నిజ క్రైస్తవ జీవితం

రచయిత: జోనాథన్ ఎడ్వర్డ్స్
అనువాదం: నగేష్ సిర్రా
చదవడానికి పట్టే సమయం: 44 నిమిషాలు

ఆడియో

నామకార్థ క్రైస్తవులకు హెచ్చరిక 
(లేదా)
దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో పాలిభాగస్థులౌతూనే, ఏదైనా తెలిసిన దుష్టత్వంలో జీవిస్తున్నవారి మహాపరాథం

విషయసూచిక

  1. భాగము - 1 దేవుడు నియమించిన సంస్కారాలు పరిశుద్ధమైనవి ఆ దైవిక సంస్కారాలు ఈ క్రింది కారణాలను బట్టి పరిశుద్ధమైనవి
  2. భాగము - 2 దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో పాల్గొంటూనే దుష్ట మార్గాల్లో జీవించేవారు వాటిని భయంకరంగా అపవిత్రపరుస్తున్నారు
  3. భాగము - 3 ఆత్మ పరిశీలనకు పిలుపు
  4. భాగము - 4 దైవిక సంస్కారాలలో పాల్గొంటూనే తెలిసి తెలిసి పాపంలో జీవిస్తున్నవారికి ఒక మాట

జొనాతన్ ఎడ్వర్డ్స్ గారు మరణించిన తర్వాత ఈ కింది వాక్యభాగంపై ప్రచురించబడిన రెండు ప్రసంగాల సారాంశమే ఈ కరపత్రిక. ఇది 1788లో ఎడిన్ బర్గ్ లో ముద్రించబడింది.

వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్టించిరి. వారీలాగున నాయెడల జరిగించుచున్నారు. అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్యదినములుగా ఎంచిరి (యెహెజ్కేలు 23: 37,38,39).

అంశం:
దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో పాల్గొంటూనే, ఏదైనా తెలిసిన దుష్టత్వంలో జీవిస్తున్నవాళ్ళు ఆ సంస్కారాలను అత్యంత భయంకరంగా అపవిత్రపరుస్తూ, కలుషితం చేస్తూ, దోషులౌతున్నారు. ఇక్కడ సమరయ,యెరూషలేములనూ (లేదా) ఇశ్రాయేలు,యుదాలనూ అహోలా,అహోలీబా అనే ఇద్దరు స్త్రీలతో పోల్చడం జరిగింది. తమ నిబంధనా‌ దేవునికి వ్యతిరేకంగా ఈ రెండు రాజ్యాల ప్రజలు జరిగించిన విగ్రహారాధన మరియు ద్రోహం ఈ ఇద్దరు స్త్రీలు జరిగించిన వ్యభిచారంతో సూచించబడ్డాయి. తమకు భర్తయైన, యవ్వనకాలంలో తమకు మార్గదర్శియైన దేవుణ్ణి వాళ్ళు విసర్జించి, ఇతరులతో వ్యభిచరించారు. తమకు భర్తయైన దేవుని యెడల అహోలా,అహోలీబాలు జరిగించిన నీచత్వం, "వ్యభిచారం" మరియు "రక్తపాతం" అనే రెండు పాపాల ద్వారా సూచించబడుతుంది. వాళ్లు వ్యభిచారం చేశారు, వాళ్ల చేతులు రక్తాన్ని ఒలికించాయి.

1. వారు తమ ఇతర ప్రియులతో అనగా తమ విగ్రహాలతో వ్యభిచరించారు.
2. వాళ్లు వ్యభిచరించడమే కాదు, తాము దేవునికి కనిన తమ బిడ్డల్ని తీసుకుని తమ ప్రియుల కొరకు వారిని చంపారు. తమకు పెనిమిటియైన దేవునికి వాళ్ళ హృదయాలు ఎంతో దూరమయ్యాయి. వాళ్ళు తమ ప్రియుల మోజులో పడి ఎంతగా మోసపోయారంటే, వారు విందు చేసుకోవడానికి, తమ భర్తకు వారు కనిన తమ సొంత పిల్లల్ని తీసుకుని వాళ్ళను క్రురాతిక్రూరంగా చంపారు. 37వ వచనంలో చెప్పబడినట్టు "నాకు కనిన కుమారులను విగ్రహములు మింగినట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి". అయితే వాళ్ళు జరిగించిన చర్యలోని రెండంతల దుష్టత్వం ఈ మాటల్లో కనిపిస్తుంది.

వారు చేసినవి దుష్టమైన క్రియలు. తమకు భర్తయైన దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేసిన ఘోరమైన నీచత్వాన్ని ఎవరు వ్యక్తపరచగలరు? అయితే అది చాలదన్నట్టు ఈ క్రియలను వారు పవిత్రమైనవాటితో కలిపి రెండంతల దుష్టత్వంగా మార్చారు. ఎందుకంటే, వారు ఆ దుష్టక్రియలను చేయడంతో పాటు అదే రోజున దేవుని పరిశుద్ధాలయ ప్రాంగణంలోనికి వచ్చారు; అది వారి దోషాన్ని మరింత అధికం చేసింది. మరోవిధంగా చెప్పాలంటే వాళ్ళు దుష్టత్వంలో జీవిస్తూనే దేవుని మందిరంలోకి ప్రవేశించి, అక్కడ జరుగుతున్న పవిత్ర సంస్కారాల్లో పాల్గొన్నారు. ఆయనను అత్యంత ఘోరమైన రీతిలో అవమానపరుస్తూనే ఆయనను ఆరాధిస్తున్నట్టు, ఘనపరుస్తున్నట్టు నటించారు. ఆ విధంగా వాళ్ళు పవిత్రమైనవాటిని అపవిత్రం చేశారు, మలినం చేశారు. 38,39 వచనాల్లో ఈ విషయం రాయబడింది. "అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినముగా ఎంచిరి. తాము పెట్టుకొనిన విగ్రహముల పేరిట నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినముగా ఎంచిరి, తాము పెట్టుకొనిన విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధ స్థలములో చొచ్చి దానినపవిత్రపరచి, నా మందిరంలోనే వారీలాగున చేసిరి".

ఉపదేశం:
దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో పాల్గొంటూనే ఏదైనా ఘోరమైన దుష్టత్వంలో జీవిస్తున్నవాళ్లు ఆ సంస్కారాలను అత్యంత భయంకరంగా అపవిత్రపరుస్తూ, కలుషితం చేస్తూ దోషులౌతున్నారు.

పవిత్ర సంస్కారాలు అన్నపుడు దేవునిచేత స్థాపించబడిన లేదా నియమించబడిన ఆచారాలు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకు వివాహ వ్యవస్థను స్థాపించింది దేవుడే కాబట్టి వివాహాన్ని మనం "పవిత్ర సంస్కారం" అని పిలుస్తుంటాం. అయితే సాధారణంగా ఈ పదాన్ని మనం ఆరాధన నిమిత్తం నియమించబడిన పద్ధతులను సూచించడానికే ఉపయోగిస్తుంటాం. ప్రభువు బల్లలో పాల్గొనడం, బహిరంగ ప్రార్థన, స్తుతి కీర్తన, వాక్యప్రకటన, వాక్యం వినడం అనేవి పవిత్ర సంస్కారాలు. ఎందుకంటే ఇవన్నీ దేవునిచేతే నియమించబడ్డాయి.

సంఘంలో కొంతమంది పరిచారకులను ప్రత్యేకించడం, సంఘక్రమాన్ని కలిగుండడం, చేసిన అక్రమాలను బహిరంగంగా ఒప్పుకోవడం, గద్దించడం, గద్దింపుకు లోబడనివారిని‌ బహిష్కరించడం ఇవన్నీ దేవుని‌చేత నియమించబడిన సంస్కారాలే. వీటిని దేవుని ఇంటికి సంబంధించిన ఆజ్ఞలనీ, బహిరంగ ఆరాధనకు సంబంధించిన నియమాలు‌ అనీ అంటారు. ఇలాంటి పవిత్ర సంస్కారాలను అపవిత్రం చెయ్యడం గురించి ఈ వాక్యభాగంలో చెప్పబడింది. "వారు నా పరిశుద్ధ మందిరములో చొచ్చి దానినపవిత్రపరచి, నా మందిరంలోనే వారీలాగున చేసిరి" అని దేవుడు చెబుతున్నాడు. ఈ ఉపదేశంలో రెండు అంశాలున్నాయి.

భాగము - 1
దేవుడు నియమించిన సంస్కారాలు పరిశుద్ధమైనవి
ఆ దైవిక సంస్కారాలు ఈ క్రింది కారణాలను బట్టి పరిశుద్ధమైనవి

1. అవి పూర్తిగానూ, ప్రత్యేకంగానూ దేవునికీ మరియు దైవిక విషయాలకూ సంబంధించినవి. దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో మనం పాల్గొన్నప్పుడు మనం దేవుని ప్రత్యేకమైన సన్నిధిలో ఉంటాము. మనుషులు వచ్చి దైవ సంస్కారాల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు దేవుని ముందుకు వచ్చారనీ, ఆయన సన్నిధిలోనికి ప్రవేశించారనీ వాక్యం చెబుతుంది. "నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు.." (యిర్మీయా 7:10). "ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి" (కీర్తన 100:2).

దైవిక సంస్కారాల ద్వారా మనుషులు నేరుగా దేవునితో సంబంధంలోనికి వస్తారు. ప్రార్థనల ద్వారా స్తుతికీర్తనల ద్వారా ఆయనతో మాట్లాడడం, అలాగే వాక్యాన్ని మౌనంగా భక్తిశ్రద్ధలతో వినడంవల్ల ఆయన నుండి ఆధ్యాత్మిక మేలులు పొందుకోవడం ద్వారా ఇది జరుగుతుంది. ఇలా మనుషులు దేవునితో సంభాషించడానికి మరియు సహవాసం చేయడానికే ఈ సంస్కారాలను ఆయన నియమించడం జరిగింది. మనం నిరుపేదలం, అజ్ఞానులం, గుడ్డివారం, మట్టి పురుగుల్లాంటి వాళ్ళం. మనకు నచ్చిన మార్గంలో తనతో సంభాషించడం శ్రేయస్కరమని దేవునికి తోచలేదు కాబట్టి ఆ అవకాశాన్ని ఆయన మనకివ్వలేదు‌. కానీ ఆయనతో సంభాషించేందుకు మార్గాలుగా కొన్ని సంస్కారాలను ఆయనే మనకొరకు నియమించాడు.

ఈ సంస్కారాల్లో పరిశుద్ధమైన దైవికమైన విషయాలను దేవుడు మనకు చూపిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. దేవుని వాక్యప్రకటన ద్వారా తన పరిశుద్ధ ఆజ్ఞలనూ, దైవచిత్తాన్నీ ఆయన చూపిస్తున్నాడు. అదేవిధంగా ప్రభువు బల్లలో పాల్గోవడం ద్వారా మనకుండవలసిన విశ్వాసం, ప్రేమ, విధేయతలు ఆయన నేర్పిస్తున్నాడు.

2. దేవుడు నియమించిన సంస్కారాల ఉద్దేశం పరిశుద్ధమైనది. దేవుణ్ణి మహిమపరచడమే వాటి సత్వర లక్ష్యం. విశ్వాసం, ప్రేమ, భయభక్తులు, విధేయత, కృతజ్ఞత, పవిత్రమైన ఆనంద దుఃఖాలు, పవిత్రమైన కోరికలు, తీర్మానాలు, ఆశలు తదితర పరిశుద్ధమైనవాటిని అభ్యాసం చేయడానికి ఈ సంస్కారాలను దేవుడు నియమించాడు. నిజమైన ఆరాధనలో పవిత్రమైన ఆత్మ సంబంధమైన ఈ అభ్యాసాలుంటాయి. ఈ దైవికసంస్కారాలు ఆరాధనకు సంబంధించినవి. కాబట్టి ఆరాధనలో మనకు సహాయపడడానికి మరియు మనల్ని నడిపించేందుకే అవి ఉన్నాయి.

3. ఈ సంస్కారాలు నియమించబడింది దేవునితో సంభాషించడానికి, దేవుని నుంచి ఆశీర్వాదం పొందడానికి, దైవికమైన పవిత్రమైన ఆరాధనలో మనల్ని నడిపించి మనకు సహాయపడడానికి మాత్రమే కాదు కానీ వాటికొక దైవికమైన, పరిశుద్ధమైన కారకుడున్నాడు. అనంతమైన గొప్పతనాన్నీ పరిశుద్ధతనూ కలిగి, నిత్యమూ త్రియేకునిగా ఉన్న దేవుడే వాటిని నియమించాడు. వాటి నియామకంలో త్రిత్వంలోని ప్రతీవ్యక్తి పాత్రా ఉంది. తండ్రియైన దేవుడు తన సొంత కుమారుని ద్వారా వాటిని నియమించాడు. కుమారుడు తండ్రి నుంచి వాటిని పొందాడు, కాబట్టి వాటిని క్రీస్తు స్వయంగా నియమించాడు. "ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో యేమి మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకాజ్ఞ ఇచ్చియున్నాడు" (యోహాను 12:49). తండ్రి కుమారులు వాటిని పరిశుద్ధాత్మ చేత సంపూర్ణంగా వెల్లడి చేశారు, ఆమోదించారు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అవి లేఖనాలుగా రాయబడ్డాయి.

దేవుడే వాటిని పరిశుద్ధపరచి ప్రతిష్టించాడు కాబట్టి అవి పరిశుద్ధమైనవి. అవి పరిశుద్ధమైనవాటికి సంబంధించినవి. మనం పరిశుద్ధమైనవాటి గురించి శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు వాటిని నియమించాడు. అవి పరిశుద్ధమైన వినియోగం నిమిత్తమే ఉన్నాయి. తన సొంత అధికారంతో పరిశుద్ధమైన వినియోగం నిమిత్తం వాటిని నియమించింది సాక్షాత్తు దేవుడే కాబట్టి అవి మరెంతో పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. దేవుని హస్తం లేకపోతే అవి సాధారణమైనవాటిగానే పరిగణించబడి ఉండేవి.

4. ఈ సంస్కారాలన్నీ దేవునినామంలోనే ఆచరించబడతాయి. మాటలోనైనా, క్రియలలోనైనా మనం చేసేదంతా క్రీస్తు నామంలోనే చెయ్యాలని లేఖనం మనకు ఆజ్ఞాపిస్తుంది (కొలస్సీ 3:17 ). ఈ నియమం ప్రత్యేకంగా ఈ సంస్కారాల విషయంలో వర్తిస్తుంది. సంఘంలో ఏర్పరచబడిన సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, క్రీస్తు రాయబారులుగానూ, క్రీస్తుకు జతపనివారుగానూ దేవుని నామంలోనే వాళ్ళు మాట్లాడతారు. "మేము క్రీస్తుకు రాయబారులము" (2 కొరింథీ 5:20). "మేము ఆయన తోడి పనివారమైయున్నాము" (2 కొరింథీ 6:1). నిజసేవకుడు ప్రకటిస్తున్నప్పుడు అతడు దేవోక్తులనే పలుకుతున్నట్టు ప్రకటిస్తాడు (1 పేతురు 4:11). ఆ సేవకుణ్ణి క్రీస్తుకు ప్రతినిధిగా పరిగణిస్తూ అతడు ప్రకటించేదానిని అందరూ వినాలి.

సంస్కారాలను నిర్వహిస్తున్న సేవకుడు క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. క్రీస్తు నామంలోనే అతడు బాప్తిస్మం ఇస్తాడు. ప్రభురాత్రి భోజనంలో ఆయనకు బదులుగా తానుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. సంఘంలో క్రమశిక్షణను కూడా అతడు క్రీస్తు నామంలోనే అమలు చేస్తాడు (2 కొరింథీ 2:10). అదేవిధంగా సంఘం కూడా మధ్యవర్తియైన క్రీస్తు నామంలోనే ప్రార్థనలను, స్తుతులను దేవునికి చెల్లిస్తుంది, ఎందుకంటే సంఘానికి దేవునియెదుట క్రీస్తే ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయన ద్వారానే సంఘం దేవుని దగ్గరకు రాగలదు.

భాగము - 2
దైవారాధనకు సంబంధించిన సంస్కారాల్లో పాల్గొంటూనే దుష్ట మార్గాల్లో జీవించేవారు వాటిని
భయంకరంగా అపవిత్రపరుస్తున్నారు

దేవుని మందిరంలోనికి దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి వచ్చి దైవనియమం ప్రకారం బహిరంగ ఆరాధనలో తమ విధులకూ, కార్యక్రమాలకూ హాజరౌతూ దేవుని నామంతో మొరపెట్టడానికీ, ఆయనను స్తుతించడానికీ ఆయన వాక్యాన్ని వినడానికీ, క్రీస్తు యొక్క మరణాన్ని స్మరించుకోవడానికీ, ఇతరులతో నటిస్తూ అదే సమయంలో దేవుని వాక్యంలోని స్పష్టమైన నియమాలకు విరుద్ధంగా దుష్టమార్గాల్లో ఉద్దేశపూర్వకంగా ఏకీభవించే వాళ్ళు దేవుని పవిత్రమైన ఆరాధనను ఘోరంగా అపవిత్రపరుస్తున్నారు. దేవాలయాన్నీ, పవిత్రమైన దైవకార్యాలనూ మలినం చేస్తున్నారు. ఈ మాటలోని సత్యాన్ని ఈ క్రింది విధంగా ధ్యానం చేద్దాం.

1. దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే దుష్టత్వంలో జీవిస్తున్నవాళ్ళు ఆ పవిత్రమైన సంస్కారాల యెడల తీవ్రమైన అమర్యాదనూ, అవమానాన్నీ ప్రదర్శిస్తున్నారు. దుష్టత్వంలో జీవిస్తూ "ఆ దినమందే" అన్నట్టుగా పవిత్రమైన, ఉన్నతమైన ఆరాధనలోనూ దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ, దేవుని మందిరం నుంచి నేరుగా వెళ్ళి మరలా దుష్టకార్యక్రమాల్లో నిమగ్నమయ్యేవారు పరిశుద్ధమైన వాటియెడల అత్యంత అమర్యాదకరమైన వైఖరిని కనపరుస్తున్నారు. దేవుని పవిత్రమైన నియమాల యెడల భయంకరమైన ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఈ నియమాలను పవిత్రపరిచిన దేవుడంటే వారికి ఏ మాత్రమూ గౌరవం లేదని వాళ్ళు రుజువు చేస్తున్నారు. వాటిని వ్యవస్థీకరించిన దైవాధికారం యెడల వారికున్న ధిక్కారాన్ని కనపరుస్తున్నారు. ఏ దేవుని సన్నిధికైతే వాళ్ళు వస్తున్నారో, సంస్కారాల విషయంలో వాళ్ళు ఎవరికైతే లెక్క చెప్పాలో, ఏ దేవుని నామంలో ఈ సంస్కారాలను వాళ్ళు నెరవేర్చాలో ఆయన యెడల అత్యంత అమర్యాదకరమైన వైఖరిని కనపరుస్తున్నారు. దేవుని శాసనాలను ఆయన యెడల ఆరాధనాభావాన్నీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, సాత్వికాన్నీ, విధేయతనూ, స్తుతినీ వ్యక్తపరచడానికి దేవుడు నియమించిన ఈ సంస్కారాల యెడల వాళ్ళు ద్వేషాన్ని కనపరుస్తున్నారు.

వాళ్ళు దేవుని ముందుకు ఎంతో నిర్లక్ష్యధోరణితో వస్తున్న విధానమే వారి అమర్యాదకరమైన వైఖరిని చూపిస్తుంది. దేవునిముందుకు యోగ్యమైన విధంగా రావడానికి తమను తాము వాళ్ళు శుద్ధీకరించుకోవడానికీ, పవిత్రపరచుకోవడానికీ రవ్వంతైనా శ్రద్ధ కనపరచరు. మరింత అపవిత్రంగా, మురికిగా తమను తాము మార్చుకోకుండా ఉండాలని వాళ్ళు అస్సలు ఎలాంటి ప్రయత్నమూ చెయ్యరు. దేవుడు దుష్టత్వాన్ని చూడలేనంత నిష్కల్మషమైన నేత్రాలు కలిగినవాడనీ, దోషాన్ని చూసి భరించలేడనీ, పాపమంటే ఆయనకెంతో అసహ్యమనీ వాళ్ళకు అనేకసార్లు బోధించబడింది. అయినా సరే ఆయన సన్నిధిలోకి ఎంత అపవిత్రంగా, హేయంగా వస్తున్నారో వాళ్ళు ఏ మాత్రమూ పట్టించుకోరు. ఆవిధంగా దేవుని సన్నిధిలోనికి రావడానికి వారేమాత్రమూ భయపడకపోవడంలోనూ, పరిశుద్ధమైన కార్యక్రమాలకు హాజరైన తరువాత దేవుని సన్నిధి నుంచి నేరుగా పాపిష్ఠి కార్యాలువైపు తిరిగివెళ్ళడానికి సాహసించడంలోనూ వారి అమర్యాద మరియు ధిక్కారణ కనబడుతున్నాయి.

దేవుని యెడల, పరిశుద్ధమైన విషయాల యెడల, ఆయన సన్నిధిలోకి ప్రవేశం యెడల, పవిత్రమైన కార్యక్రమాలకు హాజరయ్యే విషయం యెడల వారికి ఏ మాత్రమైనా గౌరవముంటే అది వారి మనస్సులో ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. అందువల్ల వారు ఆ కార్యక్రమాల నుంచి నేరుగా వెళ్ళి దుష్టచర్యల్లో పాల్గొనేందుకు సాహసించరు. ఒకరాజు సన్నిధిలోకి అమర్యాదకరమైన విధానంలోనూ, నీచమైన ప్రవర్తనతోనూ అడుగుపెట్టడం ఆయననెంతగా అవమానించినట్టు ఔతుంది. దేవుడెంతో ఘోరంగా ద్వేషించే అపవిత్రతతో తమను తాము ఇష్టపూర్వకంగా మలినం చేసుకుంటూ తరచూ ఆయన సన్నిధిలోనికి రావడం మరెంతో ఘోరమైన అవమానం కలిగించినట్టు ఔతుంది కదా!

2. దేవుని సంస్కారాల యెడల గౌరవమున్నట్టు నటిస్తూ, తమ జీవితాల్లో దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్ళు దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నారు. దైవారాధన కార్యక్రమాలకు హాజరౌతూ దేవుని యెడల తమకు గౌరవమున్నట్టు వాళ్ళు చూపిస్తారు. ప్రార్థనలో, బహిరంగ ఆరాధనలో, పాపపు ఒప్పుకోలులో, ప్రార్థనా విన్నపాలలో, కృతజ్ఞతాస్తుతులతో ఏకీభవిస్తూ తమకు దేవుని యెడల ఉన్నతమైన భావాలున్నాయనీ, ఆయన ముందు తమను తాము తగ్గించుకుంటున్నామనీ, తమ పాపాల విషయంలో దుఃఖపడుతున్నామనీ, ఆయన చూపే కృపలకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నామనీ, దేవునికి విధేయత చూపడానికీ, ఆయనకు సేవ చేయడానికీ, ఆయన కృపాసహాయలను కోరుతున్నామని వాళ్ళు నటిస్తుంటారు. దేవుని వాక్యాన్ని వినడానికి హాజరౌతూ నేర్చుకునే మనస్సు తమకుందనీ, దేవుడనుగ్రహించిన ఆదేశాల కనుగుణంగా జీవించడానికి తాము సిద్ధపాటు కలిగి ఉన్నామనీ వాళ్ళు నటిస్తుంటారు. ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటూ తమకు క్రీస్తునందు విశ్వాసముందనీ, ఆయననే తమకు భాగంగా ఎంచుకుంటున్నామనీ, ఆయననే ఆధ్యాత్మిక ఆహారంగా భుజిస్తున్నామనీ వాళ్ళు నటిస్తుంటారు. అయితే తమ క్రియల ద్వారా వాటికి విరుద్ధమైన దానిని ప్రకటిస్తుంటారు.

కానీ వాస్తవానికి దేవుని యెడల తమకు ఉన్నతమైన గౌరవం లేదనీ, తమ హృదయాల్లో ఆయనను తృణీకరించామనీ వాళ్ళు తమ క్రియలద్వారా ప్రకటిస్తారు. తమ పాపాల విషయంలో నిజమైన పశ్చాత్తాపానికి సుదూరంలో ఉన్నామనీ, తమ పాపాల్లో కొనసాగాలనే ఉద్దేశంతోనే తామున్నామనీ వాళ్ళు ప్రకటిస్తున్నారు. వారు ఏ పవిత్రజీవితం విషయమై దేవుని కృపా సహాయాల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ విధంగా జీవించే కోరిక వారికి లేదని అందుకు విరుద్ధంగా దుష్టత్వంలో జీవించడమే తమకు ఇష్టమని ప్రకటిస్తున్నారు. వాళ్ళు ఎంచుకునేది ఇదే, ప్రస్తుతం ఇదే వారి తీర్మానం. ప్రకటించబడుతున్న వాక్యాన్ని వింటున్నట్టు, దేవుని మార్గంలో నడవడానికి ఆయన చిత్తమేంటో తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉన్నట్టు వాళ్ళు నటిస్తారే తప్ప అందులో నిజం లేదని తమ చర్యల ద్వారా వాళ్ళు ప్రకటిస్తారు. దేవుని చిత్తాన్ని జరిగించాలనే కోరిక, ఉద్దేశాలు తమకు లేవని తమ చర్యల ద్వారా వాళ్ళు ప్రకటిస్తారు. దానికి భిన్నంగా ఆయనకు విధేయత చూపాలనే ఉద్దేశమే తమకున్నట్టు వాళ్ళు నటిస్తారు. దేవుని అధికారానికంటే, మహిమకంటే తమ శరీరకోరికలే తమకు ప్రాధాన్యమని వాళ్ళు తెలియచేస్తారు.

సంస్కారాల్లో పాలిభాగస్థులౌతూనే ఆత్మ సంబంధమైన ఆహారంతో తృప్తి పొందాలనే కోరికనూ, క్రీస్తు స్వరూపంలోనికి మార్పు చెందాలనే అపేక్షనూ, ఆయనతో సహవాసం కలిగి ఉండాలనే ఆశనూ కలిగున్నట్టు వాళ్ళు నటిస్తారు. కానీ తమ చర్యల ద్వారా అందులో నిజం లేదని వాళ్ళు ప్రకటిస్తారు. క్రీస్తు యెడల తమకు ఏ మాత్రమూ గౌరవమర్యాదలు లేవనీ, ఆయన అనుగ్రహించే ఆత్మసంబంధమైన ఆహారంతో తమ హృదయాలను నింపుకోవడానికి బదులు తమ పాపేచ్ఛల్ని నెరవేర్చుకోవడమే తమకు ఇష్టమనీ వాళ్ళు తమ క్రియల ద్వారా చూపిస్తారు. క్రీస్తుతో సమరూపం గలవారిగా ఉండాలని కాక ఆయన స్వభావానికి విరుద్ధమైన స్వభావాన్ని కలిగి ఉండాలని కోరుతున్నట్టు వాళ్ళు జీవిస్తుంటారు. క్రీస్తుతో స్నేహం చేయాలని కాక ఆయనను అగౌరవపరుస్తూ, ఆయనకు విరుద్ధంగా ఉండే సాతాను యొక్క అభీష్టాలను ప్రచారం చేస్తూ ఆయనకు బద్ధవిరోధులుగా ఉండాలనే కోరికను తమ జీవితాల ద్వారా వాళ్ళు చూపిస్తుంటారు. 

గొప్ప గౌరవమర్యాదలున్నట్టు, భయభక్తులున్నట్టు, ప్రేమ విధేయతలున్నట్టు చూపించుకుంటూ అదే సమయంలో తమ చర్యల ద్వారా వాటికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం ఆయనను ఎగతాళి చేయడం కాకపోతే మరేమౌతుంది? ఒక తిరుగుబాటుదారుడు కాని, ద్రోహి కాని తన రాజు యెడల గొప్ప విశ్వాసనీయతనూ, నమ్మకత్వాన్నీ కలిగి ఉన్నట్టు సందేశాలు పంపిస్తూ ఆ రాజు సమక్షంలోనే ఆయనను గద్దె దించేయాలనే వ్యూహాల్ని రచిస్తుంటే ఆ ద్రోహి యొక్క సందేశాలు ఎగతాళితో కూడినవి కాక మరేమౌతాయి? ఒక వ్యక్తి తన పైఅధికారి ముందు మోకరించి, శిరస్సు వంచి గౌరవప్రదమైన మాటలెన్నో పలుకుతూనే ఆయనను కొట్టి ఆయన ముఖంపై ఉమ్మి వేస్తే అతను చేసిన సాష్టాంగ నమస్కారమూ, మర్యాదతో కూడిన మాటలూ అపహాస్యంగా కాక మరే విధంగానైనా కనిపిస్తాయా?

రోమా సైనికులు క్రీస్తు ముందు మోకరించి "యూదుల రాజా, నీకు శుభము" అని చెప్పి అదే సమయంలో ఆయన ముఖంపై ఉమ్మి వేసి, రెల్లును తీసుకుని ఆయనను తల మీద కొట్టారు. అలాంటప్పుడు వారి సాష్టాంగ నమస్కారాలు, అభివందనాలు ఎగతాళి చెయ్యడం కాక మరేమైనా ఔతాయా?

మనుషులు దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలకు హాజరౌతూ, ఇష్టపూర్వకంగా దుష్టచర్యల్లో జీవిస్తుంటే, క్రీస్తు యెడల రోమా సైనికులు చూపిన వైఖరినే వీళ్ళూ కనపరుస్తున్నారు. వాళ్ళు సంఘ ఆరాధనకు వస్తుంటారు, ఆయనకు ప్రార్థిస్తున్నట్టు, స్తుతులు పాడుతున్నట్టు కూర్చుని ఆయన వాక్యం వింటున్నట్టూ నటిస్తుంటారు. ఆయన మరణాన్ని స్మరించుకుంటున్నట్టు నటిస్తూ ప్రభుని బల్లలో చేతులు వేస్తుంటారు. ఆ విధంగా వాళ్ళు ఆయన ముందు రోమా సైనికుల మాదిరిగానే మోకరించి "యూదుల రాజా, నీకు శుభము" అని చెబుతూనే చెడుమార్గాల్లో జీవిస్తున్నారు. ఈ చెడుమార్గాల్ని క్రీస్తు నిషేధించాడని వాళ్ళకు తెలుసు. ఈ చెడు మార్గాలు ఆయనకు తీవ్రమైన అవమానాన్ని తీసుకువస్తాయనీ, అవంటే ఆయనకు పరమ అసహ్యమనీ కూడా వాళ్ళకు తెలుసు. ఆవిధంగా వాళ్ళు ఆయనను అపహాస్యం చేస్తూ ఆయన ముఖంపై ఉమ్మి వేస్తున్నారు. యూదా వచ్చి "బోధకుడా, నీకు శుభము" అని చెప్పి ఆయనను ముద్దుపెట్టుకుని అదే సమయంలో ఆయన ప్రాణాన్ని తీయచూచినవారి చేతులకు ఆయనను అప్పగించినట్టుగానే వీళ్ళు కూడా చేస్తున్నారు.

మనుషులు సంఘ ఆరాధనకు వస్తూ, సంస్కారాల్లో పాల్గొంటూ అదే సమయంలో తాగుబోతులుగా, అబద్ధసాక్షులుగా ఉంటూ కామాతురతలోనూ, అన్యాయంలోనూ, ఇతర దుష్టకార్యాల్లోనూ జీవిస్తుంటే వాటికి మరో అర్థం చెప్పడం ఎలా కుదురుతుంది? ఎవరైనా వ్యక్తి దేవునికి ప్రార్థన చేసి, త్రాగుడు నుంచి తనను విడిపించమని అడుగుతూనే, మద్యం సీసాను ఎత్తి ఆత్రంగా త్రాగుతున్నాడు అనుకోండి; అతని అజ్ఞానమూ, అతని ప్రవర్తనలో ఘోరమైన దుష్టత్వమూ ప్రతీ ఒక్కరికీ స్పష్టమౌతాయి కదా! దేవుని యెడల గొప్ప మర్యాద ఉన్నట్టు ప్రవర్తిస్తూ, తమను పాపం నుంచి కాపాడమని పదే పదే దేవునికి ప్రార్థిస్తూనే తమ పాపాలను విడిచి పెట్టడానికి ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకుండా దానికి విరుద్ధంగా తమ పాపాల్లో కొనసాగడానికే నిశ్చయించుకున్నవాళ్ళు కూడా పైన ఉదాహరించిన త్రాగుబోతులాంటివాళ్ళే. అయితే వాళ్ళు మనకు స్పష్టంగా కనపడకపోవచ్చు. మనం వారి బహిరంగ చర్యలను చూడగలిగిన దానికంటే ఎంతో స్పష్టంగా దేవుడు వారి వ్యూహాలనూ, తీర్మానాలనూ చూడగలడు. అందువల్ల ఏ వ్యక్తి అయినా పాపం నుంచి తనను కాపాడమని దేవునికి ప్రార్థించి, అదే సమయంలో ఆ పాపాన్నే చేయాలని ఉద్దేశించడం దేవుణ్ణి ఎగతాళి చెయ్యడమే ఔతుంది. అది దేవునికి చాలా స్పష్టంగా కనబడుతుంది.

దేవుని సంస్కారాలను తీవ్రంగా అపవిత్రపరుస్తూ వీళ్ళు దోషులౌతున్నారు. ఈ సంస్కారాల్లో వాళ్ళు ఏకీభవిస్తూ దేవునికి తీవ్ర అవమానాన్ని తీసుకువస్తున్నారు, వారి అహంకారాన్నీ, దుస్సాహసాన్నీ కనపరుస్తున్నారు. దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాల్లోనూ, సంస్కారాల్లోనూ పాల్గొంటూ దుష్టత్వంలో జీవించేవాని దోషం, దుస్సాహసం కంటే దేవుని సంస్కారాలను ఆస్వాదించకుండా దుష్టత్వంలో జీవించేవాని దోషం అల్పమైనదే. దేవుని గురించి తెలిసి దుష్టత్వంలో జీవించే వ్యక్తి ఆయన సన్నిధిలోనికి ఆయనను అవమానించేందుకే వస్తున్నట్టు ఉంటుంది. దేవుని చిత్తం గురించి వినడానికి అతడు తరచూ వస్తుంటాడు, అదే సమయంలో అవిధేయతతో జీవించడానికి నిర్ణయించుకుని, దైవ సన్నిధి నుంచి బయటికి వెళ్ళి ఆయన చిత్తానికి విరుద్ధంగా జీవిస్తుంటాడు.

యజమాని ఆజ్ఞలకు ఉద్దేశపూర్వకంగా అవిధేయత చూపించే సేవకుడు తన యజమానిని బహిరంగంగా అవమానిస్తున్నాడు. అయితే ఆ సేవకుడు తన యజమాని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఆయన సన్నిధికి పదేపదే వస్తూ తన యజమాని ఆజ్ఞాపించినదానిని ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు కనపరచుకుని, వెంటనే బయటకు వెళ్ళి, తన యజమాని చిత్తానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అప్పుడు అతడు తన యజమానిని మరింత తీవ్రంగా అవమానించినట్టే ఔతుంది.

3. దేవుని ఆజ్ఞలనూ, సంస్కారాలనూ వాళ్ళు అపవిత్రమైన రీతిలో వాడుకుంటారు. దేవుని ఆజ్ఞలూ, సంస్కారాలూ పరిశుద్ధమైనవి, ఎందుకంటే ఒక పవిత్రమైన ఉద్దేశంతో దేవుడు వాటిని ప్రత్యేకపరిచాడు. దైవారాధన నిమిత్తమే అవి ఉన్నాయి, తనకు మహిమ‌ఘనతలు తీసుకురావడానికి మనకు కృపలో ఎదుగుదల, మరియు ఆత్మసంబంధమైన ఆహారాన్ని‌ ఇవ్వడానికి దేవుడు వాటిని స్థాపించాడు. అయితే ఈ సంస్కారాల్లో పాల్గొంటూనే దుష్టత్వంలో జీవించేవాళ్ళు దేవుని ఈ ఉద్దేశాలపైన గురి ఉంచరు. ఈ సంస్కారాల్లో ఏకీభవిస్తున్నప్పటికీ వాళ్ళు దేవుణ్ణి ఘనపరచరు, ఆయన యెడల ప్రేమను కాని, గౌరవాన్ని కాని, కృతజ్ఞతను కాని వ్యక్తపరచరు. చివరికి వాళ్ళు తమ ఆత్మల క్షేమాన్ని కూడా యథార్థంగా కోరుకోరు. కృప పొందడం కానీ, పరిశుద్ధపరచబడడం కానీ వీరి ఆశయం కాదు. ఇవి వారి అపేక్ష కాదని వారి చర్యలే స్పష్టం చేస్తుంటాయి. దుష్టులుగా ఉండాలనే వాళ్ళు నిర్ణయించుకుంటారు.

అందువల్ల దేవుని పవిత్రమైన సంస్కారాల్లో వాళ్ళు పురోగతి సాధించాలనుకునేది పవిత్రమైన ఉద్దేశాలతో కాదు. వాళ్ళు అపవిత్రమైన ఉద్దేశాలతో వాటిని వినియోగించుకుంటారు. ఇష్టపూర్వకంగా, అలవాటుగా ఈ సంస్కారాల్లో వాళ్ళు పాల్గొనకపోతే తాము ఎవరి మధ్య జీవిస్తున్నారో వారి దగ్గర అవమానం ఎదురౌతుంది. ఆ అవమానాల నుంచి తప్పించుకోవడానికీ లేదా తమకున్న లోక ప్రయోజనార్థం, ఇంకొక దుష్టత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికీ వాళ్ళు ఈ సంస్కారాల్లో తరచూ పాల్గొంటారు. అపవిత్రమైన ఉద్దేశాలతో వాటిలో పాల్గొంటూ వాళ్ళు దైవ సంస్కారాలను అపవిత్రం చేస్తున్నారు.

4. దేవుని పరిశుద్ధ సంస్కారాలలో మనుషులు అలా అశ్రద్ధగా పాల్గొంటున్నపుడు ఇతరుల్లో వాటి యెడల నిర్లక్ష్యభావం ఏర్పడుతుంది. పవిత్రమైన ఈ సంస్కారాలను ఎంతో అమర్యాదగా అలుసుగా పరిగణించినప్పుడు, ఎంతో ధిక్కారణతో వాటిలో పాల్గొన్నప్పుడు, పవిత్రమైన భావాలు ఏమీ లేకుండా వాటితో వ్యవహరించినప్పుడు, భయభక్తులు లేకుండా వాటిని ఎదుర్కొన్నప్పుడు ఇతరులు అది చూసి ఆ పరిశుద్ధమైన సంస్కారాలకున్న విలువను తక్కువగా అంచనా వేస్తారు. తద్వారా అలా చూసిన వాళ్ళు, పరిశుద్ధమైన దేవుని సంస్కారాలను అపవిత్రం చేయడానికి ధైర్యం తెచ్చుకుంటారు.

దేవాలయంలోనూ, ప్రత్యక్ష గుడారంలోనూ ఉండే పరిశుద్ధమైన ఉపకరణాలను, పాత్రలను ఎన్నడూ సామాన్యమైన అవసరాల నిమిత్తం ఉపయోగించలేదు. ఎంతో శ్రద్ధ, భయభక్తులు లేకుండా వాటిని వాడేవారు కాదు. వాటిని సామాన్యమైన పనులకు వాడియుండుంటే వాటి పవిత్రతను కొనసాగించడం, వాటిని మిగిలినవాటి కంటే పవిత్రంగా చూడడం సాధ్యమయ్యుండేది కాదు. క్రైస్తవ ఆరాధనకు సంబంధించిన సంస్కారాల విషయంలో కూడా ఇదే సత్యం.

భాగము - 3
ఆత్మ పరిశీలనకు పిలుపు

ఏదైనా తెలిసిన దుష్టత్వంలో మీరు జీవిస్తున్నారో లేదో ఈ సందేశం ద్వారా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.

మీరు దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలను ఆస్వాదించే వ్యక్తులై ఉండవచ్చు. దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి మీరు వస్తారు. దేవునితో నేరుగా సంభాషించాలనీ, ఆయనను ఆరాధించి ఘనపరచాలనీ, ఆయన యెడల దీనమైన, పవిత్రమైన, ఉన్నతమైన గౌరవాన్ని వ్యక్తపరచాలనీ, ఆయన నుంచి నేరుగా సందేశాలను పొందుకోవాలనీ దేవుడు తన సర్వాధికారంతో పరిశుద్ధపరచి ప్రత్యేకించిన ఆ సంస్కారాలలోనే మీరు పాలిభాగస్థులౌతున్నారు.

దేవుడెంతో మహిమగలవాడనీ, ఎంతో యోగ్యుడనీ, తాత్కాలిక సుఖభోగాలను కాక ఆయన యెడల భయభక్తులనూ, ప్రేమనూ మీరు కలిగి ఉన్నారనీ ఆయన ముందు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారనీ, ఆయనకు లోబడుతున్నారనీ ఆయన ఆజ్ఞల యెడల, ఆయన ఘనత యెడల మీకు మర్యాద ఉన్నదనీ తెలియచేయడానికి మీరు మందిరానికి వస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. గతంలో మీరు జరిగించిన పాపాల మూలంగా మీరెంత అయోగ్యంగా ప్రవర్తించారో మీరు గ్రహించినట్టూ, భవిష్యత్తులో అలాంటి పాపాలు చేయకూడదనే తీవ్రమైన కోరికను మీరు కలిగి ఉన్నట్టూ ఇక్కడ దేవుడు ముందు నటిస్తున్నారు. మీ పాపాలను ఒప్పుకున్నట్టూ, వాటి విషయంలో మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్టూ మీరు నటిస్తున్నారు. గతంలో ఏ పాపాలు చెయ్యడం‌వల్ల మీరు దోషులయ్యారో వాటి నుంచి తొలగిపోవాలనే తీవ్రమైన ఆపేక్ష మీకు నిజంగా ఉందన్నట్టు, పాపాలకు వ్యతిరేకంగా పోరాడడానికి శోధనల్ని అధిగమించడానికీ మీ ప్రవర్తన అంతటిలోనూ పరిశుద్ధంగా ఉండేందుకు దేవుని ఆత్మ సహాయం నిమిత్తం మీరిక్కడ దేవునికి ప్రార్థిస్తున్నారు. వాక్యాన్ని వినడం, స్తుతులు పాడడం అనే దైవారాధనకు సంబంధించిన ఇతర కార్యక్రమాలకు హాజరౌతున్నపుడు కూడా మీరు ఇలాంటి నటనలే చేస్తున్నారు.

అయితే ఇలా చేస్తున్నపుడు బహిరంగ ప్రార్థనలనూ, ఇతర సంస్కారాలనూ మీరు ఘోరంగా మలినం చేస్తున్నారో లేదో ఆలోచించుకోండి. మీరు ఎంత గొప్పగా నటించినా, ఆ కార్యక్రమాలకు హాజరౌతూ మీరు ఎంత విస్తారంగా మాట్లాడుతున్నా, మీరు దేవునికి విరుద్ధంగా దుష్టత్వంలో జీవించడం లేదా? దేవుని యెడల ఎంతో మర్యాద ఉన్నట్టు, పాపం విషయంలో సిగ్గుపడుతూ దానినుంచి తొలగిపోవాలని కోరుతున్నట్టు మాట్లాడుతున్నారు. అదే సమయంలో పాపపు క్రియలు చేస్తూనే దైవారాధన కార్యక్రమాలకు హాజరౌతున్నారు. మీరు చేసిన దాని విషయంలో ఏ మాత్రమూ పశ్చాత్తాపపడడం లేదు. దేవుని ముందు నిలబడినప్పుడు ఆ దుష్టత్వం విషయంలో ఏ విధమైన దుఃఖాన్నీ వెలిబుచ్చట్లేదు. మార్పు చెందడానికి ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకపోగా దైవసన్నిధి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఆ పాపానికే తిరిగి వెళ్ళాలని ఉద్దేశిస్తున్నారు. ఔనా? కాదా? దైవారాధన సంబంధించిన కార్యక్రమాలకు చాలా సందర్భాల్లో మీరు ఈవిధంగానే రాలేదా, ఈ విధంగానే హాజరవ్వలేదా అని నేను‌‌ అడుగుతున్నాను. ఈ రోజుకు కూడా దైవారాధనకు సంబంధించిన కార్యక్రమాలకు ఈ విధంగానే హాజరవ్వడం మీకు సర్వసాధారణం కాదా? ఆయన గొప్ప దేవుడనీ, మీరు చేసిన పాపాల నిమిత్తం ఆయన ఉగ్రతకు పాత్రులైన దరిద్రులైన, దోషులైన, అయోగ్యులైన ప్రాణులమని చెబుతూ మీరు దేవుని ముందు అబద్ధాలు పలకడం లేదా? రాబోయే రోజుల్లో అలాంటి పాపాల నుంచి భద్రపరచమని మీరు ఆసక్తితో ఆయనను వేడుకుంటున్నట్టు నటిస్తూ అదే సమయంలో దాని కోసం ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకుండా ఉంటూ మీరు దేవుణ్ణి తీవ్రంగా ఎగతాళి చెయ్యట్లేదా? ఈ విధంగా మీరు దోషులు కావట్లేదా?

దేవుని మందిరంలోనికి వచ్చి, ఆయన నియమించిన సంస్కారాల్లో ఏకీభవించిన రోజునే ఘోరమైన దుష్టత్వానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవట్లేదా? ఏ దుష్టత్వానికైతే మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారో, గత వారంలో ఏ పాపాలనైతే మీరు అభ్యాసం చేశారో ఆ పాపపు చర్యల గురించి ఇష్టంగానూ, ప్రియంగానూ ఆలోచించడం లేదా? దైవ సంస్కారాలకు హాజరైన రోజునే ఒక దుష్టమైన తలంపు తలంచడానికీ, అందులో ఆనందించడానికీ మీరు పూనుకోవడం లేదా? మీ ఆలోచనల్లో దుష్టత్వాన్ని జరిగించడానికీ, మీ దుష్టత్వాన్ని నెరవేర్చుకోవడానికి మరింత సమయాన్ని వెచ్చించడం లేదా? సాక్షాత్తు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే దైవ సంస్కారాల్లో పాలిభాగస్తులౌతున్నప్పుడే కొన్నిసార్లు వీటి విషయంలో మీరు దోషులుగా ఉండట్లేదా? ఇతరులు నేరుగా దేవునితో సంభాషిస్తున్న విధంగానే మీరు కూడా దేవునితో సంభాషిస్తున్నట్టు నటించడం లేదా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా దుష్టమైన ఆలోచనల్లో, భ్రష్టమైన ఊహల్లో ఇష్టపూర్వకంగా మీరు మునిగి తేలడం లేదా?

మీ ఆలోచనలను నియంత్రించుకోకుండా ఎలాంటి విషయాన్నైనా ఆలోచించడానికి సిద్ధపడుతూ లోక సంబంధమైన సంగతుల గురించి విస్తారంగా మాట్లాడుతూ దేవుని పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని (ప్రభువు దినాన్ని) ఉల్లంఘిస్తూ మీలో కొందరు దోషులు కావట్లేదా? దేవుని పరిశుద్ధ దినాన అపవిత్రమైన పద్ధతిలో, నిషిద్ధమైన రీతిలో సంభాషణ చేస్తూ, కొన్నిసార్లు సాధారణ దినాలలో కూడా మాట్లాడకూడని విధంగా మాట్లాడుతూ, అలాంటి అపవిత్రమైన సంభాషణల్లో సంతోషిస్తూ, మునిగి తేలుతూ ఉండట్లేదా? ఆరాధన కార్యక్రమాలకు హాజరౌతున్న సమయంలోనే ఇలాంటి దోషం కూడగట్టుకోకుండా ఉండడం మంచిది.

మీ పరిస్థితి ఎలా ఉందో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దైవారాధనకు సంబంధించిన పలు కార్యక్రమాలకు మీరు హాజరౌతున్నారు. దేవుని ఆలయానికి వచ్చి, బహిరంగ ప్రార్థనల్లోనూ పాటల్లోనూ వాక్య ప్రకటనలోనూ మీరు ఏకీభవిస్తున్నారు. మీలో చాలామంది పరిశుద్ధ సంస్కారమైన ప్రభువుబల్లను సమీపిస్తున్నారు‌. మానవాళి యెడల దేవుడు జరిగించిన కార్యాలన్నింటిలో అత్యంత గొప్పదైన, అద్భుతమైన కార్యాన్ని ప్రత్యేకమైన రీతిలో స్మరించుకోవడానికి దేవుడు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని నియమించాడు. మన విశ్వాసాన్ని అత్యంత మహిమకరంగా అద్భుతంగా ప్రత్యేకంగా ప్రత్యక్షంగా చూపించే సంస్కారం ఇది; దేవుని యెడల మీ ఒప్పందాన్ని బాధ్యతను అత్యంత గంభీరంగా చేపట్టడానికీ పునరుద్ధరించుకోవడానికీ, యేసుక్రీస్తుతో ప్రత్యేకంగా సంభాషించడానికీ దేవుడు నియమించిన సంస్కారం ఇది. ఇంతటి పవిత్రమైన సంస్కారాన్ని ఘోరమైన పాపంలో కొనసాగుతూ తీవ్రంగా అపవిత్రపరుస్తున్నారేమో, మలినం చేస్తున్నారేమో అని ప్రతి ఒక్కరూ తమను తాము పరీక్షించుకోవాలి.

పాపమని దేని గురించైతే మీకు స్పష్టంగా తెలుసో, ఆ పాపానికే మిమ్మల్ని మీరు అప్పగించుకుని మీ తోటివారికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారేమో పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. మీ వైఖరిలోనూ, మీ ప్రవర్తనలోనూ, మీ మాటల్లోనూ మీ భర్త యెడల, మీ భార్య యెడల, మీ పిల్లల యెడల, మీ సేవకుల యెడల, మీ పొరుగువారి యెడల చెడ్డగా వ్యవహరిస్తూ ఏదైనా దుష్టత్వంలో ఉన్నారేమో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి.

మీ సంభాషణల్లో కాని, మీ ఊహల్లో కాని అపవిత్రమైన కార్యాల్లో ఇష్టపూర్వకంగా నిమగ్నమై ఉన్నారేమో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. తీవ్రంగా మద్యం సేవించిన తర్వాత కామ క్రియలకు మీరు లొంగిపోరా? మాంసాహారాన్ని తిని మద్యం సేవించి శరీర ఆకలిని తృప్తిపరచుకోవాలనుకుంటూ తిండిబోతులుగా, త్రాగుబోతులుగా మీరు మారిపోవడం లేదా? మీ సంభాషణలో ఇష్టపూర్వకంగా వ్యర్థమైన విషయాలను అవసరానికి మించి మాట్లాడుతూ మీరు దోషులు కావడం లేదా?

దైవ సంస్కారాలన్నిటికీ హాజరౌతూనే ఏకాంత ప్రార్థననూ, వ్యక్తిగత బాధ్యతనూ నిర్లక్ష్యం చెయ్యడం లేదా? ప్రభువు దినాచారాన్ని మీరు ఉల్లంఘించట్లేదా? దేవుని పవిత్ర ఆరాధనకు సంబంధించిన సంస్కారాలన్నీ ఈ విధానాల్లో అపవిత్రం చెయ్యబడుతున్నాయి, మలినమౌతున్నాయి.

స్వీయపరీక్ష విషయంలో మనుషులు ద్రోహపూరితంగా, వక్రంగా ప్రవర్తిస్తారు. తమను తాము పరీక్షించుకునే విషయంలో తరచూ మనుషులు నిజాయితీగా వ్యవహరించరు. స్వీయపరీక్షకు సంబంధించిన ఉపదేశాన్ని వింటారు కాని అవి ఇతరుల కోసమన్నట్టుగా వ్యవహరిస్తూ, వాటిని ఎన్నడూ తమకు నిజాయితీగా అన్వయించుకోరు. ఒకవేళ తమను తాము పరీక్షించుకునే ప్రయత్నం చేసినా తమ విషయంలో ఎంతో పక్షపాతాన్ని కనపరచుకుంటారు. వాళ్ళు తమకు తాము ఎన్నో మినహాయింపులు కల్పించుకుంటారు. సత్యానికి అనుగుణంగా తమను తాము పరిశోధించుకోరు, పరిశీలించుకోరు, తీర్పు తీర్చుకోరు. కానీ తమకు తామే సహాయపడేలా, సమర్ధించుకునేలా తగని పద్ధతిలో తీర్పు తీర్చుకుంటారు. దైవ సంస్కారాల్లో పాల్గొంటూ తమను తాము దుష్టత్వానికి అప్పగించుకునేవాళ్ళను స్వీయపరిశీలన చేసుకోమని చెబితే వాళ్ళు నిష్పక్షపాతంగా ఆ పని చెయ్యరు. తాము ఏ విధమైన దుష్టత్వంలోనూ లేమని తమను తాము ప్రశంసించుకోవడానికే వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ తమ మనస్సాక్షికి నిజమైన జవాబు చెప్పుకునేలా తమకు తాము పరిశోధించుకోరు. ఈ విషయంలో తరచూ అక్రమంగా అబద్ధమైన విధానంలో ప్రవర్తించడం వెనుక రెండు ముఖ్యమైన విషయాలున్నాయి.

1. మనుషులు ఏ పాపాల్లోనైతే జీవిస్తున్నారో వాటి దుష్టత్వం వారికి తెలియదన్నట్టుగా నటిస్తూ మోసయుక్తంగా ప్రవర్తిస్తుంటారు. మనుషులు ఏ దుష్టత్వంలోనైతే జీవిస్తున్నారో అది చాలా అల్పమైన పాపమనీ, సామాన్యమైన విషయమనీ సమర్థిస్తుంటారు. అది ఎలాంటి ఘోరపాపమైనప్పటికీ అందులో ఎలాంటి దుష్టత్వమూ ప్రమాదమూ లేదని తమ మనస్సాక్షులకు సర్దిచెప్పుకుంటారు, వాటిని శాంతపరిచేందుకు తీవ్రమైన కృషి చేస్తారు. ఈవిధంగా చెయ్యడం వారికెంత అలవాటో వారి మనస్సాక్షే చక్కగా చెప్పగలదు. ఎలాంటి పాపం చేసినా దానికి తగిన సాకులు చెప్పడం మనుషులకు సహజమే. ఆ విధంగా వారి మోసం గురించీ, అన్యాయం గురించీ తమ పొరుగువారి పట్ల తమకుండే ద్వేషం గురించీ, వారి చెడ్డమాటల గురించీ, వారి ప్రతీకారేచ్ఛ గురించీ, వారి అధిక మద్యపానం గురించీ, వారి అబద్ధం గురించీ, ఏకాంత ప్రార్ధన విషయంలో నిర్లక్ష్యం గురించీ, వారి కామాతురత గురించీ, వారి అక్రమ సంబంధాల గురించీ వాళ్లు అదే విధంగా సాకులు చెబుతుంటారు. జారత్వము, వ్యభిచారము అనే ఘోర అపవిత్ర కార్యాల గురించి కూడా వాళ్ళు సాకులు చెబుతుంటారు. తమ దుష్కార్యాలన్నిటినీ సమర్థించుకోవడానికి వాళ్ళకెన్నో వ్యర్థమైన సాకులూ, శరీర సంబంధమైన సమర్థనలూ ఉంటాయి. ఇందులో ఉన్న నష్టం ఏంటి? ఇందులో ఏ దుష్టత్వం దాగి ఉంది? అని వాళ్ళు ప్రశ్నిస్తుంటారు. మనం ఏదైనా స్పష్టమైన నియమాన్ని చూపిస్తే, "మా పరిస్థితులు చాలా భిన్నమైనవి, అందరికీ వర్తించే నియమం మాకు వర్తించదు, మాకున్న శోధన చాలా గొప్పది, మేము క్షమార్హులము" అని వాళ్ళు చెబుతుంటారు.

ఎవరైనా/ఏదైనా వారి పాపేచ్ఛలపై తీవ్రమైన దాడిచేసినా, ఆ దాడి మూలంగా వారి మనస్సాక్షి దుఃఖపడుతున్నా, తమ మనస్సాక్షిని శాంతపరిచే కారణం, సాకు ఏదో ఒకటి కనుగొనే వరకూ వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. కుంటి సాకుల్ని కనిపెట్టడంలో వాళ్ళకున్న నైపుణ్యాన్ని వాళ్ళు చక్కగా వినియోగించుకుంటారు. వాళ్ళు తమ మనస్సాక్షిని ఒప్పించగలిగినా, ఒప్పించలేకపోయినా, తమ వాదన మంచిదే అనీ, అది పాపం కాదనీ వాళ్ళు వాదిస్తూ ఉంటారు. తమది పాపమని వాళ్ళు ఒప్పుకున్నా, అది కేవలం అజ్ఞానంతో చేసిన పాపమనే వాళ్ళు చెప్పుకుంటారు. చీకట్లో తాము చేసిన పాపాలను ఇలా వాళ్ళు సమర్థిస్తుంటారు. ఇలా పాపులు తమ మనస్సాక్షితో వాదిస్తుంటారు. మనం వారి హృదయాలను పరిశీలనగా చూడగలిగితే అది మనకు కనబడుతుంది.

ఇందులో ఏ దుష్టత్వం లేదు అనడానికి వారు వాడే అతి బలమైన వాదనే వారికి ఆ పాపంపట్ల ఉన్న అధికదురాశనూ, అందులో కొనసాగాలనే వారి భయంకరమైన కోరికనూ బట్టబయలు చేస్తుంది. మనమందరమూ తప్పుకాదు అనుకునే పాపాల మూలంగానే నశిస్తాము అని ఒకాయన చెప్పాడు. ఇంకోవిధంగా చెప్పాలంటే "ఇది పాపం కాదులే" అని తమను తాము సమర్థించుకోవడాన్ని బట్టే సహజంగా మనుషులు దుష్టత్వంలో జీవించి నరకానికి వెళ్తారు. అవి అజ్ఞానంతో చేసినవని, పెద్ద తప్పేమీ కాదులే అని సమర్థించుకోవడమే అందుకు కారణం. స్వీయ పరీక్ష చేసుకోమని ఎవరైనా వాళ్ళను బలవంతం చేస్తే వాళ్ళిదే చేస్తారని నేను నిస్సందేహంగా చెప్పగలను. రహస్య ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్న మీ విషయంలో మద్యం నిమిత్తం అపరితమైన ఆకలి కలిగిన మీ విషయంలో ఇతరుల్ని మోసం చేస్తూ అణచివేస్తూ ఉండే మీ విషయంలో మీ పొరుగువాని యెడల ప్రతీకారేచ్ఛనూ, ద్వేషాన్నీ కలిగి ఉండే మీ విషయంలో మీరిలా సమర్థించుకుంటున్నారో లేదో మీ మనస్సాక్షులనే మాట్లాడనివ్వండి. ఇక్కడ రెండు లేదా మూడు విషయాలను మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను.

మొదటిగా కొన్ని చర్యలు పాపమని ఒక వ్యక్తికి ఖచ్చితంగా తెలియనప్పటికీ, వాటన్నింటినీ అజ్ఞానంతో, అమాయకత్వంతో చేసే పాపాలని న్యాయంగా పిలవలేము. ఈ చర్యలు, అలవాట్లు పాపమని మాకు తెలియక చేశామని చెప్పుకుంటూ మనుషులు తమను తాము సమర్థించుకుంటారు. అవి పాపమని వారికి స్పష్టంగా తెలుసు, వాక్యపు వెలుగును బట్టి అది వాళ్ళకు తెలుస్తుంది. ఆ చర్యలు దేవునికి ఆయాసకరమని వారు గుర్తించగలిగేంత వెలుగు వారికి వాక్యోపదేశం ద్వారా అనుగ్రహించబడింది. అవి పాపమని వారి మనస్సాక్షికి తెలుసు. అవి పాపమని వాళ్ళు రహస్యంగా ఒప్పించబడతారు. అయితే వాళ్ళు దానికి భిన్నంగా నటిస్తారు, తమను తాము మోసగించుకోవడానికి ప్రయాసపడతారు, వారి చర్యల్లో ఎలాంటి పాపమూ లేదని తమను తాము ఒప్పించుకుంటారు.

చాలినంత సమాచారానికీ, ఉపదేశానికీ విరుద్ధంగా, తమ సొంత మనస్సాక్షి చేసే నిజమైన సూచనలకు విరుద్ధంగా, తమ సొంత మనస్సుల తీర్పుకు విరుద్ధంగా చేసే పాపాలు అత్యంత ఘోరమైనవి. ఇవి తెలిసి తెలిసి చేసే పాపాలని నేనంటున్నాను. ఈ పాపాలకు మనుషులు తమను తాము అప్పగించుకున్నప్పుడు అవి దేవుని పరిశుద్ధ సంస్కారాలను ఘోరంగా అపవిత్ర పరుస్తాయి, మలినం చేస్తాయి.

రెండవదిగా ఈ పాపాలకు వ్యతిరేకంగా దేవుని వాక్యం నుంచి ఎంతో తరుచుగా, ఎంతో స్పష్టంగా హెచ్చరికలు విన్నప్పటికీ, వీటిని తెలియక‌ లేక అమాయకత్వంతో చేసే పాపాలనీ సమర్థించుకోవడం వ్యర్థమే, వెటకారమే. అంత్యదినాన ఈ విషయం అందరికీ తెలుస్తుంది. సువార్త వెలుగులో జీవించినవారు, ప్రతీ అపరాధానికీ వ్యతిరేకంగా వాక్యం సాక్ష్యమిచ్చినప్పుడు విన్న వాళ్ళందరూ దుర్నీతితో, దురలవాట్లతో జీవించి తెలియక ఆ పాపాలు చేశామని చెప్పుకోవడం వ్యర్థమే ఔతుంది. ఎందుకంటే దేవుడు వాటిని బట్టబయలు చేస్తాడు.

మూడవదిగా, దేవుడు ఈ రాత్రి నీ ప్రాణమడిగాడని మీకు తెలిస్తే ఏ పాపాలనైతే చేయడానికి నువ్వు సాహసించలేవో వాటిని తెలియక, అమాయకత్వంతో చేసే పాపాలని వాదించడం వ్యర్థమే. 24 గంటలలోపే క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు నిలబడవలసి ఉందని నీకు తెలిస్తే, ఏ పాపాల నిమిత్తం నువ్వు అగ్నిగుండంలో పడవలసి వస్తుందో నీకు తెలిసినా, వాటిలో ఎలాంటి దుష్టత్వమూ లేదని వాటిలో కొనసాగడం వెర్రితనమే. తాము తెలియక పాపం చేస్తున్నామని వాదిస్తూ మనుషులు మరింత దోషులలౌన్నారని ఈ వాదన రుజువు చేస్తుంది.

2. ఈ విషయంలో మనుషులు అబద్ధంగా, అక్రమంగా ప్రవర్తించే రెండవ విషయం, తాము అలవాటుగా చేస్తున్న పాపాలకు తమను తాము అప్పగించుకోలేదని వాదించడమే. అయితే తమ చర్యలు తమకు పాపాలని తెలియదని వాళ్ళు వాదిస్తారు, ఒకవేళ వాటిని పాపాలని ఒప్పుకోవలసి వస్తే, తమను తాము వాటికి అప్పగించుకోవట్లేదని వాళ్ళు చెబుతుంటారు. కాబట్టి తమ చర్యల వలన దేవునికి పెద్దగా కోపం కలగదని వాళ్ళు భావిస్తుంటారు. వాళ్ళు నిరంతరం ఆ పాపాల్లో కొనసాగుతున్నా తమకేమీ తెలియదన్నట్టు నటిస్తుంటారు. గతంలో చేసిన పాపాన్ని బట్టి ఏ మాత్రమూ నిజాయితీగా పశ్చాత్తాపపడరు, భవిష్యత్తులో వాటిని చేయకూడదని కూడా తీర్మానించుకోరు. కానీ ఒక పాపం తర్వాత మరొకటి చేస్తూనే ఉంటారు. అయితే ఈ విషయంలో మిమ్మల్ని మీరే మోసం చేసుకోకుండా జాగ్రత్తపడండి. ఇలాంటి నటనలూ, వాదనలూ ఇప్పుడు మీ మనస్సాక్షిని నిమ్మళపరచడానికి ఎంతో సహాయపడవచ్చు కానీ నీతిమంతుడూ, పరిశుద్ధుడూ అయిన మీ న్యాయాధిపతి ముందుకు మీరు వచ్చినప్పుడు అవి మీకు ఏ మాత్రమూ సహాయపడవు.

భాగము - 4
దైవిక సంస్కారాలలో పాల్గొంటూనే తెలిసి తెలిసి పాపంలో జీవిస్తున్నవారికి ఒక మాట

దేవుడు నియమించిన సంస్కారాలు ఎంత పరిశుద్ధమైనవో ఆలోచించండి. అలాంటి సంస్కారాలకు హాజరౌతూనే వాటికి విరుద్ధమైన రీతిలో ఇష్టపూర్వకంగా ప్రవర్తిస్తూ మీరు దేవుణ్ణి ఎంతగా ఎగతాళి చేసి దోషులౌతున్నారో ఆలోచించండి. దేవుడు నియమించిన సంస్కారాలను అపవిత్రపరిచేవారి కంటే ఎక్కువ కోపాన్ని మరెవ్వరూ ఆయనకు కలిగించలేరు, ఆయన ముందు దోషులుగా నిలబడలేరు. పరిశుద్ధమైనవాటిని మలినం చేసేవారికంటే ఎక్కువగా ఆయన కోపాగ్నిని ఎవరూ రగిలించలేరు. "తన నామమును వ్యర్థముగానుచ్చరించువానిని యెహోవా నిర్దోషిగా ఎంచడు" అనే మూడవ ఆజ్ఞ ప్రకారం దేవుని ముందు దోషులుగా నిలబడేది ఆయన నియమించిన సంస్కారాలను అపవిత్రం చేసేవాళ్ళే. పది ఆజ్ఞలలో ఈ ఒక్కదానికే ఈ హెచ్చరికను ముడిపెట్టడానికి కారణమేంటి? ఈ ఆజ్ఞను ఉల్లంఘించడమే మనిషిని దేవుడి ముందు మరింత దోషిగా నిలబెడుతుంది.

దేవుడు నియమించిన సంస్కారాలనూ, పరిశుద్ధమైనవాటిని అపవిత్రం చేయడమూ, మలినం చేయడమూ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడంలో భాగమే. దేవుడు నియమించిన సంస్కారాలకు హాజరౌతూ ఘోరమైన పాపంలో జీవించేవాళ్ళు దేవుని నామాన్ని ఎంతో ఘోరమైన రీతిలో వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆయన యెడల అత్యంత అమర్యాదనూ, దైవ సంబంధమైన విషయాలలో చులకనభావాన్నీ వాళ్ళు కనపరుస్తున్నారు‌. మనం ఇదివరకే చెప్పుకున్నవిధంగా దేవుని అధికారం యెడల, ఆయన నియమించిన సంస్కారాల వెనుక ఆయనకున్న ఉద్దేశాల యెడల, దేవునితో నేరుగా సంభాషించే అవకాశమున్న కార్యక్రమాల యెడల వారు కలిగి ఉన్న అత్యంత నిర్లక్ష్యపు వైఖరిని వాళ్ళు కనపరుస్తున్నారు. దేవుని నామంలోనే సంస్కారాల్లో పాల్గొనాలి. కాబట్టి వాటిలో అపవిత్రంగా పాల్గొంటూ దేవుని నామాన్ని ఎంతో దారుణంగా మనుషులు అవమానపరుస్తున్నారు. దేవుడు నియమించిన సంస్కారాలను ఈ విధంగా ఆచరిస్తూ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తూ, కేవలం ఎగతాళి చెయ్యడానికే దేవుని సంస్కారాల్లో పాలిభాగస్థులౌతున్న మీరు వాటిని ఘోరమైన అవమానానికి గురిచేస్తున్నారు. దేవుడు నియమించిన సంస్కారాల్లో ఈ విధంగా పాల్గొనడం పరిశుద్ధమైనవాటిని కాళ్ళ క్రింద త్రొక్కడమే తప్ప మరేమీ కాదు. 

పరిశుద్ధమైనవాటిని నిర్లక్ష్య వైఖరితో చులకనగా పరిగణించిన వ్యక్తుల యెడల దేవుడు అప్పటికప్పుడే తన ఉగ్రతను కురిపించిన భయానక సందర్భాలు కొన్ని ఉన్నాయి. తన ముందు అన్యాగ్నిని ఉపయోగించినందుకు దేవుడు నాదాబు, అబీహులను అక్కడికక్కడే అగ్నితో దహించివేసాడు. నిబంధనా మందసాన్ని అనాలోచితంగా తాకినందుకు ఉజ్జాను దేవుడు వెంటనే మొత్తాడు (2 సమూయేలు 6:6,7). నిబంధన మందసాన్ని తెరిచి చూసినందుకు బెత్షేమేషులోని ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు మొత్తాడు. దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబైవేల డబ్బై మందిని మొత్తాడు (1 సమూయేలు 6:19).

"ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైయున్నది" అని చెబుతూ కొత్త నిబంధనలో కూడా దేవుడు హెచ్చరించాడు (1 కొరింథీ 3:17). ఈ మాటల్లో ఎంతో గంభీరమైన సందేశముంది. మనుషులు చేసింది ఏ పాపమైనా, వాళ్ళు ఏ పాపంలో కొనసాగినా దేవుడు ఆ పాపులందర్నీ నాశనం చేస్తాడు. అయితే దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానిని నాశనం చేస్తాడని వాక్యం ప్రత్యేకంగా హెచ్చరిస్తుంది. అంటే ఈ పాపంలో మరింత ప్రత్యేకమైన దోషముందని అది చేసినందుకు ప్రత్యేకంగా దేవుని కోపోగ్రతలో నాశనం అవ్వడానికి దేవుని ఉగ్రతను రేపినవారు ఔతారని ఇది నేర్పిస్తుంది. అత్యంత భయానకమైన రీతిలో దేవుడు వాళ్ళను నాశనం చేస్తాడు.

"దేవుడు వెక్కిరింపబడడు" అని గలతీ 6:7 ప్రకటిస్తుంది. ఎవరైనా ఆయనను వెక్కిరిద్దామని ఉబలాటపడితే, ఆయన ఏ మాత్రమూ అంత అల్పుడు కాడనే విషయాన్ని ఆ వ్యక్తి కనుగొంటాడు. తనను వెక్కిరించడానికి సాహసించేవారికి దేవుడు తన పరిశుద్ధ మహిమను ఎంతో సమర్థవంతంగా రుజువు చేసుకుంటాడు. దేవుని నామాన్ని ఎంతో ధైర్యంగా అపవిత్రపరచడానికీ, మలినం చేయడానికీ సాహసించేవారు ఆయనెంత భయంకరుడో పూర్తిగా తెలుసుకుంటారు. ఎలాంటి సంస్కారాలూ, దైవ శాసనాలూ లేని అన్యజనుల కంటే ఘోరమైన పాపంలో జీవిస్తూ అతి నీచమైన దుష్టత్వానికి తమను తాము అప్పగించుకుంటూ దేవుడు నియమించిన సంస్కారాలను అపవిత్రపరుస్తూ ఉన్నవాళ్ళే దేవునికి ఎక్కువ ఆగ్రహం కలిగిస్తారు‌. అందువల్లనే సొదొమ నివాసులు అన్యజనులందరిలోనూ అత్యంత నీచులైనప్పటికీ సొదొమవారి దుష్టత్వం కంటే యూదా రాజ్యపు దుష్టత్వం, యెరూషలేము యొక్క దుష్టత్వం మరింత హేయమైనదని లేఖనం చెబుతుంది. యెహెజ్కేలు 16:46,47 చూడండి. సొదొమవారు చేసిన పాపాలు యూదావారు చేసిన పాపాలతో పోల్చుకుంటే అల్పమైనవని ఈ వచనాలు తెలియచేస్తున్నాయి. దానికి కారణమేంటి? ఏ పవిత్రమైనవాటినైతే యూదారాజ్యవాసులు ఆస్వాదించారో, వేటినైతే అపవిత్రం చేసి మలినం చేశారో, వాటిని పొందే అవకాశం సొదొమ వారికి రానే రాలేదు.

అందువల్ల ఘోరమైన దుష్టత్వానికి మిమ్మల్ని మీరే అప్పగించుకుని, అందులోనే జీవిస్తూ దేవుని ఆలయానికి వస్తూ, క్రమంగా ఆయన నియమించిన సంస్కారాల్లో పాల్గొంటూ, మీ పాపాలను విడిచిపెట్టాలని ఎలాంటి ప్రయత్నమూ చెయ్యకుండా, వాటిలో కొనసాగాలనే ఉద్దేశంతో తరచూ దేవుని మందిరం నుంచి బయటకి వెళ్ళి మీ దుష్ట చర్యలను జరిగిస్తున్న మీరు మిమ్మల్ని దేవుని దృష్టికి ఎంత దోషులుగా చేసుకున్నారో, దేవుడు మీ మూలంగా ఎంతటి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడో ఆలోచించండి. ఒక్క క్షణంలో మీపై విరుచుకుపడి, మిమ్మల్ని మృత్యువాతకు గురి చెయ్యకపోవడం దేవుని అద్భుతమైన సహనానికి నిదర్శనం. ఉజ్జా ఒక్కసారే నిబంధన మందసాన్ని తాకినందుకు దేవుడు అతణ్ణి అక్కడికక్కడే మొత్తాడు. మీరు పరిశుద్ధమైనవాటిని అతని కంటే ఎంతో ఘోరంగా అపవిత్రపరుస్తున్నారు. అదే పాపాన్ని ప్రతీరోజూ, ప్రతీవారమూ చేస్తున్నారు.

దేవుడు తన ఉగ్రతను పిడుగులా నీపై కురిపించి, అంతులేని అగాథంలో నిన్ను పడవేయకుండా నిన్నింకా భూమిపై జీవించనివ్వడం అద్భుతమే. నీకింకా తన మందిరంలో కూర్చునేందుకూ, ఈ భూమిపై జీవించేందుకూ అవకాశాన్నిస్తూ సర్వశక్తిమంతుడైన దేవుడు తన ఉరుములనూ, మెరుపులనూ నీపై ప్రయోగించకపోవడం అద్భుతమే. భూమి ఇంకా నిన్ను మోస్తుండడం, పాతాళం ఇంకా నిన్ను మ్రింగకపోవడం అద్భుతమే.

పరలోకం నుంచి అగ్ని నీపైకి దిగి రాకపోవడం, పాతాళం నుంచి మంటలు నీపైకి చెలరేగకపోవడం, నరకాగ్ని రగిలి నిన్ను చేరుకోలేకపోవడం, అంతులేని అగాథం నిన్ను మ్రింగకపోవడం మహాద్భుతమే. అయితే దేవుడు నిన్నింకా భరిస్తున్నాడంటే నీ నాశనం కునికి నిద్రపోతుందని అర్థం కాదు. మనుషుల కోపం తొందరపడుతుంది, ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. దేవుని కోపం అలాంటిది కాదు. ఉగ్రతాపాత్ర ఘటాలను శిక్షించడం కోసం, వారి క్రియలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం కోసం దేవుడొక దినాన్ని నియమించాడు. ఆ రోజు ఆసన్నమైనప్పుడు, మనుషుల పాపం పండుతుంది. అప్పుడు ఏ ఒక్కరూ దేవుని చేతి నుంచి విడిపించబడలేరు. అప్పుడే నీ పాపాలకు తగిన ప్రతి దండననూ దేవుడు నీకు విధిస్తాడు.

 

Add comment

Security code
Refresh

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.