ఇతర అంశాలు

రచయిత: కె. విద్యా సాగర్
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు
 
 

400year1

దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో బైబిల్ గ్రంథాన్ని రాయించినప్పుడు అందులో ఎటువంటి వైరుధ్యమూ ఉండే అవకాశం లేదు; దేవుని‌వాక్యం సత్యం (యోహాను17:17). అయితే  ముద్రణ యంత్రాలు లేని సమయంలో దేవుని వాక్యాన్ని చేతులతో ప్రతులుగా రాసేటప్పుడు అందులో చిన్నచిన్న పొరపాట్లు జరగడం సహజం. ప్రస్తుతం మనం చదువుతున్న బైబిల్ గ్రంథంలో కొన్నిచోట్ల సంఖ్యాపరమైన, పేర్లకు సంబంధించిన వైరుధ్యాలు, కనిపించడానికి అటువంటి పొరపాట్లే కారణం. అటువంటి సమయంలో వాటిని మనం మన ప్రస్తుత బైబిళ్ళు తర్జుమా చేసిన రాతప్రతుల కంటే, పురాతనమైన రాతప్రతులనూ, యూదులు మొట్టమొదటిసారిగా హీబ్రూ భాషనుండి గ్రీకు లోనికి తర్జుమా చేసిన పాతనిబంధన Septuagint (LXX) ను పరిశీలించడం ద్వారా పరిష్కరించవచ్చు.

ఈ వ్యాసంలో నేను అదే పద్ధతిని అనుసరిస్తూ బైబిల్ గ్రంథంలో వైరుధ్యంలా అనిపించే ఒక  సందర్భం గురించి తెలియచేస్తున్నాను.

ఆదికాండము 15:13-16 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను. 

ఈ వచనాలలో దేవుడు అబ్రాహాముకు రెండు విషయాల గురించి చెబుతున్నాడు.
మొదటిగా అతని సంతానం 400 సంవత్సరాలు పరాయి దేశంలో, దాసులుగా శ్రమ అనుభవిస్తారు. రెండవదిగా అతని నాలుగవతరం‌ కనాను ప్రాంతానికి తిరిగివస్తారు (స్వాధీనపరచుకుంటారు).

మొదటిగా అబ్రాహాము సంతానం నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశంలో దాసులుగా శ్రమపడడం గురించి మనం తెలుసుకుందాం; దీనిగురించి స్తెఫను కూడా తన ప్రసంగంలో ప్రస్తావించినట్టు మనకు కనిపిస్తుంది.

అపొస్తలుల కార్యములు 7:6 అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. 

సాధారణంగా చాలామంది ఈ నాలుగువందల సంవత్సరాలూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో దాసులుగా శ్రమ అనుభవించిన కాలమని భావిస్తుంటారు. వారలా భావించడానికి మన బైబిల్ లో రాయబడిన మాటే కారణం.

నిర్గమకాండము 12:40,41 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.  ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగిన దేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములో నుండి బయలుదేరిపోయెను. 

ఈ వచనాల్లో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించినకాలం‌ 430 సంవత్సరాలని స్పష్టంగా రాయబడింది. అయితే అబ్రాహాముతో దేవుడు నీ సంతానం శ్రమపడతారని చెప్పిన కాలంకంటే ఇందులో 30 సంవత్సరాలు ఎక్కువగా ఉంది. చాలామంది మోషే పొరపాటువల్ల ఈ 30 సవత్సరాలు ఆలస్యం‌ అయ్యిందని వివరిస్తుంటారు. కానీ అది‌ వాస్తవం కాదు. ఎందుకంటే, దేవుడు చెప్పిన మాట ఎవరో చేసిన పొరపాటును బట్టి మారిపోవడం అసాధ్యం. అటువంటప్పుడు కొన్ని సందర్భాలలో  400 సవత్సరాలని మరికొన్ని సందర్భాలలో 430 సంవత్సరాలని ఎందుకు రాయబడిందో మనం ఇతర పురాతన రాతప్రతులను ఆధారంగా చేసుకుని పరిశీలించగలిగితే, ఈ రెండు సందర్భాలలో ఉన్న సంవత్సరాలు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్న కాలం గురించి మాత్రమే చెప్పబడడం లేదని అర్ధమౌతుంది. ఎందుకంటే, యాకోబు కుటుంబం ఐగుప్తుకు వెళ్లడానికీ మోషే నాయకత్వంలో తిరిగిరావడానికీ ఉన్న సమయాన్ని మనం పరిశీలిస్తే;

నిర్గమాకాండం 6:16-20 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తయైన యోకె బెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.

ఈ వచనాల ప్రకారం ఐగుప్తులో ప్రవేశించిన యాకోబు కుమారుల్లో ఒక కుమారుడైన లేవీ కహాతును కన్నాడు, కహాతు అమ్రామును కన్నాడు, అమ్రాము మోషేను కన్నాడు మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుండి స్వతంత్రులయ్యారు. మనం వాదనకోసం వీరందరూ ఐగుప్తులోకి వెళ్ళాక, తమ 100వ యేటన కుమారుడిని కన్నారని అనుకున్నప్పటికీ, ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నట్టుగా నిర్థారించడం అసాధ్యం. 

ఎందుకంటే, లేవి ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి కహాతును కన్నప్పటికీ, కహాతు ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి అమ్రామును‌ కన్నప్పటికీ, అమ్రాము ఐగుప్తులో 100 సంవత్సరాలు బ్రతికి మోషేను కన్నప్పటికీ కూడా అక్కడికి 300 సవత్సరాలే ఔతుంది. మోషే వయస్సు యొక్క 80 యేట అతను ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటకు తీసుకువచ్చి ఆ దాసత్వం నుండి విడిపించాడు. 

నిర్గమకాండము 7:7 వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.

ఇదంతా కలిపిచూస్తే 380 సంవత్సరాలు ఔతున్నాయి. మనం కేవలం ఈ లెక్కలన్నీ మనం  వాదనకోసమే చూస్తున్నాం తప్ప, వాస్తవానికి వారంతా ఐగుప్తులో 100వ యేట కుమారులను కనలేదు. ఉదాహరణకు ఆదికాండము 46:11 ప్రకారం లేవి ఐగుప్తులోకి యాకోబుతో రాకముందే కహాతును‌ కన్నాడు.

ఆదికాండము 46:11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి.

అదేవిధంగా వారికాలంలో పితరులవలే తాము 100వ యేట కుమారులను కనే పరిస్థితి లేదు. అందుకే అబ్రాహాము కూడా 99 సవత్సరాలకే తన సంతానం విషయంలో ఆందోళన చెందాడు. 

ఆదికాండము 17:17 అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను

కాబట్టి వారంతా ఆ వయస్సుకు ముందే పిల్లలను కన్నారు. దీనిప్రకారం మనం వాదన కోసం చూసిన 380 సంవత్సరాలు కంటే చాలా ముందుగానే వారు ఐగుప్తు దాసత్వం నుండి విడుదలయ్యారు.

అదెలాగో చూద్దాం; మనం పైన నిర్గమకాండము 12:40 వాక్యభాగంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 430 సంవత్సరాలని రాయబడడం చూసాం. ప్రస్తుతం మనం వాడే బైబిల్ గ్రంథాలు అన్నీ, క్రీస్తు శకం 8 వ శతాభ్దం నుండీ బైబిల్ గ్రంథానికి రాతప్రతులను రాస్తున్నటువంటి "Masoretic" అనే గుంపువారి ద్వారా క్రీస్తు శకం 10/11 వ శతాబ్దంలో రాయబడ్డ "Leningrad codex, Aleppo codex" అనే ప్రతులనుండి తర్జుమా చేయడం జరిగింది.

ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మిగిలిన భాషల్లోకి ముద్రించేసరికి  ఆ ప్రతులు మాత్రమే పూర్తి వాక్యంతో ఉన్నటువంటి (పాతనిబంధన) పురాతన ప్రతులు, మిగిలిన ప్రతుల్లో పూర్తి పాతనిబంధన వాక్యాలన్నీ అందుబాటులో లేకుండా పాడైపోయాయి. ఈ రెండు రాతప్రతుల్లో కూడా "Aleppo codex" రాతప్రతి పూర్తిగా లేకుండా కొంతమట్టుకు పాడైపోయింది. అందుకే ఎక్కువశాతం పాతనిబంధనను "Leningrad codex" నుంచి తీసుకుంటూ వారికేదైనా confusion నెలకొన్నపుడు "Aleppo codex" లో అందుబాటులో ఉన్న వాక్యంతో పోల్చుకునేవారు‌. అప్పటికి ఇంకా "dead see scrolls" లభ్యంకాలేదు‌.

అంతకు ముందున్న క్రైస్తవ సంఘం క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలోనే హీబ్రూ భాష నుండి గ్రీకు భాషలోకి అనువదించబడిన పాతనిబంధన Septuagint (LXX) ను, జెరోము భక్తుడు గ్రీకు భాషనుండి పాతనిబంధన, కొత్తనిబంధనతో కలిపి లాటిన్ భాషలోకి అనువదించిన పూర్తి బైబిల్ ను ద్యానించేవారు. అందులో జెరోము అపోగ్రిఫ పుస్తకాలను కూడా  చేర్చడం జరిగింది.

ఈవిధంగా మన బైబిళ్ళు తర్జుమా చేయడానికి డానికి ఆధారంగా ఉన్నటువంటి "Leningrad codex , Aleppo codex" రాతప్రతుల్లో, మనం పైన చూసినటువంటి నిర్గమకాండము 12:40వ వచనంలో ఒక పొరపాటు జరిగింది.  వాస్తవానికి ఈ రాతప్రతులు రాయబడడానికంటే ముందునుండీ ఉన్నటువంటి, క్రీస్తుపూర్వం 100వ సంవత్సరానికి చెందిన "Samaritan Pentateuch" అనే పూరాతన హీబ్రూ రాతప్రతిలో ఈ వచనం "ఇశ్రాయేలీయులు, వారి పితరులు కానానులోనూ, ఐగుప్తులోనూ నివసించినకాలం 430 సంవత్సరాలని ఉంటుంది". కాబట్టి మనం నిర్గమకాండము 12:40 లో చూసిన 430 సంవత్సరాలు కేవలం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం మాత్రమే కాదు కానీ, అబ్రాహాము తన తండ్రి ఇంటినుండి‌ బయటకు వచ్చి కనానులో ప్రవేశించనప్పటినుండీ, ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యోసేపు ద్వారా యాకోబు సంతానం అంతా ఐగుప్తుకు వెళ్ళి విస్తరించి, ఆ విస్తరించిన  ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చేవరకూ ఉన్న మధ్య ఉన్నకాలం.

దీనిగురించి కేవలం "Samaritan Pentateuch" పురాతన హీబ్రూ పాతనిబంధన రాతప్రతిలో మాత్రమే కాదు, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో హీబ్రూ భాషనుండి గ్రీకులోకి తర్జుమా చేయబడిన పాతనిబంధన Septuagint (LXX) లో కూడా నిర్గమకాండము 12:40వ వచనంలో "ఇశ్రాయేలీయులు, వారి పితరులు కనానులోనూ, ఐగుప్తులోనూ నివసించిన కాలం‌ 430 సంవత్సరాలని" అర్థం వచ్చేలానే రాయబడింది. అంతమాత్రమే కాకుండా, మొదటి శతాబ్ధపు యూదా చరిత్రకారుడు, యెరుషలేము దేవాలయంలో యాజకుడిగా పనిచేసిన ప్లేవియస్ జోసెఫెస్  ఆయన రచించిన "The antiqueties of the Jews" అనే పుస్తకం రెండవభాగం,15 వ అధ్యాయంలో తమ పితరుడైన అబ్రాహాము కనాను దేశానికి వచ్చినప్పటినుండీ, 430 సంవత్సరాలు తరువాత ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చారని స్పష్టంగా రాశాడు.

ఆదికాండము 12 వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై, నీ తండ్రి ఇంటిని విడచి కనానుకు వెళ్ళు నీ సంతానాన్ని ఆకాశనక్షత్రాలవలే, ఇసుకరేణువులవలే ఆశీర్వదిస్తాననీ వాగ్దానం చేసినప్పుడు, అబ్రాహాము ఆయన చెప్పినట్టుగా కనానుకు వచ్చాడు.  అప్పటినుండి (దేవుడు వాగ్దానం చేసినప్పటినుండీ) ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో  ఐగుప్తునుండి బయటకు వచ్చి సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రాన్ని పొందేవరకూ మధ్యఉన్న సమయం 430 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి బయటకు వచ్చిన అదే సంవత్సరంలోనే (430 వ యేట) సీనాయి పర్వతం పైన ధర్మశాస్త్రాన్ని పొందుకున్నారు. దీని గురించి పౌలు కూడా గలతీ పత్రికలో ప్రస్తావిస్తూ, ధర్మశాస్త్రం అనేది అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన 430 సంవత్సరాల తర్వాత వచ్చిందని తెలియచేస్తున్నాడు.

గలతియులకు 3:17 నేను చెప్పునదేమనగా నాలుగువందల ముప్పది సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము, వాగ్దానమును నిరర్థకము చేయునంతగా పూర్వమందు దేవునిచేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు.

ఇంతటితో మనకు నిర్గమకాండము 12:40 లో 430 సంవత్సరాలని రాయబడిన కారణం అర్ధమైంది.

ఇప్పుడు అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు దేవుడు చెప్పినట్టుగా ఎక్కడ, ఎలా శ్రమపడిందో చూద్దాం;

ఆదికాండము 15:13,14 ఆయన నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు. వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 

అపొస్తలుల కార్యములు 7:6 అయితే దేవుడు అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. 

ఈ సందర్భాలలో అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు తమది కాని దేశంలో పరదేశులుగా శ్రమలను అనుభవిస్తారని రాయబడడం మనం చూస్తాం. ఈ సమయమంతా కేవలం ఇశ్రాయేలీయులు ఐగుప్తులో దాసులుగా అనుభవించిన శ్రమల  గురించి మాత్రమే కాదు కానీ, అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు, అతని కుమారుడైన యాకోబులతో సహా వారు పరాయి దేశంలో అనుభవించిన శ్రమలతో కలిపి చెప్పబడ్డాయి.  

ఎందుకంటే, దేవుడు అబ్రహాముతో కనాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తున్నానని వాగ్దానం చేసాడే తప్ప అది ఆయనకు కానీ ఆయన కుమారుని కుమారునికి కానీ స్వాధీనపరచలేదు. ఐగుప్తునుండి తిరిగివచ్చిన అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కనాను దేశాన్ని స్వదేశంగా పంచి ఇచ్చాడు. అంతకుముందు అదే కనాను దేశంలో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు పరదేశులుగానే జీవించారు.

అపొస్తలుల కార్యములు 7:4,5 అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.  ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.

ఆదికాండము 26:1-4 అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు ఆ దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్లక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము.  ఈ దేశమందు పరవాసివై యుండుము. నేను నీకు తోడైయుండి నిన్ను ఆశీర్వ దించెదను;  ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నియు ఇచ్చి, నీ తండ్రియైన అబ్రాహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రములవలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నియు నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానమువలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. 

హెబ్రీయులకు 11:8,9 అబ్రాహాము పిలువ బడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. మరియు ఎక్కడికి వెళ్లవలెనో అది ఎరుగక బయలువెళ్లెను.  విశ్వాసమునుబట్టి అతడును, అతనితో ఆ వాగ్దానమునకు సమానవారసులైన ఇస్సాకు యాకోబు అనువారును, గుడారములలో నివసించుచు, అన్యుల దేశ ములో ఉన్నట్టుగా వాగ్దత్తదేశములో పరవాసులైరి. 

ఈ వచనాలన్నిటి ప్రకారం అబ్రాహామూ, ఇస్సాకూ, యాకోబులు వాగ్దానదేశమైన కనానులో పరదేశులుగా జీవించారు. అబ్రహాము తన తండ్రి ఇంటినుండి‌ బయటకు వచ్చేసరికి అతనికి 75 సంవత్సరాలు.

ఆదికాండము 12:4 యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను, అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు. 

ఈ సమయం నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చేసరికి మనం పైభాగంలో చూసిన ఆధారాల ప్రకారం 430 సంవత్సరాలు. అబ్రహాము తన 100 వ యేటన ఇస్సాకును కన్నాడు.

ఆదికాండము 21:5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టి నప్పుడు అతడు నూరేండ్లవాడు. 

అబ్రాహాము త‌న ఇంటినుండి బయలు దేరివచ్చిన 25 సంవత్సరాలకు ఇస్సాకు జన్మించాడు. దీనిప్రకారం ఇస్సాకు జన్మించి‌నప్పటినుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తు‌ దాస్యం నుండి బయటకు వచ్చేసరికి 405 సంవత్సరాలు. ప్రాచీన యూదుల సాంప్రదాయం ప్రకారం (ఇది పితరులనుండి వారికి ఆనవాయితీ అనుసరించవచ్చు) తల్లితండ్రులు తమకు పుట్టిన పిల్లవాడి చేత 5వ సంవత్సరంలో పాలు మానిపించి, ఆరోజున గొప్ప విందును చేస్తారు. దీనిప్రకారం ఇస్సాకు పుట్టిన ఐదేళ్ళకు అబ్రాహాము ఇస్సాకు చేత పాలు మానిపించి విందుచేసాడు.

ఆదికాండము 21:8 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.

మనం పైన చూసినట్లుగా ఇస్సాకు పుట్టినప్పటినుండీ ఇశ్రాయేలీయులు‌ ఐగుప్తును విడిచిపెట్టేవరకూ మధ్య ఉన్న సమయం 405 సంవత్సరాలు ఐతే, అబ్రాహాము ఇస్సాకు చేత పాలు మానిపించి విందుచేసిన సమయం నుండి ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచిన సమయం వరకూ ఉన్న మధ్య ఉన్న సమయం 400 సంవత్సరాలు. అదే రోజున ఇస్సాకుకు మొదటిసారిగా హాగరు కుమారుడైన ఇస్మాయేలునుండి శ్రమ కలిగినట్టు రాయబడింది.

ఆదికాండము 21:8-10 ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేసెను.  అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి  ఈ దాసిని దీని కుమారుని వెళ్లగొట్టుము; ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై యుండడని అబ్రాహాముతో అనెను. 

గలతీయులకు 4:28-30 సహోదరులారా, మనమును ఇస్సాకువలె వాగ్దానమునుబట్టి పుట్టిన కుమారులమైయున్నాము. అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవానిని ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమేమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్లగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడైయుండడు.

ఇది ఇస్సాకు జీవితంలో అతనికి సంభవించిన మొదటి శ్రమ. అప్పటినుండి ఇస్సాకు జీవితాన్నీ, యాకోబు జీవితాన్నీ మనం పరిశీలిస్తే వారు పరదేశులుగా ఉన్న దేశంలో రాజులనుండీ, ప్రజలనుండీ, వారికి ఎన్నో శ్రమలు సంభవించినట్టు కనిపిస్తుంది. తరువాత యాకోబు కుమారుడైన యోసేపు మొదటిగా ఐగుప్తుకు వెళ్ళినట్టు అతనిని బట్టి యాకోబు సంతానమంతా ఐగుప్తులో ప్రవేశించి కొంతకాలం‌ తరువాత వారికి దాసులుగా మారి శ్రమపడినట్టు కూడా మనకు  కనిపిస్తుంది. ఆ తరువాత దేవుడు వారిని మోషే నాయకత్వంలో ఐగుప్తు బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చాడు.

నిర్గమకాండము 2:23-25 ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారుపెట్టిన మొర దేవునియొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

ఈ ప్రకారంగా ఇస్సాకు పాలువిడిచిన రోజున అతనికి ఇష్మాయేలు నుండి శ్రమకలిగిన సమయం‌ నుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుండి బయటకు వచ్చిన సమయం వరకూ 400 సంవత్సరాలు. అబ్రాహాముతో దేవుడు నీ సంతానం 400 యేళ్ళు తమది‌కాని పరదేశంలో శ్రమపడతారని చెప్పింది దీని గురించే. ఇంతటితో అబ్రాహాము సంతానం 400 సంవత్సరాలు తమది కాని దేశంలో దాసులుగా శ్రమపడతారనే దాని గురించి కూడా మనకి స్పష్టత వచ్చేసింది.

ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లుగా అతని నాలుగవ తరం దాస్యం నుండి విడిపించబడి కనానులో ప్రవేశించిందా అనేదానిని కూడా చూద్దాం;

చాలామంది అబ్రాహాము నాలుగవ తరం అనగానే అబ్రాహాము నుండి ‌లెక్కవేసి యాకోబు కుమారులతో నాలుగవ తరం ఔతుంది కాబట్టి వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకోలేదని సందేహపడతారు. అసలు అబ్రాహాము సంతానం‌ కనానును విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్లిందే యాకోబు కుమారుల కాలంలో. అప్పటికే వారికి పిల్లలు కూడా పుట్టేసారు.

ఆదికాండము 46:2-7 అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను. నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి. అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను. 

దీనిప్రకారం మనం ఆలోచిస్తే, దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన సందర్భంలో నీ నుంచి నాలుగవ తరం ఇక్కడికి వస్తారని అనలేదు కానీ, నీ సంతానంలోని నాలుగవ తరం వారు వస్తారని చెప్పాడు. అబ్రహాముకు పుట్టిన కుమారులలో దేవుడు ఇస్సాకును మాత్రమే ఏర్పరచుకున్నాడు, ఇస్సాకుకు పుట్టిన కుమారులలో దేవుడు యాకోబును మాత్రమే ఏర్పరచుకొన్నాడు. యాకోబుకు పుట్టిన కుమారులు మాత్రమే అందరూ అబ్రాహాము సంతానంగా గుర్తించబడ్డారు. అప్పటినుండి మనం‌ లెక్కిస్తే అబ్రాహాము సంతానంలో నాలుగవ తరం వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు.

నిర్గమకాండము 6:16,18,20 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను. కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను. అమ్రాము తన మేనత్తయైన యోకెబెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. 

ఈ వచనాల ఆధారంగా అబ్రాహాము సంతానంలో లేవి నుంచి, నాలుగవ తరమైన మోషే తరంలోని వారు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ఇక్కడ మీకు ఐగుప్తునుండి బయటకు వచ్చిన తరంలోని వారంతా కనానులో ప్రవేశించకుండానే దేవుడు వారిని నాశనం చేసాడు, మోషే అహరోనులు కూడా ఐగుప్తులో ప్రవేశించలేదుకదా అనే సందేహం రావొచ్చు. అయితే ఆ తరంలో అందరినీ దేవుడు నాశనం చేయలేదు, యపున్నె కుమారుడైన కాలేబు కనానులో ప్రవేశించారు.

సంఖ్యాకాండము 14:23,24 కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. 

ఈవిధంగా దేవుడు అబ్రాహాముతో చెప్పినట్లుగా అతని సంతానపు నాలుగవ తరం వారు కనానుకు తిరిగిరావడం జరిగింది. ఇంతకూ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎంతకాలం నివసించారు?

అబ్రాహాము తన 75వ యేట కనానుకు వచ్చి100వ యేట ఇస్సాకును కన్నాడు ఆమధ్యలో అతను 25 సంవత్సరాలు అక్కడే నివసించాడు. ఇస్సాకు అదే కనానులో 60వ యేట యాకోబును కన్నాడు (ఆదికాండము25:26)యాకోబు 130వ యేట ఐగుప్తుకు వెళ్ళాడు (ఆదికాండము 47:9). దీనిప్రకారం అబ్రాహాము కనానుకు వచ్చి‌నప్పటినుంచీ యాకోబు ఐగుప్తుకు వెళ్ళేంతవరకూ 25+60+130-215 సంవత్సరాలు. మనం పైన చూసిన 430 సంవత్సరాల నుండీ యాకోబు ఐగుప్తుకు వెళ్ళేంతవరకూ ఉన్న ఈ 215 తీసివేస్తే మరో 215 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించింది 215 సంవత్సరాలు.

యూదా చరిత్రకారుడైన "ప్లేవియస్ జోసెఫెస్" కూడా తన "the antiquities of the Jews" అనే పుస్తకం రెండవభాగం 15 వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలం 215 సంవత్సరాలని వెల్లడించాడు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.