నిజ క్రైస్తవ జీవితం

రచయిత: యశ్వంత్ కుమార్
చదవడానికి పట్టే సమయం: 11 నిమిషాలు

 

అందరూ చెయ్యాల్సిన పరిచర్య

టైటిల్ చదవగానే, ఈ వ్యాసం సువార్తీకరణ గురించనో లేక ఇతరులను శిష్యులుగా తయారు చేసే పరిచర్య గురించనో లేదా ఇంకా ఇలాంటివేవైనా అనుకొని ఉండొచ్చు. కానీ విశ్వాసులంతా ఒకరికి ఒకరు చేసుకోవాల్సిన పరిచర్యలలో ఒకానొక ప్రాముఖ్యమైన పరిచర్య - 'ఒకనికొకడు బుద్ధి చెప్పుకోవడం'. ఈ పరిచర్య ఎవరెవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్న సంగతులను ఈ వ్యాసంలో నేర్చుకుందాము.

 

ఈ పరిచర్య ఎవరెవరు చెయ్యాలి?

'ఇది పాస్టర్లు లేదా సంఘకాపర్లు మాత్రమే చేసే పరిచర్య కదా. మేము దాని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఏముంది?' అని మీకు అనిపించొచ్చు. నిజమే, చాలామందికి అదే అభిప్రాయం ఉంటుంది. బోధించడం, బుద్ధిచెప్పడం అనేవి పాస్టర్లు లేక సంఘపెద్దలు మాత్రమే చేసే పరిచర్య అని అనుకుంటారు. అందుకు కారణం లేకపోలేదు. అటువంటి వచనాలు బైబిల్ లో ఉన్నాయి. ఉదాహరణకు

తీతుకు 1:9 - 'తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను.'

ఇటువంటి వచనాలను ఆధారం చేసుకొని ఈ పరిచర్య పాస్టర్లు మాత్రమే చెయ్యాలి అని అనుకుంటారు. కానీ బైబిల్ ఎం చెప్తుంది అంటే ఈ పరిచర్య అందరు విశ్వాసులు చెయ్యాలని. కొన్ని లేఖనభాగాలను పరిశీలిద్దాము.

రోమా 15:14 - 'నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును, సమస్త జ్ఞానసంపూర్ణులును, ఒకరికి ఒకరు బుద్ధిచెప్ప సమర్థులునై యున్నారని నామట్టుకు నేనును మిమ్మును గూర్చి రూఢిగా నమ్ముచున్నాను."

కోలస్సీ 3:16 - "సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి."

హెబ్రీ 3:14 - "పాపమువలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే, ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి."

అంత మాత్రమే కాదు, ఈ బుద్ధి చెప్పడం, హెచ్చరించడం, ఉపదేశించడం అనే ఆజ్ఞ కొన్ని గుంపులవారికి ప్రత్యేకంగా ఇవ్వబడినట్లు కూడా చూస్తాము.

తీతుకు 2:1-6 - "1. నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. 2. ఏలాగనగా వృద్ధులు మితానుభవముగలవారును, మాన్యులును, స్వస్థబుద్ధిగలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపములేనివారునై యుండవలె ననియు, 3. ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును,మిగుల మద్యపానాసక్తులునై యుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవునివాక్యము దూషింపబడకుండునట్లు, 4. యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడియుండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని బుద్ధి చెప్పుచు, 5. మంచి ఉపదేశముచేయువారునై యుండవలెననియు బోధించుము. 6. అటువలెనే స్వస్థబుద్ధిగలవారై యుండవలెనని యౌవన పురుషులను హెచ్చరించుము."

ఈ వచనాలలో బుద్ధి చెప్పడమూ, బోధ చెయ్యడమూ అనే పరిచర్యని పౌలు వృద్ధులైన స్త్రీలకూ, పురుషులకూ అప్పగిస్తున్నాడు. ఇది మాత్రమే కాకుండా తల్లిదండ్రులు పిల్లలకు బోధించమని కూడా వేరొక సందర్భంలో చెప్తాడు. ఎఫెసీ 6:4 - "తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి." సరే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ, ఈ వాక్య భాగాల అర్థం, ప్రతి ఒక్కరూ సంఘపెద్దలూ, డీకన్లు అయిపోవాలి అని కాదు. దేవుడు ఆ పరిచర్య చేసేవారికి ఉండాల్సిన కొన్ని ప్రత్యేకమైన అర్హతల గురించి వివరంగా తెలియజేశాడు. ఆ అర్హతలు లేదా సద్గుణాలు కలిగిన పురుషులు మాత్రమే ఒక సంఘాన్ని నడిపించే నాయకులుగా ఉండడానికి అర్హులు. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాస్టర్లు లేదా సంఘపెద్దలు చెయ్యాల్సిన అనేక పనులలో ఈ బుద్ధి చెప్పడం లేదా హెచ్చరించడం అనేది కూడా ఒకటి. అది వారి పరిచర్యలో ఒక భాగం. కానీ ఆ పని వారు మాత్రమే చెయ్యాలని కాకుండా విశ్వాసులందరికీ ఇవ్వబడిన బాధ్యతని ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

గమనిక - పైన మనం చదివిన వాక్య భాగాలలో ఇంగ్లీష్ లో admonish, instruct అని ఉంది కానీ, తెలుగులోనూ, గ్రీకులోనూ ఈ పదాలకు చాలా అర్థాలు ఉన్నాయి. బోధించడం, బుద్ధి చెప్పడం, హెచ్చరించడం మొదలైనవి.

సరే అందరు విశ్వాసులు ఈ పరిచర్య చెయ్యాలి అని చెప్పాను కానీ,

 ఏ విషయాలలో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పాలి? ఈ పరిచర్య చెయ్యడం కోసం మనం ఎలా సిద్ధపడాలి?

సరే ఇంతకీ ఏ విషయాలలో ఒకనికి ఒకరు బుద్ధి చెప్పాలో కొన్ని ఉదాహరణలు చెప్తాను. చాలా విషయాలలో ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాల్సిన, హెచ్చరించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఓ మూడు ప్రాముఖ్యమైన విషయాలను మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను.

మొదటిగా, నీ సహోదరుని లేదా సహోదరి యొక్క కంటిలో నలుసును తీసేసుకోమని చెప్పడం. ఎంతో తగ్గింపుతో, దీనమనస్సుతో, అవతలివారు క్రీస్తు మార్గం నుండీ ఏదైనా విషయంలో తప్పిపోతున్నట్లు గుర్తించినప్పుడు, అలా చెయ్యడం వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటో అర్థం అయ్యేలా ప్రేమతో చెప్తూ సరిచేయాలి. ofcourse అంతకంటే ముందు, నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకోవాలి. లేదా యేసుప్రభువువారు చేసిన హెచ్చరిక నీకు కూడా వర్తిస్తుంది (మత్తయి 7:3,4,5). తన సొంత అవిధేయత విషయంలో పశ్చాత్తాపపడకుండా, తన చెడ్డ నడవడిని మార్చుకోకుండా ఇతరులను ఉద్ధరించాలని బయల్దేరినవారిని ఉద్దేశించే ప్రభువు ఈ హెచ్చరిక చేశారు. అయితే సంపూర్ణంగా పరిశుద్ధులు అయిన తరువాతే ఇతరుల గురించి ఆలోచించాలి అన్నది దీన్ని ఉద్దేశం కాదు. ఎందుకంటే మనం చనిపోయినప్పుడు మాత్రమే క్రీస్తును పోలిన పరిపూర్ణ స్థితిలోకి వెళతాము. మరి ఎవరు ఈ పని చెయ్యొచ్చు అంటే - ఎవరైతే వాక్యపు నియమాలకు అనుగుణంగా తమ జీవితాన్ని మలుచుకుంటూ, అనుదినం పాపంతో పోరాడే అనుభవం కలిగి, నీతిమంతుని వలె ఎన్నిసార్లు పడినప్పటికీ, తిరిగి లేచి నిజమైన పశ్చాత్తాపము, మారుమనస్సు అనుభవంలో కొనసాగుతూ, పాపానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వకుండా, దానిని అసహ్యించుకుంటూ, దాని నుండి దూరంగా పారిపోతూ ఉంటారో వారు నిజమైన విశ్వాసులు. పరిశుద్ధాత్మ ఏదైనా పాపం విషయంలో నిన్ను ఒప్పిస్తున్నప్పుడు, దాని విషయమై పశ్చాత్తాపపడాలి, మారుమనస్సు పొందాలి. ఇలాంటి పరిశుద్ధమైన లేదా పవిత్రమైన జీవితాన్ని జీవించేవారు బాధ్యతాయుతంగా ఇతరుల కంట్లో ఉన్న నలుసును తీసి, ఇతరులకు సహాయపడాలి. వారికి ఉపదేశించాలి, సరి చెయ్యాలి, బుద్ధి చెప్పాలి.

రెండవదిగా, హితబోధను ఇంకా ఎక్కువగా తెలుసుకునేలా, ప్రేమించేలా ప్రోత్సహించాలి. ఈ రోజుల్లో వాక్యం 'ఏం చెప్తుంది' అని ఆలోచించేవారు తక్కువ అయిపోతున్నారు. తమ విశ్వాసాన్నీ, భక్తినీ అనుభవాల పైన కట్టుకునేవారూ, అలాగే ఏవో ప్రయోజనాలను ఆశించి భక్తి చేసేవారు ఎక్కువైపోతున్నారు. కానీ మన విశ్వాసాన్ని దేని పైన కట్టుకోవాలి అంటే - దేవుని వాక్యం పైన.

1 తిమోతి 4:6 - "ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడల,నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యములచేత పెంపారుచు క్రీస్తుయేసునకు మంచి పరిచారకుడవై యుందువు." ఎంతసేపూ పైపైన విషయాలు కాదు, సిద్ధాంతపరంగా కూడా వాక్యబోధను అధ్యయనం చేసేలా, ధ్యానించేలా, నేర్చుకునేలా ఇతరులకు ప్రోత్సహించాలి. దాని కోసం సమయాన్ని కేటాయించాలి. 'పెంపారుచు' అన్న మాటకి ఇంగ్లీష్ లో ఉన్న పదం 'being trained'.అయితే నువ్వే ముందుగా ఈ పని చెయ్యకుండా ఇతరులకు ఎలా చెప్పగలవు? ఇతరులను ఎలా ప్రోత్సహించగలవు? కాబట్టి ముందు నువ్వు తర్ఫీదు పొందటం ప్రారంభించి, నువ్వు ఎదుగుతూ ఇతరుల ఎదుగుదలకు దోహదపడు. ఏ పని చెయ్యడానికైనా ముందు నువ్వు మంచి మాదిరిని కనపరచి, అప్పుడు ఇతరులను ప్రోత్సహించే పని చెయ్యి. నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా అంశం గురించి నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు, ఆ అంశానికి సంబంధంచిన పుస్తకాలు ఏవో తెలుసుకోవాలి. తెలిసినవారిని అడగాలి, కనుక్కోవాలి. ఆ విధంగా నువ్వు మొదట వాక్యాన్ని హత్తుకుంటూ, ఇతరులు కూడా ఆ విధంగా చేయునట్లు ఉపదేశించి, బోధించి, హెచ్చరించి, బుద్ధి చెప్పుము.

మూడవదిగా, ప్రతి ఒక్కరికి వారి జీవన సంబంధమైన పిలుపు ఉంటుంది. నువ్వు కుటుంబంలో ఒక భార్యగానో, భర్తగానో, కొడుకుగానో, కూతురుగానో, తల్లిగానో, తండ్రిగానో ఉండటానికీ, అలాగే సంఘంలోనూ వేరు వేరు పాత్రలు పోషించడానికి పిలువబడి ఉండొచ్చు. వాటిని నిర్వర్తించే విషయంలో అనేక విధాలుగా ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలి, హెచ్చరించుకోవాలి. వృద్ధులైన స్త్రీపురుషులు యవ్వనస్థులకు ఎటువంటి పరిచర్య చెయ్యాలో ఇందాక చదివాము కదా. అలాగే తండ్రులకు పిల్లల విషయంలో ఎటువంటి బాధ్యతలు ఉంటాయో కూడా చదివాము. తీతుకు 2:3-5; ఎఫెసీ 6:4. జీవితంలో వేరు వేరు దశల్లో, వేరు వేరు పరిస్థితులగుండా వెళ్తున్నప్పుడు విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనకంటే ముందు నడిచినవారి యొక్క, మన కంటే అనుభవజ్ఞుల యొక్క మార్గదర్శకత్వము అందరికీ అవసరం. అటువంటి మార్గదర్శకత్వం కింద నువ్వు ఉంటూ, ఇతరులను నువ్వు నడిపించాలి. దేవుడు నీకు నేర్పించిన సంగతులను నీ తోటి సంఘ సభ్యులతో, నీ పిల్లలతో పంచుకోవడం నేర్చుకోవాలి. ఆ విధంగా కూడా ఈ బుద్ధి చెప్పడం, హెచ్చరించడం అనే పరిచర్య చెయ్యొచ్చు.

 

అయితే ఈ పరిచర్య ఎలా చెయ్యాలో తెలుసా?

ఎఫెసీ 4:15 - "ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము."

సత్యాన్ని చెప్పే విశ్వాసికి ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం గురించి ఈ వచనంలో ప్రస్తావించబడింది, అదే ప్రేమ. అన్ని సందర్భాల్లోనూ మృదువుగా, సౌమ్యంగా మాట్లాడటమే ప్రేమ అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే సౌమ్యంగా, ఆప్యాయంగా మాట్లాడాల్సిన సందర్భాలూ ఉంటాయి, గద్దించి, హెచ్చరించాల్సిన సందర్భాలూ ఉంటాయి. యేసు ప్రభువు కూడా సౌమ్యంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి, కొరడా చేత పట్టి గద్దించిన సందర్భాలూ ఉన్నాయి. ప్రేమకు మనం కొత్త నిర్వచనాలు ఇవ్వకుండా, వాక్యం ఆమోదిస్తున్న పరిధిలో సందర్భానుగుణంగా ప్రవర్తించగల జ్ఞానం మనకు అనుగ్రహించుబడునట్లు ప్రభువును వేడుకోవాలి. అయితే ఈ బుద్ధి చెప్పడం, హెచ్చరించడం అనే పరిచర్య చేసే వ్యక్తి యొక్క హృదయ వైఖరి ఎలా ఉండాలో ఈ వచనంలో చదువుతున్నాము. నీ సహోదరుని లేదా సహోదరి యెడల నీకున్న ప్రేమే వారికి ఈ పరిచర్య చేసేలా నిన్ను పురికొల్పేదైయుండాలి. కేవలం ఇతరుల తప్పులను ఎంచి చూపించి, వారిని కించపరచాలని కానీ, లేక ఏవో దురుద్దేశాలు కలిగి పైకి ప్రేమ నటిస్తూ ఇతరులకు హాని కలిగించాలని గానీ, ఇతరులను ద్వేషిస్తూ, వారి తప్పులను ఎత్తి చూపించి, అవమానించడం వంటి పాపాలు చెయ్యడానికి ఈ పరిచర్యను అడ్డుపెట్టుకోవద్దు. ఇది ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణం కాదు. ప్రేమ ఒక విశ్వాసిలో ప్రస్ఫుటంగా కనిపించే గుర్తు. మరీ ముఖ్యంగా ఈ బుద్ధి చెప్పడం, హెచ్చరించడం అనే పరిచర్య చేసే విశ్వాసి ప్రేమతో సత్యాన్ని బోధించేవాడయ్యుండాలన్నది జ్ఞాపకం ఉంచుకోండి.

1 కొరింథీ 13: 4-6 -

"4. .....ప్రేమ మత్సరపడదు.....; 5. అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు....; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.6. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.'

ముగింపు-

ఇలా ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవడం, సరి చేసుకోవడం వల్ల దేవుడు ఆశించిన విధంగా సంఘము ఎదిగే అవకాశం ఉంటుంది. తగ్గింపుతో, మర్యాదగా, ప్రేమతో ఇతరులను హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ, ఇతర విశ్వాసులకు నువ్వు ప్రయోజనకరంగా ఉండునట్లు దేవుడు నీ యెడల కృప చూపించును గాక. ఆమెన్.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.