దుర్బోధలకు జవాబు
రచయిత: కె విద్యా సాగర్

కాల్వినిజమని వెక్కిరింపుగా పిలవబడుతున్న దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పే బోధపై సోషిల్ నెట్వర్క్ లో అవగాహన లేని కొందరు అపార్థపు ఆరోపణలు చేస్తున్నారు‌.
బైబిల్ బోధించే సిద్ధాంతాలపై ఇటువంటి అపార్థపు ఆరోపణలు కొత్తకాదు. 

ఉదాహరణకు జన్మపాపం‌ విషయంలో కూడా, కొన్ని అవాంతర శాఖలవారు, పుట్టే పిల్లలు పాపంలోనే పుడుతుంటే దానిప్రకారం వారిని పుట్టిస్తున్న దేవుడే వారిపాపానికి కర్త ఔతాడని ఆ సిద్ధాంతాన్ని వాక్యపరిధిలో అర్థం చేసుకోలేక దానిని‌ బోధించేవారిపై నోరు పారేసుకుంటుంటారు. 

ఇక‌‌ విషయానికొస్తే, కాల్వినిజాన్ని విశ్వసించేవారు లేఖన ఆధారంగా దేవుడు సృష్టిలోని అన్నింటినీ తన నిర్ణయం (చిత్తం) చొప్పున జరిగిస్తాడని బోధిస్తారు, ఆ ఆధారాలలో కొన్నిటిని చూడండి.

ఎఫెసీయులకు 1:12 ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు.

దానియేలు 4:35 ఆయన పరలోక సేనయెడలను భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు.

సామెతలు 19: 21 నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవాయొక్క తీర్మానమే స్థిరము.

సామెతలు 21: 1 యెహోవా చేతిలో రాజు హృదయము నీటికాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తిచొప్పున దాని త్రిప్పును.

సామెతలు 20: 24 ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది యొకడెట్లు తెలిసికొన గలడు?

విలాపవాక్యములు 3:37,38 ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు? మహోన్నతుడైన దేవుని నోటనుండి కీడును మేలును బయలు వెళ్లునుగదా?

రోమీయులకు 11:36 ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌.

ఈ వచనాలన్నీ కూడా దేవుని సార్వభౌమత్వాన్ని చాటిచెప్పేవిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అవగాహన లేని‌ కొందరు ఈ బోధ ప్రకారం, మానవులు చేసే పాపాన్ని కూడా దేవుడే నిర్ణయించి, తన చిత్త‌ం చొప్పున జరిగిస్తున్నాడా? అటువంటపుడు దేవుడే పాపానికి కర్త అవుతాడు కదా అంటూ, కాల్వినిజం దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుందని విరుచుకు పడుతున్నారు.బైబిల్ గ్రంథం దేవుడు సార్వభౌముడని చెబుతూ, ఆయన పరిశుద్ధుడని కూడా చెబుతుంది కాబట్టి వాటిని అంతమట్టుకే తీసుకోకుండా, ఈ రెండు అంశాలనూ మానవ తర్కంతో సమతుల్యపరచాలని చూస్తే అటువంటి అపార్థాలే చోటుచేసుకుంటాయి.

ఎందుకంటే మానవ తర్కానికి‌ అతీతమైన అంశాలు బైబిల్ లో మనకి కనిపిస్తాయి ఉదాహరణకు త్రిత్వాన్ని తీసుకోండి. బైబిల్ గ్రంథం దేవుడు ఒకడే అని చెబుతూ ముగ్గురు వ్యక్తులని మనకి పరిచయం చేస్తుంది. ఈ అంశాన్ని మానవ తర్కంతో మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. అందుకే కొంతమంది‌ త్రిత్వ సిద్ధాంతాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఒకే దేవునిలో మూడు భాగాలున్నాయనీ, లేక ఒకే దేవుడు ముగ్గురిగా వేషాలు మార్చాడని, మరియు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పే బోధలు తీసుకువచ్చారు.

ఒకవేళ కాల్వినిజ భావజాలాన్ని వ్యతిరేకరించేవారు చెబుతున్నట్టుగా మనిషి దేవుని నిర్ణయం లేకుండా తన స్వచిత్తంతోనే పాపాన్ని చేస్తున్నాడని‌‌ భావించినప్పటికీ వారు కూడా దేవుణ్ణి పాపానికి కర్తగానే చూపిస్తున్నారు.

అదెలాగో చూడండి. ఇంతకూ మనిషికి‌ ఫ్రీ విల్ ఇచ్చింది ఎవరు? ఆయనే కదా, ఆయనకున్న భవిష్యత్తు జ్ఞానం చొప్పున ఆ ఫ్రీ విల్ తో మనిషి పాపం‌చేస్తాడని తెలుసుకోలేడా? ఒకవేళ తెలుసుకున్నా ఫ్రీ విల్ ఇచ్చాడంటే పాపం చేసే అవకాశం‌ మనిషికి ఎవరు ఇచ్చినట్టు? దీనిప్రకారం సృష్టిలో పాపానికి కర్త పాపం‌చేసేలా ఫ్రీ విల్ ఇచ్చినవాడే ఔతున్నాడు కదా.(మానవ స్వేచ్చను గౌరవించే రాజ్యాంగం, చట్టం ఉన్న దేశంలో కూడా, ఒక వ్యక్తి నేరానికి పాల్పడతాడని ముందే తెలిస్తే అతడిని అదుపులోకి తీసుకుంటారు, దేవుడు ఎందుకలా చేయలేదు)

ఒకవేళ దేవుని చిత్తం నిర్ణయం లేకుండానే సృష్టిలో పాపం ప్రవేశించి రాజ్యమేలుతుందని‌ భావిస్తే దేవుణ్ణి పాపం‌కంటే శక్తిహీనుడైనవాడని ప్రకటించడమే ఔతుంది ఎందుకంటే,

1) పాపం దేవుని సర్వశక్తిని‌ అధిగమించి లోకంలో ప్రవేశించింది, ఆదాము హవ్వలనూ, మానవజాతంతటినీ ఆయనకి దూరం చేసింది. సృష్టిలో‌ దేవుణ్ణి అధిగమించేది ఏదున్నా అదే సర్వశక్తిగలది ఔతుంది‌తప్ప దేవుడు కాదు.

2) తన చిత్తంలో లేకుండానే ఆదాము హవ్వల్లో పాపం‌ ప్రవేశించినా, అప్పటినుండి మానవజాతంటిలోనూ వ్యాపిస్తున్నా దేవుడు ఆపలేకపోయాడు. దీనిప్రకారం తన చిత్తంలో లేనిది సృష్టిలో జరుగుతున్నా దేవుడు దానిని ఆపలేనంత అసమర్థుడు.(తీర్పుదినాన లోకం నుండి పాపాన్ని నాశనం చేస్తాడనుకున్నా అప్పటివరకూ ఆ పాపం వల్ల  జరుగుతున్న పర్యవసానం సంగతేంటి)

మేమైతే ఈవిధంగా దేవుణ్ణి పాపం‌కంటే శక్తిహీనుడని చెప్పే దయనీయ బోధను, ఆయనను అసమర్థునిగా చూపే దౌర్భాగ్యపు బోధను విశ్వసించము. మేము లేఖనాధారంగా దేవుడు సార్వభౌముడనీ, సర్వశక్తిమంతుడని, మనం ఊహించలేని ఆయన రహస్య చిత్తమేదో పాపాన్ని లోకంలో అనుమతించిందని  నమ్మి‌బోధిస్తున్నాము. అనంతుడైన దేవునిలో‌ ఉన్న ఆ చిత్తమేమిటో పరిమితి కలిగిన మనం చెప్పలేము, ఎందుకంటే

1) మనం పరిమితి కలిగినవారం. 

2) వాక్యం దానిని రహస్యంగా ఉంచి మనకి వివరించలేదు.

ద్వితీయోపదేశకాండము 29:29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

విచిత్రమేమిటంటే, ఫ్రీ విల్ సిద్ధాంతాన్ని‌ నమ్మేవారు కూడా, దేవుని భవిష్యత్తు జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు. ఆయన తన fore knowledge లో అన్నిటినీ చూసాడని చెబుతుంటారు, ఇంతకూ ఆయన సృష్టికిముందే ఆదాము హవ్వల పతనాన్నీ, మానవజాతి పాపాన్నీ చూసాడా అంటే చూసాడనే అంటారు. చూసి దాన్ని అనుమతించాడా, లేదా అంటే అనుమతించాడనే అంటారు. మరి ఉద్దేశపూర్వకంగానే దానిని అనుమతించాడా లేక ఏ ఉద్దేశమూ లేకుండా అనుమతించాడా? ఉద్దేశం లేకుండా దేవుడు ఏదీ చేయడు. ఇంతకూ ఆ ఉద్దేశం ఆయనలో అప్పటికప్పుడు పుడుతుందా లేక అనాది సంకల్పమా? ముస్లింల దేవుడిలా ఆయనకి ఎప్పటికప్పుడు మెరుగైన ఆలోచనలు పుడుతుంటాయా? మేమైతే అలా నమ్మము.

ఈవిధంగా అన్నీ ఆయన నిర్ణయం/అనుమతి ప్రకారమే జరుగుతాయి. అయినప్పటికీ వాక్యపరిధిలో ఆయన పాపానికి కర్త కాదు. బైబిల్ మనకి ఆయన పరిశుద్ధుడని పదేపదే జ్ఞాపకం‌చేస్తుంది. దానితో పాటుగా ఆయన సార్వభౌమునిగా అన్నిటినీ నిర్ణయించినవాడనీ,  తన సృష్టిలో తన చిత్తప్రకారమే అన్నిటినీ (పాపంతో సహా)  అనుమతించినవాడనీ చెబుతుంది. (ఏదేనులోకి సాతాను ఆయన‌ అనుమతి‌ లేకుండా ప్రవేశిస్తే, ఆయన సృష్టిలో ఆయన అనుమతిలేకుండా ప్రవేశించగలిగిన సాతానే ఆయనకంటే శక్తిగలవాడవుతాడు) కాబట్టి మనం మానవ తర్కంతో ఈ రెండింటినీ సమతుల్యపరచలేము. 

ఒకవేళ సమతుల్యపరచాలని చూస్తే ఏమౌతుందో ఈ ఉదాహరణ చూడండి.

కీర్తనల గ్రంథము 5:4-6 నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీయొద్ద చోటులేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయువారందరు నీకసహ్యులు
అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు.

ఈ‌ వచనాల్లో కీర్తనాకారుడు, ఆయన పరిశుద్ధ సన్నిధిలో పాపం చేసేవారు నిలువలేరనీ, అబద్ధాలు చెప్పేవారు, కపటంగా ప్రవర్తించేవారు ఆయనకు అసహ్యులని చెబుతున్నాడు.
ఇప్పుడు‌ మరో సందర్భాన్ని చూడండి.

మొదటి రాజులు 22:19-23  మీకాయా యిట్లనెను - యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము; యెహోవా సింహాసనాసీనుడై యుండగా పరలోకసైన్యమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచి యుండుట నేను చూచితిని. అహాబు రామోత్గిలాదుమీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరియొకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ యెదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి-నేను అతనిని ప్రేరేపించెదననగా యెహోవా-ఏ ప్రకారము నీవతని ప్రేరేపించుదువని అతని నడిగెను.
అందుకతడు-నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన-నీవు అతని ప్రేరేపించి జయము నొందుదువు; పోయి ఆ ప్రకారము చేయుమని అతనికి సెలవిచ్చెను.
యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు.

ఈ సందర్భంలో దేవుని దగ్గరనుండే (ఆయన అనుమతితో) ఆహాబు ప్రవక్తల ద్వారా అబద్ధాన్ని పలికించి కపటంగా అతన్ని హత్యచేసే ఆత్మ వచ్చినట్టు రాయబడింది. మనం పైన చూసిన కీర్తనలులో‌ అబద్ధం చెప్పేవారు, కపటంగా ప్రవర్తించేవారు ఆయనకు అసహ్యులన్న మాటలతో కలిపి  ఈ సందర్భాన్ని మానవ తర్కంతో ఎలా సమతుల్యపరుస్తారు? ఎందుకంటే ఆయనకు‌ అసహ్యమైన అబద్ధాలు చెప్పేవారినీ కపటంగా హత్యచేసేవారినీ (ఆత్మను) ఆయన అనుమతించి ఆహాబును నాశనం చేయబోతున్నాడు. అంటే ఆయన తనకు అసహ్యులైన వారిని కూడా తన‌చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అనుమతించి వాడుకుంటాడా? అలా అనుమతించినపుడు‌ వారి అబద్ధం, కపటంలో ఆయన పాలిబాగస్తుడు ఎందుకు కాడు?

మేమైతే వాక్యం చెప్పేదాని పరిధిలో అన్నీ (సాతాను కూడా) ఆయన సర్వశక్తి, సార్వభౌమత్వం క్రిందనే పనిచేస్తాయని నమ్ముతారు, కాబట్టి మాకిక్కడ ఏ సమస్యాలేదు.

1) వాక్యం చెబుతున్నట్టుగా ఆయనకి అబద్ధాలు చెప్పేవారు, కపటం చూపేవారు ఆయనకి అసహ్యులు.

2) వారిని కూడా దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేందుకు అనుమతించి వాడుకుంటాడు అయినప్పటికీ వారి అబద్ధం,కపటంతో ఆయనకు సంబంధం లేదు.

ఇంతకూ సాతాను యోబును శోధించేటప్పుడు దేవుని అనుమతితోనే ఆయనదగ్గరకు వెళ్ళాడా లేక, మనం అత్తారింటికి చెప్పకుండా వెళ్ళివచ్చేట్టు పరలోకం వెళ్ళి వస్తుంటాడా?

అందుకే మరి కాల్వినిస్టులు వాక్యం ఎంతవరకూ చెబుతుందో అంతవరకే తీసుకుని సత్యాన్ని తెలుసుకుందామని పిలుపునిస్తున్నారు. కొందరేమో ససేమిరా, జాన్ పైపర్ అలా అన్నాడు, జాన్ కాల్విన్ ఇలా అన్నాడని పిచ్చి ప్రేలాపనలు పేలుతూ, వారికున్న తర్కాన్ని ఉపయోగించి దీనిప్రకారం దేవుడే పాపానికి కర్త అవుతున్నాడు అంటున్నారు. వాస్తవానికి వారి ఫ్రీవిల్ తర్కాన్ని వారిపైనే పెట్టుకుని‌ చూసుకుంటే దేవుణ్ణి పాపానికి కర్తగా చూపిస్తుంది వాళ్ళే....మేము కాదు.

 

Add comment

Security code
Refresh

దుర్బోధలకు సరైన సమాధానాలు కనెక్ట్ అవ్వండి

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు  ఆధ్యాత్మిక, అనుసరణీయ,  ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది.   అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.