ఆదికాండము 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న "దేవుని కుమారులు - నరుల కుమార్తెలపై" క్రైస్తవసమాజంలో ప్రాముఖ్యంగా రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూదులకు కూడా ఇది ఒక వివాదాస్పదపు అంశమే. ఇది మన రక్షణకు కానీ విశ్వాసానికి కానీ దేవుని గుణలక్షణాలకు కానీ లేఖనాల ప్రామాణికతకు కానీ సంబంధించిన అంశం కానప్పటికీ లేఖనంలో రాయబడినవాటిని క్షుణ్ణంగా పరిశీలించి (సాధ్యమైనంతమట్టుకు) సరైనదానిని విశ్వసించడం మన బాధ్యత కాబట్టి కొంచెం విస్తారంగానే దీనిపై చర్చించదలిచాను. అందుకే ఈ అంశంపై ఉన్న ఆ రెండు అభిప్రాయాలనూ వాటిలో నేను గమనించిన లోపాలనూ మీతో పంచుకుని చివరిగా నేనేం విశ్వసిస్తున్నానో కూడా తెలియచేస్తాను. నిజానికి నేను మూడవ అభిప్రాయం విశ్వసిస్తాను.
"నరులు భూమిమీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి" (ఆదికాండము 6:1,2)
ఈ దేవునికుమారుల విషయమై మొదటి అభిప్రాయం ప్రకారం; హీబ్రూబాషలో అక్కడ בני האלהים (Benay ha Elohim) అనేపదం వాడారు. పాతనిబంధనలో ఈ పదం కేవలం దేవదూతలను ఉద్దేశించి మాత్రమే వాడబడింది. ఉదాహరణకు; యోబు 1:6, 2:1, 38:7. ఈ కారణం చేత, అక్కడ మనకు కనిపించే దేవుని కుమారులు దేవదూతలేయని వీరు విశ్వసిస్తారు. అయితే ఈ వాదనపై చాలా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ప్రాముఖ్యంగా పరలోకంలో దేవదూతలు పెండ్లికియ్యబడరు అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు (మార్కు12:25).
అయితే ఆ ప్రశ్నకు వీరు ఆదికాండము 18వ అధ్యాయంలో యెహోవా ఇద్దరు దేవదూతలతో అబ్రాహామును దర్శించి అతని ఇంట భోజనం చేసిన సందర్భాన్ని చూపించి సులభంగానే సమాధానం చెబుతుంటారు. అక్కడ దేవదూతలు మానవదేహాన్ని ధరించుకున్నారు, ఆహారం కూడా తిన్నారు. అదేవిధంగా వారు మానవ దేహాలను ధరించుకుని మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారు అన్నదే ఆ సమాధానం.
నాకు ఈ సమాధానంలో సమస్యగా అనిపించిన విషయం ఏంటంటే అబ్రాహాము ఇంటికి వచ్చిన దూతలు దేవునితో కలసి వచ్చారు. కాబట్టి వారు మానవరూపాన్ని కలిగియుండడం, ఆయనతో కలసి భోజనం చెయ్యడంలో విచిత్రమేమీ లేదు. కానీ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే దూతలు కూడా తమకు ఇష్టమైనప్పుడు మానవదేహాలను ధరించుకునే సామర్థ్యం కలిగియుంటారు అనడానికి లేఖనాలలో ఒక్క ఆధారం కూడా లేదు. పైగా ఆ దూతలు మానవ స్త్రీల అందాన్ని చూసి దానిని అనుభవించడానికి మానవ దేహాలను ధరించుకోవలసిన అవసరం ఏముంటుంది?. యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటల ప్రకారం వారు పెండ్లికియ్యబడరు అంటే మనకు ఉన్నట్టుగా వారికి లైంగిక కోరికలు ఉండవని అర్థం. ఆ కోరికలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించాలనే దేవుని సంకల్పాన్ని బట్టి మనకూ (మనుషులకు) జంతువులకూ మాత్రమే అనుగ్రహించబడ్డాయి (ఆదికాండము 1:21,22, 1:27,28).
మరి లైంగిక కోరికలే లేని దేవదూతలు మానవ స్త్రీల అందానికి ఎలా ఆకర్షితులయ్యారు?. ఉదాహరణకు, నాకు ఆకలివేస్తుంది కాబట్టి అన్నం తింటాను, అది నా స్వభావం. ఒకవేళ నా స్వభావంలో ఆకలే లేకపోతే దానిని పుట్టించుకుని తినవలసిన అవసరం నాకు ఉండదు కదా!. ఎందుకంటే దానికోసం మళ్ళీ శ్రమపడాలి. పైగా మానవ స్త్రీలను వివాహం చేసుకున్న ఆ దేవుని కుమారులు పిల్లలను కూడా కన్నట్టుగా చదువుతున్నాం (ఆదికాండము 6:4). దేవుడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా పిల్లలు జన్మించేలా నియమించాడు. ఆ ప్రక్రియ దేవదూతలు కూడా మానవ దేహాన్ని ధరించుకుంటే కొనసాగుతుందా?. నేనైతే దీనికి అంగీకరించను. దేవుడు మాత్రమే సృష్టికర్త అయినప్పుడు దేవదూతలు తమంతట తాముగా మానవదేహాలను అది కూడా ప్రత్యుత్పత్తి చేసే సామర్థ్యంతో ఎలా సృష్టించుకోగలిగారు? దేవదూతలు కూడా సృష్టికర్తలేనా? కాదు.
అయితే దేవదూతలు ఎందుకలా చేసారు? వారికి ఆ అవసరం ఏముంది? అని పైన నేను ప్రస్తావించిన ప్రశ్నకు కొందరు వారు దేవుడు చేసిన నరులను (సృష్టిని) పాడుచెయ్యాలనే ఉద్దేశంతో అలా చేసారని చెబుతుంటారు. కానీ వాక్యభాగాన్ని పరిశీలించినప్పుడు, వారు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే (చక్కనివారని చూసి) కారణమని స్పష్టంగా రాయబడింది. వారు అలా చెయ్యడానికి కారణమేంటో లేఖనం అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు అది పక్కనపెట్టేసి ఇంకేదో కారణం చెప్పడం సమంజసం కాదు.
మరికొందరు ఇక్కడ చెప్పబడుతున్న దేవదూతలు అప్పటికే పతనమైన దేవదూతలని వారు దేవునిపై కోపంతోనే అలా చేసారని కూడా చెబుతుంటారు. యూదా చరిత్రకారుడైన ప్లేవియస్ జోసెఫస్ రచనల్లోనూ (The antiquities of the Jew), book of Enoch లోనూ మిగిలిన కొన్ని యూదా రచనల్లో కూడా ఈ దేవుని కుమారులు దేవదూతలే అని, నెఫీలీయులు వారి సంతానమే అని రాయబడింది. అదే నిజమైతే పతనమైన దేవదూతలు కూడా దేవుని కుమారులుగానే పిలవబడతారా? పతనమైన ఆ దూతలు అబ్రాహాము, లోతు దగ్గరకు వెళ్ళినప్పటివలే మానవదేహాన్ని ధరించుకోలరా? పైన తెలియచేసినట్టుగా లేఖనంలో దీనికి ఒక్క ఆధారం కూడా లేదు. మళ్ళీ చెబుతున్నాను. వాక్యంలో రాయబడినదాని ప్రకారం; దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వారి అందమే కారణం తప్ప, దేవునిపై కోపం కూడా కారణం కాదు.
అయితే ఈ దేవుని కుమారులు దేవదూతలే అని వాదించేవారు దానికి ప్రధానమైన ఆధారంగా యూదాపత్రిక నుండి "మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను" (యూదా 1:6,7) అనే వాక్యభాగాన్ని చూపిస్తుంటారు.
అక్కడ యూదా దేవదూతలు చేసిన పాపం గురించి ప్రస్తావిస్తూ "ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారము చేయుచు" అంటున్నాడు. అంటే ఈమాటల్లో దేవదూతలు చేసిన పాపం సొదొమ గొమొఱ్ఱాలు చేసిన పాపం ఒక్కటే (వ్యభిచారం) అని అర్థం వస్తుంది. దేవుని కుమారులు (దేవదూతలు) చేసినదానినే యూదా తన పత్రికలో ప్రస్తావిస్తున్నాడని వీరు చెబుతుంటారు. అయితే మనం మాట్లాడుకుంటున్న దేవునికుమారులు వ్యభిచారం చేసారా? లేక వివాహం చేసుకున్నారా?. వివాహమే కదా!.
"దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి"
కాబట్టి యూదా మాటలకు వీరు చెబుతున్న వ్యాఖ్యానం ప్రకారం దేవదూతలు వ్యభిచారం చేసారు అనుకున్నప్పటికీ ఈ దేవుని కుమారులు యూదా చెబుతున్న దేవదూతలే అని రుజువు చెయ్యలేరు. ఎందుకంటే వారు వివాహం చేసుకున్నారు. వ్యభిచారం చెయ్యలేదు. లేఖనంలో ఎక్కడా కూడా వివాహం వ్యభిచారంతో పోల్చబడలేదు. వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన కలయిక, వ్యభిచారం అనేది పతనస్వభావం నుండి పుట్టుకొచ్చిన పాపపు కోరిక (హెబ్రీ 13:4).
ఇకపోతే యూదా తన పత్రికలో "వీరివలెనే" అని సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థు గురించి మాట్లాడుతున్నప్పుడు అతను దేవదూతలను ఉద్దేశించి కాదు కానీ అతను మొదటివచనం నుండీ ఎవరి గురించైతే మాట్లాడుతున్నాడో వారిని ఉద్దేశించే ఆ పదప్రయోగం చేసాడు.
యూదా 1:4-8 ఏలయనగా "కొందరు" రహస్యముగా జొరబడియున్నారు. "వారు" భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు "వారు" పూర్వమందే సూచింపబడిన వారు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఆ ప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపట్లనున్న పట్టణములును "వీరివలెనే" వ్యభిచారము చేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. అటువలెనే "వీరును" కలలు కనుచు, శరీరమును అపవిత్ర పరచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, మహాత్ములను దూషించుచు ఉన్నారు.
ఈ సందర్భం అంతటినీ మనం పరిశీలించినప్పుడు యూదా అప్పటి సంఘంలో కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న (వ్యభిచారం చేస్తున్న) వారిని ఉద్దేశించి మాట్లాడుతూ దేవుని తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. ఆయన దృష్టికి పాపం చేసిన ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, తమ ప్రధానత్వాన్ని విడిచిపెట్టిన దూతలను ఆయన విడిచిపెట్టలేదు. అదేవిధంగా "వీరివలెనే" (కృపను కామాతురత్వానికి దుర్వినియోగపరుస్తున్న వీరివలెనే) వ్యభిచారం చేసిన సొదొమ గొమొఱ్ఱా పట్టణస్థులను కూడా ఆయన విడిచిపెట్టలేదు. అలా ఆయన వీరిని కూడా విడిచిపెట్టడు అనేదే అతని మాటల సారాంశం. అంతేతప్ప అతను దేవదూతలు వ్యభిచారం చేసారని చెప్పట్లేదు.
ఇక ఈ దేవుని కుమారులు దేవదూతలే అనేవారు వారికీ మానవ స్త్రీలకూ పుట్టినపిల్లలను కూడా మరో ప్రాముఖ్యమైన ఆధారంగా తీసుకుంటారు. ఎందుకంటే వారి గురించి "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" (ఆదికాండము 6:4) అని రాయబడింది.
దేవుని కుమారులకూ మానవస్త్రీలకూ జన్మించిన ఆ నెఫీలులను ఇంగ్లీష్ బైబిల్ లో Giants అని తర్జుమా చెయ్యడం జరిగింది. హీబ్రూలో ఈ נפלים (Nephilim) అనేదానికి Fall (పతనం) అనే అర్థం వస్తుంది. వీరు సాధారణ మనుషులకంటే ఉన్నత దేహులు. ఆవిధంగా దేవుని కుమారులు దేవదూతలు కాబట్టే వారి సంతానమైన వీరు ఉన్నతదేహులుగా జన్మించారనేది వారి వాదన. ఈ నెఫీలీయులు ఉన్నతదేహులు అనడంలో మనకు ఏ సందేహమూ లేదు కానీ దేవుని కుమారులకూ నరుల కుమార్తెలకూ పుట్టిన అందరూ ఉన్నత దేహులేనా (నెఫీలీయులు) లేక కొందరే అలా ఉన్నారా అనేది నా ప్రశ్న. పైగా ఈ నెఫీలీయులు "తర్వాత కూడా" (జలప్రళయం తర్వాత కూడా) ఈ భూమిపై ఉన్నారని రాయబడింది (ఆదికాండము 6:4). ఆ సందర్భాలన్నీ సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2 లలో మనకు కనిపిస్తాయి. దావీదు కాలంలో కూడా గొల్యాతు, రెఫామీయుల సంతతివారు ఉన్నత దేహులుగానే పేర్కోబడ్డారు (2 సమూయేలు 21:20). ఒకవేళ ఈ నెఫీలీయులు దేవదూతలకూ మానవస్త్రీలకూ పుట్టిన పిల్లలే ఐతే జలప్రళయంలో వారంతా నాశనమయ్యాక కూడా తర్వాత మళ్ళీ ఎలా ఉన్నారు?. కొందరు దీనికి నోవహు కుమారుడైన హాము భార్య ద్వారా ఆ జన్యువుల సంక్రమించాయని చెబుతుంటారు. కానీ ఇది నమ్మశక్యం కానటువంటి సమాధానం.
ఈ దేవుని కుమారులు నరుల కుమార్తెలపై ఉన్న రెండవ అభిప్రాయం ప్రకారం; ఆదికాండము నాలుగవ అధ్యాయంలో దుష్టుడైన కయీను సంతానం ఎలా విస్తరించిందో రాయబడింది, ఆ సంతానంలో హత్యలు చేసేవారూ బహు భార్యాత్వం కలిగినవారు (లెమెకు) మనకు కనిపిస్తారు. ఐదవ అధ్యాయంలో విశ్వాసియైన షేతు సంతానం గురించి రాయబడింది, ఆ సంతానంలో మనకు దేవునితో నడచినవారు (హనోకు, నోవహు) యెహోవా నామమున ప్రార్థన చేసినవారు (ఎనోషను) దర్శనమిస్తారు. ఈ రెండు వంశావళులూ రాయబడిన తర్వాతి అధ్యాయంలో (6వ) ఈ సంఘటన జరగడం వల్ల, అక్కడ దేవుని కుమారులంటే షేతు సంతానమని, నరుల కుమార్తెలంటే కయీను సంతానమని వీరు భావిస్తారు. లేఖనాలలో విశ్వాసులను దేవుని కుమారులుగా సంబోధించబడడం మనకు సాధారణంగానే కనిపిస్తుంటుంది (రోమీయులకు 8:14).
కానీ ఆ దేవుని కుమారులు ఆత్మీయతకు కాకుండా అందానికే ప్రాముఖ్యతను ఇస్తూ కయీను సంతానపు వారిని వివాహం చేసుకోవడం వారికి పాపమైంది అంట. అలా వారు చెడిపోవడమే కాకుండా వారికి పుట్టిన పిల్లలు కూడా బలాత్కారులుగా (నెఫీలీయులకు తెలుగు బైబిల్ లో పుట్ నోట్) తయారయ్యారనేది వీరి వాదన. ఎందుకంటే ఇలాంటి మిశ్రిత వివాహాల వల్ల వారి కుటుంబవ్యవస్థ తప్పకుండా దెబ్బతింటుంది.
మరి వారికి పుట్టిన పిల్లలు ఉన్నతదేహులుగా ఎలా ఉన్నారనే ప్రశ్నకు కూడా వీరు, అప్పటిప్రజల ఆయుష్షును ఉదాహరణగా తీసుకుంటూ అలానే వారిలో కొందరి దేహాలు కూడా పెద్దవిగా ఉన్నాయని (జన్యుపరమైన మార్పులు) సమాధానం ఇస్తుంటారు. అందుకే జలప్రళయం తర్వాత కాలంలో కూడా వారి ఉనికి ఉందట (సంఖ్యాకాండము 13:32,33, ద్వితీయోపదేశకాండము 2:10, 9:2). అయితే షేతు సంతానం కూడా నరులే అయినప్పుడు, మానవులకు నరులని దేవుడే పేరుపెట్టినప్పుడు, మోషే ఈ 6వ అధ్యాయంలో మాత్రం కయీను సంతానాన్ని నరుల కుమార్తెలని, షేతు సంతానాన్ని దేవుని కుమారులని వేరువేరుగా ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం ఔతుంది. కానీ ఈ ప్రశ్న ఈ వాదనను కాదనేంత బలీయమైనది కాదు. ఎందుకంటే నరులు అనేది అందరినీ ఉద్దేశించి సాధారణంగా వాడే పదమే అయినప్పటికీ (నరులు భూమిమీద విస్తరించనారంభించినప్పుడు) వారినుండి విశ్వాసులను ప్రత్యేకించి చూపించడానికి మోషే వారిని దేవుని కుమారులని ప్రస్తావించియుండవచ్చు కదా!. కానీ నాకు ఈ వాదనలో కలిగిన అసలైన అభ్యంతరాలు ఏంటంటే నెఫీలీయులు ఉన్నతదేహులుగా ఎందుకున్నారు అనే ప్రశ్నకు అప్పటి ప్రజల ఆయుష్షును బట్టి చెప్పే సమాధానం సరైందైతే ఆ సంఘటన జరగడానికి ముందు అలాంటివారు ఎందుకు పుట్టలేదు? అలానే విశ్వాసులైన వీరు షేతు సంతానంలో అందగత్తెలు లేరనే కయీను సంతానపు స్త్రీలను వివాహం చేసుకున్నారా?
అందుకే నేను ఈ రెండు అభిప్రాయాలకంటే మూడవ అభిప్రాయాన్నే ఎక్కువగా విశ్వసిస్తున్నాను. అదేంటంటే; DR. John Gill గారు తన ఆదికాండము 6 వ్యాఖ్యానంలో యూదులకు చెందిన Targums of Onkelos and Jonathan, Jarchi and Aben Ezraలలో అక్కడ ఈ "దేవునికుమారులను" గొప్పవ్యక్తులు, న్యాయాధిపతులు, బలవంతులు పాలకులుగా వివరించారని తెలియచేసాడు. కాబట్టి పురాతన యూదులు "Benay ha Elohim" అన్నప్పుడు ఇలాంటివారిని కూడా పరిగణలోకి తీసుకునేవారని మనకు అర్థమౌతుంది. ఆవిధంగా "Benay ha Elohim" (దేవుని కుమారులు) అనేది అప్పుడు కొందరు కలిగియున్న బిరుదు (Title). కాబట్టి నాకు దేవునికుమారులు అనగానే లేఖనాల ప్రకారం విశ్వాసులు అని భావించడం కంటే చరిత్రను బట్టి కొందరు కలిగియున్న బిరుదుగా (Title) గా భావించడమే సరి అనిపించింది. ఉదాహరణకు; నిమ్రోదుకు "అతడు యెహోవాయెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తికలదు" (ఆదికాండము 10:9) అని బిరుదు ఉంది. నిజానికి యూదా చరిత్ర ప్రకారం అతను మంచివాడు కాదు. కాబట్టి ఈ దేవుని కుమారులను విశ్వాసులుగా భావించనక్కర్లేదు. వీరు ఆ ప్రజల్లో గొప్పవారు బలవంతులు కాబట్టి "Benay ha Elohim" అని పిలవబడ్డారు. అలానే తమకున్న బలాన్నీ అధికారాన్నీ ప్రదర్శించి ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు. అలాంటి వివాహాలు దేవుని చిత్తం కాదు అందుకే ఆయన వాటిని నేరంగా చూసాడు. బహుశా ఆయన శాపం కారణంగానే వారి పిల్లలు ఇతరులకంటే భిన్నంగానూ మరింత నాశనం కలిగించేవారిగానూ పుట్టియుండవచ్చు. తర్వాత కాలంలో కూడా శపించబడిన జాతుల్లోనే అలాంటి ఉన్నతదేహులను మనం చూస్తున్నాము (ఆ వాక్యభాగాలు ఇప్పటికే ప్రస్తావించాను).
ఏది ఏమైనప్పటికీ ఈ దేవునికుమారులు మనుషులే అనేది మాత్రం సత్యం. దీనికి 3వ వచనంలోని "అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించడు" (ఆదికాండము 6:3) అనే మాటలు కూడా మంచి ఆధారంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పాపం చేసిన ఇద్దరూ నరులు కాబట్టే దేవుడు నరుల గురించి మాట్లాడుతున్నాడు. అయితే దేవుని కుమారులు దేవదూతలని నమ్మేవారు, ఈ వచనానికీ పై రెండు వచనాలకూ మధ్యలో చాలా సమయం గడచిందని, దేవుని కుమారులు (దేవదూతలు) మానవ స్త్రీలను వివాహం చేసుకోగా జన్మించిన నెఫీలీయుల కారణంగా అప్పుడున్న మనుషులంతా చెడిపోయారని, వారు మనుషులకు దైవవిరుద్ధమైన చాలా కార్యాలను నేర్పించారని Book of Enochలో రాయబడిన కొన్నిమాటల ఆధారంగా చెబుతుంటారు. ఆ నెఫీలీయుల వల్ల చెడిపోయిన నరుల గురించే దేవుడు ఈ సందర్భంలో ఇలా మాట్లాడుతున్నాడు అంట.
కానీ 4వ వచనంలోని "ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే" అనే మాటల ప్రకారం; దేవుడు ఈమాటలు పలికేసరికి నెఫీలీయులు కూడా ఈ భూమిపైనే ఉన్నారు. దేవుడు వారిని కూడా నరులనే సంబోధిస్తున్నాడు. ఎందుకంటే 5వ వచనం ప్రకారం ఆయన "నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డది" అని నరుల చెడుతనాన్ని ప్రస్తావించి, 7వ వచనంలో ఆ నరులను నాశనం చేస్తాను అంటున్నాడు.
"అప్పుడు యెహోవా నేను సృజించిన నరులును నరులతో కూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొందియున్నాననెను"
ఒకవేళ నెఫీలీయులు దేవదూతలకూ మనుషులకూ పుట్టినవారే ఐతే వారు పూర్తిగా నరులు ఎలా ఔతారు? దేవునికుమారులు దేవదూతలే అని అంటున్నవారి వాదనప్రకారం వారు ఒక విధంగా రాక్షసజాతి కదా!.
చదువరులకు విజ్ఞప్తి: ఇలాంటి వివాదాస్పదమైన అంశాలకు వివరణలు, విరోధుల ఆరోపణలకు తిరుగులేని ప్రత్యుత్తరాలు, మరియు సందేహాలకు సమాధానాలను మేము మా వ్యాఖ్యానాలలో ప్రస్తావిస్తూనే ఉన్నాము. కాబట్టి హితబోధ అనే మా Website లో వ్యాఖ్యానాల కేటగిరిలో ఇప్పటివరకూ మేము వ్యాఖ్యానించిన పుస్తకాలను పరిశీలించి ఏ లేఖనభాగం విషయంలోనైనా మీకు పై అభ్యంతరాలు తలెత్తితే పరిష్కరించుకోవలసిందిగా కోరుతున్నాము. వరుసగా మిగిలిన అన్ని పుస్తకాలనూ ఇదే దృక్పథంతో వ్యాఖ్యానించబోతున్నాము. అందువల్ల తరచుగా మా Website ను సందర్శించండి.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2024 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.