ఇతర అంశాలు

రచయిత: అభినవ్ కే
చదవడానికి పట్టే సమయం: 20 నిమిషాలు

ఆడియో

 

దేవుని నామానికి అవమానకరంగా మారుతున్న నేటి క్రైస్తవ్యం

నేటి క్రైస్తవ్యంలో జరుగుచున్న సంఘటనలు గమనిస్తే హృదయం ఆవేదన చెందుతుంది. మొదటి శతాబ్దపు కాలంనాటి క్రైస్తవ్యంతో పోలిస్తే నేటి క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదనిపిస్తుంది. యేసు క్రీస్తు చెప్పిన బోధలు, చేసిన పరిచర్య, అపొస్తలులు అనుసరించిన పద్ధతులు, వారు వేసిన పునాది, దాన్ని అనుసరించిన తరువాతి కాలపు అపొస్తలుల క్రైస్తవ్యం, పరిచర్య పద్ధతులు నేటి పరిచర్యతో అసలు పొంతనే లేదనిపిస్తుంది. ముఖ్యంగా సంఘ పెద్దలు, దైవజనులు పూర్తిగా వ్యాకానికి భిన్నంగా లోకరీతిగా నడుచుకుంటున్నారు. అలాగే సంఘం కూడా వాక్యం మీద ఆధారపడకుండ అవగాహన లేని దైవజనుల మీద ఆధారపడుతూ తప్పు త్రోవలో నడుస్తుంది. “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరకము చేయుచున్నారు” (మత్తయి 15:6).ఇలా తప్పు త్రోవలో నడుస్తున్న సంఘానికి గల కారాణాలను గమనిద్దాము.

1. వాక్యం మరియు దేవునియెడల సరైన ఆసక్తి లేకపోవుట:

నేటి క్రైస్తవులలో వాక్యము మరియు దేవుని మీద ఆసక్తి చాలా సన్నగిల్లుతుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనిషి లోకపరమైన పనులతో మునిగిపోయి దేవునిపై ప్రేమ, శ్రద్ధ మరియు సంబంధాన్ని కోల్పోతున్నాడు. ఉదయాన్నే లేచినప్పటి నుండి ఇల్లు, ఆఫీసు పనులలో మునిగిపోతూ కనీసం వాక్యం చదవకపోవడం, ఐదు నిమిషాలు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయకపోవడం జరుగుతుంది. యువత వాట్సప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి అనేక మాద్యమాలతో మునిగిపోయి దేవుని గురించిన అవగాహన లేకుండా పోతుంది. వీరికి ఆసక్తి లేకపోవడం వల్ల అవగాహనలేని దైవజనులు వలలో తప్పు త్రోవలో నడిపించబడుతూ సమాజంలో దేవుని నామానికి అవమానం కలిగేలా వ్యవహరిస్తున్నారు. “ఈ ప్రజలు నోటిమాటలతో నాయొద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొనియున్నారు. వారు నాయెడల చూపు భయభక్తులు మానవుల విధులనుబట్టి వారు నేర్చుకొనినవి" (యెషయా 29:13).

2. వాక్యములోని మూలార్థాలు, భావాల గూర్చి సరైన అవగాహన లేకపోవుట:

సంఘము, వాక్యమును గురించిన సరైన పరిశోధన లేక లోతైన అవగాహన చేయకపోవడం చాలా బాధకరమైన అంశం. చాలామందికి వాక్యము గురించిన కనీస అర్థాలు కూడా తెలీదు. దీనికి ముఖ్య కారణం రోజూవారి దినచర్యలో ప్రార్థన, వాక్యపఠనం లేకపోవడం. అవి మన దినచర్యలో వుంటే మనఃపూర్తిగా ప్రార్థన చేస్తూ దేవునితో అన్యోన్య సంబంధముంటే ఖచ్చితంగా దైవజనుడు చెప్పేది తప్పా, ఒప్పా అని అర్థమవుతుంది. అలాగే మనకు అందుబాటులోవున్న బైబిల్ వేదాంత విద్యకు సంబంధించిన పుస్తకాలు చదవడం, ఇంటర్నెట్ లో వివిధ బైబిల్ అంశాలను పరిశోధించడం చేస్తే ఒక మంచి అవగాహనగల క్రైస్తవునిగా జీవిస్తూ సమాజాన్ని ప్రగతిపథంలో నడిపించవచ్చు.

3. సంఘం యొక్క క్షేమం కొరకు సరైన అవగాహన, బాధ్యత లేకపోవుట:

క్రైస్తవ్యం మీద వాక్యం మీద క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద దైవజనులు, సంఘకాపరులు సరైన రీతిలో స్పందించక కనీసం, ఖండించలేకపోవడం చాలా బాధకరమైన విషయం. వారి వారి సొంత సంఘాలను పరిరక్షించుకోవడానికే పరిమితమైపోతున్నారే గాని ఎవరూ కూడా బయటికి వచ్చి ప్రభుత్వ పెద్దలతో చర్చించకపోవడం, మీడియాలో ఖండించకపోవడం మనం చూస్తున్నాం. దీనికి ముఖ్యకారణం సంఘం (తోటి క్రైస్తవ సమాజం)పట్ల బాధ్యత లేకపోవడం, స్వార్థప్రియులుగా నిలిచిపోవడం. చట్టపరంగా వెళ్ళి దోషులకు శిక్షపడేలా చెయ్యడంలో నేటి సంఘపెద్దలు, దైవజనులు ఎటువంటి చొరవ చూపకపోవడం పూర్తిగా విఫలమయ్యారు. ఇది చాలా బాధకరం. అలాగే విద్యలేని, అవగాహనలేని, స్వార్థపూరిత మరియు ధనాపేక్షగల దైవజనులు చేతిలోనుండి సంఘాన్ని రక్షించడంలో ఎవరూ సరైన బాధ్యత తీసుకోవడం లేదు. దీనివలన అన్యజనుల మధ్య ప్రభువు నామానికి తీవ్రమైన అవమానం జరుగుతుంది. అన్యజనులు సంఘాన్ని చూసి హేళన చేసే పద్ధతి వస్తుంది.

"వ్రాయబడిన ప్రకారం మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది?” (రోమా 2:24).

4. దేవునికి చెందాల్సిన మహిమను సంఘపెద్దలు దోచుకోవడం:

సంఘంలో ఎవరైనా మారుమనస్సు పొందినా, స్వస్థత కలిగినా, ఆశీర్వాదం కలిగినా అది మావల్లనే, మా సంస్థవలనే కలిగిందని చెబుతూ దేవునికి రావాల్సిన మహిమను చాలామంది సంఘపెద్దలు దోచేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. మారుమనస్సు, ఆశీర్వాదం, స్వస్థత అనేవి దేవునికి ఆ మనిషిపట్ల వున్న ప్రేమ వలన మరియు ఆ మనిషికి దేవునిపట్ల వున్న విశ్వాసం వలన జరుగుతుంది. ఈ ప్రక్రియలో దైవజనుడు కేవలం ఒక మధ్యవర్తి పాత్ర పోషిస్తాడే గాని తాను లేక తన సంస్థ వలన జరిగిందని సంఘాన్ని తప్పుత్రోవలో నడిపించడం చాలా మోసపూరితమైన క్రియ అవుతుంది. “మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” (2 పేతురు 2:1).

5. నేటి సంఘం మరియు సంఘపెద్దల విపరీతమైన పోకడలు:

సంఘపెద్దల మరియు సంఘంలోవుండే చాలామంది వ్యక్తులు పేరు, ప్రతిష్ఠ, ఘనత పొందడానికి విపరీతమైన లోకపరమైన పోకడలు పోవడం జరుగుతుంది. అభిమాన సంఘాలు, అభిమానుల్ని ఏర్పాటు చేసుకోవడం లేక సామాజిక మాధ్యమాలలో మరియు ఇతర మార్గాలలో తాము గొప్పవారమని, ప్రముఖులమని అందరితో పొగడ్తల వర్షం కురిపించుకోవడం వారి విపరీతమైన పోకడలకు నిదర్శనం. వారి సంస్థలను కార్పోరేట్ సంస్థలలాగా లేక బిజినెస్ సంస్థలలాగా తీర్చిదిడడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. తమని తాము అందంగా కనుపర్చుకోవడానికి ఎక్కడలేని ఫ్యాషన్స్, రంగులు పూసుకోవడం, అర్థిక స్థాయిని మించి అత్యంత ఖరీదైన వస్త్రాలు ధరించడం వంటిది చేస్తుంటారు. ఇతరులను ఆకర్షించడానికి మరియు శరీరేచ్ఛలను ప్రేరేపించుటకు నీచమైన వస్త్రాలంకరణ, విపరీతమైన గర్వపు కామపు చూపులు మొదలగునవి గమనిస్తుంటే అసలు మనం వెళ్ళేది దేవాలయంకా లేక ఫ్యాషన్ షోలకా అని అర్థం కాని పరిస్థితి. మరియు ఖరీదైన భవనాలు, కార్లు వంటివి కొనుక్కొని వాటిల్లో ప్రయాణిస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇవన్నీ పేద ప్రజల యొక్క కష్టార్జితం నుండి వచ్చిన సొమ్ముతో సుఖాన్ని అనుభవిస్తుంటారు. ఆదిమ క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా ఇంత ఘోరమైన దుస్థితి లేదు.

“మీరు ప్రయాణము కొరకు చేతికజ్జునైనను జోలెనైనను రొట్టెనైనను వెండినైనను మరిదేనినైనను తీసుకొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడనుండి బయలుదేరుడి” (లూకా 9:3-4). ఇలా ప్రభువు చెప్పిన ఆజ్ఞలను పాటించే దైవజనులు చాలా తక్కువమంది నేటి క్రైస్తవ్యంలో వున్నారు.

6. లక్షల్లో, కోట్లల్లో ఆర్జించే సంఘాలు, సంఘ పెద్దలు:

ప్రభువు మనందరి పాపముల నిమిత్తం తన ఆఖరి బొట్టు వరకు రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని అర్పిస్తే నేటి సంఘపెద్దలు, దైవజనులు పేద ప్రజల యొక్క ఆఖరి పైసా వరకు కానుకలు దశమ భాగముల రీతిలో వసూలు చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు. అందుకోసం అన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ పేద ప్రజల్ని సంఘపు వారిని నిట్టనిలువునా దోచేస్తున్నారు. ఆశీర్వాదాలు వస్తాయని కల్లబొల్లి పిట్ట కథలు అల్లడం, లక్షిస్తే రెండు లక్షలొస్తాయని స్వస్థతలు జరుగుతాయని ప్రార్థించిన నూనె, కర్చీఫులు మరియు అనేకరకమైన వస్తువులతో వ్యాపారాలు చేయడం వంటివి చేస్తూ లక్షల్లో, కోట్లల్లో ఆర్జిస్తూ కానుకలు సేకరిస్తున్నారు. ఒక పూటికి రూ|| 20 భోజనం చేయలేని పేదవాడి దగ్గర నుండి రూ|| 100 ప్రార్థించిన నూనె (ప్రేయర్ అయిల్) అమ్ముతున్నదౌర్జన్యపు దు:స్థితి ఈ రోజు సంఘాలలో కనబడుతుంది. ఒక చర్చి భవనమును మించి మరో చర్చి భవనం ఉండాలనే కోరికతో విపరీతమైన కానుకలను, ఆశీర్వాదాల ముసుగులో వసూలు చేస్తూ నిలువునా దోపిడి చేస్తున్నారు. నిజానికి ప్రభువు మన కోసం తన రక్తం కార్చి ప్రాణం అర్పించిన దానికన్న మరే ఆశీర్వాదమూ, స్వస్థత ఎక్కువ కాదు. మన బలహీనతలయందే ఆయన కృప అధికముగా ఉన్నది. మొదట మనము ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలి తర్వాత అవన్నియు మనకనుగ్రహింపబడుతాయి. ఆయన కొరకు మన ప్రాణాలని సైతం లెక్కజేయకుండ శ్రమించాలి.

“వారు అధికలోభులై, కల్పనా వాక్యములు చెప్పుచు మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు అలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు” (2 పేతురు 2:3).

“అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవంతు చెల్లించుచున్నారే గాని, న్యాయము దేవుని ప్రేమను విడిచిపెట్టచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది. అయ్యో పరిసయ్యులారా మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో, వందనములను కోరుచున్నారు. అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనష్యులు యెరుగరనెను” (లూకా 11:42–44).

7. చర్చి స్థలాలను పుణ్యక్షేత్రాలుగా మార్చడం:

చాలామంది దైవజనులు లక్షలతో,కోట్లతో కట్టిన తమ చర్చిలను పుణ్యక్షేత్రాలుగా మారుస్తున్నారు. ఫలానా చర్చికి వెళ్తే పుణ్యము వస్తుందని లేక ఫలానా ప్రదేశంలోని చర్చికి వెళ్తే పుణ్యం వస్తుందని కల్లబొల్లి కట్టు కథలు చెబుతూ ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తున్నారు. నిజానికి, ప్రభువే సమరయస్త్రీతో మాట్లాడేటప్పుడు... “అప్పుడా స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉ న్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను - అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యధార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను” (యోహాను 4:19-24). కాబట్టి దేవున్ని ఆరాధించువారు తమ పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ఆరాధించాలి, అంతేకాని ఒక ప్రదేశమందే ఆరాధిస్తే పుణ్యం వస్తుందని చెప్పడం పొరపాటు. అలా చెబుతూ ఇశ్రాయేలు యాత్ర, వేళాంగణి యాత్ర ఇంకా మరెన్నోయాత్రలు చేబడుతూ పుణ్యం వస్తుందని ప్రజలను మోసగిస్తున్నారు.

8. స్వస్థతల పేరిట విపరీతమైన మోసాలు, వెకిలి చేష్టలు:

గత రెండు, మూడు దశాబ్దాల నుండి స్వస్థతల పేరిట క్రైస్తవ సంఘాలను మోసం చెయ్యడానికి దైవజనులు పాల్పడుతున్నారు. వాక్య భోదనను పూర్తిగా విస్మరించి కేవలం స్వస్థతల పేరిట కూడికలు, కూటములను జరిపిస్తున్నారు. నిజానికి మొదటిగా ప్రతి మనిషికి కావాల్సింది మారుమనస్సు, పాపక్షమాపణ, మానవాళి కొరకు ప్రభువు తన స్వరక్తమిచ్చి మరణించి, తిరిగి లేచాడని, ఆయన మరల రాబోవుచున్నాడని అందరికీ అనగా, ప్రతీ ప్రాంత, భాష,జాతి, కుల, తెగల మొదలగువారందరికి తెలియజేయాలి. వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో బోధించాలి. పాపక్షమాపణ మారుమనస్సు లేకుండ కేవలం స్వస్థత జరిగిన అది మనిషిని పరలోకానికి తీసుకొని పోలేదు. వాక్యం, స్వస్థత గురించి సరైన అవగాహన లేకుండ దైవజనులు సంఘాన్ని పాడుచేస్తున్నారు. అలాగే తమ స్వార్థపూర్వకమైన ధనాశల, పేరు ప్రఖ్యాతల కొరకు సంఘాన్ని పూర్తిగా తప్పుత్రోవ పట్టిస్తున్నారు. కింద పడిపోవడం, పిచ్చి పిచ్చి గంతలు వేయించడం, దోర్లడం వంటి వెకిలి చేష్టలు చేయిస్తున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పేరుతో నీళ్ళు చల్లడం, గాల్లో ఊదడాలవంటివి చేయిస్తూ ప్రభువు నామానికి అవమానాన్ని కూడగడుతున్నారు. ప్రార్థించిన నూనె (ప్రేయర్ అయిల్) డబ్బాలు, ముఖాన్ని తుడుచుకొనే చేతి గుడ్డలు (కర్చీఫ్స్), పుస్తకాలలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని మరీ దిగజారిపోయి స్వస్థత పేరిట వ్యాపారాలు చేస్తూ మోసాలకు పూనుకొంటున్నారు. కాబట్టి సంఘాన్ని చెడగొట్టే ఇలాంటివారిని దేవుడు సమర్థిస్తాడా? సమర్థించడు కదా! "ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్ట నారంభించెను” (లూకా 19:45–46).

గమనిక: ప్రియ పాఠకులారా స్వస్థతలు లేవని నేను చెప్పడం లేదు. ప్రభువు సజీవుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థించేవారి ప్రార్థనలు విని స్వస్థతలు చేస్తాడు. లేఖనం చెబుతుంది - "విశ్వాససహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును” (యాకోబు 5:15). అయితే స్వస్థతల పేరిట క్రైస్తవ సమాజంలో జరిగే మోసాలు గూర్చి నేను మాట్లాడుచున్నాను. ఈ విషయాన్ని పాఠకులు గ్రహించమనవి.

9.కులం పేరిట విడిపోయిన సంఘాలు:

బైబిల్ లో చెప్పబడిన సమానత్వానికి, నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని చెప్పబడిన వాక్యానికి తూట్లు పొడుస్తూ... సాంఘిక దురాచారమైన కులవ్యవస్థను క్రైస్తవ సంఘాలలో విస్తరింప చేసే క్రమంలో అగ్ర, నిమ్న కులాలపేరిట సంఘాన్ని నిట్టనిలువునా చీలుస్తూ... కులాలపేరిట చర్చిలు నిర్మితమవ్వడం చాలా బాధాకరమైన విషయం. కులాలపేరిట దైవజనులు తయారవ్వడం, సంఘాలు స్థాపించడం, ఇతర సంఘాల తోటి క్రైస్తవులను దూషించడం, తమ కులాల దైవజనులతో మాత్రమే ప్రార్థనలు, పెళ్ళిళ్ళు చేయించడం వంటివి సర్వసాధరణమైపోయాయి. అలాగే తమకు అనుకూలంగా వుండే చర్చిలను మాత్రమే ప్రజలు ఎంచుకొని వాక్యముతో సంబంధం లేకుండా సంఘాలను నిర్మించడం ఎంతో బాధకరం. “ఒక్కడు - నేను పౌలువాడను, మరియొకడు నేను అపొలోవాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుష్యులుకారా? అపొల్లో ఎవరు? పౌలెవడు? పరిచారకులే గదా.” (1కొరి. 3:4)

10. మూఢనమ్మకాలు, మూఢమైన ఆచారాలు, పద్ధతులు:

దేవుని మీద, వాక్యంమీద ధ్యాసకంటే మూఢమైన ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాల మీదనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వాక్యంలోని లోతులను పరిశీలించడంలో విఫలమవుతున్నారు. వాస్తులు పాటించడం, ముహుర్తాలు పెట్టుకోవడం, గ్రహణాలు అవలంబించడం, జ్యోతిష్యాలు చూయించుకోవడం వంటి మూఢ నమ్మకాలు చాలామంది క్రైస్తవులు ఆచరించడం చాలా బాధకరం. వీటన్నిటిపై మన సృష్టికర్తయైన ప్రభువు ఉన్నాడనే సంగతి మరవడం చాలా విచారించవలసిన విషయం. "ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై, నిజమునకు దేవుళ్లుకానివారికి దాసులై యుంటిరి గాని, యిప్పుడు మీరు దేవునిని ఎరిగినవారును, మరి విశేషముగా దేవునిచేత ఎరుగబడిన వారునైయున్నారు. గనుక, బలహీనమైనవియు నిష్ ప్రయోజనమైనవియునైన మూలపాఠములతట్టుమరల తిరుగనేల? మునుపటివలె మరలవాటికి దాసులైయుండగోరనేల? మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు” (గలతీ 4:8-10).

11. సంఘాలలో రాజకీయాలను ప్రోత్సహించడం:

సంఘాలలో రాజకీయాలు అపొస్తలుల కాలం నుండి జరుగుతున్నవి. వీటివల్ల సాధారణ ప్రజలు చర్చిపట్ల చురుకైన ఆసక్తి కనుపరచలేకపోతున్నారు. సంఘకాపరికి, కమిటీ సభ్యులకు మధ్య సమన్వయలోపం కనబడుతుంటుంది. కమిటీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరించకపోతే సంఘకాపరిని ఆ ఫలాన చర్చి నుండి బదిలీ చేయడమో లేక మరో విధంగా ఇబ్బందులకు గురి చేయడమో జరుగుతుంది. కొన్నిచోట్ల సంఘకాపరి, కమిటీ సభ్యులు కలిసి చర్చికి వచ్చి సొమ్మును దోపిడి చేయడం జరుగుతుంది. అలాగే జిల్లాలకు లేక ప్రాంతాలకు గల చర్చిలకుండే పెద్ద సంఘకాపరులు లంచాలు ముసుగులో లేక అధిక మొత్తంలో ధనాన్ని, అర్జిస్తూ అవినీతి, అక్రమాల రాజకీయాల వలన సంఘం నానాటికి క్షీణించిపోతుంది.

12. చర్చి ఆస్తులను అన్యాక్రాంతం చేయడం:

లంచాల ముసుగులో పడిపోయి మిషనరీలు భారతదేశ క్షేమానికి, క్రైస్తవసంఘ అభివృద్ధికై సంపాదించిపెట్టిన స్థిరాస్థులును, భూములను అన్యజనులకు, కార్పోరేట్ శక్తులకు అమ్మివేసి అన్యాక్రాంతం చేస్తున్నారు. మిషనరీలు ఎంతో కష్టపడి, తమ సుఖ జీవితాలను వదిలివేసి ఇక్కడికొచ్చి మనకు సువార్తను ప్రకటించగా దైవాత్మ మన దేశ ప్రజల్లో కొందరిలో పనిచేయగా మారుమనస్సునొంది, రక్షింపబడినాము. మనమంత ఒకచోట కూడుకొని దేవున్ని స్తుతించుటకు చర్చి స్థలాలను కొన్నారు. మనకు విద్యలేక వాక్యాన్ని చదువలేని స్థితిలో ఉండగా మన క్రైస్తవ సమాజం కొరకు అలాగే దేశ ప్రజల కొరకునూ పాఠశాలలను, కళాశాలలను మరియు వైద్యం కొరకు ఆసుపత్రులను, అనాథల, వృద్ధుల కొరకై అక్రమాలు, స్థలాలు, భవనాలు మనకు సమకూర్చి ఇచ్చివేశారు. నేటి మన సంఘ కాపరులలో కొంతమంది డబ్బుకి ఆశపడి, ధనాపేక్షగలవారై వాటిని అమ్మివేయడం ఎంతో దు:ఖాన్ని కలిగిస్తుంది. “దేశపు జనలు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి, కట్టుచున్న వారిని బాధపరిచిరి. మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినులన్నిటిలోను పారసీకపు దేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలన కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి” (ఎజ్రా 4:4-5).

13. కుటుంబ ప్రదర్శనకు ప్రాధాన్యం పెరిగిపోవడం:

నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది సంఘకాపరులు, దైవజనులు దేవుని సువార్త చాటించేదాని కన్నా కుటుంబ ప్రదర్శనకే, అంటే వారి వారసులను (కుమారులను) లేక కుటుంబాన్ని ఎక్కువగా దృష్టిపెట్టడం లేక సంఘము ముందు పైకి తీసుకొనిరావడం జరుగుతుంది. వారి తరువాత వారి కుమారులే వారి వారసులుగా ప్రదర్శిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఖండించాల్సిన విషయం. ఎందుకంటే సువార్త ప్రకటనలో వారసులను అంటే దైవజనులను ఎంచుకొనే విషయంలో తప్పక బైబిల్ చెప్పిన బోధను పాటించాల్సిన అవసరముంది. “ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యాదస్థుడును, అతిధి ప్రియుడును, బోధింపతగిన వాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక సాత్వికుడును, జగడమాడనివాడును,ధనాపేక్షలేనివాడునై, సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచు కొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునైయుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను” (1తిమోతి 3:1-7).

దేవుని వాక్యం కోసం, సత్యం కొరకు నిలబడే వ్యక్తిని ఎంచుకొని వారసులనుగా ఎంచుకోవడం ఎంతైనావుంది. కేవలం కుమారులను, కుమార్తెలను, కోడళ్ళను, అల్లుళ్ళను, మనువండ్లను, మనువరాండ్లను ఇలా కుటుంబాన్ని ఒక సినిమా లేక సీరియల్ ప్రదర్శనలాగా ప్రదర్శించడం చాలా బాధకరమైన విషయం. సంఘంలో ఎంతోమంది దేవునిమీద ఆసక్తి కలిగి మంచి ప్రతిభను కనపరిచే యువ దైవజనులను, అనుభవముండి దేవుని వాక్యాన్ని చక్కగా విడమర్చి బోధించే సామర్థ్యమున్నవారిని, చక్కని స్వరంతో పాడేవారిని, ఆత్మానుసారమైన సంగీత వాయిద్యాలను వాయించేవారిని ప్రోత్సాహించాలి. అంతేకాని కేవలం తమ కుమారులే వాక్యం చెబుతారు, కుమార్తెలే పాటలు పాడుతారు; వాయిద్యాలు వాయిస్తారనుకొని ఇతరులను ప్రోత్సాహించకపోతే అది పక్షపాతవైఖరి మరియు సువార్త వ్యాప్తి కాదు. సంఘంలో అందర్నీ క్రీస్తును వెంబడించే శిష్యులుగా, శిష్యురాండ్లుగా తర్ఫీదునిస్తూ వారికి పరిశుద్ధాత్ముడిచ్చిన కృపవరాలను, సామార్థ్యాలను గుర్తించి ఆయా పరిచర్యలో వారిని సంఘ క్షేమాభివృద్ధి కొరకును, ప్రభువు మహిమ కొరకును వాడుకోవాలి మరియు సర్వసృష్టికి సువార్తను అందించే గొప్ప సువార్తికులుగా తయారుచేయాలి.

మొదటి శతాబ్దపు క్రైస్తవులలో ఎక్కడ కూడా కుటుంబ ప్రదర్శనకు చోటులేదు. ఇంకా యేసు ప్రభువు ఒకానొక చోట ఉండగా... నీ తల్లియు, సహోదరులు వస్తున్నారంటే, నా తల్లియు, సహోదరులు ఎవరని అడుగుతూ కుటుంబ సభ్యులకంటే, పరలోకమందున్న తండ్రి చిత్రానికే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి మంచి మాదిరిని చూపాడు.

కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దైవజనులారా క్రీస్తు సంఘమా మేల్కొనండి దేవునిపట్ల, ఆయన వాక్యం యెడల ఆసక్తి కలిగి ప్రార్థించండి. సంఘం లోకపరమైన పనులలో మునిగిపోకుండ ప్రార్థనకు, వాక్యపఠనకు కేటాయించాల్సిన సమయం కేటాయిస్తూ మనపిల్లలకు, వారి వారిపిల్లలకు దేవుని ఆజ్ఞలను నేర్పిస్తుండాలి. "నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును,త్రోవను నడుచునప్పుడును, పడుకొనునప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను” (ద్వితి.కా 6:6-9). “దేవుని వాక్యాన్ని లోతుగా పరిశీలిస్తూ, అందరికి అర్థమయ్యే విధంగా హేతుబద్ధంగా ప్రకటిస్తు వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టవలెను” (2 కొరింథీ 10:5).

చివరిగా, దేవుని వాక్యం, క్రైస్తవులపై జరుగుచున్న దాడులను ఖండిస్తూ క్రైస్తవులకు అలాగే అన్యాయం పొందుతున్న పేద ప్రజలకు తోడుగా నిలుస్తూ సంఘకాపరుల బాధ్యతగా వ్యవహరించాలి. దేవునికి చెందాల్సిన మహిమను దైవజనులు దోచుకోకుండా ప్రేమ, సమాధానం గల పలకరింపులు కలిగి సంఘాన్ని నడపాలి. చర్చిలను పుణ్యక్షేత్రాలుగా మార్చవద్దు. వ్యక్తిగతంగా దేవునితో లోతైన సంబంధాన్ని, సహవాసాన్ని కలిగివుండునట్లు సంఘాన్ని ప్రోత్సాహిస్తూ, వ్యాక్యానుసారమైన జీవితాలు కలిగుండే దిశగా నడిపించాలి. సర్వసృష్టికి సువార్తను ప్రకటించే సువార్తికులను తయారు చేయాలి.మోషే ఇశ్రాయేలీయులను నడిపించునట్లుగా సహనంతో, దైవజ్ఞానంతో మంచి నాయకునివలె మరియు యిర్మియా ప్రవక్తవలె సంఘ క్షేమాభివృద్ధికై విలపిస్తూ... ప్రభువైన యేసుక్రీస్తు నడిచిన మార్గంలో నడుస్తూ... సంఘ విషయమై ప్రభువు కలిగున్న భారంలో కొంతైన దైవజనులు తమ భుజాలపై మోస్తూ ఆయన అడుగుజాడలలో పయనించుటకు ప్రభువు తన విశేషమైన కృపను అనుగ్రహించి, బలపరుచును గాక! ఆమేన్.

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.