేత గానీ
ప్రేరేపించబడుతుంది). ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మనం చెబుతున్నదానిని విశ్లేషిద్దాం. ఒక ఆదివారపు మధ్యాహ్న సమయంలో మన స్నేహితుల్లో ఒకరు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నాడని ఊహిద్దాం. అనారోగ్యంతో ఉన్న మరొక వ్యక్తిని దర్శించడానికి ఆత్రుత అతనికి ఉంది. ఒకవేళ అనారోగ్యంతో ఉన్న వేరొక సహోదరుణ్ణి దర్శిస్తే తన ఆరోగ్య పరిస్థితి విషమించవచ్చు. అదే గనుక జరిగితే ఆ సాయంత్రపు సువార్త ప్రకటనకు అతడు హాజరు కాలేడు. ఇప్పుడు రెండు ప్రత్యామ్నాయాలు ఆ సహోదరుని ముందున్నాయి. ఆ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని అనారోగ్యంగా ఉన్న వేరే సోదరుణ్ణి తర్వాత రోజు దర్శించాలా? లేదా ఆ మధ్యాహ్నమే విశ్రాంతి తీసుకోకుండా అనారోగ్యంతో ఉన్న సోదరుణ్ణి దర్శించాలా? విశ్రాంతి తీసుకుంటే సాయంత్రం జరిగే సభకు వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు. విశ్రాంతి తీసుకోకపోతే వేరే రోగిని సందర్శించవచ్చు కాని మరింత బలహీనపడి సువార్త ప్రకటనకు వెళ్ళలేకపోవచ్చు. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న సోదరుణ్ణి చూడాలనే తపన, ఆ వ్యక్తి యెడల ప్రేమ మన స్నేహితునికి ఉన్నాయి. మరొక ప్రక్క తన తలనొప్పి వలన కలిగే బాధ, సాయంత్రం సభలో సువార్త ప్రకటన చేయలేమోనన్న ఆందోళన కూడా ఉన్నాయి. చివరికి మన స్నేహితుడు ఆ మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుని, ఆ సాయంత్రం సభకు హాజరై సువార్త ప్రకటించడానికే నిశ్చయించుకున్నాడు. ఈ రెండు ప్రత్యామ్నాయాల్లో మన స్నేహితుడు విశ్రాంతికీ, సువార్త ప్రకటనకూ మొగ్గు చూపడానికి కారణమైనదేంటి? చిత్తమా? కానే కాదు. చిత్తం ఈ నిర్ణయం తీసుకుందనేది వాస్తవమే. కానీ ఆ చిత్తం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉంచబడ్డాయి.

మొదటిది: అనారోగ్యంగా ఉన్న సోదరుని యెడల తనకున్న శ్రద్ధ, తన బాధ్యత. రెండవది: తన అనారోగ్య పరిస్థితి, సువార్త ద్వారా దేవుని మహిమ గురించిన నిజమైన భారం. ఈ రెండవ ప్రత్యామ్నాయమే గెలిచింది. మన స్నేహితుడు ఈ రెండు ప్రత్యామ్నాయాల గురించీ ఆలోచించాడు. తన మనస్సు తన బాధ్యతపై కంటే దేవునికి మహిమను తీసుకొచ్చే సువార్తపైన ఎక్కువ దృష్టి పెట్టింది. మనస్సు నిర్దేశించిన రీతిగా చిత్తం పని చేసింది. రెండూ ఆత్మసంబంధమైన ఆలోచనలే. అయితే అతని మనస్సు విశ్రాంతి, సువార్త ప్రకటనల వైపే మొగ్గు చూపింది. అందువల్ల అతడు ఆ మధ్యాహ్నం పూట విశ్రాంతి తీసుకున్నాడు. పై విశ్లేషణలో ఆత్మసంబంధమైన ఆలోచనలు మనస్సును ప్రేరేపించాయి. మనస్సు చిత్తాన్ని నిర్దేశించింది, నియంత్రించింది. చిత్తం నియంత్రించబడిందంటే అది సార్వభౌమత్వం గలది కాదు, స్వతంత్రం ఉన్నది కాదు. అది మనస్సుకు పరిచారకురాలు.

పరిశుద్ధ లేఖనాల్లో మన ప్రభువు గురించి ఉన్న రెండు వచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. “అప్పుడు యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను” (మత్తయి 4:1). అయితే మార్కు 1:12,13 వచనాలు ఇలా ఉన్నాయి - "వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు ఉండెను”. మనిషికున్న చిత్తం గురించి ఆర్మీనియన్ శాఖకున్న అవగాహన ఈ రెండు వచనాలను ఎన్నటికీ సమన్వయం చేయలేదు. అయితే నిజానికి ఇక్కడ ఎలాంటి కష్టమూ లేదు. ఎదిరించలేనంత, తిరస్కరించలేనంత శక్తివంతమైన ప్రేరణ క్రీస్తు త్రోసికొనిపోబడ్డాడు” అనే మాటలో కనబడుతుంది. “ఆయన కొనిపోబడెను” అనే మాటలో 'అరణ్యానికి వెళ్ళడంలో ఆయనకున్న స్వేచ్ఛను' తెలియచేస్తోంది. ఈ రెండు వచనాల నుంచి మనం నేర్చుకునేదేమిటంటే 'ఆయన త్రోసికొనిపోబడ్డాడు, ఇష్టపూర్వకంగా తగ్గించుకుని ఆయన అక్కడకు వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనిషి చిత్తానికున్న స్వతంత్రం, దేవుని కృపయొక్క సామర్థ్యం ఐక్యం చేయబడ్డాయి. పాపి క్రీస్తు దగ్గరకు ఆకర్షించబడవచ్చు. అతడు కూడా ఇష్టపడి రావచ్చు. ఆకర్షించడం అనేది ఎదిరించలేని ప్రేరణనూ, 'రావడం' అనేది తన చిత్తం యొక్క స్పందనగానూ సూచిస్తోంది. ఇది క్రీస్తు ఆత్మచేత అరణ్యంలోనికి ఆకర్షించబడిన, నడిపించబడిన విధంగా ఉంది.

చిత్తమే మనిషిని పరిపాలిస్తుందని మానవ తత్వశాస్త్రం వాదిస్తుండగా, మన వ్యక్తిత్వాన్ని శాసించేది హృదయమని దేవునివాక్యం బోధిస్తుంది. ఈ మాటను నిరూపించడానికి కొన్ని లేఖనభాగాలను చూద్దాం. “నీ హృదయములోనుండి జీవధారలు బయలు దేరును కాబట్టి అన్నిటి కంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము” (సామెతలు 4:23). "లోపలినుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును... వచ్చును” (మార్కు 7:21). ఈ పాపపు చర్యలన్నిటికీ మూలం హృదయమేనని మన ప్రభువు ఇక్కడ చెబుతున్నాడు, జీవధారలన్నిటికీ చిత్తం కాదు హృదయమే కేంద్రమని సొలొమోను ప్రకటిస్తున్నాడు. “ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది” (మత్తయి 15:8). 'చిత్తం' అనే పదం కంటే 'హృదయం' అనే పదం మూడు రెట్లు ఎక్కువగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. చిత్తం గురించి మాట్లాడే వచనాల్లో సగం దేవుని చిత్తం గురించే ప్రస్తావిస్తున్నాయి.

మనిషిని పరిపాలిస్తున్నది చిత్తం కాదు హృదయమే అని చెబుతున్నప్పుడు మనం పోరాడుతున్నది పదాల్లో ఉన్న వ్యత్యాసం గురించి కాదు కానీ బోధ గురించే. మనిషి ముందు రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. అతడు దేన్ని కోరుకుంటాడు? తనకు అత్యంత అంగీకారయోగ్యంగా ఉన్నదానిని, అంటే అతని అంతరంగంలో అత్యంత కీలకమైన, తన హృదయానికి నచ్చినదానినే కోరుకుంటాడు. పాపి ముందు నీతితో కూడిన జీవితాన్నీ, పాపభోగాలతో కూడిన జీవితాన్ని పెడితే, అతడు దేన్ని కోరుకుంటాడు? పాపభోగాలతో కూడిన జీవితాన్నే కోరుకుంటాడు. ఎందుకు? ఎందుకంటే అదే అతని ఎంపిక. అయితే ఈ విషయం 'చిత్తాన్ని సార్వభౌమత్వం గల దానిగా నిరూపిస్తోందా?', కానే కాదు. సరే మరొకసారి ఆలోచించండి! పాపి పాపభోగాలతో కూడిన జీవితాన్నే ఎందుకు ఎంచుకుంటాడు? అతనికి తన పాపం మూలంగా కలిగే పరిణామాలంటే ఇష్టం లేకపోయినా అతడు పాపభోగాలతో కూడిన జీవితాన్నే ఎందుకు ఎంచుకుంటాడు? ఎందుకంటే అతని హృదయం పాపిష్టిది కాబట్టి! ఈ రెండు రకాలైన ప్రత్యామ్నాయాలనే క్రైస్తవుని ముందు పెట్టినప్పుడు నీతితో కూడిన భక్తి మార్గాన్ని ఎంచుకుంటాడు, నీతిగా జీవించడానికి పట్టుదల కనపరుస్తాడు. ఎందుకు? ఎందుకంటే దేవుడు అతనికి నూతన హృదయాన్ని స్వభావాన్ని అనుగ్రహించాడు కాబట్టి! అందువల్ల 'పాప జీవితాన్ని విడిచిపెట్టు' అని పాపికి చేసిన మనవులన్నిటికీ అతన్ని ఏ మాత్రమూ చలించకుండా చేసేది 'చిత్తం' కాదు, కానీ అతని దుర్నీతిమయమైన దుష్టహృదయమే. అతడు క్రీస్తు దగ్గరకు రాడు, ఎందుకంటే అతనికి రావాలనే కోరిక ఉండదు. అతడు రావాలని అనుకోడు ఎందుకంటే అతని హృదయం క్రీస్తుని ద్వేషిస్తుంది, పాపాన్ని ప్రేమిస్తుంది (చూడండి యిర్మీయా 17:9).

'చిత్తం అంటే నిర్ణయం తీసుకునే విభాగం, చర్యలన్నిటికీ తక్షణ కారకం' అని నిర్వచించాను. చిత్తాన్ని 'తక్షణకారకం' అని అన్నాను, కానీ 'మూలకారణం' అని చెప్పలేదు. మనం చేతులతో పనులు చేస్తాం, అయితే మన చేతులే ఆ పనులకు మూలకారణం కాదు. చేతిని కండరాలు, నరాలు, మెదడు నియంత్రిస్తాయి. అందువల్ల చెయ్యి మనం చేసే పనులకు మూలకారణం కాదు తక్షణకారకం మాత్రమే. అదేవిధంగా చిత్తం అనేది మనసుకు పరిచారకురాలు. మనసు వివిధ పరిస్థితులచేత, ప్రేరణలచేత ప్రభావితం చేయబడుతుంది. అయితే 'లేఖనం మనిషి యొక్క చిత్తానికి విన్నపం చేయట్లేదా?' అని ఎవరైనా అడగడానికి అవకాశముంది. “ఇచ్చయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము” (ప్రక 22:17) అని రాయబడలేదా? “మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు” (యోహాను 5:40) అని మన ప్రభువు చెప్పలేదా? అనే ప్రశ్నలకు నా జవాబు: లేఖనం చేసిన మనవులు, ఆదేశాలు అన్ని సమయాల్లోనూ మనిషి చిత్తానికే కాదు! మనిషి యొక్క ఇతర అవయవాలకు కూడా లేఖనం ఆజ్ఞాపించడం మనకు కనబడుతుంది. ఉదాహరణకు, “వినుటకు చెవిగలవాడు వినును గాక!” “మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు” “నా వైపు చూచి రక్షణ పొందుడి” “ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడి, అప్పుడు మీరు రక్షించబడుదురు” “రండి, మన వివాదం తీర్చుకొందము” “నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును”.

2. మానవ చిత్తం యొక్క బానిసత్వం

మానవచిత్తం గురించి, దాని స్వభావం, పనితీరు గురించీ చర్చించే ఏ పుస్తకంలోనైనా “చిత్తం” ముగ్గురు భిన్నమైన వ్యక్తుల్లో ఎలా పనిచేస్తుందో/చేసిందో గమనించాలి. ఆ ముగ్గురు వ్యక్తులు - పతనం కావడానికి ముందు ఆదాము, పతనమైన పాపి, ప్రభువైన యేసుక్రీస్తు.

1) పతనం కాని ఆదాము చిత్తం స్వేచ్ఛ కలిగినదే. మంచి, చెడ్డల విషయంలో దానికి సమానమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాలున్నాయి. ఆదాము పరిపూర్ణమైన పరిశుద్దతతో సృష్టించబడ్డాడన్నది వాస్తవం కాదు, కాని అతడు నిర్మలమైన, నిష్కపటమైన, నిర్దోషమైన స్థితిలో సృష్టించబడ్డాడనేది నిజం. అందువల్ల ఆదాము యొక్క చిత్తం దేవుని సార్వభౌమత్వం - మానవ చిత్తం నైతికంగా తటస్థస్థితిలో ఉంది. అంటే మంచియెడల గానీ, చెడుయెడల గానీ అతన్ని నిర్బంధించేది ఏదీ అతనిలో లేదు. కాబట్టి ఆదాము తన సంతానమంతటికీ, క్రీస్తుయేసనే నరునికీ పూర్తి భిన్నంగా ఉన్నాడు.

2) అయితే పాపి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. నైతికంగా తటస్థస్థితిలో లేని చిత్తంతో పాపి జన్మిస్తున్నాడు. ఎందుకంటే అతనిలో “అన్నిటికంటే మోసకరమైన, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఉంది.” ఈ హృదయం అతన్ని దుష్టత్వంవైపే నడిపిస్తుంది.

3) ప్రభు యేసుకున్న చిత్తం పాపి యొక్క చిత్తానికి పూర్తి భిన్నమైనది. అంతేకాదు, ఆయన చిత్తం ఆదాము యొక్క చిత్తానికి కూడా పూర్తిగా భిన్నమైనదే. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క పరిశుద్ధుడు కాబట్టి ఆయన పాపం చేయలేడు. ఆయన ఈ లోకంలో జన్మించక ముందు, గబ్రియేలు మరియతో “పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును” (లూకా 1:38) అని చెప్పాడు. అందువల్ల ఎంతో భయభక్తులతో ఈ మాట చెబుతున్నాను. మనుష్య కుమారుని చిత్తం నైతికంగా తటస్థ స్థితిలో లేదు. అంటే మంచిచెడుల విషయంలో సమానంగా ఆయన ఉండలేడు. ప్రభు యేసు యొక్క చిత్తం మంచి వైపు మొగ్గు చూపేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన పాపరహిత, పవిత్రమైన, పరిపూర్ణమైన మానవత్వంగలవాడైనా పాపం చేయలేని దైవత్వం కూడా ఆయనలో ఉంది.

మంచి వైపు మాత్రమే మొగ్గు చూపే ప్రభు యేసు యొక్క చిత్తానికి భిన్నంగా మంచిచెడ్డల విషయంలో తటస్థంగా ఉన్న ఆదాము చిత్తమూ, కేవలం పాపం వైపు మాత్రమే మొగ్గు చూపే పాపి యొక్క చిత్తమూ ఉన్నాయి. పాపి యొక్క చిత్తం భ్రష్ఠహృదయానికి బానిసగా ఉంది.

నా చేత్తో ఒక పుస్తకాన్ని పైకెత్తి పట్టుకున్నాను. కొంతసేపటి తర్వాత దాన్ని వదిలేశాను. ఏం జరుగుతుంది? ఆ పుస్తకం పడిపోతుంది. ఏ దిశలో పడుతుంది? కిందనే పడుతుంది, ఎల్లప్పుడూ భూమివైపుకే పడుతుంది. ఎందుకు? గురుత్వాకర్షణ నియమాన్ని బట్టి జవాబు చెబితే - భూమి ఆకర్షిస్తోంది, పుస్తకపు బరువే దాన్ని నేలపై పడేలా చేస్తోంది. ఒకవేళ ఆ పుస్తకం 3 అడుగుల ఎత్తుకు లేవాలని నేను కోరుకున్నాను; అప్పుడు పరిస్థితి ఏంటి? నేను దాన్ని పైకెత్తాలి; ఆ పుస్తకానికి బయటున్న శక్తి ఏదో ఒకటి దాన్ని పైకెత్తాలి. నాకు ఆ పుస్తకానికి ఉన్న సంబంధం ఎలాంటిదో పతనమైన మనిషికీ దేవునికి ఉన్న సంబంధం కూడా అలాంటిదే. దైవశక్తి అతన్ని ఎత్తిపట్టుకున్నంత కాలం అతడు పాపంలో మరింత లోతుగా కూరుకుపోకుండా భద్రపరచబడతాడు. దేవుడు తన శక్తిని వెనక్కి తీసుకుంటే, అతని సొంత బరువే (పాపమే) అతన్ని కిందకి ఈడ్చేస్తుంది. నేను పుస్తకాన్ని ఏ విధంగా కిందకు పడేయాల్సిన అవసరం లేదో, దేవుడు కూడా అతన్ని కిందికి తోసేయవలసిన అవసరం లేదు. ఒక వేళ దేవుడు తన పాప నియంత్రణా శక్తిని ఈ లోకం నుంచి వెనక్కి తీసుకుంటే ప్రతీ మనిషి కూడా కయీను, ఫరో, యూదా కాగలిగినవాడే. మరైతే పాపి పరలోకం వైపు ఎలా పయనిస్తాడు? తన స్వచిత్తంతో చేసే కార్యం వల్లనా? కానే కాదు. తనకు బయటున్న శక్తి అతన్ని పట్టుకుని పైకి లేపాల్సి ఉంటుంది. పాపికి స్వేచ్ఛ ఉంది, కేవలం ఒక్క మార్గంలోనే అతనికి స్వేచ్ఛ ఉంది. కేవలం పడిపోవడానికి మాత్రమే, అంటే కేవలం పాపం చేయడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది. “మీరు పాపమునకు దాసులైయున్నప్పుడు నీతి విషయమై నిర్భంధము లేనివారై యుంటిరి” (రోమా 6:20). పాపికి తనకు నచ్చినదాన్ని చేసుకునే స్వతంత్రం ఉంది, అన్ని వేళల్లోనూ ఆ స్వేచ్ఛ ఉంది, కానీ అతనికి నచ్చింది పాపం చేయడమే.

ఒకప్పుడు పెలెజియన్ బోధ, ఈ మధ్యకాలంలో అర్మీనియన్ బోధ చిత్తానికి స్వతంత్రం ఉందని చెబుతుండగా, ఒకనాటి అగస్టీన్ బోధ, ఈనాటి కాల్విన్ బోధ చిత్తం బానిసగా ఉందని చెబుతున్నాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే మనిషి యొక్క సంపూర్ణ పతనాన్ని తృణీకరించే బోధ ఒకటైతే, దాన్ని సమర్థించేది మరొక బోధ.

3. మానవ చిత్తం యొక్క అసమర్థత

ప్రభువైన యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించడం, తృణీకరించడం మనిషి చిత్తం యొక్క పరిధిలో ఉందా? పాపికి సువార్త ప్రకటించబడింది, పరిశుద్ధాత్ముడు అతన్ని తన పాపస్థితి గురించి ఒప్పింపచేస్తాడు. అయితే దేవునికి లోబడటం లేదా దేవునిని తిరస్కరించడం మనిషి యొక్క స్వచిత్తపు శక్తి పరిధిలోనే ఉందా? ఈ ప్రశ్నకు మనం ఇచ్చే జవాబు మానవ పతనం గురించిన మన అవగాహనను నిర్వచిస్తుంది. 'మనిషి పతనమయ్యాడు' అని క్రైస్తవులందరూ ఒప్పుకుంటారు. “పతనమవడం” అనే పదానికి వాళ్ళు ఇచ్చే వివరణను నిర్ధారించడం తరచూ చాలా కష్టమైన విషయం . క్రైస్తవుల అభిప్రాయం ఇలా ఉంటుంది- 'మనిషి ఇప్పుడు అమరుడు కాడు, తన సృష్టికర్త చేతుల్లో నుండి బయటపడినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా లేడు, దుష్ట వైఖరిని అతడు సంపాదించుకున్నాడు. అయితే తన శక్తి సామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకుంటే, అతడు చివరికి సంతోషంగా ఉంటాడు'. ఇది సత్యానికి ఎంత దూరంగా ఉందో చూడండి! బలహీనతలు, వ్యాధులు, చివరికి మరణమైనా పతనం మూలంగా కలిగిన నైతికమైన, ఆత్మసంబంధమైన పరిణామాలతో పోలిస్తే ప్రమాదకరమైనవి కావు. పతనమైనప్పుడు కలిగిన ఆత్మసంబంధమైన, ఘోరమైన ఉ పద్రవం గురించిన అవగాహన పరిశుద్ధ లేఖనాలను సంప్రదించడం మూలంగానే కలుగుతుంది.

మనిషి సంపూర్ణంగా పతనమయ్యాడని చెప్పినప్పుడు మన ఉద్దేశం, 'మనిషి స్వభావంలోని ప్రతీ భాగమూ, ప్రతీ అవయవమూ పాపం యొక్క ప్రభావానికి గురై, కలుషితమయ్యింది' అని. సంపూర్ణ పతనం అంటే ప్రాణాత్మ దేహాలున్న మనిషి పాపానికి బానిసగా, అపవాదికి బందీగా ఉండి “వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి నడుచుకుంటున్నారు” అని అర్థం (ఎఫెసీ 2:2). ఈ మాట గురించి వాదించాల్సిన అవసరం లేదు. మానవ అనుభవంలో ఇదొక సాధారణమైన వాస్తవం. మనిషి తనకున్న ఆశయాలను సాధించలేకపోతున్నాడు, తనకున్న ఆదర్శాలను నిజానికి ఆచరించలేకపోతున్నాడు. తాను కోరిన విషయాలను తాను చేయలేకపోతున్నాడు. అతని నైతిక అసమర్థత అతన్ని పక్షవాతం వచ్చిన వ్యక్తిలా చేస్తోంది. ఇదే అతడు స్వేచ్ఛాజీవి కాదనీ, పాపానికీ, సాతానుకీ అతడు బానిస అనే మాటకు సంపూర్ణ సాక్ష్యంగా ఉంది. “మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు” (యోహాను 8:44). పాపం అనేది క్రియలకు మించినది, పాపం అనేది ఒక స్థితి. తెరవెనుక నుండి ఈ పాపపు స్థితే మనిషి చేత పాపపు క్రియలు చేయిస్తోంది. మనిషి యొక్క మొత్తం నిర్మాణమంతటిలోనికీ పాపం చొచ్చుకొనిపోయింది, పాకిపోయింది. అతని అవగాహనను పాపం అంధత్వంతో మొత్తింది, హృదయాన్ని కలుషితం చేసేసింది, మనసును దేవుణ్ణుంచి దూరం చేసేసింది. ఈ పాపపు ప్రభావం నుండి చిత్తం కూడా తప్పించుకోలేదు. పాపం యొక్క సాతాను యొక్క అధికారం కింద చిత్తం ఉంది. అందువల్ల చిత్తానికి స్వతంత్రం లేదు. హృదయ స్థితిని బట్టే భావోద్వేగాలు పనిచేస్తాయి, చిత్తం నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దేవుణ్ణి వెదకువాడెవడును లేడు (రోమా 3:11).

మన ప్రశ్నను మరొకసారి గుర్తుచేసుకుందాం. పాపి తన్ను తాను దేవునికి అప్పగించుకోవడం అనేది అతని చిత్తపు యొక్క శక్తి పైనే ఆధారపడి ఉంటుందా? కొన్ని ప్రశ్నలడిగి ఈ ప్రశ్నకు జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. నీరు తనకు తానే తన స్థాయికి పైగా లేవగలదా? అపవిత్రమైనదాని నుంచి పవిత్రమైనది రాగలదా? మానవ స్వభావాన్ని చిత్తం పూర్తిగా మార్చగలదా? సాధ్యం కానే కాదు అనేదే ఈ ప్రశ్నలకు జవాబు. పతనమైన మనిషి యొక్క చిత్తం దేవుని వైపు తిరగాలంటే, దైవశక్తి దానిపై పనిచేయాలి. అప్పుడు మాత్రమే పాపం యొక్క ప్రభావాన్ని చిత్తం అధిగమించగలదు. పాపానికి వ్యతిరేకంగా ప్రయాణం చేసి దేవుని వైపు వెళ్ళగలదు. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని యెవడును నా యొద్దకు రాలేడు” (యోహాను 6:44). ఇంకో విధంగా చెప్పాలంటే 'నీ బలపరాక్రమాలు కనబరచే రోజున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు (కీర్తన 110:3). డార్బీ ఇలా చెప్పాడు, 'నశించినదానిని రక్షించడానికి క్రీస్తు వచ్చియుంటే, స్వతంత్రచిత్తం అనే అంశానికి స్థానమే లేదు. క్రీస్తును అంగీకరించడానికి మనుషుల్ని దేవుడు అడ్డుకోడు. మనిషి హృదయంలో ప్రభావం చూపగలిగే సామర్థ్యం ఉన్నవాటిని దేవుడు ఉపయోగించు కున్నప్పుడు కూడా మనిషి క్రీస్తును స్వీకరించలేడు, ఎందుకంటే అతని హృదయం అంతగా చెడిపోయింది, దేవునికి లోబడకూడదని అతని చిత్తం నిర్ణయించుకుంది. కాబట్టి ప్రభువును స్వీకరించేలా, పాపాన్ని విడిచి పెట్టేలా ఏదీ కూడా అతన్ని పురికొల్పలేదు. మనిషికున్న స్వతంత్రం అంటే, ప్రభువును తృణీకరించడానికి ఎవ్వరూ అతన్ని బలవంతం చేయరు అనేదే అర్థం అయితే, ఆ స్వతంత్రం సంపూర్ణంగా ఉంది. అతడు పాపానికి బానిసగా ఉన్నాడు, పాపపు అధికారం కింద ఉండడం వల్ల మంచిని గుర్తిస్తాడు, ఆమోదిస్తాడు. కాని తనకు తానుగా తన స్థితి నుంచి తప్పించుకుని, మంచిని ఎంచుకోలేడు. కాబట్టి అతనికి స్వతంత్రం లేదు. అతని మనస్సు దేవునికి విరోధమై యున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు. “కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు” (రోమా 8:7). చిత్తం సార్వభౌమత్వం గలదికాదు; అది సేవకురాలు, ఎందుకంటే అది మనిషిలోని ఇతర అవయవాలచే పురికొల్పబడుతుంది, నియంత్రించబడుతుంది. పాపి స్వేచ్ఛగల వ్యక్తి కాడు ఎందుకంటే అతడు పాపానికి బానిస. ఇది మన ప్రభువు యొక్క మాటలను బట్టి స్పష్టంగా సూచించబడింది. “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు” (యోహాను 8:36). మనిషి వివేచనా శక్తిగల జీవి, అందువల్ల అతడు దేవునికి జవాబుదారీ, తన చర్యలకు బాధ్యుడు. అయితే, అతడు నైతికంగా స్వేచ్ఛ ఉన్నవాడు అని చెబితే, అతడు సంపూర్ణంగా భ్రష్టుడు అయ్యాడు - అన్ని విషయాల్లో లాగే చిత్తం విషయంలో కూడా భ్రష్టుడైపోయాడు - అనే బోధను తృణీకరించడమే. మనిషి యొక్క మనస్సు, హృదయం అతని చిత్తాన్ని పరిపాలిస్తాయి కాబట్టి, మనస్సునూ హృదయాన్నీ పాపం కలుషితం చేసేసింది కాబట్టి, మనిషి దేవునివైపు పయనించాలంటే దేవుడే స్వయంగా ఇచ్ఛయించడానికి, తన దయాసంకల్పాన్ని నెరవేర్చడానికి పనిచేయాలి (ఫిలిప్పీ 2:13). ఎంతో గర్వంగా నేను స్వతంత్రుణ్ణి అని మనిషి చెప్పుకుంటున్నాడు కానీ నిజానికి అతడు దుర్నీతికి బానిసగా ఉన్నాడు. వివిధరకాలైన ఇచ్చలకూ, భోగాలకూ అతడు సేవ చేస్తున్నాడు. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, 'మనిషి తన చిత్తాన్ని బట్టి చూస్తే ఒక అసమర్థుడు. దేవునికి అంగీకారయోగ్యమైన చిత్తం అతనికి లేదు. నేను స్వతంత్ర చిత్తాన్ని నమ్ముతాను. అయితే తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించడంలో మాత్రమే ఆ చిత్తానికి స్వేచ్ఛ ఉంది. పావురానికి మృత కళేబరాన్ని తినాలనే చిత్తం ఉండదు; కాకికి పావురంలా శుభ్రమైన ఆహారం తినాలనే చిత్తం ఉండదు. పావురపు స్వభావాన్ని కాకిలో ప్రవేశపెడితే, అది పావురపు ఆహారం తింటుంది. సాతానుకు పరిశుద్ధత గురించిన చిత్తం లేదు, ఉండబోదు. దేవునికి దుష్టత్వం చేయాలనే చిత్తం ఉండదు (ఎంతో భయభక్తులతో ఈ మాట చెబుతున్నాను). పాపపు స్వభావం కలిగిన వ్యక్తికి దేవునికి అనుగుణమైన చిత్తం ఎన్నడూ ఉండదు. దీని కోసం అతడు తిరిగి జన్మించాలి' (J. Denham Smith). స్వభావమే చిత్తాన్ని నియంత్రిస్తుంది అని ఈ అధ్యాయమంతా నేను నిరూపించడానికి ప్రయత్నించాను. ట్రెంట్ సమాలోచన సభలో (1563వ సంవత్సరంలో) రోమన్ కేథలిక్ సంఘం చేసిన శాసనాల్లో, మనకు ఈ కింది విషయాలు కనబడతాయి.

'నీతిని పొందుకోవడానికి మనిషి యొక్క స్వతంత్ర చిత్తం దేవునితో సహకరించదని ఎవరైనా వాదిస్తే, మానవ చిత్తం దానికి ఇష్టమైతే సువార్తను అంగీకరిస్తుందనీ, ఇష్టం లేకపోతే అది అచేతనంగా ఉంటుందనీ, కేవలం జడ పదార్థంలా ప్రవర్తిస్తుందనీ ఎవరైనా పట్టుబడితే వాడు శాపగ్రస్తుడగును గాక.”

'ఆదాము పతనమైన తర్వాత కాలం నుంచి మనిషి యొక్క స్వతంత్ర చిత్తం నాశనమయిందనీ, నిర్మూలించబడిందనీ, అది నామమాత్రమైనదనీ, అందులో వాస్తవమేమీ లేదనీ, సంఘంలోనికి సాతాను ప్రవేశపెట్టిన కల్పితమే స్వతంత్ర చిత్తమనీ ఎవరైనా చెబితే, అతడు శాపగ్రస్తుడగును గాక!'

కాబట్టి ప్రకృతిసంబంధియైన మనిషికి స్వతంత్ర చిత్తముందని వాదించేవాళ్ళు - రోమ్ బోధించేదాన్నే ఖచ్చితంగా నమ్ముతున్నారు. రోమన్ కేథలిక్స్ ట్రెంట్ సమాలోచన సభలో చేసిన ఇతర శాసనాలను చూస్తే అర్మీనియన్లు వాళ్ళతో చేయి చేయి పట్టుకుని నడుస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. 'తిరిగి జన్మించిన, నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి ఎన్నికైనవారిలో తాను కూడా తప్పనిసరిగా ఒకణ్ణని నమ్మితే ([simple_toolti content='ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును. 5మీ నిమిత్తము మేము మీయెడల ఎట్టివారమై యుంటిమో మీరెరుగుదురు.']1థెస్స 1:4,5[/simple_tooltip] స్పష్టంగా బోధిస్తున్నదిదే A.W.P), అతడు శాపగ్రస్థుడగును గాక! జీవితపు చివరిదశ వరకు భక్తిలో కొనసాగే వరం తప్పనిసరిగా తనకుందని ఎవరైనా బల్లగుద్ది చెబితే ( 29వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటె గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలోనుండి యెవడును వాటిని అపహరింపలేడు;[ref] 30నేనును తండ్రియును ఏకమై యున్నామని వారితో చెప్పెను.']యోహాను 10:28-30 దీనికే హామీ ఇస్తోంది, A.W.P), అతడు శాపగ్రస్థుడగును గాక!

ఏ పాపి అయినా రక్షింపబడడానికి 3 విషయాలు తప్పనిసరిగా జరగాలి. తండ్రియైన దేవుడు అతని రక్షణను సంకల్పించాలి, కుమారుడైన దేవుడు దాన్ని కొనాలి, ఆత్మ దేవుడు దాన్ని అన్వయించాలి. దేవుడు మనల్ని కేవలం ఆహ్వానించి వదిలేస్తే, మనలో ప్రతీ ఒక్కరూ నశించిపోతాం . పాతనిబంధనలో దీనికి ఎంతో చక్కటి ఉదాహరణ కనబడుతుంది. ఎజ్రా 1:1-3 వచనాల్లో ఇలా రాయబడింది. “పారసీకదేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమంతా యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతట చాటింపు వేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీకదేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించునదేమనగా - ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నాశనముచేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను వారి దేవుడు వారికి తోడైయుండును గాక”. ఇక్కడ చెరలో ఉన్న ప్రజలకు తామున్న ప్రాంతం నుంచి బయలుదేరి దేవుని నివాసస్థలమున్న యెరూషలేమునకు తిరిగి వెళ్ళడానికి అవకాశం ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులందరూ ఈ ప్రతిపాదనకు ఆత్రంగా స్పందించారా? లేదు. వాళ్ళలో ఎక్కువ శాతం శత్రుదేశంలో ఉండడంతోనే సంతృప్తి చెందారు. అతికొంత శేషమే దీనికి స్పందించారు, ఎందుకు? లేఖనం ఇచ్చే జవాబును గమనించండి. “అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును యాజకులును లేవీయులును ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితో కూడుకొని వచ్చి, యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి” (ఎజ్రా 1:5). అదేవిధంగా తాను ఎన్నుకున్నవారికి సమర్థవంతమైన పిలుపు వచ్చినప్పుడు వారి మనస్సులను దేవుడు ప్రేరేపిస్తాడు, అలా ప్రేరేపించేవరకూ దైవప్రకటనకు స్పందించాలనే ఇష్టం వాళ్ళకుండదు.

ప్రకృతిసంబంధియైన మనిషి యొక్క బానిసత్వం గురించి ఇప్పుడున్న దురభిప్రాయాలకు కారణం గత 50 సంవత్సరాలుగా ప్రముఖ సువార్తికులు చేసిన లోతులేని పని మరియు అన్నిటినీ పరీక్షించడంలో (థెస్స 5:21) విఫలమైన సంఘసభ్యుల సోమరితనం. ఒక పాపి రక్షించబడడం, రక్షించబడకపోవడం అనేది పూర్తిగా పాపి చేతిలోనే ఉందని సగటు ఇవాంజెలికల్ వేదికపై నుంచి వినబడుతోంది. 'దేవుడు తన బాధ్యత నెరవేర్చాడు, ఇప్పుడు మనిషి తన పని చేయాలి' అని ఇప్పుడు చాలామంది చెబుతున్నారు. నిర్జీవుడైన మనిషి ఏం చేయగలడు? స్వభావరీత్యా మనిషి అపరాధాల్లోనూ పాపాల్లోనూ చచ్చినవాడు! (ఎఫెసీ 2:1). రక్షించబడనివాళ్ళకు సువార్త ప్రకటించే ప్రసంగీకులు తరచూ ఈ కింది ఉదాహరణను ఉపయోగిస్తుంటారు - 'దేవుని సువార్త అనేదొక ఔషధం. పాపి మంచం పట్టిన వ్యాధిగ్రస్థుడు. తన వ్యాధి నయం కావాలంటే అతడు చేయాల్సిందల్లా అతనికి పక్కన ఉన్న బల్లవైపు చేయిచాచి ఆ ఔషధాన్ని తీసుకోవడమే' అంటుంటారు. అయితే పతనమైన, భ్రష్టుడైన పాపి గురించి లేఖనం ఇచ్చే వివరణలో ఈ ఉదాహరణ ఇమిడిపోవాలంటే మంచం పట్టిన ఆ వ్యాధిగ్రస్థుడు ఆ ఔషధాన్ని చూడలేని అంధునిగా (ఎఫెసీ 4:18), తన చేయి చాపలేని పక్షవాతం వచ్చినవానిగా (రోమా 5:6), ఆ ఔషధాన్ని అతని హృదయం ఏ మాత్రమూ విశ్వసించకుండా వైద్యుడంటేనే తీవ్రమైన ద్వేషం కలిగినవానిగా (యోహాను 15:18) వర్ణించబడాలి. అయితే మనిషి యొక్క దుస్థితిని వివరించడానికి ప్రస్తుతం కొందరు ఉపయోగిస్తున్న ఉదాహరణలు ఎంత పసలేనివో గమనించండి! తమకు తాము సహాయం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నవారికి సహాయం చేయడానికి క్రీస్తు రాలేదు కానీ తమకు తాము సహాయం చేసుకునే సామర్థ్యం లేని తన ప్రజలకు సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. “గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును” (యెషయా 42:7) ఆయన వచ్చాడు.

చివరిగా, ఈ బోధకు సాధారణంగా, తప్పనిసరిగా ఎదురయ్యే అభ్యంతరాలను అంచనా వేసి, వాటికి జవాబు చెబుదాము. స్పందించడానికి మనిషికి శక్తి లేకపోతే సువార్త ప్రకటించడం ఎందుకు? తాను క్రీస్తు దగ్గరకు రాలేనంత ఘోరంగా పాపం ఒక పాపిని బందీగా చేసినప్పుడు పాపిని ఆయన దగ్గరకు రమ్మని ఎందుకు ఆహ్వానించాలి? మనుషులు స్వతంత్రులు కాబట్టి క్రీస్తును స్వీకరించే సామర్థ్యం వాళ్ళకుంది కాబట్టి మనం సువార్త ప్రకటించట్లేదు, దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కాబట్టి మనం సువార్తను ప్రకటిస్తున్నాం (మార్కు 16:15). నశిస్తున్నవారికి సువార్త వెర్రితనమే గానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి (1కొరింథీ 1:18). “దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానముకంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలముకంటే బలమైనది” (1 కొరింథీ 1:25). పాపి అపరాధాల్లోనూ, పాపాల్లోనూ చచ్చినవాడు (ఎఫెసీ 2:1), చనిపోయిన వ్యక్తి ఏ పని చేయడానికైనా, దేన్ని ఇష్టపడటానికైనా పూర్తిగా అసమర్థుడే కాబట్టి శరీరస్వభావం గలవారు (తిరిగి జన్మించనివాళ్ళు) దేవుణ్ణి సంతోషపెట్టలేరు (రోమా 8:8).

లోకస్థుల ప్రకారం మృతినొందినవారికి, అనగా తమకు తాముగా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నవారికి సువార్త ప్రకటించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అయితే మన మార్గాలకు దేవుని మార్గాలు భిన్నంగా ఉంటాయి. "సువార్త ప్రకటనయను వెర్రితనముచేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను” (1కొరింథీ 1:21). ఎండిపోయిన ఎముకలకు ప్రవచిస్తూ, “ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి” అని చెప్పడం మనిషికి వెర్రితనంగా అనిపించవచ్చు, (యెహె 37:4). అయితే ఇది యెహోవా వాక్యం, ఆయన మాట్లాడిన మాటలు “ఆత్మయు జీవమునై యున్నవి” (యోహాను 6:63). లాజరు సమాధి ముందర నిలబడి, “లాజరూ, బయటకురా” అని యేసు పలికినప్పుడు అక్కడున్న జ్ఞానులు ప్రభువు పిచ్చివాడని ఎగతాళి చేసి ఉంటారు. అయితే అలా మాట్లాడినవాడే పునరుత్థానమూ, జీవమూ అయినవాడు. ఆయన మాటకు మృతులైనా సరే బ్రతుకుతారు! మనం సువార్తను ప్రకటించడానికి వెళ్తాము, దానికి కారణం రక్షకుణ్ణి తమకు తామే స్వీకరించగల శక్తి పాపులకు ఉందని కాదు, కానీ నమ్ము ప్రతివానికి సువార్త దేవుని శక్తియై ఉంది కాబట్టే, నిత్యజీవమునకు నిర్ణయించబడినవాళ్ళందరు (అపొ.కా. 13:48) నమ్ముతారు కాబట్టి (యోహాను 6:37; 10:16), దేవుడు నియమించిన కాలంలో వాళ్ళు విశ్వసిస్తారు. ఎందుకంటే 'నీ బలపరాక్రమాలు కనబరచే రోజున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు' అని రాయబడింది.

చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి 30 శీర్షికల్లో ఇలా రాయబడింది, 'ఆదాము పతనం తర్వాత మనిషి స్థితి : తన సహజమైన శక్తితో, సత్క్రియలతో అతడు దేవుని వైపుకు తిరగలేడు, దేవుణ్ణి సమీపించలేడు. క్రీస్తు ద్వారా దేవుని కృప లేకపోతే మనం సత్క్రియలు చేయడానికి గానీ, దేవునికి ప్రీతిపాత్రమైన, అంగీకారయోగ్యమైన వ్యక్తులుగా ఉండడానికి గానీ శక్తి లేనివారమే' (10వ శీర్షిక). ప్రెస్బిటేరియన్లు స్వీకరించిన 'వెస్ట్ మినిస్టర్ కేటకిజమ్ ఆఫ్ ఫెయిత్'లో ఇలా రాయబడింది, 'మనిషి పాపపు స్థితిలోకి పడిపోయాడు. ఆ స్థితిలో ఆదాము చేసిన తొలిపాపం యొక్క దోషం ఉంది. ఏ నీతిలో అయితే అతడు సృష్టించబడ్డాడో పాపం వల్ల ఆ స్థితి నుంచి తొలగిపోయాడు, ఆ నీతిని పోగొట్టుకున్నాడు. ఆత్మ సంబంధంగా మంచి అనేదానికి వ్యతిరేకి అయ్యాడు. నిరంతరం దుష్టత్వం వైపుకే మొగ్గు చూపేలా మారిపోయాడు' (25వ ప్రశ్నకు జవాబు). బాప్టిస్టుల ఫిలదెల్పియన్ కన్ ఫెషన్ ఆఫ్ ఫెయిత్, 1742లో మనం ఇలా చదువుతాం. 'మనిషి పాపపు స్థితిలోకి పడిపోవడంవల్ల రక్షణ పొందడానికి ఆత్మసంబంధమైన ఏ మంచి పనినైనా చేసే సామర్థ్యాన్నంతటినీ కోల్పోయాడు. అందువల్ల ప్రకృతి సంబంధియైన మనిషి మంచికి పూర్తిగా దూరమై, పాపంలో చనిపోయినవాడు కాబట్టి తన స్వశక్తితో తన్ను తాను మార్చుకోలేడు' (9వ అధ్యాయం).

 

అధ్యాయం 8
దేవుని సార్వభౌమత్వం-మనిషి బాధ్యత

 “మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను” (రోమా 14:12).

మానవ చిత్తం అనే అత్యంత వివాదాస్పదమైన, కష్టతరమైన అంశం గురించి గత అధ్యాయంలో మనం సమగ్రంగా చర్చించాం. ప్రకృతిసంబంధియైన మనిషి యొక్క చిత్తం సార్వభౌమాధికారం గలదీ కాదు, స్వతంత్రమైనదీ కాదు; అదొక పరిచారకురాలు, బానిస అని మనం గమనించాం. మనిషి యొక్క పతనం గురించి నాశనకరమైన స్థితి గురించీ సరిగ్గా అర్థం చేసుకోవడానికి పాపి యొక్క చిత్తం గురించి, దాని బానిసత్వం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని మనం వాదించాం. మానవ స్వభావపు ఘోరమైన దుర్నీతినీ, నీచస్థితినీ ఒప్పుకోవడమంటే అతనికి అసహ్యం. దేవుడు అతనికి బోధించే వరకు అతని దుర్నీతిని గురించిన వాస్తవాన్ని అతడు తీవ్రంగా, తీక్షణంగా తృణీకరిస్తూనే ఉంటాడు. మానవ భ్రష్టత్వం గురించి దేవుడు వివరించిన సత్యాన్ని మనిషి తిరస్కరించడమే నేటి దినాన మనం వింటున్న అనారోగ్యకరమైన బోధకు ముఖ్య కారణం. “మేము ధనికులం, ధనవృద్ది చేసుకున్నాం, మాకేమీ కొదువలేదు” అని మనుషులు చెప్పుకుంటున్నారు; కానీ వాళ్ళు దౌర్భాగ్యులు, దిక్కుమాలినవాళ్ళు, దరిద్రులు, గ్రుడ్డివాళ్ళు, దిగంబరులు అని వాళ్ళకు తెలియట్లేదు (ప్రకటన 3:17). వాళ్ళు మనిషి యొక్క ఔన్నత్యం గురించి గప్పాలు కొట్టుకుంటున్నారు, మనిషి యొక్క పతనం గురించిన సత్యాన్ని వాళ్ళు తృణీకరిస్తున్నారు. వాళ్ళు పాపానికి బానిసలుగా ఉన్నారు, సాతాను తన యిష్టం చొప్పున వీళ్ళను చెరపట్టినందునల్ల అపవాదికి బందీలుగా ఉన్నారు (2తిమోతి 2:26). అయినా సరే, మనిషి నైతికంగా స్వతంత్రుడని మనుషులు అతిశయిస్తున్నారు. అయితే ప్రకృతి సంబంధియైన మనిషి నైతికంగా స్వేచ్ఛ లేనివాడైతే మాత్రం అతడు జవాబుదారి కాడా?

'మనిషి నైతికంగా స్వేచ్ఛాజీవి' అనే మాట 'మానవ ఆవిష్కరణే'. ప్రకృతి సంబంధియైన మనిషి స్వతంత్రుడని చెప్పడం అతని ఆధ్యాత్మిక పతనాన్ని బొత్తిగా తృణీకరించడమే. పాపికున్న స్వతంత్రం గురించీ నైతిక సామర్థ్యం గురించీ లేఖనాలు ఎక్కడా మాట్లాడలేదు కానీ అతని నైతికమైన, ఆత్మసంబంధమైన అసమర్థత గురించి అవి నొక్కి చెబుతున్నాయి. మన పుస్తకంలో ఇదే అత్యంత కష్టతరమైన అంశం. దేవుని సార్వభౌమత్వంతో మనిషి బాధ్యతను ఐక్యపరచడం దైవ శాస్త్రమంతటిలోనూ అత్యంత కఠినమైన చిక్కుముడి అని ఈ అంశాన్ని గతంలో అధ్యయనం చేయడానికి పూనుకున్న ప్రతీ ఒక్కరూ ఒప్పుకున్నారు.


దేవుని సార్వభౌమత్వానికీ మనిషి బాధ్యతకూ మధ్యనున్న సంబంధాన్ని నిర్వచించడమే ప్రధానంగా కష్టంతో కూడుకున్న విషయం. ఈ రెండిటికీ మధ్యన అస్సలు సంబంధమనేదే లేదని చెప్పి ఈ సమస్య గురించి తప్పించుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. 'దేవుని సార్వభౌమత్వం' అనే అంశం కనుమరుగయ్యేంత తీవ్రంగా 'మనిషి యొక్క బాధ్యత' అనే అంశాన్ని కొంతమంది దైవశాస్త్ర పండితులు హెచ్చించారు. 'దేవుని సార్వభౌమత్వాన్నీ మనిషి యొక్క బాధ్యతనూ లేఖనాలు ముక్తకంఠంతో బోధిస్తున్నాయి. ఈ రెండు సత్యాలనూ ఐక్యపరచడం, సమాధానపరచడం మన ప్రస్తుత పరిస్థితికీ, పరిమిత జ్ఞానానికీ అసంభవం. అయితే విశ్వాసి ఈ రెండు సత్యాలను తప్పనిసరిగా అంగీకరించాలి' అని మరికొందరు అంటున్నారు. ఈ రహస్యమంతటినీ దేవుని వాక్యం స్పష్టం చేయనప్పటికీ, అవసరమైనంత వెలుగును మాత్రం ప్రసరింపచేస్తోంది. ప్రార్థనాపూర్వకంగా లేఖనాలను పరిశోధిస్తే ఈ సమస్యకు పరిష్కారము దొరుకుతుంది, దేవునికీ ఆయన వాక్యానికీ మహిమ కలుగుతుంది. గతంలో చాలామంది ఈ విషయంలో విఫలమయ్యారు, అది మనం దేవునిపై మరింత ఆధారపడటానికి కారణమవ్వాలి.

దేవుని సార్వభౌమత్వం, మనిషి బాధ్యత అనే అంశాలు కలిసే స్థానాన్ని నిర్ధారించడమే మనకు కష్టతరమైన విషయమని ఇంతకు ముందే చెప్పాం. దేవుడు తన సార్వభౌమత్వం గురించి నొక్కిచెప్పడం, మనిషిపై నేరుగా తన శక్తిని ప్రదర్శించడం, మనిషిని హెచ్చరించడానికీ, ఆహ్వానించడానికి మించి ఆయన ఏదైనా చేయడం మనిషికున్న స్వేచ్ఛకు భంగం కలిగించడమే, అతని బాధ్యతను నాశనం చేయడమే, అతన్ని ఒక యంత్రంగా కుదించడమే. డాక్టర్ పియర్సన్ గారి రచనలు లేఖనానుసారంగా సహాయకరంగా ఉంటాయి. అలాంటి వ్యక్తే ఈ కింది విధంగా చెప్పడం శోచనీయమే * 'దేవుడు సైతం నా నైతికతను నియంత్రించడు, నా నైతిక ఎంపికను నిర్బంధించడు - అనే ఆలోచనే మహత్తరమైనది. నేను ఆయనను ధిక్కరిస్తున్నా, తృణీకరిస్తున్నా ఆయన నన్ను ఆటంకపరచడు. ఆయన అడ్డుకోగలిగినా తన శక్తిని ఆయన ప్రదర్శించడు. ఆయన చేయాలనుకున్నా చేయడు' (A Spiritual Clinique). ఎంతోమంది గౌరవనీయులైన ప్రియమైన సహోదరులు కూడా ఇదే భావజాలాన్ని వ్యక్తం చేయడం ఎంతో విచారకరం, ఎందుకంటే పరిశుద్ధ లేఖనాలకు ఈ ఆలోచన వ్యతిరేకంగా ఉంది.

ఈ బోధలో ఉన్న కష్టతరమైన అంశాలను నిజాయితీగా ఎదుర్కోవాలనీ, దేవుడు ఏ విధంగా వాటిని మనకు వెల్లడి చేయాలని ఇష్టపడ్డాడో వాటిని శ్రద్ధగా పరీక్షించాలనీ నా కోరిక. ఈ బోధలో క్లిష్టమైన అంశాలను ఈ కింది విధంగా వ్యక్తపరచవచ్చు.

మొదటిగా,మనుషులు చేయదలచినదానిని చేయనివ్వకుండా అడ్డుపడుతూ, వాళ్ళు చేయడానికి ఇష్టపడనివాటిని చేసేలా పురికొల్పుతూ, చివరికి వాళ్ళనే ఆ చర్యలకు బాధ్యులుగా ఎంచడం దేవునికి ఎలా సాధ్యం?

రెండవదిగా, పాపి చేయలేని కార్యం విషయంలో దేవుడు అతన్ని ఎలా బాధ్యునిగా ఎంచుతాడు? పాపి చేయలేకపోయిన క్రియను బట్టి దేవుడు న్యాయంగా అతన్ని ఎలా శిక్షించగలడు?

మూడవదిగా, మనుషులు కొన్ని పాపాలు చేసేలా నియమించి/శాసించి, వాటిని చేసినందుకు వాళ్ళను బాధ్యులుగా ఎంచి, దోషులుగా వాళ్ళను పరిగణించడం దేవునికి ఎలా సాధ్యం ?

నాలుగవదిగా, దేవుడు ఒక పాపిని శిక్షావిధికే ముందుగా నియమించి, అతడు క్రీస్తును తృణీకరించినందుకు అతన్ని శిక్షార్హునిగా ఎలా చేస్తాడు? క్రీస్తును అంగీకరించే విషయంలో పాపి ఎలా బాధ్యత వహిస్తాడు?

ఈ చిక్కుముడులన్నిటినీ విప్పడానికి మనం ఇప్పుడు ప్రయత్నిద్దాం. పరిశుద్ధాత్ముడే మన బోధకునిగా ఉన్నాడు, ఆయన అనుగ్రహించిన వెలుగులోనే మనం పై ప్రశ్నలకు జవాబును కనుగొందాం.

1. మనుషులు చేయదలచినదానిని చేయనివ్వకుండా అడ్డుపడుతూ, వాళ్ళు చేయడానికి ఇష్టపడనివాటిని చేసేలా పురికొల్పుతూ, చివరికి వాళ్ళనే ఆ చర్యలకు బాధ్యులుగా ఎంచడం దేవునికి ఎలా సాధ్యం?

జ) దేవుడు తన శక్తిని మనుషులపై నేరుగా ప్రదర్శిస్తే అది వారి స్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకున్నట్లే అనిపిస్తుంది. మనుషుల్ని కేవలం హెచ్చరించి ఆహ్వానించడానికి మించి దేవుడేమైనా చేస్తే అది వారి బాధ్యతను ఉల్లంఘించినట్లు అనిపిస్తుంది. మనిషిని దేవుడు బలవంతం చేయకూడదనీ, ఏ మాత్రమూ నిర్బంధించకూడదనీ, అలా చేస్తే మనిషిని దేవుడు యంత్రంగా మార్చేసినట్లే అని కొందరు చెబుతుంటారు. ఇది సముచితంగా, సహేతుకంగా అనిపిస్తుంది, నీతిశాస్త్రంలో ఈ ప్రతిపాదన సార్వత్రికంగా జనామోదం పొందినది. అయితే లేఖనం దీన్ని ఖండిస్తోంది.

మొదటిగా ఆదికాండం 20:6ని చూద్దాం: “అందుకు దేవుడు అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు”. మనిషి యొక్క స్వేచ్ఛకు దేవుడు అడ్డుపడకూడదనీ, అతన్ని దేవుడు నిర్బంధించకూడదనీ, ఒత్తిడి చేయకూడదనీ, అలా చేస్తే మనిషిని యంత్రంగా మార్చినట్లే అవుతుందని అందరూ అంటూ ఉంటారు. అయితే మనిషి యొక్క బాధ్యతను నాశనం చేయకుండానే దేవునికి తన శక్తిని మనిషిపై ప్రయోగించడం అసాధ్యమేమీ కాదని పై లేఖనం ఖచ్చితంగా నిరూపిస్తోంది. దేవుడు తన శక్తిని ప్రదర్శించి, మనిషికున్న స్వేచ్ఛను నియంత్రించి, అతడు చేయదలచిన చర్యను చేయనీయకుండా అతన్ని ఆటంకపరిచిన సందర్భానికి ఇది ఉదాహరణగా ఉంది.

ఈ లేఖనాన్నుంచి దృష్టి మళ్ళించకముందే, ఇది మొదటి మానవునిపై వెలుగును ఎలా ప్రసరింపచేస్తుందో మనం గమనిద్దాం. 'దేవుడు ఆదాము పతనాన్ని ఆపగలడు. దేవుడు అలా ఆపితే, ఆయన ఆదామును యంత్రంగా చేసినట్లే అవుతుంది' అని కొందరు వాదిస్తారు. దేవుడు తాను సృష్టించిన మనుషుల్ని బలవంతం చేయకూడదు, నిర్బంధించకూడదు, అలా చేస్తే అది వారి జవాబుదారీతనాన్ని నాశనం చేస్తుందని వీళ్ళు మనకు నిరంతరం చెబుతుంటారు. అయితే దీనికి జవాబు : తనకూ తన ప్రజలకూ వ్యతిరేకంగా పాపం చేయకుండా కొందరు మనుష్యుల్ని దేవుడు ఆటంకపరచిన కొన్ని సందర్భాలను లేఖనం గ్రంథస్తం చేసింది. అబీమెలెకును తనకు వ్యతిరేకంగా పాపం చేయకుండా అడ్డుకున్న దేవుడు, ఆదామును ఎందుకు అడ్డుకోలేకపోయాడు? పతనం కాకుండా సాతానును దేవుడు ఎందుకు ఆపలేదు? తరచూ ఈ ప్రశ్నకిచ్చే జవాబు: 'మనిషి స్వేచ్ఛను అడ్డుకుంటే అది అతన్ని యంత్రంలా మార్చేయడంతో సమానం. కాబట్టి దేవుడు జోక్యం చేసుకోడు'. అయితే ఈ జవాబు అంగీకారయోగ్యం కాదు, పొరపాటుతో కూడినది అని అబీమెలెకు వృత్తాంతం నిరూపిస్తోంది. నిజానికి ఈ జవాబు దుర్మార్గమైనది, దేవదూషణతో కూడినది అని చెప్పాలి, ఎందుకంటే సర్వోన్నతునికి పరిమితులు పెట్టడానికి మనం ఎవరము? సర్వశక్తిమంతుడు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి పరిమితుడైన మనిషికి ఎంత ధైర్యం! 'ఆదాము పతనాన్ని అడ్డుకోవడానికి దేవుడు ఎందుకు తన శక్తిని ప్రదర్శించలేదు? ఆదాము పతనమే దేవుని జ్ఞానయుక్తమైన ధన్యకరమైన సంకల్పానికి చక్కగా పనికొచ్చింది, పాపం విస్తరించిన చోట కృప మరింత ఎక్కువగా విస్తరించాలి అనే సత్యాన్ని ప్రదర్శించడానికి ఇదొక చక్కని అవకాశంగా పనిచేసింది' అని మనం జవాబు చెప్పాలి. మనిషి తనకు అవిధేయత చూపించి, మంచిచెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని తింటాడని ముందే చూసిన దేవుడు అసలు ఆ చెట్టును ఆ తోటలో ఎందుకు పెట్టాలి? గమనించండి, ఆ చెట్టును చేసింది సాతాను కాదు దేవుడు. అలా అయితే పాపానికి దేవుడే కర్త అనంటున్నారా? అని ఎవరైనా అడగొచ్చు. అప్పుడు, 'కర్త' అంటే మీ ఉద్దేశం ఏంటి? అని మనం అడగాలి. పాపం ఈ లోకంలోనికి ప్రవేశించాలన్నది దేవుని చిత్తం అనే మాట స్పష్టం, లేకపోతే అది ప్రవేశించి ఉండేదే కాదు. ఎందుకంటే దేవుడు సృష్టికి ముందు శాసించినది తప్ప మరేదీ ఈ లోకంలో జరగదనేది వాస్తవం. దేవుడు పాపాన్ని ఈ లోకంలోనికి అనుమతించాడు అని మాత్రమే చెప్పడం సరిపోదు , ఎందుకంటే ఆయన సంకల్పించినదానినే ఆయన అనుమతిస్తాడు. ఆదాము యొక్క బాధ్యతను నాశనం చేయకుండానే పాపం చేయకుండా దేవుడు అతన్ని అడ్డుకోగలిగి ఉండేవాడు. ఇప్పుడు పాపానికి మూలం అయిన సంగతుల్ని చర్చించడం ఆపుదాం.

అబీమెలెకు వృత్తాంతం ఒక్కటే కాదు, ఇదే నియమం బిలాము గురించిన వృత్తాంతంలో కూడా కనబడుతుంది; ఇంతకుముందు అధ్యాయంలో దీన్ని మనం ప్రస్తావించాం. మరొకసారి ఆ వృత్తాంతాన్ని గుర్తుచేసుకుందాం. మోయబీయుడైన బాలాకు ఇశ్రాయేలును శపించడానికి అన్యప్రవక్త అయిన బిలామును పిలిపించుకున్నాడు. అతనికి అధికమొత్తంలో ధనాన్ని ఇస్తానని బాలాకు రాజు వాగ్దానం చేశాడు. బాలాకు ఇవ్వచూపిన ధనాన్ని స్వీకరించి, దేవునికి ఆయన ప్రజలకూ వ్యతిరేకంగా పాపం చేయడానికి బిలాము ఆత్రుత కనపరిచాడని సంఖ్యాకాండం 22-24 అధ్యాయాలను శ్రద్ధగా చదివితే అర్థమవుతుంది. అయితే ఆ పాపం చేయనివ్వకుండా దైవశక్తి అతన్ని అడ్డుకున్నది. బిలాము మాటల్లోనే ఈ భావాన్ని గమనించండి: “అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చితిని; అయిననేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను” (సంఖ్యా 22:38). బిలాముపై బాలాకు సణుగుకున్న తర్వాత, “యెహోవా నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలుకవద్దా? అని బిలాము ఉత్తరమిచ్చెను... ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను ఆయన దీవించెను; నేను దాని మార్చలేను” (సంఖ్యా 23:12,20). దేవుని శక్తినీ, బిలాము యొక్క బలహీనతనూ, మనిషి యొక్క చిత్తం నిష్ఫలమవడాన్నీ, దేవుని చిత్తం నెరవేరడాన్ని ఈ వచనాలు ఖచ్చితంగా మనకు చూపిస్తున్నాయి. అయితే బిలాము యొక్క స్వేచ్ఛ గానీ, బాధ్యతగానీ నాశనమయ్యాయా? కానే కాదు. ఇప్పుడు ఈ విషయాలను నిరూపించడానికి ప్రయత్నిద్దాం.

మరొక ఉదాహరణ: “యూదా దేశముచుట్టు ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి” (2దిన 17:10). ఈ వచనంలో అంతరార్థం స్పష్టంగా ఉంది. యెహోవా భయం ఈ రాజ్యాలపై పడకపోతే, వాళ్ళు యూదా రాజ్యం పై యుద్ధం చేసి ఉ ండేవారు. దేవుని యొక్క అగించే శక్తే వాళ్ళను ఆటంకపరిచింది. వాళ్ళను తమ చిత్తానికి వదిలి పెడితే, యుద్ధమే జరిగి ఉండేది. కాబట్టి దేవుడు వ్యక్తుల్ని, దేశాల్ని కూడా అడ్డుకుంటాడనీ, ఆయనకు ఇష్టమైనప్పుడు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపుతాడనీ లేఖనాలు బోధిస్తున్నాయి: ఆది 35:5తో పోల్చండి.

ఇక్కడ మనం శ్రద్ధగా పరిశీలించాల్సిన ప్రశ్న: పాపం చేయకుండా మనుషులను ఆటంకపరుస్తూనే, వారి స్వేచ్ఛలో బాధ్యతలో జోక్యం చేసుకోకుండా ఉండడం దేవునికెలా సాధ్యం? పరిమితమైన మన ప్రస్తుత పరిస్థితిలో ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం అసాధ్యమని చాలామంది అంటున్నారు. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలంటే అసలు నిజమైన నైతిక స్వాతంత్య్రం అంటే ఏంటో తెలుసుకోవాలి; నైతిక స్వాతంత్య్రం అంటే ఏంటి? దీనికి జవాబు: పాపపు బానిసత్వం నుంచి విడుదల చేయబడటమే నిజమైన నైతిక స్వాతంత్య్రం. ఒక వ్యక్తి పాపపు చెర నుండి ఎంత ఎక్కువగా విడిపించబడితే, అంత ఎక్కువ స్వాతంత్య్రంలోనికి అతడు ప్రవేశిస్తాడు. “కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులైయుందురు” (యోహాను 8:36). పై ఉదాహరణల్లో అబీమెలెకునూ, బిలామునూ, అన్యరాజ్యాలనూ పాపం చేయనివ్వకుండా దేవుడు అడ్డుకున్నాడు. అందువల్ల వాళ్ళ నిజమైన స్వేచ్ఛలో ఆయన ఏ విధంగానూ జోక్యం చేసుకోలేదు. ఒక వ్యక్తి పాపరహితమైన స్థితికి దగ్గరగా సమీపించేకొలది, అతడు దేవుని పరిశుద్ధతకు దగ్గరవుతున్నాడు. దేవుడు అబద్దమాడలేడనీ, శోధించబడలేడనీ లేఖనం మనకు చెబుతోంది. అయితే ఆయన దుష్టత్వంలో భాగస్వామి కాలేడు కాబట్టి ఆయనకు తక్కువ స్వాతంత్య్రం ఉందని అర్థమా? కానే కాదు. అలా అయితే మనిషి దేవుణ్ణి ఎంత ఎక్కువగా సమీపిస్తాడో అతడు పాపం చేయకుండా ఎంత ఎక్కువగా అడ్డగించబడతాడో అంత గొప్పగా అతనికి స్వాతంత్ర్యం ఉంటుందని స్పష్టం కావట్లేదా?

నైతిక స్వాతంత్య్రం విషయంలో, దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని బాధ్యత ఎక్కడ కలుస్తాయో నేర్పించే ఒక ఉదాహరణ లేఖనాలు మనకు అనుగ్రహించబడిన సందర్భంలో చూస్తాము. దేవుడు తన వాక్యాన్ని వ్యక్తీకరిస్తున్నపుడు, మనుషుల్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అయితే స్కూల్లో టీచర్ డిక్టేషన్ చెబుతున్నప్పుడు రాస్తున్న విద్యార్థుల్లా బైబిల్ గ్రంథకర్తల్ని దేవుడు ఉపయోగించుకోలేదు - “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” (2 పేతురు 1:20,21). ఇక్కడ దేవుని సార్వభౌమత్వమూ, మానవ బాధ్యతా పక్కపక్కనే మనకు కనబడుతున్నాయి. ఈ పరిశుద్ధుల్ని పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు, అయితే వారి నైతిక బాధ్యతకు భంగం కలగలేదు, వారి స్వేచ్ఛ హరించబడలేదు. దేవుడు వాళ్ళ మనస్సులను వెలిగించాడు, వాళ్ళ హృదయాలను రగిలించాడు, తన సత్యాన్ని వాళ్ళకు వెల్లడి చేశాడు. వాళ్ళు తన మనస్సును ప్రజలకు వ్యక్తీకరిస్తున్నప్పుడు పొరపాట్లు దొర్లకుండా దేవుడు వాళ్ళను నియంత్రించాడు. అందువల్ల వాళ్ళు పొరపాటు చేయడం అసాధ్యమయ్యింది. దేవుడు నియమించుకున్న పాత్రలైన మనుషుల్ని ఒక వేళ ఆయన నియంత్రించకపోతే వాళ్ళచేత తప్పులు చేయించేది ఏమిటి అయ్యుండేది? వాళ్ళలో ఉన్న పాపమే! ఈ పరిశుద్ధుల్లో ఉన్న పాపాన్ని అడ్డుకోవడం, శరీర సంబంధమైన మనసును నియంత్రించడం అనేవి వాళ్ళ స్వాతంత్య్రాన్ని నాశనం చేయడం లేదు గాని వాళ్ళను నిజమైన స్వేచ్ఛ పొందినవారిగా చేస్తోంది.

నిజమైన స్వేచ్ఛ యొక్క స్వభావం గురించి చివరిగా ఒక మాటను చెబుతాను. మనుషులు సాధారణంగా గొప్ప పొరపాట్లు చేసేది మూడు ముఖ్య విషయాల్లో : దుఃఖం - సంతోషం, వెర్రితనం - జ్ఞానం, బానిసత్వం – స్వేచ్ఛ. లోకం అణిచివేతకు గురైనవారిని పట్టించుకుంటుంది కానీ దుఃఖంలో ఉన్నవారిని కాదు; భాగ్యవంతుల్నే పట్టించుకుంటుంది కానీ సంతోషంగా ఉన్నవారిని కాదు, ఎందుకంటే శరీరానికి ఏది ప్రస్తుతం సుఖంగా ఉందో దాన్ని బట్టే వాళ్ళు పరిస్థితుల్ని అంచనా వేస్తున్నారు. ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. ఈ లోకజ్ఞానంతో సంతృప్తి చెందుతూ, రక్షణార్థమైన దేవుని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాల విషయానికొస్తే, తమ చెప్పుచేతల్లోనే తాము జీవించడమూ, తమ హృదయాభిలాషలకు అనుగుణంగా జీవించడమే నిజమైన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు అని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇదే అత్యంత దారుణమైన బానిసత్వం. నిజమైన స్వాతంత్య్రం అంటే మనకు నచ్చినట్లు జీవించడం కాదు, మనం జీవించవలసిన రీతిగా జీవించడం. అందువల్ల ఆదాము పతనం తర్వాత సంపూర్ణమైన స్వాతంత్య్రాన్ని ఆస్వాదిస్తూ ఈ భూమిపై నడిచిన ఒకే ఒక వ్యక్తి నరుడైన క్రీస్తు. ఈయనే దేవుని పరిశుద్ధమైన సేవకుడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఈయనకు ఆహారంగా ఉండేది.

ఇప్పుడు మనం రెండవ ప్రశ్నకు జవాబును పరిశీలిద్దాం:

2. పాపి చేయడానికి కుదరని కార్యం విషయంలో దేవుడు అతన్ని ఎలా బాధ్యునిగా ఎంచుతాడు? పాపి చేయలేకపోయిన క్రియను బట్టి దేవుడు న్యాయంగా అతనికి ఎలా శిక్ష వేస్తాడు?

మనిషి సృష్టించబడిన వ్యక్తి కాబట్టి ప్రకృతి సంబంధియైన వ్యక్తికి దేవుణ్ణి ప్రేమించాల్సిన, విధేయత చూపించాల్సిన, సేవించాల్సిన బాధ్యత ఉంది. పాపి కాబట్టి సువార్తను నమ్మి మారుమనస్సు పొందాల్సిన బాధ్యత మనిషిపై ఉంది. అయితే ప్రకృతి సంబంధియైన మనిషికి దేవుణ్ణి ప్రేమించే, సేవించే సామర్థ్యం లేదు. తనకు తానుగా అతడు సువార్తను నమ్మలేడు, మారుమనస్సు పొందలేడు. ఇప్పుడు మనం చెప్పినదాన్ని మొదటిగా నిరూపిద్దాం. యోహాను 6:44ని ప్రస్తావించి మనం ప్రారంభిద్దాం. "నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు.” ప్రకృతి సంబంధియైన ప్రతి మనిషి యొక్క హృదయం పూర్తిగా భ్రష్టమైనది. అతని దారికి అతన్ని వదిలేస్తే అతడు ఎన్నడూ క్రీస్తు దగ్గరకు రాలేడు. 'క్రీస్తు దగ్గరకు రావడం' అనే మాటల్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ మాటను ఎవ్వరూ ప్రశ్నించరు. అందువల్ల “ఏ మనిషీ నా యొద్దకు రాలేడు” అనే మాటల్లో ఉన్న అంతరార్థాన్ని నిర్వచించడం కోసం, ఆలోచించడం కోసం ప్రస్తుత అంశాన్ని కొంతసేపు విడిచిపెడదాం. “ఏ మనిషీ నా యొద్దకు రాలేడు” అనే మాటల్ని “మీకు జీవం కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు” అనే మాటలతో పోల్చండి (యోహాను 5:40).

జీవం పొందునట్లు పాపి క్రీస్తు దగ్గరకు రావడం అంటే, తానెంత ఘోరమైన ప్రమాద పరిస్థితిలో ఉన్నాడో గుర్తించడమే; తన మెడపై దైవనీతి అనే ఖడ్గం వేలాడుతోందని గ్రహించడమే; తనకూ మరణానికి ఒక్క అడుగుదూరం మాత్రమే ఉందనే వాస్తవానికి మేల్కొనడమే; మరణం తర్వాత తీర్పు ఉందని తెలుసుకోవడమే; ఈ భయంతో అతడు పట్టుదలతో రాబోయే దేవుని ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ కనికరించమని దేవునికి మొరపెట్టాలి, ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలి.

జీవం కోసం పాపి క్రీస్తు దగ్గరకు రావడమంటే, దేవుని అనుగ్రహాన్ని పొందుకోవడానికి తనకు ఎలాంటి అర్హతా లేదని ఒప్పుకోవడమే; తన్ను తాను బలహీనునిగా, తప్పిపోయినవానిగా, నశించినవానిగా పరిగణించుకోవడమే; నిత్య మరణానికి తప్ప మరి దేనికీ పాత్రుణ్ణి కానని అంగీకరించి, తనకు విరోధంగా తానే లేచి దేవుని పక్షంగా చేరడమే; దేవుని ముందు ధూళిలో కూర్చొని, దేవుని కనికరం కోసం దీనంగా వేడుకోవడమే.

జీవం కోసం పాపి క్రీస్తు దగ్గరకు రావడమంటే: తన స్వనీతిని తృణీకరించి క్రీస్తులో దేవుని నీతిగా చేయబడడానికి సిద్ధపడడమే; తన సొంత జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని జ్ఞానం చేత నడిపించబడడమే; తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి, దేవుని చిత్తంచేత పరిపాలించబడడమే; ప్రభు యేసును తనకు రక్షకునిగా, ప్రభువుగా, తనకు సర్వస్వంగా స్వీకరించడానికి బహిరంగంగా సిద్ధపడడమే!

'క్రీస్తు దగ్గరకు రావడం' అనే మాటలో ఇమిడియున్న భావాలు ఇవే. అయితే పాపి దేవుని ముందు అలాంటి వైఖరి కనబరచడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు; మొదటిగా తానెంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడో గుర్తించడు, ఫలితంగా ఆ ప్రమాదాన్నుంచి తప్పించుకునే ఎలాంటి ఆసక్తినీ అతడు కనపరచడు; మనుషులు అధిక శాతం ప్రశాంతంగానే ఉంటారు. పరిశుద్ధాత్మ కార్యం జరగకుండా కేవలం మనస్సాక్షి భయపెట్టినందుకు భయపడితే వాళ్ళు క్రీస్తు వద్దకు తప్ప ఇతరుల దగ్గరకు పారిపోతారు. రెండవదిగా, తమ నీతి అంతటినీ మురికి గుడ్డలుగా గుర్తించరు కాని సుంకరిలా లేనందుకు దేవుణ్ణి స్తుతించిన పరిసయ్యుల్లా ఉంటారు. మూడవదిగా, తమ విగ్రహాలను విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు కాబట్టి క్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా వాళ్ళు స్వీకరించరు. ఆ విగ్రహాలను విడిచిపెట్టడం కంటే తమ ఆత్మల నిత్యక్షేమాన్నే వాళ్ళు ప్రమాదంలోకి నెట్టుకుంటారు. కాబట్టి ప్రకృతి సంబంధియైన మనిషిని తన దారికి తనను విడిచిపెట్టేస్తే అతని హృదయం ఎంతో భ్రష్టమైంది కాబట్టి అతడు క్రీస్తు దగ్గరకు రాలేడు.

పైన మన ప్రభువు చెప్పిన వచనం ఒక్కటే కాదు, మరెన్నో లేఖనభాగాలు ప్రకృతి సంబంధియైన మనిషి యొక్క నైతికమైన, ఆత్మసంబంధమైన అసమర్థత గురించి తెలియచేస్తున్నాయి. “యెహోవా పరిశుద్ధ దేవుడు కాబట్టి మీరు ఆయనను సేవించలేరు” అని యెహోషువ ప్రజలతో చెప్పాడు. (యెహో 24:19). “మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుటవలననే గదా?” అని క్రీస్తు పరిసయ్యులతో చెప్పాడు (యోహాను 8:43). “ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావముగలవారు దేవుని సంతోషపరచ నేరరు” (రోమా 8:7,8). అప్పుడు ప్రశ్నను మరొకసారి గుర్తుచేసుకుందాం. పాపి తన అసమర్థత వల్ల చేయాల్సిన పనిని చేయడంలో విఫలమవుతున్నాడు. అలాంటప్పుడు దేవుడు అతన్ని ఎలా బాధ్యునిగా ఎంచుతాడు? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే పై వచనాల్లో ఉన్న పదాలకు శ్రద్ధగా నిర్వచనం చెప్పాల్సినవసరం ఉంది. “సేవించలేరు, లోబడనేరదు, సంతోషపరచనేరరు” అంటే అర్థం ఏంటి?

ఇప్పుడు మనం విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం. పాపి అసమర్థుడు అంటే 'తనకు తానుగా క్రీస్తు దగ్గరకు రావడానికి ఇష్టపడినా, ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అవసరమైన శక్తి లేదు' అని కాదు. క్రీస్తు దగ్గరకు రావాలనే ఇష్టం లేకపోవడమే పాపి యొక్క అసమర్థతకు కారణం, ఇష్టం లేకపోవడమనేది భ్రష్టహృదయం యొక్క ఫలం. మనుషుల సహజమైన అసమర్థతకూ, నైతికమైన ఆత్మసంబంధమైన అసమర్థతకూ మధ్యనున్న వ్యత్యాసాన్ని మొదటిగా మనం గుర్తించాలి. ఉదాహరణకు, “అహీయా వృద్దాప్యము చేత కండ్లు కానరాని వాడైయుండెను” అని 1రాజులు 14:4లో మనం చదువుతాం. “వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను బలముచేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను” (యోనా 1:13). ఈ రెండు వచనాల్లోనూ కనబడేది 'సహజమైన అసమర్థత'. అయితే ఆది 37:4లో మనం ఇలా చదువుతాం “అతని సహోదరులు తమ తండ్రి అతనిని (యోసేపును) తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిమీద పగపట్టి, అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి”. ఈ వచనంలో కనబడుతున్నది నైతికమైన అసమర్థత. యోసేపును క్షేమసమాచారమైన అడగలేకపోవడానికి వాళ్ళు సహజసామర్థ్యం లేనివాళ్ళు కారు, అంటే వాళ్ళు మూగవాళ్ళు కాదు. మరెందుకు వాళ్ళు యోసేపును క్షేమసమాచారం కూడా అడగలేకపోయారు? అదే వచనంలో జవాబు ఉంది. వాళ్ళు అతని మీద పగబట్టారు. 2 పేతురు 2:14లో ఒక ప్రత్యేకమైన వర్గానికి చెందిన దుష్టుల గురించి చదువుతాం. “వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు” అని వారి గురించి చెప్పబడింది. ఇక్కడ కూడా నైతిక అసమర్థతే మనకు కనబడుతోంది. వీళ్ళు ఎందుకు పాపాన్ని మానుకోలేరు? ఎందుకంటే వాళ్ళ కళ్ళు వ్యభిచారిణిని చూసి ఆశిస్తూ ఉన్నాయి. అదే విధంగా రోమా 8:8. "శరీర స్వభావంగలవారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు”. ఇక్కడ అసమర్థత ఆత్మసంబంధమైనది. ప్రకృతిసంబంధి అయిన మనిషి దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టలేడు? ఎందుకంటే అతడు దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుచేయబడ్డాడు కాబట్టి (ఎఫెసీ 4:18). తన హృదయానికి ప్రతికూలమైనదాని నుంచి ఏ పాపీ ఎంపిక చేసుకోలేడు. "సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచి మాటలు పలుకగలరు?” (మత్తయి 12:34). “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” (యోహాను 6:44). ఇక్కడ మనముందున్నది నైతికమైన, ఆత్మసంబంధమైన అసమర్థత. దేవునిచేత ఆకర్షించబడకపోతే పాపి ఎందుకు క్రీస్తు దగ్గరకు రాలేడు? సహజమైన అసమర్థతకూ, నైతికమైన ఆత్మసంబంధమైన అసమర్థతకూ మధ్యన భేదముందని లేఖనాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. చూపు పొందాలని తీవ్రంగా అపేక్షించిన బర్తిమయి అంధత్వానికీ, “మనస్సు త్రిప్పుకొని స్వస్థత పొందకుండునట్లు చెవులతో విన్నప్పటికీ గ్రహించకుండా కళ్లతో చూసినా తెలుసుకోకుండా” కళ్లు మూయబడిన పరిసయ్యుల అంధత్వానికీ మధ్యనున్న వ్యత్యాసాన్ని ప్రతీ ఒక్కరూ స్పష్టంగా చూడగలరు (మత్తయి 13:15). అయితే 'ప్రకృతిసంబంధియైన వ్యక్తి, రావాలనుకుంటే క్రీస్తు దగ్గరకు రాగలడా?' అని కొందరు ప్రశ్నిస్తారు. క్రీస్తు దగ్గరకు రావడానికి శక్తి కావాలంటే అపేక్ష అవసరం. పాపికి అపేక్ష అస్సలు ఉండదు.

మనం పైన వాదించిన విషయం చాలా ముఖ్యమైనది. పాపికి ఉన్న భౌతిక సామర్థ్యానికీ, అతనికున్న నైతికమైన ఆత్మసంబంధమైన అసమర్థతకూ మధ్యలోనే అతని బాధ్యత ఉంది. మానవ హృదయం యొక్క భ్రష్టత్వం మనిషికున్న జవాబుదారీతనాన్ని నాశనం చేయదు. పాపి యొక్క నైతిక అసమర్థతే అతని దోషాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. పైన ప్రస్తావించిన లేఖనాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. యోసేపు సోదరులు అతన్ని క్షేమసమాచారాన్ని కూడా అడగలేకపోయారు, ఎందుకు? ఎందుకంటే వాళ్ళు అతనిపై పగబట్టారు. వారి యొక్క నైతిక అసమర్థత వాళ్ళను నిర్దోషులుగా చేసిందా? కానే కాదు; నిజానికి ఈ నైతిక అసమర్థతలోనే వాళ్ళ పాపం యొక్క ఘోరత్వం ఉంది. పాపం మానలేనివారి గురించి 2 పేతురు 2:14లో చెప్పబడింది. వాళ్ళెందుకు పాపాన్ని మానలేరు? ఎందుకంటే వారి కళ్ళు వ్యభిచారసంబంధమైన ఆలోచనలతో నిండియున్నవి. నిజానికి అది వారి పాపాన్ని మరింత ఘోరంగా చేసింది. వాళ్ళు పాపం చేయటం మానలేకపోయారు అనేది వాస్తవం; అయితే అది వాళ్ళను తప్పించుకోనివ్వలేదు. నిజానికి అదే వాళ్ళ పాపాన్ని ఘోరంగా చేసింది.

'నేను భ్రష్టహృదయంతో ఈ లోకంలో జన్మించడంలో నా పాత్ర ఏమీ లేదు కాబట్టి నా భ్రష్టహృదయం మూలంగా ప్రాప్తించిన నైతికమైన ఆత్మసంబంధమైన అసమర్థతకు నేను బాధ్యుణ్ణి కాదు' అని ఎవరైనా అభ్యంతరం లేవనెత్తడానికి అవకాశం ఉంది. భ్రష్టమైన కోరికలను నెరవేర్చుకోవడం వలన దోషం చేశావు. దానికి నువ్వు బాధ్యత వహించాలి, ఎందుకంటే దేవుడు ఎవ్వరినీ పాపం చేమమని బలవంతం చేయడు. నేను విపరీతమైన కోపాన్ని ఎవరిమీదైనా వెళ్ళగ్రక్కి 'ఆ కోపాన్ని మా తల్లిదండ్రుల నుంచి నేను పొందుకున్నాను' అని నా తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నన్ను తప్పనిసరిగా ఎవ్వరూ క్షమించరు. ఈ విషయంలో తీర్పు తీర్చడానికి వారికి ఉన్నటువంటి సహజ జ్ఞానమే సరిపోతుంది. 'నువ్వు నీ కోపాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత నీపైనే ఉన్నాయి' అని వాళ్ళు వాదిస్తారు. మరైతే పాపానికి బాధ్యత వహించే విషయాల్లో కూడా ఇదే నియమం వర్తిస్తుంది కదా? "దుష్టుడైన సేవకుడా, నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీరుస్తాను” అనే నియమం ఇక్కడ తప్పనిసరిగా వర్తిస్తుంది. 'ఒక దొంగ మిమ్మల్ని దోచుకున్నాడు' అని అనుకోండి. ఆ తర్వాత 'దొంగతనం చేయడం నా స్వభావం; దానికి భిన్నంగా నేను ప్రవర్తించలేను' అని తనను తాను సమర్థించుకుంటూ అతడు వాదిస్తూ ఉంటే మీరు ఏమంటారు? 'జైలే అతనికి సరైన స్థలం' అని అంటారు, అవునా? 'నా పాప హృదయాన్ని అనురించకుండా నేను ఉండలేను' అని వాదిస్తే అతని గురించి మీరు ఏమంటారు? 'అతడు తప్పనిసరిగా అగ్నిగుండానికి వెళ్ళాలని' అంటారు, అవునా? 'నా శత్రువుకి దగ్గరగా వెళ్ళి అతన్ని చంపకుండా ఉండలేనంతగా నేను అతన్ని ద్వేషించాను' అని ఒక హంతకుడు చెబితే అది అతని నేరాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది కదా! దేవునికి శత్రువు అయ్యేంతగా పాపాన్ని ప్రేమించే వ్యక్తి పరిస్థితి ఏంటి?

'మనిషి తన చర్యలకు బాధ్యుడు' అని లోకమంతా ఒప్పుకుంటుంది. అది మనిషి యొక్క నైతిక ప్రవృత్తిలోనే ఉంది. దీన్ని కేవలం లేఖనం బోధించడం మాత్రమే కాదు సహజమైన మనస్సాక్షి కూడా దీనికి సాక్ష్యం ఇస్తోంది. మనిషి తన చర్యలకు బాధ్యుడు అనే దానికి ఆధారం అతని సామర్థ్యంలోనే ఉంది. ఇప్పుడు సామర్థ్యం అంటే ఏంటో మనం నిర్వచించాలి. దీనికి ఒక ఉదాహరణ చెబుతాను.

నాకు ఒక వ్యక్తి 100 డాలర్లు రుణపడి ఉన్నాడు అనుకోండి. అతడు తన అవసరాలను, కోరికలను తీర్పుకోవడానికి చాలా ధనం సంపాదిస్తాడు, గాని నా అప్పు కోసం మాత్రం అతడు ఏమీ సంపాదించడు. అప్పుడు నేను ఏమంటాను? అతనికి లేనిది కేవలం యధార్థహృదయమే అని అంటాను. నాకు అప్పు పడిన వ్యక్తి బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయి. చెక్ రాయడానికి అతనికి సామర్థ్యం ఉంది, అయితే యథార్థమైన మనసు మాత్రమే లేదు, అందువల్ల రాయడానికి అతనికి ఉన్నటువంటి సామర్థ్యమే అతన్ని జవాబుదారీగా చేస్తుంది. అందువల్ల అతనికి యథార్థహృదయం లేదనే వాస్తవం అతని జవాబుదారీతనాన్ని తొలగించదు.

పాపికి నైతికమైన ఆత్మసంబంధమైన సామర్థ్యం లేదు, అయితే అతనికి సహజమైన సామర్థ్యం ఉంది, కాబట్టి ఈ సామర్థ్యమే అతన్ని దేవునికి లెక్క అప్పగించేలా చేస్తుంది. దేవుణ్ణి ద్వేషించడానికి ఎలాంటి సహజమైన సామర్థ్యాలు ఉన్నాయో దేవుణ్ణి ప్రేమించడానికి కూడా అవే సహజ సామర్థ్యాలున్నాయి; దేవునిని విశ్వసించకపోవడానికి ఏ హృదయాలున్నాయో ఆయనను విశ్వసించడానికి కూడా అవే హృదయాలున్నాయి. అందువల్ల ఆయనను ప్రేమించడంలో, నమ్మడంలో వారి వైఫల్యమే వాళ్ళకు దోషం అవుతుంది. ఒక పిచ్చివానికీ, పసి పిల్లవానికీ సహజమైన సామర్థ్యం లేదు కాబట్టి వాళ్ళు దేవునికి వ్యక్తిగతంగా బాధ్యులు కారు. అయితే దేవుడు ఎవరికైతే వివేకాన్ని అనుగ్రహించాడో, ఎవరికైతే మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోగలిగిన మనస్సాక్షి ఉందో, ఎవరైతే నిత్యత్వానికి సంబంధించిన విషయాల్ని ఆలోచించగలరో వాళ్ళు బాధ్యులు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఈ సామర్థ్యాలే వారిని దేవునికి లెక్క అప్పగించేలా చేస్తాయి (రోమా 14:12). 

పాపికి ఉన్న సహజమైన సామర్థ్యానికీ, నైతికమైన ఆత్మసంబంధమైన అసమర్థతకూ ఉన్న వ్యత్యాసం చాలా ముఖ్యమైంది అని నేను మరొకసారి చెబుతున్నాను. స్వభావసిద్దంగానే అతనికి సహజసామర్థ్యం ఉంది కానీ నైతికమైన ఆత్మసంబంధమైన సామర్థ్యం లేదు. అతనికి నైతికమైన ఆత్మసంబంధమైన సామర్థ్యం లేదు అనే వాస్తవం అతని బాధ్యతను తొలగించదు. ఎందుకంటే అతనికి సహజ సామర్థ్యం ఉంది అనే వాస్తవంపై అతని బాధ్యత ఆధారపడి ఉంది. మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు, ఒక సాధారణమైన వ్యక్తి ఇంకొకడు దొంగతనం చేసి పట్టుబడ్డారు అని ఊహించండి. అయితే రెండో వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు నేరస్తులు. వీళ్ళకి తీర్పు తీర్చినప్పుడు ఏ జడ్జిగారూ కూడా మతిస్థిమితం లేని వ్యక్తికి శిక్ష వేయడు, కానీ సాధారణమైన ఆరోగ్యం ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష వేస్తాడు. రెండవ వ్యక్తికి నేరచరిత్ర ఉన్న తల్లిదండ్రులు ఉండి ఉండవచ్చు. వాళ్ళ దుష్ట స్వభావం ఇతనికి కూడా సంక్రమించి ఉండొచ్చు. అయినంత మాత్రాన అతని కుటుంబ నేపథ్యం అతన్ని నిర్దోషిగా ప్రకటించదు ఎందుకంటే అతనికి తెలివితేటలున్నాయి. అందువల్ల మనిషి జవాబుదారి కావడానికి ఆధారం - అతనికి ఉన్న వివేకం, మనస్సాక్షి అనే వరం. పాపికి దేవుడు ఈ సహజమైన సామర్థ్యాలను అనుగ్రహించాడు కాబట్టి అతడు బాధ్యత కలిగినటువంటి ప్రాణి. అతడు తన సహజ సామర్థ్యాలను దేవుని మహిమ కోసం ఉపయోగించడు. కాబట్టి అదే అతనికి దోషం అవుతుంది.

విధేయత అనే రుణాన్ని చెల్లించలేని ఒక వ్యక్తి దగ్గర నుంచి దేవుడు దానిని ఆశించడం దేవుని కనికరంతో ఎలా పొసుగుతుంది? మనిషి తన సామర్థ్యాన్ని కోల్పోయినా దేవుడు తన హక్కును కోల్పోలేదు అనే విషయాన్ని మనం అందరం గమనించాలి. మనిషి యొక్క అసమర్థత అతని యొక్క విద్యుక్తధర్మాన్ని రద్దు చేయదు. మద్యం సేవించినా సేవకుడు సేవకుడే; సేవకుడు చేసిన పొరపాటును బట్టి అతని యజమాని అతనిపై హక్కులను కోల్పోతాడు అని వాదించడం హేతు విరుద్ధమైన విషయం. ఆదాము మానవజాతి అంతటికీ శిరస్సు, ప్రతినిధి. ఆదాములో దేవుడు మనతో నిబంధన చేశాడు. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆదాములోనే దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు. మన తొలి తల్లిదండ్రుల పతనం ద్వారా దాన్ని కోల్పోయాము. మన సామర్థ్యాన్ని కోల్పోయినప్పటికీ ఆయనకు మనం విధేయత చూపించాలని, సేవ చేయాలని దేవుడు న్యాయంగా కోరతాడు.

3. మనుషులు కొన్ని పాపాలు చేసేలా నియమించి/శాసించి, వాటిని చేసినందుకు వాళ్ళను బాధ్యులుగా ఎంచి, దోషులుగా వాళ్ళను పరిగణించడం దేవునికి ఎలా సాధ్యం?

ఇప్పుడు మనం ఇస్కరియోతు యూదా యొక్క వృత్తాంతం గురించి ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించేది యూదాయే అని నిత్యత్వంలోనే దేవుడు నియమించాడని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మాటలను ఎవరైనా సవాలు చేస్తే వాళ్ళకి జెకర్యా ప్రవచనాన్ని చూపించాలి. తన కుమారుడు 30 వెండి నాణాలకు అమ్మబడాలని దేవుడు ప్రవక్త ద్వారా ప్రకటించాడు (జెకర్యా 11:12). ప్రవచనం ద్వారా దేవుడు జరగబోయే సంగతులను తెలియజేస్తాడు. జరగబోయే సంగతులను తెలియజేయడంలో ఆయన ఏం జరగాలని నియమించాడో, దాన్ని మనకి వెల్లడి చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు చూశాము. యూదా ద్వారానే జెకర్యా యొక్క ప్రవచనం నెరవేరిందని వాదించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఎదుర్కునే ప్రశ్న: దేవుని శాసనాన్ని నెరవేర్చిన యూదా అతని చర్యకు జవాబుదారీయేనా? అవును, యూదా అతని చర్యకు బాధ్యత వహించాల్సిందే! ఒక పనిని ఒక వ్యక్తి ఏ ఉద్దేశంతో, ఏ ప్రేరణతో చేశాడు అనేదానిని బట్టి అతడు తన చర్యకు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని అందరూ ఒప్పుకుంటారు. ఎలాంటి దురుద్దేశమూ లేకుండానే చేసిన నష్టానికీ, దురుద్దేశంతో, ద్వేషంతో ప్రణాళిక వేసుకుని చేసిన నష్టానికీ, మానవచట్టం భిన్నంగా తీర్పు తీరుస్తుంది. ఇదే నియమాన్ని యూదాకు అన్వయించండి. యాజకులతో బేరం కుదుర్చుకున్నప్పుడు అతని హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి? దేవుని శాసనాన్ని నెరవేర్చాలి అనే కోరిక అతనిలో లేదు అనేది స్పష్టం, అయినా అతనికి తెలియకుండానే అతడు ప్రవచనాన్ని నెరవేర్చాడు, దేవుడు ముందుగానే ఈ చర్యను నియమించినా, అతన్ని ఆ విధంగా నడిపించినా, యూదా ఉద్దేశం మాత్రం చెడ్డదే. అందువల్ల అతని ఉద్దేశమే అతన్ని దోషిగా చేసింది, 'నేను నిరపరాధి రక్తాన్ని చిందించాను' అని అతడు తర్వాత గుర్తించాడు. క్రీస్తు సిలువ విషయంలో కూడా ఇలాగే జరిగింది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి యేసు అప్పగించబడ్డాడనీ (అపొ.కా. 2:23), ప్రభువు మీదను, క్రీస్తు మీదను రాజులు లేచిరి. అధికారులును ఏకముగా కూడికొనిరి. అయితే ఏవి జరుగవలెనని నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా ఈ పట్టణమందు నిజముగా కుడుకున్నారనీ (అపొ.కా. 4:26, 28) లేఖనం స్పష్టంగా ప్రకటిస్తోంది. దేవుడు సిలువనూ, దాని చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కేవలం అనుమతించాడు అని కాకుండా నియమించాడు అని ఈ వచనాలు బోధిస్తున్నాయి. అయితే మన ప్రభువుని సిలువ వేసిన హస్తాలు, వధించిన చేతులు దుష్టుల చేతులు (అపొ..కా. 2:23). వారి హస్తాలు దుష్టమైనవి, ఎందుకంటే వాళ్ళు దురుద్దేశంతోనే యేసును సిలువ వేశారు.

క్రీస్తును అప్పగించాలని యూదానూ, ఆయనను సిలువ వేయాలని యూదుల్నీ అన్యజనుల్నీ దేవుడే నియమించాడు. కాబట్టి వాళ్ళు వేరేది ఏదీ చేయలేకపోయారు, అందువల్ల వాళ్ళు తమ దురుద్దేశాల విషయంలో బాధ్యులు కారు' అని ఎవరో ఒకరు అభ్యంతరం తెలపవచ్చు. అవును, వాళ్ళు చేసిన పనుల్ని చేయాలని దేవుడే నియమించాడు, కానీ ఆ పనులు చేసిన వాళ్ళు న్యాయంగా దోషులే. ఎందుకంటే ఆ చర్యలను వాళ్ళు తమ స్వార్థపూరిత ఉద్దేశాల కోసమే చేశారు. దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకోవడం కోసం పాపపు ఆలోచనలను నియంత్రిస్తాడు, నడిపిస్తాడు. కానీ మనిషిలో పాపపు ఆలోచనలను ఆయన పుట్టించడు అని నేను నొక్కి చెబుతున్నాను. అందువల్ల ఆయన పాపానికి కర్త కాడు, పాపాన్ని ఆమోదించేవాడు కూడా కాడు. ఈ వ్యత్యాసాన్ని అగస్టీన్ కూడా ఈ విధంగా వ్యక్తపరిచాడు - 'మనుషులు చేసే పాపం వారిలోనుండే వస్తుంది. అయితే తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం చీకటి నుంచి వెలుగును వేరు చేసే శక్తి ఉన్న దేవుడే వాళ్ళు చేస్తున్న పాపాన్ని నియంత్రిస్తాడు, ఉపయోగించుకుంటాడు'. అందువల్లనే “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వానిని స్థిరపరచును” అని సామెతల గ్రంథంలో రాయబడింది (సామెతలు 16:9). అందువల్ల 'దేవుని శాసనాలు' అంటే 'మనుషుల్లో పాపానికి కారణమయ్యేవి కాదు' కానీ మనుషుల పాపపు క్రియల్ని నియంత్రించడానికి, నడిపించడానికి ముందుగా నిర్ణయించబడిన ఉద్దేశాలు' అని నేను ఇక్కడ నొక్కి చెబుతున్నాను. క్రీస్తు అప్పగింపబడిన విషయంలో, 'తాను సృష్టించిన మనుషుల్లో ఒకరిచేత అమ్మి వేయబడాలి అని నిర్ణయించి, ఆ తర్వాత ఒక మంచి మనిషిని తీసుకుని అతని హృదయంలో ఒక చెడ్డ ఆలోచన పెట్టి, తన శాసనాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆ దుర్మార్గపు చర్య చేసే విధంగా అతన్ని ఒత్తిడి చేశాడు' అనేది ఏమాత్రమూ నిజం కాదు. లేఖనం ఈ విధంగా చెప్పట్లేదు. దానికి భిన్నంగా, దేవుడు ఆ చర్యను శాసించాడు. ఆ పని నెరవేర్చబోయే వ్యక్తిని ఎంచుకున్నాడు, అయితే అతడు ఆ పని చేసే విధంగా దేవుడు అతన్ని దుర్మార్గుడిగా చేయలేదు. దానికి భిన్నంగా, ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఎంచుకున్నప్పుడు అందులో యేసును అమ్మివేసే యూదా గురించి 'సాతాను' అని రాయబడింది (యోహాను 6:70). అతడు తన దుష్టహృదయంతో, దురుద్దేశాలతో తలపెట్టిన చర్యలను దేవుడు తన సంకల్పం నెరవేర్చుకోవడం కోసం నడిపించాడు. అదే సిలువ కార్యం వెనుక జరిగిన సంగతి.

4. దేవుడు ఒక పాపిని శిక్షావిధికే ముందుగా నియమించి, అతడు క్రీస్తును తృణీకరించినందుకు శిక్షార్హునిగా అతనిని ఎలా చేస్తాడు? క్రీస్తును అంగీకరించే ఈ విషయంలో పాపి ఎలా బాధ్యత వహిస్తాడు?

నిజానికి ఈ ప్రశ్నకి జవాబు ఇంతకుమందే చెప్పడం జరిగింది. అయినాసరే దీనిని మరొకసారి క్లుప్తంగా చర్చించాలని అనుకుంటున్నాను. పై ప్రశ్నలో ఉన్న సమస్యను అర్థం చేసుకోవడానికి ఈ కింద ఉన్న అంశాలను జాగ్రత్తగా ఆలోచించండి. మొదటిగా, ఒక పాపి తాను ఈ లోకంలో బ్రతికుండగా తాను 'నాశనానికి సిద్ధపడిన ఉగ్రత పాత్రమైన ఘటమో, కాదో' ఖచ్చితంగా తెలుసుకోలేడు. అది దేవుని రహస్యం, ఆ రహస్యాన్ని పాపి తెలుసుకునే అవకాశం లేదు. దేవుని రహస్యచిత్తాన్ని తెలుసుకోవడం పాపి పని కాదు. తన వాక్యంలో దేవుడు బయలుపరచిన చిత్తాన్ని మనిషి తెలుసుకుని పాటించాలి, అదే అతనికి ప్రమాణం. దేవుడు బయలుపరిచిన చిత్తం చాలా స్పష్టంగా ఉంది. ప్రతి పాపి ఇప్పుడు నమ్మాలని ఆదేశించబడుతున్నాడు (1యోహాను 3:23). నిజంగా మారుమనస్సు పొంది విశ్వాసముంచినవాళ్ళు అందరూ రక్షించబడతారు. కాబట్టి మారుమనస్సు పొందడం, విశ్వాసముంచడం ప్రతి పాపి యొక్క బాధ్యత.

రెండవదిగా - రక్షణార్థమైన జ్ఞానమును కలిగించుటకు శక్తి కలిగిన లేఖనాలను ప్రతి పాపి పరిశోధించవలసినవాడై ఉన్నాడు (2తిమోతి 3:15). దేవుని కుమారుడు లేఖనాలను పరిశోధించమని ఆజ్ఞాపించాడు కాబట్టి అది పాపి యొక్క బాధ్యత (యోహాను 5:39). దేవుణ్ణి వెదకాలనే హృదయంతో అతడు లేఖనాలను పరిశోధిస్తే అప్పుడు దేవుడు పాపులను కలుసుకునే మార్గంలోకి అతడు వస్తాడు. దీని గురించి ప్యూరిటన్ భక్తుడైన Manton రాసిన మాటలు మనకు చాలా సహాయపడతాయి.

భూమిని దున్నే ప్రతివాడికి 'నీకు మంచి పంట పండుతుంది' అని నేను చెప్పలేను, కానీ 'కష్టపడే వాళ్ళను దీవించడం దేవునికి ఇష్టం' అని మాత్రం చెప్పగలను. పెళ్ళి చేసుకుని బిడ్డలను కనాలనుకునే ప్రతివాళ్ళకి 'మీకు సంతానం కలుగుతుంది' అని నేను చెప్పలేను. “ధైర్యము కలిగి ఉండుము, మనము మన జనుల నిమిత్తము మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వము చూపుదము, యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానిని చేయును” అని యోవాబు చెప్పినట్లు మాత్రమే నేను చెప్పగలను (1దిన 19:13). 'నీకు తప్పనిసరిగా కృప దొరుకుతుంది' అని నేను చెప్పలేను కానీ 'దేవుడు ఏర్పరచిన మార్గాన్ని ఉపయోగించుకో, ఫలితాన్నీ, నీ సొంత రక్షణనూ దేవుని చిత్తానికీ ఆయన దయాసంకల్పానికీ విడిచిపెట్టు' అని నేను ప్రతి ఒక్కరితో చెప్పగలను. 'దేవుడు ఏ ఒక్కరినీ రక్షించుకోవాల్సిన అవసరం లేదు, అయితే 'ఆయన తన సత్యవాక్యాన్ని బట్టి తన సంకల్పం ప్రకారం మనలను కన్నాడు' అని మాత్రం నేను చెప్పగలను (యాకోబు 1:18). దేవుడు ఆజ్ఞాపించినదానిని మనం చేద్దాం, ఆయనకు ఇష్టమైనదానిని ఆయన్ను చేయనిద్దాం. ప్రపంచంలోని మనుషులందరూ ఈ నియమం చేతనే నడిపించబడాలి, నడిపించబడుతున్నారు. మనం మన బాధ్యతలను నిర్వర్తిద్దాం. తనను వెదికేవారికి కనబడడం దేవునికి ఇష్టం కాబట్టి ఫలితాన్ని ఆయనకు విడిచిపెడదాం. ఆయన ఇప్పటికే మనతో ఉన్నాడు; ఆయన ఏర్పరచిన మార్గాన్ని ఉపయోగించుకోవాలనే భారమైన పట్టుదల ఆయన కృపలో నుంచి కలిగినదే. ఆయన మనతోనే ఉన్నాడు కాబట్టి మనకు మేలు చేయడం కోసం ఆయన ఏ మాత్రమూ వెనకడుగు వేయలేదు కాబట్టి, ఆయన కృపాకనికరాలు దక్కవేమోననే నిరాశ మనకు అవసరం లేదు, మనం శ్రేష్ఠమైనవాటిని నిరీక్షించాలి (Vol, XX1, పేజీ 312).

రక్షకుని గురించి సాక్ష్యం ఇచ్చే, రక్షణ మార్గాన్ని తెలియజేసే పరిశుద్ధ లేఖనాలను మనుషులకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. వార్తాపత్రికను చదవడానికి సహజమైన ఏ ఇంద్రియాలు ప్రతి పాపికి ఉన్నాయో బైబిల్ చదవడానికి కూడా అవే ఇంద్రియాలు అతనికి ఉన్నాయి. ఒక వేళ అతడు అక్షరజ్ఞానం లేనివాడు కావడం వల్ల లేదా అంధుడు కావడం వల్ల బైబిల్ చదవలేకపోతే, ఇతర విషయాల గురించి వాకబు చేయడానికి తన స్నేహితుడిని ఏ నోటితో అడుగుతాడో అదే విధంగా బైబిల్ని తన కోసం చదవమని అడగడానికి కూడా అదే నోరు అతనికి ఉంది. దేవుడు తన వాక్యాన్ని, శక్తి కలిగిన లేఖనాలను పరిశోధించండి అని మనుషుల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. దానిని తిరస్కరిస్తే వాళ్ళు న్యాయంగా శిక్షార్హులు అని లేఖనం స్పష్టం చేస్తోంది. వాళ్ళ రక్తాపరాధం వాళ్ళ తలపైన ఉంటుంది, దేవుడు వాళ్ళను న్యాయంగా అగ్నిగుండంలో వేయవచ్చు.

మూడవదిగా, ' పైన మీరు చెప్పింది అంతా నేను ఒప్పుకుంటాను అయితే ఎన్నికలో లేనివారిలో ప్రతివాడు మారుమనస్సు పొందలేడు, విశ్వాసం కనపరచలేడు అనేది వాస్తవం కాదా?' అని కొందరు అభ్యంతరం తెలపవచ్చు. అవును, వాళ్ళు విశ్వాసం ఉంచలేరు, మారుమనస్సు పొందలేరు. పాపి తనకు తానుగా క్రీస్తు దగ్గరకు రాలేడు అనేది వాస్తవమే. 'రాలేడు' అనేది దేవుని కోణం నుంచి చూస్తే అంతిమమైనది. అయితే శిక్షావిధికి ముందుగా నియమించబడి, ఆ సంగతిని ఎరుగని పాపి యొక్క బాధ్యత గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. మానవకోణం నుంచి చూస్తే పాపం యొక్క అసమర్థత నైతికమైనది. ఈ విషయాన్ని ఇంతకుముందే మనం చూశాం. ఈ నైతిక అసమర్థతకు తోడు పాపిలో ఇష్టపూర్వకమైన అసమర్థత కూడా ఉంటుంది. మంచి చేసే విషయంలో అసమర్థత మాత్రమే కాదు పాపిలో పాపం ఎడల ఆనందం కూడా ఉంటుంది. అందువల్ల మానవకోణంలో చూస్తే 'రాలేడు' అనే మాటను 'రావడానికి ఇష్టపడడు' అని మనం అర్థం చేసుకోవాలి. అది స్వచ్ఛందమైన అసమర్థత. మనిషి యొక్క అసమర్థత అతని మొండితనంలో ఉంటుంది. అందువల్ల ఏ ఒక్కరికీ సాకు చెప్పి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. తీర్పు తీర్చునప్పుడు దేవుడు నిర్మలంగా ఉంటాడు, వెలుగు కంటే చీకటినే ప్రేమించే మనుషులందరినీ నాశనం చేయడంలో ఆయన నీతిమంతుడుగా ఉంటాడు.

మన సామర్థ్యానికి మించినదాన్ని దేవుడు మన నుంచి కోరతాడు అనే విషయం అనేక లేఖనాలలో మనకు స్పష్టంగా కనబడుతుంది. సీనాయి పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దానికి సంపూర్ణంగా లోబడమని వాళ్ళని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అవిధేయత చూపిస్తే వచ్చే పర్యవసానాలు ఏమిటో వాళ్ళకు తెలియజేశాడు (ద్వితీ 28వ అధ్యాయం చూడండి). 'ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా లోబడగలిగారు' అని ఎవరైనా చెప్పగలరా? అలా చెప్పగలిగినవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకు రోమా 8:3ను చూపిద్దాం. “ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను”.

ఇప్పుడు కొత్త నిబంధనకు రండి. “మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు” (మత్తయి 5:48). “నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి” (1 కొరింథీ 15:34). “నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను” (1యోహాను 2:1). 'దేవుడు కోరినవన్నీ ఎవరైనా సంపూర్ణంగా పాటించగలరు' అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీతో వాదించడం నిరుపయోగం.

మనిషికి అసాధ్యమైనదాన్ని చేయమని దేవుడు ఎందుకు ఆజ్ఞాపించాడు? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమౌతుంది. మొదటి జవాబు: మనుషుల పాపపు బలహీనతలను బట్టి తన ప్రమాణాన్ని తగ్గించుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మన ముందు ఆయన పరిపూర్ణమైన ప్రమాణాన్నే నియమించాలి. 'దేవుని ప్రమాణాల్ని అందుకోవడానికి మనిషి అసమర్థుడు కాబట్టి ఇక అతనికి బాధ్యత ఎక్కడిది?' అని మనం ఇంకా అడగవచ్చు. ఈ సమస్య కష్టతరంగా అనిపించవచ్చు కానీ దీనికి సులభమైన, సంతృప్తికరమైన పరిష్కారం ఉంది.

దీనికి ముందు, తన అసమర్థతను ఒప్పుకొని, బలపరిచే ఆయన కృప కోసం మొరపెట్టుకోవాల్సిన బాధ్యత మనిషికి ఉంది. ప్రతి క్రైస్తవుడు దీన్ని తప్పనిసరిగా ఒప్పుకుంటాడు. దేవుని పరిశుద్ధమైన, న్యాయమైన ఆజ్ఞలను పాటించడానికి నా అజ్ఞానాన్ని, బలహీనతను, పాపాన్ని, అసమర్థతను దేవుని ముందు ఒప్పుకోవడం నా విద్యుక్త ధర్మం. అదే సమయంలో 'ఆయన దృష్టికి సంతోషంగా ఉండేదానిని చేయడం కోసం నన్ను బలపరచు' అని ఆయన జ్ఞానం కోసం, బలం కోసం, కృప కోసం ఆయనను ఆసక్తిగా ప్రార్థించడం అనేది కూడా నా విద్యుక్తధర్మం, నా ధన్య ఆధిక్యత. 'ఇచ్ఛయించుటకు కార్యసిద్ధి కలుగజేయుటకు నాలో తన దయాసంకల్పాన్నిబట్టి పనిచేసేవాడు ఆయనే' (ఫిలిప్పీ 2:13).

అదేవిధంగా ప్రభువుకి మొరపెట్టవలసిన బాధ్యత ప్రతీ పాపికీ ఉంది. తనకు తానుగా అతడు మారుమనస్సు పొందలేడు, విశ్వాసముంచలేడు. అతడు క్రీస్తు దగ్గరకూ రాలేడు, తన పాపాల నుంచీ తిరగలేడు. దేవుడు అదే అతనికి చెబుతున్నాడు. దేవుడు సత్యవంతుడు అని అతడు మొదటిగా నమ్మాల్సి ఉంది. రెండవదిగా, ఆయనతో ఉన్న శతృత్వాన్ని అధిగమించడానికి శక్తినిమ్మనీ, మారుమనస్సు, విశ్వాసం అనే వరాలను తనకు అనుగ్రహించమనీ అతడు దేవునికి మొరపెట్టాలి. అతడు హృదయపూర్వకంగా అలా చేస్తే తప్పనిసరిగా దేవుడు అతని మాట వింటాడు ఎందుకంటే “ప్రభువు నామమున ప్రార్థించినవాడెవడో వాడు రక్షించబడతాడు” అని రాయబడింది (రోమా 10:13).

ఉదాహరణకు ఒక అర్థరాత్రి నేను మంచుతో కప్పబడిన రహదారిపై జారిపడి నా తొడగూటిని విరగ్గొట్టుకున్నాను అని ఊహించండి. నేను పడినచోట నుండి పైకి లేవలేకుండా ఉన్నాను. నేను ఆ రహదారిపై అలాడే ఉండిపోతే గడ్డకట్టుకుపోయి చనిపోతాను. అప్పుడు నేను ఏం చేయాలి? నేను నాశనం అయిపోవడానికి నిర్ణయించుకుంటే అక్కడ మౌనంగా ఉండవచ్చు. అలాంటి నిర్ణయం తీసుకుంటే నింద నేనే భరించాల్సి వస్తుంది. ఒకవేళ నేను బ్రతకాలని ఆశపడితే అప్పుడు నా గొంతు ఎత్తి సహాయం కోసం అరవాలి. అదేవిధంగా తనకు తానుగా పైకి లేచి క్రీస్తువైపు మొదటి అడుగు వేయలేని స్థితిలో ఉన్న పాపి పై దేవునికి మొర్రపెట్టాల్సిన బాధ్యత ఉంది. అతడు హృదయపూర్వకంగా అది చేస్తే ఆపన్నహస్తం అందించడానికి విమోచకుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉన్నవాడు కాడు (అపొ.కా. 17:27). అవును “ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు” (కీర్తన 46:1) ఒకవేళ పాపి ప్రభువుకి మొరపెట్టడానికి తిరస్కరిస్తే, నాశనం కావడానికే నిర్ణయించుకుంటే అప్పుడు తన రక్తాపరాధం అతని తల పైనే ఉంటుంది, అతని నాశనం న్యాయమైనదిగా ఉంటుంది ( రోమా 3:8).

ఇప్పుడు మానవ బాధ్యత యొక్క పరిధి గురించి చర్చిద్దాం.

మానవుని బాధ్యత యొక్క పరిధి పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఆ కొలమానం మన రక్షకుని మాటల్లో కనబడుతుంది, “మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వారి దగ్గర నుండి ఎక్కువగా అడుగుతారు (లూకా 12:48). క్రైస్తవ సంఘ యుగంలో జన్మించినవారి నుండి కోరినదానికంటే ఎక్కువగా పాత నిబంధన కాలంలో జీవించినవారి నుంచి దేవుడు కోరలేదు. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి వ్యక్తికి ఒక బైబిల్ ఉండే అవకాశం ఉన్న నేటి తరం నుండి దేవుడు కోరేంతగా లేఖనాలు కేవలం కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉండే చీకటి యుగపు తరం నుండి దేవుడు కోరడు. అదే విధంగా దేవుడు క్రైస్తవ ప్రపంచంలో ఉన్నవాళ్ళ నుంచి కోరినదానికంటే అన్యజనుల నుంచి ఎక్కువగా కోరడు. అన్యజనులు క్రీస్తుని నమ్మనందుకు నశించరు కానీ ప్రకృతి ద్వారా, మనస్సాక్షి ద్వారా దేవుని గురించి, ఆయన ప్రమాణాల గురించి వాళ్ళకు తెలిసినవాటికి అనుగుణంగా జీవించడంలో వాళ్ళు విఫలం అయినందుకే నశిస్తారు.

సారాంశం: 'మనిషి తన చర్యలకు బాధ్యుడు' అనే వాస్తవం అతని సహజమైన సామర్థ్యంపై ఆధారపడి ఉంది. దీనికి మనస్సాక్షి సాక్ష్యం ఇస్తోంది, లేఖనాలు దీన్ని ఖండితంగా బోధిస్తున్నాయి. మనిషి హేతుబద్ధంగా ఆలోచించగలడు, నిత్యత్వానికి సంబంధించిన విషయాలను వివేచించగలడు, లిఖితపూర్వకమైన దైవప్రత్యక్షత అతనికి ఉంది, అందులో సృష్టికర్తతో తనకున్న సంబంధమూ సృష్టికర్త యెడల చూపించాల్సిన విధేయత స్పష్టంగా నిర్వచించబడ్డాయి. వీటి పైనే మనిషి యొక్క బాధ్యత ఆధారపడి ఉంది. మనిషి బాధ్యత యొక్క పరిధి ఆయా వ్యక్తులను బట్టి, వారికి దేవుని నుంచి కలిగిన వెలుగు పరిమాణాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మానవ బాధ్యత అనే సమస్యకు పరిశుద్ధ లేఖనాల్లో పాక్షికమైన పరిష్కారం ఉంది. మరింత వెలుగు కోసం లేఖనాలను ప్రార్థనపూర్వకంగా, శ్రద్ధగా పరిశోధించాల్సిన గంభీరమైన అవసరం, ఆధిక్యత మనకు ఉన్నాయి, సర్వసత్యంలోనికి మనల్ని నడిపించమని పరిశుద్ధాత్మను వేడుకోవాల్సిన అవసరం మనకుంది. “న్యాయవిధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును” (కీర్తన 25:9) అని రాయబడింది.

దేవుడు ప్రతి మనిషికి అందుబాటులో ఉంచిన మార్గాల్ని అతడు ఉపయోగించుకోవలసిన బాధ్యత ఉంది. జరుగుతున్న ప్రతిదాన్ని దేవుడు ముందుగానే నియమించాడు. దేవుడు ఈ సత్యాన్ని నా హృదయాన్ని ఆదరించడం కోసం వెల్లడి చేశాడు. అయితే దేవుడే సమస్తాన్ని నియమించాడు కాబట్టి ఇక నేను చేయాల్సింది ఏమీ లేదు అని ఈ మాటని మనం అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే అది విధిరాత అనే తప్పుడు సిద్ధాంతాన్ని నమ్మినట్లు అవుతుంది. ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నియమించిన దేవుడే ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కొన్ని మార్గాలను కూడా నియమించాడు. దేవుడు ఆ మార్గాలను ఉపయోగించుకోవడాన్ని వ్యతిరేకించడు కాబట్టి నేను కూడా ఆ మార్గాలను తృణీకరించకూడదు.

ఉదాహరణకు, “భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవని దేవుడు తన హృదయంలో అనుకున్నాడు" (ఆది 8:22). 'అయితే మనిషి భూమిని దున్నాల్సిన అవసరం లేదనీ, విత్తనాలు నాటవలసిన అవసరం లేదనీ దాని భావం కాదు. మనుషులు ఈ పనులు చేసే విధంగా దేవుడు వాళ్ళను ప్రేరేపిస్తాడు, వాళ్ళ ప్రయాసలను దీవిస్తాడు, తాను నియమించినదాన్ని నెరవేర్చుకుంటాడు. అదే విధంగా దేవుడు సృష్టికి పూర్వమే కొంతమందిని రక్షణ కోసం ఎన్నుకున్నాడు. అయితే సువార్తికులు సువార్తను ప్రకటించాల్సిన అవసరం లేదని గానీ, పాపులు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని గానీ దీని అర్థం కాదు. ఈ మార్గాలను ఉపయోగించే దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకుంటాడు.

- 'దేవుడు ప్రతి మనిషి యొక్క నిత్య గమ్యాన్ని ముందుగానే నిర్ణయించాడు, కాబట్టి ఆత్మల గురించిన శ్రద్ధ మనకు అవసరం లేదు. రక్షణ మార్గాన్ని శ్రద్ధతో ఉపయోగించుకోవలసిన అవసరం లేదు' అని వాదించేవాళ్ళు దేవుడు ఈ భూమిపై వాళ్ళకు అప్పగించిన బాధ్యతలను విస్మరిస్తున్నారు. భూమిపై నా జీవితం ఏ విధంగా, ఎంతకాలం ఉండాలో ఆయనే నియమించాడు (అపొ.కా. 17:26; యోబు 7:1; 14:5). ఇహలోక సంబంధమైన విషయాల్లో మనుషుల చర్యలను దేవుడు ముందుగా నియమించినప్పుడు, భవిష్యత్తుకు సంబంధించిన వాటిని ఎందుకు నియమించకూడదు? దేవుడు జతపరిచినదానిని మనుషుడు వేరు చేయకూడదు. దేవుడు చేసే సమస్త కార్యాలు మనకు అర్థం అయినా అర్థం కాకపోయినా మన బాధ్యత మాత్రం చాలా స్పష్టంగా ఉంది. “రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును అయితే మనకు ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించి నడుచుకొనే విధంగా బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మన సంతతి వారివి అవుతాయి అని చెప్పుదురు” (ద్వితీ 29:20).

పౌలుతో పాటు ఓడలో ప్రయాణిస్తున్న వ్యక్తుల తాత్కాలిక భద్రతను తాను ముందుగానే నియమించినట్లు దేవుడు అపొ.కా. 27:22లో తెలియచేశాడు. అయినా 'వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు' అని చెప్పడానికి పౌలు సంకోచించలేదు(వ.31). దేవుడు తాను సంకల్పించినవాటిని అమలు చేయడం కోసం కొన్ని మార్గాలను నియమించాడు. 2వ రాజులు 20వ అధ్యాయంలో దేవుడు హిజ్కియా ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పొడిగించానని స్పష్టంగా తెలియజేశాడు. అయితే యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించి హిజ్కియా కురుపు మీద వేయాల్సి వచ్చింది. క్రీస్తు చేతిలో తాను నిత్యభద్రతను కలిగి ఉన్నానని పౌలుకు తెలుసు (యోహాను 10:28). అయితే “అతడు తన దేహాన్ని నలగొట్టుకున్నాడు” (1కొరింథీ 9:26). “మీరు ఆయనలో నిలుచున్నారు” అని అపొస్తలుడైన యోహాను విశ్వాసులకు ధైర్యం చెప్పాడు. అయితే ఆ తర్వాత వచనంలోనే “చిన్నపిల్లలారా, మీరు ఆయనయందు నిలిచి ఉండండి” అని వాళ్ళకు ఆజ్ఞాపించాడు (1యోహాను 2:27,28). ఈ ముఖ్యమైన నియమానికి మనం చెవియొగ్గాలి, దేవుడు నియమించిన మార్గాల్ని బాధ్యతగా ఉపయోగించుకోవాలి, అప్పుడు మాత్రమే సత్యసమతుల్యతను మనం కాపాడుకోగలుగుతాము, విధిరాత అనే దారుణమైన దురభిప్రాయం నుంచి తొలగిపోతాము.

 

అధ్యాయం 9

దేవుని సార్వభౌమత్వం - ప్రార్థన

“మనం ఆయన చిత్తానుసారముగా ఏమి అడిగినా, ఆయన మన మనవి ఆలకిస్తాడు” (1యోహాను 5:14).

సృష్టికర్తను హెచ్చించి సృష్టాన్ని తగ్గించడమే ఈ పుస్తకం యొక్క ముఖ్యమైన లక్ష్యం. మనిషిని ఘనపరచడం దేవుణ్ణి అవమానపరచి తృణీకరించడం అనేది ఇప్పుడు ప్రపంచమంతటా కనబడుతున్న వైఖరి. ఆత్మసంబంధమైన విషయాలను చర్చిస్తున్నప్పుడు మానవుల కృషిని కొనియాడి, దేవుని కృపను, దేవుని కార్యాలను తెర వెనుకకు నెట్టేస్తున్నారు. ప్రార్థన గురించి నేటి కాలంలో జరుగుతున్న బోధలో ఇది మనకు స్పష్టంగా కనబడుతోంది. ప్రార్థనపై రాయబడిన అనేక పుస్తకాలూ, చేసిన ప్రసంగాలూ మానవ కేంద్రితంగానే మనకు ఎక్కువగా కనబడతాయి. మన మనవులను దేవుడు నెరవేర్చాలి అంటే మనం ఏ షరతులకు లోబడాలి, ఏ వాగ్దానాలను నెరవేర్చమని దేవుణ్ణి అడగాలి, మనం ఏం చేయాలి అనేవాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ దేవుని ఆజ్ఞల్నీ, దేవుని హక్కుల్నీ, దేవుని మహిమనూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు.

'ప్రార్థన? లేదా విధాత?' అనే శీర్షికతో ప్రముఖ క్రైస్తవ వారపత్రికలో ఈ మధ్యకాలంలో కనిపించిన సంపాదకీయం నుండి మనం కొన్ని మాటలు గమనిస్తే, అది ప్రార్థన గురించి నేటి ప్రపంచానికి ఉన్న దృక్పథాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

'మనిషి చిత్తాన్ని బట్టి అతని పరిస్థితులు మారేలా, మలచబడేలా సార్వభౌముడైన దేవుడు నియమించాడు. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది' అనే సత్యానికి ఇదే కీలకమైనది. అంటే 'మనుషులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు' అని అర్థం. ప్రార్థన గురించి ఒకరు ఎంతో అద్భుతంగా ఇలా చెప్పారు, 'ఒక వ్యక్తి ప్రార్థన చేసినా, చేయకపోయినా తన జీవితంలో కొన్ని సంగతులు జరుగుతాయి. అతడు ప్రార్థన చేస్తే జరిగే కొన్ని సంగతులున్నాయి. ప్రార్థన చేయకపోతే జరగని కొన్ని సంగతులున్నాయి.' ఈ మాటలు ఒక క్రైస్తవ ఉద్యోగిని ఆకర్షించాయి. అతడు తన వ్యాపార కార్యాలయంలోకి ప్రవేశిస్తూ ఎవరో ఒకరితో క్రీస్తు గురించి మాట్లాడడానికి మార్గం తెరవమని ప్రభువుకు ప్రార్థన చేశాడు. తాను ప్రార్థన చేశాడు కాబట్టి పరిస్థితులు మారతాయి అనే ఆలోచన అతనిలో మెదులుతూ ఉంది. ఆ తర్వాత అతని మనసు వేరే విషయాల పైన దృష్టి సారించింది. అతడు తాను ప్రార్థించిన విషయాన్ని మర్చిపోయాడు. ఒక వ్యాపారవేత్తతో మాట్లాడుతున్నప్పుడు అతనికి ఆ అవకాశం వచ్చింది. కానీ అతడు దాన్ని గుర్తించలేదు. అతడు ఆ సంభాషణ ముగించిన తర్వాత తాను అరగంట ముందు చేసిన ప్రార్ధననూ, దేవుడు ఆ ప్రార్థనకు ఇచ్చిన జవాబునూ గుర్తు చేసుకున్నాడు. వెంటనే ఆ వ్యాపారవేత్తతో తిరిగి మాట్లాడి, 'మీరు రక్షించబడ్డారా?” అని అడిగాడు. ఆ వ్యాపారవేత్త సంఘానికి హాజరయ్యే వ్యక్తి అయినప్పటికీ తనను ఇంతకుముందు ఎవ్వరూ ఈ ప్రశ్న అడగలేదు. మనల్ని మనం ప్రార్థనకు అప్పగించుకుందాం. పరిస్థితుల్ని మార్చడానికి దేవునికి అవకాశం ఇద్దాం. దేవుడు మనకు అనుగ్రహించిన చిత్తాన్ని ప్రార్ధనలో ఉపయోగించుకోకపోతే మనం కూడా విధిరాతను నమ్మే వ్యక్తులుగా మారిపోతాం. అందువల్ల జాగ్రత్త పడదాం.'

ప్రార్థన అనే ఈ అంశంపై ఇప్పుడు ఏం బోధించబడుతుందో అనేదానికి పై మాటలు ఉదాహరణగా ఉన్నాయి. ఈ మాటలకు వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా పైకి లేవకపోవడం శోచనీయం. మనిషి చిత్తమే అతని పరిస్థితుల్నీ, భవిషత్తునూ మార్చేస్తుందనీ, మలిచేస్తోందని చెప్పడం విశ్వాసఘాతుకం, నాస్తికత్వం. మనిషి చిత్తమే అతని పరిస్థితుల్ని మార్చేలా, మలిచేలా దేవుడు నియమించాడని చెప్పడం ఎంత మాత్రమూ సత్యం కాదు. మనిషి భవిషత్తును నిర్దేశించేది మనిషి చిత్తం కాదు, గానీ దేవుని చిత్తమే. ఒక వ్యక్తి తిరిగి జన్మించాడా, లేదా? అనే విషయమే మనిషి యొక్క భవిషత్తును నిర్ధారిస్తుంది. ఎందుకంటే, “ఒకడు తిరిగి జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యాన్ని చూడలేడు” అని ప్రభువైన యేసు చెప్పిన మాటల్ని యోహాను రాశాడు. నూతన జన్మకు మూలకారణం దేవుని చిత్తమా, లేదా మనిషి చిత్తమా? అనే విషయం యోహాను 1:13లో ఎంతో స్పష్టంగా రాయబడింది. “వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛల వలనైనను, మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు” (యోహాను 1:13). 'మనిషి చిత్తమే అతని భవిషత్తుని మార్చేస్తుంది' అని చెప్పడం సృష్టించబడిన వ్యక్తి యొక్క చిత్తాన్ని సింహాసనం ఎక్కించినట్లు, దేవుణ్ణి గద్దె దింపినట్లు అవుతుంది. అయితే లేఖనాలు ఏం చెబుతున్నాయి? “జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్య్రమును, ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధి కారులతో కూర్చుండబెట్టువాడును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే” (1 సమూ 2:6-8).

మనం ఇంతకుముందు చూసిన సంపాదకీయాన్ని మరొక్కసారి పరిశీలిద్దాం. 'ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది' అంటే 'మనుషులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులను మార్చేస్తాడు' అని అర్థం. ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా 'ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది' అని నినాదం మనకు వినబడుతుంది, కనబడుతుంది. దీని భావం నేడు ప్రార్థన అనే అంశంపై రాయబడిన సాహిత్యంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. 'దేవుణ్ణి తన ఉద్దేశం మార్చుకునేలా మనం ఒత్తిడి చేయాలి' అని ఈ మాటకు అర్థం. దీని గురించి మనం మరికొంత ఇప్పుడు చర్చిద్దాం.

మరల ఆ సంపాదకుడు మనకు ఇలా చెబుతున్నాడు, ప్రార్థన గురించి ఒకరు ఎంతో అద్భుతంగా ఇలా చెప్పారు - 'ఒక వ్యక్తి ప్రార్థన చేసినా, చేయకపోయినా తన జీవితంలో కొన్ని సంగతులు జరుగుతాయి. అతడు ప్రార్థన చేస్తే జరిగే సంగతులు కొన్ని ఉంటాయి,ప్రార్థన చేయకపోతే జరగని కొన్ని సంగతులు ఉంటాయి.” తిరిగి జన్మించనివారిలో ఎక్కువమంది అసలు ఎన్నడూ ప్రార్థన చెయ్యరు. అందువల్ల 'ఒక వ్యక్తి ప్రార్థన చేసినా, చేయకపోయినా అతని జీవితంలో కొన్ని సంగతులు జరుగుతాయి' అనే మాట గురించి ఆలోచిద్దాం. విశ్వాసి నమ్మకంతో ప్రార్థన చేసి దేవుని చిత్తానుసారంగా ఉన్న విషయాలను అడిగితే, అతడు తప్పనిసరిగా వాటిని పొందుతాడు. అంతేకాదు, అతడు ప్రార్థన చేస్తే మరికొన్ని వ్యక్తిగతమైన ప్రయోజనాలు కూడా అతనికి చేకూరతాయి. అతడు దేవుణ్ణి మరింత ఎక్కువగా ఆస్వాదించగలుగుతాడు. దేవుని వాగ్దానాలు అతనికి మరింత విలువైనవిగా కనబడతాయి. 'అతడు ప్రార్థన చేయకపోతే కొన్ని సంగతులు జరగవు' అనేది కూడా అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించినంతవరకూ నిజమే. 'ప్రార్థనారహిత జీవితం' అంటే 'దేవునితో సహవాసం లేనటువంటి జీవితాన్ని జీవించడం' అని అర్థం. అయితే 'మనం ప్రార్థన చేస్తేనే తప్ప దేవుడు తన నిత్యసంకల్పాన్ని నెరవేర్చడు' అని చెప్పడం మూర్ఖమైన తప్పిదం. ఎందుకంటే ఒక లక్ష్యాన్ని ఉద్దేశించిన దేవుడే ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి కొన్ని మార్గాలను కూడా నియమించాడు. ఆ మార్గాల్లో ప్రార్థన కూడా ఒకటి. ఆశీర్వాదం అనుగ్రహించాలని ఉద్దేశించిన దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మొదటిగా అన్వేషించే ప్రార్థనాత్మను కూడా అనుగ్రహిస్తాడు.

పైన సంపాదకీయంలో క్రైస్తవ ఉద్యోగి గురించి, వ్యాపారవేత్త గురించి రాయబడిన విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దాం. ఇది చాలా విచారకరమైన ఉదాహరణ. క్రైస్తవ ఉద్యోగి యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. అంటే ఆ వ్యాపారవేత్తతో అతని ఆత్మ గురించిన సంగతి మాట్లాడడానికి దేవుడు మార్గం తెరవలేదు. క్రైస్తవ ఉద్యోగి ఆఫీసును విడిచిపెట్టిన తర్వాత తన ప్రార్థనను జ్ఞాపకం చేసుకుని ఆ ప్రార్థనకు తనకు తానే జవాబు ఇచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు మార్గం తెరవడానికి ప్రభువుకు అవకాశం ఇవ్వకుండా పరిస్థితుల్ని అతడు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

ప్రార్థన గురించి ఈ మధ్యకాలంలో రాయబడిన ఒక పుస్తకం నుంచి మనం కొన్ని మాటలను పరిశీలిద్దాం. 'దేవుని ఉద్దేశాలను బంధించడంలో, మార్చడంలో, ఆయన శక్తిని ఉపయోగించుకోవడంలో ప్రార్థన యొక్క అవసరత, దాని శక్తి, దాని ఫలితాలు వెల్లడి అవుతాయి.' ఈ మాట సర్వోన్నతుడైన దేవుని స్వభావంపై అత్యంత దారుణంగా బురద చల్లేదే. “ఆయన పరలోక సేన యెడలను భూనివాసుల యెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకుని 'నీవు ఏమి చేస్తున్నావు?' అని ఆయనతో చెప్పుటకు ఎవడూ సమర్థుడు కాడు” (దాని 4:35). 'దేవుడు తన ప్రణాళికలను పరిపూర్ణమైన మంచితనంతో, పొరపాట్లకు తావులేని తన అనంతజ్ఞానంతో నియమించుకున్నాడు కాబట్టి ఆయన తన ఉద్దేశాలను, సంకల్పాలను మార్చుకోవాల్సిన అవసరం ఏ మాత్రమూ లేదు. ప్రణాళికలను వేసుకున్న తర్వాత జరిగే పరిస్థితులు ఏమిటో మనుషులు పూర్తిగా ఊహించలేదు. కాబట్టి వాళ్ళు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. 'దేవుడు తన సంకల్పాన్ని మార్చుకుంటాడు' అని చెప్పడం ఆయన మంచితనాన్ని ఆక్షేపించడం, ఆయన నిత్యజ్ఞానాన్ని అపహాస్యం చేయడమే!

అదే పుస్తకంలో ఆ రచయిత ఇలా చెబుతున్నాడు, 'దేవుని పరిశుద్ధుల ప్రార్థనలు పరలోకంలో మూలధనం. అలాంటి ఆదాయంతోనే క్రీస్తు ఇప్పుడు భూమి పైన తన గొప్ప కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ ప్రార్థనల మూలంగానే భూమిపైన గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థనలు మరింత ఎక్కువగా, శక్తివంతంగా జరుగుతుంటే భూమిపై విప్లవాత్మకమైన మార్పులు జరుగుతాయి. దేవదూతలు మరింత శక్తివంతంగా పనిచేస్తారు. దేవుని ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది.' ఇది చాలా దారుణమైన మాట, దీన్ని దేవదూషణ అని పిలవడానికి నేను కొంచెమైనా సంకోచించను. మొదటిగా, ఇది దేవుడు నిత్యసంకల్పాన్ని కలిగి ఉన్నాడు అని చెప్పే ఎఫెసీ 3:11ను పూర్తిగా తృణీకరిస్తుంది. దేవుని సంకల్పం నిత్యమైనదైతే ఆయన ప్రణాళిక ఈ రోజున రూపుదిద్దుకోవడం లేదు. రెండవదిగా, ఈ మాట 'దేవుడు తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్తము జరిగిస్తున్నాడు' అని స్పష్టంగా ప్రకటించే ఎఫెసీ 1:11కి విరుద్ధంగా మాట్లాడుతోంది. అంటే మనుషుల ప్రార్థనల మూలంగా దేవుని ప్రణాళిక మార్చబడడం లేదు అని స్పష్టమవుతోంది. మూడవదిగా, పైన ఉన్న మాట రూపుదిద్దుకున్నది అంటే అప్పుడు సర్వోన్నతుడు భూనివాసులకు కింద ఉన్నవాడు అని అర్థం. “ప్రభువు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు?” అని అపొస్తలుని ద్వారా పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు (రోమా 11:34).

ప్రార్థనపై మనం ప్రస్తావించిన ఇలాంటి ఆలోచనలు దేవుని గురించి మనుషులకు ఉన్న నీఛమైన, అసంపూర్ణమైన అవగాహనను చూపిస్తున్నాయి. ఊసరవెల్లిలా ప్రతిరోజూ రంగులు మార్చే దేవునికి ప్రార్థన చేయడంలో ఎలాంటి ఆదరణా ఉండదు అనేది వాస్తవం. నిన్న ఒకలాంటి మనసును, మరొక రోజు మరొకలాంటి మనసును కలిగి ఉండేవానికి మన హృదయాలను అర్పించడంలో ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? ఒక రోజు మన మనవిని అనుగ్రహించి ఆ తర్వాతి రోజు మన విన్నపాన్ని తృణీకరించేలా మారిపోయే భూసంబంధమైన రాజుకు మనవి చేయడంలో ఎలాంటి ఉపయోగం ఉంటుంది? దేవుని మార్పులేని తత్వమే మనం ప్రార్థించడానికి మనకున్న గొప్ప ప్రోత్సాహం కాదా? దేవునిలో ఏ విధమైన చంచలత్వమైనా, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయయైనా లేదు. కాబట్టి మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా ఆయన మన ప్రార్థన తప్పనిసరిగా వింటాడనే నిశ్చయత మనకుంది. 'ప్రార్థన అంటే దేవుని పట్టుదలను అధిగమించడం కాదు, కానీ ఆయన ఇష్టాన్ని పట్టుకోవడం' అని మార్టిన్ లూథర్ చక్కగా చెప్పాడు.

ఇప్పుడు ప్రార్థన యొక్క ఉద్దేశం గురించి కొన్ని సంగతులు వివరిస్తాను. మనం ప్రార్థించాలని దేవుడు ఎందుకు ఆదేశించాడు? 'మనకు అవసరమైనవాటిని దేవుని నుంచి పొందటానికి' అని చాలామంది ప్రజలు జవాబు చెబుతారు. ప్రార్థన ఉద్దేశాలలో ఇది కూడా ఒకటి అయినప్పటికీ ఇది ఏ మాత్రమూ ముఖ్యమైనది కాదు. అంతేకాదు, ఇది ప్రార్థనను కేవలం మానవకోణం నుండే చూస్తోంది. ప్రార్థనను మనం దైవకోణం నుంచి కూడా చూడాలి. ఇప్పుడు దేవుడు ప్రార్థించమని మనకు ఎందుకు ఆజ్ఞాపించాడో కొన్ని కారణాలను చూద్దాం. మొదటిది, అతి ముఖ్యమైది: ప్రభువైన దేవుణ్ణి మనం ఘనపరచడం కోసమే ఘన నియమించబడింది. దేవుణ్ణి మనం “మహా ఘనుడిగా, మహోన్నతునిగా, నిత్యనివాసిగా” గుర్తించాలని ఆదేశిస్తున్నాడు (యెషయా 57:17). తన విశ్వవ్యాప్తమైన ఆధిపత్యాన్ని మనం సొంతం చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. వర్షం కోసం మనవి చేస్తూ దేవునికి పంచభూతాలపై ఉన్న అధికారాన్ని ఏలీయా ఒప్పుకున్నాడు. రాబోయే ఉగ్రత నుంచి పాపిని విడిపించమని దేవునికి ప్రార్థన చేస్తూ, “రక్షణ యెహోవాదే” అని మనం గుర్తిస్తున్నాం (యోనా 2:9). భూదిగంతాల వరకు తన సువార్తను వ్యాప్తి చేయమని దేవునికి ప్రార్థన చేస్తూ, సర్వలోకంపై ఆయనకున్న అధికారాన్ని మనం ప్రకటిస్తున్నాం.


మనం ఆయనను ఆరాధించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. నిజమైన ప్రార్థన ఆరాధన కార్యం. ప్రార్థనలో మన అంతరంగాన్ని ఆయన ముందు ప్రణమిల్లేలా చేస్తాం. ప్రార్థనలో ఆయన మహోన్నతమైన, పరిశుద్ధమైన నామానికి మొరపెడతాం. ప్రార్థన ద్వారా ఆయన దయను, శక్తిని, మారని తత్వాన్ని, కృపను మన సొంతం చేసుకుంటాం. ప్రార్థనలో ఆయన సార్వభౌమత్వాన్ని గుర్తిస్తాం. ప్రార్థనలో ఆయన చిత్తానికి మనం విధేయులం అవుతాం. అందువల్ల ప్రార్థన అనేది ఆరాధన స్థలం. దేవాలయాన్ని బలి అర్పణ మందిరం అని కాకుండా ప్రార్థనామందిరం అని క్రీస్తు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని మనం ఈ సందర్భంలో గుర్తించడం అత్యవసరం.

ప్రార్థన దేవుని మహిమను కొనియాడుతుంది. ఎందుకంటే ప్రార్థనలో మనం దేవునిపై ఆధారపడి ఉన్నామని ఒప్పుకుంటాం. మనం దీనమనసుతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన శక్తి పైన, కనికరం పైన మనం ఆధారపడతాం. దేవుని ఆశీర్వాదాలను కోరుతున్నప్పుడు శ్రేష్ఠమైన ప్రతి ఈవికి సంపూర్ణమైన ప్రతి వరానికి దేవుడే మూలం, ఆధారం అని మనం గుర్తిస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు మనం మన విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నాం. మన హృదయాల్లోని విశ్వాసమే దేవుణ్ణి ఘనపరుస్తుంది, సంతోషపరుస్తుంది. కాబట్టి ప్రార్థన దేవునికి మహిమ తెస్తుంది.

రెండవదిగా, మన ఆధ్యాత్మిక ఆశీర్వాదం కోసం, కృపలో మన ఎదుగుదలకు మార్గంగా దేవుడు ప్రార్థనను నియమించాడు. మనకు అవసరమైనవాటిని పొందుకోవడానికి ఉపయోగపడే మార్గమే ప్రార్థన అని మనం గుర్తించకముందే, ప్రార్థన యొక్క ఈ ఉద్దేశం మన మనసుల్ని నింపాలి. మనల్ని దీనులుగా చేయడం కోసమే దేవుడు ప్రార్థనను నియమించాడు. నిజమైన ప్రార్థన అంటే దేవుని సన్నిధిలోకి రావడమే. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని గంభీరమైన మహిమ మనకు మన అయోగ్యతనూ, భక్తిహీనతనూ గుర్తు చెయ్యాలి, మనలో భయాన్ని పుట్టించాలి, మనం మన విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి అని దేవుడు ప్రార్థనను ఉద్దేశించాడు. వాక్యం ద్వారానే విశ్వాసం పుడుతుంది (రోమా 10:17). అయితే ఆ విశ్వాసాన్ని మనం ప్రార్థన ద్వారానే అభ్యాసం చేయాలి. అందువల్లనే మనం “విశ్వాస సహితమైన ప్రార్థన” గురించి వాక్యంలో చదువుతాం. ప్రేమను క్రియారూపంలో పెట్టమని ప్రార్థన పిలుపునిస్తుంది. వేషధారి గురించి ఈ ప్రశ్న అడగబడింది. “వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా?” (యోబు 27:10). అయితే ప్రభువుని ప్రేమించేవారు ఆయనకు దూరంగా ఉండలేరు. వాళ్ళు తమ భారాన్ని ఆయన దగ్గర తొలగించుకోవడంలో ఆనందిస్తారు. ప్రార్థన ప్రేమను క్రియారూపంలో పెట్టమని పిలుపునివ్వడమే కాదు, మన ప్రార్థనలకు వచ్చిన జవాబులు దేవుని యెడల మన ప్రేమను ఇంకా పెంచుతాయి. “యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించియున్నాడు. కాగా నేనాయనను ప్రేమిస్తున్నాను” (కీర్తన 116:1). మనం దేవుని నుంచి కోరిన దీవెనల విలువను మనకు బోధించడానికి దేవుడు ప్రార్థనను ఉద్దేశించాడు. మనం ప్రార్థించినదానిని ఆయన మనకు అనుగ్రహించే కొలదీ మనం ఆనందించడానికి అది కారణమవుతుంది.

మూడవదిగా, మనకు అవసరమైనవాటిని ఆయన నుంచి పొందటానికి దేవుడు ప్రార్థనను నియమించాడు. అయితే ఈ పుస్తకంలోని ఇంతకుముందు అధ్యాయాలను శ్రద్ధగా చదివినవాళ్ళకే ఇక్కడ ఒక క్లిష్టమైన అంశం కనబడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి కార్యాన్నీ దేవుడు లోకాన్ని సృష్టించకముందే నియమించాడు. కాబట్టి ఇక ప్రార్థన యొక్క ఉపయోగం ఏమిటి? “ఆయన మూలముగానూ ఆయన ద్వారానూ ఆయన నిమిత్తమునూ సమస్తము కలిగియున్నవి” (రోమా 11:36) అనే మాటే నిజమైతే ఇక ప్రార్థన ఎందుకు? దేవునికి అన్నీ తెలిసినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు చెప్పడం వల్ల నాకు ఉపయోగం ఏమిటి? నా అవసరం ఆయనకు ఇంతకుముందే తెలిసినప్పుడు నేను ఆయన ముందు దాన్ని చెప్పడం వల్ల నాకు ఉపయోగం ఏముంది? దేవుడు అన్నిటిని ముందుగానే నియమించినప్పుడు ప్రార్థన వల్ల ఉపయోగం ఏముంది? “మీరు అడగక ముందే మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు” అని మన రక్షకుడు స్పష్టంగా ప్రకటించాడు. కాబట్టి ప్రార్థన అంటే దేవునికి తెలియని విషయాలను, సమాచారాన్ని తెలియజేయడం కోసం కాదు గానీ మన అవసరాలు ఆయనకు తెలుసు అని గుర్తించడానికి, అన్ని విషయాల్లో మాదిరిగానే ఈ విషయంలో కూడా దేవుని ఆలోచనలు, మన ఆలోచనలు ఒకటి కాదు. మనం ఆయన ఇచ్చే బహుమానాలను వెదకాలని దేవుడు కోరుకుంటాడు. మనం అడగడం ద్వారా ఆయనకు ఘనత, ఆయన మనకు దీవెన ఇచ్చిన తర్వాత మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆయన ప్రార్థనను ఉద్దేశించాడు.

అయితే ఈ ప్రశ్న మరలా మనకు తిరిగి వస్తుంది. 'దేవుడే జరుగుతున్న ప్రతిదానిని ముందుగా నిర్ణయించినవాడైతే, ఆయన సమస్త పరిస్థితులను నిర్వహిస్తున్నవాడైతే ప్రార్థన అనేది ప్రయోజనం లేని అభ్యాసం కాదా??' ఈ ప్రశ్నలన్నిటికీ సరైన జవాబు: “ఎడతెగక ప్రార్థించండి” అని (1 థెస్స 5:17). మనుషులు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని (లూకా 18:1) దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. “విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది”, “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదై యుండును” (యాకోబు 5:15,16). మనకు సమస్త విషయాల్లో పరిపూర్ణమైన ఆదర్శంగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన ప్రార్థనాపరుడు. అందువల్ల ప్రార్థన అనేది అర్థరహితమైనది కాదు, విలువ లేని