ఆడియో
అంగవైకల్యం గలవారిపై సమాజానికి ఉండే సానుభూతి, శ్రద్ధలను అసరాగా తీసుకున్న కొందరు బైబిల్ విమర్శకులు బైబిల్ దేవునికి వారిపై వివక్ష ఉందంటూ కొన్ని లేఖనాల ఆధారంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణాలు చూపించి బైబిల్ దేవుడు దేవుడే కాదని, అసలు బైబిల్ దేవుని వాక్యమే కాదంటూ ప్రజలను మభ్యపెడుతుంటారు. ఇటువంటి విమర్శలను నిర్వీర్యం చెయ్యడంలో భాగంగా వారు స్త్రీలపై బైబిల్ దేవునికి వివక్ష ఉందంటూ చూపిస్తున్న కొన్ని సందర్భాలను వివరిస్తూ నేను ఇప్పటికే రెండు వ్యాసాలను రాయడం జరిగింది. ఈ క్రింది లింక్స్ ద్వారా మీరు వాటిని చదవవచ్చు.
స్త్రీకి శీలపరీక్ష, బైబిల్ దేవుని వివక్షేనా?
బైబిల్ దేవుడికి స్త్రీలపై వివక్ష వాస్తవమా లేక ఆరోపణా?
ఈ వ్యాసంలో వారు అంగవైకల్యం గలవారిపై కూడా ఆయనకు వివక్ష ఉందని ఉటంకిస్తున్న లేఖన సందర్భాలను వివరించబోతున్నాను. ముందుగా ఈ వాదనకు ఆధారంగా వారు తీసుకునే లేఖనాలను చూడండి.
రెండవ సమూయేలు 5:8
యెబూసీయులను హతము చేయువారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను.
లేవీయకాండము 21:17-21
నీవు అహరోనుతో ఇట్లనుము నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు. ఏలయనగా ఎవనియందు కళంకముండునో వాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవయవముగల వాడే గాని కాలైనను చేయినైనను విరిగినవాడే గాని గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వుగల వాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు. యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.
మనం చూసిన ఈ సందర్భాలలో ఒకచోట దేవుని హృదయానుసారుడైన దావీదుకు గుడ్డివారు, కుంటివారు హేయులనీ, మరోచోట అంగవైకల్యంగలవారు ఇశ్రాయేలీయుల దేవుని మందిరంలో ప్రవేశించి ఆయనకు బలులు అర్పించకూడదని రాయబడింది. వీటి ఆధారంగానే బైబిల్ దేవునికి అంగవైకల్యం గలవారిపై వివక్ష ఉందనే వాదన పుట్టింది. బైబిల్ విమర్శకులు చెబుతున్నట్టుగా ఈ సందర్భాలలో ఏదైనా వివక్ష ఉందా లేక అది కేవలం వారి పన్నాగంలో భాగమా అనేది చూడడానికంటే ముందు ఇదే బైబిల్ లో అంగవైకల్యం గలవారి గురించి రాయబడిన కొన్నిమాటలు చూద్దాం.
లేవీయకాండము 19: 14
చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డము వేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.
ద్వితియోపదేశకాండము 27: 18
గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు ఆమేన్ అనవలెను.
ఈ వచనాలలో కేవలం చెవిటివాడికి వినిపించదులే అని తిట్టినా, గుడ్డివాడికి కనిపించదులే అని అడ్డం వేసినా, లేక త్రోవను తప్పించినా దేవుడు దానిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వారిపట్ల ఇటువంటి పొరపాట్లు కూడా చెయ్యకూడదని కఠినంగా ఆజ్ఞాపిస్తున్న అదే దేవుడు వారిపట్ల వివక్ష చూపిస్తున్నాడంటే పైన చెప్పినట్టుగా, అది కేవలం విమర్శించేవారి పన్నాగమే తప్ప అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. మరికొన్ని సందర్భాలను కూడా చూడండి.
యోహాను సువార్త 9:1-3
ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డియైన యొక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీని కన్నవారా? అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.
ఈ సందర్భంలో శిష్యులు ఒక వ్యక్తికి కలిగిన అంగవైకల్యం గురించి యేసుక్రీస్తును ప్రశ్నించినపుడు అది ఎవరి పాపం వల్లనో వచ్చింది కాదని దేవుని క్రియలు వానియందు ప్రత్యక్షపరచబడడానికే అతనలా పుట్టాడని చెబుతున్నాడు.
కాబట్టి అంగవైకల్యం అనేది ప్రతీసారీ పాప పర్యవసానంగా వచ్చేది కాదు.
ప్రపంచంలో ఎంతోమంది అంగవైకల్యం గలవారు ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన చరిత్ర మనకు తెలుసు. క్రైస్తవ ప్రపంచంలో కూడా ఎంతోమంది అంగవైకల్యం గలవారు విస్తృతమైన సేవను జరిగిస్తూ, దేవుని క్రియలను వారి ద్వారా లోకానికి ప్రత్యక్షపరుస్తున్నారు, అన్ని అవయవాలు బావుండి సోమరులుగా బ్రతుకుతున్నవారిపై తీర్పరులుగా ఉండబోతున్నారు.
యోహాను సువార్త 9:39-41
అప్పుడు యేసు చూడనివారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను, అను తీర్పు నిమిత్తము నేనీలోకమునకు వచ్చితినని చెప్పెను.
ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట వినిమేమును గ్రుడ్డివారమా అని అడిగిరి.
అందుకు యేసు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరిప్పుడు చెప్పు కొనుచున్నారు గనుక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను.
రెండవ కొరింథీయులకు 12:8,9
అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
చివరిగా అంగవైకల్యంగలవారి గురించి దేవుడు చెబుతున్న మరోమాటను చూడండి.
నిర్గమకాండము 4:11
యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
ఈ సందర్భంలో దేవుడు అంగవైకల్యం గలవారిని కూడా తన చిత్తానుసారంగా పుట్టిస్తున్నట్టు తెలియచేస్తున్నాడు కాబట్టి వారి జననం వెనుక దేవునికంటూ ఒక చిత్తం ఉంది. ఈలోకపు జీవితమే శాశ్వతమని, మనిషి శూన్యం నుండి శూన్యం వైపుకు పయనిస్తున్నాడని నమ్మే నాస్తికులకు ఇదేదో అన్యాయంలా కనిపించవచ్చు కానీ, ఈలోకంలో మనషి జీవితం అల్పకాలమని, ప్రతీ మనిషీ ఈ భూమిపై దేవుడు అప్పగించిన పని నెరవేర్చి, మరణించిన తరువాత అసలైన జీవితం ప్రారంభమౌతుందని నమ్మే బైబిల్ విశ్వాసులకు మాత్రం ఇందులో ఎటువంటి అన్యాయమూ లేదు. అన్ని అవయవాలు కలిగినవారిని ఆయన ఎలా అయితే తన చిత్తానుసారంగా పుట్టిస్తున్నాడో అదేవిధంగా అంగవైకల్యం గలవారిని కూడా పుట్టిస్తున్నాడు. ఈవిధంగా ఆయన ప్రతీమనిషి పట్లా తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నాడు. బైబిల్ ప్రకటించే దేవుడు సార్వభౌముడు, మానవుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నిర్ణయాలు చేసేవాడు కాదు.
రోమీయులకు 9:20
అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకీలాగు చేసితివని రూపింపబడినది రూపించినవానితో చెప్పునా?
ఇక బైబిల్ దేవుడు అంగవైకల్యం గలవారిపై వివక్ష చూపాడనేందుకు ఆధారంగా ప్రారంభంలో ప్రస్తావించడిన సందర్భాల విషయానికి వస్తే, దావీదుకు గుడ్డివారు కుంటివారు అంటే సాధారణంగానే హేయమో లేక అతను వారిని హేయంగా భావించడానికి ఏదైనా కారణముందో ఆ పై వచనంలో రాయబడింది చూడండి.
రెండవ సమూయేలు 5:6,7
యెబూసీయులు దేశములో నివాసులై యుండగా రాజును అతని పక్షమువారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి-నీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను.
ఈ సందర్భంలో రాజైన దావీదు యెబూసీయులు నివసిస్తున్న సీయోను కోటను స్వాధీనం చేసుకునేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న గుడ్డివారు, కుంటివారు ఆ యెబూసీయులతో కలసి దావీదుపై తిరుగుబాటు చేసారు. కాబట్టే దావీదు యుద్ధవిధిలో భాగంగా వారిని హతం చేయించాడు. ఇక్కడ మనం గుర్తించవలసిన రెండు విషయాలు ఏంటంటే,
1. దావీదు ఆ ప్రాంతంలో తనపై తిరుగుబాటు చేసిన కుంటివారు గుడ్డివారిని మాత్రమే హేయంగా భావించాడు తప్ప దేశంలో ఉన్న గుడ్డివారినీ, కుంటివారందరినీ కాదు; అదే నిజమైతే అతను వాళ్ళందరినీ కూడా చంపించేవాడు. ఇదే దావీదు చరిత్రను మనం ఇంకాస్త ముందుకు పరిశీలిస్తే, యోనాతాను కొడుకైన ఒక కుంటివాడిని ఇతను ఆదరించి తన కుటుంబ సభ్యునిగా పరిగణించాడు (2 సమూయేలు 9:1:13).
2. దావీదు రాజు యొక్క మంచితనం, పరాక్రమం అ చుట్టుపక్కల ప్రజలందరికీ తెలుసు. ఇది తెలిసిన గుడ్డివారు, కుంటివారు అతనితో కాకుండా యెబూసీయులతో కలసి తిరుగుబాటు చెయ్యడం వారి పొరపాటు. కాబట్టి ఇక్కడ దావీదుకు ఆ గుడ్డివారు, కుంటివారు హేయులుగా మారడానికి, వారిని చంపించడానికి కారణం ఉంది. దావీదు యుద్ధవిధిలో భాగంగా చేసిన దీనిని ఎవరూ తప్పుపట్టలేరు.
ఉదాహరణకు ఈరోజు మనదేశంలో అంగవైకల్యం కలిగిన వ్యక్తి రాజద్రోహానికి పాల్పడ్డాడు అనుకుందాం. చట్టం ఆ వ్యక్తిని శిక్షిస్తుందా లేక అతనికున్న వైకల్యాన్ని బట్టి వదిలేస్తుందా? దావీదు చేసినదానిని వివక్షకు ఆపాదించేవారు చట్టం చేసేదానిని కూడా వివక్షగానే పరిగణిస్తారా? ఒకవేళ ప్రజల మన్ననలు కోరుకునే చట్టం అలాంటివారికి శిక్షల్లో మినహాయింపులు ఇవ్వవచ్చు కానీ, న్యాయం విషయంలో రాజీపడని దేవుని హృదయానుసారుడైన దావీదు వారిని క్షమించవలసిన అవసరం లేదు. న్యాయవంతుడైన దేవుని దృష్టికి నేరం ఎవరు చేసినా నేరమే, నేరం చేసిన వ్యక్తిని ఏ కారణంతో విడిచిపెట్టినా నేరాన్ని ప్రోత్సహించినట్టే. ఈరోజు చట్టం కొన్ని వర్గాలవారికి శిక్షల్లో మినహాయింపులు ఇచ్చుకుంటూ పోబట్టే వారిలో నేరప్రవృత్తి రోజురోజుకీ విస్తరిస్తుంది.
ఇక అంగవైకల్యం గలవారు దేవాళయంలో బలులు అర్పించడానిని ఆయన ఎందుకు నిషేధించాడంటే, లేవీకాండం ప్రారంభం నుండీ మనం చదివినపుడు ఇశ్రాయేలీయుల నిమిత్తం యాజకులు అర్పించవలసిన బలులు ఎంత కష్టతరంగా ఉంటాయో అర్థమౌతుంది. అటువంటి బలులను వైకల్యంగలవారు అర్పించడం వారికి ఆయాసకరంగా ఉంటుంది, పైగా ఆ క్రమంలో వారు ఏదైనా పొరపాటు చేస్తే ఆ బలియాగం అపవిత్రమౌతుంది (లేవీకాండము 21:24). కాబట్టే దేవుడు వారిపై కరుణ చూపించి వారికి ఆ కష్టతరమైన బలుల విషయంలో మినహాయింపు కల్పించాడు.
దీనిని బట్టి ఆయనకు వివక్ష ఆపాదించేవారు ఏ యజమానుడైనా తన దగ్గర పనిచేసేవారిలో ఒకరికి ఉన్న వైకల్యాన్ని బట్టి అతను చేయాల్సిన పని విషయంలో మినహాయింపు కల్పిస్తే మెచ్చుకుంటారా లేక ఆ యజమానుడు వివక్షతోనే అలా చేసాడని విమర్శిస్తారా? విజ్ఞత కలిగిన వ్యక్తులు మాత్రం తప్పకుండా ఆ యజమానుడిని ప్రశంసిస్తారు.
ఇక్కడ మనం గుర్తించవలసిన మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, బైబిల్ దేవుడు అంగవైకల్యంగలవారి పరిమితిని బట్టి వారు దేవాలయంలో చేయాల్సిన పని విషయంలో మినహాయింపు కల్పించాడే తప్ప వారి జీతాన్ని తగ్గించలేదు. ఆ మాట కూడా ఆ క్రింది వచనంలో స్పష్టంగా రాయబడింది చూడండి.
లేవీయకాండము 21:22
అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
ఇప్పుడు చెప్పండి, వారికున్న పరిమితిని బట్టి పని విషయంలో మినహాయింపు కల్పించి, జీతాన్ని మాత్రం సమానంగా ఇచ్చే దేవుడు వారిపై వివక్ష చూపిస్తున్నట్టా? ఒకవేళ దీనిపై ఇంకా ఎవరైనా వైకల్యంగలవారిని ఆయన బలుల విషయంలో మినహాయించకుండా వారు అర్పించే బలులు సులభతరంగా ఉండేలా కట్టడను చేయొచ్చుగా అని ప్రశ్నిస్తే, అసలు వారికి ఆ పనే అప్పగించకుండా జీతం ఇవ్వడంలో మీకున్న సమస్యేంటో ముందు వివరించాలి. మోషే ధర్మశాస్త్రంలో ఆయన నియమించిన బలుల ఆచారానికీ, వాటి క్రమానికీ ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఉంది. అవన్నీ క్రీస్తు బలియాగానికి ఛాయగా ఉన్నాయి. కాబట్టి వాటి క్రమాన్ని ఎవరి కోసమూ మార్చడం సాధ్యపడదు.
Copyright Notice
"ఈ వ్యాసం/పుస్తకం, 'హితబోధ కమ్యూనికేషన్స్'వారి అనుమతి ద్వారా ప్రచురించబడింది ©2021 www.hithabodha.com"
ఇందులో ఉపయోగించిన బైబిలు వచనాలన్నీ బైబిల్ సొసైటీవారు ప్రచురించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉపయోగించబడినవి.