దేవుడు

రచయిత: యం. జోషి లీలన్ రెడ్డి

విషయసూచిక

 

1. క్రీస్తు శాస్త్రము
(CHRISTOLOGY)

 

1.1. క్రిస్టాలజీ (క్రీస్తు శాస్త్రము) అంటే ఏమిటి?

యేసుక్రీస్తు యొక్క దైవత్వం, నిత్యత్వం, శరీరధారణ, మానవత్వం, బలియాగం, వ్యక్తిత్వం, స్వభావం, ఆయన పరిచర్య, ఆయన బోధలు, మరియు ఆయన జీవితం మొII వాటిని గూర్చి దేవుని వాక్యంలో సవిస్తారంగా వ్రాయబడివుంది. ఈ విషయ సంగ్రహాన్ని గూర్చి, సార్వత్రిక సంఘచరిత్రలో ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు క్రీస్తును గూర్చిన విశ్వాసం ఎలా మార్పులు చెందిందో ఆయా సమయాల్లో తలెత్తిన దుర్బోధల్ని సంఘం ఎలా ఎదుర్కొందో - క్రిస్టాలజీ బోధిస్తుంది. సంక్షిప్తంగా క్రిస్టాలజీ (క్రీస్తు శాస్త్రము) అంటే బైబిల్లో క్రీస్తును గూర్చిన అధ్యయనం అని అర్థం.

1.2. క్రిస్టాలజీ ఎందుకు చదవాలి?

త్రిత్వాన్ని నమ్మనటువంటి వారు క్రీస్తు వ్యక్తిత్వాన్ని ముఖ్యంగా ఆయన దైవత్వాన్ని చిధ్రం చేయకుండా త్రిత్వాన్ని ఎదిరించలేరు. యేసుక్రీస్తు యొక్క రెండు స్వభావాలను అర్థం చేసుకోలేక భిన్నమైన బోధలకు కారణమవుతున్న వారు చాలమంది ఉన్నారు. తెలిసీ తెలియని జ్ఞానములో, నిర్లక్ష్యవైఖరిలో యేసుక్రీస్తును గూర్చి దురభిప్రాయం కలిగించే వారున్నారు. మానవుని రక్షణ సంకల్పంలో యేసుక్రీస్తు శరీరధారణ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఆయన చేసిన కార్యం నిర్వీర్యం అయిపోతుంది. క్రీస్తు వ్యక్తిత్వం మీద అనేకులు అనేక పర్యాయాలు అనేక విధాలుగా దాడి చేశారు, చేస్తున్నారు. క్రీస్తు శాస్త్రము ఈ దాడిని ఎదుర్కొని, మన విశ్వాసాన్ని సరియైన పునాదిపై నిర్మించుకోడానికి, క్రీస్తును గురించి మన నమ్మకాన్ని భద్రంగా కాపాడుకోడానికి మనం “క్రిస్టాలజీ” చదవాలి. యేసుక్రీస్తు గొప్పతనాన్నీ, ఆయన మహిమను, ఆయన గంభీరతను, ఆయన చేసిన రక్షణ కార్యంలోని శక్తిని, ఆయన మనకు అనుగ్రహించిన విమోచనం యొక్క నిబద్ధతను దృఢంగా గ్రహించి, యేసుక్రీస్తును మన రక్షకుడిగ, మరియు ప్రభువుగా ఎరిగి మన జీవితాంతం ఆయనకు కృతజ్ఞులమై ఆయన్ని సేవించుటకు, ఆరాధించుటకు మనం క్రిస్టాలజీ చదవాలి.

1.3. క్రిస్టాలజీ ప్రాముఖ్యత

మానవ విమోచన కార్యంలో యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకుండా రక్షణలేదు. అలాగే బైబిలుకు యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. బైబిల్ సారాంశం మరియు సారం యేసుక్రీస్తే, త్రిత్వానికి యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకుండా త్రిత్వమే లేదు. క్రైస్తవుల విశ్వాసానికి, యేసుక్రీస్తుకు నేరుగా సంబంధం ఉంది. యేసుక్రీస్తు లేకపోతే క్రైస్తవ్యమే లేదు. యేసుక్రీస్తును గురించి సవిస్తరంగా తెలియజేసేది మన విశ్వాసాన్ని స్థిరపరిచేది క్రిస్టాలజీ - మాత్రమే.

 

2. కుమారుని యొక్క దైవత్వం
(THE DIETY OF SON)

 

క్రీస్తు ప్రభువు వ్యక్తిత్వాన్ని గురించిన వాదనలో, వివాదాలకు ఆస్పదమైన అంశం ఆయన దైవత్వం. సంఘ చరిత్రలోను, ప్రస్తుత కాలంలోను ఈ సమస్య చాల జటిలమైందిగా అంగీకరించబడింది. ఆదికాలపు సంఘంలోనేగాక, ప్రస్తుత కాలంలోని మోడ్రనిస్టులు, క్యారిస్మాటిక్ వారు కూడా క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని నిరాకరిస్తున్నారు. నోటితో క్రీస్తు దేవుడని చెప్తారు కాని వారి బోధల సారాంశం క్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని నిరాకరిస్తుంది. వారి బోధల సారాంశం క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తున్నట్లుగా కనబడవచ్చును కాని వారు ప్రతిపాదిస్తున్న దైవత్వం బైబిలులో ప్రత్యక్షపరచబడిన దైవత్వానికి విరుద్ధంగానో లేక అల్పస్థాయిలోను ఉంటుంది. క్రీస్తు ప్రభువు దేవుడు కానిచో ఆయన చేసిన బలియాగం కూడా నిరర్ధకమౌతుంది. క్రీస్తు ప్రభువు దేవుడు కానిచో క్రైస్తవ్యమే అర్ధ విహీనం అవుతుంది. ఈ భూమి మీద ఉన్న అనేక మతాల్లో ఒక మతంగా మాత్రమే క్రైస్తవ్యాన్ని పరిగణించాల్సి వస్తుంది. యేసుక్రీస్తు దేవుడు అనేది ఒక తిరుగులేని సత్యం. యూదులు యేసుక్రీస్తును నిరాకరించారు. నేను అబ్రహాము కంటే ముందున్న వాడిని (యోహాను 8:58) అని ప్రభువు యూదులతో చెప్పినప్పుడు యూదులకు ప్రభువు ఏమి చెపుతున్నారో అర్ధమైంది. క్రీస్తు ప్రభువు ఆయన తన నిత్యత్వాన్ని గురించి చెపుతున్నాడని, తద్వారా తను దేవుడు అనే విషయాన్ని వారికి అన్యోపదేశంగా బోధించాడని వారు గుర్తించి, ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తారు.

2.1.క్రీస్తు  దైవత్వాన్ని నిరూపించే డైరెక్టు రిఫరెన్సులు :

 

2.1.1.పా త నిబంధన రిఫరెన్సులు :

 

యెషయా 7:14 : ఇమ్మానుయేలు (అనగా దేవుడు మన తోడు) అని అర్థం. ప్రభువు కన్యగర్భాన జన్మించినపుడు, ఆ శిశువు ఇమ్మానుయేలు అని పిలువబడును. హీబ్రూ భాషలో “ఏల్” అనగా దేవుడు.

యెషయా 9:6-7 : మనకు అనుగ్రహించబడు శిశువు బలవంతుడగు దేవుడు.

 

2.1.2.క్రొత్త నిబంధన రిఫరెన్సులు :

 

• యోహాను 1:1-14: వాక్యం శరీరధారియై మన మధ్య నివసించెను. ఆ వాక్యం దేవుడై యుండెను. దేవుని “యొద్ద” ఉండెను. తెలుగులో “యొద్ద" అనే మాట పూర్తి అర్థాన్ని ఇవ్వడంలేదు. గ్రీకు భాషలో “యొద్ద", దగ్గర అనే అర్థాన్నిచ్చే మాటలు మూడు ఉన్నాయి. (1) సున్ (Sun) “తో” అనే అర్థాన్ని పొందడానికి వాడబడుతుంది. (2) మెటా (Meta) “సమాంతరంగా” అనే అర్థం కోసం వాడబడుతుంది. (3) ప్రోస్ (Pros) "ముఖాముఖి” సంబంధం లేదా “ఏకీభవించిన లేదా ఏకమై ఉన్నా" అనే భావం కోసం వాడబడుతుంది. ఈ వచనంలో ప్రోస్ అనే పదం వాడబడింది. అనగా దేవునితో ఏకమై ఉన్న వాక్యం అనగా దేవుడు.- యోహాను 1:18 - ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.

• రోమా 9:5 - శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడై యుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు.

తీతు 2:13 - మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు.

2వ పేతురు 1:1 - మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి

హెబ్రీ 1:8-10 - ఈ భాగములో యెహోవా దేవుడు తన కుమారుని దేవా అని సంబోధించుచున్నాడు.

• 1వ యోహాను 5:20,21 - మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారిపై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయన నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.

• ప్రకటన 1:8 - వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.

• యోహాను 20:28 - అందుకు తోమా ఆయనతో - నా ప్రభువా, నా దేవా అనెను.

2.2. దైవనామములు :

దేవునికి మాత్రమే చెందవలసిన పేర్లు, బిరుదులు క్రీస్తు ప్రభువుకు కూడ చెంది ఉన్నవి. దేవుడు ఏ పేర్లతో పిలువబడినాడో క్రీస్తుకూడ అదే పేర్లతో పిలువబడినాడు. ఈ పేర్లు దేవుడు మాత్రమే కలిగి ఉండగలడు. కాని అవి యేసు క్రీస్తుకు కూడ అన్వయించబడినవి.

 

2.2.1. ప్రభువు (కురియోస్) :

 

కురియోస్ అనగా గ్రీకు భాషలో ప్రభువు అని అర్థము. కురియోస్ అనేమాట. “యెహోవా” అనే మాటకు మారుగా గ్రీకు పాతనిబంధనలో వాడబడింది. (గ్రీకు పాత నిబంధనను “సెప్టువజింట్” అంటారు). యేసుప్రభువు భూమిపై జీవించిన కాలంలో ఈమాట బహుళ ప్రచారంలో ఉంది. యెహోవా నామాన్ని గ్రీకులో అనువదించలేక దానికి ప్రత్యమ్నాయంగా కురియోస్ (ప్రభువు) అనేక పదాన్ని సుమారు 6,814 సార్లు గ్రీకు పాతనిబంధనలో ఉపయోగించారు. కాబట్టి గ్రీకు భాష మాట్లాడే యూదులకు - ప్రభువు (కురియోస్) - అనేమాట యొక్క అర్థము, దాని గంభీరత తెలుసు, ఆ దినాలలో వారు యేసును ప్రభువు అనే సంబోధించారు. లూకా 2:11 ; 2:15 ; 1:45 ;మత్తయి 3:3; 22:44; యెషయా 40:3; కీర్తన 110:1; 1 కొరింథీ. 8:6; 12:3; హెబ్రీ 1:10-12; ప్రకటన 19:16 లను పోల్చిచూడండి.

 

2.2.2. యెహోవా :

 

జకర్యా 12:10 లో యెహోవా దేవుడు తన ప్రజలతో తాము పొడిచిన నామీద అని చెపుతున్నాడు. పొడవబడింది యేసుప్రభువే. ప్రకటన 1:7 లో కూడ అదే భాష వాడబడింది. యెషయా 40:3 లో బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి ప్రవచిస్తూ అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అనే స్వరం అని చెప్పబడింది. దీనినే యేసుప్రభువు విషయంలో యోహాను 1:23 వచనంలో యోహాను ప్రస్తావించాడు. పై పేరాలో వ్రాసినట్లుగా యెహోవా అనేమట గ్రీకులో కురియోస్ (ప్రభువు) అని అనువదించబడినది.

 

2.2.3. లోగాస్ (వాక్కు):

 

యోహాను 1:1 లో యేసును “లోగాస్” అని పిలిచాడు. అనగా వాక్కు గ్రీకు భాష మాట్లాడే యూదులు “లోగాస్” అంటే “యెహోవా” లేదా “దేవుడు” అని గ్రహించగలరు. కీర్తన 33:6 లో యెహోవా వాక్కుచేత ఆకాశములు గలిగెను. అని తెలుపబడింది. ఆదికాండము 1:1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అని తేటతెల్లం చేయబడింది.

 

2.2.4. సర్వాధికారి:

 

ప్రకటన 1:8

 

2.2.5. అల్ఫా ఒమేగా :

 

ప్రకటన 21:6

 

2.2.6. నిత్యుడగు తండ్రి :

 

యెషయా 9:6 తండ్రి అంటే త్రిత్వములోని మొదటి వ్యక్తియగు తండ్రియైన దేవుడని అర్థము చేసుకోకూడదు. ఇక్కడ తండ్రి అంటే జీవాన్నిచ్చేవాడని, సృష్టికర్తయని అర్థము చేసుకోవాలి.

 

2.2.7. పరిశుద్దుడు :

 

అ.కా. 4:30; మార్కు 1:24; యెషయా 41:14; హో షేయ 11:9. దేవుడు ఒక్కడే పరిశద్ధుడు. మరి ఇంకెవ్వరునూ పరిశుద్దులు కారు. కాని యేసుక్రీస్తు  పరిశుద్ధుడు. అనగా దేవుడు.

 

2.2.8. న్యాయాధిపతి :

 

మీకా 5:1; ; అ.కా. 10:42

 

2.2.9. రాజులకు రాజు :

 

ప్రకటన 17:14 ప్రకటన 19:16

 

2.2.10. ప్రభువులకు ప్రభువు :

 

ప్రకటన 19:16

 

2.2.11. బలవంతుడైన దేవుడు :

 

యెషయా 10:5,6 యెషయా 9:6; యెషయా 63:1

 

2.2.12. మహిమా స్వరూపియగు ప్రభువు:

 

1 కొరింథి 2:8; కీర్తన 24:8-10

2.3. దైవ లక్షణాలు :

యేసుప్రభువు యొక్క వ్యక్తిత్వంలో దైవలక్షణాలు లేదా గుణగణాలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఈ గుణశీలాలు కేవలం దేవునికి మాత్రమే పరిమితం, దేవుడు తప్ప సృజింపబడింది. ఏది కూడ దేవదూత అయినా, మానవుడు అయినా ఈ లక్షణాలు మూర్తీభవించినవారు కారు. దేవుని ఈ గుణగణాలను దేవునికి తప్ప మరి ఎవరికి ఆపాదించిన అది దైవదూషణే అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు కనుకనే దేవునికే స్వంతమయిన గుణశీలాలను కూడ కలిగి ఉన్నాడు అన్నది నిర్వివాదాంశం.

 

2.3.1. స్వయంభవుడు (self-existent) :

 

దేవుడు “స్వయంభవుడు” అనగా తనంతట తానే కలవాడు. స్వయంభవత్వం వలన దేవుడు సర్వ స్వతంత్రుడు. దేవుడు ఎవరిమీద ఆధారపడడు. పరాధీనుడు కాదు. క్రీస్తు ప్రభువు స్వయంభవుడు. యోహాను 5:26 లో యేసుప్రభువు బహుతేటగా ఈ విషయాన్ని వెల్లడిచేశాడు. “తండ్రి ఏలాగు తనంతట తానే జీవంగలవాడై యున్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవంగలవాడై యుండుటకు అధికారం అనుగ్రహించాడు”. తండ్రియైన యెహోవా దేవుడు ఎలాంటి వ్యక్తి, కుమారుడైన యేసుకూడ అలాంటి వ్యక్తియే అని మనం గ్రహించాలి. క్రీస్తు తన జీవాన్ని తండ్రి నుండి గ్రహించలేదు. లేదా తండ్రి కుమారుని లోనికి తన జీవాన్ని ప్రవేశపెట్టలేదు. యేసుక్రీస్తు తనంతటతానే జీవాన్ని గలిగి ఉన్నాడు. కాబట్టే కుమారుడు జీవప్రదాత. ఒకరినుండి జీవాన్ని గ్రహించిన వ్యక్తి దాన్ని ఇతరులకు ప్రసాదించలేడు. యేసుక్రీస్తు ప్రభువు స్వయంభవుడు.

 

2.3.2. నిర్వికారుడు (Immutable) :

 

దేవుడు నిర్వికారుడు. దేవుడు వికారములేని వాడు అనగా చపలుడు కాదు స్థిరుడు. మార్పులేనివాడు. దేవునిలో వ్యత్యాసంలేదు. ఆయనలో చంచలత్వంలేదు. గమనాగమనాల వలన కలుగు ఛాయలేదు. ఈ లక్షణాన్ని బట్టి దేవునిలోని దైవత్వం నీరసించేది కాదు, క్షయమయ్యేది కాదు, కృశించిపొయేదికాదు. హెబ్రీ 1:11-12 దేవుడు సదా నిలిచి ఉండేవాడు. ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. ఈ మాటలు దేవుడు కాకతాళీయంగా పలుకలేదు. కాని తన కుమారుని తోనే చెప్పాడు. కుమారుడైన యేసుక్రీస్తు నిర్వికారుడు. యేసుక్రీస్తు శరీరధారి కాకమునుపు, శరీరధారిగా ఉన్నప్పుడు, ఇప్పుడు రాబోయే యుగములలో కూడా ఒకేరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8. యేసుక్రీస్తు నిన్న, నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయనలో ఏమార్పులేదు. దైవలక్షణాలన్ని పుణికి పుచ్చుకొనే ఉన్నాడు. ఆయన దైవత్వానికి మానవత్వం కలుపబడిందేతప్ప, దైవత్వంలో ఏదీ కొదువ కాలేదు. ఆయన నిరంతరం ఏకరీతిగానే ఉన్నాడు.

 

2.3.3. నిత్యుడు (Eternal) :

 

దేవుడు నిత్యుడు, ఆయన నిత్యత్వం కలవాడు. దేవునికి ప్రారంభంలేదు. ఆయనే ఆది, ఆరంభం, మొదటివాడు దేవునికి అంతములేదు. ఆయనే అంతం, ముగింపు, కడపటివాడు, దేవుడు కాలపరిమితి లేనివాడు. కాలాతీతుడు, కాలానికి అందనివాడు యేసుక్రీస్తు నిత్యుడు, ఆయనే కాలాన్ని సమయాన్ని సృజించాడు. “నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను” యోహాను 8:58. పేతురు తన రెండవ పత్రిక 3:8 లో అన్నాడు ప్రభువు దృష్టికి ఒక దినం వేయి సంవత్సరాలవలెను లేక వేయి సంవత్సరాలు ఒక దినంగాను ఉన్నాయి ప్రకటన 1:8. “అల్పాయు, ఒమేగాయు నేను, వర్తమాన, భూత, భవిష్యత్కాలములలో ఉన్నవాడను నేనే అని సర్వాధికారియు, దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు.” యేసుక్రీస్తు ప్రభువు కాలాతీతుడు. ఆయన సర్వకాలములలో ఉన్నవాడు. ప్రకటన 4:8,9; యుగయుగాలకు జీవించుచున్నవాడు. అల్ఫా ఒమేగా అనునవి గ్రీకు అక్షరములు. అల్ఫా మొదటి అక్షరము ఒమేగా ఆఖరి అక్షరము అనగా యేసుకు ముందు ఏది కూడలేదు. అంతేకాదు ఆయన తరువాత ఏదీ ఉండదు. దాని భావం యేసుక్రీస్తు నిత్యుడు.

 

2.3.4. పరిశుద్దుడు (Holy) :

 

దేవుడు పరిశుద్దుడు, దేవునిలో ఏ పాపం లేదు. ఆయన పాపరహితుడు. యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్దుడు, పాపరహితుడు, నిర్దోషి, నిర్మలుడు, నిష్కల్మషుడు హెబ్రీ 7:26 . అ.కా. 4:28-30 - “పరిశుద్ద సేవకుడైన యేసు” మార్కు 1:24 . “దేవుని పరిశుద్ధుడవు” ( 1 పేతురు 1:19 ). యేసురక్తము నిర్దోషమైనది నిష్కళంకమైనది. యేసుప్రభువు పరిశుద్దుడు కాకపోతే మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగదు. “మీరు పరిశుద్దుడును, నీతిమంతుడైన వానిని నిరాకరించి” అ.కా. 3:14. “మీరు పరిశుద్దునివలన”. 1 యోహాను 2:20 , “సత్యస్వరూపియగు పరిశుద్దుడు” ప్రకటన 3:7 .

 

2.3.5 సార్వభౌముడు (Sovereignty) :

 

అనగా సర్వాధికారం గలవాడని అర్థం. ప్రకటన 19:6-7 “సర్వాధికారియు...” ఆయన సృష్టికర్త కనుక సర్వాధికారం కలిగిన వాడైయున్నాడు. యేసుప్రభువు సర్వాధికారియైన దేవుడు.
యోహాను 10:17,18 “నా ప్రాణము పెట్టుచున్నాను... దాని పెట్టుటకు తీసికొనుటకు నాకు అధికారం కలదు.”

 

2.3.6. సర్వశక్తిమంతుడు (Omnipotent) :

 

యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు. ఆయన తన శక్తిని వినయోగించడానికి, ఏ పనికీ ఎవరి ఆధారం, అవసరం, సహకారం అక్కరలేదు. ఎవరి సహాయం అవసరంలేదు. యేసుక్రీస్తు భూమిమీద ఉన్నప్పుడు తన శక్తిని ప్రదర్శించాడు. లూకా 7:14,15;
మత్తయి 9:29,30 మార్కు 1:40-42; , లూకా 8:54-55; , యోహాను 11:43-44;, మత్తయి 8:26-27 .

 

2.3.7. సర్వవ్యాపి (Omnipresent) :

 

యేసుక్రీస్తు సర్వవ్యాప్తి. ఆయన సర్వవేళల్లోను, సర్వస్థలాల్లోను, ఏకకాలంలో ఉండగలడు. ఆయనను అడ్డగించగలిగిన దేమిలేదు. మత్తయి 18:20; 28:20; యోహాను 14:20; ఎఫెసీ 1:23 యేసుక్రీస్తు ప్రభువు సమస్తమును పూర్తిగా నింపు సంపూర్ణుడు, యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యాపి. (సర్వాంతర్యామి అనే మాటను ఇక్కడ నేను వాడలేదు. సర్వాంతర్యామి అనగా అన్నింటిలో వ్యాపించి యున్నవాడు. కాని దేవుడు అన్నింటిలో లేడు రాళ్ళల్లో చెట్లల్లో ఆయన ఉండడు. సర్వవ్యాపి అంటే అన్నిస్థలాల్లో ఉన్నవాడు. అంతేకాని ఆయన అంతర్యామి కాదు).

 

2.3.8. సర్వజ్ఞాని (Omniscient) :

 

యేసుక్రీస్తు ప్రభువు సర్వజ్ఞాని. ఆయన సమస్తాన్ని ఎరుగును. ప్రతి వ్యక్తిని ఎరుగును. భూత, వర్తమాన, భవిష్యత్కా లాలలోని సంభవాలన్ని ఎరుగును. ఆయన జ్ఞానం మితిలేనిది. పరిమితులు లేనిది. రోమా 7:10.యేసుక్రీస్తు మనుష్యుల రహస్య జీవితాన్ని ఎరుగును. యోహాను 1:48. దూరంగా ఉన్న వ్యక్తులు ఏమి చేస్తున్నది ప్రభువు ఎరుగును. యోహాను 2:24-25 . రహస్య ఆలోచనలు ఎరుగును. లూకా 5:22 యేసుక్రీస్తుకు మనుష్యుల హృదయాలు, వారి మనస్సులలో ఏమున్నదో, వారి ఆలోచనలు తెలియును. యేసుకు సంభవించబోయే సంగతులు ప్రతిచిన్నవి కూడా క్షుణ్ణంగా తెలుసు. లూకా 22:10-12 . మానవులు భవిష్యత్తులో వారు దేనిని ఎన్నిక చేసుకుంటారో ప్రభువుకు తెలుసు. ఆయన యందు ఎవరు విశ్వాసముంచుతారో, ఎవరు ఆయనను తృణీకరిస్తారో కూడా ఆయన ఎరుగును. యోహాను 6:64 . యేసుక్రీస్తు సమస్తము ఎరుగును. ఆయనకు మరుగై ఉన్నదేది కూడ లేదు. ఆయన యందు సమస్తమైన జ్ఞాన సంపదలు గుప్తమై ఉన్నవి. యోహాను 16:30,కొలొస్స 2:3 .

 

2.3.9. సత్యసంధత్వం (Truthfulness) :

 

దేవుని సత్యసంధత్వం అనగా దేవుని జ్ఞానం, దేవుని మాటలు, క్రియలు, సత్యమైనవి, మరియు సత్యానికి ప్రామాణికమైనవి అని అర్థం. ఆయనలో అబద్దంలేదు. ఆయనే సత్యం, యోహాను 14:6 నేను సత్యము. “యేసుప్రభువు నేను సత్యాన్ని అని ఎలుగెత్తిచాటాడు. యోహాను 17:17 , యోహాను 1:1-14 వాక్యం అనగా దైవ వాక్కే అనగా సత్యము. యేసుప్రభువు వాక్యము అనగా సత్యము 1వ యోహాను 2:8 యోహాను 1:9 సత్యమునకు వెలుగు పర్యాయపదంగా వాడబడింది. చీకటి అనగా అబద్దం. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఆయన సత్యము అనగా యేసుక్రీస్తు  క్రియలు, మాటలు, జ్ఞానము, ప్రణాళికలు, సంకల్పాలు అన్నీ కూడా సత్యమే. (ఆయన సత్యవంతుడు కనుక నమ్మకమైన వాడు ఆయనే. సత్యము కనుక న్యాయాధిపతియైనాడు. ఆయన తీర్పులు సత్యము ప్రకటన 3:7... సత్యస్వరూపియగు పరిశుద్దుడు, (పరిశుద్దుడు సత్యవంతుడై ఉండాలి). యేసుక్రీస్తు సత్యస్వరూపి. వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సత్యమునకు భౌతికరూపం యేసుక్రీస్తు, సత్యమునకు సంపూర్ణత యేసుప్రభువు. ప్రకటన 3:14 . యేసుక్రీస్తు సత్యసాక్షి యేసుక్రీస్తు  ప్రభువు తన గురించి తను చెప్పుకొనిన సాక్ష్యం సత్యం..

 

2.3.10. ప్రేమ (Love) :

 

దేవుడు ప్రేమాస్వరూపి. యేసుక్రీస్తు ప్రభువు ప్రేమామయుడు. దేవుని ప్రేమ అనగా ఆయన తన్నుతాను అర్పించుకొనుట. యేసుప్రభువు తన్నుతాను మానవాళి కొరకు బలి అర్పణ గావించాడు. యోహాను 13:1 ప్రేమించాడు. అంతం వరకు ప్రేమించాడు. 1 యోహాను 3:16. మన కొరకు ప్రాణం పెట్టాడు గనుక ఆయన ప్రేమ ఎట్టిదో అర్థం చేసికొనవచ్చు. గలతీ 2:20. ప్రేమించి తన్నుతాను అప్పగించుకొన్న దేవుని కుమారుడు.

2.4. దైవ కృత్యాలు (Divine offices) :

దేవుడు మాత్రమే చేయగలిగే కార్యాలను యేసుప్రభువు చేశాడు..

 

2.4.1. సృష్టించుట (Creation) :

 

యేసుప్రభువు సృష్టికర్త, సృష్టించబడిన వ్యక్తి సృష్టి చేయలేడు. హెబ్రీ 1:10, యోహాను 1:3 కొలస్సీ 1:16 దేవుని కుమారుడే నిత్యవాక్యము. ఆయనే ప్రభువు, సృష్టికర్త.

 

2.4.2. పాపక్షమాపణ(Forgiveness of sins):

 

యేసుక్రీస్తు ప్రభువు పక్ష వాయువు గలవాన్ని బాగుచేసినపుడు నీ పాపాలు క్షమించబడ్డాయని వానితో చెప్పాడు. అప్పుడు అక్కడున్నవారు దేవుడు ఒక్కడే గదా పాపాలు క్షమించగల సమర్థుడు. ఈయన దైవదూషణ చేస్తున్నాడని సణుక్కొన్నారు. అప్పుడు ప్రభువు తనకు పాపాలను క్షమించే అధికారం ఉంది అని నిక్కచ్చిగా చెప్పారు. మార్కు 2:5-10,లూకా 7:48, ప్రకటన 1:6.

 

2.4.3. నిర్వాహకుడు (Preserver) :

 

దేవుడు సృష్టికర్త మాత్రమే కాదుకాని, సృష్టిని భద్రపరచి, సంరక్షించి, పోషించి, నిర్వహిస్తున్నవాడు. హెబ్రీ 1:2-4 . యేసుక్రీస్తు తన మహత్తుగలమాటచేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు.

 

2.4.4. నిత్యజీవప్రదాత (Everlasting Life giver) :

 

దేవుడు నిత్యుడు, ఆయనలోని జీవం నిత్యం నిలిచేది. మానవులకు ఆయన నిత్యజీవాన్ని ప్రసాదిస్తాడు.యోహాను 10:28,యోహాను 17:2 యేసుక్రీస్తు నిత్యజీవాన్ని తనయందు విశ్వాసముంచు వారికి ప్రసాదించును.

 

2.4.5. పునరుత్థానం కలుగజేయుట (Ressurector) :

 

మృతులను సజీవులుగా చేయగల వాడు దేవుడు. యోహాను 6:39 యోహాను 6:44 “అంత్యదినమందు యేసుక్రీస్తు ప్రభువు మృతులను తిరిగి లేపును”.

 

2.4.6. న్యాయాధిపతి (Judge):

 

దేవుడు న్యాయాధిపతి. అందరికి న్యాయం తీర్చువాడు. 2 తిమోతి 4:1. యేసుక్రీస్తు ప్రభువు సజీవులకును, మృతులకును తీర్పుతీర్చువాడు. రోమా 2:16. యేసుక్రీస్తు మనుష్యులు చేసెడి రహస్యకార్యాలకు తీర్పుతీర్చును. 2 కొరింథీ 5:10. విశ్వాసులకు ఆయన తీర్పుతీర్చును. ప్రకటన 20:12 ప్రభువు మృతులైన పాపులకు తీర్పుతీర్చును.

 

2.4.7. రూపాంతరపర్చువాడు (Transformer) :

 

శరీరాలను రూపాంతర పరచువాడు దేవుడు మాత్రమే. మన మట్టి శరీరాలను మహిమ శరీరాలుగా రూపాంతపరచగలడు. ఫిలిప్పీ 3:21. యేసుక్రీస్తు విశ్వాసుల హీనమైన మట్టి శరీరాలను మహిమగల శరీరాలుగా మార్చగలడు.

 

2.4.8. సమస్తాన్ని లోపరుచుకొనుట (subduer) :

 

దేవుడు మాత్రమే సమస్తాన్ని తనకు లోపరచుకోగలడు. అది దేవునికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఫిలిప్పీ 3:21. యేసుక్రీస్తు సమస్తాన్ని తనకు లోపరచుకొన శక్తిగలవాడు.

 

2.4.9. పరిశుద్దాత్మను పంపుట (Sending the Holy Spirit) :

 

యోహాను 14:16లో తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహించును అని ప్రభువు చెప్పారు. అనగా పరిశుద్దాత్మను పంపు పని దేవునిదే. దేవుడు కాని వ్యక్తి పరిశుద్దాత్మను పంపలేడు. 26 వ వచనములో తండ్రి నా నామమున పరిశుద్దాత్మను పంపుతాడు. అని ప్రభువు చెప్పాడు. యోహాను 15:26 లో “తండ్రి యొద్దనుండి మీ యొద్దకు నేను సత్యస్వరూపియైన ఆత్మ లేదా ఆదరణకర్తను పంపుదును” అని ప్రభువు చెప్పాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు తానే పరిశుద్దాత్మను ఈ లోకములోనికి పంపుతున్నట్టుగా స్వయంగా చెప్పాడు.

 

2.4.10. లయం చేయుట (Destroyer) :

 

హెబ్రీ 1:10-12 ప్రకటన 21:5, యేసుప్రభువు ఈ సృష్టి అంతటిని లయపర్చి నూతన సృష్టిని చేయబోతున్నాడు. సృష్టికర్తయే లయకర్త. దేవుడే లయకర్త.
ఈ పది కృత్యాలు దేవుడే నిర్వహించగలడు. మనుష్యులుగాని దేవదూతలు కాని ఈ కార్యాలు చేయలేరు. యేసుక్రీస్తు దేవుడు కనుకనే ఈ కార్యాలన్ని చేయగలడు.

2.5.పాతనిబంధన గ్రంథంలో యెహోవా దేవునికే చెందిన నామధేయాలు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు ఆపాదించబడ్డాయి:

పాత నిబంధన గ్రంథంలో యెహోవా దేవునికి చెందిన అనేక వాక్యభాగాల్ని క్రొత్త నిబంధన గ్రంథకర్తలు యేసుక్రీస్తు ప్రభువుకు అన్వయింపజేశారు. దేవుడు తన మహిమను ఎవ్వరికీ చెందనీయడు. యెహోవా దేవుని గూర్చి పలుకబడ్డవి యేసు క్రీస్తుకు అన్వయింపచేయుటలో క్రొత్త నిబంధన రచయితలు యేసుక్రీస్తును దేవుడని నమ్మినారు. పాత నిబంధన గ్రంథంలోని క్రైస్తవ సిద్ధాంతము, ఆలోచన, అంశములకు కేంద్రం యెహోవా అయితే, క్రొత్త నిబంధనలో వీటికి కేంద్రము యేసుక్రీస్తు ప్రభువే అనగా పాత నిబంధన దేవుడు యెహోవా అని, క్రొత్త నిబంధన దేవుడు యేసుక్రీస్తుని తప్పుగా భావించకూడదు. అది భిన్నమైన బోధ (Heresey) పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలోను యెహోవాయే దేవుడు. పాత నిబంధనలోను, నూతన నిబంధనలోను యేసుక్రీస్తే దేవుడు.

 

2.5.1. మంచికాపరి :

 

యెహెజ్కేలు 34:11-12, యోహాను 10:14 ; లూకా 19:10 పాత నిబంధనలో తప్పిపోయిన ఇశ్రాయేలీయులనే గొర్రెలను వెదకి రక్షించే యెహోవాయే యేసుక్రీస్తు.

 

2.5.2. మార్పులేని ప్రభువు :

 

కీర్తన 102:24-27, హెబ్రీ 1:10-12 పోల్చిచూడండి. దేవుని మార్పులేని లక్షణాన్ని జ్ఞాపకం చేసికొంటూ రచించబడిన కీర్తన ఇది. యేసుక్రీస్తు మార్పులేని లక్షణాన్ని సూచించుటకు వాడబడింది.

 

2.5.3. మహిమ ప్రభువు :

 

యెషయా 6:1-3 యోహాను 12:37-41 పోల్చి చూడండి. యెషయా చూచినది యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమయే అని యోహాను తేటతెల్లం చేయుచున్నాడు.

 

2.5.4. ఇశ్రాయేలు ప్రభువు - మెస్సియా :

 

యెషయా 40:3-4 ; మత్తయి 3:8 , లూకా 1:68-70 ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. బాప్తీస్మమిచ్చు యోహాను అరణ్యంలోని కేకవంటివాడు. యెహోవాకు ముందు ఆయన రాయబారిగా వెళ్ళాలి. యెషయా ప్రవచనం యేసుక్రీస్తు విషయమై నెరవేరినట్లు మనం గమనించగలం.

 

2.5.5 ఇశ్రాయేలును తొట్రిల్ల చేయు బండ :

 

యెషయా 8:13-14 1వ పేతురు 2:7-8 రోమా 9:33 యెహోవాను బట్టి ఇశ్రాయేలు అభ్యంతరపడి తొట్రుపడుతుందని యెషయా ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరినట్లుగా చూడగలం.

 

2.5.6. అంతరింద్రియాలను ఎరుగు దేవుడు :

 

యిర్మియా 11:20;యిర్మియా17:10;ప్రకటన 2:23 . పాతనిబంధ గ్రంధంలో యెహోవా ఇశ్రాయేలు అంతరింద్రియాల్ని పరీక్షించి దానికి తగిన ప్రతి ఫలాన్ని దయచేస్తే అదేపని యేసుక్రీస్తు సంఘాల విషయంలో క్రొత్త నిబంధనలో చేస్తున్నాడు.

 

2.5.7. ఇశ్రాయేలు మహిమ (వెలుగు) :

 

జకర్యా 2:5 ; యెషయా 60:19 ;లూకా 2:32 సుమయోను శిశువుగా ఉన్న యేసును ఎత్తుకొని స్తుతిస్తూ, యేసును మహిమగాను, వెలుగుగాను అభివర్ణిస్తున్నాడు.

 

2.5.8. ఇశ్రాయేలు శోధించిన ప్రభువు :

 

సంఖ్యా 21:6-7 ; 1 కొరింధు. 10:9 అరణ్యంలో ఇశ్రాయేలీయులు యెహోవా దేవున్ని శోధించి శ్రమపరచబడ్డారు. అయితే పౌలు ఆ సంఘటనను యేసుక్రీస్తుకి అన్వయింప చేస్తున్నాడు.

 

2.5.9. మొదటివాడు కడపటివాడు :

 

యెషయా 44:6 లో యెహోవా తనను గూర్చి “మొదటివాడను కడపటివాడను” అని చెప్పుకున్నాడు. ప్రకటన 1:18 లో యేసుప్రభువు తనకు తానే అవే మాటలను ఆపాదించుకున్నాడు.

 

2.5.10. నేను ఉన్నవాడను :

 

నిర్గమ 3:14 లో యెహోవా తనను మోషేకు పరిచయం చేసుకుంటూ తాను ‘ఉన్నవాడను' అని చెప్పాడు. యేసుప్రభువు తనను యూదులకు పరిచయం చేసుకుంటూ “అబ్రహాము పుట్టకమునుపే నేను ఉన్నాను అని నిశ్చయముగా చెప్పుచున్నానని అనెను”. యూదులకు యేసుప్రభువు తాను యెహోవాను అని చెప్పుకొని నందున కోపగించి రాళ్ళతో కొట్టే ప్రయత్నం చేశారు. యోహాను 8:58,59.

 

2.5.11. ఏకరీతిగా ఉండువాడు :

 

కీర్తన 102:26-27 లో యెహోవాను గూర్చి సంబోధించబడిన మాటలు హెబ్రీ 1:11-12 లో యేసుప్రభువుకు ఆపాదించబడినవి.

 

2.5.12. యెహోవా పరిశుద్దుడు :

 

యెషయా 8:13 లో “యెహోవాయే పరిశుద్దుడు” అనే మాటను పేతురు తన 1 పేతురు 1:14-16 లో యేసుప్రభువుకు అన్వయించుచున్నాడు.

 

2.5.13. యెహోవాను గూర్చిన వర్ణన :

 

యెహె 43:2 ; దాని యెహోవాను10:6 లోని యెహోవాను గూర్చిన వర్ణన ప్రకటన 1:13-16 లో యేసు ప్రభువుకు ఆపాదించబడినది.

 

2.5.14. ప్రతి మోకాలు వంగును :

 

యెషయా 45:23 లో యెహోవా యెదుట “ప్రతి మోకాలును వంగును” అని చెప్పబడిన మాటలు ఫిలిప్పీ 2:9-11 లో యేసు ప్రభువును గూర్చియు చెప్పబడినవి.

 

2.5.15. సృష్టించుట :

 

కీర్తన 102:24-27 లో యెహోవా దేవుడు చేసినట్లుగా చెప్పబడిన పని యేసు ప్రభువు చేసినట్లుగా హెబ్రీ 1:10-12 లో చదువుతాము.

 

2.5.16. యెహోవా నామమున ప్రా ర్థించువారు రక్షణ పొందుట :

 

యోవేలు 2:32 లో చెప్పబడిన “యెహోవా నామమున ప్రార్థన చేయువారు రక్షణ పొందుదురు” అను మాటలను అ.కా. 2:21లో పేతురు; రోమా 10:13 లో పౌలు యేసుప్రభువుకు ఆపాదించుచున్నారు.

 

2.5.17. బాప్తీస్మమిచ్చు యోహాను ప్రకటన :

 

యెషయా 40:3 లో యెహోవాను గూర్చిన ప్రకటన మత్తయి 3:3 లో బాప్తీస్మమిచ్చు యోహాను యేసుప్రభువును గూర్చి ప్రకటించాడు.

 

2.5.18. యెహోవా దేవుని విశ్వాస్యత :

 

యెషయా 28:16 లో “యెహోవా యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు” అని వ్రాయబడిన వాక్యాన్ని పౌలు, పేతురులు యేసుప్రభువుకు ఆపాదించారు. రోమా 9:33; రోమా 10:11;1 పేతురు 2:6.

 

2.5.19. ఇశ్రాయేలీయుల అవిశ్వాసము :

 

యోహాను 12:40 లో యేసుప్రభువు మాటలను ఇశ్రాయేలీయులు తృణీకరించినప్పుడు యెషయా 6:10 లో మాటలను యోహాను ఉటంకించినాడు.

 

2.5.20. యేసుప్రభువు విజయము :

 

కీర్తన 68:18 లో 'చెరను చేరగా తీసుకొని పోయెను” అని యెహోవాను గూర్చిన చెప్పబడిన మాటలు యేసుక్రీస్తువే అని ఎఫెసీ 4:8 లో పౌలు చెబుతున్నాడు.

 

2.6. తండ్రి కుమారుల ఏకత్వం :

 

నూతన నిబంధనలో తండ్రి పేరుతోపాటు కుమారుని పేరు కలుపబడింది. పౌలు తన లేఖలన్నింటిలో తండ్రి కుమారులిద్దరి నామమున శుభములు తెలియజేశాడు. రోమా 1:1 ; 1 కొరింథు 1:3 ; ఎఫెసీ 1:2. పేతురు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. 2 పేతురు 1:1.యోహాను కూడా తండ్రి కుమారుల సహవాసం విషయమై ప్రస్తావించాడు. 1 యోహాను 1:3. యూదాకూడా తండ్రి కుమారుల్ని కలిపే మాట్లాడుచున్నాడు. యూదా మొదటి వచనం యేసుప్రభువు తనను, తండ్రినీ కలుపుకొని మాట్లాడినాడు. యోహాను 14:23, మేము అనగా దేవుడు మరియు యేసు. యేసు ప్రభువు తనయందును తండ్రి యందును విశ్వాసముంచమని కోరినాడు. యోహాను 14:1 ; యోహాను 5:23. తండ్రిని ఘనపరచు ప్రతివాడు యేసు ప్రభువును ఘనపరచాలి. యోహాను 17:3. దేవుని ఎరుగుట, క్రీస్తు ఎరుగుట రెండును ఒకటే. దేవుని ఎరగడం క్రీస్తును ఎరగడం నిత్యజీవం. నిత్యజీవం దేవుడు మాత్రమే కలిగి ఉండగలడు. దేవుడు మాత్రమే ఇతరులకు దాన్ని దానం చేయగలడు. దేవునికి, దేవుని గొర్రెపిల్లకును కలిపి ఘనత, మహిమ, స్తుతులు ఆపాదించబడుతున్నాయి. ప్రకటన 5:13 , ప్రకటన 7:10.

 

2.7. క్రీస్తు ప్రభువుకు సమర్పించబడిన దైవారాధన :

 

దేవునికి మాత్రమే ఆరాధన చెందుతుంది. దేవుడు రోషం గలవాడు. తనకు చెందవలసిన ఆరాధనను ఇతరులకు చెందనీయడు. అయితే క్రీస్తు ప్రభువు కూడా ఆరాధింపబడినాడు. దేవుడు దీనిని అంగీకరించాడు. క్రీస్తు ప్రభువు దానిని స్వీకరించాడు.

 

2.7.1. దేవదూతల ఆరాధన :

 

హెబ్రీ 1:6 . ప్రభువు రెండవ రాకడలో దేవదూతలు ఆయన్ను ఆరాధించాలి. కీర్తన 97:7 తో పోల్చి చూడండి.

 

2.7.2. మానవుల ఆరాధన :

 

మత్తయి 14:33; మత్తయి 2:10-11 శిష్యులు, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన్ను పూజించారు.

 

2.7.3. సార్వత్రిక ఆరాధన :

 

ఫిలిప్పీ 2:9-11 ; యెషయా 45:23 ప్రతి మోకాలు యెహోవా యెదుట వంగును అని చెప్పబడిన సార్వత్రిక ఆరాధన ఫిలిప్పీ పత్రికలో యేసయ్యను గురించి చెప్పబడినది.

 

2.8. యేసుక్రీస్తు దేవునిని ప్రత్యక్షపరచుట :

 

కొలస్సీ 1:15 ఆయన అదృశ్యదేవుని స్వరూపి, దేవున్ని ఎవరూ చూడలేదు. కాని క్రీస్తు దైవస్వరూపుడు. కొలస్సీ 2:2; క్రీస్తు దేవుని యొక్క మర్మము, కొలస్సీ 2:9. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అనగా దైవ లక్షణాలు, దైవకృత్యాలు, దైవస్వభావం యేసునందు నివసిస్తున్నాయి. దైవనామాలు, దైవకృత్యాలు, దైవ లక్షణాలు, దైవారాధన మొదలైనవి శరీరధారియైన క్రీస్తు ప్రభువు దేవుడని రుజువు చేస్తున్నాయి. పాత నిబంధనలోని ఆలోచన, అంశములకు కేంద్రం యెహోవా దేవుడైతే, క్రొత్త నిబంధనలోని ఆలోచన అంశములకు కేంద్రం యేసుక్రీస్తు. పాతనిబంధన తండ్రియైన దేవుని ప్రాముఖ్యతను తెలియపరిస్తే, క్రొత్త నిబంధన కుమారుడైన దేవుని ప్రాముఖ్యత తెలియపరుస్తుంది. అందుచేత పాతనిబంధన యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధన అని; క్రొత్త నిబంధన యొక్క ఛాయ పాత నిబంధన అని చెప్పుకోవచ్చు. క్రీస్తు ప్రభువు దైవ మానవుడు.

 

3. కుమారుని యొక్క నిత్యత్వం
(ETERNALITY OF SON)

 

త్రిత్వాన్ని అంగీకరించలేని యెహోవా సాక్షులు మొదలగువారు యేసుక్రీస్తు దేవుని నిత్యత్వాన్ని నిరసిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నీత్యుడు అని బైబిలు ఘోషిస్తూ ఉంది. ఆది సంఘకాలంలో “ఏరియస్” అనే వ్యక్తి యేసు ఆది సంభూతుడే గాని నిత్యుడుకాడని బోధించి సంఘాన్ని కలవరపరిచాడు. అయితే క్రీ.శ. 325 లో నైసీన్ అనే స్థలంలో ఆది సంఘంలోని భిషప్పులందరు (కాపరులు లేదా అధ్యక్షులు లేదా పెద్దలు) ఏరియస్ సిద్ధాంతాన్ని భిన్నమైన బోధగా తీర్మానించి, ఏరియసను వెలివేశారు. యేసుక్రీస్తు యొక్క నిత్యత్వం అనే సిద్ధాంతం క్రైస్తవ విశ్వాసానికే ఆయువుపట్టు, యేసు నిత్యుడు కాకపోతే త్రిత్వం లేదు, యేసు దేవుడు కాకపోతే, మనకు నిత్య రక్షణే దొరకదు.

తెలుగు బైబిలులోని “ఆదిసంభూతుడు” అనేమాట సరియైన అనువాదం కాదు. గ్రీకులో “ప్రోటోటోకాస్” అని వ్రాయబడింది. యేసు సృష్టికి ప్రోటో టోకాస్. ప్రోటో టోకాస్ అనగా ప్రథమ హేతువు. అనగా యేసుక్రీస్తు సృష్టికి ఆదిసంభూతుడు కాదు కానీ ప్రథమ హేతువు.

3.1.నిత్యత్వం యొక్క భావం :

యేసు నిత్యుడు. ఆయన ఉన్నవాడు అని అర్థం. యేసుక్రీస్తు సృష్టిలో మొదటివాడు అనే భావన సరికాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు. ఆయన ఉనికిలోనికి రావడానికి ఎవరి సహాయం, సహకారం అవసరం లేదు. ఆయన స్వయంభవుడు, తనంతట తానే ఉన్నవాడు. యేసుక్రీస్తుకు ప్రారంభంలేదు. ఆయన అనాదిగా ఉన్నవాడు. నిత్యత్వానికి అనాది మరియు శాశ్వతకాలము పర్యాయపదాలు.

3.2. ఆయన నిత్యత్వానికి రుజువులు :

 

3.2.1. పాత నిబంధన రుజువులు :

 

మీకా 5:2 పురాతనకాలం, శాశ్వత కాలం, ఈ రెండు మాటలు ఆయన నిత్యత్వాన్ని చెబుతున్నాయి. యెషయా 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు ప్రభువు నిత్యుడగు తండ్రి.

 

3.2.2. నూతన నిబంధన రుజువులు :

 

యోహాను 1:1 ఆదియందు వాక్యం ఉండెను అనే మాట గమనింపదగినది. అనగా సృష్టించబడినది అనికాని, కలుగచేయబడినది అని కాని అర్థమిచ్చుట లేదు. యేసు కూడా నేను ఉన్నవాడను అని తనను గూర్చి ప్రకటించుకొన్నాడు. 1 యోహాను 1:1 ఆదినుండి ఉండినవాడు యేసుక్రీస్తు ప్రభువు.

3.3. యేసుక్రీస్తు దైవత్వం :

యేసుక్రీస్తు ప్రభువు దైవత్వాన్ని గురించి వెనుక అధ్యాయంలో విశదంగా చర్చించబడింది. ఆయన దైవత్వం యేసుక్రీస్తు నిత్యత్వానికి గుర్తు.

3.4. యేసుక్రీస్తు పాతనిబంధన ప్రత్యక్షతలు (Theophanies) :

“థియోస్” అనగా దేవుడు “ఫెనోయ్” (Phaneo) అనగా కనపడుట లేదా ప్రత్యక్షమగుట. ఇవి గ్రీకు మాటలు థియోఫనీలు అనగా దేవుని యొక్క ప్రత్యక్షతలు. పాతనిబంధనలోని దైవ ప్రత్యక్షతలన్నీ యేసుక్రీస్తు ప్రభువును గూర్చియే నిర్దిష్టంగా మాటలాడుచున్నాయి. అనేక ప్రత్యక్షతల్లో అతి ప్రాముఖ్యమైనవి : “యెహోవా దూత”. ఆదికాండము 16:7-18; ఆదికాండము 21:17-19 లో యేసుక్రీస్తు ప్రభువు “యెహోవాదూత”గా హాగరుకు ప్రత్యక్ష మయ్యాడు. ఆది 22:11-18 లో అబ్రాహామునకు ప్రత్యక్షమాయెను. నిర్గమ 3:2 లో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. సంఖ్యా 22:35 లో బిలామును గద్దించాడు. న్యాయా 6:11-24 లో గిద్యోనును న్యాయాధిపతిగా పిలిచాడు. న్యాయా 13:3-24 సమ్సోను జన్మను గూర్చి అతని తల్లిదండ్రులతో మాట్లాడాడు.

3.5. ఇతర సందర్భాలు :

ఆది 24:7; 40; 31:11; 32:24-32; (హోషేయ 12:4) ఆది 48:15-16; నిర్గమ 3:2 (అ.కా. 7:30–35) న్యా యాధిపతులు 2:1-4; 5:23; 2 సమూ 14:17-20; 19:27; 24:14-17; 1 రాజులు 19:5-7; 2 రాజులు 1:3,15; 19:35; 1 దిన 21:11-30; కీర్తన 34:7; 35:5-6; ప్రసంగి 5:6; యెషయా 37:36; 63:9; జెకర్యా 1:9-21; 2:3; 3:1-10; 4:1-7; 5:5-10; 6:4-5; 12:8.

యెహోవా దూత క్రీస్తు ప్రభువు శరీరధారియైన తరువాత క్రొత్త నిబంధనలో ప్రత్యక్షం కాలేదు. ఈ విషయం గమనార్హం.

3.6. యేసుక్రీస్తు యొక్క దైవనామములు :

యేసుక్రీస్తుకు అన్వయించబడిన దైవనామాల్ని గూర్చి మొదటి అధ్యాయంలో చర్చించబడింది. (1) లోగాస్ (2) దేవుని కుమారుడు (3) యెహోవా (4) ప్రభువు (5) రాజు (6) దేవుడు అనే పేర్లు యేసుక్రీస్తుకు కూడ పెట్టబడ్డాయి. ఈ పేర్లన్ని యేసు క్రీస్తు నిత్యుడు అనే విషయాన్ని తేటపరుస్తున్నాయి. దేవుడు నిత్యుడైతే యేసుక్రీస్తు నిత్యుడే. దేవుడు నిత్యుడు కాకపోతే యేసుక్రీస్తు కూడ నిత్యుడు కాడు. దేవుడు నిత్యుడు కాకపోతే దేవుడు దేవుడే కాదు.

 

 

4. కుమారునియొక్క శరీరధారణ
(INCARNATION OF SON)

 

యేసుక్రీస్తు ప్రభువు నరావతారిగా, లేదా శరీరధారిగా ఈ భూలోకంలో అవతరించాడు అన్న విషయం క్రైస్తవ సిద్ధాంతాలన్నింటికి ఆయువుపట్టు. క్రైస్తవ విశ్వాసమంతా అనగా క్రైస్తవ మత సిద్ధాంతంగాని, క్రైస్తవ మత విశ్వాసంగాని, క్రైస్తవ మత సౌవార్తిక ఉద్యమాలు గాని, క్రైస్తవ సంఘచరిత్రగాని, చివరకు నూతన నిబంధన యావత్తుకూడ యేసుక్రీస్తు ప్రభువు శరీరధారణపైనే ఆధారపడి ఉన్నాయి. దుర్బోధలు, భిన్నమైన బోధలు మొదలగు ఈ బోధలన్నీ కూడ, యేసుక్రీస్తు యొక్క శరీరధారణను గూర్చిన వివిధ అంశాల్ని కేంద్రంగా చేసుకొని పరిభ్రమిస్తున్నాయి. ఈ అధ్యాయంలో శరీరధారణకు చెందిన వాస్తవాల్ని గూర్చి తెలుసుకుందాం. 1 యోహాను 4:2-3

4.1. శరీరధారణ యొక్క భావము :

ఆత్మ స్వరూపియైన దేవుడు ఆదియందు వాక్యం అయి ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకోవడం అనే ప్రాథమిక సత్యాన్ని మనం గ్రహించాలి. నిత్యుడగు దేవుడు, కాలాతీతుడగు దేవుడు మానవ చరిత్రలోనికి, మానవ సమయంలోకి అడుగు పెట్టాడు. మనం గుర్తించవలసిన ప్రధాన విషయం ఏమంటే త్రియేక దేవుడు శరీరాన్ని ధరించలేదు. త్రియేక దేవునిలోని రెండవ వ్యక్తి అయిన కుమారుడైన దేవుడు మాత్రమే శరీరాన్ని ధరించుకొన్నాడు. తండ్రిగాని, పరిశుద్దాత్మగాని, శరీరధారిగా అవతరించి మనకై శ్రమపొంది, మరణించలేదు. అయితే కుమారుడు శరీరధారిగా అవతరించుటలో తండ్రి, పరిశుద్దాత్మలు కూడ పాలుపంచుకున్నారు. కుమారుడు తన దైవత్వానికి మానవత్వాన్ని కలుపుకున్నాడు. మానవాకృతి, ప్రాణం మరియు శరీరం కూడా, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది కొలస్సీ 2:9 .

4.2. కుమారుని శరీరధారణ ముందుగా నిర్ణయించబడింది :

నిత్యుడగు కుమారుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి రావలెనన్న విషయం జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడింది. కుమారుని శరీరధారణ త్రియేక దేవుని యొక్క ప్రణాళిక. కుమారుడు శరీరధారిగా అవతరించి ప్రోక్షించబడగా ఆ కుమారుని యందు మానవులు విమోచించబడుట ముందుగా నిర్ణయించబడింది. ఎఫెసి 1:4-7; ఎఫెసి 3:11 ; ప్రకటన 13:8 ; 1 పేతురు 1:19-21 .

4.3. కుమారుని శరీరధారణను గూర్చి ప్రవచనాలు :

కుమారుడు శరీరధారిగా అవతరించనున్నాడన్న విషయం ముందుగానే నిర్ణయించబడుట వలన ఈ విషయం పాత నిబంధనలో ప్రవచింపబడింది. శరీరధారియైన కుమారుని దైవమానవతను గురించి, కన్యక గర్భాన జన్మించాలన్న విషయం ప్రవక్తయైన యెషయా ప్రవచించాడు. యెషయా 9:6 మనకు శిశువు పుట్టెను. కుమారుడు అనుగ్రహింపబడెను. యెషయా 7:14 కన్యక గర్భవతియై కుమారుని కని...

4.4. కన్యక గర్భాన జన్మించుటలోని ఆవశ్యకత :

యేసుక్రీస్తు కన్యక గర్భాన జన్మించడం చాల ప్రాముఖ్యమైన విషయం. ఈ దినాల్లో చాలమంది మోడ్రనిస్టులు ఈ సత్యాన్ని నమ్ముటలేదు. యేసు కన్యకకు జన్మించకపోతే కలిగే నష్టాలు చాల తీవ్రమైనవి.

 

4.4.1. దైవవాక్యం అబద్దం అవుతుంది :

 

కుమారుడు కన్యకకు జన్మిస్తాడని దేవుని వాక్యం కరాఖండిగా సెలవిస్తుంది. యెషయా 7:14లో ప్రవచింపబడిన కన్యక గర్భాన దేవుడు జన్మిస్తాడు అన్న విషయాన్ని మత్తయి తన సువార్తలో ఎత్తి చూపించాడు. మత్తయి 1:20 దేవుని వాక్యం సర్వసత్యం. మరియ, యోసేపులు ఏకం కాకమునుపే మరియు పరిశుద్దాత్మ ద్వారా గర్భవతి అయింది. మత్తయి 1:18,25 అంతేకాదు ఆమెకు కుమారుడు పుట్టే వరకు ఆమెను ఎరుగడు. దేవదూత మరియకు ప్రత్యక్షమై యేసు జన్మాన్ని ప్రకటించినపుడు, మరియ నేను పురుషుని ఎరుగని దాననే అని భీతిచెందింది.

 

4.4.2. దేవుడు అబద్దీకుడు అవుతాడు :

 

దేవుడు ఆదాము హవ్వలు పాపం చేసినపుడు “స్త్రీ సంతానము” ద్వారా సైతాను క్రియల్ని లయం చేస్తాను అని వాగ్దానం చేశాడు. స్త్రీ సంతానమంటే పురుషసంతానం కాదు. బైబిలులోని వంశావళుల్ని చూస్తే అంతా పురుష, సంతానంగానే నమోదు చేయబడ్డాయి. కాని యేసు స్త్రీ సంతానం. ఆది. 3:15 యేసు కన్యకకు జన్మించకపోతే దేవుని వాగ్దానం నెరవేరదు. దేవుడు అబద్ధికుడు కాదుగదా.

 

4.4.3. యేసుక్రీస్తు పాపరాహిత్యం అబద్ధమవుతుంది :

 

యేసు కన్యకకు జన్మించకపోతే పాపరహితుడు కాలేడు. ఒకవేళ మరియ కన్యక కాకపోయి ఉండి, యేసు పురుష సంయోగం వల్ల జన్మించితే ఆదాము యొక్క పాపం యేసుక్రీస్తుపై కూడ మోపబడుతుంది. యేసుప్రభువు పరిశుద్దుడు కాలేడు. పరిశుద్ధుడు కాకపోతే మనల్ని పాపాలనుండి రక్షించలేడు. కాని యేసుప్రభువు పరిశుద్ధుడు. పాపరహితుడు పాపములనుండి రక్షించువాడు. మత్తయి 1:21-22;లూకా 1:35 .

 

4.4.4 యేసుక్రీస్తు దైవకుమారుడుగా పిలువబడుట అబద్దం అవుతుంది :

 

లూకా 1:35 యేసుక్రీస్తు బాప్తీస్మం తీసుకోగానే ఆకాశంనుండి తండ్రి స్వరం వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు. లూకా 3:22. యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాకపోతే పాతనిబంధనలోని అనేక ప్రవచనాలు నిష్ఫలమవుతాయి.

 

4.4.5. విశ్వాసుల దత్తపుత్రత్వం అబద్దమవుతుంది :

 

గలతీ 4:4 క్రీస్తు కన్యక గర్భాన జన్మించకపోతే మనం దత్త పుత్రులం కాలేము. మనం మానవపుత్రులం. దేవుని కుమారులము కాలేము. కనుకనే దేవుడు మనల్ని తన దత్తపుత్రులుగా చేసుకొన్నాడు. అది కేవలం మధ్యవర్తియగు యేసుక్రీస్తు ద్వారానే సాధ్యం. యేసుక్రీస్తుకు మానవ తండ్రి ఉన్నట్లయితే ఆయన కూడ దైవకుమారుడు కాలేడు. ఆయన ద్వారా మనం కూడ దత్తపుత్రులం కాలేము.

 

4.4.6. యేసుక్రీస్తు దైవమానవుడనుట అబద్దమవుతుంది :

 

యేసుప్రభువు సమగ్రంగా మానవుడు అదే సమయంలో సంపూర్ణంగా దేవుడు. యేసుక్రీస్తులోని మానవత్వం సమగ్రమైనది. దైవత్వం పరిపూర్ణమయింది. యేసుక్రీస్తు కన్యకకు కాకుండా మానవ తండ్రి సహాయంతో (సంయోగము) తో జన్మిస్తే ఆయనలో దైవత్వం ఉండదు. కేవలం మనిషి మాత్రమే అవుతాడు. స్త్రీ గర్భంలో కాకుండా, వేరే విధంగా ఈ లోకానికి వస్తే మానవుడు కాలేడు. దేవుడు సర్వశక్తిమంతుడు కనుక పరలోకంలోని కుమారుడు మానవుడై భూమికి రాగలడు. అలా వస్తే ఆయనను సమగ్రమైన మానవుడిగా మనం అంగీకరించలేం. కనుకనే ఆయన పురుషుని సహాయం (సంయోగం) లేకుండా కన్యక గర్భంలో దైవ మానవుడై జన్మించాడు. యోహాను 3:16; గలతీ 4:4.

4.5. కన్యక గర్భధరణ ఇశ్రాయేలీయులకు ఒక సూచన:

ఇస్సాకు, సమ్సోను, సమూయేలు, బాప్తిస్మమిచ్చు యోహానుల జన్మము దేవుని ఆశ్చర్యకార్యాలే. కాని కన్యకకు జన్మించుట అనేది ఒక సూచక క్రియ. ఆహాజు రాజు తన శత్రువులు తనను ఓడిస్తారని, దేవుడు తనకు సహాయం చేయలేడనే అపనమ్మకత్వములో ఉన్నప్పుడు దేవుడు యెషయా ద్వారా (7:14) మాట్లాడాడు. “కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపెను. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును”. ప్రస్తుత కాలమందరి మాడ్రనిస్టులు, లిబరల్స్ యేసు కన్యకు జన్మించాడని నమ్మడం లేదు. ఇది యెషయా కుమారుని గూర్చిన ప్రవచనమని వారి వాదన. నిజమే. ఆహాజు కాలానికీ యెషయా కుమారుని విషయములో ఈ ప్రవచనం కొంత నెరవేరింది. అయితే కన్యక అనే పదం, ఇమ్మానుయేలు అనే పదం యెషయా కుమారునిని దాటి వారికి నిజమైన విమోచకుడు, రక్షకుడు పుట్టాడని ఈ వాక్యం చెబుతుంది. మరియ కన్యక కాదనే వాదనకు వారు చెప్పేది, హెబ్రీ భాషలో అల్మా(AIma) అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం స్త్రీ గాని కన్యక కాదు అని వారు అంటారు. కన్యకకు హెబ్రీలో మరో మాట ఉంది. అది బేతూల (Bethula). స్త్రీ అంటే వివాహమైనది అనే ఎందుకు అనుకోవాలి స్త్రీ అంటే కన్యక కావచ్చు, వివాహిత కావచ్చు, విధవరాలు కూడా కావచ్చు కదా. “అల్మా' అనే మాట పా.నీం.7సార్లు వాడబడింది. [simple_tooltip content='8అందుకు ఫరో కుమార్తెవెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.'] నిర్గమ. 2:8 లో 'చిన్నది' అని అనవదించబడింది. మిర్యాము చిన్నది. చిన్నది అంటే కన్యక అనే కాని వివాహిత అని అనుకోలేము కదా!కీర్తన 68:24 , ప.గీ. 1:3, 6:8, సామె. 30:19 , లలో అల్మా కన్యక అనే అనువదించబడింది. రిబెక్కను గూర్చి వ్రాయబడిన వాక్యభాగములో. ఆది. 24:43లో అల్మా అని ఆది.24:16లో రెండు సార్లు బెతూల అని వ్రాయబడింది. కనుక ఆ మాటలు ఒకదానికొకటి పర్యాయపదాలు. అంతే కాదు హెబ్రీ పాత నిబంధన గ్రీకు భాషలోనికి అనువదించబడినప్పుడు హెబ్రీ - గ్రీకు భాషా పండితులు అల్మాను పార్తనోస్ (Parthenos) అని అనువదించారు. ఆ మాటకు అర్థం కన్యక.

4.6. కుమారుని శరీరధారణలో త్రిత్వము యొక్క పాత్ర :

 

4.6.1. తండ్రియగు దేవుని యొక్క పాత్ర :

 

రోమా 6:5;గలతీ 4:4 తండ్రియైన దేవుడు తన అద్వితీయ కుమారుని పాప శరీరాకారంలో పంపించాడు. తండ్రి ముందుగానే ఈ విషయాన్ని దావీదుకు వాగ్దానం చేశాడు అ.కా.2:23-30. తండ్రి కూడా కుమారునికి శరీరాన్ని అమర్చాడు. హెబ్రీ 10:5.

 

4.6.2. కుమారుడైన దేవుని పాత్ర :

 

ఫిలిప్పీ 2:7; హెబ్రీ 2:14 కుమారుడు రక్తమాంసాల్లో పాలివాడైనాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకొని మానవుని స్వరూపం ధరించాడు.

 

4.6.3. పరిశుద్దాత్మ దేవుని పాత్ర :

 

మత్తయి 1:20 ; లూకా 1:35 పరిశుద్దాత్మవలన మరియ గర్భవతి అయ్యింది. పరిశుద్దాత్మ మరియను కమ్ముకొన్నాడు. అనగా పిండము గర్భంలో రూపొందించబడుటకైన బీజమును (Zygote) పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొని ఆమెలో నాటి నాడు.

4.7. కుమారుని శరీరధారణ ఆవశ్యకత :

త్రిత్వంలోని ఒక వ్యక్తి అయిన కుమారుడు నిత్యుడగు కుమారుడు ఎందుచేత శరీరాన్ని ధరింపవలసి వచ్చిందో ! కాలాతీతుడగు దేవుడు కాలంలోనికి అడుగిడినాడు. దానికి చాలా కారణాలు ఉన్నాయి.

 

4.7.1. అదృశ్య దేవుని ప్రత్యక్ష పరచడానికి :

 

దేవున్ని ఎవరు చూచి ఉండలేదు. చూచి ఏ నరుడూ బ్రతుకజాలడు. 1 యోహాను 4:12 ; 1 తిమోతి 6:16 దేవుడు తనను తాను మానవులకు ప్రత్యక్షపరచుకోడానికి తన కుమారుని శరీరధారిగ ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి, యేసుక్రీస్తు జీవితాన్ని మనం గ్రహించినపుడు, ఆయన బోధలు అర్థం చేసుకొన్నప్పుడు, ఆయన క్రియలు గుర్తించినపుడు మనం ఆయన్ని దేవుడని తెలుసుకుంటున్నాం. అదృశ్యస్వరూపియగు దేవుడు, దృశ్యమగుటకు శరీరాన్ని ధరింపవలసివచ్చింది. యోహాను 1:18; 14:7-1 కొలస్సీ 1:15.

 

4.7.2. పాపక్షమాపణ నిమిత్తం రక్తం చిందించడానికి :

 

యోహాను 4:24దేవుడు ఆత్మ, దేవునికి రక్తమాంసాలు లేవు. ఆత్మకు మాంసము, ఎముకల ఉండవు. లూకా 24:39. దేవునికి మాంసంలేదు. కనుక రక్తం లేదు. రక్తప్రోక్షణ జరుగకుండ పాపక్షమాపణ జరగదని దేవుని వాక్యం నిర్ద్వందంగా చెపుతుంది లేవి 17:11; హెబ్రీ 9:22; 1 పేతురు 1:19 . జంతువుల రక్తము మనకు శాశ్వతమైన శుద్దిని కలిగించలేదు. కారణం వాటికి ఆత్మలేదు. మానవునికి ఆత్మ ఉన్నది. మానవుని రక్తం మానవుని పాపాన్ని రూపుమాపలేదు. కారణం మానవులందరూ పాపాత్ములే (రోమా 3:4-20). పాపరహితుడు దేవుడొక్కడే కనుక దేవుడే రక్తాన్ని చిందించాలి. శరీరాన్ని ధరించకపోతే రక్తాన్ని చిందించే అవకాశం లేదు. అందుచేత దేవుడైన కుమారుడు శరీరధారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది.

 

4.7.3. మధ్యవర్తిత్వం చేయడానికి :

 

వివాదంలో ఉన్న ఇద్దరిని సమాధాన పరచడానికి ఒక మధ్యవర్తి ఉండాలి. మధ్యవర్తిగా ఉండే వ్యక్తి ఇద్దరినీ బాగా ఎరిగినవాడై ఉండాలి. దేవునికి మానవునికి మధ్య వైరం ఉన్నది. వివాదం ఉన్నది (యెషయా 1:18; 43:26). మానవునికి, దేవునికి మధ్యవర్తిత్వం చేయగల వ్యక్తికావాలి. దేవునిపైనను, తనపైనను చేయినుంచదగిన వ్యక్తి ఉండాలని మనిషి కోరుకొంటున్నాడు. (యోబు 9:33). అదే సమయంలో దేవుడు కూడా మధ్యవర్తి ఉండాలని వాంచిస్తున్నాడు యెషయా 59:16. మానవుని, దేవుని సమాధాన పరచగలిగిన వ్యక్తి ఇద్దరినీ ఎరిగి ఉండాలి. అంటే ఆ మధ్యవర్తి దేవుడై ఉండాలి. మానవుడై ఉండాలి. ఏ మానవుడు దైవత్వాన్ని సంతరించుకోలేదు. కాని దేవుడు తనకు మానవత్వాన్ని జోడించుకోగలడు. అందుకనే ఆత్మ స్వరూపియగు కుమారుడు శరీరాన్ని ధరించవలసి వచ్చింది. హెబ్రీ 9:15 ; 1 తిమోతి 2:15 ).

 

4.7.4. శోధింపబడు వారికి సహాయం చేయ కనికరంగల ప్రధాన యాజకుడుగా ఉండుటకై :

 

మానవులమైన మనం శోధనకు గురిచేయబడేవారం. శోధనకు లోబడి పాపం చేయగలవారం. మనం శోధింపబడినప్పుడు మనకు సహాయం చేయగలవాడు కావాలి. మనవలనే శోధింపబడి పాపంలేని వాడుగా ఉన్న వ్యక్తి మనకు సహాయం చేయగలవాడు. పాపంలేని వాడుగా ఉండగలగేవాడు దేవుడే. శరీరం లేకుండా ఆయన శోధింపబడలేడు. అందువలననే ఆయన మనవంటివాడై శోధింపబడీ పాపంలేని వాడుగా ఉండి, శోధింపబడు మనకు సహాయాన్నదించి, కనికరంగల ప్రధాన యాజకుడుగా ఉన్నాడు(హెబ్రీ 2:17-18 .

 

4.7.5. మరణం జయించుట కొరకు :

 

మానవుడు పాపం చేసి మరణానికి లోబడినాడు. మరణ భయంచే జీవిస్తున్నాడు. మనిషి మరణాన్ని జయించలేడు. మానవుడు మరణం నుండి మరణంయొక్క అధికారం నుండి మరణం యొక్క బలం నుండి విడిపించబడాలి. అయితే ఆ విడుదలను ప్రసాదించగలిగిన వాడు దేవుడే మరణాన్ని ఓడించాలి అంటే ఒక వ్యక్తి మరణించి జయశీలిగా తిరిగి బ్రతికితే మరణం ఓడించబడుతుంది. ఆ పని దేవునికే సాధ్యం. ఎందుకంటే ఆయన నిత్యజీవం గలవాడు. శరీరం లేకుండా మరణించుట అసాధ్యం. కారణం ఆత్మకు మరణం లేదు. కనుకనే కుమారుడైన దేవుడు శరీరాన్ని ధరించవలసివచ్చింది. హెబ్రీ 2:14-16.

 

4.7.6. దాసత్వం నుండి విమోచించే సమీప బంధువు కావడానికి :

 

మానవుడు పాపానికి దాసుడైపోయాడు. (యోహాను 8:34; రోమా 6:16-17,20; 2 పేతురు 2:19; యెషయ 50:1;52:3 ) మనం పాపానికి అమ్మబడినాం. అమ్మబడిన దాన్ని విమోచించ కలిగిన వ్యక్తి సమీపబంధువై ఉండాలి. శక్తిగలవాడు కూడా కావాలి. అయితే ఆయన మానవుడైతేనే సమీపబంధువుగా (Kinsman) కాగలడు. కాబట్టి సమీప బంధువుగా మనల్ని విమోచించడానికీ (Kinsman-deliverer) ఆయన శరీరధారియై మానవుని స్వరూపం ధరించుకొన్నాడు. (హెబ్రీ 2:14; ఫిలిప్పీ 2:6,7.

 

4.7.7. పాపానికి శిక్ష విధించబడుట కొరకు :

 

పాపానికి నిర్ణయించబడిన శిక్ష మరణం. ఈ శిక్ష శరీరంలో విధించబడాలి. మానవుల మీదకు రావలసిన దోష శిక్షను కుమారుడు తనమీదకు తీసుకోవాలి అంటే అది ఆయన శరీరంలో విధించబడాలి. అందుకనే ఆయన శరీరధారిగా రావలసివచ్చింది. పాపానికి శిక్ష పాపానికి అలవాలమైన శరీరంలోనే విధించాలి. (రోమా 8:3,4 ).

 

4.7.8. అపవాది క్రియలను లయపరచడానికి :

 

అపవాది క్రియల్ని లయపరచడానికి ఆయన ప్రత్యక్షమైనాడు. అనగా ఈ లోకంలోకి వచ్చాడు. అనగా ఎందుకు శరీరధారియైనాడు? అపవాది క్రియల్ని లయపరచడానికి, ఆయన ఈ లోకంలోకి ఎందుకు రావాలి? పరలోకం నుండీ లయపరచలేడా? దేవునికి ఏదియు అసాధ్యం కాదు గదా? కాని, అపవాది తన క్రియల్ని ఈ లోకంలో నిర్వహిస్తున్నాడు. అపవాది తన క్రియలకు మొదటిగా ఆదామును గురిచేశాడు. అపవాది యుద్ధభూమి ఈలోకం. కాబట్టి యేసుప్రభువు కడపటి ఆదాముగా, రెండవ మనుష్యుడుగా ఈలోకంలోకి వచ్చి అపవాది క్రియల్ని లయపరచాడు. (1 యోహాను 3:8 ; ఆది 3:15 ; లూకా 10:17,18 ; హెబ్రీ 2:14 ; యోహాను 10:11 ).

 

4.7.9. విశ్వాసుల జీవన విధానానికి మాదిరిగా ఉండడానికి :

 

పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపానికి దాసులమై జీవించి, కృపద్వారా విశ్వాసంచేత రక్షించబడిన విశ్వాసులకు, ఒక మాదిరి కరమైన జీవితాన్ని దేవుడు మన ముందుంచవలెనని ఇష్టపడినాడు. నమూనా జీవితం, ఆదర్శ జీవితం దేవుడే ప్రసాదించగలడు. అందుచేత దేవుడే స్వయంగా శరీరధారిగా మనమధ్య జీవించి మనకు ఒక మాదిరిని ఇవ్వగలిగాడు. అందుకే కుమారుడైన దేవుడు శరీరధారిగా మనమధ్య అవతరించాడు. (1 పేతురు 2:21-24 ; 1 యోహాను 2:6 ).

 

4.7.10. దేవుని నిబంధన నెరవేర్చుటకు :

 

దేవుడు దావీదుతో షరతులు లేని ఏక పక్ష నిబంధన చేశాడు. దావీదు వంశంలో నుండి, దావీదు సింహాసనంపై కూర్చుండి నిరంతరం రాజ్యపాలన చేయనున్నాడు. దేవుడు ఆత్మ స్వరూపిగా ఎప్పటికీని మానవ చరిత్రను, సృష్టిని నిర్వహించుచున్నాడు. కాని సింహాసనంపై కూర్చుని రాజుగా పాలించవలెనన్న మెస్సీయ్యకు శరీరం ఉండాలి. అందుచేతనే కుమారుడు శరీరధారియై, దైవమానవుడైనాడు. (లూకా 1:31-33 ; హెబ్రీ 1:8 ,2:9 ).

 

4.7.11. విశ్వాసులను దత్తపుత్రులుగా చేయుటకు :

 

ఆదాము దేవుని కుమారుడు అనబడినాడు. (లూకా 8:38 ; ఆది 5:1 ). మనం ఆదాము కుమారులం. ఆదాము పోలికలో ఉన్నాం. (ఆది 5:8 ; లూకా 3:24-38 ). ఆదాము పాపం చేసి దేవుని పోలికను కోల్పోయినాడు. మనం ఆదాముతో దేవుని పోలిక కోల్పోయి, కుమారత్వాన్ని కోల్పోయాం. మనం తిరిగి దేవుని పుత్రులుగా చేయబడాలంటే మనం దత్తత తీసుకోబడాలి. దేవుడు క్రీస్తునందు దత్తపుత్రుల్నిగా మనల్ని చేసుకొన్నాడు. యేసు శరీరాన్ని బట్టి యోసేపు కుమారుడని అనబడినాడు. యోసేపు హేలికీ కుమారుడు. చివరగా ఆదాము దేవుని కుమారుడు అని మనం లూకా 3:24-38 వరకు గల వంశావళిలో చదువుతున్నాం. అనగా శరీరధారియైన క్రీస్తులో మనం మరల దేవునికి పుత్రులం అయ్యాం . (గలతీ 4:4 ). అందుచేతనే ఆయన దైవ మానవుడు కావలసి వచ్చింది.

 

4.7.12. మనల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకు :

 

దేవుడు తన సన్నిధిలో మనల్ని నిర్దోషులుగా, పరిశుద్దులుగా, నిరపరాధులుగా నిలువబెట్టుకోవాలి అంటే, మనం ఈ శరీరంలో జీవించి ఉండగా సాధ్యంకాదు. ఎందుకంటే ఈ శరీరం పాపభూయిష్టం. ఈ శరీరం మరణించవలసినదే, మనం పాపులుగా మరణిస్తే నరకానికి వెళ్ళాల్సిందే. కాబట్టి మనం మరణించకుండానే ఈ శరీరంలో ఉండగానే దేవుని సన్నిధిలో నిర్దోషులుగా, పరిశుద్దులుగా, నిరపరాధులుగా నిలబడాలి. మనకు మారుగా యేసు రక్తమాంసాలుగల దేహంతో మరణం పొందితే, ఆయన ద్వారా నీతి మనకు సంప్రాప్తమవుతుంది. అందుచేతనే కుమారుడు శరీరం ధరించి దైవమానవుడు అయినాడు ( కొలస్సీ 1:22 ).

 

4.7.13. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు :

 

ధర్మశాస్త్రాన్ని ఎవరును నెరవేర్చలేదు. అంతేకాదు ధర్మశాస్త్రం ప్రతి వ్యక్తిని కూడ దోషిగా నిలువబెడుతుంది. ధర్మశాస్త్రం తీసివేయ బడకపోతే పాపానికి ఉన్న బలం తీసివేయబడదు. ( 1 కొరింథు 15:5-6 ). మరణం పాపానికున్న ముల్లైతే, ధర్మశాస్త్రం ఆ పాపానికి ఉన్న బలం. మరణపు ముల్లును విరువాలంటే దాని బలాన్ని తీసివేయాలి. అనగా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి లేదా తీసివేయాలి లేదా నెరవేర్చాలి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని జయించగలిగింది దేవుడే. కానీ దాన్ని శరీరంతోనే చేయాలి. ఆయన శరీరధారి కాకపోతే ధర్మశాస్త్రం కొట్టివేయబడదు ( ఎఫెసి 2:14 ). కుమారుడు దైవ మానవుడై ధర్మశాస్త్రపు విధిని నెరవేర్చినాడు.

 

4.7.14. సరియైన న్యాయాధిపతిగా ఉండుటకొరకు :

 

దేవుడు లోకానికీ తీర్పు తీర్చాలి. లోకం చూపు సాకుల్ని దేవుడు వమ్ము చేయడానికి ఆయన లోకంలోనే, శరీరాకారంతోనే లోకానికి తీర్పుతీర్చాలి. ఆయన మానవుడైతేనే కాని లోకానికి తీర్పు తీర్చలేడు. ఆయన దేవుడైనందున ఆ తీర్పు సత్యమైనదై ఉంటుంది. ( యోహాను 5:22,23,27 ) అందుకే కుమారుడైన దేవుడు దైవమానవుడు అయినాడు.

 

4.7.15. శరీరాన్ని సృష్టించుటలో దేవుని మూల ఉద్దేశాన్ని నెరవేర్చుటకు:

 

దేవుడు ఆదామును అనగా మొదటి శరీరాన్ని సృష్టించి, భూమిని లోపరచుకొని దాన్ని ఏలుమని కోరినాడు. కాని మానవుడు అవిధేయుడై పాపానికీ దాసుడై దేవుని మూల ఉద్దేశ్యాన్ని నెరవేర్చలేకపోయాడు. దేవుడు సార్వభౌముడు. దేవుడు ఈ భూమిని లోపరచుకొనే ఉన్నాడు. కాని తన స్వరూపంలో చేయబడ్డ మానవుడు దాన్ని చేయాలని దేవుని ఉద్దేశ్యం. ( ఆది. 1:27-30 ; హెబ్రీ 4:8 ). దైవోద్దేశ్యాన్ని నెరవేర్చడానికి కుమారుడైన దేవుడు శరీరధారిగా, కడపటి ఆదాముగా, రెండవ మనుష్యుడుగా వచ్చి సమస్తం మీద అధికారియై సమస్తాన్ని తనకు లోపరచుకొన్నాడు. ( హెబ్రీ 2:9 ; మత్తయి 28:18 ; ఎఫెసీ 1:22 ; ప్రకటన 3:21 ). అందుకే కుమారుడైన దేవుడు దైవమానవుడిగా అవతరించవలసి వచ్చింది.

 

4.7.16. విశ్వాసుల విమోచనా శరీరాలకు నమూనాగా ఉండుటకు :

 

దేవుడు ఆదామును తనతో నిరంతరం దైవసన్నిధానంలో శరీరిగా ఉండాలనే మట్టితో చేశాడు. అయితే ఆదాము పాపం చేసి మరణానికి లోనయ్యాడు. ఇప్పుడు ఈ శరీరం దేవుని సాన్నిధ్యంలో ఉండడానికి తగదు. ఈ శరీరం విమోచింపబడి మరణం లోనుండి బయటకు దాటితే తప్ప మానవుడు శరీరిగా దేవుని రాజ్యంలో పరలోకంలో, దేవదూతలతో కలిసి ఉండలేడు. ( 1 కొరింథీ 15:50 ). ఈ కార్యం సఫలం చేయగలిగినవాడు దేవుడే. కుమారుడు శరీరధారిగా వచ్చి మరణించి పునరుత్థానుడైనాడు. యేసుక్రీస్తు మరణంలో నుండి బయటకు వచ్చిన ప్రథమ ఫలం. విశ్వాసులు భూసంబంధమైన దాని రూపాన్ని ధరించినట్లుగానే, పరసంబంధమైన వాని రూపాన్ని కూడా ధరించాలి. ( 1 కొరింధీ 15:48,49,53 ).

 

5.కుమారుని జననంలో ప్రవచనాల మర్మము
(THE MYSTERY OF PROPHECIES OF INCARNATION OF SON)

 

పాత నిబంధనలో యేసయ్యను గూర్చి వందలాది ప్రవచనాలు కలవు. అయితే అవన్ని ప్రవక్తలకు అర్థమయ్యయా? లేవనే చెప్పుకోవాలి. యేసయ్య జన్మించేంతవరకు ఆ ప్రవచనాలు విప్పబడలేదు. పొడపు కథల లాగానే ఉండి పోయాయి. ఉదాహరణకు బాప్తీస్మమిచ్చు యోహాను, యేసు విషయమై అభ్యంతరపడి “రాబోవువాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెనా?” అని అడిగాడు. “యేసయ్యకు మార్గము సరాళము చేయువాడనను నేనే” “ఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల'' అని చెప్పి తన శిశ్యులను యేసును వెంబడించమని చెప్పిన యోహాను అభ్యంతరపడ్డాడు. “నా వెనుక వచ్చువాడు పరిశుద్ధాత్మతోను, అగ్నితోను బాప్తీస్మమిచ్చును” అని యోహాను చెప్పాడు. అగ్నిబాప్తిస్మము అంటే దేవుని తీర్పు, శిక్ష కాని యేసు ఎవరికి తీర్పు తీర్చుటలేదు. రోమా ప్రభుత్వానిగాని, హేరోదునుగాని, మతభ్రష్టులనుగాని యేసు శిక్షించటంలేదు. పాతనిబంధన ప్రవచనాలను ఎరిగిన యోహాను అభ్యంతరపడ్డాడు. 1 పేతురు 1:10-12 లో పేతురు ఇలా వ్రాసాడు “పాత నిబంధన ప్రవక్తలు యేసయ్యను గూర్చిన ప్రవచనాలు ఏ కాలములో ఎలా నెరవేరుతాయోనని పరిశీలిస్తూ, విచారిస్తూ, పరిశోధిస్తున్నారు. ఆ ప్రవచన మర్మము యేసు ప్రభువు జన్మించుటతో నెరవేర్చబడినవి. వాటిని మనమిప్పుడు పరిశీలిద్దాం. నేను చాలా సార్లు మత్తయి సువార్త బోధించాను. అది ఇప్పుడు నాకు ఈ విషయాన్ని వ్రాయడానికి ఉపకరించింది.

5.1. మొదటి మర్మము :

పాతనిబంధన ప్రవచనాలు యేసయ్య మనుష్య కుమారుడని కొన్నిసార్లు, దేవుని కుమారుడని కొన్ని సార్లు చెబుతున్నాయి. అది ఎలా సాధ్యము, స్త్రీ పురుషులకు పుడితే మనుష్యుడుగాని దేవుడు కానేరడు. దేవుడు పుట్టలేదుకదా, పైనుండి దిగిరావాలి కదా. పా.నిం. భక్తులకు యూదులకు ఇది ఒక మర్మము. అందుకే యూదులు యేసును నిరాకరించారు. రాళ్ళతో కొట్టబోయారు, సిలువ వేశారు.

ఆది. 3:15 స్త్రీ సంతానము “సాతానుని తలను చితక గొట్టాలి. యూదుల దృష్టిలో అందరూ పురుషులకు పుట్టినవారే (వంశావళులు చదవాలి) సాతానుని తలను దేవుడు చితక గొట్టాలి కదా! స్త్రీకి సంతానమేమి?, స్త్రీ సంతానము దేవుడు ఎలా అవుతాడు? ఇది ఎలా సాధ్మము? రాబోవు మెస్సయ మనుష్యకుమారుడని( దాని. 7:13 ) అబ్రహాము సంతానమని ( ఆది. 22:17,18 ), అలానే మెస్సయ దేవుని కుమారుడని( కీర్తన 2:7) ప్రవచనాలు చెబుతున్నాయి. క్రీస్తు పుట్టుకకు 700 సంవత్సరాలకు ముందే యెషయా మెస్సయ మానవుడని, దేవుడని ప్రవచించాడు. యెషయా 7:14 “ప్రభువు తాను ఒక సూచన (Sign) మీకు చూపును. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవుని యొక్క సూచక క్రియ మెస్సయ. సూచక క్రియ అంటే దేవుడే నేరుగా చేసే అద్భుతం, మానవ మేధస్సుకు, విజ్ఞాన శాస్త్రానికి అతీతమైనదని అర్థము. కన్యక గర్భవతియై కుమారుని కనును అనగా మనుష్యకుమారుడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనుష్యులతో కలిసి జీవిస్తాడు అని అర్థము. ఇది ఎలా సాధ్యం? యెషయా 9:6 “మనకు శిశువు పుట్టెను(Born) కుమారుడు అనుగ్రహించబడెను (Given) 'పుట్టెను' అనేమాట మెస్సయ మనుష్యకుమారుడని తెలుపుతుంది. “అనుగ్రహించబడెను” అనే మాట ఇంతకుముందే ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన వద్దకు వచ్చాడు అని అర్థము. మెస్సయ నిత్యుడని, దేవుని కుమారుడని తెలుపుతుంది.

మత్తయి 22:41-46 లో యేసు పరిసయ్యులకు ఒక ప్రశ్నవేశాడు. “మెస్సయ ఎవరు?” వారు దావీదు కుమారుడని జవాబిచ్చారు. అప్పుడు ప్రభువు కీర్తన 110 ని వారికి జ్ఞాపకం చేస్తూ “అలాగైతే దావీదు మెస్సయను ప్రభువు” (దేవుని కుమారుడుని) అని ఎందుకు పిలిచాడు అని ప్రశ్నించగా వారు మాట్లాడలేక పోయారు. 2 సమూ. 7:11,12 లో మెస్సయను గూర్చి ప్రవచిస్తూ, అతడు దావీదు కుమారుడని చెప్పబడింది. అందుకే యూదులందరు మెస్సయను దావీదు కుమారుడని పిలుస్తారు. అయితే యెషయా 11:1 మెస్సయ యెష్షయి యొక్క వేరు చిగురు అని ప్రవచిస్తాడు. అనగా దావీదు తండ్రికే ఆయన వేరు. యెష్షయి కంటే ముందే ఉన్నవాడు. తన తండ్రి కంటే ముందే ఉన్నవాడు. తనకు ఎలాగున కుమారుడవుతాడు. ఇది యూదులకు గ్రాహ్యంకానీ మర్మము.

అయితే యేసు ప్రభువు జనన వృత్తాంతం ఈ చిక్కుముడిని సులభంగా విప్పేసింది. లూకా సువార్త 1:25-26 . ఇక్కడ గమనించవలసిన పదాలు - 'నీకు పుట్టబోవు శిశువు', 'పరిశుద్దాత్మ నీ మీదికి వచ్చును' 'సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్మును', 'పరిశుద్దుడై దేవుని కుమారుడనబడును” మరియను పరిశుద్దాత్మ కమ్ముకున్నాడు, ఆయన శక్తి మరియను కమ్ముకున్నది. మరియకు ఇది ఆశ్చర్యం కలిగించే విషయంకాదు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వ్యక్తి గనుక ఆ మాటను విశ్వసించింది. ఆదికాండము 1:2 లో పరిశుద్ధాత్మ భూమిని నీటిని కమ్ముకున్నాడు. అద్భుతమైన విశ్వం సృష్టించబడింది. భూమిని, నీటిని దేవుని ఆత్మ కమ్ముకున్నప్పుడు ఇంత పెద్ద సృష్టి ఉనికిలోనికి వచ్చినప్పుడు పరిశుద్దాత్మ మరియను కమ్మినప్పుడు కుమారుడు జన్మించటం ఆశ్చర్యపడనవసరం లేదు, అనుమానించాల్సిన అవసరం లేదు. మరియకు పుట్టాడు అనగా మనుష్యకుమారుడని, దేవుని కుమారడనబడును అనగా దేవుని కుమారుడు. ఇది దేవుడు చేసిన సూచక క్రియ. మత్తయి 12:38-42 లో శాస్త్రులు, పరిసయ్యులు, యేసును సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. ఎన్ని అద్భుతాలు చేసినా కూడా సూచక క్రియ అడుగుతున్నారు. సూచక క్రియ ఆకాశమునుండీ, నేరుగా దేవుని నుండి దిగివచ్చును, మోషే ఏలియాలు చేశారు. అప్పుడు యేసు ప్రభువు, యోనాను ఉదాహరణముగా చూపుతూ నేనే ఒక సూచనను, లేదా సూచక క్రియను నేను చనిపోయి తిరిగి లేచిన తరువాతైనాసరే మీరు నమ్మండి అని ప్రభువు చెపుతాడు.

5.2 రెండవ మర్మము :

మెస్సయ యూదా గోత్రములో జన్మించుట. పాత నిబంధన నెరిగినవారికి ఇది ఒక సమస్య లేదా మర్మము. మెస్సయ యూదా క్రమములో ఎలా వస్తాడు. ఆది. 48:10 “షిలోహుకు వచ్చువరకు, యూదా యొద్ద నుండి తొలగదు? అతని కీళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు” యూదా కీళ్ళ మధ్య నుండి రాజదండము రావాలి. యూదా సంతానములో నుండి రాజు వస్తాడు. షిలోహు అనగా (Until He come whose right it is) అని ఎవరి హక్కో అతను వచ్చువరకు' అని అర్థము యూదుల టార్గమ్స్ (Targams)లో యెహెజ్కేలు 21:27 కు ఈ మాటనను యూదు రబీలు అన్వయించుకున్నారు. “దాని స్వాస్థ్యకర్త వచ్చు వరకు”. ఎవరీ స్వాస్థ్యకర్త? యూదలోంచి ఎలా వస్తాడు? వారికెందుకు ఈ అనుమానం కలిగింది? ద్వీ. కాం. 23:1,2 - “కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు. వానికి పదియవ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు” అని ధర్మశాస్త్రము ఆజ్ఞాపిస్తుంది. కుండుడు(Bastard) ఇంగ్లీషు బైబిల్ చూడండి అనగా అపవిత్రమైన కలియిక వలన పుట్టిన వాడు. యూదా, తామారులకు పుట్టిన వాడి వంశములో మెస్సయ రాగలడా? తమారు గర్భవతి అని తెలియగానే ఆమెను కాల్చివేయండి అని యూదా అంటాడు ( ఆది. 38:24 ) లేవి. 21:8 ప్రకారము యాజకుని కుమార్తె జారత్వము చేస్తే ఆమెను కాల్చివేయాలి. లేవి 20:14 ప్రకారము కుమార్తెతో పాపం చేస్తే ఇద్దరిని కాల్చాలి. తామారు యూదాకు కూతురు వంటిది. తామారుకు మరియు యూదకు పుట్టిన అనైతిక సంతానం 10 తరాల వరకు యెహోవా సమాజములో చేరకూడదు. పెరసుకు దావీదు కుమారునికి మధ్య 10 తరాలు కలవు (చూడండి లూకా 3:31-33 ). యేసుక్రీస్తు యూదా వంశంపైనున్న శాపాన్ని తీసివేసాడు.

5.3 మూడవ మర్మము :

మెస్సయ యొక్క నివాస స్థలమును గూర్చి పాత నింబంధన ప్రవచనాలను ఎరిగినవారికి మరొక గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. మెస్సయ యొక్క ఊరు ఏది? మీకా 5:2 - “బెత్లహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును” హోషయ 11:1 - “నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని” యూదు రబ్బీలు ఈ వచనాన్ని మెస్సయకు ఆపాదించుకున్నారు. మత్తయి కూడా ఆ సంగతినే ( మత్తయి 2:13-15 ) చెప్పుతున్నాడు. యూదులకు ఓ ప్రశ్న మిగిలిపోయింది. మెస్సయ ఎఫ్రతలో నున్న బెత్లహేము నుండి వస్తాడా లేక ఐగుప్తు నుండి వస్తాడా? అంతే కాదు యేసు ప్రభువు ( మత్తయి 2:22,23 ) నజరేతు నుండి వచ్చాడు. మెస్సయ నజరేయుడు అని ఏ పాతనిబంధన ప్రవక్త కూడా చెప్పలేదు. అందుకే యేసు ప్రభువు విషయమై యూదులు అభ్యంతరపడ్డారు. అయితే ఈ స్థలాలను గూర్చిన మర్మాన్ని యేసు జన్మవృత్తాంతము తేలికగా పరిష్కరించింది. సంబంధిత ప్రవచనాలను నెరవేర్చడానికి దేవుడు దుర్మార్గులైన అన్యరాజులను వాడుకున్నాడు.

ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు అగస్తు (సీజర్ అగస్తస్) వలన ఆజ్ఞ జారీ అయింది. అప్పటి సీరియా ప్రాంతానికి కురేనియస్ గవర్నర్ గా ఉన్నాడు( లూకా 2:1,2 ). అందువలన యేసేపు మరియలు, బెత్లహేముకు రావలసిన వచ్చినది. ఇది మొదటి ప్రజా సంఖ్య. దేవుడు తన ప్రణాళిక చొప్పున వీరిని బెత్లహేమునకు పంపడానికి కైసర్ అగస్తస్ ఆజ్ఞను వాడుకున్నాడు ( గలతీ. 4:4,5 ). మెస్సయ బెత్లహేము నుండి వచ్చాడు. ఇప్పుడు ఐగుపు నుండి రావాలి. అంటే ఐగుప్తుకు వెళ్ళాలి కదా! ఇక్కడొక విచిత్రం జరిగింది. నక్షత్రం కనబడింది. నక్షత్రం అదృశ్యమైంది. నక్షత్రం మరల కనబడింది. (Star Appeared, Star Disapeared, Star Reapeared) దేవుడు నక్షత్రాన్ని కనబరిచి జ్ఞానులు ప్రయాణమైయేటట్టు చేశాడు. దేవుడు నక్షత్రాన్ని కనబడకుండా చేసి వారిని హేరోదు వద్దకు వెళ్ళేట్టుగా చేశాడు. హేరోదు చంటి పిల్లలను చంపాలనుకున్నాడు. మళ్ళీ నక్షత్రం కనబడింది. జ్ఞానులు మెస్సయను దర్శించుకున్నారు. ప్రవచనం నెరవేర్పునకు దేవుడు నక్షత్రాన్ని, జ్ఞానులను, హేరోదును వాడుకున్నాడు. దేవునిచే హెచ్చరింపబడి యోసేపు మరియలు యేసును ఐగుప్తుకు తీసుకెళ్ళారు. ఐగుప్తు హేరోదు అధికారం క్రిందలేదు. ప్రవచనం నెరవేరునట్లుగా మెస్సయ హేరోదు చనిపోయిన తరువాత ఐగుప్తు నుండి వచ్చాడు ( మత్తయి 2:14, 15 ). అయితే అర్కిలాస్ యూదయను పాలిస్తున్నాడు. అతడు వేలకొలది యూదులను చంపించాడు. అందుకే రోమా చక్రవర్తి ఇతనిని తొలగించి గవర్నర్లను నియమించాడు. యోసేపు మరియలు వారి స్వస్థలం నజరేతుకు వెళ్ళిపోయారు. ప్రవక్తలు చెప్పినట్టు నజరేయుడనబడినాడు ( మత్తయి 2:22, 23 ). యేసు ప్రభువు నజరేతు నుండి వచ్చాడు కనుక యూదులు ప్రభువును మెస్సయగా అంగీకరించలేకపోయారు ( యోహాను 1:47) , పా.నీం.లో ఎక్కడ కూడా మెస్సయ నజరేతు నుండి వస్తాడనే ప్రవచనం లేదు. కాని మత్తయి ప్రవక్తలు చెప్పినట్లు అని వ్రాసాడు. బహు వచనంలో మత్తయి చెప్పాడు. మెస్సయా ప్రవచనాలసారము. హెబ్రీ భాషలో నజరీన్(Nazarene) అనగా “చిగురు” అని అర్థము. నేజెర్ (Neser) హెబ్రీ మాట మెస్సయకు ఉపయోగించబడినది.

యెషయా 11:1 – “యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును”

యిర్మియా 23:5 - "రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను”.

యిర్మియా 33:15 - “ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను”

జెకర్యా 3:8 - “చిగురు అను నా సేవకుని నేను రప్పింపచేవుచున్నాను”

జెకర్యా 6:12 - “చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును”. హెబ్రీ భాషలోని ప్రవచనాలలో నెజర్ అనగా మెస్సయా అని యూదు రబ్బీలు అర్థం చేసుకున్నారు. ఆ రీతిగా మెస్సయ నజరేయుడు అయ్యాడు. నెజర్ తెలుగు అనువాదం చిగురు.

5.4. నాలుగవ మర్మము:

ఆదికాండము 49:24 ప్రకారము మెస్సయ ఇశ్రాయేలుకు బండ. వీరి రాజ్యము మెస్సయ మీద కట్టబడాలి. కీర్తన 118:22, 23 ప్రకారము మెస్సయ నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి ఆయెను. రబ్సీలు ఈ రాయి మెస్సయి అని భావించారు. హెబ్రీ భాషలో రాయిని ఎబెన్, బెన్ అంటే కుమారుడు యెష8:14, 15 లో మెస్సయ ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పడి కాళ్ళు చేతులు విరుగగొట్టుకొనువారుగా వర్ణించబడినాడు. యెషయ 28:16 లో మెస్సయ పరిశోధించబడిన రాయి. అనగా శ్రమనొందే వాడు (యెషయా 53 అధ్యాయం). దాని. 2:34, 35, 40 ప్రకారము మెస్సయ అన్యరాజ్యాలను నలుగగొట్టి తమకు రాజ్యాన్ని నిర్మించే రాయి, మెస్సయ పునాది రాయి. అన్యులను నలుగగొట్టే రాయి, తృణీకరించబడేరాయి, శ్రమనొందే రాయి, ఇశ్రాయేలీయుల కాళ్ళు చేతుల విరుగగొట్టే రాయి. యూదులకు ఇదొక గందరగోళ పరిస్థితి. మెస్సయ ఎవరు? ఏలాంటి వాడు? ఈ ప్రవచనాల మర్మము యేసులో విప్పబడింది.

మత్తయి సువార్త 21:44 లో యేసు ప్రభువు తాను ఆ రాయిని అని చెపుతున్నాడు - "మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవునుగాని అది ఎవనీ మీద పడునో వానీని నలిచివేయును”. యేసును మెస్సయగా అంగీకరించలేక యూదులు ఈ బండ తగిలి తోట్రిల్లి ఆ బండ మీద పడిపోయారు, ముక్కలైపోయారు. వారి రాజ్యం పోయింది. ప్రపంచం నలమూలలో చెదిరిపోయారు. ప్రభువు యొక్క రెండవ రాకడలో ఆయన అన్యరాజ్యాల మీద పడే రాయిగా వచ్చి, వారిని నలుగగొట్టి దావీదుకు వాగ్దానం చేయబడిన రాజ్యాన్ని స్థాపిస్తాడు. పాత నిబంధనలో చెప్పబడని మర్మము “సంఘము”. ఈ రాయి సంఘానికి పునాదిరాయిగా మారింది. ఈ మర్మమును యూదులుగాని, అన్యులుగాని గ్రహించలేకపోయారు. యేసు ప్రభువు జన్మవృత్తాంతములో మెస్సయ రాజు మరియు శ్రమనొందే సేవకుడు అనే విషయాన్ని మన చూడగలం.

దేవుడే హేరోదుకు మెస్సయ పుట్టాడు అనే సమాచారాన్ని ఇచ్చాడు. హేరోదు చంటిపిల్లలను చంపించాడు. మత్తయి దీని విషయం వ్రాస్తాడు. మత్తయి 2:16, 17 “రామాలో అంగలార్పు వినబడెను. ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు, తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను”. రామా అనే స్థలం బెన్యామీనీయుల నివాసస్థలం. రామా అనగా దుఃఖపట్టణం అని అర్థం ( యెషయా 10:29 , హోషే 5:8 ). బెన్యామీనును రాహేలు సంతానం. బేత్లెహేము మొట్టమొదటిసారి ఆదికాండము 35:16-20 లేక ప్రస్తావించబడింది. ఇక్కడ ఏమి జరిగింది. రాహేలు బెత్లహేములో బెన్యామీనును ప్రసవించి చనిపోయింది. రాహేలు ఏడ్చింది. రాహేలు చనిపోతు తన కుమారునికి బెనోని అని పేరు పెట్టింది. బెన్ అంటే కుమారుడు, ఓని అంటే దుఃఖము. దుఃఖపుత్రుడు అనే పేరు పెట్టింది. యేసు ప్రభువు దుఃఖపుత్రుడు( యెష 53:3 ). అయితే యాకోబు బెన్యామీను అనే పేరు పెట్టాడు. బెన్ అంటే కుమారుడు, యామిన్ అంటే కుడిచాయి, కుడిచేతి పుత్రుడు అని భావం. యేసు ప్రభువు దేవునికి కుడిచేతిపుత్రుడు. ( అ.కా. 5:31 , హెబ్రీ. 1:3, 13 , కీర్తన 110:1 ). ఈ రెండు పేర్లు యేసునందు నెరవేరినవి. ఇక్కడ యిర్మియా చెప్పిన ప్రవచనాన్ని మత్తయి ఎందుకు వాడుకున్నాడో కూడ మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రవచనం క్రీ.పూ. 587-586లో నెరవేరింది. యూదులు దేవునిని తృణీకరించి అబద్ద ప్రవక్తల మాటలు నమ్మి దేవుని వాక్యాన్ని విసర్జించి, యిర్మియా ప్రవచనాల విషయమై అభ్యంతరపడి దుర్మార్గంగా ప్రవర్తించి భ్రష్టులైపోయారు. నెబుకద్నెజరు వచ్చి బెన్యామీనుయులను, యూదులను చంపి, పట్టణాన్ని కాల్చి, వారిని చెరలోకి తీసుకెళ్ళాడు. యేసు ప్రభువు విషయమై కూడా యూదుల అలానే ప్రవర్తించి, ప్రభువును సిలువ వేశారు. ఆ తరువాత రోమా చక్రవర్తి యూదయపై దండెత్తి, వారిని చంపి, వారిని చెదరగొట్టాడు. మెస్సయ వారికి అభ్యంతరం కలిగించు బండగా మారాడు. మెస్సయ యూదా గోత్రపు సింహము, వధించబడిన గొర్రెపిల్ల ( ప్రకటన 5:2-7 ).

5.5. ఐదవ మర్మము:-

యోసేపు యొక్క వంశావళి ఒక అభ్యంతరం, యూదులు యేసును మెస్సయగా అంగీకరించలేకపోవడానికి మరొక ప్రధాన కారణం పాత నిబంధనలోని ప్రవచనం. యూదులరాజులైన యెహోయాకీము, యెహోయాకీనుల కాలములో యిర్మియా ప్రవచించాడు. యెహోయాకీము యిర్మియా గ్రంథాన్ని కాల్చివేశాడు. తండ్రి కుమారులిద్దరు దేవుని దృష్టికి చెడునడత నడిచారు. కనుక వారి సంతానములో ఎవరును దావీదు సింహాసనానికీ వారసులు కారని శపించి, వారి నుండి రాచరికాన్ని దేవుడు తీసివేశాడు ( 2 రాజులు 24:5 , 2 ది.వృ. 36:8 , యిర్మి. 36:1 , 22:30 , 22:28-30 ). యోసేపు యోకన్య కుమారుడు ( మత్తయి 1:6-16 వరకు గల వంశావళిని చూడండి). యోసేపు యొకన్య వంశములో పుట్టాడు కనుక అతని సంతానానికి రాజు అయ్యే అవకాశం లేదు అందుకే వారు యేసు విషయమై అభ్యంతరపడ్డాడు. ఈ మర్మము యేసుక్రీస్తు లోనే విప్పబడింది. యిర్మియా 22:28-30 లో యోకన్య నేను సంతనానికి సింహాసనం తీసివేశానని చెప్పిన దేవుడు 23:5 లో నేను దావీదుకు నీతి చిగురు పుట్టిస్తానన్నాడు. 2 సమూ. 7:16 లో నీ సింహాసనము నిత్యము స్థిరపరచుదునని దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ రెండు ప్రవచనాలు విరుద్ధంగా కనబడుతున్నాయి. ఈ మర్మము యేసు ప్రభువు జన్మ వృత్తాంతములో విప్పబడింది. లూకా వ్రాసిన వంశావళిని గమనించండి ( లూకా 3:23-32 ). దావీదుకు బెత్సబా వలన ఇద్దరు కుమారులు కలిగాను. సొలోమోను, నాతాను ( 1 ది. వృ. 3:5 ). సొలోమోను క్రమంలో యెహోయాకీము (యోకన్య లేదా కొన్యా), యోసేపులు వచ్చారు. కనుక యోసేపు కుమారుడు మెస్సయ కాలేడు. అయితే మరియ నాతాను క్రమంలో వచ్చింది. మరియ తండ్రి హేలీ ( లూకా. 3:23 ). హేలీకి కుమారులు లేరు. కుమార్తె మాత్రమే ఉంది. సంఖ్యాకాండము 27:1-11 , 30:1-12 ప్రకారము ఎవరికైనా కుమారులు లేకుండా కుమార్తె మాత్రమే ఉంటే ఆమె భర్త అతనికి కుమారుడుగా ఎంచబడతాడు. వారి స్వాస్థ్యము పరులు పాలుకాకుండా వారిలోనే ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రకారము యోసేపు చట్టబద్ధమైన వారసుడయ్యాడు (Legal Heir). యేసు ప్రభువు యేసేపును బట్టి చట్టబదమైన వారసుడయ్యాడు. మరియను బట్టి సహజమైన, భౌతికమైన Woonvocadogo (Biological & Physical Heir)

పాత నిబంధనల ప్రవక్తలు మెస్సయను గూర్చి ప్రవచించిన విషయాలు ఒకదానికొకటి విరుద్దగా కనబడినప్పటికిని అవి యేసు జన్మ వృత్తాంతములో సమన్వయ పరచబడిన నెరవేరినట్లుగా మత్తయి చాలా మట్టుకు వాటి మర్మాన్ని విప్పి చూపించాడు.

 

6. మనుష్యకుమారుడు
(SON OF MAN)

 

యేసు ప్రభువు తనను తాను మనుష్య కుమారునిగా సువార్తలలో అభివర్ణించుకున్నాడు. సువార్తలలో ఈ పదం (Phrase) 81 సార్లు కనబడుతుంది (మత్తయి 30; మార్కు 2-14; లూకా 25; యోహాను 12). ఈ క్రొత్త నిబంధన పదానికి మూలం దానియేలు 7:13,14 - *... ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొకడు వచ్చి... ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. అదేన్నటికిని తొలగిపోదు, ఆయన రాజ్యము ఎన్నడును లయము కాదు.” యుగాంతమందు మెస్సీయా వస్తాడని, ఆయన తమకు శాశ్వత రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని యూదుల విశ్వాసం. ఆ మెస్సీయా మనుష్యకుమారుడని వారు నమ్ముతున్నారు. ఆ యూదుల మధ్యనున్న యేసు నేనే మీరు ఎదురుచూస్తున్న మెస్సియాను లేదా మనుష్యకుమారుణ్ణి అని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుప్రభువు తనను తాను మనుష్యకుమారునిగా అభివర్ణించుకున్నప్పుడు 3 అర్ధాలతో దీనిని తెలియజేశాడు.

6:1 భవిష్యత్తులో రానైయున్న దాని 7:13,14 ) మనుష్య కుమారుడు (Apocalyptic son of man):

యూదులు ఎవరికొరకు ఎదురుచూస్తున్నారో ఆ మెస్సయాను తానేనని, దానియేలు ప్రవచించిన మెస్సయాను తానేనని యూదులకు తన్నుతాను బయల్పరచుకున్నాడు. దానియేలు 7:13,14 ను మత్తయి 26:64 ; 25:31 తో పోల్చిచూడండీ. ఇదే అర్ధాన్నిచ్చే ఇతర వచనాలు - మత్తయి 13:41 ; 16:27 ; 19:28 ; 24:27,30,37,44 ; 25:31 ; 26:64 ; (బహుశా 24:39 ; 10:26 ; 16:28 ).

6.2. శ్రమనొందుచున్న మనుష్యకుమారుడు (Suffering Son of man):

రాబోయే మెస్సియాను యెషయా ప్రవక్త ‘సేవకుడు'గా వర్ణించాడు. అతని పుట్టుకను, రాజ్యాన్నీ, పరిచర్యను వర్ణించాడు. ముఖ్యంగా శ్రమనొందే సేవకునిగా వర్ణించాడు - యెషయా 42:1-4 ; 49:1-6 ; 50:4-9 ; 52:13-53:12 . ఈ వాక్యభాగాలను సేవక గీతాలు అంటారు. యెషయా ప్రవచించినట్లే సేవకున్ని దేవుడు ఏర్పరచుకున్నాడు ( 42:1 ; 49:1 ); అతని ద్వారా నీతిన్యాయములు వచ్చును ( 42:1 ; 53:11 ); యూదులకు, అన్యులకు ఆశీర్వాదము అతని ద్వారా వచ్చును ( 49:3-5 ; 53:10-12 ; 42:1,4 ; 49:6 ; 52:15 ); అతడు కేకలు వేయడు, జగడమాడడు గనుక మొదట ఓడినట్టుగా కనబడతాడు ( 42:2-3 ; 50:5-7 ; 53:7 ); ఎందుకంటే మొదట శ్రమపరచబడతాడు కనుక ( 49:7 ; 50:6 ; 53:3 ) కాని అంతిమ విజయం అతనిదే ( 42:4 ; 50:8,9 ; 53:10-12 ). ఆ సేవకుని నేనే అని ప్రభువు తనను తాను యూదులకు బయల్పరుచుకున్నాడు - మత్తయి 12:40 ; :9,12,22; 20:18,28 ; 26:2,24,45 .

6.3. భూసంబంధమైన మనుష్య కుమారుడు (Earthly son of man):

యేసుప్రభువు తనను తాను నూటికి నూరుశాతం మానవునిగా, సమగ్రమైన మానవుడిగా అభివర్ణించుకుంటూ అదే సమయంలో నేను మెస్సియాను అని యూదులకు బయల్పరుచుకున్నాడు. కీర్తన 8:4,5 లో మనుష్యునియొక్క అల్పత్వాన్ని గూర్చి చెబుతూ కీర్త 80:17 లో దేవుడు తనను ఏర్పరుచుకున్నాడని, హెచ్చిస్తాడని చెప్పాడు. పోల్చండి హెబ్రీ 2:5-18 . అంతేకాక కీర్తన 40:1-5 లో మెస్సియా శరీరధారిగా వస్తాడని చెప్పబడింది. పోల్చండీ హెబ్రీ 10:5-10 . యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుని కుమారుడు అదే సమయంలో సమగ్రమైన మనుష్యకుమారుడు. యేసుప్రభువు భూసంబంధమైన మనుష్యుడు - మత్తయి 8:20 ; 9:6 ; 11:19 ; 12:8,32 ; 13:37 ; బహుశా 16:13 పోల్చండి 18:11 .

 

7. కుమారుని యొక్క మానవత్వము
(HUMANITY OF SON)

 

యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణమైన దేవుడు. అదే సమయంలో ఆయన శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా ఈలోకంలో జీవించిన కాలంలో ఆయన సమగ్రమైన మానవుడు. మనుష్యకుమారుడని ప్రభువు పిలువబడినాడు. దేవుని శరీరధారణను గూర్చి మనం సవిస్తారంగా వెనుకటి అధ్యాయంలో చర్చించుకొన్నాం. దేవుని కుమారుడు మానవత్వాన్ని తనకు జోడించుకొనిన తరువాత ఆయన సమగ్ర మానవస్వభావాన్ని, మానవ ప్రాణాన్ని, మానవమనస్సును, మానవ తలంపును, మానవ ఇష్టాన్ని, మానవ పరిమితులను కలిగి ఉన్నాడు. ప్రభువు సమగ్రమయిన మానవుడని అనడానికి గల కొన్ని రుజువులను పరిశీలిద్దాం.

7.1. కుమారుని మానవ జన్మ :

యేసుప్రభువు అందరి మానవుల వలె తల్లి గర్భంలో బీజమై, పిండమై నవమాసాలలో అన్ని అవయవాలు రూపింపబడి మనుష్యునిగా జన్మించాడు. ( మత్తయి 1:20 ; లూకా 1:31 ; మత్తయి 1:25 ; లూకా 2:6 , 7,21).

7.2. కుమారుని మానవత :

యేసు ప్రభువు మానవ తల్లిని కలిగి ఉన్నాడు. మానవ తండ్రిలేడు. యేసుక్రీస్తుకు దేవుడు తండ్రి అనుట ఎంత వాస్తవమో, మరియ తల్లి అనుట కూడా అంతే వాస్తవం. ఆమె పరిశుద్దాత్మ శక్తిచే కమ్మబడింది. పరిశుద్దాత్మ ద్వారా గర్భం దాల్చింది. అయితే యేసుక్రీస్తు శరీరం మరియ గర్భంలో రూపుదాల్చింది. మరియ యేసును కన్నందుకు యేసుకు తల్లి అయినది. ( లూకా 1:31 ; లూకా 2:7 ; యోహాను 2:2,12 ; 19:26,27 ; అ.కా. 2:30 ; 13:23 ; రోమా 1:3 ).

7.3. దేవదూతల ప్రకటన :

ప్రభువు మానవుడుగా జన్మిస్తాడన్న సంగతిని దేవదూతలు యోసేపు, మరియలకు ప్రకటించారు. యేసు జన్మించిన తరువాత యేసు మానవుడిగా జన్మించిన విషయాన్ని గొర్రెల కాపరులకు ప్రకటించారు. ( మత్తయి 1:21 ; లూకా 2:11,12 ; లూకా 1:30,35 ).

7.4. కుమారుడు శరీరాకారం గలవాడు :

యేసుప్రభువు మానవులవలె ప్రాణాత్మ దేహాలు కలిగి ఉన్నాడు. ఆయన ప్రాణం దుఃఖంతో నిండినది. ( మత్తయి 26:38 ). ఆయన ఆత్మలో కలవరపడినాడు. ( యోహాను 13:21 ). ఆయన మానవ శరీరం గలవాడు ( రోమా 8:34 ; 1 యోహాను 4:2,9 ).

7.5. కుమారుడు మానవుల దౌర్బల్యాలు, మానవ పరిమితులు, లేదా మానవ సహజాతాలు కలవాడు :

• యేసుక్రీస్తు మానవునివలె అలసినాడు. యోహాను 4:6 .

• యేసుక్రీస్తు మానవునివలె నిద్రించినాడు. మార్కు 4:38 .

• యేసుక్రీస్తు మానవునివలె దాహంగొన్నాడు. యోహాను 4:7 .

• యేసుక్రీస్తు మానవునివలె ఆకలిగొన్నాడు. మత్తయి 21:18 .

• యేసుక్రీస్తు మానవునివలె దుఃఖించినాడు. యోహాను 11:35 .

• యేసుక్రీస్తు మానవునివలె ఆత్మలో మూలిగినాడు. యోహాను 11:33 .

• యేసుక్రీస్తు ప్రాణం మానవునివలే దుఃఖంతో నిండినది. మత్తయి 26:38 .

• యేసుక్రీస్తు మానవునివలెనే శరీరంలో నొప్పిని అనుభవించాడు. 1 పేతురు 2:23 .

• మానవునివలె చనిపోయాడు. 1 కొరింథి 15:3 .

• యేసుక్రీస్తు మానవునివలెనే జ్ఞానంలోను, వయస్సులోను దేవుని దయలోను, మనుష్యుల దయలోను వర్ధిల్లాడు. లూకా. 2:52 .

• ఆయన మానవునివలె ఆశ్చర్యపోయాడు. మత్తయి 8:10 .

• ఆయన మానవునివలె ఆశించాడు. మార్కు 11:13 .

• ఆయన మానవులవలె ప్రార్థించాడు. హెబ్రీ 5:7 .

• ఆయన మానవులవలెనే శోధింపబడినాడు. హెబ్రీ 4:15 ; 2:18 .

7.6. కుమారుడు మనుష్యుల పేర్లతో పిలువబడినాడు :

• మనుష్యకుమారుడు మనుష్యుడే అవుతాడు. యేసుప్రభువు కూడా మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు. లూకా 19:10 .

• ఆయన నరుడని పిలవబడినాడు. 1 తిమోతి 2:5 .

• ఆయన కడపటి ఆదాము అనబడ్డాడు. 1 కొరింథు 15:45 .

• ఆయన రెండవ మనుష్యుడనబడ్డాడు. 1 కొరింథు 15:47 .

• ఆయన దావీదు కుమారుడనబడ్డాడు. లూకా 18:38 .

7.7. మానవుడు దేవునితో కలిసి ఉండే సంబంధాన్నే యేసు దైవ మానవుడుగా తండ్రితో కలిగి ఉన్నాడు.

• పరలోకపు తండ్రి అని పిలిచాడు. మత్తయి 6:10

• దేవున్ని నా దేవుడు అని పిలిచాడు. యోహాను 20:17

• కృతజ్ఞతలు చెల్లించాడు. మార్కు 8:6

• దేవున్ని బ్రతిమాలుకొన్నాడు. హెబ్రీ 5:7

7.8. కుమారుడు సమగ్రమైన మానవుడు:

యేసుక్రీస్తు అన్ని విషయాల్లో మానవుని వంటివాడయ్యాడు. హెబ్రీ 2:17 ఆయన సమస్త విషయాల్లో మనవునిలా ఉన్నాడు. హెబ్రీ 4:15 .

7.9. యేసు చెంతనున్నవారు ఆయన్ను మానవునిగానే చూశారు:

యేసు ప్రభువుతో కలసి జీవించిన వారు ఆయన్ను మనిషిగానే గుర్తించారు. చాలా మంది ఆయన్ని దేవుని కుమారుడుగా విశ్వసించలేకపోయారు. మత్తయి 13:53-58.

క్రింది మాటలను గమనించండి ( మత్తయి 13:54 ).
“వారు ఆశ్చర్యపడిరి.”
“ఈ జ్ఞానం ఈ అద్భుతాలు ఇతనికి ఎక్కడివి ?”
“వడ్లవాని కుమారుడు కాడా ?”
“తల్లి పేరు మరియకాదా ?”
“ఇతని సహోదరులు కారా ?”
“ఇతని చెల్లెండ్రు”
“అభ్యంతర పడిరి”

 

8. కుమారుని యొక్క ద్వంద్వ స్వభావం
(HYPOSTATIC UNION OF SON)

 

శరీరధారియైన యేసుక్రీస్తు రెండు స్వభావాలను (అనగా ఆయన దైవస్వభావాన్ని, ఆయన మనుష్య స్వభావాన్ని) గురించి వాద ప్రతివాదాలు సంఘచరిత్రలో ప్రతిధ్వనించాయి. ఈ అంశం చాల క్లిష్టమైనది. ఈ అంశాన్ని గ్రహించడానికి దేవుని వాక్యంలో లోతైన అవగాహన దైవ వాక్యంలో లోతైన విశ్వాసం చాలా అవసరం. కొందరు యేసుప్రభువు యొక్క మానవత్వాన్ని కాపాడడానికి ఆయన దైవత్వానికి గాయం చేస్తే, మరికొందరు దైవత్వాన్ని కాపాడబోయి మానవత్వాన్ని గాయపరిచారు. దైవమానవుని అసలు దైవత్వాన్ని ఛిద్రంచేశారు. మనం యేసుక్రీస్తు పరిపూర్ణ దైవత్వాన్ని అంగీకరించాలి. అంతేకాక ఆయన సమగ్ర మానవత్వాన్నీ కూడా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏకకాలంలోనే పరిపూర్ణ దేవుడు మరియు సమగ్రమైన మానవుడు, ఈ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి సంఘచరిత్రలో తలెత్తిన వివిధ సిద్ధాంతాల్ని, వివిధ వాదప్రతివాదనల్ని మనం తెలుసుకోవాలి.

సంఘ చరిత్రలో క్రీస్తుని గూర్చిన వివిధ సిద్ధాంతాలు :

8.1. గోచరవాదము (Docetism) :

ఈ దుర్బోద మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో తలెత్తింది. దోసిటిజమ్ అనే పదం గ్రీకు భాషలో నుండీ తీసుకోబడింది. “దొకియో” (Dokeo) అనగా గోచరించుట లేదా కనబడుట. వీరి బోధ ప్రకారం యేసుక్రీస్తు మానవుడుగా గోచరించాడే తప్ప నిజమైన మానవుడు కాదు. యేసు క్రీస్తునకు మానవ శరీరం లేదు. మొదటి శతాబ్దంలో (Gnostics నాస్టిక్స్) అనే ఒక తెగ ఉండేది. వీరి విశ్వాసం ప్రకారం శరీరం పాపభూయిష్టం. ఆత్మ పాపరహితం. కనుక దేవుడు పాపభూయిష్టమైన శరీరాన్ని ధరించలేడు అని వీరు నమ్మేవారు. ఈ నాస్టిక్కుల్లోని ఒక గుంపువారు చేసిన బోధే దోసిటిజమ్. క్రీస్తు ఒక భూతం లేదా ఒక మాయారూపం గలవాడు అని వీరి బోధ. అయితే ఈ బోధ రాబోవుచున్నది. అని ముందుగానే ఎరిగిన అపొస్తలుడగు యోహాను తన మొదటి పత్రిక 4:2-3 లో ఈ బోధ విషయమైన హెచ్చరించాడు. ఈ బోధ మార్సియన్ ద్వారా ప్రచారాన్ని పొందింది. పాలికార్పు అపొస్తలుడయిన యోహాను శిష్యుడు. క్రీ.శ. 155 లో పాలికార్పు రోమా సంఘ భిషప్పు ఎనిలిటిసను దర్శించినపుడు మార్సియన్ను పాలికార్పు ముఖాముఖిగా కలుసుకున్నాడు. అప్పుడు మార్సియన్ “నీవు నన్ను గుర్తుపట్టావా ?” అన్నాడు. వెంటనే పాలికార్పు నేను నిన్ను గుర్తించాను, నువ్వు అపవాది ప్రథమ పుత్రుడివి కదా ? అన్నాడు. మార్సియన్ రోమా సంఘ సభ్యుడే. అయితే అతని దుర్బోధనవల్ల అతన్ని క్రీ.శ. 144 లో వెలివేశారు. గోచరవాదము క్రీస్తు ప్రభువు యొక్క నిజమానవత్వాన్ని తృణీకరించింది.

8.2. దైవావహనవాదం (Ebionism) :

“ఎబియోనైట్” అనే మాట హెబ్రీ భాషలో నుండి తీసుకొనబడింది. వీరు యూదా మతప్రాతిపదిక క్రైస్తవ్యాన్ని విశ్వసించినవారు. క్రైస్తవులైనప్పటికీ యూదా మత బోధలు ముఖ్యంగా మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని తీవ్రంగా బోధించేవారిలోని శేషము ఈ ఎబియోనైట్లు. ఎబియోనైట్ అనగా పేదవారు. వారు ఆర్థికంగా పేదవారు. అంతేకాదు ఆత్మీయంగా కూడా పేదవారే. వీరు దేవుడొక్కడే అని విశ్వసించినవారు. వీరికి త్రిత్వం అవగాహన కాలేదు. వీరు క్రీస్తు ప్రభువు యొక్క నిజదైవత్వాన్నీ నీరసించారు. వీరి బోధ రెండవ శతాబ్దంలో ప్రచారం పొందింది. వీరి బోధ ప్రకారం యేసు మానవుడు. యేసు స్వభావసిద్ధంగా మానవుడు. యేసు మరియ కుమారుడు. మోషే ధర్మశాస్త్రాన్ని అక్షరాలా నిష్టగా పాటించిన మూలాన్న దేవుడతన్ని మెస్సియ్యాగా ఏర్పరచుకొన్నాడనీ, యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యేసుకు దేవుని ద్వారా క్రీస్తు పూనినట్లు అనగా దైవశక్తి యేసును కమ్ముకొన్నట్లు నమ్మేవారు. యేసు సిలువవేయబడక మునుపు అనగా యేసు జీవిత చరమాంకంలో యేసును క్రీస్తు విడిచిపోయినాడని వాదించేవారు.

8.3. ఆది సంభూత వాదం (Arianism) :

ఏరియానిజమ్ సృష్టికర్త “ఏరియస్” అనే అలెగ్జాండ్రియా సంఘ పెద్ద. ఈ బోధ 4వ శతాబ్దంలో ప్రాచుర్యం పొందింది. ఈ బోధ అనేకులపై ప్రభావం చూపీ సంఘాన్ని కల్లోల పరచింది. ఏరియస్ యేసుక్రీస్తు నిజదైవత్వాన్ని తృణీకరించాడు. ఈ బోధ ప్రకారం యేసు కూడ దేవుడు చేసిన సృష్టి యేసు అర్థదేవుడు (Demi God) లేదా దైవాంశసంభూతుడు. దైవాంశగలవాడే గాని దేవుడు కాదు. ఈ దుర్భోధ ప్రభావంగల రోజుల్లో ఒక నినాదం ఉండేది. “ఆయన లేని కాలం ఒకటి ఉండేది” (There was a once when he was not). ఏరియస్ బోధప్రకారం యేసుదేవుని పోలిన (హోమోయ్ హుసియాస్) వాడే కాని దేవుడు (హోమో హుసియాస్) కాదు. క్రీ.శ. 325 లో నైసియాలో సంఘ అధ్యక్షుల, సంఘ పెద్దల విశ్వసమ్మేళనం జరిగింది. (Council of Nicea) అందులో ఏరియస్ దుర్బోధ ఖండించబడి, ఏరియసను వెలివేశారు. ఈ ఆలోచనసభ ఎథినీసియస్ నాయకత్వంలో జరిగింది. ఈ ఆలోచనసభ క్రీస్తు దైవత్వాన్ని పూర్తిగా సమర్థించింది. యేసుక్రీస్తు దేవునితో ఏక స్వభావం గలవాడు (హోమో హుసియాస్).

8.4. అసమగ్ర మానవవాదం (Appollonarianism) :

“ఏరియస్”ను తూలనాడుతూ ఈ అపొల్లోనేరియనిజమ్ ఆవిర్భవించినది. నాల్గవ శతాబ్దం చివరి భాగంలో ఈ సిద్ధాంతం బోధింపబడింది. “ఏరియస్” బోధను ఖండించడంలో యేసుక్రీస్తు దైవత్వాన్ని పరిరక్షించాలనే తాపత్రయంతో, యేసుక్రీస్తు సమగ్ర మానవత్వాన్ని అపొల్లోనేరియస్ (లవోదకీయా సంఘ బిషప్పు) తృణీకరించాడు. ఈ దుర్బోధ ప్రకారం యేసు మానవ దేహం. మానవ ప్రాణం గలవాడేగాని మానవాత్మ గలవాడు కాదు. యేసుక్రీస్తు యొక్క మానవాత్మ నిత్యుడగు లోగాస్ (వాక్యము) ద్వారా స్థానభ్రంశం చెందింది. ఈ బోధ యేసు దైవత్వాన్ని పరిరక్షించలేకపోగా యేసు సమగ్ర మానవత్వాన్ని చిద్రంచేసింది. క్రీ.శ. 378, 379 లో జరిగిన అంతియొక కౌన్సిల్ లోను, క్రీ.శ. 381 లో కాన్స్టాంటినోపుల్ లో జరిగిన విశ్వ సంఘ అధ్యక్షుల, సంఘ పరిచారకుల సమ్మేళనం (కౌన్సిల్)లో ఈ దుర్బోధ ఖండించబడింది. ఈ ఆలోచనసభ యేసుక్రీస్తుని సమగ్ర మానవుడిగా అంగీకరించింది.

8.5. ద్వంద్వ వ్యక్తిత్వవాదము (Nestorianism) :

అంతియొకయలోని ప్రముఖ ప్రసంగికుడును, కాన్స్టాంటినోపుల్ లోని అధ్యక్ష సంఘ బిషప్పు అయిన నెగ్గేరియన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. యేసుక్రీస్తులోని ద్వంద్వ స్వభావాన్ని ఇద్దరు వేరువేరు వ్యక్తులుగా భావించి ద్వంద్వ వ్యక్తిత్వాలుగా అభివర్ణించినాడు. యోహాను 14:23 లో యేసు ప్రభువు మేము అన్న మాటను తప్పుగా అర్థం చేసుకొని యేసుక్రీస్తులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారనే దుర్బోధకు అంకురార్పణ చేశాడు నెసోరియన్. ఆ రోజుల్లోనే మరియ ఆరాధన ప్రారంభమైంది. మరియను దైవమాతగా (థియోటోకాన్) అంగీకరించారు. అయితే దాన్ని నోల్గేరియన్ అంగీకరించలేక, మరియ యేసు మానవత్వానికి తల్లి, దైవత్వానికి తల్లికాదు అని బోధిస్తూ యేసుక్రీస్తులో మరియ నుండి వచ్చిన మానవుడు, దేవుని నుండి వచ్చిన దేవుడు ఇద్దరూ ఉన్నారని బోధించాడు. ఈ దుర్బోధను క్రీ.శ. 431 లో ఎఫెస్సులో జరిగిన ఆలోచన సభ (సినడ్) ఖండించి, యేసుక్రీస్తు రెండు స్వభావాలు కలవాడేకాని, ఇద్దరు వ్యక్తులుకారని బోధించారు.

8.6. ఏకస్వభావవాదము (Monophysitism):

కాన్స్టాంటినోపుల్లోని ఒక క్రైస్తవ సన్యాసుల మఠం నాయకుడైన యూటికస్ అనే వ్యక్తి నెసోరియన్ కు వ్యతిరేకంగా ద్వంద్వ వ్యక్తుల సిద్ధాంతాన్ని ఖండించబోయి ఏకస్వభావ సిద్ధాంతం అనే మరో దుర్బోధకు క్రీ.శ. 448 లో నాందిచేశాడు. ఇతని బోధ ప్రకారం యేసుక్రీస్తులో దైవత్వం, మానవత్వం సంకీర్ణం చెంది నూతన వ్యక్తిత్వం ఆవిష్కరించబడింది. యేసుక్రీస్తు మానవత్వం దైవత్వంలో విలీనమైంది. దైవత్వం మానవత్వాన్ని ఆపాదించుకొంది. అందువల్ల దైవత్వం మానవత్వం సంకీర్ణం చెంది ఏకస్వభావం ఏర్పడింది. దీన్ని బట్టి యేసుక్రీస్తు మానవత్వం ద్వితీయశ్రేణి మానవత్వం, దైవత్వం ద్వితీయ శ్రేణి దైవత్వం అయ్యింది.

పాలల్లో నీళ్ళు కలిపితే నీళ్ళు పాలైనవి. పాలుకూడ నీళ్ళలో కలిసి నీళ్ళు అయినవి. వెరసి నీళ్ళపాలు అయినవి. నీళ్ళు ప్రత్యేకంగాలేవు. పాలు ప్రత్యేకంగా లేవు. పాల లక్షణాల్ని నీళ్ళు అంగీకరించాయి. అనగా దైవలక్షణాల్ని కూడ మానవత్వం అంగీకరించింది. యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావాన్ని ఈ దుర్భోధ పాడుచేసింది. ఈ బోధ సంఘంలో గొప్ప అలజడి సృష్టించింది. ఈ బోధ నిర్ద్వంద్వంగా చెప్పేది ఏమిటంటే - యేసుక్రీస్తు సంపూర్ణమైన దేవుడు కాడు. సమగ్రమైన మానవుడుకాడు. క్రీ.శ. 405 మరియు 451 లో “కాల్సిడన్” లో జరిగిన విశ్వ సంఘ సమ్మేళనంలో ఈ దుర్బోధను ఆలోచనసభ ఖండించింది. యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావాలు కలవాడని నిర్ధారించింది. ఈ బోధన “యూటకియనిజమ్” అని కూడా అంటారు.

8.7.సాంప్రదాయకమైన క్రిస్టాలజీ (క్రీస్తుని గురించిన విశ్వాసము)

క్రీ.శ. 451 లో అక్టోబరు 8 నుండి నవంబర్ 1 వరకు విశ్వ క్రైస్తవ సంఘ సమ్మేళనం కాల్సిడన్లో జరిగింది. ఈ ఆలోచన సభలో 600 మంది బిషప్పులు పాల్గొన్నారు. ఈ ఆలోచన సభలో అనేక తర్జన భర్జనలు, వాదప్రతివాదనలు జరిగిన తరువాత క్రీస్తు ప్రభువుడైన మానవ స్వభావాన్ని గురించిన ఒక “క్రీడీను” ఏర్పరిచారు. ఈ “కాల్సిడన్ క్రీడ్” ను అప్పటి నుండి రోమన్ కాథలిక్కులు, ప్రొటెస్టెంటులు, ఆర్థోడాక్స్ వారి డినామినేషన్లు అన్ని కూడ ఈ రోజు వరకు నమ్ముతున్నారు.

యేసుక్రీస్తు ద్వంద్వ స్వభావాన్ని (Hypostatic Union) హైపోస్టాటిక్ యూనియన్ అని నిర్వచించారు. ఐక్యపరచబడిన స్వభావాలు అని దీని భావం. సంకీర్ణం చేయబడిన కాదు. ఐక్యము చేయబడిన స్వభావాలు.

 

కాల్సిడన్ దృక్పథం

 

“మేము సంఘ పితరుల్ని అనుసరిస్తూ ఏకాభిప్రాయంతో ఒక్కడే అయి ఉన్న కుమారుడు మన యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణమైన దేవుడు మరియు సమగ్రమైన మానవుడని ఒప్పించేలా బోధిస్తున్నాం. హేతుబద్ధమైన ప్రాణాత్మ దేహాలు కలిగిన నిజ మానవుడు, నిజదైవం యేసుక్రీస్తు, దైవత్వాన్ని బట్టి దేవునితో సమానమైన దైవత్వాన్ని మరియు మానవత్వాన్ని బట్టి మానవునితో సమానమైన మానవత్వాన్నీ కలిగి ఉన్నాడు. అన్ని విషయాల్లోను మనవలె ఉండి పాపరహితుడుగా ఉన్నాడు. దైవత్వాన్ని బట్టి యుగాలకు పూర్వం తండ్రి యొక్క అద్వితీయ కుమారుడై ఉన్నాడు మరియు మానవత్వాన్ని బట్టి దైవమాత అయిన కన్య మరియకు మన రక్షణార్థం కాలానుగుణంగా జన్మించాడు. ఏలాటి గందరగోళం లేక ఏమార్పులేక అవిభాజ్యంగా వేరుపరచలేని విధంగా ఒకే ఒక క్రీస్తు, కుమారుడు, ప్రభువు, జనిత్రిక కుమారుడు, రెండు స్వభావాలు గలవాడై ఉన్నాడు. ఐక్యతవల్ల రెండు స్వభావాలు వాటి స్పష్టతలను కోల్పోలేదు, కాని అవి, ఒకే వ్యక్తిలోను ఒకే సారంలోను సమ్మతి గలిగినవై, వాటికున్న విశేష లక్షణాల్ని భద్రపరిచాయి. ఇద్దరు వ్యక్తులుగా అవి విభజించబడలేదు. లేదా విభాగింపబడలేదు. గాని ఒకే కుమారుడు, అద్వితీయ కుమారుడు, దేవుని వాక్యం, యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాయి. ఆయనను గూర్చి అనాది నుండి ప్రవక్తలు ప్రకటించిన విధంగా యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా మాకు బోధించాడు. మరియు పరిశుద్ద పితరుల ద్వారా ఈ క్రీడ్ (వ్రాత ఒడంబడిక) మాకు హస్తగతం చేయబడింది.” (కాల్సిడన్ క్రీడ్ తెలుగు అనువాదం).

 

9. కుమారుని యొక్క రిక్తత
(KENOSIS OF SON)

 

యేసుప్రభువు తన్నుతాను రిక్తునిగా చేసుకొనెను అని ( ఫిలిప్పీ 2:5-11 ) లో మనం చూడగలం. ఈ బోధనకి సిద్ధాంతం అంటారు. కాని ఈ సిద్ధాంతం దుర్బోధకుల రాద్ధాంతానికి దారితీసింది. ఫిలిప్పీ 2:5-11 వరకు గల వాక్యభాగాన్ని సరిగ్గా వ్యాఖ్యానించక పోవడం (Wrong Exegesis) వల్ల భిన్న బోధలు ఉనికిలోనికి వచ్చాయి.

9.1. భిన్నమైన బోధలు :

1) యేసుక్రీస్తు తన దైవత్వాన్ని కోల్పోయి మానవుడు అయినాడు. కనుక శరీరధారియైన యేసుక్రీస్తు దేవుడు కాడు.

2) యేసుక్రీస్తు మానవునిగా ఉన్నప్పుడు సర్వజ్ఞానం, సర్వశక్తి అనే కొన్ని దైవిక లక్షణాల్ని కోల్పోయినాడు. కనుక యేసుక్రీస్తు పరిపూర్ణమైన దేవుడుకాదు.

3) యేసుక్రీస్తు తన దైవత్వాన్ని దాచిపెట్టడం ద్వారా మానవుడిగా కనబడినాడు.

9.2. ఈ బోధలు దుర్బోధలు అనడానికి గల కొన్ని వాదనలు :

1) గత 1900 సంల చరిత్రలో పేరున్న ఏ ప్రసంగికుడు కాని, బోధకుడు గాని, పండితుడుకాని ఈ బోధలు చేయలేదు.

2) యేసుప్రభువు రెండు స్వభావాల్ని గురించి సంఘ చరిత్రలో అనేక దుర్భోధలు బయలుదేరినవి. వాటిని విశ్వ సంఘ సదస్సుల ఆలోచన సభలు ఎప్పటికప్పుడు ఖండించాయి.

3) కల్సిడన్ ఆలోచన సభవారు సిద్ధంచేసిన క్రీడ్ యేసుప్రభువు పరిపూర్ణమైన దేవుడని, సమగ్రమైన మానవుడని నిర్ధారించినది.

4) ఫిలిప్పీ 2:5-11 వరకు గల వాక్యభాగాన్ని తప్పుగా వ్యాఖ్యానించడం ప్రధాన కారణం.

5) యేసుక్రీస్తు మానవుడుగా ఉన్నప్పుడు తన దైవ లక్షణాలన్నింటిని ప్రదర్శించి తీరాలనే అపోహ..

6) యేసుక్రీస్తు మానవుడుగా ఉన్నప్పుడు తన దైవ లక్షణాలన్నింటిని కోల్పోయి తీరాలనే అపోహ.

7) సందర్భాన్ని చూస్తే పౌలు ఫిలిప్పీయుల్ని యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండమని ప్రోత్సహిస్తూ, యేసు రిక్తునిగా చేసుకొన్నాడని చెప్పాడు. యేసును అనుసరించచున్నాడు. వారిని హెచ్చుగా ఉండక దీనులుగా ఉండమని చెప్పాడు. సందర్భాన్నిబట్టి చూస్తే దైవత్వానికి యేసు మానవత్వాన్ని జోడించుకొని తన్నుతాను తగ్గించుకొన్నాడు అని అర్థం వస్తుంది.

8) క్రీస్తు చనిపోయినపుడు దేవుడుగా చనిపోకపోతే మనకు రక్షణలేదు.

9.3. కినోసిస్ (రిక్తత)కు సరియైన నిర్వచనములు :

యేసుక్రీస్తు ప్రభువు తన దైవత్వాన్నిగాని, దైవ లక్షణాలనుగాని కోల్పోకుండానే తన దైవత్వానికి మానవత్వాన్ని జోడించుకున్నాడు.

9.4. ఫిలిప్పీ 2:5-11 వాక్యభాగానికి సరియైన వ్యాఖ్యానము :

(డా||జాన్. ఎఫ్. వాల్ వార్డ్చే విరచితమైన జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్, డా|| బెల్షా క్లాస్ నోట్సు ఆధారంగా)

1) “ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైయుండి” అనే మాట గ్రీకు భాషలో ఊపర్ కోన్స్ (Huperchons) అనే ఈ గ్రీకు పదము (hupercs) అనే క్రియయొక్క వర్తమాన అసమాపక క్రియ (present participle) రూపము. ఈ క్రీయరూపం రెండు అర్ధాలను ఇస్తుంది. (a) యేసుక్రీస్తు శరీరధారణ చేశాక, మునుపు ఆయనకు స్వతహాగా ఉన్నస్థితి. అనగా ఆయన దేవుడై ఉండినాడు. (b) ఇంతకుమునుపు ఉండిన స్వతః సిద్ద లక్షణం, శరీరధారణ తదుపరి కొనసాగించబడింది. అనగా సిలువ వేయబడినపుడు కూడ దేవుడే. ఆ క్రియ వర్తమాన క్రియ. అనగా యేసుక్రీస్తు వర్తమాన పరిస్థితి. ఆయన దేవుడు.

2) “దేవునితో సమానంగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు కానీ”...
“విడిచిపెట్టకూడని భాగ్యము” యొక్క భావము. ఒక వ్యక్తి తను దేనికి తగడో అది అతనికి ఇవ్వబడితే అతడు దానిని విడిచిపెట్టుకొనలేడు. దానిని పట్టుకొనే వ్రేలాడుతాడు. దేవునితో సమానంగా ఉండుట యేసుప్రభువుకు విడిచిపెట్టకూడని భాగ్యమేమీకాదు. ఎందుకంటే ఆయన దేవునితో సమానుడు.

అది ఆయన భాగ్యముకాదు. అది ఆయన సారము. అది ఆయన హక్కు

3) “తనను తాను రిక్తునిగా చేసుకొనెను.” రిక్తునిగా అను పదము యొక్క భావము:
“రిక్తునిగా” అనేమాటకు గ్రీకు భాషలో “కినోసిస్” అనే పదం వాడబడింది. కీనోసిస్ అనగా ఖాళీచేయుట లేదా ధారపోయుట, క్రీస్తు ప్రభువు మనకొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. ( యెషయా 53:12 చూడండి). కీనోసిస్, కోనో ఓ అనే క్రియనుండి గ్రహించబడింది. యేసు తన్నుతాను రిక్తునిగా చేసుకున్నందున మానవుడు కాలేడు. మనం వాక్య నిర్మాణాన్ని గమనిస్తే మనుష్యుని రూపం ధరించుకొని తన్నుతానే రిక్తునిగా చేసుకున్నాడు. యేసుక్రీస్తు దైవత్వాన్ని లేశమాత్రం కోల్పోలేదని మనం ముందే చూశాం. కనుక రిక్తునిగా చేసుకోవడం అంటే ఖాళీచేసుకోవడం కాదుకాని మానవ ఆకారాన్ని, పోలికను జోడించుకున్నాడని భావించాలి.

4) “ఆయన ఆకారమునందు మనుష్యునిగా కనబడి”. “ఆకారం” అనగా ఏమిటి? “ఆకారం” అన్న మాటకు గ్రీకు పదము “సేమా” అనగా బహిరంగస్వరూపము. మానవుని ఆకారమును యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. లేదా ధరించినాడు. లేదా తన దైవత్వానికీ మానవ ఆకారాన్ని జోడించాడు.

9.5. సారాంశము :

అన్నిటిని కలిపి యోచించినపుడు మనం ఈ క్రింది వాటిని గ్రహించగలం.

1) యేసుక్రీస్తు దైవత్వాన్ని కోల్పోలేదు.

2) యేసుక్రీస్తు కొన్నిదైవ లక్షణాలను కోల్పోయినాడు అనుట సరికాదు. ప్రభువు తను భూమిపై నున్నప్పుడు తనంతట తానే స్వేచ్ఛాయుతంగా కొన్ని దైవ లక్షణాలను వినియోగించుకోలేదు. ఆ అవసరము కలుగలేదు.

3) దేవుని మహిమను ఎవరూ చూడలేదు. యేసుక్రీస్తు తన మహిమను తాత్కలికంగా మరుగుచేసినాడు. ఆయన మహిమ కలిగి ఉన్నాడు కాని మనుష్యులకు దాన్ని గోచరం కానివ్వలేదు (చూడండి మత్తయి 17:1-8 ; యోహాను 1:14 ; 17:5 ).

4) యేసుక్రీస్తు దేవుని బాహ్య స్వరూపము కనబడనీయలేదు. మనుష్యుని ఆకారంలో కనబడాలి. అంటే దేవుని బాహ్య స్వరూపాన్ని మరుగుచేయాలి. అది శరీరధారణకు అవసరం.

5) యేసుక్రీస్తు తన్నుతాను మన కొరకు ధారపోసుకొన్నాడు. ఖాళీచేసుకున్నాడు.

 

10. కుమారుని యొక్క పాపరాహిత్యం
(IMPECCABILITY OF SON)

 

(డా|| బిల్షా గారి క్లాసునోట్సు ఆధారంగా) యేసుప్రభువు మనకోసం చేసిన బలియాగం అనే కృత్యం యొక్క ప్రయోజనాలు మనకు సిద్ధించాలంటే ఆయన వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైనదై యుండాలి. వ్యక్తిత్వంపై కృత్యం యొక్క సిద్దత లేక సాఫల్యత ఆధారపడి ఉంటుంది. వేరెవరైనా మానవుడు మనపాపముల కోసం మరణిస్తే ఆ మరణ ఫలసాయం మనకు సిద్దించగలదా ? సిద్ధించదు. కారణం అతడు మనవంటివాడే కనుక. యేసు ప్రభువే ఎందుకు మరణించాలి ? ఆయన కూడ మనవంటి నరుడు కాదా ? అవును ఆయన మనవంటి నరుడే కాని మనకు వేరుగా ఉన్నాడు. అదే ఆయన పాపరాహిత్యం. యేసుక్రీస్తు పాపసహితుడైతే ఆయన చేసిన బలికి మరో పుణ్యాత్ముడు చేయు బలికి వ్యత్యాసం లేదు. యేసు ప్రభువు పాపం లేదా పాపబీజం కలవాడైతే లేదా జన్మపాపం కలవాడైతే లేదా పాపం చేయు సామర్థ్యం గలవాడైతే ఆయన చేసిన పాపపరిహారకృత్యం అర్థవిహీనం అవుతుంది. యేసునందు మనం విశ్వసించడం, మనకెట్టి సాఫల్యత కలిగించదు. ఆ విశ్వాసం వ్యర్థమే. ఒకవేళ యేసుప్రభువు పాపరహితుడైతే, ఆదాము నుండి పాపం సంక్రమించనివాడైతే లేదా పాపం చేయుటకు అశక్తుడైతే ఆయన చేసిన పాపపరిహార కృత్యం అర్థవంతమవుతుంది. ఆ కృత్యం ద్వారా మనకు సాఫల్యత సిద్ధిస్తుంది. యేసుక్రీస్తు పాపరాహిత్యం క్రైస్తవ సిద్ధాంతాలకు ఆయువుపట్టు. కుమారుని పాపరాహిత్యం విషయంలో కొన్ని అపోహలు ఉన్నవి. వాటిని మనము చర్చిద్దాం.

10.1. మొదటి అపోహ :

“శోధన యధార్ధమైనదైతే, ఆ శోధనకు శోధింపబడే వ్యక్తిని లోపరచుకొనే శక్తి ఉండాలి”. శోధించబడే వ్యక్తిని శోధన లోపరచుకొనకపోతే, ఆ శోధన కృత్రిమమైన శోధనేగాని, అచ్చమైన శోధనకాదు.

 

పరిష్కారం :

 

1) శోధనకు లోపరచుకొనే శక్తి ఉండాలి అనే ఆలోచన సరియైనది కాదు. ఇది ఒక అపోహ మాత్రమే. ఉదాహరణకు ఒక రోబోట్ ఒక పెద్ద యుద్ధనౌక మీద దాడి చేసింది. రోబోట్ ఎట్టి పరిస్థితుల్లోను యుద్ధనౌకను జయించలేదు. జయించలేను అని రోబోట్కు కూడ తెలుసు. అయితే అంతమాత్రాన ఆ దాడి నిజమైనది కాకుండా పోదు.

2) శోధించుటకు సమానమైన గ్రీకు మాట 'పెయిరాడో (Peiradz0). ఈ పెయిరాడ్లో ఒక వ్యక్తిని పాపం చేయించుటకు శోధించుట అనే అర్థంలో వాడబడలేదు. కాని దాని భావం “పరీక్షించుటకు, రుజువు చేసికొనుటకు, అనే సందర్భంలో వాడబడింది. అనగా ఒక వ్యక్తి సామర్థ్యం లేదా బలహీనత, మంచితనం లేదా పాపం తెలుసుకొనే సందర్భంలో ఉపయోగించే మాట, ఒక వ్యక్తి శీలాన్ని లేదా స్థితిని పరిశోధించేందుకు ఈ మాట వాడబడుతుంది.

10.2. రెండవ అపోహ :

“శోధింపబడువాడు ఇతరులకు సహాయం చేయుటకు శోధనకు లోబడుట అవసరం.” యేసుక్రీస్తు శోధనకు లోబడకలిగేవాడేకాని, లోబడక శోధనను జయించాడు. కాని శోధనకు లొంగుట అనేది ఏమిటో ఆయన ఎరుగును. కనుక ఆయన శోధనకు లోబడు వారికి సహాయము చేయుటకై వారితో సమాన అనుభవముగలవాడు అయ్యాడు.

 

పరిష్కారం :

 

1) శోధించబడేవారికి సహాయం చేసేవ్యక్తి శోధనకు లొంగుట అనేది స్వీయానుభవంలో ఉండాలనే నియమంలేదు. అది ఒక అపోహమాత్రమే. నిజానికి శోధనకు లొంగుబాటు చూపించుట అనే స్వభావం లేని వ్యక్తే మరి ఎక్కువగా సహాయం చేయగలడు. శోధనకు లొంగే పాపుల ఆలోచనకన్న శోధనకు లోబడని పరిశుద్దుల ఆలోచన మనం అంగీకరించాలి.

2) హెబ్రీ 4:15 : మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాదుగానీ, సమస్త విషయములలో మనవలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

“సహానుభవం మరియు పాపం లేనివాడు” అనే మాటలను హెబ్రీ 4:15 జోడిస్తూ ఉంది. ఆయన శోధించబడుటలో మనతో సహానుభవం గలవాడేకాని ఆయన పాపం లేని వాడుగ ఉన్నాడు. అన్న విషయం గమనార్హం. .

10.3 మూడవ అపోహ :

సహానుభవం అంటే మనవలెనే శోధించబడి అని అర్థం. అనగా మనకు కలిగిన శోధనలే యేసుకూ కలిగినవి. ఒక మానవునికి కలిగిన అన్ని రకాల శోధనలు యేసుకూ కలిగాయి కనుకనే ఆయన అందరికి సహాయం చేయగలడు.

 

పరిష్కారం :

 

1) మనకు కలిగిన శోధన వంటి శోధనలే యేసుకు కలిగినవి అనుకోవడం ఒక అపోహ. అలాటి నియమం ఏమీలేదు. ఉదా : చిన్న బిడ్డలు వ్యభిచార విషయంలో శోధింపబడలేరు. వారి శోధన ఆహారం. ఏ వయస్సుకు తగ్గ శోధన ఆ వయస్సుకు కలుగుతుంది. అందరూ అన్ని పాపాల విషయమై శోధింపబడలేరు.

2) మెస్సియాకు కలిగే శోధనే ప్రభువుకు కలిగాయి. ఇంత వరకు ఏ మానవుడు కూడా రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినడానికి శోధింపబడలేదు; ఎత్తైన కొండ మీద నుండి దూకితే దేవదూతలు క్రింద పట్టుకుంటారు కాబట్టి దుకాలి అని శోధింపబడలేదు; లేదా ప్రపంచ మహిమను మానవునికి చూపించి, అదంతా తనకు ఇవ్వబడుతుంది. కనుక అపవాదిని పూజించు అని శోధింపబడలేదు. ఇవి మెస్సీయాగా రాబోయే వ్యక్తికి కలిగే శోధనలు.

3) అన్ని రకాల శోధనలను మూడు తరగతులుగా వర్గీకరించవచ్చును. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ( 1 యోహాను 2:16 ) ఆదాము కూడ వీటి విషయంలోనే శోధించబడి లోబడిపోయాడు. ప్రభువు కూడా వీటి విషయంలోనే శోధింపబడి జయించినాడు.

10.4. నాలుగవ అపోహ :

నిజమైన మానవత్వం పాపానికి లోబడుట అనే లక్షణాన్ని కలిగి ఉండాలి. యేసు ప్రభువు సమగ్రమైన మానవుడు గనుక ఆయన తప్పక శోధనకు లోబడే స్వభావం కలిగి ఉండాలి.

 

పరిష్కారం :

 

1) యేసుక్రీస్తు దైవమానవుడని గుర్తుంచుకోవాలి. నిత్యుడగు పరిశుద్ధ కుమారుడు మానవత్వాన్ని తన దైవత్వానికి జోడించుకున్నాడు. యేసుక్రీస్తు సమగ్రమైన మానవుడు అదే సమయంలో పరిపూర్ణమైన దేవుడు. యేసుక్రీస్తు మానవస్వభావం దైవత్వం అనే పునాది మీద కట్టబడింది. దైవత్వం అనాది నుండి ఉంది. మానవత్వం మధ్యలో జోడించబడింది. మానవత్వానికి దైవత్వం కలుపబడలేదు. యేసుక్రీస్తు మానవ దేవుడు కాదు. కాని దైవ మానవుడు.

2) యేసుక్రీస్తులో రెండు స్వభావాలు కూడ సమ్మతి కలిగి నివసిస్తున్నాయి. మానవత్వం అనాదినుండి ఉన్న దైవత్వానికి జోడింపబడి ఒకే వ్యక్తిలో దైవత్వంలో సమ్మతి కలిగి నివసిస్తుంది. యేసుక్రీస్తు  దైవత్వం యేసుక్రీస్తు మానవత్వాన్ని తనకు కలుపుకొని యేసుక్రీస్తులో నివసించడానికి సమ్మతించినది.

3) పాపం చేసేది వ్యక్తి. స్వభావం కాదు. యేసుక్రీస్తు పాపంచేస్తే (లేదా చేయాలనుకుంటే) దైవమానవుడు పాపం చేయాలి కాని అతనిలోని మానవత్వం కాదు. దైవమానవుడు పాపరహితుడు.

4) యేసుక్రీస్తులో ఆదాము నుండి సంక్రమించిన పాపం లేదు. అనగా ఆదాము యొక్క పాపము యేసు మీద మోపబడలేదు. కుమారుడు మరియ గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. పరిశుద్ధాత్ముడే మానవబీజాన్ని మరియ గర్భంలో నాటాడు. ప్రభువులో పాపనైజం లేనేలేదు. పాపం చేయాలంటే పాపనైజం ఉండాల్సిందే, కాని ప్రభువులో అదిలేదు. ( లూకా 1:30–35 ). ఆయన పాపులతో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని హెబ్రీ పత్రిక రచయిత చెప్పుతున్నాడు. హెబ్రీ 7:26 .

10.5. ఐదవ అపోహ :

యేసుక్రీస్తు కడపటి ఆదాము. కాబట్టి మొదటి ఆదాము క్రమంలో ఆయన కూడ శోధింపబడి పాపానికి లోబడగల సామర్థ్యం గలవాడే. ఆదాముకు కూడ జన్మ పాపం లేదు. కాని శోధింపబడినపుడు పాపం చేశాడు. యేసుప్రభువుకు కూడా ఆ అవకాశం ఉన్నది. పాపాన్ని ఎన్నుకొనే నైతిక స్వేచ్ఛ మానవునికి ఉన్నది. అది యేసునకు కూడా ఉన్నది.

 

పరిష్కారం :

 

1) నైతిక స్వేచ్ఛను తప్పుగా అర్థం చేసుకోవడం జరిగింది. నైతిక స్వేచ్ఛ అనేది మంచి చెడులను చేసే అవకాశాలపై ఆధారపడిలేదు. కాని మంచి చెడులను విశ్లేషించగల సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. పాపాన్ని ఎన్నుకునే నైతిక స్వేచ్ఛ మానవునికి ఉంది. కాని యేసుకు కూడా ఉండాలనే నియమం ఏదీ కూడలేదు. కారణం మానవునికి పాపంవైపు మొగ్గుచూపే నిర్భంధం ఉంది. రోమా 7:18-21 చదవండి. మానవునికి పాపం చేయాలనే నిర్బంధం ఉంది. దీనికి కారణం పాపబీజం. యేసుప్రభువుకు ఆ నిర్భంధం లేదు.

కాబట్టి మానవునికి నైతిక స్వేచ్చలేదు. పాప నిర్బంధమే ఉంది. వాస్తవానికి నిజమైన నైతిక స్వేచ్ఛ దేవునికే ఉన్నది. నైతిక స్వేచ్ఛలో పాప నిర్బంధము అనే (Ingrediant or element) దినుసు లేదా మూలకము లేదు..

2) ఆదాములో పాపమూలం లేదు. కనుకనే నిజమైన నైతిక స్వేచ్ఛ ఉండినది. కాని శోధనకు లోబడుటను బట్టి ఆ నైతిక స్వేచ్ఛ పాపంచేత కలుషితమైపోయింది. కాబట్టి ఇప్పుడు మానవుడు కలిగి ఉన్న నైతిక స్వేచ్ఛ, స్వచ్ఛమయిన నైతిక స్వేచ్ఛ కాదు. నైతిక స్వేచ్ఛస్థానాన్ని నిర్భంధం తీసుకున్నది. యేసుక్రీస్తు స్వచ్చమైన నైతిక స్వేచ్ఛగలవాడు. స్వచ్ఛమైన నైతిక స్వేచ్ఛలో పాప నిర్భంధం లేదు.

3) ఆదామును శోధించినవాడు అపవాది. అపవాది. ఆదాము కంటే ఎన్నోరెట్లు శక్తిమంతుడు. కాబట్టి ఆదాము శోధనకు లోబడినాడు. ఆదాము బహిరంగ శక్తులకు లోబడినాడు. కాని అంతరంగ నిర్భంధశక్తికి కాదు. ఇప్పుడైతే మానవుడు బహిరంగ శక్తులకన్నముందే అంతరంగంలో ఉన్న పాప నిర్బంధ శక్తికి లోబడిపోతున్నాడు. యేసుప్రభువును బహిరంగ శక్తులు ఏమీచేయలేవు. ఆయన అపవాది కన్న ఎన్నెన్నో రెట్లు శక్తిమంతుడు. ( 1 యోహాను 4:4 ).

4) యాకోబు 1:14 ప్రకారం దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ప్రతి మనిషి కూడ తన స్వకీయ దురాశవలన మరులుకొల్పబడి శోధింపబడతాడు. దేవునిలో స్వకీయమైన దురాశలేదు.

 

11. కుమారుని యొక్క శ్రమలు-మరణము
(PASSION OF SON)

 

అనంతుడైన దేవునిలో రెండవ వ్యక్తియైన కుమారుడు, నిత్యత్వంనుండీ ఉన్నవాక్కు (లోగాస్) శరీరాకృతి ధరించినది మరణించడానికే. దైవ కృత్యాలలో అత్యంత ప్రాధాన్యమైంది. యేసుప్రభువు మరణం. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు సంభవించిన ఏ సంఘటన కూడ యేసుప్రభువు శ్రమనొంది మరణించుట అంత ప్రాముఖ్యమైనవికావు. మానవుల రక్షణార్థమై లోకపాపాన్ని మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్లయగు యేసుక్రీస్తు మరణించుట మహాద్భుతమైన సంఘటన.

11.1.యేసుక్రీస్తు శ్రమానుభవం మరియు ప్రభువు మరణంలోని విశేషత

 

11.1.1. నిత్యత్వంలో నిర్ణయించబడింది :

 

యేసుప్రభువు శ్రమనొంది మరణించవలెనని సృష్ట్యారంభానికి పూర్వం అనగా ఆదాము చేయబడక ముందే, ఆదాము పడిపోకముందే నిర్ణయించబడింది. అ.కా. 2:23 , అ.కా. 4:27-28 .

 

11.1.2. భూతకాలంలో సాదృశ్యంగా చూపబడినది :

 

పాతనిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు బలియాగం సాదృశ్యరీతిగా అనేకచోట్ల ప్రదర్శింపబడింది.

• దేవుడు ఆదాం హవ్వలకు చర్మపు చొక్కాయిలు తొడిగించుట (పశువు
మరణించకుండ చర్మం లభ్యంకాదు) ఆది 3:21 .

• హేబేలు అర్పించిన బలి ఆది 4:4

• అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చే సంఘటన. ఆది 22:10-13

• ఐగుప్తులో జరుపబడిన పస్కాపండుగ. నిర్గమ 12:1-28

• ధర్మశాస్త్రాను సారంగా అర్పించబడే పలురకాల అర్పణలు లేవి 1-7 అధ్యాయాలు

ఈ బలులన్నీ కూడా సంభవించనైయున్న ఒక గొప్ప బలికి సంకేతాలుగా ఉన్నాయి.

 

11.1.3. పాత నిబంధనలో ప్రవచింపబడినది:

 

• యేసుప్రభువు అప్పగించబడుటను గూర్చిన ప్రవచనం ( కీర్తన 41:9 ; పోల్చండీ యోహాను 13:18 ; అ.కా. 1:16 ).

• సిలువ మరణాన్ని గూర్చిన ప్రవచనాలు ( కీర్తన 22:1,7,8 ; పోల్చండి. మత్తయి 27:39, 46 ; మార్కు 15:34 , యోహాను 19:23 ).

• యేసుప్రభువు శ్రమ (యెషయా 53వ అధ్యాయము)

• మెస్సియా 69 వారాలకు తీసివేయబడతాడని దానియేలు ప్రవచించాడు ( దానియేలు 9:26 ).

• యేసుక్రీస్తు ముప్పై వెండి నాణెములకు అమ్మబడుట. ( జకర్యా 11:12 ; పోల్చండి మత్తయి 26:15 ; 27:9 ).

• గొర్రెల కాపరి కొట్టబడును ( జెకర్యా 13:7 ).

 

11.1.4. వర్తమాన కాలంలో నెరవేర్చబడింది :

 

సువార్తలలో పత్రికలలో ఈ విషయం నెరవేరినట్లు మనం చూడగలం. (మత్తయి 27:32-66; మార్కు 15:21-47; లూకా 23:23-56; యోహాను 19:16-42; రోమా 5:6 ; 1 కొరింథు 15:3 ; 2 కొరింథు 5:15 ).

 

11.1.5. భవిష్యత్తులో జ్ఞాపకం చేసుకోబడనైయుంది :

 

పరలోకంలో వధింపబడిన గొర్రెపిల్లను జ్ఞాపకం చేసుకొని పరలోక సమూహాలు స్తుతిస్తున్నాయి ( ప్రక 5:8-11 ).

11.2. యేసుప్రభువు శ్రమలు

యేసుప్రభువు శరీరధారణ నుండి మరణం వరకు శ్రమపడుతూనే ఉన్నాడు. వివిధ దశల్లో వివిధ రకాలుగా వివిధ పరిస్థితుల్లో శ్రమను అనుభవించాడు. శ్రమపరచబడుట అనేది ఆయన జీవితంలో ముడిపడి ఉన్న విషయం. ప్రభువు శ్రమ శరీర సంబంధమైనది మాత్రమే కాదు అది మానసికమైనది కూడా.

 

11.2.1. శరీరధారణలో కలిగిన శ్రమ :

 

నిత్యుడగు దేవుడు, అనంతుడగు దేవుడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలనీ అపరిమితుడైన దేవుడు (IMMENSE). మానవత్వాన్ని తనకు జోడించుకొని మరియ గర్భంలోకి ప్రవేశించి, పరిమితుడైన లేదా అల్పుడైన మానవుడుగా జన్మించుటలో వేదన శ్రమ ఇమిడి ఉన్నాయి. పాపాన్ని చూడలేని దేవుడు, పరిశుద్ద దేవదూతల మధ్య నివసించి సంచరించే దేవుడు, పాపభూయిష్టమైన లోకంలో పాపాత్ముల మధ్య సంచరించుట శ్రమే కదా !

 

11.2.2. జీవితకాలంలో కలిగి శ్రమ :

 

మనుష్యుడుగా ఆయన ఎదుగుచున్నప్పుడు శ్రమ పొందాడు. విధవరాలైన తల్లికి జ్యేష్ణ కుమారుడుగా శరీర సంబంధమైన కష్టాలు అనుభవించక తప్పలేదు. హెబ్రీ 5:7-8 .

 

11.2.3. పరిచర్యలో కలిగిన శ్రమ :

 

ప్రభువు తాను జరిగించిన 3 1/2 సంవత్సరాల పరిచర్య కాలంలో అనేక పర్యాయాలు అవమాన పరచబడ్డాడు. ఆయన కుటుంబం ఆయన్ని నమ్మలేదు. చివరకు శిష్యుడే ద్రోహం చేశాడు. సాతానుచే శోధింపబడినాడు. ( మత్తయి 4:1-11 ; హెబ్రీ 12:2 ; యోహాను 11:35 ; యెషయా 53:5 ; మత్తయి 13:56,57 ).

 

11.2.4. సిలువలో కలిగిన శ్రమ:

 

ప్రభువు కొట్టబడ్డాడు. దూషింపబడ్డాడు, శపించబడ్డాడు. అవమాన పరచబడ్డాడు. ఈడ్వబడినాడు. హీనాతిహీనంగా చంపబడినాడు. ఆయన శిష్యులు ఆయన్ని విడిచి పారిపోయారు. అన్యాయపు తీర్పు తీర్చబడినాడు. తండ్రి ఉగ్రత కుమ్మరించబడింది. లోకపాపం మోపబడింది. తండ్రి, పరిశుద్దాత్ముడు విడనాడినారు. ( మత్తయి 26:38 ; యెషయా 53:5 ; లూకా 28:1-39; యెషయా 53:6 ; 2 కొరింథు 5:21 ; 1 పేతురు 2:24 ; గలతీ 3:13 ; మత్తయి 27:46 ; హెబ్రీ 12:21 ).

11.3.యేసుప్రభువు శ్రమకు గల కారణాలు

 

11.3.1. మానవుని పాపాన్ని భరించుట ద్వారా కలిగిన శ్రమ :

 

యేసుప్రభువుపై లోకపాపం మోపబడింది. పాపులతో చేరక ప్రత్యేకంగా నున్న యేసుపై ( హెబ్రీ 7:26 ) మన పాపాలు సిలువలో మోపబడినాయి. ( 1 పేతురు 2:22-24 ) పరిశుద్ధమైన వాడు పాపంగా చేయబడినాడు. ( 2 కొరింథీ 5:21 ) యేసుక్రీస్తు గెత్సెమనెలో ప్రార్థించినపుడు “నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించుము” ( లూకా 22:42 ) అని తండ్రిని వేడుకొన్నాడు. ఈ గిన్నె శ్రమల గిన్నెకాదు. ఆయన శ్రమనొందడానికి జంకడంలేదు. కాని లోక పాపం అనే గిన్నెను తాను స్వీకరించుట ద్వారా ఆయన శ్రమ పరచబడ్డాడు. ఈ శ్రమ ఆత్మ సంబంధమైన శ్రమ.

 

11.3.2. దేవుని ఉగ్రత భరించుట ద్వారా కలిగిన శ్రమ :

 

మానవుని పాపానికి శిక్ష మరణం. ఆ శిక్ష ప్రభువుకు విధింపబడింది. అన్యాయపు తీర్పు తీర్చబడి ( యెషయా 53:8 ) మరణానికి అప్పగింపబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతనిపైబడింది. ( యెషయా 53:5 ). దేవుని వలన బాధింపబడ్డాడు. ( యెషయా 53:4 ). ప్రాణాత్మ దేహాలు (soul and body) ఈ శ్రమను అనుభవించాయి.

 

11.3.3. నమ్మిన వారు ద్రోహం చేయుట ద్వారా కలిగిన శ్రమ :

 

ఆయన శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభువును శ్రమకు అప్పగించాడు. ( కీర్తన 41:9 ; యోహాను 18:2-5 ; మార్కు 14:43-46 ) ప్రభువుతోనే ఉంటామనుకొన్న శిష్యులు ప్రభువును విడిచి పారిపోయారు. ( మత్తయి 27:56 ). ఇది మానసికమైన శ్రమ.

 

11.3.4. దేవుడు చేయి విడుచుట ద్వారా కలిగిన శ్రమ:

 

యేసుప్రభువు మిక్కుటమైన శ్రమను అనుభవించుచున్నాడు. శరీరాత్మ ప్రాణాలు శ్రమ పరచబడుతున్నాయి. ఈ సమయంలో ఆయనకు తండ్రి సన్నిధి ఎంతో అవసరం కాని తండ్రి యేసుప్రభువు చేయి విడిచాడు. ( మత్తయి 27:46 ).

 

11.3.5. సిలువలో హింసించబడుట ద్వారా కలిగిన శ్రమలు :

 

యేసుప్రభువు కొట్టబడినారు. కాళ్ళు చేతులలో మేకులు కొట్టబడ్డాయి. తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది. వీపు దున్నబడింది. ఎముకలు స్థానాలు తప్పి పోయాయి. ఆయన నీళ్ళవలే పారవేయబడినాడు. ఆయన హృదయం మైనం వలె కరిగిపోయింది. ( కీర్తన 22:14-15 ; యోహాను 19:1-5 ; మార్కు 15:15-20 ; మత్తయి 27:27-31 ) ఈ శ్రమను ఆయన తన శరీరంలో అనుభవించాడు.

11.4. యేసుక్రీస్తు బల్యర్పణ విశ్లేషణ

యేసుక్రీస్తు బలియొక్క వివిధ రూపాల్ని మనం విశ్లేషించి చూద్దాం. యేసుప్రభువు మరణం నాలుగు ప్రధాన సమస్యలు పరిష్కరించింది.

 

11.4.1. పాపము యొక్క సమస్య :

 

పాపానికి జీతం మరణం ( రోమా 6:23 ). మానవుడు జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యానికి లోబడినవాడు. ( హెబ్రీ 2:15 ). మానవుడు పాపానికి లోబడిపోయి సాతాను చెరలో ఉన్నాడు. దేవుని కోపం మానవునిపై మండుచున్నది. యేసుక్రీస్తు శరీరంలో దేవుడు పాపానికీ శిక్ష విధించాడు. ( రోమా 8:3-4 ). మన దోష శిక్షను అనుభవించడం ద్వారా ( యెషయా 53:5-6 ) ఆయన పాపము యొక్క సమస్యను పరిష్కరించాడు.

 

11.4. 2. దేవుని యొక్క సమస్య :

 

దేవుని ఉగ్రత మానవుని మీద ఉంది. దేవుడు ప్రేమామయుడు. అదే సమయంలో సత్యవంతుడు మరియు న్యాయవంతుడు. దేవునిలోని సత్యసంధత, న్యాయం మానవుడు శిక్షించబడాలని కోరుతున్నాయి. యేసుక్రీస్తు తన మరణం ద్వారా మన నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. ( హెబ్రీ 2:17 ). యేసుక్రీస్తు దేవుని న్యాయాన్ని సంతృప్తిపరచాడు. దేవుని శాంతపరచాడు. ( 1 యోహాను 2:2 ). ఆయన దేవుని సమస్యను పరిష్కరించాడు.

 

11.4.3. మానవుని యొక్క సమస్య :

 

మానవుడు దేవునికి అవిధేయుడై దేవునిపై తిరుగుబాటు చేశాడు. దేవునికి శత్రువుగా జీవించాడు. దేవుడు మన శత్రువు స్థానంలో ఉన్నాడు. ( రోమా 5:10 ). దేవునికి మనతో వ్యాజ్యముంది. ( యెషయా 1:18 ; యిర్మియా 2:35 ) అయితే యేసుప్రభువు మానవుల్ని దేవునితో సమాధానపరచాడు. ఇది ఆయన మరణం ద్వారానే సాధ్యమైంది. ( యెషయా 53:5 ; రోమా 5:10 , 2 కొరింథు 5:18-19 ). యేసుక్రీస్తు తన బల్యర్పణ ద్వారా మానవుని సమస్యను పరిష్కరించాడు.

 

11.4.4 ధర్మశాస్త్రం యొక్క సమస్య :

 

ధర్మశాస్త్రం పాపానికి బలం, పాపపు ముల్లు ధర్మశాస్త్రం. మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక నేరస్థుడు అయినాడు. ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానికి లోబడ్డ వారిని విడిపించాడు. ( గలతీ 4:4-5 ). దేవుని వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మనమీద ఋణంగాను మనకు విరోధంగాను, నుండిన పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి, దానిమీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండ దాన్ని ఎత్తివేశాడు. ( కొలస్సీ 2:13-15 ) ఆ విధంగా ఆయన ధర్మశాస్త్రం సమస్యను పరిష్కరించాడు.

11.5. యేసుక్రీస్తు బలియాగం యొక్క స్వభావము

 

11.5.1. యేసుక్రీస్తు బల్యర్పణ దండనార్హమైనది (Penal) :

 

పాపానికి జీతం మరణం. పాపం చేసినవాడు శిక్షార్హుడు. దేవునిలోని న్యాయం పాపానికి శిక్ష విధించవలసిందే. పాపాన్ని బట్టి మానవులంతా నశించిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు మన దోష శిక్షను భరించాడు. ( యెషయా 53:5 ). గలతీ 3:13 , 2 కొరింథీ 5:21 , రోమా 8:4 , రోమా 8:1 .

 

11.5.2. యేసుక్రీస్తు బల్యర్పణ ప్రత్యామ్నాయమైంది (Substitutional or Vicarious) :

 

యేసుక్రీస్తు మనకు మారుగా చనిపోయాడు. మనకు బదులుగా మనకొరకు మనపక్షంగా మనస్థానంలో అనే మాటలు యేసుప్రభువు ప్రత్యామ్నాయ మరణాన్ని వివరిస్తున్నాయి. మనం నేరస్థుల స్థానంలో నిలబడ్డాం. అయితే యేసుక్రీస్తు మనల్ని ఆ స్థానం నుండి తప్పించి, తను ఆ స్థానంలో నిలుచుండి మనకు విధించబడిన దోష శిక్ష తన పైకి తీసుకొని మనల్ని శిక్షనుండి విముక్తం చేశాడు. 2 కొరింథీ 5:21 , 1 పేతురు 2:24 ; యెషయా 53:5-6 .

 

11. 5.3. యేసుక్రీస్తు బల్యర్పణ ప్రాయశ్చిత్తార్థమైంది (Propitiatory):

 

శాంతికరమైంది, కరుణాధారమైంది, ప్రాయశ్చితార్థమైంది అనే వివిధ రూపాల్లో ఈ మాట ఉపయోగించబడింది. యేసుక్రీస్తు దేవున్ని శాంతిపరిచాడు. మనం పాపం చేసిన మూలాన్న దేవుని ఉగ్రత మనపై నిలిచి ఉంది. దేవుని కోపాన్ని శాంతి పరచకపోతే మానవునికి రక్షణ లభించదు. యేసుక్రీస్తు మన దోష శిక్షను భరించి, మనస్థానంలో దేవుని ఉగ్రత అనుభవించి తన మరణం ద్వారా శాంతి పరిచాడు. దేవుని కోపాన్ని చల్లార్చాడు. ఈ కాలంలోని మోడ్రనిస్టులు (ఆధునికులు) ఈ అంశాన్ని అంగీకరించడం లేదు. ప్రేమామయుడైన దేవుడు మానవునిపై ఉగ్రత చూపడు అని వారి బోధ. పాత నిబంధన గ్రంథంలోనే దేవుని ఉగ్రత గూర్చి 580 మార్లు వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడ ఈ విషయం ప్రస్తావించబడింది. ( రోమా. 2:5 ; 3:5 ; 4:15 ; 5:9 ; 9:22 ; ఎఫెస్సీ. 2:3 , 5:6 ; కొలస్సీ. 3:6 ; 1 థెస్స. 1:10 ; 2:16 ; 5:9 ; 2వ థెస్స. 1:7-9 ; హెబ్రీ. 12:29 ; ప్రక. 16; 11:18 ; 14:10,19 ; 15:1,7 ; 16:1,19 ; 19:15 ; రోమా. 3:25-26 ; 1 యోహాను 2:2 ).

11.5.4. యేసు బల్యర్పణ విమోచనార్థమైంది (Redemptive) ఫిలి 1:7 ; గలతీ 3:13 ; 2 కొరింథీ 5:21 :

యేసుప్రభువు చేసిన విమోచనా కార్యాన్ని సమగ్రంగా గ్రహించడానికి విమోచనకు గ్రీకు భాషలో వాడబడిన పదాలను గమనించాలి.

• అగోరాజో (Agoraz0) : అనగా కొనుగోలు చేయుట, సాధారణంగా మనం ఏదైనా వస్తువును వెల చెల్లించి కొంటాం. యేసుప్రభువు పాపపు బజారు నుండి మనల్ని కొన్నాడు. ( 2 పేతురు 2:1 ; ప్రక 5:9-10 ; 14:3-4 ) ఈ వచనాల్లో విమోచనకు అగోరాజో అనే పదం వాడబడింది. 1 కొరింథీ 6:20 , 7:23 యేసుక్రీస్తు మనల్ని తనకోసం వెల చెల్లించి కొన్నాడు.

• ఎక్స్అగరాజో (Exazarazo) : 'వెలుపలికి కొనుట' అని అర్థం. యేసుప్రభువు మనల్ని పాప దాస్యపు బజారులో కొనడం మాత్రమే కాదుగానీ ఆ బజారు వెలుపలికి మనం తేబడునట్లుగా కొన్నాడు. అనగా ధర్మశాస్త్రం పరిధినుండి, పావదాస్యంలోనుండి మనల్ని కొని వెలుపలికి తెచ్చాడు. అనగా పాపం అధికారం నుండి విడిపించాడు. గలతీ 3:13 గలతీ 4:5 ఈ వచనాల్లో విమోచనకు 'ఎగ్జాజరజో? అనే గ్రీకు పదం వాడబడింది ( ద్వితీయో 21:23 చూడండి).

• లుట్రూ (Lutroo) : అనగా విడిపించుట అనగా 'వెల చెల్లించి విడుదల చేయుట' అని అర్థం. యేసుక్రీస్తు మనలను పాపదాస్యపు బజారులో కొని, దానినుండి వెలుపలికి తెచ్చి మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు. ( లూకా 24:21 ). తీతు 2:14 , 1 పేతురు 1:18,19 ఈ వాక్యభాగాల్లో విమోచనకు 'లుట్రూ' అనే గ్రీకు పదం వాడబడింది. యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించి మనకు స్వేచ్ఛను ప్రసాదించాడు.

• అపొలుత్రోసిస్ (Apolutrosis) : అనగా విడుదల, యేసుప్రభువు తానే వెలచెల్లించి మనల్ని విడిపించాడు. తెలుగులో లూకా 21:28 లో విడుదలగా “అపొలుత్రోసిస్' అనువదించబడింది. అది సరియైన అనువాదం. కొలస్సీ. 1:13 లో కూడ విడుదల అనే అనువదించబడింది. మిగిలిన చోట్ల విమోచనం అనే అనువదించబడింది. నిజానికీ ఆమాట విడుదల. యేసుక్రీస్తు మనల్ని సాతాను బంధకాల నుండి, పాపాల నుండి విడిపించాడు. ఈ వాక్య భాగాలన్నింటిలోని 'విమోచన' అనే పదం గ్రీకు భాషలోని అపొలుత్రోసిస్. ( లూకా 21:28 ; రోమా 3:24 ; 1 కొరింథి 1:30 ; ఎఫెస్సీ 1:14 ; 4:30 రోమా 8:23 , కొలస్సీ 1:13 ; హెబ్రీ 9:15 ).

 

సారాంశం :

 

యేసుక్రీస్తు తన మరణం ద్వారా విమోచన క్రయధనాన్ని అనగా మనల్ని విడిపించుటకు అవసరమైన వెలను చెల్లించాడు. మనల్ని పాపదాస్యపు బజారులో వెల ఇచ్చికొన్నాడు. పాపదాస్యపు బజారులో కొని వెలుపలికి తెచ్చి స్వేచ్ఛను ప్రసాదించాడు. సైతాను అధికారం నుండి విడుదలను అనుగ్రహించాడు.

11. 5.5. యేసుక్రీస్తు బల్యర్పణ సమాధానార్థమైంది (Reconciliatory) :

సమాధానమునకు సంబంధించి గ్రీకు భాషలోని 3 ప్రధానమైన మాటలు

• కటాలస్సో (Katalasso) రోమా 5:10 ; 2 కొరింథీ 5:18,19,20

• కటలేజ్ (Katalage) ఇది (Katalasso) నామవాచకం. ఈ మాట నాలుగు పర్యాయాలు వాడబడింది ( రోమా 5:11 ; 11:15 ; 2 కొరింథు 5:18-19 )

• మూడవ పదం అయితే ప్రాముఖ్యమైన క్రియాపదం. అపోకేటలస్సో (Anakatalasso) ఈ మాట పౌలు మాత్రమే ఉపయోగించాడు. గ్రీకు సాహిత్యంలో ఈ మాట కనబడదు. (జాన్. ఎఫ్. వాల్వర్డ్ ప్రకారం). సమాధాన కార్యం యొక్క సంపూర్ణ అర్థాన్ని, సంపూర్ణ కృత్యాన్ని ఈ మాటలు వివరిస్తున్నాయి.

2 కొరింథీ. 5:17-19 ; ఎఫెసీ. 1:20-22 ; కొలస్సీ. 1:20-22 ; రోమా. 5:10-11 ; యెషయా 2:5 . సరియైన అనువాదం సంపూర్తిగా సమాధానపరచుట.

 

సారాంశం :

 

మానవుడు విరోధ భావంతో దేవునికి శత్రువుగా ఉన్నాడు. అయితే మానవుని తనతో సమాధానపరచుకోవాలనే కోర్కెతో దేవుడు మన దోషాల్ని మనపై మోపక, వాటిని క్రీస్తుపై మోపి మన సమాధానార్థమైన శిక్షను మాంసయుక్తమైన దేహంలో ఆయనకు విధించి, ఆయన మరణం ద్వారా దేవుడు మానవుని సమాధానపరచు కొన్నాడు. ఇపుడు మానవుడు నూతన సృష్టిగా, పరిశుద్ధుడుగా, నిర్దోషి, నిరపరాధిగా దేవుని సన్నిధిలో నిలుచున్నాడు.

 

11.5. 6. యేసుక్రీస్తు బల్యర్పణ దేవుని ప్రేమను ప్రత్యక్షపరచుచున్నది (Revelatory) :

 

యోహాను 3:16 ; 1 వ యోహాను 4:9,10

 

11.5.7. యేసుక్రీస్తు బల్యర్పణ స్వేచ్ఛాయుతమైంది (Voluntary) :

 

యేసుక్రీస్తు తనంతట తానే మరణించాడు. ఆయన్ని బలవంతం చేయలేదు. మానవుల నిమిత్తం మరణించమని ఎవరును ఆయన్ను కోరలేదు. యోహాను 10:17-18.

 

11.5.8. యేసుక్రీస్తు బల్యర్పణ సదాకాలం నిలిచేది (Final) :

 

ధర్మశాస్త్ర సంబంధిత యాజకులు ప్రతిరోజు, ప్రతి ఏటా బలులు అర్పిస్తూనే ఉండాలి. ఏటేట ఎడతెగ అర్పించే ఒకే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణ సిద్ధి కలుగజేయవు. అయితే యేసుప్రభవు సదాకాలం నిలిచే బలిని ఒకసారి చేయుటద్వారా ఇక పాపాలు జ్ఞాపకానికి రావు. (హెబ్రీ 10:1-18 చదవండి) హెబ్రీ 10:12-14 .

 

11.5.9. యేసుక్రీస్తు బల్యర్పణ సఫలీకృతమైంది (Efficacious) :

 

హెబ్రీ 9:11-28 మరియు 10:1-25 చదవండి.

యేసుక్రీస్తు బలియాగం మనకు క్రింది వాటిని సాధించి పెట్టింది..

 

 

1. నిత్యమైన విమోచన
2. నిర్జీవ క్రియలను విడుచుట
3. శుద్ధిచేయబడిన మనస్సాక్షి
4. అపరాధాలనుండి విమోచన
5. పాపక్షమాపణ
6. పాప నివారణ
7. రక్షణ
8. పరిశుద్ధ పరచబడుట
9. సదాకాలం వరకు సంపూర్ణత
10.ధర్మవిధులు వ్రాయబడిన హృదయం
11. పాపం జ్ఞాపకం లేకుండుట 1
2. పరిశుద్ధ స్థల ప్రవేశం
13. కల్మషం లేని మనస్సాక్షి
14. ప్రోక్షించబడిన హృదయం
15. వాక్యంతో శుద్ధిచేయబడిన శరీరం
16. యధార్థమైన హృదయం

11.6. యేసుక్రీస్తు బల్యర్పణ ఫలితాలు

రోమా 3:24-26 -మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం

రోమా 5:16 -మన దేవునితో సమాధానం కలిగి ఉంటాం

2 కొరింథీ 5:21 -దేవుని నీతిగా చేయబడ్డాo

గలతీ 5:1 -స్వాతంత్ర్యం లభించింది

ఎఫెసీ 1:7 -పాపక్షమాపణ లభించింది.

ఎఫెసీ 2:18 -దేవుని సన్నిధికి చేరగలిగాం

హెబ్రీ 2:14 -సాతాను బలం నుండి విడిపించబడ్డాం

1 యోహాను 1:7 -మనం శుద్ధి చేయబడినాం.

 

12. కుమారుని రక్తము (THE BLOOD OF SON)

 

లియోన్ మోరీస్ ప్రకారం 'రక్తము' అనే పదం పాతనిబంధనలో 357 వచనాలలో 447 సార్లు కనబడుతుంది. రక్తము నేరుగా లేదా సాదృశ్యరీతిగా అనేకసార్లు యేసురక్తాన్ని చూపిస్తుంది. రక్తము బైబిల్లో కేంద్ర పదం. క్రైస్తవ విశ్వాసానికి పునాది. బైబిల్ బోధిస్తున్న రక్తము మన ప్రసంగాలలో నుండి, విశ్వాసములో నుండి, బైబిల్లో నుండి తొలగిస్తే మనం విశ్వాసభ్రష్టులం, అబద్ద బోధకులం. మానవ శరీరములోనుండి రక్తాన్ని తీసేస్తే జీవాన్ని కోల్పోడం జరుగుతుంది. బైబిల్లో నుండి, క్రైస్తవ విశ్వాసంలో నుండి యేసురక్తాన్ని తీసివేస్తే మనం నిత్యజీవాన్ని కోల్పోతాం. బైబిల్లో రక్తం లేకపోతే అది మృతగ్రంథం అవుతుందేగాని జీవగ్రంథం కానేరదు ( హెబ్రీ 4:12 ).

12.1. ధర్మశాస్త్రంలో రక్తముయొక్క ప్రాధాన్యత:

లేవీకాండం 17వ అధ్యాయం పశువులను చంపుటను గూర్చి వ్రాయబడింది. ఈ అధ్యాయంలో రక్తముయొక్క ప్రశస్థతను మనము చూడగలము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళినప్పుడు విస్తారమైన పశుసంపదతో వెళ్ళారు ( నిర్గమ. 10:24-26 ; 12:32,38 ). ఈ అధ్యాయము విభజన పరిశీలిస్తే రక్తానికి దేవుడు ఎంత విలువనిచ్చాడో గ్రహించగలం.

 

12.1.1. పశువులను చంపే విషయంలో నియమాలు-

 

17:3-7 . ఇశ్రాయేలీయులు మన్నాద్వారా పోషించబడుతున్నారు. మాంసాహారం కొరకు పశువులను ఎక్కడబడితే అక్కడ చంపకూడదు. ఆవు, మేక, గొర్రెలను, ఆడ పశువులు చాలా ప్రశస్తం. ఎందుకంటే పశు సంపద పెరగడానికి అవి బ్రతికి ఉండాలి. వీటి పాలపదార్థాలు తినవచ్చును, త్రాగవచ్చును. అయితే మాంసం కావాలనుకున్నప్పుడు, ఆ పశువును దేవుని సన్నిధిలో సమాధానబలిగా అర్పించి, రక్తాన్ని చిందించి, ఆ పశుమాంసాన్ని తినవచ్చును. రక్తం ప్రోక్షణ చేయాలి (6వ వచనం).

 

12.1.2. ఇతర బలులను గూర్చిన నియమాలు-

 

17:8,9 . ఎవరైనా సరే ఇశ్రాయేలీయుడైన, పరదేశి అయిన బలి అర్పించాల్సిందే లేకపోతే దేవుడు వానిని చంపుతాడు. రక్తప్రోక్షణ చేయవలసిందే.

 

12.1.3. రక్తముతో కూడిన మాంసాన్ని తినుట నిషిద్దము-

 

17:10-13 . ఎవరైనా సరే రక్తాన్ని తినకూడదు. దానిలో ప్రాణమున్నది ( ఆది 9:2-4 ). రక్తము ప్రాయశ్చిత్తము చేయుటకుగల ఏకైక కారణం దానిలో ప్రాణమున్నది. కనుక రక్త ప్రోక్షణ మరణం నుండి తప్పించి నిత్యజీవాన్ని ప్రసాదిస్తుంది.

 

12.1.4. చంపబడిన లేదా వేటాడబడిన జంతువును తినే విషయంలో నియమాలు-

 

17:14-16 . వేటాడబడి, చంపబడిన జంతువును తినుట నిషిద్ధం. వాటిరక్తము నేలపోయినప్పటికీని తినకూడదు. ఎందుకంటే ఆ రక్తము దేవుని సన్నిధిలో చిందించబడలేదు. దీనిని తిన్నవారు చంపబడతారు. రక్తము ప్రాయశ్చిత్తము చేయను, పరిశుద్ధపరచును ( హెబ్రీ 9:19-22 ).

12.2. రక్తము యొక్క ఆవశ్యకత:

ఇశ్రాయేలు ప్రజలు నాటకీయంగా ఐగుప్తు నుండి విమోచించబడ్డారు. దీని అంతటికి కారణం పస్కా పశువు రక్తము. పస్కా పశువు రక్తము ద్వారబంధానికి, ప్రక్క కమ్ములకు పూసి రక్తముతో ద్వారము భద్రపరచబడిన ఇంటిలో ఉన్నవారిమీదకు మరణం రాలేదు. వారంతా విమోచించబడినారు ( నిర్గమ 12:7-13 ). రక్తము ద్వారా విమోచన కలిగింది. ఈ సిద్ధాంతానికి అది ఎక్కడ ఉందో చూస్తే మనము యేసు రక్తము యొక్క ఆవశ్యకతను అర్ధం చేసుకోగలం.

12.2. ఇది దేవుని ప్రణాళిక:-

రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము దేవుని ప్రణాళిక:- మన విశ్వాసానికి ఆధారం రక్తమే - 1 పేతురు 1:19,20 ; అపో 2:23 ; 4:27,28 . దేవుని ప్రణాళిక పా.నిం.లో సాదృశ్యంగా చూపబడినది.

 

12.2.1. చర్మపు చొక్కాలు:

 

ఆదాము పాపము చేయకమునుపే సృష్టి ఉనికిలోకి రాకమునుపే రక్తము ద్వారా విమోచనను దేవుడు సంకల్పించాడు. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారు తమ దిగంబరత్వం కనబడకుండా ఆకులు తమ దిసమొలకు కట్టుకున్నారు. దేవుని ఎదుటికి రాలేకపోయి చెట్టు వెనుక దాక్కున్నారు. పాపఫలితం దేవుని నుండి దూరమగుట, దిగంబరత్వము. దానిని కప్పుకోవడానికి మానవుని పద్ధతి ఆకులు (స్వనీతి క్రియలు). కాని దేవుడు తన పద్దతి ఏమిటో తెలియచేశాడు. అది చర్మపు చొక్కాయిలు. మొదటి బలి జరిగింది. పశువును వధించి రక్తము కార్చి వారి దిగంబరత్వాన్నీ దేవుడు కప్పాడు. వారు దేవుని ఎదుట నిలువగలిగారు.

 

12.2.2. హేబేలు బలి :

 

హేబేలు బలిని దేవుడు అంగీకరించాడు. రక్తము చిందించుట ద్వారానే మనిషి దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోగలడని హేబేలు గ్రహించాడు. కయీనుకు కూడా తెలుసు ఎందుకంటే వారిద్దరు ఆదాము నుండి తెలుసుకున్నారు. కాని కయీను దేవుని పద్దతిని అనుసరించలేదు. కారణం హేబేలుకు విశ్వాసమున్నది, కయీనుకు విశ్వాసం లేదు ( హెబ్రీ 11:4 ). హేబేలు రక్తముద్వారానే దేవునివలన అంగీకరించబడి నీతిమంతునిగా తీర్చబడ్డాడు.

 

12.2.3. కీలు పూయుట:

 

నోవహు ఓడ ఉదంతం కూడా దేవుడు ఉద్దేశించిన దానిని సాదృశ్యంగా చూపిస్తూ ఉంది. ఆది 6:14 - “ఆ ఓడను చేసి లోపల వెలుపల కీలు పూయవలెను.” వరంలో కర్ర పాడవకుండా నీరు లోపలికి ప్రవేశించకుండా పూత పూయాలి. 'పూత పూయుట' అనే ఈ పదం హెబ్రీ భాషలో (Kopher/kapper) కొఫెర్ లేదా కాఫర్ అంటే కప్పుట (Covering). ఈ పదం హెబ్రీ బైబిల్లో సుమారు 100 సార్లు కనబడుతుంది. మొట్టమొదటిగా ఆది 6:14లో కనబడుతుంది. కాఫర్ అంటే కప్పుట, ప్రాయశ్చిత్తం చేయట, శాంతి చేయుట, సమాధానపరుచుట అనే అర్థాలున్నాయి. ఇశ్రాయేలీయుల ప్రాయశ్చితార్ధ దినమైన (yom kippur) యోమ్రిప్పుర్ అనే పండుగలోని మూలపదం కప్పుర్, ద్వితి 30:19 ; కీర్తన 65:3 ; 78:38 ఇంకా అనేక వాక్యాలలో ప్రాయశ్చిత్తం అనీ వ్రాయబడింది. ఓడలోనివారు దేవుని తీర్పులోనికి రాకుండా, వారు కనబడకుండా వెలుపట బయట పూతపూయబడింది. యేసుప్రభువు రక్తముచేత మనము కప్పబడాలి అనే విషయాన్ని సాదృశ్యరీతిగా దేవుడు చూపించాడు. రక్తము చేత కప్పబడుట దేవుని నిత్య ప్రణాళిక.

 

12.2.4 అబ్రహాముతో నిబంధనచేసిన పద్దతి:

 

అది 15:9-17లో దేవుడు అబ్రాహాముతో నిబంధన చేసినప్పుడు మూడేండ్ల పెయ్య, మూడేండ్ల మేక, మూడేండ్ల పొట్టేలులను ఖండించి వాటి మధ్య నుండి నడిచిపోయెను (Cut through). ఆ కాలములో వారి సాంప్రదాయం లేదా పద్ధతి ప్రకారం నిబంధన చేయుట అనగా ఖండించబడిన ఖండముల మధ్యలో నుండి నడిచిపోవుట. ఖండించినప్పుడు రక్తం కారుతుంది. ఇది నిబంధన చేసే విధానం. నిబంధనకు హెబ్రీ పదం బేరియత్ (Beriath). బేరియత్ అంటే ఛేదించుట. దేవుడు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు రక్తముతో చేశాడు. ఇదే జంతువులను లేవియ అర్పణలలో వాడారు ( నిర్గమ 29:15 ; సంఖ్యా 15:27 ; 19:2 ; ద్వితి 21:8 ). బలులు అర్పించినప్పుడు దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేవాడు. నిబంధనకు ఆధారం రక్తం. “వాటి మధ్య నడుచుట” అనేమాట యిర్మియా 34:18లో కనబడుతుంది. కళేబరాల ఖండనల మధ్య నడుచుట నిబంధన. ఖండించినప్పుడు.

 

12.2.5. పస్కా పశువు:

 

నిర్గమ 12:7,13 లలో పస్కా పశువు రక్తాన్ని చిందించి దానిని ఇశ్రాయేలీయులు తమ ఇండ్ల ద్వారబంధపు రెండు కమ్ములమీదను పైకమ్మిమీదను పూయాలి, సంహార దూత రక్తము పూయబడిన గృహాలను దాటిపోతాడు (Passover). రక్తము మరణము నుండి, తీర్పునుండి, దేవుని ఉగ్రత నుండి విమోచిస్తుంది.

 

12.2.6. క్రీస్తులో నెరవేరుట:

 

1 నిర్గమ 12లోని పస్కాపశువు ఉదంతం క్రీస్తులో నెరవేరుట మనం చూడగలం. ( 1 కొరింథీ. 5:7,8 ; 1 పేతురు 1:19 )

• గొర్రెపిల్లను కుటుంబము ఎన్నుకొంటుంది. ముఖ్యంగా ఇంటి పెద్ద లేదా తండ్రి ( నిర్గమ 12:3 ); క్రీస్తును తండ్రి ఎన్నుకున్నాడు ( యోహాను 3:16,17 ; ఎఫెసీ 3:13,14 ; అపో 4:27 ).

• గొర్రెపిల్ల నిర్దోషమైనదిగా ఉండాలి ( నిర్గమ 12:6 ). క్రీస్తు ప్రభువు నిర్దోషి ( లూకా 23:4 ; యోహాను 8:46 ; 1పేతురు 1:19 ; 2 పేతురు 2:22 ).

• పస్కాపశువు మగ గొర్రెపిల్ల అయిఉండాలి ( నిర్గమ 12:6 ) క్రీస్తు ప్రభువు పురుషుడు మరియు గొర్రెపిల్ల ( యోహాను 1:29 ; యెషయా 53:7 ).

• పస్కా గొర్రెపిల్ల ఏడాది వయసు కలిగినది అనగా యౌవ్వన ప్రాయంలో ఉండాలి ( నిర్గ 12:6 ). యేసుక్రీస్తు యౌవ్వనుడుగా మరణించాడు.

• ప్రతివాడు భుజించాలి ( నిర్గమ 12:5 ). యేసు ప్రభువును ఎవరికి వారే వ్యక్తిగతంగా విశ్వసించాలి లేదా భుజించాలి ( యోహాను 6: 53-56 ).

• పస్కాపశువు నీసాను 14న వధించబడాలి ( నిర్గమ 12:18 ). క్రీస్తుకూడా అదే దినమున వధించబడినాడు ( యోహాను 13:1,29 ; 18:28 ; 19:14,31 ).

• దశమినాడు అనగా పస్కాకు 4 రోజుల ముందు పస్కా పశువును వేరుపరచి ప్రదర్శించాలి ( నిర్గమ 12:3 ). యేసుక్రీస్తు దశమినాడు అనగా ఆదివారం యెరూషలేములోనికి ఊరేగింపుగా వెళ్ళాడు ( యోహాను 12:1 ; మత్తయి 26:6-13 ).

• ఎముకలు విరువకూడదు ( నిర్గమ 12:46 ). యేసుప్రభువుతో సిలువ వేయబడిన దొంగల కాళ్ళు విరగగొట్టబడినవి, కానీ యేసుక్రీస్తు కాళ్ళు విరుగగొట్టబడలేదు ( యోహాను 19:32-36 ; కీర్తన 34:20 ).

• ఎవరి ఇంటికి రక్తము పూయబడి, ఎవరు ఆ రక్తముతో భధ్రము చేయబడతారో వారు మరణాన్ని తప్పించుకుంటారు ( నిర్గమ 12:13 ). యేసు రక్తము ద్వారా మనము భధ్రపరచబడినాము ( ఎఫెసీ 1:7 ; 1యోహాను 1:7 ; 1పేతురు 1:18,19 ).

• పస్కాను ఇశ్రాయేలీయులు జ్ఞాపకార్ధంగా ఆచరించాలి ( నిర్గమ 12:11-14 ). యేసుప్రభువు మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆజ్ఞాపించబడినాము ( లూకా 22:19 ; 1 కొరింథి11:24,25 )

12.3. క్రీస్తు ప్రభువు రక్తము యొక్క ప్రాముఖ్యత:

1. యేసు రక్తము మానవుని పాపాన్ని, అవిధేయతను కప్పుతుంది - ఆది. 3:21.

2. యేసు రక్తము అర్పణను అర్పించువానిని, అర్పణను దేవుడు అంగీకరించునట్లుగా చేయును - ఆది 4:1-6 .

3. యేసు రక్తము విశ్వసించినవారికి, విధేయులకు రాబోవు తీర్పునుండి, శిక్ష నుండి విడుదల కలిగించును - నిర్గమ 12:13 .

4. యేసు రక్తము మన పాపక్షమాపణ నిమిత్తము చిందింపబడినది - మత్తయి 26:28 ; ఎఫెసీ 1:7.

5. యేసు రక్తము మన పాపమును కడుగుతుంది - ప్రకటన 1:5 ; 7:14.

6. యేసు రక్తము మనలను పాపదాస్యపు బజారులో నుండి కొనింది - ఎఫెసీ 1:7; కొలస్సీ 1:14; 1 పేతురు 1:18,19 .

7. యేసు రక్తము ద్వారా దేవునితో సమాధానము కలిగియున్నాము - - కొలస్సీ 1:20; ఎఫెసీ 2:14 .

8. యేసు రక్తము దూరంగా ఉన్న మనలను సమీపస్తులుగా చేసింది - ఎఫెసీ 2:13 .

9. ధర్మశాస్త్రాన్ని అతిక్రమించుట వలన మనకు కలిగిన అపవిత్రతను, శిక్షను యేసు రక్తము తుడిచివేసింది - కొలస్సీ 2:13.

10. యేసు రక్తము అనగా దేవుని రక్తము మనలను దేవునితో స్వకీయ సంపాద్యంగా చేసింది - ఆపొ 20:28; 1 కొరింథీ 6:19; 1 పేతరు
2:9,10.

11. యేసు రక్తము మన మనస్సాక్షిని శుద్ధిచేసింది, మన సేవను జీవముగల దేవునికి అంగీకారముగా చేస్తుంది - హెబ్రీ 9:14.

12. యేసు రక్తము మనలను హెచ్చించి దేవుని కొరకు మనలను రాజులుగా యాజకులనుగా చేస్తుంది - ప్రకటన 1:5,6; 5:9,10.

13. యేస రక్తము వలన దేవుని ఎదుట మనము నీతిమంతులముగా తీర్చబడినాము - రోమా 5:9.

14. యేసు రక్తము మనలను పరిశుద్ధ పరచినది - 1కొరింథీ 6:11; హెబ్రీ 10:14; 13:12.

15. యేసు రక్తము ద్వారా మన రక్షణ భద్రపరచబడినది, నిత్య రక్షణను పొందాము, రక్షణ నిశ్చయతను కలిగి ఉన్నాము - హెబ్రీ 10:10-14; 13:20; 9:12.

16. యేసు రక్తము ద్వారా అన్యులమైన మనము యూదులతో సంధిచేయబడి ఒక నూతన పురుషునిగా సృష్టించబడినాము - ఎఫెసీ 2:13,14 .

17. యేసు రక్తము ద్వారా మనము దేవునితో సమాధానపడి దేవుని నీతి అయ్యాము - 2కొరింథీ 5:20,21.

18. యేసు రక్తము ద్వారా అతిపరిశుద్ధ స్థలములోనికి అనగా దేవుని సన్నిధికి చేరగలిగాము - హెబ్రీ 10:19-22.

19. యేసు రక్తము ద్వారా మనము దేవునితో, యేసుక్రీస్తుతో, ఒకరితో ఒకరము సహవాసము కలిగియున్నాము - 1 యోహాను 1:1-3,7.

20. యేసు రక్తము ద్వారా మనము దేవునిచే నిత్యస్వాస్థ్యముగా కొనబడినాము - హెబ్రీ 9:14, 15.

21. యేసు రక్తము చేత మనము అపవాదిని జయించాము - ప్రకటన 12:11.

గమనిక:- "యేసు రక్తము", "యేసు", "యేసు మరణము" అనేపదాలు ఒక దానికి ఒకటి పర్యాయ పదాలు (Blood of Jesus, Jesus, Death of Jesus are Synonyms). వీటిని మనము వేరువేరుగా చూడలేము.

 

13. కుమారుని యొక్క భూస్థాపన
(BURIEL OF SON)

 

యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తరువాత ఆయన పాతిపెట్టబడినాడు. మూడు దినాలు ఆయన శరీరం సమాధిలో ఉంచబడింది. ఆయన ఆత్మ దేవుని నుండి తిరిగి వచ్చి శరీరంలో ప్రవేశించింది. ఆయన ప్రాణాత్మ శరీరాలు గలవాడుగా తిరిగి లేచాడు. ఈ పునరుత్థాన శరీరం మహిమ పరచబడిన శరీరం. ప్రభువు సమాధిలో ఉన్న కాలానికి కొన్ని అపోహలు సృష్టించబడ్డాయి. వాటిని చూద్దాం.

13.1. మొదటి అపోహ :

అ.కా. 2:27 మరియు రోమా 10:6-7. ఆధారం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత పాతాళానికీ వెళ్ళినాడు. యేసుక్రీస్తు మనదోష శిక్షను భరించాడు. కనుక ఆయన పాతాళానికి (నరకానికి) కూడ వెళ్ళి బాధను అనుభవించి వచ్చాడు. అనేది ఒక అపోహ. భిన్నమైన బోధ.

 

జవాబు :

 

1) సందర్భాన్ని బట్టి చూస్తే పేతురు దావీదును గురించి అన్నాడు. నేను సమాధిలోనికి వెళ్ళినను తిరిగి లేస్తాను అని దావీదు తన నిరీక్షణను వెల్లడి చేస్తున్నాడు. ( అ.కా. 2:29-36 వచనాలు చదవండి). ఇక్కడ ఉపయోగించబడిన గ్రీకు పదం “హేడెస్” అనగా సమాధి. పాతనిబంధన గ్రంథంలో ఉపయోగించబడ్డ మాట “షియోల్” అనగా సమాధి. దావీదు చనిపోయి సమాధి చేయబడినాడు. అతని సమాధి తెరువబడలేదు. కాని యేసుక్రీస్తు సమాధి తెరువబడి ఖాళీ చేయబడింది. ఆయన సమాధిలోనే ఉండిపోలేదని పేతురు ఉద్దేశ్యం.

2) యేసుక్రీస్తు సిలువలోని దొంగతో "నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు” ( లూకా 23:43 ) యేసుప్రభువు తను మరణించగానే తన ఆత్మ పరదైసుకు వెళుతోందని స్వయంగా చెప్పాడు. సమాప్తమైనది ( యోహాను 19:30 ) అని ప్రభువు చెప్పడంలో ఆయన రక్షణ కార్యం సంపూర్ణమైందని అర్థం. దాన్ని సంపూర్ణం చేయడానికి ఆయన పాతాళానికి పోనవసరం లేదు. “తండ్రీ నీచేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను” ( లూకా 23:46 ). ప్రభువు తండ్రికే తన ఆత్మను అప్పగించాడు గాని పాతాళానికి కాదు.

3.2. రెండవ అపోహ :

ఎఫెసీ 4:8-9. ఆధారము చేసుకొని యేసుక్రీస్తు భూదిగంతాల్లోనికీ అనగా పాతాళంలోకి వెళ్ళీ చెరపట్టబడిన పాత నిబంధన విశ్వాసులను విడిపించి పరదైసుకు తీసుకెళ్ళాడు.

 

జవాబు :

 

1) యేసుక్రీస్తు తన మరణములోనే అపవాదిని జయించాడు. అందరికి విముక్తిని ప్రసాదించాడు. ఈ పని చేయడానికి పాతాళానికి పోవలసిన అవసరంలేదు.

2) పాత నిబంధన విశ్వాసులు సాతాను చెంతలేరు. వారు రాబోయే మెస్సీయాయందు విశ్వాసముంచినందున వారి పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిపై సాతానుకు అధికారం లేదు. వారు పరిశుద్ధులై ఉన్నారు. ( ఆది 5:24; కీర్తన 16:10-11; 17:15; ప్రసంగి 12:7; లూకా 16:22; రోమా 4:1-8 ) యేసుక్రీస్తు వారిని విడిపించడానికి పాతాళానికి పోయే ప్రసక్తేరాదు.

3) యేసుక్రీస్తు ఆరోహణమైనాడు. ఎక్కడినుండి ? పునరుత్థానుడైన తరువాత నలభై రోజులకు ఒలీవల కొండనుండి ఆరోహణమైనాడు. ఆకాశమండలానికీ వెళ్ళాడు. అంతకుముందు ఆయన క్రిందకు దిగినాడు. అనగా పరమునుండి భూమిమీద జన్మించాడు. మరణించి తిరిగిలేచి ఆరోహణమైనాడు. పరలోకమునకు క్రిందనున్న భూమిమీదకు దిగెను అనే అర్థమేకాని పాతాళంలోనికి అని కాదు.

13.3. మూడవ అపోహ:

1 పేతురు 3:19-20 ఆధారము చేసుకొని యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళి అక్కడున్న వారికి బోధించినాడు. ఎ) నోవహు కుటుంబానికి బోధించాడు. బి) పాత నిబంధన విశ్వాసులకు బోధించాడు.

 

జవాబు :

 

1) యేసుప్రభువు ఆ ఎనిమిది మందికే ఎందుకు సువార్త ప్రకటించాలి అని ప్రశ్నించుకుంటే ఈ అభిప్రాయం తప్పు అని తేలుతుంది. దేవుడు పక్షపాతికాదు. వారు నోవహు కుటుంబం అని అర్థం అవుతుంది. వారిని నీటినుండి రక్షించాడు. నోవహు కాలంలో జరిగిన సంఘటనే పేతురు తిరిగి వ్రాస్తున్నాడు.

2) చెరలో ఉన్న ఆత్మలు - “ఆత్మలు” అనే మాటను రెండు విధాలుగా అర్థము చేసుకోవచ్చును. 'ఆత్మలు సంపాదించువాడని', 'ఆత్మల్ని రక్షించుట', 'ఆత్మల్ని పట్టుకోవాలి' అని మనము సామాన్యంగా ఉపయోగించే పదజాలాన్ని గమనిస్తే ఇక్కడ ఆత్మలనగా వ్యక్తులు. రెండవదిగా, పేతురు లేఖ వ్రాసేటప్పటికీ వారు చనిపోయారు. కాబట్టి భూతకాల సంఘటనలు వర్తమాన కాలం భాషలో చెపుతున్నాడు. బైబిల్లో ఇలాంటి వాడుక (usage) ఒకటి రూతులో (18) చూడగలం. చనిపోయిన వారి ఎడల తన కోడళ్ళు దయ చూపారు. అని నయోమి చెప్పుతుంది. ఎవరైనా చనిపోయినా వారికి ఎట్లా దయచూపగలరు ? అంటే వారు బ్రతికి ఉన్నప్పుడు దయచూపారు. ఇపుడు ఆ దయ పొందినవారు చనిపోయారు. భూతకాలం సంఘటనను చెప్పడానికి వర్తమానకాలం పదాలను వాడటం మనము ఇక్కడ చూడగలం. పేతురు కూడా అలానే చెప్పాడు..

3) యేసుక్రీస్తు పాతనిబంధనలో చేసిన పరిచర్య ఆత్మరూపిగానే చేశాడు. శరీరాన్ని సమాధిలో వదలి ఆయన ఆత్మ నోవహు కుటుంబం వద్దకు పోయింది అనడం సరికాదు. (ఆయన పరలోకానికి పోయాడు. అని ఇంతకు ముందు చూశాము). 1 పేతురు 1:11 ప్రవక్తలు, క్రీస్తు ఆత్మ కలిగిన వారై ప్రవచించారు. బోధించారు. నోవహు కూడా తన చుట్టున్న అవిధేయులకు క్రీస్తు ఆత్మ గలవాడై బోధచేశాడు. 2 వ పేతురు 2:5; ఆది 6:3 కూడా గమనించండి.

4) సందర్భాన్ని చూచినట్లైతే పేతురు తన పాఠకులను సాక్ష్యమిమ్మని ప్రోత్సాహ పరుస్తున్నాడు. వారి పరిస్థితులు నోవహు పరిస్థితులవంటివే. తమ చుట్టూవున్న అవిధేయులకు క్రీస్తు ఆత్మను కలిగినవారై, సువార్త లేదా రాబోయే దైవోగ్రతను బోధించమని పేతురు వారిని హెచ్చరిస్తున్నాడు పోల్చిచూడండి..

 

నోవహుపేతురు పాఠకులు
నీతిమంతుడైన ఒక్కడు నీతిమంతులైన కొద్దిమంది
అవిధేయులచే దుర్మార్గులచే అవిధేయులచే,
దుర్మార్గులచే ఆవరించబడి ఉన్నాడు
అవిధేయులచే దుర్మార్గులచే అవిధేయులచే,
దుర్మార్గులచే ఆవరించబడి ఉన్నారు
దేవుని తీర్పు సమీపించింది దేవుని తీర్పు సమీపిస్తుంది
( 1 పేతురు 4:5,7; 2 పేతురు 3:10 )
నోవహు ధైర్యంగా బోధించాడు
(క్రీస్తు ఆత్మగలవాడై)
వీరు కూడ క్రీస్తు ఆత్మ కలిగి ధైర్యంగా బోధించాలి
( 1 పేతురు 3:14,16-17; 3:15; 4:11 ).
నోవహు చివరకు రక్షించబడ్డాడు. వీరును రక్షింపబడతారు
( 1 పేతురు 3:13-14; 4:13; 5:10 ).

13.4. నాలుగవ అపోహ :

1 పేతురు 4:6 ఆధారము చేసుకొని - మృతులకు కూడ సువార్త బోధింపబడుతుంది. వారికి రెండవ అవకాశం ఉంది. ఇది భిన్నమైన బోధ.

 

జవాబు :

 

1) లూకా 16:16-31 లో లాజరు, ధనవంతుని కథ ప్రకారం మారుమనస్సు పొందడానికి పాతాళంలో మరల అవకాశం లేదు. ఎవరైనా సరే బ్రతికి ఉండగానే భూమిమీదనే సువార్త విని లోబడాలి. అనే విషయం ప్రభువు తేటతెల్లం చేశాడు. హెబ్రీ 9:27 “మనుష్యులు ఒక్కసారే మరణించాలి. ఆ తరువాత తీర్పు జరుగును” అని చెప్పుతున్నది.

2) వారు బ్రతికి ఉన్న దినాల్లో యేసుక్రీస్తు వారికి సువార్త ప్రకటించడాన్ని మనము గ్రహించుకోవాలి.

యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి పాతిపెట్టబడ్డ ఆయన శరీరం సమాధిలో ఉంది. ఆత్మ దేవుని వద్దకు వెళ్ళింది. తిరిగి లేచినపుడు శరీరంతో కలుసుకొన్నది. మన అనుభవం కూడ అదే.

 

14. కుమారునియొక్క పునరుత్థానం
(RESURRECTION OF SON)

 

ఇతరమతాల్లో లేని ప్రత్యేకత క్రైస్తవ మతానికే పరిమితమైన ఒక నిర్దుష్ట వాస్తవం. పునరుత్థానం ఒక చారిత్రిక సంఘటన. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుప్రభువు యొక్క పునరుత్థానం 104 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది.

14.1. యేసుప్రభువు పునరుత్థానం విశేషం :

 

14.1.1. యేసుప్రభువు పునరుత్థానం పాతనిబంధనలో సాదృశ్యంగా చూపబడింది.

 

( లేవీ 23:10-14 ). యెహోవా పండుగల్లో మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగ యేసుప్రభువు యొక్క పునరుత్థానాన్ని సాదృశ్యపరుస్తుంది. మొదటి పండుగ పస్కా పండుగ. పస్కా పండుగ ప్రభువు బలియర్పణాన్ని సూచిస్తుంది. మూడవ పండుగ (10-14) ప్రథమ ఫలముల పండుగ. యేసుప్రభువు పునరుత్థానాన్ని సూచిస్తున్నది. 1 కొరింథి 15:20. యేసుక్రీస్తు నిద్రించుచున్న వారినుండి తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలం.

 

14.1.2. పాత నిబంధనలో ప్రవచింపబడింది

 

( యెషయా 53:9-12; కీర్తనలు 16:10 )

 

14.1.3. క్రొత్త నిబంధనలో ముందుగా తెలియజేయబడింది.

 

( మత్తయి 16:21; 17:19, 22:23; లూకా 9:22; యోహాను 2:19-22; మార్కు 8:31 ).

 

14.1.4. అపొస్తలుల బోధల్లో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది.

 

అ.కా. 2:32

 

14.1.5. సువార్తలోని రెండు అంశాల్లో ఒక అంశం పునరుత్థానం

 

రోమా 4:25. సువార్తలోని రెండు ప్రాథమిక సూత్రాలు. ఒకటి యేసు మరణం. రెండు యేసు పునరుత్థానము. ( 2 తిమో 2:8; 1 కొరింథి 15:14,17; 1 కొరింథి 15:1,3,4 ).

14.2. పునరుత్థానములో త్రిత్వం యొక్క పాత్ర :

 

14.2.1. తండ్రియైన దేవుని పాత్ర :

 

( అ.కా. 2:24; అ.కా. 10:40; 13:30; రోమా 6:4; 10:9; 1 కొరింథీ 6:14; గలతీ 1:1; ఎఫెసీ 1:19,20; కొలస్సీ 2:12; అ.కా. 10:40 ), తండ్రియైన దేవుడు యేసును మృతులలో నుండీ లేపినాడు.

 

14.2.2. కుమారుడైన దేవుని పాత్ర :

 

( యోహాను 10:17-18; 2:19-25 యోహాను 11:25; లూకా 7:16 ).

నా ప్రాణాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉంది. దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉంది అని చెప్పాడు. నేనే పునరుత్థానం అనికూడ తెలియచేశాడు. యేసుప్రభువు తనంతట తాను తిరిగిలేచాడు.

 

14.2.3. పరిశుద్దాత్మ దేవుని పాత్ర :

 

( రోమా 1:4; 1 పేతురు 3:18 ). పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును లేపినాడు. పరిశుద్ధాత్మనుబట్టి యేసు మృతులలో నుండి లేపబడినాడు.

14.3. యేసు క్రీస్తు పునరుత్థానము యొక్క ప్రాముఖ్యత :

 

14.3.1.యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఋజువు పరచింది :

 

రోమా 1:4 యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఋజువు చేస్తున్నాడు. తనంతట తానే జీవం గలిగినవాడుగా ఋజువు చేసుకున్నాడు. ( యోహాను 5:20; 10:18 ).

 

14.3.2.

యేసుక్రీస్తు ఈ లోకానికి న్యాయాధిపతియై ఉన్నాడనే విషయాన్ని ఋజువు చేసింది. దేవుడు తనకు తన లోకానికి తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించాడు అని ప్రభువు చెప్పాడు. దీనికి ఋజువుగా తండ్రి ప్రభువును లేపినాడు. ( యోహాను 5:22; 27-28 ).

 

 

14.3.3. యేసుక్రీస్తు పునరుత్థానం మన పునరుత్థానానికి ఒక హామి :

 

( 1 కొరింథి 15:55-57; 2 వ కొరింథీ 4:14.

 

14.3.4. పితరులకు చేయబడ్డ వాగ్దానసారం యేసుక్రీస్తు పునరుత్థానం :

 

( అ.కా. 26:6,8; అ.కా. 23:6 ). యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను నెరవేర్చగలడు అనుటకు ఋజువు లభించింది. అబ్రాహాము సంతానంతో అన్నీ వంశాలు దీవించబడాలి. ఆయన చనిపోయినవాడుగా ఉంటే అది సాధ్యంకాదు.

 

14.3.5. దావీదుతో చేసిన నిబంధన నెరవేర్పుకు నిదర్శనం :

 

( అ.కా. 13:29–39 ) అ.కా. 13:34. దావీదుకు అనుగ్రహించిన వరాల్ని దావీదు వంశానికి సిద్దింపచేయగలడు అనడానికి నిదర్శనంగా దేవుడు యేసును మృతుల్లో నుండి లేపాడు.

 

14.3.6. పునరుత్థానం బైబిల్ ను దైవవాక్యం అని నిర్ధారించింది :

 

( అ.కా. 2:27; పోల్చండి. కీర్తనలు 16:10; అ.కా. 26:23 ). యేసుక్రీస్తు పునరుత్థానాన్ని తృణీకరించువారు బైబిల్ ను తృణీకరించుచున్నారు. యేసు పునరుత్థానం బైబిల్ దైవవాక్యం అని నిర్ధారించింది.

14.4. పునరుత్థానం అబద్ధమైతే కలిగే నష్టం:

| ( 1 కొరింథీ 15:12-19 ) క్రీస్తు లేవబడకపోతే కలిగే నష్టాలను పౌలు భక్తుడు వివరిస్తున్నాడు:

• సువార్త ప్రకటన వ్యర్థం.

• అపొస్తలులు అబద్ద సాక్షులైపోతారు.

• మన విశ్వాసము వ్యర్థం.

• బ్రతికి ఉన్న మనమింకను మనపాపాల్లోనే ఉన్నాం.

• చనిపోయిన విశ్వాసులు నశించిపోయారు.

• మన నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే ఉంటుంది.

• మనుష్యులందరికంటే దౌర్భాగ్యులం అవుతాం.

14. 5. యేసుక్రీస్తు పునరుత్థానానికి గల ఋజువులు

 

14.5.1. ఖాళీ చేయబడిన సమాధి :

 

( మత్తయి 28:1-6; మార్కు 16:3-6; లూకా 24:23; యోహాను 20:1-8; అ.కా. 2:29–32 ).

 

14.5.2. యేసుప్రభువు యొక్క ప్రత్యక్షతలు :

 

యేసుక్రీస్తు తాను తిరిగి లేచిన తరువాత కనీసం 18 సార్లు ప్రత్యక్షమయ్యారు. మొదటి ఈస్టర్ సండే రోజున 5 సార్లు కనపడ్డారు. తాను ఆరోహణం కాక మునుపు 6 సార్లు కనపడ్డారు. పెంతుకోస్తు దినం నుండి బైబిల్ పరిపూర్తి చేయబడు వరకు 7 సార్లు ప్రత్యక్షమయ్యారు.

14.5.3. ప్రధానయాజకులు ప్రచారం చేసిన అబద్దం : ( మత్తయి 28:11-15 ) యేసుక్రీస్తు సజీవుడు కాకపోతే వారు అబద్దాలు ప్రచారం చేసే అవసరం కలుగదు. శిష్యులు యేసుక్రీస్తు శరీరాన్ని ఎత్తుకు పోయారు అని ప్రచారం చేయించారు. పెద్దరాతిని సామాన్యులు దొర్లించడం, రోమా సైనికులను తప్పించి క్రీస్తు శరీరాన్ని ఎత్తుకు పోవడం నమ్మశక్యంగా నిది.

 

14.5.4. మార్చబడిన జీవితాలు :

 

ఆది అపొస్తలిక సంఘము. ఆది సంఘ క్రైస్తవులు యేసుక్రీస్తు పునరుత్థాన శక్తివల్ల తాము మార్చబడి శక్తివంతమైన జీవితాలు జీవించారు. ధైర్యంగా బోధించారు, ధైర్యంగా సాక్షమిచ్చారు. ధైర్యంగా శ్రమనొందారు, ధైర్యంగా హతసాక్షులయ్యారు. 1

 

14.5.5. ప్రభువును నమ్మని స్వంత కుటుంబం :

 

ప్రభువును ఆయన స్వంత తమ్ముళ్ళే నమ్మలేదు. ( యోహాను 1:1-5 ). ప్రభువు చనిపోయి తిరిగిలేచిన తర్వాత తన తమ్ముడైన యాకోబుకు కనబడ్డాడు ( 1 కొరింథీ 15:7 ). ఆ తమ్ముడే యాకోబు. యాకోబు ఒక పత్రికను వ్రాశాడు. రాళ్ళతో కొట్టబడి హతసాక్షి అయ్యాడు.

 

14.5.6. యూదా మత చాంధస్సుని మార్పు :

 

సౌలు యూదా మతచాంధస్సుడు. క్రైస్తవ మతాన్ని ద్వేషించి ప్రభువు ప్రత్యక్షతతో మార్చబడి, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసి, హతసాక్షి అయ్యాడు.

 

14.5.7.పరిశుద్దాత్మ ఆగమనం :

 

యేసుప్రభువు తను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపుతానని చెప్పాడు. ( యోహాను 14:16; 15:26; 16:7 ) పెంచుకొస్తు దినాన శిష్యులు భాషలతో మాట్లాడ్డం చూచి అనేకులు వారిని అపహాస్యం చేశారు. అనేకులు మార్చబడ్డారు. ( అ.కా. 2:1-13 ).

 

14.5.8. దైవారాధన శనివారం నుండి ఆదివారానికి మార్చబడ్డం :

 

ఆది అపోస్తలిక సంఘం ఆదివారం రొట్టె విరవడానికి కూడియున్నారు. ప్రతి ఆదివారం చందా నిలువ చేయాలని హెచ్చరించబడ్డారు. ( అ.కా. 20:7; 1 కొరింథీ 16:2 ) ప్రభువు ఆదివారం లేచినందున క్రైస్తవ ఆరాధన ఆదివారానికి మార్చబడింది. అంతేకాదు ఆదివారం ప్రభువు దినమని పిలువబడింది.

14.6. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన సంఘటనలు

1. యేసుక్రీస్తు పునరుత్థానుడగుట, రాయి యేసుక్రీస్తు శరీరాన్ని బంధించలేదు. యోహాను 20:26-29 .

2. పరలోకంనుండి దూత వచ్చి రాయిని పొర్లించుట. (ఖాళీ సమాధిని ఇతరులు చూడ్డం కొరకు) మత్తయి 28:2-4 .

3. కావలివారు ఆ దృశ్యాన్ని చూచి భయభ్రాంతులగుట.

4. ఆ వార్తను కావలివారు ప్రధానయాజకుని వద్దకు చేరవేయడం.

5. “మేము నిద్రించుచుండగా యేసుశిష్యులు ఆయన శరీరాన్ని తీసుకొని పోయారు. అని అబద్ద ప్రచారం చేయమని ప్రధాన యాజకుని సలహా ( మత్తయి 28:11-15 ).

6. మగ్ధలేని మరియ, యాకోబు తల్లియైన మరియ, సలోమి మరియు ఇతర స్త్రీలు సమాధి వద్దకు వచ్చుట. ( మత్తయి 28:1; మార్కు 16:12; యోహాను 20:1; లూకా 24:10 ).

7. దూత స్త్రీలకు పునరుత్థాన శుభవర్తమానాన్ని తెలుపుట. ( మత్తయి 28:5-7; లూకా 24:6-7 ).

8. మగ్ధలేని మరియ శిష్యుల వద్దకు పరుగెత్తి వెళ్ళింది. ( మత్తయి 28:8; మార్కు 16:8; లూకా 24:8-10; యోహాను 20:2 ).

9. యోహాను సమాధిలోనికి ప్రవేశింపక నారబట్టలు చూచుట. ( యోహాను 20:5 ).

10. పేతురు ఆ తరువాత సమాధిలోనికి ప్రవేశించుట ( యోహాను 20:6 ).

11. పేతురు, యోహాను ఖాళీసమాధి చూచి వెళ్ళిపోయిన తర్వాత మగ్దలేని మరియ సమాధి దగ్గర నిలిచి ఏడ్చుట ( యోహాను 20:11 ).

12. ప్రభువు మగ్గలేని మరియకు మొదటిసారి ప్రత్యక్షమగుట ( యోహాను 20:16-17; మార్కు 16:9-11 ). ఇది ప్రభువు మొదటి ప్రత్యక్షత.

13. మగ్గలేని మరియ తన ప్రభువును చూచిన సంగతి శిష్యులకు తెలియచేయడం. ( యోహాను 20:18; మార్కు 16:10-11 ).

14. యేసు ఇతర స్త్రీలకు కనబడుట ( మత్తయి 28:9-10 ).

15. యేసుక్రీస్తు పేతురుకు ప్రత్యక్షమగుట ( లూకా 24:34 ).

16. ఎమ్మాయి మార్గంలో శిష్యులకు కనబడుట. ( మార్కు 16:12-13; లూకా 24:13-15 ).

17. పదిమంది శిష్యులకు కనపడుట. ( మార్కు 16:14; లూకా 24:36-43; యోహాను 20:19-23 ) తోమా ఆ సమయంలో అక్కడలేడు.

18. వారం దినాల తర్వాత 11 మంది శిష్యులకు ప్రత్యక్షమగుట. తోమా వారితో ఉన్నాడు. ( యోహాను 20:26-29 ).

19. గలిలయ సముద్రం దగ్గర ఏడుగురు శిష్యులకు కనపడుట. ( యోహాను 21:2,3 ).

20. పౌలు చెప్పినట్లుగా 500 మందికి కనపడుట ( 1 కొరింథి 15:6 ).

21. తన సోదరుడైన యాకోబుకు కనపడుట ( 1 కొరింథి 15:7 ).

22. గలిలయలోని పర్వతాల పై 11 మంది శిష్యులకు కనబడుట.

23. ఒలీవల కొండపైనుండి ఆరోహణమగునపుడు ఆయన తన శిష్యులకు కనబడ్డారు. ( లూకా 24:44-53; అ.కా. 1:8-9 ).

24. స్తెఫను చనిపోయేముందు ప్రభువు కనబడ్డాడు. ( అ.కా. 7:55 ). 25. సౌలుకు దమస్కుకు పోయే మార్గంలో కనబడ్డాడు. ( అ.కా. 9:3-6 ).

26. పౌలుకు అరేబియాలో కనబడ్డం ( అ.కా. 18:9-11; 20:24; 26:27; గలతీ 1:12;17 ).

27. పౌలు దేవాలయంలో ఉండగా అతనికి ప్రభువు కనిపించాడు. ( అ.కా. 22:17 21 )

28. కైసరయ ఖైదులోని పౌలుకు యేసుక్రీస్తు కనిపించాడు. ( అ.కా. 23:11 ).

29. అపొస్తలుడగు యోహానుకు కనిపించడం ( ప్రకటన 1:12-20 ).

14.7. యేసుక్రీస్తు పునరుత్థాన శరీర లక్షణాలు

1. ఆయన చేతిలో మేకుల గుర్తులు అలాగే ఉన్నాయి. ( యోహాను 20:25-29 ).

2. శిష్యులు యేసుక్రీస్తును గుర్తించగలిగారు. ( యోహాను 20:8 ).

3. పునరుత్థానుడైన యేసుక్రీస్తు కాళ్ళను తాకి స్త్రీ ఆరాధించింది. ( మత్తయి 28:9 ) ఆయనకు ఎముకలు, మాంసం ఉన్నాయి.

4. పునరుత్థాన ప్రభువు భుజించాడు. ( లూకా 24:41-43 )

5. మూసి ఉన్న తలుపులు ఆయన ప్రవేశాన్ని అడ్డుకోలేకపోయాయి. ( యోహాను 20:26 ). భౌతిక నియమాలకు ఆ శరీరం పై అధికారం పోయింది.

6. ఆయన తాను కోరుకొన్న స్థలాల్లో ప్రత్యక్షమయ్యాడు. ( యోహాను 21:1; అ.కా. 9:3-6; మత్తయి 28:16-20; లూకా 24:15 ). అస్వాభావికమైన వేగం ఆ శరీరానికి వచ్చింది.

7. ఆయన అదృశ్యుడయ్యాడు ( లూకా 24:31 )

8. ఆయన ఆరోహణుడయ్యాడు ( అ.కా. 1:9 ) భూమ్యాకర్షణ శక్తి ఈ శరీరంపై
పనిచేయలేదు.
ఈ పునరుత్థాన శరీరం భౌతికంగా, స్వరూపంలో మామూలు శరీరంవలెనే ఉండి, గుర్తుపట్టుటకు వీలుగా ఉంది. అయితే అది మహిమ శరీరంగా మార్చబడి ఈ పదార్థసంబంధమైన భౌతిక నియమాలకు అతీతంగా ఉంది.

14.8. విశ్వాసికి యేసు పునరుత్థానం వల్ల దొరికిన ఫలాలు

1. విశ్వాసి నీతిమంతుడుగా తీర్చబడినాడు. రోమా 8:25 దేవుడు యేసుక్రీస్తును లేపుట ద్వారా ప్రభువు మన కోసం చేసిన ప్రాయశ్చితార్థాన్ని అంగీకరించాడని ఋజువుగా ఉంది. ఆదాము పాపంవల్ల మన మీదికి వచ్చిన పాపాన్ని యేసుమీదకు దేవుడు మోపినాడు. యేసు దానికి ప్రాయశ్చిత్తం చేశాడు. యేసు నీతిని దేవుడు మనపై మోపినాడు. మనం నీతిమంతులుగా తీర్చబడినాం. ఇదే సువార్త.

2. విశ్వాసులు రక్షించబడినారు రోమా 5:9-10 యేసులోని జీవం మనల్ని రక్షించినది. ఆయన పునరుత్థానం ఆయన జీవాన్ని ఋజువు చేస్తున్నది.

3. విశ్వాసుల విశ్వాస నిరీక్షణలకు ఆధారం లభించింది. 1 పేతురు 1:21 . దేవునిలో నిలిపిన విశ్వాసనిరీక్షణలకు దేవుడు ప్రభువును లేపడం ద్వారా ఆధారాన్ని కలిగించాడు.

4. విశ్వాసులు తిరిగి జన్మించడానికి ఆధారం కలిగింది. 1 పేతురు 1:3-4

5. విశ్వాసులకు జీవంతో కూడిన నిరీక్షణ లభించింది 1 పేతురు 1:3-4 6.

6. విశ్వాసులకు నిర్మలమైన వాడబారని స్వాస్థ్యం లభించింది. 1 పేతురు 1:3-4 7.

7. విశ్వాసులు దేవునికి ఇష్టమైన ఫలాన్ని ఫలించగలరు. రోమా. 7:4

8. విశ్వాసులు నూతన జీవం పొందినడుచుకోగలరు. రోమా. 6:4

9. దేవుని బలాతిశయం మన జీవితాలకు అనుగ్రహించబడింది. ఎఫెసీ. 1:17-20

10. దేవుడు మనల్ని తిరిగి లేపుతాడనే నిరీక్షణ మనకు లభించింది. 2 కొరింథీ 4:14

14.9. యేసుక్రీస్తు వివిధ కృత్యాలకు పునరుత్థానం ఆధారం

1. యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా అర్పించబడ్డాడు. దేవుడు యేసుక్రీస్తును అంగీకరించిన మూలాన్న మనల్ని కూడా అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు మనల్ని దేవునికి సమర్పించాడు. 1 కొరింథీ 15:20

2. నిత్యజీవాన్ని అనుగ్రహించడం, యోహాను 11:25

3. పరిశుద్దాత్మను పంపించడం, యోహాను 14:16, 26 ; 15:26; 16:7

4. వరాల్ని అనుగ్రహించడం. ఎఫెసి 4:7-19

5. దేవుని అపరిమితమైన శక్తిని అనుగ్రహించుట. అపొ.కా. 1:8; ఎఫెసి 1:17-23

6. సంఘానికి శిరస్సుగా ఉండడం. ఎఫెసి 1:17-23

7. మందకు కాపరిగా ఉండడం. క్రీస్తు మంచి కాపరిగా గొర్రెల కొరకు (ప్రాణాన్ని) ధారపోశాడు. తిరిగి లేచి ప్రధాన కాపరిగా ఉన్నాడు. యోహాను 10:14; హెబ్రీ 13:20; 1 పేతురు 5:4

8. ఉత్తర వాదిగా ఉండడం. 1 యోహాను 2:1

9. విజ్ఞాపన చేయడం. హెబ్రీ 7:25

10. విశ్వాసిని నూతన స్థాయికి లేపుట. ఎఫెసీ 2:5-8 మానవుడు పాపం చేయడం ద్వారా తన తొలిస్థానాన్ని కోల్పోయి పతనమైనాడు. పతనమైపోయిన మానవుని క్రీస్తు లేపి ఉన్నత స్థలాల్లో కూర్చుండ బెట్టాడు.

11. విశ్వాసులకు స్థలం సిద్ధపరచడం. యోహాను 14:2-3

12. సమస్త సృష్టి మీద ప్రభువుగా నుండుట. ఎఫెసి 1:20-23

13. విశ్వాసులను తిరిగి లేపుట. 1 కొరింథీ 15:51-53; 1 థెస్స 4:14-17

14.10. పునరుత్థానాన్ని తృణీకరించే వాదనలు

యేసుప్రభువు యొక్క పునరుత్థానాన్ని వ్యతిరేకించే వివిధమైన వాదనలను చూద్దాం. వారి ప్రకారము యేసుప్రభువు తిరిగి లేచాడా లేక ఆయన శిష్యులు ఆయనను లేపారా ! (Was it a Resurrection or Resuscitation)

 

14.10.1. పస్కా కుట్ర (Passover Plot) :- హ్యూస్కాన్ఫీల్డ్ (Hugh Sconfield)

 

అనే వ్యక్తి యేసుప్రభువు మరణ పునరుత్థానాలను ఒక కుట్రగా అభివర్ణించాడు. దీనినే పాస్ ఓవర్ ప్లాట్ (పస్కా కుట్ర) సిద్ధాంతము అంటారు. ఇతని ప్రకారము - అబద్దపు మరణము, అబద్దపు పునరుత్థానము (Fake Death & Resurrection) ద్వారా “శ్రమపడుతున్న సేవకుడు”, “విజయ శీలుడైన రాజు” కు సంబంధించిన పాతనిబంధన ప్రవచనాలను నెరవేర్చినట్లుగా కనబడాలనే కుట్రను యేసు పన్నాడు. అరిమతయి యోసేపు, మరియొక అపరిచిత యావనసుడు ఇందులో భాగస్వాములు. కాని ఒక సైనికుడు బలెముతో యేసు రొమ్ములో పొడవడంతో యేసు చనిపోయాడు. కాబట్టి ఈ అపరిచిత వనస్తుడు పునరుత్థానుడైన యేసుగా నటించాడు.

 

14.10.2. పునర్ చైతన్య సిద్దాంతం (Resuscitation theory) :

 

దీనిని మూర్చ సిద్ధాంతం (Swoon Theory) అని కూడా అంటారు. ఈ సిద్ధాంతం ప్రకారం యేసుక్రీస్తు నిజముగా చనిపోలేదు. కేవలము మూర్చిల్లాడు. సమాధిలో పెట్టిన తరువాత ఆ చల్లదనానికీ చైతన్యాన్ని పొంది లేచి కట్లు విప్పుకొని. రాయిని దొర్లించుకొని బయటకు వచ్చాడు. పునః చైతన్యాన్ని పొందిన క్రీస్తునే శిశ్యులు చూచారు.

ఈ సిద్ధాంతానికి పునాదులు 7వ శతాబ్దంలో వ్రాయబడిన ఖురాన్ (4వ సురా : 156-157) లో ఉన్నాయి. అహ్మదీయ మతము వారి ప్రకారము, యేసుక్రీస్తు కాశ్మీర్ కు పారిపోయినాడు. అక్కడే చనిపోయాడు. ఆయన సమాధి శ్రీ నగర్లో ఉన్నది. పందొమ్మిదవ శతాబ్దంలో ఈ సిద్ధాంతాన్ని కార్ల్ బార్డ్, కార్ల్ పెంటూరినిలు ప్రాచుర్యములోకి తెచ్చారు. 1929 లో డి. హెచ్. లారెన్స్ అనే వ్యక్తి ఒక కథను ఈ సిద్ధాంతం చుట్టూ అల్లాడు - యేసుక్రీస్తు సమాధిలో నుండి బయటకు వచ్చి ఐగుప్తుకు పారిపోయి అక్కడ ఐసీస్ (ISIS) దేవత యొక్క పూజారిణిని వివాహము చేసుకున్నాడు. మైఖేల్ బైజెంట్, రిచర్డ్ లేహ్, హెన్నీలింకాన్లు 1982 లో వ్రాసిన “హాలీబ్లడ్, హాలీగైల్” అనే పుస్తకంలో ఇంకా పెద్ద కథ అల్లారు - పొంతిపీలాతు లంచం తీసుకొని యేసుక్రీస్తు చనిపోకముందే సిలువపై నుండి దించుకోవడానికి అనుమతించాడు. 1992 లో బార్బరా థీరింగ్ (సిడ్నీ యూనివర్సిటీ ప్రొఫెసర్) జీసస్ అండ్ ద రిడల్ ఆఫ్ ద డెడ్సీ స్కోల్స్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన అబద్దాన్ని చెప్పింది - యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు. యేసుకు చిరక నిచ్చినప్పుడు అందులో విషాన్ని కలిపారు. యేసు చిరకను త్రాగి వెంటనే మూర్చిల్లిపోయాడు. సమాధి చేసిన గుహలో శిష్యులు యేసుక్రీస్తుకు విరుగుడు మందులిచ్చినందున స్పృహలో నుండి మేల్కొన్నాడు. తరువాత రోమా నగరానికి పారిపోయి అక్కడ క్రీ.శ. 64 వరకు ఉన్నాడు. పైన వ్రాసినవన్ని నాస్తికులు, యేసుక్రీస్తును దేవునిగ అంగీకరించ లేనివారు చెప్పిన కట్టుకథలు, వారు వ్రాసినవాటికి ఆధారాలు లేవు. సత్యము ఒక్కటే ఉంటుంది. కట్టుకథలు చాలా ఉంటాయి. కట్టుకథలకు పొంతన ఉండదు.

 

14.10.3. దొంగిలించబడిన శరీరము సిద్ధాంతము (The stolen Body Theory):

 

యేసుప్రభువు శవము దొంగిలించబడినది. బహుశా వీరిలో ఎవరో ఒకరు దొంగిలించి ఉంటారు. (1) యూదా మత ప్రవిష్టులు (2) రోమీయులు (3) యేసుప్రభువు శిశ్యులు (4) యేసును పాతిపెట్టిన అరిమతయి యోసేపు.

 

14.10.4. తప్పు సమాధి సిద్దాంతం (The Wrong Tomb Theory):

 

స్త్రీలు వేరొక సమాధి వద్దకు వెళ్ళారు అనే సిద్ధాంతానికి 1970 లో కిర్సోప్ లేక్ నాంది పలికాడు. ఇతని ప్రకారము స్త్రీలు ఇంకా ఎవరిని పాతిపెట్టని కాపలాలేని ఖాళీ సమాధి వద్దకు వెళ్ళి యేసుక్రీస్తు సమాధిలో లేడని అనుకున్నారు.

 

14.10.5, ప్రత్యామ్నాయ సిద్దాంతం (The substitution Theory) :

 

యేసుక్రీస్తు సిలువలో మరణించ లేదు, కాని యేసుక్రీస్తును పోలిన మరొక వ్యక్తి మరణించాడు. దేవుడు యేసుక్రీస్తును చనిపోకముందే పరలోకానికి తీసుకుపోయాడు. యేసుప్రభువు స్థానంలో చనిపోయింది ఇస్కరియోతు యూదా.

 

14.10.6. తప్పు గుర్తింపు సిద్దాంతము (The Mistaken identity Theory):

 

శిష్యులు మరెవరినో చూసి యేసుప్రభువు అని అనుకుని, యేసు లేచినాడని ప్రచారం చేశారు.

 

14.10.7. ఆత్మీయ పునరుత్థాన సిద్దాంతం (The spiritual Resurrection Theory):

 

యేసుక్రీస్తు ఆత్మీయంగా పునరుత్థానుడయ్యాడే తప్ప ఆయన శరీరము చనిపోయే ఉన్నది.

 

14.10.8. కల్పనా సిద్ధాంతం (The Fabrication Theory) :

 

యేసుక్రీస్తు శిష్యులు యేసుప్రభువు మరణాన్ని జయించడనే కల్పానా కథలను ప్రచారం చేశారు.

 

14.10.9. పురాణ సిద్దాంతం (The Legend/Myth Theory) :

 

1835 లో డేవిడ్ స్టాప్ ప్రకారం పునరుత్థానం ఒక పురాణగాధ. పునరుత్థానం ఒక ఆత్మ సంబంధమైన కథ. సువార్తలు ఒక రకమైన పురాణగాధలు.

 

14.10.10. భ్రమ సిద్దాంతము (The Hallucination Theory) :

 

యేసుప్రభువు తాను తిరిగి బ్రతుకుతానని చెప్పాడు కనుక శీశ్యులు దానిని నమ్మడం మొదలు పెట్టినందున యేసు ప్రభువు లేచాడని భ్రమపడ్డారు. జోన్హిక్, ఎ.ఎన్.విల్సన్ల ప్రకారము శిష్యులు భ్రమపడ్డారు.

 

14.10.11. అనుమాన సిద్దాంతము (Subjectivity of Truth Theory):

 

రుడోల్ఫ్ బుల్డ్మన్ ప్రకారము పునరుత్థానమనేది జరిగి ఉండవచ్చును. లేదా జరిగి ఉండకపోవచ్చును. జీవము గల యేసు ప్రభువును మనము అనుభవరీతిగా తెలుసుకొనుట ముఖ్యము గానీ ఆయన పునరుత్థానము కాదు. దీనినే ఎక్సీ స్టెన్షియల్ రిసరక్షన్ (Existential Ressurection) అని కూడా అంటారు.

ఈ పైన వ్రాయబడిన భిన్నమైన వాదనలు అన్నీకూడా అశాస్త్రీయమైనవి. అసమంజసమైనవి, అక్రమమైనవి. వీటిలో దేనికి కూడా చారిత్రక ఆధారాలు గాని, సాంస్కృతిక ఆధారాలు కానీ, పారంపర్య ఆధారాలు గానీ, తార్కిక ఆధారాలు గాని, శాస్త్రీయ ఆధారాలు గాని, తాత్విక ఆధారాలు గాని, వాక్యపరమైన ఆధారాలు గాని, న్యాయశాస్త్ర ఆధారాలు గాని, వైద్య పరమైన ఆధారాలు గాని లేవు. ఈ సిద్ధాంతాల్లో ఒకదానికి ఒకటి పొందిక లేదు. ఒక సత్యాన్ని (యేసు పునరుత్థానం) అబద్దం అని చెప్పడానికి ఎన్నో అబద్ధాలు చెప్పాలి. ఒక అబద్దాన్ని (యేసు మరణించలేదు) సత్యమని నమ్మించడానికి ఎన్నో అబద్దాలు చెప్పాలి. అబద్దాలు ఒక దానితో ఒకటి అతకవు. సత్యాలైతే ఒకదానిని మరొకటి బలపరుస్తుంది.

14.11. యేసుప్రభువు నిజముగా మరణించాడు అనుటకు వాక్యమునకు వెలుపలి ఆధారాలు:

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యశాస్త్ర పరిశోధకులు (Medical Research Doctors) మరియు న్యాయశాస్త్ర వైద్య నిపుణులు (Forensic Medical Science) సమకాలీన చరిత్రకారులు (Contemparury Historians) యేసుప్రభువు మరణ పునరుత్థానాలను గూర్చి చేసిన పరిశోధనల సారాంశము. డా|| అలెగ్జాండర్ మెథరిల్ M.D, PH.D. యొక్క పరిశోధనలు.

 

14.11.1. హెమాటిడ్రోసిస్ (Haematidrosis) :

 

యేసుప్రభువు గెత్సెమనేతోటలో ప్రార్థించినప్పుడు పొందిన వేదన వలన చెమట బిందువులవలె రక్తపు బొట్లు పడ్డాయి ( లూకా 22:44 ). ఇది చాలా అసాధారణమైన సంఘటన. ఎవరైన ఒక వ్యక్తి చాలా తీవ్రాతి తీవ్రమైన ఒత్తిడికి గురియైనప్పుడు, మానసిక ఆందోళనకు గురియైనప్పుడు కొన్ని రకాలైన రసాయనాలు విడుదలై, ఈ రసాయనాలు స్వేద గ్రంధాలలో ఉండే రక్త నాళాలు చిట్లిపోయేట్టుగా చేస్తాయి. దాని వలన స్వేద బిందువులతో పాటు రక్తబిందువులు కూడా తక్కువ మోతాదులో బయటకు వస్తాయి. దీనిని వైద్య పరిభాషలో హెమాటిడ్రోసిస్ (Haematidrosis) అంటారు. చర్మము క్రింద నున్న రక్తనాళాలు చిట్లుటవలన చర్మము చాలా సున్నితమైపోయి గాజువలె పగిలిపోవడానికి సిద్దంగా ఉంది. ఏ మాత్రం గట్టి దెబ్బ తగిలినా రక్తనాళాలు బయటకు వచ్చేస్తాయి.

 

14.11.2. కొరడాలతో కొట్టబడుట:

 

రోమా సైనికులు యేసుప్రభువును తమకిష్టము వచ్చినట్టు హింసించారు ( లూకా 23:25; మత్తయి 27:26 ). రోమా సైనికులు యేసుప్రభువును కొరడాలతో కొట్టి హింసించారు. మూడవ శతాబ్దపు చరిత్రకారుడు ఈసూబియస్ (Eusebius) కొరడాలతో కొట్టడమెలాంటిదో వివరిస్తాడు. రోమాసైనికుల కొరడాలు తోళ్ళ పటకాలతో తయారు చేయబడి ఉంటాయి. ఈ తోలు బెల్టుల మధ్య లోహపుగుండ్లు, కత్తులవలె పదునైన మొనదేలిన ఎముక ముక్కలు అల్లబడి ఉంటాయి. రోమీయులు ఒకసారి కొట్టినప్పుడు 39 దెబ్బలు కొట్టి ఆపుతారు. ప్రతి రోమా సైనికుడు తనకు ఓపిక ఉన్నంతవరకు ఎన్నిసార్లైనా కొట్టవచ్చును. ఈసూబియస్ ప్రకారము రోమీయుల దెబ్బలు తిన్నవారి చర్మము లోతుగా తెగి చర్మము, కండరాల క్రిందనున్న రక్తనాళాలు బయటకు వస్తాయి. కడుపులోని సున్నితమైన భాగాలు (Bowels) కండరాలకు, ఎముకలకు మధ్య అతుక్కుని ఉండే స్నాయువులు (Sinews) బయటకు కనపడ్డాయి. యెషయా 52:14; 53:3 ప్రకారము యేసుప్రభువు వికారముగా (Disfigured) మనుష్యులు చూడనొల్లని వాడుగా మారిపోయాడు.

 

14.11.3.'హైపోవోలెమిక్ షాక్' (Hypovolemic Shock) :

 

యేసు ప్రభువుకు దాహము వేసినది. ఎంతదాహం వేసినదంటే చనిపోవడానికి ముందు “దప్పిక గొనుచున్నాను” అని కేకవేశాడు. ( యోహాను 19:28 ). ఈ స్థితిని వైద్య పరిభాషలో 'హైపోవోలెమిక్ షాక్' (Hypovolemic Shock) అని అంటారు. హైపొఅంటే తక్కువ వోల్ అంటే పరిమాణము; ఎమిక్ అంటే రక్తము - అంటే ఎక్కువ పరిమాణములో రక్తమును నష్టపోవుట. దీని వలన 4 పరిణామాలు కలుగుతాయి. (1) గుండె లోపలి రక్తాన్ని బయటకు (Pump) పంపుటకు గుండె ఎక్కువగా కొట్టుకోవడం, విపరీతంగా శ్రమించడం. (2) రక్తపోటు పూర్తిగా తగ్గిపోయి సొమ్మసిల్లుట లేదా కూలిపోవడం జరుగుతుంది. (3) అంతర్ద్రవాలు లేనందున మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం మానేస్తాయి అందువలన రక్తములోని వ్యర్థాలు (ఇవి విషపూరితమైనవి) రక్తములోనే ఉండిపోతాయి. (4) రక్తము లేమి వలన విపరీతమైన దాహం వేస్తుంది. యేసుప్రభువు సిలువ మోయలేక సొమ్మసిల్లినప్పుడు కురేనీయడైన సీమానునుతో సిలువను మోయిస్తారు. గొల్టతకు రాగానే ద్రాక్షారసాన్ని యేసు ప్రభువుకు త్రాగుటకు ఇస్తారు ప్రభువు దానిని త్రాగాలని ఆశపడ్డాడు గాని త్రాగలేకపోయాడు ( మత్తయి 27:32-34; మార్కు15:21-23 ).

 

14.11.4.దుర్భరమైన బాధ (Excruciating Pain):

 

యేసుప్రభువు చేతులలో మేకులను దిగగొట్టారు ( యోహాను 20:24-29 ). సిలువలోని అడ్డు కర్రను 'పాటిబులమ్' (Patibulum) అనీ అంటారు. రోమీయులు పాటిబులమ్ కు చేతులను పెట్టి 5 నుండి 7 అంగుళాల మేకులను దిగగొడారు. ఈ మేకులు మణికట్లను చీల్చుకొని లోపలికి దిగి వెలుపలికి వస్తాయి. మణికట్లలో మేకును కొడితేనే ఒక వ్యక్తి శరీరము సిలువలో వ్రేలాడగలదు. ఆ దినాలలో మణికట్టు వరకు గల భాగమంతటిని చేయిగానే అనగా అరచేయిగానే పరిగణించారు. మనమోచేతి క్రింద భాగాన్ని కుడి వేలితో కొడితే అక్కడున్న నరం వలన మనకు విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ నరాన్ని తాకడానికే మనం అంగీకరించము. ఈ నరాన్ని అల్నా నర్స్ (Ulna Nerve) అని అంటారు. మేకులు మణికట్లను చీల్చుకొని వెళ్ళినప్పుడు అలా నఝను పట్టకారతో పట్టుకొని నలిపితే కలిగే దుర్భరమైన బాధను ప్రభువు అనుభవించాడు. సిలువలో పొందే నొప్పిని వివరించడానికి ఆంగ్లభాషలో మాటలు లేనందున ఒక క్రొత్త మాట సృష్టించారు. దీనినే ఎక్స్క్రూసిట్టింగ్ పేయిన్ (Excruciating Pain) అన్నారు. 'సిలువలో నుండి వెలువడిన' అని అర్థము. సిలువలో అనుభవించే శ్రమ మిగిలిన అన్ని శ్రమల కంటే భిన్నమైనది. దానిని శ్రమ అనరు. దానిని ఎక్స్ క్రూసిట్టింగ్ అంటారు. అడ్డుకర్రకు చేతులలో మేకులు కొట్టినప్పుడు చేతులను బాగాలాగుతారు. సుమారు 6 అంగుళాలు లాగి మేకులు కొడారు. అప్పుడు ఎముకలు స్థానాలు తప్పిపోతాయి. ( కీర్త 22:14 ).

 

14.11.5. ఆస్ఫిక్సియేషన్ (Asphyxiation) :

 

ప్రభువు మరణానికి కారణం వైద్య పరిభాషలో చెప్పాలంటే ఆస్ఫిక్సియేషన్ (Asphyxiation) అంటారు. అనగా రక్తంలో ఆక్సీజన్ తక్కువ కావడం చేత శ్వాస నిరోధించబడడం. స్తన్యమిచ్చే జంతువులలో (Mammal) రొమ్మును, ఉదరాన్ని వేరు చేసే కండర నిర్మితపొర ఒకటుంటుంది. దానిని ఉదర వితనం లేదా విభాజన పటలం (Diaphrxgm) అంటారు. మనము ఊపిరి పీల్చుకొన్నప్పుడు విభాజన పటలం మీద ఒత్తిడిపడి మనము ఉచ్చ్వాస (Inhale Position) స్థితిలోనే ఉంటాము. యేసుప్రభువు సిలువలో వ్రేలాడినప్పుడు క్రింద ఆధారం లేనప్పుడు నీశ్వసించడానికి అవకాశంలేదు. ఎందుకంటే గాలిపీల్చినప్పుడు విభజన పటలం క్రిందకు వెళ్ళుతుంది. ఆ సమయంలో కాళ్ళమీద బరువు పడి కాళ్ళు క్రిందకు తన్నాలి. అప్పుడు పాదాలలోని మేకువలన కాళ్ళు సిలువకు అతుక్కోపోతాయి. మళ్ళీ ఊపిరి పీల్చాడు. ఈ సారి ఊపిరి వదలడానికి అవకాశం లేదు. ఎందుకంటే కాళ్ళు అతుక్కుపోయి ఉన్నాయి. అంతేకాదు భూమ్యాకర్షణ శక్తి వలన వ్రేలాడే వ్యక్తి కాళ్ళు కదిలితేనే విభాజక పటలం పైకి వెళ్ళుతుంది. అందువలన యేసుప్రభువు ఊపిరి పీల్చిన స్థితిలోనే ఉండిపోయాడు. కాని లోపలి ఆక్సీజన్ ఖాళీ అయిపోయి కార్బన్ డయాక్సైడ్ ప్రభువు ఊపిరితిత్తులలో నిండిపోయింది. ఎప్పుడైతే ఉచ్ఛ్వాశ నిశ్వాసాలు తగ్గిపోతాయో అప్పుడు ఆ వ్యక్తి రెస్పిరేటరీ ఆసిడోసిస్ (Respiratory Acidosis) అనే స్థితిలోనికి వెళ్ళిపోతాడు. రక్తములో కార్బన్ డయాక్సైడ్ శాతం పెరిగి, కార్బన్ డయాక్సైడ్ రక్తంలో కరిగి కార్బానికి ఆసిడ్గా మారుట ద్వారా రక్తంలో ఆసిడ్ పెరుగుతుంది. దీనివలన గుండె లయబద్దంగా కొట్టుకోవడం మానేసి ఇష్టం వచ్చినట్లుగా విపరీతమైన వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు యేసుప్రభువు తన మరణం సమీపించిదని ఎరిగి “తండ్రి ! ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను” అని చెప్పి మరణించాడు. యేసుప్రభువు గుండె ఆగి మరణించాడు.

 

14.11.6. యేసు ప్రభువు ఈటెతో పొడవబడుట:

 

యేసుప్రభువు ప్రక్కలో ఈటెతో పొడవబడినప్పుడు, వెంటనే రక్తమును, నీళ్ళును కారెను ( యోహాను 19:34 ) హైపొవోలమిక్ షాక్ (3వ పాయింట్) వలన, ఆస్ఫిక్సియేషన్ వలన (5వ పాయింట్) యేసు ప్రభువు గుండె వేగం పెరిగినప్పుడు గుండె ఆగిపోయింది. ఈ ప్రక్రియలో గుండె చుట్టూ ఉండే గుండె సంచి (Pericardium) లోనికి, ఊపిరితిత్తుల చుట్టూ ఉంటే శ్వాసకోశావరణం (Pleural Membrane) లోనికీ ఒకరకమైన ద్రవం చేరుకుంటుంది. ఈ ద్రవం నీరు రక్తాల మిళితం. ఈ ద్రవాలను పెరికార్డియల్ ఎఫ్యూసన్ (Pericardial Effusion), ప్యూరల్ ఎఫ్యూషన్ (Pleural Effusion) అని అంటారు. యేసుప్రభువును పొడిచిన బల్లెము కుడివైపుననున్న ఊపిరితిత్తిలో నుంచి దూసుకుపోయి గుండెలోనికి జొరబడినప్పుడు రక్తము, నీరు బయటకు స్రవించాయి.

యేసు ప్రభువు సిలువ వేయబడకముందే చాలా రక్తాన్ని కోల్పోయాడు. పైపోవోలమిక్ షాక్ లో ఉన్నాడు. శ్వాస నిరోధించబడింది. ఊపిరితిత్తులలో ఆక్సీజన్ అయిపోయింది. గుండె, ఊపిరితిత్తులకు రంధ్రం పడింది. ఎముకల జాయింట్లు ఊడిపోయాయి. పాదాలలో మేకు దిగగొట్టబడింది. ఈలాంటి వ్యక్తి చనిపోకుండా ఎట్లా ఉండగలడు? సమాధిలో పెట్టబడిన తరువాత మూర్చలోనుండి తేరుకొని తనంతటతానే తనకు చుట్టిన బట్టలు తీసేసుకొని, పెద్దరాయిని దొర్లించి, రోమా సైనికులను జయించి, ఎలా నడిచివెళ్ళ గలడు? అది అసాధ్యం. ఈ సిద్ధాంతాలన్ని కూడ నాస్తిక సిద్ధాంతాలు, ఉదారవాద క్రైస్తవ పండితుల వాదనలు. యేసుప్రభువు చనిపోయాడని వైద్యశాస్త్రం, న్యాయవైద్య శాస్త్రాలు ధృవీకరిస్తున్నాయి.

(జర్నలిస్ట్ లీస్ట్రాబెల్ విరచిత ది కేస్ ఫార్ ఈస్టర్; యూత్ ఫార్ క్రైస్ట్ శ్రీలంక జాతీయ డైరెక్టర్ అజిత్ ఫెర్నండో విరచిత ది. సుప్రీమసీ ఆఫ్ క్రెస్ట్ పుస్తకాలలో నుండి గ్రహించబడినది).

 

15. కుమారుని యొక్క పదవులు
(OFFICES OF SON)

 

యేసుక్రీస్తు మూడు ప్రధాన పదవుల్ని నిర్వహిస్తున్నాడు. దైవవాక్యం ప్రభువును (మెస్సియా) మూడు ప్రధానమైన వ్యక్తులుగా చిత్రీకరించింది. అవి - ప్రవక్త, యాజకుడు, రాజు. ఈ మూడు పదవుల్ని ప్రభువు నిర్వహించాడు. క్రొత్తనిబంధనలో ఈ సత్యాన్ని మనం తేటగా చూడగలం. ప్రవక్తలు దేవుని పక్షంగా మనుష్యులతో మాట్లాడినారు. భవిష్యత్ విషయాల్ని వారితో చెప్పారు. హెచ్చరించారు. యాజకులు మనుష్యుల పక్షంగా దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించారు. ప్రార్థించారు. రాజులు దైవనడిపింపుతో ప్రజలను పాలించారు. అయితే పాత నిబంధనలోని ప్రవక్తలుకాని, యాజకులుగానీ, రాజులుగానీ పరిపూర్ణులుకారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక రీతిన తప్పిపోయిన వారే. అయితే నిజమైన ప్రవక్త, యాజకుడు మరియు రాజు యేసుక్రీస్తే ఈ అవగాహనకు మూడు ఆధారాలు ఉన్నాయి.

1. పాత నిబంధన ఆధారం

2. సువార్త ఆధారం

3. సంఘ చరిత్ర ఆధారం

15.1. పాత నిబంధన ఆధారం :

మెస్సియా అనగా అభిషిక్తుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు. పాత నిబంధనలో ప్రవక్తలు అభిషేకించబడ్డారు. ( 1 రాజు 19:16; యెషయ 61:1 ). యాజకులు అభిషేకించబడ్డారు. ( నిర్గమ 30:30; 40:13 ). రాజులు అభిషేకించబడ్డారు. ( 1 సమూయేలు 10:1; 15:1; 1 రాజుల 19:15-16 ).

15.2. సువార్త ఆధారం :

యేసుక్రీస్తు  ప్రభువును జ్ఞానులు దర్శించినప్పుడు వారు 3 రకాల కానుకలను అర్పించుకొన్నారు. ( మత్తయి 2:11 ) అవి బంగారం, సాంబ్రాణి, భోళం, బంగారం రాజును సాదృశ్యపరుస్తుంది. సాంబ్రాణి యాజకుని సాదృశ్యపరుస్తుంది. భోళం ప్రవక్తను సాదృశ్యపరుస్తుంది.

15.3. సంఘ చరిత్ర ఆధారం :

క్రీ.శ. 260-340 మధ్యకాలంలో జీవించిన "ఈసూబియస్” యేసుక్రీస్తు ప్రభువు యొక్క మూడు పదవుల విషయమై ప్రస్తావించాడు. (ఎక్లేసియాస్టికల్ హిస్టరి 1,3,89) అప్పటినుండి కూడా ఈ అవగాహన ప్రాచుర్యం పొందింది.

15.4. ప్రవక్తగా యేసుక్రీస్తు :

 

15.4.1. పాత నిబంధన సాక్ష్యాలు :

 

మోషే తనవంటి ప్రవక్తను దేవుడు ఇశ్రాయేలు వారికి అనుగ్రహించునని ప్రవచించాడు. ద్వి.కా. 18:15-18.

 

15.4.2. సువార్త సాక్ష్యము :

 

యేసు ప్రభువును ప్రజలు ప్రవక్తగా ఎంచారు. ( మత్తయి 13:57 పోల్చండీ లూకా 17:34; లూకా 7:26; యోహాను 4:19; యోహాను 9:17 యోహాను 6:14 యోహాను 7:40 ).

 

15.4.3. అపొస్తలుల సాక్ష్యం :

 

మోషే ప్రవచించిన ప్రవక్తయే ప్రభువు అని పేతురు ఇశ్రాయేలు ప్రజలతో ప్రసంగించి, నిర్దారించాడు. ( అ.కా. 3:20-26 అ.కా. 3:22 హెబ్రీ 1:1-2 ). ప్రవక్తలు దేవుని మాటను పలికారు. కాని క్రీస్తు తన స్వంత అధికారంతో బోధించాడు. కారణం ఏమిటి అంటే ఆయన నిత్యవాక్యం. దేవుని చిత్తాన్ని మనుష్యులకు తెలుపుట మాత్రమే కాదు. దైవచిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు యేసుప్రభువు. ప్రభువు అనేక భవిష్యత్ విషయాలను బోధించినాడు. (మత్తయి 5-7 అధ్యాయాలు; మత్తయి 24-25 అధ్యాయాలు; యోహాను 13-16 అధ్యాయాలు.

 

15.4.4. యేసక్రీస్తు స్వీయసాక్ష్యం :

 

మత్తయి 13:57; మార్కు 6:4; లూకా 4:24; 13:33; యోహాను 4:44; 8:26; 12:49–50; 15:15; 17:8.

15.5. యాజకునిగా యేసుక్రీస్తు :

యేసుక్రీస్తు లేదా రాబోయే మెస్సియా యాజకుడని పాతనిబంధన సాక్ష్యమిస్తున్నది. కీర్తన 110:4; జెకర్యా 6:13.

 

15.5.1. యేసు క్రీస్తు యాజక పరిచర్య :

 

పాత నిబంధన యాజకులు బలులు అర్పించడం ద్వారా ప్రజల్ని శుద్ధిచేశారు. ప్రజల కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేసేవారు.

• యేసు క్రీస్తు శుద్ధీకరణ పరిచర్య : యేసు క్రీస్తు ప్రభువు తన బలియాగము ద్వారా మనలను శుద్ధిచేశాడు. యేసురక్తము మనలను శుద్ది చేసింది, శుద్ధి చేస్తూనే ఉంటుంది. (కుమారుని రక్తము అనే అధ్యాయమును చూడము)

• విజ్ఞాపన పరిచర్య : హెబ్రీ 7:25 : రోమా 8:34 గ్రీకు భాషలో విజ్ఞాపన అనే మాటను “ఎంటైగీకెనో ఎంటైగీకెనో అనగా నిర్దుష్టమైన అవసరాలకోసం ప్రార్థించుట. యేసుక్రీస్తు చేసే విజ్ఞాపన నిజమైంది.

 

15.5.2. మెల్కీసెదకు క్రమములోని యాజకత్వం :

 

యాజకులు లేవీ గోత్రమునకు చెందినవారై ఉండాలి. యూదులు యాజకత్వం చేయలేదు. యూదా గోత్రం వారు యాజకత్వం చేయకూడదు. యేసుప్రభువు యూదా గోత్రములో పుట్టినవాడు. కాని యాజకునిగా అంగీకరించబడినాడు. మెల్కీసెదకు క్రమంలో అదిసాధ్యమైంది. ( ఆది 14:18-20; హెబ్రీ 7:1-25; కీర్తన 110:4; జెకర్యా 6:13 చదవండి).

 


మెల్కీసెదకు యేసుక్రీస్తుకు గల పోలికలు :

 

మెల్కీసెదకుయేసుక్రీస్తు దేవుడు
1. అబ్రహామును ఆశీర్వదించాడు 1. యేసుక్రీస్తు అబ్రహాముకంటే ముందున్నవాడై అబ్రహామును ఆశీర్వదించాడు.
2. అబ్రాహాము నుండి పదియవంతును పుచ్చుకున్నాడు అప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు అనగా యాజకుని నుండి దశమ భాగం తీసుకున్నాడు. అనగా యాజకునికంటే, అహరోను కంటే గొప్పవాడు. 2. మన కానుకలకు పాత్రుడు యేసుక్రీస్తు, మనం ప్రభువుకు దశమ భాగం చెల్లించాలి
3. నిరంతర యాజకుడు 3. ప్రభువు నిరంతర యాజకుడు
4. మెల్కీసెదకు అనగా నీతికి రాజు అని అర్థము 4. యేసుక్రీస్తు నీతిరాజు
5. షాలేం రాజు అనగా సమాధానానికి రాజు 5. యేసుక్రీస్తు సమాధానకర్త
6. వంశావళిలేనివాడు 6. దేవుని కుమారునిగా వంశావళి లేనివాడు
7. ఎప్పుడు జన్మించాడో ఎప్పుడు మరణించాడో వివరాలు లేవు హఠాత్తుగా ఆదికాండము 14:18-20 లో కన్పించాడు. మరి ఏమైనాడో తెలీదు. 7. ఆదియైనను, అంతమైనను లేనివాడు
8. కేవలం పోలిక మాత్రమే 8. నిజమైనవాడు

 


15.5.3. అహరోను యాజకత్వానికి మరియు యేసుక్రీస్తు యాజకత్వానికి వ్యత్యాసాలు (యేసుక్రీస్తు యాజకత్వం యొక్క విశేషం) : హెబ్రీ 7,9 మరియు 10 అధ్యాయాలు జాగ్రత్తగా పరిశీలించి చదవండి హెబ్రీ 1:12; హెబ్రీ 7:24 ).

 

అహరోను క్రమపు యాజకత్వంయేసుక్రీస్తు యాజకత్వం
1. సంపూర్ణ సిద్ధి కలిగించదు 1. సంపూర్ణ సిద్ధి కలిగించును
2. శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రాన్నిబట్టి నియమించబడ్డాడు 2. నాశనం లేని జీవపు శక్తిని బట్టి నియమించబడ్డాడు.
3. ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున నివారణ చేయబడింది. 3. అంతకంటే శ్రేష్ఠమైన నిరీక్షణను కలిగించే దానియందు దేవుని యొద్దకు మనం చేరగలం.
4. వారు ప్రమాణం లేకుండా యాజకులైనారు. 4. ప్రమాణ పూర్వకంగా యాజకుడైనాడు.
5. యాజకులు మరణానంతరం పొందిన యాజకులు మారుతూవచ్చారు. 5. మరణాన్ని జయించి నిరంతరం ఉండే యాజకుడు
6. రక్షించలేడు 6. సంపూర్ణంగా రక్షించగల శక్తిగలవాడు.
7. బలహీనమైన యాజకులు శోధనకు లోనయ్యారు 7. బలవంతుడు, పాపరహితుడు శోధనకు లొంగనివాడు. సంపూర్ణ సిద్ది కలిగినవాడు.
8. మనుష్యులు అనగా సృష్టించబడినవారు 8. కుమారుడు, దేవుడు
9. తన స్వంత పాపాల కొరకు బలి అర్పించాలి. 9. పాపరహితుడు, కనుక ఆ అవసరం లేదు.
10. దినదినం బలులు అర్పించాలి 10. ఒక్కసారే అర్పించెను
11. బలులు అర్పించాలి 11. ఒకే ఒక్క బలి తన్ను తాను అర్పించుకొనెను.
12. ఆరాధకునికి, మనస్సాక్షికి సంపూర్ణ సిద్ది కలిగించలేదు 12. మనస్సాక్షి శుద్దిచేయును
13. నానా విధమైన ప్రక్షాళనాలతో సంబంధించిన శరీరాచారాలు మాత్రమే. 13.సత్యమైన విమోచనను సంపాదించింది.
14.హస్తకృతమైన గుడారం, సృష్టిసంబంధమైంది (అనగా సృష్టింపబడిన చర్మం, కర్ర, వెండి, బంగారములతో చేయబడినది) 14.హస్తకృతంకానిది. ఘనమైన సృష్టి సంబంధమైనది (అనగా సృష్టింపబడిన చర్మం, కర్ర, వెండి,బంగారాలతో చేయ బడింది కాదు). పరిపూర్ణమైన గుడారం అనగా యేసుక్రీస్తు శరీరం
15. మేకల, కోడెల యొక్క రక్తం 15. స్వరక్తం
16. శరీరశుద్ది కలిగింది 16. మనస్సాక్షి శుద్ధి చేయబడింది.
17. నిర్జీవ క్రియలలో దేవుని సేవించుట 17.నిర్జీవ క్రియలు లేకుండా ఆత్మద్వారా దేవుని సేవించుట.
18. పోలిక మాత్రమే 18.నిజమైనది
19. ప్రధాన యాజకుడు హస్తకృతమైన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడం 19. యేసుక్రీస్తు దేవుని సన్నిధిలో కనబడ్డానికి పరలోకంలో ప్రవేశించాడు
20. తనదికాని రక్తంతో ప్రవేశిస్తాడు 20. స్వీయ రక్తంతో ప్రవేశిస్తాడు
21. నిజస్వరూపం గలదికాదు 21. నిజస్వరూపం గలది
22. పాపాలు జ్ఞాపకం చేయబడతాయి 22. పాపజ్ఞప్తి యుండదు
23. పాపం తీయలేని బలులు 23.పరిశుద్ధ పరచబడు వారికి సదా కాలానికి సరిపడు సంపూర్ణమైన బలి
24. మోషే వల్ల కలిగింది 24. యేసు ప్రతిష్టించింది
25. పాతది 25. నూతనమైనది
26. నిర్జీవమైనది 26. జీవంగలది
27. సన్నపు నారతో చేసిన తెర 27. ఆయన శరీరం అను తెర
28. ఇంటిలో పనిచేసే యాజకుడు 28. ఇంటిపై యాజకుడుగా ఉండే యాజకుడు
29. మనకు ఏరకంగాను సహాయం చేయలేనివాడు 29. మనకు సహాయం చేయగలవాడు

15.6. రాజుగా యేసుక్రీస్తు :

రాజరికం యొక్క స్వరూపం ఇశ్రాయేలు చరిత్రలో మనం చూడగలం. శాసనసంబంధమైన, న్యాయసంబంధమైన, కార్య నిర్వాహక సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, సైనిక సంబంధమైన అధికారాలు రాజుసొత్తు, అవి అతనికి ధారాదత్తం చేయబడ్డాయి.

• రాజు వాగ్దానం చేయబడినాడు - 2 సమూ 7:12-16, యెషయా 9:7

• రాజుగా ప్రవచింపబడినాడు - జెకర్యా 9:9, మత్తయి 21:1-11

• రాజుగా ప్రకటించబడినాడు - లూకా 1:32-33

• రాజుగా పిలువబడినాడు - యోహాను 12:13, మత్తయి 2:2

• యేసును రాజుగా అంగీకరించారు - మత్తయి 27:11

• తృణీకరించబడిన రాజు - మార్కు 15:12-15; యోహాను 19:15

• మహిమతో రానైయున్నరాజు - మత్తయి 25:31; ప్రకటన 19:16

• నీతి రాజ్యం స్థాపించు రాజు - కీర్తన 110:2; కీర్తన 2:8-9

• నిత్యం ఉండే రాజు - 1 తిమోతి 1:17

• యేసుక్రీస్తు సంఘానికి రాజు కాదు శిరస్సు - అపొ.కా. 17:7; 1 తిమోతి 1:17, ఎఫెసీ 5:23

• యేసుక్రీస్తు యాజకత్వం కలిగిన రాజు - జెకర్యా 6:13.

 

16. కుమారుని యొక్క హెచ్చింపు మరియు వర్తమాన కృత్యాలు
(EXALTATION AND PRESENT WORKS OF SON)

 

కుమారుడైన దేవుడు తన్నుతాను రిక్తునిగా చేసుకొని ఆకారమందు మనుష్యునిగా కనపడి, దాసుని పోలికను ధరించి సిలువ మరణం పొందునంతగా తన్నుతాను తగ్గించుకున్నాడు. ఆయన తిరస్కరించబడి, అవమానించబడ్డాడు. ఆయన దూతలకంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడీ ఇపుడు హెచ్చించబడినాడు. హెబ్రీ. 1:8-9

16.1. కుమారుని హెచ్చింపు :

 

16.1.1. పునరుత్థానం :

 

యేసుప్రభువు హెచ్చింపులో మొదటి దశ ఆయన పునరుత్థానం. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన మూలాన ఆయన హెచ్చించబడ్డాడు. ( హెబ్రీ 2:9 ).

 

16.1.2. ఆరోహణం :

 

యేసుప్రభువు హెచ్చింపులో రెండవ దశ ఆయన ఆరోహణం. ఒలీవల కొండపై ఆయన శిష్యులు అందరూ చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణం అయినాడు. ( అ.కా. 1:9 ). యేసుప్రభువు ఆరోహణం ద్వారా మానవ రూపానికి పరలోకంలో స్థలం దొరికింది. మర్యమైన ఈ మాంసానికీ, ఎముకలకు అమర్త్యత ఆపాదించబడీ పరలోక మహిమను మానవ శరీరం పొందుకుంది.

16.2. కుమారుని హెచ్చింపులోని విశేషం :

 

16.2.1. సింహాసనాసీనత :

 

యేసు ప్రభువు ఆరోహణమైన తరువాత హెచ్చించబడి దేవుని సింహాసనముపై ఆయన కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. హెబ్రీ. 2:7. భవిష్యత్తులో ఆయన రారాజుగా ఈ లోకాన్ని పరిపాలించబోవుచున్నాడు. దానియేలు 7:13, 14. యేసుప్రభువు దేవదూతల కంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకంలో మహామహుని పార్శ్వన కూర్చున్నాడు. ( ఎఫెసి 1:20-21; హెబ్రీ 1:13, 14 ).

 

16.2.2. సృష్టిమీద సర్వాధిపత్యం కలిగి ఉండుట :

 

యేసుప్రభువు ఇపుడు సర్వసృష్టిలో తన అధికారాన్ని కలిగి ఉన్నాడు. అనగా తన అధికారాన్ని కొనసాగిస్తున్నాడు. దృశ్యమైన వాటి మీద అదృశ్యమైన వాటిమీద ఆయన అధికారాన్ని కలిగి ఉన్నాడు. సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తికంటే, ప్రభుత్వం కంటే ఆయన ఎంతో హెచ్చయిన అధికారాన్ని కలిగి ఉన్నాడు. ( మత్త 28:18; కొలస్సీ 1:16-17; ఎఫెసీ 1:20-21; 1 కొరింథీ 15:24-28 ).

 

16.2.3. సంఘానికి శిరస్సు :

 

యేసుక్రీస్తు ప్రభువు ఇపుడు సంఘమనే శరీరానికి శిరస్సుగా ఉన్నాడు. ( కొలొస్సి 1:18; ఎఫెసి 1:22-23; ఎఫెసి 4:16; ఎఫెసీ 5:23 ).

 

16.2.4. శ్రేష్టమైన బలిగా అర్పించబడటం :

 

మనకోసం శ్రేష్టమైన బలిగా అర్పించబడటం కోసం యేసుక్రీస్తు ప్రభువు హెచ్చింపబడి పరలోకంలో ప్రవేశించి తండ్రి ఎదుట మన పక్షాన అంగీకరించబడినాడు. ( హెబ్రీ 9:23-25; 1 కొరింథీ 15:20 ).

 

16.2.5. పరిశుద్దాత్మను పంపుట :

 

యేసుక్రీస్తు ప్రభువు తాను హెచ్చింపబడిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మను ఈ లోకంలోకి పంపించాడు. ( యోహాను 15:26 ).

16.3. కుమారుని వర్తమాన కృత్యాలు :

కుమారుని వర్తమానకృత్యాలు, కుమారుని హెచ్చింపు ఫలమే. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై, సృష్టిపై అధికారం కలిగి, సంఘానికి శిరస్సై, ఈ కృత్యాలన్ని జరిగిస్తున్నాడు.

 

16.3.1. ఈవుల్ని అనుగ్రహించుట :

 

సంఘం అనే శరీరంలోని వివిధ అవయవాలు తమ ధర్మాల్ని నెరవేర్చడానికి అవసరం అయిన సామర్థ్యాన్ని కృపను శిరస్సుగా తన శరీరానికి ఆయన అనుగ్రహిస్తున్నాడు. సంఘంలో పరిచర్య ధర్మం కలుగుట కోసం సంఘాన్ని ఈవులతో ఆయన నింపియున్నాడు. ( రోమా12:3-8; 1 కొరింథీ 12:4-11; ఎఫెసీ 4:7-11; 1 కొరింథీ 12:11,18 ).

 

16.3.2. విజ్ఞాపన చేయుట :

 

ఆయన విశ్వాసుల నిమిత్తం దేవుని కుడి పార్వమున నుండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన నిమిత్తమై నిత్యం విజ్ఞాపన చేస్తున్న మూలాన సంపూర్ణంగా రక్షిస్తున్నాడు. ( యోహాను 17:9,20; హెబ్రీ 7:25; రోమా 8:34 ).

 

16.3.3. ఉత్తర వాదత్వం వహించుట :

 

దేవుని ఎదుట విశ్వాసులపై అపవాది ఎల్లప్పుడు నేరాలు మోపుతూ ఉంటాడు. రక్షింపబడ్డ విశ్వాసులు పాపం చేయరు. అయితే పాపం చెయ్యకుండా ఉండగలరు అనే గ్యారంటీ ఏమీలేదు. విశ్వాసి ప్రభువు రక్తంలో కడగబడినప్పటికిని, విమోచింపబడినప్పటికిని పాపనియమం విశ్వాసి జీవితాంతం ఆయన శరీరంలో క్రియచేస్తూనే ఉంటుంది. ఇది విశ్వాసులు అంగీకరించవలసిన చేదు నిజం. కనుకనే అపవాది విశ్వాసులపై నేరస్థాపన చేస్తూనే ఉంటాడు. అయితే యేసుప్రభువు విశ్వాసుల పక్షాన తండ్రి ఎదుట ఉత్తరవాదిగా ఉంటున్నాడు. తన బలియాగం చేత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ప్రభువు ఉచితంగా నీతిమంతులుగా తీర్చినాడనే సత్యాన్ని తండ్రి ఎదుట పెట్టి మన కోసం ఉత్తర వాదత్వం వహిస్తూ ఉన్నాడు. ఇపుడు విశ్వాసుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు ఉత్తరవాదత్వ కృత్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. (ప్రకటన 12-10; హెబ్రీ 9:24; 1 యోహాను 1:9 1 యోహాను 2:1-2 పోల్చండి. 1 పేతురు 3:18; రోమా 3:25-26 ).

 

16.3.4. స్థలాన్ని సిద్దపరచుట :

 

యేసుక్రీస్తు ప్రభువు తన విశ్వాసుల నిమిత్తమై నివాసాన్నాడు. ( యోహాను 14:1-4 ).

 

17. కుమారునియొక్క భవిష్యత్ కృత్యాలు
(ESCHATOLOGICAL ACTS OF SON)

 

యేసుక్రీస్తు ప్రభువు భవిష్యత్తులో అనేక కృత్యాలను నిర్వర్తించబోతున్నాడు. వాటిని నేను ఇక్కడ విపులంగా చర్చించడం లేదు. వీటిని క్రీస్తు శాస్త్రంలో ఒక అధ్యాయంలోనే క్లుప్తంగా నిర్వచిస్తూ ఉన్నాను. విస్తృత చర్చను భవిష్యత్ విషయాల శాస్త్రంలో చూడగలరు.

17.1. సంఘకాల విశ్వాసులు పునరుత్థానము :

సంఘకాలానికి చెందిన విశ్వాసుల్ని ప్రభువు తిరిగిలేపుతాడు. ( 1 థెస్స 4:13-14, 16; 1 కొరింథీ 15:22-23 ).

17.2. సంఘం యొక్క ఉద్దానం :

సంఘాన్ని యేసుప్రభువు ఆకర్షించుకోవడం వలన సంఘం ఎత్తబడి మధ్యాకాశంలోనికి కొనిపోబడుతుంది. అపుడు ప్రభువు సంఘాన్ని మధ్యాకాశంలో కలుసుకుంటాడు.( 1థెస్స4:13-17 ).

17.3. విశ్వాసుల తీర్పు :

మధ్యాకాశంలో క్రీస్తు ప్రభువు విశ్వాసులకు తీర్పు తీర్చనైయున్నాడు. విశ్వాసులు బహుమతులు పొందుతారు. దీనినే యేసుప్రభువు న్యాయపీఠ విమర్శ అంటారు. ( 1 కొరింథీ 3:12-15; 2 కొరింథీ 5:10 ).

17.4 ఏడు సంవత్సరాలు భూప్రజలపై తీర్పు కుమ్మరించుట :

ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు మహాశ్రమ కాలం. (యిర్మియా 30:1-31:25). ప్రకటన గ్రంథము ఈ విషయాన్ని విపులంగా వివరిస్తుంది. అదే సమయంలో ఆయన భూప్రజలన్ని శిక్షించబోతున్నాడు.

17.5 క్రీస్తు ప్రభువు రెండవరాకడ :

క్రీస్తు ప్రభువు దేవుని సంకల్పం చొప్పున ఈ భూమిని వేయి సంవత్సరాలు పరిపాలించే నిమిత్తం ఈ భూమిపైకి రెండోసారి మహిమా ప్రభావంతో రాబోతున్నాడు. రెండవ రాకడలో దావీదుతో చేసిన నిబంధన, అబ్రాహాముతో చేసిన నిబంధన నెరవేర్చనై యున్నాడు. ( ప్రకటన 19:11-16; జకర్యా 14:4 ).

17.6. సజీవులైన ఇశ్రాయేలు జనాంగాల తీర్పు:

మత్తయి 24:31; 25:1-30; జెకర్యా 14:4; 13:8,9; యెహెజ్కేలు20:34-38; రోమా 11:26,27.

17.7. సజీవులైన అన్య జనాంగాల తీర్పు :

మత్తయి 25:31-46;