ఆడియో
విషయసూచిక
దేవుడు సార్వభౌముడు అని వాక్యం చెప్తుంది. సార్వభౌముడు అంటే సమస్తాన్ని తన నియంత్రణలో ఉంచుకున్నవాడు, సమస్తము చేయగలవాడు. తన నియంత్రణ వెలుపల ఏ విషయమూ లేదు, తనకు తెలియకుండా తాను అనుమతి ఇవ్వకుండా ఏదీ జరగదు. ఈ సత్యం మనుష్యునిని తన బాధ్యత నుండి స్వతంత్రునిగా చేయదు. మనుష్యులు తాము చేసిన పనులకు బాధ్యత వహిస్తారు అనీ, మనం చేసే పనులను బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు అనీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే మనం ఈ రెండు విషయాలను పక్కన పెట్టి చూసినప్పుడు, ఇవి వైరుధ్యాలుగా అనిపించొచ్చు. దేవుడు సార్వభౌముడైతే, మానవుడు చేసే ప్రతి పనికి దేవుడే బాధ్యత వహించాలి కదా అని కొంతమంది ప్రశ్నించొచ్చు.
ఇక్కడ రెండు పదాల గురించి తెలుసుకుందాం
a) Contradiction (వైరుధ్యం)
b) Paradox (వైరుధ్యంగా అనిపించేది)
Contradiction (వైరుధ్యం) అంటే రెండు విషయాలు ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉండడం; ఈ రెంటిలో ఒకటి మాత్రమే సత్యమయ్యే అవకాశం ఉంటుంది. 'A' అనే ప్రతిపాదన సరైనది, అయితే 'non-A' అనే ప్రతిపాదన కచ్చితంగా తప్పవుతుంది. ఉదాహరణకు, దేవుడు ఉన్నాడు అనే ప్రతిపాదన 'A' అనుకుందాం, దేవుడు లేడు అనే ప్రతిపాదన 'non-A' అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు ప్రతిపాదనలలో ఒకటి మాత్రమే సత్యం రెండవది సత్యం అయ్యే అవకాశం లేదు. దీనిని వర్ణించే సూత్రాన్నే 'The Law of Non-Contradiction' అని అంటారు. ఈ సూత్రం ప్రకారం, 'A' అనే ఒక ప్రతిపాదన, ఒకే సమయంలో ఒకే అర్థంలో (లేదా ఒకే సంబంధంలో) 'A'గాను మరియు 'non-A'గాను ఉండదు.
ఒక ఉదాహరణ చూద్దాం,
'A' అనే ప్రతిపాదన - 'అన్ని కార్లు ఎర్రనివి',
'non-A'అనే ప్రతిపాదన - 'కొన్ని కార్లు తెల్లనివి'.
ఈ రెండు ప్రతిపాదనలనూ మనం గమనిస్తే, అన్ని కార్లూ ఎర్రవైతే ఇంక తెల్లవి ఎలా ఉంటాయి? కొన్ని కార్లు తెల్లవైతే అన్నీ ఎర్రవి ఎలా అవుతాయి?' ఇది అర్థంలేని ఒక ప్రతిపాదన. కాబట్టి, 'A' అనేది ఒకే సమయంలో ఒకే అర్థంలో 'A' గాను మరియు 'non-A' గాను ఉండడం సాధ్యపడదు. ఆలా ఉంటే, దానినే వైరుధ్యం అంటారు.
దేవుని వాక్యంలో వైరుధ్యాలు (Contradictions) లేవు, అంటే ఒకచోట సత్యం అని చెప్పబడిన విషయం ఇంకొకచోట అసత్యంగా ప్రస్తావించడం దేవుని వాక్యంలో ఎక్కడా మనం చూడం.
Paradox (పారడాక్స్) అనే పదానికి తెలుగు డిక్షనరీలో 'వైరుధ్యం' అనే అనువాదం ఇవ్వబడింది, అయితే అది సరైన భావం కాదు. ఈ మాటకు అర్థం ఏంటి అంటే, 'చూడడానికి వైరుధ్యంలాగ కనిపించినా క్షుణ్ణంగా పరిశీలించిన్నప్పుడు అవి అర్థవంతంగా ఉంటాయి'.
ఉదాహరణకు, మత్తయి 10:39, "నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును" అని యేసు చెప్పాడు. ఈ మాటను జాగ్రత్తగా గమనిస్తే, ఇది ఒక వైరుధ్యంలాగ అనిపిస్తుంది. ఎవరైనా తన ప్రాణం పోగొట్టుకుంటే దానిని ఎలా దక్కించుకుంటాడు? కొంచెం ఆలోచిస్తే ఇవి ఒకే సమయంలో ఒకే అర్థంలో (లేదు ఒకే సంబంధంలో) చెప్పబడిన విషయాలు కావు. గనుక ఇది వైరుధ్యం అని చెప్పలేం. మీరు ఈ లోకంలోనే మీ ప్రాణాలు పోగొట్టుకొని, ఈ లోకంలోనే దానిని తిరిగి పొందుకుంటారు అని యేసు చెప్పుంటే అది వైరుధ్యం అయ్యుండేది. అయితే ఆయన ఉద్దేశం అది కాదు, నా కోసం ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టేవాడు, రాబోయే లోకంలో తన ప్రాణాన్ని దక్కించుకుంటాడు అని అర్థం.
ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, "దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని బాధ్యత" అనేవి వాక్యంలో ఉన్న వైరుధ్యాలు కావు, అవి Paradoxes అని మనం తెలుసుకోవాలి. అంటే దేవుడు ఏమి జరగాలో ముందే నిర్ణయించాడు, అయినప్పటికీ నా పనులకు నేనే బాధ్యుడను. ఈ రెండూ సత్యాలే అని బైబిల్ తెలియజేస్తుంది.
i) దేవుని శాసనం మానవుని బాధ్యతను మినహాయించదు
దేవుని వాక్యం నుండి కొన్ని సన్నివేశాలను చూద్దాం
a) యోసేపు యెడల దేవుని చిత్తం తన అన్నల పాపాన్ని మినహాయించలేదు
“మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరి గాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. " ఆది 50:20
మనకు యోసేపు కథ తెలుసు కదా. యేసేపును తన సహోదరులు ద్వేషించారు, తమ తండ్రి అయిన యాకోబు అందరికంటే యోసేపునే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, మరియు యోసేపుకు వచ్చిన దర్శనాన్ని బట్టి (అనగా వీరందరూ యోసేపు ముందు సాష్టాంగపడతారు) వారు అతని మీద మరింత పగబట్టారు, అసూయపడ్డారు ( ఆది 37:8-11 ). ఒకరోజు, యోసేపు అన్నలు గొర్రెలు కాసుకొనుచుండగా యోసేపు వారి దగ్గరికి వచ్చాడు, అతనిని చూసి అతని అన్నలు, "వీని చంపి యిక్కడనున్న ఒక గుంటలో పారవేసి, దుష్టమృగము వీని తినివేసెనని చెప్పుదము" (ఆది 37:20) అని అనుకున్నారు. అయితే రూబేను చంపొద్దు అని, అడవిలోనున్న ఒక గుంటలో పారేద్దామని సలహా ఇచ్చాడు, తర్వాత యూదా అటుగా వెళ్తున్న మిద్యానీయులైన వర్తకులకు అమ్ముదాము అని సలహా ఇచ్చాడు. ఆవిధంగా యోసేపు మిద్యానీయులైన వర్తకుల ద్వారా ఐగుప్తునకు తీసుకొని వెళ్ళబడ్డాడు.
నేను మీకు ఈ కథ అంతా చెప్పిన తర్వాత, యోసేపు అన్నలు చేసింది తప్పా లేదా ఒప్పా? అని ప్రశ్నిస్తే, బహుశా అందరూ వారు చేసింది తప్పు అని ముక్తకంఠంతో చెప్తారేమో.
ఇప్పుడు ఈ కథను వేరే కోణంలో చెప్తాను, తర్వాత ఇదే ప్రశ్నను అడుగుతాను. దేవుడు యోసేపుకు కల ద్వారా ఒక దర్శనం ఇచ్చాడు "అందులో సూర్యచంద్రులును పదకొండు నక్షత్రములును నాకు (యోసేపుకు) సాష్టాంగపడెను" (paraphrase added) (ఆది 37:9) అని చూస్తాం. తనకు ఈ దర్శన భావం ఆ సమయంలో తెలియలేదు, తన సహోదరులకు మరియు తన తండ్రికి కూడా ఆ దర్శన భావమేంటో ఆ సమయంలో తెలియదు. యోసేపును తన అన్నలు చంపుదాము అని అనుకున్నప్పుడు, అదే సమయంలో దేవుడు మిద్యానీయులైన వర్తకులను ఆ మార్గంలో తీసుకొచ్చాడు, యోసేపు అన్నలు అతనిని వారికి అమ్మేసారు. తర్వాత దేవుడు యోసేపును పోతీఫరు ఇంటిలో అధిపతిగా నియమించాడు. పోతీఫరు ఇంటి నుండి యోసేపు తాను చేయని తప్పుకు చెరసాల పాలయ్యాడు (ఆది 39), అక్కడ రాజు దగ్గర పనిచేసే వారిలో ఇద్దరిని కలుసుకున్నాడు, వారు చేసిన తప్పులను బట్టి చెరసాలలో ఉంచబడ్డారు. వారికి ఒక కల వచ్చింది, దానికి యోసేపు అర్థం చెప్పాడు (దేవుడు యోసేపుకు బయలుపరిచాడు). వారిద్దరిలో ఒకడు ఉరితీయబడ్డాడు, ఇంకొకరు (పానదాయకుడు) విడువబడ్డాడు. ఈ పానదాయకుడు యోసేపుకు ధన్యవాదాలు చెప్పి, రాజు ముందు యోసేపు గురించి చెప్తాను అన్నాడు గాని ఆ విషయం విడుదలైన తర్వాత మర్చిపోయాడు. ఐగుప్తు రాజుకు ఒక కల వచ్చింది, ఆ కల భావం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు ఆ పానదాయకుడు యోసేపు గురించి రాజు ముందు ప్రస్తావించడం, రాజు యోసేపును పిలిపించడం జరిగింది. దేవుడు యోసేపుకు ఆ కల భావం తెలియజేసాడు, దానినే యేసేపు రాజుకు చెప్పాడు. ఈ విధంగా యోసేపు ఐగుప్తు దేశంలో రాజు తర్వాత స్థానంలో నియమించబడ్డాడు.
ఇప్పుడు యోసేపును రాజు తర్వాత స్థానంలో ఉంచింది దేవుడే అని, అది దేవుని ప్రణాళికే అని మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది, కాదు కాదు, అది యోసేపు పడ్డ కష్టం అని అంటారేమో, దానికి యోసేపు కూడా ఒప్పుకోడు.
ఇందాక మనం ప్రస్తావించిన ఆది 50:20లో యోసేపు "నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను" అంటున్నాడు. అంటే ఈ దినాన్ని దేవుడే నియమించాడు, నన్ను ఈ స్థానంలో ఉంచడం దేవుని ఉద్దేశం, నన్ను ఈ స్థానంలో ఉంచి అనేకులను బ్రతికించాలని (7 సంవత్సరాల కరువు నుండి తప్పించాలని) దేవుడు అనుకున్నాడు అని యోసేపు చెప్తున్నాడు.
దేవుడు యోసేపును ఆ స్థానంలో ఉంచాలి అనుకున్నాడు, అదే స్థానంలో ఉంచాడు. అయితే యోసేపు అన్నలు చేసిన పని యోసేపు ఆ స్థానానికి రావడానికి సహాయపడింది గనుక, యోసేపు అన్నలు దేవుని చిత్తాని జరిగించారు అని చెప్పగలమా? లేదు, ఆలా చెప్పలేము.
యోసేపు అన్నలు చేసింది తప్పు అని వారే ఒప్పుకున్నారు, యోసేపు కూడా అదే మాట చెప్పాడు. దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఇక్కడ చూపించాడు. దేవుడు, యోసేపు అన్నలు ఉద్దేశించిన "కీడు" ద్వారా తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి, అది అనేకులకు "మేలు" కలిగేలాగా మార్చాడు.
యోసేపు అన్నలు చేసిన తప్పుకు వారే బాధ్యులు, దేవుడు కాదు. యోసేపు పట్ల కీడు చేయమని దేవుడు యోసేపు అన్నలకు చెప్పలేదు, బలవంతంగానూ చేయించలేదు. యోసేపు అన్నలే తమ స్వేచ్ఛాసంకల్పాన్ని బట్టి తాము చేయాలనుకున్న కీడును చేసారు, దేవుడు ఆ కీడు ద్వారా మేలును జరిగించాడు. ఇక్కడ దేవుని సార్వభౌమత్వం మరియు మానవుని బాధ్యత చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా!
b) ఇశ్రాయేలీయుల యెడల దేవుని చిత్తం అష్షూరు రాజు గర్వాన్ని మినహాయించలేదు
దేవుడు అష్షూరీయుల గురించి మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు - “అష్షూరీయులకు శ్రమ వారు నా కోపమునకు సాధనమైన దండము నా దుడ్డుకఱ్ఱ నా ఉగ్రత వారిచేతిలో ఉన్నది, భక్తిహీనులగు జనములమీదికి నేను వారిని పంపెదను దోపుడుసొమ్ము దోచుకొనుటకును కొల్లపెట్టుటకును వీధులను త్రొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులగు జనులనుగూర్చి వారికాజ్ఞాపించెదను." యెషయా 10:5,6
దేవుడు ఇశ్రాయేలీయుల పాపాన్ని బట్టి వారికి శిక్ష విధిస్తున్నాను అని చెప్తున్నాడు. ఏ విధంగా శిక్ష విధించబోతున్నాడు, అంటే ఇశ్రాయేలీయుల మీదకు అష్షూరీయులను యుద్దానికి తీసుకొచ్చి, వారు ఇశ్రాయేలీయులను చెరపట్టుకుపోయేలాగా చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అయితే దేవుడు అష్షూరీయులను "నా కోపమునకు సాధనమైన దండము" అని వర్ణిస్తున్నాడు. అంటే వారు దేవుని చేతిలో అస్త్రాలు అని, లేదా దేవుని చేత దేవుని పని నెరవేర్చడానికి ఉపయోగించబడుతున్న సాధనాలు అని అర్థం కదా. దేవుడే వారిని తన అస్త్రంలాగ వాడుకుంటుంటే, 5వ వచనంలో "అష్షూరీయులకు శ్రమ" అని ఎందుకు అంటున్నాడు. దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో దానినే అష్షూరీయులు చేస్తున్నారు కదా.
ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోవడానికి అదే అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుదాం, "అయితే అతడు (అష్షూరు రాజు) ఆలాగనుకొనడు అది అతని ఆలోచన కాదు; నాశనము చేయవలెననియు చాల జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన". దీనిని బట్టి అష్షురీయులు ఇశ్రాయేలును "నాశనము" చేయాలని "జనములను నిర్మూలము" చెయ్యాలనే ఉద్దేశంతో వచ్చారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వారి ఆలోచన కాదు. అయితే వారి ఆలోచనలకు, వారి ప్రవర్తనకు వారే బాధ్యులు, కానీ దేవుడు వారిని ఇశ్రాయేలీయులకు శిక్ష విధించడానికి వాడుకున్నాడు. ఇశ్రాయేలీయులకు తమ పాపాన్ని బట్టి శిక్ష విధించిన తర్వాత, అష్షురీయులు చేసిన పనిని బట్టి వారికి కూడా శిక్ష విధించబోతున్నాడు, అందుకే ప్రభువు 12వ వచనంలో (యెషయా 10:12) ఈ విధంగా అంటున్నాడు " ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరురాజుయొక్క హృదయగర్వమువలని ఫలమునుబట్టియు అతని కన్నుల అహంకారపు చూపులనుబట్టియు అతని శిక్షింతును".
ఎందుకు అష్షురు రాజుకు గర్వం? దేని గురించి అంత అహంకారంతో ఉన్నాడో చూద్దాం: “అతడు నేను వివేకిని నా బాహుబలముచేతను నాబుద్ధిచేతను ఆలాగు చేసితిని నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకొంటిని మహా బలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసితిని పక్షిగూటిలో ఒకడు చెయ్యివేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకొనునప్పుడు రెక్కను ఆడించునదియైనను నోరు తెరచునదియైనను కిచకిచలాడునదియైనను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొను చున్నానని అనుకొనును." యెషయా 10:13,14
నా వివేకము నా బాహుబలము, నేనే ఇదంతా చేసింది, నేనే రాజ్యాలను త్రోసివేసింది, నేనే ఖజానాలను దోచుకుంది, నేను సర్వలోకాన్ని ఏరుకొనుచున్నాను అని అష్షురు రాజు అనుకుంటున్నాడు, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు అనే ఆలోచన లేదు, విజయం వచ్చినప్పుడు అది దేవుని మూలంగా కలిగింది అనే గ్రహింపు అతనికి లేదు, గనుక అతని హృదయపు గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి దేవుడు అతనికి తీర్పు తీరుస్తున్నాడు.
ఇక్కడ కూడా చాలా స్పష్టంగా దేవుని సార్వభౌమత్వం కనబడుతుంది, మానవుని బాధ్యత కనబడుతుంది. అష్షురు రాజును ఇశ్రాయేలీయుల మీదకు తీర్పుగా తెచ్చింది దేవుడే అయినప్పటికీ, అష్షురు రాజు చేసే పనులకు అతనే బాధ్యుడు.
c) బబులోను దేవుని చేతిలోని పాత్ర అయినప్పటికీ తమ పాపానికి తామే బాధ్యులు
బబులోను గురించి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు: “బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లియున్నారు " యిర్మీయా 51:7
“నీవు నాకు గండ్రగొడ్డలివంటివాడవు యుద్ధాయుధమువంటివాడవు నీవలన నేను జనములను విరుగగొట్టుచున్నాను నీవలన రాజ్యములను విరుగగొట్టుచున్నాను. నీవలన గుఱ్ఱములను రౌతులను విరుగగొట్టుచున్నాను. నీవలన రథములను వాటి నెక్కినవారిని విరుగగొట్టుచున్నాను. నీవలన స్త్రీలను పురుషులను విరుగగొట్టుచున్నాను నీవలన ముసలివారిని బాలురను విరుగగొట్టుచున్నాను నీవలన యవ్వనులను కన్యకలను విరుగగొట్టుచున్నాను. నీవలన గొఱ్ఱలకాపరులను వారి గొఱ్ఱలమందలను విరుగగొట్టుచున్నాను నీవలన దున్నువారిని వారి దుక్కిటెద్దులను విరుగగొట్టుచున్నాను నీవలన ఏలికలను అధిపతులను విరుగగొట్టుచున్నాను." యిర్మీయా 51:20-23
దేవుడు బబులోనును వాడుకుంటున్నాను అని పై వచనాలలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. బబులోను ద్వారా అనేక దేశాలను "విరుగగొట్టుచున్నాను" అని చెప్తున్నాడు. ఒకవేళ దేవుడు ఒక మనిషిని లేదా రాజ్యాన్ని వాడుకొని తన చిత్తాని నెరవేర్చుకుంటే దానికి దేవుడే కదా బాధ్యుడు. ఎవరైనా దేవుని ప్రణాలికను అడ్డుకోగలరా, ఎవరూ అడ్డుకోలేరు.
అయితే, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాక దేవుడు బబులోను గురించి ఏమి చెప్తున్నాడో చూద్దాం: “ఇశ్రాయేలు పరిశుద్ధదేవునికి విరోధముగా తాము (కల్దీయులు/బబులోనీయులు) చేసిన అపరాధముతో వారి దేశము నిండియున్నది" యిర్మీయా 51:7
దేవుడే బబులోనీయులను ఇశ్రాయేలీయుల మీదికి యుద్ధానికి తీసుకొచ్చాడు అయితే బబులోనీయులు "పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధము" అని యిర్మీయా 51:7 లో అంటున్నాడు. అదేంటి నా చిత్తాన్ని నెరవేర్చిన బబులోనీయులు నాకు ఇష్టులైన ప్రజలు అని దేవుడు బబులోనీయులను పొగడాలి కదా, వారు దేవుడు అనుకున్న పనినే నెరవేర్చారు కదా. ఇప్పుడు దేవుడు ఇలా మాట్లాడుతున్నదేంటి?
దేవుడు బబులోనీయుల గురించి ఇంకా ఏమంటున్నాడో చుడండి: “నా స్వాస్థ్యమును దోచుకొనువారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడిచేయుచు పెయ్యవలె గంతులువేయుచు బలమైన గుఱ్ఱములవలె మీరు సకిలించుచున్నారే?మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మును కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతినీచ జనమగును అది యెడారియు ఎండినభూమియు అడవియునగును. యెహోవా రౌద్రమునుబట్టి అది నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవువారందరు ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నియు చూచి--ఆహా నీకీ గతి పట్టినదా? అందురు ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విల్లు త్రొక్కువారలారా, మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి చుట్టు కూడి దానిని బట్టి కేకలు వేయుడి అది లోబడనొప్పుకొనుచున్నది దాని బురుజులు పడిపోవుచున్నవి దాని ప్రాకారములు విరుగగొట్టబడుచున్నవి ఇది యెహోవా చేయు ప్రతికారము.దానిమీద పగతీర్చుకొనుడి అది చేసినట్టే దానికి చేయుడి." యిర్మీయా 50:11-15
బబులోను మీద దేవుడు తన తీర్పును చెప్తున్నాడు, "మీరందరు బబులోనునకు విరోధముగా దాని చుట్టు యుద్ధపంక్తులు తీర్చుడి ఎడతెగక దానిమీద బాణములు వేయుడి" అని అంటున్నాడు. ఎందుకు దేవుడు ఇలా అంటున్నాడు అంటే, ఇందాక అష్షురు విషయంలో ఏదైతే చూసామో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. బబులోనువారు విగ్రహారాధికులు, బబులోను రాజు గర్విష్టి; అందుకే తనని తాను దేవునితో సమానంగా చేసుకునే ప్రయత్నం చేసాడు (నెబుకద్నెజరు కూడా దానియేలు సమయంలో ఈ విధంగా చేసాడు). అంతే కాదు, వారు దేవుని చేతిలో అస్త్రాలు అనే ఉద్దేశంతో వారు ఎప్పుడూ పనిచేయలేదు, పరిశుద్ధ దేవుని ప్రజలను దోచుకోవాలి అనేదే బబులోనీయుల ఆలోచన, అందుకే దేవుడు ఇలా అంటున్నాడు, "పరిశుద్ధదేవునికి విరోధముగా తాము చేసిన అపరాధము" అని వారి హృదయాలోచనను తెలియజేస్తున్నాడు, దానిని బట్టే వారికి తీర్పు తీరుస్తున్నాడు.
దేవుడు బబులోనును తన సార్వభౌమ చిత్తాన్ని బట్టి తన పని నెరవేర్చుకోవడానికి వాడుకున్నాడు, బబులోను మాత్రం మేము దేవుని కోసం పనిచేస్తున్నాం అనే ఉద్దేశంతో ఎవరి మీదనూ యుద్ధం చేయలేదు, తమ బలాన్ని చూపించడానికి, అహంకారాన్ని చూపించడానికి మాత్రమే వారు పాటుపడ్డారు. దేవుని ప్రణాళిక బబులోను ద్వారా నెరవేరింది, బబులోనీయుల పాపానికి వారికి శిక్ష పడింది.
d) యేసు క్రీస్తు మరణం తండ్రి నిర్ణయమైనప్పటికీ ఆయనను అప్పగించినవారి పాపానికి మినహాయింపు లేదు
ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ లో ఇలాంటివి అనేక ఉదాహరణలు చూస్తాం. ఈ భాగంలో చివరిగా మరొక ఉదాహరణని చూద్దాం.
యేసు క్రీస్తు మరణానికి ఎవరు కారణం అంటే వాక్యం చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్తుంది - “ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి." అపొ.కార్య 4:27,28
తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు విషయంలో ఏమి జరగాలనుకున్నాడు అంటే, యెషయా 53:10లో ఈ మాట చూస్తాం, "అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను". యేసు క్రీస్తు సిలువపై మరణించడం తండ్రి నిర్ణయం మరియు సంకల్పం అని చెప్పొచ్చు. యేసు క్రీస్తు కూడా "అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును" వచ్చాడు. తండ్రి చిత్తం అదే, యేసు క్రీస్తు చిత్తం అదే. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే, "ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో" అనే మాటలతో తండ్రి అయిన దేవుడు ఏమి జరగాలో ఎలా జరగాలో నిర్ణయించాడు, ఆయన నిర్ణయించిన విధంగానే, "వాటినన్నిటిని చేయుటకై….యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి."
చాలా స్పష్టంగా ఉంది కదా, దేవుడు ఏది చేయాలనుకున్నాడో ఏ విధంగా చేయాలనుకున్నాడో దానినే చేసాడు, మరి "హేరోదు", "పొంతి పిలాతు", "యూదా అధికారులు", "ఇశ్రాయేలు" "అన్యజనులు" చేసిన తప్పేంటి. వారు దేవుని సార్వభౌమ చిత్తాన్ని ఎదిరించగలరా? దేవుడు ఒకటి జరగాలని నిర్ణయిస్తే దానిని మార్చగల శక్తి వీరికి ఉందా?
మిమ్మల్ని నేను అడుగుతున్నాను, యేసు క్రీస్తు మరణించడంతో తప్పు ఎవరిది? దేవుడు తప్పు చేసాడు అని చెప్పగలమా, లేదు ఆలా అనకూడదు. దేవుడు పాపం చెయ్యడు, ఎవరిని పాపం చేయమని ప్రేరేపించడు అని వాక్యం చాలా స్ఫష్టంగా చెప్తుంది. క్రీస్తును అప్పగించమని "ఇస్కరియోతు యూదాని" దేవుడు ప్రేరేపించాడా? లేదు అతను సాతాను చేత ప్రేరేపించబడ్డాడు అని వాక్యం చెప్తుంది (అంతట పండ్రెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను - లూకా 22:2).
సరే, ఇస్కరియోతు యూదాని పక్కన పెడదాం, మరి యేసు క్రీస్తును సిలువ వెయ్యమని కేకలు వేసిన ప్రజలు దేవుని చిత్తాన్నే నెరవేర్చారు కదా, మరి వారి తప్పేంటి? అది వారి మాట్లల్లోనే చూద్దాం, "అందుకు ప్రజలందరు వాని రక్తము (యేసు రక్తము) మా మీదను మా పిల్లలమీదను ఉండుగాకనిరి" (మత్తయి 27:25). వారు చేస్తున్న పనికి పూర్తి బాధ్యతను అంగీకరిస్తున్నారు కదా. పిలాతు అధికార స్థానంలో ఉండి ప్రజల ఒత్తిడి తట్టుకోలేక యేసు పట్ల అన్యాయపు తీర్పు తీర్చాడు కదా. యేసు చేస్తున్న అద్భుతాలు, జనాలందరూ ఆయన వెనక ఉండడం చూసి అసూయతో క్రీస్తును చంపాలని యూదా మత పెద్దలు అనుకున్నారు కదా. ఈ తప్పులన్నీ ఎవరు చేసారు? దేవుడు చేశాడా? లేదా దేవుడు వీరి చేత చేయించాడా? లేదు, ఈ తప్పులన్నీ వారే చేసారు, అది వారే ఒప్పుకుంటున్నారు.
e) దేవుని శాసనం - మానవుని బాధ్యత సారాంశం
ఈ విషయాలను బట్టి (ఇంకా వాక్యంలో చాలా ఉన్నాయి, వాటిని మీరు జాగ్రత్తగా చదవాలని ఆశిస్తున్నాను) దేవుడు సార్వభౌముడు అని తెలుస్తుంది, తాను అనుమతించకుండా ఈ లోకంలో ఏదీ జరగదు అని, తన సార్వభౌమ చిత్తాన్ని ఏ విధంగా అయినా నెరవేర్చుకుంటాడు అని తెలుసుకున్నాం.
దేవుడు సార్వభౌముడు గనుక ఏది జరిగినా అది దేవుని అనుమతి గనుక మానవుడు చేసే ప్రతి పనికి దేవుడు బాధ్యత వహిస్తాడా అనంటే, అసలు ప్రసక్తే లేదు అని వాక్యం చాలా స్పష్టంగా చెవుతుంది. మానవుడు చేసిన పనులకు తానే బాధ్యుడు, దేవుని సార్వభౌమత్వం మానవుని బాధ్యతను మినహాయించదు. ఇది ఎలా సాధ్యం అని మీరు నన్ను అడుగుతారేమో, అది నాకు తెలియదు, దేవుని అపరిమితమైన జ్ఞానంలో ఇది చాలా చిన్న విషయం, కానీ నా పరిమితమైన జ్ఞానానికి ఇది ఒక "Paradox" (పారడాక్స్).
ii) రక్షణ యెహోవాదే, అవిశ్వాసం మానవుడిదే
యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదివినప్పుడు, అక్కడ నీకొదేము మరియు యేసు క్రీస్తు ప్రభువుకు మధ్య జరిగిన సంభాషణ చూస్తున్నాం.
“యేసు ఇట్లనెను ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు" యోహాను 3:5-7
నీకొదేము ప్రభువుతో మాట్లాడుతూ, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడవు అని అన్నాడు, అందుకు యేసు, కొత్తగా జన్మిస్తేనే తప్ప అతను దేవుని రాజ్యాన్ని చూడలేడు అని సమాధానమిచ్చాడు. ఆంటే రక్షణ లేకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఇక్కడ వరకూ బాగానే ఉంది, ఇది మనం అర్థం చేసుకోగలం. నీకొదేము ఇలా అంటున్నాడు, "ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాడు" (paraphrase added). నీకొదేము ఇశ్రాయేలులో బోధకుడు, అతను ఒక పరిసయ్యుడు, తనకు తల్లి గర్భంలో తిరిగి ప్రవేశించలేరని తెలుసు, అయితే నీకొదేము ప్రశ్న బాహ్యపరమైనది కాదు, దేవుని రాజ్యాన్ని చూడాలంటే కొత్తగా జన్మించాలి కదా, అది ఎలా సాధ్యపడుతుంది, నేను ముసలివాడిని, నేను ఎలా తిరిగి జన్మించగలను? యేసు క్రీస్తు తనకు సమాధానం చెప్తూ నీటిమూలంగా మరియు ఆత్మమూలంగా జన్మించాలి అని చెప్పి, "గాలి తనకిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగేయున్నాడనెను" (యోహాను 3:8) ఏంటి ఈ మాటకు అర్థం అని మనం ఆలోచన చేద్దాం.
"ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగేయున్నాడనెను" అని ప్రభువు అంటున్నాడు. ఎలా ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే, గాలి ఏ విధంగా అయితే దానికి ఇష్టమొచ్చిన చోటికి వెళ్తుందో, ఎవరూ దానిని అడ్డుకోలేరో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్తానుసారముగా ఎవరినైనా తిరిగి జన్మింపజేస్తాడు, పరిశుద్దాత్మ దేవుని కృపను ఎవరూ అడ్డగించలేరు, ఎవరిలో అయితే ఆయన తన కార్యాన్ని చేస్తాడో వారు తిరిగి జన్మించబడి రక్షింపబడతారు. అందుకే పౌలు రోమా 9:16లో రక్షణ అనేది "పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాదు గాని, కరుణించు దేవునివలననే అగును" అంటున్నాడు. అపొస్తలుడైన యోహాను కూడా రక్షణ గురించి మాట్లాడుతూ, "వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు" (యోహాను 1:13) అని చెప్తున్నాడు.
పౌలు ఎఫెసీ సంఘానికి తమ రక్షణ గురించి చెప్తూ, "మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే" అంటున్నాడు. రక్షణ అనేది దేవుడు అనుగ్రహించేది, అది మానవ ప్రయత్నం కాదు, మానవులు తమ సొంత ఇష్టాన్ని బట్టో, తమ శక్తిని బట్టో రక్షణను అందుకోలేరు, పొందుకోలేరు.
రక్షణ ఇచ్చేది దేవుడే అయితే, హృదయాలను మార్చేది దేవుడే అయితే, మారుమనస్సు మరియు నూతన జీవం ఇచ్చేది దేవుడే అయితే, మరి రక్షణ పొందనివారి పరిస్థితి ఏంటి? వారు రక్షించబడకపోవడానికి ఎవరు కారణం? దేవుడా? మానవుడా?
అవిశ్వాసుల యొక్క హృదయం ఎందుకు మారలేదు?
ఎందుకు వారికి రక్షణ రాలేదు?
దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు గనుక మనకు రక్షణ వచ్చింది అని చెప్పినట్టే. దేవుడు వారికి రక్షణ ఇవ్వలేదు కాబట్టి వారికి రక్షణ రాలేదు అని మనం చెప్పగలమా?
ఈ విషయం గురించి యేసు క్రీస్తు ఏమంటున్నాడో చుడండి:
“నేను ఆయననని మీరు విశ్వసించనియెడల మీరు మీ పాపములోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను" యోహాను 8:24
“ఆయనయందు ...... విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను " యోహాను 3:18
“నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్యవిషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక" 2 థెస్సలొ 2:9
ఈ వచనాల నుండి మనకు అర్థమవుతున్న విషయం ఏంటి ఆంటే రక్షణ పొందకపోవడానికి కారణం మానవుని అవిశ్వాసమే.
బైబిల్ లో ఒక్క వచనంలో కూడా మానవుని అవిశ్వాసానికి కారణం దేవుడు అని చెప్పలేదు, అందుకు భిన్నంగా వారి అవిశ్వాసానికి వారే కారణం అని వాక్యం చేప్తుంది. అవును దేవుడు అందరినీ ఎన్నుకోలేదు, ఆయన ఎన్నుకున్నవారిని కచ్చితంగా రక్షిస్తాడు, ఇది సత్యం. అదేవిధంగా రక్షణ పొందాలంటే ప్రతి ఒక్కరు యేసు క్రీస్తును విశ్వసించాలి అనే బాధ్యత వారిపై మోపబడింది. అందుకే, పేతురు, "మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను"
అసలు ఇది ఎలా సాధ్యం అని మీరు నన్ను అడుగుతారేమో, ఇది నా జ్ఞానానికి మించింది, ఇది ఒక Paradox, ఒక మర్మం (Mystery).
అయితే నా మితమైన జ్ఞానంతో కొద్దిగా ఈ విషయం గురించి వివరించే ప్రయత్నం చేస్తాను. మా నాన్న ఎవరికో ఒక 10 లక్షలు అప్పు ఉన్నాడు అనుకుందాం, తాను ఆ అప్పు తీర్చకుండా చనిపోతే ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? కచ్చితంగా నాదే! అదే విధంగా దేవునికి వ్యతిరేకంగా మన తండ్రి అయిన ఆదాము పాపం చేసినప్పుడు, ఆ పాపభారం లోకమంతటి మీద మోపబడింది. నా మీద, మీ మీద కూడా మోపబడింది. పాపానికి శిక్ష మరణం అని దేవుడు నిర్ణయించాడు గనుక, నేను మరణానికి పాత్రుడను. దాని నుండి విడుదల పొందాలంటే నేను విశ్వసించాలి, క్రీస్తు నామమందు విశ్వసించాలి, ఒక వేళ విశ్వసించకపోతే నా పాప ఫలితాన్ని నేనే అనుభవించాలి. ఆ 10 లక్షలు అప్పు చెల్లించకపోతే నేను ఏవిధంగానైతే అప్పు ఇచ్చినవానికి ఋనస్తుడనో అదే విధంగా దేవునికి కూడా పాప విషయంలో నేను ఋణపడి ఉన్నాను, ఆ ఋణం నన్ను నరకంలో వెయ్యడాన్ని బట్టి తీరుతుంది. అది తప్పించుకోవాలంటే యేసు క్రీస్తే మార్గం, ఆయన దగ్గరికు రావాలి, అది నా బాధ్యత, అయితే ఆ సామర్థ్యం నాకు లేదు అని వాక్యం చెప్తుంది. "తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు" అని యేసు చెప్పాడు (యోహాను 6:37). దేవుడు సామర్థ్యం ఇస్తేనే (నన్నుతిరిగి జనమింపజేస్తేనే) నేను ఆయన దగ్గరకు రాగలను, లేకపోతే రాలేను.
విశ్వసించడానికి సామర్థ్యం లేదు బాధ్యత మాత్రం ఉంది (10 లక్షలు తీర్చడానికి సామర్థ్యం లేదు, బాధ్యత మాత్రం ఉంది).
దేవుడు సార్వభౌముడు, అయినప్పటికీ మానవుడు చేసిన పనులకు మానవుడే బాధ్యుడు అని వాక్యం చాలా స్పష్టంగా చెప్పిన విషయాలను మనం చూసాం. మీరు ఈ విషయాలు చదివిన తర్వాత దేవుడు ఇలా ఎలా చేస్తాడు అని ఆయనను దూషించకుండా, జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆయన కృపను ఆయన ఇచ్చిన రక్షణ పిలుపును నువ్వు గ్రహిస్తే మంచిది. వారిని ఎందుకు ఎన్నుకోలేదు అనేది కాదు నీ సమస్య, ఏ కారణం లేకుండా నరకపాత్రుడవైన (పాత్రురాలువైన) నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు దేవుడు నీ పట్ల ఇంత కృప చూపించాడు? తన కుమారుని ప్రాణాన్ని నీకు బదులుగా అర్పించేంతగా నిన్ను ఎందుకు ప్రేమించాడు? దీనిని గ్రహించడానికి ప్రయత్నించు, నిన్ను నువ్వు తగ్గించుకో.
ఈ వ్యాసాన్ని చదువుతున్నవారిలో ఎవరైనా రక్షణ లేకుండా ఉంటే, దేవుడు నన్ను ఎన్నుకోలేదు అనేది కాదు నీ సమస్య, నువ్వు విశ్వసించలేదు అనేది మాత్రమే నీ సమస్య, దేవుడు ఆ కారణాన్ని బట్టే నీకు తీర్పు తీరుస్తాడు. దయచేసి పశ్చాత్తాపపడు, ప్రభు నామమందు విశ్వాసముంచు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.