దుర్బోధలకు జవాబు

రచయిత: జి. బిబు

 నేటి క్రైస్తవ సమాజంలో కొందరు బోధకులు ఆయా లేఖనభాగాలను అపార్థం చేసుకుంటూ, రక్షణ, పాపక్షమాపణ మరియు పరిశుద్ధాత్మను పొందడానికి బాప్తీస్మమే ఏకైక మార్గమని‌ బోధిస్తున్నారు.

రక్షణ కృపచేత, విశ్వాసము ద్వారా మాత్రమే అని బోధించిన అపోస్తలుల సువార్తకు ఇది భిన్నమైనదే ఔతుంది. ఈ లేఖనం చూడండి.

యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును.
(రోమా 10:9,10).

హృదయంలో విశ్వసించి, దానిని నోటితో ఒప్పుకోవడం వల్ల ఒక వ్యక్తికి నీతి మరియు రక్షణ లబిస్తుందని పై వాక్యభాగం స్పష్టంగా బోధిస్తుంది. 

అదేవిధంగా; మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియలవలన కలిగినదికాదు గనుక ఎవడును అతిశయపడవీలు లేదు. మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్దపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము (ఎఫెసీ 2:8-10).

పై వచనాలలో, ఏ సత్ క్రియను బట్టి మనం రక్షించబడమని అయితే రక్షింపబడేది దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్ క్రియలు చేయటం కొరకే అని మనం చదువుతాం. కాబట్టి బాప్తీస్మమనే సత్ క్రియ ద్వారా మనం రక్షించబడం కానీ రక్షణ పొందిన పిదప బాప్తీస్మమనే సత్ క్రియలో ఖచ్చితంగా పాల్గొనాలి. అయితే రక్షణ మాత్రం కృపచేత విశ్వాసం ద్వారా మాత్రమే కలుగుతుంది. బాప్తీస్మం వల్ల  కానీ, మరే ఇతర సత్ క్రియల వల్ల కానీ కాదు. సున్నతివల్ల రక్షణ కలుగుతుందని ఆదిమసంఘంలో కలవరం సృష్టించిన యూదా క్రైస్తవులవలే బాప్తిస్మం వల్ల రక్షణ కలుగుతుందని నేటి సంఘాన్ని కలవరపరుస్తున్నారు కొందరు బోధకులు.

అయితే వారు రక్షణ మరియు పాపక్షమాపణ పొందటానికి బాప్తిస్మం అవసరమనే వారి బోధకు ఆధారం చేసుకున్న లేఖనభాగాల మాటేమిటి? 

ఆ లేఖనాలు బాప్తీస్మం వల్లే రక్షణ కలుగుతుందని చెప్పేమాట వాస్తవం కాదా? కాదు! సందర్భసహితంగా బైబిల్ సమగ్ర బోధ వెలుగులో ఆ లేఖనభాగాలను చదివినప్పుడు, అసలు బాప్తిస్మం ద్వారా రక్షణ, పాపక్షమాపణ, మొదలైనవి కలుగుతాయని బోధించే ఒక్క వాక్యం కూడా బైబిల్లో లేదనే నిర్ధారణకు ఖచ్చితంగా మనం రాగలం.  

ఆ లేఖనభాగాలను వరుసగా పరిశీలిద్దాం.

1. “ఒకడు నీటిమూలముగానూ, ఆత్మ మూలముగానూ జన్మించితేనే గాని దేవుని రాజ్యములోప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యోహను 3:5)

ఇక్కడ 'నీటిమూలముగా' అనే మాట చూసిన వెంటనే ఇది నీటిబాప్తిస్మం గురించి మాట్లాడుతుందనీ, తిరిగి జన్మించడానికి ఈ నీటి బాప్తిస్మం అవసరమనీ కొందరు భావిస్తున్నారు.

అయితే ఇదే సువార్తలో  “నీరు జలం” అనే మాట అనేక పర్యాయాలు (యోహాను 4:14; 7:37,38) సాదృశ్యరీతిగా వాడబడిందనే సాధారణ విషయాన్ని కూడా వారు గ్రహించలేకపోవడం బహుశోచనీయం. యేసు ఈ సువార్తలోని తన బోధలలో నీటిని సాదృశ్యరీతిగా వాడిన విధంగా, ప్రస్తుత సందర్భంలో కూడా అది సాదృశ్యరీతిగానే వాడబడిందనటంలో ఏ మాత్రమూ సందేహం లేదు.

అయితే ఇక్కడ 'నీరు' దేనికి సాదృశ్యంగా వాడబడింది? బైబిల్ జాగ్రతగా చదివితే దీనికి జవాబు కనుగొనడం అంత కష్టమేమీ కాదు. ఇక్కడ “నీరు” తిరిగి జన్మింపజేసే సాధనానికి సాదృశ్యంగా వాడబడిందనేది వాస్తవమే. ఇంతకూ ఏమీటా సాధనం? నీటి బాప్తిస్మమా ? ఆ విధంగా అనుకోవడానికి బైబిల్లో ఒక్క వచనం కూడా సమ్మతించదు. అందుకు భిన్నంగా నూతనజన్మ కలిగించే సాధనం గురించి ప్రస్తావించబడిన ప్రతీ ఇతర లేఖనభాగాలు దేవుని వాక్యమే ఆ సాధనమని స్పష్టంగా రూఢిపరుస్తున్నాయి.

ఈ క్రింది వచనాలను జాగ్రత్తగా గమనించండి.

“నీ వాక్యము నన్ను బ్రదికించియున్నది”  (కీర్తన 119:50). 

 “యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని” (1 కొరింథీ 4:16).

"సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను” (యాకోబు 1:18).

“మీరు క్షయబీజమునుండికాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయబీజమునుండి పుట్టింపబడినవారు” (1పేతురు 1:23).

పై వచనాలలో నూతనజన్మకు సాధనంగా పేర్కోబడిన వాక్యానికి ప్రత్యామ్నాయంగా మరే సాధనమూ లేఖనాలలో పేర్కొనబడలేదు. కాబట్టి మన ప్రస్తుత సందర్భంలో కూడా నూతన జన్మకు సాధనంగా పేర్కొనబడిన 'నీరు', వాక్యాన్నే సాదృశ్యపరుస్తుందని నిస్సందేహంగా తేల్చిచెప్పవచ్చు.

ఎఫెసీయులకు 5: 27 నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదక స్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.

వాక్యం, అదిచేసే ఆయా కార్యాలకు తగిన సాదృశ్యాలతో అభివర్ణించబడింది.

మనం నడవవలసిన మార్గాన్ని నిర్దేశిస్తుంది గనుక వాక్యం 'వెలుగు'గా అభివర్ణించబడింది. (కీర్తనలు 119:105).

రాతి హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది కాబట్టి వాక్యం 'సుత్తి'గా అభివర్ణించబడింది నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా? ' (యిర్మీయా 23:29). 

అదే విధంగా వాక్యం శుద్దీకరించి, పవిత్రపరచి, నూతనపరుస్తుంది కనుక 'నీరు'గా అభివర్ణించబడింది. (కీర్తనలు 119:9, యోహాను 15:3; యోహాను 17:17; ఎఫెస్సీ 5:26). పరిశుద్ధాత్మే నూతన జన్మకు కారకం; నీరు (వాక్యం) అందుకు సాధనం.

2. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును.

(మార్కు 16:16). ఇది 'బాప్తిస్మం ద్వారా రక్షణ' అనే తప్పుడు సువార్తను బలపరచుకోవడానికి కొందరు దుర్వినియోగపరచిన మరొక లేఖనభాగం. కానీ అటువంటి సువార్తను ఈ వచనం ఏ మాత్రం సమర్థించదు. ఈ వచనం యొక్క తరువాత భాగంలో “నమ్మనివానికి శిక్ష విధింపబడును" అని ఉంది కానీ 'నమ్మని, బాప్తిస్మము పొందని వానికి శిక్ష విధింపబడును' అని లేదు. అంటే ఒక వ్యక్తి బాప్తీస్మం పొందినా సరే అతడు యథార్థమైన విశ్వాసి కాకపోతే బాప్తీస్మం వల్ల అతనికి ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి రక్షించేది కృప ఉత్పన్నం చేసే విశ్వాసం మాత్రమే.

ఈ విధంగా అంతరంగంలో జరిగే మార్పుకు బాప్తిస్మం ఒక బహిరంగ సాక్ష్యం  (రోమా 6:4-5). కాబట్టి యథార్థంగా నమ్మిన ప్రతివాడూ బాప్తిస్మం ఖచ్చితంగా పొందుతాడు. ప్రభువు అనుగ్రహించిన రక్షణను బహిరంగంగా, ఆయన ఆజ్ఞాపించిన విధానంలో (అనగా బాప్తీస్మం ద్వారా), సాక్షీకరించేందుకు విధేయత చూపని వ్యక్తి యథార్థంగా నమ్మాడని అనుకోవడానికి ఏ ఆస్కారం లేదు. అయితే అలా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు; అంత మాత్రాన బాప్తీస్మమే రక్షణకు కారకమని, లేక ఏకైక మార్గమని బోధించడం బైబిల్ లోని సువార్తకు వ్యతిరేకం.

ఆ మాటకొస్తే యేసుతో సిలువ వేయబడి, విశ్వాసంతో మారుమనస్సు పొందిన దొంగ బాప్తీస్మం లేకుండానే పరదైసులో ఆయన ఆనందంలో పాలివాడు కాలేదా? ఇందుకు భిన్నంగా బాప్తీస్మం పొందినప్పటికీ తన విశ్వాసం యథార్థమైనది కానందున గారడీ సీమోను “నీ వెండి నీతో కూడా నశించును గాక” అనే శాపానికి గురికాలేదా? రక్షణననుగ్రహించేది బాప్తీస్మం అనే బాహ్య ఆచారమైన కర్మకాండ కాదని ఋజువు పరచటానికి ఈ నిదర్శనాలు సరిపోవా?.

ఔను నపుంసకునిలా (అపో 8:36-38), చెరసాల అధికారి యొక్క ఇంటివారిలా (అపో 16:31-33) ఏ మాత్రమూ తడవు చేయకుండా నమ్మిన వెంటనే బాప్తీస్మం పొందాలనే ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. అయితే క్రైస్తవుడు ఏ సత్క్రియ చేసినా (అది బాప్తీస్మమైనా సరే, ప్రభుబల్ల ఆచరించడం అయినా సరే, ఇంకేదైనా సరే) దానిని రక్షణ పొందటానికి చేయడు కానీ, రక్షణ పొందాడు కాబట్టి చేస్తాడు. “అది కృపచేతనైన యెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును” (రోమా 11:6) అందుకే 'నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును' అనే మాటలో బాప్తిస్మం అతని రక్షణకు రుజువనే తప్ప కారకం అనే అర్థాన్ని ఇవ్వదు.

3. “దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే.”
(1 పేతురు 3:21) ఇది బాప్తీస్మం ద్వారానే రక్షణ అని బోధించేవారు దుర్వినియోగం చేస్తున్న మరో లేఖనం.

ఈ వచనంలోకూడా, దాని తరువాత భాగాన్నీ శ్రద్దగా చదివితే అక్కడ బాప్తిస్మమని పేర్కొనబడినదేంటో స్పష్టంగా నిర్వచించబడింది “అదేదనగా (బాప్తీస్మమని పేర్కొనబడినది) శరీరమాలిన్యము తీసివేయుట కాదుగాని (ఇది నీటిలో మునిగి లేచుట వలన కలగవచ్చేమో గాని) యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే (ఇది అంతరంగంలో కలిగే మార్పు వల్ల మాత్రమే సాధ్యపడుతుంది). కాబట్టి కాస్త లోతుగా ఆలోచించినప్పుడు రక్షించేది నీటిలో మునిగి లేచే కర్మకాండ కాదు కానీ అది సాదృశ్యపరిచే అంతరంగిక మార్పు మాత్రమేనని స్పష్టమౌతుంది. 

కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలో నుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతన జీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడా పాతిపెట్టబడితిమీ. మరియు ఆయన మరణముయొక్కసాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైనయెడల, ఆయన పునరుత్థానము యొక్కసాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము.” (రోమా 6:4-5)
 
యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలలో ఐక్యం చేయబడే రక్షణ అనుభవానికి బాప్తీస్మం కేవలం ఒక సాదృశ్యం మాత్రమే. ఈ అంతరంగిక రక్షణానుభవమే 1పేతురు 3:21లో ప్రస్తావించబడిన బాప్తిస్మం. ఇది అంతరంగంలో జరిగిన తర్వాత అవకాశం ఉన్న ప్రతీ వ్యక్తి ఏ మాత్రం ఆలస్యం  చేయకుండా ఇందుకు సాదృశ్యమైన నీటి బాప్తీస్మం తప్పక తీసుకోవాలి. అయితే అటువంటి రక్షణ అనుభవమేదీ లేకుండా నీటిబాప్తీస్మం తీసుకుంటే అది కేవలం “శరీర మాలిన్యమును తీసివేయుట” మాత్రమే ఔతుంది కాని “యేసు క్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమ'ని ఎలా అనబడుతుంది? అందుకే బాప్తీస్మం వల్ల రక్షణ కలుగుతుందనే వారి అపార్థానికి ఈ వచనంలో కూడా తావులేదు.

4. “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్దాత్మ అను వరము పొందుదురు” (అపొ. 2:38) ఈ వచనాన్ని మరియు అపో 22:16నూ ఆధారం చేసుకుని బాప్తిస్మం వల్ల మాత్రమే పాపక్షమాపణ లభిస్తుందనీ, మరేవిధంగానైనా పాపక్షమాపణ లభించదని కొందరు భావిస్తుంటారు కానీ, యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును” (1యోహను 1:7) అనే వాక్యాన్ని వారు విడిచిపెడుతున్నారు. నీటిలో మునిగి లేవటం, పాపాలని కడిగివేయటానికి చాలినదైతే, యేసు క్రీస్తు సిలువలో మరణించటం వ్యర్థం.  దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపటం మాని కేవలం బాప్తీస్మమిచ్చే యోహానుతోనే ఆ పనిని జరిగించి ఉండేవాడు.

మరి వారు ఉదహరించిన అపోస్తలుల కార్యములు 2:38వ లేఖనం మాటేమిటి? ఈ వచనంలో “నిమిత్తము' అనే మాట εἰς (ఎయిస్) అనే గ్రీకుపదం నుండి అనువదించబడినది. 'ఎయిస్' అనే ఈ పదాన్ని సందర్భాన్ని అనుసరించి 'నిమిత్తము', 'లోనికి', ‘ఆధారముగా', ఇలా అనేక విధాలుగా అనువదించవచ్చు. కాబట్టి “మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి” అనే మాటను 'మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ ఆధారముగా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని కూడా అనువదించవచ్చును.

ఈ విధంగా అనువదిస్తే ఈ వచనానికి ఒక సరికొత్త అర్థం వస్తుంది. కాబట్టి “ఎయిస్” అనే మాటకు “నిమిత్తము” అనే సంశయాస్పద అనువాదాన్ని ఆధారం చేసుకుని పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం అవసరమని తీర్మానించి, క్రియల ద్వారా రక్షణ కలగదనే స్పష్టమైన లేఖన సత్యాన్ని కూలద్రోయటం సమంజసం కాదు. 

అదేవిధంగా అపోస్తలుల కార్యాలు 22:16లోని “నీ పాపములను కడిగివేసికొనమనే" మాటను ‘బాప్తీస్మము పొంది' అనేమాటతో కాక ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి' అనేమాటతో జోడించి అర్థం చేసుకోవాలనీ, కాబట్టి 'బాప్తిస్మం వల్ల పాపములు కడిగివేయబడుట' అనే బోధకు ఇక్కడ ఏమాత్రం తావులేదని ఇంగ్లీషు కింగ్ జేమ్స్ అనువాదంలో ఈ వచనాన్ని చదివిన ఎవరైనా సులభంగా గ్రహించగలరు. కాబట్టి "baptismal regeneration" (బాప్తీస్మం ద్వారా రక్షణ) అనేది పూర్తిగా వాక్యభిన్న సువార్త. ఇది అపోస్తలీయ సువార్తకు వ్యతిరేకమైనది.

మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక దూతయైనను మీకు ప్రకటించినయెడల అతడు శాపగ్రస్తుడవును గాక (గలతీయులకు 1:8).

అయితే రక్షణపొందినవారికి బాప్తీస్మం అవసరం‌లేదనే బోధకూడా బైబిల్ కి‌ వ్యతిరేకమైన బోధనే అని ప్రత్యేకంగా గమనించాలి. ఉద్దేశపూర్వకంగా బాప్తీస్మం తీసుకోకపోవడం దేవుని వాక్యానికి అవిధేయత చూపించడమే ఔతుంది.

పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి (లూకా సువార్త 7:30).

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : హితబోధ ఎప్పుడూ, ఎవ్వరినీ ఆర్థిక సహాయం కోరదు; ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.