దుర్బోధలకు జవాబు

రచయిత: కె విద్యా సాగర్

గతంలో నేను అన్యమత గ్రంథాలలో దేవుని వాక్యం‌ ఉండడం సాధ్యమా అనే వ్యాసంలో, సంఘంలోకి‌ చొరబడ్డ అబద్ధ ప్రవక్తలూ, దొంగ అపోస్తలులు చేసే ఆబోధను లేఖనాలు ఏ మాత్రం సమర్థించడం లేదనీ రుజువు చేస్తూ వారు వక్రీకరించే కొన్ని సందర్భాలకు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా ఆ వ్యాసాన్ని చదవకపోతే, ఈ లింక్ ద్వారా దానిని చదివిన తరువాత దీనిని చదవండి.

అన్యమత గ్రంథాల్లో దేవుని వాక్యం ఉండడం సాధ్యమా?

ఈ వ్యాసంలో కూడా, అన్యమత‌ గ్రంథాలలో బైబిల్ దేవుని‌వాక్యం‌ రాయబడిందని‌‌ మరియు ఒకవేళ రాయబడకపోయినా సువార్తను ప్రకటించేటపుడు వాటిని ప్రస్తావించవచ్చని కొందరు వక్రీకరిస్తున్న ప్రధానమైన సందర్భానికి‌ వివరణ ఇవ్వబోతున్నాను. ఆ సందర్భం చూడండి.

అపొస్తలుల కార్యములు 17:28
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

ఏథెన్సు పట్టణంలో అరేయొపగు సభలో పౌలుపలికిన ఈమాటల్లో ఆయన వారి కవీశ్వరుల మాటలను ప్రస్తావిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనిని ఆధారం చేసుకునే కొందరు అన్య మతగ్రంథాలలో కూడా దేవుని వాక్యం రాయబడిందని ఒకవైపు, మరోవైపు అలా రాయబడకపోయినా సువార్త ప్రకటనలో పౌలు వాటిని ప్రస్తావించాడు కాబట్టి, మనం కూడా ఇతర మతగ్రంథాలలో సువార్తకు అనుకూలంగా ఉన్న విషయాలను ప్రస్తావిస్తూ అన్యజనులకు సువార్త ప్రకటించవచ్చని బోధిస్తున్నారు. కానీ ఇక్కడ పౌలు ఏ సందర్భంలో వారి‌ కవీశ్వరుల గురించి ప్రస్తావించాడో‌ మనం పరిశీలిస్తే ఆ రెండు భావజాలాలూ సరైనవి కావని మనకు అర్థమైపోతుంది.

ఇక్కడ మనం మొదటిగా గుర్తుంచుకోవలసిన విషయం; పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కవీశ్వరుల మాటలను ప్రస్తావించినప్పటికీ వారికి ఆ మాటలను దేవుడే తనవాక్కు ద్వారా తెలియచేసి వారిచేత రాయించాడని ఎటువంటి నిర్థారణ చెయ్యలేదు. పైగా అది అసాధ్యమని బైబిల్ లోని లేఖనాలు మనకు తెలియచేస్తున్నాయి. దీనిగురించి ప్రారంభంలో నేను పరిచయం చేసిన వ్యాసంలో పూర్తి ఆధారాలతో వివరించాను.

ఇక అంశంలోనికి వెళ్ళి పౌలు ఏథెన్సులో ప్రస్తావించిన ఆ కవీశ్వరులు ఎవరు? ఆ మాటలను ఆ కవీశ్వరులు ఎక్కడ రాశారు. అందులో ఇంకా ఏమేం రాయబడ్డాయో క్షుణ్ణంగా పరిశీలిద్దాం. అంతకంటే ముందుగా, ఏథెన్సుపట్టణం గురించీ, అక్కడ జీవిస్తున్న ప్రజలు గురించీ, వారిమధ్య పౌలు ఉన్నటువంటి పరిస్థితి గురించీ కూడా తెలుసుకుందాం. దానియేలు గ్రంథంలో ప్రపంచాన్ని ఏలబోయే రెండవ సామ్రాజ్యంగా మనకు కనిపించే పారశీక మాదీయ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ ఓడించి మూడవదిగా గ్రీసు రాజ్యాన్ని స్థాపించాక ఆ గ్రీసు సామ్రాజ్యానికి రాజధానిగా ఈ ఏథెన్సు పట్టణం విలసిల్లింది.

అంతమాత్రమే కాకుండా, ప్రపంచలో పేరు పొందిన తత్వజ్ఞానులైన, అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీసులు ఈ దేశానికి చెందినవారే. మొదటి కొరింథీయులకు 1:22 లో గ్రీసుదేశస్థులు జ్ఞానాన్ని వెదకుతున్నారని పౌలు వారి గురించి ప్రస్తావించడం ద్వారా, గ్రీసు దేశస్తులకు జ్ఞానం సంపాదించాలనే మక్కువ ఎంత ఉన్నతంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దానికోసం వీరు ప్రపంచంలో కొత్తగా అనిపించే ప్రతీదానినీ తెలుసుకోవడానికి ఆరాటపడేవారు.

అపొస్తలుల కార్యములు 17:21
ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు

వీరికి జ్ఞానం సంపాదించాలనే ఆసక్తితో పాటుగా ఎక్కువమంది దేవుళ్ళను పూజించాలనే అతిదేవతా భక్తి కూడా ఉందేది ఇదంతా ఆ పట్టణం గురించినటువంటి చరిత్ర.

ఇక ఆ పట్టణంలో వారిమధ్య నిలబడిన పౌలు పరిస్థితిని చూద్దాం.

అపొస్తలుల కార్యములు 17:18
ఎపికూరీయులలోను, స్తోయికులలోను, ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి.

అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలో యూదులతోనూ, భక్తిపరులైన కొందరితోనూ యేసుక్రీస్తును గురించీ, ఆయన పునురుత్థానం గురించీ తర్కిస్తున్నపుడు ఎపికూరీయులూ, స్తోయికులు అనే రెండు తెగలవారు పౌలుతో వాదించినట్టు,‌ తదుపరి వారంతా కలసి ఆయనను అరేయొపగు సభలోనికి తీసుకెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది.‌ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అన్యజనులకు వారి గ్రంథాలలోని విషయాలనే తీసుకుంటూ వారికి సువార్త ప్రకటించడమే పౌలు పద్ధతి అయితే, అతిదేవతా భక్తికలిగిన ఏథెన్సు పట్టణవాసులకు ఆయన ముందే అలా ఎందుకు చెయ్యలేదు?. అరేయొపగు సభలోకి ఆయనను తీసుకుని వెళ్ళేంతవరకూ ఆ కవీశ్వరుల గురించి‌ఎందుకు ప్రస్తావించలేదు?.

పోని పౌలు అరేయొపగు సభలో కాకుండ ఇతరచోట్ల అన్యజనులకు సువార్త ప్రకటించినపుడు ఆవిధంగా ఎప్పుడైనా చేసాడా అని పరిశీలిస్తే అటువంటి ఆధారాలు ఎక్కడా కూడా మనకు కనిపించవు. ఆయన సువార్తను ఎలా చేసాడో ఆయనమాటల్లోనే చూడండి.

అపొస్తలుల కార్యములు 26:22,23
క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.

అపొస్తలుల కార్యములు 14:15-17
అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేముకూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచిపెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్ను గూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.

ఈమాటల ప్రకారం పౌలు అన్యజనులకైనా యూదులకైనా పాతనిబంధన లేఖనాలను ప్రస్తావిస్తూ అవి అన్యజనులకు కొన్నిసార్లు అర్థం కావు కాబట్టి సృష్టిలోని దైవలక్షణాలను ఆధారం చేసుకుంటూ సువార్తను ప్రకటించాడు‌ తప్ప, ఎక్కడా కూడా అన్యజనుల మతగ్రంథాలనుంచి పోలికలు తీసుకుని సత్యసువార్తను స్థాపించే ప్రయత్నం చెయ్యలేదు.

ఇక పౌలును అరేయొపగు సభలోకి తీసుకువెళ్ళిన రెండుగుంపుల గురించి తెలుసుకుందాం. "ఎపికూరస్" అనే తెగ క్రీస్తుపూర్వం 300 సవత్సరాలకు ముందు ఆ పట్టణంలో వృద్దిచెందింది.‌ దేవుడు అనేవాడు లేడనీ, ఆయన సృష్టికర్త కాడనీ, సమస్తమూ కూడా అకస్మికంగా సంభవించిందనీ, ఆత్మ శాశ్వతమైనది కాదనీ, దేవుళ్ళు అనేవారు మానవుడిపైన ప్రభావం చూపుతారనేది అబద్ధమని వీరు బోధించేవారు.

ఇక "స్తోయికులు" గురించి చూస్తే, కుప్రకు చెందిన జినో అనే వ్యక్తి స్థాపించిన గుంపునే "స్తోయికులు" అని‌ పిలిచేవారు. ఇతను క్రీస్తుకు పూర్వం 264 సంవత్సరాలకు ముందు జీవించినవాడు, ఈ జినో 48 సంవత్సరాలు అదే ఏథెన్సు పట్టణంలో ఒక మంటపంలో బోధించాడు. "స్తోవ" అనే మాటకు "నూతన ముఖమంటపం" అని అర్థం దాని ఆధారంగా అతని బోధలను అనుసరించే వారికి "స్తోయికులు" అనే పేరు వచ్చింది. వీరు దేవుడు ఉన్నాడని నమ్ముతారు కానీ అంతాకూడా విధియనీ, దేవుడు కూడా ఆ విధిని దాటి ఏదీచేయలేడనీ, మానవుడు జీవించినంతకాలం తన కోరికలను అదుపుచేసుకుంటూ, ఆనందంగా జీవించాలనీ, ఉనికి కలిగినవన్నీ నశిస్తాయనీ, ఆ సమయంలో ఆత్మ కూడా నశిస్తుందని బోధించేవారు.

ఇటువంటి‌ ప్రజలమధ్యలో పౌలు వారి నమ్మకాలకు వ్యతిరేఖంగా తన బోధను కొనసాగిస్తున్నాడు. అక్కడున్న తెగల్లో ఒక తెగవారు దేవుడు ఉన్నాడని కానీ, ఆత్మ అనేది ఉందని కానీ, దేవుడు సమస్తాన్ని సృష్టించాడని కానీ నమ్మరు.‌ మరొక తెగవారు దేవుడు ఉన్నాడని నమ్మినప్పటికీ, ఆయన కూడా విధిని దాటిపోలేడనీ, ఆత్మకూడా నాశనమౌతుందనీ (మృతుల పునరుత్థానం లేదని) నమ్ముతారు. వీరిరువురి మధ్యలో నిలబడ్డ పౌలు వారు నమ్మేవాటికి పూర్తి వ్యతిరేకంగా మృతుల పునరుత్థానం గురించీ, యేసుక్రీస్తును గురించీ బోధిస్తున్నాడు. అప్పుడు వారి ప్రతిస్పందన ఎలా ఉందో చూడండి.

అపొస్తలుల కార్యములు 17:18,19
ఎపికూరీయులలోనూ, స్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునురుత్థానమును గూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్యదేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయినీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?.

ఈవిధంగా ఆ రెండుతెగల ప్రజలూ పౌలును తాను సువార్త చేస్తున్న ప్రాంతం నుండి అరేయొపగు సభలోకి తీసుకుని‌ వెళ్ళారు. ఆ సభ గురించి చెప్పాలంటే అది గ్రీకుల మహాసభ ఆ పట్టణంలోని ధనికులు, పాలనా యంత్రాంగంలోని మిగిలిన సభ్యులు ఆ సభయొక్క సభ్యులుగా కొనసాగేవారు. మొదట్లో ఆ సభ ప్రారంభమైన ఉద్దేశం నేరస్తులకి శిక్షవిధించడానికే అయినప్పటికీ, తదుపరి కాలంలో పాలనను గురించిన విషయాలను చర్చించడానికీ, ఆధ్యాత్మిక సంగతులను తెలుసుకోవడానికీ, తత్వ జ్ఞానులు తమ ప్రసంగాలు చేయడానికీ కూడా దానిని ఉపయోగించేవారు. అదేవిధంగా మనం పైన చూసిన రెండు తెగలకు చెందినవారూ, అతి దేవభక్తి కలిగిన విగ్రహారాధికులూ, మిగిలిన తత్వ జ్ఞానులూ ఒకరి నమ్మకాలు మరో గుంపుకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి, వారిమధ్య ఏదైన‌‌ వివాదం చెలరేగితే ఆ సభను ‌నిర్వహించి శాంతిని నెలకొల్పేవారు. ముఖ్యంగా ఆ పట్టణంలోకి ఎవరైనా ఏదైన కొత్త మతాన్ని కానీ, బోధను కానీ తీసుకువస్తే ఆ సభలో చర్చించి (debate) దానిని నిరూపించుకోవాలి.

ఈ సభలో మాట్లాడేవారు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏమిటంటే,
(1) వారు ప్రకటిస్తున్న కొత్తమతాన్ని కానీ బోధను కానీ వారిముందు నిరూపించి తీరాలి.
(2) ఆ విధంగా చేయకుండా అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టేలాకానీ, వారి నమ్మకాలను తప్పుపట్టేలా కానీ మాట్లాడారో వారిచేతుల్లో చావు తప్పదు.

"సోక్రటీస్" అనే పేరుపొందిన ఫిలాసఫర్ ను వారు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే సభలో వారి నమ్మకాలకూ వ్యతిరేకంగా మాట్లాడాడన్న కారణంతో‌ విషం కలిపిన ద్రావకం అతనిచేత త్రాగించి చంపండం జరిగింది. సోక్రటీసును ఇదే చోట వారు చంపినట్టుగా "మరా-బర్ సెరాపియన్" అనే సిరియనుడు తనకుమారునికి మొదటి శతాబ్ధపు చివరిలో రాసిన లేఖలో స్పష్టం చేసాడు. 'ఏథెనుస్సు వారు సోక్రటీసును చంపడం వల్ల వారికి కలిగిన ప్రయోజనం ఏమిటి? తదుపరి భయంకరమైన కరువు తెగులు వారిపైకి వచ్చి వారిని నాశనం చేసాయి' బ్రిటీష్ మ్యూజియం- సిరియక్ వ్రాతప్రతులు 16,658.

ఈ లేఖలో మనకి కనిపించే కరువు గురించి కూడా, చివరిలో మాట్లాడుకుందాం; ప్రస్తుతం మన అంశంలోనికి వెళ్తే అరేయొపగు సభలో నిలబడిన పౌలు అక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా మాట్లాడివారి‌ నమ్మకాలను‌ అవమనించినా, తన వాదనను నిరూపించలేకపోయినా, ఆయనకు కూడా వారిచేతుల్లో చావు తప్పదు. అందుకు పౌలు తన వాదనను ఎంత వివేకంతో, కొనసాగిస్తున్నాడో చూడండి.

అపొస్తలుల కార్యములు 17:22-32
పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. "జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.
ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలియున్నదని తలంపకూడదు ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా ‌తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించి యున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు. మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరుదీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.

ఇదే పౌలు అరేయొపగు సభలో చేసిన వాదన. దీనిగురించి వివరణ చూడడానికి ముందు ఇదే సందర్భంలో పౌలు ప్రస్తావించిన మరోదానిని కూడా కొందరు వక్రీకరిస్తూ, పౌలు ఆ సందర్భంలో ఏథెన్సు ప్రజలు తమకు తెలియబడని దేవునికి కట్టిన బలిపీఠం గురించి జ్ఞాపకం చేస్తూ, మీరు తెలియక బలిపీఠాన్ని కట్టి ఏ దేవుని పట్ల భక్తికలిగి ఉన్నారో ఆ దేవుణ్ణే నేను మీకు ప్రకటిస్తున్నానని అంటున్నాడు. కాబట్టి, మేము కూడా అన్యమతస్తులు నమ్మే దేవుళ్ళను ఆధారం చేసుకుని మనదేవుణ్ణి ప్రకటించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతుంటారు. కానీ, బైబిల్ గ్రంథం మనదేవుణ్ణి పోలిన దేవుడు ఎవరూ లేరని స్పష్టంగా చెబుతుంది. అటువంటప్పుడు అన్య మతస్తులు నమ్మే దేవుళ్ళను ఆధారం చేసుకుని మన దేవుణ్ణి ప్రకటిస్తే అది ఘోరపాపం‌ ఔతుంది. కాబట్టి, పౌలు ఇక్కడ ప్రస్తావించిన బలిపీఠం గురించి కూడా మనం కింద వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పౌలు అరేయొపగు సభలో చాలా కచ్చితంగా, వివేకంతో తన ముందున్న ప్రజలలో దేవుడు లేడు ఆయన సృష్టిని చేయలేదు, మానవునికి దేవునినుంచి ఏ తీర్పూ లేదు అనే తెగనూ, దేవుడు ఉన్నాడు కానీ అంతా విధే, ఆత్మకూడా నాశనం ఔతుంది అనే తెగనూ, దేవుళ్ళు ఉన్నారని నమ్మి విగ్రహాలను నిర్మించి పూజించుకుంటున్న మరో తెగనూ వారిస్తూ, తాను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మృతులలోనుండి లేచాడు కాబట్టి మృతుల పునరుత్థానానికి ఆధారం ఉందనీ, దీని ప్రకారం ఆత్మ నాశనం కాదనీ, యేసుక్రీస్తు ద్వారా లోకానికి తీర్పు రాబోతుందనీ, దానిని తలపెట్టినవాడు దేవుడేయనీ, ఆ దేవుడు సమస్తాన్నీ సృష్టించాడనీ, అలాంటి దేవుడు విగ్రహాలలో, మనం కల్పించిన రూపాలలో నివసించడనీ, ఆయన ఒకే మానవునినుండి ప్రజలందరినీ సృష్టించాడనీ వివరిస్తూ తార్కికంగా తన వాదనను నిరూపిస్తున్నాడు. ఇది పౌలుకూ అక్కడున్న తెగలవారికీ జరుగుతున్న డిబేట్.

ఈ క్రమంలో ఆ పట్టణంలోని ప్రజలంతా అభిమానించే కవీశ్వరుల ప్రస్తావన తీసుకువచ్చి "మనమాయనయందు ఉనికి కలిగియున్నాము చలించుచున్నాము అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులు కూడా చెబుతున్నారనే" మాటలు జ్ఞాపకం చేసాడు. ఇంతకూ ఈ కవీశ్వరులు ఎవరు? ఆ పట్టణానికీ ఆ కవీశ్వరులకీ, సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం. వీరు ఏథెన్సు పట్టణంలో క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జీవించిన తత్వ జ్ఞానులు, వీరి పేర్లు అరాటస్, ఎపిమెనిడెస్ వీరు‌ తత్వ జ్ఞానులుగా మాత్రమే కాకుండా గ్రీకులు దేవునిగా నమ్మే "zeus" అనే వాడి గురించి కొన్నిపద్యాలు రాసిన కవులుగా కూడా గుర్తింపుపొందారు. వీరు చనిపోయిన తర్వాతకాలంలో కూడా, వీరిపట్ల ఏథెన్సులోని ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది. వీరు రచించిన పద్యాలు కూడా ఆనాటి ప్రజల్లో బాగా ప్రాముఖ్యతతను సంతరించుకున్నాయి.

ఏథెన్సు పట్టణంలో పౌలు ప్రస్తావించిన "తెలియబడని దేవునికి కట్టిన బలిపీఠం" కూడా ఎపిమెనిడెస్ సలహాతోనే కట్టడం జరిగింది. పౌలు అపోస్తలుల కార్యాలు 17:28 వచనంలో చెప్పిన మాటలు ఈ ఇద్దరు తత్వ జ్ఞానుల (కవీశ్వరుల) పద్యం నుంచే తీసుకున్నాడు. ఆ ఇరువురు రాసిన పద్యాలలో పౌలు ఏయే భాగాలను తీసుకున్నాడో ఆ పూర్తి పద్యాలతో సహా చూద్దాం.

అపొస్తలుల కార్యములు 17:28 "మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము." అటువలె మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.

"మనము ఆయనయందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము ఉనికికలిగి ఉన్నాము" అనేది "ఎపిమెనిడెస్" రాసినటువంటి "క్రెటికా" అనే పద్యంలో నుండి పౌలు ప్రస్తావించారు

ఆపూర్తి పద్యాన్ని చూడండి;
They fashioned a tomb for you, holy and high one,
Cretans, always liars, evil beasts, idle bellies.
But you are not dead: you live and abide forever,
"For in you we live and move and have our being"
ఈ పద్యంలో ఉన్నటువంటి కింద మాటలనే, పౌలు 28 వ వచనంలో మొదటిగా ప్రస్తావించారు;

ఈ విషయాన్ని క్రీస్తుశకం 9 వ శతాబ్ధంలో "సిరియక్" బాషలో అపోస్తలుల కార్యాలు గ్రంథానికి వాఖ్యానం రాసినటువంటి "Isho'dad of merv" అనే బైబిల్ పండితుడు తెలియచేస్తూ అందులో ఈ పూర్తి పద్యాన్ని ప్రస్తావించాడు;

ఇక అదే 28 వచనంలోని "మనమాయన సంతానము" అని పౌలు ప్రస్తావించిన మాట "అరాటస్" తన "phenomena" అనే పుస్తకంలో రాసింది, ఈ పుస్తకం ఇప్పటికీ కూడా, మనకి అందుబాటులోనే ఉంది.

ఆ పుస్తకంలో రాయబడ్డ పూర్తి పద్యాన్ని చూడండి;
The beginning of the world was you, and with law you rule over all things.
To you all flesh may speek, "for we are your offspring".
Therefore I will lift a hyms to you
And will sing of your power.
ఈ పద్యంలో పౌలు తీసుకున్న మాట "for we are your offspring" (మనమాయన సంతానము). ఇదే పద్యాన్ని అదేకాలానికి చెందిన మరొక కవి "cleanthes" కూడా తన పుస్తకంలో ప్రస్తావించాడని, నేను పైన చెప్పిన బైబిల్ పండితుడు "isho'dad of Merv" తన వాఖ్యానంలో రాసాడు.

ఇంతకూ పౌలు ఈ కవులు చెప్పిన మాటలు ఎందుకు ప్రస్తావించాడంటే, సువార్తకు ఆధారంగా కానేకాదు. ఆయన సువార్తను వేటి ఆధారంగా ప్రకటిస్తాడో ఇప్పటికే నేను పైన ఆధారాలతో వివరించాను. కానీ అరేయొపగు సభలో ఆయన నిలిచినపుడు అది అక్కడున్న తెగలతో జరుగుతున్న డిబేట్ కాబట్టి అక్కడ వారి కవీశ్వరుల మాటలనే ఆయన ఉటంకించి వారి లోపాలను ఎత్తిచూపుతున్నాడు.
మనం కూడా ఇతరమతస్తులతో చర్చలు చేసేటపుడు వారిగ్రంథాలనుండే వారి లోపాలను‌ బయటపెట్టే ప్రయత్నం చేస్తాం కదా. దీనినే వారిచెప్పుతో వారినే కొట్టడం అంటారు‌.

ఇక్కడ పౌలు ప్రస్తావించిన ఆ కవీశ్వరుల మాటల ప్రకారం దేవుడు లేడనే ఎపీకూరీయుల భావజాలం తప్పు ఔతుంది. అదేవిధంగా దేవుడున్నాడని చెప్పి విగ్రహారాధన చేసేవారి భావజాలం కూడా తప్పు ఔతుంది. ఎందుకంటే మనం ఆయనయందు‌ బ్రతుకుతున్నాం చలిస్తున్నాం ఉనికి కలిగియున్నాం మనం ఆయన సంతానమని వారి కవీశ్వరులు చెప్పినపుడు దేవుని సంతానమైనవారు పౌలు ఖండిస్తున్న విగ్రహారాధనను ఎలా సమర్థించుకోగలరు?. పౌలు వాదనను ఎలా తప్పుపట్టి ఆయనను చంపగలరు?. కాబట్టి ఇక్కడ పౌలు ఆ కవీశ్వరుల మాటలను కౌంటర్ గా ఉపయోగించాడే తప్ప తన సువార్తకు ఆధారంగా కాదు.

అపొస్తలుల కార్యములు 17:28,29
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలెమన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.

ఇటువంటి పద్దతినే పౌలు మరోసందర్భంలో కూడా ఉపయోగించినట్లు మనం చూడగలం

తీతుకు 1:12,13
వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను క్రేతీయులు ఎల్లప్పుడు అబద్ధికులును, దుష్టమృగములును, సోమరులగు తిండి పోతులునైయున్నారు. ఈ సాక్ష్యము నిజమే.

ఇక్కడ పౌలు ప్రస్తావించిన క్రేతీయుల సొంత ప్రవక్త కూడా మరెవరో కాదు మనం పైన చూసిన తత్వజ్ఞాని, కవి అయినటువంటి "ఎపిమెనెడెస్" గారే. ఈ సందర్భంలో కూడా పౌలు క్రేతీయుల ప్రవర్తనను గురించి వారు ఒకప్పుడు ప్రవక్తగా నమ్మిన వాడి మాటలనుండే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసాడు క్రీస్తు గురించి ప్రకటించడానికి మాత్రం కాదు. కాబట్టి కొందరు చెబుతున్నట్టుగా క్రీస్తు గురించి ప్రకటించడానికి అన్యమతగ్ర‌ంథాల నుండి పోలికలు ప్రస్తావించడం పౌలు పద్ధతి కాదు. మన‌ దేవుణ్ణి ప్రకటించడానికి ఆయనకు విరుద్ధంగా సాతాను ప్రవేశపెట్టిన అన్యమత వాంగ్మూలాలు మనకు అవసరం లేదు. అపవాది ప్రవేశపెట్టిన అపవిత్రమైన వాంగ్మూలాలతో మన దేవుణ్ణి ప్రకటించేప్రయత్నం చెయ్యడం ఏవిధంగా సబబు ఔతుందో ఆలోచించండి. మరొక భావజాలానికి సంబంధించిన వ్యక్తితో వాదన జరుగుతున్నపుడు, అతను నమ్ముతున్న వాంగ్మూలం ఆధారంగా అతని‌ లోపాలను బయటపెట్టడానికీ మన భావజాలాన్ని స్థాపించుకోవడం కోసం వాటిని ప్రస్తావించడానికీ చాలా తేడా ఉంది.

చివరిగా, పౌలు ఆ పట్టణంలో ప్రస్తావించిన, తెలియబడని దేవునికి కట్టిన బలిపీఠం గురించీ, ఆయన దానిద్వారా బైబిల్ దేవుణ్ణి పరిచయం చేయడానికి గల కారణాన్నీ చూద్దాం.

అపొస్తలుల కార్యములు 17:22,23
పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పినదేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా "ఒక బలిపీఠము నాకు కనబడెను.దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది". కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.

మనం ఈ వచనాలను పరిశీలిస్తే, ఏథెన్సు ప్రజలు అతిదేవతా భక్తితో అనేకమైన దేవుళ్ళను పూజిస్తున్నప్పటికీ, పౌలు ఆ మిగిలిన దేవుళ్ళపై వారు కలిగియున్న భక్తిని బైబిల్ దేవునికి ఆపాదించడం లేదు కానీ, కేవలం వారు తెలియబడని దేవుడికని ఎవరికైతే బలిపీఠం కట్టి ఆయనపై భక్తి చూపిస్తున్నారో దానిని మాత్రమే ఆయన మన బైబిల్ దేవునికి ఆపాదిస్తూ ఆయననే నేను మీకు ప్రకటిస్తున్నాను అంటున్నాడు. అంతమాత్రమే కాదు, అక్కడ వారు ఆ తెలియబడని దేవుని పట్ల చూపిస్తున్న భక్తి ఏదైతే ఉందో, ఆ భక్తి సరైనదని కూడా పౌలు చెప్పడం లేదు. ఆ భక్తి సరైనదే అయితే, దానివల్ల వారికేదైనా ప్రయోజనం ఉంటే పౌలు అంత కష్టపడి వారికి సువార్త ప్రకటించాల్సిన అవసరం లేదు.

ఇప్పుడు ఆ బలిపీఠాన్ని ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఆ దేవునిపైన ఆ ప్రజలకు ఉన్న భక్తిని పౌలు బైబిల్ దేవునికి ఎందుకు‌ ఆపాదిస్తున్నాడో చూద్దాం. దానికంటే ముందు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఏథెన్సు ప్రజలు అనేకమైన పేర్లతో, చరిత్రలనూ, రూపాలనూ కల్పించుకుని ఏయే దేవుళ్ళపట్ల భక్తికలిగియున్నారో, ఆ భక్తిని పౌలు బైబిల్ దేవునికి ఆపాదించలేదు. కాబట్టి, ఈరోజు మేము కూడా పౌలు బాటలోనే నడుస్తున్నామని ఆయనను‌ అడ్డుపెట్టుకుని హేయమైన బోధ‌చేసేవారు ఈదేశంలో హిందువులు వివిధ పేర్లతో, చరిత్రలనూ, రూపాలనూ కల్పించుకున్న దేవుళ్ళపై చూపిస్తున్న భక్తిని బైబిల్ దేవునికి ఎలా ఆపాదిస్తారు? ఇది కూడా వారి వక్రీకరణను మనకు రుజువు చేస్తుంది.

ఇక సందర్భంలోనికి వెళ్తే; పైన మనం అరేయొపగు అనే ఏథెనుస్సు వారి సభలో సోక్రటీసు అనబడే వ్యక్తిని విషం ఇచ్చిచంపినట్టు చూసాం. ఆ తర్వాత ఆ పట్టణంలో భయంకరమైన తెగులూ, కరువు తటస్థించి అనేకులు మృత్యువాత పడ్డారు. "ఏథెనుస్సు వారు సోక్రటీసును చంపుట వలన వారికి కలిగిన ప్రయోజనం ఏమిటి? తదుపరి భయంకరమైన కరువు తెగులు వారిపైకి వచ్చి వారిని నాశనం చేసాయి బ్రిటీష్ మ్యూజియం- సిరియక్ వ్రాతప్రతులు 16,658"

ఆ సమయంలో ఆ పట్టణపు ప్రజలు పైన మనం ప్రస్తావించుకున్న కవీశ్వరుడిని సంప్రదించి, ఆ విపత్తునుండి తప్పించుకునే మార్గాన్ని తెలియచెయ్యమని వేడుకుంటారు. అప్పుడు అతని సలహామేరకు కట్టబడిందే ఆ తెలియబడని దేవునికి కట్టబడిన బలిపీఠం. దీనిని 'అగ్నోస్టిక్ థియోస్' అంటారు, ఇది ఇప్పటికీ రోమ్ మ్యూజియంలో భద్రంగా ఉంది, ఇంటెర్నెట్ లో దీని చిత్రాలు కూడా మనం చూడవచ్చు.

సృష్టిలో విపత్తులు రప్పించేదీ, తప్పించేదీ నిజదేవుడు మాత్రమే, ఆయనే బైబిల్ ప్రకటించే త్రియేకదేవుడు. అందుకే పౌలు మీరు తెలియక ఏదేవునికైతే బలిపీఠం కట్టి భక్తిచూపిస్తున్నారో ఆ దేవుణ్ణే నేను మీకు పరిచయం చేస్తున్నానని చెబుతూ వారికి యేసుక్రీస్తు గురించిన సువార్త చెబుతున్నాడు. కాబట్టి పౌలు చేసినదానికీ, నేటి అబద్ధప్రవక్తలూ దొంగ అపోస్తలులూ చేస్తున్న హేయమైన‌ బోధకూ ఎటువంటి సంబంధం లేదని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను.

Add comment

Security code
Refresh

Comments  

# SuperPrasanth 2019-09-19 01:42
Good analysis. God bless your ministries.
Reply
# ఏథెన్సులో పౌలుచేసిన బోధ అన్యమత గ్రంథాల్లో దేవునివాక్యం ఉందనడానికి ఆధారమా?Raju 2020-11-22 12:49
ఎంతో చక్కగా వివరించారు సార్..... ఇంకనూ అనేక మంది కి ఈ విషయాలు తెలియబడును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్....
Reply
 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.