నిజ క్రైస్తవ జీవితం

రచయిత: కె విద్యా సాగర్

మనుషులు తమ జీవితంలో చాలా రకాలైన భ్రమలకు గురౌతుంటారు. భ్రమ అంటే, అది వాస్తవం కానప్పటికీ వాస్తవమే అయినట్టుగా ఎటువంటి సందేహం లేకుండా భావించడం/జీవించడం. బైబిల్ గ్రంథంలో సాతానును భ్రమపరచు ఆత్మగా పేర్కోవడం జరిగింది (1యోహాను 4:6). ఎందుకంటే వాడు తన వ్యూహాలను నెరవేర్చుకోవడానికి మనుషులను అనేకవిధాలైన భ్రమలకు గురిచేస్తుంటాడు. నేటి సంఘంలో చాలామంది తాము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని, ఆయన పిల్లలమే అని భరోసా కలిగియుండడం కూడా వాడు కలిగించిన ఒకానొక భ్రమనే. అందుకే ప్రతీఒక్కరూ దేవునిపట్ల తమకున్న ప్రేమ ఆయన మూలంగా కలిగిందేనా, లేక అది సాతాను కలిగించిన భ్రమనా అని లేఖనాల ప్రకారం పరీక్షించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అలా పరీక్షించుకున్నపుడు‌ లేఖనాల ప్రకారం దేవునిపై తమకున్న ప్రేమ వాస్తవం కాదని తేలితే, కనీసం ఆ విషయంలో సరిచేసుకుని ఆయనను వేడుకునే అవకాశమైనా ఉంటుంది. అలా కాకుండా ఆ భ్రమలోనే బ్రతికేస్తుంటే తీర్పుదినాన ఆయన నోట "నీవెవరివో నేను ఎరుగను" అనే మాటలు వినవలసి వస్తుంది. అప్పుడు "ప్రభువా నేను నిన్ను ప్రేమించలేదా" అంటూ ప్రాధేయపడినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

సాతాను విషయంలో మనం గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, వాడికి కావలసింది మానవనాశనం. తీర్పు దినాన వాడితో పాటుగా మనుషులందరూ అగ్నిగుండంలో పాలుపొందాలన్నది వాడి తీవ్రమైన కోరిక. ఈ క్రమంలో వాడు చాలామందిని సువార్తకు లోబడకుండా చెయ్యడమే కాదు, మరికొందరిని సువార్తకు లోబడ్డామనే భ్రమలో ఉంచి కూడా తన పధకం నెరవేర్చుకుంటాడు. ఈరోజు వేరొక సువార్త క్రింద జీవిస్తున్నవారంతా అలాంటివారే (గలతీ 1:8). పాపం వారంతా మేము సువార్తకు లోబడేయున్నామని, రక్షించబడిపోయామని భరోసా కలిగియుంటారు కాబట్టి, ఇక లోకస్తుడికి (అన్యుడికి) ఉన్నట్టుగా తమ గమ్యం విషయంలో ఎటువంటి చింతా లేకుండా బ్రతికేస్తుంటారు. కానీ చివరికి నాశనానికే పోతారు.‌ దేవుని పట్ల ప్రేమ విషయంలో కూడా అంతే. ఇలాంటి భ్రమలు మనం లోకస్తులలా (అన్యులుగా) ఉన్నప్పటికంటే ప్రమాదకరం. దీనిని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వ్యక్తికి cancer ఉంది అనుకోండి, ఆ వ్యక్తికి cancer ఉందని తెలియడం అతనికి ప్రమాదమా లేక అతను ఆరోగ్యంగానే ఉన్నాడని మభ్యపెట్టబడడం ప్రమాదమా? రెండవదే కదా! ఎందుకంటే ఆ వ్యక్తికి cancer ఉందని అతనికి అర్థమైతే దానికి తగిన చికిత్స తీసుకుని‌ నయం చేసుకోగలుగుతాడు. అలా కాకుండా మభ్యపెట్టబడితే మాత్రం ఆ cancer ముదిరి చనిపోతాడు. అందుకే మనం విశ్వసించిన సువార్త, దేవునిపట్ల మనకున్న ప్రేమ వంటి విషయాలలో లేఖనాలను బట్టి పరీక్షించుకుంటూ ఉండాలి. లేఖనాలు దేవుని మాటలు కాబట్టి, అవి మాత్రమే మనకు ఏ విషయంలో అయినా ఏది వాస్తవమో ఏది‌ భ్రమనో తేల్చగలవు.

ఇక లేఖనాల ప్రకారం, దేవుణ్ణి ప్రేమించడానికీ, దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూ భ్రమపరచబడడానికీ మధ్య‌ఉన్న వ్యత్యాసం చూద్దాం.

మనందరికీ పాతనిబంధనలో సౌలు గురించి బాగా తెలుసు. ఇతను దేవునిచేత ఇశ్రాయేలీయులకు మొదటిరాజుగా నియమించబడినవాడు (1సమూయేలు 10:1). అయితే ఇతను అమాలేకీయుల విషయంలో దేవుని ఆజ్ఞను ధిక్కరించినందుకు ఆయన దృష్టిలో దోషిగా ఎంచబడి, రాజుగా ఉండకుండా విసర్జించబడ్డాడు (1సమూయేలు 15:10,11). అంతే కాదు అంతకుముందు కూడా ఇతను యాజకులు మాత్రమే బలులను అర్పించాలనే దేవుని నియమాన్ని మీరుతూ, స్వయంగా బలిని అర్పించే సాహసానికి పూనుకుంటాడు (1సమూయేలు 13:8,9). చివరికి దావీదుకు సహాయం చేసారనే కారణంతో ఏఫోదు ధరించుకున్న 85మంది దేవుని యాజకులను దారుణంగా చంపించి, వారి పట్టణాన్ని కూడా నాశనం చేయిస్తాడు (1 సమూయేలు 22:18,19). ఇలాంటి దైవధిక్కారం, దేవుని యాజకులను చంపించిన క్రూరత్వం కలిగిన ఈ సౌలు దేవుడు కోరుకున్న దావీదును‌ చంపడానికి ప్రయత్నిస్తూ "దేవుడు అతడిని నా చేతికి అప్పగించాడని" (1 సమూయేలు 23:7), ఇంకా అతనికి దేవుడు తోడైయున్నట్టు భావిస్తుంటాడు. ఆ దేవుని పేరిట ఆశీర్వాదాలు పలుకుతూ (1 సమూయేలు 23:21), తనకేదో దేవునిపై గొప్ప ప్రేమ ఉన్నట్టు భ్రమపడుతుంటాడు. కానీ అతను నిజంగా దేవుణ్ణి ప్రేమించియుంటే, ఆ దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా ప్రవర్తించేవాడు కాదు, ఆయన యాజకులను చంపించేవాడూ కాదు, దావీదును కూడా చంపడానికి ప్రయత్నించేవాడు కాదు. కాబట్టి అతను కేవలం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా భ్రమపరచబడ్డాడు, ఆ భ్రమ అతడిని ఆవహించిన దురాత్మ మూలంగానే కలిగింది (1సమూయేలు 16:14). ఈ కారణంగా అతని జీవితం ఎంత దారుణంగా ముగిసిందో మనందరికీ తెలుసు (1సమూయేలు 31:3,4).

ఇప్పుడు యిర్మియా కాలంలోని ఇశ్రాయేలీయుల పరిస్థితిని ఆలోచిద్దాం.

యిర్మీయా 3:2-5 చెట్లులేని కొండప్రదేశమువైపు నీ కన్నులెత్తి చూడుము; నీతో ఒకడు శయనింపని స్థలమెక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబిదేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారికొరకు త్రోవలలో కూర్చుండియున్నావు; నీ వ్యభి చారములచేతను నీ దుష్కార్యములచేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి యున్నది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యమువంటి ధైర్యము గలదు, సిగ్గు పడనొల్ల కున్నావు. "అయినను ఇప్పుడు నీవునా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవే యని నాకు మొఱ్ఱపెట్టుచుండవా? "ఆయన నిత్యము కోపించునా? నిరంతరము కోపము చూపునా? అని నీవనుకొనినను నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే యున్నావు.

ఇక్కడ ఇశ్రాయేలీయులు ఒకవైపు దేవుడు అసహ్యించుకునే విగ్రహారాధన, వ్యభిచారం వంటి ఘోరపాపాలను జరిగిస్తూ మరో‌ వైపు "అయినను ఇప్పుడు నీవు నా తండ్రీ, చిన్నప్పటినుండి నాకు చెలికాడవు నీవేయని" మొఱ్ఱపెడుతున్నారంట. వారు చేయాలి అనుకున్న దుష్కార్యాలు నిరాటంకంగా చేస్తూనే ఉన్నారంట. వీరు కూడా సౌలులా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూ భ్రమపరచబడినవారే, ఆ భ్రమలోనే దేవునికి "నీవే మా తండ్రివి, మా చెలికాడవు" అని మొఱ్ఱపెడుతున్నారు కానీ, అది నిజమైన ప్రేమ కాదు‌ కాబట్టి, ఆయన పరిశుద్ధతకు వ్యతిరేకమైన చెడుతనాన్ని విసర్జించలేకపోతున్నారు.

కీర్తనల గ్రంథము 97:10 యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి.

ఇప్పుడు యూదుల గురించి ప్రభువు చెబుతున్న ఒకమాటను ఆలోచిద్దాం;

యోహాను 16: 2 వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు; "మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది".

ఇక్కడ యేసుక్రీస్తు పలుకుతున్నదాని ప్రకారం, యూదులు; అపోస్తలులనూ, ప్రారంభ క్రైస్తవ సంఘ విశ్వాసులనూ చంపుతూ అది దేవునిసేవగా భావిస్తారంట. మనం ఒకరిని ప్రేమిస్తేనే కదా, వారిపై ఆసక్తితో వారికి సేవ చెయ్యగలం.

యూదులు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామనే భ్రమలో బ్రతికేస్తున్నారు, అందుకే ఆయనకోసం ఏదోటి చెయ్యాలని అనుకుంటున్నారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు కాబట్టి, చివరికి ఆయన సేవకులనే చంపాలనుకుంటున్నారు. అందుకే యేసుక్రీస్తు వీరిగురించి ఏమంటు‌న్నాడో చూడండి.

యోహాను 16: 3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.

ఇంతకూ దేవుణ్ణి ప్రేమించడమంటే ఏంటి? మనకు దేవునిపై ఉన్న ప్రేమ వాస్తవమో, అపవాది కలిగించిన భ్రమనో కచ్చితంగా ఎలా తెలుసుకోగలం? ఈ ప్రశ్నకు యేసుక్రీస్తు ప్రభువే స్పష్టమైన సమాధానం చెబుతున్నారు చూడండి.

యోహాను 14: 21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచు కొందునని చెప్పెను.

ఈ మాటలప్రకారం దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించడమే. ప్రభువు ప్రియ శిష్యుడైన యోహాను కూడా తన పత్రికలో ఈ మాటలనే మరలా జ్ఞాపకం చేస్తాడు.

1యోహాను 5: 3 మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట.

భక్తుల జీవితాలలో, ముఖ్యంగా యేసుక్రీస్తు జీవితంలో ఇలాంటి ప్రేమనే మనం గమనిస్తాం, ఆయనకు తండ్రిపై ఉన్న ప్రేమ వాస్తవం కనుకనే ఈలోకంలో జీవించినంతకాలం ఆయన చిత్తానికి (ఆజ్ఞలకు) లోబడుతూ, చివరికి ఆ తండ్రి కోరిక ప్రకారం తన ప్రాణాన్ని కూడా అర్పించాడు.

యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని.

కీర్తనలు 40: 8 నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.

యెషయా 53: 12 ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణ మును ధారపోసెను అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసినవారినిగూర్చి విజ్ఞాపనముచేసెను

అదేవిధంగా "నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను" (కీర్తనలు 18:1) అంటూ కీర్తనపాడిన భక్తుడైన దావీదు గురించి ఏం రాయబడిందో చూడండి.

1రాజులు 15: 4 దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతియందు తప్ప తన జీవితదినములన్నియు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను.

ఈమాటల ప్రకారం "నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నానని" దేవునిగురించి పాడిన దావీదు; అతనికి దేవునిపట్ల ఉన్నది వాస్తవమైన ప్రేమ కాబట్టి "యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయ మందును తప్పిపోకుండెను".

(అయితే ఇక్కడ ఊరియా భార్య విషయంలో తప్పిపోయాడు కదా, అలాంటప్పుడు ఆ ప్రేమ మాత్రం ఎలా వాస్తవమైనదనే ప్రశ్న రావొచ్చు. దానికి మునుముందు సమాధానం లభిస్తుంది)

దావీదు తరహాలోనే దేవుణ్ణి వాస్తవంగా ప్రేమించిన భక్తులందరూ " యెహోవా దృష్టికి యధార్థంగా నడుచుకుంటూ ఆయన ఆజ్ఞలను గైకొన్నట్టుగా" మనం గమనిస్తాం. దానియేలు అలానే చేసాడు, యోసేపు అలానే చేసాడు, అపోస్తలులందరూ అలానే చేసారు. ఎందుకంటే వారికి దేవునిపై ఉన్న ప్రేమ ఆ దేవునిమూలంగానే కలిగిన వాస్తవమైన ప్రేమ. అందుకే వారు ఆ ప్రేమకు తగినట్లుగా జీవించారు (1యోహాను 4:19). కానీ ఆ విషయంలో అపవాది చేత భ్రమపరచబడినవారు మాత్రం వారికిలా "యెహోవా దృష్టికి యధార్థంగా నడుచుకుంటూ, ఆయన ఆజ్ఞలను గైకొనలేరు". వారు దేవుణ్ణి ప్రేమించడమంటే సౌలులా వారేం తప్పుడు పని చేస్తున్నా "దేవుడు తమకు తోడైయున్నాడని భావించడం" ఇశ్రాయేలీయుల్లా చేసే హేయక్రియలన్నిటినీ జరిగిస్తూ "నీవే మాకు తండ్రివి, చెలికాడవు" అని ప్రార్థించడం అనుకుంటారు. నేటి సంఘాలలో ఇదే మనం గమనిస్తున్నాం. మందిరంలో ఉన్నంతసేపు వారికి కలిగిన భ్రమచొప్పున ఇలాంటి ప్రార్థనలే చేస్తుంటారు, కానీ మందిరం నుండి బయటకు రాగానే వారు "చేయదలచిన దుష్కార్యాలు" చేస్తూనే ఉంటారు. కనీసం ఆ మందిరంలో ఉన్నంతసేపు కూడా వారి మనసు నిలకడగా ఉండదు.

యేసుక్రీస్తు ధనాపేక్ష కలిగినవారిని ఉద్దేశించి మాట్లాడుతూ, మీరు దేవునికినీ సిరికినీ "దాసులుగా" ఉండలేరని, మీరు ఈ రెండింటిలో ఏదో ఒకదానినే ప్రేమించి మరోదానిని విసర్జించాలని బోధించడం మత్తయి 6:24లో మనకు కనిపిస్తుంది. ఆ మాటల ప్రకారం; ఎవరైనా ఒకవైపు ధనాపేక్షతో ఉంటూ మరోవైపు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని భావిస్తే అది కేవలం భ్రమపరచబడడమే (లేక తమను తాము మోసం చేసుకోవడమే). ధనాపేక్ష విషయంలోనే ఆయన ఇంత కచ్చితంగా ఆ మాటలు చెబితే, పాపం‌ విషయంలో వాటిని ఇంకెంతగా అన్వయించుకోవాలో ఆలోచించండి. దీనిప్రకారం దేవుని ఆజ్ఞలకు విరుద్ధంగా ప్రవర్తించేవారు (పాపమంటే అదే) ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని భావించడం భ్రమపరచబడడమే కదా! "నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను" (ద్వితీయోపదేశకాండము 6:5) అనేమాటలకు వారి జీవితం వ్యతిరేకమే కదా!

1కోరింథీయులకు 16: 22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక.

అయితే ఇక్కడ నేను రెండు విషయాలకు స్పష్టత ఇవ్వదలిచాను.

  1. చాలామంది విశ్వాసులకు లేఖనాలలోని దేవుని ఆజ్ఞలన్నీ తెలియకపోవచ్చు, అలాంటివారు కొన్నిసార్లు వాటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ‌ ఉండవచ్చు. అంతమాత్రనా వారికి కూడా దేవునిపట్ల ఉన్నది నిజమైన ప్రేమ కాదు, అది సాతాను కలిగించిన భ్రమనే అని నేను ఆరోపణ చెయ్యడం లేదు. ఎందుకంటే అలాంటివారు;

    A: తాము తప్పిపోయిన దేవుని ఆజ్ఞ/న్యాయం విషయంలో ఎవరైనా లేఖనాలనుండి హెచ్చరించినప్పుడు సరిచేసుకునేవారిగా ఉంటారు.

    B: తాము అనుసరించవలసిన దేవుని ఆజ్ఞలు ఏంటో తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా లేఖనాలను పరిశీలించేవారిగా ఉంటారు. ఉదాహరణకు; భర్తను నిజంగా ప్రేమించే భార్య ఆ భర్త మనసును తెలుసుకుని దానికి తగినట్లుగా ప్రవర్తించడానికి ఆసక్తి కలిగియుంటుంది.

    ఒకవేళ ఈ పరిస్థితికి విరుద్ధంగా, తాము తప్పిపోయిన దేవుని ఆజ్ఞలు/న్యాయం విషయంలో ఎవరైనా హెచ్చరించినప్పుడు, సరిచేసుకోకపోగా తాము చేస్తుందే (లేక తమ మనసులో పుట్టిందే) సరియైనట్టు వాదనలకు దిగుతుంటే, దేవుని ఆజ్ఞలను తెలుసుకోవాలనే/పాటించాలనే ఆసక్తి వారిలో లేకపోతే, నేను మొదటినుండీ చెబుతున్నట్టుగా వారికి దేవునిపై ఉన్న ప్రేమ కేవలం సాతాను కలిగించిన భ్రమ మాత్రమే. నేను మరలా చెబుతున్నాను, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను‌ గైకొంటారు, వారు ఏం గైకొనలో ఆ ఆజ్ఞలకోసం లేఖనాలను అన్వేషిస్తారు. అవి పూర్తిగా తెలియని సమయంలో ఏ ఆజ్ఞ విషయంలో అయినా తప్పిపోతే అది తెలిసినపుడు/ఎవరైనా హెచ్చరించినప్పుడు వెంటనే సరిచేసుకుంటారు (మరలా అలా ప్రవర్తించరు).

  2. విశ్వాసులు కొన్నిసార్లు తమకు తెలిసిన దేవుని ఆజ్ఞల విషయంలో కూడా తప్పిపోతుంటారు. అంతమాత్రాన వారికి దేవునిపై ఉన్నది వాస్తవమైన ప్రేమ కాదు, అది సాతాను కలిగించిన భ్రమనే అని నేను ఆరోపించడం లేదు. "నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను" అని పరిశుద్ధాత్మ ప్రేరణతో కీర్తన రచించిన దావీదు కూడా ఊరియా భార్యయైన బెత్సెబా విషయంలో తప్పిపోయాడు. కాబట్టి ఏదైనా ఆజ్ఞ‌ విషయంలో తప్పిపోయినంత మాత్రాన వారికి దేవునిపై ఉన్న ప్రేమ వాస్తవం కాదని‌ మనం నిందించలేము. ఎందుకంటే వాస్తవంగా దేవుణ్ణి ప్రేమించినవారు తాము తప్పిపోయిన ఆజ్ఞ విషయంలో నిశ్చింతగా జీవించలేరు, ఆ పాపంలో అలవాటుగా కొనసాగలేరు. దావీదు పరిస్థితినే చూడండి, అతను తప్పిపోయాడు కానీ తరువాత ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు, తన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుంటూ ఒక కీర్తనే రాసాడు (కీర్తనలు 51). తన జీవితంలో మరలా అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఈవిధంగా దేవుణ్ణి వాస్తవంగా ప్రేమించే వ్యక్తి ఒకవేళ ఏదైనా దేవుని ఆజ్ఞ‌ విషయంలో తప్పిపోయినప్పటికీ దానిగురించి దేవునిసన్నిధిలో తన గుండె పగిలేంతగా, భరించలేనంతగా పశ్చాత్తాపపడతాడు. మరలా తప్పిపోకుండా జాగ్రతపడతాడు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని సాతాను చేత భ్రమపరచబడిన వ్యక్తి మాత్రం దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తూ అలవాటుగా పాపం చేస్తుంటాడు, దానిని ఏదోలా సమర్థించుకుంటాడు (ఈ కోవకు చెందిన కొందరు పైపైకి తమ పాపాలను ఒప్పుకుంటుంటారు, ఎందుకంటే అది వీరికి అలవాటుగా, ఆచారంగా తోస్తుంది. కానీ, దానినుంచి మాత్రం వైదొలగరు, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టడం ప్రేమ, కానీ ఏదో అలవాటు/ఆచారంగా తమ పాపాలను ఒప్పుకుంటూ మరలా అవే పాపాలలో ఇష్టపూర్వకంగా కొనసాగడం మాత్రం అపవాది కలిగించిన భ్రమే).

పేతురు గురించి కూడా మనం ఆలోచిస్తే ప్రభువు అతడిని "సీమోను కుమారుడవైన పేతురూ నీవు నన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా" అని మూడుసార్లు ప్రశ్నించినప్పుడు అతను "ఔను ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలియును" అంటూ బదులిచ్చాడు (యోహాను 21:16-17). అతనికి యేసుక్రీస్తుపై ఉన్న ప్రేమ వాస్తవం కాబట్టే ఆయన నామం‌ కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు. అయితే అతను కూడా, అన్యుడనీ యూదుడనీ బేధం చూపకూడదనే దేవుని ఆజ్ఞ (సువార్త క్రమం) విషయంలో తప్పిపోయాడు, వెంటనే పౌలు దానినిబట్టి గద్దించినప్పుడు మాత్రం సమర్థించుకునే ప్రయత్నం చెయ్యలేదు (గలతీ 2:11-14). పైగా తరువాత కాలంలో అతను తన పత్రికలో పౌలును అభినందిస్తూ రాసాడు (2 పేతురు 3:15,16). దీనిప్రకారం అతను సువార్త క్రమం విషయంలో తప్పిపోవడాన్ని బట్టి పశ్చాత్తాపపడ్డాడని‌ మరలా ఆ పాపం చెయ్యలేదని మనం గ్రహించవచ్చు. ఈవిధంగా దేవుణ్ణి ప్రేమించేవారు కూడా కొన్నిసార్లు ఆయన ఆజ్ఞల‌ విషయంలో తప్పిపోతారు, కానీ వారు ఆ తప్పిదంలోనే కొనసాగరు, ఎవరైనా లేఖనానుసారంగా హెచ్చరించినప్పుడు సరిచేసుకునేవారిగా ఉంటారు, పశ్చాత్తాపపడి మరలా అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రతపడతారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటూ సాతానుచేత భ్రమపరచబడినవారు/లేక ఈ విషయంలో తమను తాము మోసం చేసుకుంటున్నవారు (యిర్మియా 17:9, 1కొరింథీ 3:18) మాత్రం అలవాటుగా పాపం చేస్తుంటారు "బుద్ధి పూర్వకంగా పాపం‌ చెయ్యడమంటే ఇదే" (హెబ్రీ 10:26,27).

ఇంతవరకూ నేనిచ్చిన వివరణ ప్రకారం, దేవుణ్ణి వాస్తవంగా ప్రేమించడానికీ, ప్రేమిస్తున్నామంటూ సాతాను చేత భ్రమపరచబడడానికీ మధ్య వ్యత్యాసం అర్థమైందని భావిస్తున్నాను. ఒక్క ప్రేమ విషయంలోనే కాదు, మన భక్తి విషయంలోనూ, మారుమనస్సు విషయంలోనూ, విశ్వాసం విషయంలోనూ ఈవిధంగానే లేఖనాల ఆధారంగా పరీక్షచేసుకుంటూ, ఏది వాస్తవమో ఏది భ్రమనో గ్రహించేవారంగా ఉండాలి. ఉదాహరణకు నేటిసంఘాలలో అందరూ భక్తులే. కానీ భక్తి‌ గురించి బైబిల్ బోధించే ప్రాధమికమైన విషయాలు కూడా వీరిలో చాలామందికి తెలియవు.

యాకోబు 1: 27 తండ్రియైన దేవునియెదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి యేదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి యిబ్బందిలో పరామర్శించుటయు, "ఇహలోకమాలిన్యము తనకంటకుండ" తన్నుతాను కాపాడుకొనుటయునే.

సామెతలు 8: 13 యెహోవాయందు భయభక్తులు గలిగియుండుట "చెడుతనము నసహ్యించుకొనుటయే".

ఈ వచనాలలో దేవునిపట్ల భక్తి కలిగినవారిలో ఉండే ప్రాముఖ్యమైన లక్షణాలను‌ వివరించడం జరిగింది. ఇలాంటి లక్షణాలు మనం ఎంతమంది విశ్వాసుల జీవితంలో చూస్తున్నాం. ఈ విషయంలో చాలామంది సాతాను చేత భ్రమపరచబడుతున్నవారే కదా! వీరు అదేపనిగా వెదకి మరీ "ఇహలోక‌మాలిన్యాన్ని" తమకు అంటించుకుంటుంటారు. "చెడుతనాన్ని" గాఢంగా ప్రేమిస్తూ దానిలోనే enjoyment ని ఆస్వాదిస్తుంటారు. ఇలాంటి ఒక అంశం గురించి రాయబడిన వ్యాసాన్ని ఈ క్రింద సూచించిన లింక్ ద్వారా చదవండి.

సినిమాలు-క్రైస్తవులు

లేఖనానుసారమైన మారుమనస్సు ఎలా ఉంటుందో వివరించబడిన ఈ వ్యాసం కూడా చదవండి

నిజమైన మారుమనస్సుకు కచ్చితమైన ఏడు గుర్తులు

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.